Friday, December 15, 2017

డి. నారాయణశెట్టి గారికి - బహిరంగ లేఖ

 ఒక్కమాట! చాలాకాలంగా పరిచయాలుండీ, కొంతకాలం ఆత్మీయుల బృందంలోని వారంగానూ కొనసాగినప్పటికీ రకరకాల కారణాల వల్ల క్రమంగా మన మధ్య మనస్ఫూర్తిగా మిత్రుడా అని అనగలిగే పరిస్థితి లేకుండాపోయింది. ఒకరిపై ఒకరికి చెడ్డవాళ్ళమన్న దృష్టిలేకున్నా, బిగుసుకున్న భిన్న ధోరణులకు చెంది ఉన్న వారంగా మసలుకుంటున్నాం. ఈ విషయంలో మీరైతే ఒకింత ముందుకుపోయి ఎవరిదగ్గర నా ప్రస్తావన వచ్చినా, నాకూమీకూ తెలిసిన వారు ఎక్కడతారసపడినా, ఏ రెండుమూడేండ్లకో ఏదో ఒక సందర్భంలో మనం ఎదుటపడడం సంభవించినా; ఆస్థికత - నాస్తికతల గురించి ప్రస్తావిస్తూ రెండూ కానంటున్న నన్ను తప్పు బట్టే దృష్టిని కనబరుస్తూ వస్తున్నారు. ఇది నిజమేననడానికి రుజువులుగా అనేక సందర్భాలను చెప్పవచ్చుగానీ, వ్రాతమూలకమైన ఆధారాలున్న మూటి ప్రస్తావన చేస్తాను. 1) ఆర్య సమాజం వారితో దయానంద సిద్దాంతాలపై నేను వివాద పడుతున్న సందర్భంలో మీరు విఠలరావు గారి నాశ్రయించి నాతో మాట్లాడే అవకాశానికై యత్నించడం 2) పెంచలయ్యగారి సంస్మరణ సభలో నేను మాట్లాడిన దానిని ఆధారం చేసుకుని అనంతరం మీరు వ్యక్తీకరించినవి. 3) మొన్న అంటే ఏప్రియల్‌ 9,10 తేదీలలో దోరకుంటలో కృష్ణారావు గారు మనమంతా కలసిన సందర్భంలో మీరు మాట్లాడినవి. గమనిక : - మనం వ్యక్తిగతంగా ఒకరి పట్ల ఒకరం ఎలాటి వైఖరి కలిగి ఉన్నామన్నది ప్రస్తుతానికి అనవసరం. దాని నిప్పుడు ప్రస్తావించవద్దు అనుకునే మీరు విషయపరంగా నాతో ఏమిమాట్లాడాలని, చర్చద్వారా 1)  ఏ విషయంలోనన్ను నిలువరించాలని, 2) మీది నిలబెట్టాలని అనుకుంటూ వచ్చారో ఆ విషయానికో ముగింపు పలకడం మంచిదన్న ఉద్దేశంతోనే ఈ లేఖనిలా రాయడానికి ఇప్పుడు నేను సిద్దపడ్డాను. 1) మీరు ఆర్య సమాజ సిద్దాంతాన్ని ప్రతిపాదించి నిరూపిస్తాను. అన్న ప్రకటన చేశారు. 2) దేవుడున్నాడన్న పక్షం మాది. పెంచలయ్యగారి పక్షం వారుగా మీరీమాట అన్నారు. లోకంలో దేవుడున్నాడనే వాళ్ళు, లేరనే వాళ్ళు ఉండే వీలుంది. మీరేమో నేనారెంటికీ చెందినవాణ్ని కాదంటున్నారు. అదెలా సరైందో మీ పక్షాన్ని చెప్పి నిలబెట్టండి. అది తప్పని నిరూపిస్తాను. అనీ అంటున్నారు. 3) పెంచలయ్యగారి శిష్యరికం చేసి, ఆయన పోయాక ఆయన పై వ్యతిరేకంగా మాట్లాడడం అనుచితం. ఉన్నాడో లేడో తేలలేదన్నవాడు. ఉన్నాడన్న వాళ్ళను తప్పు బట్టడం తప్పుకదా మరోమాట! నేను దాదాపు ప్రతిసారీ ఆయా ధోరణుల వారితో చర్చించే సందర్భంలో చోటు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు పరుషవాక్కులు అన్న వాటిని ఎదుటివారు విషయ విచారణకు సిద్దపడిన సందర్భాలలో ప్రక్కన పెట్టేద్దాం అన్న మాటలు చెపుతూ వచ్చాను. ఇప్పుడు మన మధ్య కూడా, మీరుగాని ఆస్తిక, నాస్తికతలపై చర్చకు సిద్దపడేట్లయితే, మనం మాట్లాడిన వ్యక్తిగతమైన వాటన్నింటినీ ప్రక్కన పెట్టి విషయాన్ని విషయంగా విచారించడానికి నేను సిద్దం అని చెప్పాలన్నదే నా ఈ మరోమాట. నేను ఎప్పటికప్పుడు ఎవరి విషయంలోనైనా ఇదే వైఖరిని అవలంభిస్తూ వచ్చానన్నదానికి రుజువుగా, వివేకపథం - 18 (1998)లోని ఒక ప్రకటనను ఉట్టంకిస్తాను. ''ఒక్క విషయపరమైన సత్యాసత్యాలను మినహాయించి, వ్యక్తిగత ఆవేశ కావేశాల వల్ల ఏర్పడ్డ పంతాలు, పట్టింపులూ, అమిత్రతా భావాలు మొ||న వాటినన్నంటినీ, ఈనాటికి గతంగా ఉన్నవాటిని విడవడానికి నా వరకు నేను మనస్ఫూర్తిగా సిద్దంగా ఉన్నాను.'' అన్నదే ఆ ప్రకటన. ఒక్క విషయపరమైన సత్యాసత్యాలు తేల్చుకునే విషయంలో ఎట్టి సర్దుబాటు ఉండకూడదు. సత్యాసత్య విచారణ విషయంలో ఇతరేతర సంబంధాలననుసరించి పరీక్షించే ప్రక్రియలో, పోకడలో ఎట్టి సర్దుబాట్లూ ఉండకూడదు అన్నదే పైనా మాటలకు అర్ధం. కనుక ఈ లేఖలో పైన రాసిన 3 అంశాలలో మూడో అంశాన్నీ ప్రక్కనుంచి, మీకూ నాకూ మధ్య తేలాల్సిన, తేల్చుకోవాల్సిన అంశంగా ఉన్న దానిపై చర్చకు కూర్చుందాం. అవి 1) మీరు దేవుడున్నాడన్న పక్షం వారు. 2) నేను దేవుడున్నాడన్న పక్షం అనిర్దారితమన్న పక్షం వాణ్ణి. 2) 1) మీరు, దేవుడున్నాడు / లేడు అన్న రెండు పక్షాలే ఉండేందుకు వీలుంది మరో పక్షంలేదు అంటున్నవారు. 2) నేను ఉన్నాడు లేడు అన్న రెండూ తేలకనే తేలిందనుకుంటూ, తమదే సత్యమంటున్న పక్షాలు, నిజానికి దేవుని విషయం ఉన్నాడనిగానీ లేడనిగాని తేలలేదంటున్నవాణ్ణి. నాకు అనిర్ధారితం అది. అనిర్ధారణీయం కూడా కనుక అందరికీ అనిర్ధారితమే అన్న పక్షం వాణ్ణి. 3) 1) సత్య జ్ఞాన సంఘానికి చెందిన వాణ్ణన్నట్లుగా, పెంచలయ్యగారు దేవుడున్నాడన్న ప్రకటనను మీరూ సరైందేనన్నట్లు మాట్లాడారు. అది మీ పక్షం. 2) పెంచలయ్యగారు చివరిదినాలలో ఈ ప్రకటన చేయడం ద్వారా జనంలో గందరగోళం ఏర్పడడానికి తెరతీశారన్నది నా పక్షం. గమనిక : ఆర్య సామాజికుల పక్షాన మాట్లాడిన సందర్భంలో, ఆర్య సమాజ సిద్దాంతాన్ని నిరూపిస్తా నన్న ప్రకటన మీరు చేయగా, అది గాని జరిగితే, మిమ్ము నా గురువుగా అదే వేదిక నుండి ప్రకటించి, దయానంద సిద్దాంతంతో తలమునక అవుతానని నేను ప్రకటించాను. (వి.పధం 53/పే.19) ఒక దశలో మీరు నేను ఆర్య సమాజికుల పక్షం వహించి వాదిస్తాను. నన్ను ఏపాటి నిరోధింతువో చూస్తాను, అని అనేశారు. అంటే ఏది సత్యము? అన్నది ప్రక్కకుపోయి నీబలమెంతో చూస్తాను అన్న దగ్గరకొచ్చేశారు మీరు. అంటే మన మధ్య వాద బలమేపాటిది? దీంతోపాటు మన ఇరువురిలో ఎవరిబలమెంత? (వాదిబలమేపాటి?) అన్న దానినీ లేవనెత్తారు. మొన్నటికి మొన్న సురేంద్ర! ఇంతకూ ఆస్తికతను కాదన్న నీ సిద్దాంతమేమిటో ప్రకటించు అని అడిగారు.

