Thursday, March 23, 2017

దేవుడు - ఒక పరిశీలన



- పుట్టా సురేంద్రబాబు

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

మిత్రులు రఘుగారు ఫోను చేసి మేము ముద్రించనున్న వ్యాసాల సంపుటిలో మీ వ్యాసమూ ఉంటే బాగుంటుంది. ఒక వ్యాసం రాసివ్వగలరా? అని అడిగారు. నావైఖరి రచనా శైలి కూడా తెలిసున్న ఆయన అలా అడగడంతో యోచనాపరుల మెదడుకు పదును పెట్టే ఉద్దేశంతోనే అడిగి ఉంటారులే అనుకుని, సరే అలాగే రాసి పంపుతానని మాటిచ్చాను. అదిగో ఆ అలాగే వలన ఇదిగో ఇలా రూపు ధరించిందీ వ్యాసం. మీరూ దీనిని విజ్ఞతతోనూ, విమర్శనా దృష్టితోనూ పరిశీలించి చూడండి.

ముందుగా ఒక్కమాట!

మన దృష్టిలోకి వచ్చిన కొన్ని రకాల విషయాలు, అంతా బాగా తెలిసున్నవేననిపిస్తుంటాయి కాని నిజానికి వాటి గురించి మనకేమీ తెలిసుండదు. అలాటి వాటిలోనిదే మనం ఎత్తుకున్న దేవుడి విషయం కూడా. అంతేకాదు, అలాటి విషయాల జాబితాలను గనుక తయారు చేస్తే, ఇది మొదటి జాబితాలోనూ మొట్టమొదట ఉంచాల్సిందిగా ఉంటుంది.

ప్రపంచ సాహిత్యంలో దేవుడు అన్న పదం ఆధారంగా సృష్టించబడినంత సాహిత్యం మరే పదం క్రిందా తయారవలేదు.

అంతేకాదు. ఈ పదం చేత దేనిని గురించి తెలపాలని వారంతా ఇంత సాహిత్యాన్ని రాశిపోశారోదానిలో ఎంతో వైవిధ్యంతో కూడిన, పరస్పరం పొసగని, కొన్నింట వైరుధ్యాన్నీ కలబోసుకున్న సమాచారం ఉంది.

దేవుడు అన్న పదం సంస్కృత మూలం నుండి వచ్చింది. దానాద్వా, దీపనాద్వా, ద్యోతనాద్వా అన్న అర్ధాలున్నాయి దీనికని 'నిరుక్తం' అంటోంది.

దీవ్యతీతి దేవః! దిపు క్రీడాయాం - ప్రకాశించునది, ప్రకాశించువాడు అని అమర కోశములో వుంది.

దేవా ఏవ దేవతాః! దేవతా ఏవ దైవతాని. దేవుళ్ళే దేవతలు, దేవతలే దేవుళ్ళు అనిదానర్ధం. మరియు పుంసివా అన్న నియమం చేత దేవత అన్న మాట స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. అంటే దేవత పురుష దేవత కావచ్చు స్త్రీ దేవతా కావచ్చన్నమాట.

గాడ్‌ (God) :- అన్నమాటకు ఆంగ్లంలో 'ద సుప్రీం బీయింగ్‌' (The supreme being) అన్న అర్ధం ఉంది. సర్వోన్నత జీవి అని దానర్ధం. భగవంతుడు, సృష్టికర్త, ఈశ్వరుడు, పరమాత్మ అన్న మాటలూ దేవుణ్ణి తెలిపే పదాలుగా రూఢిపడి ఉన్నాయి. కొందరైతే దేవుడు సహస్రనాముడనీ, అనంత నాముడనీ అనేశారు. వేయి నామాల వరకు వివిధ దేవీదేవుళ్ళకు కల్పించేశారు కూడా.

