Saturday, May 7, 2022

262 వివేకపథం - మే 2022

 

 

సంపుటి:8  సంచిక:4 మే 2022

ఒక ప్రత్యేక ప్రకటన

సత్యాన్వేషణ మండలికి చెందిన వారినిగా తమను తాము భావించుకుంటున్న వారికి మొట్టమొదట ఈ ప్రకటన వర్తిస్తుంది. మండలితో సన్నిహిత సంబంధాలు కల మిత్రులకూ, మిత్ర సంస్థలకు తరవాత వర్తిస్తుంది. చివరకు ఈ అభిప్రాయాలు సరైనవే నన్న దృష్టి కలిగిన వారందరినీ కూడా ఉద్దేశించిందే ఈ ప్రకటన. కనుక సత్యాన్వేషణ మండలి సభ్యులు విధిగానూ, మిగిలిన వారూ త్వరగానూ స్పందించండి.
మన పెద్దలు సమాజం బాగుండాలనీ, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉండాలనీ, ప్రజలంతా పరస్పరం సోదర భావంతో మెలుగుతూ, సమానత్వ దృష్టితో, దేశభక్తితో మనుగడ సాగించాలని కోరుకుని, అందుకు తగిన రాజ్యాంగాన్ని, అప్పటికి ఉన్న పరిస్థితుల ననుసరించి దాదాపు మూడేండ్లు శ్రమించి రూపొందించి మనకిచ్చారు.

అయినా అప్పటికి నాయకత్వ స్థానాలలో ఉన్న, మరియు భవిష్యత్తులో పాలన భాగాలలోకి రానున్న రాజకీయులు సమాజాన్ని ఎలా నడపబోతారోనన్న ఆందోళన కనబరిచారు ఆనాటి పెద్దలు. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్, “రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసే స్థానాలలో అయోగ్యులు గనుక చేరితే ప్రజలకు అన్యాయం (చెడు) జరగడం ఖాయం” అని చెప్పారు.

మరో మాటగా, నాయకుల పట్ల గానీ, సంస్థల పట్ల గానీ, వీరవిధేయత నెలకొంటే, వ్యక్తి ఆరాధన ప్రబలమైతే, అమలు జరిగేది ప్రజాస్వామ్యం పేరున నియంతృత్వ పాలనే. అది చాలా ప్రమాదకరమైనది, అని స్పష్టంగా ప్రకటించారు. పెద్ద విషాదమేమంటే, గత 71 సంవత్సరాలుగా, ఆయన భయపడినట్లు, ఆ రెండు రకాల ధోరణులే అమలవుతూ వస్తున్నాయి.

దీన్నంతటినీ నిశితంగా పరిశీలించిన సమాజ హితకాంక్ష కల కొన్ని సంస్థలు ఏకమై, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్న మహదాశయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి పూనుకున్నాయి.

మిత్రులారా!

ఈ పని చాలా పెద్దది. కష్టసాధ్యమైనది. వేలమంది పూనుకుంటే గాని సాగనిది. మానవ వనరులూ, ఆర్థిక వనరులూ పెద్ద ఎత్తున అవసరమైయున్నది. కనుకనే ఈ వేదికలో భాగస్వామ్య సంస్థగా ఉన్న మండలి ఈ ముఖంగా ఒక ఆహ్వాన రూపమైన ప్రకటన చేస్తోంది. 

రండి మిత్రులారా! ఈ ఉద్యమంలో మీరూ భాగస్వాములు కండి. మీ మీ బంధువులనూ, స్నేహితులనూ, పరిచయస్తులనూ కూడా దీనిలో భాగస్వాములను చేయండి. ముఖ్యంగా మండలి సభ్యులూ, మిత్రులూ మీ మీ జిల్లాలలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలోసభ్యులుగా, క్రియాశీల కార్యకర్తలుగా చేరి సమాజ రుణం తీర్చుకోండి. దేశాభివృద్ధిలో మీ వంతు పాత్రను పోషించి, చరిత్రలో నిలచిపోయేలా మీరూ చేరండి, ఇతరులను కూడాచేర్పించండి.

అదనపు సమాచారం కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి. 9492569080,9704180330, 9959190408, 9848036063. - దేశమాత సేవలో సత్యాన్వేషణ మండలి. 

 

ప్రజాస్వామ్యము ఒక పరిశీలన

ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? 

ఈ మాట ఒక రకమైన సామాజిక వ్యవస్థను చూపించేదిగా ఉంది. దీనిలో రెండు పదాలున్నాయి. అవి, ప్రజలు - స్వామిత్వము అన్నవి. ప్రజలు అన్నమాట పుట్టి, కలసికట్టుగా జీవిస్తున్న జనం (మనుషులు) అన్న అర్థాన్నిస్తుంది. ఆధునిక సామాజిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ‘పౌరులు’ అన్నదానికి సమానార్థకమది.

స్వామ్యము:- స్వామిత్వము కలది. స్వామిత్వము అంటే యజమానితనము. స్వామి అంటే సొంతదారు, యజమాని, అధికారము కలవాడు అని ఈ సందర్భానికి చెందినఅర్థము .

ఈ పదము సంబంధజనిత పదాల కోవకు చెందింది. అంటే మరొకదానితో కూడే అన్వయం చేసుకోవలసిందిగా ఉంటుంది. యజమాని అనగానే, దేనికి యజమాని? ఎవరికి యజమాని? అనాలి, సొంతదారు అనగానే దేనికి సొంతదారు అనో, అధికారి అనగానే దేనిపై, ఎవరిపై అధికారి అనో ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం జత చేసుకుంటేనే అర్థ స్పష్టత చేకూరుతుంది. ప్రధానంగా 'యజమాని, సొంతదారు' అన్న మాటలు ఏదో ఒక సంపదతో ముడి పెట్టి, ఆ సంపద విషయంలో సర్వాధికారాలు కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి.

'ప్రజాస్వామ్యం' అన్న పదం, ఒక రకమైన సామాజిక వ్యవస్థను తెలిపే మాట అనుకున్నాక ఈ వాక్యం సరిగా అర్థం కావాలంటే, సమాజమూ, వ్యవస్థ అన్న రెండు పదాలకూ సరైన అర్థం చెప్పుకోవాలి.

సమాజమన్న మాటకు, ఒక కట్టుబాటుకు లోనై జీవిస్తున్న ప్రజ లేక జన సముదాయము అని అర్థం. అదే ఈనాడు 'దేశ ప్రజలు' అన్న రూపంలో రూఢి పడి వినియోగంలోకి వచ్చింది. దానిని బట్టి సమాజము అన్న మాటకు; ఒక నిర్దిష్ట ప్రాదేశిక ఎల్లల మధ్య, ఒక ఒప్పందానికి లోనయి జీవిస్తున్న ప్రజలు, అని అర్థం చెప్పుకోవాలి.

దేశ ప్రజలు, పౌరులు అన్న మాటలు ఈ అర్థాన్ని సూచించేటివే, వ్యవస్థ అంటే ఆ సమాజపు స్థితికీ, గతికీ అవసరమైన విధి విధానాలతో కూడిన నిర్మాణము అని అర్థము. స్థితి అంటే ఆ సమాజంలోని ప్రజలందరి నిత్య నైమిత్తిక వ్యవహారాలన్నింటినీ నిర్వహించుకోవడానికి అవసరమైన పాత్రలు, 'పాత్రధారులు' వారికి చెందిన విభాగాలతో కూడిన నిర్మాణం అని అర్థము. గతి అంటే, ఆ నిర్మాణం మొత్తం కొనసాగుతూ ఉండడంఅని అర్ధం .

యజమానితనంలోని ప్రధాన లక్షణం, దేనికి యజమానో దానిపై అతనికి, సర్వాధికారాలు ఉండడం.

దీనినే సార్వభౌమాధికారం అంటారు. సొంతదారు అన్నా ఇదే అర్థం వస్తుంది.

మరొక్క మాట, ఈనాడు పౌరులు అన్నమాట గానీ, ప్రజలు అన్నమాట గానీ ఏదో ఒక  దేశంతో ముడిపెట్టే వాడడం జరుగుతోంది. కనుక సమాజమన్న మాటకు ఆ దేశంతో కలిపే అన్వయించాలి. అలాగే ఆ దేశ రాజ్యాంగమే, ఆ దేశ ప్రజల మూల ఒప్పందం అవుతుంది. ఇంత వరకు బాగా ఆలోచించుకుని, ఏకాభిప్రాయానికి వస్తేనే మిగిలిన విషయాలను లోతుగా విచారించడం కుదురుతుంది. ఈ నేపథ్యం నుండే భారత రాజ్యాంగం పీఠికలోని తొలి వాక్యంలోని తొలిమాట “భారత దేశ ప్రజలమైన మేము” అంటూ మొదలు పెట్టడం జరిగింది.

ఒక సమాజం గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థను తనకొరకై ఏర్పరుచుకుంటే, ఆ సమాజం అదుపులో వున్న ప్రదేశం మొత్తం (ఇక్కడ ప్రదేశం అంటే, భూ, జల, వాయు సరిహద్దులలోని ఆ సమాజం మొత్తం అని అర్థం) ఆ సమాజంలోని ప్రజలందరి ఉమ్మడి యాజమాన్యంక్రింద ఉందని అర్థం. ఆ మొత్తం మీద ఆ ప్రజలందరి ఉమ్మడి సార్వభౌమాధికారం నెలకొని ఉందని అర్థం.

ఆ సంపద పైన, ఆ దేశ ప్రజలకు వేరైన వారి ఆధిపత్యం కానీ, ఆ దేశ ప్రజలలోనే ఒక సమూహం ఆధిపత్యం గానీ చెల్లదని అర్థం. సూత్రప్రాయంగా ఆ దేశ సంపదంతా, ఆ దేశ ప్రజలందరి ఉమ్మడి యాజమాన్యం క్రింద ఉందని, ఉంటుందని అర్థం. ఈ అర్థం కాక ఇంకే అర్థం చెప్పినా, అది ప్రజాస్వామ్య స్వభావాన్ని కలిగి లేదనీ, కోల్పోయిందనీ అనాల్సిందే. ఇంతవరకు, మన విచారణ మీ మీ వివేకానికి సరైందిగనే ఉంది అన్న నిర్ణయానికి రాగలిగితే “ప్రజలు యజమానితనం దాని సరైన  - అసలైన అర్థంలో అమలవుతుందన్న సామాజిక వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అంటారు.” అని నిర్వచించుకోవచ్చు.

యజమాని తనం, సొంతదారు తనం, అమలవుతుండడమంటే యజమాని అనబడుతున్న వానికి అతడు దేనికి యజమానో దాని విషయంలో నిర్ణయాధికారము, పర్యవేక్షణాధికారము, ఫలితాలను అనుభవించే (లాభనష్టాలకు బాధ్యత వహించే), అధికారము కలిగి ఉండడమనిఅర్థము .

  • కనుక సర్వాధికారాలూ, సర్వోన్నత అధికారము ప్రజలకు దఖలై యున్న వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారు. ఈ ఒక్క ముక్కనూ వదిలిపెడితే, పట్టించుకోకుంటే వేరేగా అర్థం చేసుకుంటే, ఇక ప్రజాస్వామ్యాన్ని గురించి విచారించడమే కష్టమైపోతుంది.


భారత రాజ్యాంగ పీఠిక (ప్రస్తావన; ప్రవేశిక)

భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని, సర్వసత్తాక (సార్వభౌమ్య), సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగ ............

ఏర్పరుచుకుని మాకు మేము ఇచ్చుకున్నాము.

