Friday, January 14, 2022

260 వివేకపథం జనవరి 2022

 




వివేకపథం 260                                                                         జనవరి 2022


ప్రమాదపుటంచుల్లో కాదు ప్రమాదపు అఖాతంలో ప్రజాస్వామ్యం


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

ఈ దేశాన్ని విదేశీ పాలన నుండి విముక్తం చేయడానికి వందల సంవత్సరాలుగా యత్నాలు సాగుతూనే వచ్చాయి. అవన్నీ అటు ఇస్లాం విశ్వాసులతో కూడిన ముస్లిం రాజులను, బైబిలు విశ్వాసులైన ఆంగ్లేయులు, పోర్చుగీసు వారితోనూ జరిగిన పోరాట రూపాలే. కాకుంటే ఆంగ్లేయులు ఈ దేశానికి రాకమునుపు ఈ దేశంపై దండెత్తిన విదేశీయులుగా ముస్లిం రాజులే పరిగణింపబడ్డారు. ఆ ముస్లిం రాజులంతా ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఈ దేశంపై దండెత్తేవారు. 

ఒకటి ఈ దేశ సంపదను దోచుకోవడం, రెండు అవకాశమున్నంత కాలం ఈ దేశాన్ని , పరిపాలిస్తూ తమ ఆధిపత్యాన్ని విస్తరింప జేసుకుంటూ స్థిరపరచుకోవడం. ఈ రెండు రకాల ప్రయత్నాలలోనూ అంతర్లీనంగా మత మార్పిడి, దోపిడీ, మానభంగాలు, మారణకాండ అన్నవి అనివార్యంగా జరుగుతుండేవి. మత విశ్వాసము క్రింద ఒక వంక బలవంతపు మతమార్పిడులు, విగ్రహాల, దేవాలయాల విధ్వంసము అన్నది ఇస్లాం విశ్వాసంలో భాగంగా జరుగుతూ వచ్చాయి. దోపిడీ కొరకే వచ్చిన ముస్లిం రాజులు అందినంత సంపదను కొల్లగొట్టడంతో బాటు, దొరికినంత మందిని ఎత్తుకెళ్లి బానిసలుగ వాడుకునేవారు. రాజ్యాధికారాన్ని చేజిక్కించు కోవడానికి వచ్చిన వారు తాము గెలిచిన రాజ్యాలలో పాలకులై ఇక్కడే స్థిరపడిపోయారు. అలాంటి వారిలో కొందరు ప్రజారంజకంగా పాలన సాగించిన వారూ ఉన్నారు. అట్టివారిలో అక్బరును ప్రధానంగా ఉదహరిస్తుంటారు చరిత్రకారులు. 1) దోపిడీ లక్ష్యంతో దాడులు చేసినవారు, 2) రాజ్యాధికారానికై దాడులు చేసినవారు. అందులో దుర్మార్గంగా పాలన సాగించిన వారు, మంచిగానే పాలించిన వారు అన్న రెండు రకాలవాళ్ళూ, మూడు విషయాలలో సామాన్యంగానే ప్రవర్తించారు. 1) సంపదను అనుభవించారు. 2) మత మార్పిడులు చేశారు. 3) విగ్రహాలనూ, మందిరాలను ధ్వంసం చేశారు.

పరాయిదేశపు రాజులైనా, ఈ దేశపు రాజులైనా, సంపదను అనుభవించడం అన్నది , రాజరిక వ్యవస్థలో మామూలే. మతమార్పిడులూ, దేవాలయాల విధ్వంసము అన్నవే అట్టి వారి నుండి ఈ దేశాన్ని రక్షించుకోవాలన్న కసిని రగిలించాయి ఇక్కడి రాజులలోని, మరియు జనంలోని కొందరిలో. పృధ్విరాజ్, రాణాప్రతాప్, శివాజీలను ఆ రకమైన యత్నాలు చేసిన వారుగా చరిత్రకారులు ఉదహరిస్తారు. 

ఈ సందర్భంలో అత్యంత ప్రధానమైన ఒక చారిత్రిక వాస్తవాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. సంపదను కొల్లగొట్టి అందినంత మందిని స్త్రీలను, పురుషులను కూడా ఎత్తుకెళ్లిన వారి వల్ల ఈ దేశానికి పెద్దగా ప్రమాదం జరగలేదు. కొద్దిపాటి నష్టం తోనే ముగిసాయవన్నీ. 

ఈ దేశం పై దాడిచేసి, ఇక్కడి రాజులను జయించి, పాలకులుగ ఇక్కడే స్థిరపడిపోయిన వారి వల్లే ఈ దేశానికి ఎక్కువ నష్టం జరిగింది.

ముస్లిం రాజులు ఇక్కడకు రాకపూర్వం ఇక్కడి రాజులు గానీ, ప్రజలు గానీ బహుదైవారాధకులుగ కొనసాగుతుండడంతో ఇక్కడ మతపరమైన అసహనంగానీ, వ్యతిరేకతగానీ అంతగా ఉండేది కాదు. అత్యల్పంగానే ఉండేది. ఎక్కడైనా ఉన్నా దాదాపు లేదనేంత స్థాయి లోనే ఉండేది. ముస్లింల రాకతో అదే అన్నింటికంటే పెద్ద వ్యత్యాసంగా తయారైంది. అందుకు కారణం, ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ బోధనలే. అన్యమత తిరస్కారాన్ని ఇస్లాం విశ్వాసంలో భాగంగా, ముఖ్యాంశంగా ఆదేశించి ఉండడమే. శుద్ధమైన ఇస్లాం విశ్వాసిగా అంటే ముస్లింగా ఉండడమంటే అన్యమత తిరస్కారిగా ఉండడమూ తప్పనిసరి అవుతుందన్నమాట. అదెంత బలమైన ఆదేశంగా ఉంటుందంటే, తనను తాను ముస్లింగా భావించుకునే, గుర్తింపబడే 1000 మంది ముస్లింలనబడే వాళ్లలో, దేవుని కొలతకు సరిపడే విశ్వాసిగా (ముస్లింగా) ఒక్కడే తేలుతాడు.

ఖురాను భారత రాజ్యాంగం సూచించిన రీతిలో మత స్వేచ్ఛను అంగీకరిస్తుందా? లేదా? అన్నది నిశితంగా పరిశీలించి నిక్కచ్చిగా తేల్చుకోవలసిన అంశము. ఇక్కడ మన పరిశీలన గానీ కప్పదాటు పద్ధతిలో సాగితే మనం ఎప్పటికీ ఖురాన్ సందేశాన్ని, మార్గ నిర్దేశకత్వాన్ని యథాతథంగా కనుగొనలేము. నాకు తెలిసి ఖురాన్ రాకడ పోకడ కలిగి ఉండేలా మత స్వేచ్ఛను అంగీకరించదు. ముస్లిమేతరులు ఇస్లాం విశ్వాసంలోకి రావడానికి మాత్రమే అనుమతి ఉంది. పైగా అన్యులకు అదొక్కటే తరించే మార్గమనీ చెబుతుంది. తొలినుండీ అంటే పుట్టుకనుండే ముస్లింగా ఉన్నవాడు గానీ, మధ్యలో ఇస్లాం విశ్వాసిగా మారిన వాడుగానీ తిరిగి ఇస్లామును విడిచి పెట్టే స్వేచ్ఛను అది అంగీకరించదు. పైగా అట్టివాడిని అవకాశముంటే ఇక్కడే శిక్షించాలని చెబుతోంది. ఇక మరణించాక అయితే వాడికి వాడు చేసిన ఇతరేతర మంచి పనులతోనూ నిమిత్తం లేకుండా నరకలోక శిక్ష అనివార్యంగా ప్రాప్తిస్తుంది అని స్పష్టంగా ప్రకటిస్తోంది. ఈ విషయంలో ఖురాను ఎటువంటి మెతక వైఖరిని చూపదు.

ఖురాను ప్రకారం ఒక వ్యక్తి ముస్లింగా జీవించడం మసలు కోవడం అంటే అల్లా తప్ప వేరే దైవం లేదు అని మనసా వాచా కర్మణా ప్రవర్తించడం అనే. ఇక్కడికి ఇది నిజమో కాదో ఖురాన్ తెలిసిన వారెవరైనా చెప్పవచ్చు. ఖురాన్ అంతిమ దైవ గ్రంథంగానూ, మహమ్మదే అంతిమ ప్రవక్తగానూ, అల్లాను మాత్రమే దేవుడుగాను, తదితరాలన్నీ సాతాను పోకడలుగానూ తలంచని వానిని ఇస్లాం (ఖురాన్) విశ్వాసిగా అంగీకరిస్తుందా? 

ఖురాన్ ను నెత్తిమీద పెట్టుకుని ఏ ముస్లిమైనా, అన్ని విశ్వాసాలు సరైనవేనని తలచడం గానీ, ప్రకటించడం గానీ, కర్మణా అంటే ఆచరణలో చూపడంగానీ, చేయగలడా? చేయలేడన్నది నా సమాధానం.

ముస్లింగా ఉన్న ఒకవ్యక్తి, మసీదు ప్రక్కనే ఒక మందిరాన్నిగానీ, చర్చినిగానీ నిర్మించాడనుకుందాం. ఆ పనిని అతడు ఇష్టం లేకున్నా బలవంతంచేత చేసాడన్న లేదా పన్నాగంలో భాగంగా చేశాడన్న సందర్భాన్ని కాదు నేను ఇక్కడ చెబుతోంది. అతడు కావాలనే ఆ పని చేసిన సందర్భాన్ని, మాత్రమే మీ దృష్టికి తెస్తున్నాను. ఖురాన్ ప్రకారం అతడు సత్య తిరస్కారి, మార్గ భ్రష్టుడు అవుతాడా? అవ్వడా? అన్నదే నేనిక్కడ పరిశీలనకు పెడుతున్న అంశం.

దీనికే చెందిన మరో పార్శ్వాన్నీ యథాతథంగా చూడగలిగితేనే దేశ భవిష్యత్తుకు సరైన మార్గం ఏమిటన్నది నిర్ధారించుకో గలుగుతాము.

అదే మరి, ఒక ముస్లింకు అన్య దేవతారాధనను ఖండించే అవకాశం వచ్చిందనుకుందాం. అవకాశం వచ్చీ ఖండించలేదు. ఖురాన్ అతడ్ని ఖచ్చితమైన ముస్లింగా అంగీకరిస్తుందా? అలాగే అవకాశమూ, బలమూ తగినంత ఉండి కూడా ఉండే ఒక అన్య దేవతా మందిరాన్ని తొలగించే లేదా పగలగొట్టే పని కావాలనే చేయకుంటే, అట్టి వాణ్ని ముస్లింగా స్వీకరిస్తుందా?

