మేలుకొలుపు
సంపుటి-2 సంచిక-2 1-2-92
ప్రమాణ వివేచన – 3
మానవ జీవితంలో తర్కం పాత్ర-జ్ఞాన
ప్రక్రియలో దాని పాత్ర-ఏమిటన్నది నిజ జీవితాన్ని యధాతధంగా చూడగలిగితేగాని, వ్యక్తి వికాసానికి, సామాజిక
వికాసానికి తార్కికతకూ ఉన్న సంబంధం బోధపడదు. ప్రారంభ సాధకులలోనూ, సాధారణ మానవుల-అనుయాయులలోనూ ఆయా సిద్ధాంత ప్రచారకులూ, మార్గదర్శకులూ కలసి తర్కంపై ఒక వ్యతిరేక భావనను బలంగా నాటుకొనేటట్లు
చేయగలిగారు. దాని ప్రభావం సామాన్యులపైనేగాకుండా, రానురాను
ఆయా శాస్త్రములందూ, విషయాలందూ నిష్ణాతులైన విద్యావంతులపై
గూడా గణనీయంగానే పడింది. వర్తమాన సమాజంలొ, అట్టి ప్రభావంలో
నున్న తర్కమంటే చెడ్డదనో, మరో రకంగా తిని కూర్చునే వాళ్ళు
తోచక చేసే వాగ్వివాదాలకు పనికి వచ్చేదనో ఒక తప్పు అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్న
వారిచే వ్యక్తీకరింపబడినదే పై రెండో అభిప్రాయం. అయితే ఇక్కడ మరో విషయమూ గమనించవలసి
ఉంది. అలా తర్కంపై వ్యతిరేకాభిప్రాయం గాని, ఉదాసీనతగానీ,
ఏర్పడటానికి తర్కం తరచుగా, దాదాపుగా, తన స్వీయ క్షేత్రాన్ని విడచి అక్కరలేని విషయాలలోనూ, అక్కరలేనంతగానూ
ఉపయోగించడమో (ఈ పని అతి తార్కికులు చేస్తుంటారు) అవసరమైనంతవరకైనా ఉపయోగింపబడక
పోవడమో (ఈ పని మంద వేగులు చేస్తుంటారు) జరుగుతోందన్నమాట. ఇలాంటి వాటిని పదేపదే
అనుభవాల ద్వారా గమనిస్తున్న జనసామాన్యంలో తర్కంపై అలాంటి వ్యతిరేకత ఏర్పడడంలో
ఆశ్చర్యమేముంది.
అయితే
ఒక విద్య దుర్వినియోగం చేయబడుతున్నంత మాత్రానో, సక్రమంగా వినియోగించుకోలేకపోయినంత మాత్రానో అది విద్యే
కాకుండా పోతుందా?ఏ మాత్రం వివేకంతో ఆలోచించగలిగినా అలా కాదని
చెప్పగలం. అదలా ఉంచి ఈ తార్కికతను మానవ జీవితంనుండి వేరు చేద్దామన్నా కుదిరే విషయం
గాదు వాస్తవంగా ఎందుకని? తర్కం సహజంగానే మానవ మేధస్సులో
జరిగే జ్ఞాన ప్రక్రియలో ఇమిడి ఉంది. నిశ్చయాత్మకమైన బుద్ధి ఆయా విషయాలను నిశ్చ
యించడానికి, గ్రహణ, విశ్లేషణ, వివేచన అన్న పనులపైనే ఆధారపడుతుంది. ఇది సంఘంలో ఎవరో ఏర్పరచింది కాదు.
ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఏర్పడి ఉన్న విధానమది. తర్కమూ, తార్కికతా
మనిషికి సహజాతము లన్నది వాస్తవమో కాదో మీమీ జీవితాలనుండి గమనించండి. తర్కమన్న
మాటకు అనవసరమైన అర్థాలు మనమే కల్పించుకుని, ఆ కొలతలనుండి
దానిని నిరర్ధకమూ, దురర్ధకమూ నని కొట్టివేయ బూనడం సబబు కాదు.
హేతుబద్ధమైన పరిశీలనారూపమైన అనుభవాంగ తర్కాన్ని విడిచిన వారు జీవితంలో ఎంతో
కోల్పోతారు. విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖలలోనూ తర్కం-హేతుబద్ధ యోచన-ఆయా
విజ్ఞానాభివృద్ధికి ప్రాణప్రదంగా ఉంటున్నది. అదలా ఉంచండి.
తర్కం జీవితావసరం, వికాస హేతువు కాదని చెప్పదలచుకున్న వారు
కూడా తార్కికంగానే దాని అనవసరాన్ని నిర్ధారించే యత్నం చేస్తారు, తర్కం ఎందుకవసరం లేదో నిరూపించడానికి వారి కాధారమైనది మళ్ళా తర్కమే. ఇదెలా
ఉందంటే తర్కాన్ని చంపాలనుకున్న వారు తర్కాన్ని బ్రతికించవలసి వస్తోందన్నమాట
మొత్తమ్మీద ఏమర్థమవుతోంది? ఏ విషయాలను గూర్చి సమగ్రంగా అర్థం
చేసికోవాలనుకున్నా, నిర్థారణలకు రావాలనుకున్నా మేధస్సుకున్న
ఒకే ఒక్క ఆధారం తర్క ప్రక్రియే. ఏ మానవుడైనా తార్కికంగానే ఆయా నిర్ధారణలకు
వస్తాడు.
Note:-తర్కమంటే హేతూదాహరణల
సామర్ధ్యంతో ఆయా విషయాలకు చెందిన అవగాహనకు రావడానికై మేధస్సు చేసే మేధో ప్రక్రియ అనే నా
యభిప్రాయం. నిజంగా నిజం కూడా అదే.
మనం
యింత వివరంగా చెప్పిన పిదపనూ పిడివాదంతో- అదీ ఒక రకమైన తర్కమేనన్నది
గమనించకుండానే- తర్కమెందు కవసరం లేదో తర్కించడం ప్రారంభిస్తారు మరికొందరు.
వారిదాడి యిలా ఉండవచ్చు. సహజంగానే ఉన్న దానిని గూర్చి మళ్ళా తర్కం నేర్చుకోండి అని
మీరెందుకు చెప్పడం? ఉన్నదాన్ని తెచ్చుకోండనడం వ్యర్ధ ప్రసంగం కాదా? సిద్ధ
వస్తువుకై సాధనలేమిటి? వగైరా.
వారు నిజంగా ఉన్న విషయం చూడదలచుకుంటే
కొన్ని విషయాలు పరిశీలించి చెప్పండని వారి నడగాలి. 1) తార్కికత జ్ఞాన ప్రక్రియలో సహజంగానే ఇమిడి
ఉందా లేదా? ఉందన్న వాస్తవం వారు అంగీకరిస్తే తర్కం అనవసరమన్న
మాట మీరెప్పుడూ అనరాదు. 2) అది సరేనయ్యా, తర్కం సహజంగా ఉన్నదే కనుక నేర్చుకోవలసిన, నేర్పవలసిన
అవసరంలేదు అంటున్నాము అన్నట్టైతే, మనిషి తనలో ఏర్పడి ఉన్న
వనరులనే వినియోగంలోకి తేవడానికీ, వాటి సామర్ధ్యాన్ని
పెంచుకోవడానికీ, వాటిని సందర్భానుసారం-సమయోచితంగా-
ప్రయోగించుకోడానికీ వాటిచేత క్రమబద్ధంగా విశేష పరిశ్రమ చేయించడం అవసరం. సహజంగా అదే
పరికరాలున్న మేధావికీ, సామాన్యునికి ఉన్న తేడా ఏమిటి?
