Monday, March 7, 2022

261 వివేకపథం మార్చి2022


 
                        ముస్తాక్ గారి విమర్శపై సురేంద్ర స్పందన

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

గత సంచికలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ దానికి సంబంధించిన కొన్ని వివరాలు మీ ముందుంచాను. ప్రమాదంలో పడడం విషయంలో మతం నిర్వహించిన, నిర్వహించ గల పాత్ర గురించి ఒకింత వివరంగానే వ్రాశాను. దానిపై మిత్రులు ముస్తాక్ అహ్మద్ గారు స్పందిస్తూ 24 పేజీల విమర్శనాత్మక లేఖ వ్రాసి, వివేకపథం ద్వారానే బహిరంగంగా చర్చించుదామనీ, అందుకు సిద్ధం కమ్మనీ సూచించారు. ఆ లేఖనూ, దానితో పాటు లోగడ మండలిలో జరిగిన సమావేశాలలో వారు వ్రాసి పంపిన పుస్తకాన్ని, వాట్సాప్ ద్వారా అందజేశారు, 24 పేజీల లేఖ మరియు ఆ పుస్తకం కలిపి 60 పేజీల నిడివితో ఉందాయన పంపింది.

ముస్తాక్ గారు! సత్యాసత్య విచారణకు మండలి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మీకు తెలుసు. మండలి తనదిగా ప్రకటించిన భావాలపై విచారణ చేయడానికి, విచారణలో తేలిన ప్రకారం తప్పులను తప్పులుగా, ఒప్పులను ఒప్పులుగా స్వీకరించి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడాకీ సిద్ధంగా ఉంటుంది. నేను గత 40 ఏండ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా మళ్ళా మళ్ళా ఈ ప్రకటన చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడూ అంటే మన మధ్య జరగనున్న విచారణ విషయంలోనూ ఆ మాటకు కట్టుబడి ఉంటాను. అయితే ఆ నియమాన్నిఅంగీకరిస్తున్నట్లు బహిరంగంగా మీరూ ఒక ప్రకటన చేయండి. ఎందుకంటే ఆ నియమం అందరూ పాటించవలసిందే కనుక.

ఇకపోతే, విచారణకు సంబంధించి అవసరమైన కొన్ని పద్ధతుల గురించీ ముందుగనే చెప్పుకుంటే తరువాత తరువాత విచారణలో ఆటంకాలు ఏర్పడకుండా ఉండడానికి పనికొస్తా యవి.

1. 20 పేజీలు, 30 పేజీల నిడివిలో మీరు మీ పక్షాన్ని ప్రకటిస్తుంటే ఆ మొత్తాన్ని  యథాతథంగా ప్రకటించి, దానిపై నా పక్షాన్ని వినిపించడానికి స్థలాభావం రీత్యా పత్రిక నిడివి సరిపోదు. ఉదాహరణకు మొన్నటి మీ 24 పేజీల లేఖను మండలి అనుసరించే పంచ ప్రశ్నా పద్ధతిని అనుసరించి పరిశీలించగా, అందులో మొత్తం 350కి పైగా అభిప్రాయా లున్నట్లు తేలింది. విచారణ పద్ధతి ననుసరించి ప్రతి అభిప్రాయాన్ని దేనికి దానినిగా విచారణకు లోను దాని సబబు, బేసబబుల్ని నిర్ధారించాల్సిందే. అలా చేసిన ఆ విచారణంతా కూడా పత్రికలోనే ప్రకటించాలంటే అదంతా ఒక గ్రంథమంత అవుతుంది.ప్రచురించడం ఇటు మాకూ ఇబ్బందే. దాన్నంతా చదవడం అటు పాఠకులకూ ఇబ్బందే అవుతుంది. పైగా ఆ రూపంలో సాగే విచారణ ఒక కొలిక్కి రావడానికి చాలాకాలం పడుతుంది కూడా. వ్యయభారమూ ఎక్కువే. 24 పుటలకే మాకు 6,7 వేల ఖర్చు వస్తోంది. ఇంకొన్ని పుటలు పెంచితే 10 వేల వరకు ఖర్చవుతుంది. కనుక ఆచరణ సాధ్యమైన, కాలహరణం కాని వీలైనంత త్వరగా ఒక ముగింపుకు రావడానికి అవకాశమున్న విధానాన్ని ఎంచుకోవడం వివేకవంత మవుతుంది.

అట్టి విధానం మనం ఇరువురమూ ముఖాముఖి కలసి విచారణ సాగించడమన్నదే.మన ఇరువురమే కూర్చుందామన్నా, ఎంపిక చేసుకున్న కొద్ది బృందంతో కూర్చుందామన్నా నా వైపు నుండి అభ్యంతరం లేదు. మొత్తం విచారణ ప్రక్రియంతా రికార్డు చేద్దాము. అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేద్దామన్నా సరే. ఈ విషయం వరకు మీరెలాగంటే అలానే చేద్దాము. పత్రిక ద్వారా బహిరంగ చర్చే చేద్దామన్నారు గనుక, ఇందుకు మీకు అభ్యంతరం ఉండనక్కర లేదనుకుంటాను. మరో మాట వాట్సాప్ ద్వారా మీరు పోస్టింగ్ పెట్టినప్పుడే, ఈ విషయం తెలుపుతూ నేను వాట్సాప్ ద్వారానే ప్రతి స్పందించాను. దానిలో విచారణకు నేను సిద్ధము. ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరం కలసి కూర్చుందామో చెప్పండి. సమాధానం మీ వైపు నుండే రావలసి ఉందని చెప్పాను. ఎందువల్లనో మీ నుండి ఇంత వరకు సమాధానం రాలేదు.

పాఠకులకు ఒకింత అవగాహన కలగడానికి వీలుగా మీ విమర్శనాత్మక లేఖలోని ప్రధాన ఆరోపణలను కొన్నింటిని సాధారణ రూపంలో ఇక్కడ రాస్తాను. వీనిలో మీరనని వాటిని ఏమైనా చెప్పాననిపిస్తే వాటిని ఎత్తి చూపించండి. సరిచేసుకునే విచారణమొదలెట్టుకుందాం.

1. మీ లేఖకు శీర్షికగా “ఘోర పక్షపాతం చూపుతున్న గొప్ప నిష్పక్షపాతి సురేంద్రబాబు” అని పేరు పెట్టారు.

2. చిన్నతనం నుండే సురేంద్ర ఇస్లాంపై విపరీతమైన ద్వేష భావం పెట్టుకునిఉన్నారు. దానికి బందీ అయిపోయారు.

3. ఖురాన్ పై ఆయన వెల్లడించిన అభిప్రాయాలకు ఆధారాలను ఒక్కటంటే ఒక్కటీ చూపించలేక పోయారు. ఖురాన్ పై ఆయన చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలే.

4. ఇస్లాంపై ఆయన వెల్లడించిన వన్నీ అసత్యాలే. ఖురాన్ అన్ని మతాలనూ, అన్య మతాలనూ సమానంగానే చూస్తుంది. ఇతర మతానుయాయులూ ముక్తి పొందుతారనిప్రకటించింది.

5. భారత రాజ్యాంగం సూచించిన మత స్వేచ్ఛా విధానానికి ఖురాన్ పూర్తిగా అనుగుణ్యతకలిగి ఉంది.

6.  గతంలో నిర్వహించిన చర్చా వేదికలోనూ సురేంద్ర మేము అడిగిన వాటికి ఎట్టి సమాధానమూ చెప్పలేదు. దాంతో వారి పక్షంలో పసలేదని ఆనాడే తేలిపోయింది.

7. ఖురాన్ మత విశ్వాస విషయంలో మనుషులకు పూర్తి స్వేచ్చ నిచ్చింది.

8. విదేశీ దండయాత్రల గురించి రాస్తూ, మహమ్మదీయుల గురించి సురేంద్ర రాసిందంతా  అసత్యమే.

9. బలవంతపు మతమార్పిడులూ, విగ్రహాల, దేవాలయాల విధ్వంసం అన్నది ఇస్లాం విశ్వాసంలో భాగంగా జరుగుతూ వచ్చాయన్నారు కదా! మహమ్మద్ ప్రవక్త రాకముందు కూడా పై మూడు రకాల దుర్మార్గాలు జరిగాయని మీరు ఒప్పుకుంటారా, లేదా? జరిగితే అవి ఏ మత విశ్వాసంలో భాగంగా జరిగాయి?

ముస్తాక్ గారూ! ఈ ప్రశ్న వరకు ఇక్కడే సమాధానం చెబుతాను. మీకూ, చదువరులకూ స్పష్టత వస్తుంది కనుక.

నా సమాధానం: ఆ మూడూ మహమ్మదుకు ముందు కూడా జరిగాయి. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగానే గ్రంథ ప్రజలే అట్టి పనులు చేశారని చెప్పగలం. గ్రంథ ప్రజలంటే ఖురాన్ ప్రకారం తౌరాతు, జబూరు, ఇంజీలు అన్న గ్రంథాల ప్రజలు అనే, మరింత సూటిగా చెప్పాలంటే, యూదులు, నసారాలు (క్రైస్తవులు) గ్రంథ ప్రజలవుతారు. పూర్వ గ్రంథాలన్నమాటకు ఖురాను నుండి ఇంతకంటే అదనపు సమాచారం నాకు తెలిసిలేదు. మీరు గాని ఉందని భావించితే అవిఏవో, ఆ వివరం ఎక్కడ ఉందో చూపండి. 

అయితే యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులను హింసించిన భాగంలో విగ్రహాలధ్వంసం ఉండదు. మీకూ విగ్రహాలు లేవు గనుక, కానీ అప్పటికే వారికి ఎదురైన వారిలో బహుదైవారాధకులూ, విగ్రహారాధకులూ ఉన్నారు గనుక. విగ్రహారాధన చేయకూడదన్నఆదేశం వారికీ ఉంది కనుక, వారూ ఆ విధ్వంసకాండ కొనసాగించారు. మీ ప్రశ్నకు నాసమాధానం ఇదే. ఇక్కడి వరకు నా సమాధానంలో ఏమి తప్పు ఉందో స్పష్టంగా ఒక ప్రకటన చేయండి ముందు.

10. కులమతాలను విడిచిన వాడే భారత పౌరుడు కాగలడు, అని సురేంద్రబాబు అంటున్నారు.

11. సురేంద్ర గారు ఖురాన్, బైబుల్ నే కాక గీత, ఉపనిషత్తులు, వేదాలను కూడా దైవగ్రంథాలుగా భావించరు. నేనైతే వాటన్నిటినీ దైవ గ్రంథాలుగా భావిస్తా.

