Saturday, June 1, 2013

హేతువాద ఉద్యమం ఈనాటి సామాజికావసరం

యోచనాశీలురైన పాఠకమిత్రులారా !


ముఖ్యమైన నాలుగైదు విషయాలు ముందుగా చెబుతాను. మనసుపెట్టి జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి యత్నించండి. అటుపిమ్మట అవి సబబైనవో కావో నిర్ణయించండి.



1. హేతువాద ఉద్యమం ఈనాటి సామాజికావసరం. అంతేకాదు ! ప్రతి మనిషీ (మనుషులంతా) స్వతంత్రంగానూ, యోగ్యమైన ఆధారం లేదా సరైన సమాచారం తోనూ కూడి ఆలోచించలేనంత కాలం సమాజంలో హేతువాద ఉద్యమము యొక్క అవసరం ఉంటూనే ఉంటుంది.



2. వెంకటాద్రి గారు, ఆయన మిత్రులూ, సహచరులలో కొందరు వ్రాసినవి తప్ప, తెలుగులో హేతువాదాన్ని గురించిన రచనలు దాదాపు లేవనవచ్చు. ఇతరత్రా అయినా ఇదే హేతువాదమంటే అనదగ్గ పరిష్కృత రూపంలో రచనేమీ లేదు. అంతర్జాలంలోనూ, విజ్ఞాన సర్వస్వాలలోనూకూడా హేతువాదం పేరున క్రీ.పూ.నుండి నేటివరకు అనేకులు వెళ్ళడించిన వివిధాభిప్రాయాలు మాత్రం సంక్షిప్త రూపంలో కనపడుతున్నాయి.



3. వెంకటాద్రి గారూ, వారి బృందమూ, ఆయన రచనలను చదివిన పరిచయస్తులు, ఇతర నాస్తిక, భౌతికవాద, హేతువాద సంస్థలతో ఉంటూ హేతువాదులం మేము అని చెప్పుకుంటున్న వాళ్ళు వెంకటాద్రి గారి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ హేతువాదమనేది ఒక సిద్ధాంతం కాదనీ, అదొక ఆలోచనా విధానమనీ అనుకుంటూ, అంటూనూ వస్తున్నారు. ఈ విషయాన్ని - దీనికిదీనినిగా - తగినంత విచారణ చేసి నిర్ధారించదగ్గ రీతిలో దీనిపై ఏకాభిప్రాయ సాధనకు కృషిచేయాల్సి ఉంది. ఈ విషయంలో నాపక్షం, హేతువాదమనేది ఒక సామాజిక దృక్ఫథం కలిగిన, తాత్విక స్థాయి కల, ఆలోచనా క్షేత్రానికి సంబంధించిన ఇతివృత్తంతో ముడిపడి ఉన్న సిద్ధాంతమనే. మిత్రులంగానే ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో విచారించుకోవడం మంచిది.



4. ఏయే విషయాలలోమనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉందో, ఆయా విషయాలలో మనం సక్రమమైన నిర్ణయాలకు రావాలంటే మాత్రం ఆలోచనకు ఆధారంగా స్వీకరించే - హేతు స్థానంలో ఉంచే - సమాచారం శాస్త్రీయ స్థాయి కలిగినదిగా (సరైనదిగా) ఉండడం అవసరం. కనుక అవసరమైన మేర వైజ్ఞానిక సమాచారాన్ని సంపాదించుకొని ఉండడం హేతుబద్దాలోచనాపరునికీ, హేతువాద ఉద్యమకారునికీ అవసరమే అవుతోంది.



గమనిక : దానర్థం ప్రతి హేతువాదీ ఆధునిక విజ్ఞాన శాస్త్రావిష్కరణలన్నింటినీ వంటబట్టించుకుని ఉండితీరాలని కాదు. నిజానికి నిత్యజీవితంలో ఎదురయ్యే విషయాల గురించి హేతుబద్దంగా ఆలోచించడానికి సాపేక్ష సిద్ధాంతాలు, అందులోని ప్రదేశకాలాల వివరాలు తెలుసుకొని ఉండాల్సిన పనేమీ లేదుకూడా.



5. లోగడ వివేకపథంలో (2013 ఏప్రిల్‌ సంచిక, క్రమ సంఖ్య -198) నేను ప్రస్తావించినట్లు వెంకటాద్రిగారు, తదితరులూ వెలిబుచ్చిన భావాలలో కొన్ని నాకంగీకారమైనవి ఉన్నాయి. మరికొన్ని నాకంగీకారము కానివి ఉన్నాయి. ఇంకొన్ని అయితే అవి సరైనవేననే వాళ్ళతో కూర్చుని విచారించాల్సినవీ ఉన్నాయి. ఈ విషయంలో నాపక్షం ఒక్కటే. విచారణలో ఒప్పులని తేలినవి స్వీకరించడానికీ, తప్పులని తేలినవి విడిచి పెట్టడానికీ, ఇంకా నిర్ణయించుకోవలసే ఉంది అని తేలినవి అనిర్థారిత జాబితాలో ఉంచి వాటిలో అవసరమనుకున్న వాటిని పరిశీలనకు లోనుచేయడానికి నేను ఆజీవితం సిద్ధంగా ఉంటాను. సత్యాన్వేషి ఎవరైనా, సరైన హేతువాది ఎవరైనా అలా ఉండాల్సిందే. ఈ రీతికి మీలో ఎవరు సిద్ధపడగలరో తేల్చుకుని నాకూ తెల్పండి.


గమనిక : వివేకపథం 198 చాలా శ్రమకోర్చి రాసిన రచన. నాదృష్టిలో ఈ సంచిక కూడా అలాంటిదే. కనుక పట్టుబట్టి, శ్రద్ధగా, విమర్శనాదృష్టితో దానినీ, 

దీనినీ కూడా పరిశీలించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.



హేతు”వాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు -2




1. ఈ విషయంలో ఆరంభ యత్నాలుగా ఏప్రిల్‌ 27,28 తేదీలలో దోరకుంట సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయంలో ప్రథమ సమావేశం జరిగింది. అందులోనుండి ఎంపిక చేసుకున్న అధ్యయనశీలురైన బృందం కొంతకాలంపాటు హేతువాద సిద్ధాంత భావజాలాన్ని గుదిగుచ్చేపని చేద్దామనుకోవడం జరిగింది. ఏమేమి చదువుకు రావాలో సూచనమాత్రంగా అనుకున్నాం.



2. దాని కొనసాగింపుగా జూన్‌ 8,9 తేదీలలో విజయవాడలోని ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో మలి సమావేశం జరిగింది. రావలసిన వారంతా వచ్చినా తగినంతగా తయారై రాకపోవడంతో వివేకపథం 198 లోని ఒక్కో అంశంపైన కొంత విచారణ చేశాం. తయారై రాసుకొచ్చిన వాళ్ళ భావాలను కొంతవరకు గమనించాము. విచారణంతా స్పష్టంగా, అస్పష్టంగా, ఏ విషయంలోనూ ఒక ముగింపుకు రాకుండా సాగినా, కొంతవరకు విచారణ రీతుల గురించి అందరికీ తెలియరావడం, పై సమావేశానికి అందరమూ ఒకింత నిర్ధిష్టరూపంలో తయారై రావాలనుకోవడమూ జరిగింది. మూడవ సమావేశం జూలై 13, 14 తేదీలలో విజయవాడలోనే జరగనుంది. ఆనాటికి ప్రతి ఒక్కరూ ''198'' సంచికలో ప్రస్థావించిన ''60'' పదాలకు అర్థాలు వ్రాసుకొని రావాలని తీర్మానించుకున్నాము. ఇందులో పాల్గొనే వ్యక్తులకు పదాల అర్థాల దగ్గర స్పష్టతలేకున్నా, సమానార్థాలు లేకున్నా, ఒకరినొకరు అర్థంచేసుకోవడమూ, ఏది సరైనదో పరిశీలించడమూ అన్న రెండు అసాధ్యమవుతాయన్నంత వరకు దాదాపు అందరం ఏకాభిప్రాయానికి రాగలిగాం. నా అవగాహనననుసరించి అక్కడికదే గొప్ప సఫలతనొందడమే.



''నిర్థిష్టార్థాలు, సమానార్థాలు, కలవాళ్ళ మధ్యనే భాష పూర్తి స్థాయిలో ప్రయోజనాన్ని కలిగించగలుగుతుందనేది భాషా నియమాలకు చెందినంతలో అత్యంత మౌలికాంశం'', భాషావేత్తలలో నిర్వివాదాంశం కూడా. 198 సంచికలో వ్రాసిన పదాలన్నింటినీ, వాటి స్వరూప స్వభావాల రీత్యా కొన్ని రాశులుగ - సముదాయాలుగ - విడదీసి కూర్చవచ్చు.


ఎ) 1. జ్ఞానము, 2. విజ్ఞానము, 3. అజ్ఞానము, 4. ప్రమ - సత్యము - ఒప్పుజ్ఞానము, 5. భ్రమ- అసత్యము - తప్పుజ్ఞానము.
బి) 1. ప్రత్యక్షజ్ఞానము, 2. పరోక్షజ్ఞానము.
సి) 1. ఆలోచన, 2. ఆధారము, 3. ఆధారసహితాలోచన, 4. హేతుబద్దాలోచన, 5. అహేతుకాలోచన, 6. తార్కికాలోచన, 7. ఊహ, 8. కల్పన, 9. పరికల్పన.
డి) 1. హేతువు, 2. హేతుత్వము, 3. హేతువాదము, 4. హేతువాది, , 5. హేతుమంతుడు.
ఇ) 1. కార్యము, 2. కారణము, 3. నియమము, 4. కార్యకారణ నియమము.
ఎఫ్‌) 1. శాస్త్రీయము, 2. శాస్త్రీయ దృక్ఫథము, 3. శాస్త్రీయ పద్ధతి, 4. ప్రయోగము.
జి) 1. వాదము, 2. వాదన, 3. సిద్ధాంతము, 4. రుజువు, 5. ఉదాహరణ, 6. ఉపమానము.
హెచ్‌) 1. అనుభవము, 2. అనుభూతి, 3. సానుభూతి, 4. సహానుభూతి, 5. సామరస్యము.
ఐ) 1. స్వేచ్ఛ, 2. స్వాతంత్య్రము, 3. విసృంఖలత, 4. సంపూర్ణ స్వేచ్ఛ, 5. బంధము, 6.భావబంధము
జె) 1. ఘటన, 2. సంఘటన, 3. విఘటన.

ఈ ఒక్క సంచికలోనే అన్ని పదాలకు అర్థాలు వ్రాయడం కష్టం. కొన్నింటిని ప్రస్తావిస్తాను గమనించండి.


1. ప్రత్యక్షజ్ఞానం : ఆయా విషయాలకు సంబంధించిన సమాచారం ఆయా ఇంద్రియ సామర్ధ్యాలకు లోబడి ఎంతమేరకు, ఏరూపంలో మెదడుకు చేరిందో అంతమేరకు ఆ రూపంలో అనుభూతి చెందడాన్నే - దానిని గురించి ఆ రకంగా అనిపించడం లేదా ఎరుక ఏర్పడటం ఉందే దానినే - నేరుగా తెలియడం - ప్రత్యక్షజ్ఞానం - అంటున్నాము.
2. పరోక్షజ్ఞానం-1 : పైన చెప్పుకున్న రీతిలో ప్రత్యక్షజ్ఞానం అనడానికి వీల్లేకున్నా, ఆధారసహిత ఆలోచనల ద్వారా పరోక్షంలో ఉన్న విషయాలకు సంబంధించిన ఊహాత్మక భావనలను అనుమానిక జ్ఞానం అంటారు.
పరోక్షజ్ఞానం -2 : పై రెండు రకాల జ్ఞానాలకు చెందిన వివరాలను వినడం, చదవడం ద్వారా గ్రహించడాన్ని వినకిడి జ్ఞానం లేదా శాబ్దీజ్ఞానం అనంటారు. మనిషికి ఈ మూడు విధానాలలో ఏదో ఒక విధానం ద్వారానే తలలో తెలివిడితనం పుడుతుంది లేక తెలియడం అన్నది జరుగుతుంటుంది.

