Wednesday, July 1, 2009

రహ్మాన్‌గారి లేఖ యధాతథం


వివేకపథం స్పందనకంటూ ఫజులుర్‌ రహ్మాన్‌గారిలా వ్రాస్తున్నారు (రహ్మాన్‌గారి లేఖ యధాతథం).
ప్ర.స్పం. : యోచనాశీలురైన రహ్మాన్‌గారికి, మన ఇరువురి లేదా మన రెండు సంస్థల ఆధ్వర్యంలో ఆరంభమై, కొంతవరకు సాగిన ఆస్తిక, నాస్తిక పక్షాల విచారణ విషయంలో, దానినో ముగింపుకు చేరాల్సిన బాధ్యత లేదా అవసరం మన ఇరువురికీ సమానంగనే వుంది. ఆ విషయం మీకూ తెలుసు. అలాగే, వత్తిడిననుసరించి, అవకాశమున్నంతలో మీవంతు బాధ్యతను నెరవేర్చేపని చేయాలనుకునేవారే మీరన్నది మీ గురించిన నా ఒక అంచనా. వివేకపథం-155లోని నా ప్రతిస్పందన చూశాక అవసరమైన దిశగా మీవంతు కృషి మొదలెట్టడం, ఆ కృషి సారాంశాన్ని పత్రికకు అందించడం, మీ విషయంలో ఆ నా అంచనా వాస్తవ దూరం కాదన్న విషయాన్ని పట్టిస్తోంది. సంతోషం.

1వ అంశం ద్వారా, సి.టి.ఎఫ్‌.వారు లేవనెత్తి, నాస్థిక సంఘాలతోగాని బైబిలు సృష్టివాదంపై కూర్చోడానికి మేము సిద్ధం, అయితే అటునుండి ఎవరు చర్చకు కూర్చున్నదీ మాకు తెలియాలి అన్న విషయాన్ని కొంత విచారించాలి.
మీరూ నేను కలసి ఆరంభించిన వేదికలో వాదప్రతివాదాలకు సంబంధించిన కొన్ని పద్ధతుల గురించి లోగడే చెప్పుకున్నాం.
1) వాది బలాన్ని పరీక్షించేటప్పుడు అతనికి ఇతరులు సహాయపడకూడదు, పడనివ్వకూడదు అనీ, వాదాన్ని పరీక్షించబూనుకున్నప్పుడు ఆ పక్షానికి చెందిన ఎందరైనా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రతిపాదించవచ్చని చెప్పుకున్నాం.
2) ప్రతిపాదనను ప్రశ్నించే అవకాశం ఎవరికైనా వుంటుందనీ, నిర్వాహకులమైన మనమూ అవసరమనుకున్న ప్రశ్నలు వేయవచ్చని, ప్రతిపక్షంలో వీరుండాలి, వీరుండకూడదు అన్న పరిమితేమీ వుండదని, నిజానికి వుండకూడదనీ కూడా అనుకున్నాం.
3) ప్రతిపాదక పక్షం ఎదుటి పక్షాన్ని ప్రశ్నించకూడదనీ, విచారణకు ఆ సమయంలో తీసుకున్న ప్రతిపాదననే పూర్తిగా పరీక్షించే పని, స్థాపించే పని చేయాల్సి వుంటుందనీ, విచారణ అలాగే సాగేలా చూసే బాధ్యత మనందరి-వేదిక మొత్తం-పైనా ఉంటుందనీ అనుకున్నాం.
గమనిక : నావరకు నేను, సందర్భం వచ్చినప్పుడల్లా, క్రమం తప్పుతుందనిపించినప్పుడల్లా ఈ అంశాల్ని గుర్తుచేస్తూనే వచ్చాను. కనుక ఈనాడు నాస్తికులతోనైతేనే మాట్లాడుతాము అని సి.టి.ఎఫ్‌. వారనడం మనవేదిక-నిజానికి సరైన ఏ వేదిక-నియమాలకు అనుగుణ్యత కలిగిందిగా లేదు. వారు ప్రశ్నించే పక్షంలో కూర్చున్నప్పుడూ ఇలాంటి షరతును లేవనెత్తలేదెవరూ.
