Friday, June 1, 2012

బైబిలు దైవ గ్రంథమా? ... 4

యోచనాశీలురైన పాఠక మిత్రులారా! వివేకపథం 185 సంచికతో ప్రారంభించి బైబిలు ఆధారంగా క్రమంగా విచారించుకుంటూ వస్తున్న; దేవుని మనుషులం అంటున్నవారి మాటలు చేతలకథను శ్రద్ధగా చదువుతూ, అర్ధం చేసుకుంటూ వస్తున్నారనే తలుస్తాను. ఆక్రమంలో స్పందన రూపంగా కొన్ని ఉత్తరాలు వచ్చాయి. ముందుగా వాటిని పరిశీలించే పని చేస్తాను. తరవాత, క్రమంగా సాగాల్సిన కథాభాగంలోకి వస్తాను.

స్పందన - ప్రతి స్పందన 

1. నల్గొండ జిల్లా రామన్నపేట నుండి డి.జగదీశ్వర్‌ (సెల్‌ 9703091496) గారు ఇలా వ్రాస్తున్నారు.

(1) మొదటిసారి మిమ్ము కలిసినపుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి, మీకు తాత్విక విషయాలలో మంచి పరిజ్ఞానం ఉందనిపించి, మీతో మతసంబంధ విషయాలు చర్చించాలన్న ఆసక్తి కలిగింది. ఆ సమావేశంలో నేను చెప్పడంకంటే, మీ నుండి తెలుసుకోవడానికే ప్రాధాన్యత నిచ్చాను.

(2) దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? దీని క్లైమాక్సు (ముగింపు అని కాబోలు) ఏమిటి? దేవుని ఉనికి ఎటువంటిది? లాంటి అనేక ముఖ్యప్రశ్నలకు అనేకులు అనేక సమాధానాలు వెలిబుచ్చారు. అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారి సాహిత్యంలో ఇటువంటి అనేక ప్రశ్నలకు, ఇతర వాటికంటే సబబైన సమాధానం నాకు కనపడింది. కనుకనే వారి గ్రంథాలను పరిశీలించి మీ అభిప్రాయం తెలుపమని మీకు సూచించాను. అంతేకాని, మిమ్మల్ని క్రైస్తవంలోకి లాగాలని నాకేమీ లేదు. ఈ నిజం మీకు తెలుసు.

(3) మత సంబంధ విషయాలను విడిచి, మీరు సమాజంలో చేస్తున్న కార్యక్రమాలను గురించి వివేకపథం ద్వారా గమనించాక, సమాజంలో ఉండకూడని తనంపై మీరు చేస్తున్న పోరాటంలో మీతో కలసి పని చేయడానికి ఇష్టపడుతున్నాను. సామాజికంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు అనితర సాధ్యాలుగ అనిపించాయి. ఆయా సమాజహిత క్షేత్రాలలో కొనసాగడానికి దేవుడు మీకు అవసరమైనవి సమకూర్చాలని కోరుకుంటున్నాను.

2. (1) 'నేను ఏసు జవాబు' అని ఓఫిర్‌ గారు చెప్పుకున్నారు. కాబట్టి ఆయననాకు సమాధానం చెప్పాలి అనన్నారు.

బైబిలు దేవుని వాక్యం అని నమ్మి దాని ప్రకారం జీవించాలనుకునే వారికి మాత్రమే, 'నేను ఏసు జవాబు' అన్న ఓఫిర్‌గారి మాటలు వర్తిస్తాయి కాని అవి మీకు వర్తించవు.

(2) ఇక పి.డి. సుందరావు గారి వాక్యాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. వాటిని క్రైస్తవులందరకూ ఆపాదించకూడదు. వాటికి మేము బాధ్యులం కాదు. కనుక దయచేసి మమ్మల్ని పి.డి. సుందరావు గారితో గాని - జగద్గురు గారితో గాని జమకట్టకూడదు.

సత్యాన్వేషణకు నా స్పందన

3. (1) మీరు దేవుని చాలా హేళనగా ఎగతాళిగా, హాస్యాస్పదంగా సంబోధించారు. గాప్పవాళ్ళను గురించి మాట్లాడవలసి వచ్చినపుడు గౌరవంతో, భక్తితో సంబోధించాలి.

(2) ఒకవైపు ఆయనను (దేవుణ్ణి) అన్వేషిస్తూ, మరోవైపు ఆయనను తూలనాడడమేమిటి? అదేమి సత్యాన్వేషణ? అదెలా నెరవేరుతుంది?

(3) మీ ప్రమాణ విద్య, వివేకపథం జ్ఞానార్జనకు ఉపయోగపడుతుందిగాని, దైవానుగ్రహానికి పనికిరాదు.

(4) విశ్వాన్ని నియమించిన వానికి మీరు కొన్ని హద్దులు, షరతులు పెట్టగలరా? మీరు చేసుకున్న సూత్రాలు ఆయనకు ఆపాదిస్తారా? ఎంత బుద్దిహీనత

(5) సత్యాన్వేషణ అని ప్రారంభించి, సత్యం ఇలా ఉండాలి. అని నిర్ణయించడానికి నీవెవరు? అక్షరాభ్యాసం మొదలెట్టినవాడు, అక్షరాలు అలాకాదు, ఇలా ఉండాలి. అన్నట్లుందిది. అట్టివాడికి చదువేమివస్తుంది?

(6) ఇప్పుడు మీ వివేక పథాన్ని చదివి, దాని ప్రకారమే దేవుడు చేస్తే అతడు దేవుడెలా అవుతాడు? ఆయనకు మీ అనుమతికాని, మీ సర్టిఫికెట్టు గాని అవసరమా?

(7) ఆయన స్వేచ్చాపరుడు. కొన్ని కోట్ల సం|| నుండి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు. ఇక మీ సూత్రీకరణలను నేనే అంగీకరించను. అలాంటిది దేవుడెందుకు అంగీకరించాలి?

(8) దేవుణ్ణి అన్వేషించాలనుకున్నప్పుడు, ఆయన ప్రేమను, దయను, అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన చూపిన పద్దతిలో ప్రయత్నించాలిగాని, ఆయన్ను శాసించడమేమిటి? ఇదేమి న్యాయం?

(9) ఆయనను తెలుసుకోవాలనే ప్రయత్నం మంచిది. ఇప్పుడే తెలుసుకోగలిగితే మంచిదే. లేకున్నా ఆయన ఎదుట ఎలాగూ నిలబడాలి. అప్పుడు మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆయన్ను తెలుసుకోడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడం తప్ప మరో మార్గంలేదు.

(10) మీ అన్వేషణలో ఒక లోపం ఉంది. మీరు పూర్తిగా వినకుండానే ప్రశ్నిస్తుంటారు. అయినా సైన్సుతో బైబిలును పరీక్షించడమేమిటి? సైన్సుతో బైబిలును పరీక్షించమని బైబిలు చెప్పిందా?

(11) మీరొక విషయం తెలుసుకోవాలి. మేము బైబిలు మొత్తాన్ని చదివి అర్ధం చేసుకుని దేవుణ్ణి తెలుసుకోలేదు. మొదట దేవుణ్ణి తెలుసుకుని తరవాత బైబిలును తెలుసుకున్నాం.

(12) నిజంగా మీరు సత్యాన్వేషులైతే బైబిలు అక్షరాలను కాదు, దాని కంటెంటును చదివి, దానిని గ్రహించి, దానిపై ప్రశ్నలడగండి. మీరేదైనా చెట్టును విచారించాలనుకుంటే, ఆ చెట్టును పరీక్షించాలి గాని, గాలి ఇటెందుకువీచింది? అటేందుకు వీచలేదు అని ప్రశ్నిస్తారా? కాబట్టి అసలు బైబిలు ఏమిచెపుతుందో వదిలేసి ఏదేదో ప్రశ్నిస్తే ఎలా?

(13) మరో విషయం. ఏదైనా గ్రంథంలో సందేహం వస్తే ఏమి చేయాలి? ఆ గ్రంథకర్తనే అడగాలి. అదే సరైన పద్దతి, బైబిలు గ్రంధానికి కారకుడు దేవుడు కనుక, మీకేమైన సందేహం వస్తే శిష్యునికి తగిన మనస్సుతో, ప్రార్థన ద్వారా ఆయననే అడగండి. సమాధానం మీకు లభిస్తుంది. నాకు అలా ఎన్నో సమాధానాలు లభించాయి కూడా.

(14) క్రీస్తుమీద మీకున్న అభిప్రాయమే, శాశ్వతకాలం మీరు ఎక్కడ జీవించ బోతున్నారో నిర్ణయిస్తుంది. దీనిని మరచిపోకండి.

మా సవాలు :

4. (1) బైబిలులో కొన్ని వేల సం|| క్రితం వ్రాయబడ్డ అనేక ప్రవచనాలు నెరవేరాయి. జరుగుతున్నాయి. మరికొన్ని నెరవేరబోతున్నాయి.

(2) ఏసు రాకడరానైయున్నదని, ప్రపంచ సామ్రాజ్యాన్ని ఓడించి, తన నీతి రాజ్యాన్ని స్థాపించుతాడని అనేక బైబిలు వచనాలు సాక్ష్యమిస్తున్నాయి. దానికి తగ్గట్టు అనేక సూచనలూ కనిపిస్తున్నాయి. మీరు గాని, మీ ప్రమాణ విద్యగాని, మీ మండలిగాని, ఆయనను భూమిపైకి రాకుండ ఆపగలరేమో ప్రయత్నించండి. ఈ విషయంలో ముందుగా మేమే ప్రకటిస్తున్నాము, మీరేవరూ ఆయనను ఆపలేరు.

మీ ప్రార్థన + ఆయన అనుగ్రహం = సత్యప్రత్యక్షం, ఇదే నిత్య సూత్రం.

(3) ముగింపు : - ఎవరైనా బైబిలులో ఉన్న దేవుణ్ణి విమర్శించాలంటే, ముందుగా వారు అసలైన దేవుడెవరో తెలుసుకుని, గ్రహించి, అప్పుడు మమ్మల్ని విమర్శించాలి. మరో రకంగా విమర్శించాలనుకోవడం అన్యాయం, అసంబద్దం.

క్రమంగా మీ పత్రికలను నా అడ్రసుకు పంపించవలసిందిగా మనవి.

ఇట్లు

సత్యసాకారం కోసం - జగదీశ్వర్‌

జగదీష్‌ లేఖకు - స్పందనకు - సురేంద్ర ప్రతిస్పందన

పాఠకులకు గమనిక :- జగదీష్‌తో మాట్లాడాలనుకుంటున్న పాఠకుల కొరకు వారి చిరునామా ఇదిగో;

డి. జగదీశ్వర్‌ : 8-26, క్రిష్టియన్‌ కాలనీ, రామన్నపేట, నల్గొండ జిల్లా - 508113, సెల్‌ : 9703091496

నా ప్రతి స్పందన : జగదీష్‌ గారికి, 185, 186 సంచికలు చదివి నాకు ఫోను చేసి మీరు నన్ను జగద్గురువుతో కలిపి మాట్లాడడం నాకు చాలా బాధకలిగించింది. దీని పై మీకు లేఖ వ్రాద్దామనుకున్నాను, అని మీరన్నప్పుడు అలాగే చేయండి. మీకు అభ్యంతర కరమైన అంశాలు ఆ సంచికలలో నేను వ్రాసి ఉంటే, సూటిగా వాటిని బైటపెట్టి, మీ అభ్యంతర మేమిటోనూ తెలియపరచండి. దానిని పత్రికలో వేసి దానిపై నా పక్షాన్ని ప్రకటిస్తాను, అని చెప్పాను. ఆనాటి మీ అభిలాష కూడా ఇదంతా పాఠకులకూ తెలియాలన్నదే.

