Friday, July 9, 2021

జూలై 2021

 

 సంపుటి:7          సంచిక:11                     జూలై 2021 


ప్రమాదపుటంచుల్లో తెలుగు భాష-ఒక పరిశీలన. 

యోచనాశీలురైన పాఠక మిత్రులారా! 'దేశ భాషలందు తెలుగు లెస్స'అన్నది ఒకనాటి మాటగా మిగిలిపోయిందీనాడు. దాంతోపాటే తెలుగు జిలుగుల వెలుగును దర్శించిన పాశ్చాత్య భాషావేత్తలు పలికిన 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'అన్నదీ మరుగున పడిపోయింది. ఎందరో భాషా శాస్త్ర పరిశోధకులు తెలుగు ప్రాచీనతను తెలుగు లిపి ప్రాచీనతను గురించిన చారిత్రక ఆధారాలను వెలికితీసినా, వాటిని పట్టించుకునే నాధుడే లేక పోయాడు. స్వతంత్రం రాకముందున్న పరాయి పాలకులకు ఉన్నపాటి ఇంగితం కూడా ఈనాటి పాలకులకు లేకపోవడం దానికదే ఒక పెను విషాదం. వెనుకటి నాణేలపై అధికారంగా లిఖింపబడిన భాషల్లో తెలుగూ ఉంది. ఆ నాణేలపైన ఆంగ్లము హిందీ తెలుగు మాటలు ఉన్నాయి. అంటే తెలుగుకున్న ప్రాధాన్యతను పరాయి పాలకులున్నూ గుర్తించారన్న మాట. ఆనాటి నాణేలపై ఈ దేశ ప్రజలకు సంబంధించినంత లో రెండు భాషలు వాడారు. దేశమంతటి లో వ్యవహారంలో అవసరమైన రెంటిలో తెలుగు ఒకటన్నమాట. 

తెలుగు మూలాల పైన, దాని ప్రాచీనత పైన, దేశమంతటి లోని అతి ప్రాచీన పుస్తక భాండారాలలోని గ్రంథాలలో తెలుగు లిపి ఉండడానికి సంబంధించిన సాక్షాధారాలెన్నో పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయి. ఇవేవి ఈనాడు తెలుగు భాషకు జీవం పోయలేక పోతున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1) కేంద్రంలో నున్న ప్రభుత్వాలకు హిందీ పట్ల మక్కువ ఎక్కువగా ఉండడం, దాక్షిణాత్య భాషలపై చిన్న చూపు ఉండడం 2 దక్షిణాది రాష్ట్రాలలో అనేక భాషలుండి వేటికవిగా స్థానిక భాషలుగా విడిపోయి ఉండడంతో, అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంలో జరపాల్సిన వ్యవహారాలన్నీ ఆంగ్లము హిందీ భాషలలో తప్పనిసరిగా జరపాల్సి రావడం. కేంద్రంలో ఔతారాహికుల ఆధిపత్యం బలంగా ఉండడంతో హిందీని అన్ని రాష్ట్రాల పైన రుద్దే యత్నాలు పెద్ద ఎత్తున సాగడం, ఇవన్నీ కలసి స్థానిక 

భాషల వినియోగంపై ప్రతికూల వాతావరణం పడింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కొన్ని రాష్ట్రాల, మాతృభాషాభిమానం స్వాభిమానం కలవాళ్ళు ఒకింత ఆలస్యంగానైనా మేల్కొని, స్థానిక అధికార భాషగానూ, వాడుక భాషగానూ బోధనా భాషగా కూడా వారి వారి మాతృభాషలనే ఏర్పరుచుకుని కట్టుదిట్టంగా అమలు చేసుకున్నారు. ఆ రకంగా వారివారి మాతృభాష లకు ఊపిరి పోసి, ఆయుష్షును పెంచుకున్నారు. 

కొన్ని రాష్ట్రాల ప్రజలు మాతృభాష తర్వాతే ఏ భాష అయినా, అది దేశ భాష కానీ, ప్రపంచ భాష కానీ మనలో మనం మాట్లాడుకోవడానికి సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోడానికి మాతృభాష కంటే మించింది లేదని స్వాభిమానంతో వాస్తవ దృష్టితో మాతృభాషను పెంచి పోషించుకుంటూ, అవసరమైన కొత్త పదాలను సృష్టించుకుంటూ 

దానిని వర్తమాన భవిష్యత్ తరాలకు సరిపడిన రీతిలో సుసంపన్నం చేసుకున్నారు. 

చేసుకుంటూనూఉన్నారు. 

ఈ వైఖరికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిన ఒకే ఒక్క జాతి తెలుగుజాతి మాత్రమే. అటు ఆంగ్లాన్ని ఇటు హిందీని కూడా నెత్తిన పెట్టుకొని తెలుగును మాత్రం పక్కన పడేసిన జాతి తెలుగు జాతి ఒక్కటే. ముఖ్యంగా ఇక్కడ ఆంగ్లం తెలుగును కబళించి వేసింది. తెలుగువాడిగా పుట్టినవాడు. వాడు అక్షరాస్యుడైనా, నిరక్షరాస్యుడైన ఇద్దరూ కూడా ఆంగ్ల పదాలను వాడడమే గౌరవసూచికంగా భావించేలా వారి మెదళ్ళు కలుషితమై పోయాయి. ఒక్క తెలుగు వాడు తప్ప ప్రపంచంలో ఎవడూ మాతృభాష మాట్లాడడం చిన్నతనంగా అగౌరవంగా, భావించడు. ఇంకా ఇప్పటికీ లిపిలేని వారూ అతి కొద్దిమంది మాత్రమే మాతృభాషగా కలిగి ఉన్న వారు కూడా, తమలో తాము తమ భాషని మాట్లాడుకోవాలనే భావిస్తారు, ఇష్టపడతారు. అక్కడికదే గొప్పన్నట్లుగా అభిమానంతో ఉంటారు. అలాగే వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన సమూహాలు కూడా, తమ ప్రాంతీయ భాషలో మాట్లాడుకోడానికే ఇష్టపడతారు. ఆయా దేశాల ప్రజలు ఆయా దేశ భాషలలో మాట్లాడుకోవడానికే ఇష్టపడతారు. అది స్వాభిమానానికి చెందిన అంశంగా భావిస్తారు. వీటన్నింటికీ మినహాయింపుగా ఒకే ఒక్క సముదాయం ఉ ంది. అది తెలుగు మాతృభాషగా కలిగివున్న మన సమూహమే. 

చరిత్రకు అందినంతలోనే, సరిపడినంత వినియోగం లేకపోవడం వల్ల గాని, ఇతర భాషలు రుద్ద బడడం వల్ల గానీ అనేక భాషలు కాలగర్భంలో కలిసిపోయినై. అట్టి వాటిలో ఎక్కువ భాషలు అవసరానికి సరిపడినంత మాటల మూటను సమకూర్చుకోలేకపోవడం వల్ల నశించి పోయి ఉండవచ్చు కనుక వాటి మరణానికి కారణాలను మనం అర్ధం చేసుకోగలం. 

కానీ అర్థం కాని విషయం ఏమంటే, అత్యంత విస్తారమైన పదరాశిని కలిగి ఉండి, ఎంతో విస్తారమైన సాహిత్యం ఉండి కూడా మన తెలుగు మరజోన్ముఖంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి? ఇంతటి వినసొంపుగా ఉండే, విడివిడి శబ్దాలు కలిగి ఉన్న భాష మరొకటి ఏదైనా ప్రపంచంలో ఉందా? అయినా దానిని వాడుకోటానికి సిద్ధపడక పోవడాన్ని ఏమనుకోవాలి? స్వాభిమాన రాహిత్యం ఆత్మన్యూనతా భావం ఇవి మన దౌర్భల్యాలు. ఇది చాలదన్నట్లు ఆంగ్ల భాషపై మనకున్న గౌరవం ఈ సందర్భానికి సరిపడే ఒక సంఘటన గుర్తుకొస్తుంది. లక్ష్మణ యతీంద్రులు వారు ఒకసారి తెలుగు వారి స్వభావాన్ని గురించి చెబుతూ నాతో ఒక మాట అన్నారు. ఒక తెలుగు వాడు మరొక తెలుగు వాణ్ణి నీవు సమర్థుడవయ్యా అంటే నీవెవడివోయి నిర్ణయించడానికి నేనొప్పుకోను అంటాడట. అదే మరి ఒక తెల్లదొర నీ వింత అసమర్దుడమేమి టోయ్ అనంటే అయి ఉంటాను, లేకుంటే దొరవారెందుకంటారు? అనంటాడట. ఒకింత అత్యుక్తిగా అనిపిస్తున్నా తెలుగోడి నాడిని పట్టి ఇచ్చే మాటే ఇది. 

ఇక్కడ తెల్లవాడి తుపాకికి ఎదురు గుండె చూపిన సాహసజోదులున్నారన్నమాట వాస్తవమే అయినా, అలాంటివి అరుదైన ఘటనలే. తెలుగు భాష పట్ల తక్కువ భావం ఆంగ్లం పట్ల ఆరాధనాభావం ఉన్నవారైతే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఇది చాలదన్నట్లు ఇక్కడ తిని, ఇక్కడి వారికి వ్యతిరేకంగా పరదేశీయుల తొత్తులుగా పనిచేసే మేధావులు తెలుగు భాషను బలహీనపరచడానికి చేయగలంత చేశారు. చేస్తూ వస్తున్నారు. ఆంగ్లేయులను తమను ఉ ధరించిన వారుగా బహిరంగంగా మాట్లాడుతుండే ఈ రకాన్నంతటినీ దేశద్రోహులు గానో, శిక్షార్హమైన నేరం చేసిన వాళ్ళనుగనో పరిగణించి, అదుపు చేయాల్సిన అవసరం ఉందీనాడు. 

ఏదేమైతేనేమి, సామాన్య ప్రజల నుండి అత్యున్నత విద్యావంతుల వరకు అందరి మనస్సులలో, తెలుగు మాట్లాడడం చిన్నతనం ఆంగ్లం మాట్లాడడం గొప్ప విషయం అన్న భావం దృఢంగా పాతుకుపోయిందీనాడు. వ్యక్తుల మనసులో నుండి ఆ గబ్బును తొలగించకుండా ఇతరేతర మైన ఎన్ని పనులు చేసినా మనం సాధించాలనుకున్న తెలుగును బతికించుకోవడం అన్నది పూర్తి రూపంలో సిద్ధించదు. అందుకు ముందుగా చేయవలసింది తెలుగులో మాట్లాడండి, తెలుగు మాటలుగా ఆంగ్ల పదాలను వాడడం మానండి, అన్న ప్రత్యామ్నాయ భావాన్ని మాటిమాటికి జనం తలకెక్కించాలి. తెలుగును మాట్లాడడం అలవరచాలి. తెంగ్లీష్ (తెలుగింగ్లీషు కలగాపులగపు భాష) వాడడాన్ని మాన్పించాలి. అలా మాట్లాడడానికి సిగ్గుపడేలా విమర్శనాత్మక నానుడులు తయారు చేసి జనం మధ్యలోకి పంపాలి. చక్కటి తెలుగు మాట్లాడడాన్ని ప్రోత్సహించాలి. ఈ భాష పునర్నిర్మాణం ఒక ఉ ద్యమంగా అటు ప్రభుత్వం, ఇటు ప్రజా సంఘాలు కలిసి సాగించాలి. ఇలాంటి యత్నాలకు 

స్ఫూర్తిదాయకంగా తమిళనాడు, కర్ణాటకలాంటి మాతృభాషను వినియోగంలోకి తెచ్చుకున్న రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు మనకు అవసరమైన మేర వినియోగించుకోవాలి. 