12. ఎంతో నిష్పక్షపాతంగా ఉంటానని చెప్పుకునే మీరు అత్యంత దారుణమైన పక్షపాత వైఖరిని ఈ వ్యాసంలో కనబరిచారు. భారతీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడానికి ఏకైక కారణం ఒక్క ఖురాన్, బైబిలే అని నమ్మబలకడానికి యత్నించారు.

13. ఒకప్పుడు హిందూ ముస్లిముల మధ్య దూరాలు పెంచే ఏర్పాటువాద విషబీజాలు నాటింది బ్రిటిష్ వారు. ఇప్పుడు మీ లాంటి వారూ హిందూ, ముస్లింల మధ్య దూరాలు పెంచే పనికి పూనుకోవడం నాకైతే బహు ఆశ్చర్యకరం.

14. మీరు ముస్లిం వలస పాలకులను, బ్రిటీష్ దోపిడీదారులతో పోల్చేపని చేశారు. ఇది చరిత్రపై మీకు కనీసావగాహన లేదనడానికి రుజువుగా ఉంది.

15. ముస్లిముల గురించి కొద్దిపాటి మంచి చెప్పడానికి కూడా మీ మనసు అంగీకరించడం లేదు.

16. బహు దైవారాధన నేరమని ఖురానే కాదు, అన్ని గ్రంథాలు చెబుతున్నాయి.

17. బహు దైవారాధనను ఖండించడం వల్లనే మతపరమైన అసహనం, వ్యతిరేకతలుఏర్పడుతున్నాయని సురేంద్ర అంటున్నారు. అదే నిజమైతే భారతీయ ఇతిహాస - పురాణాలలో యుద్ధాలెందుకు జరిగాయో మీరే చెప్పాలి.

8. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా దౌర్జన్యానికీ, దురాక్రమణకూ, మారణకాండకూ పాల్పడితే, అది ముస్లిముల పనే అయి ఉంటుందన్న తప్పుడు నిర్ణయానికి మీరువచ్చేశా రనిపిస్తోంది.

19. ఇంటా బయటా జరుగుతున్న సకల గొడవలకు ఖురాన్, ముస్లింలే కారణమన్నరంగు నివ్వడమే మీ ఉద్దేశం.

20. బహు దైవారాధన ఖండిస్తున్న హిందూ గ్రంథాలూ ఎన్నో ఉండగా మీరు ఖురానునే ఎందుకు తప్పు పడుతున్నారు? ఇది పక్షపాతం కాదా?

21. సురేంద్ర గారు విగ్రహారాధన, బహు దైవారాధనల ఖండనవంటి సమస్యలను,కేవలం హిందూ, ముస్లింల సమస్యలు గానూ, వాటిని ఈ లోకంలో మొట్టమొదట సృష్టించిందిముస్లింలే నన్నట్లుగానూ చూపించే పని చేస్తున్నారు.

22. ఖురాన్ ఎటువంటి మతోన్మాద ప్రకటన చేయలేదు. మతోన్మాదమంటే "ముక్తి మార్గం, నావద్ద తప్ప ఎవరి వద్దా లేదు అన్న దృష్టి కలిగి ఉండడమే” ఖురానులో అట్టి ప్రకటనఒక్కటీ లేదు.

23. పైగా ముస్లిమేతరుల వద్ద సత్యమూ ఉంది, ధర్మమూ ఉంది, ఖురాను ప్రకారంఅది, ప్రాచీనమైన మరియు అనాదిగా వస్తున్న వైదిక ధర్మమే. ఖురాన్ దానినే ప్రకటిస్తోంది. 

24. మా వేద గ్రంథమే వాస్తవ ధార్మిక గ్రంథం. మీ ఖురాను అసలు దైవ గ్రంథమే కాదు అని ఎవరైనా అంటే, అతడు మతోన్మాదాన్ని ప్రదర్శించినట్లే, మిగిలిన గ్రంథాలకూఇదే సూత్రం వర్తిస్తుంది.

25. ఎవరైనా తనకు నచ్చిన విశ్వాసాన్ని స్వీకరించడం, నచ్చని వానిని తిరస్కరించడం అత్యంత సాధారణం. అలాగే ఖురాన్ కూడా సత్య విశ్వాసాన్ని స్వీకరించమనీ, అసత్యవిశ్వాసాలను తిరస్కరించమనీ తన అనుయాయులకు చెబుతోంది. ఇందులో ఆక్షేపించడానికేముంది.

26. తప్పుడు విశ్వాసాలను ఖండించడం విషయంలో మీరు ఒక్క ఖురానునే ఎందుకుతప్పు పడుతున్నారు. బైబిలు మరియు హిందూ గ్రంథాలూ ఆ పని చేశాయి కదా!

27. ఖురాన్ ప్రకారం సకల మానవ సముదాయాలూ దైవ ధర్మాన్నే కలిగి ఉన్నాయి.

28. ముస్లిమేతరుల విషయంలో ఖురాన్, మీ మీ ధర్మ గ్రంథాల ప్రకారమే ప్రవర్తించండి అని చెబుతోంది.

29. ఖురాను మత స్వేచ్ఛను ఇవ్వడం లేదన్నది, ఖురాన్ పై సురేంద్ర గారు చేసిన ఘోరమైన నిందారోపణ. అది ఖురాన్ పై మీకున్న దారుణమైన విద్వేషం కారణంగా పుట్టింది మాత్రమే.

30. ఖురాన్ దేవుని వద్ద నుండి వచ్చింది. ఇష్టమైన వారు దీనిని విశ్వసించ వచ్చు. లేకుంటే తిరస్కరించనూ వచ్చు.

31. ఇస్లాంలోకి రావాల్సిందే, దానినుండి బయటకు వెళ్ళరాదు. అని ఖురాను ఎవరినినిర్బంధించదు.

పాఠక మిత్రులకూ, ముస్తాక్ గారికీ!

ముస్తాక్ గారి విమర్శనాత్మక లేఖలోని “350” అభిప్రాయ ప్రకటనలల్లో ఎంపిక చేసికొన్న కొన్ని అభిప్రాయాలివి. ముందుగా ముస్తాక్ గారు వీటి వరకు ఇవన్నీ వారి లేఖలోని అభిప్రాయాలో, కాదో ఖరారు చేయాలి. కావాలనుకున్నవారు, ముస్తాక్ గారు వాట్సాప్ లోపెట్టిన ఆ లేఖ మొత్తాన్ని అందులోనే చూడండి. ముస్తాక్ గారి నంబర్ 9848516362. వారిని సంప్రదించి లింకును తీసుకోండి. సాంకేతిక పరిజ్ఞానం తగినంత ఉన్నవారెవరైనావారి లేఖను నా స్పందనతో కలిపి వీలైనంత ఎక్కువ మందికి పంపించండి.

ముస్తాక్ గారి విమర్శపై నా స్పందన క్లుప్త రూపంలో…

ముస్తాక్ గారూ! మీ 24 పేజీల విమర్శనాత్మక వ్యాసము నుండి అక్కడొకముక్కా అక్కడొకముక్కా ఎత్తి రాస్తేనే ఇంతైంది. కనుక మొత్తం విషయాలను వివేకపథం పత్రికలో చర్చించడం అనవసరపు కాలహరణకు, అధిక వ్యయ ప్రయాసలకు దారి తీస్తుంది. ఒక సూచన చేస్తాను. రాబోయే త్రైమాసిక సమావేశాలు ఎప్పటిలానే ఏప్రియల్ లో జరుగుతాయి. కనుక మీరు సరేనంటే, ఆ మూడు రోజులూ మీరూ నేనూ ప్రకటించిన అభిప్రాయాల పైనే విచారణను పెట్టుకుందాం. విచారణంతా వివేకపథం 260లోని నా భావాలు, దానిపై మీ విమర్శ లేఖలోని భావాల సత్యాసత్యాలేమిటన్న దానికి పరిమితమయ్యే సాగించుదాం.

ఎలాగూ బహిరంగంగా చర్చించుకుందాం అని మీరే అన్నారు గనుక, విచారణ వేదికలోఎవరున్నా పరవాలేదన్నట్లయింది. అయినా చర్చ నాణ్యత తగ్గకుండా ఉండేందుకు గాను, ఖురాన్, హదీసులలో తగినంత పరిచయం ఉన్న వారి వరకే కొందరిని ఎంపిక చేసుకుని, వారి వరకే ఆహ్వానాలు పంపుదాము. “వాస్తవాలు వెల్లడి కావాలి” అనేంతవరకు నా వరకు నాకు ఎట్టి అరమరికలూ లేవు. అలాగే నా అవగాహనలో ఏమైనా దోషాలుంటే చక్కజేసుకునే విషయంలోనూ నాకెట్టి గుంజులాటలూ లేవు.

ఆనాటి సమావేశానికి 260 సంచికలో నేను వెల్లడించిన అభిప్రాయాలన్నింటినీ వేటికవిగా విడదీసి మీరే రాసుకు రావాలి. మీ 24 పేజీల రచన విషయంలో నేనూ అదే పని చేస్తాను. దానికి సంబంధించి ఇప్పటికే మీకు కొంత సమాచారం అందించాను. మీ వ్యాసంలో 350 పైగా అభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్ని పరస్పరం దగ్గరగా పోలి ఉండవచ్చు. ఇప్పటికే వాటిని ఎత్తి వ్రాశాను. సమావేశం నాటికి గానీ, అంతకుముందే గానీ వాటిని పరస్పరం మార్పిడి చేసుకుందాం అనుకుంటే దానికి నిర్ణయించుకున్న తేదీ నాటికి వాటిని "డి.టి.పి” చేయించి పరస్పరం మార్పిడి చేసుకుందాము. అలా చేస్తే ఆ సమయానికి వాటిని మరింతగా పరిశీలించుకుని రావచ్చు.

గతంలో జరిగినవంటూ మీరు ప్రస్తావించిన వాటి పైనా విచారణ చేద్దాము. ఆనాటి సమావేశంలో మనం ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశానికి సంబంధించి మీరు మీ పక్షాన్ని పూర్తి సమాచారాన్ని పుస్తక రూపంలో అందించినట్లూ, నేను నా పక్షానికిచెందిన ఒక్క ఆధారాన్ని చూపనట్లు ఈనాటి మీ లేఖలో వ్రాశారు. దాని పైనా, ఆనాటి విచారణీయాంశంపై మీరు అందించిన పుస్తకం పైనా మూడు రోజులలో ఒక రోజు తగినంత సమయం ఇచ్చి పునర్విచారణ చేద్దాము.

మీ దృష్టిలో ఎవరెవరిని పిలిస్తే బాగుంటుందనుకుంటున్నారో చెప్పండి. అలాగే సమావేశవిషయంలో మీరింకేమైనా సూచనలు చేయదలచుకుంటే అవీ తెలియజేయండి. ఒక్క మాట!

