వ్యాస సంపుటి
రచయిత: శ్రీ పుట్టా సురేంద్రబాబు.
సంపుటి-1 సంచిక-10 1-12-91.
మానవ జీవన యానానికి చుక్కాని వంటిదగు జ్ఞానాన్నీ, జ్ఞాన సాధనలనూ గురించి వివరించేముందు దానికి చెందిన గతాన్ని స్మరించడం, అధవా పూర్వీకుల ధోరణులను గూర్చి పాఠకులకు కనీసంగానైనా పరిచయం చేయడం సందర్భో చితంగా ఉండ గలదు.
ప్రమాణ వివేచన అన్నది వాస్తవంగా, శరీరంలోనే సహజంగా నిర్మితమై యున్న ఆయా జ్ఞాన పరికరాలనూ, వాటి పనుల తీరు తెన్నులనూ సమగ్రంగా అవగాహన చేసికోవడమే ఐయున్నది. దానితో పాటే సహజంగానే ఏర్పడి మొత్తం -జ్ఞాన ప్రక్రియలో అంతర్భూతంగానే ఉన్న విచక్షణా శక్తి, దానికాధారమైన హేతురూపజ్ఞానమూ వాటి తీరుతెన్నులూ కూడా అర్థం చేసికోవలసి యున్నది. ఈభావాలనే నేను ప్రమాణ వివేచన-తర్కవిద్య- అన్న పేరున తెలియజేస్తున్నాను. వీటినే మరోలానూ చెప్పుకోవచ్చు.
వాటి వాటి క్షేత్రాలలోని విషయాలను ఆయా ఇంద్రియాలు స్వీకరించి, మెదడుకు పంపడంద్వారా అనుభవ రూపాన్ని పొంది తెలివిచే గ్రహింపబడి, విశ్లేషించబడి నిశ్చయరూపాన్ని పొందుతున్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు పని చేయడమూ, తద్వారా అందిన సమాచారాన్ని పూర్వానుభవ సామర్థ్యంతో విచారించి నిర్ణయించు కోవడమూ నన్నది, తలలో జరుగుచున్న కార్యక్రమ మన్నమాట. ఈ క్రమంలో (1) ఇంద్రియార్థ సన్నికర్ష, (2) అనుభవమూ, తద్గ్రహణా, (3) గతజ్ఞానంతో సరిచూసుకుని ఒక నిర్ణయానికి రావడమూ (4) అదిన్నీ స్మృతిరూపంగా నిక్షిప్తం చేయబడి వర్తమాన, భవిష్య జీవితాలను నడుపు వివేకరూపంగా-బుద్ధిశక్తిగా-ఉండడమూ జరుగుతోంది. ఈ బుద్ధి శక్తి స్వాభావికంగానే హేతుబద్ధత కలిగి ఉంది.
ఎట్లు విషయగ్రహణా, హేతుబద్ధతా అన్న రెండూ, శరీరంలో స్వాభావికంగానే ఏర్పడి యున్నవో అట్లే ప్రస్తుతాంశమైన ప్రమాణ వివేచనలోనున్నూ ప్రమాణములూ, తర్కమూ కూడా విడదీయరానివిగానే ఉన్నాయి. తర్కశాస్త్రం(తర్కం)పై ఒక విపరీత భావన బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందుచే జిజ్ఞాసువులైన పాఠకులలోనూ అట్లే ఏర్పడి యుండుటకు వీలున్న ఆ దోష దృష్టిని పోగొట్టిన పిదపనే అసలు విషయాన్నివారి వారి పరీశీలనలకు అందించడం సర్వదా సమీచీనమూ, శ్రేయస్కరమూ కాగలదు. కనుకనే ఈ విషయం ముందుగా చెప్పవలసి వచ్చింది. మీరందరూ ముందీ విషయాన్ని చక్కగా అర్థం చేసికోవలసి ఉంటుంది.
జ్ఞానేంద్రియ వ్యాపారంలో బుద్ధికున్న స్థానమే, విషయ పరిశీలనలో తర్కానికి ఉంది.తర్కాన్ని విడచి పరిశీలించడమంటే బుద్ధిని విడచి జ్ఞానార్జన చేయడం వంటిదే ఔతుంది. అయితే తర్కం ప్రస్తుతం రెండురూపాల్లో ఉంది. (1) కేవలతర్కమూ (2) అనుభవాంగ తర్కమూనని. వాటిని సందర్భం వచ్చినప్పుడు విపులంగా వివరిస్తాను. వాటిలో ఒకటవది విడువదగినదిగానూ, రెండవదైన అనుభవాంగ తర్కము సర్వులూ, సర్వదా స్వీకరించవలసినది గానూ ఉన్నాయి. ఈవిషయం ఇంతవరకూ స్పష్టంగా అర్ధం చేసికోగలిగితే మిగిలిన విచారణ సులభమవుతుంది. సక్రమమైన జీవనానికి సక్రమమైన వాస్తవజ్ఞానం ఆధారంగా ఉందన్నది నిర్వివాదాంశం. అట్టి సత్యజ్ఞానమునే ఎప్పుడూ పొందుచుండవలె నన్నచో తర్క ప్రమాణములను గూర్చి తెలిసికొని, వినియోగించుకోవలసి యున్నది. అయితే ఈ రెండు విషయాల్ని గూర్చి సమగ్రమైన అవగాహన పొందడం మిక్కిలి కష్టంతో కూడుకున్న పనిగాను ఉంది. గత చరిత్రను చూస్తే అనేకవేల ఏండ్లుగా ప్రతి సంప్రదాయ ప్రవర్తకుడూ, సిద్ధాంతకారుడూ కూడా వారి వారి సిద్ధాంతాల కనుగుణ్య మైన రీతిలో తర్కాన్నీ, ప్రమాణ స్వరూపాల్నీ ఏర్పరచుకునే యత్నం చేసినట్లు కనబడుతోంది. అలా ఏర్పడినవే తర్కం పేరుతో నున్న వివిధరీతులూ.
ప్రధానంగా తర్కశాస్త్రం అన్న పేరనే రెండు దర్శనములున్నా [న్యాయ, వైశేషికములను తర్కశాస్త్ర మంటారు. వీటిని సిద్ధాంత రూపములుగా అంగీకరించి అనుసరించువారిని తార్కికులు లేక నైయాయికులు అంటారు] ప్రతి దర్శన కారుడూ తన పరిధిలో తర్కాన్నీ, ప్రమాణాల్నీ ప్రతిపాదించారు. (1) నైయాయికుల తర్కం, (2) అద్వైత తర్కం, (3) బౌద్ధతర్కం, (4) సాంఖ్యతర్కం (5) జైన తర్కం (6) నాస్తిక తర్కం (7) ద్వైత తర్కం (8) పాశ్చాత్య తర్కం. ఇట్లా యనేకంగా ఏర్పడ్డాయవి. వాటి మధ్య కొద్దిగానో, గొప్పగానో తేడాలున్నా అన్నిటిలోనూ హేతుదృష్టి, విశ్లేషించి, పరీక్షించి, నిర్ధారించడమూ నన్నది సామాన్యంగానే ఉంటూ వచ్చింది. అలా సామాన్య నియమాన్ని కలిగియుండి కూడా తర్కాన్నీ, ప్రమాణాలనూ రకరకాలుగా ఎలా ప్రతిపాదించగలిగారు? అసలెందుకలా చేయవలసివచ్చింది? ఈ అంశాన్ని ముందుగా అర్థం చేసికోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయా ప్రతిపాదన లన్నింటి వెనుకా ప్రతిపాదించువారి కాధారంగా నున్నది స్వీయ జీవితమేకనుకనూ, ఆ జీవితంలో జ్ఞానేంద్రియాల స్వరూప స్వభావాలూ అందరకూ ఒక్కరకంగానే ఉన్నవి కనుకనూ, వాస్తవంగా వైరుధ్యానికీ, వైవిధ్యానికీ కూడా తావుండరాదు కదా? మరెందుకు, ఎలా ఇన్ని తేడాలేర్పడ్డాయి? నిష్పాక్షికంగానూ, లోతుగానూ విచారించగలిగితే కొన్ని విషయాలు గోచరించగలవు.
(1) ప్రధమ కారణం ఆయా సిద్ధాంతకారుల అవగాహనలలోని అసమగ్రత. (2) ముందుగానే కొన్ని సిద్ధాంతాలేర్పరచుకుని వాటిని నిలబెట్టుకొనుటకే తర్కాన్ని తయారు చేసికోవటం, (3) ఎదుటి పక్షాన్ని నిగ్రహించుటే లక్ష్యంగా కలిగి అందుకే తర్కాన్ని తయారు చేసికోవడం. ఎప్పుడైతే తర్కం యిలా అవగాహనా లోపం కలవారిచేతనూ, రాగద్వేష సంకలితమైన మనస్సుగలవారల చేతనూ తయారు చేయబడిందో ఆనాడే అది తన సహజ వివేకరూపాన్నీ, ప్రయోజనాన్నీకూడా కోల్పోయింది. ఆయా తర్క పద్ధతులందు పాక్షికత, చోటుచేసికుని ఉంది. కనుకనే నాటినుండి నేటివరకూ ప్రతితార్కికుడూ మరోతార్కికుని తనదైన శైలిలో తప్పు పట్టగలుగుతున్నాడు. అట్లుగాక అనుభవాంగ రూపమైన తర్కాన్ని ఉన్న దున్నట్లుగా ప్రతిపాదించ గలిగితే లోకంలో ఎవ్వరూ, ఏనాడూ దానిని కొట్టివేయ జాలరు. ఎప్పుడైనా ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి సామర్థ్యం ఉంటుంది.
ఇప్పుడు మనం చేయబోయే విషయ పరిశీలనలోనూ ఎన్నో దోషా దోషాలు ప్రస్తావించవలసి ఉంటుంది గనుక అనుభవంలో ఎట్లుంది? అన్న కొలత నుండే అందరమూ ప్రతిపాదిత విషయాలను పరికించవలసి ఉంటుంది. అదే ఆద్యంతమూ మన పరిశీలనకు వేదిక గానుండగలదు. ఉండాలికూడా. అట్లుగాక నేను చెప్పిన విషయాన్ని ఎవరుగానీ, ఆయా సాంప్రదాయ గ్రంధాలలో చెప్పినవాటినే ప్రమాణాలుగా పెట్టుకొని పరిశీలించడం మొదలిడితే వాస్తవం తెలియడం కష్టతరమౌతుంది. అట్టివారిని ముందుగా నే నడిగే ప్రశ్నేమంటే ఆయా శాస్త్రాలలో చెప్పబడ్డ వాటికి ప్రామాణికత ఎలా ఏర్పడింది? అని. వాటిని ప్రామాణికములే నని నిరూపించిన పిదపనే వాటి ఆధారంతో నేను చెప్పిన విషయాన్ని కొలిచిచూడడం ఉచితంకాగలదు. కానినాడు వారి పరిశీలనలన్నీ నేలవిడిచిన సాము వంటివే కాగలవు. మరో దృష్టినుండి ఆలోచిస్తే ప్రమాణాదులలోని వైవిధ్యానికి మరో కారణమూ కనిపిస్తుంది. అది వారివారి అనుయాయులకు బోధించుటకుగాను అవగాహనా సౌలభ్యం కొరకుగా వారు వారు ఏర్పరుచుకున్న విభజన అయ్యుండచ్చు. నిజంగా అట్లు జరిగే ఏర్పడి ఉన్న తేడా లైతే వాటిని అర్ధం చేసికోవడమూ, సర్దుకుపోవడమూ కూడా కష్టమేమీకాదు. ఈ ప్రమాణ వివేచన మన్నది ఆ విషయము యొక్క గాఢతా, జటిలతలను బట్టి నిదానంగానూ కూలంకషంగానూ, పరిశీలించుకుంటూ, అవగాహన చేసి కుంటూ మాత్రమే చేయదగియున్నది. ఇందు రచయిత లేక వక్త పాత్ర చాలా కొద్ది మాత్రమే. అదే మంటే విషయాన్ని ఒక క్రమంలోనూ, తగినంత స్పష్టంగానూ, శ్రోతచే శ్రవణం చేయించడమే. పఠితలకు తగినంత సమాచారాన్నందించడం మాత్రమే నన్నమాట. అటుపిమ్మట వినిన-చదివిన-విషయాన్ని సమగ్రంగానూ, నిష్పాక్షికంగానూ పరిశీలించి నిర్ణయించుకోవలసిన పని శ్రోతపైనే ఉన్నది. మననమూ, నిదిధ్యాసనమూ రెండూ శ్రోత బాధ్యతే. అప్పుడే అది అతనికి అనుభవాంగ రూపమౌతుంది. గతంలో జ్ఞానపీఠ మను పేర ప్రకటించిన ఒక సంచిక ఈ సందర్భంలో గుర్తుచేసుకోవడం మిక్కిలి ప్రయోజనకారి కాగలదు. అందులో విషయాన్ని చెప్పాలకున్నవారూ, వినాలనుకున్న వారూ కూడా అనుసరించ వలసిన నియమావళి విపులీకరింపబడింది.
సహజంగానే ఆయా విషయాలు గ్రహించినప్పుడు దానిని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. తెలుస్తున్న విషయాలను పరిశీలించి ఒక అభిప్రాయానికి రావడం సహజ ప్రక్రియగా నున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కూడా మీరందరూ అలా పరిశీలనా దృష్టితోనే చూస్తారు. అందుకే ఇచ్చట మీకో హెచ్చరిక చేయవలసి వస్తోంది. అదేమంటే, ఏ విషయాన్ని గూర్చి న్యాయ నిర్ణయం చేయాలన్నా చేయు వారు న్యాయ నిర్ణేతలుగా- న్యాయమూర్తిగా ఉండగలగాలి. న్యాయవాదిగా ఉన్నంతకాలం ఎవరూ సరైన న్యాయం చేయలేరు. అప్పుడు వారి వారి మేథస్సులన్నీ తమ పక్షాన్ని నిలుపుకొనుటకే వినియోగిస్తారు. అనుకోకుండానే, నీ పక్షంలోనే న్యాయముంటే తప్ప ఏ న్యాయవాదైనా స్వపక్షాన్ని నిలుపుకొనుటకే యత్నిస్తాడు. రాగ ద్వేషాలు లేకుండా-నిష్పక్షపాతంగా-నిర్ణయించగల స్థితిలో ఉన్నప్పుడు, (అది ఒకే పక్షాన్ని స్వీకరించిన వారి వల్ల కాక న్యాయ మూర్తిగా నుండగలిగిన వారి వల్లనే సాధ్యపడుతుంది.) తీసుకున్న నిర్ణయమే వాస్త వానికి దగ్గరగా ఉండగలుగుతుంది. సాంప్రదాయక తర్కాన్ని [ఏదో ఒక తర్క ధోరణికి కట్టుబడి] ప్రామాణికంగా స్వీకరించిన పిదప నీవు శుద్ధంగా ఉండుట కష్టము. ఈ కారణమే ఇంతకాలమూ సత్య నిర్ధారణకు అడ్డుపడుతూ వచ్చింది.
ఇక్కడ మార్పు రాక, అంటే అనుభవాంగ తర్కాన్ని ప్రమాణంగా స్వీకరించక సత్యాన్ని నిర్ధారించడం కుదరదు. ఈ విషయంలో మీకేమైనా అభిప్రాయ భేదముంటే మాకు తెలుపండి. స్పందన-ప్రతిస్పందన శీర్షికన ఆయా విషయాలలోని నిజానిజాలను పరిశీలించి చూద్దాము.
ప్రమాణములనగా జ్ఞానోత్పత్తికి అసాధారణ కారణము లనుకున్నాము కదా! జ్ఞాన మన్నదొక కార్యరూపము, పుడుతోంది కనుక. ప్రతి కార్యోత్పత్తికీ పరికరములూ, పనీ సామాన్య కారణాలు గానే ఉంటాయి. ఆ రకమైన పరికరాలూ, ఆ రకమైన పనీ, ఆ రకమైన కార్యానికి అసాధారణ కారణాలౌతాయి. కనుకనే ప్రస్తుతాంశమునందునూ ప్రమకు-జ్ఞానానికి-జ్ఞానేంద్రియములూ, ప్రక్రియలూ కూడా కరణములు (సాధకములు) అవుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రమాణ మంటే జ్ఞాన సాధకమనాలా? యదార్ధ జ్ఞాన సాధక మనాలా? అన్నది పరిశీలించ వలసి ఉంది. వెనుకటి వాళ్ళీ విషయంలో కొందరు జ్ఞాన సాధకమనీ, మరి కొందరు యదార్ధ జ్ఞాన సాధకమనీ, రెండు రకాలుగానూ అభిప్రాయపడ్డారు. ఈ దృష్టి భేదం వల్ల కూడా తర్క ధోరణులు వేరు వేరుగా మారాయి. ఎవరి అభిప్రాయాల్ని వారు మాటి మాటికీ పునరుద్ఘాటిస్తున్నంత కాలం ఈ విషయంలో వాస్తవం తేలదు. రెండు పక్షాలలో అనుభవానికేది సరిపోతుందో చూసుకోవాలి గాని నాది నాదేనంటే ఎలా? దీనినే విశ్లేషించి చూపడానికి యత్నిస్తాను. మీరూ పరిశీలించి చూసుకోండి.
సంస్కృత భాషలో ప్రమ, భ్రమ అన్న రెండు పదాలున్నాయి. ప్రమ అనగా ఒప్పు జ్ఞానమనీ, భ్రమ అనగా తప్పుజ్ఞానమనీ ఆ పదాలకు రూఢ్యర్థం ఉంది. దాని ననుసరించి ప్రమాణమనగా ప్రమాకరణమనీ, అనగా యదార్ధ జ్ఞాన సాధకమనే అర్ధాన్ని స్వీకరించా మనుకోండి. అప్పుడు మనం నిర్దేశించే-అంగీకరించే ప్రమాణాలన్నీ యదార్ధ జ్ఞాన సాధకములేనని నిరూపించవలసి ఉంటుంది. మరో వంక భ్రమ(తప్పు జ్ఞానాని) కి సాధకమేమో చెప్పవలసి ఉంటుంది. భ్రమ కూడా ఒక రకమైన జ్ఞానమే నన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే.
[Note :అవగాహనకూ, జ్ఞానార్జనలో ఎల్లప్పుడూ ఉపయోగించుకో గలందులకూ ఒక విషయాన్ని యీ సందర్భంలో చెప్పడం మంచిదనిపిస్తున్నది. అజ్ఞాన మన్న పదం రెండు సందర్భాలకు సరిపోతుంది. బొత్తిగా తెలియని తనానికి, తప్పుగా తెలిసి ఉండడానికీ, ఎలానంటే రెండు సందర్భాలలోనూ ఉన్నది తెలియక పోవడం జరుగుతోంది. అయితే వాటిని రెండని ఎందుకనాలి? శుద్ధంగా తెలియ లేదు అన్న స్థితిలో ఆ వ్యక్తి తెలుసుకుంటానికి వీలుంది. ఈ విషయం తనకి తెలియలేదు అన్న దృష్టి ఉంటుంది కనుక. మరి రెండోదైన తప్పు తెలివి గల వారిలో తనకు విషయం తెలిసి పోయింది. అన్న భావం ఉంటుంది. ఇకవారు తెలిసికునే అవకాశమే ఉండదు. బొత్తిగా తెలియని తనం కంటే తప్పుగా తెలియడం ఆద్యంతమూమూ ప్రమాదకరమైయున్నది. జ్ఞానార్జనలో ప్రారంభకులూ, కొంత పరిశ్రమ చేసిన వారు, పూర్తయిందను కున్నవారూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఉండడం సర్వదా శ్రేయస్కరము. జ్ఞానార్జనాపరుడు అప్పటికా విషయంలో తనకెంత తెలిసిందో, ఎక్కడనుండి, తెలిసికోవలసి ఉందో స్పష్టంగా గమనించి ఉండాలి. అప్పుడే ఆతని జ్ఞానార్జనా యత్నం ఫలవంతమవుతుంది. చక్కగా వ్యక్తం చేయబడీ తప్పుగా వ్యాఖ్యానించబడుతున్న గీతా శ్లోకాన్నొక దాని నిచ్చట చెప్పితే విషయం మరింత వివరణాత్మకంగా ఉంటుంది.
“అజ్ఞానేనా౬ వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః”
"అజ్ఞానముచే నావరింపబడిన జ్ఞానంచే మోహితు లౌతున్నారు జనులు" అన్న అర్ధాన్నిస్తోందా వాక్యము. జ్ఞానమే మనిషిని కదిలిస్తోంది అన్న అనుభవాన్ని బట్టి చూస్తే అజ్ఞానం-తెలియని తనం-మనిషిని మోహితుల్ని చేయలేదు, ప్రయత్న పరుల్నీ చేయజాలదు. మరిక్కడ అజ్ఞానానికే అర్ధం చెప్పుకోవాలి? క్రితం నే చెప్పిన రెండవ అర్థాన్నే. తప్పుగా తెలియడమన్నదే ఒప్పు తెలివిని సాధించు కోడానికి గల మార్గాన్ని మూసి వేస్తోంది, కప్పివేస్తోంది. మరి మోహితు లవడమేమి? తప్పుగా తెలియడంలో ఉన్నది తెలియక పోవడమూ, తెలిసింది అనుకోవడమూ కలిసి ఉన్నాయి. యీ ఉన్నది తెలియకనే తెలిసిందనుకోవడం వలన ఆ విషయమై ఇక తెలిసికోవడం అన్నదే ఏర్పడదు. ఇదే కప్పి వేయడమంటే, విపర్యయ-భ్రమ-జ్ఞానమే వాస్తవాన్ని కప్పివేయ గలదు. చక్కగా ఒకటి, రెండు సార్లు చదివి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లోపాలున్నా యనిపిస్తే సహేతుకంగా పత్రికకు వ్రాయండి.] సరే అసలు విషయానికి వద్దాం. భ్రమ కూడా జ్ఞాన రూపమే ఐనప్పుడు అదీ ఒక కార్యరూపమే అవుతుంది. దానికీ అసాధారణ కారణం ఉండితీరాలి. ఆ కరణాలూ, పద్దతీ ఏమిటి? వాటినే పేరుతో పిలవాలి? యదార్ధ జ్ఞాన సాధకమే ప్రమాణ మన్న నిర్వచనం చేసేవారు, ఈ సందేహానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పక్షం వారైనా మూడు పదాలకు అర్థ నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. (1) జ్ఞానము, (2) యదార్థ జ్ఞానము, (3) అయదార్థ జ్ఞానము. ఈ మూడు పదార్థాల జ్ఞానం లేక ప్రస్తుత విషయాన్ని పరీక్షించుట కుదురదు. భిన్న ధోరణులు కల వారు పత్రికను పరిశీలిస్తున్నారు గనుక వారు గానీ, మీరు గానీ ఈ మూటి అర్థాల్నీ మీమీ దృష్టుల నుండి నిర్వచించండి. భిన్న మార్గీయులైన ఆయా తార్కీకులు ప్రతిపాదించిన నిర్వచనాలు రెండు, మూడు మీ ముందుంచుతాను గమనించండి. న్యాయ, వైశేషిక దర్శనాలను ప్రామాణిక గ్రంధాలుగా స్వీకరించు తార్కికులు-వీరిని నైయాయికులంటారు-చెప్పిన నిర్వచనం ప్రకారం, ప్రత్యక్షంలో భ్రమకు తావు లేదు.
సూ:- “ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానమ్, అవ్యపదేశ్య మవ్యభిచారి వ్యవసాయాత్మికం ప్రత్యక్షం!” ఇంద్రియములూ, విషయములూ సంబంధ పడగా ఏర్పడ్డ జ్ఞానమే, వినికిడి జ్ఞానం కాకుండానూ, తెలియబడుతున్నది మార్పుకు లోనుగాకుండానూ, సంశయ రహితంగానూ ఉన్నప్పుడే ప్రత్యక్ష మవుతుంది. అని పై సూత్రార్థం. ఈ సూత్రం ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. (1) ఇంద్రియార్థ సన్నికర్షవల్ల జ్ఞాన మేర్పడుతుందని, (2) ఆ జ్ఞానము అవ్యప దేశ్యాది మూడర్హతలు కలిగి యున్ననే ప్రత్యక్ష ప్రమ అవుతుందని, ఈ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంలో వ్యపదేశ జ్ఞానం గానీ, భ్రమజ్ఞానం గానీ సంశయ జ్ఞానం గానీ ఉండవు. అదే మరి సాంఖ్య దర్శన కారుని మతం ప్రకారమైతేనో.
అసన్ని కృష్టార్థ పరిచ్చిత్తిః ప్రమా!
బుద్దికి, ఫలానా కొత్త విషయం మేధస్సుకు చేరింది అని తెలియడాన్నే ప్రమ అంటారు అని సూత్రార్ధం. ఇక్కడ ప్రమ అనగా ఇంద్రియార్థ సన్నికర్షవలన పుట్టిన జ్ఞానమనే అర్ధం వస్తోంది. అయితే మరి ఆ తెలుస్తున్నది ఉన్నది ఉన్నట్లేనా అన్న నిర్ధారణేమీ వారి సూత్రం ద్వారా లభించదు. పై నైయాయిక మతాన్నంగీకరించి నట్లైన ప్రత్యక్షంలోనే గాక, ఏ ప్రమాణం లోనూ భ్రమలుండవు. సాంఖ్యాదుల ప్రకారం కలుగుతున్న జ్ఞానానికే ప్రమ అని పేరు. అందు తప్పు జ్ఞానమూ, ఒప్పు జ్ఞానమూ ఉండవచ్చు. మరొకరి దృష్టి నుండి ప్రమకు అనధిగతత్వమూ, అబాధితత్వమూ ఉండాలి. తెలియనిది తెలియడం, తెలిసింది మార్పుకు లోనుగాకుండడం అన్న స్థాయిగల ఆయా విషయ జ్ఞానాన్నే ప్రమ అంటామని వారి అభిప్రాయం. మరో వర్గం వారికి ప్రత్యక్షమే ప్రమాణం అంటే ఇంద్రియాలే – పరికరాలే - జ్ఞానసాధకాలు. మన మనుకునే అనుమానాది ప్రమాణములు ప్రమాణములే కాదు. వాటి వలన జ్ఞాన మేర్పడదు అని, అంటే పరోక్ష జ్ఞానమన్న పదమే తప్పని దాని అర్ధం. పరిశీలకులను పరిశీలనకు తగిన విధంగా సంసిద్ధులను చేయవలసియుండుట చేతనూ, అది బహు ప్రయాసతో కూడియున్న విషయమగుటచేతనూ ఈ ప్రమాణ వివేచనకు పీఠికగానున్న ఈ వ్యాసము ఒకింత దీర్ఘమైంది. మేలుకొలుపులో క్రమంగా వస్తున్న ఆయా విషయాలను భిన్న సిద్ధాంతాభిమానులైన తార్కికులొకవంకా, ప్రాధమిక పరిచయాన్ని పొంద యత్నించు జిజ్ఞాసువు లొకవంకా పరిశీలించే వారుగా ఉండుటచే ఇరువురకూ అందుబాటులో ఉండే విధంగా భాషను మలచడం కొంత శ్రమతో కూడుకున్న పని. వెనుకటి వారు ఉపయోగించిన భాషా పదాలు వాడక తప్పదు. వాటిని ఉపయోగిస్తూనే వాటి అర్థాలలోని దోషాదోషాలు చూడడమంటే బహు క్లిష్టమైన పని ఔతుంది. ప్రకరణ విషయం నాకు అనుభవ రూపంలో స్పష్టంగానే ఉన్నప్పటికీ రెండు స్థాయిలలోని పరిశీలకులకూ అందుబాటులో ఉండగల వాక్య నిర్మాణానికై నేపడ్డ శ్రమ ఎంత వరకు ఫలవంత మవుతుందో మీ స్పందనలను బట్టి గాని నిర్ధారించ వీలులేదు.
ప్రమాణ వివేచన - 2
సంపుటి – 2 సం క్రాంతి సంచిక -1 1-1-92
ప్రమాణములు పరికరముల ననుసరించి పద్ధతుల ననుసరించీ ఏర్పడతాయనుకున్నాము కదా. పద్ధతుల ననుసరించి ప్రమాణములేమో వివరించలేదంటూ ఒకరిద్దరు లేఖలు వ్రాశారు. ఆ లేఖలనుబట్టి విషయాన్ని మరో విధంగా చెప్పినచో బాగుంటుందనిపిస్తోంది. పరిశీలించి గత సంచికలో ఈ విషయం చెప్పానో లేదో కూడా గమనించండి.
- పరికరముల ననుసరించి ప్రమాణములారు. రూపాదులకు నేత్రమూ, రసాదులకు జిహ్వ అలానే ముక్కు, త్వక్కు, చెవి ప్రమాణములౌతాయి. ఇంత వరకు బాహ్య విషయ జ్ఞాన సాధనములివి. ఆరవదిగా అంతరింద్రియమొకటి. దీనిని మనస్సందాము. మొత్తం పరికరములు 6. కనుక ప్రమాణములారు.
- పద్ధతులను-ప్రకార భేదాన్ని-బట్టి ప్రమాణములను భిన్న సిద్ధాంతకారులు, విభిన్న రీతులుగా ప్రతిపాదించారు. అందరు చెప్పినవి కూడా క్రోడీకరిస్తే ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనన్న 3 ప్రమాణము లేర్పడతాయి. చిన్నచిన్న తేడాలున్నాయనుకుంటూ వాటినే ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ది, ఐతిహ్యము, సంభవము అన్న పేర్లతో మొత్తం 8 ప్రమాణములుగా మరి కొందరు వర్గీకరించారు. పద్ధతుల ననుసరించి ప్రమాణములివే.
- నా దృష్టి నుండి ఇవి ముఖ్యంగా రెండు. (1) ప్రత్యక్ష పధ్ధతి (2) పరోక్ష పద్ధతి. ఈ పరోక్ష పద్ధతిని మళ్ళా కనీసం రెండు భాగాలుగా చూడాల్సి వస్తున్నది. వాటినే అనుమానము, శబ్దము అన్న పేర్లతో పిలుస్తున్నాము. ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనని ప్రకార బేధంచే ప్రమాణాలు మూడన్న మాట.
( Note :- పరికరముల ననుసరించిన ఆరు ప్రమాణాలూ ఒక్క ప్రత్యక్ష పద్ధతిలో ఇమిడి పోతాయి.)
వేటివలన జ్ఞానం కలుగుతున్నది? అని ప్రశ్నించుకుంటే ఆయా ఇంద్రియముల వలన అనీ, ఏ ప్రకారం జ్ఞానం కలుగుతోంది? అని ప్రశ్నించుకుంటే ప్రత్యక్ష, అనుమానాదుల ద్వారాననీ సమాధానం వస్తుంది. అలానే ప్రత్యక్ష పదార్ధ మేది అని ప్రశ్నించుకుని ఏ యింద్రియాన్ని సూచించినా లక్షణం చెప్పినట్లు కాజాలదు. ప్రక్రియా విశేషాన్ని ఇంద్రియార్ధ సన్నికర్ష జరిగి, సన్నికర్షలోనున్నంత వరకు తెలియడం అని చెప్పి తీరాలి. అలానే రూప జ్ఞానం ఎలా కలిగింది? అంటే ప్రత్యక్షాదుల వలన అంటే లక్షణం చెప్పినట్లుకాక, నేత్రం వలన అన్నప్పుడే కరణనిర్దేశం చేసినట్లవుతుంది. విషయాన్ని పరిశీలించి అర్ధం కాకుంటే ప్రశ్నించండి. స్పందనకు లేఖ వ్రాయండి. జ్ఞాన ప్రకరణంలో పరిశీలించవలసిన మరో అంశముందిక్కడ, చూడండి.
మనిషి తనకు కలుగుతున్న అనుభవాలనూ, వాటిననుసరించి తాను చేస్తున్నపనులనూ సమీక్షించి చూసుకుంటే అనుభవాలూ, వాటి నుండి కలుగుతున్న జ్ఞానమూ రెండు రకములుగా నున్నట్లు బోధపడుతుంది. (1) యదార్ధ జ్ఞానము-తద్వతి తత్ర్పకారకానుభవం, (2) అయదార్థ జ్ఞానము-తదభావ వతి తత్ర్ప కారకానుభవం. అంటే (1) ఎట్టి విషయమో అట్టి ప్రతిబింబమే అనుభవ రూపాన్ని పొందడం, దీనినే ప్రమ ఆంటాము. అట్లుగాక (2) ఉన్న విషయానికి భిన్నమైన ప్రతిబింబం అనుభవరూపంగా నుండడం. దీనినే భ్రమ అంటాము. అసలలా ఎందుకు జరుగుతుంది? అంటే భ్రమలకు కారణా లేమిటని అడిగినట్లు. అది సందర్భం వచ్చినప్పుడు అనుకుంటాము. జీవితంలో సహజంగానే జరుగుతున్న జ్ఞాన ప్రక్రియలో భ్రమకూడా చోటు చేసుకుంది కనుకనే, దాని వలన జీవితానికి నష్టమూ, ప్రమాదమూ ఏర్పడుతోంది కనుకనే. అసలీ ప్రమాణ, తర్క విచారణ అవసరమైంది మనిషికి. వీటి పట్ల సామాన్య జ్ఞానం ప్రతి మనిషికి ఉంది. భ్రమ రహితంగా, వాస్తవ జ్ఞానాన్నే నిరంతరం పొందవలసిన అవసరం ఉంది గనుకనే ఆయా పరికరాలు, ప్రక్రియలూ, భ్రమలకు కారణాలూ, వీటిని గురించిన విశేషజ్ఞానం పొందటం తప్పనిసరి అయింది మనిషికి. Note:-జిజ్ఞాసువుకు జ్ఞానార్జనలో, కలిగినది తప్పు జ్ఞానమా? ఒప్పు జ్ఞానమా? నిశ్చయించుకోవడం అతి ప్రధానమూ, జ్ఞానార్జనా ప్రక్రియలో ఆయా విషయాలకు ముగింపు కూడా అవుతుంది. ఈ పాఠ క్రమాన్నలా ఉంచి పాఠకులు గమనించ వలసిన మరి కొంత సమాచారాన్ని అందించి ఈ సంచిక ముగిస్తాను.
తర్క ధోరణులనేక మున్నాయనీ, అలా వివిధ రీతులేర్పడడానికి వారి వారిలోని అవగాహనాలోపమో, స్వపక్ష మండన దృక్పథమో, పరపక్ష ఖండనే లక్ష్యముగా పెట్టుకొనుటో కారణాలుగా ఉంటాయని గమనించాము. అలా తర్కరీతుల మాదిరే తార్కికులలోనూ (1) అతితార్కికులు, (2) మధ్యమానుసారులు (3) మందవేగులు అను మూడురకాల వారుంటారు. Note:-ఈ పేర్లు నచ్చకుంటే మరో పేరు పెట్టుకోండి. 3 రకాల తార్కికులుంటారన్నదే గమనించవలసిన అసలు విషయం.
ప్రతి మనిషీ జ్ఞానేంద్రియాలా, మెదడూ, వాటి పనుల తీరుతెన్నుల ననుసరించి స్వాభావికంగానే విచక్షణా శీలిగా నున్నాడు. అట్లా సహజంగానే ఏర్పడి యున్న తార్కిక శక్తిని కొందరు అక్కరలేనంతగా ఉపయోగిస్తుంటారు. వీరినే అతితార్కికులనేది. (2) మరో రకము వారు తర్కాన్ని అవసరమైనంత మేర జీవితానుభవాల నతిక్రమించకుండా ఉపయోగించుకుంటారు. వీరినే మధ్యమానుసారులు అంటాము. ఈ తరహా తర్కాన్నే గత సంచికలో నేను అనుభవాంగ తర్కము అన్నది. ఇక మూడో రకం వారున్నారే. (సమాజంలోనూ సాంప్రదాయ ప్రచారకులలోనూ, భిన్న ధోరణుల ప్రచారకులలోనూ,వీరే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం). వీరు తర్కాన్ని పూర్తిగా విడువరు, [తర్కించడం మానవ స్వభావం కనుక.] అలా అని అవసరమైనంత మేర అనగా పరిశీలించవలసిన అంశాలలో పరిశీలనలు పూర్తయ్యేంత వరకూ దానిని ఉపయోగిస్తారా అంటే అదీ లేదు. పోనీ యితరులు పరిశీలిస్తానంటే అంగీకరిస్తారా? అబ్బే అలా అయితే ఇక అనుకోవడ మెందుకు? వీరి పనీ, వీరి తార్కికతా కూడా మునగానామ్, తేలానామ్‌గా ఉంటుంది. పూర్తి విశ్వాసులూ కారు, విచారణశీలురూ కారు. నేడు సమాజాన్ని ప్రమాదపు నదిలో ముంచెత్తుతున్నదీ మూడవ తరహా తార్కికులే. వీరు తాము చెప్పగలము అనుకున్నంత వరకు హేతు బద్దంగానే మాట్లాడుతుంటారు. ఋజువులు లేకుంటే ఎలా గయ్యా! అని ఎదుటివారి నడుగుతూనే ఉంటారు. తాము చెప్పగల విషయం ముగిసిందనుకోండి. అప్పటికింకా మిగిలి వున్న సందేహాల నెవరైనా అడిగితే మాత్రం తర్కించకు, తర్కానికవధుల్లేవు, నిలకడా లేదు. తర్కం పనికిరాదు అంటూ మరో పాటందుకుంటారు. ముందు ముందాయా పరిశీలనలలో వీరు మనకధికంగానే ఎదురు పడతారు గనుక తార్కికుల్లోని ఈ రకాలను గుర్తులో ఉంచుకోండి ప్రస్తుతానికి.
ఇక ఒకటవ రకం వాళ్ళన్నారు చూశారూ! వారికిక ఇది అవసరమా? అనవసరమా అన్న స్పృహే ఉండదు. చిన్న చిన్న విషయాలనైనా తర్కించుతూ రోజులకు రోజులే వెచ్చించగలరు వీరు. లోకం ఏమైపోతున్నా వీరికేమీ పట్టదు. ఒక రకంగా తర్క కండూతి వీరిది. తర్కించకుండా ఉండలేరు. ఆ తర్కానికి హద్దే ఉండదు. మరో ఆశ్చర్యకరమైన విషయ మేమంటే అలా రోజులూ, నెలలూ, సంవత్సరాలూ కూడా తర్కిస్తూనే గడిపివేయ గలరు వీరు. అయినా విషయం మాత్రం ఒక కొలిక్కిరాదు. వీరి వరకు వీరికి ఆనందంగానూ, బహు తృప్తిగానూ, గొప్ప ఘన కార్యం సాధించినట్లున్నూ ఉంటుంది తర్కిస్తూ జీవితం గడిపివేస్తుంటే. తర్కమన్నది విషయ పరిశీలనకూ, వివేక సామర్థ్యాన్నిపెంచుకొనుటకూ కేవల మొక సాధనం మాత్రమేనన్న దృష్టి ఉండదు ఈ రకం వారిలో. వీళ్ళలో మరల రెండు రకాల వాళ్ళున్నారు. (1) విషయ పరిజ్ఞానం కలిగున్నవారు, (2) అదీ లేనివారు. ఇరువురూ తర్కానంద స్వాములే. తర్కం వీరికి జ్ఞాన సాధనంగా కాక ఆనంద సాధకంగా ఉంటుంది. వీరిలో రెండో రకం వారు తాము చెడి, యితరులనూ చెడగొడుతుంటారు. మరి ఒకటో రకం వారు మాత్రం తామేమీ నష్టపోడు. వారి పాలబడిన వారు మాత్రం జీవితాన్నీ, విలువైన కాలాన్నీ చాలా నష్టపోతారు. మీమీ అనుభవాల నుండీ, సమాజాన్ని పరిశీలించడం నుండీ పై విషయాలు గమనించి రూఢి పరచుకునే యత్నం చేయండి. అట్టి తరగతుల వ్యక్తులు లేరు అనిపిస్తే నాకు వ్రాయండి. అట్టి వారిని కలిసే ఏర్పాటు చేస్తాను. అలానే మీరూ ఏ మూడు రకాల వారిలో చేరి ఉన్నారో చూసుకోండి.
మరోమాట. తర్కమన్నమాట వ్యవహారంలో రకరకాలుగా వాడుతున్నప్పటికీ, తర్కశాస్త్రము అన్న ప్రయోగంలో మాత్రమే దానికి సరైన అర్థం చెప్పబడింది. ప్రమాణైః అర్థ పరీక్షణం న్యాయం! అన్నది తర్కలక్షణం. ప్రమాణాదులచే (హేతూదాహరణలే ఇక్కడ ప్రమాణ శబ్దంచే సూచితం). అంటే ఆధార సహితంగా విషయాన్ని పరీక్షించి నిర్ణయించే ప్రక్రియావిశేషాన్నే తర్కమంటామని పై వాక్య భావం. సత్యనిర్థారణకై మనిషి చేయు క్రమబద్ధమైన మానసిక ప్రక్రియే తర్కమంటే. ఈ అర్ధాన్ని అర్థం చేసుకోగలిగితే మానవ జీవితంలో తర్కం పాత్రేమిటో, ప్రాధాన్యతేవిటో బోధపడుతుంది. తర్కాన్ని గూర్చి చులకనగా మాట్లాడే వారెవరైనప్పటికీ తర్కమంటే ఏమో వారి కర్థం కాలేదనాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిన మరో అంశముంది. అది వెనుక చెప్పుకున్న అతి తర్కమో, అటూ ఇటూగాని- మందవేగుల తర్కమో కాకుండా ఉండాలి. కేవలం ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి విలువుంది. తర్కపద నిర్వచనం మరో రకంగానూ చెప్పబడింది. “అవిజ్ఞాతతత్వే అర్ధే కారణోపసత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః” తెలియబడని విషయంయొక్క యదార్థ స్థితిని గ్రహించుటకై కొన్ని ఆధారాలతో ఊహ చేయడం తర్కము అని సూత్రార్థం. ఈ సూత్రం అనుమాన ప్రమాణంలో- పరోక్ష జ్ఞానవిషయంలో తర్క దృష్టియొక్క పాత్రను, అవసరాన్నీ సూచిస్తోంది. అందుతున్న ఆధారాన్ని బట్టి అందుబాటులో లేని విషయాన్ని నిర్ధారించుటకై చేయు ఊహనే తర్కమంటారని అర్థం.
తర్కం శాబ్దీ ప్రమ- శబ్ద ప్రమాణం వల్ల కలుగుతున్న జ్ఞానం-విషయంలో కూడా అవసరమా కాదా? పనికొస్తుందా లేదా? ఆలోచించి స్పందనకు వ్రాయండి. అలానే, తర్కబద్ధం కాని సిద్ధాంత ముంటుందా? ఉంటుందంటే ఎలాగో, అదే సిద్ధాంతమో చెప్పండి. ఉండదన్నారనుకోండి! ఇక మీరెప్పుడూ తర్కం పనికిరాదనీ, తర్కించకండనీ ఎక్కడా అనకూడదన్న విషయం గమనించండి. సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళపై కుహనాగురువులు చల్లిన బురదగానీ, తర్కబద్ధంగా యోచించడమనే పనిపట్ల అమాయకులైన తమ తమ అనుయాయులలో కల్పించిన వ్యతిరేకతగానీ, అంతింతనలేము. యదార్ధ శతృవులైన ఈ పండితమ్మన్యుల వల్ల అటు సమాజానికీ, ఇటు విజ్ఞానకాయానికి జరిగిన అపకారం మరే రకమైన శతృవులవల్లనూ జరుగలేదన్నది పచ్చి నిజం. సృష్టిలోని సమస్త పదార్ధములందునూ శుద్ధమూ, వికశిత రూపమూ, శక్తివంతమూనైన మానవ మేధస్సును ఉపయోగించుకోనీకుండా అడ్డుపడుతున్న బాధ గురువుల నేమనాలి? ఏమన్నా ప్రయోజనం లేదు. ఏరివేయాలి.
