Monday, June 13, 2016

మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

పౌరులందరూ 'మతస్వేచ్చ' అన్న విషయాన్ని గురించి సరైన, సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆ మతాల పట్టులో ఉండే కలిసి జీవిస్తున్నారు. జీవించాల్సి ఉంది కనుక. గతంలో మతం నిర్వహించిన పాత్ర. ఇప్పుడది నిర్వహిస్తున్న పాత్ర ఇది ఇలానే సాగితే రేపు అది నిర్వహించగల పాత్ర అన్న వాటిని నిశితంగా, నిస్పాక్షికంగా పరిశీలించితే అది అందించిన మంచికంటే, కలిగించిన వినాశమే అధికమని తేలిపోతుంది. ఆ విషయాన్ని ఆయా మత సాహిత్యంలోని సమాచారం ఆధారంగానూ, సామాన్య చరిత్ర అందించే సమాచారం ఆధారంగానూ (గతానికి సంబంధించిన వాటిని) ఎప్పుడంటే అప్పుడు రుజువు చేసుకోవచ్చు. ఇక మతాల పేరిట ఇప్పుడు - వర్తమానంలో - జరుగుతున్నదంతా మనకు కనపడుతూనే ఉంది. ఈనాడు మతావేశాలు, మతోన్మాదము ప్రపంచ సమస్యగా మారి ఉందన్నది ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన వాస్తవం. ఇదీ మనందరకూ తెలుసు. భవిష్యద్దర్శనం చేయగల మేధావులలో ఎక్కువ మందిలో, మరో ప్రపంచ యుద్దమంటూ వస్తే దానికి ప్రధానకారణం మతవైషమ్యమే అయి ఉంటుందన్న ఊహలు బలంగానే ఉంటున్నాయి. ఈ దృష్టికల మానవ సంక్షేమ కాంక్షులైన మేధావులు, మానవజాతి మనుగడే మతోన్మాదం వల్ల ప్రశ్నార్ధకం కావచ్చునన్న ఆందోళననూ కలిగిఉంటున్నారు.

ఈ విషయంలో 130 కోట్ల జనాభా కలిగి, ప్రపంచ మతాలన్నింటికీ ఆవాసంగా ఉన్న భారత దేశపు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా బైటి నుండి దిగుమతి అయిన ఇస్లాం, క్రైస్తవాలు, వాటికి ఆధారంగా ఉన్న ఖురాను బైబిలు ఆదేశాల మేర, లేదా వాటిని అడ్డు పెట్టుకుని శక్తివంచనలేకుండా, లేదా వీలయిన ప్రతి అవకాశాన్ని బట్టీ మతాంతరీకరణలకు పాల్పడుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా ఆ రెండు మతానుయాయుల్లోనూ తమ విశ్వాసం వరకు పరిమితమై నిజమైన విశ్వాసులుగ, మానవతాదృష్టి కలిగి జీవిస్తుండేవారెందరో ఉన్నారు. ఈ రకం వారు తమ మతమే ఇతర విశ్వాసులపట్లా, అవిశ్వాసులపట్లా శతృవైఖరి కలిగి ఉండమని ప్రబోధిస్తున్నా, ఆ మేరకు వాటికి ప్రాధాన్యత నివ్వకుండా ఇరుగుపొరుగు సంబంధాలకు, జాతీయ భావనకూ పెద్ద పీట వేసి ఐకమత్యంతోనూ, సహకార భావంతోనూ మసలుకుంటుంటారు కూడా. ఈ రకం వారు, మత ప్రచారాలకుగానీ, మత మార్పిడులకు గానీ గడంగరు సరికదా, ఈ దేశ సంస్కృతిని వారసత్వంగా అంది పుచ్చుకున్న నేపధ్యంతో ఏర్పడ్డ అలవాట్ల వల్ల వివిధ విశ్వాసాలను, విశ్వాసులనూ గౌరవిస్తూనే జీవిస్తుంటారు. దీనిని ఆ మత ప్రబోధంగా పొరపడకూడదు. ఈ పోకడ ఆ మేరకు మతాదేశాన్ని పట్టించుకోకపోవడం వల్లనే సాద్యమైంది.

