Thursday, March 23, 2017

ఫజులూర్‌ రహ్మన్‌ గారికి



రాయడానికి ఒకింత ఇబ్బందిగా ఉన్నా ముందుగా ఒక నిజాన్ని చెప్పి విషయానికి వస్తాను. సుమారు 10 ఏండ్లు ఆత్మీయంగా మెసలిన మన మధ్య ప్రస్తుతం మనస్ఫూర్తిగా మిత్రుడా అని అనలేని పరిస్థితి నెలకొని ఉంది. నాకైతే సత్యం ప్రాతిపదికన, ఈ పరిస్తితి మారితే బాగుండును అనిపిస్తున్నా, ఆశ మాత్రం దాదాపు కొండెక్కేందుకు సిద్దంగా ఉన్న దీపంలా మినుకు మినుకు మంటోంది. ఇంకా కొండెక్కలేదన్న ఆ ఆశతోనే లేఖ ఇలా తయారైంది.

1. బైబిలు, ఖురాను మూలాల్లోనే పరమతాన్ని సహించని, విరోధించే వాక్యాలున్నాయి.

''నేను తప్ప మరోదేవుడుండకూడదు'' బైబిలు; ''దేవుడు లేడు అల్లా తప్ప'' ఖురాను

2. మీరు ఏ రూపమును, విగ్రహమును చేసికొనకూడదు, మొక్కకూడదు, పూజించ కూడదు. నిర్గ 20:3,4; వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, దేవతాస్థంభాలనూ పడగొట్టాలి. నిర్గ 34:13,14. సమస్త స్తోత్రములూ అల్లాకే, అల్లా తప్ప ఆరాధ్యుడులేడు. బహుదైవారాధకులు, విగ్రహారాధకులకు ఈ లోకము పరలోకములో కూడా ఘోరమైన శిక్ష ఉంది. ఖురాను. ఆవు దూడను పూజించినందుకే స్వజనులనే హతం చేయడం బకరా:54; మక్కాలోని దేవతామందిరాలను ప్రవక్తే ధ్వంసం చేయడం మీకూ తెలిసున్న విషయాలే.

3. ఆ రెండు గ్రంధాలను బట్టే కాక, ఆ వాక్యాలననుసరించి గతంలో చాలా ఘటనలు జరిగాయనడానికి చరిత్ర నిండా అనేక ఆధారాలూ ఉన్నై.

ఈనాడు పై మూడు వ్రాతరూపంలో మనకు అందుబాటులోనే ఉన్నప్పటికీ, మతాభిమానం మన చేత ఈ నిజాన్ని అంటే ఆ రకమైన అన్యమత వ్యతిరేకత బైబిలు, ఖురానులలో ఉందన్నా అంగీకరించనీయడం లేదు. ఎందుకని క్రైస్తవులూ, ముస్లింలూ అంగీకరించడం లేదు?

ఒకటి :- రకరకాల దైవారాధనలను అంగీకరిస్తూ అనుసరిస్తూ కూడా కలసి మెలసి జీవించడం నేర్పిన భారతీయ సంస్కృతికి అలవాటు పడి ఉండడం.

రెండు :- మానవీయ మరియు ఇరుగు పొరుగు సంబంధాలననుసరించి విశ్వాసాలు వేరైనంత మాత్రాన ఒకరి నొకరు శత్రువులుగానూ, దుష్టులుగానూ భావించనక్కరలేదని మనకు మనకే అనిపిస్తుండడం.

మూడు :- ఆ అసహనపు, శత్రుపూరిత వైఖరిని నలుగురూ అంగీకరించరు. భారత రాజ్యాంగమూ అంగీకరించదు కనుక. ఈ మూడూ, ఇలాటి మరి కొన్ని కారణాలవల్ల పై గ్రంధాలలో పేర్కొన్నటువంటి పరమత అసహనంగానీ, వైరభావం గానీ మనుషుల మధ్య ఉండకూడనివనే, మన సామాన్య జ్ఞానం (ఇంగితం) ప్రకారం అంగీకరిస్తున్నామన్నమాట. కాబట్టే అట్టి వైఖరి సరైందా కాదా అన్న దగ్గర మనం విభేదించుకోడం జరగలేదు. ఆ గ్రంధాలలో అట్టి భావాలున్నాయా లేదా? అన్న దగ్గరే మనం వివాద పడ్డాం. ఉన్నాయని నేను, మరికొందరూ అనగా ఉంటే చూపండి, దానిని విడిచి బైటికి వచ్చేస్తాను అని మీరూ అనడం జరిగింది.