ఇప్పటికే కొందరు తర్కజ్ఞులకు అసలు విషయం చెప్పవయ్యా ఎందుకీ ఉపోద్ఘాతం అని అడగాల నిపిస్తూండవచ్చు. తార్కికులకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రతి తార్కికునికీ ఎదుటివాడు ప్రతిపాదించే విషయాన్ని సందేహించి పరిశీలించే ప్రవృత్తి అలవాటుగా మారి ఉంటుంది. వారికి నేచెప్పేదేమంటే పత్రికోద్దేశం ప్రమాణ నిర్దేశమో, తార్కికులతో చర్చించడమో మాత్రం కాదు గనుకనూ, భిన్న స్థాయిలోని పాఠకులకు-జిజ్ఞాసువులకు ఆయా విషయాల్ని క్రమంగా అందించడమెలా అన్నది కూడా పరిగణించవలసి ఉంది కనుకనూ రచనా విధానం వివరణాత్మకంగా ఉండుంటే ఉచితమౌతుంది. ఈ ప్రమాణ విద్యనూ, ఆధ్యాత్మిక-విద్యనూ కూడా బోధించడమూ, గ్రహించడమూ, మరో తార్కికునితో చర్చించడమూ కూడా తేలికైన విషయమేమీ కాదు. ఈ విషయమూ తార్కికులకున్నూ తెలియనిది కాదనుకొందును.
Note:-1) ప్రత్యక్షగోచరం కాని దాన్ని తర్కంద్వారానే గమనించాలి, సాధించాలి అన్న నిర్ణయానికి ప్రాచీన తాత్వికులు ఎక్కువమంది వచ్చినా రనిపిస్తోంది నాకు వచ్చిన రచనలు చూస్తుంటే. మీరేమంటారు.
2) ప్రత్యక్ష గోచరం కాని పరమాణువుల ఉనికినీ, వాటి ధర్మాలను వైజ్ఞానికులే ఆధారంతో ప్రతిపాదించి ఉంటారో యోచించండి. మీ యోచనలను స్పందనకు వ్రాయండి.
సంపుటి-2 సంచిక-2 1-2-92
తర్క ప్రమాణములను గురించిన మేలుకొలుపు అభిప్రాయాలపై రెండు స్పందనలందాయి. i] చాలా విలువైన విషయాన్ని సమాజానికందించే యత్నం చేస్తున్నారు ఈ విషయంలో “మేలుకొలుపు” తన పేరు సార్ధకం చేసుకుంటున్నది అనీ, 2) ఈ తర్క ప్రమాణములు నేడు సమాజ వికాసమునకు అనవసరం. ఏమి సాధించాలని వ్యర్ధమైన ఈ రచనలు చేస్తున్నారు? అనీ. మొదటి అభిప్రాయం నా భావాల కనుగుణమైనదే కనుక దానినలా ఉంచి, రెండో అభిప్రాయాన్ని గూర్చి కొంత విశ్లేషణ చేస్తాను. సత్య దృష్టి నుండి పరీక్షించి ఒక నిర్ణయానికి రండి.
మానవ జీవితంలో తర్కం పాత్ర-జ్ఞాన ప్రక్రియలో దాని పాత్ర-ఏమిటన్నది నిజ జీవితాన్ని యధాతధంగా చూడగలిగితేగాని, వ్యక్తి వికాసానికి, సామాజిక వికాసానికి తార్కికతకూ ఉన్న సంబంధం బోధపడదు. ప్రారంభ సాధకులలోనూ, సాధారణ మానవుల-అనుయాయులలోనూ ఆయా సిద్ధాంత ప్రచారకులూ, మార్గదర్శకులూ కలసి తర్కంపై ఒక వ్యతిరేక భావనను బలంగా నాటుకొనేటట్లు చేయగలిగారు. దాని ప్రభావం సామాన్యులపైనేగాకుండా, రానురాను ఆయా శాస్త్రములందూ, విషయాలందూ నిష్ణాతులైన విద్యావంతులపై గూడా గణనీయంగానే పడింది. వర్తమాన సమాజంలొ, అట్టి ప్రభావంలో నున్న తర్కమంటే చెడ్డదనో, మరో రకంగా తిని కూర్చునే వాళ్ళు తోచక చేసే వాగ్వివాదాలకు పనికి వచ్చేదనో ఒక తప్పు అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్న వారిచే వ్యక్తీకరింపబడినదే పై రెండో అభిప్రాయం. అయితే ఇక్కడ మరో విషయమూ గమనించవలసి ఉంది. అలా తర్కంపై వ్యతిరేకాభిప్రాయం గాని, ఉదాసీనతగానీ, ఏర్పడటానికి తర్కం తరచుగా, దాదాపుగా, తన స్వీయ క్షేత్రాన్ని విడచి అక్కరలేని విషయాలలోనూ, అక్కరలేనంతగానూ ఉపయోగించడమో (ఈ పని అతి తార్కికులు చేస్తుంటారు) అవసరమైనంతవరకైనా ఉపయోగింపబడక పోవడమో (ఈ పని మంద వేగులు చేస్తుంటారు) జరుగుతోందన్నమాట. ఇలాంటి వాటిని పదేపదే అనుభవాల ద్వారా గమనిస్తున్న జనసామాన్యంలో తర్కంపై అలాంటి వ్యతిరేకత ఏర్పడడంలో ఆశ్చర్యమేముంది.
అయితే ఒక విద్య దుర్వినియోగం చేయబడుతున్నంత మాత్రానో, సక్రమంగా వినియోగించుకోలేకపోయినంత మాత్రానో అది విద్యే కాకుండా పోతుందా?ఏ మాత్రం వివేకంతో ఆలోచించగలిగినా అలా కాదని చెప్పగలం. అదలా ఉంచి ఈ తార్కికతను మానవ జీవితంనుండి వేరు చేద్దామన్నా కుదిరే విషయం గాదు వాస్తవంగా ఎందుకని? తర్కం సహజంగానే మానవ మేధస్సులో జరిగే జ్ఞాన ప్రక్రియలో ఇమిడి ఉంది. నిశ్చయాత్మకమైన బుద్ధి ఆయా విషయాలను నిశ్చ యించడానికి, గ్రహణ, విశ్లేషణ, వివేచన అన్న పనులపైనే ఆధారపడుతుంది. ఇది సంఘంలో ఎవరో ఏర్పరచింది కాదు. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఏర్పడి ఉన్న విధానమది. తర్కమూ, తార్కికతా మనిషికి సహజాతము లన్నది వాస్తవమో కాదో మీమీ జీవితాలనుండి గమనించండి. తర్కమన్న మాటకు అనవసరమైన అర్థాలు మనమే కల్పించుకుని, ఆ కొలతలనుండి దానిని నిరర్ధకమూ, దురర్ధకమూ నని కొట్టివేయ బూనడం సబబు కాదు. హేతుబద్ధమైన పరిశీలనారూపమైన అనుభవాంగ తర్కాన్ని విడిచిన వారు జీవితంలో ఎంతో కోల్పోతారు. విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖలలోనూ తర్కం-హేతుబద్ధ యోచన-ఆయా విజ్ఞానాభివృద్ధికి ప్రాణప్రదంగా ఉంటున్నది. అదలా ఉంచండి.
తర్కం జీవితావసరం, వికాస హేతువు కాదని చెప్పదలచుకున్న వారు కూడా తార్కికంగానే దాని అనవసరాన్ని నిర్ధారించే యత్నం చేస్తారు, తర్కం ఎందుకవసరం లేదో నిరూపించడానికి వారి కాధారమైనది మళ్ళా తర్కమే. ఇదెలా ఉందంటే తర్కాన్ని చంపాలనుకున్న వారు తర్కాన్ని బ్రతికించవలసి వస్తోందన్నమాట మొత్తమ్మీద ఏమర్థమవుతోంది? ఏ విషయాలను గూర్చి సమగ్రంగా అర్థం చేసికోవాలనుకున్నా, నిర్థారణలకు రావాలనుకున్నా మేధస్సుకున్న ఒకే ఒక్క ఆధారం తర్క ప్రక్రియే. ఏ మానవుడైనా తార్కికంగానే ఆయా నిర్ధారణలకు వస్తాడు.
Note:-తర్కమంటే హేతూదాహరణల సామర్ధ్యంతో ఆయా విషయాలకు చెందిన అవగాహనకు రావడానికై మేధస్సు చేసే మేధో ప్రక్రియ అనే నా యభిప్రాయం. నిజంగా నిజం కూడా అదే.
మనం యింత వివరంగా చెప్పిన పిదపనూ పిడివాదంతో- అదీ ఒక రకమైన తర్కమేనన్నది గమనించకుండానే- తర్కమెందు కవసరం లేదో తర్కించడం ప్రారంభిస్తారు మరికొందరు. వారిదాడి యిలా ఉండవచ్చు. సహజంగానే ఉన్న దానిని గూర్చి మళ్ళా తర్కం నేర్చుకోండి అని మీరెందుకు చెప్పడం? ఉన్నదాన్ని తెచ్చుకోండనడం వ్యర్ధ ప్రసంగం కాదా? సిద్ధ వస్తువుకై సాధనలేమిటి? వగైరా.
వారు నిజంగా ఉన్న విషయం చూడదలచుకుంటే కొన్ని విషయాలు పరిశీలించి చెప్పండని వారి నడగాలి. 1) తార్కికత జ్ఞాన ప్రక్రియలో సహజంగానే ఇమిడి ఉందా లేదా? ఉందన్న వాస్తవం వారు అంగీకరిస్తే తర్కం అనవసరమన్న మాట మీరెప్పుడూ అనరాదు. 2) అది సరేనయ్యా, తర్కం సహజంగా ఉన్నదే కనుక నేర్చుకోవలసిన, నేర్పవలసిన అవసరంలేదు అంటున్నాము అన్నట్టైతే, మనిషి తనలో ఏర్పడి ఉన్న వనరులనే వినియోగంలోకి తేవడానికీ, వాటి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికీ, వాటిని సందర్భానుసారం-సమయోచితంగా- ప్రయోగించుకోడానికీ వాటిచేత క్రమబద్ధంగా విశేష పరిశ్రమ చేయించడం అవసరం. సహజంగా అదే పరికరాలున్న మేధావికీ, సామాన్యునికి ఉన్న తేడా ఏమిటి? ఎందు వల్ల ఆ తేడా ఏర్పడింది? అలానే ఆయా విషయాలకు చెందిన సామాన్య జ్ఞానానికి విశేష జ్ఞానానికీ తేడా ఏమిటి? అదెట్లా ఏర్పడింది? ఈ విషయాలను స్వానుభవం ద్వారా గ్రహించగలిగితే తర్కం ఒక విద్యగా కూడా ఎందుకు నేర్వవలసి ఉందో బోధపడుతుంది.
పూర్వీకుల పరిశోధనాంశాలను యధాతధంగా (మొత్తమూ సత్యమేననే దృష్టితో) స్వీకరించుట ఎంత దోషయుక్తమో, అవి అక్కరలేనివిగా, పనికిరానివిగా భావించి విడచివేయడం కూడా అంతే దోషయుక్తము. గతం నుండి సంక్రమించిన విజ్ఞానాన్ని పరిశీలించడమూ, తన అధ్యయనంలో భాగంగా స్వీకరించడమూ నిరర్ధకమనే ఆలోచన విద్యావిధానానికి గొడ్డలిపెట్టు కాగలదు. ప్రతివ్యక్తి ఆయా విషయాలను స్వయంగా గ్రహించడం అసాధ్యం కానప్పటికీ, ప్రతిదీ అలానే సాధిస్తాననడం అవివేకమూ, మూర్ఖతా కూడా అవుతుంది. అంతేకాక అధిక వ్యయ ప్రయాసలూ, కాలహరణము కూడా. ఒక్క విషయ మాలోచించండి. ఒక క్రమ బద్దమైన అభ్యాసరూపమైన పరిశ్రమ చేయని మేధస్సు చూసే చూపుకూ, చేసే నిర్ణయాలకూ, ఆ ప్రక్రియలో నిపుణత్వం సాధించిన మేధస్సు చూసే చూపుకూ, నిర్ణయాలకూ తేడా ఉంటుందా? ఉండదా? ఆలోచించండి. ఒక వృత్తాన్ని గీశామనుకోండి. దానికి ప్రారంభమూ, ముగింపు ఒక్కటా కాదా? ఆలోచించి చెప్పండి.
జీవితం సక్రమంగా సాగాలంటే బుద్ధి నిరంతరం వివేచనచేసి నిర్ణయాలు తీసికోవలసి ఉంటుంది. సమస్యను సరిగా చూడాలన్నా, సరైన పరిష్కారాన్ని కనుగొనాలన్నా వివేకం పాత్రే మౌలికమైనది. తర్కబద్దంకాని వివేకముండదన్నదో వాస్తవం. తర్కం యొక్క ఆవశ్యకతా, జ్ఞాన ప్రక్రియతో తర్కానికున్న సంబంధమూ, తర్కించే స్వభావం మనిషికి సహజాతమైనదే ఐనప్పటికీ దాని నుపయోగించుటలో నిపుణతకై దానినో విద్యగా నేర్వవలసిన అవసరమూ అన్న వాటిని గురించి నేచూపిన ఆధారాలతోబాటు మీమీ యనుభవాలనుండిన్నీ ఆధారాలు లభిస్తాయేమో చూసి ఒక నిర్ణయానికి రండి. తర్కం తప్ప మరేదీ అక్కరలేదనో, తర్కం అక్కరలేనిదనో రాగద్వేష రూపమైన తొందరపాటు నిర్ణయాలకు రాకుండా నిదానంగానూ, నిష్పాక్షికంగానూ- తర్కమూ నిత్యజీవితంలో దాని పాత్ర- అన్న దానిని యథాతథంగా గమనించే యత్నం చేయండి. మీ మీ అభిప్రాయాలను సహేతుకంగా పత్రికకు వ్రాయండి. పై సంచికలో, మరికొంత విశ్లేషణ చేద్దాము.
ప్రస్తుతాంశమైన ప్రమాణ వివేచనలో మరికొన్ని విషయాలు మీ ముందుంచుతాను. గమనించండి. ప్రమాణమన్న పదం పరికరాలకూ-పద్దతులకూ కూడా అన్వయిస్తుంది అన్న నా ప్రతిపాదనపైనే వివరణలు కోరుతూ కొందరు లేఖలు వ్రాశారు. వాటిని దృష్టి నిడుకునే గత సంచికలో కొంత వివరణ చేశాను. ఆ వివరణానంతరమున్నూ “పరికరముల ననుసరించి ప్రమాణములారు. ఇంద్రియములే అవి" పద్ధతుల ననుసరించి ప్రమాణములు మూడు (ప్రత్యక్షమూ, అనుమానము,శబ్దము)అన్నారు. ఇక్కడో విషయం తెలియవలసి ఉంది. పరికరముల ననుసరించి ప్రమాణములగు ‘6’టినే ప్రత్యక్ష ప్రమాణముగా నేను తెలిసికొని ఉన్నాను. మరి పద్దతుల ననుసరించి ప్రమాణములను వాటిల్లో ప్రత్యక్షమును కూడా లెక్కించినారు. మీ దృష్టిలో ప్రత్యక్షమనునది శోత్రనేత్రాది 6 ప్రమాణముల కంటె వేరా? ఒక్కటేనా? వేరే అయితే ఆ ప్రత్యక్ష రూపమేమో తెలుపండి. శ్రోత్రాదులే ప్రత్యక్ష ప్రమాణమనుకుంటే పద్దతుల ననుసరించీ ప్రమాణము లుంటాయని రెండు రకముల విభజనెందుకు? పద్దతుల ననుసరించిన ప్రత్యక్షానికీ, పరికరముల ననుసరించిన ప్రత్యక్షానికీ తేడా ఏమో తెలుపండి. అంటూ ఒకరిద్దరు వ్రాశారు.
పై సందేహాలకు సమాధానం చెప్పాననే నాకనిపిస్తున్నప్పటికీ నాభావం ఎదుటి వారికి అందవలసినంత స్పష్టంగా అందిందో లేదో? అన్న దృష్టి నుండి మరి కొంత వివరణ అవసరమనిపిస్తోంది. పద పదార్థము లెలా సంబంధపడి ఉంటాయో పదార్ధ నిర్వచనం ఎలా చేస్తే సమగ్రమవుతుందో తెలిసికోవలసిన అవసరముందిక్కడ. ఏ అర్ధాన్ని (అనుభవంలో ఉన్న దానిని అనుభవాని కాధారమైన దానినీ అర్ధమంటాము.) సూచించడానికి ఒక పదాన్ని వాడుతున్నామో ఆ పదానికది అర్ధమవుతుంది. పదానికీ అర్థానికి సాంకేతిక సంబంధముంటుంది. పరిణితి చెందిన భాషలో నున్న పర్యాయపదాలూ (ఒక పదానికనేకర్థాలు) అన్నవాటిని మినహాయిస్తే ప్రతి పదమూ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఈ పదానికిదే అర్ధము అన్న వివేకం కలిగియుండుటే పదార్ధ విజ్ఞానం కలిగియుండడమంటే.
. Note:-పదాని కర్థం పదార్థం. అది తెలియడమంటే ఆ పదంచే సూచింప బడుతున్న విషయం అనుభవంలో ఉందన్నమాట. ఆయా విషయాలు తెలియడమంటే ఏమిటో ఈ విషయం అర్థమైతేగాని తెలియదు. జిజ్ఞాసువుకు పదార్థాలు తెలియడమంటే ఏమో తెలియకపోతే గ్రంథాధ్యయనంలోనూ, శ్రవణం చేయుట లోనూ ప్రమాదపడే వీలుంది.
పద పదార్ధముల నిర్ధారణ ఎలా చేయవలసి ఉంటుందో దృష్టాంత పూర్వకంగా చూద్దాము.
ప్రక్క ఒక నలుపు చుక్క వుంది. దానిని చూపి నలుపు పదార్థమది అన్నాను. మళ్ళా దానినే చూపించి రంగు అనబడే పదార్థము అనియూ, మూడవ సారి అది ఒక గుణము అనియూ, చెప్పాను. ఒకే విషయాన్ని చూపుతూ నలుపు, రంగు, గుణము అన్న మూడు పదాలు వాడాను. మూడు పదాలు ఒకే అర్ధాన్ని చూపుతున్నాయి కనుక అవి పర్యాయ పదములా? కాదనాలి. ఎందుకని నలుపున్న ప్రతిచోటా గుణముంటుంది గానీ, గుణమున్న ప్రతిచోటా నలుపుండదు. పులుపును చూపీ గుణమన వచ్చుగదా. అలానే నలుపన్న దానిని చూపి రంగన వచ్చుగానీ, రంగున్న ప్రతిచోటా నలుపే ఉండాలన్న నియమం లేదు. అలానే గుణము, రంగు అన్నది కూడా. దీనిని బట్టేంతెలుస్తోంది పై మూడు పదములకూ మూడు పదార్దములున్నవనే గదా! (అయితే మూడు పదాలకూ ఉన్న మూడు వేర్వేరు పదార్థములను కనుగొనడమెలా అన్నది మీరే పరిశీలించండి. (పై మూటిలో ఒకటికంటే మరొకటి అధిక దేశవర్తిగానో, న్యూన దేశవర్తిగానో ఉంటున్నది. గమనించండి.)
అలానే పద్దతుల ననుసరించి ప్రమాణ నిర్వచనమూ, పరికరాల ననుసరించి ప్రమాణనిర్వచనమున్నూ చేయవలసి ఉంటుంది. పరికరము (జ్ఞానేంద్రియములు) ఈ విధానంలో పనిచేయుట ద్వారా ఈ రకమైన జ్ఞానం కలుగు తున్నది కనుక విధానము ననుసరించిన్నీ, ఈ రకమైన జ్ఞానమీ ఈ యింద్రియము వలనే కలుగుంది కనుక ఈ జ్ఞానమునకీ యింద్రియం ప్రమాణమని పరికరముల ననుసరించీ పేర్లు పెట్టబడ్డాయని లోగడ చెప్పాను. అదెలానో చూద్దాం. ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ వగైరా...ఇలా కదా ప్రమాణాలకు పేర్లున్నాయి. పరికరముల ననుసరించే ప్రమాణ పదార్ధాన్ని చెప్పవలసి వస్తే; నేత్రమూ, శ్రోత్రమూ, ఇలా ఆ జ్ఞానేంద్రియాల పేర్లనే చెప్పితే సరిపోతుంది. అప్పుడు వాటిచే కలుగుతున్న ప్రమలనూ క్రమంగా నేత్రప్రమ ఆకృతి, రంగు మొదలైనవనీ, శ్రోత్ర ప్రమ. శబ్దజ్ఞానమనీ... ఇలా ప్రమాణ వర్గీ కరణమూ, ప్రమాణ వర్గీకరణమూ చేయవలసి ఉంటుంది. ఈ ఆరింటి ద్వారా కలుగుతున్న ప్రమనే ప్రత్యక్ష ప్రమ అన్నాము అంటే ఇందాకే చెప్పుకున్నట్లు నలుపు, ఎరుపు, తెలుపు పదములన్నీ రంగు అన్నమాటచే చెప్పుకున్నట్లు అవుతుంది. అయితే రంగు అన్న పదార్థానికీ, ఎరుపు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా ఎలా గమనించామో, అలానే ప్రత్యక్ష మన్న పదార్థానికీ, కన్ను, ముక్కు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా కూడా గమనించాల్సి ఉంటుంది. ఎలా ఎరుపు పద నిర్వచనం రంగుకు సరిపోదో అలానే ఇంద్రియం ప్రమాణమన్న నిర్వచనం ప్రత్యక్షమన్న పదానికి సరిపోదు. కనుక ప్రత్యక్షమన్న పదం పరికరానికి పెట్టింది కాదు. ప్రత్యక్షంలో పరికరాలు సామాన్యంగా ఉంటాయి. ఎలా ఎరుపు రంగు, నలుపురంగు మొదలైనవో అలానే నేత్ర ప్రత్యక్షమూ, శ్రోత్ర ప్రత్యక్షమూ మొదలగునవిన్నూ. ప్రత్యక్షంలో ఆరు యింద్రియములూ సామాన్యమై జ్ఞానం కలుగుతున్న పద్దతి విశేషమైయుంటుంది. విశేషాన్ని బట్టే ఆయా పద నిర్వచనాలు చేయవలసి ఉంటుంది. లక్షణంలో అసాధారణత్వం (అతివ్యాప్తి, అవ్యాప్తి అసంభవతలు లేని స్థితి) ఉండి తీరాలి.
మరోకోణం నుండిన్నీ పరిశీలిద్దాం. ప్రత్యక్ష పదార్దమేదందాము? ఇంద్రియమా, ఇంద్రియములా? అనుభవంలో అనేక రకాల జ్ఞానము అనేక ఇంద్రియాల ద్వారా కలుగుతున్నది కనుక ఇంద్రియములనాలి. అప్పుడు ప్రత్యక్ష ప్రమాణమని గాక ప్రత్యక్ష ప్రమాణములు అనాల్సి వస్తుంది. అలానే అందామను కున్నా ఉన్న ఆరింద్రియాలూ ప్రత్యక్షంలోనే చెప్పబడ్డాయి కనుక మరి అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? ప్రత్యక్షంలోని ఇంద్రియాలనే చెబుదామంటే అది దోష యుక్త లక్షణమవుతుంది. కనుక వాటితో ఏ యింద్రియాన్నీ మరో ప్రమకు కరణంగా చెప్పడం కుదరదు. మరి మిగిలిన ప్రమాణములెలా సిద్దిస్తాయి? ఆలోచించండి. ఏ దృష్టినుండి ప్రమాణాలకు పేర్లు పెట్టుంటారో తెలుస్తుంది. అన్ని ప్రమలకూ పరికరములు సామాన్యములే. పద్దతులే విభేదిస్తున్నాయి. పరికరాలుండడమూ, పనిచేయడమూ అన్నంతవరకూ, ఏర్పడితేగానీ ఏదో ఒక కార్యోత్పత్తి జరగదు. అనుభవమూ, జ్ఞానమూ ఫలరూపాలే గనక అట్టి దేర్పడుటకు ఏదో పరికరం ఏదో క్రమంలో పనిచేయ వలసి ఉంటుంది. పరికరాన్ని బట్టి ఫలితం మారితే అసాధారణత్వం పరికరంలోనూ, పని తీరును బట్టి ఫలితం మారితే అసాధారణత పనిలోనూ, చూసి తీరాలి. అట్టిదే ఈ విషయం కూడా. ఇంతా చేస్తే నా ప్రతిపాదన ప్రమాణ పదము ప్రకరణాన్ని బట్టి పరికరాలకూ, పద్ధతికి కూడా వర్తిస్తుందనీ, ప్రత్యక్షాది ప్రమాణ పదములు విధానముల ననుసరించి ఏర్పడినవనీ మాత్రమే. గమనించి అవసర మనుకున్న ప్రశ్నలు వేయండి.
గమనిక :- తర్కజ్ఞులైన శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యుల వారు వేసిన ప్రశ్నలను దృష్టి నిడుకునీ ఈ వివరణ లివ్వడం జరిగింది. ప్రశ్న, తెలుసుకోడానికీ, పరీక్షించటానికి కూడా పనికివస్తుంది. ప్రమాణ, తర్కములను క్రొత్తగా పరిశీలిస్తున్న వారి అవగాహనా సౌలభ్యతను దృష్టి నిడుకునో, విషయాన్నెలా నిర్ధారిస్తారో తెలుసుకుందామనో వారీ ప్రశ్న వేశారనుకుంటాను. ఏ దృష్టి నుండి అడిగినప్పటికీ పరిశీలించే చెప్పవలసిన నాకూ, పరిశీలించి నిర్ణయించు కోవలసిన మీకూ-పాఠకులకూ-కూడా మరింత అవగాహనకు ఈ ప్రశ్నావళి తోడ్పడగలదు. ఈ సందర్భంలో పాఠకులుగానే ఉన్న మిగిలిన తర్కజ్ఞులనూ నేను కోరేదేమంటే మీరున్నూ మీమీ కోణము నుండి విషయాన్ని పూర్వ పక్షం చేస్తే మరింత విశాలంగా, విస్తృతంగా ప్రకరణ విషయ క్షేత్రాన్ని దర్శించుటకు వీలవుతుంది. అందరూ స్పందిస్తారనీ ఆశిస్తూ ప్రస్తుతానికీ వ్యాసం ముగిస్తాను.
సంపుటి-2 సంచిక-3 1-3-92
మానవ జీవితానికి గల తర్కావశ్యకతను గురించీ, దానిని ఒక విద్యగా నేర్వవలసిన అవసరాన్ని గురించీ ప్రతి సంచికలోనూ కొద్దికొద్దిగా పరిశీలిస్తూనే వస్తున్నాము. దానికే చెందిన మరికొన్ని వివరాలున్నూ ప్రస్తావిస్తున్నాను పరికించండి. ఏ విషయాన్ని గూర్చి తెలుసుకుందా మనుకుంటున్న వారైనా ముందుగా ఆ విషయాన్ని గూర్చి అప్పటికేమయినా సమాచారం అందుబాటులో ఉందేమో చూస్తాడు మామూలుగా. మీకే ఒక విషయాన్ని గురించి తెలిసికోవా లనిపించిం దనుకోండి. ఏo చేస్తారు? ఆ విషయం తెలిసిన వారెవరైనా ఉన్నారా? అని విచారిస్తారు. వారిని కలసి వీలైనంత సమాచారాన్నిసేకరిస్తారు. వాటిని లోతుగానూ, నిదానంగానూ పరిశీలించి దోషాదోషాలు విశ్లేషించి స్వానుభవంలో అవెట్లున్నాయో సరిచూసుకుని ఒక నిర్ధారణకు వస్తారు. సాధారణంగా ఎవరైనా యిలానే చేస్తారు. ఈరోజు విశ్వవిద్యాలయాలలో విశేష జ్ఞానరూపమైన పరిశోధనలందు సిద్ధాంత వ్యాసాలు ప్రతిపాదించే అధ్యయన శీలురున్నూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రాచీన మేధావులున్నూ జిజ్ఞాసువులకీ క్రమాన్నే బోధించారు.
గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః
ఫలాలమివ ధాన్యార్ధీ త్యజేద్గ్రంథమశేషతః. |
జ్ఞాన విజ్ఞానములను లక్ష్యముగా నెంచిన మేధావి ముందు గ్రంథాధ్యయనం చేయాలనీ, ఏదో ఒక రోజు-అది అనుభవజ్ఞానం పొందిన రోజే-గ్రంథాదులను ఆమూలాగ్రం విడువవలెననీ శ్లోక తాత్పర్యం. మరో విషయం. తర్కమే జ్ఞానగమ్యమనో, తర్కం జీవితానికంత ప్రధానమైనది కాదనో తలచే రెండు దృక్పథాలూ, భ్రమాత్మకాలే. మరో శోచనీయమైన విషయమేమంటే మానవజీవితంలోని వివేక భాగాన్ని సమగ్రమూ, సమర్ధవంతమూ చేసికుని తద్వారా జీవనాన్ని ధార్మికమూ, సుఖశాంతియుతముగా నడుపుకొనుటకుగాను వినియోగించుకోవలసిన తర్కమును నేడు కేవల మొుక జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు తర్కం నేర్చినవాళ్ళు. ఇప్పుడు నేర్చుకునేవాళ్ళున్నూ వృత్తిగానే (ఉద్యోగ సముపార్జనకే) నేర్చుకుంటున్నారు. నిజంగా తర్కం కేవల మొక పొట్టకూటి విద్యకాదు. కారాదుకూడా. వివేకమన్నది జ్ఞాన నేత్రంగా చెప్పుకుంటే, దానిని తయారు చేయటానికి తర్కం నిమిత్త కారణమవుతుంది. అనుభవం ఉపాదాన కారణమవుతుంది. తర్కానికి ప్రారంభం ఏదేని విషయములో అనిశ్చిత స్థితి ఉండడమే. సంశయమే విచారణకు మూలం. ఈ వాస్తవం తర్కశాస్త్రంలోనూ ప్రస్తావించబడింది. సంశయించక పరీక్షించుటే కుదురదు కనుకనే న్యాయదర్శనంలోనూ పదార్థ పరీక్ష సంశయంతో ప్రారంభమవుతుంది. ఈ వాస్తవాన్ని ఆస్తిక సాంప్రదాయకులెందుకు గమనించరో, గమనించామని ఎవరైనా అంటే మరి వారివారి సిద్ధాంత పరీక్షకెందుకు సిద్ధపడరో నావరకు నాకు బోధపడని విషయం. ఈ మాటెందు కనవలసివస్తోందంటే, ముఖ్యమైన అన్ని సిద్ధాంతాలవాళ్ళూ తర్క ప్రావీణ్యులే అయినప్పటికీ, అన్ని ఆస్తిక సిద్ధాంతాలకూ ప్రాతిపదిక విశ్వాసమే అయి ఉన్నది. పరస్పర విరుద్ధములైన ఈ రెంటికీ వారికి సమన్వయం ఎలా కుదిరిందో అర్థం కాని విషయం.
Note:-ఏ విషయమైనా ఒకనికి అది విశ్వాసంగా ఉన్నంతవరకు అతనికి దానిని గురించిన తెలియనితనం ఉన్నట్లే. ఒకవేళ ఎప్పటికైనా ఎవరికైనా దానిని గురించిన జ్ఞానం అనుభవం కలిగిందంటే ఇక ఆ విషయమై అతనికి విశ్వాసమన్నది లేదు. తెలిసే ఉంది కనుక. విశ్వాస మూలకములైన సిద్ధాంతానుయాయు లుపయోగించు తర్కము విశ్వాసానికి-తెలియనితనానికి-అనుయాయియై తన స్వీయ స్వభావాన్నే కోల్పోతుంది. ఈ విషయమూ ముందుముందు విశేష చర్చనీయాంశం కాబోతోంది కనుక ప్రస్తుతానికిదీ ఒక చర్చనీయాంశమే నన్నది గుర్తులో ఉంచుకోండి చాలు.
తర్కం మానవ మేధో ప్రక్రియలో- మెదడు చేసే పనిలో- భాగంగా సహజంగానే ఏర్పడియుండగా దానిని నేర్పడమూ, నేర్వడమూ ఎందుకన్న పక్షాన్ని గూర్చి గతంలో కొంత విచారించాము.
వారినీ, వారి వాదనా సబబుగానే ఉందనుకునే కొందరు పాఠకులనూ, దృష్టి నిడుకుని క్రింది విషయాలు వ్రాస్తున్నాను. (1) ప్రతి మనిషికి కాళ్ళూ, చేతులూ ఉన్నాయి. అవసరమైతే ఆత్మరక్షణకు వాటిని ఉపయోగించడమూ ప్రతి మనిషికి తెలుసు. మరింక ఆత్మరక్షణ విద్యలంటూ నేర్వడమెందుకు? నేర్పడమెందుకు? అలానే ఇప్పటి వరకు మానవ సంఘంలో పుట్టి పెరిగిన అన్ని విద్యల విషయం తోనూ మొదటివాడికి గురువేడీ అని అడిగి, వీటిని ఎవరికి వారే సాధించుకోవచ్చు, అని తర్కబద్దంగా వాదించవచ్చు. అది ఒకరకంగా నిజమూ కావచ్చు. వీటిని ఎవరికి వారే నేర్వవచ్చు. అయినా అవన్నీ నాటినుండి నేటివరకు విద్యారూపాలుగా నేర్పబడుతున్నాయి. నేర్వబడుతున్నాయి, కనుక, వాటిని ఎవరికి వారే నేర్వవచ్చు వాటికై విద్యాలయాలూ, బోధనలూ, నిరర్ధకమనడం వివేకవంతం కాదు. అదలా ఉంచి, సాంప్రదాయక తర్కాన్ని పరిశీలించవలసిన-నేర్వవలసిన అవసరం లేదనుకునే వాళ్ళకు నేచెప్పేదేమంటే ఈ అంశాన్ని పరీక్షకు పెట్టి చూసుకోండి. ఒక్క ఆరుమాసాలు నిజమైన విద్యార్థిలానో, నిష్పాక్షిక పరిశోధకుని లానో ప్రాచీన తర్కాన్ని-తర్క విద్యను-అభ్యసించండి. పూర్తయిన పిదప ప్రారంభానికి ముందున్న బుద్ధి వికాసానికీ, ప్రస్తుత జ్ఞాన స్థాయికి తేడా ఉందో లేదో చూసుకోండి. విషయం పరిశీలనా సామర్థ్యంలోనూ, విషయజ్ఞతలోనూ అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉందో లేదో గమనించండి. అలా చేయుటవలన విషయాన్ని అనుభవం ద్వారా పరీక్షించినట్లౌతుంది.
Note- : కలిగిన జ్ఞానం సత్యమా కాదా? అందిన సమాచారం (అనుమాన శబ్ద ప్రమాణాల ద్వారా) సత్యమా కాదా? నిర్ణయించుకోడానికి మనిషికున్న ఆధారం ఒక్కటే. అది యదార్ధ అనుభవమే. అదే-స్వతః ప్రమాణం
మీ, మీ పరిశీలనల ద్వారా మీరు ప్రాచీనులలోని దోషాదోషాలను నిర్ణయించగలగడమూ, వెనుకటివారు భ్రమపడినవిషయాలకు చెందిన వాస్తవాన్ని గ్రహించడమూ చేయగలిగినప్పటికీ, వెనుకటి వారిచే చెప్పబడిన ఆయా విషయములను అధ్యయనం చేయడం నిష్ప్రయోజనం మాత్రం కాదు. ఈ విషయాన్ని తర్కం అక్కరలేదనే నవీన వేదాంతులూ, హేతువాదు లనుకునేవాళ్ళూ, తగినంత విషయావగాహన లేకనే తమను తామే జ్ఞానులుగా చెప్పుకునే వాళ్ళు కూడా స్పష్టంగా గమనించడం అవసరం.
అలానే, తార్కికత మానవస్వభావం కనుక తర్కం నేర్వనక్కరలేదనే వాళ్ళను నేనడిగినదేమంటే, సహజ తార్కికులారా! వెనుకటివాళ్ళ ఏ పరిశోధితాంశాలనూ స్వీకరించకుండా మీ స్వాభావిక తర్కశక్తి ద్వారానే యీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. 1) జ్ఞాన మెన్ని రకాలు? 2) పదార్ధా లెన్ని? 3) భ్రమలెన్ని రకాలు? మానవుడు పొందవలసిందేమిటి? దానిని పొందటమెలా? ఇతరుల భావాలు మీపై పడకుండా సమాధానాలు చెప్పండి చూద్దాం.
ఏతావాతా నే చెప్పదలచుకున్న దేమంటే, ఆయా విషయాలను సాధించిపెట్టు పరికరములమరి ఉన్నంత మాత్రానే ఫలితాలు జనించవు. ఉపయోగించు మెలకువల నెరుంగుటా, ఉపయోగించు అభ్యాసము ద్వారా నిపుణత సాధించుట అన్న విన్నీ సమకూడినప్పుడే ఫలితం కోరినస్థాయిలో సిద్ధిస్తుంది, కనుక ఎంతగా మానవునిలో తర్కించే స్వభావమున్నా, తార్కికంగానే జీవిస్తున్నాడని ఒప్పుకున్నా, తర్కాన్ని సంపూర్ణంగా జీవితంలో వినియోగించుకోగల నేర్పుకై దానిని విద్యగా నేర్వవలసియే ఉన్నది. దీనిపై మీ, మీ యభిప్రాయాలను వ్రాయండి.
ప్రమాణముల పేర్లు ఏ దృష్టినుండి ఏర్పరచడం జరిగింది? అన్నది ప్రస్తుత పరిశీలనాంశమై యున్నది. ఫిబ్రవరి సంచిక చూసిన పిదప శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారు వ్రాసిన లేఖను కూడా ప్రచురించడం ఈ విషయంలో జిజ్ఞాసువుల పరిశీలనకు కాగలదని అనిపించుటచే దానినీ వ్రాస్తున్నాను. మ||శ్రీ|| 1-2-92 సంచిక అందినది. నా ప్రశ్నకు సమాధానము సరిగా లేదు. ప్రత్యక్షమను ప్రమాణము శ్రోతనేత్రాదులకంటె వేరా? కాదా? అని నా ప్రశ్న. వేరనిగానీ, వేరుకాదనిగానీ సమాధాన ముండాలి. ఏదో వివరణ యిచ్చారు. అది నా కంత అవసరము గాదు. వేరే అంటే ఆరింటికంటె వేరైన ప్రత్యక్ష ప్రమాణమేమో చెప్పాలి. వేరు కాకపోతే పద్ధతుల ననుసరించి ప్రమాణములను వాటిలో ప్రత్యక్షమును చేర్చరాదు. మొదటి వర్గములోనే '6'న్నూ చేరినవి కనుక.
మీరు “రంగు” అంటూ ఏదో వ్రాశారు. రంగు అనునది సామాన్యవాచక శబ్దము. ప్రత్యక్ష ప్రమాణమనునది కూడా అటువంటిదే. తెలుపు, నలుపు, ఎరుపు ఇత్యాదులు రంగు యొక్క విశేషముల చెప్పు శబ్దములు. విశేషములకంటె విడిగా సామాన్యముండదు. అంటే తెలుపో, నలుపో, ఎరుపో కాక ఇంకా రంగు అనేది ఒకటి వేరే ఉండదు. అట్లే ప్రత్యక్ష ప్రమాణముకూడా. శోత్రమో, నేత్రమో ఇత్యాది ‘6’ కాక వేరే ప్రత్యక్షముండదు. అనునంతవరకే నాకు తెలిసిన అంశము.
మీరు ప్రత్యక్ష ప్రమాణ విశేషములగు శోత్ర నేత్రాదులారింటినీ మొదటి వర్గములో చేర్చినారు. [మొదటి వర్గమంటే పరికరముల ననుసరించి ప్రమాణములన్న వర్గమని పాఠకులు గమనించాలి-సురేంద్ర] ఇక దానికంటూ అన్యమైన ప్రత్యక్ష ప్రమాణమేదేని ఉంటే దానిని రెండవ వర్గములో చేర్చవచ్చు. కానీ ఆ ఆరింటికీ అతి రిక్తమైన ప్రత్యక్ష ప్రమాణం నాకు తెలియదు. మరొక్కమాట. మీరు అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? అని ఓ మాట న్నారు. దీనినిబట్టి అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లు అర్థమగుచున్నది. అలా అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీ భావమా? ప్రమాణ వివేచన ఆరంభించినప్పుడు మీరన్న ప్రాచీనులు కానీ, మీ సమకాలీనులు కానీ ఎటువంటి అభిప్రాయములు కలిగియున్నారో పేర్కొని, వారి యభిప్రాయములలోగల దోషమేమిటో తెలిపి, మీ అభిప్రాయమునకూ, వారల అభిప్రాయములకూ గల భేధమేమో వివరించి, ఎందువల్ల ఆ భేదమేర్పడిందో వివరించితే కొంత విషయ స్పష్టత ఉండేదేమో ననిపించుచున్నది. సరి. సంతకం.
సురేంద్ర :- ఈ విషయమై నేనిప్పటికే వెలిబుచ్చిన అభిప్రాయములను క్రోడీకరించి చూపుతాను గమనించండి.
1] ప్రమాణమన్నమాట జ్ఞానార్జనలో ఉపయుక్తమవుతున్నది. అది పరికరములనూ, పద్ధతులనూ సూచించగలదు.
2] ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ ఇత్యాది పేర్లు పరికరముల యందలి తేడాలను సూచించునవిగా కాక, ప్రక్రియా విశేషములను సూచించునవై యున్నవి.
3] ప్రమాకరణం ప్రమాణం అని వివరణ చేస్తూ కరణమింద్రియం అని అన్వయించినచో, ప్రమాణముల పేర్లూ, సంఖ్యా ఇంద్రియాల పరంగా నిర్ధారించవలసి వస్తుంది. కానీ అవి అలా లేవు.
4] ప్రత్యక్ష మొక్కదానిలోనే “6” ఇంద్రియాలు చేరిపోతాయి. మరి విుగిలిన ప్రమాణాల కింద్రియాలేవి? అన్న ప్రశ్నకు ప్రమాకరణం ప్రమాణం, ప్రమాణమింద్రియం అన్నవాళ్ళే సమాధానం చెప్పవలసి ఉంది.
5) ఒక్క ప్రత్యక్షంలోనే “6” జ్ఞానేంద్రియాలూ ఇమిడిపోతాయి. పరికరాలననుసరించే ప్రత్యక్షాది పదములు ఏర్పాటుచేసి ఉంటే అనుమానమూ, శబ్దమూ నన్న పేరు నిరర్థకమౌతాయి.
6) ప్రత్యక్షంలో ఆయా ఇంద్రియాలు ఆయా విశేష విజ్ఞానాలకు ప్రమాణం లౌతాయి. వాటి పేర్లూ వాటికి సంబంధించే ఉంటాయి. నేత్ర ప్రత్యక్షం వగై రా. సరే.
అదీకాక రంగు సామాన్యవాచక శబ్దమై ఎరుపాదులు విశేషత్వబోధకాలై నప్పటికీ ఎరుపూ, రంగూ ఒకే పదార్థమును సూచించు పదము లనరాదు. అవి పర్యాయ పదములు కావు. ఎందుకనగా రంగు అన్న పదార్ధాని కన్యంగా ఎరుపు ఉండదుగానీ ఎరుపు లేకున్నా రంగు ఉంటుంది. అలానే అవయవావయవిలన్న రెండు పదార్ధములనూ విడదీసి చూపలేకపోయినా, అవయవాలకంటే అన్యంగా అవయవి లేకున్నా అవి రెండు పదములూ, రెండు పదార్ధములూ అనాల్సిందే. పదార్థవివేచన అలా చేయవలసిందే. కనుక ప్రకరణోద్దేశాన్ననుసరించి ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అన్న పేర్లు ప్రకార భేదాలననుసరించిపెట్ట బడినవే. అయితే ప్రత్యక్ష పద్ధతిలో కలుగుతున్న జ్ఞానానికాధారం ఇంద్రియాలే.