జీవసృష్టి అనేది లేకపోయినా, మెదడన్న పదార్ధం ఉనికిలోకి రాకపోయినా, అది మానవునిలో ఉన్న రూపంలో ఏర్పడక పోయినా, మనిషి తనకు కలిగిన అనుభూతుల ద్వారా గమనింపులోకి వచ్చిన వాటి మూలాల గురించి ఆలోచించకపోయినా, ఈ దేవుడన్న పదం గానీ, ఇలాటి ఊహాజనితాలైన మరికొన్ని పదాలు గానీ ఉనికిలోకే వచ్చుండేవికావు.

సృష్టి - సృష్టిలోని వివిధాంశాలు, వాటికి కారణాలు అన్న వాటిని గురించిన పరిశీలన ఆధారంగానే దైవ భావన సృష్టికి కారణం అన్న స్ధానంలో ఏర్పడింది.

'కార్య కారణ భావన' :- మనిషి, నిత్యజీవితంలో ఎదురపడే అనేక సంఘటనల నుండి క్రొత్త క్రొత్తవి ఉనికిలోకి రావడం, అలా అవి రావడానికి ముందే, వాటికి ఆధారంగా కొన్ని సమకూడి ఉండడం, మాటి మాటికీ గమనించడం ద్వారా పుట్టింది- అది పుట్టడానికి అవసరమైంది అన్న రెంటినే 'కార్యము - కారణము' అన్న పదాల ద్వారా గుర్తించుతూ, పేర్కొంటూ వచ్చాడు. అట్టి అనుభవాల సాధారణీకరణే ఏదైనా పుట్టింది అంటే, దానికి ముందే ఆ పుట్టిందాంట్లో ఉండాల్సిన ద్రవ్యాలు, వాటిని ఆ రూపానికి తెచ్చే పని చేసిన పదార్ధమూ ఉండి తీరతాయి, ఉండితీరాలి అన్న నియమం ఏర్పడింది. దీనినే మనం కార్యకారణ నియమం (Law of causation) అనంటున్నాము. దాని సాధారణ రూపం ఇలా ఉంటుంది. అప్పటికి లేని ద్రవ్యంగానీ, వస్తువుగాని ఉనికిలోకి రావాలంటే అందుకవసరమైన ముడి సరుకు ఉండాలి. అది ఆ కార్యంలోనూ ఉండాలి. అదిగో అలాటి దానినే కార్యకారణాలలో ఉపాదాన కారణం, Material cause అనన్నారు. అది కార్యానికి అంతర్గత కారణం కూడా. కార్యం ఏర్పడక పూర్వం ఉన్న ముడిసరుకును కార్యరూపంలోకి మలచిన పని చేసిన దానిని నిమిత్త కారణం. బాహ్యకారణం అనన్నారు. ప్రతి కార్యానికీ అంటే క్రొత్తగా ఉనికిలోకి వచ్చే ప్రతిదానికి అవశ్యం పై ఉపాదాన, నిమిత్త కారణాలు ఉండి తీరతాయి. ఉండి తీరాలి అన్న నిర్ణయానికి వచ్చిన మనిషి, ఈ కార్యకారణ నియమం విశ్వనియం అనీ సర్వసాధారణ నియమమనీ నిర్ణయించుకున్నాడు. Universal law / Most general law ఈ సూత్రం, కనుగొన్న నాటి నుండి ఈ నాటి ఆధునిక వైజ్ఞానిక క్షేత్ర పరిశోధనల వరకూ నిర్వివాదాంశంగా చెలామణి అవుతూ వస్తోంది. ఈ సూత్రం ఆధారంగానే గతానికి చెందిన వివిధ పరిశోధనలూ, కొత్త క్రొత్త వాటి తయారీ జరుగుతూ వస్తోంది.