ముగింపు  

1) ఆస్తికతపై మీ పక్షమేమిటో మీరు ప్రకటించండి. 2) నా పక్షమేమిటో నేను ప్రకటిస్తాను. ముందుగా అందుకవసరమైన ప్రశ్నావళిని రూపొందించుకుని, దాని వెలుగులో మన మన సిద్దాంత ప్రతిపాదన చేద్దాం. అవి పరస్పరం మార్పిడి చేసుకుని, పరిశీలకులుగా నున్న మిత్రులకూ అందిద్దాం. అటుపైన ఒక్కో పక్షాన్నీ సత్యాసత్య విచారణకు లోను చేసి, ఫలితాంశాలను ప్రకటించి స్వీకరిద్దాం. గమనిక : మీరు చర్చకు సిద్దమన్నట్లూ త్వరలో ఎప్పుడు, ఎక్కడ కలవగలమో, అనుకుందామన్నట్లు, తిరుపతిలో బాగుంటుంది అన్నట్లూ వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పారు. తిరుపతైతే నాకేమీ అభ్యంతరం లేదు. మీరు - నేను, వెం.రెడ్డి, రఘుపతిరావు, సోంప్రకాష్‌, ఎన్‌ కృష్ణారావు మా వైపు నుండి మరి ఒకరిద్దరు సమావేశంలో ఉండేట్లు యత్నిద్దాం. మీ దృష్టిలో ఇంకెవరైనా ఉంటే వారినీ పిలవవచ్చు. వీలున్నంత త్వరలో కలవగలమని ఆశిస్తున్నాను. - సురేంద్ర 

1 comment: