ఉపోద్ఘాతం : ప్రమాణాలను, ప్రమాణ క్షేత్రాలను, వాటి పని తీరుతెన్నులను ఒకింత నిశితంగా పరిశీలించడం మొదలెట్టిన నాటినుండి, సక్రమాలోచనా నియమాల పట్ల సరైన మరియు సరిపడినంత అవగాహన కలిగించుకోవడం, ఆపై ఆ అవగాహనాధారంగా, సక్రమంగా ఆలోచించడంలో నేర్పును అలవర్చుకోవడం అన్నది అటు వ్యక్తిగత జీవితానికేగాక, సామాజిక జీవనగమనానికీ ఎంతటి అవసరమో కండ్లకు కట్టినట్లు (సుస్పష్టంగా) తెలియవచ్చింది నాకు. మొదటి వాక్యంలో మొదటనే నేను వాడిన ''ప్రమాణాలు, ప్రమాణ క్షేత్రాలు'' అన్న పారిభాషిక పదాలను చదవగానే, చదువరులలో అనేక మందికి ఇదంతా సంస్కృతభూయిష్టంగా ఉంది. దీని వెనుక కథ భారతీయ ఆస్తిక ధోరణికి ముడిపడి ఉంటుందేమోనన్న సందేహం కలుగవచ్చు. నిజానికి ఆ పదాలు వాడకుండగనే వాటి భావాన్ని వ్యవహారిక భాష ద్వారానూ వ్యక్తీకరించవచ్చు. కానీ అధ్యయనపరునికి, విషయంపట్లే దృష్టి ఉండాలి గాని, ఆ విషయం ఎవరు చెప్పారు, ఏ భాషలో చెప్పారు అన్నదానిపై దృష్టిపెట్టి చూసే నైజం ఉండకూడదు అన్నంతవరకేనని గ్రహించాలి.
వెంకటాద్రి గారు నాతో భావసారూప్యత కలిగి ఉన్నారు. హేతువాదికి ఏ గ్రంథమూ, ఏ సైద్థాంతికుడూ ప్రమాణం కారాదు, కారు, అని స్పష్టంగా ప్రకటించారాయన. ప్రశ్నించడానికి, ప్రశ్నింపబడడానికీ సమానంగా సిద్ధపడగలగడం హేతువాదికి ఉండాల్సిన నిబద్ధత. ఇతరులది విచారించడానికీ, పరీక్షించడానికీ సిద్ధపడడం, అలానే అంతే సమదృష్టితో తనది విచారణకు, పరీక్షకు ఇవ్వడానికీ సిద్ధపడడం హేతువాది స్వభావంగా ఉండాలి.
నిజానికి హేతుబద్దాలోచన ప్రతి వ్యక్తికీ నిత్యజీవితావసరం. అలాగే హేతువాద ఉద్యమం అన్ని ఉద్యమాలకూ ఊతాన్ని, బలాన్ని ఇవ్వగల పునాది ఉద్యమం. యోచనాశీలురైన ఆయా సైద్ధాంతికులకు గనుక ''హేతుబద్దాలోచన'' అన్నది గానీ లేకుండా ఉండుంటే, ఏ సిద్ధాంతాలూ పుట్టుండేవి కావు. వైజ్ఞానిక క్షేత్రాలు, హేతుబద్దాలోచనా సామర్ధ్యంతోనే పరికల్పనలను రూపొందించుకుంటాయి. ఆపైన ప్రయోగరీత్యా వాటిని పరీక్షించి సరిచూసుకుంటాయి. కనుక ప్రతి వైజ్ఞానిక ప్రయోగం వెనుకా హేతుబద్దాలోచన అన్నది అనివార్యంగా చోటుచేసుకొని, ఆద్యంతమూ - ప్రయోగపు ముగింపు పర్యంతమూ - పనిచేస్తూనే ఉంటుంది. హేతుబద్దాలోచన లేని జీవితాన్ని ఊహించడమే కుదరదు. వర్తమానం లోనుండి భవిష్యత్‌లోకి కదలాలన్నా, గతంలోనికి తొంగిచూడాలన్నా హేతుబద్దాలోచన తప్ప గత్యంతరం లేదు. కనుక మానవ సమాజమున్నంతవరకూ, మనిషన్నవాడు బ్రతికున్నంతవరకూ (నిజానికి జంగమాలైన ప్రాణులన్నింటికీ) హేతుబద్దాలోచనతో పనిఉంటుంది. యోచించే సామర్ధ్యం సహజాతం కనుక, సరైన ఆధారం లేకుండా చేసే యోచన విపరీత పరిణామాలకు దారితీస్తుంది కనుక, యోగ్యమైన ఆధారంతో యోచించడం అత్యంతావశ్వకం. మండలి ప్రధానాకాంక్ష - అంతిమ లక్ష్యం - ఉత్తమ సమాజం ఏర్పడాలన్నదే. ఐతే అది నెరవేరడానికి వ్యక్తులు స్వతంత్రాలోచనాశీలురై ఉండడం, భావబంధనాలనుండి విడుదలై ఉండడం ముందుగా జరగాలి. అటు తరువాత పొందిన వివృతమనస్సుతో జీవితాన్ని గురించిన అంటే వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్నవాటికి చెందిన యదార్ధ జ్ఞానాన్ని - సరైన అవగాహనను - కలిగించుకొని ఆ వెలుగులో తన నడవడిని తీర్చిదిద్దుకోవాలి. అలా, సంయజ్ఞానము - దానిననుసరించిన ఆత్మనియంత్రణ కలిగున్న వ్యక్తులున్న సమాజమే ఉత్తమ సమాజం దిశగా, ఎప్పటికప్పుడు మెరుగైన సమాజాన్ని నెలకొల్పుకుంటూ, అభివృద్ధిపథంలో పురోగమిస్తూ సాగిపోతూ ఉంటుంది.
కాబట్టి సమాజ పునర్నిర్మాణ కార్యక్రమం తలలను సంస్కరించుకోవడం సంస్కరించడంతో అంటే భావపరంగా ఉండకూడని వాటిని వదిలించుకొని, ఉండవలసిన వాటిని జతకూర్చుకోవడంతో మొదలవ్వాలి. అదిగో ఆ పనికై హేతువాద ఉద్యమం తనవంతుగా మార్గదర్శక పాత్ర పోషించాల్సి ఉంది.
ఆంధ్రాప్రాంతంలో (దేశమంతా కూడా అన్నా వాస్తవ విరుద్ధం కాదేమో) హేతువాద ఉద్యమం తిరిగి కోలుకోలేనంతగా పడకనపడిందన్న నిర్ణయానికి వచ్చాను నేను. సత్యాన్వేషణాతత్పరతతో గత నాలుగు థాబ్దాల పైబడి, ఇటు స్వీయ జీవితాన్ని, అటు గతానికీ, వర్తమానానికీ చెందిన సామాజిక గమనాన్ని (చరిత్రను) అవసరమైన అంశాలవరకైనా నిశితంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి చూసిన నాకు, వివిధ మతాలు, సిద్ధాంతాలు (ధోరణులు), వ్యక్తులు వారి వారి భావజాలమనే సంకెళ్ళతో సామాన్య జనుల మెదళ్ళను బంధించి, ఎవరికి చేతనైనంత మందిని వారు కట్టలుగట్టుకొని ఈడ్చుకెళుతున్నారని (మందకట్టుకొని తోలుకెళుతున్నారని) తేలిపోయింది. ఇలాంటి విషయాలను కథలు చదివినట్లు చదువుకెళ్ళకూడదు. సమస్యను పరిశీలిస్తున్నంత లోతుగా, గంభీరంగా పరిశీలించాలి.
ఏ పంథాను చూసినా, ఆ పంథాకు నేతృత్వం వహిస్తున్న వాణ్ణి చూసినా సంశయించడం, విచారించడం మాని, విశ్వసించి తనను అనుసరించమనడమే కనిపిస్తుంది. వీటిని, వీరిని మరికాస్త లోతుగా పరిశీలించిచూస్తే, అంతటితోనూ ఆగక, తనను విశ్వశించని, అనుసరించని వారిపట్ల వివిధ స్థాయిలలో అసహనాన్ని ప్రదర్శించినట్లు, ఆ అసహనం అతైనప్పుడల్లా - శృతిమించినప్పుడల్లా - శతృవైఖరిని ప్రదర్శించినట్లు చరిత్రంతా దాఖలాలు కనపడతాయి. దాదాపు మన థోరణులన్నీ నమ్మకంతో ప్రారంభమై కొన్ని విషయాలలో మూఢనమ్మకాలనడానికి తగిన రీతిలో, మూఢనమ్మకాలనక తప్పని థకు చేరి తీరికూర్చున్నయ్.
మనిషి ఏరకమైన విశ్వాసాల బంధనాలలో చిక్కుకుని ఉన్నప్పటికీ, ప్రతి థోరణిలోనూ అంగీకరించక తప్పని (వాస్తవ సామాజిక జీవనానికి అవసరమైన) మంచి భావనలు ఎన్నోకొన్ని చోటుచేసుకొని ఉండడం కనపడుతుంది. అట్టి వాటిని చూపించుకుంటూనే ప్రతి థోరణీ అనవసరమైనవీ, అంగీకరించరానివి, అంగీకరించలేనివి, అర్థం కానివి అయిన భావాలనెన్నింటినో వాటితో కలిపి మందినెత్తికెక్కించే పని చేస్తూ వస్తున్నాయి. జనం విశ్వసించడంపైనే తమ ఉనికి నిలబడి ఉంటుందన్న విషయం చాలా చాలా స్పష్టంగా గమనించిన ఆయా మత ప్రవర్తకులు, సంశయించడం, విచారించడం, పరీక్షించడం అన్న ప్రక్రియలకు జనం చేరువ కాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొంటూ వచ్చారు. పన్నగలిగిన పన్నాగాలన్నీ పన్నారు. సామాన్య జనంలో కలిగించగలిగినంత ఆశనూ, భయాన్ని కలిగించారు. జనాన్ని వారెంతగా వివశుల్ని - స్వవసుల్ని - చేయగలిగారంటే ఒక మందలోనివాడు మరో మందలోని వానిని తనవైపుకు లాక్కొనే పనిలో తాను చావడానికీ, అవతలి వాడిని చంపడానికి కూడా వారు సిద్ధపడేటట్లు చెయ్యగలిగారు. ఒకింత బలంగా నిలద్రొక్కుకున్న ఏఏ థోరణుల చరిత్ర చూసినా ఈ విషయం - ఈ వైఖరి - మాత్రం వారందరిలోనూ సమానంగానే ఉన్నట్లు రుజువవుతుంది.
మానవ సమాజాన్ని, వ్యక్తి జీవితాన్ని నిశితంగా, యధాతధంగా పరిశీలించే సందర్భంలోనే పై పోకడకు చెందిన చిత్రానికి వేరుగా, విరుద్ధంగా కూడా కొనసాగుతూ వస్తున్న మరో దృశ్యమూ కనపడుతోంది. మనిషిలో ఆలోచనాశీలత, సహజాత లక్షణంగా ఉండడం, ఆధారసహితంగా ఆలోచించక తప్పని వాస్తవ పరిస్థితులు ఎదురవుతూ ఉండడం అన్న రెంటివల్లా ప్రతి వ్యక్తీ, నిత్యజీవితంలో, ఎక్కువలో ఎక్కువసార్లు హేతుబద్దంగా - సక్రమంగానే - ఆలోచిస్తూనే జీవిస్తున్నాడు అన్నదే ఆ మరో దృశ్యం. (రాయ్ ప్రతిపాదించిన నవ్య మానవవాద సూత్రీకరణలోని మానవుడు వస్తుతః హేతుమంతుడు అన్న మాట ఈ విషయాన్ని సూచించేదే. హేతుమంతుడు కనుక నీతిమంతుడును అన్నది అన్ని సందర్భాలకూ వర్తించే అభిప్రాయం కాదు). తప్పనిసరి పరిస్థితుల్లోనూ ఇతరులచే అతిగా ప్రభావితుడైన సందర్భాలలోనూ మాత్రమే వ్యక్తి నమ్మడం అన్న దగ్గరకు వస్తుంటాడు.
