యోచనాశీలురైన మిత్రులారా! ప్రజాస్వామ్యం దాని పూర్తిరూపంలో ప్రపంచంలో ఎక్కడా ఆచరణలోకి రాలేదెప్పటికీ. అయినా అదంటే ఏమిటో, దాని స్వరూప స్వభావాలేమిటో మానవమేధ ఊహించగలిగింది. ప్రాచీనకాలంలోనూ, ఈ మధ్యకాలంలోనూ, ప్రజాస్వామ్యం దాని పూర్తిరూపంలో అమలైతే ఆ సమాజం ఎలా వుంటుందో ప్రస్తావించబడింది. అది ఒకటి వసుధైక కుటుంబ భావన కాగా మరొకటి కమ్యూనిజం ఆచరణలోకి వస్తే వుండేది. ఎక్కడ రాజులేడో, రాజ్యం లేదో; ఎక్కడ దండించేవాడు, దండింపబడేవాడు వుండడో (దండనతో పనిలేదో) అట్టి సమాజం ప్రజాస్వామ్యానికి ఆదర్శ రూపం అవుతుంది. ప్రజలుంటారు. ఎవరెవరి శక్తిసామర్థ్యాలనుబట్టి సమాజానికవసరమైన రంగాలలో పనిచేస్తుంటారు. వారి వారి వాస్తవావసరాల కనుగుణ్యంగాగానీ, ఉన్న మొత్తం-అవసరపడి వున్నమొత్తం అన్న దృష్టినుండి ఉన్నంతలో అందరికీ చెందేలా చూసుకుంటుగానీ ఉమ్మడి జీవితాన్ని సాగిస్తూ వుంటారు. దాచుకోవలసిన అవసరంగానీ, సోమరితనం అలవడకపోవడంతో పనిచేయలేమని వత్తిడి చేయాల్సిన అవసరంగానీ లేని వాతావరణము, స్వభావము కలిగిన వ్యక్తుల సమాజంగా అది వుంటుంది. దాంతో తనకు అవసరమైనది అందదేమోనన్న భయమూ ఉండఖ్కరలేని వాతావరణం ఏర్పడుతుంది.
అంటే ఎటువంటి వత్తిడులూ లేకుండా ఎవరి విధులు (నిజానికాథలో విధులన్నమాట సార్థకం కాదు) వారు స్వతంత్రులై అంటే తమవశంలో తాముండి ఎటువంటి తేడాపాడాల్లేకుండా నిర్వర్తిస్తూ వుంటారు. దాంతో ఎవరికందవలసినవి వారికి అందుతుంటాయి - అలాగే అందుబాటులో అదనం వున్నా అవసరానికి మించి పుచ్చుకోవలసిన అవసరం వుండదు. దీనినే అవగాహనాపూర్వకమైన స్వేచ్చాస్వాతంత్య్రాలుకల వ్యక్తులున్న సమాజం అనంటాము. వివేకులు పౌరులుగా వున్న సమాజము అని దానర్థం. అదిగో అట్టి సమాజమే సార్థకరూపంలో వున్న 'ప్రజాస్వామ్య వ్యవస్థ' ఆకృతిదాల్చిన సమాజం అనడానికి తగి వుంటుంది. ప్రపంచంలో ఇప్పటికిది ఆదర్శరూపమే. ఎప్పటికీ ఇది ఆదర్శరూపమే అయినా కావచ్చు. కానీ ఊహకందని విషయం మాత్రం కాదది. తాత్విక భావనాత్మకమైన ప్రజాస్వామ్య సమాజపు స్వరూపాన్ని మానసికంగానైనా ఊహించుకోగలిగితేగాని, ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరున నడుస్తున్న వ్యవస్థ స్థితిగతుల్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, నిలిపి వుంచుకోవాలి. పెంచి పోషించుకోవాలి అననుకునేవారు అంచలంచలుగానైనా అందుకై ఏయే యత్నాలు చేయాల్సి వుంటుందో తేల్చుకోలేరు. అట్టి ఆదర్శనమదగ్గ ప్రజాస్వామ్యానికి చెందిన ఊహల్లో నుండి వాస్తవంలోకి వద్దాం.
