స్పం-1 : రాజమండ్రి నుండి మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారిలా వ్రాస్తున్నారు. వివేకపథం-151వ సంచిక చదివి ఈ లేఖ వ్రాస్తున్నాను. అందులోని 6 పేజీవరకు 'సంపాదకీయం' 1 లక్ష కరపత్రాలు వేసి అతి ప్రధాన పట్టణాలలో బడుగువర్గాల వారికి అందేలా చేస్తే బాగుండుననిపించింది. ఈనాటి రాజకీయ నాయకుల నిజస్థితిని ఓటరు మనస్సుకు హత్తుకునేలా వుందది.
ఇక మీ, మానవ వినాశనానికి దారులుతీస్తున్న మతమార్పిడులు గురించి : అందులోని మీ ఆలోచనాసరళి బాగుంది. నా లెక్కప్రకారం, ఈనాటి పాలకులు, రాజకీయ నాయకులు, ఓట్లకోసం కుమ్ములాడుకోడమేగాని, దేశభక్తిని గురించిగాని, దేశ రక్షణను గురించిగాని పట్టించుకునే ఆలోచనేలేదు వారికి, ఒకవంక తాగుబోతులై పెద్దలిచ్చిన ధనాన్ని, ఆస్తిని హరింపచేస్తూ, భార్యాబిడ్డల చేతికి చిప్పనిచ్చే ధోరణి పెరిగిపోతోంది. మరోవంక క్రైస్తవ, మహమ్మదీయులు రకరకాల ప్రచారాలు, ప్రలోభాలతో ప్రమాదకరమైన మతమార్పిడులను చేస్తూ వున్న, వారి ఓట్లకోసం-మైనారిటీల రక్షణ అంటూ వారిని వెనకేసుకురావడమో, నెత్తినెక్కించుకోడమో చేస్తున్నారు. దానివల్ల క్రమంగా దేశం అతలాకుతలం కానున్నదన్నది మీకు గోచరించడంలేదా? అంటూ మరింత మరింతగా చివాట్లుపెడుతూ వ్రాస్తే బాగుండుననిపిస్తోంది నాకు.
అదే సంచిక 9వ పేజీలో ''క్రీస్తును తత్వంలో భాగంగా, రక్షకులుగా అంగీకరించనివారంతా నరకానికి పోయే వారేనని బైబిలు''అని వ్రాశారు. ఈ దేశంలో పుట్టి, ఇక్కడే బ్రతుకుతూ మతం మారి, దాని ప్రచారం నెత్తికెత్తుకున్న వాళ్ళను ఇలా అడగాలి. ఓ ప్రచారకులారా! బైబిలులో చెప్పినవాటిని మీరు ప్రత్యక్షంలో చూశారా? ఈ దేశంలో పుట్టిన మీకు, ఆ దొర దేశాలవాళ్ళు వచ్చి, డబ్బిచ్చి, కాంతలనిచ్చి, మాయమాటలు చెప్పగా మీరా మతంలో దూరేరు. అటుపై ఈ దేశ సంస్కృతికి-సమగ్రతను ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. మాతృదేశానికి ద్రోహం చేయడం పాలుత్రాగి రొమ్ము గుద్దడంలాంటిదే.
సురేంద్రగారిని నా మనవేమంటే, మీ కలం పదునైనది. మారు చాలా ధైర్యంగా విమర్శలను సంధిస్తున్నారు. ఇంకా బాగా వ్రాయండి. మీరు పెట్టిన శీర్షిక వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా వుంది.
ప్ర.స్పం.-1 : కృష్ణమూర్తి శాస్త్రిగారికి, మీ లేఖ ఎంతో మనోవేదనతోనూ, ఆవేశంతోనూ కూడి వుంది. కనుక యథాతథంగా ముద్రించకుండా, భావం చెడకుండా, తగ్గకుండా వుండేలా క్లుప్తీకరించాను.
