Monday, May 9, 2022

216 సంచిక

 



వివేకపథం
సంపుటి 4                            సంచిక 6                                 మే 2015 

"ఆస్తికత నాస్తికత రెండూ ఇప్పటికింకా తేలని విషయాలే" 


  పాఠక మిత్రులారా! గత మాసపు వివేకపథం25 (పే. 12, 13)లో జగన్ గారిలా రాశారు.

  1. ఆస్తికత నాస్తికతలు రెండూ ఇప్పటికి తేలనివి, అందులో ఆస్తికత ఒప్పని తేలడానికే మాత్రం అవకాశం లేదు. నాస్తికత ఒప్పని తేలడానికి కొంతలో కొంతైనా అవకాశముంది అన్నది మండలి అభిప్రాయం.

  2. మండలి తనకు తాను ఆస్తిక పక్షంలో గానీ, నాస్తిక పక్షంలో గానీ చేరనంటూ, తనది ఆస్తిక, నాస్తికేతర పక్షమని అంటుంది. (ఆస్తికేతరుల మంటూనే నాస్తికులమూ కానంటుంది.)

  3. సురేంద్ర ఆస్తికత అనిర్ధారణీయమనడానికొక ప్రాతిపదికనూ (ఎత్తుగడను), నాస్తికతా అనిర్ధారితమే ననడానికి మరొక ప్రాతిపదికనూ తీసుకున్నారు. అలా ఎందుకు చేశారో ఆయనే వివరిస్తే బాగుంటుంది.

మంచి ప్రస్తావనే చేశారు జగన్. మండలి పరిచయంలోకి రాకముందూ, హేతువాద, మానవవాద వైఖరినే కలిగి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం గార్ల మార్గదర్శకత్వంలో ప్రయాణిస్తుండేవారాయన. మండలి పరిచయం లోకి వచ్చాక, సత్యాన్వేషణ మండలిలో క్రియాశీలంగా ఉంటూ, మండలి భావజాలాన్ని, నన్ను ప్రామాణికునిగా తీసుకుని గాక, శాస్త్రీయ పరిశీలనా పద్ధతులతో కూడిన సొంత పరిశీలన ద్వారానే సొంతం చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు, నేనంగీకరిస్తున్న భావజాలమంతటిలో, కొన్నింటి విషయంలో నాతో పూర్తిగా అంగీకారం కాని పరిస్థితి ఉండవచ్చు. మరి కొన్నింటి విషయంలో తానేర్పరచుకున్న ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి లోతుగా పరిశీలన చేసి ఉండకపోవచ్చు. మరికొన్నింటిలో విషయ గాఢత, క్లిష్టతల వల్ల పరిశీలన ఒక ముగింపుకు చేరి ఉండకపోవచ్చు.

ఏదేమైనా, తాత్వికంగా అత్యంత మౌలికము, కీలకము, ప్రాచీనమూ కూడా అయిన ఈ విషయంపై, మండలి భావజాలానికి ప్రధాన బాధ్యత వహించాల్సిందీ, ప్రస్తుత చర్చనీయాంశంలో మండలి పక్షం వహించాల్సిందీ, వహించగలిగిందీ కూడా నేనే గనుక, ఆపని నన్నే చేయమని జగన్ గారనడం సందర్భోచితంగానూ సమంజసంగా కూడా ఉంది.

ఈ సందర్భంలో మరోమాటా చెప్పుకుంటే బాగుంటుంది. ఈ మధ్య మండలి భావాలకు ప్రాతినిధ్యం వహిస్తూనే, మండలి పక్షాన్ని - వెంకటాద్రి పక్షాన్ని తులనాత్మక పరిశీలనకు లోనుచేస్తూ, ఆ వివరాలను పాఠకులకు అందించడానికి చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషిచేస్తూ వస్తున్నారు జగన్. ఆ క్రమంలో వెల్లడిస్తున్న భావాలు, చాలావరకు నేను వివరాలు, సవరణలు చేయనక్కరలేని రీతిలోనే ఉంటున్నాయి. మండలి భావాలకు ప్రాతినిధ్యం వహించగల వ్యక్తులు క్రమంగా రూపొందుతున్నారనడానికి రుజువుగా ఉన్న ఈ వ్యవహారంమండలి సంక్షేమాకాంక్షిగా నాకు ఆనందాన్ని కలిగించే విషయమే. కనుక ఈ ముఖంగా మండలిని అర్థం చేసుకున్నామనుకుంటున్న ముఖ్యుల వరకైనా మరికొందరు మండలి ఆయా విషయాలపై వెల్లడించిన భావాలను తమదైన శైలిలో రాత రూపంలోకి తేగలిగితే బాగుంటుంది. అందువల్ల ఎవరెవరు ఎక్కడున్నారనే విషయంలో విషయ స్పష్టత, నిర్దిష్టత చేకూరుతుంది. తేడాపాడాలుంటే సరిచూసుకోడానికి వీలవుతుంది.

మరొక్కమాట!

మండలి పోకడలకు సంబంధించిన అంతర్గత నియమాలలో సురేంద్ర చెప్పిందే ప్రామాణికంగా తీసుకోవాలి అన్న నియమం ఎక్కడా లేదు. పైగా ఎవరు చెప్పిందైనా సరైన, సరిపడినంత విచారణ పూర్తయ్యాక తేలిన దానినే అందరూ స్వీకరించాలి అన్న ముఖ్య నియమం ఉంది. జ్ఞాన క్షేత్రాలలోని వారెవరికైనా ఈ నియమం అనుల్లంఘనీయం. దీనిని అర్థం చేసుకుంటూ హృదయంలో పదిలంగా భద్రపరుచుకోండి, ఆచరణలో ఉండేలా అలవరచుకోండి.

