Monday, July 6, 2020

జ్ఞాన పీఠం - వ్యాస సంపుటి

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhihi-eFeffRpdf9HogquuRpOGvDpbkCwpnbaAC854ibKZVWa5vTIKQhOhw1BhOrD7-by9nShA10FHadkoObhjexrYJrNWw6fp5QO3sba_EpBT8fhCALR1-4MIxITJ1RnzD9BTwnNpb7xgU/s1600/Vivekapatham-Title+copy.tif
వ్యాస సంపుటి
రచయిత: శ్రీ పుట్టా సురేంద్రబాబు.

జ్ఞాన పీఠం


ఆర్యులారా!
 గత నాలుగు సంచికలలోనూ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడియున్న కొన్ని అంశాలను పరిశీలించాము. ఈ సంచికలోనూ అట్టిదే మరో ప్రముఖాంశం వివరిస్తాను. మానవ జీవితాన్ని గమనించితే అది రెండు ప్రధాన విభాగాలుగా గోచరిస్తుంది.

[1] అనుకోవడం (జ్ఞానభాగం)
[2] అనుకున్న దానికి తగినట్లు ప్రవర్తించడం (కర్మ విభాగం)

ఈరెంటి సమాహారమే (కూడికే) జీవితమని చెప్పుకోవచ్చు ఒకరకంగా. ఈ సంచిక జ్ఞాన భాగానికి చెందినదిగా నున్నది. జ్ఞానాధారంగానే (ఆలోచనలపై నాధారపడే) మనిషి జీవిస్తున్నాడన్నది ఒక వాస్తవము. అయితే ఆ జ్ఞానం ఒప్పు జ్ఞానమూ, తప్పు (భ్రమ) జ్ఞానమూనని రెండు ప్రకారములుగ నుంటున్నది. ఈ రెండు విషయాలనూ స్పష్టంగా గమనింపబడ వలసి ఉంది. ఈ విషయాన్ని కావలసినంత స్పష్టంగానూ గమనించాడనుకోండి వ్యక్తి, అప్పుడతడు తన జ్ఞానము ఏ కారణం వలనగానీ. (ఉదా: పెద్దలు చెప్పారు గనుక సరిచూడ వలసిన పని లేదనో, తొందర పాటువలననో, మరో విధంగానో కూడా భ్రమపొందవచ్చు) భ్రమాత్మక మైనచో ఆ జ్ఞానం తోనే తాను ఆయా కర్మలు చేస్తాడు గనుక అట్టి పనులన్నీ ఇటు తనకూ, అటు తనతోటే సంబంధాలున్న సమాజానికి కూడా నిరుపయోగంగానో, దురుపయోగంగానో మారగలవని గమనించగలుగుతాడు. భ్రమజ్ఞానం వలన ఎంత నష్టం రావడానికి వీలుందో గమనింపబడినగానీ వాస్తవ జ్ఞానం యొక్క ఆవశ్యకతను సరిగా గుర్తించలేడు. అట్లు గుర్తించిన గాని వ్యక్తి నిజంగా సత్యజ్ఞానార్జనకు యత్నించడు. ఇట్లు జీవన యాత్రలో మేథస్సు (జ్ఞానం) యొక్క పాత్రను గూర్చి స్పష్టత తగినంతగా ఏర్పడినగానీ సత్యజ్ఞానార్జన యవసరమూ, విలువా గమనింపబడవు. అట్లు గమనింపబడినగాని జ్ఞానార్జనయందు నిజమైన శ్రద్ధ ఏర్పడదు. చెప్పినదే చెప్పినట్లనిపిస్తున్నది కదూ! మీకు. అవును, దీని కంత ప్రాధాన్యత ఉంది మరి. ఆయా సందర్భాలలో మేము ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రతివారూ దీనికింత చెప్పాలా! ఈ విషయం ఎవరికి తెలియదు అన్న భావాన్ని వ్యక్తం చేశారు. అయినా అట్లు పదే పదే హెచ్చరింపబడ్డవాళ్ళూ, మాకు ముందే తెలుసన్న వాళ్ళూ కూడా యిప్పటికీ మేమనుకున్న స్పష్టత అన్న స్థాయికి చేర లేదు వాస్తవంగా. ఆ విషయం ప్రత్యక్ష ప్రయోగాల ద్వారానే వారికి తెలిసేట్లు చేయడం జరిగింది చాలచోట్ల.
అస్తు.

వ్యక్తి వికాసం గురించి చెప్పవలసివస్తే అది నిజంగా వ్యక్తి మానసిక, శారీరక సామర్థ్యముల పెంపు అన్న దగ్గర నుండే ప్రారంభ మవుతుంది. చివరకు మరల దానితోనే ముగుస్తుంది కూడా. ఈ విషయం వెనుకటి వాళ్ళూ స్పష్టంగానే గమనించారనడానికి వ్యవస్థలోనే మిళితం చేయబడ్డ ఒక అంశాన్ని ఉటంకిస్తాను. అది ఉపనయన సంస్కారమే. ఆయా కర్మలు చేయడానికధికారి ఉపనయనం చేయబడిన వాడేనన్నారు వాళ్ళు. ఆచారంగా నేడది వికృత రూపంలో నున్నా దాని భావం “ఉప సమీపేనయనం ప్రాపణి” అన్న వ్యుత్పత్తిని బట్టి ఏర్పడింది. దాని సమీపానికి కన్ను చేరడం అంటే ఆయా విషయాలకు చెందిన జ్ఞానం పొందబడడం అన్న భావం పుడుతోంది. ఆ భావాన్ని స్వీకరించడం కూడా ఉపయోగకరంగా కూడా ఉంది. ఉండగలదు. ఒక పని చేయడాని కధికారెవరు కాగలరు? దానిగూర్చి తెలిసినవాడే, అనడం సబబే కదా! సరే ప్రస్తుతాంశానికి వస్తాను.

ఒక విషయాన్ని గూర్చి తెలిసికొనగోరినా, తెలుపగోరినా తెలిసికొనువారూ, తెలుపువారూ ఆవశ్యం పాటింపదగిన తప్పనిసరి యంశముల సంపుటియే ఈ జ్ఞాన పీఠమను శీర్షికని చెప్పబడుచున్నది. గమనించగలరు. దీనిని నాలుగు పాదములుగా సౌలభ్యం కొరకు చేయడమైనది. 
  1. చక్కగా వినడము:-ఈ వినగలగడమన్నది ఒక కళ. వినడమూ, చెప్పడమూనన్న విషయములను కడు జాగరూకతతో అభ్యాసము చేసినగాని యలవడదు. అన్ని కాలములందునూ ఆయా విషయ పరిశీలన, విషయ గ్రహణల యందలి పొరపాటులకూ, యనవసర వాగ్వివాదాలకూ చాలావరకు సరిగా వినక పోవడమన్నది కారణంగా యుంటున్నది. మరియు చెప్పేవారిని గూర్చి చదువుచున్న గంథాన్ని, గ్రంథ రచయితను గూర్చి మనకున్న యభిప్రాయాన్ని బట్టి చెప్పబడ్డ విషయానికి విలువల నాపాదించి చూడడం తరచుగా జరుగుతున్న పొరబాటు. అంటే ముందుగనే ఒక యభిప్రాయా న్నేర్పరచుకుని (రాగద్వేష రూపంగా) చూడడం అవుతున్న దన్నమాట. ఇది అసలు విషయాన్ని సంపూర్ణంగా చూడనివ్వక పోవడమో, ఆలోచనలను అన్యదృష్టికి మరల్చడమో చేస్తుంది. దీని వలన చెప్పిన విషయానికి చెందిన వక్త (రచయిత) యభిప్రాయాన్ని సరిగా గ్రహించలేక పోవడమో, అన్యథా గ్రహించడమో జరుగుతుందన్న మాట. ఆపై మన మెంత విశ్లేషణ చేసినా యది దుష్టార్థవ్యంజకమే యవుతుంది.
ఇక్కడ దీనికి ముందుగా జాగ్రత్త వహించవలసిన మరో ప్రముఖాంగముంది. అది ఎదుటివారు చెపుతున్నప్పుడు, [గ్రంథాన్ని పఠిస్తు న్నప్పుడు] శ్రద్ధలోనూ, ఏకాగ్రతలోనూ ఆ పదాలను వాక్యాలను వినాలి. అలాగే మనం చెప్పదలచుకున్న ప్పుడన్నూ, చెప్పదలచుకున్న భావాన్ని సక్రమంగా వ్యక్తం చేయగల పదాలను చెప్పడం, చెప్పిన విషయాన్ని ఎదుటి వారు యధాతధంగా గ్రహిస్తున్నారో, గ్రహించినారో లేదో గమనించడం చేయాలి. ఈ విషయంలో వినేవాళ్ళూ, అనే వాళ్ళూ ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆ క్షణంలో కొంత భాగం వినలేక పోవడమో, వినని భాగాన్ని విన్నా మనుకుని ఆ వినని భాగాన్ని మనస్సునుండి పూరించడమో జరుగుతుంది. అట్టి సందర్భం ఏర్పడిందే యనుకుందాం. అప్పుడేమవుతుంది? అన్న వారు తానన్నది ఫలానా యనుకుని తన పక్షాన్ని కొనసాగిస్తే విన్న వారు మరో విధంగా గ్రహించి యున్నారు గనుక ఆ దృష్టినుండి పరిశీలన ప్రారంభిస్తారు. ఆపై వారి వారి వేరువేరైన దృష్టుల నుండి పరిశీలనలూ, చర్చలు సాగుతాయి. ఎంత సేపటికి తెగవు. నేను చెప్పింది సరిగనే యున్నది కదా? ఎందుకంగీకరించరు. అని అన్న వారూ, ఇంత దోషమున్నా దాన్నే పట్టుకుని ఊగులాడతారేమా యని విన్న వారూ అనుకుంటూ యుంటారు. ఇక ఆ పరిశీలన ముగింపు పరస్పర యసమర్థతలనూ, దోషాలనూ ఎత్తి చూపుకొనుటతోనో, అసంపూర్ణంగానో ముగుస్తుంది. లేదా ఎప్పటికోగాని అసలు పొరబాటు ఎక్కడ జరిగిందో గమనింపబడదు. ఈ విషయాన్ని గమనిస్తే చెప్పాలనుకున్న వారూ, వినాలనుకున్న వారు ప్రారంభం నుండే మెలకువగా నుండవలసిన, ఉండి తీరవలసిన యగత్యం ఎంతుందో గోచరిస్తుంది.
అయితే మెలకువగా ఉండడం అంటే ఏమిటి? 
వినువారూ, చదువువారూ మనస్సులో మరో భావం లేకుండగ ఉన్న విషయాన్ని ఉన్నట్లువినడమో, చదవడమో మొదట చేయాలి. చాల వరకు అలానే జరుగుతున్నది యనుకుంటారే గానీ అలా జరగడం లేదన్నది మా పరిశీలనలో అనేక సందర్భాలలో రుజువైంది. ఉదా:- రాయామణం, మహారాభతం అన్న పదాలు వ్రాసి చదువమన్నపుడు చదువరులు వీటిని రామాయణ మహాభారతాలుగా చదివారు. అయితే యిక్కడేమి జరిగింది? పైన చెప్పిన పొరబాటే. ఈ విషయాన్ని చెప్పకుండా ఇలాటి ప్రయోగాలు మీరు చేసి చూడండి. ప్రమాదం ఎక్కడుందో ఆలోచించండి. ఇదంతా రామాయణంలో పికడల వేటలాగుంది కదూ? మొట్ట మొదట శ్రోత ఈ దోషాన్ని తొలగించుకుని వినాలి. అది మది ప్రాముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయమైనచో అన్న వారిని మరల యిదేనా మీరన్నది యని అడిగి తెలుసుకోవాలి. నిర్ధారించుకోవాలి. ఇంతా క్రమంగా జరిగినప్పుడు మాత్రమే అన్న వారి నుండి (గ్రంథమునుండి) విన్న వారికీ,(పఠితకూ) ప్రతిపాదన చేరిందన్నమాట. యథాతథంగా చేరిందో లేదో నిర్ధారించుకోవాలన్నది మరలా గుర్తు చేస్తున్నాను. దానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పటికి పదప్రత్యక్షం దోషరహితంగా జరిగిందన్న మాట. ఈ విషయమున్నూ వెనుకటి తాత్వికులలో కొందరకైనా తెలిసేఉంది అనడానికొక ఆధారాన్ని ఉటంకిస్తాను. ఒక వంక “నాయమాత్మా  ప్రవచనేనలభ్యం” అంటూనే మరోవంక “ఆశ్చర్యో వక్తాకుశలో స్వలాబ్ద్వా అశ్చర్యోజ్ఞతా కుశలం సుశిష్ట:” అంటూ పై విషయాన్ని సూచించినారు. ఇక అర్థ బోధ జరుగవలసియుంది. అది జ్ఞాన పీఠంలో రెండవ పాదంగా ఉంది. చక్కగా వినడం జరిగిన పిదప, విన్న దానికి అన్న వారి నుండే యర్ధాన్ని గ్రహించడం రెండవ పాదస్థ విషయంగా ఉంది. భాషకున్న శక్తి పరిస్థితుల దృష్ట్యా విన్న పదానికి అర్ధాన్ని అన్న వారి (ప్రయోక్త) నుండే గ్రహించడం అవశ్యానుసరణీయమై ఉంది. నిజం చెప్పాలంటే పరిశీలకునికి అంతకంటే గత్యంతరం కూడా లేదు. ఈ యర్థగ్రహణ విషయంలో ఏ మాత్రం అవసవ్యత, అన్యథా గ్రహణకానీ భిన్నా ర్థారోపణకానీ జరిగినా ఆ పైనంతా గందరగోళమే. ఇది జరిగిన పిదప పరిశీలకుని మేధస్సూ, నిజాయితీ, తీక్షణత, అన్ని నిరుపయోగాలు గనో కదా చిత్ దురుపయోగాలు గనో మారగలవు. చూడడానికంత ప్రాధాన్యత కల విషయంగా గోచరింపకపోయినా తరచుగా జ్ఞానర్జనలోనూ, పరిశీలనలోనూ ఆటంకాలనూ, అప మార్గాలను ఏర్పరుస్తూన్న ప్రధాన విషయమిది. ఈ విషయం మాయనుభవంలో మేము తరచుగా - ప్రతి సారీ ఏదో సందర్భంలో అనొచ్చు కూడాఎదుర్కొన్నాము.౦౦ ఆయనుభవ పరంపరనుండే జ్ఞాన పీఠాన్ని ఏర్పరచుకున్నాము. మీరూ మీయనుభవాలను దీని నేపధ్యం నుండి యవలోకించినా యిప్పుడు ప్రయోగం చేసి చూసినా వీటి విషయంలోని వాస్తవాన్ని - విషయ పరిశీలనలోనూ, మనం తీసుకునే నిర్ణయాలలోనూ తరచుగా జరుగుతున్న ప్రమాదాల్ని గమనించ గలరు. పైన చెప్పినట్లు, అతనన్నది యిదీ యనుకున్నా, దానర్థం యిదై ఉంటుంది యనుకున్నా కథ అడ్డం తిరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా విషయ పరిశీలన సత్యాసత్యాలు నిర్ణయించేదిగా ఉన్న సందర్భంలో దీని విలువ యపారంగా యుంటున్నది. ఎందుకనగా ఆవతలివారు చెప్పినదేమిటి? దాని విషయంలో యుద్దేశ ముమిటి? యన్నది యధాతథంగా స్వీకరింపబడిననే గాని అసలు యదార్థ పరిశీలన, సత్యా సత్య నిర్ణయమూ అన్నది పొసగదు. అయితే అనేకానేక సందర్భాలలో యిచ్చటనే ఎంతో కొంతమేర లోపం ఏర్పడుతూ యుంటున్నది. భాష ద్వారా-గ్రంథములద్వారా వ్యక్తం చేయదలచుకున్న యితరుల యనుభవ పరంపరలను విశ్లేషించి వాటి బాగోగులను సమీక్షించాలనుకునే వారికి పై విషయాలు స్ఫురణలో యుండడం చాలా యువసరము. ఏతావాతా యిప్పటికి తేలిన సాంశ మేమంటే,
అన్న విషయాన్ని అన్నట్లుగనే వినడం (గ్రహించడం) విన్న దానికి ఉన్న అర్ధాన్ని అన్న వారి నుండే గ్రహించడం జ్ఞానార్జనలోనూ, ప్రదానంలోనూ ప్రాధమిక అవసరంగా గుర్తించడం, అట్లు జరుగనప్పుడు పరిశీలనా, జ్ఞానార్జనా, ఆ పై చేయు సత్యాసత్య నిర్ణయాలూ, అన్నీ యవకతవకలు గానే యుంటాయనీ గుర్తించడం ఇదీ సారాంశం. 
ఇప్పటికి జ్ఞానపీఠంలో యర్ధ భాగాన్ని యవలోకించి నట్లయినది. ఇంతవర కున్న క్రమాన్ననుసరించినచో రచయిత-వక్త-వుద్దేశ్యాన్ని పఠిత-శ్రోత-యథాతధంగా స్వీకరించినట్లైనది. యింతా జరిగిన గానీ యదార్ధమైన పరిశీలన యన్నది నిజంగా ప్రారంభం కావడంలేదు. ఇక మరో పాద విషయంగా పైన లభించిన విషయాన్ని రెండు కోణాలనుండి పరిశీలించడం ప్రారంభిస్తాము.
