యోచనాశీలురైన పాఠకమిత్రులారా!
పి.డి. సుందరావు & కంపెనీ గురించి తెలిసిన వారందరూ అనుకున్నట్లే అయ్యింది.
నేను వివేకపథం 188 సంచిక ద్వారా స్పందన -2 శీర్షికన,
పి. డి సుందరావు గారి తరుఫున ఎన్. కనకమహాలక్ష్మిగారు పంపిన లేఖను, దానిపై ఎక్‌నాలెడ్జ్‌మెంటు కార్డు ద్వారానే నేను వారికి క్లుప్త సమాధానంగా వ్రాసిన ప్రత్యుత్తరాంశాలను, అటు పై వారికి నేను 18-6-2012 తేదీన విపులంగా వ్రాసి రిజిష్టర్ పోస్టు చేసిన లేఖను ప్రచురించాను. ఆ విషయాలు వివేకపథాన్ని శ్రద్ధగా చదువుతున్న మీ కందరికీ తెలుసున్నవే. ఆ నా రెండో రిజిష్టర్ లేఖ తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. దానిని తీసుకుంటే సమాధానం చెప్పవలసి వస్తుందనీ, సమాధానం చెప్పలేమని తేల్చుకుని వారా పని చేసుండాలి.
గత 20 ఏండ్లుగా, సుందరావుగారి సవాళ్ళ రూపంలోని ప్రగల్భాల పాలబడిన వాళ్ళలో కొందరు ఒకింత కోపం తెచ్చుకుని, రా! తేల్చుకుందాం అని పి.డి సుందరావు గారికి ప్రతి సవాల్ చేసి, అతణ్ణి ముగ్గులోకి లాగడానికి రకరకాల యత్నాలు చేసి చేసి, ఇదయ్యేపని కాదులే అనుకుని ఊరుకున్నవాళ్ళు, సుందర్రావు చర్చకెందుకొస్తాడండీ! అతనికి, చర్చలు, యుద్ధాలు ఎగవేయడానికి అవసరమైన పలాయన పద్ధతులు అనేకం తెలుసు అందులో అతడు. పి.హెచ్.డి. చేశాడు. అని నాతోనే అని ఉన్నారు. అలా నాతో అన్నవాళ్ళలో హేతువాద, నాస్థిక ధోరణులవారేగాక, పి.డి సుందర్రావుగారి బైబిలు ప్రవచనాలూ, ఆయన వ్యవహారశైలీ నచ్చనివాళ్ళు, అంగీకరించదగినవి కాదనుకుంటున్న వాళ్ళూ అయిన, అతని గురించి తెలిసిన క్రైస్తవ, ముస్లిం విశ్వాసులూ ఉన్నారు. ఈ విషయమై ఆలోచనాపరుల ఆలోచనలనూ పాఠకుల ముందుంచాలన్న యోచనతో వివేకపథంలో 'స్పందన - ప్రతిస్పందన' శీర్షికను ఆరంభిస్తున్నాను. వివేకపథంలోని భావాలపైనగానీ, బైబిలుపైనగాని నిస్పాక్షికంగా అనుకూలంగాగాని, ప్రతి కూలంగాగాని, మీమీ భావాలను వెళ్ళడించే అవకాశముంది ఈ శీర్షిక ద్వారా. అయితే ఆ వెసులుబాటుతో బాటు ఒక కట్టుబాటూ ఉంది. అవసరమైతే మీరు వెళ్ళడించే అభిప్రాయాలు సరైనవేనని నిర్ధారించేందుకు విూరు సిద్ధ పడవలసి ఉంటుంది. అందుకు సిద్ధపడని వాళ్ళను ఈ శీర్షిక క్రింద పరిగణనలోకి తీసుకోము. తాత్విక క్షేత్రానికి (భావజాలక్షేత్రానికి) సంబంధించినంతలో ఈ సందర్భానికి చెందిన రెండు మూడు నియమాలను గుర్తు చేస్తాను. మీరూ గమనించండి.
1. భాషాపరమైనది : (ఎ) అవసరమైనపుడల్లా 'విన్నమాటకు అర్ధాన్ని అన్న వాణ్ణేఅడిగి తెలుసుకోవాలి. అన్నవారు తానన్నమాటకు అర్ధం చెప్పే బాధ్యత వహించాలి.
బి. సిద్ధాంత చర్చలలో ఉపమానాలు చెప్పనేకూడదు. చెప్పనివ్వకూడదు. సూటైన అర్ధాన్నిచ్చే మాటలే మాట్లాడాలి.
2) విచారణపరమైనది : ప్రతిపాదకుడు తన ప్రతిపాదన సరైనదేనని నిరూపించే బాధ్యత వహించాలి.
గమనిక : మనమంతా ఈ మూడు నిబంధనలను పాటిస్తూ మనమన పక్షాలను ప్రకటించి, విచారణకు సిద్ధమైనపుడే భావజాలక్షేత్రంలో వీలైనంతలో తాలు, తప్పలేకుండా, చేరకుండా ఉంటుంది. పొరపాటున అలాంటి పేలవమైన మాటలేమైనా చోటు చేసుకున్నా గమనించి, తొలగించుకోవడానికీ వీలవుతుంది. అసత్యాలు, అసమంజసాలు, అహేతుకాలు, అనిర్ధారితాలు సత్యాలుగా చెలామణి కాకుండా ఉండాలంటే ఇదెంతో అవసరం, తప్పనిసరి కూడా.
ఒక కీలక ప్రకటన
ఈ ప్రకటన ముఖ్యంగా పి.డి. సుందర్రావుగారికి వర్తిస్తుంది. అటు తరువాత, ఇది సత్యమంటూ, సమాజం ముందు ప్రకటించే ఏ ధోరణికి చెందిన వారికైనా వర్తిస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించండి దీనిని.
అన్నమాట మీద నిలబడని వారెవ్వరినీ స్థాయి కలిగిన వారని అనకూడదు. అట్టి వారు భావజాలక్షేత్రంలో బొడ్టూడని వారితో సమానం. ఒక్కోసారి అడ్డగోలుగనూ తయారవుతారు. అట్టి కురచమనుషుల్ని, విజ్ఞత కలవారందరూ పట్టుబట్టి గట్టిగా పట్టుకుని కట్టిపడేయాలి. భావజాల క్షేత్రంలో సొల్లుకబుర్లు, చెప్పే వాళ్ళవల్ల, కోతలరాయుళ్ళ వల్ల, వాచావేదాంతులవల్ల ఇప్పటికే ఆ క్షేత్రంపైనా, దానిలోని వ్యక్తులపైనా జనానికి గౌరవం తగ్గిపోయింది. 'మాటలు కోటలు దాటుతున్నై, చేతలు గడప దాటడం లేదు' అన్న సామెత ఇలాంటి మంద మాట్లాడిన సొల్లుమాటల వల్లే పుట్టింది. పి.డి సుందర్రావుగారిలాంటి వాళ్ళంతా మాటల మనుషులే గాని చేతల మనుషులు కాదు. ఇలాంటి సంత మనుషుల సంతగోల వినబట్టే, భారతీయ తాత్విక క్షేత్రంలోను 'ఏన క్రతునావదేత్' (స్వీనక్రతునావదేత్) అన్న సూక్తి ఉనికిలోకి వచ్చింది నీవు తెలపాలనుకున్నది, వ్యక్తం చేయాలనుకున్నది. (చెప్పాలనుకున్నది) నోటి ద్వారా కాక పనులద్వారా (చేతల ద్వారా) చెప్పై అని సూత్రార్థం.
మరిక పి.డి. సుందర్రావుగారు థాబ్దాలుగా చేస్తూ వస్తున్న సవాళ్ళు, తొడగొట్టడాలు, మీసాలు మెలేయడాలు వగైరాలన్నీ మాటలు దాటి చేతలలోనికి ఒక విడతైనా రానేలేదు. ఏం మనిషండీ ఆయన?! సైద్దాంతిక క్షేత్రాలకు చెందిన భావజాలాన్ని పరిశీలించుకోవడానికి, పరిశీలనా పద్ధతులు సరైన వైయ్యుండడం ముఖ్యంగాని, పరిశీలించుదాం అనే వ్యక్తులు సమాన స్థాయిలో ఉండాల్సిన పనేముంది. ఆవలి పక్షం తెలిసిన వారైతే మనకేమి? తెలుసుకునే వారైతే మనకేమి? సరైన పద్ధతుల ననుసరించి ఫలాని, ఫలానివి సరైన అభిప్రాయాలేననీ, ఫలానివి సరైనవి కావనీ నిర్ధారించితే ఆ పని ప్రజలందరికీ గొప్ప మేలును కలిగిస్తుందికదా! మన లక్ష్యం ప్రజలకు ఒప్పు భావాలు అందాలి, తప్పు భావనలు అందకూడదు అన్న దైయుండాలేగాని, పరిశీలిద్దాం అన్నవారు పెద్దవాడా చిన్నవాడా అన్నది ఎందుకండీ! పరిశీలనాంశం వెంకటాద్రి గారికో, పి.డి. సుందర్రావు గారికో, దీదాత్ గారికో, ఓఫిర్ గారికో మాత్రమే సంబంధించింది కాదన్న కనీస ఇంగితమైనా కనబరచకపోతే ఎట్టా? నిబద్ధతకలవారికి ఇలాంటివన్నీ గల్లీల వ్యవహారంలా అనిపిస్తాయి.
నాలెఖ్ఖ ప్రకారం పి.డి సుందర్రావు గారిలాంటి, దుందుడుకుపోకడ గలవాళ్ళపోకడను ఆపడానికైనా వెంకటాద్రి గారిలాంటి వాళ్ళు 'జనహితం లక్ష్యంగా' చర్చకు సిద్ధపడాలి. అలాంటి చర్చలకు ఖర్చయ్యే కొన్ని గంటల శ్రమపాటి శ్రమను, కాలాన్ని మనం అంతకంటే తక్కువ విలువైన పనులకూ, పిచ్చాపాటీ మాటలకీ ఖర్చు చేస్తూనే ఉంటాం జీవితంలో, కనుక నీవునాకు తగవంటే, నీవునాకు తగవంటూ విచారణను ప్రక్కన పెట్టేయడం ఏమి సబబు? రావయ్యా సుందర్రావు! నీ సంగతేమిటో చూస్తాను అని వెంకటాద్రిగారంటే, కొంపలేమన్నా అంటుకుంటాయా? భరించరానంత స్థాయిలో పూరించు కొలేనంత స్థాయిలో సమయం వృధా అవుతుందా? మన పెద్దరికానికి భంగం వాటిల్లుతుందా? ఏమి విధానమండీ ఇది?! రారమ్మని పిలిచి, విషయంపై నిలువరించి, ఇంతేగదటయ్యా నీపని ఇంతోటి దానికి అంతలేసి కేకలేశావెందుకయ్యా! అని నలుగురి మధ్యలో తేల్చి మరింత మందికీ తెలుపవచ్చుకదా!
