Tuesday, July 5, 2016

మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన


మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన


(గత సంచిక తరువాయి)

విన్నవాటి విషయంలో లేదా చదివిన వాటి విషయంలో, వాటిని గురించి మరొకరు నీకే విధమైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఏరకమైన వత్తిళ్ళు పెట్టకుండా, నీకునీకుగానే, అప్పటికున్న నీ సొంత జ్ఞానం- అవగాహన - ఆధారంగానే వాటిపట్ల అనుకూలతో, ప్రతికూలతో (ఇష్టమో, అయిష్టమో) ఏర్పడితే అదిగో దానిని అనాలి స్వ-ఇచ్చ = సొంత యిష్టము = స్వేచ్చ అని.

అలాకాక ఆ విన్నవాటి విషయంలో అంటే వాటికి చెందిన సమాచారం వరకు తెలిసిన సందర్భంలో మరొకరుగానీ, ఆ సమాచారం అందించిన వ్యక్తేగాని, వాటి గురించి తన ఇష్టాఇష్టాలననుసరించి నిన్ను ప్రభావితం చేయడం ద్వారా అలాగా! అయితే అది నాకిష్టమేననిగాని, అయిష్టమేనని గాని నీవనుకుంటే దానిని స్వయిచ్చ అనరు. ఆదశలో నీవు ఎంతో కొంత మేర స్వేచ్చను కోల్పోయావు. మరొకరి ఇష్టాయిష్టాల ప్రభావానికిలోనై నావు అనాల్సిందే.

తాత్వికంగా దానినే పరాధీనమనస్కత అంటారు. మనం ఎత్తుకున్న విషయపు విచారణంతటికీ ఇదే ఆధారశిల లాంటి అంశమై ఉంది.

స్వేచ్చంటే ఏమిటి? స్వేచ్చ లేకపోవడమంటే ఏమిటి? అన్న విషయం స్పష్టంగా నిర్వచించుకోగలిగితేనే ఈ రాజ్యాంగ శాసనాన్ని దాని సరైన అర్దంలో వినియోగించుకోగలుగుతాం. స్వార్ధపరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోగలుగుతాం.

బాధ్యత గల ప్రతిపౌరునికీ ఇలాటి విషయాలలో అంటే చట్టం విషయంలో రెండు రకాల బాధ్యతలుంటాయి. 1. చట్టాన్ని తాను సరిగావాడుకోవడం, దుర్వినియోగం చేయకుండడం 2. ఇతరులూ చట్టాన్ని వాడుకునేలా, దుర్వినియోగం చేయకుండేలా చేయగలంత చేస్తుండడం. ఇది అర్ధమైతేనే ఒక వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయవచ్చు. వేయాలి అని రాజ్యాంగం ఎందుకు చెపుతోందో అర్ధమవుతుంది. అలాగే న్యాయస్ధానాలు ప్రజల నుండి ఫిిర్యాదులు లేకున్నా కొన్ని విషయాలను సుమోటోగా తమంత తాముగా విచారణకు తీసుకోవచ్చని, తీసుకోవాలని చట్టం ఎందుకు చెపుతోందోనూ అర్ధమవుతుంది. కనుక రాజ్యాంగంలోని స్వేచ్చకు సంబంధించిన అధికరణాలను అర్ధం చేసుకునే సందర్భంలోగాని, వివరించుకునే, వ్యాఖ్యానించుకునే సందర్భంలోగానీ, వినియోగించుకునే సందర్భంలోగాని పై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇక్కడగాని ఏమాత్రం పొరపాటు పడినా అంటే అవగాహనాలోపం ఏర్పడినా, తప్పవగాహన వున్నా ఇక ఆపై జరిగేదంతా స్వేచ్చనకు స్వేచ్చకాదనుకోవడమో, స్వేచ్చ కాని దానిని స్వేచ్చ అనుకోవడమోనో జరుగుతుంటుంది. వేరే మాటలతో మళ్ళా ఈ విషయాన్నే చెపుతాను చూడండి.

పూర్తి స్వాధీన మనస్సుతో ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకుని అది కావాలనో, వద్దనో కోరుకోడాన్నే - అనుకోడాన్నే - స్వేచ్చ అనాలి. ఏ రకమైన పరాధీనత ఏర్పడినా, అంటే దాని విషయమై అనుకూలంగానో, ప్రతికూలంగానో మరో వ్యక్తి మాటలో, మరొకరచనలోని మాటలో ఏ మేరకు నిన్ను ప్రభావితం చేసినా ఆ దశలో నీవు చేసుకునే నిర్ణయం అది కావాలనిగాని, వద్దనిగాని, అన్న రెంటిలో ఏ రూపంలో ఉన్నా దానిని స్వేచ్చ అనరు. అంటే అది నిజంగా నీ సొంత ఇష్టం కాదన్నమాట. మరొకరి ఇష్టం యొక్క ప్రభావం కలిసి ఉన్న నిర్ణయమన్న మాట అది.

ఈ అవగాహనలేకున్నా, దీనికి లోబడే మత స్వేచ్చా హక్కును మరే స్వేచ్చా హక్కునుగానీ వినియోగించుకోవాలన్న దృష్టి, నిబద్దత లేకున్నా రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ దుర్వినియోగం అవుతూనే ఉంటుంది. మరో రూపంలోనూ దీనినే వివరించవచ్చు.

'స్వతంత్రుడే (నిజమైన) స్వేచ్చను అనుభవించగలడు'. అనంటాను. నామాట తప్పొ వప్పో చెప్పండి చూద్దాం.

