వివేకపథం 256 జూన్ 2021
యోచనా శీలురైన మిత్రులారా!
సత్య జ్ఞాన సంఘపు 40వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధాన ప్రసంగం
చేసిన ఎన్ కృష్ణారావు గారు 255వ సంచికపై స్పందిస్తూ ఒక లేఖ
వ్రాసి దానిని వివేక పథంలో ప్రచురించమని చెప్పారు. అది సరైన సూచనే గనుక వారి లేఖను
యధాతధంగా ఈ సంచికలో ప్రచురించాము. వారి లేఖాంశాలపై నా వైపు నుండి కొన్ని వివరణలు
చేయవలసి ఉంది కనుక స్పందన ప్రతిస్పందన ప్రత్యేక సంచిక పేరున ఈ మాసం వివేకపథం ఇదిగో
మీ ముందుకు వచ్చింది. నిశితంగా, నిష్పాక్షికంగా దీనిని
పరిశీలించండి.
సత్య జ్ఞాన సంఘము తోటి పి. సురేంద్రబాబు గారి 25 యేండ్ల అనుబంధం: ఎన్ కె లేఖ
మిత్రులు,
సురేంద్రబాబు గారికి,
నమస్తే!
సత్యజ్ఞాన సంఘ 40వ వార్షికోత్సవ సమావేశములోని నా మాటలను మరియు మీకు అందజేసిన
వ్రాతప్రతిని ఆధారంగా చేసుకుని వివేకపథం మాస పత్రికలో ఆ విషయాలను 24 పేజీలలో వివరిస్తూ, విశ్లేషిస్తూ అనేక ప్రశ్నలు
లేవదీస్తూ, ఇంకా వివరిస్తే ఒక చిన్న గ్రంథము కాగలదంటూ,
అంతటితో ముగిస్తూ, పాఠకులకు అందజేశారు.
పాఠకులు సమావేశానికి రాలేదు. మీకు అందజేసిన వ్రాతప్రతిని వారు ముందుగా చూడలేదు.
సత్యజ్ఞాన సంఘముతో 20
సంవత్సరాలు పైగా మీకున్న సంబంధం వారికి లేదు. సత్యజ్ఞాన సంఘము పట్ల
ఏ అవగాహన లేని పాఠకులకు కనీసం వ్రాతప్రతుల కాపీలను అందజేస్తూ, దానిపై వారి స్పందనలను రాబట్టి, ఆ తరువాత మీ
విమర్శను జతపరచి ఉంటే బాగుండేదన్నది నా అభిప్రాయం. అంతవరకే. మీరెందుకు అలా చేశారని
అడిగే అధికారం నాకు లేదు.
కానీ ఈ సందర్భముగా సత్యజ్ఞాన సంఘ 40వ వార్షికోత్సవ విషయాలను మరియు
మీరిచ్చిన విశ్లేషణను దృష్టిలో పెట్టుకుని వ్రాతలో పెట్టిన నా యీ స్పందనను
వివేకపథం పాఠకులకు అందజేయగలరు.
వివేకపథ పాఠక మిత్రులకు,
నమస్తే!
సంపాదకులైన శ్రీ సురేంద్రబాబు సత్య జ్ఞాన సంఘ 40వ వార్షికోత్సవ
విషయాలను సంక్షిప్తంగా మీకు అందజేస్తూ అనేక ప్రశ్నలను లేవనెత్తారు. వ్యాస రచనలో
అసంబద్ధాలు ఉన్నాయంటూ, వాటిని ఎత్తి చూపారు. పదపదము
విడదీస్తూ, చదువరుల గ్రాహక శక్తిని సక్రమ పరచగల పంచ ప్రశ్న
పద్ధతిని ప్రవేశపెట్టారు. కానీ మీరెవరూ సత్యజ్ఞాన సంఘము 40వ
వార్షికోత్సవ సమావేశానికి హాజరు కాలేదు. ఏ వ్యాసమైతే మేము వారికి అందజేసామో అది
మీరు ముందుగా చదివి, స్వతహాగా మీరే ఒక అభిప్రాయానికి
రావడానికి అవకాశమేర్పడలేదు. అంతేకాదు, బాబుగారు సత్యజ్ఞాన
సంఘముతో 20 సంవత్సరాలకు పైగా సంబంధ పడినవారు. సత్యజ్ఞాన
సంఘము స్థాపకులు కీర్తిశేషులు శ్రీ ఎస్. పెంచలయ్య వారితో కలసి ఎన్నో సమావేశాలు
జరుపుతూ, పరస్పరం భావ సమైక్యతకు ప్రయత్నిస్తూ, చివరగా అది సాధ్యపడక పూర్తిగా విడిపోవడం జరిగినది. కానీ సత్యజ్ఞాన సంఘము
తోటి ఇంతటి సుదీర్ఘమైన సంబంధము మీకెవరికీ లేదు.
శ్రీ పెంచలయ్య వారు, వారి
చివరి రోజులలో “దేవుడున్నాడు...... దేవుని ప్రత్యక్షంగా చూడవచ్చు” అని
ప్రకటిస్తూ “ఉపనిషత్తు
సందేశం”
అను శీర్షికతో ఒక పుస్తకం ప్రచురించటం కూడా జరిగినది. ఈ విషయం
సత్యజ్ఞాన సంఘము సభ్యులెవరికి ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించలేదు. కారణం జీవిత
పరిశీలన ఎలా జరగాలో వివరిస్తూ, జ్ఞాన ప్రక్రియ అత్యంత
ప్రధానమైనదని తెలియజేసేవారు. అందుకు లక్షణ ప్రమాణ విద్య తోడ్పడగలదని, దానిని కూడా పదే పదే వివరించేవారు. మనిషి యొక్క ప్రధానమైన కోరికలను 4
గా వర్గీకరించారు:
1)
నాకు సుఖము ఉండాలి.
2)
దుఃఖం రాకూడదు.
3)
చనిపోకూడదు.
4)
స్వతంత్రుడుగా ఉండాలి.
ఇట్టి పరిశీలన ఉపనిషత్కారులు,
దర్శనకారులు కూడా చేశారంటూ ఎన్నో ఉపనిషత్తు శ్లోకాలను వివరించేవారు.
వాటిపై సాంప్రదాయ బద్ధంగా ఏర్పడ్డ అపోహలను తెలియజేస్తూ, జీవితం
పట్ల మనం స్వయంగా చేసెడి పరిశీలనకు ఉపనిషత్కారుల పరిశీలన ఒకటిగానే ఉందని
ప్రస్తావించేవారు. ఎన్నో శ్లోకాలు చెప్తూ వాటి అర్థాలూ ఎలా తీసుకోవాలో
వివరించేవారు. కనుకనే ఆయన "దేవుడున్నాడు ప్రత్యక్షముగా
దర్శించవచ్చు”,
అందుకు లక్షణ ప్రమాణ విద్య సాధనం కాగలదని అన్నప్పుడు సంఘ సభ్యులకు ఆ
మాటల్లో విడ్డూరమేమీ కనిపించలేదు.
2013
కానీ సురేంద్రబాబు గారికి ఇది చాలా విడ్డూరంగా కనిపించింది.
పెంచలయ్య వారు చనిపోయిన తరువాత వెంకటగిరిలో నన్ను సురేంద్రబాబు గారు కలసినప్పుడు (2013)
ఒక మాట అడిగారు.
“మీరు మాతో కలవండి. మనం కలిసి
కార్యక్రమం జరుపుతాం. నేను ఈ మాట త్రికరణ శుద్ధితో అంటున్నాను” అని అన్నారు.
అందుకు నా సమ్మతము వ్యక్త పరచలేదు. భావ సమైక్యత లేక కలవటానికి నాకు ఇష్టం లేదు.
కనుకనే నేను మౌనం వహించాను. వారి తిరుగుప్రయాణంలో ఒక వ్యాఖ్య చేశారు. “వ్యక్తులతో
సంఘాలు వస్తాయి. కానీ వాటి అస్తిత్వం వారి జీవితకాలం వరకే. వారి జీవితకాలం ముగిసిన
తరువాత వారితోనే ఆ సంఘాలు అంతమవుతాయి”అని. అప్పుడు కూడా నేను ఏమి మాట్లాడ లేదు. తరువాత వారు
వివేకపథం పత్రికలో “ముగిసిన,
ముగించిన పెంచలయ్య గారి జీవనయానము”అన్న శీర్షిక
క్రింద ఒక వ్యాసము రాశారు. మరొక సంవత్సరము తరువాత వివేక పథంలో పెంచలయ్య గారి పట్ల
తనకు గల 20 సంవత్సరముల
సంబంధమును నెమరువేసుకుంటూ సురేంద్ర బాబు గారు అన్న మాటలు:
“నేను ఇంతకాలం
వీరితో కలిసి తిరిగాను అంటే, నామీద
నాకే జాలి కలిగింది”
అందుకు సమాధానంగా నేను వారికి ఒక లేఖ వ్రాశాను. అందులో “సంస్థలు ఎన్నయినా
రావచ్చు, పోవచ్చు. కానీ సంస్థ
స్థాపకులు సమాజానికి అందించ దలచిన విషయము సమాజ పురోగమనానికి దారితీయ గలిగినట్లయితే
అట్టి భావాలు సమాజంలో సజీవంగానే నిలబడగలవు”, అని వ్రాస్తూ,
సత్యజ్ఞాన సంఘము జీవితంపట్ల పరిశీలన, విచారణ,
నిర్ధారణ అన్న అంశాలను ముందుంచుకుని దానికి అనుగుణంగా తన భవిష్యత్
కార్యక్రమమును రూపు దిద్దుకుంటుందని ముగించాను.
2017
పెంచలయ్య వారు తన చివరి రోజులలో నాతో ఒక మాట అన్నారు. “సురేంద్రబాబు తోటి
మనకు భేదాభిప్రాయం తొలిగే అవకాశం లేదు”
అని. కానీ నా మనసులో నేను బాబుగారితో సంబంధము పూర్తిగా తెంచుకోవాలని
లేదు. బాబుగారు 2016 ప్రాంతంలో తన సభ్యుల ద్వారా పాత మిత్రులమంతా
కలిస్తే బాగుండు అన్న భావాన్ని వ్యక్త పరిచారు. అది ఒక ఆహ్వానంగా భావిస్తూ 2017,
ఏప్రిల్ నెలలో ద్వారకుంటలో సమావేశమయ్యాము. ఉదయము 9 గంటల నుండి 5 గంటల వరకు సమాజములో వేదాంత పరంగా
ఏర్పడ్డ గందరగోళం తొలగాలి అంటూ నేను మాట్లాడడం జరిగినది. దానిని మొత్తం వీడియో రికార్డింగ్
చేశారు.