  1. చర్చా సందర్భమైతే ప్రయోక్త ప్రతిపాదన యనుభవజన్య జ్ఞానం నుండి ప్రవృత్తమైనదా? అనుభవ రహితంగానా? అనగా వినికిడే లేక యనుసరణ శీలమైన విశ్వాసం నుండియా? అన్నది పరిశీలించవలసి యున్నది.
  2. ప్రయోగింపబడిన పద-వాక్య-సముదాయమును ఒక సమర్థవంతమైన పద్దతి ద్వారా అర్థ నిర్ధారణ చేయుటకు యత్నించడం, తద్వారా లభించిన యర్థము సబబైనదా కాదా యని సత్య నిర్ధారణకై యత్నించడం చేయవలసి ఉంటుంది.
ఇందులో ప్రధమపక్షమైన యనుభవ జన్యజ్ఞానం కాదు విశ్వాసమే-పెద్దలు వాక్కు అని చెప్పినాడనుకోండి వక్త. అప్పుడతడు విషయ నిర్ధారణ చేయుటకు తగిన యర్హ స్థానంలో లేడన్న మాట. ఆ విషయాన్ని గమనించి, యతడు కూడా గమనించునట్లు చేయాలి.
Note:-ఇదే విషయాన్ని మనమేదైనా ప్రతిపాదన చేసేటప్పుడు కూడా నియమంగానే స్వీకరించాలి. ఎందుకంటే ప్రతిపాదించినది మనమైనా, మరొకరైనా ప్రతిపాదిత విషయంలో విశ్వాసమే గాని, జ్ఞానం లేనట్లు యంగీకరించి నదైనది గనుక. ఇది యంతే యని చెప్పడం ఆయా విషయాలలో జ్ఞానం- అనుభవజన్యత్వం ఉన్నవారి విషయంలోనే సాధ్యము. తదితరుల-విశ్వాసుల విషయంలో విశ్వాసం విశ్వాసమే ఔతుంది. జ్ఞాన స్థాయిలేని వారి పక్షం నిజ నిర్ధారణలో నిలచుట కష్టము. “జ్ఞానినః తత్వదర్శినః అనియు శ్రోత్రియం బ్రహ్మ నిష్టం” అన్నదియు ఈ విషయాన్నే.
ఇక రెండవ విషయాన్ని బట్టి ప్రతిపాదిత విషయం అనుభవజన్య జ్ఞానమే తెలిసే చెపుతున్నాను యనినచో దానిని ఒక క్రమంలో విశ్లేషించాల్సియుంటుంది. అదెలాగంటే భాష సాంకేతిక రూపై యున్నది. అనగా ఒక్కొక్క పదమూ ఒక్కొక్క నిర్ధిష్టార్థాన్ని సంకేతిని కలిగియున్నది. పద పదార్థాలు సంజ్ఞా సంజ్ఞ సంబంధమన్న మాట. ఆయా పదాలను స్వయం సత్తాకాలూ, సంబంధ జనితాలూ నన్న రెండు వర్గాలుగా విభజించవచ్చు. మరలయవన్ని నామవాచకాలు గానో, క్రియావాచకాలుగానో, గుణవాచకాలుగానో అర్థాన్ని కలిగి యుంటాయి. యింత వరకు గమనించినట్లైనచో యిక ప్రయోక్త ప్రయోగించిన పదాన్ని గుర్తించి దాని భావాన్ని గమనించుటకై యత్నించాలి. ఉక్త పదం ఒక నామిని తెలుపుతుందా? అవునన్నచో దాని గుణమేమి? క్రియలేమి? అని విచారించాలి. అట్లే గుణ వాచక
మైనచో అది దేని గుణము, దాని క్రియలేమి? అనియూ, క్రియయైనచో అది దేని క్రియ? దాని గుణమేమి యనియూ విచారించి సమాధానం రాబట్టాలి. వక్తవు నీవైనా యిదే విధానము. మనచే ప్రయోగింపబడ్డ పదముల విషయంలోనూ పై ప్రశ్నావళికి సమాధానం చెప్పగలిగి యుండడమూ, చెప్పవలిసిన బాధ్యత ప్రయోక్తపై నున్నదన్న విషయాన్ని గమనించి బాధ్యతా యుతంగా వ్యవహరించడమూ యిరు పక్షాలు చేయ వలిసి యుందన్న మాట. 
Note:-వస్తువు, ద్రవ్యము, గుణము, క్రియ, అన్న నాలుగు రూపాలలోనే మన కలిగే జ్ఞానమంతా యిమిడి ఉంటుంది. ప్రాచీనులున్నూ యీ విషయాన్ని గమనించారు అయితే వస్తువునూ, ద్రవ్యాన్ని కలిపి ద్రవ్యంగానే పరిగణించారు. ఉదా : మృద్ద్రవ్యం, ఘఠ ద్రవ్య మన్న పదములు - కార్య, దవ్యం, కారణ ద్రవ్యం అన్నమాటలూ ఈ యర్థాన్నే సూచిస్తున్నాయి. ఇంతదనుక చెప్పుతున్న విషయాలు మనచే గ్రహింపబడిన పిదప జిజ్ఞాసువు (పరిశీలకుడు) మూడవ కోణం నుండి పరిశీలన ప్రారంభించాలి. గుణరహితములైన వస్తు దవ్యములు గానీ ద్రవ్యాధారం లేని గుణ క్రియలు గానీ మన యనుభవంలో లేవు. కనుక తెలిసి మాట్లాడుతున్నా నన్న వాని యవగాహన ఎటువంటిదో, లేక తెలిసికొనగోరి యత్నించు వాని గ్రహణ ఎట్టిదో పరిశీలించు కోవడం సర్వదా సమీచీనం కాగలదు. గుణ జ్ఞానము కలిగిందా? గుణి తెలియబడకుండగనా? తెలియబడుతూనా? గుణ గుణి సంబంధము విడదీయదగునా? ఆ గుణమును విడదీసిన ఆ గుణి యుండునా? ఉండునన్నచో ఆ గుణికి యాగుణీ యన్న పేరెట్లు వచ్చింది? ఇలా పరిశీలించాలి. ఆ గుణమును విడచి గుణి యుండ దన్నచో గుణము గ్రహింపబడ్డ తావులెల్ల గుణి యస్తిత్వాన్ని యంగీ కరించాల్సి యుంటుంది. అట్లే క్రియ విషయమున్నూ. అయితే క్రియ ఉన్న చోటు దవ్యం ఉండి తీరుతుంది. గానీ ద్రవ్యం ఉన్న చోటులెల్ల క్రియ ఉండి తీరాలన్న నియమం లేదు. మొత్తం మీద జ్ఞానపీతం మూడవ పాద విషయంగా గుణ గుణి సంబంధాలు తెలిసి ఆ వివేకంతో తెలియబడుతున్న వాటినీ, తెలియాలను కుంటున్న వాటినీ, గూర్చి యవగాహన చేసికోవలయు నన్నదే నే చెప్పదలచుకున్న యంశముగా నున్నది.
ఇహ నాలుగవ పాదస్థ విషయంగా గమనించ వలసిన యంశము. జీవిత గమ్యమూ, గమన పద్ధతులను బట్టి మరింత ప్రాముఖ్యతను కలిగి యున్నది. మనిషి కదలిక యన్నదే కావలసిన దానిని సాధించుకొనుటకూ, యక్కరలేని దానిని పోగొట్టు కొనుటకుగా జరుగుచున్నది. అట్టిచో కార్య సాఫల్యతను కోరువారు పై రెండు సాధ్యముల విషయమైన (కావలసినవి తెచ్చుకొనుటకూ, అక్కర లేనివి పోగొట్టు కొనుటకూ) కావలసినవి ఎందుకు రావడం లేదో గమనించి యారాక పోవడానికి గల కారణాన్ని తొలగిస్తే గాని యది రాదనియు, అట్లే యక్కర లేనిది పోక పోవడానికి గల కారణాన్నెరిగి దానిని తొలగిస్తే గాని యదిపోదనియూ గమనించాలి. ఆపై తగిన రూపంలో కారణ నాశాన్ని చేయగలిగిన గాని కామితార్థ ఫలసిద్ది జరుగదు. నేటి ఆయా సాంప్రదాయాలు సిద్ధాంతా యనుయాయులు అభీష్ట సిద్ధి నందక పోవడానికి ఇది ప్రబల కారణముగ నున్నది. కనుక కారణాన్నెరిగి అదెందుకుంటున్నదో గమనించి ఎట్లు కారణ నాశాన్ని చేయాలో గమనించి యట్లొనరించిన గాని యనుకున్నది జరుగదు. ఈ కార్య కారణ నియమాన్ని యెంత సమగ్రంగా యవగాహన చేసికుని యమలు పరుపగలరో యంతమేర జీవితం జయావహంగానూ; పురోగామి పథంలోనూ ఉంటుంది. ఇది ప్రతి సంఘటనలోనూ ఎంతో కొంతమేర సంబంధం కలిగి ఉంది. విశ్వమంతా కార్య కారణ నియమాన్న నుసరించే కదులుతున్నది. పరిణామం పొందుతోంది. ఏతావాతా తేలినదేమంటే,
1) చక్కగా విన గలగడం అనగా రాగద్వేషాలు లేకుండగనూ, అన్యమనస్కత లేకుండగనూ, పూర్వ నిశ్చిత యభిప్రాయాలు లేకుండగనూ వినడం యని యర్ధము.
2) వినిన మాటలకు, వాక్యములకు అర్థాన్ని యన్న వారి నుండే గ్రహించడం. [గ్రహించు విధానం పైన వివరింపబడ్డది.] అట్లే అన్ని మాటల అర్థాలు చెప్పుటలో బాధ్యత వహించడం. 
3) గుణ, గుణి, అవయవ, అవయవి అన్న వాటి విషయాలను, సంబంధాలను చక్కగా యవగతం చేసి కొని ఆ వివేకంతో. తెలియబడిన, తెలియగోరిన దానిని యవలోకించడం,
4) కార్య కారణ నియమాన్ని యర్థం చేసికొని ఆ సామర్థ్యంతో అక్కర లేనిది ఉండడానికి కారణాన్ని అలానే అక్కరైనది లేక పోవడానికి గల కారణాన్ని గ్రహించి కారణ నాశం చేయడం ద్వారా కావలసిన దానిని పొందడం, అక్కర లేని దానిని విడవడం చేయవలసి యుంటుంది. ఈ నాలుగు యంశాల్ని జ్ఞానార్జనా, ప్రధానమూ యన్న రెండు వైపుల నుండే అనగా చెప్పువాడూ, వినువాడూ చక్కగా గ్రహించి వాటి యాధారంతోనే చెప్పడంగానీ, వినడం గానీ జరుపవలయును. అట్లు సాధించుకున్న జ్ఞానమే సత్యజ్ఞానం కాగలదు. మరోసారి మరో యంశాన్ని ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి సెలవ్. నమస్సులతో.
Note: కనీసం మరొక్కసారి పరిశీలించండి దయచేసి.
                                                                         సత్యాన్వేషణలో .
                                                                              మీ
                                                                            సురేంద్ర

స్వమంతవ్యము [నేనూ, నా పత్రిక]
సంపుటి – 1                       సంచిక – 6                                  1.8-91
పత్రిక వెలువడిన పిదప పత్రిక వెలువరిస్తున్న ఆయా విషయములపై, పాఠకులు వారివారి యభిప్రాయములను తెలియపరచడమూ అందు౦పై నాలో మెదిలిన భావాలను కూడా స్పందన ప్రతిస్పందన శీర్షికన ప్రకటించడమూ జరుతున్న కార్యక్రమమే. అయితే పత్రిక ముఖచిత్రమూ, దాని శీర్షిక (కవర్ పేజీలోని యంశాలు) అన్న వాటిపై కొన్ని అభిప్రాయాలు రావడమూ, అయా అభిప్రాయాలు సూచనల తీరుతెన్నులూ గమనించిన పిదప దానినే ప్రధానాంశంగా ఓ వ్యాసం వ్రాయవలసిన అవసరం ఉందన్న ఆలోనయే ఈ వ్యాసానికి ప్రేరణము. ఒక - క్రమంలో ఆయా విషయాలను ప్రస్తావించి నా యభిప్రాయములున్నూ వ్రాస్తాను. తులనాత్మకంగా పరిశీలించి ఉచితానుచితములను నిర్ణయించ గలరని భావిస్తాను. 
    1) పత్రిక ముఖచిత్రాన్ని చూడగానే యిది ఒక మత (హిందూ) పత్రిక అనిపిస్తున్నది గదా! అట్టి భావనను ఎందుకు కలిగించడం? మీమీద ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తున్నది గదా ఆ చిత్రం పాఠకునిలో! 
  ప్ర.స్పం:- ఈ మాటలు అన్న వారితో నాకు గల సాన్నిహిత్యాన్ని, ముందుగా ఓ అభిప్రాయాన్నేర్పరచుకొన్న వ్యక్తి (ఆ అభిప్రాయం  అనుకూల దృష్టి నుండైనా, ప్రతికూల దృష్టినుండై నా ఏర్పరచుకుని ఉండవచ్చు.) అటు పిమ్మట చెప్పిన విషయాన్ని తులనాత్మకంగా చూడలేరు కదా! అట్లు పాఠకుడు విషయాన్ని యథాతధంగా గమనించలేని పరిస్థితిని మనమే కల్పించినట్లుంది కదా! అన్న అర్థం వారి మాటలలో గోచరిస్తోంది. ఈ యభిప్రాయం కొంత వరకు నిజమే అయినప్పటికీ రచయిత ఈ మాట వాడితే పాఠకుడు నన్ను గురించి ఏమనుకుంటాడో, ఆ మాట వాడితే ఏమనుకుంటాడోనన్న దృష్టినుండి ఆలోచించడం ఆరంభిస్తే పదాలు దొరకడమే కష్టమవుతుంది. ఆస్తిక నాస్తికాది సంస్థలన్నిటికీ భాష సామాన్యంగానే ఉంటుంది. అంటే ఆయా విషయాలతో బాటు క్రమంగా భాషా స్వరూపమూ, ప్రయోజనమూ [శక్తి, పరిమితులు] అన్న విషయమైన వివేకాన్ని కూడా పాఠకునిలో కలిగించగలిగినచో అది పాక్షిక దృష్టి నుండి మనిషిని బైట వేయడానికి ఉపయోగకరంగా ఉండగలదు. అట్లుగాక వారికా దృష్టి ఏర్పడుతుందేమో, ఈ దృష్టి ఏర్పడుతుందేమోనన్న యోచన నిష్ప్రయోజనమేకాక, ప్రతిచోటా ఏదో అడ్డంకిని [ఒక్కోసారి లేని యడ్డంకిని కూడా] చూపెడుతుంది. ఇది వాస్తవమేనన్నట్లు పై యభిప్రాయం వ్యక్తం చేసినవారి ధోరణి కూడా ఋజువు పరుస్తోంది. వారిని,
వారనుకునే యభిప్రాయాలను వ్రాతమూలకంగా చెప్పమన్న ప్రతిసారీ వెనుకాడడం నాచే గమనింపబడ్డది.
 తప్పనిసరిగానూ, నిష్పాక్షికంగానూ ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని స్మరణలో ఉంచుకునే పరిశీలనలు చేయవలసి ఉంది. ‘భూమిక’లోనే చెప్పినట్లు ఆయా సంఘ స్థాపకుల ఆశయం సమాజహితమన్నదే ఆ అంశము. అయితే హిత కాంక్ష వేరు. తత్సిద్దికైన ప్రణాళిక నేర్పరచి అమలు పరుపగలుగుట వేరు. హితకాంక్ష ఉన్నదా? లేదా? అన్నది అచర్చనీయాంశమై ఉంది. ప్రణాళిక, ప్రణాళిక నేర్పరచుటకు ప్రాతిపదికగ నున్న వివేకమూ, సమగ్రమైనవా కాదా? అవి యిప్పటికీ విలువ కలిగియున్నవా లేదా? అమలు పరుపబడుచున్నవా, లేదా? అన్న విషయములే పరిశీలింప దగియున్నవి. ఈ విషయాలను ప్రతి పరిశీలనా సందర్భం లోనూ పరిశీలకుడు స్ఫురణలో నుంచు కొనవలసియున్నది.
 ముఖపత్రము (కవర్ పేజీ) నేర్పరచక పూర్వమే నాచే ప్రచురింపబడ్డ రెండు సంచికలనూ నిశితంగా పరిశీలించ గలిగితే నా పోకడ [యోచనా తీరు] ప్రత్యేకంగా ఓ సంఘూనికో, మతానికో కట్టుబడిలేదన్న విషయం స్పష్టం కాగలదు. ఒక భాషలో (సంస్కృతం) ఉన్న వాక్యాన్ని ఉపయోగించాడు గనుక (అది ఫలానా మతస్తుల భాష అన్న యవివేకం లోకంలో ప్రాచుర్యంలో ఉంది గనుక) అతడు ఫలానా మతస్థుడనుకోవడం ఆ నిర్ణయానికొచ్చిన వారి అజ్ఞానాన్ని [జ్ఞానం విషయమైన అసమగ్రతను] చాటుతోంది. ఎందుకంటే భాష భావాన్ని వ్యక్తం చేయడానికి మనిషి ఏర్పరచుకున్న ఉపకరణం మాత్రమే. దాని కంతకంటే విలువల నాపాదించడం కూడా అవివేకమే. (ఉదా: సంస్కృతం దేవభాషయని కొందరూ, మృతభాషయని కొందరూ చెప్పుతుంటారు) వీలైతే ఆ యవివేకాన్ని పోగొట్టే యత్నం చేయాలిగానీ, ఆ భాషను ఉపయోగించుకోలేక పోవడం ఏమి పద్ధతి? భాషా ద్వేషాలూ, భాషాభిమానాలూ ఈ రెండూ పై కోవకు చెందిన అజ్ఞాన జనితాలే నన్నది ఒక వాస్తవము. ఇక్కడే మరో అంశాన్ని కూడా గమనించవలసి ఉంది.