మరో ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తేవలసి ఉంది. ఈ క్షేత్రంలో ఒకనాడు తెలుగుకు పట్టం కట్టిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లే, వాడుక తెలుగు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోందన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి, దీనికి బలాన్నివ్వడానికి తమ వంతు కృషి 

చేసిన మహనీయులు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ప్రజల భాషలో విస్తారమైన పద్యాలు, పాటలు, గద్యాలు కూడా అందించారు వాళ్ళు. అలా అన్ని రకాల వనరులుండీ, ఆధునిక తెలుగు ప్రజలు ఆంగ్లభాషా దాసులై ఎప్పటికప్పుడు ఎవరికి చేతనైనంతగా వారు దీనికి వాడుకను తగ్గిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగానే మరోవంక గత 100 సంవత్సరములుగ వాడుక తెలుగును నిలబెట్టే యత్నాలూ కొన్ని జరిగాయి. దానినందిపుచ్చుకున్న ఈ తరం తెలుగు భాషా వేత్తలు కొందరు కూడా ఈ విషయంలో చాలా శ్రమించి వ్యవహారిక తెలుగు నిఘంటువులను తయారు చేశారు. కథలూ, కవితలూ వెలయించారు. ఈ మధ్యనే ఒక బృహత్తర కార్యం గురించిన వివరం నాకు తెలిసింది. 

విశాఖపట్నంలో ఉన్న పరవస్తు శయనసూరి అన్నాయన దశాబ్దకాలంగా శ్రమించి 3 లక్షల పదాలతో కూడిన తెలుగు మహా నిఘంటువును తయారు చేశారు. ఎంతటి మహత్కార్యమది!?! అది ముద్రించాల్సి ఉంది. వారితో మాట్లాడినప్పుడు ఆయన గారు మరో అబ్బురమనిపించే మాట అన్నారు. తెలుగులో మరో మూడు లక్షల పదాలూ ఉ న్నాయి. వెదికి వాడుకోవాలి. అంటే తెలుగులో 6 లక్షల పదాలున్నాయన్నమాట. వాస్తవానికి మన తెలుగుకున్న బలుపు అదన్నమాట. 6 లక్షల పదాలలో ఎక్కువ భాగం అడవిగాచిన పూలల్లే వాడుక లేక పడున్నాయన్నమాట. 

2) ప్రపంచంలోని ఏ భాషకూ పద్యాల వాడుక తెలియదు. పద్యం మన తెలుగు సొంతం. వాటితోబాటు వెతికితే సామెతలు, నానుడులూ కూడా వేలకు వేలు దొరుకుతాయి. 

3) ఇంకే భాషకు లేనన్ని విడి శబ్దాలు తెలుగుకున్నాయి. స్పుటమైన ఉచ్చారణకు తగిన ఒత్తులు, పొల్లులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో కూడిన అద్భుతమైన, సుందరమైన, 

సొంపైన భాష మనది. 

4) గుట్టలుగుట్టలుగా పండిన పదాలనెడి పండ్లున్న భాష మనది. ఏరుకుని ఆరగించడమే తరువాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, ఉన్న అపారమైన వనరులూ వాడుకోను చేతకాని అసమర్ధలు - వగైరా వివరాలు పెద్ద గ్రంధమంతవుతుంది. ప్రస్తుతానికి దీనినిక్కడ ఆపి, ఈ వ్యాసం రాయడానికి కారణమైన వర్తమానాంశాలను మీ దృష్టికి తెస్తాను. 

గత వందేళ్లుగా జరిగిన, వ్యవహారిక తెనుగును వాడుకలోకి తెచ్చే యత్నాలను అందిపుచ్చుకుని, మాతృభాషను తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవాలన్న తపనతో వర్తమానంలోనూ కొన్ని సంస్థలూ, కొందరు వ్యక్తులూ కొంత వరకు వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని మరీ ఇదే పనిలో నిండా మునిగి పనిచేస్తున్నారు. వారంతా విడివిడిగా శక్తివంచన లేకుండా, శక్తికి మించి పాటు పడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక ప్రజా ఉద్యమ రూపాన్ని సంతరించుకోలేదు. ఒక బలమైన ఆకాంక్షగా ఇది ప్రజల ముందుకు గానీ, ప్రభుత్వం ముందుకు గానీ రాలేదు. ఇలాంటి వాటినన్నింటినీ చక్కచేయాల్సిన ప్రభుత్వాలు, ప్రజల నుండి పెద్ద ఎత్తున అసహనం ఎదురైనప్పుడు మాత్రమే అట్టివాటిని పట్టించుకునే అలవాటు పడిపోయాయి. కనుకనే దశాబ్దాలుగా తెలుగు నుడి వాడుకకు జవసత్వాలు కలిగించే పనులు జరుగుతున్నా, ఫలితాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. 

మిత్రులారా! ఇప్పటివరకు ఈ దిశగా జరిగిన దాన్నతా సమీక్షించుకుని, ఇకపై జరగాల్సిన దానిని గురించి ఆలోచించుకుని, గట్టిగా, కలసికట్టుగా జట్టుకట్టి కదిలేందుకు ఒక యత్నం చేసి చూద్దాం అని జూన్ 22న జీయర్ స్వామివారి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో అనుకున్నాం. ఆ మా నిర్ణయాన్ని మీ ముందుంచడానికే ఇదిగో ఈ పలుకులిలా మీ ముందున్నాయి.  

కలివిడిగా జరుపుకోవాలనుకున్న తొలి సమావేశం 2021 జూలై 25న జరుగుతుంది. ఎప్పటినుండో పనిచేస్తున్న వారిలో ఈతట్టు కలసికట్టుగా సాగడానికి మనసైన వారంతా ఆనాటికి అక్కడకు చేరాల్సి ఉంది. సమావేశం ఉదయం 11 గంటల నుండి అనుకున్నాము. మధ్యాహ్న భోజనం ఏర్పాటు ఉంటుంది. ఏమాత్రం హడావుడి లేకుండా తీరుబాటుగా, ఉన్న వాస్తవ పరిస్థితులనూ ఇకముందు చేయాల్సి ఉన్న దశలవారీ పనులను సమీక్షించుకుని భవిష్యత్ కార్య క్రమాన్ని రూపొందించుకోవాలన్నది మొన్నటి సమావేశ ఉద్దేశము. 

రానున్న కాలంలో, పెద్ద ఎత్తున చేపట్టనున్న వ్యవహారిక తెనుగు భాషోద్యమంలో పాలు పంచుకో గోరుతున్న వారందరికీ ఈ వార్త చేరాల్సి ఉంది. ఈ పనికై క్రమంగా జిల్లాల వారీగా కూటాలు ఏర్పడాల్సిన ఉంది. అందుకై ఎక్కడికక్కడ తెలుగు భాషాభిమానులంతా ఏకత్రాటి పైకి రావలసి ఉంది. ఈ పనికై మనసున్న వారంతా ఎవరికి వారుగా పూనుకుని మరికొందరిని జత చేర్చుకునే పని మొదలెట్టాలి, “భాషను నిలబెట్టుకోవాలి, దానిని వాడుక భాషగా రాబట్టుకోవాలి” అన్న తపన ఉన్న వాళ్లంతా కొంతకాలం పాటు కలసికట్టుగా పాటు పడడానికి నడుము కట్టుకుని ముందుకు రావాలి. ఒక ఉద్యమం నిర్మాణం కావలసి ఉంది. మనపనంతా రెండు ప్రధాన విభాగాలుగా ఉంటుంది. 1) ప్రభుత్వం చేయాల్సిన పనులు, 2) మనం చేయాల్సిన పనులు. 

ప్రభుత్వం చేయాల్సిన పనులు: 1) తెనుగు వాడకాన్ని తప్పనిసరి చేసే శాసనాన్ని తీసుకురావాలి. అది ఖచ్చితంగా అమలయ్యేలా శ్రద్ధ పెట్టాలి. 

2) తెలుగు వాడ కానికి అవసరమైన వ్యవహారిక, పారిభాషిక పదకోశాలను ప్రచురించి రాష్ట్రమంతటా అందుబాటులోకి తేవాలి. 3) నూతన రూపంలోని భాషను వాడుకలోకి తేవడానికి వీలైన రీతిలో, ఒక ఉప సంఘాన్ని- దానికి అనుబంధ వ్యవస్థను రూపొందించాలి. ఇప్పటికే బోధనా క్షేత్రంలో ఉన్న పంతుళ్లకూ, అంగన్వాడీ కార్యకర్తలకూ, తెలుగును ప్రజలకు అలవరచడంలో శిక్షణనిచ్చి, బాధ్యతలను అప్పగించాలి. గ్రామాలలోని తెలుగు ఉపాధ్యాయులకు ఈ బాధ్యతలను అప్పగించి, దీనిని నెరవేర్చేందుకు ఎంతో కొంత అదనపు పారితోషకాన్ని అందించాలి. 4) వ్యవహారిక భాషలో విస్తారమైన, సాహిత్యాన్ని చిరు పొత్తాల రూపంలో సిద్ధంచేసి, గ్రామ గ్రంథాలయాలలో ప్రవేశపెట్టాలి. అన్ని బడులు, ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పుస్తక విక్రయ దుకాణాలలో ఇవి ఉండేలా చూడాలి. 5) అన్ని రకాల వ్యవహారాలకు సంబంధించిన పేరు పలకలపై విధిగా తెలుగు లిపినే వాడాలన్న శాసనం ఏర్పరచాలి. 6) వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా, తెలుగు వాడకానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించి ప్రచారం చేయాలి. 7) ఆయా విభాగాలలో విస్తృతంగా వాడాల్సిన విభాగ వాడుకపదకోశాలనూ రూపొందించి వినియోగంలోకి తేవాలి. కార్యాలయాల రాతకోతలన్నీ ఈ తెలుగు భాష లోనే జరిపి తీరాలి. 8) ఈ కార్యక్రమంలో ఉద్యమ వేదిక ద్వారా పాల్గొనేలా ప్రజలను ప్రభుత్వమూ ప్రోత్సహించాలి. 

2) మనం చేయాల్సిన పనులు : 

1) భాషను వాడుకలోకి తెచ్చేందుకు వీలైన పదకోశాలనూ, వివిధ స్థాయిలలో నున్న విద్యార్థులకూ, అక్షరాస్యులైన వయోజనులకూ, అభిరుచిని కలిగించే సాహిత్యాన్నీ సిద్ధంచేసే పనిచేయాలి. 

2) పెద్ద ఎత్తున ఉద్యమ వేదికను రాష్ట్రమంతటా విస్తరించేలా గ్రామాల వరకు విస్తరించేలా సభ్యులను చేర్పించి, కూటాలను ఉనికిలోకి తేవాలి. 

3) అవగాహన, ఇష్టము, సమయాన్నివ్వగల వెసులుబాటు ఉన్నవారికి వివిధ స్థాయిలలో బాధ్యతలను అప్పగించాలి. 

4) ఈ మహాకూటమి ఉద్యమ నిర్మాణము - ఉద్యమ కార్యాచరణ అన్న రెండు ఫార్శాలతోనూ పూనికతో పని చేయాలి. 

5) దీర్ఘకాలం కొనసాగించాల్సిన ఈ ఉద్యమానికి అవసరమైన నిధులను సమకూర్చుకునే పని ఎక్కడికక్కడే ఆరంభం కావాలి. ఎక్కడి నిధులు అక్కడనే సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిధులు పోగేసుకోవడమన్న దృష్టి కానీ, నిధులపై అజమాయిషీ చేయాలన్న దృష్టి కానీ ఉండరాదు. అది గాని ఉద్యమంలో చొరబడితే ఇది పతనం కావడానికి ఎక్కువ సమయమేమీ పట్టదు. 

