Friday, July 15, 2016

స.హ. ఐక్యవేదిక తృతీయ వార్షికోత్సవ విశేషాలు

స.హ. ఐక్యవేదిక తృతీయ వార్షికోత్సవ విశేషాలు


1)     పరవాలేదు బాగానే జరిగిందనిపించింది సభ. ఉద్యమ భవిష్యత్తు విషయంలో ఒకింత ఆశావహంగానూ అనిపించింది

    అదే సమయంలో, అన్ని జిల్లాల నుండి ముందుగా అనుకున్నంత సంఖ్యలో సభ్యులు (కార్యకర్తలు) రాకపోవడం ఒకింత అసంతృప్తినీ కలిగించింది.

2)     సభ 500 మందితో జరుపుకోవాలనుకున్నాము. 500 మందీ హాజరైనారుగానీ తూ.గో - దానినంటి ఉన్న జిల్లాల హాజరు ఎక్కువ ఉండడంతో అనుకున్న సంఖ్యకు చేరాము.

3)     అతికొద్ది సమయంలో వార్షికోత్సవ నిర్వహణ బాధ్యతను తలకెత్తుకున్న చేతనను ముందుగా అభినందించాలి. అలాగే, 30 ఏండ్ల యువకుడైన చేతన్‌కు తోడుగా జతకలిసి ఈ కార్యాన్ని గట్టెక్కించిన 80 ఏండ్ల యువకులైన కృష్ణమూర్తి రాజుగార్ని మరింతగా అభినందించాలి.

4)     కాకినాడ పట్టణ కమిటీ, రూరల్‌ కమిటీ ముఖ్యంగా సర్పవరం బృందం కలసికట్టుగా పూనుకోబట్టే ఇంత పనీ ఎటువంటి వడిదుడుకులు లేకుండా సజావుగా పూర్తయింది. ఆ బృందాన్నంతటినీ అభినందించడం పొగడ్త మాత్రం కాదు. వారందరినీ మిగిలిన జిల్లాలు స్ఫూర్తిగా తీసుకోవడం మేలు కలిగిస్తుంది.

5)     రాబోయే మహా సభనాటికి తూ.గో. జిల్లా ఐక్యవేదిక 10 వేల సభ్యత్వంతో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వారన్నారు. అదీ ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీసుకోదగిన అంశంగానే ఉంది.

6)     సమావేశం అంత సజావుగా జరిగిపోవడానికి అనేక మంది ఆర్థికంగా చేయూతనిచ్చారు. అందులో అంబేద్కర్‌ భవనం వారిని ముందుగా చెప్పుకోవాలి. వారందరికీ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

7)     సమావేశం జయవంతం కావాలన్న ఆకాంక్షతో కూడిన అభినందన సందేశాన్ని పంపిన రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జన్నత్‌ హుస్సేన్‌ గారికి అభివాద పూర్వకమైన ప్రత్యభినందనలు తెలుపుకుంటున్నాము.

8)     నేనూ ఒక కార్యకర్తనే అన్నంత ఉత్సాహంతోనూ, మీ తరపు మనిషినేనంటూను మాతో కలసి పోయిన సమాచార కమీషనర్‌ తాంతియా కుమారి గారిని ఒక పట్టాన మరచిపోవడం కష్టం. ఆమె మాలో ఒకరనే అనుభూతిని కలిగించగలిగారు మాకు. అదే బాగుందనిపిస్తోంది మాకున్నూ.

ఇక కార్యక్రమ విశేషాలు గమనించండి

1)     ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఖచ్చితంగా 9 గంటలకు, ఐక్యవేదిక జండా ఎగురవేయడంతో వార్షికోత్సవ కార్యక్రమం ఆరంభమైంది.

2)     వేదిక రచించుకున్న జెండాపాటను సర్పవరం జిల్లా పరిషత్‌ సంగీతం టీచరుగారు - వారి విద్యార్థులు విద్యార్థినులతో రాగయుక్తంగా పాడి కార్యక్రమాలకు శుభారంభాన్ని, ఉత్సాహాన్ని కలిగించారు.

3)     గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా, మాతెనుగుతల్లికి, అన్న రెండు పాటలూ అభినయంతో కలిపి మొత్తం సభను అలరింపజేశారు వారే. వీటితో పాటు, కృ.మూ.రాజగారు రచించిన బ్రహ్మాస్త్రం - స.హ. చట్టం - నాటికనూ ప్రదర్శించారు. సభ మొత్తం మొత్తంగా ఉత్తేజాన్ని పొందింది. అందుకు కారకులైన ఎం.వి.సి.వి సత్యవతి గారినీ, పాడి, నటించిన పిల్లలను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

4)     పుట్టా చౌదరి గారు వేదికపైకి ముఖ్యుల్ని పిలవడంతో సరిగా 10 గంటలకు సభ మొదలైంది. అధ్యక్ష స్థానంలో నేను కూర్చున్నాను  జంపా కృష్ణకిషోర్‌ గారు (ప్ర.కార్యదర్శి) మాట్లాడుతూ ఉద్యమమింకా చేవతేలలేదనిన్నీ, బుడిబుడి నడకల దశలోనే ఉందనిన్నీ చెపుతూ, అది ఆటుపోటులకు తట్టుకునే దశవరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ అన్నారు.

2)     అనంతరం వేణుగోపాలరెడ్డిగారు (ప్ర.కార్యదర్శి) ప్రజల పనులు మరోకరు - మనం - చేసిపెట్టడం అన్న రీతిమారాలి. జనం వారి పనులు వారే చేసుకోగలగాలి. మన పని అందుకవసరమైన అవగాహనను, కార్యకుశలతను, గుండె ధైర్యాన్ని మనం వారికి అలవరచాలి. అందుకు అవసరమైనంతమేర వారితో మనమూ కలిసి నడవాలి. అంటూ ఐక్యవేదిక మూల స్వభావాన్ని సభ ముందుంచారు.