ఈ రెండు అంశాలూ బయటికి కనపడే, మాటచేతకు సంబంధించినవి. ఈ రెండింటి కంటే బలమైనది అంతరంగానికి సంబంధించినది. ఒక ముస్లింగా ఉన్న వ్యక్తి, మానసికంగా, అల్లాతో బాటు, యేసునీ ఉండనీ, కృష్ణుణ్ణి ఉండనీ అని భావిస్తున్నాడనుకుందాం. ఖురాన్ (ఇస్లాం) అతణ్ణి ముస్లింగా అంగీకరిస్తుందా? కొన్ని నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. అయినా నిజాలు నిజాలే కదా!

యోచనాశీలులారా!

నేను లేవనెత్తిన ఈ సందర్భాలకు చెందిన ప్రశ్నలకు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, రెంటినీ కూలంకషంగా అధ్యయనం చేసిన ఎవరు గానీ, తనను తాను నిజమైన ముస్లింగా తలంచుతూ ఆ రెండు గ్రంథాలను సమగ్రంగా అర్థం చేసుకున్న ఎవరుగానీ సమాధానం చెప్పండి.

ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసమున్న ఏ రాజైనా ఇతర రాజ్యాలపై దండయాత్ర చేశాడంటే, అతడు కేవలం రాజ్యాధికారం కొరకో, రాజ్యభోగాలను అనుభవించడం కొరకో మాత్రమే ఆపని చేయడు. అతడు అవశ్యం, ఇస్లామును స్థాపించాలన్న లక్ష్యాన్ని మనసులో పెట్టుకునే ఆ పని చేస్తాడు. ఎందుకంటే ఖురాను ప్రకారం, ఈ లోక జీవితం చాలా చిన్నది. అశాశ్వతమైనది. శాశ్వతమైన స్వర్గ నరకాలకు చేరడం విషయంలో పరీక్ష స్థలం మాత్రమే. ఏముస్లిమయినా ఈ లోక కష్ట సుఖాలను అల్లా పరీక్షలో భాగంగానే భావించాల్సి ఉంటుంది. సుఖాలను మరిగి దానిని మరచినా, కష్టాలకు ఓర్చక దానిని విడిచినా అతనికి స్వర్గం రాదు. నరకం వస్తుంది. ఇంతవరకు ఖురాన్ ప్రకారం వాస్తవమో కాదో తేల్చుకోండి.

ఇప్పుడు చెప్పండి. ఏ ఇస్లాం విశ్వాసి అయినా, ఖురాన్ ఆదేశిస్తున్న విశ్వాస రీతిలో ఎంతో కొంత భాగాన్ని సడలించుకోవడానికి సిద్ధ పడకుండా, భారత రాజ్యాంగం సూచిస్తున్న రీతిలో, అది నిర్ణయించిన పరిమితుల్లోనే మత స్వేచ్ఛ అమలవ్యాలని మనస్ఫూర్తిగా అనగలడా? అనలేడా? నిజం ఏమిటి?

విషయాన్ని ఇంత విపులంగా మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో, మరొక వాస్తవాన్ని గురించి ప్రస్తావించుకుని తీరాలి. అదేమంటే,

ప్రతి విశ్వాస పంథీయులలోనూ, వ్యక్తిత్వ పరంగా మంచివారూ, చెడ్డవారూ, పరమ స్వార్ధులూ, పరిమిత స్వార్ధులూ, త్యాగులూ కూడా ఉండే అవకాశంముంది. అలాగే శాంతం కలవారూ, ఆగ్రహావేశాలు కలవారూ, సహనం కలవారూ, అసహన పరులూ; జాలీ, దయ, కరుణ లాటి గుణాలు ఉన్న వారూ, వీటికి వ్యతిరేకమైన క్రూర స్వభావం కలవారూ ఉండే వీలుంది. ఇదంతా ఏ కాలంలోని సమాజాన్ని పరికించి చూడగలగినా, యథార్థమేననడానికి తగిన తగినన్ని రుజువులు దొరుకుతాయి.

కనుక ముస్లిం సముదాయంలోనూ, ఆదర్శప్రాయులైన వ్యక్తులూ ఉండవచ్చన్న దాన్నెవరమూ కాదనకూడదు. అలాగే ఇది అన్ని సముదాయాలలోని వ్యక్తులకూ వర్తించే సాధారణ సూత్రమని అంగీకరించాలి. మన ఈ విచారణను కావాలని పక్కదారి పట్టించకుండా ఉండేందుకనే ఈ నిజాలనూ మీ దృష్టికి తెస్తున్నాను. చాలా సున్నితమైన విషయాన్ని విచారిస్తున్నాం కనుక, రచయితగా నా గురించిన ఒక నిజాన్ని ఈ సందర్భంలో మీ ముందుంచడం అవసరమనిపించింది.

ఇప్పటి నా అవగాహననుసరించి, నాకు నేనుగా ఏ మతానికి చెందిన వాణ్ణి కాను. సామాజికంగా ఈ దేశంలో బలంగా పని చేస్తున్న కులాల పరంగా చూస్తే, కులం పట్టు సడలిన వాణ్ణి, కులాన్ని వదులుకున్న వాణ్ణి కూడా. కేవలం భారతీయుణ్ణి. భారత రాజ్యాంగం సూచిస్తున్న రీతిలో భారత పౌరుణ్ణి. లౌకిక వాద క్షేత్రానికి పరిమితమైన వాణ్ణి. పుట్టుకకు పూర్వపు విషయాలుగానీ, మరణానంతర విషయాలు గానీ తెలుసుకోలేనివీ, అనవసరమైనవీ అని కూడా నిర్ణయించుకుని ఉన్నవాడిని. ఈ జీవితంలో ఎదురయ్యే సమస్యలకూ - పరిష్కారాలకూ కూడా కారణాలు ఇక్కడే, ఈ జీవితంలోనే ఉంటాయంటున్న వాణ్ణి. నన్ను ఈ భావాలు కలిగి ఉన్న వానిగా మాత్రమే స్వీకరించి, నా యీ వ్యాసాన్ని సాకల్యంగా పరిశీలించండి.

నా అవగాహననుసరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని స్వీకరించే నాటికి, అది సంపూర్ణమయ్యింది కాదు. అదే నిర్దేశించిన లక్ష్యాలతో ముడిపెట్టి చూసుకుంటే, రాజ్యాంగ శాసనాలలో కొన్ని లోపాలు, కొన్ని దొసుగులూ కూడా కలిసి ఉన్న మంచి రాజ్యాంగమది. దాని అసంపూర్ణతనూ, కాలానుగుణ్యంగా మార్పులూ, చేర్పులు చేసుకోవలసి ఉంటుందన్న నిజాన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా స్పష్టంగా గమనించారు. అందుకనే అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకునే సరళమైన వెసులుబాటునూ కల్పించి, ఆ మాటా బహిరంగంగా ప్రకటించారు కూడానూ. 100కు పైగా సవరణలు చేసుకున్న ఈ నాటికీ అది అసంపూర్ణమైనదే. కొన్ని లోపాలు, ఒకటి అరా దోషాలూ కలిగి ఉన్నదే. భవిష్యత్తులోనూ సంపూర్ణ రాజ్యాంగం అన్నది రూపొందక పోవచ్చు అనడమే సరైన మాట. లోపాలనూ, దోషాలను ఎప్పటికప్పుడు కనీస స్థాయికి తగ్గించుకుంటూ సంపూర్ణత దిశగా ప్రయాణిస్తుండడమే వివేకవంతమూ, చైతన్య వంతమూ అయిన సమాజం చేస్తుండ వలసిన పని, అదే చేయగలిగిన పని.

నా గురించీ, రాజ్యాంగం గురించీ, నేను చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకునే ఈ వ్యాసాన్ని నిశితంగా పరిశీలించి, దీని సబబు బేసబబుల్ని నిష్కర్షించండి.

మరి కొన్ని మత సంబంధ విషయాలను విచారించుదాం. ఖురాన్ కంటే ముందు నుండే కేవలం మత ప్రచారానికై ఈ దేశంలో ప్రవేశించిన క్రైస్తవం, చాలా కాలం వరకు మత ప్రచారానికి మాత్రమే పరిమితమై, అంతకు ముందు నుండీ ఈ దేశ సామాజిక వ్యవస్థ రూపంలో ఉన్న కుల వ్యవస్థ ద్వారా; అణిచివేయబడిన, విసిరేయబడిన సమూహాలకు దగ్గరై వారిని క్రైస్తవంలోకి ఆహ్వానించడం రూపంలో మతమార్పిడులు చేసుకుంటూ వచ్చింది.

చాలా కాలం తరువాత ఇటు ఆంగ్లేయులు, అటు పోర్చుగీసు వారూ వ్యాపారం పేరుతో ఇక్కడ ప్రవేశించి; ఆస్తులను, సంపదను కూడబెట్టుకుంటూ, స్వీయ రక్షణకు అనే సాకుతో సొంత సైన్యాన్ని (రక్షణ దళాలను) ఏర్పరుచుకోవడంతో, క్రమక్రమంగా అవకాశమున్నంత మేర అధికారాన్ని చేజిక్కించుకోవడమన్నదీ మొదలయింది. అప్పటికే, ఈ దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపడి ఉండడం, వారిలో వారికి రకరకాల కారణాల వల్ల విభేదాలూ, ఘర్షణలు సాగుతుండడం, అటు ఈస్టిండియా కంపెనీ వారికీ, ఇటు పోర్చుగీసు వారికీ కూడా బాగానే కలసి వచ్చింది. వారు కుటిల రాజనీతిని ఉపయోగించి, స్వదేశీ రాజుల మధ్య జరిగే ఘర్షణలో ఒక పక్షాన పోరాడడానికి సిద్ధపడడం, అందుకు ప్రతిఫలంగా కొంత ప్రదేశాన్ని అధికారికంగా సొంతం చేసుకోవడం చేసుకోగలిగారు. అక్కడి నుండి వ్యాపార సంస్థల స్వరూపం పాలకుల రూపంలోకి పరివర్తన చెందింది. వారి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి ఇక్కడివారి సాంప్రదాయ ఆయుధ సామాగ్రి కంటేనూ శక్తివంతమైనదై ఉండడంతో ఇక్కడి రాజులున్నూ వారి సహాయాన్ని తీసుకోవడానికి అతిగా ప్రాధాన్యతనిచ్చారు. దానితో ఆంగ్లేయులు ఇక్కడి రాజుల పైనా, వీరి పాలన వ్యవహారాలపైనా గణనీయమైన పట్టు సాధించుకోగలిగారు. షరామామూలే అన్నట్లు వారు ఈ స్థితి నుండి, తమ పట్టును స్థిరపరుచుకోవడానికి తమకున్న ఒకే ఒక బలమైన ఉపాయం మతాంతరీకరణేనన్న అవగాహనకు వచ్చారు. మతాంతరీకరణకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించారు. ఈ విషయంలో వారి బలమంతా తమను హీనంగా చూస్తున్న సమాజం పట్ల ఎంతో అసహనంగా ఉన్న అణగారిన వర్గాల వారిని మతం పేరున ఒక్కటి చేయడం, వారు ఊహించని రీతిలో వారిని ఆదరించడం, గౌరవాన్ని కట్టబెట్టడం అన్న ఎత్తుగడలోనే ఉంది. ఆ ఆ రకంగా మత మార్పిడులను ప్రభావవంతంగా చేయగలిగారే గాని, ఈ దేశ సామాజిక వ్యవస్థలోని కుల అంతరాల పునాదుల్ని గానీ, దానిపై నిర్మించిన ఉక్కుగోడల్ని గానీ పగలగొట్ట లేకపోయారు. కుల అంతరాలను తొలగించలేకపోగా, క్రైస్తవం కూడా ఈ కుల అంతరాల అంటురోగానికి బలైపోయింది. ఈ నాటికది వివిధ కుల క్రైస్తవ సంఘాలుగా, తీరి కూర్చుంది. సమానత్వ దిశగా సాగుతోందనిపించిన అది అలాసాగకపోగా, అసమానత దొంతరలలోనే తానూ కూరుకు పోయింది. దాన్నలా ఉంచండి. ఇంతకూ బైబిలు భారత రాజ్యాంగం సూచించిన మత స్వేచ్ఛను అంగీకరిస్తుందా? అంగీకరించదా? అంగీకరిస్తుందా? అనడం కంటే అంగీకరించ గలదా? అని అడగడం మరింత లోతైన ప్రశ్న.