ఆచార్యులవారే, మరోమాట అంటూ “అనుమాన ప్రమాణాని కింద్రియ మేదందాము” అన్న నా మాటను ప్రస్తావించి, అనుమాన ప్రమాణం కూడా ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లున్నది. అవునా? అని అడిగారు. ఇక్కడ నామాటేమిటంటే సంచికను వారూ, పాఠకులూ కూడా మరోసారి చూడమని. ఎందు కంటే ప్రమాణ పద నిర్వచనంలో ప్రమాకరణం ప్రమాణం అని, ప్రమాణ మింద్రియం అను పక్షంవారు సమాధానం చెప్పవలసిన అంశంగా ఆ ప్రశ్న వేశాను. నా ప్రతిపాదన దృష్టినుండీ అది అసంబద్దమనే కదా! ప్రమాణపదములు ఇంద్రియాలనుబట్టి కాక విధానాలనుబట్టి ఏర్పరచారన్నదే నా ప్రతిపాదన.
సాంప్రదాయకులున్నూ ప్రమాణ పదవ్యుత్పత్తి రెండుగా చేశారు;1) ప్రమీయతే ఏన తత్ర్పమాణమ్! 2) ప్రమీయతే అనేన ఇతిప్రమాణం- మొదటిది పరికరాన్ని, రెండవది ప్రకారాన్నీ సూచిస్తాయవి.
ప్రత్యక్ష జ్ఞానకరణ మింద్రియం అనడంలో దొసగేమీలేదుగానీ ప్రమాణ నిర్వచనంలో ప్రమాకరణం ఇంద్రియం అంటే అనుమాన, శబ్దములందు ఇంద్రియ కారణత్వానికి అవ్యాప్తి సంభవిస్తుంది. గమనించగలరు.
ప్రమాణ సంఖ్యపైననూ తార్కికులలో బహుచర్చ సాగింది. కానీ సంఖ్య విషయమై పెద్దగా పెనుగులాడ వలసిన అవసరం లేదు. పోతే కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ మనం నిర్ణయించిన ప్రమాణములలో ఇమడ్చగలగాలి. అదే అసలు విషయం. ఈ దృష్టినుండి చూస్తే(ఆయా పక్షాలవారు, నేచెప్పిన సంఖ్యనే అంగీకరించా లంటూ అక్కరలేని పిడివాదాన్ని పట్టుకోకపోతే) మానవ జీవితంలో కలుగుతున్న జ్ఞానరాశిని, (ఉపయుక్తమవుతున్న జ్ఞానరాశిని) ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ నన్నమూడు వర్గాలలో ఇమడ్చవచ్చు.
సంపుటి-2 సంచిక-4 1-4-92
జ్ఞానార్జనలోనూ, విషయ పరిశీలనా, నిర్ధారణల సందర్భంలోనూ ప్రమాణ, తర్క విద్యలందు నిపుణత్వం కలిగియుండడం ఎంత అవసరమో గమనించనంత కాలం వ్యక్తి వీటినో విద్యగా నేర్వడానికి సిద్ధపడడు. ఆ లోపమే ఈనాడు తర్క విద్యను జీవితావసరంగా చూడనీయకుండా చేస్తోంది. అటు తార్కికులలోనూ, ఇటు తర్కజ్ఞానం లేని ఆయా ధోరణుల ప్రచారకులలోనూ కూడా తర్క ప్రమాణములను గూర్చి తప్పు భావనే చోటు చేసికుని ఉందీనాడు. ఆ విద్యలో ప్రవేశమున్న వారిలో ఎక్కువమంది దానిని, గతంలోనే మనమనుకున్నట్టు స్వీయ జీవిత యానానికి చుక్కాని వంటిదనికాక, ఒక వృత్తిగా - బ్రతుకుతెరవుగానూ, అసలు దాని పూర్వాపరాలే తెలియనివారు అదో అక్కరలేని అంశంగానూ పరిగణిస్తున్నారు. అయినా జీవస్వభావంలోనే ఉన్న తర్కించే గుణం వల్ల అస్తవ్యస్తపు తర్కాన్ని (అదీ తర్కమేనన్న స్పృహ కూడా లేకనే) తమ తమ పిడివాదాలు నిలబెట్టుకుంటానికి ప్రయోగిస్తుంటారు. ఆయా విషయాలకు చెందిన మిడిమిడి జ్ఞానంతోనూ, తెలిసీ తెలియని తర్కంతోనూ వారు వెచ్చించే కాలమూ, పడే శ్రమా కూడా నిష్ప్రయోజనకరమో, దుష్ప్రయోజనకరమో అవుతున్నయన్న వివేకమూ వీరికుండదు. తర్కం ఎందుకక్కర లేదో తర్కించే వీరిని చూచి ఏమనుకోవాలి? నిష్కర్షగా చెప్పాలంటే దురభిమాన దుర్విదగ్దులైన అమాయకులు వీరు. వీరిని వీరి అమాయకత నుండి బయటపడవేయడం కూడా మిక్కిలి కష్టమౌతోంది. ఎందుకనగా ఆయా విషయాలలో తామింకా అల్పజ్ఞులమేనన్న విషయాన్నీ తెలిసికోనీయదు వీరి దురభిమానం. తర్కశాస్త్ర వాద ప్రక్రియలలో ఒకటైన జల్పవాద ప్రక్రియ లక్ష్యాలలో ఇట్టివారి నుద్దరించాలనే ఆకాంక్ష కూడా ఒకటేమో ననిపిస్తుంది నిశితంగా ఆలోచిస్తే. ఇట్టివారిని పోటీకి-పరీక్షకు-పెట్టి పదేపదే ఓటమికి గురిచేయుట అన్న ప్రక్రియద్వారా ఈ తరహా వ్యక్తులలో కొందరినైనా ఆత్మ విమర్శనా శీలురనుగా చేయవచ్చు. నిజమైన పట్టుదల గలవారైతే మాత్రం వారి ఓటమే వారిని ప్రయత్నపరులను చేసి ఆయా విద్యలందు నిపుణులనుగా చేయగలదు. అయితే ఈ విధానంలో ఒక ప్రమాదమూ ఉంది. సత్యమన్నిటికంటె విలువైనదనియూ, అట్టి సత్యజ్ఞానాన్ని తాను పొందాలనియూ కోరుకునే వారికే ఈ విధానం వల్ల మేలు కలుగుతుంది. అట్లు కానివారిలో ఇది (ఓటమి) ఎదుటివారిపై ద్వేషాగ్నులను రగుల్కొలిపి మరింత మూర్ఖులనుగా మార్చివేస్తుంది. ఇక్కడ మీకో విషయాన్ని-జరిగినదే సుమండీ చెప్పాలనిపిస్తోంది. నేనూ ఒకరకంగా ఈ కోవకు చెంది ఉన్నవాడినే ఒకప్పుడు. కాకుంటే అప్పట్లో ఆయా విషయాలపై నాకున్న అతి అభిమానం దురభిమాన స్థాయికి చేరి ఉండకపోవడంవల్లనూ, సత్యం అన్నిటికంటే విలువైనదనీ, దానివద్ద యిష్టాయిష్టాలకు విలువలేదన్న వివేకం ఉన్నవాడి నగుట చేతనూ ఆనాటికి నేననుసరిస్తున్న విషయాలను ఓటమికి గురైనంతవరకు సమూలంగా విడచివేశాను. సత్యమూ, ధర్మమూ నన్నవి తప్ప మిగిలిన వాటిని అభిమానించ నవసరం లేదన్న దృష్టిని పెంచుకుని జీవితాధ్యయనాన్నీ జీవికనూ సాగిస్తూ వస్తున్నాను. ఈ పద్దతిలో ఎదురైన గెలుపోటములు రెండూ మానావమానము లకు, హేతువులుగా కాక వికాస హేతువులుగానే నాకుపయోగ పడుతున్నాయన్నది నిరంతరం నేను గమనిస్తున్న అంశం. మీరూ ఈ అంశాన్ని చక్కగా విచారించి ఈ స్వభావంవల్ల - ప్రయోజనముంటుందో లేదో తేల్చుకోండి.
ఈ దృష్టినుండే గతసంచికలో తర్కం ఒక విద్యగా నేర్వనక్కర లేదనుకునే వారికొరకు కొన్ని ప్రశ్నలు వేశాను. వివేచనలోనూ, తార్కికతలోనూ, యదార్థ నిరూపణలోనూ తమకు తామే సమర్ధులమనుకునే అట్టి వారిని మరల ఈ సంచిక ద్వారానూ పోటీకి ఆహ్వానిస్తున్నాను. పోటీకి సిద్ధపడండి. మీరు గెలిచినా, నేను గెలిచినా యిరువురకూ మేలే. మీరే గెలిస్తే వినమ్రంగా నా ఓటమి నంగీకరించి విశేష జ్ఞానానికై మరింత కృషి చేసి ఎదుగుతాను. మీరోడినా నిజాయితీగా ఆ ఓటమిని అల్పజ్ఞతగా స్వీకరించి విశేష జ్ఞానానికై యత్నించండి. విద్యావిషయమైన స్పర్ధ ఇరుపక్షాలకూ హితకారి కాగలదు. అయితే ఆ స్పర్ధ ద్వేషకారణం కాకుండా ఇరువురం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. స్పర్థయా వర్థతే విద్యా-అన్న సూక్తిని స్వీకరించే ఈ పోటీ అన్నది గమనించండి. ఏదో ఉపాయంతో అందరం వివేకవంతులం కావాలన్నదే నాయాకాంక్ష. సరే గతసంచికలో నేను ప్రస్తావించిన ప్రశ్నావళినే మరోసారి గుర్తు చేసికుందాం.
- ప్రమాణము లెన్ని వాటివాటి కార్యక్షేత్రముల వివరమేమి?
- భ్రమ స్వరూపస్వభావాలూ, రకాలూ, కారణాలూ చెప్పుకోండి చూద్దాం?
- పదార్ధాలెన్ని? వాటిని నిర్ధారించుట ఎలా?
- మానవుడు పొందవలసిన దేమి? దానిని పొందుట ఎలా?
Note:-పాఠకులందరూ ఈ అంశాల్ని పరిశీలించి సమాధానాలు పొందవలసే ఉన్నప్పటికీ, నా ఉద్దేశం ప్రకారం ఇతరుల యోచనలను అధ్యయనం చేయనక్కర లేదన్న వారికొరకే ఇది ప్రత్యేకింపబడింది. హేతుబద్ధతా (తార్కికత). యోచనాశీలతా నాకూ ఉన్నాయి, ఇతరుల యోచనలనూ, తర్కరీతులనూ గ్రహించేదేమిటి? అనే పక్షీయులు ఇతరుల యోచనలను తమపై పడనీయకుండా యోచించి పోటీలో పాల్గొనండి. జిజ్ఞాసువు లందరకూ ఈ అంశాలు ఎరుగ వలసినవే యగుట వలన ఇష్టమున్నవారు వారి యోచనలనూ పత్రికకు పంపండి. ఆ విధంగా ఈ శీర్షిక సమగ్రమూ, సార్థకమూ కూడా కాగలదు.
ప్రకరణాంశమైన ప్రమాణ వివేచనలో ప్రమాకరణం ప్రమాణమనీ, అసాధారణ కారణం కరణమనీ చెప్పుకున్నాము. ఆ కరణత్వం -అసాధారణ కారణం కాగల అర్హత- సందర్భాన్ని బట్టి 1) పరికరాలకూ (ఇంద్రియాలకు), : 2) పద్ధతులకూ (ప్రక్రియా విశేషాలకూ) ఉంటుందనీ అనుకున్నాము. దీనిపై గత సంచికలలో తగినంతగానే పరిశీలనలు సాగించాము కూడా. పాఠకులనుండి సందేహాలుగానీ, సూచనలుగానీ మార్చి సంచిక తరువాత రాలేదు కనుక ఆపై పరిశీలించ వలసిన విషయాన్ని ప్రారంభిస్తున్నాను.
ప్రమాకరణం ప్రమాణమన్న మాటలోని కరణ విషయాన్ని చర్చించాము కదా! ప్రమ అన్న పదాన్ని గూర్చీ కొంత పరిశీలన చేయవలసి ఉంది. దానివల్ల ముందు ముందు మనం పరిశీలించవలసిన అనేక విషయాలలోని వాస్తవావాస్తవాలను గమనించడం సుళువౌతుంది.
ప్రమ అన్నమాటకు యదార్థ జ్ఞానం అన్న రూఢ్యర్ధం ఉంది వ్యవహారంలో. జ్ఞానరూపాలే అయిన సంశయాన్నీ, స్మృతినీ మినహాయించితే (ఆ రెండూ జ్ఞాన రూపాలా కాదా అన్నది మీరూ, యోచించండి. సందర్భం వచ్చినపుడు పరిశీలిద్దాం) కలుగుతున్న జ్ఞానం ఒప్పుజ్ఞానమనీ, తప్పుజ్ఞానమనీ రెండు రకాలు. మనకు వెనుకటి వాళ్ళు యదార్థ జ్ఞానమును ప్రమ అనీ, అయదార్థ జ్ఞానమును భ్రమ అనీ అన్నారు. విభజన కొరకు రెండు పదములూ అవసరమే కనుక ఇంతవరకు మనకూ అభ్యంతరం లేదు. కానీ ప్రమాణ పద విచారణలోనున్న “ప్రమ” కు యదార్థజ్ఞానమన్న అర్ధాన్ని చెప్పుకుంటే, [ప్రమాకరణంలోని కరణమను మాటకు ఇంద్రియమో, విధానమో ఏదో ఒకదాని నర్థంగా చెప్పుకున్నా] కలుగుతున్న జ్ఞానమంతా యదార్థమే ననవలసి వస్తుంది. అయితే జరుగుతున్న జ్ఞానక్రమాన్ని పరీశీలిస్తే ఆయా యింద్రియాలద్వారా, ఆయా పద్ధతుల వలన కలిగిన జ్ఞానాన్ని మరల వాస్తవమా కాదా? పరిశీలించుకోవలసి వస్తున్నది. మరో కొలతకు-పరీక్షకు-కలిగిన జ్ఞానాన్ని లోనుచేసే అది యదార్ధ జ్ఞానమో, భ్రమ జ్ఞానమో నిర్ణయించుకుంటున్నాం, సహజ క్రమమిలానే ఉంది. ఎంతో ప్రధానమైన ఈ అంశాన్నీ పరిగణనలోని తీసుకోకపోవడం వల్లనే భిన్నభిన్న ధోరణులవారు. ఎవరి ప్రమాణాలను వారు పెట్టుకుని, అన్యులవి అప్రమాణము లనుకుంటున్నారు. ఆయా సిద్ధాంత చర్చలలోనూ, సత్యావిష్కరణ చేయబూని నప్పుడున్నూ వాస్తవం నిర్ధారింప బడకుండ అడ్డుపడుతున్నదీ అంశమే. ఎందుకంటే యదార్థ జ్ఞాన సాధకమన్నది ప్రపంచంలోని ఎవ్వరికైనా, ఏ కాలమందైనా ఒక్కటే అయ్యుండుట అవసరమూ, తప్పనిసరి కూడా. లేనిచో యదార్థమన్నది - సత్యమన్నది - వ్యక్తిగతమైపోతుంది. అప్పుడిక తప్పొప్పుల ప్రస్తావనే పొసగదు.
అలానే ప్రమాకరణం ప్రమాణంలోని ప్రమకు యదార్థజ్ఞానమనుకుంటే, మరి భ్రమకూడా ఒక రకమైన జ్ఞానరూపమే కనుక దానిని సాధించుటకున్నూ ఏదో ఒక పరికరమూ, ఒక క్రమంలో పని జరగడమూ అవసరమయ్యే ఉంటున్నది. మరి ఆ పరికరాలేవి? ఆ పద్దతులేవి? వాటినే పేర్లతో పిలవాలి. ఈ అంశాన్ని విచారించేముందు ప్రమాణంలోని ప్రమకు యదార్థజ్ఞానమన్న అర్ధాన్ని స్వీకరించిన వారినుండేమైన ప్రతిపాదనలొస్తాయేమో గమనించుదాం. దీనిపై విశేష పరిశీలన పై సంచికనుండి.
పంపుటి – 2 సంచిక – 5 1-5-92
ప్రమాణాల్ని గురించిన సమగ్రమైన అవగాహన లేకుండా ఆయా విషయాలను గురించి తెలుసుకోవడంలో ప్రమాదపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అసలు తెలియడమంటే ఏమో సరిగా తెలియకుండానే సామాన్యుల నుంచి మేధావుల వరకూ, ప్రాచీన కాలనుండి నేటివరకూ అనేకమంది తమకు నిజంగా తెలియని విషయాలెన్నింటినో తెలిసినవాటిగనే ఎంచుతున్నారు. జ్ఞానార్జనలో ఎంతో ప్రమాదకరమైన ఈ అంశాన్ని వారు గుర్తించుటలేదు సరికదా! వారిచే ఆ విషయం గమనింపజేయడం కూడా మిక్కిలి కష్టసాధ్యమై పోతోంది. ఎందుకంటే ఇట్టి వారు ఆయా విషయాలు అప్పటికే తమకు తెలిసిపోయినవనే నిర్ణయానికొచ్చి ఉంటున్నారు కనుక. ఇట్టి ప్రమాదకర పరిస్థితి నుండి మేల్కొల్పబడిన పిదప వాస్తవాన్ని(అప్పటికి నిజంగా తానున్న స్థితిని) గమనించిన యదార్ధ జిజ్ఞాసువైన ఒక మేధావి పల్కిన పల్కులీ సందర్భంలో(ఆత్మ పరిశీలనాశీలురం కాగలిగితే) మనకూ ప్రయోజనకారులు కాగలవు. ఆలోచించండి.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
ఈ పద్యాన్ని విన్న వాళ్ళూ, చదివిన వాళ్ళూ చాలా మంది ఉండవచ్చు. మీలో అయితే దీని సారాంశాన్ని హృదయానికి పట్టించుకున్న వాళ్ళు చాలా అరుదు. నిజంగా ఏ జిజ్ఞాసువైనా దీనిని తన హృదయంగమం చేసికోగలిగితే అది అతని జ్ఞానార్జనలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. మాట వరసకు మనమెంత, మనకు తెలిసిందెంత అని అంటున్నా ఎవరికి వారు ఆయా విషయాలలో తనకు సరైన-సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉందనే భావించు కుంటున్నారు. ఎందుకంటే, ఆయా విషయాలలో తాను తెలిసిన వాడిననేనన్న భావన అంతర్గతంగా లేకుంటే చర్చలూ, నిర్ణయాలూ చేయత్నించడు మనిషి. కానీ ఈనాడు లోకాన్ని చూడగలిగితే ఏ యిద్దర్ని పరిశీలించినా అదంతే, ఇదింతే అంటూ వాద ప్రతివాదాలు చేస్తూండడం కనిపిస్తుంది. అయితే యదార్ధంగా చర్చ అన్నది ఏ యిరువురి మధ్య సాధ్యపడుతుంది? అన్నది కూడా ప్రముఖమైన చర్చనీయాంశంగానే ఉంది. చర్చ ప్రారంభించదలచుకున్న వారందరూ ముందుగా ఈ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం అవసరం. లేకుంటే నిరర్ధకమైన, పిడివాద రూపమైన వాగ్వివాదాలే జరుగుతాయి. నేడు సర్వే సర్వత్రా గోచరిస్తూ, సమయాన్నీ, మానసిక సమతౌల్యాన్నీ కూడా హరించివేస్తున్న ప్రమాదకరమైన అంశమిది.
“అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః” అన్న వ్యాస వచనం కూడా, ఈ విషయాన్ని సూచిస్తూ చేసిన హెచ్చరికలాంటిదే. అజ్ఞానంచే జ్ఞానం కప్పివేయబడుతోంది. దానిచే జనులు మోహితులౌతున్నారు. (కింకర్తవ్య మూఢతా మోహస్య లక్షణం). అజ్ఞానం అంటే ఏమీ తెలియకపోవడమన్న అర్థం కాదిక్కడ. ఏమీ తెలియనితనం జ్ఞానాన్ని కప్పివేయజాలదు. అలా తెలియనివాడు ఆయా విషయాలు తనకు తెలియవనే అనుకుంటుంటాడు, కనుక అతనికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి తెలియకనే తెలుసనుకుంటున్నాడే, వాడి అజ్ఞానాన్నే అజ్ఞానం అంటున్నది గీత. గీతలో చెప్పబడింది గనుక ఆ మాట విలువైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. నాటి గీతాకారునికిన్నీ ఈ విషయం తెలిసే ఉందన్నదీ, ఈనాడు తమను తామే మేధావుల మనుకుంటున్న, వెనుకటి వాళ్ళందరూ అజ్ఞానులే ననుకునే అనేక సిద్దాంతాల ప్రచారకులకున్ను ఈ విషయం తెలిసిలేదన్నదీ గమనించమంటున్నాను. ఇంత మాత్రమైనా తెలియకనే తామెంతో తెలిసిన వాళ్ళమనుకుంటున్న వారిని జాలిపడాలి నిజంగా. ఏవో నాలుగు గ్రంధాలు, నేటి భౌతిక విజ్ఞానానికి చెందినవి గానీ, నాటి ఆధ్యాత్మిక గ్రంథాల నబడేవి గానీ చదివి (కేవలం చదివిమాత్రమే, కనీసం వాటివరకైనా అధ్యయనం చేసిందీలేదు) స్వయం ధీరులమూ, సిద్ధాంతకారులమా ననుకుంటూచేసే దురహంకార పూరిత చర్చలూ, ప్రతిపాదనలూ, ప్రచారాలూ కూడా దాదాపు అజ్ఞాన జనితాలై, రాగద్వేష సంకలితాలై మానవ సంఘాన్ని పెడదారుల పట్టిస్తున్నాయి. సంఘ హితైషులూ, సమ్యగ్వివేకులూనైన వారెల్లరూ ఇట్టివారిని ప్రతిఘటించో, మేల్కొలిపో వారిని సరైన మార్గానికి మళ్ళించాల్సి ఉంది. ఈ మాట ఎవ్వరిపైనగానీ వ్యతిరేకత నిడుకుని అంటున్నది కాదు. మానవ వికాసానికిది ప్రతిబంధక మన్న దృష్టినుండి చెబుతున్నది మాత్రమే విషయాన్ని నిదానంగా గానూ, కూలంకషంగానూ పరికించి మంచిని కలిగించగల నిర్ణయానికి రండి. మంచి హృదయంకల మేధావులందరూ ఒకటి కావాలన్నదే నా యాకాంక్ష. సరే విషయానికొస్తాను. తెలియకనే తెలుసనుకుంటున్నాడే వాడు, తనకున్న అజ్ఞానాన్నే (తప్పు తెలివినే) జ్ఞానంగా అభిప్రాయపడడం వలన జరిగే ప్రమాదం అంతింతనలేము. ఏమంటే అట్టివాడు ఆయా విషయాలు తనకు తెలిసిపోయినవనే నిశ్చయానికి రావడంవల్ల వాటిని గూర్చి తెలుసుకునే యత్నమే చేయడిక. పోనీ, తనవరకు చెడి అంతటితో ఊరుకుంటాడా అంటే, అదీ లేదు. జీవ స్వభావంలోని గుర్తింపు పొందాలనే గుణంవల్ల తెలిసింది ఎదుటివానికి చెప్పాలన్న తృష్ణ ఏర్పడి, ఆయా విషయాల్ని ఎదుటివారికి తెలిపే యత్నం ప్రారంభిస్తాడు మానవుడు. మరి నిజమేమో తెలిసిందనుకుంటున్నాడే గానీ, అసలు తెలియదు. అతనికి జీవధర్మం వల్ల తెలుపకుండా ఉండలేడాయే. ఆపై ఏమి జరుగుతుందో ఆలోచించ గలిగితే ఆలోచించండి, గుడ్డివాడు మరో పదిమంది గుడ్డివాళ్ళకు దారిచూపుతాడన్న మాట యిక. మరో ఉపనిషదృషి ఈ అంశాన్ని తన జీవితాధ్యయనం నుండి మరింత స్పష్టంగా గ్రహించి నట్లగుపిస్తుంది అతని రచన చూస్తూంటే. ఉపనిషత్సాహిత్యమంతా అనాగరికుల వాచాలతే ననుకునే నేటి నవీన మేధావుల మనుకునేవారి బుద్ధిలేనితనానికి విచారించగలం, సానుభూతి చూపగలం వారి అవివేకానికి. అంత మాత్రమే. అంతకు మించి వారి విషయంలో మనమేమీ చేయలేము. ఎందుకంటే నిజంగా తెలియని ఎన్నో విషయాల్ని ఈ తరహా వ్యక్తులు తెలుసు ననుకుంటుంటారు. రాగద్వేషాలు విడచి (వెనుకటి వాళ్ళు చెప్పిందంతా బంగారమనో, చెత్త అనో అభిప్రాయం పెట్టుకోకుండా) ఈ విషయాన్ని పరికించండి. ఈ మాటెందుకంటున్నానంటే వెనుకటి వాళ్ళపేరన ఉన్న సాహిత్యంలో చెత్త కూడా తగినంతగానే ఉంది కనుక. ఇక్కడ పనిచేయవలసింది వివేకం మాత్రమే.
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితమ్మన్యమానాః
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః అంధేనైవ నీయమానా యధాంథా
విద్యకాని విద్య అవిద్య, తెలియకనే తెలుసుననుకునేతనం. (తప్పు తెలివీ లేక భ్రమ) అందులో మునిగి చరిస్తున్నారు కొందరు. అయితే వారు తమకు తామే ధీరులం, పండితులం అని ఎంచుకుంటున్నారు. ప్రకటించు కుంటున్నారు. వీరి చుట్టూ తిరుగుతూ, వీరి వెంటబడిపోతున్నారు మరికొందరు మూఢులు. వీరిని చూస్తుంటే గుడ్డివాని వెంటబడిపోతున్న గుడ్డి వారివలె అగుపిస్తున్నది అన్నది శ్లోక భావం. తమాషా ఏమంటే ఈ కోవకు చెందిన పండితమ్మన్యులున్నూ ఈ శ్లోకాన్నే వర్ణించి అమాయకులకు చెప్పడం జరుగుతోంది. ఇక్కడనే పాఠకులకూ, విమర్శకులకూ, జిజ్ఞాసువులకూ ఓ సంశయం పుడుతోంది. విషయం తెలిసినవాడూ, తెలుసు ననుకుంటున్నవాడూ (జ్ఞానీ-అజ్ఞానీ కూడా) ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. మరి వారిరువురిలో అసలైన వాడెవరో నిర్ధారించడం ఎలా? అన్నదే ఆ సందేహం. ఇది పైకి చిన్న విషయంలా అనిపిస్తున్నా, నేడున్న ఏ సిద్ధాంతానికి చెందినవారూ దీని నంత ప్రధానంగా గమనించకపోయినా మొటమొదట తేల్చుకోవలసిన అంశమేయిది. ఇక్కడ కూడా ప్రమాణ వివేచనావశ్యకత రంగప్రవేశం చేస్తోంది.
తెలియడమంటే ఏమిటో, ఆ తెలియడాలెన్ని రకాలో, సత్యా సత్యాలు నిర్ణయించే శక్తి ఏ రకంగా తెలిస్తే మాత్రమే ఏర్పడుతుందో స్పష్టంగా తెలియకనే, ఏదో రకంగా తెలిసికునో, అసలు తెలియకుండగనే తెలిసిందనుకుంటూనో చేసే చర్చలూ, సిద్ధాంతాలూ కూడా కేవలం నిష్ఫలాలైతే పరవాలేదు. అవి తరచు దుష్ఫలితాల్ని అందిస్తాయి సమాజానికి. వీటికి సంబంధించిన ప్రశ్నలనే గత సంచికలో నేను ప్రస్తావించింది. తెలియడమంటే ఏమో, సత్యం తెలియడమంటే ఏమో చక్కగా తెలిసి, ఆ విధానాల ద్వారా సత్యాన్ని గమనించినవారే సైద్ధాంతిక చర్చలకు యధార్ధంగా అర్హులై ఉంటారు. మిగిలినవారి వాదనలన్నీ - వారంతటి వారుగా సమాజంచే గుర్తింపబడుతున్నప్పటికీ- ఊకదంపుడులే అవుతాయి.
ఈ సందర్భంలోనే పాఠకులందరకూ మరో హెచ్చరిక చేయడమూ ఉచితమనిపిస్తోంది. ఎదుటి వారినుండేదైన ప్రతిపాదన విన్నప్పుడు మనం. (1) అవి తనకవసరం లేని విషయమైనప్పుడో, (2) అప్పటికే ఆ విషయం మనకు పూర్తిగా అవగాహనమైయున్నప్పుడో, (3) అసలేమీ అర్థంకానప్పుడో మాత్రమే మనం ఆవిషయమై తగినంతగ స్పందించము. ఈ మాట నిజమేనని మీరంగీకరిస్తే. ప్రమాణ వివేచన పైగానీ, గత సంచికలో నేనడిగిన ప్రశ్నలపైగానీ మీ నుండి తగిన స్పందన ఎందుకు రావడంలేదో నాకర్థంకాని విషయం. నిజంగా జీవితానికిది అనవసర మనిపిస్తోందా? ఇప్పటికేపూర్తిగా తెలిసి ఉందా? అసలేమీ బుర్రకెక్కడం లేదా? మరింకేదైనా కారణముందా? పత్రికకో రూపునివ్వడానికి ఎంతో మానసిక శ్రమా, కాలమూ కూడా ఖర్చు చేయవలసి వస్తోందన్నదో నిప్పులాంటినిజం. యదార్థంగా ఏ లాభమూ కోరని నాకు స్వీయశ్రమ నిరుపయోగమవు తున్నదేమోనన్న యోచన పుట్టినప్పుడల్లా కొంత బాధాకరంగానే ఉంటుంది.
ఆశ్చర్యో వక్తాకుశలో న్చలబ్ద్యా ఆశ్చర్యో జ్ఞాతాకుశలా సుశిష్టః
తెలియజెప్పడంలో (చెప్పడంలో కాదు) కుశలుడైన వక్తా, గ్రహించడంలో (వినడంలో కాదు) కుశలుడైన శ్రోతా లభించడం ఆశ్చర్యపడవలసిన అంశమే నన్నది ఈశ్లోక తాత్పర్యం. విద్యా విధానాన్ని కాచివడపోస్తేగానీ గుర్తించలేని సూక్ష్మ విషయం ఇది సరే ప్రకరణ విషయాని కొస్తాను. గతసంచికలో, ముందు సంచికలో ప్రస్తావించిన అంశాలపై సందేహాలూ సూచనలూ రాలేదు కనుక మరి కొంత ముందుకు సాగుదాం అంటూ వ్రాశాను. తరువాత శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారినుండి మరో లేఖ అందింది. ప్రమాణవివేచన మన్నది పరుగులిడకుండ అధ్యయనం చేయవలసిన జటిల విషయమగుటచే మరల ఒక అడుగు వెనకకు వెళ్ళి పునర్విమర్శ చేద్దాం విషయాన్ని. మరింగంటి వారి లేఖ కూడా ప్రచురిస్తున్నాను నిదానంగా పరిశీలించండి.
సురేంద్రగార్కి, నమస్కారములు. సంచిక-8,1-3-92. అందినది. అందులో నా లేఖ ప్రచురించినారు. సంతోషం. ఐతే మీ సమాధానం స్పష్టంగా లేదు. ప్రత్యక్షమనునది. శ్రోత్రాదులు '6' కంటే వేరా? ఆ ఆరూ మాత్రమేనా? '6' మాత్రమే అయితే ప్రత్యక్షం మొదటి వర్గంలోనే చేరాలి. రెండవ వర్గములోనూ ప్రత్యక్షమును మీరు చేర్చినారు. అది కుదరదు. ఆ ఆరింటికంటే వేరుకూడా ప్రత్యక్షము అంటే అది ఏదో చెప్పాలి అన్నాను. దీనికి మీరు జవాబు చెప్పలేదు. ఒక విషయ మడిగితే మరికొంత మీ అభిప్రాయాన్ని క్రోడీకరించడం నాకు (అడిగిన వ్యక్తికి) అనవసరం. రంగు-ఎరుపు సామాన్య విశేష వాచకాలన్నాను. పర్యాయ పదాలని ఎవరన్నారు? ప్రమాణ మింద్రియమని ఎవరన్నారు?. ప్రమాణవ్యుత్పత్తి మీరు ప్రదర్శించిన రెండువిధాలుగా కనుపించినా ప్రమాకరణమను అర్ధమేగాని వేరర్ధము రాదు. ‘యేన’ అన్నా, ‘అనేన’ అన్నా కరణార్ధంలో “ల్యుట్” ప్రత్యయ మని చెప్పడానికే కదా. మొదటి ప్రశ్నకు జవాబు రానిదే ఇక అడగలేను. సెలవ్. అంటూ వ్రాశారు. సరే.
పాఠకుల కిచ్చటో విషయం చెప్పాలి. అర్ధమైనా కాకున్నా చదువుకుంటూ పోవడమూ, చదివేశానను కోవడమూ పరిపాటిగా ఉంటున్న రోజులివి. ఆధ్యయన శీలురు ముందీ మార్గాన్ని విడచి, ప్రతి పదార్థాన్నీ గ్రహించుతూ, వాక్య సారాంశాన్నీ గ్రహించాల్సి ఉంటుంది. అదే సరైన అధ్యయనరీతి. పద పదార్ధ జ్ఞానం లేని వారికి వాక్యార్ధ జ్ఞానం కలుగదన్నది భాషాస్వభావానికి చెందిన ప్రాధమిక నియమాలలో ఒకటి. దీనిని గమనించి ఈ ప్రశ్న మనది కాదు గదా అని యను కోకుండా, పరిశీలనకిదో ఆవకాశంగా భావించి ప్రశ్ననూ, సమాధానాన్నీ పరిశీలించండి.
శ్రీ మరిగంటివార్కి, ఆర్యా! విషయాన్ని కేవలం మనమిరువురమే పరిశీలించడం లేదు కనుకనూ పది మందికీ, ఈ విషయంతో పరిచయాన్నీ, ప్రవేశం కలిగించడం పత్రిక ఉద్దేశం కనుకనూ సమాధానం మరి కొంత సమాచారంతో కూడి వివరణాత్మకంగా ఉండడం అనివార్యం. అవసరం కూడా. అదలా ఉంచండి. చర్చా సందర్భంలో యిరు పక్షాలూ ఒక విషయాన్ని గమనించి ఉండడం ప్రయోజనకారి కాగలదు. అదే మంటే మన మనుకుంటున్న మాట ఎదుటి వాడు చెప్పలేదు కనుక అస్పష్టంగా ఉంది అనడం కాక, ఎదుటి వాడు చెప్పాలను కుంటున్న భావము-(తానేమి చెప్పా లనుకుని ఆ మాటలు ప్రయోగిస్తున్నాడన్న దృష్టినుండి) ఏమిటన్నది ప్రధానంగా చూడవలసి ఉంటుంది, అట్లు కానప్పుడు అది క్రమంగా జల్పాకృతిని పొంది ఛలాన్ని కూడా ప్రయోగించడం వరకూ సాగుతుంది. (జల్పవాదమంటే గెలుపు కొరకే చేసేవాదం. నా మాటే నిలవాలన్న దృష్టితో చేసేది, ఛలమంటే వక్త ఉద్దేశానికి భిన్నమైన అర్ధాన్ని అతని మాటలకు కల్పించి దోషం చూపబూనడం. (Miss interpretation). ఇవి పాఠకులు గమనించవలసిన అంశాలుగనుక వివరించడమైనది) సరి.
'6' ఇంద్రియాలద్వారా ఏర్పడే ప్రత్యక్ష జ్ఞానం కంటే అన్యంగా ప్రత్యక్షముందా? ఉంటే అదేమిటి? అనేది మీ ప్రశ్న. మొట్ట మొదట నా ప్రతిపాదనేమిటి? ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అన్న పేర్లు పరికరాలయందలి విశేషాలనుబట్టికాక, పద్దతులందలి తేడాలను దృష్టి నిడుకుని ఏర్పరచబడ్డవని. ఇక్కడ మీకు అభ్యంతరమేమో ప్రశ్నించండి. ప్రత్యక్షం 6 ఇంద్రియాలకంటే వేరైనదా? చెప్పండంటూ దానిని మీరు. మరో మార్గం పట్టించారు. నా దృష్టంతా ఆ పదాలు ఏ విషయాన్ని ప్రత్యేకించుట కేర్పడి ఉంటాయో వివరించడంమాత్రమే. పర్యాయ పదాలు కానంతవరకు ఒక పదానికీ, మరోపదానికి తేడా వాటి అర్ధమునందలి తేడాలను బట్టే ఏర్పడుతుందనేది భాషా స్వరూపానికి వేదిక వంటిది. [నేనీ మాటలంటుండగనే నేనడిగిందొకటైతే మీరింకేదో వివరిస్తున్నారు, అనకూడదు. విషయ పరిశీలనకు అవసరమైన అంశాలు-మొత్తం క్షేత్రావలోకనకు గాను, పరిగణనలోనికి తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఆయా విషయాలకు చెందిన యదార్ధాన్ని స్పృశించడానికి వీలవుతుంది.] బాషాభిజ్ఞులకెవరికైనా ఈ విషయంలో అభ్యంతర ముండవలసిన పనిలేదు. ఇక్కడ మీకూ అభ్యంతరం లేకుంటే ప్రత్యక్షము నుండి వేరుపరచుట కనుమానమన్న మాటనూ, అలానే శబ్దమన్న మాటనూ ప్రయోగించారన్న నా ప్రతిపాదనలోని దోషాన్ని ప్రశ్నించండి. ప్రత్యక్షానుమాన శబ్దాది పదార్దములు పరస్పర వ్యావర్తకాలు. ఏలక్షణాన్ని బట్టి వాటి యందలి తేడాలు తెలియ బడుతున్నాయి? పరికరాలందలి తేడాలా? పద్ధతులందలి తేడాలా? నా సమాధానం పద్ధతులందలి తేడాలను తెలిపే పదాలే అవి అని. దీనిని విడచి ప్రత్యక్షమనునది '6' ఇంద్రియాలకంటే వేరా? కాదా? అంటూ ప్రక్క ప్రశ్నవేశారు. అయినా దానికీ నేను సమాధానం చెప్పాను. ప్రత్యక్ష జ్ఞానకరణ మింద్రియం అనుటలో దొసగేమి లేదని, అయితే పద్దతులందలి తేడాలను బట్టే ప్రత్యక్షాది పదములు పుట్టాయి అన్న నా భావాన్ని పరిశీలకులూ గ్రహించుట కొరకు నాకు ఉచితమనిపించిన (విషయాన్ని చెప్పడానికి ఎవరిశైలీ, ఎత్తుగడా వారి కుంటాయి) విధానాన్ని నేననుసరించడంలో అనౌచిత్యమేమీ లేదనుకుంటాను. ప్రమాకరణం ప్రమాణం అనుటలోని కరణ పదం ఇంద్రియ బోధకంగాకాక విధానాల కన్వయించడమే సబబనీ, ఈ సందర్భంలో ఇంద్రియాన్నే కరణమన్నట్టేతే మిగిలిన ప్రమాణాలకూ ఇంద్రియాలను చూపవలసి ఉంటుందనీ చెప్పుతూ, అవునో కాదో పరిశీలించుటకై విషయాన్ని మీ(వారి) ముందుంచాను. విశేషోత్పత్తి –కార్యోత్పత్తి పరికరాలను బట్టీ, పనులనుబట్టి కూడా ఏర్పడుతుందనేది మనందరి అనుభవంలో నున్న విషయమే. కరణ మింద్రియమని ఎవరన్నారు? అని ప్రశ్నించారు. మీరన్నారని నేననలేదు. ఇంద్రియం (పరికరం) కరణం కాకుంటే మరి దేనికి కరణత్వం సాధ్యమో చెప్పండంటున్నాను. మీరుగానీ, మరెవరుగానీ పనిముట్టునో ప్రక్రియా విశేషాన్నో కార్యానికి అసాధారణ కారణంగా చెప్పితీరాలి. మరో మూడో కారణం కనబడదు. అదలా ఉంచండి.
పద-పదార్థ వివేచన ప్రకరణాంశమైనపుడు, భాషలోని పర్యాయ పదాల్ని మినహాయించితే ప్రతి పదానికీ విశేషార్థం ఉంటుంది. సామాన్యమూ, విశేషమూ భిన్న పదార్ధములేనన్నది భాషావిషయం తెలిసినవారిలో నిర్వివాదాంశము. సామాన్యాన్ని, విశేషాన్నుండి వస్తుపరంగా వేరు చేయలేనప్పటికీ, ఆ రెండు పదార్థాలూ-‘పదస్య అర్ధః పదార్థః’ ఒకటేననడం కుదరదు. అవినాభావ సంబంధమున్న రెండు పదార్ధములే సిద్ధిస్తున్నపుడు, వ్యాప్యవ్యాపక భావ సంబంధమున్న పదార్థాలు రెండనడంలో దోసమేమీ లేదు. ఎరుపు నలుపూ విశేష వాచకాలై అన్యోన్యాభావ సంబంధంలో ఉంటాయి. మరి రంగు పదార్థమో రెంటి యందు వ్యాప్యవ్యాపక భావసంబంధంలో ఉంటుంది. కనుక రంగు అంటే ఎరుపనో, నలుపనో అర్ధం కాదు. ఆ రెండూ వేరు వేరు పదార్థాలే. అలానే ప్రత్యక్షమూ దానిలోని ఆరు ఇంద్రియాలూ. ఇక్కడ అస్పష్టత ఏమో, దోషమేమో ప్రశ్నించండి. అంతేకాక మీ లేఖలోనే వాటిని పర్యాయ పదములని ఎవరన్నారు? అని ప్రశ్నించారు. పర్యాయపదములు కానప్పుడు అవి వేరువేరు అర్ధములను కలిగియున్న పదములన్నదే మీ యభిమతమూ అవుతున్నది. నా ప్రధమ ప్రతిపాదననుండి ప్రత్యక్షం ఇంద్రియాలకంటే భిన్నమా? అభిన్నమా? అన్నది చర్చనీయాంశంకాదు. ప్రత్యక్షాది ప్రమాణముల పేర్లు పరికరాలందలి తేడాలనుబట్టి ఏర్పడినవా, విధానములందలి తేడాలనుబట్టా - అన్నదే వర్తమానవిషయం. ఆ దృష్టినుండే విధాన వైశేషికతే వాటి కాధారం అని ప్రతిపాదించాను. సరి. లేఖ వ్రాయలేనన్నారు. అయ్యా, కేవలం మన యిరువురి కోసమే మన సంభాషణలు అని నేననుకోను. అవి పత్రికోద్దేశ్యానికి సహకారులుగా ఉండగలవన్నదే నా ఆశయము. ప్రశ్నలే లేకుంటే పరిశీలనలో సమగ్రత లోపిస్తుంది. ప్రమాణవిద్య లుప్తమై, అవి అసలఖ్ఖరే లేదనుకొను దృష్టికూడా సమాజంలో పాదుకొంటున్న సమయంలో, వాటి విలువ గమనించినవారి బాధ్యత దృష్ట్యా (మీ మాట నిలచిందా, నామాటనా? అన్నది ప్రక్కకు పెట్టి) విషయపరిశీలన సాగించడం ఉచితమని నాయభిప్రాయము, యధాభిమతంగా హితకరమైన నిర్ణయం చేయండి. ఈ సందర్భంలో మీకూ, పాఠకులకూ, నాకూ కూడా ఒక సంతోషకరమైన వార్తేమంటే శ్రీవంగీపురం రామానుజాచార్యులవారు తార్కికాంశాలపై సందేహాలకు సమాధానాలు వ్రాస్తామని అంగీకరించారు. మీకభ్యంతరం లేకుంటే మీరూ వారూ కలసి ఆ శీర్షికను నడపవచ్చు. పాఠకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచు కుంటారని ఆశిస్తాను. పాఠకులారా! గత సంచికలోని నా ప్రశ్నలకూ సమాధానాలు వ్రాయండి.