ప్రపంచంలో, ప్రజాస్వామ్యాన్ని గురించి నిశితంగా లోతుగా పరికించి చూసిన సామాజిక తత్వవేత్తలలో కొందరు ఆచరణసాధ్యమైన ప్రజాస్వామ్యంగా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. అదిగో దాని లక్షణాన్ని చెప్పుకునేందుకుగా పుట్టిందే þ అన్న సూత్రం. అంటే ప్రజలకొరకు ప్రజలచేత ప్రజలతో ఏర్పడిన పాలనాధి విభాగాలుకల వ్యవస్థ అని అర్థం.
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పద్ధతినెంచుకున్న లౌకిక రాజ్యాంగం. ఇది ప్రధానంగా శాసనసభ, దానికై ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల నుండి ఏర్పరచుకున్న ప్రభుత్వము - ప్రభుత్వ పాలన సక్రమంగా జరగడానికి అవసరమైన నిర్వహణ విభాగము, న్యాయ విభాగము, వాటినమలు చేయడానికి క్రియాశక్తిగా వుండగల పోలీసు (రక్షణ) వ్యవస్థ అన్న విభాగాల సమాహారంగా వుంటుంది. వ్యవస్థకంతటికీ నియంత్రణస్థానం రాజ్యాంగానిదే. అయితే దాని అత్యున్నతాధికారం కూడా ప్రజల సార్వభౌమాధికారానికి లోబడిందే. అసాధారణ పరిస్థితుల్లో, అంటే వ్యవస్థయొక్క ప్రధాన లక్ష్యం నెరవేరనప్పుడు అందుకవసరమైన రాజ్యాంగ సవరణలు చేసుకునే వెసులుబాటు, చేయగల అధికారము చట్టసభల కందించింది ఆ రాజ్యాంగమే. అంటే ఏ ప్రజలయొక్క సర్వాంగీణాభివృద్ధికోసమై రాజ్యాంగం రూపొందించుకోబడిందో, ఆ రాజ్యాంగమూ ప్రజల సార్వభౌమాధికారానికి లోబడి వుండేదేనన్నమాట. అందుకే ప్రజల స్వామిత్వం అత్యున్నతమైనదిగా అంగీకరింపబడ్డ వ్యవస్థలో సర్వాధిక్యత ప్రజలదే అవుతుందనడం.
అయితే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికున్న పరిమితాల దృష్ట్యా రాజ్యాంగ సవరణలు కూడా దాని మౌలిక స్వభావాన్ని మార్చేదిగాగాని, దాని స్ఫూర్తిని దెబ్బతీసేదిగాగానీ ఉండకూడదన్న షరతు విధించుకున్నాము.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనగానే, ప్రతినిధుల ఎంపిక అత్యంత ప్రధానమైనదవుతోంది. ప్రజలే ప్రభువులు అన్నదాని స్థానంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యపు ఆచరణ రూపంగా, ప్రజాప్రతినిధులే ప్రభువులు అన్న రీతికి మార్పునొందింది.
ప్రతినిధి అంటే ఏమిటి? ఎవరి తరఫున ప్రతినిధో, వారు చెప్పమన్నవి చెప్పడానికిగాను, చేయమన్నవి చేయడానికిగాను ఎంపిక చేసుకున్న వ్యక్తి అనీ కూడా. అట్టివానికి రెండు రకాల పనులుంటాయి. ఒకటి తననెంచుకున్న వారికి జవాబుదారీగా వుండడం. ఆ విషయంలో సొంత పోకడలు పోతూ, విశృంఖలంగా మాట్లాడడంగానీ, చేయడంగానీ లేకుండడం. రెండు వారి తరఫున ఆయా మాటలు మాట్లాడడానికిగానీ, పనులు చేయడానికిగానీ అధికారం కలిగి వుండడం. ఇది చాలా కీలకమైన అంశం. దీనిని అర్థం చేసుకోండి.
