మిత్రులు శ్రీ సురేంద్రబాబుగారికి,
నమస్కారములు!
''ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవన యానం'' 203 వివేకపథములో చదివాను.
మీరు చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా ప్రస్తావించారు. పెంచలయ్యగారితో సన్నిహితంగా 19 సంవత్సరాలు, అప్పుడప్పుడు కలస్తూ మరొక 9 సం||లుగా తాత్విక పరిశోధన సాగిందని, ఆయన పరిచయం సత్యాన్వేషణకు ప్రధానమైన మలుపుకు దారి తీసిందని అన్నారు. ఆయనతోటి సంపర్కం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన వారిలో ''నా పేరు ఒకటవ స్థానంలోనో లేదా రెండవ స్థానంలో ఉంటుందన్నారు.''
నిస్సంశయంగా ప్రథమ స్థానం మీదే. అన్వేషణ పరంగా మీరు పడ్డ శ్రమ, మీరు వెచ్చించిన కాలము మరెవ్వరూ పెట్టులేదన్నది వాస్తవము.
అయినా అంత దీర్ఘకాల సాహచర్యంతో ఏకాభిప్రాయము పొసగలేదని, అందుకు కారణము పెంచలయ్యగారి ఏకపక్ష వాదనా విధానమని వివరించారు. విడిపోక తప్పలేదన్నారు.
సత్యజ్ఞాన సంఘ భవిష్యత్తు విషయమై సందేహాలు వెలిబుచ్చారు. సంస్థలు, సంస్ధల పేర్లు కాలగతిలో మరుగున పడవచ్చు, మాసిపోవచ్చు సంస్థాపకుల భావాలు సమాజ శ్రేయస్సుకుపకరించగలవైనట్లైతే తాత్విక ప్రపంచములో వాటి స్థానము ఎప్పుడూ చెరిగిపోదు.
అందుకు మీరు సాగిస్తున్న నిర్విరామ కార్యక్రమమే తార్కాణం. మీలాగా మరెందరో మిత్రులు తమ జీవితాల్లో పెంచలయ్యగారి కారణంగా తాము పొందిన పెనుమలుపే వారికి వెలుగు బాటైందని నిర్ద్వందంగా ప్రకటించారు.
తాత్విక పరిశోధనలో జరిపే పరస్పర సంభాషణలు కొంతవరకే సాగుతాయి. ఆ తరువాత వాగ్వివాదాలకు అవకాశముండదు. ఉండేదల్లా ''పరిశీలన - విచారణ - నిర్థారణ అదీ స్వతంత్రంగా!'' సత్యజ్ఞాన సంఘ దృక్పథమిది. దానికి కట్టుబడే సంఘ కార్యము రూపుదిద్దుకుంటుంది.
మిత్రులు కొందరు పెంచలయ్యగారి స్యుృత్యర్థము ఒక స్మారక ప్రతిని వెలువరించాలని కోరుచున్నారు. మీకభ్యంతరము లేకుంటే మీ వ్యాసాన్ని యధాతధంగా అందులో ప్రచురించగలము. మీ అభిప్రాయాన్ని పత్రికాముఖంగా వ్యక్తపరచగలరని ఆశిస్తున్నాము.
వందనములతో - కృష్ణారావు
ప్రతిస్పందన : ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవనయానం గురించి 204 వివేకపథంలో కూడ మరింత సమాచారం రాగలదు. కనుక మీకు అవసరమైనంత వరకు ఈ రెండు మాసపత్రికలలో ప్రచురించిన దానిని పెంచలయ్యగారి స్మారక ప్రతిలో ముద్రించుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పత్రికాముఖంగా తెలియపర్చుచున్నాము.