We the people of India.... Sovereign, Socialist, Secular, Democratic Republic....

రాజ్యాంగ హృదయాన్ని, అంతస్సారాన్ని, మొత్తాన్ని ఈ పీఠిక స్పష్టం చేస్తూ ఉంది. రాజ్యాంగంలోని అధికరణాలన్నింటినీ సక్రమంగా అర్థం చేసుకోవడానికీ, వివరించు కోవడానికీ, ఇది కరదీపిక గానూ, మార్గదర్శి గానూ ఉంది. ఈ పీఠికలో రాజ్యాంగపు మూలభూత లక్షణాలను పట్టించే కీలకమైన పదాలు కొన్ని ఉన్నాయి. అవి, 1) సర్వసత్తాకం,2) సామ్యవాదం, 3) లౌకికం, 4) ప్రజాస్వామ్యం, 5) గణతంత్రం, 6) న్యాయం, 7) స్వేచ్ఛ, 8) సమానత్వం , 9) సహోదరత్వం , 10) ఐక్యత, 11) అఖండత.

గమనిక : ఈ పదాలకు సరైన అర్థాలు ఏమిటో, వాటి మధ్యనున్న పరస్పర సంబంధం ఏమిటో, వాటి పూర్వాపరాల అన్వయ క్రమమేమిటో, స్పష్టంగా తెలుసుకోవడం, రాజ్యాంగ అధ్యయనంలో అత్యంత కీలకాంశం అవుతోంది. ప్రజాస్వామ్యాన్ని గురించి వివరించుకొన్నాక, మిగిలిన వాటిని ప్రస్తావిస్తాను. గుర్తుంచుకోండి.

ప్రజాస్వామ్యం ఆచరణలో దాని రూపం

ప్రజాస్వామ్యమంటే, ప్రజల యజమానితనం, దాని సరైన అర్థంలో అమలవుతూ ఉండడం అని పైన చెప్పుకున్నాం. యజమానితనం ఉమ్మడిగా ప్రజలందరికీ దఖలై ఉండి, అది ఆయా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు అమలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షిస్తూ ఉండడం, అన్న ప్రక్రియను అమలు చేయడం. దేశం మొత్తాన్నీ ఒక యూనిట్ గా తీసుకుంటే, ఆచరణ సాధ్యం కాకుండా పోతుంది కనుకనే, దేశాన్ని అనేకంగా అంటే రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా విభజించుకున్నాం. అప్పుడు కూడా, ఒక్కో విషయం పైనా, ఆ భాగంలోని ప్రజలందరూ కలసి నిర్ణయంతీసుకోవడం, ప్రతి విషయాన్నీ, ప్రజలు అందరూ కలసి పర్యవేక్షించడం, ఆచరణ సాధ్యంకాదు గనుక, ఆ పనులు నిర్వహించేందుకు ఒక సమూహాన్ని తమకు ప్రతినిధులుగా ఎంపిక చేసి, నిర్ణీత కాలానికి, నిర్ణీత విషయాలకు సంబంధించి, యాజమాన్యపు అధికారాలను వారికి సంక్రమింప జేయడం అన్న విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. దానినే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న దేశాలన్నిటా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం (indirect Democracy) పేరున అమలు పరచుకుంటున్నారు. ప్రజలే వ్యవస్థను నడుపుకోవడంకాకుండా, వారు ఎంపిక చేసుకున్న ప్రతినిధులే వ్యవస్థను నడుపుతుంటారు, గనుక దీనికి పరోక్ష ప్రజాస్వామ్యం (Indirect Democracy) అంటున్నారు. అలా ఎంపికైన బృందాన్నే పీఠికలోని 'గణం' అన్నమాట సూచిస్తుంది. తంత్రం అంటే 'వశం' అని అర్థం. గణతంత్రం అంటే, ప్రజలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ప్రజా ప్రతినిధుల సమూహపు , వశంలో సమాజం నడుస్తూ ఉండడమని అర్థం వస్తుంది ఈ సందర్భంలో. 

ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత మౌలికమూ, కీలకమూ అయిన అంశమేమంటే ఎన్నికల ద్వారా ఎన్నికైన అభ్యర్థులకు ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని దఖలు పరచడంలేదు. ఎన్నికైన ప్రతినిధులు దేశానికి గానీ, సమష్టి సంపదకు గానీ స్వాములు (యజమానులు) కారు. కాలేరు. వారు కేవలం ప్రజల తరుపున ప్రజల కొరకు పనిచేసేందుకు ఎంపిక చేయబడిన ఉద్యోగులు మాత్రమే వారి ప్రాతినిధ్యపు కాలపరిమితి మన దేశంలో  ‘5' ఏండ్లు మాత్రమే. ఇది సాధారణ నియమమే. అవసరమైతే మధ్యలోనే ప్రతినిధిని ప్రతినిధి స్థానం నుండి తొలగించే అధికారం, ప్రజాస్వామ్యంలో, ప్రజలకే ఉంటుంది. ప్రజాప్రతినిధిగా అతని ఉద్యోగపు స్వరూప స్వభావాలు మిగిలిన నిర్వహణ భాగంలోని ఉద్యోగుల స్వరూప స్వభావాలకు ఒకింత భిన్నంగా ఉంటుంది గాని, ప్రజాప్రతినిధికి, పౌరులకున్న యాజమాన్యపు భాగస్వామ్యం రాదు. ఉండదు.

ఈ ప్రజాప్రతినిధుల సమూహాలు మనదేశంలో రాజ్యాంగం ప్రకారం మూడు ప్రధాన భాగాలుగా ఉన్నాయి. 1. దేశం మొత్తానికి చెందిన లోకసభ సభ్యత్వం, 2. రాష్ట్రం మొత్తానికి చెందిన శాసన సభ సభ్యత్వం, 3. స్థానిక ప్రభుత్వాల పేరున చెప్పబడుతున్న జిల్లా, మండల, గ్రామ పంచాయతీల సభ్యత్వం. గ్రామంలో వార్డు ప్రతినిధి దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా, సార్వభౌమాధికారం కల ప్రజలు, వారే రూపొందించుకున్న ఎన్నికల ప్రక్రియ ననుసరించి ఎన్నుకోబడిన వారే. వారందరూ ఏదో రూపంలో ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన వారే.

ప్రజాస్వామ్య వ్యవస్థలోని అత్యంత సారభూత విషయం ఇదే.

  • భారత రాజ్యాంగం సిద్ధమైన సందర్భంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్

  • ఇప్పటివరకు పాలకులుగ ఉన్న మనం ఇప్పటినుండి సేవకులుగ ఉండబోతున్నాము” అని రాశారు.

  • పౌరులు (ప్రజలు) అన్న పేరుతో కాక, ఇంకే పదవికి చెందిన పేరుతో పిలవబడిన వారైనా ఈ దేశంలో (ప్రజాస్వామ్యంలో) ఉద్యోగులు గానే పరిగణింపబడతారు. వారంతా ప్రజల పనులు చేసిపెట్టడానికి వేతనం తీసుకుంటూ పనిచేస్తున్న వాళ్ళేనన్నమాట. 

ప్రజాస్వామ్యం గణతంత్ర విధానాన్ని అనుసరిస్తున్నపుడు దానిని పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. అంటే ప్రజలు నిత్య మరియు నైమిత్తిక (రోజువారీ మరియు ఆయా ప్రత్యేక సందర్భాలలో జరిగే) వ్యవహారాలలో నిర్ణయాలు తామే తీసుకునే స్థానంలో ఉండక ఆ పనిని తమ ప్రతినిధుల ద్వారా జరిగేలా చేసుకున్న ఏర్పాటు ఉంటుంది కనుక. దానిని పరోక్ష ప్రజాస్వామ్యం అన్నారు.

ప్రజాస్వామ్యం యొక్క అంతస్సారం సంపద ప్రజలది, అధికారం ప్రజలది, లాభనష్టాలు ప్రజలవి అన్నదే. ఈ ఒక్క విషయం అర్థమైతే, దానిని అమలు పరచుకోవడం ఎలా? అమలు అవుతుందో అమలు కావడం లేదో గమనించడం ఎలా? ఏయే విభాగాలలోఅమలవుతుందో, ఏయే విభాగాలలో అమలు కావడం లేదో, అందుకు కారణాలేమిటోకనుగొనడం ఎలా? అన్నది గమనించడానికి వీలవుతుంది. కనుక ప్రజాస్వామ్యం అంటే ఏమిటన్న విషయంలో ఎట్టి సందేహాలకూ తావులేని స్పష్టత కలిగి ఉండడం మన విచారణీయాంశాని కంతటికీ పునాది అవుతోంది.

మనం ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను ఎంచుకున్నాం. ఈ రెంటికి తేడా ఏమిటి? రెంటికీ సంబంధమేమిటి? అన్నది తెలుసుకోవలసిన ముఖ్యాంశమే.

ప్రజాస్వామ్యంలో ఏ రకమైన నిర్ణయాలైనా ప్రజలు నేరుగా పాల్గొని తీసుకుంటుండాలి. అలాగే నిర్ణయాలు అమలవుతుందీ, లేనిదీ ప్రజలే నేరుగా పర్యవేక్షించుకుంటూ ఉండాలి. లాభనష్టాల రూపంలో ఉన్న ఫలితాలలో న్యాయబద్ధమైన వాటా ఉండేలా పంపకం కూడా ప్రజలే చేసుకుంటుండాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యం అన్న మాటకు మనం ఇచ్చుకున్న అర్ధానికి సరిపడిన ఆచరణ రూపం అవుతుంది.

అదే మరి గణతంత్రం (Republic) అన్న దానిలో నిర్ణయాలు, పర్యవేక్షణ, లాభనష్టాల పంపిణీ అన్నదంతా ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధుల సమూహం చేస్తుంటుంది. అదెలాగంటే, మొత్తం దేశానికి సంబంధించిన వ్యవహారా లన్నింటిని లోకసభ నిర్వహిస్తుండగా, పెద్దల సభ పేరున రాజ్యసభ వారికి తోడ్పాటు నందిస్తుంటుంది. లోకసభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 245 వెనసి 788 మంది. అంటే దేశ వ్యవహారాల విషయంలో, రాష్ట్రాలకు కేటాయించిన అంశాలు పోను మిగిలిన వాటి విషయంలో 543 మందే నిర్ణయాలు, పర్యవేక్షణ, సంపద పంపిణీలన్న మూటిని నియంత్రించే అధికారం కలిగి ఉంటారన్నమాట. ప్రజలకున్న నిరవధిక, అపరిమిత సర్వోన్నతాధికారం అన్నది వీరికి ఉండదు గానీ, ప్రజల సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే, నిర్ణీత కాలానికి పరిమితమై, వ్యవస్థను నడపడానికి అవసరమైన సర్వాధికారాలు వీరికి దఖలు చేయబడి ఉంటాయి. ఒక్క ప్రజలకు జవాబుదారీగా ఉండడం, ప్రజల అనుమతితోనే అధికారం పొందడం అన్న దాన్ని మినహాయించి, మిగిలిన ప్రభుత్వ వ్యవస్థ అంతా వీరికి జవాబుదారీగా ఉంటూ, వీరి అజమాయిషీలోనే ఉంటుందన్నమాట.

