Sunday, November 21, 2021

259 వివేకపథం


వివేకపథం

సంపుటి: 8 సంచిక:1 నవంబరు 2021


యోచనాశీలురైన పాఠక మిత్రులందరకూ, మిత్రులారా!

తాత్వికాంశాలకు చెందిన అత్యంత ప్రధానమైన విషయాలలో,  జ్ఞానము - ఇచ్ఛ - క్రియలు   అన్న వాటికి సంబంధించిన సరైన అవగాహన కలిగి ఉండడం కూడా ఒకటి. 

సాధారణంగా ఆయా విషయాలకు చెందిన జ్ఞానం ఎంతో కొంత కలిగాకనే, అవి తనపై   కలిగిస్తున్న ప్రభావాల ననుసరించి వాటిపై అనుకూల, ప్రతికూల దృష్టి ఏర్పడుతుంటుంది.  దానినే మనం ‘కావాలనో వద్దనో’ అనిపించడ అనంటున్నాము. ఇక్కడ రెండంశాలను విడివిడిగా చూడడం అవసరం. ఇంద్రియార్థసన్నికర్ష ద్వారా ఆయా విషయాలకు  సంబంధించిన జ్ఞానం (అనుభూతి) కలిగింది. ఆ అనుభూతి ననుసరించి, అది అలాగే  కొనసాగుతుండాలి అనిపించింది. అది అలాగే కొనసాగా లంటే ఆ అనుభూతిని జనింప చేయగలది, అంటే దానికి చెందిన ఇంద్రియార్థ సన్నికర్ష లోని అర్థం ఏదైతే ఉందో అది  అందుబాటులో ఉండడం తప్పనిసరి అని తెలిసింది. ఎలాగంటే, ఆ విషయం ఇంద్రియానికి  అందకున్నా, ఇంద్రియం దానిని గురించిన సమాచారాన్ని జ్ఞాతకు అందించే ప్రక్రియ  పూర్తిగాకున్నా; ఆ అనుభూతి కలగడం గానీ, అనుభూతికి అనుకూలంగానో, ప్రతికూలంగానో   స్పందించడం గానీ సాధ్యపడడం లేదు. జరుగుతున్న దానిని జాగ్రత్తగా గమనించగలిగితే,  అవును అది అలాగే జరుగుతూ ఉందన్నది తెలిసిపోతుంది.

జీవి ఉనికిలోకి వచ్చి జీవన క్రియ కొనసాగుతున్న క్రమంలో, తెలుసుకునే పనికి   సంబంధించిన వ్యవస్థ కూడా పని చేయడం ప్రారంభించిన తరువాతనే ఇంద్రియాలతో   అర్థాలకు సన్నికర్ష ఏర్పడి వానికి సంబంధించిన అనుభూతులు ఏర్పడడం, అవి ఆ జీవి  స్వభావాన్ని బట్టి బాగుందనో, బాగాలేదనో అనిపించడం; బాగుందనిపించే వాటిని అలాగే  ఉండనివ్వడం, బాగా లేదనిపించినప్పుడు, యధాశక్తి వాటిని తిరస్కరించేలా ప్రతిచర్యకు పూనుకోవడం జరుగుతుటుంది. ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకుని ఉన్న క్రమాన్ని, క్రమంలోని దశలను స్పష్టంగా అర్థం చేసుకుని ఉన్నప్పుడే, వాటి మధ్య జరిగే విషయంలో  పునర్విచారణ గానీ, సత్యాసత్య విచారణ గానీ సజావుగా సాగుతుంది. ఈ విషయంలో విచారణలో పాల్గొనే వారి మధ్య వేరు వేరు అభిప్రాయాలున్నా, సరైన అవగాహన లేకున్నా  విచారణంతా గందరగోళంగా తయారవుతుంది. అలాటప్పుడు ఒక ముగింపుకు రావడం కష్టమవుతుంది.

కనుక ప్రాతిపదికల విషయంలో స్పష్టత, ఏకాభిప్రాయం కలిగుండడం తప్పనిసరి. ప్రస్తుతం మనం విచారిస్తున్న విషయంలో అంటే, తెలుసుకునే ప్రక్రియలో ఇమిడి ఉన్న వేమిటి? ఆ తెలియడం అన్నది జరిగే క్రమ మేమిటి? అందులోని దశలేమిటి? అన్న  వాటిని గురించిన స్పష్టత రావాలి. అందుకై మన మన అనుభవాలను లేదా ఈ విషయంలో  జరుగుతున్న దేమిటన్న దానిని ఈ క్రింది అంశాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా   గమనించాలి.

1) ఈ మొత్తం ప్రక్రియలో ఇమిడి ఉన్న పాత్రలు:  

1) తెలుసుకునేది (ప్రమాత, జ్ఞాత, విషయి, ద్రష్ట అన్న పదాలు తెలుసుకునే పని చేస్తున్న దానిని సూచించేందుకుగా చెప్పబడుతున్నాయి).

2) తెలియబడేటివి (ప్రమేయాలు, జ్ఞేయాలు, విషయాలు, అర్థాలు అన్న పదాలు   తెలియబడేటివి అన్న దానికి పర్యాయాలుగా చెప్పబడుతున్నాయి.

3) తెలుసుకునేందుకు అవసరమైన పరికరాలు - పద్ధతులు (ప్రమాణాలు, జ్ఞాన  సాధకాలు అన్న మాటలూ దీనిని తెలిపే టివిగనే ఉన్నాయి. 

4) తెలియడం : ప్రమ, జ్ఞానము, అనుభూతి, అనిపించడం అంటున్నాం దీనినే.

ప్రమాతకు ప్రమాణాల ద్వారా, ప్రమేయాలకు సంబంధించిన ప్రమ కలుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో తెలుసుకునేవాడు లేకపోయినా, తెలుసుకోవలసినవి లేకపోయినా, తెలుసుకునే పనికి అవసరమైన సాధన సామాగ్రి లేకపోయినా, ఆయా  విషయాలకు చెందిన తెలివి (జ్ఞానం లేదా అనుభూతి) కలగనే కలగదు.

  • ఇంతవరకు మీ మీ అనుభవాలు ఇలాగే ఉన్నాయో లేదో తరచి చూసుకోండి.

1) తెలుసుకునే దానికి ఆయా విషయాలకు సంబంధించిన తెలివి (జ్ఞానం) కలుగుతుంటుంది. ఈ తెలుసుకునే పని తలలో జరుగుతున్నట్లు మనందరికీ తెలిసిన   విషయమే. అయినా ఇక్కడా కొంత లోతుగా విచారించాల్సిన భాగం ఉంది.

తెలుసుకునే పని తలలో జరుగుతుందని మనకు ఎలా తెలిసింది?

నా అవగాహన ప్రకారం అది, ఆధార సహితమైన ఊహా రూపమే. సాధారణానుమాన ప్రక్రియ ద్వారా ఏర్పడ్డ అభిప్రాయమది. మనకు ఒక విషయంలో సార్వత్రికానుభవం  అనదగిన అనుభవం ఒకటుంది. శరీరంలో ఏ అవయవం అతిగా పని చేస్తే ఆ అవయవం  అలసటకు లోనవుతుంది అన్నదే ఆ అనుభవం. ఈ విషయం మన మధ్య నిర్వివాదాంశము. అవునా? కాదా?

తెలుసుకునే పని చేసేది చేస్తున్న ముఖ్యమైన పనుల్ని గమనిస్తే, అవి 1) గ్రహణ 2)  ధారణ 3) స్మరణ 4) చింతన 5) సృజన అన్నవిగా తెలుస్తాయి. ఈ పనులను గనుక  అతిగా చేస్తే, మనకు తల అలసటకు లోనయిందిని అనిపిస్తోంది. చదవడం, రాయడం, ఆలోచించడం, క్రొత్త క్రొత్త విషయాలను కల్పించడం అన్న పనులు చేసి చూడండి. తల:-  ఇప్పుడు మనం మెదడు అంటున్న భాగంలో పని విరమించా లనిపించడం జరుగుతుంది.   ఈ ఆధారంతోనే ఆలోచించే పని తలలో జరుగుతుం దన్న నిర్ణయానికి రాగలిగాము

గమనిక: మెదడులోని ఏ భాగంలో ఈ పని జరుగుతుందన్నది ఎవరికి వారికిగా   మనకెవరికీ నేరుగా తెలియడం లేదు. ఇంతవరకు వాస్తవమో? కాదో?నూ తేల్చుకోండి. 

వీటి విషయంలో స్పష్టత గానీ, ఏకాభిప్రాయం గానీ లేకుంటే, ఈజ్ఞాన క్షేత్రానికి   సంబంధించిన మౌలిక విషయాలను అందరం కలసి పరిశీలించడం సాధ్యపడదు.

1) శరీరంలోని తెలుసుకునే భాగం (అవయవం లేదా పరికరం) తెలుసుకొనే స్థితిలో   ఉండాలి. అంటే నిద్రలో గానీ, సృహ కోల్పోయిన స్థితిలో కానీ ఉండరాదు.

2) తెలియ బడేటివి ఉండాలి. అవి జ్ఞానేంద్రియాలు పట్టుకో గలిగినవిగా ఉండాలి. (వాటిని విషయాలందాము)

3) విషయాలు ఇంద్రియాలకు అందడం, ఇంద్రియాలు తాము పట్టగలిగిన మేర వాటి  వివరాలను మెదడుకు చేరవేయడం, తెలుసుకునేది తన దగ్గరకు చేరిన సమాచారాన్ని  గతానుభవాలతో సరి పోల్చుకోవడం ద్వారా ఇది లోగడ తెలిసిన లాటిది అనో, కొత్తది  అనో అనుభూతి చెందడం (తెలుసుకోవడం) అన్న రూపంలోనే ఈ ప్రక్రియంతా జరుగుతూ ఉంటుంది.

4) ఈ ప్రక్రియంతటిలో ప్రధానంగా గమనికలో ఉంచుకోవలసిన దశలు ఏమిటన్నది   తెలియాలి. అవి మనకు ఎలా తెలుస్తాయి?

 1) నా అవగాహన ప్రకారం మనందరమూ సాధారణానుమానం ద్వారానే ఈ   దశలుండాలని ఊహిస్తాము.

2) ఆధునిక శరీర విజ్ఞాన శాస్త్ర జ్ఞానమేర్పడుతున్న క్రమాన్ని గురించి నాడీమండల   వ్యవస్థ పనితీరు గురించీ, మనం మామూలుగా ఊహించిన దాని కంటే ఎంతో మెరుగైన   అవగాహనను అనేక ప్రయోగాల ద్వారా కలిగించుకో కలిగింది. మనకీనాడు 1) ఆ శాస్త్రాలు అందించే సమాచారం అందుబాటులో ఉంది. 2) ఆ ప్రయోగాలను నేరుగా (ప్రత్యక్షంగా)  చూసే అవకాశమూ ఉంది.


మిత్రులారా!

  నేనేమి చెబుతున్నానో అర్థమవుతుందా? 

1) జ్ఞానమేర్పడుతున్న క్రమాన్ని గురించి, గతకాలపు లేదా ఈ కాలపు చింతకులు   (తార్కికులు, తాత్వికులు) తెలుసుకున్నదంతా ఆధార సహితమైన ఊహారూపమే.