ఈ దేశంలో హిందువులూ, ముస్లింలే కాదు, ఇతరేతర మత ధోరణుల వారూ కూడాకలిసి బ్రతకక తప్పదు. ఆ బ్రతుకేదో అనుకూల సంబంధాలతో, పరస్పరం సర్దుబాటు, సహకార వైఖరితో బ్రతక గలిగితే మంచిదన్నంత వరకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానము ఉన్నవారైనా చెబుతారు. అంగీకరిస్తారు. ఈ విషయంలో మన రాజ్యాంగం మరింత ఉన్నతంగా, విశాలంగా ఆలోచించి భారతీయులంతా పరస్పరం సోదరభావం కలిగి ఉండండి. అది మరింత మరింతగా ధృఢపడేందుకు వీలుగా ప్రవర్తిస్తూ ఉండండి. సమానత్వాన్ని సాధించుకోండి. సమష్టి అభివృద్ధికి అవసరమైన మరియూ ఇతరుల స్వేచ్ఛా స్వతంత్ర్యాలకు ఆటంకం కాని పరిమితులతో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించండి అనిమార్గనిర్దేశం చేసింది. ప్రజలంతా సమైక్యంగా ఉంటూ, దేశాన్ని అఖండంగా ఉంచుకోండంటూ లక్ష్య నిర్దేశమూ చేసింది. ఆ మార్గాన నడచి, ఆ లక్ష్యాన్ని చేరడానికి అనువైన విధి విధానాలతో కూడిన వ్యవస్థనూ అందించింది. రాజ్యాంగ పీఠికలోని మొదటి వాక్యం ఏమంటుందో గమనించండి.

“భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగ నిర్మించుకోడానికి సత్యనిష్ఠా పూర్వకముగ తీర్మానించుకోవడమైనది”.

గమనిక : పీఠిక చివరిలో ఉన్న “సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకుని” అన్నమాట, పీఠికలోని ప్రతి వాక్యానికీ అన్వయిస్తుంది. ఎలాగంటే, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుటకు సత్యనిష్టా పూర్వకముగ తీర్మానించుకుని, అంతస్తులలోనూ, అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకుని,ఇలాగన్నమాట…

ముస్తాక్ గారూ! మరియు పాఠక మిత్రులారా!

భారత రాజ్యాంగం మొత్తంలోకి “భారత దేశ పౌరులమగు మేము........సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకుని, మాకు మేము ఇచ్చుకున్నాము” అన్న మూడువాక్యాలూ తలమానికమైనవి. అందులో 'భారతదేశ పౌరులమగు మేము' అన్నమాట ఈదేశంలో సర్వోన్నతాధికారము (యాజమాన్యపు అధికారము) ప్రజలదే అని నిర్ధారిస్తోంది. పీఠికలో చెప్పుకున్న రీతిని ఆచరించడానికి, అమలు పరుచుకోవడానికీ సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకున్నాం అన్నది, దాని ఎడల మన వైఖరి ఎంతటి నిబద్ధతతో ఉండాలో తెలియజేస్తోంది. ‘మాకు మేము ఇచ్చుకున్నాము' అన్నది మా మీద ఇది ఎవరో రుద్దినదికాదు. ఇది మాకు మేమే నిర్దేశించుకున్న కట్టడి. అన్నది నిర్ణయాధికారం ప్రజలదేనని తేల్చిచెబుతోంది. మిత్రులారా! రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదమూ దేనికదే ఒక ఆణిముత్యమే. 

ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ, పీఠికలో చెప్పినట్లు సత్యనిష్టాపూర్వకముగ ప్రవర్తించినట్లయితే, ఈ దేశం సకల సంపదలతో కూడి ఎక్కువలో ఎక్కువ సుఖశాంతులను అనుభవించకలుగుతుంది. దేశంలోని వివిధ సాంప్రదాయాలకు చెందిన భావజాలాలేవైనా,ఈ ప్రవేశికలోని భావాలకు అనుగుణ్యత కలిగి ఉన్నంతవరకే అంగీకరించడానికీ,అనుసరించడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఆయా మత గ్రంథాలలోని భావజాలం రాజ్యాంగం విధించిన పరిధులను గనుకదాటినట్లయితే వాటి వాటి వరకు ప్రక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే, మనమంతా అనుసరించాల్సిందీ, అనుసరించక తప్పనిదీ కూడా భారత రాజ్యాంగాన్నే. రాజ్యాంగాన్నిమాత్రమే. దీని అర్థం ఏమిటో అర్థమవుతోందా? మనందరికీ వర్తించే ఆధునిక ధర్మశాస్త్రం భారత రాజ్యాంగ మేనన్నమాట.

మనుధర్మ శాస్త్రం లాటి హిందూ ధర్మ శాస్త్రాలను గానీ, బైబిలు ధర్మ శాస్త్రాన్ని గానీ,ఖురాను ధర్మ శాస్త్రాన్ని గానీ ప్రజలంతా అనుసరించాలన్న నిబంధనేమీ లేదు. భారత రాజ్యాంగాన్ని మాత్రం విధిగా అనుసరించి తీరాల్సిందే. ఆయా సాంప్రదాయాలకు చెందిన విశ్వాసులు రాజ్యాంగం విధించిన పరిమితులకు లోబడే వాటిని పాటించాలి. రాజ్యాంగాన్ని త్రోసిరాజనే వాటిని వేటినీ అనుసరించడానికి వీలులేదు. అట్టి వాటిని అవసరమైన మేర కుదించుకునో, సడలించుకునో అందరమూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే.

నేనిక్కడున్నాను. మిమ్ములనూ ఇక్కడకు రమ్మంటున్నాను. అందరూ ఇక్కడకు రావాల్సిందేనని అంటున్నాను. మనం ఇక్కడే ఉంటూ, మిగిలిన వారిని ఇక్కడకు రమ్మని చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని పైనా ఉందంటున్నాను. 

ఈ విషయాలపై ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. మాట్లాడాలని అనిపిస్తుంది. అయినా ,పత్రికా ముఖంగా అది సాధ్యపడదు. కనుక, కలసి కూర్చుని మాట్లాడుకుందాం రండంటున్నాను. సత్యాలను కనుగొందాం, స్వీకరిద్దాం, పదిమందికీ అందిద్దాం సిద్ధపడండంటున్నాను, నా ఈ ఆహ్వానం (పిలుపు) ముస్తాక్ గారికే కాదు, మీ అందరికీ కూడా అనంటున్నాను.

భారతీయ తాత్వికులు 'సత్యాన్నాస్తి పరోధర్మః' అనన్నారు. మీరు తలకెత్తుకున్న ఖురాను కూడా సత్య తిరస్కారివి కావద్దని పదే పదే చెపుతోంది. నా వరకు నేను సత్యతిరస్కారిని కాను. పైగా సత్యాన్వేషిణి కూడా. కాకుంటే ఏది సత్యమో తేలాలి. తేల్చుకోడానికి మనమంతా నూరుశాతం చిత్తశుద్ధితో సిద్ధం కావాలి. సత్యమని తేలిన వాటినెల్లా స్వీకరించడానికి సిద్ధంకావాలి.

నేనందుకు సిద్ధం. మీరూ సిద్ధపడ కలిగితే రండి, కూర్చుని సౌమనస్యంతోనే సత్యావిష్కరణకై పాటుపడదాం. ప్రస్తుతానికి ముస్తాక్ గారి సూచన మేరకు వారికీ, నాకూ మధ్య జరగనున్నచర్చా వేదికలో, రాజ్యాంగం పైనా, ఖురాన్ పైనా పట్టున్న వారెవరైనా పాల్గొనవచ్చునని నా వైపు నుండి అంగీకరిస్తున్నాను. విచారణంతా మేమిరువురం వివేకపథం260 సంచిక ఆధారంగా వెల్లడించిన అభిప్రాయాలకు పరిమితమై ఉంటుందన్నది గమనించండి.ఇదే విధంగా, మీరే తాత్విక ధోరణికి చెందినవారైనా పరవాలేదు. సత్యావిష్కరణ లక్ష్యంగా తత్వ విచారణకు సిద్ధపడే వాళ్ళదరికీ కూడా, రండి కూర్చుని మాట్లాడుకుందామని ఆహ్వానిస్తున్నాను.


ప్రమాదపుటంచుల్లో కాదు 

ప్రమాదపు అఖాతంలో - ప్రజాస్వామ్యం-2


75 ఏండ్ల క్రితం జరిగిన దేశ విభజనలో కొంతమంది ముస్లిములు ఇక్కడా, కొంతమంది హిందువులు అక్కడా అంటే ఈనాటి పాకిస్తాన్లో ఉండిపోయారు. ఇక్కడ నిలచిన వారంతా ఈ దేశంపై భక్తి వల్లనే ఇక్కడ ఉండిపోయారని గానీ, అక్కడి హిందువులు ఆదేశంపై భక్తి వల్లనే అక్కడ నిలిచిపోయారనీ చెప్పలేమని గత సంచికలో వ్రాశాను. దేశ విభజన మత ప్రాతిపదికనే జరిగిందన్నది చారిత్రక వాస్తవం. ఆ నాటికి దేశంలో ఉన్న మొత్తం ముస్లిములుఎందరు? అందులో తరలి వెళ్ళిన వారెందరు? ఇక్కడే ఉండి పోయిన వారి జనాభా ఈనాడు ఇక్కడ ఎంత? అన్న వివరాలు సేకరించాలి.

అలాగే ఆనాటికి పాకిస్తాన్ గా విడగొట్టబడిన ప్రాంతంలో నుండి ఇటు తరలివచ్చినవారెందరు? వారు కాక అక్కడే నిలిచి ఉన్న వారెందరు? అలా అక్కడే ఉన్నవారి ఆనాటి ఈనాటి జనాభా ఎంత? అన్న వివరాలు సేకరించాలి.

మత ప్రాతిపదికన విడిపోయిన (ఆవిర్భవించిన) పాకిస్థాన్ మత ప్రమేయం ఉన్న రాజ్యాంగాన్ని రూపొందించుకుందా? మత ప్రమేయం లేని రాజ్యాంగాన్నిరూపొందించుకుందా?

ఈ దేశంలో, ఈ 75 ఏండ్లలో ముస్లిములు హిందువులుగా మారిన వారెందరు? హిందువులు ముస్లిములుగ మారిన వారెందరు? పాకిస్థాన్లో ముస్లిములు హిందువులుగ మారిన వారెందరు? హిందువులు ముస్లిములుగా మారిన వారెందంరు? ఈ సంఖ్యలకుచెందిన వివరాలు వాస్తవా లాధారంగా సేకరించాలి.