 వెనుకటి వాళ్ళు [ఈనాటి,ఏనాటి వాళ్ళైనా] ఆస్తికులుగానీ, నాస్తికులుగానీ, మరో పంథావాళ్ళుగానీ చెప్పిన వాటిలో మంచి ఉంద నుకుందాం (నిజంగా ప్రతి సంఘ సాహిత్యంలోనూ కొంత మంచి ఉంటుంది. అయితే మొత్తం మీద ఆ సంఘము సమాజాన్ని ఎటు కదిలించ చూస్తోంది అన్నదే పరిశీలనాంశము) అట్టిదే సందర్భం వచ్చినప్పుడు వారి, వారి మాటలను ఉటంకించామనుకోండి. అంత మాత్రానే మనం ఆ సంఘీయుల మవుతామా? మరో సందర్భాన్ని బట్టి వెనుకటి వాళ్ళలోని దోషాన్ని చూపామనుకోండి. ఇక మనం వారికి వ్యతిరేక సంఘీయులమైనట్లేనా? ఎవరైనాసరే అవునంటే అది వారి తొందరపాటు స్వభావాన్ని సూచిస్తుందే గాని వాస్తవం మాత్రం కాజాలదు.
ప్రస్తుత సమాజపు కొలతలనుండి నేను హిందూ కుటుంబంలో పుట్టినా, హిందూ గ్రంథాలుగా ప్రాచుర్యంలోనున్న నిజంగా తాత్విక గ్రంధాలు మత పరిధిని దాటి (సర్వ మానవాళిని ఉద్దేశించి) ఉంటాయి. వాటి ప్రభావం నామీద ఎక్కువగానే పడినా, ప్రస్తుత నా బుద్ధి స్థాయి ననుసరించి నేను ఏ మతస్తుడిని కాను, ఏ కులస్తుడినీ కాను. ఏ వర్గానికి చెందిలేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెపుతున్న విషయం. పరిశీలిస్తే నా రచనలు కూడా మీకీ యభిప్రాయాన్ని కలిగించ గలవు. అదిన్నీ అలా ఉంచి మరో విషయాన్ని కూడా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి హిందూ మతస్థుడిగా గానీ, మరో మతస్థుడిగా గానీ ఉన్నాడనుకోండి. అతడు చెప్పిన వాటి విలువలు అంత మాత్రాన తల్లక్రిందులౌతాయా? ఆయా వర్గాలలో ఉన్నంతమాత్రానే ఒకడు అర్హుడో, అనర్హుడో అయిపోతాడా? అట్లు కాదు అనడం అన్ని విధాలా విజ్ఞత కాగలదు. ఉదాహరణకు ఓ అంశాన్ని మీ ముందుంచుతాను, పరిశీలించండి.
శ్లో :- యుక్తి యుక్త ముపాధేయం వచనం బాలకాదపి I
అన్య త్తృణమివ త్యాజ్యం అప్యుక్తం పద్మ జన్మనా II
(ఈ శ్లోకం గత సంచికలో కూడా ఉటంకించాను) భాషేమో సంస్కృతం, గ్రంథం హిందూ సాహిత్యాంతర్గతం, అయితే ఏమిటంట? ఈ శ్లోకాన్ని అవగాహన చేసికోలేని, ఉపయోగించుకోలేని వారి యవివేకానికి విచారించాలి, జాలిపడాలిగాని, ఆ శ్లోకాన్ని ఉటంకిస్తే ప్రయోక్తను హిందువనుకుంటుందీ సమాజం అనడమో, అలా తానే అనుకోవడమో ఏపాటి వివేకం? వాస్తవంగా నా అధ్యయనాధ్యాపన క్షేత్రాలలో ఇప్పటికీ, ఎప్పటికీ ఈ శ్లోకభావమే నాకు ఊతకర్రగా, ఆధారపీఠంగా ఉంది. ఉండగలదు. ఏదో ఒక అంశాన్ని బట్టి మొత్తాన్నీ (మంచినీ,చెడునీ కలిపి) విడువడమో, పట్టుకోవడమోనన్నదే నాడూనేడూ జరుగుతున్న దుష్ట విధానము. ముందిది పోవాలి తులనాత్మక దృష్టి రావాలి. విషయాన్ని గమనించాలి. మరల దానిని ఆచరణలో ప్రయోగించి సరిచూసుకోవాలి. వాస్తవిక దృష్టి కల ఎవరికైనా, ఏనాడైనా మార్గమిదొక్కటే, ఆయా వ్యక్తులు ఈ విధానానికే పేరైనా పెట్టుకోనివ్వండి. పేరువల్ల కాగల కార్యమీ విషయంలో ఏమిలేదు. ఎందుకంటే;
హేతువాదుల మనుకునే వారిలోని యహేతుక దృష్టినీ, నాస్తికులుగా చెప్పుకుంటున్న వారిలోని ఆస్తిక దృష్టినీ, అలానే ఆస్తికులనబడే వారిలోని నాస్తిక దృక్పథాన్ని, కమ్యూనిస్టుల మనుకునే వారిలోని కమ్యూనలిజాన్ని (కుల కండూతిని) కూడా మేము తరచుగానే గమనించాము మా యన్వేషణలో అట్లే
పరిపూర్ణులుగా తమని తామే భావించుకుంటూ, మరికొందర చేతనూ గుర్తింపబడుతున్న వారలనూ, వారిలోని యపరిపూర్ణతనూ, అలానే వాస్తవజ్ఞానం పొందే ఉన్నామనుకునే వారిలోని అవాస్తవికతనూ (భ్రమాత్మక స్థితిని) కూడా అనేక చోట్ల గుర్తించాము. మరో వంక మా అన్వేషణలోనే భాగంగా నున్న స్వీయానుభవ విశ్లేషణల నుండి గతంలో వాస్తవమనుకున్న ఎన్నో విషయాలు మార్పులూ, కూర్పులకు లోను చేయవలసి రావడం కూడా గమనించాము. వీటన్నిటి క్రోడీకరణ రూపమే సత్యాన్వేషణ మండలి ఆవిర్భావానికి ఆలంబనము. ఎవరో ఏదో అనుకుంటారనో, సంజాయిషీ యివ్వవలసి వస్తుందనో, ఉన్న స్థితిని మరుగు పరచుకోవడమూ, నాగురించి నేననుకుంటున్న దాని కన్యమైన భావాన్ని నా గురించి యితరులకు కలిగించడమూ చేయలేను. అట్లు చేయవలసిన అవసరమూ లేదు. రాదుకూడా. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... సంస్థ పేరు సత్యాన్వేషణ మండలి. సంచాలకుడు సత్యాన్వేషి, బాగుంది అంటూ రెండు మూడు చోట్ల నుండి ఆక్షేపణలు వచ్చాయి. అయితే ఆ యిరువురకో, ముగ్గురకో వ్యక్తిగతంగా లేఖలు వ్రాయవచ్చు గదా అన్న సందేహం పాఠకుల్లో కొందరకు కలగవచ్చు. వ్రాయవచ్చుగానీ, పాఠకుల్లోనూ ఇదే యభిప్రాయం మనస్సులో ఉండి, ఉదాసీనంగా ఉండే మరికొందరు ఉండి ఉండవచ్చు. మరియూ పై యిద్దరు ముగ్గురూ తమ కెదురుపడిన మేలు కొలుపు పాఠకులలో ఒక సందిగ్ధ స్థితిని రేకెత్తించవచ్చు తమ ప్రశ్నలద్వారా. వీటన్నిటిని దృష్టినిడుకునే ఆయా అంశాలను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాను. ఇందువల్ల మూడు ప్రయోజనాలున్నాయి. 1) ప్రతికక్షుల దురాగ్రహ ప్రతిష్ఠంబన జరుగుతుంది. 2) ఎవరికి వారు వారివారికి నచ్చిన తోచిన రీతిన నాగురించి యభిప్రాయముల నేర్పరచుకునే ప్రమాదంనుండి నన్ను నేనుద్ధరించుకొనుటకు వీలవుతుంది. 3) పరిశీలకుల ఎదుట నా గురించి నేనేమనుకుంటున్నానో, ముఖపత్రాంశాల గూర్చి నేనేమనుకుంటున్నానో నా మాటలలోనే చెప్పినట్లయిన అభిప్రాయ భేదాలు వీలయినంతవరకు తగ్గగలవు. తద్వారా ఈ విషయమైన అనవసర వాగ్వివాదాలను చాలా వరకు ఆపుచేయవచ్చు. ఇకపోతే దోషాలు చూడడమే స్వభావంగా ఉన్న వాళ్ళను ఉపేక్షించడమే సబబు. ఎందుకంటే ఆ వర్గానికి నచ్చజెప్పాలను కోవడమన్నది అవివేకమో, అతి మంచితనమో కాగలదు. ఈ రెండూ అనుసరింపదగినవి కాదు.
 “సత్యాన్వేషణలో మీ సురేంద్ర” అన్న నా ముగింపు వాక్యంపై అక్షేపణ ప్రధానంగా ఉంది. తానే యన్వేషకుడైన వాడు ఇతరులకేం 'చెప్పగలడు? మేల్కొల్పగలడు? అని.
ఈ యాక్షేపణ వినడానికి బాగానే ఉంది. అయితే ఏదో ఒక దృష్టి కోణం నుండి దానికి పరిమితార్ధం పెట్టుకుని పలికిన మాట అది. కానీ మానవ జీవితాన్నీ, మేధస్సు పనిచేసే తీరుతెన్నులనూ, ప్రకృతితోనూ, సమాజంతోనూ అతనికి గల సంబంధాలనూ, ముఖ్యంగా మానవునిలో నున్న గవేషణా ప్రవృత్తినుండి జనించిన విజ్ఞాన చరిత్రనూ మొత్తంగా యవలోకించగలిగినప్పుడు గానీ బోధపడదు. అన్వేషణ యన్నపదంలోని ఔచిత్యం. పరిమితార్థంలో ఆ పదాన్ని స్వీకరించినా వెదికేవాడు, కొన్ని ఆధారాలు లేక వెదకలేడు. అట్టి ఆధారాలు (ఆయా విషయాలకు చెంది) కల ఒకడు మరికొందరి నిన్నీ వెదుకులాడ ప్రేరేపించడంలోనూ అనౌచిత్యం ఏమీలేదు. విజ్ఞానావిష్కరణలలో ప్రతిచోటా ఈ యంశాన్ని కూడా గమనించగలం పరిశీలించగలిగితే.
 ఎంతటి మేధావియైనా, సామాన్యుడైనా కొన్ని విషయాలలో సరైన జ్ఞానాన్నీ (సమగ్రమైన అవగాహననూ) మరికొన్నింటి పట్ల అసమగ్రతనూ, అప్పుడప్పుడూ తప్పు భావాన్ని కూడా కలిగియుంటున్నాడు, కనీసం అలా జరిగేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన వాస్తవిక దృక్పథంకల వివేకి, తన ఇతరుల విషయమై జీవితంలో ఏర్పడుతున్న పై మూడు స్థితులను సమీక్షించుకుంటూ 
1) నిశ్చితాలను నిలిపి ఉంచుకుంటూ, అవకాశమున్నంత మేర ఇతరులకున్నూ అందించు యత్నం చేస్తూ ఉండడం. 2) అనిశ్చితాలను (అసమగ్ర జ్ఞానం కల అంశాలను) పూరించుకుంటూనో, సరిచేసుకుంటూనో ఉండడం, ప్రతి మనిషి జీవితంలోనూ యిలాంటి అంశా లుండే వీలుంది అన్న మెలకువను ఇతరులలోనూ కలిగిస్తూండడం, 3) భ్రమపడే వీలుంది ఎవ్వరైనా అన్న వాస్తవాన్ని గమనించే వున్నాం గనుక (ఈ విషయం వెనుకటి వాళ్ళునూ గమనించారు. ఉదా:- “ప్రమాదోధీమతామపి!”) అట్టిది ఏర్పడి ఉందేమో చూసుకుని ఏర్పడి ఉంటే తొలగించుకోవడం, మరల ఏర్పడకుండ జాగ్రత్త కలిగి ఉండడం, అన్న పద్ధతిని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవడం వివేకవంతమూ, శ్రేయస్కరమూ కాగలదు. అయా విషయాలకు చెందిన వైజ్ఞానికావిష్కరణలన్నీ అలాగే సాగినాయి. ఇక ముందున్నూ సాగుతాయి. సాగాలి కూడా. దీని కన్యమైన విధానాన్నేర్పరచుకున్న వారివల్లనే (నిజంగా వీరి హృదయంలో ఇతరుల కపకారం చేద్దామని లేకున్నా) వ్యక్తికీ, సమాజానికీ నాడూ నేడూ, ఏనాడైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. చరిత్రను చూడగలిగితే ఇట్టి సందర్భాలు గణనీయంగానే ఎదురుపడతాయి శోధకులకు. ఒకటి రెండు ఉదాహరణలు మీ ముందుంచుతాను గమనించండి. శంకరులు తాను గమనించి ప్రకటించిన అద్వైత సిద్ధాంతము సత్యమనే నిర్ణయానికి వచ్చారు. అంటే దేశ కాలాలకు మారనిదని వారి నిశ్చయమన్నమాట. తదన్య సైద్ధాంతికులు అది అట్టిది కాదనియూ, భ్రమాత్మకమైనదనియు నిర్ధారించే యత్నం చేశారు. అలానే వెంకటాద్రి రావిపూడి నాస్తికులున్నారు జాగ్రత్త అంటూ నాస్తిక సంఘాలను దృష్టి నిడుకునే ఓ గ్రంథాన్ని రచించారు. అలానే కమ్యూనిజంలోని అశాస్త్రీయత అనే
భావాన్ని వ్యక్తం చేసే మరో గ్రంథాన్ని రచించారు. మరోవంక కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు తమ సిద్ధాంతం శాస్త్రాలకే శాస్త్రం వంటి దంటుంటారు. ఈ మధ్యకాలంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన జిడ్డు కృష్ణమూర్తి తాము గమనించవలసిన వాస్తవాన్ని గమనించా మంటారు. వారు చెపుతున్నంత యదార్థమేమీ వారివద్ద లేదని అదే కోవకు చెంది ప్రస్తుతం ప్రచారంలోనున్న U.G.K, గారంటారు. ఇలా కళ్ళు తెరచి లోకాన్ని చూడగలగాలేగాని నేను వాస్తవాన్ని గమనించాననో, పొందవలసింది పొందాననో అనే వాళ్ళు అనేకంగా ఉన్నారు. ప్రతివారూ తన భావాల కన్యమైన భావజాల మంతటినీ ఏదో వంకన త్రోసిరాజంటారు. ఈ సంఘటనల స్వభావాన్ని అర్థం చేసికొనగలిగితే ఇప్పటివరకు ప్రకటించబడిన నానా సిద్ధాంతాల పోకడల నన్నింటినీ మరల పునస్సమీక్ష, పునఃపరీక్ష చేయవలసియే ఉంది. అయితే యిదేమీ అర్ధం కానంత జటిల విషయమేమీ కాదు గదా? మరెందుకు అవన్నీ సమీక్షింపబడుట లేదు? దానికి ఒక్కటే సమాధానం ఉంది. జ్ఞానభాగం నిరంతరం మెలకువ గలిగి ఉండి తీరవలసిన ఒకానొక అంశం మరుగున పడి, ఆ చోటును మరో భావం (మనది పరీక్షింపబడవలసిన పనిలేదు అన్న భావం) ఆక్రమించుకుని ఉండడమే అందుకు కారణంగా ఉంది. జ్ఞాన విషయం ఏ కాలంలో గానీ, ఏ దేశంలోగానీ ఏవ్యక్తిచేగానీ పరీక్షింపబడడానికి సిద్ధంగా ఉండడం, మరల మరల శోధింపబడే సందర్భంలో మార్పులూ, కూర్పులకు అవసరం ఏర్పడితే కించిత్తు కూడా వెనుకాడకుండా అట్లు చేయగలగడం అన్నదే ఆ యంశము. అయితే ఇదే యిప్పుడు దాదాపు ప్రతి సిద్ధాంత కారులలోనూ, అనుయాయులలోనూ బలహీనంగా ఉంది. ఆ స్థానాన్ని పైన చెప్పినట్లు మాది పరీక్షింప బడవలసిన అవసరం లేదనియో, (ఒక రకమైన మూర్ఖత్వమే అది) పరిపూర్ణ వాస్తవమది అన్న విశ్వాసమో చోటు చేసుకుని ఉంది. వెనుక విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి జరిగిన పెద్ద పెద్ద యవరోధాలు ఇట్టి తప్పు భావన నుండియే ఉత్పన్నమైనాయి. ఉదా:- భూ కేంద్ర సిద్ధాంతం “అరిస్టోటిల్”చే అంగీకరింపబడింది. అంతటి వాడు చెప్పాడు. గనుక ఇక అది పరీక్షింపబడవలసిన అవసరంలేని విషయంగా స్వీకరింపబడింది. అంటే ఫలాని వాడు చెప్పాడు గనుక అనే ఒక విశ్వాసాధారంగా అజ్ఞానమే జ్ఞానంగా చెలామణి అయ్యింది శతాబ్దాల తరబడి. విజ్ఞాన కాయం యొక్క ఎదుగుదల అక్కడితో ఆ కోణంలో ఆగిపోయింది. అది ఎప్పుడు మరల పునరుజ్జీవింపబడిందో ఆలోచించ గలరా?!? 
 మరల ఏదో బుర్రలో నిశ్చితాలను కూడా పరీక్షిస్తూండడం అవసర మన్న మెలకువ, పరీక్షించగల తెగువ (ఈ మాట ఎందుకంటున్నా నంటే సమకాలికులు అట్టి వారిని తగినంత బలంగానే వ్యతిరేకిస్తారు గనుక) ఏర్పడిన క్షణం నుండే. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశమేమంటే; నేడు ఈ విషయాన్ని మనం చెపితే వారు చెప్పింది నిజమే, కానీ మా సిద్ధాంతం మాత్రం అట్టిది కాదు అనే అమాయకులే మరల మనకెదురౌతారు. ఇప్పుడు మార్పును కోరే మన ముందున్న అనేక ఇబ్బందుల్లో ఇది చిన్నదేమీ కాదు.
ఏతావాతా తేలిన సారాంశమేమంటే (మొత్తంమీద యిప్పటికి నే చెప్పదలచుకున్న దేమంటే) తనచే పదే పదే పరీక్షింపబడి నిర్దారించుకో బడ్డ అంశాలైనా ఎవ్వరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా పరీక్షించి చూసుకునే అవకాశం-వెసులు బాటు కలిగి ఉండడం, తన యనుభవాలను - నిశ్చయాలను - అప్పుడప్పుడూ తానున్నూ సమీక్షించుకోవడం జరగాలి. అయితే ఇది ఆచరణ ఎప్పుడు సాధ్య పడుతుంది?
   వాస్తవాలూ, భ్రమలూ [ఈ రెండూ నిశ్చయరూపంలోనే ఉంటాయన్నది స్పష్టంగా గమనింపతగియున్నది] సందేహాలు అన్న మూడు స్థితులూ అనుభవరూపంలోనే ఉంటాయనియూ, భ్రమ, ప్రమాదాలకు లోనయ్యే ప్రమాదం ప్రతి మానవ జీవితంలోనూ ఏర్పడే వీలుం దనియూ, అట్టి వాటినెన్నింటినో అధిగమించే మానవుడు తన జ్ఞానాన్ని-వివేకాన్ని అభివృద్ధి చేసికుంటున్నాడనియూ, ఈ విషయంలో తనకూ ఎవ్వరికిగానీ-మినహాయింపు లేదనీ, ఉండకూడదనియూ, ఎరుక గలిగి ఉండడం జరుగవలసి ఉంది. అట్టి స్వభావాన్ని ఏర్పరచుకున్న వారిలో ఇప్పటికీ కొన్ని నిశ్చయాలూ, మరికొన్ని పరిశీలనలూ, ఉన్నప్పటికీ జ్ఞానాభివృద్ధి దిశలో కదలిక ఆగదు, ఈ తరహా యోచనా శీలతనే నేను వాస్తవిక దృష్టి అంటాను.
ముఖచిత్రం పైనున్న వృత్తంలోని “వాస్తవిక దృష్టి” అన్న పదాన్ని వివరించే యత్నంలో సంబంధితాంశము లనేకములు ప్రస్తావించినాను. మరింత స్పష్టత కొరకు దానిని గూర్చే మరో కోణం నుండి వివరిస్తాను. పరిశీలించండి.
ఒక వ్యక్తిలో నిజాయితీ ఉందనడానికి, ఏదేని ఒక విషయాన్ని గూర్చి నిజం తెలిసి ఉందనడానికి మధ్యనున్న తేడాను గమనించ గలిగితే గానీ వాస్టవిక దృష్టికీ, సత్యాన్వేషణకూ, సత్యజ్ఞానం కలిగింది అనడానికి మధ్యగల తేడాలను గమనించ లేము. నిజాయితీ యన్నది వ్యక్తి స్వభావానికి చెందిన యంశము, ఈ పదము ఉపయోగించునప్పుడు అది అతని వ్యక్తిత్వాన్ని, ఆయా సందర్భము లందతని ప్రవర్తన (స్పందన) తీరునూ ప్రధానంగా సూచిస్తుంది ఈ నిజం తెలిసి ఉంది అన్న పదం ఏదేని విషయంపట్ల అతనికి ఉన్న యవగాహనా స్థాయిని ప్రధానంగా వ్యక్తీకరిస్తుంది. ఈ విషయంలో నిజాయితీ-అతని స్వభావం-అప్రధానమై ఆయా విషయములు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. నిజాయితీ లేని వారికి కూడా ఆయా విషయాలకు చెందిన వాస్తవం తెలిసి ఉండడం, అలానే నిజాయితీ కలవారలకున్నూ కొన్ని భ్రమలు ఏర్పడే అవకాశం ఉండడం, నిత్య జీవితంలో మనం దాదాపు తరచుగానే గమనిస్తున్నాము. కపటి (కపటము), అమాయకత్వమూ నన్న పదాలు ఈలాటి సందర్భాలను దృష్టినిడుకునే పుట్టినాయి. ఒక వ్యక్తికి ఒక విషయమునకు చెందిన వాస్తవము తెలుసు. అయినా ఏదేని ప్రయోజనాన్నాశించి దానిని మరుగు పరచాడనుకోండి. అప్పుడతడు నిజాయితీ లేనివాడంటాము కాని నిజం తెలియని వాడనలేము. యింతవరకు స్పష్టంగా గమనించినట్లైతే నిజాయితీ గల వ్యక్తి స్వభావాన్నీ, ఆయా విషయాలపట్ల అతని ప్రవర్తనా తీరును కలిపి అతనిని వాస్తవిక దృష్టి కలవాడంటాము. దానినే మరోరకంగా చెప్పవలసి వస్తే
వాస్తవిక దృష్టి కలవాడు యిప్పటికి ఆయా విషయాలను గూర్చి తనకెంత తెలుసో, ఎంత తెలియదో యధార్ధంగానే గుర్తించే యత్నం చేస్తాడు. ఆ విషయం చెప్పవలసి వచ్చినప్పుడున్నూ నిజాయితీగానే తనను గూర్చి తానెట్లు గుర్తించుకుని యున్నాడో అంత మాత్రమే వ్యక్తం చేస్తాడు. అప్పటికీ తనచే గ్రహింపబడింది అన్న వాటి విషయంలో గల దోషాలను గుర్తింపజేస్తే గ్రహించి మార్చుకుంటానికిన్నీ నిజాయితీగానే యత్నిస్తాడు. తెలియంది తెలుసనిగానీ, తెలిసింది తెలియదని గానీ, ఉన్న స్థితి కంటే తనను తాను గొప్పవానినిగాగానీ, అల్పుడననిగానీ భావించడు, ఇతరులకున్నూ చెప్పుకోడు. ఇది వాస్తవిక దృష్టి, కలవాని తీరుగా ఉంటుంది. దీనిని ఎందుకింతగా ప్రస్తావించవలసి వచ్చింది?
వర్తమాన సమాజాన్నీ, అందలి వ్యక్తులను నిశితంగా గమనించగలిగితే ఈ ఈ రకమైన స్వభావం (వాస్తవిక) దృష్టి యొక్క లోటు కొట్టవచ్చినట్లు కనుపిస్తుంది. ఉదాహరణకు ఒకడు తానెంత? చాలా అల్పుడనని చెపుతాడు పైకి. కానీ అంతర్గతంగా అధికుడనేనన్న భావం ఉంటుంది. అది అతని ప్రవర్తనలోనున్నూ కనుపిస్తుంటుంది. దీనిని ఒక రకమైన కపటమేననాలి. మరికొందరు నాలుగు మాటలు అక్కడక్కడా వినో, నాలుగు గ్రంధాలు చదివో అంతా తెలిసిపోయిందన్న భావాన్నేర్పరచుకుంటారు. తెలియడమంటే ఏమిటో, ఒకదానిని గూర్చి అది తెలిసింది అనడానికీ, అది చేతనయింది అనడానికి మధ్యనున్న వ్యత్యాసమేమిటో కూడా తెలియని వీరూ మరో రకమైన కపటుల క్రిందనో, భ్రాంతాత్మకుల క్రిందనో చేరిపో తారు. ఇట్టివారు తరచుగా వాగాడంబరులుగా (వాచా వేదాంతులుగా) ఉంటారు. దయనీయమైన స్థితేమంటే ముప్పాతిక మూడొంతులు దాదాపు అన్ని సంఘాలలోనూ ఇట్టివారుండడమే. నిజంగా తెలియకనే తెలుసనుకునే వీరి స్థితికి జాలిపడాల్సిందే. మరో రకంగా చూస్తే వీరిని ప్రతిఘటించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకనగా, వీరు అట్టి భ్రాంత భావన కలిగి గమ్మునుండరు. పదిమందినీ తమలాటి వారుగ చేయుటకో అమాయకుల వద్ద పెద్దవారుగా గుర్తింపు పొందాలనో నిర్విరామంగా యత్నిస్తుంటారు గనుక. ఇట్లు మానవ సంఘంలో తరచుగా జరుగుతున్న భ్రమ ప్రమాదాల్ని గమనించి, తనలోనూ అట్టి స్థితులేర్పడే యవకాశము ఉందని గమనించి తనవిగానీ, యితరులవిగానీ మరల మరల పరిశీలించుకుంటూ, ఇతరులు కూడా పరిశీలించుకునే వెసులుబాటును కూడా కలిగిఉండి, నిగ్గుతేలిన యంశాలనే అట్టెపెట్టుకుని తదితరములైన వాటిని [అవి తనవి గానీ, యితరులవి గానీ] తృణప్రాయంగా విడువ గలిగిననాడే వాస్తవిక దృష్టి కలవాడవుతాడు. మరింత వివరణాత్మకంగా చెప్పుకునే వీలున్నా ఇప్పటికే తగినంత వివరణాత్మకంగానే చెప్పాననిపించుట చేతను, రచనలోనే అంతటినీ యిమడ్చాలనుకోవడం సరికాదు  కనుకనూ, సార గ్రహీతలైన సత్యాన్వేషకులకు ఒకటి రెండంశములను ఎదుట నుంచుట ద్వారా మిగిలిన విషయాలను వారలే గ్రహించగలరు గనుకనూ ఈ "వాస్తవిక దృష్టి" అన్న పదవివరణను ముగిస్తాను.
ఈ దృక్పథంకల వ్యక్తులు అత్యల్పంగా ఉండడం వల్లనే ఆయా సిద్ధాంత విశ్లేషణలూ, గుణదోష నిరూపణలూ అప్పుడప్పుడూ చేయబడ్డా, గుణములను స్వీకరించడమూ, దోషములను విడవడమూ నన్న ఆచరణాత్మకత సమాజంలో ప్రబలం కాలేకపోయింది. ఇది వెనుకటి కాలంలోనేగాక, వర్తమానంలోనున్నూ జరుగుతున్న పొరబాటే. ఉదాహరణకు, ప్రతి సిద్ధాంతకారుడూ, ప్రవర్తకుడూ స్వీయ సిద్ధాంతాని కన్యమైన సిద్ధాంతాలలోని దొసగులను చూపి అది యవాస్తవ మనియో, అసమగ్రమనియో, నిరూపించే యత్నం చేశాడు. అత్యంత ప్రముఖంగా గమనింపవలసిన అంశమొకటుందిచ్చట. జ్ఞానానికి, విశ్వాసానికి మధ్యనున్న తేడాను గుర్తించడమే అది. ఈ గమనింపు లేనిచో జరిగే ప్రమాదం (తరచుగా జరుగుతున్నది కూడా అదే) ఏమిటో ఆలోచించగలరా?
వాస్తవమిది యని తాను నిరూపింపదలచుకున్న అంశాలకు సిద్ధాంతానికి ఆధారంగా తాను చూపుతున్న అంశము విశ్వాస ప్రాతిపదికను కలిగి ఉంటున్నది. ముఖ్యంగా సాంప్రదాయక ఆస్తికుల (వారు హిందూ, క్రైస్తవ, ఇస్లామీ ఆదిగాగల ఏ వర్గం వారైనా కావచ్చు గాక) విషయంలో ఇది ప్రత్యక్షర సత్యంగా ఉన్నది.
దీనినే తర్క పరిభాషలో చెప్పాలంటే సాథ్య సమ హేత్వాభాస అవుతుంది. అనగా ఒక విషయాన్ని నిరూపించడానికి నీవు చూపదలచు కున్న ఆధార విషయమే యింకా నిరూపింపబడవలసి యుందన్న మాట. (ఉదా :- బైబిలు ఎందువల్ల ప్రమాణము అని క్రైస్తవుల నడిగామనుకోండి. దేవుని వాక్కగుటవలన అని చెపుతారు. అది దేవుని వాక్కని ఎలా చెప్పగలవు అని మరల ప్రశ్నిస్తే బైబిలు చెపుతుంది. గనుక అని సమాధానం. లోపమెక్కడుందో గమనించారా? ఆలోచించండి. ఒక్క ఆధారాన్నిస్తాను. ఇందు అన్యోన్యాశ్రయ దోషం ఉంది.) అయితే ఈ విషయాన్ని గమనించే వారెందరు? ఒకవేళ గమనించగల్గినా స్వీకరించి విడువవలసినవి విడువగల మానసిక స్థైర్యం ఉన్న వాళ్ళెందరు? విశ్వాసాధారంతో జ్ఞాన నిర్దేశం చేయబూనుట ఎంతటి యవివేకమోకదా?  నేల విడచిన సాము అన్న నానుడి యిట్టి సందర్భాలు కొరకుగా చెప్పబడింది. ఇవన్నీ వ్యక్తులలో వాస్తవిక దృష్టి లేదనదానికి నిదర్శనాలే.
ఇహపోతే వాస్తవాలను నిరూపించడానికి ఊహల నాధారం చేసికోవడమన్నది మరో వర్గం వారి పోకడగా నుంది. ఇది ఆస్థికేతర సంఘాలలో తరచుగా కాన వస్తుంది. వీటన్నిటికీ, వాస్తవిక దృష్టి లేక పోవడమో, వాస్తవాన్ని నిరూపింపగల తూనికలు (ప్రమాణాలు) ఏమిటో సరిగా తెలియనితనమో కారణాలుగా ఉంటున్నాయి. Note :- ప్రమాణ విషయం విపుల పరిశీలన చేయువలసిన అంశమగుటచే దానిని మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను 
ఇప్పటివరకు అనుకున్న విషయాలలో చేసికొనవలసిన మార్పులు, చేర్పులూ చేసికొనగలిగిన (వాస్తవిక దృష్టికి రాగలిగిన) గాని వ్యక్తి నిజమైన సత్యాన్వేషకుడు కాజాలడు. సత్యాన్వేషిగా మారక పూర్వమున్నూ ఏవో కొన్ని విషయాలలో వాస్తవాన్ని గమనించగలిగి నప్పటికీ, ప్రత్యేక ప్రత్యేక సందర్భాలలో ఈ దృష్టి ఏర్పడినగానీ సత్యశోధనకూ తద్వారా నిర్దిష్ట విషయావగాహనకూ దృఢమైన, ఖచ్చిత మైన వేదిక ఏర్పడజాలదు. ఈ విషయాన్నింత నిఖ్ఖచ్చిగానూ ఎలా చెప్పగలిగాము? ఆయా సిద్ధాంతానుయాయులతో అనేక సందర్భాలలో మేము జరిపిన వాద ప్రతివాదనలే మమ్ములనీ యవగాహనాపరులనుగా తీర్చిదిద్దినవి.
Note:-సమావేశ వివరాలున్నూ అందరకు తెలిపిన బాగుండునన్న ఉద్దేశం వలన ఈ సంచికలో స్వమంతవ్యాదులను సశేషంగా ప్రకటించటమైనది. కొరవలు తరువాయి సంచికలో చూడగలరు.