2) నాడీ మండల వ్యవస్థ గురించిన ప్రయోగాలు చేసిన ఈనాటి ఆధునిక విజ్ఞానులు వెనుకటి వారి ఊహలకు మించి, ప్రయోగ రీత్యా రాబట్టబడిన, మరల మరల ప్రయోగం   చేసి చూసుకోగల స్థాయిలో, రీతిలో దీనికి సంబంధించిన అవగాహన కలిగి ఉన్నారు. 

ఈ క్షేత్రాన్ని విచారిస్తున్న మనం, ఈనాటి వైజ్ఞానికులు అందించిన ప్రామాణిక సమాచారం ఆధారంగా విచారణ సాగించడం గానీ, దాని ప్రామాణికత ఏపాటిది ? అన్న ప్రశ్న  ఏర్పడినప్పుడల్లా ఆ సమాచారానికి ఆధారమైన ప్రయోగాన్ని తిరిగి చేసి నిర్ధారించుకోవడం గానీ చేసుకోవచ్చు. మండలి అవగాహన మేర ఆ క్రమమూ, అందులోని ముఖ్యమైన దశలూ ఇలా ఉన్నాయి.

1) విషయాలుండాలి, 2) ఇంద్రియాలకు అందాలి, 3) ఇంద్రియాలు తాము పట్టగలిగిన  మేర వాటిని మెదడులోని ఒక భాగంలో కి చేర్చాలి. (గమనిక: అయిదు జ్ఞానేంద్రియాలూ,  అవి పంపగలిగిన సమాచారాన్ని మెదడులోని వేరు వేరు స్థానాలకు పంపుతున్నట్లు ప్రయోగ  రీత్యా నిర్ధారణ అయ్యింది), 4) మెదడులోకి ఒక దగ్గరకు చేరిన ఆ సమాచారం, అక్కడనుండి మెదడులోని మరో భాగానికి చేరవేయడం జరుగుతోంది. ఈ భాగాన్నే గ్రహణ కేంద్రం  లేదా విశ్లేషణ కేంద్రం అంటున్నాము, 5) అక్కడకు చేరిన సమాచారాన్ని అప్పటికే స్మృతి  కేంద్రంలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకు ఆయా ఇంద్రియాల ద్వారా అందిన సమాచారం లేదా విషయం అనుభూతి రూపంలోకి వస్తుంది. ఈ '6'వ దశలోని దానినే జ్ఞానం కలగడం, తెలియడం, అనిపించడం  అనంటున్నాము.

గమనిక : ఇంతవరకు ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రయోగాలు ఇలానే చెబుతున్నాయో  లేదో సరి చూసుకోండి. అవసరమైతే ఈ ప్రయోగ కేంద్రాలకు వెళ్లి ప్రయోగాలను చూడండి.

  • ఈ మొత్తాన్ని క్రోడీకరించి కొన్ని సాధారణ సూత్రీకరణలను రూపొందించవచ్చు.

1) తెలుసుకునే పనీ, తెలిసిన వాటిని వినియోగించుకునే పని తలలో జరుగుతోంది.

2) తలలోనూ (మెదడులోనూ) గ్రహణ కేంద్రం అనడానికి తగిన భాగంలోనే   జరుగుతోంది.

అంటే ఇంద్రియాలు తాము పట్టుకున్న సమాచారాన్ని మెదడులోని తమకు చెందిన  భాగానికి చేర్చిన దశలో జ్ఞానం కలగడం లేదన్నమాట. మన విచారణలో ఇది చాలా కీలకమైన అంశం. మెదడుకు చేరిన సమాచారపు (తొలిదశ, మలిదశ) అన్న రెంటినీ వేరుచేసి అర్థం చేసుకోవడానికి వీలుగా మండలి వీటిని రెండు వేరు వేరు పేర్లతో సూచిస్తోంది.

1) ఇంద్రియాలు చేరవేసిన సమాచారం ముందుగా మెదడులో ఎక్కడికి చేరిందో దానిని అనుభవ కేంద్రమనీ, అక్కడకు చేరిన దానిని అనుభవమనీ మేము అంటున్నాము. ఆ దశలో   అనిపించడం గానీ, తెలియడం గానీ జరగదు. అంటే అనుభవ దశలో జ్ఞానం లేదన్నమాట.

2) అనుభవ కేంద్రం నుండి మెదడులోని మరో కేంద్రానికి ఆ సమాచారం చేరాకనే  విశ్లేషణ, సంశ్లేషణ ప్రక్రియంతా జరుగుతుంది. అదుగో దానినే మేము గ్రహణ కేంద్రం అంటున్నాము. అక్కడ జరగాల్సింది జరిగాకనే మనకు అనిపించడం, (అనుభూతి)  జరుగుతుంది. అనిపించడం అనుభూతి కలగడం అన్న రెండూ ఒకే అర్థాన్నిచ్చే మాటలుగా  వాడుతున్నాను. తెలివి ఏర్పడడం జ్ఞానం కలగడం, తెలియడం లాటి పదాలన్నీ ఆ గ్రహణ  కేంద్రంలో విశ్లేషణ  సంశ్లేషణ ప్రక్రియ ముగింపులో ఉన్న దానిని సూచించడానికి వాడే   పదాలే.    

పాఠక మిత్రులారా!

ఇంతవరకు నేను మీ ముందుంచిన సమాచారం, మీకు మీరుగా హేతుబద్ధంగా ఆలోచించి చూడండి లేదా ఈ క్షేత్రానికి చెందిన ఆధునిక వైజ్ఞానిక ప్రయోగాలను నేరుగా వీక్షించడం ద్వారా సరైనదో కాదో చూసుకుని ఒక నిర్ణయానికి రండి. ఈ మొత్తాన్నే నేను జ్ఞాన క్షేత్రానికి   చెందిన ప్రాతిపదికలు అని అంటున్నాను.

ఈ విచారణంతటి పర్యవసానంగా, మనం మొదట్లో చెప్పుకున్న ప్రమాత, జ్ఞాత, ద్రష్ట,   విషయి అన్న పదాలచే సూచించేది మెదడులోని గ్రహణ కేంద్రాన్నే నన్నది నిర్ధారణోతుంది.  

2) ప్రమ, జ్ఞానము, తెలియడం, అనిపించడం, అనుభూతి కలగడం లాటి పదాలన్నీ,   ఈ జ్ఞాన ప్రక్రియ పర్యవసానంగా పైన చెప్పుకున్న గ్రహణ కేంద్రంలో ఏర్పడ్డ నిర్ణయాలను   గురించే.  

గమనిక: ఇవిగాక మిగిలిన రెండూ ప్రమేయాలు  ప్రమాణాలు అన్నవి. వాటిని   గురించిన విచారణే లక్షణ ప్రమాణ విద్య అన్న శీర్షిక క్రింద పెంచలయ్య గారు ప్రస్తావించిందీ, నేను ప్రస్తావిస్తున్నది కూడా. వీటినే పదార్థ వర్గాలు  ప్రమాణాలు అన్న రెండుగా విపులంగా  విచారణకు లోను చేస్తున్నాం.

  • పదార్థ వర్గాలెన్ని? అని అడిగామంటే తెలియ బడేటివి అంటే జ్ఞానేంద్రియాలకు  అందేటివి ఎన్ని రకాలుగా (రాశులుగా, సముదాయాలుగా) ఉన్నాయని అడిగినట్లన్నమాట.

  • ప్రమాణములెన్ని? అని అడిగామంటే, తెలియబడేటిటివి వేటి ద్వారా, ఏ విధానంలో  తెలియబడుతున్నాయో అవెన్ని అని అడిగినట్లన్నమాట.

సత్యాన్వేషణ మండలి ప్రకారం పదార్ధ వర్గాలు 5. అంటే ప్రమేయాలు లేదా విషయాలు లేదా అర్థాలు లేదా జ్ఞేయాలు అన్న పదాలతో మొదట్లో చెప్పుకున్న వాటినన్నింటినీ ఐదు   రకాలుగా విడదీసి అవగాహన చేసుకోవచ్చు అనే.

అలాగే తెలుసుకోవడానికి అవసరమయ్యే పరికరాలు  విధానాలు అంటే ప్రమాణాలు,   జ్ఞానసాధకాలు అన్న పదాలతో మొదట్లో చెప్పుకున్నవన్నమాట. మండలి ప్రకారం అవి   పరికరాలు '6', విధానాలు '3.’

వీటికి సంబంధించిన విద్యనే నేనూ, పెంచలయ్య గారూ కూడా లక్షణ ప్రమాణ విద్య   అనంటూ వచ్చాము. దానినే సంవత్సరాల తరబడి మా సత్సంగ సమావేశాలలో విచారణ  రూపంలో తెలిపే పని చేస్తూ వచ్చాము. వివిధ తాత్విక ధోరణులకు చెందిన విశేషజ్ఞులనూ  వీటి గురించే ప్రశ్నిస్తూ వచ్చాము.

అతి ముఖ్యమైన విషయం

రెండు మూడు దశాబ్దాల పాటు చేస్తూ వచ్చిన ఈ పని విషయంలో పెంచలయ్య గారు  అనుసరించిన విధానానికీ. నేననుసరించిన విధానానికీ ఒక మౌలికమైన తేడా ఉంది. ఒక   దగ్గర కొంత సారూప్యతా ఉంది.

పెంచలయ్య గారు చివరి వరకూ ఇదమిద్దంగా ఈ రెంటికి సంబంధించి తన  ఈ అవగాహనేమిటో చెప్పకుండా, ఎదుటివారిని ప్రశ్నిస్తూ, వారన్న దానిలో దోషాలుంటే ఎత్తిచూపుతూ, అప్పుడు కూడా సరైందేమిటో చెప్పకుండానే మీకు మీరే అన్వేషించి ఆ   సత్యాలు తెలుసుకోండి అంటూ వచ్చారు. అయితే, ఆయన జరిపిన చర్చలను గానీ, వారీ  విషయం పై చేసిన రచనలను గానీ, నిశితంగా పరిశీలిస్తూ పోతే, ఎదుటి వారి అభిప్రాయాలను  ప్రశ్నించకుండా ఊరుకున్న సందర్భాలను బట్టి గానీ, విచారణ క్రమంలో అనుకోకుండా, ఆయన నోటినుండే 'అది ఇలాగే ఉంది కదా' లాటి మాటలు వెలువడిన సందర్భాలను బట్టి గానీ, బహుశా పెంచలయ్య గారి పక్షం ఇదైయుండవచ్చు, అని ఊహించే అవకాశాలు   కొన్ని ఎదురు పడవచ్చు గానీ, ఆయన స్వయంగా మా పదార్థ వర్గాలిన్ని, అవి ఇవిగో, ఇవే అని గానీ, మా ప్రమాణాలిన్ని, ఇవే అవి అనిగానీ సూటిగా చెప్పనేలేదు.

సత్యాన్వేషణ మండలి ఇందుకు విరుద్ధంగా, సందర్భం వచ్చినప్పుడల్లా, మా   పదార్థవర్గాలిన్ని, ఇవే అవి అని; మా ప్రమాణాలిన్ని, ఇవే అవి అని విస్పష్టంగా ప్రకటించడమే  కాక, ఎవరైనా వీటిని పరీక్షించి లోపాలుగానీ, దోషాలు గానీ ఉంటే నిష్కర్షంచ వచ్చని   బహిరంగంగా ప్రకటించింది. ప్రకటిస్తూ వస్తున్నది.