ముగింపుగా నేను “మన దృష్టి అంతా ఇంద్రియ సంబంధముగా తెలియబడెడి జ్ఞానము వరకే
పరిమితమైంది తనను గురించిన అవగాహన కొరకు జరగవలసిన ప్రయత్నము జరుగుట లేదు. కనుకనే
పరస్పర భేద భావాలతో ఘర్షించుకుంటూ, ఎవరికి
వారు ప్రక్క వాడితో పోటీపడుతూ సమాజంలో ఉన్న వారికి, లేని వారికి అంతరాన్ని
విపరీతంగా పెంచేశారు. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మొత్తం ఆర్థిక సంపద
అంతా, ఒక శాతంగా వున్న వ్యాపారవేత్తల చేతులలోకి వచ్చేసింది.
సంపద వారి చేతులలో ఉంది కనుక సామాజిక పరిస్థితులను శాసించ గలుగుతున్నారు. వారి
ఆధిక్యతను నిలుపు కొనుటకు చేసెడి నిరంతర ప్రయత్నములో మానవ సంబంధాలు ఎంత
దెబ్బతింటున్నా వారికి పట్టదు. జీవన స్థితిగతులు ఎంత తారుమారు అయినా వారికి పట్టదు” అలా ముగించటం
జరిగినది.
సాయంత్రం ఇంచుమించు అందరూ వెళ్లిపోయారు. సోమ్ ప్రకాష్ గారు
ఇంకా వెళ్ళలేదు. వారి సమక్షంలో నాకు సురేంద్ర బాబు గారికి మధ్య జరిగిన సంభాషణను నా
జ్ఞాపకశక్తిని ఆధారంగా చేసుకుని మీ ముందు ఉంచుతున్నాను.
బాబు: అయితే మనము ఎదుర్కుంటున్న సంక్షోభానికి గల కారణము,
మీరు సూచించే జ్ఞానము లేకపోవడమేనా?
ఎన్ కె: అవును బాబు.
బాబు: ఇలా ఎంత మందిని మార్చగలరు?
ఎన్ కె: మీరు విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. (ప్రక్కదారి
పట్టిస్తున్నారు.)
బాబు: మౌనం
బాబు: మీరు ప్రస్తావించిన ఎన్నో విషయాలు పరీక్షకు నిలబడవు.
ఎన్ కె: మౌనం
బాబు: మీరు మూడు నెలలకొకసారి ఇక్కడ సమావేశాలు జరపవచ్చు. మీరు
ప్రస్తావించెడి ఆయా విషయాలను పరీక్షకు పెడదాం...
ఎన్ కె: (పరీక్ష అన్న పదం చాలా పెద్ద మాటగా అనిపించింది)
పరీక్షించ వలసినంత అవసరమేమీ లేదు బాబు.
బాబు: పరీక్షించకపోతే ఎలా?
సోమ్ ప్రకాష్: అవసరం లేదనే!
బాబు: మీరు సూచించిన ధోరణిలో నేను కూడా ఒక 6
నెలలపాటు ప్రయోగం చేస్తాను.
ఎన్ కె: మీరు చేయలేరు బాబు. మీకు మా పట్ల చాలా నెగిటివ్ భావం
ఉంది.
బాబు : నెగిటివ్ భావం ఉన్నది నూరు శాతం కరెక్టే. కానీ నా సొంత
భావాలను ప్రక్కన పెట్టి నిష్పాక్షికంగా ప్రయోగం చేయగలను. అలా లోగడ చేసి ఉన్నాను.
అక్కడకు మా మాటలు ముగిశాయి. ప్రక్క రోజు ఉదయం ఒక పెద్ద ఆయన, “నేను నిన్న మీ
మాటలను ఆలస్యంగా వచ్చిన కారణంగా పూర్తిగా వినలేక పోయాను. ఇప్పుడు మరలా చెప్పగలరా?” అని అడిగారు.
మధ్యాహ్నం భోజన సమయం వరకు నేను ముందు రోజు అన్నమాటలను తిరిగి చెప్పటం జరిగినది. ఆ
మాటలను శ్యామలమ్మ గారు కొంతవరకు వింటూ వచ్చారు. బాబుగారు కొంత వింటూ కొంత ఫోన్లో
మాట్లాడుతూ బయటకు వెళ్ళేవారు. భోజనం తరువాత, మేము సెలవు తీసుకున్నాం. ద్వారకుంటలో జరిగిన సంభాషణలు తమ వివేకపథంలో
వేస్తారని అనుకున్నాను. కానీ ఆ విషయాలు ప్రస్తావించినట్లుగా నాకు తెలియలేదు. తను
చేస్తానన్న ప్రయోగం చేసినట్లు కానీ, చేయనట్లు గాని ఎక్కడ, ఎప్పుడు,
ఎవరితోనూ ప్రస్తావించినట్లు నాకు తెలియలేదు. అది ప్రయోగార్హమని గాని,
ప్రయోగార్హము కాదని గాని నిర్ధారించినట్లు ఎవరితోనూ అన్నట్లుగా నాకు తెలియదు.
2018
2018
మార్చి నెలలో మేము 38వ వార్షికోత్సవ సందర్భంగా
మాట్లాడుకున్న విషయాలు “దేవుడున్నాడు - దేవుని దర్శించవచ్చు” అన్న పేరుతో ఒక
చిన్న పుస్తక రూపంలో ప్రచురించాం. దానిని శ్రీ కృష్ణ గీత ఆశ్రమం,
మడమనూరు, నెల్లూరు జిల్లాలో ఆవిష్కరించదలిచాము.
కొన్ని పుస్తకాలను ప్రసాద్ గారికి (విజయవాడ) పంపాము. పుస్తక ఆవిష్కరణ
కార్యక్రమానికి రాగలరేమోనని ఫోనులో మాట్లాడినాను. కానీ తనకు గాని, బాబు గారికి గాని ఇతర కార్యక్రమాల కారణంగా రాలేమని అన్నారు. పుస్తకం మీద
వారి యొక్క పరిశీలన వివేకపథంలో పెడతారనుకున్నాను. కానీ అలా ప్రచురించినట్లు నాకేమీ
తెలియలేదు.
2021
ఏప్రిల్ నెలలో సత్యజ్ఞాన సంఘ 40వ వార్షికోత్సవ సందర్భంగా బాబు గారిని ముఖ్య అతిథిగా ఫోను ద్వారా
ఆహ్వానించాము. అందుకు ఆయన ఒప్పుకున్నారు. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువ ఉన్న కారణంగా
కార్యక్రమాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. 2021 మార్చి 14వ తారీఖున 40వ వార్షికోత్సవాన్ని మడమనూరు, శ్రీ కృష్ణ గీతా ఆశ్రమంలో శ్రీ ప్రణవ ఆత్మానంద సరస్వతి స్వాములవారి
ఆధ్వర్యంలో జరిగినది. సమావేశము చివరిలో బాబు గారిని తన ముఖ్య అతిథి హెూదాలో
మాట్లాడమని అక్కడ ఉన్నవారు బాగా ఒత్తిడి చేశారు. అయినా తన గట్టి నిర్ణయంతో
మాట్లాడనని ఉండిపోయారు.
ఇంత వ్రాయడంలో ఉద్దేశం సురేంద్ర బాబు గారికి మాకు ఉన్న సంబంధం
ఒక రోజుది కాదు. కీర్తిశేషులు శ్రీ పెంచలయ్య గారితో 20
సంవత్సరములు. సత్యజ్ఞాన సంఘము తోటి ఇప్పటివరకు 25 సంవత్సరాలు పైగా సత్య జ్ఞాన సంఘముతో అంత దీర్ఘకాల సంబంధం ఉన్న బాబు గారు,
సత్యజ్ఞాన సంఘమును గురించి ఏమీ తెలియని మీకు, వార్షికోత్సవ
సమావేశంలో పాల్గొనని మీకు, కనీసం దానికి సంబంధించిన
వ్యాసమును కూడా చదవని మీకు, అందులోని 4, 5 పాయింట్లను తీసుకుని పంచ ప్రశ్న పద్ధతి అన్న నియమావళి ప్రవేశ పెట్టి ప్రశ్నల
మీద ప్రశ్నలు లేవనెత్తుతూ తన విమర్శనాత్మకమైన విశ్లేషణను 24 పేజీలలో
నింపి వేస్తూ, ఇంకనూ వివరిస్తే ఒక చిన్నపాటి గ్రంథము
అవుతుందని ముగించటం జరిగినది.
చివరి యత్నం!
సమావేశానికి బాబు గారిని ఆహ్వానించటానికి ఎవరు సుముఖత
వ్యక్తపరచలేదు. వద్దని ప్రతి ఒక్కరు హెచ్చరించారు. అయినా నా పట్టుదల నాది. 25
సంవత్సరములుగా మా విభేదాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ, చివరి ప్రయత్నం చేస్తామని అందరిని ఒప్పించి బాబు గారిని ఆహ్వానించడం
జరిగినది. బాబు గారు 255 వివేకపథంలో లేవనెత్తిన పాయింట్స్ కి
నేను తిరిగి సమాధానం ఇవ్వదలచినట్లయితే, ఒక్కొక్క పాయింటు మీద
సుదీర్ఘంగా వివరణ చేయవలసి వస్తుంది. మరలా దానిపై బాబు గారు పదాన్ని విడగొడుతూ,
విశ్లేషణ ప్రశ్నల పరంపర తోటి ఒక మహత్ గ్రంథాన్ని తయారు చేయగలరు.
బాబుగారి భాషా పరిజ్ఞానం అట్టిది. అట్టి భాషా పరిజ్ఞానం సంపాదించుకోవాలన్న కోరిక
మాకు లేదు. దాని యొక్క ఆవశ్యకతను మేము గుర్తించుట లేదు. విషయ అవగాహనకు అది అవరోధము
కూడాను. మేము ఎన్నుకున్న
మార్గాలు వేరు. ప్రశ్నల మీద ప్రశ్నలు
తోటి చర్చావేదిక యుద్ధ వేదిక కాకూడదు. బాబు గారితో నేను చేసిన నా ఈ చివరి
ప్రయత్నముతో మా దారులు కలిసే అవకాశం లేదన్నది స్పష్టంగా తేలిపోయింది.
