Wednesday, May 1, 2013

స.హ.ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభల విశేషాలు

మే 4,5 తేదీలలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు రాష్ట్ర మహాసభ ఒంగోలులో జరిగాయి. 4వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమా వేశం స.హ.ప్ర.ఐక్యవేదిక ప్రకాశం జిల్లా కోశాధికారి తులసీ జిగీష గారి ఇంటివద్ద ఉదయం 10 గం.ల నుండి సా|| 6 గం.ల వరక జరిగింది. రాష్ట్ర అధ్యకక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఆదిలాబాద్‌ (తూర్పు), ఆదిలాబాద్‌ (పశ్చిమ), కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, నల్గొండ, ఖమ్మం, అనంతపురం, విశాఖ జిల్లాల నుండి కార్యవర్గ సభ్యులు 30 మంది వరకు హాజరయ్యారు. 

5వ తేదీన రాష్ట్ర మహాసభ సంతపేట లోని ఆచార్య ఎన్‌.జి. రంగా భవన్‌లో జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు రాష్ట్ర ఉపాధ్యకక్షులు చెర్కూరి వెంకట్రామయ్య వేదిక జెండాను ఆవిష్కరించారు. సభకు రాష్ట్ర అధ్యకక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర ఉపాధ్యకక్షులు డా|| వి.బ్రహ్మారెడ్డి, చెర్కూరి వెంకట్రామయ్య, పి. వేణుగోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జంపా క్రిష్ణ కిషోర్‌ గారలు  వేదికనలంకరించారు. ఈ సభలోనే జిల్లా జడ్జి రామ్‌గోపాల్‌ గారు కృష్ణాజిల్లాకు బదిలీ అయిన సందర్భముగా వారి సేవలను కొనియాడుతూ స.హ.ప్ర. ఐక్యవేదిక మరియు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంయుక్త నిర్వహణలో జరిగిన అభినందన సభలో వారికి జ్ఞాపికను బహూకరించటం జరిగింది. తనకు జరిగిన అభినందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ జస్టీస్‌ రామ్‌గోపాల్‌ సమాజ పురోభివృద్ధిలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక చేస్తున్న కృషి బహు ప్రశంసనీయమని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది సమక్షంలో తనకు అభినందనలు తెలిపినందులకు సంతోషాన్ని తెలియజేశారు.

మహాసభలో ప్రధాన వక్తగా డా|| వి.బ్రహ్మారెడ్డిగారు తన ప్రసంగంలో గత మూడున్నర సంవత్సరాల నుండి ఏం చేయాలనుకున్నాము, ఏమి చేశాము? ఏమి చేస్తే బాగుంటుందన్న దానిపై విశ్లేషణ చేశారు. తన 40 సంవత్సరాల ప్రజా ఉద్యమ జీవితంలో ప్రజల్లో కలసి పనిచేసిన అనుభవాలను ప్రతినిధులతో పంచుకున్నారు. అందులో భాగంగానే తన జీవితానుభవాలను, మీ జీవితాలకు వర్తింపజేసుకుంటూ, సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడతాయో? ఎలా ఉపయోగించుకోవాలో చూడమన్నారు. ఉమ్మడి సమస్యలైన ఆరోగ్యం, అక్షరాస్యత, ఉపాధి, రక్షణ, వ్యవసాయం లాంటి సమస్యలు చాలా వున్నాయని, సమస్యలు లేకుంటే బాగుండునని ప్రతివారు కోరుకొంటుంటారు. కాని ఏం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయనుకునే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అన్నారు. అంతేగాక సమస్యలను పరిష్కరించే దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారుగా తమదైన శైలిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం, అవి సక్రమంగా అమలు జరగకపోవటం, అందుకు పరిస్థితులు అనుకూలించక పోవటమే గాక, వారి ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యతనియ్యటం అనేవి కూడా కారణాలుగా ఉన్నాయన్నారు.
మనం చేసే పనుల్లో చాలా జయాలు, అపజయాలు ఉంటాయి. అపజయాలను పరిశీలించిన యెడల భవిష్యత్తులో అపజయాలకు కారణమైన పనులు తిరిగి చేయకుండా ఉండే అవకాశాలుంటాయని, మన అపజయాలను అతిగమించి మరింత ఎత్తుకు ఎదుగుటకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తాను గతంలో ఎక్కువ మందికి తరగతులు నిర్వహించుట నిర్వాహకులకు, తనకు కూడా గొప్పేనని అనుకున్నామని. కాని అనుభవములో  వీలైనంత తక్కువ మందితో మమేకమై వారిమీద శ్రద్ధపెడితే ఫలితాలు వస్తాయనేది గమనించానని అన్నారు. మేము చేసిన ఆ తప్పును మీరు చేయవద్దని హెచ్చరించారు. అలాగే వక్త తాను చెప్పదలచిన విషయం మీద తగిన ప్రణాళికతో ముందుగా నోట్స్‌ తయారుచేసుకొని దానిని అర్థమయ్యే విధంగా కార్యకర్తలకు వివరించాలని అన్నారు. అంతేగాక తమకు అర్థంకాని విషయాలను శ్రోతలు వెంటనే వక్తను అడిగి తెల్సుకోవాలని అన్నారు. ఆ వక్త కూడా అడిగిన దానికి అప్పుడే వివరించాలన్నారు. లేనియెడల అడుగుదామనుకున్న విషయాన్ని శ్రోత, చెప్పవలసిన వక్త కూడా మర్చిపోయే అవకాశం ఉందన్నారు. వక్త ప్రసంగంలో ఒక్క పదము అర్థం కాకపోయినా మిగతా విషయం అర్థం కాదన్నారు.

