Tuesday, March 7, 2023

11 సంచిక వివేకపథం

 

  

వివేకపథం

సంపుటి : 1 జూన్ 1997. సంచిక : 11

 వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక తెలంగాణ జిల్లాల పర్యటన విశేషాలు 

సమాజ హితకాంక్షులైన పాఠక మిత్రులారా! ఈ సంచిక కొరకై మీలో చాలామంది ఎదురు చూస్తుంటారని తెలుసు. ప్రతి జిల్లాలోనూ చెప్ప వలసిన అంశం ఒకటే గనుక ప్రతిజిల్లా ప్రసంగాలుగా కాకుండా మొత్తం ప్రసంగాల సారాంశాన్ని వివరిస్తాను.

పర్యటన బృందం ప్రజలకు తెలుపవలసిన అంశాలు రెండు 1. ఐక్య వేదిక గురించి, 2. కల్కి వంచన గురించి. వీటిని గురించి వివరించే పని నేనూ, గుత్తా రాధాకృష్ణ, Ch. వెంకట్రామయ్య, ప్రసాద్ గార్లూ చేశాము.

ఐక్య వేదిక పూర్వాపరాలు:- సమాజంలో మార్పుకై యత్నిస్తున్న సంఘాలలోని పెద్ద లెందరో తమ తమ ఉద్యమాలు అనుకున్న ఫలితాల్ని కోరుకున్న స్థాయిలో సాధించలేక పోయాయన్నది గుర్తించారు. దానికి కారణం తగినంత శక్తి లేకపోవడం, దీర్ఘకాలిక కార్యాచరణకు అవసరమైన ప్రణాళిక లేకపోవడంగా తేల్చుకున్నారు. ఆ అవగాహన నుండి భావసారూప్యతగల మిత్ర సంఘాలను ఉమ్మడి కార్యక్రమానికై కలుపుకోవాలనే యత్నంచేశారు కొందరు. అనేక కారణాలవల్ల అది కార్యరూపం ధరించలా. ఈ పరిస్థితి యిలా ఉండగా సత్యాన్వేషణ మండలి గత 5 సంవత్సరాలుగా తాత్విక చర్చావేదికను ఒక దానిని ఏర్పరచి ఒక్కో ధోరణినీ, భిన్న ధోరణుల పెద్దలతో కూడిన సమష్టి వేదిక పై విశ్లేషిస్తూ విచారిస్తూ వస్తోంది. ఆ క్రమంలో పరస్పరం దగ్గరైన భిన్న ధోరణులు పెద్దలలో కొందరి నుండి నాకో సూచన అందింది. ఎలాగూ ఒక రకమైన సమష్ఠీ వేదికను నిర్వహిస్తూ వస్తున్నారు గదా ఉమ్మడి కార్యక్రమం కోసం అందరం కలిసి పనిచేయడానికి వీలైన ఐక్య వేదికకై యత్నించకూడదా అని. కూడదనేమిలేదు. కాకుంటే అది ఒకణ్ని చేయవలసిన పనిగాదు. కలిసి యత్నిద్దామంటే నేనిప్పటినుండే సిద్ధము మీరు రెడీనా అనడిగా నా మిత్రుడ్ని: O. K. అన్న వాళ్ళన్నారు. తటస్థంగా ఉన్నారు కొందరు. ఆ క్రమంలో ముందుగా నా ఆలోచన గుత్తా రాధాకృష్ణగారితో 96 అక్టోబర్. B. H. E. L. క్యాంపులో చెప్పడం వెంటనే అలాగే చేద్దామనడం, అటు పిమ్మట కొద్ది సమయంలోనే రాష్ట్ర కార్యవర్గంతో చర్చించి ఆం. హే. సంఘం ఐక్యవేదికలో “పాలుపంచుకోడానికి తీర్మానించు కోవడం జరిగినది. పిమ్మట ధర్మాచరణ మండలి తిరుపతి, ఆర్య సమాజ్ “గుంటూరు, విజయవాడ శాఖలు, అవగాహన సంస్థ గుంటూరు, జన చైతన్య వేదిక, J. K స్టడీ సెంటర్ చిత్తూరువాళ్ళూ దీనిలో మమేకమైయ్యారు. ఆ బలిమితో ప్రధమంగా కోస్తా జిల్లాల పర్యటన పూర్తి చేశాము. ఆయా జిల్లాల నుండి మార్క్సిస్టు దృక్పధంకల కొన్ని సంఘాలు, అంబేడ్కర్ ఉద్యమం'లో ఉన్న కొన్ని శాఖలు ఐక్యవేదికలో పని చేయడానికి నిర్ణయించుకుని జిల్లా కమిటీలో చేరాయి.

ఈ మా తెలంగాణాజిల్లా పర్యటన కాలంలో రెండు మూడు విద్యార్థి సంఘాలూ తోడయ్యాయి. మాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిం చిన అంశమేమంటే ఇప్పటి వరకు ఎవరంగడి వాళ్ళదిగా ఉన్న వాళ్ళందరూ విషయం వివరించాక పరిస్థితిని అర్థం చేసుకుని జరిగిందిచాలు, మన మధ్య బేధభావాలొద్దు.. కలసి పనిచేయవలసిన అవసరం గుర్తించాము. అంటూ ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాధాకృష్ణగారు మరింత ఉత్సాహాన్ని, స్నేహ హస్తాన్నీ ఇచ్చి పుచ్చుకో వలసిన అవసరాన్ని వివరిస్తూ సైద్ధాంతిక భావ సారూప్యతకల సంఘాల మధ్యనే ఐక్య సంఘటన ఉండాలని కొందరంటున్నారు. అది సరికాదు. సాధ్యమూకాలేదు అన్నది మన గతానుభవం. కనుక ఆ అభిప్రాయాన్ని మార్చుకోవలసిన తరుణమిది. ఒక్కో అంశంపై భావసారూప్యత కలిగిన సంఘాలన్నీ కలసి కనీసకార్యక్రమం దగ్గర దగ్గరైతే క్రమంగా సత్సంబంధాలు ఏర్పడి మెరుగుపడవచ్చు. కాబట్టి Common minimum programme తో మంచిని వాంచించే ఏ సంఘంలోనైనా మనం కలసి పనిచేసే నైజాన్ని పెంచుకోవాలి. ఇది ఈనాటి సామాజికావసరం అంటూ నొక్కి చెప్పారు. అందుకు ఉదాహరణగా కల్కి వంచనపై పోరాడదాం అనుకున్నపుడు కలసి రాని భావ సారూప్య సంఘాల వైఖరినీ, కలసి పనిచేయడమేగాదు, వంచనను ఎదుర్కొనడంలో ప్రాణాలర్పించడానికైనా సిద్ధం అన్న భావసారూప్యత లేని సంఘాల్ని ఉదహరించారు. కనుక కలసి పనిచేయగల మనస్సున్న వాళ్ళందరం కలసి పనిచేద్దాం. ఇక్కడ సిద్ధాంత రాద్ధాంతాల గొడవద్దు అనీ ఆయన చెప్పారు.

 సామాజిక విప్లవాన్ని కాంక్షించే ఉద్యమాలు ప్రబలం కాకపోవడానికి ప్రధాన కారణాలిలా ఉన్నాయి..

  1. కార్యాచరణకూ, దాని కొనసాగింపుకూ తగినంత శక్తి లేకపోవడం 

  2. ఉన్న శక్తులు కూడా అనైక్యతవల్ల మరింత బలహీనంగా తయారవుతుండడం.

  3. ప్రతి తాత్విక దోరణిలోనూ ఇమిడి ఉండే అనేకాంశాలలో ఏవో కొన్ని విషయాల్లో పరస్పరం విభేదించుకుని ఒకరికొకరం పరాయివాళ్ళం అన్న భావాన్నేర్పరచుకుని అమిత్ర భావనతో ఉండడంవల్ల ప్రధాన లక్ష్య మైన సమాజ హితమన్నది అప్రధానంగా ఎంచబడడం.

  4. ఉద్యమానికి ఊపిరివంటిదైన కార్యకర్తల నిర్మాణంలో శ్రద్ధ వహించక, ఆదర్శాల నినాదాలు చేసుకుంటూనో, ఎదుటి పక్షంలోని ఉన్న దోషాలను ఎత్తిచూపుకుంటూనో, లేని దోషాలనూ ఆరోపించుకుంటూనో వేదికలపై ఉపన్యాసాలూ, రచనా వ్యాసాంగాలు చేయడమే ఉద్యమమంటే అన్న భ్రాంతిలోపడి ఉండడం.

  5. ఉద్యమ నాయకుల మధ్య సరైన అవగాహన లేమివల్ల ఉద్యమం బలపడడం కంటే నాయకత్వ కుమ్ములాటే ప్రధాన భూమికను వహించడం.

  6. నిజాయితీ పరులైన ఉద్యమ కారుల మధ్యన కొందరు స్వార్థ పరులు ఉద్యమకారుల వేషంలో చొరబడి ఉండడం. ఇదిలా ఉండగా.

A. నిజాయితీపరులై ప్రాణాలర్పించడానికైనా వెనుదీయని కార్య కర్తలలో ఆలోచన, అవగాహనల పాలుకంటే ఆవేశం, ద్వేషం పాలు ఎక్కువై ఉండడం.

B. ఆలోచనగల వారిలో స్వార్థపరత ఎక్కువై యుండడం. అన్నవీ - కారణాలే అయి; ఈ మొత్తం కలిసిగానీ, విడివిడిగా పని చేస్తూగానీ ఉద్యమ కార్యాన్ని బలహీన పరుస్తున్నాయి.

