ప్రజా ప్రయోజనాల దృష్టితో ఈ వ్యాసాలను యధేచ్ఛగా వినియోగించుకోవడానికి సహృదయంతో అంగీకారం తెలిపిన మిత్రులు కళైమామణి శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తి గారికి సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఉద్యమాభినందనలను తెలుపుకుంటోంది. డాక్టర్ అంబేద్కర్‌ను ఒక వర్గ ప్రతినిధిగా గాక, భారత జాతికంతటికి ప్రతినిధిగా, ఇంకా సరిగా చెప్పాలంటే మానవత్వానికి ప్రతినిధిగా అర్థం చేసుకోవడం, సమాజానికి అర్థమయ్యేట్లు తెలియజెప్పటం అన్న రెండూనే ఆయన చేసిన శ్రమకు, పడిన తపనకు సరైన నివాళి అవుతుందని తలంచుతోంది.
రాజ్యాంగ నిర్మాతగ గుర్తుంపబడిన డా||బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా పూర్తిచేసినపుడు ప్రకటించిన తన భావాలు ఆయన ప్రసగంలోనే చూడండి.
ప్రతిపాదిత రాజ్యాంగము ఉద్దేశములూ - లక్ష్యముల గురించి
పండిత జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం పై ది. 17-12-1946న డా|| బి.ఆర్. అంబేద్కరు చేసిన ఉపన్యాసం
అధ్యక్షా! ఈ తీర్మానం పై మాట్లాడమని నన్ను కోరినందుకు మీకు కృతజ్ఞుణ్ణి. మీ ఆహ్వానం నాకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పక తప్పదు. నా ముందు కొందరు 20 లేదా 22 వున్నారని అనుకొంటున్నాను. నా వంతు అంటూ వస్తే అది రేపు రావాలి. నేను ఈనాడు ఏ విధమైన సంసిద్దతా లేకుండా వచ్చినందున రేపటికయితే దీనిని బాగా ఇష్టపడి ఉండేవాడిని. ఇలాంటి సందర్భంలో ఒక పూర్తి ప్రకటన చేయాలని అనుకొన్న మూలంగా, దీనికి రేపటికయితే సిద్ధపడివచ్చి వుండేవాడిని. పైగా, మీరు ఇందుకు 10 నిమిషాలు సమయం పరిమితి విధించారు. ఈ పరిమితులకు లోబడి నా ముందు ఉన్న తీర్మానానికి ఏ విధంగా న్యాయం చేయాలో తెలియడం లేదు. ఈ విషయంలో నా ఆలోచనలను సాధ్యమైనంతవరకు కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
అధ్యక్షా! నిన్నటి నుంచి జరిగిన చర్చలో ఈ తీర్మానం రెండు భాగాలుగా వుందనడం స్పష్టం. ఒక భాగం వివాదాస్పదంగా వుంది. మరోభాగం వివాద రహితంగా వుంది. వివాద రహితంగా వున్న భాగం, ఈ తీర్మానంలో 5 నుండి 7 వరకు ఉన్న పేరాగ్రాపుల భాగం. ఈ పేరా గ్రాఫ్‌లు, ఈ దేశపు భావి రాజ్యాంగ లక్ష్యాలను ఉల్లేఖిస్తున్నాయి. ప్రసిద్ధ సోషలిస్టు అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుండి ఈ తీర్మానం వచ్చిన మూలంగా, ఇది వివాద రహితంగా వున్నప్పటికీ ఇది నాకు నిరాశనే కలిగించిందని చెప్పక తప్పదు. ఈ తీర్మాన భాగంలో అతడు ఇంకా ముందుకు వెళ్ళి వుండవలసిందని నేను ఆశించాను. చరిత్రాధ్యేతగా నేను, ఈ తీర్మాన భాగమును పూర్తిగా ఇందులో చేర్చకపోతే బాగుండును అనుకొంటున్నాను. ఈ తీర్మాన భాగాన్ని చదివినప్పుడు ఫ్రెంచి రాజ్యాంగ సభ వారిచేత ప్రకటించబడిన మానవహక్కుల ప్రకటన ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తుంది. నేను ఈ సూచన చేయడంలో తప్పులేదనుకొంటున్నాను. 450 సంవత్సరాలు గడిచిన తర్వాత, మానవ హక్కుల ప్రకటనా, అందులోని సూత్రాలు మన అందరి మనస్సుల్లో ఒక భాగమైపోయాయి. నాగరికతా ప్రపంచంలో ఆధునిక మానవుని మనస్సులో ఇవి ఒక భాగమైపోవడమే కాదు, ఇంత సనాతనంగా, ఆలోచనల్లో సాంఘిక వ్యవస్ధలో ఇంత చాందసంగా, వుంటున్న మన దేశంలో కూడా, దీని విలువను కాదనేవాడు కనిపించడం అరుదు. ఈ తీర్మానంలో దీన్ని పునరుచ్చరించడం, సూక్ష్మంగా చెప్పాలంటే - మన జ్ఞానానికి డప్పుకొట్టుకోవడం లాంటిది. ఈ సూత్రాలు మన దృక్పధానికి మన స్వచ్ఛభావాలవుతున్నాయి. కాబట్టి వీటిని ఈ తీర్మానంలో భాగంగా ఉద్ఘాటించడం అనవసరం. ఈ తీర్మానానికి ఇంకా కొన్ని ఇతర లోపాలున్నాయి. ఈ తీర్మాన భాగం కొన్ని హక్కుల్ని ఉద్ఘాటించినా - వాటి పరిహారాల గురించి మాట్లాడ్డం లేదు. హక్కులకు పరిహారాలు ఏర్పాటు చేయకపోతే అవి హక్కులుగా వుండవని మనందరకూ తెలుసు. ఈ హక్కులపై దాడి జరిగినప్పుడు ప్రజలు పరిహారాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ పరిహారాలు పూర్తిగా లుప్తమైఉన్నాయి. ఒక మనిషి జీవితాన్ని కాని, స్వేచ్చను కాని, ఆస్తిని కాని చట్టబద్ధంగా తప్ప, తీసికోకూడదనే సామాన్య భావన కూడా ఈ తీర్మానంలో చోటు చేసుకోలేదు. ప్రాథమిక హక్కులు చట్టానికీ, నైతికతకూ లోబడినటువంటివి. ఏది చట్టము, ఏది నైతికత అనేది, అప్పటి కార్యనిర్మాహక శాఖ నిర్వచిస్తుంది. ఒక కార్య నిర్వాహక శాఖ ఒక దృక్పథాన్ని మరొక కార్యనిర్వాహకశాఖ మరొక దృక్పధాన్ని అవలంభించవచ్చు. ఆయా కాలపు కార్యనిర్వాహక శాఖలకు దీనిని వదిలివేస్తే - ప్రాధమిక హక్కుల స్థితి ఎలా వుంటుందో మనకు తెలియదు. ఆర్యా! ఇందులో కొన్ని రాజకీయ, సాంఘిక, ఆర్ధిక, న్యాయ విషయాల గురించిన భావాలున్నాయి. ఈ తీర్మానం ప్రముఖునిచే ప్రవేశపెట్టబడింది. కాబట్టి నిశ్చయంగా ఇందులో నిజాయితీ వుంది. దీని వెనుక వాస్తవికత వుండాలంటే ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయాన్ని యధార్ధం చేయడానికి ప్రభుత్వానికి ఒక ఏర్పాటు వుండాలని అనుకొంటున్నాను. ఈ దృష్టితో ఈ తీర్మానం దీనిని విస్పష్టంగా ప్రకటించాలని అనుకొంటున్నాను. దేశంలో సాంఘిక, ఆర్థిక న్యాయం వుండడానికి పరిశ్రమల, భూమి జాతీయీకరణ జరగాలి. దేశంలో ఆర్థిక వ్యవస్థ సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్ధగా మారనంతవరకు, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేయాలనుకొనే ఏ భావి ప్రభుత్వానికైనా ఇది ఎలా సాధ్యపడుతుందో నాకు అర్ధం కావడం లేదు. కాబట్టి ఈ ప్రతిపాదనల ఉద్ఘాటనకు నాకు వ్యక్తిగతంగా ఏమీ అభ్యంతరం లేనప్పటికీ, ఈ తీర్మానం నా మనస్సుకు కొంతవరకూ నిరాశ కలిగించింది. ఇంతవరకూ చేసిన పరిశీలనలతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేస్తున్నాను.
నేనిప్పుడు తీర్మానంలోని మొదటి భాగానికి వస్తున్నాను. ఇందులో 4 పేరాలున్నాయి. నేను ముందే చెప్పినట్లుగా, చర్చల్లో ఇది చాలా వివాదాస్పదమయింది. రిపబ్లిక్ అనే మాటపై వివాదమంతా కేంద్రీకృతమయింది. 4వ పేరాలో వచ్చిన సార్వభౌమాధికారం ప్రజల నుండి వస్తుంది. అనే వాక్యంపై కేంద్రీకృతమయింది. నా మిత్రుడు డా. జయకర్ నిన్న ఈ విషయాన్ని లేవదీసాడు. ముస్లింలీగు ఇక్కడ లేనపుడు, ఈ సభ - ఈ తీర్మానంపై కార్యకలాపాలు సాగించడం సరికాదన్నాడు. ఈ మహాదేశపు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధ తుది రూపం గురించి, భవిష్యదభ్యుదయం గురించి, ఇప్పుడు నాకెంత మాత్రం సందేహం లేదు. మనం సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా విభజింపబడ్డాయని ఈ రోజు నాకు తెలుసు. మనం పోరాట శిబిరాల్లో వున్న ఒక గుంపుగా ఉన్నాము. అలాంటి శిబిరంలోని ఒక నాయకునిగా నన్ను నేను చెప్పుకొంటున్నాను. ఆర్యా! అయినా సరే. కాలమూ, పరిస్థితులూ ఎలా వున్నాసరే, ఈ దేశం ఒకటిగా ఉండడానికి ప్రపంచంలో ఏదీ అడ్డుకోలేదని నమ్ముతున్నాను. (చప్పట్లు) మనకు గల కులాలు, తెగలు అన్నింటితో కలిపి, మనమందరం సమైక్య ప్రజారూపంలో వుంటామని చెప్పడానికి నాకెంత మాత్రం సందేహం లేదు. (హర్షద్వానాలు) ఇప్పుడు ముస్లిం లీగు ఇండియాను విభజించమని ఉద్యమం చేస్తూంది. ఏదో ఒక రోజున వారికి వివేకోదయం అవుతుంది. వారు కూడా, సమైక్య భారతదేశం వారికి కూడా శ్రేయోదాయకం అని భావిస్తారని చెప్పడంలో నాకు సందేహం లేదు.
ఇంతవరకు తుది లక్ష్యానికి సంబంధించినంతవరకూ, మనలో ఒకరికి (ఒక వర్గ ప్రతినిధికి అనా?) కొన్ని భయాలున్నట్లుగా అనుకొంటున్నాను. మనలో ఎవరూ భయపడనక్కర్లేదు. మన ఇబ్బంది తుది భవిష్యత్తు గురించి కాదు. మన ఇబ్బంది దేని కోసమంటే ఈనాడు భిన్నవర్గాలుగా ఉన్న ప్రజానీకం సమిష్టిగా ఎలా నిర్ణయం తీసుకొంటుంది? ఐక్యత వైపు పయనించడానికి ఎలా సిద్ధమవుతుంది? అనే దాని కోసం మాత్రమే మన విచారం. ముగింపు గురించి కాదు. మన విచారం ఆరభం గురించి మాత్రమే. అధ్యక్షా! ఇందుకు మనల్ని వాంఛనీయ మిత్రుల్ని చేసుకోవడానికి నేను ఆలోచించాలి. ప్రతి పార్టీని ఒప్పించడానికి ప్రయత్నించాలి. ఈ దేశంలోని ప్రతి వర్గాన్ని మార్గంలోనికి తీసుకురావాలి. ఇది మెజారిటీ పార్టీకి పెద్ద రాజనీతిజ్ఞతతో కూడిన పని. మనతో కలసి నడవడానికి సిద్ధపడని ప్రజల మూఢ విశ్వాసాల విషయంలో కూడా మనం కొన్ని రాయితీలు ఇవ్వాలి. ఇందుకోసమే, నేనీ విజ్ఞప్తి చేస్తున్నాను. నినాదాలను వదిలివేద్దాం. ప్రజల్ని భయపెట్టే మాటల్ని వదలివేద్దాం. మనలో ఉన్న శత్రువుల మూఢవిశ్వాసాలకు రాయితీలు ఇద్దాం. వారిని మనలో కలుపుకొందాం. మన మార్గంలో మనతో కలసి నడవడానికి వారు ఇష్టంతో ముందుకువస్తారు. నేను ముందే చెప్పినట్లు, మనం చాలినంత దూరం నడిస్తే - మనం ఐక్యత వద్దకు తప్పనిసరిగా చేరుకొంటాం. అందుచేత, ఇక్కడ నేను డా. జయకర్ సవరణను బలపరుస్తున్నాను. ఎందుచేతనంటే మన మందరమూ ఇది ఒప్పో తప్పో గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం అవలంభిస్తున్న వైఖరి చట్టబద్ధ హక్కుల అనుకూలంగా వుందో లేదో, ఇది 16మే, నాటి ప్రకటనతో ఏకీభవిస్తుందో లేదో లేక 6 డిశంబరు నాటి ప్రకటనకు సరిపడుతుందో, లేదో ఇవన్నీ ప్రక్కన పెడదాం. దీనిని చట్టబద్ధ హక్కులుగా వ్యవహరించడానికి, ఇదిచాలా పెద్ద సమస్య. ఇది చట్టబద్ధ సమస్య కానేకాదు. చట్ట విషయాన్ని వదలివేయాలి. మనతో రావడానికిఇష్టపడని వారు, మనతో వచ్చేలా, కొన్ని ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు కూడా మనతో వచ్చే అవకాశం కల్పిద్దాం. ఇది నా విజ్ఞప్తి.