స్వమంతవ్యము [ నేనూ నా పత్రిక] 
సంపుటి -1                    సంచిక - 7                     1-9-91 
గత సంచికలో ముఖచిత్రంలోని కొన్ని అంశాలు విపులంగా పరిశీలించాము. వాస్తవిక దృక్పథం కలవారలే సత్యాన్వేషణ చేయగలరనీ చెప్పాను. సత్యాన్వేషణ అన్న పదంలో తెలిసికోవాలనే, నిజం తెలిసికోవాలనే ఆకాంక్ష ఉంది. సత్యమంటే ఉన్నది అనీ, ఉన్నది ఉన్నట్లు అని అర్ధం చెప్పుకోవచ్చు. ఈ అర్థంనుండి చూస్తే సత్యమన్న పదం ఏదో విషయానికి సంబంధపడే అర్ధమవుతుందన్నమాట. ఏది ఉన్నది? ఎలా ఉన్నది? ఎక్కడ ఎప్పుడు ఉన్నది? యిలా ఆయా సందేహాల కారణంగానే అన్వేషణ-తెలుసుకునే యత్నం- ప్రారంభమవుతుంది. నిస్సందేహస్థితి ఏర్పడేవరకు కొనసాగుతుంది. పిదప ఆ విషయంలో అన్వేషణ ముగుస్తుంది. మరల మరో విషయంలో సందేహం... అన్వేషణ.... సమాధానము. అన్వేషణ ముగింపు. జీవితాన్ని గనుక సవ్యంగా పరిశీలించగలిగితే ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ కొనసాగుతూనూనే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక్కడ సత్యాన్వేషణము అన్న పదాన్ని రెండు విధాలుగా ఉపయోగించే వీలుంది? అది వ్యక్తిపరంగానూ, విషయపరంగానూ, వ్యక్తిపరంగా సత్యాన్వేషణము అన్నది నిజం తెలిసికోవాలనే స్వభావాన్ని సూచిస్తుంది. దీనినే పూర్వ సంచికలతో గవేషణా ప్రవృత్తి కలిగి ఉన్నాడు. మనిషి అని చెప్పాను. 6. వ సంచిక లోనున్నూ ఏదో విషయానికి చెందిన అన్వేషణ ముగించగలడేగాని, మనిషి అన్వేషణే అక్కరలేనిస్థితికి చేరలేడు. చేరకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఆ విషయ పరంగా అన్వేషణము అన్న పదం ఆయా విషయాలకు చెందిన స్థానం యొక్క అసమగ్రతను సూచిస్తోంది. నేను ప్రయోగిస్తున్న ఈ సత్యాన్వేషణము అన్న పదం వ్యక్తి స్వభావాన్ని కలిగి ఉండాలి? అన్న దృష్టినుండేగానీ, తాను చెపుతున్న విషయంలో తెలియనితనాన్ని వ్యక్తీకరించుటకై చెప్పుతున్నది. కాదు. ఆ విషయాన్ని పత్రిక పేరూ, ముఖచిత్రంలోని మాటలుకూడా రూఢిపరుస్తున్నాయి. మేలుకొల్పాలన్న యోచన నిద్రించేవాడికి రాదు కదా!? మేల్కొన్న వాడు అన్న పదం ఏదో విషయానికి చెందిన జ్ఞానస్థితిని తెలుపుతోంది కదా!? కనుక దీనినిబట్టి నా రచనలోని “సత్యాన్వేషణ” పదం తెలిసికోవాలనే ప్రవృత్తి బోథకంగా గ్రహించాలి. అదిన్నీ ఎందుకు ప్రధాన విషయంగా చూడవలసి వచ్చింది. విజ్ఞాన చరిత్రను పరిశీలిస్తే యదార్థాన్వేషకులై కూడా ఒక దశలో, జీవితానికి చెందిన ఒక వాస్తవాన్ని గమనించి (గమనించామని భ్రమించైనా కావచ్చు) ఇక అన్వేషించ వలసిందేమీ లేవన్న నిర్ణయానికి (ఆయా కాలాలనాటి మేధావులేసుమండీ) వచ్చినట్లు కనబడుతోంది. ఈనాటి సహేతుకమైన పరీక్షలకు అందులో ఏ ఒక్కటీ పూర్ణంగా నిలుచుటలేదు. పాక్షికత చోటు చేసికుంటోంది. గంథ న్యాయంగా ఉందీ వ్యవహారాన్ని చూస్తే. కొంతమంది గృడ్డివాళ్లు ఒక ఏనుగును పరీక్షించి ఏనుగంటే ఎలా ఉంటుందో నిశ్చయించారనుకోండి. ప్రతివక్కడు అనుభవంలో చూసిన దాన్నే చెపుతున్నాడు. నిజాయితీగానే చెపుతున్నాడు. అయినా ఒకళ్ళదొకళ్ళకు సరిపడడం లేదు. ఒకరి దొక రంగీకరించడం లేదు. తాను పాక్షిక జానాన్నే పొంది ఉన్నానని గానీ, మరింత పరిశీలించవలసి ఉందనిగానీ తలంచుటలేదు. (అన్వేషణ ముగిస్తున్నాడు) యోచనాశీలురను ఈ విషయంలోనూ మేలుకొల్పాలన్న యోచననుండే అన్వేషణ ముగించుకోకు, అన్వేషించవలసిన విషయం మారుతుందేగానీ అన్వేషణే లేకుండా పోవడం మంచిదికాదు, అన్న మాట పుట్టింది నాలో ఇక్కడ నేను చెప్పదలచుకున్న ముఖ్య విషయమేమంటే ఎవ్వరైనా తనను తాను అన్వేషకుడినని చెప్పుకున్నా, కానని చెప్పుకున్నా వాస్తవంగా అతడు ఏదో విషయంలో అన్వేషకుడి గానే ఉంటున్నాడు. అన్వేషిస్తూనే ఉంటాడు. ముఖచిత్రంలోని సత్యాన్వేషణము అన్న పదం వెనుక నా దృక్పథమిదే. ఇప్పటికి అనుభవంలో ఎన్నో విషయాలు మరింక తెలియవలసింది లేదన్నంతగా తెలిసికొన్నా ఎప్పటికప్పుడు ఏదో విషయం నన్ను గమనించావా? అన్నట్లు ఎదురుపడుతూనే వుంది నా జీవితంలో. అలానే లోకాన్ని గమనిస్తున్నప్పుడు అనేకులు తమకు తామే పరిపూర్ణులం అన్న భ్రాంతిలో కొట్టుకుపోవడమూ కనబడింది. అలా అనేకంగా కలిగిన అనుభవాలనుండే, ఓ మనిషీ, అన్వేషించే స్వభావాన్ని చంపివేయకు. అన్వేషకుడిగానే ఉండు. నష్టమేమీ రాదు. అని చెప్పాలన్న భావన స్థిరపడింది నాలో. తెలుసుకునే యత్నం చేస్తూ ఉండు. ఇప్పటికి తెలిసింది తెలుపుతూ ఉండు. సత్యమని నిర్ణయింవబడిన దానినే తెలుపు. అయినా దానిని కూడా ఏ క్షణంలో నైనా మరల పరీక్షించుకొనుటకు సిద్ధంగా ఉండు. ఇదే నేననుసరిస్తున్న విధానము. అనుసరించమంటున్నది కూడా ఇదే.
 వెనుకటి తాత్వికులలోనూ ఈ భావన చోటు చేసుకునే ఉందనడానికి తగిన ఆధారమొకటుంది మనకందుబాటులో. “అధ్యయన మధ్యాపనం బ్రాహ్మ్యం కర్మ స్వభావజం” తెలుసుకుంటూ ఉండడం, తెలియజేస్తూ ఉండడం అన్న పనులు స్వభావంగా కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు అని పై వాక్యానికర్థం.
గమనిక : ఇక్కడ బ్రాహ్మణపదం. శిరోభాగానికి-జ్ఞానానికి ప్రతీకగా వాడబడింది మాత్రమే. నేటి మన అనుభవంలో చూస్తున్న కుళ్లు కుల వ్యవస్థకు చెందినది కాదా పదం. తెలుసుకోవడమూ-తెలియజెప్పడమూ ఎవనికి స్వభావకర్మలుగా ఉంటాయో అని అర్ధం. ఇది విద్యా సంప్రదాయానికి చెందిన అంశం. సహజ దేహంలో జ్ఞానభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారెట్టి దృక్పథం కలిగి ఉండాలి? లేక ఉంటారు? అన్న ప్రశ్నకు సమాధానరూపమై ఉంది పై శ్లోక భావం. (సత్యాన్వేషణ మండలి ప్రాథమిక నియమాలలో తెలియంది తెలుసుకుంటూ ఉండు. తెలిసింది తెలుపుతూ ఉండు అన్నది కూడా ఒకటి) పై వాక్యభావం దేనిని చూపెడుతోంది. ఇప్పటి కెన్నో తెలిసివున్నవనీ, మరెన్నో తెలియవలసి ఉన్నవనే కదా! ఇదేమీ భ్రాంతినుండి పుట్టిన భావం కాదు. ఎంతో లోతైన అవగాహననుండి, వాస్తవిక దృష్టినుండీ ఏర్పడ్డ నిశ్చయమిది. ఈ విషయం మీరూ మీ మీ యనుభవాలతో పోల్చుకొని ఒక నిర్ణయానికి రండి.
లోకంలో రెండురకాల మనుషులు కనుపిస్తూంటారు. ఒక వర్గంలో ఆత్మ న్యూనతా భావం స్థిరపడి వుంటే, రెండోవర్గం వారిలో ఉండకూడనంత ఆధిక్యతా భావం పాదుకొని ఉంటుంది. నిష్కర్షగా చెప్పాలంటే ఈ రెండూ తప్పు అభిప్రాయాలే. అభివృద్ధి నిరోధకాలే. ఒక రకం వారు మనవల్ల కాదు అని యత్నించడం మానితే మరోరకం వారు ఏమిటి దానికై యత్నించేది అన్న దృష్టినుండి పని
చేయడం మానతారు. రెండు దృష్టులనుండి ఏర్పడుతున్న ఫలితమొక్కటే
జీవితాధ్యయన మన్నది బహుముఖాలుగానూ, జాగరూకతతోనూ అధ్యయనం చేయవలసినదిగా ఉన్నదన్న వివేకం లోపించినప్పుడల్లా వ్యక్తి వికాసానికి గానీ సామాజిక వికాసానికిగానీ ఎంతో కొంత అపకారం జరిగి తీరుతుంది. ఏతావాతా నే చెప్పదలచిన దేమంటే అన్వేషణా దృష్టిని విడువకు అన్వేషించే క్షేత్రాలు మారవచ్చు. అంతేకాదు. అన్వేషణ ముగించిన వాటిని కూడా ఎప్పుడు అవసరపడితే అప్పుడు పునఃపరీక్ష చేసికొనుటకు సిద్ధంగా ఉండు, అన్నదే ఈ భావం. మీలోనూ, ధృఢపడుట కొరకు కొన్ని దృష్టాంతాలను చూపుతాను. 1) శంకర రామానుజాది ఆస్థికులూ, మార్క్సు, సార్త్రేలాటి పదార్ధ వాదులూ, గోరాలాటి నాస్తికులూ ఇలా, ఆయా సిద్ధాంత స్థాపకులూ, ప్రవర్తకులూ కూడా ఎవరికి వారు తాము గమనించవలసింది గమనించేశామనే అనుకున్నారు. జీవితాన్ని అర్థం జేసుకున్నామనే అనుకున్నారు. అందరూ తాము గమనించా మనుకున్న దానికి అన్యమైన వాటిని తప్పులుగానో, పాక్షికమైనవి (అసంపూర్ణమైనవి) గానో కొట్టి పారేశారు. ప్రతివారు ఎదుటివారి గురించి దోషాలను సహేతుకంగా చూపే యత్నం చేశారన్న మాట. తమాషా ఏమంటే ఎదుటి వారందరు దాదాపు అన్వేషణ చేయదగి యున్నారనే ప్రతి వక్కరూ చెపుతున్నారు. తాము అన్వేషణ ముగించామని తలుస్తున్నారు. మేధావులు ఒకే వేదిక పైకి రాలేక పోవడానికి ఇదో అంతర్గతమైన (మౌలికమైన) కారణమన్నది మీకు తట్టడం లేదా? వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు సాధించవలసినదిగా ఉన్నది. అనగా సాధ్య మన్నమాట. దానిని పొందుటకు గాను సాధన సామగ్రీ కావలసి ఉంది. వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు ఎప్పుడు, ఎలా కలుగుతుంది? అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే, సమిష్టి వ్యష్టి యోగ క్షేమములకు తగిన వ్యవస్థ నేర్పాటు చేసి అమలు పరచుటా, వ్యష్టిన్నీ స్వార్ధం ప్రధానం కాకుండా బాధ్యతలు సక్రమంగా నేరవేర్చుట ద్వారా సమిష్టి యోగ క్షేమములకు తనవంతు కృషి సల్పుటా అన్నది అమలు చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది?
వివేకము: వాస్తవిక దృష్టి కలిగి, సత్యాన్వేషణ ద్వారా ఏర్పడ్డ జీవితావగాహన ననుసరించి ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎంత చేయాలి లాటి విచక్షణా జ్ఞానాన్నే వివేకమంటాము. ఇది జ్ఞాన క్రియలలోనూ, శారీరక క్రియల లోనూ, సామాజిక సంబంధాల నుండి ఏర్పడిన బాధ్యతలూ, హక్కుల పరంగాను పనిచేస్తూ ఉంటుంది.
ధర్మాచరణము :- పైచెప్పబడ్డ వివేకం యొక్క మార్గదర్శనంలో ఆయా కర్మల నాచరిస్తూ ఉండడాన్ని ధర్మాచరణ మంటారు. Note:-ధర్మమన్నది మరింత పరిశీలించదగిన అంశముగా నున్నది కనుక దీనిని ప్రత్యేక సంచికగా ముందు ముందు మీ ముందుంచుతాను. మానవ స్వభావాన్ని వీక్షించితే ప్రతి మనిషీ తనది కాని దానిని తనదిగా చేసికుంటానికి, తన దానిని -- నాదిని - బలపరచడానికి నిరంతరం యత్నిస్తున్నాడు. ఇదో తాత్వికాంశము. కనుక ఎంత పరిధిలో నా అన్న భావన పెట్టుకో గలడో దాని యోగక్షేమాలకై యత్నిస్తున్నాడన్న మాట. సామాజిక సమస్యల పట్ల వేదన కలిగి, పరిష్కారాలు వెదుకుతున్న వారు ఖచ్చితంగా అవగాహన చేసికో వలసిన విషయాలలో ఇదీ ఒకటిగా ఉంది. మనం వ్యక్తి సమిష్టి శ్రేయస్సును సాధ్యంగా పెట్టుకున్నాం . అదెట్లు నెరవేరుతుంది. అంటే వ్యష్టి సమిష్టిలు ఒకరిపట్ల ఒకరు నా అన్న భావన దృఢంగా కలిగి ఉండాలన్నమాట. అప్పుడు హృదయ గతంగా పరస్పర యోగక్షేమాలను కాంక్షించే స్థితి ఏర్పడుతుంది. సూత్రప్రాయంగా చెప్పాలంటే మూల సమస్యకు మౌలిక పరిష్కారమన్న మాట ఇది వసుధైక కుటుంబ భావన మన్న పదం దానినే సూచిస్తోంది. (సమిష్టి అన్న పదంచే సామాజిక వ్యవస్థా, దానిని నడపు రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థా, రక్షణ వ్యవస్థా, ప్రభుత్వమూ అన్నది సూచింపబడుతున్నాయి. వ్యష్టి అన్న మాటచే వివేకమూ, బాధ్యతలూ, ప్రజలూ, వ్యక్తిగత హక్కులూ అన్నవి సూచితములు) ఒకే కుటుంబంలో ఉన్న అందరూ అందరనూ నావారు అనే భావిస్తారు. మనమంతా ఒక్కటి అనే భావనే వారిలో ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాన్ని నడుపుతున్న, నియంత్రిస్తున్న వారిలో ఈ భావన ఉంటుంది. ఉండాలి. చిన్న వారిలో ఈ భావన లేకున్నా వారు పెద్ద వారి, ఈ భావన కలిగియున్న వారి అదుపులో ఉండాల్సి ఉంది. అలానే సమాజాన్ని నియంత్రించే అన్ని శాఖలకు చెందిన మేధాపులలోనూ ఈ భావన వుండాలి. సామాన్యులలో అట్టి భావన లేకున్నా, అట్టి భావన కలిగి యున్న వారిచే ఏర్పాటు చేయబడ్డ విధి విధానముల నాచరించునట్లు వారిని అదుపు చేయాలి. అప్పుడు ఒకే పెద్ద కుటుంబం ఏర్పడుతుందన్నమాట నిజమైన వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు అప్పుడే సాధ్యమవుతుంది. అంతవరకు అన్నీ చిలక పలుకుల మాదిరే అవుతాయి.
వసుధైక కుటుంబ భావన పొందాలి, వీలయినంత ఎక్కువ ప్రజలలో దీసిని కలిగించాలి. అట్లేర్పడిన వివేకంచే నిర్మితమయిన ప్రణాళికను అందరూ అనుసరించేట్లు వత్తిడి చేయగల వ్యవస్థ నేర్పాటు చేయగలగాలి. మొత్తం మీద ఏమన్నట్లయింది? ప్రతి మనిషి ఆత్మ నియంత్రణ నన్నా కలిగి ఉండాలి, లేక వ్యవస్థచే నియమితుడన్నా కావాలి. ఇప్పటికి ముఖచిత్ర వృత్తంలోని అంశాలను పరిశీలించినట్లయింది. 
  1. వాస్తవిక దృష్టి, 2. సత్యాన్వేషణా ప్రవృత్తి, 8. వివేకము, 4. వివేకాన్ననుసరించిన కార్యాచరణము వీటన్నిటి బలిమిచే ఏర్పడ్డ వ్యవస్థ, వసుధైక కుటుంబ భావన వల్ల ఏర్పడే వ్యవస్థే అవుతుంది. తద్వారా వ్యష్టి సమిష్టుల శ్రేయస్సు సాధింపబడుతుంది.
