Tuesday, March 7, 2023

12 వివేకపథం

 

వివేకపథం

 సంపుటి : 1                                                     జులై 1997                                                      సంచిక : 12

చర్చావేదిక నియమాలు - ఒక పరిశీలన - 3

                                                                                          

యోచనాశీలురైన పాఠక మిత్రులారా ! "చర్చావేదిక నియమాలు" అన్న అంశాన్ని విచారణకు స్వీకరించే ముందు విషయాన్ని మూడుగా విభజించుకోవడం అవసరం అనుకున్నాము గుర్తుంది కదా! అవి 1) భాషా నియమాలు, 2) తార్కిక (వాద) నియమాలు, 3) నిర్ధారణ (పరీక్షా) నియమాలు. గత రెండు సంచికలలో భాషా నియమాల్ని ముచ్చటించుకున్నాము, తరువాత రెండవదైన తార్కిక నియమాల్ని గురించి విచారించాల్సి ఉంది.

ఈ ప్రకరణాన్ని సక్రమంగా అర్థం చేసుకుని విచారించాలంటే  ముఖ్యమైన పారిభాషిక పదాలను కొన్నింటినైనా అర్థం చేసుకుని ఉండాలి.

వాదనకు అవసరమైన ముఖ్యాంశాలు. వీటిని పారిభాషికంగా 'అవయవాలు' అంటారు. వీటిని మూడుగా కొందరు, నాలుగనీ, ఐదనీ మరి కొందరూ విభజించుకున్నారు. మనం మాత్రం విషయాన్ని పట్టి చూద్దాం. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము- నని, నైయాయికులు (తార్కికులు) అంటారు. పై అయిదింటినీ ప్రయోగించేటప్పుడుగానీ, అర్థం చేసుకునేటపుడుగాని మరికొన్ని పారిభాషిక పదాలు ఎదురౌతాయి. అవేమిటో వీటిని వివరించ మొదలెడితే అర్థమవుతుంది.

1) ప్రతిజ్ఞ :- ఏదేని ఒక విషయానికి సంబంధించి ఒకని అభిప్రాయాన్ని తెలియపరిచే వాక్యము. ఇదిలేక చర్చకు భూమికే సిద్ధంకాదు. కనుక చర్చకు ఆరంభ స్థానము ప్రతిపాదన అవుతుంది. అలాగే మరో పక్షం లేకున్నా అంటే ప్రతిపాదితాంశంపై సందేహంగానీ, భిన్నాభిప్రాయంగానీ లేకుంటేనూ చర్చ మొదలవదు. అలాగే ప్రతిపాదించేవాడు విషయాన్ని స్పష్టంగా ప్రకటించాక గాని వాదం ఆరంభమైయ్యేందుకు వీలులేదు. నే చెపుతున్నది అర్థమవుతోంది కదూ! అయితే ఇక్కడో నియమముంది గుర్తించండి. అలాగే వీలయ్యే ఏ అంశాలనైనా ఒక్కొక్కటిగా ప్రతిపాదించే, విచారించాల్సి ఉంటుంది. తప్పని సరైతే తప్ప అనేకాంశాలకు ఒకే ప్రతిపాదన అన్నది చేయరాదు.

ఇప్పటికి చర్చనీయాంశం లభించింది గనుక చర్చ మొదలెట్ట వచ్చన్న మాట. అయితే చర్చకు లక్ష్యమేమిటి? అన్నదీ నిర్దిష్టంగా తెలిసి ఉండడం, తేల్చుకుని ఉండడం అవసరం. నన్నడిగితే చర్చకు లక్ష్యాలు రెండు. వాద పరీక్ష, వాది పరీక్ష అని. ప్రతిపాదితాంశానికి సంబంధించిన వాస్తవ మేమిటని గానీ, ప్రతిపాదకుని అవగాహనా స్థాయికి సంబంధించిన వాస్తవ మేమిటనిగానీ తేల్చుకోవడం చర్చకు సాధ్యవిషయంగా ఉంటుంది. అంటే ప్రధానాశయం సత్యాసత్య వివేచనే అవుతుందన్న మాట. విషయానికి సంబంధించిన వాస్తవమూ, వాది అవగాహన అన్నవి వాదంలో కలిసే ఉన్నా పరీక్షకు దేనిని తీసుకున్నాం అన్నదాన్ని బట్టి ఒకటి ప్రధానమూ, రెండవది అప్రధానముగా చూడబడతాయి. ఈ అంశమూ ముఖ్యమైనది గానే గుర్తించవలసి ఉంటుంది.

వాదిపరీక్షకూ, వాదపరీక్షకూ తేడాను వివరించుకుంటే బాగుంటుందనిపిస్తోంది.

వాదిని పరీక్షించదలచినపుడు ప్రకరణాంశం యొక్క వాస్తవం మనకు తెలిసిఉన్నా దానిని ప్రకటించిన వారికి ఎంత తెలుసో పరీక్షిస్తాము. ఆ సందర్భంలో మరొక రెవ్వరినీ అతనికి సహకరించనీయము. ఎందుకని? అతని కెంత తెలుసన్నది తేల్చుకోవలసిన విషయం గనుక. 

అదే వాదపరీక్ష. విషయానికి చెందిన వాస్తవ మేమిటన్నది తేల్చడం- సందర్భమైనప్పుడు ఒకడు తప్పు చెప్పినా, సగం చెప్పినా అతణ్ణిబట్టి వాదం సరికాదని అనుకోకుండా మరింత మందినీ కలసి విచారించి విషయనిర్ధారణకై యత్నిస్తాము. తెలుస్తోంది కదా! ఇందులో ప్రతి అంశం దగ్గరా ఒక్కో నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. వాటిని గమనించి స్పందనకు రాయండి. విషయపరంగా చర్చించడమే ఎక్కువసార్లు సరైందవుతుంది. రెండు సందర్భాలలో మాత్రం వ్యక్తి అవగాహనా స్థాయిని పరిశీలించవలసి ఉంటుంది. (పండిత పరీక్ష, విద్యార్థి పరీక్ష)

చర్చ ప్రతిపాదనతో ఆరంభమవుతుందనుకున్నాం కదా! మరి ముగింపో? అది నిర్ధారణతోగాని పూర్తిగాదు. చర్చనీయాంశమో: విషయానికి చెందిన వాస్తవ మేమిటనిగానీ, వ్యక్తి అవగాహనేపాటిదనిగానీ? అయ్యుంటుంది. మరి వీటిని నిర్ధారించడానికి అటు పరీక్షకులుగానీ, నిలబెట్టుకోడానికి ప్రతిపాదకుడుగానీ స్వీకరించే ఆధారాల విచారణే ఆరంభానికి - ముగింపుకూ

మధ్య ఉండేది. వాటినే హేతు, ఉదాహరణ, ఉపనయాలన్న మూడు పేర్లతో పైన చెప్పుకున్నాము.

2. హేతువు :- మానవుని ఆలోచనా క్రమంలో మరి దేనికీ లేనంత విలువా, కీలకపాత్రా కలిగి ఉన్నదీ హేతువన్నది. హేతుబద్ధాలోచన అన్నది ఉత్తమోత్తమ స్థాయికి పరిణితి చెంది ఉండడంవల్లే ఇతర ప్రాణులకంటే శ్రేష్టుడైనాడు మానవుడు. ఈ వనరే లేకుంటే ప్రత్యక్షంకాని విషయాలనూ ఎంతో కొంత తెలుసుకోగలగడమూ, భవిష్యత్ప్రణాళికల నేర్పరచుకోగలగడము, సృజనాత్మకతతో నూతనాంశాలను సృష్టించుకోవడమూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలగడమూ మొదలైనవి సాధ్యమయ్యేవే కాదు. ఇంతటి మహత్తర ప్రయోజనాన్ని సాధించి పెడుతున్న ఆధార సహితాలోచన అన్న దానిలో ఆధారం అన్న దాని దగ్గర సరైన ఆధారం లభించక - స్వీకరించక- నే ఆలోచన సాగిస్తే మరింత ప్రమాదాలు జరిగే అవకాశము ఉంది. అలా కాక సరైన ఆధారం లభిస్తే దానినే 'సద్దేతువు' అనంటారు. సరికాని దానిని ఆధారంగా - హేతువుగా - స్వీకరించ రాదు. ఎందుకంటే అట్టిది హేతువు నిర్వర్తించవలసిన కార్యాన్ని నెరవేర్చక పోగా ఆలోచనలను  పెడమార్గం పట్టించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేట్లు చేస్తుంది. అందుకనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భంలో హేతు, హేత్వాభాసల స్వరూప స్వభావాలను తెలుసుకుని ఉండడం అవసరమవుతోంది. వస్తుతః ప్రతివాడూ ఆధార సహితాలోచనే చేస్తాడు. అయితే ఒకడు సరైన ఆధారాన్ని- హేతువును- బట్టి ఆలోచిస్తే, మరొకడు హేత్వాభాసను - సరికాని ఆధారాన్ని - బట్టి ఆలోచిస్తాడు. మూఢనమ్మకాలన్నీ హేత్వాభాసల ఆధారంగా ఏర్పరచుకున్న అభి ప్రాయాలేనంటే, ఇక్కడ ఎంత జాగరూకత వహించాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూఢనమ్మకాల నలా ఉంచండి. శాస్త్రీయదృక్పథం కలవాళ్ళం అనుకునే వాళ్ళలోనే ఒక విషయంపై ఆలోచించి ఊహించి నిర్ణయించాల్సి వచ్చిన సందర్భంలో వేరు వేరు నిర్ణయాలు ఏర్పడ్డప్పుడల్లా ఎక్కడో ఒకచోట హేత్వాభాస చోటుచేసుకుని ఉందని చెప్పవచ్చు. హేతువాద రధసారధులం అనే వాళ్ళలోనే తరచుగా హేతుబద్ధాలోచనకు బదులు హేత్వాభాస బద్ద ఆలోచన లుండడం గమనించాము మేము. సరే ఆ వివరాల కిది సందర్భం కాదు గనుక హేతు, హేత్వాభాసల గురించి కొంచం వివరిస్తాను. గమనించండి.

జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షమైన ఏ అంశము-విషయము-మరో పరోక్ష విషయపు ఉనికిని ఆలోచించి నిర్ణయించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందో దానిని 'హేతువు' లేక సక్రమాలోచనకు 'తగిన ఆధారము’ అనంటారు. ఇందులో తెలియబడుతున్న దానికీ దాని ఆధారంతో ఊహ చేస్తున్న దానికీ మధ్య తగినంత బలమైన సంబంధం ఉండడ మన్నదే అత్యంత ప్రధాన విషయం. ఈ హేతుబద్ధాలోచనంతా ప్రధానంగా, ప్రత్యక్షంగా తెలియబడని దానిని ఊహాత్మకంగా తెలుసుకోడాని కొరకయ్యే ఉంటుంది. కనుక హేతుబద్దాలోచన ద్వారా చేసే నిర్ణయాలన్నీ ఊహాత్మకాలే. అయితే అధార సహిత ఊహ లన్నమాట.

సైద్దాంతికాంశాలలో పారిభాషిక రూపాలైన పదాలకు నిర్దిష్టార్థాలు చెప్పుకోవడం అవసరం కనుక అట్టి వాటికి నిర్వచనాలు చెప్పుకుంటే బాగుంటుంది, అయితే మరి నిర్వచనమంటే ఏమిటి? ఏ అనుభవానికి గుర్తుగా ఒక పదాన్ని-సంకేతాన్ని - పెట్టుకున్నామో ఆ అనుభవాన్ని గురించి వ్యక్తీకరించడానికి క్లుప్తంగా వాడే పదసముదాయాన్ని నిర్వచన మంటారు. ఇప్పుడు నేను చేసింది నిర్వచనమంటే ఏమిటో వివరించడమన్న మాట. మరి దీనినే నిర్వచన రూపంలో చెప్పుకుంటే ఇలా ఉంటుంది. సంపూర్ణార్ధాన్నిచ్చే సంక్షిప్త పద సముదాయం నిర్వచనం. ఇది నిర్వచనమన్న మాటకు నిర్వచనం. అర్థమవుతోందా? పారిభాషిక పదాలన్నింటికీ ఇలా స్పష్టంగా భావాన్ని- పదార్థాన్ని - తెలిపే రీతిలో నిర్వచనాలు తయారు చేసుకోవడం అవసరం. భావప్రకటన, భావగ్రహణలలో స్పష్టత, సౌలభ్యతల కొరకే ఈ నిర్వచనా లన్నవి అవసరమయ్యాయి. సరే మళ్ళా హేతువు దగ్గర కొద్దాం.

వెనకటి తార్కికులు హేతువు నిలా నిర్వచించారు. "ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్యసాధనం హేతుః” రూఢిగా తెలిసిన లేక జరిగిన సంఘటనే ఉదాహరణంగా పనికి వస్తుంది. అట్టి దానితో సరిపోలడం అన్నదాన్ని ఆధారం చేసుకుని సాధ్యాన్ని పరోక్షంగా ఉన్నదాని ఉనికిని - నిర్ధారించడానికి సాధనంగా పనికి వచ్చేదేదో అది హేతువు అని సూత్రార్థం.

నోట్ :- ఈ హేతువులు రెండు రకాలు. అన్వయ హేతువు, వ్యతిరేక హేతువునని. పరోక్షంలో ఉన్న ఒకదాని ఉనికిని, (లేమిని) ఊహించి నిర్ణయించడానికి  మనకు ఆధారంగా లభించిన దానిని హేతువు అంటారు.

అన్వయ హేతువు :- ఇది ఉంది గనుక అదీ ఉంటుంది. ఇది అన్వయ హేతువుతో కూడిన ప్రయోగం.

వ్యతిరేక హేతువు:- ఇది ఉంది గనుకనే అది ఉండదు. ఇది వ్యతిరేక హేతువుతో కూడిన ప్రయోగం.

ఇది లేదు గనకనే అది ఉంటుంది అనే ప్రయోగం కుదురుతుందా లేదా ఎక్కడైనా ఆలోచించండి. 

ఉదాహరణలు చూడండి.

1) అక్కడ పొగ వుంది గనుక నిప్పూ ఉంటుంది. 

2) అక్కడ పొగలేదు గనుక నిప్పూ లేదు (లేనట్లే). 

3) అక్కడ నీరే ఉంది గనుక నిప్పు లేనట్లే.  

4) అక్కడ నిప్పు ఉంది గనుక నీరు లేనట్లే.

5) సూర్యునిలో శీతలంలేదు అగ్నిగోళం కనుక.

6) చంద్రునిలో ఉష్ణముండదు. అగ్నిగోళం కాదు గనుక.

ఇలా మరికొన్ని ఉదాహరణలనూ తీసుకుని వాటిలో హేతు సహిత నిర్ణయాలేవో, అన్వయ వ్యతిరేకాలతో కూడినవేవో, అహేతుకాలేవో నిర్ణయించండి.