నమ్మకం - విశ్వాసం - ప్రధానంగా శబ్దప్రమాణ క్షేత్రానికి సంబంధించిందై ఉంటుంది. కనుకనే ప్రతి మత థోరణికి, ఒక ప్రామాణిక గ్రంథమో, ఒక ప్రామాణికునిగా పరిగణింపబడే వ్యక్తో (ప్రవక్తో) ఉండితీరుతారు. ఆ గ్రంథం లేదా ఆ వ్యక్తి ప్రకటించే అభిప్రాయాలను పరీక్షించకుండగనే, అనుభవం ద్వారా తెలుసుకోకుండగనే సత్యాలుగా, ధర్మాలుగా అంగీకరించడాన్నే నమ్మడం (విశ్వశించడం) అంటాము. నిజానికి మనిషి జీవితంలో నమ్మక తప్పని పరిస్థితులు అనేకం ఉంటాయి. నమ్మకాలన్నవవేవైనా, వాటి విషయాలు మనకు సాక్షాత్తుగా తెలియనంతకాలమే పనిచేస్తుంటాయి. ఆయా నమ్మకాలకు సంబంధించిన విషయాలు మనకు అనుభవం ద్వారా తెలియబడగానే నమ్మకం అన్నపదం పోయి తెలిసింది (తెలుసు) అన్న పదాలు వచ్చి చేరతాయి. అంటే, నమ్మకాలన్నింటివెనుకా, వాటిని గురించి తెలియనితనం - అజ్ఞానం - ఉండితీరుతుంది. ఏర్పరచుకున్న నమ్మకాలకు చెందిన నిజానిజాలను వాటికి సంబంధించిన ప్రయోగాల ద్వారా జీవితాచరణ ద్వారా తెలుసుకుంటూ తప్పులను సరిచేసుకుంటూ, ఒప్పులను వినియోగించుకుంటూ సాగిపోతుంటాడు మనిషి. అలాంటి సందర్భాలలో అటు ప్రయోగాల ద్వారా గాని, ఇటు జీవితాచరణ ద్వారా గానీ, తప్పులని తేలిన వాటిని, ఒప్పులని తేలని వాటిని కూడా ఎవరూ నమ్మకాల జాబితాలో ఒప్పులుగనే అట్టిపెట్టు కుంటుంటారో అట్టి వాటిని మూఢనమ్మకాలని అంటాము.
హేతుబద్దాలోచన, హేతువాదము అన్నవాటిని గురించి మాట్లాడుకోవలసిన సందర్భములో, ఈ విశ్వాసాల, మూఢవిశ్వాసాల విచారణేంటి? అని మీలో కొందరికైనా ఆలోచన వచ్చిఉండవచ్చు. జీవితంలో నమ్మకాల అవసరం ఉందా? లేదా? అన్నదానికి గాని, నమ్మకానికి, జ్ఞానానికి, మూఢనమ్మకానికి ఉన్నతేడాలేమిటి? అన్నదానికి సరైన సమాధానాలు రాబట్టాలన్నా, ఎదుటివారికి చక్కగా అర్థమయ్యేలా వివరించాలన్నా మనకు సక్రమంగా ఆలోచించడం చేతనై ఉండాలి. మనం హేతుబద్దంగా ఆలోచించగలిగాం గనుకనే జీవితములో ''నమ్మకం'' అన్నదాని పాత్రను గమనించగలిగాం. నమ్మకం ఎంతవరకు అవసరమో, ఎక్కడ దాని అవసరముండదోనూ నిర్ణయించగలిగాం.
కనుకనే సక్రమాలోచనానియమాల శాస్త్రం - తర్కశాస్త్రం - ఒకవంక జీవితంలో నమ్మకపు పాత్రయెక్క అనివార్యతను అంగీకరిస్తూనే, సంశయించక విచారించడమే కుదరదని, విచారించక (పరీక్షించక) తప్పొప్పులను నిర్ణయించడమూ కుదరదని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది.
మిత్రులారా ! ఇవన్నీ నా అన్వేషణా పథంలో స్పష్టంగా గమనించాను గనుకనే, హేతుబద్దాలోచన ప్రతి మనిషికీ జీవితావసరమని, బ్రతుకు అవసరతే, అతని చేత ఆధారసహితంగా ఆలోచించడాన్ని అలవాటు చేసిందని చెబుతూవస్తున్నాను. అనేక సంస్థలు కలిసి ఏర్పరచుకున్నది, మండలి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నది అయిన ఉమ్మడి శిక్షణా తరగతుల్లోనూ, అధ్యయనాంశంగనూ, శిక్షణాంశంగనూ ''నిత్య జీవితంలో హేతుబద్దాలోచనావశ్వకత'' అన్న దానిని చేర్చుకున్నాము. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. కనుక వ్యక్తులు హేతుబద్దాలోచనాపరులుగా తయారవ్వాల్సి ఉందన్న విషయంలోగాని, ఆ దిశగా నిబద్ధతతో మనం చేయగలిగింది చేద్దామన్న విషయంలోగాని ఎటువంటి గుంజులాట లేదు మాకు.
సమాజ పునర్నిర్మాణ కార్యక్రమంలోకి నేను ప్రవేశింపక పూర్వం 3,4 థాబ్దాల ముందునుండే మూఢనమ్మకాలకు, కుల, మతాలకు వ్యతిరేకంగా ప్రజలను మేలుకొలిపే పనికి పూనుకుని, చిత్తశుద్ధితో కృషిచేస్తూ వస్తున్న ముఖ్యులలోని వారైన ఎన్.వి.బ్రహ్మం, గుత్తా రాధాకృష్ణ గార్లిరువురు మండలి పరిచయంలోకి వచ్చిననాటినుండీ నాతో కలిసి ఉంటూ, నన్ను ఎప్పటికప్పుడు మరింత దగ్గరగా పరిశీలిస్తూ మా కార్యక్రమాలలోనూ నిబద్దతతో పాల్గొంటూ వచ్చారు. ఒకటి రెండు తాత్వికాభిప్రాయాలలో మామధ్య ఏకాభిప్రాయము లేకున్నా, నేను, నా ఆలోచనలు ఏమత థోరణితోనూ ముడిపడినవి కాదన్నంతవరకు నిశ్చితాభిప్రాయం కలిగి ఉన్నారు వారిరువురు.
ఇక ఎనభయ్యో శతాబ్ది హేతువాద ఉద్యమంలో ఎన్.వి.బ్రహ్మం గారితో పాటు తానూ ప్రవేశించిన నాటినుండి ఈనాటి వరకు అత్యంత ప్రధాన భూమికను పోషిస్తూ వస్తున్న వెంకటాద్రి గారికి నాపై రకరకాల కారణాల వల్ల కొన్ని అపోహలు ఏర్పడ్డా, ఆయన బృందంలోని ముఖ్యులలో ఎవరెవరు నాతో సన్నిహితంగా ఉంటూ, నన్ను దగ్గరగా ఉండి పరిశీలిస్తూ వచ్చారో అట్టి 1. తోటకూర (చార్వాక) వెంకటేశ్వర్తు, 2. రావి సుబ్బారావు, 3. ఆరిజ్, 4. బసవపున్నారావు, 5. సిద్ధార్థబకక్షు, 6. వై. జగన్‌మోహన్‌రావు లాటి వాళ్ళకు నేను మతవాదిని కాదనేంతవరకు ఖచ్చితంగా తెలుసు. ఇందులోని ఇద్దరు ముగ్గురైతే మండలి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ వచ్చారు. వాళ్ళకైతే, ఎందరో హేతువాద ప్రముఖుల కంటేనూ నేను అనేక విషయాలలో మరింత హేతుబద్దంగా ఆలోచించగలనని, హేతువాద ఉద్మమావశ్యకతను చాలా స్పష్టంగా గుర్తించి ఉన్నానని తెలుసు.
ఇటు గుత్తా రాధాకృష్ణగారి బృందంలోని ముఖ్యులకు కూడా నేను మతవాదిని కాదన్నంతవరకు స్పష్టంగా తెలుసు. హేతువాద ఉద్యమం సామాజికావసరమని గత రెండు థాబ్దాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా మిత్రులతో చెబుతూ ఆ దిశగా కలసికట్టుగా కృషిచేద్దాం అని పదే పదే చెబుతూ వస్తున్నాను. ఈ గతాన్నంతా నెమరువేసుకొని, ఒకింత వేదనతోనూ, అసహనంతోనూ ఈ వ్యాసం ఆరంభంలో నేను వెల్లడించినట్లు ''హేతువాద ఉద్యమం తిరిగి కోలుకోలేనంతగా పడకన పడింది'' అన్న నిర్ణయానికి వచ్చాను నేను. అయినా ఉద్యమ నిర్మాణక్షేత్రానికి సంబందించిన ఒక తాత్విక సూత్రం బాగా వంటబట్టి ఉండటంతో గత 5,6 నెలలుగా గుమ్మా వీరన్న గారు, వై.జగన్‌మోహన్‌రావు, బ్రహ్మారెడ్డిగారు, జి.వెంకటస్వామి గారు మరికొందరు మిత్రులతో కలసి హేతువాద స్వరూప స్వభావాలపై ఒక క్రమంలో విచారణచేస్తూ వస్తున్నాము. ఏకాభిప్రాయానికి రాగలిగితే హేతువాద ఉద్యమాన్ని పునరుత్తేజపరచి కొనసాగించాలన్నదే ఈ ప్రయత్నం వెనుకనున్న నా ఆకాంక్ష. మరో ఘటనా గుర్తుకొచ్చిందిప్పుడే.
ఆ మధ్యనొకసారి సుమారు 5, 6 సంవత్సరములు కావచ్చునేమో, హేతువాద ఉద్యమంలో పాతకాపులనదగ్గవాళ్ళందరినీ సమీకరించి గోగినేని బాబు ఇంట్లో ఒక సమావేశం జరిగేలా కృషిచేశాను. ఆనాడు నా ప్రతిపాదన తాత్వికంగా ఉన్న భిన్నాభిప్రాయాలనలా ఉంచి హేతువాద ఉద్యమాన్ని సమష్టి కార్యక్రమంగా తీసుకొని కదులుదామన్నదే.