శ్రీ ప్రణవాత్మానంద సరస్వతి స్వాములవారు (పూర్వాశ్రమ శ్రీ
ప్రమోద చైతన్య గారు) ఒక శ్రేయోభిలాషిగా నాకు ఇచ్చిన సలహా,
“కృష్ణారావు
గారు తర్కమే జీవితం కారాదు. ఏ అవగాహన కొరకు తర్కము సాధనము అయ్యిందో ఆ అవగాహనతో ఈ
శేష జీవితాన్ని గడుపుతాము. అంతవరకే!” వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
40వ వార్షికోత్సవ సంబంధంగా వ్రాసిన వ్యాసములోని ముఖ్య విషయములు
గత 5000 సంవత్సరముల
మన చరిత్ర చూచినట్లయితే మనకు కనిపించేది యుద్ధాలు, ఆందోళనలు,
అక్రమాలు, అరాచకాలు, అమానుషమైన
నరమేధం, మానవహక్కులను తొక్కి వేయటాలు.... అంతే! ఈరోజుకి
జరుగుతున్నది అదే!
ఒక్క కరోనా విషయం తీసుకుందాము: 100
సంవత్సరముల క్రితం ఇటువంటి వైరల్ జ్వరమే, స్పానిష్
ఫీవర్ అన్న పేరుతో కోట్ల మందిని ప్రపంచమంతటా బలి తీసుకున్నది.
మన దేశములో రెండు కోట్లకు పైగా చనిపోయారు. ఈ వంద సంవత్సరములలో
సైన్సు ఎంత అభివృద్ధి అయినది, టెక్నాలజి
ఎంత అభివృద్ధి అయినది. కరోనాని గుర్తించగానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసి,
తక్షణమే తగు చర్యలు తీసుకుని ఉంటే దాని వ్యాప్తి అక్కడికి ఆగిపోయి
ఉండేది. దానికి బదులుగా బయట పడిన విషయం గుప్తంగా ఉంచుతూ, ఎవరైనా
నోరు మెదపటానికి ప్రయత్నిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకున్నారన్న వార్తలు
విన్నాము. దాని పర్యవసానం ఈ రోజుకి ఈ ప్రపంచం మొత్తం మీద చనిపోయిన వాళ్ళ సంఖ్య 30
లక్షలు. ఏమిటి దీనికి కారణం!
మానవాళి ఒకటిగా లేకపోవడమే!
జాతి, మత, కుల భేదాలతో విడిపోయాం . ఏ మతానికి ఆ మతం, ఏ
దేశానికి ఆ దేశం ప్రపంచ ఆధిక్యత కొరకు పన్నాగాలు పన్నుతూనే ఉన్నాయి. మరొకవైపు “క్లైమేట్ చేంజ్” అన్నది జీవన
స్థితిగతులను మార్చివేస్తుందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. చేయిదాటి పోతున్నట్టి
ఈ దుస్థితికి కారణం ఏమిటి! ఒక్క మాటలో చెప్పాలంటే
జీవితమునకు ఆధార భూతమైన పోషణ రక్షణ లేకుండా జీవిస్తున్నాము.
రోగగ్రస్తమైన మన సమాజానికి మూల కారణం ఏమిటో తెలుసుకోవలసిన
అవసరం ఉందని సత్యజ్ఞాన సంఘము లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ విధంగా సత్యజ్ఞాన సంఘము తెలుసుకున్నది
కొత్త విషయమేమీ కాదన్నది గమనించింది. 3000 సంవత్సరముల క్రితమే తత్వ పరిశోధకులు ఆ కారణాన్ని ఛేదించగలిగామనే
భావించారు. వారు మనిషికి తనను, గురించిన స్పష్టమైన జ్ఞానం
కలగకపోవడమే అన్ని సమస్యలకు మూలమై ఉందని నిర్ధారించారు. అంతేకాక ప్రపంచ మంతటా వివిధ
కాలాలలో తత్వవేత్తలు అదే వాస్తవాన్ని వ్యక్తపరిచారు. ఉష్ణ ధర్మం కలది అగ్ని అని
గుర్తించినప్పుడు, అగ్ని ఉన్నంతవరకు ఆ ధర్మం ఉండాలి. అది ఏ
కాలమైనా ఏ ప్రాంతమైనా ఆ ధర్మం ఉన్నప్పుడు దానిని అగ్ని అని అంటాము. అలాగే మనిషి
అనబడే ఈ వస్తువు ధర్మమేమిటని నిర్ధారించగలిగితే అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ అదే ధర్మము తెలియబడాలి.
వస్తు ధర్మం వస్తువుతో ఉండేది మరియూ వస్తువుతో అంతమయ్యేది.
మనిషి నిజ తత్వమిది అని నిర్ధారించగలిగేది పరిపూర్ణ విజ్ఞాన
శాస్త్రం. వేల సంవత్సరముల క్రితమే జీవిత తత్వ పరిశోధకులైనట్టి ఋషుల అంతరంగమందు పరిమళించినది
అదే. ఆ ఋష్యపరంపర ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతునే ఉంది. మనిషి జీవితముతో
ముడిపడ్డ ఈ పరిపూర్ణ విజ్ఞాన శాస్త్రము వ్యక్తి శ్రేయస్సు సమష్టి శ్రేయస్సుకు వేరు
కాదని రుజువు చూపుతుంది. సమష్టికి హాని కలిగితే,
దాని ప్రభావము వ్యక్తి పైన పడక తప్పదు. గమనించవలసినది ఒక్కటే. ఇచ్చట
ప్రయోగ కర్త, ప్రయోగ వస్తువు, ప్రయోగ ఆలయం,
ప్రయోగ ఫలితం తనే అవుతున్నాడు. కనుకనే ఎంతో నిశితంగా పరిశోధన కొనసాగించవలసిన
అవసరం ఉంది. అందుకు అద్భుతంగా సహకరించగలిగేది సత్సంగం. సామరస్య వాతావరణంలో,
జిజ్ఞాసే ప్రధానముగా గల మనస్సుతో పరస్పరం సహకరించుకోగలిగితే,
అవగాహన అన్నది సులభతరం అవుతుంది. పసిబిడ్డ మనస్సు శుద్ధమైనది. “తన తోటి వాళ్ళ కులమేమిటి, మతమేమిటి, దేశమేమిటి, రంగేమిటి” అంటే ఏమిటో
వారికి తెలియదు. వాళ్ళతో కలసి రోజంతా ఆటలు ఆడుతూ తనను తానే మరచి పోతాడు. అంత
శుద్ధమైన మనసును కాపాడవలసిన బాధ్యత విద్యా వ్యవస్థది. ఆ నిర్మల స్వభావాన్ని
పోషిస్తూ, మొత్తం మానవాళితో సమైక్యపరచగల విద్యను రూపొందించ
వలసిన అవసరం ఉంది. అప్పుడే మానవ వికాసం అన్న పదమునకు అర్థమును చూడగలము.
యావత్ మానవాళిని కలిపి ఒకటిగా కట్టి వేయగల మహత్తర పాశము,
“ప్రేమ”.
అది ఒకరు తయారు చేసినది కాదు. అలవరచుకునేది కూడా కాదు. అది
ఉంది. అంతే. దానిని మనము చూడగలగాలి.
It
is gravitational pull that we experience at the spiritual level.
వేల సంవత్సరాలుగా కుల, మత, జాతీయతా భావాలతో నిర్మించుకున్న అడ్డుగోడలను పడగొట్టగలగాలి.
అంతే కాదు. ఎవరికి వారు తమలో తాము సృష్టించుకున్న భావనా వలయాన్ని ఛేదించగలగాలి.
అలల ఉదృతం ఆగాలి. అప్పుడు నిశ్చలమైన తన అంతరంగమందు తనను దర్శించగలిగేదే ఆ ప్రేమ.
ఆ "ప్రేమ
స్వరూపమే దైవము”
పరిమితమైన మన సహానుభూతిని (compassion)
విస్తృత పరచగల భావముతో
సర్వ జీవరాశి తోనూ,
ప్రకృతి తోనూ, ప్రకృతి సౌందర్యంతోనూ ఒకటవుతూ
మనలను మన నుండి విడుదల చేసుకోవడమే మన లక్ష్యం కావాలి.
అట్టి సత్య దృష్టికి అవసరమైన వైజ్ఞానిక మార్గాన్ని సూచించిన
వారు కీర్తిశేషులు శ్రీ ఎస్. పెంచలయ్య వారు.
ప్రపంచ శాంతిని సాధించుటకు మరొక మార్గం లేదు.
“సర్వేజనా
సుఖినోభవంతు........... మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్”
(అందరూ సుఖంగా ఉండాలి...... ఎవరికీ కష్టం రాకూడదు.)
నమస్తే. సెలవు.
ప్రతిస్పందన: యోచనాశీలురూ,
మిత్రులూ అయిన కృష్ణారావు గారికి, ఈ మీ లేఖను రెండుగా
విడదీసి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి, పెంచలయ్య
గారితో, సత్య జ్ఞాన సంఘ మిత్రులతో గతానికి చెంది నాకున్న
సంబంధాల గురించి, రెండు, ప్రస్తుతం 40వ వార్షికోత్సవం సందర్భంలో మీరు చేసిన ప్రసంగాంశాల గురించి.
నా ఉద్దేశం ప్రకారమైతే ఒకటవ అంశానికి చెందిన విషయాలు ఈనాటి
వివేకపథం
పాఠకుల ముందుకు తేవలసిన అవసరం లేదు. వాటిని క్లుప్త రూపంలో
పాఠకుల ముందుంచడం వల్ల అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం.
మీ ఉద్దేశంలో, వాటిని
పాఠకులకు తెలపడం వల్ల వాస్తవాలను అర్థం చేసుకోవడం విషయంలో సహాయపడతాయి అనిపిస్తే,
వాటిని మరికొంత వివరంగా పత్రికలో ప్రస్తావించడానికి నా కెట్టి
అభ్యంతరం లేదు. మీరు గాని వాటిని పరిశీలించాల్సిందేననేట్లయితే, అటు పత్రిక ద్వారా గానీ, లేకుంటే, మనం ఒక బృందంగా సమావేశమై గానీ పెంచలయ్య గారి
సంబంధంగా నేను వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటినీ విచారణకు
తీసుకోడానికి నేను సిద్ధము. విచారణలో తేలిన వాటిని తేలినట్లు బృందంలోని వారందరమూ
అంగీకరించి, స్వీకరించాలి. నా
వరకు నేనైతే, ఆ విచారణాంశాలనన్నింటిని సంగ్రహంగా
ప్రకటిస్తాను. పొరపాటుగా ఏమైనా మాట్లాడానని తేలితే, ఆ
విషయాన్ని ప్రముఖంగా ప్రకటిస్తాను. ఈ విషయంలో నిర్ణయం మీదే. 2013 నుండి ఆయా కాలాలలో జరిగిన సంఘటనలుగ మీరు
ప్రస్తావించిన వాటిని పునర్విచారణ
చేసుకోడానికి నా వరకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు,
సరికదా చేస్తే బాగుండును అన్న దృష్టే ఉంది. నేను నావిగా ప్రకటించిన
ప్రతి అభిప్రాయ విషయంలోనూ, అది సరైందేనని నిర్ధారించాల్సిన
బాధ్యత నా పైనే ఉంది. ఇక ప్రస్తుతాంశమైన, మీ ప్రసంగ పాఠంలోని
అంశాలపై నేను వివేకపథం 255 లో మాట్లాడిన దాన్ని గురించి.
