Tuesday, July 5, 2016

పెరికల మోషే మరణానికి మండలి నివాళి


పెరికల మోషే మరణానికి మండలి నివాళి


సత్యాన్వేషణ మండలి రాష్ట్ర అధ్యక్షుడు, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు అయిన శ్రీ పెరికల మోషే జూన్‌ 9వ తేదీ రాత్రి గుంటూరులో మరణించారు. శ్రీ పెరికల మోషే వెంకటేశ్వర్లు, దయమ్మలకు పేర్లిగ్రామంలో జన్మించాడు. మరణించేనాటికి అతని వయసు 62 ఏళ్ళు. అతడు ముందే రాసిన అవయవ, దేహదాన వీలునామా ప్రకారం ఆ రాత్రి నేత్రదానం మరుసటిరోజు అంటే జూన్‌ 10 వ తేదీన మధ్యాహ్నం బాపట్లలో దేహదానం కార్యక్రమాలు జరిగాయి.

17వ తేదీ ఉదయం 11 గంటలకు బాపట్ల అంబేద్కర్‌భవన్‌లో అతని సంతాపసభ సత్యాన్వేషణ మండలి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 500 మంది హాజరైన ఈ సభకు సత్యాన్వేషణ మండలి బాధ్యుడు శ్రీ శీలం నాగార్జునరావుగారు అధ్యక్షత వహించగా, శ్రీ అబ్రహంలింకన్‌, ఆనందకుమార్‌, ఇన్నయ్య, ఏబేల్‌, యర్రం శెట్టి జగన్‌ మోహన్‌రావు, మాధవి, శాంతారామ్‌, జయన్న, రామకృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, నటుకుల శ్రీనివాసరావు, చుండూరినాగయ్య పాతూరి రాధాకృష్ణారావు తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ సభకు శ్రీ పుట్టా సురేంద్రబాబు, కోట ప్రసాదశివరావు, పి.సి సాయిబాబు, కొడాలి రవిబాబు తదితరులు కూడా హాజరయ్యారు. సభలో మిత్రులు చేసిన ప్రసంగాల ముఖ్యాంశాలను సంక్షిప్తీకరిద్దాం.

మోషేని మండలికి పరిచయం చేసినవారు శ్రీ హెబేల్‌, డా|| ఆనందకుమార్‌లే. హెబేల్‌గారు మాట్లాడుతూ, మోషే ఒక ఉక్కు మనిషి అని అభివర్ణించగా, డా|| ఆనందకుమార్‌ మోషే మాట తీరు ఇతరులను గాయపరిచేదిగా వుండేదనీ, స్నేహ పూర్వకంగా అనిపించదనీ, అయినప్పటికీ మంచి హృదయం కలవాడనీ మాట్లాడారు.

మిత్రులు శ్రీ శాంతారామ్‌గారు మాట్లాడుతూ, మోషే చేసిన అవయవ, దేహదానం స్ఫూర్తితో తాను కూడ అవయవ దేహదానం చేయాలనినిర్ణయించుకున్నట్లు, అంతేకాక మహాకవి శ్రీ శ్రీ అవయవ దేహదానం వీలునామా వ్రాసినప్పటికీ అతని కుటుంబ సభ్యులు అమలు పరచలేదనీ, కానీ ఈ విషయంలో మోషే కుటుంబ సభ్యులు మోషే వీలునామాను గౌరవించి అమలు చేయటం అభినందించదగ్గదన్నారు.

సమాచార హక్కు ఉద్యమకారుడు శ్రీ నటుకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మోషే స్మారక దినాన్ని ప్రతి సం|| ప్రకాశం జిల్లాలో జరుపుకుంటామని చెప్పారు.

యర్రం శెట్టి జగన్‌మోహన్‌రావు గారు మాట్లాడుతూ మోషేని మండలిని అర్ధం చేసుకోవటానికి సమాజానికి కొంత టైమ్‌ పడుతుందన్నారు అవయవ, దేహదానం చేయటంలో మృతుని బంధువులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.

1. అవయవ, దేహదానం చేయాలనుకునే వ్యక్తి ముందుగా కుటుంబ సభ్యుల అనుమతి సంతకాలతో తన ఉద్దేశ్యాన్ని వీలునామా ద్వారా తెలియపర్చి దగ్గరలో ఉన్న మెడికల్‌ కాలేజికి ఇవ్వాలి.

