Saturday, October 2, 2021

258 వివేకపథం

పెంచలయ్య గారి జ్ఞాన విద్యా శాస్త్రము-తర్కశాస్త్రము ఒక పరిశీలన

సత్య జ్ఞాన సంఘ సభ్యులకూ, నాకూ, వారికీ కూడా పరిచయాలూ, సాన్నిహిత్యమూ, ఉన్న మిత్రులకూ ఒక సూచన. నాకంటే ముందునుండీ, పెంచలయ్య గారితో సంబంధాలు, సాహిత్యమూ ఉన్నవాళ్ళతో సహా ఎవరూ, నేనూ పెంచలయ్య గారూ కలసి చేసినన్ని కార్యక్రమాలు చేసినవారూ లేరు. అలాగే, మేమిరువురమూ, కలసి తిరిగి చేసినన్ని సిద్ధాంత చర్చలూ, పెంచలయ్య గారితో కలసి తిరిగి చేసినవారూ లేరు. కనుక మేమిరువురమూ ఇతర తాత్విక ధోరణులకు చెందిన పండితులతో సైద్ధాంతిక చర్చలు చేసే సందర్భాలలో, అనుసరించిన విధానమేమిటన్నది నాకంటే అధికంగాస్పష్టంగా తెలిసినవారు నా పరిచయస్తులలో ఎవరూ లేరు. అయినా ఆ విధానమేమిటో తెలిసిన వారు మీలోనూ కొందరుండవచ్చు. ఆ విధానాన్ని గురించిన వివరాలు కొంతవరకు 1.2.1997 వివేకపథం-7లో ఉన్నాయి. అంటే సుమారు 24 ఏండ్ల నాడే, ఆ విషయాలు స్పష్టంగా ప్రకటించానన్న మాట. ఈనాటికీ (ఏనాటికైనా కూడా) అవి పాటించి తీరవలసినవిగానే ఉన్నాయి గనుక, మరోసారి మీ అందరి దృష్టికి తెస్తున్నాను.

వివేకపథం 7-12-1997 లో ప్రచురించిన విషయం.

“భావ విప్లవం యొక్క ఆవశ్యకత లోగడ కంటే ఈ నాడెక్కువగా ఉంది. కనుక ఆయా సిద్ధాంతాలకు చెందిన మనమందరము సంసిద్ధులమై ఉమ్మడి వేదికపై మన మన భావాలను ముందుగా పరీక్షకు పెట్టుకుని సరైనవేవో, సరికానివేవో తేల్చుకోనిదే ‘భావ విప్లవం’ అన్నది నీటి మీద రాత, గాలి మూట వంటిదే అవుతుంది. మాకీ రకమైన అవగాహన కలిగినప్పటినుండి అంటే దాదాపు 13, 14 సంవత్సరాలుగా పెంచలయ్య గారూ, నేనూ కలసి ప్రసిద్ధ తాత్విక ధోరణులకు చెందిన పెద్దలతో చర్చలు  చేస్తూ ఈ విషయాన్ని వారి ముందు పెడుతూ వస్తున్నాము. దానికి కొనసాగింపుగా గత మూడు సంవత్సరముల పైబడి ‘తత్వ చర్చావేదిక’ పేరుతో ఒక్కో సిద్ధాంతాన్ని పది మంది పరీక్షకూ పెట్టడానికి వీలైన ఒక ప్రత్యేక తరహా సమష్టి వేదికను ప్రతి మూడు మాసాలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నాము. అవి జనవరి, ఏప్రియల్, జూలై,  అక్టోబరు మాసాలలో జరుగుతున్నాయి. 

మరో మాట! పెంచలయ్య గారు కూడా, ఒక సిద్ధాంత కారుడు తాను చెప్పవలసినంతా, సుస్పష్టంగా చెప్పకుండానే చనిపోతే; అనంతరకాలంలో అదే సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళలో, వివిధ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు బయలుదేరి, తాము చెపుతున్నదే సరైనది అని  ఎవరికి వారు చెప్పే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. అదే గాని జరిగితే, లోకంలో ఆ సిద్ధాంతం ఏమిటన్న దానిపట్ల మరింత గందరగోళం ఏర్పడుతుంది. అని చాలా స్పష్టంగా ప్రకటించారు. 

ఈ విషయాన్ని ఎన్. కృష్ణారావు గారున్నూ, శ్రీనివాసులు గారికి వ్రాసిన లేఖలో అంతే స్పష్టంగా పేర్కొన్నారు. (వివేకపథం 257 జూలై 2021 సంవత్సరము, పుట 9 చూడండి.)

అలాగే, ప్రమాణాల, పదార్థ వర్గాల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం, ఆయా విషయాలను అర్థం చేసుకునేందుకూ విచారణ లేదా పరిశీలన సరళంగా, సజావుగ, లోతుగా కొనసాగించేందుకు చాలా చాలా అవసరం అన్నంత వరకు పెంచలయ్య గారికీ నాకూ ఏకాభిప్రాయమే ఉంది. కాకుంటే, ఆ రెంటికి సంబంధించిన మా అవగాహనల్లో అంటే…

1) ప్రమాణాలెన్ని? అవేవి? వాటి స్వరూప స్వభావాలేమిటి?

2) పదార్ధ వర్గాలెన్ని? అవేవి? వాటి స్వరూప స్వభావాలేమిటి? అన్న విషయంలో నేనేమిటో చాలా స్పష్టంగా ప్రకటించి ఉన్నాను. కానీ పెంచలయ్య గారు మాత్రం ఆ రెంటి విషయంలో వారేమన్నారు? వీరేమన్నారు? అంటూ అవసరానికి మించి అనవసరమైన విచారణ చేసుకుంటూ పోయారేగానీ తానేమనుకుంటున్నదీ సూటిగా ప్రకటించనే లేదు. నా ఈ ప్రకటన సరైనదే ననడానికి తగిన ఆధారాలు చూపడానికి ఉద్దేశించిందే ఈ  వ్యాసము.

భాష యొక్క ప్రయోజనము, లక్షణ పమాణ విద్య యొక్క అవసరం అన్నవాటిని దృష్టిలో పెట్టుకునే పెంచలయ్య గారు, “జ్ఞాన విద్యా శాస్త్రము - తర్కశాస్త్రము” అన్న ఒక పుస్తకం రాశారు. కావలసినవారు సత్యజ్ఞాన సంఘం నుండి దానిని పొందవచ్చు. దానిలోని విషయాలనే ఇందులో నేను కొన్నింటిని కొద్దిపాటి పరిశీలనకు లేదా విశ్లేషణకు లోను  చేశాను. మీ మీ అనుభవాల ఆధారంగా మీరూ వాటిని జాగ్రత్తగా పట్టి చూడండి. 

* జ్ఞాన విద్యా శాస్త్రముతర్కశాస్త్రము - రచయిత పెంచలయ్య గారు.

పరిశీలన :- పుస్తకం పేరుకు సంబంధించిన ఒక ప్రశ్నను మీ ముందుంచి, తరువాత  పుస్తకంలోకి వెళతాను.

పుస్తకానికి ఏదో ఒక పేరు సూచిస్తే సరిపోను కదా? రెండు పేర్లేందుకు వాడారు? లోకంలో తర్కశాస్త్రం (తర్కశాస్త్రాలు) అన్న పదాల వాడుక ఉంది గానీ, జ్ఞాన విద్యా శాస్త్రమన్న మాట తార్కికులు వాడినట్లు నా దృష్టికి రాలేదు. పెంచలయ్య గారి ప్రకారం ప్రమాణ పదార్థ వర్గాల గురించి వివరించే రచనను జ్ఞాన విద్యా శాస్త్రం అనాలి గానీ, తర్కశాస్త్రం అనకూడదని అన్నారు (పేజీ. 19). ఆనాటివారు వారి రచనకు వారికిష్టమైన  పేరు పెట్టుకున్నారు. అది సరికాదని మనమెందుకనాలి. పెంచలయ్య గారు పుస్తకాన్ని ఇలా ప్రారంభించారు.

1) ‘మానవ జీవితమనగానేమి? కోరికలు కోరుట వాటిని తీర్చుకునే యత్నం చేయుట.’

2) మానవుని యందు గల కోరికలేవి?

ఎ) నేను జీవించ వలయును, మరణించరాదు. బి) నేను స్వతంత్రుడనై ఉండవలయును. సి) నాకు దుఃఖం కలుగ రాదు. డి) నాకు ఎప్పుడూ సుఖం ఉండాలి.

*దీని విషయంలో పెంచలయ్య గారి సమాధానాలు ఇవిగో ఇలా ఉన్నాయి చూడండి.

1) మొదటి కోర్కె కొంతకాలం నెరవేరుతుంది. చనిపోవడమూ జరుగుతోందని, సాటి మనుషుల్ని చూసి గ్రహించాడు. చావ కూడదనే అనిపిస్తోంది గనుక ఉనికి కొనసాగేందుకు చేయగల పనులు చేసుకుంటూ వస్తున్నాడు.

సురేంద్ర :- కానీ చావక తప్పదు అన్న దగ్గరకూ వచ్చాడు కదా మనిషి. పుట్టిన వానికి , చావు తప్పదన్న నిర్ణయాన్ని ఎవరూ కాదనుకోవడం లేదు. కుదిరినంత కాలం బ్రతికుండాలన్న దగ్గరే మనమందరమూ ఉన్నామన్నది నిర్వివాదాంశం కదా

2) రెండో కోర్కె కూడా సంతృప్తికరంగా నెరవేరడం లేదన్న నిజాన్ని పెంచలయ్య గారూ అంగీకరించారు. స్వతంత్రం కలుగుతోంది. పరతంత్రత పరాధీనత కూడా కలుగుతున్నది.  అయినా పరాధీనత లేని స్వతంత్రమును సాధించాలని ప్రయత్నిస్తున్నాడు అనన్నారు. 

సు:- ఇది అంత సబబుగా లేదన్నది నా అభిప్రాయం. సహజీవనాన్ని తన అవసరాల కొరకు తానే కదా అంగీకరించి, ఏర్పరుచుకున్నాడు? ఉండాలన్న కోర్కె తీరాలన్నా, దుఃఖం  రాకుండా ఉండాలన్నా, సుఖం వస్తుండాలన్నా, ఎంతో కొంతమేర స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వదులుకోక తప్పదని, అనుభవం ద్వారా గ్రహించాడు. కనుకనే పరస్పరం కొన్ని కట్టుబాట్లకు లోనవ్వడానికి సిద్ధపడ్డాడు. స్వభావం, అంతా తన ప్రకారమే జరగాలనీ, తనతో ముడిపడినవన్నీ తన అధీనంలో ఉండాలని కోరుకుంటున్నా, జీవితానుభవాల ఫలిత  రూపమైన వివేకం, అది అసాధ్యం. నీ స్వభావాన్ని అదుపు చేసుకోమని చెప్పింది. వత్తిడి చేసింది. గనుకనే, హక్కులువిధులు బాధ్యతలు, కర్తవ్యాలు, విధినిషేధాలు అంటూ స్వేచ్ఛపై నొక్కు పెట్టి అనేక కట్టుబాట్లను తనకు తానే విధించుకున్నాడు. వాటిని పాటించడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. తన వివేకం చెప్పినట్లు నడుచుకోవడం తన ఒక్కని వల్ల అయ్యే పని కాదని తెలుసుకున్నాకనే బాహ్య అదుపునూ తానే తెచ్చి పెట్టుకున్నాడు. దీని అర్థం ఏమిటో తెలుస్తోందా?

స్వభావానికి చెందిన ఆకాంక్షలను, యథార్ధ జ్ఞానం చూపిన పరిమితులకు లోబడి , పొందుతుండడమే చేయగలిగిందీ, చేయవలసిందీ అన్న దగ్గరకు చేరాడు మనిషి.

3) మానవునికి దుఃఖం వస్తోంది. తొలగించుకోగలిగిన మేర దుఃఖ నాశనం జరుగుతోంది. 

సు:- జీవితమంతా దుఃఖమయమై పోవడం గానీ, దు:-ఖలేశమైనా లేకుండా పోవడం గానీ జరిగే పని కాదు. దుఃఖం వచ్చినప్పుడల్లా తొలగించుకో గలిగిన మేర తొలగించుకుంటూ,  వీలున్నంతలో తిరిగి అలాటి దుఃఖం రాకుండా చూసుకుంటూ జీవించడమే చేయగలదీ, చేయవలసిందీ కూడా, అన్న అవగాహనకు వచ్చేశాడు.

4) దుఃఖంలానే సుఖమూ వస్తూ పోతూ ఉంది. సుఖం పోకుండా ఉంటే బాగుండును అని అనిపిస్తూనూ ఉంది.

సు:- మిగిలిన వాటిలానే ఈ సుఖం కూడా. శాశ్వత సుఖమన్నది జీవించి ఉండగా , సాధ్యపడదు. జీవితం సుఖదుఃఖాల మిశ్రితం. పొందకలిగినంత పొందేందుకు యత్నిస్తూ , జీవితాన్ని సాగించడమే చేయగలిగిందీ, చేయవలసింది అన్న దగ్గరకు వచ్చేశాడు మనిషి. 

