Friday, July 15, 2016

వెంకటాద్రి వ్యక్తీకరణలు - గుణాలు - దోషాలు

వెంకటాద్రి వ్యక్తీకరణలు - గుణాలు - దోషాలు


గుణ దోష విచారణ (విమర్శ)

ధారావాహికగా

ఉపోద్ఘాతం 
:- ఈ రచననిలా ఆరంభించడానికి నన్ను ఒత్తిడి చేసిన కారణాలనేకమున్నాయి. ఒక చారిత్రక దస్త్రంగా ఉండబోయే ఈ రచనను, భవిష్యత్తులో చదవబోయే అధ్యయన పరులనూ దృష్టిలో ఉంచుకుని పూర్వాపరానుక్రమణికతో కూడి ఉండేలా రూపొందించాల్సి ఉంది కనుక, దీనికి పూర్వ రంగమన దగ్గ - నేపధ్యంగా ఉన్న - ముఖ్యాంశాలవరకైనా కొన్నింటిని ఈ విధంగా ప్రస్తావించాల్సి వచ్చింది. అట్టి వాటి క్రిందికి చేరే వాటిలో కొన్నివిగో. జాగ్రత్తగా మనస్సు పెట్టి, వాస్తవిక దృష్టినీ తోడెట్టుకుని పరిశీలించను మొదలెట్టండిక.

1) ఎవరంగీకరించినా, అంగీకరించకున్నా నిజానికి, వెంకటాద్రి గారూ, నేనూ కూడా భావ విప్లవ క్షేత్రానికి చెందిన వాళ్ళమే. భావ విప్లవ క్షేత్రమన్న మాటకు నే నంగీకరిస్తున్న అర్థం, మనుషుల భావాలలో  సరైన మార్పు రావలసి ఉందనీ, సామాజికంగా రావలసిన అన్ని మార్పులకు ఆధారస్థానంలో లేదా కారణస్థానంలో ఉండవలసింది, ఉండగలిగిందీ వ్యక్తులలో భావ విప్లవం రావడమె. అంటే తప్పుభావాలు తొలగిపోయి, ఒప్పు భావాలు వచ్చి చేరడం, ఎప్పటికప్పుడు తప్పు భావాలను ఒదిలించుకునే, ఒప్పు భావాలను జత చేసుకునే ప్రక్రియను అమలు చేసుకుంటుండాలనే అవగాహన ఆచరణాత్మకతను కలిగించే స్థాయిలో ఉండడం, అనే.

2) భావ విప్లవాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వారెవరైనా, అప్పటికి ఉనికిలో ఉన్న భావాలను (జ్ఞాన క్షేత్రాన్ని) అవి ఎవరివైనాకానీండి (తనవైనా,ఇతరులవైనా) నిశిత పరిశీలనకు, సత్యాసత్య విచారణకు లోను చేయడానికి సిద్దంగా ఉండాలి. ఈ విషయంలో మండలి(నా) వైఖరి సుస్పష్టంగా ఉంది. మేము విమర్శింపబడడానికీ, విమర్శించడానికీ కూడా సమానంగా ఇష్టపడుతున్నాము. సిద్దపడి ఉన్నాం. విమర్శకు ఎవరూ అతీతులు కాదు, కారాదు అన్నదే ఈ విషయంలో మండలి సిద్దాంతం కనుకనే, సరైన హేతువాదికి విమర్శకుడు మిత్రుడే గాని శతృవుకాడనీ, హేతువాది విమర్శను ఆహ్వానిస్తాడని అన్న వెంకటాద్రి గారి అభిప్రాయం నాకు 100% అంగీకారమేనని అనగలిగాను.

3) విమర్శ అంటే గుణ దోష విచారణే. అది రెండుగా ఉంటుంది. ఒకటి వ్యక్తినుద్దేశించీ, రెండు అతని వ్యక్తీకరణల అంటే అతని అభిప్రాయాల నుద్దేశించీ. ప్రతి విమర్శకుడూ ఇక్కడో విషయాన్ని ముఖ్యంగా గమనించుకుని ఉండాలి. తప్పని సరైతేనే తప్ప ఈ రెండు పార్శ్వాలను లేదా విభాగాలను కలగాపులగం చేయనేకూడదు. ముఖ్యంగా భావజాల క్షేత్రంలో చోటుచేసుకునే విమర్శలో విచారణంతా విషయ ప్రధానమైనదిగనే ఉండాలి.

4) విమర్శ, ఖండన, నింద అన్నవి వేరు వేరు అంశాలు. ఖండన, నింద అన్న రెండూ విమర్శకు ఆవలి విషయాలు కూడా. విమర్శ యొక్క పరమావధి విమర్శకులోను చేస్తున్న దానిలోని తప్పొప్పులను వేరు చేసి చూడడం, చూపడం అన్నది మాత్రమే. అలా తప్పొప్పులను విడదీసి గమనించినవారు, వాటి విషయంలో, అవి కలిగి ఉన్న వారి విషయంలో ప్రవర్తించే - స్పందించే - విభాగానికి చెందినవి ఖండన - నిందలన్నవి. భావ విప్లవాకాంక్షులకు, తప్పు భావనను దానిని కలిగి ఉన్న వారినీ నిరశించడం, ప్రతికూలించడం కొన్ని సందర్భాలలో అవసరమవుతుంది గనుక అలాటప్పుడు ఖండనా అవసరమవుతూ ఉంటుంది. అలాగే ఒప్పు భావాన్ని, అట్టివి కలిగి ఉన్న వారినీ ప్రశంసించడం, అనుకూలత కనబరచడం (దీనినే మండన మనీ అంటారు) అవసరపడుతూ ఉంటుంది. అంతేకాని ఆలోచనా క్షేత్రాలలో పనిచేసే వారు, ఏ రకంగానూ సరైన ఆలోచనను రేకెత్తించని, అనవసరపుటావేశాలను రేకెత్తించే 'నింద' ను చేపట్టనే చేపట్ట కూడదు.