జ్ఞానం : అలా ఆయా విషయాలకు సంబంధించిన ఎరుక (అనిపించడం, అనుభూతి చెందడంనే జ్ఞానం అనంటారు. ఆయా విషయాలకు సంబంధించిన తెలివి - భావన - ఏర్పడడమే జ్ఞానం కలగడమంటే. ఒక్క ముక్కలో చెప్పుకుంటే విషయపరమైన ఎరుకనే జ్ఞానమంటారు. ఆయా విషయాలకు సంబంధించిన స్పృహనే జ్ఞానమంటారు. 

సాంఖ్యదర్శనకారుడు ''అసన్ని కృష్ణార్థ పరిచ్ఛిత్తిః ప్రమ'' అనన్నాడు. అంటే అప్పటికి లేనిదేదో ఎరుకైంది అని దానర్థం.

విజ్ఞానము : విశేషజ్ఞానము అని దీనర్థం. వాడుకలో సైన్స్‌ సంబందితాలను విజ్ఞానము అనుపేరున పిలవడం జరుగుతోంది. ''జ్ఞానము - విజ్ఞానము'' అని కలిపిగాని చెబితే అప్పుడు జ్ఞానమన్న దానికి వినికిడి జ్ఞానమని, విజ్ఞానమన్నదానికి ప్రయోగస్థాయి కలిగిన జ్ఞానమని అర్థం చెప్పబడుతోంది.
అజ్ఞానం : దీనికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి జ్ఞానంలేనితనం, తెలియని తనం అని అర్థం కాగా రెండో అర్థం తప్పు తెలివి ఉండడం అని. తప్పు తెలివిని (తప్పుజ్ఞానాన్ని) జ్ఞానమనక అజ్ఞానమని ఎందుకన్నట్లు? తప్పు తెలివిలోనూ ఉన్న దానికి సంబందించిన తెలియనితనం ఉందిగనుక. దానినీ అజ్ఞానమనే అన్నారు.
ప్రమ - సత్యము - ఒప్పుజ్ఞానము - తధ్యం అన్న నాలుగు మాటలూ ఉన్నది ఉన్నట్లు కలిగిన తెలివిడితనానికి (ఎరుకకు) పెట్టిన పేర్లే. సబద్దము, ఋతము, నిజము, నిక్కవము లాటి మరికొన్ని పదాలు సత్యానికి పర్యాయాలే.
గమనిక : సత్యాన్ని గురించి వివిధ కాలాలలోని మేథావులు వారిదైన శైలి, భాషలలో ఇలా చెప్పారు. జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోండి వాటిని. చివరకు మీకు మీరుగా సత్యమంటే ఏమిటో ఒక నిర్ణయానికి రండి.
1. తద్వతి తత్‌ప్రకారకో -నుభవోయథార్థః సయేవ ప్రమేత్యుచ్ఛతే, యథారజతే ఇదం రజితమితి. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు కలిగిన జ్ఞానము ప్రమ అనబడుతుంది.
2. అబాధిత జ్ఞానం సత్యం
3. అనధిగత, అబాధిత విషయజ్ఞేయత్వం ప్రమాత్వం
4. త్రికాలాబాధితం సన్‌నామరూప వివర్జితం సత్యం
5. Knowledge that which corresponds to reality is truth
6. దేశకాలవ్యక్తులకు మారనిది సత్యము
7. Truth is the content of knowledge that which corresponds to reality.
8. ఉన్నది ఉన్నట్లే తెలియబడితే ఆ తెలిసిన దానిని ఒప్పుజ్ఞానం అంటారు. ఒప్పుజ్ఞానానికి మరోపేరే సత్యం.
9. వాస్తవానుగుణ్యత గల జ్ఞానమునే సత్యమంటారు. (నాప్రతిపాదన ఇదే)

వెంకటాద్రి గారు - గుమ్మా వీరన్న గారు సత్యాన్ని గురించి ఏమని చెప్పారు?


1. పూర్వుల నుండి మనకు సంక్రమించిన జ్ఞానంలో కొంత సత్యమూ ఉంది, కొంత అసత్యమూ ఉంది (గు.వీరన్న, హేతువాదం-భావ విప్లవం - పరిచయంలో వెంకటాద్రి)
2. నిజానికి సత్యానికి మానవుడు ఈనాడు చేరుకున్నంత దగ్గరగా గతంలో ఏనాడూ చేరుకోలేదన్నది చారిత్రక సత్యం. (విశ్వతత్వం ముందుమాట 4వ పేజీలో)
3. జ్ఞానం సత్యాన్ని తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. సత్యమంటే జ్ఞాన విషయమే.
4. దేనిని మనం తెలుసుకుంటామో అది సత్యమవుతుంది.
5. మొదటి సత్యం కంటే సమగ్ర సత్యాన్ని మానవుడెల్లప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు.
6. సత్యపరిజ్ఞానం స్వేచ్ఛకు దారితీస్తుంది.
7. హేతుత్వం, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ అనేవి ఒక క్రమంలోనివి.
8. మనుషులు లేకపోయినా విశ్వం ఉంటుంది అనేది వాస్తవిక సత్యం.
9. ఒకనాటి సత్యాలు మరొకనాటికి సత్యాలు కాకుండా పోతాయి. శాశ్వత సత్యాలంటూ ఉండవు.
10. ఆధునిక విజ్ఞానమే అత్యుత్తమ సత్యసాధనం. మతస్తులకు సత్యం అందనేలేదు.
11. హేతువాదం ఏ సిద్ధాంతాన్ని శాశ్వత సత్యమని అంగీకరించదు.
12. తుది తీర్పుగా శాస్త్రంచెప్పే ఏకైక సత్యం ఏమిటి?

మిత్రులారా ! 

సత్యం విషయంలో వెంకటాద్రి గారికీ నాకు మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో ఇతర హేతువాద నాస్తిక మిత్రులతోనూ చర్చించాల్సి ఉంది. సత్యమంటే ఏమిటో వెంకటాద్రి గారు ఇదమిద్దంగా ప్రకటించినట్లు నాదృష్టికి  రాలేదు. మనిషి సత్యానికి దగ్గర మదింపు మాత్రమే వేయగలడనీ, సత్యాలు మారుతూ ఉంటాయనీ (ఎక్కడో ఒకచోటయితే మారంది సత్యమే కాదనీ) అన్నారాయన. మళ్ళా ఆయనే సత్యాలనదగ్గ కొన్ని ఉదాహరణలు చెబుతూ, సదకారణవన్నత్యం; మూలే మూలాభావాద మూలం మ్మూలం, ప్రకృతి అనాది నిత్యమన్న నిజాన్ని రుగ్వేద కాలంనాటి చింతకులే అన్నారనీ, అవి ఈనాటికీ మార్చుకోనక్కరలేనివిగనే ఉన్నాయనీ అన్నారు. ఇప్పుడు మనం సరైనవని చెబుతున్న వాటిలో కొన్నింటిని వేదకాలం నాటి చింతకులూ, దార్శినికులూ, ఇతర తాత్వికులూ కూడాచెప్పారని, అవి ఈనాటికీ  వసివాడనివే ననీ (మార్చుకోనక్కరలేనివేనని చెప్పారు). అలాగే అనిశ్చయతా నియమం (Law of Uncertinity) పై 1940 ప్రాంతాలనాడే సరైన భావాన్ని రాయ్‌ చెప్పగలిగాడనీ, అతనానాడన్నవి సరైనవేనని ఈనాడు రుజువవుతుందని అన్నారు. అంటే వాటిని మార్చుకోనక్కరలేనివని అంగీకరిస్తున్నట్లే గదా! అంటే కొన్ని సత్యాలంటూ ప్రకటింపబడ్డ భావాలు వేల సంవత్సరాలైనా ఇప్పటికీ మారనివిగనే, మార్చుకోనక్కరలేనివిగనే ఉన్నట్లు ఆయనే చెప్పినట్లుగదా!

గమనిక : ఇలా, సత్యాలు మారతాయి, మారకుంటే అవి సత్యాలే కావు. ఇంకా సత్యాన్ని మానవుడు కనుగొననే లేదు, వైజ్ఞానిక క్షేత్రాలలోని నిర్ధారణలన్నీ సత్యానికి దగ్గర మదింపులు మాత్రమేలాటి అభిప్రాయాలను - సత్యాలు మారవు, మారితే అది సత్యం కాదనీ నాలాంటి వారు వెల్లడించిన అభిప్రాయాలను విచారణకు పెట్టి సరైన అభిప్రాయం దగ్గరకు అందరం రావలసిన అవసరం ఉంది. అవునా? కాదా? ఆలోచించండి.

మచ్చుకు ఈ విషయాన్నే విచారణకు తీసుకుందామనుకుంటే సత్యం విషయంలో మూడు రకాల అభిప్రాయాలు (ప్రతిపాదనలను) చర్చకోసం లేదా  విచారణ కోసం తయారుచేయవచ్చు. అలాటి వాటిని అభ్యుపగమ సిద్ధాంతాలంటారు.

1.  సత్యాలు మారతాయి. మారకపోతే అవి సత్యాలే కావు.
2. సత్యాలు మారవు. మారితే అది సత్యమే కాదు.
3. కొన్ని సత్యాలు మారతాయి, కొన్ని సత్యాలు మారవు.
విచారణానంతరం ఈ మూటిలో ఏదో ఒకటే సరైన సిద్ధాంతం - అభిప్రాయం - అని నిర్ధారణౌతుంది.
అసత్యము - భ్రమ - తప్పు జ్ఞానము, అబద్దము, అనృతము, మిధ్య, విపర్యయము అన్న మాటలన్నీ ఉన్నది ఒక రకంగా ఉంటే మరో రకంగా అనిపించడం అదే ''మరొకరకంగాకలిగిన జ్ఞానం'' అన్న అర్థాన్నిచ్చేటివే.
1. విపర్యయో మిధ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టితమ్‌ |
2. అతస్మిన్‌ తద్జానమ్‌ మిధ్యా జ్ఞానం తదేవ భ్రమా ||
3. తదభావవతి తత్ప్రకారకో అనుభవం అయ్యథార్ధం తజ్జన్యం జ్ఞానం భ్రమ.
4. భాధిత జ్ఞానం అసత్యం
5. వాస్తవానుగుణ్యత లేని జ్ఞానం అసత్యం.

ప్రత్యక్షజ్ఞానము : విషయాలు జ్ఞానేంద్రియముల ద్వారా ఏమేరకు మెదడుకు చేరుతున్నాయో ఆ మేరకు తెలియడాన్నే ప్రత్యక్షజ్ఞానం అంటారు.

పరోక్షజ్ఞానం : ఆధారసహితాలోచన ద్వారా, పరోక్షంలో ఉన్న వాటిని గురించి ఊహామాత్రంగా ఏమి తెలియబడుతుందో దాన్నీ, వినడం, చదవడం ద్వారా ఏమి తెలియబడుతుందో దానిని పరోక్షజ్ఞానమంటారు. అంటే అనుమాన, శబ్ద ప్రమాణముల ద్వారా కలిగే జ్ఞానాన్ని పరోక్షజ్ఞానమంటారన్న మాట.