నిజానికి ఈ రకం మతవిశ్వాసుల వల్ల మానవాళికి నాడు, నేడు, రేపు (ఏనాడూ) ప్రమాదాలేవీఉండవు. సమస్యంతా మతాదేశాలను 100% అమలుపరచాలనుకుంటున్న వారి నుండే మతావేశము, మతోన్మాదము అన్న స్ధితులు ఏర్పడి 1. మత ప్రచారాలు, 2. అన్యమత నిరసనలు 3. మత మార్పిడులూ 4. అన్య మతస్థులతో శతృవైఖరి 5. పోరాటాలు, (చంపడాలు - చావడాలు) మొదలై, ఆరని అగ్నిలా (రావణకాష్టంలా) రగులుతూనే ఉంటాయి. అందులోనూ బైబిలు ఖురానులు రెండు ఏకేశ్వరారాధన మూల భావనగా ప్రకటించడం - ఇతర విశ్వాసాలూ ఆరాధనలూ ఉండకూడదనీ ప్రకటించడంతో వాటిని నూటికి నూరుశాతం ఆచరించాలనుకునే  విశ్వాసులకు స్వమతావేశం - అన్యమత వ్యతిరేకత అనివార్యంగా, అవశ్యంగా ఏర్పడితీరుతుంది. పైగా ఆ రెండు గ్రంథాలలో దైవధర్మంకోసం, దేవుని మార్గంలో పోరాడు అన్న ఆదేశం ఉంది. ఖురానులోనైతే ప్రతి ముస్లింకూ 'జిహాద్‌' విధి చేయబడింది. అన్న మాట ఉంది.

గమనిక : జిహాద్‌ అన్న పదానికి చాలా విస్తృతార్ధం ఉంది. ఖురాన్‌ ఆదేశాలకు భిన్నంగా నీ ఆలోచనలుగానీ, అలవాట్లు గాని ఉండుంటే, వాటిని తీసి వేయడానికి, వ్యక్తితనలో తాను, తనపై తాను ప్రకటించుకునే యుద్దం చేసే పోరాటం దగ్గర నుండి, ఈ లోకంలో భౌతికంగా ఖురాన్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న జనం పై చేసే అన్ని రకాల పోరాటాలకూ చివరికి ఆ పనిలో అవిశ్వాసులను చంపడానికీ, తాను చావడానికీ అన్నంత వరకూ ఆ పదం యొక్క అర్ధం విస్తరించి ఉంటుంది.

ఇక బైబిలు పాత నిబంధనలో దేవుని పాత్రలో కనబడే యెహోవా చేసిన, చేయించిన పనులన్నీ కూడా ఖురాను రీతినే పోలి ఉంటాయి. నిజానికి అలా అనడంకంటే, ఖురానులో అల్లా పేరున ప్రస్తావింపబడిన వ్యక్తి, బైబిలు ఆది కాండంలో కనపడిన వాటినన్నింటినీ జరిపించింది తానేనని చెపుతుంటాడు. చారిత్రిక కాల క్రమాన్ని బట్టి బైబిలు ముందుంది, ఖురాను తరవాతదీ కావడం వల్లా, రెంటిలోనూ సమానాంశాలే ఉండడం వల్లా బైబిలులో 'యెహోవా' అనబడిన వ్యక్తీ, ఖురానులో అల్లా అనబడిన వ్యక్తీ ఒక్కరేననిపిస్తుంది రెంటినీ చదివిన వారికి.

ఈ రెండు ధోరణులకు సంబంధించి  చరిత్ర రూపంలో అందుతున్నవీ - ప్రస్తుతం ప్రత్యక్షంగా తెలియబడుతున్నవీ :

1. బైబిలు పాత నిబంధనలోని సమాచారం ప్రకారం యెహోవా తానెంచుకున్న జనాంగంతో చేయించిన అన్యజనుల హననకాండ, స్వజనుల హననకాండ.

2. క్రొత్త నిబంధనాధారంగా యూదులు ఏసుక్రీస్తు పట్లా, క్రైస్తవుల పట్లా జరిగించిన హత్యాకాండ.

3. ఖురాన్‌ ఆధారంగా, అనంతరం ఈ రెండు సమూహాలూ మహమ్మదీయుల పట్ల జరిపించిన అమానుషకాండ.