5) వెంకటాద్రి గారిని నేనూ, నన్నాయనా చూడడం మొదలెట్టిన నాటి నుండి మా మధ్య అంతరాలు కొనసాగుతునే వస్తున్నాయి. వ్యక్తిగతాంశాలను ప్రక్కన బెడితే, విషయపరంగా మా మా అవగాహనల్లోని వ్యత్యాసాలను, అదిన్నీ తాత్వికంగా కీలకమైన అంశాలవరకైనా, నిశిత పరిశీలనతో కూడిన విమర్శకులోను చేయడం, భావ విప్లవాకాంక్ష రీత్యా అవసరసమూ తప్పనిసరికూడా.

6) నాలుగోపడిలో ఉన్నారు ఆయన. ఆయన భావాలను ఆయన ఉండగనే విమర్శకు లోనుచేయడం అన్నివిధాలా మంచిది. అందువల్ల (1) ఆయన భావాలపై వెలువడిన విమర్శను ఆయనే స్వయంగా సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. (2) విమర్శకులు తన భావాలలోని లోపాలూ, దోషాలంటూ చూపిన వాటిని అంగీకరించి సరి చేసుకోవడానికో, తృణీకరించి, తనవి సరైనవేనని వివరించి నిర్థారించుకోడానికో వీలవుతుంది. అలాకాక ఆయన తదనంతరం ఆయన భావాలపై తామరతంపరగా వెలువడే విమర్శలను స్వీకరించడానికీ, తృణీకరించడానికి - సరిచేసుకోడానికీ అంతగా వీలుండదు. పైగా ఆయన తరవాత, ఆయన ననుసరిస్తున్నవాళ్ళు, ఆయనపై వచ్చిన విమర్శకు సరైన రీతిలో సమాధానాలు చెప్పకపోగా, ఆయన గాని ఉండుంటే, మీకు చెప్పవలసిన రీతిలో సమాధానం చెప్పి ఉండేవారు. ఆయనున్నంత కాలం ఒక్కరూ నోరెత్తలేదు. అనంటూ, విమర్శతాకిడి నుండి తప్పించుకోడానికీ యత్నిస్తారు. లేదా ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు ఆయన మాటలకు వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ సాగిపోతుంటారు.

7) భావజాల క్షేత్రంలో, ఒక వ్యక్తి వెళ్ళడించదలచిన భావాన్ని గ్రహించే సందర్భంలో సందిగ్థత - అనిశ్చితి - ఏర్పడ్డప్పుడల్లా అనుసరించాల్సిన పద్దతి నొకదాన్ని, మండలి తనదైన రీతిలో రూపొందించుకుని ఉంది. నా అవగాహన ప్రకారం ఆవిధానం ఎవరూ కాదనడానికి వీల్లేనిది. ఎవరు ఉపయోగించుకున్నా మేలు కలిగించగలదీ కూడా 1. అలాటి సందర్భాలలో విన్నమాటకు అర్థాన్ని అన్నవారినే అడిగి తెలుసుకోవాలి. అన్న వారూ తానన్న మాటకు తానుద్దేశించిన అర్థమేమిటో తెలిపే బాధ్యత వహించాలి.

2. భాషకున్న శక్తీ పరిమితుల దృష్ట్యా ప్రయోక్తకూ - గ్రహీతకు అంటే అనేవారికీ - వినేవారికీ ఒకే రకమైన పదాలు ఒకే అర్థం కలిగి ఉన్నంత వరకే అన్నవారేమి చెప్పాలనుకుంటున్నదీ విన్న వారికి స్పుర్తిస్తుంటుంది. అలా లేని సందర్భాలలో విషయం అర్థంకాక పోవడమో, తప్పుగా అర్థం చేసుకోవడమో జరుగుతుంటుంది. తగినంత భాషా సామర్థ్యం అటు అనేవానికి లేకున్నా, ఇటు వినేవానికి లేకున్నా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడుతుంది. మామూలుగా మనందరి నిత్య జీవితంలోనూ, సాధారణ వ్యవహారాలలో ఇది ఎదురవుతూనే ఉన్నా, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పనులు కానిచ్చేసుకుంటుంటాము. పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాక పోవడంతో ఆపైన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోము.

కానీ మన ప్రస్తుత క్షేత్రమైన భావవిప్లవరంగానికి సంబంధించినంతలో, అటు తాత్వికంగా గానీ, ఇటు వివిధ సిద్దాంతాల విచారణ సందర్భంగాగానీ, కొన్ని కీలకమైన పదాలు (అట్టి వాటిని పారిభాషిక శబ్దాలంటారందుకే) చోటు చేసుకుని ఉంటాయి. అలాటి మాటలకు ప్రయోక్త తనకు తానుగానే, తానంగీకరిస్తున్న అర్థాన్ని ప్రకటించడం సర్వధా శ్రేయస్కరం. కనీసం సందిగ్ధత ఏర్పడి గ్రహీత - పరిశీలకుడు - అడిగినప్పుడైనా తనదైన అర్థాన్ని వెళ్ళడించాలి. లేకుంటే భావగ్రహణ ప్రక్రియలో ''ఆదిలోనే హంస పాదన్న'' సామెత రీతిగా, ఆరంభంలోనే దారి తప్పే ప్రమాదం ఉంది.

