Monday, July 6, 2020

పదార్ధ వివేచన - వ్యాస సంపుటి

సంపుటి-3 సెప్టెంబరు 1993 సంచిక-9

పదార్థవివేచన – భూమికా  

  

పదార్ధ వివేచనకు అవశ్యపూర్వరంగంగా [ముందే తప్పనిసరిగా తెలిసికొని ఉండవలసిన] శబ్ద ప్రమాణ స్వరూపస్వభావాలను అనగా భాష పుట్టుక, శక్తి, పరిమితులను జూన్, జులై సంచికలలో తగినంతగానే విశ్లేషించి చూపాను. ఈ వ్యాసం వ్రాసే ముందు ఆ రెండు సంచికలను ఒకసారి ముఖ్యంగా చూశాను. జూన్ సంచికలోనైతే గొప్పచెప్పుకోవడం కాదుగాని నేనే అబ్బురపడేంత విలువైన అంశాలు చాలా పొందిక గానూ, ఎంతో భావ ప్రకటనా సామర్థ్యంతోనూ నా కలం నుండి వచ్చినట్లు అనిపించింది. రచన ఒక్కోసారి అనుకున్న దాని కంటే చక్కగా కుదిరినట్లు, అప్పుడపుడు సరిగా సాగనట్లు ఉండడం రచయితలందరి అనుభవంలోని విషయమే. సరే జిజ్ఞాసగానీ, పరీక్షించాలనే కుతూహలమూ, సమర్ధతగానీ ఉంటే ఆ సంచికలను  4, 5సార్లు మననం చేసి యధాభిమతం స్పందనలో కలవండి. విషయ పరిశీలన కలసి చేద్దాం. 

ఈ శబ్ద ప్రమాణ స్వరూపం (అసలు రంగు) బోధపడక పదార్థ వివేచన చేయడం అసాధ్యం. భాషా నియమాలు తెలియక శబ్దప్రమాణ బలాబలాలనూ, పరిధుల్నీ అవగాహించడమూ దుస్సాధ్యమే. ఎందుకంటే ఈ మూడూ పదము, పదార్ధము, పదపదార్థ సంబంధము అన్న అంశాల పైనే ఆధారపడి ఉన్నాయి కనుక. అలాగే పదార్థ వివేచనకు ప్రాతిపదికలుగ ఉండగల 8 పదాలను వాటి అర్థాలను ముందుగా మనం గమనించాల్సి ఉందని చెప్పాను గుర్తుండే ఉంటుందనుకుంటాను. 

పదము,

పదార్థము,

పర్యాయ పదము,

నిర్వచనము,

వివరణ,

ఉపమానము,

ఉదాహరణము,

నిర్ధారణ

అన్న ఎనిమిది పదాల అర్థాలను విస్పష్టంగా తెలుకుని చేసే పదార్థ విచారణకూ (శాస్త్రాధ్యయనానికి) ఆ వివేకం లేక చేసే మీమాంసకూ హస్తిమశకాంతర భేదముంటుంది. ఈ మాటను మరొక్కమారు చదివి పై భావాన్ని సూటిగా అర్థంచేసుకోడానికి యత్నించండి.

ఏ పదానికేది అర్థమో అది పదార్థం. పదస్య అర్థః పదార్థః, పదార్థమంటే ద్రవ్యం మాత్రం కాదనీ, ద్రవ్యమూ  [Material] ఒక పదార్థమేనని గ్రహించండి ముందు. పదార్థాలు మౌలికంగా ఐదు రకాలు. వస్తు, ద్రవ్య, గుణ, క్రియా, సంబంధాలని. ఈ పదార్థ వర్గీకరణను గురించి ముందు ముందు విపుల విచారణ చేయబోతాం. కనుక ప్రస్తుతానికి, పేర్లు పదాలు గుర్తుంచుకోండిచాలు. ఏ పదమూ పదార్థమైనా పై ఐదు రకాలలో ఏదో ఒక దానిలో చేరిపోతుందన్న విషయాన్ని పదార్థ  వివేచనలో ప్రతిక్షణం గుర్తుంచుకోవలసి ఉంటుంది. విషయం అర్ధమవుతోంది కదూ!

 ఒక పదార్థాన్ని తెలిసికోవడ మెలాగన్నది ఆలోచిద్దాం. పదార్థ జ్ఞానం అనుభవం ద్వారానో, సంబంధ స్మరణ ద్వారానో మాత్రమే తెలుసుకునే వీలుంది. అనుమానమూ, శబ్దమూ రెండూ కూడా సంబంధస్మరణ ద్వారా జ్ఞాన జనకాలు మాత్రమే. ప్రమాణాన్ని స్మరించండొకసారి. అనుభవం ద్వారా తెలుసుకోవడమన్నది అందరకూ తెలిసిన విషయమేనని గతసంచికలలో చెప్పుకున్నాం. పదాలు విన్న ప్పుడు పదజ్ఞానం కలుగుతుంది. పద - పదార్థ సంబంధ జ్ఞానం గతంలో కలిగి ఉంటే (స్మృతిలో ఉంటే) పదం వినగానే అర్థం స్మరింపబడుతుంది. లోగడ మనకు పదార్థం తెలిసి లేదనుకోండి పదం విన్నా ఏమవుతుందపుడు? ఏమీ కాదు. కేవలం ఏదో శబ్దం వచ్చిందనిపిస్తుందంతే. అవునా? కాదా? కనుక పదం తెలియడానికి పదార్థం తెలియడానికి చాలా వ్యత్యాసముంది. పదం పదార్థం కాదు, కాలేదు. కనుక పదజ్ఞానం కలిగినప్పుడు పదార్థజ్ఞానం కలిగిన ట్లెంచుకోవడముందే అదే ఈనాడు పండితుల్నీ, పామరుల్నీ కూడా పట్టి పీడిస్తున్న పెద్ద భ్రాంతి. భ్రాంతి తొలిగాక వాస్తవం తెలిసాక గాని అంతకు ముందను కున్నది భ్రాంతి అని బోధపడదు.  ఇది పెద్ద చిక్కుకనుకనే, విసుగనిపించేంతగా మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి అనుకోవలసి వస్తుంది విషయాన్ని. ఈ సందర్భంలో జూలై, ప్రమాణ వివేచన నొకసారి మళ్ళీ చూడండి. అందు పై ఎనిమిదింటిలో ఐదింటికి నిర్వచనరూపంగా వివరాలు చెప్పి, అవి అర్ధమైతే మనస్సుకు తట్టి ఉండాల్సిన అంశాలంటూ 5 అంశాలు చెప్పాను. గత సంచికాంశాల నికిక్కడికాపుదాం.మిగిలిన పదాలు మూడు . ఉపమానం, ఉదాహరణం, నిర్దారణ లేక రుజువు పరచుకోవడం.

ఉపమానం :- మహత్సా దృశ్యముపమానమని ప్రాచీనులు, అంటే దగ్గర పోలిక – ఎక్కువ పోలిక – అని అర్ధం. తెలుపవలసిన దానిని తెలుపడానికై ఉపమానం ద్వారా చూపు తున్న పదార్థం. నిజానికి విజాతీయమైనది ఉంటుంది. ఉప మానోపమేయాల లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. విశేషాలు సమానంగా వున్న రెండు పదార్థాలు సజాతులనబడతాయి. అలా లేనివి వేరువేరు పదార్థాలై విజాతు లనబడతాయి. ఉపమానంలో ఉపమానోపమేయాలకు సజాతీయత లేదు. (దేనిని తెలుపుటకు ఉపమానం చెబుతున్నా డో యీ ఉపమానం ద్వారా తెలుపాలనుకుంటున్న అది ఉపమేయం అనబడుతుంది.) ఉపమానోపమేయాలు సజాతీయాలేనంటే అసలు ఉపమించవలసిన అవసరమే లేకుండా పోతుంది.

[Note:- ఈ జాతి, విజాతులను గూర్చి ముందు  ముందు విచారించ గలము కనుక ప్రస్తుతానికి స్థూలార్థం గమనించండి. అట్టివి రెండుగానీ అంత కెక్కువ గాని సజాతులవుతాయి. అట్టివి కానివి అనేకం పరస్పరం విజాతులవు తాయి.]

లక్షణం చెప్పకపోతే వస్తువు (పదార్థం) సిద్ధించదు. జూలై సంచిక లో నిర్వచనం అన్న పదాన్ని వివరించేప్పుడు చెప్పిన మాటల్ని మరోసారి చూడండి. మరి ఈ ఉపమానంలో ఉపమిస్తుంది ఉపమేయానికి చెందిన అసాధారణ, ధర్మాన్ని చూపించ లేదు, స్మరింపజేయలేదు. అది ఏదో ఒక అస్పష్ట  భావనను కల్పిస్తుంది. అంత మాత్రమే దాని సత్తా సందర్భోచితం గనుక ఒక మాట చెప్తానిక్కడ. పెద్ద పెద్ద బడాస్వాములమనుకునే, వాళ్ళూ, అలా గుర్తింపు పొందినవాళ్ళూ, మహావక్త లుగా చెలామణిలోనున్న వాళ్ళూ, కొందరు జగద్గురువుల స్థాయిలోనున్న వాళ్ళూ, నాస్తికవర్గానికి చెందిన భిన్న భిన్న సిద్ధాంత ప్రచారకులతో సహా అందరూ అను కున్న విషయాన్ని తెలుపడానికి ఉపమానాల్ని ఆశ్రయిస్తున్న వాళ్ళే దాదాపుగా, ఇది కావ్యాలకు అలంకార ప్రాయమైనదేగాని జిజ్ఞాసకు ఉపకరించగల అంశం, కాదు సరికదా అప్పుడప్పుడు జ్ఞానార్జనకు ప్రతిబంధకం కూడా అవుతుంది. జిజ్ఞాస పరంగా గొప్ప ప్రమాదం పొంచి ఉందిక్కడ. విద్యావిధానంలో తనవంతు దుష్ప్రభావాన్ని చూపగలుగుతోందిది. తరచుగా. అయినా బోధకుడు, బోధితుడూ ఇరువురూఈ విషయాన్ని గ్రహించడంలా. ఇది నిజంగా చాలా విచారించ వలసిన అంశం . వక్త ఉపమానం చెప్పి విషయాన్ని తెలియ జెప్పాననుకుంటున్నాడు. శ్రోత ఉపమానం విని అసలు విషయాన్ని గ్రహించాననుకుంటున్నాడు. జ్ఞానార్జనలో, తెలుపకనే తెలిపాననుకోవడము, తెలుసుకొనక నే తెలుసుకున్నా ననుకోవడమూ కంటే  ప్రమాదకరమైన అంశ మేముంటుంది?నిదానంగా ఆలోచించండి. ఈనాడు వేదాంత ప్రచారం పేరిట సాగుతున్న ధ్వనికాలుష్యంలో అధిక భాగం ఉపమాన రూపమైన పిట్టకథలే. వినేవాడికి అర్ధమయ్యేది. పిట్టకథలే నచ్చేవి పిట్టకథలూ, జోకులే. ఈ విధానం, నిరాటంకంగా ఎందుకు కొనసాగిపోతోందో తెలుసా? చెప్పేవాడికి, ఉపమానానికి, ఉదాహరణకూ మధ్యనున్న వత్యాసం తెలియదు. వినే వాడికంతకంటే బలంగా వివేక రాహిత్యం ఉంది. వినేవాడికి ఉత్సుకతేగాని జిజ్ఞాసలేదు. చెప్పేవాడికి చెప్పడానికి తగిన యోగ్యత గానీ, వినేవాళ్ళపట్ల నిజమైన వాత్సల్యరూపమైన మైత్రీభావనగానీ లేవు. తనపబ్బం గడుపుకోడానికి చెప్పేవాడు చెపుతుం టే, కాలక్షేపానికో మరొకందుకో వినే వారు వింటున్నారు. ఇరువురినీ తృప్తి పరుస్తోంది ఉపమానం. విద్యకు మాత్రం విద్యాలోకం గుర్తించలేని రూపంలో, వినాశ కారి అవుతోంది. ఇంతకూ ఉపమానానికి నిర్వచన రూపం ఎలా ఉంటుంది? ఉండొచ్చు? నేనొక రూపంలో చెపుతాను. వాక్య నిర్మాణంలో మరింత పొందికను సాధించగలిగితే ఎవరికివారు ఉపమాన నిర్వచనాన్ని సాధించండి సొంతమాటలలో.

 ఉపమానం : విజాతీయ పోలిక రెండు భిన్న పదార్థాలలోని విశేషాల్ని గాక మామూలు గుణాలలో ఎక్కువ సామ్యంగల వాటిని పోల్చడమే ఉపమించడం. ఆ రెంటికీ ఉన్న దగ్గర పోలిక ఉపమానం.

 ఉదాహరణ : “లౌకిక పరీక్ష కాణాం యస్మిన్నర్థే బుద్ధిసామ్యం సదృష్టాంతః”  అని సాంప్రదాయకులంటారు. కానీ ఇది సూక్ష్మంగా పరిశీలించవలసి ఉంది. సామాన్యజ్ఞానం కలవాడూ, విశేషజ్ఞానం కలవాడూ కూడా ఏ విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటారో అది దృష్టాంతం లేక ఉదాహరణమే నని సూత్రార్థం. దేనిని నిర్ధారించడానికి ఉదాహరణను ఋజువుగా చూపుతున్నాడో అదినిర్ధారించవలసి యున్న విషయానికి సజాతీయమై ఉండాలి. ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం (ఉదాహరణ) చూద్దాం. పర్వతం వహ్ని కలిగియున్నది అని అనుమానించే సందర్భంలో ఎలా చెప్పగలవ్? అన్న ప్రశ్న రాగా పొగ కనబడుతోంది. కనుక అని సమాధానం చెపుతాం. పొగవుంటే ఏమి నిప్పు ఉండాలా అని అడగ్గా, అవును ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంటుంది అని సమాధానం. ఎలా చెప్పగలవు అన్న ప్రశ్నకు ఋజువుగా వంటయింటిని ఉదహరిస్తారా సందర్భంలో, ఆ పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది అన్న విషయానికి నిర్ధారణగా వంటయిల్లు ఉదాహరణ మవుతుంది. పర్వతము, వంటయిల్లు అన్న స్థలభేధమేగాని దేనిద్వారా ఏది – సాధించాల నుకుంటున్నామో ఆ పొగ నిప్పులకు ఉదాహరణం, వంటయింటి పొగ, నిప్పులే. దాష్ట్రాంతికం, దృష్టాంతం రెండూ ఒకే జాతి విషయాలు. వెనకటి మేధావులలో కొందరీ విషయాన్ని సరిగ్గానే గమనించనట్లు అనిపిస్తుంది. ఆ వారు వారు ప్రతిపాదించ దలచుకున్న బ్రహ్మానికి ఉదాహరణ లేదంటారు. "హేతు దృష్టాంత వర్జితమ్" అన్నమాట మీలో కొందరైనా వినివుంటారు. దాన్నొకసారి గుర్తు చేసుకోండి. అట్టిది మరొకటి లేక ఉదాహరణం అసాధ్యమన్నమాట. కనుక ఉదాహరణలో సజాతి సామ్యం వుంటుంది. ఉదాహరణ చెప్పవలసిన తావున ఉపమానం చెప్పడ మంటే తాను భ్రాంతుడై శ్రోతనూ భ్రాంతిలోనికి నెట్టడమన్నమాట. శోచనీయమైన విషయ మేమంటే నేడు ప్రవచనాలు, ఉపన్యాసాలూ, బోధనా తరగతులూ వగైరాలలో ముప్పాతిక మూడొంతులు ఈ ప్రహసనమే. భ్రాంత చేతస్కులలో పడి తత్వరూపం గిజగిజలాడిపోతోంది.

Note: ఒకదానికి ఉదాహరణ చెప్పాలంటే ఆ చెప్పేవాడికిదాష్ట్రాంతికమూ, దృష్టాంతమూ రెండూ అనుభవం ద్వారా తెలిసుండాలి. లేకుంటే అంతా వాచాలతే. టేపు రికార్డు రీప్లే చేయడంలాంటిదే.

సరే ఇక ప్రాతిపదికలుగా ఉండు పదార్థాలలో ఆఖరి విషయం నిర్ధారణ. ఈ అనుకుంటున్న విషయాన్ని ఇది ఇంతేననీ, సరైనదేననీ స్థిరపరచడాన్ని నిర్ధారించడ మంటాము. పదం ప్రయోగించిన పిదప పర్యాయపదాలు చెప్పుకుంటూ పోక, అర్థనిర్ధారణకు లక్షణ రూపమైన నిర్వచనాన్ని చెప్పడం- అర్ధం కాకుంటే వివరించడం - ఉదాహరణ ద్వారా విషయాన్ని గమనించాలకున్న వారికి మరింత దగ్గరగా తీసుకురావడం. ఎవరు ఎక్కడ ఎప్పుడు పరిశీలించినా అది అంతేనన్న అంశాన్ని సాధించడం ఉంది చూశారూ దాన్నే నిర్ధారించడమనాలి. అంతేగాని, మీ మాటకు ఋజు వేమిటి? అని అడిగితే ఆ పుస్తకం చెప్పిందనో, ఆయన చెప్పాడనో, మరొకరి మాటను ఉటంకించడం ఋజువుకాజాలదు. పెద్ద చిక్కేమిటంటే శంకర, రామానుజాది విద్వద్వర్యులతో సహా అందరూ వారి సిద్ధాంతాలను రుజువు పరచడానికి మరొక, ప్రజ్ఞా వాక్యాన్ని చూపించారు. ఇది సిద్ధాంత నిర్ధారణకు చాలా చాలా బలహీనమైన వేదిక. కనుకనే ఇన్ని వందల, వేల ఏండ్లుగా సత్యాసత్యాల గొడవ, గొడవలానే ఉంది. విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు పరికించి పరిశీలించి మేలు కలిగించగల నిర్ణయానికి రండి. ఈ సంచిక లోనే ఉన్న మరో వ్యాసం "ఉత్సుకత, జిజ్ఞాస" ను జాగ్రత్తగా అర్ధం చేసికొని మీ కోవకు చెంది ఉన్నారో గుర్తించండి.

 పై సంచికలో పదార్థ వర్గీకరణ ముఖశీర్షిక లైన వస్తువు, ద్రవ్యము, గుణము, క్రియ, సంబంధాల్ని - వాటిని గురించి వివరించేందుకు యత్నిస్తాను. మరచాను లక్షణము అన్న పదార్థాన్ని, జిజ్ఞాసులూ, పరీక్షకులు కూడా గుర్తుంచు కోవలసి ఉంది. ఒకదాన్ని అదిగా గుర్తించడానికి దానియందు మనకుపలబ్దమగుచున్న ప్రత్యేక ధర్మాన్ని (అసాధారణ ధర్మాన్ని లేక విశేషాన్ని) దాని లక్షణమంటాము. అసాధారణ ధర్మమే లక్షణమున్న మాట. పదార్ధం తెలియడమంటే లక్షణం తెలియడమనే అర్ధము. ఈ సందర్భంలో ఒకమారు గుర్తు చేసుకోడం మంచిదనిపిస్తోంది.

 తర్కమంటే పిచ్చి వాదులాట అన్న అపప్రధ వాడుకలో కొచ్చిందీనాడు. కాని యదార్థంగా తర్కం లేక మానవజీవితమే కొనసాగదు. సక్రమైన ఆలోచనా క్రమమే తర్కమంటే. ఈ అర్ధం తెలియక ఒకడు తర్కం అనవసరం అన్నాడంటే వాని అవివేకానికి నవ్వుకోవాలంతే. కానీ అతను తర్కిస్తూనే ఉంటాడు. వాస్తవంలో, అలవిగాని చోటనో, శ్రమించటం ఇష్టం లేకనో ఎగవేతకు ఎత్తుగడగానో తర్కం పనికి రాదంటాడేగాని తర్కించకుండా (విచారించకుండా) అసలు మానవ జీవితం ఎలా గడుస్తుంది? విచక్షణే కదా మానవుణ్ణి మిగతా ప్రాణి ప్రపంచం నుండి విశిష్ట పరుస్తుంది. తర్క స్వరూప స్వభావాలు అర్థం చేసికుని దానిపై తప్పు అభిప్రాయాలేర్పడి ఉంటే ముందు తొలగించుకోండి. చక్కగా గ్రహించడం ఎలాగో, గ్రహించినదాన్ని పరిశీలించి పరీక్షించడమెలాగో, తెలియజేస్తుంది తర్కశాస్త్రం. మేధాశక్తిని ఉద్దీపింపజేసి బుద్ధి వికసించేట్లు చేస్తుంది. అట్టి తర్కాన్ని మందుడు తప్ప ఎవరు పనికి రాదని అనగలరు. జిజ్ఞాసోపకరణాలనూ, జ్ఞాతవ్య విషయాలనూ, జ్ఞాన పద్దతులను వివరించేదాన్ని తృణీకరించడం తనకు తానే అపకారం చేసికోవడమన్నమాట. ఆవేశాలూ అభిప్రాయాలూ పెట్టుకుని చూడక నిదానంగా విచారించి చూడండి. తర్కమన్న పదం కర్కశంగా వుంటే ఆ విద్యను మీరే పేరనైనా గుర్తించండి. అది లక్షణ ప్రమాణ విద్య అని ఒక మేధావి అన్నారు. అలాగే మీరూ మరో పేరుతో దానిని గుర్తించవచ్చు. అంతేగాని ఏ మేధస్సు జీవనయానానికి చుక్కానివంటిదో, దాని శక్తి యుక్తులను పెంచగల విద్యను విడువడం ఏ విధంగా చూసినా ఆమోదయోగ్యం కాదు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను? మీకు ఆలోచనాశక్తి పెరిగితే నాకేమీ ఒరగదు. మీకేమీ నష్టంరాదు. ఇంతకంటే ఏమి చెప్పను? ఎలా చెప్పను? తర్క విద్య చూపును ప్రసాదించే విద్య. దానిని కాదనడం వదలుకోవడం పిచ్చిపని. సరే అసలు విషయాలకొద్దాం మళ్ళీ.

(ఎలాగూ తత్వవివేకానికవసరమైన పదార్థాలను గురించి విపులంగా పరిశీలించబోతున్నాం. కనుక ఈ పదార్థ వివేచన భూమికను మరో నాలుగు మాటలు ముఖ్యమైనవి చెప్పి ముగిస్తాను.)

  1. ప్రాతిపదికలుగా నుండదగినవి ఎనిమిది పదములు వాటి పదార్థములు
  2. పదార్థ వర్గీకరణలో మౌలికమైన విభజనయగు వస్తువు, ద్రవ్యము, గుణము, క్రియ, సంబంధమునన్నవి ఐదు పదార్థాలు.
  3. ఈ మూల వర్గీకరణను అర్థం చేసుకోడానికి పనికివచ్చే ఉపవర్గీకరణలు. 
  1. భావపదార్థములు, భౌతిక పదార్థములన్న విభాగాలు.
  2. i) విషయముంటుంది. దాని అనుభవముంటుంది. దానికి సంకేతంగా ఒక పదముంటుంది. ఆ పదం ఆ అనుభవాన్నీ, దాని కాధారమైన వస్తువునూ చూపెడుతుంది. ఇదొక తరహాపదార్థం.
  3. ii) వస్తువు ప్రేరకంగా మాత్రమే ఉంటుంది. ఆ ప్రేరణవల్ల ఒక అనుభవం కలుగుతుంటుంది. ఆ అనుభవానికి సంకేతంగా ఒకపద ముంటుంది. ఆపదం ఆ అనుభవాన్ని మాత్రమే సూచిస్తుంది.

iii) వస్తువుందో లేదో తెలియదు. అనుభవం మాత్రం లేదు. కానీ పదముంది. భాషలో ఈ మూడు తరహాల పదాలూ ఉంటాయో, లేదో ఆలోచించండి.

  1. స్వయం సత్తాక పదములు, సంబంధజనిత పదాలు అన్న విభజన మరొకటి.

