Sunday, May 6, 2018

మేలుకొలుపు 1-6


మేలుకొలుపు
సంపుటి 1                                               సంచిక 6         1-8-1991
స్వమంతవ్యము – [నేనూ, నా పత్రిక]
పత్రిక వెలువడిన పిదప పత్రిక వెలువరిస్తున్న ఆయా విషయములపై, పాఠకులు వారివారి యభిప్రాయములను తెలియపరచడమూ అందుపై నాలో మెదిలిన భావాలను కూడా, స్పందన-ప్రతిస్పందన' శీర్షికన ప్రకటించడమూ జరుతున్న కార్యక్రమమే. అయితే పత్రిక ముఖచిత్రమూ, దాని శీర్షిక (కవర్ పేజీలోని - యంశాలు) అన్న వాటిపై కొన్ని అభిప్రాయాలు రావడమూ, అయా అభిప్రాయాల సూచనల తీరుతెన్నులూ గమనించిన పిదప దానినే ప్రధానాంశంగా, ఓ వ్యాసం వ్రాయవలసిన అవసరఉందన్న ఆలోచనయే ఈ వ్యాసానికి ప్రేరణము. ఒక క్రమంలో ఆయా విషయాలను ప్రస్తావించి నా యభిప్రాయములున్నూ వ్రాస్తాను. తులనాత్మకంగా పరిశీలించి ఉచితానుచితములను నిర్ణయించగలరని భావిస్తాను.
1] పత్రిక ముఖచిత్రాన్ని చూడగనే ఇది ఒక మత (హిందూ) పత్రిక అనిపిస్తున్నది గదా! అట్టి భావనను ఎందుకు కలిగించడం? మీమీద ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నది కదా  ఆ చిత్రం పాఠకునిలో.
 ప్ర.సం: ఈమాటలు అన్న వారితో నాకుగల సాన్నిహిత్యాన్ని బట్టి ముందుగా ఓ అభిప్రాయాన్నేర్పరచుకొన్న వ్యక్తి (ఆ యభిప్రాయం అనుకూల దృష్టి నుండైనా, ప్రతికూల దృష్టినుండైనా ఏర్పరచుకుని ఉండవచ్చు) అటు పిమ్మట చెప్పిన విషయాన్ని తులనాత్మకంగా చూడలేడు కదా! అట్లు పాఠకుడు  విషయాన్ని యధాతధంగా గమనింపలేని పరిస్దితిని మనమే కల్పించినట్లనిపిస్తుంది కదా! అన్న అర్దం వారి మాటలలో గోచరిస్తూ ఉంది. ఈ అభిప్రాయం కొంతవరకూ నిజమే అయినప్పటికీ, రచయిత ఈమాట వాడితే పాఠకుడు నన్నుగురించి ఏమనుకుంటాడో, ఆమాట వాడితే ఏమనుకుంటాడోనన్న దృష్టినుండి ఆలోచించడం ప్రారంభిస్తే పదాలు దొరకడమే కష్టమవుతుంది. ఆస్తిక, నాస్తిక సంఘాలన్నిటికీ భాష సామాన్యంగానే ఉంటుంది. ఆయా విషయాలతోపాటు క్రమంగా దాని స్వరూపమూ, ప్రయోజనమూ (శక్తి పరిమితులు) అన్న విషయమైన వివేకాన్ని కూడా పాఠకునిలో కలిగించగలిగినచో అది పాక్షికదృష్టినుండి మనిషిని బైట వేయడానికి ఉపయోగకరంగా ఉండగలదు. అట్లుగా వారికాదృష్టి ఏర్పడుతుందేమో - ఈదృష్టి ఏర్పడుతుందేమోనన్న యోచన నిష్ప్రయోజనమేకాక, ప్రతిచోటా ఏడో అడ్డంకిని (ఒక్కోసారి లేని యడ్డంకిని కూడా) చూపెడుతుంది. ఇది వాస్తవమేనన్నట్లు పైయభిప్రాయం వ్యక్తం చేసినవారి ధోరణి కూడా ఋజువు పరుస్తోంది. వారిని, వారనుకునే యభిప్రాయాలను వ్రాతమూలకంగా చెప్పమన్న ప్రతిసారీ వెనుకాడడం నాచే గమనింపబడ్డది.
తప్పనిసరిగానూ, నిష్పాక్షికంగానూ ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని స్మరణలో ఉంచుకునే పరిశీలనలు చేయవలసి ఉంది.భూమికలోనే చెప్పినట్లు ఆయా సంఘ స్థాపకుల ఆశయం సమాజహితమన్నదే ఆ అంశము. అయితే హితకాంక్ష వేరు, తత్సిద్ధికై న ప్రణాళిక నేర్పరచి అమలు పరుపగలుగుట వేరు. హితకాంక్ష ఉన్నదా? లేదా? అన్నది ఆచర్చనీయాంశమై ఉంది. ప్రణాళిక, ప్రణాళిక నేర్పరచుటకు ప్రాతిపదికగ నున్న వివేకమూ, సమగ్రమైనవా కాదా? అవి యిప్పటికీ విలువ కలిగియున్నవా లేదా? అమలు పరుపబడుచున్నవా, లేదా? అన్నవిషయములే పరిశీలింపదగియున్నవి. ఈ విషయాలను ప్రతి పరిశీలనా సందర్భంలోనూ పరిశీలకుడు స్పురణలో నుంచుకొనవలసియున్నది.
ముఖపత్రము (కవర్ పేజి) నేర్పరచక పూర్వమే, నాచే ప్రచురింపబడ్డ రెండు సంచికలనూ నిశితంగా పరిశీలించగలిగితే నా పోకడ (యోచనా తీరు) పై ప్రత్యేకంగా ఓ సంఘానికో, మతానికో కట్టుబడిలేదన్ప విషయం స్పష్టం కాగలదు. ఒక భాషలో (సంస్కృతం) ఉన్న వాక్యాన్ని ఉపయోగించాడు గనుక (అది పలానా మతస్థుల భాష అన్న యవివేకం లోకంలో ప్రాచుర్యంలో ఉంది గనుక) అతడు పలానా మతస్థుడనుకోవడం ఆ నిర్ణయాని కొచ్చిన వారి అజ్ఞానాన్ని (జ్ఞానం విషయమైన అసమగ్రతను) చాటుతోంది. ఎందుకంటే భాష భావాన్ని వ్యక్తం చేయడానికి మనిషి ఏర్పరచుకున్న ఉపకరణం మాత్రమే. దాని కంతకంటే విలువల నాపాదించడం కూడా అవివేకమే. (ఉదా:- సంస్కృతం దేవభాషయని కొందరూ, మృతభాషయని కొందరు చెప్పుతుంటారు) వీలైతే ఆ యవివేకాన్ని పోగొట్టే యత్నం చేయాలిగానీ, ఆ భాషను ఉపయోగించుకోలేకపోవడం ఏమి పద్ధతి? భాషా ద్వేషాలూ, భాషాభిమానాలూ ఈ రెండూ పై కోవకు చెందిన అజ్ఞాన జనితాలే నన్నది ఒక వా స్తవము. ఇక్కడే మరో అంశాన్ని కూడా గమనించవలసి ఉంది.
 వెనుకటి వాళ్ళు (ఈనాటి, ఏనాటి వారైనా) ఆస్తికులుగానీ, నాస్తికులు గానీ, మరో పంధావాళ్ళుగానీ చెప్పినవాటిలో మంచి ఉందనుకుందాం (నిజంగా ప్రతి సంఘ సాహిత్యంలోనూ కొంత మంచి ఉంటుంది, అయితే మొత్తంమీద అ సంఘము సమాజాన్ని ఎటు కదిలించ చూస్తోంది అన్నదే పరిశీలనాంశము) అట్టిదే సందర్భం వచ్చినప్పుడు వారి, వారి మాటలను ఉటంకించామనుకోండి. అంత మాత్రానే మనం ఆ సంఘీయుల మవుతామా? మరో సందర్పాన్ని బట్టి వెనుకటి వాళ్ళలోని దోషాన్ని చూపామనుకోండి. ఇక మనం వారికి వ్యతిరేక సంఘీయుల మైనట్లేనా? ఎవరైనాసరే అవునంటే అది వారి తొందరపాటు స్వభావాన్ని సూచి స్తుందే గానీ వాస్తవం మాత్రం కాజాలదు.
    ప్రస్తుత సమాజపు కొలతలనుండి నేను హిందూ కుటుంబంలో పుట్టినా, హిందూ గ్రంధాలుగా ప్రాచుర్యంలోనున్న- నిజంగా తాత్విక గ్రంధాలు మత పరిధిని దాటి (సర్వ మానవాళిని ఉద్దేశించి) ఉంటాయి-వాటి ప్రభావం నామీద ఎక్కువ గానే పడినా, ప్రస్తుత నా బుద్ధి స్థాయిననుసరించి నేనుఏ మతస్థుడినీకాను, ఏ కులస్తుడినీ కాను. ఏ వర్గానికి చెందిలేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెపుతున్న విషయం. పరిశీలిస్తే నా రచనలు కూడా మీకీ యభిప్రాయాన్ని కలిగించగలవు. అదీన్నీ అలా ఉంచి మరో విషయాన్ని కూడా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి హిందూ మతస్థుడిగాగానీ, మరో మతస్థుడిగాగానీ ఉన్నాడనుకోండి. అతడు చెప్పిన వాటి విలువలు అంతమాత్రాన తల్లక్రిందులౌతాయా? ఆయా వర్గాలలో ఉన్నంత మాత్రానే ఒకడు అర్హుడో, అనర్హుడో అయిపోతాడా? అట్లు కాదు అనడం అన్నివిధాలా విజ్ఞత కాగలదు. ఉదాహరణకు ఓ అంశాన్ని మీ ముందుంచుతాను, పరిశీలించండి.
శ్లో :- యుక్తి యుక్త ముపాధేయం వచనం బాలకాదపి