ప్రతి అన్వయ హేతువు దగ్గరా వ్యతిరేక హేతు ప్రయోగం కుదురుతుందో లేదో చూడండి.

అతి ముఖ్య గమనిక :- నిజానికివన్నీ పాఠంలానో, ప్రసంగంలానో చెప్పుకు పోదగినవికావు. ఒక్కో అంశాన్ని విచారణ పూర్వకంగా అనుభవాలతో సరిచూసుకుంటూ జీర్ణం చేసుకుంటూ నేర్వవలసినది. ప్రస్తుత పరిస్థితుల్లో అట్టి అవకాశాలు తక్కువ గనుక కొంత సరికానితనమున్నా తప్పక ఈ మార్గాన్నెంచుకున్నాము. మీ కిది సమాచార రూపమే గనుక పరిశీలించకనే సత్యాలు గానో ఆసత్యాలుగానో స్వీకరించకూడదు. అభిమానులకూ, వ్యతిరేకులకూ కూడా సమానంగా వర్తించే ఈ సూచనను జాగ్రత్తగా గమనించండి.

ఉదా :- అక్కడ పొగలేకపోడానికి కారణమేమిటి? నిప్పులేదు గనుక. అంటే అక్కడ నిప్పులేదు గనుకే పొగలేదు. ఈ ప్రయోగం సరైందేనా? పొగ లేనితనం నిప్పులేని తనాన్ని సాధిస్తుందా ?

ఇప్పుడిక హేత్వాభాస స్వరూపాన్ని- దానిలోని రకాలనూ విచారిద్దాం.

హేత్వాభాస :- హేతువువలె భాసిస్తోంది (కనిపిస్తోంది, అనిపిస్తోంది) కానీ హేతువు నిర్వర్తించవలసిన పనిని సక్రమంగా నిర్వర్తించలేకపోతోంది. కనుక హేతువుగా స్వీకరించడానికి యోగ్యం కానిది హేత్వాభాస. ఒక చేదు నిజం గుర్తించా లిక్కడ. అటు భావవాదుల (ఆస్తికుల) పరంగాగానీ, భౌతికవాదుల (నాస్తికుల) పరంగాగానీ ఒకే విషయానికి సంబంధించి వేరు వేరు నిర్ణయాలకు రావడం జరిగినప్పుడల్లా వారి ఆలోచనలకు ఆధారంగా ఉంటోంది (వారు హేతువుగా స్వీకరించింది) హేత్వాభాసే అవుతుంది. అంటే ఏమని? అటు హేతువాదులలోని భిన్న ధోరణులా, ఇటు ఆస్తికులలోని భిన్నధోరణులా ఆలోచనల వెనుక ఎక్కడోచోట అహేతుకత ప్రవేశించిందనే. కనుక చర్చావేదికలో అత్యంత కీలకమైన అంశమూ, అతి జాగరూకత కలిగి ఉండాల్సిన విషయమూ వారి వారి నిర్ణయాలకు ఆధారంగా ఉన్నది సరైన హేతువా, హేత్వాభాసనా అన్నది తేల్చుకోగలగడమే అవుతుంది.

నోట్ :- విచారణ సౌలభ్యం కోసం గతంలో నైయాయికులు తార్కికులు (నిజానికి తార్కికులన్నా హేతువాదులన్నా ఒక్కటే) ప్రస్తావించిన హేత్వాభాసల్ని ముచ్చటిస్తాను. మీ మీ అలోచనలకవి సరిగా ఉన్నాయో లేవో తేల్చుకోండి.

సవ్యభిచారి, విరుద్ధ, ప్రకరణ సమ, సాధ్యసమ, కాలాతీతములని హేత్వాభాసలు ఐదు. వీటినే అనైకాంతిక, విరుద్ధ, సత్పతిపక్ష, అసిద్ధ, బాధితములనీ పిలుస్తారు కొందరు.

1. సవ్యభిచార (అనైకాంతిక) హేత్వాభాస :- దేని ఉనికిని ఊహించడానికి దేనిని ఆధారంగా (హేతువుగా) స్వీకరించామో అది ఒకటి కంటె ఎక్కువ వాటి ఉనికినీ ఊహింపజేస్తోందనుకోండి. దానిని అనైకాంతికము లేక సవ్యభిచార హేత్వాభాస అనంటారు.

ఉదా :- రామారావుగారి స్కూటర్ను వాకిట చూసి లోపల రామారావు గారు న్నట్లూహించడంలో ఆధారంగా ఉన్న స్కూటర్ రామారావుగారి ఉనికిని నియమంగా సాధించగలదా? ఆలోచించండి. అక్కడ పొగ ఉంది గనుక నిప్పుంటుందిలాగా, వాకిట స్కూటరు ఉందిగనుక రామారావుగారూ ఉన్నారు అని నిర్ధారణగా చెప్పగలమా ?

2. విరుద్ధ హేతువు : దేని ఉనికి ఎట్టి పరిస్థితులోనూ దేని ఉనికిని సాధించలేదో అట్టిది విరుద్ధమని అంటారు. ఒక రకంగా ఇది ఉంటే అది ఉండలేని స్థితి ఉంటుందన్న మాట.

ఉదా : కొలనులో నిప్పు వుంది, నీళ్ళున్నాయి గనుక. నీళ్ళున్నాయి గనుక నిప్పు ఉండదు అనుకోవడంలో ఒకింత ఔచిత్యం ఉండొచ్చుగానీ, వాది నీళ్ళున్నాయి గనుక నిప్పు ఉంటుంది అనంటున్నాడు. దీనిని విరుద్ధ హేతువు అనంటారు. నోట్ : ఇంత పిచ్చిగా ఎవరంటారు అని మీ కనిపించవచ్చు. మామూలుగా అనరుగానీ, అపసవ్యవాదనలు చేస్తుంటారు చూడండి అలాటి సందర్భాలలో అప్పుడప్పుడూ ఎదురవవచ్చు ఈ రకం. 

3) ప్రకరణ సమం(సత్పతిపక్ష) :- ఒకడు ఎలాంటి ఆధారాన్ని చూపి ఒకదాని ఉనికిని నిర్ధారిస్తున్నాడో అలాంటి ఆధారాన్నేచూపి మరొకడు దాని అభావాన్ని (మొదటి దానికి విరుద్ధమైన భావాన్ని) నిర్ధారిస్తున్నా డనుకోండి. ఆ రెండు వాదాల మధ్య వారికి ఆధారంగా ఉన్నదానిని ప్రకరణ సమం అంటారు. 

ఉదా:- ఎ)దేవుడులేడు ఉన్నాడనడానికి రుజువు లేదుగనుక. ఆస్తికులు ఉన్నాడని రుజువు పరచలేదు గనుక. 

బి) దేవుడు ఉన్నాడు లేడనడానికి రుజువులేదు గనుక. నాస్తికులు లేడని రుజువు చేయలేదు గనుక. ఈ క్రమంలోని అహేతుకతేమిటో ఆలోచించండి. 

నోట్ :- ఇది ఒకింత సంక్లిష్టమైంది గనుక మరో ఉదాహరణ చెపుతాను పరికించండి.

ఉదా :- ఎ) చైతన్యం పదార్థజన్యం కాదు. పదార్థ జన్యమని నాస్తికులు రుజువుచేయలేదు గనుక.

బి) చైతన్యం స్వయం సత్తాకంకాదు. పదార్థానికి భిన్నంగా ఆస్తికులు దానిని చూపలేక పోయారు గనుక.

నిజానికి ఆస్తిక, నాస్తిక పంథా వాళ్ళ వాదరీతి అంతా ఈ కోవకు చెందిందే. అవునా? కాదా?