- మరో సూక్ష్మాంశముందిక్కడే. ఆయా మత గ్రంథాలననుసరించే ఆ గ్రంథాన్నంగీకరించనివారంతా ఆ గ్రంథం దృష్టినుండి అవిశ్వాసులే. అంటే నాస్తికులే. కనుక బైబిల్‌ను, బైబిల్‌ దేవుని అంగీకరించని వారంతా బైబిలునంగీకరించే వారి ప్రకారం నాస్తికులే అవుతారు. (1) నాస్తికోవేదనిందకః| (2) దేవుడు లేడు అల్లా తక్క, (3) దేవుని కుమారులు కల్పించినవారు అవిశ్వాసులే, (3) ఏసును దైవకుమారునిగ, రక్షకునిగ అంగీకరించనివారంతా అవిశ్వాసులే. వాదనకు వాదించాలనుకుంటే తప్ప, నిజాయితీకి తిలోదకాలిస్తే తప్ప ఏ గ్రంథానుయాయులు దీనిని కాదనలేడు, కాదనకూడదు.
అదలా వుంచుదాం. పలానివాడు అడిగితేనే మా సృష్టివాదం చెపుతాం అనడంలోని ఔచిత్యమెంత? మీకందాలో ఏమో అనౌచిత్యం కనపడ్డంలేదా? నాకైతే అనౌచిత్యంతోబాటు, వారిలోని డొల్లతనం, దానిని కప్పిపుచ్చుకునే ఎత్తుగడాకూడా కనపడుతోంది. ఎందుకంటే, సి.టి.ఎఫ్‌.వాళ్ళు తలంచుతోంది, బైబిలు సృష్టివాదం సరైందేనని, దానిని నిరూపించగలమనేకదా? ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేయాలనుకుంటున్నదీ అందరకూనా? ఎంపిక చేసుకున్న కొందరికేనా?
- అభిలాషకల ఎవరికైనా, పరీక్షించదలచిన ఎవరికైనా అని తీరాలి. అవునా? కాదా? ఆలోచించండి.
2వ అంశంలో క్రైస్తవ సృష్టివాదంపై సురేంద్రతో చర్చకూ మేమూ సిద్ధమేకాని, ఒక షరతుంది. ఆయన ముందుగా తమ జ్ఞానసిద్ధాంతాన్ని చెప్పి నిరూపించి, మేమడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితేనే. అందుకాయన సరేనంటే, కొన్ని చర్చానిబంధనలకు అనుగుణంగా మేము సృష్టివాదాన్ని ప్రతిపాదించగలం అంటూ మరో అపసవ్య విధానాన్ని తలకెత్తుకున్నారు. ఇక్కడా కొంత విశ్లేషణ అవసరం అనిపిస్తోంది.
1) మన వేదిక ఏర్పరచిన పద్ధతిననుసరించి, అటు సృష్టివాదాన్నిగానీ, ఇటు పరిణామవాదాన్నిగాని ఫలానివారే ప్రతిపాదించాలి, ఫలానివారే ప్రశ్నించాలి అన్న నిబంధనేమీ లేదు. ఈ విషయం మీకేగాక, సి.టి.ఎఫ్‌.వాళ్ళకూ తెలుసు. వేదికలో పాల్గొన్న వాళ్ళెవరూ ఇక్కడ ఎట్టి అభ్యంతరాలూ పెట్టలా. ఒకవేళ గనుక అలా జరిగివుంటే, నావరకు నేను అలాంటి నిబంధన అనవసరమనీ చెప్పివుండేవాణ్ణి. అంతటితో ఆగక మా వేదికలో అట్టి కట్టడిలేదు అనీ అన్నవారిని కట్టడిచేసి వుండేవాణ్ణి. పరిణామవాదం సరైందా? సృష్టివాదం సరైందా అన్నది తేల్చుకుంటానికి కూర్చున్నాక, మండలి జ్ఞానసిద్ధాంతం చెప్పి, అడిగినవాటికీ సమాధానాలు చెప్పి అది సరైందని నిరూపించుకున్నాకనే మా మా పక్షాలను ప్రతిపాదించి పరీక్షించనిస్తాం. అంతవరకు మండలి మమ్ము ప్రశ్నించటానికి వీల్లేదు అని ఎవరన్నా అది వారి అడ్డగోలుతనాన్ని పెడదారి పట్టిన వైనాన్ని పట్టిస్తుంది. వేదిక ఆరంభమైన నాటినుండి జరిగినదంతా పునఃపరిశీలనకు తీసుకుందాం. లేదా ఏ పక్షానికీ చెందని, విషయాన్ని పట్టిచూడగల ఒక బృందానికి అప్పజెపుదాం. సి.టి.ఎఫ్‌. సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికిగానీ, దానిని ఫలానివాడే పరీక్షించాలి, ఫలానివారు పరీక్షించరాదు అనడానికిగానీ ఆ వేదికలో అవకాశంగానీ, అవసరంగానీ ఉన్నట్లు తేల్చుతారో, అట్టిదేమీ లేదని తేల్చుతారో చూద్దాం. వారి నిర్ణయాన్ని అనుసరిద్దాం.
నాకు తెలిసినంతలో ఆ వేదిక సృష్టివాదాన్నిగాని, పరిణామవాదాన్నిగాని ఎవరైనా ప్రతిపాదించవచ్చు, పరీక్షించవచ్చు' అన్న స్వభావాన్ని మాత్రమే కలిగివుంది.
వాళ్ళ తరఫున చివరి సమావేశంలో డా|| ఆనంద్‌ మాట్లాడిందే కొంత దారి మళ్ళించేందుకు ఉద్దేశించిందే అయినా, చర్చావేదిక నియమనిబంధనలు స్థిరపరచుకుని విచారణ మొదలెడితే మేలుకదా! అన్న అతని సూచన దానికదిగా సరైందేగనక వెంటనే నావరకు నేను అంగీకరించాను. మిగిలినవారికీ నచ్చచెప్పాను. నేనూ ఆ వివరాలు వ్రాసుకొస్తాను, పాల్గొనదలచిన ప్రతి ఒక్కరూ రాసుకురావాల్సి వుంటుంది అన్నానేగాని, అలాగే మీ రెండు పక్షాలూ వ్రాసుకొచ్చి ముందా విషయం తేల్చండి అననలా.
ఈమధ్య సి.టి.ఎఫ్‌.నుండి పేరు తెలుపని వ్యక్తి ఒకరు, మేము మా సిద్ధాంతాన్ని ప్రకటించడానికి భయపడడం లేదు. పనుల వత్తిడి తగ్గగానే వచ్చి ప్రతిపాదిస్తామంటూ ఇ-మెయిల్‌ చేశారు.
మిత్రమా! ఇక్కడికి వ్రాసేటప్పటికి మా ఫోను, మీ ఎస్‌.ఎం.ఎస్‌.లు అందాయి. సి.టి.ఎఫ్‌. గురించి నా తార్కిక నిర్ణయాలు తప్పుకాదంటానికి రుజువుగా వుందా సందేశం. కనుక ఆశ్చర్యం కలగలా. లెక్క ప్రకారమే సాగుతోందిగదా కథాగమనం అనిపించింది. అటుపై ఇలా సాగింది నా లేఖ.
ఒక్క విషయం రహ్మాన్‌గారూ! సత్యోదయంలో జరిగిన సమావేశం మన వేదికను కొనసాగింపు సమావేశం కానేకాదు. మనవేదిక కొనసాగింపు ఆయా ఆస్థికపక్షాలు తమతమ సృష్టివాదాల్ని ప్రతిపాదించి పరీక్షకిచ్చి నిరూపించడం కోసంగా జరగాల్సి వుంది. పైగా అది మన వేదికనే నిర్వహించాల్సి వుంది. సత్యోదయం వేదిక మరొకరు మళ్ళా పరిణామ వాదంపై విచారణంటూ మొదలెట్టినట్టిది. అందుకు వారికందుబాటులో వున్నవారిని వారు పిలిచారు. ఎవరికిష్టముంటే వారు పాల్గొన్నారు. నావరకు నేను కేవలం పరిశీలకుణ్ణి మాత్రమే అని ముందుగా ప్రకటించే, నాకున్న సహజ కుతూహలంతో నేనక్కడికి వెళ్ళాను. పరిశీలకునిగా చేయదగ్గ ఒకటి రెండు సూచనలు చేశాను. పాల్గొన్న వ్యక్తిగా, ఆనంద్‌చేత అడగబడిన వ్యక్తిగా సత్యోదయం సమావేశంపై నా అభిప్రాయాలు వ్రాశాను. పత్రిక నైతికతకు సంబంధించి వారికీ వ్రాసే అవకాశమిచ్చాను.
ఇక్కడే ఒక సూక్ష్మ విషయం వుంది. రెండు వేదికల గురించి నేనే వ్రాస్తూ, మా వివేకపథంలోనే వేయడంవల్ల సావధానంగా, నిశితంగా పట్టిచూడలేనివారికి ఈ రెండు వేదికల మధ్యనున్న అంతరంగాని, ఆ వేదికలలో జరిగిన విచారణల స్వరూప స్వభావాలలోని వ్యత్యాసాలుగానీ, దేని కొనసాగింపు ఎలా వుండాలన్న స్పష్టతగానీ అంత స్పష్టంగా కనపడదు. సి.టి.ఎఫ్‌.వారు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు పెద్దయత్నమే చేశారు, చేస్తూ వున్నారు.
నిష్ఠూరంగా వున్నా నిజమేమిటంటే సత్యోదయం-సమావేశాంశాలు వివేకపథం మధ్య జరిగే వాదవివాదాలకు మీకుగానీ, మన వేదికకుగానీ నేరుగా ఎట్టి సంబంధంలేదు. మన వేదిక కొనసాగింపుగా సాగాల్సిన కార్యక్రమానికి సంబంధించి మాత్రమే మీకు, నాకూ, సి.టి.ఎఫ్‌. వారికి మనం ఎక్కడినుండి, ఎప్పుడు మాట్లాడినా సంబంధం వుంటుంది.
సున్నితమైన, సూక్ష్మమైన, కీలకమైన మరో వాస్తవాన్ని గురించి చెప్పుకోవడం ఈ సందర్భంగా అవసరమనిపిస్తోంది. ఒక వ్యక్తి ఎదుట జరుగుతున్న జరక్కూడనిదాన్ని గమనించి, ఊరుకోలేక ఆవేశంలో కోపంగ మాట్లాడి వుండవచ్చు. లేదా తానే నిగ్రహం కోల్పోయి ఒకింత అనుచితమైన, లేదా అతి ఆగ్రహాన్ని ప్రదర్శించి వుండవచ్చు. ఆ రెండు సందర్భాలలో ఆ వ్యక్తిని అదుపులో వుండమనడమూ, ఆ వ్యక్తి తనని తానదుపు చేసుకునేదానికి సిద్ధపడడమూ అన్న రెండూ సరైనవే. కాని మరోవ్యక్తి ఎదుటివానిని అపహాస్యం చేయబూనుకున్నా, గేలిచేస్తూ అవమానించదలచుకున్నా అది మొదటివ్యక్తి పోకడలోని ఆవేశంతో సమానమనుకోవడం చాలాతప్పు. మొదటి వ్యక్తి కోపిష్ఠి, ఆవేశపరుడు. రెండో వ్యక్తి ఆవేశపరుడుకాడు, కౄర స్వభావం. ఈ తేడా చూడడం చాలామందికి సాధ్యపడకపోవచ్చు. కాని ఇది ఒక నిష్ఠుర సత్యం. కోపిష్ఠి సమావేశంలో కూర్చోడానికి, పాల్గొనడానికీ అనర్హుడు అనకూడదు. కౄరత్వం, హేళన చేసే నైజం ఉన్నవారిని సమావేశాలలోకి అనుమతించడమే పెద్దదోషం. అట్టివారివద్ద ఒకవేళ పెద్ద సమాచారమే వున్నా సభలో పాల్గొనడానికి వారు అర్హులుకారు. విద్యావంతుడు వినయశీలిగనూ, చిన్నవారికి చేయందించి అక్కున చేర్చుకునే హృదయం కలిగినవాడుగనూ ఉండాలంటారు జ్ఞానసాంప్రదాయాన్నెరిగినవారు. నాకు తెలిసి, ఆయా వ్యక్తులతో ప్రవర్తించవలసిన సందర్భాలలో ఇది చాలా కీలకమైన, విలువైన అంశం. ఈ విషయంలో చాలా పట్టింపు వున్న నాకు అట్టివారు తారసపడి అవతలివారిని హేళన చేయబూనినప్పుడల్లా, కడుపులో దేవినట్లుంటుంది. ఆవేశం అదుపును కోల్పోతుంది. అదుపు చేసుకోవలసిన అవసరాన్ని కాదననుగాని, కౄరత్వం విషయంలో అది తప్పుమాత్రం కాదనే నాకనిపిస్తుందిప్పటికీ.
ప్రతిపాదకుడే తనదానిని నిరూపించే బాధ్యత స్వీకరించాలని గత 15 ఏళ్ళుగా విస్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నాము మేము. ఈ నియమానికి ఎవరూ మినహాయింపు కాదనీ, మండలీ ఆ నియమానికి లోబడే వుందనీ వ్రాతమూలకంగనే నిర్ణయాన్ని ప్రకటించివున్నాము. మండలి తనవిగా తాను ప్రకటించిన ప్రతి అభిప్రాయానికీ బాధ్యత వహిస్తుంది. విచారణలో తప్పని తేలిన మరుక్షణం ఆ విషయాన్ని ప్రకటించి తనను తాను సవరించుకుంటుంది. అది నిన్నటిదా? నేటిదా? అన్న ప్రశ్నేలేదు. మా భావజాలం బహిరంగ విషయం. గత 20 ఏండ్లుగా సమాజంముందు పరచబడి వుంది. అందులోనే మా యీ బాధ్యతకు కట్టుబడి వుంటామన్న ప్రకటనలూ వున్నాయి.
ఇక మీ చివరి మాటలు! చిన్న ఉదాహరణ చెపుతాను. ఒక దారంట నలుగురి పోతున్నారు. ఎవరూ దారిని చెడగొట్టకుండా, దారికి అడ్డురాకుండా, ఉన్నంతవరకూ ఎవరూ ఎవరిగురించీ పట్టించుకోము-ఎవరిపనిలో వాళ్ళుంటాము. అదేమరి అందులో ఎవరుగానీ క్రమానికి ఆటంకం కలిగించినప్పుడేమిచేస్తాము. చేస్తున్న పనినీ ఆపి ఆ వ్యక్తిని గురించి పట్టించుకుని అతనిని సంక్రమపరిచేపనో, అతనిని అడ్డంకి కాకుండా చేసుకునే పనో చేస్తామా? లేదా? అది సహజ ప్రక్రియేగాక, గమనం (పని) సక్రమంగా సాగడానికి వివేకం చూపించే తప్పనిసరి పనికూడా. ఇక్కడ క్రమం తప్పుతున్నా వ్యక్తిల్ని, వారి వైఖరిని సక్రమపరచడంవైపు దృష్టిపెట్టకుండా వుండడమే ఒక పెద్దతప్పు. దానిని తప్పు కాదనగలిగేది, ఒక్క అంటీ ముట్టని రకమే. ఇక క్రమం ప్రకారం జరగాల్సిన పని జరక్కుండా ఉండాలనుకునేవారైతే ఎలాగోలా, అవతలివారు దీని విషయమై పట్టించుకోకుండా చేయడానికి నానాపాట్లు పడుతూ, కుటిల వ్యూహాలన్నింటినీ పన్నుతుంటారు.
