Sunday, May 1, 2011

ఉలకరూ - పలకరేఁ?

ఒక వంక త్వంశుంఠంటే త్వంశుంఠంటూ, మరోవంక స్వయంగా ధీరులమని ప్రకటించుకుంటూ ఎవరింట్ల్లో వారు తేగ వీరాలాపాలాడే వాస్తు పక్షాల వాళ్ళు, తీరా రండి పరీక్షకు కూర్చుందాం అనంటే ఒక్కరూ ఉలకడంలా, పలకడంలా. అలాగే అభౌతిక శక్తులున్నాయంటూ తెగ వదరుతుండే వివిధ ఆస్థిక పక్షాల పండితమ్మన్యులూ నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునున్నారు. ఇక్కడికిది ఒక పార్శ్యం కాగా ఇన్ని వివరాలు అరటి పండు వలచి పెట్టినట్లు పట్టుకొచ్చి ఇంటి ముంగిటకు పత్రికనందిస్తే పాఠకులూ ఉలకరూ పలకరు!

తెలిసినవారే సమాజానికేదైనా తెలియ జెప్పడానికి అర్హులవుతారన్న జ్ఞాన (విద్య) క్షేత్రానికి చెందిన ప్రాథమిక నియమంగానీ, తెలియడమంటే ఏమిటో, తెలిసింది సత్యమో కాదో సరిచూసుకోవడమెలాగో గమనించి గాని తెలియని పండిత వేషధారులే దండిగా సమాజమంతా విస్తరించి ఉన్నారు. ఎవరికి వారు వారి పాలబడిన అమాయక, అజ్ఞాన జనాన్ని వివిధ ప్రలోభాలకులోను చేసి, ఆశాభయాలను కల్పించి, కానని వాడు కానని వారికి దారులు చూపుటన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. నిరాడంబర జనాన్ని ఇంద్రియ నిగ్రహణ, నిజాయితీలకు పెద్దపీట వేసిన ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ఉంటూ, దానికి ప్రతినిధులమని ప్రకటించుకుంటూ 'త్యాగేనైకేనమృతత్వ మానశు' అన్న తాత్విక దృష్టిని తుంగలో తొక్కి భోగైక జీవన లక్షణంతో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా అదీ దొంగ వ్యాపార క్షేత్రంగా మార్చేశారు. సన్యాసుల, సాధువుల, యోగుల, రాజయోగుల పేర్లతో వివిధ వేషధారణతో మందినెత్తికెక్కి చిందులేస్తున్నారు. మరో వంక స్వస్థత కూటాలు, ప్రార్థనా మందిరాల పేరున సంస్ధలను వెలయించి పరీక్షలు పాసవడానికీ, పెన్ను సరిగ్గా రాయడానికీ, దగ్గరనుండి సర్వ కార్యాలకూ ప్రార్థనలంటూ మైకులదరగొట్టే బొంకు మందా పెరిగి పోయారు. ఏసు నోరునంటాడొకాయన, ఏసు చేయినంటాడింకొకడు. ఆయనకు ఈ తరం ప్రతినిధినంటారు. మరొకడు ప్రభువు పేరున సింహం గర్జిస్తోందంటాడింకొకాయన. అది సాతాను సింహ గర్జనేనంటాడు మరొకడు. ఒకడు క్రైస్తవాన్ని దుమ్ముదులిపానంటుంటే, వాడెంత? వాడి గురువునే ప్రభువు పేరున తొక్కిపారేశానంటుంన్నాడింకొకడు. ఈరకమంతా పిల్లకాకులు, పెద్దకాకులు, ముంగిసలు, తోడేళ్ళు మాదిరి మసలుతూనే, మానవత్వాన్ని గురించి తెగ ప్రవచనాలు చేసేస్తుంటారు. చరిత్రను చూస్తే 'ఒకవంక నీవలె పొరుగు వానిని ప్రేమించు' అన్న సూత్రాన్ని వల్లిస్తూనే క్రీస్తు నంగీకరించనివారిని, అంగీకరించే వారిలోనే తామన్నట్లు అనుసరించని వారినీ కోట్ల మందిని కిరాతకంగా పొట్టనబెట్టుకున్న వాస్తవాలు కనపడతై. యూదులు క్రైస్తవుల్ని, క్రైస్తవులు ముస్లిముల్ని, ముస్లింలు వారిరువురినీ బలి పశువులుగా చేసినవైనాలు వారి వారి మత గ్రంధాలనుండే కొట్టొచ్చినట్లు కనిపిస్తే. ఇక భారత దేశంలో ఒక వంక ''సర్వ దేవ నమస్కారాం కేశవం ప్రతి గచ్చతి'' అంటూనే పరస్పరం కొట్టుకు చచ్చిన ఘటనలు కోకొల్లలు. అంతగా పట్టించుకోవడంలేదు గానీ, నిజంగా నిశితంగా పట్టి చూస్తే ఇక్కడా