సమీక్షా సమావేశం అనగా మనం ఏమనుకున్నాం, ఏం చేశాము, ఇంకా ఏం చేయాలనే విషయాల మీద విశ్లేషణే అని అన్నారు. కార్యకర్త ముందుగా మనం చేద్దామనుకున్న పనిమీద ఇష్టం కలిగి ఉంటే ఫలితాలు బాగుంటాయని, కార్యకర్తలను తయారు చేసుకోవటంలో క్లాసులో ఎక్కువమందిని కాక, వీలయినంత తక్కువ మందితో మాత్రమే నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సమాజంలో సమస్యలు పరిష్కారం కాకపోవుటకు ముఖ్య కారణం సమస్యలున్న వారు కదలకుండా, ఆ సమస్యలు లేనివాళ్ళు సమస్యలు వున్నవారికి బదులు ఆ సమస్య పరిష్కారం కొరకు కదలటమే నన్నారు. కార్యకర్తలు నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించుతూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఉద్యమ నిర్మాణం చేయాలంటే తాము ముందు నిబద్దత కలిగి ఉండాలని అన్నారు. ఆ నిబద్దత మూడు విషయాల్లో ఉంటుందంటూ 1. సమయపాలనను పాటించుట, 2. అన్నమాటకు కట్టుబడి ఉండుట, 3. చేస్తానన్న పనిని మనసుపెట్టిచేయటమేనని అన్నారు. సమాజాభివృద్ధికి ఎవరికి వారు తమవంతు సమయం, ఆర్థికం ఇచ్చుటకు సిద్ధపడాలని, తెలియక చేసిన తప్పులకు, తప్పులు చేసిన వారికి మరలా మరలా తెలియజెప్పటమొక్కటే మార్గం అని అన్నారు. కావాలని తప్పులు చేసే వారిని మాత్రం వదిలించుకోవటమే మంచిదని అన్నారు.
ఆయన ప్రసంగం అక్షరసత్యాలన్నంతగా వున్నాయి. ఆ ప్రేరణతోనే వివిధ జిల్లాల బాధ్యులు తమ ప్రసంగంలో తమ జయ, అపజయాల అనుభవాలను చెప్పుతూ, ఆ అనుభవాలు క్రొత్తవారు ఎలా వుపయోగించుకోవాలో తెలియజేస్తూ మాట్లాడుట నిజంగా సంస్థ ఆరోగ్యంగా, బలంగా ముందుకు సాగుతుందన్న దానికి నాందిగా నిలచాయి.
ప్రధాన కార్యదర్శి గడచిన మూడున్నర సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలను, నిర్మాణం తదితర అంశాలను వివరించారు. 300 మంది ప్రతినిధులు హాజరైన మహాసభలో స్వార్థ, వ్యాపార రాజకీయాలను, సేవా రాజకీయాలుగా మార్చడానికి, తద్వారా అవినీతి తక్కువగా వున్న సమాజం ఏర్పడటానికి అవసరమైన 73, 74 సవరణ చట్టం సక్రమంగా అమలుచేసుకునేలా ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు,  నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు వున్న సభ్యులు, మండల, జిల్లా కమిటీలు, ఏ విధంగా వున్నాయో వివరిస్తూ రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రణాళికను సూచించటం జరిగింది.