వ్యష్టి సమిష్టి శ్రేయస్సు అనవలసిన పనేముంది. సమిష్టి శ్రేయస్సు అంటే సరిపోతుంది గదా! అన్న ఆక్షేపణ రావడానికి వీలుంది యిచ్చట. దీనినర్ధం చేసికోవడానికి విషయాన్నీ, జీవితాన్ని మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. విశ్లేషిస్తాను పరిశీలించండి.
సమాజంలోని ఆయావ్యక్తులచే చేయబడుతున్న పనులు 3 రకాలుగా ఉన్నాయి.
  1. ఒక్కడి ప్రయోజనం కోసం ఎక్కువమంది నష్టానికో, ఇబ్బందికో గురి, అయ్యేట్లు చేసేవి.
  2. ఎక్కువ మంది ప్రయోజనం కొరకు ఒక్కొడికి నష్టాన్నో, యిబ్బందినో కలిగించేవి.
  3. అందరకు ఎవరి విధులు వారికీ, ఎవరి హక్కులు వారికి అందేట్లు చేసేవి.
మరో రకంగా చెప్పుకుంటే 
  1. ఎవరేమైతే నేమి నావరకు బాగుంటే చాలుననుకునే రకం.
  2. నేను బాగుండాలి. నలుగురూ బాగుండాలి అని ప్రవర్తించే వారు. 
  3. నేనేమైతేనేమి నలుగురకూ మేలు జరిగితే చాలు ననుకునేవారు.
1వ వారు స్వార్ధం ప్రధానమైనవారు, 2వ వారు ధార్మికులు, 3వ వారు త్యాగులు. ఇక్కడే మనం గమనించ వలసిన ప్రధానాంశముంది. 1, 3 స్వభావాలూ, ప్రవర్తనలూ కోరదగినవి కాదు. అందులోని భావాలలో తేడా ఉన్నా జరుగుతుంది కొందరకు జరుగకూడనిదే. 1వ రకం బలపడి సమాజము అధార్మికమైనప్పుడు 3వ రకం వ్యక్తుల అవసరం ఏర్పడుతుంది. ఎందుకొరకు? సమాజాన్ని రెండవ స్థితిలో నిలిపి ఉంచుటకు, అంటే 1వ రకం బలపడడమంటే సమాజ శరీరానికి రోగం రావడం అన్న మాట. 3వ రకం చికిత్సా ఔషదమూ అవుతుంది. స్వస్థత రెండవ స్థితి అవుతుంది. పైన నేను పేర్కొన్న వ్యష్టి సమిష్టి శ్రేయస్సు అన్నది అప్పుడే సాధ్యమవుతుంది. 1వ రకం వారు సమాజాన్ని కాల్చుకు తింటుంటే, 3వ రకం సనూజం కొరకై తాము కాలిపోతుంటారు. వారు చిన్న వారని కాదుగానీ వారి అవసరం (త్యాగుల అవసరం) లేనిస్థితే నిజంగా కోరదగిన స్థితి. ఇంత ఆలోచించే వ్యష్టి, సమిష్టీ అన్న రెండు పదాల్ని వాడాను. వాస్తవిక దృష్టి నుండి వీటిని పరిశీలించండి.
“అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా౬మృతంగమయ.” అన్న వాటిలో మౌలికమైన జీవి ఆకాంక్షలు వ్యక్తం చేయబడ్డాయి.
ఇవి సార్వజనీనమూ, సార్వ కాలీనములైన విషయములుగాన తాత్విక విలువ కలిగి యున్నవి.
అసతోమా సద్గమయ - అసతః, మా, సత్, గమయ అన్న పదాల కూడికగా నున్నది.
లేమి నుండి కలిమి లోనికి పోవాలన్న కోర్కెకు సంకేత మీ వాక్యము. ఇది ఎదుగుదలకు చెందిన అభిలాషను వ్యక్త పరుస్తోంది. అసమర్ధతనుండి బైటపడి సమర్ధతను పొందాలనీ లేక అపరిపూర్ణత నుండి పూర్ణతలోనికి చేరాలనీ, భావన వ్యక్త పరుపబడింది. జీవి ఆకాంక్షలలో ఒకటైన ఎదగాలనుంది అన్న ప్రవృత్తినీ స్వభావాన్ని వ్యక్తం చేసే సూత్రమిది. ప్రతి మనిషికి అలా ఉందో లేదో ఆలోచించుకోండి. ఏ విషయంలో ఎదగాలి అని చూస్తే వ్యక్తుల్ని బట్టి విషయాలు మారతాయేగానీ, ఎదగాలని లేకపోవడం మాత్రం జరుగదు.
“తమసోమా జ్యోతిర్గమయ : తమసః; మా, జ్యోతి, గమయ” చీకటినుండి వెలుగులోనికి, తెలియని తనాన్నుండి తెలిసిన స్థితికి చేరాలన్న కోర్కెను తెలుపుతున్నదీ వాక్యము. మనిషిలోని తెలిసికోవాలన్న స్వభావానికి చెందినదీ సూత్రార్థము. ఇవన్నీ ప్రతి మనిషి స్వభావమో కాదో పరికించండి. ఈ విషయంలోనూ తెలియవలసింది మారుతుందే కానీ తెలిసికోవాలన్నది మారదన్నమాట.
“మృత్యోర్మా మృతంగమయ, మృత్యుః, మా, అమృతం, గమయ” అన్న శబ్దాల కూడికే ఈ వాక్యము. ఇది జీవన పోరాటానికి చెందిన అంశము. ఇది మిగిలిన రెండు వాక్యములకూ ముగింపు వాక్యంగానూ ఉంది. ఉండాలనుంది అన్న స్వభావానికి సూచనగానున్న సూత్రమిది. Struggle for Existents. అన్న సూత్రమునే యిది వ్యక్త పరుస్తోంది. ఇది ప్రథమ కోర్కెగానున్నది. ఉండాలనుంది అన్నామంటేనే అది యిష్టమనీ, ఆటంకాలెదురౌతున్నాయని అర్థం వస్తున్నది. ఆ ఆటంకాలేమిటో అనుభవంలో చూస్తే 1. తరగిపోవడంగా నున్నది. అది యిష్టం లేదు. కనుక ఆశయసిద్ది - ఉండాలన్నది - నేరవేరాలంటేనే తరుగుదల ఉండరాదన్నది తెలియబడింది. కనుకనే ఎదగాలన్న కోర్కె ఏర్పడింది. జీవితాన్ని చూస్తే నడిపించేది జ్ఞానంగా ఉంది. ఆశయం వైపుకే నడక సాగించాలన్నా, ఆశయసిద్ధిని గమనించాలన్నా జ్ఞానం అవసరంగా ఉంది. కనుక 2వ కోర్కెగా అజ్ఞానము లేక భ్రాంతి జ్ఞానం నుండి జ్ఞానం, లేక సత్యజ్ఞానంలోనికి కదలాలన్న కోర్కె ఏర్పడింది. పైశ్లోక భావం యిదే. మూడవ మాటగా చెప్పబడిన అమృతత్వం సాధ్య విషయంగా ఉంది. అది సాధించు కొనుటకు బలమూ, దానిని సరిగా వినియోగింపజేయు సరైన జ్ఞానమూ అవసరమైనాయి. అవే 1, 2 వాక్యాలలో చెప్పబడింది.
సారాంశమేమంటే ప్రతి మనిషి ఉండాలనీ, బలంగా ఉండాలనీ, తెలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాడనియే. ఇది ఒక మతానికి చెందిన విషయం కాకుండా జీవ ప్రవృత్తికి చెందిన అంశమై తాత్విక విలువ కలిగి ఉంది. యదార్థంగా తాత్వికత మత పరిధిని దాటి సర్వ మానవాళిని ఉద్దేశించి సర్వ కాలాలకు చెందినదిగా ఉంటుంది. ఇది ఎప్పుడూ గమనింపులో ఉంచుకోవాలి. Note: ధర్మానికీ, తత్వానికీ ఉన్న తేడానూ, సంబంధాన్నీ ఎరగడమన్నది జీవితాధ్యయనంలో అత్యంత ప్రధానమైన అంశమై యున్నది.
ముఖపత్రంలో క్రింది భాగాన వున్న శ్లోకం కూడా ఇది మత పత్రిక అనుకునేందుకు వీలుగా ఉంది. అయితే దానినిన్నీ విశ్లేషించి చూద్దాము.
“నమో బ్రహ్మాధిభ్యః”:- బ్రహ్మ మొదలగు వారికి నమస్కారం. భారతీయ యోచనలో బ్రహ్మ ప్రథమ జీవుడూ, ప్రథమ జిజ్ఞాసువు, ప్రథమవేత్తా, ప్రథమ గురువు కూడా. కనుక విద్యా సంప్రదాయాన్ని బట్టి ప్రథముడూ, పెద్ద వాడూ అయిన బ్రహ్మకూ, అదే మార్గములో నున్న తదనంతరం వారికీ (ఆది - శబ్దంచేత పరంపర బోధింప బడింది.) నమస్కారమన్న భావం – విద్యా భోధకులా, ప్రవర్తకులా ఎడ వినయాన్ని ఈనాడు జిజ్ఞాసువులో ప్రవేశ పెట్టేయత్నమే, ఇక్కడ చేయబడుతోంది.
“బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యః”: ఈ వాక్యాన్ని రెండుగా అర్ధం చేసికోవచ్చు. 1. మొదటి వాక్యంతో కలిపి. బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ప్రారంభించి, కాపాడుతున్న బ్రహ్మ మొదలైన వారలకు నమస్కారము. 2. దీని వరకే అర్థం చెప్పుకుంటే బ్రహ్మ విద్యా (పెద్ద విద్య లేక అన్ని విద్యలకూ ఆధారమని చెప్పదగ్గ విద్య ఏదో అది) పరంపరను (తరం నుండి తరానికి అందించే పద్ధతిని) ఏర్పరచి, కొనసాగేట్లు చేస్తున్న వారు సాంప్రదాయ కర్తలనబడతారు. అట్టి వారిని విద్యార్థిచే స్మరింపజేస్తున్నారు. వారియెడ వినయాన్నీ, వినమ్రతను అభ్యాసిలో ప్రాదుకొల్పుతున్నాడు గురువులు.
“వంశ ఋషిభ్యః”: వంశ ఋషులన్న మాటకు వ్యవహారంలో కుల గురువులు అన్న అర్ధం చేయబడుతోంది. అయితే ఈ శ్లోకము, విద్యార్థికి, గురువులూ, విద్యా సంప్రదాయ రక్షకులూ నైన వారి ఎడల ఉండదగ్గ భావానికి చెందినదై
యుండుట వలన, వంశ ఋషులు అన్న మాట భిన్న భిన్న శాఖలుగా నున్న విద్యా బోధకులనూ, ప్రవర్తకులను సూచించునదిగా స్వీకరించుట ఉత్తమము. అప్పుడు లోకంలో ప్రవర్తిల్లుతూ మానవ వికాసానికి పనికివచ్చు అన్ని విద్యలకు చెందిన బోధకులూ ప్రవర్తకులూ నైన వారలనున్నూ విద్యార్థి వినయ పూర్వకంగా స్మరించునట్లు చేస్తున్నారన్నమాట.
“మహద్బ్యో నమో గురుభ్యః” :- మహనీయులైన అట్టి జ్ఞాన ప్రదాతలకు గురువులకు అందరకూ నమస్కారమన్నది ముగింపు వాక్యం.
మొదటి సాధకుడూ, బోధకుడూ, పరంపరను ప్రారంభించి తానెరిగిన విద్యను సమాజానికి అందించి, వారున్నూ అట్లే అందించునట్లు ఒకబాట నేర్పరచిన బ్రహ్మకూ, తదితరులకున్నూ అంటూ ప్రారంభించి ఆధ్యాత్మ విద్యా-బ్రహ్మ విద్యా-సాంప్రదాయ ప్రవర్తకులును పిదప స్మరిస్తూ, అన్ని విద్యాశాఖా ప్రవర్తకులను కూడా స్మరిస్తూ అట్టి మహనీయులైన గురువులందరకూ నమస్కారమను భావన ఎంత ఉదాత్తమంగా ఉందో గమనించండి. నిజంగా విద్యార్థికి గానీ, విద్యా బోధకులకు గానీ (బోధకులు కూడా ఒక నాటి విద్యార్ధులే కదా) ఈ శ్లోక భావం వంటబట్టి తదను గుణ్యంగా విద్యా ప్రదానమూ, విద్యార్జనా కొనసాగిన అట్టి విద్యావ్యవస్థ సమాజమంతటికీ మేలొనగూర్చగలదు కదా?
Note:-దీనికి భిన్నంగా ఉన్న నేటి విద్యాలయాలూ, బోధకులూ, విద్యార్థులూ, విద్యాలయా నిర్వాహకులూ అన్న మొత్తం విద్యా విభాగాన్ని పరిశీలిస్తే పై శ్లోక భావం నేడు ఆ విభాగంలో ఎవరికీ పట్టకుండా ఉండడం కొట్ట వచ్చినట్లు కనబడుతుంది.
మేలుకొలుపు:- పత్రికను ప్రారంభించాలనుకున్న వెంటనే ఏ పేరు పెట్టాలన్న ఆలోచన బయలుదేరింది. “మేలుకొలుపు” అన్నది సంస్థ ఆశయాన్ని సమాజంలో ప్రస్తుత ప్రథమావసరాన్నీ సమగ్రంగా చాట గలిగి ఉండాలన్న భావంతో ఆలోచించడం జరిగింది. పిలుపు, సమాలోచన, అంతర్మధనం, జ్యోతిర్మయి మొదలగు అనేక మాటలను కూడా పరిశీలించాము. మేలుకొలుపులో జ్ఞానం-చూపు కలిగి యుండడం. అజ్ఞానం తొలగించుకోవడం అన్నది ప్రధానంగా ఉన్నా, మానవ జీవితం దానితో ముడిపడి యున్న సమస్త విషయాల లోనూ ఉండకూడని స్థితిని గమనించి తొలగించుకోవడమూ నన్నది కూడా వ్యక్తం చేయవీలుంది.
కనుక మేలుకొలుపు కావలసిన కార్యానికి తగిన స్ఫూర్తి నివ్వగల నామంగా ఎంచి స్థిరపరచాము.
ముఖ్య గమనిక:- ముఖ చిత్రం పై కొన్ని విషయాలు వివరణాత్మకం గానూ, మరికొన్ని సంగ్రహంగానూ పాఠకుల ముందుంచడం జరిగింది. ఈసారి సంచిక, స్వమంతవ్యం పై చర్చా వేదికకు చెంది ప్రత్యేక సంచిక అవుతుంది. కనుక మేధావులూ, వివేచనాశీలురూ, నిస్పాక్షికులూ నైన వారెల్లరూ వారి వారి యభిప్రాయములను నిష్కర్షగా పంపగోరుతున్నాము. వీలయినంత వరకు అన్నింటినీ ప్రత్యేక సంచికలో ప్రకటించగలము. సెప్టెంబరు 15వ తేదీలోపుగా చర్చా వేదిక ప్రత్యేక సంచికకు మీ మీ యభిప్రాయములను పంపండి.

స్వమంతవ్యంపై విమర్శా – సమీక్ష
సంపుటి -1                                  సంచిక – 8                               1-10-91
స్వమంతవ్యం అన్న శీర్షికన నా గురించీ, పత్రికను గూర్చి అనేకాంశాలను 6, 7 సంచికలలో వివరించాను. ఆయా వివరణల పై అభిప్రాయాలను 8వ సంచికకు పంపవలసిందనియూ, 8వ సంచిక అందుకై ప్రత్యేక సంచికగా వస్తుందనియూ, గత సంచిక లోనే తెలిపాను. అయితే విచారించవలసిన విషయమేమంటే పాఠకుల నుండి ఇంతవరకూ తగినంత స్పందన రాలేదు. పాఠకులలో ఉత్సుకతను కలిగించ లేక పోయిందేమో పత్రిక అన్న సందేహం కలుగుతోంది. అట్లుకాక పత్రికను దినపత్రిక లానో, ఏదో కాలక్షేపానికి పనికివచ్చే పుస్తకంగానో మాత్రమే ఒకసారి చూసి అవతల పడవేస్తున్నారేమో ననిపిస్తుంది. అయితే నా హృదయంలో కదులాడుతున్న భావాలను బట్టి పత్రికను గూర్చి చెప్పవలసి వస్తే, ఇది గుర్తింపుకొరకో, కాలక్షేపానికో ప్రారంభింపబడింది కాదు. భావాత్మకమైన, ఆచరణాత్మకమైన క్రాంతిని, విప్లవాన్ని కోరి ఆరంభింపబడింది మాత్రమే. నిశితంగా చూడగలిగితే నా రచనలీ విషయాన్ని ప్రకటపరుప గలవు. మార్పూ, మార్పు యిష్టపడేవారి సంఘటనా-కలయికా-ప్రస్తుత ప్రథమావసరమన్నది కొట్టవచ్చినట్లుగా కనబడుతున్నప్పటికీ, సమాజం దీనిని ఎందుకు చూడడం లేదో, అధవా కొందరు చూసినా ఎందుకు స్వీకరించడం లేదో పరిశీలించవలసి ఉంది. పరిశీలన వల్ల నా వరకు ముఖ్యంగా నాలుగు కారణాలు ఎదురు పడుతున్నాయి. [1] అవగాహనా లోపము. అనగా, అసమగ్ర జ్ఞానమో, తప్పు జ్ఞానమో కలిగి ఉండడం. [2] స్వార్థం ప్రధానం కావడం. [3] సోమరితనం అలవాటుగా మారడం. [4] ఉదాసీనత. ఇది జరిగేదా? పెట్టేదా? మనకెందుకులే అన్న భావన. పరిశీలిస్తే యింతకన్న సరైన కారణాలు ద్యోతక మగుట లేదు. మంచివేపుకు మరలుదామన్న భావన – తపన - క్రమంగా సామాజిక చైతన్యం మనుష్యుల మనస్సులలో నుండి దిగజారి పోతోంది. అక్కడక్కడా ఎక్కడో మనస్సు అంతరాంతరాల్లో అది మినుకు మినుకు మంటున్నా ధర్మ మార్గంలో జీవించాలనుకునే వారి బ్రతుక్కే భద్రత ఉండదేమోనన్న పరిస్థితి అనుభవంలో ఎదురవుతున్నది. మనుషులలో అమానుష ప్రవృత్తి జనించి క్రమంగా పాశవికంగానూ, పైశాచికంగానూ మారుతూ బలపడుతోంది. సమాజాన్ని అవలోకిస్తే నిత్య సంఘటనలుగా, ఇవే మనకు గోచరిస్తాయి. ఈ విషయంలో అంతకంటే ప్రమాదకరమైన విషయమేమంటే పై అమానుష ప్రవృత్తులన్నీ ఏదో ఒక అభ్యుదయం పేరిటో, విప్లవం పేరిటో చెప్పబడుతూ ఉద్యమాలుగా రూపాంతరం చెందడం.