8. ఒకింత విచారకరమైన నిజమేమంటే, వెంకటాద్రి గారికి నాపై ప్రతికూలత ఏర్పడడానికి కారణమైన గుంటూరు సమావేశంలోనూ ఆ పక్షీయుల్నినేనడిగింది కార్యకారణాలన్న పదాలకు నిర్వచనాలు చెప్పమనే. అలా అడగడం అక్కడికదేదో తప్పన్నట్లూ, నేను ఓనమాలు నేర్చుకునే స్థాయిలో ఉన్నట్లు, చాలా ఆవేశంగానూ, హేళన ధ్వనించేట్లు వెంకటాద్రిగారు మాట్లాడారానాడున్నూ. ఆపైన అదే ఆవేశంతో ''కార్యకారణ వ్యర్థ చర్చ'' అన్న శీర్షికన కొంత రచనా చేశారాయన. ఈ విషయంలో ఇప్పటికీ నా పక్షమేమంటే,

శాస్త్రీయ స్థాయి కలిగిన రచనలన్నంటికీ పారిభాషిక శబ్దాలకు తమవైన అర్థాలు - నిర్వచనాలు - చెప్పడమన్న విధానాన్నే అనుసరిస్తున్నాయి అన్ని వైజ్ఞానిక క్షేత్రాలున్నూ. ఆ నేపధ్యం నుండే వివిధ శాస్త్రాలకు చెందిన పారిభాషిక పదకోశాలూ వెలిశాయీ నాడు. వెనకటి తాత్వికులున్ను తమ తమ సిద్ధాంతాలనర్థం చేసుకోవడానికి వీలుగా తాము ముఖ్యమని ఎంచుకున్న పదాలకు తామంగీకరిస్తున్న అర్థాలతో కూడిన పదార్థ కోశాలను రచించారు. వేదాంత పరిభాష, తర్క పరిభాష వగైరాలలాటివే. కానీ వెంకటాద్రి గారే ఎందుకనో దీనిని అంగీకరించడంలేదు. పైగా వ్యతిరేకిస్తున్నారు కూడాను. అంతటితో ఆగక; అందరికీ అర్థమయ్యే పదాలకు అర్థాలు, నిర్వచనాలు చెప్పమనడం, సరికాదంటూ ఒకింత దురుసుగానూ మాట్లాడారు. ఒక ప్రత్యేకాంశంగా దీనిపైనే చర్చ జరగాలిమునుముందుగా.

నేనేమడిగిందీ, అడుగుతూ వస్తోంది ఏమిటన్నదిగానీ, అందుకాయన ఎలా స్పందించారన్నది గానీ ఒక్కడంటే ఒక్కడు ఆ పక్షంలోనుండి సజావుగా పట్టించుకోలేదిప్పటికీ. ఏమి హేతువాదోద్యమం? ఏమి హేతువాదులు? హేతువాది స్వతంత్రాలోచనాశీలుడై ఉంటాడని, భావాలను ఎప్పటి కప్పుడు శాస్త్రీయ విచారణకు లోను చేస్తూ, ఆధునిక విజ్ఞానపు వెలుగులో సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ సాగుతుంటాడని, విచారణకు విమర్శకు అంగీకరించని వైఖరి మత ధోరణి అవుతుందని హేతువాది - (సరైన హేతువాది) అలా ఎన్నడూ ప్రవర్తించడని, అలా ప్రవర్తించేవాడు హేతువాదే కాడని... ఇలా చాలా చాలా వ్రాసేశారు వెంకటాద్రిగారు. వారి ఆంతరంగికులున్నూ దీనికి వత్తాసుగా, అవునంటే, అవుననేశారు.

నేనీముఖంగా అడుగుతున్నది, మీ ప్రకటితాలపై విమర్శను ప్రారంభిస్తున్నాను, విచారణకు సిద్దంకాగలిగేదెవరో ముందుకురండనే. నా వరకు నేను, విచారణలో తేలిన వాటిని అవెలా తేలాయో అలా స్వీకరించడానికి, వాటి విషయంలో నా పూర్వభావాలను వదులుకోవలసి వచ్చినా, సరిచేసుకోవలసి వచ్చినా 100% సిద్దంగా ఉండగలనని, ఆ మేరకు పత్రికలో ప్రకటించగలనని నిజాయితీగా ప్రకటిస్తున్నాను. ఈ విషయాన్నే విచారణకు ముందుగా వ్రాతమూలకంగా స్థిరీకరించుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. విచారణలో పాల్గొన్న ఎవరివల్ల ఆయా విషయాలలో నాకు మార్పులు, చేర్పులు చేసుకునే పరిస్థితి వచ్చిందో వారి గురించీ కృతజ్ఞతలంటూ పత్రికలో నిస్సంకోచంగా ఒక ప్రకటనా చేస్తాను.