నేటివరకు సభ్యులుగా 1476 మంది వున్నారని. రాబోవు 4 నెలల్లో 1384 మందిని నూతనంగా చేర్పించి 2860 మందిని ఉద్యమంలో భాగస్వాములుగా చేద్దామని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 33 మండలాల్లో పూర్తిస్థాయి మండల కమిటీలు ఏర్పడ్డాయని, రాబోవు నాలుగు నెలల్లో మరో వంద మండల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పరచాలని అన్నారు. రాబోయే నాలుగు నెలల కాలంలో 30 కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని, 79 గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పటివరకు 500 మందికి పైగా శిక్షణనిచ్చామని, రాబోవు నాలుగు నెలల్లో మరో 200 మందికి శిక్షణనివ్వాలని తెలిపారు. ఉద్యమాభివృద్ధికి కార్యకర్తలను మరియు ప్రజలను చైతన్యపర్చటానికి ఇప్పటివరకు 5 రకాల పుస్తకాలను, 48750 కాపీలను ముద్రించటం జరిగిందన్నారు. 
రాబోవు నాలుగు నెలల్లో జిల్లాల్లో పూర్తిచేయగలమని ప్రకటించిన వివిధ లక్ష్యాల వివరాలు

   జిల్లా సభ్యత్వం  కమిటీలు వేసే  కళాశాలల్లో  శిక్షణకు  గ్రామ సభల
కోటా మండలాలు సమావేశాలు పంపేవారు నిర్వహణ

1. అనంతపురం 250 7 2 8 4
2. కర్నూలు 400 12 2 10 4
3. కృష్ణా 400 12 2 47 4
4. ప్రకాశం 350 13 2 20 -
5. గుంటూరు 100 22 2 15 -
6. పశ్చిమ గోదావరి 400 21 4 30 15
7. ఆదిలాబాద్‌ తూర్పు 400 8 5 15 2
8. ఆదిలాబాద్‌ పశ్చిమ 300 15 4 30 20
9. నల్గొండ 200 15 2 15 5
10. విశాఖ 60 8 5 10 25

రాష్ట్ర ఉపాధ్యకక్షులు పి.వేణుగోపాల్‌రెడ్డి గారు మాట్లాడుతూ కమిటీ నిర్మాణాల గురించి సవిస్తరంగా వివరించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.

నిర్మాణం : మండల కమిటీలో కనీసం 3 గ్రామాల ప్రాతినిధ్యం, ఒక మహిళతో సహా 15 మంది తగ్గకుండా సభ్యులుండాలని, అందులో ఒక అధ్యకక్షులు, ఇద్దరు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి గ్రామం నుండి ఒకరు కార్యవర్గంలో వుండేలా చూడాలని. ప్రతి మండల కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) నెలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 2 నెలలకు ఒకసారి జరపాలి. జిల్లా వార్షిక సమావేశం (ప్లీనం) ప్రతి సంవత్సరం జరపాలి. మహాసభ 2 సంవత్సరాల కొకసారి జరపాలి.
జిల్లా కమిటీలో కనీసం 5 పూర్తి స్థాయి మండల కమిటీలు, రెండు రెవిన్యూ డివిజన్ల నుండి మరియు కనీసం ఇద్దరు మహిళలు ఉండాలని, వారిలో ఒక అధ్యకక్షులు, నలుగురు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, నలుగురు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి పూర్తి స్థాయి మండల కమిటీ నుండి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికార్లు మరియు అడ్‌హాక్‌ కమిటీల కన్వీనర్‌, కో కన్వీనర్లు జిల్లా కార్యవర్గంలో సభ్యులుగా వుంటారు. ప్రతి జిల్లా కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) 2 నెలలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 4 నెలలకు ఒకసారి జరపాలి. రాష్ట్ర వార్షిక సమావేశం (ప్లీనం) ప్రతి సంవత్సరం జరపాలి. మహాసభ 2 సంవత్సరాల కొకసారి జరపాలి.

రాష్ట్ర కమిటీలో కనీసం ముగ్గురు మహిళలు ఉండాలని, ఒక అధ్యకక్షులు, ఐదుగురు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, (అవసరమనుకొంటే ఉద్యమ అవసరాన్ని బట్టి మరొక ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకొనవచ్చు) ఐదుగురు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి పూర్తిస్థాయి జిల్లాకమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికార్లు మరియు అడ్‌హాక్‌ కమిటీల కన్వీనర్‌, కో కన్వీనర్లు రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులుగా వుంటారు. రాష్ట్ర కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) 2 నెలలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 4 నెలలకు ఒకసారి జరపాలి.