Note:-ఈ ఉపవర్గీకరణ మూలవర్గీకరణను అర్థం చేసుకోవడానికి మాత్రమే గమనించాల్సి ఉంటుంది. విషయ జఠిలం వల్ల ఈ అంశాన్నింతటితో ఆపుతాను. ఎక్కువ సమాచారాన్నందించిన కొలదీ గ్రహించడం కష్టమై అస్పష్టత చోటు చేసుకుంటుంది. గనుక పై సంచికలో వర్గీకరణల స్వరూప స్వభావాలను వివరించే యత్నం చేస్తాను. ఈ లోపు మీరూ ఎవరికి వారుగా వర్గీకరణల గురించి యోచించండి.

సంపుటి-4 సంచిక 4 ఏప్రియల్ - 1994

పదార్థవివేచన 1

1993 జూన్ – జూలై, సెప్టెంబంరు సంచికలు ఈ సంచికకు పూర్వరంగంగా ఉండగలవు. జ్ఞానార్జనలో అత్యంత ప్రధాన భూమికను వహించగల ఈ పదార్థ వివేచన అన్నది ఎంతో సునిశిత, సూక్ష్మ పరిశీలనల వల్లగాని మనస్సుకు పట్టదు. పాఠకులు దీనిని గమనించడం అవసరం. పదార్థ వివేచనలో ఆరంభ స్థానం అష్టపద వివేకానిది. అవి పదము, పదార్థము, పర్యాయ పదము, నిర్వచనము, వివరణము, ఉపమానము, ఉదాహరణము, నిద్ధారణ అన్నవి. ఈ ఎనిమిది పదాల అర్థం సుస్పష్టమైతే ఆపై అసలు పదార్థ వివేచన క్రమబద్ధంగా సాగిపోతుంది. ఈ అంశం పైన తెలిపిన సంచికలలో వివరించాను.

ఇక రెండవ స్థానం ప్రధాన వర్గీకరణ రూపానిది. దానిని పలువురు పలు రకాలుగా వ్యక్తీకరించినా నా దృష్టికోణాన్ని బట్టి మొత్తం జ్ఞాన రాశినంతటినీ వస్తు, ద్రవ్య, గుణ, క్రియా, సంబంధాలని ఐదుగా విభజించుకుంటే సరిపోతుంది. గత సెప్టెంబరు సంచికను మరొక్కమారు మననం చేసిన పిదప దీనిని పరిశీలించడం మొదలు పెట్టండి.

సృష్టిలో – విశ్వంలో - ఉన్న పదార్థరాశి అంతా మనకున్న జ్ఞానేంద్రియ వ్యవస్థ ఉన్న తీరు ననుసరించీ మానవ వివేకం వివేకించగల శక్తి పరిమితు లాధారంగా పై ఐదు రకాలకంటె అదనపు జ్ఞానాన్ని పొందే అవకాశం లేదనిపిస్తోంది. మీరూ ఆలోచించండి.

ఒక ముఖ్య విషయం గుర్తుంచుకుంటే గాని ఈ విశ్లేషణ అవగాహనలలో సౌలభ్యం ఏర్పడదు. పై ఐదింటిలో వస్తు గుణక్రియా సంబంధాలన్న నాలుగూ ఈ ద్రవ్యం పైనే ఆధారపడి ఉంటాయి. స్వతంత్రావరణ, పరిమాణం కలిగి మిగిలిన నాలుగు రకాల అనుభవాలు ఎక్కడ, దేనివలన కలుగుతున్నాయో దానినే ద్రవ్యమంటాము. వెనుకటి వాళ్ళూ ద్రవ్య లక్షణాన్ని చెప్పారు. క్రియావతి, గుణవతి అయిఉండి సమవాయి కారణంగా ఉన్నది ద్రవ్యమని వాళ్ళనిర్వచనం. అంటే దేని వలనో (చలిస్తున్నదేదో) గుణము దేనియందో అది ద్రవ్యమని అర్థం. అంటే క్రియ జరగాలన్నా గుణం ఉండాలన్నా ఆధారంగా ద్రవ్యం ఉంటుందని. గుణ క్రియలకు ద్రవ్యాన్ని విడచి అస్తిత్వం ఉండదు. అలాగే వస్తువు, సంబంధాలకు కూడా. కనుక ఏది ఉంటేగాని వస్తు, గుణ, క్రియా, సంబంధాల అనుభవాలు మన కేర్పడేందుకు వీలుకాదో అట్టి సర్వాధారమైన అధిష్టానరూపమైన, స్వయంసత్తాకమైన, ఎంతో కొంత స్థలాన్నాక్రమించి, పరిమాణాన్ని కలిగి ఉన్న పదార్థాన్ని ద్రవ్యమంటాము. ఈ పరిమాణం, అతి సూక్ష్మమై యుండవచ్చు. అతి పెద్దదై - విభువై – మహత్తై ఉండవచ్చు. ఇలా మనకు భిన్నానుభవాల ద్వారా తెలియబడుతూ ఉన్న రకరకాల ప్రమేయాలనూ. పారిభాషికంగా పదార్థాలంటున్నాం. పదార్థమన్న మాటకు ఉన్న వ్యుత్పత్తి - అర్థము – “పదస్య అర్థః పదార్థః” అందుకే వ్యవహారంలో పదార్థమంటే ద్రవ్యమేనన్న ప్రసిద్ధి వాడుకలోనికి వచ్చింది. అస్సలుంది ద్రవ్యమేనన్న మాట. దేనికి స్వంత స్థలాన్నా క్రమించగల సత్తా - ఉనికి – ఉంటుందో, మరి మిగిలిన రకరకాల – అనుభవాలూ అదే స్థలంలో మనకు కలుగుతూ తమకంటూ వేరు స్థలాన్ని కలిగి లేవో ఆ మొదటి దానిని అసలుఉన్నదనీ, అధిష్టానమనీ, ఆధారమనీ, మిగిలినవి ఆ అసలుకు సంబంధించినవనీ, ఆ ఉన్న దాని ధర్మాలుగనో, గుణాలుగనో, క్రియలుగనో, సంబంధాలుగనో మనకు అగుపిస్తుంటాయని నిశితంగా చూడగలిగితే అర్థమవుతుంది. వెనుకటి, వాళ్ళు క్రియ, గుణములకు సమవాయి కారణం కాగలిగింది అన్న మాటల వెనుక ఈ భావనా ఉండి ఉండవచ్చు. మరోరకమైన మాటలలో దీన్నే మరోలా చెప్పవచ్చు. అది ద్రవ్యము, మిగిలినవి దానివి, దానిలో వ్యక్తమయ్యేవి, దానిద్వారా వ్యక్తమయ్యేవిగా ఉంటాయి. ఒక్క ద్రవ్య పదార్థాన్ని గురించిన ఇన్ని రకాలుగా యింతగా ఎందుకు చెప్పుకోవలసివస్తోందో, జిజ్ఞాసువులూ పరిశీలకులు కూడా దీనిని ఇక్కడ కొంచెం ఆగి ఆలోచించుకోవలసి ఉంది. ఈ ద్రవ్యం విషయంలో ఇప్పటికీ ఒక కొలిక్కి రాని అనేక భిన్నా భిప్రాయాలు కొనసాగుతున్నాయి. ద్రవ్యం అతీంద్రియ విషయమని ఒక పక్షంకాగా, కాదు ఇంద్రియ గోచర విషయమేనని మరొక పక్షం. ఎవరి ఉపపత్తులు వారు చూపుకుంటూ వారి వారి ధోరణుల్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇంతా చేసి ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని మీ ముందు ఉంచబోవడం లేదీ విషయంలో. అలా అని ఊరకుండుట కూడా లేదు. ఈ సందర్భంలో అది ఇంద్రియగోచర విషయమా, ఈ కాదా నిర్ణయించుకోవాలంటే ముందు, ఇంద్రియాలను, వాటి క్షేత్రాలనూ ఇదమిద్ధంగా నిర్ధారించవలసి ఉంటుంది. అది మళ్ళా ప్రమాణ వివేచనకు సంబంధించిన అంశమౌతుంది. అసలీ ప్రమాణాన్ని పదార్థాలనూ అవగాహన కొరకు విడగొట్టి చూస్తున్నాముగానీ. అవి పరస్పరం సంబంధపడి ఉన్న అంశాలు. ఎందుకంటే ఏ పదార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలన్నా, ప్రతిపాదించి నిర్ధారించాలన్నా ప్రమాణాలుండాల్సి వస్తుంది. 

ఆ ప్రమాణాలు పదార్థాలేన్నదీ గమనించాల్సి ఉంటుంది. సరే! ద్రవ్యాన్ని గురించి విశ్లేషిస్తున్నాముగదా. అది అతీంద్రియ విషయమా? కాదా? అన్న ప్రశ్న ఎందుకు రావలసి వచ్చింది? కొందరు - ఇంద్రియాలు 5 అన్నారు. మనస్సును ప్రతి ఇంద్రియానికీ జ్ఞాత, వారధి వంటిదన్నారు. “అతి బాహ్యేంద్రియే”, అన్న అర్థం చెప్పి బయటి పంచ జ్ఞానేంద్రియాలకు తెలియని దానిని అతీంద్రియ విషయ మని మరికొందరు అన్నారు. “బుద్ధి గ్రాహ్యం అతీంద్రియమని” మరో భావన. బుద్ధి చేతనే గ్రహింపదగినది అతీంద్రియమని దానర్థం. కొందరీ గ్రహణ విషయాన్ని ప్రత్యక్షమూ, పరోక్షమూ, అపరోక్షమూనని మూడుగా విభజించారు. ప్రత్యక్షం 5 జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానం కాగా, అనుమాన, శబ్దాల ద్వారా కలిగే దానిని పరోక్షమన్నారు. మరి సుఖదుఃఖ శాంత్యశాంతాది ఆంతరిక అనుభవాలు, నేనున్నాను అన్న అనుభవరూపము వంటివాటిని అపరోక్షం అని అంటూ ప్రత్యక్ష - పరోక్షాలకు కించిద్భేధం చూపారు. ఆ అపరోక్ష విభాగంలోనికి వస్తున్న విషయాలనే మరికొందరు అతీంద్రియ విషయాలన్నారు.

ఇక్కడొక గమనిక ఉంది. మనిషిలో ఉన్న మొత్తం చేతన భాగాన్ని అది పని చేస్తున్న తీరు - ఆ పరికరాలు అంతటినీ కలిపి ఒక వ్యవస్థగా తీసుకుంటే, ఆజ్ఞాన విభాగాని కందిన దేదైనా తెలియబడిందే అవుతుంది. దాని కందనిది అతీంద్రియ మనడానికి, అసలు ఉందనడానికి కూడా మనకు అవకాశం లేదు.

నా ఉద్దేశంలో మనము యిక్కడ ఘర్షించవలసిందేమీ లేదు. ఎదుటివారు ఏ యే విషయాలను తెలుపడానియేయే మాటలు ఉపయోగించారో తెలిస్తే అర్థం చేసుకోడానికి యిబ్బందేమీలేదు. అక్కడ కేవలం భాష మారిందంతే. అయితే చెప్పేవాడు తన మాటలను, భాషా పదాలకున్న ప్రసిద్ధార్థంలో కాక (వాడుకలో నున్న అర్థాన్ని బట్టికాక) వేరే అర్థంలో, వాడుకలో నున్నమాట ప్రయోగిస్తే మాత్రం విధిగా ఆ మాటలవెనుక తన ఉద్దేశం ఏమిటో, ఏ విధంగా ఆ మాట తన భావాన్ని చెప్పడానికి కూడా శక్తివంతంగానే పని చేయ గలుగుతుందో స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఈ విషయాన్ని విడిస్తే అంతా గందరగోళమే. ఇంతగా ఈ విషయాన్ని తరచి చూడవలసి వస్తోందెందుకని? మీరూ ఆలోచించి చూడండి. నాకే మనిపిస్తోందంటే, ఇప్పటివరకు జరిగిన పరిణామ క్రమంలో భాషారూపం అనేక కారణాలవల్ల [ప్రాంతీయము, దేశీయము, వ్యంజనరూపము, పారిభాషికము, వ్యవహారము అన్న వాటివల్ల] ఒకే శబ్దం. భిన్నార్థ భోధకంగానూ, ఒక్కోచోట భిన్న శబ్దాలు ఒకే అర్ధాన్నిస్తూనూ వినియోగంలో ఉన్నాయి. కనుకనే ఒకే వేదం ప్రమాణ మంటూనే వైదికులలో అనేక ధోరణులు ప్రాచుర్యం పొందాయి. రకరకాల వ్యాఖ్యానాలు ఏర్పడ్డాయి. అలాగే క్రైస్తవాదులలో శాఖా భేధాలున్నూ. ఆయా సిద్ధాంతకారులు ఉన్న ఆ మాటలకే వేరు వేరు అర్థాలు గుంజుతున్నారన్నమాట. పదాలననుసరించి పదార్దము, వాక్యార్థము, భావార్థము అను మూడు రకాలుగా భాష ద్వారా భావాన్ని గ్రహించడం జరుగుతోంది. పైగా భాషా పదాలలో నానార్థాలు, పర్యాయపదాలు, అలంకారికాలు, సమాసాలు, విగ్రహాలు చోటు చేసుకుని ఉండడంవల్లా ఈ విపరీతం ఏర్పడుతుంది. వ్యవహారం వరకైతే వీటివల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. ఒక వేళ అపోహలకు తావేర్పడ్డా సరిచేసుకోవడమూ పెద్ద కష్టం కాదు. కానీ గ్రంథరూపం పొందినవీ, సిద్ధాంతాలుగా చెలామణి అవుతున్న వాటి విషయంలోనే పెద్ద యిబ్బంది వచ్చిపడుతోంది. రచయిత అందుబాటులో లేకుంటే (అతడు చనిపోయినా, దూర దేశస్థుడైనా) ఇక పఠితల పరిస్థితి నిజంగా అగమ్యగోచరమే. కనుకనే తాత్విక ధోరణులను అధ్యయనం చేసే సందర్భంలో నైనా పదార్థ వివేచన అంటే నిర్దుష్ట, నిర్దిష్టార్థావగాహన అత్యంతావశ్యకమూ, తప్పనిసరీ అవుతోంది. ఈ మార్గాన్ని విడిస్తే జరిగే అనర్థం అంతాయింతాకాదు.

నలుగురూ ఒకే గ్రంధాన్నో, వాక్యాన్నో ప్రమాణంగా చూపుతారు. అర్థాలు మాత్రం ఎవరివి వారు వెలిబుచ్చి వారివే సరైనవంటూ వాదులాడుకుంటారు. అసలర్థం ఏమిటో నిర్ధారించడానికేమో ప్రయోక్త (రచయిత) అందుబాటులో లేడాయె. ఈ సందర్భంలో రెండు దారులు ఏర్పడుతున్నాయి. 1. ఎవడు అధిక ప్రజ్ఞావంతుడో, బాషావేత్తయో అతని పక్షం సిద్ధాంత పక్షంగా చెలామణి కావడం. 2. వారు వారు చెప్పిన అర్థాలలో ఏవి వర్తమాన స్థితిగతులకు తగినట్లు మన అనుభవాలకు సరిపోతూనూ ఉంటున్నదో ఆచరణలో మంచిని కలిగిస్తున్నదో అన్న దాన్ని బట్టి స్వీకరించి ఉపయోగించుకోవడం. పై రెంటిలోనూ రెండో మార్గం సర్వదా శ్రేయస్కరమైనది. వివేకవంతమైనది. ప్రయోక్తభావమిది అని నిర్ధారించడం దాదాపు అసాధ్యం కనుక (భాషానియమాన్ని బట్టి ఈ మాటంటున్నాను.) జీవితంలో ఉపయోగపడగల అర్ధాన్ని చెప్పుకోవడమో, దానినలా ఉంచి మన పై మనమే అధారపడి నడచిపోవడమో ఉత్తమ మార్గం అవుతుంది. ఏమంటారు. అదే ఉచితమనిపిస్తున్నదా లేదా.

ఇంతవరకు వ్రాసేటప్పటికి చెంచు కృష్ణయ్య గారి లేఖ అందింది. అదీ వెంకటేశ్వర రెడ్డిగారి లేఖా జిజ్ఞాసాయోగ్యమైన. రీతిలో ఉన్నాయి కనుక ఆ కోణం నుండే పరిశీలన కొనసాగించుదాం. కనుక పాఠక మిత్రులారా! ముందుగా ఆ రెండు లేఖాంశములనూ మీరు క్షుణ్ణంగా అర్థంచేసికోండి.

మరోసారి ప్రమాణ వివేచనను గుర్తు చేసికోండి. లేదా మార్చి సంచికను మరోసారి తిరగ వేయండి. ఈ ప్రమాణాలు ప్రత్యక్షానుమాన శబ్దములని మూడనుకున్నాం కదా! అందు ప్రత్యక్షాన్ని రెండు భాగాలుగా అర్ధం చేసికుంటే ముందు ముందు మనం చేయబోయే పదార్థ వివేచనలో అవగాహనా సౌలభ్యం ఏర్పడుతుంది. సాక్షాత్, అపరోక్షాత్ అన్నవే అవి. ఈ రెండూ పరోక్ష జ్ఞాన సాధకాలైన అనుమాన శబ్ద ప్రమాణాలకంటే భిన్న ములు. అయితే సాక్షాత్, అపరోక్షాత్ అన్న వాటిలోనూ కించిత్తు భేధం - విశేషం - వుంది. అదెలానంటే 1. సాక్షాత్ అన్న క్రమంలో ప్రమాత - ప్రమాణ - ప్రమేయ విభాగం స్థూలంగా అంరదరకూ - సామాన్యులకు కూడా  కానవస్తుంటుంది. దీనికి "సూక్ష్మ పరిశీలనతో" పనిలేదు. ఉదా: రంగు కంటి ద్వారా మనకు తెలుస్తుంది. రంగు ప్రమేయ పదార్థం కాగా కన్ను ప్రమాణమవుతోంది. నేను ప్రమాతను. ఇట్టి తరహా ప్రమేయాల్నే బాహ్య పదార్థాలు, భౌతిక పదార్థాలు అంటున్నాం. 

మరో భాగమైన అపరోక్షంలో ప్రమాత-ప్రమాణ-ప్రమేయ విభాగం ఉన్నా ప్రమాత - ప్రమాణాలు స్థూలంగా తెలియబడవు. అక్కడ ఉండే ప్రమేయాలు కూడా భావరూపమైన పదార్థాలై ఉంటాయి. మొత్తం విషయమంతా అంతరంగానికి చెంది ఉంటుంది.

గమనిక: లోగడ భాషా పదాలను విడగొడుతూ ఒక వివరణ చేశాను. గుర్తుచేసుకోండి. 1. పదముంది - అనుభవముంది. అనుభవాన్నిచ్చేదీ బాహ్యంగా ఉనికి గలిగి ఉంది. ఈ తరహా పదార్థాలలో పదం అనుభవానికి, అనుభవాన్నిచ్చే దానికి వర్తిస్తుంది.

మరోరకం పదాలున్నాయి. వాటికి, పదముంటుంది. అనుభవముంటుంది. అనుభవాన్ని పుట్టించే కారకముంటుంది. కానీ ఆ పదం అనుభవాన్ని మాత్రమే వర్తిస్తుంది. ఆ అనుభవాన్ని పుట్టించిన కారకానికి వర్తించదు. ఆ కారకానికి వేరే సంకేతం - పదం - ఉంటుంది. అదుగో ఆ తరహా పదార్థాలున్నాయే అవి భావ పదార్థాలు. ఉదా: చెంచు కృష్ణయ్య గారి లేఖలో సూచించిన ఆనందమూ, జ్ఞానము ఈ కోవకు చెందుతాయి. వీటిని నిర్వచించడమూ, ఎదుటివారు తెలుసుకునేట్లు చెప్పడమూ కూడా కౌశల్యంతో కూడిన పని అవుతుంది. మరో అంశం చూద్దాం. నాలో కదలాడుతున్న అలోచనలు, నేను ఆలోచించడమూ నాకు తెలుస్తున్నాయి. ఇది మనందరి అనుభవంలోని విషయమే. ఈ విషయాలు మనకు పరోక్షంగా తెలిశాయని అనగలమా? అనలేము కదా! మరి ప్రత్యక్షంగా తెలిశాయందామా? తెలుసుకునే నాకు భిన్నంగా ఒక ప్రమాణమూ, ఒక ప్రమేయమూ నిజంగా ఉనికి గలిగియున్నాయా ఇక్కడ? ఆలోచించి అవలోకించి చూడండి. నేత్ర ప్రత్యక్ష విషయంలా, భౌతిక పదార్థాల నెరగడంలా తెలియబడుతున్నాయా ఇవి? తేడాగా అనిపిస్తోందా? లేదా? దానిన్నే అపరోక్షమంటాము. అవినాకే తెలుస్తున్నాయి. నేరుగానే తెలుస్తున్నాయి. కానీ కంటి ద్వారా రంగెలా తెలుస్తోందో అలా మాత్రం కాదు. ఈ రకంగా తెలియడాన్నే మరో విధంగా చెప్పుకోవచ్చు. “బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం” అన్న వాక్యం ఇలాటి భావాన్ని స్పురింప జేసేదే.

క్లుప్తంగా నాలుగు మాటలు మీ ఆలోచనకు పెడుతున్నాను చూడండి. సరిచూడండి. తప్పో, ఒప్పో తేల్చండి. మనస్సు క్రియా సంబంధమైన పదము. జ్ఞానము గుణ పదార్థము. ఆనందమూ అట్టిదే అయితే భావ పదార్థము. పెన్ను వస్తువు. బంగారు ద్రవ్య విశేషము. తమ్ముడు సంబంధ జనితము. ఎరుపు గుణపదార్థము. వ్రాయుట క్రియా సంబంధమైనది. ప్రస్తుతానికి ఇక్కడది అపుదాం. మీ మీ లోచనలున్నూ స్పందనకు వ్రాయండి.

సంపుటి : 4 - మే 1994 సంచిక : 5

పదార్థవివేచన - 2

 జిజ్ఞాసువులూ పరిశీలకులూనైన మిత్రులారా ! లక్షణ ప్రమాణ విద్య మానవ జీవితంలో అత్యంత విలువైన భూమికను కలిగి ఉంది. మరోవంక దీనిని అర్థం చేసుకోడానికి ఎంతో ఓర్పు, నిపుణత (శుద్ధమూ, తులనాత్మకమూ, సూక్ష్మమూనైన బుద్ధి) అవసరమై ఉన్నాయి. గహనమైన సత్య జ్ఞానార్జనకు ఆధారమైనదీ, అయిన ఈ విద్యను వివరించడమూ, గ్రహించడమూ కూడా ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ అంశాన్నే వెనుకటి వాళ్ళూ ప్రకటించారు.

“ఆశ్చర్యో వక్తాకుశలో౬స్య లబ్ద్వా - ఆశ్చర్యో జ్ఞాతా కుశలాను శిష్టః!” తెలియడమంటే ఏమిటో తెలిసి తెలుసుకోవడానికి తగినరీతిలో తెలుపగలవాడూ, తెలియడమంటే తెలిసి తెలిసికోడానికి తగిన యోగ్యత కలిగి చెప్పినదాని ఆధారంతో అనుభవాలను తాకి చూసుకొని తెలుసుకోగలవాడూ లభించడం అబ్బురమైన విషయమని శ్లోక సారాంశం.