దీనిని సక్రమంగా విచారించుకోవాలంటే స్వేచ్చ అన్నమాటతో పాటు స్వతంత్ర మన్నమాటనూ నిర్వచించుకోవలసి ఉంటుంది. తాత్విక క్షేత్రంలో స్వేచ్చ - స్వతంత్రత అన్నవి పర్యాయ పదాలు కావు. పైగా వేరు వేరు అర్ధాలు కలిగి ఉన్న చాలా ముఖ్యమైన పదాలు కూడా. స్వేచ్చ అన్నది ప్రధానంగా మానసిక క్షేత్రానికి వర్తించేపదం. కొన్ని కొన్ని చోట్ల బంధం నుండి విముక్తుడైన సందర్భాలలో - జైలులాటి నిర్భందాల నుండి విడుదలైన సందర్భాలలో స్వేచ్చావాయువులు పీల్చుకున్నాడు, స్వేచ్చ లభించింది లాటి మాటలు వాడుకలో ఉన్నా, దాని అసలైన అర్ధం మానసిక క్షేత్రానికి చెందింది మాత్రమే.

మనిషి శారీరకంగా బంధింపబడి ఉన్నా మానసికంగా అంటే భావాలు, ఆలోచనల విషయంలో సొంత ఇష్టాయిష్టాలనే కలిగి ఉండవచ్చు. దానికి అంటే స్వఇచ్చకు - ఎట్టి ఆటంకాలూ ఉండవు. అదే మరి అతడో శారీరకంగా ఎట్టి నిర్భంధాలు లేని స్థితిలోనూ పరాధీన మనస్కుడై ఉండవచ్చు. ఆ దశలో అతనిలో ఏర్పడిన ఇష్టాయిష్టాలు అతని సొంతానివి అనడానికి వీల్లేదు. అప్పడతడు స్వేచ్చను కోల్పోయినట్లే అదే మరి అతడు భౌతికంగా నిర్బంధాలూ ఉండీ ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలో, స్వీయజ్ఞానం పై ఆధారపడి ఏర్పరచుకున్న ఇష్టాఇష్టాలనే కలిగి ఉన్నట్లైతే, ఆ విషయాల వరకు అతడు స్వేచ్చను కలిగి ఉన్నట్లే. మానసిక పరాదీనత లేనట్లే.

ముఖ్య గమనిక :- అవధారణార్ధం ద్విరుక్తి సరైనదేనని విజ్ఞులంటారు. అంటే భావన గట్టిపడడం కోసం గానీ, అవగాహనలో మరింత స్పష్టత రావడం కోసం గానీ ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పుకోడం తప్పుకాదు సరైనదేనని దానర్ధం. మన ప్రస్తుతాంశం అత్యంత కీలకమైనదీ, సూక్ష్మమైనదీ కూడా అవడం చేత ఒకే విషయాన్ని వివిధ రూపాలలో చెప్పుకుంటూ వస్తున్నాం. చదువరులలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పదజాలం సుబోధకంగా (బాగా అర్ధమవుతూ) ఉంటుంది కనుకనే ఈ పని చేస్తున్నాం.

స్వతంత్రము = స్వ + తంత్రము = స్వ = తన (స్వీయ, స్వీకీయ) తంత్రము = వశము = తనవశము అని ఆ పదానికి అర్ధం. కనుక స్వతంత్రుడు అంటే తన వశంలో తానున్నవాడు, పరవశుడు కానివాడు పరుల అధీనంలో లేనివాడు అని దానర్ధం.

ఇది ప్రధానంగా భౌతిక క్షేత్రానికి వర్తించేదిగా ఉన్నా, మానసిక పరాధీనత, మానసిక స్వాధీనత అన్న సందర్భాలకూ వర్తించగలపదమే. ఒక వ్యక్తి భావదాస్యంతో ఉన్నాడనుకుందాం. అంటే మానసికంగా పరాధీనుడన్నమాట. ఆ దశలో నిర్ణయాలు అతడేతీసుకుంటున్నా, అతడా నిర్ణయాలకు రావడానికి అతని స్వీయ జ్ఞానానికి ఆవలి నుండి వస్తున్న ఇతరుల భావాలు పని చేస్తున్నట్లైతే అతడు మానసికంగా అస్వతంత్రుడుగా ఉన్నట్లే అవుతుంది. అంటే మానసిక స్వేచ్చ లేకపోవడాన్ని, మానసిక స్వతంత్ర లేకపోవడంగానూ చెప్పవచ్చు. అయితే శారీరక పరాధీన స్ధితిని, మానసిక స్వేచ్చ లేకపోవడం అనకూడదు. విషయం అర్ధమవుతుందనే అనుకుంటాను

ముగింపు :- ఒక వ్యక్తి శారీరకంగా బంధింపబడి అంటే స్వతంత్రత కోల్పోయిన దశలోనూ మానసికంగా పరాధీనుడు కాకుండా ఉండగలడు. అంటే శరీరం తన అధీనంలో లేకున్నా మనస్సు తన అధీనంలోనే ఉండడమన్నమాట. ఇది ఆచరణ సాద్యమో కాదో ఆలోచించండి.

అదే మరి అతడు భౌతికంగా ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలోనూ, మానసికంగా పరాధీనుడై ఉండవచ్చు. ఆ దశలో భౌతిక నిర్భందం లేకున్నా, మానసికంగా స్వయిచ్చ - స్వేచ్చ  లేని వాడే.

ఒక సందర్భంలో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని బంధించి ఉంచి, మేము చెప్పినట్లు నడచుకుంటానంటే నిన్ను విడిచిపెడతాము, మరి కొంత లాభాన్ని చేకూరుస్తాము. అలా కాక మేము చెప్పినట్లు వినకున్నా, నడచకున్నా నిన్ను విడిచిపెట్టము, మరిన్ని కష్టాల పాలు చేస్తాము. అన్నారనుకోండి. అప్పుడతను మీరేమి చేసినా నా నడవడిని మార్చుకోను, మీ ఇష్టమొచ్చింది మీరు చేసుకోండి అన్నాడనుకోండి. అతడు శారీరకంగా పరాధీనుడేగాని, మానసికంగా పరాధీనుడుకాలేదు. స్వాధీనమనుస్కుడే, స్వతంత్రుడే అనితీరాలి. అంటే స్వేచ్చ = స్వ + ఇచ్చ కలవాడేనని తీరాలి. మరి కొంత చెప్పవలసింది ఉన్నా, ఒకింత వివరంగానే చెప్పుకున్నాం స్వేచ్చ గురించి. ఈ మేరకు అర్ధమైనా మనం భారత రాజ్యంగం కల్పించిన మతస్వేచ్చను సక్రమంగా అర్ధం చేసుకోడానికి సరిపోతుంది. విజ్ఞులైన పాఠక మిత్రులకు స్వేచ్చకు సంబంధించిన నాఈ రచనలో ఏవైన లొసుగులున్నాయనిపించినా, దీనిని మరింత పరిపుష్టం చేయడానికి పనికి వచ్చే భావాలు మీ దగ్గరున్నా నాకు తెలియపరచండి. ఈ విషయాన్నంతటినీ ఒక చిన్న పుస్తక రూపంలోకి తెస్తున్నాము. మలిముద్రణ నాటికైనా మీ భావాలు మాకందితే ప్రజలకు మరింత సమగ్రమైన సమాచారాన్ని అందించే వీలు కలుగుతుంది.