4) సాధ్యసమం (అసిద్ధ హేత్వాభాస) :- దేని ఉనికిని సాధించడానికి ఆలోచనకు ఆధారంగా దేనిని స్వీకరించామో అదే ఇంకా సాధించవలసిందిగా ఉందన్నమాట.

ఉదా:- వేదం సర్వజ్ఞము. ఈశ్వరోక్తం గనుక. ఇక్కడ హేతువుగా తీసుకున్న ఈశ్వరుడు చెప్పాడు అన్నదే ఇంకా అనిర్ధారిత విషయంగా ఉంది. హేతువే ఇంకా తేలని విషయంగా ఉందన్న మాట. ఇట్టివింకేమైనా ఉంటాయేమో చూడండి.

5) కాలాతీతం (బాధిత హేత్వాభాస):- హేతుసాధ్యాలు సమకాలీనము లనడానికి వీలులేని విషయాలలో దేనిని సాధించడానికి మరి దేనిని ఆధారంగా స్వీకరిస్తామో అది బాధిత హేతువై హేత్వాభాస అవుతుంది. తార్కికులు దీనికి ఉదాహరణను ఇలా చెప్పారు.

ఉదా :- దూరంగా చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. అది కంటికి కనిపిస్తోంది. బండకు బట్ట తాకడం కనపడ్డప్పుడు శబ్దం వినపడడంలా, శబ్దం వినబడ్డప్పుడు బండకు బట్ట కొట్టడం కనపడ్డంలా. ఇటువంటి  సందర్భంలో కొట్టినట్టు వినబడ్డ శబ్దం చాకలి దెబ్బ వేశాడనడానికి హేతువు అవుతుందా? అవదా? అన్నది ఇక్కడ విచారణీయాంశం. మనం సాధారణంగా ఈ చప్పుడు ఆ ఉతుకుడుదే అని నిర్ణయిస్తాం. కానీ ఇదంత సక్రమాలోచన కాదు అన్నది వెనుకటి తార్కికుల అంచనా. మీరేమంటారు.

ఇప్పటి సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించి నేనో ఉదాహరణ చెపుతాను  అదీ ఆలోచించండి. సినిమాలో నటులు పాటలు పాడుతున్నట్లు అనిపిస్తుంది - వాళ్ళ పెదాల కదలికనుబట్టి. నిజానికి పాడేది వేరొకరు, వేరొకచోట, వేరొక కాలంలో. ఇక్కడ మనకొక భ్రాంతి కలుగుతున్నది. ఈ మొత్తం సంఘటనలో హేతుబద్ధాలోచన పాలెంత ? అందులో ఆధారంగా తీసుకున్న దేమిటి? ఊహించి (ఆలోచించి) నిర్ణయించిందేమిటి? ఆ ఆధారం సరైన హేతుపు అవుతుందా? మిత్రులారా ! హేతుబద్దాలోచనా క్రమంలో కీలకాంశమైన హేతువు, హేతువులా అనిపిస్తూ హేతువు కానిది అన్న రెండంశాలూ, క్షుణ్ణంగా అర్థమైతే గాని చర్చ సజావుగా సాగదు.

3) ఉదాహరణము :- తార్కిక యోచన కంతటికీ ఆయువు పట్టు ఉదాహరణమన్నదే. హేతుబద్ధాలోచనలో ఒకదానినిబట్టి మరొక దానిని ఊహించడం ఉంటుంది. అందుకు తప్పనిసరిగా అది- ఊహిస్తున్నది - ఉంది గనుకనే ఇది ఉంది, అది లేకుంటే ఇదీ ఉండేందుకు వీలులేదు అనడానికి తగిన బలమైన బంధం దానికీ - దీనికి మధ్య ఉంది అనడానికి రుజువుగా చెప్పదగ్గ అంశాన్నే దృష్టాంతం- ఉదాహరణ-అంటారు. హేతు-సాధ్యాలుగా అంగీకరిస్తున్న రెంటినీ కలిగున్న తావు దృష్టాంతం అంటాము.

ఎక్కడ దేనిని చూచి- హేతువుగా స్వీకరించి - దేనిని ఊహిస్తున్నామో, అట్టిదే గతంలో తెలిసున్న సంఘటన మరొకటి దృష్టాంతమవుతుంది. సజాతి పోలికనే దృష్టాంతము అంటారు. అనాలి.

నోట్ :- దృష్టాంతానికి - ఉపమానానికీ అతి కీలకమైన బేధముంది. ఉపమానం ఆలంకారికం. వస్తు నిశ్చయం చేయడానికి పనికిరాదు. ఈ అంశాన్ని స్పష్టంగా గమనించారు గనుకనే వెనుకటి హేతువాదులు (తార్కికులు) - (నోట్ :- ఈ మాట ఈనాటి హేతువాదులు మంటున్నవారిలో కొందరికి మ్రింగుడుపడదు) వాదంలో ఉపనయం అన్న మరో అంశాన్ని ఒక ప్రధాన భాగంగా జొప్పించారు. హేతువాధారంగా ఏ అంశాన్ని ఊహిస్తున్నామో అట్టిది సంభవమనడానికి దేనిని (జరిగిన సంఘటనగా - అనుభవంలో తేలిన అంశంగా) ఉదహరిస్తున్నామో రెండూ సమాన ధర్మాలు కలిగినవై యుండాలి. అది నిర్ధారించుకోడానికే సరిపోల్చుట - ఉపనయనం అన్నది అవసరమౌతుంది. చక్కగా సరిపోలనిది ఉదాహరణకు పనికిరాదు. దృష్టాంతం కాదన్నమాట. ఉపమానం ఎన్నటికీ దృష్టాంతం కాదు. కాలేదు కూడా. హేతువాధారంగా చేసిన నిర్ణయం దేనికి సంబంధించిందో, ఉదాహరణగా చూపించిందీ దానికి సంబంధించిందే అయ్యుండాలన్నమాట.

నోట్ :- ఈనాడు భిన్నధోరణుల ప్రచారకుల్లో దాదాపు 90% మంది  ఉపమానాల గొడవో, హేత్వాభాసలు రగడో చేస్తూ అసలు విషయాన్ని గడబిడ చేయడమే జరుగుతోంది. ఇది గుర్తుంచుకోండి. రేపు జరిగే చర్చల్లో ఎదురైనప్పుడల్లా దీనిని ఎత్తిచూపుతాను. అదలా ఉంచండి. ఉదాహరణను నిర్వచించుకోలేదింకా.

హేతుబద్ధాలోచన సక్రమంగా చేయడానికి తగిన అవగాహనను గతంలో కలిగించి స్మృతిలో ఉన్న అట్టిదే సంఘటన దృష్టాంతమవుతుంది. అదే ఉదాహరణంటే.

4) ఉపనయం :- ప్రతిజ్ఞా వాక్యం ద్వారా చేసిన, ప్రతిపాదిత విషయానికీ, చూపించిన ఉదాహరణకు పోలిక ఉందో లేదో చూడడాన్నే ఉపనయమంటారు. సరిగా పోలిక సరిపోతే న్యాయ ప్రయోగం సరిగనే ఉన్నట్లు. లేకుంటే ఉదహరించింది, విషమ దృష్టాంతమో, ఉపమానమో అవుతుంది. ఉదాహరణమే లభించకుంటే ప్రతిపాదితాంశానికి అసంభవ దోషం ఏర్పడుతుంది.

నోట్ :- కనుక చర్చలో హేతువు, ఉదాహరణము, ఉపనయము అన్నవి ప్రధానావయవాలు వీటి బలంపైనే ప్రతిజ్ఞా వాక్యాన్ని నిగమనం - కరెక్టేనని కంక్లూడ్ -చేస్తాము.

