సంఘ హిత కాంక్షా యోచనాశీలత కల పాఠక మిత్రులారా!
వర్తమాన సమాజం బాగానే ఉంది. దీనిని ఇలానే ఉంచుకుందాం. ఉంచుకోవచ్చు అన్నమాట సమాజ స్థితినీ, గతినీ పట్టిచూస్తున్నవాళ్ళు అనగలిగే పరిస్థితి లేదనాలి. అందరూ బాగుండాలి అని కోరగలిగే వాళ్ళలో ఇది నిర్వివాదాంశమంటాను. ఏమంటారు? నా ఈ మాట వాస్తవాలను తెలియజేస్తోందా? లేదా?
గతానికి సంబందించి మత ప్రాతిపదికన ఏర్పడ్డ ధర్మశాస్త్రాలను, వాటిననుసరించిన సమాజాలను పట్టిచూస్తే అందులో ఏదీ ఈ నాడు మనం యధాతధంగా వాటినే తిరిగి అనుసరించవచ్చు అనడానికి వీలుగా లేదు. ఎందుకంటే ప్రధానంగా అవన్నీ (1) రాజరిక వ్యవస్థనంగీకరించిన నియంతృత్వరూపాలు (2) దైవ విశ్వాసం ఆధారంగా ఏర్పడ్డ సమాజాలు, ధర్మశాస్త్రాలు (3) మనిషెందుకలాగే ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించగూడదు? అన్న ప్రశ్నకు, దేవునికి ఇష్టం గనుక అనో, మరణించాక నీకు ఫలానిది ప్రాప్తించాలిగనుక, ఫలానిది ప్రాప్తించకూడదు గనుక అనో మాత్రమే చెపుతాయి.
ఈ లోకంలోని నీ ప్రవర్తనకంతటికీ నీవు చేయాల్సిన పనులన్నీంటికీ పరలోకమే గమ్యంగా రూపొందించబడ్డపోకడలవి. ప్రపంచ ప్రధాన మతాలుగ ఈనాటికీ చెలామణి అవుతున్న (1) వేదం ప్రమాణమంటూనే బహుదేవతారాధనే ప్రధాన లక్షణంగా కనిపించే హైందవం (2) బైబిలు ప్రమాణమంటూనే యూదులు - క్రైస్తవులుగ ఒకటి కాలేనంతగా వేరుపడిన రెండు కూటాలు, (3) ఖురాన్ ప్రామాణిక మంటూ ఇస్లాం పేరున ఉనికిలోకి వచ్చిన షియాలు - సున్నీలుగ విడిపోయి సాగుతున్న మహమ్మదీయము అన్నమూడూ మౌలికంగా ఈ లక్షణాన్ని కలిగి ఉన్నవే.
ఈ పోకడలలోని ప్రధానలోపం, వివేకం అంగీకరించడానికి వీల్లేని నిబంధన అయిన దైవాన్ని అంగీకరించడం. దైవ విశ్వాసిగ ఉండడం మిగిలిన అన్ని ధర్మాలకు మూలధర్మం అనడం దగ్గర ఉంది. వైదికం, బైబిలీయం, ఖురానీయం అన్న మూడు ప్రధాన పోకడలూ గ్రంథాలాధారంగా చలామణి అవుతున్నవే. అందులో వందలరకాల వైవిధ్యంతోనూ, ఒకటిరెంటి మధ్య వైరుధ్యరూపమూ సంతరించుకున్న పరిస్థితిలోనూ మా ధోరణికి మూలధారం వేదమే నంటూ చెప్పుకుంటూ ఈ నాడు హైందవం (హిందూ ధర్మం లేదా హిందూ మతం) అని వ్యవహరింపబడుతున్న బహుదేవతారాధన, విగ్రహారాధన, అవతారాల ఆరాధననేగాక, యోగులు, సిద్ధులు, సాధుసంతుల ఆరాధన, గ్రహాల ఆరాధన, గ్రామదేవతల ఆరాధన, పేరంటాళ్ళ ఆరాధన లాంటి వాటినీ కలగలుపుకుని కొనసాగుతున్నది ఒకటి. నిజానికి దీనిని ఒక కట్టగా చెప్పడానికి వీలులేని పరిస్థితే ఉన్నా, ఆయా ఆరాధనా రీతులలోని వ్యత్యాసాల వల్ల వివిధ మతాలుగా వేరు వేరుగనే ప్రకటింపబడుతూనే వస్తున్నా, వాటిన్నంటి మధ్యనా, ఇదంతా కొన్ని సాధారణ సూత్రాలనంగీకరించిన జన సమూహాలకు చెందిందిగా సంప్రదాయం చెపుతూ వస్తోంది. ఎలాగంటే ఈశ్వరుడు మీకు సంబంధించిన వాడేనా అని ఒక శైవుణ్ణి, వైష్ణవుణ్ణి, ఇలా ఆయా దేవీదేవతల నారాధించే వారినెవర్ని అడిగినా, వారంతా అవును ఆయన మాకు సంబంధించినవాడేనంటారు. అలాగే మూడు కోట్లో ముప్పై మూడు కోట్లో ఇంకా ఎక్కువగానో చెప్పబడే ఏ దేవుని, దేవిని, దేవతలను, అవతారాలనబడే వాళ్ళను, గురించి అడిగినా, అవును వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళేనంటారు. అదిగో అక్కడుంది ఈ దేశపు ఆస్థికత అంతస్సూత్రం. దేవుడంటే ఏమిటి? అతనికుండాల్సిన లక్షణాలు, సామర్థ్యాలు ఏమిటి? అతనికి మనతో ఉన్న సంబంధమేమిటి? అన్న ప్రశ్నలకు సిద్ధాంతస్థాయిలో, ఈ వైఖరి నవలంభించే ఏ గుంపు దగ్గరా సమాధానం ఉండదు. మరి వీళ్ళంతా గొడవల్లేకుండా వేల సం||లుగా ఎలా సహజీవనం చేయగలుగుతున్నారు? ఆయా గ్రంథ రచయితలు జనాన్ని పరస్పరం కొట్టుకు చావకుండా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు కొనసాగుతుండే లాగనో, ప్రక్కవాడిష్టానికి వాణ్ణి సాగ నిచ్చేలాగనో, ఓరిమివహించేలాగనో జనాల మనస్సులనెలా సిద్దం చేయగలిగారు?
దీనికి సమాధానం చెప్పాలంటే భారతీయఆస్థిక సాహిత్యమంతటినీ అవసరమైన మేర స్పృశించి సాధారణ సూత్రాన్ని కనుగొనాల్సి ఉంటుంది.
1) దేవుడొక్కడే అన్నదాన్ని సర్వులూ అంగీకరిస్తారు. అతడు సాకారుడూ, నిర్వికారుడూ అని కూడా అంగీకరిస్తారు. ఒకరిద్దరు దేవుడు వ్యాపకుడు కనుక నిరాకారుడు మాత్రమేనంటారు.
2) సామర్ధ్యాల హెచ్చుతగ్గులతో అనేక దేవీదేవతలున్నారనీ అంగీకరిస్తారు.
3) వాళ్ళందరి మధ్య అటుబంధుత్వాల రూపముగాని, ఇటు స్నేహ సంబంధాల రూపంలోగాని, విశ్వవ్యవస్థల వారి వారి పనుల - కర్తవ్యాల- పరంగా అధికారాలు, శక్తుల రూపంలోగాని ఒక మొత్తంలో భాగాలుగ చూడడమనే చిత్రాన్నివ్వగలిగారా రచయితలు.
4) ఎ) ఏకం సత్‌విప్రా బహుదావదంతి!
బి) సర్వదేవ నమస్కారాం కేశవం ప్రతిగచ్చతి!
సి) మమవర్త్మాను వర్తం తేమనుష్యాపార్దసర్వశః!
డి) శివాయవిష్ణురూపాయ, శివరూపాయవిష్ణవే!
ఇ) శైవులు, విష్ణువును అత్యంత దగ్గరైన (ఆంతరంగిక) శివభక్తుడు అని చెపుతారు.
ఎఫ్) వైష్ణవులు, శివుణ్ణి విష్ణుభక్తునిగ - నిత్య సూరులలో ఒకనిగ అంగీకరిస్తారు.
జి) త్రిమూర్తుల మధ్యన, వాళ్ళ భార్యల మధ్యన బంధుత్వాలను కలుపుతారు.
హెచ్) ఈ లోకంలో మనుషులుగ ఉన్నవాళ్ళకూ పైలోకంలోని ఏదోఒక దేవుని సంబంధాన్ని అంటగడతారు.
మొత్తం మీద వీళ్ళందరి మధ్య రకరకాల బీరకాయపీచు లాంటి సంబంధాలు నెలకొని ఉన్నట్లు తెలుస్తుందా సాహిత్యాన్ని పట్టిచూస్తే.
దానికి తోడు
1) వర్షాలు కావాలి - వరుణుణ్ణో, ఇంద్రుణ్ణో అడుగు
2) పుత్రులు కావాలి - పలాని దేవుణ్ణి ఫలాని పద్ధతిన ప్రార్థించు
3) చదువు కావాలి - సరస్వతిని కొలువు, ధనం కావాలి - లక్ష్మిని అడుగు, అంటూ నీకేమి కావాలో తేల్చుకుని, దాని కొరకైతే వీరిని అడుగు అంటూ ఒక సాంప్రదాయాన్ని జనసామాన్యం చేత అనుసరింపజేయడంవల్ల ఈ క్షేత్రంలోని జనం ఉన్న దేవుళ్ళ పేరున కొట్టుకోకుండడమే కాకుండా కొత్తగా వచ్చిన రానున్న దేవుళ్ళను తృణీకరించకుండా ఉండడానికీ, స్వీకరించడానికీ కూడా మానసికంగా సిద్దం చేయబడి ఉన్నారు.
ఈ వెసులుబాటు బహుదేవీదేవతారాధన అన్న విధానం వల్ల ఏర్పడింది. కనుకనే వీరశైవం, వీరవైష్ణవంలాంటి అతివాదాలు అరుదుగా మాత్రమే సంభవించాయి. అవి కూడా ఆచరణలో క్రమంగా ఒక దాన్నొకటినాశనం చేసుకునే వైఖరిని విడచి ఎవరిమానాన వారు బ్రతకడానికీ అలవాటు పడిపోయారు. ఉదాహరణకు శంకరుడు అద్వైతాన్ని చెపుతూనే షణ్మతోద్దారకునిగా గుర్తింపబడ్డాడు. శంకరుని కాలానికి ఆరుమతాలు ప్రసిద్ధిలో ఉండేవి.
