సత్యాన్వేషణ మండలి, సత్యజ్ఞాన సంఘము అన్న రెంటిని గురించి తెలిసి ఉన్న, ఆ రెండు సంస్థలతోనూ సన్నిహితంగా మెలగిన; రెంటిలో ఒక సంఘంలోపలి వారుగా ఉంటూ రెండో దానినీ గమనిస్తూ ఉన్న, రెంటికీ వేరుగా ఉంటూ రెంటితోనూ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్న మిత్రుల్నీ, పరిచయస్తులనూ; పెంచలయ్య గారూ నేనూ కలసి సిద్దాంత చర్చలు చేసిన ఆయా ధోరణులకు చెందిన పండితులనూ; ఇక ముందు సత్యజ్ఞాన సంఘం ఏమికానుంది? ఏమి చేయనుంది? ఏమి చేద్దాము? అన్న అంశాలపై ఆలోచించాలనుకుంటున్న ఆ సంస్థ ఆంతరంగికుల మనుకుంటున్న వారినీ, ఇతరత్రా ఉన్న తాత్విక క్షేత్రాలలోని వివిధ స్థాయిలలో ఉన్న చింతకుల్నీ కూడా మనస్సులో పెట్టుకుని ఈ వ్యాసం వ్రాశాను.
క పెంచలయ్య గారి గురించి మాట్లాడుకునేముందు ఆద్యంతం గుర్తుంచుకోవలసిన విషయమొకటుంది. ఆయన సిద్దాంతమేమిటో తెలుసుకోదలిస్తే అది అయ్యేపని కాదు. అందువల్ల నీ కొరిగేదీ ఏమీలేదు. అలాకాక నీ సిద్దాంతాన్ని నిర్థిష్టంగా ప్రకటించి, దాని బలాబలాలను నిర్థారించుకోదలిస్తే మాత్రం చాలా ప్రయోజనం చేకూరుతుంది. నీ ఆలోచనకు పదును పెట్టుకోదలిస్తే మాత్రం ఆకురాయిలా ఉపయోగపడతారాయన. గత పాతికేండ్లుగా నేను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిందీ అంశాన్నే లబ్దపొందిందీ కూడా దీనిని చక్కగా వాడుకునే.
మూడు పుస్తకాలు (1) నేను (2) జ్ఞాన విద్యా శాస్త్రము - తర్కశాస్త్రము (3) సత్య జ్ఞానము - ఉపనిషత్తుల సారము - వ్రాశారాయన. వాటిలోని ఆయన పోకడంతా, ఇద మిద్దంగా తనదేమిటో చెప్పకుండా, చెపుతానని ఆరంభించిన అంశాలపై వారేమన్నారు, వీరే మన్నారు, వాటిపై తన పరిశీలనేమిటి? అన్నది విస్తారంగా చెప్పుకుంటూ పోయారాయన. దాంతో పెంచలయ్యగారేమిటన్నది స్పష్టాస్పష్టంగా తయారై; ఆయనగారు ఎన్ని శాస్త్రాలు చదివారు !? అని ఆశ్చర్యపోయేందుకూ, ఆయన చాలా తెలిసిన వారు అన్న భావనను పాఠకుల్లో కలిగించేందుకూ ఉపయోగపడిందది.
దీన్నంతటినీ నిశితంగా పరిశీలిస్తే, బహుశాస్త్రకోవిధునిగా నలుగురిలో నిలిచిపోవాలన్న వాంచ అంతర్లీనంగా ఆయనలో బలంగానే ఉందనిపిస్తోంది. దాదాపు 450, 500 పేజీల ఆ రచనల్లో ఆయనివిగా చెప్పుకోడానికి వీలైన అభిప్రాయాలను ఏరి కూర్చితే అవన్నీ 15, 20 పేజీలకు మించి ఉండవు. (అంతకూ ఉండకపోవచ్చునేమో)
క ఒక యాభై ఏండ్లుగా ఎందరు ఎన్ని విధాలుగా అడిగినా, వత్తిడి చేసినా తెరపకుండా బిగించి పట్టిన గుప్పెటిని, చివరి నాళ్ళలో ఎవరూ అడగకుండగనే విప్పి చూపించారాయన. తనది చెప్పేదికాదనీ, చెప్పినా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నవారు తనకెవరూ కానరాలేదనీ అంటూ వచ్చిన ఆయనే, కడకు ఏమనుకున్నారో ఏమోగానీ చాలా పేలవమైన ప్రతిపాదన చేసి, దానిని పరీక్షకివ్వకుండానే జీవితాన్ని ముగించారు. ఇక ముందది, వారితో సన్నిహితంగా మెలగిన, సాన్నిహిత్యం ఉందనుకుంటున్న, అంటున్న వారి వివరాలు, వ్యాఖ్యానాలు, విమర్శల ద్వారా ఎన్ని రకాలుగా తీరబోతోందో నన్న ఆలోచన, ఆందోళనకూడా నాకున్నాయి.