గమనిక : స్మృతికేంద్రంలో ఉన్నవి మరల, మరల గుర్తుకు రావడాన్ని కలుగుతున్న జ్ఞానం అనము. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గాని, అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా గాని జ్ఞానం కలిగిందంటున్నామంటే, అది పరోక్షజ్ఞానరూపమైనా సరే, ఏదోఒకరకమైన తెలియనితనాన్ని పోగొడుతూ, ఏదోఒకటి తెలిసిందనిపించాలి. కనుక జ్ఞానం కలగడానికి అనధిగతత్వం (అది అప్పటికి పాతబడనిదైయుండడం) నియమమంటారు ప్రమాణజ్ఞులు.
ఆలోచన : ఆలోచన అన్నది మెదడు చేసే అనేక పనుల్లో ఒకపని. మనం మాట్లాడాలన్నా, గమనించాలన్నా, గుర్తుచేసుకోవాలన్నా, ఊహించాలన్నా, కలగనాలన్నా అవన్ని ఎలా జరుగుతున్నాయో గమనించిండి. అ మొత్తాన్నీ ఆలోచనలనే అంటారు.

ఆధారం : ఏది ఉంటేగాని ఏది ఉండలేదో అది దానికి ఆధారం అంటారు. ఇక్కడ మన ప్రస్తుతాంశమైన హేతువాదానికి సంబంధించి ఆధారమన్న మాటను ఆలోచన పుట్టడానికి (ఆలోచనకు) ఆధారమైనది అనే అర్థంలో వాడుతున్నాము. ఆలోచనకు ఆధారం గత జ్ఞానం తాలూకూ ఏదో ఒకటి గుర్తుకు రావడం. విషయరహితమైన ఆలోచనగానీ, ఆధారరహితమైన ఆలోచనగానీ చేయడం సాధ్యపడదు. కనుక ఆలోచన మొదలవ్వాలన్నా, కొనసాగాలన్నా విషయాలు గుర్తుకువస్తూ ఉండాల్సిందే. విషయాలు గుర్తుకు రావడం ఆగిపోయిందా, ఆలోచన కొనసాగుతున్న విషయాలు గుర్తుకు వస్తూ ఉండాల్సిందే. విషయాలు గుర్తుకు రావడం ఆగిపోయిందా, ఆలోచనలూ ఆగిపోవాల్సిందే. అధమపక్షం కావలసిన విషయం గుర్తుకురావడం లేదు అన్నవరకైనా గుర్తుకు వస్తుంటేనే విషయాలు గుర్తుకు రావటం లేదన్న ఆలోచనైనా ఏర్పడదు. విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.

ఆధారసహితాలోచన : వెనుకచెప్పుకున్న ఆధారాలన్నవి రెండు రూపాలుగా ఉండవచ్చు. ఒకటి బాహ్య విషయాలు ఆధారంగా లేకనే గతాన్ని గుర్తుచేసుకుని దాని ఆధారంతో ఆలోచిస్తూండడం. రెండవది ఇప్పుడు ఏదోఒక విషయం ప్రత్యక్షం ద్వారా తెలియబడింది. అది స్మృతిలోకి వెళ్ళి దానితో సంబంధం ఉన్న విషయాలను గుర్తుకొచ్చేటట్లు చేసింది. అలా స్పురణకు వచ్చిన వాటి ఆధారంగా ఆలోచన సాగించడం రెండు రకాల ఆలోచనలకూ స్మృతిజ్ఞానం ఆధారంగా ఉండడం సామాన్యమే అయినా, ఒకదానికి బాహ్య విషయజ్ఞానంతో పనిలేకపోవడం, మరొకటి బాహ్య విషయజ్ఞానంతో ఇప్పుడు పంపబడి ఉండడం అన్న తేడా ఉంటుంది. 

ఈ ఆధారసహితాలోచన అన్నదగ్గరే సహేతుకాలోచన, అహేతుకాలోచన అన్న పదాలు వాడవలసి వస్తుంది. 
గమనిక : నిజానికి ఆధారసహితాలోచన అన్న పదాన్ని వాడనక్కరలేదు. ఎందుకంటే ఆధారరహిత ఆలోచన ఉండదు కనుక. ఆలోచన పుట్టిందంటేనే ఏదో ఒక విషయానికి సంబంధించి అనీ, ఏదో ఒక విషయం గుర్తుకు రావడం ద్వారానే అనీ చెప్పుకున్నట్లే.

హేతుబద్దాలోచన : హేతువాదానికి తగిన ఆధారంతో కూడిఉన్న ఆలోచన అని ఈమాటకు అర్థం. సహేతుకాలోచన అన్నది ఈ అర్థాన్ని తెలిపే పదమే. ఆలోచించడం ద్వారా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పడుటకున్న అభిప్రాయాలు సరైనవిగా ఉండాలంటే హేతుస్థానంలో ఎట్టి ఆధారాలుండాలో నన్నదే హేతుబద్దాలోచనలో కీలకమైనది. కనుక సరైన ఆధారంతో కూడుకున్న ఆలోచననే హేతుబద్దాలోచన లేదా సహేతుకాలోచన అంటారు.

అహేతుకాలోచన : అహేతుకాలోచన అంటే ఆధారరహితమైన, నిరాధారమైన ఆలోచన అనకూడదు. ఎందుకంటే ఆధార రహితంగా ఆలోచన పుట్టదనుకున్నాం కదా! కనుక తప్పుడు నిర్ణయాలకు, అభిప్రాయాలకు దారితీయించే అయోగ్యమైన, సరికాని ఆధారాలతో చేసే ఆలోచననే అహేతుకాలోచన అంటారు. 

తార్కికాలోచన : నిజానికీ పదం పేపర్‌ కాగితం లాంటిది. ఎందుకంటే తర్కమంటేనే సక్రమాలోచన, సహేతుకాలోచన అని అర్థం.

సూత్రం : అవిజ్ఞాతతత్వే అర్జే కారణోపపత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః ! ఒక తెలియబడని విషయాన్ని, పరోక్షంలో ఉన్నదానిని గురించి, యోగ్యమైన ఆధారాలు లభించడం ద్వారా ఊహాత్మకంగా తెలుసుకొనే పద్ధతినే తర్కమంటారు.

హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలు లేక తార్కిక నిర్ణయాలు అన్నవి అనుమాన ప్రమాణం ద్వారా ఆర్జించిన జ్ఞానరూపాలవుతాయి. ఈ రకమైన నిర్ణయాలు ఏర్పడాలంటే...

1.  ఇదుంటే అదీ ఉంటుంది అన్న రూపంలో రెంటి సంబంధ జ్ఞానం గతంలో కలిగియుండాలి.
2. ఆరెంటిలో ఒకటి ఇప్పుడు ప్రత్యక్షం ద్వారా తెలియబడి ఆలోచనకు ఆధారంగా హేతుస్థానంలోకి రావాలి.
3. ఆ హేతుస్థానంలో వున్నదాని ఆధారంతో చేసే ఆలోచన హేతుబద్దాలోచన (తార్కికాలోచన) అవుతుంది. ఆ ఆలోచన పర్యవసానంగా ఏర్పడ్డ నిశ్చయం (రెండోదీ అక్కడ ఉందన్న ఊహ) నే హేతుబద్ద ఆలోచనాజనిత నిర్ణయమని, అనుమాన ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమనీ అంటారు.

ఊహ : మనస్సులో ఆలోచనానంతరం ఏర్పడే భావనకు ఊహ అంటారు. 
పరోక్షజ్ఞాన రూపంలో మనస్సులో ఏర్పడే భావనలన్నీ ఊహలే. 
కల్పన : ఇదీ ఒకరకమైన ఊహే. మనస్సు చేసే భావనే. అయితే వాస్తవంగా లేనిదానిని లేదా అనుభవంలో లేనిదానిని, అప్పటికి కలిగియున్న ఇతరేతర భావనలాధారంగా ఊహించడాన్ని కల్పన అంటారు. సృజనాత్మకత అన్నది కల్పనా రూపమే.

పరికల్పన : ఈ పదం విజ్ఞాన శాస్త్రక్షేత్రాలలో ప్రముఖంగా వాడబడుతుంది. శాస్త్రజ్ఞులు చేసే ఊహాత్మక సిద్ధాంతాలను పరికల్పనలు అంటున్నారు. (హైపోథిసీస్‌ అని ఆంగ్లపదము). అనుమితి ప్రమాణజన్య నిర్ణయాలు పరికల్పనలే.
హేతువు : ఇది అనేక అర్థాలలో వాడబడుతున్న పదం. ప్రధానంగా కారణము అన్న అర్థములోనూ, పరోక్షజ్ఞాన సాధకమైన ఆలోచనాత్మక నిర్ణయాలు చేసే విధానంలో ఆధార స్థానం దగ్గర యోగ్యమైన ఆధారం అన్న అర్థంలోనూ వినియోగమవుతోంది. అందులనూ మన ప్రస్తుత విచారణీయాంశమైన హేతువాదము, హేతుబద్దాలోచన అన్న సందర్భంలో, సరైన నిర్ణయాలకు రావడానికి ఆలోచనకు, ఆధారంగా ఉన్నది అన్న అర్థంలో వాడుతున్నాము.
గమనిక : కార్యకారణాలు అన్నవి ఎలా జంటపదాలు మరియూ పరస్పరాధార సంబంధ పదాలో, అలానే హేతువు అన్నదానికి సాధ్యమన్న పదంతో సంబంధం ఉంది కనుక, హేతు-సాధ్యాలన్న పదాలున్నూ. హేతు స్థానంలో ఉన్న దేని జ్ఞానం మనకు కలుగుతుందో అది వాస్తవంలో కారణమనడానికీ, కార్యమనడానికీ కూడా తగి ఉండవచ్చు. కనుక హేతువు- కారణము, హేతుబద్దాలోచనా క్షేత్రంలో పర్యాయపదాలు కావు. ఎలాగంటే : 

అనుమాన ప్రమాణంలోని, హేతుబద్దాలోచన జనిత నిర్ణయం అన్నదానికి ఒక్క ఉదాహరణ చెబుతాను.
ఒక కర్మాగారంలో పొగవస్తుండడాన్ని చూశాము. ఎక్కడ పొగ ఉందని మనకు తెలిసిందో, అక్కడ నిప్పుఉంటుందన్న ఊహాత్మక నిర్ణయం చేశాము. దానిని పొగ ఉందన్న జ్ఞానం ఆధారంగా ఆలోచించి అక్కడ నిప్పుఉందన్న జ్ఞానాన్ని సాధించాము.

ఇక్కడ ప్రధానాంశమేమంటే ; హేతుస్థానంలో ఉన్నదీ ఒకరకమైన జ్ఞానమే. అది పొగజ్ఞానం, నిప్పుకు సంబంధించిన దాని ఆధారంతో ఆలోచించిన ఈ ఆలోచననే హేతుబద్దాలోచన అంటున్నాము. అక్కడే నిప్పు ఉందన్న ఊహాత్మక జ్ఞానాన్నే పొందాము. అంటే సాధ్యస్థానంలో ఉన్నదీ మరోరకమైన జ్ఞానమే.
అదే మరి వాస్తవాలలో కార్యకారణ నియమాన్ని బట్టి పొగ-నిప్పుకు మధ్య ఉన్న సంబంధం పొగ కార్యం, నిప్పు కారణం అవుతాయి.

అర్థమవుతుందా మిత్రులారా !

మళ్ళీ ఒకసారి చెబుతాను జాగ్రత్తగా పరిశీలించండి.