6) గుర్తింపు కొరకు మంచి పనులు చేసే వారు చాలామంది ఉంటారు. గుర్తింపు కొరకే మంచి పనులనే వారు కొందరుంటారు. గుర్తింపు దృష్టి లేకుండా, పని నచ్చింది కనుక, పని చేయకుండా ఉండలేనితనము ఉంది. కనుక పనిచేస్తూ, పనిలోనే తృప్తి, అసంతృప్తినీ కూడా అనుభూతి చెందుతూ పని చేస్తుండే వాళ్లూ కొద్ది మంది ఉంటారు. 

మూడు రకాల వాళ్లూ మంచి పనులు చేస్తూనే ఉన్నా ఆ పని వెనుక వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనాలు వేరు వేరు గానే ఉంటాయి. మొదటి రెండు రకాల వాళ్ల వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయి కానీ, అట్టి వారి వల్ల ఐక్య ఉద్యమాలు క్రమంగా బలహీనపడి పోతాయి. కనుక మూడో రకం వ్యక్తుల తోటే ఉద్యమం నిర్మాణం కావాలి. కనీసం ప్రధాన బాధ్యతలు వహించే వారి వరకైనా ఈ తరహా వ్యక్తులు తప్పనిసరవుతారు. 

అవగాహన - ఇష్టము (తపన) నైపుణ్యము - వెసులుబాటు అన్న నాలుగు ఉన్న వారివల్లే ఉద్యమాలు నడుస్తాయి. వేగవంతమవుతాయి. అందులోనూ ఇష్టము- వెసులుబాటు అన్నరెండే ప్రధాన మవుతాయి. ఈ రెండూ కనక ఉంటే, అవగాహన పెంచుకోవడం, నిపుణతను పొందడం అన్న రెండూ క్రమంగా అవే ఏర్పడతాయి. 

కనుక ఉద్యమ నిర్మాణంలో అత్యంత కీలకమైనది, ఈ పని చేయడానికి ఇష్టము, అవకాశము (సమయమిచ్చే అవకాశం) అన్న రెండూ ఉన్న వ్యక్తులను వెదికి పట్టుకుని కూటమిలో చేర్చడమే. 

ఉద్యమ నిర్మాణ సూత్రం : వెదకు, గమనించు, సమీకరించు, సంఘటితపరచు, పోరాడు. రేపటి జూలై 25 సమావేశం 'వెదికి, గమనించి, అంగీకరించిన వారిని సమీకరించడం' అన్న దశకు చెందిందై ఉంది. సమీకరింపబడిన వారిలో ఎవరు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలోకి వస్తారో వారు సంఘటితమైనట్లు. 

అలా సంఘటితమైన వారు ఎప్పటికప్పుడు అందరూ కలసి నిర్ణయించుకున్న దశలవారీ కార్యక్రమాన్ని శక్తివంచన లేకుండా చేసుకుంటూ పోవడమే పోరాడడమంటే. 

ఉద్యమ నిర్మాణం, ఉద్యమ విస్తరణ అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఉద్యమాశయాలు నెరవేరేవరకు అది జరుగుతుండాల్సిందే. అనంతరం కూడా పర్యవేక్షణ అన్న పని (రక్షణకు చెంది) మిగిలే ఉంటుంది. 

వందనాలు తెలుగు భాషాభిమానులారా! మొదలవబోతున్న ఉమ్మడి ఉద్యమంలో చేరండి, మరింతమందిని చేర్చండి. ఈ కార్యక్రమానికి సంబంధించిన మలివార్తకై వేచి చూడండి. మాతో సంప్రదిస్తూ ఉండండి. మీ ప్రాంతంలో ఉద్యమ శాఖ ఏర్పాటు చేయగలరేమో 

యోచించండి. 

ఉద్యమాభివందనలతో...

 

యోచనాశీలురూ, మిత్రులూ అయిన కృష్ణారావు గారికి,

ఈ మధ్య పుస్తకాలు సర్దుతుంటే, 2017 ఏప్రియల్ 9, 10 తేదీలలో మనమంతా కలసిన సమావేశానికి చెందిన వివరాలంటూ, మీరు కె.శ్రీనివాసులు గారికి వ్రాసిన లేఖ కనపడింది. 

మొన్నటి వివేకపథం 255 పై మీరు స్పందిస్తూ పంపిన లేఖలోనూ (256 సంచికలో మీ లేఖ ప్రచురించాను) 2017 నాటి ఈ సంఘటననూ ప్రస్తావించారు కనుక దానిని యథాతథంగా 257 సంచికలో వేస్తే మీరాశించినట్లే విషయాన్ని పాఠకులకు అందించినట్లు అవుతుంది. దానిపై వారిని ఆలోచింపజేసినట్లు అవుతుంది. నా పరిశీలన నూ జత  చేయడానికి వీలవుతుందనిపించింది. అందుకే ఆ లేఖను యధాతథం పాఠకుల ముందుంచుతున్నాను. 

శ్రీ కె.శ్రీనివాసులు గారికి, డియర్ సర్, నమస్తే!

ది. 9-4-2017న ద్వారకుంటలో సురేంద్ర గారి ఇంటిలో జరిగిన సమావేశంలోని ముఖ్యమైన విషయములు మీకు తెలియజేయుచున్నాను. సమావేశము ఆదివారం ఉదయము 9.00 గం.లకు ప్రారంభమై మధ్యాహ్నము 3.30గం.లకు ముగిసినది. హాజరైన వారు శ్రీ సోమ్ ప్రకాష్, శ్రీ రఘుపతిరావు, వారి శ్రీమతి, శ్రీ నారాయణ శెట్టి, చంద్రమోహన్, లెనిన్, రమణయ్య గారు, సురేంద్ర గారూ, వారి అక్క ఝాన్సీ గారు, నేను, నా భార్య మరియు ఆర్య సమాజ సభ్యులు రాధాకృష్ణ గారు, వెంకటేశ్వర రెడ్డి గార్లు. 

సమావేశమునకు నేను ప్రవేశపెట్టిన విషయము “వేదాంతము యొక్క ఆవశ్యకత జీవితంలో ఉందా?” ప్రధాన అంశములు. 1. వేదాంతంలో ఏర్పడిన గందరగోళము, 2. సమస్య, 3. సమస్యకు కారణము. 4. కారణము తొలగు విధానము. 

1. వేదాంతము పేరుతో ఏర్పడిన గందరగోళము : సామాజిక జీవితములో మనిషికీ మనిషికీ మధ్య సఖ్యత లోపించి ఘర్షణ ఏర్పడి ఒకరినొకరు హింసించుకొనుట జరుగుచున్నది. అందుకు గల కారణమేమిటని ప్రశ్నించుకొని పరిశోధన జరిపిన పూర్వీకులు తమ పరిశోధనా ఫలితములను కొంతకాలం పాటు మౌఖికంగా అందజేయడం జరిగింది. తరువాత కాలంలో అవి గ్రంథస్థముగావించబడ్డాయి. వాటిని అధ్యయనం చేసిన వారు భిన్న భిన్న విరుద్ధ అవగాహనలతో వ్యాఖ్యలు చేశారు. ఆ విధముగా అనేక సాంప్రదాయములేర్పడ్డాయి. జీవిత తత్వ విషయమై ఏర్పడ్డ అనేకమైన విరుద్ధ భావాలలో ఏదో ఒకటి వాస్తవమైనట్లయితే మిగిలినవన్నీ అవాస్తవం అయినవి కావాలి. 

జీవిత సమస్యను తీర్చటానికి ఏర్పడ్డ వేదాంతము విరుద్ధ దృక్పథాలతో సమస్యను మరింత జఠిలపరచి, గందరగోళమునకు దారి తీసినది. ఈరోజు మనము సమస్య స్వరూపమును పరిశీలించి, అందుకు గల కారణమును మరియు అది తొలగు విధానమును చూచెదము. 

ఎ) 1) మనిషి చేయు సమస్త కర్మలను రెండు విభాగములుగ చేయవచ్చు. అ) తన బ్రతుకు కొరకు తను సంబంధ పడ్డ వస్తువులను గురించి తెలుసుకోవడం ఆ) వాటిని సమకూర్చుకోవటం. 

2) ఏమి కావాలి, ఏమి వద్దు అన్న విషయంలో మనిషిని కర్మ వైపు నడిపించునది తన యొక్క ఇష్టాఇష్టాలే. 

3) ఏ ఇద్దరి వ్యక్తుల ఇష్టాయిష్టాలు పూర్తిగా ఒకటి కాదు. 

4) తన ఇష్టానుగుణంగా ప్రవర్తించుటలో ఇతరుల స్వతంత్రతకు భంగము కల్గించుచున్నాడు. 

5) ఎవడు తన స్వతంత్రతను కోల్పోవుటకు ఇష్టపడడు. కనుక ఘర్షణ తప్పుటలేదు.

6) మనిషి అధిక్యత కొరకు - అది ఏ రంగమైనా సరే- నిరంతరము పోరాడుతున్నాడు. 

7) అనగా కావాలి అన్నది ఎక్కడ ఆగుటలేదు. సంపదంతా కొద్దిమందికి హస్తగత మవుతుంది.  దానితో జీవిత స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. దేశదేశాలకు మధ్య, మతాలకూ మతాలకూ మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. 

బి) ఇంతవరకు సమస్య స్వరూపము విశ్లేషించబడింది. కావాలి అన్నది ఆగకపోవడానికి గల కారణం ఏమిటి? 

1) ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అర్ధాలతో సంబంధపడుతున్నాయి. ఆయా సంబంధాలలో ఏర్పడెడి ప్రప్రధమ జ్ఞానము ఐదు పదార్థములకు చెందినది. రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దములు. జ్ఞాన ఉద్భవముతోటి ఇది బాగుంది, బాగా లేదన్న ప్రభావాన్ని చూస్తున్నాడు. బాగుందన్నది సుఖము. బాగాలేదన్నది దుఃఖము. పదార్థముల జ్ఞానముతో పాటు సుఖదుఃఖ అనుభూతులు క్షణకాలమందు కలిగి స్మృతిలోకి పోవుచున్నవి. ఆ అనుభూతులాధారం చేసుకుని తన బ్రతుకుకు అవసరమైనవి తెచ్చుకొనగలుగుతున్నాడు. అనగా బ్రతుకు వర్తమానమందు సాగుచున్నది. 

2) స్మృతి యందు నిలవవుతున్న జ్ఞానరాశి రెండు విభాగములుగా విడిపోవుచున్నది. సుఖ రాశి, దుఃఖ రాశి. వానినాధారముగా చేసుకుని మానసిక స్థాయిలో సుఖాన్వేషియై ఊహలలో కొట్టుకుపోతాడు. సుఖమును వస్తువుతో ముడిపెట్టి, వస్తువులను అనంతంగా 

ప్రోగు చేసుకుంటూ నిరంతర సుఖము కొరకు ప్రాకులాడుతాడు. మనిషి సుఖాన్వేషియై ఉన్నంత వరకు దుఃఖపీడితుడుగ కాక తప్పుట లేదు. తను సృష్టించుకున్న సుఖ దుఃఖ జగత్తులో కొట్టుమిట్టాడుతూ అందులోనే తన జీవితాన్ని గడిపి వేస్తాడు. ఎవడి సుఖదుఃఖ జగత్తు వాడిది. భాహ్యమందు అట్టి సుఖదుఃఖ జగత్తు ఎవడూ చూపలేడు.  ఊహాత్మకమైన తన సుఖ దుఃఖ సృష్టియందు నిరంతర సుఖము ఒక మిద్యాపదార్థమే. అది లభ్యంకాక నిరంతర దుఃఖానికి లోనవుతున్నాడు. ప్రక్కవానిని బాధిస్తున్నాడు. 

సి) తన అవివేకముతో ఏర్పడిన ఈ సృష్టి ఆగేదెప్పుడు? 