బైబిలు భారత రాజ్యాంగం 

బైబిలు కూడా దాని మూల ప్రాతిపదికల్లోనే, యెహోవాయే దేముడు. అతనికి మారుగా వేరొక దేవుడు లేడు. ఉండకూడదు అన్నదే ముఖ్యమైందిగా ఉంది. పాత నిబంధనంతా తనని అంగీకరించిన వాళ్ళు - అంగీకరించని వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేది గానే ఉంటుంది. అన్యమత విశ్వాసులను ఉండనియ్యక తప్పనిసరి పరిస్థితులలో గానీ, వారితో కలిసి ఉండక తప్పని పరిస్థితుల్లో గానీ, వారికీ తమకూ మధ్య సమానత్వాన్ని అది ఎప్పుడూ అంగీకరించదు. అది అన్య దైవారాధకుల పట్లా, విగ్రహారాధకుల పట్లా, శత్రువైఖరి కలిగి ఉండాలనే తన వాళ్లకు బోధించింది. ఆ బోధనలను అంగీకరించని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు బైబిల్ దేవుడు. తిరస్కరించిన వారిని హతమారుస్తూనూ ఉంటాడు. తనను అనుసరించే వారిని అతిగా ప్రేరేపించి అన్యులపై దాడులు చేయిస్తాడు. వారి ధన, మాన, ప్రాణాలను హరింపచేస్తుంటాడు. బైబిల్ పాత నిబంధనలోని దేవుడు తనను అంగీకరించని, అనుసరించని, ఇతరేతర దైవాలను అంగీకరించే వారిపట్ల జరిపించిన హనన కాండను గురించి తెలుసుకుంటుంటే, క్రూరత్వానికి పరాకాష్ఠ రూపం ఎలా ఉంటుందో బోధపడుతుంది. యెహోవా మాత్రమే దేవునిగా అంగీకరించిన వారిలో మిగిలి ఉన్న వారినే ఈనాడు యూదులు అంటున్నాము.

  ఇక బైబిలు పేరునే పిలువబడుతూ, క్రొత్త నిబంధనగా చెప్పబడుతున్న దానిలోని ఏసే, క్రీస్తుగా, అనుసరించవలసిన వాడుగా కనపడతాడు. అతడు ఆనాటి కున్న అన్ని సముదాయాలలోని వ్యక్తుల బాధలను ఆయా సందర్భాలలో ఉపశమింప చేసినట్లు కనబడుతున్నా, తనను తాను ప్రత్యేకించున్నట్లు ఆధారాలున్నాయి. మిగిలిన ఎవరి కంటెనూ తనను మాత్రమే ఎక్కువ ప్రేమించేగలిగితేనే తన వాడవుతాడని, తనకు ఇష్టుడు కాగలుగుతాడని ఏసే అన్న మాటలు అందులో ఉన్నాయి. ఇక యేసును గురించి జరిగిన ప్రచారాలలో కెల్లా అత్యంత ప్రధానమైనది, యేసును రక్షకునిగా అంగీకరించని వానికి పరలోక ప్రాప్తిగానీ, నరకం నుండి విముక్తి గానీ లభించదు అన్నదే.

పాతనిబంధనలో లేని ఒక గందరగోళం కొత్త నిబంధనలో మనకు (చదువరికి) ఎదురవుతుంది. ఒక వంక వాని వాని క్రియల చొప్పునే వారికి ఫలితాలు అందుతాయంటూనే, యేసును రక్షకునిగా అంగీకరించని వానికి నరకం తప్పదనీ అంటుందది. నిన్ను నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించమని చెబుతూనే, నా కంటే అధికంగా గానీ, సమానంగా గానీ నీవెవరినీ ప్రేమించకూడదనీ అంటుంది. క్రొత్త నిబంధన చేసిన ప్రకటనలలో కెల్లా అత్యంత ప్రమాదకరమైనది యేసు రెండో రాకడే. యేసు పేరున దేవుడే గానీ, దేవుని పేరున యేసుగానీ నిర్వహించే భయానక మానవ హనన కాండ గురించిన వివరాలు కొత్త నిబంధన భాగంలో ఉన్నాయి. ఇలా రెండు విరుద్ధమైన భావాలూ అందులో ఉన్నాయి గనుకనే, ఏసు వ్యతిరేకులూ, అనుకూలురూ కూడా ఎవరికి కావలసిన వాక్యాలను వారు క్రొత్త నిబంధన నుండే చూపించి వారి వారి వాదాలను నిలబెట్టుకునే పని చేస్తున్నారు. 

మొత్తం మీద బైబిల్ ను పరిశీలిస్తే మనం ఎంచుకున్న విషయం వరకు అంటే మనుషుల మధ్య సమానత్వం విషయములో బైబిలు వైఖరి ఎలా కనిపిస్తుంది? అది తన-పర అన్న రెండు గానే జనాన్ని చూస్తుంది.

1) వారి మధ్య సమానత్వాన్ని అది అంగీకరించదు. ఆ సమానుల పట్ల కూడా సహనాన్ని బోధించదు సరికదా అసహనాన్నే రేకెత్తిస్తుంటుంది. యెహెూవా విశ్వాసులు - అన్య విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించిన తీరు వివరాలను పరికిస్తే అంతో ఇంతో ఎంతోకొంత సహనాన్ని అవిశ్వాసులే కలిగి ఉన్నట్లు కనబడుతుంది. అక్కడ కూడా సహనం - అసహనం విషయంలో తారతమ్యాలే కాని, రెండు పక్షాల వారూ ఎదుటివారిని తమతో సమానులుగా చూసిన దాఖలా లేదు.

2) అన్య విశ్వాసుల రాజ్యంలో యెహోవా అనుసారులు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. 

3) తట్టుకోలేనప్పుడో, అవకాశం లభించినప్పుడో, బలం సరిపోతుందనిపించి నప్పుడో అన్యులతో పోరాడతారు. వారిపై దాడి చేసి చంపేశారు. ఈ రెండూ సాధ్యపడ నప్పుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇక యెహోవా అయితే జనం తనను అనుసరించడం లేదన్న ఒకే ఒక కారణం చేత జలప్రళయాన్ని సృష్టించి మనుషులనే కాక, భూమిపైనున్న ప్రాణిజాతాన్నంతటినీ నాశనం చేశాడు. దాని తరువాత యూదులు తాము బలంగా ఉన్న దశలో, యేసునే కాక అతనిననుసరించిన క్రైస్తవులను కూడా హతం చేస్తూనే వచ్చారు. ఇదంతా బైబిలు అందించిన సమాచారమే.

అనంతర కాలంలో తరతమ భేదాలతోటి వందలాది ఆరాధ్యులు ఉనికిలోకి వచ్చారు. అవతారవాదం బలంగా ప్రబలింది. యోగులు, సిద్ధులు, భక్తులూ, సంస్కర్తలు కూడా ఆరాధ్యులుగా చలామణిలోకి వచ్చారు. వారికందరికీ మందిరాలు వెలిశాయి. పూజాదులు ఏర్పడ్డాయి. మొత్తం మీద స్వదేశీ మతం అన్న గొడుగు క్రిందికి బహు దైవారాధన, విగ్రహారాధన అన్న రెండు కలివిడిగా చేరి బలంగా స్థిరపడి పోయాయి. నిజానికి చాలా కాలం వరకు అవన్నీ వేటి పేరున అవే చలామణిలో ఉన్నా, అనంతర కాలంలో వీటినన్నింటినీ కలిపే ‘హిందూ మతం’ అన్న పేరున పిలవడం మొదలయింది. 

వేదంతో మొదలెట్టి పురాణాలూ, ఉప పురాణాలూ, స్థల పురాణాల వరకు ఉన్న విశ్వాసరీతులన్నింటినీ కలిపే ఈనాడు హైందవం క్రింద మాట్లాడడం జరుగుతోంది. కనుక హిందూ మతం అంటూ ఒకటి లేనేలేదు. స్వదేశీయమైన అనేక మతాల సమష్టికి పెట్టిన పేరే హిందూ మతమన్నది అన్న స్పష్టత రావడం చాలా అవసరం. అందులోని ప్రధాన మతవిశ్వాసాల వరకు తాము విశ్వసించే దైవమే సర్వోన్నతమైనదనీ, మిగిలినవి అంతకు దిగువ స్థాయి కలిగినవేననీ అనుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడి ఆస్తిక తాత్విక ధోరణుల ప్రకారమైతే దేవుడు - సృష్టికర్త ఒక్కడే, మిగిలిన చేతనులంతా దేవీ దేవతలతో సహా అందరూ జీవులే. అనాద్యానంతంగా ఉనికి కలిగి ఉండేవి మూడే. దేవుడు - జీవులు - ప్రకృతి అని అంటారు వాటిని. హైందవంలోని నానాత్వాన్నంతా ఇక్కడ చెప్పుకోవడం సాధ్యపడదు. మన రాజ్యాంగ విచారణకు సంబంధించినత వరకు వివిధ దైవ విశ్వాసాల సమాహారమే హిందూ మతము. ఈ మతమైనా మనుషులందరి మధ్యా సమానత్వాన్ని అంగీకరిస్తుందా? అనంటే అంగీకరించదనే అనాలి. ఇక్కడ మనుషుల మధ్య అంతరాలను మతవిశ్వాసాలు, అందులోని వారివారి దైవాలలోని వ్యత్యాసాలననుసరించే కాక కులాల ప్రాతిపదికనా ఏర్పరచడం జరిగింది. మతాల వరకు చూస్తే వివిధ విశ్వాసుల మధ్య ఖురాన్ బైబిల్ లో మాదిరి శత్రు దృష్టి కనపడదు. బహు దైవారాధన మూల కుదురులోనే అనేక దేవుళ్ళు, విశ్వాసాలనంగీకరించడమన్నది ఉండడంతో వారి మధ్య శత్రు వైఖరి లేకుండా పోయింది. అయితే వీరశైవం, వీర వైష్ణవం లాటి అతివాదులు ఒకరిద్దరు మాత్రం సిద్ధాంతంలో లేకపోయినా ఒకింత శత్రు దృష్టితో ప్రవర్తించినట్లు ఆధారాలున్నాయి. అంతకుమించి మత ప్రాతిపదికన ఈ దేశంలో పెద్ద ఎత్తున హనన కాండ జరిగినట్లు ఆధారాలు లేవు. 