ఇలాటి పరిస్థితిలో జంగారెడ్డిగూడెంలో నున్న మిత్రుడు ఎం.ఎస్. ఫోను చేసి హేతువాదులందరినీ ఒకతూరి కదిలించబోతున్నాం, మీరూ పాల్గొంటే బాగుంటుంది గదా! అని అడిగారు. ఎందుకండి ఎం.ఎస్. గారు వృధా ప్రయాసలు. సంవత్సరానికో, రెండేళ్ళకో నలుగురు కలవటం, మతస్థులపైన, మతాలపైనా నాలుగు గేలి మాటలు మాట్లాడుకోవటం, అదిచేయాలి, ఇది చేయాలంటూ తెగ ఆవేశపడిపోవడం, టైమైపోయిందంటూనో, పనుందంటూనో హడావిడి పడిపోతూ మళ్ళా కలుద్దామంటూ వెళ్ళిపోవడం. అంతా గుడిపూడి జంగాల కథేకదా! హేతువాద ఉద్యమం తిరిగి పుంజుకుంటుందన్న ఆశ కలగడంలేదు నాకు అనన్నాను ఆయనతో. అలాకాదులేండి, మళ్ళా కదలిక తేవాలని గట్టి కృషిచేస్తున్నాం. మీరూ రావడం ఉద్యమానికి మంచిది, ఆలోచించండొకసారి అన్నారాయన. కరపత్రంలో పేరు వేయకండి. అత్యవసర కార్యక్రమాలు వత్తిడి చేయకుంటే తప్పక వస్తాను అన్నాను. తీరా వచ్చి అక్కడి నిర్వాహకుల యత్నం చూశాక, పునర్నిర్మాణ యత్నాల ఆరంభకృషికి న్యాయం చేశారనిపించేంత కృషేజరిగిందినిపించింది. కొనసాగింపు యత్నాలు, పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాలిక. ఒక్కమాట మళ్ళా చెబుతున్నాను. ఎవరు ఎక్కడ నుండి ఆరంభించినా, హేతువాద ఉద్యమంలో సత్యాన్వేషణ మండలి శక్తివంచన లేకుండా తన వంతుగా భాగస్వామి పాత్రను పోషించగలదని మాత్రం నిజాయితీగా వాగ్దానం చేస్తున్నాను. మరొక్క మాట. ఇంతోటి కృషికి కంకణం కట్టుకున్న కె.సత్యన్నారాయణ గారిని అభినందించి ఊరుకోవడం కంటే, అట్టి వారి కృషిలో భాగస్వాములం కావడం ఆశ్రమలో కొంత భారాన్ని మనమూ పంచుకోవడం విజ్ఞత. వ్యక్తిగా పట్టుబట్టే వాళ్ళం వందమందిమి కూడగలిగితే చాలు. వాడవాడలా హేతువాద అవగాహనా సదస్సులు నిర్వహించవచ్చు. జిల్లా స్థాయిలో అధ్యయన శిక్షణా తరగతుల్ని నిర్వహించుకోవచ్చు. ఈ పని శక్తివంతంగా కొనసాగించాలంటే హేతువాద అధ్యయనాంశాలను, అవకాశమున్న మేరనైనా, గుదిగుచ్చి, ఆ భావజాలాన్ని నిర్ధిష్ట రూపంలో లిపిబద్దం చేయాల్సిన అవసరముంది.
మలి సమావేశాన్ని ఏప్రియల్ 27, 28 తేదీలలో సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో నిర్వహించుకొనేలా నిర్ణయం జరిగింది. ఆనాటికి హేతువాద ఉద్యమావశ్యకతను స్పష్టంగా గుర్తించి అందుకు శక్తి ఉన్నంత మేర (ఎంతోకొంత మేర) పూనుకోగల వాళ్ళను సమీకరించవలసి ఉంది. కనుక మనమందరం గట్టిగా యత్నించాలి. గతంలో హేతువాద ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వారిని సమావేశానికి రాబట్టాల్సి ఉంది. ఆపనీ రాశికోసం కాకుండా వాసిని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు నలుగురైదుగురు చొప్పున సమీకరించుకోగలిగితే మలిథ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవచ్చు.
వచ్చిన వారిలో ఒక్క 10 మందిని అవసరమైన భావజాలాన్ని క్రోడీకరించి గుదిగుచ్చే పనికి ఎంపికచేసుకోగలిగితే, ఒకటి రెండు నెలల్లో ఆపనిని వారు పూర్తిచేయగలిగితే, ఉద్యమ భవనానికి పునాది ఏర్పడినట్లవుతుంది. నా ఆలోచనలు ఇక్కడికి చేరాక, అసలింతకు హేతువాదంపై తెలుగులో రచనలేమేమి ఉన్నాయో చూద్దామనిపించి ఆ దిశగా దృష్టి సారించాను. వెంకటాద్రి గారివి, గుమ్మా వీరన్న గారివి, ఎం.వి.రామ్మూర్తి గారివి తప్ప ఇంకే రచనలూ దొరకలేదు.
1980 నాటి ''హేతువాదం'' అన్న తన రచనలలో వెంకటాద్రి గారున్నూ, ''ఈ రచనకు పూర్వం హేతువాదమంటే వివరించడానికి తెలుగులో పుస్తక రచన ఎవరు గానీ చేసినట్లు లేరు. చేసి ఉంటే నా దృష్టికి రాలేదు'' అన్న మాటతోనే తన ముందు మాట ప్రారంభించారు. ఇక నా దృష్టికానినంతలో చెప్పాలంటే, ఆనాటికే కాక ఈనాటికీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వెంకటాద్రి గారు హేతువాదపు పరిస్థితిపై మరికొన్ని మాటలూ రాశారు. ''హేతువాదం మీద ఇంగ్లీషులో కూడా సిద్ధాంత పరమైన చర్చ చేసిన గ్రంథమేదీ నాదృష్టికి రాలేదు''. అర్చిబాల్ట్ రాబర్ట్‌సన్ లిటరరీ గైడ్‌లో, 1940 థకంలో రాసిన వ్యాసాలు కొన్ని ''రేషనలిజమ్'' పేరున బ్రిటీష్ రేషనలిస్ట్ ప్రెస్ అసోసియేషన్ వారు ప్రచురించారు కాని అందులోనూ హేతువాదం మీద సిద్ధాంత చర్చ లేదు. రేషనలిస్ట్ ప్రెస్ అసోసియేషన్ (ఆర్.పి.ఎ) వారి పత్రికలీవిషయం పౖౖెన సుదీర్ఘంగా చర్చించాయి. కాగా ఎం.ఎన్.రాయ్ రచనలు నాకు దీనిపై కొంత అవగాహనకు తోడ్పడ్డాయి.
ఇప్పటికీ హేతువాద, నాస్తిక వాదాల పేర్ల క్రింద, అందుకు తగిన స్థాయి లేని వర్గాలు (సమూహాలు) పనిచేస్తున్నాయనీ, అలాటివన్నీ హేతువాద వైఖరికి చెందినవి కావనీ ఆయన అన్నారు.
''హేతువాదం'' అన్న శీర్షిక (పేరు) క్రింద చోటుచేసుకొనుండే పదాలు, అభిప్రాయాలు కొన్ని మీ ముందుంచుతాను. జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించి వాటి విషయంలో మీ అవగాహనేమిటో గమనించండి. అవకాశము, అభిలాష ఉన్నవాళ్ళు ఏప్రియల్ 27, 28 తేదీలలో హేతువాద పునర్జీవన కొరకు సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో జరగనున్న సమావేశాలకు ముందుగా తెలియపర్చుకొని రండి. లేదా క్రింది అంశాలపై మీమీ అవగాహనలను వ్రాతమూలకంగా సిద్ధంచేసి మాకు పంపించండి. అవసరమైన మేర వాటిలోని మీ భావాలనూ ఆ సమావేశంలో పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాము. ఆ రకంగా హేతువాదోద్యమ పునర్నిర్మాణ కృషిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములు కండి.
కొన్ని మార్గదర్శకాలు :
1. ఏ సిద్ధాంత రచనైనా కొన్ని ముఖ్యమైన పదాలను - పారిభాషిక శబ్దాలను - కలిగి ఉంటుంది.
2. అట్టి వాటికి అటు నిర్వచన రూపంలో గానీ, ఇటు వివరణ రూపంలో గానీ స్పష్టంగా అర్థాలు చెప్పుకు తీరాలి.
ఏ వివరణ : ఎందుకంటే ఒక వ్యక్తి తాను అర్థంచేసుకున్న విషయాలను గానీ, ఏర్పరచుకున్న అభిప్రాయాలను గానీ వ్యక్తంచేయడానికైనా, ఎదుటివారికి అంటే భావవ్యక్తీకరణకు గానీ, భావ ప్రసారానికి గానీని భాషను వాడుకోక తప్పదు. కనుక, భాషా నియమాలను అనుసరించి తీరాల్సిందే.
ఎ) పదాలు - వాటి అర్థాలు తెలుసుకున్న వారికే వాక్యాలు అర్థమవుతాయి. అంటే పదపదార్థ జ్ఞానం ఉన్నవారికే వాక్యర్థజ్ఞానం కలుగుతుందని.
బి) ఇద్దరికీ ఒకే రకమైన పదాలకు, ఒకేరకమైన అర్థం ఉన్నప్పుడే ఒకరు చెప్పింది మరొకరికి యధాతధంగా అర్ధమవుతుంటుంది.
సి) పర్యాయపదాలు, నానార్థాలు కలబోసుకొని ఉన్న భాషను వాడుకొనేప్పుడు పొరపాటుగా అర్థం చేసుకొనే ప్రమాదం జరగకుండా ఉండేందుకు, శ్రద్ధగా వినడం, అవసరమైనప్పుడల్లా విన్నమాటకు అర్థాన్ని అన్నవారినే అడిగి తెల్సుకోవడం, అలాటి సందర్భాలలో అన్నవారు తానన్న మాటకు భాష అంగీకరించే పరిధిలో తన అర్థాన్ని చెప్పే బాధ్యత వహించడం అవసరం.
ఏ ఈ నియమాలననుసరించే, శాస్త్రీయ స్థాయి కలిగిన రచనలలో పారిభాషిక శబ్దాలకు నిర్వచనాలు చెప్పే విధానం (నియమం) అమలవుతోంది.
ఏ తాత్వికస్థాయి లేదా సిద్ధాంత స్థాయి కలిగిన రచనలన్నింటికీ ఈ నియమం తప్పనిసరి. కనుక మన ప్రస్తుతాంశమైన హేతువాద విచారణ సందర్భానికీ ఇది తప్పనిసరి అవుతుంది.
గమనిక : వందల సంవత్సరముల చరిత్ర కలిగి ఉన్న హేతువాదమన్నదానికో సరైన, సమగ్రమైన సిద్ధాంత రచనే ఈనాటికీ లేకపోవటం కంటే విచారకరమైన అంశమేముంటుంది. ఆ లోటుండటం వల్లనే రకరకాల ధోరణులకు చెందిన హేతువాదులు పుట్టి కొట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఇతర తాత్విక - సిద్ధాంత - ధోరణుల నుండి, హేతువాద భావజాలాన్ని - సిద్ధాంతాన్ని - విడదీసి నిర్థిష్ట రూపంలో గుదిగుచ్చుకోవడం మంచిది. అది వివేకవంతమూ, సామాజికావసరం కూడా.
కొన్ని పారిభాషిక శబ్దాలు :
1. హేతువు, 2. హేతుత్వము, 3. ఆలోచన, 4. ఆధారము, 5. ఆధారసహితాలోచన, 6. హేతుబద్దాలోచన, 7. అహేతుకాలోచన, 8. తర్కము, 9. తార్కికాలోచన, 10. హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలు, 11. తార్కికాలోచనాజనిత నిర్ణయాలు, 12. ఊహ, 13. కల్పన, 14. పరికల్పన, 15. జ్ఞానము, 16. విజ్ఞానము, 17. అజ్ఞానము, 18. తప్పుజ్ఞానము, 19. ఒప్పుజ్ఞానము, 20. ప్రమ - భ్రమ - భ్రాంతి, 21. వాస్తవము, 22. యదార్ధము, 23. సత్యము, 24. ప్రత్యక్షజ్ఞానము, 25. పరోక్ష జ్ఞానము, 26. సత్యము - అసత్యము, 27. సత్యాసత్య వివేచనా పద్ధతి, 28. శాస్త్రీయము, 29. శాస్త్రీయ దృక్ఫధము, 30. శాస్త్రీయ పద్ధతి, 31. కార్యము, 32. కారణము, 33. నియమము, 34. కార్యకారణ నియమము, 35. ప్రకృతి, 36. విశ్వము, 37. పదార్థము, శక్తి, క్షేత్రము, 38. అనుభవము, 39. అనుభూతి, 40. ప్రయోగము, 41. వాదము, 42. వాదన, 43. రుజువు, 44. ఉదాహరణ, 45. ఉపమానము, 46. హేతువాదము, 47. సిద్ధాంతము, 48. లయ - ప్రతిధ్వని, 49. స్వేచ్ఛ, 50. స్వతంత్రము, 51. సంపూర్ణ స్వేచ్ఛ, 52. విసృంఖలత, 53. నీతి, 54. సామరస్యం, 55. సానుభూతి, 56. సహానుభూతి, 57. వస్తువు, 58. ద్రవ్యము, 59. పదార్థము, 60. మనస్సు, 61. సంఘటన.