అన్యత్తృణమివత్యాజ్యం అవ్యుక్తం పద్మజన్మనా!! (ఈ శ్లోకం గత సంచికలో కూడా ఉటంకించాను) భాషేమో సంస్కృతం, గ్రంథం హిందూ సాహిత్యాంతర్గతం, అయితే ఏమిటంట? ఈ శ్లోకాన్ని అవగాహన చేసికోలేని, ఉపయోగించుకోలేని వారి యవివేకానికి విచారించాలి, జాలిపడాలిగాని, ఆ శ్లోకాన్ని ఉటంకిస్తే ప్రయోక్తను హిందూవనుకుంటుంది. సమాజం అనడమో, అలా తానే అనుకోవడమో ఏ పాటి వివేకం? వాస్తవంగా నా అథ్యయనాధ్యాపన క్షేత్రాలలో ఇప్పటికీ, ఎప్పటికీ ఈ శ్లోకభావమే నాకు ఊతకర్రగా, ఆధారపీఠంగా ఉంది. ఉండగలదు. ఏదో ఒక అంశాన్ని బట్టి మొత్తాన్నీ (మంచినీ చెడునీ కలిపి విడువడమో, పట్టుకోవ డమోనన్నదే నాడూ నేడూ జరుగుతున్న దుష్ట విధానము. ముందిది, పోవాలి. తుల నాత్మక దృష్టి రావాలి. విషయాన్ని గమనించాలి. మరల దానిని ఆచరణలో ప్రయోగించి సరిచూసుకోవాలి. వాస్తవిక దృష్టికల ఎవరికైనా, ఏనాడైనా మార్గమిదొక్కటే, ఆయా వ్యక్తులు ఈ విధానానికే పేరై నా పెట్టుకోనివ్వండి. పేరువల్ల కాగల కార్యమీ విషయంలో ఏమిలేదు. ఎందుకంటే;
  హేతువాదుల మనుకునేవారిలోని అహేతుక దృష్టిని, నాస్తికులుగా చెప్పుకునే వారిలోని ఆస్తిక దృష్టిని, అలాగే ఆస్తికులనబడే వారిలోని నాస్తిక దృక్పధాన్ని, కమ్యూనిష్టులమనుకునే వారిలోని కమ్యూనలిజాన్ని(కుల కండూతిని) కూడా మేము తరచుగానే గమనించాము మా అన్వేషణలో. అట్లే
      పరిపూర్ణులుగా తమని తామే భవించుకుంటూ, మరికొందరచేతనూ గుర్తింపబడుతున్న వారలనూ, వారిలోని యపరిపూర్ణతనూ, అలానే వాస్తవజ్ఞానం పొందే ఉన్నామనుకునే వారిలోని అవాస్తవికతనూ (భ్రమాత్మక స్థితిని) కూడా అనేకచోట్ల గుర్తించాము. మరోవంక మా అన్వేషణలోనే భాగంగా నున్న స్వీయానుభవ విశ్లేషణలనుండి గతంలో వాస్తవమసుకున్న ఎన్నో విషయాలు మార్పులూ, కూర్పులకు లోను చేయవలసి రావడం కూడా గమనించాము. వీటన్నిటి క్రోడీ కరణరూపమే సత్యాన్వేషణ మండలి ఆవిర్భవానికి ఆలంబనము. ఎవరో ఏదో అను కుంటారనో, సంజాయిషీ యివ్వవలసి వస్తుందనో, ఉన్న స్థితిని మరుగు పరచుకోవ డమూ, నాగురించి నేననుకుంటున్న దానికన్యమైన భావాన్ని నాగురించి యితరులకు కలిగించడమూ చేయలేను. అట్లు చేయవలసిన అవసరమూ లేదు. రాదుకూడా. ఈమాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... సంస్థ పేరు సత్యాన్వేషణ మండలి. సంచాలకుడు సత్యాన్వేషి, బాగుంది అంటూ రెండు మూడు చోట్లనుండి ఆక్షేపణలు వచ్చాయి. అయితే ఆ యిరువురకో, ముగ్గురకో వ్యక్తిగతంగా లేఖలు వ్రాయవచ్చు గదా అన్న సందేహం పాఠకుల్లో కొందరకు కలగవచ్చు. వ్రాయవచ్చుగానీ, పాఠకుల్లోనూ ఇదే యభిప్రాయం మనస్సులోఉండి, ఉదాసీనంగా ఉండే మరికొందరు ఉండి ఉండవచ్చు. మరియూ పై యిద్దరు ముగ్గురూ తమ కెదురుపడిన మేలు కొలుపు పాఠకులలో ఒక సందిగ్ధస్థితిని రేకెత్తించవచ్చు తమ ప్రశ్నలద్వారా. వీటన్నిటిని దృష్టినిడుకునే ఆయా అంశాలను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాను. ఇందువల్ల మూడు ప్రయోజనాలున్నాయి. 1) ప్రతికక్షుల దురాగ్రహ ప్రతిష్ఠంబన జరుగుతుంది. 2) ఎవరికివారు వారివారికి నచ్చిన-తోచీన-రీతిన నాగురించి యఖ ప్రాయముల నేర్పరచుకునే ప్రమాదంనుండి నన్ను నేనుద్ధరించుకొనుటకు వీలవుతుంది. 3) పరిశీలకుల ఎదుట నాగురించి నేనేమనుకుంటున్నానో, ముఖపత్రాంశాల గూర్చినేనేమనుకుంటున్నానో నా మాటలలోనే చెప్పినట్లయిన ఆభిప్రాయ భేదాలు వీలయినంతవరకు తగ్గగలవు. తద్వారా ఈ విషయమైన అనవసర వాగ్వివాదాలను చాలవలకు అపుచేయవచ్చు. ఇకపోతే దోషాలు చూడడమే స్వభావంగా ఉన్న వాళ్ళను ఉపేక్షించడమే సబబు. ఎందుకంటే ఆ వర్గానికి నచ్చజెప్పాలనుకోవడ మన్నది అవివేకమో, అతి మంచితనమో కాగలదు. ఈరెండూ అనుసరింపదగినవి కాదు.
సత్యాన్వేషణలో మా సురేంద్ర అన్న నా ముగింపు వాక్యంపై అక్షేపణ ప్రధానంగా ఉంది. తానే యన్వేషకుడైన వాడు ఇతరుల కేం చెప్పగలడు? మేల్కొల్పగలడు? అని.
 ఈ యాక్షేపణ వినడానికి బాగానే ఉంది. అయితే ఏదో ఒక దృష్టి కోణం నుండి దానికి పరిమితార్ధం పెట్టుకుని పలికిన మాట అది. కానీ మానవ జీవితాన్నీ, మేధస్సు పనిచేసే తీరు తెన్నులనూ, ప్రకృతిలోనూ, సమాజంతోనూ, అతనికిగల సంబంధాలనూ, ముఖ్యంగా మానవునిలోనున్న గవేషణా ప్రవృత్తినుండి జనించిన విజ్ఞాన చరిత్రనూ మొత్తంగా యవలోకించగలిగినప్పుడు గానీ బోధపడదు. అన్వేషణ యన్నపదంలోని ఔచిత్యం. పరిమితార్ధంలో ఆ పదాన్ని స్వీకరించినా వెదికేవాడు. కొన్ని ఆధారాలు లేక వెదకలేడు. ఆట్టి ఆధారాలు (ఆయా విషయాలకు చెంది) కల ఒకడు మరికొందరి నిన్నీ వెదుకులాడ ప్రేరేపించడంలోనూ అనౌచిత్యం ఏమీలేదు. విజ్ఞానావిష్కరణలలో ప్రతిచోటా ఈ యంశాన్ని కూడా గమనించగలం పరిశీలించగలిగితే.
         ఎంతటి మేధావియైనా, సామాన్యుడైనా కొన్ని విషయాలలో సరైన జ్ఞానాన్నీ (సమగ్రమైన అవగాహననూ) మరికొన్నింటిపట్ల అసమగ్రతనూ, అప్పుడప్పుడూ తప్పు భావాన్ని కూడా కలిగియుంటున్నాడు, కనీసం అలా జరిగేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన వాస్తవికదృక్పధంకల వివేకి, తనఇతరుల-విషయమై జీవితంలో ఏర్పడుతున్న పై మూడు స్థితులను సమీక్షించు కుంటూ 1) నిశ్చితాలను నిలిపి ఉంచుకుంటూ, అవకాశమున్నంత మేర ఇతరుల కున్నూ అందించు యత్నం చేస్తూ ఉండడం. 2) అనిశ్చితాలను (అసమగ్ర జ్ఞానం కల అంశాలను) పూరించుకుంటూనో, సరిచేసుకుంటూనో ఉండడం, ప్రతి మనిషి జీవితంలోనూ యిలాంటి అంశాలుండేవీలుంది అన్న మెలకువను ఇతరులలోనూ కలిగిస్తూండడం, 3] భ్రమపడే వీలుంది ఎవ్వరైనా అన్న వాస్తవాన్ని గమనించే వున్నాం గనుక (ఈ విషయం వెనుకటి వాళ్ళునూ గమనించారు. ఉదా :- ప్రమాదోధీమతామపి) అట్టిది ఏర్పడి ఉందేమో చూసుకుని ఏర్పడి ఉంటే తొలగించుకోవడం, మరల ఏర్పడకుండ జాగ్రత్త కలిగి ఉండడం, అన్న పద్ధతిని ప్రతిఒక్కరూ ఏర్పరచుకోవడం వివేకవంతమూ, శ్రేయస్కరమూ కాగలదు. అయా విషయాలకు చెందిన వైజ్ఞాని కావిష్కరణలన్నీ అలాగే సాగినాయి. ఇకముందున్నూ సాగుతాయి. సాగాలికూడా. దీని కన్యమైన విధానాన్నేర్పరచుకున్న వారివల్లనే-నిజంగా వీరి హృదయంలో ఇతరుల కపకారం చేద్దామని. లేకున్నా-వ్యక్తికీ, సమాజానికీ నాడూ నేడూ, ఏనాడైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. చరిత్రను చూడగలి గితే ఇట్టి సందర్బాలు గణనీయంగానే ఎదురుపడతాయి శోధకులకు. ఒకటి రెండు - ఉదాహరణలు మీ ముందుంచుతాను గమనించండి. శంకరులు తాను గమనించి ప్రకటించిన అద్వైత సిద్ధాంతము సత్యమనే నిర్ణయానికి వచ్చారు. అంటే దేశ కాలాలకు మారనిదని వారి నిశ్చయమన్నమాట. తదన్య సైద్ధాంతికులు అది అట్టిది కాదనియూ, భ్రమాత్మకమైనదనియు నిర్ధారించే యత్నం చేశారు. అలానే వెంకటాద్రి రావిపూడి నాస్తికులున్నారు జాగ్రత్త అంటూ నాస్తిక సంఘాలను దృష్టి నిడుకునే ఓ గ్రంధాన్నీ రచించారు. అలానే కమ్యూనిజంలోని అశాస్త్రీయత అనే భావాన్ని వ్యక్తం చేసే మరో గ్రంధాన్నీ రచించారు. మరోవంక కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు తమ సిద్ధాంతం శాస్త్రాలకే శాస్త్రంవంటి దంటుంటారు. ఈ మధ్యకాలంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన జిడ్డు కృష్ణమూర్తి తాము గమనించవలసిన వాస్త వాన్ని గమనించామంటారు. వారు చెపుతున్నంత యదార్ధమేమి వారివద్ద లేదని ! అదే కోవకు చెంది ప్రస్తుతం ప్రచారంలోనున్న U,G.K, గారంటారు. ఇలా కళ్ళు తెరచి లోకాన్ని చూడగలగాలేగాని నేను వాస్తవాన్ని గమనించాననో, పొందవలసింది పొందాననో అనే వాళ్ళు అనేకంగా ఉన్నారు. ప్రతివారూ తన భావాల కన్యమైన భావజాల మంతటినీ ఏదో వంకన త్రోసిరాజంటారు. ఈ సంఘటనల స్వభావాన్ని అర్ధం చేసికొనగలిగితే ఇప్పటివరకు ప్రకటించబడిన నానా సిద్దాంతాల పోకడల నన్నింటినీ మరల పునస్సమీక్ష, పునఃపరీక్ష చేయవలసియే ఉంది , అయితే యిదేమీ అర్థం కానంత జటిల విషయమేమి కాదు గదా? మరెందుకు అవన్నీ సమీక్షింపబడుట లేదు? దానికి ఒక్కటే సమాధానం ఉంది. జ్ఞానభాగం నిరంతరం మెలకువ గలిగి ఉండితీరవలసిన ఒకానొక అంశం మరుగున పడి, ఆ చోటును మరో భావం (మనది పరీక్షింపబడవలసిన పనిలేదు అన్న భావం) ఆక్ర మించుకుని ఉండడమే అందుకు కారణంగా ఉంది. జ్ఞాన విషయం ఏ కాలంలో గానీ, ఏ దేశంలోగానీ ఏవ్వరిచేగానీ పరీక్షింపబడడానికి సిద్దంగా ఉండడం, మరల మరల శోధింపబడే సందర్భంలో మార్పులూ, కూర్పులకు అవసరం ఏర్పడితే కించిత్తు కూడా వెనుకాడకుండా అట్లు చేయగలగడం అన్నదే ఆ యంశము. అయితే ఇదే యిప్పుడు దాదాపు ప్రతి సిద్ధాంత కారులలోనూ, అనుయాయులలోనూ బలహీనంగా ఉంది. ఆ స్థానాన్ని పైన చెప్పినట్లు నది పరీక్షింపబడవలసిన అవసరం లేదనియో, (ఒక రకమైన మూర్ఖత్వమే అది) పరిపూర్ణ వాస్తవమది అన్న విశ్వాసమో చోటు చేసుకుని ఉంది. వెనుక విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి జరిగిన పెద్ద పెద్ద యవరోధాలు ఇట్టి తప్పు భావననుండియే ఉత్పన్నమైనాయి. ఉదా :- భూ కేంద్ర సిద్ధాంతం అరిస్టాటిల్ చే అంగీకరింపబడింది. అంతటి వాడు చెప్పాడు గనుక ఇక అది పరీక్షింపబడవలసిన అవసరంలేని విషయంగా స్వీకరింపబడింది, అంటేపలానీ వాడు చెప్పాడు గనుక అనే ఒక విశ్వాసాధారంగా అజ్ఞానమే జ్ఞానంగా చెలామణి అయ్యింది శతాబ్దాల తరబడి, విజ్ఞాన కాయం యొక్క ఎదుగుదల అక్కడితో ఆ కోణంలో ఆగిపోయింది. అది ఎప్పుడు మరల పునరుజ్జీవింపబడిందో ఆలోచించ గలరా?!?
          మరల ఏదో బుర్రలో నిశ్చితాలను కూడా పరీక్షిస్తూండడం అవసర మన్న మెలకువ, పరీక్షించగల తెగువ (ఈ మాట ఎందుకంటున్నానంటే సమకాలికులు అటివారిని తగినంత బలంగానే వ్యతిరేకిస్తారు కనుక) ఏర్పడిన క్షణం నుండే. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశంమేమంటే, నేడు ఈ విషయాన్ని మనం చెపితే మీరు చెప్పింది నిజమే, కానీ మా సిద్ధాంతం మాత్రం అట్టిది కాదు అనే అమాయకులే మరల మన కెదురౌతారు. ఇప్పుడు మార్పును కోరే మన ముందున్న అనేక ఇబ్బందుల్లో ఇది చిన్నదేమీ కాదు..
         ఏతావాతా తేలిన సారాంశమేమంటే మొత్తంమీద ఇప్పటికీ నే చెప్పు దలచుకున్న దేమంటే తనచే పదే, పదే పరీక్షింపబడి నిర్దారించుకోబడ్డ అంశాలైనా ఎవ్వరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా పరీక్షించి చూసుకునే అవకాశం-వెసులు బాటు-కలిగి ఉండడం, తన యనుభవాలను - నిశ్చయాలను - అప్పుడప్పుడూ తానున్నూ సమీక్షించుకోవడం జరగాలి. అయితే ఇది ఆచరణ  ఎప్పుడు సాధ్య పడుతుంది?
             వాస్తవాలూ, భ్రమలూ (ఈ రెండూ నిశ్చయరూపంలోనే యుంటాయన్నది స్పష్టంగా గమనింపదగియున్నది) సందేహాలు అన్న మూడు స్థితులు అనుభవ రూపంలోనే ఉంటాయనియూ, భ్రమ, ప్రమాదాలకు లోనయ్యే ప్రమాదం ప్రతి మానవ జీవితంలోనూ ఏర్పడే వీలుందనియూ, అట్టి వాటినన్నింటినో అధిగమించే మానవుడు తన జ్ఞానాన్ని-వివేకాన్ని -అభివృద్ధి చేసికుంటున్నాడనియూ, ఈ విషయంలో ఎవరూ- ఎవ్వరికిగానీ-మినహాయింపు లేదనీ, ఉండకూడదనియూ, ఎరుక గలిగి ఉండడం జరుగవలసి ఉంది. అట్టి స్వభావాన్ని ఏర్పరచుకున్న వారిలో ఇప్పటికీ కొన్ని నిశ్చయాలూ, మరికొన్ని పరిశీలనలూ, ఉన్నప్పటికీ జ్ఞానాభివృద్ధి దిశలో కదలిక ఆగదు, ఈ తరహా యోచనాశీలతనే నేను నా స్తవిక దృష్టి అంటాను.
ముఖచిత్రం పైనున్న వృత్తంలోని 'వాస్తవిక దృష్టి' అన్న పదాన్ని వివరించే యత్నంలో సంబందితాంశము లనేకములు ప్రస్తావించినాను. మరింత స్పష్టత కొరకు దానిని గూర్చే మరో కోణంనుండి వివరిస్తాను, పరిశీలించండి.
ఒక వ్యక్తిలో నిజాయితీ ఉందనడానికి, ఏదేని ఒక విషయాన్ని గూర్చి నిజం తెలిసి ఉందనడానికి మధ్యనున్న తేడాను గమనించగలిగితేగానీ వాస్తవిక దృష్టికీ, సత్యాన్వేషణకూ, సత్యజ్ఞానం కలిగింది అనడానికీ మధ్యగల తేడాలను గమనించలేము. నిజాయితీ యన్నది వ్యక్తి స్వభావానికి చెందిన యంశము, ఈ పదము ఉపయోగించునప్పుడు అది అతని వ్యక్తిత్వాన్నీ, ఆయా సందర్భము లందతని ప్రవర్తన-స్పందన-తీరునూ ప్రధానంగా సూచిస్తుంది ఈ నిజం తెలిసి ఉంది అన్న పదం ఏదేని విషయంపట్ల ఆతనికి ఉన్న యవగాహనా స్థాయిని ప్రధానంగా వ్యక్తీకరిస్తుంది. ఈ విషయంలో నిజాయితీ ఆతని స్వభావం అ ప్రధానమై ఆయా విషయములు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. నీజాయితీ లేని వారికి కూడా ఆయా విషయాల చెందిన వాస్తవం తెలిసి ఉండడం, అలానే నిజాయితీ కలవారలకున్నూ కొన్ని భ్రమలు ఏర్పడే అవకాశం ఉండడం, నిత్య జీవీ తంలో మనం దాదాపు తరచుగానే గమనిస్తున్నాము. కపటి (కపటము) అమాయకత్వమూ నన్న పదాలు ఈలాటి సందర్బాలను దృష్టినిడుడనే పుట్టినాయి. ఒక వ్యక్తికి ఒక విషయమునకు చెందిన వాస్తవము తెలుసు. అయినా ఏదేని ప్రయోజనాన్నాశించి దానిని మరుగు పరచాడనుకోండి. అప్పుడతడు నిజాయితీ లేనివాడంటాము కానీ నిజం తెలియని వాడనలేము. యింతవరకు స్పష్టంగా గమనించినదైతే నిజాయితీ గల వ్యక్తి స్వభావాన్ని, ఆయా విషయాలపట్ల అతని ప్రవర్తనా తీరును కలిపి అతనిని వాస్తవిక దృష్టి కలవాడంటాము. దీనినే మరోరకంగా చెప్పవలసి వస్తే,