ప్రజాస్వామ్యం అవకాశమున్నంతవరకైనా అమలవుతుండాలంటే, ప్రజాప్రతినిధి ప్రజల సమష్టి అభిమతానికి లోబడి వుండితీరాలన్నదే ఇక్కడ అసలు విషయం. పురమాయించడం, చేయించుకోవడం ప్రజలహక్కుగా, వాటిని విధిగా స్వీకరించి అమలుపరచడం ప్రతినిధి కర్తవ్యంగా, కథనడుస్తుంటేనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం బ్రతికున్నట్లు.
ప్రస్తుత వ్యవహారమంతా దీనికి పూర్తివిరుద్ధంగా జరుగుతోందన్నది మనందరకూ నిత్యానుభవమే. వ్యవహారంకూడా మేము అధికారులం, నాయకులం, పాలకులం, మీరు పాలితులు, అడుక్కునేవాళ్ళు, మేము వరప్రదాతలం అన్న రీతిగనే సాగుతోంది. ప్రభువులెవరు, పనివాళ్ళెవరు; ఆదేశించేదెవరు-అనుసరించేదెవరు? అన్న విషయం పూర్తిగా తల్లక్రిందులుగా నడుస్తోంది నేడు. ప్రతినిధులు, జీతగాండ్లు, పాలకులుగాను, అధికారులుగనూ, ప్రభువులైన ప్రజలు పాలితులుగా, దేబరించుకునేవాళ్ళుగా, రెండు పక్షాలూ తలంచడం, అంగీకరించడం దగ్గరే అస్సలు లొసుగంతా పేరుకుని వుంది. ఇది తిరగబడందే, దీనిని తిరగదీసుకోందే ప్రజాస్వామ్యం మనగల్గడం అసంభవం.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనగానే, కథంతా 'ఎన్నికలు-ప్రతినిధుల ఎంపిక' అన్న కేంద్రం చుట్టూ చేరిపోయింది. మరి ఈ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారకుండా, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా జరగాలంటే ఏం జరగాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1) ప్రజలందరూ కలసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నవారే అత్యంత యోగ్యుడైన ప్రజాప్రతినిధి అవుతాడు. అయితే ఈ ఏకగ్రీవ ఎన్నిక ఉదాత్తంగానూ జరగవచ్చు, అథమంగా, అధమాధమంగానూ జరగవచ్చు. అదెలానంటే, ప్రజలంతా ప్రతినిధిని గురించి సంపూర్ణంగా తెలిసినవారై, అతడి గుణగణాలు, సామర్థ్యాలు కూడా మరెవరితోనూ పోల్చడానికి వీల్లునంతగా తమ అభిమతానికి అనుగుణ్యత కలిగినవిగా గుర్తించి అతణ్ణెంచుకుంటే అది ఒక ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకున్నట్లు.
అదే మరి ఒకడు తననే ఎన్నుకోవలసిందిగా సామదానభేద దండోపాయాలనుపయోగించి ప్రజలచేత తననే ఎంపిక చేయించుకోగలిగితే, మరెవ్వరూ ప్రత్యర్థిగా నిలుచుండకుండా నియంత్రించగలిగితేనూ జరిగే ఏకగ్రీవ ఎంపిక అథమాథమస్థాయి ఎంపిక, అట్టివాడు ప్రజాప్రతినిధి వేషంలో వున్న నియంత అనన్నమాట. కనుకనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలను నిశితంగా పట్టిచూస్తున్న సామాజిక తత్వవేత్తలు ఎన్నికలలో కనీస పోటీ వుండడం ఆరోగ్యకరం, వాంఛనీయం అన్న అభిప్రాయానికి వచ్చారు. అప్పుడేమవుతుంది? అభ్యర్థి తనను గురించి తాను తప్పనిసరై వివరించుకునే పరిస్థితీ, ప్రజలకు విధేయుడుగా వుంటానంటూ ప్రకటించుకోవలసిన పరిస్థితీ వస్తుంది. దానితోపాటు ప్రజలకు అతడు తనని తాను దాచిపెట్టుకున్న కోణాల గురించి ప్రత్యర్థిద్వారా తెలుసుకునే వీలుకలుగుతుంది. అంటే, అభ్యర్థులకు సంబంధించిన గుణాలు, దోషాలుకూడా ప్రజల దృష్టికి వచ్చే వీలుకలుగుతుంది. తులనాత్మకంగా చూసి ఎంపిక చేసుకునే వీలూ కలుగుతుంది.
