Tuesday, July 5, 2016

ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు


ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు


-హైం.క్రై.పు.168


''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యెను'' అని వివేకానందుడు అన్నట్లు మన అడ్డగోలు అపొస్తలుడు రంజిత్‌ ఓఫీరుగారు తమ చాలెంజి పుస్తకం హైం.క్రైస్తవంలో ప్రకటించారు. కానీ ఆ వచనాలను ఎక్కడనుండి పట్టుకొచ్చిందీ అక్కడ పేర్కొనలేదు. రిఫరెన్సులు (ఆధారాలు) చూపించాలన్న తెలివిలేదనుకుందామా అంటే అలా అనుకోడానికి వీలులేదు. తానన్న ప్రతిమాటకూ ఆధారాలు చూపి రుజువు చేశానని ప్రకటించారు. గ్రంథం చివరలో మీరే వెతుక్కుచావండంటూ, 115 రిపరెన్సులు ఎక్కడున్నాయో ఆ సమాచారం ఇచ్చారు. నిజానికి ఇలాటి చాలెంజ్‌ గ్రంథాలలో వాటన్నంటినీ ఆ సందర్భం దగ్గరే చూపించి ఉండాలి. అది నియమం కాకున్నా నైతిక బాధ్యత. చదువరికి సులభంగా ఆధారాలను సరిపోల్చుకునే అవకాశం ఉండేది. అలాకాకపోవడం వల్ల, ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకాన్ని విమర్శనాత్మకంగా చూడాలనుకుంటే, అదెంత కష్ట సాధ్యమో గమనించారా? 1. దాశరథి నాలుగువేదాల అనువాదం కొనుక్కోవాలి (లేదా సంపాదించాలి), నాలుగు వేదాల మూలం సంపాదించాలి. దానికి రెండు మూడు భాష్యాలన్నా దగ్గర పెట్టుకోవాలి. అవన్నీ వెదకాలి. సరిచూడాలి.

ఈయన గారి పుస్తకంలో చెప్పింది సత్తో, చెత్తో తేల్చడానికై, ఇంత వ్యయ, ప్రయాసలకు ఎందరు పూనుకుంటారు? పూనుకోగలరు? అస్సలు ధీమా! మన రంజిత్‌ ఓఫీరుగారి అస్సలు ధీమా అదే. హిందువులు - అందులోనూ హిందూ మత గ్రంధాల పండితులూ ఇంకా సరిగా చెప్పాలంటే వేదాలను అర్ధ సహితంగా చదువుకున్న పండితులు ఇంత శ్రమకు పూనుకోరని ఓఫీర్‌గారికి గట్టి నమ్మకం. అలాటిది, పైన తానన్న మాటలు ఎక్కడినుండి పట్టుకొచ్చిందీ చెప్పకుంటే ఇక దానిని పట్టించుకుని నిలదీసే పరిస్థితేరాదు. ఇక తాను మాత్రం అమాయకపు మంద దగ్గరకు వెళ్ళి ఇలాటివి చూపి, తోలు కెళ్ళగలిగినంత మందిని తోలుకెళ్ళవచ్చు.

పుస్తకారణ్యంలో పడి దాని ఆచూకీ కనుగొనడానికి మాకు చాలా సమయం, శ్రమాఖర్చైంది. కడకు రామకృష్ణ మిషన్‌ను సంప్రదిస్తే, ఉత్తేజిత ప్రసంగాలన్న పుస్తకంలో ఆ వివరాలున్నాయన్నారు. ఆ పుస్తకం తెచ్చుకున్నాం. తరవాత, కొందరు మిత్రులు ఈ విషయమై ఓఫిర్‌ మినిస్ట్రీస్‌ను ఒత్తిడి చేయగా, ప్రబోధరత్నాకరంలో ఆమాట ఉంది చూసుకొండి అన్నారు. ఉత్తేజిత ప్రసంగాలలోని ఒకరోజు ప్రసంగమే ప్రబోధరత్నాకరంలోనూ ఉంది. క్లుప్తంగా ఆ వివరాలివిగో.