సందర్భం వచ్చింది గనుక, మరో విషయాన్నీ పరిశీలనకు స్వీకరించాల్సి ఉంది.

  • విభజన నాటికి పాకిస్థాన్లో యూదులు గానీ, క్రైస్తవులు గానీ, ఇతర ధోరణులకుచెందిన విశ్వాసులు గానీ ఎంతమంది ఉన్నారు. ఈ నాటికి వారి జనాభా ఎంతెంత అక్కడి ముస్లిములు ఎవరైనా బైబిల్ విశ్వాసంలోకి మారారా? బైబిల్ విశ్వాసము నుండి ఇస్లాంలోకిగానీ, హైందవంలోకి గానీ మారారా? ఎంతమంది? ఈ వివరాలు సేకరించాలి.

  • ఒక్క ముస్లిం యువకుడు లేదా యువతి, ముస్లిమేతరులను వివాహం చేసుకోవడానికి అవతలివారు ఇస్లాం స్వీకరించక పోయినా పర్వాలేదు, వారి విశ్వాసాలలో వారుంటూనే వివాహ బంధంలో కొనసాగవచ్చు అని ఇస్లాం అంగీకరిస్తుందా? అంగీకరించదా?

  • ఒక ముస్లిమేతర యువతిని లేదా యువకుడ్ని వివాహమాడిన ఇస్లాం విశ్వాసి, తాను వివాహమాడిన వ్యక్తి విశ్వాసంలోకి మారిన దాఖలాలున్నాయా? ఉదాహరణకు ఒక హిందువును వివాహమాడిన ముస్లిం వ్యక్తి హిందూమతాన్ని స్వీకరించటం జరిగిందా? అలాజరగడానికి ఆ హిందూ విశ్వాసి ఆ ముస్లింను హిందువుగా మారితేనే మన వివాహంజరుగుతుంది, అన్న ఆంక్షను విధించిన సందర్భం ఉందా? అది కూడా ఆ హిందూ విశ్వాసి హైందవంలోని ఏ ధోరణికి చెందిన వాడో ఆ ధోరణికి ప్రమాణ గ్రంథం అలాటి ఆదేశం ఇచ్చి ఉంది, అనడానికి ఆధారం దొరుకుతుందా?

  • అదే మాదిరి ఒక బైబిలు విశ్వాసి యూదుడు (క్రైస్తవుడు) తాను వివాహమాడిన వ్యక్తికి చెందిన హిందూ మతంలోకి మారిన దాఖలాలున్నాయా? అలా జరగడానికి, ఆ హిందూ వ్యక్తి సాంప్రదాయ గ్రంధమే అలా మారితేనే వివాహం చేసుకోమని నిబంధన విధించినట్లు ఆధారాలున్నాయా?

  • ఒక మతం ఇతర మతాల వారితో తనను అనుసరించే వారిని ఎలా ప్రవర్తించమంటోంది? చరిత్రలో వారి వారి ప్రవర్తనలు ఎలాగున్నాయి? వాటి ఫలితాలుఎలాగున్నాయి? అన్న కోణాలనన్నింటినీ నిశితంగా పరిశీలిస్తేనే వాటిని గురించిన యథార్థ అవగాహన కలుగుతుంది అన్నంత వరకు గత సంచికలో సూత్ర ప్రాయంగా ప్రస్తావించాను. వీటికి సంబంధించిన వాస్తవాలను రాబట్టడానికి మనలో ఎవరమూ ఒక ప్రక్కకు వరగాల్సిన పనిలేదు. లాయర్ పాత్ర పోషించనక్కరలేదు. ఆయా మత గ్రంథాల ఆధారంగా ఇస్లాం, క్రైస్తవాలతో పోలిస్తే హైందవంలో ఇతర మతాలను, మత విశ్వాసులను సహించగలిగే లక్షణం ఎక్కువ అన్న నా మాటలు వాస్తవాలా? కాదా?

హిందూ అన్నమాటను కొంత విచారిద్దాం.

1. భారతీయ ప్రాచీన ఆస్తిక సాహిత్యంలో 'హిందు' అన్న శబ్దం కానరాదు. ఈ మాట ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి చాలా ప్రస్ఫుటంగా పేర్కొన్నాడు. మరికొందరు భారతీయ చింతకులూ ఇదే వైఖరిని కలిగి ఉన్నారు. వారన్నారని కాదు గానీ, ఆరు దర్శనాలు, 10 ఉపనిషత్తులు, భగవద్గీత అన్న పుస్తకాలలో 'హిందు' అన్నమాట లేదన్నది నిజం. 

ఇక్కడికి ఇది ఒక అంశం.

2. హిందూ మహాసముద్రము, హిందూ దేశము, హిందుస్థాన్ అన్న మాటలు ఏనాడుఆరంభమయ్యాయో గాని అధికారికంగానే వ్యవహారంలో వినియోగంలో ఉన్నాయి. ఇక్కడికిదిమరో నిజం .

3. చాలాకాలం వరకు 'హిందు' అన్న శబ్దం దేశాన్ని సూచించేది గానే, ఇతర దేశీయులు వాడినట్లు ఆయా రచనలాధారంగా ధృవీకరించవచ్చు. అయితే ఆ వినియోగం కూడాహిందువులుండే దేశం అన్న అర్థంలోనే వాడబడినట్లు కొందరు చారిత్రికులు వ్యాఖ్యానించడం జరుగుతోంది.

  మరొక వర్గం సింధూనదితో ముడిపడి ఉన్న ప్రాంతాన్ని హిందూ దేశంగా భావించినట్లూ చెప్పటం జరుగుతోంది. నాకు తెలిసి ఈ రెండు పక్షాలూ 'హిందు' అన్నమాటను ఒక దేశానికి ముడిపెట్టి వాడారు. మత సంబంధ విషయాలను ముడిపెట్టి చూస్తే వేదాలు, స్మృతులు, పురాణాలను ప్రమాణ గ్రంథాలుగా భావించిన బహు దైవారాధకులు నిర్వహిస్తూ వచ్చిన భూమినే హిందూ దేశంగా ప్రస్తావించినట్లు అనిపిస్తుంది.

భారతదేశం అన్న పేరు ఎలా వచ్చింది? అన్నదానికి ఇక్కడి గ్రంథాల ఆధారంగా చెప్పాలంటే, భరతుని కాలం నుండి ఈ దేశాన్ని భారతదేశంగా చెప్పుకున్నట్లు, చెప్పాల్సి వస్తుంది. భారతీయ ఆస్తిక సాంప్రదాయంలో సంకల్పం చెప్పుకునే ప్రక్రియలోనూ భరతఖండే, భరతవర్షే అన్న పదాలు చాలా ప్రసిద్ధంగా వాడుకలోకి వచ్చాయి. కనుక, భారత్ అనేమాట ఒక దేశానికి చెందిన పేరుగా వాడబడిందన్న మాట.

అంటే ఒక కాలంలో ఈ దేశాన్ని సూచించేదిగా 'హిందు' శబ్దమూ వాడబడింది. భారత్ అన్నదీ వాడబడింది అన్నమాట. అయితే ఈనాడు ఈ రెండు శబ్దాలూ కొంత గందరగోళానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా 'హిందు' అన్న శబ్దమే ఆ గందరగోళానికి కారణంగాఉంటోంది.

ఇక ప్రపంచ వ్యాపితంగా స్థిరంగా వినియోగంలోకి వచ్చిన పదం, ఇండియా. దీనికిసంబంధించిన వివరాలలోకి వెళితే సింధూ - హిందూ - ఇండస్ = ఇండియాగా రూపాంతరం చెందిందనే, ఈ విషయానికి చెందిన పరిశోధకులలో ఎక్కువమంది చెబుతున్నారు. మనవిచారణకు, వాటిని మరింత లోతుగా చూడాల్సిన అవసరం లేదు, గనుక దీనిని ఇక్కడకు ఆపుతాను. మనకు సంబంధించినంతలో ప్రస్తుతం.....

ప్రపంచమంతా ఈ దేశాన్ని ఇండియా అని గానీ, భారత్ అని గాని మాత్రమేపిలుస్తున్నాయి. 'హిందు' అన్నమాట దేశాన్ని ఉద్దేశిస్తూ వాడడం తగ్గిపోయింది. ఆర్.ఎస్.ఎస్ లాటి కొన్ని సంస్థలు, అలాటి భావాలే కలిగి ఉన్న వ్యక్తులు కొందరు మాత్రం ఇంకాహిందూ దేశం అన్న పదాన్ని వాడుతున్నారు. అలాంటి వారున్నూ హిందువుల దేశం కనుక, హిందూ దేశం అన్న అర్థంలోనే దీనిని వాడుతున్నారు. ఒక్క మాట!

'హిందూ దేశంలో ఉన్నవారు హిందువులు'. 'హిందువులు ఉన్న దేశం కనుక ఇది హిందూ దేశం' అన్నవి 'హిందూ దేశం' అన్న పదాన్ని వాడుతున్న వారిలో రెండు ధోరణులు. అవి పరస్పరం చాలా తేడా ఉన్న దృష్టి కోణాలు.

1. అక్కడున్న వారి కారణంగా దేశానికి పేరు వచ్చిందనాలంటే, హిందువులెవరో, వారికి ఆ పేరు ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చిందో చెప్పగలగాలి. వారిని బట్టి దేశానికి ఆ పేరు సంక్రమించిందన్నట్లు.

2. ముందీ దేశానికి హిందూ దేశం అన్న పేరు ఉంది. ఆ పేరు ఇదిగో, ఇందువల్లవచ్చింది. అందులో ఉన్న వారికి ఆ పేరున హిందువులు అన్నమాట సంక్రమించింది, అన్నది రెండో వైఖరి అన్నమాట. ఏదేమైనా ఈనాడు ప్రపంచ దేశాలన్నీ ఈ దేశాన్ని భారతదేశం అని గానీ, ఇండియా అని గానీ మాత్రమే వ్యవహరిస్తున్నాయి. ఇందులో ఉన్న వారు హిందువులు గనుక దీని పేరు హిందూదేశం అన్నది వినియోగంలో లేని అర్థమే. ఇండస్ ఇండియా అన్నదీ, 'హిందు' అన్నది 'సింధు' అన్న పదం యొక్క అపభ్రంశ రూపాలే నన్నది ఎక్కువమంది చారిత్రికుల అభిప్రాయం. దీనిని కాదనదలుచుకున్న వారు సరైన ఆధారాలతో తమ వాదాన్ని ప్రకటించే హక్కు కలిగి ఉన్నప్పటికీ, అట్టి ఆధారాలు చూపగలిగినప్పుడే, ఆవాదానికి బలం వస్తుంది. అంతవరకు అది ఎవరో కొద్ది మంది అనుకుంటున్న అభిప్రాయంమాత్రమే. ఇక వాదాలనాపి వాస్తవంలోకి వస్తాను.