2. వ్యక్తి మరణించగానే కాలేజీకి మృతుని బంధువులు తెలియచేయాలి.

3. మరణించిన 6 గంటలలోపు వ్యక్తి నేత్రాలను (కార్నియాలను) దానం చేయాలి. నేత్రదానం జరిగేలోపు అవి చెడిపోకుండా, కళ్ళపై తడిగుడ్డ ఉంచాలి. దగ్గరలో ప్రమిదలు, కొవ్వొత్తుల వేడి, తగల నీయరాదు. ఎండలో తల ఉంచరాదు.

4. శరీరం చెడిపోకుండా ఫ్రీజర్‌లో ఉంచాలి. కాలేజీవాళ్ళకు మృత శరీరం అప్ప చెప్పే వరకు బయటకు తీయరాదు.

5. రక్తదానం చేసేవారు 50 సం||లోపువారు అయితే మంచిది. 350 మి.లీ కంటే ఎక్కువ తీసుకోరు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన రోజే మన పనుల్ని యధావిధిగా చేసుకోవచ్చు.

6. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాల్ని అంటే నేత్రాల్ని ఇద్దరికీ, కిడ్నీలు, ఇద్దరికీ, కాలేయం, ముగ్గురికీ, ప్రాంక్రియాస్‌ ఒక్కరికి, గుండె ఒకరికీ, గాల్‌బ్లాడర్‌ ఒకరికీ, ఊపిరితిత్తులు ఇద్దరికీ ఎముకలు మొదలగునవి మొత్తం కలిపి సుమారు 18 మందికి పైగా జీవితాన్ని ప్రసాదించవచ్చు.

శ్రీమతి మాధవి మాట్లాడుతూ జగన్‌గారి తల్లిగారు దేహదానం చేసిన రోజునే అంటే సుమారు 3 సం|| క్రితమే మోషే కూడా ఆ స్ఫూర్తితో వీలునామా వ్రాసి తమ సంస్థకు అందచేశాడన్నారు.

ఎర్ర కండవా లింకన్‌గారు మాట్లాడుతూ మోషే తమ దళం నుంచి విడిపోయినా, సమాజానికి సేవ చేస్తున్న మండలిలో సభ్యుడై కొనసాగుతున్నందున సంతోషంగా ఉండేదన్నారు.

శ్రీ కాగిత కోటేశ్వరరావు మాట్లాడుతూ మోషే తనను తాను ఒక కులానికో ఒక మతానికో సంబంధించినవాడుగా భావించుకోలేదనీ, మండలి చెబుతున్న కుల, మత బంధనాలు విడవండన్న మాటను ఒంటబట్టించుకున్న వ్యక్తిగానే మోషేను చూడడం సరైందనీ అన్నారు.

మోషే కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేయడం ద్వారా నాగార్జునరావు గారు సభ ముగిస్తూ.

సత్యాన్వేషణ మండలిలో మోషే ఆదర్శాలైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం, గ్రామ సభ, వార్డు సభలు జరిగేట్లు కృషి చేయాలని, మోషే మరణానంతరం మోషే లానే మండలి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాద్యత మనందరిపైనా ఉందని భావిస్తూ మోషే కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియచేశారు.

సంస్మరణ సభకు హాజరైన శ్రీమతి మంచినేని మాధవి 'సంఘమిత్ర సేవాసమితి' మరియు శ్రీ కొడాలి రవిబాబు 'జపాన్‌ నమూనాల కరాటే అసోసియేషన్‌' ల తరపున అవయవ, దేహదాన ప్రచారం కోసం కరపత్రాలు, వీలునామ పత్రాల కాపీలు పంచారు.

సహచర మిత్రుడు మోషే భౌతికంగా మనతో లేడు. లేడుకదూ!? అవును!