క ఈ పుస్తకాల ద్వారా ఆయనవిగా గమనించదగిన 15,20 అంశాలను పేర్కొని కొద్దిపాటి విశ్లేషణ చేస్తాను. అవసరమైతే భవిష్యత్తులో కొద్దికాలం వివేక పథంలో వారి రచనలపై పరిశీలనాత్మక వ్యాసాలు (ఇతరులూ చర్చలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ) వ్రాస్తాను.
ఎ. అంతిమంగా ఆయన తనవిగా సూటిగా పేర్కొన్న సిద్దాంతాలు ఐదు.
1. దేవుడున్నాడు 2. అతడు ప్రత్యక్షంగా తెలియబడతాడు 3. ఆత్మను - నేనును - తెలిసిన వానికి దేవుడు తెలుస్తాడు. 4. అన్వీక్షికీ (ఆత్మ) విద్య మరియు లక్షణ ప్రమాణ విద్య (తర్కవిద్య) వలన ఆత్మ మరియు దేవుడు తెలుస్తాయి. 5) దేవుని తెలిసికొనదలచిన వానికి సత్యజ్ఞాన సంఘము తోడ్పడుతుంది.
విచారణ :- ముందుగా 5వ అంశాన్ని గురించి ప్రస్తావిస్తాను. పెంచలయ్యగారు నాకు పరిచయమైన క్రొత్తలో స.జ్ఞా. సంఘంలో ముఖ్యులుగా 5, 6 గురు గుర్తింపబడేవారు. వారిలో ఎన్. కృష్ణారావుగారు, చెంచుకృష్ణయ్యగారు, గపూర్ గారు, శేషగిరిరావుగారు నాకు బాగా తెలిసినవారు. ఆ తరవాత పెంచలయ్యగారిపై విపరీతమైన అభిమానం పెట్టుకుని ఉండేవారు కొందరున్నారు. వారిలో సుబ్బన్నగారు, పుల్లయ్యగారు, చంద్రమోహన్ నాకు దగ్గరగా తెలిసినవారు. ఆయనపై గురుభావాన్ని పెట్టుకుని ఉన్న మరో 10 మంది దాకా నాకు తెలుసు. వీరంతా సత్యజ్ఞానసంఘం లోపలి వారే ఆ సంఘంలోపలివారుగాకాక ఆయనతో తగినంత దగ్గరగా మెలగినవారు కె. శ్రీనివాసులుగారు సోంప్రకాష్‌గారు మనోహర్‌హింద్, అనంతరకాలంలో అంటే నేనూ పెంచలయ్యగారూ కలసి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సందర్భంలో పరిచయమై ఆయనతో సన్నిహితంగా మెలగినవారు, ముఖ్యంగా నారాయణ శెట్టి, సంజీవరాయడు, వెంకటేశ్వరరెడ్డి, ఆనందకుమార్‌లు వీరు కాక సత్యాన్వేషణ మండలికి చెందిన ప్రసాదు, విజయమ్మ, పద్మమ్మగారూ, వారి అక్కచెల్లెళ్ళు ఆయనతో సన్నిహితంగానే మెలిగారు. నాకు తెలిసినంతలో ఆయనతో తాత్విక గోష్ఠులు నిర్వహించినవారు వీరే. నాకు తెలియని మరికొందరూ ఆయనతో సంభాషించినవారు ఉండవచ్చు.
ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, ఆయన చనిపోయాక, ఇప్పుడు నేను సత్యజ్ఞాన సంఘ ప్రతినిధిని అని చెప్పుకోడానికి మనస్పూర్తిగా సిద్దపడేదెవరు? ఎందరు? అన్నది నిర్ధారించుకోడానికే. నాకు తెలిసి ఒక్క ఎన్. కృష్ణారావు గారు తప్ప (గఫూర్‌గారి సంగతి నాకు తెలియదు) ఇతరులంతా ఆయనతో రకరకాలుగా విభేదిస్తూ వచ్చారు. కొందరైతే ఆయనకు, ఆ సంఘానికీ దూరమయ్యారు కూడా. మరలాటపుడు, ''దేవుని తెలిసికొనదలచినవారికి సత్యజ్ఞాన సంఘం తోడ్పడుతుంది'' అన్న మాటకు ఈనాడు ఆచరణ రూపం ఎలా ఉంటుంది? మొన్నటికి మొన్న వారి సంస్మరణ సభలో ఎన్. కృష్ణారావుగారు కూడా 'దేవుని విషయమై ఈ రకమైన ప్రకటన చేయకండని పెంచలయ్యగారికి సూచించినట్లు చెప్పారు. కనుకనే, ఇక ముందు సత్యజ్ఞాన సంఘం ఉంటుందా? అంటే ఎవరు సభ్యులుగా, మార్గదర్శకులుగా అది ఉంటుంది? ఉంటుందనుకుంటే, అందులో ఉన్న వారెవరుగానీ, ఈ పై '5' అంశాలనూ అంగీకరిస్తూ వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తారా? వీటిని ప్రక్కన పెట్టి జీవితానికి సంబంధించిన ఇతరేతరాంశాలపై చర్చలు, పరిశీలనలు చేసుకుంటూ సాగుతుంటారా? అన్నది ఆ సంస్థకు చెందినంతలో ఇప్పటకి ముందున్న ముందు తెల్సుకోవలసిన అంశం అవుతోంది.
మొన్న సంస్మరణ సభలోనే, పెంచలయ్యగారితో సన్నిహితంగా మెలగినవారిలోని ఇరువురు (1) మనోహర్ (2) సోంప్రకాష్ గార్లు, దేవుడు మాకూ తెలుసు,నని ప్రకటించారు. సోంప్రకాష్‌గారైతే దేవుని తెలిసికొనాలన్న తపన ఉన్న వారికి తామ తోడ్పడగలమనీ అన్నారు. మనోహర్ ఈ మాటనలేదుగానీ, ప్రమాణాలకు సంబంధించినంతలో, ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణముల విషయంలో పెంచలయ్యగారికీ, తనకు ఏకాభిప్రాయం ఉందనీ, అనుమాన ప్రమాణం విషయంలోనే ఒకింత విభేదం ఉందనీ అన్నాడు. ఈ సందర్భంలో పెంచలయ్యగారన్న ఒక మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంది.
క ''దేవుని చూసిన వాని స్థితి ఎట్లుండునో దేవుని చూసిన వానికి తెలియును. ఇతరులకు తెలియదు.''
దేవుని చూశాను అన్న పెంచలయ్యగారు లేరు. దేవుని చూశామంటున్న మరో ఇద్దరు మన ముందుకొచ్చారు. పెంచలయ్యగారితో సన్నిహితంగా మెలగిన వారిలో ఎవరి గురించీ పెంచలయ్య గారు, ఇతడూ దేవుని చూసిన వాడేనని ప్రకటించనేలేదు. లేదా ప్రకటించినట్లు నా దృష్టికి రాలేదు. అలా అన్న దాఖలాలున్నాయేమోనూ తెలియదు. అంటే దేవుని చూశాననుకుంటున్న ఆయనకు దేవుని చూసిన వారుగా తన వాళ్ళలో ఎవరూ కనపడలేదన్నమాట.