అయితే ఈ మీ లేఖ ఆ ఒక్క విషయాన్నేగాక, అనేక విషయాలనూ తెరమీదికి తెచ్చింది. కనుక వివరణ రూపంగా ఉండాల్సిన నా సమాధానం ఒకింత విస్తారమవుతోంది. అయినా దీనిని, మీకూ నాకూ జరిగిన సంభాషణగాకాక, అలాంటి అభ్యంతరాలకు, ప్రశ్నలకు - సరైన సమాధానం ఎలా ఉంటుందనినాకనిపిస్తున్నదో, దానికి పాఠకుల అవగాహన పెంచడానికీ పనికివస్తుందనిపించి వివరంగా వ్రాయడానికే సిద్దమైనాను, అందుకే మీ లేఖను అంశాలవారీగా విడగొట్టాను.

(1) నాతో మీ ప్రథమ సమావేశం, నా గురించి మీకు కలిగించిన అభిప్రాయం సత్యదూరంకాదు. తాత్వికాంశాలపట్ల కొంత వరకు అభినివేశం కలవాణ్ణే నేను. ఆనాటి సమావేశం జ్ఞానపరంగా మీకు ఒకింత ప్రయోజనం కలిగించిందనే భావిస్తాను.

(2) దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు? లాటి ప్రశ్నలకు అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారి సమాధానాలు, ఇతరుల సమాధానాలకంటే సబబుగా ఉన్నాయనిపించిందన్నారు. అందుకనే, రంజిత్‌ ఓఫిర్‌గారి గ్రంథాలను చదవమని నాకు చెప్పానన్నారు. బాగనే ఉంది. మీ సూచన మేర మీ నుండే నాకు చేరిన వారి రచనలను కొన్నింటిని చదివాను. దాంతో ఆయన వెలిబుచ్చిన భావాలపై ఆయనతో చర్చించాలనిపించి ఆ విషయాన్ని మీకు తెలియబరిచాను. మీరు రంజిత్‌ ఓఫిర్‌గారితో మాట్లాడిచెపుతానన్నారు. అప్పుడు నేను ఒక సందర్భంలో ఓఫిర్‌గారన్న మాటల్ని గుర్తు చేస్తూ, ఆయన నాతో మాట్లాడేందుకు సిద్ధపడకపోవచ్చునని చెప్పాను. అలాటి దేమీలేదు ఓఫిర్‌గారు ప్రశ్నించేవారితో మాట్లాడడానికి వెనుకాడరు. బైబిలులో కూడా ప్రశ్నించేవారికి వినయంతో సమాధానం చెప్పమని ఉందంటూ ఒక బైబిలువాక్యాన్నీ ఉట్టంకించి, ఓఫిర్‌గారితో మాట్లాడేందుకు స్థలకాలాలను తెలుసుకుని నాకు తెలుపుతానన్నారు. ఇంతవరకు ఇదంతా గతంలో మన మధ్య జరిగిన ఒక భాగం. తరవాత రెండు మూడుసార్లు మాయింటి దగ్గరే మనం కలసి బైబిలుపైన, తాత్వికాంశాలపైనా, మండలి ఆలోచనా విధానంపైనా, కొంత కొంత మాట్లాడుకోవడం జరిగింది. అటు తరవాత ఒక రోజు 'హైందవక్రైస్తవం' అన్న రంజిత్‌ ఓఫిర్‌గారి రచనను నాకు తెచ్చిచ్చి, చదివి దానిపై నా అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా కోరారు. నేనాపుస్తకాన్ని చదివి, అభిప్రాయం చెప్పడంకంటే, ఆయనతో, ఆ పుస్తకం పై చాలా మాట్లాడాల్సి ఉంది. అలా పుస్తకం వ్రాసి ప్రచురించినందుకుగాను, దానిపై చర్చించడానికి ఆయనగారు నిజాయితీగా సంసిద్ధులు కావలసిఉంది. కనుక ఓఫిర్‌గార్ని చర్చకు సిద్దం కమ్మని చెప్పండి అని నేను మీకు సూచించడం, అలాగే ఏర్పాటు చేస్తానని మీరనడం జరిగింది. వెంటనే జరగాల్సిన ఆ సమావేశం మీకో, వారికో ఉన్న పనులవత్తిడి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రెండు మూడుసార్లు సమావేశం సంగతేమయింది? అని నేను మిమ్ములనడగడం మీరు కూడా పనుల వత్తిడి వల్ల ఆలస్యమైంది త్వరలో ఏర్పాటు చేస్తామని అనడం జరిగింది. ఇదంతా సుమారు 1 సం|| కాలంగా మన మధ్య జరుగుతూ వచ్చిన సంఘటనల పర్వం.

ఈ కాలంలోనే 'జగద్గురు' గారు నాతో, పి.డి. సుందరావుగారితో మాట్లాడమని, చర్చించమని, పోరాడమని రకరకాలుగా వత్తిడిచేయడం, నేను ఒక థలో సరేనని అందుకు సిద్దపడడం, ఆ సందర్భంగా పి.డి. సుందరావుగారికీ, రంజిత్‌ ఓఫిర్‌గారికీ మధ్యనూ, ఒక వివాదం నడుస్తునందున్న వాస్తవాన్ని, అటు పి.డి. గారి క్యాసెట్లు, పుస్తకాల ద్వారా, ఇటు మీరందించిన ఓఫిర్‌గారి ప్రసంగాల క్యాసెట్లు ద్వారా గమనించిన నేను, బాగానే ఉంది. బైబిలు పక్షాన దృఢంగా నిలబడి ఉన్న ఆ ఇరువురితోనూ బైబిలు విషయమై విచరణ చేసేస్తే సరిపోతుందిలే అనుకుని బైబిల్‌ పై చర్చకు నన్ను ప్రేరేపించిన మీయిరువురికీ అభినందనలు అంటూ నాతొలి సంచికలో (వి.పథం 185లో) ప్రస్తావించాను.

నేను 'జగద్గురు' గారితో మిమ్ము కలిపేసినట్లు, సమానం చేసినట్లు, పి.డి సుందరావు గారిని ఓఫిర్‌ గారిని (మిమ్ము) ఒకటి చేసినట్లు, అది చాల పొరపాటన్నట్లు మీరు చాలా వేదన చెందినట్లూ పోనులో చెప్పారు. లేఖలోనూ అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఈ విషయంపై నా సమాధానమేమిటంటే,

నేను పి.డి సుందరావుగారిని, రంజిత్‌ ఓఫిర్‌గారిని; మిమ్ము జగద్గురు గారిని ఒకగాటనే కట్టలేదు.

2. పి.డి. సుందరావుగారి మాటలు క్రైస్తవులందరూ అన్నట్లే అవుతుందనీ నేననలేదు. అనను కూడా!

3. పి.డి. సుందరావుగారి సవాళ్ళకు మీరంతా బాధ్యత వహించమనీ నేననలేదు.

కానీ నేనా మూడు పనులూ చేసినట్లు అర్ధం వచ్చేలా ఉన్నాయి మీ మాటలు. మరొక్కమారు వివేక పథం 185, 186 లు చదివి అందులో మీరు నేనన్నానన్న మాటలు ఎక్కడున్నాయో ఎత్తిచూపండి. నిజానికి నేననని మాటలు నేనన్నట్లు మీకనిపించడం వెనక, పి.డి సుందరావు, ఆయన అభిమానులపట్ల మీకున్న చులకన భావమే 'మాకూ, వాళ్ళకు పోలికా'? అన్న అసహనాన్ని మీలో కలుగజేసింది. నావరకు నాకు బైబిలుపైనా, బైబిలును సమాజానికి అందించాలనుకుంటున్న వారిపైనా, నేను విచారణకు సిద్దం కావడానికి దోహదపడిన వ్యక్తులనుగా మిమ్ము పేర్కొనడం వరకే అభిలాష ఉంది. అంతకుమించి జగద్గురు గారి గురించి మీ గురించి ఏ విషయాన్ని గాని ప్రస్తావించాలన్న దృష్టి నాకు అప్పటికి లేదు.

నా వ్యాసాల్ని గనుక మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వ్యక్తుల్ని లక్ష్యం చేసుకోవాలన్న తపన నాకంతగాలేదు. కేవలం గ్రంథాలను విచారించడమే నా ప్రధాన లక్ష్యం అన్నది ఎవరికైనా అర్ధమవుతుంది. ఆ సందర్భంలో వ్యక్తులు తనను తాను ప్రత్యేకించుకుంటూ ఆయా మత గ్రంథాలను ప్రామాణీకరించడానికి పూనుకున్న సందర్భంలోనూ, తాము చెపుతున్నదే గ్రంథానికి సరైన వివరణ అని ప్రకటించుకున్న సందర్భాలలోనూ, తప్పని సరైతేనే వ్యక్తుల్ని విచారించేపనికీ నేను సిద్దమేనంటూ వచ్చాను. అందుకే ఖచ్చితంగా ఆరెండు సందర్భాలనూ విడగొట్టి 'వాదపరీక్ష, వాది పరీక్ష' వేరు వేరు అని స్పష్టంగా తెలియపరచి ఉన్నాను.

అయితే మన మధ్య ఏర్పడి ఉన్న ప్రత్యేక సందర్భంలో అటు పి.డి సుందరావుగారు, ఇటు అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారు కూడా, ఈ కాలానికి తానే బైబిలు ప్రవచకుణ్ణిని ప్రకటించుకున్నారు కనుక బైబిలునేకాక, బైబిలును తమదైన శైలిలో వివరిస్తున్న వారిరువురినీ పట్టిచూడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఒక వంక బైబిలు పైనేకాదు, దైవాస్థిత్వాన్ని ప్రకటిస్తున్న ఖురాన్‌ మరియు వేద సిద్దాంతాలపైనా చర్చకు సిద్దమంటూనే, ముందుగా పి.డి. సుందరావుగారితో, అనంతరం రంజిత్‌ ఓఫిర్‌గారితో చర్చించాల్సి ఉందనీ వ్రాశాను. అంతటితో మీరెండు పాత్రలను జగద్గురు గారిని, మిమ్ములను ప్రక్కన పెట్టినట్లైంది. నా కదలికకు మీరిరువురూ కారణమన్నానే గాని మీరిరువురూ జతకట్టినన్ను కదిలించారనలేదు. గమనించండి.

అయితే ఇక్కడొక కీలకమైన విషయముంది. బైబిలును, బైబిలు ప్రతినిధులం అంటున్నవారినీ చర్చకు సిద్దంకండంటూ కదిలిననేను, అవతలివారు నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుంటే మాత్రం, నన్ను కదిలించిన మీ యిద్దరినీ, మీ మీ పెద్దలను కదిలించండి బాబులూ! అంటూ వత్తిడి చేయడం అవసరమవుతోంది. ప్రస్తుతం పి.డి. సుందరావుగారితో ముందుగా చర్చకు సిద్దపడదామనుకున్న నేను, సుందరావుగారిని చర్చకు సిద్దం చేసేందుకు చేయగల యత్నమంతా చేయవలసి ఉంది. ఆ పనే చేస్తున్నానుగనుక, రంజిత్‌ ఓఫిర్‌గారిని బైబిలును చర్చించాల్సిన వాళ్ళజాబితాలో రెండో సంఖ్య క్రింద చేర్చాను. ఆ విషయం కూడా వివేకపథంలో ప్రస్తావించాను. విచారణకు సిద్దపడమని నేను పిలిచే సందర్భంలో; సుందరావుగారిని చర్చకు తీసుకువచ్చే బాధ్యత మీ మీదా ఉందని జగద్గురు గారిని వత్తిడి చేస్తున్నాను. నావత్తిడికి తట్టుకోలేక ఒకటి, రెండు సార్లు జగద్గురు గారు పి.డి. సుందరావుగారికి నాతో చర్చకు సిద్దంకమ్మని ఉత్తరాలు వ్రాశారు కూడా. ఆయన ఉత్తరాన్ని వెంట్రుకముక్కతో సమానంగా భావించి అవతలపారేశారు జయశాలి బృందం. పాపం జగద్గురుగారు! ఇటు నాకు సమాధానం చెప్పుకోలేకా; అటు బైబిలు విమర్శకుల్ని చీల్చిచెండాడేస్తారు పి.డి. వారన్న కల, కల్లగానే మిగిలిపోవడం చేతా మానసికంగా ఎంతోక్షోభ ననుభవిస్తున్నారు. ప్రస్తుతం నేను మాత్రం, సుందరావుగారిని నాతో చర్చకు సిద్దం చేయాల్సిన నైతిక బాధ్యత నుండి మీరు తప్పించుకోలేరని జగద్గురు గారిని వత్తిడి పెడుతూనే, మిమ్ములనూ, బైబిలునూ కూడా మాలాంటి వారి నుండి ఉద్దరిస్తారనుకున్న ప్రగల్భాల పి.డి. సుందరావు గారికంటే, నిజాయితీలో మీరే మెరుగండీ జగద్గురుగారూ! అంటూ వస్తున్నారు.