కనుక ఈనాడు ఉద్యమ నిర్మాతలపైనున్న పెద్ద బాధ్యత ఉద్యమ కార్యకర్తల నిర్మాణము అన్నదవుతోంది. ఇది ఐక్య వేదిక కొరకనిగాక ఏ సమాజికోద్యమ నిర్మాణానికై నా ప్రాణప్రదమైన దవుతోంది. కనుక ఈ విషయంలో మనమందరం అర్ధం చేసుకుని ఉండవలసిన మరికొన్ని అంశా లను వివరిస్తాను పరిశీలించండి.

1. సామాన్యునికీ ఉద్యమ కార్యకర్తకు మధ్యనున్న అతి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, సామాన్యుడు సమాజం తనకేమిస్తుందో ఏమి పుచ్చుకోగలనో అన్న వైఖరిని అనుసరిస్తుండగా, ఉద్యమ కారుడు సమాజానికి తానేమివ్వగలడో, ఎంతివ్వగలడో, ఎలా ఇవ్వాలో ఆలోచిస్తుంటాడు. అవునా, కాదా? అనడిగాను. ఆలోచించి కరెక్టే నన్నారు. అయితే నిజాయితీగా మిమ్ము మీరు పరిశీలించుకుని ఉద్యమ కార్యక ర్తగా మీ రిప్పటికే యోగ్యత కలిగి ఉన్నారో, లేక ఇంకా మిమ్ము మీరు రూపొందించుకోవలసే ఉందో తేల్చు కోండి. ఎందుకంటే నిజాయితీ, క్రియాశీలతకల వ్యక్తులే కార్యకర్తలై ఉద్యమాన్ని సజీవంగా ఉండేట్లు చేయగలరు.

2. ఉద్యమాలేవైనా సమాజంలో సరైన మార్పును కోరేవిగానే ఉంటాయి. అలా మంచి మార్పునాశించే ఉద్యమ కార్యకర్త అవసరమైన మార్పును తన నుండే ఆరంభించాలి. ఇది అత్యంత మౌలికమైన విషయము. తానూ సమాజంలో భాగమే కనుక తన నుండి ప్రారంభమయ్యే మార్పే దృడంగా ఉండగలదు. సంస్కర్త మాటలద్వారా కాక జీవితాచరణ ద్వారా సమాజాన్ని ఉత్తేజితం చేయగలగాలి. చేతలలో మాట్లాడడమంటే ఇదే. ఇప్పటికే మీరలా చేస్తుంటే సరే. లేకుంటే మాత్రం సరైన మార్పంటే ఏమిటో తెలిపి అలాంటి మార్పు తనలో తెచ్చుకునేందుకు దృఢమైన, క్రమ మైన, నిరంతరాయమైన యత్నం చేస్తుండాలి. అందుకు మానసికంగా సిద్ధపడి ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోండి అన్నాను.

క్రియాశూన్యమైన మాటల వల్ల ఒరిగేదేమీలేదు. అయితే గియితే అమాయకుల్ని నమ్మించడానికి పనికి వస్తుందదంతే. ఏమంటారు? అనడిగాను అవునంటే అవుననుకున్నాము. ఈ సమయంలో కార్యకర్తలకు అధ్యయన తరగతులు నిర్వహించుకోవడం అవసరం అన్న మంచి సూచన చేశారు, రాధాకృష్ణగారూ, మరి కొందరు మిత్రులున్నూ.

3. భిన్న సంఘాల పేరున మనం పనిచేస్తున్నా పరస్పరం వేరు వేరు అనో వ్యతిరేకులమనో అనుకోవాల్సిన పనిలేదు. అలా అనుకోవడం సరైన అవగాహనాకాదు. ఎందుకంటే ప్రధాన లక్ష్యం విషయంలో (సరై న మార్పురావాలి, అనుకోవడంలో) స్పష్టమైన ఏకలక్ష్యంకల మనం వా స్తవానికి మిత్రులమే అవుతాము. మన మధ్య తేడాలు అనేకంగా ఉన్నా అవేవీ మన మధ్య మైత్రికి ప్రతిబంధకంగానీ, శతృత్వానికి నాందీ గానీ కానవసరంలేదు. ఇది మన మందరం (ఉద్యమ కార్యకర్తలందరూ) నిరంతరం గుర్తుంచు కోవలసిన అంశం.

4) ఈనాడు ఉద్యమాలకు సరైన కార్యకర్తల అవసరం ఎంతగానో ఉంది; యోగ్యులూ, సమర్థులూ ఐన కార్యకర్తలు తగినంత మంది లేనిలోటు కొట్టొచ్చినట్లుగా కనబడుతూనే ఉంది. దీనిని సవరించుకోవాలంటే ఒకటే మార్గం. కార్యక ర్త అన్నపదం సార్థకం కావాలంటే ప్రతికార్యకర్తా తనలాంటి వారిని తయారు చేసుకోవడానికి శతథా యత్నించాలి. అప్పుడే ఉద్యమ కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

 Note:- ఈ సందర్భంలో ఒకరిద్దరు అదెలా సాధ్యం? తనలాటి వాడు అనడానికి వీలుగా ఎదుటివాడు అచ్చం తనలాగా ఎలా అవుతాడు? లాంటి కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దానిపై కొంత విశ్లేషణ జరిగాక 'ప్రధానాశయం,' క ర్తవ్యనిష్ఠ' అన్న వాటిలో తనలాంటి వాడనే దానర్ధం ఒడ్డూ, పొడుగూ లాంటి విషయాల్లో అనికాదు అన్న వివరణతో ఏకాభి ప్రాయానికి రావడం జరిగింది.

ఐక్య వేదికకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పు కోవాల్సి ఉంది. ఏ అవసరం నిమిత్తం ఐక్యవేదిక నిర్మించుకున్నామో దానిని అందులోని భాగస్వామ్య పక్షాలైన మన మెవ్వరంగానీ సరైన అవగాహన తోనూ పూర్తి బాధ్యతతోనూ కాపాడుకోకుంటే ఐక్యవేదిక చీలిపోవడం అతి సులభం. అయితే దానిని సక్రమంగా నిలుపుకోగలిగితే మాత్రం అది నిర్వహించగల పాత్ర అనితర సాధ్యం. కనుక వివేకంతో, మైత్రీభావంతో, సామాజిక స్పహతో ఎవరికివారం దానిని నిలిపి ఉంచుకోవడానికి యత్నిద్దాం. ఐక్య వేదికకు ప్రతికూలురగుటద్వారా సామాజికాభ్యుదయానికే ప్రతికూల శక్తిగా మారేపని చేయొద్దని విజ్ఞప్తిచేస్తూ ముగిస్తున్నాను. చేయి చేయి కలపడం ద్వారా మాత్రమే చెడుకు ప్రత్యామ్నాయ శక్తి నిర్మాణం చేసుకోగలం అన్నది గమనించ గోర్తాను.

మొత్తం పర్యటనలో కల్కి గురించి మాట్లాడిన మాటల సారాంశం యిలా వుంది :

కల్కి ఉద్యమం ఒక వంచనా రూపం. ఒక మనిషి తానే దేవుణ్ణని ప్రకటించుకోవడం రెండు సందర్భాలలో సంభవం. 1) ఒక రకమైన మానసిక వైకల్యం నుండి జనించిన భ్రాంతివలన 2) కావాలని తెలిసి చేసే వంచనా రూపం. ఈ రెంటిలో రెండో తరహాకు చెందిందే ఈ కల్కి ఉద్యమం. ఎంతో ప్రణాళికాబద్దంగా, కుటిలనీతితో ఎందరో ప్రముఖులను ఆకట్టుకుని పకడ్బందీగా కొనసాగిస్తున్న వీరు అమాయకులనిగానీ, మానసిక చాంచల్యంతో మతిచెడి తానే దేవుణ్ణని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని గానీ అనుకోవడం మన వెర్రితనమవుతుంది. డబ్బు గుంజుకోవడం ప్రధానాశయంగా కొనసాగుతున్న కార్యక్రమ మీది. అందుకుగాను వారేసిన ఎర "వరయజ్ఞం" [కోరుకోండి ఇప్పటికి తీరని కోర్కెలుంటే అంటూ సామాన్య జనాన్ని ఆకర్షిం చడం] అందుకుగాను వందలకు వందలు దక్షణలు భక్షించడం వెనుక ప్రజ లకై పనిచేయాలనే నైజం ఉందనుకోవడం ఎలా? నగరాల్లో, పట్టణాల్లో నెలకు నాలుగు ధన యజ్ఞాలు సాగుతున్నాయి.  ఒక్క హైద్రాబాద్ లోనే నెలకు 40 లక్షల పైబడి రాబడి ఉందని లెక్కలు తెలుపుతున్నాయి. 'ఇలా ఎన్నో ప్రధాన నగరాలు, పట్టణాలు. సమదర్శిని ప్రకటన మేరకే భక్తుల మంద 50 లక్షలు ఉంది. యజ్ఞ రుసుముల రూపంలో కాక స్వచ్ఛందంగా పిచ్చి మంద యిచ్చే చందాల లెక్కేమిటి.? మనీ కలెక్షను, కొత్త భక్తుల బుకింగు సాక్ష్యం చెప్పడం లాటివాటికి కమిషన్ పద్ధతిన పనిజేసేవాళ్ళే అసలు సిసలు ప్రమాదకారులు సమాజానికి. తత్వ శాస్త్రీయంగా. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని (అటు భావవాద తత్వంగానీ, ఇటు భౌతికవాద తత్వంగానీ ఏ మాత్రం తెలీని) బుద్ధిహీనులే ప్రచారకులుగా, ప్రముఖులుగా చలామణీ అవుతున్నారీ సంఘంలో. ఎలాగంటే జనగాం సదస్సులో మాట్లాడుతూ భారతీయ ఆస్తిక ధోరణికి ఆధారాలు సాధికారికాలు అనదగ్గవి ఉపనిషత్తులు. అందులోనూ సంహితా భాగానికి చెందింది ఈశావాస్యం. దానిలో ఈశ్వరుని గుణగణాలను చెపుతూ 'అకాయం' అవ్రణం, అస్నావిరం.... శరీరం లేనివాడనీ, నరాలు, నాడులు, తంతువులు లేనివాడని, వ్రణములు లేనివాడని చెప్పబడింది. తార్కిక నియతి ననుసరించైనా సృష్టికర్తకు మూడు లక్షణాలు అవశ్యంగా అంగీకరించాలి. సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్త్వ, సర్వశక్తి మత్వాలే అవి. అని చెప్పి ఆస్తిక తత్వశాస్త్రం ప్రకారం దేహధారి ఎవరుగానీ దేవుడవడానికి వీలులేదు. జన్మ మరణాలు - పుట్టుక చావులు - కలవారెవరూ దేవుడగుటకు వీలు లేదు. కనుక సిద్ధాంతం ప్రకారం ఈ కల్కి వేషదారీ మోసకారేగాని దేవుడూ కాదు దయ్యమూ కాదు.