ప్రజలు అవగాహనా పూర్ణులై, బాధ్యతాయుతులైన పౌరులుగా ప్రవర్తించగలిగితే స్వేచ్ఛగా స్వతంత్రంగా వివేచించుకుని ఫలానావానిని మన ప్రతినిధిగా పంపుదాం అననుకోడం చాలా వున్నతమైన ప్రక్రియే, అయినా అట్టిది సాధ్యంకానపుడు-ప్రజలంతా అంతటి వివేకాన్ని ప్రదర్శించలేని థలో మరో మార్గం ద్వారానైనా అభ్యర్థుల బలాలు, బలహీనతల గురంచి తెలుసుకుని, ఉన్నంతలో యోగ్యుణ్ణి ఎంచుకోడం అన్నదే ఉన్నంతలో మెరుగైన విధానం అవుతుంది. ఇక్కడ ఏకోన్ముఖత దాదాపు అసాధ్యంకనుక, మెజారిటీ (ఎక్కువమది) ప్రజలెంచుకున్నవాడే ప్రజాప్రతినిధిగ ఎంపిక కావడం తప్ప గత్యంతరం లేదు. ఈ 'ఎక్కువమంది ప్రజలంగీకరించిన' అన్నదానిదగ్గరే ఉన్న చిక్కంతా చోటుచేసుకుని వుంది.
ప్రస్తుతం నడుస్తోంది ప్రజాస్వామ్యం కాదనడానికి, ప్రజాస్వామ్యం నడవడమంటే ఏమిటో ఖచ్చితంగా నిర్ణయించడానికి తగిన స్థానం ఇదే. ఎంచుకునేందుకు అర్హులైన పౌరులు ఎంతమంది? అన్నది ముందుగా దోషాలు లేకుండా తేలితేగాని, ఈ యత్నం సక్రమంగా ఆరంభం కాదు. అంటే ఓటర్ల జాబితా దోషరహితంగా సిద్ధంకావాలన్నమాట. ముందిది సత్యమోకాదో తేల్చుకోండి. ఇది సబబే అనుకుంటే నా లెక్క ప్రకారం 100%. ఇది మాత్రమే సబబు). ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలలోనూ ఈ జాబితా దోషరహితంగా లేదన్న వాస్తవాన్ని గుర్తించండి. ఈ మధ్యకాలంలోనైతే ప్రజాస్వామ్య పరిరక్షణ భావాలుకల కొన్ని సంస్థలూ, వ్యక్తులు చేసిన పరిశీలనాధారంగా, 10, 15 శాతం తప్పులు (కొన్నిచోట్ల 30% వరకూ కూడా) జాబితాలో దోషాలు వున్నట్లు, అందుకు ప్రధాన బాధ్యులు ఆయా పార్టీలలోనివారే అవుతున్నట్లు తేలింది. పాత జాబితాలో నుండి తొలగించవలసినవారిని (మరణంచడం ద్వారా, ఇతర ప్రాంతాలకు వెళిపోవడం ద్వారా) తొలగించకపోవడం, క్రొత్తగా అర్హత పొందినవారిని (ఓటుహక్కు పొందే వయస్సు వచ్చినవారు, ఇతర ప్రాంతాలనుండి వచ్చి స్థిరపడినవారు) క్రొత్త జాబితాలో చేర్చకపోవడం, అర్హత లేనివారినీ జాబితాలో చేర్చడం, ఒకచోటకంటే ఎక్కువచోట్ల ఓటర్లుగ నమోదుగావడం అన్నవి జాబితాలోని దోషాలకు కారణాలు.