కనుక పర మతస్తులను తమతో సమానులుగా అంగీకరించకున్నా ఎవరి మానాన వారు ఉండడానికి, వారివారి విశ్వాసాల ప్రకారం వారిని ఉండనివ్వ డానికీ అలవాటు పడిపోయారిక్కడి వాళ్ళు. కనుకనే మత స్వేచ్ఛ విషయంలో ఎవరిష్టం వారిది అని అంగీకరించడానికి హిందువులకు సిద్ధాంతపరమైన అభ్యంతరాలు ఏమీ లేవు.

హిందూ మతం సర్వశ్రేష్టమైనది అనే మాటలు ఈ దేశంలో తరచుగానే వింటుంటాం. తగినంత అవగాహన లేకపోవడం వలన అనే మాటలే అవి. ఏ విషయంలో వేటి మధ్య అన్న స్పష్టత లేకుండా నిమ్నోన్నతాల (ఎక్కువ తక్కువల) గురించిన ప్రస్తావనే పొసగదు. కనుక తమది సర్వ శ్రేష్టమైనది అంటున్న వారినెవరినైనా, ఏ విషయంలో దేనికంటే శ్రేష్టమైనదో అడగాలి. ఆ ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఆ మాటన్నవారు సమాధానం చెప్పాలి. పుట్టుకతోనే, పుట్టుక కారణంగానే వ్యక్తుల మధ్య ఎక్కువ తక్కువలను ప్రకటించే ఏ మతామై నా అమానుషమైన దేనంటాను.

భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ ప్రధానాకాంక్ష సమానత్వ సాధనే. మనుషుల ఈ మధ్య ప్రకృతి సహజంగా ఏర్పడ్డ భౌతిక సామర్థ్యాలకు సంబంధించిన అసమానతలు తప్ప, మానవ కృతమైన అసమానత లేవీ ఉండకూడదన్నదే ఆ సమానత్వ సాధన యొక్క సారాంశం. కనుకనే రాజ్యాంగం మూడో అధ్యాయం లోని ప్రాథమిక హక్కులకు చెందిన అధికరణాలన్నీ సమానత్వాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినవి గానే ఉన్నాయి. అంత క్రితం వరకు అమలవుతూ వచ్చిన అసమానతలను తొలగించడానికి, అమలు కాకుండడానికి ఉద్దేశించినవే ఆ అధికరణాంశాలన్నీ.

1) మూల భూత లక్షణాలను మార్చకూడదు. 2) చట్టం ముందు అందరూ సమానులే. 3) ఒక్క ఓటు ఒకే విలువ. 4) కాలాన్ని బట్టి, మతాన్ని బట్టి, లింగాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఏ ఇరువురి మధ్యా వ్యత్యాసాన్ని చూపకూడదు. 5) అస్పృశ్యత రద్దు. 6) బిరుదులు రద్దు. 6) భావ ప్రకటనా స్వేచ్ఛ. 7) మత విశ్వాస స్వేచ్ఛ. 8) జీవించే హక్కు 10) పౌర హక్కులకు రక్షణ. 11) సమానత్వాన్ని నెలకొల్పడానికి అవసరమైన అదనపు అవకాశాలుఇలా మొత్తం రాజ్యాంగంలోనూ ప్రధాన భాగమైన ప్రాథమిక హక్కులకు చెందిన అధికరణాలన్నీ భారతీయులందరి మధ్యా సమానత్వాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినవే. ఎవరి హక్కులు వారికి లభించేట్లు చూసే విషయంలో ప్రతి పౌరునికీ బాధ్యత ఉంటుందన్న సూచన వాటిలో అంతర్భూతంగా ఉంది.

పౌరులందరి మధ్య సమానత్వాన్ని నెలకొల్పు కోవాలన్నదే భారత రాజ్యాంగపు అంతిమలక్ష్యం. ఈ ఒక్క ముక్క అర్థం కాకపోతే రాజ్యాంగాన్ని ఎంతగా బట్టీ పట్టినా అదంతా సారాన్ని విడచి పిప్పిని పట్టుకున్న చందమే అవుతుంది. కనుక సమానత్వాన్ని అంగీకరించనిదేదైనా రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది.

కనుక సమానత్వం నెలకొల్పేందుకు వేసే ప్రతి అడుగూ, చేసే ప్రతి పనీ రాజ్యాంగానుకూలమైనదే అవుతుంది. అలాగే సమానత్వానికి ప్రతికూలమైన ప్రతి పని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదే అవుతుంది . ఈ దేశంలో ఒక పని చేయదగిందో కాదొ నిర్ణయించడానికి ఇంతకంటే చివరి పరీక్ష మరోటి లేదు.

గత సమాజం నుండి మనకు సంక్రమించిన ఆచారాలలో ఏవేవి వివక్షా రూపాలో, అంటే అసమానతలకు నిలయాలో అసమానతలకు అనుకూలత కలిగి ఉంటాయో వాటిని చాలా చాలా విస్పష్టంగా ప్రకటించారు మన రాజ్యాంగ నిర్మాతలు. అదే రాజ్యాంగంలోని 15వ అధికరణంలో ఉంది.

1) కులం అసమానతల్ని అంగీకరిస్తుంది. పాటిస్తుంది.

2) మతం అసమానతల్ని అంగీకరిస్తుంది. పాటిస్తుంది .పాటించమని శాసిస్తుంది కూడా.

3) లింగ వివక్ష అంటే స్త్రీ పురుష నపుంసక సముదాయాల మధ్య అసమానత ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

4) ప్రాంతాల పేరున అసమానతలు నెలకొని ఉన్నాయి.

5) వర్గాల మధ్యనా అసమానతలు బలంగానే ఉంటున్నాయి. 

గమనిక: వర్గాల మాట క్రింద 1) ధనికపేద అనీ, 2) వివిధ పార్టీలు అనీ అర్థం చెప్పవచ్చు. ఇవే కాక, రాజ్యపాలనకు సంబంధించి అప్పటి వరకూ నడిచిన రాజరిక (నియంతృత్వ) వ్యవస్థ దానికదే నిమ్నాధిక్యతలు గల వ్యవస్థ. మొత్తం ప్రజలను అది పాలకులు - పాలితులు అన్న రూపంలో విడగొడుతుంది.

ఇకపోతే ఆర్థిక అసమానతలకు దారి తీసే లక్షణం పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ : స్వభావంలోనే ఉంది.

మిత్రులారా:- పైన నేను చూపించిన ప్రతి అంశాన్ని విడివిడిగా అర్థం చేసుకోవడం, ఆ మొత్తాన్ని కలిపి ఒక సమష్టి చిత్రాన్ని ఊహారూపంగా చూడగలగడం చేస్తేనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో లేదో అర్థమవుతుంది. వేటి వేటి కారణంగా అది ప్రమాదానికి లోనైందో, లోనవుతూనే ఉందో అవగతమవుతోంది.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటానికి కారణాలు ఎక్కడున్నాయన్నది ముందు కనుగొనాలి.

1) ఒప్పందంలోనే అంటే రాజ్యాంగ సూత్రీకరణలోనే వివక్షకు దారితీసేవి ఉండడం వల్ల.

2) దానిని అమలు పరచుకోవలసిన పౌరుల లోనే వివక్షకు దారితీసే వైఖరి ఉండడం వల్ల. 

నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఏ మాత్రం తొందర పడ్డా ఇక ఈ ప్రమాదం నుండి బయట పడేందుకు ఏమి చేయాలన్న దాంట్లో పొరపాట్లు జరిగి పోతాయి.

అంబేద్కర్ సమానత్వ సాధనకు మానసిక వైఖరి చాలా కీలకమైందిగా భావించాడు. స్వాతంత్ర్యం అన్నది ప్రతి ఒక్కరికి దక్కాలి. అది ప్రాథమిక హక్కుగా అంగీకరింపబడాలి. అది జరగాలంటే ప్రతి వ్యక్తి ఇతరులంతా తనతో సమానులేనన్న దృష్టిని కలిగి ఉండాలి. మానసికంగా అది దృఢ పడాలంటే, ఒకరినొకరు సోదరులుగా భావించగలగాలి. ఇది జరగాలంటే ఈ దేశాన్ని మాతృ భావనతో చూడగలగాలి. దేనికి ఏది ఆధారమన్న క్రమం ఇలానే ఉండాలి.

ఇదంతా మానసిక భావనకు సంబంధించిందే. కనుక బిడ్డ పుట్టిన దగ్గర నుండి, అంచెలంచెలుగా దేశభక్తిని నూరిపోయడం జరగాలి. వివక్షకు దారితీసే భావన లేవీ వారి తలలకు ఎక్కించరాదు. అలాగే వివక్షకు దారితీసే పనులను భావితరానికి అలవాటు చేయరాదు. వివక్షకు దారితీసే సంఘటనలు అతని అనుభవంలోకి రాకుండా చూడడమో, వివక్షత చూపిన వారు శిక్షార్హులు దండింపబడతారు అన్న అనుభవాలు కలిగేట్లు చేయడమో చేయాలి.

ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన వ్యక్తిత్వాలను రూపొందించే పని ఇంటి నుండి మొదలవ్వాలి. ఇల్లే తొలి బడిగా శాసనం రావాలి. తల్లిదండ్రులే తొలి ఉపాధ్యాయులుగా అధికారికంగా ప్రకటింపబడాలి. వారికీ ఆ మేరకు శిక్షణ గరపాలి. అది విద్యావిధానం లోని ప్రణాళికలో భాగం కావాలి.

సరైన పౌరుడు తయారు కానంతకాలం రాజ్యాంగం ఆశిస్తున్న, సమాజం ఏర్పడనే ఏర్పడదు. కనుక అందుకు భిన్నమైన వ్యక్తులు ఉన్నంతకాలం, తయారవుతున్నంత కాలం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లే.

సరైన పౌరుడంటే; రాజ్యాంగ లక్ష్యాల సాధనకు అవసరమైన విషయాలకు సంబంధించిన అవగాహన, అందుకు తగిన ఆచరణ, అలా ప్రవర్తించడానికి తగిన శీలము (నైతిక వర్తన) కలిగి ఉన్నవారు అని అర్థము. దీనినే సూత్ర రూపంలో ఇలా చెప్పుకుంటున్నాము.