  ఇక అసలీ 'కల్కి' అవతారాన్ని గురించి ప్రస్తావించిన ఆధార గ్రంథాల ప్రకారమైనా.. 1. కల్కి పురాణం, 2. భవిష్య పురాణం, 3. దశావతార వాదం, 4. థియో సాఫికల్ సొసైటీ ప్రధానుల్లో ఒకరైన మేడం బ్లావిట్ స్కీ రచించిన సీక్రెట్ డాక్ట్రిన్, 5. నాస్ట్రాడామస్ లాటి కొందరు చేసిన ప్రడిక్షన్సు ఆధారం. అందులోనూ 4, 5, అంశాలకు మూలం మొదటిమూడే. వాటి ప్రకారం చూసినా మదరాసీ లేక రామకుప్పం కల్కి; వేషగాడూ మోసగాడూ కూడా. ఏమంటే దశావతారాల కల్కి హిమాయాల నుండి రావాలి. అతడి తల్లి పేరు ఈ దొంగ కల్కి తల్లి పేరు వేరు. ఆ కల్కి కన్యకు పుడతాడు. ఈతడు నిక్షేపంలా మనలానే అబ్బా అమ్మకే పుట్టాడు. వాడు శంబల గ్రామం నుండి తెల్లని గుర్రంపై, బంగారు కత్తితో బయలుదేరి వస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. ఆకాశం నుండి దిగి వస్తాడు లాటి వివరాలున్నాయి. మరి వీడేమో, వీడి గెటప్పు, సెటప్పేమో అందుకు పూర్తి విరుద్ధం. సన్యాసి వేషం, చేసేది మామూలు సంసారమే. ఆ పొట్ట, ఆ గడ్డం అదొక వికార రూపం. పెళ్ళాం, బిడ్డలు మళ్ళా వాళ్ళ పెళ్ళిళ్ళూ వారికి చదువు సంధ్యలూ దోపిడీ సొత్తులో వారసత్వపు పొత్తూ; ఈ కచాట అంతా చూస్తున్నా బుద్ధిరాదీ అనుచరగణానికీ, అమాయకపు స్వార్థపిండాలకు.

నోట్ :- డబ్బుకు కక్కుర్తిపడి కమిషన్ కోసం భక్తులుగా నటించే దొంగమందను అలా ఉంచి, తమ డబ్బునే పోగొట్టుకునే వంచితులైన, అమాయకపు జనంకూడా; తాత్వికపరమైన అవగాహనా శూన్యులేగాని, అప్పనంగా కోర్కెలు తీరాలన్న స్వార్థపరతలో అమాయకులేం కాదు. చేయనిదానికి రావాలన్న, చేసిన అవకతవకల వల్ల రానున్న, వచ్చియున్న అరిష్టాలు ఊరకనే తీరి పోవాలన్న దుర్మార్గపు ఆలోచనే, ప్రధానంగా వీరిని వారికి తొత్తులు అయ్యేట్లు చేస్తోంది. వైద్యం లేకుండానే రోగం తగ్గాలి. పని చేయకుండానే పబ్బం గడవాలి. ఇవన్నీ ఒక రకమైన మెంటల్ కేసులూ, స్వార్ధపు లబ్దికై పైసా యిచ్చి పదివేలు కోరే వంకరబుద్ధులే కనుక ఒక వంక దోపిడీకి గురవుతున్నా!? వీరూ దోపిడీ మన స్తత్వం కలవారే. కనుకనే ఎన్ని సుద్దులు చెప్పినా బుద్ధి రాదు. లుబ్ధులూ , సోమరులూ ఐన ఈ రకం జనానికి. తేరగా రావాలనుకునే వారిని తెగేసే రోజు వచ్చినప్పుడే ఈ సమాజానికి నిజమైన విముక్తి లభిస్తుంది.

ఈ కల్కికి ప్రచారకులుగా ఉన్న వైద్యుల్ని మక్కెలిరగదన్నాలి. సమాజం వీళ్ళ నెత్తిన ఒక్కోని చదువుకు 7, 8 లక్షలు పోసింది వైద్యం మాని కల్కి భజనలు చేయించేందుకా? వీరికి కల్కిపై నిజమైన భక్తైనా ఉండేడిస్తే ఆస్పత్రి మూసేసి ప్రతి రోగికీ ప్రార్థనచేసే రోగాలు పోగొట్టొచ్చు గదా. అబ్బే సొంత రాబడి కేం లోటు రాకూడదు. అదనంగా ఈ రూపంలో కూడా . అంతో యింతో సంపాయించాలి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్టూరుకుంటోంది. ప్రజా ప్రతినిధులూ, ఈ వంచకులూ పరస్పరం ఒకరి కొకరు అండదండలుగా ఉంటున్నారు. న్యాయవ్యవస్థకెలానూ కళ్ళులేవు. ఇక మిగిలిన చిన్న చిన్న హెూదాలు వెలగబెట్టేవారందరు వేమన అన్నట్లు 'పసిడిగలవాని బానిస కొడుకులు.’

ఈరోజు ఈ దొంగలపై కేసు పెట్టడానికి వీలులేనంత బలహీనంగావుంది సివిల్ క్రిమినల్ కోడ్. అతడేం మోసం చేశాడో ఆధారాలు చూపమంటుందే గాని, దేవుడనంటున్నావు, సిద్ధులు, మహిమలు ప్రదర్శిస్తున్నావు, బహిరంగంగా ప్రచారం చేస్తున్నావు వాటి యదార్థతను మా ఎదుట రుజువు పరుచు అని నిలేసి సామాజిక న్యాయానికై బాధ్యత వహించే నాధుడులేడు. ఎంత దిక్కుమాలిన పరిస్థితి యిది. మోసం జరిగిపోతోందని తెలిసినా ఏమీ చేయ లేనిస్థితి. అవతలివానిది మోసమని మనం సాక్ష్యాధారాలు చూపాలేగాని, అతడు ప్రకటించి ప్రచారం చేస్తున్న అంశాలు సరైనవేనని రుజువు పరచు కోవలసిన బాధ్యత అతనిదేనన్న కనీస న్యాయాన్ని ప్రదర్శించలేని, అట్టి వెసులుబాటులేని న్యాయపరమైన నియమ నిబంధనలు ధర్మపక్షాన్ని మరింత కుంగదీస్తున్నాయి. ఈరోజు న్యాయవాది వృత్తంటే ఏమిటో మనందరకూ తెలుసు. అబద్దాలాడడం చేతకానివాళ్ళ కావిద్యనేర్పే నిపుణులెవరంటే ముందు చెప్పవలసింది న్యాయవాదులనే. ఇది మింగుడుపడకున్నా కాదనడానికి వీలులేని బహిరంగ రహస్యం. ఇక ‘న్యాయనిర్ణేతలు' ఇంగితం ఒక వంక హెచ్చరిస్తున్నా దోషాదోషాల్ని పసిగట్టగలిగినా చట్ట పరిధులలో ఇరుక్కుని ఉండడంతో ఏమీ చేయలేని దుస్థితి.

డబ్బు దండిగా ఉన్నా, రాజకీయ నాయకుల, గూండాల అండదండలున్నా, పోలీసేమి చేయలేడు, చట్టమేమి చేయలేదు, ప్రభుత్వం పట్టించుకోదు. ఇది నేటి వాస్తవ పరిస్థితి. సరే ఈ కంఠశోష నాపుదాం.