పెంచలయ్య గారి విధానం, మాది చెప్పేది కాదు. మీది చెప్పి, అదెలా సరైనదో నిరూపించండి. అది తప్పయితే తప్పంటాం, ఒప్పయితే ఒప్పంటాం అన్నది కాగా, మండలి  (నా) విధానం మాది ప్రకటిస్తాం  పరీక్షించండి. తప్పయితే విడిచి పెడతాం, ఒప్పయితే   మీరు స్వీకరించాలి. లేదా మీది ప్రకటించండి మేము పరీక్షిస్తాం. ఒప్పయితే మేము స్వీకరిస్తాం. తప్పయితే మీరు విడిచి పెట్టండి. అయితే, ఎవరు ఎవరి దాన్ని పరీక్షించ దలచకున్నా,  పరీక్షించే పక్షం వారు ముందుగా సత్యాసత్య నిర్ధారణ పద్ధతేమిటన్నది ప్రకటించి, స్థాపించాల్సి ఉంటుంది. అది నాకూ మీకూ కూడా సమాననియమమే అన్నదిగా ఉంది.

విజ్ఞులారా! 

ఈ రెండు పోకడల్లో ఏది సరైనదో ముందుగా మీలో ఎవరికి వారుగా ఆలోచించి ప్రకటించండి. నాఈ సూచన, ఈ ప్రకటన చూచిన సత్యజ్ఞాన సంఘ సభ్యులకూ, పరిచయస్తులకు, ఆ సంఘం ద్వారా విద్య నేర్చామనుకుంటున్న వారికీ కూడా మిగిలిన  పాఠకులందరికీ లాగానే సమానంగా వర్తిస్తుంది.

పెంచలయ్య గారూ నేనూ కలసిన తొలినాళ్లలో, భాషకు సంబంధించిన ఒక అంశాన్ని   పరిశీలనకుగాను మా ముందుంచారు పెంచలయ్య గారు.

1) చెప్పలేని అనుభవముందా?

2) చెప్పగలిగిన అనుభవముందా?

3) తెలియచెప్పగలిగిన అనుభవముందా?

4) తెలియజెప్పలేని అనుభవముందా?

ఈ విషయాన్ని పెంచలయ్య గారు మా ముందే కాకుండా, ఆయనతో విచారణలో పాల్గొనే వారందరి ముందూ సందర్భం వచ్చినపుడల్లా లేవనెత్తే వారు. అయితే ఈ నాలుగు  ప్రశ్నలకు, ఆయన ఏ సమాధానాలు పెట్టుకుని ఉన్నారో సూటిగా ప్రకటించినట్లు నాకు గుర్తుకు రావడం లేదు. వారినెరిగిన వారెవరైనా ఆ వివరాలిస్తే పరిశీలిస్తాను.

ఇదంతా శబ్ద ప్రమాణపు శక్తి పరిమితులకు సంబంధించినదై యుండడమూ, భాష ,  పుట్టుక, శక్తి, పరిమితులు, దాని వివిధ పరిణామ రూపాలు, అన్నది మండలి ప్రధాన, విచారణీయాంశాలలో ఒకటై ఉండడమూ కారణంగా, నేనీ విషయమై ఒక స్పష్టమైన  అభిప్రాయాన్నేర్పరుచుకోవడమే గాక, మా సత్సంగాలలోనూ, భాష శక్తీ పరిమితులకు సంబంధించిన చర్చ ఏర్పడ్డ ఇతర మిత్రులున్న సందర్భాలలో కూడా, వాటిపై నా భావాలను  ప్రకటిస్తూనే వచ్చాను. ఇప్పుడైనా దీనిని ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నానంటే, మొన్నటి 9,  10, 11 నాటి సమావేశాలలో; సోంప్రకాష్ గారు ఏ అనుభవాన్ని మాటలతో చెప్పలేము అనన్నారు. మనోహర్ హింద్ గారు కూడా తాను ప్రమాణాలపై ప్రసంగించే సందర్భంలో, ఇది చెబితే తెలిసేది కాదు. ఎవరికి వారే చూసి తెలుసుకోవలసిందే నని అనేకసార్లు అంటూ  వచ్చారు. 

పై నాలుగు ప్రశ్నలకు వారనుకుంటున్న సమాధానాలేమిటన్నది వారి నుండే నేరుగా   వినాల్సి ఉంది.

ఈ విషయం భాషను వినియోగించుకునే వారదరికీ తెలిసుండటం అవసరమే కనుక,  ఇప్పుడిక్కడ అందరి కొరకుగా దీనిని ప్రస్తావిస్తున్నాను. మీరందరూ, (మనమందరము)  భాషను వాడుకుంటున్న వాళ్ళమే గనుక మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి (ఎందుకొరకు) భాషను వాడుతున్నారు? ఎక్కడైనా, ఎప్పుడైనా అది పని చేయకపోవడాన్ని గమనించారా? ఎక్కడ? ఎప్పుడెప్పుడు ఆలోచించి సమాధానాలు వ్రాయండి. పనిచేస్తున్న సందర్భాలలోనూ  మీకు తెలిసిన విషయాలను తెలుసుకోవడానికి వాడుకున్నారా? తెలియని విషయాన్ని   తెలుసుకోవడానికి వాడుకున్నారా?

  • ఈ విషయానికి సంబంధించే శంకరాచార్యులవారన్నట్లుగా ఒక శ్లోకం చెప్పబడి ఉంది. 

             అవిజ్ఞాత తత్వే అర్థే శాస్త్ర ధీతిస్తు నిష్పలాః 

విజ్ఞాతేపి తత్వే అధ శాస్త్ర ధీతుస్తు నిష్పలాః

ఏదైనా ఒక తెలియని విషయంలో శాస్త్రం చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే తెలిసిన దాని విషయంలోనూ శాస్త్రజ్ఞానం నిష్ప్రయోజనమే. అన్నది   శ్లోకార్థం. నాకది సరైందే.

మామూలు చదువరులకు ఇదంత సమంజసంగా అనిపించక పోవచ్చు గానీ, నాకు తెలియని విషయం ఎవరో చెప్పగా విని (చదివి) తెలుసుకోలేవు. అలాగే, నీకు అప్పటికే తెలుసున్న విషయంలో, దానినే మరొకరు చెప్పగా వినడం వల్ల అదనంగా తెలిసేదేమీ  ఉండదు, అన్నది మనందరి అనుభవంలోనూ ఉన్నదే కదా!

ఈ విషయానికి సంబంధించే, పెంచలయ్య గారు; భాషను తెలిసినవారు తెలియనివారికి  ఎలా నేర్పుతారు? తెలియని వారు ఎలా నేర్చుకుంటారు? అన్న సందర్భాన్ని లేవనెత్తి, ఇలా   చెప్పారు.

“మొదట భాషను నేర్పిన తల్లిదండ్రులు, తెలియబడు వాటితో ఇంద్రియ సన్నికర్ష కలుగునట్లు చేసి, అప్పుడు దానిని తెలుపు ఒక శబ్దము అనగా పదమును చెప్పెదరు. ఉదాహరణను చూచెదము. ఎదుటనున్న ఆవును కంటితో చూచునట్లు చేసి ‘ఆవు’ అని   చెప్పెదరు. అలాగే రంగును చూచునట్లు చేసి ‘ఎరుపు’ అని, నాలుకతో రుచికి సంబంధం   కలుగజేసి ‘తీపి’ అని చెప్పెదరు. ఇట్లు చేయుట వలన, భాష నేర్చుకొనువానికి ఒక అర్థము   దానిని తెలుపు పదము ఆ రెంటి మధ్య గల సంబంధము కూడా తెలియును”.

పద ప్రత్యక్షము - అర్థ ప్రత్యక్షము - పద అర్థ సంబంధ ప్రత్యక్షము కలిగించుట ద్వారానే   భాష నేర్పడం, నేర్వడం జరుగుతుందన్నది భాషాభిజ్ఞులలో నిర్వివాదాంశము. కనుక నాకూ అంగీకారమే.

ఒక్క మాట చెప్పి ఈ భాష విషయాన్నిక్కడికి ఆపుతాను. 1) పెంచలయ్య గారూ ఆ  జీవితం మాట్లాడుతూనే వచ్చారు. ఇతరులు మాట్లాడుతుంటే వింటూనూ వచ్చారు. ఏమి తెలియజెప్పాలని మాట్లాడినట్లు? ఏమి తెలుసుకోవాలని ఇతరుల మాటలు (గ్రంధాలు/  రాతలు) విన్నట్లు?

2. సోంప్రకాష్ గారూ సుమారు గంటకు పైగా ప్రసంగించారు. ఏమి తెలపాలని   ప్రసంగించినట్లు? ఆ సమావేశములో ఉన్నంతసేపు ఇతరులు చెప్పింది వింటూనూ వచ్చారు.   వినడం ద్వారా ఏమి తెలుసుకోదలచారు? తెలుసుకున్నారు?

3) మనోహర్ గారికీ ఇదే ప్రశ్న ఉంది. వారికే కాదు వినడం, చెప్పడం రూపంలో  భాషను వాడుకునే వారందరి ముందూ ఈ ప్రశ్న ఉంది. ఆ రకంగా ఈ ప్రశ్న నా ముందు   ఉన్నట్లే. ఏమి తెలపాలని మాట్లాడినట్లు? ఏమి తెలియాలని వింటున్నట్లు?

చెప్పి ఏమి తెలిపావు? విని ఏమి తెలుసుకున్నావు? ఇదే ప్రశ్న. దీనికి వారూ, మీరూ,   నేనూ కూడా ఎవరికివారుగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానం గానీ సరైందైతే,   అక్కడ మనందరి మధ్యా ఏకాభిప్రాయం ఏర్పడి తీరాల్సిందే.

ప్రమాణాలు పదార్ధ వర్గాలు  జీవితంలో వాటి అవసరం

ప్రమాణాలు అంటే జ్ఞానేంద్రియాలు అవి పనిచేస్తున్న తీరుతో కూడిన వ్యవస్థ అన్న మొత్తాన్ని మనం గమనించినా, గమనించకున్నా అవి పని చేస్తూ ఉండడం, ఆ మొత్తాన్ని  గురించిన అవగాహన కలిగి ఉండడం అన్న రెండూ రెండు వేరు వేరు దశలు.

ప్రమాణాల గురించి తెలియక ముందు నుండే అవి పనిచేస్తుండడం, వాటి వాటి శక్తీ  పరిమితులననుసరించి మనకు జ్ఞానం కలుగుతుండడం జరుగుతూనే ఉంది. ఇక్కడికిది  నిజమా? కాదా? ఈ యీ ఇంద్రియాల ద్వారా ఈ యీ అర్థాల/ విషయాల జ్ఞానం కలుగుతున్నది అన్న వివరం తెలియక ముందే ఆయా విషయాల జ్ఞానం ఆయా ప్రమాణాల  ద్వారా మనందరికీ కలుగుతూనే ఉంది. ఇదంతా పుట్టిన నాటి నుండి చనిపోయేవరకు  ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుండే సహజ ప్రక్రియే.

ఈ సహజ ప్రక్రియ ద్వారా కలిగే జ్ఞానంలో, కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లు తెలియడం అలా కాక మరో రకంగా తెలియడం కొన్నిసార్లూ జరుగుతోంది. వీటినే ఒప్ప జ్ఞానము   (ప్రమ), తప్పు జ్ఞానము (భ్రమ) అంటున్నాము.