మిత్రులారా ! పై పదాలకు ఖచ్చితమైన రూపంలో సరైన అర్థాలు గనక చెప్పుకోకున్నా, ఎవరిష్టం వచ్చిన అర్థాలు వారు పెట్టుకొని ఉన్నా 1. స్ఫష్టమైన అవగాహన కలగదు, 2. ఒకళ్ళ మాటలొకళ్ళకు అర్థం కావు, లేదా తప్పుగా అర్థమవుతాయి. ఒకేరకమైన పదాలకు, ఒకేరకమైన అర్థాలున్నప్పుడే భాష భావప్రసారసాధకం కాగలుగుతుందన్నది భాషనెరిగిన వారిలో (100 శాతం సరైనది) నిర్వివాదాంశం. కనుక మన ప్రస్తుతాంశమైన ''హేతువాదం'' అన్న ధోరణిని కూలంకషంగా, తులనాత్మకంగా, పరిశీలించాలన్నా, పరీక్షించాలన్నా, ప్రకటించాలన్నా పై పదాలకు దోషరహితమైన, నిర్థిష్టమైన అర్థాలు ముందుగా సిద్ధం చేసుకోవాలి. మరో మార్గంలేదు. వీటికి తోడు వెంకటాద్రి గారు వెల్లడించిన కొన్ని భావాలను ఇక్కడ వ్రాస్తున్నాను. వాటినీ పరిశీలించి, ఆ భావాల విషయంలో మీ అవగాహనేమిటోనూ నిర్ణయించుకుని రండి రేపటి సమావేశానికి. అదనంగా ఇంకేమైనా విచారించాల్సిన అంశాలుంటే వాటినీ వ్రాసుకొని రండి. మిత్రుల ముందు పెడదాం.
1. హేతువు అనేది విశ్వక్రమములోని లయ, హేతుత్వమనేది విశ్వక్రమముయొక్క ప్రతిధ్వని.
2. మానవుడు వస్తుతః హేతుమంతుడు. ఇతర జీవజాలములోనూ హేతుత్వం ఉంది.
3. ఆలోచనలోని క్రమబద్దతనే మనం హేతుత్వం అంటున్నాం.
4. విశ్వంలో జరుగుతున్న ఘటనల క్రమం యొక్క ముద్ర మన మనస్సుల మీద పడటం వల్లనే వాటిమధ్యనున్న సంబంధాన్ని గ్రహించగలుగుతున్నాం. అలా గ్రహించిన దానినే మనం జ్ఞానం అంటున్నాం.
5. మానసిక వ్యాధి ఉన్నవారికి మాత్రమే లేనివి వున్నట్లు, ఉన్నవి లేనట్లు అనుభూతి కలుగుతుంది.
6. విశ్వంలో క్రమంలేకుండా ఉండుంటే, వాటి జ్ఞానం మనకు కలిగేది కాదు.
7. ప్రకృతి నియమాలు మన అనుభవంలోకి వచ్చినప్పుడు, వాటి జ్ఞానం మనకు కలిగినప్పుడు, ఫలాన కారణాల వల్ల ఫలాన ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుంటున్నాం. అదే హేతుత్వమంటే.
8. జ్ఞానం హేతు వికాసానికీ, ప్రతిగా హేతుత్వం ఇతోధిక జ్ఞానాభివృద్ధికి దారితీస్తాయి.
9. జ్ఞానం సత్యాన్ని తెలుసుకోవటానికి దోహదం చేస్తుంది. సత్యమంటే జ్ఞాన విషయమే.
10. దేనిని మనం తెలుసుకుంటామో అది సత్యమవుతుంది.
11. సత్య పరిజ్ఞానం స్వేచ్ఛకు దారితీస్తుంది. స్వేచ్ఛ అంటే మన గమన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవటమనే.
12. మొదటి సత్యం కంటే సమగ్రమైన సత్యాన్ని మానవుడెల్లప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు.
13. హేతుత్వం, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ అనేవి ఒక క్రమంలోనివి.
14. సమాజ సామరస్యతకు దోహదం చేసేదే నీతి.
15. ఉనికి జ్ఞానంపైన ఆధారపడి ఉంటుందనే వారు హేతువాదులూ కారు, నాస్తికులూ, భౌతికవాదులూ కారు.
16. ఒక విధంగా చూస్తే భావవాదులూ, మాయావాదులూ నాస్తికులే, నిరీశ్వర వాదులే, అయినా వారిది నిరీశ్వరవాదం కాదు.
17. భౌతిక వాస్తవికతకు, భౌతిక నాస్తికతకు మధ్యగల తేడా గమనించడంలోనే హేతుత్వం ఉంది.
18. మనుషులు లేకపోయినా విశ్వం ఉంటుంది అనేది వాస్తవిక సత్యం.
19. విశ్వం వాస్తవం (రియల్) విశ్వంలోని మనం, మన జ్ఞానం వాస్తవం.
20. ప్రపంచాన్ని గురించిన మన అనుభవం కూడా వాస్తవమే. అనుభవం నుండే జ్ఞానం చిందుతుంది.
21. ఇంద్రియ జ్ఞాన పరోక్షంలో మనస్సుపడే ఆరాటం ఆలోచన కాదు. దానివల్ల జ్ఞానం లభించదు.
22. విశ్వమంటే - ఏదైతే వున్నదో అదంతాను అని అర్థం.
23. పంచేంద్రియాలు గ్రహించే జ్ఞానానికి మనిషి హేతుత్వాన్ని సంధించి పెంపొందించడం వల్ల ఆ జ్ఞానం ద్విగిణీకృతమవుతుంది.
24. ప్రత్యక్ష జ్ఞానాన్ని మననం చేసి మనస్సు ఆలోచిస్తుంది. అది నిరంతర క్రమం.
25. ఒకసారి ఏర్పడిన భావాలు, భావచిత్రాలు వస్తువులుగా మారిపోతాయి.
26. స్మృతి జ్ఞానం, పంచేంద్రియ జ్ఞానంతో సమానమే.
27. కోరినంత మాత్రానే మనకు మనస్సులో ఆ వస్తువులు ప్రత్యక్షమవుతాయి.
28. ప్రతి ఆలోచనకూ ముందే దానికిసరిపడే జ్ఞానం ఉండాలి. అది ప్రత్యక్ష జ్ఞానమే కానవసరం లేదు.
29. ప్రతిదీ ప్రత్యక్షం ద్వారా కనిపించాలని ఏ హేతువాదీ అనడు. ప్రయోగాల ద్వారా, ప్రమాణాల ద్వారా పునఃపరిశీలించి రుజువు చేసుకొని నిజాన్ని ధృవపరుచుకోవాలని మాత్రమే అంటాడు.
30. అనిశ్చయ సూత్రానికి విజ్ఞాన శాస్త్రములో తావులేదనే వాస్తవం నిరూపించబడింది. నిజానికది నిరూపణతో నిమిత్తంలేని వాస్తవం.
31. అనిశ్చయతా సూత్రానికి చెప్పే భాష్యాలు తప్పయ్యాయిగాని, నియతివాదం మాత్రం తప్పని రుజువు కాలేదు. కాబోదు.
32. విశ్వం స్వయంకారణమైన అనాది. ముమ్మాటికీ దానికి బాహ్యకారణం లేదు.
33. హేతువాదం నియతి తత్వం ద్వారా కర్మవాదానికి దారితీస్తుందనే అపప్రద ఒకటుంది. అది నిరాధారం.
34. హేతువాదములో ప్రతి కార్యానికీ కారణం ఉండాలి కాబట్టి, అనాదికి కారణం లేదు కాబట్టి హేతువాదం తప్పుఅని కొందరు అంటారు.
35. విశ్వం దైవం లాగా భావనామాత్రం కాదు. అది యదార్ధం, వాస్తవికం, దాన్ని మనం అనుభవిస్తున్నాం.
36. హేతువాదమనేది కేవల తర్కం కాదు. అది సందర్భోచితమైన వివేకంతో తర్కిస్తుంది.
37. స్వేచ్ఛ కూడా హేతుబద్దమైనదే. హేతుబద్దం కాని స్వేచ్ఛ ''మదం'' అవుతుంది. మతోన్మాదమవుతుంది.
38. స్వేచ్ఛకు మూలం జ్ఞానం, సత్యం. వాటికి మూలం హేతుత్వం.
39. ప్రకృతిలో నియమబద్దత, మానవునిలో హేతుబద్దత లేకపోతే అస్సలు స్వేచ్ఛ అనేదే సాధ్యం కాదు.
40. స్వేచ్ఛకు బానిసత్వానికి తేడా తెలియని అహేతుకవాది స్వేచ్ఛను అనుభవించటమే సాధ్యం కాదు.
41. నీతి అంటే ఏమిటో, నీతివంతంగా ఎందుకు ప్రవర్తించాలో అహేతుకవాదికి అర్థం కాదు.
42. హేతువాదం తప్పనేవారు కూడా హేతురీత్యానే, తర్కరీత్యానే ఆలోచిస్తుంటారు.
43. హేతుత్వం సమగ్రంగా పనిచేసే విధానాన్నే హేతువాదం అంటున్నాం.
44. హేతువాదమనేది ఒక వాదం కాదు. అదొక ఆలోచనా విధానం. సమగ్ర ఆలోచనకు సాధనం, హేతుత్వం సాధనంగా తప్ప ఆలోచించడానికే వీలులేదు. అహేతుక ప్రమేయాల మీదనుండి అహేతుక నిర్ణయాలు చేసేవారు కూడా హేతుత్వం సాదనంగానే ఆలోచిస్తారు.
45. మొదట దైవాన్ని ఊహించింది, భావించింది కూడా హేతువాద విధానమే.
46. మతం అజ్ఞానంలోనుంచి పుట్టలేదు. అసమగ్ర జ్ఞానంలోనుండి పుట్టింది.
47. నిజానికి మతాలన్నీ ప్రారంభంలో హేతుత్వం నుండి పుట్టినవే. అవి సమకాలీన మూఢనమ్మకాలను ఎదిరించడానికి అవతరించినవే.
48. స్వభావములో ఉన్న హేతుత్వంలో శాస్త్రజ్ఞానాన్ని తరచి పురోగించడమే సమగ్ర హేతువాద లక్షణం.
49. మారని విజ్ఞానమే మతమై కూర్చొంటుంది.
50. వక్రమార్గంలో పయనించే హేతుత్వాన్నే నిర్హేతుకత్వం అంటున్నాం.
51. నిజానికి ఏ శాస్త్రంకానీ అభౌతికతను అంటే భౌతికాతీతత్వాన్నీ, అతీంద్రియత్వాన్ని సమర్థించదు.
52. మానవునిలోని నిర్హేతుకత్వం కూడా హేతువాద బీజాలనుండి ఉత్పన్నమైనదే.
53. స్థిరమైన భావాలు మనిషి ఆలోచనల్లో జడత్వాన్ని చొప్పిస్తాయి. అప్పుడు ఆలోచనల్లో హేతుత్వం లోపిస్తుంది.
54. విశ్వాసమనేది మానవ చైతన్య స్వభావానికే విరుద్దం. మానవజాతి పురోభివృద్ధికి హానికరం.
55. పరిశీలించడం, గ్రహించడం, సంశయించడం, ప్రశ్నించడం, వివేచనతో నిరూపణ చేసికోవటం ద్వారా సత్యాన్ని నిర్ధారించుకోవడమే మానవ స్వభావం.
56. సంశయించకపోవడం, ప్రశ్నించకపోవడం మానసిక రోగలక్షణం.
57. మనమొక అబద్దాన్ని నమ్మితే దాని ఫలితం మనవరకే పరిమితమై ఊరుకోదు. అది అంటు జాఢ్యంలా సమాజమంతటికీ వ్యాపిస్తుంది. కనుక నిజమైన సామాజిక జీవిగా అసత్యాన్ని నమ్మి ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదు.