జనగాం సభలోనే హాజరైయున్న కల్కి భక్తుల్లో [ ప్రచారకుడో పెద్దో తెలీదుగాని] బాగా తెలుసు ననుకుంటున్న ఒకాయన ఏమండి భగవంతునికి భార్యా బిడ్డలుండకూడదా రాముడికీ, కృష్ణుడికి లేరా? అంటూ ఒక పిచ్చి ప్రశ్నవేశాడు. ఆస్తిక స్వరూపం ఏపాటి తెలుసో తెలుస్తూనే ఉంది. ఆయినా పదిమందికీ తెలుస్తుందిగదా అనుకుని అయ్యా! రాముడూ దేవుడుకాదూ, కృష్ణుడూ దేవుడుకాదు. రామాయణంలో వాల్మీకే రామునిచేత "ఆత్మానం మానుషంమన్యే రామం దశరథాత్మజం" అని పలికించాడు. రాముడే తనను తాను మనిషినేనని చెప్పుకున్నాడు. దేవునికి అత్తలూ, మామలూ, తాతలూ, భావలూ, మరదులూ, శత్రువులూ, మిత్రులూ, స్వజనమూ, పర జనము, స్వదేశమూ, పరదేశమూ ఏంట్రా నాయనా? అంటే బుర్రకెక్కితే కదా! తూర్పు పడమర తెలీని, తాత్వికంగా బొడ్డూడని ప్రతివాడూ జ్ఞానే, ప్రచారకుడే, దార్శనికుడే అయిపోతున్నాడీ రోజుల్లో.

ఇప్పటికే జియ్యరుస్వామి, వేదవ్యాస, వేదవ్రత లాంటి కొందరు పరోక్షంగా అతణ్ణి వేషగాడని ప్రకటించగా, సుందర చైతన్య, గణపతి సచ్చిదానందలైతే బహిరంగంగానే వంచకుడని ఆక్షేపించారు, ఈ విషయాన్ని చెప్పినపుడా కల్కి కాటుకు గురైన ఆ కుర్రవాడు, వాళ్ళు మీకు ప్రమాణమా అంటూ ఎదురాడాడు. ప్రమాణికులని కాదు నాయనా, దేవుని గురించి అటు తత్వశాస్త్రంగానీ, ఇటు పురాణాలుగానీ ఏమి చెపుతున్నాయన్నది, కనీసం చదివి వున్నారు వాళ్ళు. అసలా పురాణాల్లో చెప్పబడిందే సత్య నిర్ధారణకు నిలవదు. దానికంటే అధమాధమ స్థాయికి చెందింది ఈ కల్కి వేషం అన్నాను. అబ్బే ఒక పట్టాన అర్థం చేసుకునే నైజంగానీ, బుద్ధికుశలతగాని ఉండేడిస్తేగదా, కల్కి భక్తురాండ్రు ఆవేశంగా మేమేమి మోసగాండ్లం కాదు, మోసపోవడమూ లేదు, మాకు అనేకానేక అనుభవా లున్నాయి. అంటూలేచి ఇంటిదోవ పట్టారు. ఉన్న వివేకులందకు ఆలోచనకు పనికివచ్చే పై అంశాలనే మరొకసారి వివరించి ముగించా నావిషయం అప్పటికి.

జనగాంలో ఈ కల్కి గుంపు ఒక ప్రచారం లేవనెత్తారు. కొత్తగా జూన్ 15న కల్కి జనగాంలో దర్శనమిచ్చి సంభాషిస్తాడని. ఈ విషయం నా చెవినబడగానే అచ్చటి ఐక్యవేదిక కార్యకర్తలకొక సూచనచేశాను. అయితే మీ కల్కికి ఇక్కడ ఆఖరి రోజు జూన్ 15 నేనని ఒక కరపత్రం వేయమని. జూన్ 15 దాటాక ఏం చేస్తారో ఈ పిచ్చోళ్ళు చూడాలి.

హైద్రాబాద్ లో ఒక కల్కి భక్తుణ్ణి, ప్రచారకుడ్ని అడిగాను. రాముడూ, కృష్ణుడూ వగైరా దేవుళ్ళుండగా ఈతని కాళ్ళెందుకట్టుకున్నావని. ఆళ్ళందరూ ఇప్పుడు లేరుగదండీ అన్నాడతడు. అంటే రాముణ్ణి ప్రార్థిస్తే కోర్కెలు సిద్దించవన్నమాట మరైతే పిచ్చాయనా ఈ కల్కి గూడా నాల్గు నాళ్ళలో చస్తాడుగదా? అప్పుడేం జేస్తావ్ అనడిగా. అలా అంటూనే ఇంతకూ నీ కోర్కేమిటంటావ్? అనగా బిడ్డ పెళ్ళి జరగాలి. యోగ్యుడు రావాలి. నామీద మాత్రం బరువు పడకూడదు అన్నాడు. జరక్కపోతే ఏమిజేస్తావ్ అన్నా. ఒక పిచ్చినవ్వు నవ్వి నా పరిస్థితీ అటూ ఇటూ గాకుండా ఉంది సార్ అన్నాడు.

కల్కి మహిమలుగా ఈ దొంగ గుంపు ప్రచారం చేస్తున్న కొన్ని అంశాలు మీ అందరకు తెలియ జేయడం మంచిదనిపిస్తోంది. 1) మనతో పాటు కూల్ డ్రింక్ తాగుతాడు, 2) ఫొటో నుండి అమృతం, తేనె ధారలుగా కారుతుంది 3) విభూతి, కుంకుమ రాలుతున్నాయి 4) చిన్న ఫొటో పెద్దదై పోతుంది 5) ఫొటోలో నుండి చేతులు బయటకు వస్తాయి 6) మన ఇంట్లోనే చిన్న పిల్లవాడుగా తిరుగుతుంటాడు. 7) ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తాడు 8) ఆపరేషన్ కేసులు ఆపరేషన్ చేస్తాడు, లేదా ఆపరేషన్ లేకుండానే నయమై పోతాయి. ఈ అంశానికి సాక్ష్యమిస్తూ హైదరాబాద్ కల్కి దొంగాటకానికో సూత్రధారిలాంటి సత్యనారాయణ అనేవాడు (ఇతడు కల్కి బురదను రాజధానికి పులిమినోళ్ళలో ప్రథముడు) కల్కిని ఈనాడు దొంగంటున్న అజిత్ కుమార్ తోబాటు వరయజ్ఞాదుల్లో శిక్షణ పొందినవాడుకూడా) తన కొడుక్కు 'యాక్సిడింటై చనిపోయాడనీ తాను కల్కిని ప్రార్థించగా బ్రతికాడనీ చెప్పాడు. అలాగా సరే గానీ అతడు చనిపోయాడని ఎవరు నిర్దారించారు? ఎలా నిర్ధారించారు అనడిగాను. తడబడ్డాడు. మేమే చూశాము. 40 నిమిషాలు శ్వాస ఆడలేదు అన్నాడు. ఎలా గుర్తించారన్నాను. ముక్కు దగ్గర చేయిపెట్టి అనన్నాడు. తరవాత అతణ్ణి హాస్పటల్లో చేర్పించారని చెప్పాడు. అలాగా డాక్టర్లేమన్నారు? అనడిగాను. అసలెలా ఎడ్మిట్ చేసుకున్నారు చచ్చినోణ్ణి అనడగాలి కద కొనసాగించడం కోసం అ మాటడగలేదు. హెూప్ లెస్ అన్నారనీ, వారం రోజులుంటేగాని ఏ విషయం చెప్పలేమని చెప్పారని అలాటి వాడు కల్కి అనుగ్రహంవల్ల రెండో రోజే లేచి ఆడుకున్నాడనీ చెప్పారు. ఇలాటి అభూతకల్పనలన్ని గుడ్డిగా నమ్మి బుద్ధిలేని, ఆశపోతులున్నంత వరకు వీరి కెలాంటి ఎదురూ ఉండదు. చచ్చాడని నిర్ణయించుకున్నాక హాస్పటల్ కెందుకు తీసుకెళ్ళినట్లు? తీసుకెళ్ళారనే అనుకుందాం. శవాన్ని ఎందుకు ఎడ్మిట్ చేసుకున్నట్లు? పైగా పరిస్థితి ఆశావహంగా లేదని ఎందుకన్నట్లు? మళ్ళా ఒక 'వారం' పోతేగాని' ఏమీ చెప్పలేమని ఎందుకన్నట్లు? ఈ తరహా దొంగ గాడిదల్ని చెప్పులతో నడివీధిలో కొట్టి పదిమందీ వీళ్ళను గుర్తించేట్లు చేస్తే గాని పరిస్థితి సరిగాదు. ఇతగాడే తన బంధువు మరొకడికి బ్రైన్ ట్యూమర్ ఉన్నట్లు మెడిసిన్ లో రిపోర్టు వచ్చినట్లు కల్కికి మ్రొక్కి ఆశ్రమానికి వెళ్ళి వచ్చాక అతడు హాయిగా ఉన్నట్లు మళ్ళా పరీక్ష చేస్తే మెదడులో ఏ దోషం లేనట్లు రిపోర్టు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నాడు. R.T.C డ్రైవర్ ఉద్యోగం వెలగబెట్టి ఆస్తిక సిద్ధాంతం విషయంలో, కళ్ళు తెరవని పసిగుడ్డు స్థాయిలో ఉన్న ఈ రకం ఈనాడు కల్కి ప్రచారకుల్లో కీలకపాత్ర వహిస్తున్నారు.

