Monday, June 13, 2016

ఈనాటి మత ప్రచారకుల - మత పెద్దల వింత పోకడ


మతమన్నమాట 'మత్యుద్భవం' అన్న అర్ధంతో మొదలై, భావజాల సముదాయానికి ఆస్తిక నాస్తికతలన్న తేడాలేకుండా వాడబడి, అనంతరకాలంలో ఆస్తికులకు మాత్రమే వర్తించేదిగా స్థిరపడిందని వెనక పేజీలలో చెప్పుకున్నాం గుర్తుందికదూ!

అయితే ఈ మధ్యకాలంలో ఆస్థికుల వైఖరిలోనూ తేడా వచ్చింది. మతమన్నమాట వారికీ ఇష్టం లేకుండాపోయింది. హిందూ, క్రైస్తవ మహమ్మదీయాది మతాలవారు తమది మతం అనడానికి ఎందుకు ఇష్టపడడం లేదన్నదానికి వాస్తవమిదే అనదగ్గ సూటైన ఆధారంలేదుగానీ, మతం, మతస్ధులు అన్న వాటిని అల్ప దృష్టితో చూడడం, మతాలను చూపుతూ విమర్శలు ఎక్కువకావడం, మతాలన్నీ మూఢనమ్మకాలతో కూడి ఉంటాయన్న అభిప్రాయం ప్రచారం కావడం లాంటి వివిధ ప్రతికూల పరిస్థితుల నుండి, బైటపడడానికి ఎంతో కొంత ఆలోచనా పరుల ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే మాదిమతం కాదన్నమాట.

మరైతే మీ ధోరణిని ఏమంటారు? అని అడగబట్టో, ఎవరో ఒకరు అడుగుతారు అనిపించబట్టోగాని మాది ధర్మం అంటే ఒక రకమైన జీవనవిధానం అనడం మొదలుపెట్టారు. అలా ఎవరో ఒకరి నుండి మొదలైన దానిని గమనించి ఇదేదో బాగనే ఉందే అనుకుని మిగిలినవారూ అదే పాటందుకున్నారు. ఏమి ప్రమాదం నుండి బైటపడ్డారో, మరే ప్రయోజనాన్ని సాధించుకున్నారో నాకైతే అర్ధం కాలేదు. ఎందుకంటే గ్రంథమదే, భావజాలమూ అదే, జీవన రీతీ అదే. పుస్తకంపైన ఇస్లాం మతం బదులు ఇస్లాం ధర్మం, హిందూ మతం బదులు హిందూ ధర్మం క్రైస్తవ మతం బదులు క్రైస్తవ ధర్మం అని అక్షరాలు మార్చాము. అందువల్ల వనగూడిందేమిటి?

ఒక్కమాట :- మూడు ధోరణులకు చెందిన ప్రచారకులనూ, ప్రసంగీకులనూ కూడా దగ్గర నుండి శ్రద్దగా పట్టిచూశానునేను. 'మాది మతం కాదు, ధర్మం అన్న మాటలు మాట్లాడేటప్పుడు ఆ ప్రచారకుడు ముఖంలో, గొంతులో కనబరిచే హావ భావాలను చూస్తే తెగ అబ్బుర మనిపిస్తుంది నాకు. అదేదో గొప్ప విషయమన్నట్లు, ఆ మాటంటున్న తాను చాలా తెలిసిన వాడినన్నట్లు చూపిస్తుంటాయవి.

ఒకరిద్దరిని కొద్దిగా పరిచయముండి సమయం దొరికినప్పుడు అడిగాను. మిత్రుడా ఇంతకూ మతమంటే ఏమిటి? అదెందుకు అయిష్టమైందినీకు? ధర్మమంటే ఏమిటి? జీవన విధానమన్నదానికి ధర్మం అన్నది సమానార్ధకం ఎలా అవుతుంది? అని అడిగిన ప్రశ్నలకు దేనికి దానికిగా సరైన సూటైన సమాధానం నేనడిగిన వారెవరూ చెప్పలా. ఈ రచనను చదువుతున్న వారెవరైనా చెపుతానంటేనూ, వినడానికీ, పరిశీలించడానికీ నేను సిద్దంగా ఉన్నాను. ఉంటాను. చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక, ఈ దశలో గుర్తొచ్చిన మరో ముఖ్యాంశాన్ని మీ ముందుంచుతాను జాగ్రత్తగా గమనించండి.