1. వాస్తవంలో పొగకు నిప్పుకు ఉన్న సంబంధం (కార్యకారణాల రూపంలో చెపితే). పొక కార్యం, నిప్పు కారణం.
2. అది హేతుబద్దాలోచనలో హేతు సాధ్యాలతో ముడిపెట్టి చెప్పుకొంటే హేతు స్థానంలో ఉన్న పొగ జ్ఞానం కారణం. సాధ్య స్థానంలో ఉన్న నిప్పు జ్ఞానం కార్యం అవుతాయి. ఈ వ్యత్యాసం తెలియనంతకాలం అతడెంత మేథావియైనా, ెన్ని విషయాలు తెలిసున్నవాడైనా, హేతువు గురించి గానీ, హేతుబద్దాలోచన గురించి గానీ సరైన అవగాహన పొందలేడు. హేతువాద ఉద్యమ క్షేత్రాలలో ఉన్న చాలామందిలో ఇక్కడే తగినంత స్పష్టత లోపించి ఉంది. ఆవేశానికి లోను కాకుండా ఈ విషయంలో ఇది చదవక పూర్వం మీ అవగాహనేమిటో, దీనిని గమనించాక ఇప్పుడు మీకేమనిపిస్తోందో ఆలోచించుకోండి. నా పక్షం సబబు కాదనిపించినా, అర్ధంకాలేదనిపించినా నాతో మిత్రునిగా తలంచే సుమండీ! సంప్రదించండి.

హేతుత్వం : నిజానికీపదం ఆలోచనకు ఆధార స్థానంలో ఉన్నదానికి హేతువుకుండాల్సిన లక్షణం - సామర్ధ్యం - ఉందనటానికై వాడవలసిందిగా ఉంది. హేతుత్వం అన్నదానికి హేతుదనం గల అని మాత్రమే అర్థం. ఎలాగంటే భాషలో 1. తీపి- తీపిదనం, మధురం- మధురత్వం; 2. రెడ్‌ - రెడ్డిష్‌ (ఎరుపు-ఎర్రదనం), 3. మృదువు - మృదుత్వం, 4. సున్నితము - సున్నితత్వం ; లాగనే హేతువు-హేతుత్వమున్నూ. కనుక హేతుత్వం అన్నది ఆధార స్థానంలో ఉన్నదానికి హేతువు అనడానికి తగిన అర్హత- హేతుత్వం. ఉందనడానికి వాడే మాటన్నమాట.

1.  హేతువాదం : హేతువుతో ముడిపడివున్న ఆలోచన, దానితో ఏర్పరచుకునే పరోక్షాంశాలకు సంబంధించిన ఊహాత్మక నిర్ణయాలు. ఈ ప్రక్రియకూ వ్యక్తి జీవితానికీ, సామాజిక గతిని, ప్రకృతికీ ఉన్న సంబంధాలు వివిధ వైజ్ఞానిక క్షేత్రాలకూ, హేతుబద్దాలోచనకు ఉన్న సంబంధమూ, సత్యాన్వేషణలో దీనికున్న స్థానము. సక్రమాలోచన చేయాల్సిన అవసరాలు, చేయకుంటే జరిగే అనర్థాలు, ఇప్పటికే జరిగిన అనర్థాలు ఇలా బహువిస్తారమైన క్షేత్రపరిథిని ఆవరించుకొని ఉన్న, మంచి సమాజం ఏర్పడాలన్న సామాజిక దృక్ఫథం కల భావ విప్లవం లక్ష్యంగా, అందుకు అవసరమైన భావజాలంతో కూడిఉన్న సిద్ధాంతమిది. మరోరకంగా చెప్పుకుంటే

2.  ఆలోచనా క్రమంలో ఇమిడి ఉండే అంశాలను సక్రమాలోచన చేయడానికి పాటించాల్సిన నియమాలను వివరించి ప్రతి వ్యక్తీ, ప్రతి జ్ఞాన విభాగము దానిని గురించి తెల్సుకోవాల్సిన, నేర్వవలసిన, వినియోగించుకోవలసిన అవసరాన్ని, అలా చేయకుంటే జరిగే అనర్థాలనూ సంక్రమంగా వివరించే జ్ఞానక్షేత్రానికి చెందిన సిద్ధాంతమిది.
హేతువాది : హేతుబద్దాలోచనావశ్యకతను ఎరిగి, హేతువాద సిద్ధాంతమునెరిగి, అది సామాజికావసరంగా తలపోస్తున్నవాడు హేతువాది అనబడతాడు.

హేతుమంతుడు : ధనవంతుడు అంటే ధనం కలవాడు, బలవంతుడు అంటే బలం కలవాడు మొదలగు వానిలా హేతుమంతుడు అంటే హేతువు కలవాడు అని అర్థం. ఆ అర్థంలో దానిని ఒక వ్యక్తికి అన్వయించి అర్థం చేసుకోవాలంటే, ఏ వ్యక్తి ఆలోచనలు హేతుబద్దాలోచనా రూపాలు అనడానికి వీలవుతుందో ఆ వ్యక్తిని ఔపచారికంగా లేదా ఆలంకారికంగా హేతుమంతుడు అనంటాము. అంతేగాని ''హేతువు కలవాడు'' అంటూ ఏ వ్యక్తీ ఉండడు. ఒక వ్యక్తి ఆలోచనలు ఎక్కువ సార్లు హేతుబద్దంగా, సహేతుకంగా ఉంటున్నాయో అతణ్ణి హేతుమంతుడంటున్నాం.
గమనిక : ఏ మనిషినీ హేతుమంతుడనిగానీ, హేతుమంతుడు కాడని గానీ గుండుగుత్తగా (ఏకమొత్తంగా) ఒకే మూటగా కట్టేయకూడదు. ఒకతూరైనా హేతుబద్దంగా ఆలోచించని వ్యక్తిగానీ, ఒకసారైనా అహేతుకంగా ఆలోచించి ఉండని మనిషిగానీ ఉండడు. ఇది పరీక్షకు పెడితే నూటికి నూరు శాతం సరైనమాటేనని రుజువవుతుంది.
మరో గమనిక : హేతువు, హేతుత్వము, హేతుమంతుడు, హేతుబద్దాలోచన, హేతువాదము, హేతువాది, హేతువాద ఉద్యమము, హేతువాదఉద్యమకారుడు అన్న మాటలన్నింటికీ వేటి అర్థం వాటికి ఉంది.. అవి ఏవీ పరస్పరం పర్యాయపదాలు కానేకాదు. ఆ పదాల అర్థాలకున్న సంబంధము, వాటి మధ్యనున్న తేడాలను గమనించనంతవరకు, అర్థంచేసుకోనంత వరకు హేతువాదాన్ని గురించిన అధ్యయనం పూర్తికాదు. ఈ మన సమావేశ ప్రధానాశయమైన హేతువాద సిద్థాంత రూపకల్పన కార్యక్రమానికంతటికీ పునాదిరాళ్ళ వంటివీ పారిభాషిక శబ్దాలు.

కార్యము : ఇదీ అనేకార్థాలు కలిగివున్న పదం. పని, మంచిపని, చేయవలసింది, వివాహమైనాక ఏర్పరచే తొలిసంగమం, ఇలా అనేకార్థాలున్నాయి. కాని మన ప్రస్తుత సందర్భమైన కార్య-కారణ, విచారణలో అట్టివేవీ చెప్పకూడదు కార్యకారణాలన్నదగ్గర.

కార్యమంటే - ఏర్పడింది, పుట్టింది, చేయబడింది, రూపొందింది లాటి మాటలచే చెప్పదగిన ఫలితరూపము అని అర్థమే చెప్పాలి. ్పుబితిరీలి బిదీఖి లితీతీలిబీశి అన్న ఆంగ్ల పదాలలోని జూతీతీలిబీశి అన్న పదానికి సరైన అనువాదరూప పదమిది.

కారణం : 1. కార్యరూపమును ధరించునది లేదా పొందునది అన్న అర్థంలోనూ, 2. ఉన్నదానిని కార్యరూపము పొందునట్లు చేయునది అన్న అర్థంలోనూ ఈ పదాన్ని వాడవచ్చు.
 రెంటికీ వర్తించే రూపంలో నిర్వచించుకోవాలంటే ఏది కార్యోత్పత్తికి ముందు తప్పనిసరిగా ఉండాలో, దేనివల్ల మాత్రమే ఆ కార్యం (అట్టి ఫలిత రూపం) ఏర్పడుతుందో దానిని కారణమంటాము.
అనన్యధాసిద్ది అవశ్య కార్య నియత పూర్వ వృత్తిః కారణం :- కార్యోత్పత్తి తప్పనిసరిగా ఏది ముందు ఉంటే గానీ జరగదో అది కారణమని  సూత్రార్ధం.
గమనిక :  1.  కాలంలో ఆరంభము ఉన్నవన్నీ కార్యరూపాలనడానికి తగినవై ఉంటాయి. అట్టివన్నీ కార్యకారణ నియమానికి అనుగుణ్యత కలిగిఉంటాయి.
2. కొన్ని కూడి ఏర్పడేవన్నీ కార్యాలు అనడానికి తగిఉంటాయి. అలా అది ఏర్పడడానికి ఏవి కూడాయో వాటిని ఆ కార్యానికి ఉపాదాన కారణం అనంటారు. ద్రవ్య కారణం అని దానర్ధం.
3. వాటినలా కూర్చడానికి వినియోగపడ్డ శక్తి దేనిదో అది ఆ కార్యానికి నిమిత్త కారణం అవుతుంది.
మరో గమనిక : కార్యకారణాలను గురించి చాలా విపులంగా విచారించాల్సి ఉంది. గనుక ఆ పదాలకు అర్థాలు చెప్పే సందర్భములో దాన్నంతటినీ వివరించడం కుదరదు. దీనిపై ప్రత్యేకంగా విచారణ చేయాలి. మీలో అభిలాష ఉన్నవాళ్ళు ఎంతోకొంత తయారై రావడానికి వీలుగా విచారణీయాంశాలను కొన్నింటిని చెబుతాను. వాటి వివరాలు తెలుసుకొనే యత్నం చేయండి. కార్యకారణ చట్రాలు రెండు రకాలు.
1. ఉపాధాన కారణం, నిమిత్త కారణం - సహకారీ కారణం వాటివల్ల ఏర్పడే కార్యం.
2. సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం - వాటివల్ల ఏర్పడే కార్యం.
నియమము : ఎక్కడైనా, వేటి విషయంలోనైనా ఒక క్రమం (పద్ధతి) నడుస్తోంది అని తెలిసినప్పుడు, అదలాగే జరుగుతుంటుంది, మరోలా జరిగే వీలులేదు అనీ తెలిసినప్పుడు, అలా జరగడానికి కారణం అక్కడొక నియమం పనిచేస్తుంది అంటున్నాము. అంటే అది లేక అవి అలాగే ఉండడానికి  అలాగే ప్రవర్తించడానికి అవకాశము లేదో దానినే నియమం అంటున్నాం.

ఈ నియమమన్నదాన్ని ప్రకృతిలోని క్రమానికి వర్తించేటప్పుడు అవైవున్న నియమాలు - సహజ నియమాలు- అనీ సమాజానికి వర్తించే వాటిని ఏర్పరచుకున్న నియమాలు అనీ రెండుగా చెప్పుకొంటుంటాము. 
 ఉబిగీ, ష్ట్రతిజిలి, ఆజీరిదీబీరిచీజిలి అన్న పదాలు మార్పులేని పద్ధతి అమలవుతుండడాన్ని సూచించే సందర్భంలో వినియోగంలో ఉంటున్నాయి. ఈ మూడు కొన్నిసార్లు పర్యాయాలుగా, మరికొన్ని సార్లు కొద్ది తేడాలతో వేరువేరు అర్థాలలో వినియోగిస్తున్నాము.

భౌతిక విజ్ఞాన శాస్త్రక్షేత్రాలలో : సాధారణ నియమాలను తెలిపేందుకు మనం రూపొందించిన వాక్యరూపాలను, సూత్రీకరణలను (ఆజీరిదీబీరిచీబిజిరీ) అనంటున్నాము. అదలాగే ఉండడానికి దానివెనుక ఒక సూత్రం - నియమమే - పనిచేస్తుంది అంటుంటాము.

