Friday, July 15, 2016

వెంకటాద్రి గారికి


వెంకటాద్రి గారికి


1. మీరే వెలిబుచ్చిన పై వాటిలోని ఆఖరి  అంశం (10) అంశంలో మూడు అభిప్రాయాలున్నాయి. 1) భాష మనకు సంక్రమించింది. 2) మన కందించిన వారిచ్చిన అర్థాలతోనే వాటిని చూడాలి. 3) అప్పుడు కూడా పదాలు వాడడంలోనూ, అర్థాన్ని గ్రహించడంలోనూ సందర్భ శుద్ధిని పాటించితీరాలి.
ఈ మూడు అభిప్రాయాలూ నాకు నూటికి నూరు శాతం శిరోధార్యం. నాకు తెలిసినంతలో భాషకు సంబంధించిన ప్రాథమిక నియమాలివి. కనుక వాటినతిక్రమించే స్వేచ్ఛ ఎవరికీ లేదు. మీరే అన్న ఈ సూత్రీకరణకులోబడే మన విచారణ సాగించుదాం.

నా పక్షం :-


మాట్లాడే ప్రతి మాటకు నిర్వచనాలు చెప్పుకోవాలని నేనెన్నడూ అనలేదు. మేలుకొలుపు ప్రారంభసంచికల నుండి అంటే గత పాతికేండ్లుగా నేను చెపుతున్నది పారిభాషిక శబ్దాలకు నిర్వచనాలు చెప్పుకోవాలని మాత్రమే. ఈ విషయం వరకు ఇప్పటికైనా మీరేమంటారో స్పష్టంగా ప్రకటించండి.

2) నేను వాడిన పదాలకు నేను అర్థాలు చెప్పలేదు, చెప్పను అని అభాండం వేశారు. నా గత సంచికల్ని నిర్ణేతల ముందు తెరచి చూద్దాం. సంచికారంభంలోనే స్వమంతవ్యం పేరున (నేనూ - నా పత్రికంటూ) కొన్ని వ్యాసాలు ప్రచురించాను. అందులో నేను - నా పత్రిక గురించిన పదాలకు వివరణలు చేశానో లేదో చూద్దాం. అంతేకాదు, ఆ నా వివరణలపై విమర్శించండనీ అందులోనే ప్రకటించాను.

3) అంతదాకా వద్దు, 'హేతువాద పునరుజ్జీవన యత్నాలు' అన్న శీర్షిక ప్రారంభించాకనూ, కొన్ని ముఖ్యమైన పదాల జాబితాను ప్రచురించి, వాటికినేనంగీకరిస్తున్న అర్థాలు స్పష్టంగా ప్రకటించాను.

4. పదాలకు అర్థాలు కావలసినవారు నిఘంటువుల్ని వెదుక్కోవచ్చునన్నారు. మంచిదండీ నేను నాక్కావలసిన పదాలకు అలాగే వెదుక్కుంటాను. ఎవరైనా అలాగే చేస్తారు. కానీ ఇక్కడ సందర్భం అదికాదు. (సందర్భ శుద్ధి ఉండాలని మీరూ అన్నారు కదా!) ప్రతిపాదకుని - ప్రయోక్త - ఉద్దేశాన్ని గ్రహించే సందర్భంలో సందిగ్దత ఏర్పడ్డ సందర్భంలోగానీ, దాని విచారణ సందర్భంలో గాని, అన్నవాని బాధ్యతకు సంబంధించిన విధానాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భమిది. నేనిది కేవలం మీకోసం అన్నమాట కాదు. భాషకు సంబంధించి మండలి వైఖరి ఇది. కావాలంటే ఈ విషయాన్నీ ''మేలుకొలుపు - వివేక పథం'' సంచికలలో అనేకసార్లు ప్రస్తావించినట్లు రుజువు చూపగలను.

5. సాహిత్య సౌష్ఠవం కోసం పదాలను నిర్వచించుకుంటుంటారని, విషయ ప్రధానమైన రచనల్లో పదాలను నిర్వచిస్తూ కూర్చుంటే అతడు చెప్పదలచుకున్న విషయం ప్రక్కదోవపడుతుందనీ, అన్నారు. నా అవగాహన ప్రకారం ఇది పూర్తిగా తిరగబడిన భావన. సాహితీ ప్రక్రియలలో ఎక్కడా నిర్వచన పద కోశాలుండవు. ముఖ్యంగా వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించే నిర్వచన పదకోశాలుంటాయి.అయితే భాషా నియమాల గురించి వివరించే భాషా శాస్త్రాలు అంటే వ్యాకరణము, చందస్సు మొ||గు వాటిలోని కీలక పదాలకూ నిర్వచనాలుంటాయి. ఎందుకంటే అదీ ఒక విజ్ఞాన శాస్త్రమే కనుక.

6. 'పరమం' అంటే అర్థం ఏమిటో నేను చెప్పలేదన్నారు. నిజమే అక్కడ నేనెందుకు చెప్పాలి. మీరు చెప్పలేదనికదా నేను సూచించింది. మీరు చెప్పలేదని మీరంగీకరిస్తూనే ''మరి నన్ను తప్పు బట్టిందెక్కడ?'' అనడుగుతారేమిటి? మీరు చెపితే కదా! దానిని పరిశీలించి సరిగనే ఉందో, దోషముందో చెప్పగలిగేది?

విచారణకు కూర్చుందామంటే, వేదికనేనే ఏర్పాటు చెస్తాను. మీరేర్పాటు చేస్తేనూ నేను పాల్గొంటాను.

పై సంచిక నుండి క్రమంగా మీరు వెళ్ళడించిన అభిప్రాయాలను విశ్లేషించి గుణదోషాలు చూపే పనిని ఆరంభిస్తాను.

ఈ వివరాలు మన రెండు పత్రికలలో వేద్దామంటేనూ నా కంగీకారమే.

రంగంలోకి నేరుగా దిగనున్నాం కనుక, అనవసరపు ఆవేశాలు, రచ్చలు రేకెత్తకుండేలా, విమర్శను విషయానికి పరిమితం చేసుకుందామనీ, నిందకు చోటీయకుండా, విమర్శ మరియు అవసరమైన ఖండనలకు పరిమితమవుదామని మీ విజ్ఞతకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.. సశేషం.

పాఠకులకో విజ్ఞప్తి :- వెంకటాద్రి గారితో ముడిపెట్టి వ్రాస్తున్నవే అయినా, ఈ విషయాలు ప్రతి జిజ్ఞాసికీ, హేతువాద క్షేత్రాలలో నున్నవారికి, వివిధ తాత్విక దోరణుల వారికీ కూడా అవసరమైనవీ, మేలొనగూర్చగలిగినవీ, తెలుసుకుని, ఆచరిస్తూ ఉండాల్సినవీ కూడా గనుక, శ్రద్ధగా వీటిని అధ్యయనం చేస్తూ రండి. నాతో విభేదించాల్సిన సందర్భాలున్నాయనుకుంటే నిర్మొగమాటంగా వాటిని నా దృష్టికి తెండి. వ్యంగ్యోక్త్తులు కానీ, దురుసు మాటలను గానీ చొరబడనీకుండా విజ్ఞతను కనబరచండి.

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర

No comments:

Post a Comment