చర్చ జరుగుతున్నప్పుడు, రెండు ప్రశ్నలు వచ్చాయి. అవి నన్ను ఎంతగా ఆకట్టుకొన్నాయంటే వాటిని ఓ కాగితం ముక్కపై నోటు చేసికొన్నాను. నిన్న సభలో మాట్లాడిన నా మిత్రడు బీహారు ప్రధానమంత్రి (ఆనాడు రాష్ట్రముఖ్యమంత్రిని- రాష్ట్ర ప్రధాన మంత్రి అనేవారు) నుండి ఒక ప్రశ్న వచ్చిందనుకొంటున్నాను. ఈ తీర్మానం లీగును ఈ రాజ్యంగ సభలోనికి రాకుండా ఎలా నిరోధిసస్తుంది? అన్నది ఈ రోజున నా మిత్రడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరో ప్రశ్న అడిగాడు. ఈ తీర్మానం కేబినెట్ మిషన్ ప్రతిపాదనతో విభేదిస్తుందా? ఆర్యా! ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలనుకొంటున్నాను. వీటికి జవాబు చెప్పాలి. ఖచ్చితమైన జవాబు చెప్పాలి. ఈ తీర్మానం కోరిక ఫలితాన్ని సాధించడానికి ఉద్ధేశించిందో లేదా నెమ్మది వ్యూహం ఫలితమో, లేదా కాకతాళీయమో, ఏది ఏమైనా లీగును మాత్రం బయటవుంచింది. ఈ సందరభంగా ఈ తీర్మానంలోని 3 పేరాను పరిశీలించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇది చాలా ముఖ్యమైనదీ. అర్ధవంతమైనది. 3వ పేరా, భావిభారత రాజ్యంగాన్ని ఉపలక్షిస్తుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారి అభిప్రాయమేమిటో నాకు తెలియదు. ఈ తీర్మానం నెగ్గిన తరువాత, ఆ విషయం ఎత్తుకొంటాను. 3వ పేరాలోని విషయాలతో రాజ్యాంగాన్ని తయారు చేయమని రాజ్యాంగ సభకు ఇదొక మార్గదర్శక సూత్రంగా పనిచేస్తుంది. ఇంతకీ 3వ పేరా ఏం చెపుతూ వుంది? ఈ దేశంలో రెండు విభిన్న ప్రభుత్వాలుండాలని, ఒకటి దిగువన సర్వస్వతంత్ర రాష్ట్రాలు లేదా రాష్ట్రాలు లేదా సమైక్య భారతదేశంలో చేరేటటువంటి ఇతర ప్రాంతాలుండాలని 3వ పేరా చెపుతుంది. ఈ సర్వస్వతంత్ర రాష్ట్రాలు పూర్తి అధికారాలు కలిగియుంటాయి. వాటికి శేషించిన అధికారాలు కూడా వుంటాయి. రెండు అగ్రభాగాన, అంటే రాష్ట్రాలపైన, కేంద్ర ప్రభుత్వముంటుంది. దానికి శాసన, కార్యనిర్వాహక, పరిపాలన అంశాలు కొన్ని వుంటాయి. తీర్మానంలో ఈ భాగాన్ని చదివినప్పుడు, ఒక వైపున కేంద్రాన్ని, మరొకవైపున రాష్ట్రాలను అనుసంధానించే వ్యవస్థ కాని, కలిపే ఆలోచన కాని నాకు కనిపించలేదు. కేబినెట్ మిషన్ ప్రకటనను దృష్టిలో వుంచుకొని దీనిని చదివినపుడు, లేదా వార్ధా సమావేశంలో కాంగ్రెసు వారు గెలిపించిన తీర్మానాన్ని దృష్టిలో వుంచుకొని దీనిని చదివినపుడు, ఈ రాష్ట్రాలను గ్రూపింగు చేసే ఆలోచన గురించి ప్రస్తావించకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా, నాకు సంబంధించినంత వరకూ, వీటి గ్రూపింగు ఆలోచన నాకు ఇష్టం లేదు. (హియర్, హియర్) నేను ఒక బలమైన ఐక్య కేంద్రాన్ని ఇష్టపడుతున్నాను. (హియర్ హియర్) 1935 భారత ప్రభుత్వ చట్టం క్రింద ఏర్పాటు చేసికొన్న కేంద్రం కంటే బలంగా వుండాలి. కాని, మనం చాలా దూరం ప్రయాణించాము. తనకు మాత్రమే బాగా తెలిసిన కారణాలతో కాంగ్రెసు పార్టీ, బలమైన కేంద్రాన్ని శిథిలం చేయడానికి సమ్మతించింది. ఈ మాట అనక తప్పడం లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం 150 ఏళ్ళ పరిపాలనా పలితంగా, ఈదేశంలో ఏర్పాటు చేయబడింది. దీనిని నేను ఎంతో ఆరాధనా, గౌరవ రక్షణ భావాలతో చూసాను. ఇప్పుడు ఈ పరిస్థితికి తిలోదకాలిచ్చాము. మనకు బలమైన కేంద్రం అక్కర లేదన్నాము. మధ్య తరహా ప్రభుత్వమే ఉండాలని, రాష్ట్రాలకు యూనియన్‌కు మధ్య దిగువ స్ధాయి ఫెడరేషన్ ఉండాలని అంగీకరించాము. రాష్ట్రాలను గ్రూపింగు చేసే ఆలోచన గురించి ఎందుకు ఈ 3వ పేరాలో ప్రస్తావించలేదో నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు సరిగా అర్థమైనంతవరకూ, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగు మరియు ఆంగ్ల ప్రభుత్వమూ, గ్రూపింగుకు సంబంధించిన క్లాసుపై వ్యాఖ్యానంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. నేను ఎప్పుడూ ఇదే అనుకొన్నాను. ఒక వేళ ఇది తప్పయితే నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా వున్నాను. రకరకాల గ్రూపుల్లో చేర్చబడిన రాష్ట్రాలు యూనియన్‌గా గాని, చిన్నస్ధాయి ఫెడరేషన్‌గా గాని తయారవడానికి ఇష్టపడితే - కాంగ్రెసు పార్టీ అందుకు సమ్మతిస్తుంది. దానికి అభ్యంతరం చెప్పదు. కాంగ్రెసు పార్టీ ఆలోచనను నేను సరిగానే వ్యాఖ్యానించాననుకొంటున్నాను. నేను అడుగుతున్న ప్రశ్న ఇది. రాష్ట్రాల యూనియన్ ఆలోచన గురించికాని, రాష్ట్రాల గ్రూపింగు గురించి కాని, తాను, తన పార్టీ ఆమోదించిన రీతిలో, ఈ తీర్మాన ప్రతిపాదకుడు ఎందుకు ప్రస్తావించలేదు? నాకు జవాబు లేదు. ఎవరికీ లేదు. ఈ రాజ్యాంగ సభలో బీహారు ప్రధాని, డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి రెండు ప్రశ్నలకు అంటే ఈ తార్మానం 16మే ప్రకటనకు ఏ విధంగా భిన్నంగా వుంది? ఈ సభలో ముస్లిం లీగును ప్రవేశించకుండా ఇది ఎలా నిరోధిస్తుంది? అనే ప్రశ్నలకు నా జవాబు ఇది. 3వ పేరాను ముస్లిం లీగు అవకాశంగా తీసికొని తీరుతుంది. తన గైరుహాజరు కొనసాగింపును సమర్ధించుకొంటుంది. అర్యా! నిన్న నా మిత్రడు డా. జయకర్ ఈ విషయం పై నిర్ణయాన్ని వాయిదా వేయమని నివేదించాడు. అతనికి నొప్పి కలిగించకుండా మాట్లాడాలంటే - అతడు దీనిని న్యాయపరిధిలో చూస్తున్నాడు. అతని వాదానికి ఆధారం ఏమిటంటే - ఈ రకంగా చేసే హక్కు మీకు వుందా? అతడు కేబినెట్ మిషనులోని కొన్ని భాగాలను చదివి వినిపించాడు. రాజ్యాంగ సభ కార్యకలాపాలకు సంబంధించిన భాగాలవి. ఆయన అభిప్రాయం ఏమిటంటే - రాజ్యాంగ సభ ఈ తీర్మానాన్ని సూటిగా నెగ్గించే హక్కు మీకు ఉందా లేదా అని నేను మిమ్మల్ని అడగడం లేదు. ఇలా చేయడానికి మీకు హక్కు ఉండవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ఈ ఆలోచన ముందు జాగ్రత్తతో కూడినదేనా? వారి ఎత్తుగడలేమిటి? వారి వ్యూహం ఏమిటి? నాకు తెలియదు. కాని ఈ సమస్య పై బయటి వానిగా, నా బుద్దినంతా ఉపయోగించి చూస్తే - మూడు మార్గాలున్నట్లుగా నాకు తోస్తూ ఉంది. ఈ మార్గాల ద్వారా భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. 1. ఒక పార్టీ కోరికలకు మరొకటి తలవంచడం. ఇదొక మార్గం. రెండో మార్గం ఏమంటే సంప్రదింపుల ద్వారా శాంతిని సాధించడం. మూడో మార్గం ఏమిటంటే యుద్ధం. అర్యా! సభలోని కొందరు సభ్యులు యుద్ధానికి సిద్ధమే అంటున్నట్లుగా వింటున్నాను. ఈ దేశంలో ఎవరైనా సరే రాజకీయ సమస్య యుద్ధం ద్వారా పరిష్కరిస్తామంటే నాకు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ దేశంలో ఎందరు ప్రజలు ఈ ఆలోచనలను సమర్ధిస్తారో నాకు తెలియదు. బహుశా చాలా మంది సమర్ధించవచ్చు. అందుకు కారణం చాలా మందికి యుద్ధమంటే బ్రిటీషు వారితో చేసే యుద్ధం లాంటిదే అనుకొంటారు. ఈ ప్రజలు మనస్సులో అటువంటి యుద్ధాన్ని లక్షిస్తూ వుంటే - అది స్ధానిక మవుతుంది. పరిమితమవుతుంది. అది బ్రిటీషు వారిపై చేసిన యుద్ధం కంటే గొప్పదైయుండదు. ఇటువంటి వ్యూహానికి నాకు కూడా బహుశా పెద్ద అభ్యంతరం వుండదు. కాని అది బ్రిటిషు వారిపై యుద్ధం మాత్రమేనా? ఈ సభ ముందు వీలయినంత విస్పష్టంగా చెప్పాలనుకొంటున్నాను. ఈ దేశంలో యుద్ధమంటూ వస్తే - ఆ యుద్ధం. ఈ రోజు మనకు ఎదురైన సమస్యకు సంబంధించినదైతే అది బ్రిటిషు వారిపై యుద్ధమే. అది ముస్లిములపై యుద్ధమే. అది ముస్లింలపై యుద్ధమే కాదు. ఇంకా దారుణమైనది, ముస్లింలు, బ్రిటిషు వారు వీరిరువుపై యుద్ధం అవుతుంది. ఈ ఉపలక్షిత యుద్ధం, నేను భయపడుతున్న యుద్ధానికి ఏ విధంగా భిన్నంగా వుంటుందో నేను గ్రహించలేకపోతున్నాను. అమెరికాతో రాజీ అనే బర్కు ప్రసంగం నుండి ఒక భాగాన్ని ఈ సభలో చదవాలనుకొంటున్నాను. ఈ సభ వారి ఉద్రేకం పై ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తుందనుకొంటున్నాను. బ్రిటిషు వారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని తిరుగుబాటు స్ధావరాలను జయించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వాటిని తమ పాలనలోనికి తెచ్చుకోవాలనుకొంటున్నారు. ఆ స్థావరాలను జయించే ఆలోచనను వ్యతిరేకిస్తూ బర్కు ఇలా అంటాడు.
ఆర్యా! ముందుగా నన్నొకటి చెప్పనివ్వండి. బలప్రయోగం తాత్కాలికమే. కొద్ది కాలం లొంగదీయవచ్చు. కాని మళ్ళీ మళ్ళీ లొంగదీసుకోవలసిన అవసరాన్ని అది తొలగించదు. ఎప్పుడూ లొంగదీసుకోవలసిన దేశంలో పరిపాలన వుండదు. నా రెండో అభ్యంతరం ఏమిటంటే దీని అనిశ్చిత స్థితి భయోత్పాతం ఎప్పుడూ బలం యొక్క ఫలితం కాదు. ఆయుధ దారణ విజయం కాదు. మీరు గెలవకపోయినట్లయితే - మీరు ఏ వనరులూ లేకుండా మిగిలిపోతారు. రాజీ విఫలమయినచో బలప్రయోగం మిగులుతుంది. కాని బలప్రయోగం విఫలమయితే - ఇక రాజీకి అవకాశం లేదు. శక్తీ, అధికారమూ కూడా ఒకోసారి దయాదాక్షిణ్యాలలో కొనుగోలు చేయబడతాయి. పేదవాడిని దేశంలో ఓడిపోయిన హింసావాదంతో ముష్టిగా అవి ఎన్నడూ యాచించబడవు.
బలప్రయోగానికి మరో అభ్యంతరం ఏమిటంటే - ఏ లక్ష్యాన్ని కాపాడడానికి నీవు ప్రయత్నాలు చేస్తున్నావో - ఆ లక్ష్యాన్ని నీవు బలప్రయోగంతో ధ్వంసం చేస్తున్నావు. నీవు దేని కోసం పోరాడుతున్నావో అది - నీవు సంపాదించుకోవలసింది కాదు. దాని విలువ తరిగిపోతుంది. వ్యర్థమైపోతుంది. పోటీలో అరిగిపోతుంది.
ఇవి చాలా శక్తివంతమైన మాటలు వీటిని విస్మరించడం ప్రమాదకరం. ఎవరికైనా తన మనస్సులో హిందూ - ముస్లిము సమస్య బలప్రయోగంతో పరిష్కరించాలనివున్నట్లయితే - అంటే యుద్ధంతో పరిష్కారించాలంటే ముస్లిములను లొంగదీయాలి. రాజ్యాంగానికి లోబడేలా చేయాలి. వారికి ఇష్టం లేకపోయినా సరే అనుకొంటే - ఈ దేశం వారిని ఎల్లప్పుడూ ఓడిస్తూనే వుండాలి. ఈ దండయాత్ర ఒకసారి కాదు. ఎల్లప్పుడూ ఇప్పటి దాకా తీసికొన్నదానికంటే ఎక్కువ సమయం తీసికోవాలని లేదు. మళ్ళీ ఒకసారి బర్కు మాటల్ని చెప్పి దీన్ని ముగిస్తాను. బర్కు ఒక చోట అంటాడు. అధికారమివ్వడం సులువే. వినియెగించడానికి సంసిద్ధమైనపుడు, మన ప్రవర్తనతో దానిని రుజువు చేద్దాం. దేశంలోని అన్ని వర్గాలను మనతో కూడగట్టుకుపోయే మార్గం అదొక్కటే. మనల్ని ఐక్యత దిశగా తీసికువెళ్ళే మరో దారి లేదు. ఈ విషయంలో మనం నిస్సందేహంగా వుందాం.