చివరి మాటలు : నిజానికి అవసరం లేకపోయినా బైబిలు సృష్టివాదాన్ని పరీక్షించడానికి ఏయే సంస్థలనుండి, ఎవరెవరు రావడానికి సుముఖంగా ఉన్నారో వారిపేర్లు తెలియపరచడానికి నావరకు నాకెట్టి అభ్యంతరం లేదు. మీకు ఉండక్కరలేదు.
బైబిలు సృష్టివాదం సరైందికాదనుకుంటున్నట్లు ఒక ముస్లిం, ఒక హిందువు, ఒక భౌతికవాది ఇలా ఎవరైనా ప్రశ్నించవచ్చు. అని గనక మన వేదిక అంగీకరించకుంటే, దానికదే శాస్త్రీయస్థాయిని, నిష్పాక్షిక దృష్టిని అంటే యోగ్యతను కోల్పోయినట్లే. అవునో కాదో ఆలోచించండి.
నాటినుండి నేటివరకు నేనడుగుతోంది ఒక్కటే. మన వేదిక క్రమాన్ననుసరించి సృష్టివాదులు వారివారి సృష్టివాదాల్ని ప్రతిపాదించి పరీక్షకిచ్చి సరైందేనని నిరూపించాలి. ఆ క్రమంలో వైదికులు (హిందూ ఆస్తికపక్షం) మొదటినుండి కొంత నిరాసక్తంగా వున్నారుగనుక వారిని బలవంతపెట్టడం కుదరడంలా. ఇక మిగిలిన మా ఇస్లాం పక్షాన పాల్గొన్నవారు, మరెవరైనాగాని, క్రైస్తవపక్షాన పాల్గొన్న ప్రకాష్‌, సుధాకర్‌, ఆనంద్‌గార్లు మరెవరైనా, వారి వారి సృష్టివాదాల్ని ప్రతిపాదించి నిరూపించి తీరాలి. అది మీ రెండుపక్షాల విధి. అందునా ప్రకాష్‌, సుధాకర్‌గార్ల విషయంలో ఒకింత ముందున్నారుగనుకనే మన వేదిక 'బైబిల్‌ సృష్టివాదం' ప్రతిపాదించమని వారిని కోరింది - క్రమం. ఈ క్రమం సజావుగ సాగుతున్నంతవరకు ''వేదికలోని ఎవరమూ, ఎవరిని గురించీ వ్యక్తిగతంగా ప్రస్తావించడం, విమర్శించడం చేయవద్దు' అన్న మీ సూచనను పాటించడానికి నాకభ్యంతరం లేదు. ఎవరికీ అభ్యంతరం వుండక్కరలేదు కూడా. కానీ, జరగాల్సిన క్రమాన్ని జరక్కుండా అడ్డుతగులుతున్న మరియు దారి మళ్ళిస్తున్న వారిని పట్టించుకోకుండా వుండడం బాధ్యతారాహిత్యమేగాక, విషయం ఒకరికొరకు రావాలన్న తపన లేకపోవడంకూడా. ఎవరేమనుకున్నా జరగాల్సిన క్రమం జరిపించడానికి నావంతు కృషి నేను చేస్తూనే వుంటాను. క్రమం అమలవుతున్నంతవరకు వ్యక్తుల్ని పట్టించుకోను. మీరూ, మిగిలినవారూ కూడా ఇలా ప్రవర్తించడమే సరైందని నా దృఢనిశ్చయం.
వాద నియమాలలో ఒక ముఖ్యనియమం వుంది. విప్రతిపత్తి రిప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానమ్‌ ||
క్రమాన్ననుసరించి మాట్లాడవలసినదాన్ని విడచి అన్యవిషయాలెత్తుకున్నా, చెప్పవలసినదానిని చెప్పక ఊరుకున్నా ఆపక్షం వీగిపోయినట్లేనని నిర్ణయించాలి అని దానర్థం.