''1995 జూన్‌లో వివేకానంద, సహస్రద్వీపవనం (థౌజండ్‌ ఐలండ్‌పార్కు) లో తన శిష్య బృందానికి జూన్‌ 19 నుండి ఏడు వారాలపాటు ప్రతిరోజూ పాఠాలు చెప్పారు. 19వ నాడు మేమంతా హాజరుకాలేదు. అయినా సమయం మించిపోతుండడంతో, అప్పటికి ఉన్న మా ముగ్గురు, నలుగురికే పాఠం బోధించడం మొదలెట్టారు. ఉన్న నలుగురం క్రైస్తవులమవడంతో బైబిలు తెచ్చి దానిలోని యోహాను సువార్తను తెరిచి దానిలోని మొదటి వాక్యాలను చదివి వివరించడం మొదలెట్టారు''. ఇదండీ సందర్భం.

ఆదిలో 'శబ్దం', అది దేవుడి వద్ద ఉండినది, శబ్దమే దేవుడు ఇది (శబ్దం) బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమనీ, మాయ అనీ చెపుతారు. విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ, ఇలా 'శబ్దం' రెండు రీతుల వ్యక్తమవుతోంది.

యోచనాశీలులారా! ఇది చదివిన తలకాయ ఉన్నవాడెవడైనా ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానంద అన్నాడని అనగలడా?! మన ఆధునిక అపొస్తలుడు, ఏసునోరు అయిన ఓఫీర్‌ అనగలిగారు.

వివేకానంద తాత్వికంగా అద్వైత ధోరణికి చెందినవాడు. అంతా బ్రహ్మమే ధోరణి అది. అందుకనే ఆ శబ్దం యొక్క సామాన్య రూపం ప్రకృతేనన్నాడు. విశేషరూపం అయితే, కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు లాంటి అవతారమూర్తుల రూపంలోనూ, ఇలా రెండు రూపాల్లో వ్యక్తమవుతుందన్నాడాయన . దానిని వివరించుకుంటే విశేషరూపాలలోని వ్యక్తులు ఆగణితంగా (అసంఖ్యాకంగా) ఉండవచ్చు, అన్నదే ఆయన ఉద్దేశం. కనుకనే కృష్ణుణ్ణీ, బుద్దుణ్ణీ, తన గురువు రామకృష్ణుణ్ణి కూడా ఆ శబ్దం యొక్క విశేష రూపాలేనంటూ, మొదలైన అన్నపదం వాడాడు, అదీగాక శబ్దమంటే బ్రహ్మశక్తి అనీ, అదే బ్రహ్మస్వరూపమని, మాయ అనీ హిందువులంటారనీ అన్నాడు. ఈ సందర్భాన్నీ వివేకానంద దృష్టికోణాన్ని, ఆ సందర్భంలో అతడన్న మొత్తం మాటలను కప్పిపెట్టి ఓంకారమే క్రీస్తు అయ్యాడని వివేకానందుడన్నాడనడాన్ని అమాయకత్వం అనగలమా? మాయకత్వం - వంచన లేదా కుటిల పన్నాగం అని అనకుండా ఉండగలమా?

ఆ రోజు ప్రసంగంలో వివేకానంద ఇంకా ఏమన్నాడో చూడండి.