అయినా సక్రమ జీవన విధానానికై జీవితంలో దానికున్న పాత్ర దృష్యా. ఎంతో శ్రమతో కూడినదైనా దీనిని ఆకళింపు చేసుకోడానికి యత్నిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయాన్నీ గమనించి గుర్తుంచుకోవలసి ఉంది. ప్రతి విద్యకు

“యోగ్యత" అనేది ఉంటుంది. విద్యా విషయంలో ఈ యోగ్యత తెలపా లనుకుంటున్న, తెలుసుకోవా లనుకుంటున్న ఇరువురికీ అవసరం. పైన చెప్పుకున్నట్లు నేర్పరియై నేర్పేవాడూ, నేర్పరియై నేర్చేవాడూ తారసపడ్డప్పుడు మాత్రమే నేర్పడమూ, నేర్వడమూ సఫలమవుతాయి. ఆయా విద్యలను యోగ్యుడైన ప్రతి వాడూ గ్రహించగలుగుతాడు, నేర్వగలుగుతాడు. తగిన యోగ్యత లేక ఏ విద్యా

ఎవరికీ వంటబట్టదు. మనకు నచ్చినా నచ్చకున్నా ఇదొక వాస్తవము. అందునా ఈ విద్యలో అది మరింత ప్రముఖ భూమికను కలిగి ఉంది. కనుక వివరించడానికి, గ్రహించడానికి తగిన వేదిక నేర్పరచుకుంటే గాని పై విషయం సుగమం కాదు. భూమిక పేరున వ్రాసిన అంశాలు, పదార్థ వివేచన - 1, జూన్, జూలై, సెప్టెంబర్ సంచికలలోని అంశాలు, ఈ సంచిక కూడా వేదిక నిర్మాణానికి సంబంధించినవే. వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి. ముందే చెప్పాను ఈ విద్య నార్జించుటకు ఎంతో ఓర్పు, నిపుణత అవసరమని.ఈ విద్యను ఉపన్యాస

ధోరణిలో తెలుపరాదన్నదీ, తెలుసుకోలేమన్నదీ. ఇరువురూ గుర్తుంచు కోవాలి ప్రధానంగా. అయితే మరెలా కదలాలి? ఇరువురమూ

ప్రశ్నించుకుంటూ, యోచించుకుంటూ, సమాధానాలు అనుభవాల అ నుండి రాబట్టుకుంటూ, సరి చూసుకుంటూ సాగవలసి ఉంటుంది. నిజానికి ఏ విద్యకైనా అదే ఉత్తమ మార్గమైనా దీని విషయంలో మరో మార్గం కూడా లేదు. తగిన వేదికను ఏర్పాటు చేసుకోవడంలో ఈ అంశానికెంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఇక్కడ కొంచమాగి నిదానంగా అర్థం చేసుకోడానికి యత్నించండి. ఎందుకంటే ఈ అంశం. ఇరువురిలో, ఎవరికి వంటబట్టక పోయినా శ్రమకు తగ్గ ఫలితం రాదు సరికదా. ఒక్కోసారి తప్పు భావాలు ఏర్పడే ప్రమాదమూ ఉంది. యోగ్యతా విషయాలుగా 1) తెలియడమంటే ఏమో తెలుసుండడం. 2) చూసే చూపును క్రమపరచగల 8 పదాల – పదార్థాలలోని విశేషాల్ని - తేడాలను - వివేకించగలిగి ఉండడం. 3) పరిశీలనాంశం పట్ల ముందుగా ఎట్టి అభిప్రాయాలూ పెట్టుకోకుండా ఉండగలగడం. 4) వివరించే వాడు వివరణల ద్వారా పదార్థ లక్షణ రూపాన్ని, వినేవాడు తాకిచూసు కోవడానికి తగిన స్థాయిలో వివరించడం, గ్రహించాలనుకునే వాడు. విన్న వివరణలాధారంగా ఆ ఆయా అనుభవాలను తాకి చూచుకోగలగడం చేతనై ఉండాలి. ఇవి మౌలికమైన యోగ్యతలు. పదార్థ వివేచన తరువాత చేద్దాం. ముందీ విషయాల్ని అవలోకించి, అర్థం చేసికొని సరిగా ఉన్నాయో లేదో తేల్చండి. ఇప్పుడు, ఇక్కడ మనం తీసు కునే నిర్ణయాన్ననుసరించే మిగిలిన కథంతా నడుస్తుంది.

సాక్షాత్తుగానో, అపరోక్షంగానో తెలుసుకుని లేని (సాక్షాత్, అపరోక్షాత్ అన్నవి గత సంచిక లో వివరించాను.) వాటిని గురించి పరోక్ష ప్రమాణాల ద్వారా తెలుసుకుందామని యత్నించినప్పుడు ఏది తెలిసిం దనిపిస్తోందో నిజానికి అదింకా తెలియవలసిందిగానే ఉంటుంది. కనుకనే ఆ విషయంలో కలిగిందానిని పరోక్ష జ్ఞానమంటున్నాము. ప్రత్యక్షంగా తెలుస్తున్న వాటిని గురించి వివరిస్తుంటే. విని అనుభవాల్ని తాకి చూచుకోవడం సాధ్యపడుతుంది గాని, పరోక్ష రూపాల్లో తెలిశాయనుకొంటున్న వాటిని మాటలతో, వివరించడం ద్వారా అనుభవాల్ని తాకేట్లు చేయడంగానీ, ఆ పదార్థాలను వివరించగలవాడు (యోగ్యుడు) వివరించగా విని అనుభవాల్ని తాకి చూడడంగానీ అసాధ్యము.

 ఏం చెపుతున్నానో అర్థమవుతోందా? నిజంగా ఈ విషయం అర్థమైతే ఈ విద్యా విధానంలో సరైన జ్ఞానం కలుగనీయకుండా చేస్తున్న ప్రధాన అవరోధం తొలగినట్లే. ఈ విషయంపట్ల తగినంత అవగాహన లేకపోవడం వల్లనే మేధావులలో సైతం తెలియకనే తెలుసు ననుకునే ప్రమాదం ఏర్పడుతోంది. ఇదెంతటి సూక్ష్మమూ ప్రముఖమూనైన విషయమో ఈనాడు మహామహులమనుకునే వారికీ, (వారు నాస్తిక, ఆస్తికాది ఏ వర్గములందున్నప్పటికీ) తెలియవలసినంతగా తెలిసి లేదు.

నా అనుభవాలు నాకు చెబుతున్న దాన్ని బట్టి ఇప్పటికీ పాఠకులలోన ఏ కొద్దిమందికో మాత్రమే ఇది స్ఫురించి ఉంటుంది. కనుక౦` మిత్రులారా! మరలా మరలా ఈ అంశాన్ని పరిశీలించండి. పరీక్షించండి. వాయిదా వేయకుండా మీలో కదలాడిన భావాలను స్పందనకు వ్రాయండి. మీకూ నలుగురికీ గూడా ఉపయోగపడుతుందది. సరే, యోగ్యతల సంగతి దాదాపు ప్రతి సంచిక లోనూ గుర్తు చేసుకుంటూ ఉండవలసిందే. ఇక ద్రవ్యాన్ని గురించి మరికొన్ని విశేషాల్ని వివరిస్తాను. గత సంచిక విషయాన్ని స్మరించి ఆపై, దీనిలో ప్రవేశించండి. 

తెలియడం, తెలియకపోవడం అన్న దాని గురించి లోకంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

1) ఉన్నది తెలియబడదు. యధార్థజ్ఞానం – అన్నమాటే తప్పు. ఈ దృష్టికి - చెందిన వాళ్ళలో వారిలో వారికి కొంచెం తేడాలున్న వాళ్ళుంటారు. మాయా వాదులు ( తెలియబడేదంతా మిధ్యే అనే అద్వైతులు వగై రాలు), ఆజ్ఞేయ వాదులు, మార్మిక వాదులు మొదలగువారు.

2) తెలుస్తున్నదంతా ఉన్నది మనస్సు పై కలిగిస్తున్న ప్రభావం మాత్రమే. అనుభవాల్ని గుర్తిస్తున్నాము గాని, అనుభవాల్ని పుట్టిస్తున్న దాన్ని గుర్తించడం లేదు. ఈ రీతిగా చెప్పే వాళ్ళు కార్య జ్ఞానమేగాని, కారణజ్ఞానం మనిషికి కలుగదు అంటారు. సావయవ ద్రవ్యాలు – మాత్రమే ప్రత్యక్ష గోచరమవుతాయి గాని నిరవయవ ద్రవ్యాలు – ఇంద్రియ గోచరాలు కావు అంటారు ఇందులో మరికొందరు.

3) ఉన్నవి గుణముల సముదాయము క్రియలే గాని గుణములకు క్రియలకు అన్యమైన పదార్థ మేదీ ఉనికి గలిగిలేదు. ఉందనటానికి తగిన ఆధారాలు లేవు. ఇదొక పక్షం.

4) తెలుస్తుందంతా సత్యమే. మిధ్య అనే మాటకు పరీక్షకు తట్టుకునే శక్తి లేదు. మిధ్య అని నీవంటున్నది కూడా సత్యమే. ఈ తరహా పక్షీయులు కొందరు. మచ్చుకు విశిష్టాద్వైతులు. ఇలాంటివీ, మరోలాటివీ అయిన పక్షాలు లోకంలో మరికొన్ని ఉండవచ్చు. ఇక ముందు ఏర్పడనూవచ్చు. సిద్ధాంతాల రూపంలో ఇలాంటి భావాలెన్నో సమాజంపై పనిచేస్తూ జిజ్ఞాసువులలో ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

కనుకనే ప్రమాణ, పదార్థ వివేచనా కౌశలం సామాజిక అవసరంగా ఉంది. అలానే ఎవరేది చెప్పినా గంగిరెద్దులా తలనూపే స్థాయి నుండి మనిషి శతధా యత్నించి శుద్ధంగానూ, నిశితంగానూ, తులనాత్మకంగానూ చూడగల ఒడుపు సంపాదించడం తప్పనిసరి అవుతుంది. ఇంతకూ ఏ అనుభవానికి ద్రవ్యమన్న పేరు పెట్టుకున్నామో దానిని నీకై నీవు చూడగలిగితే గొడవే లేదు. దీన్ని ద్రవ్య మంటున్నామో, అది ఎలా తెలుసుకునేందుకు సాధ్యమైందో (ఎలా తెలిసిందో), అపరోక్షంగా గ్రహించామన్న మాట. అలా కానప్పుడు  తెలుపువాడు వివరిస్తుంటే చూచుకోగల, సరిచూడగల సమర్థతన్నా ఉండాలి. అందుకు నా వివరణల వెంట మీ చూపు పరిగెత్త గలిగుండాలి. రెండు మూడు , విషయాలు, మీ ముందు పెడతాను. మీ మీ అనుభవాల్ని తాకి చూసుకుని (గుర్తు చేసికొని) నా వివరాలు ఎలా ఉన్నాయో నిర్ణయించండి.

1). ద్రవ్యం మనకు తెలియబడదు. ఇంద్రియాలకు అందేవి గుణాలే. ద్రవ్యము అతీంద్రియ విషయమని

2)  ఉన్నది. తెలియబడదు. యధార్థజ్ఞానం అన్న మాటే సరైనది కాదు. తెలుస్తున్నది పాక్షికమే.

3) ఉన్నది మనపై కలిగించే ప్రభావాల్నే మనం గుర్తించగలం. ఆ ప్రభావాలు కార్యరూపాలై ఉన్నాయి. దానిని పుట్టిస్తున్న దాన్ని కారణాన్ని లేక ఉన్న దాన్ని మనం గుర్తించడం అసంభవం.

Note: 1) గతంలో ఉన్నది ద్రవ్యమనీ, దానిపై ఆధారపడే వస్తు, గుణ, క్రియా, సంబంధాలనేవి ఉంటున్నాయనీ చెప్పాను. గుర్తుంది కదా! ఈ మాటకు పై మూడు వాక్యాల భావాలకు మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తోంది గదా! మరోమాట స్పందన ద్వారా చెంచు కృష్ణయ్యగారడిగిన ఆధారపడడమంటే ఏమిటి? అన్న దానికి కొంత వివరణ చేశాను. దాని పైనా మీరూ స్పందిస్తే బాగుంటుంది.

Note: 2) ఈ ప్రమాణ విద్యలో అతికీలకమైన అంశం ఒకటుంది. అది వినడానికి, అబ్బురంగానూ, గ్రహించడానికి అంగీకరించడానికి కష్టంగానూ ఉంటుంది. అదేమంటే ఏ విషయంలో తప్పొప్పులు తేల్చే శక్తి మీకుంటుందో ఆ విషయం నేను మీకు తెలుపవలసిన పనిలేదు. మరి ఏ విషయంలో మీ కట్టి శక్తి లేదో ఆ విషయం నేను మీకు తెలిపీ ప్రయోజనం లేదు. చాలా సందర్భాలలో అట్టి దసలు, తెలుపడమూ సాధ్యం కాకపోవచ్చు కూడా. 

సంపుటి : 4 - జూన్ 94 - సంచిక : 6

పదార్ధ వివేచన – 3

విద్యకు ప్రాథమికావసరమూ, ముఖ్యంగా ఈ విద్యకు ఆధారము వంటిదీ అయిన భూమిక నిర్మాణం నా పక్షాన్నుండి, అంటే వివరించడం వరకు దాదాపు పూర్తయినట్లే. దాని స్వరూపాన్ని అర్ధం చేసుకోవడమూ, అవసరాన్ని గుర్తించడమూ, అనుభవాన్ని తాకి చూసుకోవడం అన్న ప్రక్రియద్వారా ఇక మీరే మీ వంతు పూర్తి చెయ్యాల్సి ఉంది. అర్థమై సరిగనే ఉందనుకున్న పిదప ఇరువురం 

ఆ వేదిక పైనే వివరించడం, గ్రహించడం అన్నది చేస్తూ విచారణ కొనసాగించాలి. దీనిని ఇరువురిలో ఎవరం అనుసరించకున్నా ఫలితం శూన్యం. పదార్థ వివేచన శీర్షికకు సంబంధించి అసలు విషయం లోనికి సూటిగా ప్రవేశించబోతున్నాం సావధానంగా ఉండండి. ముఖ్యంగా ఏర్పడి వున్న ఆభిప్రాయాల్లో నుండి చూడడం ఆపి మీ మీ అనుభవాలతో సరిపోల్చుకుంటూ సాగండి. న ఎత్తుగడనుండి పదార్ధాన్ని ఐదుగా వర్గీకరించి అర్ధం చేసుకోవచ్చు ననుకున్నాం గదా! వస్తు, ద్రవ్య, గుణ, కర్మ, సంబంధాలని నే వాడిన సంకేతాలు వ్యవహారంలో వున్నవే. సాధారణ వ్యవహారంలో నిత్యం మన అనుభవంలోకి వస్తుండేవి. అధిక భాగం ప్రధానంగా వస్తువులే. అదలా వుంచండి. పూర్వరంగంలో చెప్పుకొనవలసినదీ, ప్రస్తావించడం జరుగనిదీ ఇప్పుడు వ్రాస్తున్నాను చూడండి. లక్షణ స్వభావము ఆ లక్షణము సార్థక రూపంలో ఉన్నదీ లేనిదీ పరీక్షించుకోడానికి అవసరమయిన దూషణత్రయ స్వరూపమూ చెప్పుకోవలసి వుంది. ఆ దూషణత్రయమంటే అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవ దోషాలు. వివరించేవాడు తన పాత్ర సరిగా నిర్వర్తించినట్లు ఎప్పుడవుతుందంటే పదార్ధాన్ని నిర్వచన రూపంలో ప్రతిపాదించి అంటే లక్షణాన్ని చెప్పి ఆపై ఇంకా సులభంగా అర్ధం కావడానికి వివరణాత్మకంగా చెప్పినప్పుడు. నిర్వచన రూపంలో చెప్పడమంటే లక్షణాన్ని తెలుపడమే. మరి లక్షణమంటే ఏమిటి? (1) అసాధారణ ధర్మో లక్షణం (2) దూషణత్రయ రహిత ధర్మో లక్షణం. అసాధారణమంటే ప్రత్యేక ధర్మమని భావము. పారిభాషికంగా విశేషమన్న మాట వాడుకలో వుంది. విశేషమంటే దానినదిగా తెలియడానికీ, మరోదానికంటే భిన్నమని, తెలియడానికి ఏది అవసరమో అది. అన్యము నుండి వేరుబరచి దాని నదిగా గుర్తించడాని కచ్చట ఏది పనిజేస్తుందో అది విశేషం. ప్రత్యేక ధర్మమని అర్థం. దానినే దాని లక్షణ మంటాము. ఇది వస్తువని, ఫలాని వస్తువని, ఇది ద్రవ్యమని, ఫలానా ద్రవ్యమని, ఇది గుణమని, ఫలానా గుణమని, ఇది కర్మయని, ఫలానా పనియని, ఇది ఫలాని సంబంధమని మనం ఎలా చెప్పగలుతుకున్నామో ఆలోచించండి. ఇది అదికాదు, ఫలానా అనడానికి ఆధారమైనదే విశేషం లేక దాని లక్షణం. విచారణలో గానీ చర్చలతోగాని గానీ వస్తువును (ఏదేని విషయాన్ని) గురించి, మాట్లాడాలనుకునే  వారు ముందుగా ఆ పదార్థ లక్షణాన్ని ప్రతిపాదించడం శాస్త్రీయ పద్ధతి.అలా ప్రతిపాదించిన లక్షణ రూపాన్ని సరిగా ఉందో లేదో పరిశీలించడానికి అవసరమైన పరీక్షా ప్రక్రియలోనివే అసంభవ, అతివ్యాప్తులు. 

అసంభవ దోషమంటే తెలుస్తూనే ఉందనుకుంటాను. ఏ పదార్థాన్ని తెలుపడానికై దాని ప్రత్యేక ధర్మమంటూ (లక్షణం) విశేషం చెప్పబడిందో అట్టిది ఎక్కడా లభించకపోతే చెప్పబడ్డ లక్షణానికి అసంభవ దోషం ఉందంటాము.

అతివ్యాప్తి దోషమంటే చెప్పబడ్డ ధర్మం, తెలియజెప్పాలనుకున్న దానియందే కాక మరో దాని యందూ లభించడం. అంటే దానిలో అసంభవత లేదుగాని ఆ విషయాన్ని మాత్రం ప్రత్యేకించలేక పోతోందన్న మాట. ఇక అవ్యాప్తి అనగా చెప్పబడ్డ లక్షణం తెలియ జెప్పాలనుకున్న అంశము నందు పాక్షికంగానో, కొన్నింటియందో మాత్రమే లభించడం. ఈ మూడు రకాల దోషాలు లేకుండా తెలుపాలనుకున్న దానిని సర్వేసర్వత్రా తెలుపగల ప్రత్యేక ధర్మాన్నే లక్షణ మంటాము. అట్టి లక్షణం సిద్ధిస్తేగాని వస్తువు సిద్ధించినట్లు కాజాలదు. ఈ అంశాన్ని గమనించక పోవడం వల్ల జరిగే అనర్థం అంతా యింతా కాదు. అసలీ కోణంలో విషయ పరిశీలన చేయలేని వాడు సత్యాసత్యాలు తేల్చుకో జాలడు. సత్యాసత్యాలు నిర్ధారించుకొంటూ సరైన జ్ఞానం సంపాదించుకోడానికి ఈ రకమయిన విచారణా సమర్ధత అత్యంతావశ్యకము. లేకుంటే అనుకోకుండా అతడు గ్రహించింది సత్యమో, అసత్యమో, అవుతుందేగాని, ఐచ్చికంగా సత్య జ్ఞానార్జన సంభవం కాదు. (Note): కలిగిన జ్ఞానం సత్యమో, అసత్యమో అయ్యుండడం వేరు, ఆ కలిగింది సత్యమో, అసత్యమో నిర్ధారించుకోగలగడం వేరు. ఈ వివేకించగల, నేర్పు లేనివారు ఆ సత్యాన్వేషణ చేయలేరు. ప్రాచీనుల నిత్యానిత్య వస్తు వివేకం లోనూ ఈ అర్థం ధ్వనిస్తుంది చూచాయగా. కానీ సాంప్రదాయకులు దానికి మరో రూపాన్ని అంటగట్టి స్థిరపర్చారు కూడా. దాంతో వినడానికి ముందే ఉండవలసిన “విన్నదానిని వివేకించగల సమర్థత” అన్న యోగ్యతా విషయం మరుగున పడిపోయింది. అసలింతకూ ఇక్కడ మనం గమనించ వలసిందేమంటే జ్ఞానార్జన చేయడంకంటే, కలిగిన జ్ఞానంలోని సత్యాసత్యాలను వివేకించగలగడం ఎంతో ప్రముఖమయినది. జిజ్ఞాసువులూ, పండితులూ, ప్రబోధకులూ కూడా ఎంతో మెలకువ కలిగి ఉండాల్సిన అంశమిది. కనుక సత్యా సత్యాల్ని వివేకించడ మెలాగో మీ మీ జీవితాలనుండి స్వయంగా అవగాహన పొందండి.

లక్షణ విషయంలోనూ, దోషత్రయం విషయంలోనూ మీ మీ స్పందనలను పత్రికకు వ్రాయండి. అనేకాంశాలింకా పాఠకుల ముందుంచ వలసి ఉన్నందున ఈ పాఠాన్నిక్కడకు ఆపుదాం.

 

 

 

సంపుటి : 4     సెప్టెంబరు 1994 సంచిక – 8

పదార్థవివేచన-4

పాఠక మిత్రులారా ! క్రమంగా పదార్థ వివేచన చేసుకుంటూ వస్తున్నాం గదా ! కొందరు పాఠకులకు ద్రవ్యాన్ని గురించి కొన్ని సందేహాలు రావడమూ అందుకు నేను మొత్తం పదార్థ వివేచన ముగిస్తేగాని విషయాన్ని సంపూర్ణంగా వివరించినట్లు కాదని చెప్పడమూ జరిగింది. ఇక్కడో విషయం గుర్తులో ఉంచుకోవడం అవసరం. అనుకున్న ప్రతి చిన్న విషయమూ జిజ్ఞాసి స్ఫురణలో ఉంచుకోవడం ఈ విద్యకు తప్పనిసరి. కనుకనే అనేకాంశాలతో ముడిపడియున్న దీనిని కొద్దికొద్దిగా వ్రాస్తూ వస్తున్నాను. ఎందుకంటే 'పదార్థ వివేచన' తొందర పడి వివరించడమూ, ముగించడమూ రెండూ సరికాదు. ఈ సంచికలోనూ విచారణకు పనికివచ్చే అవగాహనను మెరుగుపరచే మరికొన్ని అంశాలను మీ ఎదుట పెడుతున్నాను. 

వస్తు, ద్రవ్య, గుణ, క్రియా, సంబంధాలని పదార్థాలు పంచవిధములనుకున్నాం. అందులో గుణమూ ఒకటి. ద్రవ్యగతమై ఇంద్రియాల ద్వారా తెలియబడుతుండేది, క్రియకానిది ఏదో అది గుణ పదార్థము. ఈ పదార్థవర్గం క్రింద పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, ఆవరణ కలిగి ఉన్న దానికి [ ద్రవ్యానికి ] చెంది స్వతంత్రావరణ లేని (అదే స్థలంలో ఉన్న) అనేకం ఏవో వాటినే గుణములంటాము. ఉదా: ద్రవ్యరాశి కలిగిన ఒక పదార్థాన్ని తీసుకోండి. అదీ విధిగా ఒక స్థలాన్నాక్రమించి స్థలంలో గోచరిస్తుంది. దానికి భిన్న జ్ఞానేంద్రియాలను తాకించడం ద్వారా అదే స్థలంలో అనేక అంశాల జ్ఞానం మనకు కలుగుతుంది. అందులో క్రియలను విడిస్తే మిగిలిన వాటిని గుణము లంటాము. కంటి ద్వారా రంగు, రూపము, నాశిక ద్వారా వాసన వగైరాలన్న మాట. అయితే ఇవి వేటికవి. స్వతంత్రంగానూ, స్వంత స్థలాన్ని కలిగి ఉండడం లేదు. దానర్థం ఏమిటి? ఉన్నది మన ఇంద్రియాలపై, ఇంద్రియ భేదాలననుసరించి రకరకాల ప్రభావాల్ని కలిగించ గలుగుతోందన్నమాట.అలా రకరకాలుగా గోచరించగల సమర్థత ఆ ఉన్న దానికి ఉన్నదన్నమాట. ఆ ఉన్న దానినే ద్రవ్య మంటాము. ఆయా ఇంద్రియాల ద్వారా దానిలోని ఏ మేమి తెలుస్తున్నాయో అవి గుణములు. 