మనమందరం తప్పనిసరిగా అంగీకరించి, అనుసరించాల్సింది మన రాజ్యాంగాన్నే. అవసరమైన సవరణలు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు అప్పటికి ఉన్న రూపంలోనే రాజ్యాంగాన్ని అంగీకరించుకుంటూ వ్యవహారాలను నడుపుకుంటుండాల్సిందే. ఇది నిర్వివాదం. అనుల్లంఘనీయము కూడా. దాని ప్రకారం 'హిందు' అన్న పదాన్ని రాజ్యాంగం ఏ అర్థంలో వాడుతుందో చూడాలి. రాజ్యాంగం ప్రకారం 'హిందు' అన్న శబ్దం మత సంబంధమైన అర్థంలోనే వినియోగమవుతోంది. నేషన్ - నేషనాలిటీ, సిటిజన్ అన్నదానికి సమానార్ధకంగా 'హిందు' శబ్దం వాడబడడం లేదు. వాటికి సమానార్ధకంగా భారత్, భారతీయత, భారతీయుడు, భారత పౌరసత్వం అన్న పదాలే వాడుకలో ఉన్నాయి. హిందూ పౌరుడు అని గానీ, హిందూ జాతీయుడు అని గానీ, హైందవీయత అని గానీ ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ అధికారిక వ్యవహారాలలోనూ మతానికి ప్రతీకగానే 'హిందు' శబ్దం వినియోగంలో ఉంది. కనుక ఈ రెండు పదాల వాడకాన్ని కలగాపులగం చేయకుండా, నిర్దిష్టార్థంలో వాడుకోవడమే సరైనది.

రాజ్యాంగం ప్రకారం మనమంతా కులం, మతం, ప్రాంతం అన్న వాటితో సంబంధం లేకుండా అందరం భారతీయులం. ఆంగ్లంలో ఇండియన్లం 'హిందు' శబ్దం అన్ని మతాల వారికి కలిపి వాడడం కుదరదు. కనుక దేశీయులంగా మనమంతా, అంటే ఈనాటి జనాభాననుసరించి 140 కోట్ల మందిమి భారతీయులం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అంతర్గత జాతుల్ని బట్టి (వర్ణాలను బట్టి) వారి మధ్య వ్యత్యాసాలను చూపరాదు. అందరూ సమానులే. సమాన హక్కుదారులే. సమానంగా బాధ్యులే. ఈ మూల భావనకులోబడే మిగిలిన వ్యవహారాలన్నీ నడుస్తుండాలి.

కనుక 'హిందు' అన్న శబ్దం, బైబిలు, ఖురాను గ్రంథాలకు చెందిన మత విశ్వాసాలకు చెందిన వారిని మినహాయించి, ఆ రెండు ధోరణుల వారూ, ఈ దేశానికి రాకముందు నుండీ ఈ దేశంలో జీవిస్తున్న వివిధ తాత్విక ధోరణుల వారందరినీ ఉద్దేశించి వాడుకోగల సామాన్య పదమవుతోంది. రాజ్యాంగమూ ఆ అర్థంలోనే వాడింది కూడా. కనుకనే ఈదేశంలోని బహుదైవారాధకుల్నే కాక, బైబిలు, ఖురాను విశ్వాసులను మినహాయించి బౌద్ధ, జైన, సిక్కు సాంప్రదాయాల వారినీ హిందువులుగనే పరిగణించింది. 

మనం చేయబోయే విచారణ విషయంలో 'హిందు' శబ్దం వాడేటప్పుడు ఈ అవగాహనకలిగి ఉండడం, అంగీకరించి ఉండడం చాలా అవసరం. కనుక ఈ దేశ పౌరులను భారతీయులు అనడమే సరైంది. హిందువులు అనడం సరైంది కాదు. ఇది నా అవగాహన, నా పక్షం. ఈ విషయంలో ముస్తాక్ గారి పక్షమేమిటో తెలియాలి. నాతో విభేదించే వారు ,ఎవరైనా ఉంటే వారి పక్షమేమిటో ప్రకటించాలి.

నిజానికి హిందూ మతమంటూ ఒకటి లేదు. ఏకేశ్వరారాధన మొదలు, లెక్కకు మిక్కిలిగా ఉన్న దేశీయమైన వివిధ దైవారాధనల సమష్టికి (సమాహారానికి) పెట్టిన పేరే హిందూమతం అన్నది. రాజ్యాంగానికి అవసరమైన వివరణలిచ్చే స్థానంలో ఉన్న భారత సర్వోన్నతన్యాయస్థానం కూడా ఈ రకమైన వివరణే ఇచ్చింది. మత సంబంధంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నా, ఇప్పటికి ఆగుతాను.

'కులం' ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడడానికి అది నిర్వహించిన పాత్ర

'ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది' అన్న విషయాన్ని విపులంగా విచారించుకునేసందర్భంలో ఎలా మతాన్ని గురించి ప్రస్తావించుకోవడం తప్పనిసరో, అలానే కులాన్ని గురించిఅది నిర్వహించిన ప్రమాదకర పాత్రను గురించి విచారించుకోవడమూ తప్పనిసరే నన్నది నా అభిప్రాయము.

సమానత్వాన్ని భావించండి, నెలకొల్పుకోండి అన్నదే రాజ్యాంగ హృదయాకాంక్ష.

సమానత్వాన్ని అంగీకరించని స్వభావం గల వ్యవస్థల్లో కుల వ్యవస్థంత బలమైంది మరొకటి లేదు. మతమూ అసమానత్వ స్వభావం కలిగిందే. అయినా అది మార్చుకోటానికి వీలైనది. పుట్టుక నుండి అంటించబడిందైనా, మధ్యలో పట్టించుకున్నదైనా, మతం మారడానికిఅవకాశం ఉంది. కానీ కులం అలా కాదు. పుట్టుకతో వస్తుంది. చచ్చేదాకా ఉంటుంది. ఒక కులంలో పుట్టి మరొక కులంలోకి మారడానికి అవకాశం లేనిది. దాని నిర్మాణంలోనే అసమానతల దొంతర స్వభావం కలిగి ఉంది. అత్యున్నత కులము, అతి నికృష్ణ కులము అనబడినవి తప్ప మిగిలిన కులాలన్నీ తనకు క్రిందా, తన పైనా మరికొన్ని కులాలుండేలా ఏర్పడ్డ అసమానతల వ్యవస్థ అది.

మనిషిగా పుట్టిన వారిలోనే ఒకరిని దైవంతో సమానంగానూ, మరొకరిని జంతువులకంటే హీనంగానూ పరిగణించే లక్షణాన్ని కలిగివున్న వ్యవస్థ అది. ఈ అసమానతల వ్యవస్థ ఈ దేశంలో రెండు పేర్లతో, రెండు రకాల అన్వయ వివరణలతో చెప్పబడింది. దీనిలోఅత్యంత ప్రాచీనమైనది 'వర్ణ వ్యవస్థ'. దీనిలోనూ 'ఆర్యాః త్రైవర్ణికాః.” అంటూ మూడే వర్ణాలనే, చాతుర్వర్ణ్యం అంటే వర్ణాలు నాలుగనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్రులంటూ వర్ణాలు 5 అని చెప్పే మూడు రకాల సూత్రీకరణలూ ఉన్నాయి.

ఈ వర్ణవ్యవస్థను వివరించే వారిలో, వర్ణం పుట్టుక నుండే సంక్రమిస్తుందని, చనిపోయే వరకు ఉంటుందని చెప్పేవారూ, వర్ణం పుట్టుక నుండీ రాదనీ, పుట్టుక అతని గుణకర్మల ననుసరించి ఏర్పడుతూ ఉంటుందని చెప్పేవారూ, ప్రతి వ్యక్తి ఆయా పనులు చేసేటప్పుడు ఆయా వర్ణ స్వభావం కలిగి ఉంటాడని చెప్పేవారూ ఉన్నారు. అంటే, 

1. పుట్టింది లగాయతు ఆ జీవితం ఒకే వర్ణం వాడుగా ఉంటాడు. దీనిలో అతణ్ణి కన్నవారి వర్ణమే అది అవుతుంది.

2. అతణ్ణి కన్నవా రేవర్ణం వారైనా, ఇతని గుణ క్రియల ననుసరించి వర్ణం ఏర్పడుతుంది. అంటే ఈ లెక్కన ఒక కుటుంబంలోనే అనేక వర్ణాల వారుండవచ్చన్నమాట.

3. మరో వివరణ మరింత విచిత్రమైనది. అత డేవర్ణం వారిలో పుట్టినా, తన జీవితంలో కొంతసేపు బ్రాహ్మణుడిగా, మరి కొంతసేపు క్షత్రియుడిగా, ఇలా ఐదు రకాలుగా అంటే, ఐదవదైన అంటరాని వాడుగా కూడా పరిగణింపబడతాడన్న మాట.

ఎవరెన్ని చెప్పినా, అమలయ్యింది మాత్రం పుట్టుకతోనే వర్ణం సంక్రమిస్తుంది, చచ్చేవరకుఅదే ఉంటుంది అన్న సూత్రీకరణే.

ఈనాడు మనం 'కులం' పేరున చెబుతున్న వ్యవస్థ కూడా ఈ సూత్రీకరణకు సరిపోయేది గానే ఉంది. ఈనాడు ఈ అంతరాల దొంతరల వ్యవస్థ వర్ణం పేరున కాకుండా, కులం పేరునే ప్రాచుర్యంలోనూ, ఆచరణ రూపంలోనూ ఉంది. శూద్రుడు, బ్రాహ్మణుడు కావచ్చు. బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చు లాటి అర్ధాన్నిచ్చే శ్లోకాలు అక్కడక్కడా ఉన్నా అవన్నీ కులాన్ని మార్చుకోవచ్చు అనడానికి సరిపడేవి కాదు. అట్టి అసాధారణ ప్రవర్తనలు కలిగిన వాళ్ళు, వారు ఒక వర్ణంలో పుట్టినా, మరో వర్ణం వారితో సమానులుగ చూడబడతారన్నంత వరకే ఆచరణలో ఉంది గానీ, పుట్టినప్పటి వర్ణాన్ని కోల్పోయి మరో వర్ణాన్ని పొందుతాడన్న అర్థంలో అమలు కాలేదు.