అతనేమో లోకంలో తనకెవడూ సరిజోడు లేడంటున్నాడు. ఏ కళనున్నాడో, ఏమరుపాటున అన్నాడోగాని, వెంకటాద్రితోనైతే పోటీకి రెడీ అన్నాడు. దొరికిన అవకాశాన్ని వాడుకుని, ఇంకెక్కిడికిపోతావు తండ్రి! అనుకుని అతణ్ణి చిక్కబట్టుకుని, అతనిలోని అనవసరపు అతిశయాలను చక్కజేసేందుకు పూనుకోవలసిందిపోయి, ఈయన గారు కూడా, నీవు నాకు చాలవు, నీతో చర్చకు నేనురాను నా కుర్రవాణ్ణి పంపిస్తాను అనడమేమిటండీ! బైబిలు గణాచారుల్ని నిలవరించి, హేతుబద్ధాలోచన అవసరాన్ని జనానికి తెలియపరచడానికి చిక్కిన చక్కని అవకాశమది. చాలా అరుదుగా మాత్రమే అలాంటి అవకాశాలు ఎదురొస్తాయి.
నిజంగా; బైబిలు సృష్టివాదాన్ని శాస్త్రీయంగా సరైందేనని రుజువు చేస్తాను. అన్న పి.డి సుందర్రావుగారిని, స్వాగత సత్కారాలతో ఆహ్వానించి, దానిని రుజువు చేయమని అడిగుండాల్సింది వెంకటాద్రిగారూ, వారి బృందమూ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తనకంతగా ఇష్టంలేకున్నా, భావజాల క్షేత్రానికి చేకూరగల బలాన్ని, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునైనా, వెంకటాద్రిగారు వారి పత్రికా ముఖంగానూ రిజిష్టర్ లేఖ ద్వారానూ కూడా పి.డిసుందర్రావుగారిని బైబిలు సృష్టివాదం శాస్త్రీయంగా సరైందేనని రుజువు చేయమని ఆహ్వానించడం మంచిది అవసరం కూడా (కబురుపెట్టండి) అవసరమైతే, వేదిక నిర్వహణ భారాన్ని స.మండలి స్వీకరిస్తుంది. ఒక్కమాట.
వాద నియమాలననుసరించి ప్రతిపాదకుడూ తన ప్రతిపాదనను నిరూపించాల్సి ఉంటుంది. సిద్దాంత విచారణలో ఇది అనుల్లంఘనీయమైన నియమం కనుక బైబిలు సృష్టివాదం సరైందేనని నిరూపించాల్సిన బాధ్యత దాని తలకెత్తుకున్న వారిపైనా, అదే సత్యమంటూ ప్రకటించినవారిపైనా ఉంటుంది. కనుక రెండో ప్రక్కన కూర్చున్న వారి పనల్లా ప్రతిపాదక పక్షం పద్దతి ప్రకారం, వారి ప్రతిపాదనలను అంటే బైబిలు ప్రకటించిన అభిప్రాయాలను సరైనవేనని నిరూపిస్తున్నారా లేదా అని జాగ్రత్తగా పరికిస్తుండడం తేడా వస్తే ఆ విషయాన్ని తెలిపి, సరిగా నిరూపించండని సూచన చేస్తుండడమే. కనుక వెంకటాద్రి గారు ఇప్పటికైనా స్థాయిల గొడవ నావలబెట్టి, భావజాల క్షేత్రంలో ఎంతో మేలును కలిగించగలదీ, అనేక వందల, వేల మంది గ్రుడ్డిగా పి.డి సుందర్రావుగారి వెంటనో, ఆయనలానే తమ మత గ్రంథంలోనే అన్నీ ఉన్నాయనే ఇస్లాం, వైదిక మతానుయాయుల వెంటనో పడిపోకుండా నిలువరించే మంచి పనికి తనవంతు న్యాయం చేసినట్లవుతుంది. వెంకటాద్రి గారినీ, వారి ఉద్యమ మిత్ర బృందాన్నీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు ఖర్చు చేసిన కాలం వృధాకాదనీ, సుందర్రావుగారు మారకపోయినా, దీని ప్రభావం, ప్రయోజనం దీనికుంటాయన్న విషయాన్ని గమనించమంటున్నాను.
సత్యానికి పెద్దపీట వేయమని చెప్పని మతం లేదు : కనుక నిజాయితీ, గల ప్రతి మతానుయాయి సత్యాన్ని గ్రహించడానికీ, స్వీకరించడానికీ సిద్దంగా ఉండి తీరాలి. ఇక్కడికిది నిజమా కాదా? కాని ఆచరణలో జరుగుతున్న దేమిటి? సత్యమంటే ఏమిటో స్పష్టంగా తెలిసిన వారుగానీ, ఫలాని విషయంలో సత్యమేమిటో తెలుసుకుందామనుకుంటున్నవారు గానీ, అరుదుగా కూడా తారసపడడం లేదు.
ప్రతి మత ధోరణికి చెందిన వాడూ ఇతరులను తన మతంలోకి రమ్మని ఆహ్వానిస్తునే ఉంటాడు, వస్తే సంతోషిస్తుంటాడు. రాకుంటే వ్యతిరేకతను ఏర్పరచుకుంటాడు. అసహనాన్ని ప్రదర్శిస్తుంటాడు. మరింత ఆవేశపరుడైతే అవతలివాణ్ణి హతమార్చడానికీ సిద్దపడిపోతాడు. తాను మాత్రం తన మతాన్ని విడిచి రావడానికి గానీ, తన మతంలోని విషయాల బాగోగుల్ని పరీక్షించి చూసుకోడానికి గాని ససేమిరా అంగీకరించడు. ఇతర మతాలలో ఉన్న అసమంజసతలను, అహేతుకాలోచనలను, పరీక్షకు నిలవని అంశాలను దుర్భిణీవేసి మరీ కనుగొనడానికీ, కనుగొన్నాననుకున్న వాటిని, భూతద్దంలో పెట్టి మరీ పదుగురికి చూపించడానికి తెగ ఆరాటపడిపోతుంటాడు. ఎంతటి అడ్డగోలుతనం?!
ఇలాటి మందను మాటిమాటికీ గమనించాకే వేమన్నకు
తప్పులెన్నువారు తండోపతండంబు! ఉర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు! అనాలనిపించింది
నీకంట్లో దూలాలెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసులు వెదుకుతావెందుకంటోంది బైబిలు
అతి ముఖ్య విషయం
నాకు తెలిసినంతలో ఆయా మతాలను అనుసరిస్తున్న మతస్ధులల,ో ఆయా మత గ్రంథాలు ప్రకటిస్తున్న విషయాలలో (1) తనకు తెలిసినవెన్ని? 2) తెలియనివెన్ని? 3) తప్పులెన్ని?, ఒప్పులెన్ని? తేలనివెన్ని? అని తేల్చుకున్నవారుగాని, అసలు తేల్చుకోడానికి వీలైనవెన్ని? తేల్చుకోడానికి వీల్లేనివెన్ని? అన్నది తేల్చుకున్నవారు గానీ, దాదాపు లేరనే చెప్పాలి. గ్రుడ్డిగా, బండగా, మొండిగా వాటిని తలకెత్తుకుని ఉండడం, వీలైతే మరికొంత మంది నెత్తినబెట్టడం అన్నదే కనపడుతోంది. ఎక్కడచూసినా, మతాలు మాటవరసకు మానవత్వపు విలువల్ని గురించి ప్రస్తావించినా, కొన్నింట గొప్పగా ప్రవచించినా, ఆచరణలో అది నిర్వహించిన ప్రధాన పాత్ర మాత్రం మానవ మారణకాండే (జనహననమే) ఒకింత జాగ్రత్తగా చూడగలిగితే ఇది అడుగడుగునా కనపడే చారిత్రకసత్యం.
నాగురించి, మండలి గురించి నాలుగు మాటలు :
యోచనాశీలురైన మిత్రులారా!
పి.డి సుందర్రావుగారి పోకడంతా, 'స్థాయి' ల గొడవ మీద ఆధారపడి ఉంటోంది గనుకనూ, తాత్విక చర్చలలో పాల్గొంటుండే. రెండు పక్షాలు ఒకరి గురించి ఒకరికి కనీసమైన సమాచారం తెలిసిఉండడం మంచిదే గనుకనూ, మాఅంతట మేము మా గురించి చెప్పుకునే అలవాటు మాకు లేకున్నా, పరిస్థితులు ఒకింత వత్తిడి చేస్తున్నాయి గనుకనూ కనీసావగాహన కలగడానికి సరిపడినంతైనా మా వివరాలు ఈ ముఖంగా అటు పి.డి సుందర్రావుగారికీ, ఎంపిక చేసుకున్న మతానుకూల, ప్రతికూల పక్షాల వారికీ, పాఠకులకూ అందించాలన్న నిర్ణయానికి వచ్చాము. ఇవిగో మాగురించిన కనీస వివరాలు.
1) సత్యాన్వేషణ మండలి ప్రధానంగా సాధన స్వభావంకల సంస్థ
2) సంస్థ ప్రధాన అధ్యయన క్షేత్రం, భిన్నతాత్విక ధోరణులను శాస్త్రీయ దృక్పధంతో అధ్యయనం చేయడం, తులనాత్మక అధ్యయనం చేయడం.