ఎందు వల్ల ఆ తేడా ఏర్పడింది? అలానే ఆయా
విషయాలకు చెందిన సామాన్య జ్ఞానానికి విశేష జ్ఞానానికీ తేడా ఏమిటి? అదెట్లా ఏర్పడింది? ఈ విషయాలను స్వానుభవం ద్వారా
గ్రహించగలిగితే తర్కం ఒక విద్యగా కూడా ఎందుకు నేర్వవలసి ఉందో బోధపడుతుంది.
పూర్వీకుల
పరిశోధనాంశాలను యధాతధంగా (మొత్తమూ సత్యమేననే దృష్టితో) స్వీకరించుట ఎంత దోషయుక్తమో, అవి అక్కరలేనివిగా, పనికిరానివిగా
భావించి విడచివేయడం కూడా అంతే దోషయుక్తము. గతం నుండి సంక్రమించిన విజ్ఞానాన్ని
పరిశీలించడమూ, తన అధ్యయనంలో భాగంగా స్వీకరించడమూ నిరర్ధకమనే
ఆలోచన విద్యావిధానానికి గొడ్డలిపెట్టు కాగలదు. ప్రతివ్యక్తి ఆయా విషయాలను స్వయంగా
గ్రహించడం అసాధ్యం కానప్పటికీ, ప్రతిదీ అలానే సాధిస్తాననడం
అవివేకమూ, మూర్ఖతా కూడా అవుతుంది. అంతేకాక అధిక వ్యయ
ప్రయాసలూ, కాలహరణము కూడా. ఒక్క విషయ మాలోచించండి. ఒక క్రమ
బద్దమైన అభ్యాసరూపమైన పరిశ్రమ చేయని మేధస్సు చూసే చూపుకూ, చేసే
నిర్ణయాలకూ, ఆ ప్రక్రియలో నిపుణత్వం సాధించిన మేధస్సు చూసే
చూపుకూ, నిర్ణయాలకూ తేడా ఉంటుందా? ఉండదా?
ఆలోచించండి. ఒక వృత్తాన్ని గీశామనుకోండి. దానికి ప్రారంభమూ, ముగింపు ఒక్కటా కాదా? ఆలోచించి చెప్పండి.
జీవితం
సక్రమంగా సాగాలంటే బుద్ధి నిరంతరం వివేచనచేసి నిర్ణయాలు తీసికోవలసి ఉంటుంది.
సమస్యను సరిగా చూడాలన్నా, సరైన పరిష్కారాన్ని కనుగొనాలన్నా వివేకం పాత్రే మౌలికమైనది. తర్కబద్దంకాని
వివేకముండదన్నదో వాస్తవం. తర్కం యొక్క ఆవశ్యకతా, జ్ఞాన
ప్రక్రియతో తర్కానికున్న సంబంధమూ, తర్కించే స్వభావం మనిషికి
సహజాతమైనదే ఐనప్పటికీ దాని నుపయోగించుటలో నిపుణతకై దానినో విద్యగా నేర్వవలసిన
అవసరమూ అన్న వాటిని గురించి నేచూపిన ఆధారాలతోబాటు మీమీ యనుభవాలనుండిన్నీ ఆధారాలు
లభిస్తాయేమో చూసి ఒక నిర్ణయానికి రండి. తర్కం తప్ప మరేదీ అక్కరలేదనో, తర్కం అక్కరలేనిదనో రాగద్వేష రూపమైన తొందరపాటు నిర్ణయాలకు రాకుండా
నిదానంగానూ, నిష్పాక్షికంగానూ- తర్కమూ నిత్యజీవితంలో దాని
పాత్ర- అన్న దానిని యథాతథంగా గమనించే యత్నం చేయండి. మీ మీ అభిప్రాయాలను సహేతుకంగా
పత్రికకు వ్రాయండి. పై సంచికలో, మరికొంత విశ్లేషణ చేద్దాము.
ప్రస్తుతాంశమైన
ప్రమాణ వివేచనలో మరికొన్ని విషయాలు మీ ముందుంచుతాను. గమనించండి. ప్రమాణమన్న పదం
పరికరాలకూ-పద్దతులకూ కూడా అన్వయిస్తుంది అన్న నా ప్రతిపాదనపైనే వివరణలు కోరుతూ
కొందరు లేఖలు వ్రాశారు. వాటిని దృష్టి నిడుకునే గత సంచికలో కొంత వివరణ చేశాను. ఆ
వివరణానంతరమున్నూ “పరికరముల ననుసరించి ప్రమాణములారు. ఇంద్రియములే అవి"
పద్ధతుల ననుసరించి ప్రమాణములు మూడు (ప్రత్యక్షమూ, అనుమానము,శబ్దము)అన్నారు.
ఇక్కడో విషయం తెలియవలసి ఉంది. పరికరముల ననుసరించి ప్రమాణములగు ‘6’టినే ప్రత్యక్ష ప్రమాణముగా నేను తెలిసికొని ఉన్నాను. మరి పద్దతుల
ననుసరించి ప్రమాణములను వాటిల్లో ప్రత్యక్షమును కూడా లెక్కించినారు. మీ దృష్టిలో
ప్రత్యక్షమనునది శోత్రనేత్రాది 6 ప్రమాణముల కంటె వేరా?
ఒక్కటేనా? వేరే అయితే ఆ ప్రత్యక్ష రూపమేమో
తెలుపండి. శ్రోత్రాదులే ప్రత్యక్ష ప్రమాణమనుకుంటే పద్దతుల ననుసరించీ ప్రమాణము
లుంటాయని రెండు రకముల విభజనెందుకు? పద్దతుల ననుసరించిన
ప్రత్యక్షానికీ, పరికరముల ననుసరించిన ప్రత్యక్షానికీ తేడా
ఏమో తెలుపండి. అంటూ ఒకరిద్దరు వ్రాశారు.
పై
సందేహాలకు సమాధానం చెప్పాననే నాకనిపిస్తున్నప్పటికీ నాభావం ఎదుటి వారికి
అందవలసినంత స్పష్టంగా అందిందో లేదో? అన్న దృష్టి నుండి మరి కొంత వివరణ అవసరమనిపిస్తోంది. పద
పదార్థము లెలా సంబంధపడి ఉంటాయో పదార్ధ నిర్వచనం ఎలా చేస్తే సమగ్రమవుతుందో తెలిసికోవలసిన
అవసరముందిక్కడ. ఏ అర్ధాన్ని (అనుభవంలో ఉన్న దానిని అనుభవాని కాధారమైన దానినీ
అర్ధమంటాము.) సూచించడానికి ఒక పదాన్ని వాడుతున్నామో ఆ పదానికది అర్ధమవుతుంది.
పదానికీ అర్థానికి సాంకేతిక సంబంధముంటుంది. పరిణితి చెందిన భాషలో నున్న
పర్యాయపదాలూ (ఒక పదానికనేకర్థాలు) అన్నవాటిని మినహాయిస్తే ప్రతి పదమూ ప్రత్యేక
అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఈ పదానికిదే అర్ధము అన్న వివేకం కలిగియుండుటే పదార్ధ
విజ్ఞానం కలిగియుండడమంటే.
. Note:-పదాని కర్థం పదార్థం. అది తెలియడమంటే ఆ
పదంచే సూచింప బడుతున్న విషయం అనుభవంలో ఉందన్నమాట. ఆయా విషయాలు తెలియడమంటే ఏమిటో ఈ
విషయం అర్థమైతేగాని తెలియదు. జిజ్ఞాసువుకు పదార్థాలు తెలియడమంటే ఏమో తెలియకపోతే
గ్రంథాధ్యయనంలోనూ, శ్రవణం చేయుట లోనూ ప్రమాదపడే వీలుంది.
పద పదార్ధముల నిర్ధారణ ఎలా చేయవలసి
ఉంటుందో దృష్టాంత పూర్వకంగా చూద్దాము.
ప్రక్క ఒక నలుపు చుక్క వుంది.