ప్రజాస్వామ్యానికి సంబంధించి మరో ముఖ్యాంశాన్ని మనం తెలుసుకుని ఉండడం అవసరం. ప్రజాస్వామ్య విధానంలోనైనా, గణతంత్ర విధానంలోనైనా తీసుకునే నిర్ణయాలు ఏకగ్రీవ రూపంలోనో, ఎక్కువమంది అభిమతాన్ని బట్టి అన్న రూపంలోనే ఉంటాయి. తేడా అల్లా ప్రజలే స్వయంగా నిర్ణయాలు ప్రకటించడం, ప్రజా ప్రతినిధుల వరకే కూర్చుని నిర్ణయాలు ప్రకటించడం అన్నది మాత్రమే.

ప్రజాస్వామ్యము  - సాధక బాధకాలు

ఏ ప్రయోజనాన్నాశించి, సమాజహితైషులైన మేథావులు, వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన రాజరిక లేదా నియంతృత్వ వ్యవస్థను కాదనుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థకు రూపకల్పన చేశారో ఆ ప్రయోజనాలు సిద్ధించాలంటే, 1) తీసుకునే నిర్ణయాలు సరైనవై ఉండాలి. 2) వాటి అమలుకు సంబంధించిన పర్యవేక్షణ సమర్థవంతంగా ఉండాలి. ఫలితాల వినియోగము, పంపిణీ అన్నది నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఇంతవరకు సబబో కాదో ఆలోచించండి.

సరైన జ్ఞానమే నిర్ణయించేదిగా ఉండాలన్నది నిర్వివాదాంశం. అరకొర జ్ఞానం గానీ, అపసవ్య జ్ఞానం గానీ నిర్ణయ స్థానంలో ఉంటే జరిగేదంతా అనర్థమే. కనుక వ్యవస్థ ప్రజాస్వామ్యమే అయినా ప్రయోజనాలు చక్కగా సిద్ధిస్తుండాలంటే నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న ప్రజలు 1) అవగాహన పరులు, 2) పనిమంతులు, 3) శీలవంతులు అయ్యుండాలి. ఎందుకంటే, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా, సమర్థవంతంగా పర్యవేక్షణ చేసుకోలేకపోయినా, సక్రమ పంపిణీ జరిగేలా నిష్పాక్షికంగా ప్రవర్తించక పోయినా, సరైన ఫలితాలు పుట్టవు. అందరికీ న్యాయబద్దంగా అందవు. కనుక ఈ సూత్రాన్నే వేరే మాటల్లోనూ చెప్పుకోవచ్చు. ప్రజలు 1) వివేకవంతులు, 2) కార్యకుశలురూ, 3) నీతిమంతులూ అయితే ఎంపిక చేసుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ సమష్టి అభివృద్ధికీ, సమానాభివృద్ధికీ,సమగ్రాభివృద్ధికి మరే వ్యవస్థ అందించలేని స్థిరత్వంతో పరుగులు తీస్తుంది. ఈ లక్షణాలుగాని లేకుంటే, నియంతృత్వ వ్యవస్థ కంటేనూ ప్రమాదకారిగా కూడా పరిణమించవచ్చు.

ఉద్యోగులతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుడు నిర్ణయాలతోనూ, అసమర్ధ పర్యవేక్షణతోనూ, అసమ పంపిణీతోనూ కూడి ఉండే అవకాశాలే మెండుగా ఉంటాయి కనుక. అభివృద్ధి జరగకపోగా తిరోగమనం పొందడమో, అసమ పంపిణీ విధానానికి లోనై బలవంతులదే రాజ్యం అన్న రూపం ధరించడమో జరిగే అవకాశం ఉంది. ఏమి చెబుతున్నానోఅర్ధమవుతుందా?

యజమాని అజ్ఞాని, అసమర్థుడు, అవినీతిపరుడు లేదా స్వార్థపరుడు అయితే వ్యవహారంఎలా ఉంటుందో, ప్రజలు అజ్ఞానులు, అసమర్థులూ, అవినీతిపరులూ అయితే ఇక ఆ సమాజమూ అలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడానికి ప్రజలలో ఉన్న పై మూడు అపసవ్యతలే (బలహీనతలే) మూల కారణమవుతాయి. నిజానికి గత 73సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతూ వచ్చింది ఇదే.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యపు ఆయువుపట్టంతా ఎన్నికల దగ్గరుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో '3' విభాగాల వారు పాల్గొంటారు. 1) ప్రజలు, 2) ఎన్నికల నిర్వహణ యంత్రాంగము, 3)అభ్యర్థులు.

1) ప్రజలు (ఓటర్లు) : ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి.

2) అభ్యర్థిని ఎంచుకోవడంలో అతని యోగ్యతలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

3) కులము, మతము, ప్రాంతము, లింగము, వర్గము సంబంధంగా స్వపర బేధాలను , పెట్టుకుని, అనుకూల ప్రతికూల దృష్టితో అభ్యర్థిని ఎంచుకోకూడదు.

4) అభ్యర్థికి చెందిన పూర్తి సమాచారాన్ని పరిశీలించకుండా గుడ్డిగా ఓటు వేయడంగానీ, వేయకుండడం గానీ చేయకూడదు.

5) ఓటు హక్కుగా కాకుండా బాధ్యతగానో, విధిగానో రూపొందాలి. 100 శాతం ఓటింగ్ జరగాలి.

6) ఓటర్లకు, అభ్యర్థికి సంబంధించిన వాస్తవ మరియు సంపూర్ణ సమాచారం అందాలి. ఆ సమాచారంలో ఏవైనా అసత్యాలుంటే అట్టి సమాచారమందించిన అభ్యర్థిని ఆ ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హుడిగా ప్రకటించడమే గాక, మరొక్కసారి వరకు అనర్హుడవుతాడని శాసనంఉండాలి.

7) అభ్యర్థి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాని రీతిలో తన గురించిన సమాచారాన్నిఇవ్వడానికీ, తనను ఎంచుకుంటే దేశానికి ఏమి చేయగలడో, తన నియోజకవర్గానికి ఏమి చేయగలడో అన్నంతవరకే ప్రచారంలో చెప్పుకునే వెసులుబాటు ఉండాలి. పరిమితీఉండాలి.

8) ప్రచారంలో ఎక్కడా అధికరణం '15' లోని అభిప్రాయాలకు భిన్నంగా ప్రచారంచేయరాదు.

9) ప్రత్యర్థుల గురించి మాట్లాడకూడదన్న నియమం ఉండాలి. తన గురించిన వివరాలిస్తే సరిపోతుంది.

10) ఓటరును ప్రలోభపెట్టే పని చేసినట్లు ఆధారాలు లభిస్తే, ఆ అభ్యర్థిని పోటీలో పాల్గొనకుండా నిషేధం విధించాలి.

11) ప్రజాస్వామ్యం గురించి తెలిసినవాడై ఉండాలి. నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు,సమస్యలు పరిష్కారాలు, అందులో తాను చేయగలిగినవీ, తాను ప్రభుత్వంపై ఒత్తిడిచేయగలవీ అన్న వాటి వివరాలు తెలిసినవాడై ఉండాలి.

ఎన్నికల సంఘం 

గమనిక : ఇది 1) కేంద్ర ఎన్నికల సంఘం, 2) రాష్ట్ర ఎన్నికల సంఘం, అన్నరూపంలో ఉంటుంది. ఈ రెండూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయని, ఎవరి ప్రభావాలకు లోను కాకుండా, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడం వీటి పని అని రాజ్యాంగం చెబుతోంది.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా గణతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు ఎన్నికలే ఆధారం. కనుక ఎన్నికల సంఘానికిది కీలకమైన పాత్ర అవుతోంది. ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి, ఎన్నికలు జరిపి గెలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే వరకూ, ఇది అసాధారణ అధికారాలు కలిగి ఉంటుంది. ఎన్నికలు గనుక సజావుగా జరగకుంటే మొత్తం మొత్తం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదే అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రకటించిన ఎన్నికల కాలంలో, ప్రభుత్వ కార్యకలాపాల పైనా దీనికి నియంత్రణ ఉంటుంది.

ఎన్నికల సంస్కరణలు

ఇప్పటివరకు నడిచిన ఎన్నికల విధానంలో చాలా లోపాలున్నాయి. వాటిని చక్కచేయడానికి, సుసంపన్నం చేయడానికి ఎన్నో సంస్కరణలు అవసరమై ఉన్నాయి. వాటిగురించి కొద్దిగా వివరించుకుందాం.

1) ఎంపిక ఏకగ్రీవంగా జరగడం అభిలషనీయము, ఆదర్శప్రాయము. కానీ ఇది చాలా అరుదు.

2) ఎక్కువమంది ఎన్నుకున్న వారే ఎంపిక కావడం జరుగుతుంది. ముప్పాతిక , మూడొంతులు ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడో  పెద్ద లోపం చోటుచేసుకుని ఉంది. మొత్తము ఓటర్లలో అధికులు ఎంచుకోవడం అన్నది జరగడం లేదు. ఎన్నికల్లో పాల్గొన్న వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారే ఎన్నిక అవుతున్నారు. ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థుల సంఖ్య పెరిగినకొద్దీ గెలవడానికి అవసరమైన ఓట్ల శాతం తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుతం 30 శాతం ఓట్లు పోలైనా గెలిచేస్తున్నారు.

3) మరో పెద్ద లోపం . అభ్యర్థులలో ఒకరికి లక్ష ఓట్లు వచ్చాయి. మరొకరికి లక్షా ఒక్కఓట్లు వచ్చాయి. పోటీలో మరింతమంది అభ్యర్థులు ఉంటే 30 శాతం ఓట్లు వచ్చినవాడు గెలుస్తున్నాడు. అంటే అతణ్ణి 70 శాతం ఓటర్లు తిరస్కరించారన్న మాట. ఓడిన వారికి 70శాతం ఓట్లు పడుతున్నాయి. లక్షా ఒక్క ఓటు వచ్చినవాడు గెలుస్తుంటే, లక్ష వచ్చినవాడు ఓడిపోతున్నాడు. లక్ష ఓట్లు విలువ లేనివిగా అయిపోతున్నాయి. మరో రకంగా చూస్తే 30 శాతం ఎంచుకున్న వాడు, 70 శాతం తిరస్కరించిన వాడూ గెలుస్తున్నాడు. ఇంతకంటే అడ్డగోలుతనం ఇంకేముంటుంది? ఈ అపసవ్యతను గుర్తించే దీనికి పరిష్కార రూపంగా దామాషా పద్ధతి ఓట్ల లెక్కింపు అన్న విధానాన్ని సూచించారు సంస్కర్తలు.

అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు

  • ఈనాడు ఇది కలిగిస్తున్నంత తప్పుడు ప్రభావం కలిగిస్తున్నది మరోటి లేదు.

1) అభ్యర్థుల చిత్రాలతో కూడిన హోర్డింగులు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, రోడ్ల వెంటా, కూడళ్ళలోనూ, ఖాళీ ప్రదేశాలలోనూ నిండిపోతున్నాయి.

2) ప్రచార వాహనాలు ఎన్నికల సంఘం నిషేధించిన కాలం వరకు ఒక నెల రోజులనుండే ఊరు వాడ రొద పెట్టేస్తుంటాయి.

3) స్థానిక నాయకులు, కార్యకర్తలూ సమూహాలుగ కూడి రోడ్ల వెంట ర్యాలీలు, రోడ్డు వేదికలు, బహిరంగ వేదికల పేరిట జన జీవనాన్ని సైతం స్తంభింపచేస్తూ ఉంటారు. పెద్ద నాయకులైయితే రథయాత్రలు, పాదయాత్రలను వేల మంది కార్యకర్తలను కలుపుకుని చేస్తుంటారు. 