పరమత అసహనంగానీ, అల్లాను విశ్వసించక, అన్య విశ్వాసం కలిగి ఉన్నాడన్న కారణంగా శత్రువుగా తలంచడంగానీ, సరైంది కాదనే ఇరువురమూ అంటున్నాం. అట్టిపోకడను విడిచిపెట్టాలనీ, అరికట్టాలనీ అంటున్నాం. ఇక్కడికిది మనం నిజంగా అనుకుంటున్నదోకాదో మీరూ ఆలోచించండి.

కానీ, ఖురాను ప్రకారం, ఖురానుకు వేరైన ధర్మశాస్త్రాలేవీ ప్రామాణికాలుకావు. అల్లా ప్రవక్త ద్వారా అంతిమ సందేశాన్ని అందించాక, ఇక ఇతరమైన వేటినీ అంగీకరించడు. కనుక ఒక ముస్లింకు ఇస్లాం రాజ్యమే కోరదగిందై ఉంటుంది. ఇతర రాజ్యాలు, రాజ్యాంగాలు అవేవైనాగానీ, ఉండకూడనివీ, ఒక ముస్లింగా పరాయివీనే అవుతాయి. ఈ అర్ధాన్నిచ్చే వాక్యాలు ఖురానులోనూ, హదీసుల్లోనూ ఉన్నాయి. సూటిగా అడుగుతున్నాను. ఖురాన్‌ తెలిసిన వ్యక్తి, భారత దేశంలోనూ, ఇస్లాం ధర్మం స్ధాపించబడాలని కోరుకుంటాడా లేదా? విధిగా కోరకుంటుంటాడు. కోరుకోవలసిందే లేకుంటే అవిశ్వాసి ఐపోతాడు కూడా.

కనుక నా లెక్క ప్రకారం బైబిలు, ఖురానులననుసరించి, పరమత అసహనం, బహుదైవారాధకుల పట్ల, అన్యదైవారాధకులపట్ల శత్రువైఖరి కలిగి ఉండడం వాటిననుసరించే వారికి తప్పనిసరి. సమానమూ కూడా. కానీ మీరు దీనిని అంగీకరించడం లేదు. అట్టి మాటలు లేవు అనంటున్నారు. ఇదే మన మధ్య వివాదాంశం.

ఈ విషయంలో ఎవరి అవగాహన - పక్షము - సరైందో తేల్చుకోడానికి రకరకాల వ్యక్తిగత విమర్శలు గానీ, ఇతరేతరమైన పలు అంశాలుగాని ప్రస్తావించుకుంటూ కూర్చోనక్కరలేదు. రెండు మూడు భాషలలో ఉన్న ఖురాను అనువాదాలను, హదీసులను పరిశీలించి అర్ధ నిర్ణయం చేయగల భాషాభిజ్ఞులను నిర్ణేతల స్ధానంలో కూర్చుండబెట్టుకుని, మనం చూపించదలచిన వాక్యాలను, ఖురానులోని సందర్భాన్ని కూడా వారి ముందర పెట్టి అర్ధ నిర్ణయం చేయండని అడిగితే సరిపోతుంది. విచారణ నీతివంతంగా జరిపించుకోవాలంటే, ఆ నిర్ణేతలుగా ఎంచుకునేవారిని మన రెండు పక్షాలలో ఎవరమూ ప్రభావితం చేయకుండా ఉండాలి. ''భాషననుసరించి ఈ మాటలకు అర్ధమేమిటి?'' అన్న మాట తప్ప మరింకేమీ మాట్లాడకూడదు మనం. ఇది మీకు గానీ, మీ పక్షంలోని వారెవరికి గానీ అంగీకారమైతే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఖురాను అనువాదాలను, వీలుంటే అరబ్బీ ఖురానును తీసుకుని, ఆ నాలుగు భాషలలోని భాషావేత్తల ముందుంచుదాం. ఆ వచనాలకు అర్ధాలు చెప్పమని అడుగుదాం.