ఒక్క మాట: ఈ పదార్థాన్ని వివరించడమూ గుర్తించడమూ కూడా ఎంతో సూక్ష్మ పరిశీలనతోనూ, పూర్వాభిప్రాయాల నావల పెట్టి

చూడగలగడం పైననూ ఆధారపడి ఉంది. ఇందుకు ఒక ఉపాయం ఉంది. నేను చెపుతున్న సంఘటనను మీ మనోఫలకంపై సాక్షాత్కరింప జేసుకోవడమో, అట్టి సంఘటనను ప్రత్యక్షంగా ఏర్పాటు చేసు కోవడమో చేసి దానిని నిశితంగా పరిశీలించాలి. అలా జరుగనంత కాలం “వివరించడం ద్వారా గ్రహించడం” అన్న ప్రక్రియ సఫలం కాజాలదు.

 ఇప్పుడిక ఈ గుణ పదార్థాలను రెండుగా విభజించి అర్థం చేసుకుంటే మరింతగా అవగాహనా సౌలభ్యం ఏర్పడుతుంది.1) ఉన్న దాన్ని నుండీ తాను తొలగితే ఉన్న దాని స్వరూప స్వభావాలలోనే [లక్షణంలోనే] మార్పు ఏర్పడే తరహాకు చెందినవి. 2) తాను తొలగినా లక్షణంలో మార్పు తీసుకు రాలేనివి.

 ఈ రెండో తరహాకు చెందిన గుణాలు ముఖ్యంగా రెండు. ఆకృతి, పరిమాణము [ షేప్ - సైజు] ఈ రెండు గుణాలు స్థల సంబంధితాలు. ఏదో ఆకృతిలో ఎంతో కొంత పరిమాణంలో ఉన్న మొత్తాన్నే ద్రవ్యము అంటాము. ద్రవ్యాన్ని అంటి పెట్టుకునే, ద్రవ్య లక్షణం పై ప్రభావాన్ని కలిగించని పై రెండు గుణాలు ఇంద్రియాల ద్వారా తెలియబడుతున్నాయి కనుక గుణములేకాని ద్రవ్యంలో ఉండేవి కాదు. ఈ తేడాను స్పష్టంగా గ్రహించగలిగితే గాని వస్తు - ద్రవ్య పదార్థాల మధ్య నున్న వ్యత్యాసాన్ని గ్రహించడం సాధ్యంకాదు. Note: ఇంతవరకు అర్థమైందనుకుంటే గ్రహించిన విషయాన్ని పరీక్షకు పెట్టి అనుభవంలో అది అలా ఉందో లేదో నిర్ధారించుకోవడం విన్న వారు చేయవలసిన పని. ఆగండి, ఆపని కానీయండి ముందు నామాట రైటా కాదా? పై అవగాహనాధారంతో ఇప్పుడు ద్రవ్యానికి నిర్వచనం ఇచ్చినట్లయితే ఒక స్థలంలో ఏదో ఒక ఆకృతిలో ఎంతో కొంత సైజులో ఉన్నదీ గుణ క్రియలకు ఆశ్రయమైనది ద్రవ్యము అని తెలియడం లేదూ! దానికున్న లక్షణము ఆకృతిని బట్టిగానీ, పరిమాణాన్ని బట్టికానీ ఏర్పడింది కాదు. పరిమాణాన్ని, ఆకృతిని మార్చినా అది అదిగానే ఉంటుంది. ఉదా: బంగారు, ఇత్తడి, వెండి వగైరాలు. అలా తెలియబడుతున్న ద్రవ్యమన్న పేరుతో పిలువ బడుతున్న దానిని, ఆకృతి లేనిదే వస్తువనడానికి వీలులేదు. ఆ ద్రవ్యాన్ని వస్తువుగా గుర్తించాలంటే దానికో “నిశ్చితాకృతి” ఉండాల్సి వస్తుంది. కనుక వస్తుపదార్థం “నిశ్చితాకృతి” అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. మరి అదే ద్రవ్యమైతేనో ఫలాని ఆకృతి అనడానికి వీల్లేని దశలోనూ ఫలాని ద్రవ్యం అనడానికి వీలుగానే ఉంటుంది. అలాగే గ్రహింప బడుతుంది కూడా. వస్తువు యొక్క ఆకృతి మారినా, పరిమాణం మారినా ద్రవ్యాస్థిత్వాని కొచ్చిన ఇబ్బందేమీ లేదన్నమాట. నేటి విజ్ఞానశాస్త్ర పరిభాషలో చెప్పుకుంటే పదార్థము మన భాషలో ద్రవ్యము (Matter)- ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటుంది. ఆ మూడు స్థితులలోనూ అది ఫలానా ద్రవ్యమనడానికి తగిన అసాధారణతను [స్వీయలక్షణాన్ని] కోల్పోదు. ద్రవ, వాయు స్థితులందున్న నిశ్చితాకృతి కోల్పోయిన ద్రవ్యాన్ని ఫలాని వస్తువనడం సాధ్యంకాదు. అంటే ఏమని? వస్తు పదార్థానికి నిశ్చితాకృతి ప్రధానమన్నమాట. వస్తు లక్షణం ఆకృతిపరమైనదన్న మాట. ఆకృతి ననుసరించే వస్తువుల పేర్లుంటాయి. అర్థమైందా? అయితే ఇప్పుడు అనుభవంలో పోల్చి చూడండి.

మొత్తమ్మీద ఏమన్నట్లు? ద్రవ్యంతో కూడుకున్న వస్తువుకు నిర్ధిష్టాకృతి ఉంటుంది. ఉండి తీరాలి. ఆకృతిని బట్టే దానికా పేరు పెట్టడం జరుగుతుంది. అదే ద్రవ్యం అలానే ఉన్న ఆకృతిని మారిస్తే ఇక దానిని ఆ వస్తువనడం కుదరదు. అంటే ఆకృతిని బట్టి వస్తువులూ, ఆకృతీ, సైజును విడచి ఉన్న మొత్తం యొక్క విశేషాన్ని బట్టి ద్రవ్యమూ ఉనికిగలిగి గుర్తింపబడుతూ, సంకేతాల్ని కలిగి ఉంటున్నాయి. ఆకృతిపోతే వస్తువు పోయింది లేక మారింది. ద్రవ్యం పోలా, మారలా వస్తు - ద్రవ్య పదార్థాల మధ్య తేడా తెలుస్తోందా ? ఆగి ఆలోచించి ఒక అభిప్రాయానికి రండి.

వినిన, చదివిన [భాషా పరిధుల్లో గ్రహించిన] అంశాలను పరీక్షకు లోను చేయడమెలాగన్నది గతంలో అనుకుని ఉన్నాం. గుర్తుండే ఉంటుందనుకుంటాను. ముందుగా ప్రతిపాదిత విషయము సంభవమా కాదా అని పరిశీలించాలి. సంభవమైతే చెప్పినమాట తప్పు మాత్రం కాదని అర్థం. ఆ పై దానికి సమగ్రత ఉందో లేదో చూడాలి. అందుకు అతివ్యాప్త వ్యాప్తులతో సరిపోల్చాలి. ఆ రెండు దోషాలు కూడా లేకుంటే ప్రతిపాదితాంశం నిర్దోషమై నిర్ధిష్ట స్థాయిని పొందుతుంది. నిర్ధారితాంశంగా స్వీకరించడానికి యోగ్యమై ఉంటుంది. అవునా? కాదా?

ఈ సందర్భంలో జిజ్ఞాసువుల స్వీయ పరిశీలనకుగాను కొంత విషయాన్ని నేనుగా విశ్లేషించకుండా విడచి పెడుతున్నాను. ఎందుకంటే చూడగల - గ్రహించి వివేచించగల సమర్థత, నేర్పు లేనివారు కేవలం అభిలాష ఉన్నంత మాత్రాన విద్య నార్జించలేరు. ముఖ్యంగా తాత్విక స్థాయికి చెందిన విషయాలలో ప్రతి చిన్న విషయమూ అవగాహనా పరంగా ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. ఒక చిన్న అంశాన్ని గమనించక పోవడమో, నిర్లక్ష్యం చేయడమో జరిగితే ఆపై అదీ, అతని అవగాహనా స్వరూపాన్నే మార్చి వేయవచ్చు. కనుక మీ పరిశీలనాశక్తి నిపుణతలను మీరే బేరీజు వేసుకోడానికి వీలుగా ఒకటి రెండంశాలు మీ ముందుంచుతాను చూడండి. వివేచించండి.

వస్తువు, ద్రవ్యము, గుణము అన్న పదాల అర్థాలను (పదార్థాలను) విడివిడిగా గుర్తించడానికి అవసరమైన విశేషాలను పైన వివరించానుకదా! అలానే ద్రవ్యంలో [స్థలంలో ఉన్న దానిలో] మరింకే గుణాలైనా అలాంటివి ఉన్నాయేమో పరిశీలించండి. తాను రావడము, పోవడము వల్ల ఉన్న దాని లక్షణము మారటమూ, మారకపోవడమూ జరిగే సందర్భాలుంటే గమనించండి.

Note: గతంలో విద్యా విధానంలో పాత్ర వహించిన మేధావులు విద్యార్జనకు యోగ్యు లెవరన్న ప్రశ్న వేసుకుని రెండు మూడు రకాలుగా వారి భావాల్ని వెల్లడించారు.

1) సుధీః భోక్తా! అని, సక్రమమైన బుద్ధి విశేషం కలవారు అనగా శుద్ధమూ, శక్తివంతమూనైన ప్రజ్ఞకలవారని దానర్థం!

2) సూక్ష్మయా సూక్ష్మదర్శి భిః! సూక్ష్మ దర్శనులైన వారే సూక్ష్మ విషయాన్ని గ్రహించగలరు. తత్వవివేచన ఎంతో సూక్ష్మమైనది, కనుక సూక్ష్మ దర్శనులు మాత్రమే దీనిని వివేకించగలరని సూత్రార్థం.

3) గ్రహణ - ధారణ సమర్థులే విద్యార్జనకు యోగ్యులు. చెప్పింది గ్రహించడం, గుర్తుంచుకోవడం చేతనై యుండాలి విద్యార్థికి అని దాని భావం. ఇవన్నీ సబబేననిపించడం లేదూ! గ్రహణధారణ పటుర్బాలః అని అన్నంభట్టు. ఇక్కడ బాలురంటే వయస్సు చేత చిన్న వారని అర్థం కాదు. నేర్వవలసిన విషయంలో ఆరంభకులు అని మాత్రమే. ఈ అంశాలను మన బుద్ధి - ఆలోచిస్తే వాటి విపుల రూపం యిలా ఉంటోంది.

జ్ఞాన ప్రక్రియలో పాల్గొనే వాటిని మూడుగా విడగొట్టి చూడవచ్చు. 1) కర్త అతనికున్న ఉద్దేశ స్పష్టత - తీవ్రత. 2) అతనికి సహకరించు పరికరాల శుద్ధత సామర్థ్యము. 3) జ్ఞానార్జనకై అతడనుసరిస్తున్న విధానపు శుద్ధత, సామర్థ్యము. ఈ మూడంశాలు ఏ విద్యలో గాని, ఎవరి విషయంలో గానీ అవశ్యమై కీలకపాత్ర వహిస్తాయి. ఆగండి. నిదానంగా ఆరోచించి వంట బట్టించుకోండి. ఇక్కడ త్వరపడ్డామా ఆ పైదంతా నేలవిడచిన సామే.

Note: మొత్తంగా జ్ఞాన ప్రక్రియ అంతా గ్రహించడం, అట్టే పెట్టుకోవడం వివేక రూపంలో అవసరానికి వినియోగించుకోవడం అనే రూపాల్లోనే ఉంటుంది. ఈ గ్రహించడం ప్రత్యక్ష, అనుమాన శబ్ద ప్రమాణముల ద్వారా సాగుతుంది. ప్రస్తుతం శబ్దం ద్వారా గ్రహించే అంశాలను మాత్రం ముచ్చటించుకుంటున్నాం.)

ఇక్కడ గ్రహించడం రెండు. రూపాలు. 1) పదాలను - వాక్యాలను గ్రహించడం, 2) వాటి అర్థాలను, సారాంశాన్ని గ్రహించడం. మొదటిది. యాంత్రికంగా జరుగుతుంది. శబ్ద ప్రమాణంలో ఇమిడి ఉన్న ప్రత్యక్ష  భాగం క్రిందికి వస్తుంది. రెండవది విన్న ఆ పదాలకు అర్థాలను స్మృతినుండి స్వీకరించడం, బుద్ధి చేసే సమన్వయ ప్రక్రియ ద్వారా సందర్భానుసారమైన సారాంశాన్ని గ్రహించడం. ఈ రెంటి సమాహారమే విషయాన్ని గ్రహించడమంటే. ఈ రెండంశాలు శుద్ధంగా, శక్తివంతంగా ఉంటే గ్రహణ శుద్ధంగా శక్తివంతంగా ఉన్నట్లు. ఈ గ్రహణ సామర్ధ్యాన్ని పెంచుకోవాలంటే దానికో క్రమం ఉంది. చక్కగా వినడం, విన్న మాటలకు అర్థాలను అన్న వారినుండే స్వీకరించడం. మొదటిది కాగా ముందుగా ఎట్టి అని ప్రాయాలేర్పరచుకోకుండా (తాను తానుగా ఉంటూ దానినదిగా గ్రహించడం.) విషయాన్ని స్వీకరించడం. గ్రహించిందాన్ని అట్టే పెట్టుకోవడం ధారణ. ధారణ కూడా రెండు రకాలుగా ఉంటోంది. పదాలు, వాక్యాలు రికార్డు చేసికుని నిలిపి వుంచుకోవడం ఒక తరహా. ఇదే ఈనాడు సాంప్రదాయకంగా అమలులో ఉన్న బట్టీ పట్టే పద్దతి. అర్థరహితంగా సూత్రాలను గ్రహించి నిలిపి ఉంచుకోవడ మన్నమాట. ఇదే యాంత్రికమైనదీ, జడప్రాయమున్నూ. ఇక్కడ యధాతధం నిలిపి ఉంచు కోవడమన్నది ప్రధాన భూమికను వహిస్తుంది. అవగాహన ఏర్పడిందా లేదా అన్నది పరిగణనలో ఉండదు. ఇందులో సరైన ధారణ అర్థ సహితంగా పదాలను వాక్యాలను నిలిపి ఉంచుకోవడం. ఈ రెండో తరహానే జ్ఞానార్జనలో ధారణ అనుకోవలసి ఉంటుంది. ఇక్కడా కొంత యాంత్రిక క్రియ ఉన్నా తెలివి-ప్రజ్ఞ - ప్రధాన పాత్ర వహిస్తుంటుంది. ఒకే అంగాన్ని రెండు మూడు రకాలుగా తెలియజేశాను. అవగాహన కొరకుగా. ఇప్పుడిక మీకు మీరుగా మిమ్మల్ని పరికించి చూసుకోండి. గ్రహించడంలో నేర్పు గ్రహించించి నిలిపి ఉంచు కోవడంలో శక్తి కలిగి ఉన్నారా? లేదనిపిస్తే మాత్రం అసలు విద్య నేర్వడంకంటే ముందు గ్రహించి నిలిపి ఉంచుకోవడం అన్న విద్య నేర్చుకోవలసి ఉంటుంది. ఎక్కువమంది ఈ విషయాన్ని దీనికున్న ప్రాముఖ్యతనూ గమనించక పోవడం వల్లనే ఈనాడు మేధావుల మనుకుంటున్న వాళ్ళలోనూ అవగాహనా లోపం (వారి వారి క్షేత్రాల్లోనే సుమండీ) కొట్టవచ్చినట్లు కాన వస్తోంది. ఈ అంశాన్నిక్కడ కాపి మళ్ళీ ద్రవ్యం గురించి ఆలోచించడానికి కొంత సమాచారం అందిస్తాను ఆలోచించండి. ఈనాడు ద్రవ్యం అతీంద్రియ విషయమని కొందరూ, బుద్ధీ, తనకు కలిగిన అనుభవ సంపుటి నుండి సాధించుకునే సమన్వయ రూపమేనని మరి కొందరూ అంటుంటారు. మనమిప్పుడు ఈ రెంటికీ ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి ముందు. మొదటి పక్షం ద్రవ్యానికి బాహ్యమైన ఉనికిని అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. అయితే అది ప్రత్యక్ష గోచరం కాదంటుంది. రెండో పక్షం ద్రవ్యం భావరూపం మాత్రమే. బైట ఇంద్రియాలకు అందే గుణాదులు ఉన్నాయి. వాటికి సంబంధించి కలిగిన అనుభవాలను క్రోడీకరించి ఒక ఊహాచిత్రాన్ని తయారు చేసు కుంటుంది మేధస్సు, అలాంటిదే ద్రవ్యమన్నది. దానికి భావరూపమే గాని భౌతికంగా ఉనికి లేదు. ఈ రెండు పక్షాలలో మీకేది సబబనిపిస్తోందో ఎందుకలా అని పిస్తోందో స్పందనకు వ్రాయండి. . ఇంకొంత చెపితే బాగుంటుందనిపిస్తున్నా

మీ.. ఆలోచనకోసంగా ఇప్పటికిదీ ముగిస్తున్నాను.

సంపుటి:4 అక్టోబరు 94 - సంచిక – 9

పదార్థవివేచన-5

పదార్ధ వివేచన ఎంతో క్లిష్టమూ, గ్రహించడానికి గహనమూనైన పదార్థ స్వరూప స్వభావాల (లక్షణాల)ను గురించి నిదానంగానూ క్రమంగానూ, కొన్ని సార్లు చెప్పిందే చెప్పుకుంటూనూ వస్తున్నాము. గత సంచికలో వస్తు, ద్రవ్య, గుణములను గురించి కొంత వరకు వివరించాననే అనుకుంటాను. మరి మీకవి ఎంతవరకు అర్థమయ్యాయో ఆలోచించుకుని స్పందనకు వ్రాస్తేగానీ నాకు తెలియదు పరిస్థితి ఏమిటన్నది. పై వాటిని గురించే మరికొంత విచారణ చేద్దాం. మీరూ పరిశీలిస్తూ కదలి నడవండి.

కంటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగల దూరంలో (కంటికి తగినంత దూరంలో) ఒక వస్తువును ఉంచామనుకోండి. దాని ఆకృతి తెలుస్తుంది, పరిమాణం తెలుస్తుంది, రంగు తెలుస్తుంది. వీటితో పాటు అది ఫలాని ద్రవ్యమని తెలుస్తుంది. ఆ స్థలాన్నుండి వస్తువును కదిలిస్తూ దూరంగా తీసుకు పోవడమో, దగ్గరగా తీసుకు రావడమో చేసామనుకోండి. క్రమంగా ఏమి జరుగుతుందో, పరిశీలించగలరా? పరిశీలించండి. పరిశీలించాకనే మిగిలింది చదవండి. ముందుగా దూరంగా కదిలినప్పుడు 1. మొదట చూచిన సూక్ష్మమైన, ప్రత్యేకతలు (విశేషాలు) స్పష్టంగా గోచరించక పోవడం జరుగుతుంది. 2. రంగుల్లో వున్న వైవిధ్యం సూక్ష్మంగా గోచరించడం తగ్గుతూ పోతుంది. ఉదా: వస్తువు ఎరుపురంగు గలదీ అనుకుందాం. కొంత దూరం జరిగాక కూడా ఎరుపే అన్న ట్లగుపిస్తుంది గాని, దగ్గరగా వున్నప్పుడు ఎట్టి ఎర్రదనం గమనించామో అంత స్పష్టంగా ఆ రకమైన ఎర్రదనాన్ని గమనించలేక పోతాం. మరికాస్త దూరం జరిపితే ఫలాని రంగు అని చెప్పలేకపోతాం. అయినా వస్తువు పరిమాణం తెలుస్తూనే ఉంటుంది. 3. వస్తువు దూర మవుతున్న కొలదీ ఆకృతి గ్రహణలో స్పష్టత తగ్గుతూంటుంది. పరిమాణం తెలుస్తూనే వుంటుంది. 4. అతి దూరస్తమవడం వల్ల క్రమంగా పరిమాణ విషయం లోనూ స్పష్టత లోపిస్తూ వుంటుంది. అలాగే వస్తువును క్రమంగా కంటి దగ్గరకు జరుపుకుంటూ వచ్చామనుకోండి. ఏ క్రమంలో ఆయా అంశాలు స్పష్టంగా గోచరించక పోవడం జరుగుతుందో పరిశీలించి స్పందనకు వ్రాయండి. ఇప్పుడు ఆలోచించండి. నేత్రేంద్రియానికి ఏ ఏ అంశాలు (పదార్థాలు) తెలియబడతాయో అలాగే ఎంత దూరంలో వుండే పదార్థ జ్ఞానం యథాతథంగా కలుగుతుందనడానికి వీలుందో, మరి ఏ ఏ దూరాలు ఏర్పడ్డప్పుడు (అతిదగ్గర, అతి దూరం) యదార్ధ జ్ఞాన ప్రతి బంధక దూరాలు అని అనడానికి వీలవుతుందో తేలుతుంది. ఇది ఎవరు చేయగలిగితే వారు గ్రహణ ధారణ సమర్థులు. చూడడం చేతనైన వారు అని అర్థం.

ఈ విద్య వంటబట్టాలంటే కొన్ని పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుంది. 1. ఈ విద్య తనకింకా అందవలసే వుందన్న గమనింపు. 2. అది తెలుసుకోవడం జీవితావసరమన్న వివేకం. ఈ రెండూ కలిపి ఉద్దేశ్యము, దాని స్పష్టత, తీవ్రత అన్నదానిని - అదే ఒక మాటలో చెప్పాలంటే ‘లక్ష్యశుద్ధిని’ తెలియజేస్తాయి. ఆపై దాని నార్జించాలన్న తపన పుడుతుంది. ప్రయత్నం మొదలవు తుంది. ఆ పనికి అవసరమైన పరికరాలు విధానము సాధించు కోవలసినవిగా తెలియవస్తుంది. ఆ పరికరాలు, విధానములనే ప్రమాణ విద్య అంటారు. అది శుద్ధమూ, శక్తివంతముగా ఉండాలి. అంటే జ్ఞానేంద్రియ వ్యవస్థ [ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి (మెదడు)] ఆరోగ్యదాయకంగా, శక్తివంతంగా ఉండాలి. మరోమాటలో చెప్పుకోవాలంటే, ప్రజ్ఞాపాటవాలు కలిగి ఉండాలి. ఇంద్రియాలు యాంత్రిక క్రియకు సంబంధించినవి గనుక అవి ఉపకరణాలు మాత్రమే. కాబట్టి ప్రజ్ఞ అన్నమాట బుద్ధి పదార్థానికి వర్తించేదవుతుంది. ఇంద్రియాలు పటుత్వం కలిగి ఉండడం, బుద్ధి ప్రజ్ఞావంతమై ఉండడం వుందే అదే ఇక్కడ ప్రజ్ఞా పాటవాలు కలవాడంటే. ప్రమాణ ప్రమేయ విద్య పొందాలనుకునేవానికి యోగ్యతలు ప్రజ్ఞాపాటవాలు. యోగ్యుడే విద్యా పరిసమాప్తిని పొందగలడు. మిగిలినవారు ఆరంభకులుగనూ, గమ్యాన్ని చేరజాలని ప్రయాణీకులుగనే మిగిలిపోతారు. ఈ విద్యను సమాజానికి అందించాలన్న యత్నంలో మేము తరచుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. దీనితో ముడిపడే మరో సమస్య పుడుతోంది. తనలోని యోగ్యతా రాహిత్యాన్ని తాను గుర్తించ లేనప్పుడూ, తనపై తనకు అతి విశ్వాసం ఏర్పడి ఉన్నప్పుడూ ఆ విషయం తాను గ్రహించక పోవడానికి గల దోషాన్ని ఎదుటి వానిలో వెదకడానికి యత్నిస్తాడు మనిషి. తనకు లేనిదీ ఎదుటి వానికీ లేదనుకుని తృప్తిపడే నైజమది. ఒక వేళ ఆ యోగ్యత ఎదుటివానికి ఉందని తెలిసినా అందువల్ల ఏర్పడ్డ అసూయా జనిత వ్యతిరేక భావన తనను తెలుసుకోనివ్వదు. ఎదుటి వాని యోగ్యతను గుర్తించినా అంగీకరించనివ్వదు. మనిషిలోని ఈ తరహా ప్రవృత్తి జ్ఞాన ప్రతిబంధకంగా ఉంటుంది. తాను యత్నం చేద్దామని కాక, ఎదుటివానికి ప్రతిబంధకంగా రూపొందే విధంగా తయారవుతుంది క్రమంగా. ఏంచేద్దాం? ఇవన్నీ ఆలోచించవలసిన సమస్యలే అవుతున్నాయి. ఈ విషయంలో వెనుకటి విద్యా వ్యవస్థలోని ఉదాత్తమైన ఆకాంక్ష ఒకటి గుర్తుకొస్తోంది. “కలిసియత్నిద్దాం. కార్యాన్ని శక్తివంతం చేద్దాం. కలిసే ఫలితాన్ని స్వీకరిద్దాం. ఎవ్వరూ ద్వేషించుకొనవద్దు. ఇందువల్ల త్రివిధ దుఃఖ నాశం కలుగు గాక” అని. ఈ మాటలను ఈనాడు, మనస్సెక్కడో క్షుద్రమైన అంశాల పై పరుగిడుతూనో మరోరకంగా ఉండగానో, చిలుక పలుకుల్లా వల్లిస్తున్నారు. అర్థాన్ని భావన చేసి జీర్ణించుకుని తద్వారా హృదయ గతమైన దానికి అనుగుణ్యంగా కదిలే వ్యక్తులే కరవైనా రీనాడు. అందుచేతనే అటు తాత్విక విద్యా కేంద్రాలలోగాని, లౌకిక విద్యా కేంద్రాలలో గాని పరస్పర సంబంధాలు తృప్తికరంగా లేవు. విద్యార్జన కూడా సముచితస్థాయి కలిగి ఉండడం లేదు.