3) ఆ అధ్యయనపు పునాది బలంతో తత్వచర్చావేదికను ఏర్పరచి, ఆవేదికపైన ఆస్థిక, నాస్థిక ధోరణులకు చెందిన వివిధ సిద్ధాంతాలను సత్యాసత్య విచారణకు లోను చేయడం. ఆ వేదికపైన ప్రధానంగా నిర్వాహక పక్షాన్ని వహించడం, అవసరమైనప్పుడు పృశ్చక పక్షాన్నీ వహిస్తుండడం
4) ఇప్పటికి మేము తత్వచర్చావేదికపైన విచారణకు పెట్టిన అంశాలు
1) 1) ఆస్థిక స్వరూప స్వభావాలు, 2) నాస్థిక స్వరూప స్వభావాలు. ఆస్థికపక్షానికి చెందినంతలో
2) 1) ఇస్లాం (ఖురాన్) 2) క్రైస్తవం (బైబిలు) 3) అధ్వైతం (4) ద్వైతం, (5) విశిష్టాద్వైతం (6) కర్మ సిద్దాంతం (7) మనుస్మృతి (8) బౌద్ధం (9) జైనం (10) న్యాయవైశేషిక దర్శనాలు (11) అచలం (12) ఆర్యసమాజ (వైదికం) (13) ప్రజా పితబ్రహ్మకుమారీల సిద్దాంతం
3) నాస్థిక (భౌతికవాద) పక్షానికి చెందిన వాటిలో
1) నాస్థికత్వం, 2) హేతువాదం 3) నవ్యమానవ వాదం 4) మార్స్కిజం 5) పరిణామవాదం
4) 1. సాధారణ రూపాల క్రిందకు చేరినవాటిలో
1. అంబేద్కరిజం 2. గాంధీఇజం 3. జిడ్డు కృష్ణమూర్తి ధోరణి
5. జ్ఞానసిద్ధాంత పై ఒక చర్చావేదిక 'ప్రమాణమీమాంస' అన్న పేరున నిర్వహించాం.
6. వాస్తు, జ్యోతిషాలపైనా చర్చావేదికలు నిర్వహించాం
తత్వచర్చావేదిక పేరున మేము ఆయా సమయాలలో నిర్వహించిన పై సిద్దాంతాల విచారణ వివరాలన్నీ, మేలుకొలుపు మరియు వివేకపథం అన్న మండలి మాసపత్రికలో ఆ కాలంలోనే క్రమంగా ప్రచురించాం. ఆ వివరాలన్నీ వ్రాత రూపంలో వాటిలో భద్రంగా ఉన్నాయి.
సత్యాన్వేషణ మండలి ప్రధాన అధ్యయన క్షేత్రంలోని మరోపార్శ్వం జ్ఞాన సిద్దాంతమన్నదే. దానినే మేము పారిభాషికంగా 'లక్షణ ప్రమాణ విద్య' అంటాము. ఇందులో జ్ఞానాన్ని గురించి, జ్ఞానసాధకాల గురించి, జ్ఞేయాలగురించిన విచారణ ఉంటుంది.
ఈ క్షేత్రాన్ని గురించి లోతుగా తెలిసిన వారు వీటిని ''ప్రమాణ వివేచన'', ''పదార్థ వివేచన'' అంటారు. అంటే ఏ సిద్ధాంతమైనా, ఆసిద్దాంతకర్తకు సైద్దాంతిక వరవడి తెలిసుండి వ్రాయబడితే మాత్రం (1) తానంగీకరిస్తున్న ప్రమాణాలెన్నో, వాటి స్వరూపమేమిటో, (2) తానంగీకరిస్తున్న భావాభివర్గాలు (పదార్థ వర్గాలు) ఎన్నో ముందుగనే ప్రకటిస్తారు. తన సిద్దాంతాన్ని వాటి ఆధారంగా, వాటి పరిధిలోనే వివరించి నిరూపించే యత్నం చేస్తారు.
ఉదా :
(1) న్యాయదర్శనం తనకు 4 ప్రమాణాలు, 16 పదార్థాలు అంటోంది.
(2) వైశేషిక దర్శనం తనకు 3 ప్రమాణాలు 6 పదార్ధాలు అంటోంది. (అందుకనే వైశేషికుల్ని షట్పదార్థవాదులు అంటారు.
3) సాంఖ్య యోగదర్శనకారులు తమకు 3 ప్రమాణాలని అంటారు 25 తత్వాలని సాంఖ్యులంటారు
4) పూర్వోత్తర మీ మాంసకులు 6 ప్రమాణాలనంగీకరిస్తారు.
5) త్రిమాతాచార్యులూ వారి వారి ప్రమాణాలను, పదార్ధ వర్గాలను పేర్కొన్నారు
6) మార్క్సు తనకు రెండు ప్రమాణాలన్నాడు.
7) నాస్థికులు ప్రాచీనులు ప్రత్యక్షమొక్కటే ప్రమాణం అన్నారు. ఆధునికులు మూడు ప్రమాణాలనంగీకరించారు.
8) బౌద్ధులూ, జైనులూ రెండు ప్రమాణాలనంగీకరిస్తారు.
9) పౌరాణికులు, విశిష్టాద్వైతులు 8. ప్రమాణాలను అంగీకరిస్తారు
10) దయానందుడు (ఆర్యసమాజ స్ధాపకుడు) తనకి 8 ప్రమాణాములని చెప్పుకున్నాడు.
ముఖ్యగమనిక :- ఈ వివరమంతా ఇక్కడెందుకు చెపుతున్నానంటే, ఎప్పుడు, ఎక్కడ ఎవరిమధ్య జరిగే చర్చలలోనైనా ప్రతిపాదక పక్షం తాను ప్రతిపాదిస్తున్న విషయం తనకు ఏ ప్రమాణం ద్వారా తెలియబడిందో, మనం ఏ ప్రమాణం ద్వారా దానిని తెలుసుకోవలసి ఉంటుందో విస్పష్టంగా ప్రకటించాలి. అటు పైన తాను ప్రకటించిన అభిప్రాయం సత్యమేనని నిర్ధారించాలి. అందుకుగాను సత్యాసత్య వివేచన విధానం గురించీ ఇదమిద్దంగా ప్రకటించాలి. ఈ విధానపు ఆవశ్యకతను, తప్పని సరితనాన్ని గుర్తించిన వెనకటి తాత్వికులు నిర్వివాదాంశమనదగ్గ ఒక నియమాన్ని సూత్రీకరించారు. సైద్ధాంతిక చర్చలలో పాల్గొన్న, గట్టి వాళ్ళందరకూ ఇది తెలుసు.
సూ : లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్దిః, నతుప్రతిజ్ఞామాత్రేణ :
నీవు చెప్పదలచుకున్న దాని లక్షణ మేమిటో చెప్పు, అది ఏ ప్రమాణానికి విషయమో ( ఏ ప్రమాణం ద్వారా తెలియబడుతుందో) చెప్పి, ఆ ప్రమాణం ద్వారా దానిని సిద్దింపజేయి. అంతేగాని కేవలం అభిప్రాయ ప్రకటన వల్ల వస్తుసిద్ధి కాదు. అని పై సూత్రార్ధం. కనుక ఒక పుస్తకంలోని మాటనో, తన మాటనో ప్రకటించి, పుస్తకం చెపుతోంది గనుక సత్యం అనడం అర్ధరహితం. సత్యాసత్య విచారణ క్షేత్రంలో అట్టివన్నీ ప్రతిపాదనలుగ స్వీకరించవలసినవే అంటే ఇంకా పరీక్షించవలసినవే అవుతాయి. ఈ విషయాలన్నీ స్పష్టంగా మా అన్వేషణలో మేము గమనించాక, వీటి విషయంలోనూ మాదైన ఒక చట్రాన్ని ఏర్పరచుకున్నాము. ఆనేపధ్యం ఆధారంగానే ప్రమాణ మీమాంస అన్న శీర్షికన చర్చావేదికపైకి జ్ఞాన సిద్ధాంతాన్ని తీసుకువచ్చి వివిధ ధోరణుల పండితులను ఆహ్వానించి ప్రమాణ విచారణ చేశాము.
మేము చేసిన విశేషకృషి, అసాధారణ యత్నం వల్ల, తత్వచర్చావేదికలపైకి వచ్చి చర్చలలో పాల్గొన్న ఉద్దండుల వివరాలు కొన్ని :-
1. ఆస్థిక పక్షానికి చెందిన వారి జాబితా :-
ఎ) భారతీయం :- హైందవం తరఫున :- రామచంద్రుల కోటీశ్వరశర్మ, గూడా సుబ్రహ్మణ్యశాస్త్రి, సూరిరామకోటిశాస్త్రి, వాలకాండ నరశింహాచార్యులు, సుశీలేంద్రా చార్యస్వామి, విద్యానందగిరి, కులకర్ణి, శ్రీభాష్యం అప్పలాచార్యులు, కృష్ణమాచార్యులు, లక్ష్మీకాంతశర్మ, డోంగ్రే, గోపదేవ్‌శాస్త్రి, వేదవ్రతవిూమాంసక్, ఆచార్య రఘమన్న, మనస చెన్నప్ప, విఠల్‌రావు, గోపాలకృష్ణశాస్త్రి, మాగంటి శ్రీరంగాచార్యులు, వంగీపురం రామానుజాచార్యులు, రామచంద్రాచార్యులు, కామేశ్వరరావు, ప్రమోదచైతన్య, బోధ చైతన్య మొ|| వాళ్ళూ
బి) క్రైస్తవం తరఫున : ఫాదర్ ప్రకాష్, ఫాదర్ చిన్నప్ప, సి.హెచ్. ఫ్రాన్సిస్, ఆనందకుమార్, స్టెఫెన్, ఎం. సుధాకర్ మొ|| వారూ
సి) భౌతికవాద ధోరణికి చెందిన నాస్తిక హేతువాద పక్షాల నుండి
గో|| సాంబశివరావు, గుత్తారాధాకృష్ణ, ఎన్. ఇన్నయ్య, రా. వెంకటాద్రి. లవణం, విజయం, ఈశ్వర ప్రభు, గణేశం బాబురావు, పి. సుబ్బరాజు, క్రాంతికార్ మొ|| వాళ్ళూ
డి) కమ్యూనిస్టుల వైపు నుండి
కొండపల్లి సీతారామయ్య, మహీదర రామ్మోహనరావు, నండూరి ప్రసాదరావు, పరకాల పట్టాభిరామరావు, ఈడ్పుగంటి నాగేశ్వరావు, జక్కా వెంకయ్య, ఏటుకూరి బలరామమూర్తి గారు, వై.వి.కృష్ణారావు మొ|| వారు.
ఇ) జిడ్డు కృష్ణమూర్తి ధోరణికి చెందిన వేదపారాయణ, రఘుపతిరావు, చిన్నయ్య, చిరంజీవులు, బోధ చైతన్య, మొ|| వాళ్ళూ.
ఎఫ్) ఇస్లాం తరుఫున అసీఫుద్దీన్, మల్లిక్, ఫజులుర్‌రహ్మన్, తారిఖ్, వహీద్, ముస్తాక్ అహ్మద్, హమీదుల్లాషరీఫ్ మొ||గు వాళ్ళూ మేము నిర్వహించిన ఆయా చర్చావేదికల్లో పక్షప్రతి పక్షాల తరఫున పాల్లొన్నారు.