1. భారత రాజ్యాంగం మతాలను సామాజిక వాస్తవాలుగా (సమాజంలో ఉన్నవిగా) అంగీకరిస్తుంది.

2. అలాగే దేశంలో వివిధ మతాలున్నాయనీ అంగీకరిస్తుంది.

3. హిందూ మతం క్రిందికి ఏయే దేశీయ మత ధోరణులు వస్తాయో సాధారణ రూపంలో ప్రకటించింది.

4. నాస్తికులు, హేతువాదులు వగైరా భౌతికవాదులను మతస్థులుగ, వాటిని మతాలుగ ప్రకటించలేదు.

5. బైబిలు, ఖురానులాధారంగా ఉన్న మతాలను ప్రధాన మతాల జాబితాలోనే అంగీకరిస్తుంది.

6. అయితే హిందు మతంతో పోల్చి వాటిని మైనారిటీ - అల్పసంఖ్యాక - మతాలుగా చెపుతుంది.

ఇంతవరకు ఈ అభిప్రాయాలు రాజ్యాంగం అంగీకరించేవా? కావా? అన్నది పరిశీలించి తేల్చుకోండి. ఆశ్చర్యకరమైన అంశమేమంటే ముఖ్యమైన మూడు మతాల వాళ్ళూ మాది మతం కాదంటే మాది మతం కాదంటున్నారు. వారి మాటలను క్రోడీకరిస్తే లోకంలో మతమనేది లేదన్నమాట అన్న సారాంశం వస్తోంది.

మళ్ళా మరోప్రక్క ఇలా మతంకాదన్నవాళ్ళ కూటాలనుండే, తాముకాక మిగిలిన కూటాల వాళ్ళు మతస్థులేననీ, వాళ్ళలో కొందరైతే మతోన్మాదులు కూడాననీ మాటలు వినిపిస్తున్నాయి. మూడు కూటాలవారి ఈ మాటలను సంగ్రహిస్తే అందరూ మతస్థులేననీ, వారి ముగ్గురివీ మతాలేననీ వారిలోని కొందరైతే మతోన్మాద స్థితికీ చేరి ఉన్నారనీ సారాంశం వస్తోంది. ఏమిచేద్దాం? మతస్థులం కాని మతస్థులం అంటున్న మతధర్మస్థులారా! ఏమి చెద్దాం? మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి.

గమనిక :- దీనికి సంబంధించిన మరో కోణాన్ని వివరించుకుంటే గాని అవగాహనలో స్పష్టతరాదు.

ఈనాడు పై మతక్షేత్రాలకు చెందిన సమూహాల వాళ్ళంతా ఆయా మత ధోరణులకు చెందిన సంస్ధలను ఏర్పరచుకున్నదేకాక, ఆ పునాది బలం ఆధారంగా రాజకీయ పార్టీలనూ స్ధాపించుకున్నారు. ఎం.ఐ.ఎం, శివసేన లాటివీ, వాటి అంతటి కరుడు కట్టిన తనం లేకున్నా మత భావాలవైపు మొగ్గి ఉన్న బి.జె.పి లాటివీ ఆ కోవకే చెందుతాయి.

ఇక, జగమూ, జీవితమూ కూడా రాజకీయమేననుకుంటూ, ఓటర్ల నాకట్టుకోడానికి గంటకో వేషం కట్టే నేతలున్న పార్టీలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఈరకం వారంతా కూడబలుకున్నట్లు ఇటు ప్రజాస్వామ్యాన్ని గురించి, అటు లౌకికవాదాన్ని గురించీ మరో వంక సామ్యవాదాన్ని గురించీ కూడా అనర్గళంగా, అదరగండంగా తెగ మాట్లాడేస్తుంటారు.