ముఖ్యగమనిక :- ఈ రకమైన సంస్కృతే ఈ దేశపు గొప్పదనం అనే దృష్టి కలిగినవారు కొందరుండగా ఇదే ఈ దేశపు బలహీనత. ఇందువల్లనే దాడి స్వభావం కలిగిన ఇస్లాం, క్రైస్తవ మతాలను ఈజాతి సమర్థవంతంగా నిరోధించలేకపోయింది అనే వారూ కొందరుంటున్నారు. ఇందేది వాస్తవమన్నదానిని ప్రక్కన బెట్టి ప్రపంచ చరిత్రవైపు దృష్టి సారిస్తే మాత్రం హిందువుల మనుకుంటుండేవారు ఇస్లాం, క్రైస్తవుల మనుకుంటుండేవారిని మీరక్కడ ఉంటే నరకం తప్పదు, మాలోకి వస్తేనే రక్షింపబడతారు అని గట్టిగా పట్టుబట్టిన దాఖలాలు కనపడవు. అంత మాత్రమే కాకుండా, హైందవ మతవైఖరి ఇతరులను ఈ మతంలోకి రమ్మనకుండడమేకాకుండా, అన్యమతాలను స్వీకరించినవారిని తిరిగి తమలోకి చేర్చుకోడానికి అంతగా సుముఖత కనబరచక పోవడమూ కనపడుతుంది. ఇక్కడ నేను చెపుతున్నది శైవుడు వైష్ణవుడవడం, వైష్ణవుడు శాక్తేయుడవడం లాంటి అంతర్గత మార్పుల గురించి కాదు. ఈ రకమైన మార్పులు అరుదుగా జరిగిన సందర్భాలున్నా హైందవం నుండి తొలగినట్లు వారెవరూ తలంచలా. ఈ మధ్య కాలంలో మరి కొందరైతే మరో అడుగు ముందుకు వేసి ఈశ్వరుడు, అల్లా, క్రీస్తు ఒక్కడేననేంత వరకు తెగించారు. ఇంకొందరైతే ఓంకారాన్నీ, శిలువను, చంద్రవంకతో కూడిన నక్షత్రాన్ని కలిపి ఒక ప్రతీకను చేయడం వరకు బరితెగించారు. ఇది మృదువుగా చెపితే అతి ఉదారత క్రిందికి వస్తుందనిగాని, మొరటుగా చెప్పితే మతిస్థిమితంలేనివారి- పిచ్చివారి - ప్రలాపం క్రిందికి వస్తుందని చెప్పితీరాలి. ప్రపంచంలో ఉన్న ఏ ముస్లింగానీ, క్రైస్తవుడు గానీ, క్రైస్తవానికి ముందున్న యూదుడుగానీ వారి వారి దైవమందిరాలపైన తమ మతం అంగీకరించిన గుర్తును తప్ప మరోదాన్ని ఉంచడానికిగానీ, ఉంచవచ్చునని అంగీకరించడానికి గాని సిద్దం కాగలడా? అలా జరిగిన దాఖలాగానీ, అలా చేయడానికి మా మతానికెట్టి అభ్యంతరం లేదన్న దాఖలాలుగాని లభిస్తాయా? లభించనే లభించవు. పైగా అట్టి పని దైవవిశ్వాసానికి వ్యతిరేకం అనీ చెపుతారు ఆ గ్రంథాలను నిక్కచ్చిగా విశ్వసించేవారు.
ఎక్కడుందీ విపరీతానికి ఆధారం? మూలబలం?
బైబిలు, ఖురాన్ అనబడే రెండు మత ప్రామాణిక గ్రంథాలలోనే ఉందీ రకం పోకడకు కావలసిన ఆధారం. ఆ రెండు గ్రంథాలలోనూ నేను తప్పనీకు మరో దేవుడుండకూడదు. నన్నుగాక అన్యుని దేవునిగ అంగీకరించినవాడు సత్యాన్ని విడిచినవాడు, దైవదూరుడు, అవిశ్వాసి అవుతాడు లాంటి మాటలచే చెప్పడానికి తగినవాడై నరకానికి పోవడానికి మాత్రమే అర్హుడవుతాడు, స్వర్గానికి పోవడానికి అర్హుడుకాడు అని నిర్థిష్టంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పబడిఉంది.
విగ్రహాలను ఆరాధించినా, అన్యదేవతలనారాధించినా, శక్తి ఉండీ అవకాశం ఉండీ వాటిని నాశనం చేయకపోయినా అట్టివాడు దేవుని అనుగ్రహాన్ని పొందకపోవడమేకాక, ఆయన ఆగ్రహానికీ గురికాక తప్పదు అని చెపుతున్నాయాగ్రంథాలు. అదిగో ముస్లింల, క్రైస్తవుల పోకడ ఆధారం అక్కడుంది. ఒక మనిషిగా వారు మంచివారే అయి ఉన్నా మత విశ్వాసిగా ఆ గ్రంథ శాసనాలను తప్పుబట్టలేరు సరికదా, సూత్రప్రాయంగా అది సరైందేనన్న దృష్టికలిగి ఉంటారు.
ఇస్లాం, క్రైస్తవాలకు పరమతసహనం లేకపోవడానికి అస్సలుసిసలు కారణం ; దేవుడొక్కడే, ఆ దేవుడు మా గ్రంథంలో చెప్పబడ్డవాడు, ఆ రీతిగనున్నవాడు మాత్రమే నన్న నమ్మకంలో ఉంది. ఆ నమ్మకానికీ ఆధారం ఆ మత గ్రంథాలలో ఉంది. అదైనా అక్కడితో ఆగిందా ఆ గ్రంథ ప్రబోధం తనననుసరించని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే ఊరుకోను అనీ భయపెట్టడం వరకూ సాగింది. ఒక ఉదాహరణను సాధారణ రూపంలో ప్రస్తావిస్తాను.
బైబిలు దేవుడైన యెహోవా తననంగీకరించని వాళ్ళనూ, ఇతర దేవుళ్ళ నారాధించే వాళ్ళనూ చంపడం చంపించడం చేసినట్లు అందులోనే తట్టెడంత ఇంకా సరిగా చెప్పాలంటే బండెడు సమాచారం ఉంది. ఇదేమీ రహస్యమూకాదు, ఎవరమో కల్పించి దానికి అంటగట్టిందీకాదు. చరిత్రలోనూ ఆ గ్రంథాన్ని నెత్తికెత్తుకున్న వారు ఆయా కాలాలలో ఆపనే చేసినట్లు రుజువులూ ఉన్నై. నిజానికి యూదులు క్రీస్తును చంపించింది అతడు తామప్పటికి విశ్వసిస్తున్న నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారాలు, ప్రబోధాలు చేస్తున్నాడన్న నేపంతొనే కదా!
ఇక ఇస్లాం దగ్గరకొస్తే ఈ అంశంలో అలాంటి పనిని ముస్లింల చేత అల్లా మరింత కఠినంగా, నిక్కచ్చిగా ఆచరింపజేసినట్లు ఖురాన్‌లోనే ఆధారాలున్నై. విగ్రహాలను, మందిరాలను ధ్వంసం చేయడమన్న పని మక్కానుండే, ప్రవక్త ద్వారానే మొదలైంది. ఇది జరిగిన వాస్తవం. అనంతరకాలంలో జరిగిన యుద్ధాలన్నీ సిసలైన నాస్థికులకూ - మహమ్మదు బృందానికీ జరిగినవిగా కాక, ఎక్కువలో ఎక్కువ అన్య దేవతారాధకులకు- ప్రవక్త నంగీకరించనివాళ్ళకు - ప్రవక్త బృందానికీ మధ్య జరిగినవేనన్నది ఖురాన్ ఆధారంగానే నిర్థారించవచ్చు, ఆధునిక చరిత్ర నుండీ రాబట్టవచ్చు. ఈ దేశంలో దేవాలయాలను పడగొట్టని ముస్లిం రాజులెంత మంది ఉన్నారు? అస్సలున్నారా?
క్రైస్తవులలో ఉన్న అంతర్గత కుమ్ములాటలవల్ల జరిగిన మారణకాండను, ముస్లింలలోని అంతర్గత కుమ్మలాటలవల్ల జరిగిన హింసను గురించి నేనిక్కడ ప్రస్తావించడంలేదు. అయినా ఇక్కడ చదువరిని ప్రక్కదారి పట్టకుండ చూసేందుకుగాను ముఖ్యమైన ఒక హెచ్చరిక చేస్తున్నాను. నా ఈ హెచ్చరిక ఈనాటి బైబిలు, ఖురాన్ అనుయాయుల విషయంలో సందర్భాచితమోకాదో ఎవరికి వారే పరిశీలించి చూసుకోవచ్చు.
మా మతం పరమత సహనాన్ని ప్రధానంగా చెపుతోంది, మత సామరస్యానికి మామతంలో చాలా విశాలమైన అవకాశాలున్నాయి అనంటూ ఆ రెంటికీ చెందిన ఆధునిక వ్యాఖ్యాతలు, ప్రచారకులు తెగ ఊదరగొట్టే పని చేస్తున్నారు. హత్య చేయకూడదు. ఎవడుగాని ఒకన్ని హత్య చేసినా గ్రంథం అతణ్ణి దైవ వ్యతిరేకిగనే పరిగణించమంటోంది అనో, దేవుని సృష్టిలోని వారమైనందునగానీ, ఆది దంపతుల సంతానమేమనమందరం కనుక మనుషులందరం సోదరులమే అని గానీ గ్రంథం అంటోందంటూ వివరణలు చేస్తున్నవారంతా గ్రంథస్థ విషయాల యథార్థ్యతను మరుగుపరుస్తున్నవారే.
నరహత్య కూడదని ప్రధాన సూత్రీకరణల్లో ఒకటిగా చెప్పిన గ్రంథంలోనే దేవుని పేరున జరిగిన హత్యాకాండకు చెందిన వివరాలనంతా ఏమి చేద్దాం? హత్య అన్న దానికి రకరకాల అర్థాలు చెప్పుకుందామా? ఆ రెండు గ్రంథాల (బైబిలు, ఖురాన్‌ల)లోని వివరాల ప్రకారం జరిగిన యుద్ధాలలో జరిగిన మానవహననాన్ని 'నర హత్యల' క్రిందకు చేర్చరాదు అంటూ ఏదైన ఒక సూత్రం పెట్టుకుందామా?
ఎక్కడో ఒకటీ అరా వాక్యాలలో 'అన్య జనుల్ని ఉండనీ' లాటి వాక్యాలు ఎత్తిచూపి అదిగో మా దేవుడు పరమత సహనం కలిగినవాడు, పరమత సహానాన్ని పాటించమంటున్నవాడు అని చెప్పడం ఉందే అది అలా చెప్పే వానిలోని నిజాయితీ లేనితనాన్నో, ఆ గ్రంథాన్ని చదవాల్సినంత చక్కగా చదవని, అర్థం చేసుకోని తనాన్నో, ఆత్మవంచన చేసుకుంటూ, ఇతరులనూ వంచించే తనాన్నో పట్టిస్తుందేగాని అంతకంటే ఆ మాటలకు వేరే అర్థాలు మంచి అర్థాలు కట్టబెట్టడం అనవసరం.
మరి కొందరు ప్రచారకులైతే మరీ ఆకాశంలో విహరిస్తూ, మా మతం పొరుగువానిని నీవలె ప్రేమించమంటోంది అనో, అల్లానే అందరికీ తండ్రి కనుక మనమంతా అన్నదమ్ములం, అంటోందనో ప్రకటిస్తూ తెగ పేట్రేగిపోతుండడమూ జరుగుతోంది. నిజానికారెండు గ్రంథాలను గట్టిగా పట్టుకున్న బృందాల సాధారణ ప్రవర్తనలో ఏనాడూ అలా ప్రవర్తించిన దాఖలాలు చరిత్రలో కానరావు. పైగా ఆ రెండు గ్రంథాలలోని దేవుళ్ళే తానే సృష్టించానంటున్న అనేక మందిని క్రూరాతిక్రూరంగా చంపేసినట్టు, తనమాట వినేవాళ్ళ చేత చంపించినట్లూ సమాచారం ఉంది. కనుక ఈ సూత్రాలు గొప్పలు చెప్పుకోడానికో, ఇతరుల్ని మభ్యపెట్టడానికో మాత్రమే పనికివచ్చాయి గాని, ఆచరణకురానేలేదు చాలా సందర్భాలలో
ఆ రెండు గ్రంథాలలోని దేవుళ్ళు స్వయంగా, తనననుసరించేవాళ్ళు అలా ప్రవర్తించకుండా, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా ఓపికున్నంత కృషి చేశారు.
గ్రంథాధారం లేకుండా దాని వల్ల ప్రేరణన పొందకుండా - జరిగిన మతయుద్ధాలుంటే చూపించండి నేనూ ఒక్కసారి తిరిగి చూసుకుంటాను
మరైతే హైందవం - సనాతనం - సంగతేమిటి?
నిజానికి మతగ్రంథాల, వాటిలోని దేవుళ్ళ అనుచితవర్తనల్ని ఆ గ్రంథాల ఆధారంగానే వెలికితీసే సందర్భంలో హత్యాకాండల పరంగా చూస్తే ముందు చెప్పుకోవలసింది బైబిలు, ఖురానులే అయినా, ఈ దేశంలో ఆ రెండు ధోరణులు ప్రవేశించకముందిక్కడ కొనసాగిన మతాల గురించీ ప్రస్తావించకపోతే ఈ రచనకు తులనాత్మకత లేనట్లే అవుతుంది. ఈ దేశంలోని మతాలలో ఒక్కదేవుని విషయంలో మాత్రం బైబిలు, ఖురానులలో ఉన్నంత అన్య దేవతలపైని అసహన భావం, శతృభావం లేకపోయినా మిగిలిన మానవ సంబంధాల విషయంలో గానీ, సామాజిక వ్యవస్థా నిర్మాణం విషయంలోగాని బుద్ధున్న మనిషెవడూ అంగీకరించలేనంత అమానుష స్థాయిలో రకరకాల వివక్ష వెలుజొప్పింపబడి అమలు చేయబడ్డాయి.