హైద్రాబాద్, కొత్త పేటలోని S.B.I. కాలనీ ఒక అపార్టుమెంటులో ఉంటూ సమదర్శిని వాళ్ళకు ప్రధాన ఆలంబనగా ఉన్న ఇంటి గృహిణి రామ కుప్పం, నేమం గ్రామాల్లో జరుగుతున్న. డబ్బు దండుకునే నాటకాన్ని చూసి, శంకర్ చేత చేయబడ్డ ఒక హిప్నోటిక్ టెక్నీక్ ను గమనించి అంతా మోసమని గమనించి , మౌనంగా, దూరంగా ఉంటుందిపుడు. ఆనాడు శంకర్ ఒక క్రొత్త సజిషన్ పాస్ చేశాడు భక్తులపైకి. అకాశంలోకి చూడండి. రెండు సూర్యులు కనిపిస్తున్నారని, అందునుండి ప్రకాశం వలయాలుగా ప్రసరిస్తోంది. వాటిమధ్య నుండి తెల్ల గుర్రంపై నెక్కి కల్కి దిగి వస్తున్నాడు. బాగా చూడండి అదుగో వస్తున్నాడు. కనిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడా.... ఇది నాటకం. కొందరు జనం కనిపించాడంటే కనిపించాడని అరవడం మొదలెట్టారు. ఈమెకు కనబడలా, మరి కొందరూ కనబడ్డంలేదని అరిచారు. పిచ్చి నాయనలారా. మరింత భక్తితో మనస్సుతో చూడాలి. ఇలాంటి తప్పుడు కూతలు కూస్తుంటే చట్టాలేం పట్టనట్టుంటాయి. ఇక బండ స్వభావుల కెంత అన్నాడతడు. ఇలాగే కథ. ఇలాటి తప్పుడు వివరిద్దామని యత్నించినా మొండిగా తిరస్కరిస్తుంటారు.

ఇలా ఊరూరా జరిగే చిత్రవిచిత్ర కథలన్నీ వరస బెట్టాలంటే పెద్ద దిండంతవుద్దీ గ్రంథం. రెండంశాలు చెప్పి ముగిస్తాను..

1. ఐక్యవేదిక కల్కికి సంబంధించిన వారందరికీ ఒక సవాలు విసురు తోంది. సిద్ధాంత చర్చకుగాను శాస్త్రీయ విశ్లేషణకుగానీ బహిరంగ వేదిక పైకి రావడానికి సిద్ధపడండి. 10 లక్షలు ఛాలెంజ్ మనీ ప్రకటిస్తున్నాము.. అటు ఆస్తిక తత్వవేత్తలను భౌతికతత్వ వేత్తలను సైంటిస్టులను పిలచి వేదిక నేర్పాటు చేస్తాను.

2. మూఢ భక్తులారా! అమాయకులైన ఆశపోతులారా! ఇప్పటికే పెద్ద రొచ్చులో దిగబడ్డారు. మీ వరకు. మీరు వంటినిండా, మనస్సునిండా బురద పూసుకున్నదే గాక తెలిసో తెలీకో దొంగలతో కూడి మరికొందరకూ ఆ బురదంటిస్తున్నారు త్వరలోనే ఆ కల్కి ఉద్యమం బుగ్గి అయిపోతుంది. చరిత్రలో ఆ గుంపంతా దొంగలుగా, వంచకులుగా నమోదవుతారు. వారితోపాటు మీరూ చచ్చేంతవరకూ, అటు పిమ్మటకూడా భావి తరాల వారిచే దుష్టులుగా, దోషులుగానే గుర్తింపపడతారు. ఇప్పటికైనా నిజంగా మీ హితాన్నే కోరుతున్న మా ఈ హిత వచన రూపమైన హెచ్చరిక వల్లనైనా మేలుకొని పచ్చాత్తాప పడి పరిహార రూపంగా మంచి తరఫున అప్రూవర్గానైనా మారండి. చరిత్ర క్షమిస్తుంది. అసలు పనిచేయకనే తేరగా కోర్కెలు తీసు కోవడం ఒక నేరం, ఆత్మవంచన కాదా అవి వాడెవడో తీరుస్తాడనడం మరింత వంకరాలోచన.

3. మంచినికోరి వంచనను ప్రతిఘటించాలనుకునే వివేకవంతులారా! ఎక్కడి కక్కడే సంఘటితం కండి. ఐక్యవేదిక మీ కొరకై నిలబడింది. దానిలో చేరి శక్తివంతమైన ధార్మికశక్తి నిర్మాణంలో భాగస్వాములు కండి. చరిత్రలో మంచికై వంచనను ఎదుర్కొని సమాజహిత సాధనలో పాలుపంచుకున్న వారిగా చిరస్తాయిగా నిలచి పొండి.

ఐక్యవేదిక జిల్లా సంఘాల కార్యకర్తలకూ, సమాజంలోని 'మంచివారికి; ఉధ్యమ కార్యక ర్తలారా! మిత్రులారా! వంచన పక్షంలోని ఆనుపానుల్ని తెలుసుకుని వారి గుట్టు రట్టు చేయాలంటే మనలోనుండి కొందరు గూఢ చర్యం చేయవలసి ఉంటుంది. కనుక మీ మీ ప్రాంతాలలో జరిగే కల్కి కార్యక్రమాలల్లో మీరూ నేరుగా పాల్గొని అక్కడ జరుగుతున్న క్రమాన్నీ, వాటికి బాసటగానున్న వ్యక్తుల పూర్వాపరాలనూ నిశితంగా గమనించండి. ఆధారసహితమైన సమాచారాన్ని సేకరించండి. ఈ ధర్మపోరాటంలో కొన్ని కష్టా లెదురైనా విజయం మనదే. వారెందరున్నా, వారికెంతున్నా అవన్నీ దొంగ బ్రతుకులే. ముసుగు బ్రతుకులే. మొక్కవోని పట్టుదలతో కార్యా చరణకు నడుంకట్టి వంచన నరికట్టడమే మన ఆశయం. జయం మనదే సోదరా, జయం మనదే మొదలెట్టండిక వారి పనిబట్టడం.

తాత్కాలిక సంఘాలుగా ఏర్పడ్డ వారి పేర్లు, జిల్లాల వారీగా :

 1. ఖమ్మం, 2. వరంగల్, 3. జనగాం (వరంగల్) 4. కరీంనగర్ 5. హైద్రాబాద్ . 6. నల్గొండ-సూర్యా పేట.

ఖమ్మంజిల్లా వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక తాత్కాలిక కమిటీల వివరాలు

చెరుకూరు వెంకట్రామయ్యగారు (అధ్యక్షులు) డి. సత్యన్నారాయణగారు (ఉపాధ్యక్షులు)

వి. ప్రసాద్ గారు .

చేబ్రోలు వెంకటేశ్వరరావుగారు,,

జె. హనుమంతరావుగారు (ప్రధాన కార్యదర్శి) సారపాక బ్రహ్మంగారు (కార్యదర్శి)

కె. సి. నరసయ్యగారు

టి. వెంకన్నగారు (కార్యదర్శి)

సిహెచ్. జనార్ధనరావుగారు (కోశాధికారి)

సభ్యులు:- కళాంజలి అంజయ్యగారు, ఎ. అయోధ్యగారు, రాకెళ్ళ క్రిష్ణారావుగారు, కోడెరెక్క మురళీగారు,

సిహెచ్. శేషగిరిరావుగారు, కాంపాటి సుధాకర్రావుగారు, జక్కుల లక్ష్మయ్యగారు, ఎల్. వెంకన్నగారు,

అలవాల నాగేంద్రగారు, ఆర్. రవికుమార్ గారు, ఎన్. సుధాకర్ గారు. దరకమే ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, ఎమ్. రంగనాధ్ గారు.

వరంగల్ జిల్లా.

కె. సురేందర్, ఆం.ప్ర. అంబేద్కర్ సంఘ జిల్లాధ్యక్షులు (అధ్యక్షులు)

యు. జ్యోతీరావుగారు (ప్రధాన కార్యదర్శి)

మరుపాక ఎల్లయ్య, అంబేద్కర్ యువజన సంఘ గ్రామాధ్యక్షులు

కందికొండ బుచ్చిరాములు (కార్యదర్శి)

గొడిశాల సాంబయ్యగారు (కోశాధికారి)

సభ్యులు :- టి. స్వామిగారు, Y.V.K.V. ప్రసాద్ గారు, కె. సారుమయ్యగారు,

బి. శ్రీనివాసరావుగారు,

(కార్యదర్శి)

కె. దామోదర్ గారు, టి. నాగేశ్వరరావుగారు, తాళ్ళపల్లి రవిగారు.

కరీంనగర్ జిల్లా 

ఆర్. వెంకటేశ్వరరావుగారు B.A.. L.M.E. (AMIE) (జిల్లా కన్వీనరు) టి. రాములుగారు (కో కన్వీనరు)

కోడూరి పోషయ్యగారు, సాంఘిక కార్యకర్త (జాయింటు కన్వీనరు) బోయిని అశోక్ గారు, AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు,

సభ్యులు :- ఎ. మథుసూదనరావుగారు, విశాలాంధ్ర రిపోర్టర్ ఎమ్. బాపయ్యగారు, అంబేద్కర్ సంఘ జిల్లా అధ్యక్షులు. అందె స్వామిగారు.