సందర్భం రంజిత్‌ ఓఫిర్‌ గారికి సంబందించినదిగా తయారైనపుడు, రంజిత్‌ ఓఫిర్‌ గారిని చర్చకు రమ్మని నాకు చేతనైనంత వత్తిడి చేస్తాను. అలాటప్పుడు కూడా నా దృష్టంతా బైబిలు విచారణ పైనే. తప్పని సరిపరిస్థితి ఏర్పడినప్పుడే ఓఫిర్‌గారి అవగాహన పై చర్చ మొదలెడతాను. నావైఖరి అది కనుకనే చర్చకు ఎవరుగానీ, ఏ మత గ్రంథం పై గాని సిద్దం కావచ్చుననీ, అందరికీ పి.డి సుందరావు గారికి వర్తించే షరతులే వర్తిస్తాయని ప్రకటించాను. కావాలంటే షరతుల్ని (చర్చావేదిక నియమనిబంధనల్ని) అందరం కలసి ఏర్పరచుకోవచుననీ వ్రాశాను.

ఒక్కమాట జగదీష్‌ గారూ! నావిగా వివేకపథంలో ప్రకటించిన ప్రతి మాట విషయంలోనూ నేను పూర్తి బాధ్యత వహిస్తాను. పరిశీలనలో వాటిలో లోపాలున్నట్లు తేలితే మరు సంచికలో ఆ వివరమూ ప్రకటించి లోపాలను సవరించుకుంటాను. అది నా వ్యక్తిత్వానికి, అందులోనూ నా నిజాయితీకి సంబంధించిన అంశము. నాతో బేటీకి సిద్దమైన వారూ అలాగే ఉండాలని, ఉండి తీరాలని అభిలషిస్తాను. ఇక్కడ మీరేమిటో, మీ దారేమిటోనూ స్పష్టంగా ప్రకటించండి.

ఏ వ్యక్తైనా తాను వెళ్ళడించిన భావాల వరకు, వాటి బాగోగులు విచారించడానికి సిద్దంగా ఉండడం, బాగును ఉంచుకుని, ఓగును వదలుకోవడం కనీస విజ్ఞత. అది విచక్షణా జ్ఞానం కలవారి బాధ్యత కూడా. నిజానికి నా ఈ మాటలు మిమ్మొకరిని దృష్టిలో పెట్టుకుని చెపుతున్నవి కాదు. మిమ్ములను అడ్డుపెట్టుకుని, ఆలోచించగల వారందరి ముందుకూ తెస్తున్న నా అభిప్రాయాలివి. భవిష్యత్తులో రంజిత్‌ ఓఫిర్‌గారిని బైబిలుపై సత్యా సత్యవిచారణకు సిద్దంకండని నేను ఆహ్వానించబోయే సందర్భంలో ఆయన గారిని చర్చకు పిలుచుకు వచ్చే పనిలో మీవంతు కృషి మీరు చేయండి. అది మీ బాధ్యత కూడా! అని మీకూ వ్రాస్తాను. ఆ వ్రాతల్ని పత్రికలోనూ ప్రకటిస్తాను. ఇదంతా ఆయా గ్రంథాలకు మేమే సాధికారిక ప్రతినిధులం అని ప్రకటించుకుంటున్న వారిని ఎవరిని గానీ విచారణకు సిద్దం చేసే ప్రక్రియలో భాగం మాత్రమే. ఆ భాగంలోకి ఆయా సందర్భాలలో జగద్గురు వస్తారా?

'జగదీష్‌' వస్తారా? 'మోషే' వస్తారా? 'ముస్తఫా' వస్తారా? అన్నది నాకంత ప్రధానంకాదు. వ్యక్తి ఎవరైనా ఆ పాత్ర పోషణ అవసరం అన్నదే నా దృష్టి. ఎన్నో విషయాలపై తనదైన అభిప్రాయాలను ప్రకటించిన ఓఫిర్‌ గారు, అవన్నీ సరైనవేనని నిరూపించే బాధ్యత వహించితీరాలి. ఆ బాధ్యత తీసుకోమని వారికి మీరూ చెప్పాలి.

బైబిలు గురించి అనుకూలంగాగానీ, ప్రతికూలంగాగాని, అలాగే ఏ గ్రంథాన్ని గురించైనా అనుకూలంగాగాని, ప్రతికూలంగాగాని అభిప్రాయాల్ని ప్రకటించిన వారందరిపైనా, తాను ప్రకటించినవి సరైన భావాలేనని నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే తప్పనాకైనా, మీకైనా, ఎవరికైనా ఎట్టి మినహాయింపూ ఉండదు. ఉండకూడదు. కనుక పి.డి సుందరావుగారుగానీ, రంజిత్‌ ఓఫిర్‌గారు గాని, ఇమ్రాన్‌ గారు గాని మరెవరు గాని విచారణకు సిద్దం కాకుండడమన్నదే జరక్కూడదు. మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం, మీకు నచ్చింది మీరు చెప్పుకోండి అనడం, భావ ప్రకటనా స్వేచ్చ అన్న సూత్రాన్ని (హక్కును) తప్పుగా వాడుకోవడమే.

ఈ విషయంలో పి.డి. సుందరావుగారిపైన కంటే, రంజిత్‌ ఓఫిర్‌గారిపైన చాలా పెద్ద భారం ఉంది. ఎలాగంటే, పి.డి సుందరావుగారు ఇతర గ్రంథాల విషయం మాకనవసరం. మేము బైబిలును చెప్పుకుంటాం. బైబిలును ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోం అన్న విధానానికి పరిమితమైనారు. రంజిత్‌ ఓఫిర్‌గారైతే ఆ ఎల్లలు దాటి ఇతర మత గ్రంధాలు బైబిలు దేవుణ్ణి, క్రీస్తును ప్రకటిస్తున్నాయి అనేంతవరకు పోయారు. పలాయనాన్నో పట్టించుకోని వైఖరినో అవలంభిస్తే తప్ప ఆ మాటలను సరైనవేనని రుజువు చేసే బాధ్యత నుండి వారు తప్పించుకోలేరు. తప్పించుకోకూడదు.

మీరెవరండి మమ్మల్ని అడగడానికనో, మీకు సమాధానం చెప్పుకోవలసిన అవసరం మాకు లేదనో అనడం లాటి పోకడలన్ని అడ్డగోలు వ్యవహారాలే. ఎందుకంటే ఏ వ్యక్తైనా, సమాజం ముందు, 'ఇదిగో ఇది సత్యము ఇదే సత్యము' అనంటూ తానుగా ప్రకటించిన భావము వాస్తవాన్ని తెలిపేటిదేనని (సరైందేనని) నిరూపించే బాధ్యత స్వీకరించితీరాలి. అలా స్వీకరించకపోవడంకంటే తప్పుడు తనం - మతిసెబ్బరితనం - భావజాల క్షేత్రానికి సంబంధించినంతలో మరోటిలేదు. కనుక భావజాల క్షేత్రంలోని ప్రసంగీకులంతా తాను ప్రకటిస్తున్న అభిప్రాయాలన్నీ సరైనవేనని నిరూపించే బాధ్యత తీసుకుతీరాలి.

కనుక పి.డి.సుందరావుగారుగానీ, రంజిత్‌ ఓఫిర్‌ గారుగాని, ఇమ్రాన్‌గారు గానీ, మరొకరు మరొకరు (మీరైనా నేనైనా) గాని, విచారణకు సిద్దం కాకపోవడమన్నదే జరక్కూడదు. అది సత్యసంధతకు, చిత్తశుద్ధికి, సామాజిక బాధ్యతకు సంబంధించిన కర్తవ్యము. అది భావజాలక్షేత్రంలో చొరబడిన వారందరి 'విధి' కూడా.

సరే! ఈ విశ్లేషణను ప్రస్తుతానికి ఆపి, లేఖలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలపై నా ఆలోచన లెలాసాగాయో క్లుప్తంగా వ్రాస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. నిర్మొహమాటంగా స్పందించండి. వీలైనంత వరకు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా విషయ ప్రధానంగా పరిశీలనను, విమర్శను సాగిద్దాం. ఎందుకంటే ఒక పత్రికలో ఇలాంటి చర్చ చేసేటప్పుడు, అది ఒకరిద్దరికి సబందించినది కాకుండా అందరికీ పనికి వచ్చేదిగా ఉండేట్లు విషయ ప్రధానంగా చర్చసాగించడం మంచిది. పైగా నావైపు నుండి చూస్తే ఇది 1 పేజీకి 200 రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అవుతోంది. కనుక ఖర్చు అయితే మానే పాఠకులందరకూ ఉపయోగపడితే నన్నా బాగుంటుంది. అని అనుకోవడం సబబుకదా!

1(2) దేవుడు సృష్టి ఎందుకు చేశాడు? సృష్టిని ఏదో ఒక సమయాన మొదలెట్టాడనక తప్పదు గనుక, అప్పటి వరకు అతడెక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు? అప్పుటికి అతడుగాక ఇంకెవరైన ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? వారు ఎప్పటి నుండి ఉన్నారు? ఇంతకూ ఆసృష్టికర్త ఉనికి, స్వరూపస్వభావాలు ఏమిటి? వగైరాలన్నింటికీ ఆయా మత గ్రంథాలు (ప్రస్తుత సందర్భాన్ని బట్టి బైబిలు) ఏమి చెపుతున్నట్లు? వగైరాలకు మీరుగాని, మీరభిమానించే లేదా అనుసరించే అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారు గాని ఏమి చెపుతున్నారో స్పష్టంగా ప్రకటించండి. ఓఫిర్‌గారు పుస్తకరూపంలో ప్రకటించి ఉంటే ఆ పుస్తకాన్ని పంపండి.

2. (1) ఇట్లు 'దేవుని నోరు అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌' అని, దేవుని గండ్రగొడ్డలి అన్న పుస్తకం రెండవ ముద్రణకు ముందుమాట చివరలో వ్రాసుకున్నారు ఓఫిర్‌గారు. 'ఏసు జవాబు' అని ఎక్కడ చెప్పుకున్నారో మీరే చెప్పండి అలాగే 'పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము' అన్న పుస్తకంలో 'ముందుమాట'కు చివర, ఇట్లు నిరంతర సత్యాన్వేషి, సత్యసంస్ధానాభిలాషి అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌, అని ప్రకటించుకున్నారు. సింహనాదం తృతీయముద్రణ ముందుమాటలో చివరన ''సత్యసంస్థాపనాభిలాషి; దేవుని నోరు'' ఇర్మియా (15/19) అని వ్రాసుకున్నారు. యుగాంతం అన్న పుస్తకంలోనూ 'దేవునినోరు' అనే ఉంది. ఇక పోరాడండి అన్న గ్రంథంలోనైతే క్రీస్తుకోసం భక్త జన దాసుడు ఓఫిర్‌ అని వ్రాసుకున్నారాయన. క్యాసెట్‌ ప్రసంగాలలో 'ఏసునోరు' ను అని చెప్పుకున్నారు.

ఇంతకూ దేవునినోరు, ఏసునోరు, అన్న మాటలకు అర్థమేమిటి? ఇర్మియా 15:19 లో ఉన్న సందర్భం వేరు. ఇర్మియా నాపై దయ చూపు దేవా అని యోహోవాను ప్రార్థింపగా, నీవు నావైపు తిరిగితే నేను నిన్ను తిరిగి రప్పింతును. ఉచ్చనీచములు గుర్తించితే నీవు నా నోటి వలె ఉండగలవు. అన్న సందర్భమది. దానికి ముందు వెనక కూడా చదివితేగాని ఏ సందర్భంలో ఆ మాట వచ్చిందో, ఆ సందర్భానికి తగిన అర్ధమేమిటో బోధపడదు. ఇక్కడ ఓఫిర్‌గారు 'దేవుని నోరు'గా తనని తాను చెప్పుకోవడం వెనుక మనల్ని ఏ అర్ధాన్ని గ్రహించమని అంటున్నదీ ఆయనే చెప్పాలి. ఎందుకంటే, స్పష్టతలోపించినప్పుడు విన్నమాటకు అర్ధాన్ని అన్న వారినే అడగడం, తానన్న మాటకు అర్ధాన్ని చెప్పే బాధ్యత అన్నవారే స్వీకరించడం సరైన విధానం. ఈ సూత్రాన్ని వెనక విూరూ ప్రస్తావించారు.

3. (1) దేవుని నేను చాలా హేళనగా మాట్లాడాను అనన్నారు. (1) ఎక్కడ అలా మాట్లాడానో ఎత్తిచూపండి. (2) ఇక ఇప్పుడు మాట్లాడుతున్నాను. బైబిలు అందించిన వివరాల ప్రకారమే యెహోవా సర్వజ్ఞుడుకాడు, సర్వ శక్తివంతుడు కాడు, సర్వవ్యాపికాడు, అతడో మత్సరగ్రస్తుడు, క్రూరస్వభావి, ఉగ్రుడు. వెంకటాద్రిగారు కోట్‌ చేసినట్లు అంతటి భయానక స్వభావి మరే సాహిత్యంలోనూ కానరాడు.

(3) అట్టి వాణ్ణి నెత్తికెక్కించుకున్నందుకు మిమ్మల్ని, జనాలను అట్టి వాని దగ్గరకు చెర్చడానికే కృషి చేస్తున్నందుకు ఏసును, ఏసు బృందాన్ని అనాలి.

(4) బైబిలులోని యోహోవాను చులకనగా మాట్లాడి ఊరుకోవడం అన్యాయం. మానవత్వమా, హేతుబుద్ది ఉన్న మనుషులెవరూ అతడి స్వభావాన్ని, అభిరుచుల్ని, ప్రవర్తనలను సరియైనవిగా అ ంగీకరించలేరు. అసహ్యించుకుంటారు కూడా.

(5) నిందాత్మకమైన ఏ పదాలూ అతణ్ణి యథాతథంగా చూపించడానికి సరిపోవు. అతనిలోని ఒంకరబుద్దిని గురించి, కురచ బుద్దిని గురించి బైబిలు రచయితలు ఆదికాండం నుండే తగినన్ని వివరాలందించేపని చేశారు. బైబిలు దేవుని పాత్ర వివరాలు తగినంతగానూ అందినందుకు వారిని అభినందించాలి. పాత నిబంధన పుస్తక రచయితలారా, అభినందనలు.

(2) నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నాను అని వ్రాశారు. నేనెక్కడన్నానామాట? ఈ విూమాటతో సత్యాన్వేషణంటే దేవుణ్ణి అన్వేషించడం కాదన్న ప్రాథమిక విషయం కూడా మీకు తెలియదని అర్ధమైంది. మీ పెద్ద రంజిత్‌ ఓఫిర్‌గారు తనను తాను నిరంతర సత్యాన్వేషినని చెప్పుకున్నారు. ఆ మాటైనా అర్ధమైయ్యుంటే, దేవుని విషయంలో అన్వేషణ ముగిసినవారు గానీ, దేవుని విషయాన్నసలు పట్టించుకోనివారు గానీ, కొంతకాలం దేవుని విషయమై గట్టిగా పట్టించుకుని, దానిని గురించిన అన్వేషణ వ్యర్ధ ప్రయత్నమని తెలుసుకున్నవారు గానీ, అటు తరవాత కూడా సత్యాన్వేషిగా ఉంటూ, సత్యాన్వేషణ చేస్తూ ఉండవచ్చు. ఇందులో నేనే విధానానికి చెందిన వాణ్ణో మీరెరుగకనే, నేను దేవుణ్ణి గురించి అన్వేషిస్తున్నానని అనేశారు. అన్నమాట మీద నిలబడి, మీరన్నది వాస్తవమేనని నిరూపించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఆలోచించండి.

(3) ప్రమాణ విద్య గురించి, అందునా మండలి ప్రమాణ పక్షాన్ని గురించి ఈ షన్మాత్రమూ తెలియదు మీకు. ప్రమాణ పద్ధతుల్ని మేమో, మీరో ,మరొకరో సృష్టించలేదు. అవి మనిషి జీవితంలో, శరీరంలో చోటు చేసుకుని సహజంగానే వినియోగపడుతున్నట్టివి. మీరు యోహోవా దేవుడని తెలుసుకున్నానంటున్నది కూడా ఉన్న ప్రమాణాలను వాడుకునే. అయితే ప్రమాణాలను సక్రమంగా వాడుకోకుంటే, అవి ఒప్పు జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే బదులు తప్పు జ్ఞానాన్ని కలిగించడానికీ ఉపయోగపడతాయి. ఆయా విషయాల గురించి తెలయకనే తెలుసనుకుని వాటిపై తప్పుడు అభిప్రాయాన్ని వెలిబుచ్చే ఒకింత తొందరపాటు స్వభావం కూడా మీకుందని అనిపిస్తోంది. లేదా దీనితో తేలుతోంది.

(4) విశ్వాన్ని నియమించిన వానికి హద్దులు, షరతులు పెట్టగలరా? మీ సూత్రాలు ఆయన కాపాదిస్తారా? అదెంతటి బుద్ధిహీనత? అంటూ తెగబడి మాట్లాడారు. నన్ను బుద్దిలేనివాడా! అనేంతవరకు సిద్దపడ్డారంటే మిమ్మల్ని ఏమనాలి? మీ గురించి ఏమనుకోవాలి.

ఇహ మీ బైబిలులో సృష్టికర్త, నియమకుడుగా చెప్పబడ్డవాడికిఎన్నో హద్దులున్నట్లు, ఆయనే కొందరితో షరతులు నిబంధనలు చేసుకున్నట్లు ఆ తరువాత వాటిని అతడు, వారు కూడా చాలసార్లు అతిక్రమించినట్లు, అతడో బుడింకాయకంటే పెద్దగా ఎక్కువ కానట్లు, నిర్ణయించడానికి తట్టెడు వివరాలన్నై బైబిలులోనే

(5) సత్యం గురించి మీకు ప్రాథమిక పరిజ్ఞానం కూడాలేదని, కలిగించుకోవాలన్న స్పృహ కూడా లేదని ఈ వాక్యం వల్ల నాకర్ధమైపోయింది. ఒక్కమాట! దీనినైనా అర్ధం చేసుకోగలరేమో చూడండి. అవసరమైతే మీ ఓఫిర్‌గారికైమైనా అర్ధమైందేమో అనైనా అడగండి.

సత్యమంటే ఏమిటి? సత్యమేమిటి? ఈ రెండు ప్రశ్నలు ఒకే అర్ధాన్నిస్తాయా? రెండూ వేరువేరా? వేరైతే రెంటి అర్ధాలు, వాటికి సమాధానాలు చెప్పండి. ఈ విషయం అర్ధం కాకుంటే సత్యాన్వేషణా లేదు. సత్యమిది అని తెలుసుకోవడమూ లేదు. అలాంటివారు చెప్పేవన్నీ గ్రుడ్డివాడు రాయి విసిరిన చందమే.

(6) వివేక పథాన్ని చదివాకే, మీ దేవుణ్ణి సృష్టిచేయమని నేనేమైనా చెప్పానా? అనవసరపు విషయాలు, నేను లేవనెత్తని విషయాలు కలబోసి అప్రస్తుత ప్రసంగాలు చేయడమెందుకట!

(7) మీరు దేవుడనుకుంటున్న వానికి నేనేమీ సర్టిఫికెట్టు ఇవ్వబోవడంలా! అదలా ఉంచి బైబిలు తెలియజేస్తున్న యోహొవా అన్నవానిని గురించి ఇంతైనా తెలిశాక బుద్దున్నవాడెవడూ అట్టివాణ్ణి దేవుడనడానికి సాహసించడు.

(8) బైబిలు దేవుడు స్వేచ్చాపరుడనీ, కొన్నికోట్ల సం|| నుండి విశ్వాన్ని నడిపిస్తున్నాడనీ అన్నారే. కనీసం ఆ విషయాన్ని బైబిలు ఆధారంగానైనా రుజువు చేయండి చూద్దాం. సృష్టి ఆరంభమై కోట్ల సం||లు గడచిందనడానికి బైబిలు నుండి ఆధారాలు చూపండి. అలా చూపలేకుంటే, ఇలాంటి పసలేని మాటలు మాట్లాడడమైనా మానండి.

ఇక మీ సూత్రీకరణలను నేనే అంగీకరించను. అలాటిది దేవుడెందుకంగీకరించాలి? అంటూ ఒక ముక్తాయింపు కూడానా! మన మధ్య సాగిన సంభాషణల్నిగానీ, నావిగా నారాతలనుండి మీరు గమనించిన సూత్రీకరణలనుగానీ పేర్కొని, అందులో దేనిని (వేనిని) మీరు అంగీకరించడలేదో, ఎందుకంగీకరించడంలేదో, ఆయా విషయాలలో మీరంగీకరించే సూత్రీకరణ లేమిటోనూ నిజాయితీ, నిబ్బరమూ ఉంటే డొంకతిరుగుడు లేకుండా సూటిగా, స్పష్టంగా ప్రకటించండి. నా భావాలు సరికావనేముందు ఆ విషయంలో మీ అవగాహనేమిటో, దాని స్థాయేమిటోనూ బేరీజు వేసుకోవడం కనీస విజ్ఞతే కాదు. అది విూ అవసరం కూడా. ఆ విషయాన్ని ప్రకటించడం మీపైనున్న బాధ్యత.

మీ దేవుణ్ణి నేను అన్వేషించాలనుకోవడమేమిటి? నా మాటల్ల్నో, ఆ ధ్వని ఎక్కడుంది? అదీ గాక, ఆయన్ను శాసించాలన్న అభిప్రాయమూ నాకున్నట్లు వ్రాశారు. ఉన్నడోలేడోనే తేలలేదంటున్న పక్షం వాణ్ణైన నేను దేవుడనబడేవాణ్ణి శాసించాలనుకోవడమేమిటి? ఇన్ని నావికాని భావాలు, నా రచనలలో లేని భావాలు ఆ రెండు సంచికలలో మీ కెలా కనిపించాయి? ఒకవేళ ఇదంతా నాపై మీరేర్పరచుకున్న తప్పభిప్రాయం వల్ల ఊరుకుండలేక చేయతలపెట్టిన పులుముడు పనా?