సూత్రము : ప్రజలు అవగాహనా పరులు, పని మంతులూ, శీల వంతులూ (నీతిమంతులూ) కానంత కాలం, ప్రజాస్వామ్యం దాని సరైన అర్థంలో ఆచరణలోకి రాదు. 

సమానత్వాన్ని సూత్రప్రాయంగా అంగీకరించడం అన్న దగ్గర నుండే ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తెచ్చుకునే పని మొదలవ్వాలి. మరి ఇది వ్యక్తి దృక్పథంతో ముడిపడి ఉన్నదిగా ఉంది. భారత దేశం నాది, భారతీయులందరూ నా వాళ్ళు అన్న భావన వ్యక్తిలో దృఢంగా నెలకొననంత కాలం తనకు, 'తన - పర' అన్న దృష్టి నిలబడి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గతంలోని తాత్వికులు గమనించారు. 

అయం నిజః పరైవేతి ఘణనా లఘు చేత సాం!

ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం!! అన్న సూత్రీకరణ చేశారు వాళ్ళు. 

అంటే, ఇది తనది, ఇది ఇతరులది అన్న దృష్టి కురచ బుద్ధి కలవారికి ఉంటుంది. ఎదిగిన వ్యక్తిత్వం కలవారైతే వసుధ (ఈ లోకం) అంతా ఒకే కుటుంబం అన్న దృష్టి ఉంటుంది. అన్నది దానర్థం.

దీనిని సక్రమంగా అర్థం చేసుకోవాలంటే, మరికొంత వివరించుకోవలసి ఉంటుంది. వసుధ అంటే భూమిపైనున్న మానవులంతా అని అర్థం. మానవులు కాక మిగిలినవన్నీ మానవులకు చెందిన ఉమ్మడి సంపద క్రిందికి చేరిపోతాయి.

భూమిపైనున్న మానవులంతా ఒకే కుటుంబం అన్న భావన ఆదర్శ ప్రాయమైనదే గానీ, ప్రస్తుతం మానవులంతా దేశాలుగా విడి విడి సమూహాలుగా ఏర్పడి, స్థిరపడి కొనసాగుతున్నారు. కుటుంబం అంటే, అందులో ఉన్న పది మందీ, వారికి చెందిన సంపద అని అర్థం. ఆ పది మందిలో ప్రతి ఒక్కనికీ, మిగిలిన తొమ్మిది మంది 'తన' అవుతారు. ఆ కుటుంబానికి చెందిన సంపదంతా తనదే అవుతుంది. కుటుంబంలో ఈ తరం వారూ, వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు అన్న మూడు తరాలు కొనసాగుతుంటాయి.

ఈ తరం వారే కుటుంబానికి సంబంధించిన ప్రధాన బాధ్యత వహిస్తూ ఉంటారు. మిగిలిన రెండు తరాల పోషణ, రక్షణ బాధ్యతలు వీరివిగానే ఉంటున్నాయి. ఎవరికీ వారు శక్తిమేర పనిచేస్తుండడం, అవసరమైన మేర వాడుకోవడం చేస్తుంటారు. భావి తరాన్ని వివేక వంతులుగా, పనిమంతులుగా తయారు చేయడమన్నది కుటుంబ బాధ్యతలలో ప్రధానమైనదిగా ఉంటుంది. ఎందుకంటే, కుటుంబపు స్థితిగతుల యొక్క భవిష్యత్తు అంతా దానిపైనే ఆధారపడి ఉంటుంది కనుక. ఇక పెద్దతరం క్రమంగా పని విరమణ వైపు నడుస్తూ ఉంటుంది కనుక పని చేయకున్నా, వారి పోషణ రక్షణ బాధ్యత కూడా మిగిలిన కుటుంబానిదిగా అలవాటుగనే జరిగి పోతూ ఉంటుంది. అందుకని తాత్వికులు మంచి సమాజానికి నమూనాగా కుటుంబాన్ని చూపించారు.

ఈ కుటుంబభావనను దేశానికి వర్తింపజేస్తే, దేశీయులంతా ఒకే కుటుంబము. ఆ దేశ సంపద అంతా ఆ కుటుంబానిది. ఆ సమూహంలోని ప్రతి ఒక్కరికి మిగిలిన వారంతా తనవారే. తనతో పాటు తన వారి పోషణ, రక్షణ, భారాన్ని ఉమ్మడిగా భరించడం అన్నది నిత్య జీవన విధానం నుండి వారికి అలవాటవుతుంది.

మన రాజ్యాంగ పీఠికలో ఈ విషయాలే ప్రస్తావించబడ్డాయి. ఈ దేశ పౌరులందరి మధ్యా సోదరభావం ఉండాలన్నది అత్యంత కీలకమైనది. ఈ సోదర భావం అన్నది కుటుంబ భావన ప్రాతిపదికన చెప్పబడిందే. దేశమంతా ఒకే కుటుంబం అన్నప్పుడే, ఈ సోదరభావన అన్నది కుదురుతుంది. అది జరగాలంటే దేశాన్ని మాతృ స్థానంలో పెట్టుకో గలగాలి. దేశం తల్లి అయితేనే దేశీయులందరూ పరస్పరం సోదరులు కాగలుగుతారు. ‘భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు' అన్న పౌర ప్రతిజ్ఞ ఈ అవగాహన నుండి రూపొందించుకున్నదే.

ఈ విషయాన్ని అంబేద్కర్ తనదైన శైలిలో వివరించారు. సోదరత్వాన్ని అంగీకరించక సమానత్వం గానీ, సమానత్వాన్ని అంగీకరించక స్వాతంత్రం గానీ ఆచరణలోకి రావు. అసలు ఈ మూటిని విడివిడిగా చూడకూడదు. మూటినీ కలిపే అర్థం చేసుకోవాలి. ఆయన మాటల్లోనే గమనించండి.

“మనం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతుష్టిపడరాదు. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాంఘిక ప్రజాస్వామ్యం చేయాలి. సాంఘిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే రాజకీయ స్వాతంత్ర్యం నిలబడదు. సాంఘిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? 

స్వతంత్రం, సమానత్వం, సోదరత్వాలను జీవన సూత్రాలుగా గుర్తించిన జీవన శైలియే సాంఘిక ప్రజాస్వామ్యం అంటారు. స్వతంత్ర, సమానత్వ, సోదరత్వ సూత్రాలను ఈ త్రయంలో విడివిడిగా చూడకూడదు. ఈ మూడింటి సమన్వయ రూపమే సాంఘిక ప్రజాస్వామ్యం. వీటిని ఒక దాని నుండి మరొక దానిని విడదీస్తే, ప్రజాస్వామ్య లక్ష్యాన్నే కూలద్రోసినట్లు. స్వతంత్రం సమానత్వం నుండి ఎన్నడూ వేరు కాలేదు. అలాగే సమానత్వం కూడా స్వతంత్రం నుండి వేరు కాలేదు. అదే మాదిరి స్వతంత్ర సమానత్వాలు సోదరత్వం నుండి వేరుకాలేవు. సమానత్వం లేని స్వతంత్రమనేది ఎక్కువ మందిపై తక్కువమంది ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది”.

డాక్టర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యపు అమలు అన్నది మూడు విషయాలపై ఆధారపడి ఉంది అనన్నాడు. 1) సాంఘిక ప్రజాస్వామ్యం. 2) ఆర్థిక ప్రజాస్వామ్యం, 3) రాజకీయ ప్రజాస్వామ్యం. అన్న మూడూ సక్రమంగా అమలు అయితేనే దానిని దేశానికి సంబంధించి ప్రజాస్వామ్యం అనగలుగుతాం. కానీ దేశంలో అది సిద్ధ రూపంలో లేదు. సాధించుకో వలసిందిగా వుంది అంటాడు. ఆయన మాటల్లోనే వినండి. 

"స్వతంత్ర సమానత్వాలన్నవి సహజ రీతిలో ఉండవు. వాటిని అమలు చేయడానికి ఒక కానిస్టేబుల్ అవసరం అవుతాడు. భారత దేశంలో సాంఘిక ఆర్థిక సమానత్వాలు లేవన్నది మనం గుర్తించాలి. సాంఘిక రంగంలో అసమానతల శ్రేణి (దొంతర) అనే సిద్ధాంతం పైనే మన సమాజం ఏర్పడింది. ఇక ఆర్థిక రంగంలో కొద్దిమంది మహా ధనవంతులు చాలా మంది మహా దరిద్రులు ఉన్న సమాజం మనది. కనుక, మనం పరస్పర వైరుధ్యాలున్న జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఎలాగంటే….

“రాజకీయాలలో మనం సమానత్వాన్ని కలిగి ఉంటాము. అదే సమయంలో సాంఘిక, ఆర్ధిక జీవితంలో అసమానతను కలిగి ఉంటాము. రాజకీయాలలో 'ఒక్క మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ' అనే సూత్రాన్ని గుర్తిస్తాము. కానీ మన సాంఘిక, ఆర్థిక జీవితంలో, మనకు గల సాంఘిక, ఆర్థిక వ్యవస్థల కారణంగా, ఒక మనిషికి ఒక విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాము.” ప్రజాస్వామ్యం అమలు కాకుండా అడ్డుపడుతున్న అంశాలలో ఇదీ ఒకటి.”

ఈ వైరుధ్యాల జీవితాన్ని ఎంత కాలం, నిరాకరిస్తూ ఉంటాము? (అంటే వైరుధ్యాలు ఉన్నాయన్న నిజాన్ని ఎంతకాలం అంగీకరించకుండా నిరాకరిస్తూ ఉంటాము అని అర్థం -రచయిత). మన సాంఘిక, ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటాము? మనం చాలా కాలం దీనిని (ఇలానే) నిరాకరిస్తూ పోతే మనమే మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడ వేస్తున్నామన్న మాట. ఈ వైరుధ్యాన్ని అంటే రాజకీయంలో సమానత్వాన్ని, సాంఘిక, ఆర్థిక విషయాలలో అసమానత్వం కలిగి ఉండడమన్న వైరుధ్యాన్ని వీలైనంత త్వరలో మనం తొలగించుకోవాలి. లేనట్లయితే అసమానతలతో బాధపడేవారు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తారు. ఈ రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్యం ధ్వంసమౌతుంది.

మనలో లేని రెండో అంశం సోదరత్వ సూత్రానికి గుర్తింపు.

సోదరత్వమంటే ఏమిటి? సోదరత్వమంటే అందరు భారతీయుల మధ్య ఒక సమష్టి సహోదర భావం. భారతీయులందరూ ఒకే ప్రజ అన్న భావం. సాంఘిక జీవితానికి ఈ సూత్రం ఐక్యతనూ, సహానుభూతిని కలిగిస్తుంది. దీనిని సాధించటం (ఆచరణలోకి తెచ్చుకోవడం) కష్టమే. భారతీయులు తామంతా ఒకే దేశం అని (నిజంగా) అనుకోవడం ఎంత కష్టమో ఊహించండి.

