Wednesday, June 9, 2021

మేలుకొలుపు 13

మేలుకొలుపు

సంపుటి-2                                         సంచిక-3                                               1-3-92

ప్రమాణ వివేచన  4

 మానవ జీవితానికి గల తర్కావశ్యకతను గురించీ, దానిని ఒక విద్యగా నేర్వవలసిన అవసరాన్ని గురించీ ప్రతి సంచికలోనూ కొద్దికొద్దిగా పరిశీలిస్తూనే వస్తున్నాము. దానికే చెందిన మరికొన్ని వివరాలున్నూ ప్రస్తావిస్తున్నాను పరికించండి. ఏ విషయాన్ని గూర్చి తెలుసుకుందా మనుకుంటున్న వారైనా ముందుగా ఆ విషయాన్ని గూర్చి అప్పటికేమయినా సమాచారం అందుబాటులో ఉందేమో చూస్తాడు మామూలుగా. మీకే ఒక విషయాన్ని గురించి తెలిసికోవా లనిపించిం దనుకోండి. ఏo చేస్తారు? ఆ విషయం తెలిసిన వారెవరైనా ఉన్నారా? అని విచారిస్తారు. వారిని కలసి వీలైనంత సమాచారాన్నిసేకరిస్తారు. వాటిని లోతుగానూ, నిదానంగానూ పరిశీలించి దోషాదోషాలు విశ్లేషించి స్వానుభవంలో అవెట్లున్నాయో సరిచూసుకుని ఒక నిర్ధారణకు వస్తారు. సాధారణంగా ఎవరైనా యిలానే చేస్తారు. ఈరోజు విశ్వవిద్యాలయాలలో విశేష జ్ఞానరూపమైన పరిశోధనలందు సిద్ధాంత వ్యాసాలు ప్రతిపాదించే అధ్యయన శీలురున్నూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రాచీన మేధావులున్నూ జిజ్ఞాసువులకీ క్రమాన్నే బోధించారు.

గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరఃI

ఫలాలమివ ధాన్యార్ధీ త్యజేద్గ్రంథమశేషతః.II

జ్ఞాన విజ్ఞానములను లక్ష్యముగా నెంచిన మేధావి ముందు గ్రంథాధ్యయనం చేయాలనీ, ఏదో ఒక రోజు-అది అనుభవజ్ఞానం పొందిన రోజే-గ్రంథాదులను ఆమూలాగ్రం విడువవలెననీ శ్లోక తాత్పర్యం. మరో విషయం. తర్కమే జ్ఞానగమ్యమనో, తర్కం జీవితానికంత ప్రధానమైనది కాదనో తలచే రెండు దృక్పథాలూ, భ్రమాత్మకాలే. మరో శోచనీయమైన విషయమేమంటే మానవజీవితంలోని వివేక భాగాన్ని సమగ్రమూ, సమర్ధవంతమూ చేసికుని తద్వారా జీవనాన్ని ధార్మికమూ, సుఖశాంతియుతముగా నడుపుకొనుటకుగాను వినియోగించుకోవలసిన తర్కమును నేడు కేవల మొుక జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు తర్కం నేర్చినవాళ్ళు. ఇప్పుడు నేర్చుకునేవాళ్ళున్నూ వృత్తిగానే (ఉద్యోగ సముపార్జనకే) నేర్చుకుంటున్నారు. నిజంగా తర్కం కేవల మొక పొట్టకూటి విద్యకాదు. కారాదుకూడా. వివేకమన్నది జ్ఞాన నేత్రంగా చెప్పుకుంటే, దానిని తయారు చేయటానికి తర్కం నిమిత్త కారణమవుతుంది. అనుభవం ఉపాదాన కారణమవుతుంది. తర్కానికి ప్రారంభం ఏదేని విషయములో అనిశ్చిత స్థితి ఉండడమే. సంశయమే విచారణకు మూలం. ఈ వాస్తవం తర్కశాస్త్రంలోనూ ప్రస్తావించబడింది. సంశయించక పరీక్షించుటే కుదురదు కనుకనే న్యాయదర్శనంలోనూ పదార్థ పరీక్ష సంశయంతో ప్రారంభమవుతుంది. ఈ వాస్తవాన్ని ఆస్తిక సాంప్రదాయకులెందుకు గమనించరో, గమనించామని ఎవరైనా అంటే మరి వారివారి సిద్ధాంత పరీక్షకెందుకు సిద్ధపడరో నావరకు నాకు బోధపడని విషయం. ఈ మాటెందు కనవలసివస్తోందంటే, ముఖ్యమైన అన్ని సిద్ధాంతాలవాళ్ళూ తర్క ప్రావీణ్యులే అయినప్పటికీ, అన్ని ఆస్తిక సిద్ధాంతాలకూ ప్రాతిపదిక విశ్వాసమే అయి ఉన్నది. పరస్పర విరుద్ధములైన ఈ రెంటికీ వారికి సమన్వయం ఎలా కుదిరిందో అర్థం కాని విషయం.

Note:-ఏ విషయమైనా ఒకనికి అది విశ్వాసంగా ఉన్నంతవరకు అతనికి దానిని గురించిన తెలియనితనం ఉన్నట్లే. ఒకవేళ ఎప్పటికైనా ఎవరికైనా దానిని గురించిన జ్ఞానం అనుభవం కలిగిందంటే ఇక ఆ విషయమై అతనికి విశ్వాసమన్నది లేదు. తెలిసే ఉంది కనుక. విశ్వాస మూలకములైన సిద్ధాంతానుయాయు లుపయోగించు తర్కము విశ్వాసానికి-తెలియనితనానికి-అనుయాయియై తన స్వీయ స్వభావాన్నే కోల్పోతుంది. ఈ విషయమూ ముందుముందు విశేష చర్చనీయాంశం కాబోతోంది కనుక ప్రస్తుతానికిదీ ఒక చర్చనీయాంశమే నన్నది గుర్తులో ఉంచుకోండి చాలు.

తర్కం మానవ మేధో ప్రక్రియలో- మెదడు చేసే పనిలో- భాగంగా సహజంగానే ఏర్పడియుండగా దానిని నేర్పడమూ, నేర్వడమూ ఎందుకన్న పక్షాన్ని గూర్చి గతంలో కొంత విచారించాము.

వారినీ, వారి వాదనా సబబుగానే ఉందనుకునే కొందరు పాఠకులనూ, దృష్టి నిడుకుని క్రింది విషయాలు వ్రాస్తున్నాను. (1) ప్రతి మనిషికి కాళ్ళూ, చేతులూ ఉన్నాయి. అవసరమైతే ఆత్మరక్షణకు వాటిని ఉపయోగించడమూ ప్రతి మనిషికి తెలుసు. మరింక ఆత్మరక్షణ విద్యలంటూ నేర్వడమెందుకు? నేర్పడమెందుకు? అలానే ఇప్పటి వరకు మానవ సంఘంలో పుట్టి పెరిగిన అన్ని విద్యల విషయం తోనూ మొదటివాడికి గురువేడీ అని అడిగి, వీటిని ఎవరికి వారే సాధించుకోవచ్చు, అని తర్కబద్దంగా వాదించవచ్చు. అది ఒకరకంగా నిజమూ కావచ్చు. వీటిని ఎవరికి వారే నేర్వవచ్చు. అయినా అవన్నీ నాటినుండి నేటివరకు విద్యారూపాలుగా నేర్పబడుతున్నాయి. నేర్వబడుతున్నాయి, కనుక, వాటిని ఎవరికి వారే నేర్వవచ్చు వాటికై విద్యాలయాలూ, బోధనలూ, నిరర్ధకమనడం వివేకవంతం కాదు. అదలా ఉంచి, సాంప్రదాయక తర్కాన్ని పరిశీలించవలసిన-నేర్వవలసిన అవసరం లేదనుకునే వాళ్ళకు నేచెప్పేదేమంటే ఈ అంశాన్ని పరీక్షకు పెట్టి చూసుకోండి. ఒక్క ఆరుమాసాలు నిజమైన విద్యార్థిలానో, నిష్పాక్షిక పరిశోధకుని లానో ప్రాచీన తర్కాన్ని-తర్క విద్యను-అభ్యసించండి. పూర్తయిన పిదప ప్రారంభానికి ముందున్న బుద్ధి వికాసానికీ, ప్రస్తుత జ్ఞాన స్థాయికి తేడా ఉందో లేదో చూసుకోండి. విషయం పరిశీలనా సామర్థ్యంలోనూ, విషయజ్ఞతలోనూ అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉందో లేదో గమనించండి. అలా చేయుటవలన విషయాన్ని అనుభవం ద్వారా పరీక్షించినట్లౌతుంది.