మధ్యలో ఎందుకీ ఉపోద్ఘాతం అని మీలో కొందరికైనా అనిపిస్తూంది కదూ! అవును. నిజమే మరి. అయితే పత్రికకు వస్తున్న స్పందనల తీరు తెన్నుల దృష్ట్యా అవసరమనిపించియే ఈ చర్విత చర్వణం. అయినా అవధారణీయ అంశాల పట్ల పునరుక్తి దోషం కాదన్నది విజ్ఞుల అభిభాషణమే.

 

సంపుటి:4 నవంబరు 94 - సంచిక - 10

పదార్థ వివేచన-6

పదార్థ వివేచనలో మరో ముఖ్యమైన విషయముంది. మనకు ఆయా అంశాలు తెలుస్తున్నా యనిపించడానికి వెనుక మెదడులో జరుగుతున్న కార్యక్రమము ఏమిటి? ఎలాగన్నదే అది. ఇది తెలియకుంటే నిక్కచ్చిగా భావపదార్థాల్ని, భౌతిక పదార్థాలనూ విడదీసి చూడడం కుదరదు. ఇంకా ద్రవ్యంలో గోచరిస్తున్న గుణ సముదాయంలో ఏవి ద్రవ్యపరమైన సహజాతాలు లేక స్వాభావికాలో, మరి ఏయే గుణాలు ఆగంతుకాలో అర్థం చేసికోవడమూ కష్టము. ఈ అంశంలోనే గతంలో ఒక వివరణ చేశాను ఆకృతి, పరిమాణము వాస్తవంగా ద్రవ్య స్వభావానికి చెందిన గుణాలు కావంటూ. యింకేమైనా అలాంటివి ఉన్నాయేమో చూడండన్నాను గుర్తుందా? అయినా ఏం ప్రయోజనం. మీ వైపునుండి ఒక్క స్పందనా లేదు ఈ విషయంలో. పైగా ఎందుకీ గాడిద చాకిరీ అనిపించేలా, అదెందుకు రాశావు, ఇదెందుకు రాశావు, నన్నెందుకలా అన్నావు అంటూనో నిన్ను, నీ అంశాల్నీ నీవే పరీక్షించుకో, పరీక్షకు పెట్టి సరి చూసుకో అంటూనో విమర్శలు, సూచనలు మాత్రం అసలు విషయాన్ని విడచి దండిగా వ్రాస్తుంటారు. సరేలెండి, నా ఓపినంత, ఓపికున్నంత వరకు వ్రాస్తుంటాను. ఏం చేద్దాం, విద్యపరిస్థితి అట్లావుంది.

రంగు ద్రవ్యానికి ఉండదని, ద్రవ్యగతమైన అంశం కాదనీ అంటే మీ అనుభవాలు మీకు అవును అని చెపుతున్నాయా? చెప్పవు. కాని వాస్తవానికది కాంతికిరణ విశేషమే కదా! ద్రవ్య స్వరూపానికి చెందిన గుణం కాదుకదా! ఉన్న ద్రవ్యము తనపై పడ్డ కాంతి కిరణాన్ని కిరణ పుంజంలోని ఎంత మేరకు ప్రతి ఫలించగలదో ఆ మేరకు కాంతి మన కంటికి చేరి అదొక రంగు అన్న అనుభవాన్నీ, ఆ రంగు ఆ ద్రవ్యానిదేనన్న అనుభూతిని కలిగిస్తూ రంగు వస్తువు దగ్గర, వస్తువులో, వస్తువుదిగానే ఉంది అన్న భావనను దృఢంగా కలిగించడం లేదూ? వాస్తవంగా ద్రవ్య స్వరూపంలో లేని రంగు ద్రవ్యానిదిగా అనుభవంలోకి వస్తోంది. దీనికి కారణం మనలో వున్న జ్ఞాన భాగపు [ఇంద్రియాలు - మెదడు - వాటి పని తీరు] సంవిధానంలో ఉంది. ఈ విషయాన్నే మీ ఎదుట పెట్టుకుని మరి కొంత ఆలోచించండి. ద్రవ్యాన్ని ఎదుట ఉంచుకున్నా కాంతి దాని పై పడకుండా చేశామనుకోండి. ద్రవ్యం మనకు కనబడదు. అయినా అది ఉంది. దాని అసాధారణతను లక్షణాన్ని అంటే స్వరూప స్వభావాలను కోల్పోకుండగనే ఉంది. అంటే కాంతి ఉన్నా లేకున్నా ద్రవ్యం ఉనికికేమీ లోటు లేదన్న మాటేగదా? ఏమంటారు? దీనిని అంగీకరిస్తే రంగు అన్న గుణం ద్రవ్యానికి స్వగతమైనదా? ఆగంతుకమా? కానీ ఇంత విచారణ చేయకుండానూ వైజ్ఞానిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొనకుండగనూ ఈ విచక్షణ సాధ్యమా? ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే తత్వతః పదార్థాలనర్థం చేసుకోవడానికి ఎంతో నిశిత దృష్టి, మేధస్సు అవసరమని తేలడం లేదూ? తగినంతటి దృష్టి ఏర్పరచు కోకుండా చేసే విచారణా, నిర్ధారణా రెండూ పాక్షికమైన అవగాహననో, తప్పు అవగాహననో మాత్రమే కలిగించగలవు. పైగా యిట్టి అవగాహన వల్ల తెలియకనే తెలిసింది అనుకునే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. నిదానంగా ఆలోచించండి.

 

సంపుటి : 4 డిశంబర్ 1994 సంచిక : 12

పదార్థ వివేచన-7

ద్రవ్యం ఏ యింద్రియానికి విషయమవుతోంది? అన్న ప్రశ్నను ఆధారం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నాం. మనం మన విచారణలో ఎన్ని మలుపులు తిరుగుతూ వస్తున్నా చెప్పే నేనూ గమనిస్తున్న మీరూ ఈ విషయాన్ని మరవ కూడదు. సూక్ష్మమూ, సంక్లిష్టమూనైన విషయాలను నిర్ధారించడానికి తగినంత ఆసక్తి, సునిశిత మేధాశక్తి, విస్తృతపరిధిలో అవగాహనాస్థాయి అవసరమవుతాయి. అందుకే ఇంత విశ్లేషణ. ఈ రకమైన యత్నాలు ఇరువురం కలసి ఏకోన్ముఖంగా కొనసాగిస్తేగాని సత్ఫలితాల్నివ్వవు. ఈ పనిలో మీకో నాకో ఎప్పుడైనా ఎందుకొచ్చిన చాకిరి అనో, ఇకచాల్లే అనో అనిపించిందా విచారణ పరమైన నడకలో కుంటుదనం వచ్చినట్లే. ఈ రకమైన జాగ్రత్తలు సావధానత కొరకు మరల మరల స్మరిస్తూ ఉండడం అవసరం, తప్పనిసరి కూడా. ఎన్ని సార్లనుకుంటున్నా ఇదంతా అధ్యయనానికి, సరైన పరీక్షకూ తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకే.

ప్రకరణాంశాన్ని అర్థం చేసుకోడంలో కీలకపాత్ర వహించగల కొన్ని విషయాల్ని ఈ వ్యాసంలో ముచ్చటిస్తాను. మనకు ఏర్పడుతున్న అనుభవరూపాల్ని మౌలికంగా రెండుగా విభజించుకోవచ్చు. 1) ఉన్నవీ, 2) అనిపిస్తున్నవి. వీనిని ప్రమేయాలనుకుంటే వీటికి సాధనలున్నూ మౌలికంగా రెండు రూపాలే. అవి 1) ఉన్న వాటినీ, లేని వాటినీ నేరుగా తెలుపుతున్నవీ, 2) ఉన్న వాటినీ లేనివాటినీ తోపింప చేస్తున్నవీ. అంటే ఏమిటో అర్థమవుతోందా!? ఉన్నవీ, అనిపిస్తున్నవి అన్న రెండురకాల అనుభవాలకూ ఆధారమైన వాటిని గ్రహించడానికి ఉన్న సాక్షాత్ సాధనాలూ, పరోక్ష సాధనాలూ రెండుగానే ఉన్నాయని నా అభిప్రాయం. వీటినే ప్రమాణాలంటారు. (ప్రమాణమంటే ఇక్కడ నా అర్థం జ్ఞానసాధనమనే).

పై అనుభవాలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలుకాగా అవి మళ్ళా భౌతికాలూ, భావరూపాలు, భ్రమాత్మకాలూ, వాస్తవికాలునని అర్ధం చేసుకో గలిగితేగాని మన విచారణ సాధికారికంగా అనుభవానుసారంగా కొనసాగదు. మరో విషయం: ఆయా అంశాల స్వరూప స్వభావాల్ని వివరణాత్మకంగా మీ ముందుంచడమే నా వంతు. వాటిని చూడడమూ, సరిచూసుకోవడమూ, తప్పొప్పుల్ని వివేచించడమూ మీ వంతు.  ఈ అంశమూ ప్రస్ఫుటంగా గమనించి ఉండడమూ చాలా అవసరం. అసలింతకూ ద్రవ్యం ఇంద్రియ గోచర విషయమా, అతీంద్రీయ విషయమా, దానికి భౌతికాస్తిత్వం ఉందా లేక కేవలం భావరూపమేనా? అన్న చర్చ ఈ నాటిది కాదు, ఇంతవరకు ఇదమిద్థమని తేలిందీ లేదు. ఇరుపక్షాల వారూ ఎవరికివారు ఎదుటి పక్షంలోని లొసుగులనూ, అసమగ్రతనూ, అసంభావ్యతనూ ఎత్తి చూపుకుంటూ, తమ పక్షానికి మరింత ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుక్కుంటూ సాగిపోతున్నారు. ఎదుటివారిలోని దోషాలు కని పెట్టడంతోనూ, ఎత్తిచూపడంతోనూ, తమ పక్షం స్థిరపడుతుందనీ, స్థిరపడినట్లేననీ భ్రమిస్తూ పరిభ్రమిస్తుంటారు. ఈనాటి వరకూ ఈ పోకడలో రాదగినంత మార్పు రాక పోవడం మిక్కిలి శోచనీయం. పదార్థ లక్షణాలను ప్రతిపాదించి, ప్రమాణాది యుక్తులతో దానిని స్థిరపరచవలసి ఉంటుందన్న వివేకం లోపించుటేగాక ఎవరికివారు తాము పండిపోయామని ఎంచుకుంటున్న నేపథ్యంలో ఇక నిజమైన పదార్థ తత్వ విచారణ, పరీక్ష అన్న వాటిని గురించి ఆలోచించే అవకాశమే కానరావడంలా. ఇట్టి స్థితిలో ఎవరో పెంచలయ్య గారిలాంటి వారో, వారిచే ప్రేరణ పొందిన (నిజంగా వీరికిది నిజ జీవితాన్నుండి పుట్టిన అక్కర అనేకంటే పెంచలయ్య గారు దీనిని భూతద్దంలో చూపించడం ద్వారా ఏర్పడ్డ ఉత్సుకత అంటే నిజానికి దగ్గరగా ఉంటుంది.) ఒకరిద్దరు పదార్థాలూ, ప్రమాణాలు అంటూ ఆరంభించినా, సరే కానీండంటూ వాటి విచారణ నాలాటివారు కొనసాగించినా పెద్దగా ప్రయోజన మేమీ కానరావడం లేదు.

ఇక ఆయా ధోరణులకు చెందిన ప్రసిద్ధులైన ప్రచారకులైతే ఈ ప్రమాణాల పదార్థాల గొడవేమిటయ్యా, వీటి కోసం ఇంత గింజులా టేమిటయ్యా అంటూ ఇదో పనికిమాలిన విషయంగా భావిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రమాణ, పదార్థ విచారణ చేద్దాం రండంటూ ఈ విచారణ మొదలెట్టి ఆసాంతం కొనసాగించడమంటే ఒకరకంగా సాహసంతో కూడిన ప్రయోగంలాంటిదే. ఇలా ఎంతో కాలమూ, ధనమూ వ్యయం చేస్తూ శ్రమతో కూడిన ఈ పనిని నిర్వహించడానికి వెనుక ఒక భావము నాకు ఊతకర్రగా పనిచేస్తూ నడిపిస్తోంది. “ఇది చేయవలసిన పనా కాదా? , అన్నది మాత్రం ఆలోచిద్దాం. చేయవలసిన పనిచేసుకుంటూ పోదాం. ఎందుకొచ్చిన శ్రమ అనుకుని దీనిని విడచినా ఇంతకంటే మంచిపని మాత్రం చేయలేము. కనుక ఏం జరిగితే అది జరగనీ, మన పని మనం చేసుకుంటూ పోదాం. నిజమైన మంచి, పనికి ఏదో ఒక నాటికి తగిన ఫలితం రాకపోదు. అదీ సమాజానికి హితాన్ని కలిగించకపోదు. ఇదీ నన్ను, మిమ్మల్ని నడిపిస్తున్న ఆలోచన. ఈ అంశం వెనుకటి తాత్వికులలో కొందరికైనా తెలియకపోలా. వీరినీ ఈ సందర్భంలో స్మరించడం విజ్ఞత, కృతజ్ఞతా సూచకం కూడా.

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మకరోతియః |

ససన్యాసీచ యోగీచ ననిరగ్నిర్నచా క్రియః ||

 కర్మ ఫలితాన్నాశ్రయించకుండా (ఆశించకుండా కాదు సుమండీ. ఈ రెంటికీ తేడా ఏమో మీరూ ఆలోచించండి. తగిన సందర్భం వచ్చినప్పుడు నేను వివరిస్తాను. సరే) చేయవలసిన పనిని ఎవడైతే చేస్తున్నాడో నిజానికి వాడే యోగీ, సన్యాసీకూడా. కేవలం కర్మ విరమణ, వేషధారణ మాత్రంచేత ఒకడు నిజమైన యోగిగానీ, సన్యాసిగానీ కాలేడు అని శ్లోక భావం. నావరకు నాకు తాత్విక పరంగా ఇదెంతో ఉదాత్తమైన చిత్రణ). కనుకనే సరైన (శుద్ధమైన, శక్తివంతమైన) జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకునే నిజమైన ఆకాంక్ష కలిగిన వారినీ, సరైన జ్ఞానం కలుగకనే ప్రచారకులుగా, మార్గదర్శకులుగా మారి తామూ ఒకరకమైన భ్రమలో ఉంటూ ఎంతో కొంత సమాజాన్ని అపమార్గం పట్టిస్తున్న తరహా వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని, సమ్యక్ జ్ఞానార్జనకు ప్రాతిపదికలై ఆద్యంతమూ ఉపయోగ పడగల ప్రమాణ, పదార్ధ విద్యలను, సమాజానికందచేయాలనే దృష్టితో ఈ బరువు నెత్తుకున్నాము. అయితే సాధారణ జీవనం గడిపే సామాన్యునికి వీటిపట్ల అభినివేశమూ ఉండదు. కావాలని మనం కలిగించనూ లేము. నిజానికి వారికా అక్కర కూడా లేదు. ఇవన్నీ విజ్ఞాని కాదలచుకున్న వారికీ, వైజ్ఞానికాంశాల పరిశోధనలోనూ, పరీక్షలోనూ, ప్రచారంలోనూ పాలు పంచుకోదలచిన వారికీ, మాత్రం అవసరమైన, అత్యంతావశ్యకమైన, ఆద్యంతమూ, ఉపయోగపడగల విషయాలు. నా ఈ రచనలు ఎవరి కొరకు? అన్న ప్రశ్న వేసుకుని, తెలుసు కోవాలనుకుంటున్న, తెలిసిందనుకుంటున్న వారిని ఉద్దేశించేనని గతంలోనే తెలిపి ఉన్నాను.

ఇప్పటివరకు జరిగిన అన్వేషణలన్నింటి వెనుక అన్వేషకులకు, జ్ఞాన సాధకాలుగా 1) సాక్షాదనుభవాలు, 2) హేతుయుక్తాలోచన, 3) వెనుకటి అన్వేషకుల మాటలు, రాతలు ఉంటున్నాయి. అటు ఆస్తిక ప్రతిపాదనలుగాని, ఇటు నాస్తిక ప్రతిపాదనలుగానీ, మరింకే సిద్ధాంత ప్రతిపాదనలుగానీ వీని ద్వారానే గ్రహించడం, ప్రతిపాదించి, నిర్ధారించడం జరుగుతోంది. ప్రస్తుతాంశమైన ద్రవ్యం విషయం లోనూ ఈ మార్గాన్నే అనుసరించవలసి ఉంటుంది. 

  1. ద్రవ్యం ప్రత్యక్ష విషయమా? అప్రత్యక్షమా? అతీంద్రియ విషయమా? అన్నది నిర్ణయించాలంటే ముందుగా ప్రత్యక్ష, పరోక్ష ప్రమాణాల స్వరూప స్వభావాన్నీ, వాటి క్షేత్రాల్ని పరిధుల్ని ఇదమిద్ధంగా నిర్ణయించాల్సి ఉంటుంది.
  2. గుణము - గుణీ అన్న పదార్థాలనూ వివేచించాల్సి ఉంటుంది. 
  3. గుణ ప్రత్యక్షమే గుణి ప్రత్యక్షం అనడానికి వీలయిన సందర్భాలుండే వీలుందో లేదో చూడాలి.
  4. అలాగే గుణ ప్రత్యక్షం గుణి ప్రత్యక్షం కాదు అనడానికి తగిన సందర్భాలున్నాయేమో చూడాలి
  5. A) భౌతిక పదార్థాల ప్రత్యక్షానికీ, భావ పదార్థాల ప్రత్యక్షానికి ఉన్న వ్యత్యాస మేమిటో తెలియాలి.
  1. B) భావ పదార్థాలలో ద్రవ్యాలుండేందుకు వీలుందా లేదా అన్నది తేల్చాలి.
  1. సంయోగ సంబంధానికి, సమవాయి సంబంధానికి ఉన్న తేడా ఏమిటి? ఆ రెండు స్వతంత్ర ద్రవ్యాల మధ్య సమవాయ   

   సంబంధం కుదురుతుందా? కుదరదా?

  1. A) ఆకృతి, పరిమాణము, రంగు, ఉష్ణము మొదలగునవి ఒకదానిలో ఉన్న గుణములుగా వ్యక్తమవుతున్నాయి కదా! ఇవి ఉన్నదాని సహజ గుణములా? ఆగంతుకములా అన్నది నిర్ధారించడ మెలానో తెలియాలి.
  1. B) ఆగంతుకములైన సందర్భంలో ఏ గుణమూ స్వయం సత్తాకం కాదు గనుక మరో ద్రవ్యానికవి సహజ గుణములై    

        యుండాలి. అప్పుడా గుణములు మొదటి ద్రవ్యంలో గోచరించడానికి దానితో మరొక ద్రవ్యం సంయోగ సంబంధంలో 

        వచ్చి చేరిందనాలి.

  1. C) అలాకాక ఈ ఆగంతుక గుణాలు మరో ద్రవ్యం సంయోగ పడకనే ఏర్పడే వీలుందా? సంయోగపడే ఏర్పడతాయంటే అవి 

       రెండో ద్రవ్యానివా? రెండు ద్రవ్యాల కలయిక వల్ల పుట్టిన కొంగ్రొత్త రూపాలా? రెండు రకాలుగానూ సంభవించవచ్చునంటే 

       ఆయా సందర్భాలలో ఏదేదీ ఏయే రకానికి చెందినదో నిర్ధారించడమెలాగో తెల్సుకోవాల్సి ఉంది.

  1. సాధారణ ధర్మం, అసాధారణ ధర్మం అంటే ఏమిటో నిర్ణయించుకోవాలి. సాధారణ ధర్మం ప్రత్యక్షమవడానికీ, అసాధారణ  

         ధర్మం ప్రతక్ష్యమవడానికీ ఉన్న తేడా ఏమిటో నిర్ధారించుకోగలగాలి.

  1. సామాన్యం, విశేషం అన్న వాటి స్వరూప, స్వభావాల్ని నిర్ధారించుకోవాలి.
  2. లక్షణ స్వరూపం ఏమిటో, అది ప్రత్యక్షమవుతుందో కాదో, లక్షణానికీ లక్ష్యానికి ఉన్న సంబంధం ఏమిటో అసలవి రెండునో, ఒక్కటేనో మొదలైన అంశాల్ని నిర్ధారించుకున్నాకనే ఇటువంటి సమస్యలు తేల్తాయి.
  3. రెండు ద్రవ్యాల మధ్య కారణ కార్య సంబంధం కుదురుతుందా? కుదరదా? అదే రెండు వస్తువుల మధ్యనై తేనో? అలాగే గుణ గుణిల మధ్యా అదీ సంభవమవుతుందా ? మొదలైన అంశాలు తేల్చుకోవలసి ఉంటుంది.

 

1-6-1995    

పదార్థ వివేచన-8

అనేక కారణాలవల్ల ఈ శీర్షికను రెండు మూడు నెలలుగా కొనసాగించ లేకపోయాము. ఈ సంచిక నుండి తాత్విక ధోరణులను పరిశీలనకు తీసుకుంటున్నాం గనుక పదార్థ వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. కనుకనే స్థలాభావం ఉన్నా దీనిని కొంతవరకు మీ ముందుంచే యత్నం చేస్తున్నాను.

అసలీ పదార్థ వర్గీకరణ ప్రకృతిలో సహజంగా ఉందా? మనిషి ఏర్పరచు కున్నాడా? అన్నది అర్థం చేసుకుంటే మిగిలిన భాగాన్ని అర్థం చేసుకోవడం సుళువవుతుంది. ఇప్పటి కేర్పడి వున్న పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరికించితే ఈ వర్గీకరణకు తగిన వైవిధ్యం అటు ప్రకృతిలోనే ఉందనీ, అలాగే కొన్నింటిలో ఒకటిగా తీసుకునే అవకాశం (సాధర్మ్యం-సారూప్యత) కూడా విశ్వంలో ఉందని తెలుస్తుంది. అయితే ప్రకృతిలో సిద్ధమైయున్న దానికి మరల మనిషి ఏర్పరచుకోవలసిన అవసరం ఏమిటి? ఆ ఏర్పాటు కూడా అనేకంగా ఎందుకైంది? దీనిలో అసమంజసత ఏమీ లేదనడానికి ఒక దృష్టాంతాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. గ్రంథాలయాల్లో గ్రంథాల పట్టిక తయారు చేయడంలో అనేక వర్గీకరణ పద్ధతుల్ని అనుసరిస్తున్నాం. అన్నీ ప్రయోజనకరమైనవే. రేపు ఇప్పటికి లేని మరో రకమైన వర్గీకరణ వచ్చినా ఆశ్చర్యపడనక్కర లేదు. ఉన్న సమాచారమూ, దానిని గుర్తుంచుకుని, వినియోగించుకోడాని కవసరమైన సరళీకృత విధానము అన్నదే వర్గీకరణకు ఆధారమూ, స్వరూపమూ కూడా. కనుకనే ఉన్నవవే అయినా ఆ ఉన్న వాటిని గమనించిన తీరూ, గుర్తుంచుకున్న తీరూ ఆధారంగా వర్గీకరణలో రకాలేర్పడ్డాయి. వర్గీకరణావశ్యకత మాత్రం నిర్వివాదాంశం. ఏ వర్గీకరణలో అవధారణా వకాశాలూ వినియోగ సౌలభ్యతా అధికంగా ఉంటాయో ఆ వర్గీకరణ ఉత్తమమైన దవుతుంది. అయినా ఉత్తమోత్తమ వర్గీకరణ ఇదే The Best అనడానికి మనవద్ద దాఖలాలేమీలేవు.