దానిని చూపి నలుపు పదార్థమది అన్నాను. మళ్ళా దానినే చూపించి రంగు అనబడే పదార్థము
అనియూ, మూడవ సారి అది ఒక గుణము
అనియూ, చెప్పాను. ఒకే విషయాన్ని చూపుతూ నలుపు, రంగు, గుణము అన్న మూడు పదాలు వాడాను. మూడు పదాలు ఒకే
అర్ధాన్ని చూపుతున్నాయి కనుక అవి పర్యాయ పదములా? కాదనాలి.
ఎందుకని నలుపున్న ప్రతిచోటా గుణముంటుంది గానీ, గుణమున్న
ప్రతిచోటా నలుపుండదు. పులుపును చూపీ గుణమన వచ్చుగదా. అలానే నలుపన్న దానిని చూపి
రంగన వచ్చుగానీ, రంగున్న ప్రతిచోటా నలుపే ఉండాలన్న నియమం
లేదు. అలానే గుణము, రంగు అన్నది కూడా. దీనిని బట్టేంతెలుస్తోంది పై మూడు పదములకూ
మూడు పదార్దములున్నవనే గదా! (అయితే మూడు పదాలకూ ఉన్న మూడు వేర్వేరు పదార్థములను
కనుగొనడమెలా అన్నది మీరే పరిశీలించండి. (పై మూటిలో ఒకటికంటే మరొకటి అధిక
దేశవర్తిగానో, న్యూన దేశవర్తిగానో ఉంటున్నది. గమనించండి.)
అలానే
పద్దతుల ననుసరించి ప్రమాణ నిర్వచనమూ, పరికరాల ననుసరించి ప్రమాణనిర్వచనమున్నూ చేయవలసి ఉంటుంది.
పరికరము (జ్ఞానేంద్రియములు) ఈ విధానంలో పనిచేయుట ద్వారా ఈ రకమైన జ్ఞానం కలుగు
తున్నది కనుక విధానము ననుసరించిన్నీ, ఈ రకమైన జ్ఞానమీ ఈ
యింద్రియము వలనే కలుగుంది కనుక ఈ జ్ఞానమునకీ యింద్రియం ప్రమాణమని పరికరముల
ననుసరించీ పేర్లు పెట్టబడ్డాయని లోగడ చెప్పాను. అదెలానో చూద్దాం. ప్రత్యక్షమూ,
అనుమానమూ, శబ్దమూ వగైరా...ఇలా కదా ప్రమాణాలకు
పేర్లున్నాయి. పరికరముల ననుసరించే ప్రమాణ పదార్ధాన్ని చెప్పవలసి వస్తే; నేత్రమూ,
శ్రోత్రమూ, ఇలా ఆ జ్ఞానేంద్రియాల పేర్లనే
చెప్పితే సరిపోతుంది. అప్పుడు వాటిచే కలుగుతున్న ప్రమలనూ క్రమంగా నేత్రప్రమ ఆకృతి,
రంగు మొదలైనవనీ, శ్రోత్ర ప్రమ.
శబ్దజ్ఞానమనీ... ఇలా ప్రమాణ వర్గీ కరణమూ, ప్రమాణ వర్గీకరణమూ
చేయవలసి ఉంటుంది. ఈ ఆరింటి ద్వారా కలుగుతున్న ప్రమనే ప్రత్యక్ష ప్రమ అన్నాము అంటే
ఇందాకే చెప్పుకున్నట్లు నలుపు, ఎరుపు, తెలుపు
పదములన్నీ రంగు అన్నమాటచే చెప్పుకున్నట్లు అవుతుంది. అయితే రంగు అన్న పదార్థానికీ,
ఎరుపు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా ఎలా గమనించామో, అలానే ప్రత్యక్ష మన్న పదార్థానికీ, కన్ను, ముక్కు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా కూడా గమనించాల్సి ఉంటుంది. ఎలా ఎరుపు
పద నిర్వచనం రంగుకు సరిపోదో అలానే ఇంద్రియం ప్రమాణమన్న నిర్వచనం ప్రత్యక్షమన్న
పదానికి సరిపోదు. కనుక ప్రత్యక్షమన్న పదం పరికరానికి పెట్టింది కాదు. ప్రత్యక్షంలో
పరికరాలు సామాన్యంగా ఉంటాయి. ఎలా ఎరుపు రంగు, నలుపురంగు
మొదలైనవో అలానే నేత్ర ప్రత్యక్షమూ, శ్రోత్ర ప్రత్యక్షమూ
మొదలగునవిన్నూ. ప్రత్యక్షంలో ఆరు యింద్రియములూ సామాన్యమై జ్ఞానం కలుగుతున్న పద్దతి
విశేషమైయుంటుంది. విశేషాన్ని బట్టే ఆయా పద నిర్వచనాలు చేయవలసి ఉంటుంది. లక్షణంలో
అసాధారణత్వం (అతివ్యాప్తి, అవ్యాప్తి అసంభవతలు లేని స్థితి)
ఉండి తీరాలి.
మరోకోణం నుండిన్నీ పరిశీలిద్దాం. ప్రత్యక్ష పదార్దమేదందాము? ఇంద్రియమా, ఇంద్రియములా? అనుభవంలో అనేక రకాల జ్ఞానము అనేక ఇంద్రియాల ద్వారా కలుగుతున్నది కనుక
ఇంద్రియములనాలి. అప్పుడు ప్రత్యక్ష ప్రమాణమని గాక ప్రత్యక్ష ప్రమాణములు అనాల్సి
వస్తుంది. అలానే అందామను కున్నా ఉన్న ఆరింద్రియాలూ ప్రత్యక్షంలోనే చెప్పబడ్డాయి
కనుక మరి అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? ప్రత్యక్షంలోని
ఇంద్రియాలనే చెబుదామంటే అది దోష యుక్త లక్షణమవుతుంది. కనుక వాటితో ఏ యింద్రియాన్నీ
మరో ప్రమకు కరణంగా చెప్పడం కుదరదు. మరి మిగిలిన ప్రమాణములెలా సిద్దిస్తాయి?
ఆలోచించండి. ఏ దృష్టినుండి ప్రమాణాలకు పేర్లు పెట్టుంటారో
తెలుస్తుంది. అన్ని ప్రమలకూ పరికరములు సామాన్యములే. పద్దతులే విభేదిస్తున్నాయి.
పరికరాలుండడమూ, పనిచేయడమూ అన్నంతవరకూ,
ఏర్పడితేగానీ ఏదో ఒక కార్యోత్పత్తి జరగదు. అనుభవమూ, జ్ఞానమూ
ఫలరూపాలే గనక అట్టి దేర్పడుటకు ఏదో పరికరం ఏదో క్రమంలో పనిచేయ వలసి ఉంటుంది.
పరికరాన్ని బట్టి ఫలితం మారితే అసాధారణత్వం పరికరంలోనూ, పని
తీరును బట్టి ఫలితం మారితే అసాధారణత పనిలోనూ, చూసి తీరాలి.
అట్టిదే ఈ విషయం కూడా. ఇంతా చేస్తే నా ప్రతిపాదన ప్రమాణ పదము ప్రకరణాన్ని బట్టి
పరికరాలకూ, పద్ధతికి కూడా వర్తిస్తుందనీ, ప్రత్యక్షాది ప్రమాణ పదములు విధానముల ననుసరించి ఏర్పడినవనీ మాత్రమే.
గమనించి అవసర మనుకున్న ప్రశ్నలు వేయండి.
గమనిక :- తర్కజ్ఞులైన శ్రీ మరింగంటి
శ్రీరంగాచార్యుల వారు వేసిన ప్రశ్నలను దృష్టి నిడుకునీ ఈ వివరణ లివ్వడం జరిగింది.