4. మహమ్మదీయులు, యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, విగ్రహారాధకుల పట్ల ప్రవర్తించిన తీరు.

5. బైబిలు - క్రైస్తవులు - వారిలోవారు రోమన్‌ కేధలిక్కులు - లూధరన్‌ (పొటెస్టెంట్ల మధ్య జరిగిన మారణకాండ / హతసాక్షులు చరిత్ర ఆధారంగా)

6. మహమ్మద్‌ అనంతరం షియాలు - సున్నీలు పేరున నాటి నుండి నేటి వరకు ఒకరి నొకరు చంపుకుంటున్న ఖురాను విశ్వాసులు.

7. ఆంగ్లేయులు, పోర్చుగీసువారు ఈ దేశానికి వచ్చి సాగించిన మత ప్రచారాలు - మత మార్పిడులు మానవ హనన కాండ.

8. ఇస్లాం విశ్వాసులుగ ఉన్న వివిధ జాతుల ముస్లింరాజుల దండయాత్రలు, దేవాలయాల విధ్వంసము, బలవంతపు మత మార్పిళ్ళు, మానవ హననకాండ

9. ఈనాటికీ ప్రపంచంలో యూదులకు, క్రైస్తవులకూ, మహమ్మదీయులకు మధ్య వివిధ రూపాలలో, వివిధ దేశాలలో జరుగుతున్న యుద్దాలు.

10. ప్రపంచ వ్యాపితంగా, ఇంక ఏ మతధోరణుల వారిలోనూ కనపడనంత ఉన్మాద స్ధితికి చేరిన కొంత మంది ముస్లింలు చేస్తున్న ఇస్లాం ఉగ్రవాద కౄరకృత్యాలు...

గమనిక : - 1. చరిత్రలోతుల్లోకి వెళ్ళితే, మతం పేరున జరిగిన మారణకాండ సమాచారం ఒక పెద్ద గ్రంథానికి సరిపడినంత దొరుకుతుంది.

హైందవం పరిస్థితేమిటి?


చాలామంది హిందూత్వాభిమానులు నా పై రాతలు చూసి చాలా గొప్పగా రాశాడు వాస్తవాలను అనుకుంటూ హిందూమతం అలాంటిదికాదు అన్న దృష్టి కలిగి ఉంటారు. నిజానికి, హిందూమతస్వభావంలో పై రెండు మతాలలో ఉన్నంత కరుడు కట్టిన తనం లేదుగానీ, ఇక్కడా అవకాశం దొరికినపుడూ, బలం చాలినప్పుడూ అన్యమతస్థులనూ, మతాలను అణచివేసే ప్రయత్నాలు మతమార్పిడి యత్నాలూ జరుగుతూనే వచ్చాయి.

1. భారత రామాయణాలలో చార్వాకుల నిరసన, శంభూకవధ లాటి సమాచారం.

2. శంకరాదులు బౌద్దం పట్ల ప్రవర్తించిన, ప్రవర్తింపజేసిన కౄరవైఖరి.

3. బౌద్దారామాలను శైవక్షేత్రాలుగా మార్చిన వైనం.

4. వీరశైవం - వీరవైష్ణవం పరస్పరం మసలుకున్న తీరు.

ఇలా ఈ దేశంలోనూ బైబిలు - ఖురాను ధోరణులంతకాకున్నా - ఎంతోకొంత మత అసహనం, మానవహననం జరిగింది. గుట్టలు, గుట్టలుగా కాకున్నా కొద్ది పాటైనా వాటి అవశేషాలు దొరుకుతాయి.

5. బౌద్దారామాలు శైవక్షేత్రాలుగా, శైవక్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలుగా మార్చబడ్డాయన్న చరిత్ర ఉంది.