ఈ విషయాలు మరింత స్పష్టంగా అర్ధం కావాలంటే మరికొన్ని పారిభాషిక పదాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందులో పక్షము - సపక్షము-విపక్షము అన్నవి ఒక సముదాయము.

1. పక్షము :- ఎక్కడ హేతు వాధారంతో సాధ్యాన్ని ఊహిస్తున్నామో లేక హేతుబద్దాలోచన ద్వారా దేని ఉనికిని ఊహాత్మకంగా నిర్ణయిస్తున్నామో అది ఉన్నస్థానము పక్షము. లేక ప్రతిపాదన ద్వారా ప్రకటించిన దేనిని నిర్ధారించడానికి విచారణకు స్వీకరించామో అది పక్షము. సందిగ్ధ సాధ్యవాన్ పక్షః అని తార్కికు లంటారు.

2. సపక్షము :- హేతుబద్ధాలోచన ద్వారా చేసిన ఊహాత్మక నిర్ణయము సరైనదేనని చెప్పడానికి ఆధారంగా చూపుతున్న (సంఘటన) ఉదాహరణ సపక్షమవుతుంది. నిశ్చిత సాధ్యవాన్ సపక్షః అని తార్కికు లంటారు.

3. విపక్షం :- సాధ్య వస్తువు లేనిది విపక్షం. ఇప్పుడొక ఉదాహరణ ద్వారా పై మూడిటినీ అర్థం చేసుకుందాం.

రెంటి సంబంధం ఉన్నప్పుడే ఒకదాన్నిబట్టి మరొకటి ఊహించడానికి వీలవుతుంది. ఈ రెంటిలో ఆధారాన్ని హేతువనీ (కారణం అనకూడదు.) ఊహిస్తున్న దానిని (హేతువుగా స్వీకరించిన దానితో విడివడక ఉండే ఆ రెండో దానిని) సాధ్యము అనీ అంటారు. ఆధారం లభించి సాధ్యాన్ని ఊహిస్తున్న స్థానాన్ని పక్షమనీ, హేతుసాధ్యాలు కలిసి ఉన్నట్లు ఇప్పటికే తేలిన స్థానాన్ని సపక్షమనీ, సాధ్యంలేని స్థానాన్ని - చోటును - విపక్షమనీ అంటారని చెప్పుకున్నాం పైన. ఉదాహరణ యిలా ఉంటుంది.

1) ఆ ఫ్యాక్టరీ నిప్పు కలిగివున్నది. 2) పొగ కలిగి ఉండుటచేత. 3) పొగ ఉన్నచోటల్లా నిప్పు ఉంటుంది. 4) వంటయింటివలె. ఇది న్యాయప్రయోగం.

ఫ్యాక్టరీ పక్షం. వంట యిల్లు సపక్షం. నీటికొలను విపక్షం.

పక్షంలో పొగ ఉండడం ఆధారంగా నిప్పును ఊహిస్తున్నాం. ఇక్కడ సాధ్యం నిప్పన్నమాట.  పొగ ఉండడం హేతువు. పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంటుంది  అన్నది నియమం. అందుకు రూఢి సపక్షం- వంటయిల్లు. పక్షంలో పొగ కనబడుతూవుంది, సపక్షంలో  పొగ + నిప్పు ఉన్నాయి. కాబట్టి పక్షంలోనూ నిప్పు ఉండే ఉంటుంది. (ఉంది) ఫ్యాక్టరీ వంటిల్లులు పక్ష - సపక్షాలనుకున్నాం కదా. ఫ్యాక్టరీలో పొగ + నిప్పుల విషయమే ఉండగా, ఉదాహరణగా చూపిన వంటయింట్లోనూ పొగ + నిప్పులే చూపబడతాయి. ప్రతిజ్ఞా వాక్యంలో పొగ + నిప్పు, దృష్టాంతంలోనూ పొగ + నిప్పేనన్నమాట. అవి అలా ఉన్నాయో లేవో రెండూ సరిపోల్చడాన్నే ఉపనయం అంటారు.

దేనిని ఊహిస్తున్నామో అది సాధ్యం, దేని ఆధారంతో ఊహించగలుగుతున్నామో అది హేతువు. సాధ్య నిశ్చయం కలిగింది సపక్షం. సాధ్యాన్ని ఊహించే స్థానం పక్షం. సాధ్యం లేనితావు విపక్షం. అర్థమైందా? మరొక్కమారు అలోచించి చూడండి. ఇంతవరకు బాగానే అర్ధమైందను కుంటే హేతు లక్షణం యిలా ఉంటుంది. హేతువుగా స్వీకరించే పదార్థం పక్షంలో ఉండాలి, సపక్షంలో ఉండాలి, విపక్షంలో ఉండకూడదు. మరో హేతువూ ఈ హేతువు సాధించే దానిని సాధించకూడదు. అన్ని సందర్భా లలోనూ ఇది సాధ్యాన్ని ఊహించడానికి పనికిరావాలి. బాధింపబడకూడదు. (ఇది లభించే సాధ్యం ఉండకపోవడాన్నే బాధితమంటాము.)

Note:- పై ఐదు యోగ్యతలు కలిగింది సద్దేతువు (సరైన ఆధారం) అవుతుంది. అందులో ఒక్కో లోపం ఉంటే ఒక్కోరకమైన హేత్వాభాస అవుతుంది.

చర్చా వేదికకు సంబంధించినంతవరకు ఈ అవగాహన కలిగి వుండడం తప్పనిసరి. ఈ హేతువు హేత్వాభాసలకు సంబంధించి ఏదైనా నియమం ఏర్పడుతుందేమో ఆలోచించండి.

చర్చలలో చోటుచేసుకునే అపసవ్యతా రూపం మరొకటుంది. దానిని "ఛలం" అంటారు పారిభాషికంగా. ఎదుటిపక్షంవాడు పలికిన మాటలకు అతను వ్య క్తపరచాలనుకున్న అర్థాన్ని కాక విరుద్ధార్థాన్ని, మరో అర్థాన్ని గుంజడం.

ఉదా :- వాడుకొనే పనిముట్టు ఎంతో విలువైంది. వాడుకొనే, దగ్గర ఆపి చదివితే ఉపయోగిస్తున్న అని అర్థం వస్తుంది, వాడు దగ్గరాపితే కొనే పరికరం అనంటే మరో అర్థం వస్తోంది. అన్నవాడొక అర్థం చెపితే. విన్నవాడు మరో అర్ధం చెప్పుకోగల వాక్యమిది.

జాతి:- సాధర్మ్య వైదర్మ్యాభ్యాం ప్రత్యవస్థానం జాతిః ఎదుటివాడు చేసిన ఆధార సహితమైన ప్రతిపాదనను ఖండించడానికి ప్రతిపాదకుడు ఎంచుకున్న అంశంలోనే (పక్షంలోనే) ఉన్న సమర్థవంతంకాని ఆధారాన్ని చూపుతూ ఖండన వాక్యాన్ని ప్రయోగించడం జాతి అనబడుతుంది.

ఉదా:- పొగ ఉంది గనుక నిప్పు ఉంది అని ఒకడనగా, ఏం, పొగ లేకుండా నిప్పు ఉండగూడదా? ఉండొచ్చు గనుక, పొగ ఉంది కనుక నిప్పు ఉందనడం సరికాదు.