ష్ట్రతిజిలి : ఇదీ నియమాన్ని తెలిపేదే అయినా, నియమం యొక్క గట్టిదనాన్ని తెలిపే సందర్భంలో వాడడానికి తగిఉంది. అదంతేనంటాం చూడండి. అదన్నమాట.

ఉబిగీ :  మానవ కృతాలైన కట్టడులు, విధివిధానాలను తెలిపే వాటిని నియమాలు అనంటాము. అదే మరి ప్రకృతిలో ఒక క్రమంలో జరిగే వాటిలోని  ఆ క్రమతయొక్క నిరంతరాయతకు కారణమైన దానిని నియమం అంటారు. కొన్ని ప్రయోగాలను చూడగలిగితే నియమం అన్న మాటకు అర్థం బోధపడుతుంది.

1. ఒక పండు లేదా వస్తువు ఎగరేస్తే తిరిగి నేలపైనే ఎందుకు పడుతుంది? అనడిగితే అక్కడ గురుత్వాకర్షణ నియమం (ఉబిగీ ళితీ స్త్రజీబిఖీరిశిగి) పనిచేస్తుండడం వలన అనంటోంది భౌతికశాస్త్రం. పదార్థాలకు ఇతరాన్ని తమవైపుకు గుంచుకొనే శక్తి - స్వభావం - ఉందని గురుత్వాకర్షణ సిద్ధాంతం చెబుతోంది. పరస్పరం ఆకర్షించుకొనే లేదా గుంజుకునే రెండు వస్తువులు క్రమంగా దగ్గరవుతాయి అన్నదాన్నే ఇక్కడ నియమం అంటున్నాము.
2. హెచ్చు ఉష్ణోగ్రతనుండి తక్కువ ఉష్ణోగ్రత దిశగా ఉష్ణం ప్రవహిస్తూ ఉంటుంది. (ఆ రెండు ఉష్ణోగ్రతలు సమమయ్యేంత వరకు) అన్నది ఉష్ణ ప్రవాహాలకు సంబంధించిన మరో నియమం.

గమనిక : నియమము - ష్ట్రతిజిలి, చీజీరిదీబీరిచీబిజి వ సూత్రము. ఉబిగీ వ  శాసనము అన్నవి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలలో వాడబడినా, మన ప్రస్తుతాంశమైన ప్రాకృతిక, సామాజిక శాస్త్రాలకు సంబంధించినంతలో ఎన్నిసార్లు అయినా, ఎంతకాలమైనా అవి అలానే ప్రవర్తింస్తుండడానికి కారణం, ఆధారం అయిన వాటిని నియమాలంటున్నాము.

లోకంలో నియమమన్న పదార్థం ఉండదు. ఉన్నవాటిలోనే ఒక క్రమమైన, మరియు నియంత్రణతో కూడిన, ప్రవర్తనను గమనించినప్పుడు వాటిలోని ఆ క్రమతను నిలిపి ఉంచేవాటిని నియమాలన్న పేరుతో చెప్పుకుంటున్నాం. 
ప్రకృతిపరంగా చెప్పుకుంటున్నప్పుడు వాటివాటి శక్తులు, స్వభావాలు, పరస్పర బంధనలు అన్నవే, అవి అలాగే జరుగుతుండడానికి కారణాలవుతుంటాయి. అందువల్ల అవి అలాగే జరుగుతుంటాయి అనడానికి అక్కడొక నియమం ఉంది అంటుంటాము. నియమమన్న మాటకు అంతకంటే వేరర్థం చెప్పుకోవలసిన పనిలేదు.
హేతు”వాదము

హేతువాదము గురించిన వివరాలను తెలిపే సిద్దాంతం హేతువాదం. మెరుగైన సమాజ స్థాపన లక్ష్యంగా కలిగి, అందుకు తప్పనిసరిగా అవసరమై యున్న సక్రమాలోచనా రీతుల్ని వ్యక్తులకు ఎరుకపరచి, అటుపై వాటిని అలవరచుకొనేందుకు తగిన రీతులను వివరించి ప్రోత్సహించే భావజాలాన్ని కలిగిఉన్న తాత్విక ధోరణి ఇది. ఆలోచన, ఆలోచనకు ఆధారంగా ఉంటున్న అంశాలు, వాటి యోగ్యతాయోగ్యతలు, ఆలోచనల పర్యవసానంగా ఏర్పడే ఊహాత్మక నిర్ణయాలు, వాటి బాగోగులు, ప్రతికూల ఆలోచనాత్మక నిర్ణయాల పాత్ర, అవి సరైనవైతే కలిగే ప్రయోజనాలు, సరికానివైనపుడు కలిగే అరిష్టాలు (నష్టాలు), సరైన నిర్ణయాలకు రాగలిగేందుకు ఆలోచనకు ఆధారాలుగా తీసుకునే వాటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వగైరాలను వివరించే సామాజిక దృక్పధం కల సిద్దాంతమిది.

హేతువాద తాత్విక ధోరణి (సిద్దాంతం)పై వాటితో పాటు గతంలోనూ, వర్తమానంలోనూ సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న తప్పుడు భావాలను వివరించి, మూఢ నమ్మకాలు, అనిర్ధారితాంశాలు, అనిర్ధారణీయాంశాలు వాటిని నెత్తిన పెట్టుకున్నందువల్ల జరిగిన, జరుగుతున్న కీడునూ వివరించే పని చేస్తుంది. వాటిని  వదలగొట్టుకుని, సరైన దిశగా ప్రయాణం సాగించమని ప్రభోధిస్తుంది. అందుకు తగిన మార్గాలను సూత్రప్రాయంగా తెలియజేస్తుంది. అంతటితోనూ ఆగక, క్రమక్రమంగా అందుతూవచ్చిన విజ్ఞానం వల్ల కలిగిన అవగాహన ఆధారంగా శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవలసిన అవసరాన్ని, శాస్త్రీయ పద్దతుల్ని అనుసరించాల్సిన అవసరాన్ని సమాజానికి తెలియజేస్తుంది. యోగ్యమైన ఆధారాలనే తీసుకొని ఆలోచించడం వ్యష్టి, సమష్టి శ్రేయస్సులకు ఎందుకు తప్పనిసరోనూ తెలియజేస్తూ, అ దిశగా కదిలేలా వ్యక్తుల్ని, వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుంది. కనుక 'హేతువాదం' మేథోభాగానికి సంబంధించిన రీతి రివాజుల్ని వివరంచి, స్వతంత్రాలోచనా పరుల్ని తయారు చేయడం ద్వారా, మెరుగైన సమాజం ఏర్పడాలని లక్ష్యంచే ఒక తాత్విక థోరణి (వాదం లేదా సిద్దాంతం) అవుతోంది. 
మనిషి తలగాని సవ్యంగా లేకుంటే తక్కినదంతానూ అపసవ్యంగానే సాగుతుంటుంది. కాబట్టి తల సక్రమంగా ఉంచుకోండని హెచ్చరిస్తూ, సక్రమాలోచనారీతుల్ని, (హేతుబద్దాలోచనా విధానాన్ని) తెలయబరుస్తూ, వాటిని అలవరచుకోవలసిందిగా జనుల్ని, ప్రోత్సహిస్తూ, అట్టి సామర్ధ్యం పొందిన వారిని మిగిలిన వారికీ దీనిని విస్తరింపజేసేందుకు ఉద్యమించాల్సిందిగను దిశానిర్దేశంచేసే తాత్కిక ధోరణి కలిగి ఉన్న సిద్దాంతాన్ని  హేతువాదం అంటాము. 

గమనిక : ఇప్పటివరకు నడిచిన హేతువాద ఉద్యమాలు, 'హేతువాదం' అన్న దానికి సరైన రీతిలో, సరిపడినంత స్థాయిలో అటు నిర్వచనాన్ని గాని, ఇటు వివరణలనుగానీ ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టం జరిగిపోయింది. దాంతోబాటే, హేతుత్వం, హేతబద్దాలోచన, హేతువాదము, హేతువాది అన్న మాటలను, వాటికి ఆధారంగా ఉన్న హేతువు కారణము, కార్యము అన్న పదాలనూ ఎలాపడితే అలా వాడేయడం వల్లనూ, హేతువాదమంటే ఏమిటన్న విషయంలో ఎంతో గందరగోళపరిస్థితి ఏర్పడి ఉంది. ఒక సందర్భంలో వెంకటాద్రి గారు, హేతువాదాన్ని తగినంతగా వివరించే గ్రంధాలిప్పటికి లేవు నేనెరిగినంతలో అంటూ ఒక అభిప్రాయాన్ని ప్రకటించారు. హేతువాద ఉద్యమాలకు ఈనాటికీ ఆ కొరత అలానే ఉంది. 

హేతువాది :  హేతువాదాన్ని ఎరిగి, అంటే హేతువాదం చెపుతున్న భావజాలాన్ని అర్ధం చేసుకుని, అది సరైందేనని అంగీకరించి, దాన్ని నిబద్దతతో శక్తి మేర అనుసరిస్తున్న వాడిని హేతువాది అనంటారు.
హేతువాదాన్ని అంగీకరించేవాడు, అనుసరించేవాడు, దాని పక్షాన నిలిచేవాడు హేతువాది అవుతాడు. ఇది సబబేననుకుంటే అతను హేతువాదో కాదో నిర్ణయించడానికి హేతువాదం క్రిందికి వచ్చే భావజాలాన్నంతటినీ అర్ధంచేసుకుని ఉండటమూ, అందులో ఏయే భావాలతో అతడు అనుగుణ్యత కలిగివున్నాడో సరిపోల్చి చూడడమూ చేయాల్సి ఉంటుంది.

హేతుబద్దాలోచన :  హేతువుమీద ఆధారపడి, లేదా హేతువు అనదగ్గ అంశాన్ని (సమాచారాన్ని) ఆధారం చేసుకుని, హేతువు చేత నియంత్రింపబడుతూ అంటే ఆ ఆధారాన్ని అనుసరించి చేసే ఆలోచననే హేతుబద్దాలోచన అనంటాము.

హేతుబద్దాలోచన అన్నా. తార్కికాలోచన అన్నా, సక్రమాలోచన అన్నా ఒక్కటే. 
సూత్రం :- అవిజ్ఞాత తత్వేఅర్దే కారణోపపత్తితః తత్వజ్ఞానార్ధం ఊహః తర్కః ! సరైన ఆధారంతో చేసే ఊహనే తర్కమంటారు.