4) ఇక మాధ్యమాల విషయం చెప్పనక్కరలేదు. పెద్ద పార్టీలకు అయితే సొంత ఛానళ్లు, సొంత పత్రికలు కూడా ఉంటున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే మాధ్యమాలకు పండగే పండగ. ఇబ్బడి ముబ్బడిగా అడ్వర్టైజ్ మెంట్ల సంపాదన.

5) రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, బహిరంగంగా, కుల, మత, ప్రాంత, వర్గాల పేరునేప్రచారాలు.

6) డబ్బు, మద్యం, మాంసం, ఓటర్లకు అందుబాటులో అభ్యర్థుల స్తోమత ననుసరించి ఒక నెల ముందు నుంచే అందించడం.

7) ఓటుకింతని డబ్బు పంపడం. కానుకలు పంపడం, ఎంతో ఖరీదైనవి ఇవ్వడం. 

8) వీటన్నింటికీ తోడు వరాలు ఇవ్వడం - బెదిరించడం.

  • అది ఇది అననేల ఎన్ని తప్పుడు మార్గాలున్నాయో అన్ని విధాలుగానూ ఓటర్లను , ఆకట్టుకోవడం .

  • 9) ఓటింగ్ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు, ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు వాహనాలపై వెంట ఉండి తీసుకురావడం, తిరిగి ఇళ్లకు చేర్చటం. ఏ ఒక్క అభ్యర్థికీ నైతిక విలువలు, రాజ్యాంగ బద్ధత, అన్న సోయే ఉండదు.

  • 10) ఎన్నికల సంఘం అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సుమారు 25, 30 లక్షలుగా , నిర్ణయించగా, అది వాస్తవంలో 25, 30 కోట్లు దాకా అవుతోంది. ఇక పార్టీలు పెట్టేబలప్రదర్శన లాటి బహిరంగ సభలుకు అయితే ఒక్కో సభకే 10, 20 కోట్లు అవుతుంది. 

నిజానికిదంతా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదే. అభ్యర్థులు కోరుకో వలసింది ప్రజల అభిమానాన్ని. తన గురించి తెలుసుకుని అభిమానించడం, తమ ప్రతినిధిగా ఉండదగినవాడని తేల్చుకుని ఉండడం అన్న రూపములో ఉండాలి.

11) ఈ మధ్యనే తెలంగాణాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి చేసిన ఖర్చు 500 కోట్ల వరకు ఉంటుందని ఆ పార్టీల ఛానళ్లే బహిరంగంగా ప్రకటించాయి. అందరూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే వాళ్లే, నైతిక విలువలు గురించి మాట్లాడే వాళ్లే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే, ఓట్లను కొనకపోతే ఎవరికీ కనీస పరిమితి ఓట్లు అయినారావన్నది అందరి ఏకాభిప్రాయం అయిపోయింది.

సంస్కరణ ఎలా ఉండాలి

1) అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారాలు చేయకూడదన్న నిషేధం ఉండాలి. 

2) ఎన్నికల సంఘమే ప్రతి అభ్యర్ధికీ తన గురించి, తన కార్యాచరణ గురించి ప్రజలకుచెప్పుకునేందుకు సమాన అవకాశాలు ఇస్తూ ఒకటి, రెండు, మూడు సార్లు మాట్లాడే అవకాశం కల్పించాలి. అందరికీ సమానమైన సమయాన్ని కేటాయించాలి.

3) ఈ ఏర్పాటు సెలవుదినాల్లో చేస్తూ, ఆరోజు ఓటర్లందరికీ సమాచారం అందించి, అందరూ అందరి ప్రసంగాలూ జాగ్రత్తగా విని యోగ్యులను ఎంపిక చేసుకోమని చెప్పాలి.

4) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం, మద్యనిషేధం కఠినంగా అమలు జరపాలి. 

5) ఇతరేతరమైన ఎట్టి ప్రచారాలూ, పత్రికా ప్రకటనలూ, హోర్డింగులూ వగైరాలుచేయడాన్ని నిషేధించాలి.

6) పోలింగ్ తేదీన అభ్యర్థులు ఓటర్లకు ఎట్టి సదుపాయములు కల్పించ కూడదు. ఎన్నికల , సంఘమే ఓటర్లకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. 

7) ఓటు వేయడానికి వచ్చిన, ఇంకా ఓటు వేయని వారు మాత్రమే పోలింగ్ బూత్ పరిసరాల్లో ఉండాలి. ఓట్లు వేసిన వారు ఆ పరిసరాలలో కూడా ఉండరాదు. నా లెక్క ప్రకారం ఆరోజు ఆ నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ అమలు చేయాలి.

8) ఈ నియమాలను అతిక్రమించినట్లు ఖచ్చితమైన ఆధారం ఒక్కటి దొరికినా, ఆ పనిచేసిన, చేయించిన అభ్యర్థిని ఆ తఫా ఎన్నికలకు అనర్హుణ్ణి చేయాలి.

9) అభ్యర్థి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకూడదు. ఉండకూడదు. అభ్యర్థులు ఎన్నికల సంఘం ఏర్పరచిన వేదికపై నుండి గాక విడిగా ఓటర్లను కలవకూడదనేఆదేశం ఉండాలి. 

10) అభ్యర్థులు తన గురించి చెప్పుకోవడానికే పరిమితం కావాలి. ఇతర అభ్యర్థుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అవకాశం కూడా ఇవ్వరాదు. అలా ఇతర అభ్యర్థులు గురించి చెప్పిన అభ్యర్థిని ఆ ఎన్నికలకు అనర్హునిగా ప్రకటించి ఎన్నికల ప్రక్రియ నుండి ఈ తొలగించాలి. 

గమనిక : ఎందుకీ విషయాన్ని ఇంతగా చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ గాని, రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణ్యత లేకపోయినా, విరుద్ధమైన రీతి నడచినా, ఇక ఆపై జరిగేదంతాఅప్రజాస్వామిక ప్రక్రియే. 

11) ఈ విషయాలు చర్చించే సందర్భంలో మామధ్య ఒక ప్రశ్న తలెత్తింది. ఎన్నికల సందర్భంలో అభ్యర్ధులుగా నిలుచున్న వారిలోని ఒక అభ్యర్ధికి సంబంధించిన సమాచారం, ఎన్నికల నియమావళి ననుసరించి అతణ్ణి అనర్హుణ్ణి చేయగల సమాచారం మరో అభ్యర్థికి తెలిసింది. అలాటప్పుడు ఆ వాస్తవాలను తన ప్రచారంలో భాగంగా వెల్లడిచేస్తే తప్పేముంది.అది ఒక పౌరునిగా అతని బాధ్యత కూడా కదా అన్నది ప్రశ్న. 

దానికి నా సమాధానం ఏమంటే, అభ్యర్థులు ఒకరి గురించి ఒకరు ప్రస్తావించరాదన్నదే ఈ సందర్భంలోనూ నియమంగా ఉండాల్సిందే. అది సాధారణం. ఒక పౌరునిగా, సామాజిక బాధ్యతతో ఆ విషయాలు వెల్లడి చేయాలా వద్దా అంటే, వెల్లడి చేయాల్సిందే. కానీ ఆ వెల్లడి ఎవరికి చేయాలంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు (ఓటర్లకు) కాదు. ఎన్నికలనిర్వహణాధికారికి ఆ సమాచారాన్ని వెంటనే అందించాలి. అందించినట్లు, అందించిన సమయంతో సహా పేర్కొని, అందినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.

సరిపడినంత సమాచారం ఉందనిపిస్తే, అభ్యర్థిని ఎన్నికల బరి నుండి వెంటనే తప్పించే విధానం ఉండాలి. సమాచారం సంపూర్ణంగా లేని పరిస్థితుల్లో, విచారణకు ఆదేశించి ఎన్నికలలో అదే అభ్యర్థి గెలిచినప్పటికీ, విచారణలో తేలిన దాని ప్రకారం, అవసరమైతే అతన్ని అనర్హుడిగా ప్రకటించి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఓడిన అభ్యర్థుల విషయంలో ఇలాంటి సమాచారం అంది, అది వాస్తవం అని నిర్ధారణ అయితే, అతడు రాబోయే ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడడానికి అనర్హుడని వెంటనే ప్రకటించాలి.

12) వ్యవస్థలోని మిగిలిన అన్ని విభాగాలలోనూ అభ్యర్థుల ఎంపికకు ఉన్న సాధారణ నియమాలను, ప్రజాప్రతినిధులుగా ఉండగోరిన వారి విషయంలోనూ రూపొందించి, తూ.చ తప్పకుండా అమలు చేయాలి. వీటి అమలు విషయంలో ఎన్నికల సంఘంలో ఎక్కడైనా అవకతవకలు, నిర్లక్ష్యం, పక్షపాతం లాంటివి చోటుచేసుకున్నా, అందుకు కారకులైన వారికి కఠిన దండన పడేలా నిబంధనలు ఉండాలి.

ఎ) ఆయా స్థానాలకు చెందిన అభ్యర్థులకు సాధారణ విద్యార్హత, బి) ఆయా పాత్రలకు ఈ చెందిన ప్రత్యేక పాఠ్యాంశాల బోధన, శిక్షణ పొంది ఉత్తీర్ణుడై ఉండడం, సి) ఉత్తీర్ణులైన వారిలోనూ ఉన్నత శ్రేణి కనీసార్హతగా నిర్ణయించి అభ్యర్ధులుగా చేయడం, డి) ఎలా అయితే, ఫలానా పదవికి కనీస మార్కులు 60 శాతం అనో, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై ఉండడమనో నియమం ఉంటుంది చూడండి, అలాగన్నమాట. రాజకీయ పాఠశాలలో తను చదవాల్సిన తరగతి చదివి, ఉత్తీర్ణుడవడం, అందులోనూ మెరుగైన స్థానాన్ని పొంది ఉండటం, ఆ తరువాతే ఆయా స్థానాలలో ప్రజా ప్రతినిధిగా పాల్గొనే అర్హత కలిగి ఉండడం అన్నది జరగాలి. అట్టి వారిలో నుండి ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. 

ఓటర్లు ఓటింగు - ఒక అవగాహన

ఓటరు అవగాహనాపరుడు, విచక్షణా సామర్ధ్యం కలవాడు, నిష్పాక్షికుడు, నీతిమంతుడు కాకుంటే జరిగే అభ్యర్థుల ఎంపిక, తెగిన గాలిపటపు పోకడలా మారి లక్ష్యము లేకుండా , పోతుంది. ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధిని ఎంచుకోవడం అంటే, అక్కడ తామే ఉండుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవారమో, దాదాపు అలాంటి నిర్ణయాలే తీసుకో గలడు, తీసుకుంటాడు, అనదగ్గ వాడిగా వాడిని ఎంచుకోవడం అని అర్థం. 

కనుక ఓటర్లను అవగాహనాపరులుగా చేయడంతో మొదలవ్వాలి పరోక్ష ప్రజాస్వామ్యపు ఆచరణ (ప్రయాణం ). అందుకై 1) పదవ తరగతి పాసైన దగ్గర నుండి లేదా పదవ తరగతి నుండి వారికి రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించీ, ఎన్నికల గురించి, ఓటు గురించీ, ఓటు విలువ గురించి, ప్రతినిధిని ఎంచుకోవాలి పట్టించుకోవలసిన ముఖ్య విషయాల గురించీ తప్పనిసరి పాఠ్యాంశం ఉండాలి. ఆ విషయంలో సిలబస్ పూర్తయిందని , అనిపించేలా కాక, ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అవగాహన కలిగించాలి. దేశభక్తి, జాతీయ భావనప్రతి ఒక్కరిలో నెలకొనేలా యత్నించాలి. 