కార్మికవర్గ నియంతృత్వమే తమ సిద్దాంత లక్ష్యంగా చెప్పుకునే కమ్యూనిస్టులూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటారు. ఇస్లాం- ఖలీఫా- రాజ్యస్ధాపనే లక్ష్యంగా పెట్టుకున్న ముస్లింలూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేస్తుంటారు. రామరాజ్యం రామరాజ్యం అంటుండే మరో మత ధోరణివారూ  ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేస్తుంటారు. ఇక మేం మాత్రం తీసిపోయామా అనుకుని, ఏసు ఈ లోకంలోనే 1000 ఏండ్లు రాజ్యపాలన చేస్తాడు అంటుండే క్రైస్తవులూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేస్తుంటారు. ఇక్కడికిదే విడ్డూరమనిపిస్తూ, తలలు కొట్టుకోవాలనిపిస్తుంటే, ఇది చాలదన్నట్లు ఈ మతాలవారందరూ లౌకిక వాదాన్ని గురించి మహా ఆవేశంగా మాట్లాడేస్తున్నారు. అల్లా దయవల్ల లౌకికవాదం వర్ధిల్లుగాక అన్నట్లుకాదా ఇది?! చిన్న పోలిక చెప్పనా?!

ఒక నాస్తిక మహాసభ ముగింపు సందర్భంగా సభాధ్యక్షులవారు భగవంతుని కృపవల్ల నాస్తిక మహాసభ దిగ్విజయంగా ముగిసిందిఅంటూ ముగించారట! ఈ మాట హాస్యాస్పదంగానూ, కల్పిత కథలానూ అనిపిస్తున్నా, పై కరడుగట్టిన మతధోరణుల వారు లౌకికవాదాన్ని గురించీ, కరడుగట్టిన నియంతలు ప్రజాస్వామ్యాన్ని గురించీ తెగ మాట్లాడేస్తుంటే ఎలా ఉంటుంది. అది విజ్ఞులకు హాస్యాస్పదంగా మాత్రం ఉండదు. గొప్ప విచారాన్నీ, నిర్వేదాన్ని కూడా కలిగిస్తుంది.

నిజంగా మాది మతంకాదని అంటున్న వాళ్ళంతా నిజాయితీగా అలానే ప్రవర్తిస్తుంటే వారి ప్రకారం మతమే లేకుండాపోయినప్పుడు, ఇక మనకు లౌకికవాదంతో పనేముంది? మత స్వేచ్చా శాసనాలతో పనేముంది? మతమేలేని స్థితిలో మతస్వేచ్చను వాడుకునేందుకు ఎవరుంటారు? మాది మతంకాదంటే, మాది మతం కాదంటున్న ఈ వేషధారులమూక, మత స్వేచ్చ హక్కులున్న అధికరణాలను రద్దు పరచడానికి సిద్దపడతారా? అవిరద్దు చేశాక లౌకికవాద రీతిని చిత్తశుద్దితో అమలు చేస్తారా? ఎందుకీ తెలిసీ తెలీని ప్రవచనాలు? వంచనా పూర్వపు కుటిల పన్నాగాలు?

ఇలాటి పన్నాగాలు, ఎటువంటి పొరపొచ్చాలు లేని నిష్కల్మష హృదయాలు, అకళంక దేశ భక్తులూ కనుకనే, రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న ఎందరో మేధావులు ఈ దేశ ప్రజలందరూ వారి వారి విశ్వాసాలను ఉంచుకుంటూనే కలివిడిగా, ఒక్కటిగా ఉండగలందులకు ఏమి చేయగలమా అని నిరంతరం చింతించారు. అవకాశమున్నంతలో సహజీవన ప్రాతిపదికలను ఏర్పరచడానికీ, సమానత్వాన్ని సాధించుకోడానికీ అవసరమైన సూత్రీకరణలను రూపొందించారు. పెట్టగలిగినన్ని పరిమితులను పెడుతూనే మత స్వేచ్చనూ ప్రాధమిక హక్కుగా ఉండనిచ్చారు. వీలయినంత తక్కువ నష్టంతో మత విశ్వాసాలనంగీకరిస్తూనే ఆచరణసాధ్యమైన లౌకిక జీవన విధానం అమలయ్యే విధానాలను రూపొందించగలిగారు. తమ తరవాతి తరాల వారి ఉజ్వల భవిష్యత్తుకై సరైన బాటలు పరచడానికి అహరహం శ్రమించారు. చాలవరకు కృత కృత్యులయ్యారుకూడా. మరికొన్ని వివరాలు మీ ముందుంచితేగాని వారి శ్రమ ఏపాటిదో మనకు అర్ధంకాదు. ఇవిగో వీటిని కల్మషంలేని మనస్సుతో అవలోకించండి.

1. ఏ మతమూ చట్టంముందు అందరూ సమానులేనని ప్రకటించలేదు.

ఉదా :- స్త్రీ పురుషుల మధ్య, బానిసలు - బానిసలుకానివారి మధ్య, విశ్వాసులు - అవిశ్వాసుల మధ్య, వివిధ కులాల మధ్య జాతుల మధ్య అంతరాలనే ఏర్పరచింది.

రాజ్యాంగం :- 1) మరి మన భారత రాజ్యాంగం ప్రస్తావనలో సమానత్వసాధనే లక్ష్యంగా పనిచేయాలన్నది.

2. చట్టం ముందు అందరూ సమానులేనని ఆర్టికల్‌ 14 ద్వారా ఆదేశించింది.

3. కులం, మతం, లింగం, ప్రాంతం, వర్గం అన్న వాటిని బట్టి వివక్ష చూపరాదన్నది.

4. అమానుషమైన హిందూమతానికి అంటిన అశుద్దంలాటిదైన అస్పృశ్యతనకు నిషేధించింది. ఆర్టికల్‌ 17

5. మనిషిని అమ్మకూడదు, కొనకూడదు అంటూ బానిసత్వాన్ని రద్దు చేసింది.

6. సమాన పనికి సమాన వేతనం అంటూ శ్రమను బట్టి ఫలితం అన్న న్యాయ సూత్రాన్ని అందించింది.

7. విశ్వాసాలు - అవిశ్వాసాల విషయంలో ఎవరిష్టం వారిది అంటూ వాటిని ఈలోకవ్యవహారాల నుండి ప్రక్కకు తప్పించి, ఇక్కడంతా సమానులేనని తేల్చేసింది.

8. జాతీయతకు ప్రామాణికత భారతీయ పౌరసత్వమేనంటూ, మిగిలిన వేవీ రాజ్యాంగం ప్రకారం జాతిని సూచించవని, మొత్తం భారతీయులంతా ఏకజాతి అని ప్రకటించడం ద్వారా దేశంలో అంతర్గతంగా అప్పటివరకు అమలవుతూ ఉన్న అసమానతల నెన్నంటినో తుడిచివేసింది.

9. గతంలో మతాలు వ్యక్తుల మధ్య అసమానతలను నిలబెట్టడానికి పన్నిన ఎన్నో పన్నాగాలను వమ్ముచేస్తూ, వాటన్నంటికీ పరిష్కార రూపంగా, విద్యాహక్కు చట్టాన్ని, బాలకార్మిక నిరోధ చట్టాన్ని తెచ్చి నిర్భంధ ఉచిత విద్యనందించే విధానాలను శాసన రూపంలోకి తెచ్చింది.

10. మత ధర్మశాస్త్రాలలో చెప్పబడ్డ ఘోరమైన, కౄరమైన శిక్షలనెన్నింటినో రద్దు చేసి, శిక్షయొక్క పరమార్ధం వ్యక్తుల్ని సంస్కరించడం అన్న దృష్టితో శిక్షాస్మృతిని రూపొందించింది.

వీటన్నింటినీ మించి మొత్తం మానవేతిహాసంలో పుట్టుకొచ్చిన భావజాలమంతటికీ తలమానికం లాటి భావాన్ని ఆర్టికల్‌ 51 ఎ/హెచ్‌ రూపంలో అదిన్నీ ప్రాధమిక విధుల జాబితాలో పొందుపరిచింది.

51 ఎ/హెచ్‌ :- శాస్త్రీయ స్పృహకు చెందిన బిగితనాన్ని, పరిశోధనాతత్వానికి చెందిన స్ఫూర్తిని మానవవాద దృష్టిని, సంస్కరణాభిలాషను పెంపొందించుకోవడం ప్రతి భారత పౌరుని కర్తవ్యం అన్నదే ఆ మహోదాత్తతాత్విక సూత్రం.

సురేంద్ర :- మొత్తం మొత్తం మత సాహిత్యమంతటినీ జల్లేడపట్టైనా, దీనికి సమమైన సూత్రం ఎక్కడుందో చూపించగలిగితే చూపించండి. ఈ ఒక్క భావననూ సూత్రబద్దం చేసి భారత ప్రజలకందించిన ఆ శుభచింతకులకు ఏ రూపంలో కృతజ్ఞతలు చెల్లించగలం? ఉదయాన్నే లేవగానే స్మరించుకోవడం వారు చూపిన దారిలో నిజాయితీగా నడవడం తప్ప.