ఆలోచన :- కలిగిన జ్ఞానం ఆధారంగా లేదా స్మ ృతి ఆధారంగా ఆయా విషయాలను గురించి చింతించడాన్నే ఆలోచన అంటారు. విషయ రహితమైన ఆలోచన గానీ, ఆధారరహితమైన ఆలోచనగాని చేయడం సాధ్యపడదు.
ఆలోచన అన్నది (1) గతాన్ని గుర్తుచేసుకోవడం, (2) భవిష్యత్తును ఊహించడం (3) వర్తమానంలో పరోక్షంగా ఉన్న దానిని గురించి ఊహించు కోవడం (4) కల్పనలు చేయడం అన్న రూపాలలో ఉండవచ్చు.
హేతుబద్దాలోచనా ప్రక్రియ హేతువును గమనించడంతో ఆరంభమై దానితో సంబంధపడిన దానిని గురించి ఊహాత్మకంగా నిర్ణయానికి రావడంతో ముగుస్తుంది. ఈ మోత్తాన్ని కలిపే హేతుబద్దాలోచనా ప్రక్రియ అనంటారు. దీనిలో (1) రెంటి సంబంధజ్ఞానం స్మ ృతిలో ఉండటం, (2) అందులో ఒకటి హేతు స్థానంలో ఎదురుపడడం (మనస్సుకు అందడం) (3) ఈ రెంటి ఆధారంతో యోచన ఆరంభమై హేతుస్థానంలో ఉన్న దానితో సంబంధపడిఉండే రెండో దానిని ఊహాత్మకంగా నిర్ణయించడం అన్న అంశాలు ఒక క్రమంలో ఇమిడి ఉంటాయి. 
గమనిక: జ్ఞానార్జనా పద్దతులు మూడు, (1) ప్రత్యక్ష పద్దతి (2) అనుమాన పద్దతి (3) శబ్ద పద్దతి అన్నవే అవి.
అందులో ప్రత్యక్ష జ్ఞానార్జనకు హేతుబద్ధాలోచనతో పనిలేదు. అలాగే శబ్ద ప్రమాణ జ్ఞానానికీ హేతుబద్దాలోచనతో పనిలేదు. మిగిలిన అనుమాన ప్రమాణక్షేత్రానికి చెందిందే హేతుబద్దాలోచనంతా. కనుక హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలన్నీ  (అంటే ఆ విధానం ద్వారా కలిగిన) అవగాహన లోనివన్నీ ఊహారూపాలే అవుతాయన్న మాట. 
ప్రశ్న :- ఆధారరహితంగా (విషయరహితంగా) ఆలోచన చేయడమే అసాధ్యమనుకున్నాం కదా! మరి ఏదో ఒక ఆధారంతో చేసే ప్రతి ఆలోచనా హేతుబద్దాలోచనే అవుతుందా? 

సమాధానం :- అలా అవదు. ఆధారంగా తీసుకుంటున్నది యోగ్యమైనదా? కాదా? అన్నదే ఈ విచారణంతటకీ కీలకమై ఉంది. యోగ్యమైన ఆధారం మాత్రమే హేతువు అనడానికి తగి ఉంటుంది. అట్టి సరైన ఆధారాన్ని తీసుకుని చేసే ఆలోచననే సహేతుకాలోచన లేదా హేతుబద్దాలోచన అనంటారు. అలా కాని, అయోగ్యమైన ఆధారాలనే అహేతుకాలు, హేత్వాభాసలు అనంటారు. అట్టివాటినాధారం చేసుకుని చేసే ఆలోచనలనే అహేతుకాలోచనలు, అపసవ్యాలోచనలు, అతార్కికాలోచనలు (అతార్కికాలు) అనంటారు.

గమనిక :- నిర్వచనాత్మకంగా చెప్పుకోవాలంటే తర్కమంటేనే హేతుబద్దాలోచనా జనిత ఊహఅని అర్ధం. కనుక తార్కికాలోచన అన్న మాట నిజానికి అనక్కర్లేదు. తేలిగ్గా అర్ధం కావాడానికలా అంటున్నామంతే. 
సూత్రం :- అవిజ్ఞాత తత్వేఅర్దే కారణోపపత్తితః తత్వజ్ఞానార్ధం ఊహాః తర్కః !
యోగ్యమైన  ఆధారంతో మనకప్పటికి పరోక్షంగా ఉన్న విషయాన్ని గురించి తెలుసుకొనేందుకు చేసే ఊహ (ఆలోచనాజనిత నిర్ణయాన్నే) తర్కమనాలన్నది పై సూత్రం. 

హేతు”వు

మన ఈ చర్చ అంతటికీ కేంద్రస్థానం దీనిదే. హేతువు అనదగ్గదానితో ముడిపడి చేసే ఆలోచననే హేతుబద్దాలోచన అని వెనక చెప్పుకున్నాం. ఇంతకూ హేతువన్నమాటకు అర్ధమేమిటి?
భాషాశాస్త్రాలలోకి (సాహిత్యంలోకి గానీ, నిఘంటువుల్లోకి గాని) తొంగిచూస్తే హేతువన్న మాటకు ఒకే అర్ధం కాక అనేకార్ధలు ఉన్నట్లు, ఆయా రచయితలు ఆయా సందర్భాలలో తమకవసరమైన అర్ధంలో ఆ పదాన్ని వాడినట్లు తేలుతుంది. ఆ పదానికి అనేకార్ధాలుండటమూ, అనేక పర్యాయపదాలుండడమూ అన్న పరిస్థితి వల్లనే హేతువాదాన్ని గురించి మాట్లాడుకునే సందర్భంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ వస్తోంది. కనుక, ఏమాత్రం తొందరపడకుండా ఈ విషయంలో ఒక స్పష్టమైన, ఖచ్ఛితమైన నిర్ణయానికి వచ్చేందుకవసరమైనంత విచారణ చేయవలసిఉంది.

1. అమరకోశం
(1) హేతుర్నామ కారణమ్‌ బీజం

హేతువన్నా, కారణమన్నా , బీజమన్నా ఒక అర్ధం వచ్చే మాటలు అని సూత్రార్ధం. ఇక వాటి ఉత్పత్తి క్రమం ఇదిగో. 

(1) హేతుః :- హినోతిగచ్చతి పరిణత్యా కార్యరూపతామితి హేతుః 
అంటే మార్పు చెందడం ద్వారా కార్య రూపాన్ని ధరించుతున్న దేదో దానిని హేతువు అనాలి అని. కార్యరూపాన్ని ధరించేది కారణమేకదా!

(2) కారణం :- కరోతీతి కారణం 'డుకృఞకరణే' చేయునది. చేయబడింది కార్యం కనుక చేసేది కారణం అని దీనర్ధం.
కార్యతే అనేనేతి కారణం. దీని చేత చేయబడుతుంది గనుక ఇది కారణం.

(3) బీజం :- విశేషేణ జాయతే అనేన ఇతి బీజం. జని ప్రాదుర్భావే :- దీని చేత చక్కగా పుట్టించబడును గనుక ఇది కారణం. బీజతే అనేనేతి వాబీజం. (బీజరోహణే) దీనిచేత పుట్టించబడును.
వివరం :- ఏదైతే వేరొకటిగా పరిణమిస్తుందో అదిగాని, ఒకదానిని మరొక దానిగా పరిణమింపజేసినదిగాని కారణం లేదా హేతువు లేదా బీజం(వీజం:వభయోరభేదః) అనబడుతుంది. అన్నది పై సూత్రాలసారాంశం.
గమనిక :- అది కారణం. మూల కారణం, నిదానం అన్న మూడు కారణాన్ని తెలిపే పదాలే అయినా ప్రధమ కారణాన్ని తెలిపే పదాలవుతాయి.

2. తెలుగు పర్యాయ పద నిఘంటువు :
(1) హేతువు :-  పనిముట్టు, సాధనము, ఉపకరణము, విధానము  (2484)
(2) హేతువు :-  ఉద్దేశము, పూనిక, లక్ష్యము (1858)
(3) హేతువు :-  కారణము, తర్కము, నిమిత్తము, మూలము (3745)
(4) హేతువాది :- తార్కికుడు, నైయాయికుడు, తర్కశాస్త్రజ్ఞుడు (3752)
(5) హేతువాదము :- మోసము, కలహము, వాగ్వాదము, సంవాదము (1416)

3 న్యాయ దర్శనం :

(1) హేతువు :- ఉదాహరణ సాధర్మ్యాత్సాధ్యసాధనం హేతుః!

ఒక దానిని బట్టి మరొక దానిని ఊహించి తెలుసుకోవటానికి గాను, అవసరమైన ఇదిలా ఉంటే అదలాగే ఉంటుంది లేదా ఇదున్న చోటల్లా అదీ ఉంటుంది అన్న సాధారణ సూత్రాన్ని తయారు చేసుకోవటానికి ఆధారమైన ఘటనను (దృష్టాంతాన్ని) ఉదాహరణమంటారు. అట్టి ఉదాహరణననుసరించి ఇప్పుడు మనకు పరోక్షంలో ఉన్న ఒక విషయాన్ని గురించి ఊహాత్మకంగా తెలుసుకోడానికి ఆధారమైన దానిని హేతువంటారు.

(2) హేతువు :- ఏది ప్రత్యక్షాదులతో తెలియబడుతూ తనతో సంబంధపడి పరోక్షంలో ఉన్న మరొక దానిని గురించి ఊహాత్మకంగా తెలుసుకోడానికి ఆధారమై ఉన్నదో దానిని హేతువంటారు.
గమనిక:- ఊహాత్మక  జ్ఞాన సాధనకగలిగిన దానిని హేతువంటారు. ఆ జ్ఞానాన్ని పుట్టిస్తుంది గనుక అలా పుట్టిన జ్ఞానం కార్యమనబడుతుంది. కనుక హేతుస్థానంలో ఉన్నదానిని ఆ జ్ఞానానికి కారణం అంటున్నాము. 
ఉత్పత్తి సాధనం అన్నప్పుడు కారణమన్న పదాన్ని, జ్ఞానోత్పత్తి సాధనం అన్నపుడు హేతువు అన్న పదాన్ని వాడతారు.

ఎలాగంటే పొగను పుట్టించింది అంటే పొగ పుట్టటానికి కారణం నిప్పు. ఇక్కడ అంటే వాస్తవంలో పొగ నిప్పుల మధ్యనున్న కార్యకారణ సంబంధంలో పొగ కార్యము - నిప్పు కారణము అవుతున్నాయి. అదే మరి హేతుబద్దాలోచన ద్వారా పొగను చూచి, పొగఉన్న చోటున నిప్పూు ఉందన్న జ్ఞానం కలిగిన సందర్భంలోనైతే అక్కడ పొగ ఉందన్న జ్ఞానానికీ - ఆ కలిగిన అక్కడ పొగ ఉందన్న జ్ఞానం ఆలోచనను ప్రేరేపించి కలిగించిన పొగ ఉన్న చోట నిప్పూ ఉందన్న జ్ఞానానికీ మధ్య ఉన్న కార్య కారణ సంబంధంలో పొగ ఉందన్న జ్ఞానం కారణస్థానంలోనూ నిప్పూ ఉందన్న జ్ఞానం కార్య స్థానంలోనూ ఉంటాయి. 

(1) పొగకూ - నిప్పుకూ ఉన్న సంబంధంలో పొగ కార్యము - నిప్పు కారణము అనబడతాయి. హేతుబద్దాలోచనలో కంటికి కనబడ్డ పొగ కారణం (హేతువు) గానూ, అటుపై ఊహించి ఉందనుకున్న నిప్పు కార్యంగానూ చెప్పబడతాయి.

గమనిక :- మన విచారణీయాంశానికి సంబంధించినంతలో ఈ తేడా తెలిసుండడం, అత్యంత ప్రాధమికము మౌలికమూ అయినదవుతుంది. ఎందుకంటే హేతువు - కారణము అన్నవి నానార్ధాల్లో వాడ బడ్డ పదాలు గనుక, ఏ సందర్భంలో ఆమాటను ఏ అర్ధంలో వాడాలో, వాడారో తెలసుండకపోతే అంతా గందరగోళమే.
Reason :- Reason, Rational, Rationale/ Reasonable, Rationalism, Rationalize all refer to concious thought or ezcultating.


Reason :- (1) ఒప్పించడానికి వాదించు లేదా బోధించు. 
(2) సతర్కంగా ఊహలతో నిర్ణయానికి వచ్చు, ఊహించు
(3) అనుమతి చేయు
(4) తర్క సమ్మతమైన వివరణం (బి జీలిబిరీళిదీలిఖి లినిచీళిరీరిశిరిళిదీ) 
Reasonable :- సహేతుకమైన, యుక్తియుక్తంగా, హేతువునంగీకరించే, సమంజసమైన
Cause  :- కారణం (ఫలితాన్ని కలగచేసేది) (2) Efficient Cause నిమిత్త కారణం (3) Material Cause ఉపాదాన కారణం (4) Formal Cause భావరూపకారణం
Casual :- కారణసంబంధమైన, కారణంగా వ్యవహరించే
Causality  :- కారణత్వం, కారణసహితత్వం
Causation  :- కార్య కారణసంబంధం
Effect- ఫలితం, కార్యం, పరిణామం.