సంపుటి – 2 సంచిక. 6 1.6.92
తర్కము (తార్కికతా తర్కజ్ఞతా) ప్రతి ఒక్కడి జీవితంతోనూ సహజంగానే ముడిపడి ఉంది. ఈ నిజాన్ని సక్రమంగా గుర్తించనంతకాలం ఆ విషయంలో సామర్థ్యాన్ని (అవగాహననూ, కౌశల్యాన్నీ) పెంచుకునే యత్నం తగినంతగా చేయడు మనిషి. ఎందుకంటే ఏ మాత్రం అవకాశమున్నా శ్రమించడాని కిష్టపడని వాడు. శ్రమలలో కెల్లా శ్రమ వంటిదైన మేధో ప్రక్రియారీతులను (ఆలోచనలనూ, ఆలోచనారీతులనూ ఆ ప్రక్రియలో యిమిడియున్న పరికరాలనూ, వాటి బలాబలాలను) స్పష్టంగా తెలిసికోవడం అన్న పనికి అసలే యిష్టపడడం లేదు. కనుకనే ఈ విషయంలో (జీవితాని కాద్యంతమూ అవసరమై యున్న మేధస్సు స్వరూప స్వభావాలను అర్థం చేసుకునే విషయంలో) మేధావులనుకునే వాళ్ళను కూడా కదిలించడం కష్టమవుతోంది.
[Note :- మేధావులు రెండు రకాలు. (1) అనేక విషయాలు తెలుసుకున్నవారు. (2) తెలుసుకునే వాటి (మనస్సు) స్వరూప స్వభావాలు తెలుసుకున్న వారు. ఇందు మొదటి రకంవారు తగినంతగానే ఉండవచ్చుగానీ, రెండవ తరగతి వారి సంఖ్య బహు స్వల్పము. ఈ రెండో తరగతి మేధావిత్వాన్ని గూర్చే ఈ శీర్షికలో మనం ముచ్చటించా లనుకుంటున్నది. రెండు తరగతులని ఎందుకంటున్నానో ఈ ఉదాహణను బట్టి గమనించండి. (A) శాస్త్రజ్ఞత-శాస్త్రీయత(B) తర్కజ్ఞత-తార్కికత. అన్న పదార్ధాల తేడాలను గమనించండి. (А)లో ఒకటి ఆయా విద్యలందలి పరిచయాన్నీ, రెండవది వ్యక్తిలో ఉండే స్వభావాన్నీ తెలుపుతుంది. అలానే (B) లోనూ, శాస్త్రజ్ఞుడు కావడం అంత కష్టమేమీ కాదు గానీ, శాస్త్రీయ దృక్పథం ఏర్పడడం మాత్రం అంత సులభం కాదు. అలానే తర్క శాస్త్రం తెలిసి ఉండడం, తార్కిక స్వభావం కలిగి ఉండడమున్నూ.]
తెలిసిన వనుకుంటున్నవన్నీ తెలియవలసినట్లే తెలిసినవా? ఆ తెలిసినవీ వాస్తవ రూపంగా తెలిసినవా? భ్రమరూపాలా? అన్నది తేల్చుకోడాని కవసరమైన విద్య ప్రమాణ విద్య. అది సరిగా తెలియనంతకాలం తెలిసినవాటి యదార్ధాయదార్ధాలు నిర్ధారించడం కష్టమవుతుంది. కనుకనే అన్ని విద్యలనూ ప్రామాణీకరించగల ప్రమాణ విద్య విద్యా కాయానికే ప్రాణస్థానీయమై (గుండెకాయ వంటిదై) ఉంది. ప్రమాణబద్ధం కాని విద్య విశ్వాస రూపమై సమాజంలో క్రమంగా, అంథానుకరణను పెంచుతుంది. కనుక ఆయా విషయాలను తెలుసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలూ, పాటించవలసిన నియమాలూ చక్కగా అమలు చేయనిచో కలిగే జ్ఞానం సరైనదేనని నిర్ణయించడం కుదరదు. ఈ విషయం మీ కర్థమయ్యేందుకుగాను ఈ మధ్య జరిగిన ఒకటిరెండు సంఘటనలను వివరిస్తాను. చక్కగా పరిశీలించి పై జాగ్రత్తలూ, నియమాలూ ఏమై ఉంటాయో ఆలోచించండి.
నంద్యాల ప్రాంతంలోని "మేలుకొలుపు" పాఠకులూ, పూర్వ పరిచయమున్న సత్సంగ మిత్రులూ కలిసి నన్నచటి కాహ్వానించడమూ నేను వెళ్ళడమూ జరిగింది. లోగడే నన్నెరిగియున్న వాళ్ళకు నేను చెపుతున్నదేమిటో, నా విధాన మేమిటో కొంత అవగాహన కలిగే ఉన్నప్పటికీ, క్రొత్త వాళ్ళకున్న ప్రధాన సమస్య, నేనే వర్గానికి చెందినవాడినో ఒక పట్టాన వాళ్ళకు అంతుబట్టక పోవడం. దాదాపుగా మెల్లచూపు (పాక్షికదృష్టి) కలవాటుపడి ఉన్న సమాజం (నిజంగా సహజంగా- వారు మెల్ల చూపువారు కాదు. అయినా సమాజాన్ని నడిపేవారు (గురువులూ, నాయకులూ) ప్రజలను క్రమంగా మెల్లచూపు చూడడాని కలవాటు చేసి అదే అసలైన చూసే పద్ధతి అని నమ్మించ గలిగారు) నేనే వర్గానికి చెందిన వాడినో ముందుగా తెలిస్తే తప్ప నా వాక్యాలకు విలువనూ, అర్ధాన్నీ నిర్ణయించడానికి సిద్ధపడటం లేదు. అలాగే వాడిన భాషద్వారా ఏ భావం పుడుతుందో చూద్దామని గాక ఆ భాషా శైలి ననుసరించైనా సరే (కమ్యూనిష్టుల శైలీ, వేదాంతుల శైలీ, ఇలా...) ఆయా వ్యక్తులపై ఒక అభిప్రాయన్నేర్పరచుకొని అటు తర్వాతే విషయాన్ని పరిశీలించడానికి ఇష్టపడుతున్నారు. ఈ వక్రదృష్టి మేమెరిగిన అన్ని సంఘాలలోనూ సామాన్యుల నుండి మేధావుల వరకు బీరుపోకుండా స్వానుభవంలో ఎదురైంది.
ఎవరు చెప్పారన్నది విడచి ఏమి చెప్పారన్నది పరిశీలనాంశంగా స్వీకరించనంత కాలం వాస్తవాన్ని చూసే అవకాశాలు సన్నగిల్లుతాయి. అని నేను ప్రతిచోటా పదే పదే చెపుతుండడమూ, మళ్ళీ మళ్ళీ ఎందుకండీ చెపుతారు? మేమేమన్నా పసివారమా ఇంత మాత్రం అర్ధం చేసికోలేకపోవడానికి అని అనేక సందర్భాలలో వారు కొంత విసుగును కూడా వ్యక్తం చేయడం, అటువంటి సందర్భాలలో నాలో నేను నవ్వుకుంటూనో, విచారిస్తూనో ఆ విషయాన్ని దానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా మరల మరల హెచ్చరిస్తూండడం నాకు పరిపాటిగా కూడా మారిపోయింది.ఇంతా చెప్పి నేను మరల మీకు చెప్పేదేమంటే, జిజ్ఞాసువులూ పరిశీలకులూ ఐన పాఠక మిత్రులారా! అనవసరంగా నన్నేదో వర్గానికి చెందిన వానినిగా ఎంచి[ఒక వేళ అలా మీరే నిర్ణయానికివచ్చినా అది మెల్లచూపే నన్నదో వాస్తవం] అటుపిమ్మట నా మాటల బాగోగులను పరిశీలించడం మొదలిడితే మాత్రం మీరు చేసే నిర్ణయాలు నిజానికి బారెడటో యిటోగా ఉండే ప్రమాదముంది. కనుక నా గురించి మీలో కదులుతున్న ఆలోచనల్నీ, సందేహాల్నీ ఆవలుంచి చెపుతున్న విషయాన్ని చూడండి. సరే నంద్యాలలో ఉన్నాం కదా!
సమావేశాన్ని సామూహిక చర్చలా ప్రారంభించాను. మిమ్మలనేమైన అడగమంటారా? నన్నేమైన అడుగుతారా? అన్నది నా మొదటి మాట. వచ్చిన వారిలో ఒకరు అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా అని అడిగారు. ఆ రెంటిలో ఏది సత్యమని అడిగారు సరే. ఇంతకీ ఆ రెంటి గురించి ఏమైనా విన్నారా? అని అడిగాను. విన్నాను, విన్నంతలో ద్వైతం సరిగా ఉందనిపిస్తోంది అన్నారాయన. మరి నన్నెందు కడుగుతున్నారు? అని నా ప్రశ్న. మీరు తెలిసిన వారుగదా మీరేమి చెపుతారోనని. నిజంగా నన్ను తెలిసిన వానినిగా విశ్వసిస్తున్నారా? అని అడిగాను. అవునన్నారు. మరి మీకు సరిగా ఉందనిపించింది నేను కాదంటాననుకోండి అపుడు మీరెలా స్పందిస్తారు? అని అడుగుతూనే, అద్వైతం సరైనది అన్నాను. అబ్బే,అదెలాగండీ, అది నా జీవితంలో ఏ రకంగానూ పొసగడం లేదు అన్నారు. నే చెప్పినా అంగీకరించనపుడు నన్నడగడమెందుకు? నన్ను తెలిసినవాడివి అనడ మెందుకు? అని ప్రశ్నించాను. ఆయనే మరో ప్రశ్నవేశారిది యిక్కడితో ఆపి. జీవుడు స్వతంత్రుడా? అస్వతంత్రుడా? అని. జీవుడంటే మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. ఆత్మ అన్నారు. అదేనండి బాబూ! ఆత్మ అంటే ఏమిటనే నేనడుగుతోంది. మళ్ళీ “నేను" అని అనబోకండి అన్నాను. మరెలాగండి చెప్పడం, నావరకు నాకు తెలుస్తూనే ఉంది గానీ చెప్పడం కుదురుటలేదు అన్నారు. సరేలెండి, ఇంతకీ ఆ తెలుస్తున్నది స్వతంత్రమైనదిగా తెలుస్తున్నదా? అస్వతంత్రమైనదిగానా? అని అడిగాను. అస్వతంత్రమైనదిగానే ఉంది చాలవరకు అన్నారు. మరింక మీ సందేహమేమిటి? అని ఆడిగాను. కొన్ని కొన్ని పనులు అనుకున్నవి చేస్తున్నాం, చేయగలుగుతున్నాం గదా! అన్నారు. మరింకేం? ఆ పాటి స్వతంత్రం కూడా ఉందన్నమాట. అన్ని విషయాలలోనూ మనిషి పూర్తి స్వతంత్రుడూ కాదు. అస్వతంత్రుడూ కాదు. ఇది బాగానే ఉంది కదా! అనుభవానికీ సరిపోతూనే ఉంది అన్నాను. ఇంతకీ మీ అభిప్రాయం చెప్పారుకాదు అన్నారు. మీ అనుభవానికి భిన్నంగా నా అభిప్రాయం చెప్పినా అదెలాగండీ అంటున్నారు కదా? ఇంక చెప్పీ ఏమి ప్రయోజనం? ఆలోచించండని ఆగాను.
Note – ఈ శీర్షికలో ఈ ప్రస్తావనెందుకు? అని మీలో కొందరకైనా అనిపిస్తూండ వచ్చీపాటికే. కానీ ఈ అంశాలన్నీ ప్రమాణ తర్కాలతో ముడిపడే ఉన్నాయన్నది ఎంతమందికి తెలుస్తోంది?
మరొకరు జన్మలున్నాయా లేదా? అని అడిగారు. దేనికి? ఎవరికి? అని అడి గాను. జీవుడికి అన్నారు. జీవుడు మీ సిద్ధాంతం ప్రకారం నిత్యుడు కదా? మరి జన్మంటే ఏమిటి? అని అడిగాను. శరీరాన్ని విడచి మరో శరీరాన్ని పొందడం అన్నారు. అసలది సంభవమో కాదో నిర్ణయించడమెలా? తెలిసి నిర్ణయించాలా? తెలియకుండగనేనా? అన్నాను. తెలిసే నిర్ణయించాలన్నారు. అయితే ఆ విషయం నాకు తెలీదు. మరెవ్వరికీ తెలిసేందుకూ వీలులేదు అన్నాను. ఎందుకని అని అడిగారు. ఈ జీవితంలోనే-బ్రతికుండగనే-శరీరం వేరుగా-తాను (ఆత్మ) వేరుగా ఉన్నట్లు తెలిసినప్పుడే శరీరం ఉన్నా లేకున్నా ఉండే వస్తువొకటి (శరీర భిన్న మైన దాని ఉనికి) ఉందనడం సాధ్యపడుతుంది. ఒకవేళ ఎవరైనా అలాటి అనుభవం నాకుంది అన్నా, అది కలలాంటి కాల్పనికానుభవమో (భ్రమో), యదార్ధమో చూడవలసి ఉంది. అంటూ ఒక పరీక్షా విధానం చెప్పాను. ఎవరిట్టి అనుభవం నాకుంది అంటారో వారిని, జీవుడు వేరైన దేహంలో ప్రాణ ముంటుందా? గుండె కొట్టుకుంటుందా?శ్వాసక్రియ జరుగుతుంటుందా? అని అడగమన్నాను. మనమే ఆయా పరీక్షలన్నీ నిర్వహించవచ్చు ఆయన అంగీకరిస్తే అని ముగించాను. ఇంత చర్చ జేసినా వారికి నాపై ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడడంలేదు. నా పోకడ నేనో నాస్తికుణ్ణేమోనన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. నా రచనలూ, శైలీ, ఆయా గ్రంధాల నుండీ ఉటంకింపులూ, పత్రిక ముఖ చిత్రంలోని అంశాలూ ఇవినేనొక ఆస్తికుణ్ణేమోనన్న సందేహాన్ని పుట్టిస్తున్నాయి. నేనెవరినో తెలిస్తేగాని నా మాటలకర్ధాలు చెప్పుకోవడం యిష్టం లేదాయె. ఇదీ వారి సమస్య. నేనెవరైతే మీకెందుకయ్యా! నా మాటలలోని గుణ దోషాలు చూడరాదా? అంటాను నేను. ఈ సమయంలో ప్రమోద చైతన్యగారు రంగప్రవేశం చేసి వారెవరై తేనేమి? వారి ప్రశ్నలు పరిశీలించ దగినవిగానూ, సమాధానాలు పొందవలసినవిగానూ ఉన్నాయా లేదా? ఆలోచించండని హెచ్చరించి నా పని సులువు చేశారు.
ఆ సందర్భంలోనే K.V. రెడ్డిగారు ఇంతకీ మీరు చెప్పేదేమిటి? మీ రచనలు చూస్తుంటే ఏదో సామాజిక శాస్త్రం చెపుతున్నట్టు తోస్తోంది. అంత మాత్రంతో సరిపెట్టుకోలేక పోతున్నాము. దీని వెనుక అంతరంగంలో మీరు మరో విషయాన్ని కలిగి ఉన్నారనిపిస్తోంది. అదేమిటి? సూటిగా చెప్పండన్నారు? అయ్యా, ఒక ప్రశ్నకు - ఆలోచించి సమాధానం చెప్పండి. ఆపై నావిషయం చెపుతాను అని, ప్రతి మనిషీ స్వాభావికంగానే తాను వినిన, చూచిన అంశాలపై బాగోగులు విచారించి ఒక నిశ్చయానికి వస్తుంటాడు. సరిగా నిర్ణయించే సామర్థ్యం లేనివారు చేసే (తీసికునే) నిర్ణయాలు సాధారణంగా వాస్తవానికి బారెడటూ, ఇటూగా ఉంటుంటాయి. మరి ఇప్పుడు మీరందరున్నూ నేను చెప్పబోయే విషయాల బాగోగులు నిర్ణయించబోతారు. బాగుందనో, లేదనో నిర్ణయానికి వస్తారు. గమనించిన విషయం సరిగా ఉందో లేదో నిర్ణయించడమెలా గన్నది మీకు స్పష్టంగా తెలిసి ఉంటే చెప్పండని అడిగాను. నా ప్రశ్న అర్థమైందా? అంటూనే తెలిసిన విషయాలలోని తప్పొప్పులను నిర్ణయించగల సార్వత్రికమైన కొలతేమైనా ఉందా? ఉండాల్సిన అవసరముందా? ఉంటే మీరందరూ ఆలోచించుకుని సరైన కొలతను చూపిస్తే నా విషయాన్ని మీ ముందుంచుతాను. అట్లుకాకుంటే ఎవరి కొలతలు వారివై కొందరకు నేను చెప్పింది వాస్తవంగానూ, మరికొందర కవాస్తవంగానూ అనిపిస్తుంది కదా! ఆలోచించండని చెప్పాను.
కొద్దిసేపు వారిలో వారు చర్చించుకున్నారు. ఒక కొలతంటూ తేలలేదు. విసుగనిపించిందను కుంటాను. ఇంతకీ మీ విషయం చెపుతారా? లేదా? అని అడిగారు. కొలతలు లేకుండగనూ, కొలతల గురించి తెలియకుండగనూ కొలుస్తానంటున్నారు. అది సరైన పద్ధతేనా అని అడిగాను. ఇవన్నీ ఎందుకండీ? ఎవరి సామర్థ్యాన్నిబట్టి వారు నిర్ణయించుకుంటారు. మీదేదో మీరు చెప్పరాదా! అని అన్నారాయన. కొలతల గురించి తెలియకుండా కొలుస్తాననడమూ, సరే కొలవండనడమూ రెండూ తెలివి తక్కువ పనులే కనుక అట్టిపని నేను చేయను అన్నాను. అంటే మా దగ్గర సరైన కొలతలు లేకుంటే (సత్యా సత్యాలు నిర్ణయించడమెలా అన్నది తెలియకుంటే) మీ విషయం చెప్పరన్న మాటేగా అన్నారు. చెప్పను అన్నాను. ఇదో వింత ధోరణిలాగుంది. మరి మీరక్కడ వరకూ వచ్చిందెందుకు? అని అడిగారు. ఈ విషయంలో గూడా సమాజాన్ని మేలుకొలపాలనే అన్నాను.
ఇదంతా కాలహరణంతో కూడిన దండగమారి పనిలా తోచిందేమో! అయ్యా, అవన్నీ అలా పెట్టండి. ఒక్క ప్రశ్న వేస్తాను సూటిగా సమాధానం చెప్పండి అన్నారు. ఆలోచించి సరే అడగండి అన్నాను. ఈ ఉపాదికి భిన్నమైన దేదైనా ఉనికి కలిగి ఉందంటారా? లేదా? అని అడిగారు. ఉందనో, లేదనో చెపుతాననుకోండి. అందువల్ల ప్రయోజన మేమిటన్నాను. అదుగో మళ్ళీ ప్రక్కడారి తొక్కుతున్నారు. సూటిగా సమాధానం చెప్పండన్నారు. సరేనండీ! ఇంతకీ మీ ప్రశ్న సరిగా అర్థమైతేనేగా నేను సమాధానం చెప్పగలిగేది. ఉపాది అంటే ఈ శరీరమేనా? అని అడిగాను. ఈ ఒక్క శరీరం మాత్రమే కాదు, దృశ్యమాన మవుతున్న విశ్వమంతా అన్నారు. అంటే విశ్వానికి. భిన్నమైన (విశ్వానికతీతంగా అని కూడా వారే చెప్పారు.) దాని అస్తిత్వాన్ని గురించేనా మీరడుగుతున్నది అని తిరిగి ప్రశ్నించాను. అవునన్నారు. అలా అయితే అట్టి దాని ఉనికి నాకు తెలిసి లేదు. మరెవరికీ తెలిసి ఉండటానికి వీలులేదు. అని సమాధానం చెప్పాను. (అసలీ ప్రశ్న తప్పు ప్రశ్న అన్నది ఎందరకు తెలుసంటారు? యిప్పటికైనా మీలో ఎవరికైనా ఈ విషయం తట్టిందా? తెలిస్తే ఎందువల్ల ఇది తప్పు ప్రశ్నన్నది ఎందరకు తెలుసంటారు? ఇప్పటికైనా మీలో ఎవరికైనా ఈ విషయం తట్టిందా? తెలిస్తే ఎందువల్ల ఇది తప్పు ప్రశ్నో పత్రికకు వ్రాయండి.) వెంటనే ఆయన కొంత ఆవేశంగానే, మీరు చాలా తప్పు మాట్లాడారు మీకు తెలీదనండి. అంతేగాని మరెవరికి తెలియదంటానికి మీరెవరు? అన్నారు.
నాలో నేను నవ్వుకుంటూనే, మిగిలిన వాళ్ళను కూడా ఉద్దేశించి, రెడ్డిగారేమడిగారో, దానికి నేనేమి సమాధానం చెప్పానో అదెక్కడికి తీసుకు పోతుందో వారుగానీ, మీరు గానీ గమనించారా? అని అడిగి, ఉదయం నుండి నేను మొత్తుకుంటున్నదీ, మీరు అనవసరమని భావిస్తున్నదీ అయిన కొలమానానికి (ప్రమాణాలకు) సంబంధించిన ప్రశ్నే యిది. ఇంకెవరకూ తెలియదనడానికి మీకున్న ఆధారం (ప్రమాణం లేక కొలత) ఏమిటన్నదే వారి ప్రశ్న సారాంశమున్నూ. అక్కడున్న వారిలో ప్ర. చైతన్య మాత్రమే ముందుగా, విషయాన్ని నేనెక్కడ నుండి ఎక్కడకు తీసుకు వచ్చిందీ గమనించగలిగారు. పిదప మరికొందరకున్నూ అర్థ మైందనుకోండి. ఇంత జరిగినా (అంతకుముందే మాటల మధ్యలో రెడ్డిగారు నేను విషయానికి ప్రాధాన్యత నిస్తాను గానీ విషయికి (వ్యక్తికి) కాదు అని రెండు మూడుసార్లని ఉన్నారు) నా సమాధానంలోని లోపమేమిటనిగానీ, దానిలోని బలమెంతని గానీ ఆలోచించకుండగనే ఆ చర్చ నాయన ముగించారు. అదేమంటే ఇక అడగవలసిందేమీ లేదు. నాకు కావలసిన సమాధానం లభించిం దన్నారు. అప్పటి కాయనెక్కడకు చేరుకున్నారో నాకర్థమవుతూనే ఉంది. 1) ఇతనీ విషయం తెలియనివాడు అనో, అనాత్మ వాది అనో నిర్ణయానికి వచ్చి ఉండాలాయన. అదే ఆయనకు కావలసిన సమాధానం. నాకా ఊహ రాగానే ఆయన పొరపాటుగా నిర్ణయించు కున్నారనుకుని; అయ్యా భోజనానంతరం అందరం కలుద్దాం. నేననుకొంటున్నది కొద్దిసేపు చెపుతాను. జాగ్రత్తగా విని ఆపై ఒక నిర్ణయానికి రండి అన్నాను. సరేనన్నారు గానీ, మరల ఆయన రాత్రి 9 గం. వరకూ రాలేదు. ఏదైనా పనిబడి ఆగారో, అనవసరమనుకున్నారో తెలియదు.
అలాటిదే మరో సంఘటన జరిగింది. బాబూరావు గారు. వీరు సహృదయులూ, సంస్కరణాభిలాషులూ కూడా, పత్రిక పోకడనుబట్టి, ఆయనకు నేనెవరై ఉంటానన్నది సందేహంగా ఉండి ఉండవచ్చు. దాంతో ఆ సందేహాన్ని తీర్చుకోవడానికిగాను, సురేంద్రగారూ, చాతుర్వర్ణ వ్యవస్థను మీరంగీకరిస్తారా లేదా? అని అడిగా రొకనాడు. ఏం, ఎందుకడుగుతున్నారు? అన్నాను. ఏం లేదులే చెప్పండి అన్నారు. ఇప్పుడు చెప్పనులెండి దానికి తగిన సమయం రావాలి అన్నాను. సరే మీ యిష్టం అని అప్పటికి ఊరుకున్నారు. మరి కొంతకాలం తరువాత మరో సందర్భంలో కలసినపుడు నా ప్రశ్నకు సమాధానం రాలేదు అంటూ హెచ్చరించారు. అయ్యా, విషయాల్ని పరిశీలించేముందు ఏవేవో అభిప్రాయాలు పెట్టుకుని గానీ, ఆవేశంతో గానీ ఉండకూడదు. అది సత్యాన్వేషణను ప్రక్కదారి పట్టిస్తుంది. అప్పుడు వాస్తవాలను గమనించడం కుదరదు. మీరు ఒకింత ఆవేశపరులుగానూ, పై విషయంలో ఒక అభిప్రాయం పెట్టుకునీ ఉన్నారు. కనుక ప్రస్తుతం నేనేమి చెప్పినా పరిశీలన సవ్యంగా సాగదు అంటూనే, నిజాయితీగా చెప్పండి మీలో ఆవేశంపాలు ఒకింత ఎక్కువగా ఉందా లేదా? అని అడిగాను. వారు నిజంగా నిజాయితీపరులే, మీ మాట నిజం. అయినా ఆలోచనలేని ఆవేశం కాదు నాది అన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థపై ఒక అభిప్రాయానికి వచ్చి వుండడమూ, ఒకింత ఆవేశాత్మక స్వభావం ఉండడమూ వల్లనే ఆనాడూ, ఈనాడూ కూడా ఆ విషయం చర్చించడానికి నేను సిద్ధపడడం లేదు అన్నాను. అప్పుడాయన సరే మీ యిష్టం అన్నారనుకోండి. పాఠకులారా! ఇక్కడా, పైనంద్యాల సంఘటనలోనూ జరిగిందేమిటో మీరాలోచించగలరా! రెడ్డిగార్నీ, బాబూరావుగార్నీ కూడా ఈ విషయం నిదానంగా పరిశీలించి సత్య నిర్ణయం చేయండని అడుగుతున్నాను, మీరూ పరిశీలించి విషయాన్ని అర్థం చేసికోండి.
1) K.V. రెడ్డిగారు ఆస్తిక మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే సమాజం సంస్కరింపబడాలన్న అభిప్రాయంతోబాటు ఆ సంస్కరణమన్నది అందరూ ఆస్తిక మార్గానికి మరలడం ద్వారానే సాధ్యమన్న నిర్ణయంలో ఉన్నారు. నాస్తిక వ్యతిరేకత ఉంది వారిలో. నాస్తికుడుగా ఉంటూ మంచివాడుగా ఉండడం ఎలా సాధ్యం? (ఇది నిజమో కాదో నిజాయితీగా వారే ఆత్మ విమర్శన చేసుకోవలసి ఉంటుంది.) అలానే,
బాబూరావుగారు నాస్తిక మార్గావలంబులు. వారూ సమాజ హితకాంక్ష కలిగి యధాశక్తి అందుకై యత్నిస్తున్నవారే. ఆస్తిక మార్గం సమాజానికి కలిగించినంత (ముఖ్యంగా కుల వ్యవస్థ) నష్టం మరే విధానం వల్లనూ జరగలేదనీ, అది కన్ను లుండి చూడగలిగితే చారిత్రిక వాస్తవమనీ దృఢ నమ్మిక కలిగిన వ్యక్తి ఆయన. వీరేగాక ఈ రెండు దృక్పధాలకు చెందినవారూ మేలుకొలుపు చదువుతున్నారు. (ఒక నవలలా పైపైన చదివి పారేసే వారూ చాలామంది ఉండవచ్చు పాఠకుల్లో. వారితో పోలిస్తే అనుకూలంగానో, ప్రతికూలంగానో విషయాన్ని నిశితంగా పరిశీ లించే వారు ఎంతో మేలు) పై యిరువురూ నా వివరాలకై (నేనే మార్గం వాడినో తెలుసుకునేందుకు) యత్నించారు. అప్పటి కందిన సమాచారాన్ని బట్టి చూస్తే పత్రిక ముఖ చిత్రమూ, శైలీ నేను హిందూ సమాజానికి చెందిన ఆస్తికుణ్ణై ఉండవచ్చు నేమోనన్న ఊహనూ, పత్రికలోని కొన్ని అంశాలు నాస్తికుణ్ణేమో ననిపించేట్ల గానూ ఉన్నాయి. సమాజం-మనిషి- మారాలి అంటూ లోకంలో జరుగుతున్న జరగకూడని వాటిని గూర్చి వ్రాస్తున్నానొక వంక, ఆస్తికులకూ, నాస్తికులకూ కూడా నేనెవరై ఉంటానో నన్నది సందేహమే. (ఇక్కడో తమాషా చెప్పనా? నేను తమ వర్గం వాణ్ణైతే ఇహ గొడవేమీ లేదు. అంతా బాగానే ఉంది) నేనెవరో నిశ్చయంగా తేలితేగాని నా మాటలు స్వీకరణ యోగ్యాలో కాదో నిర్ణయించుకోవడం కుదరదు అంటోంది వాళ్ళ మనస్సు. పైకి మాత్రం యిరు వర్గాలూ, ఎవరు చెపితే నేమండి, ఏమి చెప్పారో చూడాలి గాని అంటూనే ఉన్నారు. మరి నేనే వర్గానికి చెందిన వాణ్నో కనిపెట్టమంటోంది మనస్సు. ఇంతా జేసి వ్యక్తిగతంగా చూస్తే యిరువురూ ధార్మికులే, సంస్కరణాభిలాషులే. అయితే ఒకర్ని ఒకరు మంచి వారుగా అంగీకరించలేరంతే.
ఇదంతా ఎందుకొచ్చిన సొద అనిపిస్తూండవచ్చు మీకు. అన్ని సిద్ధాంతాల వాళ్ళ తన్ను లాటలకూ, పరస్పర నిందారోపణలకూ ప్రాణం పోస్తూ చూపుండీ గ్రుడ్డి వాళ్ళను చేస్తున్న ప్రమాదకరమైన అంశమిది. అంతెందుకు, యిప్పటి నా ఆలోచనా ధోరణికి ప్రేరణ కర్తలూ, ఒరవడి దిద్దిన వారూ, అభిప్రాయం పెట్టుకుని చూడకూడదని వారి విద్యార్థులకు నిరంతరం చెపుతుండేవారు అయిన ఒకరు (మేమీరువురం అతి సన్నిహితంగా సంవత్సరాల తరబడి విచారణలూ, అనేక వ్యక్తులతో చర్చలూ కలసి సాగించాం) ఈ మధ్య నాకూ, ఆయనకు తెలిసిన వారితో, ఇంతకూ సురేంద్ర ఆత్మ ఉన్నదంటాడా? లేదంటారా? అంటూ ఒక సందేహన్ని వెలిబుచ్చారట. ఆయనకూ, నా మాటలకర్ధాలు స్వీకరించడానికి, ముందుగా నేనే వర్గీయుణ్ణో తెలుసుకోవడం అవసరమని పించిందన్నమాట, అది తెలియకుండా నా మాటలు వాస్తవాలో కాదో నిర్ణయించడం యిష్టం లేదన్నమాట. అంత ప్రమాదకరమైన అంశమిది, తెలుసికోవడ మెలా? అన్నది నేడు మనిషికి తెలియకుండా పోయింది.
(1) K. V. రెడ్డిగారు వారి పద్ధతిలో నన్ను ప్రశ్నించి నా సమాధానాన్ని సరిగనూ, పూర్తిగనూ గ్రహించకుండగనే ఒక నిర్ణయానికి వచ్చారు. నేను అనాత్మ వాదినని. కనుక అనాత్మ వాదులైన తార్కికులతో సంభాషణలనవసరం అని అనిపిస్తూంటుందిక వారికి. ఆలోచించవలసిన ప్రశ్నలే నేను అడుగుతున్నప్పటికీ,అవి బుర్ర వున్న, ప్రతివాడూ తెలుసుకోవలసిన, తేల్చుకోవలసిన విషయాలే అయినప్పటికీ, వేలికేస్తే కాలికీ, కాలికేస్తే, వేలికి ముడి పెట్టి తిమ్మిని బమ్మిని చేస్తు న్నట్టుంటుందిక వారికి నా పద్ధతి.
(2) అలానే బాబూరావు గార్కిన్నీ, నేను వర్ణ వ్యవస్థ సరైనది అంటే చాలు, ఇక నా మాటలన్నీ మోసపూరితాలూ, సమాజం కొంపమంచడానికై వేసే ఎత్తు గడలుగా కనుపిస్తాయిక వారికి. ఎందుకని? వర్ణ వ్యవస్థ పట్ల వారికి విపరీతమైన ద్వేషభావముంది. దానినంగీకరించేవాడు మంచివాడుగా ఉండటం అసంభవం
ఒకరు నేను నాస్తికుణ్ణి. గనుక ఇక సంస్కరణ వాదిగా ఉండడం బూటకమనీ, మరొకరు, నేను ఆస్తిక వర్గీయుణ్ణి గనుక అందునా హిందువును (కుల వ్యవస్థ నంగీకరించే వాడు) కనుక సమాజం బాగు అన్నమాట నా విషయంలో నీటిమీద రాతలాంటిదనీ, అనుకుంటున్నారు. సాధారణంగా సమాజపు కొలతలు (కొలతలు తెలీని వారి కొలతలు) ఇలానే ఉంటాయి. అయితే తాము తప్పు కొలతలు కొలుస్తున్నామేమో నన్న స్పృహే వీరికుండదు.
సైద్ధాంతిక విశ్లేషణలకీ కొలతలు సరిపోవు, (1) ముందుగా అభిప్రాయాలు పెట్టుకుని చూడడమూ, (2) ఇష్టా యిష్టాలతో ముడి పెట్టి పరిశీలించడం, (3) విషయాన్ని సరిగా స్వీకరించకుండగనే నిర్ణయాలు చేయబూనడం వగైరాలన్నీ కొలతలు తెలియని తనానికి ఉదాహరణలే. ఎందుకంటే వస్తువు. యాదార్థ్యం వీటన్నిటినీ అంటనిది.
నిజంగా వాస్తవాన్ని తెలుసుకోవాలనుకుంటూనే పై వక్ర దృష్టులవల్ల తమకు తెలియకుండానే వాస్తవానికి దూరమవుతున్నామని వారెప్పటికి గ్రహించగలరు. అట్టి యెడల వారి దృష్టిని సరిచేయడం ముందు చేయవలసిన పని ఔతుందో, లేక మీకు నచ్చినట్లు మీరు కొలుచుకోండి, మీరేమైతే నాకేమి? అనుకుని విషయాన్ని వారి ముందుంచడం సబబౌతుందో అందరూ యోచించండి. నిత్య వ్యవహారంలో సామాన్య జ్ఞానం కల వ్యక్తైనా కొలతలు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే వస్తువులను తెచ్చుకుంటాడు. ఒక వేళ అలా చేయకుంటే తానే నష్టపోతాడు. అయితే మరెందువల్లనో, మరింత జాగరూకుడై యుండవలసిన సందర్భంలో (సత్యా సత్యాలూ, ధర్మాధర్మాలు నిర్ణయించే సందర్భంలో) మరీ గుడ్డిగాను, తొందర పాటుతోనూ వ్యవహరిస్తున్నాడు. పరిశీలించకండి, యోచించకండి, ప్రశ్నించకండి తర్కించకండి అంటూ రొద పెట్టే నవీన వేదాంతుల (నిజంగా వారు వేదాంతులూ, మార్గదర్శకులూకారు) మార్గదర్శకుల పాత్ర ఎక్కు వుందీ మార్గాన్ని తయారు చేయడంలో.
ఏ విద్య వుంటేగాని మిగిలిన విద్యల విలువలను నిర్ధారిండం కుదరదో ఆ విద్య తెలియక పోవడమట్లుంచి తెలియనక్కరలేదన్న దృష్టితో తెలుసుకోడానికి ఇష్టపడక పోవడం నిజంగా విచారించదగ్గ విషయం.
"ప్రమాణ వివేచన" అన్న శీర్షిక ప్రారంభించి ఒక పాఠంలా విషయాన్ని చెప్పుకు పోకుండా ప్రమాణ వివేచన ప్రారంభించడానికి ముందే అవసరమైన అంశాలనూ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఈ విద్యను గ్రహించడానికి, పరిశీలించడానికి కూడా మనిషి మానసికంగా ముందు తయారు కావలసి ఉంది. మన ప్రస్తుత సమాజపు దౌర్భాగ్యం వల్ల ప్రమాణ విద్యకు కనీస గుర్తింపు కూడా లేకపోయినప్పటికీ, యదార్థంగా మిగిలిన అన్ని విద్యలూ ఒక ఎత్తు, వాటి వాటి యదార్ధ విలువల్ని నిర్ధారించే విద్య ఒక్కటే ఒక ఎత్తు అవుతుంది.
ఈ విద్యా విషయకమైన స్థాయి భేదాలవల్లనే (మానసిక సామర్థ్యాన్ని బట్టి) మనుషులకు ఒక్కొక్కరికొక్కో విషయం సత్యంగానూ అనుసరించదగినది గానూ అనిపిస్తుంది. ఏమి చెపుతున్నానో తెలుస్తూనే ఉన్నదనుకుంటాను. భిన్న భిన్న ధోరణుల యందు మన కభిమానం అతిగా ఉండడానికీ, వాటివాటిని (నిజంగా అవి అంత విలువైనవి కానప్పటికీ) పట్టుకుని వేలాడడానికి ఈ ప్రమాణ తర్క విద్యలందు సమగ్రమైన అవగాహన లేక పోవడమే కారణం. ముందీ విషయాన్ని జిజ్ఞాసువు స్పష్టంగా గ్రహించగలిగితే (ఆయా వస్తువుల యదార్థ విలువల్ని నిర్ణయిండానికి, తూనికలు కొలతలు ఎంత అవసరమో గ్రహించ గలిగితే) గాని ఈ విద్యార్జన యందు సరైన శ్రద్ధ ఏర్పడదు.
జిజ్ఞాసువు (తెలుసుకోవాలనుకునే వాడు) ముందుగా తెలియడమంటే ఏమిటో, ఎలా తెలిస్తే గాని, తెలిసినట్లుగాదో, తెలుసుకునేందుకు తనకు ఏవేవి అక్కరవుతున్నాయో, వాటిని ఉపయోగించడమెలానో, వాటి వాటి క్షేత్రాలూ, బలా, బలాలు ఎట్టివో ముందు స్పష్టంగా తెలిసికోవాలి. ఈ విషయానికి చెందిందే ప్రమాణ విద్య అంటే ఆపై తెలిసింది సరిగా ఉందో లేదో నిర్ణయించుకోడాని కుపయోగపడేదే తర్కవిద్య లేక న్యాయవిద్య. తర్కానికి లక్ష్యం సత్యావిష్కరణే. " ప్రమాణైః అర్ధ పరీక్షణం న్యాయం" అర్ధాన్ని పరీక్షించి నిర్ణయించేదే న్యాయం-తర్కం. యుక్తాలోచననే తర్క మంటాము. "అన్వీక్షకీ న్యాయవిద్యా" అనుసరించి చూపించేది. దేని ననుసరించి? అనుభవాన్ని-ఆధారాలను-అనుసరించి. విషయాన్ని చక్కగానూ, నిశితంగానూ, నిష్కర్షగానూ పరిశీలించి ఒక నిర్ణయానికి రండి.
సంపుటి– 2 సంచిక. 7 1.7-92
గత సంచికలో ముఖ్యమైన కొన్ని విషయాలను ప్రస్తావించాను. వాటినొక సారి గుర్తుచేసుకొని ముందుకు సాగుదాం (1) తార్కికతకూ - తర్కజ్ఞతకూ ఉన్న తేడాను గమనించండి. తార్కికతను (యుక్తాలోచనను) అలవరచుకోవడం. అందుకు తర్కజ్ఞత-తర్కశాస్త్రావగాహన-దోహద పడుతుందనీ తెలియడం. అలానే శాస్త్రీయ దృష్టిని పెంచుకోవడం. (2) ఎన్ని విధానాల ద్వారా విషయ జ్ఞానం కలుగుతుందో, ఆయా విధానాల ద్వారా కలిగే జ్ఞానరీతులెన్నో, వాటి స్వరూపాల లోని తేడాపాడాలేమో తెలుసుకోవడం. దీనినే ప్రమాణ వివేకమంటారు. అలానే జ్ఞానార్జనలో తీసికోవలసిన జాగ్రత్తలేమో గమనించి ఉపయోగించుకోవడం.
(3) మేధావులలోని రకాలు : (A) అనేక విషయాలు తెలుసుకొన్నవారు. (B) తెలుసుకునే వాటిని గూర్చి తెలుసుకునేవారు (4)ఆ వ్యాసం మొత్తం సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది, విషయాన్ని గ్రహించాలను కున్నవారూ, పరీక్షించాలనుకున్నవారూ విషయానికి సంబంధించినంత వరకే పరిగణనలోకి తీసికోవాలనీ, విషయేతరమైన వాటినీ వేటినీ ఆ సందర్భంలో ముడిపెట్టిచూడరాదనీ, అంటే ఎవరు చెప్పారన్నది విడచి ఏమి చెప్పారన్నది మాత్రమే గ్రహించండనే.
(5) ఒక వ్యక్తినీ, అతడు చెప్పిన విషయాన్నీ, అతడు ఆస్తికుడా నాస్తికుడా? నా వాడా- పరాయివాడా? చిన్నవాడా-పెద్దవాడా? సన్యాసా-గృహస్తుడా? నాయకుడా-సామాన్యుడా?లాంటి వాటితో ముడిపెట్టకుండా చూడగలినప్పుడే నిజమైన సత్యాన్వేషణ సాధ్యపడుతుంది. ఈ విషయం వినడానికి చిన్నదిగా అనిపించవచ్చుగానీ, జిజ్ఞాసువునూ, పరిశీలకునీ కూడా తరచుగా పెడత్రోవ పట్టించగలుగుతోంది. మేలుకొలుపు సంచికలు ఓపిగ్గా మరోసారి తిరగవేయగలిగితే ఈ నియమాన్ని గూర్చి నేను అచ్చటచ్చటా ప్రస్తావించినట్లు గమనించగలరు.
ప్రమాణముల పేర్లను గురించి అనుకుంటూ మధ్యలో ఏర్పడిన పరిస్థితుల వలన ప్రమాణ తర్కవిద్యలను గురించి మరింత విశదంగా పరిశీలన చేస్తున్నాము. ఎందుకు మరల ఈ విపులీకరణ? ఎందుకంటే జీవితంలో ఈ విద్యయొక్క స్థానాన్ని-ప్రాధాన్యతను-పాఠకులు చక్కగా గుర్తించక పూర్వమే, నా అభిలాషకొద్దో, చెప్పవలసింది చెప్పేస్తే మన పని అయిపోతుందనుకునో త్వరత్వరగా వ్రాసుకుంటూపోతే పాఠకుల కొరిగేదేమీ ఉండదు. మేలుకొలుపు ఉద్దేశమూ నెరవేరదు. ప్రతికోద్దేశం నెరవేరడం కొరకే తర్కశాస్త్రంలో విశేష ప్రవేశమున్న డా.వం. రామానుజాచార్యుల వారినీ సంప్రదించి ఒక నూతన శీర్షికను ప్రారంభించాలను కోవడమూ జరిగింది. గత సంచికలో ఆ విషయం ప్రకటించానుకూడా. కానీ దానీకీ పాఠకులనుండి తగినంత స్పందన రాలేదు. ఎందుకని?
నిజంగా తర్కపద్దతీ, ప్రమాణ వివేకమూ మానవ జీవితాని కఖ్ఖరలేనివా? వాటిని గూర్చి సమగ్ర జ్ఞానం కలవారి కవి విశేష (అదనపు) ప్రయోజనాన్ని కలిగించలేవా? యదార్థంగా ఆరెంటినీ విడచి ఏ వ్యక్తైనా వ్యవహారం సాగించ గలడా? లేదే? మరెందుకని ఈ విద్యపట్ల సమాజంలో ఇంత ఉదాసీనత (కొందరిలోనైతే వ్యతిరేకతకూడా) చోటుచేసుకుని ఉంది? ఎప్పటినుండి ఈ అపసవ్య భావన సమాజాన్ని పీడించడం మొదలైంది? నిజంగా తర్కాన్నీ, ప్రమాణాల్నీ వ్యతిరేకించే వారు ఆచరణలో (నిజజీవితంలో) వాటిని విడిచి ఉంటున్నారా, ఉండగలరా! అసలా రెంటినీ విడవడమంటే ఏమిటో, విడిస్తే ఏమవుతుందో ఆలోచించారా ఎన్నడైనా? నిత్యజీవిత వ్యవహారంలోనూ, విద్యా విధానంలోనూ తర్క, ప్రమాణాలు ఏ పాత్రను నిర్వర్తిస్తున్నాయో చూడగలిగితే ఈ మాట అనగలరా? ఉదాసీనంగా ఉండగలరా? ఏ మాత్రం అనలేరనీ, ఉదాసీనులు కాలేరనీ ఘంటాపథంగా చెప్పగలను. ఇంత శ్రమించీ, పాఠకులలో దీనిపై ఉత్సుకత [తెలిసికుందామన్న కోర్కె]ను కలిగించలేకపోవడం నాకు బాధాకరమైన విషయమే. అయినా సత్యజ్ఞానార్జనలో వీటి పాత్రనెరిగిన వారు అందరి హితాన్నీ కోరి ఏదోవిధంగా సమాజాన్ని ప్రేరేపించడం ఉచితంకాగలదు.