ఇది కేవలం తన ఊహాత్మక సృష్టి అని గుర్తించగలడా? అది గుర్తించాలంటే తెలియబడెడి పదార్థంతో (జ్ఞేయ పదార్థంతో) సంబంధపడుతూ నేను సుఖిని, నేను దు:ఖిని అని తలుచుకుంటూ పరుగులు పెడుతున్నాడు. ప్రక్క వానిని అధిగమించడంలో ఊహాత్మక మైన 

సుఖమును పొందుతూ తన పరుగును ఎక్కడా ఆపుటలేదు. ఇది నేను, ఇదినేను కాదు అంటూ జేయ సంబంధమైన 'నేను'కు కట్టుబడిపోయాడు. థి తెలుసుకొనెడి తనను (జ్ఞాతను) చూచుట లేదు. ఎప్పుడైనా తను దారి తప్పానన్న జ్ఞానము తనకు కలిగినట్లయితే జేయ స్థానములోనున్న నేనును బ్రాంతి నేనుగ గుర్తించి, తెలుసుకొను 

నేనును ( జ్ఞాత అయిన నేనును) పట్టుకోగలడు. అనగా జేయ పదార్థమును జేయ పదార్థంగా చూచుచు, జ్ఞాతను జ్ఞాతగా చూచుచు రెండిటిని విడగొట్టి జ్ఞాత స్థానమందు నిలబడగలడు. జ్ఞాత లక్షణము జేయ పదార్థ లక్షణముకన్న పూర్తిగా భిన్నమైనదని చూడగలడు. 

అట్టి దృష్టి ఏర్పడనంతవరకు జీవిత సమస్య తెగదు. సాయంత్రమయ్యేసరికి చాలామంది వెళ్లిపోయారు. మిగిలిన వారు సోమ్ ప్రకాష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఝాన్సీ గారు, రాధాకృష్ణ గారు (ఆర్య సమాజ సభ్యులు), సాయంత్రం మాట్లాడుతూ చాలా క్యాజువల్ గా సురేంద్ర గారు "మీరు ప్రస్తావించిన చాలా విషయాలు పరిశీలనకు నిలబడవన్నారు” కొంత సమయమైన తరువాత నన్ను సంభోదిస్తూ “మీ మాటలు ఇక్కడ విన్నవారు పరిశీలిస్తారు. నేను కూడా ఒక ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాను అని అన్నారు”. అందుకు నేను “మీ రట్టి ప్రయోగము చేయలేరు. మీకు మా పైన నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది గనుక” అని అన్నాను. తిరిగి ఆయన "అవును నాకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. 100% ఉంది. అయినా పాత విషయాన్ని ప్రక్కన పెట్టి క్రొత్త విషయాన్ని పరిశీలన చేయగలను” అని అన్నారు. 

ఆదివారము సాయంత్రం సమస్యకు కారణమెరిగి ఆ కారణాన్ని తొలగించిన గాని సమస్య పరిష్కరింపబడదు అన్న నా మాటను ప్రశ్నిస్తూ సురేంద్ర గారు “అలా ఎంత మందిని మీరు మార్చగలరు?” అని అడిగారు. అందుకు నేను “అది వేరు విషయము. సమస్యకు కారణము పొందక పరిష్కారము సాధ్యమా అని మరలా రిపీట్ చేశాను.” కానీ సురేంద్ర గారు దానిని దాటవేయ ప్రయత్నించారు. నేను మీరు విషయాన్ని సైడ్ ట్రాకింగ్ చేస్తున్నారన్నాను. తరువాత ఆయన వాదించలేదు. 

మూడు నెలలకొకసారి కలుసుకుందాము, మీరు చెప్పిన మాటలు ఎవరు ఎంతవరకు పట్టుకోగలిగారు అన్న విషయమై పరిశీలన జరపవచ్చు. పరీక్షకు అవి ఎంతవరకు నిలబడగలవో నిర్ధారించవచ్చు అని అన్నారు. ఈ విషయంలో టైం ఫ్యాక్టర్ ఫిక్స్ చేయలేము అన్నాను. వ్యక్తి ఆసక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి కాలము నిర్ధారిత మౌతుందన్నాను. ఎవరు ఏమిటని పరీక్షించడం గాని, నన్నెవరు పరీక్షించవలసిన అవసరం ఉందని గాని నేను ఇష్టపడను. అట్టి దృక్పధము నాకు లేదు అని అన్నాను. అందుకు సురేంద్ర గారు “అయితే ఇదంతా వేస్ట్ కదా!” అని అన్నారు. సోమ్ ప్రకాష్ గారు "అవును వేస్టే” అన్నారు. ఆదివారం సాయంత్రం అలా 9.30 గంటలకు సమావేశం ముగిసింది. 

సోమవారం ఉదయము సోమ్ ప్రకాష్ గారు వెళ్లిపోయారు. భోజన సమయము వరకు నేను, వెంకటరెడ్డి గారు, రాధాకృష్ణ గారు, ఝాన్సీ గారు మాత్రమే మిగిలారు. సురేంద్ర గారు ఆదివారం నేను ప్రస్తావించిన విషయాలు ఏవీ ప్రశ్నించలేదు. 10 గంటల వరకు ఇతర విషయాలే మాట్లాడుతూ ఉండినారు. రాధాకష్ణ గారు ఆదివారం ఆలస్యంగా వచ్చారు. ఆయన మరలా నా మాటలు వినాలని ఆసక్తి చూపారు. 12.30 గంటల వరకు నేను మరలా ముందురోజు ప్రస్తావించిన విషయాలె క్రమముగా వ్యక్తపరిచాను. సురేంద్ర గారు మరొక్కసారి నా మాటలు విన్నారు. కానీ ఎక్కడ ప్రశ్నించలేదు. అలా సమావేశము ముగిసింది. 

జీవిత తత్వ నిర్ధారణ జీవిత తత్వ యథార్థమును నిర్ధారించుటలో ఎవరికి వారే ప్రమాణము. రుజువు కొరకు తననన్యులెవరూ పరీక్షించవలసిన అవసరం లేదు. అలా ఉన్న యెడల పరీక్షించు వ్యక్తిని పరీక్షించు వారెవరు? అది అనవస్తాదోషమునకు దారితీయును. యథార్ధమునకు కొలత త్రికాల అబాధితమే. ఇంకనూ దానిని బలపరచునది దేశ, కాల, వ్యక్తులకు ఆ భాదితమై యుండుటే. అన్ని ప్రాంతాలలోనూ, అన్ని కాలాలలోనూ వ్యక్తులెవరైనను చూడగల యథార్థము ఒక్కటే. 

అయితే ఏదేని సాంప్రదాయమునకు కట్టుబడి ఏదో నమ్మకం పెట్టుకుని, తను నమ్మినదే యథార్థమని భావించవచ్చు కదా! అట్టి వ్యక్తి తనకు తానుగా తన దోషాన్ని గుర్తించలేడు కదా! అని అనవచ్చు. యథార్థమును ఎలా నిర్ధారించగలమో ఎరిగి నిర్ధారించుట ఎవరైనను చేయగలిగింది. ఆత్మవంచన లేకుండా చూడవలెనన్న పట్టుదల ఉందా లేదా అన్నది కూడా తనకు తానే నిర్ణయించుకోవలె. ఈ విషయమందు యథార్ధ దృష్టి గల వారు సహకరించగలరే గాని, చూచుటకు ఇష్టపడని వారిని ఎవరూ ఏమీ చేయలేరు. 

జర్గీ వాసుదేవ్ జగీ వాసుదేవ్ వేదాంతమంటే ఏమిటో తెలియజేస్తున్నారు. మన పరిశీలనకు ఆయన పరిశీలనకు సామ్యమేమైనా ఉందో లేదో చూడవచ్చు. మనిషి అనగా తన స్మృతి యొక్క ప్రతిరూపమే. తన స్మృతి చిత్రమే తన జీవితము. స్మృతి అంతము కావడమంటే తన ఉనికే అంతమవటమని అర్థము. కాని తన స్మృతికి అతీతముగ ఉన్న చైతన్యమును - చిత్-ఇంటలిజెన్స్- పట్టుకో గలిగిన యెడల తను స్వతంత్రుడు కాగలడు. స్మృతి ప్రభావమునకు లోనుకాడు. అది జరగనంత వరకు మనిషి నిరంతర సుఖాన్వేషియై పరితపించక తప్పదు. తన బ్రతుకుకు ఆధారభూతమైనదే చిత్/చైతన్యము. దానిని పట్టుకో గలిగిన, ఇక కోరదగినదంటూ ఏమీ ఉండదు. భగవంతుడే మీసేవ లో ఉన్నట్లు చూడవచ్చు. 

పరిశీలన : 'బ్రెడ్' పురుషుడు కావటమో లేక స్త్రీ కావటమో అన్నది స్మృతి ద్వారా జరిగెడి యంత్రాంగమని అనుటలో జగ్గీ వాసుదేవ్ గారికి స్పష్టత లేదు. స్మృతి చక్రమే మానవ 

జీవితమంటూ దాని నుండి బయట పడాలంటే 'చిత్'ను పట్టుకోగలగాలి అంటున్నారు. 

అది సాధిస్తే దైవమే తన కనుగుణంగా ఉండగలదని అంటారు. స్మృతి ఎందుకు దోషభూయిష్టమైందో వివరించాలి. 'చిత్' పదార్థం నుండి తను ఎందుకు దూరమయ్యాడో 

తెలపాలి. దానిని పట్టుకోవడమంటే ఎలాగో వివరించాలి. 

మన పరిశీలనలో మనిషి తెలియబడెడి దానితో ఏకీభావము చెందడంతో స్మృతి దోషపూరితమవుతుందని అంటున్నాము. అనగా తన వద్ద ఇంత వరకు స్మృతి రూపములో ఏర్పడ్డ జ్ఞాన రాశి ద్వందరూపమైన సుఖ దుఃఖ రాసులుగా విడిపోయింది. అక్కడ ఇరుక్కుపోయిన మనిషి తెలుసుకొను తనను చూచుట లేదు. చూడవలసిన అవసరముందని గుర్తించుట లేదు. 

స్టాఫ్ క్రిబ్బింగ్ (20-4-2017-పేపర్ కటింగ్) మనిషి ఎప్పుడూ తన పరిస్థితుల పట్ల లేక ఇతరుల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తూ పరితపిస్తాడు. ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని దానికై ఎంతో తపించి, దానిని సాధించిన తర్వాత, మరలా ఏదో ఒక దాని కొరకు పరితపిస్తాడు. ఏ దశలోను అసంతృప్తి కోరుటలేదు. బుద్ధుడు తెలియజేయు నాలుగు ఆర్య సత్యాలలో మొట్టమొదటిది జీవితం దుఃఖమయమని గుర్తించడము. తరువాత దాని కారణమును పరిశోధించి తొలగించుకోవడము. శాశ్వత మన్నదేదీ లేదు. 

సర్వము క్షణికమే అన్నది బౌద్ధమతంలో చెప్పు ప్రతీతి సముత్పాదసిద్దాంతము. అజ్ఞానమే అనంతమైన కోర్కెలకు కారణమైనది. అది ఇంద్రియార్దబంధముతో మొదలవుతుంది. అయిష్టమైన వాటి సంబంధము తెంచుకోవాలనుకుంటాడు. ఇష్టమైన వాటితోటి సంబంధము తెగకూడదనుకుంటాడు. అంతులేని ఈ ప్రయాసకు మనిషి ఎప్పుడూ లొంగిపోతాడు. మధ్యమ మార్గాన్ని సూచిస్తూ దేనికి కట్టుబడకూడదంటాడు. - అది మంచి గాని, చెడు గాని అది ఏదైనా క్షణికమే కనుక. 