6. రామానుజాచార్యుల వారిని చంపేయత్నం చేసింది, శైవావేశం ఉన్న ఒక రాజేనన్నదీ రామానుజాచార్య చరిత్రలో లిఖింపబడి ఉంది. కుళోత్తుంగచోళుడు 1070- 1120

వర్తమానం - వాస్తవ పరిస్థితులు


ఎవరేమనుకున్నా అవునన్నా కాదన్నా, ఈనాడు ఈ దేశంలో ఉన్న క్రైస్తవులూ, ముస్లింలూ ఒకనాడు ఈ దేశంలోని ఏదో మత ధోరణికి చెంది ఉన్న హిందువుల సంతతివారే. ఇది చరిత్ర నెరిగిన వారిలో నిర్వివాదాంశం. అయితే ఇలా మత మార్పిడి పొందిన వారు రెండు రకాలుగా మతమార్పిడికిలోనై ఉండవచ్చు 1. ముస్లిందేశాల నుండి వచ్చిన ముస్లింలకు ఇక్కడి వారికీ ఏర్పడ్డ లైంగిక సంబంధాల వల్ల పుట్టడం ద్వారా ముస్లింలు అయినవారు 2. నేరుగా ఇస్లాం సందేశాలు విని ఇష్టపడడమో, ఏదో ఆశాభయాలకులోనై స్వీకరించడం ద్వారానో (రక్త సంబందంగా కాకుండానే) ముస్లింగా మారడం.

ఇదే సూత్రం క్రైస్తవులకూ వర్తిస్తుంది. నిజానికిది ఏమత మార్పిడులకైనా వర్తించే అవకాశం ఉంది. పుట్టుకద్వారా ఆ మతస్ధునిగ గణింపబడడం, మధ్యలో ఆ మతాన్ని స్వీకరించడం ద్వారా ఆ మతస్ధునిగ పరిగణింపబడడం అన్న రెండు రకాలుగానూ మతస్థులు కావచ్చునన్నదే సూత్రం. గతానికీ వర్తమానానికీ చెందిన ఈ రకమైన వాస్తవ పరిస్తితులన్నింటినీ గమనించీ భవిష్యత్తులో మతం ప్రాతిపదికనకంటే భారతీయత- దేశ ప్రజలందరూ ఒక జాతి- అన్న ప్రాతిపదికన ప్రజలను కలిపి ఉంచడమే అన్ని విధాలా సరైందవుతుంది అన్న గొప్ప విచక్షణతో భారత రాజ్యాంగంలో 1) మత స్వేచ్చను ఆర్టికల్‌ - 25, 26,27,28లలోనూ 2) న్యాయం ముందు అందరూ సమానులు అన్న దానిని ఆర్టికల్‌ 14 ద్వారానూ, 3) భారతీయులలో కుల, మత, ప్రాంత, లింగ, వర్ణాలను బట్టి వివక్ష చూపగూడదన్నది ఆర్టికల్‌ 15 ద్వారాను ప్రస్తావించి, శాసనరూపంలో భవిష్యద్దిశానిర్ధేశం చేశారు మన పెద్దలు.

వీటన్నింటికీ ఆలంబనగా రాజ్యాంగం పీఠికలోనే ఈదేశ ప్రజలంతా ఒక్కటైఏమి సాధించుకోవాలో (లక్ష్యాలు, సాధ్యాలు, గమ్యాలు ఏమిటో) సుస్పష్టంగా, సరళంగా, సుబోధకంగా పేర్కొన్నారు. క్లుప్తంగా వాటి వివరాలివిగో.

1. మనది సార్వభౌమిక దేశం అంటే బాహ్య అంతర్గత శక్తుల పెత్తనం మనపై లేదు. ఉండదు అని.

2. ప్రజాస్వామ్య విధానం : రాజరిక వ్యవస్థ వద్దనుకున్నాం, ప్రజలే యజమానులు, సొంతదారులు అనుకున్నాం. 1) సాంఘిక ప్రజాస్వామ్యం 2) ఆర్ధిక ప్రజాస్వామ్యం 3) రాజకీయ ప్రజాస్వామ్యం అన్న మూడు రూపాలలో ప్రజలే యజమానులు, సొంతదారులు, సమాన హక్కు దారులు అన్నది అమలవ్వాలి అన్నారు.