తెలిసీ తెలియని వారిలోనూ, వారిద్వారా ప్రేరేపిపంబడి ఏదో మార్గాన పోతున్న సామాన్యులలోనూ మాత్రమే ఈ విషయాల పట్ల వ్యతిరేకత ఉంది. మరి ఈ విషయంలో ప్రాచీన తాత్వికులూ, సిద్ధాంత స్థాపకులూ, ప్రవర్తకులూ ఎలాటి అభిప్రాయం కలిగిఉన్నారో, అలానే నవీన విజ్ఞాన శాఖలీ విషయాన్నెంత ప్రముఖంగా స్వీకరిస్తున్నాయో గమనించితేనన్నా మన కంటిన ఈ మౌఢ్యం సడలదు. జాడ్యం వదలదు. పై రెండు కోవల దృక్పధాన్నీ మీ ముందుంచుతాను. సావధానంగా గ్రహించి ఒక నిర్ణయానికిరండి. ప్రాచీనుల భావనలిలా ఉన్నాయి.
(1) వేదాలనర్థం చేసికోవడానికి షడంగాలు అవసరమైనవిగా నిర్ణయించారు పూర్వీకులు. శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అన్నవే అవి. వాటిలో మొదటి నాలుగూ భాషా విషయానికి చెందినవి. ఈ ఆరు శాస్త్రాలలో ప్రవేశమున్నవారే వేదార్థాన్ని గ్రహించగలరన్నది వారి భావన. ఎందుకంటే వేదం వాజ్ఞ్మయ (శబ్ద) రూపమే అగుటవల్ల భాషారూపంలో నిక్షిప్తం చేయబడ్డ విజ్ఞానాన్ని అందుకోవడానికి భాషాస్వరూపస్వభావాల్నీ, నియమ నిబంధనలనూ అర్ధం చేసికొని ఉండడం ప్రాధమికావసరం అవుతోంది. అలానే ఉపాంగాలుగా షడ్దర్శనాలను ఎంచుకున్నారు వారు. న్యాయవైశేషికాలు, సాంఖ్య యోగాలు, పూర్వోత్తర మీమాంసలూ అన్నవే ఆ ఆరు. వీటిలో ప్రావీణ్యులైన వారి కవి అద్దంలా వేదార్ధాన్ని ప్రకటపరుస్తాయన్నది వారి భావన. ఆ ఆరు దర్శనాల్లోనూ తర్క ప్రమాణాలు సామాన్య విషయాలు. ఆ దర్శనాలన్నీ తాము ప్రతిపాదించి నిర్ధారించదలచుకున్న వాటికి సాధనాలుగా తర్క ప్రమాణాల్నే స్వీకరించాయి. తరువాతి కాలంలోని వారైన సాంప్రదాయ ప్రవర్తకులలోనూ వాటివిలువలు తగినంతగానే ఉంటూ వచ్చాయి. ఈ తరం వారిచే ఒక సూక్తి స్మరింపబడింది. “కాణాదం, పాణినీయంచ సర్వశాస్త్రోపకారకం” అన్నదే ఆసూక్తి. సర్వశాస్త్రాలకు ఉపకారాన్ని కలిగించగలవి తర్కమూ, వ్యాకరణమూనని ఆ సూక్తి భావం. విజ్ఞానార్జనలో ఫలానివారికవి అవసరమనీ, ఫలానివారి కక్కరలేదనీ చెప్పడం కుదరదు. కాణాదం అనుటవల్ల న్యాయవైశేషిక దర్శన విషయాలైన తర్క ప్రమాణాలనూ, పదార్థ విజ్ఞానాన్నీ, పాణీనీయం అనుటచే భాషా సంవిధానమూ, భాషాప్రయోగాల స్వరూప స్వభావాల నెరిగి ఉండవలసిన అవసరాన్నీ, సర్వ శాస్త్రోపకారకం అనుటచే అన్ని రకాల శాస్త్రాలకూ వాటితో నున్న విడదీయరాని సంబంధాన్నీ స్పష్టంగా గ్రహించి భావితరాలకూ సూచించారన్నది తెలుస్తోంది. పరంపరాగతంగా అందున్నట్టి, జ్ఞానార్జనలో ఆద్యంతమూ అవసరమైయున్నట్టి, వీటిని, తరువాత తరానికి చెందిన సిద్ధాంతకారులూ, ప్రవర్తకులూ (నాస్తిక, ఆస్తికాది విభిన్న మార్గీయులైన బుద్ద, జైన, చార్వాక, శంకర, రామానుజ, మధ్వ, మీమాంసకాదు లెల్లరూ) చక్కగానే స్వీకరించారు. తర్క, ప్రమాణ విద్యలందు బహుముఖ ప్రజ్ఞను సాధించే ప్రవర్తించారు. ఈ నాటికీ ఆయా పీఠాధిపతులకు తర్క వ్యాకరణ విద్యలు నేర్పే, వారి వారి సిద్ధాంత స్వరూపాల్ని అభ్యసింపజేయడం నియమంగా సాగుతోంది. వారందరకూ అవి అవసరమైనవిగా ఎందుకనిపించాయి? మరి నవీన గురు రూపధారులకూ, జిజ్ఞాసువులకూ, ఇతరులకూ ఎందు కక్కరలేని వైనాయి? ఒకింత లోతుగా పరిశీలిస్తేతప్ప వీటికి కారణాలు అంతుబట్టవు.
(1) సాంప్రదాయకాస్తికులందరకూ ప్రమాణములైన శృతులచ్చటచ్చటా తర్కాన్ని నిరాకరించడమో, నిరాదరించడమో చేసాయి. గురపరంపర ద్వారానూ తర్కానికి అప్రతిష్టాదోషం ఆపాదింప బడినది.
తర్క శాస్త్రంలోనే తర్కమన్న మాటకు మరో సందర్భంలో వేరు అర్థం కల్పింపబడినది. వ్యాప్యారోపేణ వ్యాపకారోపస్తర్కః. ఇది తర్కానికి నిందితార్ధము. ఒక వేళ వెనుకటివాళ్ళు ఈ అర్థంలో తర్కాన్ని తీసుకుని (అపసవ్యపు తర్కాన్ని) నిరాకరించి ఉండవచ్చు.
(3) ఈ తర్క ప్రక్రియ నాధారం చేసికవి పండితులు పాండితీ ప్రకర్షను అతిగా ప్రకటపరచుకోవడం ఒక కాలంలో జరిగి ఉండాలి. అలానే అయ్యుంటుందనేందు కాధారంగా గొప్పతార్కికుడై న రఘునాథ శిరోమణి రచించిన ఈ క్రింది అర్ధాన్నిచ్చే శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. “పండితులందరూ ఒప్పన్న దానిని తప్పని నిరూపిస్తాను. మరి అందరూ తప్పన్న దానిని ఒప్పుగా నిర్ధారిస్తాను.” ఇలాంటి పట్లు పట్టుకోవడానికై తర్క లక్ష్యాన్నే (సత్యావిష్కరణే తర్క పరమావధి) దెబ్బతీసే విధంగా బుద్ధిబలం యొక్క బలా బలాలను తేల్చుకోవడానికి ఉపకరణంగా తర్కాన్నతిగా వాడుకుంటున్న రోజులలో (దీనినే నేను గతంలో అతి తర్కం అన్న పేరుతో మీ ముందుంచాను. అయినదానికీ, కాని దానికీ కూడా తర్కిస్తుండడం దీనిలక్షణం) నిజమైన తాత్వికులు, ఆ సమయానికి తగినట్లు తర్కాన్ని నిరాదరించి ఉండవచ్చు. రఘునాధ శిరోమణి గొప్ప తార్కికుడే కావచ్చుగానీ ఒక పెద్ద తప్పుమాట అన్నానని తాను గానీ, దాన్నో గొప్ప విషయంగా సమ్మానించే తార్కికులు గానీ గమనించలేదు. వాస్తవంగా వాస్తవికులందరూ నిందించదగ్గ అంశమిది. ఏ మంటే సత్యాన్ని మరుగుపరచగల బుద్ధిబలం ఏ సత్పలితాన్నిసాధించగలదు? ఎవరినుద్దరించుట కొరకు? అలాటి ఘఠితఘటనా సమర్థులైన దుస్తార్కికుల తర్క క్రీడల వల్లనేకదా తర్కం పనికిరానిదన్న వ్యతిరేక భావం సమాజంలో నిలువగలిగింది. నాడది వ్యక్తిగతంగా వారి కెంత ఆనందాన్నీ తృప్తినీ కలిగించిందో గానీ, క్రమంగా తర్క విద్యే పనికిరానిదన్న తప్పు అభిప్రాయం ఏర్పడేందుకు మాత్రం బాగా ఉపయోగపడింది. ఇది మనందరమూ విచారించవలసిన విషయం, ఎందుకంటే,
యదార్థంగా ఏ క్షణాన తర్కాన్నీ (యుక్తాలోచనను) జ్ఞానసాధనాలనూ తగినంతగా ఉపయోగించుకోవడం మానుకున్నాడో ఆ క్షణాన్నుండే మనిషి అందుకు తగ్గట్టే నష్టపోతున్నాడు. ఇదో నిప్పులాంటి నిజం. చైతన్యానికి (తెలివికి) ఆధారమైన ఇంద్రియాలూ, మెదడూ, వాటి కార్యక్రమమూ అన్న వాటిలోనే అన్ని ప్రమాణాలూ, తర్కమూ, ఇమిడి ఉన్నాయి. మరి ప్రమాణాలు కాదనట మేమిటి? కలిగిన అనుభవ సారాంశంగా ఏర్పడిన జ్ఞానరాశి నుండి జనించిన ఆలోచనను, అందునా సహేతుకమైన ఆలోచనను. అఖ్ఖరలేని దనడ మేమిటి? మాటవరసకన్నా ఆచరణలో ఆలోచననూ, జ్ఞాన ప్రక్రియా విశేషాలను, విడుస్తాడా ఏమనిషైనా? అసలు విడువగలడా అని? విడుద్దామనుకునే వారూ, విడవమనే వారూ వాటిని విడిస్తే ఏమవుతుందో ఆలోచించారా ఎన్నడైనా?
4.కఠోరమూ, సునిశితమూనైన మానసిక పరిశ్రమతో కూడుకున్నవిద్య యిది. సమర్ధుడైన తార్కికుడు తనలోనీ, ఎదుటివానిలోనీ దోషాదోషాలను అత్యంత సూక్ష్మంగానూ నిశితంగానూ, చూడగలడు. కనుకనే స్వార్థపరులూ, సోమరులూ, అజ్ఞానులైన వారు తమ గురు స్థానాలనధిష్టించిన పిదప కాలంలో తమ అస్తిత్వాన్నీ, అధికారాల్నీ నిలుపుకోడానికై ఎదుటివారిని (సమాజాన్నీఅందులోని వారే అయిన అనుయాయులను) సూక్ష్మవిచారం చేయలేనివారుగా తయారుచేయడానికి పన్నిన ఎత్తుగడ అయ్యుండ వచ్చు. నేడు మాత్రం ఈ అంశమే ప్రబలమై సామాన్యుని నుండి విద్యావంతుల వరకు అందరిలోనూ, అంధ విశ్వాసాలను పెంచి పోషిస్తోంది.
అయితే ఏ విజ్ఞాన శాఖలైనా తర్కాన్నీ, ప్రమాణాలను విడచి మనగలుగుతాయా? మనలేవు. ఆయా శాస్త్ర రంగాల్లో తర్కం పాత్ర అన్న దాన్ని కళాశాల విద్యార్ధులకు పాఠ్య గ్రంథాలుగానున్న తర్కశాస్త్ర పరిచయ గ్రంథాల్లో చక్కగా వివరించడం జరిగింది. విజ్ఞాన శాఖలన్నీ స్వీకరించి ఉపయోగించుకుంటున్న తర్కాన్నొక చేదు మాత్రగా భావించే వారికి, చేదు మాత్రే అయినా అజ్ఞాన రోగానికది దివ్యౌషధం అన్న కనువిప్పు కలిగించగలవు ఆ వివరణలు. మేలుకొలుపు ఆశయంలో భాగంగా వాటినీ కొన్నింటిని మీముందుంచబోతున్నాను. పరిశీలించండి.
- “తర్కం-శాస్త్రీయ విధానం” అన్న పేరుతో తెలుగు అకాడమీ వారు ముద్రించిన గ్రంధంలో తర్కమంటే ఏమిటి? అని ప్రశ్నించి సమాధానం చెప్పారు.
1) ఆలోచనా నియమాల అధ్యయనాన్ని తర్కమనవచ్చు.
2) ఒక తెలిసిన విషయాన్నాధారం చేసుకుని మరోదాన్ని తెలుసుకునేందుకు (నిర్ధారించుకునేందుకు) చేసే క్రమబద్ధమైన యోచననే తర్కమంటారు.
3) తర్క శాస్త్ర మూలద్రవ్యం- సారాంశం- క్రమబద్దమైన చింతనా వ్యవస్థే.
4) ప్రతి విజ్ఞాన శాస్త్రంలోనూ తర్కం అంతర్భూతంగా ఉండి తీరుతుంది. అతి నిర్దిష్టమైన గణితశాస్త్రం కూడా తర్కంపైనే పూర్తిగా ఆధార పడుతుంది. శుద్ధగణితం తర్కానికి భిన్నం కాదంటారు బెర్ ట్రండ్ రస్సెల్
5) అధునాతన శాస్త్రీయ సృష్టి కంప్యూటర్. అది పనిచేయు విధానం పూర్తిగా తర్కం(బూలేతర్కం) పైనే ఆధారపడిఉంది.
6) సంకుచితార్ధంలో తర్కం ప్రామాణిక వాదాల సిద్ధాంతం. విస్తృతార్ధంలో చెప్పుకోవాలంటే క్రమబద్ధమైన చింతనా వ్యవస్థద్వారా సాధారణీకరణాలకు చివరకు అమూర్తీకరణాలను (నిర్దిష్ట రూపాలను) సాధించి పెట్టే శాస్త్రం తర్కమని ఎవరైనా అంటారు.
7) ఉపసంహారం పేరుతో ఆ గ్రంధంలోనే “యదార్ధాన్వేషణలో మన మందరం అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. తర్కం లేకపోతే మనం మొదట్లోనే తప్పిపోతాం” అని వ్రాశారు.
2) B.A.తత్వశాస్త్రం, తర్కం - శాస్త్రీయ విధానం (వెంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంతం) అన్న పేరుతో నున్న గ్రంథంలో (ఇదీ తెలుగు అకాడెమీ ప్రచురణే) తర్కాన్ని గురించి విపులమైన వివరణ చేయబడింది. ఇష్టమన్న వారు దానిని సాకల్యంగా అధ్యయనం చేయండి. స్థలాభావంవల్ల దాని సారాంశాన్ని మాత్రం వ్రాస్తాను. గ్రంథ ప్రథమాధ్యాయంలో తర్కశాస్త్ర స్వభావము, తర్కశాస్త్ర నిర్వచనము; తర్కము శాస్త్రమా-కళా? తర్కశాస్త్రము-ఇతరశాస్త్రాలు, తర్కశాస్త్రము-వ్యాకరణశాస్త్రము, తర్కమూ- మనస్తత్వశాస్త్రము, తర్కము- నీతి శాస్త్రము, తర్కము-అన్వయము, తర్కశాస్త్ర ఉపయోగాలు, అన్న ఉపశీర్షికలతో విషయాన్ని వివరించారు. అందులోనేవారు “సత్యాన్వేషణకు ఆలోచనే మూలము. ఈ ఆలోచన ద్వారా మనం ఒక విషయాన్ని గురించిగానీ. వస్తువును గురించిగానీ,కూలంకషంగా తెలుసుకో గలుగుతున్నాము.ఈ ఆలోచన మనం అన్య విషయాలను గురించి యోచించడమేగాక, ఆలోచనల తీరుతెన్నులను గురించీ ఆలోచిస్తాము. ఆలోచనా స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే దానిని గురించి అన్వేషించాలి. ఆలోచనలోని మూలసూత్రాలనూ, నియమాలనూ, తెలియజేసేదే తర్కశాస్త్రము. యుక్తాలోచన (right thinking) అన్నది తర్కం మీద ఆధారపడి ఉంటుంది. తార్కికాలోచన అన్ని విషయాల్నీ నిర్దుష్టీకరిస్తుంది. కనుకే దానిని యుక్తాలోచన(right thinking) అన్నది ప్రమాణానికి అనుగుణమయి సత్యాన్ని తెలుపుతుంది. కాబట్టి దానిని ప్రాణికాలోచన అని గూడా అంటారు. ఈ చర్చను బట్టి ఆలోచన 1) యుక్తాలోచన లేక ప్రామాణికాలోచన రూపంలోనూ. 2) అయుక్తాలోచనగానూ ఉండవచ్చని తెలుస్తోంది. తర్కం వద్దనేవారు అయుక్తాలోచనపరులనే దీనర్థం. తర్కం యుక్తాలోచనాధార సూత్రాలను మాత్రమే నిర్ణయిస్తుంది. వస్తువు నిర్దారించే ఆలోచన ప్రమాణాను గుణంగా ఉండవలె. ఈ వివరణలు చూపిన పిదపనైనా జీవితానికి తర్క ప్రమాణాల వివేకం యొక్క ఆవశ్యకత ఎంతుందో పాఠకులు గ్రహించగలరనుకుంటాను. తర్కాన్ని నిందించే తిమిరాంధులకిది జ్ఞానాంజనమై కనువిప్పు కలిగించగలదని ఆశిస్తాను. ఆయా గ్రంథాలను అధ్యయనం చేయండి. సరే.
జూన్ సంచికలో నేను వ్రాసిన కొన్ని మాటలపై ఒకటి రెండు అధిక్షేపణలూ, సూచనలూ అందాయి. పాఠకులలో మరికొందరకున్నూ అట్టి అభిప్రాయాలేర్పడి ఉండవచ్చు. ఆ ప్రయోగాల వెనుక నా భావాలేమో ఆ సందర్భమేమో, వివరించడంవల్ల అపోహలు తొలగగలవేమో ననిపించుటచే వాటిని మీముందుంచుతున్నాను. అవి 1) అవి నాలో నవ్వుకుంటూనే (6పే 2పే) అన్నది. వీటిని ఉదహరిస్తూ అధిక్షేపణగా లేఖ వ్రాసినవారు మండలికి అత్యంత సన్నిహితులూ, ఒక రకంగా మండలి చేయబోయే కార్యరంగంలో ప్రముఖ పాత్రధారులు కావలసియున్నవారే. పైగా వారొక రచయితకూడా. నేనుపయోగించిన పై మాటలు వ్యంగ్యార్ధాన్నిచ్చే మాట నిజమేగాని, ప్రతి సందర్భంలోనూ, అవి హేళననే తెలుపుతాయనుట సరికాదు. పైసూచన చేసిన మిత్రులు, మనం ఎవరినీ హేళన చేయుట మంచిది కాదు అన్న సదుద్దేశంతోనే ఆ సూచన చేసినా వాస్తవానికా సందర్భం అట్టిది కాదు. నిజంగా ఆ సంఘటన కాలంలోగానీ, వ్రాసేటప్పుడుగానీ, ఎవ్వరినీ కించపరచే ఆలోచన నాకు లేదు. పై ఆరోపణ చేసినవారినీ, పాఠకులనూ నేను కోరేదేమంటే మరల మీరొకసారి ఆసన్నివేశాన్ని మొత్తంగాను, నిష్పాక్షికంగానూ (అభిప్రాయాలు పెట్టుకోకుండా) పరిశీలించడనే. అసలా సంచికలో ప్రధానంగా చెప్పదలచుకున్న విషయమూ, విషయాన్ని పరిశీలించే వారు (జిజ్ఞాసువులూ, పరీక్షకులూ) ముందుగా ఏ అభిప్రాయం పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా చూడాలన్నదే. ఈ అంశం చూడడానికి చిన్నదిగా కనుపించినా తరచుగా అన్నివర్గాల మేధావులనూ, ప్రమాదపడేట్లు చేస్తున్నదని సోదాహరణగా చెప్పేయత్నం చేశానందులో. ఇందులో ఉదాహరణకు నేను వాడిన పేర్లు అంత ప్రధానమైనవి కాదు. జరిగిన విషయాలే మీ ముందుంచడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఆంతమాత్రమే నా ఉద్దేశమైతే వారికొచ్చిన నష్టమేమీ లేదుగానీ, రచయిత సంకుచిత స్వభావాన్నే చూపిస్తుందది. నన్ను నేనంత చిన్నవాణ్ణిగానూ అనుకోవడం లేదు. అలా ఎవరినో రచన ద్వారా గేలిచేస్తూ ఆనందించడానికింత కార్యభారాన్ని తవ్వి తలకెత్తుకోవలసిన అవసరమూ లేదు.
ఏదైనా ఒక ఉదాహరణను అర్ధం చేస్కొనేందుకు దానివెనుకనున్న ప్రతిపాదితంశాన్ని, సందర్భాన్ని ప్రధానంగా తీసికోవడం పరిశీలనకు సరైన పద్ధతి. అభిప్రాయం పెట్టుకోకుండా చూడగలగడం అన్న విషయం నిజంగా నేననుకుంటున్న దానికన్న ప్రమాదకరమైనదిగానే కనుపిస్తోంది అనుభవంలో. కనుకనే అంత విపులంగా విషయాన్ని చెప్పడానికి యత్నించినా, పై అధిక్షేపణ చేసిన వారికి నాపై వ్యతిరేక దృష్టేమీ లేకపోయినా, మరల అదే ప్రమాదం జరిగిందిచ్చట. ఈ సందర్భంలో అట్టిదేమీ జరగలేదే అనిపించవచ్చు మీకు. ఆ సందర్భాన్నొకసారి చూడండి. నాలో నేను నవ్వు కుంటూనో, విచారిస్తూనో అన్న మాట చదవగానే ఆయన మనస్సుకు కలుక్కుమనిపించి ఉండాలి. ఎందుకని, అటువంటి ప్రయోగం కించపరచాలనుకున్న సందర్భంలోనే చేయాలి, చేస్తారు అన్న అభిప్రాయం అప్పటికే ఏర్పడి ఉంది వారిలో. ఇంకేం దాని పని అది చేసింది. దాంతో ఆ పద ప్రయోగం చేసిన నేను ఎదుటి వారిని కించపరచే ఉద్దేశంతో ఉన్నట్లు అనిపించింది వారికి. అట్టి సమయంలో ఇక సందర్భం-దానికున్న స్థానం రెండవస్థాయికి జారిపోతాయి ఎవరికైనా! (సందర్భం కాకున్నా ఇక్కడో విషయాన్ని చెప్పాలనిపిస్తోంది. నాపై ఆరోపణ చేసిన వారికి నాపై వ్యతిరేకత నిజంగా లేకున్నా ఈ మాటనగలిగారంటే ఆయన స్వభావంలో సూటిగా – నిష్కర్షగా – ప్రవర్తించే లక్షణముంది అనుకోవచ్చు.) సరే. గత సంచికలోని ఆ సందర్భాన్ని నేను వివరించను. నిజాయితీగా పరిశీలించి నిష్కర్షగా మీఅభిప్రాయాలు తెలుపండి. వ్యక్తిని కించపరచేందుకుగా ఉద్దేశించబడినట్లనిపిస్తే స్పందనకు వ్రాయండి, ప్రచురిస్తాను దానిని. అయితే పూర్వాపరాలనూ కలిపి, విషయాన్ని సాకల్యంగ పరిశీలించండి.
ఆ సంచికలోనే ఒక మేధావిని గురించి ప్రస్తావించాను.(8పే-2పే)దాన్లో, నా గురించి ఒక అభిప్రాయానికి రాగలిగితే బాగుంటుందని వారి మనస్సు వారికి చెపుతోందని వ్రాశాను. మా మధ్య చాలా కాలంగా ఒక సమస్య అపరిష్కృతంగా ఉంటోంది. అదేమంటే ఏదైనా విషయాన్ని, చెప్పి తెలుపలేమని-చెపితే తెలియదని-వారి వాదన. బొత్తిగా తెలీని పదార్ధాలను పదం చెప్పి తెలుపలేమనేంత వరకు నాకూ అంగీకారమేననీ అయితే ఆయన నేను చెప్పను, నేను చెప్పను అని అంటున్న అనేక సందర్భాలలో అవి చెప్పదగినవేవనీ, చెపితే తెలిసేవేననీ నేనడం జరుగుతోంది. జూన్ సంచికలో కొలతలు లేకుండా కొలుస్తాననడం. సరే కొలవండనటం (5పే 2 పేరా) రెండూ తెలివి తక్కువ పనులేననీ, అలాంటి సందర్భంలో చెప్పనని, నేనన్నట్లు వ్రాసిన విషయం చదవగానే వారు, “సురేంద్ర ఇన్నాళ్ళకు గమనించాడన్న మాట కొలతల గురించి” అన్నారు. ఇక్కడా అభిప్రాయం పెట్టుకు చూడడమన్న ప్రమాదమే జరిగిందని నేనంటే మీలో చాలామందికీ, వారికీ నాదో ఊతపదంలా మారిందనిపించవచ్చు. కాని వాస్తవంగా జగిందదే. ఎలాగంటే,చెబితే తెలియదు అన్న, వారి భావాన్నిచ్చట నేను సమర్ధించాననుకుని ఇప్పటికి నా మార్గానికి వచ్చాడు సురేంద్ర అన్న భావాన్ని వెలిబుచ్చారాయన. కానీ నిజంగా అక్కడ జరిగింది ఆదికాదు. ఆ సంచికల్లో కొలతల గురించి నేనడిగిన సందర్భం ఏమిటీ? తెలిసిన విషయం సత్యమో కాదో నిర్ణయించేదెలా? అన్నది అక్కడ నా ప్రశ్న. ఎందుకంటే ఎవరి కొలతలు వారివైతే సత్యా సత్యాలు నిర్ధారించడం అసంభవం. కొలతలందలి తేడాలననుసరించి ఒకే విషయం కొందరికి సరైనదిగానూ, కొందరికి సరికానిదిగానూ అనిపిస్తుంది. కనుక సార్వత్రికమైన కొలత అవసరం. తెలిసుంటే దానిని చెప్పమన్నానేగాని, చెపితే తెలియదు కనుక చెప్పను, అనలేదుకదా! అయినా అంతటి మేధావి, అభిప్రాయాలు పెట్టుకుని (రంగుల్లోంచి) చూడకూడదన్న విషయం సుస్పష్టంగా తెలిసి ఉన్న వారూ ఐనప్పటికీ ఆక్షణంలో జరగకూడనిది జరిగే పోయింది. అంత ప్రమాదకరమూ, బలవత్తరమూ అయిన విషయం కనుకనే (ఇక్కడో నిజం చెప్పాలి. చాలా అరుదుగానే అయినప్పటికీ ఎప్పుడో ఒకసారైనా నేనూ ఆ అడుసు తొక్కుతూనే ఉన్నాను.అయితే ఏమాత్రం సంకోచించండా ఆక్షణంలోనే కడిగివేసుకుంటున్నాను. ఏ రంగూ మిగలకుండా) ప్రతిసారీ మరల మరల-అది అలవాటుగా మారేంతరచుగా- ఈ సూచన చేస్తుండడం పరిపాటిగా మారింది నాకు; అని వ్రాశాను. ఇప్పుడూ మరల మీకా విషయం గుర్తు చేయాలనే అనిపిస్తుంది. నావరకు నాకూ విసుగుగానేఉంది. అయినా తప్పదుమరి. అభిప్రాయాలు పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా-దాన్ని అదిగా- చూడగలగడం సత్యజ్ఞానార్జనకు ప్రాణం వంటిది. దీని ప్రాముఖ్యతను జాగ్రత్తగా గమనించి మనస్సుకు పట్టించుకోండి. ఎవరెవరెంతెంతగా దీని నర్థం చేసికుని అమలులో పెట్టుకోగలరో సత్యజ్ఞాన విషయంలో వారంతరతగా ప్రయోజనాన్ని పొందగలరు. ఈ విషయంలో మీరైనా, నేనైనా, మరెవరైనా బ్యాలేన్సు కోల్పోతే తప్పు నిర్ణయాలే ఏర్పడతాయి. ఈ విషయాన్ని “జ్ఞాన పీఠం” అన్న వ్యాసం ద్వారాను, మీకందించాను. చక్కగా వినడం, విన్న మాటలకర్ధాలను అన్నవాడి నుండే స్వికరించడం అన్న మాటకర్ధం యిదే, ఆ వ్యాసాన్నీ మరోసారి మననం చేయండి. చెప్పీ, చెప్పీ నాకూ విసుగ్గానే ఉన్నా దాని స్థానాన్ని బట్టి జెప్పక తప్పుట లేదు. సమిష్టిహితం నిజంగా మన ఉద్దేశ్యమైతే ఒకరి నొకరు కించపరచుకోవడమన్నదీ బాల చేష్టలాంటిదే. నేను చేసినా ఎవరు చేసినా వారి వారి చిన్న మనస్సును చూపిస్తుందది. ఒక్క మాట చెప్పి ఇప్పటికిది ముగిస్తాను. “అప్రియస్యతు పధ్యస్య వక్తాశ్రోతాచ సుదుర్లభః!” ఇష్టంలేనిదైనా మేలు- హితం-కలిగించేమాట చెప్పేవాడు, వినేవాడూ కూడా అతి దుర్లభం అన్నది సూత్రార్ధం. అందరం ఆలోచించదగినదిది. ప్రమాణ వివేచనకనుబంధమే అయినా స్వతంత్ర శీర్షికగా మరో దానిని ప్రారంభిస్తున్నాము స్వీకరించి సఫలులు కండి.
ప్రమాణ వివేచన - 9
సంపుటి – 2 సంచిక. 8 1.8.82
ప్రమాణ, వివేచనంటూ ప్రారంభించి మొదలయ్యి కాకముందే దాన్నలా వదలి ఈ విమర్శలూ, నియమాలూ నిబంధనలూ అంటూ సాగించారేమిటండీ? అనిపిస్తూండ వచ్చు మీలో కొందరకైనా. అలా అనిపించడంలో విడ్డూరమేమి లేకున్నా నిశితంగా యోచిస్తే నారచనలోనూ అసంగతమేమి లేదని తెలియగలదు. ఎలాగంటే,
ఈ శీర్షిక ద్వారా మనం పరిశీలించాలనుకుంటున్నది. తర్క, ప్రమాణములను గురించే కదా! ఆ ప్రమాణ తర్కాలకు పరస్పరం - విడదీయరాని సంబంధముంది. ప్రమాణ విశ్లేషణ (ప్రమాణ వర్గీకరణ, వాటి వాటి స్వరూప స్వభావాలూ, పరిధులూ మొదలగు వాటి పరిశీలన) తర్కంపై ఆధారపడి ఉంటుంది. అలానే తర్కవిద్య ప్రమాణాను గుణ్యత కలిగి ఉంటుంది. ఆయా విషయాల స్వరూప స్వభావాలను నిర్ధారించుటకు యుక్తాలోచన లేక తర్కపద్దతి అవసరమైయుండగా, యుక్తాలోచన (right thinking) హేతు, ఉదాహరణలపై ఆధారపడి సాగుతుంటుంది. వీటిలో ఉదాహరణగా చూపబడుతున్నది గతానుభవాలలోని సంఘటననే. అది ప్రత్యక్ష ప్రమాణబద్ధమై యుంటుంది. ప్రత్యక్షం ద్వారా అలా ఏర్పడిన జ్ఞానం వల్లనే, ఆయా ప్రతిపాదనాంశాల నిరూపణ కాధారమైన హేతు వివేకం కలుగుతుంది. కనుక, తర్కపద్ధతికి స్వరూపమైన న్యాయ ప్రయోగానికి ప్రధానాంగాలైన హేతు, ఉదాహరణలకు, ప్రత్యక్షమే ఆధారము సరైన హేతువు (దుష్ట హేతువులు లేకుండా), సరైన ఉదాహరణ (విషమ - దృష్టాంతమూ, ఉపమానములను- ఉదాహరణలుగా, పొరబడకుండా) లతో సమృద్ధం కావాలి యుక్తాలోచన. అలాకానిది అయుక్తాలోచనయై తర్క లక్ష్యాన్నే దెబ్బ తీయగల ప్రతిబంధక మవుతుంది. కాబట్టే అటు ప్రమాణ నిర్ణయంలోనూ, ఇటు తర్క స్వరూప నిరూపణలోనూ - ఎదురు పడే అడ్డంకులేమో (ప్రతిబంధకాలేమిటో) అవనగాహన చేసికోవలసివస్తోంది. అలా ఏర్పడిందే ప్రసంగమధ్యంలో ఈ నియమ, నిబంధనల ప్రస్తావన.
“అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది" అంటారే అలాటి పరిస్థితే ప్రతిబంధకాల నర్ధం చేసికుని తొలగించు కోకుండా చేసే పనివల్ల ఏర్పడేది. కనుకనే ప్రతిబంధకాలనూ, వాటి బారిన పడకుండుటకుగాను ఉన్న కొన్ని నియమాలనూ అర్ధం చేసికోవలసివస్తోంది. నేను జూన్, జూలై సంచికలలో ఈ విషయాన్నే ప్రస్తావించింది. జ్ఞాన పీఠమన్న పేరున లోగడ ఒక సంచిక వెలువడింది. దానిలోనూ ఈ విషయాన్నే విపులీకరించాను. వాటిని మరొక్క సారి మననం చేయండి.
సరే. అసలు విషయాని కొద్దాం. ప్రమాణ మన్న మాట జ్ఞానార్జనలో పని చేస్తున్న పరికరాలకూ, పద్దతులకూ కూడా వర్తిస్తుందనీ, అందు ప్రత్యక్షం, అనుమానం వగైరాలు పద్దతులందలి విశేషాలననుసరించి ఏర్పరచుకున్న వేననీ అనుకున్నాము. ఆ సందర్భంలోనే తర్కజ్ఞులైన మరింగంటివారు ప్రత్యక్షం – ఆరింద్రియాల కంటే వేరా? అయితే అదేమిటో చూపండని అడిగారు. అందుకు సమాధానంగా ఆయా ప్రత్యక్షానుభావాలకు (రంగు,రుచి, వాసన మొదలగు వాటిలే) ఇంద్రియాలే ప్రమాణములనీ, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణ వర్గీకరణ - మాత్రం పద్దతుల ననుసరించి ఏర్పడ్డదనీ చెప్పాను. ఇహ ఒక్కో ప్రమాణాన్నీ, వాటి క్షేత్రాలనూ పరిశీలిద్దాం.
జ్ఞానం కలుగు తుందంటే ఏమని? ఏదో ఒక విషయం తెలియబడుతోందనే కదా! అలా ఏదో ఒక విషయం (అర్థం) లేకుండా ఒట్టి జ్ఞానం అన్నది ఉండదు. ఆయా విషయాలు ఉండడమో, లేకపోవడమో అన్న రూపంలో నే జ్ఞానం కలుగుతుంటుంది. అలా విషయాలు తెలియడానికి ముందు కొంత కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కొన్ని పరికరాలు (ఉపకరణాలు ) పనిచేస్తాయి. ఈ జ్ఞాన ప్రక్రియలో పాల్గొనే పరికరాలనే జ్ఞానేంద్రియాలంటాము. అవి కన్ను ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అన్న వే. - అందు - మొదటి అయిదూ బాహ్య జగత్తును తెలుసుకోవడానికి ఉపకరిస్తుండగా మనసన్నది. ఈ అయిదింద్రియాల ద్వారా కాక మిగిలిన విషయాలు (ఆంతరిక విషయాలు) తెలుసు కునేందుకు ఉపయోగపడుతోంది. ఇలా పై ఆరింద్రియాల ద్వారా మాత్రమే మానవుడు ఉన్న మొత్తాన్ని అర్ధం చేసికో గలడు. చేసికోవలసి ఉంటుంది. మనిషి కంతకంటే. అవకాశం లేదు. అయితే సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం ద్వారా ఆయా యింద్రియాలకు సహజంగా దూరంగా ఉన్న విషయాలను ఆయా వైజ్ఞానిక పరికరాల ద్వారా అందుబాటు లోనికి తెచ్చుకోగలము. ఉ:- సూక్ష్మదర్శిని, దూరదర్శిని, రేడియో మొ…నవి. ఇక ప్రమాణాలలో [ప్రమాణాలు - పలువురు పలురకాలుగా నిర్ణయించుకున్నారనీ, కలుగుతున్న జ్ఞానాన్నంతటినీ ఇమడ్చుకో గలసంఖ్యలో ప్రమాణా లుంటే సరిపోతుందనీ. నాదృష్టిలో అవి ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దము అనే మూడుగా ఉంటే సరిపోతుందని గతంలోనే చెప్పాను. దానినో సారి గుర్తుచేసికోండి.] మొదటిదీ, మిగిలిన వాటికీ ఆలంబనమైనది అయిన ప్రత్యక్షాన్ని పరిశీలించుదాం.
విషయానికి (అర్ధానికి) ఇంద్రియానికి సంబంధమేర్పడగా ఆ విషయానికి చెందిన సమాచారం మేధస్సుకు. చేరుతోంది. అలా చేరిన దానినో, దానినాధారం చేసికుని దానితో సంబంధ పడిఉన్న మరోదాన్నో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రమాణాల ద్వారా అందులో ఇంద్రియార్థ సన్నికర్ష ద్వారా ఉత్పన్నమైన జ్ఞానాన్ని ప్రత్యక్ష మంటున్నాము. అర్థం ఇంద్రియానికి ఏమేరకు, ఏరీతిగా సంబంధపడి ఉందో ఆరీతిగా అంతవరకే తెలియడాన్నే ప్రత్యక్ష జ్ఞాన మంటాము. Direct knowledge or Direct perscption నుండి కలిగినది ప్రత్యక్షము. అట్టిజ్ఞానం కలుగు పర్యంతం ఉన్న క్రమ విధానం ప్రత్యక్ష పద్ధతి, అందులో ఆమేరకు పాల్గొన్న ఉపకరణాలు ఆయావిషయాలకు ప్రత్యక్ష ప్రమాణాలు. ఇదీ ప్రత్యక్షం యొక్క మౌలిక స్వరూపం. అయితే దీనినే మరి కొంత విపులంగా పరిశీలించి చూద్దాం.
మొత్తం జ్ఞానేంద్రియాలు (ఆయా విషయాలను తెలిసి కోవడానికి మనకు ఉపకరిస్తున్న పరికరాలు) ఆరనుకున్నాంగదా! అయిదు ఉన్నాయనడానికి అంతగా యోచించ వలసిన పనిలేదు. ఎందుకని? ఆ అయిదూ మనం బాహ్యంగా చూడడానికి అవకాశం ఉంది. ఈ అయిదింటినీ అద్దంలో మనకు మనమేగానీ, మరోవ్యక్తిలో నేరుగా కంటితో గాని, చూడడానికి వీలుంది. చూడగలం. వీటి విషయంలో విప్రతిపత్తి -విరుద్ధ జ్ఞానం- ఎవరికీ లేదు. మరి ఆరోయింద్రియం ఉన్నదని ఎలా చెప్పగలం. (1) వైద్య శాస్త్రాన్నీ, అందులోని ప్రయోగాల్ని అధ్యయనం ద్వారా, (2) కార్య కారణ సంబంధాన్నీ, ఆ ఫలితానికి పనికి ఉన్న సంబంధాన్నీ, అలానే పనికి పరికరానికి ఉన్న సంబంధాన్నీ అర్థం చేసికోవడం ద్వారా కలిగే వివేకం ద్వారా ఆరవయింద్రియం ప్రత్యక్ష గోచరం కాకున్నా దాని అస్తిత్వాన్ని స్థిరీకరించగలం. అయితే శరీరగతమై యుండుటచేత ఆరవయింద్రియం-మనస్సు - నాకంటికి! ప్రత్యక్షం కాక పోయినా పరోక్ష పద్ధతి ద్వారానే దాని వునికిని నిర్ధారించినా - దాని ద్వారా కలుగుతున్న జ్ఞానం నాకు. పరోక్ష జ్ఞానం కాదు. అది బుద్ధికి ప్రత్యక్ష విషయమే. ఎందుకనగా ఆయా యింద్రియాల ద్వారా విషయాలకు చెందిన సంవేదనలు నేరుగా అందుతూ గ్రహింపబడుతున్నంత వరకు అవన్నీ ప్రత్యక్ష విషయాలే అవుతాయి కనుక. (మనస్సు ఉందన్న విషయం ఐదు బాహ్యేంద్రియాలకూ తెలియదు.)
మనస్సు తనను తాను తెలిసికోదు. బుద్దికి తెలుస్తోంది. ఆలోచనకు, వివేకానికి అందుతూందన్న మాట.
Note:-సాధారణ పద్ధతిలో మనస్సు (అరవయింద్రియం, బుద్ధికి వేరుగా దీనిని చెప్పుకుంటున్నామన్నది పాఠకులు గమనించాలి.) ప్రత్యక్షం - కాదు. కానీ ఎలా యితరుల ఇంద్రియాన్ని మన కంటితో చూడగలుగుతున్నామో అలానే ఇతరుల, మానవ శరీర భాగాన్ని (వైద్య విజ్ఞాన సాంకేతిక సామర్థ్యం ద్వారా) శస్త్రచికిత్స ద్వారా విభజించి చూడగలం. ఇక్కడ పరీక్షకులకూ, జిజ్ఞాసువులకూ ఒక ప్రశ్న పుట్టేందుకు వీలుంది. నిశిత యోచనా పరులై తే పుట్టి తీరాలి కూడా. కనుక అదేంటో ఆలోచించి ప్రశ్న వేయండి.)
మొత్తం ఆరింద్రియాలున్నాయన్న నిర్ణయానికొచ్చాము గదా. వాటి ద్వారా ఆరు రకాలైన విశేషాలు తెలియ బడుతున్నాయి మనకు. అలా ఆరింద్రియాలకు సంబంధించిన విషయాలు కాక మరేమీ మనకు ప్రమాణాల ద్వారా తెలిసేందుకు వీలు లేదు. కనుక మనిషన్న ఎవరికైనా తెలిసిందీ, తెలియగలదీ అయిన ప్రపంచం ఎప్పటికైనా ఆరుయింద్రియాల ద్వారా అందుతున్న విషయ సమాహారమే కాగలదు. మామూలుగా చదువుకుంటూ పోతే యిదెంతో చిన్న విషయంగా అని పించవచ్చు గానీ; ముందు ముందు జరుపబోయే అనేక సూక్ష్మ పరిశీలనలలో దీని పాత్ర గణనీయంగా ఉంటుంది. కనుక జిజ్ఞాసువు లిక్కడ కొద్దిగా ఆగి విషయాన్ని సరిచూసుకుని అనుభవానికి సరిపోతుందీ లేనిదీ తేల్చుకోండి, సరే. '
ఆరింద్రియా లున్నాయనుకున్నాముగదా! ఏయే యింద్రియాల ద్వారా ఏమేమి విషయాలు తెలియబడుతున్నాయో గమనించాల్సి ఉంది. క్రమాన్ననుసరించి, చెవితో ప్రారంభించి ముక్కుతో ముగించారు. వెనుకటి పరిశీలకులు. బాహ్యేంద్రియాలైదూ గమనించు విశేషాలు శబ్ద స్పర్శ రూప రస గంధాదులని వాళ్ళ అవగాహన. మనమూ వాటినే మన పద్ధతిలో నిర్ధారించుకుందాం..