Note- : కలిగిన జ్ఞానం సత్యమా కాదా? అందిన సమాచారం (అనుమాన శబ్ద ప్రమాణాల ద్వారా) సత్యమా కాదా? నిర్ణయించుకోడానికి మనిషికున్న ఆధారం ఒక్కటే. అది యదార్ధ అనుభవమే. అదే-స్వతః ప్రమాణం

మీ, మీ పరిశీలనల ద్వారా మీరు ప్రాచీనులలోని దోషాదోషాలను నిర్ణయించగలగడమూ, వెనుకటివారు భ్రమపడినవిషయాలకు చెందిన వాస్తవాన్ని గ్రహించడమూ చేయగలిగినప్పటికీ, వెనుకటి వారిచే చెప్పబడిన ఆయా విషయములను అధ్యయనం చేయడం నిష్ప్రయోజనం మాత్రం కాదు. ఈ విషయాన్ని తర్కం అక్కరలేదనే నవీన వేదాంతులూ, హేతువాదు లనుకునేవాళ్ళూ, తగినంత విషయావగాహన లేకనే తమను తామే జ్ఞానులుగా చెప్పుకునే వాళ్ళు కూడా స్పష్టంగా గమనించడం అవసరం.

అలానే, తార్కికత మానవస్వభావం కనుక తర్కం నేర్వనక్కరలేదనే వాళ్ళను నేనడిగినదేమంటే, సహజ తార్కికులారా! వెనుకటివాళ్ళ ఏ పరిశోధితాంశాలనూ స్వీకరించకుండా మీ స్వాభావిక తర్కశక్తి ద్వారానే యీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. 1) జ్ఞాన మెన్ని రకాలు? 2) పదార్ధా లెన్ని? 3) భ్రమలెన్ని రకాలు? మానవుడు పొందవలసిందేమిటి? దానిని పొందటమెలా? ఇతరుల భావాలు మీపై పడకుండా సమాధానాలు చెప్పండి చూద్దాం.

ఏతావాతా నే చెప్పదలచుకున్న దేమంటే, ఆయా విషయాలను సాధించిపెట్టు పరికరములమరి ఉన్నంత మాత్రానే ఫలితాలు జనించవు. ఉపయోగించు మెలకువల నెరుంగుటా, ఉపయోగించు అభ్యాసము ద్వారా నిపుణత సాధించుట అన్న విన్నీ సమకూడినప్పుడే ఫలితం కోరినస్థాయిలో సిద్ధిస్తుంది, కనుక ఎంతగా మానవునిలో తర్కించే స్వభావమున్నా, తార్కికంగానే జీవిస్తున్నాడని ఒప్పుకున్నా, తర్కాన్ని సంపూర్ణంగా జీవితంలో వినియోగించుకోగల నేర్పుకై దానిని విద్యగా నేర్వవలసియే ఉన్నది. దీనిపై మీ, మీ యభిప్రాయాలను వ్రాయండి.

ప్రమాణముల పేర్లు ఏ దృష్టినుండి ఏర్పరచడం జరిగింది? అన్నది ప్రస్తుత పరిశీలనాంశమై యున్నది. ఫిబ్రవరి సంచిక చూసిన పిదప శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారు వ్రాసిన లేఖను కూడా ప్రచురించడం ఈ విషయంలో జిజ్ఞాసువుల పరిశీలనకు కాగలదని అనిపించుటచే దానినీ వ్రాస్తున్నాను. మIIశ్రీII 1-2-92 సంచిక అందినది. నా ప్రశ్నకు సమాధానము సరిగా లేదు. ప్రత్యక్షమను ప్రమాణము శ్రోతనేత్రాదులకంటె వేరా? కాదా? అని నా ప్రశ్న. వేరనిగానీ, వేరుకాదనిగానీ సమాధాన ముండాలి. ఏదో వివరణ యిచ్చారు. అది నా కంత అవసరము గాదు. వేరే అంటే ఆరింటికంటె వేరైన ప్రత్యక్ష ప్రమాణమేమో చెప్పాలి. వేరు కాకపోతే పద్ధతుల ననుసరించి ప్రమాణములను వాటిలో ప్రత్యక్షమును చేర్చరాదు. మొదటి వర్గములోనే '6'న్నూ చేరినవి కనుక.

మీరు “రంగు” అంటూ ఏదో వ్రాశారు. రంగు అనునది సామాన్యవాచక శబ్దము. ప్రత్యక్ష ప్రమాణమనునది కూడా అటువంటిదే. తెలుపు, నలుపు, ఎరుపు ఇత్యాదులు రంగు యొక్క విశేషముల చెప్పు శబ్దములు. విశేషములకంటె విడిగా సామాన్యముండదు. అంటే తెలుపో, నలుపో, ఎరుపో కాక ఇంకా రంగు అనేది ఒకటి వేరే ఉండదు. అట్లే ప్రత్యక్ష ప్రమాణముకూడా. శోత్రమో, నేత్రమో ఇత్యాది ‘6’ కాక వేరే ప్రత్యక్షముండదు. అనునంతవరకే నాకు తెలిసిన అంశము.

మీరు ప్రత్యక్ష ప్రమాణ విశేషములగు శోత్ర నేత్రాదులారింటినీ మొదటి వర్గములో చేర్చినారు. [మొదటి వర్గమంటే పరికరముల ననుసరించి ప్రమాణములన్న వర్గమని పాఠకులు గమనించాలి-సురేంద్ర] ఇక దానికంటూ అన్యమైన ప్రత్యక్ష ప్రమాణమేదేని ఉంటే దానిని రెండవ వర్గములో చేర్చవచ్చు. కానీ ఆ ఆరింటికీ అతి రిక్తమైన ప్రత్యక్ష ప్రమాణం నాకు తెలియదు. మరొక్కమాట. మీరు అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? అని ఓ మాట న్నారు. దీనినిబట్టి అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లు అర్థమగుచున్నది. అలా అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీ భావమా? ప్రమాణ వివేచన ఆరంభించినప్పుడు మీరన్న ప్రాచీనులు కానీ, మీ సమకాలీనులు కానీ ఎటువంటి అభిప్రాయములు కలిగియున్నారో పేర్కొని, వారి యభిప్రాయములలోగల దోషమేమిటో తెలిపి, మీ అభిప్రాయమునకూ, వారల అభిప్రాయములకూ గల భేధమేమో వివరించి, ఎందువల్ల ఆ భేదమేర్పడిందో వివరించితే కొంత విషయ స్పష్టత ఉండేదేమో ననిపించుచున్నది. సరి. సంతకం.

సురేంద్ర :- ఈ విషయమై నేనిప్పటికే వెలిబుచ్చిన అభిప్రాయములను క్రోడీకరించి చూపుతాను గమనించండి.

1] ప్రమాణమన్నమాట జ్ఞానార్జనలో ఉపయుక్తమవుతున్నది. అది పరికరములనూ, పద్ధతులనూ సూచించగలదు.

2] ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ ఇత్యాది పేర్లు పరికరముల యందలి తేడాలను సూచించునవిగా కాక, ప్రక్రియా విశేషములను సూచించునవై యున్నవి.

3] ప్రమాకరణం ప్రమాణం అని వివరణ చేస్తూ కరణమింద్రియం అని అన్వయించినచో, ప్రమాణముల పేర్లూ, సంఖ్యా ఇంద్రియాల పరంగా నిర్ధారించవలసి వస్తుంది. కానీ అవి అలా లేవు.

4] ప్రత్యక్ష మొక్కదానిలోనే “6” ఇంద్రియాలు చేరిపోతాయి. మరి విుగిలిన ప్రమాణాల కింద్రియాలేవి? అన్న ప్రశ్నకు ప్రమాకరణం ప్రమాణం, ప్రమాణమింద్రియం అన్నవాళ్ళే సమాధానం చెప్పవలసి ఉంది.

5] ఒక్క ప్రత్యక్షంలోనే “6” జ్ఞానేంద్రియాలూ ఇమిడిపోతాయి. పరికరాలననుసరించే ప్రత్యక్షాది పదములు ఏర్పాటుచేసి ఉంటే అనుమానమూ, శబ్దమూ నన్న పేరు నిరర్థకమౌతాయి.