58. మతవిశ్వాసం అవినీతికి ప్రధమశ్రేణి ఉదాహరణ. అలాంటి మతంలో విశ్వాసముంచడమంటే మనిషి ఆలోచనా రహితమైన పశుథలోకి మారడమే.
59. తప్పుడు ప్రాతిపదికల్ని తీసుకుని వితర్కం చేసే విధానాన్ని మనం హేతుత్వం అనం. హేతుత్వం అంటే శుష్కతర్కం కాదు.
60. దేవుడనేవాడొకడున్నాడనీ, ఈ సృష్టికంతటికీ అతడే కారకుడనీ, రుజువు చెయ్యాల్సిన బాధ్యత ఆస్థికులపైనే వుంది.
61. యుక్తివాదంతో కుంటిసాకులు చూపడం, సాదృశ్యాలను, ఉపమానాలను ఆశ్రయించడం, దేవుని అస్థిత్వాన్ని రుజువుచేయడానికి సాధనాలు కాజాలవు.
62. హిందువుల సంతానం హిందూ మతాన్ని, క్రైస్తవుల సంతానం క్రైస్తవ మతాన్ని, ముస్లింల సంతానం ఇస్లాం మతాన్ని విచక్షణారహితంగా అవలంభిస్తున్నారు. దానిని వారసత్వంగా తప్ప మరోరకంగా అర్థంచేసుకోలేము.
63. ఈ విశ్వాన్ని సృష్టించక పూర్వం దేవుడు ఏమి చేస్తూవున్నాడు? అన్న ప్రశ్న ఒకింత బుద్దున్న ఆస్థికుల్లోనూ పుట్టింది.
64. నేనొక్కణ్ణే దేవుణ్ణి, నేనుతప్ప వేరే దేవుళ్ళు లేరు, ఇతరులను పూజించకండి అని మొత్తుకోవాల్సిన ఖర్మ ప్రతి దేవునికీ ఎందుకు పట్టింది?
65. తనకూ, ప్రకృతికీ మధ్య ఉన్న సంబంధాన్ని మనిషి అర్థంచేసుకోగలడు. ఆ అర్థం మీదినుండి బయలుదేరే ఆలోచనే హేతుత్వం అంటున్నాం.
66. రకరకాల వంచనల నుండి తప్పుకోవడం, యితరులను తప్పించడం హేతువాదుల కర్తవ్యం.
67. హేతువు - రీజన్ - సాధనమేగాని లక్ష్యంకాదు. హేతువాదం విధానమేగాని సిద్ధాంతం కాదు. దీనిమీద ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసినా అదంతే. హేతువును సాధనంగా చేసికొని లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యసాధన హేతుబద్దంగా ఉండాలి. అలాఅని చెప్పే విధానమే హేతువాదం.
68. మత పునరుజ్జీవన వాదం సమాజాన్ని వెనక్కు నడుపుతుంది. అత్యంత ప్రమాదకరమైన ఆ స్థితిని నివారించుకోవడానికి హేతువాద ఉద్యమం అవసరం. మానవవాద ఉద్యమంవైపు ప్రయాణించే హేతువాద ఉద్యమమే ఈనాడు తాత్విక విప్లవానికి మార్గం.
69. కేవలం తర్కం హేతువాదం కాదు. గౌతముడి న్యాయదర్శనమూ హేతువాదం కాదు. ఆర్థిక నియతివాదమూ హేతువాదం కాదు. నాస్తికత్వము, భౌతికవాదము హేతువాదం కాదు. గారడీ విద్యలను ప్రదర్శించడం హేతువాదం కాదు. వీటిని వేరుగా వున్న శాస్త్రీయ హేతువాదాన్ని చిత్తశుద్ధితో ప్రచారం చేయాలి. మానవవాద విలువల్ని ప్రతిపాదించి, పరీక్షించే హేతువాదం అత్యావశ్యకమవుతుంది.
హేతువాద వైఖరి :
1. హేతువాదమంటే కేవలం వ్యతిరేక వాదమనే అపోహ ప్రచారంలో ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత హేతువాద మిత్రులందరి మీదా ఉంది.
2. హేతువాదులకు బుద్ధుడుగానీ, క్రీస్తుగానీ, మార్క్సుగానీ, మనువుగానీ, గాంధీగానీ, ఎం.ఎన్.రాయ్‌గానీ ప్రమాణం కాదు.
3. జ్ఞానం పెరిగేకొలదీ మనిషిలో హేతుఅన్వయశక్తి పెరుగుతుంది.
4. మనుషులంతా సహేతుకంగా ఆలోచించగలవారే. ఆ శక్తి వారిలో గుప్తంగా లేకపోతే బయటనుంచి ఎక్కించలేము.
5. ఒకతరంవారు ఆర్జించిన విజ్ఞానాన్ని పరమ విజ్ఞానంగా భావిస్తే అది మతమైకూచుంటుంది.
6. ఏ మతమూ భిన్నాభిప్రాయాలను సహించదు. కనుక హేతువాదమూ అలాగే తయారై మరోమతం కాకూడదు.
7. భావవాదమూ, భౌతికవాదమూ కూడా సత్యాన్వేషణ ఫలితంగానే పుట్టాయి. ఇందులో ఏ వాదమూ స్వార్ధంతో సృష్టించబడింది కాదు. నిజానికి ఆ రెండు వాదాలవారూ జిజ్ఞాసువులే.
8. నేటిశాస్త్రజ్ఞానం ఏమి చెబుతున్నదీ తెలిసికోకుండా పచ్చి ప్రకటనలు చేసే మతపద్ధతిని హేతువాదులు అనుసరించరాదు.
9. హేతువాదమంటే గారడీలు చేయటం, పాములు తినడం కాదు. హేతువాదాన్ని తెలుపబోయి గారడీలను ప్రజలముందుంచడం ప్రమాదకరమైనది. అలా ఎరనువేసి చేపను పట్టాలని భావిస్తే చివరకు ఎరతోపాటు హేతువాదమూ మాయమైపోతుంది. గతంలో చాలా ఉద్యమాలు ఇలానే చేసి నాశనమైపోయాయి.
10. ఏది హేతువాదమో అర్ధంకాకపోతే, అలా అర్థంకాని, అవగాహన లేనివారు (అది మనమైనా) చెప్పేదంతా హేతువాదం కాదు.
11. అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప హేతువాదాన్ని బ్రష్టుపట్టకుండా కాపాడలేము.
12. హేతువాదుల నిర్ణయాలు, విశ్వాసాలు కాకూడదు. వారు శాస్త్రప్రయోగాలాధారంగా మాత్రమే నిర్ణయాలు చేసుకోవాలి. అట్టివైనా పరీక్షకు నిలవకుంటే వాటిని మార్చుకొంటానికి ఎటువంటి బేషజాలు లేకుండా సిద్దంగావుంటారు.
13. మతస్తుడు దేవుడున్నాడని పిడివాదం చేస్తున్నట్లే, మనం కూడా లేడని పిడివాదం మొదలుపెడితే అతనికీ మనకూ తేడాలేనట్లే. మనది విశ్వాసం కాదు. లేడన్న ఆ నిర్ణయాన్ని ఎలాచేశామో సరైన అవగాహనకావాలి.
14. హేతువాది అవశ్యం సాపేక్షసిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతం లాంటి వాటిని అధ్యయనం చేయాలి.
15. మనిషి జీవపరిణామక్రమంలో ఉద్భవించినవాడేగానీ దేవుడి సృష్టికాదు. నిర్జీవ పదార్ధం నుండి జీవుల్ని సృష్టించే రోజులు ఇంకెంతో దూరంలో లేవు (1980).
16. పితృలోకాలు, పునర్జన్మలు, ఆత్మలు వున్నాయని మతస్తులు మూఢంగా అన్నట్లే, మనమూ మూఢంగా అవి లేవనడం సరికాదు. మన నిర్ణయాల్ని శాస్త్రబద్దం చేసుకోవాలి. అవసరమైతే శాస్త్రబద్దంగా సవరించుకోవాలి. అలాచేయకుంటే మనం మతాలను విమర్శించే అర్హతలను కోల్పోతాము.
17. మతస్తుల ఆచరణంతా అనుచరణ. ఉన్న ఆలోచన వారిది కాదు. హేతువాదులు అలా ఉండకూడదు.
18. ఆలోచన, ఆచరణలకు వైరుధ్యం లేకుండా ఉండాలంటే, అవగాహన ముఖ్యం. అందుకనే మనం హేతువాదాన్ని దాని మూలానికి వెళ్ళి అన్ని శాస్త్రాలు వెల్లడించిన విజ్ఞానం ఆధారంతో అవగాహన చేసుకోవాలి.
19. ఆలోచించే హక్కును నిరాకరించి, ఆచరణను బోధించిందల్లా (నోరుమూసుకుని చెప్పింది చైఅన్నదల్లా అనా) మతమైంది. అందువల్ల ప్రతి హేతువాద కార్యకర్త యొక్క ప్రథమ బాధ్యత, తానేది ఇతరులకు చెబుతున్నాడో దాన్ని తెలుసుకునే చెప్పాలి.
గమనిక : 1983లో తెనాలిలో వెంకటాద్రి చేసిన ప్రసంగాన్ని అంచా బాపారావు గారు పై విధంగా సమీక్షించారు. ఇక్కడి వరకు ''హేతువాద వైఖరి'' పుస్తకానికి వెంకటాద్రి గారి ముందుమాటగా ఉంది.
20. హేతుత్వానికి మూలాన్ని మనం మనిషిలో చూస్తాం. అతనిలోని హేతుత్వానికి మూలాన్ని తిరిగి ప్రకృతిలో చూస్తాము.
21. దేనిని మనం ప్రకృతి అంటున్నామో ఆ విశ్వమంతా సంఘటనల మయంగా వుంది.
22. ముందు సంఘటన తరువాతి సంఘటనకు కారణంగాను, తరువాతది ముందుదానికి కార్యంగాను చెప్పుకుంటున్నాం. నీరు ఆవిరిగాను, ఆవిరి నీరుగాను - శక్తిద్రవ్యంగాను, ద్రవ్యం శక్తిగాను మారటం అలాటిదే. ఒక్కొక్కప్పుడు కార్యమే కారణంగానూ, కారణమే కార్యంగానూ మారతాయి. కారణాన్ని ముందుకు నడిపితే కార్యము, కార్యాన్ని ముందుకు నడిపితే కారణమూ అవుతాయి. వాస్తవికతను అర్థంచేసుకోడానికి ఈ కార్యకారణ సంబంధాల అవగాహనే మూలం.
23. వాస్తవికత అంటే వస్తువుల ప్రకృతే.
24. పరిణామమనేది అనివార్యమేగాక, అవిరతం కూడా. కనుక పరిణతిలేని ఉనికే లేదు.
25. పరిణామంలో వస్తువుల ధర్మాలు మారతాయి. ....... పాత ధర్మాలు మారి క్రొత్త ధర్మాలు వస్తుంటాయి. నిజానికి ధర్మాలలో పాతవి, క్రొత్తవి అనేవి లేవు.
26. వస్తువుల మధ్య సంబంధాలను కార్యకారణ భావంతో అర్థం చేసుకోవడాన్నే కార్యకారణవాదమంటాము.
27. శాస్త్రజ్ఞానమంతా కార్యకారణవాద సారమే. ఏ జ్ఞానమైనా అంతే. కాబట్టి కార్యకారణ వాదమనేది ఒకవాదం కాదు. అది మానవుడు ప్రకృతిని అర్థంచేసుకోడానికున్న ఒకేఒక ఆలోచనా పద్ధతి. దాని స్థాయీబేధంగా హేతువాదం వ్యక్తమవుతుంది. కాబట్టి హేతువాదం కూడా ఒక వాదం కాకుండా పోతుంది.