మొదటిసారిగా ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టినప్పుడు 4వ నవంబర్ 1948న డా.అంబేద్కరు చేసిన ఉపన్యాసం - గౌరవనీయ డా.బి.ఆర్.అంబేద్కరు (బొంబాయి : జనరల్)
అధ్యక్షా! ముసాయిదా కమిటీ ఖరారు చేసిన ముసాయిదా రాజ్యాంగ సంవిధానాన్ని ప్రవేశపెడుతున్నాను. దీనిని పరిశీలనలోనికి తీసికోవలసిందిగా సభను కోరుతున్నాను.
ముసాయిదా కమిటీ, 29 ఆగస్టు 1947న రాజ్యాంగ సభ వారు చేసిన తీర్మానం ప్రకారం నియమించబడింది. రాజ్యాంగ సభ వివిధ కమిటీలను నియమించింది. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ, మైనారిటీలు, గిరిజన ప్రాంతాలపై సలహా కమిటీ మొదలయినవి. ఈ కమిటీలు ఇచ్చు రిపోర్టులపై, రాజ్యాంగ సభ వారి నిర్ణయాలను అనుసరించి, ముసాయిదా కమిటీకి రాజ్యాంగ ప్రభుత్వం చట్టం 1935లో ఉన్న కొన్ని అంశాలను అనుసరించాల్సిందిగా మాకు ఆదేశాలిచ్చింది. నేను 21 ఫిబ్రవరి 1948లో వ్రాసిన ఉత్తరంలో ఈ విషయాలను ప్రస్తావించాను. వాటికి మార్పులు ప్రస్తావించాను. ప్రత్యామ్నాయాలు సూచించాను. ఇవి తప్ప ముసాయిదా కమిటీ తనకిచ్చిన ఆదేశాలను విశ్వసనీయంగా నెరవేర్చిందని అనుకొంటున్నాను.
ముసాయిదా కమిటీ నుండి వస్తున్న రాజ్యాంగ సంవిధానప్రతి బ్రహ్మాండమయిన పత్రం. దీనిలో 315 ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూల్సు ఉన్నాయి. ఈ రాజ్యాంగ ప్రతి అంత పెద్దదిగా, ఏ దేశ రాజ్యాంగమూ ఉండదని ఒప్పుకోవాలి. దీనిని పూర్తిగా చదవకపోతే - దీని ప్రత్యేక, విశిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం కష్టం.
ముసాయిదా రాజ్యాంగం 8 నెలలుగా ప్రజల ముందు ఉండబడింది. ఈ దీర్ఘ సమయంలో, స్నేహితులు, విమర్శకులు, విరోధులు, ఇందులో వున్న విషయాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి చాలినదానికంటే ఎక్కువ సమయమే తీసికొన్నారు. వారిలో కొందరు ఆర్టికల్సు విషయంలో చాలినంత అవగాహన లేక ఉన్నారు. లేదా దురవగాహన తో ఉన్నారు అని చెప్పడానికి సాహసిస్తున్నాను. అయినా విమర్శలున్నాయి. వాటికి సమాధానం చెప్పాలి.
ఈ రెండు కారణాల నిమిత్తం ఈ రాజ్యాంగ ప్రత్యేక లక్షణాలపై మిమ్మల్ని దృష్టి పెట్టి దీనిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉన్న విమర్శను చూడమని కోరుతున్నాను.
ఇలా కోరేముందు రాజ్యాంగ సభ నియమించిన మూడు కమిటీల రిపోర్టులను సభలో ఉంచాను. 1. చీఫ్ కమిషనరు రాష్ట్రాలపై కమిటీ రిపోర్టు. 2. కేంద్రాలు, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై నిపుణుల కమిటీ రిపోర్టు 3. గిరిజన ప్రాంతాల సలహా కమిటీ రిపోర్టు సభా పరిశీలనకు ఇది చాలా ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ సభ్యులందరికీ నకళ్ళు అందించాము. ఈ రిపోర్టులను, ఇందులో చేయబడిన సిఫార్సులను ముసాయిదా కమిటీ పరిశీలించింది. వీటిని సభ ఆధీనంలో వుంచడం మా ధర్మం.
ఇక ప్రధాన ప్రశ్న : రాజ్యాంగ చట్టాన్ని చదివే విద్యార్థి చేతుల్లో ఈ రాజ్యాంగ ప్రతిని ఉంచితే - అతడు రెండు ప్రశ్నలు తప్పకుండా అడుగుతాడు. మొదటిది : ఈ రాజ్యాంగ సంవిధానంలోని ప్రభుత్వ స్వరూపం ఏమిటి ? రెండవది : ఈ రాజ్యాంగం స్వరూపం ఏమిటి? ఈ రెండు క్లిష్ట ప్రశ్నలకు రాజ్యాంగం సమాథానమివ్వాలి. ఈ రెండింటిలో మొదటి దాని గురించి మాట్లాడతాను.
రాజ్యాంగ ముసాయిదాలో ఇండియన్ యూనియనుకు ప్రధానాధిపతిగా, యూనియన్ అధ్యకక్షులు ఉంటారని పేర్కొనబడింది. ఈ అధికారి పేరు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారి పేరును జ్ఞప్తికి తెస్తుంది. ఈ పేర్ల సాదృశ్యం తప్ప, ఈ రెండు ప్రభుత్వ స్వరూపాలకు పోలిక లేదు. అమెరికాలో ఉన్న ప్రభుత్వ రూపానికీ, ఈ ముసాయిదాలో ప్రతిపాదించిన ప్రభుత్వ రూపానికి పొంతనలేదు, అమెరికా ప్రభుత్వ రూపాన్ని, అధ్యక్ష తరహా ప్రభుత్వమంటారు. ముసాయిదా పార్లమెంటరీ విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ రెండు ప్రభుత్వాలు మౌలికంగానే విభిన్నాలు.
అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యకక్షుడు కార్యానిర్వాహక శాఖకు అధిపతి. పరిపాలన అంతా అతని ఆధీనంలో వుంటుంది. మన రాజ్యాంగ ముసాయిదాలో మన అధ్యకక్షుడు, ఇంగ్లీషు రాజ్యాంగంలోని రాజుతో సమానం. మన అధ్యకక్షుడు దేశానికి అధిపతి కాని కార్యనిర్వాహక శాఖకు కాదు. ఇతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని దేశాన్ని పరిపాలించడు. దేశానికి ఇతడు చిహ్నం. పరిపాలనలో ఈయన స్థానం మహా గౌరవలాంఛన స్థానం. ఈయన లాంఛన ముద్రతోనే ప్రభుత్వ నిర్ణయాలన్నీ వెలువడుతుంటాయి. అమెరికన్ రాజ్యాంగంలో అధ్యకక్షుడు, వివిధ శాఖలను నిర్వహించే కార్యదర్శులను తన ఆధీనంలో కలిగి వుంటాడు. అదే మాదిరిగా మన అధ్యకక్షుడు, వివిధ పరిపాలనా శాఖల మంత్రులను తన ఆధీనంలో కలిగివుంటాడు. ఇక్కడ కూడా. ఈ ఇద్దరి మధ్య మౌలిక వ్యత్యాసం వుంది. అమెరికా అధ్యకక్షునికి తన కార్యదర్శులు తనకిచ్చిన సలహాను మన్నించవలసిన అగత్యం లేదు. భారత అధ్యకక్షుడు తన మంత్రులు తనకిచ్చిన సలహాను సాధారణంగా మన్నించి తీరాలి. ఇతడు వారి సలహాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. వారి సలహా లేకుండా కూడా ఏమీ చేయలేడు. అలా చేయడానికి భారత అధ్యకక్షుడికి అధికారం లేదు. తన మంత్రులు పార్లమెంటులో మెజారిటీతో వున్నంత వరకు.
అమెరికాలో అధ్యక్షతరహా పాలన - శాసన నిర్మాణశాఖ, కార్యానిర్వాహక శాఖ విభజన పై ఆధారపడి వుంది. అందుచేత అధ్యకక్షుడు కాని, అతని కార్యదర్శులు కాని ''కాంగ్రెసు'' సభ్యులు కాలేరు. మన రాజ్యాంగ ముసాయిదా ఈ సిద్ధాంతాన్ని గుర్తించదు. భారతదేశంలో మంత్రులు పార్లమెంటు సభ్యులుగా ఉండాలి. పార్లమెంటు సభ్యులు మాత్రమే మంత్రులు కాగలరు. ఇతర పార్లమెంటు సభ్యులకూ, మంత్రులకూ ఒకేరకమైన హక్కులు అంటే వారు పార్లమెంటులో కూర్చోవచ్చు. చర్చల్లో పాల్గొనవచ్చు. దాని కార్యకలాపాల్లో వోటు వేయవచ్చు.ఈ రెండు ప్రభుత్వ పద్ధతులు ప్రజాస్వామికమైనవే. ఈ రెండింటి మధ్య ఎంపిక అంత సులువ కాదు. ప్రజాస్వామిక కార్యనిర్వహణాధిపతి రెండు నిబంధనలు పాటించాలి. 1. అతడు సుస్థిరత కలిగివుండాలి. 2. అతడు బాధ్యతాయుతుడైన కార్యనిర్వహణాధికారిగా వుండాలి. ఈ రెండు అంశాలను సమాన స్థాయిలో ఉంచుతూ ఒక విధానాన్ని రూపొందించడం దురదృష్టవశాత్తూ ఇంతవరకు సాధ్యంకాలేదు. ఎక్కువ సుస్థిరతను తక్కువ బాధ్యతను కలిగియుండే విధానముంది. లేదా ఎక్కువ బాధ్యతను తక్కువ సుస్థిరతనూ కలిగియుండే విధానమూ వుంది. అమెరికా, స్విస్ విధానాలు ఎక్కువ సుస్థిరతనూ, తక్కువ జవాబుదారీ తనాన్ని కలిగియున్నాయి. బ్రిటీష్ విధానం ఇందుకు ప్రతిగా ఎక్కువ జవాబుదారీతనాన్ని తక్కువ సుస్థిరతనూ కలిగి వుంది. ఇందుకు కారణం సుస్పష్టం. అమెరికా కార్యనిర్వహణాధికారి పార్లమెంటుకు సంబంధించని అధికారి అంటే అతడు తన మనుగడకోసం - కాంగ్రెస్‌లోని మెజారిటీపై ఆధారపడి ఉండడు. బ్రిటీషు విధానములో అతడు పార్లమెంటుకు సంబంధించిన అధికారి, పార్లమెంటులో మెజారిటీ పై అతడు ఆధారపడి వుండాలి. పార్లమెంటుకు సంబంధించని అధికారి అయిన మూలంగా, సంయుక్త రాష్ట్రాల కాంగ్రెసు అతణ్ణి తొలగించలేదు. పార్లమెంటు మెజారిటీ సభ్యుల విశ్వాసాన్ని కోలుపోయిన తక్షణం పార్లమెంటరీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. జవాబుదారీ దృష్టితో చూస్తే, పార్లమెంటుకు సంబంధిచని కార్య నిర్వహణాధికారి, పార్లమెంటుపై ఆధారపడి ఉండడు. కాబట్టి శాసన నిర్మాణ శాఖ పట్ల తక్కువ జవాబుదారీగా ఉంటాడు. పార్లమెంటుకు సంబంధించిన కార్యనిర్వహణాధికారి పార్లమెంటులోని మెజారిటీపై ఆధారపడి వుంటాడు. కాబట్టి ఎక్కువ జవాబుదారీగా ఉంటాడు. పార్లమెంటరీ విధానం, నాన్ పార్లమెంటరీ విధానానికి భిన్నం. రెండవ దానికంటే మొదటిది ఎక్కువ జవాబుదారీగా ఉండడమే కాదు. జవాబుదారీ తనాన్ని మదింపు చేసే ఏజన్సీ విషయంలో, సమయం విషయంలో కూడా విభిన్నమే. నాన్ పార్లమెంటరీ విధానంలో అమెరికాలో ఉన్నటువంటి విధానంలో కార్యనిర్వహణాధికారి జవాబుదారీతనం మదింపు ఒక క్రమంలో ఉంటుంది. రెండు సంవత్సరాలకొకసారి జరుగుతుంది. దీనిని ఓటరులు చేస్తారు. పార్లమెంటరీ విధానమున్న ఇంగ్లాండులో కార్యానిర్వహణాధికారి జవాబు దారీ తనానికి మదింపు ఒక క్రమంలోనూ జరుగుతుంది. ప్రతి దినమూ జరుగుతుంది. దినవారీ మదింపును, పార్లమెంటు సభ్యులు, ప్రశ్నలతోనూ, తీర్మానాలతోనూ, అవిశ్వాస తీర్మానాలతోనూ, వాయిదా తీర్మానాలతోను మరియు ఉపన్యాసాలపై చర్చలతోనూ చేస్తారు. క్రమానుసారం చేసే మదింపును ఐదేళ్ళ అనంతరం గాని, అంతకు ముందుగాని జరిగే ఎన్నికల సమయంలో ఓటరులు చేస్తారు. అమెరికా విధానంలో జవాబుదారీ తనానికి దినవారీ మదింపు లేదు. ఇది క్రమానుసారం జరిగే మదింపుకంటే శక్తివంతమని భావించబడుతుంది. ఇండియా వంటి దేశంలో ఇది మరీ అవసరంగా భావించబడింది. మన రాజ్యాంగ ముసాయిదా పార్లమెంటరీ విధానపు కార్యనిర్వాహక అధికారిని ప్రతిపాదించింది. సుస్థిరత కంటే జవాబు దారీ తనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది.
ఇంతవరకు నేను రాజ్యాంగ ముసాయిదాలో ప్రభుత్వ స్వరూపాన్ని వివరించాను. ఇక రెండో ప్రశ్నకు వస్తాను.అదేమిటంటే రాజ్యాంగ స్వరూపం.