క నాకు తెలిసినంతలో, పెంచలయ్యగారి పోకడను దగ్గరగా చూసి, అనుసరిస్తున్నది ఎన్.కె. ఒక్కడే. అడిగి తెలుసుకోవలసిందేమీలేదు. ఆలోచించీ, అవలోకించి తెలుసుకోవలసిందే దీనిని అన్నదే పెంచలయ్యగారిప్పటి వరకు అనుసరించిన పోకడ. పెంచలయ్యగారితో ముడిపడిఉన్న అంశాల వరకు ఆ పోకడను 100% ఆచరించిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఇక నా మొత్తం విధానంలో, చెప్పి తెలుపగలవీ, చూపి తెలపాల్సినవీ, తెలపగలవీ, చూసే తెలుసుకోవలసినవీ అన్న వివిధ రీతులకు చెందిన విషయాలున్నాయి. అదలా ఉంచినా మూడు ప్రమాణాలను అంగీకరించే వారెవరైనా మూడు రకాల జ్ఞానాలు కలుగుతున్నాయని చెప్పకనే చెప్పినట్లు. సైద్దాంతిక భాషలో చెప్పుకుంటే ఇది అధికరణ సిద్దాంతాల కోవకు చెందిన ప్రతిపాదన అవుతుంది. ''యత్సిద్దౌ అన్య ప్రకరణ సిద్దిః సఃఅధికరణ సిద్దాంతః!'' ఏది సిద్దిస్తే దానితో పాటు మరొకటీ సిద్దిస్తుందో అది అధికరణ సిద్దాంతమని సూత్రార్థం. మూడు రకాల ప్రమాణాలున్నాయన్నది సిద్దిస్తే మూడు రకాల జ్ఞానాలున్నాయనీ సిద్దించినట్లే. ప్రతి ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానంలోనూ ఏదో ఒక తెలియని తనాన్న పోగొట్టడం అన్నది జరగాలన్నది నియమం. కనుక శబ్దాను మానప్రమాణాల ద్వారానూ ఏదో ఒక తెలియని తనం పోయి ఆ మేరకు జ్ఞానం కలుగుతునే ఉంటుంది.
పెంచలయ్యగారు 1) జ్ఞాన విద్యా శాస్త్రం (2) ఉపనిషత్తుల సారం అన్న రెండు రచనల్లోనూ, అక్కరలేనంతగా వారేమన్నారు? వీరేమన్నారు? వారన్న దానిని పరిశీలిస్తే ఏమనిపిస్తున్నది? అంటూ 450 పేజీలపైగా రచన చేశారు. అందులో వారి సొంతభావాలుగా ఎంచుకోడానికి తగినవాటిని ఏరి కూర్చితే అవన్నీ కలిపి 10, 15 పేజీలకంటే మించవు. ఈ రెండు పుస్తకాలను ఒకింత పట్టుబట్టి జాగ్రత్తగా చదివినా, ఇంతకూ ప్రమాణాల గురించి ఏమి చెప్పినట్లు? పదార్థాల మాటేమిటి? పెంచలయ్యగారున్నాడంటున్న దేవుని నిర్వచనమేమిటి? ఆయనకు చెందిన మరిన్ని వివరాలేమిటి? లాటి వేవీ పఠితకు స్పష్టంగా ఎదురుపడవు. మసక మసకగా, ఊహా మాత్రంగా అదీ బహుశా ఇది ఆయన భావమైయుండవచ్చు. అది ఆయన దైయ్యుండవచ్చుననిపిస్తుందంతే. 4, 5 అంశాల వరకు ఇది తప్పు, అది విరుద్దము, ఇది నియమము లాటి పదాలు వాడిన వాక్యాల వరకు, ఓహో ! ఈ విషయంలో ఆయన ఇలా అనుకుంటున్నారన్న మాట అని అనిపిస్తుంది. వెరసి పెంచలయ్యగారేమిటన్నది స్పష్టాస్పష్టంగా తయారై, అబ్బో! ఆయనగారెన్ని శాస్త్రాలు చదివారు!? అని ఆశ్చర్యపోయేందుకూ, ఆయన చాలా తెలిసిన వారు అన్న భావన పాఠకుల్లో నెలకొనేందుకు ఉపయోగపడిందది.
దీన్నంతటినీ నిశితంగా పరిశీలిస్తే, మామూలుగా ఒక పట్టాన అంతుబట్టని ఆయన అంతరంగంలో, బహుశాస్త్రకోవిదునిగా లోకంలో (నలుగురిలో) నిలిచిపోవాలన్న ప్రగాఢవాంచా అంతర్లీనంగా బలంగానే ఉన్నట్లు లేదా ఉండి ఉండాలన్నట్లు తలపింపజేస్తోంది. ఒక వంక బ్రహ్మ విద్యా శాస్త్రము, జ్ఞానవిద్యా శాస్త్రము, తర్కశాస్త్రములన్న పేర్లు న్యాయవైశేషికాలకే వర్తిస్తాయంటూనే, ఆ రెండు గ్రంథాలలో చాలా తేలనివీ, తేల్చుకోవలసినవి, సరికానివిగా తేలినవీ చాలా ఉన్నాయ్ అని తన పరిశీలన క్రింద ఆయన తేల్చారు. మరలాటప్పుడైనా, తాను సరైనవిగా తలంచుతున్న వాటిని ఇద్దమిద్దంగా, మరివేటితోనూ కలగాపులగం కానీకుండా విడిగా నిర్థారించి చూపవద్దా?