ప్రజలందరి సంక్షేమంకోసం వేల స||ల అనుభవ సారాంశంగా అనేకమంది మేధావులు ఎంతో శ్రమపడి రూపొందించి అందరి శ్రేయస్సుకై అందించిన రాజ్యాంగాన్ని ఆచరణకు నోచుకోకుండా వివిధ ఎత్తుగడలతో స్వార్థప్రయోజనాలకై వాడుకోగలిగిన, వాడుకుంటున్న ఘనత రాజకీయులదే. అరాచక వైఖరి కలవారే రాజకీయాలలో ప్రబలంగా వుండడం గత ఒకటి రెండు థాబ్డాలుగా జరుగుతున్న మార్పుకాగా, వారే వ్యాపార రంగాన్ని సొంతం చేసుకోడం ఈ మధ్యకాలంలో వచ్చిన క్రొత్త పరిణామం. ఈనాటి ఆ వర్గాలలో ధర్మాన్ని, నీతి న్యాయాలను పట్టి చూడాలనుకోవడం అమావాస్య, చీకటి గదిలో నల్లపిల్లిని కనిపెట్టాలనుకోడం లాంటిదే. అయినా సత్యమే నిలబడుతుంది. ధర్మమే జయిస్తుంది లాంటి తాత్విక వచనాలు ఎక్కడో మినుకు, మినుకు మంటున్న చిరుజ్యోతి కిరణంలా ఆశను చావనీకుండా చేస్తోంది. ఏదోనాటికి భవిష్యత్తు మంచి పక్షానిదేనన్న, వెనకటి పెద్దలందించిన ఊతంతోనే పనిచేస్తున్నాము. మనం చేయగలంత చేస్తూ, ముందు తరాలకాపని నందించడమే ఎవరమైనా చేయగలిగింది.బాధితులైన బడుగు వర్గాలు కళ్ళు తెరచి, గొంతెత్తి అరచి, జబ్బచరచిన రోజుగాని రాజకీయ క్షాళన, ప్రక్షాళన మొదలవదు. రాష్ట్రంలో క్రమంగా అభ్యుదయ శక్తులు సంఘటితమవుతున్నట్లు నా పరిశీలన చెపుతోంది. ఇదొక శుభపరిణామం.
ఇక మతాలు, మతమార్పిడులు : మతమార్పిడులు చేస్తున్నవారికీ, మార్పిడులు పొందుతున్నవారికీ కూడా తామెంత ప్రమాదకరమైన, చెడ్డపని చేస్తున్నదీ స్పష్టంగా తెలియదు. ఈ లోక, పరలోకాలకు చెందిన స్వార్థమూ, తాత్కాలిక ప్రయోజనాలు, ఆత్మతృప్తి లాంటివే వారినాపని చేయిస్తున్న వారంతా మానవ సమాజ భవితవ్యం నెత్తిన నిప్పులు గుమ్మరిస్తూన్నవారే. నా ఊహకు అందుతున్న ప్రమాదచిత్రం కేవలం హద్దులు మీరిన స్త్రీ పురుషుల స్వేచ్ఛ ప్రవర్తనకు సంబంధించింది మాత్రమేకాదు. మానవ హననానికి దారితీసే పెను యుద్ధపు ఛాయలు నా మనో నేత్రానికి లీలగా గోచరిస్తున్నాయి. అత్యంత జరుగురు కార్యంగా దీనిని పరిగణించి, నిలవరించుకోకుంటే, సర్వం స్మశాన సదృశమే. మతస్తులకు, మత వ్యతిరేకులకూ, మత సామరస్యవాదులకూ కూడా ఈ ప్రమాదం కానరాకపోవడమే అత్యంత విషాదకరం. మీ లేఖనాధారం చేసుకుని మరోసారి నా మనోవేదన బహిర్గత పరిచే యత్నం చేశాను. మతప్రమేయం లేని, మానవ సంబంధాలు నెలకొల్పడానికై ఎవరివంతు కృషిగా వారువారు యత్నించడమొక్కటే భవిత భద్రతకున్న ఏకైక మార్గం- ఉంటాను.
ముఖ్య ప్రకటన (1) : మత ప్రచారకులకు, మత నేతలకు ఒక విజ్ఞప్తి. మీ మతం (ఏమతమైనా) మానవత్వానికి, పెద్దపీట వేసింది అని గ్రంథాలాధారంగా, చరిత్ర ఆధారంగా నిరూపించగలరా? నిరూపించగలము అనంటే ఒక బహిరంగ వేదిక నేర్పరుస్తాను. సిద్ధంకండి. ఆ వేదిక అంతిమ నిర్ణయాలను అంగీకరించి, స్వీకరించి, మిగిలిన జీవితాన్ని దానికనుగుణంగా కొనసాగించాలన్న షరతునంగీకరించి మండలికి కబురందించండి.
ప్రకటన (2) : అత్యంత గంద్రగోళ, సంక్షోభ పరిస్థితుల మధ్య జరుగబోతున్న రేపటి ఎన్నికలను దృష్టిలో వుంచుకుని, ''సమాజం బాగుండాలి; అందుకై నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి లాంటి సద్భావనలున్న వ్యక్తులు, శక్తివంచన లేకుండా, శక్తికి మించీకూడా అత్యంత తక్షణావసర చర్యలుగా కొన్ని కార్యక్రమాలను నెత్తికెత్తుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమాలలో పాల్గొనగలిగితే అది రేపటి మన భవితకు ఎంతోకొంత మేలు కలిగించగలుగుతుంది.