సత్యాన్వేషణ మండలిని / నన్నూ అతి దగ్గరగా చూచిన అతి కొద్దిమందిలో మోషే ఒకడు. అలాగే నాలాగే మండలి జీవితావగాహనననుసరించి క్రమంగా తనను తాను మరింత మెరుగైన మనిషిలా తీర్చిదిద్దుకొనేందుకు స్వీయసాధన చేసుకుంటూ వస్తున్న వ్యక్తి అతడు. తెలిసినంతలో తాను సరైందని నిర్థారించుకున్న మేర నిజాయితీగా నడవాలనుకునే స్వభావం ఉన్నవాడు. మండలిలోని బాగా దగ్గర వాళ్ళకూ, మండలిని దగ్గరగా చూస్తున్న వాళ్ళకు మోషే సంభాషణలు విషయపరంగా నేను మాట్లాడుతున్నట్లే అనిపించేవన్న మాట నలుగురికి తెలిసిందే. సత్యాన్వేషణ మండలి, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కూడా ఒక నిబద్ధత కలిగిన, సమర్ధుడైన క్రియాశీల కార్యకర్తను కోల్పోయిందన్నది నిజం. ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా మనల్ని మనం తయారుచేసుకుంటూ, మరింతమంది మోషేలు రూపొందాల్సి ఉందన్నది నిజం. నాకున్న ప్రతి రూపాలలో ఒక రూపం కనుమరుగైందన్నది నాలోపలి మాట. తప్పదు. వాస్తవాలనంగీకరిస్తూ మిగిలిన వాళ్ళం కాలంతో కదులుతూ నడచిపోక తప్పదు.

- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

అన్న (మోషే) - నేను


జూన్‌ 9వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో మిత్రలు కోట ప్రసాద్‌ గారు 'అన్న' అకాల మరణం కబురందించారు. జీవితంలో ఇటీవల కాలంలో నాకు 'షాక్‌' (దిగ్బ్రాంతి) కలిగించిన వార్తయిది. నాకే కాదు 'మోషే'ని ఇటీవల కాలంలో కలిసిన వారెవరూ, అంత త్వరగా నమ్మలేని వార్తే అది. మెడికల్‌ కాలేజీకి నేత్ర, దేహదానం చేయాలని వీలునామా రాశాడని, ఏర్పాట్లు చూడమని మిత్రులు కోటేశ్వరరావు, బాలాజీరెడ్డిలు కోరారు. తాము నిర్వహిస్తున్న సంఘ మిత్ర సేవాసమితికి ఆ వీలునామా అందచేసాడని మిత్రురాలు మాధవిగారు తెలియజేశారు. హేతువాద మిత్రుడు పర్వతయ్య (గుంటూరు)గారి సహకారంతో నేత్రదానం (శంకర్‌ ఐ ఫౌండేషన్‌ వారికి) దేహదానం (కాటూరు మెడికల్‌ కాలేజీవారికి) చేయడం జరిగింది.

మోషే వయసులో నాకంటే ఒక ఏడాది పెద్ద. అందుకనే 'అన్న' అని పిలిచేవాణ్ణి. ఇతరులకూ కూడ అన్న అనే చెప్పేవాణ్ణి. తాను మాత్రం నన్ను 'సార్‌' అనిపిలిచేవాడు. బహుశా తనకంటే నేను ఎక్కువ చదువుకున్నాననో, మంచి ఉద్యోగం చేసాననో, ఆర్ధికంగా మెరుగ్గా ఉన్నాననో సమావేశాలలో ఎక్కువగా మాట్లాడతాననో ఏదైనా కావచ్చు. కాని ఇద్దరం అరమరికలు లేకుండా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. పోట్లాడుకునే వాళ్ళం. సరదాగా ఒకరినొకరం ఆటపట్టించుకొనే వాళ్ళం. మా ఇద్దరికీ బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళతో సరదాగా నన్ను తన 'శత్రువు'గా చెప్పేవాడు. సమవయస్కులంకావడం, స్వతంత్ర భావాలు కలిగి ఉండడం, సత్యాన్వేషణ మండలికి దాదాపు ఒకేసారి పరిచయం కావడం, ఆ భావజాలం సరైందనిపించడం మేము రెండు దశాబ్దాలుగా కలిసి ఉండడానికీ కారణం కావచ్చు.