ప్రశ్న, తెలుసుకోడానికీ, పరీక్షించటానికి కూడా పనికివస్తుంది. ప్రమాణ, తర్కములను
క్రొత్తగా పరిశీలిస్తున్న వారి అవగాహనా సౌలభ్యతను దృష్టి నిడుకునో, విషయాన్నెలా నిర్ధారిస్తారో తెలుసుకుందామనో వారీ ప్రశ్న వేశారనుకుంటాను. ఏ
దృష్టి నుండి అడిగినప్పటికీ పరిశీలించే చెప్పవలసిన నాకూ,
పరిశీలించి నిర్ణయించు కోవలసిన మీకూ-పాఠకులకూ-కూడా మరింత అవగాహనకు ఈ ప్రశ్నావళి
తోడ్పడగలదు. ఈ సందర్భంలో పాఠకులుగానే ఉన్న మిగిలిన తర్కజ్ఞులనూ నేను కోరేదేమంటే
మీరున్నూ మీమీ కోణము నుండి విషయాన్ని పూర్వ పక్షం చేస్తే మరింత విశాలంగా, విస్తృతంగా ప్రకరణ విషయ క్షేత్రాన్ని దర్శించుటకు వీలవుతుంది. అందరూ
స్పందిస్తారనీ ఆశిస్తూ ప్రస్తుతానికీ వ్యాసం ముగిస్తాను.
చేదునిజాలు
ఆధ్యాత్మిక-తాత్విక-విద్యా కేంద్రాలు
ప్రథమవ్యాసంలో అధ్యాపకునికి (గురువుకూ)
విద్యార్ధికీ ఉండవలసిన అర్హతల గూర్చి చెప్పుకున్నాము. అత్యంత ప్రధానాంశమగుటచే
దానిని మరొక్కసారి గుర్తు చేసికొనుట అవసరము. తాను ఏ విద్యను తెలుప దలంచుచున్నాడో ఆ
విద్యా విషయాన్ని స్వానుభవము ద్వారా గ్రహించి యుండుట. ఆ విద్య విద్యార్ధియూ ప్రయోగ
రూపమైనదిగనూ, స్వానుభవంగానూ గ్రహించునట్లు ప్రేరేపించ గలిగియుండుట, బోధకునికి జ్ఞానపరమైన అర్హతగనూ, తెలసిన విషయాన్ని చెప్పాలన్న బాధ్యతతో కూడిన, చెప్పకుండా
ఉండలేని తనము హృదయ పరమైన అర్హతగనూ చెప్పుకున్నాము గుర్తున్నది కదా! అట్లే విద్య తన
అవసరంగానూ, తాను విద్యా గ్రహీతననియూ, బోధకుడు
విద్యా ప్రదాత అనియూ గమనిక కలిగి యుండటమూ పరోక్ష రూపవిద్యకూ ప్రత్యక్ష-స్వానుభవ
రూప విద్యకూ గల తేడాను గమనించి స్వానుభవ రూపంగా విద్యార్జన చేయు దృష్టి కలిగి
యుండటమూ, ఇప్పటికి ఏయే విషయ మెంతెంత తెలిసి ఉన్నదీ, ఎచ్చట నుండి తెలిసికొనుట ప్రారంభింప వలసియున్నదీ విస్పష్టంగా గమనించి
యుండటమూ విద్యార్దికి వివేక పరమైన అర్హతగనూ, తెలుసు కోవాలి
అన్న జ్ఞేయదృష్టి కలిగి, తెలిసికోకుండా ఉండలేను అన్నది హృదయ గతమైన అర్హ తగనూ
చెప్పుకున్నాము. అధ్యయనాధ్యాపనరూప జ్ఞానప్రక్రియలో శ్రమించ వలసిన యిరువురూ,
తగినవారుగా నుండిన గాని విద్యార్జనా-బోధనారూప ప్రక్రియ- సఫలంకాదు.
ఆగండి ఆలోచించండి, ఈ ప్రక్రియలో పాల్గొంటున్న యిరువురూ ఈ
విషయాన్ని గమనించి తమకు తామట్లున్నామో లేదో అనియూ, రెండవ
వారూ తగియున్నారో లేదో ననియూ సరిచూచుకోండి. ఇక్కడ సరి చేయబడక చేయు యత్నమంతా
శుద్ధదండుగ కాగలదు. గమనించండి.
అనేక మార్లు ఆంధ్రదేశంలోని ఆయా ఆశ్రమాలకు
వెళ్ళడమూ, అచ్చటి పరిస్థితులను అధ్యయనం చేయడమూ, ఇల్లూ సంసార
భాద్యతలువదలి ఆశ్రమాలకు చేరిన, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమాలకు తగిన వయస్కులనూ, కాషాయాంబర
ధారులను ఒక వంకా; ఆశ్రమాధిపతులనూ, ఆశ్రమకార్య నిర్వాహకులనూ,
ఆశ్రమ ప్రచురణలనూ వారి నిత్య కార్యక్రమావళినీ మరోవంకా పరిశీలించడం
ద్వారా నేను స్వయంగా గమనించిన అంశాలే ఇందులో ఎక్కువ భాగం చోటు చేసి కొన్నాయి.
పాఠకులలో ఎవరుగానీ నే చెప్పబోవు విషయాన్ని స్వయంగా పరిశీలించి చూసుకోవచ్చు. అలా
కాదంటే, నిర్ధారిత సత్యం వైపు ఖచ్చితంగా కదలాలి అన్న
నియమాన్ని అంగీకరిస్తే కలసి పరీక్షిద్దా రండి ఎవరైనా. 1) ఈ
రోజు ఆధ్యాత్మిక కేంద్రాలలో మార్గదర్శకులుగా (గురువులు) ప్రచారకులుగా నున్న వారిలో
ఒకరిద్దరిని విడిచితే దాదాపు అందరూ వారువారు చెపుతున్న విషయాలలో అనుభవశూన్యులే నన్నదోనగ్న
సత్యము. అంటే, తమకే తెలియని విషయాన్ని జిజ్ఞాసువులకూ
బోధిస్తున్నారన్న మాట. అలా ఎందుకు జరుగుతోంది? దీనిని అనేక
రకాలుగా పరిశీలించవలసి ఉంది.
A.
గురుస్థానాన్ని పొందాలి అన్న కోర్కె. దీనికి ప్రేరకం స్వార్ధమే దాని వల్ల సమాజంలో
గౌరవమూ, భోగమూ,
గుర్తింపూ, సంపాదనా కూడా ఏర్పడు తున్నాయి. శోచనీయమైన విషయమేమంటే వీరికి, జిజ్ఞాసువులకు
ఏమి బోధించాలి?
ఎంత బోధించాలి ? ఎవరికి బోధించాలి? అన్న వివేక
మేమీ ఉండదు, ఎందుకని? ఆయా విషయాల
పై వారికే సమగ్రమైన అవగాహన లేదుగనుకనూ, ఎదుటివాడికి అర్థమౌతుందా లేదా అనిగానీ, తగిన వారా,
కాదా అనిగానీ గమనించుట కంటే తానెంత తెలిసినవారో ఎదుటివారు గుర్తించాలన్న ఆతురతే
ప్రధానంగా ఉంటుంది గనుకనూ ఈ తరహావ్యక్తులు సందర్భశుద్ధి లేకుండగనూ, క్రమం
లేకుండగనూ, తాము
అక్కడక్కడా చదివిన గ్రంథాల నుండి ఏవో కొన్ని వాక్యాల్ని వల్లిస్తూ వుంటారు. వీరికి
తగిన అమాయకులకు సమాజంలో కొదువ లేదు గనుక వీరి చలామణి ప్రస్తుతం మూడు పూలూ, ముప్పై
ఆరు కాయలుగా సాగిపోతోంది. వీరి ననుసరించు వారు అమాయకులైన అజ్ఞానులు (గుడ్డివారు).