కుల పునాదులపైని ఒక మంచి సమాజాన్ని నిర్మాణంచేసే అవకాశమేలేదన్న అంబేద్కర్ భావన 100% వాస్తవాన్ని చూపేటిదే. ఎన్ని ఆదర్శ సూత్రాలు వల్లించినా, మనిషిని మనిషిగా చూడలేని మతం హృదయమున్న వాడెవడూ అంగీకరించకూడనిదే. ఆ లెఖ్ఖలో అన్ని మతాలూ ఏదోరకంగా మనుషుల మధ్య అంతరాలు అంగీకరించినవీ, నెలకొల్పినవే. అయినా, ఈ దేశానికి సంబంధించిన మతాలన్నింటిలోనూ సామాన్య రూపంలో ఆచరింపబడ్డ కుల దొంతరులంత దుర్మార్గపు భావన వాటికి లేదు. దానికి మించిన తప్పుడు నిర్మాణంగానీ, కనీసం దానికి తుల్యమైన తప్పుడు నిర్మాణంగాని రూపొందించడం సాధ్యంకాదు. సమన్యాయాన్ని సాధించే విషయంలో సమష్టి వికాసాన్ని సాధ్యంగా పెట్టుకున్న సందర్భంలో అట్టిది సాధించుకోడానికి బానిస వ్యవస్థ అడ్డుపడిన దానికంటే, బలంగా కులవ్యవస్థ అడ్డుపడుతుంది. బానిసవ్యవస్థను నిర్మూలించుకోవడంకంటే కులవ్యవస్థను నిర్మూలించడం కష్ట సాధ్యమవుతుంది. ఇంకా ఖచ్ఛితంగా చెప్పుకోవాలంటే, కులనిర్మూలన దాదాపు అసాధ్యమనడానికి తగినంత దుస్సాధ్యమైనది అనాల్సిందే.
ఒక మనిషిని చటుక్కున చంపేయడంకంటే అతణ్ణి మనిషికంటే తక్కువగా పరిగణిస్తూ చావనీయకుండా బ్రతికుంచడం పెద్ద హింస అవుతుంది అట్టిపని కౄరత్వంతో కూడిన పాశవికమైన దుర్మార్గపు చర్య అవుతుంది. అంతటి నిందాత్మకమైన నిర్మాణాన్ని వేలసం||లుగా ఈ సమాజంపై పెట్టి ఒక వంక జాలి, దయ, కరుణ, సహానుభూతి లాంటి మాటలువల్లిస్తూనే అందరిలో దేవుడున్నాడు, దేవునిలో అందరూ ఉన్నారు లాటి ఆచరణకురాని, ఆకాశమంత ఉన్నతమైన భావాలను సాహిత్యంలో చొరబెట్టి, మరో వంక ఈ జాతి ఉన్నంత కాలం తమగతాన్ని చెప్పుకుని సిగ్గుపడేలా, చెప్పుకోడానికే సిగ్గుపడేలా, కథనడిపించిన వైపరీత్యపు భావజాలం ఈ హైందవానికి ఉంది.
కులచట్రం ఎంత ప్రమాదకరమైందంటే, ఈనాటి ఆధునిక భారతీయుడు అంతరాంతరాల్లో కులంలో అంటకాగుతూనే, కుల అసమానతలు మంచివికాదని వల్లిస్తుంటాడు. ఈ విషయంలో మాత్రం ఎక్కువలో ఎక్కువమంది లోపల ఒకరకంగా, బైటికోరకంగా ప్రవర్తిస్తుంటారు. పుట్టుకతోనే తానధికుణ్ణనీ, మరోకడు అల్పుడనీ అనుకోవడం ఉందే అది ఈ సమాజం అతడి కంటగట్టిన వారసత్వపు - సాంక్రమిక - అంటురోగం. అది ఒక ప్రక్క కుటుంబం నుండి సంక్రమించడంతో ఆగక, అంటురోగంగా మరోకనికి అంటుకునే శక్తినీ కలిగి ఉంది. అందుకనే చరిత్రలో ఎదిగిన మనుషులెందరో ఈ వివక్షను దర్శించి, తొలగించడానికి యత్నించినా ఇప్పటికీ అది చెక్కుచెదరలేదు.
ఆది శంకరుల కాలం నుండీ, అంతకుముందు బుద్ధుని కాలంనుండీ ఇంకా వెనక్కుపోతే భారత రచనా కాలంనుండీ ఈ చట్రంలో మార్పులు తేవడానికే కొన్ని ప్రయత్నాలు జరిగిన దాఖలాలున్నా, అవేమీ ఈ చట్రం యొక్క మూలబంధనాలను కనీసం వదులు కూడా చేయలేకపోయాయి. ఈ జాతి ప్రజల వంటికంటిన ఈ జిగటతో కూడిన కుళ్ళును చర్మం వలుచుకునైనా వదిలించుకోవలసిందిపోయి, నిజంగా సమాజహితం కోరే హృదయం ఉన్నవారే అనతగ్గ, దయానందుడు, గాంధీ, దివ్యజ్ఞాన సమాజకర్తలు మొ||గు వారు కూడా, ''దీనిని ఎత్తిపారేయండి, ఇదోక అశుద్ధం'' అనకుండా, దీనికి వారివారికి తోచిన రీతిలో ఉన్నతమైన అర్థాలు, పనికిరాని అర్థాలు కల్పించే పనికి పూనుకున్నారు. సమాజహితకాంక్ష విషయంలో ఎంతో ఎత్తున ఉన్న సహృదయులవల్లే పొరపాటు పని. అదో పెద్ద విషాదం.
ఈ మధ్యకాలంలో, గతంలో పట్టించుకోని, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వ్యతిరేకంగా పట్టించుకున్న మతాంతరీకరణల విషయాన్ని, దేశంలోని భారతీయ ఆస్థిక ధోరణలకు చెందిన కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ప్రమాదకరమైన అంశంగా పరిగణిస్తూ వస్తున్నారు. అది అంతకంటెనూ ముప్పును తెచ్చిపెట్టేది అన్యమతాంతరీకరణ అన్నది కేవలం దైవవిశ్వాసాల ప్రాతిపదికను దాటి, ఈ లోకపు ఆధిపత్య సాధన లక్ష్యంగనూ పరిణమించిందన్న అభిప్రాయానికి వచ్చిన కొందరు 1) అన్య మతాంతరీకరణలకు వ్యతిరేకంగానూ, 2) స్వమతంలోకి చేర్చుకోడానికివీలైన మతాంతరీకరణకు అనుకూలంగానో చేయగల యత్నాలు చేస్తూ వస్తున్నారు.'స్వస్థాన మాగచ్చేత్', 'పునరాగచ్చేత్' లాంటి నినాదాలాయత్నల నుండి పుట్టుకొచ్చినవే.
అలాంటి సంస్థల, వ్యక్తుల యత్నాల కొనసాగింపుగా 'హిందూ ధర్మాన్నిరక్షించుకోండి'. 'హిందూధర్మాన్ని రక్షించుకుందాంరండి' లాంటి పేర్లతో, కొన్ని సమావేశాలు జరుపుకోవడం పరిస్థితుల్ని గమనించడం, ఒకింత పరిశీలించడం, చర్చించడం లాంటి పనులు ఆరంభమైయ్యాయి. జూలై నెలలో భక్తి టి.వి. ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశం, ఈ విషయాన్ని సమాజంలోని మరింత మంది దృష్టి దీని మీద పడేలా చేసింది. కానీ అక్కడకు చేరిన వాళ్ళలో ఎక్కువలో ఎక్కువ మంది, నిజంగా వచ్చిన ముప్పేమిటో? ఆ ముప్పుఎవరికొచ్చిందో లేదా దేనికి వచ్చిందో అన్న విషయాలు గానీ దానికి కారణాల విషయంగానీ, నివారణోపాయం విషయంగానీ తగినంతగా ఇంకా సరిగా చెప్పాలంటే కనీసంగానైనా పట్టించుకోనేలేదు.
ఆనాటి ఉదయం 10 నుండి 2 వరకు సాగిన చర్చావేదికలో నిజానికి ఏ అంశం మీదా చర్చ జరగనేలేదు. నిర్వాహకులు వచ్చిన వారందరకూ 10, 12 విచారణీయాంశాల పత్రాన్నిచ్చారు. ఆ వేదికలో ఎక్కువ భాగం గుళ్ళు గోపురాలనెలా కాపాడుకోవాలి? వాటి ఆస్థిపాస్తులనెలా కాపాడుకోవాలి? హైందవ ఆస్థిక దోరణులవైపు జనాన్నెలా ఆకర్షించాలి అన్న అంశాల చుట్టూతనే తిరిగింది. హిందూ ధర్మాన్ని రక్షించడమంటే ఆలయాలను, బహుదేవతారాధనను రక్షించుకోవడం, విస్తరింపజేయడం, దేవాలయ వ్యవస్థను ప్రభుత్వనియంత్రణ నుండి బైటకు తెచ్చుకోవడం ఆయా దేవతారాధనలవల్ల ఒనగూడే ప్రయోజనాలగురించి ప్రజలలో విస్తారంగా ప్రచారం కావించడం, ఆ రకంగా వారిని ఈ సాంప్రదాయపు ఆస్థిక విశ్వాసాలకే కట్టుబడి ఉండేలా, ఇతర మతాల దేవుళ్ళ నాశ్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అన్న వాటి చుట్టూతనే తిరిగిందానాటి సమావేశకర్తల ఆలోచనా సరళంతా.
ఆ సమావేశంలో పాల్గొన్న వారిలో నేనొక్కణ్ణి మాత్రమే ఆ ధోరణికి వేరుగా ఒక ప్రకటన చేశాను. ఆ సందర్భంలో చర్చనీయాంశంగా ''హిందూధర్మం ఎదుర్కొంటున్న సవాళ్ళేమిటి?'' అన్నది ఉంది.
(1) హిందూ ధర్మం ఎదుర్కొంటున్న ప్రప్రధమ సవాలు; హిందూ ధర్మం అంటే ఇది అన్న స్పష్టమైన రూపం లేకపోవడమేన్నన్నది నా మొదటి ప్రకటన.
(2) హిందూతాత్విక సాహిత్యంలో అత్యంత ఉదాత్తమైన భావజాలంతోపాటు, ఉత్తమ, మధ్యమ అధమ స్థాయి కలిగిన భావాలేకాక, అత్యంత అధమాధమం అన్న దుర్మార్గపు భావాలూ కలుగాపులగంగా ఉండడం మరో సవాలు అన్నది నా రెండో ప్రకటన.
(3) వాటిని గుదిగుచ్చి ఒక చోటికి చేర్చి అందులో ఆదర్శం క్రింద ఉంచుకోవాల్సినవి, తక్షణం వదిలించుకుని కడిగేసుకోవలసినవి అన్న వాటిని విడగొట్టి ఈ కాలానికి తగిన హిందూ ధర్మస్వరూపం ఇదిగో ఇది అని ధర్మ సంస్కరణ - ధర్మశాస్త్ర పునర్నిర్మాణం దిశగా చిత్త శుద్ధితో కూడిన యత్నం ఒక్కటి కూడా యోగ్యమైన స్థాయిలో ఇప్పటికీ జరక్కపోవడం ఇది ఎదుర్కొంటున్న మరో సవాలు.