మత స్వేచ్చ - భారత రాజ్యాంగం ప్రకారం


భారత రాజ్యాంగంలో మత స్వేచ్చకు సంబంధించిన అధికరణాలు ముఖ్యంగా నాలుగు. మరికొన్ని అధికరణాలూ వీటి పరంగానూ అర్ధం చేసుకోడానికీ, వాటికి బలాన్నివ్వడానికీ సంబంధ పెట్టుకోడానికి వీలుగా ఉండి ఉండవచ్చు. ముందుగా ఈ నాల్గింటిని గురించి చెప్పుకుందాం.

ఒక్కమాట ! పైన మనం 'స్వేచ్చ' అన్నమాటకు స్వతంత్రం అన్న మాటకు అర్ధాల్లో తేడా ఉందని చెప్పుకుని అదెలానో కూడా వివరించుకున్నాం. మరిప్పుడు ఈ ప్రకరణలోని 'మతస్వేచ్చ - మత స్వాతంత్య్రము అన్న మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి?

స్వేచ్చ = ఫ్రీ విల్‌, స్వాతంత్రము = ఫ్రీడమ్‌ అన్న రెంటి స్వభావంలో కొంత పోలికా, కొంత వ్యత్యాసమూ ఉంది.

మత స్వేచ్చ అన్న పదం వాడితే దానర్ధం ఉన్న విశ్వాసాలలో ఏదో ఒక దానిని లేదా దేనినిగానీ ఇష్టపడడానికీ, ఇష్టపడకపోవడానికీ, ఎటువంటి బాహ్యవత్తిడులూ కారణం కాని రీతిలో తన సొంత అవగాహననుండే ఇష్టం ఏర్పడడం అన్న అర్ధమే చెప్పుకోవాలి. అలా ఇష్టాన్ని ఏర్పరచుకునే హక్కును రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా అందిస్తోంది. అంటే నీవు ఎంచుకో, దానికి అడ్డంకులు ఏర్పడకుండానూ, అమలయ్యేలానూ బాధ్యత మేము తీసుకుంటాం అని ఒప్పందం చెప్పడమన్నమాట. ఈ మాటలను మరో రూపంలో చెప్పుకుంటే నీవెంచుకుంటే అది మత స్వేచ్చ అవుతుంది. అది అమలయ్యేట్లు చూడడమంటే నీకు స్వాతంత్య్రం ఏర్పడడం, (ఏర్పరచడం) అన్నమాట. మత స్వేచ్చను హక్కుగా చేయడమంటే మతం విషయంలో స్వతంత్రుణ్ణి చేయడమన్నమాట.

మరోరకంగా చెప్పుకుంటే వ్యక్తిమతపరంగా దేనిని ఇష్టపడతాడో దానిని అనుసరించుకునేందుకు ప్రతికూలతలు లేకుండా చూడడం, అనుకూలతలు కల్పించడం అని దానర్ధం. హక్కు అమలయ్యేట్లు చూడడమే రాజ్యాంగ శాసనాలన్నింటిలోకి తలమానికమైన శాసనం. ఆర్టికల్‌ 32 హక్కులకు రక్షణ అన్నదే. అందుకే ఆర్టికల్‌ 32 రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అన్నాడు అంబేద్కర్‌ మహాశయుడు.

మరొక్క ముఖ్యమైన విషయాన్ని నిరంతరం గమనికలో ఉంచుకుంటేనే హక్కుల గురించి సరైన అవగాహనకు రాగలుగుతాం. ఒప్పందంలో పొందుపరచిన ఏ హక్కులైనా వాటి వాటికి సంబంధించిన పరిమితులకులోబడే ఉంటాయి. పరిమితుల్లేని స్వేచ్చగానీ, స్వతంత్రం గానీ హక్కుగా సరైన ఏ ఒప్పందంలోనూ ఉండదు. ఉండకూడదు. ఈ విషయం 100% సరైందే కనుకనే మన రాజ్యాంగంలోనూ స్వేచ్చ స్వాతంత్య్రాలకు సంబంధించిన అధికరణాలన్నింటా అక్కడే దాని పరిమితులు విధింపబడి ఉన్నాయి. స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ ఈ పరిమితులకు లోబడి అన్నమాట - పదం - వాడితీరాలి. ఒప్పందంలో సంపూర్ణ స్వేచ్చ, సంపూర్ణ స్వాతంత్య్రం అన్నమాటలుండవు.

ఇప్పుడిక మతస్వేచ్చకు సంబంధించిన అధికరణాలను చూద్దాం


అధికరణం : 25 : freedom of conscience and free proffession, practice and propagation of religion..

1.పడాల రామిరెడ్డి :- ఇది, అంతరాత్మ (freedom of conscience) ననుసరించిన స్వాతంత్య్రము, స్వేచ్చాయుత మతావలంబన, ఆచార ప్రచారములను practice and propagation of religion గురించి వ్యవహరిస్తోంది.

2. తెలుగు అకాడమీ :- అంతరాత్మ స్వాతంత్య్రాన్ని, స్వేచ్చగా మతాన్ని అవలంభించడానికి, ఆచరించడానికీ, ప్రచారం చేసుకోడానికీ ఈ ప్రకరణ అనుమతినిస్తున్నది.