గమనిక :- ఉపాదాన కారణం అన్న దానికి మారుగా మరికొందరు కార్యకారణజ్ఞులు సమవాయి కారణం + అసమవాయి కారణం అన్న పదాలు వాడారు. బాహ్యకారణాన్ని నిమిత్త కారణంగానే వ్యవహరించారు. మొత్తానికి ఏమని తేలినట్లు? ఏదైనా క్రొత్తగా ఉనికిలోకి రావాలంటే (దీనినే కార్యం, ఎఫెక్ట్‌ అంటారు) అందుకు ముందే అంతర్గత కారణం అనదగ్గదీ, బాహ్యకారణం అనదగ్గదీ ఉండి తీరాలన్నమాట.

మిత్రులారా! దేవుణ్ణి గురించి పరిశీలనంటూ మొదలెట్టి ఇవన్నీ ఎందుకు చెపుతున్నట్లు? అని మీలో కొందరికైనా అనిపిస్తుండవచ్చు. ఆస్థిక సిద్దాంత విచారణలో పట్టున్న వారికీ ఆలోచన రాకపోవచ్చుగానీ, సైద్దాంతిక విచారణలో అంతగా ప్రవేశంలేని చాలా మంది ఆస్తికులకు మాత్రం ఇదంతా ఎందుకన్న సందేహం వచ్చి తీరుతుంది. ఎందుకిదంతానంటే; మనిషి ఈ కార్యకారణ నియమాన్ని ఏర్పరచుకుని, దానిని జీవితంలో ఎదురుపడుతున్న అనేకాంశాలకు వర్తింపజేసుకుంటూ వస్తున్న క్రమంలోనే;

అయితే మరి ఈ సృష్టికీ, ప్రకృతిలో క్రొత్తగా ఉనికిలోకి వస్తున్న వాటికీ కూడా పై రెండు కారణాలూ ఉండి తీరాలి కదా అన్న ప్రశ్న పుట్టింది. అంతర్గత కారణం (ఉపాదాన కారణం) ఆ కార్యంలో ఉండి కనపడుతూనే ఉంది. ఇకపోతే నిమిత్తకారణం (బాహ్యకారణం) ఏమై ఉంటుంది? అన్న ఆలోచనే సృష్టికి అతీతంగా ఒక నిమిత్త కారణం ఉండి ఉండాలన్న ఊహకుదారి తీసింది. అదిగో దానిపేరు 'సృష్టికర్త' అలా వచ్చిందే దైవం (దేవుడు) అన్న భావన.

నిమిత్త కారణం ఉండక తప్పదు గనుక, ఇంతటి సృష్టిని చేయగలిగింది ఎంతటిదైయ్యుండాలి? అన్న ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్నకు సమాధానంగా తార్కిక బుద్ది చెప్పిన సమాధానంలోనివే దేవుడు సృష్టికర్త - సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అన్న భావనలు. ఈ రెండూ ఉండాలంటే ఆ దేవుడు ఎంతుండాలి? అన్న ప్రశ్న పుట్టి సర్వ వ్యాపి - అంతటా ఉన్నవాడు - అయ్యుండాలన్న సమాధానం చెప్పుకున్నాడు మనిషి.

ఇక ఈ సృష్టిని తెలియబడుతున్నంత వరకు పరిశీలించినా దీనిలో ఒక క్రమం ఉన్నట్లు తెలుస్తుండడంతో క్రమం ఉండేట్లు చూచే నియామకత్వమూ దేవునికి ఉండాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాడు. దేవుడనే వాడు ఉంటేగింటే (కార్యకారణ నియమాన్ని బట్టి ఉండక తప్పదు, గనుక ఉండే ఉంటాడు) వాడు అంతటా ఉన్నవాడై ఉంటాడు, అన్నీ తెలిసిన వాడై ఉంటాడు, అన్నీ చేయగలిగినవాడై ఉంటాడు. అన్నింటినీ నియమించే వాడై ఉంటాడు అని సిద్దాంతీకరించుకున్నాడు.

1) సృష్టికర్తుత్వము 2) సృష్టి నియామకత్వము అతని పనులు అవి చేయాలంటే 3) సర్వజ్ఞత్వమూ 4) సర్వ శక్తి మత్వమూ అవసరం ఆ రెండూ ఉండాలంటే అతడు 5) సర్వవ్యాపి (అంతటా ఉన్నవాడు) అయ్యుండాలి.