కానీ పెంచలయ్య గారు, ఈ నాలుగింటి విషయంలో, అనుకున్నది జరగకపోడానికి :- కారణాలేమిటో, కనుగొని వాటిని తొలగిస్తే అవి పరిష్కారం అవుతాయి కదా, అన్న “కారణ నాశేన కార్య నాశనమ్” అన్న సాధారణ సూత్రాన్ని తీసుకుని, మనిషి వాటికి సంబంధించిన యథార్ధ జ్ఞానాన్ని సంపాదించడానికి తీవ్రంగా యత్నించడం మొదలెట్టాడు అని తమ  విచారణను మరోలా కొనసాగించారు.

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

మీరూ ఎవరికి వారుగా, పై నాలుగు విషయాలకు సంబంధించి మీ మీ జీవితానుభవాలు ఏమి చెబుతున్నాయో జాగ్రత్తగా పరిశీలించి వాస్తవాలను కనుగొనండి. వాటికి సంబంధించి నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు సరిగనే ఉన్నాయో లేదో చూడండి.

1) ఉనికి కొనసాగాలంటే జీవితంలో ఏమి జరుగుతుండాలో కనిపెట్టండి. కనిపెట్టడమంటే అదేదో కొండమీది కోతిని కనుగొనడం లాటిది కాదు. నిత్యమూ జీవితంలో, నిరంతరం ఏమి జరుగుతుందో చూడడమనే. అది ప్రతి ఒక్కరూ చేయగలిగిన పనే. ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరాయంగా జరిగే పనే. ఆ పని ఆగడాన్నే జరక్క పోవడాన్నే మరణం అంటారు. జీవిస్తూ ఉండాలంటే ఏమి జరుగుతుండాలో కనిపెట్టండి. దీనికి  సంబంధించిన వివరాల కొరకు జీవ రసాయన శాస్త్రాలను పరిశీలించవచ్చు. 

గమనిక:- అలాగే మిగిలిన మూడు విషయాలకు సంబంధించి మీమీ అనుభవాలేమి చెబుతున్నాయోనూ గమనించే పని చేయండి. ఈ విషయంలో పెంచలయ్య గారి ఆలోచనలెలా  సాగాయో చూద్దాం.

పై నాలుగు కోర్కెలు తీరకపోవడానికి గల కారణాలను కనుగొనే యత్నంలో, ఎందువల్లనో అట్టి యథార్ధ జ్ఞానం కలగడం లేదు అని అనిపించిందట మనిషికి. ఎందువల్ల యథార్ధ జ్ఞానం కలగడం లేదు? అన్న దాన్ని పరిశోధించగా, తన దగ్గర గల భాష అసమగ్రమైనదిగనూ, దోష యుతమైనదిగను ఉండడమే యథార్థ జ్ఞానం కలక్కపోవడానికి కారణం అని తెలిసిందట.

మీలో చాలా మందికి, ఇదంత తీవ్రమైన విషయంగా, ముఖ్యమైన విషయంగా పట్టించుకోవాలనిపించి ఉండదు. కానీ ఈ విషయంలో పెంచలయ్య గారు ప్రకటించిన అభిప్రాయము వాస్తవ విరుద్ధంగా ఉందన్నది నా పక్షము. ఎలాగంటే, ఒక మనిషి, తను బ్రతికి ఉండడానికి నిత్యం ఏమి జరుగుతుందో గమనించడానికి, దుఃఖమెందుకు వచ్చిందో, ఏమి చేస్తే పోయిందో గమనించడానికి, అలాగే సుఖం ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, తిరిగి ఎందుకు పోతోందో తెలుసుకోవడానికి, సమగ్రమైన భాష, దోష రహితమైన భాషతో పనేమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అదలా ఉంచితే, ఇంతకూ సమగ్రమైన భాష, దోషరహితమైన భాష అంటే ఏమిటో, అది ఒకనికి ఎలా కలుగుతుందో, కలిగిందని , ఈ నిర్ణయించుకోవడమెలానో వారు చెప్పనేలేదు.

పై నాలుగు ప్రధానమైన కోర్కెలు కొంతమేరే నెరవేరడానికీ, పూర్తిగా నెరవేరక పోవడానికి  గల కారణాలను కనుగొనాలంటే, ఆ మేరకు జరిగిన, జరుగుతున్న వాస్తవాలను స్వానుభవం  ఆధారంగా గమనించితే సరిపోయే దానికి సమగ్రమైన భాష, దోషరహితమైన భాష ఉంటే గాని ఆ కారణాల యథార్ధ జ్ఞానం కలగదంటున్నారేమిటి పెంచలయ్య గారు?!?

నాకు తెలిసినంతలో, వీటికి సంబంధించిన కారణాలను కనుగొనాలన్నా, అవి ఉన్న చోటును కనిపెట్టి వాటిని జాగ్రత్తగా చూడడం గమనించడం అన్నదొక్కటే చేయాల్సిన  పని. ఇంకే రకమైన యత్నాల వల్లకూడా ఆ యా కార్యాలకు కారణాలేమిటన్నది తెలియనే తెలియదు. ఇక్కడికిది సార్వత్రిక నియమమో కాదో తేల్చుకోండి.

పెంచలయ్య గారి ప్రకారమే, భాషను, అప్పటికే జీవితాన్ని కొనసాగిస్తున్న, జీవించడం తెలిసి ఉన్న మనిషి మరో అవసరాన్ని తీర్చుకోవడం కోసం తయారు చేసుకున్నాడు.  పెంచలయ్య గారి ప్రకారమే, అని గాక, భాష పుట్టుక, దాని ప్రయోజనాల గురించి తెలిసిన వారందరిలో ఇది నిర్వివాదాంశం.

ఏ అవసరం కోసం భాషను తయారు చేసుకున్నాడు? అని ప్రశ్నించి, తనకు తెలిసిన   వాటిని గురించి ఎదుటివారికి తెలియజేయడానికి అని సమాధానం చెప్పారు పెంచలయ్య గారు.

ఈ విషయం వరకు నేననేదేమంటే, భావ ప్రసారం కొరకు భాష ఉపయోగపడే మాట వాస్తవాన్ని తెలిపేదే గాని, భాష నిర్వర్తించ గల, నిర్వర్తిస్తున్న పనులు మరెన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని తరవాత విచారిద్దాం. ప్రస్తుతానికి, పెంచలయ్య గారు మొదలెట్టిన నాలుగు  ప్రాథమిక కోర్కెల విషయంలో, భాష తయారు చేసుకోక ముందే, మనిషికి జీవితం  కొనసాగుతుండడానికి ఏమి చేయాలో తెలుసు. చేయడమూ తెలుసు. అలాగే దుఃఖం అంటే ఏమిటో, అదెందుకు వస్తున్నదో, ఏమి చేస్తే పోతుందోనూ తెలుసు, పోగొట్టుకోవడమూ తెలుసు. సుఖం ఎలా వస్తుందో, సుఖాన్ని తెచ్చుకోడానికి ఏమి చేయాలో తెలుసు. అలా చేయడమూ తెలుసు. బంధమంటే ఏమిటో తెలుసు, బంధాన్ని వదిలించుకోవడమెలానో, ఏమిటో తెలుసు. కొంతవరకు వదిలించుకోవడమూ తెలుసు.

ఇంతవరకు నిజమో కాదో ఎవరికివారుగా గమనించండి. పెంచలయ్య గారంటున్న సమగ్ర భాష, దోషరహితమైన భాష లేకుండగనే, కలిగిన అనుభవాలాధారంగానే, మీరంతా పై నాలుగు కోరికలు తీర్చుకునే పని చేస్తూ, కొంత వరకు తీర్చుకుంటూ వస్తున్నారా? లేదా?

భాష పుట్టుక ముందే ఉన్న జీవితము, సాగించిన జీవితమూ అంటూ ఒక బండ లాటి వాస్తవం కట్టెదుట కనపడుతూ ఉండగా, ఆ నాలుగు కోర్కెలు తీరడానికీ, తీరక పోవడానికి కారణాలు మనిషి కనుగొనలేకపోయాడనీ, అందుకు కారణం అతని దగ్గర సమగ్ర భాష,  దోషరహితమైన భాష లేకపోవడమేననీ అనడం సరైందేనా? ఏదోలే సరి పెట్టుకుందా మనుకున్నా కుదిరే పనేనా?

భాష సంబంధంగా పెంచలయ్య గారు చాలా చాలా విషయాలు ప్రస్తావించారు. అయినా సమగ్రమైన భాషంటే ఏమిటో, దోషరహితమైన భాషంటే ఏమిటో తేల్చి చెప్పనే లేదు. నిజానికి  సమగ్రమైన భాషంటే ఇది అని గానీ, దోషరహితమైన భాషంటే ఇది అని గానీ ఈనాటికీ - ఏనాటికీ తీర్మానం చేయడం కుదరనే కుదరదు. అదిగో అంత పెద్ద విషయాన్ని చెప్పి, అలాటి భాష తన దగ్గర లేకపోవడం వల్లనే, మనిషి తాను కనుగొనాలనుకున్న, జీవితానికి సంబంధించి అత్యంత ప్రాథమిక అంశాలైన, నాలుగు కోర్కెలు తీరడానికీ, తీరక పోవడానికీ  కారణాలేమిటో కనుగొనలేకపోయాడనడం ఉందే, అది నిజానికి చాలా తీవ్రమైన ప్రకటన అవుతోంది.

ఒక్క విషయాన్ని చెప్పి ఈ మొదటి అంశాన్ని ముగిస్తాను. జీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడానికి, వాటికి కారణాలను కనుగొనడానికీ, నివారణోపాయాన్ని కనుగొనడానికి, నివారించుకోవడానికి, తగిన వ్యవస్థ భాష పుట్టకముందే మనిషిలో సహజంగానే ఏర్పడిఉంది. వీటినే సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే, జ్ఞానేంద్రియ వ్యవస్థ, కర్మేంద్రియ వ్యవస్థ, సాధారణ క్రియా సామర్ధము, అందుకవసరమైన శక్తి పుట్టుకతోనే సమకూడి ఉన్నాయి అంటాము.

భాషా విషయం

1) భాషను నేర్పే, నేర్చుకునే విధానమేమిటి?

భాషలో పదాలుంటాయి, మనకు తెలియబడే వాటిని సూచించడానికి పెట్టుకున్న గుర్తులే ఆ పదాలు. తెలియబడే వాటిని భాషాశాస్త్రంలో అర్థాలు అనంటారు. ఇంతవరకు గమనికలో ఉంచుకోండి. ఒక పదాన్ని వినిపించడం ద్వారా మనకు ఆ పదాన్ని తెలిసేలా చేస్తారు,  తరువాత ఆ పదం దేనిని సూచిస్తుందో ఆ అర్థాన్ని ఆయా జ్ఞానేంద్రియాల ద్వారా మనం  గమనించేలా చేస్తారు. ఆ తరువాత ఆ అర్థాన్ని చూపుతూ ఆ పదాన్ని వినిపించడం ద్వారా, ఆ పదం ఆ అర్థానికి సంబంధించింది అన్న జ్ఞానాన్ని కలిగిస్తారు. అంటే ఏమని? పద జ్ఞానము, అర్థ జ్ఞానము, ఆ పదం ఆ అర్థానికి సంబంధించింది, అన్న జ్ఞానం ప్రత్యక్షంగా (అనుభవం ద్వారా) తెలిసేట్లు చేస్తారు. భాష నేర్పడం అన్నది ఇలా జరగాల్సిందే. పెంచలయ్య గారు ఈ విషయాన్ని సరిగనే చెప్పారు. పెంచలయ్య గారనే కాదు, భాష నేర్పడం గురించి తెలిసిన వారందరిలో ఇది నిర్వివాదాంశము.

ఇంతవరకు బాగానే ఉంది గానీ, దీని తరువాత, భాష నేర్చిన వానికి, ఒక పదం వినగానే ఇవిగో ఇవన్నీ గుర్తుకొస్తాయంటున్నారు చూడండి. ఉదాహరణకు ‘ఎరుపు’ అన్నది పదం. ‘ఎరుపు’ అన్న పదం విన్నప్పుడు, 1) ఎరుపు రంగు, 2) కన్ను అను ఇంద్రియము, 3) పదానికి అర్థానికీ మధ్య గల సంబంధము, 4) తెలుసుకునే తాను, 5) ఆ పదాన్ని  నేర్పినవారు (తల్లో, తండ్రి, గురువో) గుర్తుకొస్తారు. (పేజీ. 5)

మీ మీ అనుభవాలలో ఏదైనా ఒక పదం విన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయో లేదో చూడండి. నా అవగాహన ప్రకారమైతే, పదం వినగానే అర్థం గుర్తుకు రావడం, ఆ అర్థం  కనపడగానే ఆ పదం గుర్తుకు రావడం మాత్రమే జరుగుతుంది. మరింకేదీ గుర్తుకు రాదు. పెంచలయ్య గారు చెప్పిన వాటిలో ఏది గుర్తుకు రావాలన్నా, మనం ఉద్దేశ్యపూర్వకంగా ఆ విషయంపై దృష్టి పెట్టాల్సిందే. అప్పుడు కూడా ఒకదాని తరువాత ఒకటిగా మాత్రమే వాటిని గుర్తించే పని చేయగలం. అప్పుడు కూడా ఆ పదం ఎవరు నేర్పారు? అన్న ప్రశ్న వేసుకున్నా, దీర్ఘకాలం సాగాక, ఆ విషయం గుర్తుకు రావచ్చు, రాకనూ పోవచ్చు. అలాగే  ఏ ఇంద్రియం ద్వారా తెలుస్తోంది? అన్న ప్రశ్న వేసుకుని పరిశీలించినా ఆ అర్థం తెలిసే సందర్భంలో ఇంద్రియమేదన్నది తెలియనే తెలియదు.