2) రాజకీయ పాఠశాలను ఏర్పరచి, ఆ కోర్సు పూర్తి చేసిన వారికే ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉండేలా శాసనం చేయాలి.

3) ఓటు వేయడంలో ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అవగాహన ఓటర్లందరికీ కలిగించడానికి విస్తృతంగా అవగాహనా సదస్సులు, కరపత్రాలు, మాధ్యమాలద్వారా ప్రచారం చేయాలి. 

4) ఓటును విధి చేయాలి. 100% ఓటింగ్ జరగాలి. అభ్యర్థులు ప్రచార కార్యక్రమం ఎవరికి వారుగా చేసుకోకూడదు. అభ్యర్థి తనకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పిస్తే, ఎన్నికల సంఘమే ఒక పద్ధతి ప్రకారం అందరినీ సమానంగా పరిగణించి, ఒకే స్థాయిలో అందరి గురించి ప్రజలకు తెలియజేసే పని చేయాలి.

5) సరైన కారణం లేకుండా ఓటు వేయని వారికి కఠినంగా శిక్షించే నియమంఉండాలి. సరైన కారణం లేకుండా రెండు సార్లు ఓటు వేయకపోవడం, దానికి శిక్ష పడడంజరిగిన వారికి, కొంత కాలం పాటు ఓటుహక్కు లేకుండా నిషేధించే విధానం రావాలి. 

6) ఓట్ల లెక్కింపులో ప్రతి ఓటుకూ సమానమైన విలువ వచ్చేలా శాస్త్రీయమైన పద్ధతిని రూపొందించుకోవాలి. అందుకు ఉన్నంతలో మెరుగైన మార్గం పార్టీలే అభ్యర్థులుగా పాల్గొంటాయి. పార్టీకే ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఓటరు పార్టీ మేనిఫెస్టోను, పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సమాచారాన్ని చక్కగా అర్ధం చేసుకొని ఓటు వేస్తారన్నమాట. ఇన్ని ఓట్లకు ఒక అభ్యర్థి అంటూ ప్రతినిధుల ఎంపిక జరుగుతుంది.

7) ఇక స్వతంత్రులుగా నిలుచున్న వారి విషయంలో ప్రతి ఓటునూ లెక్కలోకి తీసుకోవడంఎలాగు? అన్న సమస్యను పరిష్కరించుకోవలసి ఉంది. అది ఒకింత కష్టమైనదే అయినా, నిష్పాక్షిక పద్ధతిన ఒక మధ్య మార్గాన దానిని పరిష్కరించవచ్చు. స్వతంత్రులు అన్నదొక పార్టీగా భావించి వారందరికీ కలిపి వచ్చిన మొత్తం ఓట్లను పై విధానంలోనే గణించి అభ్యర్థుల సంఖ్యను నిర్ణయించాలి. అభ్యర్థుల ఎంపికను లాటరీ పద్ధతిన ఎంపిక చేయవచ్చు.దీనికి శాసన రూపాన్నివ్వాల్సి ఉంటుంది. 

  • అలా ప్రతి ఓటుకూ విలువనివ్వడం అన్న సూత్రాన్ని 100కి 100 కాకున్నా, ఎక్కువలోఎక్కువ శాతం అమలయ్యేలా చూడవచ్చు.

8) అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆదర్శ ప్రాయమైనది. మెజారిటీ వచ్చిన వాడు గెలుపొందడం తరువాత స్థాయిది. పార్టీలకు ఓట్లు వేసే సందర్భంలో ఈ సమస్య ఉత్పన్నంకాదు గాని, విడిగా ఎంపిక చేయాల్సి వస్తే మొత్తం ఓట్లలో 51% కనీస ఓట్లు రావాలి అన్న నియమం ఉండాలి. 

9) ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారినే ప్రతినిధులుగా ఉంచాలి అన్నదొక విధానం కాగా, ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతానికి ప్రతినిధిగా ఉంచాలి అన్నది మరొక విధానం. ఈ రెంటిలోనూ, దేని ప్రయోజనాలు దానికున్నాయి. దేని సమస్యలు దానికున్నాయి. అయినా వేరు వేరు ప్రాంతాల వాళ్ళు, వేరు వేరు ప్రాంతాలకు ప్రతినిధులుగా ఉండడమన్నవిధానమే రెంటిలో మెరుగైనది. 

10) వేరే వేరే వృత్తి, వ్యాపారాలలో ఉన్నవారు, ప్రజాప్రతినిధులుగనూ ఉండడానికి అవకాశం ఉండరాదు. ఈ వృత్తిని ఎంచుకున్న వారే ఇందులోకి వస్తారు. ఎలాగైతే కొన్ని కీలకమైన ఉద్యోగాల విషయంలో వేరే సంపాదనా మార్గాలను అనుసరించరాదన్న నిబంధనలు ఉంటాయో అలాగన్నమాట.

గమనిక : రాజకీయాలు బడా వ్యాపారంగా తలచబడుతూ ఎన్నికలకయ్యే వ్యయమంతా ఆరంభ పెట్టుబడిగా పరిగణింపబడుతున్న తరుణంలో, దీనికి సేవారంగంగా సంస్కరించాలంటే ఇలాంటి కఠిన సినిమాలు ఏర్పరుచుకోవడం తప్పనిసరి. అవసరమైతే సర్పంచ్ నుండి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు బ్రతుకు తెరువుకు సరిపడినంత జీతభత్యాలను ఏర్పరిస్తే సరిపోతుంది. లేదా ఆర్థిక స్తోమత ఉండి వేరే సంపాదన అవసరం లేదన్న అభిప్రాయం కలవారే సిద్ధపడేలా విధానం ఉండాలి. అయితే ఆర్థిక స్తోమత లేనివాళ్లకు అవకాశాలు లేకుండా పోయే వీలుంది గనుక, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. పరిష్కరింపబడే సమస్యల కంటే ఆ పరిష్కారం వల్ల తలెత్తే సమస్య పెద్దదిగా ఉండకూడదన్న నియమం ఉండాలి.

ఏదేమైనా పదవిని స్వార్థ ప్రయోజనాలకు, సంపాదనకు అడ్డు పెట్టుకోకుండా అన్నిరకాల చర్యలు తీసుకోగలిగేలా నిబంధనావళి రూపొందించాలి. రాజకీయ ప్రక్షాళనంతా ఈ విషయంతో ముడిపడే ఉంటుంది. నైతిక విలువలతో కూడి, సేవా రంగాలుగా ఉండాల్సిన ఏ క్షేత్రమైనా, ఆదాయ వనరుగా, వ్యాపార రంగంగా చూడబడుతున్నంత కాలం, ఉపయోగపడుతున్నంత కాలం రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరడం అసాధ్యం. ఈ సందర్భానికే చెందిన డాక్టర్ అంబేద్కర్ మాటలను గుర్తుచేసుకుందాం.

“రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు పరిచే స్థానాలలో అయోగ్యులుంటే ప్రజలకు చెడు జరుగుతుంది. ఒకవేళ రాజ్యాంగం చెడ్డదైనా దానిని అమలు చేసే స్థానాల్లో యోగ్యులుంటే ప్రజలకు మేలే జరుగుతుంది.”

కనుక మనముందున్న అత్యంత ప్రధానమైన సమస్య ప్రతినిధులు యోగ్యులా? కాదా? అన్నదే. యోగ్యులను ఎంచుకోవడం ఎలాగు అన్నదే. ఎంపికలో మానవ తప్పిదం కారణంగా పొరపాటు జరిగితే దానిని సరి చేసుకోవడం ఎలాగన్నదే.

రీకాల్ వెనక్కి రప్పించడం (ప్రతినిధి స్థానాన్ని తప్పించడం) 

అయోగ్యుణ్ణి ఎన్నుకున్నాం” అని నిర్ధారించినప్పుడు, అతణ్ణి ప్రజా ప్రతినిధి పాత్రనుండి తొలగించే విధానాన్నే 'రీకాల్' అంటారు. ప్రతినిధిగా ఎంపికయిన వాని అయోగ్యతను నిర్ధారించే విధి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడే ఇది సవ్యంగా ఆచరణలోకి వస్తుంది. అయితే పార్టీకి ఓటు అన్న పద్ధతిలో ఎంపిక జరిగినప్పుడు దీనిని అమలుపరచడం ఒకింత క్లిష్టమవుతుంది. అయోగ్యుడని నిర్ధారించాల్సిన బాధ్యత ఎవరిది? అన్నది కీలకమవుతుంది. నిర్ధారణైన సందర్భాలలో పార్టీ అతన్ని తక్షణం ప్రతినిధి పాత్ర నుండి తప్పించి మరొకరిని నియమిచే విధానం ఉండాలి.

రిఫరెండం : విస్తృతస్థాయిలో ప్రత్యేకాంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం, మెజారిటీప్రజల అభిప్రాయాన్ని అమలుపరచడం అన్నది దీని సారాంశం. (సశేషం) 

మిత్రులు ముస్తాక్ గారికి ;

ఏ కారణం వల్లనో మీ నుండి ఇంత వరకు అంటే ఈ వ్యాసం రాయడం పూర్తయిన 05-05-22 వరకు రావలసిన సమాధానం రానేలేదు. కొన్నాళ్ళ క్రితం వాట్సాప్ ఫోన్ కాల్ చేసి, విచారణ విషయమై, మీ వైఖరేమిటో ఆలోచించి చెబుతానన్నారు. ప్రసాదు కూడా మీకు ఫోన్ చేశానన్నాడు. సరే, అయిన ఆలస్యం అయ్యింది. ఇప్పటికైనా ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరం కలిసి కూర్చుందామో చెప్పండి.

ఈ వ్యాసంలో మీరు నా గురించి ప్రకటించిన కొన్ని అభిప్రాయాలను విశ్లేషిస్తాను. 1) నేను రాసిన 260 సంచిక ఆధారంగా, నాపై మీరు కొన్ని అభాండా లనదగిన ఆరోపణలు చేశారు. ఖురాన్ పై నేను ప్రకటించిన అభిప్రాయాలు, ముందే దానిపై నేను పెట్టుకున్న ద్వేషభావము నుండి పుట్టుకొచ్చినవే గాని, ఖురానులో అలా చెప్పబడిలేదు అని అన్నారు. అసలు మీరు మీ వ్యాసానికి పెట్టిన శీర్షికే పెద్ద అభాండం. ఎవరైనా ఒకరు నన్ను, తిట్టగల పెద్ద తిట్టు, ‘గొప్ప సత్య సంధుణ్ణి, నిష్పక్షపాతిని’ అని చెప్పుకుంటున్న నీవు వాస్తవంలో 'పెద్ద పక్షపాతివి' అన్నదే. మీరు అయితే ఆ విషయంలో మరింత నైపుణ్యంగా ఒకింత వ్యంగ్యాన్ని జోడించి మరీ, “ఘోర పక్షపాతం చూపుతున్న నిష్పక్షపాతి సురేంద్రబాబు” అన్న శీర్షికే పెట్టి అది గ్రూపులోనూ పెట్టేశారు. అంత తిట్టూ తిట్టి, ఏమీ పట్టనట్టు, ఏమీ అననట్లు మీరు నాకు గురువుతో సమానం, మీరు అంగీకరించకపోయినా, మీరు నాకు గురువేనన్నారు.