అదే మరి మీమీ ప్రకటితాలలో అలాటి దోషాలు, లోపాలు ఉన్నాయని తెలితే మీరూ ఆ మేరకు సరిచేసుకుని, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటించడానికి మీలో ఎవరెవరు సిద్దపడగలరో తెల్పండి ముందు. ఏయే విషయాలలో, నాతో జరిపిన పరిశీలన - విచారణ సందర్భంగా మీలో అవగాహన పెరిగిందో, ఆ విషయాల మేరకు మీకు వెలుగునిచ్చిన వానిగా నన్ను పేర్కొంటూనూ ప్రకటన చేయాల్సి ఉంటుంది. సత్యావిష్కరణ పట్ల తగినంత తపన (నిజమైన మక్కువ) సత్యస్థాపనోద్దతి; గుర్తించిన సత్యాన్ని ప్రకటించడానికి అవసరమైన నిర్భీతికత, స్వీకరించడానికి తగిన సంసిద్దత నాకైతే దండిగా ఉన్నాయి. మీలో నేను చూపెట్టిన వారికున్నాయో లేదో ప్రకటించండి. అటుపైన ఆమాటన్నాయన మాటలు పొల్లు మాటలు కావనడానికి తగిన రీతిలో, ఎంపిక చేసుకున్న అంశాలకు పరిమితమై విచారణకు కూర్చుందాం. మొత్తాన్ని రికార్డు చేద్దాం. దానిని మన ఇరుపక్షాలూ స్వేచ్చగా వినియోగించుకోవచ్చునన్న నియమాన్ని పెట్టుకుందాం.

విచారణ వేదిక విషయంలో నేను సూచిస్తున్న కొన్ని ముఖ్యాంశాలు


1)     నాతో విచారణకు సిద్దపడవలసిందిగా నేను సూచిస్తున్న - నేను ఇష్టపడుతున్న వ్యక్తుల జాబితాక్రమం.

    1. రావిపూడి వెంకటాద్రి గారు

    2. గుమ్మా వీరన్న గారు

గమనిక :- వెంకటాద్రి గారు తనకు మారుగా మాట్లాడు వ్యక్తిని తన ప్రతినిధిగా ఎంపిక చేసి పంపవచ్చు. అయితే, ఆ వ్యక్తి వ్యక్తీకరణలను, వాటిలోని గుణదోషాలను తనవిగానే అంగీకరించాల్సి ఉంటుంది.

అఖిల భారత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

    3. కుర్రాహనుమంతరావుగారు

    4. మేడూరి సత్యన్నారాయణగారు

    నాతో పరిచయముండి, నాతో అంతో ఇంతో విభేదిస్తూ ఒకటి రెండు విసుర్లూ విసిరిన వారు

    5. కరి హరిబాబు

    6. షేక్‌ బాబు

    ఆ పక్షాన్ని విడవ లేక, నా పక్షాన్ని పట్టుకోనూ లేక, నా పక్షం వీగిపోతే బాగుండును అన్న దృష్టీ కలిగి ఉండి, నన్ను మిత్రునిగానే తలుస్తుండేవాళ్ళు

    7. ఆకేటి సూరన్న

    8. అజరత్‌ ఆలీ

    9. నార్ని వెంకట సుబ్బయ్య

గమనిక : నేను సూచిస్తున్న వ్యక్తులేగాక, క్రింద ప్రస్తావించిన అంశాలపై నాతో విచారణకు, రాష్ట్రంలోని హేతువాద, నాస్తిక సంఘాల వారెవరు సిద్దపడ్డా నాకు అభ్యంతరం లేదు. అట్టివారు వారి వివరాలు వ్రాత పూర్వకంగా నాకు తెలియజేస్తే ఆ వివరాలూ పత్రికలో ప్రచురిస్తాను.

విషయ విచారణ సందర్భంలో పరిశీలకులుగా ఎవరెవరుంటే బాగుంటుందన్నది ఇరు పక్షాలూ కలిసి నిర్ణయించుకోవచ్చు. ఒక సాధారణ సూచన మాత్రం చేస్తాను. మా రెండు పక్షాలకు చెందిన ఎంపిక చేసుకున్న కొద్ది మంది అధికార ప్రతినిధులుగా ఉంటారు. వీరి సంఖ్య పక్షానికి, ఇద్దరు ముగ్గురైతే చాలు.

అయితే పరిశీలకులు విచారణలో నేరుగా పాల్గొనరాదు. ఇరు పక్షాలకూ సూచనలు చేయవచ్చు

వేదిక నియంత్రణాధికారిగా (సంధానకర్తగా) ఇరువురకూ అంగీకారమైన లేదా ఇరుపక్షాలకూ చెందని ఒకరిని ఎంచుకుందాం. అతడైనా వేదిక ఏర్పరచుకున్న నియమ నిబంధనల్ని ఇరుపక్షాలు మిగిలిన సదస్సులూ అతిక్రమించకుండేట్లు చూడాలేగాని స్వతంత్రంగా యధేచ్చగా వ్యవహరించకూడదు.

నా ప్రకారమైతే, విచారణలో వెంకటాద్రిగారుండడమే అన్ని విధాలా మంచిది. ఎందుకంటే మిగిలిన వారంతా, దాదాపుగా ఆయన బాటలో నడుస్తున్నవారే, కాకుంటే వారిలో కొందరు కొంత మేర స్వతంత్రాలోచనాశీలత కలిగిన వారైయ్యుండవచ్చు.

క్రమంలో రెండోవ్యక్తి గుమ్మావీరన్నగారైతే మేలన్నదిగా దృష్టి. ఎందుకంటే వెంకటాద్రి గారికి దీటుగా వారూ నాతో విభేదించారు, నా పక్షంపై విమర్శనూ నాపై విసుర్లనూ జోడించి రచనలూ చేశారాయన.