తప్పుడు జాబితా క్రిందికి చేరిన ఓటర్లు ఖచ్చితంగా ఎక్కువలో ఎక్కువ ఉద్దేశపూర్వకంగా నమోదైనవాళ్ళై వుండేందుకే వీలుందిగనుక, ఆ ఓటు వాస్తవమైన ఓటర్ల నిర్ణయాలను తల్లక్రిందులు చేయడానికే ముఖ్యంగా పనిచేస్తాయి. జాబితాలో చోటుచేసుకుని వున్న ఈ దోషం, పలితాల దగ్గరకొచ్చేటప్పటికి, జయాపజయాల వాస్తవ పరిస్థితిని తల్లక్రిందులు చేసేస్తోంది. కొన్ని ఆధారాలిస్తాను. దీని వికృత చేష్ట ఎంత విస్తారమైందో మీకు మీరుగానే ఆలోచించండి.
(1) నడుస్తున్న ఎన్నికలలో పోలవుతున్న ఓట్లు 55, 65 శాతంగా వుంటోంది. సరాసరి 60%.
(2) ఎక్కువ స్థానాలలో త్రిముఖ బహుముఖ పోటీ వుంటోంది. కనుక పోలైన ఓట్లలో 25, 30% ఓట్లు తెచ్చుకోగలిగినా, అభ్యర్థి గెలుపొందుతున్నాడు.
(3) గత ఎన్నికలలో చూస్తే కాంగ్రెస్‌కు 1.39 లక్షల ఓట్లు రాగా, టి.డి.పి.కి 1,38 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే అతి కొద్ది ఓట్ల తేడాతోనే అభ్యర్థులు గెలుపు ఓటముల పాలయ్యారన్నమాట. అంటే ఒక లక్ష ఓట్ల తేడా, అభ్యర్థుల ఎంపిక సంఖ్యను 185, 47 లుగా చేయగలిగిందన్నమాట. ఆ లక్ష ఓట్లలో తప్పుడు ఓటర్లు ఎందరుంటారంటారు? పోయినసారి ఓటర్ల మొత్తంలో 10, 15 శాతమంటే 40 లక్షలకు పైమాటేనన్నది ఒక చేదు నిజం.
మొత్తం ఓటర్లు 511 లక్షలు కాగా పోలైనవి 35? లక్షలు సుమారు) ఆ 40 లక్షల తప్పుడు ఓటర్ల జాబితా సవరించగలిగి వుంటే ఫలితాలేమైయుండేవి? ఆలోచించండి. మరో ముఖ్యవిషయమేమంటే, అంతో ఇంతో అయినా మంచితనమున్న అభ్యర్థులు, ఈ తప్పుడు జాబితా తయారవడానికిగానీ, తప్పుడు పద్ధతుల్లో, వినియోగించుకోడానికిగానీ పాల్పడరు. కనుక ఈ దొంగ ఓట్లను వాడుకుని ప్రయోజనం పొందింది, పొందేది అనర్హులైన అభ్యర్థులే. అంటే అయోగ్యులు ఎక్కువమంది ఎంపిక కావడానికిది పెద్ద వనరు అవుతోందన్నమాట. ప్రజాస్వామ్యాన్ని రోగగ్రస్తం చేస్తున్న అంశాలలో ఇదీ బలమైనదే.
ఓటర్ల జాబితా సక్రమంగా లేకపోవడమంటే ప్రజాస్వామ్య పునాదే బలహీనంగా వుండడమన్నమాట.
క ఓటర్ల జాబితా సక్రమ పరచడంతో చిత్తశుద్ధితో పూనుకోనివానికి, అభ్యర్థిగా నిలుచుండే అర్హతేలేదు.
ఎన్నికలలో మరో కీలకాంశం. ఏకగ్రీవ ఎంపిక, లేదా ఎక్కువమందిచేత ఎంపిక అన్నది సక్రమంగా అమలవడం. ఇది అర్థవంతంగా అమలవ్వాలంటే ప్రతి ఓటరూ ఓటేయాలి. అంటే సరైన ఓటర్ల జాబితాననుసరించి 100% ఓట్లు పోలవ్వాలన్నమాట. కనీసపక్షం అందులో 51 శాతం ఓట్లు పొందినవాడే ప్రతినిధిగా ఎంపిక కావాలి. దీనికి వేరుగా జరిగేదంతా ప్రజాస్వామ్య స్వభావానికి విరుద్ధమైనదే. 60% పోలవుతూ 10, 15% తప్పుడు ఓట్లుంటున్న నేటి పరిస్థితుల్లో, ఇక్కడ ఏమేమి సంస్కరణలు అవసరమో నిజమైన ప్రజాస్వామ్యవాదులంతా తేల్చుకోవాలి.