కాని తన దేహదానం జరిగేరోజున జరిగిన సంతాపసభలోను, 17వ తేదీన అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన సంస్మరణ సభలోనూ మోషేను స్ధానికంగా అందరూ ఎతుమతం మోషే అని పిలిచేవారని ఒకాయన ప్రస్తావించారు. వాడుకలో 'రెటమతం' అన్నా 'ఎతుమతం' అన్నా మొండి తనమని, ఎవరి మాటవినని సీతయ్య స్వభావమని అర్ధం. మరొకరు ఒక దళితుడి గొప్పదనాన్ని సత్యాన్వేషణ మండలి గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిందని అది ఆ సంస్ధ గొప్పదనమన్నారు. ఇంకొకరు మోషే చేసిన దేహదానం అగ్రవర్ణాలకే ప్రయోజనం అనీ వాఖ్యానించారు. పెంచలయ్య, అరవిందుడు, చలం లాగా తన చివరిరోజుల్లోనైనా మోషే ఆస్తికుడవుతాడని ఆశించానని, కాని మోషే అకాల మరణం చెందాడని మరో మిత్రుడు బాధను వ్యక్తపరిచాడు. ఇలా రకరకాలు వాఖ్యానాలు విన్నతరువాత, మోషే వారికి సరిగా అర్థంకాని మోషే అసలు స్వరూపాన్ని వివరించడం చాలా అవసరమనిపించింది మాకు.

మోషే ది పైకి 'ఎతుమతం' లా అనిపించవచ్చు. కాని నా దృష్టిలో అతనిది ఎతుమతం కాదు. ఎంతో 'ఎత్తుకెదిగిన మతం' తాను ఎదగాలనే తత్వం. తన తోటి వారూ ఎదగాలని, ఎదగటం గురించి వారికి నచ్చ చెప్పటానికి తపనపడే తత్వం. అడవిలో అన్నల పట్ల సానుభూతి పరుడుగా ఉన్నా, సత్యాన్వేషణ మండలి బాధ్యుడుగా ఉన్నా అతని స్వభావంలోని వివిధ గుణాల పూసలను కలిసి వుంచిన 'దారము' అదే. సహజంగానే అది అర్ధం కాని వారికి అతనిది 'రెటమతం' లాగే వుంటుంది. తన గురించి కంటే సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, సంస్కరణ కోసం ప్రయత్నించిన ఏ వ్యక్తి అయినా ఆనాటి సమాజంలో ప్రతిఘటన ఎదుర్కొన్నవాడే. ఎదురీదిన వాడే. అటువంటి వారి భావాలను అర్ధం చేసుకోవటానికి సమాజం చాలా సమయం తీసుకుంటుంది. బ్రూనోను, గెలీలియోలను ఆనాటి సమాజాలు చిత్రహింసలపాలు చేసాయి. హత్యచేసాయి. పరిణామసిద్దాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్‌ డార్విన్‌ను గేలి చేసిన క్రైస్తవ సమాజం, ఆయన మరణించిన 125 ఏండ్ల తరువాత పశ్చాత్తాపం వ్యక్తపరిచింది. ఏ సంస్కర్తకైనా ఇదే పరిస్ధితి.

అప్రియశ్యతు పధ్యశ్య వక్తా శ్రోతా చ దుర్లభః - ఎదుటి వానికి నచ్చకపోయినా అతనికి మేలుకూర్చే మాట చెప్పేవాడు, చెప్పినా వినేవాడు అరుదు.

మోషే సమాజం దృష్టిలో ఎలా ఎతుమతమో చూద్దాం.


1. సత్యానికి పెద్దపీట వేయమంటుంది మండలి. ప్రతి విషయాన్ని వాస్తవంతో సరిచూసుకోమంటుంది. వాస్తవంతో సరితూగిన విషయమే సత్యము అంటుంది. కాని సమాజంలో ఆ పరిస్థితి లేదు. నలుగురు ఏం చెప్తే అదే సత్యముగా చలామణీ అవుతుంది. నలుగురూ ఏదారి నడిస్తే అదే సరైనదే అనుకుంటుంది. వారి దృష్టిలో మరి మోషే ఎదురుమతం కాక మరేమౌతారు.