జి) వాస్తు జ్యోతిష్యాల పై :- గౌరు తిరుపతిరెడ్డి, మధుర పాలశంకరశర్మ, భోగినేని వెంకటరత్నం, దంతూరి పండరి, మల్లిపెద్ది రామకృష్ణ, చిత్రాల గురుమూర్తి, మధురకృష్ణమూర్తి శాస్త్రి, సుబ్రమణ్యశాస్త్రి, రాణి శ్రీనివాసశాస్త్రి మొ||వారు.
ఇక వ్యక్తిగతంగా నా ఆధ్యాత్మిక ప్రయాణ క్రమం
1. 1968లో ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాదిపతి విమలానందుల వారి ద్వారా ఆస్థిక మార్గంలో సాధన ఆరంభించాను.
2. మళయాళస్వామి శిష్యులైన చిన్మయ రామదాసుగారి పర్యవేక్షణలో, మార్గదర్శ కత్వంలో జపతపాలు గ్రంథాధ్యయనాల కొనసాగింపు కొద్దికాలం వ్యాసాశ్రమంలో సాధన, పురాణాల స్మృతుల పరిశీలన (గౌతమ, శంఖలికిత, మనుస్మృతులు)
3. బడగర శివానంద శిష్యులైన రామానందయోగి నుండి క్రియా యోగ పద్ధతిని స్వీకరించి 5 సం|| ఒక గుహలో ఉంటూ యోగ సాధన, దర్శనాలు, ఉపనిషత్తులు, ఖురాను, బైబిలు వగైరాల అధ్యయనము
4. 1981 ప్రాంతాల వెంకటగిరి సత్యజ్ఞాన సంఘాధ్యకక్షులు పెంచలయ్యగారితో బేటీ, తాత్వికచర్చ
ముఖ్య గమనిక : ఈయన గారితో భేటీ పడడం వల్లనే నా అధ్యాత్మిక ప్రయాణంలో, ఆలోచనా ధోరణిలో పెద్దకుదుపు ఏర్పడి, తద్వారా గొప్ప మలుపుకు దారి తీసింది.
అప్పటి వరకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రమేవప్రమాణం, అందునా వేదమే సర్వజ్ఞకల్పమైన స్వతఃప్రమాణ మన దగ్గ శాస్త్రం, అన్న దృఢచిత్తంతో ఉన్న నేను; 'తనది చెప్పని, ఎదుటివాని దొప్పని' విధానంలో చర్చలు చేస్తూ ప్రశ్నించడమే పనిగా పెట్టుకుని, ఎదుటి వారిని నీదెలా సరైందో చెప్పమని అడిగే పద్దతిన కొనసాగుతూ వస్తున్న పెంచలయ్యగారితో, నాది పరీక్ష కివ్వడానికైనా సిద్దమే, నీది పరీక్షించడానికైనా సిద్దమే అన్న విధానాన్నెంచుకొని ఉన్న నేను, భేటీ పడడం, తేలినవైపు ఇరుపురం నడవాలన్న నిబంధనను పెట్టుకుని విచారణకు సిద్దపడడం, జరిగింది. అందులో మాయిరువురి పద్దతులననుసరించి, నేను నా పక్షాన్ని నిలబెట్టుకోవలసి రావడంతో అందుకు సిద్దపడ్డనేను, వేదం ఈశ్వరీయం, సర్వజ్ఞకల్పం, స్వతః ప్రమాణం అన్న దానిని ప్రతిపాదించడమైతే తేలిగ్గానే చేశాను గాని ఆపై దానిని నిర్ధారించడం మాత్రం నావల్ల కాలా. (ప్రతి పాదించడానికేముంది! మాట అనేయడమేకదా)
ఏమిటి నేను సత్యమనుకున్న దానిని, సత్యమని స్ధాపించలేకపోతున్నానేమిటి? అన్న అంతర్మథనానికిలోనుగావడం, అప్పటికే ఆయనా కొంతకాలం సత్యాన్వేషిగా సాగి, ఏవో కొన్ని నిర్ణయాలకు వచ్చి సత్యజ్ఞానసంఘాన్ని స్ధాపించడం, ప్రమాణ, పదార్ధ విద్యల అవసరాన్ని గుర్తించి వాటి విషయంలో తనవంటూ కొన్ని అభిప్రాయాల నేర్పరచుకొని ఉండడం జరిగింది. ఇది అప్పటికి మా ఇద్దరి మధ్యనున్న వాస్తవ పరిస్థితి.
ఆ థలో; ఆచర్చవల్ల నా ఆలోచనా విధానమంతా ఒక పెద్దకుదుపుకులోనైంది, ఆయన తనది చెప్పడు, నాది ఒప్పుడు, నీదేమిటో, నీవే ఆలోచించి, సత్యమేమిటో నీవే చూడు, నా పని నీది తప్పో వప్పో చూడడం , తప్పుంటే ఎత్తి చూపడం వరకే, అనడంతో, అప్పటి వరకు ఉన్న ప్రమాణిక శాస్త్రం మనకున్నదాని వెంటనో, ప్రామాణికులనుకున్నవారి (గురువుల) వెంటనో నడచిపోవడం అన్న విధానం ఆగిపోయింది. సొంతంగా; జీవితాన్నీ, తాత్వికంగా ఎదురుపడుతున్న విషయాలను స్వతంత్రంగా ఆలోచించడం ఆరంభమైంది. అది నా జీవితంలో జ్ఞాన భాగంలో పెద్ద మలుపుకు దారి తీసింది. ఆ కుదుపుకు, ఈ మలుపులకు కారకులు పెంచలయ్యగారు
తరవాత నా పరిశోధన, సత్యాన్వేషణల ద్వారా నేను గమనించిన అభిప్రాయాలతో సుమారు 19, 20 సం||ల పాటు ఆయనతో చర్చలు; మేమిరువురం కలసి ఆయా తాత్విక క్షేత్రాలకు చెందిన పీఠాధిపతులతోను, పండితులతోనూ చర్చలు, సాగిస్తూ రావడం, జరుగుతూ వచ్చింది.
ఈ మొత్తం నేపధ్యం నుండే సత్యాన్వేషణ మండలి భావజాలంగా నేడు చెప్పుకుంటున్న అనేక భావాల సంపుటీకరణ ఆవిర్భవించింది. అయితే స్పష్టత కొరకు ఒక్క విషయాన్నిక్కడ చెప్పుకోవాలి. ఈనాడు నేను ఆయాతాత్విక ధోరణుల విషయంలో ఎలా స్వంత అభిప్రాయాలు కలిగి ఉన్నానో, అలానే సత్యజ్ఞాన సంఘం విషయంలోనూ నావైన అభిప్రాయాలు కలిగి ఉన్నాను. సత్యజ్ఞాన సంఘంతో కొన్నింట విభేదాలూ కలిగి ఉన్నాను. సత్యాన్వేషణ మండలి, సత్యజ్ఞాన సంఘానివిగాని, పెంచలయ్యగారివి అని గాని చెప్పడానికి వీలైన భావాలను, వారి నుండి ఏమీ స్వీకరించలేదు. లేదా పెంచలయ్య గారివేవిూ మాకు సంక్రమించలేదు. ఈనాటికీ వారి భావజాల మేమిటో ఇదమిద్దంగా, ఒక మొత్తంగా వారు ప్రకటించిందేలేదు. నా గురించి క్లుప్తంగానైనా స్పష్టంగా ప్రకటించాల్సిన సందర్భం నెట్టుకు వచ్చింది గనుక అందులో భాగంగా, నా మిత్రులలోనే ఉన్న కొందరు మా యిరువురినీ పొరపాటుగా అర్ధం చేసుకోకుండా ఉండేందుకు పనికి వస్తుందనే ఆలోచనతోనే ఈ మాత్రమైనా గతంలో ఎప్పుడూ అనని దీనిని ఇప్పుడు ప్రకటిస్తున్నాను. దీన్నిలా ఉంచుదాం.
మేమిరువురమూ, దాదాపు పదుల సంఖ్యలోనే వివిధ మత, మతేతర తాత్విక ధోరణులకు చెందిన పండితులను, స్వాములను, యోగులను, బోధకులను, సాధకులను, ఆశ్రమాధిపతులను కలసి, వారి వారి విషయాలపై చర్చలు చేస్తూ వస్తున్న క్రమంవల్లనూ, మా యిరువురి మధ్యన మిత్రులంగానే ఉంటూ సాగిస్తూ వచ్చిన విచారణల వల్లనూ; తాత్విక విచారణలకుగానీ, అన్వేషణకుగానీ, సత్యాసత్య వివేచనకుగాని
(1) ప్రమాణ విద్య, (2) పదార్ధవిద్య (3) సత్యాసత్య వివేచనా విద్య; తప్పనిసరి అవుతాయి అన్నది మా యిరువురికీ స్పష్టంగా తేలిపోయింది. ఈ మూటి విషయంలో పెంచలయ్యగారి (అవగాహన) అభిప్రాయాలు ఏమిటన్నది ఇప్పటికీ ఆయన ఇదమిద్దంగా వెళ్ళడించిందిలేదు. వాటి విషయంలో మా మధ్య జరిగే చర్చల ద్వారా గానీ, ఆయన ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆయన మాటల ద్వారా గాని వెల్లడైన వాటిని బట్టీ ఆమూటి విషయంలోనూ నాకూ, ఆయనకూ మధ్య ఎంతో కొంత తేడాలున్నాయన్నది నా దృష్టికి వచ్చింది.