4) వ్యక్తిగతంగా వైరాగ్యానికీ, ఆత్మ సాధన నిష్టకు నిలయాలుగాను, సమష్టిగా శీలవంతులైన ప్రజను నిర్మించడానికి తగిన ప్రబోధస్థానాలుగా ఉండాల్సిన సాధు, సంతుల, సన్యాసులు ఆశ్రమాలు, పీఠాలు కేవలం తినడానికి, పండడానికీ, చిలకపలుకుల్లా తన సంప్రదాయానికి చెందిన నాలుగైదు ప్రసంగాలు చేస్తూ రకరకాల పేర్లతో నిర్మాణాలు మొదలెట్టి విరాళాలు సేకరించి ధనాన్ని, సంపదను కూడాబెట్టడానికి పరిమితమైపోయాయి. అంతా లేదా ఎక్కువలో ఎక్కువమంది చిన్న నాబొజ్జకు శ్రీరామరక్ష అన్న సూత్రాన్ని జీర్ణించుకున్న వారుగనే ఉంటున్నారు. భారతీయ సంప్రదాయంలోని ఉత్తమ భావజాలంతోనూ, తలమానిక మనదగ్గ, ఆచరణ సాధ్యమైన, ఆచరించి తీరాల్సిన ఒక సూత్రీకరణ ఉంది.
'సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్వం' అన్నదే ఆ సూత్రం. ఒక్క భారత సమాజానికే కాదు, ఏ దేశ జనానికైనా, ఏకాలపు జనాలకైనా ఈ మూటిని ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరముంది. సార్వత్రిక విలువకలిగిన కర్తవ్యకర్మను గురించి వినిపిస్తోందీ సూత్రం. ఇందులోని చివరి భాగం ప్రధానంగా జ్ఞానభాగానికి చెందిన వారికి వర్తిస్తుంది. అట్టి వాటికి ప్రతినిధులం అంటున్న ధర్మాచార్యులు, జ్ఞానులు - గా చూడబడుతున్న వారెవరికీ ఈ రెంటి విషయంలో ఏ మాత్రం పట్టింపు ఉండడంలేదు. ఇది ఈ ధర్మం ఎదుర్కొంటున్న మరో బలమైన సవాలు.
(4) ఇక, అన్యమతస్ధులు ఈ మత సాహిత్యాన్ని నిశితంగా, కక్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ, ఇందులోని దోషరూపాలనన్నంటినీ సామాన్య జనం ముందు బూతద్దంలో నించిచూపిస్తూ వారి మత గ్రంథాలలోని భయంకర దోషాలను కూడా చెప్పకుండా, మంచి వాటిని మాత్రం చర్వితచర్వణంగా ఊదరగొట్టేస్తూ, విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. వారి మత సంస్థలు కలసికట్టుగా, ప్రణాళికాబద్దంగా వనరుల్ని అందిస్తూ, ప్రచారకుల్ని వేల, లక్షల సంఖ్యలో వినియోగిస్తూ సాగుతుండగా, ఇక్కడి సంస్థలు మాత్రం సంపదకూడబెట్టుకోడానికీ, తమ గుంపు అనుభవించడానికీ, విలాసవంతంగా బ్రతుకులు వెళ్ళదీయడానికీ పరిమితమైపోతున్నాయి. ఇది ఈ ధర్మం (మతం) ఎదుర్కొంటున్న మరో సవాలు.
యోచనాశీలురైన మిత్రులారా! హిందూ ధర్మం ప్రమాదంలోపడిందని ఆక్రోశించే వాళ్ళంతా, ఆ ఆవేదన గుండెలోతుల్నుండి వచ్చేదే గనక అయితే, అట్టివారిప్పటికైనా మేలుకుని అస్సలు సమస్య లేదా ఈ ప్రమాదానికి మూలం ఎక్కడ ఉందో గమనించి అక్కడినుండి పరిష్కార యత్నాలు ఆరంభించాలి. దీనికి మానసికంగా సిద్దంకానంతకాలం ఆ పై తగిన చర్యలకు పూనుకోనంతకాలం సమస్య ఇలాగే ఉండడమే కాదు. జరగాల్సింది జరిగిపోతుంది కూడా. తగిన సమయంలో, తగిన పనులు చేయకపోవడం అన్నదే ఈ దేశం పరాయి పాలన క్రింద పడి మాటిమాటికీ నలిగిపోవడానికి కారణం అన్నది చారిత్రక సత్యం.
1) నాకు తెలిసి వర్ణధర్మాలు అన్నది కాలం చెల్లిన భావన - ఆశ్రమ ధర్మాల చట్రం శాశ్వతవిలువకలది.
2) వర్ణ ధర్మాల పునాదినుండే పుట్టిన కుల అంతరాలు అమానుషమైనవి. ఏ కాలానికి పనికిరానివి.
3) ధర్మం అంటే మానవ సమూహం విధి నిషేధ రూపంలో కర్తవ్యకర్మలుగా చేయాల్సిన కర్మల సమూహమే గాని, ఏ దేవుణ్ణి విశ్వసించాలి? ఏ దేవుణ్ణి విశ్వసించరాదు? అన్నదికానేకాదు.
4) తాత్విక భాగానికీ, ధార్మిక భాగానికీ అవసరానికిమించిన సంబంధాల్ని అంటగట్టరాదు.
5) ధర్మశాస్త్రాలు కాలానుగుణ్యంగా నిర్మించుకుంటుండాలన్న ఈ దేశ ఋషుల వివేక పూర్ణమైన సూచనను పరిగణనలోకి తీసుకోవడం సర్వదా సర్వదా శ్రేయస్కరం.
కృతేతు మానవాధర్మః త్రేతాయాంగౌతమ స్కృతిః!
ద్వాపరే శంఖవిఖితౌ, కలౌపరాశరస్య చ!!
6) ఏ కారణాల వల్ల స్థిరపడిందోగాని, ఈ దేశంలో మనుస్మృతి బహుళ పాచ్రుర్యాన్ని పొందింది. కానీ వెనకటి కాలాన అనేకమంది సామాజిక శాస్త్రజ్ఞులు అనేక ధర్మ శాస్త్రాలను రచించారు. భారతీయసాహిత్యంలోకి తొంగి చూస్తే పదుల సంఖ్యలో ధర్మశాస్త్రాలు (స్మృతులు) కనపడతాయి.
ముగింపు : వీటన్నింటి నేపధ్యంలో ఈ కాలానికి మీరంగీకరించే హిందూధర్మమేమి టన్నది సిద్దం చేయడానికి ధర్మాచార్యులు పూనుకోనంతకాలం అట్టిదానిని సిద్దం చేయనంతకాలం ఈ ప్రమాదం ఈ దేశాన్ని వెంటాడుతునే ఉంటుంది.
(సశేషం)
బైబిలు దైవ గ్రంథమా? - 6
స్పందన - ప్రతి స్పందన - 1
యోచనా శీలురైన పాఠకమిత్రులకు, ముఖ్యంగా పి.డి సుందర్రావుగారికీ వారి బృందానికీ, రంజిత్ ఓఫిర్ గారికీ వారి బృందానికీ, మాది సనాతనం అంటుండే ఇస్లాం, క్రైస్తవేతర భారతీయ ఆస్థిక ధోరణులవారికీ, వారితో విబేధిస్తూ వస్తున్న వివిధ ఆస్థికేతర ధోరణులవారికీ!
అవసరమైనంతకాలం ప్రధాన శీర్షికలో భాగంగా స్పందన - ప్రతిస్పందన ఉప శీర్షికగా కొనసాగుతుంది. దానిని ఏ ధోరణికి చెందిన ఆస్థికులుగానీ, ఏ ధోరణికి చెందని ఆస్థికేతరులు గాని ఉపయోగించుకోవచ్చు. అలాగే మీ భావాలు సరైనవేనని నిరూపించే బాధ్యత స్వీకరించగలంత వరకు నా భావాలతో ఏకీభవించేవారే గాక, వాటితో విభేదించేవారూ, విరోధించేవారు కూడా దీనిలో పాలుపంచుకోడానికి వీలుంది. అయితే ఇంత విశాల అవకాశాలు అంగీకరించడం వల్ల రకరకాల వ్యక్తులు రకరకాల అభిరుచులతో ఎవరిష్టంవచ్చినట్లు వారు, ఎవరిష్టం వచ్చినంత వారు లేఖలు వ్రాసే అవకాశమూ ఉంది గనుక, ప్రకరణకు సంబంధించని అంశాలను తిరస్కరించడానికీ, విషయాలను సంక్షిప్తీకరించడానికీ పత్రికాపరమైన నిర్ణయాధికారం మా కుంటుంది. అయినా మేమూ మానవికమైన పొరపాట్లు చేసే అవకాశాల్ని కాదనలేం గనుక మా వైఖరిలో అలాంటి లోపాలు కనిపించినపుడు సమాజ హితకాంకక్షులుగా మాకూ సూచనలు చేయవచ్చని తెలియజేస్తున్నాము.
ధర్మస్యజయోస్తు, అధర్మస్యనాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్యకల్యాణమస్తు!
స్పందన - 1 :- 15.7.2012 న హైదరాబాద్ నుండి పి.డి. సుందర్రావుగారికి ఫజులుర్‌రహ్మన్ గారు వ్రాసిన లేఖ నకలు :-
అనంతకరుణామయుడు అపార కృపాశీలుడు అల్లాహ్‌ాపేరుతో
''లేనిబలాన్ని ప్రదర్శించకండి! ఉన్న బలాన్ని దాచుకోకండి!!''
పి.డి సుందర్రావుగార్కి ఫజులుర్ రహ్మన్ వ్రాయునది
క్షేమమని భావిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ - ముఖ్యముగా వ్రాయునది
ఈ మధ్యకాలంలో వివేకపథం 185 టు 189 వరకూ మిమ్ములను గూర్చి మీ ఛాలెంజ్‌లకు నిలబడిన వివేకపథం ఎడిటర్ సురేంద్రబాబు పిలుపును గూర్చి చూశాము.
యేసు తరువాత, నేటి క్రైస్తవ్యం కాపాడడం కోసం మీరే ''రక్షకుడు''గా కొందరు క్రైస్తవులు భావించేస్థాయికి మీరెదిగారు. మీ రచనలు గాని సిడిలుగాని దానికి భిన్నంగా కూడా లేవు. అయితే మీపై గంపెడు ఆశతో పేకమేడలు నిర్మించుకొన్న విశ్వాసుల కోటలు బీటలు పడేలా మీరు ప్రవర్తించే తీరు వివేకపథం ద్వారా తెలుస్తోంది. మీ గర్జనలు బలహీన విశ్వాసులకు ఎంతో బలాన్నిచ్చాయి అన్నది వాస్తవం. కాని అన్నీ ఉత్తుత్తి గర్జనలే, కేవలం ఎదుట వారిని భయపెట్టడానికో, భయపడేలా చేయడానికో అయితే మాత్రం అది తెలుసుకొన్న తరువాత అమాయకపు విశ్వాసులు ఆత్మహత్యలు చేసుకొంటారేమో ననిపిస్తోంది.
చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకొనే రకం గల దొంగబోధకులను కట్టడి చేసే మీ ప్రయత్నము అభిలాషణీయమే అయినా - మీరా కోవకు చెందినవారు కాదని చెప్పుకోడానికి వచ్చిన ఏ అవకాశాన్ని మీరిప్పటి వరకూ వినియోగించుకోలేదు. ఎందుకని?
నా పర్యటనలో మీ అభిమానులు ఎదురుపడి చర్చ జరిగిన చోటల్లా తాము నిలబడలేమని గ్రహించిన ప్రతి ఒక్కరూ మీకు ఫోన్ ద్వారానో, వ్యక్తిగతంగానో మిమ్మల్ని కలసి జరిగిన విషయాలు చర్చించిన సంఘటనలు అనేకం నా అనుభవంలో ఉన్నాయి. అవి అన్నీ విశ్వాసులమైన మన మధ్య నలుగుతున్న కొన్ని విషయాలు.
మీ నిజాయితీ విషయమై విశ్వాసులు మరింత సంశయంలోపడిపోయి మీ మీద ఉన్న నమ్మకం ఆరిపోకముందే, మీరు బయటకు రండి! కనీసం బైబిలును దైవ గ్రంథం కాదు అన్న వారినైనా నిలదీయండి! మీకున్న బలాన్ని ప్రదర్శించి విశ్వాసులకు చూపండి.