క లక్షణ ప్రమాణ విద్యలకు సంబంధించి, ఆయన దగ్గరున్న చట్రానికీ, నా అవగాహనకూ ఎంతో కొంత వ్యత్యాసం ఉందనే అనిపించింది, కొన్నిచోట్ల ఆయన వెళ్ళడించిన అభిప్రాయాలనుబట్టి. ఆ విషయమై ఆయన రచనలనుండి ఆయనవేనని నిర్ణయించడానికి వీలున్న వాటినన్నింటినీ వేరుచేసి, ఆ పైన వాటిని విచారణకు, విమర్శకులోనుచేసే పని నిధానంగా చేస్తాను. నాకాశ్రమంతా లేకుండా, పెంచలయ్యగారి ప్రమాణాలు, పదార్థాలకు నేను ప్రతినిధిగా ఉండగలను అనగలవారుంటే, వారితో ఈ విషయాలపై చర్చావేదికను ఏర్పాటు చేస్తాను. మరింత విపుల చర్చకు ఇది సందర్భం కాదు గనుక తార్కిక క్షేత్రానికి సంబంధించినంతలో ఇప్పటికాగుతాను.
పెంచలయ్యగారి తాత్వికావగాహన
ఈ రెండు పుస్తకాలలో ఆయన చూచాయగా తెలియజేస్తూ వచ్చిన దానిని బట్టి, ఆయన ఆస్థికపక్షానికి చెందిన వాడేననీ, అధ్వైతంవైపు మొగ్గిఉన్నారని అనిపించింది నా వరకు నాకు. అంతేగాక; ఆయన అనేక సందర్భాలలో (1) శివానందను; పూర్ణానందను, చంథ్రేఖరేంద్రను, జిల్లెళ్ళమూడి అనసూయమ్మను, రమణ మహర్షిని గురించి ఉదాత్తంగా మాట్లాడుతుండేవారు. దానిని బట్టీ నాకీ ఆలోచన కలిగింది. అయినా నిజమేమిటన్నది నిర్థారించేందుకు వీలులేని పరిస్థితి.
ఒకింత విడ్డూరమనిపించేలా; గతయాభై ఏండ్లుగా ఎందరు, ఎన్ని విధాలుగా అడిగినా, వత్తిడి చేసినా తెరవకుండా బిగించి ఉంచిన గుప్పెడిని, చివరి నాళ్ళలో ఎవరూ అడగకుండగనే విప్పి చూపించారాయన. తనది చెప్పేది కాదనీ, చెప్పినా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నవారు తనకెవరూ ఎదురుపడలేదనీ (కానరాలేదనీ) అంటూ వచ్చిన ఆయనే కడకు ఏమనుకున్నారో ఏమోగాని, చాలా పేలవమైన ప్రతిపాదన చేసి దానిని పరీక్షకిచ్చి, నిలబెట్టకుండగనే జీవితాన్ని ముగించారు. ఇక ముందిది, వారితో సన్నిహితంగా మెలగిన, సాన్నిహిత్యం ఉందనుకుంటున్న, ఉందనంటున్న రకరకాల వారి, విరణలు, వ్యాఖ్యానాలు, విమర్శల రూపంలో ఎన్నెన్ని రకాలుగా తీరబోతోందో నన్న ఆలోచనా, ఆందోళన కూడా నాకున్నాయి.
(1) ఉపనిషత్తులు ఏకోన్ముఖంగా లేవన్నది వాటిని ఏమాత్రం శ్రద్దగా చూసిన వారికైనా ఎదురుపడే వాస్తవం.
(2) దేవుణ్ణెరిగిన వాడే దేవుణ్ణెరిగిన వాణ్ణి గుర్తించగలడు అన్న ప్రకటన అనవసరమైన గందరగోళానికి విత్తనాలు వేసింది.