వాస్తవమిలా ఉండగా, సమగ్రమైన భాష, దోషరహితంగా భాష తెలిసుండాలన్నంత  పెద్ద పదం వాడిన పెంచలయ్య గారు, ఇలా ఎలా చెప్పగలిగారన్నదే ఆశ్చర్యం!?

ప్రతి జ్ఞానార్జన కర్మ యందు జ్ఞాత యొక్క జ్ఞానము కూడా కలుగుతున్నది. ఇది గమనింపవలసిన విషయము” (పేజీ. 5) అని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సురేంద్ర:- నిజానికిది అసందర్భ విషయం. భాష గురించి మాట్లాడుతున్నప్పుడు, “జ్ఞాత” గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

ఒక వంక భారతీయ వేదాంతులలో కొందరూ, నీవెవరో నీకు తెలియదు. నిన్ను నీవు తెలుసుకో అని నానా గొడవ చేస్తుంటే, సత్య జ్ఞాన సంఘ భావజాలం పేరిట కృష్ణారావు గారున్నూ, అసలు నీవు ఎవరో నీకు తెలియదు అంటుండగా, పెంచలయ్య గారు, ప్రతి జ్ఞానార్జన క్రియ యందూ, జ్ఞాత యొక్క జ్ఞానం కలుగుతూనే ఉంటుందంటున్నారేమిటి? అన్నది నాకు కలిగిన పెద్ద సందేహం. అయినా ఇది సందర్భం కాదు గనుక దీనినిక్కడతో  ఆపుదాం.

పైన చెప్పిన దాన్నే మళ్ళా ఇంకా గట్టిగా చెబుతున్నారు చూడండి. (అదే పేజీ. 5 లోనే) 

“పదం చేత తెలియబడు దానిని పదార్ధమని పిలిచెదరు. కావున తెలియబడు వాటినన్నింటినీ పదార్ధములని పిలువ వచ్చును” అన్నారు. ఇంతవరకు మనమూ అంగీకరించ వచ్చును. ఆ తరువాత ఒక పదము వినినంతనే, నీకు స్పష్టముగ ఆ పదము తెలుపు  అర్థము యొక్క జ్ఞానము కలిగిందనాలంటే, నీవు ఆ పదము వినినంతనే, నీ స్మృతి పథమున, 1) అర్ధ రూపము (ఎరుపు) 2) దానితో సంబంధ పడిన ఇంద్రియమగు కన్ను, 3) పదానికీ అర్ధానికి గల సంబంధము, 4) జ్ఞాత యగు నీవు, 5) ఆ అర్ధ సన్నికర్షమునకు కారణముగు పదార్థము (అంటే ఏమిటో?) 6) ఆ అర్థము గల స్థలము, 7) ఆ అర్థము గల కాలము గోచరించవలయును. అట్లు తెలియకున్నచో, ఆ పదము వినుట వలన నీకు జ్ఞానము కలుగలేదనే చెప్పవలసి యున్నది.

సురేంద్ర:- బాగుందండీ దోషరహిత రూపంలో గల పెంచలయ్య గారి భాషా జ్ఞానము!

చదువరులారా ఏదైనా ఒక పదం వినగానే, ఆయనన్న రంగునే తీసుకోండి, లేదా. మీకిష్టమైన ఏ పదాన్ని అయినా తీసుకోండి, ఆ పదం వినపడగానే, పెంచలయ్య గారన్న ఏడు రకాల అర్థాలు స్పురణకు వస్తున్నాయో లేదో పరిశీలించండి. మీలో ఎవరికి గానీ , అవన్నీ ఒక్కసారిగా గోచరించనట్లయితే ఆ పదం వలన అతనికి జ్ఞానం కలగలేదనాల్సిందే మరి. ఏమంటారు?

ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకొన్ని అంశాలను విచారించాల్సి ఉంది

1) పదం వింటే, ఆ భాష తెలిసినవానికి ఆపదం సూచించే అర్థం గుర్తుకొస్తోంది  అంతే. అలా గుర్తుకు రావడాన్ని ఆ పదార్థ జ్ఞానం కలగడం అనకూడదు. పదార్థజ్ఞానం ఎప్పుడూ ఇంద్రియార్ధసన్నికర్ష వల్ల మాత్రమే కలుగుతుంది. పదం వినగనే అర్థం గుర్తుకు రావడాన్నిభాష తెలిసుండటం అంటారంతే. దానిని పదం వినడం ద్వారా అర్థ జ్ఞానం కలుగుతుంది అననే కూడదు.

భాషకు సంబంధించిన ఇంత మౌలిక విషయాన్ని పెంచలయ్య గారు  పట్టించుకోలేదెందుకని?

2) ఇప్పుడు మీరు ఒక పాటనో, ఇతర శబ్దాలనో విని చూడండి. శబ్దాలు వస్తున్నాయని తెలుస్తుందే గాని, చెవి ద్వారా తెలుస్తున్నాయి అని గాని, చెవి గాని మీ ఎరుకలోకి రానేరాదు. అలాగే ఇతర జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అర్ధాలు తెలియబడే సందర్భాలను ఏర్పరుచుకుని, ఏమి తెలుస్తుందో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసుకోండి. ప్రత్యక్ష ప్రమాణ పద్ధతిన తెలుసుకునే సందర్భంలోనైనా, పెంచలయ్యగారన్న (7) అంశాలూ ఏకకాలంలో తెలియబడవు.

ఆవరణ గల (పరిమాణం గల) వస్తువులు గానీ, ద్రవ్యాలు గానీ, సన్నికర్షలో ఉన్నప్పుడు , మాత్రం, అది ఉన్న ప్రదేశం కూడా జతపడి అది (వస్తువు గాని, ద్రవ్యం గాని) తెలియ పడుతుంటుంది. కనుక ... 

  పెంచలయ్య గారు చెప్పినట్లు జరగడం లేదు. జరగదు కూడా, అన్నది నా అవగాహన. 

“భాష యందు వాక్యములుండును. వాక్యము నందు పదార్థములుండును. పద  సమూహమే వాక్యము. ప్రతి పదము తన అర్థమును తెలుపును. శబ్దము వలన జ్ఞానముకలుగుటన్న వాక్యము వలన జ్ఞానము కలిగిన దని అర్థము”.

సురేంద్ర :- భాష యందు వాక్యములుండును అన్నది సరైన ప్రయోగం కాదు. నిజానికి  భాషయందు పదాలే ఉంటాయి. పదాలు వ్యాకరణ బద్దంగా కూర్చబడినప్పుడు వాక్యాలనబడతాయి. లేదా వాక్యాలేర్పడతాయి. 'అలాగే వాక్యములందు పదార్థములుండును',  అన్నదీ అంత సరైన ప్రయోగం కాదు. వాక్యము నందు వాక్యార్థము ఉంటుంది అనాలి.  కేవలం పదముల అర్థమే వాక్యార్థం కాదు గనుక. అవునా? కాదా? ఆలోచించండి. 

‘పద సమూహమే వాక్యము’ అన్నదీ అంత సరైన ప్రయోగం కాదు. పదాల సముదాయం ఏర్పడినంత మాత్రాన వాక్యం రూపొందదు. ఏదో ఒక సన్నివేశానికి సంబంధించిన అవగాహన కలిగించగల రీతిలో, అందుకవసరమైన పదాలు వ్యాకరణ బద్దంగా కూర్చబడినప్పుడే, వాక్యం ఏర్పడుతుంది. పదానికి అర్థం చెప్పాలంటే నిర్వచన రూపంగానే  చెప్పాలన్నది పెంచలయ్య గారే కదా!

మీలో ఎవరైనా ఇవన్నీ చిన్న చిన్న దోషాలే కదండీ, మరీ అంతగా పట్టించుకుంటే  ఎలా? అన్న ప్రశ్న లేవనెత్తవచ్చు. కొన్ని సందర్భాలలో మీరన్న దానిని అంగీకరించవచ్చు గానీ, పెంచలయ్య గారు ఎత్తుకున్నదే, సమగ్ర మగు భాష, దోషరహితమగు భాష లేకుంటే యథార్థ జ్ఞానం కలుగదు అన్న అంశాన్ని కదా ఆయనే భాష గురించి ఇంకా ఏమంటున్నారో చూడండి.

“వాక్యార్థ జ్ఞానం శబ్ద జ్ఞానం” అని భాషావేత్తలంటారు. పదం కూడా అర్థమునిస్తుంది , కానీ ఆ పదం వాక్యము నందు చేరక దానికి వ్యవహార యోగ్యత సిద్ధించదు. వాక్యము నందు ఎన్ని పదములున్నవో, అందలి ప్రతి పదమునకు అర్థం తెలిసియుండిన గాని వాక్యము  అర్థమునివ్వజాలదు. (పేజి. 6).

సురేంద్ర:- ‘వాక్యార్థ జ్ఞానమే శబ్ద జ్ఞానం’ అని భాషావేత్తలంటారు అని అనడం ఎందుకు. మీరనరా ఆమాట?

భాష ద్వారా జ్ఞానం కలగడమంటే, వాక్యల ద్వారా వాక్యర్ధజ్ఞానం కలగడమేనన్నది మీ మాట గనే చెప్పవచ్చు కదా వారెవరో అంటున్నారని అనడమెందుకు? ఎవరన్నా అంతవరకు సరైన మాటేనన్నది నా అభిప్రాయం.

పదం కూడా అర్థాన్నిస్తుంది కాని, ఆ పదం వాక్యమందు చేరకపోతే దానికి వ్యవహార  యోగ్యత సిద్ధించదు.” 

సురేంద్ర :- పెంచలయ్య గారు భాషకు సంబంధించిన ఒక మౌలికాంశాన్ని   ప్రస్తావించారిక్కడ. పదాల అర్థాలు తెలియడాన్ని శబ్ద ప్రమాణం వల్ల కలిగిన జ్ఞానం అనకూడదు. ఆ మేరకు తెలిసుండడాన్ని భాష తెలిసుండమనే అనాలి.  

వాక్య రూపాన్ని సంతరించుకుంటేనే భాష శబ్ద ప్రమాణంగా ఉపయోగపడుతుంది.   ఇంతవరకు నాకు పెంచలయ్య గారితో ఏకాభిప్రాయం ఉంది. వారన్న తర్వాత వాక్యం కూడా చాలా విలువైనది. వాక్యము లోని ఏ ఒక్క పదానికి అర్థం తెలియకున్నా ఆ వాక్యం అర్థం కాదు. భాషకు సంబంధించినంతలో ఇది నిర్వివాదాంశం లేదా సార్వత్రిక నియమం. 

గమనిక :- ఒక్క వ్యక్తికి వాక్యార్థ జ్ఞానం కలగాలంటే, అంతకు ముందే ఏమేమి జరగాలనో  చెబుతున్నారు పెంచలయ్య గారు. మీరూ జాగ్రత్తగా గమనించండి.

“వాక్యము నుండి అర్ధమును గ్రహించుటకు, వాక్యములోని పదములను పరస్పరం  సమన్వయం చేయవలయును. అలా పదాన్వయం చేయాలంటే, మొదట వాక్యములోని  పదములను, భాషాభాగములుగ విడగొట్టి నిర్ధారించవలయును. ఆ తరువాత ఆ భాషాభాగములు, వాక్య ముందు ఏ ఏ వాక్య విభాగములుగ పనిచేయుచున్నవో తెలుసుకుని,  దాని ఆధారంతో ఆ పదాన్వయము చేయవలయును. అప్పుడే మనకు వాక్యార్థ జ్ఞానం ఏర్పడుతుంది”.

సురేంద్ర:- చదువరులారా పెంచలయ్య గారంటున్న దేమిటో మీకు అర్థమయిందా?   నిత్య జీవితంలో మీకు వాక్యాలు ఇలా జరిగే అర్థమవుతున్నాయా?

“ఒక వాక్యం అర్థం కావాలంటే, ముందుగా భాషాభాగాలేంటో తెలిసుండాలి, ఆ వాక్యము   లోని పదాలు ఏ ఏ భాషాభాగాలు క్రిందికి వస్తాయో అలా వాటిని విడగొట్టి నిర్ధారించాలి”. 