ఇప్పటి మీ పోకడను, ఇప్పటివరకు గతంలో మీరు కనబరుస్తూ వచ్చిన పోకడనూ బేరీజు వేసి చూసుకుంటే, ఇప్పటివరకు మీరు మీ గురించి కనపరచిన రూపం కంటే, వేరైన మరో రూపమూ మీకుందేమోనన్న సందేహం కలుగుతోంది నాకు. అది ఎంతవరకు నిజమో పరీక్షించి చూసుకోవాలి.

దశాబ్దం పైగా, నాతో పరిచయం అయినప్పటి నుండీ, మండలి ఏర్పరిచిన ఎన్నో సమావేశాలలో, గోష్టులలో మీరూ పాల్గొంటూ వచ్చారు. ప్రమాణాలు, పదార్ధాలు, ఆస్తిక, నాస్తిక సిద్ధాంత విషయాలు, భౌతిక విజ్ఞాన శాస్త్ర విషయము.... ఇలా అనేక విలువైన విషయాలపై నానుండి ఎంతో కొంత తెలుసుకున్నారు. ఇంతకాలం కలసి నడిచిన క్రమంలో ఎప్పుడూ నేను పక్షపాతంగా వ్యవహరించానని మీరనలేదు. కానీ ఈనాడు హఠాత్తుగా నేనో గొప్ప పక్షపాతినని తేల్చేశారు. పైగా నాకు ఇస్లాంపై ద్వేషము ఉందనీ, ఇస్లాంపై ద్వేషం ఇప్పటిది కాదు, చిన్నతనం నుండే పెట్టుకుని ఉన్నదే, అని తీర్మానం చేసేశారు.

అవునా ముస్తాక్ గారూ! ఈ విషయం నాకైతే ఒకింత ఆశ్చర్యం కూడా కలిగించింది. నా గురించి నాకే తెలియని ఇంత గొప్ప నిజాలు?? వీరికెలా తెలిశాయా అనిపించింది. ఎలాగూ బహిరంగ చర్చేనన్నారుగనుక, నాకు తెలియని ఈ రెండు సంగతులు నిజాలేనని నలుగురికి తెలిసేలా నిరూపించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది.

 వివేకపథం 260 సంచికపై మీరు వెలువరించిన భావాలు కారణంగా, మన మధ్య తేల్చుకోవలసిన విషయాలలో, చరిత్ర సంబంధంగా, మీకు తెలిసిందెంత? నాకు తెలిసిందెంత? అన్నదీ తేల్చుకోవలసిన అంశంగా వచ్చి కూర్చుంది. పైగా, చరిత్ర పేరున నేను ప్రస్తావించినవి అవాస్తవాలంటూ, మీరు ప్రకటించారుగనుక, ఆ మేరకు అవెలా అవాస్తవాలో నిర్ధారించాల్సిన బాధ్యత మీపైనే ఉంది.

ఒక్క మాటండీ ముస్తాక్ గారూ! ఫలాని విషయంలో చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకోడానికి, నిర్ధారించుకోవడానికీ, ప్రపంచ చరిత్రంతా బట్టీ పట్టాలా ఏమిటి? ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందించిన వెసులుబాటు వల్ల, ప్రపంచ చరిత్రకు సంబంధించిన ఏ ప్రత్యేక సంఘటన గురించి వివరాలనైనా 10 నిమిషాలలో అంతర్జాలం ద్వారా సేకరించి చూసుకోవచ్చు. అలాటి అతి సులభమైన విషయానికి, మీకు అవగాహన లేదు, అంటే మీకు అవగాహన లేదు, అనుకోవలసిన పని ఎవరికీ లేదు. ఈ దేశంపై మహమ్మదీయులు దండయాత్రలు చేశారా లేదా? ఎందుకు చేశారు? వాని పర్యవసానాలేమిటి? ఆయా ముస్లిముల దండయాత్రల పరంగా ఇక్కడ చారిత్రిక అవశేషాలుగా మిగిలిన, పగిలిన, విరిగిన దేవతా విగ్రహాల మాటేమిటి? శిధిలాలయాల మాటేమిటి? దేవాలయాలపై ఉండాల్సిన విమాన గోపురాల స్థానే నిర్మితమైన మసీదు తరహా నిర్మాణాల మాటేమిటి? భారతదేశ చరిత్రలో తురుష్కుల దండయాత్రలు, పర్షియనుల దండయాత్రలు, మొఘలుల దండయాత్రల పేరున రాయబడ్డ రాతలనేమి చేద్దాము?

అదంతా అలా ఉంచండి. రావణకాష్టంలా, పక్కలో బల్లెంలా తయారై గత 7 దశాబ్దాల పైగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పాకిస్థాన్ విషయమేమిటి? ఈ దేశం ఏ కారణంగా రెండు ముక్కలయ్యింది? ఖిలాఫత్ ఉద్యమం విషయంలో గాంధీ, హిందువులు నిర్వహించిన పాత్ర ఏమిటి? ఆనాటి ముస్లిం నాయకులు అనుసరించిన విధానమేమిటి? ఈ దేశ ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఇద్దరు మహనీయులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, గాంధీజీలు దేశ విభజన విషయంలో ఎలాంటి భావాలను వ్యక్తపరిచారు? వాళ్లు అన్నారని కాదు గానీ,

దేశవిభజనకు ముస్లిములను ప్రేరేపించిన విషయాలలో, ఇస్లాం (ఖురాన్) భావాల పాత్ర ఏమిటి? హిందూ విశ్వాసాల పాత్రేమిటి? హిందూ మత నాయకులలో దేశ విభజనను కోరినవారెవరు? ఎంతమంది? అసలున్నారా? ఉంటే ఏ కారణాలు చూపి వారు దేశవిభజనను కోరారు.

అలాగే, ముస్లిం మత నాయకులలో దేశ విభజనను కోరనివారెవరు? ఎంత మంది? అసలున్నారా? ఉంటే వారు ఏ యే కారణాలను చూపి దేశ విభజన జరగకూడదని కోరుకున్నారు.

ముస్తాక్ గారూ! నాకు చరిత్రకు సంబంధించిన కనీస అవగాహన కూడా లేదన్నారు కదా? బహుశా మీకు 'చాలా అవగాహన ఉంది నాకు' అని మీ గురించి మీకు అనిపిస్తూ ఉండవచ్చు. ఉత్తుత్తి స్టేట్మెంట్లు ఇవ్వకుండా, ప్రామాణిక సమాచారంతో కూడిన ఆధారాలుంటే వాటిని వెల్లడించండి. ఒక వ్యక్తిని 'నీకా విషయంలో కనీస అవగాహన లేదు', అని అనేముందు, అది సరైన మాటేనని నిరూపించాల్సిన బాధ్యత లేదంటారా? ఏదిబడితే అది అనేస్తూ, బాధ్యత మాత్రం తీసుకొనఖ్ఖరలేదు, అన్న దగ్గర ఉంటారా? విషయాలను నాన్చకుండా, సూటిగా సమాధానాలు చెప్పండి.

అభాండం 2

ఖురాన్ పై నేను వెల్లడించిన అభిప్రాయాలకు ఆధారాలు ఒక్కటంటే ఒక్కటి చూపించ లేకపోయారు. ఖురానుపై (సురేంద్ర) ఆయన చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలే, ఇస్లాంపై ఆయన వెల్లడించిన వన్నీ అసత్యాలే.

బాగుంది ముస్తాక్ గారూ! ఇంతకూ 1) ఖురాన్ పై 260 సంచికలో నేను చేసినఆరోపణలేమిటి? ముందు స్పష్టంగా ప్రకటించండి.

2) ఇస్లాంపై నేను ఏమేమి వెల్లడించానోనూ సుస్పష్టంగా ప్రకటించండి. పై రెంటికీ సంబంధించిన వివరాలు ఇచ్చి కదా మీరు ఏమైనా మాట్లాడాల్సింది? ఈ వివరాలేమీ ఇవ్వకుండా, ఊరికే, అభిప్రాయాలు, (ఆరోపణలు అభాండాలు) ప్రకటించినందువల్ల ప్రయోజనం ఏముంటుంది? ఆధారాలు చూపకుండా ఇలాగే మళ్ళా మళ్ళా ప్రకటనలు చేసుకుంటూ పోతుంటే, అట్టి వాటినే పసలేనినస అంటారు విజ్ఞులు. ఊకదంపుడు అంటారు చూడండి, అదన్నమాట.  

అభాండం 3 

గతంలో నిర్వహించిన చర్చావేదికల్లోనూ, సురేంద్ర మేము అడిగిన వాటికి ఎట్టి సమాధానమూ చెప్పలేదు. దాంతో వారి పక్షంలో పసలేదని తేలిపోయింది.

బాగుంది ముస్తాక్ గారూ! ఈ మాట అనడం వలన మీరు ఏ నిజాన్ని సమాజానికి తెలియజేయాలనుకున్నారు? ఇదే విషయాన్ని తీసుకుని, ఆనాడు తామరతంపరగా పదులు కాదు వందకు పైగా ఖురాను వచనాలను వరసగా చదువుతుంటే రహమాన్ గారికీ, ముస్తాక్ గారికీ, మిగిలిన ముస్లిములకూ నోట మాట లేదు, అని నేను ప్రకటన చేశాననుకోండి ఏమవుతుందప్పుడు? స్టేట్ మెంట్లు ఇచ్చినంత మాత్రానే, అన్న మాటలు నిజమైపోతాయా? తానన్నమాట సరైనదేనని అన్నవాడు రుజువు చేసే బాధ్యత తీసుకోనక్కర లేదంటారా? ఈ  ప్రకటన వరకు మీరేమి చేయగలరు, ఏమి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందో ముందు చెప్పండి.

నా విషయానికి వస్తే, 260 సంచికలోని విషయాల సబబు బేసబబులను విచారించడానికి, 2016 నాటి సమావేశాలతో పని లేదు, ఈ సందర్భానికి అక్కర లేని అంశాలు ఎవరు లేవనెత్తినా దానిని ప్రకరణ భంగం చేయడం, అసందర్భంగా మాట్లాడడం, విషయాన్ని పక్కదారి పట్టించడం అని అంటారు విధం తెలిసిన వాళ్ళు.

'విప్రతిపత్తిరప్రతిపత్తిశ్చ నిగ్రహ స్థానం' అన్నది విచారణ నియమాలలో కీలకమైనది. జరుగుతున్న విచారణకు సంబంధించని అంశాన్ని లేవనెత్తినా, ఏ ప్రతిపాదనా చేయకుండా మౌనంగా ఉన్నా ఆ పక్షం వీగిపోయినట్లే నన్నది పై సూత్రానికి అర్థం.

విప్రతిపత్తి = విరుద్ధ ప్రతిపత్తి = ఆ సందర్భానికి అవసరమైన భావన ఏదో దానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ప్రకటించడం విరుద్ధ ప్రతిపత్తి అవుతుంది.

అప్రతిపత్తి: = నప్రతిపత్తి, అంటే ఆ సందర్భానికి అవసరమైన అభిప్రాయం అతని వద్ద లేకపోవడంతో ఏమీ చెప్పకుండడం. ఈ రెండూ ఆ పక్షం వీగిపోయిందనడానికి గుర్తు.

మనం అప్పటికి అంత ఖచ్చితమైన పద్దతులను ఏర్పరుచుకుని ఉండకపోవడం, నాకు, నేనన్న ఎప్పటి అభిప్రాయాల మీదనైనా పునర్విచారణ సిద్ధంగా ఉండాలి అన్న వైఖరి ఉండడం కారణంగా ఆనాటి సమావేశంలో జరిగిన వాటి పైనా తిరిగి సత్యాసత్య విచారణకు సిద్ధం అని రాశాను.