మీ గర్జనలు అమాయకపు ప్రజల మధ్య కాదు. మేధావి వర్గానికి చెందిన వారి మధ్యనవేస్తే ఆ గర్జన విలువెంతో, దాని బలమెంతో - విశ్వాసులు చూసి మరింత బలాన్ని పొందుతారు. లేనిచో ''జనారణ్యంలోని క్రూరమృగం''లా - మేధావి వర్గానికి చెందినవారు మిమ్మల్ని తరుముతుంటే చూసే వారికి - జనారణ్యం నుండి పారిపోతున్న క్రూరమృగంలా మీరు కనబడతారు. బైబిలు ప్రకారం రోషము గల దేవుని బిడ్డగా మీరు - సురేంద్రబాబును ఎదుర్కొనడానికి నిలబడాలని విశ్వాసులమైన మేము కోరుకొంటున్నాము. కనీసం 189 నెం|| వివేకపథం 20 పే||లో ఒక మాటని చెప్పిన ''పరస్సరం తెలియజెప్పుకొని - తెలుసుకొనేందుకు'' అన్నచోటైనా నిలబడటానికి ప్రయత్నించండి.
కాపీ - టు - వివేకపథం ఇట్లు
ఎం.ఫజులుర్ రహ్మన్, హైదరాబాద్
సెల్ - 9440220670
ప్రతి స్పందన :- యోచనాశీలురైన రహ్మాన్‌గారికి! కొంతవరకూ తూకంగానూ, పి.డి సుందర్రావుగారి పోకడల నెరిగిన వారికి (ఆయన భక్తులుతప్ప మిగిలిన వారికి) అవును, నిజమేకదా అనిపించే రీతిలోనూ పలు నిజాలతో కూడి ఉంది మీ లేఖ. అందులోనూ ''గర్జనలు అమాయక ప్రజల ముందు కాదు. మేధావి వర్గానికి చెందిన వారి మధ్య వేస్తే ఆ గర్జన బలమెంతో విలువెంతో తెలిసిపోతుంది''. అన్న అభిప్రాయం విజ్ఞులు, బుద్ధున్న వారు మెచ్చిదగిందిగా ఉంది. ఎగవేత ఎత్తుగడల్లో సిద్దహస్తుడన్నది ఆయనతో సంబంధమున్న వారందరూ ఎరిగున్నదే గదా, అయినా ఎదురుచూద్దాం పి.డి వారేబాటపడతారో. ఆయన నుండి సమాధానం వస్తే దానిని నాకూ పంపండి.
స్పందన -2 :- పజులుర్ రహ్మన్‌గారే మరో అంశానికి సంబంధించి నా కింకొక లేఖ వ్రాశారు. అదిదిగో, ''మీ 189 వివేకపథం - నా వరకు నన్ను మరింత సీరియస్‌గా ఆలోచింపజేసింది. నిజాయితీగా ఆలోచించి, పట్టి చూసే ప్రతి వ్యక్తికీ దానిలోని ప్రతి వాక్యమూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాను వ్యక్తిగతంగా తేల్చుకున్న తరువాతే ప్రశాంతంగా నిద్రపోగలడు.
ముఖ్యంగా వ్రాయునది, 19వ పేజీలోని, వాదజల్ప ప్రక్రియలను వివరించి సందర్భోచితంగా ముగించారు. అయితే మూడవది అయిన వితండ ప్రక్రియ ఎలాగుంటుందో దాని వివరణను మీ ద్వారానే తెలుసుకొనగోరుచున్నాను.
మిత్రులు ప్రకాష్‌గారికి ఇచ్చిన పిలుపు అభినందనీయం. విషయపరిశీలన చేసే వారి విధానం కూడా ఇలా ఉంటేనే అది సరైనది. అయితే సత్యాన్వేషణ మండలిలో మీ మధ్య జరిగిన చర్చలు వారికి కొంత అడ్డంకిగా ఉన్నందున, నా వరకు నాకు, వారు వారి ప్రతిపాదనను (బైబిలు సృష్టివాదం) లిఖిత పూర్వకంగా మనకందిస్తే దానిని పరిశీలించి, పరీక్షించడానికి మనకు అభ్యంతరమేముంది? మీరు దీనిని ఏకీభవిస్తే నా వరకు నేను ఈ విషయమై వారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ సమావేశాలకొనసాగింపుగనే ఇది ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని అడుగుచున్నాను.
ప్రతి స్పందన :- రహ్మన్‌గారికి, వివేక పదాన్ని అధ్యయన రూపంలో చదివే వ్యక్తులు నా దృష్టిలో కొద్దిమంది ఉన్నారు. అందులో మీరు ఉన్నారు. ఒప్పుజ్ఞానాన్ని ఆర్జించే క్రమంలోనూ, దానిని పరిశీలించే క్రమంలోనూ నిజాయితీకి (హృదయ పరిశుద్దతకు) ఉన్న స్థానం అన్నింటికంటే విలువైంది. ప్రాథమికమైనది. ఈ విషయం మీకు తెలిసిందే అయినా ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని పాఠకుల ముందుంచాను.
వాద, జల్ప, వితండ ప్రక్రియల గురించి అయోగ్యులు, సామర్థ్యాలను దుర్వినియోగపరిచే నైజమున్నవారికి పూర్తిగా నేర్పకూడదు. అలాగని సూత్ర ప్రాయంగానైనా చెప్పకపోవడమూ ఉచితం కాదు. కనుక నాలుగు మాటలు చెపుతాను దానిని గురించి స్వమత స్థాపనాహీనోవితండః'' అని, ఆ మాటన్న న్యాయదర్శనకారుడు చెప్పాడు. తనది చెప్పనివాడు ఎదుటి వానిది ఒప్పనివాడు వితండి. అతడనుసరించే ప్రక్రియను వితండం అనంటారు. నిజానికీ విధానం ఎంతో ఉదాత్తమైనది. శిక్షకుడు, లేక అధ్యాపకుడు తన వద్ద అధ్యయనమో, శిక్షణో పొందిన వారిని వారి సాధన ఎంత వరకు వచ్చిందో తెలుసుకోడానికి వినియోగించే పరీక్షా పద్దతి వితండ విధానమే. సిద్దాంత విచారణలలోనూ పరీక్ష స్థానంలో ఉన్న ప్రతిపక్షిగానీ, పరిశీలన, నిర్థారణ స్థానాలలో ఉన్న పాత్రధారులు కానీ అనుసరించాల్సిందీ ఈ విధానాన్నే. వితండ అంటే మొండివాదం కానేకాదు. మొండివాద మంటే యోగ్యమైన ఆధారాలు చూపకుండా తానన్న ప్రతిపాదననే పట్టుక్కూర్చునేది, ఎదుటివారెన్ని యోగ్యమైన ఆధారాలు చూపుతున్నా దానిని స్వీకరించడానికి సిద్ధం కానీకుండా చేసేది అని అర్థం. అట్టివారిని వితండి అనకూడదు. మూర్ఖుడు అనాలి. మూర్ఖుడు వేరు, మూఢుడు వేరు. మూర్ఖుడు యోగ్యమైన దానిని స్వీకరించడు, మూఢుడైతే తనకు నచ్చిన ఎవరో ఒకరిని అనుసరిస్తాడు. మూఢః పరప్రత్యయనేయబుద్దిః అని వుత్పత్తి, అంటే సొంతబుర్ర లేకపోవడం వల్ల ఇతరుల జ్ఞానం పై ఆధారపడేవాడు అని, ఇక మూర్ఖుడంటే తనకు తెలీదు, ఇతరులు చెపితే వినడు అన్న వైఖరికలవాడని అర్థం. మూర్ఖుల వల్ల సర్వానర్ధం కలుగుతుంది. మూఢుడు అనుసరణశీలత కలిగి ఉంటాడంతే. మీరడిగిందానికంటే పిసరంత అధికమే చెప్పాననిపిస్తోంది. ఆలోచించండి. మూడు వాద రీతుల గురించి సమయం, సందర్భం వచ్చినపుడు విపులంగా అనుకుందాం.
ఇక మీ మూడో అంశం ప్రకాష్ గురించి, అతనితో నాకున్న అనుభవం, అతనిలోరుజుత్వం లేదన్న నిర్ణయానికి నన్ను నెట్టేసింది. కానీ నా అభిప్రాయంతప్పు అయ్యే అవకాశమూ ఉండడం వల్లా నా అభిప్రాయం అప్పటికి సరైందే అయినా, వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశం ఉండడం వల్లా మనం నిర్వహించిన వేదిక క్రమాన్ని అతను గాని అనుసరిస్తానంటే దానిని మళ్ళీ ఆగిన దగ్గర నుండి కొనసాగించడానికి అభ్యంతరం లేదని గత సంచికలోనే వ్రాశాను. నిజానికి మండలిలో అతనికీ నాకూ జరిగిన ప్రథమ సమావేశమే అడ్డగోలుగా జరిగింది. ఒకందుకు కలుద్దాం అని నాకు చెప్పిన డా. ఆనంద్ సమావేశం మొదలెట్టాక, ప్రకాష్ వ్యూహం మార్చడంతో ఆత్మరక్షణలోపడ్డాడు. తనది చెప్పకుండా ఎదుటివాళ్ళదిరాబట్టడం, దానిలో ఉన్న దోషాలనూ, లేని దోషాలను కూడా ఆపాదించండంలో దిట్టతనం చూపడాన్ని ప్రకాష్ వైఖరిలో నేను గమనించాను. కొన్ని విషయాలలో తగినంత కాకున్నా కొంత అవగాహనుండి హృదయం నిర్మలంగా లేనితనాన్ని నేను గమనించాను. మండలికి ఎవరూ శతృవులుకాదు. వంచనా ధోరణి ఉన్న వాళ్ళు తప్ప ఇది ఈ నాడు ప్రకాష్ కొరకు నేనంటున్నదికాదు. సత్యాన్వేషికి, సమాజహిత కాంక్షికి అవశ్యం ఉండాల్సిన నిబంధన అది. దానిని ఎంత పాటిస్తున్నాం. ఎంత పాటించగలుగుతున్నాం అన్నది ఆత్మ పరిశీలనకు వదిలెట్టడమే మంచిది.
సరే! మీ సూచనకు నాకెట్టి అభ్యంతరాలూ లేవు. వ్యక్తిని విడచి సిద్దాంత విచారణ చేయడానికి ప్రాధాన్యతనివ్వడం ఎప్పుడూ వివకేవంతమే కనుక ఆయనతో మాట్లాడండి. ప్రకాష్ అంగీకరించే 'బైబిలు సృష్టి సిద్దాంత ప్రతిపాదన - వాదన' రూపాన్ని లిఖిత పూర్వకంగా మనకివ్వమనండి. మళ్ళీ అనవసరపు కాలహరణ - అన్య విషయాలలోకి లాగుడు అనేవిజరక్కుండా ఉండడానికి గాను ఒక సూచన చేస్తున్నాను గమనించండి. ఈ సూచన బైబిలు సృష్టివాదం సరైందేననదలచుకున్న ఇతరులకూ వర్తిస్తుంది. అలాగే మిగిలిన ఆస్థికవర్గాలు (ఇస్లాం, వైదిక మొ|| వర్గాలు) వారి వారి సృష్టివాదాల్ని చర్చకు పెట్టేందుకూ వర్తిస్తుంది. బైబిలు సృష్టి వాదాన్ని ప్రతిపాదించడమంటే బైబిలు ఆదికాండం 1 అధ్యాయంలోని ఆ విషయాలను ఎత్తిరాయడం కాదు. ఆ పనికి ఇంతరగడెందుకు సృష్టిని గురించి బైబిలు ఏమి చెపుతోంది అవి కాదు ఆ పక్షం వాళ్ళని మన మడుగుతోంది. అది బైబిలు మొదటి అధ్యాయం చదివిన, విన్నా వాళ్ళందరికీ తెలుసు. ఈనాడు దానిని సరైనదేనని చెప్పుబూనుకున్నదివారు, కాబట్టి బైబిలు సృష్టివాదం సరైనదేనని ఆఖరి ముగింపు వాక్యంతో పాటు మధ్యలో మనం గమనించడానికి అవసరమైన వివరాలన్నింటినీ వారి విగా మన కందించాలి. అదీ బైబిలు సృష్టివాదాన్ని పరీక్షకు లిఖిత పూర్వకంగా అందించడమంటే. ఈ విషయం సబబేనని ప్రకాష్‌కు తెలుసు. ఆ మేరకు మేధావంతుడే అతడు. అతనితో నాకున్న ఒకింత సమన్యాయాన్ని పాటించకపోవడం, నిష్కపటంగా ప్రవర్తించకపోవడం అన్న దగ్గరే. యత్నించండి సెలవ్.