3. సుంకర రమాదేవి :- అంతరాత్మ ప్రబోధానుసారం మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు బలవంతపు మతమార్పిడులపై నిషేధం.

గమనిక : అనువాదాలకెప్పుడూ కొన్ని పరిమితులుంటాయి. అనువాదకుని భాషాభిజ్ఞత, శైలి అన్న రెండూ అనువాదకులు ఒకే విషయాన్ని వేరు వేరు మాటలతో చెప్పడానికి కారణాలవుతుంటాయి. ఈ ఇబ్బంది ఉంది కనుకనే పదానువాదం, భావానువాదం, స్వేచ్చానువాదం అంటూ అనువాదంలో అనేక రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో దేని ప్రయోజనాలు దానికున్నాయి. దేని బలహీనతలు (ఇబ్బందులు) దానికున్నాయి. వాటిని ఇప్పుడు మనమేమీ చేయలేం, ఎప్పటికప్పుడు మరింత జాగ్రత్తగా దాని అసలు భావాన్ని గ్రహించే శ్రద్ద పెట్టడం తప్ప.

సురేంద్ర :- మత విశ్వాసాలను స్వయంగా ఎన్నుకునే (యిష్టపడడం, అయిష్టపడడం కూడా ఎంపికే) ప్రకటించుకునే ఆచరించుకునే, ప్రచారం చేసుకునే స్వయిచ్చకు ఆచరణరూపం అంటే స్వతంత్రమూ ఏర్పడేందుకు వీలుగా దానిని హక్కుగా ప్రకటిస్తోందీ

గమనిక :- పరిమితుల్లేని హక్కులుండవు ఏ ఒప్పందంలోనూ (రాజ్యాంగంలోనూ) అని చెప్పుకున్నాం గుర్తుంది కదూ! ఇదిగో దీనికీ రాజ్యాంగం కొన్ని పరిమితుల్ని విధిస్తొంది గమనించండి.

అధికరణం 25/(1) :- Subject to the public order, morality and health and to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion.

సురేంద్ర :- పబ్లిక్‌ ఆర్డర్‌ అన్న మాటకు ప్రజాశాంతి అని కొందరు ప్రజా సంక్షేమం అని సుంకర రమాదేవి అనువాదం చేశారు. పరిమితులను తెలుపుతూ వాడిన పదాలకు నిక్కచ్చి అర్ధాన్ని లేదా ఆ సందర్భానికి బాగా నప్పుతుందనిపించే అర్ధాన్నిచ్చేలా చాలా జాగ్రత్తగా అనువదించాలి. పబ్లిక్‌ ఆర్డర్‌ అంటే సమాజంలోని జనుల నడవడిని రాజ్యాంగంలోని అనేక శాసనాలు క్రమ బద్దంగా ఉండేలా నియంత్రిస్తుంటాయి. ఎట్టి అపసవ్యతలు, అలజడులూ, అక్రమాలు, చోటు చేసుకోకుండా కట్టడి చేస్తుంటాయవి. ఈ మొత్తాన్ని కలిపి ఒప్పందం ద్వారా అమలవుతున్న సామాజిక కట్టడి అంటాము. దీనికి భంగం కలకుండా మాత్రమే పై చెప్పిన స్వేచ్చా స్వాతంత్రాలను వాడుకుంటుండడం అన్న అర్ధాన్నిస్తుంది. subject to the public order అన్న వాక్యం. క్రమం నడుస్తుంటే ప్రజాజీవనం శాంతియుతంగా సాగుతుంటుంది. గనుక ప్రజాశాంతికి భంగం కలగని రీతిలో అని అనువదించారు. ప్రజా సంక్షేమానికి ఆటంకం కలగని రీతిలో అన్నది ఒకింత స్వేచ్చానువాద రీతికి చెందిందైనా రాజ్యాంగ ప్రధానాకాంక్ష ప్రజా సంక్షేమమే. కనుక అన్ని శాసనాల పర్యవసానం ప్రజా సంక్షేమమే కనుక ఆ శాసన హృదయం ప్రజా సంక్షేమం అనడం తప్పుకాదు. కాని పబ్లిక్‌ ఆర్డర్‌ అన్న దానికి సామాజిక జీవన గతిలో క్రమం జరుగుతుండేలా క్రమరాహిత్యం చోటు చేసుకోకుండా ఉండే మేరనే ఈ మత స్వేచ్చ స్వాతంత్రపు హక్కు ఉంటుంది.

25/ 1 :- Morality అన్నది పరిమితులకు సంబంధించిన మరో మాట. నీ విశ్వాసం, ప్రకటన, అభ్యాసం, ప్రచారం అన్న నాల్గింటి విషయంలోనూ ఎలాంటి అనైతికతా చోటు చేసుకోకూడదు. నిజానికీ పదాన్ని చాలా లోతుగా విస్తారంగా వివరించుకోవాలి. ఉదా :- మతాదేశాలలోని నిజంగా నీకు తెలియని అంశాలనూ, రుజువుకు నిలబడవని తెలిసిన అంశాలనూ తెగ తెలిసిన వానిమల్లే సత్యాలని, అనేకసార్లు రుజువైనాయని ప్రకటించడంలో అనైతికత ఉందాలేదా?

ఉదా:- 'విశ్వాసి తాను చేసిన లాటివేకాక, అంతకంటే గొప్ప పనులూ చేయగలుగుతాడు' అన్న ఏసు వాక్యమొకటుంది బైబిలు కొత్త నిబంధనలో, ఈనాడు బైబిలు ప్రచారకుల్లో చాలామంది, ఎక్కువలో ఎక్కువ మంది, తాను ఏసుకు అత్యంత సన్నిహితుణ్ణి అనీ, ఏసే తనను నడిపిస్తున్నాడని బల్లగుద్ది మరీ ప్రకటిస్తుంటారు. ఇది నిజమా? అబద్దమా తెల్సుకోవాలంటే బైబిలు ప్రకారం మనకున్న ఒకే ఒక మార్గం. విశ్వాసి సుళువుగా చేయగలడని ఏసు చెప్పినవి చేసి చూపండని అడగడం, నిలదీయడమే వారిలో ఎవరందుకు సిద్దపడకపోయినా వారిలో అనైతిక చోటు చేసుకుందనే అర్ధం అనుకోవలసివస్తుంది.