అందుకే ప్రతి మత గ్రంధమూ తాను ప్రకటిస్తున్న దేవునికి ఈ అయిదూ ఉన్నట్లు ఖరాఖండీగా పేర్కొంటుంది. కానీ గొప్ప ఆశ్చర్యకరమూ, అసమంజసమూ అన్న రీతిలో తమ దేవుణ్ణి గురించి మరింత సమాచారం అందించే క్రమంలో పై అయిదు విషయాలు ఉండవలసినంతగా లేవనుకోడానికి తగిన సమాచారాన్నే అందించాయి. ఇది ఎంతటి వైరుధ్యం?!? అయినా వారెవరూ ఈ మౌలికమైన దోషాన్ని పట్టించుకోనే పట్టించుకోరు. ఆయా మత గ్రంధాలలోని సమాచారం ఆధారంగానే, వారి దేవుడు అల్పజ్ఞుడు, అల్ప సామర్ధ్యం కలవాడు, పరిమిత శరీరం కలవాడు (ఏకదేశి) అని తేల్చవచ్చు. ఈ మూడూ సరిగలేని వాడిక సృష్టికర్తగా ఉండడానికిగానీ, నియామకునిగ ఉండడానికి గానీ తగి ఉండడు అని నిరాక్షేపణీయంగా నిర్ధారించుకోవచ్చు.

ఇలాంటిదే మరో విడ్డూర ముంది. ప్రతి మత గ్రంథమూ దేవుడు ఒక్కడేనంటుంది. అలా అన్నవన్నీ రకరకాల దేవుళ్ళనే ప్రతిపాదించాయి. పైగా తమ గ్రంథంలో ఉన్నదంతా దేవునిచే ప్రకటింపబడిందేనని ప్రకటిస్తాయి అవన్నీ. ఇంతకంటే విడ్డూరం అడ్డగోలు తనం ఇంకేముంటుంది?! వెనుకటికాలపు ఆయా మత గ్రంధాల నెరిగిన వాళ్ళంతా, తమ ప్రచారంలో భాగంగా పరమత ఖండన, స్వమతస్ధాపన అన్న విధానాన్నే అనుసరించారు. ఎదుటి మతాలు దోష సహితాలనీ, తమ సిద్దాంతమే సరైందనీ, కనుక అన్ని మతాలూ ఒక్కటే చెపుతున్నాయన్నది శుద్ద అబద్దమని తేల్చేశాయి ఆ మేరకు వారు నిజాయితీగా ప్రవర్తించారు. కానీ ఈనాటి మత ప్రచారకులలో కొందరు అన్ని మతాల సారాంశం ఒక్కటేననీ, అన్ని మతాలూ ఒకే దేవుణ్ని ప్రకటిస్తున్నాయని మాయ మాటలు చెపుతూ వస్తున్నారు. దీనినైనా అర్ధం చేసుకోవచ్చు, కొంత వరకు సహించుకోవచ్చు గానీ, కపటితనాన్న - మతి సెబ్బరితనాన్ని సహించనే కూడదు. సమాజహితం కోరేవారు ఏ రకమైన వంచననూ, వంచకులనూ సహించనే కూడదు. వంచనను సహించడమంటే చెడును సహించడమేకాక, అది పెరిగిబలపడడానికి పరోక్షంగా దోహదపడడం కూడా.

మత గ్రంధాలన్నీ తమ తమ దేవునికి పై అయిదు సామర్ధ్యాలే కాక, మరిన్ని పనులు సుగుణాలు ఉన్నట్లు ప్రకటించేశాయి. జీవులు చేసిన మంచి చెడు పనులకు ఫలితాలనందిస్తుంటాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు, నిస్పాకిక్షుడు, దయాళువు, కృపాశీలుడు, క్షమాశీలి, భయంకరుడు, శాంతమూర్తి మొదలగు గుణాలను, వాటితో కూడిన పనులను అంటగట్టారు. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మిమ్ముపురికొల్పేందుకు కొన్ని వివరాలు అందిస్తాను పరిశీలించండి.