మతాంతరీకరణల కథ పెద్దదేనని తేలుతుంది. షన్మతాల వారు పరస్పరం ఒకరి మతం నుండి ఒకరి మతంలోకి మారినట్లు రుజువులు దండిగనే దొరుకుతై అద్వైతులు ధ్వైతులుగా, శైవులు వైష్ణవులుగ, వైష్ణవులు శైవులుగా, ఆస్థికులు నాస్తికులుగ, నాస్థికులాస్ధికులుగ, బౌద్ధులుగ ఇలా సకల వర్గాల సమూహాలతోనూ అటునుండిటు, ఇటునుండటూ మారడాలు, మార్పించడాలు జరుగుతూనే వచ్చినై. వీటన్నింటివెనక, అన్నింటికీవర్తించే విడ్డూరమనదగ్గ కథ, నిజం ఏమిటో తెలుసా?

ఇందులో ఏ ఒక్కపక్షానికీ తాము చెపుతున్న దైవం, పరలోకం మరియు మనిషి సాధించాల్సిన సాధ్యంగా చెపుతున్న మోక్షం, గురించిన జ్ఞానం లేకపోవడం. ఈ గుంపులో జ్ఞానులుగ చెలామణి అవుతున్న వారినెవరిని గాని మీకీ విషయం ఎలా తెలిసింది? అని అడిగినా, నిలవేసినా, వారంతా ఏకోన్ముఖంగా చెప్పగలిగిందీ, చూపించగలిగిందీ ఒక్కటే. మాకీ విషయం ఫలానా గ్రంధంవల్ల తెలిసింది అనే. అని మాత్రమే.

అంటే అంతా వ్యపదేశమాత్ర- వినికిడి - జ్ఞానులేనన్నమాట. ఒక వేళ ఈనాడు ఎవరుగాని అంతకంటే అధికంగా, అదరగండంగా ఇంకేమైన వదరుబోతుతనంతో వదరుదామనుకుంటారేమో, విషయజ్ఞుల చెంత అవన్నీ గుండులేని తుపాకీ చప్పుళ్ళవంటివే అవుతాయి. అదంతా ఊకదంపుడు వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే, ఆయా మతగ్రంధాలన్నీ (ప్రతివక్కటీ) నిర్ధ్వింద్వంగా ఈ విషయాలు తెలుసుకోడానికి గ్రంథాన్ని విశ్వసించడం వినామరో మార్గంలేదు అని ప్రకటించేశాయి. అంటే అవన్నీ నమ్మక తప్పని విషయాలని వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలే నిర్ధేశిస్తున్న విషయంపై ఈ నమ్మకం గాళ్ళంతా తమకది బాగా తెలుసని బొంకుతున్నారన్నమాట. పండిత వేషాలు, గండపెండేరధారణలు, సన్యాస వేషధారణలు, పరమహంసలు, యోగులు, అవధూతలు, బాబాలు, బాలసాయిలు, అమ్మలు ఇలా లెక్కకుమిక్కిలి నామధేయాలతో, అందుకుతగిన వేషధారణతో ఉన్న వీళ్ళంతా తాము దేవుని గురించో, అభౌతికాంశాల గురించో తెలిసిన వాళ్ళమనే చెప్పుకుంటూ, ప్రచారం చేయించుకుంటూ ఉంటున్నారు. నా అవగాహన ప్రకారం వీళ్ళంతా, వాళ్ళు వాళ్ళు చెపుతున్న అభౌతికాంశాల విషయం తెలియనివాళ్ళే. ఆయా విషయాల గురించి ఆయా గ్రంథాలేమి చెపుతున్నాయో చూసో, కంఠస్థం చేసో తెగ వదరుతుండే వాళ్ళే. పుస్తకంలో ఉన్న విషయాలను చదివో, కంఠస్ధం చేసో చెప్పడానికి చదవడం చేతనైతే సరిపోతుందన్న కనీస ఇంగితం గాని, చదవడం వల్ల తెలియడానికీ, అలా తెలిసిందాన్ని అనుభవం ద్వారా తెలుసుకోడానికి మధ్య నున్న అంతరం చాలా ఉందన్న వివేకంగాని ఇసుమంతా లేని వీళ్ళంతా జ్ఞానులుగా, వేత్తలుగ, గురువులుగా చెలామణి అయిపోతున్నారు. - 'బాధ గురువులు కోకొల్లలు - బోధ గురువులు అరుదు' అన్న సూక్తి దీనినుండి వచ్చిందే.