3. గణతంత్రం: ప్రజలే ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని దేశం మొత్తానికీ ఆచరణాత్మకం చేయడం అసాధ్యం గనుక, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాం. అంటే ప్రజలు తమతరుపున ఎవరిని ఎంపిక చేస్తారో అట్టి వారందరి గణం (సమూహం) తంత్రం (వశం)లో పాలనాదివ్యవహారమంతా నడుస్తుండాలని. ఎంతగా నచ్చజెప్పుకుందామనుకున్నా, సరిపెట్టుకుందామనుకున్నా ఈ విధానానికి ప్రజాస్వామ్య స్వభావం ఉంటుందని అనలేం. నిజానికి పరోక్ష ప్రజాస్వామ్యాలు, ప్రత్యక్షప్రజాస్వామ్యాలూ ఉండవు. దాని అసలైన అర్ధంలో ప్రజాస్వామ్యమంటే ప్రజల యజమానితనం అమలవుతున్న వ్యవస్ధ అని అర్ధం.

ఎప్పుడు ఒకని యందు, నిర్ణయాధికారము, పర్యవేక్షణాధికారము సంపదపైనా ఫలితాలపైనా యాజమాన్యపు హక్కు ఏర్పడి, ఆచరణాత్మకంగా ఉంటుందో అప్పుడు మాత్రమే అతణ్ణి దానికి యజమాని, (స్వామి, సొంతదారు) అనడం కుదురుతుంది. పరోక్ష ప్రజాస్వామ్యంలో ఇవి ఆచరణలోనికి రావు. రావుగాకరావు. రాలేవు. కనుకనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎప్పుడూ నామమాత్రపు ప్రజాస్వామ్యం మాత్రమే అవుతుంది.

అలాగే సాంఘిక, ఆర్ధిక ప్రజాస్వామ్యాలను సాధించుకోవాలంటే సాంఘిక సమానత్వానికీ ఆర్థిక సమానత్వానికీ దారితీయగల నిర్దేశికాలనూ రాజ్యాంగంలో పొందుపరుచుకోవాల్సి ఉంది. అధికరణాల రూపంలో అందుకుతగిన శాసనాలనేకం ఉన్నా, పీఠికలో ఆ విషయం సుబోధకంగా, సూటిగా అర్ధమయ్యే మాటలు రాజ్యాంగపు తొలి రూపంలో లేకపోవడంతో  42 వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలోనే 'లౌకిక' 'సామ్యవాద' అన్న పదాలను చేర్చుకున్నాం. లౌకిక మన్నది సాంఘిక సమానత్వ సాధనకూ, సామ్యవాద మన్నది ఆర్ధిక సమానత్వసాధనకు ప్రేరకంగా ఉండగలుగుతాయి.

రాజ్యాంగంలోని, 14, 15, 19, 25, 26, 27, 28 మరికొన్ని అధికరణలు కూడా సాంఘిక సమానత్వ సాధనకు అవసరమైన శాసనాలే. నిజానికి పై మూడు రకాల సమానత్వ సాధన కొరకు ఏర్పడినవే 14 నుండి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులన్నీ, మరిన్ని వివరాలకు ఎవరికి వారే రాజ్యాంగాన్ని, శ్రద్దగా అధ్యయనం చేయండి. ఇందులో ప్రస్తుతం మనం సాంఘిక సమానత్వ సాధన భాగంలోని మత స్వేచ్చకు చెందిన అంశాలను విశ్లేషిస్తూ, విచారిస్తూవస్తున్నాం.

వివిధ మత ధోరణులకు చెందిన వారి ప్రస్తుత పోకడలు, ఎత్తుగడలు


మతస్వభావం :- అది ఏ మతం కానీండి, దాని స్వభావంలోనే మనవాళ్ళు - పరాయివాళ్ళు అన్న భావన ఉంటుంది. వైదికులు - అవైదికులు, శ్రౌతులు స్మార్తులు, వైష్ణవులు, శైవులు, ద్వైతులు అద్వైతులు, బౌద్దులు, బౌద్దేతరులు, యూదులు, యూదేతరులు - క్రైస్తవులు క్రైస్తవేతరులు, ముస్లింలు ముస్లిమేతరులు, ఆస్ధికులు ఆస్తికేతరులు ఇలాగన్నమాట.

1. ఏమతమూ - ఇతర మతాలను తనతో సమానంగా చూడదు. ఇతర మతస్థులను తన వారనీ అనదు.