మనం ఒకే దేశంగా లేకుండానే, ఒకే దేశంగా ఉన్నామన్న పెద్ద భ్రమకు లోనవుతున్నామని నా అభిప్రాయం. ఇన్ని వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒకే దేశం ఎలా కాగలరు? సాంఘిక, మానసిక రంగాలలో మనం ఇంకా ఒకే దేశంగా కాలేదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడు మాత్రమే మనం ఒకే దేశంగా (ఒకటిగా) ఉండవలసిన ఆవశ్యకతను అర్థం చేసుకోగలుగుతాం.

ఈ లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా కష్టమే అవుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జరిగిన దానికంటే చాలా కష్టం. (ఎందుకంటే ప్రజలను ఒక్కటి కాకుండా అడ్డుపడే) కుల సమస్య వారికి లేదు. ఇండియాలో కులాలున్నాయి. కులాలు ఒకే దేశం అన్న ఏకత్వ భావనకు వ్యతిరేకమైనవి. ఇందుకు కారణం సాంఘిక జీవితంలో ఇవి వేరుబాటును తీసుకువస్తున్నాయి. కులాల మధ్య విద్వేషాలను, అసూయను వృద్ధి చేస్తున్నాయి. కనుక ఇవి ఒకే దేశమన్న భావనకు వ్యతిరేకమైనవంటున్నాము. నిజంగా మనం ఒకే దేశంగా మారాలంటే, మనం ఈ ఇబ్బందులు అన్నింటిని అధిగమించాలి. ఒకే దేశంగా ఉండాలంటే, మనందరి మధ్యా సోదరత్వం నెలకొని ఉండాలి. సోదరత్వం లేకపోతే, సమానత్వం, స్వాతంత్ర్యం అనేది నిజంగా లేని పైపై రంగు పూతలు మాత్రమే.

మన ముందున్న (సాధించుకోవాల్సిన) కర్తవ్యాల గురించి నా భావన లివి. ఇవి కొందరికి రుచించక పోవచ్చు. ఎందుకంటే; ఈ దేశంలో రాజకీయాధికారం చాలా కాలంగా కొందరికే ఏకస్వామ్యంగా (మోనోపలి) ఉందనడంలో అబద్ధం లేదు. ఇక్కడ చాలా మంది బరువు మోసే పశువులు గానే కాక బలి పశువులు గానూ బ్రతుకుతున్నారన్నది నిజం. ఆ ఏకస్వామ్యం కేవలం వీరి అభివృద్ధి అవకాశాలనే కాదు, అసలు వారికి జీవితమంటే అర్థమే తెలియకుండా చేసేసింది.

ఈ అణగదొక్కబడిన వర్గాలు పాలితులుగా ఉండి ఉండి అలసిపోయాయి. తమని తామే పాలించుకోవాలని చాలా అసహనంగా ఉన్నాయి. కనుక, అణగ ద్రోక్కబడిన ఈ వర్గాలలో, తమ సొంత గుర్తింపుకై పడే ఆరాటాన్ని, ఒక రకపు పోరాటంగా గానీ, ఒక వర్గ పోరాటంగా గానీ మారనివ్వకూడదు.

అది (ఒకే దేశంగా ఉండాల్సిన) ఈ ఇంటిని ముక్కలు చేయడానికి దారితీస్తుంది. (అదిగాని జరిగితే) దానికదే నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తం అవుతుంది. అబ్రహాం లింకన్ చెప్పినట్లు “ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా తానే చీలికలైతే అది ఎక్కువ కాలం నిలబడలేదు. కనుక (అణచివేత తొలగిపోవాలన్న) వారి ఆశను నెరవేర్చడానికి ఎంత త్వరగా ప్రయత్నం జరిగితే అంత మంచిది. మిగిలిన వారందరికీ అంత మంచిది. దేశాని కంతటికీ అంత మంచిది. ఈ దేశ స్వాతంత్ర్య రక్షణకు అంత మంచిది. ఈ ప్రజాస్వామ్య రక్షణకు అంత మంచిది. అయితే, ఆ మంచి అన్నది ఈ దేశ ప్రజల జీవన రంగాలన్నింటిలో సోదరత్వాన్ని, సమానత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యపడుతుంది. ఆ అందువల్లనే, వాటి గురించి ఇంతగా నొక్కి వక్కాణిస్తున్నాను”.

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

అప్పటికింకా ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకోడానికి ఏమేమి సాధించుకోవాలో చాలా సుస్పష్టంగా ప్రకటించారాయన. పైగా ఆ విషయాలను మొత్తం దేశాని కంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ సభలో ప్రకటించారు. ఆ రకంగా దేశం మొత్తం ముందుంచారు.

ఏమి జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందో, ఏమి జరక్కుంటే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుందో కుండ బద్దలుకొట్టినంత స్పష్టంగా మన ముందుంచారు. గొప్ప దార్శనికుడాయన. ఆయన ఏది జరక్కూడదన్నారో, ఏది జరుగుతుందేమోనని ఆందోళన పడ్డారో కచ్చితంగా అదే జరిగింది. జరుగుతూ వస్తోంది. కనుక ఆయన కాలం నాటికి ఆయన ముందున్నది భవిష్యత్తులో అలా జరుగుతుందేమోనన్న భయం మాత్రమే. కానీ ఈనాటి మనముందున్నది అదే ప్రమాదం జరిగిన, జరుగుతున్న వాస్తవం.

ఇప్పటికైనా నిజాయితీ కలిగిన ప్రజాస్వామ్య వాదులూ, రాజ్యాంగం సాధించుకోండంటూ సమానత్వాన్ని చిత్తశుద్ధితో ఇష్టపడుతున్నవాళ్ళూ రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని సజావుగా నిలబెట్టుకోడానికి, నియంతృత్వ పోకడలవారి నుండి దానిని రక్షించుకోడానికి నడుంకట్టి పూనుకోకుంటే, ఆయన ఆందోళన పడ్డ ప్రళయ దుర్ముహూర్తం వచ్చి మీద పడిపోతుంది.

గతంలో జరిగిన మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన అక్కడితో ఆగలేదు. ఈనాడు కొన్ని క్రైస్తవ సమూహాలూ, ముస్లింలకు జరిగినట్లే మాకూ జరిపించండి. మా నేల మాకు విడగొడితే మా పాలన మేము చేసుకుంటాం అని బహిరంగంగానే అనడం మొదలెట్టాయి. ఈ ప్రమాదకరమైన ఈ ధోరణిని చంపేసే పని ఈ దేశం పట్ల నిజమైన ప్రేమా, ఇక్కడి ప్రజలంతా ఏక జాతీయులేనన్న భావనా కల క్రైస్తవ సంఘాల వైపునుండే ఆరంభం కావాలి. దానికి మిగిలిన దేశమంతా వత్తాసు పలకాలి. ఆ ప్రయత్నం ఒక ఉద్యమంగా సాగాలి. ఇక ముందు మరొకరెవ్వరూ దేశ విభజన గురించి మాట్లాడాటానికే భయపడేంతగా ఉండాలి దాని రూపం.

పాకిస్తాన్ విభజన సమయంలో ముస్లింలు తీసుకున్న నిర్ణయం ఎంత తొందరపాటుతో కూడుకున్నదో, ఎంత ప్రమాదకరమైనదో, 'పాకిస్తాన్ విభజన' అన్న పేరున తను రాసిన ఉద్గ్రంథంలో డా. అంబేడ్కర్ చాలా చాలా వివరంగా ప్రస్తావించారు. ఏదోనాటికి పాకిస్తాన్ ముస్లింలు తమ తప్పును తెలుసుకొని తిరిగి భారతదేశంలో కలిసిపోతారనే ఆశిస్తున్నాను అని చెప్పారు.

ఆనాడు విభజన కోరిన ముస్లింలతో పాటు పాకిస్తాన్ కు వెళ్లకుండా ఇక్కడే నిలిచిపోయిన ముస్లింలు అలా ఎందుకు చేశారన్నది చాలా సున్నితమైన, గంభీరమైన ప్రశ్న. దానికి వాస్తవాలాధారంగా సమాచారం రాబట్టాలి. అందులో కొందరైనా ఈ దేశాన్ని ప్రేమించే ఇక్కడ నిలిచిపోయారని చెప్పవచ్చన్నది నా నిశ్చితాభిప్రాయం. అయితే నిలిచిపోయిన వారంతా ఈ దేశాన్ని ప్రేమించడం వల్లే నిలిచి పోయారని చెప్పడం సరైంది కాదు. వారంతా ఎవరి ప్రాధాన్యతలననుసరించి వారు, రకరకాల కారణాలతో నిలిచి ఉంటారన్నది నా తర్కానికి తడుతున్న అంశం. ఈ అంశం వరకు ఈనాడు తిరిగి సమీక్షకు లోనుచేస్తే పాకిస్తాన్ కు వెళ్ళిన ముస్లింలలో కొందరైనా తప్పు చేశాము తిరిగి వెళితే బాగుండుననుకునేవాళ్ళుండే అవకాశముంది. అలాగే ఇక్కడ నిలిచిపోయిన వాళ్ళలో పాకిస్తాన్ వెళ్ళడానికి ఇష్టపడేవాళ్లు కొందరుండవచ్చు. అలాంటివాళ్లు, పాకిస్తాన్లో ఈ 70ఏండ్లుగా జరుగుతున్నది చూస్తూనూ ఎందుకలా అనుకుంటున్నారోనన్నది మరో చిక్కు  ప్రశ్న.

ఈ విభజనకు సంబంధించిన మరో పార్శ్వాన్ని చూస్తే గాని ప్రస్తుతం మనం విచారణకు పెట్టుకున్న ప్రజాస్వామ్యానికి చెందిన ఆలోచనా రీతిలో మతం పాత్ర ఎలా ఉంటున్నదో అర్థం కాదు.

దేశ విభజన సమయంలో కొందరు ముస్లింలు ఈ దేశాన్ని ఎలా విడచి వెళ్లలేదో, అలానే పాకిస్తాన్ గా విడగొట్టబడిన ప్రాంతాలలోని హిందువులు కొందరు అక్కడ నిలిచిపోయారు. పాకిస్తాన్ దేశంపై ప్రేమతోనే వారక్కడ నిలచిపోయారనడం మాత్రం కుదరదు. ఎందుకంటే విభజనకు పూర్వం భారతదేశాన్ని తమ సొంత దేశంగా భావించే అవకాశం అక్కడి ముస్లింలకు ఉందిగానీ, కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ ను తమ సొంత దేశంగా భావించే అవకాశం అప్పటివరకు భారతీయులుగా ఉన్న హిందువులకు లేదు. పైగా దేశ విభజనే మత ప్రాతిపదిక పేరున జరిగింది. కనుక అక్కడ హిందువులకు అది మాతృదేశం కాజాలదు. ముస్లింలకు మాత్రమే అది స్వదేశం అవుతుంది. అటు తరువాత పాకిస్తాన్ తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తరువాత, దాని ప్రకారం పౌరసత్వాన్ని పొందిన వారందరికీ అప్పటినుండి అది స్వదేశం అవుతుంది. ఇదేంతో కీలకమైన అంశం. 