(1) కంటి ద్వారా అందుతున్న విషయాలు: రంగులు, రూపాలు (ఆకృతులు), పరిమాణాలు (లావు, సన్నం, పొడుగు, పొట్టి) చలనాలు (పనులు, కదలికలు), సంబంధాలు, వగైరా....
(2) ముక్కు:- వాసనలు (సుగంధ విశేషాలు, దుర్గంధవిశేషాలు)
(3) నాలుక:- రుచులు ( ముఖ్యముగా ఆరని ప్రసిద్ధి. ఆయా పదార్థాల విభిన్న కలయికల వల్ల ఏర్పడే రుచులు అనేకం) తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, అన్నది ప్రధాన రుచులు
(4) చర్మం:- స్పర్శ (చల్లదనం, వెచ్చదనం, సమశీతోష్ణం, గట్టి, మెత్తన, గరుకుదనం, మృదుత్వం, చలనం.
(5) చెవి:- శబ్దాలు (అర్ధయుక్త శబ్దాలు, అర్ధరహిత శబ్దాలు)
- Note: అయిదింద్రియాల ద్వారా ఇంకేమయినా తెలుసుకుంటున్నామా? లేదా మీ అనుభవాన్ని చూసి పత్రికకు వ్రాయండి. అలానే ఆరోయింద్రియమైన మనస్సుద్వారా గ్రహిస్తున్న విషయాలేమో ఆలోచించండి. ఇలా వీటి ద్వారా తెలుస్తున్న వాటికంటె అధికం మరేవిధంగానే నా తెలిసే వీలుందా? లేదా? ఇవి జిజ్ఞాసువులు యోచించాలి. -
- వీటన్నింటినీ క్రోడీకరించి మనం విశ్వానికి సంబంధించి కొన్ని సాధారణ సూత్రీకరణలు చేసికోగలం.
- (1) బాహ్యజగత్తు అంతా అయిదు జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే గ్రహిస్తున్నాం. గ్రహించగలం గనుక మౌలికంగా అయిదు రకాల విశేషాలతోనే మనకది గోచరిస్తుంది. అయితే అయిదు జ్ఞానేంద్రియాలే విషయ సేకరణకు ఆధారంగా ఉన్నప్పటికీ, అయిదు ఐదు విశేషాలను గ్రహించేవిగానే ఉన్నప్పటికీ ఐదింటిద్వారా వచ్చిన బాహ్య విషయాలన్నింటినీ రాశిపోసి మరో కోణం నుండి వాటిని చూస్తూ. కొందరు పదార్థాలు మూడనీ, ఆరనీ, పదహారనీ, ఇరువది ఐదనీ యిలా రకరకాలుగా వర్గీకరించారు. ఆయా వర్గీకరణకు, ఉన్న దాని నర్థం చేసికో డానికి, స్పష్టమైన భావవ్య క్తీకరణకూ సహకారులుగా ఉంటాయన్నదే వారందరి అభిప్రాయమూ. నా అభిప్రాయమూ అట్టిదే కనుక ఆయా వర్గీకరణల స్వరూప స్వభావాల్ని పరిశీలించేటప్పుడు. వారేర్పరచిన సంఖ్యతో గొడవ పడవలసినపని మనకేమీ, లేదు. ఎవరికీ ఉండనఖ్ఖర లేదు కూడా. మరింక పరిశీలనలూ పరీక్షలు ఎక్కడ? ఎందుకు? వారేర్పరచిన (వారే వర్గీకరణకు చెందినవారై నా ) గుంపులో (వర్గాల్లో) మొత్తం మనకు తెలిసిన జ్ఞానరాశి నంతనూ ఇమడ్చడం సాధ్యమా?కాదా? అన్న దగ్గరే మన పరిశీలన. ఈ నాడు మన మేర్పరచుకున్న వర్గీకరణను కూడా వేరెవరై నప్పటికీ సందేహించవలసింది వర్గాల సంఖ్య దగ్గర కాదు. మనం నిర్ణయించుతున్న వర్గాలలో మొత్తం జ్ఞానరాశి యిమడ గలదా లేదా అన్న దగ్గరే. భిన్న భిన్న ధోరణుల వారెల్లరూ ప్రధానం గానూ, సుస్పష్టంగానూ, గమనించుకోవాల్సిన అంశమిది. ఇక్కడ తొందరపడ్డామా పరిశీలనలన్నీ అవసరమైన చోటును విడచి అనవసర విషయాల వైపు పరుగులెడతాయి. వర్గీకరణలను పరిశీలించే ముందు, లేక మనమే ఒక క్రొత్త వర్గీకరణను చేయబోయే ముందు వర్గీకరించడాని కాలంబనమైన నియమాల్ని అర్ధం చేసుకోవడం అవసరం. ఒక గుంపును (ఉన్న మొత్తాన్ని) కొన్ని చిన్న మొత్తాలుగా విభజించడానికి సానూన్యత్వమో, విశేషత్వమో ఆధారంగా ఉంది. తీరాలి, అంటే…
(1) కొన్నింటిని చూపి ఇవన్నీ ఒకరకం (ఒకేవర్గం) అనాలంటే వాటిలో పరస్పరం పోలిక (సమానలక్షణం) ఉండాలి. దీనిని బట్టి కొన్నింటిని ఒకటిగా, విభజించగలం. అలా చేయడానికాధారమైన దానినే సామాన్య పదార్థ మంటున్నాము. అలా లక్షణ సామ్యం కలవన్నీ సజాతీయాలవుతాయి. అలా వాటిని సజాతీయా లనుటకు వాట న్నింటిలో ఉన్న సామాన్య లక్షణాన్నే జాతి అంటు న్నాము.
(2) ఉన్న కొన్నింటిని ఇదొకరకం ఇదొరకం అని విభజించగలిగా మనుకోండి. దాని కాధారంగా వాటియందు మనకు లభించిన అసాధారణ ధర్మాన్నే - లక్షణమంటున్నాము. లేక విశేష పదార్ధమంటాము. అంటే ఏమన్న మాట. ఏ ధర్మం మనకు తెలియడంవల్ల, ఒకటి మరొక లాటిది కాదని నిర్ణయించగలమో అది విజాతి బోధకమవుతుంది. వర్గీకరణ మన్నది ఈ రెండు ఆధారాలనుండే చేయడానికి వీలవుతుంది. వ్యవహారికంగా చెప్పుకోవాలంటే, అట్టిది. అని కొన్నింటిని చూసి నిర్ణయిస్తాము. అట్టివి కాదనిని కొన్నింటిని వేరు చేస్తాము. అట్టివి అట్టివి కాదు అని నిర్ణయించడానికి, గ్రహించడానికి ఏవి ఆధారాలో అవే వర్గీకరణకు ఆధారస్థానాలు.
(1) ఈ మొత్తాన్నీ అర్ధం చేసుకుని ఒక సాధారణ సూత్రాన్నిలా తయారు చేసుకోవచ్చు. మనం ఉన్న వాటిలో కొన్నింటిని చూపి. ఇవి : ఒక వర్గం అనాలంటే వాటిలో వాటికి సారూప్యతా, మిగిలిన వాటితో - వై రూప్యతా, ఉండి తీరాలి. ఈ రెండు లక్షణాలు కలిగియున్నవే, మొత్తంలో కొన్ని గానూ. ఒకే వర్గంగానూ ఉండే యోగ్యతను పొందగలవు. వర్గీకరణకు ఆధార సూత్రాలు – ఇంకేమైనా ఉంటే పత్రికకు వ్రాయండి. వాటిని ఇదే శీర్షికన ప్రస్తావిస్తాను. (2) అలానే వర్గీకరణ సందర్భంలో ఎదురుపడే మరికొన్ని అంశాలున్నాయి. వాటిని గురించి ఆలోచించంచడి అందరూ. వాటి వివరాలు. మాత్రం పై సంచికలో అందజేస్తాను. ఆ అంశాలివి.
(1) సంఖ్యలు, 2. పృధక్త్వము. (వేరుబాటుతనము).
గమనిక :- మళ్ళా అసలు విషయం విడిచి వర్గాలూ జాతులూ అంటూ మొదలెట్టాడేమా అనిపిస్తున్నదా? ఇది తెలియకుంటే ప్రమాణ విభజనగానీ, ఒక్కో ప్రమాణంలో ఉన్న అనేకాన్ని (వర్గాన్ని) అర్థంచేసికోవడంగానీ సాధ్య పడదు. అలానే ఆ ప్రమాణాన్ని మరోదాన్నుండి వేరుచేయడమున్నూ. నిదానంగానూ, నిశితంగానూ, అనుభవాలతో పోల్చుకుంటూనూ, ముందుకు సాగండి, దోషాలు సందేహాలు, అస్పష్టతలు ఉన్న వనిపిస్తే తెలియ పరచండి.
సంపుటి-2 సంచిక- 9 1.9.92
గత సంచికలో ఇంద్రియానికీ, అర్థానికీ ఏ మేరకు, ఏ రీతిగా సంబంధ మేర్పడిందో ఆ మేరకే ఆ రీతిగనే తెలియడాన్ని ప్రత్యక్షజ్ఞానమంటారని చెప్పుకున్నాం. ఇంద్రియాలకు ఆయా విషయాలతో సంబంధమేర్పడడము. ఇంద్రియాలు తమ కందిన విషయాన్ని మెదడుకు చేరవేయడమూ, మేధస్సులో ఒక చోట అవి ప్రతిఫలించడమూ (దీనినే అనుభవం అనాలి గుర్తుంచుకోండి) అలా ప్రతి ఫలించినవాటిని మనం గ్రహించడమూ జరుగుతోంది. ఈ క్రమ విధానాన్ని ప్రత్యక్ష పద్ధతి అనీ, ఈ పద్ధతి ద్వారా మనకు కలుగు జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమ అనీ అంటాము. పరిశీలిస్తే ఈ విధానంలో పనిచేసే ఉపకరణాల సంఖ్యను బట్టి ప్రత్యక్ష జ్ఞానం ఆరు రకాలు. ఆ పరికరాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అన్నవే. ఆ యింద్రియాలనాయా ప్రత్యేక విషయాలకు ప్రమాణములనీ, ఆ యింద్రియాలన్నీ పనిచేస్తున్న వైఖరిని బట్టి పైన పేర్కొన్న క్రమాన్ని బట్టి ప్రత్యక్ష పద్ధతి అనీ- ఈ మొత్తాన్నీ ప్రత్యక్ష ప్రమాణమనీ కూడా అనుకున్నాం. దీని విపులీకరణ రూపం యిలా ఉంటుంది చూస్తే.
(1) కన్ను-నేత్ర ప్రత్యక్షం :- రూపాలు, రంగులు ప్రధానంగా తెలియబడ తాయి. దీని ద్వారా క్రియలు,(కదలికలు) సంఖ్య; సామాన్యము (జాతి), విశేషము, సంబంధాలు, సంయోగ విభాగాలు, పరిమాణము, వ్యక్తి, ఘనత్వ, ద్రవత్వాలు, కొన్ని వాయురూపాలు మొదలగునవన్నీ కంటి ద్వారా తెలుసుకుంటున్నాము.
(2)ముక్కు- ఘ్రాణ ప్రత్యక్షం :- సుగంధ, దుర్గంధాలు, వాటిలోని సామాన్య విశేషాలు దీనిద్వారా తెలుస్తున్నాయి. రకరకాల ద్రవ్య సమ్మేళనాల నుండి ఏర్పడే నానా విధ గంధ రూపాలూ ఇందులో ఉన్నాయి.
(3) నాలుక-రస ప్రత్యక్షం :- రసమంటే ఇక్కడ రుచి అని అర్ధం. రుచులు ముఖ్యంగా ఆరు. అవి కల ద్రవ్యాల రకరకాల కలయికల వలన ఏర్పడే రుచులనేకం. వీటిలోనూ సామాన్య, విశేషాలుంటాయి.
(4) చెవి- శ్రోత్ర ప్రత్యక్షం - అర్ధయుక్త, అర్థ రహిత శబ్దాలు. ఇవీ వాటి స్థాయిల్ని బట్టి రకరకాలు.
(5) చర్మ-త్వక్ప్రత్యక్షం - స్పర్శలు తెలుస్తాయి.అవి చల్లన, వెచ్చన, గట్టి, మెత్తన, గరుకు, మృదుత్వము, కొన్ని చలనాలు, మంట, నొప్పి మొదలగునవి.,
(6) మనో ప్రత్యక్షం :- [ఈ యింద్రియం మేధస్సులోని భాగమే. రకరకాల నిర్వచనాలున్నాయి, ఆయా శాస్త్రాలలో దీనికి. కాని మనమిక్కడ ఆ యింద్రియాల ద్వారా తెలియబడని శరీరగత విషయాలను తెలుసుకోవడాని కుపకరిస్తున్న పరికరం అన్న అర్థంలో వాడుకుంటున్నాము. గమనించగలరు.] దీని ద్వారా రకరకాల ఉద్వేగాలూ (సుఖము, దుఃఖము, శాంతి, అశాంతి, ప్రేమ, ద్వేషం, తృప్తి, అసంతృప్తి వగైరా భావనలు (feelings) దప్పిక, మొదలగు శరీర స్థితిగతులూ మేధస్సుకు అందుతున్నాయి. అలానే బరువు, తేలిక అన్న విన్నీకాలమూ మనస్సుకు తెలిసేదే. స్థలమంటే ఏమో ఇంద్రియ విషయమో ఆలోచించండి.
Note:-ఆయా విషయాల సత్యాసత్యాలు నిర్ణయించేది బుద్ధి మాత్రమే. అదీ మేధస్సులో ఒక భాగమే. ఈ ప్రత్యక్ష విషయమై పై అభిప్రాయాలకు భిన్నమైన విషయం మీ దగ్గరుంటే స్పందనకు వ్రాయండి.
ప్రమాణ క్రమంలో రెండవది అనుమానం. అనుమానించడమంటే ఇక్కడ, వ్యవహారంలో ఉన్న సందేహం (Doubt) అన్న అర్థంకాదు. కొన్ని ఆధారాలతో ఒక నిర్ణయానికి రావడమనే అర్థంలో ఆ పదం ఉపయోగిస్తున్నాం, కనుక క్రొత్తగా ఈ పరిశీలనలోనికి ప్రవేశిస్తున్న వారు దీనిని గుర్తులో ఉంచుకోవాలి.
వందల తాత్విక సిద్ధాంతాలు మానవ మేధస్సునుండి జనించాయి. విజ్ఞాన శాస్త్రమూ బహుగా విస్తరించింది. వీటన్నిటికీ ఆలంబనం జీవితానుభవాలూ, హేతుబద్ధమైన యోచన అన్నవే. ఈ యోచనే అనుమాన ప్రమాణానికి ఆయువుపట్టు, అన్ని ప్రమాణాలకూ ఆధారమైనది ప్రత్యక్షమే అయినా ప్రత్యక్షం ద్వారా మన జీవితంలో మనం తెలుసుకుంటున్న విషయాలు చాలా కొద్ది మాత్రమే. ఎక్కువ భాగం పరోక్ష పద్ధతిపైనాధారపడే ఆయా విషయ సమాచారాన్ని పొందుతున్నాం మనం. అందులోనూ శబ్దమాణం నేడు, శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. అయినా శబ్ద ప్రమాణం కంటే అనుమాన ప్రమాణం ప్రత్యక్షం కంటే (బలహీనమైనదైనా) పటిష్టమైనది. ప్రతి ప్రమాణంలోనూ ఏదో రకంగా ప్రత్యక్షంతో సంబంధముంటుంది. మొత్తంమ్మీద ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసే విషయాలకు అన్య ప్రమాణాల అవసరం లేదు. అదే యితర ప్రమాణాల ద్వారా తెలుస్తున్న విషయాలకు ప్రత్యక్ష జ్ఞానం కూడా ఆధారంగా ఉంటుందన్న మాట. ప్రమాణ వివేచన చేస్తున్న చేయాలనుకుంటున్న ఎవరైనాఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించవలసి ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనకు తెలుస్తున్నట్లు పూర్తిగా క్రొత్తవైన పదార్ధాలు (అనుభవాలు) మిగిలిన ప్రమాణాల ద్వారా తెలియబడవన్నవి కూడా ఒక ముఖ్య విషయం. మిగిలిన ప్రమాణాల అవధి-పరిమితిని గుర్తించడానికి ఈ అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. చాలా వరకు అనేక సిద్దాంతాలు పరీక్షకు నిలువలేకపోడానికి, ఆయా సైద్ధాంతికులకూ వారి వారి సిద్ధాంతాలపట్ల, విశ్వాసమూ, అభిమానమూ ఉన్నంతగా, అవగాహన లేకపోవడానికీ కారణం ప్రమాణ స్వరూపాలూ, క్షేత్రాలు తగినంతగా తెలీకపోవడమేనన్నది ఒక వాస్తవం. సరే ఇక మనం బహు సిద్ధాంతాల నిర్మాణానికి ప్రధానమైన ఆధారంగా ఉన్న అనుమాన ప్రమాణాన్ని అవలోకించడానికి యత్నిద్దాం.
అనుమాన ప్రమాణంలోని ముఖ్యమైన భాగం ఊహ. ఊహ అన్న మాటను మనం మరో అర్థంలో వాడుకుంటున్నాం గనుక ప్రమాణ వివేచనలో ఆ మాట ఏ అర్ధంలో వాడుతుంటారో ముందు గమనించాలి. ఆ అర్ధంలోనే ఈ ప్రకరణలో దానిని గ్రహించుతూ పోవాలి. ఈ తేడా గమనించక పోయామా ఊహ మనని ప్రమాణాల నుండి ఊహల్లోకి లాక్కు పోతుంది. మామూలు ఊహలకు అనుమాన ప్రమాణంలో భాగమైన ఊహకు ఉన్న తేడాని స్పష్టంగా గ్రహించడం అవసరం.
మనం మామూలుగా అప్పుడప్పుడూ ఊహల్లో విహరిస్తుంటాం. మానసికంగా రెక్కలు కల్పించుకోగలం. కొండపైకి ఎగిరి వెళ్ళుతున్నట్లు భావించుకోగలం. అలానే గాలిలో మేడల్ని నిర్మించుకోగలం. గుర్రపు మొండానికి మనిషి తల, సింహపు తోక అంటించీ ఆ రూపాన్నీ మానసికంగా ఊహించుకోగలం. ఇలా అసంభవాలనూ, అనుభవంలేని వాటినీ ఊహిస్తాం. ఈ తరహా వాటిని ఊహలనే అంటాం. మరైతే అనుమాన ప్రమీయమైన ఊహ అలాంటిది కాదు. అచ్చటి ఊహ కాధారంగా గత ప్రత్యక్ష విషయమూ, వర్తమానంలో ప్రస్తుతం మనం ఊహ చేస్తున్న దానికి సంబంధించిన కొంత ప్రత్యక్షమూ ఉంటాయి. అంటే ఇక్కడ అనుమాన ప్రమాణంలో ఏదో ఒక అంశం. (అది ద్రవ్యం కావచ్చు, గుణ, కర్మ, సంబంధాలలో ఏదైనా కావచ్చు.) ప్రత్యక్షంగా తెలుస్తుంది. దానితో సాహచర్య నియమంతో ఉండే మరొక దానిని గురించిన ఊహ బుద్ధికి అందుతుంది. అలా, ఇది ఉన్నట్లు ప్రత్యక్షంలో తెలుస్తోంది. కనుక దీనితోబాటు అదీ ఉంటుంది అన్న నిర్ణయాత్మక రూపమే అనుమాన ప్రమాణంలోని ఊహా స్వరూపం. అయితే అనుమాన ప్రమాణంలోని ఊహ నిశ్చయాత్మకమే అయితే దానికీ, ప్రత్యక్షం ద్వారా కలిగే నిర్ణయానికి తేడా ఏమిటి? ప్రత్యక్ష గోచరమయ్యే అంశాలలో జ్ఞానం విశేషాత్మకంగా ఉంటుంది. అనుమానాదులనైతేనో అది సామాన్య స్వరూపం వరకే పరిమిత మౌతుంది. అంటే లోగడ తెలిసిన లాంటిదే అక్కడ ఉంది, ఉండి ఉంటుంది అన్నంత వరకే అనుమానాదుల ద్వారా తెలియగలిగేది. పరోక్ష ప్రమాణాదులు వేటి ద్వారానైనా మనకు కలిగే జ్ఞాన రూపం ఈ పరిమితుల్లోనే ఉంటుందనేది గమనించనంత కాలం ఆయా విషయాలు తెలిసినట్లనిపిస్తున్నా, ఇక వాటిని గూర్చి తెలియవలసిందేమీ లేదు అన్నంతగాతెలియలేదనీ, వాటినింకా తెలియ వలసే వుందనీ గమనించలేం. కనుక తెలియకనే తెలిసిందనుకునే, అలా భ్రమపడే, అవకాశం ఉండదక్కడ. కనుకనే తత్వాన్వేషకులు, జిజ్ఞాసువులు, జ్ఞానార్జనకు ముందే ప్రమాణ క్షేత్రాలను గురించి కూలంకషంగా అధ్యయనం చేయవలసి వస్తోంది. నిదానంగా నిశితంగా ఈ విషయాన్నవగాహన చేసికోండి. మీ అభిప్రాయలను స్పందనకు పంపండి.
సంపుటి - 2 సంచిక. 10 1-10-92
ప్రమాణ క్రమాన్ననుసరించి ప్రత్యక్షం తరువాత చెప్పుకోవలసిందీ, కుడి ఎడంగా ప్రత్యక్షమంతశక్తి గలిగిందీ అనుమాన ప్రమాణం. ప్రత్యక్షం అన్ని ప్రమాణాలకూ ఆధారమైయున్నప్పటికి జ్ఞానార్జనలో, విశ్వాన్వేషణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది అనుమాన ప్రమాణమే. దీని క్షేత్రం కూడా బహు విస్తృతమైనది. ప్రత్యక్ష ప్రమాణ క్షేత్రం బహు చిన్నది. అది తానున్న కాలంలో, తానున్న దేశంలోనున్న విషయాలను గ్రహించుటకు మాత్రమే పరిమితమై వుంటుంది. ఎప్పటికప్పుడు ఏ మనిషికైనా ప్రత్యక్షం వర్తమాన విషయం మాత్రమే కాగలదు, మరి జీవితమో గతంతోనూ, భవిష్యత్తుతోనూ సంబంధపడి ఉన్నదాయె, స్వాభావికంగానే గవేషణా ప్రవృత్తికల మనిషి తన అధ్యయన క్షేతంలో [ప్రస్తుత మేర్పడియున్న పరిస్థితులాధారంగా గతంవైపుకూ, భవిషత్తు వైపుకూ దృష్టి సారిస్తున్నాడు. అనాదిగా విశ్వాన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు మానవుడు. ఈ అన్వేషణలో అతనిని నిరంతరం కదిలిస్తున్నది హేతుబద్దమైన ఊహే. నాటి మేధావుల తాత్విక దృక్పధాలకూ, నేటి విజ్ఞాన శాస్త్రజ్ఞులైన ప్రకృతి పరిశోధకుల ప్రతిపాదనలకూ. ఈ అనుమాన ప్రమాణాంతర్గతమైన ఊహే ఆయువుపట్టు. అయినా ఆయా సిద్దాంత ప్రతిపాదకులైన వారిలో ప్రముఖంగా రెండు పంథాలు కనుపిస్తాయి పరిశీలిస్తే.
కొన్ని ఆధారాలతో, ప్రత్యక్షానుభవాల ద్వారా ఏర్పరచుకున్న కొన్ని సాధారణ సూత్రీకరణల ననుసరించి-ఒకానొకదాని ఆస్తిత్వాన్ని ఊహించడం వరకూ యిరువురూ సమానమే అయినా ఆయా ఊహాత్మక సిద్దాంతాల నిర్ధారణకు మరికొన్ని ప్రయోగాల నాశ్రయించి ప్రత్యక్షంగా బుజువు పరచుకునేంత వరకు సాగుతుంది వైజ్ఞానిక పద్దతి. అందువల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు రెండు (1) ఏనాటికైనా పరోక్షజ్ఞాన స్థాయినుండి అపరోక్షజ్ఞాన స్థాయికి ఎదగ గలుగుతోంది విజ్ఞానము. (2) ఆధార సహితమైనవే తమ తమ ఊహలనుకుంటూ సిద్ధాంతాలు చేసుకున్న వాటిలో కొన్నింటిలోని ఆధార రాహిత్యాన్నీ, దుష్ట హేతువులనూ గమనించి ఆ భ్రమలనుండి బయటపడే వీలుకలుగుతోందా విధానం వల్ల.
మరి అదే సమయంలో వేదాంతము, ఆధ్యాత్మ విద్య, ఆస్తికత, మతము వగైరాల పేరున ప్రచారంలో నున్న తాత్విక ధోరణులైతేనో ప్రయోగాల ద్వారా నిర్ధారించుకునే పద్ధతి నవలంభించకపోవడం వల్లనూ; ఒక ఊహాత్మక సిద్ధాంతాన్ని నిర్ధారించుటకు మరికొన్ని ఊహలనే ఆధారం చేసికుని సాగడం వల్లనూ కేవలం సిద్ధాంతాలన్నీ అనుమాన, శబ్ద ప్రమాణ విషయాలై పరోక్షజ్ఞాన స్థాయి నుండో, భ్రమాత్మక స్థితి నుండో బైటపడలేక పోతున్నాయి.
Note:-ఈ సందర్భంలో మరో ముఖ్య విషయాన్నీ గమనించాలి. సత్యాన్వేషి. విజ్ఞాన శాస్త్రావిష్కరణలు మాకాధారం అని చెప్పుకుంటుండే నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు వగైరాలు కూడా తమ తమ అభిప్రాయాలకు ఆధారంగా ఊహనో మరో వ్యక్తి మాటనో (అనుమాన, శబ్ద ప్రమాణాలను) ఆధారంగా తీసుకుంటున్నారు. ఈ విషయంలో మతస్తులు అంధ విశ్వాసులు అని చెపుతూ తామూ అదే మార్గంలో పయనిస్తున్నామని గమనించరు వీరు. ఉదా:- “గోరా అన్నీ చెప్పే ఉన్నాడు,” “మార్క్సు సిద్ధాంతాన్ని మరల పరిష్కరించవలసిందేమీలేదు.” “M.N. రాయ్ నిర్ధారితాంశాలు మరల సరిచూడవలసిన పని లేదు.” “మా విజ్ఞానాన్ని పరీక్షించ వలసిన పనిలేదు” లాంటి అభిప్రాయాలన్నీ మతస్తులకున్న అభిప్రాయాల్లాటివే. ఎవరు ప్రయోగం ద్వారా విషయాన్ని నిర్ధారించుకోరో, ప్రయోగానికి-పరీక్షకు-అంగీకరించరో వారంతా పెడమార్గం పట్టిన వారేనన్నది నిర్వివాదాంశము. వారు మేధావులూ, సత్యసంధులూ ఐయండవచ్చు గాక.
అనుమాన ప్రమాణాంతర్గతమైన ఊహ ద్వారా ఏర్పరచుకున్న నిర్ణయాలను ప్రత్యక్షంలో సరిచూసుకోనంత కాలం ఆ జ్ఞానానికి విజ్ఞానస్థాయి చేకూరదు. పైగా ఆ వూహాత్మక సిద్ధాంతాలే క్రమంగా విశ్వాసులైన వారిలో మూఢ నమ్మకాలుగా రూపొందుతాయి. ఈ విషయాన్ని కేవలం మతాలకే పరిమితం చేయక్కరలేదు. ఏ సిద్ధాంతానికైనా అన్వయించి చూసుకోవచ్చు. ఉదాహరణకు మార్క్సు సిద్ధాంత లక్ష్యమైన కమ్యూన్ ఊహాత్మకమైనదే. కమ్యూనిష్టు అనుయాయులలో నేడది పిడివాద రూపంలో అంధ విశ్వాసప్రాయమై మతస్తుల స్వర్గంలాంటిది గానే స్థిరపడి ఉంది.
ప్రస్తుతం అనుమాన ప్రమాణంలోని ఊహా స్వరూపం వ్యవహారంలో ఉన్న కాల్పనికమైన భావనా రూపం కాదనీ, అలానే సంశయ రూపమూ కాదనీ, కొన్ని ఆధారాలతో (పారిభాషికంగా వీటినే లింగములంటారు.) ఒక దాని అస్తిత్వాన్ని ఊహించడం అనీ అనుకున్నాము. దానినే మరికొంత విపులీకరిస్తాను. పరస్పరం సాహచర్య నియమంలో ఉండే రెండు పదార్థాలను గురించి లోగడ మనకు తెలిసి ఉందనుకోండి. (సాహచర్య నియమం అంటే దీనిని విడచి అది ఉండదు. ఇందుంటే అదీ ఉంటుంది అనడానికి తగిన సంబంధం ఏ రెంటి మధ్య ఉన్నదో ఆ రెంటికీ ఉన్న సంబంధం సాహచర్య నియమం అంటారు.) ఇప్పుడు అందులో ఏ ఒక్కటి కనిపించినా రెండో దానిని స్మరిస్తాము. ఇందుంది గనుక అదీ ఉంటుంది అన్న నిశ్చయానికి వస్తాము. తర్కంలో దీనికి ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం ఉంది. పర్వతము నిప్పు కలిగి ఉంది. పొగ కనబడుతోంది కనుక, ఎక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది. ఆ రెంటి మధ్య సాహచర్య నియమముంది. ఇక్కడ పొగ ప్రత్యక్షంలో ఉంది. పొగా నిప్పు కలసి ఉంటాయన్న వివేకం గతానుభవాల ద్వారా (వంటయిల్లు వగైరా) కలిగే ఉంది. దానిని స్మరించడం ద్వారా యిప్పుడు కనబడుతున్న పొగతోబాటు కనబడని నిప్పు ఉనికినీ ఊహిస్తాము. ఆ వూహ కాల్పనికమూ, సందిగ్ధమూ కాక నిశ్చయ రూపంలో ఉంటుంది. కనుకనే అనుమాన ప్రమాణంలోని ఊహను జ్ఞానంగానే స్వీకరిస్తాము. తెలిసింది అనే అంటాము.
అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అనుమితి ప్రమలో సామాన్య పదార్థం మాత్రమే తెలుస్తూంటుంది. పొగ ఉన్నదగ్గర నిప్పు ఉంటుందని తెలుస్తుందే గానీ ఆ నిప్పు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు కనడుతున్న పొగకూ, గతంలో తెలిసి ఉన్న పొగకూ ఉన్న తేడా తెలుస్తూనే ఉంటుంది మనకు. కానీ గతంలో తెలిసి ఉన్న నిప్పుకూ ప్రస్తుతం పొగ దగ్గర ఉన్న నిప్పుకూ గల తేడా తెలియదు. ఎందుకంటే నిప్పు ఉన్నదన్న విషయం తెలిసిందే గానీ అదెలా ఉందో యింకా తెలియవలసే ఉంది కదా ఇక్కడ. విశేష జ్ఞానం ప్రత్యక్షం ద్వారా మాత్రమే కలుగుతుందనేది ఇక్కడ గమనించవలసిన విషయం. అనుమానంలో ఏది ఉందని తెలిసిందంటున్నామో అదింకా తెలియ వలసే ఉందని గమనించక పోయామా గొప్ప ప్రమాదంలో పడిపోయినట్లే. అనుమాన ప్రమాణం ద్వారా తెలిసే విషయం దానిని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రేరణగా ఉండాలేగానీ, విషయం తెలిసిపోయింది. మరింక తెలియవలసిందేమీ లేదు అన్న భ్రమలోనికి నెట్టివేయరాదు. మత ధోరణులకూ, వైజ్ఞానిక పంధాకూ ఉన్న మౌలికమైన తేడా యిక్కడే ఉంది. మతం అనుమాన ప్రమాణం ద్వారా గ్రహించిన విషయాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయదు. అసలు నిర్ధారించుకోవడానికి వీల్లేని వాటిని కూడా సైద్ధాంతిక రూపంలో ప్రచారం చేస్తుంది. అదే శాస్త్రీయ పద్ధతిలోనైతే అనుమాన ప్రమాణ విషయం అన్వేషణకు ప్రారంభం మాత్రమే. తేడాను గమనిస్తున్నారనుకుంటాను. ఇక్కడ ఆగి మరోమారు పై విషయాన్నే విషయాన్నే పరిశీలించండి. జిజ్ఞాసువూ, పరీక్షకుడూ కూడా అత్యంత మెలకువగా ఉండవలసిన చోటిది.
అనుమాన ప్రమాణం నిత్య జీవితంలో ప్రతి క్షణమూ ఎలా ఉపయోగకారిగా ఉంటున్నదో అలానే దానివల్లే తరచుగా ప్రమాద పడే పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. దాదాపుగా తాత్విక సిద్ధాంతాలన్నీ దీని నాధారం చేసికొనే రూపు దిద్దుకున్నాయి. పరీక్షకు సిద్ధంకమ్మన్నప్పుడవి “మాది పరీక్షింప వలసిన పనిలేదు.” అనే మొండి వైఖరిని ప్రదర్శించి మత రూపాన్ని పొందాయి. (Note:- మతమంటే చెడ్డదనే అర్థంలో నే నామాట అనడం లేదు. ప్రతిపాదితాంశాలకు ఋజువులను వెతుక్కునేందుకు యిష్టపడని, సిద్ధపడని విశ్వాస ప్రాతిపదికను స్వీకరించే స్వభావాన్నే ఇక్కడ నేను మతమన్న మాట ద్వారా సూచిస్తోంది. గమనించగలరు. నాస్తికాదులల్లోనూ మతస్తులున్నారని తేలుతుంది ఈ విషయం గమనిస్తే. అందుకే నాస్తికాదులూ మతాలే నేడు)
ప్రయోగించి సరిచూసుకోడానికి వనరులు లేని కాలంలో ఏర్పడ్డ అనేక సిద్ధాంతాలు నేటికీ వాస్తవాలుగానే చలామణీ అవుతున్నాయి అనుయాయుల్లో. ఈ చెలామణి ఎంత మొండిగా, బండగా అనుసరించబడుతోందంటే నేడవి ప్రయోగం ద్వారా తప్పులని పదే పదే నిర్ధారింప బడినా వాస్తవాన్నంగీకరించటానికి, అసత్యాలను విడవడానికి సిద్ధంగా లేరు ఆయా సిద్ధాంతానుయాయులు. ఉదా:- జల పరమాణువులనేవి లేవనీ, అసలు జలమన్నదే రెండువాయువుల సమ్మేళనమనీ కొద్దిపాటి పదార్థ విజ్ఞానం తెలిసిన విద్యార్థికైనా నేడు తెలుసున్న విషయమే. అలానే ఆకాశం అంటే ఏమీలేదన్న అర్థమో, మరొకటి ఉండటానికి వీలున్నదన్న అర్ధాన్నో సూచిస్తుందేగాని అదొక ద్రవ్యంకాదు అంటే వినే సాంప్రదాయకులెందరున్నారు? అలానే కమ్యూనిస్టుల కమ్యూన్ లేక సమసమాజమన్నది కూడా అంటే ఆశ్చర్యంగా లేదా మీకు?
ఇవన్నీకూడా ప్రత్యక్షం కంటే అనుమాన ప్రమాణానికి అధిక విలువనివ్వడంవల్ల ఏర్పడ్డ ప్రమాదరూపాలే. ఊహద్వారా ఏర్పడ్డ పరోక్షరూపమైన జ్ఞానాన్ని మరల మరో ప్రమాణం ద్వారా అపరోక్షరూపానికి మార్పు చేసుకోవా లన్న వివేకం లేకపోవడమే (ఒక రకమైన అజ్ఞానమే అది) ఈ ప్రమాదాలన్నింటికీ ప్రధాన కారణం. సరే యిప్పటికింత వరకు గమనించండి. పైసంచికలో అనుమాన ప్రమాణంలోని విభాగాలూ, వాటి స్వరూప స్వభావాలు విపులీకరిస్తాను.
అనుమాన ప్రమాణం, దానిద్వారా తెలిసే విషయం యొక్క స్వరూపం, దానికున్న స్థాయి అన్నవాటిని యధాతధంగా గమనిస్తే యిలా ఉంటుంది.
అనుమానం ద్వారా తెలిసే విషయం లోగడ తెలిసినట్టిదే. ఆ తెలియడానికాధారం వ్యాప్తిస్మరణం. వ్యాప్తిస్మరణం మంటే, స్మృతిలో ఏ రెంటి సంబంధం ఉన్నా ప్రస్తుతం వాటిలో ఒకటి ప్రత్యక్షంలో ఉంటే ఆ రెండో దాని ఉనికి స్మృతిలో ఉన్న సంబంధ బలం వల్ల స్మరించడమని అర్ధం. కనుక అనుమాన ప్రమాణం యొక్క స్వరూపం సంబంధ స్మరణమవుతోంది. ఈ సంబంధములన్నవి ద్రవ్య,గుణ క్రియలలో వేటిలోనైనా ఉండ వచ్చు. సామాన్య విషయమే తెలుస్తుందిగానీ ఉన్నది ఉన్నట్లు తెలియదు. అది తెలియవలసే ఉంటుందింకా. ఏది తెలిసిందంటున్నామో అనుమానం ద్వారా, అదింకా పరోక్షంలోనే ఉందన్న మాట. అనుమాన ప్రమాణం యొక్క పరిమితిని గుర్తిస్తే అదెంత విశాల క్షేత్రాన్ని కలిగిఉన్నా దానిస్థాయి (బలం) చాలా పరిమిత మైనదేనని తెలుస్తుంది.
ప్రమాకరణం ప్రమాణం అన్నది గుర్తులోనే ఉందనుకుంటాను. మరిప్పుడు అనుమాన ప్రమాకరణం పనిముట్టా? పద్ధతా? మరొకటా? ఆలోచించండి. అలానే రెంటి సంబంధ జ్ఞానం గతంలో కలిగి ఉండవలెనంటే ఏమిటి? రెండు వస్తువుల సంబంధ జ్ఞానమా? గుణ గుణి సంబంధ జ్ఞానమా? అవయ వావయవి సంబంధ జ్ఞానమా? పరిణామ క్రమంలోని రెండు రకాల సంఘటనల జ్ఞానమా? యిలా ఎన్నో అంశాలను విశ్లేషించి చూడవలసి ఉంది. దీని క్షేత్రాన్ని అవగాహన చేసికోవాలంటే, ఆవివరాలు పై సంచికలో. ఈ లోపు మీ మీ ఆలోచనకందిన వాటిని స్పందనకు పంపండి
ప్రమాణ వివేచన-12
సంపుటీ. 12 సంచిక-12 1.12-92.
ప్రమాణ వివేచనలో అతి సంక్లిష్టమూ, నానా సిద్ధాంత రాద్ధాంతాల, కాలంబనమూనై జిజ్ఞాసువులనూ, సైద్ధాంతికుల్నీ కూడా గందరగోళ పరుస్తున్నదీ అనుమానప్రమాణమే. అయితే మరో ప్రక్క సాంకేతిక ప్రగతికీ, విజ్ఞాన శాస్త్ర ప్రగతికీ, మనోవికాసానికి కూడా మరొకటి, మరొకటి సహకరించలేనంతగా ఇది వినియోగపడుతోంది. కొన్ని ఆధారాలతో తెలియని దానిని గురించి తెలుసుకునేందుకు ఉన్న ఆధార సూత్రం తార్కికయోచనే. అది హేతు పూర్వకమైన - ఊహే అవుతుంది.
లింగపరామర్శ జన్యం జ్ఞానం అనుమితి. ‘లింగం’ అంటే హేతువు, ఆధారము అని అర్థం. ఏది తెలియడం వల్ల తెలియని దేనిని ఊహించుటకు వీలవుతుందో అది దానికి హేతువు. లింగం అనన్న మాట. ఏదో తెలుస్తున్నంత మాత్రాన మరేదో తెలియని దానిని ఊహించుట ఎలా సంభవం? ఈ ప్రశ్నకు సమాధాన మేదో అదే అనుమాన ప్రమాణానికి ప్రాణం. అది రెంటి సంబంధ జ్ఞానం స్మృతిరూపంలో – (గతంలో తెలిసి) ఉండడమే. అనుమాన ప్రమాణం ఆకృతి దాల్చాలంటే రెంటి సంబంధ జ్ఞానం కలిగి ఉండడమూ, ప్రస్తుతం హేతువు, (లింగం) ప్రత్యక్షంలో. ఉండడమూ జరిగితీరాలి. ఆ రెంటి సంబంధమన్నది నియమంగా ఉండగలగాలి. ఇదుంటే అదుండక తప్పదు (అవినాభావం) అన్న సంబంధం ఉండాలన్న మాట. సాధారణంగా అట్టివి కార్యాన్ని బట్టి కారణాన్ని, అవయవాన్ని బట్టి అవయవినీ, గుణాన్ని బట్టి గుణినీ, కొన్ని క్రియల్ని బట్టి మరికొన్ని సంఘటనలనూ ఊహించడంగా ఉంటుంది.
ప్రస్తుతం ప్రత్యక్షంలో నున్నది హేతువనుకున్నాం గదా. దాని వలన మనం ఊహిస్తున్నది, సాధిస్తున్నది సాధ్యమవుతుంది. హేతుసాధ్యాలకున్న సంబంధం వ్యాప్తి అంటారు. ఇదే గతంలో మనకు తెలిసి ఉన్న రెంటి సంబంధ జ్ఞానం, దానిని పరామర్శ అంటారు పారిభాషికంగా, అలాగే హేతువెక్కడ గోచరిస్తూ సాధ్యం యొక్క ఉనికిని ఊహించడానికి, నిశ్చయించడానికి ఆలంబన మవుతున్నదో దానిని పక్షమంటారు. హేతు సాధ్యాలకున్న సంబంధ జ్ఞానం గతంలో ఎక్కడ దీని వలన, కలిగిందో దానిని సపక్షమంటారు. హేతువు, పక్షము, సపక్షమునన్న పదార్ధాలే (అంశాలే) అనుమాన ప్రమాణంలోని ప్రధాన భాగాలు. అయితే పక్షాన్ని గురించి విశ్లేషించ వలసినంత అవసరం లేదుగానీ, మిగిలిన హేతువు, సపక్షములను గురించి మరికొంత ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే హేతువుకు బదులుగా హేత్వాభాసలు ఏర్పడే వీలుంది. దుష్ట హేతువువల్ల సాధ్య నిశ్చయంలో భ్రాంతి ఏర్పడవచ్చు. అలానే సపక్షం విషయంలోనూ. సపక్షంలో మనం ఉదాహరణను చూపుతాము, చూస్తాము. దీనినే దృష్టాంతం అంటారు పరిభాషలో. సాధ్యం-పక్షం. దాష్ట్రాంతిక మనబడుతుంది. హేతు దృష్టాంతముల జ్ఞాన సామర్ధ్యం వల్ల దాష్ట్రాంతిక జ్ఞానం [1] అనుమితి ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియా విశేషాన్నే అనుమాన ప్రమాణ మంటాము.