నల్గొండజిల్లా (సూర్యాపేట)

ఖానాగారు, M. M. జనార్దనగారు, పి. రామచంద్రా రెడ్డిగారు, గాలి రామచంద్రయ్యగారు

హైద్రాబాద్ సదస్సులో విప్లవోద్యమాలల్లో పనిచేసిన పెద్ద లిద్దరు మాట్లాడారు.1) యు. సాంబశివరావు, 2. జ్వాలాముఖి.

 1 ) సాంబశివరావుగారు మాట్లాడుతూ, ఏకత్వంలో భిన్నత్వం అన్న సూత్రం చాలా లోతైన అవగాహన నుండి పుట్టిందనీ, దాని అవసరం ఈనాడు మరింతగా ఉందనీ చెపుతూ ఆ భావానికి కార్యరూపం వంటిదే ఐక్య వేదిక కనుక. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.

 ఉద్యమాల ఆవశ్యకత లేదనే తప్పు అభిప్రాయం చాలామందిలో ఉండడం, కేవలం తామెంచుకున్న రీతొక్కటే చాలు విప్లవం రావడానికి అనే నైజం మితిమిరి ఉండడమన్నదే ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడక పోడానికి కారణం. దీనికి ముందు బాధ్యులుగా మార్క్సిస్టులనే నేను పేర్కొంటాను.

 అందరనూ కలుపుకోవాలనుకోవడం కూడా ఒక రకంగా కార్యాచరణకు ప్రతిబంధకం అవుతోంది. అది అతి మంచి కిందకు వస్తుంది. కనుక అనుభవాల నుండి ఆచరణాత్మకమైన కార్యాచరణను నిర్మించుకోవడం వివేకం.

 2.జ్వాలాముఖి : పేరులో స్పష్టత ఉందిగానీ, నిర్దిష్టత లేదనిపిస్తోంది. పేరుకు ముందు విశేషణాన్ని తగిలిస్తే బాగుంటుంది అంటూనే ఆస్తికుల్ని కూడా దీనిలో చేర్చుకోవడం అన్న అంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఒక వంచనను ఎదుర్కోడానికి మరో వంచనను ఆశ్రయించడం మంచిది 'కాదు అనన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి' నిర్మాణం జరగనంత కాలం వంచనలకు ఆధార స్థానంగా ఉంటున్న ఆస్తిక్యపు పునాదులపై ఒకటిపోతే మరో వంచన పుట్టుకొస్తూనే ఉంటుంది.

ఈ దేశంలో హిందూత్వ పునరుజ్జీవనానికై నడుం బిగించిన R.S.S. సంస్థ ప్రధానంగా విప్లవ ప్రతికూలశక్తి దీనికి ప్రత్యామ్నాయాన్ని పునర్వికాసోద్యమాలు నిర్మించుకోవలసి ఉంది అనీ అన్నారు.

 దానిపై ప్రసాదు మాట్లాడుతూ, ఏ రూపంలో ఉన్న వంచననైనా ఎదుర్కోవాలన్నదే ఐక్యవేదిక ప్రధానాశయం. కనుక కల్కి వంచననో, మరోటనో విశేషించడం సరైందికాదు. అది తాత్కాలికం ఐపోతుంది. కనుక పేరు మార్పు అనవసరం అని నా అభిప్రాయం అంటూ ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం చిన్న విషయంకాదు. దానికీ ఐక్యకార్యాచరణ, భిన్న భావాలు కల మేధావులతో కూడిన చర్చావేదిక అన్న రెండూ అవసరమవుతాయి కనుక మీరందరూ కార్యాచరణకు ఐక్యవేదికలోనూ, తాత్విక ఆవగాహనకు చర్చావేదికలోనూ పాలుపంచుకోండి అంటూ ముగించాడు.

 ఒక మంచి వార్త :- వార్త ప్రధాన సంపాదకులు A.B.K. ప్రసాద్ గారిని వారి యింటివద్ద కలసి ఐక్యవేదిక పూర్వాపరాలను వారికి వివరించి మీ పత్రిక సహకారం అవసరం అని నేనూ రాధాకృష్ణగారూ చెప్పగా, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వంచనా రీతులను ఎదుర్కోవడానికి మేమెప్పుడూ సిద్ధమే. మీ పర్యటన పూర్తయ్యాక వివరాలతో రండి అంటూ మైత్రీభావాన్ని ప్రకటించారు.

 కొన్ని తీర్మానాలు :- ముఖ్యమంత్రిగారికీ, గవర్నర్కు ఉత్తరాలు రాసే ఉద్యమం, కల్కి వంచనకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమణ చేపట్టాలని తీర్మానించుకోవడం జరిగింది. సంతకాల సేకరణకు సంబంధించిన వివరాలు త్వరలో మీ మీ జిల్లా కన్వీనర్లకు పంపడం జరుగుతుంది సంతకాల సేకరణ పని మొదలెట్టండి. అలాగే ముఖ్యమంత్రికీ, గవర్నర్ గార్ల కు లేఖలు వ్రాయండి.

 డిమాండు :- ఒక వంక తనదైన రీతిలో ప్రజాహిత కార్యక్రమాలకు 'శ్రమదానం' జన్మభూమి, మెరుపు పర్యటన, ప్రజలతో ముఖాముఖి లాటి వినూత్న కార్యక్రమాలను రూపొందించి కొత్త వరవడిని దిద్ది అంతర్జాతీయం గానే గుర్తింపు పొందుతున్న ముఖ్యమంత్రి మరోవంక దానికి పూర్తి విరుద్ధ మైన వంచనా రూపమైన కల్కికి వెన్నుదన్నుగా ఉండడం నిజంగా విడ్డూరమే. ఇది ఈనాడు కాకున్న రేపైనా చంద్రస్వామి గొడవలా ఆయనకు అప్రతిష్ఠ పాలు చేసేదే. ఇప్పటికైనా మేలుకుని మోసగాళ్ళకు అండగా ఉండే వైఖరిని విడనాడడం వివేకవంతమవుతుంది. ప్రజల అండదండలు నిజమైన బలాన్ని స్తాయిగానీ, అలాంటి వంచకుల వల్ల వరిగేదంతా తాత్కాలికమే. చంద్రస్వామిలాటి వారి సంబంధాలవల్ల ఎందరు ఏ విధంగా చిక్కలబడి ఉక్కిరి బిక్కిరవు తోంది ముఖ్యమంత్రికి తెలియ దందామా ?

 భగవద్విషయంగా ఆ స్తిక తత్వ శాస్త్రాన్నెరిగిన పండితులూ, పీఠాధి పతులూ ఎందరో ఉన్నారు. కనీసం వారిని సంప్రదించి ఉండవలసింది కల్కిని మనసుకు ఎక్కించుకునే ముందు. దేవుని గురించి సుంతైనా తెలీని మీరు, ఇసుమంతైనా నైతిక విలువ, సామాజిక సృహలేని ఒక వంచకుణ్ణి దేవుడని ఎంచి ఇంట్లో నిలువెత్తు పటాన్ని పెట్టుకుని పూజించడం వింతకాక మరేమిటి. ఆ రాజకీయ చతురత, బుద్ధి కుశలత ఈడేమైనట్లు? ఆశ్చర్యం..

 ముఖ్యమంత్రిగారూ ! ఈ రాష్ట్రానికే సారధి ఈ రాష్ట్రానికే సారధి మీరు. ఈ రాష్ట్ర అభ్యుదయాన్ని కోరే విషయంలో ప్రతి కోణంలోనూ మీ బాధ్యత ఎంతో ఉండి ఉంటుంది. విజయకుమార్, శంకర్లను వాళ్ళతో ఒకవేళ ఉంటే మీకు పరిచయమో, స్నేహమో ఉండొచ్చు గాక. అంతమాత్రాన సమాజ పీడకులుగా రూపొందిన వారిని ఉపేక్షించడమే సరికాదనుకుంటుంటే వారికి మీ వత్తాసు కూడానా? ఇదెక్కడి న్యాయం ?

 అమాయకుల్ని అనేక ప్రలోభాలకు లోనుచేసి 4, 5 సం॥రాలలోనే 2, 3 వందల కోట్లు పైబడి దోచుకున్న అతగాడు (కల్కి) వంచకుడన్నది కొద్దిపాటి హేతుబుద్ధి ఉన్నవాళ్ళకే అర్థమైపోతుంటే మీ కింకా నిజంగా అర్థం కాలేదనే అనుకోమంటారా? నిజంగా మీ కింకా తేలని, తెలీని విషయమే ననుకుంటే ప్రజానాడికి అనుగుణంగా స్పందించి నిజనిర్ధారణ కమిటీని వేయండి. అందులో ఆస్తిక తత్వం తెలిసిన కొందర్నైనా సభ్యులుగా స్వీకరించండి. ఒకరిద్దరు విజ్ఞానులూ అందులో ఉంటే మంచిది. అలాగే ప్రసిద్ధులైన ఒకరిద్దరు మాంత్రికులు. (ఈ ఇంద్రజాలికులు కూడా ఉండడం అవసరం.)