1)
మీ ప్రసంగ పాఠాన్ని యథాతథంగా పాఠకులకు అందించకుండా, అందులోని కొన్ని అంశాలను మాత్రమే లేవనెత్తడం, అంత
సరైంది కాదు అన్నది మీ మాట. దీనిపై రెండు విధాలుగా నా అభిప్రాయం చెప్పే వీలుంది.
రెండూ సరైనవేనన్నది నా అభిప్రాయం.
2)
మీరన్నట్లు మొత్తం ప్రసంగ పాఠాన్ని పాఠకులకు అందించి, ఆ తరువాతనే నేను నా విశ్లేషణను చేసి ఉండడం, ఇది సరైన
పద్ధతే. ఇప్పటికీ మీరు అదే ఇష్టపడుతున్నట్లైతే, వచ్చే సంచికలో
మీ ప్రసంగ పాఠాన్ని యధాతథంగా ప్రచురిస్తాను. ఆ తరువాత, నేను 255లో లేవనెత్తిన అంశాలకు కట్టుబడే నా పక్షాన్ని వినిపిస్తాను. నా వైపున ఏవైన
పొరపాట్లు జరిగినట్లు పరిశీలనలో తేలితే, ఆ మేరకు పత్రికలోనే
సవరణ ప్రకటన చేస్తాను.
3)
ఇక రెండవ విధానం, ఒక ప్రసంగంలో నుండి, నాకు అడగాలనిపించిన అంశాల వరకు ఎంపిక చేసుకుని వాటిపై విశ్లేషణ సాగించడం.
ఇదీ సరైన విధానమే. సత్య జ్ఞాన సంఘం అనుసరించిన విధానం కూడా
ఇదే. సాధారణంగా ఎక్కువ మంది విశ్లేషకులు విమర్శకులూ అనుసరించే విధానం కూడా ఇదే.
ఉదాహరణకు, పెంచలయ్య
గారు శంకరాద్వైతంఒక పరిశీలన అన్న రచనలో, గీతపై, శంకరుని భాష్యాన్ని పరిశీలిద్దామంటూ ఆరంభించిన పరిశీలన, మొత్తం భాష్యాన్ని ప్రకటించి విమర్శించలేదు. ఎంచుకున్న భాగాల పైనే పరిశీలన
సాగించారు. ఇక్కడ నేను చెప్పదలచుకుంది పెంచలయ్య గారు అనుసరించారు గనుక ఆ విధానము
సరైందేననాలని కాదు. ఆ విధానం సరైందేనని సత్యజ్ఞాన సంఘానికి (పెంచలయ్య గారికి)
తెలుసు అని చెప్పాలనే.
నేను చూపించిన పంచ ప్రశ్నా పద్దతిని గురించీ,
అది అనవసరమైన సాగతీత వ్యవహారం అన్నట్లు మాట్లాడారు. ఇక్కడా నేను
చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి.
1)
ఏ విశ్లేషణ అయినా, విశ్లేషణకు గురి
చేయబడుతున్న వాక్యాల పరిమాణం కంటే పెద్దదిగానే ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడా నేను
పెంచలయ్య గారు విశ్లేషించిన అంశాలనే చూపిస్తాను.
శంకరాద్వైతం పరిశీలన అన్న తన రచనలో ఆయన సాధన చతుష్టయం అన్న
వాటిపై పరిశీలన అంటూ తనదైన రీతిలో విశ్లేషణ చేశారు. అందులో శంకరుడు చెప్పిన ఒక్కో ప్రతిపాదననూ
చూపించి పేజీలకు పేజీలు విశ్లేషణ చేశారు. శంకరుని ఒక్కో భావ ప్రకటనపై తామరతంపరగా
ప్రశ్నలు లేవనెత్తారు. శంకరుడు చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పవలసి నంతగా
చెప్పలేదని తీర్మానించారు. కనుకనే ఆయన చెప్పదలచింది స్పష్టంగా అర్థం కావడం లేదని
తేల్చారు. కొన్నింట శంకరుని మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని స్పష్టంగా
పేర్కొన్నారు. మొత్తం మీద, సాధన
చతుష్టయం అన్న నాలుగు అంశాలపై పరిశీలనంటూ 36 పేజీలు
వ్రాశారు.
అదే మరి వారూ, నేను
పైన పేర్కొన్నట్లు శంకరుని గీతా భాష్యమంతటినీ ముద్రించి దానిలోని ప్రతి అంశాన్ని
విశ్లేషించే పని మొదలిడితే, అది పూర్తయ్యేటప్పటికి ఆ రచన ఒక
మహాగ్రంధ మంత అయ్యుండేది. ఇందులో అసంబద్ధత ఏమీ లేదన్నది ఎవరెప్పుడు పరీక్షించి
చూద్దామన్నా రుజువు చేయవచ్చు. విమర్శనాత్మక రచనలు చేసిన వారందరికీ ఇది అనుభవంలో ఉన్నదే.
దీనినే నేను వివేకపథం 255లో (పేజీ 20) పంచ
ప్రశ్నా పద్ధతిని అనుసరించి, కృష్ణారావు గారి ప్రసంగం
పాఠ్యాంశాలను విచారణకు లోను చేయాలంటే అదంతా చిన్నపాటి గ్రంథమే అవుతుంది అని
ప్రకటించాను. దాని వరకు ఇప్పుడు నేను చెప్పేదేమంటే, ఆ నా
మాటలు 100% వాస్తవాన్ని తెలిపేవనే. అదలా ఉంచి ఇప్పుడు నా వ్యక్తీకరణలపై
(మీరు) విశ్లేషణ ప్రారంభించినా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజమో కాదో
ఆలోచించండి.
పెంచలయ్య గారి వద్ద ‘పంచ ప్రశ్నా పద్ధతి’ అన్న చట్రం
లేదనే గాని, ఇతరులు వెల్లడించిన
అభిప్రాయాలను అర్థం చేసుకుని, దాని సబబు బేసబబులను
పరిశీలించే సందర్భంలో దాదాపు ఇదే విధానాన్ని అనుసరిస్తారాయనగారున్నూ. ఈ విషయం వరకు
ఆయనకూ నాకూ మధ్య భిన్నాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయమే ఉంది. 10, 15 సంవత్సరములు ఇతర సిద్ధాంతవేత్తలతో మాట్లాడే సందర్భంలో, ఆయన మాట్లాడినా, నేను మాట్లాడినా ఇదే విధానాన్ని
అనుసరిస్తూ వచ్చాము మేమిరువురమూ.
“భాషా పరిజ్ఞానం
సంపాదించుకోవాలన్న కోరిక మాకు లేదు. దాని యొక్క ఆవశ్యకతను మేము గుర్తించుట లేదు.
విషయావగాహనకు అది అవరోధం కూడా”
అన్నది మీరు ప్రకటించిన మరో ముఖ్యాంశం. సాహితీవేత్త
అనిపించుకోవడానికి కావలసిన భాషా పరిజ్ఞానం అక్కరలేదనవచ్చు గానీ, తత్వ క్షేత్రంలో వాడబడే ముఖ్య పదాల విషయంలో ఖచ్చితమైన భాషా పరిజ్ఞానం గాని
లేకుంటే చెప్పే దగ్గరా, వినే దగ్గరా కూడా గందరగోళం ఏర్పడి
తీరుతుంది. తత్వ పరిభాషా జ్ఞానం కలిగి ఉండాలన్న విషయంలోనూ, నాకూ
పెంచలయ్య గారికీ మధ్య ఏకాభిప్రాయమే ఉంది. మీరు కూడా మీ ప్రసంగంలో, వక్త ఎవరైనా, తను మాట్లాడిన ప్రతి మాటకూ అర్ధాన్ని
చూపించాల్సిందే నన్నారు. ఇక పెంచలయ్య గారైతే, మొదట అడిగే
ప్రశ్నే ఇది. నీవు చెప్పిన పదానికి అర్థమేమిటో నిర్వచన రూపంలో చెప్పు. అదే పదార్థ
వర్గం క్రిందికి వస్తుందో చెప్పు. అర్థం ఏ ప్రమాణగోచరమో చెప్పు. అన్న దానితోనే ఆయన పరిశీలన ఆరంభిస్తారు. కావాలంటే, శ్రీ శంకరుని మాటలలో గీతా భాష్యమందలి అద్వైతము పరిశీలన, అన్న రచననే చూడండి. తత్వ పరిభాష తెలిసి ఉండడం ఎంత అవసరమని ఆయనంటున్నారో
మీకే తెలుస్తుంది.
ప్రసంగ పాఠంలోని ముఖ్యాంశాలుగా మీరు చెబుతున్నవి.
1)
గత 5వేల సంవత్సరముల మానవ చరిత్ర అంతా అరాచకాల
చరిత్రే.
2)
ఇప్పటి, కరోనా విషయంలో గానీ గత కాలంలో వచ్చిన
ప్రమాదకర రోగాల విషయంలో గానీ వ్యక్తులు, దేశాలు
ప్రవర్తిస్తున్న తీరు ఆందోళనకరంగానే కాదు, ప్రమాదకరంగానూ
ఉంటోంది.
3)
దీనికి కారణం మానవాళి ఒక్కటిగా లేకపోవడమే. అందులో మతాలు, దేశాలూ ఆధిపత్యం కొరకు పన్నాగాలు పన్నుతున్నాయి.
4)
మరోవంక వాతావరణ కాలుష్యం ప్రమాదకరంగా తయారైంది.
ఇవన్నీ కూడడం వల్ల మానవ మనుగడకు ఆధారభూతమైన పోషణ రక్షణ లేకుండా
జీవిస్తున్నాం.
5)
దీనికి మూల కారణమేమిటో కనుగొనాలని సత్యజ్ఞాన సంఘం పరిశోధించి,
తెలుసుకున్నది.