నిగ్రహస్థానం:- విప్రతి పత్తి, రప్రతి పత్తిచ్చ నిగ్రహస్థానం. ఒక పక్షం వీగిపోయిందనడానికి అవసరమైన అంశాలకు సంబంధించినదిది. ఎదుటి పక్షంవాని ప్రశ్నకుగానీ, ప్రతిపాదనకుగానీ బదులాడక (అప్రతిపత్తి) ఊరకుండుటగానీ, సందర్భోచితంకాని విషయాలను ఎత్తుకుని చర్చను ప్రక్కదారి పట్టించడం - విప్రతిపత్తి - గానీ చేసినవాని పక్షం వీగిపోయిందని అర్థం.

ఉదా:- 1) దేవుడున్నాడంటున్నావుగదా రుజువుచేయి అనడగ్గా, మౌనంగా ఉండడమో, (అప్రతిపత్తి) దేవుడు లేకుంటే నీవెలా పుట్టావోయ్ అంటూ అసందర్భ వాదాన్నెత్తుకోవడము (విప్రతిపత్తి).

2) సత్తావుంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని ఒకడనగా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడాన్నావలబెట్టి సత్తా చూపమన్నావుకదా అంటూ బలప్రదర్శన చేయడమో, సత్తాలు గిత్తాలంటున్నాడు చూడండని వేరేగొడవ మొదలెట్టడమో లాంటివి విప్రతిపత్తి. ఈ తరహా వ్యవహారం అసలు విషయంలో సరుకులేని వారివైపు నుండి ఏర్పడుతుంటుంది తరచుగా. నిజాయితీగా విషయం పట్ల స్పష్టత తీవ్రత కలిగి చర్చలలో పాల్గొన్న వారెవరికైనా మిడి మిడి జ్ఞానులతో జరిగే చర్చలలో ఇది ఎదురుపడే విషయమే.

అతిముఖ్య గమనిక:- సత్య నిర్ధారణ ప్రధానంగా ఉద్దేశించిన వారెవరుగానీ ఏరకంగానూ ఛలవాదాన్ని చేయరాదు. సామాజికస్పృహ, హితకాంక్ష కలిగి భావవిప్లవం రావాలని కోరుకునే వారికి ఛలం బద్ధశతృవు. ఈ ప్రమాదం ఏ విధంగాను జరుగకూడదనే భాషా నియమాల్లో మొట్టమొదటిదిగా చక్కగా వినడంతో పాటు, విన్నమాటకు అర్ధాన్ని అన్నవాడి నుండే స్వీకరించు అన్న దానిని నియమంగా స్వీకరించాము. సత్యం కొరకై మీ పక్షం వీగిపోతే పోనీండి, చిన్నబుచ్చుకునే పరిస్థితివస్తే చిన్నబుచ్చుకోండి. కానీ ఎదుటివాడు చెప్పాలనుకున్న భావానికి విరుద్ధమైన అర్ధాలను వక్తకు యిష్టంకాని అర్థాన్ని - అతని మాటల నెత్తిన రుద్దకండి. జ్ఞానపరంగా అది పరమ దుర్మార్గమైన స్వభావాన్ని అధమాధమస్థాయిని తెలియజేస్తుంది. ఏదేమైనా ఆ మార్గం మాత్రం మనకొద్దు. 

Note:- విషయపరమైన అవగాహనాలోపం ఉన్నవాళ్ళుగానీ, గెలుపే ప్రథానాశయంగాగల జల్పవాద రీతిలోగానీ ఇవి చోటు చేసుకుంటాయి. వాది బలా బలాల ప్రదర్శనలో ప్రయోగింపబడేవే ఇవి. సత్య నిర్ధారణ లక్ష్యంగా కల వాదాల్లో మాత్రం ఛలం, జాతి అన్నవాటి ప్రమేయం ఉండదు. అవ సరమూలేదు. ఎందుకనో అర్థమైతే స్పందనకు రాయండి మీ ఆలోచనలను.

Ans:- వాదాన్ని పరీక్షించడమంటే- భావాన్ని నిర్దిష్టంచేశాకే చేసే పనిగనుక వేరే అర్థం గుంజడమన్న ప్రశ్నే ఉత్పన్నంకాదు. కనుక సత్య స్థాపన ధ్యేయంగాకల వాదాల్లో ఛలం ప్రవేశించలేదు.

సరే అదలా ఉంచండి. ఒకరిద్దరు ప్రసిద్దులు వెలిబుచ్చిన అభిప్రాయాలను వాటికి వారు చూపిన ఆధారాలను మీ ముందుంచుతాను. అవి పైచర్చా వేదిక నియమాల విచారణలో చోటుచేసుకున్న వేటికిసరి పోల్తాయో చూడండి.

1) వంచనా ప్రతిఘటన ఐక్య వేదికలో చేరిన మిత్ర సంఘాలలో ధర్మాచరణ మండలి తిరుపతి కూడా ఒకటి. ఐక్య వేదిక ఎందుకు పనికిరానిదయిందోగాని ఒక భావవిప్లవ సంఘానికి జాతీయస్థాయి నాయకుడి  సంఘం ఐక్య వేదికలో చేరినట్లు ఎవరో చెప్పగా విని ధర్మాచరణ మండలిలో ధర్మ మన్నమాట వుంది గనుక ఇది మత సంస్థ అని తిరుపతి దేవస్థానంవారి ప్రచార విభాగమనీ, ధర్మమన్నదానికి వర్ణాశ్రమ ధర్మమనే అర్థం చెప్పాలిగాని మరో అర్థం చెప్పరాదనీ, రాతమూలకంగా తన ఆ(నా) లోచనాయుత నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇతని ఆలోచనలోని సక్రమత ఏపాటిది?

2) మరొకాయన గొప్ప పరిశోధన గ్రంథంగా చెప్పుకుంటున్న తన రచనల్లో ఒక దాంట్లో రాముడు వ్యభిచారి అనడానికి ఆధారాలు అంటూ శృంగార కవులైన జయదేవుని, శ్రీనాధుని, అన్నమయ్య, క్షేత్రయ్యల రచనలనూ వాటిలోని శృంగార కామకేళీ వర్ణనలను దాదాపు 20 పేజీలలో ఎత్తిచూపి రాముడు తల్లికీ, కూతురుకూ కూడ భర్తరికం జరిపాడు అని నిగ్గుతేల్చాడు. ఎలాగంటే వేంకటేశ్వరుడు (విష్ణువు), శ్రీదేవి, భూదేవులను పత్నులుగా కలిగున్నాడు. రాముడు విష్ణువే కదా. కనుక భూమికి రాముడు భర్త అయినట్లే. మరి భూమిజనూ (సీతను) పెండ్లాడాడు. కనుక తల్లీ కూతుళ్ళతో సంసారయ్యాడు. ఎలా ఉందీ పరిశోధన గ్రంథంలోని శాస్త్రీయత, హేతుబద్ధతా.......... ఆలోచించండి.

ఆస్తిక ప్రసిద్ధుల్లోనూ ఒక రిద్దరి పోకడలను ముచ్చటిస్తే మీ విచారణకు పదునెక్కుతుంది.

3) ఒక ప్రసిద్ధి చెందిన స్వామిని అడిగాడొక జిజ్ఞాసి. అజ్ఞానానికి కారణమేమిటని? జ్ఞానం లేకపోవడమే నాయనా అని, అజ్ఞానం చీకటిలాటిది . చీకటికి కారణమేమిటని? అడిగాడు స్వామి. వెలుతురు లేకపోవడమేగా స్వామి అన్నాడు జిజ్ఞాసి. కరెక్టుగా చెప్పావు నాయనా. అలాటిదే పైన నేను చెప్పింది కూడా అన్నాడు. అబ్బా, ఎంత చక్కగా విడమరచారు స్వామివారు అను కున్నాడు జిజ్ఞాసి.