సురేంద్ర:- మీరు నిత్యం ఇలా చేసే వాక్యార్థాలను గ్రహిస్తున్నారా? ఈనాటికైనా మీకు వ్యాకరణ శాస్త్రం చెప్పే భాషాభాగాల గురించిన పూర్తి అవగాహన ఉందా? దానినలా ఉంచండి. ఆ తరువాత ఆయన రాసిన వాక్యం నాకైతే అర్థం కాలేదు. మీకెవరికైనా అర్థమైతే  చెప్పండి. 

“ఆ తరువాత, ఆ భాషాభాగములు, వాక్యమందు ఏఏవి వాక్య విభాగములుగ  పనిచేయుచున్నవో తెలిసికొని, దాని ఆధారంతో ఆ పదాన్యయము చేయవలయును.”

ఇది నాకైతే అర్థం కాలేదు, సత్యజ్ఞాన సంఘ ప్రతినిధులెవరైనా వివరిస్తే తెలుసుకుంటాను.   వాక్యం మొత్తం అర్థం కాలేదు గాని సారాంశం అర్థమైంది. భాషాభాగముల గురించి  తెలిసుండడమే కాక ఆ వాక్యంలోని వాక్య విభాగములన్నవీ తెలిసుండి ఆ అవగాహనతో పదాన్వయం చేస్తేనే వాక్యార్ధ జ్ఞానం కలుగుతుందంటున్నారన్న మాట. 

ఒకే ఒక్క మాట చెప్పి ఈ అంశాన్ని ముగిస్తాను. ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి భాషాభాగాలు, వాక్య భాగాలు వీరు చెబుతున్న రీతిలో తెలిసుండక్కరలేదన్నంత వరకు  మీరూ నా మాట కాదనరనుకుంటాను.

పెంచలయ్య గారి బృందానికి నేను చెప్పదలచిందేమంటే, పెంచలయ్య గారు తన పుస్తకంలో, వ్యాకరణ శాస్త్రం చెప్పిన విషయాలను పరిశీలనకు లోనుచేసి, ఆ శాస్త్రాలు చెప్పినవేవి మనకు అర్థం కాలేదనాల్సిందేనని తేల్చారు. అదే నిజమైతే వ్యాకరణ శాస్త్రం  చెప్పిన భాషాభాగాలు గురించి పెంచలయ్య గారికీ అర్థం కాలేదనాల్సిందే. అప్పుడు వారికీ, ఆయా వాక్యాలు అర్థం కానట్లే కదా కానీ, భాషాభాగాలు అర్థం కాలేదంటూనే, ఇన్నిన్ని వాక్యాల అర్థాలను గ్రహించడమూ, వాటి తప్పొప్పుల గురించి మాట్లాడడమూ చేసేశారాయన. ఈ వైరుధ్యాన్ని ఆ పక్షం వారు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.

“పద్ధతి ప్రకారం భాష నేర్చిన వారికెవరికైనా, ఒక పదం విన్నప్పుడు గానీ, ఆ పదార్థ నిర్వచన వాక్యం విన్నప్పుడు గానీ, ఆ అర్థం అతని స్మృతికి వస్తుంది.” భాష ద్వారా జ్ఞానార్జన చేసే విషయంలో ఇది ప్రధాన నియమము. (పేజి. 6,7) 

సురేంద్ర :- ఇది సరైన అభిప్రాయమేనని నేనంగీకరిస్తున్నాను. ఇక్కడి నుండి ఆయన భాషా భాగాల గురించి మాట్లాడారు. వ్యాకరణ దర్పణం అను తెలుగు వ్యాకరణ గ్రంథం నుండి వీటిని ప్రస్తావించారు.

తెలుగు భాషా భాగములు (5)

1) నామవాచకం 2) సర్వనామం 3) విశేషణం 4) క్రియా వాచకం 5) అవ్యయం. (పేజి. 7) 

నామవాచకం :- నామమును చెప్పునది నామవాచకం, ఉదాహరణ రాముడు,  హైదరాబాదు, పుస్తకం మొదలగునవి. కనుక మనుషుల, స్థలముల, వస్తువుల పేర్లను తెలుపు పదములను నామవాచకములంటారు.

పెంచలయ్య గారు:- ఇక్కడ రచయిత నామవాచకం అన్న పదానికి నిర్వచనం చెప్పలేదు ఉదాహరణలు మాత్రం చెప్పాడు. ఆ చెప్పే సందర్భంలో రాముడు, హైదరాబాదు, పుస్తకము, మనిషి, స్థలము, వస్తువు, అన్న ఆరు పదాలను పేర్కొన్నారు. పదార్థ నిర్వచనం చెప్పాల్సినప్పుడు, దానికి మరొక పదమును అర్ధముగా చూపుట సరైనది కాదు. ఆ పదం యొక్క అర్థం ఏ యింద్రియంతో సంయోగము చెందిన తెలియునో ఆ అర్ధ సంయోగం స్మృతికి వచ్చునట్లు చెప్పాలి. కానీ (వ్యాకరణ కారుడు) రాముడు, హైదరాబాదు, పుస్తకము  అన్నవి క్రమంగా మనిషి, స్థలము, వస్తువు, అనటానికి సరిపోతాయని మరో మూడు  అదనపు పదాలు వాడాడు. అవి ఏ ఇంద్రియ సన్నికర్షతో తెలియపడతాయో, వ్యాకరణ వేత్త చెప్పనే లేదు. బహుశా వ్యాకరణ విద్యార్థికి ఆ పదాల అర్థాలు ఇదివరకే తెలిసియుండును అని తలచి ఉండవచ్చును.

“మనిషి, వస్తువు, అను పదాల అర్థాలు” మనకు తల్లిదండ్రులూ నేర్పలేదు, గురువులూ నేర్పలేదంటాను. ఆ రెండు పదార్థాలూ ఏ యింద్రియ సన్నికర్షవలన తెలియబడునో మీలో ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఎందుకంటే మనిషి, వస్తువు అన్న పదముల అర్థములు తెలియకుండా 'నామవాచకం' అను పదమునకు అర్థం మనకు తెలియబడదు. అలాగే ‘నామము’ అన్న పదం యొక్క అర్థం ఏ ఇంద్రియ సన్నికర్షతో తెలియునో ఆ ఇంద్రియ సంయోగమును ఆ అర్థమునకు కలిగించిననే ఆ అర్థం తెలియును. (పేజీ. 8)

సురేంద్ర :- ఇదేవిధంగా మిగిలిన నాలుగు పదాల విషయంలోనూ, ఒకే విషయాన్ని వత్తి చెప్పారు పెంచలయ్య గారు. వాటిని చూడండి.

2) సర్వనామము:- నామవాచకమునకు బదులుగా వాడబడునది సర్వనామము. ఉదాహరణకు అతడు, వారు, అవి, ఇవి, అన్ని మొదలగునవి.

వ్యాకరణ కారుడు ఇక్కడా 1) సర్వనామ పదానికి నిర్వచనం చెప్పలేదు. 2) అది ఏ ఇంద్రియ సన్నికర్షతో తెలియనూబడుతుందోనూ చెప్పలేదు. కనుక సర్వనామమన్న పదానికి అర్థం మనకు తెలియలేదనాల్సిందే.

3) విశేషణం:- ఇక్కడా నిర్వచనం చెప్పలేదు. ఉదాహరణలు చెప్పారు, ఆ పదార్థం ఏ ఇంద్రియ సన్నికర్షతో తెలియబడుతుందో అదీ చెప్పలేదు. కనుక ఆ పదం యొక్క అర్థం మనకు తెలియ లేదనే చెప్పాలి.

4) క్రియ:- క్రియ అను పదానికి నిర్వచనం చెప్పలేదు. అది ఏ ఇంద్రియ సన్నికర్ష వలన తెలియునో అదీ చెప్పలేదు. కనుక క్రియ పదానికి మనకు అర్థం తెలియలేదనీ అనవలయును.

5) అవ్యయం:- దీనికి నిర్వచనం చెప్పలేదు. అది ఏ ఇంద్రియ గోచరమో చెప్పలేదు. అలాగే ఉదాహరణలుగ చూపిన పదములు ఏ ఇంద్రియ గోచరములో చెప్పలేదు. కావున అవ్యయమన్న పదానికి అర్థం మనకు తెలియలేదనాల్సిందే.

అంతేకాక, వ్యాకరణ కారుడు తెలుగు భాషయందలి వాక్య విభాగము లేవియో చెప్పలేదు. ) కనుక వాక్యము నందలి పదములను అన్వయము చేయుట కుదరదు గాన, వాక్యము  యొక్క అర్ధమును గ్రహించుట వీలు కాదు అని చెప్పవలసి ఉంది.

సురేంద్ర:- మిత్రులారా  తెలుగు వ్యాకరణం పైన పెంచలయ్య గారి విశ్లేషణ ఇది.  సారాంశాన్ని క్రోడీకరిస్తాను చూడండి.

1) వాక్యార్థ జ్ఞానం కలగడమే భాషాధారంగా జ్ఞానం కలగడమంటే, అది నెరవేరాలంటే వాక్యమందలి ప్రతి పదం యొక్క అర్థం తెలిసి ఉండాలి.

2) పదానికి అర్థం చెప్పడమంటే పర్యాయపదం చెప్పడం కాదు. నిర్వచనం చెప్పాలి. నిర్వచనం చెప్పడానికి ఒక వాక్యము, లేదా కొన్ని వాక్యాలు వాడతారు. ఆ వాక్యములు  విన్న లేక చదివిన వ్యక్తికి, ఆ పదం తెలిపే అర్థము స్మృతి పథమున మెదలవలెను.

3) అలా జరగాలంటే ఆ పదం సూచించు అర్థం ఏ ఇంద్రియ సన్నికర్ష ద్వారా తెలియబడుతుందోనూ చెప్పాలి.

4) భాషా భాగాల గురించీ, వాక్య విభాగాల గురించి చెప్పకపోయినా, తెలిసుండక పోయినా, వాక్యార్ధమును గ్రహించుట కుదరదు.

ఈ ప్రాతిపదికలను తీసుకుని వ్యాకరణ శాస్త్రం, భాషాభాగాలను గురించి మాత్రమే ప్రస్తావించిందనీ, ఆ మేరకైనా ఆ పదాలకు 1) నిర్వచనాలు చెప్పలేదనీ, ఆ పదాల అర్ధం ఏ ఇంద్రియ సంయోగం వల్ల తెలియబడుతుందో ఆ విషయము చెప్పలేదనీ, కేవలం  ఉదాహరణగా మరికొన్ని పదాలను మాత్రం చెప్పిందని అందువల్ల ఆ పదాల అర్థ జ్ఞానం తెలిసినట్లు కాదనీ, విన్న వానికి తెలియలేదనాల్సిందేననీ తీర్మానించారు. అంతటితోనూ , ఆగక, ఆ శాస్త్రం అసంపూర్ణంగా ఉందని, భాషా భాగాలతో పాటు, వాక్య విభాగాలను  తెలిపి, ఆ పదాల నిర్వచనాలూ తెలియజేస్తేనే మనకు వాక్యార్థ జ్ఞానం పొందడానికి  అవసరమైన వాక్యంలోని పదాలన్వయించేయడం సాధ్య పడుతుందని తేల్చిచెప్పారు. మొత్తంమీద ఏమని తేల్చినట్లు?

వాక్యార్థ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన భాషాభాగాలను, వాక్య భాగాలను  గురించి చెప్పడంలో వ్యాకరణ శాస్త్రం అసమగ్రంగానూ, దోషపూరితంగానూ ఉందని తేల్చారన్నమాట. పెద్ద విడ్డూరమేమంటే, భాషాభాగాలలోని పదాల నిర్వచనాలేమిటో, ఆ పదాల అర్థాలు ఏ ఇంద్రియ సన్నికర్ష ద్వారా తెలియబడతాయో, తాము మాత్రం ఒక్క ముక్కా చెప్పనేలేదు. వాక్య విభాగాల క్రిందికి ఏమేమి వస్తాయోనూ ఇక్కడ చెప్పలేదు. అలా  అసంపూర్ణంగానే పరిశీలన ముగించి, సంస్కృత వ్యాకరణాన్ని పరిశీలించే పని మొదలెట్టారు.

1) వ్యాకరణం తెలియక, భాష ద్వారా జ్ఞానాన్ని ఆర్జించడం కుదరదు అని చెప్పిన పెంచలయ్య గారే, తెలుగు వ్యాకరణంలో, వాక్యార్థ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన పూర్తి వివరాలు లేవు. ఉన్న వివరాలు సరిగా లేవని తేల్చారన్నమాట. బాగుంది కదూ విశ్లేషణ? ఆయన విశ్లేషణ సరైందే అయ్యుంటే, మనకెవరికి గానీ, ఆయనగారికైనా తెలుగు రచనలు చదువుతున్న, ప్రసంగాలు వింటున్న, అందులోని వాక్యాలు అర్థం కాకూడదన్న మాట. ఇది అనుభవ విరుద్ధంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. ఆయనకూ మనకూ  కూడా, నిరక్షరాస్యులకు కూడా ఈ భాషాభాగాల, వాటి నిర్వచనాల, ఆయా ఇంద్రియ సన్నికర్షలన్నవేమీ లేకుండగనే వాక్యాలు అర్థమవుతూనే ఉన్నాయి కదా మరొక్కమాట.