''టేకెత్‌ అవే ది సిన్‌ ఆఫ్‌ ది వరల్డు''లో కులపాపాన్ని హరిస్తున్నాడు, అనే పాదానికి, పరిపూర్ణులమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు. అని అర్ధం అన్నాడు. వివేకానందుని ఈ మాటను ఓఫీర్‌ అంగీకరిస్తారా? మానవుడికి అతడి తత్వాన్ని ప్రకటించే నిమిత్తం, మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు. మనం బ్రహ్మాన్ని ఆవరించి ఉన్న మానవాచ్చాదనలం. కాని పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఏకమే ..... ఈ అవతార మూర్తులు సదాతమ దైవత్వాన్ని గురించిన ఎరుక కలిగే ఉంటారు. పుట్టుక నుండి వారికది తెలిసే ఉంటుంది. తమనటన సమాప్తమైనా, తిరిగి ఇతరులను సంతుష్టపరచడానికై నాటకరంగానికి వచ్చే నటులవంటివారు అవతారమూర్తులు. ఈ మహనీయులు ఐహిక స్పర్శేలేనివారు. మనకు బోధించడానికి తాత్కాలికంగా వారు ఉపాధులను ధరిస్తారు. వాస్తవానికి వారు ఉపాథిరహితులు, అపరిశ్చిన్నులు, నిత్యముక్తులు.

పాఠక మిత్రులారా! పరిశీలకులారా! ఇదీ ఓఫీరుగారు ఎత్తుకొచ్చానంటున్న ప్రబోధరత్నాకరంలో ఉన్న వివేకానందుని ప్రసంగానువాదంలోని సమాచారం.

అయ్యా దేశ చాలెంజర్‌ ఓఫీరు గారూ!

1. ఇందులో ''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యను'' అన్న వాక్యం ఎక్కడుందండీ?! డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా, ఆ మాటలు ఎక్కడున్నాయో చూపించండి. అసలానాటి ప్రసంగంలో ''ఓంకారపు ప్రస్తావనే లేదుకదా! ఇంత అడ్డగోలుగా మాట్లాడుతూ'', నాతో వాదించాలంటే ఇంగితముండాలి, చాలా జ్ఞానముండాలి, తర్కం తెలిసి ఉండాలి అని అనడం ఆ మూడూ ఉన్నవాళ్ళు చేయగలిగిన పని కాదు. సరైన రీతిలో వాదన చేయాలంటే ఆ మూడూ ఉండాలన్నంత వరకు నాకూ అంగీకారమే. ఇంగితమంటే సాధారణ విచక్షణాజ్ఞానమనీ, జ్ఞానమంటే, విచారణీయాంశాలలో సరిపడినంత తెలిసుండడమనీ, తర్కం తెలిసుండడమంటే, తార్కిక నియమాలు, వాద రీతులు, తెలిసుండడమనీ, అనుకునే ఈ మూడూ ఉండాలన్నది నాకు అంగీకారమేనంటున్నాను. హైందవ క్రైస్తవం ఆధారంగానే పై మూడూ మీకు లేవనిగానీ, తెలిసుండీ ఆచరించడం లేదని గానీ రుజువు చేస్తాను. అయితే ఈ విచారణంతా వీటి విషయం తెలిసున్నవారూ, ఏపక్షానికీ చెందని - నిస్పాకిక్షులూ అయిన పరిశీలకుల - నిర్ణేతల - సమక్షంలో జరగాలి. వాదనియమాలలో, వాద ప్రతివాదులే నిర్ణేతలుగ ఉండరాదు. నిస్పాకిక్షులు, విచారణీయాంశంలో విజ్ఞులూ అయిన మూడో పక్షమే నిర్ణేతలుగ ఉండాలి. అదీ చాలా కీలకమైన నియమం.

గమనిక :- శ్రోతల (ప్రేక్షకుల) స్ధానంలో ఉన్న ప్రజలే నిర్ణేతలు అనేతప్పుడు పోకడ ఒకటి ఈమధ్య కాలంలో చర్చావేదికల పేరన జరుగుతున్న వాటిలో వినపడుతోంది. ఇలాటి ఏర్పాట్లు చేసుకున్న వారికి తార్కికనియమాలుగానీ, వాద నియమాలుగానీ, నిర్దారణ నియమాలుగాని తెలియనే తెలియవన్నది నా అభిప్రాయం. అది ముమ్మాటికీ నిజం కూడా.

ఓఫీరుగారికి, పి.రాధాకృష్ణరావు (మండపేట) వారికీ మధ్య ఈ విషయంపైనే వాట్సాప్‌లో కొంత సంభాషణ జరిగింది. (31 మే 2016న జరిగినట్లుంది నా వాట్సాప్‌లో) అలాగే మే 30-2016 సత్య సంస్థాపన అన్న పేరున ఓఫీర్‌గారి వీడియో ప్రసంగం కూడా నాకు అందింది. క్రైస్తవనాడు, పుట్టా, మరియు షఫీగారు రంజిత్‌ ఓఫీర్‌ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఖండన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. యూట్యూబ్‌. కామ్‌. పేరున ఉందది వాటిలో ప్రస్తుతానికి సంబంధించిన భాగం వరకు ప్రస్తావిస్తాను. ఓఫీర్‌గారు : 1. రాధాకృష్ణగారూ! ప్రబోధ రత్నాకరంలోని టాపిక్‌ ఇప్పుడు క్రొత్తగా ఎత్తిందికాదు. వివేకానందుని ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి...... కనుక నాహైందవ క్రైస్తవంలో ఆ మహాపురుషుల మాటలను మొదటి పేజీలోనే ప్రముఖంగా ఎత్తిచూపాను.

2. రాధాకృష్ణగారూ! మరొక ముఖ్య విషయం ప్రమాదకరమైన మీ పోకడలు మానుకొండి అని పుట్టావారన్నారు. రెండు మత గ్రంధాలసారం ఒక్కటే అని చెప్పడం వలన ఎవరికి ప్రమాదం వస్తుందో, ఏ రకమైన ప్రమాదమో, హైం.క్రైస్తవం పుస్తకాన్ని ఎక్కడ ఖండిస్తున్నారో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది.

3. రాధాకృష్ణగారూ! వివేకానందుడు చెప్పినంత మాత్రాన అది సత్యంకాదు అన్నారు మీరు! మరి ఎవరు చెప్పింది సత్యమవుతుంది? సత్యాన్వేషణ మండలివారు చెప్పినంత మాత్రాన సత్యమవుతుందా?

రాధాకృష్ణగారు :- మీరు పంపిన ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో ఓంకారమే క్రీస్తు అయ్యెను అని వివేకానందుడు అన్నట్లు ఎక్కడ ఉందండీ!? ఇవిగో ఆ సందర్భంలోని మాటలు.

''మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు.... పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఒక్కటే''.

సురేంద్ర :- అయ్యా అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారూ! వివేకానందుడు చెప్పింది సత్యమే అవుతుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కనీసం ఆమాటవరకైనా కడదాకా నిలబడగలరేమో చూడండి. నిజానికి అక్కడ అప్పుడు వివేకానందుడు బైబిలులోని ఏసును గురించి చెప్పాలనుకోలేదు. తన సిద్దాంతమైన అద్వైతాన్ని, బ్రహ్మాన్ని గురించి క్రైస్తవులకు చెప్పాలనుకున్న సందర్భం అది. విచారణకు ఇంగితం పని చేస్తుండాలన్న మీకు ఇక్కడ, అదెందుకు పనిచేయలేదు. ''ఆ ప్రసంగంలో ఓంకార ప్రస్తావన లేదు. శబ్దం బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమని, మాయ అని చెపుతారు. విశ్వంద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటారు. ఆ శబ్దం (బ్రహ్మశక్తి సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, విశేషంగా కృష్ణుడు, బుద్దుడు, జీసెస్‌ క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ ఇలా రెండు రీతుల వ్యక్తమవుతోంది.'' ఇవండీ ఆ ప్రసంగంలోని వివేకానందుని మాటలు. నా లెక్క ప్రకారం అవి తప్పా ఒప్పా అన్నది పరీక్షించాల్సీఉంది. అయినా అదలా ఉంచుదాం. మీ వరకు మీరు తెగరెచ్చిపోయారు కదా! వివేకానందునివి సత్యంకాకుంటే, పుట్టా వారివి సత్యమవుతాయా? అంటూ వ్యంగ్యాన్ని జోడించారుకదా! వివేకానందుని పై మాటలు సత్యాలని అంగీకరించి మీ క్రీస్తు దేవుడు కాదనిగానీ, హిందువుల బ్రహ్మం యొక్క అవతారాలలో ఒకటి మాత్రమే, ఎలా కృష్ణుడు, బుద్దుడు, రామకృష్ణుడుల్లాగా ననీ అంగీకరించండి. వివేకానందుని ప్రకారం బుద్దుడు, రామకృష్ణుడు కూడా ఏసులాటి అవతారులేననీ అంగీకరించండి. ఆ వివేకానందుడే మీ ఏసు గురించి మరికొన్ని విషయాలూ చెప్పాడు. గుండె చిక్కబట్టుకుని వినండి (చదవండి) మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా అవును అవన్నీ సత్యాలే వివేకానందుడు చెప్పాడు గనక అని ప్రకటించండి.

''రెండు గ్రంథాలలో ఒకే దేవుని గురించి చెప్పబడింది.'' అంటే ఏమి ప్రమాదమొచ్చిపడిందండీ! అంటూ నంగనాచిలా మాట్లాడారు. అబద్దాలు చెప్పగూడదన్నంత వరకైనా ఇంగితం పని చేయడంలేదా? పైగా బైబిలువైపుకు అమాయకపు జనాన్ని ఆకర్షించడానికి, ఇలాటి అబద్దాలు, స్వకపోలకల్పిత మాటలూ చెప్పడం మీ దృష్టిలో తప్పుకాదన్నమాట. 10 వేల మందికి బాప్తిజమ్‌ ఇచ్చానని ఒక ప్రసంగంలో చెప్పుకున్నారు. 4 లక్షల మంది నీ మాటలు వినేవారున్నారనీ చెప్పుకున్నారు. అంత పెద్ద సంఖ్యలో జనాన్ని అబద్దాల ప్రభావానికి లోను చేయడం ప్రమాదంకాదన్నమాట! అది వంచనాకాదన్నమాట.

ఒక్కమాట సూటిగా అడుగుతాను సూటిగానే సమాధానం చెప్పండి. డొంక తిరుగుడొద్దు.

1. వేదాలు సృష్టిలో మొదటి గ్రంథాలు అని మీరూ అన్నారు.

2. వేదాలు, బైబిలులోని వివరాలు నూటికి నూరుశాతం సరిపోతున్నాయన్నారు.

3. వేదాలలోని దేవుడు బైబిలులోని దేవుడు ఒక్కడేనన్నారు.

4. హిందూమతం - క్రైస్తవం నిజానికి రెండు కాదు ఒక్కటేనన్నారు.

నిజాయితీ అట! అంటూనన్ను ఎకసెక్కమాడారు. మీతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, ఇంగితం పని చేస్తుండాలి, తర్కం వచ్చుండాలి అని తెగ బిగువుగా మాట్లాడారు.

షఫీలాటి ముస్లింలను ఉద్దేశించి, ఖురాను బైబిలును అంగీకరిస్తున్నట్లైతే, ముందొచ్చిన బైబిలులోని దేవుని పేరుతోనే దేవుణ్ణి పిలవండి. ఎందుకనంటే మీ అల్లానే, అబ్రహాము,ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణినేనేనంటున్నాడు కనక, ఆ దేవుడు తన పేరు ఎహోవాననే ప్రకటించుకున్నాడు గనుక అని నిగ్గదీశారు కదా!

మరి అదే నియమాన్ని మీ బైబిలుకూ, వేదానికీ అన్వయించవద్దా!