(9) ఆయన్ను తెలుసుకున్నా, తెలుసుకోకున్నా, ఆయన ఎదుట నిలబడకతప్పదు అన్న మీ మాట కాసుకుకొరగాదు. లోకంలో ప్రతిమతమూ తాను చెపుతున్న దానిని అంగీకరించకుంటే నరకం తప్పదంటుంది. ఇక ఖురాన్‌ ప్రకారం క్రీస్తును దేవుని కుమారుడనిగానీ, దేవునితో సమానులు మరిద్దరున్నారనిగానీ, క్రీస్తే రక్షకుడని గానీ అన్న వాళ్ళంతా ప్రథమశ్రేణిలో నరక పాత్రులవుతారు. కొన్ని కొన్ని ఇతర తప్పులకు ప్రాయశ్చిత్తమైనా ఉందిగానీ, పై మూడు భావనలు ప్రకటించేవానికి ప్రాయశ్చితం కూడా లేదు. నాలాటి వాళ్ళ సంగతలాఉంచి, మీ సంగతేమికానుందో ఆలోచించుకోండి. ఖురాన్‌ను తెలుసుకోకున్నా, అంగీకరించకున్నా, అల్లా ఎదుట అందరూ నిలబడే రోజు వస్తుంది. దానినెవరూ తప్పించుకోలేరు అంటున్న ముస్లింల కేకలు విూకు వినబడ్డం లేదా? అల్లా అంటే భయం లేదా? తేల్చుకోవాల్సిన అవసరం నాకంటే మీకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే నావరకు నాకు, వారిద్దరూ ఉన్నారో లేదో, ఎవరు అస్సలు, ఎవరు నకిలీనో అన్న రెండూ అనవసరపు విషయాలు. ఉన్నారని కళ్ళు మూసుకుని ఉన్న మీ లాటి వారికే ఆ విషయం తేల్చుకోవలసిన అవసరం ఉంది.

(10) నా అన్వేషణలో ఒక లోపం ఉందంటూ, పూర్తిగా వినకుండగనే ప్రశ్నిస్తుంటానని, అదే ఆలోపమనీ వ్రాశారు. సత్యాన్వేషణకు, మీలాంటి వారు మాట్లాడతున్నది పూర్తిగా వినడానికీ, వినకపోవడానికీ సంబంధమేమిటండీ జగదీశ్‌గారూ! నేను మీతో మాట్లాడేటప్పుడు పూర్తిగా వినకుండానే, సమాధానం చెప్పి, బదులాడే సందర్భాలు ఉండి వుండవచ్చు. అట్టి వేవీ నా అన్వేషణలో భాగాలు కావు. అన్వేషణ పూర్తైన అంశాలలో అనేకసార్లు విన్నమాటలే మరొకసారీ వినవలసి వచ్చినప్పుడు, వాళ్ళు మొదలెట్టగానే, ఇక చాలంటూ బదులాడడానికి సంబంధించిన సందర్భాలవి. వినీ వినీ ఉన్న ఆ విషయాలు మొదలెట్టగనే వాళ్ళేమి చెప్పదలచిందీ అర్థమైపోయింది గనుక కాలహరణమెందుకని బదులాడిన సందర్భాలవి. ఎక్కడైనా, ఎప్పుడైనా తెలిసిన విషయమేనని నేననుకుని వాళ్ళు పూర్తిగా చెప్పుకుండగనే నేను బదులాడిన సందర్భాలలో, ముందు మాది పూర్తిగా వినండని వాళ్ళుపుడల్లా, మీరిదే చెప్పబోతారు అని చెప్పి మరీ, చెప్పండి వింటాను అని వినేవాణ్ణి. ఒకటీ అరా సందర్బాలలో నా అంచనా తప్పైందేమో కాని 98, 99 శాతం నా అంచనాలు సరైన వేనని వాళ్ళే అంగీకరించేవారు. ఇంతకూ మన మధ్య జరిగిన చర్చలో, పూర్తిగా వినకుండా, మీరు చెప్పదలచుకున్నది గ్రహించకుండా, నేను మాట్లాడిన సందర్భాలుంటే ఎత్తి చూపండి. పొరపాటు జరిగుంటే సవరించుకుంటాను. అలాటి పొరపాట్లు మరేరకమైన పోరపాట్లుగాని మీరు చేసుంటే, వాటిని ప్రకటించి మార్చుకోడానికి విూరు సిద్దంగా ఉండగలరా?

(11) మేము బైబిలు మొత్తాన్ని చదివి అర్ధం చేసుకుని దేవుణ్ణి తెలుసుకోలేదు. మొదట దేవుణ్ణి తెలుసుకుని ఆ తరవాత బైబిలును తెలుసుకున్నాము. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే మేలు అనన్నారు. బాగుందండీ జగదీశ్‌గారూ! ఇంతకూ బైబిలు చదవకుండా మీరు దేవుణ్ణి తెలుసుకున్నామన్నారు. అదెలాగో వివరించండి. దేవుడంటే ఏమిటో, మీరు తెలుసుకున్నది దేవుణ్ణేనని ఎలా తెలుసుకోగలిగారో, ఆ దేవుణ్ణ ఎలా తెలుసుకున్నారో, ఇంతకూ తెలుసుకోవడమంటే ఏమిటోనూ వివరించండి. దేవుణ్ణలా ముందే తెలుసుకున్నాక బైబిలు చదవాల్సిన అవసరమేమొచ్చిందోనూ తెలుపండి. ఇంతకూ 'మేము' అంటూ సంబోధించుకున్నారు. ఆ మేము లో ఎవరెవరున్నారో నూ తెలుపండి. అప్పుడాలోచిస్తాను మీ మాటలను పరిగణనలోకి తీసుకోవాలో, అఖ్ఖరలేదో!

బైబిలు అక్షరాలనుగాక, దాని విషయాన్ని (కంటెంట్‌ను) చదివి దాని నర్ధం చేసుకోండనీ అటు తరవాత ప్రశ్నించండనీ సలహాయిచ్చారు. అక్షరాలను పట్టించుకోకుండా విషయాన్ని గ్రహించమెలానో మీరే నేర్పితే తెలుసుకుంటాను. అక్షరాలను మాత్రమే పట్టించుకుని విషయాన్ని పట్టించుకోకుండా నేనెక్కడ ఏమి మాట్లాడానో, అదైనా చెపితే ఒకసారి వెనుదిరిగి చూసుకుంటాను. ఎందుకండీ ఈ సరుకులేని మాటలు? మేము విషయాలనే కదా అడుగుతున్నది, ఎవరైనా అడగగలిగిందీ అదేకదా!.

'పదపదార్థ సంబంధ జ్ఞానం లేనివానికి వాక్యార్థ జ్ఞానం కలగదు' అన్న భాషానియమాన్ని గురించి మీకేమైనా తెలుసా? దానిని మీరంగీకరిస్తారాలేదా? బైబిలు ఇలా చెపుతోంది, అని మీరైనా, నేనైనా, మరొకరైనా అంటున్నామనంటే అక్షరాలు, పదాలు, వాక్యాలు వాటి కూర్పు వల్ల వచ్చే అర్ధాలను, అభిప్రాయాలను పట్టుకునే గదా అంటున్నాం? అనగలం? మరి అక్షరాలను పట్టుకోవద్దు కంటెంటును పట్టుకోండి అన్నారేమిటి? ఈ సందర్భంలో మీరు పోల్చిన 'చెట్టు - గాలి' పోలిక ప్రస్తుత సందర్భానికి ఏమీ పోలదు. పైగా బైబిలు ఏమి చెపుతుందో వదిలేసి ఏదేదో ప్రశ్నిస్తే ఎలా? ''అనడిగారే! నేను బైబిలు చెపుతున్నదానిని విడచి ఎవరినిగాని ఏమి ప్రశ్నించానండీ జగదీష్‌గారూ! ఇతరుల విషయం అలా ఉంచండి, మిమ్మల్నలాటి ప్రశ్నలేమి అడిగాను? ఈ ఒక్కలేఖలోనే మీరు లేవనెత్తిన అంశాలు సరైనవేనని నిర్ధారించండి ముందు. అనాల్సిన వాటికంటే, అనక్కరలేనివీ, అనకూడనివీనే ఎక్కువ అనేసి అందేంటండీ అంటే, నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుండడం విధం తెలిసిన వారు చేయగలిగిన పనికాదు. కనుక మీరు లేవనెత్తిన విషయాలకో సరైన ముగింపు వచ్చే వరకు మీరు బాధ్యతాయుతంగా ఈ విచారణలో పాలుపంచు కుంటుండాల్సిందే.


పట్టుపట్టరాదు. పట్టి విడువరాదు ! పట్టెనేని బిగియ బట్టవలయు

పట్టివిడుచుటకంటె పరగి చచ్చుటమేలు ! విశ్వదాభిరామ వినురవేమ!


విప్రతిపత్తిరప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానం! అని వాదనియమాలు తెలిసిన వారంటారు. ఏదో ఒక పక్షాన మాట్లాడడం మొదలెట్టి, మధ్యలో ప్రతిపక్షం అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఊరుకోవడం గాని, ఒకటడిగితే మరో దాని గురించి మాట్లాడడం గాని ఓటమికి గుర్తు అని ఆ సూత్రం చెపుతోంది. కనుక మొదలెట్టకూడదు. మొదలెట్టాక తుదముట్టేదాకా వదిలెట్టకూడదు. అదే మాటల మనుషులుకాని, చేతల మనుషుల రీతి. మీరు చాలా విషయాలను లేవనెత్తారు కనుకనూ కొన్నింటి నన్ను అలా చేయడమేమిటి? ఇలా చేయడమేమిటి. అని సతాయించడమే కాక, కడకు సవాలనేంత వరకు సాహసించారు కనుకనూ పి.డి. సుందరావుగారిని, రంజిత్‌ ఓఫిర్‌గారిని విడచి, మీదైన మార్గంలో మీరే విచారణకు సిద్దమైనట్లు అయ్యింది. కనుక బాధ్యతతో నిలబడండి.

(13) ఒక గ్రంథంపై సందేహం వస్తే వివరణ గ్రంథకర్తనే అడగమని ఒక సరైన భాషా నియమాన్ని గురించి పేర్కొన్నారు. నాకా నియమం నూటికి నూరు శాతం అంగీకారమే. ఈ మాట అనడం ద్వారా, బైబిలు వ్యాఖ్యాతలూ అట్టి వారిలో ఎవరో ఒకరి వెంట నమ్మకంతో పడిపోతున్న మీరే నిజానికి ఇరకాటంలోపడ్డారు. నేను నా రెండు సంచికలలోనూ చర్చావేదిక నియమనిబంధనల్ని గురించి క్లుప్తంగా చెపుతూ, భాషా నియమాలు, వాద నియమాలు, విచారణ నియమాలు, నిర్ధారణ నియమాలు అన్న నాల్గింటితో కూడి చర్చావేదిక నియమనిబంధనల్ని రూపొందించుకుని, ఆ చట్రానికి లోబడే చర్చ చేయాలి, చేద్దాము అని సుందరావుగారి సందర్భంగా వ్రాస్తూ, ఇతరులెవరితో మాట్లాడాలన్నా అవే షరతులు వర్తిస్తాయి అనీ ప్రకటించాను.