        6] ప్రత్యక్షంలో ఆయా ఇంద్రియాలు ఆయా విశేష విజ్ఞానాలకు ప్రమాణం లౌతాయి. వాటి పేర్లూ వాటికి సంబంధించే ఉంటాయి. నేత్ర ప్రత్యక్షం వగై రా. సరే.

అదీకాక రంగు సామాన్యవాచక శబ్దమై ఎరుపాదులు విశేషత్వబోధకాలై నప్పటికీ ఎరుపూ, రంగూ ఒకే పదార్థమును సూచించు పదము లనరాదు. అవి పర్యాయ పదములు కావు. ఎందుకనగా రంగు అన్న పదార్ధాని కన్యంగా ఎరుపు ఉండదుగానీ ఎరుపు లేకున్నా రంగు ఉంటుంది. అలానే అవయవావయవిలన్న రెండు పదార్ధములనూ విడదీసి చూపలేకపోయినా, అవయవాలకంటే అన్యంగా అవయవి లేకున్నా అవి రెండు పదములూ, రెండు పదార్ధములూ అనాల్సిందే. పదార్థవివేచన అలా చేయవలసిందే. కనుక ప్రకరణోద్దేశాన్ననుసరించి ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అన్న పేర్లు ప్రకార భేదాలననుసరించిపెట్ట బడినవే. అయితే ప్రత్యక్ష పద్ధతిలో కలుగుతున్న జ్ఞానానికాధారం ఇంద్రియాలే.

ఆచార్యులవారే, మరోమాట అంటూ “అనుమాన ప్రమాణాని కింద్రియ మేదందాము” అన్న నా మాటను ప్రస్తావించి, అనుమాన ప్రమాణం కూడా ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లున్నది. అవునా? అని అడిగారు. ఇక్కడ నామాటేమిటంటే సంచికను వారూ, పాఠకులూ కూడా మరోసారి చూడమని. ఎందు కంటే ప్రమాణ పద నిర్వచనంలో ప్రమాకరణం ప్రమాణం అని, ప్రమాణ మింద్రియం అను పక్షంవారు సమాధానం చెప్పవలసిన అంశంగా ఆ ప్రశ్న వేశాను. నా ప్రతిపాదన దృష్టినుండీ అది అసంబద్దమనే కదా! ప్రమాణపదములు ఇంద్రియాలనుబట్టి కాక విధానాలనుబట్టి ఏర్పరచారన్నదే నా ప్రతిపాదన.

సాంప్రదాయకులున్నూ ప్రమాణ పదవ్యుత్పత్తి రెండుగా చేశారు;1) ప్రమీయతే ఏన తత్ర్పమాణమ్! 2) ప్రమీయతే అనేన ఇతిప్రమాణం- మొదటిది పరికరాన్ని, రెండవది ప్రకారాన్నీ సూచిస్తాయవి.

ప్రత్యక్ష జ్ఞానకరణ మింద్రియం అనడంలో దొసగేమీలేదుగానీ ప్రమాణ నిర్వచనంలో ప్రమాకరణం ఇంద్రియం అంటే అనుమాన, శబ్దములందు ఇంద్రియ కారణత్వానికి అవ్యాప్తి సంభవిస్తుంది. గమనించగలరు.

ప్రమాణ సంఖ్యపైననూ తార్కికులలో బహుచర్చ సాగింది. కానీ సంఖ్య విషయమై పెద్దగా పెనుగులాడ వలసిన అవసరం లేదు. పోతే కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ మనం నిర్ణయించిన ప్రమాణములలో ఇమడ్చగలగాలి. అదే అసలు విషయం. ఈ దృష్టినుండి చూస్తే(ఆయా పక్షాలవారు, నేచెప్పిన సంఖ్యనే అంగీకరించా లంటూ అక్కరలేని పిడివాదాన్ని పట్టుకోకపోతే) మానవ జీవితంలో కలుగుతున్న జ్ఞానరాశిని, (ఉపయుక్తమవుతున్న జ్ఞానరాశిని) ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ నన్నమూడు వర్గాలలో ఇమడ్చవచ్చు.

 

చేదు నిజాలు-3

చేదునిజాలు ప్రారంభ వ్యాసంలో విద్య గ్రహించవలసిన వాడూ- (విద్యార్థి, జిజ్ఞాసువు, సాధకుడు) విద్యగరపువాడూ [ బోధకుడూ, వక్తా, గురువు] కలసి శ్రమించినగానీ విద్యా ప్రయోజనం సిద్ధించదనీ, అందుకై యిరువురూ వివేక పరంగానూ, హృదయ పరంగానూ కొన్ని అర్హతలు కలిగియుండాలనిన్నీ, అయితే

ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఈ రెండురకాల అర్హతలూ, ఇరువురిలోనూ మృగ్యమై పోయాయనే అనుకున్నాము. ఇవి అన్ని రకాలైన విద్యారంగాలలోనూ ఉండవలసివే ఐనప్పటికి, ముఖ్యంగా వ్యక్తిత్వ నిర్మాణానికి పనికివచ్చే నైతిక, ధార్మిక, తాత్విక కేంద్రాలలో, వీటిని ప్రాణప్రదంగా ఎంచవలసి ఉంది. శోచనీయమైన విషయమే మంటే ఈ కేంద్రాల లోనూ మామూలు విద్యా కేంద్రాల స్థాయిలోనో, మరింకొంత ఎక్కు వగా నేనో కాపట్యమూ, డాంభికతా, స్వార్థ పరత్వమూ, కులవర్గ, వర్ణపిచ్చిలు, భోగలాలసతా, అజ్ఞానమూ కరడుగట్టుకుని పై అర్హతలను పాతాళానికి తొక్కి వేశాయి. వేస్తున్నాయి.

సమాజాన్ని సరైన దిశకు మళ్ళించాలనుకునే హృదయావేదనకల ఆస్తిక, నాస్తిక, హేతువాదాది నానా సంఘాలలోని సహృదయులలోనూ, అట్టిసరైన మార్పు వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మాత్రమే సాధ్యమనే అవగాహన లేకపోవడం, ఒక వేళ ఒకరిద్దరికి ఉన్నా, అది అయ్యే పనికాదులే అన్న ఉదాసీనత ఏర్పడి ఉండడం అన్నది, సమాజంలో - వ్యక్తిలో-మార్పు రాక పోవడానికి, ప్రసంగ ప్రహసనాలకూ హేతువౌతూ ఉంది. సంస్కరణోద్యమ నిర్మాతలలో ఈ విషయమైన వివేకాన్ని మేల్కొల్పడమూ కష్టసాధ్యంగా ఉంటున్నది. ఎందుకని? వారి వారిలో ఒకరకమైన అభిమానం విషయం మనకు తెలిసే ఉంది. పరుల సూచనల లేమిటి గ్రహించేది అన్న భావన-హృదయపు లోపలిపొరల్లో ఉండి ప్రతిబంధకం అవుతోంది. ఇది ఎంతో సున్నిత విషయమగుట వలననూ, దీనిని చెప్పి వప్పించవలసిన వారు మేధావులై ఉండడం వలననూ, మేధావులలో ఉంటున్న శృతిమించిన ఆత్మ విశ్వాసం అడ్డుగోడలా ఉండడం వలననూ, ఇది కష్ట సాధ్య మవుతోంది. ఈ రోజు సమాజ సంస్కరణోద్యమకారులందరూ గమనించవలసిన మౌలిక విషయమిది. ఈ ప్రతి బంధకం ఉద్యమానికో రూపు సంతరించుకోనీయడం లేదన్నదో పచ్చి నిజం.