ప్రజా విప్లవోద్యమాల పేరిట మతోద్యమాలూ, వర్గ పోరాటోద్యమాలూ, కులోద్యమాలు, స్వతంత్ర రాష్ట్రోద్యమాలూ, వీటికై చేయబడుతున్న బందులూ, రాస్తారోకోలూ వాటిలో ప్రధాన కార్యాలుగా ఉంటున్న లూటీలూ, గృహ, వాహన దహనాలూ, దౌర్జన్యాలూ, నక్సలైటు ఉద్యమాల పేరిట మారణకాండ, దానిపై సమాజ భద్రత పేరిట ఎన్ కౌంటర్లూ, రాజకీయ పదవీ వ్యామోహం- దీనిని పిచ్చి అంటే బాగుంటుంది – నుండి పుట్టి ప్రజలను గుడ్డివాళ్ళను చేస్తున్న నాయకమ్మన్యుల వాగ్దానాలూ, నాయకత్వాన్నీ, అధికారాన్ని పొందాలనుకునే కుహనా మేధావుల రెచ్చగొట్టు ధోరణులూ, మరో వంక సామాన్య ప్రజానీకంలోనూ పెచ్చుపెరిగిన లంచగొండితనం, డబ్బు కోసం గడ్డి తినే ప్రవృత్తి, బాధ్యతల ఎగవేత దనం, హక్కుల పోరాటం, రకరకాల రూపాల్లో అంతర్యుద్ధాలూ, నిరక్షరాస్యత, కుల పిచ్చి, చిన్న చిన్న ఘర్షణల నుండే ప్రాణాలు తీసుకునే వినాశకర ప్రవృత్తి, దోపిడీలూ, అత్యాచారాలూ భూతాల్లా ముసురుకుంటున్నాయి.
  ఇవన్నీ యిలా ఉండగా ఆధ్యాత్మికత పేరున అంకచండాలం, ఆచరణ శూన్యమైన ప్రగల్భాలూ, హితోక్తుల ముసుగులో స్వార్ధమూ, ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ రూపంలో ఉన్న కుహనా రాజకీయ నాయకుల బాల్యచేష్టలూ, అనవసర ప్రసంగాలూ, యువశక్తిని స్వార్థ ప్రయోజనాలకై బలి చేసే నానా సంఘాల నాయకుల కౌటిల్య తంత్రాలూ, గృడ్డిగా వారలచే ఈడ్వబడి శలభాలై పోతున్న యువతా, ఆవేశమే తప్ప ఆలోచనే లేని నానా విధ యత్నాలూ, కేవల వ్యాపార సరళికంటేనూ మిక్కుటంగా వ్యాపార దృష్టిని సంతరించుకున్న జ్ఞాన కేంద్రాలూ, తనది తనకు ముడితే చాలు విద్యార్థులే మైతేనేమి అనుకునే గురువులూ, వీలుంటే పంగ నామాలు పెడదాం, అవకాశం దొరికితే అవమానిద్దాం అదో హీరోయిజం అనుకునే విద్యార్థులూ ... ఇలా....ఇలా .... ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు నేటి సామాజిక శరీరంలోని వికృత రూపాల్ని గూర్చి.
ఉన్నదున్నట్లుగా పై వినాశ కారకాలైన వికృత రోగ రూపాలన్నింటిన్నీ క్రోడీకరించి ఏ మహాశిల్పో, చిత్రకారుడో గనుక ఒక రూపాన్ని మలచగలిగితే దాని వికృత రూపాన్ని ప్రస్తుత మానవ మేధస్సు ఊహించలేదు. అది సుమారుగా, అమానుష రీతిలోనూ, పశువులకు భిన్నంగానూ, రాక్షస, పైశాచికాకృతి కంటేనూ వికృతమూ, భయానకమూ, ప్రమాదకరమూ కాగల స్థితిలోనూ ఉంటుందని మాత్రం చెప్పగలం. ఇట్టి స్థితిలోనూ, వీటితోనే కలసి జీవించక తప్పని స్థితిలోనూ మార్పుకై ఎవరి వంతు వాళ్ళు నిజాయితీగా యత్నించక పోవడాన్ని ఏమనుకోవాలి? మార్పు అవసరాన్ని గుర్తించిన వాళ్ళ వరకన్నా ముందుగా ఒక వేదిక పైకి రావడమూ, పరస్పరావగాహన ద్వారా వాస్తవమన్న ఒకే తాటి పైకి చేరడమూ మాత్రమే సమస్యా పరిష్కారానికి నాందీ ప్రస్తావన కాగలదు. ఇంతటి ప్రమాదకర పరిస్థితి సమాజాన్నంతటినీ కబళించే స్థితిలోనూ ఎవరికి వారు తమకు మోక్షం కావాలనుకుంటూ (మోక్షమంటే ఏమో అదెలా వస్తుందో కూడా తెలియని అంధానుయాయులే ఈ తరహా వారిలో ఎక్కువ మంది.) లోకమేమైతేనేమీ నాకు మాత్రం దుఃఖలేశం కూడా ఉండ కూడదన్న కోర్కె మఱ్ఱి వృక్షంలా ఊడలు దిగి బలపడుతూంటే, ఆధ్యాత్మిక సాధనల పేరిట నానా హంగామా చేస్తుండేవారిని, తత్వజ్ఞానం పేరిట శాస్త్రాలను చిలక పలుకుల్లా వల్లించే వారినీ, ఉబుసుపోక కబుర్లతో కాలం గడిపే వారినీ ఏమనాలో అర్థం కాదు. అలానే ఆత్మోద్ధరణమంటే నేను బ్రహ్మను, ప్రపంచం మిధ్య అని మాటకు మాత్రం అనుకునే, చెప్పుకునే వారలను ఎంతమందినో చూశాను. తెలియడమంటే ఏమో తెలియని వీరు పుస్తకంలో చూశో, వినో అలా అనుకుంటే చాలుననుకుంటుంటారు. ఒక వంక ఏకాదశేంద్రియాలూ పటుత్వం కోల్పోయి వాటి వాటి పనులు నిర్వర్తించలేని స్థితిలోనూ నాదీ, నావాళ్ళంటూ సంసార లంపటంలో పడి తన్నుకుంటూ తనకంటె చిన్న వారికి మాత్రం ఇదంతా వట్టిది, బొత్తిగా లేనిది అంటూ చిలక పలుకులు పలుకుతుంటారు. పిచ్చి వాళ్ళుగా గుర్తించడానికి వీలుగానున్న పిచ్చివాళ్ళ వలన పెద్దగా ప్రమాదమేమీ లేదు గానీ, పెద్దవాళ్ళుగా గురింపబడుతున్న పిచ్చివాళ్ళ వలననే అసలు ప్రమాదమంతా. ఈ తరహా బోధకులు తాము మాత్రం ఏది అంతా వట్టిది అని సాధకులకు చెపుతుంటారో దానిలోనే (డబ్బు, కీర్తి, భోగం) మునిగి తేలుతుంటారు. వారి వలలో పడిన సాధకులు మాత్రం (గృడ్డివారూ, అమాయకులూ) అటు లౌకిక భోగాల్నీ వదలు కుంటారు. ఇటు వారనుకునే మోక్షమున్నూ ఆయా అసంబద్ధ విచారణలూ, అవకతవక సాధనల వల్ల గగన కుసుమమే ఔతుంది. ఇలా వీరు రెంటికీ చెందిన రేవడౌతారు. అయితే ఎంతకాలమలా ఉండగలరు? కొంతకాలానికి క్రమంగా వీరూ చిన్న చిన్న బోధకులుగా మారతారు. ఆపై జరిగేదేమో పాఠకులు గ్రహించ గలరనుకుంటాను. వీరు కూడా డబ్బు, కీర్తి, భోగం అన్నవే అసలైనవని వారి సాధన కాలంలో గల జీవితానుభవాల నుండి గ్రహించి వాటికై యత్నించడం మొదలెడతారు.
అయితే ఇక్కడో గమనించవలసిన విషయముంది. ఈ తరహాకు భిన్నమైన స్వభావం కల వ్యక్తులు ఉంటారన్నదే ఆ విషయం అట్టివారు వేలల్లోనో, లక్షల్లోనో ఒకరిద్దరుంటారు. వారి వారి సిద్ధాంత విషయాలను పరీక్షించి చూడవలసే ఉన్నప్పటికీ, మళయాళ స్వామీ, అరవింద, రమణ, రామకృష్ణ లాంటి వాళ్ళూ అలానే మార్క్సు, గోరా, వినోభా, గాంధీ లాంటి వాళ్ళూ పై వేలల్లోని వారిలో చేరి పోతారు. ఈ కోవకు చెందిన వారిలో వాస్తవంగా స్వార్ధం ప్రధానం కాకుండా ఉండి సమాజాన్ని సంస్కరించాలన్న తపన వీరిని నడిపిస్తూ ఉంటుంది. గుర్తింపు తపనేమీ ఉండదు. వారి వారి జ్ఞానస్థాయిల నుండి ప్రణాళికల నేర్పరచుకుని అమలు చేసికుంటూ పోతూంటారు. ఇట్టి వారిని మినహాయించే సామాజిక వికృత రూపాన్ని మీకు చూపించే యత్నం చేశాను. మీరున్నూ ఈ విషయాన్ని విడగొట్టి చూడగలరనే ఆశిస్తాను. పై వ్యక్తుల నిజాయితీని శంకించ వలసిన పనిలేదు గానీ, వారికి నిజం తెలిసి వుందా? అన్నది మాత్రం పరీక్షించవలసియే ఉంటుంది. వారు ఎవరైనా, వారు ప్రవచించిన విషయాలు ఏవైనా అవి మాత్రం పరిశీలించే స్వీకరించటం సర్వదా శ్రేయస్కరం అన్నది ఎప్పుడూ మరువకూడదు. సరే ఈ విషయ మట్లుంచండి.
మేలుకొలుపు పత్రికలు పోస్టు ద్వారానే 200 మందికి పైగా అందజేస్తున్నాము. సుమారు మరో వంద మామూలుగా ఆయా వ్యక్తులకు చేరుతున్నాయి. మొత్తం మీద 500 మందైనా పత్రిక చూసుంటారని అంచనా. పత్రిక చూసిన పిదప వారంతట వారికిగానీ, నా ప్రకటననుసరించి గానీ అభిప్రాయాలు వ్రాయాలన్న ప్రేరణ కలగకపోవడం కొంత విచారించవలసిన విషయమేమరి. స్వమంతవ్యం పై విమర్శలు పంపండని నేను ప్రకటించినా యింతవరకు 5, 6 వుత్తరాల కంటే ఎక్కువ నాకు చేరలేదు. ఇప్పటికి నాకందిన స్పందనలను మీ ముందుంచి ఈ సంచిక ముగిస్తాను. మరిన్ని విశేషాలుంటే మరో సంచికలో ప్రచురిస్తాను.
(1) డా. మో. కృష్ణస్వామి ఎమ్.ఎ.పి.హెచ్.డి. అధ్యక్షులు మానవ ధర్మ రక్షణ సంస్థ; వారి నుండి, “సత్యాన్వేషకులు సురేంద్రగార్కి శుభాకాంక్షలు. మేలుకొలుపు పత్రికను గూర్చి అభిప్రాయం వ్రాయమన్నారు. భాష రాను రాను సరళతను సాధించుకుంటున్నది. వ్యక్తీకరణము క్రమముగా సూటిదనమును పొందుచున్నది. ఈ రెండునూ పత్రికకు కావలసిన అంశములు. ఇంకనూ చెప్పవలెనన్నచో పత్రికకు ప్రాణప్రదమైన అంశములు. వీటి విషయమున మీరు చేయుచున్న కృషి ఆదర్శప్రాయమైనది.
(2) సి. హెచ్. సుబ్బారావు బి.కాం.బి.యి.డి., ఎన్.ఎస్.ఎమ్, పబ్లిక్ స్కూలు వారు, “గౌరవనీయులైన సురేంద్రగార్కి, మీరు వెలువరిస్తున్న పత్రిక సంచికలు కొన్ని చదివే భాగ్యం కలిగింది. అత్యంత క్లిష్టమైన యిటువంటి విషయాలను అందించే పత్రికను నిర్వహించడం విశేషమైన శ్రమతో కూడుకొన్న పని. అటువంటి సాహసోపేతమైన పనులు చేస్తున్నందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు సంచికలకూ, ఈ మధ్య వచ్చిన సంచికలకూ పురోభివృద్ధి కన్పించినది. భాషను సరళం చేయుట, విషయాలను వివరించుట ముఖ్యంగా నేను మెచ్చుకుంటున్న మార్పులు. ముఖచిత్రంపై వివరణ చాలా బాగుంది. అయినప్పకీ దానిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత యున్నది. మేలుకొలుపు పాఠకునిగా కొనసాగుటకు నేనేమి చేయవలయునో తెలియపరచండి. అక్టోబర్ నెలలో మీరు ఏర్పాటు చేస్తున్న సమాలోచన శిబిరానికి హాజరగుటకు యత్నించెదను.
(3) ఎమ్. రామచంద్రకుమార్. హైద్రాబాద్ వారు “గౌరవనీయులైన సురేంద్రగార్కి, మీరు ప్రచురించిన పత్రిక రామకృష్ణ మఠం, హైద్రాబాదులో ప్రతినెలా చదువుచున్నాము. మమ్ములను మీ మండలిలో సభ్యులుగ చేర్చుకొనగోరెదము.
(4) టి. శంకర్రావు, తుళ్ళూరునుండి. “పూజ్యులైన సత్యాన్వేషణ మండలి వార్కి నమస్కారములు. మేలుకొలుపు అన్న పేరు పత్రికకు బాగా సరిపోయినది. ఇంకా సమాజంలో అంతానాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్టు అనే స్వాములూ ఉన్నారు. పెద్దలూ ఉన్నారు. ఎంత నిజమయినా దాన్ని కూడా పరిశీలించాలి అన్నమాట చాలా ముందుచూపుతో కూడుకున్నదిగా ఉన్నది. వాస్తవిక దృష్టి, సత్యాన్వేషణమూ, వివేకమూ, ధర్మాచరణమూ, వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు ప్రతివారిలో వుంటే అదే వసుధైక కుటుంబము. అవి ఇప్పుడు సమాజంలో లోపించాయి. వాటిని మీ పత్రిక ద్వారా ప్రజలకు మేలుకొలుపు పాడాలని మనసారా కోరుకుంటున్నాను. మిమ్ములను తుళ్ళూరులో కలసిన దగ్గరనుండి నాలో కూడా మార్పు వస్తున్నది. ఇంకా తెలిసికోవలసినది చాలా ఉన్నది. నమస్కారము.
(5) శ్రీరామశర్మ. తెలుగుపండిట్. రామకృష్ణ విద్యాలయం వారు సుదీర్ఘ మైన లేఖ వ్రాశారు. అయినా సారాంశాన్ని కాక విషయానికి సంబంధించినంత వరకు వారి మాటలనే వ్రాస్తున్నాను గమనించండి.
“సత్యాన్వేషి సురేంద్రగార్కి, ఆర్యా, మీరు పంపిన ‘మేలుకొలుపు’ అనే పత్రికలను చూచితిని. చాల బాగున్నవి. విషయము పరమార్ధ విషయము గనుక విషయాన్ని గూర్చి బాగుంది, లేదు అని చెప్పనవసరం లేదు. ఇక విషయం చెప్పుటలో భాషను గూర్చి ఎవరి పంథా వారిది. వాక్య నిర్మాణము అనగా భావము కాక, వ్యాకరణమునకు సంబంధించినది. నేటి సమాజంలో వ్యాకరణమునకు ప్రాధాన్యము లేదు. పరస్పరము వారి వారి భావములను అర్థమగునట్లు విశదపరచిన చాలును. ఇందులో మీ భావములను వాక్య నిర్మాణములో పెట్టినప్పుడు సామాన్య వ్యక్తికి అర్ధమగుట కష్టము. పారిభాషిక పదమును తెలిసిన వారికి సులభము. ఇక సత్యాన్వేషణములో సురేంద్ర అంటే తప్పులేదు అని నాయభిప్రాయము.