కాబట్టి, బైబిలును అవతల పారేసి వేదాన్ని పట్టుకోండి. వేదంలో చెప్పబడిన ప్రార్ధనలు, కర్మలే చేయండి. వేదంలోని పేర్లతోనే ఆ మీ దేవదేవుణ్ణి పిలవండి! నిజాయితీ గురించి ఎందుకు మాట్లాడానో, మాట్లాడుతున్నానో, మాట్లాడుతునే ఉంటానో ఇంగితానికి అందడం లేదా? మీది నయవంచన కపటస్వభావం లేదా విషయం తెలియకుండానే తెలుసుననుకునే భ్రాంతస్థితి.

మళ్ళా మనం వివేకానందుని దగ్గరకువద్దాం. మీరు గుండె నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకుని వినాల్సిన వివేకానందుని మాటలు - మీ ఏసు గురించే సుమండీ! మరికొన్ని వున్నాయి. బేజారు కాకుండా వినండి.

1. క్రీస్తు ప్రవచనాలన్నీ తూర్పు దేశానికి చెందినవే.

సురేంద్ర :- అర్ధమవుతోందా ఓఫీర్‌జీ ! భారతదేశం నుండి ఏసు అరువు తెచ్చుకున్నవేననిదానర్ధం.

జగన్మాతలో ఒక అంశం కృష్ణుడు, మరొక అంశం బుద్దుడు, వేరొకటి క్రీస్తుగా భాసించారు.

సురేంద్ర : మీకిది సమ్మతమేనా? ఇది బైబిలు ఒప్పుకుంటుందా? (దివ్యవాణి జూలై 2 మంగళవారం)స్వీయధర్మాన్ని పూర్తిగా ఆచరించని కారణంగానూ, అన్నింటికంటే, స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తినివ్వని కారణంగానూ ఏసు అపరిపూర్ణుడు. స్త్రీలే అతనికి సర్వం ఒనర్చారు. అయినా ఒక్క స్త్రీనైనా అతడు శిష్యురాలిగా స్వీకరించలేదు. యూదుల ఆచారానికి అంతగా కట్టుబడ్డాడు. అతని కంటె బుద్దుడు కొంత మేలు. స్త్రీని బుద్దుడు పురుషునితో తుల్యాధికారిణిగా అంగీకరించాడు. అయినా అతడూ అపరిపూర్ణుడే (పే. 478)

సురేంద్ర :- ఓఫీర్‌జీ! వింటున్నారా! మీ మహనీయుడు వివేకానందుని సత్యవాక్కులు అవి సత్యాలేనని మీరంటే అనగలిగితే, మనస్ఫూర్తిగా స్వీకరించగలిగితే మావరకు మాకు అభ్యంతరం ఏమీ లేదండీ అద్దంకోరూ!

4. ఒక మానవుడు అతడెంత మహనీయుడైనా అవుగాక! మనం అతణ్ణే నమ్ముకుని ఉండకూడదు. మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి. క్రీస్తు మానవుడే, బుద్దునికంటే కొంచెంతక్కువవాడు. అతణ్ణీ నమ్ముకోడం సరికాదు. (పే. 478)

5. జీసస్సే జన్మించకుంటే, మానవకోటికి తరుణోపాయం ఉండేదికాదని తలంచడం మహాపరాధం..... ఇంతకు ముందూ మనమే పరాత్పరులం. క్రీస్తులూ, బుద్దులూ ఆత్మసాగరంలోని వీచికలు. నీలోని పరమాత్మకు తప్ప దేనికీ ప్రణమిల్లకు. నువ్వే ఆ దేవదేవుడినని గ్రహించే వరకు నీకు ముక్తిలేదు. (పే. 478)

సురేంద్ర : చాలా! రంజిత్‌ ఓఫీర్‌గారూ! మొహం వాచేలా, కడుపు నిండేలా చాలా పెట్టాడనుకుంటా మీ మహనీయుడు వివేకానందుడు!? ఇది చాలా? ఇంకా కావాలా? హైందవం - క్రైస్తవం వకటికాదనే అంటున్నాడు వివేకానందుడన్నంతవరకైనా మీ ఇంగితానికి అందుతోందా? గుండె దిటవు చేసుకుని వింటానంటే, విని తట్టుకోగలనంటే, ఇంకొన్ని, వివేకానందుని మాటలనే మీ ఇంగితంముందు పెట్టగలను.