28. వస్తువుల మధ్య సంబంధాలను, సంబంధాల మధ్య క్రమాన్ని అవగాహన చేసుకోవడమే హేతుత్వం. ఆ అవగాహనను జీవితంలో అన్వయంచేసుకోవడమే హేతువాదం.
29. లౌకిక జీవితంలో ఆస్తికుడూ, నాస్తికుడూ కూడా కార్యకారణ బద్దంగానే ప్రవర్తిస్తాడు. అనుభవంలో ఎదురయ్యే సంఘటనలను ప్రతి మనిషీ హేతుబద్దంగానే అర్థంచేసుకుంటుంటాడు.
30. ప్రకృతి సత్యాలు తనకు అవగాహనైనమేరకు వాటిని సమన్వయం చేసుకోగల హేతుబుద్ధి ప్రతిమనిషికీ ఉంది. ప్రకృతి వాస్తవికత అంతా కార్యకారణ క్రమంలోనే ఉంది కనుక, అది మనిషి మనస్సులో హేతుబద్దతగా ప్రతిబింబిస్తోంది.
31. నిజానికి ప్రకృతిలోని ప్రాథమిక సత్యాలనేకం వేలాది సంవత్సరాలుగా మనిషికి అర్థం కాలా. అలాగే రకరకాల దోషాల కారణంగా ఉన్నదున్నట్లు తెలియకపోవడమూ జరగవచ్చు.
32. మనిషికి ప్రశ్నించకుండా ప్రతిదాన్నీ ఆమోదించడం, అలవాటై, ప్రశ్నించడాన్నే ఆమోదించలేని స్థితికి చేరాడు.
33. అహేతుకతను, మౌఢ్యాన్ని రూపుమాపి, మనిషిలో స్వతహాగా వున్న హేతుత్వశక్తిని సర్వదా, సర్వథా సర్వత్రా పనిచేయించడమే హేతువాద విధానం.
34. ఆలోచనలో - ఆచరణలో గంగిరెద్దు విధానాన్ని, స్వభావాన్ని హేతువాదం తిరస్కరిస్తుంది.
35. అనాలోచితంగా ఎంచుకున్న తప్పుడు ప్రమేయాల మీదనుంచి సాగే ''గాడి ఆలోచన'' కేవలతర్కం అవుతుంది.
36. మానవుడు వస్తుతః హేతువాది అనంటున్నామంటే హేతుబద్దంగా వివేచనచేయగల శక్తి మానవుడిలో స్వతహాగా ఉందని అర్థం.
37. ముందుగా స్థిరపడివున్న భావాలను కదిలించడానికి, లేదా మార్చడానికి అంతకంటే బలమైన భావాలతో పాత భావాలపై దాడిచేయడం అవసరం. లేకుంటే పాతభావాల సంకెళ్ళనుండి మనస్సును విముక్తిచెందించడం కష్టం.
38. హేతువాద అవగాహనకు కేవలపాండిత్యం, విషయసేకరణ చాలవు. విశ్లేషించి, వివేచించి, సమన్వయించే శక్తి తప్పనిసరి.
39. నిజానికి లక్ష్యాలను (జూదీఖిరీ) సాధనాలను (ఖలిబిదీరీ), ప్రమేయాలను (ఆజీలిళీరిరీలిరీ) సరైన వాటిని ఎన్నుకోగలిగేవి మాత్రమే హేతువాదం కాగలుగుంది.
40. హేతువాదమనేది అసంగతమైన వాటిని నిరాకరించడంతో ప్రారంభమవుతుంది. అయితే హేతువాదం అనుసరించే నిరాకరణ పద్ధతి కేవలం తార్కికం కాదు. అసత్యాన్ని నిరాకరించడంలో నీతి ప్రారంభమవుతుంది.
41. స్వతంత్రాలోచన చేయనిది హేతువాదం కాదు. కాపీ ఆలోచన స్వతంత్రాలోచనక్రిందికి రాదు.
42. హేతుమంతమైన సమాధాన అన్వేషణలో ఊహాపరికల్పనలు (కగిచీళిశినీలిరీరిరీ)గా మాత్రమే దైవభావాన్ని ఏర్పరచుకున్నారు. ఈనాటి వరకు వాటికెలాంటి రుజువులు దొరకలేదు.
43. అవాస్తవిక పరతత్వాల వలెనే, అవాస్తవిక ఇహతత్వాలు కూడా ఆలోచనా మార్గాన్ని మూసివేసినై.
44. ప్రతి మతమూ తనది పరమసత్యం అనీ, ఇతరులది సత్యంకాదనీ మూఢంగా నమ్ముతుంది.
45. శాస్త్రజ్ఞానం పెరిగేకొలది సత్యపరిధి పెరుగుతూ ఉంటుంది.
46. అభిప్రాయ నిర్ధారణ చేసుకుని తుదిక్షణంలో ఏది సత్యంగా రుజువవుతుందో, అది శాస్త్రములో భాగమవుతుంది. మతాలవలె శాస్త్రం పరస్పర విరుద్ధ నిర్ణయాలు చేయదు.
47. మతాలు ఎన్నింటినో పరమసత్యాలుగా ప్రకటించినై, అట్టివాటినెన్నింటినో విజ్ఞాశాస్త్రం తప్పులంటూ కొట్టివేసింది.
48. ముందటి సత్యంకంటే వికాసవంతమైన సత్యం రంగంలోకి దిగినా దానికి దారిఇవ్వకపోవడం మత లక్షణం. మొదటిదాన్ని ప్రక్కకు నెట్టి దీనికి దారివ్వడం శాస్త్రలక్షణం. అందువల్ల శాస్త్రీయమార్గమొక్కటే సత్యమార్గం.
49. ఆధునిక విజ్ఞానమే అత్యుత్తమ సత్యసాధనం. మతస్థులు నాదిసత్యం, నాదిసత్యమంటూ కొట్టుకు చచ్చారేతప్ప సత్యంవారికి అందనేలేదని విజ్ఞానశాస్త్ర చరిత్ర పరిశీలిస్తే తెలిసిపోతుంది.
50. సత్యం విషయంలో భిన్నత్వం, మౌఢ్యం విషయంలో ఎకత్వం మతలక్షణం.
51. స్వేచ్ఛగా, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించినప్పుడే హేతువాద ప్రమాణాన్ని అందుకొనగలుగుతాం. కాబట్టి స్వేచ్ఛాయోచనే హేతువాదానికి జీవనాడి అంటున్నాం.
52. నియంతృత్వం 'ఊఁ'కొట్టనిస్తుంది గానీ, 'ఊహూఁ' కొట్టనీయదు. కనుక ఎక్కడ నియంతృత్వముందో అక్కడ హేతువాదం చెల్లుబడికాదు. నియంతృత్వం హేతువాదానికి గొడ్డలిపెట్టు. ఏ నియంతృత్వవాదీ హేతువాది కాజాలడు. నియంతృత్వాన్ని ప్రతిపాదించే ఏ సిద్ధాంతమైనా హేతువాదానికి సిద్ధశతృవే.
53. హేతువాదం ఏ వ్యక్తినీ సర్వజ్ఞుడని అంగీకరించదు. ఏ సిద్ధాంతాన్నీ శాశ్వత సత్యమని అంగీకరించదు.
54. వారసత్వంగా సంక్రమించిన భావాలను, ఉద్వేగాలకు లోనుకాకుండా శాస్త్రీయ దృక్ఫధంతో పరిశీలించాలి.
55. ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రక్రియ లేనికాలంలో మనిషిలోని హేతుత్వం కేవల తర్కపద్ధతిలో నడిచింది.
56. జీవన తత్వాన్ని (ఆనీగిజిళిరీళిచీనీగి ళితీ ఉరితీలి) ఏర్చరచుకోవడంలో వాస్తవిక దృక్ఫధాన్ని అనుసరించడమే హేతువాద విధానం.
57. సత్యనిర్ణయం, ధర్మనిర్ణయం చేసేటప్పుడు మనం ఏ పరిస్థితుల్లోనూ రాగద్వేషాలకు బద్దులం కాకూడదు. సత్యానికీ, ధర్మానికీ బురదపూయకూడదు.
58. హేతువాదం శాస్త్రజ్ఞానం వెలుగులో భౌతికవాదాన్ని కొనసాగిస్తుంది.
59. హేతువాదాన్ని వ్యతిరేకించడంలో మార్క్సిస్టులు అనుసరిస్తున్న వైఖరి, వారి పంథాకు అనుగుణ్యంగానే ఉంది. గానీ, హేతువాదులు గతితర్కాన్ని, మార్క్సిజాన్ని ఆలింగనం చేసుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.
60. వ్యక్తుల విచక్షణా జ్ఞానాన్ని మంది సిద్ధాంతాలకు బలిచేసే విధానం హేతువాద వైఖరికి విరుద్ధం.
61. రాజకీయాలను నాయకుల చేతుల్లోంచి విడిపించితేగాని అవి ప్రజాకీయాలుగా మారవు. అప్పుడు అధికార యంత్రాంగం సేవక యంత్రాంగమవుతుంది. రాజకీయాలు ప్రజాకీయాలు కావాలంటే ప్రజలు విచక్షణాజ్ఞానం కలవారు కావాలి. సంస్కారవంతులు కావాలి. నీతీ నిజాయితీపరులు కావాలి.
62. ఏది హేతువాదం? ఏది కాదు? ఎవరు హేతువాది? ఎవరు కాదు? అన్నది జాగ్రత్తగా పరిశీలించాలి.
63. మన నిర్ణయాలు మన జ్ఞానం మేరకు హేతుబద్ధంగా వుంటాయి.
64. నాస్తికత్వం, భౌతికవాదం మాత్రమే హేతువాదం అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే వివేచనాశక్తే హేతువాదానికి వెన్నెముక.
65. మరింత స్వేచ్ఛ అన్నది మానవుని భోగంగా కాక అవసరంగా కావాలి. ఈ స్వేచ్ఛాతత్వమే హేతువాదం.
66. జ్ఞానం ఎక్కడ వ్యవస్థీకరింపబడితే అక్కడ మతం స్థాపించబడినట్లే. మతం ఇహలోకపరమైనదైనా, పరలోకపరమైనదైనా ప్రమాదకరమైనదే.
67. సంస్కర్తలంతా హేతువాదులు కావాలనిలేదు. నాస్తికులు, భౌతికవాదులంతా హేతువాదులు కావాలని లేదు.
68. హేతువాదుల నిర్ణయాలన్నీ తార్కికంగా ఉంటాయి. తర్కం కూడా హేతువాద సాధనమే. అంతమాత్రాన గతితార్కికులంతా హేతువాదులు కావాలని లేదు.
69. హేతువాదులు శాస్త్రీయ దృక్ఫధాన్ని అవశ్యంగా అనుసరిస్తారు. శాస్త్రజ్ఞానాన్ని వాస్తవ జ్ఞానంగా అంగీకరిస్తారు. అంతమాత్రాన శాస్త్రజ్ఞులంతా హేతువాదులు కావాలని లేదు.
70. మానవుడి సర్వం సహాధికారాన్ని గుర్తించే హేతువాదులు అతని పరిమితుల్ని కూడా గుర్తించి మానవవాదంవైపు పయనిస్తారు.
71. జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి, హేతువాదానికి మూలస్థంభాలు. జ్ఞానం వల్ల సత్యాన్ని తెలుసుకుంటాం.
హేతువాద వైఖరి ప్రకారం :
1. హేతువాదమంటే ఇంగితజ్ఞానం, ఇది ఆస్థిక నాస్తికుల్లోను, మతస్థులు - లౌకికవాదుల్లోనూ ఉంది. హేతువాదం తప్పటడుగు వేస్తే అహేతుకవాదం అవుతుంది.
2. హేతువాదమనేది కేవలం తర్కం కాదు. హేతువాద లక్ష్యం, సాధనం రెండూ మానవుడే. అందువల్ల జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి, మానవతలకు స్థానమిచ్చే ఆలోచనా విధానమే హేతువాదం.