వీరు మాత్రం మాయకులైన గుడ్డివారు. “అంధేనైవ నీయమానాయధాంధాః” అన్న సూక్తి ఇట్టితరహా
గురుశిష్యుల నుద్దేశించినదే. మన పరిశీలనాంశంగా మొదట దీనినెందుకు
చెప్పవలసి వచ్చినది?
ఆధ్యాత్మిక కేంద్రాలలో అధిక భాగం ఈ కోవకు చెంది ఉంది
గనుకనే. ఈ విషయాన్ని చదువుతున్న మీలోనూ, భోధకులుగనున్న మరి కొందరిలోనూ, ఈమాటనలడానికి
తనకెంత సాహసం అనో, వాక్స్వాతంత్రముంది
కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా డనో అనిపిస్తూండవచ్చు. అయితే వాస్తవమేమిటంటే
మీరనుకుంటున్నట్లు దీనికి కొంత సాహసమూ, తెగింపూ అవసరమే ఐనప్పటికీ (యధార్ధ వాది లోక
విరోధి అవుతాడు కనుక) నామాటలు
అసంబద్ధమనిపించిన వారెవరితోనైనా కలసి విషయాన్ని నిర్ధారించుకొనుటకూ, నాది
అహేతుకారోపణగా తేలితే వినమ్రంగానే అట్టి ఆరోపణలను ఉపసంహరించుకొనుటకు కూడా నేను
సంసిద్ధుడనే కనుక అంతగా ఏ మాత్రము భయపడవలసిన పని నాకు లేదు.
ఆయా సంఘాలనూ, సంఘీయులనూ
పరిశీలించినప్పుడు మేము గమనించిన కొన్ని అంశాలు ఈ సందర్భంలో మీ ముందుంచడం అవసరం.
ప్రయోజనకరంగా ఉంటుందికూడా 1)ఒక స్వామి ఉపన్యాసం ఇలాసాగుతోంది. ఒక దొంగ, ప్రజలు తనను గుర్తించకుండా ఉండుటకు, సాధువేషం
వేసికొని తిరుగుతూ ఒక ఊరు వస్తాడు. గుడిలో మకాం చేస్తాడు. దొంగజపం చేస్తుంటాడు.
ఆలయానికి ఎచ్చటి నుండోమహాత్ము లొకరు వచ్చారన్న విషయం ఒకరినుండి ఒకరికి వ్యాపించి ఆ
వూరి ప్రజలు అతనిని దర్శించుకోటానికి రావటం ప్రారంభిస్తారు. కానుకలూ, మొక్కుబడులూ, బిక్షలు, దక్షణలూ, పూజలూ సేవలు చేయడం క్రమంగా
ప్రారంభమవుతుంది. దొంగ తనకు జరుగుతున్న సేవలూ, భోగాలు, సంపాదనా వీటిని చూసుకొని
ఆశ్చర్యపోతాడు. దొంగ బ్రతుకులో ఉన్న శ్రమకూ, భయానికీ,
యోగక్షేమాలకూ, ప్రస్తుత వేషంలో జరుగుతున్న
దానికీ తేడాను సమీక్షించు కుంటాడు. వెనుకటి జీవితములోని శ్రమకూ, ఫలితానికి ప్రస్తుత వేషంలో శ్రమకూ, ఫలితానికి ఉన్న తేడాను గుర్తించి
ఆశ్చర్య పోతాడు. దొంగ సన్యాసికే ఇంత గౌరవమూ భోగమూ లభిస్తుంది. ఇక అసలు సన్యాసి
కెంత ఫలిత మొస్తుందో గదా అని నిజమైన సాధువుగా మారతాడు. ఇది ఆరోజు ఉపన్యాస
సారాంశము. ఆ భోదకుడు ఈ కధను ఎవరి కొరకు, ఏ ప్రయోజనాన్ని
దృష్టినిడుకొని చెప్పిఉంటాడు? ఈ కధ శ్రోతలలో ఏ ప్రభావాన్ని
కలిగించదు అనలేము. మానవులలో సాధారణంగా వీలయినంత తక్కువ శ్రమచేసి అవకాశమున్నంత
ఎక్కువ ఫలాన్ని పొందాలన్న స్వభావం ఉంటున్నట్లు మీకైనా తెలుస్తుంది
పరిశీలించగలిగితే. పై కథ మనిషి లోని ఈ స్వభావానికి బలాన్నీ ఊపునూ ఇవ్వగలదు. ఇలాంటి
కథలచే ప్రేరితులయిన వారే ఈనాడు ఆశ్రమాలలోనూ ఆధ్యాత్మిక క్షేత్రాలలోనూ ఉంటున్నారు.
నిన్న సాధకునిగా రంగప్రవేశం చేశాడు. నేడు సిద్ధావస్థ నాది అనుకున్నాడు. మూడవ నాటికి
గురువుగా ముద్రవేసుకొంటున్నాడు. ఆ పై అతడు చేస్తున్నదేమిటో గమనించగలరా? ముందుగా శిష్య పరమాణువులను ఆకర్షించుయత్నము, పిదప ఆశ్రమ నిర్మాణము, ఆ పై
ఆశ్రమానికి నిధుల సేకరణ, అనేక మందిరాల, భవంతుల నిర్మాణ యోచన, అంతరంగిక శిష్యులనే పేర సేవకుల
సమీకరణ, ఆ పై కొంతకాలం
ఆస్వామి వారిని సమీపము నుండి నిత్యమూ గమనిస్తున్న అంతరంగిక శిష్యపరమాణువుల
యత్నారంభము. దేనికనుకుంటున్నారు? తానూ ఒక గురువు కావటానికి. ఆ పై ఆశ్రమ నిర్మాణమూ, నిధుల
పెంపు... ఇదీ వరుస. ఇదే వరుస. ఆశ్రమానికి వచ్చిన శిష్యరూప మానవుడు ఆశిస్తున్నదిదే.
జీవితాన్ని క్రమబద్ధమూ, శాంతియుతముగా తీర్చగల జ్ఞానము కొరకు గాదు. రేపు గురువు
కావడానికి, ప్రచారానికి తగిన శక్తి సమకూర్చుకోడానికి,
కీర్తి, భోగమూ, వనరులూ సంపాదించు కోవడానికి
కావలసిన మెలకువలు నేర్చుకోడానికి మాత్రమే.
ఏదో
సాధించాలని అమాయకంగా యిల్లు విడచి తమను చేరిన వారికి ఆశ్రమాధిపతులున్నూ తగిన
బుద్ధిగరపి యిండ్లకు పంపడమో, అర్హతననుసరించి విద్యనూ, సాధనలనూ అభ్యసింప జేయుటయో
చేయక, వ్యక్తులు-వినయంగానూ, జీతం
తీసికోకుండానూ, సేవచేయువారు - లభించిందే చాలుననుకుని బైటికి
మాత్రం వాళ్ళను ఉద్ధరించే వాళ్ళమని ప్రకటించుకుంటూ, మరో వంక
వచ్చినవాళ్ళు వెళ్ళిపోతారేమో ననుకుని వారికో భ్రమనూ కల్పిస్తుంటారు. ఇల్లు విడచి
ఆధ్యాత్మిక కేంద్రాలకు రావాలంటేనే ఎంతో అసాధారణులై ఉండాలనిన్నూ, ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉండాలనిన్నూ, ఏదో పొరబాటున గత జన్మలో ఈ మార్గం
విడచి ఉంటారనీ, యీ జన్మలోనై నా మరల ఈ దారి విడువకుండా చచ్చేలోపే గమ్యాన్ని
చేరుకోండనియూ బోధిస్తారు. ఆ మంత్రం కూడా పనిచేస్తుందో చేయదో నన్న భయంతో అర్హత,
అనర్హతలన్నవి చూడకుండానే బోడి కొట్టించి కాషాయం తగిలిస్తుంటారు.