చరిత్రకు తెలిసినంతవరకూ రెండు రకాల రాజ్యాంగాలున్నాయి. ఒకటి యూనిటరి. మరొకటి పెడరల్. యూనిటరీ రాజ్యాంగానికి రెండు ముఖ్య లక్షణాలు 1. కేంద్ర ప్రభుత్వ అధిపత్యం. 2. సర్వసత్తా కలిగిన ఉపప్రభుత్వాలు లేకపోవడం. ఇందుకు విరుద్ధంగా వుంటుంది ఫెడరల్ ప్రభుత్వం. 1. కేంద్ర ప్రభుత్వమూ, ఉప ప్రభుత్వాలూ ప్రక్కప్రక్కనే ఉంటాయి. 2. తనకు ఇచ్చిన రంగాల్లో ఒక్కొక్కటి సర్వసత్తాకగా ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే ఫెడరేషన్ అంటే ద్వంద్వ ప్రభుత్వమేనని అర్థం. రాజ్యాంగ ముసాయిదా, ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతవరకు ఫెడరల్ రాజ్యాంగమే. ఇది. కేంద్రంలో యూనియన్ ప్రభుత్వంగాను, ఇతర చోట్ల రాష్ట్ర ప్రభుత్వంగాను వుంటుంది. రాజ్యాంగం ఒక్కొక్క ప్రభుత్వానికి ఇచ్చిన రంగాల్లో అవి సర్వసత్తాక అధికారాన్ని కలిగివుంటాయి. ఈ ద్వంద్వ ప్రభుత్వం అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికాది ద్వంద్వ ప్రభుత్వమే. ఒక దానిని ఫెడరల్ ప్రభుత్వమంటారు.మిగిలినవాటిని స్టేట్సు అంటారు. ఇది కూడా అచ్చంగా మన యూనియన్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను పోలి వుంది. అమెరికా రాజ్యంగంలో ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య కాదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పెడరల్ ప్రభుత్వం ఏజన్సీలు కావు. అదే మాదిరిగా భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య కాదు. రాష్ట్ర ప్రభుత్వాలూ దాని ఏజన్సీలు కావు. ఇక్కడ మాత్రమే. అమెరికా, ఇండియా రాజ్యాంగాలకు పోలిక. ఈ రెండు రాజ్యాంగాల మధ్య వున్న వ్యత్యాసాలు చాలా మౌలికమైనవి. ఈ రెండింటి మధ్య పోలికల కంటే ఈ వ్యత్యాసాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి.
అమెరికా, ఇండియా ఫెడరేషనుల మధ్య తేడాలు ముఖ్యంగా రెండు. అమెరికాలో ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం ద్వంద్వ పౌరసత్వాన్ని ఇచ్చింది. అమెరికాలో అమెరికాపౌరసత్వం ఉంది. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ ద్వంద్వ పౌరసత్వపు ఇబ్బందుల్ని అమెరికా రాజ్యాంగంలోని పదునాల్గవ సవరణ తొలగించింది. ఈ సవరణ, అమెరికా పౌరుల రక్షణలనూ, రాయితీలను, హక్కులనూ రాష్ట్ర ప్రభుత్వాలు భంగపరచరాదని ఆదేశించింది. అదే సమయంలో, విలియం ఆండర్సన్ చెప్పినట్లుగా, కొన్ని రాజకీయ విషయాల్లో వోటు హక్కు, ప్రభోత్వోద్యోగం పొందడం లాంటి వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులకు అనుకూలంగా వివక్ష చూపవచ్చు. ఈ అనుకూల్యం చాలా కేసుల్లో చాల దూరం పోతూ వుంది. ఈ విధంగా, రాష్ట్ర ప్రభుత్వంలో కాని, స్థానిక స్వపరిపాలనలో కాని ఉద్యోగం కావాలంటే చాలా చోట్ల ఆ వ్యక్తి, స్థానిక నివాసి లేదా స్థానిక పౌరుడు అయివుండాలి. అదే మాదిరి, ప్రజా సేవకు అంటే వకీళ్ళుగా, వైద్యులుగా ప్రాక్టీసు చేసికొనే లైసెన్సులకు, ఆ వ్యక్తికి ఆ రాష్ట్రంలో నివాసమూ, పౌరసత్వమూ తరచుగా అవసరం. వ్యాపార రంగంలో చట్టాలు మరీ కఠినం. మద్యం అమ్మకాలు, స్టాకులు మరియు బాండ్లు అమ్మకాలు వంటివాటికి, ఇటువంటి చట్టాలు పాటించి తీరాలి.
ప్రతి రాష్ట్రానికి తనకిచ్చిన పరిధిలో కొన్ని హక్కులున్నాయి. అది తన పౌరుల ప్రత్యేక ప్రయోజనాలకు వాటిని వాడుకొంటుంది. వేట, చేపలు ఒక విధంగా రాష్ట్రానికి చెందుతాయి. మృగాలవేటకూ, చేపల వేటకూ ఇచ్చే లైసెన్సులకు తన సొంత పౌరులకంటే. స్థానికేతరుల వద్ద ఎక్కువ రుసుము వసూలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో స్థానికేతరలుకు ఎక్కువ ట్యూషను ఫీజులు వసూలు చేస్తాయి. తమ ఆస్పత్రుల్లో, ఆశ్రమాల్లో స్థానికులకే అనుమతిస్తాయి. అత్యయిక పరిస్థితిలో తప్ప ఇతర పౌరుల్ని అనుమతించవు.
కొద్ది మాటల్లో చెప్పాలంటే తన పౌరుల, స్థానికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా హక్కులున్నాయి. ఈ హక్కుల్ని అవి స్థానికేతరులకు చట్టబద్ధంగా తిరస్కరించవచ్చు. లేదా స్థానికులకు ఇచ్చినట్లు కాకుండా స్థానికేతరులకు ఎంతో కష్టతరంగా ఇవ్వవచ్చు. ఈ లాభాలు రాష్ట్ర పౌరసత్వం కలవానికి తన రాష్ట్రంలో ప్రతేక్యంగా ఇవ్వబడుతున్నాయి. మొత్తం పై చూస్తే - ఒక రాష్ట్రంలో తన పౌరునికీ - ఇతరా రాష్ట్ర పౌరునికీ హక్కుల విషయంలో ఎంతో తేడాను సృష్టిస్తున్నాయి. తరచు చోటులు మారే వ్యక్తికి, తాత్కాలికంగా నివాసముండే వానికీ - ప్రతిచోటా కొన్ని ఇబ్బందులు ఎదురవక తప్పదు. ఇండియా రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో కూడిన ద్వంద్వ ప్రభుత్వం. ఇండియా మొత్తానికి ఒకే ఒక పౌరసత్వం. ఇది భారతీయ పౌరసత్వం. రాష్ట్ర పౌరసత్వమంటూ ఏదీ లేదు. ప్రతి భారతీయ పౌరుడూ ఒకే రకం హక్కుల్ని కలిగివుంటాడు. అతడు ఏరాష్ట్రంలో ఉన్నాసరే.
ఇంకో విషయంలో కూడా మన ద్వంద్వ ప్రభుత్వం, అమెరికా ద్వంద్వ ప్రభుత్వంతో విభేధిస్తుంది. అమెరికాలో, ఫెడరలు, రాష్ట్ర రాజ్యాంగాలు బలంగా బంధింపబడిలేవు. అమెరికాలో పెడరలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వర్ణిస్తూ బ్రైస్ ఇలా అన్నాడు.
కేంద్రం లేదా జాతీయ ప్రభుత్వమూ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే స్థలంపై కట్టబడిన ఒక పెద్ద భవంతిగానూ, చిన్న భవనాల సముదాయంగానూ పోల్చవచ్చు.ఈ కట్టడాలన్న ఒకదానికొకటి వేరు వేరు.
అవి వేరు వేరే. కాని ఫెడరలు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వేరు వేరు అవుతున్నాయి? ఈ క్రింది వాస్తవాలను చూస్తే - ఆ వేరు పాటు అర్థమవుతుంది.
1.ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి అమెరికాలో ప్రతి రాష్ట్రమూ తన సొంత రాజ్యాంగాన్ని నిర్ణయించుకోవచ్చు.
2. జాతీయ ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ రాజ్యాంగానికి మార్పులు చేసికొనే హక్కు ప్రతి రాష్ట్ర ప్రజలూ కలిగియున్నారు.
దీనిని బ్రైస్ ఇలా చెప్పాడు. అమెరికాలో ఒక రాష్ట్రం తన రాజ్యాంగకారణంగా ఒక కామన్ వెల్తులా వుంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలూ, శాసనశాఖ, కార్యనిర్వాకహక శాఖ, న్యాయశాఖ రాజ్యాంగానిక కట్టుబడినవే. రాజ్యాంగం సృష్టించినవే.
భారత రాజ్యాంగంలో ఈ అవకాశం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమునకూ (పార్టు1 లోనివి ఎన్నడూ) తన సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొనే హక్కు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకే చట్రంలోనివి. ఆ చట్రంలో నుంచి ఏదీ బయటకు రాలేదు. అందులో వుంటూనే అవి పని చేయాలి.
ఇంతవరకు నేను అమెరికను ఫెడరేషను, ఇండియను ఫెడరేషనుల మధ్య తేడాల గురించి మీకు తెలియజేశాను. కాని ఇండియను ఫెడరేషనుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవి. ఈ ప్రత్యేక లక్షణాలను, అమెరికను ఫెడరేషను నుండే కాదు, ఇతర ఫెడరేషనుల నుండి కూడా చూడవచ్చు. ఈ ఫెడరల్ విధానాలన్నీ అమెరికా, దానితో సహా, ఫెడరలిజం అనే బిగువైన మూసలో ఇమడ్చబడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ, దీని స్వరూప స్వభావాలు మారలేవు. ఇవి ఎన్నడూ ''యూనిటరీ'' కావు. మన రాజ్యాంగం రెండు విధాలుగా అంటే యూనిటరీ ఫెడరల్‌గా కూడా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. సాధారణ పరిస్థితులలో ఇది ఫెడరల్‌గా పనిచేయడానికి ఉద్దేశించబడింది. యుద్ధ సమయంలో ఇది యూనిటరీగా పనిచేయడానికి ఉద్దేశించబడింది.
రాష్ట్రపతి ఆర్టికలు 275 ప్రకారం ఒక ప్రకటన చేసిన వెంటనే, దృశ్యమంతా మారిపోతుంది. కేంద్రం ''యూనిటరీ'' అవుతుంది. ఇలా ప్రకటనతో యూనిటరీగా మారిన కేంద్రం - తను కావాలనుకొంటే, ఈ దిగువ హక్కులను తీసికోవచ్చు. 1. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉన్న ఏ అంశం పైనైనా శాసనాలు చేసే అధికారం. 2. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వహణాధికారాన్ని ఎలా పాటించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చే అధికారం. 3. ఏ ఉద్యోగికయినా, ఏ కారణం కోసమైనా అధికారాన్నిచ్చే హక్కు. 4. రాజ్యాంగంలోని ఆర్థికాంశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసే అధికారం. ఇలా తనను యూనిటరీగా మార్చుకొనే అధికారం ఏ ఫెడరేషనుకు లేదు. ఇంతవరకు మనకు తెలిసిన ఇతర ఫెడరేషనులకూ, మన ఫెడరేషనుకూ ఇదొక మౌలికమైన తేడా.
ఇతర ఫెడరేషనులకూ, మన ఫెడరేషనుకూ ఇదొక్కటే తేడా కాదు. ఫెడరలిజాన్ని శక్తిరహితమైన లేదా బలహీనమైన ప్రభుత్వరూపంగా అభివర్ణిస్తారు. ఫెడరేషన్ను బాధించే రెండు బలహీనతలున్నాయి. ఒకటి ధృఢత్వం, రెండు చట్టాల పుట్ట. ఈ రెండు లోపాలు ఫెడరలిజంకు తప్పవు. ఇది నిర్వివాదం. ఫెడరల్ రాజ్యాంగం లిఖిత రూపంలోనే వుంటుంది. ఫెడరల్ రాజ్యాంగమంటే సర్వసత్తాక (సార్వభౌమ) అధికార విభజన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ చట్టం ప్రకారమే ఈ విభజన రెండు అవసర పరిణామాలతో జరగాలి.
1. రాష్ట్రాలకు ఉద్ధేశించిన అధికారాలపై కేంద్రం దురాక్రమణ, అదే మాదిరి కేంద్రపు అధికారాలపై రాష్ట్రం దురాక్రమణ ఫెడరలిజానికి ఇది ప్రధాన అవలక్షణం కాబట్టి. ఇది చట్టాల పుట్ట కాక తప్పదు. ఫెడరల్ రాజ్యాంగంలోని ఈ లోపాలను, అమెరికా రాజ్యాంగం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఫెడరలిజాన్ని అవలంభించిన దేశాలు, అనంతర కాలంలో, ఈ నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి. ఇందులో తప్పనిసరిగా ఉన్న దృఢత్వమూ, చట్టాల పుట్ట వలన కలిగే నష్టాలనూ తగ్గించుకోవాలనుకున్నాయి. ఈ సందర్భంలో ఆస్ట్రేలియాను ఉదాహరణగా తీసికోవచ్చు. ఆస్ట్రేలియా రాజ్యాంగం ధృఢత్వాన్ని ఉమ్మడి జాబితాలో ఎక్కువ అధికారాలను, అంటగట్టి మిగిలిన శాసనశాఖకు కొద్ది అధికారాలే అంటగట్టడం.
2. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్సును - పార్లమెంటు మరో విధంగా ఏర్పాటు చేసే వరకు అంటే కొంతకాలం మాత్రమే అమలులో ఉండేలా చేయడం.
దీనినిబట్టి ఆస్ట్రేలియన్ రాజ్యాంగంలో, పార్లమెంటు చాలా చేయగలదనేది స్పష్టం. అమెరికను కాంగ్రెసుకు ఈ శక్తిలేదు. అలా చేయాలంటే అమెరికను ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్ళాలి. తన అధికార నిర్వహణను సమర్థించుకోవడానికి ఒక సిద్ధాంతం ఏర్పాటుచేసుకోవటానికి, తన వాంఛ, మేధాశక్తి మరియు శక్తి సామర్ధ్యాలపై ఆధారపడాలి.