అట్టి పనులకు పూనుకున్న మూడు వేదికల గురించిన సమాచారం మీ ముందుంచుతున్నాను. మీరంతా మీమీ ప్రాంతాలలో వాటిలో మీవంతు పాలుపంచుకోండి.
(1) ఎన్నికల నిఘావేదిక :
సుమారు 200 సంస్థలకు పైగా భాగస్వామ్యం కలిగి, అధికతమ బాధ్యతను స్వీకరించిన కొద్ది సంస్థల నేతృత్వంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడానికై ఏర్పడ్డ వేదిక యిది. కొద్దిగా మనస్సుపెట్టి యత్నిస్తే మీమీ ప్రాంతాలలో ఈ సంస్థ బాధ్యుల వివరాలు మీరెవరైనా తెలుసుకోగలరు. కొన్నినెలల తరబడి దీని కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకై శ్రమించిన ఆ వేదికలో మీరెరిగిన మన ఐక్యమిత్ర మండలి కూడా మార్చి 10వ తేదీన చేరి పనిచేయనారంభించింది. ఐక్యమిత్రమండలిలోని మిత్రసంస్థలన్నీ ఎన్నికలయ్యేంతవరకు మిగిలిన పనులను రెండవ స్థానానికి నెట్టి దీనికే ప్రథమ స్థానాన్నిచ్చి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కనుక మారుతున్న పార్టీలకతీతంగా, పౌర బాధ్యతగా ఈ నిఘావేదిక కార్యక్రమంలో పాలుపంచుకోండి. ఏరకమైన సహాయ, సహకారాలకు మీ మనస్సు, శక్తీ అంగీకరిస్తుందో ఆ మేరకు ఈ నాలుగునాళ్ళు సిద్ధపడండి. ముఖ్యమైన కొన్ని ఫోన్ నెంబర్లిస్తాను. అధిక వివరాలకై వారిని సంప్రదించండి.
1) డా|| చెలికానిరావు-040-64504993
2) యు. వెంకటేశ్వరరావు-98490 64309
3) వి. లక్ష్మారెడ్డి-99499 30670
4) యం. వేదకుమార్-99599 22022
5) జంపా కృష్ణకిషోర్-93930 65487
6) జి. సత్యన్నారాయణ-98662 47360
1. గమనిక : పై నెంబర్లలో ఎవరినడిగినా మీ మీ జిల్లాల బాధ్యుల సమాచారం అందిస్తారు.
2. ప్రజాస్వామ్యానికి సగం ఊపిరి 100% ఓటర్ల జాబితా సవ్యంగా వుండడం, 100% ఓటర్లు ఓటు వేయడం.
3. కనుక జాబితాలో దోషాలుంటే గుర్తించి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్‌కు తెలుపండి. ఓటువేయండి, వేయించండి.
4. ఎన్నికల ప్రధానాధికారి, ఎన్నికల గురించి తెలుసుకోవలసినవి, అంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రధాన పోస్టాఫీసుల్లో అవి ఉచితంగా యిస్తారు. తెచ్చుకుని చదివి, దానిననుసరించండి.
5. ఎన్నికల నిఘా వేదిక ప్రచురించిన మరో పుస్తకముంది. అది నిఘా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాళ్ళ వరకైనా సేకరించి, జాగ్రత్తగా చదవండి. ఆ పుస్తకాలు జిల్లా నిఘా కమిటీవద్ద పరిమితంగా వుంటాయి.
2. మేలుకొలుపు :
రాష్ట్రంలో రాబోయే 5 సం||ల కాలంలో ఒక వెయ్యి గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ప్రధానంగా అవినీతి, మద్యపానం లేని గ్రామాలుగా రూపొందించాలన్న లక్ష్యంతో మార్చి 22న ఆవిర్భవించిందీ 'మేలుకొలుపు' అన్న సంస్థ. ఇప్పటికే ఆదర్శ గ్రామాలుగా రూపొందిన పశ్చిమ గోదావరిజిల్లాలోని కాళ్ళకూరు, దొంగపిండి; నెల్లూరుజిల్లాలోని తోటచెరువుపల్లి, వరంగల్లులోని గంగదేవిపల్లి గ్రామాలు వైవిధ్యభరితమైన ఆదర్శాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ గ్రామాలలో మద్యాన్ని నిషేధించగలిగారు. ఓటును అమ్ముకోము అని శపథం చేసుకుని సాగుతున్నారు.