(1) ఓటుహక్కుగాకాక, ప్రాథమిక విధిగా (కర్తవ్యంగా) పేర్కొంటూ చట్టంరావాలి.
(2) విధిని అదీ ప్రాథమిక విధిగా వున్న దీనిని నిర్వర్తించినవారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా శిక్షాస్మృతీ సవరింపబడాలి.
(3) ఎన్నికలైన వెంటనే, ఓటేయని, లేదా తప్పుడు ఓటేసిన, ఓటరును శిక్షించే ప్రక్రియ అత్యవసరమైన, జరుగుడు కార్యంగా అతి త్వరగా పూర్తిచేసి, దోషులను కఠినంగా శిక్షించాలి. దానిని ప్రజలందరికీ స్పష్టంగా తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతి పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరా శిక్షింపబడ్డ వారి జాబితా ప్రకటిస్తే చాలా మేలు కలుగుతుంది.
(4) పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితా సక్రమంగా లేకుంటే, అందుకు సర్పంచి, కార్యదర్శులను బాధ్యుల్ని చేసి శిక్షించాలి.
అవగాహన, స్వేచ్ఛ లేకుండా వేసే ఓట్లు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించలేవు సరికదా, చంపేస్తాయికూడా. మరొకడు వేయమన్నవానికి ఓటేయడమంటే అది నీ ఓటుకాదనే అర్థం. వాడే తన వోటుతోబాటు, నీ ద్వారా, రెండో ఓటుకూడా వేశాడన్నమాట. కనుక, సరైన వివరాలు తెలుసుకుని, ఎటువంటి ప్రలోభాలకు-మొహమాటాలకు లోనుగాకుండా స్వతంత్రంగా-అంటే నీ వశంలోనే వుండి - ఉన్నంతలో లేదా, ఖచ్చితంగా అభ్యర్థులందరూ అనర్హులనిపిస్తే వ్యతిరేక ఓటు వేయాలి. అదే ఓటును సద్వినియోగం చేయడమంటే.
ప్రలోభాలకు, ఇతర ప్రభావాలకు లోనుకాని మరియు అవగాహనకల, తలవేసిన ఓటే ప్రజాస్వామ్యంలో ఓటేయడమన్నదానికి సరైన అర్థం. దానికి వేరుగా జరిగేదంతా అప్రజాస్వామికమే. ఈ నిజాన్ని మళ్ళామళ్ళా చెప్పుకుంటుండాల్సిన అవసరముంది. ఈరోజు మన రాష్ట్రంలో (దేశంలోనూ పరిస్థితి అదేననుకోండి) నడుస్తోంది ఏకనాయకస్వామ్యం, గుంపునాయకస్వామ్యం లేదా పార్టీస్వామ్యం అన్నదే. ఈ మూటి విషయంలోనూ, వాటివరకైనా సక్రమంగా అంతర్గత ప్రజాస్వామ్యం కలిగి నడుస్తోందా వ్యవహారం అంటే అదీలేదు. నాయకస్వామ్యాన్నైనా అందులోని వ్యక్తి తనకు ఇబ్బంది కలగనంతవరకు నాయకుణ్ణి అతని పెత్తనాన్ని అంగీకరిస్తాడు. తనకు ప్రతికూలంగా ఏమైనా జరిగితే తిరగబడతాడు, చెలరేగిపోతాడు కూడా. అక్కడ బలంచాలకుంటే ప్లేటు ఫిరాయించి మరో నాయకుణ్ణి, పార్టీని వెతుక్కుని ఎగిరిపోతాడు. వీటిని వేటినీ ప్రజాస్వామ్య విధానంలో విభాగాలు, అనకూడదు. అంతర్గత ప్రజాస్వామ్యం అమలవ్వాలంటే ఒక్కో అభిప్రాయంమీద ప్రకటన. విచారణ, చర్చ జరిగి ఏకాభిప్రాయానికి రావడమో, భిన్నాభిప్రాయాలేర్పడితే ఎక్కువమంది అభిప్రాయాన్ని అమలు చేయడానికి అందరూ సిద్ధపడడమో జరగాలి. ప్రతి వ్యక్తీ; అధికులంగీకరించినదానిని ఆమోదించి నిజాయితీగా స్వీకరించి, తదనుగుణ్యంగా ప్రవర్తిస్తాను అన్న దృక్పథాన్ని కలిగి వుంటేనే వారు ప్రజాస్వామ్య విధానాన్ని తమదిగా స్వీకరించినట్లు.