ఇక మూడోస్థానంలో, ప్రస్తుతం ఆ సంస్థకు జాతీయ స్థాయి ప్రధాన బాధ్యులుగనున్న మేడూరి సత్యన్నారాయణ గారూ, కుర్రా హనుమంతరావుగార్లు ఉంటారు. ఈ జాబితాను ఇప్పటికి ఆపుతాను. ఈ నలుగురి విషయంలోనూ, మిగిలిన ముగ్గురిలో నేనెవరితో మాట్లాడాలన్నా వెంకటాద్రిగారు ముందుగా వారిని తన ప్రతినిధిగా అంగీకరించాల్సి ఉంటుంది. కాదంటే, ఎవరికి వారు స్వేచ్చగా తనకు తానుగా పాల్గొంటున్నానని ప్రకటించీ పాల్గొనవచ్చు.

మా మధ్య విచారణీయాంశాలుగ ఉండాలని నేను గమనించిన వాటిలో ప్రథమ జాబితా ఇదిగో


1.     భావ జాల క్షేత్రంలో చోటు చేసుకునే ముఖ్యమైన, కీలకమైన పదాలకు నిర్వచనాలు అవసరమని నేను, అనవసరమని వెంకటాద్రి గారూ అంటూ వస్తున్నాం. ఇందులో ఎవరి పక్షం సరైంది?

2.     హేతువాదం సిద్దాంతమా? విధానమా? అన్న అంశంలో వారు నేను ప్రకటించిన భావాలు. ఎవరివి సరైనవి?

3.     'సత్యం' అన్న మాటకున్న అర్థం ఏమిటి? సత్యాలుమారతాయి అని ఆయన ఆపక్షంలోనివారు అంటుండగా, సత్యం మారదని నేను అంటున్నాను.

4.     కార్య - కారణాల గురించి మా అవగాహనల్లో వైరుధ్యం కూడా ఉంది. ఎవరిది సరైనది?

5.     ఎలా ఆస్థికత ఇప్పటికీ అనిర్థారితమో, అలానే నాస్తికత కూడా ఇప్పటికీ అనిర్థారితమేనన్నది నా పక్షం. ఈ విషయంలో లేని దానిని రుజువులు చేయమంటున్నానని నాపై ఆరోపణ చేస్తున్నారు వెంకటాద్రి గారు. అది నేనననిమాటను అన్నానని అభాండం వేయడమే. నాస్తికతే సరైందని రుజువైందంటున్న మీ పక్షాన్ని నిలబెట్టండనే నేనడుగుతున్నది. ఇది చాలా చాలా కీలకాంశం.

విచారణకు ముందే విచారణలో పాలుపంచుకునే వారంతా తెలుసుకుని, అంగీకరించి ఉండాల్సిన సాధారణ సూత్రీకరణలు :-

1.     ఒకరిభావాలొకరం గ్రహించడానికి మాధ్యమంగా మనకున్నది భాష మాత్రమే. కనుక గ్రహింప చేయాలనుకుంటున్న, గ్రహించాలనుకుంటున్న వారిరువురకూ వర్తించే భాషానియమాలు కొన్ని ఉన్నాయి.

పదపదార్థ జ్ఞానం లేనివానికి వాక్యార్థ జ్ఞానం కలుగదు. ఇది మీకంగీకారమేనా కాదా?

సమాన సంకేతాలు (పదాలు) సమాన సంకేతులు (అర్థాలు) ఉన్న వారి మధ్యనే భావ ప్రసారం సాగుతుంది. ఇంకా సరిగా చెప్పాలంటే, అలాటప్పుడు కూడా ప్రసరించేది పదాలే. అర్థం లేదా భావం స్ఫురిస్తుందంతే. (అంటే పదాలే అన్నవాడి నుండి మన కందుతాయి. అర్థం స్మృతి నుండి గుర్తుకొస్తుందంతే నన్నమాట)

కనుకనే అవసరమైనప్పుడల్లా విన్నమాటకు అర్థాన్ని అన్నవాడి నుండే గ్రహించాలి, అన్నవాడూ తానన్న మాటకు తానుద్దేశిస్తున్న అర్థమేమిటో తెలిపేందుకు సిద్దంగా ఉండాలి అనంటున్నాను.

విచారణ పరంగా అవసరమయ్యే కొన్ని జాగ్రత్తలు

1.     వక్త హృదయం ఇదేనని నిర్ధారణయ్యాకనే శ్రోత దాని సబబు బేసబబుల్ని విచారించేందుకు పూనుకోవాలి.

2.     ప్రశ్న అర్థమైందని నిర్ణయించుకున్నాకనే - నిర్ధారించుకున్నాకనే - దానికి తానంగీకరిస్తున్న సమాధానమేమిటో ప్రకటించాలి. అప్పుడుకూడా

3.    ప్రశ్న ఏ విషయంలో ఎంత సమాధానాన్నాశిస్తొందో ఆ విషయంలో అంత సమాధానాన్ని చెప్పినప్పుడే, అడిగిందానికి సరైన సమాధానం చెప్పినట్లు అవుతుంది.

4.     శాస్త్రీయ విచారణలో ఉదాహరణలే ప్రకటితాభిప్రాయాన్ని రుజువు చేసేందుకు పనికి వస్తాయి. ఉపమానాలు పనికిరావు సరికదా, విచారణను ప్రక్కదారికి మళ్ళిస్తాయి కూడా.