పరిశీలన: మనము కూడా సమస్య స్వరూపము చూడాలని అంటున్నాము. కారణమును విశ్లేషిస్తూ కావాలన్నది ఆగడం లేదు ఎందుకని ప్రశ్నిస్తున్నాము. అజ్ఞానము మూలమని పైన చెప్పబడినది. కానీ వివరణ లేదు. 12 నిదానములను -లింక్స్ -చెబుతారు. కాని అక్కడ కూడా అస్పష్టతే ఉంది. మన విశ్లేషణలో మనిషియొక్క దృష్టి తెలియబడే దానికి కట్టుబడి పోయింది (జేయ పదార్థము వద్ద) తెలుసుకొను తన స్వరూపమును (జ్ఞాతను) చూచుట లేదు. చూడవలసిన అవసరముందని గుర్తించుట లేదు. అంతవరకే తేడా. 

వేదాంతమంటే ఏమిటి ? వేదాంతమంటే ఏమిటో ఒక్కమాటలో చెప్పవలసి వస్తే కావాలన్నది ఎందుకు ఆగడంలేదో ప్రశ్నించుకొని దాని ఉన్న మర్మమును ఛేదించడమే. 

The knower and the known have got mixedup. The entire confu sion is because of our failure to undo this knot.

జ్ఞాత, జ్ఞేయ పదార్దములు కలగాపులగమై జీవితము గందరగోళంగా తయారయింది. ఆ ముడిని విప్పడమే వేదాంత రహస్యము. జ్ఞాత జేయములను వేరుచేసి జ్ఞాతను జ్ఞాతగా జేయమును జేయముగా చూడగలగటమే మనిషి జీవితమందు సాధించుకోవలసిన మహోన్నత లక్ష్యం. అది జరగక ఏమి సాధించినను వ్యర్థమే. 

గీతా భాష్యమందు శంకరుడు గీత లక్ష్యమేమిటో చెబుతారు. గీతా శాస్త్రము యొక్క ప్రయోజనము “పరమనిశ్రేయస" మని ఒక్కమాటలో చెప్పవచ్చు. ఈ జీవిత పరమ లక్ష్యమదే. కనుక సర్వకర్మలను త్యజించగ కలుగు ఆత్మజ్ఞాన నిష్టారూపమైనదే ధర్మము. 

“జగతః స్థితి కారణం, ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతుః యః సధర్మః" 

"జగత్తు యొక్క ఉనికికి కారణమైనది, ప్రాణులకు ఉత్తమ జీవితమును, స్వతంత్రతను పొందుటలో ఆధారభూతమైందేదో అదే ధర్మము.” 

నిజానికిలాటి తాత్విక చర్చారూపమైన వివరణాత్మక వ్యాసాలను పాఠకులందరూ, అవసరమైనంత శ్రద్ధ పెట్టి చదవరు. ఎందుకంటే ఇలాంటివి మెదడుకు పని పెడతాయి, ఆలోచనకు పదును పెట్టాల్సి వస్తుంది, కనుక అంతటి మేధో శ్రమకు అందరూ సిద్ధపడరు. అయినా జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్న దృష్టి, యత్నము ఉన్నవాళ్ళ వరకైనా ఎంతో కొంత ప్రయోజనం కలిగించ గలదన్న ఆలోచనే నన్నందుకు సిద్ధం చేసింది. 

ఇందులో, ఆ లేఖలో నుండి నేను ఎంపిక చేసుకున్న అంశాల వరకు విశ్లేషణ చేస్తాను. పాఠకుల నుండి ఏమైన స్పందనలు వస్తాయేమో చూసుకుని, తరువాతి సంచికలలో వాటిపైనా, ఈ లేఖాంశాల పైనా విపులంగా విశ్లేషణ చేస్తాను. 

1) ఆనాటి సమావేశానికి, విచారణీయాంశంగా “వేదాంతం యొక్క అవసరం జీవితంలో ఉందా?” అన్న దానిని మీరే ఎంపిక చేశారు. దానికి సమాధానం కనుగొనడానికి నాలుగంశాలను విచారించాల్సి ఉందని చెప్పారు. 

2) నాలుగంశాలు : 1) వేదాంతంలో ఏర్పడ్డ గందరగోళము, 2) సమస్య, 3) కారణము, 4) కారణం తొలగు ఉపాయం. 

ముఖ్య గమనిక :- ఆ లేఖలోని ఈ భాగంలో మీరు వెల్లడించిన అభిప్రాయాలు ఇవిగో, ఇవే నాకు అనిపించాయి. 

1) వేదాంతం పేరుతో లోకంలో గందరగోళం ఏర్పడి ఉంది. 

2) మనుషుల మధ్య ఘర్షణ ఉండడాన్ని గమనించిన వెనకటి పరిశోధకులు దాని కారణాన్ని వెతికారు. తమ పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందించారు. గ్రంథస్థం చేశారు. 

3) అనంతర కాలంలో వాటిని అధ్యయనం చేసిన వారు వాటికి విరుద్ధ వ్యాఖ్యానాలు చేశారు. 

4) జీవిత తత్వ విషయమై అన్నీ సరైనవి కావడానికి వీల్లేదు - వాటిలో ఏది వాస్తవమైనా మిగిలినవన్నీ అవాస్తవాలే అవుతాయి. 

5) జీవిత సమస్యను తీర్చడానికే వేదాంతం ఏర్పడింది. 

కానీ ఇలా వివిధంగా తయారవడం వల్ల సమస్య మరింత జఠిలంగానూ, గందరగోళంగానూ తయారయ్యింది. 

6) కనుక ఈ రోజు మనము, సమస్య, కారణము, నివారణోపాయం అన్న వాటిని గురించి విచారిద్దాం. 

7) ప్రతి మనిషీ జీవితంలో రెండు రకాల కర్మలను చేస్తుంటాడు. 1) తన బ్రతుకు అవసరం కొరకు సంబంధ పడ్డ వస్తువుల గురించి తెలుసుకోవడం. 2) వాటిని సమకూర్చుకోవడం. 

8) ఇష్టా ఇష్టాలే మనిషిని కర్మ వైపు నడిపిస్తున్నాయి. 9) ఏ ఇద్దరి ఇష్టాలు ఒకేరకంగా ఉండవు. 

10) ప్రతి మనిషీ తన ఇష్టానుగుణ్యంగా ప్రవర్తించే క్రమంలో ఎదుటి వాని స్వతంత్రతకు భంగం కలిగిస్తున్నాడు. 

11) ఎవడికి వాడు ఎవడూ స్వతంత్రతను వదులుకోవడానికి సిద్ధం కాడు కనుకనే ఘర్షణ పుడుతోంది. 

12) మనిషి ఆధిక్యత కొరకు నిరంతరం పోరాడుతున్నాడు.

13) కావాలి అన్నది ఎక్కడా ఆగుటలేదు.

14) సంపదంతా కొద్దిమంది హస్తగతం అవుతున్నది.

15) అందువల్ల జీవిత స్థితిగతులు అస్తవ్యస్త మయ్యా యి.

16) దేశాలకు దేశాలకు మధ్య, మతాలకు మతాలకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. 

17) * ఇంతవరకు సమస్య స్వరూపం విశ్లేషించబడింది.

18) కావాలి అన్నది ఆగకపోవడానికి కారణం ఏమిటి? 

19) ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అర్థాలతో సంబంధ పడుతున్నాయి. 

20) అందువల్ల రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్ద అన్న ఐదు పదార్థాల జ్ఞానం కలుగుతోంది. 

21) అలా పుట్టిన జ్ఞానంతో ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్న ప్రభావాన్ని చూస్తున్నాడు. 22) బాగుందన్న దానినే సుఖ మనీ, బాగా లేదన్న దానిని దుఃఖమని అంటారు. 

23) పదార్థాల జ్ఞానంతో పాటే, సుఖ, దుఃఖాల అనుభూతీ క్షణకాలం కలిగి స్మృతిలోకి పోతున్నాయి. 

24) ఆ అనుభూతులాధారంగానే తన బ్రతుకుకు అవసరమైనవి తెచ్చుకుంటున్నాడు. 25) కనుక బ్రతుకు వర్తమానమందు సాగుతున్నది. గమనిక : ఇక్కడి వరకు 1వ అంశంగా చెప్పారు. తరువాతది 2వ అంశం క్రింద చెబుతున్నారు. (సురేంద్ర) 

2. 1) స్మృతిలో ఉన్న జ్ఞానరాశి, సుఖరాశి, దుఃఖరాశి అన్న రెండు రాశులుగా విడిపోతుంది. 

2) వాటిని ఆధారం చేసుకుని మానసిక స్థాయిలో సుఖాన్వేషియై ఊహలలో కొట్టుకుపోతున్నాడు. 

3) సుఖమును వస్తువుతో ముడిపెట్టి వస్తువులను అనంతంగా పోగు చేసుకుంటుంటాడు. 4) నిరంతర సుఖం కొరకు ప్రాకులాడుతుంటాడు.

5) సుఖాన్వేషిగా ఉన్నంతవరకు దుఃఖపీడితుడు అవుతూనే ఉంటాడు.

6) తానే సృష్టించుకున్న సుఖ దుఃఖజగత్తులో కొట్టుమిట్టాడుతుంటాడు.

7) అందులోనే జీవితాన్ని గడిపేస్తాడు.

8) ఎవడి సుఖ దుఃఖజగత్తు వాడిదే.

9) బాహ్యమందు అట్టి సుఖ దుఃఖ జగత్తును ఎవడూ చూపలేడు.

10) సుఖ దుఃఖ సృష్టి అంతా తన ఊహ రూపమే.

11) అందులో నిరంతర సుఖమన్నది ఒక మిధ్యా పదార్థమే.

12) కనుక, అది లభ్యం కాక నిరంతర దుఃఖానికి లోనవుతున్నాడు. 

13) ప్రక్క వానిని బాధిస్తూ ఉన్నాడు.

14) ఈ సృష్టి తన అవివేకంలో ఏర్పడ్డదే.

15) ఈ సృష్టి ఆగేదెప్పుడు.

16) వ్యక్తి, ఇదంతా తన ఊహత్మక సృష్టేనని గమనించగలడా? 

17) ఆ విషయాన్ని గుర్తించాలంటే; తెలియబడే వాటితో సంబంధపడుతూ, నేను సుఖిని, నేను దుఃఖిని అని తలచుకుంటూ పరుగులు పెడుతున్నాడు. 

18) ప్రక్క వానిని అధికమించాలనుకొంటున్నాడు.

19) అలా అధిగమించడంలోనే ఊహాత్మక సుఖమును పొందుతున్నాడు.

20) అలా సుఖమును పొందుతూ పరుగును ఎక్కడా ఆపడం లేదు. 

21) ఇది నేను, ఇది నేను కాదు అంటూ ప్లేయ సంబంధమైన 'నేను'కు కట్టుబడి పోయాడు. 

22) తెలిసికొనెడి తనను తాను తెలిసికోవడం లేదు.

23) ఈ విషయంలో తాను పొరబడ్డానని గమనించితేనే సరిచేసుకునే వీలుంటుంది.

24) జ్ఞేయ స్థానములో నున్న 'నేను' భ్రాంతి నేను మాత్రమే.

25) ఈ వాస్తవాన్ని గుర్తించితేనే తెలుసుకొను నేనును గుర్తించుతాడు.

26) అంటే జ్ఞేయాన్ని ప్లీయంగా, జ్ఞాతను జ్ఞాతగా విడగొట్టి తాను జ్ఞాతగా నిలబడతాడు. 27) జ్ఞాత, థేయ పదార్థ లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి. 

28) అట్టి దృష్టి ఏర్పడనంతవరకు జీవిత సమస్య పరిష్కారం కాదు.

కృష్ణారావు గారూ! 

ఇవే ఆనాటి ప్రసంగంలో మీరు ప్రకటించిన అభిప్రాయాలు. ఈ ప్రసంగంపై ఆ రోజు సాయంత్రం మాట్లాడుకునే సందర్భంలో వెల్లడైన భావాలంటూ మీరే ఇలా రాశారు. 

సురేంద్ర :- 1) మీరు ప్రస్తావించిన చాలా విషయాలు పరిశీలనకు నిలవవు. 