వ్యవస్థలో ఎవడుగాని వాడన్నమాట సబబైందేనని రుజువు పరచాల్సి ఉంటుందన్న నిబంధన లేకపోవడం ఒక వంకా, పరిపాలనలో వివిధ అధికార స్ధానాలో ఉన్న వాళ్ళకే ఏదో ఒకరకమైన మూఢనమ్మకం తలకెక్కి ఉండడం మరోవంకా జతకూడి, ఇట్టి అవాచ్య వాచ్యులపై కట్టడి కరవైపోయింది. సత్యాసత్య నిర్ధారణతో పనిలేని ఈ ప్రవచనాలు అమాయకజనాన్ని కట్టగట్ట గలిగినంత కట్టగట్టి జ్ఞానవేషదారులైన ప్రవచకుల చేతి కందిస్తున్నాయి. ఈ రకం సంతతోకూడిన సంస్ధలన్నీ అమాయకజనం గట్టిగా, వీరావేశంలో చేసిన దానాలు, దక్షిణల వల్ల కోట్లాది రూపాయలకు సొంత దారులైపోతున్నారు. ఈ మధ్యనే చనిపోయిన పుట్టపర్తిబాబా ఏమి శ్రమ చేస్తే అంత సొమ్ముకు సొంతదారు కాగలుగుతారు న్యాయబద్ధంగా? ఒక విడ్డూరం చెపుతాను.

దానమిచ్చిన వాడు దాసోహమంటున్నాడు. వారిచ్చింది పుచ్చుకున్న ఈయన మహాదాతగా, త్యాగిగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ప్రజలిచ్చిందానితో కూడు, గుడ్డ, గూడులతో పాటు, అత్యంత విలాసవంతమైన, భద్రమైన జీవితం గడుపుతుండే ఆధ్యాత్మిక కేంద్రాలునడుపుతుండే అన్ని మతాల మతాధిపతులూ, గురువులూ అపరిగ్రహం గురించి, నిరాడంబరత గురించి ఇంద్రియ నిగ్రహాన్ని గురించీ, త్యాగాన్ని గురించి, ధర్మాన్ని గురించి, నీతి న్యాయాల గురించీ తెగ ఆవేశంగా ప్రసంగాలు చేస్తుంటారు.

''గమ్మునుంటే గిల్లుతుంటారు. కస్సుమంటే తుస్సుమంటారు''. వదలరు, పట్టుకోరు, సత్యాన్వేషణ తత్పరతతో సంవాదానికీ సిద్దంకారు. జిగేషా ప్రవృత్తితో జల్పానికే సిద్దపడతారు. (వితండానికిది సందర్భం కాదుగనక అదెలానూ కుదరదు) ఏమి మనుషులో ఏమిటో? జిజ్ఞాసతో తెలుసుకోవడానికి గాని, జ్ఞానిగా తెలపడానికి గాని, సైద్ధాంతికునిగా సిద్ధాంత చర్చకుగానీ సిద్ధం కాకుండగనే బహుగా వదరుతుండే రకాన్నేమి చేయాలి? గజశునక న్యాయాన్ననుసరించి సాగిపోనైనాపోవాలి. లేదా తొండాన పట్టినేలకేసికొట్టనైనా కొట్టాలి. అంత దనుక ఈ సమస్య తీరదు. అనిపిస్తోంది.

వివిధ ఆస్థిక పక్షీయులకు (వారు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, యూదులా, మరొకరా, మరొకరా అన్న వ్యత్యాసమేమీ నాకులేదు) అభౌతికశక్తుల ఉనికిని అంగీకరించే వాస్తు, జ్యోతిష పక్షాల వాళ్ళకు అభౌతిక శక్తులతో పని లేకనే వాస్తు ఉందనేవాళ్ళకు, ఈ పత్రికాముఖంగా విచారణకు రండని కబురందిస్తున్నాను.

నాపక్షం ఇదిగో :

1. అభౌతికశక్తుల ఉనికి అనిర్ధారితము. అనిర్ధారణీయము. మనకున్న జ్ఞానగ్రహణ పరికరాలు, విధానములకున్న పరిమిత సామర్ధ్యాలననుసరించి అభౌతికాలను గుర్తించడమే సాధ్యపడదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భౌతికాలలోనూ అతీంద్రియాలెన్నో వున్నాయి.

2. వాస్తు జ్యోతిషాలకు ఒక ప్రామాణిక గ్రంథమంటూ లేదు. అనేక కాలాలలో అనేక దేశాలలో అనేకులు ఎవరికి తోచింది, వారు చెపుతూ, వ్రాస్తూ వచ్చారు వాటిని. అవన్నీ పరస్పరం సమాన, అసమాన, మరియు ప్రతికూల భావాలతో ఉన్నేౖ.