2. కుల, మతాలు లేకుండా ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా అందరం కలిసి మెలసి ఊండాలంటున్న మోషే కులాల కుళ్ళుతో, మతాల గబ్బుతో మమేకమై జీవనం సాగిస్తున్న సమాజం దృష్టికి ఎతుమతం వానిలానే కనిపిస్తాడు మరి.

3. శాస్త్రీయ దృక్పథం పెంచుకోమంటున్న మండలి మాటలు, నిత్యం మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న సమాజం దృష్టిలో ఎతుమతమే.

చెప్పదలచుకున్నది ఇతరులకు సరిగా చెప్పటం, ఇతరులు చెప్పింది సరిగా వినటంలో కూడా నిపుణత అవసరమని మండలి చెప్తోంది. అవతలివాడు ఏదైనా ప్రశ్నించినపుడు ఆ ప్రశ్నను సరిగావిని, అర్ధం చేసుకున్న తరువాతే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని మండలి బోధిస్తుంది. మోషే ఈ సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్నాడు. కాని ప్రశ్నించడమే ఇష్టపడని, ప్రశ్నించడమే తెలియని, సరిగా ప్రశ్నించడమే చేతకాని జనాల వద్ద అసలు సరిగా వినడమే అలవాటులేని జనాన్ని, మోషే ప్రశ్నించినపుడు వారికి ఇది ఎతుమతంగా అనిపించటం సహజం కాని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఆ విషయంలో సమాచార హక్కు చట్టం ఉపయోగించుకోవాలని మండలి, ఐక్యవేదికల ద్వారా మోషే చెప్పేవాడు.

4. గీత, బైబిలు, ఖురానులు మన ధర్మ శాస్త్రాలు అనేకంటే, ప్రతి భారతీయ పౌరునికీ భారత రాజ్యంగమే ధర్మశాస్త్రమని మండలి ప్రబోదిస్తుంది. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని, అసలు దాని పేరే వినని సగటు సమాజానికి మోషేలాంటి వారు ఎతిమతంగానే కనిపిస్తారు.

రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు (12వ అధికరణ నుండి 35 వ అధికరణ వరకు, ఆదేశసూత్రాలు (36వ అధికరణ నుండి 51వరకు) పౌర బాధ్యతలు 51ఎ లోని 11 అంశాలు మోషే వరుస క్రమంలో వివరించటం రాజ్యాంగం పట్ల అతనికున్న శ్రద్ద అతని జ్ఞాపకశక్తి తోటి సభ్యులను అబ్బురపరిచేవి స్పూర్తినిచ్చేవి.

5. నోటుకు ఓటును అమ్ముకోకూడదని, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకూడదని, అందరూ ఓటు విధిగా వేసి తీరాలని చెప్పే మండలి అసలు ఎన్నికల రోజును ఒక సెలవు దినంగా భావించి టివిలో క్రికెట్‌ మ్యాచో, సినిమాలో, సీరియల్స్‌తోనూ కాలక్షేపం చేసే సమాజం దృష్టిలో ఎతుమతంగానే వుంటుంది.

ఓటును అమ్ముకోకూడదంటూ మోషే సభల్లో పాడిన పాట అందరినీ ఆలోచింపచేసేది.

6. ఆడబిడ్డల్ని, పిండదశలోనే చంపేస్తూ, పుట్టిన వారిని బడికి పంపక కూలికి పంపిస్తూ, ఎదిగిన తరువాత అత్యాచారాలకు గురి చేస్తూ, వ్యభిచార కొంపలకు అమ్మేస్తున్న సమాజానికి, 'ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని' అని ఆర్ధ్రంగా పాడే మోషేది ఎతుమతమే మరి.

7. స్వార్ధమే పరమార్ధం అనే సమాజం దృష్టిలో, తానూ మరణించినా పది మందికీ ఉపయోగపడాలనే దృష్టితో అవయవ, దేహదానం వీలునామా మోషే రాయటం 'ఎతుమతమే'. మండలి సభ్యులందరూ అవయవ దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.

మండలికి రాష్ట్ర అధ్యక్షుడు అవటం మోషే గొప్పదనమని కొంతమంది ప్రసంగించారు.