మిత్రులారా! మనం ఎంచుకున్న విచారణీయాంశాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈవివరణంతా ఎంతో కొంత అవసరమవుతుంది. కనుకనే ఈ సమాచారం మీ ముందుంచాను. మరొక విషయాన్ని గమనికలో ఉంచుకుంటే దీనికి సంబంధించినంత వరకు స్పష్టత ఏర్పడుతుంది. 

విద్యా విషయంలో వర్ణవ్యవస్థనంగీకరించే వారిలోనే రెండు ధోరణుల వారున్నారు. కొందరు స్త్రీలు, శూద్రులు, అతి శూద్రులు విద్యకు అర్హులు కారు. ఉపనయన సంస్కారానికి అర్హులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులన్న మూడు వర్ణాల వారికే విద్యాధికారం ఉంది, అన్న ధోరణి కలిగి ఉండగా, మరి కొందరు విద్యకు అతి శూద్రులతో సహా అందరూ అర్హులే అన్న దృష్టి కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి ఈ ధోరణిని గట్టిగా ప్రచారం చేసి, ఆచరణలో పెట్టడానికి పూనుకున్నాడు. విద్యను కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఉపనయనం చేసి విద్యను అందించే పని చేశాడాయన. సమకాలీన సమాజంలో విద్యా విషయంగా ఉన్న అసమానతలను తొలగించడానికి సిద్ధపడ్డ ఆయనను ఈ ఒక్క కారణంగానే గొప్ప సంస్కర్తగా చెప్పితీరాలి. ఒకరకంగా, అసమానతలను తొలగించి, సమానత్వాన్ని స్థాపించే పనికి పూనుకున్నాడన్నమాట. సమానత్వం దిశగా అడుగులు వేసిన, వేయించిన అట్టి వారెవరైనా, ఇతరేతర విషయాలలో వారికీ మనకు ఎన్నిఅభిప్రాయ భేదాలున్నా, వారంతా మనలాటి వారికి స్ఫూర్తి ప్రదాతలే నన్నది నా అభిప్రాయం.

ఒక్క సూత్రం గుర్తుంచుకోండి, అనుచితమైన అసమానతలను తొలగించుకోడానికి, ఉచితమైన అసమానతలను స్వీకరించడానికి నిరంతరం సన్నద్ధంగా ఉండడమే విజ్ఞులనుసరించదగిన విధానం అవుతుంది.

 ఇక కులం దగ్గరకు వస్తాను. వెనుక ఏదో ఒక కాలంలో పైన చెప్పుకున్న మూడే వర్ణాలు, నాలుగే వర్ణాలు అన్న వ్యవస్థ అమలయ్యిందో లేదో గానీ, మనుధర్మ శాస్త్రం అధికారికంగా అమలులోకి వచ్చిన నాటి నుండీ, ఈనాటి వరకు అమలవుతూ వచ్చింది, పుట్టుకతో సంక్రమించే వందల కులాల వ్యవస్థే నన్నది చారిత్రక వాస్తవం. ఈ నిజాన్ని రాజ్యాంగ నిర్మాతలూ గమనించారు గనుకనే కులాల ఉనికిని అంగీకరించారు. రాజ్యాంగంలోనూ కులం ఉంది అన్న సూత్రీకరణ చేశారు. అయితే కుల పరంగా అప్పటివరకూ, సాగుతూ వచ్చిన అసమానతలు, వివక్షత, ఇకనుండి ఉండకూడదు అంటూ అందుకు తగిన అధికరణాలను (సూత్రీకరణలను) రాజ్యాంగంలో పొందుపరచారు. అంతటితో ఆగక అప్పటివరకు అసమానతల దొంతరలతో స్థిరపడిపోయిన, అమానుషమన దగ్గ స్థాయిలో నిమ్నోన్నతాలు నెలకొని ఉన్న అంతరాలను తొలగించటానికి, అణచివేయబడిన వెనుకబడిన కులాల వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవలసిన అవసరాన్ని గమనించి రిజర్వేషన్లవ్యవస్థను ఏర్పరిచారు.

మిత్రులారా! ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న దానిని అర్థం చేసుకోడానికి ఈ వివరణంతా అవసరమా అని మీలో కొందరికి అనిపిస్తుండవచ్చు. అవగాహనలో స్పష్టతరావడానికీ, స్థిరత్వం రావడానికీ ఇదంతా అవసరమేనన్నది నా అభిప్రాయం. నిజానికి మరింతగా చెప్పినా తప్పు కాదు. 

డాక్టర్ అంబేద్కర్ సమాజంలో కులం నెలకొల్పిన అమానుషమైన అసమానత్వాన్ని స్వీయ జీవితానుభవం లోనూ చవిచూశాడు. సమాజాన్ని నిశితంగా పట్టి చూసీ అర్థం చేసుకున్నాడు, గతం తాలూకు చారిత్రక గ్రంథాల అధ్యయనం ద్వారానూ గమనించాడు. కనుకనే కుల వ్యవస్థ అనే కట్టడం దుర్భేద్యమైనదని ప్రకటించాడు. అతని దృష్టిలో మతపరమైన అసమానతలు అంత ప్రమాదకరమైనవి కావు. కులపరమైన అసమానతలే మరింత ప్రమాద కరమైనవి. అమానుషమైనవి. మనిషిని జంతువు కంటేనూ హీనంగా పరిగణించినవి. కనుకనే కుల నిర్మూలన జరక్కుండా సమానత్వ సాధన అసాధ్యం, అనూహ్యం అని అనేశాడు. వారెవరో అన్నారని కాదు గానీ, ఈనాటికీ అంటే గత 75 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అమలు కానీకుండా అడ్డుపడుతున్న, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేసిన బలమైన కారణాలలో కులాన్నే ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అసమానతలు పోకుండా అడ్డుపడే విషయంలో కులానికున్న బలం; మతం బలం కంటే చాలా ఎక్కువ. ప్రజాస్వామ్యాన్ని అమలు కాకుండా అడ్డుకునే వాటిలో రెండూ ముఖ్యమైనవే. తొలినాళ్ళలో కుల పరమైన అసమానతలను చూపించే అణచివేతకు గురైన జనాలను తమ మతంలోకి ఆకర్షించగలిగినక్రైస్తవం కూడా క్రమక్రమంగా కుల కాటుకు గురైంది. ఈనాడు శుద్ద క్రైస్తవులు అత్యల్పం. కులగజ్జితో కూడిన క్రైస్తవులే ఎక్కువ. బ్రాహ్మణ క్రైస్తవులు, రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ,వైశ్య క్రైస్తవులూ తయారైనారు. అది అంతటితో ఆగకుండా, వీరికి వేరుగానే ఇప్పటికీ మాల, మాదిగ, కుమ్మరి, మంగలి క్రైస్తవులూ ఎవరికి వారుగానే కొనసాగుతున్నారు. బ్రాహ్మణ క్రైస్తవుడు మాల, మాదిగ క్రైస్తవులను కులవివక్ష విషయంలో వెనుకటిలానే ప్రవర్తిస్తున్నాడు.

ఈ కుల జబ్బు క్రైస్తవులకే కాదు ముస్లింలకూ కొంతవరకు సోకింది. వారిలోనూ ఆయా ఇంటి పేర్లను బట్టి, స్థాయి భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దూదేకుల కులానికి చెందిన ఇస్లాం స్వీకరించిన వారు దిగువ స్థాయి ముస్లిములుగనే చూడబడుతున్నారట.

ఇలా క్రైస్తవ, ఇస్లాం మతాలు మూలంలో కులం లేనివై యుండి కులం ఉన్న వారిని తమ మతంలోకి చేర్చుకుని కులపు రోగాన్ని పోగొట్టాల్సింది పోయి, అవే కులగజ్జిని అంటించుకున్నాయి. అందుకునే సమానత్వ సాధనకు అడ్డుపడే విషయంలో మతం కంటే కుల వ్యవస్థే బలమైన అడ్డుగోడగా ఉందని అన్నాను.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకోడానికి ఎంచుకున్న గణతంత్రవ్యవస్థకు మూలం ఎన్నికలే కదా ఎన్నికల ద్వారా మాత్రమే మనం మన ప్రతినిధుల గణాన్ని ఎంపిక చేసుకుని, పాలనాధికారాన్ని వారికి దఖలుపరుస్తున్నాం. ఎంతో కీలకమైన ఆ ఎన్నికలు గాని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగితే, ఆ పరోక్ష ప్రజాస్వామ్యం :కూడా నామమాత్రంగా మారిపోతుంది. 

నిజానికి పరోక్ష ప్రజాస్వామ్యమన్నది దాని స్వభావాన్ని బట్టే అసలైన ప్రజాస్వామ్యం అనడానికి తగింది కాదు. ఎలాగంటే 140 కోట్ల మందికి ప్రతినిధులుగా 545 మందిసమూహం దేశాన్ని పాలిస్తున్నారన్నమాట. పట్టి చూస్తే, వినడానికే విడ్డూరంగా ఉన్నా, ఇదే ఇప్పటివరకు ప్రజాస్వామ్యం పేరిట అమలవుతోంది.

ఈనాడు దేశమంతా పార్టీల పేరునే ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలే అధికారాన్ని చేపడుతున్నాయి. ఆ పార్టీలలో ఎక్కువ భాగం, మత ప్రధానమైన పార్టీలుగనో, కుల ప్రధానమైనపార్టీలుగనో తీరి కూర్చున్నాయి. కులమో, మతమో ప్రధానంగా ఉంటున్నాయే గాని, అట్టివాటిలో కులము, మతం కూడా ఓటరును ప్రభావితం చేయడమే జరుగుతోంది.

మాటవరసకు ఓటరును అతిగా ప్రభావితం చేస్తున్న కులాన్ని, మతాన్ని లేకుండా చేసి, మిగిలిన అవలక్షణా లన్నింటినీ అలాగే ఉండనిస్తే అంటే ప్రాంతము, వర్గం, డబ్బు, మద్యం,అస్మదీయులు, తస్మదీయులు లాటి వాటి ప్రభావాన్ని అలాగే ఉండనిచ్చి ఎన్నికలు నిర్వహిస్తేవాటి తీరు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. 

ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ కుల, మత ప్రాతిపదికనే సామాజిక సమీకరణాలు రూపొందించుకొని, తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. ఆయా కుల సంఘాలున్నూ, మా కులం జనాభా ఇంత, దాని నిష్పత్తి ఇంత. కనుక ఏ పార్టీ అయినా మాకు రావలసినన్ని సీట్లు మాకు కేటాయించాల్సిందే నంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాయి. అవి జాతీయ స్థాయి పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా కులాల, మతాల ఓటర్ల  సంఖ్యననుసరించే అభ్యర్థులను ఎంపిక చేయడం, గెలిస్తే ఆ దామాషా ప్రకారమే ఆయా పదవులను కట్టబెట్టడం చేస్తున్నాయి. ఏమి చెబుతున్నానో అర్ధమవుతోందా? ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకొనే విషయంలో గానీ, ఆయా పథకాలను అమలు చేసే విషయంలో గానీ, సమన్యాయాన్ని పాటించాలన్న నియమం గానీ, వివక్షా రహితంగా ప్రవర్తించాలన్న నియమం గానీపట్టించుకున్న పాపాన పోవడం లేదు. వ్యవహారమంతా స్వపర భేదాలతోటె, స్వార్థ ప్రయోజనాల: తోటె ఆచరణలో ఉంటుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందనడానికి ఇంతకంటే దాఖలా ఏది కావాలి?

ఇక ప్రజాస్వామ్యం రాజ్యాంగం సూచించిన రీతిలో అమలు కాకుండా అడ్డుపడుతున్నవాటిలో మూడవది ప్రాంతీయతత్వం. రాజ్యాంగం మనకు నిర్దేశించిన లక్ష్యాలలో దేశాన్ని సమైక్యంగా, అఖండంగా నిలిపి ఉంచుకోవడమూ ఒకటి. నిజానికి రాజ్యాంగం మనకు నిర్దేశించిన అనడం కంటే రాజ్యాంగం రూపంలో మనకు మనం నిర్దేశించుకున్న అనడమే సరైనది. ఈ దేశ ప్రజలను సమైక్యంగా ఉండనీయకుండా, దేశాన్ని అఖండంగా ఉండనీయకుండా చేయడానికి ఉద్దేశించిన ఏ ప్రయత్నమైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవే. అట్టివన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే వాటి క్రిందకే వస్తాయి. ఎలా మతమూ, కులమూ సమానత్వాన్ని అంగీకరించవో అలాగే ప్రాంతీయతత్వమూ సమానత్వాన్నిఅంగీకరించదు. ప్రాంతీయతత్వపు ఆచరణ రూపం చాలా విస్తృతమైనది. అవగాహన కొరకు కొద్దిపాటి వివరాలు మీ దృష్టికి తెస్తాను. ఈ దేశంలో ప్రాంతీయతత్వం వివిధ రూపాలలో వ్యవహరిస్తోంది. 1. ఔత్తరాహికులు, దాక్షిణాత్యులు; 2.తన రాష్ట్రము - అన్య రాష్ట్రములు 3.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఎ) ఉత్తరాంధ్ర, బి) రాయలసీమ,సి) పల్నాడు, డి) కోస్తా జిల్లాలు ఇలాగన్నమాట. 4. జిల్లాలలో తమతమ నియోజక వర్గాలు - ఇతర నియోజకవర్గాలు 5.మండలాలలో తమ గ్రామము, ఇతర గ్రామాలు, 6. నగరాలు, మున్సిపాలిటీలలో తమ తమ వార్డులు, డివిజన్లు, 7. తమ గ్రామాలలో వార్డు/వీధి, ఇతర వార్డులు / వీధులు ఇలా అసమాన దృష్టికి కారణం కాగలవన్నీ ఈ ప్రాంతీయ అసమానతల క్రిందికే వస్తాయి.

ఇలాంటి వన్నీ రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వ సాధనకు, సమన్యాయం అమలుకావడానికి ఆటంకాలుగా తయారవుతాయి. తయారయ్యాయి కూడా. ఇక ఎన్నికల సందర్భంలోనైతే ఈ ప్రాంతీయ తత్వం యోగ్యుడైన వ్యక్తిని ఎంచుకోనీకుండా ఓటర్లను బలంగా ప్రభావితం చేస్తూ వస్తోంది. ఆయా పార్టీల వారూ అభ్యర్థులు కూడా ఈ ప్రాంతీయతత్వాన్ని వాడుకుని, ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయకుండా వారిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. మన ఊరి వాడు, మన మండలం వాడు, మన జిల్లా వాడు, మన రాష్ట్రం వాడు అంటూ ప్రాంతీయ తత్వాన్ని ప్రవేశపెడుతూ, ప్రభావితుణ్ణి చేస్తూ ఉన్నారు. అతి చిన్న ప్రాంతంగా మన ఊరు వాడుతో మొదలై, అతిపెద్ద ప్రాంతీయ తత్వానికై ఔత్తరాహికుడు, దాక్షిణాత్యుడు అన్నంతవరకు వివక్షకు లోను చేసేదంతా ప్రాంతీయతత్వం క్రిందకే వస్తుంది. ఒకే దేశం ఒకే ప్రజ అన్నది రాజ్యాంగపు అంతరంగం. దానికి వేరైన వైఖరులన్నీ రాజ్యాంగం సూచిస్తున్న ప్రజాస్వామ్యానికి ప్రమాద కారులే. ఇలాంటి వాటినన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించ గలిగితే ప్రజాస్వామ్యం అమలు కాకుండా అడ్డుపడుతోంది ఏదో ఒక్క అంశంకాదనీ, అనేక రకాలుగా, అనేక కారణాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని తేలిపోతుంది. మీరూ ఈ విషయాన్ని ఎవరికి వారుగా మరికొంత ఆలోచించడానికి వీలుగా ఒక అధికరణాన్ని మీ దృష్టికి తెస్తాను. భారత రాజ్యాంగంలోని సారభూతమైన అధికరణలలోఆర్టికల్ - 15 కూడా మౌలికమైనదే సమానత్వ సాధనకు ప్రతిబంధకాలు కాగల అంశాలను సుస్పష్టమైన రూపంలో మన ముందుంచిన అధికరణమది.

ఆర్టికల్ - 15 జాతి, మత, కుల, లింగ, భేదాలాధారంగా ఏ ఇరువురి మధ్యా వివక్షతను చూపరాదు.                                                             (సశేషం) 


 ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రథమ రాష్ట్ర మహాసభ విశేషాలు 

మన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రథమ రాష్ట్ర మహాసభ 2022 ఫిబ్రవరి 27వ తేది ఆదివారం గుంటూరులోని ఎ.సి. కాలేజి అసెంబ్లీహాల్ లో జరిగింది. ఉదయం 9.30గం.లకు విశాఖజిల్లా సీనియర్ సభ్యుడు శ్రీ ఎ.సి. హెచ్. కన్నబాబు మరియు గుంటూరు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె.రామిరెడ్డి గార్లచే పతాకావిష్కరణ కార్యక్రమంతో మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగానే మహ్మద్ మియా బృందం ఆధ్వర్యంలో జండా పాట గీతాలాపన చేయటం జరిగింది.

ఉదయం 10 గం.లకు యర్రంశెట్టి జగన్ మోహన్ రావు వేదికపైకి అధ్యక్షునిగా డా వి. బ్రహ్మారెడ్డి గారిని మరియు పుట్టా సురేంద్రబాబు, విజయవిహారం రమణమూర్తి, మంచినేని మాధవి, ప్రసంగి ఆదినారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్, రాష్ట్ర కోశాధికారి శీలం నాగార్జునరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్, జె.వి.వి. జాతీయ ప్రధాన కార్యదర్శి జంపా క్రిష్ణకిషోర్, ధర్మాచరణ మండలి అధ్యక్షులు సోంప్రకాష్, గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు ప్రత్యూష సుబ్బారావు గార్లనువేదిక పైకి ఆహ్వానించారు. 

డా వి.బ్రహ్మారెడ్డిగారి పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలో పాల్గొన్న ముఖ్యనేతల ప్రసంగ విషయాలు.

పుట్టా సురేంద్ర బాబు గారి ప్రసంగాంశాలు

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక లక్ష్యాలను, కార్యక్రమాలను కార్యకర్తలు సీరియస్ గా తీసుకోవాలి. పండుగలు, వినోద కార్యక్రమాల్లాగా భావించవద్దు. మన కుటుంబ సొంత సమస్య పట్ల ఎలా దృష్టి పెడతామో అంత శ్రద్ధ పెట్టాలి.

వేల సంవత్సరాలుగా అధిక సంఖ్యాకులు, కొద్దిమందిచే అమానుషంగా,అవమానించబడినారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు పైబడినప్పటికీ, ఇంకా కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలున్నాయి. వాటిని వదిలేయాలి. అసమానతల నుండి సమానతలవైపు పయనించినప్పుడే స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి అర్థం చేకూరుతుంది. అలా పయనించడానికి సిద్ధమై, రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం కొరకు కొన్ని సంస్థలు, అంటే సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక, జై భారత్ లు ఏకమై ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికను స్థాపించుకోవడం జరిగింది. ప్రజలు యజమానులని, అధికారులు కేవలం సేవకులనే విషయాన్ని,ప్రజలకు తెలియపరచి, ప్రజలు తమ యజమానిత్వాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యాన్ని మన ఐక్యవేదిక సభ్యులు అర్థం చేసుకోవాల్సి ఉంది.

మన ఐక్య వేదికలో అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం అమలు చేసుకోవాలి. బృంద నాయకత్వము, సహచర నాయకత్వాన్ని అమలు చేసుకోవాలి గాని, అనుచర నాయకత్వాన్ని కాదు.

  ఈ మహాసభ సమీక్షారూపమైంది మాత్రమే. మన ఉద్యమ కార్యక్షేత్రం గ్రామాలు మరియుపట్టణాలే. ఇలాంటి మహాసభలో మనం గత రెండేళ్లుగా చేసిన కార్యక్రమాలను సమీక్షించుకోవాలి. మనం సాధించలేకపోయిన అంశాల పట్ల మన దృష్టిపెట్టి వాటిని సవరించుకోవాలి.

దానికి మన వేదిక ఎంచుకున్న 3 ప్రతిజ్ఞలను అంటే, సమయపాలనను పాటిస్తాను,ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను, చేస్తానన్న పనిని మనసు పెట్టి చేస్తాను అన్న వాటిని ఆచరణలో పెట్టుకోవాలి.

సంస్థను ఆర్థికంగా, స్వయం పోషకత్వంతో నిలబెట్టుకోవడానికి మన నిఖరాదాయంలో కొంత భాగం ఉద్యమానికి కేటాయించుకోవాలి. సొంత ప్రయోజనాల కంటే, సమాజ ప్రయోజనం కొరకే ఎదిగిన మనుషులుగా ఆలోచించాలి. జెండా పాటలో పాడుకున్న రీతిగా  'భవ్య భారతికి బాటలు వేద్దాం'  అనన్నారు.