 అలాగే చరిత్రలో ఒక సమాజ హితైషిగా, నిష్పాక్షికునిగా నిలచి పోవాలంటే ఆ గుంపు ప్రకటించి ప్రచారంచేస్తున్న విషయాలను రుజువుపరచ వలసిందిగా వారిపై ప్రభుత్వ పరంగా వత్తిడి తీసుకురండి. ఒక ప్రజాప్రతినిధి గానూ వత్తిడి తేవచ్చు. భ్రమలను కలిగించడం చట్టవిరుద్ధం. అన్న ప్రాతి పదికన ఎన్నో భ్రమలను కల్పిస్తున్న వారిని నేరస్తులుగా ప్రకటించడం మీ బాధ్యత కూడా. వారు మోసగిస్తున్నారన్న విషయం నిరూపించడానికి ఐక్యవేదిక సంసిద్ధంగా ఉంది. సమాజ హితాన్ని మనస్ఫూర్తిగాకోరే నిజాయితీ గల వ్య క్తిగా వంచనను వ్యతిరేకించే వాళ్ళతో చేతులు కలిపి న్యాయానికి, నైతికతకూ న్యాయం చేకూర్చడానికి సిద్ధపడగలరా? ఆ కల్కి వంచకుడు కాకుంటే మేమన్నా ప్రజలను పక్కదోవ పట్టించిన వైనం బయటపడుతుంది.

ఆ మూకపై గట్టి నమ్మకముంటే ఇది జరిగినా సమాజానికి హితమే కదా? ఏదేమైనా మీరు కిమ్మనకుండడంగానీ, వారి కొమ్ము గాయడంగానీ ఎలాంటి హితాన్ని మీకు కలిగించవన్న నిజాన్ని గ్రహించి వివేకవంతంగా స్పందిం చండి. ఐక్యవేదిక ఒక ప్రభంజనం లాటిది. అందులో గాంధేయవాదు లున్నారు. నక్సలైట్లున్నారు. హేతువాదు లున్నారు. తాత్వికు లున్నారు. నవ్య మానవ వాదులున్నారు. విజ్ఞానులున్నారు. వృద్ధులు, మధ్యవయస్కులతో బాటు యువశ క్తీ ఉంది. అంబేట్కరైట్లున్నారు. న్యాయవాదు లున్నారు. రక రకాల శ క్తుల సమష్టిరూపం. అనేక సంఘాల కూడికలో పురిపేనిన మోకు వంటిదీ ఐక్యవేదిక గడ్డిపోచలే పురిబెడితే ఏనుగునైనా బంధించగలం. మరి ఈ ఐక్యవేదికకు కల్కిలాటి వాళ్ళనగానెంత. క్రమవిజృంభణతో త్వరలోనే తన బలిమిని వంచకుల కెదురుగా ప్రదర్శించడానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధ మవుతోందీ సంఘటన. దీనిలో మమేకమై కలవగలవాళ్ళు చరిత్ర నిర్మాతల పంచన నిలుచుండబోతారు. కనుక చరిత్రలో ఎలా గుర్తింపబడా లనుకుంటున్నారో యోచించుకోండి. సముచితంగా ఆలోచించుకుని ప్రజల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాము.


చర్చా వేదిక నియమాలు -ఒక అవగాహన.

 మిత్రులారా ! భిన్న ధోరణులకు చెందిన వేత్తలారా! తమకు తాము జిజ్ఞాసువులమనుకుంటున్న వారూ, జ్ఞానులమనుకుంటున్నవారు, ప్రచారకులూ, ప్రబోధకులూ అందరూ కూడా తెలుసుకుని ఉండవలసిన అత్యంత ప్రధాన విషయాల్లో 'విచారణ నియమాలు' అన్నది కూడా ఒకటి. మీరందరూ అలో చించడానికి వీలుగా గత సంచికలో ఆలోచనా ప్రేరకాలైన 10, 15 అంశా లను మీ ముందుంచినాను. వాటికి సంబంధించిన భావాలనే వేరు మాటల్లో చెప్పడానికి యత్నిస్తాను. సావధానంగా పరిశీలించడానికి పూనుకోండి.

చర్చా వేదిక నియమాలు-2

 జూలై నెలలో నిర్వహించాలనుకుంటున్న ఈ తాత్విక చర్చావేదిక నిజానికి అందరి అవసరంగా ఉంది. కనుక దృఢయత్నంచేసి విషయావగాహన పెంపొందించుకుని బాధ్యతతో ఈ వేదికలో పాల్గొనరండని వివేకవంతు లందరనూ ఆహ్వానిస్తున్నాను.

 ఏప్రియల్ వేదిక పై సుధాకర్ గారి సూచనలోని ఔచిత్యాన్ని గమనించాం గనుకనే ఆనాటి నుండే, మండలి క్రమంగా విచారిస్తూ వస్తున్న అంశాలను గూడా ప్రక్కనబెట్టి ప్రతి వారం సత్సంగంలోనూ, ప్రతినెలా చీరాల అధ్యయన సదస్సులోనూ ఇదే విషయాన్ని విచారణచేస్తూ వస్తున్నాం.

దీని ప్రాధాన్యతను ఎవరెవరెంత వరకు గుర్తించి యత్నిస్తున్నారో తెలియదు. కనీసం సూచన చేసిన సుధాకర్ వారి మిత్రులైనా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తున్నారో లేదో తెలియదు. అయినా నా యోపినంతలో వారికీ, మిగిలిన వారికీ ఆలోచనకు పనికి వచ్చే చర్చావేదిక నియమాలను గురించి క్రమబద్ధీక రిస్తాను. పట్టుకుచూసి కూర్పులు మార్పులు ఉంటే వాటినీ కలుపుకుని చర్చా వేదిక నాటికి మరింత సమాచారంతో సిద్ధపడి రండి. అట్టి యత్నం అందరకూ హితాన్ని కలిగించగలదు.

 చర్చావేదికలో అవసరమయ్యే నియమ నిబంధనలన్నింటినీ ప్రధానంగా మూడు అంశాలుగా వర్గీకరించుకోవచ్చు.

 1. ఇరుపక్షాలకూ భావప్రసార సాధనంగా ఉన్న భాష (మీడియా)కు సంబంధించినవి.

 2. రెండు పక్షాలు ప్రతిపాదించి నిర్ధారించడానికి ఉపయోగించే

'వాదా'నికి చెందినవి.

 (వీటినే న్యాయప్రయోగ పద్ధతిలోని అంశాలు, తార్కిక లేక వాద నియమాలు అనందాం.)

 3. సత్యనిర్ధారణ చేయడానికి కావలసిన అంశాలు. దీనినే మరింత క్లుప్తంగా పారిభాషికంగానూ చెప్పుకోవచ్చు. ప్రమాణ సామాన్యత్వం, పదార్థ సామాన్యత్వం ఏర్పడితేగాని ఇరుపక్షాలకూ వాద వేదిక ఏర్పడ్డట్లు కాదు. (ప్రమాణాలు, పదార్థాలు నిర్ధారించుకోవలసి ఉంటుంది.)

 నోట్ : చర్చావేదిక ప్రధానాశయం సత్యాసత్య నిర్ధారణ, ధర్మాధర్మ నిర్ధారణే. వాద ప్రతివాదుల అభీష్టంలో గెలుపోటముల దృష్టివున్నా అంతర్గ తంగా పై రెండే కీలక పాత్ర వహిస్తాయి.

వాద ప్రతివాదు లిరువురూ అంగీకరించవలసిన భాషా నియమాలు 

 1. చక్కగా వినడం :- పరధ్యానంగా వింటూ ఎదుటివాని వాక్యాలలో గమనించని (మిస్ అయిన) పదాలను తానూహించుకుని ఇదే అని వుంటాడులే అనుకుని ఎదురాడడం. ఈ లోపం జరగకుండా ఉండడానికి గాను చక్కగా వినాలి ముందుగా.

 నోట్:- ఆపై ముందుగా ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలలో నుండి ఎదుటివాని మాటలకు అర్థాలను ఊహించుకోవడం. తాననుకున్న భావాల దగ్గరకు ఎదుటివాణ్ణి గుంజడానికై అతడి మాటలకు వేరర్థాలు తీయడం అన్న ప్రమాదాన్ని దాటడానికె .

 2) విన్నమాటలకు అర్థాన్నీ అన్నవాడి నుండే స్వీకరించడం చేయాలి.

ఈ నియమాన్ని పాటించకుంటే వక్త హృదయమే మన వద్దకు చేరలేదు గనుక ఆపై జరిగే ప్రతివాదనంతా గతి తప్పిన గడబిడే. నేల విడచిన సామే.

 నోట్ :- అతనన్న మాటకు అతడిచ్చే అర్థం. భాషా పరిమితుల్ని అతి క్రమి స్తే. (అలాటి అర్ధం ఆ భాషనుండి రాకుంటే) భాష మార్చుకోమని చెప్ప వచ్చు. విచారణ మాత్రం అతని భావంమీద మాత్రమే చేయాలి.