ఈ మధ్య కాలంలో ఆయన, దేవుడున్నాడు, అనీ, దేవుణ్ణి ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవచ్చుననీ, దానికి ఆత్మవిద్య (తర్కవిద్య) అవసరమనీ ప్రకటించడంతో, నేను తలంచినట్లే ఆయన భావాలకూ, నా భావాలకు మధ్య మౌలికాంశాలలోనే తేడాలున్నట్లు తేలినట్లైంది. ఈ విషయంలో వాస్తవం ఏమిటన్నది ఆయన సిద్దపడితే మేమిరువురమూ తేల్చుకోవలసీ ఉంది. అందుకు నా వరకు నేను ఎవరూ కాదనలేని (సాధారణమైన) చర్చావేదిక నియమనిబంధనలతోటే సత్యాసత్య వివేచనకు కూర్చోడానికి సిద్దంగా ఉన్నాను. నిజమైన లేక సరైన సత్యాన్వేషణకు సత్యాసత్యాల విచారణ సందర్భంలో స్వపరభేదాలుగాని, శతృమిత్రభావనలుగాని, పెద్ద, చిన్నా అన్న అంశాలుగాని పరిగణనలోకి తీసుకోగూడదు అన్న నియమాన్ని తలంచే ఈ విషయాన్నీ ప్రకటిస్తున్నాను. సత్యాసత్య విచారణ విషయంలో విషయాన్నిగాక, మిగిలిన ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోనక్కరలేదనీ, తీసుకోకూడదనీ అనేంతవరకు పెంచలయ్యగారికీ, నాకూ ఏకాభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని ఇరువురమూ ఇతరులకు ఆయా విచారణల సందర్భంలో చెపుతూనే వచ్చాము కనుక వారు ప్రకటించిన అభిప్రాయాల విషయమై చర్చావేదికపైకి రావడం విషయంలో ఆయనెట్టి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
సరే! మళ్ళీ ప్రధాన శీర్షికాంశానికి వస్తాను : -
సత్యాన్వేషణ మండలి ఆదర్శం ఉత్తమ సమాజ స్థాపన. ఆ ఆశయ ఆదర్శం దిశగా సమాజాన్ని క్రమాభివృద్దిగా కదిలించగల వ్యక్తుల్నీ, వ్యవస్థనూ రూపొందించుకోవడం, దీని సాధనకు భావసారూప్యతకల వాళ్ళ నందరినీ కలుపుకుంటూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని సమష్టిగా పెద్ద యెత్తున కృషి చేయడం.
జీవితానికి సంబంధించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకుని, ఆ జ్ఞానం సూచిస్తున్న మార్గంలోనే జీవించడానికి శక్తి మేర సాధన చేస్తూ, అదే విషయాన్ని సమాజానికీ అందించి, సమాజమూ ఆ దిశగా సాధన చేయడానికి శక్తి మేర వత్తిడి చేయడం. ఒక సంస్థగా సత్యాన్వేషణ మండలి లక్ష్యం ఇది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే అపసవ్యభావజాలాన్ని సమాజం నుండి తొలగించడానికీ, సంఘ వ్యతిరేక శక్తులనెదుర్కోడానికీ మరో పార్శ్వంలో కృషి చేస్తూ వస్తున్నాము. అలా ఉనికిలోకి వచ్చినవే మండలి ప్రధాన పాత్ర వహించడం ద్వారా ఉనికిలోకి వచ్చిన ఐక్యవేదికలు.
1. వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక, 2) లౌకిక ఐక్యవేదిక (3) వాస్తు నిజనిర్ధారణ ఐక్యవేదిక (4) ఎన్నికల నిఘా ఐక్యవేదిక (5) ఐక్యమిత్రమండలి (6) ప్రాథమిక విద్యారంగ ప్రక్షాళన ఐక్యవేదిక (7) సమాచార హక్కు ప్రచారఐక్య వేదికలన్నవి అలా ఉనికిలోకి వచ్చినవే.
మా అన్వేషణ ఫలితంగా కొన్ని విషయాలలో మేము కొన్ని నిర్ణయాలకు వచ్చాము. వాటిని సంగ్రహిస్తాను పరిశీలించండి. కొన్ని విషయాలపై మావిగా మేము ప్రకటిస్తున్న ఈ అభిప్రాయాలు (భావజాలం) ఆ మేరకు మండలి సిద్ధాంతసంగ్రహంలాంటివే. కనుక వీటిపై మాతో విభేదించేవారితో సత్యాసత్య వివేచనకు కూర్చోడానికి మండలి సిద్దంగా ఉంది. అయితే ఇందులో తేలిన విషయాల వైపు కదలడానికి వారు సిద్దపడి ఉండాలి. ఆ విషయాన్ని వ్రాత మూలంగా ప్రకటించాలి.
మరో ముఖ్య గమనిక
ఇప్పటికే మా పరిశీలనలో ఋజుత్వం లేనివారుగా తేలిన వారి విషయంలో మాకు మినహాయింపు ఉంది. అంటే, అట్టి వారికి మండలి చర్చావేదికలో స్థానం లేదు. అయితే ఇది కొందరితో మాట్లాడకుండడానికి వంకగా వాడుకునేదిగనూ కావచ్చు గనుక, మండలికి అలాంటి సాకుల వ్యవహారం ఏమీలేదనీ, గతంలో అలా అపసవ్యంగా, అడ్డగోలుగా ప్రవర్తించినవారు, మనస్సు మార్చుకుని నిజాయితీగా బాధ్యతగా ప్రవర్తించడానికి సిద్దమైతే వారు వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్వహించితే, అట్టి వారితోనూ, వారి రుజుత్వం నిర్దారణైనాక చర్చలో కూర్చోవడానికి సిద్దమే. ఈ మాటైనా ఎందుకంటున్నానంటే మండలి పోకడకు సంబంధించినంతలో కపటులు, వంచనా వృత్తికలవాళ్ళు మినహా ఎట్టి విభేదాలున్నవాళ్ళైనా శతృవులు కాదు. ఎన్ని విభేదాలున్నా మంచివాళ్ళతో విషయపరీక్షకు, సమీక్షకు, సర్దుబాటులకు కూడా మండలి సదా, సర్వథా సిద్ధంగా ఉంటుంది. ఎంతో మందితో గత 30 ఏండ్లుగా చర్చలు చేస్తూ, కొందరితోనైతే వివాద పడుతూ గూడా వస్తున్న నాకు అతి కొద్ది మంది మాత్రం రుజుత్వం లేనివారుగా కనబడ్డారు. అందులో సి.టి.ఎఫ్ అన్న సంస్థ ప్రతినిధిగా పరిచయమైన గంటేల ప్రకాష్ అన్నాయనొకరు. లోగడ ఆయన పోయిన అపసవ్య పోకడ చాలదన్నట్టు, ఈ మధ్యన బాబూరావు గారితోనూ, రాజేంద్రప్రసాద్ గారితోనూ ఈ మెయిల్ సంభాషణలు మొదలెట్టి మండలిపైనో, నాపైనో కొన్ని అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు ప్రకటించారట. వారిరువురూ నాకు పరిచయస్తులేకాక, మిత్రులు కూడా అవడంతో ఈ విషయం నా చెవినేశారు. దాంతో మీకూ, ప్రకాష్‌కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటినీ నాకు పంపమని కబురు చేశాను. అవి మొత్తం చేరాక వాటినీ క్రమంగా పత్రిక ద్వారా మీ ముందుంచుతాను.
ప్రకాష్‌కు మండలి వైపు నుండి మరో అవకాశం
ప్రకాష్ గారూ!
నేనూ, ఫజులుర్ రహ్మాన్‌గారూ కలసి సంయుక్తంగా నిర్వహించిన 'పరిణామ వాదమా? స్పష్టివాదమా ఏది సరైంది? అన్న వేదికలో క్రైస్తవ చింతనాపరుల వేదిక నుండి బైబిలు సృష్టివాదానికి ప్రతినిధిగా మీరూ పాల్గొన్నారు. క్రమాన్ననుసరించి జరుగుతూ వచ్చిన చర్చలు ఒకనాటికి పరిణామవాదంపై ఒక ముగింపుకు వచ్చాయి. ఆ వేదిక నిర్వాహకునిగా ఉన్న నేను జన విజ్ఞాన వేదిక మీటింగు హాలులో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలకు చెందిన పలువురి సమక్షంలో ఒక ప్రకటన చేశాను. మీరూ, మరి కొందరు బైబిలు పక్షీయులు, ఖురాన్ పక్షానికి చెందిన కొందరూ, పరిణామవాదానికి చెందిన ఇంకొందరూ, ఒకరిద్దరు సైంటిస్టులూ కూడా ఉన్న ఆ సమావేశంలో, పరిణామవాదం శాస్త్రీయంగా 100% నిరూపిత సిద్దాంతం 'ప్రూవ్‌డ్ ఫ్యాక్ట్' అనడానికి తగిన స్థాయి కలిగిందికాదు. అది మీ లెక్కప్రకారం కూడా పరికల్పన స్ధాయి కంటే ఒకింత పై స్ధాయిలో నున్న - ప్రయోగాలు నిర్వహింపబడుతున్న సిద్ధాంతం. కనుక తప్పని తేలిన సిద్దాంతం అననే కూడదు. మీలానే సృష్టివాదం పక్షాన వచ్చిన ఇస్లాం ప్రతినిధులున్నూ కొంతవరకు పరిణామం జరుగుతుందన్నది వాస్తవమే. సైంటిస్టులూ అనేక విషయాలలో పరిణామ సిద్దాంతం ఆధారంగానే నేడు ఎన్నో ప్రయోగాలు జరగుతున్నేౖ, అనేక ఫలితాలూ రాబట్టబడుతున్నేౖ అన్నంతవరకు చెపుతున్నారు. వీటన్నింటి ఆధారంగా ఈ వేదిక ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తోంది అనంటూ;
పరిణామ సిద్ధాంత ప్రతిపాదనలన్నీ పూర్తిగా రుజువు చేయబడలేదు. పరిణామ సిద్ధాంతం తప్పని రుజువు కాలేదు. పైగా క్రమంగా దానికి ఊతంగా ఉండే ఆధారాలు లభిస్తూ వస్తున్నాయి. మన ప్రస్తుతాంశమైన పరిణామవాదమా? సృష్టివాదమా? ఏది సరైంది? అన్న దానిలో పరిణామవాదం సరైందనాలంటే నిర్జీవాన్నుండి జీవం ఆవిర్భవించిందని రుజువు చేయగలగాలి. ఆ పని నిజానికి మనది అంటే ఆస్ధిక, నాస్థిక పక్షాలను వహించిన తాత్వికులది కానే కాదు. అది జీవరసాయన శాస్త్రజ్ఞుల క్షేత్ర ప్రయోగశాలకు సంబంధించింది. అందునా సూక్ష్మజీవరసాయన శాస్త్ర లేదా అణుజీవరసాయన శాస్త్రజ్ఞుల పరిశోధనలకు సంబంధించినది కనుక ఆ విషయంలో ఆయా క్షేత్ర ప్రయోగ ఫలితాలను ఉట్టంకించడమే మనం చేయగలిగింది. అవసరమనుకుంటే ఆ శాస్త్రజ్ఞుల ప్రయోగాల సమాచారాన్ని సమీక్షించుకోడానికి ఎవరమైనా ఎప్పుడైనా యత్నించవచ్చు. అనంటూ ఈ వేదిక ప్రకారం పరిణామవాదం సరైందని ఆ పక్షం నిరూపించలేదు. సరికాదని సృష్టివాదుల పక్షమూ నిరూపించలేదు. కనుక దీనినిప్పటికి ఆపి, క్రమానిననుసరించి రెండో పక్షానికి చెందిన సృష్టి వాదం పరీక్షించడానికి పూనుకోవలసి ఉంది. అందునా బైబిలు సృష్టివాదం సరైందే నంటున్న, అదే సరైంది అనీ అంటున్న మీరు, దానిని ప్రతిపాదించి నిరూపించండి'' అని ప్రకటించాను. రహ్మాన్‌గారు, నేను కలసి నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ఆవేదికలో మరో మాటకు తావులేకుండా బైబిలు సృష్టివాదాన్ని మీరు సరైందేనని నిరూపించడానికి సిద్దం కావాలి. ఈ విషయం పలుధపాలు నేనూ చెప్పాను. రహ్మాన్‌్‌గారూ చెప్పారు. మీరు, మీరు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని ప్రక్కన బెట్టి, సత్యాన్వేషణ మండలితో గతంలో మీకు జరిగిన చర్చలను తెర మీదకుతెచ్చి, ముందు మండలి తన ప్రమాణాలను గురించి ప్రకటించి అవి సరైనవేనని నిరూపించమనండి ఆ తరవాత మా సృష్టివాదాన్ని గురించి మాట్లాడతాము అంటూ ఒక అడ్డగోలువాదనను సృష్టివాదాన్ని ప్రకటించి నిరూపించడం సాధ్యపడదని తేలిసే, కుటిల ఎత్తుగడలో భాగంగా మొదలుపెట్టారు. ఈ విషయంలో ఆ మా వేదిక నిర్ణయాన్ని, క్రమాన్ని విడచి ఇంకేది మాట్లాడినా అదంతా తప్పుడు పోకడే. నేనానాడే చెప్పాను, మీ పోకడ నిజాయితీ లేని తనంతో, నిబద్దతలేనితనంతో కూడుకుని ఉందని, సుధాకర్‌లో తన పై తనకు అతి విశ్వాసమేకాని, కుటిలత్వం నాకు కనబడలేదనీ ఆనాడే అన్నాను. ఇది జరిగిన కథలోకొంత .
అదంతా అలా ఉంచుదాం! ఆ వేదిక ప్రకారం గానీ, ఇప్పుడు సుందర్రావుగారిని ఆసరా చేసుకుని మొదలైన బైబిలు విచారణవేదిక ప్రకారంగానీ బైబిలు సృష్టివాదం సరైందేనని నిరూపించగలమనుకుంటే అందుకు సిద్దపడండి ముందు. వెనకటి ఆవేదిక ప్రకారం ఆ పని చేయడం మీ విధి . ఈ వేదిక ప్రకారమైతే పి.డి. సుందర్రావుగారికి వర్తించే షరతుల్ని మీకూ వర్తింపజేయడానికి నా కెట్టి అభ్యంతరం లేదు. ఇరుపక్షాలూ గెలిచిన వారికి కోటి రూపాయలిచ్చుకుని, తేలినవైపుకు ప్రయాణించడానికి సిద్దపడడం, తప్పుగా మాట్లాడిన ప్రతిసందర్భంలోనూ చెప్పుతోకొట్టించుకోవడం ఈ విషయాన్ని విడచి, అంటే బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి, పరీక్షకిచ్చి, అది సరైందేనని నిరూపిస్తాను 'అన్నమాటను విడచి, ఇంకేమాట మాట్లాడినా ఈ అవకాశానికి సంబంధించిన నా వాగ్దానానికి కాలం చెల్లిపోతుంది. బాగా ఆలోచించుకుని, లోకం నెత్తిన బైబిలు సత్యవేదం అన్న భావాన్ని పెడుతున్న మీరు, సత్యాసత్య వివేచనకు సిద్దపడతారో లేదో స్పష్టంగా ప్రకటించండి.
ప్రస్తుతానికి మీ విషయమింతే పి.డి సుందర్రావుగారినీ, రంజిత్ ఓఫిర్‌గారినీ, జగదీశ్వర్‌గారినీ, అలాగే మా వైపు దృష్టి సారించి ఇంతకూ మీరేమిటి? అని ఆలోచిస్తున్న వారినీ దృష్టి నిడుకుని మా (నా) సిద్దాంతాన్ని గురించిన నాలుగు మాటలు చెపుతాను. పట్టిచూడండి.
1. నా వరకు నేను ఏ మతస్థుణ్ణికాదు, తాత్వికంగా ఇప్పటికి ప్రచారంలో ఉన్న ఏ ధోరణినీయథాతథంగా నెత్తినెత్తుకున్నవాణ్ణికాను.
2. ప్రతి తాత్విక ధోరణిలోనూ సత్యాసత్యాలు, ధర్మధర్మాలు కలగాపులగంగా ఉన్నాయి నిష్పత్తుల తేడాతో అన్న అభిప్రాయంతో ఉన్నవాణ్ణి.
3. ఆస్థిక - నాస్థిక ధోరణులతో ముడిపెట్టి చూసుకుంటే, నేను నాస్థికుణ్ణికాదు, ఆస్థికుణ్ణీకాదు. ఆ రెండు పక్షాలూ ఇంకా అనిర్ధారితాలనదగ్గ థలోనే ఉన్నాయి అంటున్నవాణ్ణి. అంటే నిర్జీవం నుండీ జీవం వచ్చిందని గానీ; జీవం అభౌతికం, అది దానంతటికదే ఒక స్వతంత్ర ద్రవ్యం లేదా దేవుడే జీవాన్ని సృష్టించాడు అన్నది గానీ శాస్త్రీయంగా నిరూపణకాలేదిప్పటికి అంటున్నవాణ్ణి.
4. మాకు ప్రమాణాలు మూడు. ప్రత్యక్షానుమానశబ్దాలన్నవే అవి. మూటి ద్వారా ఒప్పుజ్ఞానం కలగవచ్చు, తప్పుజ్ఞానం కలగవచ్చు. కనుక, కలిగిన జ్ఞానం సరైందా?కాదా? అన్నది పునఃపరిశీలన చేసి తేల్చుకోవలసిందే.
5. సత్యాలు మారవు, ధర్మాలు దేశకాలానుగుణ్యత కలిగి ఉంటాయి.
6. ఆస్ధికులంటున్న మాటలైన' పుట్టకపూర్వం - మరణానంతరం నేనేమిటి?' అన్న విషయాలు మా లెక్కన తెలియనివీ, తెలియలేనివి కూడా.
7. ఇప్పుడు ఉనికిలో లేనివి, ఇప్పటికి ఉనికిలోనికి రానివీ అనదగ్గ అంశాల సత్యాసత్యాలు నిర్ధారించడం కుదరదు. ప్రయోగావకాశాలుగానీ, పునఃప్రయోగార్హతగాని లేని వాటిని సత్యాసత్యవివేచనకులోను చేయలేము. ఇది చాల కీలకం. ఇది తప్పా? ఒప్పా? తేల్చుకోండి.
8. మాకు, తాత్విక క్షేత్రానికి సంబంధించిన ప్రధాన పదార్ధ వర్గాలు ఐదు. వస్తు ద్రవ్య గుణ క్రియా సంబంధాలని
9. చర్చావేదిక యోగ్యమైనదై యుండాలంటే (ఎ) భాషా నియమాలు, (బి) వాద నియమాలు, (సి) విచారణ నియమాలు (డి) నిర్ధారణ నియమాలు అన్న వాటితో కూడిన చర్చావేదిక నియమనిబంధనలుండి తీరాలి.
10. ఒప్పులని తేలిన వాటిని స్వీకరించడానికీ, తప్పులని తేలిన వాటిని విడిచి పెట్టడానికీ, ఇంకా తేలని వాటిని అనిర్ధారితాల జాబితా క్రిందికి చేర్చడానికి, మండలి సర్వదా సిద్దంగా ఉంటుంది. మీరూ అలాగే ఉండాలంటుంది.
ఇక పి.డి. సుందర్రావుగారిని ఉద్దేశిస్తూ నాలుగు మాటలు
అయ్యా సుందర్రావుగారూ!
నా లేఖను స్వీకరించకుండా తిప్పిపంపడం మీలో ఎంతో కొంతైనా అనైతికం పాలు ఉందనడానికి చక్కనిరుజువు.
నిజానికి ఏ ధోరణికి ప్రాతినిధ్యం వహించే వారైనా ఆ భావజాలాన్ని ఇతరుల కందించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. తపన ఉంటే తప్పక వినియోగించుకుంటారు. కానీ మీరు, వాడు నాకు చాలడు, వీడు నాకు చాలడంటూ ఆ అవకాశాలన్నింటినీ నెట్టి పారేసుకుంటున్నారు. కొట్టిపారేస్తున్నారు.
ఈ క్షేత్రంలో లబ్దప్రతిష్టులైన వారిలో కొందరు, ఎవరు చెప్పారన్న దానికివిలువ నివ్వకు, ఏమి చెప్పారన్నదానినే పట్టి చూసి విలువలు కట్టు అనన్నారు.
యుక్తియుక్త ముపాదేయం వచనం బాలకాదపి!
అన్యత్తృణమివ త్యాజ్యమప్త్యుక్తం పద్మజన్మనా!!
సబబైన మాట, (యుక్తి సహమైన మాట) పిల్లవాడు చెప్పినా స్వీకరణయోగ్యమైనదే అవుతుంది. అట్లు కానిది అంటే సబబుకానిమాట ఎంతవాడు (పెద్దవాడు) చెప్పినా గడ్డి పరకతో సమానమే అవుతుంది.
''నా మీద ఉన్న గౌరవం వల్ల, నా మాటలకు విలువలనాపాదించకు,
అవి పరీక్షకు నిలుస్తాయోలేదో పట్టి చూడు గట్టివైతే స్వీకరించు'' అన్నాడు బుద్దుడు.
''ఉనికిలో ఉన్న సిద్దాంతాల నన్నంటినీ నిర్ధాక్షిణ్యంగా విమర్శించు'' అన్నాడు మార్క్సు
సంశయించక విచారించుటకుదరదు. విచారించక నిర్ణయించుటకుదరదు. కనుక తత్వ నిర్ణయానికి సంశయించుటే ఆరంభస్ధానం అంటాడు న్యాయదర్శన కారుడు.