తెలుగు భాషకు సంబంధించి మాట్లాడి ఊరుకోకుండా, అనవసరంగా సంస్కృత భాషను విచారించడం మొదలు పెట్టారు. ముందుగా యాస, నిరుక్తాన్ని తీసుకున్నారు. దానిలో పద వర్గాలుగా చెప్పబడిన నామము, అఖ్యాతము, ఉపసర్గ, నిపాతములన్న వాటిపై తనదైన  శైలిలో పరిశీలన సాగిస్తూ, నిరుక్తం ప్రకారం భాషాభాగాలు నాలుగని చెప్పినట్లయినది. ఆ నాలుగు పదాల అర్థమును తెలియజేయడానికి, ఇతడు కూడా నిర్వచనాలు చెప్పలేదు. ఆ పదార్థం ఏ ఇంద్రియ గోచరమో చెప్పకుండా, ఒక పదమునకు అర్థముగా మరొక పదమును చూపించారు. కనుక వాటి అర్థాలు మనకు తెలియ లేదనే చెప్పాలి అంటూ నిరుక్తం కూడా  అసమగ్రంగానూ, దోష సహితం గానే వివరించిందని తేల్చారు. (పేజి 10 నుండి). 

తరువాత పాణినీయ వ్యాకరణాన్ని ఎత్తుకున్నారు.

దానిలోని 1) సర్వనామము, 2) నిపాతము, 3) ఉపసర్గ, 4) గుణము, 5) అవ్యయము, 6) ధాతువు, 7) విశేషణమువిశేష్యము, 8) కర్త అన్న పదాలను పరిశీలనకు తీసుకుని, ఇంతకు ముందు వాటి విషయంలో ఇచ్చిన తీర్పునే దీనికీ వర్తింపజేశారు. అంటే ఏమిటో అర్థమవుతుందా? పాణిని కూడా, తాను చెప్పదలుచుకున్న పదాల అర్థాలను చెప్పవలసిన రీతిలో చెప్పకపోవడం వల్ల ఆ పదాల అర్థాలూ మనకు తెలియ లేదనాల్సిందే. కనుక  పాణిని భాషలోనూ అసమగ్రత, దోషములన్నవి చేరే ఉన్నాయి అని తేల్చేశారు. (పేజి. 13 నుండి).

  మిత్రులారా! పెంచలయ్య గారు భాష విషయమంటూ మనకు ఏమి తెలియజేయా లనుకున్నదీ స్పష్టంగా తెలియడం లేదు. ఇన్ని వ్యాకరణ గ్రంథాలను ఎందుకు మనముందు పెడుతున్నారోనూ అర్థం కావడం లేదు. ఆ రచనలన్నీ సరైనవి కావని తేల్చడం ద్వారా మనకేమి తెలపాలన్నదీ అర్థం కావడం లేదు. అవన్నీ అలా ఉంచుదాం. ఇంతకూ వారనుకుంటున్న భాషా భాగాలేమిటో, వాటిని పేర్కొని, వాటి వాక్య విభాగలేమిటో చెప్పి,  వాటి నిర్వచనాలను చెప్పి, ఆయా పదాల అర్థాలు ఏ ఇంద్రియ గోచరాలో చెప్పి, ఆపై వాటిని ఆయా ఇంద్రియ సన్నికర్ష చేయించడం ద్వారా మనకు తెలియపరచవచ్చు కదా కానీ ఆ బాధ్యతను ఆయన రచనలో ఒక శాతం కూడా నిర్వహించ లేదు. ఆశ్చర్యం!?!

విచారణ మొదలెట్టిన ప్రతి అంశంలోనూ, అవతల వారన్నది సరి కాదని చెప్పి, సరైందని  తాననుకుంటున్నదేమో చెప్పకుండగనే, విచారణను అసంపూర్ణంగా నిలిపివేసి, మరో అంశాన్ని, మరో అంశాన్ని లేవనెత్తుతూ వెళ్లారు. అవసరమా? అనవసరమా? అనేది పట్టించుకోకుండా, ఫలాని విషయంలో సత్యమిది అని తేల్చకుండా, ఆ విషయంలో వారి అవగాహనేమిటోనూ చెప్పకుండా, అనేక రచనలను ప్రస్తావించారు. అప్పుడు కూడా ఏ  రచనకారచననైనా పూర్తిగా విచారించకుండా వాటిలోని ఒకటి, అరా వాక్యాల నెత్తుకుంటూ  ఏదీ ఒక కొలిక్కి రాకుండానే పుస్తకాన్ని పూర్తి చేశారు. 

ఇక్కడి వరకు భాషా శాస్తాంశాలను పరిశీలించడం పూర్తిచేసి, జీవితానికి సంబంధించినవి గా ఈ రచన మొదట్లో వారే ప్రస్తావించిన నాలుగు కోర్కెలు తీరడానికి అవసరమైన యథార్థ జ్ఞానం కలిగించడానికి ఈ భాషా శాస్త్రాలు ఉపయోగపడవని ఉపనిషత్ కారులు గుర్తించారని, ఆపై భాషాపరమైన ఈ ఆటంకాలను తొలగించుకునే విధానం కొరకు తీవ్రంగా పరిశోధించి , ఒక మార్గం కనుగొన్నారనీ మరో అంకానికి తెరతీశారు. వీటికి సంబంధించిన వివరాలు వారి మాటల్లోనే వినండి

1) “ప్రపంచంలో మనకు తెలియబడేవన్నీ” సహజంగానే కొన్ని వర్గాలుగ ఏర్పడి ఉన్నాయనీ,

2) అలాగే వాటిని తెలుసుకొనుటకు, మనలోనే జ్ఞానార్జనకవసరమగు కర్మ విధానమంతా అమరి ఉందని వారు తెలుసుకున్నారు.

3) అలా తెలియబడే వాటికి అర్థములనీ, తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటికి  ప్రమాణములనీ పేరు పెట్టుకున్నారనీ చెప్పారు.

వారి పరిశోధనాధారంగా ఉపనిషత్ కారులు చెప్పినదేమనగా ...  

“పదార్ధ వర్గముల, ప్రమాణముల జ్ఞానం కలిగి, ప్రమాణ ప్రయోగ శక్తి ఉన్నచో యథార్థ  జ్ఞానము కలుగును” ఇదే ఉపనిషత్ కారులు కనుగొని చెప్పినది. ఆ విషయాన్ని తెలుపడానికి వారు చెప్పిన సంస్కృత వాక్యమిదే “లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిః నతు ప్రతిజ్ఞామాత్రేణ”

సురేంద్ర :- నేనూ అంతో ఇంతో ఉపనిషత్తులను పరిశీలించిన వాళ్లే. ముఖ్యంగా  దశోపనిషత్తుల వరకు జాగ్రత్తగా చదివాను కూడా. కానీ అందులో ఎక్కడా, ఏ రుషీ, పెంచలయ్య గారన్నట్లు వ్యాకరణ శాస్త్రాలలోని అసమగ్ర వివరణ, దోష సహితమైన వివరణల వల్లనే తాము జీవితానికి సంబంధించిన యథార్ధ జ్ఞానం పొందలేకపోయామని గమనించినట్లు గానీ, ఆ విషయం కొరకు పరిశోధన చేసి పదార్థ వర్గాల ప్రమాణాల గురించి తెలుసుకున్నామని గాని చెప్పినట్లు నాకు కనపడలేదు. అంత పెద్ద ప్రకటన చేసిన పెంచలయ్య గారూ, ఆ ఉపనిషత్కారులెవరో, ఆ మాట ఎక్కడ చెప్పారోనన్న వివరణలు ఇవ్వలేదు. ఈ అభిప్రాయాన్ని ప్రకటించేసి ఊరుకున్నారు.

ఇక్కడికిదే వారే ఉటంకించిన “లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిః, నతు ప్రతిజ్ఞా మాత్రేణ”  అన్న సూత్రానికి విరుద్ధం. ఎలాగంటే విషయాన్ని చూపకుండా, ప్రమాణాన్ని చూపకుండా, కేవలం మాటనేయడం వల్ల చెప్పదలచింది సిద్ధించదు అని కదా దానర్థం? 

1) భాషా శాస్త్రాలు భాషను అర్థం చేసుకోవడానికి పనికిరావని గానీ,

2) యథార్థ జ్ఞానం పొందేందుకు అవసరమైన పదార్థ వర్గాల ప్రమాణాల గురించి తాము శోధించి తెలుసుకున్నామని గాని చెప్పినందువల్ల ప్రయోజనమేముంది?

  ఏ ఉపనిషత్తుకారుడు ఆ మాటలన్నాడో, ఆ విషయాన్ని ఉపనిషత్తుల నుండి ఎత్తి చూపించాలి. ప్రమాణ, పదార్థ వర్గాల గురించి వారేమన్నదీ చెప్పాలి. అప్పుడే పై సూత్రాన్ని ఆయన   చెప్పిన రీతిలో అన్వయించినట్లు అవుతుంది.

ఆ రకంగా ఈ రచన ఆరంభంలో తానేమి చెబుతానని పెంచలయ్య గారు ప్రకటించారో ఆ విషయాన్ని చెప్పవలసిన రీతిలో చెప్పక పోవడమే గాక, అరకొరగానైనా చెప్పనే లేదు. 

మన ప్రధాన ప్రశ్న :- ఇంతకూ ఉపనిషత్ కారులు కనుగొన్న (ఉన్న వాటినే చూశామన్నారని వీరంటున్న) ఆ పదార్ధ వర్గాలేవి? ప్రమాణాలేవి? వాటిని సూటిగా వారో మీరో నేరుగా ఎందుకు చూపించ లేదు? 

ఇతరేతర విషయాలు ప్రస్తావించకుండా, పెంచలయ్య గారి అనుయాయులం, ఆ సంఘం వాళ్ళం అంటున్న వారెవరైనా, పెంచలయ్య గారి రచనల నుండి గానీ, నేరుగా వారికి వారు గా గానీ నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అది వారి నైతిక బాధ్యత. ఎందుకంటే, తెలుగు వ్యాకరణ శాస్త్రంగానీ, సంస్కృత వ్యాకరణ శాస్త్రమైన నిరుక్తం, పాణిని వ్యాకరణం, అన్నవి గానీ చెప్పాల్సింది చెప్పడం విషయంలో సరైనవి కావు, అన్నంత పెద్ద ప్రకటన చేశారు కదా! అలా అనేసి ఊరుకోకుండా, తానన్నది సరైందేననడానికి తగిన ప్రమాణాలు, చూపించ వద్దా?

కొనసాగింపుగా, గౌతమకణాదమహర్షుల ప్రస్తావన ఇలా చేశారు పెంచలయ్య గారు , (పేజీ 18)

1) ఉపనిషత్ కారులు పదార్థముల గురించి ప్రమాణముల గురించి శిష్యులకు చెబుతూ వచ్చిందంతా ఒక జ్ఞానరాశిగా తయారయింది.

2) దాన్నంతటినీ, గౌతముడు, కణాదుడు అన్న మహర్షులిరువురు సూత్రబద్ధం చేశారు.  వాటిని న్యాయ దర్శనము వైశేషిక దర్శనములంటారు.

3) ఆరెంటి సముచ్చయమే లక్షణ ప్రమాణ విద్య అనునది.

4) ఈ గ్రంథములందు పదార్థ వర్గముల గురించీ, ప్రమాణముల గురించి వివరముగ  చెప్పబడింది. (పేజి. 18) 

సురేంద్ర:- ఒక ముఖ్య విషయాన్ని చదువరులంతా జాగ్రత్తగా గమనించాలి. పద్ధతి ప్రకారమైతే పెంచలయ్య గారు ఏ అంశాలను ప్రస్తావించాలి. న్యాయ వైశేషిక దర్శనాలందు, వివరంగా చెప్పబడినవని తానే అన్న పదార్థ వర్గాల ప్రమాణాల గురించే కదా చెప్పాలి. ఆ పని చేయకుండా, ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రాలు ఆత్మను లేదా బ్రహ్మను తెలుసుకోవడం; అంటూ వేరు విషయాలు మొదలెట్టారు. అందులో వాద విద్య వలన వేదాంత వాక్య అవగాహన కలుగుతుందని, ఆ వాద విద్యను గురించి గౌతముడు వివరంగా చెప్పాడని అన్నారు.