    వాస్తవిక దృష్టి కలవాడు యిప్పటిలోకి ఆయా విషయాలను గూర్చి తనకెంత తెలుసో, ఎంత తెలియదో యధార్థంగానే గుర్తించే యత్నం చేస్తాడు. ఆ విషయం చెప్పవలసి వచ్చినప్పుడున్నూ నిజాయితీగానే తనను గూర్చి తానెట్లు గుర్తించుకుని యుంటాడో అంత మాత్రమే వ్యక్తం చేస్తాడు. అప్పటికీ తనచే గ్రహింపబడింది అన్న వాటి విషయంలో గల దోషాలను గుర్తింపజేస్తే గ్రహించి మార్చు కుంటానికిన్నీ నిజాయితీగానే యత్నిస్తాడు. తెలియంది తెలుసనిగానీ, తెలిసింది తెలియదని గానీ, ఉన్న స్థితి కంటే తననుతాను గొప్ప వానినిగాగానీ, అల్పుడననిగానీ భావించడు, ఇతరులకున్నూ చెప్పుకోడు. ఇది వాస్తవిక దృష్టి కలవాని తీరుగా ఉంటుంది. దీనిని ఎందుకింతగా ప్రస్తావించవలసి వచ్చింది?
వర్తమాన సమాజాన్నీ, అందలి వ్యక్తులను-నిశితంగా గమనించగలిగితే ఈ రకమైన స్వభావం (వాస్తవిక దృష్టి) యొక్క లోటు కొట్టవచ్చినట్లు కనుపిస్తుంది. ఉదాహరణకు ఒకడు తానెంత? చాలా అల్పుడనని చెపుతాడు పైకి. కానీ అంతర్గతంగా ఆధికుడనేనన్న భావం ఉంటుంది. అది అతని ప్రవర్తనలోనున్నూ కనుపిస్తుంటుంది. దీనిని ఒక రకమైన కపటమేనవాలి. మరికొందరు నాలుగు మాటలు అక్కడక్కడా వినో, నాలుగు గ్రంధాలు చదివో అంతా తెలిసిపోయిందన్న భావాన్నేర్పరచుకుంటారు. తెలియడమంటే ఏమిటో, ఒక దానిని గూర్చి అది తెలిసింది అనడానికీ, అది చేతనయింది అనడానికీ మధ్యనున్న వ్యత్యాసమేమిటో కూడా తెలియని వీరూ మరో రకమైన కపటుల క్రిందనో, భ్రాంతాత్మకుల క్రిందనో చేరిపోతారు. ఇట్టివారు తరచుగా వాగాడంబరులుగా (వాచా వేదాంతులుగా) ఉంటారు. దయనీయ గుణమైన స్థితేమంటే ముప్పాతిక మూడొంతులు దాదాపు అన్ని సంఘాలలోనూ ఇట్టి వారుండడమే. నిజంగా తెలియకనే తెలుసనుకునే వీరి స్థితికి జాలిపడాల్సిందే. మరో రకంగా చూస్తే వీరిని ప్రతిఘటించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకనగా, వీరు అట్టి బ్రాంత భావన కలిగి గమ్మునుండరు, పదిమందినీ తమలాటి వారుగ చేయుటకో అమాయకుల వద్ద పెద్ద వారుగా గుర్తింపు పొందాలనో నిర్విరామంగా యత్నిస్తుంటారు గనుక. ఇట్లు మానవ సంఘంలో తరచుగా జరుగుతున్న భ్రమ ప్రమాదాల్ని గమనించి, తనలోనూ అట్టి స్థితులేర్పడే యవకాశము ఉందని గమనించి తనవిగానీ, యితరులవిగానీ మరల మరల పరిశీలించుకుంటూ, ఇతరులు కూడా పరిశీలించుకునే వెసులుబాటును కూడా కలిగిఉండి, నిగ్గుతేలిన యంశాలనే అట్టే పెట్టు కుని తదితరములైన పోటీని ( అవి తనవిగానీ, యితరులవి గానీ) తృణ ప్రాయంగా విడువ గలిగినవాడే వాస్తవిక దృష్టి కల వాడవుతాడు. మరింత వివరణాత్మకంగా చెప్పుకునే వీలున్నా ఇప్పటికే తగినంత వివరణాత్మకంగానే చెప్పాననిపించుట చేతను, రచనతోనే ఆంతటినీ యిమిడ్చాలనుకోవడం సరికాదు కనుకనూ, సార గ్రహీతలైన సత్యాన్వేషకులకు ఒకటి రెండంశములను ఎదుట నుంచుట ద్వారా మిగిలిన విషయాలను వారలే గ్రహించగలరు గనుకనూ ఈవాస్తవిక దృష్టి" అన్న పదవివరణను ముగిస్తాను.
                       ఈ దృక్పధంకల వ్యక్తులు అత్యల్పంగా ఉండడం వల్లనే ఆయా సిద్దాంత  విశ్లేషణలూ, గుణదోష నిరూపణలూ  అప్పుడప్పుడూ చేయబడ్డా, గుణములను స్వీకరించడమూ, దోషములను విడవడమూ నన్న ఆచరణాత్మకత సమాజంలో ప్రబలం కాలేక పోయింది. ఇది వెనుకటి కాలంలోనేగాక, వర్తమానంలోనున్నూ జరుగుతున్న పొరబాటే. ఉదాహరణకు, ప్రతి సిద్ధాంతకారుడూ, ప్రవర్తకుడూ స్వీయ సిద్ధాంతాని కన్యమైన సిద్దాంతాలలోని దొసగులను చూపి అది యవాస్తవమనియో, అసమగ్రమనియో, నిరూపించే యత్నం చేశాడు. అత్యంత ప్రముఖంగా గమనింపవలసిన అంశ మొకటుంద్దిచ్చట, జ్ఞానానికీ, విశ్వాసానికి మధ్యనున్న తేడాను గుర్తించడమే అది. ఈ అవగాహన గమనింపు లేనిచో జరిగే ప్రమాదం (తరచుగా జరుగుతున్నది కూడా ఆదే) ఏమిటో ఆలోచించగలరా? అంతా యింతాకాదు.
        వాస్తవమిది యని తాను నిరూపింపదలచుకున్న అంశాలకు – సిద్ధాంతానికి - ఆధారంగా తాను చూపుతున్న అంశము విశ్వాస ప్రాతిపదికను కలిగి ఉంటున్నది. ముఖ్యంగా సాంప్రదాయక ఆస్తి కుల (వారు హిందూ, క్రైస్తవ, ఇస్లామీ ఆదిగాగల  ఏ వర్గం వారైనా కావచ్చు గాక) విషయంలో ఇది ప్రత్యక్షర సత్యంగా ఉన్నది.
జీవము (జీవుడు) అభౌతిక పదార్దముకాదు. దేవుడు లేడు. ఎందుకనంటే నిర్జీవంనుండి జీవం ఏర్పడింది గనుక. ఆ దానిలోనూ సాద్యా సమ హేత్వాభాసే ఉంది. నిర్జీవం నుండి జీవం ఏర్పడింది. ఎలా చెప్పగలమంటే విజ్ఞాన శాస్త్రం నిర్జీవాన్నుండి జీవాన్ని తయారుచేసింది యన్నదాన్ని పరిశీలించాలి. దీనినే తర్క పరిభాషలో చెప్పాలంటే సాథ్య సమ హేత్వాభాస అవుతుంది. అనగా ఒక విషయాన్ని నిరూపించడానికి నీవు చూపదలచుకున్న ఆధార విషయమేయింకా నిరూపింపబడవలసి యుందన్న మాట. (ఉదా - బైబిలు ఎందువల్ల ప్రమాణము అని క్రైస్తవుల నడిగామనుకోండి. దేవుని వాక్కగుటవలన అని చెపుతారు. అదీ. దేవుని వాక్కని ఎలా చెప్పగలవు అని మరల ప్రశ్నిస్తే బైబిలు చెపుతుంది. గనుక అని సమాధానం. లోపమెక్కడుందో గమనించారా? ఆలోచించండి: ఒక్క ఆధారాన్నిస్తాను. ఇందు అన్యోన్యాశ్రయ దోషం ఉంది.) అయితే ఈ విషయాన్ని గమనించే వారెందరు? ఒకవేళ గమనించగల్గినా స్వీకరించి విడువవలసినవి విడువగల మానసిక స్థైర్యం ఉన్న వాళ్ళెందరు? విశ్వాసాధారంతో జ్ఞాన నిర్దేశం చేయబూనుట ఎంతటి యవివేకమోకదా?. నేల నిడచిన సాము అన్న నానుడి యిట్టి సందర్భాలు కొరకగా చెప్పబడిందే. ఇవన్నీ వ్యక్తులలో వాస్తవిక దృష్టి లేదనదానికి నిదర్శనాలే.
ఇహపోతే వాస్తవాలను నిరూపించడానికి ఊహల నాధారం చేసికోవడమన్నది మరో వర్గం వారి పోకడగా నుంది. ఇది ఆస్థికేతర సంఘాలలో తరచుగా కాన వస్తుంది. వీటన్నిటికీ, వాస్తవిక దృష్టి లేక పోవడమో, వాస్తవాన్ని నిరూపింపగల తూనికలు (ప్రమాణాలు) ఏమిటో సరిగా తెలియనితనమో కారణాలుగా ఉంటున్నాయి.  Note: - ప్రమాణ విషయం విపుల పరిశీలన చేయవలసిన అంశమగుటచే దానిని మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను.
ఇప్పటివరక అనుకొన్న విషయాలలో చేసికొనవలసిన మార్పులూ, చేర్పులూ చేసికొనగలిగిన (వాస్తవిక దృష్టికి రాగలిగిన) గానీ వ్యక్తి నిజమైన సత్యాన్వేషడు కాజాలడు. సత్యాన్వేషిగా మారక పూర్వమున్నూ ఏవో కొన్ని విషయాలలో వాస్తవాన్ని గమనించగలిగి నప్పటికీ, ప్రత్యేక ప్రత్యేక సందర్భాలలో ఈ దృష్టి ఏర్పడినగానీ సత్యశోధనకూ తద్వారా నిర్దిష్ట విషయావగాహనకూ దృడమైన, ఖచ్చితమైన వేదిక ఏర్పడజాలదు. ఈ విషయాన్నింత నిఖ్ఖచ్చిగానూ ఎలా చెప్పగలిగాము? ఆయా సిద్దాంతానుయాయులతో అనేక సందర్భాలలో మేము జరిపిన వాద ప్రతివాదనలే మమ్ము నీ యవగాహనాపరులనుగా తీర్చిదిద్దినవి
Note: - సమావేశ వివరాలున్నూ అందరకు తెలిపిన బాగుండునన్న ఉద్దేశం వలన ఈ సంచికలో స్వమంతవ్యాదులను సశేషంగా ప్రకటించటమైనది. కొరవలు తరువాయి సంచికలో చూడగలరు.
స్పందన – పతిస్పందన
 "మేలుకొలుపు"  మాకు మేలుకొలుపుగానే ఉందంటూ కొందరు పాఠకులు ప్రశంసా పూర్వకంగా అభినందనలతో లేఖలు వ్రాశారు, వ్రాస్తున్నారు. అవన్నీ ఓ పత్రికలో యధాతధంగా ప్రకటించుటకు స్థలాభావం వల్ల వీలు పడక పోయినా, ప్రోత్సాహ కారకాలుగా వాటిని స్వీకరిస్తూ ప్రత్యభినందనలతో వారందరనూ మేలుకొలుపు కార్యక్రమంలో భాగస్వాములు కండని ఆహ్వానిస్తున్నాము. ప్రశంసా పూర్వకంగా వస్తున్న లేఖలలోనై నా విషయ ప్రాధాన్యతగల అంశాలను మాత్రం క్రమంగా ప్రకటించగలను. పోతే విమర్శాపూర్వకంగా వస్తున్న లేఖలతో ప్రథమ స్థాన మొసగి ముందుగా వాటి పై నా ప్రతిస్పందనను మీ ముందుంచుతున్నాను, , ఇందు పై మీమీ యభి ప్రాయములను నిష్కర్షగా వ్యక్తం చేయగలరని ఆశిస్తాను.
విమర్శ అన్నది ప్రధానంగా సందేహాలనో, లోపాలనో వ్యక్తం చేస్తుంటుంది గనుకనే వాటికి ప్రధమస్థానం ఒసంగవలసి వచ్చింది. అది సమీ చీనము కూడా,ఈ సంచికలో ప్రధానంగా ఓం ప్రకాశ్ గారు వ్రాసిన విమర్శనాత్మక లేఖనూ, దానిపై నా యభిప్రాయాన్నీ విశ్లేషణను పొందుపరుస్తున్నాను. పరిశీలించి ఉచితానుచితములు గమనించండి.
స్పందన 1) చెప్పే విషయాన్ని అయోమయంగా చెప్పడం మానండి. –
 ప్ర.సం. ఇదే విషయాన్ని మీ మొదటి లేఖతోనూ వ్యక్తం చేశారు. కానీ సంచికలోని ఏ సందర్భానికి చెందిన వాక్యాలు గందరగోళాన్నీ , అయోమయాన్ని కలిగిస్తున్నాయో కూడా చెప్పి ఆ పైన పైసూచన చేస్తే బాగుండేది. నేనూ ఆలోచించుకోడానికి, అవసరమైతే మార్చుకోడానికిన్నీ వీలుండేదప్పుడు. ఇంత విమర్శ చేసిన మీకది తెలియదని ఎలా అనుకోగలను. అదిన్నీ రాశాక మీలేఖ పోకడ కొంత ఉద్రేక పూరితంగానూ, పరుష పదప్రయోగంతో నూ కూడుకొని ఉంది. మీరే దృష్టి నుండి ఈ లేఖ ! వాసి యుంటారు? అని ఆలోచిస్తే యిలా అనిపించింది.
A) జీవితంలో నిజాయితీగానే ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆయా విషయాలు సాధించుట కుదరక అవెల్ల కుదరని విషయాలన్న నిర్ణయానికి వచ్చి అట్టి విషయాలు ఎవరినుండి వినబడినా అసంబద్దాంశములు చెప్పబడుతున్న నన్న దృష్టి ఏర్పడడం వలన కావచ్చు. .
B) చెప్పేవాడే గాని చేసేవాడేడి అందరూ కబుర్ల రాయుళ్ళే, సాధువెవడూ లేడు. కనీసం సాధకుడైనా లేడు అన్న భావన నుండైనా కావచ్చు. అయితే ఈ భావన నేను అధికుణ్ణి. అందరూ అల్పులేనన్న భ్రమాత్మక దృష్టి నుండిగానీ, వాస్తవంగా సమాజంలో అకర్మణ్యత బలపడి ఉంది. అన్న యనుభవంనుండి గానీ ఏర్పడే వీలుంది.
C) ఎవరినుండి ఏ ప్రతిపాదన వచ్చినా ఏదో దోషాన్ని చూసే ప్రవృత్తి, ఏర్పడి ఉండడం Fault Finding Nature ఐనా కావచ్చు. ఈ మూడవరకాన్ని దృష్టిలో ఉంచుకొనేకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ఉంటుందిఅన్న నానుడి ఏర్పడింది.
ఈ మూడు రకాల దృష్టులలో దేనినుండైనా మీ లేఖ రావడానికి వీలుంది. అయితే వివరాలు పూర్తిగా తెలియని నాకు ఈ విషయమై ఊహ మాత్రమే. సందిగ్ధమే- ఉంది. కానీ మీ లేఖలోని ఒకటి రెండు వాక్యాలు మాత్రం మీరు కొంత తొందరపాటు స్వభావం కలవారనిపించేట్లుగా ఉన్నాయి. విమర్శించేముందు ఆయా విషయాలను గానీ, వ్యక్తులనుగానీ సమగ్రంగా పరిశీలించిన పిదపనే మన మనభిప్రాయాలను వ్యక్తీకరించడం సబబౌతుంది. ఈ మాట వాస్తవమేనని మీరంగీకరించగలిగితే (ఆంగీకరించకపోయినా అది వాస్తవమే] మీ విమర్శలో కొంత అహేతుకత చోటు చేసుకుని ఉందనిపిస్తుంది. ఎందుకలా అనవలసి వస్తోందంటే న్యాయంగా చూస్తే మీ విమర్శనా రచనపై సాగి ఉండాల్సింది. కానీ ఆది వ్యక్తిపై (నాపై) విమర్శగామారింది. ఇక మీలేఖాంతర్గత విషయాలను విశ్లేషిస్తాను. పరిశీలించి ఉచితానుచితములు నిర్ణయించండి. –
 స్పందన 2) మొత్తం పత్రికనంతా (4వ సంచికను) వడపోస్తే తేలిన అంశాలు యివి. 1)వ్యక్తి నిర్మాణము 2) సమాజ శ్రేయస్సు; అని వ్రాశారు.
ప్రతి స్పందన!! మీ వడపోత దృష్టిలో ఈ రెండు మాటలే అర్ధవంతములు మిగిలినవి వ్యర్థ పదార్దం క్రిందే లెఖ్ఖ అన్న ధ్వని ఉంది. ఇక్కడ మీరో విష యాన్ని గమనించవలసి ఉంది. మరో వంద పేజీల నా రచన మీరు చూసినా ఆ కోణంలో మీ కనిపించేది ఆ రెండుమాటలే. పైగా ఎవరూ వడపోయనక్కర లేకుండగనే నేనే నా ఆశయమూ, ప్రస్తుత సామాజి కావసరమూ కూడా పైరెండు విషయాలేనని చెప్పినాను. అయితే మిగిలిన రచనంతా ఎందుకు? అన్న ప్రశ్న పుట్టవచ్చును.
      ప్రతి ఉద్యమ రూపంలోనూ యోచన  రెండు విభాగాలుగా ఉంటుంది. సాధ్యపక్షమూ, సాధనపక్ష మూనని. సాథ్య విషయం-ఆశయ-ఉద్దేశ రూపంలోనూ, సాథనపక్షం ఆశయసిద్ధి కైన ప్రక్రియారూపంలోనూ చెప్పబడుతుంది. మరి ఈవిషయం మీకు తెలియకనో, తెలిసే నేనెలా స్పందిస్తానో చూడాలనో, మరెందు వల్లనో వడపోత కార్యక్రమం మొదలు పెట్టినారు. నా గురించి తగినంత సమాచారం లేకనే వా రచనపై, నాపై కూడా మీకెందుకు వ్యతిరేక దృష్టి ఏర్పడిందో మీరే చెప్పాల్సి ఉంది. .
స్పం!! 3) వెనకటి కాలంలో (ధార్మికులు, తాత్వికులూ, లోకహితకాంక్షులన్న నామాటలే ఇక్కడ మీరు చూపించదలచుకున్న వనుకుంటాను.) దైవీ గుణాలు కలవారుండే వారని అనుకుంటునట్లున్నారు. అయితే సమాజం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మన వెనుకటి కాలం బాగుందనిపించవచ్చు వెనుకటివారికి ఆ వెనుకటి కాలం, ఇలా వెనక్కి వెళుతుంటే సమాజం ఎప్పుడూ వర్తమాన కాలం వారికి దుర్భరంగా, దుష్టంగానే ఉందనిపించవచ్చు. ఉపనిషత్తులను పరిశీలిస్తే నాటి సమాజం కూడా ఎంత దుష్టంగా ఉండేదో అర్థమవుతుంది. అలా దుష్టంగా ఉన్నప్పుడే నీతిబోధలూ, సన్మార్గ బోధలూ ఏర్పడతాయి. రాక్షసులూ, దేవతలూ అన్న విభాగం నాటి సమాజాన్ని సూచిస్తుంది. కాబట్టి వ్యక్తులు మారాలి, సమాజం మారాలి అన్న సలహాలివ్వడం మానండి. అని వ్రాశారు.