మీరిప్పుడు బైబిలు పై సందేహం వస్తే బైబిలు కర్తనే అడగమంటున్నారు. బాగుంది, బైబిలు కర్త ఎక్కడున్నాడండీ ఇప్పుడు? దేవుడలా అన్నాడు, సాతానిలా అన్నాడు, మోషే అలా అన్నాడంటూ వ్రాసినవాడెవడో ఇదమిత్తంగా తేలిందా? బైబిలంటే గ్రంథాలసంకలనం అన్న అర్ధం చెపుతున్నారు సాధారణంగా. ఆ గ్రంథాల రచయితలుగ చెప్పబడ్డవాళ్ళుగానీ, సంకలనకర్తగా చెప్పబడ్డవాడుగానీ అందరూ సమాధులకు చేరినవాళ్ళే. కనుక ఈనాడు మీరన్నట్లు బైబిలు గ్రంథకర్తను అడిగే అవకాశంలేదుగాక లేదు. ఆ అవకాశంలేదని నాకంటే నిక్కచ్చిగా మీకు పి.డి. సుందరావు, రంజిత్‌ ఓఫిర్‌ మరియు వివిధ క్రైస్తవ బోధకులందరికీ తెలుసుగనకనే తెగబడి థాబ్దాలుగా ఎవరి సొదవారు చెప్పుకుంటూ, నేను ప్రవక్తను నేనే అపొస్తులుడను, నేను పరిశుద్దాత్మతో నింపబడిన వాడను, నేను స్వస్థతవరం పొందినవాడను. దేవుని గొడ్డలిని, నోరునూ, ఏసు తమ్ముణ్ణి లాటి వివిధ కితాబులు, విశేషణాలు తగిలించుకునిర్భయంగా, విశృంఖలంగా చరిస్తూవున్నారు. నిజానికి మీరనుకుంటున్న బైబిలు దేవుడు గాని ఉండుండి, బైబిలులో చెప్పబడ్డట్టు చిన్నాచితకా తేడా వచ్చినా, తనని నమ్మకున్నా, వెంటబడి మరీ చంపడమో, చంపించడమో చేసే వరకు ఊరుకుండని స్వభావం కలిగుండుంటే మీలో తానెంచుకున్న వాణ్ణి తప్ప మిగిలిన వారందరి తాటా వలిచి, (వలిపించి) ఉండేవాడు. ఇంతలేసి జరుగుతున్నా అటు నుంచి చడీచప్పుడు లేకపోవడాన్ని చూడగలిగితే, ఆ బుడతడంత దేవుడూ కల్పితుడేనేమోనన్న అనుమానం కలిగితీరుతుంది.

అది సరే! నేను నా పద్ధతిననుసరించి, బైబిలు దేవుని నిలదీసి ఎడాపెడా అడిగేస్తూ, కడిగేస్తూ, తిరుగుతుంటే మీకెందుకండీ కోపం? ఆయన్నే గదా అడగమన్నారు? అయన్నే గదా అడుగుతున్నాను, ఆయనకు పట్టని వ్యవహారం మీకెందుకంట? దీనికి మీ వద్ద నిజాయితీతో కూడిన సూటైన సమాధానం ఉందా?

ఇప్పటికి యూదుల్ని, క్రైస్తవుల్ని అవిశ్వాసులు, దైవద్రోహులు అని మహమ్మదు, అతని అనుయాయులూ అనబట్టి 13, 14 వందల సం||లయ్యింది. ఆ జనం కూడా 200 కోట్ల పైబడి, ఇంకా పెరుగుతునే ఉన్నారు. ఎక్కడ నక్కుకుని, ఇన్ని వందల సం||లుగా తనని, తానెంపిక చేసి అధికార మిచ్చిన ప్రియ కుమారుని, చెడామడా ఉతికి ఆరేస్తున్న వారెవరినీ ఏమీ అనకుండా గమ్మునున్నాడే మండి మీ బైబిలులో చెప్పబడ్డ యోహోవా?! ఇదేమీ పట్టవన్నమాట మీకు!

పాత నిబంధనలో ఎక్కువ భాగం నన్ను నమ్మండిరా! నన్ను నమ్మండిరా! అని ఒకటికి పదిసార్లు కాదు, వందలసార్లు ఆపన్నెండు గోత్రీకుల వెంట, వారి పూర్వీకుల వెంట బ్రతిమలాడుకుంటూ, బామాలుకుంటూ, భయపెడుతూ, కోర్కెలు తీరుస్తూ, అందుకై ఎన్నో క్రూరకర్మలు చేస్తూ, చేయిస్తూ వచ్చిన ఆ యోహోవా ఎక్కడకు పోయాడు? ఎక్కడపండాడు? అలా కాక '7' వ రోజు విశ్రాంతి అన్న నియమాన్ని మార్చి శాశ్వతంగా విశ్రాంతిగాని తీసుకుంటున్నాడా?

మిత్రమా! ఇలా నేను బైబిలు గ్రంథకర్త గురించి మాట్లాడుతుంటే, మీరే గుర్తు చేసిన, గ్రంథకర్తనే అడగాలన్న నియమాన్ని బట్టి, ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదు. ఆయనను రక్షించేందుకు పుట్టుకొచ్చాం అన్నట్లు ఆవేశపడిపోకూడదు. జయశాలిలా! ఉత్తుత్తిరంకెలూ వేయకూడదు. పాతనిబంధనలననుసరించి యోహావా ఎక్కువగా పని పెట్టుకున్నది నమ్మిన వాళ్ళ గురించికంటే నమ్మని వాళ్ళ గురించే ఇందుకు నిదర్శనాలు ప్రతి కాండంలోనూ, దొరుకుతాయి. మీరనుకునే ఆయనే గనక ఉంటే, అతడు బైబిలు అందిస్తున్న లక్షణాలు గలిగిన వాడే గనుక అయ్యుంటే, ఇంతకాలం ఇందర్ని సహించి ఊరుకుండడమన్న ప్రశ్నే పుట్టదు. ఇక మీకు లభించాయంటున్న సమాధానాలు సరిపెట్టుకున్నవో లేక, భ్రాంతులో, మామూలుగా అదే దేవునితో పనిలేకనే, జీవితానుభవాల ద్వారా తెలియదగినవో అయ్యుంటాయి. కాని విశ్వాసపు మత్తెక్కిన వారికి ఇలాంటి సత్యాలు తలకెక్కవు. విశ్వాసపు గంతలు కట్టుకున్న వారికి అంతుబట్టవు.

(14) క్రీస్తును నమ్మితే స్వర్గం లేకుంటే నిత్యనరకం తప్పదు అని మీరు మీకు తెలిసో తెలియకుండగనో నన్ను భయపెట్టే పని చేశారు. అమాయకజనాన్ని మత ప్రచారకులు బలవంత పెడుతున్న ఆ క్రమం, అలవాటులో పొరపాటుగా మీ చేతా అదేపని చేయించింది. ఇంతలేసి మాటలనేస్తూనే, ఏమీ అననట్లు తలస్తుండడం, సాదాసీదాగా జీవిస్తుండే వాళ్ళకుగాని, అన్న మాటకు బాధ్యత వహించే వాళ్ళకుగాని సాధ్యపడదు.

ఇక మీ సవాలు గురించి

(1) బైబిలులోని ప్రవచనాలు నెరవేరాయన్నారు, మరికొన్ని నెరవేరబోతున్నాయన్నారు. వాటి వివరాలివ్వండి. ఆ తరవాత మాట్లాడతాను వాటి గురించీ, అవెంత బలహీనమైన అభిప్రాయాలో అన్నదాని గురించీ. బైబిలు ఎప్పుడు వ్రాయబడింది? ఎప్పుడు మొదలై ఎంత కాలందాకా సాగిందా రచనగాని, సంకలనపు పనిగాని? క్రొత్త నిబంధన మాటేమిటి? ఇందులో ఏనాటి ప్రవచనాలలో ఏవేవి జరిగాయి, జరుగుతున్నాయి ఇక జరగనున్నవేమిటి?

(2) బైబిలు వచనాలు ఏసురాకడను గురించి సాక్ష్యమిస్తున్నాయనడమే ఒక అడ్డగోలు వాదన. బైబిలు వచనాలను ప్రతిపాదనలుగ తీసుకుని అట్టివి జరిగాయనడానికి ఇతర వాటిని సాక్ష్యాలుగగాని, ఆధారాలుగ, రుజువులుగా గానీ చూపించాలి. అంతేగాని బైబిలుకు బైబిలు సాక్ష్యమేమిటి తండ్రీ!

మీరుగానీ, మీ విద్యగాని ఆయన రాకడను ఆపగలరేమో ప్రయత్నించండి! అని సవాలు విసిరారన్నమాట నాపై. ఎంత పేలవమైన సవాలు విసిరారోకూడా గమనించుకోలేని తనం కనపడుతుంది యిందులో. ఎలాగంటే క్రొత్త నిబంధనలో 'ఏసు రాకడరానైయుంది' అన్న వాక్యం వ్రాయబడ్డ నాటి నుండి దాదాపు రెండు వేల సం||లుగా అదే మాట పడికట్టుపదంగా వాడబడుతూనే ఉంది. సువార్తీకులు ఆనాడే ఆ మాటన్నారు. ఏసు అలా మరణించాడో లేదో, తరవాత కొద్దికాలంనుండే మరల రానున్నాడు అనీ, కాలం సమీపించియున్నదనీ అంటూ వస్తున్నారిప్పటిదాకా! ఆ మాటనేందుకు సిగ్గేయకపోవడం విడ్డూరమేమరి. పైగా చేతనైతే ఆయన రాకను ఆపండి అని సవాలోకటి, ఆయన ఉన్నాడనడానికి గానీ, మళ్ళీ వస్తాడననడానికి గాని బైబిలుమాట తప్ప మరే ఆధారం లేదు గనుకనే, సాధారణ జ్ఞానానికి అట్టిది జరిగి చచ్చేది కాదనే అనిపిస్తుండడం చేతను! మాట వరసకు మీ మాట నంగీకరించి, ఆయన రాకడనాపడానికి నాలాంటి వానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఇట్టే చేసేయగలనాపని. ఇదిగో చేసేస్తున్నాను! చేసేశాను హుష్‌ కాకి! హాంఫట్‌!

జగదీష్‌గారూ! ఆయన రెండో రాకడను మార్చేశాను. ఇక ఆయన రాబోవడంలేదు. ఛాలెంజ్‌! చేతనైతే ఆయనను రప్పించండి చూస్తాను. అది మీ వల్లాకాదు మీ ఓఫిర్‌గారి వల్లా కాదు. ఏసు తమ్ముణ్ణంటున్న పి.డి.యస్‌.ఆర్‌ వల్లా కాదు. అంతెందుకు మీరు ఉన్నాడనుకుంటున్న ఏసు తండ్రివల్లే కాదా పని. ఇక ఏసురాకడను నిలుపు చేస్తూ కట్టడి చేసేశా నిప్పుడే. అన్నాననుకోండి. ఏమి చేస్తారు? ఏమి చేయగలరు? మీరు నాదంతా ఒటొట్టి మాట లేనని సరిపుచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేరు.'చాలెంజ్‌' అన్నది ఎప్పుడూ మన చేతిలో ఉన్నదై, మన దేశకాలాలతో ముడిపడి, మనం సరిచూసుకోడానికి వీలైందిగా ఉండాలి. ఇంత ముఖ్యమైన నియమాన్ని గురించి లేశమాత్రంగా నైనా తెలియని మీరు 'మీకు మా సవాలంటూ' ఇలాంటి పేలవమైన అభిప్రాయాల్ని వెలబుచ్చడాన్నే మనుకోవాలి? నేనైతే మిత్ర దృష్టితో మీలోని అమాయకత్వానికి ఒకింత జాలిపడతాను. వీలైతే విషయం మీకర్థమయ్యెలా చేయడానికి కొంత యత్నిస్తాను. ఎన్నో విషయాలలో వాటివాటి సంబంధించిన సత్యాన్ని కనుగొనడానికి, ఏమనిషికీ దేవుని ప్రార్ధించాల్సిన అవసరంకానీ, మీరనుకునే ఆ దేవుని అనుగ్రహం కాని అక్కరలేదు. మన మన జ్ఞానేంద్రియ వ్యవస్థ వాటి పనితీరులనుండే మనకు ఆయా విషయాల జ్ఞానము, సత్యపుజ్ఞానము కూడా కలుగుతున్నాయి. నిత్యం మీరంతా కూడా ఈ విధానంలోనే జ్ఞానాన్నీ, సత్యాన్నీ తెలుసుకుంటూ జీవిస్తున్నారు. కాని ఆ పనిని, పనివిధానాన్ని గుర్తించడం లేదంతే.