చేదునిజాలు-2లో, ఆధ్యాత్మిక విద్యాలయాలలో- ఆశ్రమాలూ, పీఠాలు మొ|| -గు వాటిలో- తరచుగా గోచరిస్తున్న అధ్వాన్న స్థితుల గురించి కొంతవరకు ఆవలోకించాము. మన దేహంలో తల భాగానికెటువంటి స్థానము-పాత్ర- ఉన్నదో, మొత్తం సమాజాన్ని ఒక శరీరంగా భావిస్తే అందులో విద్యాలయాలకూ - విద్యా విధానానికి కూడా అట్టి పాత్రే ఉన్నది. మెదడులో అపసవ్యత ఏర్పడ్డ వాడి జీవితంలానే ఉంటుంది సమాజంలో విద్యావిధానంలోనూ, విద్యాలయాలలోనూ అపసవ్యత ఏర్పడితే.  దయనీయమైన అంశమేమంటే ప్రస్తుతం మన మందరమూ అనుభవిస్తున్న ప్రమాదకర పరిస్థితే ఇది. బుర్ర చెడిన వాడి బ్రతుకులా ఉంది నేటి సమాజపు బ్రతుకు కూడా. అయినా పట్టించుకొనే నాధుడు లేడు. పిచ్చి వానికి చికిత్స చేస్తానంటే నీకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి నా కేమిటిరా?! అన్నట్లే, సమాజంకూడా ఆరోగ్యకరమైన చికిత్స చేద్దామన్నా స్వీకరించేట్లు లేదు. అది ప్రమాదకరమైన విషయమే. అయినా అంతకంటే దౌర్భాగ్య కరమైన పరిస్థితేమంటే చికిత్సకులూ; చికిత్సాలయాలుగా నుంటున్న ధార్మిక సంఘాలూ, ప్రచారకులూ కూడా యదార్థంగా రోగగ్రస్తులై చికిత్స చేయించుకోవలసినవిగా నుండుటయే. ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే దీనిని చదువుతున్న వారిలో కొందరకైనా ఎందుకొచ్చిన సొద అనో, ఎవరికి తెలీని విషయమిది అనో, అబ్బా! ఈ నాటికో క్రొత్త సంస్కర్త పుట్టుకు వచ్చాడయ్యా అనే....అవహేళనా పూర్వకమైన ఆలోచనో మదిలో కదలాడుతుండవచ్చు - ఎందుకనో తెలుసా? ఈ అంశ మీనాడు మనిషి నిత్యజీవితంలో సామాన్య విషయంగా - ఆశ్చర్యపడవలసిన అంశంగా కాకుండా-మారిపోయింది. సామాజిక మార్పు అవసర మనుకునేవాళ్ళు కూడా ఉదాసీనులై, క్రియా శూన్యులై ఉండడానికి యీ భావన (ఆఁ... ఇది మామూలేలే, సమాజం కుక్క తోక వంటిది. దానిని సరిచేయలేము లాంటి యోచన) బలీయంగా ఉండడం కూడా ముఖ్య కారణమే. ఎప్పుడూ ఏదో రోగం ఉంటూనే ఉంటున్నది. ఇక మందు తినడమెందుకులే అంటే ఎంత సబబుగా ఉంటుందో ఇదీ అంతే. సమాజంలోని ఏదో ఒక భాగంలో, ఏదో ఒక రకమైన సంఘ వ్యతిరేక శక్తులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయన్నది కాదన లేని వాస్తవమే అయినా సమాజం ఆరోగ్యదాయకంగా ఉండడం, అవసరమైన వాటిని అవసరమైనంతగానూ సాధించుకోగల క్రియాశీలతా, సామర్ధ్యము కలిగి యుండడమూ, ప్రతికూల శక్తులు ప్రమాద స్థాయికి చేరకుండా నిరంతరం జాగరూకత కలిగి యుండడమూ నన్నవి వివేకవంతమూ, అత్యావశ్యకమూ కూడా. సామాజిక శరీరంలోని ప్రతివ్యక్తీ - భాగము - కూడా తన వంతు విధులను నిర్వర్తించుటా, న్యాయబద్ధమైన హక్కులనే అనుభవించడమూ అన్న విధానమునమలు పరుచుట ద్వారానే యిట్టి స్థితిని సాధించడం సాధ్యపడుతుంది. ఇక్కడో విషయాన్ని గమనించండి.

Note: ఉన్నత లక్ష్యాలు కలిగి యున్న నిరాశావాది కంటె అల్ప లక్ష్యాలు కలిగియున్న ఆశా వాది ఎక్కువ క్రియాశీలుడూ, కార్య శూరుడూ కూడా కాగలరు. ఈనాడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసలు - జాడ్యం అకర్మణ్యతా; కుకర్మణ్యతా అన్న వే.

కళ్ళు మూసుకుని ప్రపంచం మనని గమనించడం లేదులే అనుకునే స్వాముల వార్లనేమనుకోవాలి. వారిని చూస్తుంటే “మార్గాల పయః పాన న్యాయం” గుర్తుకొస్తోంది. సమాజం వాళ్ళ ఎదుట వాళ్ళనేమంటోంది, వాళ్ళ వెనుక ఏమనుకుంటోంది అన్న సృహే వాళ్ళకుండదు, ఒక వేళ ఎటునుండైనా విమర్శలు వచ్చినా, వచ్చిన విమర్శలను స్వీకరించి ఆత్మ విమర్శ చేసుకోగల నిజాయితీగానీ, విమర్శలోని వాస్తవాలను స్వీకరించగల ధైర్యంగానీ వాళ్ళకు లేవు. ఎందుకనో తెలుసా? వారి, విద్యార్ధి లేక సాధన దశలలో వాటి ప్రాముఖ్యత నేర్పబడలేదుగదా వాస్తవంగా. ఆశ్రమానికి రావడమే అసాధారణ విషయంగానూ, అనేక జన్మల పుణ్య ఫలంగానూ వారికి బోధింపబడింది. ఇక సమాజం చేసే విమర్శలను పరిశీలించుకునే అవకాశ మెక్కడిది? వారేమో, వారి  పీఠాధిపత్యమూ, కీర్తీ, భోగమూ, ధనార్జనా అబ్బా తీరు బాటే లేదాయె. వారిలో కొందరైనా నిజాయితీపరులుండక పోతారా అన్న సదుద్దేశ్యంతోనే వారి ఆత్మవిమర్శ కేమైన సహకారి కాగలదేమోనన్న వూహ వల్లనే ఒకటి రెండు జరిగిన విషయాలు చెప్పాలనిపిస్తున్నది.

ఆయా సాంప్రదాయ ప్రచారకులనూ, వారి ప్రచార ధోరణులనూ, ప్రజల నాకర్షించుటకై వారు చేయు గిమ్మికులనూ పరిశీలించు సమయంలో విజయవాడలో జరిగిన అనేక సంఘటనలు కూడా నా అవగాహనకు చాల ఉపయోగ పడ్డాయి. జరిగినవే అయిన వాటిలో కొన్నింటిని మీ ముందుంచుతాను గమనించండి. (1) స్థలం కొత్త గుళ్ళు (విజయవాడ-1లో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే చోటు) - ఆధ్యాత్మిక సమావేశాలకూ, సత్సంగాలకూ వాటి- పేరుతో జరిగే నానా భీభత్సకాండకూ కూడా ఆంధ్రదేశంలోనే ప్రముఖంగా చెప్పుకోదగ్గ నగరం విజయవాడ. ఇక్కడ ప్రారంభించని ఆధ్యాత్మిక, ధార్మిక శాఖలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అయితే విజయవాడ పౌరులలోని ప్రత్యేకతేమంటే (అన్ని చోట్లా అలానే ఉన్నారని మీకనిపించవచ్చు ) 1] - అన్నిటినీ ముట్టుకుంటారు దేనినీ అంటించుకోరు.

గమనిక :- విజయవాడలోని సత్సంగాలలో బహుళ ప్రాచుర్యం పొందినదీ, 13, 14 సంIIరాలుగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ, ఇతర సంఘాలతోనూ, సన్నిహిత సంబంధాలు కలిగి యున్న  ఒక సంస్థ ఉంది. దానితో నాకూ చాలాకాలం నేరుగానూ, ప్రస్తుతం ఏదో రూపంలోనూ, బలమైన సంబంధాలున్నా యనే నే ననుకుంటున్నాను. ఆ సత్సంగీయులు పరోక్షంలో ఏమనుకుంటారో గానీ నా ఎదుట మాత్రం నన్ను సంఘ ప్రారంభకులలో ఒకరిగానే యితరులకు పరిచయం చేస్తుంటారు. (బహుశా వారి లౌకిక కొలతల నుండీ, బ్రతకడం

నేర్చిన, ధర్మంగా ఉంటే బ్రతక లేమనే - ఆలోచనల నుండి వారి దృష్టిలో నేనొక దారి తప్పిన సాధకుడై యుండవచ్చు. చాలా కాలం నిజాయితీగా సాంప్రదాయక ఆస్తిక మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించిన నేను, వివేక నేత్రం తెరుచుకున్న కొద్దీ, ఆ మార్గం నుండి దారి తప్పిన మాట నిజమే సుమండీ. అయితే నాస్తికత పేరున నేడున్న ఏ సంప్రదాయానికి కూడా చెందిన వాణ్ణి కాదు నేను. మీ పరిశీలనా సందర్భంలో మీరు నా పై ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకుని నా రచనలు పరిశీలించే ప్రమాదముందనే-అంటే నిస్పాక్షికంగా పరిశీలనలు చేయుట కొరకై-ఇంత మాత్రం చెప్పుకొనుట అవసరం కాగలదని ఈ మాట చెప్పాను. సాంప్రదాయక - ఆస్థికులూ, సాంప్రదాయక నాస్తికులు కూడా సమగ్ర విప్లవానికి తగిన తాత్విక సిద్ధాంత దారుఢ్యమూ, ప్రణాళికా, ఆచరణా కలిగి లేరన్నది నా స్వానుభవం. సిద్ధపడితే ఇతరులకూ ఈ విషయాన్ని ఋజువు చేయగలనుకూడా. సరే.