ఈ ధృఢత్వాన్ని, చట్టాల పుట్టను సరళీకరించడానికి, మన రాజ్యాంగ ముసాయిదా ఆస్ట్రేలియన్ బాటను చాలా విస్తృత పరిధిలో అనుసరించింది. ఆస్ట్రేలియను రాజ్యాంగంలో వలెనే, ఉమ్మడి శాసన అధికారాలకు చాలా పెద్ద జాబితా ఉంది. ఆస్ట్రేలియన్ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో అంశాలు 37. ఈ రాజ్యాంగం మాదిరిగానే మన దానిలో కూడా 6 ఆర్టికల్సు ఉన్నాయి. వీటికి తాత్కాలిక కాలపరిమితి మాత్రమే ఉంటుంది. పార్లమెంటు వాటిని కాల పరిస్థితికి తగినట్లుగా ఎప్పుడైనా మార్చుకొనే ఏర్పాటు ఉంది. ఆస్ట్రేలియను రాజ్యాంగం కంటే మన పురోగతి ఏమిటంటే, మనం మిగిలిన శాసనాధికారాలను పార్లమెంటుకే అప్పగించాము. ఆస్ట్రేలియను పార్లమెంటుకు తాను తప్ప మరెవరూ చేయకూడని శాసనాధికార అంశాలు మూడుమాత్రమే. మన పార్లమెంటుకు 91 అంశాలు - ఈ రకంగా, మన రాజ్యాంగం ఫెడరలిజములో వీలయినంత సరళత్వాన్ని సంతరించుకుంది. స్వయంగా ధృఢంగా ఉండవలసినది సరళం చేయబడింది.
మన రాజ్యాంగం ఆస్ట్రేలియన్ రాజ్యాంగాన్ని అనుసరించిందనీ లేదా చాలా భారీ ఎత్తున అనుసరించబడిందనీ చెబితే చాలదు. ధృఢత్వం, చట్టాల పుట్ట అనేది ఫెడరలిజానికి సహజం. ఫెడరలిజానికే ప్రత్యేకమైన ఇవి మరెక్కడా కనిపించవు. వీటిని అధిగమించటానికి మన రాజ్యాంగం కొత్త మార్గాలను అనుసరించడం గమనార్హం. మొదటి మార్గం ఏమిటంటే మన పార్లమెంటు సాధారణ పరిస్థితిలో కూడా కేవలం రాష్ట్ర జాబితాకి చెందిన విషయాల్లో శాసనాలు చేయవచ్చు. నేను 226, 227 మరియు 229 ఆర్టికల్సు ప్రస్తావిస్తున్నాను. 226 ఆర్టికలు ప్రకారం ఒక అంశం కేవలం రాస్ట్రానికే కాదు, యావద్దేశానికి సంబంధించినది అయినప్పుడు, ఆ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే - ఆ అంశంపై పార్లమెంటు శాసనం చేయవచ్చు. ఆర్టికలు 227 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిలోనూ, పార్లమెంటుకు ఈ శాసనాధికారం ఇవ్వబడింది. 229 ఆర్టికలు ప్రకారం, రాష్ట్రాల సమ్మతిపై కూడా పార్లమెంటు ఈ శాసనాధికారం పొందుతుంది.
రెండవ మార్గం ఏమిటంటే - ఈ ధృఢత్వాన్ని, చట్టాల చిక్కుముడిని దూరం చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ చేసుకొనే సౌలభ్యం, రాజ్యాంగ సవరణ చేసుకొనే వీలున్న ఆర్టికల్స్ రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఎ) రాస్ట్రాలకు, కేంద్రానికి మధ్య శాసనాధికారాల పంపిణీకి సవరణలకు ఆర్టికల్సు బి) పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యము సి) కోర్టుల అధికారాలు, మిగిలిన అధికారాలన్నీ మరొక గ్రూపులో చేర్చబడ్డాయి. రెండవ గ్రూపులో చేర్చబడ్డ ఆర్టికల్సు రాజ్యాంగంలో చాలా భాగాన్ని ఆక్రమిస్తాయి. రెట్టింపు మెజారిటీతో పార్లమెంటులో సవరణ చేయవచ్చు. వీటిని రెట్టింపు మెజారిటీ అంటే - ఉభయ సభల సభ్యుల మొత్తం మెజార్టీగా ఉండాలి. ఈ ఆర్టికల్ సవరణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు. గ్రూపు ఒకటిలో ఉంచిన ఆర్టికల్సుకు మాత్రమే రాష్ట్రాల నుండి అదనపు రక్షణగా వాళ్ళ సమ్మతి ప్రవేశపెట్టబడింది. ఇందుచేత, ఇండియన్ ఫెడరేషన్, ధృఢత్వమూ, చట్టాల చిక్కుముడులతో బాధింపబడదని నమ్మకంగా చెప్పవచ్చు. దీని ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది సరళీకృత ఫెడరేషను.
ఇతర ఫెడరేషనుల నుండి మన ఫెడరేషనును వేరుచేసే మరొక ముఖ్య లక్షణం కూడా వుంది. ఫెడరేషను అంటేనే - అధికార విభజనపై ఆధారపడిన ద్వంద ప్రభుత్వం. ఇలా విభజింపబడిన, శాసన, కార్య నిర్వహక న్యాయ అధికారాలు రెండు ప్రభుత్వాల మధ్య - చట్టాల్లో, పరిపాలన శైలిలో, న్యాయ రక్షణలో వైవిధ్యాన్ని కలిగిస్తున్నాయి. కొంతవరకు ఈ వైవిధ్యం పరవాలేదు. స్థానిక అవసరాలకు, పరిస్థితులకు తగినట్లుగా ప్రభుత్వ అధికారాలను వినియోగించడానికి చేసిన మంచిప్రయత్నంగా దీనిని ఆహ్వానించవచ్చు. కాని ఈ వైవిధ్యం ఒక అవధికి మించినట్లయితే - సంక్షోభాన్ని సృష్టించవచ్చు. చాలా రాష్ట్రాల్లో సంక్షోభాన్ని సృష్టించినది కూడా. మనకు ఇరవై రాష్ట్రాలు (ఇది 1948 నాటి మాట. ఇప్పుడు ఇవి పెరిగాయి) ఉంటే ఇరవై రకాల చట్టాలు ఉంటాయని ఊహించుకోండి. పెళ్ళిళ్ళ గురించి, విడాకుల గురించి, ఆస్తి వారసత్వం గురించి, కుటుంబ సంబంధాల గురించి, కాంట్రాక్టుల గురించి, నేరాల గురించి, ద్రోహుల గురించి, కొలతలు, తూనికల గురించి, బిల్లులు, చెక్కుల గురించి, బ్యాంకింగ్ వ్యాపారాల గురించి, న్యాయం కోసం అవలంభించవలసిన విధి విధానాల గురించి (ప్రొసీజర్స్) పరిపాలనా ప్రమాణాలు, పద్ధతుల గురించి ఇరవై రకాల చట్టాలు ఉండవచ్చు. ఈ రకమైన పద్ధతి దేశాన్ని బలహానపరచటమే కాదు పౌరులకు అసహనం కలిగిస్తుంది. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వదలి వెళ్ళే పౌరులను ఒక రాష్ట్రంలో చట్టబద్దమైనది, మరొక రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా ఉంటుంది. ఇండియా ఫెడరేషను ఉండాలని, అదే సమయంలో మౌలిక విషయాలన్నింటిపై సారూప్యత కలిగి ఉండాలని అందుకు కొన్ని మార్గాలను ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసింది. మౌళిక విషయాలంటే, జాతీయ ఐక్యతను కాపాడటానికి అవసరమైన అన్ని విషయాలు అని అర్థం. ముసాయిదా కమిటీ ఇందుకు అవలంభించిన మార్గాలు మూడు.
1. ఒకే ఒక న్యాయ విధానం.
2. ప్రాథమిక చట్టాలు, సివిలు, క్రిమినలు చట్టాల్లో సారూప్యత.
3. ముఖ్య ఉద్యోగాలకు ఉమ్మడి ఆల్ ఇండియా సివిల్ సర్వీసు.
ఫెడరేషనుకు తప్పనిసరి లక్షణాలు : ద్వంద ప్రభుత్వ పర్యవసానాలుగా ద్వంద న్యాయ విధానం, ద్వంద చట్ట సంపుటి, ద్వంద సివిల్ సర్వీసులు, అమెరికాలో ఫెడరల్ న్యాయశాఖ, రాష్ట్ర న్యాయశాఖ వేరు వేరు. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండవు. ఇండియను ఫెడరేషను ద్వంద ప్రభుత్వాన్ని కలిగియున్నా ద్వంద న్యాయశాఖలను మాత్రం కలిగిలేవు హైకోర్టులు. సుప్రీంకోర్టు ఒకే ఒక క్రిమినల్ చట్టంలో వచ్చే అన్ని తగాదాలను న్యాయపరిధిని కలిగి (జ్యూరిడిక్షన్) పరిష్కారాలు ఇస్తాయి. పరిష్కార పద్ధతిలో వైవిధ్యాన్ని అంతం చేయడానికి చేసిన ఏర్పాటు ఇది. ఈ విధానానికి సరియైన, సమాంతరంగా వున్న దేశం కెనడా ఒక్కటే. ఆష్ట్రేలియను విధానాలు దాదాపు సుమారుగా మాత్రమే ఉంటాయి.
సివిల్, కార్పొరేటు జీవితానికి ఆధారంగా వున్న చట్టాలలోని వైవిధ్యాన్ని అంతం చేయడానికి జాగ్రత్త తీసికొన్నాం. పెద్ద సివిలు, క్రిమినలు కోడులు, సివిలు ప్రొసీజరుకోడు, పీనలు కోడు, క్రిమినలు ప్రొసీజరు కోడు, ఎవిడెన్సు చట్టము. ఆస్తి బదలాయింపు చట్టము. వివాహము, విడాకులు, వారసత్వ చట్టాల వంటివి అన్నింటినీ ఉమ్మడి జాబితాలో ఉంచాము. ఇందువలన పెడరల్ విధానానికి దెబ్బ తగులకుండా, అవసరమైన సారూప్యత ఎల్ల వేళలా కాపాడబడుతుంది.
ద్వంద్వ ప్రభుత్వం ప్రతి ఫెడరేషన్‌లో ద్వంద్వ సర్వీసులకు చోటు ఇస్తుంది. అన్ని పెడరేషన్లలో, పెడరల్ సివిల్ సర్వీసు, రాష్ట్ర సివిలు సర్వీసు వుంటాయి. ఇండియను ఫెడరేషనులోనూ ద్వంద్వ ప్రభుత్వం వుంది. దీనికి ద్వంద్వ సర్వీసులున్నాయి కాని ఒక మినహాయింపుతో ప్రతి దేశంలో, పరిపాలనలో కొన్ని పదవులు (ఉద్యోగాలు) ఉంటాయి. పరిపాలనా ప్రమాణాలను కాపాడే దృష్టితో ఇవి చాలా కీలకమైనవి. అతి పెద్దవీ. అతిక్లిష్టమైన పరిపాలనా యంత్రాంగంలో అటువంటి పదవుల్ని ఎక్కడికక్కడ గుర్తించడం సులువుకాదు. పరిపాలనా స్థాయి ఈ కీలక పదవుల్లో నియమించబడిన సివిలు సర్వెంట్సు శక్తి సమర్ధతలపై ఆధారపడి వుందనడం నిర్వివాదం. అదృష్టవశాత్తూ మనము దేశానికికంతటికీ ఉమ్మడిగా ఉన్న ఒక పాత పరిపాలనా విధానం వారసత్వంగా పొందాము. కీలక పదవులేమిటో మనకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సివిలు సర్వీసును ఏర్పాటు చేసికొనే హక్కును కాదనకుండానే, మన రాజ్యాంగం ఒక అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసింది. ఇది అఖిల భారతస్థాయిలో ఉద్యోగుల్ని తీసికొంటుంది. ఒకేరకమైన అర్హతలతో, ఒకే రకమైన జీతాలతో తీసికొంటుంది. దేశమంతటా కీలక పదవుల్లో ఈ ఉద్యోగుల్నే నియమిస్తుంది.
ఇవి మన రాజ్యాంగ ప్రత్యేక లక్షణాలు. దీనిపై విమర్శకులు ఏమన్నదీ ఇపుడు మాట్లాడతాను.
రాజ్యాంగ ముసాయిదాలో సగభాగం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి కాపీ చేయబడిందనీ, మిగిలినది ఇతర దేశాల రాజ్యాంగాల నుండి బదులు తెచ్చుకొన్నది తప్ప మరేమీలేదని విమర్శ. మేలికత చాలా స్వల్పమని వీరి విమర్శ.
ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో తయారుచేసిన రాజ్యాంగంలో ఏదైనా క్రొత్త వుంటుందా అని ప్రతి ఒక్కడూ అడగడానికి ఇష్టపడతాడు. మొదటి లిఖిత రాజ్యాంగం ఏర్పడి ఇప్పటికీ నూరు సంవత్సరాలకు పైగా గతించాయి. చాలా దేశాలు తమ రాజ్యాంగాలకు లిఖిత రూపానికి కుదించి, ఈ మొదటి రాజ్యాంగాన్ని అనుసరించారు. రాజ్యాంగ పరిధి ఏమిటో చాలాకాలం క్రిందటే స్థిరీకరించబడింది. అదే మాదిరిగా, రాజ్యాంగ మౌలికాంశాలను ప్రపంచమంతటా గుర్తించారు. ఈ వాస్తవాలను బట్టి చూస్తే - అన్ని రాజ్యాంగాలు తమ ముఖ్య ప్రతిపాదనలో ఒకేలా కనిపిస్తాయి. ఉంటేగింటే ఏమైనా కొత్త విషయాలు ఇటీవల రూపొందిన రాజ్యాంగాల్లో పూర్వ లోపాలను తొలగించడానికి చేసిన మార్పులు, దేశంలోని అవసరాలకు సరిపడేలా చేసిన మార్పులు. ఈ రాజ్యాంగాన్ని సరిగా అధ్యయనం చేయనివారే, ఇది ఇతర దేశాల రాజ్యాంగాలకు నకలు అని ఆక్షేపిస్తారు. ఈ రాజ్యాంగ ముసాయిదాలో క్రొత్త ఏమిటీ మీకు వివరించాను. ఇతర రాజ్యాంగాలను అధ్యయనం చేసినవారు, విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించేవారు ముసాయిదా కమిటీ తన విధి నిర్వహణలో లోపం చేయలేదనీ, కొందరు అనుకొంటున్నట్లుగా ఇతర రాజ్యాంగాలకు ఇది శుద్ధ నకలు కాదనీ వాటిని మూర్ఖంగా అనుకరించలేదనీ, మాతో ఏకీభవిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఈ రాజ్యాంగ ముసాయిదా 1935 భారత ప్రభుత్వం చట్టంలోని చాలా నిబంధనలతో నిండివుందనే ఆరోపణ. దీనికి నేను విచారించడం లేదు. వీటిని మనం బదులు తీసికోవడంలో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. ఇది గ్రంథ చౌర్యం కాదు. రాజ్యాంగంలోని మౌళిక భావాలపై ఎవరికీ పేటెంటు హక్కులు లేవు. ఇక్కడ నాకు విచారం కలిగిస్తున్నదేమిటంటే - 1935 భారత ప్రభుత్వ చట్టంలోని నుండి తీసికొన్న నిబంధనలు చాలా వరకు పరిపాలనకు సంబంధించినవే. రాజ్యాంగంలో పరిపాలనా సంబంధ వివరాలు ఉండకూడదని నేను అంగీకరిస్తాను. ఈ రాజ్యాంగంలో వాటి చేరికను మానిపించాలని నేనూ అభిలషించాను. కాని ఈ చేరికను సమర్థించే ఆవశ్యకత ఉందని చెప్పారు. గ్రీకు చరిత్రకారుడు గ్రోటె ఇలా అన్నాడు.