2) కావాలంటే ఇక్కడున్న వారినీ వీటిని పరిశీలించమందాం. 

3) నేను కూడా ఒక '6' నెలలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాను. అన్నాను. అప్పుడు మీరు, 

4. కృష్ణారావు గారు :- సురేంద్ర గారూ, మీరలాటి ప్రయోగం చేయలేరు, కారణం మీరు మాపైన ప్రతికూల దృష్టి (నెగిటివ్ యాటిట్యూడ్) పెట్టుకుని ఉన్నారు గనుక. 

5) సురేంద్ర :- అవునండీ! నాకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. 

6) అయినా పాత విషయాన్ని ప్రక్కన పెట్టి క్రొత్త విషయాన్ని పరిశీలన చేయగలను. 

7) కృష్ణారావు గారు: సమస్యకు కారణమెరిగి దానిని తొలగిస్తే గానీ సమస్య పరిష్కరింపబడదు. 

8) సురేంద్ర :- అలా ఎంత మందిని మీరు మార్చగలరు? 

9) కృష్ణారావు గారు :- అది వేరే విషయం. ఈ సమస్యకు కారణం పొందక పరిష్కారం సాధ్యమా? చెప్పండి. 

10) కృష్ణారావు గారు :- దీనికి సురేంద్ర సమాధానం చెప్పకుండా దాటవేయ ప్రయత్నించారు. 

11) కృష్ణారావు గారు :- అప్పుడు నేను మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అన్నాను. 

12) కృష్ణారావు గారు :- ఆ తరువాత, దానిపై ఆయన ఏమీ వాదించలేదు.

13) సురేంద్ర :- మనమంతా మూడు నెలలకు ఒకసారి కలుస్తూందాం. 

14) సురేంద్ర :- మీరు చెప్పిన మాటలు ఎవరెంత వరకు పట్టుకోగలిగారో పరిశీలించవచ్చు. అలాగే, 

15) సురేంద్ర :- అవి ఎంతవరకు పరీక్షకు నిలబడగలవోనూ పరిశీలించవచ్చు. 

16) కృష్ణారావు గారు :- టైం ఫ్యాక్టర్ ను నిర్ణయించలేము. అది వ్యక్తి శ్రద్ధ, సామర్ధ్యములను బట్టి ఉంటుంది. అదలా ఉంచి, 

17) అదలా వుంచి, ఎవరు ఏమిటని పరీక్షించడం గానీ, నన్నెవరు పరీక్షించడాన్ని గానీ నేను ఇష్టపడను. 

18) అలాంటి అవసరముందనీ నేను అనుకోవడం లేదు. అట్టి దృక్పథం నాకు లేదు.

19) సురేంద్ర :- అలా పరీక్ష అక్కరలేదనేట్లయితే ఇదంతా వ్యర్ధ శ్రమే కదా!. 

20) సోమ్ ప్రకాష్ :- అప్పుడు సోమ్ ప్రకాష్ గారున్నూ, అవును, అది వేస్ట్ పనే అన్నారు. 

21) కృష్ణారావు గారు :- ఉదయం సోమ్ ప్రకాష్ కూడా వెళ్లిపోయారు. 

రాత్రి జరిగిన వాటిపై సురేంద్ర ఏమీ ప్రశ్నించలేదు. 

జీవిత తత్వ నిర్ధారణ

4. 1) జీవిత తత్వ యదార్ధమును నిర్ణయించుటలో ఎవరికి వారే ప్రమాణము. 

2) రుజువు కొరకు తనను అన్యులెవరూ పరీక్షించవలసిన అవసరం లేదు.

3) అలా అనుకుంటే, ఆ పరీక్షించు వారిని పరీక్షించేది ఎవరు? 

4) కనుక, పరీక్షిస్తానంటున్న వారి అర్హతను నిర్ణయించేదెలా అన్న ప్రశ్న పుట్టి, అనవస్తా దోషానికి దారితీస్తుంది. 

5) యథార్ధమునకు కొలత త్రికాలాబాధితమే.

6) ఇంకనూ బలంగా చెప్పాలంటే, దేశ కాల వ్యక్తులకు అబాధితమై యుండుటే.

7) అన్ని ప్రాంతాలలోనూ, అన్ని కాలాలలోనూ, వ్యక్తులెవరైననూ చూడగల యధార్థం 

ఒక్కటే. 

8) • ఎవరికి వారు తాము నమ్మినదే యథార్థమని భావించవచ్చును కదా? అన్న ప్రశ్న కృష్ణారావు గారే లేవనెత్తారు. 

9) దానికి సమాధానంగా వారే యథార్థమును ఎలా నిర్ధారించగలమో ఎరిగి నిర్ధారించుటే ఎవరైనా చేయగలిగింది. 

10) నిజాయితీగా సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన తనకుందో లేదో కూడా తానే నిర్ణయించుకోవాలి. 

11) ఈ విషయమందు యథార్ధ దృష్టి గలవారు సహాయపడగలరంతే.

12) చూసుకోడానికి - చూడడానికి - ఇష్టపడని వారిని ఎవరూ ఏమీ చేయలేరు. పాఠక మిత్రులారా! కృష్ణారావు గారి లేఖలో, మా ఇరువురికి సంబంధించిన సంభాషణ వరకు, పూర్తి చిత్రమిదే. 

మొత్తం మీద ఈ భాగంలో 86 అభిప్రాయాలు ప్రకటింపబడ్డాయి. సిద్ధాంత గ్రంథాలు గానీ, తాత్విక రచనలు గానీ అధ్యయనం చేయాలంటే, ఇదిగో ఇలాగే చదవాలి. పరిశీలనకు తీసుకుని దానిలో, ఎన్ని అభిప్రాయాలు ప్రకటింపబడ్డాయి అన్నది సుస్పష్టంగా గమనించాలి. ఈ పని సక్రమంగా జరగడం కొరకే మండలి భాషకు సంబంధించినవీ, వినేవానికి, చెప్పేవానికి సంబంధించినవీ కొన్ని జాగ్రత్తలను ఏర్పరుచుకుంది. 

1) శ్రోత-పఠిత-చక్కగా వినాలి.

2) అవసరమైనప్పుడల్లా, విన్న మాటలకు అర్ధాలను, అన్నవాడినడిగి తెలుసుకుంటూ ఉండాలి. 

3) చెప్పేవారు కూడా, తాను వెల్లడించాలనుకున్న భావాన్ని సూటిగా, సరళంగా, సందేహ రహితంగా పట్టివ్వగల పదాలనే వాడాలి. 

4) విన్నవారు తానన్న మాటలకు అర్థమేమిటని అడిగినప్పుడు, తన అర్థం ఏమిటో చెప్పే బాధ్యత వహించాలి. ఇంత వరకు సవుగా జరిగితేనే, వక్త చెప్పదలుచుకున్నది శ్రోత వద్దకు సక్రమంగా చేరే అవకాశం ఉంది. 

దీనికి సంబంధించిందే ఒక నియమం ఉంది. నియమం : వక్త హృదయం ఇదేనని నిర్ధారించుకున్నాకనే, దాని సబబు బేసబబుల గురించి ఆలోచించాలి. ఒకవేళ వక్త మనకు అందుబాటులో లేకుంటే ఏమి చేయాలి? అన్నది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే చాలా రచనల విషయంలో, రచయితలు అందుబాటులో లేకపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అన్నవాడేమన్నాడో తేలిన తరువాతే, అది సరిగనే ఉందో లేదో చూడాలన్నది ఎవరూ కాదనడానికి వీల్లేనిదేనా? ఇక్కడ గాని స్పష్టత లేకుంటే, తరువాత సాగించాల్సిన పరిశీలన, విచారణ, నిర్ణయములన్నవి సక్రమంగా సాగనే సాగవు. మీ నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఈ సమస్యను మీరైతే ఎలా పరిష్కరించుకుంటారో ఆలోచించండి. ఇలాంటి సందర్భాలలో చేయాల్సిన ప్రక్రియనే వాక్యార్థ నిర్ణయ పద్ధతి అనంటారు. 

1) వక్త ఏ సందర్భంలో, ఏ విషయాన్ని తెలియజేయాలని చెప్పడం మొదలెట్టాడో చూస్తాం. 

2) అంతకుముందు మాటలకూ- దీనికీ - తరువాత మాట్లాడిన మాటలకూ, క్రమం కుదురుతుందో లేదో చూస్తాము. 

3) వాక్యములోని ఏ పదం, పదాలు, ఆ వాక్యానికి ఒకటికంటే ఎక్కువ అర్థాలు చెప్పడానికి వీలు కల్పిస్తున్నాయో, అన్న దానిని పరిశీలిస్తాం. 

* ఇదంతా కూడా, ఖచ్చితంగా వాక్యార్ధాన్ని (వక్త హృదయాన్ని) తెలుసుకోవా లనుకున్నప్పుడే చేస్తాం. కనుక, చెబుతున్నది యథాతథంగా గ్రహించాలనుకుంటే, ఆ పని ఎక్కడి నుండి ఆరంభం కావాలంటారు? నా అవగాహన ప్రకారం చక్కగా వినడం ,చక్కగా చదవడం అన్న దగ్గరే మొదలవ్వాలి. 

ఇలా వినే, చదివే సందర్భాలకు సంబంధించిందే, ఒక వాస్తవం చెప్పనా? వినే వాళ్లలో చాలామంది చక్కగా వినరు, చదివే వాళ్ళలోనూ చాలామంది ప్రత్యంశాన్ని పట్టించుకుంటూ  చదవరు. యాదాలాపంగా వింటారు. యాంత్రికంగా చదివేస్తుంటారు. ఈ ప్రమాదాన్ని గమనించే వెనుకటివాళ్ళాక ప్రకటన చేశారు. 

ఆశ్చర్యో వక్తా కుశలోశ్య లః, ఆశ్చర్యోజాతా కుశలాను సిస్టః 

నేర్పరియైన వక్త దొరకడం ఆశ్చర్యమే, అలాగే కుశులుడైన శ్రోత దొరకడమూ ఆశ్చర్యమే. అరుదు అని. ప్రస్తుతం మనం విచారిస్తున్నది ఒక రచనను కనుక, రచనను చదివేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలో శక్తివంతంగా చదువరికి ఉపయోగపడే పద్ధతినే మేము సరైన అధ్యయన పద్ధతి (పంచ ప్రశ్నా పద్దతి) అనంటున్నాము. దానిని గత సంచికలో ప్రసాదు వివరించాడు. అక్కడ చూడండి. ఆ సంచిక అందని వారి కొరకై సూత్రరూపంలో వాటిని చెబుతాను. 

1) చదివిన భాగంలో ఎన్ని వాక్యాలున్నాయి? 2) వాటినుండి ఎన్ని అభిప్రాయాలు వస్తున్నాయి? 3) అందులో చదువరికి అర్థమైన వెన్ని? 4) అర్థమైన వాటిలో తప్పులెన్ని? ఒప్పోలెన్ని? తేల్చి చెప్పలేనివెన్ని? 5) అర్థం కాని పదాలేమైనా ఉన్నాయా? పద పదార్థ జ్ఞానం లేని వానికి వాక్యార్థ జ్ఞానం కలుగదు. ఇది భాషా నియమం. 

మిత్రులారా! నేను ఈ వ్యాసం మొదటిలో కృష్ణారావు గారి లేఖ నుండి రాబట్టిన 86 అభిప్రాయాలూ, ఈ పంచ ప్రశ్నా పద్ధతిలోని మొదటి రెండు ప్రశ్నలాధారంగా గమనించినవే. 