3. సత్యాన్ని గురించిన మన జ్ఞానం మీద ఆధారపడి ఇంగితం పనిచేస్తుంటుంది.
4. హేతువాదం శాస్త్రబద్దంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమంటుంది.
5. హేతువాదం హటవాదం కాదు. అదొక ఆలోచనా విధానం, అది హేతువుయొక్క సర్వాధిక్యతను నిర్నిబద్దంగా అంగీకరిస్తుంది. నిరూపణకు నిలబడని ఏప్రమాణాలను అంగీకరించదు. అదొక నిష్పాక్షిక వైఖరి.
6. హేతువాదం, శాస్త్రజ్ఞానం మీద ఆధారపడని ఏ రకమైన ఆలోచననూ ఆమోదించదు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఏ వ్యక్తినీ, గ్రంథాన్నీ పరమప్రమాణంగా స్వీకరించదు.
7. జీవితానికి సంబందించిన ప్రతి విషయాన్నీ వివేచించి, పరిశీలించి నిర్ణయాలకు రమ్మంటుంది హేతువాదం.
8. ఏ సిద్ధాంతాన్ని పరమ ప్రమాణంగా పరిగణించకుండా, సహేతుక పరిశీలనకు లోనుచేసి, నిలవని దానిని వదిలివేసి, వివేచన, వరిపిడికి నిలిచినదానిని స్వీకరించి, మానవ జీవితాభ్యున్నతికి అనుగుణ్యమైన ఆలోచనా వైఖరిని అవలంభించడం హేతువాద విధానం.
9. అహేతుకమైన ప్రతి దానినీ తిరస్కరిస్తుంది హేతువాదం. కానీ దేనినీ ద్వేషించదు. అన్నింటినీ తులనాత్మక పరిశీలన చేస్తుంది. ఇదే హేతువాద విధానం.
10. మతం బయలుదేరడానికి మూలం హేతుత్వం. అది అలానే నిలిచిపోవడానికి మూలం అహేతుకతే.
ముగింపు
యోచనాశీలురైన మిత్రులారా !
ఒక్కక్షణం ఆగండి. అభ్యుదయ భావాలు, సమాజహితకాంక్షగల మిత్రులతో కలసి ఏలూరు సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చాక ఏప్రియల్ 27,28 తేదీలలో సత్యాన్వేషణ మండలి కేంద్రకార్యాలయం దోరకుంటలో నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న ''హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు'' సఫలం కావాలన్న కోర్కే, అయితే బాగుండును అన్న ఆలోచన (అభీష్ట లేక బలమైన ఇచ్ఛ) నన్నూరకుండనీయకుండా ఇప్పటికీ హేతువాదం పేరున అందుబాటులోనున్న సాహిత్యాన్ని మరోసారి పరిశీలించేలా వేగిరపెట్టింది. నా గ్రంథాలయంలో ఉన్న రచనలన్నీ వెతికాను. వెంకటాద్రిగారన్నట్లు హేతువాదంపైన వెంకటాద్రిగారు, వారి మిత్రులు, సహచరులు ఒకరిద్దరు రాసిన రచనలు తప్ప తగినంత సాహిత్యం, భావగాంభీర్యత గల సాహిత్యం ఈనాటికీ రాలేదు. నెట్ (అంతర్జాలం)లో వెదికినా సిద్ధాంత స్థాయికల సమాచారం లభించలేదు. అయినా నా దగ్గర ఉన్నవాటినన్నింటినీ తిరిగి చదవను మొదలెట్టాను. సుమారు 20 రోజులు రోజుకు ఆరేడు గంటలు వెచ్చించాల్సి వచ్చింది.
1. హేతువాదం, 2. హేతువాద వైఖరి, 3. కళ - శాస్త్రం - తత్వం - హేతువాదం, 4. నాస్తికత - మూడవ వాల్యూం, 5. సమకాలీనాలు - సార్వకాలీనాలు - సంపుటి 13, 6. మత జాఢ్యాల మచ్చుతునకలు - సంపుటి 8 లలోని హేతువాదం క్రిందికి వచ్చే భాగం, 7. డార్వినిజం - హేతువాదం, 8. సత్యాన్వేషణ.
గుమ్మా వీరన్న గారి - 1. హేతువాదం భావ విప్లవం, 2. హేతువాద స్వరూప స్వభావాలు, 3. హేతువాదం - అపోహలు ,అపార్థాలు, 4. హేతువాదం- మార్క్సిజం.
పసల భీమన్న గారి 1. నిత్యజీవితంలో హేతుత్వం, 2. హేతువాద సూత్రాలు.
ఎం.ఎన్.రాయ్ 1. రీజన్ - రొమాంటిసిజమ్ - రెవల్యూషన్, 2. రాడికల్ హ్యూమనిజం (వి.ఎం.తార్కండి)
గుత్తా రాధాకృష్ణ గారి భౌతికవాదం, గోరా గారి నాస్తిక సాహిత్యం.
పెద్దపనే చేయాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు. మానవ జీవనయానానికి, సమాజ స్థితి, గతికి కూడా భావజాల క్షేత్రంలో ఆధారపీఠమనదగ్గ ఆలోచనా క్షేత్రానికి సంబంధించిన భావజాలాన్ని వెదికి తెచ్చుకోవడానికి, గుదిగుచ్చుకోవటానికి ఆమాత్రపు శ్రమ తప్పదు మరి అనిపించింది. ముఖ్యమైన భాగాలను పరికించి చూశాక ఆ రచనలన్నింటా నా అవగాహనననుసరించి వాటిలోని ఎన్నో అభిప్రాయాలు నాకు అంగీకారమైనవిగా అనిపించాయి. కొన్ని అంగీకరించదగనివిగాను, ఇంకొన్ని చర్చించాల్సినవిగాను అనిపించాయి. చివరకు ఆలోచనలన్నింటిలోనుండి వెంకటాద్రి గారి హేతువాదం, హేతువాద వైఖరి అన్న రెండు పుస్తకాలను ఎంచుకొని వాటిలోని అభిప్రాయ ప్రకటనలను కొన్నింటిని ఈ సంచికలో మీముందుకు తెచ్చాను. అవి సంపూర్ణాలు, సమగ్రాలు అననుగానీ, హేతువాద ఉద్యమ పునరుజ్జీవన యత్నంలో పాలుపంచుకోగోరే వారందరూ వాటిని అధ్యయన సాహిత్యం క్రింద పరిగణనలోకి తీసుకొని హేతువాద వైఖరిలో లేదా దానికంటెను గట్టిమాటైన శాస్త్రీయ దృక్ఫథంతో పరిశీలించాల్సిందిగా సూచిస్తున్నాను.
1. ఎలా, దేవుని గురించి, వివిధ ఆస్థిక ధోరణులు చెబుతున్న భావాల గురించి ఏమాత్రం తెలియకుండానే దేవుడున్నాడంతే, దేవుడు లేకుంటే నీవు, ఇదంతా ఎలా వచ్చాయి? అననే ఆస్తిక విశ్వాసుల మాదిరే దేవుడు లేడు. లేని దేవుడికి రుజువులు చూపడమేమిటి. లేని దేవుడు లేడంతే అనడం హేతువాదులకు తగదు. అదీ ఒకరకమైన మతవైఖరే గాని, హేతువాద వైఖరి కానేకాదు. కనుక మనం బండగా, మొండిగా, అధరగండంగా దేవుడు లేడు అన్న పదాల్ని అనడం సరికాదు. మనమా నిర్ణయానికి ఎలా రాగలిగామో హేతుబద్దంగా వివరించాల్సి ఉంటుంది.'' అన్న భావాన్ని వెంకటాద్రి గారు ఒకటి రెండు తావుల విస్పష్టంగా ప్రకటించారు. నా అవగాహన ప్రకారం హేతువాదం మీద వెంకటాద్రి గారు వెల్లడించిన అభిప్రాయాలలోని ముఖ్యమైన భావాల జాబితాలోని మొదటి స్థానంలో వుంచాల్సిందిది. హేతువాద వైఖరినంగీకరించిన వారెవరైనా ఆస్థికతపై మాట్లాడేటప్పుడు ఇదొక్కటే వారి వాదానికి చుక్కానివంటిదవుతుంది.
2. హేతువాదమంటే, నాస్తికవాదం కాదు, భౌతికవాదం కాదు, అజ్ఞేయవాదం కాదు, మార్క్సిజం కాదు, మరేవాదమూ కాదు. హేతువాదం హేతువాదమే. హేతువాద వైఖరినంగీకరించి హేతుబద్దాలోచన చేయుటం ద్వారా ఆయా స్థాయిలలో హేతువాది చేసుకున్న - చేరిన - నిర్ణయాలవి అన్న ఆయన పలుకులూ నాకు 100 శాతం ఆమోదయోగ్యమైనవే.
3. హేతువాద వైఖరి ఒంటబట్టి, ఆచరణకూ తెచ్చుకున్న వానికీ (హేతువాదికి) బుద్ధుడు ప్రమాణం కాదు, క్రీస్తు, మహమ్మద్, శంకరులు ప్రామాణికులు కాదు. మార్క్సు, ఎంఎన్‌రాయ్‌లు ప్రామాణికులు కాదు. ఇలా ఏ వ్యక్తీ, ఏ రచనా గుండుగుత్తగా ప్రామాణికం కాదు. కారాదు. అలా ఎవరినైనా ప్రామాణికంగా నెత్తికెత్తుకున్న వాడు విశ్వాసి అవుతాడే కాని హేతువాది కాజాలడు. అన్న వెంకటాద్రి గారి పలుకులు ఆమేరకు అక్షర సత్యాలు. ఇక్కడ ఒక్కమాట చెప్పుకోవాలి. మాకు - సత్యాన్వేషణ మండలికి - ఆధారపీఠమనదగ్గ భావన ఇది. ఎవరు చెప్పారన్న దానికి విలువనీయకు, ఏమి చెప్పారో మాత్రమే పట్టిచూడు. గట్టిదైతే అట్టిపెట్టుకో, ఒట్టిదైతే నెట్టేసేయ్, విడిచిపెట్టేసేయ్. పట్టిచూడడం పూర్తికాకుండా నెత్తినెట్టుకోనూ వద్దు, నెట్టేయనూ వద్దు. పరిశీలన భాగంలో చేర్చిపెట్టుకో అన్నదే మమ్మందరినీ నడిపిస్తున్న మూల భావన. ఈ విషయంలో మీరేమిటో ఎవరికి వారుగా ఆలోచించుకొని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రండి.
4. ఆలోచనలో, స్వతంత్ర యోచన, అనులోచన, అనుసరణ అన్న మూడు స్థాయిలుంటాయి. హేతువాదికి స్వతంత్రాలోచననన్నదే అంతస్సారంగా పునాది బలంగా, ఉండాలన్న ఆయన అభిప్రాయం కూడా నాకంగీకారమైనదే.
5. ఆస్థిక ధోరణికి చెందిన రచయితలు, బ్రహ్మపదార్ధాన్ని వివరించడానికి పూనుకొని ఏది బ్రహ్మం కాదో చెప్పుకుంటూ పోయారు. కట్టల, కట్టలు సాహిత్య సృష్టిచేశారు. ఏది అది కాదో చెప్పడం అదేదో చెప్పడం కానేకాదు. నిజానికి బ్రహ్మపదార్ధమంటూ ఒకటి లేదు కనుకనే, ఉన్నవాటినన్నింటినీ, కనపడుతున్నవాటినన్నింటినీ ఇదికాదిదికాదంటూ చెప్పుకుపోయారు అంటూ ఒకచక్కటి వ్యాఖ్యానం చేశారాయన. నాలెఖ్ఖ ప్రకారమూ ఒకదాన్ని నిర్వచించమన్నా, వివరించమన్నా, అది కానివాటిని గురించి ఎంత చెప్పినా, చెప్పమన్న దాన్ని గురించి చెప్పినట్లు కానేకాదు. అంతవరకు బాగానే వుంది.