తప్పు జ్ఞానం బ్రతుకు నడకను అతలాకుతలం చేస్తుంది కనుక, ఒప్పుజ్ఞానం మాత్రమే   బ్రతుకును సక్రమంగా నడప కలుగుతుంది కనుకనూ, తప్పు జ్ఞానం రాకుండా, ఒప్పు   జ్ఞానమే వస్తుండేలా జాగ్రత్తలు తీసుకోవడం బ్రతుకు అవసరమయ్యింది. అదిగో ఆ అవసరమే  జ్ఞాన క్షేత్రాన్ని, జ్ఞానమేర్పడుతున్న క్రమాన్ని, అందులో ఇమిడి ఉండే విషయాలను అర్థం  చేసుకునేలా మనిషిని ఒత్తిడి చేసింది. ఆ వొత్తిడి పర్యవసానంగానే జ్ఞాన ప్రక్రియలో ఉన్న ప్రమాత - ప్రమాణ విలువలు -  ప్రమేయము - ప్రమ అన్న వాటికి సంబంధించిన స్పష్టమైన  అవగాహన ఏర్పడింది. ఆ నాలుగింటిలోని ప్రమాణ - ప్రమేయాలులకు సంబంధించిన   జ్ఞానాన్నే లక్షణ ప్రమాణ విద్య అంటున్నాము. ప్రమాణములు పదార్ధ వర్గాలు అన్న మాటలు   వీటిని సూచించేటివే.

మనకు  జీవితానికి సంబంధించిన సరైన జ్ఞానం కలగాలంటే ఆయా ప్రమాణాల  స్వరూప స్వభావాల గురించీ, వాటి వాటి వినియోగ క్షేత్రాల గురించీ, శక్తి పరిమితుల   గురించి స్పష్టంగా తెలియడంతో పాటు, వాటిని సజావుగా వినియోగించుకోగల నిపుణత   కలిగి ఉండడం అవసరం. అందుకనే ప్రమాణాలను ఒక విద్యగా నేర్చుకోవాలి అంటున్నాము.

అలాగే ఆ జీవితం అపరిమితంగా తెలుస్తుండే లక్షలాది విషయాలను సులభంగా  గుర్తుంచుకోవడానికీ, అంతే సులభంగా గుర్తు చేసుకుని వాడుకోవడానికీ, వాటన్నింటినీ కొన్ని రాశులుగ విభజించి, క్రమంగా కూర్చుకోవడం అవసరమైంది. ఆ అవసరం నుండి   ఏర్పడిందే పదార్థ వర్గీకరణ అన్నది.  

ఉన్న ఈ పదార్థాలన్నీ కొన్ని రకాలుగా ప్రకృతిలోనే వర్గీకరింపబడి ఉన్నాయని పెంచలయ్య గారు అంటున్నారు. కానీ ఆయనే అంగీకరించిన న్యాయ వైశేషిక దర్శన కారులు గానీ,  ఇతర తత్వవేత్తలంటూ వారే ఉట్టంకించిన శంకరాది సిద్ధాంత కారులు గానీ, ఒకేరకమైన  పదార్థ వర్గీకరణను చేసుకోలేదు. ఈ విషయం పెంచలయ్య గారి రచన ఆధారంగానూ  తెలుస్తోంది. పోనీ ప్రకృతిలోనే ఆ వర్గీకరణ ఏర్పడి ఉందన్న పెంచలయ్యగారైనా, వాస్తవంగా ఉందంటున్న ఆ పదార్థ వర్గాలేమిటన్నది బయట పెట్టేరా అంటే అదీ లేదు. కనీసం  గౌతమాదులు ప్రకటించిన పదార్ధ వర్గీకరణల్లో ఫలాని దానిని నేనంగీకరిస్తున్నాను అనంటూ ప్రకటించారా అంటే అదీ లేదు. పైగా ఈ ప్రమాణాల  పదార్థ వర్గాల గురించి సరైన జ్ఞానం లేకపోవడం వల్లే యథార్ధ జ్ఞానం సంపాదించ లేకపోతున్నాడు మనిషి అంటూ వాటి అవసరం ఎంతో ఉందని నొక్కు పెట్టి మరీ చెప్పారు.

తెలుసుకునే మనకు, ఏవేవి తెలియబడుతున్నాయి? వేటి ద్వారా తెలియ బడుతున్నాయి?   అన్న రెంటిని గురించిన విద్యనే కదా లక్షణ ప్రమాణ విద్య అంటున్నాము, అనాలి. వాటిని  గురించి కూలంకషంగా తెలుసుకునే విషయంలో ప్రమాత గురించిన విపుల పరిశీలన   అనవసరం కదా అది నిజం కనుకనే ప్రమాణాలు  పదార్థ వర్గాల గురించి ప్రస్తావించిన  వెనుకటి చింతకులు ఆరెంటి గురించే విపులంగా ప్రస్తావించారు గానీ, ప్రమాత గురించిన  విచారణకు అంత ప్రాధాన్యతనివ్వలేదు. లక్షణ ప్రమాణ విద్యను విచారించే సందర్భంలో  ఇదెంతో కీలకమైన అంశం.

ఈ విషయంలో 'నా' అభిప్రాయాలెలా ఉన్నాయి. ఈ నేనును గురించి ఆస్తిక నాస్తిక ధోరణులను వారు లేవనెత్తిన చర్చలో అనవసర విషయాలే ఎక్కువ. ఉనికి ఏర్పడి, జీవితం   కొనసాగుతున్న క్రమంలో మన ప్రమేయం లేకుండానే, సుఖ, దుఃఖానుభూతులు  కలుగుతున్నాయి. సుఖానుభూతి కలిగినప్పుడు మనకు అది అలాగే కొనసాగాలని పించడం,  దుఃఖానుభూతి కలిగినప్పుడు అది తొలగిపోవా లనిపించడం, అందుకనుగుణంగా; సుఖానుభూతి కొనసాగడానికి, దుఃఖానుభూతి తొలగిపోవడానికీ, జీవి అప్పటికి తనకున్న  శక్తిసామర్థ్యాల నుపయోగించి యత్నించడం జరుగుతూ వస్తోంది. ఇది, ఇదే బ్రతికున్నంత కాలం, ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుండే అసలు వాస్తవం. ఈ పనంతా చేస్తున్నదెవరో  అతడు జీవుడు. ‘నేను' అన్న మాట చేత చెప్పబడుతున్నది తెలుసుకునే లక్షణం కూడా కలిగి ఉన్న ఆయా ఆకారాలలో ఉన్న ప్రాణినే. ఈ సూత్రాన్ని మనిషికి అన్వయిస్తే; సజీవంగా  ఉన్న మొత్తాన్ని దేహాన్నే నేను అంటోంది. ఆ దేహంలోని భాగంగానే ఉన్న తెలుసుకునే  లక్షణం కలిగిన భాగం 'నేను' (తాను) అందులోని ఎంత చిన్న భాగాన్ని గానీ, పెద్ద   భాగాన్నయినా తనది (నాది) అనుకుంటుంది. అనవసరపు రచ్చలు విడిచి పెడితే అందరి   అనుభవంలో ఉన్నదీ ఇదే. అందరూ ప్రవర్తిస్తున్నదీ దీనిని అంగీకరించి దీని కొరకే. 

 1) తెలుసుకుంటున్నది తానేనని మనలోని ప్రతి ఒక్కరికీ తెలుస్తూనే ఉంది.

2) తెలుసుకునే పని తలలో (మెదడులో) జరుగుతుందని ఆలోచిస్తే ఆలోచనకు  అందుతూనే ఉంది.

3) తనను గురించిన స్పృహ ఏర్పడడం, తెలుసుకుంటున్నది తానేనని అనుకోవడం  అన్న రెంటిని మినహాయిస్తే మిగిలిన విషయాలన్నీ ఆయా ఇంద్రియాలు పని చేయడం వల్ల  మాత్రమే తెలియబడుతుంటాయనీ, అలా తెలియ బడే వాటన్నింటినీ, ప్రమేయాలు, విషయాలు, అర్థాలు, జ్ఞేయాలు లాటి పదాలతో పిలుచుకుంటున్నామని తెలుస్తూనే ఉంది.  కనుక ప్రమాతకు సంబంధించిన ఎరుక (తెలివి) తప్ప మిగిలిన తెలియబడేవన్నీ ప్రమాణ   బద్ధమయ్యే తెలియబడుతుంటా యన్నది మండలి మూల భావనల్లో ఒకటి.

వెనుకటి చింతకుల్లోనూ కొందరు ఈ తెలుసుకునే వాని/దాని గురించి చెప్పవలసి  వచ్చినప్పుడు, దానిని తెలుసుకోడానికి ప్రమాణాలు అక్కరలేదనో, అది ప్రమాణాల ద్వారా  తెలియబడదనో చెప్పారు. ఆ సందర్భంలోనే 'ఆత్మ అప్రమేయము' అన్న మాటను వాడారు.  అంటే మిగిలిన విషయాల లాగా ఈ జ్ఞాత, ప్రమాత అనబడే ఆత్మ ప్రమాణాల ద్వారా  తెలియ బడేది కాదు అనంటున్నామన్నమాట.

ప్రియ చదువరీ!

 విషయం ఒకింత సూక్ష్మమైనది. కనుక మరల మరల నిశితంగా పట్టి చూడడమో,   మరల మరల ఇలా చూడండి, అలా చూడండి అంటూ వివరించేవాడు రకరకాలుగా చెప్పడమో   అవసరమవుతతోంది.

తెలుసుకునే దానిని తెలుసుకోడానికి అంటే తనను తాను తెలుసుకోడానికి, తనకు  అన్యమైన వాటిని తెలుసుకునే సందర్భాలలో అవసరపడే ప్రమాణాలతో పనేముంటుంది?  ఇతరమైన విషయాలు తనకు వేరుగా ఉన్నాయి కనుక, వాటిని పట్టిచ్చే వాటి అవసరం  ఏర్పడింది. ఈ విషయాన్నే 'మానాధీనా మేయ సిద్ధిః' అని వెనుకటి చింతకులూ అన్నారు. అంటే ప్రమాణాలు లేకుండా ప్రమేయాలు అనదగిన ఏవీ తెలియబడవు అని. కనుకనే   జ్ఞాత తనకు తాను ప్రమేయం కాదు. అప్రమేయం అనన్నారు. 

 అంటే వాళ్లు. ప్రమాణాలతో పనిలేకుండానే ప్రమాత తన్ను తానెరుగ గలదు, ఎరుగుతోంది అంటున్నారు అన్నమాట. 

ఈ విషయంలో నా అభిప్రాయమూ అలానే ఉంది. తనను తాను ఎరగడానికి, తెలుసుకునే దానికి ప్రమాణాల అవసరం లేదు. కనుకనే స్పృహలో ఉన్న మనందరికీ తెలుసుకుంటున్నది నేనే అన్న నిశ్చయం సందేహ రహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని  లోగడ నేనిలా ప్రస్తావించాను.  

ఉన్న మూడు ప్రమాణాల ద్వారా ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అన్న రెండు రకాల   జ్ఞానం కలుగుతుంటుంది. అందులోనూ అనుమాన శబ్ద ప్రమాణాలు రెంటి ద్వారా కలిగేది   పరోక్ష జ్ఞానమే. ఆ రెంటి ద్వారా కలిగే జ్ఞానంలో ఉన్నదేమిటన్నది తెలుసుకోవలసింది గానే ఉంటుంది. ప్రమేయాలకు సంబంధించి ఉన్నదే తెలియడమన్నది ప్రత్యక్షం ద్వారా మాత్రమే  సాధ్యపడుతుంది. ఇక ప్రమాత తన్ను తానెరగడానికి అటు ప్రత్యక్ష ప్రమాణంతో గానీ మిగిలిన పరోక్ష జ్ఞాన సాధకాలైన అనుమాన శబ్ద ప్రమాణాలతో గానీ పని లేదని ప్రకటించాను.  కనుకనే ప్రమాతకు సంబంధించిన జ్ఞానాన్ని ఇటు ప్రత్యక్ష జ్ఞానమని గానీ, అటు పరోక్ష  జ్ఞానమని గానీ అనడం కుదరదనీ, అనకూడదనీ ఆ జ్ఞానానికి మరో పేరు పెట్టవలసి ఉందనీ చెబుతూ, 'అపరోక్షం' అన్న పదాన్ని వాడాను. అంటే మిగిలిన ప్రమేయాల మాదిరిగా  ప్రత్యక్ష, అనుమాన శబ్ద ప్రమాణాల ఆధారంగా తెలియాల్సిన అవసరం లేకుండానే, నేనుకు సంబంధించిన స్పృహ కలుగుతూనే ఉంది అందరికీ.

ఎందుకామాట అన్నారో గాని, పెంచలయ్య గారు “ప్రమాణాల ద్వారా ఆయా విషయాలు/  అర్థాలు తెలుసుకునే ప్రతి సందర్భంలోనూ ప్రమాతకు ప్రమాత జ్ఞానం కలుగుతూనే  ఉంది” అని స్పష్టంగా ప్రకటించారు. దానర్థం ప్రమాత గురించి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన   అవసరం లేదనే కదా? అంతేగాక ప్రమాతను గురించి మిగిలిన ప్రమేయాల మాదిరిగా ఏదో ఒక ప్రమాణాన్ని వాడి తెలుసుకోవలసిన అవసరమూ లేదనీ చెప్పినట్లే కదా!

ఈమాటన్నాక మళ్ళా సత్య జ్ఞాన సంఘం 'ప్రమాతను తెలుసుకోవలసే ఉందింకా అది   ప్రత్యక్షం ద్వారానే తెలుస్తుంది' అని ఎందుకంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కేవలం ఆ  ఒక్క మాట అని ఊరుకున్నారా అంటే అదీ లేదు. ప్రమాతకు సంబంధించిన భ్రమజ్ఞానంలో  ఉన్నారు జనం అనీ, అందువల్లనే జీవిత సమస్య పరిష్కారం కావడం లేదనీ, ప్రమాతకు  నేనుకు సంబంధించిన యథార్ధ జ్ఞానం పొందవలసి ఉందనీ నొక్కుపెట్టి మరీ చెబుతోంది.

అలాంటి సందర్భాలలో, వారేమీ చెప్పదలచిందీ కొద్దిగా తెలిసేట్లు వివరించమని అడిగితే  అది చెబితే తెలిసేది కాదనీ, ఎవరికి వారే స్వయంగా చూసి తెలుసుకోవలసిందేననీ  చెబుతోంది. ఆ, అసలు నేను తెలియబడితే, దేవుడు తెలియపడతాడనీ అంటోంది. అక్కడితో నైనా ఆగిందా అంటే అదీ లేదు.

ప్రపంచంలో జరుగుతున్న సంక్షోభానికంతటికీ, జరిగిన, జరుగుతున్న మారణకాండ  కంతటికీ, మనిషిలో తెంపు లేకుండా ఉంటున్న కావాలి అన్నది పోక పోవడానికి కూడా,  ఈ అసలు నేనును మనిషి గుర్తించకపోవడమే ననీ చెబుతోంది. ఈ అసలు నేను తెలుసుకున్న   వానిలో విశ్వ ప్రేమ, అవధులులేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుం దనీ చెబుతోంది.

నా అవగాహనననుసరించైతే ఇదంతా అనుభవ విరుద్ధంగా ఉందని చెప్పక తప్పడం లేదు. నీవెవరో నీకు తెలుసా అని గానీ, 'నీవెవరో నీకు తెలియదని' గానీ, నీవు ; నీవనుకుంటున్నది నిజమైన నీవు కాదు అని గానీ, ఎవరూ చెప్పకుండా ఉండుంటే, అసలీ సమస్యే సాధారణ మనిషి జీవితంలో జనించుండేది కాదు. ఎవరి తలలో ఎప్పుడు, ఏ కారణంగా ఈ ఆలోచన (ప్రశ్న) పుట్టిందో గాని అది అనేక రకాల సమాధానాలను సమాజం ముందు పెట్టి మామూలుగా జీవిస్తున్న జనాన్నంతటినీ గుంపులు గుంపులుగా విడదీసింది. ఆ పరస్పరం తనవారు పరాయి వారు అన్న భావననూ రగిలించింది. అక్కడి నుండి క్రమంగా  ఒకరినొకరు తిరస్కరించడం, వ్యతిరేకించడం ఘర్షణకు దిగడం, అది శృతిమించితే కొట్టుకోవడం, చంపుకోవడం వరకు పెరిగి దృఢంగా స్థిరపడింది. మత ఘర్షణల చరిత్రంతా   ఇదే కదా కనీసం ఎక్కువలో ఎక్కువ ఇదే కదా!

ఆస్తికులకూ, నాస్తికులకూ వివిధ మేధావి వర్గానికి సామాన్యులకూ, ఈ దేశస్థులకు ఏ దేశస్తులకైనా పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఏది సమానంగా ఉంటుందో అది 1) ఈ లోక వ్యవహారమూ, వ్యక్తికి సమాజంతోనూ, ప్రకృతి తోనూ ఏర్పడి కొనసాగుతున్న  ఒకేరకమైన బ్రతుకుకు సంబంధించిన వ్యవహారములన్నవే. అవే అసలు సిసలైన నిజాలు. అదే వాస్తవం. కనుకనే ఈ జీవిత వాస్తవాన్ని ఈ రకరకాల వారందరూ (అంటే ఇది  వాస్తవం కాదనే వాళ్ళూ, ఇదే వాస్తవం అనేవాళ్ళూ, ఇదీ వాస్తవమేననేవాళ్ళూ కూడా) సమానంగా అనుసరించక తప్పడం లేదు.

కనుకనే మండలి, మా అవగాహనంతా ఈ లోక జీవితానికి సంబంధించింది మాత్రమే.  పుట్టుకకు పూర్వపు విషయాలు గానీ, మరణానంతర విషయాలు గానీ, సృష్టికి పూర్వపు విషయాలు గానీ, ప్రళయానంతర విషయాలుగాని తెలుసుకో వలసిన అవసరం లేదు. అవసరం  లేక పోవడమే గాక, తెలుసుకునే అవకాశం కూడా లేని విషయాలవి. ఆ నాలుగు అంశాలకు సంబంధించి ఎవరికి తోచిన ఊహలు వారు ప్రకటించినా, బ్రతుకు సంబంధించిన పైన  చెప్పుకున్న వాస్తవావసరాల విషయాలలో మార్పులేమీ ఉండవు.

అలాగే వాస్తవ నేను, అవాస్తవ నేను అంటూ మాట్లాడే వివిధ ధోరణుల వారూ నేనన్న   వాస్తవ జీవితంలో మిగిలిన అందరూ బ్రతుకు వెళ్లదీయ్యాల్సిందే.

ఈ అంశానికి సంబంధించి ఆస్తికులలో లోకరీతిలో ప్రామాణిక గ్రంథాలుగా చలామణి   అవుతున్న వాటిలో మన అనుభవానికి రాని అనేక అంశాలు ప్రకటింపబడ్డాయి.

1) వ్యక్తి మరణాన్ని జయిస్తాడు. అమృతత్వాన్ని పొందుతాడు.

2) జ్ఞాని జనన మరణాలను దాటతాడు. అజ్ఞాని జననమరణాలలో తిరుగుతుంటాడు.

3) గాలి పీల్చకుండానూ మనిషి బ్రతికి ఉండగలడు.

4) ఆహారం తీసుకోకుండాను బ్రతికి ఉండగలడు.

5) ఈ నేను శరీరం కాదు. శరీర భిన్నమైనది. శరీరం రాకముందు ఉంది. పోయాకనూ   ఉంటుంది.

6) ఏకకాలంలో అనేక శరీరాలను ధరించగలడు.

7) శరీరాన్ని అతి చిన్నదిగా చేయగలడు, అతి పెద్దది గానూ చేయగలడు.

8) గతాన్నీ, భవిష్యత్తునూ కూడా తెలుసుకోగలడు.

9) ఒక దగ్గర మాయమై మరో దగ్గర ప్రత్యక్షం కాగలడు.

గమనిక: కావాలంటే ఇలాంటి అద్భుతాలు, భౌతిక విజ్ఞాన క్షేత్ర ప్రయోగాలు   అంగీకరించలేని అంశాలు ఈ ఆస్తిక పక్షపు రచనలలో ఇంకెన్నో కనుగొనవచ్చు.

ఇవేవీ ప్రయోగ రీత్యా నిర్ధారింప బడ్డవి గానీ, నిర్ధారించడానికి వీలైనవిగానీ కావు. ఈ విషయాన్నే మండలి, అట్టి వన్నీ అనిర్ధారితాలే కాక, అందులో కొన్ని అనిర్ధారణీయాలు   కూడానని విస్పష్టంగా ప్రకటించింది.

1) శరీరభిన్నమైన 'నేను' ఎవరి అనుభవంలోనూ లేదు. ఉందని నిరూపించే అవకాశమూ లేదు.

2) సత్య జ్ఞాన సంఘం చెపుతున్నట్లు 'భ్రమ నేనును' విడచి, అసలు నేనును తెలుసుకున్నా   మంటున్న జీవితాలూ, ఆ వ్యవహారంలో తలదూర్చని వాళ్ళ జీవితాల లాగానే సాగుతున్నాయి.   వారి జీవితాలలోనూ, ఈ విషయం తెలియక పూర్వపు జీవితానికీ, తెలిసిందనుకున్న తర్వాతి   జీవితానికీ వాస్తవ వ్యవహారానికి సంబంధించిన నిత్యజీవిత నడకలో ఎట్టి మార్పులూ లేవు.

ఈ ఎరుక గొడవ అంటే తెలుసుకునే దాని కథ, ఈ జీవితంతో ఆరంభమై ఈ జీవితం ముగియడంతో ముగిసిపోయేదన్నంత వరకే మనందరికీ వర్తించే సార్వత్రికానుభవం. అంతకుమించి ఏదో ఉందనే వారే దాని ఉనికిని స్థాపించే బాధ్యత తీసుకోవాలి. ఆ పనికి  వారు పూనుకోకుంటే, మిగిలిన వారు లేదా ఈ విషయంలో లోతుగా పరిశీలన చేసిన  నాలాంటి వారు 1) వారిని పక్కన పెట్టేయాలి. 2) పెద్ద భ్రమలో ఉన్నారని తెలిపే యత్నం చేయాలి. 3) భావప్రకటనా స్వేచ్ఛ పేరున సత్యాలని నిర్ధారించలేని వాటిని మంది నెత్తిన పెట్టకూడదంటూ నిగ్గదీయాలి. ఇందులో ఏదో ఒకటి చేయాలి. ఇంకా సరిగా చెప్పాలంటే  '3 వ పద్ధతి ప్రకారం నిలేయాలి. నిరూపించను అనంటే, అయితే ప్రకటించకు అని శాసనం  చేసి అదుపు చేయాలి.