ఆనాడు ముస్లిములను, క్రైస్తవులను కూడా విచారణకు తీసుకున్నాం. ఖురాను, బైబిలు అవిశ్వాసుల పట్ల వాటి వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశం. ఆ రెండింటి విషయంలోనూ మీరు మీ వ్యాసాలను (అభిప్రాయాలను) పుస్తకరూపంలో సమావేశానికి అందించారు. వాటినిపరిశీలిద్దాం.

అవిశ్వాసుల పట్ల ఖురాను వైఖరి ఏమిటన్న విషయంలో 1) మొదటి నుండి అవిశ్వాసిగానే ఉన్నవారు, 2) మొదట ముస్లింగా ఉండి తరువాత ఇస్లాంను విడిచి పెట్టిన వారు,  3) ఒకసారి ఇస్లాంను స్వీకరించి తిరిగి దానిని విడిచిపెట్టిన వారు అన్న రూపాలలో ఖురాన్అవిశ్వాసుల గురించి మాట్లాడుతుంది.

నాటి అవగాహన ప్రకారం పై మూడు రకాల వారికీ పై లోకంలో ఘోరమైన శిక్ష (నరకం) ఉంటుంది. ఈ లోకంలో మూడు పద్ధతులు ఆయా సందర్భాలను బట్టి అమలుచేయమంటోంది.

1) సందేశం వినిపించి ఇస్లాం స్వీకరణకు ఆహ్వానించడం. ఈ పని చేసేటప్పుడు స్వర్గపు ఆశనూ, నరకపు భయాన్నీ కూడా సందేశంలో భాగంగా చెప్పటం జరుగుతుంది.

2) తొలి నుండి ఇస్లాంలో ఉండి, ఇస్లాంను విడిచిన వానికి, అవకాశం ఉండి బలంసరిపోతే, (ఇస్లాం విధానం ప్రకారం పాలన జరుగుతుంటే) మరణ శిక్ష వరకు విధించవచ్చు. 

3) అన్యుడుగా ఉండి ఇస్లాంను స్వీకరించి, తిరిగి ఇస్లాం నుండి విడిచిన వానిని వధించవచ్చు.

ఇదండీ ముస్తాక్ గారూ! ఖురాన్ అవిశ్వాసుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంది? అన్నదానికి నా సమాధానాలు ఈ మూటికీ నేను ఆనాడు రాతపూర్వకంగానే సమాధానం చెప్పాను. 

ఆనాడు వాటిని చూచి మీరే మౌనంగా ఉన్నారు. రెహమాన్ గారు అందులో నేను ఖురాన్లో లేనివేమీ చెప్పలేదు, ఉన్నవే చెప్పానని అంగీకరించారు. అందులోని ఒక దాని విషయం అంగీకరిస్తున్నానని చెప్పారు. సమావేశంలో ఉన్నవారంతా సురేంద్ర తాను చెప్పవలసింది చెప్పారు, ఇక అతను చెప్పింది ఎలా సరికాదో చెప్పాల్సింది మీరేనని చెప్పారు. ఆనాటి వివేకపథంలోనూ వినిపించాల్సింది మీ పక్షమేనని నేనన్న వచనాలు ఉన్నాయి.

ఇదంతా కూడా తిరిగి ఇక్కడెందుకు రాస్తున్నానంటే, ఆనాటి నా భావాలను తిరిగి రాతరూపంలో స్థిరపరచడాని కొరకే. మీరు నన్ను కోరింది అదే కదా కానీ ఇప్పటికీ నేను చెప్పేదేమంటే, మనం సత్యస్థాపన యొక్క అవసరాన్ని గుర్తించి, త్వరగా జరగాలన్న తపనా కలిగి ఉంటే మాత్రము ముఖాముఖి రెండు మూడు రోజులు కూర్చుని విచారించడం ఒక్కటే సరైనది. కావాలంటే ఆ చర్చలో ఏ అంశానికి అంశాన్ని రాత రూపంలోనూ పెట్టుకుందాం. పూర్తిగా ఆడియో రికార్డు చేసేద్దాం. తిరిగి చూసుకోడానికి, యథాతధంగా భద్ర పరచడానికే గదా ఆ రెండూ అవసర పడేది.

మరొక్క మాట మీ వ్యక్తీకరణలో నాకు ఖురాన్ విషయంలో కనీస అవగాహన కూడా లేదన్న ప్రకటన ఉంది. నిజానికది చాలా తొందరపాటుతో కూడుకున్న ప్రకటన. ఆ ప్రకటన వల్ల నాకు జరిగే నష్టమేమీ లేదు గానీ, మీరే అనాలోచితంగా మోయలేని భారాన్ని నెత్తికెత్తుకున్నారు.

 ఇప్పటికి ముగింపు:

మీ విమర్శనాత్మక లేఖ వలన మనమధ్య రెండు మూడు అంశాలు విచారణకు తీసుకోవలసిన పరిస్థితి వచ్చిపడింది.

1) మీ నా అవగాహనల వాస్తవ పరిస్థితి ఏమిటి.

ఎ) చరిత్ర, బి) ఖురాన్ల విషయంలో మనలో ఎవరికి తప్పు అవగాహన ఉంది. లేదా ఎవరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు? ఇంతకూ ఖురాను అవిశ్వాసుల విషయంలో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని చెబుతోంది? ముస్లిం దండయాత్రలలో ఇక్కడ జరిగిందేమిటి? 

రండి, కూర్చొని మాట్లాడుకుందాం, తేల్చుకుందాం, ఇరువురము సత్యం స్థాపించబడాలని, తేలిన దానిని అంగీకరించి స్వీకరిస్తామని ప్రకటించే ఉన్నాము గనుక, మిగిలింది తేల్చుకోవడమన్నదే. నాటినుండే నేను సిద్ధంగా ఉన్నాను. స్పందించవలసినది మీరే. ఒకింత ఒత్తిడినీ జతచేసి రాసిన ఈ లేఖ మిమ్మల్ని మిత్రునిగా భావించే రాశాను. అయితే ఈవిషయానికున్న ప్రాధాన్యత దృష్ట్యా కొంత ఒత్తిడి ఉంది ఇందులో.

పాఠకులకు ఒక సూచన

ఖురానుపై అవగాహన ఉన్నవారూ, గతంలో జరిగిన సమావేశాలలో పాల్గొన్నవారూ కూడా మీ మీ స్పందనలను వివేకపథానికి పంపండి. మీ స్పందనలు 20వ తేదీ లోపల కార్యాలయానికి చేరేలా చూడాలి.

మిత్రులు ముస్తాక్ గారికి కోట ప్రసాద శివరావు ప్రతిస్పందన,

"ఘోర పక్షపాతం చూపుతున్న గొప్ప నిష్పక్షపాతి పుట్టా సురేంద్రబాబు” అన్న శీర్షిక ఈ క్రింద మీరు వెల్లడించిన అభిప్రాయాలపై నా స్పందన రాయకుండా ఉండలేక పోతున్నాను. ముఖ్యముగా వివేకపథం 260లో ప్రచురించిన అంశాలపై, మీ స్పందన గురించి తరువాత విచారిద్దాము. ముందుగా గతంలో జరిగిన ప్రతి చర్చా వేదికలోనూ నేను పాల్గొన్నాను. మీ వ్యాసంలో మీరు వెల్లడించిన రెండు అభిప్రాయాలపై నా స్పందన వ్రాస్తున్నాను.

1) ఖురాన్ పై మీరు చేసింది ఆరోపణలే గాని వాస్తవాలు కాదని తేలిపోయింది. 2) రాతపూర్వకమైన ఆధారాలతో మీ వాదనను నిరూపించుకోలేకపోయారు.

పై రెండు ప్రతిపాదనలు మీ నుండి రావడం నన్ను మీదు మిక్కిలి ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. కారణము మనము పాల్గొన్న ఏ చర్చావేదికలోనూ మీరు పైన ప్రకటించిన అభిప్రాయాలు కలిగి ఉన్నారన్న భావనే నాకు కలగలేదు. నాకు తెలిసి ఆ చర్చావేదికలో పాల్గొన్న ఎవరికీ కూడా ఆ భావన కలిగి ఉండకపోవచ్చు. ఎందు వలనంటే పై రెండు ప్రతిపాదనలు కూడా వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అంతటి విరుద్ధ భావాలు మీరు ప్రకటించారంటే ఇప్పటికీ నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఎక్కడైనా జరిగిందానికి భిన్నంగా చూడడం లేక భిన్నంగా వ్యక్తీకరించడం నా అనుభవంలో చూచాను గాని, మీలాంటి వారు పూర్తి వ్యతిరేకంగా వాస్తవాన్ని వ్యతిరేకించడం సరి పెట్టుకో లేక వ్రాస్తున్నాను.

  అసలు ఒక విషయంపై అది ఆరోపణే గాని, వాస్తవం కాదని ఎప్పుడు తేలిపోతుంది? ఆ చెప్పబడ్డ విషయానికి, జరిగిందానికి ఎలాంటి సంబంధమూ లేదని, సదస్సులో రాగద్వేషాలులేకుండా (న్యూట్రల్ గా) ఉండగలిగే వ్యక్తులు నిర్ణయించిన ప్పుడు, అవునా? కాదా? 

అప్పటి సదస్సులో ఉన్న వారు ఎవరైనా మీరు వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేననే నిర్ణయానికి వచ్చి ఉన్నారా? మీకు ఉన్నారనిపిస్తే, వారి వివరాలు ఇవ్వండి. వారితో మాట్లాడతాను. ఇంకా దీనికి విరుద్ధంగా ఖురాన్ పై సురేంద్ర గారు అడిగిన ప్రశ్నలకు మీ వైపు నుండి సరైన సమాధానం రాలేదని, ఆ బాధ్యత మీపైనే ఉందని వ్రాతపూర్వకంగా సదస్యులు వ్రాసిన వివరాలు మీకు అందిస్తాను. అప్పుడైనా మీ ప్రతిపాదనను వెనక్కు తీసుకోగలరేమో ఆలోచించండి. అలానే రాతపూర్వకమైన ఆధారాలతో మీ వాదన నిరూపించుకోలేక పోయారని వ్రాశారు. రాతపూర్వకమైన సరైన ఆధారాలతోనే నిరూపించబడింది, అని సదస్యుల రాతపూర్వకమైన అభిప్రాయాలు, (డాక్యుమెంట్ ఎవిడెన్స్)ఉంటే మీరు ఏమి చేస్తారు? ఆ వివరాలు అందిస్తాను ఆలకించండి.