మీ సింహగర్జన ముఖం చూశాను. ప్రపంచ మేధావులారా! ఖబడ్దార్! అన్న అరుపునూ కన్నాను
వెంటనే భర్తుృహరి సుభాషిత మొకటి గుర్తుకొచ్చింది.
యధాకించి జ్ఞో-హం గజమివ మదాన్ధః సమభవం
తదా సర్వజ్ఞో- స్మీత్యభవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కంచి ద్భుధజన సకాశాదవగతః
తదా మూర్ఖో- స్మీతి జ్వరవ మదోమే వ్యవగతః
తెలివియొకింత లేనియడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితిన్ దొల్లి, యిప్పుడున్
జ్వలమతులైన పండితుల సన్నిధినించుక బోధ శాలినై
తెలియని వాడనైమెలగితిఁ హతమయ్యె నితాంతగర్వమున్
తాత్పర్యము (తొలి సగభాగం) : వాస్తవంగా అల్పబుద్ధికలవాడనైయున్న థలో మధాందతలో అంటే మధంచేత ఏర్పడిన గ్రుడ్డితనంతో, కన్నూమిన్నూ కానక సర్వజ్ఞునిలా ప్రవర్తించాను. (మలిభాగం) : కాలాంతరాన లభించిన బుద్ధిమంతుల సహచర్యం వలన ఒకింత బుద్ధిని పొందాక నిజంగా తెలియవలసింది చాలా వుందని తెలియడంతో, తెలియని వాడనైనాను. తెలిసిన వాడినన్న మధంపోయి గర్వము నశించింది.
ఇందులోని తొలి సగభాగం మాత్రమే మీకు వర్తిస్తుంది. మలిభాగం పని ఇంకా జరగవలసే ఉంది.
కానీ; ఉజ్వల మతుల సన్నిధికి చేరే అవకాశాల నన్నింటిని మీకు మీరే మూసేసుకున్నారు గనుక ఆ పని జరిగే అవకశమూ కనబడడం లేదు. ఏమి జరగనున్నదో వేచి చూడాల్సిందే
ప్రపంచ మేధావులంతా ఏమి చేశారండీ సుందర్రావుగారూ! వారందరినీ పిలిచి మరీ ఖబడ్డార్! అన్నారేమిటి? కపట మేధావులారా! ఖబడ్దార్ ! అనుంటే మీదగ్గరంత సత్తా ఉన్నా లేకున్నా, మీ హృదయాన్ని అర్ధం చేసుకునే అవకాశముండేది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలన్నట్లు ప్రపంచ మేధావులారా! వందనాలు అభినందనాలు అని కదా అనుండాలి. మీరన్న ఈ మాటను గమనించాక. వెంకటాద్రి గారు మిమ్మల్ని మతిచెడినవాడనడంలో బేసబబేమీ లేదనిపించింది.
అలానే మోషే, ఏసు తరవాత బైబిలు తెలిసినవాణ్ణి నేనేనన్న ప్రకటనను, దానిని విని తెగ సంబరపడిపోతున్న మీ మూకను చూశాక మరో ఉపనిషత్సూక్తీ స్మరణకొచ్చింది.
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితమ్మన్యమానాః!
దంద్రమ్యమాణాః పరియన్తి మూడాః, అంధేనైవనీయమానా యథాంధాః!!
అజ్ఞానాంధకారమనే చీకటిలో తిరుగాడుతూ, తామంతవారం, ఇంతవారం, అంటూ తమను తామే పొగడుకుంటూ, ప్రకటించుకుంటుండే వారి వెంటబడి, వారి చుట్టూ తిరిగే వారిని చూస్తుంటే గుడ్డివాడి వెంట పడిపోయే గుడ్డివాళ్ళ చందాన ఉందది, అంటున్నాడు రుషి.
నాకు యోగవిద్య నేర్పిన గురువుతో ఒకనాడు తాత్వికాంశాలపై వివాద పడ్డాను. ఆ సందర్భంలో ఒకింత ఆవేశంగా అయ్యా ఈ వివాదాన్నలాఉంచండి. ఒక మార్గోపదేశకునిగా మీరు నాకు చెప్పాలనుకుంటున్న సారభూతమైన ఒక్క మాట చెప్పండి చాలు అన్నాను తీవ్రంగా. దాంతో ఆయనా వివాదాన్నాపి ఒకింత తడవు మౌనంగా ఉండి, నిదానంగా ప్రశాంత చిత్తంతో, అయితే విను సురేంద్రా! ఆత్మ స్తుతికి, పరనిందకు దూరంగా ఉండు, అని చెప్పారు. నేనూ నిదానంగా ఆవేశాన్ని విడచి ఒకటికి నాలుగు సార్లు ఆ మాటను గురించి ఆలోచించాను, ఆ వాక్యార్ధాన్ని ఆచరణలో పెట్టడం ఎంతకష్టమో, ఎంత ప్రయోజన కారో, అది ఆత్మాధిక్యతా భావం అన్న ప్రమాదంలో పడిపోకుండా వ్యక్తిని ఎలా నిలపగలుగుతుందో గమనించాక, ఆయనపై నాకున్న గౌరవం రెట్టింపయ్యింది. దాన్ని ఆచరణలో పెట్టే సాధన ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. వెనకటికంటే ఒకింత పరవాలేదని అనిపిస్తున్నా, అందులో పూర్ణత ఇంకారాలేదన్న నిజాన్నీ, గుర్తిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. ఆ సూక్తి మూలంగానే అనంతర కాలంలో మండలి జీవన శైలిలోనికి రెండు నియమాలు చేర్చుకోగలిగాం.
1) పొగడొద్దు పొగిడించుకోవద్దు, తెగడొద్దు తెగిడించుకోవద్దు
2) గుర్తింపు కోరవద్దు. గుర్తింపు కొరకు పనులు చేయవద్దు.
ఆ సూక్తీ, ఈ నియమాలూ మమ్ములను దురహంకారులుగా తయారవకుండా చాలవరకు కాపాడుతూ వస్తున్నాయి.
ఆత్మ విమర్శ చేసుకోగల ధైర్యం ఉంటే ఒక్కసారి వెనుతిరిగి చూసుకోండి. నిజానికదంత తేలికగాదు.మీ రచనలు చూస్తున్న కొద్దీ ఈ మధ్యకాలంలో, ఇంత స్ధాయిలో, ఆత్మస్ధుతీ, పరనింద చేసిన వ్యక్తి లేరని నాకు అనిపించింది. నిజానికి మీ గురించి మీరు అంత డప్పు కొట్టుకోవలసిన అవసరం గాని, అకారణంగా, వారూ, వీరని లేకుండా, అందరినీ కట్టగట్టి అంతగా నిందించాల్సిన అవసరంగానీ ఉందా? విజ్ఞులుమెచ్చని ఈ మీ అవజ్ఞతతో కూడిన పోకడ మందమతులకు వందనీయంగా ఉండవచ్చునేమోగాని, సారగ్రహీతల మధ్య నిందార్హమైనది మాత్రమే.
సత్యాన్వేషణాతత్పరత ఉన్న వారి మధ్య, ఒక ప్రకటితాభిప్రాయం సరైందో కాదో తెలుసుకోవడానికి గానీ, తేల్చుకోడానికి గాని తొడగొట్టడాలు మీసాలు మెలేయడాలు, సవాళ్ళు విసరడాల అవసరమే మొచ్చింది. సౌమనస్యంతోటే ఇరువురూ దానిని సత్యాసత్య పరీక్షకులోను చేసి, సత్యమైతే స్వీకరించడం, అసత్యమైతే విసర్జించడం చేసి, సరైనదిశగా ఇరువురూ సాగిపోవచ్చుకదా! దీనిని తర్కపరిభాషలో వాదం అంటారు.
న్యాయదర్శనాన్ననుసరించి విచారణ ప్రక్రియలు మూడు, (1) వాద ప్రక్రియ (2) జల్ప ప్రక్రియ (3) వితండ ప్రక్రియలని. అందులోని వాద ప్రక్రియంటే ఒక తెలిసినవాడు తెలుసుకోగోరినవాడు అన్న జంటగానీ, ఇరువురు తెలుసనుకుంటున్న వారుగానీ, తెలుసుకోవాల్సిన విషయాన్ని నిర్ణయించుకుని పరిశోధనకు పూనుకున్న ఇరువురుగానీ సత్యమేమిటన్న దానికై చేసే విచారణ అని అర్ధం.
ఇక జల్పం అన్నది, జిగీషా ప్రవృత్తితో పోటీ పడి చేసే విచారణ ప్రక్రియ. దీనిలో గెలుపే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇందులో సత్యం ఆవిషృతమై గెలవాలనే వారూ ఉండవచ్చు. సత్యానికేమైనా పరవాలేదు. నేను గెలిస్తే చాలునను కునే వారూ ఉంటారు. ఈ క్షేత్రంలో అధమ వైఖరీ ఒకటుంటుంది. ఆ స్వభావం కలవాళ్ళకి తాను గెలవకున్నా ఫరవాలేదు, ఎదుటివాడు ఓడిపోతే చాలునని ఉంటుంది.
ఈ రకం తాను ఓడించాలనుకుంటున్నవానిపైకి ఇతరులను రెచ్చగొట్టి, యుద్దానికి ఉసిగొల్పే పని చేస్తుంటారు. ఒకింత కటువుగా ఉన్నా ఈ సందర్భంలో అలాంటి పాత్రనే పోషించారు జగద్గురు గారు. బైబిలును కాదనేవారు ఓడిపోవాలి. తానుగా వాళ్ళని ఓడగొట్టలేను ఎవరోఒకరాపని చేస్తే బాగుండును అనుకుంటున్న ఆయనకు మీరు (సుందర్రావుగారు) కనపడ్డారు. అదన్నమాట విషయం.
3-7-2012 ఈనాడు నల్గొండజిల్లా దినపత్రికలో ఒక సూక్తి కనపడింది.
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిస్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషి అవసరం - సోక్రటీస్
ఎంత చక్కటి, చిక్కటి సూక్తి ఇది. కానీ సుందర్రావుగారూ! ఇందులో ఒక్క లక్షణమూ మీకు ఉన్నట్లు కనబడదు మీ రచనలు గానీ, ప్రసంగాలుగానీ చూస్తుంటే, మీ వెంటబడినడుస్తూ, పరిగెడుతూ ఉన్నవాళ్ళకు ఒక్కసారైనా, కొందరికైనా మీ పోకడపట్ల ఏహ్యభావం ఎందుకు కలగడం లేదో అర్ధం కావడం లేదు.