గమనిక :- ఉదాహరణ ఏసుని- క్రైస్తవ ప్రచారకుణ్ణి ఎత్తుకున్నా గనక అది వారికి పరిమితమైంది మాత్రమే అనుకునేరు. నా మాటలు అన్ని ఆస్తిక ధోరణులవారికేగాక, ఆస్తికేతర ధోరణుల వారికీ వర్తిస్తుంది. లక్ష్మీయంత్రాలు, ఆరోగ్య యంత్రాలు, గెలుపు యంత్రాలు, విద్యాయంత్రాలువగైరాల గురించి మాట్లాడుతుంటే, దానినే వృత్తిగనూ చేసుకుని బ్రతుకుతుండే వారిలోనూ అనైతికతాంశం లేదనగలమా?

25/1/5 ఆరోగ్యం :- మనం విశ్వసించిన మతాచరణలో ఆరోగ్యాన్ని చెడగొట్టే అంశాలుంటే వాటిని ఈ స్వేచ్చ క్రింద అభాసంచేయరాదు. అలాగే వాటిని ప్రకటించడం, ప్రచారం చేయడమూ చేయరాదు. ఆ అభ్యాసం ఆచారకాండ, వ్యక్తిని మానసికంగా శారీరకంగా అనారోగ్యానికి దారి తీయరాదు. ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి.

ఉదా :- హిందూ సాంప్రదాయాలలోని ఉపవాసాలు, వాతావరణ కాలుష్య కారకాలైన కర్మకాండలు ఆచారం పేరున అనారోగ్యకారకాలైన, మురికి నీళ్ళు స్నానాలు అపరిశుభ్రమైన ఆహార పానీయాల స్వీకరణ, జాతరలు ఇలా ఎన్నో ఈ ఆరోగ్యం అన్న మాట క్రింద మతస్వేచ్చకు పరిమితుల్ని విధిస్తుంది. అన్ని మతాల ఆచార కాండలోనూ, ఎక్కడోచోట, ఎంతో కొంత మేర ఈ అపరిశుభ్రత, కాలుష్యాలూ ఉండడం చూడవచ్చు. ఇది చిన్న విషయం కాదు గనుకనే దీనిని స్వేచ్ఛా శాసనానికి పరిమితులభాగంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానిదేముందిలే అని కొట్టేయడానికో. పక్కన పెట్టేయడానికో తగిందికాదిది.

గమనిక :- మన రాజ్యాంగ నిర్మాతలకు, పరిష్కర్తలకూ ఈ మూడు చెప్పి ఊరుకుంటే సరిపోదని అనిపించే మత స్వేచ్ఛాహక్కు పరిమితుల భాగం చాలా పెద్దదిగా ఉంది, ఉండాలి అనుకునే ఈ భాగంలో మరో మాటనూ పొందుపరిచారు.

And the other provisions of this part.  ఇందులో of this part   ఈ విభాగానికి చెందిన other provisions ఇతరాంశాల లోను ముడిపడి అన్నది. రాజ్యాంగంలోని ఈ భాగంలోని అంశాలకు అంటే ప్రాధమిక హక్కుల భాగంలోని అధికరణాలకు అనుకూలంగా ఉండే, ప్రతికూలం కాని రీతిలో మాత్రమే పై మత స్వేచ్ఛాస్వాతంత్య్రాలు హక్కుగా సంక్రమిస్తాయి అని చెప్పినట్లైంది. ఆ మూడవ భాగంలోని సాధారణాంశాలను గమనించండి.

రాజ్యాంగం 3వ అధ్యాయం ప్రాధమిక హక్కులకు సంబంధించిందై ఉంది.

ఎ. తెలుగు అకాడమీ :- 12 నుండి 35 వరకున్న అధికరణాలు ప్రాధమిక హక్కులను తెలుపుతాయి.

బి. వాటిని (6) రకాలుగా విభజించి అర్ధం చేసుకోవచ్చు. అవి.

1. సమానత్వహక్కు సంబంధితాలు 14 నుండి 18 వరకు (5)

2. స్వేచ్ఛా హక్కుకు సంబంధించినవి 19 నుండి 22 వరకు (4)

3. పీడన నిరోధక హక్కుకు సంబంధించి 23 - 24 అధికరణాలు (2)

4. మత స్వేచ్చా హక్కుకు సంబంధించినవి 25 నుండి 28 వరకు (4)

5. విద్య మరియు సాంస్కృతిక హక్కు సంబంధంగా 29, 30 అధికరణలు (2)

6. రాజ్యాంగ పరిరక్షణ హక్కు సంబంధించిన 32వ అధికరణం (1) = 18 ప్రాధమిక హక్కులు

గమనిక :- 25/1 అధికరణంలోని బిదీఖి శినీలి ళిశినీలిజీ చీజీళిఖీరిరీరిళిదీరీ ళితీ శినీరిరీ చీబిజీశి అన్న మాట, పై 18 అధికరణాలతో ముడిపడి, వాటికి ఆటంకం కాని రీతిలో మాత్రమే మత స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న అత్యంత కీలకాంశాన్ని తెలియజేస్తున్నది. ఆ మొత్తాన్ని ఒకటికి పది మార్లు చదివాకనే మత స్వేచ్చకున్న అవధుల్ని గమనించాకనే, మత స్వేచ్చ గురించి సరిగా మాట్లాడే అర్హత వస్తుంది ఎవరికైనా.

25/2 :-Nothing in this article shall affect the operation of any existing law or prevent the state from making any law
సురేంద్ర :- మత స్వేచ్చకున్న పరిమితుల్ని, అపరిమితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి రాజ్యాంగాన్నమలుచేయడానికి తగిన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వానికున్న అధికారాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తోందీ 25/2 వ భాగం.