నిజానికి మండలి సభ్యుల్లో ఆ పదవుల పట్ల ఎవరికీ లాలసలేదు. గుర్తింపూ కోరుకోరు. మోషే కూడ తనను తాను ఎప్పుడూ గొప్పగా భావించలేదు. ఇతర సమాజంలో అలాంటి పదవులు కొంత తృప్తినిస్తాయి కాబట్టి అలా వారు అనుకోవడంలో తప్పు లేదు. ముందే చెప్పినట్లుగా మండలికి కుల మతాల పట్టింపులేదు కనుక, మోషేను దళితునిగా అసలు భావించలేదు సరికదా ఒక మేధావిగా గుర్తించింది.

8. మండలి బోధించే 3 నియమాల్లో ముఖ్యమైనది సమయపాలన. అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పనికి ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించటం అని అర్ధం. అనుకున్న సమయానికి ఒక గంట అటో ఇటో ఒక రోజు అటో ఇటో ఒక నెల అటో ఇటో పని చేయటం అలవాటైన వారికి, అది ఇండియన్‌ పంక్చువాలిటీ అని సమర్ధించుకునే వారికి ఆహారం తీసుకోవటంలోను, నిద్రకు ఉపక్రమించటంలోనూ, వ్యాయామం చేయటంలోనూ సమావేశానికి హాజరు కావటంలోను అలాగే ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన వేళలు పాటించే మోషే ప్రవర్తన ఎతుమతం గానే కనిపిస్తుంది.

ఎప్పటికైనా మోషే ఆస్తికునిగా మారతాడేమో అని ఆశించిన డా|| ఆనంద్‌ మోషేని అర్ధం చేసుకోలేదేమోనంటాను. ఎందుకంటే 'సత్యమే' మా మతం అనే సత్యాన్వేషణ మండలికి మోషేని పరిచయం చేసిన 'ఆనంద్‌' కూడా 'మతమే సత్యం' అనే భావాలలోకి మారటం గురించి మోషే బాధపడేవాడు. కుల మతాల్ని వదులుకోవాలని చెప్పిన మోషేని, కుల నిర్మూలనే లక్ష్యంగా చెప్పుకున్న అంబేద్కర్‌ని కూడా ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడ్డం, ఒక రకంగా వారి గొప్పదనాన్ని తగ్గించటమేనని నాలాంటి వారి అభిప్రాయం.

ఈ కుల దురభిమానం ఎంత వరకూ పోయిందంటే మోషే చేసిన అవయవ, దేహదానాలు అగ్రవర్ణాలకే ప్రయోజనం కలిగిస్తాయనేంత వరకూ సాగింది. ఒక రకంగా ఇలా ఆలోచించే వారికే 'శాస్త్రీయ వైఖరి' ని మోషే నేర్పదలచుకుంది. అలాంటి వాఖ్యానాలు అవయవ, దేహదానాల పట్ల అనుమానాలు  రేకెత్తిస్తాయి. మోషేలాంటివారు చేసే ఈ ఉద్యమాల్ని నిర్వీర్యపరుస్తాయి. అవయవ దానాలు ఒక ప్రొసీజర్‌ ప్రకారం నడుస్తాయి. అంతేకాని దాత ఏ కులం వాడు? స్వీకర్త ఏ కులంవాడు? అనే సంకుచిత దృక్పధం ఆ ప్రొసీజర్‌లో లేదు. అంతేకాదు దేహదానం చేయబడిన 'శరీరం' వైద్య విద్యార్ధులకు ప్రాక్టికల్స్‌కు ఉపయోగపెడతారు కాని, ఆ వైద్య విద్యార్ధి ఏ కులంవాడు అనీ, ఈ మృత శరీరం ఏ కులానిదీ అని చూడరు. అలా చూస్తారనుకోవడం కుల దురభిమానమే. మోషే కలలు గన్న శాస్త్రీయ వైఖరికి అది పూర్తి వ్యతిరేకమే.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికలో జిల్లా స్ధాయిలో కార్యవర్గ సభ్యుడైనప్పటికీ, రాష్ట్రస్ధాయిలో అతడు నిర్వహించిన అధ్యాపక పాత్ర గొప్పది. అతడు పాల్గొన్నన్ని శిక్షణా శిబిరాలు, తిరిగిన ప్రాంతాలూ, చేసిన ప్రసంగాలూ వేదికలోని ఏ ఇతర కార్యకర్త చేయలేదనటం అతిశయోక్తికాదు. మరణించటానికి కేవలం వారం 10 రోజుల ముందు కూడా ద్వారకుంటలోనూ, అనంతపురంలోనూ శిక్షణ శిబిరాల్లో పాల్గొనటం అతని ఉద్యమ అభిలాషకు తార్కాణం. మోషే హాజరయిన ఏ శిక్షణాశిబిరమయినా, ఏ ఇతర సమావేశమయినా అతడు పాడే గురజాడవారి 'దేశమును ప్రేమించుమన్నా' దేశ భక్తి గీతంతో ప్రారంభమవ్వాల్సిందే. సమావేశాల మధ్యలో బ్రేక్‌ వచ్చినా ఏదో ఒక సామాజిక స్పృహ కలిగించే గీతం పాడేవాడు. మంచిగాయకుడు. అతని దేహదానం జరిగిన రోజే అనంతపురంలోనూ సంతాప సభ జరిగిందంటే మోషే పట్ల వారికి ఉన్న అభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు.