దీనిపై మీ, మరియు సి.టి.ఎఫ్‌.వారి స్పందన చూశాక, నామానాన నేను నావంతు కర్తవ్యాన్ని నిర్వర్తించే పని ప్రారంభిస్తాను. మన వేదిక క్రమాన్ననుసరించి, సి.టి.ఎఫ్‌.వారు బైబిలు సృష్టిక్రమాన్ని, ప్రతిపాదించి అది సరైందేనని నిరూపించాలి. మరీ అంశాలను, సిద్ధాంతాలను విచారించమనడం, విచారించడం రెండూ అక్రమమైనవే.
రహ్మాన్‌గారికి : సి.టి.ఎఫ్‌.వారడిగిన సంస్థలను-వ్యక్తులను వేదికపైకి రప్పించడానికి యత్నించండి- ఈ విషయంలో మా మండలి అవసరమైన మరియు అందించగల సహకారాన్నందించడానికి మీకు తోడుగా వుంది.  వుంటాను. శెలవ్‌!
స్పం.-2 : జ్యోతిషవిజ్ఞాన కేంద్రం నుండి మధుర కృష్ణమూర్తిగారు, ఉభయకుశలోపరి అంటూ, మీరు వివేకపథం జూన్‌ 2009 సంచికలో వివాహ విధివిధానాల పేర ప్రచురితమైన వ్యాసంలో 'గర్భాదానం' అన్న మాటను వాడి అది తప్పుప్రయోగం అనన్నారు. నిజానికాపదం గర్బాధానం : గర్బ+ఆధానం అని వుండాలి. అనగా తాను వివాహమాడిన స్త్రీకి గర్భమును వుంచుట అని అర్థం. అంటూ సవరణ రూపాన్ని తెలిపారు... అలాగే త్వరలో 'భారతీయ వివాహ పద్ధతి' అనే ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రకటించే యత్నంలో వున్నట్లు వ్రాశారు. ఒక స్త్రీ-ఒక పురుషుడు ఆజీవాంతం సహజీవనం చేయు ప్రక్రియను భారతీయ రుషులు ఏర్పాటు చేసిన వివిధాంశాలను కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అది సిద్ధమైన పిమ్మట మీకు పంపగలను అనన్నారు.
ప్ర.స్పం.-2 : మంచిదండీ! మధుర కృష్ణమూర్తిశాస్త్రిగారూ! మీరొనర్చనున్న యత్నం బుధజనులామోదించదగిందై వుంది. ఆ మీ రచనకై ఎదురు చూస్తుంటాను. ఇక మీరన్న 'గర్భాధానం' ప్రయోగ విషయాన్ని పరిశీలనకు తీసుకున్నాను. పరిశీలన పూర్తయ్యాక అవసరమైనమేర నా వ్యాసాన్ని సవరించుకోగలను. ఒక సూచనేమంటే వివాహ సందర్భంగా స్పృశించాల్సిన అంశాలేమిటి? అందులో వివాహవేదికపైకి అవసరమైన భాగమేమిటి? అన్నది మనం ఖచ్చితంగా నిర్ణయించాల్సిన చాలా కీలకమైన అంశమైవుంది. దీనినీ దృష్టిలో పెట్టుకుని మీ పరిశోధన సాగించగలరని ఆశిస్తాను.  వివాహ విధిలో చోటుచేసుకోవలసిన అంశాలు, వివాహితులు కాగోరుతున్న, వివాహితులైనవారు తెలుసుకునుండాల్సిన అంశాలు సందర్భోచితికి భంగం కలగనిరీతిలో ప్రస్తావించుకోడమే వివేకవంతం. ఈ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని మీ యొనర్పబోవు కూలంకష చర్చలో దీనికీ స్థానం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటికి సెలవ్‌!
స్పం.-3 : మీ నూతన 'వివాహవిధి'పై నా సూచనలంటూ ఆకేటి సూరన్నగారిలా వ్రాస్తున్నారు.