మోక్షమేమో గానీ బంధం మాత్రం తగులుకుంది. అది బ్రతికున్నంత కాలం వదలదు అన్న
విషయాన్ని గమనించ లేరీ అమాయకులు. ఎలా ఉంది గురుస్వాముల ఎత్తుగడ? చేరిన వారు కూడా కొంత కాలానికిటువంటివీ, ఇంత కంటే
శక్తివంతమైనవీ అయిన కిటుకులను తమ పబ్బం గడుపుకుంటానికే సుమండీ స్వానుభవం ద్వారానూ,
అభ్యాస రూపంగానూ నేర్చుకుంటారు. సమాజాన్ని -అమాయకులను ఆకట్టుకునే
విద్యలో ప్రావీణ్యులౌతారు. తన ప్రావీణ్యతపై తనకు ఏమాత్రం విశ్వాసం కల్గినా ఇక
అక్కడ నిలువరు. అప్పుడేమతుంది? లోకానికింకో గురుమూర్తి
లభించాడన్న మాటే. ఏదో చోట మరో ఆశ్రమం వెలసిందన్న మాటే. ఇక అక్కడ వారికి ప్రథమ
శిష్యులు కాదగ్గ వెంగళప్పలంటారా? రెడీగానూ, దండిగానూ కూడా ఉన్నారుగదా! ఈరకమైన బాధ గురువుల బాధ సమాజానికి రోజు రోజుకూ
అధికం కావడానికో ప్రధానమైన వనరు సమాజంలోనే ఉంది. అదేమిటో ఆలోచించగలరా? వీరిని తాము మోస్తూ, సమాజంచేత కూడా మోయిస్తుంది
సమాజం లోని విద్యాధికులూ, ఏదోరకమైన అధికారమో, ఆర్థిక వనరులో
ఉన్న వారై ఉండడమే. సమాజం కూడా ఆ ప్రచారకుని జ్ఞాన సామర్థ్యమెంత? జీవితం ఎలావుంది? ఆన్న దృష్టినుండి కాక, అతని కెంత మంది శిష్యులున్నారు? అందులో ఎందరు
డాక్టర్లూ, రాజకీయనాయకులూ ఉన్నారు? ఆశ్రమాలెన్ని
? ఎంత పెద్దవిగానున్నాయి? గొంతెలా ఉంది?
సంగీతం వచ్చా? పిట్ట కథలు చెప్పగలడా? జోకులు వేసి నవ్వించగలడా? ఇలాంటి కొలతలను బట్టి అతడెంత
పెద్దస్వామో, జ్ఞానో, సాధువో, సంస్కర్తో నిర్ణయించుకుంటున్నారు. కొలత లిలాఉంటే, ఈ
కొలతల ద్వారా ఆ స్వామి గొప్పదనాన్ని నిర్ణయించి, ప్రచారం
చేసే వ్యక్తులకు, అసలు విషయంలో - ఆధ్యాత్మ విద్యలో-
కొద్దిపాటి పుస్తక పరిచయమో, అక్కడక్కడా విన్న చౌచౌ జ్ఞానమో
ఉంటోంది. ఆయా స్వాములు కూడా ఏరికోరి యిట్టివారినే వెదుక్కుంటుంటారు. తమ
పబ్లిసిటీకీ, తమ తమ (స్వార్థపూరితమూ – అజ్ఞానయుతమునైన) లక్ష్యాలు [శిష్యులను పెంచుకోవడం, ఆశ్రమాన్ని పెంచుకోవడం, ఆర్థిక వనరులను కూడగట్టు కోవడం, వీలయినంత సోమరులుగనూ,
భోగలాలసులుగనూ జీవించడం ఇలాంటివే వారి లక్ష్యాలు దాదాపుగా]
సాధించుకోవడం ఇట్టివారివల్లే సాధ్యపడుతుందని వారికి బాగా తెలుసు.
మరో
వంక ప్రజలు కళ్ళు తెరిస్తే తాముండరు గనుకనూ, తమ పబ్బం గడవాలంటే వారికళ్ళు
తెరువబడకూడదు గనుకనూ అందుకు తగిన మంత్ర తంత్రాలు [ క్రొత్త క్రొత్త మెళకువలూ – ప్రణాళికలూ] కనిపెట్టి ప్రయోగిస్తుంటారు. (వందల
సంఖ్యలోని ఆశ్రమాలనూ, వేలసంఖ్యలోనున్న బోధకులనూ, ప్రచారకులనూ లెఖ్ఖలోనికి
తీసుకుంటే, ఏ సాయిబాబానో-ఏ రామకృష్ణ మిషన్ లాంటి సామాజిక సృహ
ఉన్న సంస్థలో తప్ప మిగిలిన వేవీ సామాజిక సృహకలిగి లేవన్నదో చేదు నిజం.) వారికున్న
సామాజిక సంబంధాలల్లా ఏమీ యివ్వకుండా మాటలు చెప్పి సమాజాన్నెంతవరకు పిండుకోగలమన్న
దృష్టికి చెందినవి మాత్రమే. ఈ రోజు ఏమి ఉపన్యాసం చెబుదాం? దాని
ద్వారా ఎందర్ని ఆకట్టుకోగలం? అందువల్ల వెంటనే ఎంత ముడుతుంది.
భవిషత్తులో ఏయే మార్గాల ద్వారా ఎవరెవరి
నుండి ఎంతెంత రాబట్టగలం, ఇదే గురురూపధారులైన
ప్రచారకులలో నున్న ప్రధాన యోచన. వారి రకరకాల ప్రబోధాల వెనుక, ప్రయత్నాల వెనుకనున్న ప్రేరణ శక్తిఇదే. పిచ్చి సమాజం?లో ఎవరైనా మాయింటికి దయచెయ్యండి స్వామీ అనడం ఆలస్యం.....ఆ అవకాశం ద్వారా
ఎంతెంత? ఏమేమి ?ఎలా? సాధించుకోవాలో, దానికి
తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయి. అలానే ఆయా ప్రచార సమయాల్లో స్వాములు విడిది
చేసేది ఎక్కడనుకుంటున్నారు? యదార్థ సాధకులూ, భక్తులూ, జిజ్ఞాసువులూనైన వారిళ్ళలో ననుకుంటే మనం
పొరబడినట్లే. బలిసిన, తమ అవసరాలన్నీ తీర్చగల వారిళ్ళలో మాత్రమే. ఉపన్యాసాల్లో
మాత్రం కృష్ణుడు విదురుని యింటిలో మాత్రమే విశ్రమిస్తాడనీ, దుర్యోధనుని
యింటిలో కోరినా ఉండడనీ, పెట్టేవాని హృదయాన్ని బట్టే అరటి
తొక్కలై నా తింటాడనీ, హృదయం మారితే గుజ్జు కూడా ఊసివేస్తాడనీ
చిలక పలుకులు చెపుతుంటారు. ఇక్కడ ప్రజల నేమనడానికీ నోరురావడం లేదు. వారి పక్షాన
అమాయకత్వమూ, అజ్ఞానమూ, ఉంది కనుక.
ఇక్కడో
విషయం చెపితే సందర్భోచితంగా ఉంటుంది. రోడ్డు మీదో గృడ్డి వాడు, తాను గృడ్డివాడిననీ, సహాయం చేయండనీ, దారి చూపి రోడ్డు దాటించండనీ అడుగుతున్నాడు. మరో గృడ్డివాడు మాత్రం దారి
తనకు స్పష్టమేననీ, తన ఆశయం గృడ్డి వారికి దారి చూపి, రోడ్డు దాటించడమేననీ, అందుకే అక్కడ ఉంటున్నాననీ,
ఆ పనిలోనే జీవితాంతం ఉండిపోతాననీ నమ్మబలుకుతూ, నడిపిస్తున్నాడు. జరుగుతున్నదిదే నిదానంగానూ- ఆవేశ పడకుండానూ ఆలోచించి,
పరిశీలించి చూసుకోండి. అందువల్ల మీకే మేలుకా గలదు.