సత్యాన్వేషణ మండలిని అయినా, దానిని అనుసరించే మోషేని అయినా, 'ఎతుమతం' అని ఈనాడు అన్న వారు 'మండలి' భావాల్ని పరిశీలనగా చూసి అర్ధం చేసుకుని, అనుసరించడమే మోషేకి నిజమైన నివాళి.

మోషే మరణం వ్యక్తిగతంగా నాకేకాదు. సహ ఉద్యమ కారులందరికీ లోటే. మోషే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

- యర్రంశెట్టి జగన్‌ మోషన్‌రావు

ఆడలేక మద్దెలోడు అనవద్దు


ఓఫీర్‌గార్కి                    - కె. అంజయ్య

అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌గారి పలాయన వాదం పై వివేకపథం పాఠకునిగా ఇది రాయాలనిపించింది. ''ఉడుంకెందుకురా ఊళ్ళో పెత్తనం వడిని పట్టి వంటింట్లో ఉడక పెడతారు ఖబడ్డార్‌''  అన్న సామెత ఓఫీర్‌గార్కి బాగా సరిపోద్ది అనిపించింది. సవాల్‌ను స్వీకరించాలన్నా సవాల్‌ విసరాలన్నా ఖలేజాతో పాటు నిజాయితీ ఉండాలి. ఈ రెండు మీకులేవు. వివేకపథం ద్వారా ఓ ఓఫీర్‌గారూ మీరు పలాయనావస్తలో ఉన్నట్టుగా అనిపించింది. పారిపోయే మార్గం కూడా తెలిసినట్టు లేదు ఈయనకు. నేను చాలా బలవంతుడ్ని నాతో కుస్తీకి సై అనేవాడికి నా అంతబలం లేదుగదా? అందుకే తటపటా ఇస్తున్నాను. అన్న బిల్డప్‌ ఇస్తూ సొంత డబ్బా మోగకపోయినా కొడుతున్నారు. ఓఫీర్‌గారూ మీకున్న విశ్వాసాన్ని ఎక్కడో చాటుమాటున మూఢనమ్మకాల ఊబిలో మునిగిన అమాయకుల మధ్య మీ విశ్వాస విద్యను ప్రదర్శిస్తే, అక్కడకు మత బండారాలను బయటపెట్టే పుట్టా సురేంద్రగారి లాంటి సాహిత్య విమర్శకమల్లయోధులు రారు. అక్కడ మీరే యోధులు. మీరే విద్యార్ధులు. మీరే అన్నీ.  మేధావుల మధ్య తలపండిన సాహిత్య విమర్శకులతో తలపడాలనుకుంటే ఇలాగే తలబొప్పి కడుతుంది.