ఇదొక్కటే, ఈ దశలో మన మధ్య నెలకొని ఉన్న సమస్యకు సరళమైన సరైన పరిష్కారం అనిపిస్తోంది. మీరూ, మీ బృందంలోని వారూ ఆలోచించి స్పందించండి. ఇతరేతర విషయాలను ప్రస్తావించకండి. క్రొత్త విషయాలను లేవనెత్తకండి.

రహ్మన్‌గారూ! ఈ వ్యాసం ద్వారా మిమ్మల్ని మరో విషయాన్ని అడగాలనిపించింది. అదేమంటే... రంజిత్‌ ఓఫీరుగారు వాదనలు మీకూ తెలుసు. ఆయన ప్రకటిస్తున్న వాటిలో, మీ అవగాహన ప్రకారం కూడా, సరికానివి కొన్నీ, అబద్దాలేననడానికి తగినవి కొన్నీ ఉన్నాయి. అందులో 1. ఏసే దేవుడన్నదీ, 2. ఏసేలోకరక్షకుడన్నదీ 3. ఏసే సృష్టికర్త అన్నదీ 4. ఏసే రక్షకుడన్నదీ చాలా ముఖ్యమైనవి. వీటికి సంబంధించి, ఇటు బైబిలు ప్రకారంగానీ అటు ఖురాను ప్రకారంగానీ, ఓఫీరు గారు చెపుతున్నది సత్యం కాదనీ, అతడు చేస్తున్నది అసత్య ప్రచారమేనని నిజంగా మీకు అనిపిస్తున్నదా, లేదా?

ఏసును దేవుడని గానీ, సృష్టికార్యంలో (దైవకార్యంలో) భాగస్వామి అనిగానీ అన్నవారు ఖురాను ప్రకారం మీకు శత్రువర్గమా? మిత్రవర్గమా? ఖురాను ప్రకారం వాళ్ళు విశ్వాసులా? అవిశ్వాసులా? తీర్పు తరువాత వారి నివాసం స్వర్గమా? నరకమా? సూటిగా ఒక్కమాటడుగుతాను. అంతే సూటిగా సమాధానం చెప్పగలరేమో చూడండి. మీ విశ్వాసం చెపుతున్న దానిని బట్టి, అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారు స్వర్గానికి పోతారా? ఘోరనరకాన్ని పొందుతారా? ఆయన పోకడ  'షిర్కు' క్రిందికి వస్తుందా, రాదా?

ఓఫీర్‌గారు ఇస్లాం సంబంధంగాగానీ, హైందవం సంబంధంగాగానీ మాట్లాడే విషయాలలో చాలా భాగం స్వకపోల కల్పితాలేనని మీకూ అనిపిస్తోందా లేదా? మీకు నిజమనిపిస్తున్నంత వరకైనా ప్రకటించగలిగితే ప్రకటించండి. ఇకపోతే, ఆయన తన గురించి తాను చెప్పుకునే గొప్పలకు అంతే ఉండడం లేదు. అంతగా ఆత్మ స్తుతి చేసుకోగలిగిన వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు లోకంలో అనుకోకుండా మన కళ్ళెదుటే అట్టివారు ఇద్దరు ఉన్నారు. ఒకరు పి.డి సుందర్రావుగారు కాగా మరొకరు మన రంజిత్‌ ఓఫీరుగారు ఇద్దరూ ఎవరికి వారు తాము సర్వజ్ఞులమూ, అసాధారణులము, ఏసుకు అత్యంత ఆప్తులమూ, మరెవరికీ తెలియనంతగా బైబిలు వాస్తవాలు, మర్మాలు తెలిసిన వారము, ఏసు చేత ఎంపిక చేయబడ్డవారము అని ప్రకటించేసుకుంటారు. అంతే స్థాయిలో ఒకరినొకరు నీకేం తెలీదంటే, నీకేంతెలీదంటూ నిందించుకుంటుంటారు. నీవు సాతాను ప్రతినిధివంటే, నీవే సాతాను ప్రతినిధివనీ బహిరంగంగా ప్రకటించు కుంటూనూ ఉంటారు. ఇరువురికీ తలో ఇంతమందంటూ భజన బృందం వెంటబడి ఉంటూ తమ నాయకుణ్ని పొగుడుతూ, రెండో వాణ్ణి తెగడుతూ తెగ సంబర పడిపోతుంటారు. నా అస్సలు ప్రశ్న ఏమంటే, వీరిద్దరూ తెగ రెచ్చిపోతూ ఎవర్ని మహిమాన్వితుడు, రక్షకుడు అనంటున్నారో ఆయన వీరిద్దరి చేత ఇలాటి పరస్పర విరుద్ద ప్రసంగాలు ఎందుకు చేయిస్తున్నట్లు? రంజిత్‌ ఓఫీరుగారు కురిపించమన్న పిడుగులు, భూకంపాలు ఇందులోని అబద్దకునిపైన ఎందుకు కురిపించనట్లు? ఇంతకూ వీరిలో బైబిలు సరిగా అర్ధమైందెవరికి? ఏసు ఎంచుకున్నదెవరిని? ఇది తేలేదెట్లా?