ఖురాను గురించి మనం చేస్తున్న అధ్యయనంలో ఒక అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు సురేంద్రగారు అన్నారు. 'ఒప్పుకోకపోతే నన్ను తీసేయండి అనడానికి మీరు ఎవరండి' అని. వెంటనే రహమాన్ గారు తనని ఒప్పుకోనందుకే తీసేయ్ అనే మాట గాని, అలాటి అర్ధాన్నిచ్చే మాటగానీ ఖురాన్లో ఒక్కటున్నా నేను ఇస్లామును వీడి వచ్చేస్తాను. ఇది నా పబ్లిక్ స్టేట్మెంట్ అని అన్నారు. వెంటనే మీరు కూడా అలానే ఉంటే నేను కూడా ఖురాను వదిలేస్తానని అన్నారు. అవునా? కాదా? అలానే ఖురానులో విరుద్ధ అంశము ఒక్కటున్నా అది దైవ గ్రంథం కాకుండా పోతుంది. కనుక అందులో విరుద్దాలు లేవని గతంలోనేచెప్పియున్నారు రహమాన్ గారు. వీటికి ఆధారాలుగా వందకు పైగా ఆయతులు సురేంద్ర గారూ తయారుచేసి ఆయతుల సంఖ్యల వివరాలను మాత్రం నోట్ చేసుకుని, ఒక్కొక్కటే పరిశీలిద్దాము అన్నారు. అందుకు రెహమాన్ గారు అన్ని అంశాలు ఎందుకండీ, అవన్నీ విచారిస్తే ఖురాన్ పై, సదస్యులు వేర్వేరు అభిప్రాయాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కనుక ఒక్కటంటే ఒక్కటే చూపించండి చాలు, మనం పరిశీలిద్దాం అన్నారు. ఆ తరువాత ఒక మూడు ఆయతులను కోట్ చేయగా, అప్పుడు కూడా రెహమాన్ గారు 'నేను ఒక్కటేకదా చూపమన్నాను' అని అడిగారు,

అప్పుడు ఖిజరు (ఖిద్ర్) - మూసాతో - బాలుడి విషయం చర్చించటం జరిగింది. 18:80 ఆయతు అది. ఖురాన్ ప్రకారం ఖిజరు మహాజ్ఞాని, మూసా కంటే కూడా మహాజ్ఞాని అని చెబుతోంది. అలాంటి జ్ఞాని ఒక బాలుని చంపిన ఉదంతం ఉంది అందులో.

18:80 ఇక, ఆ బాలుని విషయం , అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తలబిరుసుతనం వల్ల, అవిశ్వాసం వల్ల వారిని వేధిస్తాడని మాకు భయం కలిగింది. 

18:82 'మీ ప్రభువు సంకల్పం ఇదంతా' నా అంతట నేను చేయలేదు. అంటే అతడు మహాజ్ఞాని అయ్యుండి కూడా, అది తనంతట తాను చేసింది కాదని, అల్లాహు సంకల్పం అనీ చెప్పాడు. ఇది ఒక్కటీ చూపించిన తరువాత కూడా రెహమాన్ గారు తాను ఖురానును వదిలివేయడానికి ఒప్పుకోకపోతుంటే ఆనాటి సదస్యులు తమ వ్రాత ద్వారా రెహమాన్ గారికి చేసిన సూచనలు మచ్చుకు కొన్ని పేర్కొంటున్నాను.

ముఖ్యంగా ఖురాన్ విషయంలో అవిశ్వాసుల పట్ల అది ఏ వైఖరిని అవలంబిస్తున్నదో ఓ పరిశీలన జరిగింది. అందులో అవిశ్వాసం కారణంగానే ఒక వ్యక్తిని చంపమని ఖురాన్ గ్రంథంలో ఎక్కడ ఉన్నా ఖురాను నుండి, ఇస్లాం మతం నుండి నేను వైదొలుగుతానని అన్న ప్రకటన మీ నుండి వచ్చింది. పరిశీలనలో అటువంటి ప్రకటన సత్యాన్వేషణ మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబు గారు ఎత్తిచూపారు కదా అంతేకాకుండా అసంబద్ధతలు, వైరుధ్యాలను సైతం స్పష్టంగా పేర్కొన్నారు. అయినా మీ నుండి ఎలాంటి ప్రకటన రాకుండా మౌనంగా ఉండడం భావ్యం కాదు. సత్యాన్వేషణ తత్పరత, నిజాయితీని కలిగిన మీ వంటి వ్యక్తులకు ఇది ఎంత మాత్రం తగదని తలుస్తున్నాం. నిప్పులాంటి మీ నిజాయితీని ఆరిపోనీయకండి.                                                   -ఎం వెంకటేశ్వర రెడ్డి వివేకపథం 224 పేజీ 23

మీరు ఖురానులో అవిశ్వాసుల్ని చంపమన్నట్లు ఒక్క వాక్యమున్నా దాని నుండి బయటకు వస్తానని ప్రకటించారు. అవిశ్వాసులను మాటువేసి చంపండి, ఎక్కడ కనపడితే అక్కడ చంపండి లాంటి వాక్యాలు కొన్ని చూపగా, అవి కాదు, ఆ నాటి పరిస్థితులు వేరు. ముస్లిములకు ఇతర మతస్తులకు ఘర్షణ జరుగుతున్నప్పుడు చెప్పినవవి. ఎవరి మానాన వారు తమ మతాన్ని ఆచరించుకునే వారిని చంపమన్నట్లు ఉంటే చూపమన్నారు. చర్చ జరుగుతున్న క్రమంలో మీరు వివిధ మతాల మధ్య ఉండవలసినవి, ఉండకూడనివి అంటూ ఇలా చెప్పారు. 

1) సావధానంగా ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఒక మతం నుండి ఇంకొక మతంలోకి పోయిన వారి పట్ల ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు, చంపకూడదు. అలాంటి ఆలోచన కానీ, ప్రయత్నము గాని అమానుషం. మరైతే ఖురానులో 18:80, 2:54 బుఖారి 84:58లో చెప్పబడిన ఘటనలు మీరనే అమానుషమే గదా ఎవరి మానాన వారు వారి మతాన్ని ఆచరించుకునే వారిని చంపడము, చంపమనడము అన్నర్ధాన్నిస్తున్నాయి కదా? మీరు అన్న ప్రకారంగా మతాన్ని విడిచి బయటకు రావటానికి అభ్యంతరం ఏముంది. చర్చ ప్రారంభం నుండీ; అవిశ్వాసులను చంపమన్నది, చంపించినదే కాక మానవు లంగీకరించ కూడని, అంగీకరించ లేని వచనాలు అనేకం చూపుతున్నా, నాలుగు నెలలుగా సమయాన్ని వెచ్చిస్తున్నా ఒక్క వాక్యమూ చూపలేదనడం ఏపాటి విలువ. మీలాంటివారు మారాలి.

     పెరికల మోషే వివేకపథం 224 పేజీ 24

ఒక మనిషి విశ్వాసాన్ని ఆధారం చేసుకునే ఇస్లాం వ్యక్తులని అసమానులుగా చూస్తోంది. ఆ కారణంగానే ఇస్లాం ఆ నమ్మని వ్యక్తులను ద్వేషిస్తుంది. ఆ ద్వేషం యొక్క స్థాయి ఆ నమ్మని వ్యక్తులను చంపమనే వరకు ఉన్నది. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు సురేంద్ర గారు. తనను ఒప్పుకోకపోతే, నమ్మకపోతే చంపేయడం ఏంటండీ అని ప్రశ్నించినప్పుడు మీరు, ముస్తాక్ గారు అలా ఉంటే ఇస్లాంను వదిలేస్తాము అన్నారు.     -వివేకపథం 227 పేజీ 24

మలి సమావేశంలో అవిశ్వాసుల పట్ల ఇస్లాం వైఖరి అంశానికి సంబంధించినవి అధ్యయనం చేయడానికి 213 ఆయతులతో కూడిన ఒక చిత్తుప్రతి రూపొందించుకొని, దానిపైన ఒక్కొక్క ఆయతు అధ్యయనం చేస్తున్నాము. ఇస్లాంలో సరిగా లేని అంశాలు ఆ సమావేశంలో కనిపించసాగాయి.

సురేంద్రబాబు గారు ముందే మీకు ఆ మూడు ఆయతులు మరియు హదీసుల నెంబర్లు ఇవ్వటం జరిగింది. మీరు ఆ రోజు ముందుగా మీ ప్రతిపాదనగా మూడు అంశాలను ఉండవలసినవిగా ప్రస్తావించారు.

1) రెండు ట్రెడిషన్స్ మధ్య ఉండవలసిన సంబంధం సావధానంగా, ప్రశాంతమైన వాతావరణంలో వారివారి దృక్పధాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇది ఆ ట్రెడిషన్స్ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడానికి కీలకమైన విషయం.

2) ఒక వ్యక్తి ఒక ట్రెడిషన్లో నుంచి ఇంకొక ట్రెడిషన్లోకి మారితే మొదటి ట్రెడిషన్ , వారు ఆ వ్యక్తి పైన ఏ వత్తిడీ పెట్టకూడదు.

3) ఒక ట్రెడిషన్ వారు ప్రచారం చేస్తున్నప్పుడు ఆ ప్రచారాన్ని విన్న వ్యక్తి ఆ ట్రెడిషన్ ను నమ్మకపోతే అతన్ని చంపటం అమానుషం. నా వరకు నాకు రెండు ట్రెడిషన్స్ మధ్య ఉండవలసిన సంబంధాలు ఇంకా చూడవలసి ఉన్నప్పటికీ, మీరు ప్రస్తావించిన ఈ మూడు సిద్ధాంతాలను నేను సరైనవి గానే అంగీకరిస్తున్నాను. సురేంద్ర బాబు గారు కూడా అంగీకరించియున్నారు. అయితే ఈ మూడు అంశాలు మీరు కోరుకున్న విషయం తేల్చడానికి అవసరం లేనివి. కానీ మేము కోరుకున్న దానికి పనికి వచ్చేవిగా ఉన్నాయి. మొదటి రెండు విషయాలు కూడా ఇస్లాంలో లేవు అని మీరే అంగీకరించారు. అయినప్పటికీ ఎందుకు పట్టుకుని కూర్చున్నారు? మనసు చంపుకొని ఉంటున్నారా, ఇస్లాంలో?                                                                     వివేకపథం 227 పేజ్ 25, 26 ఖుద్దూస్

ఆయా సిద్ధాంత చర్చలలో మీరు పాల్గొంటూ, నాతో ఒక మాట అన్నారు గుర్తుందనే అనుకుంటాను. 'ఈ తర్కం ముందు ఏ మత గ్రంథము నిలబడదని' అలాటి తర్కముచేయగల సత్తా ఉన్న మీరు అన్ని మత గ్రంథాల (క్రైస్తవం, హిందూ, ముస్లిం) ను విమర్శించేటప్పుడు మీ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోతే, నిజంగా సత్యాన్వేషి మార్గంలో మీరున్నారని నేను నమ్మాను. గతంలో ఎప్పుడూ మీరు అల్లాహ్ మీకు హిదాయత్ ఇవ్వాలని నా ప్రార్థన అని అనలేదు. కానీ ఇప్పుడు మీరు పూర్తి విశ్వాసి లాగా అల్లాహ్ మీకు హిదాయత్ ఇవ్వాలని నా ప్రార్థన అంటున్నారు. దీనిని మేము ఎలా అర్థం చేసుకోవాలి మీరే వివరిస్తే బాగుంటుంది.                                                వివేకపథం 227 పేజీ 17 కోట ప్రసాద్ (నేను)

ముస్తాక్ గారూ మీ నుండి, రెహమాన్ గారి నుండి ఊహించని రీతిలో సమాధానాలు వచ్చాయి. దీనికి కారణం ఖురాన్లోనే ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. 18:54 మరియు వారు (ఇశ్రాయేలు సంతతిలోని అవిశ్వాసులు, ఈసాకు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహు (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహు అత్యుత్తముడు.

అయ్యా మేము ఎలాంటి ఎత్తుగడలు వేయడం లేదు. సత్యము స్థాపింపబడితే సమాజానికి మేలు ఒనకూడగలదన్న యోచన మాత్రమే కలిగియున్నాము. కనుక అరమరికలు లేకుండా మనందరం సత్యస్థాపనే ధ్యేయంగా, చర్చించుకోవడానికి, సందేహాలు నివృత్తిపర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారని భావిస్తూ ముగిస్తాను.   

                                                            - కోట ప్రసాద శివరావు


No comments:

Post a Comment