6)
మనిషికి తనను గురించిన స్పష్టమైన జ్ఞానం కలగకపోవడమే అన్ని సమస్యలకూ మూల
కారణం అని తెలుసుకున్నది.
7)
మనిషి అనబడే ఈ వస్తువు ధర్మమేమిటో నిర్ధారించ గలిగితే, అన్ని కాలాలలోనూ, అన్ని ప్రాంతాల లోనూ అదే ధర్మం
తెలియ బడాలి.
సూత్రం: వస్తు ధర్మం వస్తువుతోనే ఉండేది. వస్తువుతో అంతమయ్యేది,
(గా ఉంటుంది). కృష్ణారావు గారు! ఇంతవరకు మీరు ముఖ్యాంశములని
ప్రకటించిన వాటిపై మీరు సిద్ధపడితే విచారణ సాగించుదాం. ఒప్పని తేలిన అంశాలు
స్వీకరించుదాం. తప్పని తేలిన వాటిని విసర్జించుదాం. అప్పటికి తేలని వాటిని
అనిర్ధారితాల క్రింద ఉంచుదాం. మీకు అంగీకారమైతే చెప్పండి.
8)
3000 సంవత్సరముల నాటి నుండీ ఋషులకీ విషయాలు తెలుసన్నారు. ఆ వివరాలివ్వండి.
9)
ఆ రుషి పరంపర ఈ నాటి వరకూ సాగుతుందన్నారు. ఆ వివరాలూ ఇవ్వండి.
10)
మనిషి నిజ తత్వమిది అని నిర్ధారించ గలిగేదే పరిపూర్ణ
విజ్ఞానశాస్త్రం అని అన్నారు. అలాటి గ్రంథం ఎక్కడుందో తెలుపండి.
మీ ప్రసంగ పాఠంలో మనిషి నిజ తత్వమేమిటన్నది ఎక్కడ చెప్పారో
చెప్పండి. మరోసారి చూస్తాను.
11)
దీనిపై ప్రయోగం చేయాలన్నారు. ఆ ప్రయోగ వివరాలేమిటో ఆ ప్రసంగ పాఠంలో
ఎక్కడ చెప్పారో తెలుపండి.
12)
మొత్తం మానవాళిని సమైక్య పరచగల విద్యను రూపొందించాలన్నారు. ఏమిటా విద్యా
రూపం అందులో ఏ యే అంశాలు పాఠ్యాంశాలుగ ఉంటాయి. దీని విషయంలో సత్య జ్ఞాన సంఘం ఏమి
చెబుతోంది?
13)
ప్రేమ గురించి కూడా కొన్ని మాటలు చెప్పారు. ఇంతకూ ప్రేమంటే మీ
అర్థమేమిటో మీ ప్రసంగ పాఠంలో ఎక్కడ చెప్పారు? అలాగే ‘ద్వేషం’ అన్న దానిని
గురించి వివరించ లేదు కదా!
14)
ఆ ప్రేమ స్వరూపమే దైవము-ఐన్ స్టీన్ అని వ్రాశారు. ఏమి
చెప్పదలచినట్లో అర్థం కావడం లేదు కదా!
మీరనుకున్న జీవిత సమస్య, దానికి కారణము, నివారణోపాయమూ అన్న మొత్తంలో ఈ ప్రేమ
పాత్ర ఎక్కడుంటుందో చెప్పండి.
దానిని మీరు
చెప్పదలుచుకున్న ముఖ్య విషయంగానే పరిగణించాలా? అవుననేట్లైతే మీరు
ఉన్నాడు అంటున్న ‘దేవుడు’ అన్న దాని అర్థం ‘ప్రేమ’ అనేనన్న మాట. ఇంతకూ ప్రేమ
అన్నది ఏ పదార్థ వర్గంలోకి వస్తుంది?
15) దాదాపు సారాంశం
ఇదిగో అన్నరీతిలో ఒక మాట చెప్పారు.
“పరిమితమైన మన సహానుభూతిని (compassion) విస్తృత
పరచ గల భావముతో, సర్వ జీవరాశితోనూ, ప్రకృతితోనూ,
ప్రకృతి సౌందర్యంతోనూ, ఒకటి అవుతూ మనలను మన
నుండి విడుదల చేసుకోవడమే మన లక్ష్యం కావాలి”.
కృష్ణారావు గారూ! ఈ మాటలు
నాకేమీ అర్థం కాలేదు. పదిమందికి వినిపించి వారికి ఈ ఏమర్థమైందో పరీక్షించి చూడాలి.
దీని విషయమై మీరేమి చెప్పదలుచుకున్నది, వేరే మాటలతో మీరే వివరిస్తే తప్ప ఈ మాటలు
వెనుకనున్న మీ హృదయాన్ని అర్థం చేసుకోవడం దుస్సాధ్యమన్నది నా అభిప్రాయం.
16) అట్టి సత్య
దృష్టికి అవసరమైన వైజ్ఞానిక మార్గాన్ని పెంచలయ్య గారు సూచించారన్నారు. దీనిపై
నాకున్న సందేహం ఏమిటంటే;
మీ ప్రసంగ పాఠంలో ఎక్కడైనా
ఆ వైజ్ఞానిక మార్గాన్ని గురించి వివరించారా? ఈ పాఠ్యాంశం వరకే కాదు, పెంచలయ్య గారి ఇతర రచనలలో మీకిష్టమైన ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుందాం.
అందులో ఇక్కడ మీరన్న ఆ వైజ్ఞానిక మార్గాన్ని గురించిన స్పష్టమైన వివరాలున్నాయేమో
పరిశీలించుదాం. సరిపడినంత భాషా జ్ఞానం ఉన్న పదిమందికి ఆ పుస్తకాన్నిచ్చి అందులో
పెంచలయ్య గారు చూపించిన వైజ్ఞానిక మార్గమేమిటో కనుగొనమని చెబుదాం.
ప్రస్తుతానికి 255కు సంబంధించినంతలో నేను చెప్పగలిగిందేమిటంటే; అందులో నేను ముఖ్యంగా మీ ప్రసంగ పాఠానికి సంబంధించిన మూడు అంశాలు
లేవనెత్తేను.
ఎ) మీరారచనలో, చెబుతానన్న విషయాలకు సంబంధించిన అవసరమైన వివరాలు అందించలేదు.
మరికొంత చెబితేనే గాని మీరేమి చెప్పదలుచుకున్నదీ విన్న వానికి అర్థం కాదు. కనుక
ఇలాంటి వాటి విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు.
బి) కొన్ని విషయాలలో మీరందించిన వివరాలు సాధారణానుభవాన్ని బట్టి సమంజసంగా
లేవు.
సి) మేధావులందరూ వీలైనంత త్వరగా సమావేశమై సత్యావిష్కరణ చేసుకుని
సమాజాన్ని సంస్కరించే పని చేయాలి. అది మేధావుల కర్తవ్యం అన్నది నాకు 100% అంగీకారమే. ఆ పనిలో
శక్తివంచన లేకుండా నా పాత్రను పోషించగలను. ఇవే నేను చెప్పిన అంశాలు.
చివరగా,
కృష్ణారావు గారూ! సత్య జ్ఞాన సంఘపు భావజాలాన్ని కూలంకష విచారణకు లోను
చేయాలన్నది నా బలమైన అభిప్రాయం. పెంచలయ్య గారు ఒక చోట ఏ తత్వశాస్త్రమైనా తాత్వికుడైనా...
“మానవుడనగ నేమో, వానిస్వరూప
స్వభావములేమిటో, ఉనికి కాని వేనిని కావాలంటున్నాడో, వేనిని వద్దంటున్నాడో, అవి యేవియో, అతనికి వాటికీ గల సంబంధమేమిటో, ఎందుకు వాటిని
కావాలనుకుంటున్నాడో, ఎందుకు వాటిని వద్దనుకుంటున్నాడో,
అవి రాక పోవడానికీ, పోక పోవడానికి మూల కారణమేమిటో,
వాని నెట్లు తొలగించవలెనో కూడా చెప్పవలసి ఉంది”. (పెంచలయ్య గారి అద్వైతం పరిశీలన, ముందుమాట పేజీ 10).
మీ ప్రసంగ పాఠంలో ఈ విషయాలు సరిపడి నన్ని వివరాలతో అంటే లక్షణ నిర్దేశం చేస్తూ
చెప్పారా? చెప్పలేదు. చెప్పవలసింది మిగిలి ఉంది. అది చెప్పనంతవరకు మీరేమి చెప్పదలచిందీ
విన్న వాడికి స్పష్టంగా అర్థం కాదు అన్నదే నేను చెప్పదలచింది.
ఇది పెంచలయ్య గారూ అనుసరించిన విధానమే. సరైన విధానం కూడా అదే.
-సురేంద్ర.
పంచప్రశ్నా పద్ధతి-ఆవశ్యకత
పాఠక మిత్రులారా!
సత్యాన్వేషణ మండలి ఏర్పరుచుకున్న పంచ ప్రశ్నా పద్ధతి ద్వారా అధ్యయనాంశాన్ని
తెలుసుకోడానికి,
అర్థం చేసుకోడానికి, సరైందో కాదో
తేల్చుకోటానికి, అలా ఆ పద్ధతిని ఉపయోగించకుండగనే అధ్యయన
అంశాన్ని చదివి, అర్థం చేసుకున్నాము అనుకుని, అది సరైనదేనను కోటానికి గల వ్యత్యాసాన్ని పాఠకులకు నేను తెలియజేయాలని ఈ
విషయం మీ ముందుంచుతున్నాను.
కనుక కృష్ణారావు గారి లేఖలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐన్ స్టీన్
గారిచేత చెప్పబడిన ప్రధానమైన అంశమును, అధ్యయనాంశముగా తీసుకుని పంచప్రశ్నా పద్ధతిలో
పరిశీలించి, సాధారణంగా చదివిన దానికి పంచప్రశ్నా పద్ధతి
ద్వారా పరిశీలించిన దానికి గల వ్యత్యాసమును పాఠకులకు తెలియజేయాలి అనుకున్నాను.
కృష్ణారావు గారి లేఖలోని ఐన్ స్టీన్ చే చెప్పబడిన అంశము.