అంతలోనే ఆ వాద విద్య వలన సత్యము తెలియదని ఇతరులు అనేకులు చెప్పినట్లు మరో ప్రకటన చేసి, వేమన లాటి వారు వాదాన్ని కుక్కల కాటలాట అని చెప్పారనీ చెప్పారు. చాందోగ్య, కఠ ఉపనిషత్ కారులైతే, ఈ వాద విద్య వలన ఆత్మ తెలియబడదని చెప్పినట్లూ  వాటిలోని వాక్యాలను ఉదహరించారు. ఇలాటి పరస్పరం పొసగని, మొదలెట్టిన దానితో సంబంధం లేని వాటిని ఎందుకు ప్రస్తావించారో నాకైతే అర్థం కాలేదు.

ఆశ్చర్యమేమంటే, ఈ మాటలు చెప్పేముందే న్యాయ దర్శనం లోని వాద ప్రక్రియపై  తనదైన ఒక అభిప్రాయాన్ని వెళ్ళడించారు.

న్యాయ దర్శనము నందు పేర్కొనబడిన వాద ప్రక్రియ అనునది మొత్తం జ్ఞాన విద్యా శాస్త్రమును మరుగు పరచి, మానవ సమాజమునకు పెనుహాని కలిగించినది అనన్నారు. 

సురేంద్ర:- పెంచలయ్య గారే న్యాయ దర్శనం గురించి మొదట ఏమన్నారు?

1) ఉపనిషత్ కారులు దర్శించిన పదార్థం వర్గములు ప్రమాణములు అన్న వాటిని గౌతముడు, కణాదుడు సూత్రబద్ధం చేసారు అనన్నారు కదా! 

2) ఆ జ్ఞాన రాశిని సూత్రబద్ధం చేసిన గౌతముడే, వాద విద్య చాలా ప్రయోజనకర మైనదైంది అన్నట్లు ఆ మాటలనూ చూపించారు. మళ్ళా తన అభిప్రాయంగా,

3) అది (వాద విద్య) చాలా ప్రమాదకారి. అని ఇక్కడ చెబుతున్నారు.

4) అంతటితోనూ ఆగక, న్యాయ వైశేషిక దర్శనములందు అనేక ప్రక్షిప్తాలున్నాయనీ ఒక బాంబు పేల్చారు. ఇదంతా చదువరిలో ఎంతో గందరగోళాన్ని జనింప చేస్తుంది కదా?!

5) ఆ న్యాయ వైశేషికాలనాధారం చేసుకునే, అనేక ధోరణులకు చెందిన తర్క శాస్త్రాలు పుట్టాయంటూ, బౌద్ధ, జైన, ద్వైత, అద్వైత తర్కాల పేర్లు చెప్పారు.

గమనిక:- ఇంతా చేసి తాము ప్రకటించిన వీటిని నిరూపించడానికి సరిపడిన  ఆధారాలను మాత్రం చూపించనే లేదాయన. ఒక విషయాన్ని తెలియజెప్పడానికి పూనుకున్న  వాడు, ఎలా చెబితే ఆ విషయం చెప్పవలసి నట్లు చెప్పినట్లవుతుంది? అన్న విషయాన్ని ఒకటికి పది సార్లు నొక్కి చెప్పిన వారే, తాను చెప్పదలుచుకున్న వాటినీ అదే విధానంలో చెప్పాలన్న విజ్ఞతను ఎందుకు కోల్పోయారన్నది ఆశ్చర్యం కలిగించే పెద్ద ప్రశ్న.

(పేజి. 20) “ఇప్పుడు తర్క శాస్త్రం యొక్క ప్రాచీనతను పరిశీలించెదము” అంటూ మరో  అంశాన్ని ఎత్తుకున్నారు.

ఈ మాట అని, 1) శబ్దార్థ కల్పతరువు అన్న నిఘంటువు ‘తర్కం’ అన్న మాటకు ఎన్ని పర్యాయపదాలు చెప్పిందో చూపించారు.

2) చాందోగ్యోపనిషత్తును, కఠోపనిషత్తునూ, న్యాయ దర్శనాన్ని, వాత్సాయన భాష్యాన్ని, శంకర భాష్యాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని, భగవద్గీతను, గౌతముని మాటల్ని కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని, దాని పై శ్రీ మూలుని వ్యాఖ్యను, ఇలా అనేకుల గురించిన ప్రస్తావన చేశారు. తర్కం యొక్క ప్రాచీనతను పరిశీలిద్దామన్నాయన, ఆ కాలాన్ని గురించిన ఆధారాలను  చూపించకుండా, ఇవన్నీ ఎందుకు మన ముందుకు తెచ్చినట్లు?

సరైన పద్ధతిని పాటిస్తే తర్కం చాలా ప్రాచీనమైనదని నిర్ణయించడానికి ఏమి చేయాలి? అన్నింటికంటేనూ మొదట ఉన్నదనుకుంటున్న రచనను పేర్కొని, ఆ రచన చేసిన రచయిత  జీవించిన కాలాన్ని గురించిన ప్రామాణిక సమాచారాన్ని అందించాలి. చేయవలసిందిదేనన్నది, ఏమాత్రం అవగాహన ఉన్నా తెలిసిపోతుంది. ఆ పని చేయకపోగా, ఈ సందర్భానికి తగని మరో అంశాన్ని ప్రస్తావించారు చూడండి.

కాణాదం పాణినీయంచ సర్వ శాస్త్రోపకారకం (పేజీ 28) కామందకుడు చెప్పాడు.

కణాదుని వైశేషికం, పాణిని వ్యాకరణం అన్న రెండు గ్రంథాలూ సర్వ శాస్త్రములను  అర్థం చేసుకోవడానికి ఉపయోగపడును, అని ఆ సూత్రానికి అర్థం చెప్పారు. దానిపై తన అభిప్రాయాన్నిలా చెప్పారు (పేజీ 29).

సంస్కృతం లో వ్రాయబడిన ఏదైనా శాస్త్ర గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే, అతనికి 1) మొదట సంస్కృత భాష వచ్చి ఉండాలి. 2) ఆ భాష యందు పటుత్వం ఉండాలి. అందుకై తప్పక పాణిని వ్రాసిన వ్యాకరణము బాగుగ తెలిసి ఉండాలి. 

అంత మాత్రమే అయితే స్పష్టమగు జ్ఞానం కలుగదు. దానికి తోడు చదువరికి, పదార్థ ప్రమాణ విద్యాజ్ఞానమూ ఉండాలి. ఆ జ్ఞానము వైశేషిక దర్శనమందున్నది. కావున ఆ రెండు శాస్త్రముల జ్ఞానమున్న వానికి సంస్కృత శాస్త్ర గ్రంథముల జ్ఞానము కలుగునని చెప్పబడినదనవలెను.

సురేంద్ర:- ఇక్కడ వారు కామందుడలా అన్నాడని అంటున్నట్లా? అది సరైందేనని తానంటున్నట్లా? అన్నది ఒక విచారాణీయాంశం. పెంచలయ్య గారి పోకడలోని ప్రత్యేకత ఏమిటంటే, ఆయా విషయాల గురించి తానేమనుకుంటున్నదీ, చదువరికి సూటిగా, సరళంగా తెలియబడకుండా జాగ్రత్త పడడం, ఆశ్చర్యం!

ఈ విషయం వరకు చెప్పాక, “ఇంతవరకు తర్క శాస్త్రం యొక్క ప్రాచీనతను  పరిశీలించితిమి”. అని ముగించారు. మళ్ళా ఇదో ఆశ్చర్యం, కాలానికి సంబంధించిన  ఆధారాలనూ చూపించకనే ప్రాచీనతను పరిశీలించామన్నారేమిటి?

ఇంతవరకు చెప్పడం అయ్యాక ; తర్క శాస్త్రానికి అనేక పేర్లున్నాయంటూ వాటి పేర్లు  చెప్పారు. 1) తర్క విద్య, 2) తర్కశాస్త్రము, 3) న్యాయ విద్య, 4) న్యాయ శాస్త్రము, 5) హేతు విద్య, 6) హేతు శాస్త్రము, 7) వాద విద్య, 8) వాద శాస్త్రము, 8) అన్వీక్షకీ. 

  సురేంద్ర :- ఆశ్చర్యమేమంటే తర్కశాస్త్రపు పేర్లంటూ ఆయన చెప్పిన జాబితాలో ‘జ్ఞాన విద్యా శాస్త్రము’ అన్న పేరెక్కడా లేదు. అంటే ఆ క్షేత్రానికి చెందిన వేత్తలు ఈ పేరును ప్రస్తావించలేదన్నమాట.

“న్యాయశాస్త్రమనునది న్యాయ వైశేషిక శాస్త్ర ద్వయ సంయోగం చేత ఏర్పడింది” (పేజీ 29).

సురేంద్ర:- అంటే ఏమిటండీ పెంచలయ్య గారు! 1) ఆ రెండు దర్శనాలను యథాతథంగా కలిపేయడం జరిగిందనా?

2) ఆ రెంటినీ ఆధారంగా చేసుకుని ఎవరో ఒక వ్యక్తి, అందులో కొంత, ఇందులో కొంత కలిపి తర్కశాస్త్రాన్ని తయారు చేశాడనా? ఇక్కడ మీరేమి చెప్పదలచుకున్నారో చెప్పండి. అలా రెండు దర్శనాల సముచ్చయంగా రూపొందిన తర్కశాస్త్ర గ్రంథాన్ని చూపించండి. నా  అవగాహన ప్రకారం న్యాయ వైశేషికాలు రెండూ స్వతంత్ర గ్రంథాలు. దుఃఖ నాశము సుఖప్రాప్తి వాటి శాశ్వతీకరణ లక్ష్యంగా రాయబడిన తాత్విక రచనలు. అవి ఒకదానికొకటి అనుబంధాలు కావు. వారిరువురూ ముందుగా అనుకుని రచన భాగాలను పంచుకుని రాసినవీ కావు. ఏ గ్రంథానికా గ్రంథం తాను చెబుతున్నది సత్యమేననీ, ఇదే సత్యమని, దీని అధ్యయనం ఆచరణ ద్వారా మనిషి అంతిమంగా పొందవలసినవి పొందగలడని చెప్పి తమ రచనలను ముగించారు. ఈ విషయం వరకు ఎవరు ఎప్పుడు సిద్ధపడ్డా ఆ రెండు దర్శనాలను పరిశీలనకు పెట్టి రుజువు చేయగలను. ఈ మేరకు మీలో ఎవరైనా వాటిని పట్టి చూడవచ్చు. దాని కంటేనూ ముఖ్యమైనది ఆయిరువురు దర్శనకారులూ తమది తర్కశాస్త్రమని చెప్పనేలేదు.

1) న్యాయదర్శనం:- గౌతముడు:

ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క నిర్ణయ, వాద, జల్ప, వితండా, హేత్వాభాష, ఛల, జాతి, నిగ్రహ స్థానానామ్, తత్వజ్ఞానాత్ నిశ్రేయ  సాధిగమః.

ఈ పదహారు పదార్థముల యథార్థ జ్ఞానము వలన నిశ్రేయస్సు కలుగుతుంది. అన్నది న్యాయ దర్శనకారుని ప్రతిజ్ఞా వాక్యము.

2) ఇతడంగీకరించు ప్రమాణములు, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము  అని నాలుగు.

గమనిక:- పెంచలయ్య గారు, న్యాయ దర్శన కారుడు అంగీకరించిన పదార్థములు మూడు అంటూ,

వ్యక్తా కృతిర్జాతయస్తు పదార్ధః న్యాయదర్శనం 2-2-63. సూత్రాన్ని చూపించారు. ఈ అది నిజానికి గౌతముని పదార్థ వర్గములను తెలుపు సూత్రము కాదు. వివరాలు తరువాత చూపిస్తాను. 

2) వైశేషిక దర్శనం:- కణాదుడు.

1) అధాతో ధర్మం వ్యాఖ్యా శ్యామః (1-1-1) అంటూ తన రచన మొదలెట్టాడు.

2) యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధిః సద్ధర్మః (1-1-2)

3) తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం. 1-1-3.

4) ధర్మ విశేష ప్రసూతాత్, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేషసమవాయానాం పదార్థానామ్ సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానాత్ ని శ్రేయసమ్ 1-1-4.

గమనిక :- ఈ నాలుగు సూత్రాలను, కణాదుని ప్రతిజ్ఞా వాక్యాలనవచ్చు. అతడు వీటిని గురించే తన రచనలో వివరిస్తూ పోయాడు.

5) ప్రమాణాల గురించి తొమ్మిదవ అధ్యాయంలో క్లుప్తంగా వివరించాడు.

ప్రత్యక్ష ప్రమాణానికి సంబంధించి స్పష్టమైన వివరణ చేయనేలేదు. ప్రత్యక్షములో లౌకిక ప్రత్యక్షం, అలౌకిక ప్రత్యక్షం అని రెండు రకాల ప్రత్యక్షాల్ని చెప్పాడు.

అస్యేదం, కార్యం, కారణం, సంయోగి, విరోధి, సమవాయంచేతి లైంగికం. 9-2-1 

అంటూ అనుమాన ప్రమాణాన్ని; ఏతేన శబ్దం వ్యాఖ్యాతం 9-2-3 అంటూ శబ్ద ప్రమాణాన్ని ప్రస్తావించాడు. అంటే సూత్రప్రాయంగా కణాదుడు మూడు ప్రమాణాలను అంగీకరించినట్లు.