(6) పాఠకులలో కొందరు ముఖాముఖి కలుసుకున్నప్పుడు మౌఖికంగా వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. కవి శేషాచలం, ప్రిన్సిపాల్, విజ్ఞానవిహార రెసిడెన్షియల్ స్కూలు వారు “మీ పత్రికను గూర్చి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎంతో వివరణాత్మకం గానూ, విమర్శల పై మీ వ్యాఖ్యలు వాడిగానూ ఉన్నాయి'' అన్నారు.
ఇప్పటివరకూ. అందిన పై లేఖలవరకు, ప్రత్యేకంగా సమీక్షించ వలసినంత విషయమేమీ వాటి ద్వారా అందలేదు. పై 5, 6 అభిప్రాయాలూ దాదాపుగ ప్రశంసాత్మకంగానే ఉన్నాయన్నది మీరు గమనించే ఉంటారు. పైగా ఆ యభిప్రాయాలు సంగ్రహంగా ఉన్నాయి. కనుక వారిని విశ్లేషించి సమీక్షించుట పొసగదు. నా వైపు నుండి ప్రయత్న లోపం జరుగ కూడదనే ఉద్దేశంతో 10 మంది సాహితీవేత్తలకున్నూ పత్రికలు పంపాను అభిప్రాయాలు పంపండని. వారి నుండి సమాధానాలు యింతవరకు నాకు చేరలేదు. వచ్చే సంచిక లోగానైనా; ఎన్ని అభిప్రాయాలు వచ్చినా, వాటిని పై సంచికలో ప్రచురించగలను. నలుగురూ అంటున్నట్లు శైలి కొంతవరకు సరళతను పొందిందనే అనిపిస్తున్నది నాకుకూడా.
స్వమంతవ్యంలో నా గురించీ, నా మాటల గురించి నేను చేసిన వివరణల పై ప్రత్యేక విమర్శలేవీ లేవు. పత్రికలో వాడిన 1, 2 పదాలపై మాత్రం చిన్న విమర్శలు వచ్చాయి. వివరిస్తాను పరిశీలించండి.
(1) “స్పందన – ప్రతిస్పందన” అన్న ప్రయోగం వింటానికి బాగుందే గానీ సరైనది కాదు. ఎందుకంటె స్పందన అంటేనే ప్రతిచర్య (రియాక్షన్) అని అర్ధము. మరల ప్రతిస్పందనేమిటి? అర్ధం లేకుండా అన్నది విమర్శ. పైగా ఈ విమర్శ చేసినవారే చేసిన మరో సూచన, పత్రికను ప్రచురించే ముందు ఒకరిద్దరు సాహిత్యం తెలిసిన వారికి చూపించుకోవచ్చుగా, అన్నది. వారి మాటలు కొంత వ్యంగ్యాన్ని ధ్వనింపజేస్తున్నాయి. సరే.
ఇది అక్కర లేని విమర్శే కాక, అసంబద్ధం కూడా. స్పందన అంటే రియాక్షన్ అన్న రూఢ్యర్ధం ఎక్కడుంది? ఈ దోషాన్ని, మరో సూచననూ, చేసే ముందు వారు తమకెంత సాహిత్య ప్రవేశం ఉందో ఆత్మ విమర్శ చేసికొని ఉంటే బాగుండేది. ఎందుకంటే అసలు చర్యా ప్రతిచర్య అన్నవి సాపేక్షకాలు. ఏ పనినీ దాని నొక్కదానినే చూపి అది చర్య అని గానీ, ప్రతిచర్య అనిగానీ చెప్పడం కుదురదు. అలానే అదే పనిని ఒక దానితో ముడిపెట్టి చర్య అనీ, మరో దాని సంబంధంతో ప్రతిచర్య అని చెప్పవచ్చు. పై విమర్శ - అదో దోషంగా - చేసిన వారికీ విషయం తెలియదన్నది స్పష్టంగానే తెలుస్తున్నది. మరో విషయమేమంటే ఈ చర్యా ప్రతిచర్యా గొడవలు లేకుండానే ఆ శీర్షిక అర్ధం అందరకూ తెలుస్తూనే వుంది. పాఠకులు వారి అభిప్రాయాలు పత్రికకు వ్రాయడం స్పందన అనీ, అందుపై రచయిత అభిప్రాయాలు ప్రతిస్పందన అనీ, ఇదేమీ వ్రాయకూడనిదీ; అర్థంకానిదీ కాదు గదా. ఇదేదో తీవ్రమైన దోషంగా వారు చెప్పడం ఎలా ఉందంటారు? అక్కర లేని విమర్శ అనిపించడం లేదా? వారి నుండే మరో విమర్శ వచ్చింది. “ప్రతికక్షుల దురాగ్రహ ప్రతిష్ఠంభన” అన్న నా ప్రయోగం లోని దురాగ్రహమన్న మాటను వారే దుర+ఆగ్రహము అని విడదీసి అర్ధం చెప్పినారట వాస్తవంగా ఆ పదాన్నలా విడగొట్ట కూడదు. దుర్+ఆగ్రహము = దుష్టమైన ఆగ్రహము, ఉండకూడని కోపము - చెడ్డకోపము అని అర్ధమునిచ్చే పదమది. వేరే అర్థం దాని నుండి ఎవరైనా సాధించినా నేను మాత్రం నేను చూపిన అర్థంలోనే ప్రయోగించానా పదాన్ని. అది దుష్ట ప్రయోగమేమీ కాదు, నాకు సూచించిన సలహాను వారే స్వీకరించి ఇలా అభిప్రాయాలు చెప్పేముందు భాషావేత్తలను సంప్రదించి ఉంటే బాగుండేది, బాగుంటుంది అంటాను. మీరేమంటారు? ఈ నా విమర్శ కొంత ఇబ్బంది కలిగించేదిగా ఉన్నప్పటికీ వ్రాయక తప్పలేదు. ఎందుకంటే పత్రికాంతర్గత విషయాలపై నిస్పాక్షిక విమర్శ చేయుట సబబై యుండగా దానిని విడచి అక్కర లేనీ, ప్రమాదం కానీ రెండు పదాలను అపసవ్యంగానూ పరోక్షంగానూ విమర్శించడం సరైన విధానమని అనుకోను. అలా పరోక్షంగా విమర్శించే వారందరకూ, దయచేసి మీ విమర్శలు నేరుగా పత్రికకే పంపండని ఆహ్వానిస్తున్నాను. మీ మీ విమర్శలు వాడిగా, వేడిగా ఉన్ననూ యదార్ధ విలువలు కలిగి యున్నంతవరకూ వాటిని స్వీకరించుటకూ, అవసరమైన మార్పులు చేసి కొనుటకు నేను సంసిద్ధుడనే. గమనించగలరు.
    (సశేషం) 
సత్యాన్వేషణలో
   మీ సురేంద్ర

స్వమంతవ్యంపై విమర్శా - సమీక్ష – 2
సంపుటి-1                                 సంచిక-9                                  01-11-91
సంచిక-8లో కొంతవరకు స్వమంతవ్యం పై పరిశీలన జరిపాము. అనేక ప్రశంసలు తప్ప విషయానికి సంబంధించినంతవరకు ప్రత్యేక విమర్శలు రాలేదు. విమర్శల కొరకై మరికొంత కాలమాగుటకంటే ఈ శీర్షికను ఇంతటితో ముగించి, ముందుముందు వచ్చే విమర్శలను స్పందన-ప్రతిస్పందన శీర్షికలో ప్రకటించుట ఉచితమనిపించుటచే ఈ శీర్షికను ఈ సంచికతో ముగిస్తున్నాను.
  1. శ్రీ బోధ చైతన్య-వ్యాసాశ్రమంవారు. “మిత్రులు శ్రీ సురేంద్రబాబుకు - నేను, మేలుకొలుపు మీద పరిశీలనాత్మకంగా చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. బౌద్ధతర్కం కోణం నుండి మీ భావాలను విశ్లేషిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు పత్రిక గురించి చక్కని ప్రకటన చేసియున్నారు. నేనూ విషయం మీకు చెబుదామనుకున్నాను. చదవకుండా మూల పడేసే వాళ్ళకు పత్రిక పంపడం శుద్ధ దండుగ. ఎవరి నుండి పంపమని లేఖలు వస్తాయో వారికే పంపండి. ఇక అభిప్రాయాలూ, విమర్శలూ రాసేవాళ్లు చాలా తక్కువగానే ఉంటారు. విషయం అలాంది” అంటూ వ్రాశారు.
2) నర్సీపట్నం నుండి జి.బి.యస్.శేషగిరి, లెక్చరర్ గారు “సురేంద్ర గారికి నమస్కారములు మాసహాధ్యాయి; మిత్రులు శ్రీ త్రివేది ఆంగ్లోపన్యాసకులు గారి ద్వారా మీ పరిచయం జరిగి పత్రిక మొదటి నుండియు చూచుచుంటిని. మీ యభిప్రాయములూ, ఆలోచనలూ . చాలవరకు నాకు నచ్చినవి. మన పత్రిక సభ్యునిగా నేనేమైనా చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నవంబరు రెండవ, మూడవ వారము లలో మిమ్ములను కలవాలనుకుంటున్నాను. అని వ్రాశారు.
3) జి. వెంకటరావు, పెదమద్దూరువారు. “సత్యాన్వేషకులు -సురేంద్రగార్కి నమస్కారములు. మీరు పంపుతున్న పత్రిక చాలా వాస్తవాలతో కూడుకొని యున్నది. మీరు ప్రచురిస్తున్న పుస్తకము తుళ్ళూరులో టి. పానకాలు వాళ్ళ యింటివద్ద చూశాను. సమాజములో జరుగుచున్న న్యాయ అన్యాయములను వాస్తవిక దృష్టితో ఆలోచించి సమాధానములు తెలుపుచున్నారు. సమాజములో జరిగే అన్యాయములను అరికట్టలేక పోయినా కనీసం మీ పుస్తకం చదివి కొంత మందయినా మారవచ్చు. వాస్తవిక దృష్టి, సత్యాన్వేషణమూ, ధర్మాచరణమూ కలిగినవాడు ఏ కాలములోనైనా జయింపగలడు. నాయందు దయుంచి పుస్తకము పంపగలరని ఆశిస్తూ పత్రికకై వేయికళ్ళతో ఎదురుచూస్తుంటాను. అంటూ వ్రాశారు.
4) యం. నరశింహారావు ఆంధ్రోపన్యాసకులు సిద్ధార్థ కళాశాలవారు, “పూజ్యులైన సురేంద్రగార్కి నమస్కారములు. ఆర్యా, మీరు పంపిన  మేలు కొలుపు పత్రికకు సంబంధించిన “7” సంచికలూ చదివినాను. ప్రజ్ఞాన్వితులైన మిమ్ము మొట్టమొదట అభినందించుచున్నాను. పత్రికకు పేరు పెట్టుటలోనే మీ ధ్యేయము చక్కగా వ్యక్తీకరింపబడినది. ముఖచిత్రమునందలి పదముల వివరణము లెస్సగా నున్నది. మీరు నాకు ఒక చైతన్య స్రవంతివలె గోచరించినారు. నిర్భీకత, విస్పష్టత, పదునైన విమర్శ, సత్యమునందలి మమకారము, సమాజోద్ధరణమూ మీ రచనలలో చోటు చేసికొన్నవి. మొదటి సంచికలో కంటే చివరి సంచికలలో వాక్య నిర్మాణమునందు పరిపక్వత ప్రతిఫలించుచున్నది. భాషా సరళత్వమునకు. మీరు పడు శ్రమ కన్నులకు కట్టినట్లు కనుపించుచున్నది. ముందు ముందు మీ రచనల ద్వారా పాఠకులను అలరించగలదని నమ్ముచూ మీవద్ద సెలవు తీసుకుంటున్నాను అంటూ వారి అభిప్రాయాన్ని తెలిపారు. 
గతసంచిక లోవలెనే ఈ యభిప్రాయములున్నూ ప్రధానంగా ప్రశంసాత్మకములే కనుక ప్రత్యేకంగా సమీక్షించవలసిందేమీ యగుపడుట లేదు. కోరినంతనే వారి యభిప్రాయములను పంపిన సాహితీవేత్తలకు కృతజ్ఞతలు. వారి ప్రశంసలను ప్రోత్సాహకాలుగా స్వీకరిస్తూ వారి నుండి సెలవు తీసుకుంటున్నాను. ఇహపోతే...
ఓం ప్రకాష్ హైద్రాబాద్ వారు “మీ స్వమంతవ్యం పై - సమీక్షా, విమర్శా వ్యాసంలో మీ భాషకు, భావానికి బాగా స్నేహం కుదిరింది. శైలి గోదావరి ప్రవాహంలా సాగిపోయింది. అయితే, విశ్వాసమూ, వివేకమూ అన్న రచనలో ఆ వేగము కొంత మందగించింది. గమనించగలరు అంటూ వ్రాశారు.
అలానే ఒకరిద్దరు లిఖితరూపంలో కాకుండా వారి అభిప్రాయాలు వెలిబుచ్చినారు. సందర్భోచితమైనంతవరకు వారి మాటలను వ్రాస్తున్నాను. గమనించండి.
శ్రీ బహ్మచారి గోపాల్, మళయాళ సద్గురు సేవాశ్రమంవారు తిరుపతిలో కలసినప్పుడు అభిప్రాయం వ్రాయండని అడుగగా ప్రత్యేకంగా చూపించదగ్గ దోషాలుంటే కదా విమర్శించడానికి. పత్రిక చక్కగానూ, సార్థక నామధేయంతోనూ ఉన్నది. అన్నారు.
 పత్రికలోని ఒకే ఒక అంశంపై ఒక విమర్శ వచ్చింది. వారు పోనీ ప్రచురణ కిష్టపడకపోయినా విషయ ప్రాధాన్యతనుబట్టి ప్రచురణ యోగ్య మనిపించుటచే క్రింద వ్రాస్తున్నాను. మీరూ పరిశీలించి ఉచితానుచితములను నిర్ణయించండి.
 సంచిక 8లో 5వ పేజీ, రెండవ పేరాలో ఒక విషయంలో ప్రతిపాదిస్తూ ఉదాహరణకై శంకరులనూ, వారు ప్రతిపాదించిన అద్వైతాన్ని ప్రస్తావించాను. అందుపై ఒకరు ఆయన సాహితీవేత్తయేగాక విమర్శకునిగానూ ప్రసిద్ది చెందిన వారే. “ఆ సందర్భంలో మీరు శంకరుల వారిని చాలా చులకనగా (నీచంగా) ప్రస్తావించారు. మీ మాటలకు నిందార్థం వస్తుందన్న గమనింపు ఉండే వ్రాశారా? పొరబడ్డారా? తెలిసే వ్రాస్తే దాని పై విమర్శించడానికి నావద్ద మాటలు లేవు. అంటూ లేఖ వ్రాశారు.
వెంటనే నేను ఆ సంచికను మరల పరిశీలించాను. నీచంగా అన్నదట్లుంచి, నావరకు నాకు ఆ సందర్భంలో నిందా వాక్యములున్నట్లున్నూ అనిపించలేదు. యదార్థంగా ఆ వాక్యాలు వ్రాసేటప్పుడు నా మనోవీథిలో శంకరులనో, అద్వైతాన్నో నిందించాలన్న యోచన కూడా లేదు.  సామాన్యులనుండి, మేధావులవరకు ఎవరైనా ప్రమాదపడే అవకాశముందనీ, ఆ విషయం గమనించనిచో పునఃపరీక్ష చేసికునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని, మాది పరీక్షింపనఖ్ఖర లేదు అన్న ధోరణి మంచిది కాదనీ చెప్పాలన్నదే నా దృష్టి. ఉదాహరణకు శంకరుల నుటంకించానేగానీ ఆ స్థానంలో రామానుజులనో, మరొకరినో ఉదహరించినా నేచెప్ప దలచిన విషయానికి ప్రమాదమేమీ లేదు. ఒక్క విషయం చెప్పితే ఈ సందర్భంలో ఉచితంగానూ, పాఠకులలో ముఖ్యంగా శంకరాభిమానులలో దోషదృష్టి ఏర్పడకుండానూ ఉండగలదు. శంకరుల పై మాకు వీరాభిమాన మేమీలేదు గానీ, సమాజంపట్లా లోకహితం పట్ల గల వారి. హృదయాన్ని చూడగలిగితే వారెల్లరూ మనకు పూజనీయులే. నన్నది నా వ్యక్తి గతాభిప్రాయం. పెద్దలుగా వారిని గౌరవించడం, ఆదర్శంగా తీసుకోవడం వేరూ, వారు చెప్పిన దానిలోని నిజా నిజాలు చూడడం వేరు. మీరూ 8వ సంచిక మరల పరిశీలించి, నా భావాలలోని ఉచితానుచితములు నిర్ణయించండి.
నమస్సులతో  
          సత్యా న్వేషణలో,
         మీ సురేంద్ర.

No comments:

Post a Comment