(3) ఉనికి, ప్రేరణ, కోర్కె, కావాలి, వద్దు, స్వతంత్రము, అస్వతంత్రము, పరాధీనత, స్వాధీనత, స్వేచ్చ, భౌతికము, అభౌతికము, అవినాభావ సంబంధము, సుఖము, దుఃఖము, ఆనందము, చేతనము, చైతన్యము అన్న పదాలకూ, ఇలాటివే మరి కొన్నింటికీ ఆయనవైన నిర్వచనాలు బైటపడితే గాని ఆయన అవగాహనలోని లోపాలోపాలు నిర్థారించడం కుదరదు. ఆయన రచనల్లో నుండి వాటిని వెదికిపట్టుకునే పని చేయాలి. లేదా ఆయన చెప్పగా వ్రాసుకున్న వారుండి, వారువాటిని బైటపెడితేనూ సరిపోతుంది. లేకుంటే మనకున్న ఒకే ఒకదారి భాషా నియమాలకు లోబడి, వాటి బాగోగుల్ని తెచ్చుకోవడమే.
ఇప్పటికి చివరగా ఒక్కమాట చెప్పుకుంటే ఈ వ్యాసానికి తగినంత సందర్భోచితి సిద్దించదు. అందుకే ఒక్కమాట!
ఆయన గారి ఆత్మీయులకు ఆయన పోవడం ఒక విషాదం కాగా, భావాల పరంగా కొంత గందరగోళాన్ని విడిచిపోవడం మరో విషాదం. భవిష్యత్తులో, ఆయన వదలివెళ్ళిన ఈ గందరగోళాన్ని ఆధారం చేసుకుని, ఆయన్ని ఆపోశనం పట్టేశాం అనేవాళ్ళు పుట్టుకొస్తే, ఆయన పేరు చెప్పుకుంటూ, తమ భావాలను మందినెత్తిన- అదీ విచారణకు సిద్దంకాకుండా- పెట్టేవాళ్ళు పుట్టుకొస్తే, అదీ విజ్ఞులపాలిట మరో విషాదం. ఇదంతా కాదని, స్వతంత్రలోచనాశీలురకు వరిపిడిరాయిలాటి ఆయన పోకడను సజావుగా సమాజం ముందుకు తెచ్చి, చింతకులకు అందించగలిగితే అదెంతో గొప్ప ప్రసాదం కాగలుగుతుంది.
తర్క విద్య బ్రతుకు ప్రయాణానికి నిరంతరం అవసరమై ఉందనీ, అది కేవలం ఆస్థి, నాస్థిల క్షేత్రానికి సంబంధించిందికానే కాదని అనుకుంటున్న వాణ్ణి నేను. కనుక దానికి ఏ పేరు పెట్టుకున్నా మేధో సామర్థ్యాలను పెంచగల, నిశితదృష్టి నివ్వగల, సక్రమంగా ఆలోచించడాన్ని అలవరచగల తర్క విద్యను - సాంప్రదాయంగా అందులోకి చొరబడిపోగుపడి ఉన్న పనికిరాని భాగాన్ని (చెత్తను) వదిలించుకుని - సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ దిశగా జరిగే ఏ ప్రయత్నాలలోనైనా స.మం శక్తివంచన లేకుండా పాలుపంచుకుంటుంది. అలాంటి యత్నాలు ఆరంభించుకోడానికి సంధాన కర్తగా బాధ్యత వహించమన్నా సిద్ధంగా ఉంటుంది. సక్రమాలోచనా నియమాల శాస్త్రం తర్కశాస్త్రం, అన్న దాని అసలైన అర్థాన్ని అంగీకరిస్తూ. కనుకనే అది ప్రతి మనిషి నిత్య జీవితావసరమనీ, ఆరకంగా అది సామాజికావసరమనీ భావిస్తూ, ఆ అవసరం తీర్చేదిశగా కదులుదాంరండని ఆహ్వానిస్తూ, నా ఆలోచనా సరళికి ఒక థలో పెనుమార్పుకు కారకులైన పెంచలయ్యగారిని గుర్తు చేసుకుంటూ.
సత్యాన్వేషణలో..... మీ సురేంద్ర.
No comments:
Post a Comment