మిత్రులారా!  చాలా కీలకమైన, సమాజాన్ని అతిగా ప్రభావితం చేసిన, చేస్తున్న, అనేక  ఘర్షణలకూ కారణమైన ఈ 'నేను' ను గురించి అంటే మనలో ఉండి తెలుసుకునే పని చేస్తున్న దానిని గురించి అనేక రకాలుగా విచారించే పని చేశాను ఇందులో. 

అవసరమైతే రాబోయే సంచికల్లో మరిన్ని వివరాలు మీ ముందుంచే పని చేస్తాను. ఇంత వినీ కూడా, నిరూపించేది కాదది అనో, నిరూపించలేను అయినా నా అనుభవంలో ఉంది అనో అనే వాళ్ళను వారి మానాన వారిని వదిలేయడం తప్ప ఇప్పుడున్న శాసనాల  ప్రకారం ఏమీ చేయలేము. ఈ వ్యాసంలో చెప్పినవే చెప్పినట్లుండి కొంత సాగతీతగా  మీకనిపిస్తుండొచ్చు. అయినా విషయం అలాటిది కనుక ఏమీ చేయలేము.

  -సత్యాన్వేషణలో మీ సురేంద్ర. 


త్రైమాసిక సమావేశ విశేషాలు

ముందు అనుకున్న ప్రకారం మండలి త్రైమాసిక సమావేశాలు అక్టోబర్ 9, 10, 11   తేదీలలో కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో జరిగాయి. ఈ సమావేశానికి తిరుపతి  నుండి సోం ప్రకాష్ గారు, వెలుగోను మండలం నుండి మనోహర్ హింద్ గార్లతో సహా సుమారు 20 మంది హాజరైనారు.

మొదటి రోజు విమర్శ - సమీక్ష - ఖండన నిందల విషయమై సురేంద్ర గారు విశ్లేషించటం జరిగింది. వారి మాటలలోనే చూడండి.

విమర్శ అంటే గుణదోష విచారణమని. అది రచనల్లోని ఒప్పులను తప్పులను  పరిశీలించడం. విమర్శింప పడ్డ వ్యక్తి తన రచనలోని తప్పులను గమనించి సరి   చూసుకోవటానికి, మరలా ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది. కాబట్టి సద్విమర్శ చేసిన వారి పట్ల అనుకూల దృష్టి కలిగి ఉండడమే సరైంది. అలానే స్పష్టమైన అవగాహన కొరకు, ఏకాభిప్రాయం రావడం కొరకు విమర్శ చేయవలసి ఉంటుంది.

విచారణలో ఏదైనా ఒక విషయాన్ని గురించి లోతైన, నిశితమైన విశ్లేషణ సరైన రీతిలో   పూర్తి అయితే ఆ విచారణలో పాల్గొన్న వారిలో ఆ విషయంపై భిన్నాభిప్రాయాలు ఏర్పడకూడదు. ఏకాభిప్రాయం వచ్చితీరాలి.

అలా జరక్కపోవడమన్నది 1) చర్చ సజావుగా సాగకుంటేనో, అంటే అసంపూర్ణంగా   జరిగుంటేనో, 2) తేలిన అంశాలు తీసుకోడానికి ఇష్టపడకపోతేనో జరుగుతుంది. నిశితంగా పరిశీలించి విడదీసిచూసే ప్రక్రియ విమర్శ అంటే. వాస్తవాన్ని వెలికి తీసుకురావడానికి  ఉపయోగపడుతుందది. విమర్శ రెండు రకాలుగా చేయాలి. 1) భావ పరంగా గుణ దోషాలను  ఎత్తిచూపడం, 2) భాషాపరంగా గుణ దోషాలను ఎత్తిచూపడం. విమర్శకు ఏదీ అతీతం కాదు. విమర్శకునికి విమర్శించే దశలో విమర్శకు లోనుచేసే దాని విషయంలో రాగద్వేషాలు  ఉండకూడదు.

విమర్శను ఆరంభించే పని, విమర్శనీయాంశానికి సంబంధించిన విషయం పూర్తిగా   అందిన తరువాతనే, వక్త హృదయము ఇదేనని తేలినాకనే చేయాల్సి ఉంటుంది. వక్త లేనప్పుడు ఆ ప్రతిపాదనలకు భాషా నియమాల ప్రకారం ఏమి అర్థం వస్తుందో చూడాలి.   విమర్శలో ఆ రచనలోని గుణదోషాల మీద విశ్లేషణతో పాటు జడ్జిమెంట్ కూడా జరగాలి.

ఎవరైనా మాది విమర్శించనక్కర లేదంటే అది సమాజానికి బయట ఉన్నది అని అర్థము.  ప్రతిపాదకుడు తన ప్రతిపాదన సరైనదేనని నిర్ధారించడానికి తగిన బాధ్యత వహించాలి.  సమీక్ష ఎప్పుడూ రచన కంటే క్లుప్తంగా ఉంటుంది. అదే విమర్శ అయితే రచన కంటే   ఎక్కువగా ఉంటుంది.

విద్యలో సరైన రీతిలో ఎదిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అహంకారము తగ్గుతుంది.   అహంకారము వేరు ఆత్మవిశ్వాసము వేరు. అనుభవములో చూసుకోవడం అన్నది అభ్యాసక విద్య. కనుక అది చెబితే వచ్చేది కాదు. మండలి పరీక్షించడానికి పరీక్షింపబడడానికి సిద్ధంగా  ఉంది.

విచారణకు పూర్వమే దేనియందు ప్రామాణిక బుద్ది ఉండరాదు. అసలు ఒకరు చెప్పింది సత్యమా? కాదా? అని నిర్ణయించడానికి చెప్పినవాడు నిజాయితీ పరుడా? కాదా? అన్నది  ప్రధానం కాదు. నిజాయితీని, నిజమును దృష్టిలో పెట్టుకుంటే 4 రకాల వ్యక్తిత్వాలు తెలుస్తాయి.

1) నిజాయితీపరుడు నిజం తెలియనివాడు.

2) నిజాయితీపరుడు నిజం తెలిసిన వాడు.

3) నిజాయితీ లేని వాడు  నిజం తెలిసిన వాడు.

4) నిజాయితీ లేని వాడు  నిజం తెలియని వాడు అని.

ఇలానే ఉందో లేదో మీ అనుభవాలను పరిశీలించుకోండి. 

ఇక ఖండన, నింద విషయమై ఆ రెండు వేరు వేరు. ఖండించడం వల్ల మేలు జరుగుతుంది అంటేనే ఖండన అవసరమని గుర్తించాలి. విమర్శ ద్వారా ఉండకూడని తనాన్ని  గమనించినప్పుడు ఖండన ద్వారా సరైన ప్రయోజనం జరుగుతుందని పించినప్పుడు,  ఖండించక పోవడం వల్ల కీడు జరుగుతుందనిపించి నప్పుడు గాని ఖండన చేయవలసిన పని ఏర్పడుతుంది. ఈ రెండు పరిస్థితులు ఏర్పడనంతకాలం ఖండన అనవసరము.

నింద అనేది వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. నింద అదుపులేని ఆవేశాన్ని తెలియజేస్తుంది. ఏమాత్రం అవకాశం వున్నా నిందకు పూనుకోకపోవడమే మంచిది. విమర్శ మాత్రం అన్ని కాలాలలో చేయదగిందిగా ఉంటుంది.

న బ్రూయాత్ సత్యం అప్రియం అంటే ఇతరులకు అపకారము జరిగే సమయంలో   సత్యము చెప్పకూడదు అని అర్థము.

మండలి ఏది ప్రమాణ విద్యగా చెబుతుందో అది అందరి అనుభవంలో ఉన్నదే. భాష   మనకు సాంక్రమికము గనుక భాష అంగీకరించని అర్థాలు ఎవరూ చెప్పకూడదు. నా సొంత అర్థం అంటూ ఏదిబడితే అదికూడా చెప్పకూడదు.

తానన్న మాటకు అర్ధాన్ని చెప్పే బాధ్యత తానే వహించాలి. వేరే ఏ కారణం చూపి నేను అర్థం చెప్పను అననే కూడదు. ఎదుటి వాని తలకు ఎక్కించాల్సిన బాధ్యత చెప్పే వాడిదే, అవతలి వాడు వినడానికి సిద్ధం కానప్పుడు తప్ప.

కొందరు తాను ఓడిపోతానని అనుకున్నప్పుడు ప్రతిబంధి ప్రశ్న వేస్తుంటారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. నిలువరించడానికి ప్రతి బంధి ప్రశ్న వేయడానికి పూనుకున్నాడంటే,   అది ఒక రకంగా అతడు ఓడిపోయాడనడానికి సంకేతమేనని అనుకోవచ్చు.

మన ఈ విచారణ వేదిక గెలుపు, ఓటములకు సంబంధించినది కాదు. తెలిసింది   చెప్పటానికి, తెలియంది తెలుసుకోటానికి ఏర్పరుచుకున్నది మాత్రమే. మనమంతా మొదట  వినటానికి అనుకూలంగా ఉండాలి.

తెలుసుకునే వాడికి తెలియబడే వాటిని గురించిన సమాచారం చేర్చే వాటిని ప్రమాణాలంటారు. అంటే తెలుసుకునే వానికి తెలియబడే వాటికి మధ్యనున్నది ప్రమాణము అని అర్థము. జ్ఞాత బాహ్య విషయాలు తెలుసుకోవడానికి ఉన్న జ్ఞాన సాధకాలు  జ్ఞానేంద్రియాలే. పరికరాలను బట్టి ప్రమాణ పేర్లను పెట్టలేదు. విధానములను అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. ప్రమాణాల గురించి ఎవరు మాట్లాడినా మీ శరీరంలోని పరికరాలు, విధానాలు అవి పని చేస్తున్న తీరు చూసి మాట్లాడ వలసిందే. వాస్తవంతో విభేదించే ఏ ప్రతిపాదనయినా అసత్యమే. జ్ఞాన ప్రక్రియ మొత్తంలో మూడు పాత్రలు, నాలుగు మెట్లు   ఉంటాయి. ప్రమాత - ప్రమాణాలు -  ప్రమేయము -  ప్రమ.

ప్రమాతకు ఆయా ప్రమేయముల గురించి ఆయా ప్రమాణముల ద్వారా ప్రమ   కలుగుతుంది. విషయం లేకపోయినా ప్రమాణం లేకపోయినా జ్ఞానం కలుగదు. ప్రమాణ శాస్త్రములో ప్రమాతకు సంబంధించిన పూర్తి వివరాలతో పనిలేదు. పరికరములు '6', పద్దతులు '3' అని మండలి చెబుతుంది. ప్రమాణాలకు సంబంధించినంతలో ఇది అత్యంత   కీలకాంశము. వెనుకటి వాళ్ళు చెప్పింది మనకు ప్రామాణికం కాదు. ఎందువలనంటే వాళ్ళను ప్రామాణికులు అనాలంటే ఆ విషయం మనకు తెలిసిందై ఉండాలి. వెనుకటి వారు లోపల  జరుగుతున్న వని చెప్పిన విషయాలన్నీ ఊహించి చెప్పినవే.