పాకిస్తాన్ లో మత స్వేచ్చ వుందా? ఉందంటే అది ఏ రూపంలో ఉంది? ఆచరణలో అక్కడ ముస్లింల, ముస్లిమేతరుల సంఖ్యలో వచ్చిన మార్పేమిటి? అక్కడ మతమార్పిడుల పరిస్థితి ఏమిటి? వగైరాలన్నీ ‘ప్రజాస్వామ్యం ఆచరణలో ఇస్లాం పాత్ర’ అన్నదానిని అర్థం చేసుకొనడానికి అవసరమైనవే. పాకిస్తాన్ లో మత మార్పిడులు విభజన నాటికి అక్కడ వున్న హిందువుల సంఖ్య ఎంత? ఈనాడు అక్కడ వున్న హిందువులెందరు? ఎంత మంది ఇస్లాం స్వీకరించారు? అలాగే ఈ 70ఏళ్లలో అక్కడ ముస్లిం లెవరైనా ఇస్లాంను విడచి హిందూమతాన్నిగానీ, మరే మతాలను గానీ స్వీకరించిన వారున్నారా? ఎందరు? వారు ఏ కారణం వల్ల ఇస్లాంను విడిచి పెట్టారు?

ముస్లిం జాతి ప్రాతిపదికన ఆవిర్భవించిన దేశం ఏదైనా మత ప్రమేయం లేని రాజ్యాంగాన్ని తయారుచేసుకోగలదా? అక్కడి ప్రజలంతా అన్ని విషయాలలోను సమానులేనని ప్రకటించగలదా?

ఇవే అంశాలను ఈ దేశానికి వర్తింపజేస్తే, దేశ విభజన నాటికి ఈ దేశ జనాభా ఎంత? మతాల ప్రాతిపదికన ఆయా మతాల ప్రజల సంఖ్యకు సంబంధించిన నిష్పత్తి ఏమిటి ? ఈ 70 ఎండ్లలో ఇక్కడి హిందువులు, ముస్లిమేతరులు ఎవరైనా ఇస్లాంను స్వీకరించారా? 

ఎంత మంది? అలాగే ముస్లింలు ఎవరైనా ఇస్లాంను విడచి, హిందూమతాన్ని గానీ, మరే మతాలను గానీ స్వీకరించారా? ఎంతమంది ఈ మతాన్ని మార్చుకున్నారు? ఏ కారణాలవల్ల ఇస్లాంను విడచిపెట్టారు? ఈనాటి వారి వారి జనాభాల ప్రకారం హిందూ, క్రైస్తవ , ముస్లింల జనాభా నిష్పత్తి ఎంత? అవి అలా ఏర్పడటానికి కారణాలేమిటి? 

ఈ వివరాలన్నీ వాస్తవాల ప్రాతిపదికన ప్రామాణిక సమాచారాన్ని అధికారికంగా లిపిబద్ధం చేయాలి.

మత స్వేచ్చకు సంబంధించి రాజ్యాంగం ఏమి చెపుతున్నది? వాస్తవంలో ఆ పేరున ఏమి జరుగుతోంది? శివాలయాలను ధ్వంసం చేయండని ఒక వీర వైష్ణవుడు గానీ, వైష్ణవాలయాలను పడగొట్టండని ఒక వీర శైవుడు గానీ బహిరంగంగా ప్రకటించడం, ప్రకటిస్తూ ఆవేశంగా ప్రసంగాలు చేస్తూ వుండటం, తన విశ్వాసానికి చెందిన వారితో సమావేశమై అందుకు ప్రణాళిక రచన చేయడం లాటివి కూడా రాజ్యాంగం కల్పించిన మతప్రచార స్వేచ్చ కిందికే వస్తాయా? బౌద్ధారామాలను, శైవ, వైష్ణవాలయాలుగా మార్చడం కూడా మత స్వేచ్చలో భాగమేనా?

అలాగే అల్లా తప్ప దేవుడు లేడు అనుకోవడం దగ్గర ఆగకుండా, దానిని అంగీకరించని వారు సత్య తిరస్కారులు, సత్యతిరస్కారులతో స్నేహం గానీ, బంధుత్వం గానీ చేయకూడదు. ఆ పరిస్థితి తల్లితండ్రుల సంబంధంగా ఏర్పడ్డా, భార్యాభర్తల మధ్య ఏర్పడ్డా, అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డా, ఇరుగుపొరుగు వాళ్ళ మధ్య ఏర్పడ్డా, ఇస్లాం విశ్వాసి వాటిని వదులుకోవాలి, కొనసాగించకూడదు. ఆ తరువాత అలాంటివి ఏర్పరుచుకోకూడదు. ఏర్పరుచుకోవల్సివస్తే, అవతలివారు ఇస్లాం స్వీకరించాకే అందుకు సిద్ధపడాలి. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ క్రిందికే వస్తాయా? రావా?

మత ప్రచార స్వేచ్ఛంటే తమ మతగ్రంథం ఏమి చెపుతుందో దానిని ప్రకటించడం వరకే అవుతుందననీ, అవతలివారికి నచ్చచెప్పి అప్పటికి వారున్న విశ్వాసం సరైంది కాదనీ, తమ విశ్వాసంలోకి వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఆశనో, భయాన్నో కలిగించి మతాన్ని మార్చుకునేలా ప్రేరేపించడం కూడా మత ప్రచార స్వేచ్ఛ క్రిందకే వస్తుందా?

రాజ్యాంగం లక్షిస్తున్న దేశ అఖండత, సమైక్యత , సౌభ్రాతృత్వాలకు వేరుగా ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ పేరున గానీ, మత ప్రచార స్వేచ్ఛ పేరున గానీ దేశాన్ని విడగొట్టాలనీ మరియు మీతో కలిసి వుండము, వేరు పడతాము అనీ, మన మధ్య సౌభ్రాతృత్వం మాకు అంగీకారం కాదు అని గానీ బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? రాజ్యాంగబద్దం అవుతుందా? ఏయే మత గ్రంథాలు తాము శాసించిన ధర్మాధర్మ వ్యవస్థలో ఎట్టి మార్పులు చేయరాదని ప్రకటిస్తున్నాయో అవి రాజ్యాంగానుకూలతను కలిగివున్నట్లా? ప్రతికూలతను కలిగివున్నట్లా?

దీనికి రాజ్యాంగ సభలో అంబేద్కర్ సమాధానం చెప్పాడు. “ఒక కాలంలో చేసిన చట్టాలను మార్చుకునే హక్కు అనంతర కాలంలోని వారికి లేదని గాని ఎవరైనా అంటే ఈ భూమి శవాలకు మాత్రమే చెందుతుంది. సజీవులకు మాత్రం కాదు”. కనుక మార్పును అంగీకరించని ధర్మాధర్మాలను బోధించిన మతాలన్నీ ఆమేరకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవే. అలాంటి సందర్భాలు ఎదురుపడినపుడు ఆయా మత విశ్వాసులు వారి గ్రంథం చెప్పిన దానిని ప్రక్కన పెట్టి రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే.

మతాలతో ముడిపడివున్న ఈదేశంలోని ప్రజలు ఈ సూత్రాన్ని గనుక అంగీకరించకుంటే ఈదేశ ప్రజల మధ్య ఐక్యత గానీ, సోదరభావం గానీ నిలబడదు. సోదరభావనో, ఐకమత్యమో లేనినాడు వారు పరస్పరం సమానులమని తలంచడం గానీ, ఎదుటివారి స్వతంత్రతను అంగీకరించడం గానీ సాధ్యపడదు.

కులమతాలతో ముడిపెట్టుకుని వేరువేరు సముదాయాలుగా కూడివున్న ఈ దేశ ప్రజలు రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకోవాలంటే, వారి వారి విశ్వాస ప్రాతిపదికలోనే కుల మతాలకు అతీతంగా మనుషు లందరూ సమానులేనన్న స్పష్టమైన ఆదేశమైనా ఉండాలి. లేకుంటే ఆమేరకు ఆ సమూహం లోని వారు వారి మతాదేశాలను సడలించుకునైనా ఉండాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి కాక ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి. నేనూ ఆలోచిస్తాను.

వారంతట వారుగా సిద్ధపడాలంటే మాత్రం పై రెంటిలో ఏదో ఒక దాన్ని అనుసరించక తప్పదు. లేదా బాహ్య అదుపు రూపంలో విడితనాన్ని అనుసరించే అవకాశంలేని, కలిసి ఉండక తప్పని కట్టుబాటైనా (శాసనమైనా) పకడ్బందీగా అమలు జరుగుతూ ఉండాలి. నేనే అంశాన్ని ప్రస్తావించానో గమనించారా? నేనుద్దేశించిన ఆ బాహ్య అదుపు ఏ దేశ ప్రజల విషయంలోనైనా ఆ దేశ రాజ్యాంగమే అవుతుంది. రాజ్యాంగపు అమలు అన్నది అందుకొరకే ఏర్పరచుకున్న సివిల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ననుసరించి సాగుతుంటుంది. కనుక స్పష్టం కావలసిందేమిటంటే ప్రాధమిక మరియు శాసనిక హక్కులకు సంబంధించిన పరిమితులేమిటన్నదే.

ఈ దేశంలోని ఏ వ్యక్తికైనా విశృంఖలమైన హక్కులు ఉండవు. ఉండకూడదు కూడా. మన రాజ్యాంగం ప్రకారం ఆయా హక్కులకు సంబంధించిన పరిమితుల సాధారణ రూపం ఇదిగో ఇలా వుంటుంది.

1. నీవు చలాయించుకో జూస్తున్న హక్కు ఏదైనా సరే, మరొకరి హక్కులకు పతికూలమైంది కాకూడదు.

2. శాంతియుతంగా సాగిపోతున్న ప్రజా జీవనలలో కల్లోలాన్ని కలిగించేదిగా వుండకూడదు.

3. దేశ భద్రతకు అనుకూలం కానివిగా, హానికలిగించేవిగా వ్యక్తుల మాటలూ, చేతలూ ఉండరాదు. 

4. దేశ సార్వభౌమత్వానికీ, అఖండతకూ, సమైక్యతకూ ప్రతికూలంగా వ్యవహరించ కూడదు.

5. వ్యక్తులు తాము చేయవలసిన పనులు చేయకుండా గానీ, చేయకూడని పనులు చేసేలా గానీ పురికొల్పే (ప్రేరేపించే) భావాలను వ్యక్తీకరించటం భావప్రకటనా స్వేచ్ఛ లోనికిరాదు.

యోచనాశీలురైన మిత్రులారా!