గౌరవ్ లేఖాంశాలు
203 సంచిక చదివి గౌరవ్ ఫోను చేశాడు. నారెండవ లేఖ ముద్రంచాల్సింది కనీసం అందులోని నా విజ్ఞప్తి భాగాన్నేౖనా ముద్రించండి అని ఇదిగో ఆ విజ్ఞప్తి:- అది వివేకపథం పాఠకులనుద్దేశించి వ్రాశాడతడు.
''అని వార్యకారణాల వల్ల వివేకపథంలో కొనసాగుతున్న హేతువాదం గురించిన చర్చలో పాలుపంచుకోడానికి వీలుకావట్లేదు. నా భావాలకి కట్టుబడినంతలో వాటిపై విస్పష్టమైన వివరణ ఇచ్చే యత్నం వీలైనపుడు చేస్తాను. పాఠకులు అన్యధా భావించకుండా నా నిజాయితీని శంకించకుండా ఉండడానికి, నా సమస్య - దాని కారణాలు ఈసరికే సత్యాన్వేషణ మండలికి వివరంగా తెలిపాను. అనుమానాలున్న వారు సురేంద్ర గార్ని సంప్రదించగలరు. అదే లేఖలో 202లో రాజేంద్రప్రసాద్‌గారు లేవనెత్తిన సందేహంపై ఇలా స్పందించాడు గౌరవ్
మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి, మీ స్పందన చూశాను నా అభిప్రాయాలు అర్థంకాకపోయినా, లేఖ చివరిలోని గమనిక (అన్యాపదేశంగా ఉన్నా సరే) అర్థమైనందుకు సంతోషం. లేఖ నేరుగా సురేంద్రబాబుగారికే రాయెచ్చుగదా? అనే మీ ప్రశ్నకు జవాబు :- ఉత్తరాయడమేం? సరాసరి దాన్ని ముఖాముఖిగానే అందించాను. ప్రత్యేకంగా వ్యక్తుల పేర్లు ఉటంకిచడం నేను సభ్యతగా భావించనందుకే సురేంద్రగారి పేరు రాయలేదు. రెండో విషయం, నిజానికది నా వ్యాసం లేఖకాదు హేతువాది పత్రికలో సైతం యధాతధంగా అది అచ్చైంది. అందుకనే ఎవరిపేరూ అందులో వ్రాయలేదు. అందులోనే కాదు రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతరరచనలు (1) సాంఘికతత్వం విప్లవ మార్గం 2) ఒక నాస్తికుడినామం 3) అస్థిత్వం - అరాచకత్వం 4) ప్రజాస్వామ్య ప్రస్థానం మొదలగువాటిల్లో కూడా పేర్లు పేర్కోలేదు. సమకాలికంగా జీవిస్తున్న వారిపై విమర్శ చేసేటప్పుడు సగటు విలువను పాటించడం అలా అలవాటు చేసుకున్నాను.
ప్ర.స్పం : యోచనాశీలుడవైన గౌరవ్‌కు, 201లో ప్రచురించిన నీ లేఖపై నా స్పందన కూడా అక్కడే ప్రచురించాను. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు అడిగింది నీ గమనిక వాక్యం గురించి కదా! అది ఇలా గుంది చూడు.
''ఈ మధ్య రాష్ట్రంలో హేతువాదానికి సిద్దాంతాన్ని, ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించడానికి యత్నిస్తున్న కొన్ని సంఘాలకు స్పష్టత చేకూర్చే ఉద్దేశంతోనే ఇది వ్రాయడమైనది'' దీనిపై అన్యాపదేశంగా చెప్పడమెందుకు నేరుగానే చెప్పవచ్చుకదా అని అన్నారాయన. నిజంగా అది అన్యాపదేశంగానే కాదు. అట్టి వారికి కనువిప్పు కలిగించేందుకు ఇంకాస్తకటువుగా చెప్పితే, బుద్ది చెప్పేందుకే ఇది రాస్తున్నాను అన్న అర్థాన్నీ ఇస్తొంది. నిజానికి ఆ నీలేఖలో హేతువాదం సిద్దాంత మెందుకు కాదో, హేతువాదమంటే ఏమో చెప్పనేలేదు. ఆ నీలేఖ సంగ్రహాన్ని రెండంశాలుగా విడకొట్టి, ఇంకా ఏమేమి అభిప్రాయాలున్నాయో దానిలో మీరూ తెల్చండని 201లోనే పాఠకులకూ సూచించాను.