ఉనికిలో ఉన్న ఏ చట్ట వినియోగాన్ని ప్రభావితం చేయడానికి నూతన చట్టాలను చేయడానికి ప్రభుత్వానికున్న అధికారాన్ని అడ్డుకోడానికిగానీ ఈ మత స్వేచ్చా హక్కు క్రింద ఉన్న అంశాలేవీ ఏ రకంగానూ కల్పించుకోలేవు.

25/ 2 (ఎ) :- :- regulating or restricting any economic financial, political or other secular activity which may be associated with religious practice

మతావలంబనకు మతాచారాలతో కలిసి ఉన్న ఆర్ధికాంశాలు, రాజకీయాంశాలు మరియు ఇతర లౌకిక స్వభావం కల పనులను క్రమబద్దీకరించే లేదా పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

25  :- వివరణ (1) శిక్కులు కృపాణం ధరించవచ్చు. (2) సిక్కు, జైన, బౌద్దులూ హిందూ మతంలోని భాగాలే. మతమంటే ఏమిటి? అన్నదానికి సుప్రీంకోర్టు, అది తప్పనిసరిగా ఆస్థిక మతమై ఉండాల్సిన అవసరం లేదనీ అది వ్యక్తుల సమాజాల విశ్వాసానికి సంబంధించినదై ఉంటే చాలునని వివరణ చేసింది. ఆ దృష్టితోనే దేవుణ్ణి అంగీకరించని జైన బౌద్దాలనూ మతాలుగనే పరిగణించింది.

ముగింపు,  సురేంద్ర :- ఈ అధికరణం యొక్క సారాంశం :- ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా. స్వాతంత్రాల హక్కు ప్రజాశాంతికి, నైతిక విలువలకు, ఆరోగ్యానికీ భంగం కలిగించని మేరకే ఉంటుంది. అంతేగాక ఆ స్వాతంత్య్రము, మిగిలిన వ్యక్తులకు రాజ్యాంగం 3వ విభాగం ద్వారా కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కలిగించనంతవరకే ఉంటుంది. ఆ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగపు మూలభూత లక్షణమైన లౌకికత స్ధాపనకు ప్రతికూలం కానంత వరకే ఉంటుంది. ప్రజా సంక్షేమానికి అవసరమైన ప్రభుత్వ నియంత్రణాధికారానికీ లోబడే ఉంటుంది.

 ముఖ్య గమనిక :- నాస్తికవాదమూ, లౌకికవాదమూ రెండూ ఒకటికాదు. వేరు వేరు. భారతరాజ్యాంగం లౌకికవాదాన్ని తన ఆచరణ క్షేత్రానికి పునాది - ఆధార -భావనగా స్వీకరించింది. అయినా అది నాస్తిక వాదాన్ని స్వీకరించలేదు. పైగా నాస్తిక వాదాన్ని స్వీకరించడం - స్వీకరించకపోవడం మత స్వేచ్చా హక్కు భాగానికి చెందింగా భావించింది.

1) నాస్తిక వాదం, అన్ని రకాల ఆస్తికవాదాలు చెప్పే దేవుడు, జీవులు, జన్మాంతరాలు, పరలోకాలు, స్వర్గనరకాలు, తీర్పుదినాలు వగైరాలన్నీ అబద్దాలనీ, మూఢనమ్మకాలనీ, అట్టివేవీ లేనే లేవనీ పేర్కొంటుంది. దానితోపాటు ఈ లోకమే వాస్తవమనీ అంటుంది.

2) అదే మరి లౌకికవాదం, వ్యక్తి - సమాజము - ప్రకృతిలకు సంబంధించి మానవుల మధ్య జరిగే వ్యవహారమంతా ఈ లోకానికి పరిమితమైంది మాత్రమేననీ ఆస్తికులు చెప్పే దేవుడు వగైరాలున్నాయన్న విషయంగానీ, నాస్తికులనే అట్టి వేవీ లేవు అనే విషయంగాని తన ప్రకారం వ్యవహారాలు నడుపుకోడానికి అవసరం లేదనీ అంటుంది.

కనుక, లౌకిక వాదమంటే నాస్తికమేనని అనుకోవడం అవగాహనాలోపం వల్లనేనని నేనంటున్నాను. అందుకనే ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రాలున్నూ దేవుడున్నాడా? లేడా అన్న విషయాన్ని ప్రస్తావించవు. విచారణాంశంగానూ స్వీకరించవు. వాటి పనల్లా ప్రకృతిని శోధించడం, ఎరుకలోకి వచ్చిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు అప్పటికి అందినంత, అందిన రూపంలో ప్రజలకు అందించడం, వాడుకోడానికి పనికివచ్చేదైతే వినియోగ రూపానికి తెచ్చుకోవడం, ఇదే దాని క్షేత్రం కనుకనే అదిన్నూ ఆస్తికతను గురించి గానీ, నాస్తికతను గురించిగాని మాట్లాడదు. మన భారత రాజ్యాంగాన్ననుసరించి పాలన - నిర్వహణ వ్యవహారమంతటికీ ఆస్తికత ఎంత దూరమో, నాస్తికతా అంతదూరమైనదే. ఆ రెంటినీ సమాన దూరంలో ఉంచుతూనే లౌకిక వాద స్వభావంతో పనులను నిర్వహిస్తుంటుందది. ప్రజలూ అలానే ప్రవర్తించాల్సి ఉంటుందని శాసిస్తుంది.