* ఇక్కడ మీరంతా ఒకసారి దీనిని  జాగ్రత్తగా పరిశీలించండి. ఈ పద్ధతిని (ప్రశ్నలను) దృష్టిలో పెట్టుకుని చదవడానికీ, వీటిని పట్టించుకోకుండా, సాదాసీదాగా చదువుకుపోడానికీ తేడా ఉందో లేదో, ఉంటుందో లేదో గమనించండి. మామూలుగా చదివినవారికి కృష్ణారావు గారు, తాను చెప్పదలుచుకున్న వివిధ విషయాల పైన తనవైన '86' అభిప్రాయాలు 

ప్రకటించారని స్పష్టంగా గ్రహించడానికి వీలవుతుందంటారా? ఇలా చదవడం వల్లనే ఆయనగారి '86' అభిప్రాయాలు మనకెరుకలోకి వచ్చాయి. తరవాతి ప్రశ్న అందులో ఎన్ని అర్థమైనాయి? అన్నది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ప్రతి అభిప్రాయాన్ని మరొక్కమారు, దేనికి దానిగా తిరిగి జాగ్రత్తగా గమనించాల్సివస్తుంది. అలాంటప్పుడే, వాక్యం సరిగా అర్థమవుతోందా, లేదా? అని చూసుకుంటాము. ఏదైనా వాక్యములో ఏ ఒక్క పదం అర్థంకానిది ఉన్నా, ఆ వాక్యం వరకు మనకు అర్థం కానట్లే. 5 ప్రశ్నల తర్వాత చెప్పిన భాషా నియమం అర్థమైతే, అధ్యయనపరుడు, తొందర పడకుండా, ప్రతి పదాన్ని పట్టించుకుని చూసే, వాక్యార్థమైందో లేదో తెలుసుకుంటాడు. మామూలుగా చదివే వాళ్ళంత జాగ్రత్తగా, సావధానంగా చదవరు నిజమా? కాదా? ఈ విధానం అధ్యయన పరులకు ఎంతో మహత్వపూర్ణమైనది. నిశితంగా పట్టి చూడక తప్పని పరిస్థితిని కల్పించడం ద్వారా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుగలది. మరే రకంగానూ సాధ్యపడనంత స్పష్టతను చేకూర్చు గలిగింది. సరైన రీతిలో విన్నదానిలో అర్థమైందెంత? అర్థం కానిదెంత? అన్నది స్పష్టంగా తెలిసేలా చేయగలిగింది. వక్త ఏమన్నదీ తెలియడానికీ, దాని తప్పులు, ఒప్పులు తేల్చాలంటే తెలియాల్సిందానికీ మధ్యనున్న తేడాను చూపెట్టగలిగింది. అర్థం కాకుండానే అర్థమైందనుకునే భ్రమకు లోనవ్వకుండా చాలావరకు ఆపగలిగింది. ఇలా బహుముఖమైన మేలును కలిగించగలది. చెప్పడం, వినడం, రాయడం, చదవడం అన్న క్షేత్రాలలో ఎదురయ్యే పొరపాట్లను ఒడుదుడుకులను సంవత్సరాల తరబడి గమనించడం ద్వారా రూపొందించుకున్న శక్తివంతమైన అధ్యయన పద్ధతికి చెందిన చిత్రమది. 

ప్రయోగాత్మకంగా మీరు దీనిని గమనించడానికనే కృష్ణారావు గారి లేఖలోని చివరి భాగాన్ని ఈ ప్రక్రియకు లోనుచేయకుండా విడిచి పెట్టాను. అధ్యయనంలో పట్టు సాధించాలన్న పట్టుదల ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ భాగాన్ని అంటే 'జగీ వాసుదేవ్', స్టాఫ్ క్రిబ్బింగ్, వేదాంతమంటే ఏమిటి? అన్న మూడు శీర్షికల క్రింద చెప్పబడిన భాగాన్ని ఈ పంచ ప్రశ్నా పద్ధతిని వినియోగించి ఆ భాగంలో ఎన్ని అభిప్రాయాలు ప్రకటింపబడి ఉన్నాయి? అందులో మీకెన్ని అర్థమైనాయి? మీరు తప్పని చెప్పగలిగినవీ, ఒప్పని చెప్పగలిగినవీ, అలా నిర్ణయించలేనివీ ఏవేవి? అర్థం కాని పదాలెన్ని ఉన్నాయి అన్నది ఒక పేపర్ పైన పెట్టండి. ఆ తరువాత మీకు తెలిసిన మిత్రులకు కొందరికి ఆ భాగాన్నిచ్చి అధ్యయన పద్ధతిని గురించి వారికి చెప్పకుండా దానిని చదివి వారికేమర్థమైందో చెప్పమని అడగండి. అలా వేరు వేరు పుస్తక భాగాలను తీసుకుని, మామూలుగా చదవడం, అధ్యయన పద్ధతి ఉపయోగించి చదవడం అన్నది చేసి, పుస్తకాలు చదవడంలో, అదీ శాస్త్రీయ, తాత్విక రచనలు చదవడంలో దీని పాత్ర ఏ పాటిదో నిర్ణయించండి. 

జ్ఞాన క్షేత్రానికి సంబంధించిన మరొక ప్రయోజనకరమైన విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. పుస్తకాలను చదివేటప్పుడు గానీ, ప్రసంగాలను వినేటప్పుడు గానీ, ఎవరు చెప్పారన్నది అన్న దానిని పరిగణనలోకి తీసుకోకూడదు (తీసుకో నక్కరలేదు). ఏమి చెప్పారన్నది మాత్రమే గమనించాలి. అలా చేయడం వల్ల అనుకూల ప్రతికూల దుష్టులను ప్రక్కనబెట్టి ఈ విషయాన్ని విషయంగా చూడడం సులువవుతుంది. మండలికి ఇది ప్రాణప్రదమైన నియమము. గురువు చెప్పాడా? శిష్యుడు చెప్పాడా? మిత్రుడు చెప్పాడా? శత్రువు చెప్పాడా? చిన్నవాడు చెప్పాడా? పెద్దవాడు చెప్పాడా? అన్న దానిని ప్రక్కన పెట్టి చెప్పిందేమిటో గమనించాలి. అది అనుభవానికి సరిపోతుందా? లేదా? అన్నది చూడాలి. మిత్రులారా! నేను చెబుతున్నది అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. 

ఒక విషయంపై విచారణ చేసి దాని బాగోగులను గురించి నిష్కర్షించడానికి, ఆ మాటన్న వానితో మనకున్న మానవ సంబంధాలను జ్ఞాన క్షేత్రంతో ముడి పెట్టాల్సిన పని లేదు. 

ముడి పెట్టకుండడమే సరైనది. ఇద్దరి మిత్రుల మధ్య ఒక విషయంపై విచారణ జరుగుతోందనుకుందాం. మిత్రుడు రెండు రెళ్ళు ఆరు అన్నాడు. అది తప్పు అంటాం. అదే 

విషయంలో మనకు శత్రుపక్షం వారి నుండి రెండు రెళ్ళు నాలుగు అన్న ప్రకటన వచ్చింది. అది ఒప్పే అంటాం. ఈ రెండు సందర్భాలలోనూ అన్నవాడు మిత్రుడా? శత్రువా? అన్న దానివి ఏమాత్రం పట్టించుకోకుండానే వారన్నది తప్పో ఒప్పో మాత్రమే చెబుతాం. ఆ అన్న వారిద్దరూ కూడా, నన్ను మిత్రుడనీ చూడక తప్పుబట్టాడనో, శత్రువునైనా నన్ను ఒప్పన్నాడనో, చూడకూడదు. ఎందుకంటే, శత్రువు, మిత్రుడు అన్నవి మానవ సంబంధాలకు సంబంధించినవి. తప్పు ఒప్పు అన్నవి విషయానికి సంబంధించినవి. ఈ రెంటినీ ముడిపెట్టి చూడకూడదు. 

అలాగే మన భావాలు విమర్శకు లోనవుతన్నప్పుడు కూడా విమర్శను విషయపరంగా చూడాల్సిందే గాని, వారికీ మనకూ మధ్య నెలకొని ఉన్న మానవ సంబంధాలతో దానిని ముడి పెట్టకూడదు. మన పరిశీలనే వ్యక్తికి సంబంధించిందైనప్పుడు మాత్రం వ్యక్తిని విమర్శించవచ్చు. అప్పుడు కూడా ఆ విమర్శ వాస్తవాన్ని చూపిస్తున్నదా? అవాస్తవాన్ని చూపిస్తున్నదా? అన్నది పరిగణనలోకి తీసుకోవాలే గాని శత్రువు చేశాడా, మిత్రుడు చేశాడా అన్న దృష్టి నుండి చూడకూడదు. 

కృష్ణారావు గారి లేఖలోనుండి రాబట్టిన '86' అభిప్రాయాలను దేనికి దానినిగా సత్యాసత్య విచారణకు లోనుచేయాల్సి ఉంది. మీలో అభిలాష ఉన్న వాళ్ళు ఆ పని చేసి మీ మీ పరిశీలన రూపాలను పత్రికకు పంపండి. ఆగస్టు సంచికలో అవకాశం ఉన్నంత మేర వాటిని ప్రచురిస్తాను. నేను కూడా ఆ అభిప్రాయాలను పై సంచికలో ఒకింత విశ్లేషిస్తాను. ప్రస్తుతానికి వాటిలోని రెండు మూడు విషయాలపై నా అభిప్రాయాన్ని వ్రాస్తాను. 256 సంచికలో కృష్ణారావు గారు, 2017 ఏప్రిల్ 9న జరిగిన సంభాషణలో నుండి ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సందర్భంలో సోమ్ ప్రకాష్ గారు, నేను, కృష్ణారావు గారు అక్కడ ఉన్నాము. ఆ రోజంతా కృష్ణారావు గారు మాట్లాడిన దానిని దృష్టిలో పెట్టుకుని, నేను కృష్ణారావు గారిని, అయితే మనం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం, మీరు సూచించే జ్ఞానం లేకపోవడమేనా? అని అడిగాను. దానికి కృష్ణారావు గారు 'అవును అంతే' 

అని సమాధానం చెప్పారు. 

ఇక్కడ అత్యంత కీలకాంశమేమంటే, 2017 నాటి ప్రసంగంలో ఏ జ్ఞానం లేకపోవడం, ఆయన చెప్పిన సామాజిక సంక్షోభానికంతటికీ కారణమంటున్నదేమిటో స్పష్టంగా మనం గమనించాలి. అదేమిటంటే, 

1) తెలిసి కొనెడి తనను తాను తెలుసుకోవడం లేదు.

2) జ్ఞేయ స్థానంలో నున్న 'నేను” బ్రాంతి నేను మాత్రమే.

3) ఈ వాస్తవాన్ని గుర్తించితేనే తెలుసుకొను నేనును గుర్తించగలుగుతాడు. 

4) అంటే జ్ఞేయాన్ని జ్ఞేయంగా, జ్ఞాతను జాతగా విడగొట్టి తాను జ్ఞాతగా నిలబడతాడు.

5) అట్టి దృష్టి ఏర్పడనంతవరకు జీవిత సమస్య తెగదు. 