దీనిపై ఇప్పుడు విమర్శ చేయబోవడం లేదనీ, అతడు విచారణకు సిద్దపడితే విచారణను మొదలెట్టుకోవచ్చిననీ చెప్పాను. ఆ లేఖ తప్పు మార్గం పట్టిన మనల్ని - ముఖ్యంగా నన్ను - సరిచేయడానికి ఉద్దేశించినట్లుగా ఉందనీ అక్కడే వ్రాశాను. అటు తరువాత రెండు మూడు సార్లు మనం ముఖాముఖి కలసి మాట్టాడుకున్నప్పుడు చెప్పాను. నీ భావాల పరిశీలనకు సిద్దపడమని. కానీ దానికి నీవంత ప్రాధాన్యత నిచ్చినట్లు అనిపించకపోవడంతో 203లో ఆ విషయాన్నే ప్రస్తావించాను. ఇప్పటికైనా నీవు వెళ్ళడించిన భావాలపై విచారణకు సిద్దం కావడం ఉచితం.
నీరెండో లేఖలో ప్రస్తుతం తీరు బాటు లేదనీ వీలైనప్పుడు వివరణలు ఇస్తాననీ నీ నిజాయితీని శంకించవద్దనీ వ్రాశావు. ఒక్కమాట! నీ మొదటి లేఖ ఏమీ సరళంగానూలేదు. చూసిచూడనట్లు వదిలేయాల్సిందిగానూ లేదు. అందులో అవగాహనాలోపంతో కూడిన భావాలతోపాటు, మేము మందినెత్తిన ఏదో బండ పెట్టబోతున్నట్లు ఆరోపణ చేశావు. అలాగే, హేతవాదం పై తగినంత సాహిత్యం లేదని కొందరంటున్నది నిజంకాదు. దీనిపై చాలా సాహిత్యం ఉందనీ వ్రాశావు. ఇదీ నన్ను ఉద్దేశించి వ్రాసిందే. హేతువాదానికి ప్రామాణిక గ్రంధాన్ని చేకూర్చడానికివేమైనా మత గ్రంథమా అంటూ ఎద్దేవా చేశావు. ఇదంతా అన్యాపదేశమే కనకనే రాజేంద్రప్రసాద్‌గారు నేరుగానే ప్రస్తావించవచ్చుకదా అన్నారు. దానికీ, నీవు, ప్రస్తావించడమేమిటి? నేరుగా సురేంద్రగారికే లేఖ ఇచ్చానన్నావు. ఆయనడిగిందేమిటి? నీవు చెప్పిందేమిటి? లేఖ చదివే పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా రాసుండాల్సింది అని కదా ఆయనన్నది. లేఖ సురేంద్రకిచ్చానంటావేమిటి? లేఖ అర్థం కావలసింది పాఠకులకు కదా! ఇదీ అర్థం కాలేదన్న మాట నీకు! నాకేం భయంలేదు. ఆయనకు నేరుగానే లేఖ ఇచ్చాను అన్నది ఆయన ప్రశ్నకు నీ జవాబన్నమాట! బాగుంది.
రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతర రచనలంటూ నీవు చెప్పిన పుస్తకాలను ఒకింత జాగ్రత్తగానే చదివాను. అందులో రాడికల్ హ్యూమనిజం పై విమర్శ ఎక్కడుందో చూపిస్తే మళ్ళా చూస్తాను. ఆ పుస్తకాలూ, ఈ లేఖలూ చూశాక, తెలియనివన్నీ దిట్టతనాన తప్పులటంచు... అన్న తెనాలి రామలింగని మాటలు గుర్తుకొచ్చాయి. విమర్శంటే ఏమిటో నీ కిప్పటికీ సరిగా తెలియదన్నది ఒక నిజం. మనం కలసి మాట్లాడుకున్నప్పుడూ, నీ భావాలలోనూ, నీ భాషలో కూడా చాలా ఉండగూడనితనముంది. వాటిని సరిచేసుకునే పని మొదలెట్టమని సూచించానుకూడా. కానీ నీవవేమీ గట్టిగా పట్టించుకున్నట్లులేదు.
ఒక్కమాట! పత్రికలో నీలేఖ వేసి, దానిపై నిశితమైన విమర్శ చేయాలంటే ఆ లేఖవరకే 10, 15 పేజీల స్థలం అవసరమవుతుంది. అందుకు 3000 రూపాయలపైనే ఖర్చవుతుంది. కనుకనే కలసి కూర్చుని మాట్లాడుకుందామని అన్నాను. ఇప్పటికైనా నీవు ప్రకటించిన భావాలపై పరిశీలనకు సిద్దపడడం మేలు, అవసరం కూడా.
మరొక్కమాట! వెంకటాద్రి గారు హేతువాదం సిద్దాంతంకాదన్న దృష్టికీ, నీవు హేతువాదానికి సిద్దాంతాన్ని తయారు చేయడం మంచిదికాదు అన్న దృష్టికీ చాలా తేడా ఉంది. ఆయన సిద్దాంతాలుండడమే తప్పని అనడంలేదు. సిద్దాంతాలు ఉంటాయనీ, ఉండాలనీ, క్రొత్తక్రొత్త సిద్దాంతాలు వస్తుంటాయనీ, వస్తుండాలనీ అంగీకరిచే వైఖరి కలిగున్నాయడాన రాడికల్ హ్యూమనిజానికి సిద్దాంతం ఉందని అంగీకరిస్తారుకదా వాళ్ళంతా. అలాగే వివిధ శాస్త్రాలన్నీ సిద్దాంతాలు కలిగి ఉంటాయనీ అంగీకరిస్తారు కదా వాళ్ళు. ఇకపోతే హేతువాదిలో ఆ నీ మొదటి లేఖ ముందూ వెనకా చూసుకోకుండా విందుకు ప్రచురించారో, రెండోలేఖ ఎందుకు ప్రచురణకు నోచుకోలేదో. మొదటి లేఖలోని భావాలవరకైనా నాతోటి వాళ్ళు ఏకీభవిస్తారో లేదో 'హేతువాది' సంపాదకులే చెప్పాలి.
నా అభిప్రాయం ప్రకారం ఆ నీమొదటి లేఖ నుండి నీ అభిప్రాయాలుగ నేను వెళ్ళడించినవన్నీ, నీ అవగాహనలో లోపాన్నీ, నీ ఆరోపణల్లో దోషాన్ని తెలిపేటివే. కానీ నీవు వాటినేమీ పట్టించుకున్నట్లుగాలేదు. తాత్వికస్థాయిలో విచారణలు చేసే పత్రికలతో చర్చ మొదలెట్టడమంటే, అది చాలా వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుంది పత్రికల వాళ్ళకి. అప్పుడైనా ఇరుపక్షాలూ పాఠకులూ శ్రద్దగా పట్టించుకుంటేనే దానికి అంతో ఇంతో ఫలితముంటుంది. రాసిందేదో రాసేసి, వీలున్నప్పుడు వివరణలిస్తాను అని నీవు అనకూడదు. నిజానికాపోకడ ఎవరూ పోకూడనిది.