ఈనాడు సమాజంలోని వ్యక్తులు, సంస్థలు కూడా అతిగా ఆర్టికల్ 19/1/ఏ ను ఉట్టంకిస్తూ, భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే మేమీ మాటలు మాట్లాడుతున్నాం. మాకిది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అనడం జరుగుతోంది.

నిజానికి స్వేచ్ఛ హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 19/1 లో…

ఎ) వాక్స్వాతంత్ర్యము, భావప్రకటనా స్వాతంత్ర్యము.

బి) ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యము.

సి) సంఘాలను స్థాపించుకునే స్వాతంత్ర్యము.

డి) భారతదేశమంతటా సంచరించే స్వాతంత్ర్యము.

ఇ) దేశంలో ఎక్కడైనా నివాసం ఏర్పరుచుకునే స్వేచ్చ.

ఎఫ్) తన ఇష్టమొచ్చిన బ్రతుకుదెరువును ఎంచుకునే స్వేచ్ఛ. అన్నవాటిని పేర్కొంది. ఈ అటుదరువాత 19/2 నుండి పై ఆరు అంశాలను దృష్టిలో పెట్టుకొని హేతుబద్ధమైన పరిమితులను విధిస్తోంది రాజ్యాంగం.

ఆ వివరాలు ఆర్టికల్ 19/2 నుండి 19/6 వరకు చెప్పబడి వున్నాయి.

19/2 దీనిలో 19/1/ఎ ప్రకారం సంక్రమించిన భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు సంబంధించిన పరిమితులున్నాయి.

19/3 ఇది 19/1/బి కి సంబంధించిన హక్కులకు పరిమితులను విధిస్తోంది.

19/4 ఇది 19/1/సికి చెందిన సంస్థలు స్థాపించుకోడానికి పరిమితులను తెలుపుతోంది.

19/5 ఇది 19/1/డి ద్వారా అందిన సంచరించే హక్కుకు పరిమితులు విధిస్తోంది. 

19/5 ఇది 19/1/2కి సంబంధించిన నివాసం ఏర్పరుచుకునే హక్కుకు పరిమితులను తెలుపుతుంది.

19/6 ఇది 19/1/ఎఫ్ ప్రకారం సంక్రమించిన బ్రతుకు దెరువు కున్న పరిమితులున్నాయి. 

వీటన్నింటిలోని సాధారాణాంశం వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన హక్కులేవైనా అదుపులేని హక్కులు, పరిమితిలేని హక్కులు కావు. అలాగే అది దేశ అఖండతకు, భద్రతకు, ప్రజా శాంతికి, భంగం కలిగించేది కాకూడదు. మర్యాద నతిక్రమించే రూపంలోనూ, అనైతికం అనడానికి తగినదిగానూ ఉండకూడదు. న్యాయస్థాన ధిక్కారంగానీ, పరువునష్టం కలిగించేదిగాగానీ, అపరాధమును ప్రేరేపించేదిగా గానీ ఉండరాదు. దేశ సుస్థిరతను భంగం కలిగించేదిగాను ఉండరాదు. ఇంత విస్తారమైన పరిమితులకు లోబడే స్వేచ్ఛా హక్కులు ఉంటాయి.

అలాగే మత స్వేచ్ఛ పేరునా ఈనాడు రకరకాల ధోరణులు కనపడుతున్నాయి. ఈ మత స్వేచ్ఛ అన్నదీ పరిమితులులేని స్వేచ్ఛ కాదు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కంటే అధికమైన , పరిమితులతో కూడిన స్వేచ్ఛగా వుంది. ఈ వివరాలు ఆర్టికల్ 25,26, 27,28 లలో ఉన్నాయి.

మిత్రులారా!

వీటి విషయమై అధ్యయనాంశంగా సమావేశాలు కావాలనుకున్నాము. ఈ నెల 29,30,31 తేదీలలో రాజ్యాంగం పీఠిక నుండి 51/ఎ వరకు అధ్యయనాంశంగా అనుకున్నాము. ఎంతో ప్రయోజనకరమైన ఈ సమావేశంలో పాల్గొని అవగాహనను పెంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పై సంచికలో మరిన్ని వివరాలు అందిస్తాము. (సశేషం).


సత్యాన్వేషణ మండలి వార్షికోత్సవాహ్వానం

“వివేకపథం” పాఠకులకూ, మరియు మండలితో పరిచయాలున్న మిత్రులకూ, సంస్థలకూ, యోచనాశీలురైన విజ్ఞులారా!

మనమంతా ఎవరి అవగాహననుసరించి వారు వివిధ జీవనశైలులు కలిగివుండి , సమాజంలో జీవిస్తున్న వాళ్ళమే. అయినా మనమంతా భారత రాజ్యాంగ నిర్దేశాలకు లోబడి భారతీయులుగా వుంటూనే వ్యక్తిగత ఇష్టాయిష్టాలననుసరించి జీవించే స్వేచ్ఛని, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటాము.

రాజ్యాంగ నిర్దేశిత పరిమితుల్ని అతిక్రమించి ప్రవర్తించే స్వేచ్చగానీ, స్వాతంత్ర్యం గానీ మనకై మనకు ఉండవు. పైగా ఉండకూడ దన్నంతవరకు మనమంతా ఏకాభిప్రాయము కలిగి వుండాల్సిందే. దీనినే డా. అంబేద్కర్ “రాజ్యాంగం కంటే రాజ్యాంగ విధేయత ముఖ్యమైనది అనన్నాడు”. జనం చాలా కాలం దానినంత కీలకమైందిగా పట్టించుకోకపోవటం వల్లనే, ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ సవరణ చేసుకొని ప్రాథమిక విధులు అన్న అధికరణాన్ని కూడా 51/ఎ అధికరణంగా రాజ్యాంగంలో పొందుపరచవలసి వచ్చింది. రాజ్యాంగ సవరణ 42లో 51/ఎ 1976 ఇది ఇందిరాగాంధి హయాంలో జరిగింది. తిరిగి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 51/ఎ లో 'కె' అన్న ఉపాంశాన్ని జతచేశారు.

గమనిక : హక్కులేకాదు, విధులూ ఉంటాయి ప్రతి పౌరునికీ అన్న నిజాన్ని చాలా కాలం తరువాత రాజ్యాంగంలో చేర్చినా, హక్కుల విషయంలో ఉన్నంత నిర్దిష్టత, న్యాయం కోరే వెసులుబాటు, ఈ ప్రాథమిక విధుల విషయంలో ప్రకటించ లేక పోయారు. కనుక ఈ విధుల విభాగం ఇప్పటికీ నైతిక విలువ, బాధ్యత అన్న దగ్గరకే పరిమితమైంది గానీ, నియంత్రణ, పర్యవేక్షణ కలిగి ఉండడం అన్న స్థితికి చేరనేలేదు. దాంతో అది ఉన్నా , లేనిదానితో సమానమైంది..

నిఘా పెట్టలేకపోవడం, విధులను పాటించలేదన్న దానిని నిర్ధారించి శిక్షించే పని చేయలేకపోవడం అన్న కారణాన విధులే లేకపోవటం జరగదు. విధులు అన్నవి తప్పక చేయవలసినవి అవుతాయి. ఈ అర్థం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండక్కరలేదు. అందులోనూ మొట్టమొదటి విధి, ఏర్పరచుకున్న ఒప్పందానికి రాజ్యాంగానికి బద్ధుడై ఉండటమన్నదే అవుతుంది.

హక్కులు - విధులు - బాధ్యతలు - కర్తవ్యాలు అన్న నాలుగు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకొని ఉండడం, వాటిని ఆ మేరకు ఆచరించడం అన్నది పౌర ధర్మం క్రిందకి వస్తుంది. ఇదంతా సక్రమంగా ఆచరణకు నోచుకోవాలంటే వాటి విషయంలో రాజ్యాంగం ఏమి చెపుతోందన్నది స్పష్టంగా తెలుసుకొని ఉండడం వినా గత్యంతరం లేదు.

ఆ దృష్టితోనే రేపటి మండలి వార్షికోత్సవంలో 'రాజ్యాంగము కనీస అవగాహన' అన్నది అధ్యయనాంశంగా ఎంపిక చేశాము. రాజ్యాంగం 1వ అధికరణ నుండి 51/ఎ వరకు జాగ్రత్తగా చదువుకొని రాగలిగితే, వాటిపై మరింత లోతైన విచారణ జరిపి సరైన, సరిపడినంత అవగాహన కలిగించుకొనే అవకాశం ఉంటుంది.

అందులోనూ రాజ్యాంగ ప్రధానాశయము (అంతిమ లక్ష్యము) అయిన సమానత్వ సాధనకు, అసమానత్వాన్ని తొలగించుకోడానికీ ఏయే అధికరణాలు, ఏయే అంశాలపై ఎలా దిశా నిర్దేశం చేస్తున్నాయో తెలుసుకోవడం కీలకమైన దవుతోంది. ముఖ్యంగా భావప్రకటనా స్వేచ్ఛతో ముడిపడిన ఆర్టికల్19/1 నుండి 19/6 వరకూ, మత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 25 నుండి 28 వరకు ప్రత్యేక పరిశీలన ఉంటుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశాలకు ఈ కబురందిన వారందరినీ రావలసిందిగా మండలి సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈ తేదీలు : 29, 30, 31 జనవరి 2022.

ముఖ్య ప్రకటన

సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు మండలి కేంద్ర కార్యాలయమైన ద్వారకుంటలో 2022, జనవరి 29,30,31 తేదీలలో జరుగుతాయి. ఈ సమావేశాలలో రాజ్యాంగము లోని పీఠిక నుండి 51(ఎ) అధికరణము వరకు అధ్యయనము చేసుకొని రావలసి ఉంటుంది. మండలి బాధ్యులే కాక, మిత్ర సంస్థల సభ్యులు సకాలంలో హాజరు కాగలరు. అలాగే స్నేహితులు, రాజ్యాంగంపై కనీస అవగాహన కలిగించుకోగోరే ఇతరులు ముందుగా తెలియపర్చి సమావేశానికి హాజరు కాగలరు. 

మీ అధ్యయనంలో మీరు గమనించిన పై అధికరణాల్లోని లోపాలను, దోషాలను, అర్ధంకాని విషయాలను నోట్ చేసుకొని రావలసి ఉంటుంది. అలానే ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడిందనటానికి రాజ్యాంగ విధివిధానాలలోనా లేదా అమలుపరిచే పాలకులలోనా లేక అనుసరించే పౌరులలోనా? ఎవరి (దేని) పాత్ర ఎంత? అన్న విషయాలపై లోతైన అవగాహనతో రాగలరు.

ఇట్లు: సత్యా న్వేషణ మండలి. సెల్:9848036063.


1 comment:

  1. భారతదేశంలో పుట్టి, నివసిస్తూ రాజ్యాంగాన్ని అంగీకరించని వారిపట్ల రాజ్యాంగ వైఖరి ఏమిటి?

    ReplyDelete