ఆరోజు క్రొత్తగుళ్ళలో ఉపన్యాసం జరుగుతోంది. రెండు మూడు సిద్ధాంతాలకు చెందిన అస్తిక బోధకులూ, అనుయాయులూ, శ్రోతలతో సభ నిండుగానే ఉంది. ఉపన్యాసకులు ముందు వాక్యానికీ, వెనుక మాటకూ పొంతన లేకుండగనే అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. ఒకరి ఉపన్యాసానికీ, మరొకరి ప్రసంగానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలూ కనబడడం లేదు. మధ్యలో అప్పుడప్పుడూ వాళ్ళ చప్పట్లూ, ఓంకార నినాదమూ వినిపిస్తున్నాయి. సదస్యులు ఎవరి గొడవలో వారున్నారు. ఉపన్యాసకులు ఎవరి సొద వాళ్ళు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్య నిర్వాహక పెద్దలు వేదిక నెక్కి ఇప్పటివరకు మనం జ్ఞానామృతాన్ని చవి చూశాము. చూపించిన వారంతటివారు ఇంతటివారు అని ఉపన్యాసకుని ఆకాశానికెత్తి వేస్తున్నారు.

నగర ప్రముఖులలోనూ, ఆ కార్యక్రమ ఆహ్వాన సంఘ ప్రముఖులలోనూ ఒకరు ఆనాడు వేదిక మీద ఉపన్యసించారు. పేరు పేరున స్వాములను స్మరిస్తూ వారి జ్ఞాన సామర్థ్యాలను, ధర్మ నిరతినీ, నిరాడంబరతనూ, భోగ రాహిత్యాన్నీ అనితర సాధ్యంగా ప్రస్తుతించి నగర పౌరులందరి అదృష్టం పండిన రోజిది. .... వగైరా మరి కొన్ని మాటలు చెప్పి ముగించారు. ఉపన్యాసానంతరం వారే ప్రాంగణం బైట నాకు తారసపడి పలకరించారు. కుశల ప్రశ్నలైనాక ఎవరీ స్వాములు ఏమిటీ కధ? అని అడిగాను. అతనేం చెప్పుంటాడో ఊహించగలరా? ఖచ్చితంగా ఊహించలేరు. ఏమండీ సురేంద్రగారు..... వీళ్ళు స్వాములా? దొంగలు, ఇంద్రియలోలురు, డబ్బుకై నానా వేషాలూ, మాటలూ నేర్చినవారు. పరమ స్వార్ధులు, అజ్ఞానులు.... ఇలా, వేదికపై వారి గుణకీర్తన మెంత స్థాయిలో చేశారో అంతకంటే అధికంగా వారి స్వభావాలను గురించి చెప్పి, కాసుకై మా కాళ్ళ వద్దకు వచ్చిన వారు, అడుక్కునే కళలో ఆరితేరిన వాళ్ళు, జీవితంలో దాన ధర్మాలు గురించి చెప్పని రోజుగానీ, చేసిన రోజు గానీ లేని వాళ్ళు.... ఇలా .... ఇలా... [అతనా నాడు పలికిన ప్రతి మాటా లిపి బద్ధం చేయుట సభ్యత కాదు కనుక ఆ తరహా మాటలు పొందు పరచ లేదు] ఈసడించి వెళ్ళాడు. క్రితం క్షణంలో వేదిక మీద చూసిన అతని స్వరూపానికీ, బయట మరో క్షణంలో కనబడిన అతని అంతరంగానికి ఉన్న తేడా చూసి నివ్వెర పోయాను. అశ్లీలమైన పదాలను విడిస్తే బయట అతడు నాతో అన్న మాటలలో అతిశయోక్తి వుండవచ్చేమో గాని, అవాస్తవం మాత్రం లేదన్నది నిజం. దీనిని మ్రింగడం స్వాములవార్లకూ, ఆశ్రమాధిపతులకూ, ప్రచారకులకూ వారి వారి అనుయాయులకూ కష్టంగా ఉండవచ్చు. అయినా ప్రజలిలా అనుకుంటారన్న విషయం కొందరు స్వాములకైనా తెలియకపోదు. అయినా పై నగర ప్రముఖుల లానే, వీరూ లోపలొకటి బైట ఒకటిగా ఉండగల ఉద్ధండులే. మరింకేం దొందూ దొందే.

2) అదే స్థలం, మరోరోజు, మరోసభ, వేదిక అలంకరించిన ఆనాటి పెద్దలలో యతీంద్రులవారూ ఉన్నారు. ఒక ఉపన్యాసకుడు-అతడు గీతా ప్రచారకుడు కూడా. గీతలోని ఒక శ్లోక పాఠాన్ని చెప్పి వివరించాడు. అది “తన్ని బద్నాతి కౌంతేయ” నాయనలారా అది మామూలుగా బంధించదు. తన్ని మరీ బంధిస్తుంది అని చెపుతున్నాడు. యతీంద్రుల వారికి చురుక్కుమంది. మెల్లిగా అతణ్ణి పిలచి దానర్థం మరొకటంటూ చెప్పారనుకోండి. ఆ మొదటి ఉపన్యాసకుడు తనను తాను సంపూర్ణజ్ఞానిననే భావిస్తున్నాడు. శిష్యుల కొరకై వెదుకులాడుతున్నాడు కూడా !? మీరేం ఆశ్చర్య పోకండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇట్టివీ నాడు సర్వసాధారణం.

3) ఈరోజు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న ఒక స్వామిని విజయవాడకు ప్రప్రధమంగా ఆహ్వానించాలను కుంటున్నారు. పై సత్సంగ స్థాపకు లలో ఒకరు. ఆ విషయం ముందుగా నాకు తెలిసింది. వెంటనే వారిని కలసి మిత్రమా! ధార్మిక సంస్థలు అధార్మికుల తరపున ప్రచారం చేయడమూ, కాలాన్ని, డబ్బునీ అందుకై వినియోగించడమూ, అతనికై కొమ్ము కాయడమూ మీకూ, లోకానికి మంచిది కాదు. ఈ ప్రయత్నం విరమించండి. లేదంటే ముందుగా వారితో ఒక చర్చా వేదిక నేర్పాటు చేయండి మనం మాట్లాడుదాం. ఆపై మీకెలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పాను. వారు నా మాట చాలా తేలికగా కొట్టివేస్తూ దోషం లేని వాడెవడండీ, మోసం లేని దెక్కడండి. అలా వెదికితే మనమేమీ చేయలేం. మాలో లేవా, మీలో లేవా దోషాలు అంటూ ప్రారంభించారు. చివరగా ఒక మాట చెప్పి వచ్చేశాను. మీరాహ్వానించబోయే స్వామికై ఈ నగర ప్రజలు వెచ్చించబోయే ప్రతి క్షణమూ, ప్రతి పైసా అధర్మకార్యానికి వినియోగించినట్లే కాగలదు. మీయిష్టం. మీరిది గమనించేటప్పటికి పరిస్థితి మీ చేయి దాటి స్వామి చేతిలో ఉంటుంది. ఆ స్వామి జనాకర్షణలో అంతటి నిపుణుడు అని. తరువాత జరిగిన సంఘటనలు అక్షరశః నా మాటలు సత్యమని ఋజువైనా యా మిత్రునికి. ఈనాడు సత్సంగీయు లనబడేవాళ్లు సమాజ హితాన్ని హృదయ పూర్వకంగా కోరు కుంటున్నారా? పోనీ ఆత్మోద్ధరణనైనా నిజంగా కాంక్షిస్తున్నారా? ఈ రెండూ గానీ, ఈ రెంటిలో ఏ ఒక్కటిగానీ అతని హృదయగత కాంక్షే అయితే ఇక నాతడు తప్పు చేయుటగానీ, తప్పుడు వాళ్ళకు సహకరించుట గానీ చేయగలడా? ఆలోచించండి.