మిత్రులారా! న్యాయ వైశేషిక దర్శనాలు అంగీకరించు పదార్థాలూ, ప్రమాణాల వివరమిదే. ఈ సూత్రాలననుసరించి చూస్తే గౌతముడు షోడశ పదార్ధ వాది, అతని పదార్థములు పెంచలయ్య గారంటున్న పదార్థవర్గాలు కావు. అతనంగీకరించు ప్రమాణములు నాలుగు. వాటిని పెంచలయ్య గారు అంగీకరిస్తారా? లేదా?

ఇక కణాదుడు షట్పదార్థ వాది. అతని పదార్థాలు ఆరు. అందులో ముఖ్యమైనవి మూడేనన్నమాటా ఉంది. “అర్థ ఇతి ద్రవ్య గుణ కర్మ సు” 8-2-3 ద్రవ్యము, గుణము, కర్మ అన్న వాటినే అర్థములంటారు. అయినా వైశేషికం ఆరు పదార్థాలను గురించి సరిగా  తెలుసుకుంటేనే ని శ్రేయసం కలుగుతుంది అని చెప్పింది. 

కణాదుని ప్రమాణాలు మూడు. కణాదుడు ప్రమాణాల గురించి వివరంగా చెప్పనేలేదు. పెంచలయ్య గారు న్యాయ దర్శనకారుని పదార్థ వర్గాలంటూ, వ్వక్త్యాకృతి జాతయస్తు పదార్థః 2-2-63 సూత్రాన్ని వుటంకించారు. నిజానికా సూత్రం పెంచలయ్య గారు చెప్పే పదార్థ వర్గాలను గురించి తెలిపే సూత్రం కాదు. పదార్థమని దేనినంటారు? వ్యక్తినా? ఆకృతినా? జాతినా? అని ప్రశ్నించుకుని; ఒక్కో సందర్భంలో, ఆ సందర్భాన్ని బట్టి, మూటిలో ఒక దానికి ప్రాధాన్యతనిచ్చి దానినే “పదార్థం” అనంటున్నాము. కనుక ఆ మూడు పదాలూ  పదార్థం అనడానికి అర్హమైనవే అని తేల్చాడు. న్యాయదర్శనంలో 2-2-56 నుండి 2-2-66 వరకు వీటి వివరాలున్నాయి.

ఈ విషయాలకు సంబంధించి నా అవగాహనేమిటోనూ చెబుతాను. జ్ఞాన విద్యా శాస్త్రం అన్న తన రచనలో పెంచలయ్య గారు ప్రధానంగా నాలుగు అంశాల గురించి ప్రస్తావించారు

1) మానవజీవితమంటే, కోరికలు కోరడం, వాటిని తీర్చుకునే యత్నం చేయడం. ఆ కోర్కెలు…

1) నేను జీవించి ఉండాలి. చావరాదు. 

2) నేను స్వతంత్రుడనై ఉండాలి. పరాధీనుడు కారాదు. 

3) నాకు దుఃఖము రారాదు. శాశ్వతంగా పోవాలి. 

4) సుఖము రావాలి. అది ఎప్పుడూ ఉండాలి. 

గమనిక:- నా అవగాహన ప్రకారం సహజాకాంక్షలు ఐదు. 1) ఉండాలనుంది. 2)  హాయిగా ఉండాలనుంది. 3) ఎదగాలనుంది, 4) గుర్తింపు పొందాలనుంది. 5) ఈ నాలుగూ నెరవేరుతున్నట్లు తెలుస్తూ ఉండాలనుంది. వీటి విషయాన్నలా ఉంచుదాం. పెంచలయ్య గారు చెప్పిన చట్రంలోనే ఆలోచించి చూద్దాం. మనిషిలో ఆ నాలుగు రకాల కోర్కెలు ఉన్నాయా లేదా అంటే, స్వభావంలో ఉన్నాయనే అనుకోవచ్చు కానీ పై నాలుగంశాలకు సంబంధించినంతలో జీవితానికి సంబంధించినంతలో, వాస్తవ జ్ఞానం కలిగాక, ఆ వివేకం  ఏమంటోంది?

1) కొంతకాలం జీవించడమే సాధ్యము. చావు తప్పదు.

2) ఆ జీవితం పూర్ణ స్వాతంత్ర్యం అసాధ్యం. పరిమిత స్వాతంత్ర్యమే సాధ్యపడుతుంది. 

3) వివేకం చూపిన మార్గంలో కొంతమేర దుఃఖాన్ని దూరం చేయడం సాధ్యమే. కానీ దుఃఖలేశం కూడా లేకుండా చేయడం సాధ్యము కాదు.

4) సుఖాన్ని అవకాశమున్నంతలో పొంద వచ్చు. శాశ్వత సుఖం అసాధ్యం. కనుక, ఈ జీవితానికి సంబంధించిన యథార్థజ్ఞానం మనకు ఏమి తేల్చి చెప్పినట్లు

కాల పరిమితి లేని జీవితం, సంపూర్ణ స్వాతంత్ర్యం, సంపూర్ణ దుఃఖ నాశము, సంపూర్ణ , సుఖప్రాప్తి అన్నవి ఏర్పడడం అసాధ్యం.

* కానీ పెంచలయ్య గారు ఈ నాలుగూ నెరవేరతాయనంటున్నారు, కానీ ఆయన గారు సాధ్యమేనన్న, ఆ నాలుగు కోర్కెలు ఆయనకే సిద్ధించ లేదనడానికి, ఆయన జీవితమే గట్టిరుజువు. ఆయన జీవితమే ఆయన ప్రతిపాదనలు తప్పనీ, నా ప్రతిపాదనలే ఒప్పని తేల్చేసింది. 

1) ఆయన చనిపోయారు. 2) చరమాంకంలో అస్వతంత్రునిగానే - పరాధీనుడయ్యే కాలం గడిపారు. 3) ఆరోగ్య రీత్యా గానీ, అసౌకర్యాలరీత్యా గానీ, బాధపడ్డారు కూడా. 4) దానర్థం వారన్న పూర్ణ సుఖము పొందలేదనే కదా!

సాధారణ నియమం:- ఏదైనా ఉనికిలో ఉన్న ఒక దానిని లేకుండా చేయాలంటే, అది ఉండడానికి కారణమేమిటో కనుగొని ఆ కారణాన్ని తొలగిస్తే (లేకుండా చేస్తే) అది లేకుండా పోతుంది. దీనినే సూత్రప్రాయంగా “కారణ నాశేన కార్య నాశనం” అనంటారు. ఇది సర్వ  సాధారణ నియమం. అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరికైనా, కార్య నాశనం విషయంలో ఈ నియమం వర్తించి తీరుతుందని అర్థం.

ఈ సందర్భంలో నిరంతరం గుర్తుంచుకోవలసిన జీవితావగాహన రూపమైన జ్ఞానం ఒకటుంది. కావాలి అంటున్నామంటే దేనిని కావాలంటున్నామో దాని సంగతి మనకు తెలుసని, అదిప్పుడు బొత్తిగా గానీ, అవసరమైనంత గానీ లేదని. అలాగే వద్దంటున్నామన్నా ఆ వద్దంటున్నదేమిటో మనకు తెలుసనీ, అదిప్పుడు వచ్చిపడి ఉందనీ, ఎంతోకొంత పోతున్నా పోవలసినంత పోలేదని. నేనైతే ఇక్కడికిది అందరి అనుభవాలలో ఉన్నదేనంటాను. మీరేమంటారు?

పెంచలయ్య గారు ఈ పుస్తకంలోనే ఒక దగ్గర, జీవాత్మ స్వతంత్రాన్ని స్వభావంలోనే కలిగి ఉంది (పొందివుంది) అన్నారు. (పుట 63) మరిక్కడేమో స్వతంత్రం కావాలనుంది. పరాధీనత వద్దని ఉంది అంటున్నారు. మానవునకు స్వతంత్రం కలుగుతూ ఉంది. పరాధీనత  కూడా కలుగుతూనే ఉంది అనే అన్నారు. (పుట 3).

ఈ రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలని ఏ మాత్రం జాగ్రత్తగా గమనించినా అర్థమవుతుంది కదా ఈ నాలుగు కోర్కెల విషయమై పెంచలయ్య గారు ఇలా అంటున్నారు. 

“మానవజీవితంలో పైన పేర్కొన్న కోర్కెలు ఒకప్పుడు తీరుచున్నవి. మరొకప్పుడు ఈ తీరకుండా పోవుచున్నవి. అవి రాకపోకలు కలిగియున్నవని తెలియుచున్నది”. (పుట 3) 

సురేంద్ర :- చిన్నపాటి సవరణతో ఈ అభిప్రాయము నాకు అంగీకారమే. ఆ సవరణ , ఏమిటంటే, మొదటి కోరిక మినహా, మిగిలిన మూడు కోర్కెల వరకే ఈ అభిప్రాయం సరైనది, ఎవరు, ఎప్పుడు, ఎక్కడైనా సరి చూసుకోగలిగినది కూడా. కానీ జీవించటం మరణించకుండడం అన్న దానిలో మాత్రం రాకపోకలు కలిగివున్నాయన్నది మాత్రం  ఎవరి అనుభవంలోనూ లేదు. ఆ మేరకు పెంచలయ్య గారి జీవితావగాహన  దోషపూరితమైనది. నేను ముందే చెప్పినట్లు, పుట్టాక అంటే జీవితం మొదలయ్యాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతో కొంత కాలం మాత్రమే జీవించగలుగుతున్నాము. మరణం తప్పడం లేదు. జీవితాన్ని సరిగా చూడగలిగిన వారికెవరికైనా ఇదే విషయం ఎదుట పడుతుంది. “సంభవము కలవారికెల్లరకును చావు నిక్కమన్న” నానుడి దీనిని గమనించి వచ్చింది. మొత్తం మీద పెంచలయ్య గారి ఈ ప్రధాన ప్రతిపాదనకు సంబంధించి యథార్థజ్ఞానరూపమిదే. 1) జీవితం అశాశ్వతం అంటే కాలావధి కలిగే ఉంటుంది. 2) స్వతంత్రం కూడా అశాశ్వతమే. అదీ కాలావధి కలిగి ఉంది. 3) సుఖదుఃఖాలన్న రెండూ కూడా రాకపోకలు కలవే. అంటే కాలావధి కలవే. అశాశ్వతమేనన్నమాట.

జీవితానికి సంబంధించిన నా అవగాహన ఇదే. మీ అవగాహనా దీనికంటే వేరుగా  వుండేందుకు వీలు లేదన్నది కూడా జీవితానికి సంబంధించిన నా అవగాహనలో భాగమే

ఇక పెంచలయ్య గారు రెండో ప్రధానాంశంగా చెప్పిన దానిని పరిశీలిద్దాం. 

*అసమగ్రమైన భాష, దోషసహితమైన భాష కారణంగానే, తాను తెలుసుకోవాలన్న  ఈ విషయాలలో జ్ఞానార్జనకు ఆటంకం కలుగుతోంది.

సురేంద్ర:- ఇక్కడ నాకు అర్ధం కాని విషయమొకటుంది. పైన చెప్పుకున్న నాలుగు కోరికలు తీరక పోవడానికి గల కారణాలేమిటో కనుగొనడానికి, సమగ్రమైన భాష,  దోషరహితమైన భాష అనడానికి తగిన భాషా పరిజ్ఞానం ఎందుకో నాకర్థం కాలేదిప్పటికీ.

ఇంతకూ అసమగ్రమైన భాష - సమగ్రమైన భాష, దోష సహితమైన, దోష రహితమైన  భాష అంటే ఏమిటో పెంచలయ్య గారు చెప్పనేలేదు. ఆయనే పదే పదే, చెప్పేవాడు ఎలా  చెబితే గానీ సరిగా చెప్పినట్లు కాదో, విన్నవానికి సరిగా అర్థం కాదో అన్న విధానాన్ని, ఈ  రచనలో తామెక్కడా పాటించనే లేదు, ఆశ్చర్యం కదా ఇది.

పై నాలుగింటికీ సంబంధించిన కారణాలు కనుగొనడానికి, వీరన్నంత భాషా పరిజ్ఞానంతో పనిలేదన్నది నా అవగాహన. నా అవగాహనే కాదు, ప్రతి మనిషీ పెంచలయ్య గారన్నంత భాషా పరిజ్ఞానం గానీ, పదార్థ వర్గాల ప్రమాణాల పరిజ్ఞానం గానీ లేకుండానే పై నాలుగు కోర్కెలను తీర్చుకోడానికి వాటికి సంబంధించిన అనుభవాలాధారంగానే, ఎప్పటికప్పుడు, 1) స్వతంత్రత లేకపోవడానికి, 2) పరాధీనత ఏర్పడడానికి, 3) దుఃఖం రావడానికి, పోక పోవడానికి, 4) సుఖము రావడానికి, రాకపోవడానికి కారణాలను కనుగొనే, వాటిని పరిష్కరించుకుంటున్నాడు. దానితో పాటే, ఈ సమగ్ర అసమగ్ర భాషల గొడవ లేకుండానే, స్వానుభవం ఆధారంగానే, స్వతంత్రత, సుఖప్రాప్తి, దుఃఖనాశము అన్నవి అపరిమితంగానూ, శాశ్వతంగానూ లభించడం అసాధ్యం. అసంభవం అన్న, జీవిత యథార్ధాన్ని తెలుసుకున్నాడు. 