సోక్రటీసు ప్రపంచ ప్రసిద్ది గాంచిన మేధావుల్లో ఒకరు. తెలిసో తెలీకనో, పట్టించుకునో, పట్టించుకోకుండగనేనో ఆయననూ, ఆయన లాటి ప్రాతఃస్మరణీయు లెందరినో, మీ దుందుడుకుపోకడలో భాగంగా ఖబడ్దార్! అనేశారు. ఆ ఒక్క ప్రకటన చాలు పైనన్న సూక్తిలోని మంచి గుణాలు మీకు లేవనడానికి. క్రమంగా మీరు ప్రకటించిన అభిప్రాయాలలోని సబబు బేసబబుల్ని, తెలిసీ తెలియని తనాన్ని విపర్వయ దురాగ్రహాన్నీ గురించి కూడా క్రమంగా వెళ్ళడి చేసి, పలుధోరణులకు చెందిన ఆలోచనాపరుల ముందు పెడతాను. ఆపై వారి స్పందనలనూ వివేకపధంలో ప్రచురిస్తాను. వాటిపై నా పక్షాన్నీ ప్రచురిస్తాను.
ఒక్కమాట ! అయ్యిందేదో అయ్యింది. గతం గతః! వర్తమానమే మన చేతిలో ఉంది. దానిని వివేక పధానికి మరల్చి మంచి గమ్యాలవైపు సాగిపోవడమే వివేకవంతం. వివేకమూ, సామాజిక బాధ్యత కల సంఘజీవులు తాము బుద్ది గరవడానికీ, శక్తి మేర ఇతరులకు బుద్ది గరపడానికీ కూడా సిద్దంగా ఉంటారు. ఉండాలి. భారతీయ తాత్విక సాంప్రదాయంలో ఒక ఉదాత్త భావన ఉంది. అంతకు మించిన ఉన్నత మార్గ దర్శకత్వం మరెక్కడాలేదు. దానితో సమమైంది ఉంటే ఉండవచ్చనేమో! మీరూ ఆలోచించండి.
సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం.
సత్యం విషయంలో ఏమరపాటు పడకూడదు. ధర్మం విషయంలోనూ అలసత్వం కూడదు. అంటూనే ఈ రెంటికీ ఆధారమైన తెలుసుకోవడం తెలియజెప్పడం అన్న పని విషయంలోనూ ఏమరుపాటు కూడదు. ఎంత ఉదాత్తభావన ఇది. నా వరకు నాకిది శిరోధార్యం. ఆదిశగా నడవడానికి ఇప్పటికీ శక్తివంచన లేకుండా సాధన చేసుకుంటూ సాగుతున్నవాణ్ణి నేను. మీరీక్రమాన్ని అనుసరించగలరేమో చూడండి. దీనిని అనుసరించగలననిగనక మీరంటే, మన మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరచుకుని పరస్పరం తెలియ జెప్పుకునేందుకు, తెలుసుకునేందుకూ యత్నిద్దామంటేనూ, నా వరకు నేను మనస్ఫూర్తిగా సిద్దంకాగలను. కాదని జల్ప రీతే నాదని మీరంటేనూ, సత్యధర్మాల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉండగలను. డొంకతిరుగుడు మాటలో, విషయాన్ని ముగ్గులోనికి రాకుండా చేసే ఎత్తుగడలో మన మధ్య వద్దు. వాస్తవాలను వెలికి తీసి సమాజానికి అందించాలి. అది సంఘహితైషులైన మేధావుల బాధ్యత, కర్తవ్యం కూడా అన్న దృష్టి నుండే ఇవన్నీ వ్రాస్తున్నాను. మీరంగీకరించాలే గాని ఈ లక్ష్యంకోసం, ఈ స్ధాయి కలిగిన సమావేశాన్ని ఏర్పాటు చేమగలను. ఈ అంశాలతో, ముడిపడి ఉన్న వివిధ ధోరణుల ముఖ్యులనూ సమావేశానికి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తాను.
సత్యాన్నాస్థిపరోధర్మః! ధర్మస్యజయోస్తు, అధర్మస్యనాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్యకళ్యాణమస్తు!
సత్యం కంటె మించిన ధర్మంలేదు. ధర్మం జయించుగాక, అధర్మము నశించుగాక, ప్రాణులయందు పరస్పరం సద్భావన నెలకొనును గాక, విశ్వమంతటికీ మేలొనగూడును గాక.
ఉచితంగా స్పందిస్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవ్.
ఉద్యమ సమాచారం
స.హ.ప్ర.ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ 22,23 తేదీలలో హైదరాబాద్‌లోని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యాలయంలో జంపా క్రిష్ణకిషోర్ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబు, ఉపాధ్యకక్షులు డా|| వి.బ్రహ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణంరాజు, పి. వేణుగోపాల్‌రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్, టి.ఎల్.నరసింహారావు, బి.లోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సంస్థాగతంగా జన విజ్ఞాన వేదిక (జెవివి), సత్యాణ్వేషణ మండలి, జైభారత్, లోక్ సత్తా ఉద్యమ సంస్థ, ఎన్.ఎ.పి.ఎమ్, ఎమ్.వి.ఎఫ్, ఏకలవ్య, కన్స్యూమర్స్ అవేర్‌నెస్ సంస్థలనుండి పాల్గొన్నారు. జిల్లాల వారీగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపూర్, కడప, ఖమ్మం, కర్నూలు, ఆదిలాబాద్, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుండి 48 మంది హాజరయ్యారు. హాజరైన ప్రతినిధులు ఏ జిల్లాకు, ఏ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో స్వపరిచయాలు చేసుకున్నారు. 26 మంది తమ బ్లడ్ గ్రూప్‌లు తెలుసుకొని, గ్రూప్‌లు ఏ విధంగా చేయవచ్చో స్వయంగా చేసి తెల్సుకొన్నారు.
ఈ రెండు రోజుల సమావేశంలో నిర్మాణం మీద, భవిష్యత్ కార్యక్రమాల విూద తీసుకున్న నిర్ణయాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
1. సభ్యత్వం వ్యక్తిగతంగా 2 సం||లకు రూ.100/-, సంస్థాగతంగా రూ.1000/- ఉంటుంది.
2. సంస్థల సభ్యులు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికలో సభ్యులుగా మారినా, మండల స్థాయి నుండి రాష్ట్ర స్ధాయి వరకు సంస్థాగత పదవులు / బాధ్యతలు నిర్వహించాలంటే వ్యక్తిగత సభ్యత్వం వుండాలి.
3. 2011-12 సం||రంలో సభ్యులుగా చేరిన వారికి మాత్రం 2012వ సం|| డిసెంబరు / జనవరి 2013లో జరిగే మహాసభతో పాటు 2014వ సం||రము వరకు సభ్యత్వం ఉంటుంది. తిరిగి 2014-15 సం||రపు షెడ్యూల్ ప్రకారం సభ్యత్వం తీసుకోవాల్సి వుంటుంది. (ఇప్పటివరకు సభ్యత్వ పుస్తకాలు తీసుకోని జిల్లాలు రాష్ట్రకేంద్రం నుండి పొందగలరు)
4. మండల కమిటీ ఏర్పడాలంటే 15 మంది సభ్యులుండాలి. 3 గ్రామ పంచాయితీలలో సభ్యత్వం కలిగియుండాలి. కనీసం ఒక్కరైనా మహిళా ప్రాతినిధ్యం వుండాలి. ఈ విధంగా లేనిచోట్ల కన్వీనింగ్ కమిటీగా ఏర్పాటుచేసుకోవచ్చు.
5. జిల్లా కమిటీలో 2 డివిజన్లలో మండల కమిటీలుండాలి. 5 మండలాల్లో సభ్యత్వం కలిగి వుండాలి.
6. రాష్ట్ర మహాసభ డిసెంబరు 2012 / జనవరి 2013 నాటికి ముందుగా 3 నెలల్లో సభ్యత్వం పూర్తిచేసుకోవాలి. ఈ మహాసభ డిసెండరు 2012 నాటికి జరిగేటట్లయితే సెప్టెంబరు 2012 నాటికి సభ్యత్వం పూర్తిచేసుకొని మండల, జిల్లా కమిటీలను / మహాసభలను పూర్తిచేయాలి. (సభ్యత్వం మాత్రం నిరంతరం చేర్పించుకోవచ్చు).
7. సభ్యత్వ రుసుంలో మండలానికి 50%, జిల్లాకు 40%, రాష్ట్రానికి 10% చెందుతుంది.
8. వివిధ రాజకీయ పార్టీలలో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించేవారు సభ్యులుగా చేరవచ్చు. కాని స.హ.ప్ర.ఐ. వేదిక సంస్థ ప్రధాన బాధ్యతలు వహించరాదు.
9. మండలం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణంకు ప్రాధాన్యతనిస్తూ కల్సిపోవటం, కలుపుకుపోతూ పనిచేయాల్సి ఉంటుంది. నిర్మాణంలో పొరపాట్లు వుంటే వాటిని సరిచేసే ట్రబుల్ షూటర్లను గుర్తించి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారికి బాధ్యతలు అప్పగించి ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
10. జిల్లా ఆఫీసుబేరర్లుగా ఎన్నికైన ప్రాథమిక శిక్షణ పొందివుండని వారు తరువాత 3 నెలల్లోపు ప్రాథమిక శిక్షణ పొందాలి.
11. జిల్లా, రాష్ట్రంలో పనిచేయగలిగిన ఆఫీసు బారర్లు నెలలో కనీసం 5 రోజుల సమయం ఈయగలవారై ఉండాలి.
12. సమాచారం కోసం దరఖాస్తులు, సంఘం కోసం ఆర్థిక వనరులు సవిూకరించుకోవాలి.
ప్రాథమిక శిక్షణా తరగతులు జూలై 6,7,8, తేదీలలో మరియు 20, 21, 22 తేదీలలో దోరకుంటలోని వేదిక కార్యాలయంలో మరియు ఆగస్టు 10, 11,12 తేదీలలో కర్నూలు డా||వి. బ్రహ్మారెడ్డి గారి హాస్పటల్‌లో ఈ శిక్షణ వుంటుంది. మీ జిల్లాల నుండి పాల్గొనేవారి పేర్లు తెలుపవలసిందిగా కోరడమైనది.
No comments:
Post a Comment