రంజిత్‌ ఓఫీరుగారు తన గురించి తాను చెప్పుకున్న గొప్పలు కొన్ని ఇవిగో

1. 10 సం|| ప్రాయం నుండీ ఏసుతో మాట్లాడుతున్నాను.

2. ఈ కడవరి యుగానికి ఏసేనన్ను అపొస్తలునిగ నియమించాడు.

3. ఈ యుగపు ఏసునోరును నేనే

గమనిక : ఈ వ్యాసం ద్వారా నేను మిమ్మల్ని, బైబిలు తెలిసిన ఇతర క్రైస్తవ విశ్వాసుల్ని అడిగేదెమంటే,

1. రెండవ రాకడకు ముందే ఏసు ఈ లోకానికి దిగి వచ్చి, వాళ్ళతో,వీళ్ళతో మాట్లాడి వెళుతుంటాడనడానికి బైబిలులో ఏమైన ఆధారాలున్నాయా?

2. ఓఫీరు గారన్నట్లు, ఏసే ఎవరోఒకర్ని, తన శిష్యుల అనంతరం వివిధ కాలాలలో, ఆయా కాలాలకు, అపొస్తలునిగా ఎంపిక చేస్తుంటాడనడానికి బైబిలులో ఆధారాలున్నాయా?

3. ఓఫీరు గారు మాట్లాడే అబద్దాలు, ప్రగల్భాలు, కల్పితాలు, పులుముడులు అని అనిపిస్తున్నన్నీ ఏసు పల్కిన లేదా పలికించిన మాటలేనని అంగీకరించగలరా?

1. జయశాలికాడతడు భయశాలి మాత్రమేనని పి.డి వారి గురించి ఓఫీరుగారి ప్రకటన

2.  ఓఫీర్‌ కాడతడు, ఓఫియర్‌గాడు అనంటూ ఓఫీరుగారి గురించి పి.డి గారి ప్రకటన

3. ఇద్దరి ప్రకారం ఇద్దరూ సాతాను ప్రతినిధులే. ఎవరి ప్రకారం వారే ఏసు ప్రతినిధులు.

ఇందులో ఏది సత్యం? ఏదసత్యం ? ఇది ఏసుతెల్చాల్సిన ప్రశ్న. ఏసు మాత్రమే తేల్చాల్సిన ప్రశ్న అనంటారా? మన మూ ఆలోచించి తేల్చుకోవాల్సిన అవసరమున్న ప్రశ్న అంటారా? ఇందులో అంతగా ఆలోచించాల్సిన దేముందండీ! మా ఇస్లాం ప్రకారం వారిద్దరూ మార్గభ్రష్టులే. సత్య తిరస్కారులే గనుక సాతాను పక్షం వారే. ఇద్దరికీ ఘోరశిక్ష సిద్దం చేయబడి ఉంది అంటారా? రహ్మన్‌గారూ! మీ మనస్సు చెపుతున్న మాట ఏమిటో అది బైటికి అనేయగలిగితే అనేయండి. సత్య సందేశ కేంద్రం వారు కదా మీరు!?

సురేంద్ర

1 comment:

  1. ఆ లెక్కన (ఇస్లాం ప్రకారం ) సురేంద్ర గారూ ....మీరూ నరక పాత్రులే...
    అయినా మీ బుధ్ద యే అలాంటిది లెండి... మీ శత్రు వర్గాలకు గొడవ పెట్టి పైశాచిక ఆనందం ను పొందాలనే మీ ఆశ చూడండి....
    ఓఫిర్ గారి గూర్చి మాట్లాడే అర్హత మీకు లేదు... ఆయన ప్రవక్త ,ఆపొస్ఠలుడు. దేవుడు నిరంతరం మాట్లాడే వాడు...

    ReplyDelete