మిత్రులారా! ఈ కొలతతో కొలిచి చూస్తే, అటు సమాజంలోగానీ, ఇటు పార్టీలలోగానీ, ఏ ప్రాంతాలకా ప్రాంతాన్ని విడదీసి చూసినా అంతటినీ కలిపిచూసినా ప్రజాస్వామ్యం ఎక్కడా అమలులో లేదు. ఎవరిలోనూ అమలు చేయాలన్న (దుగ్ధా) అభిలాషా లేదు. సమాజంలోనూ, పార్టీలు, సంస్థలలోనూ తన ఆధిపత్యమే నిలబడి జరుగుబాటు వుండకుండా వున్న దృష్టితో ముఠా పెత్తనాలు, ముఠాల కుమ్ములాటలు మాత్రమే నడుస్తున్నాయి.
అప్పుచేసో, ఏదో ఒక మార్గాన డబ్బులు కూడబెట్టో ఎన్నికలలో గెలవడానికై ఏమి చేయడానికైనా స్ధిపడే, ఎంతకైనా తెగబడే వ్యక్తులూ-అట్టి విధానాలే నడుస్తున్నాయి. వాస్తవంలో ఓటరుచేత తనకు, తనవారికి ఓటేయించుకోడానికి విపరీతంగా, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుందన్నది బహిరంగ రహస్యమే. ఇక లోపాయకారీ ఒప్పందాలు సరేసరి. స్థానిక కుల, మత, వర్గ ముఠా నాయకులు మూకుమ్మడిగా, నావిన్ని ఓట్లు, మావిన్ని ఓట్లు అంటూ బేరంపెట్టి కట్టబెట్టే పద్ధతింకొకటి నడుస్తోంది, ఇక ప్రధానపార్టీలైతే ప్రజాస్వామ్య స్వభావానికి విరుద్ధంగా వాగ్ధానాలు, వరాలు, రాయితీలు, వగైరాలతో జనాన్ని ఆకట్టుకోడానికి ఊదరగొట్టేస్తున్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టే పనులేనన్నది నిజం.
ప్రజాస్వామ్యం అంతోయింతో ఆరోగ్యంగా బలంగా వుండాలంటే...
1) ఓటరు అవగాహనాపరుడు, ఇతర ప్రభావాలకు లోనుకానివాడు అయ్యుండాలి.
2) అభ్యర్థి తనగురించి, తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతపు అవసరాల గురించిన సమాచారం ప్రజల ముందుంచి, ప్రజాభీష్టాని కనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయాలి. ఆపై ఆ దిశగా నిజాయితీగా ప్రవర్తించాలి.
3) ఓటర్ల జాబితా నూటికి నూరుశాతం సక్రమంగా వుండాలి. అలాగే 100% ఓట్లు పోలవ్వాలి.
4) స్థానిక ప్రభుత్వాల సార్వభౌమాధికారం అమలుకావాలి. అధికార వికేంద్రీకరణ అన్న విభాగాలలోనూ జరగాలి.
5) మహాజన సభలు సర్వోన్నతాధికారాలు కలిగినవిగా వుండాలి. పారదర్శకత, జవాబుదారీతనం ఆచరణలోకి రావాలి.
6) లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగేవన్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలుగ నమోదవ్వాలి. అట్టి పనులు చేసినవారు శిక్షింపబడాలి.
7) ప్రజాప్రతినిధులుగ ఉండగోరినవారి కనీసార్హతలు అంటూ ఒక సాధారణ సూత్రావళిని రూపొందించుకోవాలి.