ముఖ్య గమనిక :- రీజన్‌ అన్న పదం జ్ఞాన క్షేత్రంలో మాత్రమే ఉపయోగ పెట్టబడేపదం, ఆలోచనతో సంబంధపడే వాడుకలో ఉంటుంది. నానార్ధాలలో హేతువు, కారణము సమానార్ధకాలుగా వాడబడినా, ప్రత్యేక సందర్భాలలో దేని అర్థం దానిదే. మన ప్రస్తుతాంశమైన రేషనలిజం అన్న దగ్గర రీజన్‌ అంటే 'కాజ్‌' అన్న అర్థం కానేకాదు. అలాగే 'హేతువాదం' అన్న దానిదగ్గర హేతువన్న దానిని కారణం అన్న అర్ధంలో వాడనేకూడదు. ఎందుకంటే అది 'కారణవాదం' అవుతుంది. అది ఆరూపంలో మనం ఉద్ధేశిస్తున్న ఆర్ధాన్నివ్వదు సరికదా, దాని క్షేత్రానికి సంబంధించీ పూర్తి అర్ధాన్నివ్వదు. 'కార్యకారణవాదం' అన్న మాట వాడితేనే సరైన అర్ధం వస్తుంది. కార్యకారణాలను రెంటినీ కలపకుండా కేవలం కారణవాదం అనిగాని, కార్యవాదం అనిగాని అనకూడదు. అందుకనే అలాంటి ప్రయోగాలు భాషలో మనకు కనబడవు. 

(Reason - Cause) హేతువాదము, కార్యకారణవాదము ఒక్కటి కానే కావు. రీజను - కాజు పర్యాయపదాలు కావు. కాలేవు. తెలుగువాడుకలో మాత్రం హేతువేమిటి? అన్నా, కారణమేమిటి? అన్నా, కొన్ని సంసందర్భాలలో సమాన భావమే పుడుతుంది. హేతుబద్దాలోచన గురించి మాట్లాడే సందర్భంలో మాత్రం హేతువు అని దేనిని చూపిస్తున్నామో దానిని కారణమనడం అన్నిసార్లూ కుదరదు.  ఎందుకంటే కొన్ని సార్లు ఆలోచనకు ఆధారంగా (హేతువుగా) స్వీకరిస్తున్నది వాస్తవంలో కార్యమనడానికి సరిపోయేదిగనూ, కొన్ని సార్లు కారణమనదగిందిగానూ ఉంటుంది. హేతువాద,కార్య కారణవాదాల గురించి విచారించే సందర్భంలో ఇదెంతో కీలకమైన అంశమవుతోంది. కనుక ఏ పదానికి ఏది సరైన అర్ధము? అన్నది ఇదమిద్దంగా తేల్చుకుని ఉండాల్సిందే. లేకుంటే భాషనాధారం చేసుకుని చేసే శ్రమంతా వ్యర్ధమవడమో, చెడ్డఫలితాన్ని పుట్టించడానికి పనికిరావడమో జరుగుతుంది. 
ఈ సందర్భంలో భాష గురించి నాలుగు మాటలు చెప్పు కుంటే తప్ప ఇప్పుడు మనం విచారిస్త్తున్న విషయాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవడం కుదరదు. 

భాష అనగా నేమి? దాని పుట్టుక, పరిణామథలు, దాని శక్తి, పరిమితి అన్న వాటి వివరాలేమిటి? మిత్రులారా! ప్రశ్నను మరొక్కసారి చక్కగా పరికించి చూడండి. ఎందుకనంటే, ప్రశ్న తనకర్ధమైందని నిర్ణయించుకొన్నాకనే, అప్పుడైనా ఈ ప్రశ్న ఏవిషయంలో ఎంతమేరకు ఎటువంటి సమాధానాన్ని ఆశిస్తున్నదో ఆమేరకే సమాధానం చెప్పాలి. అప్పుడే సరైన రీతిలో సమాధానం చెప్పినట్లు. చర్చావేదిక నియమనిబంధనల్లో ఇదీ కీలకమైనదే.
పై ప్రశ్నకు లోకంలో సాధారణంగా 'భావప్రసారసాధకం' అన్న అభిప్రాయమే చెప్పబడుతూ ఉంటుంది. నిజానికి మరింతగా చెప్పుకుంటే గాని ఆ ప్రశ్నకు సరైన రీతిలో సమాధానం చెప్పినట్లు కాజాలదు. 

(1) ఏ క్రొత్త విషయానికి చెందిన జ్ఞానమైనా మనకు ఆయా విషయాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరడంద్వారానే కలుగుతుంది. అలా కలిగిన వాటినే అనుభూతులు అంటుంటాం. అనుభూతులు తలలో స్మృతికేంద్రంలో గుర్తులు, సంస్కారాల రూపంలో నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం భాష అంటున్నది ఏర్పడకపూర్వం, మనిషి అలా తన స్మ ృతి రూపంలో ఉన్న గుర్తులనే (యథాతథ ముద్రలు అనందాం వీటిని) బైట పెట్టేందుకు యత్నించేవాడు, అప్పటికి అతనికున్న భావవ్యక్తీకరణ సాధనం ఆ అనుభూతుల తాలూకు గుర్తులే. కనుక భాషయొక్క ప్రథమ రూపం యథాతథ గుర్తుల రూపంలోని గుర్తులేనన్న మాట. అనంతరం తొలి ఆ గుర్తులకు మలి గుర్తుల నేర్పరచుకొన్నాడు. వీటినే నేడు మనం శబ్ద సంకేతాలు అనంటున్నాం. భాషా శాస్త్రాలున్నూ ఆ మలి గుర్తులనే -సెకండ్‌ సిగ్నల్స్‌నే- భాష అంటున్నారీనాడు. ఆ మలి గుర్తుల రూపంలోని శబ్దాలను ఒక క్రమ పద్దతిలో వాడడం అన్నది భాషా చరిత్ర పరిణామక్రమంలో జరిగింది. ఆ క్రమపద్దతినే నేడు మనం భాషానియమాలు  లేదా వ్యాకరణ సూత్రాలు అనంటున్నాం. ఇదంతా జరిగాక ఇప్పుడు భాష అనగానేమి అన్నమాటకు ఇలా సమాధానం చెప్పుకోవాలి. 

- భావాలను, అభిప్రాయాలను, నిలిపి ఉంచుకోడానికి, వెళ్ళడి చేయడానికి ఉపయోగపడే వ్యాకరణ బద్దమైన శబ్దరాశినే భాష  అంటాము (గమనిక :- ఆ శబ్దాలకు ఆకారాలను రూపొందించడం ద్వారా లిపి ఏర్పడింది).

- భాష ప్రయోజన మేమిటి?

భావాలను నిలిపి ఉంచుకోవడానికీ వెళ్ళడిచేయడానికీ, ఎదుటివానికి అంద జేయడానికీ, ఆలోచించడడానికీ, ఉపయోగపడుతుందిది.

ప్రశ్న : భావాలను వెళ్ళడి చేయడానికి, భావాలను ప్రసారం చేయడానికీ తేడా ఏమిటి?

సమాధానం :- భావాలను వెళ్ళడి చేయడానికి,  చెప్పే వానికి భాష తెలిసుంటే చాలు. అదేమరి భావం అవతలివానికి చేరాలంటే చెప్పేవానికే గాక, గ్రహించే స్థానంలో ఉన్న వానికీ భాషతెలిసుండాలి. అప్పుడుకూడా చెప్పేవాడు ఏ పదాలను ఏ అర్ధంలో వాడుతున్నాడో వినేవాడికీ అప్పటికే ఆ పదాలు అవే అర్థంతో కూడి తెలిసి ఉండాలి. అప్పుడే చెప్పే వాడు ఏమి చెప్పాలనుకున్నాడో, వినేవాడికి అదే చేరుతుంది. భాష భావ ప్రసార సాధకంగా (జ్ఞానసాధకంగా) ఉపయోగపడాలంటే ఇంతకంటే దారిలేదు. అందుకే ఇక్కడో భాషానియమం ఏర్పడింది.
సమాన పదాలు - సమాన అర్ధాలు కల వాళ్ళ మధ్యనే భాష భావ ప్రసారం చేయగలుగుతుంది. పదాలు సమానంగా ఉండి అర్ధాలు మారినా, అర్ధాలు అనుభవంలో ఉండి పదాలు మారినా (అన్యార్ధ గ్రహణే) చెప్పినదాని కంటే వేరైన దానిని గ్రహించుటే జరుగుతుంది. పదాలుండి అర్ధాలు లేకుంటే అవి ఉత్త శబ్దాల క్రిందికే వస్తాయి. 

(1) పద పదార్ధ సంబంధ జ్ఞానం, అంటే ఈ పదానికిది అర్థము అన్న జ్ఞానం, లేనివానికి వాక్యార్ధజ్ఞానం కలగదు అన్నది భాషా నియమాలలో ముఖ్యమైనది.

(2) ఇద్దరికీ (వినేవానికీ, చెప్పేవానికీ) పదాలు తెలిసి ఉండడం, ఆ పదాలకు ఒకే అర్ధాలు కలిగి ఉండడం జరిగినప్పుడే ఒకడు చెప్పేది మరొకనికి అర్ధమవుతుంటుంది.

(3) నానార్ధాలు, పర్యాయపదాలు ఉన్నపదాలను వాడేటప్పుడు నిపుణుడైన రచయితైతే వీలున్నంతవరకు సూటైన ఆర్నాన్నిచ్చే పదాలనే వాడతాడు, అట్టివి లేనప్పుడు ఆ పదాన్ని తానేఅర్ధంలో వాడుతున్నదీ వివరిస్తాడు.

(4) వక్త లేదా రచయిత ఆ జాగ్రత్తలు తీసుకోకుంటే భాషా పరిమితులు తెలిసిన శ్రోత (పఠిత) ఆ సందంర్భంలో ఏ అర్ధం చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందో చూసుకుంటాడు.

గమనిక : వెనకటి సిద్ధాంత గ్రంథాల రచయితలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక వాక్యం యొక్క అర్ధ నిర్ణయం చేయడానికి  గాను అందులోని పదాలకు అర్ధాలను ఖరారు చేయడానికిగాను 'తాత్పర్యలింగాలంటూ' ఒక విధానాన్ని రూపొందించుకున్నారు. ఉపక్రమము, ఉపసంహారము, ఫలము, అపూర్వత, అర్దవాదము, యుక్తి అన్న ఆరింటితో ముడిపెట్టి చూసి, యోగ్యమైన తాత్పర్యాన్ని ఇవ్వగల అర్ధాలనే ఆయా పదాలకు పెట్టే విధానమే అది. (ఆ వివరాలు మరోసారి ప్రత్యేకంగా విచారించుకుందాం).

ముఖ్య గమనిక : ఖచ్చితమైన- సూటైన- అర్ధాన్నే ఇచ్చే పదాలనే వాడడమో, అలా కుదరకుంటే, తానే అర్ధంలో ఆ పదాన్ని వాడాడో ఆ వివరం ఇవ్వడమో చేయకున్నప్పుడల్లా ఒకరు చెప్పింది మరొకరు గ్రహించడంలో ప్రమాదాలు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కథలు, నవలల విషయంలో అలాంటి పొరపాట్లు దొర్లినా ప్రమాదమేమీ లేదుగానీ, వైజ్ఞానిక సమాచారాన్ని అందించే సందర్భంలోగాని, సరైన భావాలను అందించాలి, తప్పు భావాలను తొలగించాలి అన్న లక్ష్యంతో పనిచేసే భావ విప్లవ క్షేత్రాలకు చెందిన రచనల సందంర్భములో గాని ఇలాంటి పొరపాట్లు జరిగితే జరిగే అనర్ధం అంతా ఇంతా కాదు.