మతగ్రంధాల జ్ఞానులు


ఒక మత పెద్దకు లేదా మత గ్రంథాన్ని సాంప్రదాయపద్దతులననుసరించి అధ్యయనం చేసిన పండితునికి, ఆశ్రమవల్ల ఏమి తెలుస్తుంది? ఏమి తెలియదు? అన్నది జ్ఞానానికి సంబంధించినంతలో అత్యంత కీలకమైన అంశం.

గ్రంథ జ్ఞానులలో ఎక్కువమందికి శబ్ద ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానం యొక్క స్ధాయి ఏమిటన్నది తెలియనే తెలియదు. విజ్ఞులు మాట్లాడేటప్పుడు దానిని పుస్తకజ్ఞానం అని ఎందుకంటున్నారు? పుస్తకజ్ఞానం వల్ల ప్రయోజనమేమిటి? ఎంత? మస్తకజ్ఞానం - అనుభవం ద్వారా కలిగిన (ఆర్జించిన) జ్ఞానపు ప్రయోజనమేమిటి? ఎంత? అన్న విషయాలలో స్పష్టతరానంతకాలం వ్యక్తి, పుస్తకం చదివి విషయం తెలిసిందన్న భ్రమలో పడి ఉంటాడు. భాష యొక్క శక్తీ పరిమితులనెరిగిన వారన్న రెండు మూడు మాటలు ఆ క్షేత్రాన్ని ఎవరికి వారుగా మీరు చూసుకోడానికి దోహదపడేవి చెపుతాను పరిశీలించండి.

1. అనుభూతిం వినా మూఢో వృధా బ్రహ్మణి మోదతే!

ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్‌||

ఎక్కడో వినో, చదివో బ్రహ్మానుభూతిని పొందని ఒకడు నేను బ్రహ్మమునందానందిస్తున్నానని గాని అంటే, అది చెట్టు చివర కొమ్మనున్న పండును కోసుకు తినకుండా, దాని ప్రతిబింబాన్ని పట్టుకుని పండుతిన్నాననడం లాగుంటుంది.

2. అవిజ్ఞాతే పరేతత్వేశాస్త్ర ధీతిస్ధు నిష్పలాః|

విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్ర ధీతిస్ధు నిష్పలాః||

దేని విషయంలోగాని అనుభవజ్ఞానం లేని వానికి దానికి సంబంధించిన మాటల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే ఆ విషయానికి చెందిన అనుభవం ఉన్న వానికి కూడా దానిని గురించి చెప్పే మాటల వల్ల అదనంగా కలిగే జ్ఞానమేమీ ఉండదు.

3. యదిమన్యసే సువేదేతి దబ్రమేవనూనంత్వం విద్ది!

నేను చెప్పగావిని ఏదైతే బాగా తెలిసిందని నీవనుకుంటున్నావో ఆ జ్ఞానం అత్యల్నమైనది మాత్రమే.

పాఠక మిత్రులారా! మనం మాట్లాడుకుంటున్న మత గ్రంథాల జ్ఞానుల జ్ఞానం ఆ విషయానికి సంబంధించిన అనుభవంలేనంతకాలం పై మూడు శ్లోకాలలో చెప్పబడిన స్థాయికలిగిందే అవుతుంది.

పుస్తకం - గ్రంథం - చదవడం వల్ల అందులోని పదాలకు అర్ధాలు తెలిసున్నంత మేర, ఆ సందర్భం,  సన్నివేశం అర్ధమైనంత మేర, రచయిత ఏమంటున్నారో అన్నది మాత్రం అర్ధమవుతుంది. అతనంటున్నది, అతడంటున్న రీతిలోనే ఉందో లేదో తెలియనే తెలియదు. నేనేమి చెప్పుతున్నానో మీకు అర్ధమైతే తెగ జ్ఞానులల్లే విర్రవీగీ, అహాన్ని, హావభావాలను ప్రదర్శించే శాస్త్ర పండితుల పట్ల వారు తెగ తెలిసినవారన్న భావం పుట్టదు. ఆ పండితులకూ ఈ విషయం బోధపడి ఉంటే, వారిలో విర్రవీగుడు ఉండదు.