8) ఏ వ్యక్తీ ఎక్కువకాలం పాతుకుపోకుండా వుండేవిధంగా అభ్యర్థుల, పాలకుల ఎంపిక జరిగేలా చట్టాలుండాలి.
9) రాజకీయరంగంలోనూ ఇతర రంగాలలోని వారికివలెనే గరిష్ఠ వయోపరిమితి విధించడం అవసరం.
10) ఎన్నికల ప్రచారపు రొద చేస్తున్న అరాచకం అంతా యింతా కాదుగనుక పరిమిత ప్రచార పద్ధతిని రూపొందించి ప్రభుత్వమే అందరికీ సమాన ప్రచారమిచ్చి, ప్రజలపై పార్టీల అభ్యర్థుల వత్తిడి పడకుండా జాగ్రత్తలూ తీసుకోవాలి.
11) అధిక జనులు కనీసం 51% ఓటర్లు ఎంచుకున్నవారే ప్రతినిధులుగా అర్హులవుతారన్న నిబంధన వుండాలి.
12) రాబోయే ఎన్నికలనాటికైనా ఓటర్లకూ, అభ్యర్థులకూ, పార్టీలకు కూడా ప్రజాస్వామ్యం తీరుతెన్నులపట్ల అవగాహన కలిగించే అధ్యయన, శిక్షణ శిబిరాలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించే పనిచేయాలి.
13) సమానావకాశాలు, సత్వర న్యాయము అన్నవి అమలుకానంతవరకు ప్రజాస్వామ్యం ఆచరణలోకి రానట్లే.
14) విద్య, ఆరోగ్యము, ఉపాధికల్పన (అందరికీ) అన్నది ప్రభుత్వ బాధ్యత అవ్వాలి.
15) పనిచూపడం-ఫలితంలో సరైన భాగస్వామిని చేయడం జరగాలి.
16) పనిచేయకుండానే పలితాలు అందిస్తాం అనేవన్నీ క్రమంగా సమాజపు జవజీవాల్ని కృంగదీసేస్తాయి. అది మొదటికే మోసాన్ని కలిగిస్తుంది.
17) ఆర్థికంగా, సాంఘికంగా అణగారిన, అణచివేయబడిన కుటుంబాలకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికల ద్వారా బలం పుంజుకునేలా చేయాలి.
18) ఉద్యోగాల నియామకంలోగానీ, అధికారం కట్టబెట్టడం దగ్గరగానీ సామర్థ్యానికే పట్టం కట్టడమన్న శాస్త్రీయ పద్ధతినే పాటించాలి.
19) వ్యక్తి ఎదగడానికి, సామాజిక ఉత్పత్తి-పంపిణీ క్రమంలో భాగస్వాములు కావడానికీ కుల, మత, ప్రాంత సంబంధమైన ఎట్టి వ్యత్యాసాలు చోటుచేసుకోకూడదు.
20) పని, పనికి ఫలితము, సమాన పనికి సమాన ఫలితము, సమష్టి సంపదలో యోగ్యమైన భాగస్వామ్యము, భారత పౌరులుగా పరస్పరం సర్వసమానత్వంమూ, ఇవే ప్రజాస్వామ్యం మనగల్గడానికీ, మనల్ని క్రమంగా మనగలిగేట్లు చేయడానికి అవసరమైన రీతి రివాజులు.
మిత్రులారా! ఈ ప్రకరణాంశం ఎంతో లోతైనది, విస్తారమైనదీ కూడా. ఏ కొద్ది వ్యాసంలోనూ దాన్ని పూర్తిచిత్రాన్ని పొందుపరచడం సాధ్యపడదు. ఆలోచనాశీలురైన మీముందు విహంగ వీక్షణంగా కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావించాను. మరోసారి మరో కోణం నుండి మరికొంత వీక్షించే పనిచేద్దాం. రేపటి ఎన్నికలలో ఓటేయండి! వేయించండి!! 100% పోలింగ్ ప్రజాస్వామ్యపు ఆదర్శం. ఉంటాను. సెలవ్, మీ సురేంద్ర.
No comments:
Post a Comment