సంక్రాంతి - విప్లవ సందేశం

 గత సంచికలో సారభూతమైన ఒక వాక్యం చెప్పాను. “రావలసిన-కోర దగిన మార్పు. అందుకై మనం చేయ వలసిన పని” అన్నదే ఆ మాట. మనకి తెలీని విషయమా ఇది అనో, మరో దృష్టినుండో దీనిని నిరాదరణ చేయక ఆగి కొద్దిగా ఆలోచించండి. ఈ భావన ఆధారంగానే సమస్తమూ పరిశీలించాల్సి ఉంది. ఈ  భావనాధారంగా చేసిన పరిశీలనల నుండే సమగ్ర విప్లవ సిద్ధాంతమూ, ప్రణాళికలూ తయారు కావలసి ఉంది. అవునో కాదో చూడండి.

జ్ఞానరూపాలే ఐయున్నప్పటికీ హృదయానికీ, విషయజ్ఞతకూ ఉన్న తేడాను గమనించనంతకాలం మానవునిలో-సంఘంలో రావలసిన మార్పుకు తగిన ప్రణాళిక నేర్పరచడం సాధ్యంకాదు ఎందుకంటే అర్హుడై న-సరైన వ్యక్తిత్వంకల వ్యక్తి తయారు కానంతవరకు సాంఘిక విప్లవం యదార్థంగా సాధించలేము. వ్యక్తిని సమాజము బాహ్యం నుండి అదుపు చేస్తే, వివేకము అంతరికమైన అదుపును కలిగిస్తుంది. బైటా, లోపలా కూడా వ్యక్తి ఏదో రకమైన అదుపు చేయ బడుతుంటాడు. అలా ఉండాలి కూడా. అలా రెండు శక్తులూ విలువైనవే అయినప్పటికీ విప్లవ సాధనలో ఉద్యమకారులు ఆత్మనియంత్రణ కలవారై యుండుట తప్పనిసరి. వివేకంచే జనించిన ఆత్మనియంత్రణ విప్లవకారులకు ఊపిరివంటిది. దీనిని గ్రహించని, గ్రహించినా ఆ స్థాయి లేని విప్లవ సంఘాలవల్ల విప్లవ లక్ష్యాలు సాధింపబడవు. కాకుంటే ఆవేశపూరిత నినాదాలూ, బంద్ లూ, విధ్వంసకాండలూ, ఎన్ కౌంటర్లు సాధింపబడవచ్చు. కదాచిత్ ఏవైన సంస్కరణలు జరిగినట్లు గోచరించినా అవన్నీ తాత్కాలికాలే కాగలవు. ఈనాడున్న విప్లవ పంథాలన్నింటా దాదాపు ఈ లోపం-(వ్యక్తిత్వం-వివేకం కల వ్యక్తులు లేని లోపం) కొట్టవచ్చినట్లుగా ఉంటోంది. సిద్ధాంతాలూ ఆవేశకావేశాలూ, వర్గపోరాటాలూ ఉన్నాయే గానీ; సిద్ధాంత లక్ష్యాలను సాధించ గల వ్యక్తిత్వమున్న వ్యక్తులు లేరు. వివేకమూ, సహృదయతా సరైనపాళ్ళలో మేళవింపబడని విప్లవశక్తుల త్యాగాలూ, ఉద్యమాలు కూడా ఆత్మ వినాశనానికో, తమకన్యులైన వారి వినాశనానికో హేతువులౌతాయి. ఇట్టివారు ఆవేశంలో ఆత్మత్యాగమైనా చేసుకుంటారు. అన్యులను చంపనైనా చంపుతారు. ఇదినాడు మనందరికీ - అనుభవంలోనున్న విషయమేనంటాను. మీరేమంటారు?

ఇష్టమూ, అయిష్టమూ, పట్టుదలా, చపలత్వమూ, ప్రేమ, వాత్సల్యమూ, కోపమూ, ద్వేషమూ, ఆవేశమూ, నిరుత్సాహమూ, ధీరతా, పిరికితనమూ, ఆశా భయాలూ, తృప్తి అసంతృప్తి, శాంతి, అశాంతి, సుఖ-దుఃఖాలు, అసూయ, లోభత్వము, మదము, అహంకారము, డాంబికత, కపటము, నిజాయితీ, ఆర్ద్రత, సానుభూతి, కాఠిన్యము, జాలీ, వగైరాలన్నీ భావరూపములే. హృదయానుభూతులన్న మాట. ఈ భావనలే మనిషిని ప్రధానంగా నడిపిస్తున్నవి. ఇవన్నీ మేధస్సుకు, చెందిన అంశములే అయినా-జ్ఞానరూపాలే అయినా ఈ తరహా పదార్థములను హృదయ సంబంధిత పదార్దములనుట ఉచితము. ఈ పదార్థములకు భౌతిక అస్థిత్వం లేక పోయినా అవి అస్థిత్వం కలవే. శక్తిరూపాలే. మీదు మిక్కిలి మనిషిని మరే యితర భౌతిక శక్తీ కదిలించనంత శక్తివంతంగా కదిలించగలవు. తనకొరకు సమస్త ప్రపంచాన్ని బలిపెట్టునట్లూ, తన ఆదర్శాల కొరకూ, ఇషాలకొరకూ తనను తానే బలి పెట్టుకొను నట్లూ కదిలించగల శక్తివంతాలీ భావనలు. నవీన సిద్ధాంతాలలో ఈ భావాల శక్తిని యథాతధంగా అంచనా వేసిన సైద్ధాంతికులు గానీ, భావ విప్లవం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమన్న మౌలికాంశాన్ని తగినంతగా గుర్తించి దానికై యత్నించినవారుగానీ అరుదు. సరే. అదలా ఉంచండి. హృదయ సంబంధితాలైన ఈ భావరూప శక్తులను వివేకశక్తి నియంత్రించవలసి ఉంది. అలా జరిగినంతకాలం ఈ భావశక్తులు అవసరమైన స్థాయిలో ఎక్కువా తక్కువా కాకుండా ఉండి ఆయా కార్య నిర్వహణకు వ్యక్తిని వ్యక్తులను పురికొల్పుతాయి. సంసిద్ధుణ్ణి చేస్తాయి. ఇవి గనుక అదుపు తప్పినట్లేతే వివేకం పనిచేయదు. ఉద్రేక స్థితులలో మనిషి విచక్షణను కోల్పోవడమో, అది బలహీనపడడమో జరుగుతుందన్నది మనందరి అనుభవములోనూ ఉన్నదే. కనుక హృదయపరమైన శక్తులుగా నున్న భావనలూ, విచక్షణా శక్తిగానున్న జీవితానుభవాల సారాంశమూ, కలసి-మెలసి పనిచేసినంతకాలం జీవితం వ్యక్తిది కానీ, సంఘానిది కానీ- ఒక క్రమం లోనూ, అభివృద్ధి దిశ వైపునకున్నూ సాఫీగా సాగిపోతుంది. ఇట్లా ఈ రెంటినీ (హృదయమూ - వివేకమూ) చక్కగా వివేచించగలగడమూ, వాటివాటి క్షేత్రాలలో అవి ఎక్కువా తక్కువా కాకుండా ఉంచగలగడమూ చేయగలగాలి. విప్లవోద్యమ రుల ముందూ, సంస్కర్తల ముందూ, సిద్ధాంతకారులా, ప్రచారకుల ముందూ ఉన్న అసలు సమస్య యిదే. సహృదయతా, యోచనాశీలతా, కార్యకుశలతా ఇవే ఈనాడు లోపించి ఉన్న ప్రధానాంశాలు. వీటియందు విప్లవాన్ని -సరైన మార్పును తేగలిగిననాడే సమగ్ర విప్లవానికి యదార్థంగా అంకురార్పణ జరుగుతుంది.