మీరు రాసిన దానికి మీరే కట్టుబడకుండా, గ్రంథ సమీక్షపై స్పష్టత లేకుండా, ప్రశ్నించవచ్చు అంటూనే జవాబుదాటవేస్తూ మళ్ళీ ప్రశ్నించమంటూ పొల్లుమాటలు? చూడు ఛాలెంజ్‌ చెయ్యాలన్నా స్వీకరించాలన్నా దానికి సంబంధించిన చర్చల్లో నిబంధనలు నియమాలు పూర్తిగా తెలిసినట్టులేదు మీకు. ఇప్పటికైనా మునిగి పోయింది లేదు. ఇలాంటి పొల్లు రాతలు రాయటం మాని ఓఫీర్‌గారూ చర్చా నియమాలు ఛాలెంజ్‌ స్వీకరణ ఇలాంటి శిక్షణా శిభిరాలలో శిక్షణ పొందండి. గ్రంధాలపై విశ్లేషణ చేసే వారి పరువు తీయకండి. విశ్లేషకులు తప్పును ఎత్తిచూపాలి. తప్పయితే భేషరతుగా వప్పుకోవాలి. కొర్రీలు పెట్టి జారుకోవాలనుకోవడం సుష్క వాదనలతో వాగాడంబరం చేయటం గమనించేవారు అసహ్యించుకునేలా వ్యవహరించటం సబబు కాదు. సరిచేసుకోండి. సత్తా ఉన్న వారితో కుస్తీకి దిగండి. సెలవ్‌.

మంచి స్వాగతం


ఈ సందర్భముగా ఫజులూరి రహమాన్‌గారినీ ప్రస్తావించటం సమంజసం అనిపించింది. రహమాన్‌గారూ మన మధ్య స్నేహ సంబంధాలు అంతగా చిక్కుముడి పడకున్నా ఎన్నోసార్లు సత్యాన్వేషణ మండలి సమావేశ కాలమందు పలకరించుకున్నాము. అయితే మీ చిత్తశుద్దిని మీ నిజాయితిని శంకించాలని నాకు లేదు కానీ, అన్నమాటకు కట్టుబడి, నేటి సమాజానికి ఏమాత్రం ఉపయోగం గాని, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన మీ మతం నుండి బయటపడి, సత్యాన్వేషణ మండలితో కలిసి మానవత్వ విలువలకు కట్టుబడిన మహోన్నతమైన మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వటం మంచిదని నా భావన. మీ నిర్ణయం నాలుగు రోజులు ఆలస్యమైనా పరవాలేదు. నవ సమాజ నిర్మాణంలో సురేంద్ర గారితో జత కట్టి మెరుగైన సమాజం నిర్మించే దానిలో చేరితే సంతోషిస్తాను.

అమరజీవి పెరికల మోషే


సాకీ.     అమర్‌ రహే పెరికల మోషే     2

1.     కాలమనే కడలిలోన కలిసిన ఓ మిత్రమా

    ఈ కాలంలో నువ్వు లేని లోటున్నది మిత్రమా

    సత్యాన్వేషణ చేస్తూ పాలు నీళ్ళు వేరు చేస్తు

    మంచి సమాజ స్ధాపన లక్ష్యంగా శ్రమించావు    ||అమ||

2.     అభ్యుదయ భావాలతో సమాజంలో అడుగుపెట్టి

    శ్రమతోటే దుర్బిక్షం నాస్తి అన్న యోచనతో

    మనిషే మహనీయుడు ఏ దేవుడిలలో లేడన్నవ్‌

    మార్పుకొరకు శ్రమించిన మానవతామూర్తి మోషే    ||అమ||

3.     నిజాయితి నిబద్దతకు మోషే కెవరు సాటి రారు

    హేతుబద్ద జీవనమే ఎంతో మంచిది అనుకొని

    సత్యాన్వేషణ మండలి సైనికునిగ సాగినావు

    అందినట్టి సత్యాన్ని సమాజాని కందించిన         ||అమ||

4.     పుట్టినట్టి ప్రతివ్యక్తి మరణిస్తా డెప్పుడైన

    మరణించిన ఏ వ్యక్తికి పునర్జన్మ ఉండబోదు

    మూఢ నమ్మకాలు దేశ ప్రగతికడ్డుగోడలంటు

    సమరం సాగించినట్టి అమరజీవి మన మోషే        ||అమ||

- కన్నెబోయిన అంజయ్య, అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం

రామక్రిష్ణాపురం, చింతకాని (మం) ఖమ్మం జిల్లా, సెల్‌ : 9490370563

No comments:

Post a Comment