స్పందన: 24.7.12 తేదీతో కర్నూలు నుండి ఎ. జగద్గురుగారు ఇలా వ్రాశారు.
కర్నూలు
పుట్టా సురేంద్రబాబుగారికి
అయ్యా,
1. మీ వివేకపథం మాసపత్రిక 189వ సంచికలో పి.డి సుందర్రావుగారి నుద్దేశించి ఈ విధంగా వ్రాశారు.
2. ఆ నారెండో రిజిష్టర్ లేఖ తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. దానిని తీసుకుంటే సమాధానం చెప్పవలసి వస్తుందని, సమాధానం చెప్పలేమని తేల్చుకొని వారా పని చేసుండాలి అని వ్రాశారు.
3. మీ లాంటి వారు కొందరు పి.డి సుందరావుగారికి లేఖలు వ్రాస్తుండవచ్చు. కాని వాటిని ఆయన పట్టించుకొనకుండుటకు కారణం మీరింత వరకు తెలుసుకొనలేక పోయారు.
4. పి.డి సుందర్రావుగారు భారత హేతువాద సంఘ అధ్యకక్షుడిని, సైంటిస్టులను బహిరంగ సభలలోను మా టి.విలోను, టి.వి. -5లోను, టి.వి. - 9లోను సవాలు చేశాడు. మీలాంటి వారు కొందరు వ్రాసిన ఉత్తరాలు చదివి అనవసరంగా సమయం వృధా చేసుకోవడం ఎందుకని మీ రెండవ ఉత్తరం తీసుకొనకుండా రిజక్ట్ చేసియుండవచ్చు.
5. దీనిని ఆసరగా తీసుకొని మీరు నా ఉత్తరం కు సమాధానం చెప్పవలసి వస్తుందని, సమాధానం చెప్పలేమని నా ఉత్తరం తీసుకొనకుండా రిజక్ట్ చేశారని 189వ సంచికలో వ్రాశారు.
6. నాలుగు గోడల మధ్య కూర్చొని పి.డి సుందర్రావుగారిని గురించి వివేకపథం మాసపత్రికలో ప్రచురించుకొని తృప్తిపడుట కంటే పుట్టా సురేంద్రబాబుగారు చేసేదేమీ లేదని పాఠకులు గ్రహించగలరు కదా!
7. 188వ సంచికలో 19వ పేజిలో పి.డి సుందర్రావుగారిని వదలను అన్నారు. అసలు మీరు పట్టుకుంటే కదా వదలను అనటానికి ఆయన ముందు నిలబడి మాట్లాడుటకే జంకుతున్నారు, ఇక ఆయనను పట్టుకోవడమేమిటి? అందరు క్రైస్తవ బోధకుల లాంటివాడు పి.డి సుందర్రావుగారు కాదని మీరు గ్రహించాలి.
8. మీరు బైబిలును విమర్శించాలనుకుంటే సూదిని మూటకట్టినట్టేనని, మీరు పడే ప్రయాస బూడిదలో పోసిన పన్నీరేనని, సత్పలము గోరంతైనా ఉండదని, ఇక మీదట బైబిలు జోలికి వస్తే అవమానమే తప్ప మరేమీ రాదని గ్రహించగలరు. ఈ నా లేఖ 190వ సంచికలో తప్పక ప్రచురించగలరు.
ఇట్లు
ఎ. జగద్గురు, కర్నూలు.
ప్ర.స్పం :- జగద్గురు గారికి, ఒక అనుయాయిగా లేదా అభిమానిగా మీరు పి.డి. సుందర్రావుగారి శక్తి సామర్థ్యాల పై చాలా ఆశలు పెట్టుకుని ఉండడం హర్షించదగిందే. మీరు లోపలొకటి బైటొకటి పెట్టుకోకుండా అనిపించిందే మాట్లాడుతున్నారని, మీరు నాకు కనిపించినంతలో నా కనిపించింది. మీ లేఖకు పేరాల ప్రకారం నంబర్లిచ్చాను.
మీ మూడో పాయింటు ప్రకారం నా లేఖను పట్టించుకోకపోవడానికి కారణం నాకర్థంకాలేదు. కానీ విషయం ఏమిటంటే, ఆయన నా లేఖనెందుకు పట్టించుకోకపోయింది మీకూ తెలియదు. టైం వేస్టు చేసుకోడం ఎందుకని తీసుకొనకుండా రిజక్టు చేసి ఉండవచ్చునని ఆ పేరాలో మీరు ఊహించారు. నాకున్న సమాచారంతో నేనూ ఊహించాను, మీకున్న విశ్వాసంతో మీరూ ఊహించారు. నిజమేమిటో కాలపరీక్షలో తేలిపోతుంది.
నాలుగో అంశం క్రిందే ఆయన చాల మందిని సవాలు చేసినట్లు వ్రాశారు. దానికి సంబంధించిన ప్రసంగాలున్న సి.డిలు పంపారు. వాటినీ చూశాను. ఈ విషయంలో మొదటి నుండీ నేనడుగుతోంది, ఓరి పిచ్చినాయనా నీ వెందరికి ఉత్తరాలు వ్రాశావన్నదానికి ఏమీ విలువ లేదయ్యా! నీ వెందరితో యుద్ధం చేశావు. (సిద్దాంత చర్చ చేశావు) అన్నదే తేలాల్సిన విషయం, కనుక ఆ వివరాలుంటే ఇవ్వు అనే దానికి అటునుండి ఉలుకూ పలుకూలేదు. ఇక ఈ సంచికలు మొదలెట్టాకనూ నేనడుగుతున్నది, ముఖ్యంగా వెంకటాద్రి గారి విషయంలో, వెంకటాద్రిగారు, ఎప్పుడు నీతో తాను చర్చకు (ఫలానిషరతులతో, ఫలానితేదీన) సిద్దమని అంగీకరిస్తూ లేఖ వ్రాశారో దానిని బైటపెట్టమనే కదా! మీరు గానీ, మీ వీరుడుగాని తెలుగు అర్థంకానివారా? ఏమిటి? అడిగిందానికి మాత్రం సూటిగా సమాధానం చెప్పకుండా, తనకు చెందిన వందిమాగధులు కూర్చున్న వేదికలలో అసభ్యమైన పదజాలంతో అరుపులు పెడబొబ్బలతో ఏకపాత్రాభినయంలో దిట్టైన నటకుడివలే అభినయ సహితంగా ప్రసంగిచటమే గదా! ఆయన చేస్తొంది. ఆంతోటి దానిని చూసుకుని మీరింతగా ఆయనపై డిపెండైపోవడమెందుకండీ జగద్గురుగారూ!
ఇక మీ ఆరో అంశం నవ్వు తెప్పిస్తోంది. సుందర్రావుగారికి 100% శాతం వర్తించే విషయాన్ని నా కంటించారేమిటి. ఇప్పటి వరకు సుందర్రావు గారిని ఛాలెంజ్ చేస్తూ వస్తున్న అనేకులు చెపుతున్నది అతడు సొంత మందముందు వీరంగ మాడడం మినహా చేసేదేమిలేదనే కదా! దమ్ముంటే పత్రికలో ప్రకటించు అన్న మీరే ఈ మాటనడం చూస్తుంటే మీకు మతిమరుపుందనైనా అనుకోవాలి. చిన్న బుచ్చుకునే నైజం లేదనైనా అనుకోవాలి. మీరు సుందర్రావుగారిని ప్రాథేయపడుతూ ఆయనకు వ్రాసిన ఒక లేఖ ప్రతిని నాకూ పంపారు. పి.డి. సుందర్రావుగారిని చర్చకు సిద్దం చేయాల్సిన బాధ్యత మీదేనని నేను మిమ్ము వత్తిడి చేసినప్పుడు, నేనేమి చేయలేను. ఆయన నా లేఖను చెత్తబుట్టలో వేశాడనీ మీరే చెప్పారు. మీరెక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఎవరితో నంటే వారితో యోగ్యమైన నియమనిబంధనలతో కూడిన విచారణకు నేను సిద్దమన్న నేనా గదిలో కూచుంది, ఎవరెంతగా ప్రతిసవాలు విసరుతున్నా, రోషం లేదా అని బహిరంగ ప్రసంగాల ద్వారా నిలదీస్తున్నా, 'మగతనముంటే లాటి' పి.డి సుందర్రావుగారి శైలి భాషలోనే తెగబడుతున్నా బైటకురాని ఆయనా మీరన్నట్లు గదిలో కూచుంది? మాట తృళ్ళి అనే ముందు అది తిరిగొచ్చితగులుతుందేమో అనైన చూసుకోపోతే ఎలానండీ!
ఇకమీ 7వ అంశంలో సుందర్రావుగారిని వదలను అన్న నా మాటలు ఉట్టంకించి, అసలాయన్ను పట్టుకుంటే కదా వదలను అనడానికి ఆయన ముందు మాట్లాడడానికే జంకుతున్నారు. ఇక ఆయన్ను పట్టుకోడమేమిటి? మీ వీరుడు అందరిలాటి వాడు కాదని నేను తెలుసుకుంటే మంచిదన్నట్లు వ్రాశారు. ఇక్కడ వదలను అంటే దొరికాడు జారిపోనీకుండా పట్టుకుంటాను అని అర్థమా తండ్రీ! దొరకడం లేదు చిలుక కలుగుకుపొగబెట్టి అయినా ఆ చిట్టెలుకను పట్టుకుతీరతాను. బైటికి రాని వానితో మనకెందుకులే అనుకుని విడిచిపెట్టి ఊరుకోను అని అర్థం తండ్రీ! అన్నమాటను అర్థం చేసుకోలేకపోగా విపరీతార్థాలు గుంజితే ఎలా?
ఇకమీ 8 అంశం క్రింద, బైబిలు జోలికి వస్తే అవమానమే తప్ప మరేమీరాదని గ్రహించమన్నారు ఈ మీ మాట నాసరాచేసుకుని ప్రధానంగా బైబిలు పక్షం వాళ్ళకీ, అన్యాపదేశంగా మిగిలిన రెండు మతాల వాళ్ళకు కూడా నే చెప్పదలచుకున్న దేమిటంటే,
ఏమినా చిట్టి తండ్రులూ! నీవు గాని బైబిలు కేమైనా పేటెంటు హక్కుదారుడివా? బైబిలులో ఉన్న మాటలు చెప్పి వాటికి నీతలకు తట్టిన, నోటికొచ్చిన వివరణలు చేయడానికి నీకేవడిచ్చాడురా తండ్రీ హక్కు, అధికారము? ఉదాహరణకు మీ యోధుడైన పి.డి సుందర్రావుగారినుద్దేశించే, ఆయన వాడుతున్న భాషలోనే, హలో పి.డి సుందర్రావ్ బైబిలుకు నీ యిష్టమొచ్చిన అర్థాలు చెప్పావంటే తొక్కతీస్తా! ఖబడ్దార్ అన్నానుకోండి. ఏమవుద్ది? ఏమీ కాదు. ఇంకాస్త అసభ్యంగా తాత్కాలికంగా మనస్సు చంపుకునైనా ఆయన గారి భాషనే వాడాననుకోండి నాబట్ట బుర్రమీదున్న నూగు వెంట్రుక్కూడా ఏమీ కాదు అన్నాననుకోండి ఆయన జ్ఞానంవల్లగానీ, ఆయన అన్న, తండ్రిల వల్లకానీ ఏమీ కాదు. నా గురించి ఏమీ తెలియకుండగనే, నేనో నలుసుననీ, ఆయన పోరాటాన్ని ఒక్కసారైనా చూడకుండగనే ఆయనో కొండనీ అనుకునే మీ విచక్షణా సామర్థ్యాన్ని చూసి జాలిపడాలి అంతే.