ఒక్క మాట చెప్పుకుంటే, మతశాస్త్రవేత్తల వాస్తవ స్థాయేమిటో మనకు విదితమవుతుంది. వారాగ్రంధాన్ని ఎంతగా అధ్యయనం చేసినా, వారు చెప్పగలిగింది గ్రంథమేమి చెపుతున్నదోనన్నంతవరకే, ఆ చెప్పబడింది అలానే ఉందో లేదో అనుభవం ద్వారా మాత్రమే తెలుస్తుంది. దీనిని ఏదో ఒక గ్రంథానికి అన్వయించి చూద్దాం,

ఖురాను (బైబిలు, వేదము, మరేదైనా మతగ్రంథం) పరలోకముంది. అందులో స్వర్గనరకాలన్న రెండు విభాగాలున్నాయి. ఆ రెంటి మధ్యనా ఒక వంతెన ఉంది అనందనుకుందాం. ఖురానులోని ఆ వాక్యాన్ని మొదటిసారి చదివాడొకడు. మరొకడు 10, 20 ఏండ్లుగా మరల మరల చదువుతూనే ఉన్నాడు. ఆ చెప్పబడ్డ విషయంలో వారిద్దరికి కలిగిన జ్ఞానమేమిటి? వారిరువురి జ్ఞానస్థాయిలో ఉన్న భేదమేమిటి? (తేడా ఉందా?) భాషానియమాలు, శబ్దప్రమాణాల యొక్క శక్తీ పరిమితి గురించి తెలిసిన ఎవరైనా చెప్పగలిగింది 1. పుస్తకమేమంటోందో తెలిసిందనీ, ఆ అవగాహన విషయంలో వారిరువురి జ్ఞాన స్థాయిలో హెచ్చుతగ్గు లేమీ లేవు. ఉండవు అనే.

ఉదా: - 2. బైబిలులోని ఒక వాక్యం మొదటి సారి చదివినవానికీ, వెయ్యోసారి చదివిన వానికీ ఆ విషయంలో కలిగే జ్ఞానం బైబిలు ఇలాగంటోంది. అన్నది మాత్రమే. ఆ విషయం వరకు వారిరువురూ సమానజ్ఞానులే. నోవహుతయారు చేసిన పడవ 150 - 75-50 మూరల కొలతలతో చేయబడిందని బైబిలు చెపుతోంది అనే తెలుస్తుంది. ఒక్కసారి చదివిన వానికీ, లక్షసార్లు చదివిన వానికీ కూడా.

కనుక ఖురానులోని ఒక అంశం చక్కగా ఒక్కసారి చదివిన నాకు తెలిసిన దానికంటే అదే ఖురానును అనేకసార్లు చదివాడని బాగా తెలిసినవాడని పట్టుకొచ్చిన ముఫ్తీగారికి అదనంగా తెలిసేదేమీ ఉండదు. చదవడం తెలిసే చదవవలసినట్లు చదివాడా లేడా అన్నదే ప్రశ్న. కాబట్టి మనమంతా కూర్చుని మాట్లాడుకుంటోంది ఖురాను ఏమి చెపుతోందన్న విషయాన్ని గురించే, అది నిర్ణయించడానికి భాషాభిజ్ఞత, అర్ధనిర్ణయపద్దతి తెలిసుండడం తప్పవేరే వాటితో పనిలేదు.

ప్రస్తుతం మత క్షేత్రాలలో వాదులాటంతా దేనిపైన?

ఈ వందల, వేలసంవత్సరాలుగా ఒకే గ్రంధం పై జరుగుతున్న వాదులాటంతా, గ్రంథం ఏమి చెపుతోందన్న విషయంలో ఎవరి అవగాహన సరైంది లేదా, గ్రంధ రచయిత భావాన్ని చూపెడుతోంది అన్నది తేలకపోవడంతో, తేల్చుకోడానికై చేసే యత్నము లేనన్నమాట. దానర్ధం ఏమిటో తెలుస్తోందా? ఒక్క క్షణం ఆగండి. మళ్ళా నా ప్రశ్న వినండి. దానర్ధం ఏమిటో తెలుస్తుందా?

ఆ గ్రంధం ఏమి చెపుతోందన్నది వారి మధ్య ఇంకా తేలలేదనే. ఏ మత గ్రంధం పరిశీలనకు తీసుకున్నా విషయమిదే. పుస్తకమేమంటోందోనే తేలని స్ధితిలో ఉంటూ ఇక ఆ పుస్తకం చెప్పిన విషయం వాస్తవంలో 1. ఉన్నదోలేదో 2. ఉన్నా అది చెప్పినట్లున్నదోలేదో అన్నది ముందా పుస్తకాన్ని ప్రక్కనెట్టి, ఆ విషయం ఉన్న తావునుకనుగొని అక్కడ చూస్తే గాని తేలదు. కను పుస్తకాలు పదిసార్లు చదివి జ్ఞానంకలిగిందనుకోవడం జ్ఞానిననుకోవడం, అవివేకం, అదొక రకమైన భ్రమ మాత్రమే. కనుకనే చదివినప్పుడు ఏమి తెలిసిందో దానిని పొందడానికి సాధన మొదలెట్టాలి, పొందేవరకు చేస్తూనే ఉండాలి. దానిని పొందినప్పుడు కలిగిందే దానికి సంబంధించిన అసలైన జ్ఞానం.

జ్ఞాన సిద్దాంతానికి చెందిన అత్యంత మౌలికమైన ఈ విషయం తెలిసిన నాకు, జాకీరునాయకో, రంజిత్‌ ఓఫీరో,  పి.డి సుందర్రావో, బ్రహ్మానంద సరస్వతో మరొకరో, మరొకరో తెగతెలిసిన వారిమల్లే ప్రగల్భిస్తుంటే నవ్వొస్తుంది. లేదా వారి భ్రాంతి స్థితి విషయంలో జాలి కలుగుతుంది. సానుభూతి ఉంటుందంతే. చాలా అంశాలు సమగ్రంగా కాకున్నా సూత్రప్రాయంగా మీ దృష్టికి తెచ్చాను. సరిపడినంతగానూ అవగాహన చేకూరాలంటే వీటన్నింటిని గూర్చి, ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ చిన్ని వ్యాసంలో అదంతా కుదరదు గనుక ఎవరికి వారే దీని అధారంతో వాటిని లోతుగా పరిశీలించండి.

స్వేచ్చ


మన ప్రధాన విచారణీయాంశం 'మతస్వేచ్చ' అన్నదే గనుక, మతమన్న మాట తరవాత, మనకు స్పష్టంగా తెలిసి ఉండాల్సిన పదం స్వేచ్చ అన్నదవుతోంది. స్వ+ఇచ్చ = అన్న రెండు పదాల కూడికే స్వేచ్చ అన్నమాట తనదైన ఇష్టము లేదా సొంత ఇష్టము అని దానర్ధం

మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఇష్టాఇష్టాలు సహజాతాలని తేల్చాయి. ఉరిదిలిరీ ఖిరిరీజిరిదిలిరీ బిజీలి దీబిశితిజీబిజి అన్నది మనోవిజ్ఞాన శాస్త్రపు సూత్రీకరణ నిజానికి ఆ పరిశోధనాలయం అన్నదనిగాక, మనందరి నిత్యజీవితంలో అనుభవంలో ఉన్నదీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు పునఃపరిశీలించి నిర్ధారించగలిగిందీ కూడా ఈ అంశం. స్వభావంలోనే అంటే మానవుని సామాన్య లక్ష్యణాల సమూహంలోనే కొన్నింటిని ఉండనివ్వడం, మరికొన్నింటిని ఉంచుకోలేకపోవడం అన్న గుణం ఉందన్నమాట. ఈ ఇష్టాయిష్టాలు నెరవేరుతుండాలన్న అభిలాష లేదా కోర్కెనే స్వయిచ్చ అనంటున్నారు. అయితే ఈ యిచ్చ యొక్క రూపాలూ వాటిలోని స్థాయీభేదాలు అనువంశికత ఆధారంగానూ, సాంఘికీకరణ పొందిన రీతి రివాజులాధారంగానూ వ్యక్తులలో వివిధంగా ఉంటున్నాయి. మరోకోణం నుండీ వీటిని వివరించుకుందాం.

1) స్వభావజనిత ఇష్టాయిష్టాలకు చెందిన సొంత ఇష్టం.

ఇది పుట్టుక నాటి నుండీ ఉంటుంది. దీని పరిధీ పెద్దదే. తనకు అన్యమైన వాటి నుండి, అవి తన శరీరంపైనా, మనస్సుపైనా కలిగించే ప్రభావాలు సహించుకోదగినవిగానూ, ఉండనీమని అనిపించేవిగా నున్నవన్నీ ఇష్టాలుగానూ, ఉండకూడదనిపించేటివన్నీ అయిష్టాలుగానూ అవుతాయి. దుఃఖం, బాధ, నొప్పి, ఆందోళన, అశాంతి, అసంతృప్తి వగైరా మాటలచే వేటిని గుర్తిస్తున్నామో అవన్నీ అయిష్టాల క్రిందికి చేరతాయి. సుఖము, సంతోషము, హాయి, ఆనందము, సంతృప్తి, శాంతి వంటి మాటలచే చెప్పబడేవన్ని యిష్టాలజాబితా క్రిందికి వస్తాయి. ఇవన్నీ మానసిక స్థితులే. కనుక వీటిని పుట్టించే విషయాల పట్లా ఇష్టాయిష్టాలు కలుగుతాయి. ప్రతికూలానుభూతుల నిచ్చే టివి వద్దు రావద్దు అన్న స్వయిచ్చ అనుకూలానుభూతులనిచ్చేటివి ఉండాలి, వస్తూ ఉండాలి, అన్న స్వయిచ్చ పుట్టుక నుండి వేటివేటి వాటి పట్ల ఇలాటి స్థితి, ఆకాంక్ష ఉంటుందో ఆ మేరకు ఉన్న దానినే స్వభావ జనిత స్వేచ్చ, సహజాత - పుట్టుకతో వచ్చిన - ఇచ్చ అనంటారు. మనోవిజ్ఞాన శాస్త్రం ఉరిదిలిరీ - ఖిరిరీజిరిదిలిరీ బిజీలి దీబిశితిజీబిజి అన్నది వీటిని గురించే.

2. పుట్టాక కలుగుతూ వస్తున్న జ్ఞానం ఆధారంగా తనంత తానుగా ఇష్టాన్నిగాని అయిష్టాన్ని గాని ఏర్పరచుకుంటే అది ఆర్జిత స్వయిచ్చ (స్వేచ్చ) అవుతుంది. పుట్టిన ప్రతి మనిషికీ ఈజ్ఞానం మూడు పద్దతుల ద్వారా కలుగుతుంది. 1. ప్రత్యక్షానుభవాల నుండి కలిగే జ్ఞానం

2. ఆధార సహిత ఊహా రూపంగా ఉండే, ఆలోచనాజనిత జ్ఞానం. దీనినే పారిభాషికంగా అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానం అనంటారు. 3. భాషనాధారం చేసుకుని కలిగే జ్ఞానం(వినడం, చదవడం ద్వారా కలిగే జ్ఞానం). ఈ మూడురకాల జ్ఞానాధారంగానూ మనిషి వివిధ రూపాలలో ఇష్టాఇష్టాలు ఏర్పడుతుంటాయి. పై మూటిలో మొదటి రెంటిద్వారా కలిగిన జ్ఞానం వల్ల ఏర్పడిన ఇష్టాఇష్టాలనూ స్వఇచ్చ, సొంత ఇష్టము (స్వేచ్చ) అనే అంటారు.

మళ్ళా ఈ స్వభావజనిత, ఆర్జిత ఇష్టాయిష్టాలలో చెడ్డ ఫలితాలనిచ్చేటివీ, మంచి ఫలితాలనిచ్చేటివి అని రెండు రకాలుంటాయి.

గమనిక :- వీటన్నింటినీ సోదాహరణంగా వివరించుకోవాలంటే అదొక పుస్తకమే అవుతుంది. సూత్రప్రాయంగా నేను సూచించిన ఆధారాన్ని పట్టుకుని మీమీ అనుభవాలను తరచి చూసుకోండి.

ఇక మూడవదైన శబ్ద ప్రమాణాధారంగా ఏర్పడే ఇష్టాయిష్టాలలో వేటిని సొంత ఇష్టాలు అయిష్టాలు (స్వేచ్చ) అనంటారు? మరివేటిని స్వేచ్చలేనివని అంటారు? అన్నది తేలితే మత స్వేచ్చ అన్న పదబంధంలోని 'స్వేచ్చ' అన్నదానిని దుర్వినియోగం చేయకుండా, చేయనీకుండా, సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని సాగించవచ్చు.    (సశేషం)

No comments:

Post a Comment