మనందరి అనుభవరూపమైన ఈ అవగాహనకు వేరుగా, వివిధ ఆస్తిక ధోరణులకు  చెందిన రచనలలోమాత్రం 1) మరణం రాకుండా చేయవచ్చు, 2) పూర్ణ మరియు శాశ్వత  స్వతంత్రాన్ని పొందవచ్చు. 3) ఆత్యంతిక దుఃఖ నాశమూ సాధ్యమే. 4) శాశ్వత సుఖప్రాప్తి సాధ్యమేనన్న అభిప్రాయాలు ప్రకటింపబడ్డాయి. ఆ నాలుగు గానీ, ఆ నాలుగింటిలో ఏ ఒక్కటి గానీ పొందినవారున్నారనడానికి ఈ నాటి వరకూ ఒక్కటంటే ఒక్క రుజువూ లేదు. ఆ పక్షాన్ని స్వీకరించిన వారూ పుస్తకాలలోని మాటలనుట్టంకించడం తప్ప అదనంగా చూపించిందేమీ లేదు. అట్టివన్నీ లక్షణము ప్రమాణమూ లేని కేవల ప్రతిజ్ఞా వాక్యాలు మాత్రమే.

తరువాతి అంశంగా పెంచలయ్య గారు అసమగ్రభాష, దోషసహితభాష అంటే ఏమిటో, పరిశీలిద్దాం అంటూ మొదలెట్టారు. (పుట 4). ఎంత సాహసం చేశారంటే "భాషాభాగాలు, వాక్య విభాగాలు తెలియకుండా వాక్యార్థజ్ఞానం కలగదు” అని తీర్మానించడమే కాక, వాటిని గురించి చెప్పిన వ్యాకరణ దర్పణం, యాస, నిరుక్తం, పాణిని వ్యాకరణం అన్న మూడూ  అసమగ్ర, దోష సహిత రచన లేనని తేల్చేశారు. (పుటలు 7 నుండి 17 వరకు) అంత మాటన్నాయన, సమగ్ర భాష, దోషరహిత భాషను గురించి గింతైనా తెలపవద్దా?!?

ఈ ముగింపు సందర్భంలో ఆయన మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. కావున  భాష వలన మనకు స్పష్టమగుజ్ఞానము కలుగదని తెలిసినది” (పుట.16) సరైన భాష , లేకపోవడం వల్లనే సరైన జ్ఞానం కలగడం లేదనికదా లోగడ అని ఉన్నారు

ఆయన ప్రస్తావించిన మరో ముఖ్యాంశం ఉపనిషత్ కారులు పరిశోధించి ఏదో  కనుగొన్నారన్నది.

1) అసమగ్ర మరియు దోష సహిత భాష కారణంగానే; యథార్థజ్ఞానం సంపాదించలేక  పోతున్నాం. అందువల్లనే పై నాలుగు కోరికలు తీరడం లేదు. (పుట 17). ఉపనిషత్ కారులు శోధించి కనుక్కొన్న మొదటి విషయమిది.

2) భాష వల్ల ఏర్పడ్డ ఈ దోషాలను తొలగించే ఒక మార్గాన్ని కనుగొన్నారు (పు. 17).

వారేమి కనుక్కున్నారో పెంచలయ్య గారు చెబుతున్నారు.

1) ప్రపంచంలోని తెలియబడేవన్నీ సహజంగానే కొన్ని పదార్థ వర్గాలుగా విభజింపబడి ఉన్నాయి.

2) వాటిని తెలుసుకొనడానికి తమయందు అందుకు తగిన కర్మ విధానము ఏర్పడి  ఉంది.

సురేంద్ర :- ఇది నిజమా పెంచలయ్య గారూ ఏ యే ఉపనిషత్ కారులు, ఇలా  భాషాపరమైన దోషాన్ని జీవిత యథార్దావగాహనకు ఆటంకంగా గమనించారండీ? తరువాత వారంతా కూడా బలుక్కొని పరిశోధన చేశారా? పదార్ధ వర్గాలు ప్రమాణాలు ఏమిటోనూ వారంతా కలిసే కనుక్కున్నారా? ఇంత ముఖ్యమైన విషయం చెప్పి ఉపనిషత్తుల నుండి ఆ  సమాచారాన్ని చూపించలేదేమిటండీ!

పైగా ఆ ఉపనిషత్ కారులే లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్దిః నతు ప్రతిజ్ఞ మాత్రేణ’ అన్న సూత్రాన్ని ప్రకటించారనేశారు కూడా. ఏ ఉపనిషత్తుల్లో ఉందండీ ఇది? 

నా అవగాహన ప్రకారం, దశోపనిషత్తులులలో ఈ పదార్థ వర్గాల ప్రమాణాల గురించి  ప్రత్యేకంగా సమగ్రంగా ఎక్కడా చెప్పబడలేదు. ఆ సంస్కృత వాక్యం చెప్పింది ఉపనిషత్  కారులు కాదు.

ఆ ఉపనిషత్ కారుల విషయం చెప్పాక, పెంచలయ్య గారు ప్రస్తావించింది గౌతమ, కణాదుల గురించే, ఉపనిషత్ కారులు తాము శోధించి కనుగొన్న పదార్థ వర్గాల ప్రమాణాల గురించి శిష్యులకు బోధిస్తూ వచ్చారు. అదంతా పెద్ద జ్ఞాన రాశి అయ్యింది.

దాన్నంతటినీ గౌతముడు, కణాదుడు అను ఇద్దరు ఋషులు సూత్రబద్ధం చేసి రెండు గ్రంథాలు రచించారు. వాటినే ఈనాడు న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం అంటున్నారు  (పుట. 18). ఈ రెండు గ్రంథాలను కలిపితే లక్షల ప్రమాణ విద్య అవుతుంది.

సురేంద్ర:- ఉపనిషత్ కారులు బోధించిన దానినే వీరిరువురూ గ్రంథస్తం చేశారనడానికి , ఆధారాలు చూపండి. నా అవగాహన ప్రకారం గౌతమ కణాదులు ఎవరి మానాన వారు స్వతంత్ర రచనలనే చేశారు. పైగా వారిలో ఎవరు గానీ తామీ సమాచారాన్ని ఉపనిషత్తుల నుండే స్వీకరించామని గానీ, దానినంతా సూత్రబద్ధం చేయటం వరకే తాము చేశామని గానీ ఎక్కడా ప్రకటించలేదు. ఆ రెండు రచనలూ ఒకదానికొకటి ఆధారాలుగానీ, అనుబంధాలు గానీ కావు. కనుక ఈ విషయంలోనూ పెంచలయ్య గారు యథార్థమనడానికి తగని భావాలనే వెలిబుచ్చారు. ఎలాగంటే…

గౌతముని ప్రకారం, యథార్థ జ్ఞానం సంపాదించుకోవలసిన పదార్థాలు 16. వైశేషికుని ప్రకారం యథాతధంగా తెలుసుకోవలసిన పదార్థాలు 6. గౌతముని ప్రమాణాలు 4. వైశేషికుని ప్రమాణాలు 3. అదలా ఉంచి ఉపనిషత్ కారులు ఏ ప్రమాణాలనైతే తమయందే ఉన్నాయంటున్నారో అవి ప్రత్యక్ష, అనుమాన ప్రక్రియలకు సంబంధించి రెండు మాత్రమే అయ్యేందుకు వీలుంది. ఎలాగంటే, పెంచలయ్య గారే, భాషను జీవించటం మొదలెట్టాక  చాలాకాలం తరువాతే మనిషి తయారు చేసుకున్నారని అంగీకరించారు కదా!

ప్రమాణాల విషయంలో గానీ, పదార్థ వర్గాల విషయంలో గానీ, ఎవరి ధోరణి వాళ్లదేనన్నది ఈనాడైనా ఆరచనలాధారంగా నిరూపించవచ్చు. పోతే వీటి విషయంలో నా అవగాహన ఇలా ఉంది.

1) పదార్థ వర్గాలు:-

మనకు తెలియబడే వాటినన్నింటినీ, నిరంతరం సులభంగా వినియోగించుకోవడానికి  వీలుగా, కొన్ని రాశులుగ విభజించుకోవలసి వచ్చింది. అలా ఏర్పడ్డవే పదార్ధ వర్గాలన్నవి. అయితే అలా విడగొట్టడానికి, కొన్నింటిని సముదాయంగా కట్టగట్టడానికి పనికి వచ్చే,  పరస్పరం పోలేతనం, పోలనితనం తెలియపడే వాటిలోనే ఉంది. 

నా ప్రకారం ప్రధాన పదార్ధ వర్గాలు 5.

1) ద్రవ్యము, 2) వస్తువు, 3) గుణము, 4) క్రియ, 5) సంబంధము. అన్నవే అవి.

గమనిక :- అందులోనూ అసలున్నది ‘ద్రవ్యం’ అన్న పదం చేత సూచించబడే పదార్థమే. మిగిలిన నాలుగూ ద్రవ్యాధారంగా తెలియబడుతున్నవే.

గొప్ప విషాదమేమిటంటే, పెంచలయ్య గారు తామంగీకరించే పదార్ధ వర్గాలెన్నో, ఏవో  సూటిగా ప్రతిపాదన రూపంలో చెప్పినట్లు నా దృష్టికి రాలేదు. ఆ సంస్థ ప్రతినిధిననే వారుగానీ, పెంచలయ్యగారి పదార్ధవర్గాలేవో తమకు తెలుసనే వారు గానీ, ఆ వివరాలు చెబితే పరిశీలిస్తాను.

పదాల అర్థాలను భాష ద్వారా ప్రకటించాలంటే, నిర్వచన రూపంగా చెప్పాలన్నంతవరకు ఆయన గారితో నాకు విభేదం లేదు. ఏకాభిప్రాయమే ఉంది. నేను నా పదార్ధ వర్గాలేమిటో  చెప్పాను. వాటి నిర్వచనాలూ ప్రకటించాను. పెంచలయ్య గారా పని చేయనేలేదు.

2) ప్రమాణాలు:-

ఆయా విషయాలను తెలుసుకోవడానికి అవసరమైన, పరికరాలను, అవి పనిచేసే తీరును, , విధానాన్ని ప్రమాణాలు అంటారు. అనాలి అన్నది నా అవగాహన. అట్టివి నాకు 3. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని. అందులో మొదటి రెండు మాత్రమే అవైయున్నవి. మూడవది  భాషాధారమైనది. అది అనంతరం మనిషి తయారు చేసుకున్నది. ఈ నా అవగాహనతో విభేదించే వారెవరైనా సరే, వారి అవగాహన సరైంది కాదని నిరూపించగలను.

ఈ విషయములో పెంచలయ్య గారి పక్షమేమిటన్నది ఆయన స్పష్టంగా ప్రకటించనే లేదు. ఇతర ప్రమాణజ్ఞుల ప్రతిపాదనలను యథాతథంగా అంగీకరించనూ లేదు. అలా ఇతరుల పదార్థవర్గాలను, ప్రమాణాలను పరిశీలించే సందర్భంలో వారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు, వీటి విషయంలో వారి అవగాహన ఎంతో కొంత చక్క చేసుకోవలసిందిగా ఉందన్నది నా అభిప్రాయము. ఈనాడు వారి పక్షాన్ని స్వీకరించే వారెవరైనా ఉంటే, వాటి విషయమై శాస్త్రీయ విచారణకు నేను సిద్ధము.

ప్రియ చదువరులారా! జ్ఞాన విద్యా శాస్త్రము-తర్క శాస్త్రము’ అన్న పేరుతో పెంచలయ్య గారు వ్రాసిన పుస్తకంలో కొన్ని ముఖ్యాంశాలపై నా విశ్లేషణ ఇది. దీనికి సంబంధించిన  మరిన్ని విషయాలను వీలుంటే పై సంచికలో ప్రస్తావిస్తాను. దీనిపై ఎవరైనా స్పందించవచ్చు. ముఖ్యంగా సత్యజ్ఞాన సంఘ సంబంధులం అనే వారెవరైనా రేపు అక్టోబరులో జరిగే మండల త్రైమాసిక సమావేశాలలో మాట్లాడడానికి సిద్ధం కావచ్చు. వేరే సమయాలలో మాట్లాడుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు.

  -సత్యాన్వేషణలో మీ సురేంద్ర. 

వివేకపథం 258, సెప్టెంబరు 2021

మన విధానం:- సత్యపక్షాన నిలవడం, ధర్మబద్దంగా జీవించడం.


No comments:

Post a Comment