పైఈ మాటలు చాలవన్నట్లు ఈ నా లేఖ మీ 190 సంచికలో తప్పక ప్రచురించండన్న నొక్కుకటి అంటే ప్రచురించలేనని, భయపడిపోతానని అనుమానం... అబ్బె నమ్మకం కాబోలు.
ఒక్క విషయం జగద్గురు గారూ! స్పందన - ప్రతిస్పందన శీర్షిక మొదలెట్టి మీరు పాల్గొనండి అన్నానంటే, ప్రకరణ భంగం కానంత వరకు, భాషలో సభ్యాతా సంస్కారాలకు భంగం కలగనంతవరకు, విషయ ప్రధానంగా మీ స్పందనలున్నంత వరకు, అభిప్రాయాలు నాకు అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా ప్రకటిస్తాను అని నేను వాగ్థానం చేసినట్లే. ఆ మేరకు పత్రిక స్థలంలో మీకూ హక్కునంగీకరించాననే అర్థం. ఈ ముఖంగా అన్ని పక్షాలవారికీ నా విజ్ఞప్తేమంటే నన్ను రెచ్చగొట్టే పనో, భయపెట్టే పనో చేయకండి. విషయ పరిశీలనే మన నిజమైన అభిమతమైతే, పై రెండూ అనవసరమూ, అనుచితమూ కూడా అవుతాయి. నిజమాకాదా? ఆలోచించండి.
వివేకపథం - బైబిల్ విషయాలపై స్పందన
వివేకపథం 185 నుండి 188 సంచిక వరకు నడచిన బైబిలు సంబంధ విషయాలపై చర్చకు నా స్పందన తెలియచేస్తున్నాను. ఈ చర్చలో ముఖ్యముగా 7 గురి పేర్లు ప్రస్తావించబడుతున్నాయి.
1. సురేంద్రబాబు 2. పి.డి సుందర్రావు 3. జగద్గురు 4. జగదీశ్వర్ 5. వెంకటాద్రి, బ్రహ్మంలు 6. రంజిత్ ఓఫిర్
185 - 188 వ సంచికల్లో మొదటగా కనిపించే జగద్గురు, పి.డి సుందర్రావుల గురించి మొదటగా, తరువాత జగదీష్ , రంజిత్ ఓఫిర్‌ల గురించి ఆ తరువాత వెంకటాద్రి, బ్రహ్మంలపై ప్రస్తావన గురించి, చివరిగా వ్యాసకర్త సురేంద్రబాబు పై నా అభిప్రాయాలు వ్రాస్తున్నాను.
జగద్గురు : 1. వీరు సురేంద్రబాబును మొదటగ ఈ శీర్షిక మొదలెట్టేందుకు ప్రేరేపించినవారు. రెచ్చగొట్టినవారు అంటే బాగుంటుంది. విషయాల్ని, వ్యక్తుల్ని దగ్గరగా చూడకుండగనే వాటిపై / వారిపై అభిప్రాయాల్ని ఏర్పరచుకునేవారు.
2. వీరు బైబిల్నీ పూర్తిగా పరిశీలనగా చదివి ఉండకపోవచ్చు. చదివాననుకున్నా అర్ధం చేసుకోలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ విషయాల మీద సురేంద్రబాబుతో చర్చించలేకపోయారుగా అయినప్పటికీ బైబిల్ని పరిశుద్ధ గ్రంథంగా విశ్వసిస్తున్నారు. అంతే
వీరు పి.డి సుందర్రావుగార్నీ పరిశీలినగ చూడలేదు అని అర్ధం అవుతోంది. కేవలం ఆయన ప్రసంగాలు, పుస్తకాలు విని ప్రపంచంలోనే అంతకంటే మేధావి లేరనీ భావించారు. ఎందుకంటే తాను విశ్వసించే బైబిల్ని కాపాడేవాడుగా సుందర్రావుగారు కనిపిస్తున్నారు. కాబట్టి అంతేకాని ఆయన ఎంతమందితో నిజంగా చర్చించి, గెలిచాడు అన్నది నిర్థారించుకోకుండానే సుందర్రావుగారి మీద గురిపెంచుకున్నారు. కనీసం వెంకటాద్రిగారి నుండీ, బ్రహ్మంగారి నుండీ కూడా విషయాన్ని ఈయన నిర్ధారించుకోలా.
4. బైబిల్నీ, పి.డి సుందర్రావుగార్ని ఎలా పరిశీలించకుండా అనుకూల విశ్వాసాన్ని పెంచుకున్నాడో, అలాగే మిమ్మల్నీ పరిశీలించకుండానే ప్రతికూల విశ్వాసంతో దమ్ముంటే, మగతనముంటే లాంటి లేకి భాష ఉపయోగించాడు. ఆయనకు 3 రకాల ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.
1. తానే బైబిల్ని చదువుకొచ్చి మీతో చర్చించి బైబిల్ని పరిశుద్ధ గ్రంథమని నిర్థారించడం - అలా చేస్తానని వెంటనే ప్రకటించడం.
2. పి.డి సుందర్రావుగార్ని చర్చలోకి తీసుకొచ్చే బాధ్యతను నిలబెట్టుకోవడం. అలా తీసుకురాలేకుంటే పి.డి సుందర్రావుగార్ని నెత్తికెత్తుకోవటం మానేస్తున్నాని ప్రకటించడం
3. తనకంటే సురేంద్రబాబు దగ్గర విషయం ఉందని అంగీకరించాడు కనుక, ఆయన తోటి అన్వేషణ మార్గంలో నడవటం ఇవేవీ కాకుండా పలాయనం చిత్తగించే మార్గం కూడా ఉన్నా ఆయన ఆ మార్గాన పోరని ఆశిద్దాం.
పి.డి సుందర్రావుగారి గురించి :-
నేను ఆయనలో గమనించిన మెచ్చిన విషయాలు (మీరు వివేక పథంలో వ్రాసినవి కాకుండా) కొన్ని ఉన్నాయి.
1. చేతబడి, బాణమతి, చిల్లంగి వంటి మూఢవిశ్వాసాలను నమ్మవద్దని ప్రజలకు చెప్తుంటారు.
2. స్వస్థత కూటాల మోసపూరిత ప్రకటనల్ని ఖండించటమేకాకుండా, ఛాలెంజ్ చేస్తుంటారు.
మీరు పి.డి సుందర్రావుగారికి ఆత్మాధిక్యత (సుపీరియారిటీ కాంప్లెక్స్) ఎక్కువని వ్రాశారు. కాని అది పైకి అలా కన్పిస్తారు. అంతే. లోపలి మనిషి అలా కాదు. పూర్తి భిన్నం. ఎందుకంటే ఆత్మాధిక్యత గలవారే అయితే మీ మొదటి సంచిక చేరినప్పుడే స్పందించేవారు. ఎందుకంటే ఎవడు దొరుకుతాడా అని ఆకలితో సింహంలా ఎదురుచూస్తున్నాననీ, తనకు ఎదురుపడిన వాడ్ని నలిపేయటానికి చేతులు దురదగా ఉన్నాయనీ ప్రకటించేస్తుంటారు. నిజంగానే లోపలి మనిషి కూడా అలా అయితే విషయాన్ని తప్పించుకునే ఎత్తుగడలు వేయరు గాక వేయరు.
ఈ మధ్య కె.ఎ. పాల్‌గారని ఒకాయన ఈయనలాగానే తనను విమర్శించినవారు దెబ్బయి పోతారని ప్రసంగిస్తున్నారు. ఉదా|| దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని ప్రస్తావిస్తుంటారు. బిన్‌లాడెన్ గురించి, బిల్‌క్లింటన్‌ల గురించి కూడా ఇలాగే ప్రస్తావిస్తుంటారు. అలాగే సుందర్రావు గారు కూడా ముస్లిం మత ప్రచారకుడు దీదాత్ మరణశయ్య పై ఉన్న క్లిప్పింగ్‌లు చూపిస్తూ, తననూ, బైబిల్నీ, బైబిల్ దేవుడ్నీ విమర్శించినందుకే దీదాత్‌కు ఆ గతి పట్టిందని విమర్శిస్తుంటారు. బొడిగుండుకూ , మోకాలికీ ముడిపెట్టడం అంటే ఇదే.
సుందర్రావు గారిలో వున్న ఈ ఆత్మన్యూనతాభావము ఆయనకు మీ భాష ప్రకారము వాది బలహీనత, బహుశా బైబిల్‌లోనే విషయం (వాదబలం) లేనందువలన కూడా ఏర్పడివుండవచ్చు. ఏమైనప్పటికీ చర్చనుండి తప్పించుకోవటానికే ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.
జగదీష్ గారి గురించి : రంజిత్ ఓఫిర్ గార్ని చర్చకు తీసుకువస్తానని చెప్పి విఫలమయిన ఈయనే స్వయంగా చర్చలోకి దూకేశారు. అదీ చర్చానియమాలు ప్రాథమికంగా కూడా తెలియకనే. ఇది ఎలా చెప్పగలమంటే - అసలు చర్చా విషయమే క్రైస్తవ దేవుని అస్తిత్వం గురించి స్వభావం గురించి గొప్పతనం గురించి అయి వుండగా అవేవీ తేల్చకుండా, బైబిల్ గొప్ప గ్రంథము, బైబిల్ దేవుడు గొప్పవాడు అని తాననుకునే నిర్ణయాలను సురేంద్రగారి మీదకు రుద్దేస్తున్నాడు. విశ్వాసం ఎంత ముదిరిందంటే ఆ విశ్వాసం నేపథ్యంలోనే సురేంద్రగార్ని చూస్తూ అప్పటివరకూ దేవుని గురించి ఏమీ మాట్లాడని సురేంద్రగారు తనదేవుని గేలిచేశారని, అపహాస్యం చేశారని అనుకునేదాకా, సురేంద్ర గార్ని బుద్దిహీనుడనేంత దాకా, అంత్యదినం నాడు నీ సంగతి తేలుతుందిగా అనేంతగా తొందరపడి చివరికి సురేంద్రగారి చేత దేవుని రాకను ఆపుచేయించేశారు. ఇక ఈ ప్రపంచం ఏమైపోవాలి? సురేంద్రగారు ఆపుచేసిన యేసురాకడను, ఈయనగాని, ఓఫిర్ గారు గాని నిర్వీర్యం చేయగలరా? చేయగలరు. ఎలా అంటే యేసు వస్తాడని అందరూ ఎదురు చూస్తుంటే ఏసు తమ్ముడ్నంటూ ఒకాయనా, యేసు నోరునంటూ ఒకాయన వచ్చారుగా భవిష్యత్తులో నేనే యేసునంటూ ఎవరో ఒకరు ప్రకటించేసుకుంటే, విశ్వాసులంతా ఆయన చుట్టూ చేరతారు. అంతే, విశ్వాసానికి నిర్థారణలతో పనిలేదుగా
రంజిత్ ఓఫిర్‌గారి గురించి : పి.డి సుందర్రావుగారిలా కాకుండా ఈయన చర్చావేదికలకు హాజరవుతుంటారు. భాషాపరంగా మృదువుగా మాట్లాడతారు. ఈ చర్చలో పాల్గొంటారో లేదో తెలియటంలేదు. చర్చకు తీసుకురావాల్సిన జగదీశ్వర్‌గారు కొత్త చర్చకు దారి తీశారు.
వెంకటాద్రి, బ్రహ్మంల గురించి : ఈ సందర్భంలో వీరి ప్రస్తావన తేవలసిన అవసరం లేదనుకుంటున్నాను. వదరుబోతుతనంగా పి.డి సుందర్రావుగారు వీరి గురించి మాట్లాడినప్పటికీ, సురేంద్రగారు ప్రస్తుతం వీరి విషయంలో సంయమనం పాటించవుండవలసింది. కారణమేమంటే - (1) వెంకటాద్రిగారు 90 పైబడిన వయసువారు, బ్రహ్మంగారు 90కి దగ్గర్లో ఉన్నవారు. వారు ఈ రకమైన చర్చల్లో పాల్గొనే స్థితిలో ప్రస్తుతం లేరనుకుంటున్నాను. (2) పి.డి సుందర్రావుగారు మాట్లాడే తీరు సరిగా ఆలోచించేవారు ఎవరైనా చూసినా వారు పిచ్చివాడితో మనకెందుకులే అనుకుంటారు. మీరూ అదే అభిప్రాయానికొచ్చారు. అంతేకాక వెంకటాద్రిగారు 1980 ల్లోనే సుందర్రావుగారితో వివాదం గురించి తేల్చేసి, పత్రికా ముఖంగా ప్రకటించేశారు.