 3) పదార్థ వర్గీకరణ తెలుసుకుని ఉండాలి :- భాషాపదాలన్నీ సామాన్యంగా ఒక వస్తువునో, ద్రవ్యాన్నో, గుణాన్నో, క్రియనో, ఏదేని సంబంధానో మాత్రమే తెలియజేసేవిగా ఉంటాయి. మిగిలిన పదాలు అవ్యయాలు, సర్వ నామాలుగా ఉండి పై వర్గాలను అర్థం చేసుకోడానికి వాక్య నిర్మాణానికీ పనికి వచ్చేవిగా మాత్రమే ఉంటాయి. ఈ అంశం తెలిసి, తానన్న మాటలకు ఈ వర్గాల పరంగా అర్థవగాహన కలిగిఉన్న వారిమధ్య జరిగే చర్చ, అత్యంత ఫలవంతంగా సాగుతుంది. ఒకవేళ ఈ అవగాహన కొరవడినా ఎవరాడిన మాటలుగానీ ఉన్న వాటికి సంబంధించి, తెలిసి ఉన్న విషయాలైతే మాత్రం ఈ వర్గాల క్రిందనే చేరిపోతాయి. వేరుగా జరిగే అవకాశమే లేదు. కనుక ఎదుటివాని పక్షాన్ని విచారించే సందర్భంలోనో తన పక్షాన్ని ప్రతిపాదించి నిర్ధారించే విషయంలోనో అతనన్నమాట, లేక తానన్న మాట ఏ పదార్థ వర్గం క్రింద చేరుతుందో, చేరగలదో నిర్దారించుకోవాలి. కనుక ముందుగా తెలుసుకుని ఉండవలసిన అతి ప్రధానమైన పదాలు పై ఐదే. వాటి నిర్వచనాలు విస్పష్టంగా అర్థం చేసుకుని ఉండాలి కనుక, వస్తు, ద్రవ్య, గుణ, క్రియా సంబంధాలన్న మాటలకు ఎవరికి వారు నిర్వచనాలు తయారు చేయండి.

 నిర్వచనమంటే ఏమిటి? అన్నదిక్కడ విచారణీయాంశంగా ఉంది. ఒక పదం ఏ అర్థాన్ని సూచించడానికై గుర్తుగా వాడబడుతోందో ఆ అర్థాన్ని సుస్పష్టంగా (నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ) వివరించగల అతి తక్కువ మాటలలో. ఏర్పడే వాక్యమన్నమాట. ఇది నిర్వచనానికి వివరణ రూపం. మరి దీనినే నిర్వచన రూపంగా చెప్పాలంటే, నిర్వచనమనగా "సంపూర్ణ అర్ధాన్నిచ్చే సంక్షిప్త పద సముదాయం" అని అనొచ్చు. మీ మీ దృష్టినుండీ నిర్వచనాన్ని నిర్వచించండి. ఆ పరిమితికి లోబడి పై ఐదు పదాలకు నిర్వచనాలు చెప్పండి.

 ఇంతా అయ్యాక ; ఎదుటివాడన్న మాటల అర్థాన్ని గ్రహించడానికి పాటించవలసిన అర్థగ్రహణ క్రమం యిలా ఉండాలి.

 ఒక పదం పలికాడు. అది పై అయిదింటిలో ఏ వర్గానికి చెందుతుందో చెప్పమనాలి. గుణవర్గ మన్నాడనుకుందాం. దేని గుణం-దాని క్రియలేమిటి అనడగాలి. ద్రవ్యమన్నాడనుకోండి దాని గుణాలేమిటి, క్రియలేమిటి అనడగాలి. ఇలాగే మిగిలిన వివరాలూ సేకరించాలి. ఇప్పటికి-ఇంతా సజావుగా సాగితే- వక్త చెప్పదలచిన భావం. (అతడి మనోగతం) మనకు చేరిందన్న మాట.

 పొరపాటున కూడా వ్యక్త అభీష్టానికి విరుద్ధమైన అరకల్పన శ్రోత చేయరాదు. దానిని పారిభాషికంగా ఛలం అంటారు. సత్య స్థాపనోద్దేశం నిజంగా ఉన్న వాళ్ళెవరూ ఈ క్షుద్రమైన పద్ధతిని తాకనైనా తాకరాదు. పెడ వాదపు రీతుల్లో ఇది ఒకటి. అయితే ఇలా జరిగే అవకాశం ఉన్నట్లు వాద ప్రతివాదు లిద్దరూ తెలుసుకుని ఉండడం అవసరం. అందువల్ల పొరపాటున ఈ ప్రమాదం జరిగినా, ఉద్దేశపూర్వకంగా పెడదారి పట్టినా సరిచేసుకోడానికి వీలుపడుతుంది. ఈ ప్రమాదం తరచుగా జరగకుండా ఉండడానికి క్రింది మెలకువ పనిచేస్తుంది.

 విన్నమాటకు అర్థాన్ని అన్నవాడి నుండే స్వీకరించు. ఎదుటివాని మాటలకు అర్దాలు చెప్పే బరువు నెత్తి కెత్తుకోకు. అలాగే నీ వన్న మాటలకు అర్థాలను నీవే చెప్పే బాధ్యత స్వీకరించు. నీ మాటలకు అతణ్ణి అర్థాలు చెప్పనీయకు.

 పదపదార్థ సంబంధ జ్ఞానము, వాక్యార్థ జ్ఞానము, తాత్పర్య జ్ఞానమునని భాషనుండి అర్థ జ్ఞానం కలుగుతుంది. ఇందులో వాక్యార్థ జ్ఞానంలేక తాత్పర్య జ్ఞానం కానీ,. పద పదార్థ సంబంధ జ్ఞానంలేక వాక్యార్థ జ్ఞానంకానీ కలగవు. ఇలా వాక్యార్థ జ్ఞానం పొందడానికి గానీ తాత్పర్య జ్ఞానం పొందడానికి గానీ భాషాపరమైన కొన్ని నియమాలు పాటించాలి. 1) అవి వ్యాకరణ సూత్రాలు 2) సందర్భ శుద్ధి, పూర్వాపర సంగతి, వ్యంజన, లక్షణలాటి ప్రయోగాలు తెలిసి ఉండాలి. వెనుకటి వాళ్ళీ విషయాన్నే మరో రూపంలో ప్రస్తావించారు. తాత్పర్య లింగా లంటారు వాటిని. అర్థ నిర్థారణ సందర్భంలో పాటించ వలసిన నియమాలని వాటర్థం. షడ్లింగా లంటారు వాటినే. వీటిని గురించీ ఆలోచించండి.

 క్లుప్తంగా భాషా పరమైన అంశాలివి. ఇంతవరకు గమనించాక మరో అంశాన్ని అర్ధం చేసుకుని ఉండాల్సిందాన్ని గురించి విచారించవలసి ఉంది.

చర్చ ఏ యిద్దరి మధ్య జరిగేందుకు వీలుంది? నిర్ణయించుకున్న విషయం పై.

1. ఒక తెలిసీ -ఒక తెలియని వారి మధ్యనా?

2. ఇద్దరు తెలియని వారి మధ్యనా?

3. ఇద్దరూ తెలిసినవారే అయి ఉన్నప్పుడా ? నిజానికీ మూడు జోడీల మధ్యా చర్చా జరగదు. ఎందుకంటే.

 1) వ జంటలో ప్రతివాదం ఉండదు. తెలిసినవాడు చెపుతూంటే తెలియని వాడు ఊఁ కొడుతుంటాడంతే కాకుంటే తెలిసినవాడు చెప్పింది. స్వీకరించడమా లేదా అన్నది వినేవాడి యిష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. తప్పనడానికీ, ఒప్పనడానికీ కూడా వీలులేదు వీడికి.

 నోట్ :- ఇట్టి స్థితిలో తెలియనివాడు తెలిసిందంటున్న వాడిది తప్పనేందుకు వీలైన సందర్భం సంభవించే అవకాశం ఒక్కటైనా ఉండొచ్చునా ?

 2) వ జంటకు చర్చనీయాంశమే లేదు గనుక (ప్రతిపాద నే లేకపోవటంవల్ల) ఇక్కడా చర్చ జరగదు.

 3) వ జంట విషయంలో ఇరువురిలో మొదట ఎవరు ప్రతిపాదించినా రెండవవాడు ఆ విషయంలో అది రైటే ననడమే జరుగుతుంది. ఆ విషయం వరకు ఇరువురూ తెలిసిన వాళ్ళేనని ముందే అంగీకరించి ఉన్నాము గనుక.

 నోట్:- మరిక చర్చ జరగాలంటే అవసరమైన పరిస్థితి ఏమిటి? ఆలోచించండి. ఈ అంశాన్ని గుర్తిస్తే తప్పనిసరిగా చర్చలో ఒక పక్షం అసత్య పక్షమై ఉండక తప్పదని తేలుతుంది. కథాచిత్ రెండు పక్షాలూ అసత్య పక్షాలవడమూ సంభవమే. ఏమి చెపుతున్నానో అర్థమైందా? రేపు వేదికపై ఇదీ విచారణీయాంశమే. ఆలోచించుకుని రండి. ఇంతవరకూ విచారణ సాగితే సరైన క్రమంలోనే చర్చించడం ఆరంభించా మన్నమాట. ఇక పై వాదనియమాలు, లేక తార్కిక నియమాలు విచారించవలసి ఉంది. 

 ఇంతవరకు బాషాపరమైన అంశాలను ప్రధాన భాగంవరకు వివరించాను. దీనిని క్షుణంగా పరిశీలించి మరింత అవగాహనతో వేదికపైకి రండి.

 భాషా నియమాలకు పిమ్మట 'తార్కిక నియమాలు విచారించుకోవడం అవసరం..


No comments:

Post a Comment