మీ వివాహ ప్రకరణం కొన్ని అనవసరపుటంశాలతోకూడి దీర్ఘమైందనిపించింది-ఉంగరాల మార్పిడి- పాణిగ్రహణానికి దానిని కుదించితే బాగుంటుంది. ఉంగరాలను తీపిగుర్తుగా స్వీకరించడమన్నది జరిగాక, మళ్ళా సువర్ణహారధారణను తీపిగురుతుగా అననడం అనవసరమేకదా! పైగా, అది ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడిన విషయంకూడా. దంపతులు ఇంటిదగ్గర వారి వారి స్తోమతనుబట్టి ఎన్ని ఆభరణాలనైనా ఏర్పరచుకోవచ్చు. అలాగే, వివాహానికి ఎలాగూ కొత్తబట్టలతోనే వస్తారుగనుక, మళ్ళా వేదికపై నూతన వస్త్ర బహూకరణ అనే తంతు అవసరం లేదేమో! పెద్దలడిగే ప్రశ్నలకు వధూవరులు రెడీమేడ్‌ సమాధానాలు ఇవ్వండం ఒకింత హాస్యాస్పదంగా అనిపించింది. వాటన్నింటినీ ప్రతిజ్ఞాపత్రంగా తయారుచేసి, దానిపై వారిద్దరూ కలసి సంతకాలు చేసిన పత్రాలను ముద్రించి సభకు అందజేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. పలుసార్లు ఆమోదం తెలుపండని అడగడం, మా ఆమోదం తెలుపుతున్నామని పెద్దలు, సదస్యులు అనడం అవసరమా? ఆరంభంలోనే వివాహానికి అనుమతించారని పురోహితుడడగడం, వారు సరేననడం జరిగిందికదా! మధ్యలో అనేకమార్లు మీ ఆమోదం కోరుతున్నామనడం ఆమోదిస్తున్నామని ఇవతలివారనడం అనవసరమని నా అభిప్రాయం.
అలాగే మాటిమాటికీ చెప్పి మరీ చప్పట్లు కొట్టించుకోవడం అనవసరంకదా! వధూవరులు సెలవిప్పించండనడం-పెద్దలు ఆగండాగండనడం ఎబ్బెట్టుగా, కాలాన్ని పొడిగించేదిగా అనిపించింది. ఆలోచించండి.
ప్ర.స్పం.-3 : సూరన్నగారికి! వెంటనే స్పందించినందుకు అభినందనలు. పెళ్లి రెండు ప్రధాన విభాగాలతో కూడివుంది, ఉండాలికూడా, అన్నది అందరం గమనించితీరాలి. (1) అది ఒక సామాజిక ఒడంబడిక, (2) అదొక వేడుక. ఈ రెంటిలో దేని ప్రాధాన్యత దానిదే. ఒక్కొక్కరు ఒక్కో కొలత నుండి వేడుకలెందుకండీ, ఒడంబడిక పూర్తిచేస్తే సరిపోదు అనో, ఒడంబడిక దారి ఒడంబడికదే, అదెలాగూ జరిగిపోతోంది. మిగతాదంతా వేడుకదగ్గరే అనో అనేస్తే దానిని తులనాత్మకమైన దృష్టి అనలేం. శృతిమించిన వేడుకైనా, వేడుకేలేని రిజిస్ట్రేషన్‌ అయినా అతిపోకడలే అవుతాయి.
ఇక మీరన్న సువర్ణహారధారణ ఆర్థికాంశాలతో ముడిపడి వుంది. అది కొన్ని కుటుంబాలలో అనవసరపు లేదా మోయలేని బరువుగా అవవచ్చు అన్నది సరైన సూచనే. సువర్ణహారమే వుండితీరాలన్న నిబంధన వుండక్కర్లేదు. వివాహం ఈ పద్ధతిలోనే ఎందుకు చేస్తున్నామన్నది స్పష్టంగా వివరించడం అవసరమన్నారు. ఈ సూచనా అవసరమైనదే. రాబోయే రచనలో ఉపశీర్షికగా ఆ వివరణ చేసే యత్నం చేస్తాను.

No comments:

Post a Comment