5.     ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని నిర్ధారించే బాధ్యత స్వీకరించాలి.

6.     ఒక విషయాన్ని విచారణకు స్వీకరించాక, ఆ విషయంలో విచారణ ఒక ముగింపుకు వచ్చేలోపు, మరో విషయాన్ని (ఇతర విషయాలను) లేవనెత్తనేకూడదు. అలా లేవనెత్తినా వేదిక దానిని విచారణకు స్వీకరించరాదు.

విచారణలో చోటు చేసుకునే ముఖ్యమైన విభాగాలు


1.     వాది - ఒక పక్షాన్ని స్వీకరించి ప్రతిపాదకునిగా ఉన్నవాడు.

2.     ప్రతివాది :- వాదితో విభేదిస్తూ, వాది పక్షాన్ని ప్రశ్నించడానికి, పరీక్షించడానికి సిద్దపడినవాడు.

గమనిక : వాది ప్రతిపాదనకు వేరైన ప్రతిపాదన కలిగి ఉన్నవానినీ ప్రతివాది అనవచ్చు. అయితే ప్రతివాది అలాటి మరో ప్రతిపాదన చేసిన సందర్భంలో, వాది ప్రతిపాదనపై విచారణ ముగిశాకనే, ప్రతివాది ప్రతిపాదనను విచారణకు స్వీకరించాలి. అప్పుడతడు వాది స్థానంలోకి వస్తాడు. ఆ పిమ్మటే అతని వాదాన్ని విచారణకు లోను చేయాలి. ఈ రెండు పాత్రలను ప్రతిపాదకుడూ, పరీక్షకుడు అని అనవచ్చు.

3.     విచారణ అన్నది రెండు ముఖాలు కలిగి ఉంటుంది.

    1. ఎంపిక చేసుకున్న అంశంలో ఆ పక్షాన్ని స్వీకరించిన వాని అవగాహనేపాటిదో పరీక్షించడం

    2. ఎంపిక చేసుకున్న అంశంపై ఆ ధోరణి - ఆ పక్షం - అంగీకరిస్తున్నదేమిటన్నది పరీక్షించడం

గమనిక :- ఆ పక్షాన్ని స్వీకరించిన వ్యక్తి అవగాహనేపాటిదో పరిశీలించే సందర్భంలో, అతనికివత్తాసుగా ఆ పక్షంలోని ఇతరులెవ్వరూ పాలు పంచుకోరాదు. అదేమరి, ఆ ధోరణి అవగాహనను పరీక్షించడమే ఉద్దేశమైనప్పుడు, ఆ పక్షాన్ని ఎందరుకలిసైనా నిలబెట్టే పని చేయవచ్చు. ఎంతో కీలకమైన ఈ తేడాను వేదికలో పాల్గొన్నవారంతా గమనించి ఉండాలి.

ముఖ్యగమనిక :- రేపటి మన విచారణ వేదిక ఈ రెండంశాలకూ సంబంధించినదిగా ఉంది కనుక మొట్టమొదట ఇరుపక్షాలలోనూ ఒక్కరొక్కరే పాల్గొనాలి. మండలివైపు నుండి రెండు విభాగాలకూ ప్రతినిధిగా, నే నొక్కణ్ణే పాల్గొంటాను. ఎందుకంటే రెంటి విషయంలోనూ బాధ్యుణ్ణి నేనేగనుక. ఇక హేతువాదం పక్షాన ఎవరు పాల్గొంటారో నిర్ణయించుకున్నాక, ఇక అతని వైపున మరెవ్వరూ పాల్గొన కూడదు. ఆ తొలి దశ విచారణలో ఆ పక్షాన పాల్గొన్న వానికి తగినంత అవగాహనలేదు, ఆ పక్షాన్ని అతడు సరిగా ప్రతిపాదించలేక పొయ్యాడు అని గనక ఆ పక్షంలోని మరికొందరు ముఖ్యులు ప్రకటిస్తే, అప్పుడు ఆ పక్షాన్ని స్థాపించడానికి ఇతరులూ సిద్దపడవచ్చు.

ఈ రెండు భాగాలను పారిభాషికంగా 'వాది బలపరీక్ష' ,

'వాద బల పరీక్ష' అనంటారు.


ఈ విచారణ వేదిక పూర్వరంగాన్ని గురించి ఇప్పటికి ఆగుతాను. విచారణకు సిద్దమని వెంకటాద్రి గారి వైపు నుండి ప్రకటన వెలువడితే, అప్పుడు ఇరుపక్షాలూ కలసి కూర్చుని 'శాస్త్రీయ విచారణ' అనేందుకు తగిన రీతిలో విధి విధానాలను రూపొందించుకోవచ్చు.

విచారణకు తప్పనిసరైన కొన్ని అంశాలు


1.     విచారణీయాంశపు ఎంపిక

2.     దానిపై నిర్థిష్ట రూపంలో అభిప్రాయ ప్రకటన.

దీనినే వాదము లేదా ప్రతిపాదన, లేదా విచారణకు స్వీకరించిన సిద్దాంతము అని అంటాము.

3.     అదే అంశంపై రెండో పక్షం తన ప్రతిపాదనను చేయదలచుకున్నా, మొదటి పక్షం వారు రెండో పక్షంవారిని ప్రతిపాదన చేయమని అడిగినా, ఆ అభిప్రాయాన్నీ ప్రకటించాలి.