ఏమి చేద్దాం; ఏ కారణాల వల్లనైతేనేమి ఆ అనర్ధం - ముఖ్యంగా హేతువాద ఉద్యమ క్షేత్రంలోని రచనల ద్వారా జరగనే జరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందిగనుకనే ఆధునిక విజ్ఞాన శాస్త్రక్షేత్రాలలోనూ, సామాజిక శాస్త్రాల విభాగంలోనూ కూడా, తమవైన నిఘంటువులను, పారిభాషిక పదకోశాలను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఎంతో కీలకమైన భావ విప్లవ క్షేత్రాలలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒకింత ఆశ్చర్యకరమూ, జరిగిన దుష్ఫలితాల రీత్యా విచారకరమూ కూడా. 

మచ్చుకు కొన్ని ఉదహరిస్తాను చూడండి.

(1) హేతుబద్దాలోచనాక్షేత్రంలో వాడే సందర్భంలో హేతువంటే ఏమిటో ఎక్కడన్నా నిర్వచనం (ఖచ్ఛితమైన అర్ధం) చెప్పబడి ఉందా?

(2) హేతువు, హేతుత్వము, హేతుబద్దాలోచనా, హేతువాదము అన్న పదాలకు మధ్య ఎంతోకొంత అర్ధ భేదం ఉండాలి కదా! అలావాటికి వాటివాటి అర్ధాలు నిర్ధిష్టంగా ఎక్కడైనా చెప్పబడ్డాయా? 

(3) Reason - Cause  పర్యాయపదాలు కాదని ఆంగ్లం తెలిసినవారందరకు తెలుసు. ఆ రెంటికి అనువాదాలుగా చెప్పుకుంటున్న హేతువు-కారణము పర్యాయపదాలంటున్నాము. అదేలా కుదురుతుంది?
కనుక భావజాల క్షేత్రంలో అందునా భావ విప్లవం లక్ష్యంగా పనిచేసే క్షేత్రాలలో ముఖ్యమైన పదాలకు ఖచ్ఛితమైన అర్ధాలు ముందే ప్రకటించుకునే శాస్త్రీయవిధానం వినియోగంలోకి రావాలి. అందుకు మనమందరం, హేతువాద ఉద్యమం సామాజికావసరం అని తలంచుతున్న వాళ్ళందరం - గట్టిగా కృషి చేయాలి. అదిగో ఆ దిశగా మొదలెట్టిందే 198 సంచికలోని కొన్ని పదాలకు ఖచ్ఛితమైన అర్ధాలను తయారు చేసుకుందామన్న ఈ ప్రయత్నం - దీనిపై ఎవరివంతు కృషి వారు చేసుకురండి. 

మిత్రులారా ! ఇప్పటికివి చాలు. పై సంచికలలో మరికొన్ని అంశాలను ప్రస్తావించుకొందాం. మీరూ ఎవరికి వారుగా ఈ పారిభాషిక పదాల అర్థాలను నిర్థిష్ట రూపంలో (స్పష్టంగా), నిర్ధుష్టరూపంలో (సరిగా) అర్థంచేసుకొనేందుకు యత్నించండి. నా భావాలపై ప్రశ్నలుంటే సంధించండి.

ముఖ్య గమనిక : పారిభాషిక శబ్దాలకు అర్థాలు చెప్పుకునే సందర్భంలో కొన్ని పునరుక్తులు (రిపిటేషన్స్‌) దొర్లాయి. విషయ ప్రాధాన్యత దృష్ట్యా వాటిని అలానే వుంచేశాము. గమనించి శ్రద్ధగా పరిశీలించండి.
మూర్ఖుడు, అజ్ఞాని, పొగరుమోతు పి.డి.సుందర్రావుకు

సురేంద్ర విసురుతున్న మలి సవాల్‌ !

జ్ఞాన లవలేశోత్పన్న విపర్యయ దురాగ్రహ దుర్విదగ్దుడా! వ్యర్ధుడా ! పి.డి.సుందర్రావా! ఉలుకూ, పలుకూ లేదేమిటయ్యా! ఏమాత్రం సిగ్గు, శరము, మానం-మర్యాద, చీము- నెత్తురు, రోషము, ఆవేశము - పట్టుదల, కట్టుబాటు అన్న వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నా నా పిలుపుకు ఎక్కడోచోట నిలబడి ఉండేవాడివి.
గత 10 నెలలుగా ప్రతి నెలా రిజిష్టర్‌ పోస్టు ద్వారా కబురు చేస్తూ వస్తున్నాను. గత 20 ఏండ్లుగా కనపడ్డ వాళ్ళందరికీ సవాళ్ళు విసురుతున్న నీకు రకరకాల రూపాలలో ప్రతి సవాలు విసిరాను. పందెం అంటే అందుకు నేను సిద్ధమే. రాగలిగితే రా! అనన్నాను. ఏం పందెం పెట్టుకుందాం అంటావు? 1. డబ్బు పందెమా? 2. ఓడిన వారుగెలిచిన వారిని అనుసరించాలన్నదా? 3. ఎవరి పక్షములో తప్పు (దోషం) దొర్లినా వారిని రెండో పక్షం వారు చెప్పుతో మూతిమీద కొట్టాలి, అన్నదా? అంటూ నాకు తోచిన, నీకు సరిపోయే 4,5 పందెపు రీతులను తెలియపరచి యున్నాను. నీ పక్షం సరైందని తేలితే నేను నీ మతాన్ని స్వీకరించడమే గాక ఆజీవితం ఆ మత ప్రచారమూ చేస్తానన్నాను.
పులిని, సింహాన్ని అంటూ తెగ భీరాలు పలికే నీకుగాని, నీ గాండ్రింపులు చూసి, విని అదంతా నిజమేననుకుంటూ ఒళ్ళు జలతరింపచేసుకొనే, తెగ చెప్పుకొనే నీ వెంటనున్న మందకు గాని ఇవేవీ కనపడలేదా? వినపడలేదా? రోషావేశాలు లేని ప్రగల్భాలరాయుళ్ళతో వచ్చిన చిక్కే ఇది. నిన్ను వదిలిపెడతాననుకోకు, కథ ఒక ముగింపుకు చేరేంత వరకు వెంటపడుతూనే ఉంటాను. పతనం దిశగా నీ ప్రయాణానికి తొలిగంట మోగిందిప్పుడేనన్నది గమనించే ఉంటావనే అనుకుంటాను. దమ్మున్న మగాణ్ణి చూశావా? చూస్తావా? అంటూ పెట్రేగిపోయిన నీవు ఎందరి కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు? చట్టాల్ని తగలేయమన్నావు? సుప్రీంకోర్టుకు దమ్ముండాలన్నావు, అట్టి పిట్టలదొరవు ఒక మండలస్థాయి న్యాయస్థానానికి పిల్లిలా చేరి, పనికి మాలినవి అన్న మా చట్టాల్ని ఆశ్రయించి బెయిల్‌పై బైటపడ్డావు, అన్నన్ని ప్రగల్భాలు పలికినందుకు సిగ్గేయటం లేదా?! 

నీవు అంతటోడివి, ఇంతటోడివి అని కళ్ళుమూసుకొని తలపోస్తున్న నీ అనుచరగణంలో కొందరికైనా నీవు ఉత్తుత్తి మాటలోడివేనని, నీవన్నీ ప్రగల్భాలేనని, ఇంత జరిగాకను కనువిప్పు కలగలేదా? సింహాల పేరుతో పిలువబడేటివి కొన్ని అడవుల్లో ఉంటాయి, మరికొన్ని గ్రామాలలోనూ ఉంటాయి. అడవిలోని సింహాలు అరుస్తాయి, గ్రామంలో ఉండే సింహాలూ అరుస్తాయి. అయితే అడవిలో వాటి అరుపుల్ని, గర్జనలని అంటారు, గ్రామంలోని వాటి అరుపుల్ని మొరగడం అంటారు అంతే తేడా. ఒక్క గర్జన (గాండ్రింపు) వినబడినా ఏనుగుల గుండెలదురుతాయి. అదే మరి ఎన్ని గ్రామ సింహాల (శునకాల) అరుపులు విన్నా ఏనుగు వెంట్రుక కూడా కదలదు. గత పాతికేండ్లుగా ఒక్కనితో కూడా చక్కగా తలపడకుండానే ఎన్ని ప్రసంగాలు, రచనలు, సి.డి.లు, యూ ట్యూబుల ద్వారా జైశాలినని ప్రకటించుకున్నావు. అలా చెప్పుకోడానికి నీకు సిగ్గేయడం లేదు సరే, నీ మందలో ఏ కొద్దిమందికైనా ఇది విడ్డూరమనిపించక పోవడాన్ని ఏమనుకోవాలి.

ఈ మధ్య నీవు చీరాల వెళ్ళి తొక్కేశానన్న బైబిలు బండారం రచయిత ఎన్‌.వి.బ్రహ్మం గారితో మాట్లాడాను. నీ విషయమూ చెప్పాను. అతగాడెవరో కూడా నాకు తెలియదు, అతడెన్నడూ నాకెదురు పడిందీ లేదు. నాతో మాట్లాడిందీ లేదు అనన్నారాయన. వాస్తవాలిలా ఉండగా మరోలా మాట్లాడే నిన్నేమనాలి. ఆ బ్రహ్మంగారె బైబిలు ఏమి పలుకుతోందంటూ - బైబిలు బండారాన్నే- మళ్ళా ముద్రించి ప్రచురించారు. ఏం పీక్కుంటావో పీక్కో. 
గత నా వ్యాసంలోనే ఒక మాట రాశాను. ఏమత గ్రంథమూ సరైన విమర్శకు అతీతం కాదని, ఒక ఉన్నత న్యాయస్థానం తీర్పు ఉందని. ఈ సందర్భంగా నీకు - బ్రహ్మంగారికీ కూడా ఒక మాట చెప్పదలిచాను నేను. ముందుగా ఎన్‌.వి.బ్రహ్మం గారికి : బ్రహ్మంగారూ ! మిమ్మల్ని ఛాలెంజికి పిలిచానని ప్రగల్పిస్తున్నాడు పి.డి. అలాంటిదేమీ జరగలేదని మీరంటున్నారు. వాటి రుజువుల్లోకి వెళ్ళకుండా ఇప్పుడొక ప్రతిపాదన చేస్తాను. మీకు అంగీకారమైతే, నాకు పి.డి.కి కూడా కలిపి ఒక లేఖ రాయండి మీరు. మీకు, నాకు ఉన్న పరిచయాన్ని బట్టి వివిధ విజ్ఞాన శాస్త్ర విషయాలు, తాత్విక క్షేత్రానికి (సత్య-ధర్మాలకు) చెందిన  విషయాలపై నా అవగాహన విషయంలో నేనేమిటో మీకిప్పటికే తెలిసియున్న దాన్ని బట్టి, మీ ప్రతినిధిగా నేను పి.డి.సుందర్రావుతో పోటీపడటానికి మీకంగీకారమైతే, మీతరపున నేను మాట్లాడతానని పి.డి.సుందర్రావుకు లేఖరాస్తూ, ఆ ప్రతిని నాకు పంపండి. పి.డి.సుందర్రావు సవాళ్ళంటూనూ, రుజువు చేస్తానంటూనూ, ఏవేవి ప్రకటించారో, వాటిలో ఎంపిక చేసుకొన్న విషయాలకు పరిమితమై ఉంటుంది పోటీ. ఏమంటారు ?

పి.డి.సుందర్రావుకు : హలో! ఎన్‌.వి.బ్రహ్మంగారు గానీ నా ప్రతిపాదనకు సరేనంటే అప్పుడైనా సిద్ధపడగలవా తండ్రీ.

No comments:

Post a Comment