ఇదంతా ఇప్పుడెందుకు చెపుతున్నానంటే, నాస్తికత్వమే తమ తాత్విక వైఖరి అనే లేదా అనుకుంటుండే భౌతికవాద దృక్పధం కలిగి ఉన్నవాళ్ళకూ కూడా 25వ అధికరణంలో చెప్పిన మత స్వేచ్చా హక్కుతో పాటు దానికున్న పరిమితులన్నీ వర్తిస్తాయి. అంటే సామాజిక అస్తవ్యస్తత ఏర్పడే లేదా ప్రజాశాంతికి భంగం కలిగే రీతిలో వారైనా వారికి ఉన్న దేవుడు లేడనే స్వేచ్చా హక్కును వాడకూడదు. ఎందుకనంటే ఇతరులకున్న మత స్వేచ్ఛ హక్కును అడ్డుకోడంగానీ, వ్యతిరేకించడంగానీ ఎవరూ చేయకూడదు. దానితోపాటు 25/2 లో చెపుతున్నట్లు, ఆయా మత విశ్వాసులకు ప్రాథమిక హక్కుల రూపంలో సంక్రమించిన వాటిపరిమితులను ఎవరూ అతిక్రమించకూడదు. మత స్వేచ్చను వినియోగించుకునే విషయంలో ఇదెంతో కీలకమైన అంశము. కానీ దీనిని ఎడాపెడా అనేవాళ్ళూ పట్టించుకోడంలేదు. అనిపించుకునే వాళ్ళూ పట్టించుకోడంలేదు. కనుకనూ,వాళ్ళెవరు పట్టించుకుందామనుకున్నా ప్రభుత్వం అసలే పట్టించుకోదు కనుకను ఆ అధికరణాలకు విరుద్దంగా ఎన్నో జరిగిపోతున్నా సమాజంలో ఎలాంటి అలజడులూ, ఆందోళనలు పుట్టుకరావడంలేదు.  అధికరణం 26 :-freedom to manage religious  affairs. subject to public order, morality and healths, ....

 తెలుగు :- మత సంబంధమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వాతంత్య్రముంది.

1. మత సంబంధమైన సంస్థలన్నింటికీ, సంస్థలను మత పరమైన, ధార్మికపరమైన కార్యక్రమాలను స్ధాపించి, నిర్వహించుకునే - వాటికి సంబంధించిన సొంత వ్యవహారాలను నిర్వహించుకునే, స్ధిరచరాస్థులను సమకూర్చుకునే చట్టానికి న్యాయ పద్దతులకు లోబడి వాటిని పర్యవేక్షించుకునే స్వాతంత్య్రం ఉంది.

అధికరణం 27 :- ఆదాయ వ్యయాలు, పన్నులకు సంబంధించిన వివరాలున్నాయి.

అధికరణం 28 :- దిగువ సూచించిన పరిమితులకు లోబడి మత సంస్థలు ఏర్పరచుకునే విద్యాలయాలలో వారి వారి మత నియమావళిని, ఆరాధనలను గురించి బోధించవచ్చు.

ఈ నాలుగు అధికరణాల క్రింద 'రాజ్యాంగం' కల్పించిన మత స్వేచ్చా హక్కు, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికీ, మిగిలిన ప్రాథమిక హక్కుల అమలుకూ ఆటంకం కాని రీతిలో మాత్రమే ఉండాలన్నది ఈ మొత్తానికీ పరిమితుల్ని విధిస్తూ కట్టడి చేస్తుంటుంది.

అత్యంత సారరూపం


భారతదేశంలో ....

1) ఖురాను ఒక ముస్లింను అనుసరించమన్న విధులుగాని, నిషిద్దాలుగానీ, అది చెపుతున్న నేరాలు, శిక్షలు గానీ యధాతధంగా అమలుపరచే, ఆచరించే స్వేచ్చ ఉందా? లేదా? ఖురానుకు సంబంధించిన రాజ్యాంగం అంగీకరించే విశ్వాస స్వేచ్చ, ఆరాధనా స్వేచ్చ, ప్రచార స్వేచ్చ అన్నదాని అర్ధం, ఖురానును అన్ని విషయాలలో 100% అనుసరించే స్వేచ్చ అని అర్ధమా?

రాజ్యాంగపు సమాధానం :- కానే కాదు 1) ఇతర మత విశ్వాసుల స్వేచ్చకు అడ్డురాని, భారతరాజ్యాంగపు లెక్కన మాత్రమే నేరాలు, శిక్షలను మాత్రమే అమలుపరచుకునేందుకు లోబడి ఉన్నంత మేరనే వారికి మత స్వేచ్చ ఉంటుంది.

ఖురాన్‌ అంగీకరించిన విగ్రహాల విధ్వంసం చేసే స్వేచ్చ ఉందా ఈ మత స్వేచ్చలో? సమాధానం :- లేదు గాక లేదు. ఎందుకంటే అది మరో పౌరుని మత స్వేచ్చను కాదంటూంది కనక.

భారత రాజ్యాంగం ప్రకారం బైబిలులోని మోషే, ధర్మశాస్త్రాన్ని యధాతధంగా అమలు పరచుకునే స్వేచ్చ ఉందా? యూదులకుగానీ, క్రైస్తవులకు గానీ?

 సమాధానం :- లేదుగాకలేదు. వారంతా ఈ లోకసంబంధమైన వ్యవహారాలు, నేరాలు, శిక్షలు భారత రాజ్యాంగ నిర్ధేశాల మేరకే అనుసరించడానికి లోబడి దానికి అడ్డురాని భాగం వరకే మత స్వేచ్చను కలిగి ఉంటారు.

భారత రాజ్యాంగం ప్రకారం ..

3) ఈ దేశ మతాలు లోగడ అనుసరించిన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసుకునే స్వేచ్చ కలిగి ఉంటారా?

సమాధానం  :- అట్టి స్వేచ్చ కలిగి ఉండరు గాక, కలిగి ఉండరు. వారెవరైనా, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా భారత రాజ్యాంగానికి ప్రతికూలం కాని అంశాల వరకే వారి మత గ్రంధాలను విశ్వసించే, ఆరాధించే పాటించే స్వేచ్చను కలిగి ఉంటారు.

ముగింపు


 మత విశ్వాస స్వేచ్చా హక్కు కలిగించడమంటే, తనకు నచ్చిన ఆరాధ్యాన్ని, ఆరాధనారీతిని విశ్వసించే, అనుసరించే స్వేచ్చ అని మాత్రమే అర్ధం. వారి వారి మత గ్రంధాలను తు.చ . తప్పకుండా అనుసరించే స్వేచ్చ అని అర్ధం కానే కాదు. నాస్తికులతో సహా ఎవరుగానీ, ఏ మత విశ్వాసాలను గాని నిందించే, కించపరచే, తప్పుని చెప్పేస్వేచ్చ ఉండనే ఉండదీ మత స్వేచ్చలో. అలాగే మత విశ్వాసాలను గానీ, ఆరాధనా రీతులనుగానీ, రాజ్యాంగంలోని మరే అధికరణాన్ననుసరించైనా నిందించే ఖండించే స్వేచ్చ ఉండదు. ఎందుకనంటే మత స్వేచ్చను గూర్చిన భాగమంతా దిగువ నిబంధనకు లోబడింది మాత్రమే.

Subject to public order morality and health and to the other provisions of this part all persons are equally entitled to the freedom of conscience.

ప్రశ్న :- మరైతే ముస్లిం వివాహ విధి, బహుభార్యాత్వం, విడాకుల విధానం పై సూత్రాన్ని అతి క్రమిస్తున్నేౖ కదా! అది వారి మతాచారం అనడం న్యాయంకాదు. సమన్యాయాన్ని తృణీకరించడం కూడా కదా?

 నా సమాధానం :- నూటికినూరు శాతం బహుభార్యాత్వంగాని, విడాకుల విధానంగాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనదే, వివాహమన్నది 1) ఈ లోక సంబంధమైనది

2) స్త్రీ పురుషులుగా ఉన్న మనుషులకు సంబంధించినది

3) శారీరక - మానసిక అవసరాలు కొరకు ఏర్పరచింది.

4) సామాజికావసరాలతోనూ ముడిపడి ఉన్నది.

కనుక మత గ్రంథం చెపుతోంది కనుక అన్న నెపాన, స్త్రీ పురుషుల మధ్య అసమానతను, సామాజిక అన్యాయానికీ దారితీసే అలాంటివాటిని 1) నిషేదించాలి 2) ఉక్కుపాదంతో అణచి వేయాలి. భారత రాజ్యాంగపు పరమాశయం వివక్షారాహిత్యం, సమానత్వం స్ధాపనే.

1) మతాచారం అంటూ బాల్యవివాహాలు చేసుకోవచ్చా?

2) మతాచారాం అంటూ సతీసహగమనం చేయవచ్చా?

3) మతాచారం అంటూ వ్యభిచార నేరానికి రాళ్ళతో కొట్టిచంపవచ్చా?

 చివరి మాట :- సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి అనివార్యం, తప్పనిసరి.

నలుగురిని చేసుకుంటాను, నచ్చకుంటే తల్లాకంటాను అనే వ్యక్తుల మానసిక స్ధితిని చక్కజేయనైనా చేయాలి. పక్కలిరగదన్ననైనా తన్నాలి. అంతేగాని దీనిని వాద వివాదాలలోకి లాగనే కూడదు. మానవులంతా సమానులే. అన్న దిశగా ఒక్క మెట్టు ఎక్కుతూ అడ్డు వచ్చిన వాటినన్నింటినీ ప్రక్కకునెట్టేస్తూ సాగడమే అసలైన వివేకపథం.
Common civil code  ఉమ్మడి పౌరస్మృతి కై పెద్ద ఎత్తున ఉద్యమించాలి. దానిని కాదనే వారిని ఎందుకు కాదంటున్నారని నిలదీయాలి. ఈ విషయమై అన్యాయానికి గురవుతున్న తీవ్ర మనోవేదననుభవిస్తున్న, మనస్సంగీకరించకున్నా సర్దుకుపోతున్న మహిళల ఆలోచనలో మార్పు రావాలి. సమానత్వ సాధనకై ఉద్యమించాలి. అవసరమైతే తిరగబడాలి. బుద్దున్న మగవారంతా ఆ ఉద్యమానికి అండగా నిలవాలి.

7వ శతాబ్ది నాటి సామాజిక పరిస్థితులు - అవసరాలు - ఆచారాల గొడవ మనకు అనవసరం. ఈనాడు మన వివేకానికి అందినంతలో, ఈనాటి, రేపటి తరాల మానవులందరికీ న్యాయాన్నందించగలవీ, సామాజికావసరాలకు ఉపయుక్తంగా ఉండగలిగేవీ అయిన నియమ, నిబంధనలను, ఉన్నవాటి నుండి పనికి వచ్చేవి తీసుకుని లేనివాటిని జత చేసుకునే విధానాన్ని అమలుపరచుకుంటూ సాగడమే బుద్ధిమంతులనుసరించదగిన విధానం.

దేవుని పేరున గానీ, మరేపేరున గానీ, మార్చుకోనక్కరలేని, మార్చకూడని వంటూ సంపూర్ణాలంటూ మన నెత్తిన పెట్టే వేటినీ యదాతధంగా స్వీకరించడం, స్వీకరించాలనడం బుద్దిమంతులు చేయగలిగిన, చేయవలసిన పని మాత్రం కాదు.

 గమనిక :- వ్యక్తిగతాంశాలను ప్రస్తావించకుండా, విషయ నిష్ఠతో ఈ వ్యాసం పై సూటిగా, నిర్మొగమాటంగా స్పందించండి. మేలు కలిగించే వాటిని జతచేసుకోడానికి మండలి సర్వదా, సర్వదా సిద్దంగా ఉంది, ఉంటుంది.

పాత కొత్తల మేలుకలయికే ఎప్పటికప్పుడు అప్పటికి మెరుగైన విధానం అవుతుందన్నది, ధర్మాధర్మాల విషయంలో మండలి మూలభావనల్లో ఒకటి.

సత్యాన్వేషణలో - మీ సురేంద్ర

1 comment:

  1. మతం వేరు కులం వేరు కదా . కోన్ని కులం వాళ్లు వేరే మతాన్ని స్వీకరిస్తే కుల మారుతుందా రాజ్యాంగంలో వీటికి అవకాశం ఉందా మతం మారితే కులం మారుతుందా

    ReplyDelete