1)         తప్పులు చేసి నాలుక్కరుచుకుని సంతాపపడుతూ సరిచేసుకుంటుంటారు.

2)         ఆయా వ్యక్తులు చేసే పనులను తెలుసుకోడానికి నిఘా మనుషుల్ని పెట్టుకుంటారు.

3)         అనేక పనుల కొరకై ఇతరుల సహాయాన్ని తీసుకుంటుంటారు. కొన్ని సార్లైతే పరుల సాయాన్ని కోరుకుంటుంటారు కూడా.

4)         అటూ ఇటూ తిరుగుతుంటారు. వచ్చి పోతుంటారు. అవతరిస్తుంటారు. ఒకణ్ణీ అరా చంపడానికే నానా యాతనలు పడుతుంటారు. సైన్యాన్ని ఏర్పరచుకుంటారు. పోరాటంలో అడపాదడపా ఓడిపోతుంటారు.

5)         సమాచారాన్ని రాబట్టడానికై గూఢచారుల్నీ, సమాచారం అందించడానికై సందేశహరుల్ని పెట్టుకుంటారు.

గమనిక :- వీటన్నింటికంటే వేరుగా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కీలకాంశం ఒకటుంది.

6)         ఆ గ్రంధాలన్నీ పేర్కొనక తప్పని 'వ్యక్తి - సమాజము - ప్రకృతి' అన్న మూటికీ సంబంధించిన ఆ గ్రంధాలలోని సమాచారంలో 1) అరకొర జ్ఞానము 2) అజ్ఞానము తట్టెడుంది. ఆ మూడంశాల గురించీ మనకీనాడు ప్రయోగపూర్వకంగా (అనుభవ పూర్వకంగా) తెలిసిందాన్ని బట్టే, ఏ గ్రంధానికా గ్రంధాన్ని గానీ, ఏ అంశానికా అంశంగా ఆ గ్రంధాలన్నింటిని గాని పరీక్షించడానికి వారిలోని ఎవరు సిద్దపడ్డా, ప్రయోగ పూర్వకంగా వాటిలోని దోషాలను, లోపాలనూ వెలికితీసి చూపించవచ్చు. మచ్చుకు -

    ఎ)     వ్యక్తి :- మనిషి శరీర నిర్మాణము, అందులోని అవయవాలు, వాటి పనులు, జీవన ప్రక్రియ, ఆరోగ్యము -     అనారోగ్యము అవి ఉండడానికి కారణాలు రోగ నివారణోపాయాలు వగైరాల గురించి పరీక్షించవచ్చు.

    బి) సమాజం :- సమాజాన్ని గురించిన ఆ గ్రంధాల అవగాహన - ఈ నాటి మన అవగాహన

    సి) ప్రకృతి :- ప్రకృతిని ఈనాడు అనేక ఉప విభాగాలుగ ఏర్పరచుకుని బహుముఖంగా పరిశోధనలు సాగుతున్నై వాటిని ప్రస్తుతానికి మూడుగా అనుకుని పరిశీలిద్దాం.

    1) భూలోకానికి సంబంధించిన అవగాహన

    2) ఖగోళానికి సంబంధించిన అవగాహన

    3) విశ్వానికి సంబంధించిన అవగాహన

ఈ సందర్భంలో మరో ముఖ్యమైన మాట గుర్తు చేయాలి. ప్రతి మతమూ తన గ్రంధంలోని సమాచారమంతా దైవదత్తం అని ప్రకటిస్తుంటుంది.