4.     ఒక వరుసక్రమంలో వారి - ఒక పక్షం వారి - భావాలనే పరిశీలనకు తీసుకుంటూ మొత్తం ఆ పక్షపు భావజాలాన్నంతటినీ విచారణకు లోను చేయడం ఒక పద్దతి.

5.     ఎంపిక చేసుకున్న అంశాల జాబితా నుండి, ఒక్కో అంశాన్ని తీసుకుని మొదటి అంశాన్ని ముందుగా ఒక పక్షం ప్రతిపాదించి విచారణకిస్తే, రెండో అంశాన్ని రెండో పక్షం ముందుగా ప్రతిపాదించి విచారణకిస్తుంటుంది. అన్నది మరో పద్దతి (నా వరకు నాకు ఏ విధానాన్ననుసరిద్దామన్నా అభ్యంతరం లేదు గానీ రెండో విధానం సమనియమాన్ని పాటించడమవుతుంది కనుక ప్రథమగణ్యం)

6.     విచారణ పర్యవసానంగా ఏర్పడే నిర్థారణలు మూడు రకాలుగా ఏర్పడుతుంటాయి. ప్రకటితాభిప్రాయం 1. తప్పని తేలడం  2. ఒప్పని తేలడం 3. అప్పటికింకా తేలలేదని తేలడం.

7.     ఒక పక్షం యొక్క ప్రకటితాభిప్రాయం ఒప్పని తేలితే ఆ విషయంలో వారితో విభేదించే పక్షాలన్నీ తప్పులని తేలినట్లే. అదేమరి, ఆ అభిప్రాయం తప్పని తేలితే వారితో విభేదిస్తున్నవి ఒప్పులని తేలినట్లు కాదు.

8.     ఒక పక్షం వారు తమ ప్రతిపాదనను రుజువు చేయలేకపోయారు గనుక ఆ పక్షపు ప్రతిపాదన తప్పని తేలినట్లేననడం సరికాదు. అలాగే, ఒక పక్షం వారు ఎదుటి పక్షంవారి అభిప్రాయాన్ని తప్పని తేల్చలేకపోయారు కనుక ఆ ఎదుటి పక్షం వారు తమది ఒప్పేనని తేలిందనడమూ సరికాదు.

సూత్రం :- రెండే పర్యవసానాలుండి అంటే అదో, ఇదో ఏదో ఒకటే వాస్తవమై యుంటుంది. అనడానికి తగిన సందర్భాలలో ఏదో ఒకటి ఒప్పనిగానీ, తప్పనిగాని తేలితే ఆ రెండో ప్రతిపాదన కూడా తప్పనో, ఒప్పనో తేలినట్లే పరిగణించవచ్చు. అలాకాక అందులో ఏదీ తప్పనిగానీ, ఒప్పనిగాని నిర్థారణ కానంత కాలం వాటిలో దేనినీ తప్పనిగానీ, ఒప్పనిగానీ తేలినట్లు పరిగణించనేకూడదు.

యోచనాశీలురైన మిత్రులారా! భావ విప్లవ క్షేత్రాలలో లేదా సైద్ధాంతిక స్థాయి విచారణలలో పై అంశాలు అత్యంత కీలకమైనవి. విచారణలో పాల్గొనే మూడు పక్షాలకూ ఈ సూత్రాలు మొదట చక్కగా అర్థం కావాలి. ఆ పిమ్మట ఏకాభిప్రాయ సాధన జరగాలి. అప్పుడే విచారణలు నిస్పాక్షికంగా, సక్రమంగా సాగించుకునే వాతావరణం ఏర్పడుతుంది. కనుక ఈ అంశాలు, వీటికి ముందు ఈ వ్యాసంలోనే ఉన్న మిగిలిన అంశాలను కూడా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి ఇందులో మీ కంగీకారం కానివి ఉంటే నాకు తెలియపరచండి. మరికొన్ని ఇలాటివే అవసరమనిపిస్తే వాటి వివరాలూ అందించండి. నా భాషగానీ, భావంగానీ అర్థం కాలేదనిపిస్తే ఆ వివరాలూ ఇవ్వండి. ఈనా సూచన ముఖ్యంగా వెంకటాద్రి గారికీ, వారి బృందానికీ, ఇతర హేతువాద, నాస్తిక సంఘాల అధ్యయన పరులకూ, వర్తిస్తుంది. అటు పిమ్మట, ఈ విచారణలో ఏదో ఒక పాత్రలో పాల్గొన నుత్సహిస్తున్నవాళ్ళకూ వర్తిస్తుంది.