ఎవరినుద్దేశించి విమర్శచేస్తున్నామో, రాస్తున్నామో వారిపేరును పేర్కొనకపోవడం సగటు విలువను పాటించడం కాదు సరికదా! అది కనీస పద్దతినైనా పాటించకపోవడం కూడా అవుతుంది. ఇప్పటికైనా నీవూ హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు ముందుగా, హేతువాదమంటే ఏమిటి? సిద్దాంతమంటే ఏమిటి? హేతువాదం అన్న పేరుక్రింద ఏమి భావాలుంటాయి? చెప్పి హేతువాదం సిద్దాంతమెందుకు కాదో నిర్ధారించండి. నీవరకైనా ఆపని చేయగలవేమో చూడు. ఇక హేతువాదంపై విస్తృతమైన సాహిత్యం తెలుగులోనే ఉందన్నావు. ఆ వివరాలివ్వు. నా అవగాహన ప్రకారం హేతువాదాన్ని శాస్త్రీయంగా వివరించే ఒక్క గ్రంథమూ తెలుగులో లేదు. అలా అనుకునేకదా నేను ఆ పనికి సమష్టిగా పూనుకుందామని పిలుపు నిచ్చింది. ఇక నీ మొదటి లేఖలోని ఒకటిరెండంశాలు విశ్లేషిస్తాను పరిశీలించు.
1) హేతువాదం సిద్దాంతం కాదు ఎందుకంటే, సమాజహితం కోసం ప్రతిపాదింపబడిన భావాలన్నీ ప్రామాణికమైన సిద్దాంతాలు కానవసరంలేదు. ఇది నీలేఖలోని మొదటి వాక్యాం ఇందులో నీవు లేవనెత్తిన అంశమేమిటి? చెప్పినదేమిటి? హేతువాదం ఎందుకు సిద్దాంత కాదో అన్నది గదా చెపుతానన్నావు. ఎందుకది సిద్దాంతం కాదో చెప్పావా? సమాజహితం కోరే భావాలన్నీ సిద్దాంతాలు కావలసిన అవసరంలేదు కనుక అది సిద్దాంతం కాదన్నావు. అదేం సమాధానం?! చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పనేలేదన్న నిజం ఎప్పటికి గుర్తిస్తావు?
2) ఇక నీ రెండో వాక్యం ఎంత గందరగోళంగా ఉందో చూడు ! ''అలా కాకుండా ఆయా కాలమానాలకు అనుగుణంగా, సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకునే ప్రగతిగాముకులు తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించుకుని ముందుకు సాగిపోతారు. అంతమాత్రంతో వారి నిజాయితీని అనుమానించడం మనలోని నైచ్యానికి ప్రతీక అవుతుందేమోగాని ఔన్నత్యానికి కాదు ఏమిటీ వాక్యాలకర్థం? సందర్భమేమిటి? అంతటి నైత్యానికి వడగట్టిందేవరు? అలా చేయకూడదని ఎవరికి సూచిస్తున్నట్లు? ఇంతకూ ''హేతువాదం సిద్దాంతం ఎందుకు కాదు'' అన్న శీర్షికతో మొదలైన రచనలో ఈ మాటల అవసరం ఏమిటి? సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకోవడమేమిటి? తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించడమేమిటి? అంతమాత్రం చేత వారినిజాయితీని శంకిచడమేమిటి? ఏమీటీ సంవిధానం? అర్థమవుతోందా పాఠకుకునికి? ఎంత మందికి వక్త హృదయం అర్థమైయ్యేవీలుంది?
గమనిక : నీ రెండు లేఖల మొత్తాన్ని కలిసి చూసినా హేతువాదమంటే ఏమిటో, అదెందుకు సిద్దాంతకాదోనన్న వివరం మాత్రం దొరకదు. కనుక ఏమి చెపుతానని లేఖ మొదలెట్టావో అది చెప్పకుండానే ఆ లేఖ పూర్తి చేశావన్నమాట! మళ్ళా సందోర్భిచితం కానివి చెప్పుకోకుండా ఉచితంగా స్పందిస్తావనే ఆశిస్తాను.
No comments:
Post a Comment