1) వేదం : ఈశ్వరీయం కనుక సర్వ విషయాలకూ ఆకరం (నెలవు)

2) బైబిలు : అవన్నీ దేవుడు చెప్పినవీ, దైవాదేశంతో దూతలు, ప్రవక్తలూ ప్రకటించినవీ

3) ఖురాను : ఇక ఇదైతే ఒకింత అతిగాపోయి, అన్ని గ్రంధాలూ దేవుడు చెప్పినవేగాని అవి అసంపూర్ణాలు. ఖురానైతే అంతిమగ్రంధం. పూర్ణ గ్రంధం మరో ఆదేశమూ అవసరం లేదు, మరో ప్రవక్త అవసరమూ లేదు. ఇందులోనిది మార్చాల్సిన అవసరమూ లేదు అనంటుంది.

4) ఇక ఈ దేశంలోని, ఇతరత్రానూ ఉన్న బహు దైవారాధన రూపమైన ధోరణులన్నీ ఎవరి సొద వారిదేనన్నట్లు గుట్టలకు గుట్టలన్నంత సాహిత్యాన్ని సృష్టించి మందినెత్తిన లేదా తమనంగీకరించిన మందనెత్తిన పెట్టారు.

మరికొన్ని ముఖ్యాంశాలు :

ఆయా మత గ్రంధాలు అంతో యింతో చదివి తెగ జ్ఞానులల్లే ప్రవర్తిస్తుండే వీరిలో ఎవరిని గానీ ఈ విషయాలు వాస్తవాలేనని మీకెలా తెలిశాయి. మాకెలా తెలుస్తుంది అని అడిగామనుకోండి. వారందరి సమాధానం ఒక్కటే, విశ్వసించి ఆచరిస్తూ జీవించు ఫలితాలవే వస్తాయి అనంటారు వాళ్ళంతా. నిజానికి ఇక్కడ మనం అడిగిందొకటైతే, వాళ్ళు చెప్పింది మరొకటి. అందుకు కారణం. ఆ ప్రతినిధులంతా గ్రంధాలు చెప్పిందాన్ని ఏ కరువు పెట్టడం నేర్చిన వాళ్ళే గాని, అవి చెపుతున్న విషయాలు వాస్తవంలో అలాగే ఉన్నయోలేదో తెలిసిన వాళ్ళు కాదు.

మరో విడ్డూరం చెప్పనా!? ఆ గ్రంధాలు ఏమి చెపుతున్నాయన్న విషయంలోనూ ఆయా గ్రంధాలు చదివిన వారి మధ్యనే ఇంకా ఏకాభిప్రాయం కుదురుకోలేదు. ఆయా గ్రంధాలను సరిపోల్చుతూ చూస్తే వాటిలో ఎంత గంద్రగోళం ఉందో ఇట్టే తేలిపోతుంది.

1) దేవుడు తెలియబడడు - తెలియబడతాడు

2) అంతటా ఉన్నాడు - ఫలాని చోటే ఉన్నాడు

3) సర్వజ్ఞుడు - అల్పజ్ఞుడు

4) సర్వ సమర్ధుడు - సర్వ సమర్ధుడు కాడు

5) అనుకుంటే అయిపోతుంది - అనుకుంటే కాదు, బ్రతిమాలుకున్నా అవదు.

6)     1) సృష్టి స్థితి ప్రళయాలు అనాద్యనంతంగా జరుగుతునే ఉంటాయి

    2) ఇదే ప్రధమ సృష్టి - స్థితి - ప్రళయం కూడా ఒక్కసారే. ఇక శాశ్వత స్వర్గ - నరక వాసమే

7)     1) స్వర్గ నరకాలున్నాయి - స్వర్గనరకాలు వేరుగా లేవు.

    2) స్వర్గ నరకాలున్నాయి, మోక్షమూ ఉంది. అనేకలోకాలూ ఉన్నాయి.

    3) అనేక లోకాలు లేవు. శాశ్వత స్వర్గ నరకాలున్నాయి. మోక్షం లేదు.

8)     1) జీవులను ఎవరూ సృష్టించరు. వారు దేవునిలానే నిత్యులు

    2) జీవులను దేవుడే సృష్టించాడు. వారు నిత్యులు కారు.

9)     1) జీవుడు అణురూపుడు, వ్రేలెడంత ఉంటాడు, ఏ శరీరంలో ఉంటే అంతుంటాడు. విభుడు.

    2) జీవుల అన్ని రకాల శరీరాలను ధరిస్తుంటాడు.

    3) మానవ శరీరానికే జీవాత్మ ఉంటుంది. మిగిలిన ప్రాణులలో జీవుడు ఉండడు.

యోచనా శీలురైన మిత్రులారా! ఇలా చెప్పుకుంటూ పోతుంటే దీనికో దరి తెన్ను, అంతూ పొంతూ ఉండవు. ఆయా మతాలకు చెందిన వెనకటి వారు వివిధ మత గ్రంధాలలోని తేడాలనీ గమనించి తమదే సరైందనీ మిగిలినవి అపసవ్యమైనవనీ చెప్పుకుంటూ పోయారు. కానీ ఈనాటి మత ప్రచారకులలో కొందరు అన్ని మతాల సారాంశం ఒక్కటేననీ, అన్ని గ్రంధాలు చెపుతున్నది ఒక్క దేవుణ్ని గురించేననీ చెప్పడం మొదలెట్టారు. నిజంగా ఈ పోకడ ప్రమాదకరమైనది. వంచన తోకూడినది. ఎందుకంటే, ఈ విధానం

1) సత్యాలను ప్రకటించదు సరికదా కప్పెడుతుంటుంది.

2) కనుక అవశ్యం అసత్యాలను ప్రకటిస్తూంటుంది.

3) నిజానికి మానసికంగా తాము చెడిన ఈ రకం మరింత మందిని చెడగొడుతుంటూ మరో వంక అన్ని ఒకటే చెపుతున్నాయంటూనే తమ మతంలోకి గుంజే పని చేస్తుంటారు. ఒక వంక మత మార్పిడులు చేస్తూనే, బైటికి మాత్రం మతం మారక్కరలేదంటుంటారు.

ఒక్కముక్క చెప్పి ఇప్పటికి ముగిస్తాను.

ఆత్మ - పరమాత్మ; సృష్టి - ప్రళయము; సృష్టికి పూర్వమూ - ప్రళయానంతరము, పరలోకాలు, అన్న వాటిని గురించి ఆయా గ్రంధాలలో ఉన్న వాటిని ప్రకటించడమే తప్ప, అవి వాస్తవాలో కాదో, అలాగే ఉన్నాయో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వాటిని గురించి ఆ గ్రంధాలే అందించిన సమాచారాన్ని బట్టే మరొనాటికైనా స్వయంగా తెలుసుకునే అవకాశం కూడా లేదు.

మనిషి - తనకున్న బలహీనతలు లేని వానినిగానూ, తనకు లేని, తాను ఉంటే బాగుండును అనుకునే బలాలన్నీ ఉన్న వానినిగానూ దేవుని ఊహించుకున్నాడు. అలా ఊహాత్మకంగా ఏర్పరచుకున్న దైవభావనకు గుణాలు, పనులు అంటగట్టబోయి తనకున్న అవలక్షణాలనన్నింటినీ దేవునికీ అంటగట్టాడు. దేవునికి సంబంధించినదంతా విశ్వాస మూలకమని ఆ గ్రంధాలే పేర్కొంటున్నాయి. దైవ సంబంధ విషయాలు తెలపబోవడమంటే తెలియని వాడు మరో తెలియని వానికి తెలియ జెప్పడంలాటిదే. నమ్మడం - నమ్మకపోవడం - రెండే మార్గాలు. విశ్వాసాలను సత్యాసత్య పరీక్షకు పెట్టడం అవివేకం - ఉంటాను సెలవ్‌.

సత్యాన్వేషణలో

- మీ సురేంద్ర




No comments:

Post a Comment