జై భారత్ రమణ మూర్తి గారి వ్యక్తీకరణలు

1) ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నమాట మా హృదయానికి దగ్గరగా ఉంది. కలసి కదలమని కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. ఇప్పటివరకు, ముందే పెట్టుకున్న కార్యక్రమాల వల్ల, స.హచట్టంపై అంతగా దృష్టి లేకపోవడం వల్లా, మేము ఉద్యమ భాగస్వామ్యంలో చేయవలసినంత, చేయగలిగినంత పాత్ర పోషణ చేయలేదు. జై భారత్ ఎప్పుడూ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతుంది. అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధపడే స్వభావమూ కలిగి ఉంది. ఇదిగో ఇప్పుడు సభాముఖంగా మాటిస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ నిర్మాణంలో మరింత క్రియా శీలకమైన భాగస్వామ్యాన్ని అందిస్తాము. ఈ వేదిక ఎంపిక చేసుకున్న లక్ష్యాలు, పని విధానము తెలిసిన వారెవరైనా, దీనిలో పని చేయకపోతే, తప్పు చేసినట్లే అవుతుందన్నది ,నా అభిప్రాయం. ఈ మధ్యనే భారత సామాజిక పరిస్థితులపైనా, రాజ్యాంగం పైనా భాగస్వామ్య సంస్థలకు చెందిన మేము లోతైన అధ్యయనం చేయడం మొదలెట్టాం. ఉద్యమ కార్యాచరణకు సంబంధించినంతలో అధ్యయనం మరింత స్పష్టతను అందించగలదని భావిస్తున్నాను. అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్న ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ నిర్ణయాలను అమలు పరచుకోవడం అని సాధారణంగాచెప్పుకుంటాం. అది ప్రజాస్వామ్యానికి ఒక పార్శ్వం మాత్రమే. అసలు విషయం దాని రెండో పార్శ్వా నికి చెందింది. అది (మెజారిటీ నిర్ణయం) మైనారిటీ సంక్షేమానికి సంబంధించిందిగా ఉండాలన్నదే. మైనారిటీలను పట్టించుకుంటున్నామా లేదా అన్నది చాలా కీలకం. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అమలులో లేదన్నది మాకే కాదు, మీ అందరికీ తెలిసున్న విషయమే. కేవలం రాజకీయ నాయకుల్ని తప్పు పట్టడమే ఎక్కువమంది చేస్తున్నారు. అసలు దోషం జనంలోనే ఉంది. యజమాని తన హక్కును అమ్మేసుకుంటున్నాడు. ఎన్నికలను రాజకీయులు ఒక పెద్ద పెట్టుబడి లాభార్జనకు సంబంధించినదిగా భావిస్తున్నారు. ఈవిషయంలో ఓటరును మేలుకొలపాల్సి ఉంది. రాజకీయాలలో ఈనాడు బలంగా, తప్పుగా పనిచేస్తున్నది కుల చైతన్యమే. అధికారమంతా వ్యక్తి సామ్యం రూపంలోనే ఉంటోంది. డబ్బుబలం దానికి తోడయ్యింది. యువతకు సరైన దిశా నిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. నల్ల చట్టాలు నియంతృత్వ దమనకాండకు అనుకూలంగా ఉంటున్నాయి. ప్రజాహితం కోరేవారెందరో పలు నిర్బంధాలకు గురవుతున్నారు. అలా అన్యాయానికి గురైన వారి తరపున మనం నిలబడాలి. మరోసారి సభాముఖంగా మాటిస్తున్నాను. మానవ ఆర్థిక వనరుల విషయంలోనూ మేము మరింత భాగస్వామ్యాన్ని అందించగలము. ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానూ మా వంతు కృషి చేయగలము.

డా వి. బ్రహ్మారెడ్డి గారి ప్రసంగాంశాలు

భాగస్వామ్య సంస్థలు, వారి ఉద్యమ కార్యక్రమాలను ఈ వేదిక పైకి తీసుకురాకూడదన్నంత వరకు మా ముగ్గురికీ స్పష్టత ఉంది. ఏకాభిప్రాయమూ ఉంది. ఉమ్మడిగా ఎంచుకున్న ఐక్య వేదిక కార్యక్రమాలే ఈ వేదిక ద్వారా జరుగుతుంటాయి. మీరంతా కూడాఈ విషయాన్ని అర్ధం చేసుకోండి. మేము ప్రకటించే విషయాలనైనా మా మీద గౌరవంతో అంగీకరించవద్దు. మీ మీ అనుభవాలతో సరి చూసుకునే స్వీకరించడం గానీ, తిరస్కరించడం గానీ చేయండి. సరైన, లోతైన అవగాహన గల వెనుకటి తాత్వికులూ లోగడే ఈ విషయాన్ని ఇలాగే ప్రకటించారు. ప్రజలు అడుక్కునే వారుగా తయారైనారు. అసలు జరగాల్సింది తిరగబడింది. దానిని చక్క చేసి వారిని అడిగేవారుగా, చేయించుకునే వారుగా తయారు చేయాలి. ప్రజలను అవగాహన, పనితనము, నిర్భయము అన్న విషయాలలో సమర్ధుల్ని చేయడమే మన ముందున్న అసలు పని. అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే ఉంది. చేయలేని పనులను తలకెత్తుకోవడం సరైంది కాదు. ఎప్పటికప్పుడు అప్పటికి ఉన్న వనరుల ప్రాతిపదికన చేయగలిగిన పనులు చేసుకుంటూ సాగుతుండడమే వివేకవంతము. ముందు మనం చేయగలిగింది చేయాలి, తర్వాత ఇతరులనూ కలుపుకుని చేయాల్సిన వాటిని చేస్తుండాలి. ఆపై ప్రభుత్వం చేత చేయించాల్సిన వాటిని పట్టించుకుని వారిపై ఒత్తిడి తేవాలి. ప్రథమ ప్రాధాన్యతనిచ్చి, ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలన్నది నాకు చాలా చాలా అవసరమైందిగా అనిపిస్తోంది. ఆ దిశగా మేమంతా గట్టి కృషి చేస్తాము. ఈ పనిలో మరింత మందినీ కలుపుకుని పోవాల్సి ఉంది. బలహీనుల కోసమే రాజ్యం పని చేయాలి. అది జరగడం లేదు. ఆ విషయంలోనూ మనం పని చేయాలి.

సోం ప్రకాష్ గారి ప్రసంగాంశాలు 

మీ మూడు సంస్థలూ తలకెత్తుకున్న ఈ గొప్ప పనికి నా వంతు తోడ్పాటును అందిస్తాను. ప్రజాస్వామ్యం పేరుకే గాని, నడకలో అన్నీ అవకతవకలే.

సురేంద్ర : గతంలోనే సోంప్రకాష్ గారు తమ సంస్థ, చిత్తూరు జిల్లా ఉద్యమకార్యక్రమాలకు అవసరమైన మరియు శిక్షణా తరగతులకు అవసరమైన తోడ్పాటునుఅందిస్తుందని వాగ్దానం చేశారు. జిల్లా శిక్షణాలయాన్ని, అప్పుడు అవసరమయ్యే భోజన, వసతి సౌకర్యాన్ని ధర్మాచరణ మండలి తరపున ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. 

మొదటి విడతగా నిన్నటి మహాసభ వేదిక నుండి రాష్ట్ర నిధికి ఒక లక్ష రూపాయలుఇస్తున్నట్లు ప్రకటించారు.

గమనిక : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక తరపున, వివేకపథం మిత్రులైన వారందరికీ సత్యాన్వేషణ మండలి ఒక విజ్ఞప్తి చేస్తోంది. మండలి వరకు చూసుకుంటే, మాకు సమాజంనుండి విరాళాలు సేకరించడం నిషిద్ధం. మేము అడగము, ఇచ్చినా తీసుకోము. ఇది 40ఏండ్లుగా మేము వ్రతంగా పాటిస్తున్నాము. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉద్యమ స్వరూప స్వభావాలు వేరైనవి. ఆ ఉద్యమ పరిమాణం కార్యక్షేత్రం కూడా చాలా పెద్దది. వ్యయ ప్రయాసలు ఎక్కువే. కనుక మండలి ఆ కార్యక్రమానికి తనవంతుగా ఆర్థికతోడ్పాటును అందిస్తూనే, మండలితో పరిచయాలు, స్నేహ సంబంధాలు ఉన్న వారందరికీ విజ్ఞప్తి చేస్తోంది.

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉద్యమ విస్తరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్థికవనరుల అవసరం ఉంది. కనుక మీరూ నిధి సమకూర్చే పనిలో భాగస్వాములు కండి. అవకాశం, స్తోమత ఉన్నవారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికకు చేయగలిగినంతతోడ్పాటును అందించండి.

నలుగురు ముఖ్యవక్తల ప్రసంగాల తరువాత వేదికపై నున్న మిగిలిన పెద్దలు ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది. అందరి ప్రసంగాలనంతరం మహాసభ విజయవంతంగా జరుపుకోవడానికి సహృదయంతో 25 వేలు, 10 వేలు, 5 వేలకు పైగా విరాళాలందించిన వదాన్యులను మెమొంటోలతో సత్కరించడం జరిగింది.

ఆ తరువాత కార్యవర్గ సమావేశంలో ఖరారైన రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రతిపాదించడం, సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. భోజన విరామం తరువాత నూతన అధ్యక్షుని నిర్వహణలో సభ జరిగింది. ఆ సభలో మొదటిగా అధ్యక్షుడు ఎం.రామకృష్ణారెడ్డి, తర్వాత రాష్ట్ర కోశాధికారి పారేపల్లి సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.ఆపై మహాసభ కొన్ని తీర్మానాలను ఆమోదించింది.చివరగా గుంటూరు జిల్లా శాఖ కోశాధికారి రావూరి శివకృష్ణ గారి వందన సమర్పణతో గం. 5.15లకు సభ ముగిసింది.



ముఖ్య ప్రకటన 

సత్యాన్వేషణ మండలి ఏప్రిల్ త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయమైన ద్వారకుంటలో 2022, ఏప్రిల్ 15, 16,17 (శుక్ర,శని, ఆది వారాలలో) జరుగుతాయి. 

ఈ సమావేశంలో ప్రజాస్వామ్యము - ఒక పరిశీలన అన్న అంశంపై లోతైన విశ్లేషణ జరుగును. కావున తగినంత అధ్యయనం చేసి రాగలరు. మరియు ముస్తాక్ గారు అంగీకరిస్తే వివేకపథం 260 సంచికపై వారు చేసిన విమర్శలపై కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది.

కనుక ఈ సమావేశానికి వేదిక సభ్యులందరూ తప్పక సకాలంలో హాజరు కాగలరు.

   - సత్యాన్వేషణ మండలి 


వివేకపథం 261 మార్చి2022


No comments:

Post a Comment