ప్రత్యేక ప్రకటన


పదాల మీద గట్టిగా పట్టుబట్టి క్కూర్చున్న నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్న మిత్రులొకరు, నా రచనలో భాషాపరంగా చోటు చేసుకున్న చిన్నదోషమంటూ ఒక సూచన చేశారు. నా శైలిలో 'సరిగ్గా సరిపోయే' అన్న అర్థం వచ్చే పదం వాడాలనుకునే సందర్భంలో ఆ అర్థాన్నిచ్చే 'కచ్చితంగా' అన్నమాటకు బదులు 'ఖచ్చితంగా' అన్నపదం వాడుతూ వస్తున్నాను నేను. వెంకటాద్రి గారు ఇలాటి వాటినీ పెద్ద తప్పులుగా చూపే అవకాశముంది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి, అన్న సుహృద్భావంతోటే వారా సూచన చేశారనుకుంటున్నాను. మిత్ర దృష్టితో చేసిన ఆ సూచనను పరిగణలోకి తీసుకుంటున్నాను. వారికి కృతజ్ఞతలు. అలాగే వెంకటాద్రి గారున్నూ హేతువాది 343 నంబరు సంచికలో 223 పేజీలో, నేను 'అస్తిత్వం' అనాల్సినచోట 'అస్థిత్వం' అని అంటున్నానంటూ ఒక భాషాదోషాన్ని ఎత్తి ఖండించారు. 'స్త' కు బదులు 'స్థ' అని తప్పురాతలు రాసే మీకు పదాల విలువ ఎలా తెలుస్తుంది? అనంటూ అక్షర దోషాలు పట్టించుకోని వారికి పదాల విలువే తెలియదంటూ ఈ సడించారు. ఆ మాటలు రాసేటప్పుడు ఆయన ఏ కళనున్నారోగాని, మొదటి నుండీ నేను వాదిస్తున్న దానికి బలం చేకూర్చే మాటలే అనేశారు. సంతోషం. దానితో పాటు, చిన్నదే అయినా ఉన్న దోషాన్నే చూపించారు కనుక వారికి నా కృతజ్ఞతలు. ఇక నుండి ఆ పదంలో ముద్రారాక్షసం చోటు చేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటాను. 'స్థ' శబ్దం స్థితినీ, స్దిరత్వాన్ని తెలిపే శబ్దం. ఆస్తికతకు ఆస్తికులిచ్చిన నిర్వచనం అస్తిపరలోక ఇతిమతిర్యస్యసః ఆస్తికః | అని పరలోకపు ఉనికి నంగీకరించేవాడు అని దానర్థం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 'ఆస్థిక' శబ్దం వాడుతూ వచ్చాను నేను. ఏదేమైనా భాషలో 'ఆస్తిక' మన్నదే రూడిలో ఉంది గనుక దానినలా స్వీకరించడమే సబబు. ఈ చిన్న ముక్క చెప్పడానికాయన ఎంత దురుసుతనాన్ని ప్రదర్శించారో చూడండి. ''అస్తిత్వానికి బదులు 'అస్థిత్వ' మని పదే పదే గెలికే మీకు పదాల విలువ ఎలా తెలుస్తుంది? పదార్థాల రుచి మరిగిన వారికి పదాల అర్థాలు ఎలా మనసుకుపడతాయి? (బాగుంది గదూ వారిశైలి?) ఏదేమైనా నా రచనలోని అక్షర దోషాన్ని పట్టిచ్చిన వెంకటాద్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నుండి మన మిరువురమూ, పదాల విషయంలోనూ, పదాల అర్థాల విషయంలోనూ మరింత జాగ్రత్తగా ఉందామనీ, దోషాలు దొర్లితే ఎత్తి చూపించుకుని, సరి చేసుకుంటూ సాగుదామని తెలియజేస్తున్నాను.

ముగింపు :-

ఈ వ్యాసాన్ని, మలివ్యాసానికి ఆరంభంగా ఉండ దగ్గ అంశాలను ప్రస్తావించడంతో ముగిస్తాను.

1.     ''మనం వాడే, మాట్లాడే ప్రతి పదానికీ, మాటకూ నిర్వచనాలు వెదకే దశలో మనం లేము.''

2.     పదాలకు అర్థాలు, వివరణలు కావలసిన దశలో ఉన్నవారు నిఘంటువులను సంప్రదించుకోవచ్చు.

3.     విమర్శకులు పదాల అర్థాలు అడుక్కునే చాపల్యం నుండి, అర్థం చేసుకోగల వివేక దశకు ఎదగాలి.

4.     మీరు వాడిన పదాలకు మీరు నిర్వచనాలు, అర్థాలు చెప్పరుగాని, యితరు లెవరైనా ఆ పదాలనో, అలాంటి పదాలనో తమరచనల్లో వాడితే వాటి అర్థాలను డిమాండు చేస్తారు. ఇదే కదామీ నైజం?

5.     ఎడిటోరియల్‌ శీర్షికనే అర్థం చేసుకోలేని మీరు అర్థాలడుక్కోవడం తప్ప మరేమి చేయగలరు?

6.     చెప్పండని అడుక్కోవడం తప్ప చెప్పడం మీకు అలవాటు లేదు కదా?

7.     విషయ ప్రధానమైన రచనల్లో పదాలను నిర్వచిస్తూ కూర్చుంటే, అతడు చెప్పదలచుకున్న విషయం ప్రక్కదారులు పడుతుంది.

8.     రచయిత మాటల్లోని భావం మీకు స్పురించకపోతే, మీరా భావాన్ని వదలి నిర్వచనాల కూపంలో పడిపోతే ఎలా?

9.     'పరమం' అంటే ఏమిటో నేను చెప్పలేదని గొణుగుతున్నారు. మరి 'పరమ' మంటే మీరేమనుకుంటున్నారో చెప్పిందెక్కడ? మీ నిర్వచనం ప్రకారం నన్ను తప్పు బట్టిందెక్కడ?

10.     ఆయా పదాలు నేనూ మీరూ ఈనాడు కనిపెట్టినవికావు. ఏయే అర్థాలలో అవి మనకు దిగుమతి అయ్యాయో ఆ విధంగానే మనం ఆయా పదాలను అర్థం చేసుకోవాలి. అంతేగాక, వాడకంలోనూ, అవగాహనలోనూ సందర్భ శుద్ధి ఉండాలి.

No comments:

Post a Comment