“పరిమితమైన మన సహానుభూతిని (compassion) విస్తృత
పరచగల భావముతో సర్వజీవరాశి తోనూ, ప్రకృతి తోనూ, ప్రకృతి సౌందర్యము తోనూ, ఒకటవుతూ మనలను మన నుండి
విడుదల చేసుకోవడమే మన లక్ష్యం కావాలి”
ఈ అధ్యయనాంశమును సాధారణంగా చదివినవారికి ఏర్పడగల భావాలు ఇవి. రచయిత లోతైన
అంశముల గురించి స్పష్టంగా తెలిసి ఉండి మాట్లాడుతున్నారు. అవి వారి సొంత అభిప్రాయాలు
గనుకనే ధీమాగా చెప్పగలుగుతున్నారు. మనం అర్థం చేసుకోలేక పోయినా గొప్ప విషయమే అయి
ఉంటుంది. అన్న భావన ఏర్పడుతుందా? లేదా? మీకు మీరు ముందుగా
పరిశీలించుకోండి.
ఇప్పుడు ఆ వాక్యాలను పంచప్రశ్నా పద్ధతిన విచారించు కుందాం.
పంచ ప్రశ్నా పద్ధతిలో ముందుగా పాటించవలసినవి.
1)
అధ్యయనాంశంగా మీరు నిర్ణయించుకున్న భాగంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి?
2)
ఆ భాగములో ఎన్ని అభిప్రాయ ప్రకటనలు ఉన్నాయి?
3)
అందులో మీకు ఎన్ని అర్థం అయినాయి.
4)
అందులో ఎన్ని ఒప్పు అభిప్రాయాలున్నాయి? ఎన్ని
తప్పు అభిప్రాయాలున్నాయి? ఎన్ని అనిర్ధారితాలున్నాయి?
(అనిర్ధారితా లంటే తప్పనిగాని, ఒప్పనిగాని
తేల్చలేని అభిప్రాయాలని అర్థము.)
5)
అందులో అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయా?
అధ్యయనాంశంగా తీసుకున్న భాగము.
“పరిమితమైన మన సహానుభూతిని (compassion) విస్తృత
పరచగల భావముతో సర్వ జీవరాశి తోనూ, ప్రకృతి తోనూ, ప్రకృతి సౌందర్యము తోనూ ఒకటవుతూ మనలను మన నుండి విడుదల చేసుకోవడమే మన
లక్ష్యం కావాలి.”
అధ్యయనాంశంగా తీసుకున్న భాగములోని వాక్యములు... 1
ప్రకటింపబడిన అభిప్రాయాలు.......................7
అవి 1)
మన సహానుభూతి పరిమితమైనది. 2) సహానుభూతిని
విస్తృత పరుచుకోవాలన్న భావం ఉండాలి. 3) ఆ వుద్దేశ్యంతో సర్వ
జీవరాశితోనూ ఒక్కటవ్వాలి. 4) ప్రకృతితో సహానుభూతితో
ఒక్కటవ్వాలి. 5) ప్రకృతి సౌందర్యంతో సహానుభూతితో
ఒక్కటవ్వాలి. 6) మనం మన నుండి విడుదల చేసుకోవాలి. 7) అదే మన లక్ష్యం కావాలి.
ముఖ్య గమనిక: సాధారణంగా చదువుకునే వారు, ఒకే వాక్యములో 7
అభిప్రాయాలు వ్యక్తమైయున్నాయని గమనించలేరు. కానీ ఈ పద్ధతిలో
గమనించగలుగుతాము.
అర్థమయిన అభిప్రాయాలు మొత్తము......... 7
ఒప్పు అభిప్రాయాలు...................2
1)
మన సహానుభూతి పరిమితమైనది
2)
సహానుభూతిని విస్తృత పరుచుకోవాలి అన్న భావము ఉండాలి.
తప్పు అభిప్రాయాలు.. 3,4,5,7
అనిర్ధారితాలు.......... 3,4,5,6
కొన్ని అభిప్రాయాలు తప్పని నిర్ణయించడానికి కారణములు.
సర్వ జీవరాశి తోనూ సహానుభూతితో ఒకటవ్వాలి. సహానుభూతి మన అనుభవములో ప్రాణుల
విషయములో చూపించగలము. అది తన అనుకున్న వారి పట్ల మాత్రమే కలిగి ఉంటాము. పర
అనుకున్న వారిపట్ల,
శత్రువులు అనుకున్న వారిపట్ల సహానుభూతి కలిగి ఉండలేము. కనుక సర్వ
జీవరాశితో సహానుభూతి మనకు అసంభవము అని తెలుస్తుంది. కానీ రచయిత ఉద్దేశ్యంలో
సహానుభూతి అంటే కూడా ఏమిటో తెలుసుకోవాలి. అది మన అర్థముతో పొసగడం లేదు గనుక.
దీనిని మన పెద్దలు వసుధైక కుటుంబ భావన పేరుతో ఆకాంక్షగా ఇచ్చారు.
(అదియును సర్వ ప్రజలతోనే గాని, సర్వ జీవరాశితో కాదు). అది మన ఆకాంక్షే గాని
గతంలో ఎప్పుడూ ఆ భావన కలిగిఉన్న సమాజం మనకు తెలియదు. కనుక మన అర్థము ప్రకారము అది అసంభవము
కాబట్టి తప్పు అభిప్రాయము అంటున్నాము. కాదు నీదే తప్పని రచయిత అంటే సహానుభూతికి
అతని అర్థమేమిటో చెప్పి అది సరైనదేనని రుజువు పరచాల్సిన బాధ్యత రచయితదే అవుతుంది.
కనుక దీనిని అనిర్ధారితములో కూడా వేయవచ్చు.
“ప్రకృతితో సహానుభూతితో
ఒక్కటవ్వాలి”
ఇది కూడా మనకు అసంభవమని అనిపిస్తుంది. మనకు కలిగే సహానుభూతి ప్రాణులతోనే గాని
జడ పదార్థములయెడ సహానుభూతి అంటే మనకు అర్థం కావడం లేదు. కనుక సహానుభూతికి రచయిత
అర్థం మన అర్ధానికి భిన్నంగా కనపడుతుంది. అర్థం వారినుండి వస్తే కానీ మనము అర్థం
చేసుకోలేము. కనుక ఇది మన అనుభవం ప్రకారము తప్పు అభిప్రాయము. మరి వారి అర్థము
తెలియలేదు గనుక అనిర్ధారితము కూడా.
“ప్రకృతి సౌందర్యంతో
సహానుభూతితో ఒక్కటవ్వాలి”
మొదటిగా రచయిత ప్రకృతి అని చెప్పి తరువాత ప్రకృతి సౌందర్యమును విడిగా చెప్పారంటే, ఆయన ఉద్దేశ్యంలో ఆ
రెండు వేరై ఉండాలనిపిస్తుంది. వాటి అర్థము వారు వివరిస్తే గాని మనం చూడలేము. మన
అనుభవం ప్రకారం అయితే అది తప్పు అభిప్రాయంగానే కనపడుతుంది. కనుక ఇది తప్పు
అభిప్రాయము, అనిర్ధారితము అని కూడా అనవలసి ఉంటుంది.
“మనలను మన నుండి విడుదల
చేసుకోవాలి”
ఇక్కడ రచయిత అభిప్రాయం మనకు బోధపడటం లేదు. ఏ మనలను ఏ మనము నుండి విడుదల
చేసుకోవాలో అర్థం కావడం లేదు. కనుక అనిర్ధారితములో వేసాము.
వేరే విధంగా అర్థం చేసుకోటానికి ప్రయత్నించినా, మనలను మననుండి
విడుదల చేసుకోవాలి అనే ముందు మనలను మనం బంధించు కొన్నామని చెప్పి, అలా బంధించు కోటానికి గల కారణం చూపి, ఆ కారణాన్ని
నివారించగల ఉపాయము చెప్పినప్పుడే, ఆ ప్రయత్నము వలన మనల నుండి
మనం విడుదల చేసుకో గలుగుతాము. కనుక రచయిత అభిప్రాయం ఇదేనని తేల్చడానికి అవకాశం
లేదు గనుక అనిర్ధారితంలో వేయడం జరిగింది.
“అదే మన లక్ష్యం కావాలి”
అది అంటే ఏమిటో తేలకుండ గనే, అది మన లక్ష్యంగా పెట్టుకోవాలి అనడం తప్పు అభిప్రాయం
అనిపిస్తుంది. కనుక ఇది తప్పు అభిప్రాయంలో వేయడం జరిగింది.
కనుక పాఠక మిత్రులారా! పై విషయము పూర్తిగా అవగాహన చేసుకున్నాక పంచ ప్రశ్నా
పద్ధతి పాటించవలసినదా? కాదా? అని ఎవరికి వారు
ఆలోచించుకుని నిర్ణయించుకోవలసి ఉంటుంది.
ముఖ్య గమనిక: ఈ శల్య పరీక్ష చేసే విధానము కేవలము నాదో, సురేంద్ర బాబుదో,
సత్యాన్వేషణ మండలిదో కాదు. ఇది కీర్తిశేషులు పెంచలయ్య గారి విధానము
కూడా. వారిరువురి నుండే మేము ఆ విధానమును నేర్చుకున్నాము. అలానే సునిశిత పరిశీలన
చేసి నిర్ధారించే విధానములో దోషత్రయ నివారణ విధానము పెద్దలచేత అందింపబడినది. అవి అతివ్యాప్తి,
అవ్యాప్తి, అసంభవ దోషాలు ఉండకూడదన్నదే.
పాఠకులారా! మీరు పంచ ప్రశ్నా పద్ధతిలో పరిశీలించునప్పుడు అది
సురేంద్రబాబు చెప్పాడా, కృష్ణారావు గారు చెప్పారా లేక నేను చెప్పానా చూడకుండా
ఎవరు చెప్పినా చూడవలసిన విధానమిదేనని గమనించగలరు.
మరో ముఖ్య విషయము: పంచ ప్రశ్నా పద్ధతి విషయపరంగా ఉన్న అంశాలను, దాని బాగోగులను
తెలియజేస్తుంటే, వ్యక్తిపరంగా ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి
అని తెలియజేసేదే సత్యత్వ బుద్ధి. దీనిని గురించి చూద్దాము.
ఇది మేలుకొలుపు ఏప్రిల్ 1995 సంచిక నుండి గ్రహింపబడినది.