3. వాటిలో వాస్తు వరకు చూస్తే, నిర్మాణ సాంకేతిక విజ్ఞానం (దారు, శిలా, లోహ, మిశ్రమాలకు సంబంధించిన పదార్ధ విజ్ఞానం) కొంతవరకు ఉంది. అయితే సాంకేతిక విజ్ఞానం విషయంలో ఈనాడు మనం ఆనాటి స్ధాయి కంటే ఎంతో ఉన్నతమైన స్థాయికిచేరాం. కనుకనే సాంకేతికాంశాల వరకు వెనకటి వాస్తు శాస్త్రాలను పరిగణలోక

తీసుకోవడం లేదు. వాస్తు పండితులూ ఆ విషయంలో ఆధునిక నిర్మాణ సాంకేతిక విద్యనే అనుసరిస్తున్నారు.

4. ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞానం (సివిల్‌ ఇంజనీరింగ్‌)లో లేని, అది పట్టించుకోని క్షేత్రాల గురించే ఈనాటి వాస్తు పక్షాలన్నీ వాస్తును చెపుతున్నేౖ.

5. పంచభూతాలను చెప్పే గౌరువారుగానీ, వారిని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ప్రాచీన వాస్తే సరైందంటున్న సాంప్రదాయక వాస్తు పక్షాల వాళ్ళు చెప్పే దిక్పాలకులు, ఇతర అధి దేవతలు, వగైరాలుగానీ ఉన్నారనడానికిగానీ, వారు గృహస్తు జీవితంలో అతని గృహనిర్మాణాన్ననుసరించి శుభా శుభ ఫలితాలను కలిగిస్తుంటారనడానికి గానీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

గమనిక : ఈ విషయాలలో శాస్త్రీయమనదగ్గ స్ధాయిలో నిర్ధారణలకు సిద్దపడాల్సిన అవసరం బాధ్యతకూడా అన్ని పక్షాలకు, సామాజిక స్పృహగల విజ్ఞులకూ ఉంది. కనుకనే అలాంటి విశేష పరిశీలనకు మేము సిద్ధమంటున్నాము.

జ్యోతిషం : దీనికీ ఒక ప్రామాణిక గ్రంథమంటూలేదు. 'సూర్య సిద్ధాంతమేవ ప్రామాణ్యం' అన్న ఒక వాక్యం ఉంది.

2. సూర్య సిద్ధాంతాన్ని పరిశీలనకు తీసుకుందామంటే మాకు ఎట్టి అభ్యంతరాలు లేవు. మీదే ఆలశ్యం

3. ఖగోళ విజ్ఞానమనదగ్గదాన్ని, ఫలితజ్యోతిష్యమంటున్నదాన్ని వేరు వేరుగా చూడాలి. నాకు తెలిసినంతలో సూర్య సిద్ధాంతం సిద్ధాంత భాగం. అందు ఫలితాలు, జాతకాల భాగం లేదు.

4. షడంగాలలో ఒకటైన జ్యోతిషం అన్న దానిలోనూ, ఈ నాడు జ్యోతిష్యం పేరున చెపుతున్న జాతకాల గొడవలేదు. వేద మంత్రాలలోనూ, జాతకాల గొడవలేదు.

గమనిక : ఈ విషయంలో నాతో విభేదించేవారు ఈ నాలుగాంశాలలో వారి పక్ష మేమిటో వ్రాత మూలకంగా ప్రకటించాలి ముందు.

5. సిద్దాంత భాగంలోనే వాస్తవ విరుద్ధాంశాలుంటే ఇక ఆ పై జ్యోతిష్యాన్ని గురించి విచారణ జరపడం అనవసరం. ఇది చాలా కీలకాంశం.

6. అదలా ఉంచి ఎవరుగానీ 'జ్యోతిషం రుజువు చేయదగిందే, రుజువు చేయగలను' అని అనేట్లయితే మమ్మల్ని సంప్రదించండి. నిర్ధారణకు కూర్చోడానికి వారంగీకరించే లేదా అవసరమనే షరతులు ఏమిటో మాకు వ్రాయండి.

అభౌతిక శక్తుల ఉనికి అనిర్ధారితం, అనిర్ధారణీయం అనే మా పక్ష ప్రతిపాదన ఈ వాస్తు జ్యోతిష్కులకూ వర్తిస్తుంది.

సత్యావిష్కరణైకతత్పరత గాని మీ కుంటే నిజాల నరయడానికి, పరిశోధనా దృష్టితో మిత్రులంగనే ఈ పనికి పూనుకోవచ్చు. ఉంటాను. సెలవు.

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర

No comments:

Post a Comment