చెపితే ఏది తెలియదో అది చెప్పకూడదు, దాని అవసరమూ లేదు. చెపితే తెలియనిది చెబితే ఎంత తప్పో చెబితే తెలిసేది చెప్పకపోడం కూడా అంతే తప్పు. ప్రమాణ విద్య చెబితే తెలియదు అనడం తప్పు, చెప్పి తెలుపగలము. వినడం ద్వారా తెలుసుకోవడానికి, చేస్తూ తెలుసుకోవడానికి తేడా ఉంటుంది.  

ఏ విషయం నేను చెప్పదలుచుకున్నానో ఆ విషయం మీ దగ్గర ఉందో, లేదో  తెలియనప్పుడు, 'చెపితే అర్థం కాదు' అన్న ప్రకటన చేయరాదు. ఆ విషయానికి సంబంధించిన పదార్థము ఎదుటి వానికి తెలిసి లేదని తెలిసినప్పుడు మాత్రం అది చెప్పినా అర్థం కాదని చెప్పొచ్చు. ఎప్పుడు గాని ప్రశ్న ఏ విషయంలో ఎంత సమాధానాన్ని ఆశిస్తోందో ఆ విషయంలో  అంత సమాధానం చెబితేనే సరిగా చెప్పినట్లు అవుతుంది.

కంటి ద్వారా ఏమేమి తెలుస్తాయి అని ఒక వ్యక్తిని ప్రశ్నించినపుడు ఆ వ్యక్తి తన   స్మృతిని చూచుకుని 4 విషయాలు తెలుస్తున్నాయని చెప్పినప్పుడు 5వ విషయం అతను చెప్పలేదు గనుక ఆ విషయంలో అతనికి తప్పు జ్ఞానము లేక అసమగ్ర జ్ఞానము ఉందని చెప్పకూడదు. ఎందుకంటే ఆ సమయంలో గుర్తురాక చెప్పలేక పోవచ్చు, ఎదుటి వానికి ఎంత తెలుసో చూద్దామని చెప్పకపోవచ్చు, తెలియకనూ చెప్పకపోవచ్చు కనుక.

  • ఒకటి కంటే ఎక్కువ కారణాలుండే అవకాశం ఉన్నప్పుడు ఇదే కారణం అని నిర్ణయించ కూడదన్నది నియమం. విషయం అనుభవంలో లేకపోవడం వేరు. గుర్తుకు రాకపోవడం వేరు. అతని అనుభవంలో లేదని తెలిస్తే గాని అతనికి అసమగ్ర జ్ఞానం లేక తప్పు జ్ఞానం ఉందని చెప్పలేము.

 ప్రత్యక్షము, అనుమానము అన్న రెండు ప్రమాణ పద్ధతులు శరీరంలో సహజంగా ఏర్పడి ఉన్నవి. నాడీమండల వ్యవస్థ కలిగి ఉన్న ప్రాణులన్నింటిలోనూ ఏదో ఒక స్థాయిలో ఈ రెండు ప్రమాణాలు పని చేస్తూనే ఉన్నాయి. అనుమాన ప్రమాణంలో మనకు తెలిసిందనుకుంటున్న జ్ఞానం ఇంకా తెలియవలసే ఉంది. ఎందుకంటే ఈ ప్రమాణం వలన కలిగే జ్ఞానంలో గతంలో ప్రత్యక్షం ద్వారా తెలిసిన దాని లాంటిది అక్కడ ఉండాలి  అన్నదే గాని అక్కడ ఏది ఉందో దాని జ్ఞానం కలుగదు. కనుక ఇది పరోక్ష రూపమైంది.

అనుమాన, శబ్ద ప్రమాణాలు రెండూ పరోక్ష ప్రమాణాలు. కనుక అవి సత్యా సత్య నిర్ధారణకు పనికిరావు. తానున్న చోటులో తానున్న కాలంలో ఉన్న విషయాలకు సంబంధించి  మాత్రమే అదీ తన ఇంద్రియ సామర్థ్యానికి లోబడే ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. కనుక  ప్రత్యక్ష ప్రమాణ పరిధి చాలా చిన్నది. గత జ్ఞానాధారంగా వర్తమానం నుండి భవిష్యత్తులోకి  ప్రయాణించే రూపంలో అనుమాన ప్రమాణం ఉంటుంది. కనుక అనుమాన ప్రమాణం   మీద ఆధారపడే మెదడున్న ప్రాణుల జీవితం నడుస్తోంది. ఈ ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కంటే బలహీనమైనదైనా చాలా విస్తృతమైనదిగా ఉంటుంది. భాషను ఆధారం చేసుకుని  మానవుడు సృష్టించుకున్నదే శబ్ద ప్రమాణము. ఇది మిగిలిన ప్రమాణాల కంటే బహు విస్తృతమైనదే అయినా చాలా బలహీనమైనది.

ఈ మూడు ప్రమాణములు వాడకుండా ఈరోజు జీవితం గడవదు. నాల్గవ ప్రమాణంతో   పని లేదు. ఊహ ఎప్పుడూ సత్యాసత్యాలు తేల్చుకోటానికి ఉపయోగ పడదు. చర్చ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి, విషయ పర్యవసానాన్ని స్వీకరించ లేదంటే అతని వైఖరి లోనే మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తించాలి.

చర్చ సజావుగా సాగాలంటే చర్చలో పాల్గొనేవారికి నవపద వివేకం కలిగి ఉండాలి. అవి పదము, పదార్థము, పర్యాయపదము, వాక్యము, నిర్వచనము, ఉదాహరణ, ఉపమానము, వివరణ, నిర్ధారణ అని. 

పదము:- పదము అంటే అర్థ యుక్త అత్యల్ప భాషాభాగము. అంటే ఆ అర్థము ఇవ్వడానికి అంతకంటే తక్కువది మరొకటి లేదు. పదమన్నది ఒక అక్షరము కావచ్చు, అనేక అక్షరముల సముదాయమునూ కావచ్చును.

పదార్థము:- పదస్య అర్థః పదార్థః అంటే పదము చేత సూచింపబడేది. అంటే పదము యొక్క అర్ధము. (జాతి పదాలను నిర్వచించడం ద్వారా దాని అర్థం చెబుతాము. వస్తువులను చూపించడం ద్వారా పదార్థ జ్ఞానం కలిగిస్తాము).

పర్యాయపదము:- ఒక పదం సూచిస్తున్న అర్ధాన్ని సూచించగల మరొక పదము. పదమునకు అర్థం చెప్పమంటే పర్యాయపదము చెప్పకూడదు. మరొక భాషా పదం అసలే  చెప్పకూడదు. దాదాపుగా నిఘంటువులన్నీ పర్యాయపద కోశాలే.

ఆకృతిని బట్టి వస్తువులను గుర్తిస్తున్నాం గనుక, ఆకృతిగల దానిని చూపితే వస్తువును చూపించినట్లే. పదానికి అర్థం తెలపడం వేరు, చెప్పడము వేరు. అనుభవాన్ని ఇస్తేనే అది  తెలుపడం అవుతుంది. చెప్పడమన్న దానిలో ఎదుటి వానికి అర్థమయిందా లేదా అన్నది అప్రస్తుతం. ఆ పదం సూచించే అర్థాన్ని ప్రకటించగల వాక్యాన్ని చెప్పడమే అక్కడ జరిగేది.

వాక్యము:- ఏదైనా విషయానికి సంబంధించి స్పష్టమైన భావాన్ని ప్రకటించగల వ్యాకరణ  బద్ధమైన పద సముదాయం. అంటే కర్త, కర్మ, క్రియలతో కూడిన పద సమూహము అని  అర్థము.
నిర్వచనము:- సంపూర్ణార్థము నిచ్చు సంక్షిప్త పదసముదాయం . (ఇది నిర్వచనమునకు నిర్వచనము)

ఉదాహరణ:-  సజాతి సామ్యం దృష్టాంతం, నిశ్చయ సాధ్యవాన్ దృష్టాంతః, ఏదైనా ఒక  విషయం పైన మనం ప్రకటించిన అభిప్రాయాన్ని రుజువు పరచగల సంఘటన. దేన్ని గురించిన అభిప్రాయ ప్రకటన చేసామో దానిలాంటి మరొకటి ఉదాహరణ అవుతుంది. తర్క ప్రక్రియలో ఉదాహరణమే ఆధారశిల వంటిది (ఆయు స్థానము) ఉదాహరణ  దొరకనప్పుడు ప్రకటిత అభిప్రాయం తప్పో ఒప్పో నిర్ధారించడం కుదరదు. జాతి లేని దానికి ఉదాహరణ కుదరదు. అట్టిదే మరొకటి దానికి ఉదాహరణ అవుతుంది కనుక.

ఉపమానము:- విజాతి సామ్యం ఉపమానం. మహత్ సాదృశ్యం ఉపమానం.   ఉపమానము ఏ ప్రతిపాదనను రుజువు చేయలేదు. కొన్ని సందర్భాలలో తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంది. ఉపమానంలో చూపబడేది చూపవలసిన దానికంటే వేరైనదై ఉంటుంది. సాహితీ ప్రక్రియలోనే అలంకారాలు ఉంటాయి. తర్కంలో ఉదాహరణ ఉండాలి. ఉపమానం ఉండనే కూడదు.

వివరణ:- సులభంగా అర్థం కావడం కోసం పదార్ధాన్ని ఎక్కువ మాటలతో ఉదాహరణల   సహితంగా చెప్పడం.

నిర్ధారణ:-  అనుకున్న విషయం ఇదేనని, ఇది ఇంతేనని, అది సరైనదేనని స్థిర   పరచడాన్ని నిర్ధారణ అంటారు. అంటే ప్రకటిత అభిప్రాయాన్ని దానికి సంబంధించిన   ప్రయోగం చేయడం ద్వారా ఖచ్చితమైన నిర్ణయం ఏర్పడితే దానినే నిర్ధారణ అంటాము. 

నిర్ధారణ మూడు రకాలుగా ఉంటుంది. 1) సరైనదని గాని, 2) సరి కాని దని గాని, 3) ఇంకా తేలలేదని గాని ఉంటుంది.

ఒక్కోసారి ఒక్క అంశం పైనే విచారించటం సాధ్యపడుతుంది. ఏ ప్రతిపాదనను   విచారించడానికి అయినా మరొక ప్రతిపాదన అవసరం లేదు.

నీది ఏమిటో చెబితే నేను నాది పరీక్షకు ఇస్తాను అనడం తప్పు విధానము. ఎప్పుడు గాని ఒక్కో అంశాన్నే పరిశీలించాల్సి ఉంటుంది కనుక.

పరీక్షించవలసిన వాటిల్లో ఒకటి సత్యమని తేలితే మిగిలినవన్నీ అసత్యము లని తేలినట్లే.   కానీ 99 తప్పులు అని తేలితే 100వది సత్యమని నిర్ణయించ కూడదు. ఉనికికి సంబంధించిన   అంశం చర్చనీయాంశం అయితే ఏ ఒక్కటి ఒప్పని రుజువైనా, రెండవది తప్పని తేలినట్లే.  అలానే అందులో ఒకటి అసత్యమని రుజువైతే రెండవది సత్యం అయినట్లే. ఏదో ఒకటి  సత్యం అయి ఉంటుంది గనుక. కానీ ఆ అంశంతో ముడిపడి మాట్లాడుతున్న వారు 3 గ్రూపులుగా ఉంటారు.

1) అంగీకరించిన వారు 2) అంగీకరించని వారు 3) ఇంకా తేలలేదు అని చెప్పేవారు.  రెండూ నిజాలని మూడు పక్షాలు అంగీకరించవు. ప్రతిపాదకుడు తన ప్రతిపాదనను నిర్ధారించే బాధ్యత వహించాలి.