మీరు నన్నిక్కడో ప్రశ్న వేయవచ్చు. మేము గృడ్డి వాళ్ళమన్నావుకదా! సరే అలానే అనుకుందాం. మరి మేము ఎదుటి వాడు తగిన వాడో, కాదో గమనించుట ఎట్లా? ప్రశ్న చాలా క్లిష్టమైనది గానూ, సమాధానం అసాధ్యంగానూ అనిపిస్తోంది కదూ? అయితే వాస్తవంగా అంత కష్టమేమీ లేదిక్కడ. ఎందుకంటే, మీరు పుట్టి గృడ్డివారైతే మాత్రం మీ ప్రశ్నకు సమాధానం లేదు. అయితే మీరు నిజంగా కళ్ళు లేని వారుకాదు, అనేక సంవత్సరాలుగా, అనేక పద్దతుల -యుక్తుల ద్వారా, అనేక మంది స్వార్ధపరులచే మీకళ్ళు కుట్టి వేయబడ్డాయి. అంతే. ఇదినిజం. కనుక దృఢయత్నం చేయగలిగితే, మీకు మీరే చూడాలని నిశ్చయంగా నిర్ణయానికి రాగలిగితే, మీరు కళ్ళు తెచ్చుకోవలసిన పని లేదు. కుట్లు తెంచుకుంటే చాలు. కనురెప్ప తెరిస్తే చాలు, కళ్ళున్న వారే మీరంతా. చూడ గలిగిన వారే అంతా. అభిప్రాయాలూ-సందేహాలూ స్పందనకు వాయండి. మరికొన్ని చేదు నిజాలుపై సంచికలో మనం మ్రింగవలసి ఉంది.
సశేషం.
సంక్రాంతి -
విప్లవ - సందేశం :-2
సంక్రాంతిని గూర్చి మరికొంత
చెప్పుకుంటేగాని విషయాన్ని చూడవలసి నంతా చూసినట్లు కాదు. వ్యక్తిలో మార్పు
తీసికొని రావడం ద్వారా స్థితి గతులను మార్చాలన్నది సంఘహితైషులైన మేధావులలో ఒక
వర్గం వారి పోకడగా ఉంది. వీరినే వేదాంతులు - ఆధ్యాత్మిక విద్యా వివేకం కలవారు -
అందాము. మరోరకం వారు సామాజిక మార్పునే నేరుగా సాధించవచ్చుననీ, ఆ మార్పులో భాగంగానే వ్యక్తీ మారతాడని
భావించారు. భౌతిక వాదాన్నాధారంగా తీసికున్న తాత్వికులీ మార్గాన్ని ప్రధానంగా
అనుసరించారు. వీరి ధోరణులలో కాలగతి ననుసరించి అనేక మార్పులు సంభవించాయి. ఈ వర్గం
వారిలో కొందరు తమ వాదానికాధారంగా - పరిణామ వాదాన్ని స్వీకరించారు. భౌతిక గతి
తర్కాన్ని ప్రాతి పదికగా తీసికుని సమస్యను మదింపు చేసి పరిష్కారాలకై ప్రణాళికల
నేర్పరచుకున్నారు. ఈ సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పరచుకున్న ప్రణాళికల ననుసరించి
ఉద్యమాలను సాగించారు. అట్టి యత్నాల నుండే, అనూహ్యంగానైనా - ఈ తాత్వికుల అంచనాల
ప్రకారం విప్లవం ముందుగా రావలసినచోట గాక - రష్యాలో రాజకీయ విప్లవం సాధింపబడింది.
దానిని స్ఫూర్తిగా తీసికొని క్రమంగా అనేక దేశాలు అదే తరహా విప్లవానికై ఉద్యమించడమూ,
విప్లవాన్ని సాధించడమూ కూడా జరిగింది. ఈ చారిత్రక వాస్తవాన్ని మనం
కాదనలేము. అయితే ఆ పిదప జరిగిందేమిటి? గతి తార్కిక సూత్రాల్ని
మార్క్సు, ఎంగెల్సులు సమాజానికి అన్వయించిన తీరును బట్టి ఒక
ప్రాంతంలో వచ్చిన విప్లవం క్రమంగా ప్రపంచమంతా వచ్చితీరాలి. రష్యా విప్లవం వచ్చిన
క్రొత్తల్లో మార్క్సు చెప్పినట్లుగానే అంతా ఋజువౌతూ వస్తుందన్న అపోహ చాలా
మందిలో (వారూ మేధావులే - సంఘహితైషులే
సుమండీ మచ్చుకు M. N. రాయ్) ఏర్పడ
సాగింది. అట్టి భావం దృఢపడే, మార్క్సిజం శాస్త్రాలకే
శాస్త్రం అన్న నానుడి కూడా ఏర్పడింది జన సామాన్యంలో. అలా కొంత కాలం దేశం వెంబడి
దేశం కమ్యూనిస్టు సిద్ధాంత ధోరణి వైపు ప్రయాణించి కమ్యూనిష్టు దేశాలుగా
మారిపోయాయి. కొంతకాలం గడచింది. ఇక్కడో విషయం గమనించాల్సి ఉంది. మార్క్సు ఎంత
మేధావియైనా, సమాజ హితాన్ని గూర్చి నిరంతర వేదన కల సహృదయుడైనా
తన సిద్ధాంత ప్రతిపాదనలో అంత ప్రధానం కాదని విడచి పుచ్చిన, వ్యక్తి
యిష్టాయిష్టాలూ, మానవ స్వభావము అన్న అంశమే (ఆయన సూచించిన
పరిణామ క్రమంలోని గత తార్కిక నియమాలలో ఒక దానిని అనుసరించే) క్రమంగా పరిమాణాత్మక
మార్పు నుండి గుణాత్మక మార్పు పొంది, కమ్యూనిజానికే వ్యతిరేక శక్తిగా రూపొందింది.
వ్యక్తి పాత్ర ఇంత శక్తివంతమూ, ప్రధానమూ అని మాత్రం మార్క్సు
ఊహించలేదు. వ్యక్తి అవసరాన్ని గుర్తించినా అది ఇంత గణనీయమైన పాత్ర వహించగలదని వారు
భావించలేదు. భావించి ఉంటే ఆ పాత్రను చిన్న పరికరంగా కాక గుణాత్మక మార్పు తేగల
నిమిత్త కారణంగా అంగీకరించి ఉండేవాళ్ళు. ఎందుకలా అంటున్నానంటే మార్క్సు, ఎంగెల్సు లాంటి వారెవరైనా, వారే సిద్ధాంతానికి
ప్రాతినిధ్యం వహిస్తున్నా వారందరలోనూ మౌలికంగా కొన్ని సామాన్య గుణాలుంటాయి.
నిజాయితీ, అందరి హితమూ, పదిమందికై తమను
తామర్పించుకోడమూనన్న వే అవి. ఆస్థాయికి చెందిన హృదయ పరిపక్వత కలవా రెవ్వరూ తెలిసి
తప్పు చేయరు. పది మందికీ అపకారం చేయాలన్న ఆలోచన వారి కుండదు. రాదు కూడా. “ప్రమాదో
ధీమతామపి”-హ్యూమన్ ఎర్రర్ – అన్న దో వాస్తవమని గ్రహించ గలిగితే వారు పొరపడ్డారని మాత్రం గమనించగలం. వారు పొరబడ్డారా
విషయంలో అని గమనించడం, వారి వ్యక్తిత్వాన్ని గమనించడం, అన్నవి రెండు వేరు
వేరు అంశాలు. జిజ్ఞాసువూ, విమర్శకుడూ కూడా ఈ తేడాని గమనించడం
చాలా అవసరం. ప్రతి సిద్ధాంత పరిశీలనలోనూ ఈ రెండు విషయాల్నీ దృష్టినిడుకొనాలి. (1) అతని సిద్ధాంత విషయ పరిశీలన, (2) అతని వ్యక్తిత్వ-హృదయ – పరిశీలన. పరిశీలకులీ స్థాయిని చేరి పరిశీలన చేయ గలిగితే
ఆయా సిద్ధాంతాలు దోషా దోషాలు గమనించినా ఆయా వ్యక్తులపై గల రాగ ద్వేషాలు క్రమంగా
తగ్గి పరిశీలనలో తులనాత్మకత ఏర్పడుతుంది. జ్ఞానార్జనకూ, పరీక్షకూ కూడా తులనాత్మకతే ప్రాణం వంటిది.