ఇక విూరు ముగింపుగా బైబిల్‌ దేవుణ్ణి విమర్శించాలంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నవాళ్ళే ఆ పని చేయాలని అన్నారు. బాగుందండీ! ఖురానును, వేదాన్ని, ఇతర మతాలను అసరించేవాళ్ళు తామనుకున్న దేవుడే నిజమైన దేవుడని నిర్ణయించుకునే కదా బైబిలు దేవుణ్ణి, ఏసు వగైరాలను విమర్శిస్తున్నది.

ఇక మిమ్మల్ని విమర్శించడం గురించి, బైబిలుకు సాధికారిక ప్రతినిధులం, దేవునిచే ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం అంటూ బైటపడి ప్రకటనలు ఇవ్వకుంటే మిమ్ము విమర్శించే అవకాశమూలేదు, అవసరమూ లేదెవ్వరికీ. ఇదిగో ఈ మాట వినండంటూ మొదలెట్టింది మీ బృందాలే కనుక ఆ మాటల్ని విమర్శించే హక్కును, అవకాశాన్ని కూడా మాకు జనం ముందు నోరెత్తిన ప్రచారకులు, ప్రవక్తలు, బోధకులే కల్పించారు. కనుక అటు బైబిలును విమర్శించవద్దనడానికిగానీ, ఇటు ప్రకటనలు గుప్పిస్తూ వినండిది అనంటూ హోరెత్తిస్తున్న వారిని విమర్శించవద్దనడానికి గానీ ఎవరికీ నైతికంగా హక్కులేదు. కాకుంటే, సమాజంలో అలజడి అల్లర్లు రగుల్కొనే అవకాశం ఉంది గనుక శాంతి భద్రతల దృష్ట్యా రాజ్యం వాటిని అనుమతించకపోవచ్చు.

ఇప్పటికి చివరిమాట :

పి.డి.సుందరావుగారినీ వదలను, రంజిత్‌ ఓఫిర్‌గారినీ వదలను, ఈ క్రమంలోనేనూ ఉన్నాననగల ఏమతస్థుణ్ణీ వదలను. నిజాయితీ, నిర్భీకత ఉంటే ప్రజల ముందు బహిరంగంగా ఒక విషయాన్ని గురించి మాట్లాడిన వారెవరికిగాని, అతనికి ఆ విషయమై జవాబు చెప్పి తీరాల్సిన బాధ్యత ఉంటుంది. నా వరకు నేను నావిగా వెలిబుచ్చిన భావాలన్నిటి విషయంలో అవిసరైనవేనని నిర్ధారించడానికీ, నిర్ధారించలేని వాటిని ప్రక్కన బెట్టడానికీ, తప్పులని తేలిన వానిని విడవడానికి ఎళ్ళవేళలా సంసిద్ధంగా ఉంటాను. ఆ జీవితం నా గురించి నేను చేస్తున్న వాగ్ధానమది. నా ప్రతిజ్ఞ ఇది. మీరేమిటో తేల్చండి.

మొదలెట్టాక ఒక ముగింపుకు రావడానికి నేను చేయవలసిందంతా చేయకుండా ఊరుకోను. ముగింపుకు రాకుండానే పని ఆగింది అన్నది నావల్ల మాత్రం జరగదు. అటు జగద్గురుగారి వత్తిడి వల్లా, ఇటు మీలేఖ వల్లా ఇప్పటికి వివేకపథం నెలకు 5000 చొ||న వ్యయాన్ని భరిస్తూ వస్తోంది. ఈ శ్రమవలన వ్యయం వలనా అటు ప్రజలకుగానీ, ఇటు మనకు గాని ప్రయోజనం చేకూరితే ఫరవాలేదు. తప్పొప్పులు తేల్చుకోడానికి సిద్దపడని, తేల్చుకోలేని, తేలినవాటిని స్వీకరించలేని నైజం కలవాళ్ళతోనే ఉన్న ఇబ్బందంతా, ఆ రకం లోకమంతటిని తానన్న వైపుకు మారమంటుంది గాని తాను మాత్రం దేనికీ సిద్దం కానంటుంది. నిరంతర సత్యాన్వేషినన్నారు మీ పెద్ద అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారు. సత్య స్థాపనాభిలాషిననీ చెప్పుకున్నారు. అది నిజమైతే మాత్రం ఆయన నాతో చర్చకు సిద్దంకాకపోవడమన్నదే సాధ్యపడదు. ఆ రెంటికీ తగిన వాళ్ళు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సత్యాసత్య విచారణకుగానీ నూటికి నూరు శాతం - ఎట్టి మినహాయింపు ల్లేకుండా - సిద్దంగా ఉండి తీరతారు. అంతటి పెద్ద మాటలు వ్రాసుకున్న ఆయనగారుగానీ, అంతకంటే నాలిగింతలు ఆత్మస్తుతి చేసుకున్న పి.డి. సుందరావు గారుగాని ఎంతకు సిద్దమవుతారో కాలమే తేల్చి చూపుతుంది లోకానికి.

- సత్యాన్వేషణలో మీ సురేంద్ర

భద్రాచలం నుండి డా|| భాను ప్రసాద్‌గారు, గుంటూరు వేమూరు జిల్లా నుండి హజరత్‌ ఆలీగారు, హైద్రాబాద్‌ నుండి బి. సాంబశివరావుగారు, గుంటూరు నుండి సుబ్బారావుగారు, మరికొందరూ ఉత్తరాల ద్వారా, లేఖల ద్వారా బైబిలు మీదా, దాని ప్రతినిధుల మంటున్న పి.డి. సుందరావు వగైరాల మీదా పూనికతో చర్చకు తెరతీసినందుకు అభినందనలు అంటూ మాట్లాడారు. క్రైస్తవ పక్షాన ఉన్న వాళ్ళలోనూ ఇలాటి చర్చలపై కుతూహలం ఉన్న వారి నుండి ఫోనులు వస్తున్నాయి. మీ ఎత్తుగడా భాషా సంవిధానము అభినందనీయం అంటూ వ్రాశారు ఆయన.

స్పందన -2 

పి.డి సుందరావుగారి తరఫున ఎన్‌. కనకమహాలక్ష్మి గారు మేమూ పంపిన రిజిష్టర్‌ లెటర్‌కు ఇలా సమాధానం పంపారు.

పుట్టా సురేంద్ర బాబునకు వ్రాయునది

బైబిలు అనే దైవ గ్రంధాన్ని బట్టి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని ప్రకటించేవారము. మీరైతే ఇంకా సత్యాన్వేషణలోనే ఉన్నారని మీ ఉత్తరాన్ని బట్టి మీరే గ్రహించుకోవాలి. సత్యాన్వేషణమండలి అను పేరు ఇప్పటికీ మేము వినలేదు.

మీ లెటర్‌ హెడ్‌ను బట్టి చూస్తే కోదాడ మండలం, నల్గొండజిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. మీరు పంపిన కవరును బట్టి చూస్తే మరో జిల్లా, మరో పేరు కనబడుతున్నాయి. కేవలం అడ్రసులు, వ్యక్తుల దగ్గరే సత్యం కనబడనందున మీరు సత్యాన్వేషణకు కూడా అనర్హులుగా కనబడుతున్నారు. ఇంతకూ జవాబు మేము ఎవరికి ఇవ్వాలో? కోట ప్రసాద్‌ విజయవాడకా? లేదా పుట్టా ప్రసాద్‌, నల్గొండకా? మిమ్మును గూర్చిన పూర్తి సత్యాన్ని మీ మండలితో కలిసి అన్వేషించండి.

ఇట్లు - (సం) ఎన్‌. కనకమహాలక్ష్మి

కరస్పాండెంట్‌, బైబిల్‌ ఓఫెన్‌ యూనివర్సిటీ ఇండియా - ఇంటేర్నేషనల్‌

ఈ లేఖ acknowledgement కార్డ్‌ పై మేము రాసి పంపిన మా సంక్షిప్త సమాధానము ఇదిగో పి.డి సుందరావు గారికి,

మీ తరఫున ఎన్‌. కనకమహలక్ష్మి గారు పంపిన ప్రత్యుత్తరం అందింది. దానిపైన నా ప్రతి స్పందనను వ్రాసి వివేకపథంలో ప్రచురించి ఆ పత్రికను మీకూ పంపుతాను. నా సంపాదకత్వంలో నడుస్తున్న వివేక పథంలో మీ విషయాన్ని ప్రస్తావిస్తూ నేను నావిగా వెల్లడించిన భావాల బాధ్యత నాదేనని ఈ లేఖ ద్వారా ధృవపరుస్తున్నాను.

కనుక అనవసరపు విషయాలను ప్రస్తావించడం ఆపి, బైబిల్‌ పరిశీలనకు, బైబిల్‌ పై చర్చకు సిద్దంకండి. మీ తరఫున ఎవరు మాట్లాడినా అది మీరు మాట్లాడినవిగనే మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది కనీస నైతికత. ఆ మేరకు నిజాయితీగానే ప్రవర్తించగలరని ఆశిస్తాను. ఏదో ఒక వంక చూపి చర్చకు సిద్దం కాకపోవడం పలాయనవాదపు ఎత్తుగడ మాత్రమే నన్నది నిజం

ఇట్లు - సత్యాన్వేషణలో సురేంద్ర

యోచనాశీలురైన పాఠక మిత్రులారా,

పి.డి సుందరావుగారికి, ఆయన వద్ద విద్యనేర్చుకుంటున్న వారికీ, అక్కడ పని చేస్తున్న వారికీ కూడ, విషయాన్ని ముగ్గుమీదకురాకుండా కాలం గడిపేయటానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్నిటినీ ప్రయోగించడంలో గొప్పనేర్పు వుందనిపిస్తోంది. 3 మాసాల నుండి వివేకపథం ద్వారా ఆయన సి.డి ప్రసంగాలను, రచనలను ఆధారం చేసుకునే చర్చకు కూర్చుందాంరండని పిలుస్తుంటే, దానికి సమాధానంగా ఇదిగో మేము సిద్దమని చెప్పవలసిందిపోయి, రిజిష్టర్‌ లెటర్‌ ద్వారా ఎగవేతకు పనికి వచ్చే 4 మాటలు సమాధానంగా వ్రాయించి పంపారు. వారి లేఖలో ఉన్నబిబీదిదీళిగీజిలిఖివీలిళీలిదీశి కార్డు ద్వారానే వారికి పైన వ్రాసిన రూపంలో మా సమాధానం పంపి విఫులంగా పత్రిక ద్వారా సమాధానం రాస్తానని తెలియచేశాను. వారి లేఖలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, దానికి నా ప్రత్యుత్తరము దిగువున వ్రాస్తున్నాను. సుందరావుగారితోపాటు, సత్య స్థాపనోద్దతి గల మీరున్నూ దీనిని శ్రద్ధగా పట్టిచూడండి.

వారి లేఖలో వెలిబుచ్చిన అభిప్రాయాలు

1. మేము బైబిల్‌ అనుదైవగ్రంథాన్ని బట్టి పరిపూర్ణులైన వారి మధ్యనే జ్ఞానాన్ని ప్రకటిస్తాము.

2. మీరైతే ఇంకా సత్యానేషణలోనే వున్నారు. మీ మండలి పేరైనా ఇప్పటికి మేము వినియుండలేదు.