అయితే ఇది లేక పోవడానికి కారణమేమి? ప్రధానకారణం జీవితంపట్లా, జీవిత సాధ్యాల పట్లా, వృష్టి, సమష్టి, ప్రకృతి వీటి మధ్యనున్న పరస్పర సంబంధాలపట్లో సరైన అవగాహన లేకపోవడమే. అదే సమయంలో తప్పు అవగాహన లుండడమున్నూ, ఈ తప్పు అవగాహన (దీనినే తత్వశాస్త్రం అవిద్య అంటుంది) నుండి పుట్టి నానా విధములైన పోకడలన్నీ సమాజానికెంతో కొంత అప్రకృతిని కలిగిస్తాయి. సమగ్ర విప్లవాన్ని - సంక్రాంతిని గూర్చి విచారించబోయే ముందు విప్లవ ప్రతిబంధకాలైన అజ్ఞాన జనిత వికృత ధోరణులను గురించీ కూలంకషంగానూ, నిష్పాక్షికంగానూ, సమష్టి సంక్షేమ దృష్టి నిడుకుని పరిశీలించవలసి ఉంటుంది. లేనిచో ఎక్కడోచోట, ఏదో క్షణంలో పరిశీలనలోనూ, నిర్ణయాలలోనూ పాక్షికతా, అసమగ్రతా చోటుచేసికొంటుంది. విషయాన్ని రాగంతో చూస్తే ఉన్న దోషాలు కనపడవు. ద్వేషంతో చూస్తే ఉన్న గుణాలూ గోచరించవు. ఇప్పటి వరకు జరిగిన సామాజిక చరిత్రనూ, దానిలోని సిద్ధాంత ధోరణులనూ సవ్యంగా చూడగలిగితే దాదాపు వాటన్నిటా పైదోషం కొట్టవచ్చినట్లుగా కనుపిస్తుంది. ఈ అంశాన్ని వివరించడమూ, చర్చకు పెట్టడమూ కూడా ఎంతో సాహసంతోనూ, అనేక సమస్యల తోనూ కూడుకున్న పనే అయినా ప్రస్తుత సామా జికావసరమై, “మేలుకొలుపు” పత్రిక లక్ష్యాలలోనూ ఒకటై యుండుటచే, క్రమంగా ఆయా సిద్ధాంత ధోరణుల లోని లోపాలోపాలు మీ ముందుంచేందుకు యత్నిస్తాను. సావధానులూ, ఉద్రేక రహితులూనై నిర్వికారంగా సత్యదృష్టి కలిగి విషయాన్ని పరిశీలించండి. నిజంగా నిజాన్ని స్వీకరించి సమాజాని కందించండి, నిజాని కనుబంధంగా మార్పులూ, కూర్పులు చేసికోండి. యదార్థ విప్లవానికై తగిన సాధకులు కండి.

Note: ప్రతిమనిషీ, సమాజం ఉండకూడని విధంగా ఉన్నదని, మార్పు అవసరమనీ అంటున్నాడు. కనీసం అనుకుంటున్నాడు ఏదో క్షణంలో. కానీ ఆ సమాజం తనకు అన్యంగా లేదనీ, తాను మారుటతోనే సామాజిక మార్పు ప్రారంభించాల్సి ఉంటుందనీ తలంచడు. విప్లవ ప్రతిబంధకాల్లో మొదటి అడ్డంకి యిదే. కనుక అందరం మారాలనీ, అవసరమైనంత మార్పు నాతోనే ప్రారంభం కావాలనీ ఎవరికి వారం మానసికంగా నిర్ధారించుకోగలగాలి.

అభ్యాసక్రమము -7

క్రమంగా వ్యక్తిత్వ వికాసాని కవసరమైన అంశాలను సాధన దృష్టినుండి - అమలు పరచు ఉద్దేశ్యంతో ముచ్చటించు కుంటున్నాము. అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి సంచికలో అభ్యాస క్రమం ప్రచురించలేక పోయాను. క్రమాన్ననుసరించి, వాక్కును క్రమబద్ధమూ, శక్తివంతమూ చేయుట అన్న దగ్గర ఉన్నాము. ఈ సమాజాన్ని సరిగా చూడగలిగితే, పత్రికలలోనూ, వేదికల పైననూ, కరపత్రాల - ద్వారానూ, చర్చలలోనూ, సాధారణ సంభాషణల లోనూ ప్రస్ఫుటంగా కనిపించే అంశం వాచాలతే. ఆదర్శాలను వల్లించడమూ, ఇతరులకు సందేశాలివ్వడమూ, తెలిసిన రెండు విషయాలకు తేలీని 98 విషయాలను జోడించి అనర్గళంగా ఉపన్యసించడమూ, విప్లవం, విప్లవ మంటూ యాగీ చేయడమూ, త్యాగం గురించీ, స్వార్ధ రాహిత్యాన్ని గూర్చి, సమానత్వాన్ని గూర్చి నినాదాలూ, కరపత్రాలూ .... యిలా.... అబ్బో రాశులకు రాశులు కొండల మల్లే ఉద్ధరణ సాహిత్యం పెరిగిపోతోంది. ఆధ్యాత్మకవేత్తల స్థానాలలో నున్న వారూ, పరిపాలకులుగానున్న వారూ, వ్యాపారులూ ఈ మూడు వర్గాలవారిలోనున్న వాచాలతా, కపటమూ, విశ్వరూపు ధరించి ఉన్నాయి. వీటిన్నిటికీ మూల వేరు మాటకూ చేతకూ సంబంధం లేని తనమే. అరిచే కుక్క కరవదంటారు. అది కుక్క గురించి చెప్పిన విషయంగాదనీ మనస్తత్వాన్ని ఒకింత లోతుగానే అధ్యయనం చేసిన వారు, మనిషిలోని వాచాలతనూ, దాని మాటున దాగియున్న సోమరితనాన్ని బట్టబయలొనరించేందుకుగా చెప్పిన వాక్యమని స్పష్టంగా గమనించిందెంతమంది? గమనించామని వాదనకు ఎవరైనా అన్నా, అది వదిలించుకోవలసిన దుర్లక్షణమనీ, తానిక్కడ పట్టుదలతో యత్నించి మితభాషిత్వాన్ని సాధించవలసి ఉన్నదనీ మనసా నిర్ణయించుకుని సాధన చేస్తున్న దెంతమంది? నిజం నిష్టురంగానే ఉంటుంది మరి. వాచాలతా, కపటమూ,-చెప్పేదొకటి చేసేదొకటి-దాదాపు ప్రతి మనిషిలోనూ తగితంతగానే ఉన్నా యన్నది నా యనుభవం. ఆత్మ విమర్శన చేసికుని మీరూ మీ మీ యనుభవాన్ని పరిశీలించుకోండి. ఇక్కడ సరైన మార్పురాక మనిషికీ, మనిషికీ ఉన్న సామాజిక సంబంధాలు మెరుగుపడవు. నాయనలారా! దృఢంగా ఒక్క విషయాన్ని నిర్ణయించుకోండి. తెలిసిన విషయాన్నే మాట్లాడుతాను. మాట్లాడిన విషయానికి కట్టుబడి ఉంటాను. ఈ నిర్ణయానికి రాగలిగావా ధన్యుడవే. క్రమంగా జీవితం అర్థవంతమూ, శక్తివంతమూ కాగలదు.

నిజంగా ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయమే మాట్లాడుతాను, యదార్థంగా తెలియని విషయాలు తెలిసికుంటానికే యత్నిస్తాను. అని నిర్ణయించుకున్నాడను కోండి. అప్పుడేమవుతుంది. ఏమవుతుందో నేను చెపితే మీకాశ్చర్యంగా ఉంటుంది? కానీ వాస్తవమేమంటే ఆ వ్యక్తిలో అద్భుతమైన మార్పు వస్తుంది. అతని మాటలలో నిజాయితీ చోటు చేసి కుంటుంది. మాటలలో విజ్ఞానమూ, వివేకమూ, తగినంతగా ఉంటాయి. సొల్లు కబుర్లు తగ్గిపోతాయి. ఇతరుల సమయాన్ని మింగి వేసే ప్రమాదం తప్పిపోతుంది.

అతిగా మాట్లాడడం అలవాటుగా మారిన వాళ్ళకు సందర్భ శుద్ధి ఉండదు. ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారో, అవతల వాళ్ళ పనుల వత్తిడెంతటిదో అన్న స్పృహే ఉండదు. చివరకది వాళ్ళకో కండూతిగా కూడా మారుతుంది. ఎవరూ దొరక లేదనుకోండి. ఏమీతోచదు. ఎదురిచ్చైనా ఎవరోవకరిని కూర్చోబెట్టుకుని తమ కాలాన్నీ ఖర్చు చేస్తూ, వారి కాలాన్ని తినివేస్తుంటారు. ఈ వాచాలతా స్వభావం మానవ సంఘంలో లక్షల, కోట్ల మానవ శ్రమ గంటల్ని హరించి వేస్తుంది. అంతేకాక మనుషులను సోమరులనుగానూ, బాధ్యతా రహితులను గానూ, నిర్వీర్వులనుగానూ మార్చి వేస్తుంది. వాచాలతా-అక్కర లేని మాటలు మాట్లాడు స్వభావం ఈనాడు సంఘానికి పట్టిన పెద్ద భూతం, పెద్దరోగం అంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. కానీ దీనిని గూర్చి ఎవ్వరూ ఆలోచించడం లేదు. సాధారణమైన ధూమపానాది దురభ్యాసాలకంటే అతి ప్రమాదకరమూ, నష్టదాయకమూనైన దురభ్యాసమిది. మనిషిని వర్తమానం నుండి ప్రక్కదారులు పట్టిస్తుంది ఆ సామెత మనిషిని లేని గొప్పలు చెప్పుకునే వాడినిగా తయారు చేయ గలదిది. ఇతరులలో లేని దోషాలు చూసే స్వభావాన్ని కూడా పెంచుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అంశమే ఒక గ్రంథమంత అవుతుంది. అయినా నేను మరింత విడమరచి చెప్పడమెందుకు? మీరే మీ యనుభవంలో నుండే దీనిని కొట్ట వచ్చినట్లుగా చూడవచ్చు. ఒక్కపని చేయండి చాలు.

(1) నిజంగా తెలిసిన విషయాల్నే మాట్లాడుతాను.

(2). అదైనా అవసరమైనప్పుడే ,అవసరమైనంత వరకే మాట్లాడుతాను.

(3) ఇతరుల కాలాన్ని హరించే పనులు చేయను. నా కాలాన్నీ దుర్వినియోగం చేసికోను.

(4) ఇది సాంఘిక విప్లవ కార్యంలో ఒక ప్రధానావశ్యకమైన అంశంగా గ్రహిస్తున్నాము. దీని వ్యాప్తికై త్రికరణ శుద్ధిగా యత్నిస్తాము. ఈ నియమాల్ని పెట్టుకోండి. జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పును గ్రహించండి. వెనుకటి వారూ దీనిని చక్కగా గ్రహించారు. వారి మాటవినండి. “యోగస్య ప్రధమద్వారం వాగ్నిరోధో అపరిగ్రహః”

:-స్పందన ప్రతిస్పందన-:

స్పం సురేంద్ర బాబుకు. నమస్తే, సత్యాన్ని సమగ్రంగా తెలిసికోవాలన్న జిజ్ఞాసులకు, పొందవలసిన దానిని [తెలిసికోవలసినదానిని] స్పష్టంగా పొందే దానికి పనికివచ్చే, శరరేంద్రియ మనస్సులను శక్తివంతంగా సమర్థవంతంగా ఉంచుకోమనీ, చివరికి నీమోక్షానికి కూడా సహకరించేది నీ ముందున్న సమాజానికి ఋణగ్రస్తుడవు కావద్దనీ, స్వార్ధాన్ని నియమించుకుని వీలయినంత సేవ చేయడం కర్తవ్యమనీ, బుద్ధి ఉన్న వాడికి ఆది బాధ్యతనీ, విజ్ఞానం లేనివానికి విధిగానూ, వీటన్నిటికి ప్రధానమైనదైన (పరిక్షించి గ్రహించడమనే) వివేకాన్ని నూరిపోసే మీ రచనలు మీ పత్రికల ద్వారా ఆస్తికులకూ, నాస్తికులకూ ఆదర్శం కాగలవని ఆశిస్తున్నాను. మిధ్యాచారులకు నిజాలు చేదైనా, నిజంకావాలన్న వారికి మధుర పదార్థాలు కాగలవు. హరి ఓం జ్ఞానసేవలో, మీ ప్రమోద చైతన్య.

ప్ర.స్పం ఆర్యా; మీ లేఖ మీపరిశీలనా దృష్టికీ, నిజం ఎడల మీకున్న నీజమైన గౌరవానికి అద్దం పడుతోంది. నా హృదయాంతరాళంలోని ఒక అంశాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించి లేఖలో చూపారు. ఆస్తికులూ, నాస్తికులూ - కూడా రావలసిన విప్లవాన్ని సాధించలేరు. అన్ని సంఘాలలోని వాస్తవికులూ, ధార్మికులూ మాత్రమే విప్లవానుకూల శక్తులు కాగలవన్నదే నా ఆంతర్యము. నా రచనల వెనుక నున్న అనేక లక్ష్యాలలో ఇది అత్యంత ప్రాథమికమైనది. ఈ యత్నంలో మనమూ, మరి మనలాంటి వారమూ, చేయి చేయి కలిపి నడవగల్గుదుము గాక. సెలవ్

మాటిమాటికీ సందేహాలంటూ లేఖలు వ్రాస్తుంటే మీ రేమనుకుంటారోనని శ్రీ మరిగంటి శ్రీరంగాచార్యులు వ్రాశారు.

ప్ర. స్పంఆర్యా! ఇందులో అనుకునేందుకేమీ లేదు. పైగా నా రచనల పై నేనాశించినంతగా స్పందన లేదే అన్న బాధ కూడా నాకున్నది. వ్యక్తికి, ఒక రచన పై స్పందన కలగలేదంటే, ఆ విషయం అతని కఖ్ఖర లేనిదైనా అయ్యుండాలి. లేక పూర్తిగా తెలిసినదైనా, అస్పలు తెలీనదైనా అయ్యుండాలి.పాఠకులు పై వాటిలో ఏ కోవకు చెంది ఉన్నారో గానీ తృప్తికరంగా స్పందించడం లేదన్నదో నిజం. మీలాంటి వారి స్పందనలే నారచనలకు కొంతైనా ఉత్తేజాన్ని ఇవ్వగలవు. తప్పక మీరు, ఈ సంచిక చూసిన పిదపైనా ఒకరి పాఠకులూ (పండితులూ, జిజ్ఞాసువులూ) పత్రిక ఆలోచనలలో పాలుపంచుకుంటారని ఆశిస్తాను.

మీ సురేంద్ర.

గమనికలు:

(1) ఉత్సాహం చూపుతూ అనేక లేఖలు అందుతున్నాయి. సంతోషించదగ్గ విషయమే అది. అయినా ఆత్మ సంస్కారాని కంతమాత్రం ఉత్సాహం సరిపోదు. సాధన ప్రారంభించడం. భావ సారూప్యత కల వారందరమూ వీలయినంత తరచుగా కలుసుకోవడమూ, ఆయా అంశాలను పరస్పరం పరిశీలించుకుంటూ అవసరమైన మార్పులూ, కూర్పులూ, చేసికోవడం జరగవలసి ఉంది.

2) యధాప్రకారం ప్రతి మూడు మాసాలకు జరుగు సమాలోచన సమావేశాలు జరుగుతాయి. పాఠకులందరూ ఆహ్వానితులే. సభ్యులుగా నుండ గోరువారూ, సాధనచేయగోరువారూ, భవిష్యత్తులో మండలి చేయబోయే సామాజిక విప్లవ కార్యక్షేత్రంలో భాగస్వాములు కాగోరువారూ ఈ సమావేశాలకు తప్పక రావలసి ఉంటుంది.        (3) ‘మేలుకొలుపు’ పత్రిక పట్ల అభిమానమూ, మండలి కార్యక్రమంపట్ల సానుభూతీ మాకు ప్రోత్సాహ కారకాలే అయినప్పటికీ మీ నుండి మేము కోరుతున్నదీ మాత్రమే కాదు. చేయవలసిన కార్యక్రమంలోనికి మీరూ రండి, రావలసిన మార్పుకై మన నుండే యత్నం మొదలెడదాం రండి. అన్నదే మండలి ఆకాంక్ష.

సత్య పక్షాన నిలవండి - ధర్మ బద్ధంగా జీవించండి.

No comments:

Post a Comment