వ్యక్తికి ఈ జ్ఞానం కలక్కపోవడం వల్లనే సమాజంలో సంక్షోభం నెలకొని ఉంది అంటున్నారన్న మాట. ఇగో ఇక్కడే నేను కృష్ణరావు గారిని, ఇ ఎంత మందిని మీరు మార్చగలరు? అని ప్రశ్నించాను. ఎందుకని ఆ ప్రశ్న వేశాను? సమాజ సంక్షోభం పోవాలంటే, వ్యక్తికి జ్ఞాత జేయాలకు సంబంధించిన భ్రమజ్ఞానం తొలగి, వాస్తవ జ్ఞానం కలగాల్సిందే అని అంటున్నారాయన. ఈ విషయంలో ఎవరికి వారు తాను తప్పు జ్ఞానంలో ఉన్నానని గమనించుకుని, ఒప్పు జ్ఞానానికై నిజాయితీగా, పట్టుదలగా ప్రయత్నిస్తే గాని అట్టి జ్ఞానం కలగదని స్పష్టంగా చెప్పేశారు. వారన్నట్లే పెంచలయ్య గారికి అట్టి వాస్తవ జ్ఞానం కలిగిందనుకుందాం. అంతమాత్రాన కృష్ణారావు గారు ఎంతో వివరంగా చెప్పిన ఆ సమాజ సంక్షోభం, మనుషుల మధ్య ఘర్షణ తొలుగుతుందా? అంటే తొలగదుగాక తొలగదు, అని మనలో ఎవరమైనా చెప్పగలం. కృష్ణారావు గారికీ, అలానే, సత్య జ్ఞాన సంఘం తోడ్పాటు తీసుకున్న కొంతమందికీ, వారన్న జ్ఞాత-జేయాలకు సంబంధించిన భ్రమ తొలగి వాస్తవ జ్ఞానం కలిగిందనకుందాం. అంతమాత్రాన ఏ సంక్షోభం తొలగాలని ఆయన వేదన పడుతున్నారో, ఆ సంక్షోభం తొలుగుతుందా? అని పరిశీలించాము. తొలగదుగాక తొలగదు అన్న సమాధానం వచ్చింది. దీన్నంతటినీ విచారించుకునే, అలా ఎవరికివారే ఆ సత్యాన్ని గ్రహించాలి అన్న పద్ధతి ద్వారా మీరెంతమందిని మార్చగలరండీ? అని ప్రశ్నించాను. 

కృష్ణారావు గారు, ఈ ప్రశ్నను వినగానే, మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, అనేశారు. విషయాన్ని నేనెక్కడ ప్రక్కదారి పట్టించానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 

ఆనాటి మొత్తం ప్రసంగంలో ముప్పాతిక మూడొంతులు, సమాజంలో మతాల పేరున, దేశాల పేరున, వ్యక్తుల మధ్య ఘర్షణ నెలకొనివుంది. ఆర్థికపరమైన అసమానతలు నెలకొని ఉన్నాయి. అవి తొలగాలి అనే కదా మాట్లాడింది. అవి తొలగకపోవడానికి కారణం, వ్యక్తి అసలు తానెవరో తెలుసుకుని లేకపోవడం, విద్యా నేనునే తాననుకోవడం. అన్న దానిని ఎవరికివారే తొలగించుకోవలసిందేననీ ఖరాఖండిగా ప్రకటించారు కదా? అప్పుడడిగాను నే నా ప్రశ్నను. ఏ వ్యక్తికావ్యక్తి ఈ జ్ఞానాన్ని పొందేదెప్పుడు? సమాజంలో ఘర్షణ తొలిగేదెప్పుడు? అని. కొందరికి ఈ జ్ఞానం కలిగినా, సమాజంలో ఘర్షణ పోవడం లేదు. ఈ జ్ఞానం కలిగినవారు ఘర్షణ ఉన్న సమాజంలో ఘర్షణ పడుతూనే జీవిస్తున్నారు. దీన్నంతటినీ పరిగణనలోకి తీసుకునే ఇలా ఎంత మందిని మార్చగలరనీ, ఎప్పటికీ ఘర్షణ ముగిసేను అని అడిగాను. 

ఈ సందర్భంలోనే, “మీరు ప్రస్తావించిన ఎన్నో విషయాలు పరిశీలనకు నిలబడవు” అని నేనన్నాను. మీ భావాలను పరిశీలనకు ఇవ్వండి అని అడిగాను. అప్పుడు 

ఆ అవసరం మాకు లేదని అన్నారాయన. వారామాట అనగానే, అలా అయితే, ఈ శ్రమంతా వ్యర్ధశ్రమే కదా అని అన్నాను నేను. సోమ్ ప్రకాష్ గారు కూడా అవును వేస్టేనన్నారు. 

ఈ విషయంలో మొదటినుండీ నేను అనుసరిస్తున్నదొక్కటే, ఒక వ్యక్తి ప్రకటించిన అభిప్రాయాలు పరిశీలించక్కర లేదన్నా, పరిశీలనకు ఇవ్వము అనన్నా, అవి సరైనవేనని నిర్ధారించే బాధ్యత స్వీకరించను అనన్నా, ఆపై ఆ వ్యక్తితో కలసి జరిపే పరిశీలనంతా అనవసరమైన పనే కదా! 

* 'నెగిటివ్ యాటిట్యూడ్' ఉన్నవారు సత్యాసత్య విచారణ గానీ, పునఃపరిశీలన గానీ చేయలేరన్నది కృష్ణారావు గారి అభిప్రాయం. 

* అలాటి వైఖరి కలిగి ఉండీ, సత్యాసత్య పరిశీలన చేయడం సాధ్యమేనన్నది నా అభిప్రాయం. దీనిపైనా మీ మీ అనుభవాలెలా ఉన్నాయో గమనించి పత్రికకు రాయండి. ఈ విషయంపై పై సంచికలో విశ్లేషణ చేస్తాను. మన మధ్య ఎన్ని విషయ సంబంధంగా విభేదాలున్నా, అక్కడక్కడా కొన్ని విరుద్దాభిప్రాయాలు కలిగి ఉన్నా కూడా, మానవ సంబంధాల పరంగా మిత్రులంగానే కాక ఆత్మీయులుంగా కొనసాగడానికి ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఉండక్కర లేదన్న మాటతో, అంటే మనం మిత్రులంగా ఉంటూనే విషయపరంగా కొట్లాడుకుంటానూ ఉండవచ్చునన్న వాస్తవాన్ని తెలిపే మాటతో నా యీ వ్యాసాన్ని ముగిస్తున్నాను. మీరూ, పాఠకులూ కూడా ఉచితంగా స్పందించగలరని ఆశిస్తాను. - సత్యాన్వేషణలో సురేంద్ర. 

కోట ప్రసాద శివరావు ప్రతిస్పందన.

కృష్ణారావు గారికి నమస్కారం, 

మీరు “దేవుడు ఉన్నాడు - దేవుని దర్శించవచ్చు” అన్న పుస్తకం పంపారు. చాలా సంతోషము. 

ఆ పుస్తకము అట్ట మీద సత్య జ్ఞాన సంఘం అంటూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి నాకు సరిగా అర్థము కావడము లేదు. కనుక నా సందేహాలను తెలియపరుస్తాను. వాటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన వివరాలు అందించండి. 

“గుర్తింపు రహితంగ మనమెప్పుడూ లేము. మన గుర్తింపే మన చేతన స్వరూపము. అవాస్తవం పట్ల కలిగెడి గుర్తింపు మనలను వేరు చేస్తుంది. మనలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మన యదార్ధ స్వరూపము పట్ల కలిగెడి గుర్తింపు మనలను ఒకటి చేస్తుంది. మన జీవితాన్ని కొరతలేని ప్రేమతో నింపుతుంది.” - సత్యజ్ఞాన సంఘము. 

నా సందేహము:

“గుర్తింపు రహితంగా మనమెప్పుడూ లేము”. అంటే గుర్తింపు కోరుకోకుండా మనం ఎప్పుడూ లేము అన్న అర్థం వస్తుందనిపించింది. గుర్తింపు అన్న పదానికి గమనింపు అని అనుకుంటే, తెలివి లేకుండా, స్పృహలేకుండా ఎప్పుడూ మనము లేము అన్న అర్థం వస్తుంది. అలా అనుకున్నా, గాఢనిద్రలో గమనింపు లేకుండానే ఉంటున్నాము కదా! ఇక్కడే నాకు సందేహం ఉంది. స్పష్టత రాలేదు. 

“మన గుర్తింపే మన చేతన స్వరూపము”. గుర్తింపు అంటే ఏమిటో తెలియటము లేదు. అది గుణవాచకమా, నామవాచకమా, క్రియా వాచకమా తెలిస్తే కాని ఆ వాక్యము అర్ధము కాదు. 

“అవాస్తవము పట్ల కలిగెడి గుర్తింపు మనలను (మనుషులను) వేరు చేస్తుంది”. అవాస్తవము అంటే లేనిది అన్న అర్థం వస్తుంది కదా! లేని దాని పట్ల గుర్తింపు ఎలా కలుగుతుంది? పోనీ తప్పు జ్ఞానము అన్న అర్ధాన్ని తీసుకుందామనుకున్నా, తప్పు జ్ఞానము కూడా వ్యక్తులను సమూహాలుగా కలిపి వుంచగలగడం మన అనుభవంలోనిదే చూస్తున్నదే కదా! ఉదాహరణకు : ఖురాన్, బైబిలు వగైరా మత గ్రంథాలు ప్రజలను బలంగానే పట్టి ఉ ంచుతున్నాయి కదా! కనుక తప్పు జ్ఞానం కంటే భిన్నాభిప్రాయాలే మనుషులను వేరు చేస్తున్నాయని నాకనిపిస్తుంది. ఇక్కడ స్పష్టత ఇవ్వగలరు. 

“మన యథార్థ స్వరూపము పట్ల కలిగెడి గుర్తింపు మనలను (మనుషులను) ఒకటి చేస్తుంది”. 

స్వరూపము అంటే మీ అర్థమేమిటో బోధపడటం లేదు. స్వరూపం గుణవాచకమనుకుంటే అది తెలివో, స్పృహ, గమనింపో అయి వుంటుంది. దాని యథార్ధ స్వరూపము కూడా అదేకదా అయ్యేది. యథార్ధ స్వరూపము పట్ల కలిగెడి గుర్తింపు మనలను ఒకటి చేస్తుంది. ఏమిటో అర్ధము కావటం లేదు. అంటే ఎవరు గాని, లేక దానంతటికది గాని తెలివిని తెలివి లేకపోవటం అనిగాని, స్పృహను స్పృహ లేకపోవటం అనిగాని, గమనింపును గమనింపు లేకపోవడం అనిగాని, గుర్తించడం కుదురుతుందా. అలా కుదరంది మనలను ఒకటి చేయడం ఏమిటి. 

“మన జీవితాన్ని కొరతలేని ప్రేమతో నింపుతుంది”. కొరత లేని ప్రేమ అంటే వివరించగలరు. నాకు తెలిసి కొరతలేని ప్రేమ అంటే శత్రువులను, తనకు కీడు చేసిన వారిని కూడా ప్రేమించడం అని అనుకుంటున్నాను. కానీ మన అనుభవములో సద్విమర్శ (వ్యక్తి నిందలు లేకుండా విషయపరంగా చేసేది) చేస్తేనే తట్టుకోలేక పోతుంటే మరి కొరతలేని 

ప్రేమ అసంభవం అనిపిస్తుంది. 

ఈ విషయంలో పెంచలయ్య గారు సురేంద్ర గారు నాకంటే ఆత్మీయతను ఎక్కువ చూపించగలరనిపిస్తుంది. కారణము శ్రీకాళహస్తిలో జరిగిన సమావేశములో అయ్యవారికి ఇతరులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమావేశానంతరం ఏమి అనుకోవద్దు అని రఘుపతిరావు గారు అయ్యవారిని అంటే, దానికి అయ్యవారు ఈ విషయమును గురించి మన స్నేహాన్ని వదులుకునేంతటి మూర్ఖ్యుడను కాను అన్నారు. 

అలానే రావిపూడి వెంకటాద్రి గారు విషయపరంగా కాకుండా వ్యక్తి నిందలకు పాలుపడ్డాడు అన్న విషయం మనందరికీ విధి తమే . అయినా సురేంద్ర గారు వెంకటాద్రి గారి 100 సంవత్సరములు పూర్తయిన వేడుకలో, అడిగి మరీ పాల్గొన్నారు. అది సంఘ సభ్యులందరికీ ఇష్టం లేకపోయినా. మనం కూడా ఆత్మీయతగా ఉండటానికి ప్రయత్నిద్దాము. 

మీరు నా సందేహాలను నివృత్తి చేయగలరని ఆశిస్తాను. 


No comments:

Post a Comment