ఇందులోని సక్రమాలోచన ఏపాటిది?

పరీక్షా నియమాలు :

చర్చావేదిక నియమాలల్లో చివరిది- పరీక్షా నియమాలు-అన్నది. ఇక్కడ జిజ్ఞాసువులకు చిన్న సందేహం కలుగవచ్చు. తార్కిక నియమాలలో నే 'నిగమనం' (కంక్లూషన్-నిశ్చయరూపమైన నిర్ణయానికి రావడం) ఉంది గనుక అక్కడికి పరీక్షారూపంకూడా పూర్తయినట్లే కదా? మళ్ళా ఇక్కడ పరీక్షా నియమాలన్న మరో ప్రకరణమెందుకు? అన్నది సంశయం.

జ్ఞానార్జనకు, సత్యజ్ఞానార్జనకు ఉన్న తేడా తెలిస్తేగాని ఈ సంశయం నివృత్తి కాదు. లేక కలిగిన జ్ఞానం ప్రమాత్మకమా (సత్యజ్ఞానమా), భ్రమాత్మకమా (అసత్యజ్ఞానమా) అన్నది తేల్చుకోవలసి ఉందా, లేదా? తేల్చుకోవడమెలా? అన్న అంశాలు తెలిస్తేగాని పై సందేహం సమిసిపోదు. ఉదా:- విజ్ఞానశాస్త్ర పోకడల్లో పరికల్పనల (హైపోథిసిస్) రూపంలో కొన్ని సిద్ధాంతాలుంటాయి. ఆధారసహితంగానే  ఆ థియరీస్ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశంపై ఒకటికంటే ఎక్కువ పరికల్పనలు- ఆధార సహితం గానే సుమండీ ఏర్పడుతూంటాయి. వాటిని ప్రయోగం ద్వారా సరిచూసుకోవడం అవసరమై ఉంటుంది. ఉదాహరణకు- బిగ్బాంగ్ థియరీ, స్టడీస్టేట్ థియరీ, పల్సేషన్ థియరీలన్నవి సృష్టి ఆరంభం ఎలా జరిగింది? అనడంలో ఏర్పడ్డ ఊహాత్మక సిద్ధాంతాలు. ప్రతి వైజ్ఞానిక పరికల్పనా అంతో యింతో ఆధారాన్ని తీసుకునే చేయబడుతుంది. కాని ఒక విషయానికి సంబంధించి రెండు వాస్తవాలుండవు గనుక పై అనేకాభిప్రాయాల్లో ఏదో ఒకటి మాత్రమే నిజమవడమో, అసలు నిజం మరోటై యుండడమో జరుగుతుంది గాని, అన్నీ నిజమవడం మాత్రం కుదరదు. కనుక ఎంత ఆధార సహితంగా ఆలోచించి నిర్ణయాలు చేసుకున్నా అవన్నీ ప్రయోగాత్మకంగా పునర్నిర్ధారణకు లోనుచేయకుండా తుది నిర్ణయం జరిగినట్లుకాదు. కనుక హేతుబద్దాలోచన ద్వారా మనలో ఏర్పడ్డ అభిప్రాయాలన్నీ మరోసారి మరో పద్ధతిన పరీక్షించి నిర్ధారించుకోవలసి ఉంటుంది.

మనలో అభిప్రాయాలు ఏర్పడేందుకు మార్గాలు మూడు. అవి 1) ప్రత్యక్షానుభవాల వల్ల, 

2) ఆధారసహిత యోచన ద్వారా, 3) వాళ్ళూ వీళ్ళూ చెప్పగా, రాయగా వినీ, చదివి. ఇంతకంటే ఆయా విషయాలపై అభిప్రాయా లేర్పడేందుకు మార్గంలేదు. అందులో చివరి రెండు మార్గాల ద్వారా సంపాదించిన జ్ఞానమూ, ఏర్పరచుకున్న అభిప్రాయాలు రెండూ ఇంకా తెలియవలసినంతా తెలీనివిగానూ, తేల్చుకోవలసినవిగానూ ఉంటాయి. ఇంతవరకు అర్ధమైందనుకుంటే మరి మొదటిరకం అభిప్రాయాలూ తేల్చుకోవలసినవిగానే ఉంటాయా? తేలినవిగా అవుతాయా ఆలోచించండి.

మిత్రులారా! ఇదంతా ఎందుకు చెపుతున్నట్లు అని మీలో కొందరికై నా అనిపించవచ్చు. సంబంధంలేని విషయం అనుకునేరు. అలాంటిదేమి లేదు. అతి ముఖ్యమైన విషయాన్ని తెలుపడానికే ఇదంతా.

చర్చావేదికలో చర్చనీయాంశాలన్నీ మనమేర్పరచుకున్న అభిప్రాయాలే కదా. అభిప్రాయాలు పై మూడు మార్గాలలో ఏర్పడేవే గదా. అందులో హేతుబద్ధాలోచన ద్వారా గానీ, వినీ, చదివిగానీ ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ మరో పరీక్ష చేసి నిర్ధారించుకోవలసినవిగానే ఉంటాయి. (ఇక్కడి కాగుదాం. ముందీ అంశం (పై నా అభిప్రాయం) సరైందో కాదో అలోచించి తేల్చుకోండి.) ఇది తేలితే చర్చలలో తేలిన కొన్ని విషయాలు నిజానికి ఇంకో విధంగా తెల్చుకోవలసినవిగానే ఉంటాయి. చర్చావేదిక శక్తీ, పరిమితికి సంబంధించిన విషయమిది సత్యనిర్ధారణకు అవసరమైన పరిస్థితి ఎట్టిదో తెలుసుకోడానికి మార్గాన్ని చూపించే స్థానమిది. సత్యనిర్ధారణ పద్ధతేమిటోనన్న ఆలోచనను, సమస్యను మీ ముందుకు తేగల అంశమిది. సత్యానికున్న విలువేపాటిదో, సత్యం నిర్ధారించుకోవలసిన అవసరం ఏ పాటిదో తెలిసిన వాళ్ళైతే ఇకనేమి చేయాల్సుంటుందో ఆలోచించుకోండి.

తర్కం అంటే చెడ్డదన్న అభిప్రాయం లోకంలో ఉంది. మరో విషయాన్నీ ప్రస్తావిస్తే లోకంలో తర్కంపై ఉన్న అట్టి అపోహ తొలగేందుకు వీలేర్పడుతుంది. తార్కికులు తర్కమంటే ఏమన్నారో చూడండి. "అవిజ్ఞాత తత్వే అర్థే  కారణోపపత్తితః తత్వ జ్ఞానార్థం  ఊహః తర్కః" న్యాయ దర్శనం. ఒక తెలియని విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి కారణంగా ఉండగల అధారాలతో చేసే ఊహనే (ఆధారసహితమైన యోచననే) తర్క మంటారు. ఇది అర్థమైతే తర్కానికీ, హేతువాదానికీ భేదమేమిటో చెప్పండి. చాలామంది హేతువాదులు హేతువాదం, తర్కం వేరువేరంటారు. వారూ ఆలోచించి వేరనడానికి తగిన వివరాలిస్తే మేమూ ఆలోచిస్తాము.

చర్చావేదిక నియమాల సమీక్ష

1) భాషా పరంగా :

  1. చక్కగా వినడం, విన్నమాటకు అర్థాన్ని అన్నవారి నుండే స్వీకరించడం, స్పష్టంగా అనడం, తానన్న మాటలకు అర్థాన్ని చెప్పే బాధ్యత తానే స్వీకరించడం.