సరే.
మరికొందరు, చైతన్యం యొక్క నియంత్రణే సమస్త
మార్పులకూ-సామాజిక విప్లవానికి - ఆధారం అన్న ధోరణి కలవారు. వీరిని భావ వాదులందాము.
వీరిలో ప్రకృతికతీతంగా ఒక చైతన్యముండి సమస్తాన్ని నియంత్రిస్తున్నదనుకునే వాళ్ళూ;
అసలు ప్రకృతే లేదు ఆలోచనకు భిన్నంగా భౌతిక అస్థిత్వమే లేదు అనుకునే
వాళ్ళూ ఉన్నారు. ఈ సిద్ధాంతాన్ననుసరించడం ద్వారా వ్యక్తి గతంగా వారేమి సాధించ
దలచుకున్నారో, సమాజంలో దానిని స్థాపించడం ద్వారా ఏమి
ప్రయోజనం కలుగుతుందని చెప్పగలరో నా వరకు నాకేమి అంతుపట్టడం లేదు. జీవితమే అసత్యమూ – లేనిదీ అనే వాళ్ళ భ్రమస్థాయి ఏ యితర భ్రమలకన్నా ప్రమాదకరమూ, బలీయమూ కూడా. ఈ భావ వాదులలో అనేక రకాల
వాళ్ళున్నా, వ్యక్తిని సమాజమూ, ప్రకృతి
కూడా గణనీయంగానే ప్రభావితం చేయ గలవన్న సృహే ఉండదు, నిజ జీవితంలో ప్రభావితులౌతూనే
ఉన్నా, ఆశ్చర్యంకదా!? కొందరు అదొక అంశంగా గమనించినా
దానికీయవలసినంత ప్రాధాన్యతను మాత్రం యివ్వరు. ఎలా మార్క్సు మొదలగువారు వ్యక్తి
పాత్రను తగినంతగా స్వీకరించ లేక పోయారో అలానే.
వ్యక్తి, సమాజమూ పరస్పర ప్రేరితాలన్న వాస్తవాన్నీ,
పదార్థం మనిషి పై చూపే ప్రభావానికీ, భావం
మనిషి పై చూపుతున్న ప్రభావానికి ఉన్న తేడానూ, సక్రమంగా
మదింపు చేస్తే గానీ గతంలోని ఈ రెండు ధోరణులూ సమగ్ర విప్లవాన్నెందుకు సాధించలేక
పోయాయో కొంతవరకైనా తెలియబడదు. ఒక్క విషయాన్ని చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. పాఠకుల
నుండి వచ్చే స్పందనను బట్టి పై సంచిక లోనూ ఈ శీర్షికనే కొనసాగించడమో, స్పందన,
ప్రతిస్పందన ద్వారా కలవడమో చేద్దాం .
Note: (1) ప్రకృతిలో
వస్తున్న మార్పు- అందుకు జరుగుతున్న పని.
(2) మనిషి కోరుతున్న మార్పు-అందుకతడు
చేస్తున్న పని.
(3) మనిషి కోరదగిన-రాదగిన మార్పు-
అందుకతడు-మనం చేయ వలసిన పని. ఇదే ఈనాడు తాత్వికులూ, జిజ్ఞాసువులూ,
సాధకులూ, పరిశీలించ వలసిన, సరిచూసుకోవలసిన, అమలుపరచ వలసిన అంశాలు. ఈ క్రమమే
సమగ్ర విప్లవానికి-వ్యష్టి, సమష్టి యోగ క్షేమములకు హామీ
వున్న స్థితికి-ఆలంబన కాగలదు. ఆలోచించండి. ఆలోచింపజేయండి. ఆచరించండి-ఆచరింపజేయండి.
ఉంటాను. సెలవ్
సంక్రాంతి విప్లవాభినందనలతో,
సత్యాన్వేషణలో,
మీ సురేంద్ర.
-:గమనికలు:-
(1) వ్యక్తిగా పెరగదలచుకున్నవారూ, వ్యక్తిత్వం
పెంచుకో దలచుకున్న వారూ, సమాజంలో తన పాత్ర సమర్థవంతంగా
పోషించ దలచుకున్న వారూ తనను గురించిన రెండు విషయాన్ని చక్కగా గమనించుకోవాలి
(1) తమలో ఇప్పటికి వుండకూడని గుణాలేమేమి ఉన్నాయి, ఉండవలసినవి ఏమేమి లేవు అన్నది ఒకటి. రెండో విషయం(A)
ఉండవలసిన వాటిలో, ఇప్పటికి ఉన్న గుణాలను అప్పుడప్పుడూ గుర్తు
చేసుకుంటుండాలి. అది ఆతనిలో ఉత్సాహాన్నీ, తృప్తిని
కలిగిస్తుంది. (B) ఉండకూడని వెన్నున్నాయో, ఉండవలసినవెన్ని లేవో అన్నది మాత్రం ఎప్పటి కప్పుడు ఎప్పుడూ గుర్తు
చేసుకుంటూ ఉండాలి. అది అతనిలో వికాసాని కవసరమైన అశాంతినీ, అసంతృప్తినీ
కలిగించి అతణ్ణి సాధన దిశ వైపు మళ్ళిస్తుంది. విషయాన్ని చక్కగా పరిశీలించి అవగాహన
చేసికోండి. అమలు చేయండి. ఈ మార్గంలో పోవువారు ఎదగక పోవడ మన్నది లేదు. ఈ క్రమాన్నే
మీరూ, నేను ఆనగా అందరమూ అనుసరించ వలసియున్నది.
నాయనలారా!
సాధన చేయా లనిపిస్తున్నదా? ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ విషయం గుర్తుకొస్తున్నదా? ఏది
సాధించాలను కుంటున్నావో అది సాధించకుండా ఉండ లేవనిపిస్తున్నదా? అయితే
సాధకుడవడాని కర్హత ఏర్పడినట్లే. అట్లుగాక సాధన చేయకుండా ఉండలేనంత తపన కలుగనట్లైతే మాత్రం
సాధకునికి కావలసిన హృదయ పరిపక్వత ఏర్పడనట్లే. మిమ్ము మీరే గనునించుకుని ఒక
నిర్ణయానికి రండి.
(3) అలాగే
జిజ్ఞాసువులూ,
లోక హిత కాంక్ష గల మేధావులు కూడా వారి వారి ఉద్దేశ్యాలను
నెరవేర్చుకోకుండా ఉండ లేనంత తపన కలిగితే మాత్రం హృదయం సిద్ధమైనట్లే, అప్పుడే అది
వారిలో క్రియాశీలతను రగుల్కొల్పుతుంది. ఇంకా అలా అనిపించడం లేదంటే మాత్రం వారింకా
యదార్ధ జిజ్ఞాసువులుగనో, నిజమైన సంస్కర్తలూ, ఉద్యమకారులుగనో
తయారవలేదన్న మాట. ఎవరంగీకరించినా , అంగీకరించకున్నా నిజం నిజమే నన్నది
గమనించి పై చెప్పింది వాస్తవమో కాదో కూడా గమనించండి. వాస్తవాన్ని స్వీకరించి
అందరమూ అమలు చేయగలుగుదుము గాక!
No comments:
Post a Comment