స్వేచ్ఛాయుతమైన శాంతియుతమైన ప్రభుత్వపు తప్పనిసరి స్థితి ఏమిటంటే రాజ్యాంగం వీటిని కేవలం మెజారిటీ వర్గానికే కాక జాతి మొత్తానికంతటికీ ప్రచారం చేయడమే - ఎందుకంటే అధిపత్యాన్ని సాధించుకునే శక్తి లేకున్నప్పటికీ మొండిగాను, బలంగాను ఉన్న మైనారిటీ వర్గం స్వతంత్ర సంస్థల పనులను కార్యరూపం దాల్చనీయకుండా చేయవచ్చు.
గ్రోటే భావంలో రాజ్యాంగ నీతి అంటే అధికారానికి విధేయతను అమలుపరచే రాజ్యాంగ రూపాల పట్ల పరమ భక్తియే రాజ్యాంగ నీతి. అయితే ఈ అధికారం బహిరంగ ప్రసంగపు అలవాటుతో కూడిన, నిర్ధుష్టమైన చట్టపు అదుపునకు లోబడిన రాజ్యాంగ రూపాలతో పనిచేసేదై ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పౌరుడు రాజ్యాంగ రూపాలపట్ల తనకూ తన విపకక్షులకు సమాన పవిత్ర భావం కలిగియుంటూ, పార్టీల చేదు పోటీల మధ్యన కూడా, హృదయంలో పరిపూర్ణమైన విశ్వాశంతో ఆయా అధికారుల ప్రభుత్వ చర్యలను నిలదీసే అపరిమితమైన హక్కును కలిగియుండుటే రాజ్యాంగనీతి.
రాజ్యాంగనీతిని ప్రచారం చేయవలసిన ఆవశ్యకతను అందరూ గుర్తిస్తున్నప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతియుతంగా పనిచేయడానికి ఒక దానితో ఒకటి బంధింపబడిన రెండు అంశాలున్నాయి. వీటిని దురదృష్టవశాత్తూ సాధారణంగా ఎవరూ గుర్తించడం లేదు. ఒకటి ఏమిటంటే పరిపాలనా స్వరూపం, రాజ్యాంగ స్వరూపం ఒక దానికొకటి తగినవై యుండాలి. రెండోది ఏమిటంటే పరిపాలనా రూపాన్ని మారుస్తూ - రాజ్యాంగ రూపాన్ని మార్చకుండానే - దానిని నిరోధించడం సాధ్యం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగానూ, దానికి నిలకడలేనిదిగానూ పరిపాలనా రూపాన్ని మార్చవచ్చు. ఫలితం ఏమిటంటే చరిత్రకారుడు గ్రోటే చెప్పినట్లుగా ప్రజలు రాజ్యాంగ నీతితో విసుగెత్తినప్పుడు, పరిపాలనా వివరాలను రాజ్యాంగం నుండి వదిలివేసే సాహస నిర్ణయం తీసికొంటారు. శాసనశాఖను, తిరిగి వాటిని నిర్ణయించమని దానికి వదలి వేస్తారు. మనం అటువంటి రాజ్యాంగ నీతి ప్రచారాన్ని ఊహించగలమా. రాజ్యాంగ నీతి అనేది ప్రకృతి సహజమైన భావం కాదు. దీన్ని మనం అభివృద్ధి చేసికోవాలి. మన ప్రజలు దీనిని నేర్చుకోవలసి వుందని మనం గుర్తించాలి. ఇండియాలో ప్రజాస్వామ్యం భారత భూమిపై పై పై అలంకరణ మాత్రమే. నిజానికిది అప్రజాస్వామికం.
ఈ పరిస్థితుల్లో పరిపాలనా రూపాలను నిర్మించమని శాసనశాఖను కోరడం విజ్ఞతగా లేదు. అందుచేత రాజ్యాంగంలోనే, వీటిని చేర్చడం జరిగింది.
రాజ్యాంగ ముసాయిదా పై మరో విమర్శ : ఇందులో ఏ భాగమూ భారతీయ పూర్వ ప్రభుత్వాన్ని ప్రతిఫలించడం లేదు అని. పూర్వకాలపు హిందూ రాజ్యం నమూనాపై కొత్త రాజ్యాంగం నిర్మించబడాలి. పాశ్చాత్య సిద్ధాంతాలను స్వీకరించకుండా, కొత్త రాజ్యాంగం, గ్రామ పంచాయితులపైనా, జిల్లా పంచాయితీలపైనా నిర్మించబడాలి. మరికొందరు ఇంకా విపరీత దృక్పధాన్ని కలిగియున్నారు. వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వద్దంటున్నారు. ఇండియా గ్రామ ప్రభుత్వాలనే కలిగి ఉండాలని అంటున్నారు. గ్రామ పాలనపై భారతీయ మేధావుల అభిమానం విచారకరం. కాదంటే మితిమీరినది. (నవ్వులు) మెట్కాఫ్ వీటిని ఎంతో ప్రశంసించాడు. ఇవి చిన్న సైజు ప్రజాప్రభుత్వాలన్నాడు. వాటికి కావలసినవన్నీ రమారమి వాటిలోనే సమకూర్చుకొంటాయన్నాడు. దాదాపుగా విదేశ సంబంధాలపై ఆధారపడవుఅన్నాడు. మన మేధావుల అభిమానానికి ఈ ప్రశంసలే కారణం. ఈ గ్రామాలు ఒక్కొక్కటీ ఒక ప్రభుత్వంగా తయారై, మెట్కాఫ్ చెప్పినట్లుగా మిగిలినవాటికంటే ప్రజల రక్షణకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. తిరుగుబాటుల్లో, మార్పుల్లో అవి నిలిచాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సుఖసంతోషాలు అనుభవించడానికి అవి చాలా వరకు సహాయపడ్డాయి. ఏదీ లేని చోట గ్రామపాలనలు నిలబడ్డాయి సందేహం లేదు. గ్రామ పరిపాలన గురించి గర్విస్తున్నవారు, ఈ దేశ చరిత్రలో, ఇవి ఏ పాటిపాత్ర తీసికొన్నా గమనించడం లేదు. ఎందుచేత? దేశ చరిత్రలో వాటి పాత్రను మోట్కాఫ్ స్వయంగా వివరించాడు. ఆయన ఇలా అన్నాడు.
ఒక రాజవంశం తరువాత మరో రాజవంశం పడిపోతుంది. తిరుగుబాటు తరువాత తిరుగుబాటు వస్తుంది. హిందువుల, పఠానులు, మొగలులు, మహారాష్ట్రులు, సిక్కులు, ఆంగ్లేయులు అందరూ తమవంతుగా ప్రభువులవుతారు. గ్రామాలు అలాగే వుంటాయి. కష్ట సమయంలో ఆయుధాలు ధరిస్తాయి. తమను బలసమృద్దం చేసికొంటాయి. గ్రామాలుగుండా, దుండగుల సైన్యం వెళుతుంది. గ్రామాలు తమ పశు సంపదను ఒక చోట చేర్చుకొని, నాలుగు గోడల మధ్యదాచుకొంటాయి. సైన్యాన్ని రెచ్చగొట్టకుండా వెళ్ళిపోనిస్తారు.
గ్రామ ప్రభుత్వాలు వారి దేశ చరిత్రలో పోషించిన పాత్ర ఇది. ఇది తెలిసిన తరువాత మనం వాటి గురించి ఏ పాటి గర్వం పొందగలం? ఇన్ని కష్టనష్టాల మధ్య అవి బ్రతికి బట్టకట్టాయనడం నిజమే. కాని కేవలం అలా బ్రతికివుండడం గొప్పకాదు. ఏ స్థాయిలో అవి బ్రతికాయి అన్నది మనకు ముఖ్యం. చాలా స్వార్ధంగా, అధమ స్ధాయిలో సాగిన ఈ గ్రామ ప్రభుత్వాలే భారతదేశ వినాశనానికి కారణంగా నేను భావిస్తున్నాను. ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని ద్వేషించేవాళ్ళు, ఈ గ్రామ ప్రభుత్వ వీరాభిమానులుగా ముందుకొస్తున్నందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. గ్రామ ప్రభుత్వమంటే ఏమిటి? స్థానికత్వపు మడుగు. అజ్ఞానానికి, సంకుచిత బుద్ధికీ, కులతత్వానికి ఆటపట్టు. రాజ్యాంగ ముసాయిదా గ్రామాలను వదలివేసింది. వ్యక్తినే తన యూనిట్‌గా తీసికొంది.
మైనారిటీలకు రక్షణలు ఇచ్చినందుకు కూడా, రాజ్యాంగ ముసాయిదాను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ముసాయిదా కమిటీకి బాధ్యత లేదు. ఇది రాజ్యాంగ సభ వారి నిర్ణయాలను అమలుపరిచింది. నన్నడిగితే - రాజ్యాంగ సభ మైనారిటీలకు ఇటువంటి రక్షణలను కల్పించి చాలా మంచి పని చేసిందని చెప్పడానికి వెనుదీయను. ఈ దేశంలో మైనారిటీలు, మెజారిటీలు కూడా చాలా తప్పుదారిలో నడిచాయి. మైనారిటీల ఉనికిని కాదనడం మెజారీటీ తప్పు. మైనారిటీలు తమను తాము శాశ్వతీకరించుకోవడం కూడా తప్పే. మొదట మైనారీటీల ఉనికిని గుర్తించాలి. మెజారిటీలు, మైనారిటీలు ఏదో ఒక రోజున ఒకటిగా కలసిపోయేలా చేయాలి. రాజ్యాంగ సభ ప్రతిపాదించిన పరిష్కారం స్వాగతంచదగ్గది. ఎందుకంటే ఇది ఈ తప్పులను సరిదిద్దే పరిష్కారం. మైనారిటీల రక్షణపై ఒకరకమైన ఉన్మాదాన్ని పెంచుకొన్న సనాతన వాదులకు నేను రెండు విషయాలు చెప్పదలచుకొన్నాను. మైనార్టీలు బ్రద్దలయ్యే అగ్ని పర్వతంలాంటివి. బ్రద్ధలయితే మొత్తం దేశ వ్యవస్ధనే చిన్నా భిన్నం చేస్తాయి. ఐరోపా చరిత్ర ఈ వాస్తవానికి అద్ధం పడుతూ వుంది. 2. ఇండియాలోని మైనార్టీలు తమ ఉనికిని మెజారిటీ చేతుల్లో ఉంచడానికి ఇష్టపడుతున్నాయి. ఐర్లాండును విభజనను నిరోధించడానిక జరిగిన సంప్రదింపుల చరిత్రలో కార్సన్‌తో రెడ్మండ్ అంటాడు. ప్రొటెస్టంటు మైనారిటీకి మీరు ఏ రక్షణ అయినా సరే అడగండి. కాని మనం సమైక్య ఐర్లాండును కలిగి ఉందాం. కార్సన్ జవాబు ఇది. మీ రక్షణలకో నమస్కారం. మీకు పాలితులుగా ఉండడం మాకిష్టం లేదు. ఇండియాలో ఏ మైనారిటీ ఇటువంటి వైఖరి అవలంభించలేదు. వారు విశ్వాసంతో మెజారిటీ పాలనను అంగీకరించారు. ఇది కులపరమైన మెజారిటీ, రాజకీయపరమైన మెజారిటీ కాదు. మైనారిటీల పట్ల వివక్షచూపకూడదు. అనే బాధ్యతను మెజారిటీ గుర్తించాలి. మైనారిటీలు కొనసాగాలో, అంతరించిపోవాలో - అనేది మెజారిటీ వారి ఈ అలవాటు పై ఆధారపడి వుంది. మైనారిటీల పట్ల మెజారిటీ వివక్ష చూపే అలవాటును మానుకొన్నవెంటనే, మైనారిటీల ఉనికికి తావే వుండదు. అవి అంతరించిపోతాయి.
రాజ్యాంగ ముసాయిదాలోని ప్రాథమిక హక్కులపై చాలా పెద్ద విమర్శవుంది. ప్రాథమిక హక్కుల్ని 13వ ఆర్టికలు నిర్ధారిస్తుంది. దీనికి ఎన్నో మినహాయింపులు. ఈ మినహాయింపులు ప్రాథమిక హక్కుల్ని మొత్తానికి మింగివేస్తున్నాయి. కనుక ఇదొక వంచనగా విమర్శిస్తున్నారు. విమర్శకుల దృష్టిలో ప్రాథమిక హక్కులు పరిపూర్ణంగా లేనంతవరకూ ప్రాథమిక హక్కులే కావు. ఈ విమర్శకులు అమెరికా రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసికొంటున్నారు. పది సవరణలతో కూడి హక్కుల బిల్లు వీరికి ఆదర్శం. వారి మనస్సుకు అనుగుణంగా రాజ్యాంగానికి ఈ సవరణలు రూపొందించబడ్డాయి. అమెరికన్ బిల్ల్ ఆఫ్ రైట్స్‌లో ఉన్న ప్రాథమిక హక్కులే నిజమైనవని, వాటి పై ఏ పరిమితులూ, మినహాయింపులూ లేవని విమర్శకులు అంటున్నారు.
ప్రాథమిక హక్కులపై చేసిన ఈ విమర్శ అంతా ఓ అపోహ పై ఆధారపడి వుందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. వారు ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమికేతర హక్కుల నుండి విడదీయడం సరిగా చేయలేదు. ప్రాథమిక హక్కులు పరిపూర్ణమనీ, ప్రాథమికేతర హక్కులు అసంపూర్ణమని చెప్పడం సరికాదు. ఈ రెండింటి మధ్యా ప్రధాన భేదం ఏమిటంటే పార్టీల మధ్య ఒప్పందంతో ప్రాధమికేతర హక్కులు ఏర్పడతాయి. ప్రాథమిక హక్కులు చట్టం యిచ్చిన కానుక. ఇవి చట్టం ఇచ్చిన కానుక అయినందున ప్రభుత్వం వీటిని యోగ్యతాపూర్ణం చేయకూడదు అనడం తగదు.