అనంతరం, ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థ అయిన జై భారత్‌ తరపున సత్యన్నారాయణ మాట్లాడుతూ, జై భారత్‌ అవినీతిపై పోరాడుతుందనీ, మత సామరస్యానికై కృషి చేస్తోందనీ అంటూ తమ సంస్థను పరిచయం చేసి, ఐక్యవేదికతో మా సంస్థకు భావసారూప్యత ఉండడంతో కలసి పనిచేయడానికి సిద్దమైనామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి నివేదికను జంపా కృష్ణ కిషోర్‌ సభకు సమర్పించారు. అనంతరం జిల్లా నివేదికలూ జిల్లా బాధ్యుల ప్రసంగాలూ జరిగాయి. ప్రతిజిల్లా, ప్రతినిదీ తన ప్రసంగంలో ఈ సభనుండి ఒకింత ఉత్తేజం పొందామని, మరింత నిబద్దతతో భవిష్యత్కార్యక్రమాలను నిర్వహిస్తామనీ చెప్పారు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

అదిలాబాద్‌ తూర్పు విభాగం ప్ర.కార్యదర్శి రాధాకృష్ణగారు పట్టుబట్టి ఒంటిరిగానే సుమారు 70 వేల రూపాయల వరకు జిల్లా నిధిని సమకూర్చారు. దాంతోపాటు స.మండలి పూర్వం చేసిన వాగ్దానం మేర దానికి మరో 25వేల రూపాయలు జమ చేసింది. మిగిలిన జిల్లాలు జిల్లా నిధి విషయంలో వారిని ఆదర్శంగా తీసుకుని  నిధిని సమకూర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

భవిష్యత్తు లక్ష్యాలు : ముసాయిదా!

2014 డిశంబరుతో సభ్యత్వాల కాలావధి ముగుస్తుంది. వాటిని తిరిగి నమోదు చేయించడం.  నూతన సభ్యత్వాలను రాబట్టడం చాలా ప్రధానమైన మరియు కీలకమైన పని అవుతోంది. ఇప్పటి వరకు సభ్యత్వాల చేర్పింపును నిదానంగా చేస్తూవచ్చాం. ఈ సం|| దీనికి ప్రాధాన్యత నిచ్చి ఎక్కువలో ఎక్కువ సభ్యులను చేర్చుకోవలసి ఉంది.

2)     గ్రామభ్యుదయ సంఘాలనూ, వార్డు కమిటీలను ఏర్పరచే వైపు దృష్టి సారించాలి. జిల్లాకు కనీసం 10 గ్రామాలనైనా లక్ష్యం చేసుకోవడం బాగుంటుంది.

3)     ఐక్యవేదిక ఉద్యమ బలం, సాఫల్యం రెండూ గ్రామాలకు, వార్డులకు ఎంతగా వెళ్ళగలిగాం, వేరూనుకో గలిగాం. అన్న దానిని బట్టే ఉంటుంది. ఈ పని ప్రాధాన్యతను గుర్తించకుంటే వేదిక ఇంకా సరిగా అర్థం కాలేదన్నట్లే.

4)     మహిళల భాగస్వామ్యానికై మాటలను దాటి చేతల ద్వారా గట్టి కృషి చేయాలి. రాష్ట్ర మహిళా విభాగాన్ని ఏర్పరచుకోవలసిన అవసరం ఉంది. జిల్లా మహిళా విభాగమున్ను ఏర్పడాలి.

5)     రాష్ట్ర ప్రచార విభాగం 10 మందితోనూ, జిల్లా ప్రచార విభాగం కనీసం 1 ప్రచారకునితోనూ మొత్తం 33తో ఏర్పరచుకుంటే బాగుంటుంది.

6)     2015లో జరుపుకునేది రాష్ట్ర మహాసభ అవుతుంది. రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవలసి ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్న కమిటీ సలహామండలిగా రూపొంది, రెండో తరానికి ఉద్యమ సారధ్య బాధ్యతలనప్పగించడం అత్యంతావశ్యకం. ఇప్పటినుండే అందుకు తగిన వారిని గుర్తించి, ఒక ఆరు నెలల ముందునుండే వారికి తాత్కాలికంగా బాధ్యతలనప్పగించి నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించాలి.

7)     కొత్త కమిటీల ఏర్పాటు నాటికి రాష్ట్ర నిధిగా కనీసం 10 లక్షలు, జిల్లానిధి లక్షకుపైగా 2 లక్షల వరకు ఉండేట్లు శ్రద్ద తీసుకోవాలి.

8)     మన ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది - గ్రామ, వార్డు సభలు సక్రమంగా సమర్థవంతంగా జరుగుతుండడం అనన్న దగ్గరే ఉంది. కనుక ఆ వైపూ దృష్టి పెట్టాలనుకున్నాం.

9)     సాయంత్రం నాలుగ గంటల నుండి 6 గంటల వరకు స్థానికులలోని ముఖ్యులతోనూ, కాకినాడ పట్టణ, గ్రామీణ సంబంధ (రూరల్‌) కమిటీ ముఖ్యులతోనూ, వార్షికోత్సవ నిర్వహణ కమిటీల ముఖ్యులతోనూ అభినందన సభ జరిగింది. ఆ సమావేశంలో సమాచార కమీషనర్‌ శ్రీమతి తాంతియా కుమారిగారూ పాల్గొని తమ సందేశాన్నందించారు. సభ సఫల రూపంలో జరిగిందన్న తృప్తితో అందరికీ వందనాలు తెలుపుతూ చేతన్‌ సభను ముగించారు.


No comments:

Post a Comment