ఏరకమైన రెంటి మధ్యనున్న ఏ విధమైన సంబంధం అనుమితికి అర్హమై అనుమాన ప్రమాణంలో భాగం కాగలదు అన్నది ఇదమిద్ధంగా నిర్ణయించే యత్నమే భిన్న భిన్న తార్కిక ధోరణులను జనింపజేసింది. ఇదెంత క్లిష్టమైన అంశమంటే ఈ ప్రయత్నంలో భాగంగా జరిగిన తార్కిక సిద్ధాంత రాద్ధాంతాలన్నీ చివరకు తర్కానికి నిలకడే లేదు అనే అపప్రథను మాత్రం కలిగించ గలిగాయిగాని సార్వజనీనమై, నిర్దిష్టమైన పరిధిని నిర్ధారించలేక పోయాయి. ఒకరు ప్రతిపాదించిన హేతు, సాధ్యాల మధ్యనున్న సంబంధాన్ని మరొకరు పూర్వపక్ష విషయంగా నిరూపిం చేయత్నం చేస్తూ వచ్చారు. మరైతే అదే సమయంలో వీరు ప్రతిపాదించిన అంశమైనా సర్వ సమగ్రంగా నిలచిందా అంటే మరో తార్కికునిచే ఇది పరాస్తం చేయబడింది. ఇలానే సాగాయి తార్కికధోరణులన్నీ. అయితే నేడు మనం అత్యంత ప్రధానమైన ఒక విషయాన్ని ఇక్కడ గమనించవలసి ఉంది. అలా పరస్పర దోషాలను వ్యక్తీకరించుకుంటూ సాగిన ఆయా చర్చలన్నిటి వల్లనూ మనం నష్ట పోయిందేమీ లేదు. పైగా అనుమాన ప్రమాణ స్వరూపాన్ని గురించిన మరింత లోతైన అవగాహన కది సహకరించింది కూడా. ఆ విధంగా గతంలో రకరకాల తార్కిక ధోరణుల మధ్య జరిగిన సిద్ధాంత చర్చలన్నీ ఈనాటి జిజ్ఞాసువులకు వారి జ్ఞానార్జనలో ఎంతో కాలాన్నీ, శ్రమనూ తగ్గిస్తూ మరింత నిర్దుష్టమైన స్వరూపాన్ని ఏర్పరచు కోడానికి సహకరిస్తూ ఎంతో గహనమైన మార్గాన్ని సుగమం చేస్తున్నాయి.
Note:-ఎవరైతే వీటన్నిటినీ పరిణామక్రమంలోని జ్ఞానాభివృద్ధి దశలోని స్థితులుగా స్వీకరించడం లేదో, ఏదో ఒక ధోరణికి గృడ్డిగా కట్టుబడి నిలచిపోతున్నారో వారు మాత్రం జీవితంలో, సమాజంలో అనుమాన ప్రమాణం ద్వారా పొందనలసిన ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేక పోతున్నారు. మీదు మిక్కిలి మధ్యంతరంగానే జ్ఞానార్జనకు భరతవాక్యం పలికి భ్రాంతులై నష్టపోతున్నారు కూడాను. ఈ రకమైన ధోరణుల ఫలితమే ఈనాడు ఆయా ధోరణుల మధ్యనున్న విరోధ భావాల కాధారం, ఈ భావన ఎంత ప్రమాదకర మైనదంటే తాము చెపుతున్న దాన్ని ఎదుటి వాడర్ధం చేసికోలేక పోతున్నాడనీ, ఎదుటివారు చూపే దోషాలన్నీ తమ ప్రతిపాదనలపై వారు చేస్తున్న దుష్టారోపణ లేననీ ప్రతిధోరణివారూ ఇతరులను గురించి తలపోస్తున్నారు. ఇది ఈనాడు పరిశీలించగలిగితే, తులనాత్మక విశ్లేషణ చేయగలిగితే ఎంతో విస్తృతంగానూ, వికృతంగానూ వ్యాపించివున్నట్లు తెలియగలదు.
ఒక్క విషయాన్ని ఉన్నదున్నట్లుగా రాగద్వేషాలు విడచి, అంటే ఎవరో ఒకరు చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి పోకుండానూ, ఏదో ఒక అభిప్రాయాన్ని పెట్టుకుని చూడకుండానూ, చూడగలిగితే తప్పు జ్ఞానమో, ఒప్పు జ్ఞానమో నిర్ధారించుకోడానికి ముందుగనే మనకు జ్ఞానం కలుగుతోందనీ, ఆ కలగటం కూడా ఏదో ఒక ప్రమాణం ద్వారానే కలుగుతుందనీ ఇదే సహజంగా జరిగే పద్దతిని తెలియ గలదు. ఈ అంశం పట్ల సరైన అభిప్రాయం కలిగించుకోడానికి సహకరించే కొన్ని ఉదాహరణల నిస్తాను. పరిశీలించండి.
(1) అతి ప్రసిద్ధమైన పొగ నిప్పు ఉదాహరణనే చూడండి. పొగ ఉందే దానికి కారణమైన నిప్పు ఉండక పోవడమన్నది లేదు. కనుక పొగా నిప్పు సాహచర్య నియమం కలిగి ఉన్నాయి అంటాము. సాధారణంగా దానిని బట్టే నిప్పు ఉన్నద నడానికి హేతువుగా పొగను స్వీకరిస్తాము. అయితే నిప్పు, పొగల మధ్య నున్న సంబంధమేమిటి? కారణ కార్య సంబంధమనిగదా! పొగకు నిప్పు ఉపాదానమా? నిమిత్తమా? నిమిత్త కారణమనాలి అయితే నిమిత్త కారణం కార్యోత్పత్తికి అవసరమేగాని కార్యమున్న తావులెల్ల ఉండాలనిగానీ, కార్యమున్నంతకాలం ఉండాలనిగాని నియమమేమీ లేదుగదా! అది కార్యోత్పత్తి అనంతరం నశించవచ్చు. కార్యాన్ని విడచి వేరుగానూ ఉండవచ్చు. అయినా మనం నిప్పును ఊహిస్తాము పొగనుబట్టి.
(2) పురాతత్వ పరిశోధకుల త్రవ్వకాలలో ఒక ఎముక బయటపడింది. దాని ఆకృతిని, పరిమాణాన్ని బట్టి, ఆ పదార్థంలో నున్న మూలకాల ఆయుః ప్రమాణాన్ని బట్టి అదెప్పటిదో, దానిరూపు రేఖలేమో, మాంసాహారో, శాఖాహారో నిర్ణయించుతున్నారు పరిశోధకులు. ఇక్కడ ఎముకను బట్టి ఊహిస్తున్నది దేనిని? దానికి ఎముకకు ఉన్న సంబంధం ఏమిటి? కారణకార్య సంబంధమేనా? అయితే ఎముకకు ఆ జంతువు ఉపాదానమా? నిమిత్తమా? ఉపాదానమంటే కార్యంలో స్థితమై ఉండాలి. కనుక ఎముకకు ఉపాదానం ఎముకలోనే ఉంటుంది. మరి నిమిత్తమా? నిమిత్తకారణం ఫలానా అని నిర్ధారించడానికి ఆధారాలేవి? పైగా నిమిత్తకారణం కార్యానికి భిన్నంగా ఉండాలిగదా? కనుక ఎముకకూ దాని నాధారం చేసుకుని ఊహిస్తున్న జంతువుకూ. ఉన్న సంబంధం ఇవేవీ కాక అవయవావయవి సంబంధమన్న మాట.
(3) వాహనాల ప్రయాణ ప్రారంభసమయాన్ని, ప్రయాణించవలసిన దూరాన్నీ, వాహన వేగాన్ని ఆధారం చేసుకొని గమ్యం చేరే సమయాన్ని తెలుసుకోగలము. ఈ జ్ఞానం ఏ ప్రమాణంలో సాధ్యపడింది. ఇక్కడ వేటి వేటి మధ్య ఏ ఏ సంబంధాలున్నాయి? ఆలోచించండి.
(4) న్యాయదర్శనంలో అనుమానం మూడు విధాల కలుగుతుందన్నారు. కార్యాన్ని బట్టి కారణాన్ని, కారణాన్ని బట్టి కార్యాన్నీ, సాధారణీకరణల ద్వారా (అనుభవంలో నున్న సంబంధాలద్వారా) కొన్నింటినీ అనుమానించవచ్చని వారి సిద్ధాంతము. మరైతే తర్క సంగ్రహకారులు మాత్రం కార్యాన్ని బట్టి కారణాన్నే గానీ కారణాన్ని బట్టి కార్యాన్ని అనుమానించలే మంటారు. అంటే జరిగిన దానిని మాత్రమే అనుమానించగలం గానీ, జరుగనున్న దానిని అనుమానించలేమని అర్థం. ఇది సబబు కాదనీ. మనిషి కొన్ని ఆధారాలతో గతంలో కి భవిష్యత్తులోనికి కూడా దృష్టి సారిస్తున్నాడనీ. నిత్యం మన అనుభవంలో చూస్తూనే ఉన్నాము. గ్రహ గతులూ, గ్రహణాలూ, తుఫానులూ, వర్షము వగైరాలను గురించి తెలుసుకోవడ మెలా సంభవమవుతోంది? ఇలా అన్నీ జరుగుతున్నా,
గతానికి చెందిన మన అనుమానించడాలు గానీ, వర్తమానానికి చెందినవి గానీ యింకా నిర్ధారింపబడ వలసే ఉంటాయి. ఎందుకంటే సామాన్యీ కరణం ద్వారా ఏర్పడ్డ. సాధారణ సూత్రాలద్వారా అనుమానింపబడ్డ సామాన్య జ్ఞానమే అదీ పరోక్షంగానే మనకు ఏర్పడింది. నిదానంగా ఆలోచించండి. పై సంచికలో హేత్వాభాసలను మీ ముందుంచుతాను.
మరో విషయం; మన మన అధ్యయనంలో పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది. అదేమంటే కార్యం ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది, దానికి కారణాలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? అన్నదే.
(1) పరమాణువుల సంఖ్యను బట్టి కార్యరూపాలేర్పడు తున్నాయి. (1) అవి కూర్చబడిన తీరును బట్టి కార్యరూపం మారుతోంది. ఉదా :- బొగ్గు, వజ్రం ఈ రెండింటికీ మూల ద్రవ్యం ఒక్కటే. అయినా పొందిక తీరును బట్టి గుణ, గణాలు మారుతూ భిన్న కార్యాలవుతున్నాయి. ఇదంతా ఒకే ద్రవ్యం నుండి ఏర్పడుతున్న కార్యరూపమే. అంటే ఒకే మూలకం కారణంగా భిన్న కార్యాలు.
2) అనేక ద్రవ్యాల విభిన్న నిష్పత్తుల సంయోగంవల్ల ఏర్పడుతున్న కార్యాలు. ఉదా :- రసాయనిక సమ్మేళనాలన్ని అట్టివే, చింతపండూ, పప్పు, ఉప్పు ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
(3) అనేక అవయవాల కూర్పునుండి ఏర్పడుతున్న వస్తుజాలం కూడా కార్యరూపమే. ఇవి మరల రెండురకాలు. ఒకే ద్రవ్యంతోచేయబడ్డ అనేక వస్తువులను కూర్చి మరో వస్తువును చేయడమూ, అనేక ద్రవ్యాలతో చేయబడ్డ అనేక వస్తువులను కూర్చడంవల్ల మరో వస్తువును చేయడమూ. ఉదా :- (1) రకరకాల యినుప పనిముట్లు; (2) సైకిలు, లారీ, కారు, చెప్పులు వగైరాలున్నూ, ఇలా సంబంధాల వ్యవస్థ బహు విశాలమూ, ఒక రకంగా గహనమూకూడా. ఎంతెంత పరిశీలించగలిగితే అంతంత ప్రయోజనము సిద్ధిస్తుంది. వీటి వివరాలున్నూ క్రమంగా చూద్దాం.
సంపుటి-3 సంచిక-3 1-3-93
అనుమాన ప్రమాణాన్ని ఇతర ప్రమాణాల నుంచి వేరు చేసి(దాని పరిధుల్ని నిర్ధారించి)చూడడానికి ప్రయత్నిస్తున్నాము కదా! నిదానంగాను, కూలంకషంగానూ పరిశీలించి అర్ధం చేసుకోవలసిన విషయమిది. ఏదో సూత్రం చెప్పి పూర్తి చేశామనుకుంటే అది ఆచరణలో సరిచూసుకుంటానికి, జీవితంలో వినియోగించుకుంటానికి సరిపోదు. పైగా ప్రమాదపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీని విషయంలో.
అనుమాన ప్రమాణంలో హేతువు కీలకమైనది. దాని ఆధారంగానే మనం ప్రత్యక్షంలో లేని దానిని తెలుసుకుంటాము. ఇప్పుడు మనకు గోచరిస్తున్న హేతువుకూ, దీని ద్వారా తెలుసుకుంటున్న సాధ్యానికి గత సంబంధం ఉండాలి. ఆ రెంటికీ ఉన్న సంబంధాన్ని అవినాభావ సంబంధమనీ, సాహచర్య నియమం అనీ, వ్యాప్తి అనీ పారిభాషికంగా అంటారు.
ఇక్కడ మరో మూడు మాటలను అర్ధం చేసుకోవలసి ఉంది. అవి పక్షం, సపక్షం, విపక్షములు. పక్షమంటే ఇప్పుడు మనకు హేతువు ఎక్కడ కనిపిస్తున్నదో, ఎక్కడ సాధ్యాన్ని ఊహిస్తున్నామో అది, ఆ స్థలం పక్షమనబడుతుంది. “సందిగ్ధ సాధ్యవాన్ పక్షః”. ఇప్పుడు హేతువాధారంగా సాధ్యాన్ని ఊహించడానికి ఈ రెండూ కలసి ఉంటాయని గతంలో నీవెక్కడ వాటిని తెలుసుకున్నావో అది ఆ స్థలం-సపక్షం. “నిశ్చిత సాధ్యవాన్ సపక్షః” సాధ్యము లేదు కనకనే హేతువూ లభించడం లేదు అనడానికి వీలయిన ప్రదేశము విపక్షము అవుతుంది. ఇంత వరకు అర్ధమైతే విడివడని బంధం కల రెంటి గురించి, వాటి సంబంధాన్ని గురించి గతంలో తెలిసి ఉండటం సాధ్యాన్ని ఊహించడానికి అసాధారణ కారణము అవుతుంది. దీనినే లింగ పరామర్శ అంటాము. ఇదే అనుమాన ప్రమాణ స్వరూపము అనుకోవచ్చు.
ఎట్టి అధారాన్ని సరైన హేతువుగా స్వీకరించవచ్చు? స్వీకరించాలి? గతంలోని తార్కికులు స్వీకరించారు? అన్న ఈ అంశమే అనుమాన ప్రమాణాన్ని నిర్దుష్టం చేయడానికి ముఖ్యమవుతుంది. హేతువుకు పక్ష సత్యము, సపక్ష సత్యము, విపక్ష సత్యము అన్న యోగ్యత ఉండాలి. అంటే ఒక దానిని అనుమానించడానికి అక్కడ హేతువు ఉండాలి. దానిని పక్ష సత్యమంటారు. హేతువు సాధ్యాలున్న విషయం గతంలో మనకు తెలిసిందెక్కడో దాన్ని సపక్షమంటాము గదా, అక్కడ హేతువుండడాన్ని సపక్ష సత్యమంటారు. ఇకపైన పేర్కొన్న విపక్షంలో హేతువు లేకపోవడాన్నే విపక్ష సత్యము అంటారు. తార్కిక పరిభాషలో అంతగా పరిచయం లేని వారికొరకు ఈ విషయాన్నే వేరే మాటల్లో చెప్పుకోవచ్చు. అనుమాన ప్రమాణము లోని పక్షం దాష్ట్రాంతికానికి-సపక్షం-దృష్టాంతానికీ లేక ఉదాహరణకు సమానార్థకాలే. హేతువూ, సాధ్యమూ రెండూ లేని తావు విపక్షం.
మరో కోణం నుండే హేతువును అర్థం చేసుకోవచ్చు. ఏ పదార్థమైనా దాని లక్షణం ద్వారానే తెలియ వలసి ఉంటుంది. అలానే సరైన హేతువుకూ లక్షణ నిర్దేశం చేయవలసి ఉంటుంది. అది దూషత్రయ రహితంగా ఉండాలి. దూషణ త్రయమంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవములే. శాస్త్రాధ్యయనం చేయగోరు జిజ్ఞాసువులు పరిభాషను అర్ధం చేసుకొని ఉండటం అవసరం. అందుకే ఈ వివరణలు.
ఒక విషయాన్ని (వస్తువు, గుణము, క్రియ, సంబంధం మొదలగు మాటల అర్ధాలను) తెలుపడానికి నిర్వచనరూపంగా మనం వెలిబుచ్చే మాటలు ఆ వస్తువు యొక్క అసాధారణ ధర్మాన్ని తెలుపగలగాలి. దానినే దాని లక్షణ మంటాము. అలా అసాధారణ ధర్మంగా మనం చూపించదలచుకున్న లక్షణం చూచే వస్తువు నందు ఉన్నా మరో వస్తువులో కూడా ఉందనుకోండి. లక్షణం అతి వ్యాప్తి దోషంతో కూడి ఉందని అర్ధం. ఏరకమైన వస్తువును తెలుపడానికి ఆ లక్షణం చెప్పామో ఆ రకమైన వస్తువులం దన్ని చోట్లా ఆ లక్షణం లేనట్లయితే (కొన్ని చోటులందే ఉంటే) చెప్పిన లక్షణానికి అవ్యాప్తి దోషమున్నట్లు. చెప్పిన లక్షణం-అసాధారణధర్మం-చూపుతున్న వస్తువులో బొత్తిగా లేకున్నచో నిర్వచనానికి అసంభవదోషమున్నట్లు. ప్రతిపాదన సరైందా కాదా (సత్యమా- అసత్యమా, దోషయుక్తమా-దోషరహితమా) అన్నది నిర్ధారించటానికి ఈ పరీక్ష అతి ముఖ్యమూ, సార్వత్రికమూ ఐయున్నది.
ఇప్పుడు పై “హేతువు”ను అతి వ్యాప్త్యాదులతో సరిపోల్చి చూద్దాం. విపక్షంలో హేతువుండుట (పక్ష సపక్షాల్లో ఉన్నప్పటికీ) అతి వ్యాప్తి దోషమవుతుంది. సాధ్యం లేని చోట హేతువు గోచరించుట అని అర్ధం. పక్ష, సపక్షములం దన్నితావులా, ప్రతిసారీ హేతువు గోచరించనిచో హేతువుగా చూపుతున్నదానికి అవ్యాప్తి దోషమున్నట్లు, ఈ రెంటికి భిన్నంగా హేత్వాభాసలు సాధ్యాన్ని సిద్ధింప జేయుటలో అసంభవ దోషాన్ని కలిగుంటాయి.
Note:-ఈ విద్యలో పరిచయమున్న వారు పరిశీలించి అభిప్రాయం వ్రాయండి. పరిచయం లేని నిదానంగా మళ్ళా మళ్ళా చదివి అర్ధం చేసికునేందుకు యత్నించండి. అర్ధం కాకపోయినా చిన్నబుచ్చుకోవలసిన పని లేదు. తర్కశాస్త్రమే కర్కశమైనది. ఎక్కడ అర్ధమైనట్లనిపిస్తోందో, ఎక్కడ సందిగ్ధంగా కనబడుతుందో స్పందనకు వ్రాయండి. మళ్ళా మరో తీరులో వివరించుకుందాం. అసలింతకూ ఈ ప్రమాణ వివేచన జ్ఞానార్జనకు తప్పనిసరి అవసరం అని పాఠకుల్లో ఎందరు గమనించారో నా వరకు నాకు సందిగ్ధమే. దీని అవసరాన్ని గమనించిన వారికి మాత్రం ఉపయోగపడగల సూచన ఒకటే చేస్తాను. (1) భారతీయ తర్కశాస్త్రం (A) న్యాయ వైశేషికాలు (B) తర్కశాస్త్ర సంగ్రహం (2) బౌద్ధ తర్కం న్యాయ బిందు (3) కళాశాలల్లో B.A. తర్కశాస్త్రం పేరున ఉన్న పాఠ్యగ్రంధాలు కలిపి అధ్యయనం చేయగలిగితే ఈ విద్య యందు కనీస పరిచయం కలుగవచ్చు. తర్క సంగ్రహానికి బాల ప్రియ సహితం అంటూ వ్యాఖ్యతో వంగీపురం రామానుజాచార్యులు తెలుగు చేశారు. వారి రచనాశైలి, బోధనా పద్ధతి సరళంగానూ, ప్రయోజనకరంగాను ఉన్నాయి. ఇహ అందులో కొన్ని దోషాలు దొర్లాయి. అది ఆనాటి శాస్త్రకారుల అవగాహన స్థాయికి సంబంధించిన విషయం. వాటిని గురించి జిజ్ఞాసువు క్రమంగా తెలుసుకోవచ్చు. న్యాయ వైశేషిక దర్శనాలు పండిత గోపిదేవ్ తెలుగు చేశారు. న్యాయబిందుకు మాత్రం తెలుగు లభించలేదు. వీలుంటే త్వరలో మేమే వెలయిస్తాము. తెలుగు అకాడెమీ, సాహిత్య అకాడమీ, తి.తి.దేవస్థానం లాటి సంస్థలు ఎంతో విలువైనట్టీ,బుద్ధివైశారద్యాన్ని కలిగించగలట్టీ ప్రమాణ, పదార్ధ, తర్క శాస్త్రాలను అనువదించి ముద్రించటం సమాజానికి వారు చేయగల, చేయవలసిన బాధ్యతాయుత కార్యం. అది గొప్ప నిర్వాహం కూడా కాగలదు. సరే ప్రతి పాదితాంశాన్ని విడచి ఎక్కడకోపోయాం. అయినా అకారణంగా మాత్రం కాదు. ఈ విద్య సమాజానికి అందుబాటులో ఉండడం ఎంత అవసరమో నాకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఆ ఆతురతే నన్నిలా ఆలోచింప జేసింది. దీనినిలా ఉంచి అనుమాన ప్రమాణానికి సంబంధించిన మరికొన్ని పరిశీలనాంశాలు మీముందుంచి తాత్కాలికంగా ఈ సంచికతో అనుమాన ప్రమాణాన్ని ముగిస్తాను.
నిత్య జీవితంలో మనం అనుమాన ప్రమాణాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో చూసుకుంటే తప్ప అనుమాన ప్రమాణ పరిధుల్ని (అది పని చేయగల-పని చేయలేని) చోటులను ఇదమిద్ధంగా నిర్ధారించడం కుదరదు. పైన చెప్పుకున్న మూడు యోగ్యతలున్న హేతువులు ఎల్లవేళలా మనకు సాధ్యాన్ని అనుమానించడానికి ఉపయోగపడతాయి. ప్రమాదపడే అవకాశములున్న (లోపభూయిష్టములైన) అతివ్యాప్తి, అవ్యాప్తి అనే దోషయుక్తములైన హేతువులు కూడా నిత్యజీవితంలో వినియోగంలోనే ఉంటున్నాయి. ఇంకా విపులంగా చెప్పాలంటే, ఎక్కువ భాగం ఈ రకమైనవే అనుమానంలో చోటుచేసికుంటున్నాయి. అనుమాన ప్రమాణ పరిధుల్ని వివేచించే సందర్భంలో దాని శక్తి పరిమితుల్ని సరిగా గ్రహించాలంటె కీలకమూ, మౌలికమూనైన పై అంశం సుస్పష్టంగా గ్రహించడం అవసరం. గతంలో అనుమాన ప్రమాణంపై జరిగిన అనేక తర్క వితర్కాలకు ఈ అంశమే ఆధారంగా ఉంటూ వచ్చింది. ఈ అంశానికి తగిన విలువనిచ్చి పరిగణనలోకి తీసికొనక పోవడం వల్లనే గతంలో జరిగిన ప్రమాణ మీమాంసలో ప్రతి పక్షంవారూ, ఎదుటి పక్షం వారు చూపిన అనుమాన ప్రమాణంలోని హేతువు దోషయుక్తమైనదే నంటూ చర్చలు కొనసాగించారు. ఈ సందర్భంలో మరో విషయాన్ని గుర్తు చేసికోవడం మంచిది.
సాధ్య నిశ్చయానికి ఆధారమైన హేతువు సరైనదా కాదా? అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఆ సందర్భంలో అసలు జ్ఞానం కలిగిందా? కలిగితే ఏమి జ్ఞానం కలిగింది? ఆ కలిగిన జ్ఞానం సామాన్యరూపమా? విశేషరూపమా? అన్నది ముందు తేల్చుకోవలసింది. ఆపైన కలిగినజ్ఞానం యదార్థమైనదా? భ్రాంత్యాత్మకమా అన్నది సరిచూసుకోవలసి ఉంటుంది. ఇక్కడవరకు పరిశీలన కొనసాగిన పిదపనే హేతువు సరైనదో కాదో నిర్ధారించడానికి వీలవుతుంది. మానవ జీవితంలో సాధారణంగా ఈ క్రమంలోనే వినియోగంలో ఉంటోంది అనుమాన ప్రమాణం.
మరోకోణంనుండి దీనిని వివరించుకుంటే అవగాహనకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ హేతువును గతంలో సరైనది, సరికానిది (సద్దేతువు-హేత్వాభాస) రెండుగానే విభాగించడం జరిగింది కానీ బ్రతుకులో అది పని చేస్తున్న తీరునుబట్టి దానిని మూడుగా చెప్పుకుంటే బాగుంటుందనిపిస్తుంది (1)బలమైనది, (2) బలహీనమైనది [దీన్లో అతివ్యాప్తి రూపంలోనో, అవ్యాప్తి రూపంలోనో దోషముండవచ్చు) (3) పనికిరానిది (దుష్ట హేతువు, హేత్వాభాస). 1 వది సలక్షణ రూపం కాగా రెండవది ఉపయోగపడుతూనే ఉన్నా నిక్కచ్చిగా సపక్ష సత్వము, విపక్షా సత్వము అన్న కొలతలకు నిలుస్తుందని చెప్పలేము, మూడవది కేవలం భ్రాంత్యాత్మకమై ఉంటుంది.
చివరగా కొన్ని ఉదాహరణలు తీసికొని పరిశీలిద్దాం. మీకూ అర్థమవుతుంది బ్రతుకులో అది పనిచేస్తున్న తీరూ, పైన నేను వ్రాసిన మాటలలోని వాస్తవమూ,
(1) అందరకూ తెలిసిన ఉదాహరణ ఒకటుంది ధూమాగ్నులకు సంబంధించింది. ఎక్కడ పొగ గోచరిస్తుందో అక్కడ నిప్పు వుంటుంది. అన్నదే అది. ఇక్కడ పొగ హేతువు. అగ్ని సాధ్యము.
(2) నేనెరిగిన ప్రముఖ తార్కికులొకరు, అనుమాన ప్రమాణం పై వారితో చర్చిస్తున్నపుడు చూపిన ఉదాహరణలు రెండున్నాయి. (1) రామలక్ష్మణులు (2)బంట్రోతు-ఆఫీసరు- ఇందులో లక్ష్మణుడు హేతువు-రాముడు సాధ్యము, బంట్రోతు హేతువు-ఆఫీసరు సాధ్యము.
(3) న్యాయదర్శనం ప్రకారం మూడు రకాల హేతువుల ఆధారంగా అనుమాన ప్రమాణం పనిజేస్తుంటుంది. కార్యాన్నిబట్టి కారణాన్ని, కార్యాన్ని, సాధారణీకరణల ద్వారా మరికొన్నింటినీ, అనుమానించగలమని గౌతముని అభిప్రాయం.
(4) అయితే న్యాయ వైశేషికాన్ని ఆధారం చేసికుని తర్కించే నైయాయికులలో ఎక్కువ భాగం కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించటమే సరైన పద్ధతి అంటారు. “వ్యాప్యారోపేణ వ్యాపకారోపస్తర్కః”
(5) మానవుడు మర్త్యుడు—మరణధర్మం కలవాడు అన్న సాధారణీకరణాన్ని అనుసరించి వెంకట్రావు చస్తాడు- మనుష్యుడు గనుక అనే న్యాయ ప్రయోగం తార్కికులంగీకరించేదే. ఇదీ అనుమానమనే వారి భావం. అయితే రెంటి మధ్య విడదీయరాని సంబంధం-వ్యాప్తి-ఉండాలి గదా అనుమానానికి. ఇక్కడ రెండేవి? అని అడిగేవారు కొందరన్నారు ఈ విషయంలో.
(6) సైకిలు పార్టు ఒకటి రోడ్డు మీద కనబడింది. సైకిల్ స్మృతికి వచ్చింది. ఇక్కడ జరిగిన స్మరణ విషయము ఏదైనా ప్రమాణములోని భాగమా? కాదంటే ఎలానో చెప్పండి. అవునంటే ఏ ప్రమాణంలోనిదో చెప్పండి. ఇక్కడ అవయవిని తెలుసుకోవడం జరిగిందా, జరగలేదా?
(7) గోడ ప్రక్కనుండి సైకిలు హ్యాండిలు, సగం వరకు చక్రమూ కనుపిస్తున్నాయి. అక్కడ సైకిలు ఉందన్న జ్ఞానం కలిగింది. దీనికాధారమైన స్కృతి ఏదైనా ప్రమాణంలో భాగమా? ఏ ప్రమాణంలోనిది? ఇచ్చటేమైనా అవయవాన్ని బట్టి అవయవిని తెలుసుకోవడం జరిగిందా?
(8) టేపు రికార్డర్లో ఒక పాట వినబడింది. పాడింది ఘంటసాల అని తెలిసింది-స్మృతిద్వారా, అది ఏప్రమాణానికి చెందుతుంది?
(9) వాకిట్లో ఒకరి గొంతు వినబడింది, ఫలానా వారు వచ్చారని తెలిసింది, ఇది ఏ ప్రమాణ విషయం?
(10) మరల గుర్తించడం (ప్రత్యభిజ్ఞ) లోని స్మరణకూ, హేతువునాధారం చేసికుని సాధ్యనిశ్చయం చేయడంలో ఉపయోగపడే స్మరణకు ఉన్న తేడాపాడాలేమిటి?
(11) A విలువ B విలువ కంటే ఎక్కువ, B-C కంటె అధిక విలువ గలది కనుక A-C కంటె విలువైనది అని సాధించగలమా, ఇది ఏదైనా ప్రమాణాధారంలో సాధించవలసి ఉంటుందా?
(12) "అ" అనునతడు “ఈ"ని మల్ల యుద్ధంలో ఓడించాడు. "ఈ", "ఊ"ని జయించాడు కనుక 'అ','ఊ' ని జయించగలడు అని చెప్పగలమా?
ప్రమాణ వివేచనలో మీ మీ అవగాహనా స్థాయి ఏమిటో పరిశీలించుకోండి. ప్రమాణాలు, వాటి పరిధులూ సరిగా తెలియనంతకాలం సత్యాసత్యాలు పరీక్షించి తేల్చుకోవడం అసాధ్యం. తేల్చుకోలేము.
“విడివడని రెంటి" సంబంధ జ్ఞానం ఆధారంగా వర్తమానంలో ఒకటి ప్రత్యక్షమై, రెండవది ప్రత్యక్షం కానపుడు ఆ రెండవదాని ఉనికిని ఊహించటం [సాధ్యం పరోక్షంగా ఉండటం, ఊహ నిశ్చయంగా ఉండటం జరగాలి]. అనుమాన ప్రమాణ క్రమం. సందేహాలూ, విమర్శలు స్పందనకు పంపండి. పై సంచికలో శబ్ద ప్రమాణాన్ని గురించిన విచారణ ప్రారంభించుకుందాం.
సంపుటి 3 సంచిక 4 01-04-1993
అన్ని ప్రమాణాలకూ ఆధార పీఠంగా ఉండ దగిన (ఉన్న) ప్రత్యక్షంతో ప్రారంభించి తగినంతగానూ దానిని విచారించి చూశాము. అయినా మరల సరి చూసుకోవలసిన, ఎవరెవరికెంతెంత అవగాహన ఏర్పడిందో పరీక్షించుకోవలసిన అవసరం ఉండనే ఉంటుంది. అలానే ప్రత్యక్షం తరువాత చెప్పుకోవలసిన జ్ఞాన సాధనమైన అనుమాన ప్రమాణాన్నీ సంపూర్ణంగా కాకపోయినా ఎక్కువగానే విశ్లేషించి చూశాము. అందులో భాగంగానే జిజ్ఞాసువులకూ, పరీక్షకులకూ కూడా ఆలోచించడానికి పనికి వచ్చే కొన్ని సంఘటనలను ఎవరికి వారుగా ఆలోచించడానికి అందించాను. అనుమాన ప్రమాణానికి ఉన్న విస్తృత పరిధినీ ప్రామాణికత (శక్తి) రీత్యా బలహీనమైన దాని పరిమితినీ దృష్టినిడుకునే దానిని తాత్కాలికంగానే ముగించుకున్నాము. ఆయా సందర్భాలలో, వినియోగంలో దానిని పరీక్షించి చూసుకుంటే తప్ప దాని స్వరూప స్వభావాలు యథాతథంగానూ సరిగానూ అర్థం కావు. ప్రస్తుతం ప్రమాణ క్రమంలో మూడవదీ (చివరిదీ), విశ్వాసులకాధారమైనదీ, సామర్థ్యత రీత్యా జ్ఞానసాధనంగా చాలా బలహీనమైన దైనప్పటికీ ఎక్కువ మందిచే ప్రజల ప్రమాణంగా స్వీకరించబడుతున్నదీ, ఆ కారణంగానే ప్రజలు రకరకాల సైద్ధాంతిక వర్గాలుగా చీలి ఘర్షించుకుంటానికి హేతుభూతంగా ఉంటున్నదీ ఈ శబ్ద ప్రమాణం. అయితే యధాతథంగా దాని స్వరూపాన్ని అర్ధం చేసికుని, దానికున్న వాస్తవమైన శక్తినీ, పరిమితినీ గ్రహిచి అది పని చేయగలంతలోనే ఉపయోగించుకుంటే మనిషికి చాలా కోణాల్లో ఉపయోగపడగలదు కూడా, ఈ ప్రమాణం.
Note:-శబ్ద ప్రమాణం అన్నమాట విచారణలోనూ, వినియోగంలోనూ తరచుగా తప్పుగా గ్రహింపబడుతూ, నిర్వచింప బడుతూ వస్తున్నది. అయినా నిత్యజీవితంలో మిగిలిన, రెండు ప్రమాణాల కంటే ఎక్కువ వినియోగంలో ఉంటూ విషయ సేకరణలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తోంది ఈ ప్రమాణం. ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాలకున్న స్థాయి భేదాన్ని క్షుణ్ణంగా గమనించగలిగితే మాత్రం “ఈ శ్రవణ నేత్రం” ఎంతో విశ్వాన్ని ఛాయామాత్రంగానైనా మన మనోఫలకంపై ముద్రించగలదు. శబ్ద ప్రమాణం స్వరూపరీత్యా సాంకేతికమైనది. సమాచార రూపంలో మాత్రమే విషయా న్నందించగలదు. దీనిని సంపూర్ణంగా గ్రహించాలంటే ముందుగా భాష పుట్టుపూర్వోత్తరాలు [భాష పుట్టుక, శక్తి-పరిమితి] అర్థం చేసికోవలసి ఉంటుంది. Note అన్న దాన్ని మరొక్కసారి చదివి దీని భావాన్ని గమనించండి ముందు. పిదప ప్రారంభించండి, శబ్ద ప్రమాణ పరిధుల్ని వీక్షించడం.
పరోక్షజాన సాధకాలకు ఒక సామాన్య లక్షణముంటుంది. ఏదో ఒకటి ప్రత్యక్షమవుతుంది, దాని ఆధారంతో దానితో సంబంధపడిన మరొక దానిని గురించిన జ్ఞానం కలుగుతుంది. అనుమాన, శబ్ద ప్రమాణాలకు రెంటికి ఇది వర్తిస్తుంది. రెంటికీ స్మరణయే ఆధారంగా ఉంటుంది. ఏ రకమైన సంబంధాలు అనుమాన ప్రమాణంలో పనిచేస్తుంటాయో, మరి ఏ రకమైనవి శబ్ద ప్రమాణంలో వినియోగంలో ఉంటాయో తెలియడం వలన ఆ రెంటి మధ్య తేడా ఎక్కడుందో తెలుసుకోగలం. ఈ సందర్భంలో అనుమాన ప్రమాణాన్ని ఒకసారి స్మరించండి. అక్కడ పక్ష ధర్మత-హేతువు ఎక్కడ గోచరిస్తుందో అక్కడే సాధ్యముంటుంది అన్నది ప్రధాన పాత్ర వహిస్తుంది. శబ్ద ప్రమాణంలో ఆ నియమం లేదు. పైగా సాంకేతిక సంబంధ స్మరణ (ఈ సంకేతానికి అర్ధమిది అన్న స్మృతి) ప్రముఖ భూమిక వహిస్తుంది. సంకేతం ప్రత్యక్షమై సంకేతి (సంకేతం దేనిని చూపగలదో అది) తెలియబడితే, అక్కడ పని చేసింది శబ్ద ప్రమాణం, కలిగింది. శాబ్దీ ప్రమ. ఇదంతా భాషతో ముడిపడి ఉన్న అంశం గనుక ముందు భాష అంటే ఏమిటి? దాని పుట్టుక (ప్రధమ రూపం) ఏది? దానికి ఇప్పటికున్న రూపాంతరాలేవి? అన్నది శబ్ద ప్రమాణాన్ని అర్ధం చేసికునేందుకు తెలుసుకోవలసి ఉంది.
భాష:- తనకు కలిగిన అనుభవాల్ని గుర్తు పెట్టుకునేందుకు ఆయా అనుభవాలకు మనిషేర్పరచుకున్న గుర్తులే భాష అంటే. సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే అనుభవ సంకేతాలే భాష. ఇది అక్షర సముదాయ రూపము. ఏకాక్షరమో, కొన్ని అక్షరములు కలిసో అర్ధయుక్త శబ్దంగా మారినపుడు, దానిని పదం అంటాము, పదమంటే అర్ధయుక్త శబ్దమన్న మాట. అట్టి పదముల సముదాయము వాక్యము.
Note:-పద పదార్ధ సంబంధ జ్ఞానం లేని వారికి వాక్యార్ధ జ్ఞానం కలుగదు అన్నది సార్వత్రిక నియమం. దీనిని ఈనాడు సరిగా గ్రహించిన వారు బహు కొద్ది మంది ఉంటారేమో! అదీ సందేహమే.
పదం తెలియడమంటే ఏమిటో, పదార్ధం తెలియడమంటే ఏమిటో పద పదార్ధ సంబంధ జ్ఞానం కలగడమంటే ఏమో అర్ధం కానంతవరకు జ్ఞానార్జన పేరిట అజ్ఞానాన్ని పోగుచేసికోవడమే మనిషి చేసేది. ఈనాడు పుస్తక జ్ఞానం కోకొల్లలు. మస్తక జ్ఞానులు వేళ్ళ మీద లెక్కించడానికి కూడా దొరకడం లేదు. పరిశీలించి చూస్తే కేవల పుస్తక జ్ఞానం సత్యాసత్యాలు నిర్ధారించుకోడానికెంత మాత్రమూ పనికిరాదని తెలిసిన వారెందరు? అసలు ఈ నా మాట విని అపహాస్యంగా నవ్వుకునేవారే ఎక్కువ మంది ఉండవచ్చు. శబ్ద ప్రమాణం పట్ల సమాజం పెంచుకున్న అనవసరపు అభిమానం అట్టిది. ప్రమాణాల బలబలాలు, స్వరూప స్వభావాలు ఎరగనితనం నేడు సమాజంలో చిన్నవారి నుండి మేధావులమనుకునే వారి వరకు పాదుకుని ఉంది. ఏ విషయాలనైనా వేటి ద్వారా మనిషి తెలుసుకోగలడో అలా తెలిసిన వాటిలోని వాస్తవావాస్తవాలను విడగొట్టి చూడడమెలానో వాటిని గురించి తెలివి లేకపోవడం, తెలుసుకునే యత్నమైనా చేయకపోవడం నిజంగా శోచనీయంగదా!
ఉదాహరణల రూపంలో చూద్దాం ఈ విషయాన్ని మరింత స్పష్టత కొరకు. ఆయా వ్యక్తుల మాటలో, రచనలో ఈ రోజు మనకు ఆయా విషయాలను గురించి తెలుసుకునేందుకు ఉపకరణాలవుతున్నాయి కదా. ఫలానా విషయం నీకెలా తెలిసింది అని ఒకణ్ణడిగామనుకోండి. మా గురువుగారు చెప్పారనో, ఆ మహానుభావుని ఉపదేశం వలననో, పలానా గ్రంథం ద్వారాననో చెపితే అది శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమన్న మాట. ఆ విధానం ద్వారా ఏది తెలిసిందంటున్నాడో అది అతనికింకా తెలియవలనే ఉందన్నది అసలు నిజం. ఈనాడు లోకం దీన్ని గ్రహించడం లేదు, అంగీకరించడం లేదు. అందువల్ల ఏమవుతోంది? తెలియకనే తెలిసిందనుకునే భ్రాంత స్థితి ఏర్పడుతోంది. అందువల్ల అతనా విషయం తెలుసుకునే అవకాశాన్ని కూడా చేజేతులా జారవిడచుకుంటున్నాడు. ఇంత ప్రమాదకరమైన ఈ అంశం పట్ల పండిత, పామరుల్నిరువురనూ మేల్కొల్పలేని శోచనీయ పరిస్థితి ఏర్పడి ఉంది సమాజంలో.
దీనికంతటికీ మూలకారణం తెలియడమంటే ఏమిటో, ప్రత్యక్షం ద్వారా తెలిసిన దానికీ, పరోక్ష రూపాలైన అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా తెలిసిందానికి ఉన్న వ్యత్యాసమేమిటో తెలియకపోవడమే. పరోక్ష జ్ఞాన సాధకాల ద్వారా ఏది తెలిసిందనుకుంటున్నామో అది నామ మాత్రపు తెలియడమే. అదింకా తెలియవలసే ఉంది.
ఉదా:-నీవు ఆనంద స్వరూపుడివి-అయినా దుఃఖితుణ్ణి అనుకుంటున్నావు అని ఒక ధోరణి స్వామి చెప్పారనుకోండి. శ్రోత అది విని అర్ధమైందంటున్నాడు, తెలిసిందనుకుంటున్నాడు. మరొకరితో వాదులాటకు దిగి నేనానంద స్వరూపుణ్ణే. కాని దుఖించుకుంటున్నాను అని రగడ చేస్తున్నాడు. అదెలాగని తర్కిస్తే మాత్రం మనకింకా అనుభవం లేదుగానీ అది పచ్చి నిజం అంటున్నాడు. ఈనాడు ఆస్తిక ప్రపంచంలో ప్రభంజనంలా సాగుతున్న భావమిది. నాకు తెలీదుగాని అది నిజం అన్న మాట తనను తానే బలహీనపరచుకుంటుంది. నాస్తిక, హేతువాద, కమ్యూనిజ మాది గాగల వర్గాల్లోనూ తెలియని విషయాలపట్ల తెలుసుననే మొండి వైఖరిని అవలంబించడం, పిడివాదాలు సాగించడం జరుగుతూనే ఉన్నా ఆస్తిక వర్గంలో ఇది విశ్వరూపంలో దర్శనమిస్తుంది. తెలిసి మాట్లాడే వాళ్ళూ ఆస్తికుల్లో అత్యల్ప సంఖ్యలోనూ లభించరు. మొండి వైఖరి మాత్రం బండలా కొండలా స్థిరంగా ఉంటుంది. గ్రంథం ప్రమాణం అన్న భావన వారిని జిజ్ఞాసువుల్ని కానివ్వదు. వారిని జిజ్ఞాసువులుగా మార్చుదాం అనుకునే వారి యత్నాలను కొనసాగనివ్వదు. పుస్తక జ్ఞానం, పుస్తక జ్ఞానం, పుస్తక జ్ఞానం. ఇదే ఈనాడు జ్ఞాన రూపంలో విలయ తాండవం చేస్తోంది. వివేకాన్ని, యోచననూ అపమార్గం పట్టిస్తోంది.
సంపుటి: 3 జూన్ 1993 సంచిక-6
జిజ్ఞాసువులైన మిత్రులారా!
ఏప్రియల్ సంచికలోని ప్రమాణ వివేచనను మరొక్కసారి చదివిన పిదప ఈ సంచిక పరిశీలించడం మొదలెట్టండి. ఎందుకంటే శబ్ద పమాణానికి సంబంధించిన అనేక అమూల్యనియమాలు తెలిపానక్కడ. అవి అవగాహన చేసికొంటే తప్ప ఈ ప్రమాణాన్ని గూర్చి తెలుసుకునేటప్పుడు ఎదురుపడే ప్రమాదాల్ని అధిగమించడం సాధ్యపడదు. ఇప్పటికే దానిని క్షుణ్ణంగా చదివివుంటే ఒక సారి గుర్తు చేసుకోండి.
