Friday, May 1, 2009

ఉద్యమకారులు పనీపాటా లేనివారా? సమష్టి మేలుకోరేవారా?



ఉద్యమకారులు పనీపాటా లేనివారని, కాలక్షేపం కొరకు వారు ఉద్యమాలు చేపడతారనే అభిప్రాయాన్ని అనేకమంది వ్యక్తంచేస్తుంటారు. వీరిది శాస్త్రీయ దృక్పథమా అంటే నిస్సందేహంగా కాదనే చెప్పాలి. ఉద్యమం అంటే సమష్టికి సంబంధించిన ఒక ఆశయ సాధనకు చేసే సమష్టి, గట్టి ప్రయత్నం. ఆ ఉద్యమంలోని భాగస్వాములు ఫలానా రకానికి చెందినవారని ఊహించి వారి ప్రయత్నాన్ని విమర్శించినందువల్ల రెండు నష్టాలున్నాయి. ఒకటి : విమర్శకు గురైన ఉద్యమకారులు సున్నితత్వం ప్రాబల్యంగా వుంటే వారు ప్రతివిమర్శ తీవ్రస్థాయిలో దిగవచ్చు. లేదా ఉద్యమాల గొడవ మనకెందుకు అనుకుని నిష్క్రియాపరుడిగా మారవచ్చు.
తద్వారా ఉద్యమమూ కుంటుబడుతుంది. లేదా అలాంటివారు అధికంగా వుంటే నీరుగారిపోతుంది. ఇది ఒక నష్టము అయితే విమర్శకుడు సాధించినదేమిటి? నిజానికి ఉద్యమకారులు అందరూ ఏ పనీపాటా లేనివారుకాదు. చాలామంది ఇదే తమ పని అనుకుని ఉద్యమకార్యం చేపట్టినవారున్నారు. మరికొందరు స్వంత పనులు కొంత వదలుకుని, సమాజ కార్యానికి ప్రాధాన్యత యిస్తునానరని విమర్శకులు గ్రహించాలి. ఉద్యమం ముసుగులో స్వార్థమే ప్రధానమై లేదా అదుపులేని గుర్తింపు కోరేతత్వముగలవారూ వుండటానికి అవకాశం వుంది. అందర్నీ ఒకేగాట కట్టేసి విమర్శిస్తూ కూర్చునేవారికి, సామాజిక బాధ్యతలు పట్టనివారికి, సమాజంలో ఉద్యమకారులు తెచ్చే అభ్యుదయ ఫలితాలను అనుభవించే హక్కు లేదు అనాలి. ఒకరకంగా వీరు పరాన్నభుక్కులకంటే హీనులని గ్రహించాలి. ఎందుకంటే పరాన్నభుక్కులు కేవలం ఇతరులప ఆధారపడి జీవనం గడుపుతారు. కాని వీరు అంతటితో ఆగక తాము చేయకపోగా, తమ సుఖసంతోషాలకు బాటలు వేస్తున్నవారిపైనే దాడికి దిగుతుంటారు.
ఉద్యమంలో ఒకవేళ నిజంగా పనిపాటా లేనివారు, కాలక్షేపంకోసం చేసేవారు కొందరిని ఉద్యమానికి, సమాజానికి నష్టం ఏమిటి? ఏ పనీ లేకుండా ఇతరులపై రాళ్ళేస్తూ కూర్చోవడంకంటే, మంచిపని చేసేవారికి సహకారశక్తిగా ఉద్యమంవల్ల నష్టమేముంది. ఈ విధంగా ఆలోచించి వారినీ ప్రోత్సహించండి. వారికీ జీవితంపట్ల సరియైన అవగాహన కలిగించండి. ఇది ఉద్యమకారులను సరిగా చూడటమంటే. ఉద్యమకారులపట్ల శాస్త్రీయ దృక్పథమంటే.
పనీపాటా లేనివారు అనేమాట 'ఏ బాధ్యతలూ లేనివారు' అనే అర్థంతో వాడబడినా అటువంటివారూ ఉద్యమకార్యంలో భాగస్వాములు కావటంలో, ఉద్యమానికి అదనపు శక్తులుగా మారటంలో తప్పేముంది? సమాజానికి మంచిదేగదా?
పనీపాటా లేనివారిలో నిరుద్యోగులు వుండవచ్చు లేదా ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమీ లేనివారూ వుండవచ్చు. మన దేశ జనాభా పరిస్థితి కూడా దీనికి ఒక కారణము. అలాంటి ఉద్యమ శక్తులుగా తీర్చిదిద్దటం ద్వారా భావ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఆలోచించండి.

No comments:

Post a Comment