పి.డి సుందర్రావుగారి విషయంలో వీరు సరియైన విధానం పాటించలేదనీ, అలాకాక మీరు అనుసరిస్తున్న విధానం ద్వారా సుందర్రావుగారు చర్చలోకి వస్తారనీ మీరు ఆశిస్తే తప్పులేదు. కాని అలా జరక్కపోవచ్చు. ఎవరితో ఎలాంటి చర్చల్లో పాల్గొనకుండానే, సుందర్రావుగారు వెంకటాద్రి, బ్రహ్మంలు రంజిత్ ఓఫిర్, అనిల్‌లు తోకముడిచేశారని ప్రకటించినట్లుగానే భవిష్యత్తులో వారి పేర్లతో మీ పేరూ జోడించి ప్రకటనలు గుప్పించవచ్చు. దాన్ని జగద్గురూ గారి లాంటి వారు నిజమేననుకొని వెంటబడి పోతుంటారు. ఆయనను చర్చలకు పిలచీ, పిలచీ, ఒకనాటికి మీరే ఆగిపోతారు. కాని సుందర్రావుగారు ఆగరు. పై విధంగా ప్రసంగాలు చేసుకుపోతుంటారు.
ఆ చర్చలకు నేనెందుకయ్యా మా పిల్లల్ని పంపిస్తానని అనటం ఆత్మాధిత్యతను సూచిస్తుందా లేదా ఫలితమిస్తుందా అన్నది చర్చ జరిగినపుడు కదా తేలేది? దానివలనే చర్చ జరక్కుండా ఆగిపోయిందని అనుకోలేముగదా! అందువలనే ఈ సందర్భంలోనయినా మీరు వెంకటాద్రిగార్ని, బ్రహ్మంగార్లను వ్యక్తిగతంగా కలసి ఏం చేద్దాం అని అడిగివారి అభిప్రాయాలుగా ప్రకటిస్తే సబబుగా వుంటుంది.
ప్రతిస్పందన : జగన్‌మోహన్ గారికి, మీ లేఖ ద్వారా మీరు పత్రికలో, జరుగుతున్న విషయాలను జాగ్రత్తగనే గమనిస్తున్నారని అర్థమవుతోంది. మీ లేఖకు అటువైపు నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. పత్రిక పక్షం నుండి, మీరుద్దేశించిన వారందరినీ తగు రీతిన స్పందించండని ఆహ్వానిస్తున్నాను.
చివరిగా పి.డి సుందర్రావుగారికో సూచన :
అయ్యా సుందర్రావుగారు! మీ ప్రసంగాలను క్రమంగా జాగ్రత్తగా వింటూ వస్తున్నాను. మీ వీరాభిమాని వీరభక్తుడనాలేమో - జగద్గురుగారు నల్లగొండలో మీరు మాట్లాడిన ప్రసంగపు సి.డి ని పంపారు జూలై ఆఖరి వారంలో దానిని జాగ్రత్తగా చూస్తూ విన్నాను. నిజం చెప్పోద్దూ! స్టీపెన్ హాకిన్ గురించీ మాట్లాడే సందర్భంలో మీరు వాడిన భాష, ప్రస్తావించిన అంశాలూ, అంతకు ముందటి సి.డిల్లో అనిల్ అన్నతన్ని సంబోధిస్తూ అతని అనుయాయుల గురించి మాట్లాడిన భాషా, మాటలూ, నల్గొండ రాక ముందు సత్యాన్వేషణ మండలిని ప్రస్తావిస్తూ మధ్యలో నా గురించి మాట్లాడిన మాటలు గమనించి మిమ్మల్ని ఏమీ అనకుండా ఊరుకోవడం సత్య, ధర్మ పక్షాలకే అవమానం చేసినట్లు. అన్యాయం జరుగుతున్నా అంటీ ముట్టనట్లు ఊరుకుండినట్లు కనుక ఆ దోషపరిహారార్థమైనా ఇదిగో ఈ మాట అనకతప్పడం లేదు.
ఏయ్.పి.డి! అనాలనుకుంటే అనిల్‌ను అనక, అనిల్‌ను అనుసరించే అభిమానుల అమ్మా అబ్బా ఏం చేశార్రా? స్టీఫెన్ హాకిన్సు తల్లి దండ్రుల గోడవెందుకెత్తావురా! ఇంతకూ నాతో మాట్లాడే విషయాన్నాపి, నా తండ్రి ఊసెందుకెత్తావురా, పిశాచపునీపాడె కట్టా, చెదబట్టిన నీతలతుట్టెను గొడనుగొట్టా! ''ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే'' అన్నమాటేమిటిరా సాతాను తొత్తా! ఎక్కడ ఎవడుగాని ఒక అమ్మా అయ్యకు కాక ఎలా పుడతాడురా వెధవా! ఒక వేళ స్త్రీ అనేక పురుషుల సంపర్కం కలిగిందైనా పుట్టినోడు ఒక అమ్మ అబ్బకు కాకుండా ఎలా పుడతాడురా భడవా. బైబిలును అంగీకరించకుంటేనో, నిన్నొప్పకుంటేనో అశుద్ధపు నోటితో ఇన్నేసి మాటలనడమేమిటిరా తులువా! అదృమలిపినే హారం రోపి ధృమాయతే అన్నట్లు నీ చుట్టా చేరిన గడ్డిమొక్కల మద్యన నీవో ఉమ్మెత్త చెట్టువని తెలుస్తూనే వుందిరా వెంగరివిత్తా!
అయ్యా, సుందరావుగారూ! మీ భాషా శైలిననుకరించి నేను మిమ్మల్నిన్ని సంస్కారహీనమైన మాటల్నీ ఆధారం చేసుకుని మీరు గాని, మరొకరుగాని మరింతగా పెట్రేగి బూతుల పంచాంగం మొదలెట్టారనుకోండి, నేను చేయగలిగిందీ పెద్దగా ఏముండదు. ఎవరిదారిన వాళ్ళు నోటికి బట్టిన గడ్డి దురదను తీర్చుకోడానికి మాట్లాడేవే ఇలాటి మాటలన్ని ఈ భాష ఎదుటి వాళ్ళను గాయపరచడానికి తప్ప దేనికి పనికిరాదు.
మీరు ..ప్పింగుల ద్వారా చూపించిన దీదాత్ గారి వీరంగంగానీ, మీరు ఇతరుల నుద్దేశించి మాటల పోటులతో వేస్తున్న వీరంగంగానీ, మిమ్మల్ని ఇతరులు సవాలు చేస్తూ, మీ మీ గతనాన్నే శంకిస్తూ విసిరిన సవాళ్ళ పెడబొబ్బలుగానీ, ఇప్పుడు మీ భాష యొక్క తప్పుడుదనాన్న తెలియపరచడానికి మీ భాషా శైలినేవాడుకున్న నా పోకడగాని, విషయ సంబంధంగా కాసుకుకొరగావు. ఈమాటలు, అటు మీనా అవగాహనా బలాన్ని పరీక్షించుకోడానికి గానీ, ఇటు మీరు, నేనే రక్షకుణ్ణంటూ తలకెత్తుకున్న బైబిలు మాటల సబబు బేసబబుల్ని దాని బలాన్ని పరీక్షించడానికి గానీ ఏ రకంగానూ పనికిరావు. ఉత్తుత్తి మాటలు, బీరాలు, చీదరభాష, ఇవేవి వాది బలాన్ని పరీక్షించడానికిగానీ, వాద బలాన్ని పరీక్షించడానికి గాని ఉపయోగపడవు సరికాదు. నిజానికి వాటి అవసరం కూడా లేదు.
కనుక, మీ విజ్ఞతకు మరోమారు పని చెప్పగలిగితే చెప్పండని సూచిస్తూ ఒక ప్రతిపాదన చేస్తున్నాను.
(1) మీ, నా, జ్ఞాన సామర్ధ్యాల పరంగా రెండు మూడంశాల గురించి ముందుగా అనుకుని వాటిని పరీక్షకు పెడతాము. అందులో ఆధునిక విజ్ఞాన శాస్త్ర క్షేత్రానికి సంబంధించి ఇరువురం అనుకున్న 4, 5 అంశాలపై మన మన అవగాహనలను పరీక్షించుకుందాం. వాటి విషయంలోనా దగ్గరకంటే అదనపు సమాచారం మీ వద్ద ఉంటే ఆ మేరకు వాటిని మీ నుండి గ్రహించి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తాను. అలాకాక మీ దగ్గరున్న సమాచారం కంటే నా దగ్గరే అధిక సమాచారం ఉందని తేలితే, నా నుండి ఆ సమాచారాన్ని అందుకోడానికి సిద్దపడి ఆ విషయాన్ని బహిరంగంగా మీరు ప్రకటించాలి.
(2) చర్చావేదిక నియమ నిబంధనలకు సంబంధించి మీ నా అవగాహనలను పరీక్షించుకుందాం. ఆ విషయంలోనూ, మీ నుండి నేను నేర్వవలసిన పరిస్థితే ఉందని తేలితే మీ నుండి ఆ విషయాలు నేర్చుకుని, అలా నేర్చుకున్నట్లు ప్రకటిస్తాను. ఒక వేళ ఆ విషయంలో మీరే నా నుండి కొంత గ్రహించాల్సిన పరిస్థితి ఎదురైతే మీరు నా నుండి వాటిని గ్రహించి అలా గ్రహించానని ప్రకటించాలి. మీ సి.డిలో సత్యమంటే ఏమిటో నిర్వచనం చెప్పాలి. అని మీరనడం విన్నాను. అది మంచి పద్దతే. భాషా నియమాలని నేనన్నదాంట్లోనూ ముఖ్య పదాలకు నిర్వచనాలు చెప్పుకోవాలన్న నియమం ఉంది. కనుక ఈ విషయం నాకు అంగీకారమే. అవసరమై మాటలకు ముందుగా అర్ధాలు చెప్పుకునే, వాటి వరకు ఎవరు చెప్పింది సరైందోనూ పరిశీలుంచుకుంటానే సాగుదాం.
(3) సిద్ధాంత పరిశీలకై బైబిలు దైవ గ్రంథమా? అన్న ప్రశ్నకు, అవునంటూ మీరు చెప్పదలచుకున్నదంతా ప్రతిపాదన రూపంగా ప్రకటించండి. దానికీ ప్రధానాంశాలుగా 4, 5 తీసుకుందాం. అంశాలకు సంబంధించి మీరు చెప్పదలచుకున్నది చెప్పు అది సరైనదేనని నిరూపించండి. అలా నిరూపణైన మేరకు వాటిని నేను స్వీకరించి, జీవితాచరణలోకి తెచ్చుకునే యత్నం చేస్తూ, పి.డి సుందరావుగారి మార్గదర్శకత్వంలో సాగుతున్న వాణ్ణిని ప్రకటిస్తాను. అలాటి పని చేయవలసివస్తే, గురుస్థానానికిలాంటి గౌరవమివ్వాలో అలాంటి గౌరవింతోనే ప్రవర్తిస్తాను. అలా కాక మీరు బైబిలు దైవగ్రంథమని నిరూపించలేని పరిస్థితి ఎదురైతే, నన్ను గురువుగ అంగీకరించనక్కర్లేదుగానీ, తిరిగి సరైన రీతిలో అన్వేషణ సాగించాల్సి ఉంటుంది. ఆ మేరకు మన చర్చవలన ప్రయోజనం పొందాననీ ప్రకటించాల్సి ఉంటుంది.
చివరిగా ఒక్క సూచన : బజారు భాషనాపండి. లేదా అలాంటి భాషతోనే జరిగే ప్రతిదాడికి సిద్దంకండి.
No comments:
Post a Comment