2. అదే మరి ఆ మతానికి ఒకే దేవుడు - ఒకే ఆరాధనా విధానము ఉండి ఇతర దేవుళ్ళ ఆరాధనావిధానాలపై నిరసన, వ్యతిరేకత కూడా ఉంటే అది  అని వార్యంగా శతృదృష్టికీ దారితీస్తుంది.

3. మతం యొక్క బలమంతా గుంపుని తయారు చేయడం, వారి మధ్య మనమంతా ఒక్కటి అన్న బలమైన ఐక్యతా బంధాన్ని ఏర్పరచడం అన్న దానిలో ఉంది.

4. దాని బలహీనతంతా ఇతర గుంపుల వాళ్ళతో కలవలేకపోవడం, విడితనం కలిగి ఉండడం అన్న దానిలో ఉంది.

కొద్ది మంది సమూహంలో ఐక్యత, మిగిలిన సమాజంలోని వివిధ సమూహాలతో అనైక్యత ఇదే దాని స్వభావం. మన విచారణలో అత్యంత కీలకమైనదీఅంశం. దీనిని గుర్తుంచుకోండి.

మన శీర్షిక పేరు - మతస్వేచ్చ భారత రాజ్యాంగము అన్నది కదా! దానిలో మతము - స్వేచ్చ, భారతదేశము, రాజ్యాంగము అన్న పదాలున్నాయి. ముందుగా వీటి అర్ధాలను చెప్పుకుందాం.

మతం


మత్యుద్భవం మతం అంటే మతి నుండి పుట్టినది మతం అని దానర్దం. సరళంగా చెప్పుకుంటే అభిప్రాయం అని వస్తుంది. ఏదేని విషయంపై ఎవరుగాని ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తే దానిని, 'అది అతని మతం' అని అనవచ్చు భాషాపరంగా చూస్తే. అనంతర కాలంలో, అనేక భావాల సముదాయాన్నంతటినీ కలిపే అదొక మతం అనడం మొదలైంది. ఆస్తిక మతం నాస్తికమతం, శంకర మతం, బౌద్దమతం, రామానుజమతం, మధ్వమతం, యూదమతం, క్రైస్తవమతం, ఇస్లాంమతం, శిక్కుమతం ఇలాగన్నమాట.

ఈ సందర్భంలో మనం గమనికలో ఉంచుకోవలసిన ముఖ్య విషయం ఒకటుంది.

భావజాల సంపుటి (రీలిశి ళితీ రిఖిరిళిజిళివీగి) అన్న అర్ధంలో మతమన్నమాట రూఢిపడ్డాక వినియోగంలోకి వచ్చాక, కేవలం అభిప్రాయ ప్రకటన రూపాన్ని మత మనడం (భాషాపరంగా అది సరైందే అయినా) తగ్గిపోయింది. అలాగే ఒక దశలో నాస్తిక మతం, లోకాయత మతం, చార్వాకమతం అన్న ప్రయోగాలు వాడుకలో ఉన్నా, ఆ కాలపు నాస్తికులూ తమది నాస్తిక మతమేనన్న అంగీకారంతో ఉన్నా, కాలక్రమంలో అట్టి వాటినీ మతాలనడం తగ్గిపోయింది. కొన్ని సామాన్యాంశాలను అంగీకరించిన భావజాలం కలిగి ఉన్న వాటినే మతాలనడం పరిపాటి అయ్యింది. దానికి అనుగుణ్యంగానే నాస్తికాది భౌతికవాదులు తమది మతం కాదనీ, ప్రధానంగా అభౌతికాంశాలను అంగీకరించే భావజాలం కలిగి ఉన్న వాటినే మతాలంటారనీ అంగీకరించడంతో, మతమంటే పరలోక సంబంధమైన విషయాలు, అభౌతికాంశాలతో కూడి ఉండాల్సిందేనన్న రూఢి ఏర్పడి వాడుకలోకి వచ్చింది. ఈనాడు ప్రపంచంలో ఉన్న వివిధ మతాల మధ్య పలు విషయాలలో బేధాలున్న అన్నింటిలోనూ కొన్ని సామాన్యాంశాలుంటున్నాయి.

1. దేవుడు, జీవుడు 2. జన్మ-కర్మ, 3. సాధన - సాధ్యము (దీనిలో ముక్తి, స్వర్గనరకాదిలోకాంతరాలు ఉంటాయి) 4. సృష్టి - స్థితి - ప్రళయాలు అన్న అంశాలకు చెందిన అభిప్రాయాలుంటాయి.

2. పై చెప్పుకున్న అంశాలున్న మతాలన్నింటి స్వభావంలోనే ఒక బలహీనత ఉంది. అది దాని ప్రధాన భావనలన్నీ విశ్వాస ప్రాతిపదికన ఏర్పరచుకున్నవేనన్నదే.

3. ఈ వివరాలన్నింటినీ గుది గుచ్చిన గ్రంథాన్నే ఆ మత గ్రంథం అంటున్నాం మనమిప్పుడు.

మరింత స్పష్టత కొరకుగాను మరో పట్టిక రూపంలో చెపుతాను గమనించండి.

1. ప్రతిమతానికీ ఒక ప్రామాణిక గ్రంధముంటుంది.

2. దానికి స్ధాపకుడో, ప్రవర్తకుడో - ప్రవర్తకులో ఉంటారు.

3. ఆ గ్రంథాలు దైవం పేరునగానీ, విశేషజ్ఞులైన వ్యక్తుల పేరున గాని ఉంటున్నాయి.

4. ఆ మతం అంగీకరించే దైవం లేదా అభౌతికశక్తి ఉంటుంది.

5. దానిని ఆరాధించే ఆరాధనా పద్దతి, పద్దతులు ఉంటాయి.

6. జీవులుంటారు. వారికి మరణానంతర జీవితం ఉంటుంది.

7. ముక్తి, పరలోకాలు (స్వర్గనరకాలు మరికొన్ని లోకాలు) ఉంటాయి.

8. సృష్టిస్ధితిలయాల గురించిన భావనలు ఉంటాయి.

9. వివిధ సాధనలు - సాధ్యాలు ఉంటాయి.

10. ఈలోక జీవితానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి.

పాఠకమిత్రులారా! పై పది అంశాలు లోకంలో ఉన్న ప్రధాన మత ధోరణులన్నింటిలో ఉన్నాయో లేదో మీరూ ఎవరికి వారుగా పరిశీలించి ఒక నిర్ణయానికి రండి.

ఒక ముఖ్య గమనిక :-  చిన్న చితకా కలిపితే పెద్ద సంఖ్యలోనే మతాలు ఉన్నట్లు తేలుతుంది. ఆ పద్దతిని ప్రక్కన పెట్టి మన రాజ్యాంగంతో ముడిపడి, భారతదేశంలోని మతాలనన్నింటిని మూడు ప్రధాన మతాలుగ (సౌలభ్యం కొరకే సుమండీ) చెప్పుకుందాం.

1. వేదంతో మొదలెట్టి, స్థల పురాణాల రూపంలో ఉన్న గ్రంథాల వరకు కలసి బహుదైవారాధన మతంగా, దేశీయమతంగా రూఢిలో ఉన్న హిందూమతం

2. యూదులకు, క్రైస్తవులకూ ఆధారంగా ఉన్న బైబిలుననుసరిస్తున్న మతం

3. ఖురానును అనుసరిస్తూ ఇస్లాం పేరున ప్రసిద్ది చెందిన మహమ్మదీయమతం

ముఖ్య గమనిక : బైబిలు ఖురానులు ఆధారంగా ఉన్న మూడుమతాలు యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అవి ఏకేశ్వరారాధన నంగీకరించి, అదే సమయంలో బహుదైవారాధనను, విగ్రహారాధనను ఖండించిన మతాలు.

2. వాటి పుట్టుక స్థానాలను బట్టి చెప్పవలసివస్తేనూ, వాటి ప్రధాన ఆరాధనా స్ధానాలను బట్టి చెప్పవలసి వస్తేనూ అవి భారతీయులకు విదేశీ మతాలు.

3. ఇక హిందూ మతం పేరున ఉన్న అనేక మతాలలో ఏకేశ్వరారాధన సంబంధంగానూ, సాకారేశ్వరుని, నిరాకారేశ్వరుని అంగీకరించినవీ, వివిధ  దేవీదేవతల నంగీకరించినవీ, అవతారాలను, భగవదంశారూపాలను, యోగులను, సిద్దులను అంగీకరించినవీ అంటూ అనేకం ఉన్నాయి. అయితే వీటన్నింటి మూలాలూ ఈ దేశానికి సంబంధించినవిగానే ఉంటూ దేశీయాలు అనబడుతున్నాయి.

గమనిక : - మతాల ప్రధాన భావజాలం విశ్వాస మూలకంగా ఉంటుందని చెప్పుకున్నాంకదూ! అందువలన ఆ భావాలేవీ సత్యాసత్య విచారణకు అనువుగా ఉండవు. అంటే వాటిని సత్యాసత్య పరీక్షకులోను చేయడం కుదరదన్నమాట! ఆయా భావాలను నమ్మడం -నమ్మకపోవడం మినహాయించి సత్యమనో, అసత్యమనో నిర్ణయించడం కుదరదు లేదా నిర్ణయించకూడదు. దీనిని గుర్తుంచుకోండి.

ఏమత గ్రంథాలను కూలంషంగా పరిశీలించినా వాటిలోఆయా కాలాలకు సంబంధించిన భావగమన చరిత్రకు చెందిన అంశాలూ, భౌతిక సామాజిక గమనానికి చెందిన చారిత్రకాంశాలు కనిపిస్తుంటాయి. అలాగే జ్ఞానక్షేత్రానికి చెందిన సత్యాలనదగ్గవీ, అసత్యాలనదగ్గవీ ఆధార సహిత ఊహలనదగ్గవీ, కేవల ఊహలనదగ్గవీ అభిప్రాయాలతోపాటు, జీవన రీతికి చెందిన కర్మకలాపాల పరంగా ఇప్పటికీ పనికి వచ్చేటివీ ఈనాటికి కాలం చెల్లినవీ, ఏనాడు అంగీకరించకూడనివి అన్న భావాలూ చోటు చేసుకుని ఉన్నట్లూ తేలుతుంది.

పై నేనన్నది నిజమే అయితే, దాన్నుండి రాదీయగల పర్యవసానం ఏమిటో ఊహించండి. అది! ఏమత భావజాలమూ జ్ఞానపరంగా సంపూర్ణంకాదు, దోషరహితమూ కాదు. అలాగే దాని కర్మభాగమూ ఈనాటి సామాజిక అవసరాలకు సరిపోయేటిదీ అందరికీ సమన్యాయాన్నందించగలదీ కాదు. కనుక మతగ్రంధాలేవీ ఈనాటి, రేపటి సమాజాలకు సరిపడేటివికావు. ఈ కీలకాంశాన్ని గుర్తుంచుకోండి.

మతగ్రంధాలలోని కొన్ని సామాజిక అసమానతలు


1. మూడు ధోరణులూ బానిసవ్యవస్ధనంగీకరించాయి.

2. మూడు ధోరణులూ స్త్రీ పురుషుల మధ్య అసమానతనంగీకరించాయి.

3. విశ్వాసాలాధారంగా విశ్వాసులు - అవిశ్వాసుల మధ్య అసమానతలను అంగీకరించాయి.

4. పుట్టుకను బట్టీ - ఏదో ఒక రూపంలో వ్యక్తుల మధ్య అసమానతలను అంగీకరించాయి.

5. కనీసం సమానత్వాన్ని సాధించుకోవలసింది అనైనా సూటిగా ఆదేశించలేదు.

6. పనిని బట్టి ఫలితము అన్న సూత్రాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయలేదు.

7. పెద్దతరం - రాబోయేతరం పట్ల వివేకం అంగీకరించే రీతిని అవలంబించలేదు.

8. పరిశోధన, యోచనాశీలతల కంటే, అనుసరణ, విశ్వాసాలకే పెద్దపీట వేశాయి.

9. వైవాహిక సంబంధాలుగానీ, లైంగిక సంబంధాలుగాని ఈనాటి వివేకం అంగీకరించదగినవిగాలేవు.

10. దాదాపు అన్ని మతాలూ రాజరిక వ్యవస్థను అంగీకరించినవే

అమానుషం అనిపించే అంశాలూ కొన్ని మతాలలో చోటుచేసుకుని ఉన్నాయి.

No comments:

Post a Comment