ఆప్తోపదేశం శబ్దమని సాంప్రదాయకుల అభిప్రాయం. ఈ ఆప్తశబ్దం చక్కగానూ, జాగ్రత్తగానూ విచారించవలసి వుంది. “ఆప్తస్తు యధార్ధ వక్తాః” యదార్ధాన్ని చెప్పేవాడు ఆప్తుడు, నిర్భ్రాంతుడు, స్వార్ధరహితుడు ఆప్తుడని మరో మాట. ఆప్త పదార్థ నిర్వచనాన్ని స్వరూపాన్ని తెలిపేటంతవరకు నిక్కచ్చిగానే వ్యవహరించారు ప్రాచీనులు. ఈ ఆప్త పదార్థ లక్షణాన్ని ప్రతిపాదించినవారు ఆనాడు దీనిని ఎలా అన్వయించుకున్నారోగాని ఈనాడది రక రకాల వ్యక్తుల పాలబడి చింకి చాప వలె అయిపోయింది. ప్రతివేషధారి ఆప్తుడై సమాజంలో పదిమందికో, మరికొంత మందికో గురువై కూర్చున్నాడు. యదార్ధంగా, వైజ్ఞానికాంశాలపట్ల శాస్త్రం ఆప్త వాక్యం. శాస్త్రజ్ఞుడు (శాస్త్రీయ పంధా నుండి ప్రతిపాదన చేయువాడు) ఆయా వ్యక్తులను దృష్టినిడుకొనిగాక విషయాల దృష్టి నుండి ఆయా విషయాలను గమనించి ప్రకటించువాడు. అట్టి వాడు ఆప్తుడనటానికి యోగ్యుడు. ఎందు కనగా విజ్ఞాన శాస్త్రాల లక్ష్యం ఉన్నదేమిటో, తెలుస్తున్నదేమిటో గమనించి చెప్పడమే గనుక. అపైన దానికి రాగద్వేషా లంటూ వుండవు. అదలావుంచి, ఈ శబ్ద ప్రమాణాన్ని గురించి మరొక నిప్పులాంటి నిజాన్ని చెపుతాను. నిదానంగా అవగాహన చేసికొని జీర్ణించుకోండి దాన్ని. శాస్త్ర ప్రతిపాదితాంశాలకు ఆధారం ఏమైవుంటుంది? ప్రత్యక్ష ప్రయోగ ఫలితాలో, హేతుబద్ధ యోచనో అవాలి గదా? ఈ రెండూ కాక (ఈ ఆధారాలు లేక) శాస్త్రం ఎలా ఏర్పడుతుందసలు? (నా అభిప్రాయం మరో మార్గం లేదని. వుందనే పక్షీయులెవరైనా వుంటే స్పందించండి. మేలుకొలుపులో చర్చనీయాంశంగా కొనసాగిద్దాం దాన్ని. ముగింపు ఇరుపక్షాలు స్వీకరించగలగాలి). మనకు, లోకానికెవరు ఆప్తుడెవడు కాగలడు? వైజ్ఞానికుడు ఆప్తుడు కాగలడా? కాగలడంటే ఎందుకో, ఏలాగో ఆలోచించాలి. ఒకవేళ అప్తుడవుతాడన్నా అతడు చెప్పినదానిని అంగీకరించడo వల్ల మనకు దాని జ్ఞానం కలిగినట్టా?అలా కలుగుతుందా? ఇదీ పరిశీలించ వలసిన అంశమేకదా? ఆప్త వాక్యం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుందంటే ఆపై దానిని గూర్చి తెలుసుకోవలసిన పని లేదని అర్ధం. వస్తు జ్ఞానం కలుగలేదంటే మరి తెలిసిందేమిటనేదన్నా రూఢిగా చెప్పగలగాలి. శబ్ద ప్రమాణ స్వరూప స్వభావాల్ని తెలుసుకునేందుకు చేసే విశ్లేషణలో ఇదొక పక్షం మాత్రమే. మరో పక్షముందీ విషయంలో, ఆప్తుడంటే యదార్థవక్త అనుకున్నాం గదా! ఈ యదార్థ వక్తృత్వం అతని నిజాయితీకి సంబంధించి వుంటుందా! నా ప్రశ్న అర్ధమైందనుకుంటాను. దీనినే మరొకరకంగా చెబుతాను. సులభంగా వుందేమో ఆలోచించండి. తనకు తెలిసింది తెలిసినట్లు చెప్పేవాడొకడు. ఉన్నదే తెలుసుకుని చెప్పేవాడు మరొకడు. ఇందులో ఆప్తుడెవరు? ఎందుకిలా విశ్లేషించవలసి వచ్చింది? అని కొందరికైనా సందేహం రావచ్చు.
మానవ స్వభావాన్ని అర్ధం చేసికోగలిగితే నిజం తెలిసే అబద్ధం చెప్పేవాడు (నిజాయతీ లేనివాడు), నిజాయితీ వుండి నిజం తెలియని వాడూ వుండవచ్చని తెలుస్తూంది. అలానే ప్రతి మోసగాడు ప్రతిసారీ, అబద్ధమే చెపుతాడు, నిజం ఎప్పుడూ చెప్పడు అనడం సబబుకాదు కదా! మరీ నిజాయితీ కలవాడైనా ఎప్పుడూ అబద్ధమాడ డనిగాని, పొరపడడని (భ్రమపడడని)గానీ ఎలా చెప్పగలం? ఇంత అనిశ్చిత స్థితి వుంది. ఆప్తుణ్ణి నిర్ణయించడానికి దారిన పోయే వాణ్ణి అడిగామనుకోండి ఏదైనా సమాచారాన్ని గురించి. తెలిస్తే చెపుతాడు. లేదంటే తెలియదంటాడు. మరి ఆ విషయంలో అతడు ఆప్తుడైనట్లా? కాదా? ఏమీ చెపుతున్నానో తెలుస్తోంది కదా? ఈ క్రింది ఆంశాలను గమనించండి.
- తన పర అని వ్యక్తులపై దృష్టిలేక విషయావగాహనే లక్ష్యంగా కలిగి వైజ్ఞానిక పద్ధతిలో ఆయా అంశాలను చెప్పినవాడు లేక రచన చేసిన వాడు ఆప్తుడౌతాడు. అతడు చెప్పింది వినదగిన మాట అవుతుంది. ఆయినా అతడి నిజాయితీని పరీక్షించుకోవలసిన పనిలేనప్పటికి అతడు చెప్పింది అసత్యమయ్యే అవకాశం లేకపోలేదు. పరీక్షించుకోవలసిన బాధ్యత గ్రహించే వానిపైనే వుందనేది ముఖ్య విషయము.
- వ్యక్తి నిజాయితీ మీద ఆధారపడి అతడు చెప్పేది వాస్తవమనో, అవాస్తవమనో నిర్ణయించడం అన్ని వేళలా సరైనదే ననడం కుదరదు. అలానే మోసగాని ప్రతిమాట అసత్యమనడము కుదరదు.
- ఇంతా చేసి అతడు ఆప్తుడైనా అతడు చెప్పింది వాస్తవమే అయినా వినడం ద్వారానే పదార్థం బోధ జరుగుతుందడం వీలు కాదు. ఏది గ్రహించాలనుకున్నామో అది వినడం ద్వారా (విన్న పిదప కూడ) పరోక్ష రూపంలోనే వుంటుంది.
- యదార్ధ వకృత్వాన్ని బట్టి ఆప్తుడనాలా? ఆప్తుడు చెప్పింది గనుక నిజమనాలా! అని విచారిస్తే రెండో పక్షం ప్రమాద భూయిష్టమైనది. మరి మొదటి పక్షమో? అతని మాట నిజమని తెలిసిన తరువాతగాని అతణ్ణి ఆప్తుడనడం సాధ్యపడదు. మరి ఆప్తుణ్ణి, ఆప్తవ్యాకాన్ని నిర్ణయించడమెలా?
- శాస్త్రం ప్రత్యక్షానుమాన ప్రమాణాల మీద ఆధారపడి వుంటుంది కనుక, ప్రత్యక్షానుమానాలకు శాస్త్రం ఆధారం కాకూడదు (నిదానించి దీనినర్ధం చేసికోండి)
ఇంతా చేసి భాష స్వరూప స్వభావాలనుబట్టి పదజ్ఞానమూ, పదార్థ జ్ఞానమూ, పదపదార్ధ సంబంధ జ్ఞానము లేనివారికి శాస్త్రోక్త వచనాలేమి అర్ధంకావు, కనుక శబ్ధ ప్రమాణాన్ని అవగాహన చేసికొనగోరువారు పై అంశాలనూ ముందు ముందు చెప్పబోవు వాటిల్లోని తేడాలనూ తెలుసుకొని వుండడం తప్పనిసరి. అవి 1.పదం 2.పదార్థం 3.పర్యాయపదం 4.నిర్వచనం (లక్షణం), 5.వివరణ 6.ఉపమానం, 7.ఉదాహరణ, 8.నిర్ధారణ అన్న ఎనిమిది పదార్ధాల స్వరూప స్వభావాలను తెలుసుకున్న పిదప పదం వినడం లేక చదవడంతో ప్రారంభించి నిర్ధారణ వద్ద ముగించాలి అధ్యయనం. ఈ పదార్థాన్ని తెలుపడం రెండు రకాలు 1)అనుభవాన్నివ్వడం, 2)లక్షణాన్ని చెప్పడం. మొదటిది అందరకూ తెలిసినదే. అనుభవాన్నీ తెలుపమంటే ఎలాగండీ, అనుభవాన్ని కలిగించందే చెబితే తెలుస్తుందా అని అందరూ అంటూనే వుంటారు. ఉదా: తీపి అంటే చెప్పండి అని ఎవరైనా అడిగితే, “ఎలా చెపుతామయ్యా, రుచి చూపించాల్సిందే గాని” అని అంటాము గదా! మరైతే ఈ అనుభవాన్నివ్వడమంటే శబ్ద ప్రమాణం లోనికి రాదు కదా? అది ప్రత్యక్ష విషయమైపోతుంది.
శబ్దప్రమాణమైతేనో చెప్పడంద్వారా తెలుపడమాయె. ఎలా ఈ చిక్కు విప్పడం? పదాలు చెప్పగలం పదసముదాయ రూపంగా వాక్యాలు చెప్పగలం. పదార్ధం తెలుపడమెలా?పదం తెలిస్తే పదార్ధం తెలిసినట్లు కాదన్న కనీస ఇంగితం కూడా కోల్పోయి వుందీనాడు సమాజం, అసలు ఇరువురి మధ్య భాష ఎప్పుడు సక్రమంగా పని చేస్తుంది? సమాన సంకేతాలకు సమానార్ధాలు (సమాన సంకేతులు) యిరవురూ కలిగివున్నప్పుడు. లేనప్పుడు ఆ ఇరువురి మధ్య భాష పనిచేయదు. కనుక వక్త భావము శ్రోతకు చేరదు. ఒక ప్రముఖ సిద్ధాంత ప్రవర్తకుడైన శంకరాచార్యుల వారి రచనగా చూపబడుతున్న, ‘వివేక చూడామణి’ అన్న గ్రంధంలో, ఒక శ్లోకం వుంది, ఈ సంధర్భానికి సంబంధించి,.
అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్ర ధీతిస్తు నిష్పలాః
విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్ర ధీతిస్తు నిష్పలాః
పదార్ధం (విషయం) తెలియని వానికి శాస్త్ర బుద్ధివల్ల ప్రయోజనం ఏమీ లేదు. విషయం తెలిసిన వానికి శాస్త్రంవల్ల ఒరిగేదేమీ లేదు అనీ శ్లోకార్ధం. ఈ శ్లోకాన్ని బట్టి రచయితకు భాషా స్వరూపం చక్కగా తెలిసినట్లు, శబ్ద ప్రమాణం ఎక్కడ పనిచేసేది, ఎక్కడ ఆగి ఆగిపోయేది క్షుణంగా గ్రహింపయినట్లు అనిపిస్తోంది. మనకు అయితే ఆ సాంప్రదా యానుయాయులు దీనినెలా గ్రహిస్తారో, ఆపై శాస్త్రం ప్రమాణమని ఎలా చెబుతారో చూడవలసివుంది.
భాష గురించి మరి కొంత చెబితేగాని జిజ్ఞాసువులకీ శబ్ద ప్రమాణాన్ని (దాని పరిమితులను) గ్రహించే సౌలభ్యం ఏర్పడదు. భాషంటే పదముల సముదాయమే కదా? వర్ణముల సముదాయంగా మనమీరోజు చూస్తున్నప్పటికీ మొదట్లో వర్ణసముదాయం లేదు. ఇది వికసిత (సంస్కృత) రూపం. కాలక్రమంలో ఏర్పడ్డది మాత్రమే. మనిషి తనకు కలిగిన అనుభవాలను గుర్తుంచుకుంటున్నాడు. ఆయా అనుభవాలకు తానేర్పరచుకున్న గుర్తులే భాషంటే అంటున్నామన్నమాట. ఇంత వరకు నిలచి, ఒక సారి ఆలోచించండి. అర్ధమైందనుకుంటే సరిగా వుందో లేదో చూడండి. సందేహాలుంటే అడగండి.
ఈ అనుభవ-సంకేతాలన్నవి ప్రధమంలో ఎలా ఏర్పడివుంటాయో వూహించండి. అప్పటికి లిపి లేదు. దాని ముందటి రూపమైన క్రమబద్ధమైన శబ్దాలు లేవు. మరేమో అనుభవాలు ఏర్పడుతున్నాయి. వాటి తాలూకు గుర్తులు (అనుభవ ముద్రలు) స్మృతిలో ఎలా నిలిచివుండడానికి వీలుందో అదే భాష ప్రథమ రూపం. ఆ రూపం మొదట్లో యథాతథ ముద్రలుగా మాత్రమే ఉండే వీలుంది. కనుకనే ఈనాటి మానవుడు తన భావాన్ని వ్యక్తపరచడానికి ఆకృతుల్నే వ్యక్తీకరించేవాడు. సౌజ్ఞలు చేసేవాడు. కాలక్రమంలో అనేక పరిస్థితులు భాషారూపాలు అనేకం రావడానికి తోడ్పడ్డాయి. భాష శబ్ద రూపాన్ని సంతరించుకోవడానికి ప్రధాన కారణం దూరానవున్న ఒకడికి తనలో కలుగుతున్న భావాన్ని చెప్పవలసి రావడం అయ్యుండాలి. అవతలివాడు తనని గమనించడం లేదు. తానేమో వాడిని హెచ్చరించ వలసివుంది. అలాటి స్థితిలో ఏర్పడిందే శబ్దరూప సంకేతం. కనుక భాష ప్రధమ రూపం యథాతధముద్ర. దానిని వ్యక్తీకరించడం కూడా సౌజ్ఞల రూపంలోనే. పిదప రకరకాల శబ్దాలు, క్రమంగా ఆ శబ్దాలకు నిశ్చిత రూపాలు ఏర్పడ్డాయి. దానినే లిపి అంటున్నామీనాడు. అవసరాన్ని బట్టి ఆ లిపికూడ అనేక మార్పులకు లోనై, షార్ట్ హాండు, కంప్యూటర్ కోడ్ వంటి వికసిత రూపాలేర్పడ్డాయి. ముందు ముందు ఇప్పటికి మనం ఊహించని మరి కొన్ని రూపాలు ఏర్పడవచ్చు అవసరాన్నిబట్టి. సంక్షిప్తంగా భాష పుట్టుపూర్వోత్తరాలివే. విసుగనిపిస్తున్నా మళ్ళా ఒక్కసారి తిరిగి చూచుకోండి. పై నా మాటలలో అనౌచిత్యంగాని అస్పష్టతగానీ ఉంటే స్పందనకు వ్రాయండి. మీకు నాకు నలుగురికి ఉపయోగపడుతుంది.
భాషాపదాలు ఈశ్వర ప్రదానములని అంటారు సాంప్రదాయకులు. ఈశబ్దానికి అర్ధమిది అన్నది ఈశ్వరుడు కల్పించాడనీ. ‘ఈశ్వర సంకేతః శక్తిః’ వారి విశ్వాసం. వైజ్ఞానిక పంథా మాత్రం పైన నేను చెప్పేందే. లోకంలో అనేక భాష లుండడమూ, ఆస్తిక మార్గీయులనబడే వాళ్ళలోనూ ఈశ్వర స్వరూప స్వభావాలు వారివారి ప్రామాణిక గ్రంథాల ననుసరించే వేరు వేరుగా వుండడమూ, వారి వారి ఈశ్వరుడు మాట్లాడిన భాషారూపమూ వేరువేరుగా ఉండడమూ నే చెప్పిన మాటలను రుజువు పరుస్తున్నాయి. ఉదాహరణకు వైదికులు సంస్కృతం దేవభాష అంటే క్రైస్తవులు, ముస్లింలు హీబ్రూ అంటారు. భాషా శాస్త్రం కూడ ప్రపంచ భాషలన్నీటికీ ఒకే మాతృకను అంగీకరించలేక పోతోంది, పరిశోధనలాధారంగా తీసుకుంటే మాత్రం. సరే.
అనుభవ సంకేతరూపం భాష అనుకున్నాం కదా. ఆ సంకేతాలనే పదాలు అంటాము. అంటే భాషలో వున్న ప్రతీ మాటా ఒక అనుభవాన్ని సూచిస్తుందన్న మాట. ఆ అనుభవాన్ని దాని కాధారంగా వస్తువేదైనా ఉంటే దాన్ని ‘అర్ధము’ అంటారు. పదార్ధమంటే అర్ధమైందనుకుంటాను. ఒక పదం దేనికి గుర్తుగా (అనగా అనుభవానికి గానీ, అనుభవాన్నిచ్చే దానికిగానీ) ఏర్పడిందో దానిని ఆ పదార్ధం అంటాము. పదస్య అర్ధః పదార్ధః. అంతేగాని పదార్ధమంటే ఘన, ద్రవ, వాయు స్థితులలో వుండే ద్రవ్యం (Material) అని అర్ధం కాదు. ఆ పదం-ఆ శబ్దం దేని తెలుపుతుందో అది ఆ పదార్థానికర్ధం (Meaning) పదార్ధం అని గ్రహించాలి. ఇంత వరకు తెలిస్తే ఇప్పుడొక సాధారణీకరణాన్ని సాధించ వచ్చు. అర్థయుక్త శబ్దం పదం. అర్ధం అనుభవంలో లేక పదం ద్వారా పదార్ధం తెలియడం అసాధ్యం. భాషా పరంగా ఇది అత్యంత కీలకమైన విషయం. ఇక్కడ స్పష్టత లేకపోతే శబ్ద ప్రమాణ పరిధుల్ని వీక్షించడం కష్టం. ఈ నియమాన్ని గుర్తించక చేసే సిద్ధాంత రాద్ధాంతాలన్నీ దండగమారి పనులు మాత్రమే. పదార్ధ జ్ఞానంలేని ఇరువురు నిర్విరామంగా పదార్థ సత్యాసత్యాల గురించి వాదులాడుకుంటున్నారన్నమాట. ఇదెంతటి అవివేకమో తెలిస్తే ఈనాటి పాండితీ ప్రకర్ష రూపాలైన చర్చలన్నీ వాస్తవంగా ఏపాటి విలువ కలవో బోధపడుతుంది. విజ్ఞానపరంగా ఎంతో వికసించాలనుకుంటున్న ఈ నాటి మేధావి వర్గం కంటే ఈ విషయంలో వెనుకటి మేధావులు ఎంతో వివేకాన్ని, సంయమనాన్ని ప్రదర్శించారీ విషయంలో. వారి ప్రకారం- “లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిః నతు ప్రతిజ్ఞామాత్రేణ” అన్న సార్వత్రిక నియమాన్ని స్థిరపరచారు పరీక్షకుగాను. లక్షణం (ఒకదాని స్వరూప స్వభావాలను నిర్ధారించగల అసాధారణ ధర్మం) నిర్ణయించకుండాను ప్రమాణాన్ని చూపి దానిని నిర్ధారించగల అసాధారణ ధర్మం) నిర్ణయించ కుండాను, ప్రమాణాన్ని చూపి దానిని నిర్ధారించకుండాను, కేవలం మాట చెప్పటం ద్వారా వస్తువు సిద్ధించదు అని పై సూత్రాభిప్రాయం. మరి ఈనాడో ఈ లక్షణ ప్రమాణముల గురిcచి తగినంత అవగాహన ఉన్న వారెందరు? ఉందనుకున్నా రాగద్వేషాలను విడచి వాటిని వాటి వాటి క్షేత్రాల్లో (ఏ ప్రమాణం ఎక్కడ పనిచేస్తుందో, దానివల్ల కలిగే జ్ఞానస్థాయి ఏమిటో తెలిసి) సరిగ ఉపయోగిస్తున్నవారెందరు? యధార్ధంగా చెప్పాలంటే ఈ అంశంలో సమాజం విచారించ దగ్గ దుస్థితిలో వుందీనాడు.
Note:-మేము కలసి చర్చించిన సిద్ధాంత ప్రచారకులలోనూ, “ఎందుకొచ్చిన గొడవండి ఈ ప్రమాణాలు, పదార్ధాలు” అన్న మాటే తరచుగా వ్యక్తమయింది. ఆశ్చర్యకరమైన విషయమే కదా ఇది.
జిజ్ఞాస మిత్రులారా! మీరు మాత్రం ప్రమాణ, పదార్ధ విచారణ పట్ల అలసులు కాకండి. నిర్లక్ష్యం చూపకండి. ఎవరెన్ని చెప్పినా ఈ రెంటి ద్వారానే జ్ఞేయం, జ్ఞాతమవుతుంది. మరో మార్గం లేదు. నిజమైన జిజ్ఞాసు వుంటే కష్టమూ, కాలహరణమూ ఐనప్పటికీ దీనియందు ప్రయత్నపరులై జ్ఞానార్జనకు, అసలైన వేదికను కల్పించుకోండి.
సాంప్రదాయకులలో అనుభవము, జ్ఞానము పర్యాయపదాలుగా వాడబడ్డాయి, అయినా రెంటిని వేరుగా చూడడంవల్ల ఈ జ్ఞాన ప్రక్రియలను గురించి మరింత స్పష్టత ఏర్పడగలదు.
జిజ్ఞాస క్షేత్రం ఎక్కడైనా రెండు భాగాలు మాత్రమే కలిగివుంటుంది ప్రమాణాలు, ప్రమేయాలు అని. ఈ ప్రమేయాలనే పదార్థాలంటాము. తెలుసుకొనగోరే, తెలుసుకుంటుండే మనకు కొన్ని పరికరాలు, పద్దతుల ద్వారా కొన్ని పదార్ధాలను గురించిన జ్ఞానం కలుగుతుంది. పారిభాషికంగా చెప్పాలంటే, ప్రమాతకు (జ్ఞాతకు) ప్రమాణాల ద్వారా (జ్ఞాన సాధకాల ద్వారా) ప్రమేయాలను గురించిన ప్రమ (జ్ఞానం) కలుగుతుంది. క్షుణ్ణంగా పరికించండి. మరోమారు మననం చేయండి, అర్థమైతే మాత్రం ఈ నిర్ణయానికి వచ్చి వుండాలి. మీరు ప్రమాణాలు లేకుండా పదార్థాలు తెలియబడవు. ఇది సార్వత్రిక నియమం అని. జ్ఞానసాధకం (ప్రమాణం) లేకుండా కలిగిన దనుకునే జ్ఞానం కన్నులులేని వానికి కలుగు రూపజ్ఞానం వంటిది. ముక్కులేని వానికి కలుగు గంధ జ్ఞానం వంటిది. అట్టిది తెలిసిందన్న భ్రాంతిని కలిగిస్తుందే గాని తెలియ వలసింది తెలిసిలేదింకా.
“తెలియకనే తెలిసిందనుకునే వానికంటే, తెలియవలసిందింకా తెలియలేదు” అని తెలుసుకున్నవాడు ఎక్కువ తెలిసినవాడు. వాడింకా తెలుసుకునే అవకాశం పోగొట్టుకోలేదు. మరి మొదటివాడు చేజేతులా తెలుసుకునే అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు.
శబ్ధప్రమాణాన్ని గురించి నేను చెప్పవలసినదంతా చెప్పాను. మీరు యోచించ వలసిందే మిగిలిందిక. మీ యోచనలూ, స్పందనలూ, సందేహాలు ఒకసారి చూసుకున్న పిదప కొనసాగించ వలసిన ‘పదార్ధ వివేచన’ ప్రారంభిస్తాను. ప్రమాణాలపై మీ అవగాహనలను తెలుపండి. జూలై సమావేశాల పిదప పదార్ధ వివేచన మొదలెట్టుకుందాం. వీలుంటే తదుపరి సంచికలో పదార్ధ వివేచనకు భూమిక నేర్పాటు చేస్తాను
సంపుటి 3. సంచిక-7 జూలై 1993
శబ్దప్రమాణాన్ని అర్థం చేసికునేందుకు యత్నిస్తున్నాంకదూ! గత సంచిక లోని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు సాగండిక. శబ్ధప్రమాణ క్షేత్రాన్ని, దాని పరిమితుల్ని మనస్సుకు పట్టించుకోవాలంటే ముందుగా భాష స్వరూప స్వభావాల్ని తెలిసికోవలసి ఉంటుంది.
ఇంద్రియార్ధ సన్నికర్షననుసరించి పుట్టింది అనుభవం. అర్ధాన్ని విషయమనుకొంటే ప్రతిబింబం అనుభవం. ఇంద్రియం ద్వారా మేధస్సులోనికి చేరినది అని అర్థం చెప్పుకోవచ్చు. లోపలికి చేరిన విషయాన్నే బుద్ధిగుర్తిస్తుంది, దానిని యథాతథంగా గుర్తుంచుకుంటుంది. అది స్మృతిలో ఉంటుందన్నమాట. స్మృతి సంస్కారాల (సంకేతాల, ముద్రల) రూపంలో వుంటుంది. అదే భాష ప్రధమ రూపం. భాషా పరిణామ క్రమంలో భాష ప్రధమరూపమైన యధాతధ ముద్రలకు ఆయా ప్రాంతాల, దేశాల మనుష్యులు ఏర్పరచుకొన్న వివిధ రీతులు. అవే భిన్న భాషలంటే అర్థమవుతుందనుకుంటా నేచెపుతున్నది. ఎందుకంటే ఇది అవగాహన (జీర్ణం) కాకుండే శబ్ద ప్రమాణాన్ని అర్ధం చేసుకోవడమే కష్టమవుతుంది. ఏర్పడ్డ లేక ఏర్పరచుకున్న సంకేతాల ద్వారా సూచింపబడే విషయాన్ని అర్థం అంటాము. సౌలభ్యం కోసం సంకేతం ద్వారా తెలియడేదాన్ని సంకేతి (సంకేతము కలది) అని వ్యవహరించుకుందాం. శబ్దం స్మృతిలో ఉన్న అర్ధాన్ని (సంకేతిని) స్మరింప చేస్తుందేగాని ఇంకే విధంగాను ప్రయోజనకారి కాదు. శబ్ధం (భాష) ప్రమాణం కావాలంటే వక్తకూ శ్రోతకూ సమాన సంకేతాలు, సంకేతులు ఉండడం తప్పనిసరి. పదాలూ, పదార్థాలు కూడా ఇరువురికి సమంగా తెలిసినప్పుడే భాష జ్ఞానసాధకం ( ప్రమాణం) కాగలుగుతుంది. అట్టి సందర్భం కుదరనపుడు జరిగేదంతా తెలియకనే తెలిసిందనుకోవడమే.
పదము, పదార్థము, పద్ధపదార్థ సంబంధములను గురించిన జ్ఞానం శ్రోతకు కూడా రచయితకూ లేక వక్తకూ వున్నంత ఉండాలన్నమాట. అర్థాలను అనుభవంద్వారా ఇరువురూ ఓకే విధంగా గుర్తించి వున్నా శబ్దాలు (సంకేతాలు) వేరైతే వారిరువురు వేరు వేరు భాషల వాళ్ళని అర్ధం. పదాలు(శబ్దాలు) ఒకటిగా వుండి అర్ధాలు మారినా వేరు భాషల వాళ్ళనే అంటాను నేను. మరి మీరేమంటారు?
"పదపదార్థ సంబంధ జ్ఞానం లేనివారికి వాక్యార్థ జ్ఞానం కలుగదు" అన్నది వెనకటి వాళ్ళు గమనించిన అంశము. వారు సరిగా గమనించారా లేదా! ఆలోచించి చూడండి.
Note:-ఇప్పుడు శాస్త్రం ప్రమాణం అనేవాళ్ళూ-వారికి ఏ శాస్త్రం ప్రమాణమో అందులోని పదాల ద్వారా వారికి తెలియని పదార్ధం ఏది తెలియబడిందో, అదెలా నిజమని నిర్ణయానికొచ్బారో? ఇది తెలిసి (ఇంత తెలిసి) ఫలానిది ప్రమాణ మంటే మాకభ్యంతరం ఏమీ లేదు. ఎవ్వరికీ ఉండఖ్ఖరలేదు కూడా. శబ్దం ప్రమాణమనే వారిపైనున్న పెద్దబాధ్యత, పెనుభారం కూడా ఇది. అయినా నిజం నిజమేకదా! అదీ గాక శాస్త్రం ప్రమాణమనే వాళ్ళు వారికొరకుగాని, వారిని వ్యతిరేకించే వారిని అదుపు చేయడానికిగాని ఒక విషయం రూఢి చేసుకోవలసి వుంటుంది. ఒక రచన లేక మాట (అది ఏ రకమైన రచనైనా గానీండి, ఏ కోవకు చెందిన వారి రచనైనాగానీండి) ఎప్పుడు శాస్త్రంగా స్వీకరించదగినదౌతుంది? ప్రామాణికతను సంతరించుకుంటుంది? శాస్త్రం ప్రమాణమేననుకున్నా ఏది శాస్త్రమో, ఏది కాదో ముందు తెలియాలి కదా! నీకిష్టమైంది నీకు శాస్త్రం నాకు నచ్చింది నాకు శాస్త్రం అంటారూ! అప్పుడేం జరుగుతుందో తెలుసా? అసలుకే మోసం వస్తుంది. ప్రతి ఒక్క రచననూ తదిరములైన రచనలు అశాస్త్రీయం లేక అసచ్చాశాస్త్రం అంటున్నాయన్నమాట. ఇది ఆత్మహత్యా సదృశం కదా! ఆవేశపడక నిదానంగా యోచించండి, ఏ రచననైనా ఇది శాస్త్రంగా ఎపుడంగీకరించగలం, ఎందుకంగీకరించాలి అన్న ప్రశ్నకు సరియైన సమాధానం మన దగ్గరుండి తీరాలి. లేకుంటే కేవలం విలువలేని మాటే అవుతుందది.
ఇంతకీ ప్రమాణాల ద్వారా మనిషి పొందేదేమిటి? అందువల్ల ప్రయోజనమేమిటి? జ్ఞానసాధకం ప్రమాణమనుకున్నాము కదా! ప్రమాణం ద్వారా జ్ఞానము కలుగుతుందన్నమాట. దేనిజ్ఞానం కలుగుతుందో దానిని ప్రమేయం (పదార్థం)ఆంటారు. ప్రమాణాల ద్వారా మనకు కగేది పదార్ధ జ్ఞానమే. అందుకే సర్వ సిద్ధాంతాలూ, ప్రమాణాలకూ - వాటి ద్వారా తెయబడే పదార్థాలకూ సంబంధించే (లోబడే) ఉంటాయి. ప్రమాణ రహితమైన సిద్ధాంతంగానీ, పదార్థ రహితమైన జ్ఞానం కాని ఉండవు. ఇప్పటికి సంక్షేపంగానైనా ప్రమాణాలను గురించి పరిశీలన సాగించాము. తరువాతిదైన పదార్థాలను గురించి పరిశీలించనున్నాము. అందుకు ముందుగా పదార్థ వివేచనకు ప్రాతిపదికలుగా నుండగల 8 పదాలను, వాటి అర్థాలను నిర్దిష్టంగా గమనించాల్సిఉంటుంది. ఆ పదాలు గతసంచికలో సూచించాను. గుర్తు చేసుకోండి.
1.పదం:- అనుభవ సంకేతం. అర్ధయుక్త శబ్దం.
2.పదార్ధం:- దేనిని గ్రహించి లేక తెలిసికుని గుర్తు నేర్పరచుకున్నామో అది అనుభవం. కనుక ఆ సంకేతంచే చూపబడుతున్న అనుభవం ఆ పదానికి(సంకేతానికి) అర్ధమన్న మాట. అదే పదార్ధమంటే. అయితే ఈ పదార్థాలు ముఖ్యంగా రెండు రకాలు - భౌతిక పదార్థాలు, భావ పదార్దాలు అని. అందుకనే భౌతికపదార్ధాల విషయంలో అనుభవానికి, అనుభవాన్నిచ్చేదానికీ కూడ అదే పదం సరిపోతుంది. అట్టి వాటి విషయంలో అనుభవమూ పదార్ధమే, అనుభవానికాధారమైన ఇంద్రియానికందే విషయమూ పదార్ధమే. ఈ తరహా పదార్థాలను ఈ క్రమంలో చెప్పుకోవచ్చు. పద ముంటుంది-పదానికి చెందిన అనుభవముంటుంది. ఇక భావ పదార్ధాల తీరు ఇట్లా ఉంటుంది. పదముంటుంది-పదానికి సంబందించిన అనుభవముంటుంది-ఆ అనుభవానికి పెట్టిన పదంతోనే తెలియదగిన (అనుభవానికాధారమైన) పదార్థం ఉండదు. అర్ధమౌతుందనుకుంటాను. అయినా మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించి వంటబట్టించుకోండీ అంశాన్ని. పదార్థాన్నర్ధం చేసికొనేందుకు అది ఆధారనీయం. ఇంతవరకూ తెలుస్తుందనుకుంటే పదం తెలియడానికి పదార్థం తెలియడానికి ఉన్న తేడా ఏమిటో స్పష్టమై వుండాలి. స్పష్టమైతే భాష పదసముదాయమేగాని పదార్ధ సముదాయం కాదని తెలుస్తుంది. మరి గ్రంధాల్లో పదాలు దొరుకుతాయేగాని, పదార్థాలెలా తెలుస్తాయి? శబ్దం ప్రమాణమనేవాళ్ళు ఇక్కడో ప్రశ్నను ఎదుర్కొని సమాధానం చెప్పవలసి ఉంటుంది. మీరూ ఆలోచించండి. అర్ధం అనుభవంలో (స్మృతిలో) లేకనే పదం వింటే పదార్ధం తెలుస్తుందనుకోవడం (పదం వినీ, చదివీ అర్ధం తెలిసిందనుకోవటం) అవివేకం.
3.పర్యాయ పదం:- ఒకే అర్ధాన్నిచ్చే అనేక పదములు పర్యాయ పదములనబడతాయి. పర్యాయ పదం పదార్ధం కాదు. ఎందుకనగా పదం పదార్ధం కాదు కదా! అది ఆ పదార్ధానికి మరొక గుర్తు (సంకేతం) మాత్రమే. పదానికి అర్థము తెలియడమంటే పర్యాయపదం తెలియడం కాదు. పదానికి, పర్యాయపదానికి, పదానికి వున్న తేడా గమనించండి.
4.నిర్వచనం:- పదార్థాలను ప్రమాణాల ద్వారా తెలుసుకుంటామన్నది నిర్వివాదం. తెలిసింది తెలపాలంటే రెండు మార్గాలున్నాయి, 1.అనుభవాన్నిచ్చి 2.భాష ద్వారా (చెప్పడం ద్వారా) అవునా కాదా? అనుభవాన్నిచ్చి అంటే ప్రత్యక్షం ద్వారానని. ఇచ్చట ఎవరికి విరోధం వుండనక్కరలేదు. మరో మార్గం చెప్పడం ద్వారా తెలుపడం, లేదా విని తెలుసుకోవడం. ఒక పదార్ధాన్ని తెలుపడానికి ఏర్పరచుకున్నపదము యొక్క అర్ధాన్ని మొత్తంగా చూపగల కొన్ని తగిన మాటలను ప్రయోగించడం. ఈ మాటలు ఆ పదార్థ లక్షణాన్ని (అసాధారణ ధర్మాన్ని) ప్రకటించగలగాలి. దీనినే లక్షణ నిర్దేశం అంటారు. నిర్వచనమన్న అదే. అయితే సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే-సంపూర్ణార్ధాన్నిచ్చే సంక్షిప్త పద సముదాయం నిర్వచనం (నిశ్శేషేణ ఉక్తవచనం నిర్వచనం).
- వివరణ:- పదార్ధ నిర్దేశం చేసిన పిదప జిజ్ఞాసువుల అవగాహనా సౌలభ్యం కొరకు మరిన్ని మాటలద్వారా లక్షణ రూపాన్ని - వ్యక్తీకరించడాన్నే వివరించడమంటారు. ఇంతవరకు చెప్పిన విషయాన్ని, మననం చేయదగినంత ప్రముఖమైనదిగా గుర్తించారా? గుర్తించినట్లైతే క్రింది. విషయాలు మనస్సుకు తట్టివుండాలి, సరిపోల్చుకుని సరి చూచుకోండి.
- పదంతెలియడమటే పదార్ధం తెలియడం కాదనీ, పదార్ధాన్ని తెలుపడమంటేపర్యాయ పదం చెప్పడం కాదనీ.
- చెప్పడానికి, తెలియజెప్పడానికి ఎంతో తేడా వుందనీ, చెప్పడం తెలియజెప్పడం కాదని. అలానే పదం వినడం అర్ధాన్ని గ్రహించడం కాదనీ
- నిర్వచన రూపంలో చెప్పడమూ, వివరణాత్మకంగా చెప్పడమూ తెలియ జెప్పట మవుతుందనీ, అప్పుడైనా నిర్వచనాది రూపంగా పలికిన వాక్యార్ధం ఆ వాక్యంలోని పదార్థ సంబంధ జ్ఞానం ముందే కలిగియున్న వారికి మాత్రమే-అదీ పరోక్ష రూపంగానే-తెలియబడుతోందనీ,
- శబ్ద ప్రమాణం పద ప్రత్యక్షమూ (సంకేత ప్రత్యక్షమూ) అర్ధ స్మరణ రూపము (సంకేత స్మృతి జన్యమూ) అయినదనీ, ఇంతవరకు మనస్సుకు తట్టినవా? ఇప్పటికైనా అనిపిస్తున్నదా? లేదా?
మిగిలిన ఉపమానోదాహరణ, నిర్ధారణలు, పై సంచికలో ప్రస్తావిస్తాను. ఈ లోపు మీరు వాటినిగురించి ఆలోచించండి. ఉపమాన ఉదాహరణలకున్న వ్యత్యాసమేమిటి? ఉదాహరణ చెప్పడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి? ఉదాహరణ ద్వారా తెలియబడేది గతంలో తెలిసిందా? క్రొత్తగా తెలియవలసి ఉందా? తెలుపాలకున్నదాన్ని ఉదాహరణ ద్వారా తెలుపగల మనుకోవడానికి, తెలుపవలసిన దానికీ ఉదాహరణకూ ఉన్న సంబంధ మేమిటి? ఉదాహరణ స్వరూపమేమిటి? అలానే ఉదాహరణ చెప్పవలసినచోట ఉపమానం చెప్పడంవల్ల కలిగే దేమిటి ఉపమానం వల్ల కలుగుతుందనే జ్ఞానానికి ఉదాహరణ ద్వారా కలుగతుందను కుంటున్న జ్ఞానానికీ మధ్యనున్న తేడాపాడా లేమిటి? ఉదాహరణ కాకున్నా ఉదాహరణగా చూపబడుతున్నవాటి (విషమ దృష్టాంతం) మాటేమిటి? ఇంత పరీక్ష అవసరం ఉపమానం, ఉదాహరణం అన్న పదార్థాల్ని అర్థం చేసుకోవడానికి, అదలా ఉంచి, నిర్వచన పదార్ధాన్ని నిర్వచించుకున్నాం కదా పైన. లక్షణం సలక్షణం ఎప్పుడవుతుందో, కులక్షణం (అసమగ్రమూ అసంభవాదియుతం) ఎప్పుడవుతుండో, లక్షణ పరీక్ష చేయడమెలానో తెలుసుకోవలసిఉంది.
భాషద్వారా పదార్ధాన్ని సిద్ధింపజేయడానికి లక్షణం చెప్పడమొక్కటే మార్గం. ఆ లక్షణం దోష రహితంగా ఉండాలి. “దూషణ త్రయ రహిత ధర్మో లక్షణం” అని సూత్రం. అంటే మూడు దోషాలు లేనిదిగా వుండాలి లక్షణమని. అతివ్యాప్తి,అవ్యాప్తి, అసంభవమని దోషాలు మూడు రకాలు.
- అతివ్యాప్తి: దేనిని తెలియజేయడానికని ప్రత్యేక ధర్మాన్ని లక్షణంగా చెప్పదలచామో అధర్మం మరొక దానియందు వుండరాదు. ఉందనుకోండి అప్పుడేమవుతుంది. మీరు చెప్పిన ధర్మాన్ని బట్టి ధర్మిని (విషయాన్నీ) తెలుసు కోవాలనుకున్నవానికి ఒకటికంటే ఎక్కువ విషయాలు (వస్తువులు) మనస్సుకు స్పురిస్తాయి. అందువల్ల చెప్పదలచుకున్న వాడు తెలిసినవాడు కాదా అనిగానీ, చెప్పదలచుకున్నది అదా, ఇదా అని గానీ సందేహం ఏర్పడుతుందే గానీ ఇథమిద్ధంగా విషయబోధ జరుగదు. లక్షణం లక్ష్యాన్ని అతిచరించడం (వేరే వస్తువును కూడా చూపించడం) వల్ల అనుకున్న వస్తుసిద్ధి జరగదు. కనుకనే చెప్పిన మాటలలో దోషమున్నట్లవుతుంది. ఈ తరహా దోషాన్నే అతివ్యాప్తి అంటారు.
- అవ్యాప్తి: చెప్పిన మాట ద్వారా తెలియజెప్పదలచుకున్న వస్తువులు అన్నిచోట్ల సిద్ధింపక పోవడం అంటే ఆ జాతి వస్తువులన్నిటా అధర్మం గోచరింపక పోవడమన్నమాట. కొన్నిటిలో కనబడుతూనే ఉందన్నమాట. ఎక్కడైనా ఎప్పుడైనా ఆ రకం వస్తువుల్లో ఆ ధర్మం కనబడాలి. అలా అన్నిటా కనబడకుంటే అవ్యాప్తి. ప్రతిసారి వస్తువును పట్టివ్వలేనిది. ఆ వస్తువుకు అసాధారణ ధర్మం ఎలా కాగలదు? అసాధారణ ధర్మం కాని దానిని లక్షణమనడమే ఇక్కడ జరిగిన పొరబాటు. Note: పైన అతివ్యాప్తి అవ్యాప్తులలో ఒక సామాన్యాంశముంది. చెప్పిన ధర్మానికి అసాధారణత లేకపోవడమే అది. అసాధారణ ధర్మాన్నే లక్షణ మనాలికదా మరి. ఇదే వాటిలోని లక్షణ దోషము. ఒకటి ఒకటికంటే ఎక్కువ వాటిని చూపడమూ, మరొకటి ఒక్క దాన్నైనా పూర్తిగా చూపించలేకపోవడమూ జరుగుతోంది.
- అసంభవము: ఇదేమిటో నేను చెప్పేకంటే విచారణ మార్గంలో యోచించడానికి సిద్ధంగా వున్న మీరే. అసంభవమంటే ఏమిటో నిర్వచనరూపంగా చెప్పండి చూద్దాం.
అతివ్యాప్తి నిర్వచనం:- అక్ష్యా లక్ష్యములందునా ధర్మం గోచరించడం
అవ్యాప్తి నిర్వచనం:- లక్ష్యములందైనా కొన్నిటియందు మాత్రమే ఆ ధర్మముండడం,
అసంభవం నిర్వచనం:- మీరు పూర్తి చేయండి (పై సంచికలో మరి కొన్ని పదార్ధాలు.)
No comments:
Post a Comment