అయితే హేతువాదం పేరున వచ్చిన రచనల్లోనూ వెంకటాద్రి గారు, గుమ్మా వీరన్న గారే గాక, ఇతరులూ హేతువాదమంటే ఏదికాదో అన్నది చెప్పేపనే చేశారు ఎక్కువలో ఎక్కువ భాగం. రచనలోని ఇంకొంత భాగంలో తాత్వికంగా తాము విరోధిస్తున్న, విభేధిస్తున్న సిద్ధాంతాలను, వాటిననుసరించే వాళ్ళను విమర్శించే పనీచేశారు.
కనుకనే, హేతువాదంపై ఇప్పటికీ సిద్ధాంత స్థాయిలో పటిష్టమైన రచన రాలేదన్నాను. ఇప్పుడైనా నలుగురం పూనుకుంటే ఒకింత లోతైన విచారణ చేసుకుంటూ అట్టి మెరుగైన రచనను సిద్ధం చేసుకోవచ్చు. ఈ థలో నా ఆకాంక్ష అదే.
మీలో ఎవరుగానీ, ఎందరు గానీ అందుకు సిద్ధమంటే ఒక బృందంగా మనమందరం తయారై హేతువాద సిద్ధాంత చిత్తుప్రతిని తయారు చేసుకొని మరింతమంది పరిశీలనకు దానిని అందించవచ్చు. అటుపిమ్మట అంటే తగినంత పరిశీలన, విచారణ జరిపిన పిదప కలిపి నిలిపి ఉంచుకోదగిన భావజాలాన్నంతటినీ గుదిగుచ్చి హేతువాద సిద్ధాంత శుద్ధప్రతిని రూపొందించుకోవచ్చు.
హేతువాదమంటే, ఆస్థిక - నాస్తికాది ఏ సిద్ధాంతమూ కాదని, హేతువాదులకు గుండుగుత్తగా ఏ సిద్ధాంతం గాని, ఏ సైద్ధాంతికుడు గాని ప్రమాణికుడు కారాదని, ఎప్పటికప్పుడు అవసరమైన వాటినన్నింటినీ మరలా మరలా పరీక్షించుకుంటూ, అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకుంటూ సాగుతుండటమే హేతువాద దృక్ఫథం కలవారి వైఖరిగా ఉండాలని, శాస్త్రీయ దృక్ఫథమూ, శాస్త్రీయ పద్ధతి అన్నవాటిని వినియోగించుకోడానికి సిద్దపడని వారిని హేతువాద దృక్ఫథం కలవారనడం కుదరదని అంటున్న మేరకు వెంకటాద్రి గారి భావాలను నేనూ అంగీకరిస్తున్నాను.
సత్యాన్వేషణలో...
మీ సురేంద్ర.
ఒక ముఖ్య గమనిక
హేతువు, హేతుత్వం, హేతువాదం, హేతువాది అన్న పదాలు నిర్ధిష్టమైన అర్ధాలు చెప్పుకోకుండా ఎడాపెడా వాడేయడం వల్ల జరిగిన నష్టం అంతాఇంతా కాదు. అలాగే ''హేతువాదం'' అన్నది ఒక సిద్ధాంతం కాదు అన్నమాట ఎందుకని పనికట్టుకొని అంత గట్టిగా చెప్పాల్సివచ్చిందోగానీ, ఆ అభిప్రాయమూ హేతువాదానికి సంబంధించినంతలో చాలా గందరగోళానికి దారితీసింది. ఈ విషయం నిజమేననటానికి ఉపబలకంగా ఉండగల మరికొందరి మాటలు చెబుతాను పట్టిచూడండి.
''రాడికల్ హ్యూమనిజం'' అన్న తార్కుండే ఆంగ్ల రచనకు గుమ్మా వీరన్న గారు చేసిన అనువాదం నుండి.
''మానవుడు ప్రాయికంగా లేదా స్వభావ రీత్యా హేతువాది అనే వాక్యాన్ని చాలావరకు అపార్థం చేసుకుంటున్నారు. భిన్నార్థాలలో హేతువాదం అనే పదం వాడబడడమే అందుకు కారణం. హేతువాదమనే పదం వాడకాన్ని బట్టి 'మానవుడు హేతువాది' అనే వాక్యానికి కనీసం మూడు అర్థాలున్నాయి''.
వివరణ : మిత్రులారా ! వి.ఎం.తార్కుండే అన్నాయన రాడికల్ హ్యూనిస్టు ఉద్యమంలో ఆజీవితం పనిచేసిన, గొప్ప మేధావిగా, అధ్యయనపరునిగా గుర్తింపబడ్డ వ్యక్తి. ఆయనన్నాడు గనుక ఆ మాటలు ప్రామాణికాలు అననుగాని, అంతగా భావజాల క్షేత్రంలో పనిచేసిన ఆయనకూ, ''హేతువాద'' క్షేత్రంలో నెలకొనియున్న ఒక గందరగోళం స్పష్టంగా కనపడింది అని చెప్పడము నా ఉద్దేశ్యం. ''హేతువాదం'' క్రింద అనేక అపార్థాలున్నాయి అన్నది గమనించాడాయన. అలాగే ఆ మాటకు కనీసం మూడర్థాలున్నాయి అన్నాడు. అంటే ఇంకా చాలా అర్థాలు చెప్పుకునే వీలుందన్న మాట.
1. ప్రపంచం హేతుబద్దంగా ఉంది అన్నప్పుడు ''హేతువంటే నియమబద్దం'' అని అర్థం, ఇది హేతువనేదానికి వస్తుగతమైన అర్థం.
2. హేతువనే పదం వస్తుగతమైన అర్థంలో వాడినప్పుడు ''మానవుడు హేతువాది'' అనే దానర్ధం.
3. ప్రకృతిలో మానవుడు భాగమనే సత్యం నుంచి మానవుడు వస్తుతః హేతువాది అనేది సిద్ధిస్తోంది.
4. వ్యక్తిని అంధవిశ్వాసాల నుండి విముక్తం చేసి మనిషిలో ఆత్మావలంబనను ప్రతిష్టించేది వివేకమే - హేతువే.
వివరణ : ఇక్కడ హేతువు - వివేకం పర్యాయపదాలుగా (ఒకే అర్థంలో) వాడబడ్డాయి.
5. హేతుత్వం జీవలక్షణం కాబట్టి అది సంకల్పానికి విరుద్ధం కాదు (సురేంద్ర).
6. వ్యక్తినిష్టమైన అర్థంలో ''మానవుడు హేతువాది'' అనే వాక్యానికి రెండు భిన్నార్థాలున్నాయి. అందులో ఒకటి నిజం కాదు. మనం ఒక వ్యక్తిని హేతువాదిగా చెప్పుకున్నప్పుడు ఆవేశాలు, ప్రాగ్భావాల కంటే (పూర్వ నిర్ణయాల కంటె) వివేకం చేత నడపబడుతున్నారని భావిస్తాం. మరోమాటలో చెప్పాలంటే వ్యక్తిలోని అన్నింటినీ అదుపుచేస్తున్నది వివేకమే (ష్ట్రలిబిరీళిదీ).
వివరణ : ఇంతకూ హేతువు అన్నా, వివేకమన్నా, రీజన్ అన్నా ఒకే అర్థమా ? అదలా ఉంచి అటుతరువాత మాటలలో తార్కుండే గారే
''పైన చెప్పిన అర్థంలో మానవుడు హేతువాది అని చెబితే అది నిజం చెప్పినట్లు కాదన్నారు''.
7. ఈ సందర్భంగా హేతువు అనే పదానికి సరైన అర్థం చెప్పాలంటే, మానవుడు హేతుబద్దంగా ప్రదర్శించగల శక్తి సామర్ధ్యాలను కలిగి ఉండాలని. అనీ అన్నాడు.
మిత్రులారా ! వీరూ హేతువు అంటే ఏమిటన్నది గానీ, హేతువాదమంటే ఏమనిగానీ స్ఫష్టంగా చెప్పనే లేదు. ప్రస్తుతం మనముందున్న ప్రధాన సమస్య ఇదే. హేతువాదమంటే ఏమిటో ''హేతువాదం'' అన్న శీర్షిక క్రింద చోటుచేసుకొనే పారిభాషిక - ముఖ్య లేదా కీలకమైన పదాలేమిటో, వాటికీ సూటైన అర్థాలేమిటో, హేతువాదం క్రింద ఏఏ విషయాలకు చెందిన అధ్యయనము, అవగాహన అవసరమవుతాయో విస్పష్టంగా తేల్చుకోవాలి ముందు. అటుపిమ్మట వాటికి పరిమితమయ్యే ఉద్యమించటం జరగాలి. అదిప్పటివరకు జరగలేదన్నది అందుబాటులో ఉన్న రచనలద్వారా తేలుతోంది. ఆయా ఉద్యమాలలో ఉన్న ముఖ్యులలోనూ ఉంది. ముందీవిషయాన్ని గమనించండి.
మరైతే ఇప్పుడు ఎంచేద్దాం :
నా ఆలోచన ప్రకారమైతే, అధ్యయనం చేయగలిగి, చేయాలన్న ఇష్టముండి దానికోసం కొంత సమయాన్ని కేటాయించగల వాళ్ళను మనలోనుండి గుర్తించాలి. వాళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి ఎంపికచేసుకున్న మేరకైనా, హేతువాద సంబంధమై ఒక స్థాయి కలిగిన రచనలను శ్రద్ధగా, నిశితంగా చదువుకొని వాటిలోనుండి సారభూతమైన అంశాలను ఎత్తిరాసుకొని, వాటిపై తమ అభిప్రాయమేమిటన్నది రాసుకు రావాలి. ఇదంతా ఒక నెల రోజులలో చేయగలిగితే, అలా తయారైన నివేదికలను పెట్టుకొని ''హేతువాద భావజాలపు చిత్తు ప్రతిని'' తయారు చేసేందుకు మరొక చిన్న బృందం సిద్ధం కావాలి. ఈ బృందం ''5గురికి తగ్గకుండా 10కి మించకుండా'' ఉంటే మేలు. చిత్తు ప్రతి రూపకల్పనకు ఒక వారం లేదా 10 రోజులు ఏకధాటిగా కూర్చోగలిగితే ''హేతువాదం క్రిందికి జతకూర్చవలసిన ప్రధాన భావజాలాన్ని ఏరికూర్చవచ్చు.
మిత్రులారా !
పట్టుబట్టి ఈపని గనక పూర్తిచేయగలిగామా అది గతం వందేళ్ళలో హేతువాదం పేరన చేసిన దానికంటే మహత్వపూర్ణమైన, ప్రయోజనకరమైన పని కాగలుగుతుంది. ఈపనికి, ఇతర పనులు మానుకునైనా లేదా రెండో స్థానానికి నెట్టివేసైనా నిండుగా పూనుకోవటానికి మండలి సిద్ధంగా ఉంది.
మానవాభ్యుదయానికి, సమాజపురోగతికి, సక్రమాలోచనాపరులను, స్వతంత్రాలోచనా పరులను రూపొందించుకోవటం కంటే శక్తివంతమైన పని మరోటి లేదు. ఉండదు. అట్టి వ్యక్తుల్ని తయారుచేసుకోవటానికి హేతువాదాన్ని ఉద్యమరూపంలో సమాజంలోనికి తీసుకెళ్ళాల్సి ఉంది. ఇది ఒక పెద్ద పని, నిబద్ధతతో పూనుకోగలవాళ్ళు తమగురించి రేపటి సమావేశంలో వివరాలనందించండి. ఈపనికి మీ శక్తియుక్తుల్ని ఎంతమేర వినియోగించగలమన్నది ఉత్తుత్తి మాటలు కాకుండా గట్టి మాటలుగా తెలియజేయండి. కలసి కదులుదాం.. నలుగురి కోసం.
ఉద్యమాభినందనలతో..
సత్యాన్వేషణలో... మీ సురేంద్ర.

No comments:
Post a Comment