మరో విషయం ఏమిటంటే అమెరికాలో ప్రాథమిక హక్కులూ పరిపూర్ణం అనడం తప్పు. అమెరికా రాజ్యాంగానికి, మన రాజ్యాంగానికి తేడా నిర్మాణ రూపంలోనే వుంది. వస్తు రూపంలో లేదు. అమెరికాలోని ప్రాథమిక హక్కులు సంపూర్ణ హక్కులు కావు అనడంలో వివాదం లేదు. రాజ్యాంగ ముసాయిదా ప్రాధమిక హక్కులకు ఇచ్చిన ప్రతి మినహాయింపునకూ, అమెరికాలోని సుప్రీమ్ కోర్టు తీర్పును కనీసం ఒకటైనా చూడమని కోరుతున్నాను. రాజ్యాంగ ముసాయిదాలోని 13 ఆర్టికలులో ఉన్న వాక్స్వాతంత్య్ర హక్కు పై విధించిన పరిమితుల్ని సమర్ధించడానికి, సుప్రీమ్ కోర్టు తీర్పును ఒక దానిని ఉదహరిస్తే చాలానుకొంటున్నాను. జట్లో వెర్సన్ న్యూయార్క్ అని ఒక కేసు నడిచింది. హింసను ప్రేరేపించే ప్రసంగాలను శిక్షించాలని న్యూయార్క్ క్రిమినల్ అనార్కి అనే చట్టం చేసింది. దీనికి రాజ్యాంగ బద్ధత వుందా? అనేది కేసు. సుప్రీమ్ కోర్టు ఇలా చెప్పింది.
భావ ప్రకటన స్వాతంత్య్రం అనేది చాలా కాలంగా స్ధిరపడిన ప్రాథిమిక సూత్రం. అది రాజ్యాంగం చేత కాపాడబడుతుంది. అంతమాత్రాన బాధ్యతా రహితంగా ఏదిపడితే అది ప్రసంగించడం కాని, ప్రచురించడం కాని చేసే పరిపూర్ణ హక్కును ఇది ఇవ్వదు. అదుపు లేని, మితిమీరిన అనుమతిని ఇది ఇవ్వదు. ఇష్టానుసారం ప్రసంగాలకు రక్షణ ఇవ్వదు. ఈ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేసేవారిని శిక్షిస్తుంది.
ఇందుచేత, అమెరికాలో ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా వున్నాయనడం, మన రాజ్యాంగంలో లేవనడం తప్పు.
ప్రాధమిక హక్కులకు అన్వయం కావలసి వస్తే అమెరికా రాజ్యాంగంలో చేసినట్లుగా, మన రాజ్యాంగమే అది కల్పించాలి. ఎక్కడయితే అలా చేయదో- ఆ పని న్యాయశాఖకు వదిలివేయాలి. సంబంధింత అంశాలన్నీ పరిశీలించి, న్యాయశాఖ ఆ పనిచేస్తుంది. అమెరికా రాజ్యాంగంపై అవగాహనా రాహిత్యం లేదా ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పడానికి విచారపడుతున్నాను. అమెరికా రాజ్యాంగం ఇలా చేయలేదు. ఒక్క విషయంలో తప్ప అంటే సమావేశ హక్కు పై తప్ప, అమెరికా రాజ్యాంగం పౌరుల ప్రాథమిక హక్కులపై ఏ పరిమితులూ విధించలేదు. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే పని న్యాయశాఖకే అప్పగించింది అనడం కూడా సరికాదు. పరిమితులను విధించే హక్కు కాంగ్రెసుకు వుంది. విమర్శకులు అనుకొంటున్న దానికి వాస్తవ పరిస్థితికి తేడా వుంది. అమెరికాలో, రాజ్యాంగం ఏర్పరచిన ప్రాధమిక హక్కులు నిస్సందేహంగా సంపూర్ణమే అయినా, కాంగ్రెసు వీటిని అన్వయించడానికి పరిమితులు విధించడం అవసరమని వెంటనే భావించింది. సుప్రీము కోర్టు ముందుకు ఈ పరిమితుల రాజ్యాంగ బద్ధత ప్రశ్న వచ్చినపుడు - పరిమితుల్ని విధించే అధికారం కాంగ్రెసుకు రాజ్యాంగం ఇవ్వలేదని భావించబడింది. సుప్రీమ్ కోర్టు పోలీసు అధికార సిద్ధాంతాన్ని కల్పించింది. ప్రాధమిక హక్కులు సంపూర్ణంగా వుండాలనే వారి వాదనలను కొట్టివేసింది. ప్రభుత్వానికి స్వతస్సిద్దంగా ఒక పోలీసు అధికారం వుంటుందని తీర్మానించింది. ఈ అధికారాన్ని, రాజ్యాంగం స్పష్టంగా ప్రభుత్వానికి అంటగట్టవలసిన పనిలేదని పేర్కొంది. ఈ కేసు సుప్రీమ్ కోర్టు తన మాటల్లో ఇలా చెప్పింది.
''ప్రభుత్వం తన పోలీసు అధికారాన్ని వినియోగించుకొని, స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారిని శిక్షించవచ్చు. ప్రజా సంక్షేమానికి భంగకర ప్రసంగాలు. ప్రజల నైతికతను పాడు చేసే ప్రసంగాలు, నేరాన్ని ప్రోత్సహించే స్రసంగాలు ప్రజాశాంతికి హాని చేసే ప్రసంగాలు ఆపవచ్చు. దీనిని ప్రశ్నించడానికి ఆస్కారం లేదు''.
ఇంతకీ రాజ్యాంగ ముసాయిదా చేసిందేమిటంటే - ప్రాధమిక హక్కుల్ని సంపూర్ణం చేసి, పార్లమెంటుకు పోలీసు అధికార సిద్ధాంతాన్ని కల్పించమని సుప్రీము కోర్టును కోరకుండా, ఈ ప్రాథమిక హక్కులపై రాజ్యాంగమే పరిమితుల్ని విధించే అవకాశం కల్పించింది. పర్యవసానంలో తేడా లేదు. ఒకటి డైరెక్టుగా చేస్తూ వుంది. మరొకటి ఇన్‌డైరెక్టుగా చేస్తూ వుంది. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ప్రాథమిక హక్కులు సంపూర్ణం కావు.
రాజ్యాంగ ముసాయిదాలో ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలు అనుసంధించబడ్డాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసంతయారుచేసిన రాజ్యాంగంలో ఇదొక క్రొత్తదనం. ఇటువంటి సూత్రాలను పెట్టుకొన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చెందిన ఒకే ఒక రాజ్యాంగముంది. అది ఐరిష్ స్వేచ్ఛా ప్రభుత్వం. ఈ నిర్ధేశక సూత్రాలు కూడా విమర్శలనెదుర్కొన్నాయి. ఇవి కంటి తుడుపు ప్రకటనలన్నారు. ఇవి అమలుకు నోచుకోవు అన్నారు. ఈ విమర్శ కేవలం విమర్శ మాత్రమే. రాజ్యాంగం కూడా చాలా మాటాల్లో ఇదే చెప్పింది.
నిర్ధేశక సూత్రాల వెనుక శాసన బలం లేదని చెపుతున్నారు. దీనిని ఒప్పుకొంటూన్నాను. కాని వాటికే మాత్రం ఆచరణాత్మక శక్తి లేదంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను. వాటికి శాసన బలం లేని మూలంగా, అవి నిరుపయోగమన్నా నేను అంగీకరించను.
నిర్ధేశక సూత్రాలు ఆదేశాలపట్టిక వంటిది. వలస ప్రాంతాల గవర్నర్లు, గవర్నరు జనరలు లోగడ ఇవి ఇచ్చేవారు. 1935 చట్టం ప్రకారం బ్రిటీఒక ప్రత్యేక పార్టీని అధికారంలో ప్రవేశపెట్టే ఏర్పాటుకాదు. ఎవరు అధికారంలో ఉండాలనేది ప్రజలే నిర్ణయించాలి. ప్రజాస్వామ్య హస్తగతం చేసుకొన్న - వీటి మూలంగా, వారికి తమ ఇష్టం వచ్చినట్లుగా పాలించే స్వేచ్ఛ ఉండదు. నిర్ధేశక సూత్రాలు లేదా మార్గదర్శక సూత్రాలుగా పిలువబడే ఈ ఆదేశాలను, తను అధికార నిర్వహణలో మన్నించి తీరాలి. వీటిని విస్మరించడానికి వీలుపడదు. వీటిని భంగపరిస్తే - కోర్టుకు అతను జవాబుదారి కాకపోవచ్చు. కాని ఓటరుల ముందు ఎన్నికల సమయంలో అతడు జవాబు చెప్పి తీరాలి. హక్కుల బలంతో అధికారం కైవశం చేసికొన్నప్పుడు - ఈ మార్గదర్శక సూత్రాలకున్న విలువ ఎంతటిదో అర్ధమవుతుంది. (గమనిక : ఈ అంశాన్ని లోతుగా విచారణకు పెట్టాలి - సురేంద్ర)
ఇందువలన, రాజ్యాంగంలో వీటి చేరికను ఆక్షేపిస్తూ - వీటికి ఎవర్నీ కట్టుబాటు చేసే శక్తి లేదనడం సమంజసం కాదు. రాజ్యాంగంలో వీటిని ఉంచవలసిన సరి అయిన స్ధానం ఎక్కడ అనే విషయంలో భేదాభిప్రాయాలుండవచ్చు. చేయవలసిన పనుల మధ్య, అలాకాని వాటిని ఉంచడం కొంతవరకు అసమజంసమే. నా అభిప్రాయంలో వాటికి సరైన స్ధానం షెడ్యూలు 3ఎ, మరియు 4, గవర్నర్లకు, రాష్ట్రపతికి ఆదేశాల పట్టిక ఉన్నచోటు. నేను ముందే చెప్పినట్లుగా, అవి కార్యనిర్వహణశాఖకూ, శాసన శాఖకూ, నిజానికి ఆదేశాల పట్టికలు అవి వాటి అధికారాలను ఎలా నిర్వహించాలో చెపుతాయి. ఇది కేవలం వాటి ఉనికి ఏర్పాటుకు సంబంధించిన విషయం.
కొందరు విమర్శకులు కేంద్రం చాలా బలంగా వుందంటున్నారు. మరికొందరు ఇంకా కేంద్రాన్ని బలవత్తరం చేయాలంటున్నారు. రాజ్యాంగ ముసాయిదా సమతూకాన్ని పాటించింది. మీరు కేంద్రానికి ఎన్ని అధికారులను తీసిపారేసినా, దాన్ని బలంగా వుండకుండా చేయడం కష్టం. ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అధికార కేంద్రీకరణ తప్పనిసరి. అమెరికాలోని పెడరల్ ప్రభుత్వ ప్రగతిని మనం గమనించాలి. రాజ్యాంగం తనకిచ్చిన పరిమిత అధికారాలను లెక్కచేయకుండా, అది విపరీతంగా అధికారాలను పెంచుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలను చీకటిలోనికి నెట్టి, తన ప్రాధాన్యాన్ని పెంచుకొంది. ఆధునిక పరిస్థితులే ఇందుకు కారణం. ఇవే పరిస్థితులు భారత ప్రభుత్వం పై కూడా పని చేస్తాయి. ఇది బలీయం కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. దాన్ని మరీ మరీ బలీయం చేసే ధోరణిని మనం వ్యతిరేకించాలి. అది జీర్ణించుకోగలిగిన దానికంటే ఎక్కువ ఆహారం అది మింగలేదు. దాని బరువూ బలమూ సమాన నిష్పత్తిలో ఉండాలి. దానికున్న బరువును మించి బలపరచడమంటే పిచ్చితనం తప్ప మరేమీ కాదు.
ఈ రాజ్యాంగ ముసాయిదాపై మరో విమర్శ ఏమిటంటే - ఇది కేంద్రానికి సంస్ధానాలకు మధ్య ఒక విధమైన రాజ్యాంగ సంబంధాలు, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య మరో రకమైన రాజ్యాంగ సంబంధాలు ఏర్పాటుచేయడం. సంస్ధానాలు, కేంద్ర జాబితాలో ఇచ్చిన అన్ని అంశాలనూ అంగీకరించవలసిన పనిలేదు. రక్షణ, విదేశీ వ్యవహారాలు సమాచార శాఖలు మాత్రమే తప్పని సరి. ఉమ్మడి జాబితాలో ఇచ్చిన అంశాలను కూడా అవి అంగీకరించవలసిన పనిలేదు. రాష్ట్ర జాబితాలో ఇచ్చిన వాటిని కూడా ఆమోదించవలసిన పనిలేదు. అవి తమకు స్వంత రాజ్యాంగ సభలను నిర్మించుకోవడానికి స్వేచ్ఛ వుంది. ఇదంతా చాలా దురదృష్టకరం. సమర్ధనీయం కాదని చెపుతున్నాను. ఈ వైరుధ్యం సంస్ధానాల పనితనానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ వైరుధ్యం ఉన్నంతకాలం అఖిల భారత సమస్యలపై కేంద్ర అధికారం తన ప్రయోజకత్వాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే - అన్ని సందర్భాలలో, అన్ని చోటుల్లో చలాయించలేని అధికారం అధికారమే కాదు. యుద్ధం వలన ఏర్పడిన పరిస్థితిలో కొన్ని రంగాల్లో ముఖ్య అధికారాలపై ఉంచిన పరిమితులు. యావత్ ప్రజా జీవనాన్ని ప్రమాదంలో పడవేయవచ్చు. ఇంకా ఘోరం ఏమిటంటే - సంస్థానాలు తమ స్వంత సైన్యాన్ని కలిగివుండడం చాలా అభివృద్ధి నిరోధకము, హానికరముగా భావిస్తున్నాను. ఇండియా ఐక్యతను ఇది భంగపరచవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి వేయవచ్చు. నేనూ అర్ధం చేసుకొన్నంత వరకూ ముసాయిదా కమిటీ ఈ విషయం పై ఎంత మాత్రం సంతృప్తిగా లేదు. వారు రాష్ట్రాలకూ సంస్థానాలకూ, కేంద్రంతో రాజ్యాంగ సంబంధాలలో సారూప్యత ఉండాలని గట్టిగా ఆశించారు. కాని వారిక్కడ పరిస్థితి మెరుగుపరచలేకపోయారు. రాజ్యాంగ సభ వారిచ్చిన నిర్ణయాలకు మా కమిటీ వారు కట్టుబడవలసి వచ్చింది. రెండు సంప్రతింపుల కమిటీల మధ్య కుదిరిన ఒప్పందానికి రాజ్యాంగ సభ కట్టుబడవలసి వచ్చింది.