సృష్టిలో ఉన్న అనుభవంలోకి వస్తున్న పదార్థాలలో వాస్తవంగా ఉన్న సాధర్మ్య, వైధర్మ్యాలే వర్గీకరణకు వీలు కల్పించాయి. న్యాయ ధర్శనకారుడు-16 పదార్థాలుగా వాటిని విభజించి కలిగిన జ్ఞానాన్నంతా వాటిలో పొందుపరచే యత్నం చేయగా, వైశేషికుడు 6 పదార్థాలు అందునా ముఖ్యంగా మూడు చాలనుకున్నాడు; సాంఖ్యులు 25 తత్వాలుగా వాటిని చూశారు. శంకరుడు నాలుగన్నాడు. అంతా ఒకటిగానే దర్శించవచ్చని అన్నాడు. రామానుజుడు రెండన్నాడు. యిలా ఆయా దార్శనికులు తమ అవగాహననంతా కొన్ని పదార్థాల క్రింద వర్గీకరించుకుని అటు ప్రకృతినీ, ఇటు తమ అవగాహననూ క్రమబద్ధీకరించుకున్నారు. 

ఒక్క విషయం నిక్కవం. ఇలా వర్గీకరణ రూపంలో స్మృతిలో లేనివారి అవగాహనా స్పష్టతకు, ఉన్న వారిలోని స్పష్టతకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. నా అవగాహన నుండి, గతంలోని వారేర్పరచుకున్న వర్గీకరణ పద్ధతుల్ని నేనెంచుకున్న వాటితో సరిపోల్చు కొనుట ద్వారాగానీ పరిష్కృత రూపంగా పదార్థ వర్గీకరణ రీతుల్ని ఇలా అనుకుంటేగాని తత్వావగాహనకు సరళమైన దారి ఏర్పడదన్నది నా అవగాహన.

  1. వరకం: వస్తు, ద్రవ్య, గుణ, క్రియా సంబంధాలన్న 5 రకాలలో విశ్వాన్ని మొత్తాన్ని ఇమిడ్చి చూడవచ్చు. ఇది ప్రధాన పదార్థ వర్గీకరణం అవుతుంది.

మానవ జీవితాన్ని పరిశీలనా క్షేత్రంగా తీసుకుంటే మరో రకమైన వర్గీకరణ అవసరమవుతోంది.

  1. వరకం: అనుభవం ద్వారా కలిగిన జ్ఞానంలో ఉన్నవి. 1) భౌతిక పదార్థాలూ, 2) భావ పదార్థాలునని. ఈ తరహా వర్గీకరణను అర్థం చేసుకోకపోవడం వల్ల మానవికమైన ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడమూ, వివరించడమూ కూడా సాధ్యపడదు. కామక్రోధాదులు, సుఖ శాంతులు, ఆవేశాలు, ఉద్రేకాలు, ప్రేమ, త్యాగాల్లాంటి అనుభవాలనన్నిటినీ ఈ వర్గీకరణ ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం.

  మరొక రకమైన వర్గీకరణా ఉంది. అదీ భాష ద్వారా సంక్రమించిన అనేక పదాలు, వాటి అర్థాలకు సంబంధించినది. ఇవి అనుభవాత్మకాలూ, ఊహాత్మకాలు, కాల్పనికాలు, భ్రాంతాలునని. నాలుగు రకాల అంశాలకు సంబంధించి ఉంటాయి. ఇవన్నీ జ్ఞానంలో భాగాలై మనని నియంత్రించే భావాల రూపంలోనే వుంటాయి. కనుక వీటిని అర్థం చేసికోవడమూ తప్పనిసరే.

 Note: ఈ తరహా వర్గీకరణను గురించిన సమగ్రమైన అవగాహన ఉంటేగాని, దీని విలువెంతో అర్థం కాదు. రేపు మనం చేయబోయే ఆయా సిద్ధాంతాల తాత్విక భాగ విచారణలో ముందుకు సాగడానికి వీలవదు. ప్రతి తాత్విక భాగమూ 1. సమస్యా రూపాన్ని, 2. దానికి కారణాన్నీ, 3. అది తొలగించుకునే విధానాన్ని, 4. అందుకవసరమైన పరికరాలను, 5. సమస్యా పరిష్కారంవల్ల సాధించదగిన సాధ్యాన్ని వివరించి నిర్ధారిస్తాయి. ఈ అయిదు అంశాల పట్ల స్పష్టత, సత్యాసత్య వివేకమూ కలగాలంటే ఈ తరహా పదార్థ వర్గీకరణ అవసరమవుతోంది.

నిష్టురంగా ఉన్నా ఒక్కమాట చెప్పక తప్పదు. నేటి వైజ్ఞానికులు, తమ వైజ్ఞానికాంశాలు తెలుపుతున్న వివరాల నతిక్రమించి నాస్తికులూ, ఆస్తికులూ కూడా ఉన్నారంటే అదెలా సంభవ మైందనుకుంటున్నారు? పైన చెప్పిన వర్గీకరణల సాయంతో వాళ్ళు జ్ఞానార్జన చేసికుని ఉండకపోవడమేనంటాను. ఈనాడు ఆస్తికుల్ని అవహేళన చేసే నాస్తిక మేధావులు మాది వైజ్ఞానిక దృక్పథం అంటూనే అవైజ్ఞానికంగా నాస్తిక్యాన్ని భుజాన వేసుకుని ఊరేగుతుంటారు. అందుకు వారనుసరించు రీతి, చూపించు ఉపపత్తి సమగ్రమైనవా, శాస్త్రీయ స్థాయి కలిగి వున్నవా అన్నది విచారణకు పెట్టకనే మాది శాస్త్రీయ పంథా అనుకుంటూ ఉంటారు.  

శాస్త్రీయ పంథా ఎప్పుడూ మౌలికంగా ప్రమాణ, పదార్థ విద్యల ననుసరించే కొనసాగుతూంటుంది. ఈ పేర్ల తో కాకుంటే మరో పేర్ల తో పిలువబడుతూ ఉండవచ్చునవి. అంతేగాని అవి లేక [లక్షణ ప్రమాణ విద్యననుసరించక] శాస్త్రీయ పంథా అనేదే ఉండదు. నాస్తికులు ఆస్తికులు అనుసరిస్తున్నది వైజ్ఞానిక పంథా కాదనడానికి ఒక ప్రబలమైన ఉపపత్తిని - ఆధారాన్ని - చూపుతాను. సబబు బేసబబులను చూడగల నేర్పుంటే చూడండి.

వైజ్ఞానికులు విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు తమ కెంత తెలుస్తోందో, తెలిసిందో చెపుతాయే గానీ, తమ కేమి తెలియవో వాటిని గురించి చెప్పడం వాటి పరిధిలో ఉండదు. అలాగే ఏమి ఉంది, తెలుస్తూ ఉంది అన్నదే వాటి పరిధిలోని అంశాలుగానీ, ఏమీ లేవు అన్నది చెప్పవలసిన బాధ్యత చెప్పాలన్న దుగ్ధ వాటికి ఉండదు.

 కానీ ఈ ఆస్తిక నాస్తికులు మాత్రం తమకు తెలీని, తెలుసుకుంటానికి నిజంగా వీలులేని అంశాలపట్ల నాకింత తెలుసు? నీకెంత తెలుసు? అంటూ కుమ్ములాడుకుంటూ పడదోసుకుంటూ ప్రక్క వారిని సైతం పడలాగుతుంటారు. ఈ అనవసరపు, అంతూ పొంతూ దొరకని రగడల నుండి బైటపడాలంటే ప్రమాణ, పదార్ధ విద్యలు సమగ్రంగా తెలిసి వినియోగించగల నేర్పుండడమొక్కటే మార్గం. సరే. మరో రకం వర్గీకరణుంది.

3వ వర్గీకరణ: పదాలు, స్వయం సత్తాకాలు, సంబంధ జనితాలుననీ. దానిలో మరల సాపేక్ష సంబంధ జనితాలు, నిరపేక్ష సంబంధ జనితాలునని వున్నాయి. వాటిననుసరించే ఆయా పదార్థాలూ వుంటాయి. 

మననం:

వర్గీకరణ రకాల గురించి ఇంతవరకేమనుకున్నట్లు? పైన విషయాలు మరొక్కసారి పరిశీలించి మీకేమర్ధమయిందో? అందులోని సబబు బేసబబు లేమిటో క్రింది విషయాలు చూడకుండగనే ఒక పేపరుమీద పెట్టండి. ఆ తరువాత ఏమి చెప్పానని నేననుకుంటున్నానో ఆ వివరాలు క్రింద క్లుప్తీకరిస్తున్నాను. దానితో సరి పోల్చుకోండి.

1) ప్రధాన వర్గీకరణ - వస్తు, ద్రవ్య, గుణ, క్రియా, సంబంథాలు.

2) భావ పదార్థాలు - భౌతిక పదార్థాలు.

3) పదార్థాలలోని అనుభవాత్మకాలు, ఊహాత్మకాలు, కాల్పనికాలు, భ్రాంతులు.

4) స్వయం సత్తాకాలు, సంబంధ జనితాలు, సాపేక్షిక-నిరపేక్షిక సంబంధ జనితాలు. 

5) A. పదముంది. పదార్థముంది. దానికే చెందిన అనుభవమూ ఉంది.

  1. పదముంది - అనుభవ రూపంలో పదార్థముంది. 
  2. పదముంది - ఇలాటి పదాలన్నీ భాషా రూపంలో మనకందాయి. 

6) 

ప్రత్యక్ష ప్రమాణగోచర  జన్య పదార్థాలు

అనుమాన ప్రమాణ  జన్య పదార్థాలు

శబ్ద ప్రమాణ  జన్య పదార్థాలు

సత్యము - భ్రాంతి

సత్యము - భ్రాంతి - కాల్పనికం

సత్యము - భ్రాంతి - కాల్పనికం

 

 

 

 

జులై 1995 సంపుటి 15

పదార్థ వివేచన-9

మిత్రులారా! పదార్థ వివేచన పేరున లోగడ అనేక సంచికలలో ఎంతో విషయాన్ని మీ ముందుంచాను. వాటినీ, గత నెల సంచికలోని అంశాలనూ మరొక్క సారి చక్కగా పరిశీలించిన పిదపనే ఈ సంచికలోని విషయాలనూ పరికించండి.  ప్రధాన వర్గీకరణ గుర్తుంది కదూ! వస్తు, ద్రవ్య, గుణ, క్రియా, సంబంధాలని ఐదు అవి. ఇప్పటి మన అవగాహన ననుసరించి ఉన్న ప్రపంచాన్నంతా ఈ అయిదు వర్గాల క్రింద విడగొట్టి అర్థం చేసుకోవచ్చు. జూన్ - సంచికలో వివరించిన రకరకాల వర్గీకరణలు కూడా ఈ ప్రధాన వర్గీకరణకు లోబడే ఉంటాయి. అంటే అవి ఉప వర్గీకరణలన్న మాట. అవగాహనలో గాఢత, స్పష్టత, సౌలభ్యతల కొరకుగాను. ఈ ప్రధాన వర్గీకరణనే ఉప వర్గాలుగా విభజించుకున్నాం. ప్రధాన వర్గీకరణే - తెలియ బడుతున్న అన్నింటినీ తనలో ఇముడ్చుకోగలదంటూనే, ఉప వర్గీకరణలూ ప్రయోజనకారులే అని ఎందుకన్నానో వివరిస్తాను. మీరూ మీమీ అనుభవాలతో సరి చూసుకుని స్పష్టంగా ఒక నిశ్చితాభిప్రాయానికి రండి. 

నిజానికి ప్రధాన వర్గీకరణలోని రెండవదైన “ద్రవ్యం” మాత్రమే స్వతంత్ర పదార్థం. అంటే దాని ఉనికి మరిదేనిపైనా ఆధారపడి లేదు. మిగిలిన నాలుగూ ద్రవ్యాన్నాధారం చేసుకుని మనకున్న జ్ఞానేంద్రియాల ద్వారా వాటి సామర్థ్యము, పరిమితులకు లోబడి తెలియ బడుతున్న ద్రవ్యగత విశేషాంశాలే అవుతున్నాయి. “అంటే ద్రవ్యాన్ని విడచి వస్తువు గానీ, గుణం గానీ, క్రియా , సంబంధాలు గానీ ఉనికి గలిగి ఉండవన్న మాట. ద్రవ్యాలై, ద్రవ్యభాగాలై, ద్రవ్య సహితాలై మాత్రమే మిగిలిన నాలుగూ అస్థిత్వంలో ఉంటాయి.

ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అసలున్న దేమిటి? ఆ వున్న దానిలో ఉన్నవేమిటి? అన్నది గ్రహించాల్సి ఉంది. ఏది స్వతంత్రావరణం కలిగి తానున్న చోటులో తన కన్యమైన దానిని ఉండనివ్వదో అది అసలున్నది. దానిలోనో, దాని వలననో ఉనికిలోకి వచ్చేవన్నీ, అంటే అదే స్థలంలో ఉన్న అనేకంగా గోచరించే వన్నీ దానివీ దానివల్ల ఏర్పడ్డవీ అవుతాయి. Note:-ముందు ముందు మనం విచారించబోయే తాత్విక ధోరణుల పరిశీలనలో ఈ అంశమెంతో ప్రముఖపాత్ర వహిస్తుంది. కనుక దీనిని గుర్తుంచుకోండి.

సామాన్యము - విశేషము

 మనకున్న జ్ఞాన గ్రహణ సామగ్రి, అది పనిచేస్తున్న తీరును బట్టి అసలున్న దానినీ, దానిపై ఆధారపడి తెలుస్తున్న వాటిని నానాగా [అనేకంగా], వేరు వేరుగా గుర్తిస్తున్నాం మనం. ఈ వేరువేరుగా గుర్తించడానికి మన ఇంద్రియాలకు అందుతున్న వాటినే విశేషాలంటున్నాం. ఈ విశేషాల సముదాయాలు ఎదురు పడ్డప్పుడు అంటే ఒకే లక్షణం కలిగినవి ఒకటికంటె ఎక్కువ ఉన్నప్పుడు వాటిన్నింటీనీ కలిపి ఇవన్నీ ఒక్కటే అంటున్నాము. అంటే ఒకే రకానికి చెందినవి అని అంటున్నాం. దీనినే జాతి లేక సామాన్యము అన్న మాటలో చెపుతాము పారిభాషికంగా. మనకు తెలియనచ్చే పదార్థాలన్నీ ఆటు సానూన్యంగానో, ఇటు విశేషం గానో అర్థమవుతూ ఉంటాయి.

Note:-ప్రతి పదార్థానికీ లక్షణముంటుంది. లక్షణమంటే అసాధారణ ధర్మమని అర్థం. ఒకటి ఫలానా అనడానికి దాని ప్రత్యేకతను దాన్ని ఆదిగా దేనివలన గుర్తించుతున్నామో అది, దాని విశేషం లేక లక్షణం లేక అసాధారణ ధర్మం అని అంటాము. అంటే ఏమని చెప్పుకున్నట్లు? దానినదిగా గుర్తింపజేస్తూ అన్యాన్నుండి తనను వేరుపరచుకుంటుందో ఆదిదాని విశేషమని అర్థం. సృష్టిలో ఉండి మనకు తెలియ వచ్చేవన్నీ అటు విశేషరూపంగానో, ఇటు సామాన్య రూపంగానో కూడా తెలుస్తుంటాయి. సృష్టిలో ఆ లక్షణం కలిగింది అదొక్కటే ఉన్నట్లైతే దానికి జాతి ఉండదు ఒకటికంటే ఎక్కువ వున్న వాటికే జాతి అన్న పదం వాడవలసి ఉంటుంది. తెలియ బడుతున్నవి ఒకటి కంటే ఎక్కువ ఉంటేగాని భేదాలన్నవి ఏర్పడవు. ఈ భేదాలు సజాతీయ, విజాతీయ, స్వగతములని మూడుగా వెనుకటి వాళ్ళు ప్రస్తావించారు. అవెలానంటే...

జాతీయ.విజాతీయ.స్వగత భేదాలు

1) సజాతి భేదం:- భేదం అన్నామంటేనే ఒకటికంటే ఎక్కువను అంగీకరిస్తున్నా మన్నమాట. ఈ భేదాలున్నూ పై ప్రధాన వర్గీకరణ ననుసరించే ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. అంటే ద్రవ్య, వస్తు, గుణ, క్రియా, సంబంధాల లోనే ఈ భేదాలుంటాయి. అందులో ఒకటికంటె ఎక్కువుండి ఒకేలక్షణం కలిగినవై యున్న వాటిని సజాతులనుకున్నాం కదా! ఈ జాతుల్లో భేదమేమిటి అంటే ప్రధానంగా సంఖ్యాపరంగానూ, స్థలాన్ని బట్టి ఈ భేదం ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ అనడానికి వేరు వేరు లక్షణాలు కలిగుండడంమో, వేరు వేరు స్థలాల్లో ఉండటమో కారణమవుతుంది. లక్షణ సారూప్యములై బహు సంఖ్యాకములైన వాటి మధ్యనున్న భేదాన్నే సజాతీయ భేదమంటా మన్నమాట.

2) విజాతీయ భేదం:- ఒకటికంటే ఎక్కువై యుండి, లక్షణంలో తేడా ఉన్న అనేకం మధ్యనున్న భేదాన్ని విజాతీయ భేదమంటాము. Note:-సృష్టిలో రెండు వేరువేరైన పదార్థాలున్నా యనుకుందాం. ఆట్టివి ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయనుకుంటే వాటికి జాతి అనేది ఉండదు. ఆ రెండూ వేటికవి విశేషాలేనన్నది గుర్తుంచుకోవలసిన విషయం. అయితే ఒక మనిషిగా మనం ఏ ఒక్క దాన్ని చూసినా ఇట్టిది సృష్టిలో మరొకటి లేదు అని ప్రత్యక్ష ప్రమాణాన్ని బట్టి నిర్ధారించలేము. అంటే తెలిసి దీనికి జాతిలేదు అని చెప్పడం పొసగదన్నమాట. అయినా ఆ లక్షణం కలిగింది. అదొక్కటే ఉండే అవకాశాన్ని కాదనలేము. ఈ రెండంశాలూ గుర్తులో ఉంచుకోండి.

3) స్వగత భేదం:-ఒక స్థలంలో ఉన్న కొన్నింటినీ కలిపి ఒకటిగా చెప్పుకుంటున్నపుడు, గుర్తిస్తున్నప్పుడు ఆ ఒకటిలోని అనేకం మధ్యనున్న భేదాన్ని స్వగత భేదం అంటాము. ఒకటిలో ఉన్న అనేకం మధ్య ఉండే భేదమన్నమాట. నిజానికి ఆ ఒకటి అనుకునే దానిలో నున్న అనేకంలో ఉండేవీ మళ్ళా అట్టివి, అట్టివికానివి అంటూ సజాతి-విజాతి భేదాలే.

Note:-1) మొత్తంమ్మీద ఏమనుకున్నట్లు? సృష్టిలో ఉన్న అనేకమంతా అట్టివి, అట్టివికానివి అంటూ రెండు రకాలుగానే ఉంటాయి. అంటే నిజానికున్నది సజాతీయ-విజాతీయములని రెండు భేదాలేనన్నమాట.

2) స్వగత భేదాలు ప్రధాన వర్గీకరణ పరంగా ఎన్ని రకాలుగా ఉండే వీలుందో ఆలోచించి స్పందనకు వ్రాయండి. మీ లేఖ ఈ అంశాలు మీకెంతగా బోధపడ్డాయో తెలియజేస్తుంది నాకు.

సామాన్యము-విశేషము అన్న పదాల అర్థం అర్థమైందనుకుంటాను. మరో రకమైన పదజాలంతోనూ వీటిని సంభోదించవచ్చు. పదార్థాలన్నింటినీ సాధర్మ్య వైధర్మ్య రూపాలుగా అర్థం చేసుకునే వీలుంది. అంటే ఏమనుకున్నట్లు? వస్తుగతంగా ఉన్న సాధర్మ్య, వైధర్మ్యాలాధారంగా సామాన్య, విశేషాలను భావించుకుని ఆ భావాలాధారంగా వస్తు ద్రవ్య గుణ క్రియా సంబంధాలలో సజాతీయ, విజాతీయ భేదాలను ఏర్పరచుకుంటున్నామన్నమాట.

Note:-1) సాధర్మ్య వైధర్మ్యాలకు 2) సజాతి-విజాతులకు ఉన్న తేడాపాడాలేమిటో గమనించండి. అలాగే ఉప వర్గీకరణలలో “భావ పదార్థాలు, భౌతిక పదార్థాలు” అన్న వర్గాన్ననుసరించి పై రెండూ ఏయే వర్గాల క్రిందకు వస్తాయో గుర్తించండి. 

కార్య కారణాలు

 భిన్న తాత్విక ధోరణులలోని వైరుధ్యాలకు, వైవిధ్యానికి కార్యకారణాల గురించి వారివారికున్న అభిప్రాయూలే ప్రధాన భూమికను వహిస్తున్నాయన్నదీ గమనిస్తేగాని ఈ రెంటిని గురించి క్షుణ్ణంగా విచారించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతుందో అవగతం కాదు. బుర్రకెక్కదు. ఇక్కడ కప్పదాటు వేశామా ఆపై చేసే విచారణలో దాదాపు నేలవిడచిన సామే.

ఈ కార్యకారణాలు కూడా ప్రధాన పదార్థ వర్గీకరణకు సంబంధించినవిగానే ఉంటాయి. ముందు గమనించవలసిందేమంటే ఆ అయిదు వర్గాలలో కార్యకారణాలన్న పదార్థాలు ఏ వర్గం క్రిందికి వస్తాయో తేల్చుకుని ఉండడం. పిదప ఉప వర్గీకరణైన భౌతిక-భావపదార్థాలలో వేటి క్రిందికి వస్తాయన్నదీ తెలుసుకుని ఉండాలి. ఈ అవగాహనా నేపథ్యంలోనే మనం ప్రపంచాన్ని-దానిలోని కార్యకారణ రూపభాగాన్ని అర్థం చేసుకోగలం.

నా అవగాహన నుండి కార్యకారణాలు ప్రధాన వర్గీకరణలోని సంబంధ వర్గం క్రిందనూ, రెండవ వర్గీకరణలో భావపదార్ధాల కోవకూ  చెందుతాయి. మిత్రులారా! ఇక్కడ ఆగండి. మరొక్కసారి పై విషయాన్ని పరికించండి. మీ అనుభవాలాధారంగా విచారించండి. ఈ నా పక్షం తప్పో, ఒప్పో ఒక నిర్ధారణకు రండి. స్పందనను వ్రాయండి.

పై దృష్టి ననుసరిస్తే సంబంధాలన్నవి ఎట్టివైనా అనేకం మధ్యలో ఏర్పడుతుంటాయి కనుకనూ, మిగిలి ఉన్న వర్గాలు వస్తు ద్రవ్య గుణ క్రియలే కనుకనూ ఈ కార్యకారణ సంబంధాలున్నూ వస్తు పరంగానూ అలాగే ద్రవ్య గుణ క్రియల పరంగానూ మాత్రమే ఉంటాయి. అంటే కార్య వస్తువులు-కారణ వస్తువులు, కార్య ద్రవ్యములు, కారణ ద్రవ్యముల వలెనన్నమాట.