6. భగవంతుడే భగవంతుణ్ణి గ్రహించగలడు. సో-హం, సో-హం అనేదే గానంలోని పల్లవి. ప్రతి వస్తువూ సజీవదైవం, సజీవక్రీస్తు,.... సకల బైబిళ్ళనూ, క్రీస్తులనూ, బుద్దులను వెలుగొందజేసే జ్యోతి మనమే. అది లేనిదే ఇవన్నీ మృతప్రాయాలు.

సురేంద్ర :- మాడు పగిలిందా రంజితయ్యా! నేను అనే జ్యోతి - (అది మనమేనంటున్నాడు వివేకానంద) లేనిదే ఏసూ, బుద్దుడూ కూడా మృతప్రాయులేనట! బాగుందికదూ మహనీయుల మాట! మా మాటకేంగానీ, మీవరకు అదంతా సత్యమేనని ఒప్పేసుకోండి. నావెంట మంగలి తన కత్తితో సిద్దంగా ఉన్నాడు. లక్షసార్లుకైనా సవాలుకు కట్టుబడి ఉన్నానంటిరి కదా! త్వరగారండి నాకంత టైం లేదు.

7. సత్యాన్ని పరిశీలించకుండానే, ప్రాచీన సంప్రదాయాన్ని విశ్వసించడం జరిగింది. విశ్వాస ప్రభావం అలాంటిది. ... జీసెస్‌ క్రీస్తు, మహమ్మదు లాటి మహా పురుషులైనా సరే, అనేక మూఢభావాలను విశ్వసించారు. వాటిని త్యజించలేకపోయారు. కానీ మీ దృష్టిని సర్వదా సత్యం మీదే కేంద్రీకరించాలి. సకల మూఢనమ్మకాలను పూర్తిగా పరిత్యజించాలి.

ముగింపు :


అయ్యా ఓఫీిరుగారూ! వివేకానందుడు అన్నాడని మీరు అన్నట్లు, ఆ ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో, ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలులేవు. ఇక్కడికిది ఒక అబద్దం.

ఆ రోజు వెయ్యి ద్వీపాలవనంలో వివేకానందుడు చెప్పదలచింది ఓంకారాన్ని గురించీ కాదు, క్రీస్తును గురించీ కాదు. క్రైస్తవులుగా ఉండి తన శిష్యులుగ మారడానికి సిద్దపడి తన ప్రసంగాలు వినడానికి వచ్చిన ముగ్గురు నలుగురు క్రైస్తవులతో, బ్రహ్మతత్వాన్ని గురించి మాత్రమే. ఆయన ప్రసంగసారాంశం బ్రహ్మం. ప్రకృతి రూపంలోనూ, విశిష్ట వ్యక్తుల రూపంలోనూ రెండుగా వ్యక్తమవుతూ ఉంది. మనం బ్రహ్మమే. మనమే బ్రహ్మం అని చెప్పాలన్నదే వివేకానందుని ఉద్దేశం.

ఏసు మనిషే ఇకపోతే హైందవ అద్వైతసిద్దాంతం ప్రకారం ఏసూ బ్రహ్మమే, బుద్దుడూ బ్రహ్మమే, రామకృష్ణుడూ బ్రహ్మమే. మనమూ బ్రహ్మమేనన్నదే ఆ ప్రసంగ సారాంశం.