వివిధ కమిటీలలోని సభ్యులందరూ విధిగా శిక్షణ పొందియుండాలి. లేకుంటే మూడు నెలల కాలంలో శిక్షణ పొందాలి. మండల స్థాయిలో కనీసం 2 రోజులు సమయాన్ని, జిల్లా స్థాయిలో 4 రోజుల సమయాన్ని, రాష్ట్ర స్థాయిలో 10 రోజుల సమయాన్ని  కార్యదర్శివర్గ సభ్యులు తప్పని సరిగా ఉద్యమం కొరకు కేటాయించాలి.
ఈ నిర్మాణమును వివరించుటతో పాటు ప్రసంగించిన వివిధ జిల్లాల బాధ్యులకు సమన్వయ కర్తగా వ్యవహరించడంలో మంచి గతకాల అనుభవజ్ఞులన్న విషయాన్ని చెప్పకనే సభకు తెలియపర్చారు.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ.. ఉద్యమకారుడుకి, సామాన్యుడికీ ఉన్న తేడాను, కార్యకర్త అంటే స్వతంత్రః కర్త అని, అంటే తనే నిర్ణయము తీసుకొని అమలుచేయగల వారినే కార్యకర్తలనాలని, అలానే స్వేచ్చా స్వాతంత్య్రములకు గల తేడాలను వివరించారు. స్వేచ్చ అంటే నిర్ణయము తనదైతే స్వేచ్చ గలవాడని, తన నిర్ణయాన్ని అమలుపరచుకొనే అవకాశం గలవాడే స్వతంత్రుడవుతాడని వివరించారు. జీవితమంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమాహారమేనన్నారు. ఉద్యమ నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలను సభలోని ప్రతివారూ నోట్‌ చేసుకోవడం గమనిస్తే, ఆ సభ కూడా శిక్షణాలయముగా తలపిస్తుందని అనక తప్పదు. కొన్ని నినాదాలు చేస్తూ ''సత్యాన్ని గమనించు, అంగీకరించు, స్వీకరించు, ఆచరించు'' అంటూ ఉద్యమకారుల విషయంలో ''వెదుకు, గమనించు, సమీకరించు, సంఘటిత పరుచు, పోరాడు'' అంటూ కలసిపోదాం, కలుపుకు పోదాం, చేయందిద్దాం, చేయందుకున్నామన్నారు. సభ్యత్వము గల ప్రతి ఒక్కరూ తమలాంటి వారిని మూడునెలలకు ఒకరిని చేర్పించినా ఆ ఉద్యమము మహోద్యమము అవుతుందన్నారు. అలానే భవిష్యత్తు కార్యాచరణను గురించి వివరించారు. ఆ వివరాలివిగో...

భవిష్యత్‌ కర్తవ్యాలు :

మండల స్థాయిలో సభ్యత్వాన్ని, నూతన మండల కమిటీలను, కళాశాల సమావేశాలను, శిక్షణ పొందగోరు వారిని, గ్రామ సభలు నిర్వహించుట గురించి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది.
రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి కనీసం ఒక దరఖాస్తును, ప్రతి రెండు నెలలకు పెట్టాలని, ప్రతి మండలంలో కనీసం 10 కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టాలని, జిల్లా స్థాయిలో 40 కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టాలని నిర్ణయించటం జరిగింది.

ముఖ్యంగా 4(1)బి ని అడిగి తెలుసుకొని లేని కార్యాలయాల్లో 4(1)బి ని పెట్టాలని కోరుతూ ధరఖాస్తును పెట్టాలి.
ఈ మహాసభలో కొంతమంది తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. చర్చల అనంతరం వాటిని మహాసభ ఆమోదించటం జరిగింది. తీర్మానాలను ప్రవేశపెట్టిన వారు...

1. జంపా క్రిష్ణకిషోర్‌, ప్రధాన కార్యదర్శి, 2. బి.శ్రీనివాసరావు, ఏలూరు,                3. ఎ.హొన్నూరప్ప, అనంతపురం, 4. కె.రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యకక్షుడు, 5. పి.సత్యనారాయణ, కృష్ణాజిల్లా కోశాధికారి, 6. నటుకుల శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి, 7. ఆట్ల బాలాజీరెడ్డి, గుంటూరు జిల్లా కో కన్వీనర్‌.

మహాసభలో ప్రవేశ పెట్టిన తీర్మానాలు :

కమీషనర్ల వికేంద్రీకరణ జరిపి ప్రతి 2,3 జిల్లాలకు ఒక కమీషనర్‌ అందుబాటులో ఉండే విధంగా చూడాలని,
అప్పిలేట్‌ అధికారుల వివరాలను తెలియజేసే బోర్డుల మీద విధిగా రెండవ అప్పీలేట్‌ అధికారియైన సమాచార కమీషనర్ల పేర్లను కూడా ప్రాంతీయ భాషలలో రాయించాలని అన్నారు. అలాగే చాలా కార్యాలయాల్లో అధికారులు బదిలీలలో వెళ్ళినప్పుడు క్రొత్తగా వచ్చిన అధికారుల పేర్లను వెంటనే మార్చాలని, అసలు ఈ బోర్డులు లేనిచోట్ల వెంటనే ఏర్పాటు చేయాలని.

పౌర సమాచార అధికారులకు విధిగా శిక్షణను ఇప్పించాలని.
సెక్షన్‌ 4(1)బి ని సక్రమంగా అమలు చేయాలని.
స.హ. చట్టం మీద పనిచేసే కార్యకర్తలపై జరుగుతున్న దాడులమీద ప్రభుత్వం స్పందించి అందుకు కారకులైనవారిపైన కఠినచర్యలు తీసుకోవాలని, మరణం సంభవించిన కార్యకర్తల కుటుంబాలకు నష్టపరిహారం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ మరియు ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో కూడా ఈ 4(1)బి ని అమలు చేయాలని.
స్థానిక సంస్థలకు రావలసిన అధికారాలు, నిధులు సక్రమంగా బదలాయింపు జరపాలని అందుకోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలచేత అందుకు వత్తిడి చేయించాలని.
ప్రజలు తమ యజమానితనాన్ని ప్రదర్శించేందుకు తీసుకురాబడిన స.హ.చట్టం-2005 ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టేందుకు, ఆ విషయమై పుస్తకాలు ముద్రించేందుకు, ఉచితంగా పంపిణీ చేసేందుకు, ప్రజలలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం కృషిచేయాలని.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాజకీయ నాయకులను అధిపతులుగా నియమించి గ్రామ సభలను ఏర్పాటుచేస్తున్నది. వాటిలో సమాచార కమీషనర్లను మరియు స.హ.ప్రచార ఐక్యవేదిక నుండి కూడా నామినేటెడ్‌ సభ్యులుగా తీసుకోవాలి.

స్థానికంగా ప్రభుత్వాధికారులు నిర్వహించే సభలు, సమావేశాలకు ఐక్యవేదిక బాధ్యులను కూడా ఆహ్వానించాలని తీర్మానం చేశారు.

ఈ మహాసభలో నూతన కమిటీగా ఈ క్రిందివారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది.

గౌరవాధ్యకక్షులుగా : డా||వి.బ్రహ్మారెడ్డి,

అధ్యక్షులుగా : పుట్టా సురేంద్రబాబు,

ఉపాధ్యకక్షులుగా : తోటకూర కృష్ణమూర్తి రాజు, ఎ. లోకనాధ్‌,

ప్రధాన కార్యదర్శులుగా : జంపా క్రిష్ణకిషోర్‌, పి.వేణుగోపాల్‌రెడ్డి,

కార్యదర్శులుగా : కోట ప్రసాదశివరావు, ఎ. రాజన్న, షేక్‌ అబ్దుల్‌ రహీం,


కోశాధికారిగా : ఎం. మాధవి


మరియు 30 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కొంతమంది వదాన్యులను, సహాయ సహకారములు అందించిన వారిని గుర్తించి వారికి జ్ఞాపికలు అందజేసింది. వారు..

1. పుట్టా రామకృష్ణ, హైదరాబాద్‌, 2. ఎం. విజయలక్ష్మి, సత్యాన్వేషణ మండలి, 3. డా|| వి.బ్రహ్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యకక్షులు, 4. డా|| నాగేశ్వరరావు, ఒంగోలు, 5. ఎ.లోక్‌నాథ్‌, ప్రధాన కార్యదర్శి, జైభారత్‌, 6. డి. సాంబశివరావు, ఫ్రండ్స్‌ షూ కంపెనీ అధినేత, 7. పి.మోషే, సత్యాన్వేషణ మండలి, అధ్యకక్షులు, 8. ఎం. శ్రీనివాసరావు, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రకాశం జిల్లా అధ్యకక్షులు, 9. తులసీ జిగీష, స.హ.ప్ర.ఐక్యవేదిక ఒంగోలు జిల్లా కోశాధికారి తదితరులకు జ్ఞాపికలు అందజేయడంతో మహాసభ ముగిసింది.                      

 రిపోర్టు : కోట ప్రసాదశివరావు

No comments:

Post a Comment