ఈ కార్య కారణ రూపాలు గురించి ప్రధానంగా రెండురకాల వాదనలున్నాయి. 1) కారణం నశించి కార్యమేర్పడడం. 2) కారణం నశించకనే కార్యలక్షణం ఏర్పడడం. ఈ రెండు పక్షాలలో ఏది వాస్తవాని కనుగుణ్యంగా ఉందనేది ఆయా సంఘటనలను పరీక్షించుట ద్వారా మాత్రమే నిర్ణయించడానికి వీలవుతుంది. ఆ పరీక్షకు ముందుగా కార్యమంటే ఏమిటో కారణ మంటే ఏమిటో నిర్వచించాల్సి ఉంటుంది. అంటే కార్యకారణ స్వరూపాన్ని నిర్ణయించి లక్షణ నిర్దేశం చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ కార్యకారణ భావానికి లోబడి ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సరైన దారి ఏర్పడుతుంది. ఈ పునాది లేకుండా కార్యకారణాలపై జరిపే సంభాషణలన్నీ రగడ లేగాని తాత్విక గోష్టులు కాజాలవు. క్రింది వాక్యార్థాలను గమనించండి.

1) ఉన్నది పోయి లేనిదొచ్చింది. (దీనిని ఆసత్కార్యవాద మంటారు. ఆరంభవాదమనీ దీనికి మరో పేరుంది.)

2) ఉన్నదలానే ఉండి లేనిదీ వచ్చింది.

3) లేనిది రావడం కుదరదు గనుక ఉన్న దానిలోనే వచ్చింది; అవ్యక్తంగా ఉండి వ్యక్త రూపాన్ని పొందింది. అంటే ఉన్నదలానే ఉంటే ఉన్న దానిలో ఉన్నదే వ్యక్త రూపానికొచ్చింది. (దీనిని సత్కార్య వాదమంటారు. ఉన్నది పోదు లేనిదీ రాదు అన్న నియమాన్ని అంగీకరించిన వాళ్ళు వీరు).

4) ఉన్నదీపోలేదు, లేనిదీ రాలేదు. చూసేందుకు నీకున్న పరికరాలు-విధానము అన్న వాటి పరిమితులకు లోబడి ఒకటి పోయి మరొకటి వచ్చినట్లు తోస్తోంది (అనిపిస్తోంది). ఉన్నదున్నట్లే ఉంది. అన్యమేదీ లేదు. అన్న ధోరణొకటి తాత్విక స్థాయిలో ఉంది. దీనిని వివర్త వాద మంటారు. శంకరుడు ఈవాదాన్ని స్వీకరించే తన తత్వాన్ని స్థాపించే యత్నం చేశాడు.

Note: ఈ మూడు పక్షాలూ ఆయా తాత్విక స్వరూప నిర్మాణంలో ఎంతటి ప్రధాన భూమికను వహించాయంటే ముఖ్యంగా ఈ దేశంలోని ప్రధాన మతాలైన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతాలు మూడున్ను ఈ పై విషయాలలోని అభిప్రాయ భేదాల ననుసరించే ఏర్పడ్డాయి. శంకరుడు వివర్తాన్నంగీకరించాడు గానీ పరిణామాన్ని అంగీకరించలేదు. మిగిలిన ఇరువురూ ప్రకృతి పరిణామాన్ని అంగీకరించారు. అయితే ఈ పరిణామాన్నంగీకరించిన వారిలోనూ రెండు ధోరణుల వారున్నారు.

1) పీలుపాక వాదులు:వీరు మార్పు (పరిణామం) అణువుల స్థాయిలోనే ఏర్పడి కార్యం పుడుతుందంటారు.

2) పిఠరపాక వాదులు: వీరు అణువుల స్థాయిలో మార్పుండదు. ఆపై ఏర్పడి ఉన్న ద్రవ్యాలలోనే మార్పు ఉంటుంది అంటారు.

Note: ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే పాకము-పాకజము అన్న రెండు మాటల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాకమంటే ఉష్ణ సంయోగమని. పాకజ మంటే ఉష్ణసంయోగము వలన పుట్టినది అని అర్థం. ఈ ఉష్ణ సంయోగం వలన మార్పు అవయవిలో ఏర్పడుతుందని పిఠరపాక వాదులనగా, అవయవాలలోనని పీలుపాక వాదులంటారు.

ఈ కార్య కారణాన్ని గురించి వెనుకటి వాళ్ళవన్నీ కాలం చెల్లిన అభిప్రాయాలు. మేమిప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రావిష్కరణలాధారంగా వీటిని గురించి మరింత సరైన అవగాహన కలిగి ఉన్నామంటున్నారు హేతువాదులం, హేతు మానవవాదులం, భౌతిక వాస్తవిక వాదులం, నాస్తికవాదులం, గతితార్కిక వాదులం అని తమను గురించి చెప్పుకుంటున్న వాళ్ళు. వీరిలో నేనెరిగినంతలో కార్యకారణాలను గురించిన అనగాహన ఇలా ఉంది.

సృష్టి అంతా అనాద్యనంతమైన, అవిరతమైన సంఘటనల మయం. ఈ జగత్తంతా స్వభావతః పరిణామశీలమైనది. ఈ పరిణామానికి బాహ్య కారణాలంటూ ఏవీలేవు. మార్పు చెందే లక్షణం పదార్ధంలోనే ఉంది. అది నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. ఉంటుంది. అవన్నీ సంఘటనల రూపంలోనే ఏర్పడుతుంటాయి. అన్న మూలభావంనుండే వీరి కార్యకారణ భావాలు నిలచి ఉన్నాయి. ముందు సంఘటన కారణం కాగా వెనుక సంఘటన కార్యము అన్న ఒక బండగుర్తు వేసుకుంటే చాలు. కార్యకారణాల గురించి ఇంతకు మించి నిర్వచించుకోవలసిందేమీ లేదు అని ఈ మధ్య గుంటూరులో జరిగిన రాష్ట్రహేతువాద అధ్యయన తరగతుల్లో వెంకటాద్రిగారు ఆ అంశంపై ముగింపు వాక్యంగా నిర్ధారించారు. ఆనాటి సదస్సులో ఉన్న ప్రముఖులందరూ దానినే సమర్థించారు. ఆ సందర్భంలో మామధ్య నడచిన సంభాషణను ఇక్కడ ప్రస్తావిస్తే కార్య కారణాల పట్ల వారిన్న దృష్టినీ, దాని బలాబలాలనూ విచారించుకునేందుకు వీలవుతుంది.

1) సురేంద్ర: ముందు సంఘటన కారణము, తరువాతి సంఘటన కార్యము అన్నారు గదా! బట్టకు నూలు కార్యమా కారణమా? హేతువాదులు : కారణమే.

సు: నూలుకు కారణం పత్తి అనొచ్చా?

హే: అనవచ్చు.

సు: మరైతే పత్తికి కారణం నూలుగానీ, నూలుకు కారణం వస్త్రంగానీ కాగలవా?

హే: కాగలవు. కార్య కారణాలనేవి పరస్పరం వెనుకకు ముందుకు కూడా నడుస్తాయి. ఎలాగంటే బట్టను విడదీస్తే నూలు వస్తోంది, నూలును విడదీస్తే పత్తి వస్తోంది కనుక. బట్ట ముందు దశ, నూలు తరువాతి దశ. నూలు ముందు సంఘటన నూలును పీకితే ఏర్పడే పత్తి తరువాతి సంఘటన కనుక పత్తికి నూలు, నూలుకు వస్త్రము కూడా కారణాలవుతాయి.

2) హే: కార్య కారణాలు చక్ర భ్రమణ న్యాయాన్ని కూడా అనుసరిస్తాయి. ఎలాగంటే నీరును తీసుకోండి. నీరు ఆవిరైందనుకోండి. నీటి ఆవిరికి కారణం నీరు, నీరు మంచు అయిందనుకోండి మంచుకు కారణం నీరు. అలాగే మంచు నీరై, నీరు ఆవిరై-ఆవిరి మంచై ఇలా అవి పరస్పరం కార్యాలు, కారణాలు కూడా.

సు : అయ్యా కార్యం అదేదైనా గానీండి తన కారణానికి కారణం కాగలుగుతుందా?

హే : బేషుగ్గా అవుతుంది. అదేగదా మేము పైన వివరించింది. అర్ధం కాలేదా?

సు: అయ్యీ అవనట్లుగా ఉంది. పొసగనట్లూ ఉంది. కనుక దీనిని విచారించి నిగ్గు తేల్చాలంటే ముందుగా కారణమంటే ఏమిటో, కార్యమంటే ఏమిటో నిర్వచించాల్సి ఉంటుంది. 

Note: ఈమాట నేనా సదస్సులో పదేపదే అనగా పదాలు - వాటికి నిర్వచనాలు చెప్పుకోడాలు చాలా వెనుకటి కాలం నాటి బాట. మేమీ నాడు ఆ పదాల, నిర్వచనాల స్థాయిని దాటి చాలా దూరం వచ్చేశాం. ఈనాడు మన అవగాహనకు నిర్వచనాలతోగాని పదాల వాదాలతో గాని పనిలేదని వెంకటాద్రిగారన్నారు. ఆవునంతే నన్నట్లు ప్రవర్తించారు దాదాపు అందరూ. P.S.R. అన్నాయనైతే అసలీ నిర్వచనాల గొడవేమిటండీ! అంటూ అదొక తెలివితక్కువ వ్యవహారం అన్న దుందుడుకుతనాన్నీ కనబరిచారు. నేనొక పదం చెపుతాను నిర్వచించండి చుద్దాం అంటూ ఒక సవాలుసూ విసిరారు. ఆ పదం ‘వివాహం’ అన్నదే. వివాహం అన్నదానికి నిర్వచనం ఉండదని, లేదని కాబోలు ఆ సాహితీవేత్త అభిప్రాయం. వారి భాషా వైదుష్యం ఎంతో నాకు తెలియదు గాని ఆ విషయంలో నాకు నేనేసాటి అనేట్లు ప్రసంగించారానాడు. సంభాషణ అసలు విషయాన్ని విడచి ప్రక్కదారి పట్టిందనీ, పట్టించారనీ గమనించి అయ్యా ప్రతిపదానికి ఉంటుందా ఉండదా నిర్వచనం అనేది తర్వాత పరిశీలించుకోవచ్చుగాని, తాత్వికాంశాలను నిర్ధారించే సందర్భంలో ప్రయోగించే పదాలకు మాత్రం నిర్వచనాలుండక తప్పదు. కనుక కార్యకారణ పదార్థాలను నిర్వచించాలని చెప్పాను. అదిగో, ఆ సందర్భంలోనే వెంకటాద్రిగారు లేచి దీనికింత గొడవక్కర్లా. పూర్వ సంఘటన కారణము, ఉత్తర సంఘటనకార్యము. కార్య కారణాలకు ఇంతకంటే లోతైన అర్థమేమీ లేదు అన్నారు. ఆ మాట వింటునే ఒక ప్రశ్న వేశాను.

సు: ఒక సైకిలుందనుకోండి, అది కొన్ని విడిభాగాలను ఒక క్రమంలో కూర్చడం ద్వారా ఏర్పడుతుంది. అవి సైకిలు అన్న సంఘటన ఏర్పడడానికి పూర్వమే ఉంటాయి. కనుక అవి సైకిలుకు కారణాలవుతాయి. మరైతే ఆ సైకిలు నుండి ఒక భాగాన్ని వేరుచేశామనుకోండి. ఆ పార్టుకు సైకిలు కారణం అనవచ్చా?

హే : భేషుగ్గా అనవచ్చు. విడిభాగాలు సైకిలుకు కారణమూ, సైకిలు ఆ విడి భాగాలకు కారణమూ కాగలదు.

Note: ఈ సందర్భంలో వెంకటాద్రి గారైతే ఎంతో స్థాయీ భావం కల చర్చనీయాంశాలను విచారించే సందర్భంలో ఈ సైకిలు, సైకిలు వూచలు, కుండలు, మట్టిసుద్దలు ఏమిటండీ, అంటూకించిద్ వ్యంగ్యంగాను మాట్లాడారు. పైగా ఇంత కంటే ఈ కార్యకారణ పదాలను పట్టుకుని వాదులాడవలసిన పని లేదనడంతో అప్పటికా ప్రస్తావన ఆగింది.

ఇక్కడొక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంది. అసలింతకూ కార్య కారణాలనేవి భౌతిక పదార్ధాలా? భావ పదార్ధాలా? బైట ప్రపంచంలో వస్తు ద్రవ్య గుణ క్రియలూ, వాటి మధ్య సంబంధాలూ ఉన్నాయి. వాటిలో వేటికి వాటికి వాటి వాటి పేర్లుంటాయి. కానీ దీనికి కారణమని గాని, కార్యమని గానీ పేరుండదు. ఎందుకని? అవి వస్తుతః ఉన్నవి గాక, ఉన్న వాటిలోని ఒకరకమైన సంబంధాన్ని ఆదీ సాపేక్ష సంబంధాన్ని గమనించి ఏర్పరచుకున్న భావ రూపాలు. కనుక వాస్తవంగా ఉన్న దానిని చూపి ఇది కారణమని గానీ, కార్యమని గానీ నిర్ధారించడం కుదరదు. మరొక దానిని చూపి దానికిది కారణమా, కార్యమా? అన్నప్పుడు మాత్రమే దానికది కారణమో, కార్యమో, ఏదీ కాకుంటే ఏదీకాదనో గమనిస్తాము, చెపుతాము.

ఉదా : ఒక విత్తుందనుకోండి. అదీ కార్యమా, కారణమా అనడిగితే దేనికి అన్న వివరం తెలియనంత కాలం అది కార్యమని గాని, కారణమని గాని చెప్ప జాలము. ఆది ఒకదానికి కారణం కావచ్చు, మరొకదాని కార్యమూ కావచ్చు గనుక. ఆ వవరమందనప్పుడు చెప్పలేమనో? అదీ కావచ్చు, ఇది కావచ్చుననో అనాలి తప్ప ఆది కార్యమూ, కారణమూ కూడా అని చెప్పరాదు. ఎందుకని? కార్యమూ, కారణము అన్నమాటలు విరుద్ధార్థములు కలవి. కార్యం కారణం కాదు. కారణం కార్యం కాదు. ఒక్క మాట చెప్పి కార్యకారణాల పై నాఅవగాహనను మీముందుంచుతాను. హేతువాదోద్యమ రథ సారధుల్లో ఒకరైన వీరన్నగారు ఈ కార్య కారణాలకు నిర్వచనాలంటూ ఏమీలేవు అన్నారు. కానీ నిజానికి ఆయా వైజ్ఞానిక క్షేత్రాలందు ఉపయోగించే పారిభాషిక పదాలకు నిర్వచనాలుండక పోవడం అన్నమాటే పొసగదు. పారిభాషిక పదాలన్నింటికీ నిర్వచనాలుంటాయి.

సరే అసలు విషయాని కొద్దాం. ప్రపంచాన్ని గమనిస్తున్న మనిషికి అందులోనివి ఉన్నదున్నట్లుండక పోవడమూ, మార్పుకు లోనై మరొకటిగా తయారవడమూ గోచరించింది. ఆ వచ్చిందాన్ని కార్యమన్నాడు. కార్యమంటే ఏర్పడ్డది. [తయారైందీ, తయారు చేయబడింది) అనే అర్థం. ఈ మార్పులను అనేకాంశాలలో గమనించాడు. వాటన్నిటా ఒక సాధారణ నియమాన్ని గుర్తించాడు. అదేమంటే ప్రతి కార్యానికీ ఉత్పత్తిమత్వం అవశ్యం అని. అంటే కార్యం అనగానే అది పుట్టిందై ఉండాలి. అలాగే కొన్నింటి క్రమ మార్పుతో అది తయారై ఉండాలి. ఉంటుంది. స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి పరిమితి కలదై ఉండాలి అని. ఈ అవగాహనను ఆధారం చేసుకుని కార్యమన్న మాటకు అన్ని సందర్భాలలోనూ సరిపోయే అర్థం చెప్పుకున్నాడు. దానినే కార్య పదార్ధ లక్షణం అంటాము. క్రింది వాక్యాలను గమనించండి. 

  1. సావయవత్వం పరిమితత్వం కార్యస్య లక్షణం. 
  2. ఉత్పత్తిమత్వం వినాశిత్వం
  3. ప్రాగభావ ప్రతియోగిత్వం కార్యత్వం (కార్యం ప్రాగభావ ప్రతియోగి)

ఈ మూడు సూత్రాల భావాన్ని తెలుగులో యిలా చెప్పుకోవచ్చు. కార్య మనగా కారణ పదార్ధాల కొన్నింటి కూర్పు వల్ల ఏర్పడ్డదీ (పుట్టింది). ఈ పుట్టడం జడ నిమిత్తం వలన, చేతన నిమిత్తం వలన అని రెండు విధాలుగా జరుగుతుంది.

జడనిమిత్తం వల్ల జన్మించిన దాన్ని తయారైందీ అంటాము. చేతన నిమిత్తం వల్ల ఉత్పత్తైతే తయారు చేయబడింది అని అంటాము. వేటివల్ల అయితే నేమి ఏర్పడడం కార్య సామాన్య లక్షణం.

 కారణ సామాన్య లక్షణం : కార్యోత్పత్తికి పూర్వం ఉండి, కార్యోత్పత్తి పర్యంతం జరిగే పక్రియలో పాలుపంచుకునేది.

ఇది రెండు రకాలు: 1. కార్యోత్పత్తికి పూర్వం ఉండి, కార్యోత్పత్తి అనంతరం కార్య రూపంలోనూ, కార్యంలోనూ, కార్యంగానూ ఉండేది. దీనిని ఉపాదాన కారణము లేక సమవాయి కారణము అంటారు.

2) కార్యోత్పత్తికి పూర్వముండి, కార్యోత్పత్తిలో పాలుపంచుకుని, కార్యోత్పత్తి అనంతరం కార్యంలో ఉండాలన్న నియమం లేనిది. దీనిని నిమిత్త కారణం లేక బాహ్యకారణం అంటారు.

 Note: ఈ కార్య కారణ వ్యవస్థ వెనుకటి వాళ్ళలో రెండురకాలుగా ఉంది.

1) ఉపాదానము, నిమిత్తము, సహకారి కారణాలు వాటి వల్ల తయారైన ఏర్పడిన ఫలరూపం కార్యము.

2) సమవాయి, అసమవాయి, నిమిత్త కారణాలు, వాటి వల్ల ఏర్పడిన ఫల రూపమైన కార్యమూనని.

మిత్రులారా! ఇంతవరకు నిదానంగా మరల మరల పరిశీలించి విషయాన్ని అర్ధం చేసుకోండి ముందు. పిదప అర్థమైన అంశాలను అనుభవాలతో సరిపోల్చుకుని సబబు బేసబబులను నిర్ణయించండి. ఈ కార్యకారణ పదార్థ విచారణ ఎంతో సూక్ష్మమైంది కనుక మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ మననం చేసుకుంటూ నిదానంగా కొనసాగించడం ఉచితం. కొన్ని వాక్యాలు వ్రాస్తాను. పరిశీలించండి. 

  1. కార్యం ఎన్ని రకాలుగా ఏర్పడే వీలుంది. క్లూ : ఎన్ని రకాలుగా ఏర్పడ్డా ప్రతికార్యమూ అనేకం యొక్క కూడిక, కూర్పుల వల్లనే ఏర్పడుతుంది. ఉ: అనేక ద్రవ్యాల సంయోగంవల్ల కార్య ద్రవ్యం ఏర్పడుతుంది. 
  2. కారణం నశించే కార్యం పుడుతుంది.
  3. కారణం నశిస్తే కార్యమూ నశిస్తుంది. 
  4. కార్యం ఉత్పత్తికి పూర్వమే తన కారణంలో అవ్యక్తంగా ఉంది. 
  5. కారణంలో కార్యం ఉండదు. కారణాలకు కార్యాన్ని ఉత్పత్తి చేయగల యోగ్యత (సామర్థ్యం) ఉంటుంది.
  6. ఉన్న దానిలో మార్పును (పరిణామాన్ని) అంగీకరించక కార్య కారణ వాదం పొసగుతుందా?
  7. వివర్తవాద మంటే ఏమిటో అర్థమైందా? అయితే వివర్తం రైటైతే కార్య కారణ వాదం తప్పవుతోందా లేదా?
  8. ఉన్న కారణ ద్రవ్యాలలో మార్పు రాకుండగనే సంఘాతంవల్ల కొత్త లక్షణం గోచరిస్తుంటే దానినేమనాలి? అక్కడ మార్పును ఎక్కడ చూపిస్తారు. అట్టిచోట పరిణామం జరిగిందనడం కుదురుతుందా? కుదరదా?

ప్రస్తుతానికింత వరకు పరిశీలించండి. మీ మీ ఆవగాహనలను స్పందనకు వ్రాయండి. వీటి విషయాలలో మీకున్న అవగాహనా స్థాయి లోని బలాబలాలే ఆపై మనం జరుపబోయే సత్యనిర్ధారణ యత్నంలో ప్రధాన (నిర్ణాయక) పాత్ర వహిస్తాయి. ఇక్కడ బలహీనపడితే అక్కడ చేసే నిర్ణయాలు వాస్తవాలకు దూరంగా ఉండి అసత్యాలవుతాయి. ప్రస్తుతానికి ఆగుతాను. మరిన్ని వివరాలతో పై సంచికలో కలుద్దాం.

 

పదార్థ వివేచన-10

జూలై సమాలోచనలోనూ పదార్థ విచారణ కొంత జరిగింది గనుక ఆ భాగాన్ని కలిపి వివరిస్తానిప్పుడు.గతం స్మరించి కొనసాగించండిక. ఎక్కుడున్నా మిప్పటికి? ద్రవ్యాన్ని గురించి కొంత ఆధారం అందించాను. సామాన్య విశేషములతో పదార్థాలను వివరించాను. (ఎదుటి వారి లేక, మనచే ప్రతిపాదించిన అభిప్రాయాలను పరీక్షించడానికి అత్యంతావశ్యకమైన త్రిదోషాలను గురించీ గతంలో వివరించాను. మరొకసారి వాటినీ చెప్పుకోవాల్సి ఉంది). సృష్టిలో ఉన్న రకరకాలను అర్థం చేసుకోడానికి భేదాలెన్ని రకాలన్నది అర్థమైయుండాలి. వాటిని పారిభాషికంగా సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలంటారు. వాటినీ జూలై సంచికలో అనుకున్నాం. అత్యంత ప్రధానమైన కార్య కారణాలను గురించి కొంతవరకు అనుకున్నాం.

ప్రమాణం

వ్యవహారంలో ఈ మాటకు రెండు మూడు రకాల అర్థాలున్నాయి. న్యాయ స్థానాల్లో ప్రమాణం చేసి చెపుతున్నాను అంటూ వ్యక్తులంటూంటారు. వారు దేనిని విలువైనది, పవిత్రమైనదిగా ఎంచుతున్నారో దానిని అడ్డుపెట్టి సత్యమే చెప్పించేందుకు ఎంచుకున్న విధానంలో మనిషిని అదుపు చేసేది అనే అర్థంలో ప్రమాణ ప్రయోగం జరుగుతోంది. మరొక అర్థంలో ఆయా విశ్వాస పూర్వక ప్రతిపాదనల్లో నీమాటకేదీ ప్రమాణం అన్నప్పుడు, ఆయా ధోరణుల విశ్వాసులు చూపించు గ్రంథాలు ప్రమాణం అన్న దానికి సంబంధించిన అర్థం వస్తోంది. 