ఏసు అపరిపూర్ణుడు, అనేక మూఢవిశ్వాసాలూ కలిగి ఉన్నవాడు. అతడే రక్షకుడు అనడం మహాపరాధం.

బ్రహ్మనంద సాగరంలో ఏసులాంటివాళ్ళు వీచికలు (చిన్న తెప్ప) వంటి వాళ్ళు మాత్రమే మనమే అసలు బ్రహ్మస్వరూపులం మనం లేకుంటే వాళ్ళంతా మృతప్రాయులే.

గమనిక :- హైందవ క్రైస్తవంలోని ఈ భాగంలో మీరు చెప్పిన లేదా ప్రలోభపెట్టదలచి రాసిన ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలు వివేకానంద అనలేదనీ, క్రీస్తును ఒక మంచి వ్యక్తిగా అదిన్నీ అనేక లోపాలున్న మహనీయునిగా మాత్రమే వివేకానందుడు తలచాడనీ వివేకానందుని మాటలాధారంగానే చూపించాను. దాంతో మీవన్ని అబద్దాలేనని రుజువు చేసినట్లైంది. నిజాయితీ గురించి మాట్లాడడమే తప్పన్నట్లు భాషించారు. మీ నిజాయితీని శంకించకుండేట్లు గుండు గీయించుకుని పిలకపెట్టుకోడానికి సిద్దపడి రండి. ఇక్కడ అన్నీ - మంగలి - కత్తి - సిద్దంగా ఉన్నాయి. మీరు గాని మీ నిజాయితీని నిరూపించుకుంటే, నిజాయితీ గురించి మాట్లాడాల్సిన పని మాకేమీ లేదు.

బాంబులాటి మరోమాట (వివేకానందునిదే ఇది కూడా!) చెప్పనా? ఏసు చారిత్రక వ్యక్తికాడు. మరో భారతీయ తాత్వికుని భావాలను ఏసు పేర ప్రచారం చేశారు. ఆ తాత్వికుడే సముద్ర ప్రయాణ సమయంలో వివేకానందునికి కలలో కనపడి ఈ మాట చెప్పాడు. ఆ కలలోని కొన్ని అంశాలు అనంతరం చారిత్రక పరిశోధనలో తేలాయి.

అట్టపైన మొదట, చివరి పేజీలలో ఉన్న రెండూ మీ పెడపోకడను పట్టిచ్చేవే.

1. ముఖ చిత్రం జాతిని అవమానించుతోంది.

2. అట్ట చివరి పేజిలోనివి, సొంత డబ్బాకు చెందిన అబద్దాలు మాత్రమే.

పుస్తకం లోపలి ముందుపుట 3. సత్యమహంగంభీరః - పులుముడుగొడవే అక్కడా మీ రాతలు అబద్దాల పూతలు మాత్రమే. ఇక పుస్తకం చివరిపేజీలోని 4. ఓంకారమే క్రీస్తు ఆయను అబద్దాలపుట్టే. ఆ విషయమే ఈ వ్యాసంలో చూపించాను.

ఇలా మీ హైందవ క్రైస్తవం మొదటి చివరి పుటల్లోని నాలుగంశాలూ అబద్దాలేనని రుజువు చేశాను. నిరంతర సత్యాన్వేషిననీ, సత్యం నీవు చెప్పు హిందువునవుతానని ప్రకటించిన మీరు మాటకు కట్టుబడి ముందుకు రండి.

1. పరిపూర్ణానంద గారి అమ్మవడిలోకి చేరతారా? లేదా

2. చిన్న జియ్యరుల వారి తిరునామాలు ధరించి గుండుకొట్టుకొని పిలక పెట్టుకుంటారా? లేదా

3. సత్యాన్వేషిని అంటున్నారు గనుక సత్యాన్వేషణ మండలిలో చేరుతారా? మీ యిష్టం.

No comments:

Post a Comment