ఇలాంటి గ్రామాలు రాష్ట్రంలో మరో వందకు పైగా గుర్తించడం జరిగింది. వీరందరినీ సంఘటితపరచి, విస్తృతంగా ప్రచారాన్నిచ్చి, ఉద్యమరూపంగా మరిన్ని గ్రామాలను ఆదర్శప్రాయంగా రూపొందించాలన్న దృఢచిత్తంతో బి. రామకృష్ణరాజుగారు అనేక మిత్ర సంస్థలనూ కలుపుకుని ఆరంభించిన సంస్థ యిది. గ్రామాలవైపు దృష్టి సారించకుండా, గ్రామాలకు చేరకుండా ఉద్యమాలు మంచి సమాజాన్ని నిర్మించుకోవడం అసాధ్యమన్నది గత వందేళ్ళకు పైగా ఎందరో విజ్ఞులు పేర్కొంటూ వచ్చారు. దానికో ఆకృతి నివ్వాలని మొదలెట్టిన రామకృష్ణరాజుగారు అభినందనీయులు. సామాజిక హితానికై వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్న సంస్థలేవైనా దీనినీ తమ కార్యక్రమాలలో భాగంగా చేసుకోడానికెట్టి అభ్యంతరమూ ఉండఖ్ఖర్లా. ఆదర్శ గ్రామాలనూ రూపొందించుకునే యత్నంలో సత్యాన్వేషణ మండలి ఎవరితోగానీ కలసి పనిచేయడానికి సిద్ధంగానే వుంటుంది. అలాగే అవకాశమున్నంతలో ఎక్కడికక్కడ గ్రామాలను బాగుచేసే పనిలో మీ అందరూ పాలుపంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాలు బాగుండాలని కోరుకునే వారందరూ ముందా ఆదర్శ గ్రామాలను దర్శించండి.
గ్రామాలను సంస్కరించడం అంత సులభం కాదు. అయినా గ్రామాలు బాగుకాకుండా మంచి సమాజం ఏర్పడడమూ సాధ్యంకాదు. కనుకనే, ఏదోనాటికైనా ఉద్యమాలు గ్రామాలదగ్గరకు చేరితీరాలి. 'గ్రామాభ్యుదయోద్యమం' ఐక్యవేదిక ద్వారా సాకారం కావాల్సి వుంది. అక్షరాశ్యులైన యువత, సహృదయులైన పెద్దల సలహా, సహకారాలతో దానికి నేతృత్వం వహించాల్సి వుంది. చాలాచాలా ప్రాధాన్యతమమైన విషయమిది.
3. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక :
ఐక్య మిత్రమండలి భాగస్వామ్య పక్షాలు, మరికొందరు ప్రజాస్వామ్యవాదులు కలసి చేసిన ఆలోచనల ఫలితంగా ఈనెల అంటే ఏప్రిల్ 5న ఆరంభించుకున్న (ఈ వ్యాసం రాసేనాటిని బట్టి ఆరంభించాలనుకున్న) వేదిక యిది. ఎన్నికలలోపు, నిఘా మరియు జనచైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనిచేయాలనీ, ఎన్నికల అనంతరం, నిరంతరంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుని, పెంచి పోషించుకోడానికి అవసరమైన కార్యక్రమాలన్నింటినీ ఉద్యమ రూపంగా సాగిస్తూ వుండాలని అనుకుని ఆరంభించుకున్న వేదిక ఇది.
వివిధ వేదికలు తామరతంపరగా పుట్టుకొస్తూ, నామమాత్రావశిష్టంగా కొనసాగుతూ మందినెత్తిన మరో బండపెడుతూనో సాగుతున్న నేటి పరిస్థితులలో, ఇదీ ఆ కోవకు చెందకుండా, మనమంతా ఖచ్చితమైన ఉద్యమ స్ఫూర్తితో, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడి సంఘటితులమై సమాజగతి నిర్దేశక స్థానంలో ఒక దివ్వెగా పనిచేస్తుండేలా దీనిని నిలిపి వుంచుకోవలసి వుంది. అందుకై మనమందరం, మరింత మందినీ కలుపుకుని నిబద్ధతతో పనిచేయాల్సి వుంటుంది. వార్షికోత్సవాలకో, అడపాదడపా ప్రెస్‌మీట్‌లకో పరిమితమయ్యే కల్చర్ నడుస్తోందీనాడు. దీనిని దానిపాలబడకుండా కాపాడుకుని, నిత్య చైతన్యయుతంగా, సక్రియాత్మకంగా మనగలిగేలా చేయడమెలాగన్నదే మనందరి ముందున్న పెద్ద సమస్య, ఎన్నికల తరువాత మరింత విపులంగా విచారించుకుని దీనికో స్థిరమైన, ఆచరణాత్మకమైన రూపునిచ్చుకునే యత్నం చేద్దాం.
వేదికలెక్కువ పనితక్కువ; వేదికలు తక్కువ పనెక్కువ. ఏది సైందన్నదే మనం తేల్చుకోవాల్సి వుంది.
No comments:
Post a Comment