అయితే ప్రస్తుత ప్రకరణంలో, తాత్విక, తార్కిక పారిభాషిక పదంగా ఈ మాటను ప్రయోగించేటప్పుడు ప్రమాణమన్న మాటకు జ్ఞానం కలగటానికి ఏది సాధకంగా ఉంటుందో-జ్ఞాన సాధకం ఏదో-అదీ అని అర్థం చెప్పుకోవాలి. “ప్రమాకరణం ప్రమాణం” అని సంస్కృతంలో అంటారు. Means of knowledge అని దానర్థం. ఏయే పరికరాలద్వారా, ఏయే పద్ధతిలో జ్ఞానం కలుగుతుందో అవి ప్రమాణాలు అని అర్ధం. వాడుకలో జ్ఞానేంద్రియాలన్నమాట. మీకర్థమవుతోంది కదా! వాటినే ప్రత్యక్ష ప్రమాణాలు, నేరుగా కలిగే జ్ఞానానికి సాధకాలు అని అంటారు. విషయం అర్థమవుతోంది కదా! పరికరాల పరంగా ప్రత్యక్ష ప్రమాణంకాగా, విధానాలు ప్రధానంగా పరోక్ష ప్రమాణాలుంటాయి. అవి అనేకంగా చెప్పబడ్డా ప్రసిద్ధంగా ఆమోదింపబడ్డవి రెండు. అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణమునని. మొత్తంమీద ప్రత్యక్షానుమాన శబ్దములని అందరూ అంగీకరించిన, అంగీకరించక తప్పని, జ్ఞానార్జనకు పనికి వచ్చే ప్రకారాలు మూడన్నమాట. మిత్రులారా! వీటి విషయంలో లోకంలో ఉన్న తరతమ భేదాల గురించి సమాచారం సేకరించండి. ప్రమాణ శాస్త్రాల ద్వారా, ప్రమాణముల ద్వారా అవగాహన పెంచుకుని మీ మీ అనుభవాలతో సరిచూసుకోండి. Note: ఆ కొరత కూడా మీరే చెప్పొచ్చుగా అనొచ్చు మీరు. అవును, చెప్పవచ్చు. కానీ మీలో తెలుసుకోవాలన్న ఇచ్ఛ, ఉత్సుకత స్థాయి నుండి జిజ్ఞాసా స్థాయికి పెరిగి బలపడి ఉందో, లేదో, తెలిసేదెలా? కనుక ఆ పని మీ అభిలాష మేరకు ఎవరికి వారుగా, మీరే చేయడం ఉచితం. వివేకం కూడా.

ఈ సందర్భంలో “జాతుం ఇచ్ఛ జిజ్ఞాస” అంటూ పెంచలయ్యగారు ఇచ్ఛ అన్న దానికి వెనుకటి వాళ్ళు చెప్పిన అర్థాన్ని “అవగతిపర్యంతం ఉండే ఆకాంక్ష” అంటూ వివరించారు. అవగతి పర్యంతం అనగా తెలియాలనుకున్నది పూర్తిగా తెలిసేంత వరకు అని అర్థం. వెనుకటి వాళ్ళంతా అజ్ఞానులు, అనాగరికులు, వారి జ్ఞానం మన అవగాహనతో పోలిస్తే outdated అనే వాళ్ళ అవజ్ఞతనూ, విపర్యయ దురాగ్రహాన్ని చూసి జాలిపడతాను నావరకు నేను. ఎందుకంటే తత్వశాస్త్రాధ్యయనానికి పూర్వరంగంగా ఉండగల అంశాల పట్ల వీరికున్న జ్ఞానం లవలేశం మాత్రమే.పెద్దగా తెలియకనే ఎంతో తెలుసుననుకునే వీరి గురించి ఇంకా ఒకటి రెండు మాటలు చెప్పుకోవడం తప్పుకాదు గానీ అసలు విషయం ఆగుతుందన్న ఆలోచనతో దీనినిక్కడ కాపుతున్నాను. అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలూ మీ ముందుంచుతాను పరిశీలనకు.

ప్రమేయము: ప్రమాణాల ద్వారా అంటే జ్ఞాన సాధకాల ద్వారా [తెలిసికోడానికి మనిషికున్న వనరుల ద్వారా] ఏవేవి తెలియ బడుతున్నాయో వాటిని ప్రమేయాలంటారు. ఇంద్రియాల ద్వారా అందే వీటిని అర్థాలు, విషయాలు, తెలియబడేవి అంటారు. ప్రమాణ విషయం అంటే తెలియబడేవి కనుక ప్రమేయాలు అని. ఈ పారిభాషిక పదాలు సరళంగా చెప్పే యత్నం చేస్తున్నాను. అర్ధమవుతున్నాయి కదూ! నిదానంగా కదలండి. ఇదెంతో విలువైన, జఠిలమైన, సూక్షమైన విద్య.

Note: ప్రమాణ ప్రమేయాలన్న పేరుతో పిలవబడే ఇంద్రియాలు, విషయాలూ పరస్పరం ఆధార పడకుండగానే ఉనికి గలిగి ఉంటాయి. కానీ వాటిని గుర్తించాలంటే- దేనిని గుర్తించాలన్నా రెండోదాని సహాయం అవసరం అవుతుంది. ప్రమేయాలతో సంబంధ పడకుండా ప్రమాణాలను గానీ, ప్రమాణాలు లేక ప్రమేయాలను గానీ గుర్తించలేమన్నమాట. విషయమర్థమవుతోందా? ఈ ప్రమాణ ప్రమేయ క్రమంలో నాల్గు పారిభాషిక పదాలున్నాయి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, శ్రమ.

 

ప్రమ-భ్రమ

 ప్రమాణాల ద్వారా, మనకు ప్రమేయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతోంది కదా! ఇది నిర్వివాదాంశమా, దీనిపై ఏమైనా ఆక్షేపణ లున్నాయా? నాకు తెలిసినంతలో ఇది నిర్వివాదం. వెనుకటి వాళ్ళూ దీని నంగీకరించారు. “మానా ధీనా మేయ సిద్ధిః” అని అన్నారు వాళ్ళు. కనుక ఎవరికిగానీ, ఎప్పుడుగానీ, ఏదైనా తెలిసిందంటే అది ఎలా తెలిసిందని అడగాలి. ఇలా తెలిసిందనీ దీని ద్వారా తెలిసిందనీ అతడు చెప్పాలి. అంటే మీ జ్ఞానానికి ప్రమాణ మేమిటని అడగడమూ; నాకు కలిగిన జ్ఞానానికి ప్రమాణమిదని చెప్పడమూ అన్న పద్ధతుందే అదే అసలు సిసలైన శాస్త్రీయ విధానము.

ప్రమాణముల ద్వారా కలిగే జ్ఞానాన్ని ప్రమ అంటారు. ఇక్కడొక చిన్న కీలకాంశం గుర్తుంచుకోవలసి ఉంది. “ప్రమ-భ్రమ” అన్న పదాలు వాడిన సందర్భంలో ప్రమ అన్నమాటకు యదార్థ జ్ఞానము, సత్యజ్ఞానము అని అర్థాన్ని గ్రహించాలి. ఒప్పు తెలివి అని దానర్థం. దీనికి వ్యతిరేకంగా కలుగుతున్న తప్పు తెలివిని భ్రమ అంటారు. తప్పు తెలివీ, ఒప్పు తెలివీ. రెండూ జ్ఞాన రూపాలే కనుక ప్రమాణమన్న పదంలో ప్రమ అన్న దానికి జ్ఞానం అని అర్థం చెప్పుకోవడం. సబబుగా ఉంటుంది. ప్రాచీనులు ఎక్కువమంది దీనికి యదార్ధ జ్ఞానమనే అర్థం స్వీకరించారు. కానీ కలిగిన జ్ఞానం సత్యమా! కాదా! అన్నది ఎప్పటి కప్పుడు తేల్చుకోవలసినది గానే ఉంటూందన్న అనుభవాన్ని పరిగణిస్తే ప్రమాణానికి యదార్థ జ్ఞాన సాధకం అన్న అర్థం కాక  జ్ఞానసాధకం అన్న అర్థమే దోషరహితంగా ఉంటుంది. అదలా ఉంచి ఇక్కడ “ప్రమ-భ్రమ” లోని ప్రమకు ఒక తెలియనితనం పోయి ఏదో ఒకటి ఎంతో కొంత తెలియబడడం (అనధిగత విషయజ్ఞానం) ఆ తెలిసింది బాధింప బడకుండడం (అబాధితత్వం) అన్న రెండు విశేషాలుంటాయి. దీనినే పరిభాషలో ప్రమాలక్షణం అంటారు. వేరు మాటలలో చెప్పుకోవాలంటే “తద్వతితత్ప్రకారకో అనుభవః యధార్దానుభవః ప్రమా;” అంటే తెలియబడే అర్థం (ప్రమేయం) ఎలా ఉందో అలానే (ఉన్నదున్నట్లే) తెలియబడితే దానిని యదార్థానుభవం అంటారు. అలా కలిగిన జ్ఞానాన్నే ప్రమ అనాలి. దానికి వ్యతిరిక్తమైనది భ్రమ.

“తదభావవతి తత్ప్రకారకో అనుభవః అయధార్థానుభవః భ్రమ.” ఏది నిజంగా లేదో అది ఉన్నట్లు తెలియబడితే, కలిగింది తప్పు తెలివి అవుతుంది. దానినే భ్రమ అంటారు. మొన్న క్యాంపులోనూ ఇంతవరకు చెప్పి అర్థమవుతోందా అని అడిగాను భేషుగ్గా అన్నారందరూ. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం వ్రాయండన్నాను. 

  1. కలిగిన జ్ఞానం ప్రమరూపమో - భ్రమరూపమో నిర్ణయించడమెలా?
  2. కలిగిన జ్ఞానం భ్రమరూపం అని నిర్ణయించడానికి ఎన్ని అనుభవాలు అవసరం? 
  3. కలిగింది సత్యజ్ఞానమే ననడానికి ఎన్ని అనుభవాలు సరిచూసుకోవలసి ఉంటుంది.
  4. భ్రమ తొలగి సత్యం-ఉన్నది- తెలుస్తుందా? ఉన్నది తెలిసి భ్రమ తొలుగుతుందా? 
  5. భ్రమకు కారణాలేమిటి? ఎన్ని రకాలుగా ఉండే వీలుంది?

ఈ అంశాలపట్ల మీరిచ్చే సమాధానాల ననుసరించే ప్రమ-భ్రమల గురించి మీకెంత తెలిసిందో, అర్థమైందో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. స్పందించండి మీ స్పందన ననుసరించే జ్ఞానపరంగా మీ పోకడేమిటన్నది నాకు అర్ధమయ్యే వీలుంది.

 

అనుబంధం

ఉత్సుకత – జిజ్ఞాస

దాదాపు మూడు సంవత్సరాలుగా మేలుకొలుపు, పత్రికను అనేకమంది పాఠకులకు పంపుతున్నాను. పండితులన్న వారిని గురించీ, జిజ్ఞాసువులన్న వారి గురించి వినీ విచారించే బాధ్యతతో మేమీ కార్యనిర్వహణ చేస్తూ వస్తున్నాము. గత మూడు సం||రాలుగా కనీసం ఒక్క లేఖైనా వ్రాయలేని పాఠకులు కొందరున్నారన్నది చేదునిజం. అందుకు కారణం నే వ్రాస్తున్న విషయం అర్ధం కాకపోవడమైనా కావాలి లేదా విషయ ప్రాధాన్యతను గమనించలేక పోవడమైనా జరిగుండాలి. ఎందుకంటే కొన్ని సంచికలలో పాఠకులనుద్దేశించి కొన్ని మాటలు చెప్పాను. (1) సంచికలో ఏమి ప్రస్తావించబడింది. (2) అందు మీకు ఏవైనా నచ్చితే ఎందుకు నచ్చింది, (3) నచ్చకుంటే ఎందుకు నచ్చనదీ (4) అస్పష్టత ఉంటే ఏ సందర్భంలో అలా ఉందీ నిష్కర్షగా పరిశీలించి వ్రాయండని. కనుక చదివిన ప్రతివారూ నచ్చినా నచ్చకున్నా లేఖ వ్రాయవలసి ఉంది. కానీ ఎక్కువ మంది నుండి అలాటి స్పందన లేదు ఎందుకని?

  1. బహుశా శ్రద్ధగా చదువుతుండక పోవచ్చు, (2) అక్కర లేని విషయంగా అనిపిస్తూండవచ్చు, (3) చెపుతున్నది ఆస్తికమో, నాస్తికమో తేల్చుకోలేని తనమై యుండవచ్చు. విషయ జఠిలత దృష్ట్యా మనస్సుకు పట్టక పోవడం కావచ్చు. ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. కోరినా కోరకున్నా క్రమంతప్పకుండా యింటికి సంచిక చేరుతూండడమూ ఒక కారణమై యుండచ్చు. మరైతే ఇన్నీ ఆలోచిస్తూనే ఇంత కాలం పత్రికను ఎందుకు పంపుతున్నట్లు?!?
  2. బుద్ధి శక్తిని పెంచగలదీ ప్రస్తుతం విద్యావిధానంలో మరుగున పడిపోయినదీ. అయిన సరైన చూపునివ్వగల విద్య నాకు లభించడం, దాన్ని సమాజాని కివ్వాలన్న దుగ్ధ ఉండడమూ అన్న ప్రధానమైన కారణమే. నాచే ఐచ్ఛికంగా, ఏకపక్షంగా ఈ పని చేయిస్తుంది. ఎంత బాధ్యత తీసుకుందామనుకున్నా, విద్య సత్ఫలితా న్నివ్వడమన్నది ఇరువురి, క్రమబద్ధమైన శ్రమనుండి మాత్రమే పుట్టగలదు. అందుకే విద్యా

విధానంలో సహవీర్యం కరవావహై, కలసిచేసే ఈ పని వీర్యవత్తరమగుగాక అని ఆకాక్షించబడింది. యోగ్యత లేని యత్నాలు సఫలీకృతం కావు. మరి నా వైపు యోగ్యత చెపుతున్న విషయ ప్రాధాన్యతలోనూ దాని సత్యాసత్యాలు, బలాబలాలలోనూ ఉంటుంది. మీవైపు యోగ్యత అధ్యయనం చేయడం, దోషాదోషాలు సరి చూసుకుని వినియోగించుకోడంలో ఉండాలి. విషయాన్ని చెప్పగల విద్యా విషయకమైన యోగ్యత నాకుందనే నా అభిప్రాయం.

ఈ మూడు సంవత్సరాలుగా పత్రిక నడపడంలో ఎదురైన అనుభవాల ద్వారా ఎడిటర్ అభిప్రాయాలే ఈ వ్యాసరచనకు ప్రేరణగా ఉన్నాయి. మనిషి ఉత్సుకతస్థాయిలోనే ఉంటున్నాడు గానీ, జిజ్ఞాస స్థాయికి ఎదగలేక పోతున్నాడనే నా పరిశీలనలు రుజువు చేస్తున్నాయి.

ఉత్సుకతకు, జిజ్ఞాసకు ఉన్న తేడా కూడా తెలియని స్థితిలో ఉందీనాడు సమాజం. కొంత విశ్లేషణ చేస్తాను. పరిశీలించి చూసి మీరేకోవకు చెంది ఉన్నారో ఆత్మ విమర్శ చేసుకుని చూసుకోండి. ఉత్సుకతకు పర్యాయాలు కుతూహలం, క్యూరియాసిటీ అన్న మాటలు. జిజ్ఞాసకు జ్ఞాతుం యిచ్ఛ” తెలుసుకోవాలన్న కోర్కె అని అర్థం. రెంటిలోనూ తెలుసుకోడం అన్నది సామాన్యమే. ప్రతి జిజ్ఞాసువు ఉత్సుకత కలవాడే కానీ, ఉత్సుకతకల ప్రతివాడూ జిజ్ఞాసికాజాలడు. తేడా ఎక్కడుందో ఆలోచించండి. ఈనాడు సమాజంలో జిజ్ఞాసి అనడానికి తగిన వాడు. సమావేశాలకూ, సత్సంగాలకూ వెళ్లే వారిలోనే వందల్లో ఒకడున్నాడేమో! అదీ సందేహమే ఇక మొత్తం సమాజంతో పోలిస్తే వేలల్లో ఒకడుంటాడేమో. అదీ అసలు పరిస్థితి. కానీ ప్రతివాడూ (ఎక్కువమంది) తానొక అసలు సిసలైన జిజ్ఞాసిననో, జ్ఞానిననో అనుకుంటున్నాడు. జ్ఞాన విభాగంలో ఇదొక పెద్ద భ్రాంతి. జ్ఞానార్జనకు పెద్ద అవరోధం. ఇంత ప్రమాదకరమూ, ప్రముఖమూనైన అంశాన్ని వ్యక్తి గుర్తించడమెలా? చాలాకాలం ఆలోచిస్తేగాని దొరకలా సరైన సమాధానం. అది ఇదే. వ్యక్తి ఆత్మ పరిశీలన చేసికో గలగాలి, లేక తెలిసిన వాడు ఒక వ్యక్తికి అతడెంత తెలుసుకుని ఉన్నాడో, ఎంత తెలియవలసి ఉన్నదో తెలిసేట్లు చేయాలి.అందుకై అప్పటికి అతనిలో ఉన్న జ్ఞానంలో దోషాదోషాలు ఎత్తిచూపి గుర్తించేట్లు చేయాలి. అసలా కలిగినది కొద్దిపాటి జ్ఞానమైనా జిజ్ఞాస నుండి పుట్టిందా? ఉత్సుకత నుండి జనించిందా? అన్నది గమనింపు కొచ్చేలా చేయాలి. అందుకై ఉత్సుకతకూ జిజ్ఞాసకూ, ఉన్న భేధాన్ని గుర్తించ వలసి ఉంది. పునరాలోచించండి. ప్రతి జిజ్ఞాసువు కుతూహలపరుడే, ప్రతి కుతూహలపరుడూ జిజ్ఞాసువుకాదు. ఉత్సుకత ఉంది చూశారూ, అది జీవస్వభావానికి చెందింది. ప్రతిజీవిలోనూ, ఉంటుంది. సహజాతమైన ఆ కుతూహలం ఒక ఉన్నత స్థాయీభావం పొందితే గాని జిజ్ఞాస అన చెల్లదు. రెంటిలోనూ తెలుసుకోవాలన్నది సామాన్యమే అయినా వాటి రూపు రేఖలిలా ఉంటాయి. ఉత్సుకతలో ప్రకరణకు ప్రాధాన్యత ఉండదు. ఫలాని విషయం, ఫలానా స్థానం నుండి తెలుసుకోవలసి ఉంది. కనుక తెలుసుకునే యత్నం చేద్దాం అన్న స్పష్టతా, అది తెలియవలసినంతగానూ తెలిసిందన్నంత వరకూ తెలుసుకునేందుకు క్రమయత్నమూ జిజ్ఞాసలో ప్రధాన భూమికను వహిస్తాయి  గానీ ఉత్సుకతకు అవేమీ ఉండవు. ఫలానిది తెలియవలెనన్న ఉద్దేశ్యంగాని ఉద్దేశ్య పూర్తికై దీక్షతో యత్నంగానీ లేక జీవస్వభావంనుండి పుట్టిన అదేమిటి? ఇదేమిటి? అంటూ ఎదురు పడ్డ వాటిని ఎదురు పడ్డంతవరకు గమనిస్తూ, విడిచి పెడుతూ సాగిపోతూ ఉంటుంది ఉత్సుకతా పూర్వకమైన గ్రహించడం (తెలియడం) అన్నది. తేడా తెలుస్తుందనుకుంటాను.  ఇప్పుడాలోచించి మీమీ స్థితికి చెందిన వాస్తవాన్ని తులనాత్మకంగా చేరవేసుకోండి. ఒక సమాచారం అందింది. పెద్దస్వామి వస్తు న్నారనో, గొప్ప ఉపన్యాసకు డొస్తున్నాడనో వగైరా వగైరాలతో మనలో సహజాతమైన దానికి (ఉత్సుకతకు) ఆ కాస్త ప్రేరణ చాలు. ఏమి చెపుతాడో విందాం, ఎలా ఉంటారో చూద్దాం, ఏ సిద్ధాంతానికి చెందినవాడో తెలుసుకుందాం వంటి భావాలతో అక్కడికి చేరిన వారంతా జిజ్ఞాసువులు కారు. ఇంకొక తరహా వాళ్ళుంటారు. కాలక్షేపం అవుతుందనో, శ్రవణం పుణ్యాన్నిస్తుందనో, సమావేశానికెంద రొస్తారో చూద్దామనో, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామనో అక్కడికి చేరుతారు. జిజ్ఞాసువు, శ్రద్ధాళువుగా తెలిసిన వారిచే గుర్తింప బడాలనో, పాపభీతి వగైరా వగైరాలలో ఆ సందడిలో పాల్గొనే వారెవరూ జిజ్ఞాసువులు కాదు. మరైతే జిజ్ఞాస స్వరూపం ఇదీ అనడ మెలా?!? 

జిజ్ఞాసికి జిజ్ఞాసలో ఈ విషయం తాను తెలిసికోవలసి ఉంది అని స్పష్టంగా తెలుస్తూంటుంది. అది తెలుసుకునేంత వరకు మనస్సు ఊరుకోదు, అశాంతితో వేగిరపడుతూ వుంటుంది. ఆ విషయం తెలుపగలరనిపించిన ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లామనుకోండి, అప్పుడతడా విషయాన్ని విడచి ఇంకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నా మనస్సుకు మాటిమాటికీ అసందర్భం అనిపిస్తూ ఉంటుంది. కాలం నష్టమౌతూ ఉంది. అన్న అశాంతి ఉంటుంది. మొత్తమ్మీద, ఆ జిజ్ఞాసా స్థాయిలో ఉద్దిష్ట విషయం తప్ప ఇంకే విషయాన్ని వినడమైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలన్న ఇచ్ఛ అవసర స్థాయికి చెంది ఉంటుంది. ఇంకా ఆ విషయం తెలియలేదే అన్నది సమస్యై కూర్చుంటుంది. అది నా సంగతి చూడు, అని హెచ్చరిస్తూ, తొందర చేస్తుంటుంది. ఆలోచిస్తున్నారా? అర్థమవుతోందా? సరిగానే , ఉందనిపిస్తోందా? ఆలోచించండి. జిజ్ఞాసలో ప్రధానంగా జ్ఞాతవ్యం (తెలియ వలసింది) నిస్సందిగ్ధంగా, సుస్పష్టంగా ఉంటుంది. ఆ జిజ్ఞాస కొనసాగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అప్పటికి తనకెంత తెలిసిందో ఎంత తెలియవలసి ఉందో తెలుస్తూంటుంది. కనుకనే జిజ్ఞాసికి కలిగే సందేహాలకు చక్కని క్రమం ఉంటుంది. ప్రకరణభంగం కానీయనిస్థితి సహజంగా అబ్బుతుంది. ఉత్సుకతకు ఇవేమీ ఉండవు. ఈ రెంటిని గురించి ఇంకొంత చెప్పడానికి వీలున్నా యోచనాశీలత, ఆత్మ పరిశీలన, వాస్తవాన్ని స్వీకరించగల ధీరత కలవాళ్ళకు సరిపడినంతా వివరించాననే అనిపిస్తోంది నాకు. మరి మీకేమనిపిస్తోందో స్పందనలో చూస్తాను.      

ఆ ఇంతా చెప్పాక ఈ వ్యాసరచనకు అవసరమైన పరిస్థితిని కల్పించిన ఒక విషయాన్ని చెప్పకపోవడం నబబు కాదు. అదేమంటే “మేలుకొలుపు” జిజ్ఞాసువులకు, పరీక్షకులకూ మాత్రమే ఉద్దేశించినట్టిది. కుతూహల పరులను దృష్టినిడుకుని నేనీ రచన చేయడం లేదు. కనుక “మేలుకొలుపు” పై స్పందించలేని వాళ్ళకు (స్పందన అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగానూ ఉండొచ్చు. నిష్కర్ష అవసరం కూడాను.) పత్రిక పంపడం ఎంతవరకు ఉచితం. వారికి ఎంతవరకు ప్రయోజనకారి అని ఆలోచన చేసుకో వలసిన అవసరం కనిపిస్తూంది. నా ఈ వ్యాసంలోని ఔచిత్యాన్ని విజ్ఞులు గ్రహించగలరని తలుస్తాను.

 

 

No comments:

Post a Comment