ప్రళయము, సృష్టి ఎలా జరిగాయో ఊహించగలము గాని నిర్ధారించలేము కనుక అవి  అనిర్ధారణీయాలు.

హరగోవింద్ ఖొరానా జీవకణము నుండి ఒక చిన్న భాగాన్ని తీసుకొని, మిగిలిన భాగాలను దానికి కూర్చాడు. అది పూర్తి జీవకణంలానే ప్రవర్తించింది. ఈ ప్రయోగం చేసినందుకే అతనికి నోబుల్ బహుమతి వచ్చింది. ఈ అంశమును సి.సి.ఎం.బి వారి దగ్గర ప్రస్తావనకు రాగా మొత్తం మొత్తంగా జీవ కణమును మేము తయారు చేస్తేనే జీవాన్ని   సృష్టించినట్లు అవుతుందని వారు చెప్పారు.

ప్రాథమిక కణాలు లేదా ఆదిమ పదార్థం గురించి భౌతిక విజ్ఞానులు ఇంకా వెతుకుతూనే   ఉన్నారు. ఒకవేళ అది కనుగొనబడినా ఇదే ప్రాథమిక కణం అని ప్రకటించరు. ఇప్పటికి కనపడుతున్న అతి చిన్న కణం అని మాత్రం చెబుతారు.

పదార్థ వర్గీకరణ:-  తెలియబడేవన్నీ ఎన్ని రాశులుగా ఉంటాయో వాటిని పదార్థ వర్గీకరణ   అంటారు. అంటే తెలియబడేవన్నీ ఎన్ని రకాలుగా విడగొట్టు కోటానికి వీలుంటుందో చెప్పేదే పదార్థ వర్గీకరణ. లక్షణ సామాన్యమే జాతి. ఒకటికి జాతి ఉండదు. ఒకటికి విశేషం ఉంటుంది.

పదార్థ వర్గీకరణ ఆవశ్యకతను పరిశీలిస్తే పదార్థ వర్గీకరణ వలన గమనించటం, అట్టి   పెట్టుకోవడం, ఉపయోగించుకోవడం సులువు (తేలిక) అవుతుంది. సమాన లక్షణములు  కలిగిన అనేకమును సజాతులు అంటారు. అసమాన లక్షణములు కలవి విజాతులు అవుతాయి. ప్రధాన జాతులు -  ప్రజాతులు - ఉప జాతులు వీటి నుండి అనేక ఉపజాతులు ఉంటాయి.

తనని తానుగా గుర్తింపచేసేది, అన్యాన్నుండి వేరుచేసేది ఏదో అదే విశేష లక్షణం లేక  అసాధారణ లక్షణం. ఉన్నవి గుణ క్రియలే అనే పక్షము వారు ఉన్నారు. అర్థ ఇతి ద్రవ్య  గుణ కర్మ సు అని వైశేషికుడు అన్నాడు. మండలి ప్రకారం గుణమునకు స్వతంత్రావరణ ఉండదు. ఏదైతే స్వతంత్రావరణ కలిగి ఉంటుందో దేనిని ఆశ్రయించుకుని గుణాలు క్రియలు  ఉంటాయో అది అసలు ఉన్నది. ఏక కాలంలో అనేక గుణాలు కనపడితే ఆ గుణాలతో పాటు ద్రవ్యము తెలుస్తుంది. ఏ ఒక్క ఇంద్రియము అన్ని గుణాలను పట్టి ఇవ్వలేదు. నేత్రేంద్రియము ఎక్కువగా గుణాలు పట్టి ఇవ్వగలదు. ఇక కర్మను గురించి విచారించితే  చలనాత్మకం కర్మ, సంయోగ విభాగేషు అనపేక్ష కారణం కర్మ.

కర్మ వేరు, క్రియ వేరు అనకూడదు. ద్రవ్యము ఉంది కనుక నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. గుణములకు నిరోధక వ్యవస్థ ఉండదు. కారణం గుణములు స్వతంత్రావరణ కలిగి లేవు. శక్తి ఎక్కడ ఖర్చవుతుందో అక్కడ పని జరుగుతుందని అర్థము. శరీరములో జడ కర్మలు,  చేతన కర్మలు ఉన్నాయి. అలానే ప్రయత్నరూప కర్మలు అప్రయత్నరూప కర్మలూ ఉన్నాయి.  భూమిలో చాలా చర్యలు జరుగుతున్నాయి అవి అన్నీ చేతన చర్యలు కావు. జడ, చేతనములలో క్రియలు జరుగుతుంటాయి. సృష్టిలో నియమాలున్నాయి అని మనకు తెలుస్తుంది. అవి  ఎలా వచ్చాయో మనకు తెలియదు. ఉంది అనాలన్నా; లేదు అనాలన్నా తెలిసినవాడికే అర్హత ఉంటుంది. ప్రాణులలో ప్రయత్న రూప కర్మలు ఉంటాయి. జడ పదార్థాలలోనూ   కర్మలు (చర్యా ప్రతిచర్యలు) జరుగుతూనే ఉంటాయి.

నియమబద్ధ విశ్వము (లా గ్రౌండ్ యూనివర్స్). విశ్వము నియమబద్ధము అన్నది ఒక  పార్శ్వము మాత్రమే. నియమరాహిత్యమూ ఉంది విశ్వములో మరొక పార్శ్వం. ధర్మో డైనమిక్స్ 'ఎంట్రోపీ ఇంట్రసెస్' అని చెబుతోంది. అంటే క్రమరాహిత్యం పెరుగుతోందని. కనుక నియమాలలో నుండి నియమరాహిత్యానికి విశ్వం వెళుతూ ఉంది. ఎలిమెంట్స్ ఘన, ద్రవ, వాయు, రూపాలలో ఉండవచ్చు. ధర్మాలు (ఇన్ హెరెంట్) లోపల ఉంటాయి. గుణాలు  బయటికి కనబడుతుంటాయి.

ప్రమాణ, ప్రమేయాల గురించి లోతుగా పరిశీలన చేసిన వారు వాటి విషయాలలో   భిన్నాభిప్రాయాలలో ఉన్నారు. వాటి సంఖ్యా విషయంలో గానీ, వాటి స్వరూప విషయంలో   గానీ ఎక్కడ తేడా వున్నా, వారివారి ప్రమాణాలలోనూ తేడా ఉన్నట్లే.

గమనిక:- దీని అర్థం వారు ప్రతి విషయంలోనూ విభేదించారని కాదు.

మొదటి గ్రంథము వ్రాసిన వాడికి ఆధారం ఏమిటని పరిశీలిస్తే, వాడి అనుభవాలే  వాడికి ఆధారమని తెలుస్తుంది. ఏ క్షేత్రానికి సంబంధించిన విషయాన్ని గ్రంథంలోకి తెచ్చాడో   ఆ క్షేత్రాన్ని స్వయంగా దర్శించడం ఆధారంగానే తేగలిగాడు.

ఒక తెలియని విషయము మొదటి వానికి ఏ విధానములో తెలిసిందో ఎన్నో వారికైనా ఆ విధానం ద్వారా తెలిస్తేనే ఆ విధంగా తెలిసినట్లు. అసలు తెలియని విషయాలలో ప్రత్యక్ష  ప్రమాణం తక్క వేరొక దిక్కు లేదు.

ఈ రోజు మనకు లభించే గ్రంధములలో ఎన్ని రకాలుగా తెలియబడిన భావాలుంటాయని పరిశీలిస్తే, అవి ప్రత్యక్షము ద్వారా, అనుమానము ద్వారా, శబ్దం ద్వారా అని తెలుస్తుంది.  అయితే ఆ రచనలో స్వయంగా కల్పించిన భావాలూ ఉండవచ్చు. ఇప్పుడు మనం గ్రంథం  ఎలా చదవాలి అంటే 1) చెప్పినదానిలో అసంభవాలు ఉంటే అవి కల్పితాలని, 2) పెద్దలు చెప్పింది చెబుతున్నామంటే అది శబ్దము ద్వారా గ్రహించినదనీ, 3) ఆధారాలు చూపిస్తుంటే అది ఆధార సహితం కనుక అనుమాన ప్రమాణం ద్వారా గ్రహించిందని, 4) అనుభవానికి   సరిపోతే ప్రత్యక్షము ద్వారా తెలుసుకొన్న వనీ చెప్పవచ్చు. వీటిలో భ్రమ స్థానములు గమనించి  ఎక్కడైనా భ్రమ పడ్డాడేమో కూడా చూడగలగాలి.

ఏదైనా ఒకటి ఉంది అనాలంటే అది కనబడే వరకు వెతికితే చాలు, కానీ అదే లేదనాలంటే  మొత్తము క్షుణ్ణంగా వెతకాల్సి ఉంటుంది. వెతుకు, గమనించు, అంగీకరించు జ్ఞాన భాగానికి  సంబంధించినవైతే, స్వీకరించు, ఆచరించు అన్నవి ఆచరణ భాగానికి సంబంధించినవి. ఇష్టానికి, వివేకానికి మధ్య ఘర్షణ ఉంటోంది.

సత్యాన్వేషణ పథంలో ప్రయాణిస్తున్న వాడు ఏ విషయానికి ఆ విషయంలో అప్పటికి  తనకి ఎంత తెలుసు, ఎంత తెలియదు అన్న విషయంలో స్పష్టత కలిగి ఉంటాడు. సమాచారం  కొరకు మాత్రమే పుస్తకాలు స్టడీ చేయాలి అవి తప్పో, ఒప్పో ముందే నిర్ణయానికి రాకూడదు. ఒకే వాక్యము నుండి ఇద్దరికీ రెండు అర్థాలు వస్తున్నాయంటే, అయితే వాక్య ప్రయోగంలోనే  బలహీనతో, లేక ఆ ఇద్దరిలో ఒకరు గాని ఇద్దరు గాని పూర్వ నిశ్చితాభిప్రాయాలను  పెట్టుకోవడం వలనో జరుగుతుంది. అసలు క్షేత్ర దర్శనం చేయడమంటే ఇప్పటికే ప్రత్యక్ష  ప్రమాణం ద్వారా నీ స్మృతిలోకి చేరి ఉంటే ఆ స్మృతిలోనిది స్మరించడం ద్వారా చూడటమే.

పరిమాణం కలిగి స్థలాన్ని ఆక్రమించిన దానిని ద్రవ్యం అనాలి. మిగిలినవి దానిలోనివి.  దానికి సంబంధించినవి. ఏ రెండు ద్రవ్యాల మధ్య అయినా సంయోగ సంబంధము తప్ప  వ్యాప్య వ్యాపక సంబంధం ఉండదు. అంటే రెండు ద్రవ్యాలు ప్రక్క ప్రక్కన ఉండడం తప్ప , ఒకే స్థలములో ఉండలేవు. (ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమిక నియమము)  అసలు నిరోధక వ్యవస్థ పని చేయడం వల్లనే విశ్వ నియమాలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉన్నది అని తెలియడానికి, అది ఏమిటో తెలియడానికి చాలా తేడా ఉన్నది అంటూ ముగించారు.  ఆ తరువాత పంచ ప్రశ్నా పద్ధతిని ఉపయోగించడం ఎలానో కొంత విషయాన్ని తీసుకొని అభ్యసించడం జరిగింది.

  -కోట ప్రసాద్ శివరావు (రిపోర్టర్) 


No comments:

Post a Comment