3. మీ లేఖలో 2 అడ్రసులు ఇచ్చారు. అడ్రసులు, వ్యక్తుల దగ్గరే మీ వైపు సత్యం కనబడట్లేదు. మేము లేఖ ఎవరికి వ్రాయాలి? కోట ప్రసాద్‌కా ? పుట్టా ప్రసాద్‌కా?

4. మీరు సత్యాన్వేషణకు కూడా అనర్హులుగా కనబడుతున్నారు.

5. మిమ్ము గూర్చిన పూర్తి సత్యాన్ని మీ మండలితో కలసి అన్వేషించండి.

ఖి చాలా గొప్పగా ఉందండీ సుందరావుగారూ కనక మహాలక్ష్మిగారి ద్వారా మీరు పంపిన సమాధానపు లేఖ. అందులోని 4 ముక్కల్లోనే పలు దోషాలు చోటు చేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తాను. సావధానంగా పరిశీలించండి.

1. మీరు బైబిల్‌ ప్రకారం పరిపూర్ణులైనవారి మధ్యనే జ్ఞానాన్ని ప్రకటించేవారము అన్నారు. అదేమిటి? పరిపూర్ణులకు జ్ఞానాన్ని కలిగించటం ఎందుకట? తిన్నవానికే తిండి పెట్టడం లాగా, తెలిసిన వానికే తెలియచెప్పడం చేస్తామనేవారిని ఏమనుకోవాలి?

అదలావుంచి మీ రచనల్లోగాని, మీ ప్రసంగాల్లోగానీ మీరు అలా ఎక్కడా చెప్పలేదుగదా!

ఏకంగా, ప్రపంచ మేధావుల్లారా, ఖబడ్ధార్‌ అంటిరే

బైబిల్‌ జోలికి వస్తే ఊరుకోను తొక్కేస్తాను అన్నారే!

దీదాత్‌, వెంకటాద్రి, ఎన్‌వి బ్రహ్మం వగైరాలందరితోనూ ఛాలెంజికి సిద్దపడ్డారే.

వెంకటాద్రి, ఎన్‌వి బ్రహ్మంలు నాముందు చీమలు, దోమలు అని ఒక ప్రక్క అంటూనే వెంకటాద్రితో యుద్దానికి సిద్దమయ్యారు కదా! ఇంటర్నేషనల్‌ ఫిగర్‌ అయి వుండాలి నేను చర్చించాలంటే అన్న మీరు, చీమలు, దోమలతో సమానమైన వెంకటాద్రితో చర్చించడానికి సిద్దపడడమేమిటి?

వెంటపడి పిలుస్తున్నా భయశాలి, బందరావు అని గెలిచేస్తున్నా, రంజిత్‌ ఓఫిర్‌గారితో యుద్దానికి సిద్దం కావడం లేదెందుకని?

అదంతా అలా వుంచండి. బైబిల్‌ తెలిసిన వాణ్నినేనొక్కణ్ణేఅని ప్రకటించుకున్న మీరు మళ్ళా ఇదేమిటి? బైబిల్‌ ప్రకారం పరిపూర్ణులైన వారికే జ్ఞానాన్ని ప్రకటిస్తానని కొత్త పాట అందుకున్నారు. ఇంతకూ మీరు ఛాలెంజ్‌ చేస్తున్నది, నాకౌట్‌ చేస్తానంటున్నది బైబిల్‌ పరిపూర్ణులనేనా? లేక బైబిల్‌ను, అదో పిచ్చి పుస్తకం, అబద్దాల పుట్ట, దైవ గ్రంథంగాదు, సాతాను గ్రంథం, సుందరావు ఒక సాతాను దూత, లాంటి ప్రకటనలు చేస్తున్న వాళ్ళనా? ఇంత మంది ఇంతకాలంగా ఇంత లేసి మాటలంటుంటే తేల్చుకుందాం రమ్మంటుంటే గమ్మునుండడానికి చిన్నతనం అనిపించడంలేదా? జయశాలి గారూ!

మేమింకా సత్యాన్వేషణలోనే వున్నాము కనుక నూ, నా పేరూ, నా మండలి పేరు మీరు విని వుండలేదు కనుకనూ, నాతో చర్చకు సిద్దం కారన్న మాట. బాగుందండీ జయశాలి సుందరావుగారూ! నిబద్దత గలిగిన సత్యాన్వేషులతో సత్యాసత్యాలు తేల్చుకోవటానికి సిద్దంకాని మీరు, అలగా జనం కొందరు, అరకొరజ్ఞానులు కొందరు, అజ్ఞానులు కొందరు, వంత పాడేవాళ్ళు ఇంకొందరు సంతలోలాగా చేరి ఎవరి సొదను వారు మాట్లాడుకుంటుంటే ఆటస్థలాల్లోనో, చౌరస్తాలలోనో పెట్టే వేదికలపై మాత్రమే చెలరేగిపోతుంటారన్న మాట! గొప్ప ఛాలెంజ్‌ దొరవే తండ్రీ! మా మండలి పేరు వినలేదు కనుక మేము మీకు సరి జోడికాదన్న మాట. కోడిపుంజు తాను కూయకుండా ఎలా తెల్లవారుతుందన్నట్లుంది, ఈ వరస. మీకు బాగా తెలిసుంటేగానీ ఒక సంస్థకో, దానిలోని వ్యక్తులకో సమర్ధత ఉన్నట్లుగాదన్నమాట. గోరంత పని చేయకుండగనే ఎంతగానో సొంత డబ్బా కొట్టుకుంటూ ఆ గోరంత పనినే కొండంతలుగా ప్రాపగాండ చేయించుకునే రకానికి పేరు ప్రతిష్టల జోలికెళ్ళని సమర్థులుంటారంటే అంగీకరించ బుద్ది పుట్టదుమరి. సొంత డబ్బా ఎంత కొట్టుకున్నాడన్న దాన్ని బట్టే వారు ఎంతటి వారో నిర్ణయిస్తారన్న మాట మీరు. గొప్ప సర్వజ్ఞానులే మీరు!? ఎవరేమనుకుంటే నాకేమిటి? అనుకునే పోకడకు మీ అంతటి గట్టి ఉదాహరణ దొరకటం చాలా కష్టం.

మీకు లేఖ పంపడం విషయంలో మేము మండలికి చెందిన రెండు అడ్రసులు ఇవ్వడంలోనూ, మీకు అసత్యాలే కనబడ్డాయా తండ్రీ! అందులో ఒకటి నా లెటర్‌ హెడ్‌ ఉన్న కాగితం. దానిలో నా ఛాలెంజ్‌ ప్రకటన, నా సంతకం, నా అడ్రసు ఉన్నాయి. వాటిని రిజిష్టర్‌ చేసింది మండలి ప్రధాన కార్యదర్శి, వివేకపథం పోస్టు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్న వారూ, వివేక పథం పాఠకులు సంప్రదించాల్సిన చిరునామా గల వారు అయిన కోట ప్రసాద్‌. వివేకపథంపై ఆ వివరం ఎప్పటినుండో ప్రచురింపబడుతూనే ఉంది. రెండు అడ్రసులూ వ్రాత మూలకంగా ఇచ్చామంటే మీరు రిజిష్టర్డ్‌ పోస్టు ఏ చిరునామాకు చేసినా ముట్టినట్లు సంతకం పెట్టే బాధ్యత మాదే అని అంగీకరించినట్లేకదా. నేను మీలాగా ఏదో ఒక వంకన యుద్దాన్ని ఎగగొడదాం అనుకునే రకం వాణ్ణి కాదు. ఎంత శ్రమ కోర్చైనా, ప్రతి కక్షిని యుద్దానికి రాకతప్పని స్థితికి లాగైనా యుద్దానికి సిద్దపడే నైజం కలవాణ్ణి. నా అడ్రసుతో నా సంతకంతో కూడిన నా ఛాలెంజ్‌ లేఖ మీ ఎదుట నుండగా, ఇంతకూ మేము జవాబు ఎవరికి చెప్పాలి? అని అడగటమేమిటండీ. దీనిని గమనిస్తున్న చదువరులు, మీ జారుడుతనానికి నవ్విపోతారనైనా అనిపించడం లేదా! నా లేఖకు విూరు సమాధానం చెప్పాల్సింది పోయి, ఆమెవరో ఒక కరెస్పాండెంట్‌ కనకమహాలక్ష్మి గారు వ్రాస్తే నేనేమైనా ఊరుకున్నానా? నేనూ మీలానే ఏదో నెపాన యుద్దం జరక్కుండా చూడాలి అనుకునుంటే, పి.డి.సుందరావుగారిని ఛాలెంజ్‌ చేస్తే కనకమహాలక్ష్మి సమాధానం వ్రాసారేమిటి. వారు మాతో యుద్దానికి తగరు. కనుక వారితో పోటీ విరమించుకుంటున్నానని వ్రాసేస్తే సరిపోతుంది కదా! నేను నిజంగానే యుద్దానికి సిద్దపడి వున్నాను కనుకనే పి.డి సుందరావు గారూ, మీతోనైనా రెడీనే అంటూనే, ఒక వేళ నేను గాని మీకు చాలను అనుకుంటే, నాకు సరిపోతాడు అనుకున్న వీరి పెద్దోడిని గానీ ఆఖరోణ్ణి గానీ, మీ తరపున యుద్దానికి పంపవచ్చుననీ వ్రాశానుగదా అయితే నాకు సరిపోతాడని మీరనుకున్నవాడు, నా దెబ్బకు గానీ పడిపోతే మీరే ఓడినట్లు అంగీరించేషరతులండాలనీ వ్రాశానక్కడే. నా లెక్క ప్రకారం మీరు మీకు లేని శక్తి, (శక్తులు) ఉన్నట్లు ఊహించుకుని, ఆ మేరకు ప్రగల్భిస్తూ ఉన్నారని గమనించాకనే, ఓ ఓపిక లేనాయనా! ఓడిపోతావ్‌ నాతో పెట్టుకుంటే అని నేననడమెందుకులే, చేతలలో కొచ్చేటప్పటికి నిజాలలో బయట పడతాయి కదా అనుకునే నాకు తగ్గ వారెవరో మీరే నిర్ణయించుకుని యుద్ధానికి రండని చెప్పాను. అర్ధం కాలేదా?

మేము సత్యాన్వేషణకు కూడా అనర్హులని మీరన్న మాట, మీరు ఎంతటి నోటితుత్తరి తనమున్న రకమో తెలియచేస్తుంది. రెండు స్థిరమైన అడ్రసులు మేమిస్తే అందులో సత్యం కనబడలేదందామహాతల్లి. ఆమె అన్న ఆ మాట మీరంగీకరించిందే అని తీరాలి. వ్యక్తుల్ని అంచనా వేయడంలో మీదెంత పనికిమాలిన విధానమో దీనివల్ల ఇట్లే తేలిపోతుంది.

ప్రస్తుతానికి ముగింపు : డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి, అన్నమాటకు కట్టుబడి బైబిలు దైవగ్రంథమని, మీరు దైవ జ్ఞానిలేదా సర్వజ్ఞాని అని నిరూపించడానికి సిద్దంకండి. బహిరంగంగా రెండు మూడు రీతుల్లో ప్రకటనలు విడుదల చేసిన మీరు చర్చకు సిద్దం కాకుండా తప్పించుకునే అవకాశమేలేదు. బలవంతంగానైనా మిమ్ములను యుద్ధానికి సిద్దంకాక తప్పనిస్థితికిలాగుతాను.

అసలు సిసలు సత్యాన్వేషిగాని, సత్యస్థాపనాభిలాషగానీ పద్దతి తెలిసి మాటకు నిలబడే వాడుగానీ ఎలా ప్రవర్తిస్తాడో మీకు అనుభవంలో లేదని తెలుస్తూనేవుంది. ఇప్పటికైనా చర్చకు సిద్దంకండి.

సత్యాన్వేషణలో - మీ సురేంద్ర

No comments:

Post a Comment