ప్ర. సం|| 5) మీ పైవిమర్శలోనూ నా సంచికను ఆమూలాగ్రం పరిశీలించని (లేక ఏదో దృష్టి నిడుకని పరిశీలించిన) లోటు కనుపిస్తున్నది. ఎందుకంటే మీరు మారండి అని సలహాలివ్వడం నా ఉద్దేశం కాదు. మనం మారదాం రండి, అన్నదే నా పక్షము. కలసి కదలాలన్నదే నా యోచన. నేను పరిపూరుణ్ణి, మీరందరూ యింకా సాధన దశకే రాలేదు అని చెప్పాలని నాకేమీ లేదు. నేను సాధకుణ్ణని నాకు తెలుసు. మీకు నచ్చిన కోణంనుండి మీరది పరిశీలించుకోవచ్చు. అయితే సాధ్యమేమి? సాధన క్రమమేమి? అన్న వివేకం నాకు స్పష్టంగానే ఉంది. అదిన్నీ మీరుగానీ, మరెవరుగానీ పరీక్షించి చూసుకోవచ్చు.
సమాజం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అన్న మీమాటలో మీ భావమేమో స్పష్టంగా లేదు. ఆ వాక్యాన్ని రెండుగా అర్ధం చేసికోవచ్చు. 1) మార్పులేని తనం-యధాతథస్థితి-సమాజం కలిగి ఉందని, అదే మీ ఉద్దేశమైతే అది భ్రాంతి జన్యం మాత్రమే. 2) ఏనాడు చూసినా ధర్మాధర్మ పక్షాలు సమాజంలో ఉండనే ఉంటాయి. అన్నట్లైతే మీభావన వాస్తవమే ననొచ్చు. నాల్గవ సంచిక  నేరుగా సంబంధించని అంశమైనా మీరు చెప్పింది అవాస్తవం కాదు. అయితే కొంత సరిచేయవలసి ఉంది. పైరెండు పక్షాలూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి బలం గానూ, రెండోది బలహీనంగానూ ఉంటాయి. పైగా మార్పుకున్నూ లోనవుతుంటాయి. ఆయా మార్పులకు వ్యక్తుల స్వభావమూ, సంఘాల స్వభావము నిమిత్త కారణాలుగా ఉంటాయి. ఇది చరిత్రనూ, ప్రస్తుతాన్నీ, చూడగలిగితే కనబడే విష యమే. ఈ రెండు పక్షాలలోనూ మార్పులు రావడానికీ-తేవడానికి-మనిషి ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు..
మార్కులాంటి పదార్థవాది కూడా భావవిప్లవం యొక్క (విప్లవోద్యమంలో సాహిత్యం పాత్ర యొక్క) ప్రాధాన్యతను నొక్కి వక్కాణించాడు ఆచరణ శూన్యం కాకూడదన్న నియమాన్ని స్వీకరించగలిగితే, భావమే-జ్ఞానమే మనిషిని నడుపుతున్నదన్నదొక కాదనలేని వాస్తవము.
స్పం : 4) మీరు మారగలగా స్వయంగా? మీరు మారితే సమాజం మారినట్లే లెఖ్ఖ. మీ మనస్సు ఎలా ఉందో ప్రపంచం అలానే ఉంటుంది. మీలో ఎన్ని బలహీనతలున్నాయో అందరిలోనూ అన్ని బలహీనతలుంటాయి. మీరు మారండి. ఇత్యాది..........
       ప్రసం!! నేను మారలేదని మీరెలా నిర్ణయాని కొచ్చారు? అయినా అడిగారు గనుక సాధుదృష్టినుండే దానిని స్వీకరించి సమాధానం యిస్తాను, నేను చాలా మారాను. మరికొన్ని యంశములలో మార్పుకై సాధన చేస్తున్నాను. ప్రతి మనిషి ఏదో కోణంలో మారవలసి యున్న దనియూ గమనించాను. నాకంటే శ్రేష్టులూ, సములూ, చిన్నవారు అనదగ్గ స్థాయిలలోని వ్యక్తులు సమాజంలో ఉన్నారనియూ గమనించాను. ఆయా విషయాలలో పెద్దలను సాధనకు ఆదర్శం గానూ, సములతో కలసియూ, చిన్నవారికి ఆదర్శంగానూ ఉండే మార్గంలోనే స్థిరంగా ఉన్నాను, వాస్తవంగా మీ లేఖకు మరోవిథంగా స్పందించే అవకాశం ఉన్నా మీ సూచనలను ఆనుకూలంగా స్వీకరించే నా యభిప్రాయాలు తెలిపాను. సమాజంలో మాయన్వేషణలో ఎదురైన ఒక అంశాన్ని సందర్భోచితమని భావించి తెలియపరుస్తూ ఈ లేఖ ముగిస్తాను,
మాకెదురుపడిన పెద్దలుగా గుర్తింపబడుతున్న తాము పరిపూరులము, సిద్ధావస్థలో నున్న వారము అన్న భావనలోనన్న అనేకమందిలో ఎక్కువభాగం వారితో మమ్ము సరిపోల్చుకుంటే, వారికంటే శారీరక, మానసిక, బౌద్ధిక విషయమై అధిక పరిణితి చెందిన మేము మమ్ములను సాథకగానే పరిపూర్ణులం కాదనియే-గుర్తించుకుంటున్నాం దృడంగా. ఈ విషయంలో కూడా సమాజాన్ని మేలుకొలపాలన్నది మా ఆకాంక్షగా ఉంది. ముఖాముఖి కలుసుకోవడం ద్వారా సాన్నిహిత్యమూ, సూక్ష్మ పరిశీలనావకాశము ఏర్పడగలదు. అది యిరువురకూ మేలొన గూర్పగలదు.
21, 22, 23 తేదీల సత్సంగ విశేషాలు
 అనుకున్నట్లుగానే సమావేశమునకు 30 మందికి పైగా ఆయా ప్రాంతాలు నుండి తరలి వచ్చారు. వచ్చినవారిలో హైద్రాబాద్, వరంగల్, విజయవాడ, మంగళగిరి, ఏర్పేడు, (చిత్తూరు జిల్లా), ప్రకాశం జిల్లా, ఉయ్యూరు, నంద్యాల, నెల్లూరుకు చెందిన వారున్నారు. మరికొన్ని ప్రాంతాలనుండి అనివార్య కారణాల వల్ల రాలేక పోతున్నాననియూ, త్వరతో కలవగలమనియూ లేఖలు వచ్చి నాయి.
1) జీవితాన్ని ఎలా నడుపుకోవాలి? లేక ఎలా మలుచుకోవాలి? అన్నది నిపుణుల పరిశీలన చేయవలసిన ధర్మాంతర్గతమైన యంశము. ప్రతివ్యక్తీ, ప్రతి సముమూ ముందుగా దీనిని గూర్చి నిర్దిష్టమైన కార్యక్రమాన్నేర్పరచుకొని, అమలు చేయాలి. ఇది అత్యంత ప్రధానమైన యంశమైనప్పటికీ దాదాపు ప్రతి సంఘము చేతనూ ఉపేక్షింపబడుతున్న విషయమై యున్నది. గమనించండి అన్న హెచ్చరిక తో సమావేశం ప్రారంభింపబడింది.
2) వివేకమూ- నమ్మకమూ అన్న వాటి పై విశ్లేషణ జరిగింది, విశ్లేషణాంశణాంశములు క్లుప్తంగా..
A) సంశయించి పరిశీలించుట, గ్రహించి నిర్ణయించుకొనుట, అన్నవి. మానవ స్వభావానికే చెందిన అంశాలు. అయినప్పటికీ మానవ జీవితంలో సమ్మక మనునది కూడా. గణనీయమైన స్థాయిలోనే ముడిపడి యున్నది. అయితే విడదీయరాని విధంగా సంబంధపడి యున్నప్పటికీ దానివల్ల ఏర్పడుతున్న భ్రమ ప్రమాదముల దృష్ట్యా అది మరింత పరిశీలించవలసినదిగా నున్నది. అట్టి పరిశీలన వలన విశ్వాసమునునది రెండు విభాగాలుగా విడదీయవలసి వస్తోంది.
(గమనిక:- విశ్వాసమనగా యిప్పటికి తనకు యనుభవముల ద్వారా తెలియబడని విష యములను గూర్చి అవుననిగానీ, కాదనిగానీ, ఉందనిగానీ, లేదని గానీ, సత్యమనిగానీ, ఆనత్యమనగానీ నిర్ణయానికి వచ్చుట యని అర్థము. ఆయా విషయములను వినిగానీ, చదివిగానీ అంగీకరించుట)
1) చెప్పబడ్డ విషయములను అనుసరించిన పిదప ఏర్పడ్డ ఫలితాలనుబట్టి వాటివాటి సత్యాసత్యములను నిర్ణయించుకొనగలుగ అంశములు.
2) అనుసరించిన పిదపనూ అవి సత్యములో ఆసత్యములో నిర్ణయించు కొనుటకు వీలుగాని అంశములు. (పరిశీలించే యవకాశములు లేని విషయములు)
ఇందు మొదటి రకమునకు చెందినవి నిత్యజీవితములో ముడిపడి ఉంటాయి..              బ్రతికుండగానే నిర్ధారించుకొనుటకు వీలవుతుంది. మిగిలిన విషయాలు. . నిర్దారింపవీలుకానివి.
ఉదా- క్రైస్తవుల స్వర్గం, హిందువుల స్వర్గం, ఈ రెంటినీ రెండు మతగ్రంధాలు చెపుతున్నాయి. రెండూ దైవవాక్కులేనని ఆయా గ్రంధాలలో ఉంది. ఇక్కడ నమ్మి పోదామనుకునే సాధకునికి రెంటిలో ఏది నిజము? అసలు ఆవి వున్నవా? లేనివా? అన్న సందేహం పుడుతోంది. దీనిని నిర్ణయించుకునే వీలుందా? ఆసాధకునికి?(పాఠకులీ విషయం పై చక్కగా ఆలోచించి పత్రికకు వ్రాయండి?)
Note: - అనుమానించి పరిశీలించడం-నిర్ణయించుకోవడం (తెలిసికోవడం మానవ స్వభావము అనుకున్నాము కదా! అవునో కాదో గమనించండి ఏమీ దిక్కుతోచని పరిస్థితులో ఆయా విషయాలను ఒప్పుకొన్నా వీలున్నప్పుడల్లా నమ్మానన్న దానిని గూర్చే విచారణ చేస్తుంటాడు మనిషి. అవునో కాదో ఆలో చించండి.
మనిషి తెలిసీ, తెలియకో చేయకూడని పనులు చేస్తున్నాడు, తెలియక చేసే తప్పులు అట్లుంచండి. తెలిసి ఎందుకు చేయరాని పనులు చేస్తున్నాడు!
దీనికి రెండు కారణాలున్నాయి. 1) స్వార్ధం ప్రధానం కావడం. ఎవరేలా పోతేనేమిలే మనవరకు బాగుంటే చాలునన్న ధోరణి. 2) ఆలవాటుకు బానిసగా మారే స్వభావం వల్ల. ఈ రెండూ ఇష్టాల క్రింద చెప్పుకోవచ్చు. ఇవి వివేకాన్ని కూడా తోసిరాజంటాయి. ఇచ్చాశక్తి (అనుభవ ముద్రలు లేక వాసనలు) బలీయంగా ఉండి వివేకానికి లొంగక పోవడమూ లేక వివేకమే లేకపోవడమూనన్నది మనిషి , సంఘము, చేయకూడని పనులు చేయడానికి కారణంగా ఉంది. ఈ సమస్య తీరడానికి 1) వివేకాన్ని సంపాదించుకోవడమూ 2) దానిని బలపరచుకోవడమూ తప్ప మార్గాంతరం లేదు. మీరూ ఆలోచించండి. మొత్తం మానవ జీవితాన్నిసామాజిక సంబంధాల దృష్ట్యా నిర్వచనం చేయవలసి వస్తే అవి మొత్తమూ పరస్పర విలువల మార్పిడికి (ఇచ్చి పుచ్చుకునే సంబంధాలకు లేక అవసరాలకు) చెందినవిగానే ఉంటాయి. వ్యష్టికీ, సమిష్టికీ, యోగమూ, క్షేమమూ కలగాలంటే ఈ సంబంధాలను క్రమపరచవలసి ఉంది. ప్రతిమనిషీ చేయవలసినంతా చేయడం, తీసికోవలసినంత తీసికోవడం జరగాలన్న మాట. దీనినెట్లా ఆచరణలో పెట్టాలన్నదే ! ప్రణాళిక ల్లోని ప్రధానోద్దేశంగా ఉండాలి. అయితే ఇదీ అసాధ్యం కాదు గానీ, దుస్సాద్యంగా ఉంది. ఆలోచించండి.
Note: - పనిచేసే తింటాను (ఇచ్చే పుచ్పు కంటాను) అని వ్యక్తి తనకు తాను నిర్ణయించుకోగలిగితే- ఈ పని సుళువైతుంది. కర్మణ్యతను పెంచడం మొదట చేయవలసి ఉంది.
పనిచేస్తూనే వంద సంవత్సరాలు జీవించాలని అభిలషించు. ఇంతకంటే, కర్మ బంథం కాకుండుటకు మార్గాంతరం లేదు. ఎంతో సారభూతమైన మాట యిది.
మరో అంశంగా గీతలోని ఓ శ్లోకాన్ని తీసుకున్నాము. కర్మణ్వేవాధికారస్తే . మాఫలేషు కదాచనః మా కర్మ ఫల హేతురూ.. మాటేసంగో స్వకర్మణి!! ఏ ప్రాతి పదికన – ఆధారంతో – ఈ శ్లోకం చెప్పబడినది? అసలిది సబబు అనవచ్చా? ఆనగలమా? అన్నది ప్రశ్న.
రావలసినది రాకపోవుటకు కారణమేమి? ఆన్న సమస్యను పరిశీలించాము. - .
1) ఏమి కావాలి అన్న విషయంలో స్పష్టత, కొవాలి అన్నదానిపై ఆది, లేకపోతే ఉండలేను ఆన్న తీవ్రత లేక పోయినచో కావాలనున్నా చేయవలసినంత, చేయవలసిన విధంగా చేయలేడు. (ఉద్దేశ సృష్టత, తీవ్రత లేకపోవడమన్న మాట)
2) అవి ఉన్నా తెచ్చుకోవడానికి అవసరమైన సామగ్రి తగినంత లేకపోవుట విధానం తెలియకపోవుట (పరికరాలు-విధానముల యందలి లోటుపాట్లు)
ఈ ఆంశములను బట్టే రావలసినవి వచ్చుట, రాకపోవుట అన్నది ఆధార పడి ఉన్నది. అన్న నిర్ణయానికి వచ్చాము. మీరూ ఆలోచించండి.
జ్ఞానార్జన చేయగోరువారు ఏ విషయం యితరులనుండి వినినా వెంటనే చెప్పిన విషయం మీ అనుభవం లేనిదా (తెలిసి చెప్పారా!) అని అడిగి తెలిసి కోవాలి?
A) అనుభవంలోనిది అన్నదైతే ఆది యదార్థానుభవమో? భ్రాంత్యనుభవమో పరిశీలించండి.
B) వినో, చదివో చెప్పానన్నట్లైనచో అది నిజమని ఎట్లు చెప్పగలరు? ఆని ఆడగాలి.
Note: - పరిశీలనకు ప్రారంభము సందేహమేనన్నది స్పష్టముగా గమనించాలి. చివరగా కొత్త చోటులందు సత్సంగమండలులు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. పాఠకులున్నూ ఈ విషయాన్ని ప్రముఖంగా గుర్తించగలరు...............
అభ్యాసక్రమము
    సంవత్సరాల తరబడి వందలాది యనుభవాలను పరిశీంచిన పిదప వాటన్నిటి క్రోడీకరణ రూపంగా నాలో ఏర్పడిన యనేక నిశ్చితాభిప్రాయాలలో ప్రస్తుతాంశమునకు చెందిన భావన కూడా ఒకటైయున్నది. అది ప్రతివ్యక్తి, ఆ జీవితం ఏదో కోణానికి సంబంధించి సాధకుడుగానే ఉండదగియున్నాడనునదే. ఈ ప్రతిపాదన వెనుక నా ఉద్దేశం ఏమంటే, ఏ వ్యక్తి అన్ని విషయాలలోను సిద్ధావస్థను--పరిపూర్ణ తను పొందిలేడనియు, అనగా ఏదో విషయంలో మారదగి యున్నాడనియూ మార్పు కోరుతున్నాడనియు, ఆలానే ప్రతి విషయంలోనూ మారదగియే-సాథకా వస్థలోనే ఉన్నాడని చెప్పవీలుకాదనియు మాత్రమే. ఎవ్వరికైననూ ఆథారంగా పడదగ్గ ఈ అంశమే మానవ జీవీతంలో అభ్యాసక్రమాన్ని జనింపచేసింది. తనకు పలానా విషయమే అసమగ్రత ఉన్నదనియూ, ఆ విషయంలో లోను ప్రయత్నము చేయదగ్గ స్థితిలోనే యున్నాననీయూ, అనగా సాధకునిగానే ఉన్నాననియు గ్రహించడమే సాధనకు నాంది ప్రస్తావన కాగలదు. ఈ గమనింపు ఆత్మ విమర్శా పూర్వకంగా (నిజజీవిత అను భవాలనుండి) ఏర్పడనంతకాలం వ్యక్తి యదార్థ సాధకుడు కాజాలడు. అయితే అయా వ్యక్తులు చేయు సాధనల మాటేమిటి? అన్న ప్రశ్న రావచ్చును. పై గమనింపు లేక నే చేయబడు. సాధనలుగా చెప్పబడు- క్రియలన్నియు ఇతరులచే నెత్తి మీద పెట్టబడ్డవే. ఆవి ప్రేరకుల ప్రభావం ఆ వ్యక్తిపై నున్నంతకాలం అనుసరించబడతాయి. ఎందుకని? స్వీయ జీవితానుభవంనుండి అది తన జీవితావసరంగా గుర్తింపబడలేదు గనుక. కనుకనే అధ్యాత్మవిద్యలో ప్రధమ ప్రశ్న బోధకునిదినీకేం కావాలి?" యనుటతో ప్రారంభం కావలసి యుందీ ఆకావాలి యనునది జీవితావసరంగా నిజజీవితం నుండి గమనింపబడిన యంశమై యుండాలి. ఇదీ అత్యంత ప్రధానమైన అంశ మై యున్నది.
Note: - అస్దిత్వమూ, ఎదుగుదలా, గుర్తింపూ, భోగప్రాప్తి, ఆ ప్రాప్తులూ వీటినుండి ఏర్పడుతున్న ఆనందమూ, ఈ ఐదీంటికీ సంబంధపడే మానవ జీవితము నందు ప్రయత్నము ఏర్పడుతున్నది. ఇదొక తాత్విక -మార్పు లేనియంశము.
సాధన రెండు కోణములనుండీ సాగవలసి ఉంటుందన్న విషయాన్ని వ్యక్తి-సాధన చేయగోరువాడు ముందుగా గమనించాల్సి ఉంది. అవి భౌతిక పరంగానూ, భావ - మానసిక - పరంగానూ. భావాలే-ఆలోచనలే. మనిషిని కదిలిస్తున్నాయి. భావం-యోచన-ముందూ, అనుసరణ-యత్నం పిదప అన్నది జరుగుతున్న క్రమం. కనుక భావ విప్లవం-భౌతిక విప్లవం- (విప్లవమంటే ఇక్కడ కోరదగినవైపు గుణాత్మకమైన మార్పు అని నాఉద్దేశము. వ్యక్తిలోను, తద్వారా సమాజంలోనూ రావలసి ఉంది. ఇప్పటికి మనం ఏమి చెప్పుకుంటున్నట్లైనది?
1) తాను మార్పు చెందదగి యున్నాననియూ, మార్పు కోరుకుంటున్నాననీయు తన జీవితాన్నీ పరిశీలించుట ద్వారా మార్పు తన అవసరంగా (స్పష్టంగా) గ్రహించడం.
2) ఏ విషయంలో ఆ మార్పు పొందవలసి యున్నది వాస్తవంగాను, స్పష్టంగానూ గమనించగలిగే నప్పుడే, దాని ఆవశ్యకత యొక్క తీవ్రతను గూడా గమనింపగలిగినప్పుడే (దీనినే ఉద్దేశ తీవ్రత అంటాము.) యదార్థంగా కదలిక ప్రారంభమౌతుంది.
శలవ్ ---- మీ సురేంద్ర.
సశేషం.

1 comment:

  1. కలియుగాంతం ఎలా అవుతుంది ?
    ---------------------------------------------
    కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".

    రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో  పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.

    అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే

    చిన్ని శ్రీ కృష్ణుల నుంచి
    -------------------------------
    2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.

    గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి )
    --------------------------------------------------
    ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.

    నా జన్మ రహస్యం తెలిసింది.
    నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.
    నన్ను " తథాగతుడు" అని అంటారు.

    గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి )
    ------------------------------------------------
    ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.

    ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.

    ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.

    తథాగతుడు అంటే
    --------------------------
    యదా రాజా - తథా ప్రజా
    యదా భగవంతుడు - తథా భక్తులు
    యదాగతుడు - తథాగతుడు

    యదా భగవంతుడు - శ్రీ రాముడు
    తథా భక్తులు - పాండవులు
    యదాగతుడు - శ్రీ కృష్ణుడు
    తథాగతుడు - గౌతమ బుద్ధుడు

    అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి
    అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు
    త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా
    ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.

    త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.

    యదా భగవంతుడు
    --------------------------
    త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.

    తథా భక్తులు
    -----------------
    ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.

    యదాగతుడు
    ------------------
    శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.

    తథాగతుడు
    ----------------
    కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.

    తదుపరి
    చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.

    తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.

    వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.

    కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.

    కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?
    -------------------------------------------------
    కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.

    మహాయుగం ఆయుష్షు    :    43,20,000

    కృతయుగం ఆయుష్షు      :   17,28,000
    త్రేతాయుగం ఆయుష్షు     :    12,96,000
    ద్వాపరయుగం ఆయుష్షు  :      8,64,000
    కలియుగం ఆయుష్షు.       :      4,32,000

    కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరములకు కొంచెం అటు ఇటుగా.

    ReplyDelete