సత్యత్వ బుద్ధి
గత చరిత్రలో తాత్విక చింతనా ధోరణిని, నాటి చింతకుల
నిరంతర శ్రమను పరిశీలించగలిగితే వారందరి హృదయాంతరాలలోనూ జ్వలిత రూపమైన ఒక తీవ్ర
కాంక్ష తెంపు లేకుండా స్థిరంగా ఉన్నట్లు గోచరిస్తుంది. ఏమిటది? ఎందుకని ఉందలా? అంటే 1) సత్యదర్శనం
చేయాలనీ, 2) సత్యావిష్కరణ సత్యప్రతిష్ట జరగాలనీ, 3) సత్యం అందరకూ అందుబాటులోకి రావాలనీ, తేవాలనీ,
4) తద్భిన్నమైన దోషరూపాలు వీగిపోవాలనీ, సమాజాన్ని
వీడి పోవాలనీ, అందువల్ల మాత్రమే వ్యష్టిసమష్టి అభ్యుదయ
నిశ్రేయస్సులు పొందడానికి మార్గం సుగమం కాగలదనీ ఎంచారు. ఆలా జరగాలని వాంఛించారు వారందరూ.
మనిషిలో తాత్వికంగా గానీ, ఆచరణరూపంగా గానీ యదార్థమైన మార్పు రావాలంటే వాస్తవాలను
చూడగలగ్రహించగల సామర్థ్యమూ, నేర్పులతో బాటు, గ్రహించిన దానిని స్వీకరించి ఆచరించగల బుద్ధి (ఒక కోణంలో దీనినే సత్యత్వ
బుద్ధి అంటున్నాను) ఉండాల్సి ఉంది. లేకుంటే గ్రహించేదొకటి, మాట్లాడేదొకటి,
చేసేదొకటి అయిపోతుంది. సామాజిక సంబంధా లన్నింటినీ సరైన రీతిలో
నిలిపి ఉంచగలదీ, మనిషి కదలికల్లో ఋజుత్వాన్ని నింపి ఉంచగలదీ,
నడవడికల్లో క్రమతనూ సరైన పరివర్తననూ తీసుకురాగలదీ ఈ తరహా సత్యత్వ
బుద్ధేనంటే అవుననిపించడం లేదూ?!
వాస్తవాలను స్వీకరించాలన్నా, స్వీకరించిందాన్ని ఆచరించాలన్నా మనిషి
స్వభావంలో సత్యానికి ప్రథమస్థానాన్నివ్వాలన్న వివేకమూ, ఇవ్వగల
హృదయమూ ఉండాలి. అలాగే తన యిష్టాయిష్టాలను సత్యాసత్యాలలో పోటీ పెట్టరాదన్న వివేకమూ
అత్యంతావశ్యకం.
లోకంలో ప్రజలు మూడు విధములైన దృష్టులు కలిగి ఉంటారు. త్రివిధ
దృష్టులంటారు వాటిని. 1) స్వార్థ ప్రధాన దృష్టి, 2) ధర్మప్రధానదృష్టి,
3) త్యాగప్రధాన దృష్టి.
జీవితాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యాపారంగా అవగాహనకొరకుగా నిర్వచించుకుంటే 1వ రకంవారు పుచ్చుకోవడంపట్ల
విపరీతమైన ఇష్టాన్నీ, ఇచ్చే విషయంలో అయిష్టాన్ని కలిగి వుంటారు
స్వభావరీత్యా. తదనుగుణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే హక్కులపట్ల అత్యంతాసక్తినీ,
విధులపట్ల అనాసక్తినో, ఉదాసీనతనో కలిగి
ఉంటారు.
రెండవరకం వారు మరల రెండు రకాలు. ఒకతరహా పుచ్చుకుని ఇచ్చేవారు, రెండవ తరహా ఇచ్చాక
పుచ్చుకునేవారు. ఇద్దరూ ధర్మదృష్టికి చెందినవారే అయినా, మొదటివారు
అధమ స్థాయికీ, రెండవవారు ఉత్తమస్థాయికి చెంది ఉంటారు. ఇందు
మొదటివారికి పరిస్థితులు ఏమాత్రం ప్రోత్సహించినా స్వార్ధ ప్రధాన వర్గంలోకి
జారిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. రెండవతరహా మనుషులు శుద్ధ ధార్మికులుగనో,
అవసర పరిస్థితులు ఏర్పడితే మూడవరకమైన త్యాగప్రధాన దృష్టి కలవారిలో
ప్రారంభకులుగనో మారే అవకాశాలుంటాయి.
ఇక మూడోరకం దృష్టి కలవారూ రెండు రకాలు. దీనిలో తక్కువ స్థాయి కలవారు లేక ఆరంభకులు.
విధులను బాధ్యతలుగా ఎంచి హక్కులపట్ల పట్టు లేకుండా ప్రవర్తిస్తుంటారు. వీరిని
ఉత్తమోత్తమ ధార్మికులనో తక్కువ స్థాయి త్యాగులనో అందాం అవగాహన స్పష్టత కొరకు, మూడవరకంలో
రెండవస్థాయి వ్యక్తులనే మనీషావంతులు, ఉదాత్త చరితులు,
విప్లవాధారులు అంటాము. సమష్టి హితకారకాలైన పనులను బాధ్యతగా
నెత్తినేసుకుని హక్కులపట్ల ఏమాత్రం పట్టు లేకుండా (యదృచ్చాలాభ సంతుష్టులంటే
తెలుస్తోందా!?) వైయక్తిక జీవనానికి ఏ మేర ప్రాప్తించినా
తృప్తిపడుతూ, సరిపెట్టుకుంటూ నలుగురి బాగు ధ్యేయంగా ప్రవర్తిస్తుంటారు.
జీవిస్తుంటారు. వీరినే త్యాగులు, ప్రజల మనుషులు, ఆదర్శ పురుషులు, విశ్వమానవులు లాటి విశేషణాలతో
వివేకవంతులు గుర్తిస్తుంటారు.
మానవుణ్ణి జీవి ప్రాణి స్థాయి నుండి అంటే ఒకటవ రకం దృక్పథం కలిగివున్న
దశనుండి ఈ క్రమంగా విశ్వ మానవునిగా రూపొందేవరకు అనుక్షణం వెన్నుదన్నుగా ఉండి
అభ్యుదయ పథంలో నడిపించగలిగింది సత్యత్వ బుద్ధే. నిజము, నిజాయితీ అన్న పదాల
అర్ధాలు వేరా? ఒక్కటా? నేనైతే వేరు
వేరంటాను. నిజమన్నది విషయపరమైనది. కాగా నిజాయితీ అన్నది విషయికి సంబంధించినది మనిషి
వ్యక్తిత్వానికి సంబంధించినదై ఉంది. నిజాలు ప్రమేయాలకు చెంది ఉండగా, నిజాయితీ ప్రమాతకు సంబంధించినదై ఉంటుంది. అలాగే సత్యమన్నది వస్తు విషయక జ్ఞాన
భాగానికి చెంది ఉండగా, సత్యత్వ బుద్ధి ఆ జ్ఞానంకల వ్యక్తిపరమై
ఉంటుంది.
సామాజిక సంబంధాలు క్రమబద్ధంగా నడుస్తుండాలంటే మనిషి వ్యక్తిత్వంలో ఏ
సుగుణం అత్యంత కీలక పాత్ర వహిస్తుందో చెప్పగలరా? అలాగే వ్యవస్థలోని
ఒడిదుడుకులకు స్వార్థపరత్వంతో పాటు సమాన భూమికను నిర్వహిస్తున్న అంశమేమో
యోచించగలరా? నన్ను చెప్పమంటే మొదటి ప్రశ్నకు సత్యత్వ బుద్ధి
అని, రెండవ ప్రశ్నకు అది లేకపోవడం అనీ సమాధానం చెపుతాను.
మీరైతే ఏం చెపుతారు?
మా అనుభవాలను బట్టి చెప్పుకోవాలంటే సత్యత్వ బుద్ధి తగిన స్థాయిలో ఉన్న
వారు ఒక శాతానికి మించి లేరనవలసి వస్తోంది. ఒక్కోసారి అదీ సందేహమే ననిపిస్తోంది
కూడా. ఈ సత్యత్వ బుద్ధి ఉండడమూ, లేక పోవడమూ అన్న వాటిని వివరించడానికి
కొన్ని సంఘటనలు ఉటంకిస్తాను. మీరూ యోచించండి.
గతంలో అవి కాల్పనికాలో, చారిత్రక వాస్తవాలో తేల్చడం అవసరమనుకున్న
వారు తేల్చుకోండి. నా వరకు నాకు సత్యత్వబుద్ధి అంటే ఏమో వివరించడానికి ఉదాహరణలుగా,
చూపడానికి తగిన సంఘటనలను మీ ముందుంచా లన్నదే ప్రస్తుతాశయం, శంకర మండనమిశ్రులకు మధ్య జరిగిన సంఘటన ఇందుకు తగిన దనిపిస్తోంది.
మండనమిశ్రుడు: తన కాలంలో తనకంటే ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని గూర్చి తెలిసినవాడు
లేడన్న గట్టి నమ్మకం గలవాడు. పితృలోక కర్మలనొనర్చు సందర్భంలో సన్యాసిని చూడడమే
దోషమన్న నిర్ణయంలోనున్న వాడు. భిక్ష పెట్టమన్నపుడు, కాదనకూడదన్న ఆ కాలపు
ధర్మ సూత్రాన్ని విశ్వసించినవాడు. ఇట్టి భావాలున్న వాణ్ణి శ్రాద్ధకర్మలు
నిర్వహిస్తున్న సందర్భంలో కలిశాడు శంకరుడు సన్యాసి వేషధారణలో. భిక్ష పెట్టమన్నాడు.
సరే కూర్చోమన్నాడు మండనమిశ్రుడు. ఈ భిక్షకాదు వాద భిక్ష కావాలన్నాడు శంకరుడు. సిద్ధపడ్డాడు
మండనమిశ్రుడు. ఓడినవాడు గెలిచిన వాణ్ణి అనుసరించాలన్నది నియమం. దాన్నంగీకరించి
వాదానికి దిగారిద్దరూ. (వారిరువురి వాదాలలోని దోషాదోషాలుగానీ, వాదనలోని దోషాదోషాలు గానీ అలా ఉంచండి.) ఆ వాదంలో శంకరుడు నెగ్గినట్లు
తేలింది చివరకు. ఇక్కడే చూడవలసి ఉంది సత్యత్వ బుద్ధి యొక్క పాత్ర. అనుకున్నట్లు
మండనమిశ్రుడు శంకరుని శిష్యుడై తన పూర్వ నిశ్చయాలనూ, భార్యనూ,
కీర్తి ప్రతిష్టలనూ, గతానికి చెందిన అంతటినీ విడచి
సన్యాసాశ్రమ స్వీకారం చేసి శంకర సిద్ధాంతాన్ని ప్రచారం గావించాడు. ఈ నాడొక వేళ
అతనికంటే సూక్ష్మదర్శనుడైన వాడొకడు అద్వైతాన్ని పూర్వపక్ష విషయంగా ధృవీకరించవచ్చు గాక.
మండనమిశ్రుడు ఓడడానికి కారణం వాద బలహీనతకాక, వాది బలహీనతే
అయినా కావచ్చు గాక, మండనమిశ్రుని హృదయం, అతని కట్టుబాటుతనం, అప్పటి తన బుద్ధి స్థాయికి
సత్యమని తేలిన దానిపట్ల, ఆ వీగిపోయిన దానిపట్ల అతడు తీసుకున్న
నిర్ణయాలు, దానిని అమలు పరచిన తీరు అద్భుతం, అపూర్వం. వాటికి కారణం అతని వ్యక్తిత్వం నిండా తొణికిలాసడుతున్న సత్యత్వ
బుద్ధే! అర్థమవుతోందా! అతణ్ణి చూసి సత్యత్వ బుద్ధి పోకడ అర్థం చేసుకున్నాక మనని
మనం ఒక్కసారి విచారించి చూసుకుందాం. ఎక్కడున్నాం మనం? లేనిపోని
రంధ్రాన్వేషకులంగానో, నిజంగా తెలీని విషయాలను గూర్చి కూడా
(అవి తెలీని విషయాలేనని తనలో తనకు తెలుస్తూనే వున్నా) గొప్పగా తెలిసినవారల్లే
ప్రగల్భించుతూనో గడిపేస్తున్నాం.
అలానే సత్యకామజాబాలి అన్న బాలకుడు విద్యాభ్యాసానికై వెళ్ళేపుడు జరిగిన
సంఘటన, కుమారిలభట్టు పాపకర్మకు ప్రాయశ్చిత్తంగా దేహాన్ని అగ్నితప్తం కావించుకోవడం
వెనుక ఏ బుద్ధి పనిచేసిందో అదే సత్యత్వ బుద్ధి అంటే.
అన్ని ఆస్తిక ఆస్తికేతర పక్షాలవారిలోనూ సత్యత్వ బుద్ధి లేకపోవడమో, బలహీనంగా ఉండి ఇష్టా
ఇష్టాల ప్రాబల్యం పనిచేస్తుండడమే మాత్రమే 99.9% సంఘటనలలో
మేము గమనించిన శోచనీయ విషయం. ఇదీ ఈనాటి పరిస్థితి.
చివరిగా ఒకమాట : నిజాయితీగా సత్యాన్ని అంగీకరించడానికీ, స్వీకరించడానికీ,
ఆచరించడానికి వెనుకాడని సర్వదా సంసిద్ధుడై ఉండడానికి ఇష్టపడే బుద్ధి
ఉండేదానినే సత్యత్వ బుద్ధి అంటాము. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుని మీలో అది
అట్టి స్థాయిలో ఉందో లేదో తేల్చుకోండి. నిజంగా తేల్చుకోవాలన్న నిజాయితీ ఉండాలన్నది
గమనించండి. అదొక్కటి బలంగా ఉంటే ఇప్పటి కెన్నిలేకున్నా సాధించుకునే అవకాశాలు
ఉన్నట్లే. అదొక్కటీ లేకుంటే ఇప్పటి కెన్ని ఉన్నా రావలసిన, రాదగిన
ప్రయోజనం వస్తుందన్న భరోసా, హామీ ఏమాత్రం లేదు.
ఆలోచించుకోండి.
నా గురించి నన్ను చెప్పమంటే ఈ విషయం వరకు, నా వరకు నాకు
నిఖార్సయిన సత్యత్వ బుద్ధి ఉంది. దాని ఆధారంతోనే అనేకాంశాలలో నా అన్వేషణ కొనసాగి
ఒక కొలిక్కి చేరింది. అనేకాంశాలలో చాలావరకు సాగి కొనసాగుతోంది. భవిష్యత్తులో
అవసరమైన, అంశాలలో ఆరంభమై కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు
నిర్ధారణైందే నాది. వీగిపోయింది నా నుండే వీడి పోతుంది. ఈ విషయంలో ఆ యా అంశాల పట్ల
నాకు అభిమాన ద్వేషాల గొడవ యించుకైనా లేదు. నా దృష్టికి విలువైనవి రెండే రెండంశాలు.
1) అది సత్యమా? కాదా? 2) దానిని
స్వీకరించి అమలుచేయడం ద్వారా కీడు జరుగుతుందా మేలా? ఈ రెండే
నేను పరిగణించే అంశాలు. నాదా కాదా అన్నది నాకు అప్రస్తుతము. ఇదీ నా సంగతి. మరి
మీరూ ఆలోచించుకోండి. ఆలోచించి సరైన నిర్ణయానికి రావడం మీ అవసరమన్నది గుర్తించండి
ముందు. ఉంటాను. సెలవ్.
– సురేంద్ర
నోట్ : ఇప్పటికి మీరే ధోరణివారైనా ఈ సత్యత్వ బుద్ధి వేదికగా చర్చించుకుని
సత్యపథంలో, ధర్మ మార్గాన నడవడానికి నిజాయితీగా సిద్ధపడగలిగితే అదే నియమాన్నంగీకరిస్తూ,
ఎవరితోనైనా చర్చకు నేను అహర్నిశలూ సంసిద్ధుడను. మరి ఈ విషయంలో మీ మీ
నిర్ణయాలేమిటో తెలియజేయండి. రండి లేదా రమ్మనండి. - కోట ప్రసాదశివరావు
ఓరుగంటి శ్రీనివాసరావు గారి మృతికి... సంతాపం
మాతృభూమి పట్టణాభివృద్ధి ఐక్యవేదిక సభ్యుడు, ఆ సంస్థ ప్రధమ
కమిటీలో కోశాధికారి అయిన ఓరుగంటి శ్రీనివాసరావు (టి.వి.9 శ్రీను)
కరోనా బారిన పడి, మే 29, శనివారం అర్ధరాత్రి
దాటిన తరువాత 1.30 నిముషములకు మరణించాడు. శ్రీనివాస్ నాకు పరిచయమయ్యింది
6 మాసాల క్రితమే. అయినా ఈ ఆరుమాసాలలోనే అతడు నాకు ఆత్మీయుడు
గానే కాక, కోదాడ అందించిన కొడుకు అన్నంతగా దగ్గరైనాడు.
వ్యక్తులలో చాలా అరుదుగా కనిపించే వ్యక్తిత్వం అతనిది. ఇతరులను నొప్పింపనితనం,
అందరూ తన వాళ్లేనన్నట్లు కలసిపోయే తనం, విసుగు,
విరామం లేని పనితనం. విపరీతమైన ఓరిమి, నిజాయితీ
కలగలిస్తే శ్రీనివాస్ వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
నాతో అనే కాదు. అతనితో కొద్దిపాటి పరిచయం ఉన్నవారికి కూడా అతడు
తనవాడేనన్న భావం ఏర్పడుతుంది. ఒకరిద్దరి తోనే కాక పదిమందితో నైనా, ఇంకా సరిగా
చెప్పాలంటే 100 మందితో నైనా, సంప్రదింపులు
జరుపుతూ ఐక్యవేదిక నిర్మాణంలో అత్యంత కీలకమైన, ప్రధానమైన
పాత్రను పోషించాడతడు. అందరికీ తలలో నాలుకగా మెదిలేవాడు. నలుగురి పనులు నెత్తిన
వేసుకుని పరుగులు తీస్తూ ఉండేవాడు. ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి చూస్తే అతను
లేని ఐక్యవేదిక ఊహించుకోడానికి కూడా ఇబ్బందిగా ఉంది.
అటు కుటుంబానికీ, ఇటు ఉద్యమానికీ కూడా పెద్ద ఆసరాగా ఉన్న శ్రీను లేడంటేనే మనస్సు
అదోలా అయిపోతోంది. ఇక అతనికి మరింత ఆత్మీయంగా మూడు దశాబ్దాలుగా మెలగిన మిత్రులు
నాదెండ్ల బాలకృష్ణ గారిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఆయన్ను కదిలిస్తే చాలు
కట్టలు తెంచుకున్న కన్నీరు, ఎంతగా
నిగ్రహించుకుందామనుకుంటున్నా ఆగని, ఎగదన్నుకొస్తున్న వేదన
పొర్లుకొస్తున్నాయి ఆయన నుండి.
మరోవంక అతని కుటుంబం. ఇంకా స్థిరపడని కొడుకూ, కూతురు.
అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. ఏమీ పాలుపోని అర్ధాంగి నిరామయ మానసిక
స్థితి. కళ్ళెదుటే కనుమరుగైన కొడుకుని తలచుకుని కుమిలిపోతున్న శ్రీనివాస్
తల్లిగారు. ఒక్క వారం పది రోజులలోనే ఎవరూ ఊహించని రీతిలో తల్లక్రిందులైన కుటుంబ
పరిస్థితి. వీటన్నింటినీ తలచుకుంటే మనసు కకావికలం అవుతోంది.
ఏమి చేయాలి? ఏమి చేస్తే అలాంటి మిత్రునికి ఆత్మీయునికీ, అందరి
మనిషికీ సరైన నివాళి అర్పించి నట్లవుతుంది.
1)
ఆ కుటుంబం మళ్ళా నిలదొక్కుకునేలా ఆసరా కల్పించాలి.
2)
పట్టణాభివృద్ధి విషయంలో అతణ్ణి స్ఫూర్తిగా తీసుకుని, మరింత పట్టుదలతో కార్యోన్ముఖులం కావాలి.
దీనికై మనమందరం అతని మృతికి సంబంధించిన సాంప్రదాయక కర్మకాండ ముగిశాక
సమావేశమై, సముచితమైన రీతిలో ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాలి.
మిత్రుడా! నిండిన గుండె బరువుతో, పట్టణాభివృద్ధి ఐక్యవేదిక తరపున మీ
కుటుంబం వెనుక వెన్నుదన్నుగా మేమున్నామని వాగ్దానం చేస్తున్నాము.
ఇట్లు మాతృభూమి పట్టణాభివృద్ధి
ఐక్యవేదిక ప్రతినిధిగా సురేంద్రబాబు.
వివేకపథం 256 జూన్ 2021
కోట ప్రసాదశివరావు
(సబ్ ఎడిటర్) డోర్
నెం.10187, వడ్డివారి లేన్, బ్రాహ్మణవీధి,
విజయవాడ520 001.
సెల్ : 9848036063 చందాలు
పంపగోరువారు : పై అడ్రసులో సంప్రదించగలరు
No comments:
Post a Comment