కాని, జర్మనీలో జరిగినదాన్ని బట్టి మనం ధైర్యం చేయవచ్చు. జర్మను సామ్రాజ్యం 1870లో బిస్మార్కు స్ధాపించాడు. 25 రాష్ట్రాలతో నిండి వుండేది. ఈ ఇరవై ఐదింటిలో 22, రాజు పరిపాలనలోనివి, 3 ప్రజా పరిపాలనలోనివి. ఈ బేధం మనకు తెలిసినంతవరకూ కాలక్రమంలో అంతరించిపోయింది. జర్మనీ అంతా ఒకే భూమిగా, ఒకే ప్రజగా, ఒకే రాజ్యాంగం క్రిందకు వచ్చాయి. ఈ సంస్ధానాల విలీనం జర్మనీలో జరిగిన దానికన్నా వేగవంతంగా ఇక్కడ జరుగుతూ వుంది. 15 ఆగస్టు 1947 నాటికి మనకు 600 సంస్ధానాలు ఉండేవి. ఈ రోజున, రాష్ట్రాలతో వీటిని అంతర్లీనం చేయడం వలనా, లేదా కొన్నింటిని మరికొన్నింటితో కలిపి వేయడం వలనా, లేదా కేంద్రం వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా తీసికొడం వలనా, మనకు 20/30 సంస్ధానాలే మిగిలాయి. ఇది చాలా వేగవంతమయిన, పురోగమన శీలమయిన ప్రక్రియ. రాష్ట్రాల్లో ఇంకా చేరవలసిన మిగిలిన సంస్ధానాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత ప్రభుత్వంలో, రాష్ట్రాల మాదిరిగానే, అవి కూడా అంతర్భాగాలు కావాలని కోరుతున్నాను. అందువలన అవి కేంద్ర ప్రభుత్వానికి అవసరమయిన బలాన్ని అందిస్తాయి. అవి తమకు తాము స్వంత రాజ్యాంగ సభలను నిర్మించుకోవడం, తమకు ప్రత్యేక రాజ్యాంగాన్ని వ్రాసుకోవడం లాంటి బాదరబందీని తప్పించుకొంటాయి. తమ విలువను ఎంత మాత్రం పోగొట్టుకోవు. నా విజ్ఞప్తి వృధాగా పోదని ఆశిస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని గెలిపించే ముందే, సంస్ధానాలకు రాష్ట్రాలకు మధ్య తేడాలను తుడిచిపెట్టి వేయగలమని ఆశిస్తున్నాను.
కొందరు విమర్శకులు ఆర్టికలు 1లో ఇండియాను రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొనడం పట్ల అభ్యంతరం తెలిపారు. సరియైన పదం - రాష్ట్రాల ఫెడరేషన్ అని వుండాలి. అది నిజమే. యూనిటరీ ప్రభుత్వంగా వున్న దక్షిణాఫ్రికా తనను యూనియన్‌గానవ్యవహరించుకొంది. కాని ఫెడరేషన్‌గా వున్న కెనడా తనను యూనియన్‌గానే సంబోధించుకుంది. ఈ విధంగా, ఇండియా పెడరల్ ప్రభుత్వమైనా, దీనిని యూనియన్‌గా సంభోదించడంలో అనౌచిత్యం లేదు. కాని అతి ముఖ్యమైనదేమిటంటే యూనియన్ అనే మాటను ప్రస్ఫుటంగా వినియోగించాము. కెనడియన్ రాజ్యాంగంలో ఈ మాటను ఎందుకు ఉపయెగించారో నాకు తెలియదు. కాని ముసాయిదా కమిటీ దీనిని ఎందుకు ఉపయోగించిందో మీకు చెప్పగలను. ఇండియా, ఫెడరేషను అయినా ఈ ఫెడరేషనులో చేరాలని రాష్ట్రాలు చేసికొన్న ఒడంబడిక ద్వారా ఏర్పడినది కాదు. అదే మాదిరిగా ఈ ఫెడరేషను ఒక ఒప్పందం పలితం కాదు. ఈ యూనియను నుండి విడిపోవడానికి రాష్ట్రానికి హక్కు లేదు. ఇది అవిచ్ఛిన్నమైనది కాబట్టే ఈ ఫెడరేషను, యూనియన్ అయింది. దేశమూ, ప్రజలూ, పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించబడినప్పటికీ, దేశం ఒకే ఒక అవిభాజ్య రూపం. ఒకే ఒక మౌలిక స్ధానం నుండి ఏర్పడిన ఒకే ఒక పరిపాలనలో ఉన్న ఒకే ఒక ప్రజ. అమెరికనులు, తమ పెడరేషను అవిచ్ఛిన్నమనీ, ఏ రాష్ట్రానికీ దాని నుండి విడిపోయే హక్కు లేదని స్థిరీకరించడానికి అంతర్గత యుద్ధం చేయవలసి వచ్చింది. దీనిని ఊహకూ, వివాదాలకు వదలిపెట్టే కంటే, ప్రారంభంలోనే దీనిని స్పష్టం చేయడం మంచిదని ముసాయిదా కమిటీ భావించింది.
రాజ్యాంగ సవరణకు చేసిన ఏర్పాట్లపై విమర్శకులు దాడిచేసారు. ఈ ఏర్పాట్లు సవరణను కష్టతరం చేస్తున్నాయన్నారు. కనీసం కొన్ని సంవత్సరాలపాటైనా, సవరణలు సామాన్య మెజారిటీతో జరగాలన్నారు. ఈ వాదన చాలా తెలివిగా, సున్నితంగా వుంది. ఈ రాజ్యాంగ సభ ఓటరులు ఎన్నిక చేసింది కాదు. ఇకపై భవిష్యత్తులో పార్లమెంటును ఓటరులు ఎన్నిక చేస్తారు. ఓటరులు ఎన్నిక చేయని రాజ్యాంగ సభకు సామాన్య మెజారిటీ రాజ్యాంగాన్ని గెలిపించే హక్కు ఉన్నప్పుడు ఓటరులు ఎన్నిక చేసిన పార్లమెంటుకు ఈ హక్కుకు ఎందుకు కాదనాలి? ఇది రాజ్యాంగంలోని అసంబద్ధతలలో ఒకటిగా ఆక్షేపించారు. నిరాధారమైన ఈ ఆరోపణను నేను తిరస్కరిస్తున్నాను. మన రాజ్యాంగానికి ఎంత సులువుగా సవరణలు చేయవచ్చునో తెలుసుకోవాలంటే - అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగ సవరణ పద్ధతుల్ని ప్రతి ఒక్కడూ అధ్యయనం చేయాలి. వాటితో పోలిస్తే - మన సవరణ ఏర్పాట్లు సులభాతి సులభం. సమావేశ నిర్ణయం లేదా ప్రజాభిప్రాయ సేకరణ వంటి సుదీర్ఘ, కష్టతర పద్ధతులను ఇది త్రోసిపుచ్చింది. సవరణాధికారాలు, రాష్ట్ర కేంద్ర శాసనశాఖలకు వదలిపెట్టింది. కొద్దిపాటి ప్రత్యేక అంశాలపై సవరణకు మాత్రమే, రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. రాజ్యాంగంలోని మిగిలిన ఆర్టికల్సు అన్నింటినీ పార్లమెంటు సవరించుకోవచ్చు. ఒకే ఒక పరిమితి ఏమిటంటే - ప్రతి సభలో హాజరయిన, వోటు చేసిన సభ్యులు మూడింటి రెండువంతులకు (2/3)కు తక్కువ కాకుండా వుండాలి. ఒకో సభలోని సభ్యుల మొత్తం సంఖ్యలో మెజారిటీగా వుండాలి. రాజ్యాంగాన్ని సవరించే ఇంకా సులభపద్ధతిని ఆలోచించడం కష్టం.
ఈ రాజ్యాంగాన్ని బట్టి ఎన్నుకోబడిన భావి పార్లమెంటు స్ధాయి గురించి, ప్రస్తుతమున్న ఈ రాజ్యాంగ సభ స్ధాయి గురించి ఉన్న దురాభిప్రాయంతో, రాజ్యాంగ సవరణ ఏర్పాట్లలో అసంబద్ధత చోటు చేసికొందని చెపుతున్నారు. రాజ్యాంగం తయారుచేస్తున్న ముసాయిదా కమిటీకి పక్షపాత దృష్టిలేదు. బాగా పనిచేయగల ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వడం మినహా ఈ ముసాయిదా కమిటీకి ఏ స్వార్ధ ప్రయోజనములేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్సు పరిశీలించినపుడు పలానా పద్ధతిగా దీనిని గెలిపించాలనే దృష్టిలేదు. భావి పార్లమెంటు, రాజ్యాంగ సభగా సమావేశమయితే - దాని సభ్యులు రాజ్యాంగానికి సవరణలు తెచ్చే పనిలో భాగస్ధులు కావచ్చు. పార్లమెంటులో కొన్ని ఆర్టికల్సు కారణంగా గెలిపించుకోలేని పార్టీ విధానాలను గెలిపించుకోవడానికి వీటిని సులభం చేసికోవచ్చు. వారికి అడ్డంకిగా వున్న ఆర్టికల్సును సవరించుకోవచ్చు. ప్రస్తుత రాజ్యాంగ సభకు ఏ స్వార్ధ ప్రయోజనం లేదు. కాని పార్లమెంటుకు స్వార్ధ ప్రయోజనం ఉంటుంది. భావి పార్లమెంటుకూ, ప్రస్తుత రాజ్యాంగ సభకు మధ్యగల తేడా యిది. అందుచేతనే, కొందరి చేత మాత్రమే ఎన్నికకాబడిన ఈ రాజ్యాంగ సభ సామాన్య మెజారిటీతో ఈ రాజ్యాంగాన్ని గెలిపించగలుగుతుంది. ఈ రాజ్యాంగ సవరణకు, ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుకు సామాన్య మెజారిటీని ఇవ్వడం విశ్వసనీయమూ కాదు, శ్రేయస్కరమూ కాదు.
రాజ్యాంగ ముసాయిదా పై వచ్చిన అన్ని వ్యతిరేక విమర్శలకు సమాధానమిచ్చానను కొంటున్నాను. రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచి గత ఎనిమిది నెలలుగా, ఏ ముఖ్య వ్యాఖ్యనూ లేదా విమర్శను వదలివేయలేదనుకొంటున్నాను. ముసాయిదా కమిటీ సిద్ధం చేసిన ఈరాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ సభ ఆమోదించడమో, లేదా దీనిని నెగ్గించే ముందు ఏవైనా మార్పులు చేయడమో సభ్యుల వంతు.
కాని నేనొకటి చెప్పాలనుకొంటున్నాను. ఈ రాజ్యాంగాన్ని కొన్ని రాష్ట్ర శాసన సభలు చర్చించాయి. దీనిని బొంబాయి, సెంట్రల్ ఫ్రావిన్సు, పశ్చిమబెంగాలు, బీహారు, మద్రాసు, తూర్పు పంజాబు రాష్ట్రాల్లో చర్చించారు. కొన్ని రాష్ట్ర శాసన సభల్లో, రాజ్యాంగంలోని ఆర్థిక అంశాలపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఆర్టికల్ 226 పై మద్రాసు అభ్యంతరం తెలిపింది. ఇది తప్ప ఏ రాష్ట్ర శాసనసభా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌కు ఏ మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పలేదు. ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు. ముసాయిదా కమిటీయే, ఈ రాజ్యాంగ ముసాయిదాను మెరుగుపరచడానికి అనేక సవరణలు సూచించింది. రాష్ట్ర శాసనసభల్లో చర్చలు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రారంభించడానికి ఇది చాలినంత బాగానే వుందని ధైర్యంగా చెపుతున్నాను. ఇది కార్యశీలమైనది, సరళమైనది, దేశాన్ని శాంతి సమయంలోనూ, యుద్ధ సమయంలోనూ కాపాడడానికి చాలినంత శక్తివంతమైనదిగా నేను భావిస్తున్నాను. ఈ క్రొత్త రాజ్యాంగంలో ఏదైనా చెడ్డ సంభవిస్తే - దానికి కారణం మనది చెడ్డ రాజ్యాంగమైనందు వల్ల కాదు. ఇక్కడ మనం చెప్పవలసిందేమిటంటే మనిషి చెడ్డవాడైనందువల్లనే. అంతే. ఆర్యా! రాజ్యాంగాన్ని మీ ముందుంచుతున్నాను.
డాక్టర్ అంబేద్కర్, రాజ్యాంగంపై వ్యతిరేకంగా మాట్లాడారన్న మాట అక్కడక్కడా వినపడుతోంది. రాజ్యాంగం నాదికాదనీ, దానిని తగలబెట్టడానికీ తనకంగీకారమేననీఅన్నట్లు ఒకరిద్దరు మిత్రులు నాతోనే అన్నారు. ఆయనామాటలన్నట్లు రిఫరెన్సు చూపవలసిందిగా వారిని కోరాను. కనుక పాఠకులు అట్టి అభిప్రాయం కలిగి ఉంటే ఆధారాలు చూపటం బాధ్యతతో కూడిన పని అవుతుంది. ఆయనే, స్వయంగా రాజ్యాంగ సభ ముందు వెల్లడించిన అభిప్రాయాల కంటే ప్రామాణిక వాక్యాలు, సందర్భమూ ఇంకేముంటాయి. కనుక అంబేద్కర్ రాజ్యాంగాన్ని గురించి చాలా ఉదాత్తమైన భావన కలిగిఉన్నాడనడమే ఆయనను సరిగ్గా వ్యాఖ్యానించటం అవుతుంది. పరస్పర విరుద్దంగా ఆయనే మాట్లాడాడనడం అంత సబబుకాదు. అది ఆయన స్థాయిని కించపరచడమే. గమనించండి. నిజంగా ఆ మాటలని ఉంటే ఆధారాలు చూపండి (వ్యాసకర్త - సురేంద్ర).
No comments:
Post a Comment