2. అర్థ  నిర్ధారణకు అవసరమైన మేర పూర్వాపరాల్నీ, సందర్భాల్ని గణనలోకి తీసుకోవడం   అవసరమైనమేర వ్యాకరణ నియమాల్ని పాటించడం.

3. పారిభాషిక పదాలకు నిర్వచన రూపంగా అర్థాలు చెప్పుకుని ఉండడం, ఎదుటి పక్షంవారి    భావం మనకు చేరాకనే పరిశీలనను ఆరంభించడం.

 2) వాద నియమాలు :

           1. ప్రతిపాదన ఒక విషయం పై స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండేట్లు చూసుకోడం. 

          2. ప్రతిపాదితాంశం ఏ ప్రమాణం ద్వారా గమనింపబడ్డదో తెలుసుకోవడం. 

          3. హేతుబద్దాలోచన పూర్వకమైతే ఆధారమేమిటి? అది సరైందేనా ? నిర్ణయం (సాధ్యం )

  ఏమిటి? అధారానికీ సాధ్యానికీ సాహచర్య నియమం ఉందా లేదా?

        4. అది నిర్ధారించుకోడానికి ఎంచుకున్న దృష్టాంతం సరైందేనా? ఉదాహరణకు పనికివస్తుందా?

        5. సరిపోల్చడంలో యిబ్బందులేమైనా ఎదురవుతున్నాయా? లేవా? ఉంటే ఎలాంటివి?

        6. యోచనాత్మకంగా చేసే నిగమనాని (నిర్ణయాని)కీ, ప్రయోగాత్మకంగా చేసే నిర్ణయానికీ ఉన్న      వ్యత్యాసమేమిటి?

         7. చర్చ లక్ష్యమేమిటి? సత్యప్రతిష్ఠా, జల్పమా? (గెలుపా) విషయానికి సంబంధించిందా, వ్యక్తి అవగాహనేపాటిదనేదా?

       8. ఛల, జాతి, నిగ్రహ స్థానాల గురించిన స్పష్టమైన అవగాహన ఉందా? అది అవసరమా కాదా?

       9 ఎ) హేతువు - హేత్వాభాస; బి) దృష్టాంతము - విషమ దృష్టాంతము; (ఉదాహరణ-ఉపమానము) అన్న వాటిమధ్య తేడాపాడాలు-యోగ్యతా యోగ్యతలు తెలిసి ఉన్నవా?

      10. ప్రతిపాదితాంశానికి సంబంధించిన జ్ఞానమేరకంగా సంపాదించుటకు సాధ్యమో తెలియకుండా దానిని పరీక్షించడం సాధ్యమా?

3) పరీక్షా నియమాలు :

         1) పరోక్ష పద్ధతుల ద్వారా ఏర్పరచుకున్న అభిప్రాయాలను పరీక్షించడమెలా?

         2) కలిగిన జ్ఞానం సత్యమో, కాదో నిర్ణయించడానికి సార్వజనీనమైన మార్గముందా? అసలు ఒక విషయాన్ని పరీక్షించడమంటే ఏమిటి? ఎలాగు? అన్నదాని కొరకే పై అంశాలన్నీ తడిమి చూశాము. మరింతగా విచారించుకుని ఒక సమగ్రమైన నిబంధనావళిని రూపొందించుకోగలిగితే అది అందరకూ, అన్ని కాలాలకూ కూడా జ్ఞానపరంగా ఎంతో మేలును కలిగించగలదు. ఈ మహత్తర కార్యంలో మీ వంతు బాధ్యత మీరూ నిర్వర్తించండి. వేదికలో పాల్గొనండి. ఉంటాను, సెలవ్.

                                                                                                                                      సత్యాన్వేషణలో.... మీ సురేంద్ర

కల్కి బండారం

 (వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక సభ్యులు కల్కి భక్తుల కార్యక్రమాలలో పాల్గొని అక్కడ జరుగుతున్న వంచనా రీతులను బహిర్గతం చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ పి. యోగయ్యగారి అనుభవాలు ఇలావున్నాయి. సం.)

విజయవాడలో మాచవరము నందు 1997 జూన్ 21, 22 తేదీలలో కల్కి భక్తగణం ప్రకటించిన వరయజ్ఞమునకు హాజరైన 70 మందిలో నేను ఒకడిని. కల్కి వారి భక్తగణం యజ్ఞం పేర చేస్తున్న హిప్నాటిజంను నేను స్వయంగా అనుభవించాక వారు చేస్తున్న మోసపూరితమైన యజ్ఞ విశేషాలను, ఆరోజు అనుభవాలను సమాజానికి తెలియజేయడం అవసరంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాలాగా మోసపోకూడదనియు, కల్కి పేర జరిగే ఈ యజ్ఞం పచ్చి మోసంగా ఉందో లేదో ఈ క్రింద నా అనుభవం చదివి మీరూ ఆలోచించండి.

ప్రకటించిన సమయానికి నేను వెళ్ళాను. బుక్కింగ్ లో రూ. 225/-లు చెల్లించగా చిన్న పేపరు మీద పేరు పైకము వ్రాసి యిచ్చినారు. తరువాత గేటువద్ద ప్రమాణం చేయించినారు. అది ఏమనగా "బీడీ, సిగరెట్టు, మత్తు పదార్ధములు ముట్టను. నేను కల్కి భగవాన్ నకు విధేయుడనై వుంటాను. కల్కి సత్సంగములో నేను అనుకూలముగా ప్రవర్తిస్తాను, వ్యతిరేకం చేయను, ధన మాన ప్రాణాలకు హాని కలిగినను కోర్టుకు వెళ్ళను, నా జీవితము కల్కి భగవాన్ కు అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను." తరువాత మంచి ఆకర్షణీయముగావున్న కల్కి నిలువెత్తు పటమునకు పూజా కార్యక్రమము చేసినారు. 'నామ మెంతరుచిరా కల్కినామ మెంతో రుచిరా' అని లీలాగానము (భజనలు) చేయించినారు. ఫొటోకి సాష్టాంగ దండ ప్రమాణములు చేయించినారు. తరువాత ఘట్టం ప్రారంభమైంది. ఇది మనిషి బలహీనతను ఆసరా చేసుకుని వారిని వశపరచుకునే ప్రక్రియ. అదే ఏమిటనగా యాచకునిగా, దీనునిగా, హీనునిగా పశ్చాత్తాపము కలిగి దుఃఖించండి (అలా పదే పదే) బాగా దుఃఖించండి, బాగా ఏడ్వండి ఎంత ఏడిస్తే, అంతగా కల్కికి దగ్గర అవుతారు. మీరు చేసిన పాపములు గుర్తుతెచ్చుకొని ఏడ్వండి బాగా ఏడ్వండి, పెద్దగా ఏడ్వండి, అని పదే పదే, పదే పదే సజషన్స్ ఈ యజ్ఞాన్ని నడిపించే దాసుగారు యిస్తూ ఉంటారు. హిప్నటిజం ప్రదర్శన చూచిన వార్కి ఇది క్రొత్త అనిపించదు. దాసుగారు నాకుమట్టుకు నాకు హిప్నటిజం మాష్టారుగా అనిపించారు. అదిగో కల్కి మీ దగ్గరకు వస్తున్నాడు. మీ కళ్ళ దగ్గరకు వస్తున్నాడు, మీ లోకి వస్తున్నాడు, బాగా ఏడ్వండి. ఈ విధంగా సజేషన్స్ ఇస్తారు. (మిగతాది  వచ్చే సంచికలో)



No comments:

Post a Comment