  1. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతన వేగపడక వివరింపదగున్ 

కని, కల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి.       - సుమతీశతకం

  1. యుక్తియుక్త ముపాధేయం వచనం బాలకాదపి.

అన్య తృణమివ త్యాజ్యమప్యుక్తం పద్మ జన్మనా                                   -యోగవాశిష్టం

  1. పురాణ మిత్యేవ నసాదు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యం

సంతపి పరీక్ష్యాన్యతర ద్భజన్తె, మూఢపర ప్రత్యయ నేయ బుద్ధిః.               -కాళిదాసు

  1. తాడనా తాపనాత్, నికషాత్ సువర్ణమివ పండితాః 

పరీక్ష్యభిక్షవో మద్వచో గ్రాహ్యో నతు గౌరవాత్   -బుద్ధుడు 

  1. హేతువాదికి (హేతుబుద్ధి కలవానికి) ప్రామాణికులుండరు                         -వెంకటాద్రి

  2. ఎవరు చెప్పారన్న దాన్ని బట్టి అభిప్రాయాలకు విలువ కట్టరాదు. ప్రకటితాభిప్రాయం వాస్తవానుగుణ్యత కలిగుందా లేదా అన్నదే దాని విలువను నిర్ణయించాలి.      -స.మండలి 

  3. ఊహాత్మక నిర్ణయాలు అంతిమాలనరాదు. శాస్త్రీయ ప్రయోగాలే అంతిమ నిర్ణయాలవుతాయి. -స.మండలి వైజ్ఞానికులు. 

  • మిత్రులారా! పై భావాలు తలకెక్కితే గాని, సరైన చూపు ఏర్పడదు. సజావుగా సాగదు. వీటిని సదా గుర్తుంచుకోండి.

ఆస్తికత నాస్తికత వాటి ప్రాతిపదికలు

జగన్‌ గారన్నట్లు ఆస్తిక నాస్తికతల విచారణ సందర్భంలో నేను రెండు వేరువేరు ప్రాతిపదికలను ఎంచుకున్నానన్న విషయాన్ని మీరు గమనించారా? అవేమిటో మీకు తెలుసా? మరోసారి ప్రస్తావిస్తాను జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోండి.

అస్తికత పాతిపదికలు:

1. దేవుడున్నాడు, 2. అది (అతడు) భౌతిక పదార్లం కాదు, అభౌతిక పదార్థం,

1. జీవులున్నారు, 2. వీరు శరీరం కంటే వేరైనవారు, అభౌతిక పదార్థము,3. మరణానంతరము ఉంటారు, 4. పరలోకాలున్నాయి.

గమనిక : మిగిలిన విషయాలూ, సిద్ధాంత విచారణ సందర్భములో విడివిడిగా, పరిశీలించవచ్చుగాని మన ప్రస్తుత సందర్భానికి చెందినంతలో కీలకమైన అంశం జడేతరమైన ప్రకృతికి అన్యమైన పదార్థం (ద్రవ్యము లేదా వస్తువు) ఉందా? లేదా? అన్నదే. ఈ విషయములో ఆస్తికులు అట్టివి ప్రకృతికి అతీతమైనవి రెండున్నాయి అంటున్నారు. దేవుడు, జీవుడు అనంటారు వాటిని (పరమాత్మ జీవాత్మలనీ అంటారు వాటిని).

  • అట్టివి ఉన్నాయనడానికి ఆధారాలేమిటి? అన్నది విచారించాల్సిన మలి అంశము. 

జడ పదార్థాలకు అవెంతటి విశిష్ట, సంక్లిష్ట సమ్మేళనాలైనా తెలివితేటలు, ప్రాణము ఉన్నట్లు, ఏర్పడుతున్నట్లు రుజువులు లేవుగనుకనూ, ప్రాణము, తెలివితేటలు మనకున్నాయన్నది సర్వానుభవ సిద్ధం, కనుకనూ ఈ లక్షణాలు కల మనం జడేతర పదార్థంతో కూడిన వాళ్ళం అంటే ఈ ధర్మాలను (లక్షణాన్ని) కలిగి ఉన్నది అభౌతిక పదార్థమనక తప్పదు అన్నది ఆస్తిక పక్షంవారి మాట.

దానిపై సత్యాన్వేషణ మండలి పక్షం ఇలా ఉన్నది.

జడ పదార్థాలకు ప్రాణము, తెలుసుకొనే లక్షణము ఉండదు గనుక ఈ లక్షణాలు కలిగిన చేతన అభౌతిక ద్రవ్యం (వస్తువు) ఉండాలంటున్నావు సరే. ఉన్నట్లు రుజువుందా. అన్నది మండలి ప్రశ్న.

దీనికి జవాబు ఆయా ఆస్తిక గ్రంథాలలో, గ్రంథాలు చెబుతున్నాయి కనుక, అన్నదో, గుణాలున్నాయి కనుక గుణి ఉండక తప్పదు కదా అన్నదో రూపంలోనే ఉంటుంది. నమ్ము అనో, ఊహకలా అనిపిస్తోందనో అంటున్నాయన్న మాట. మేము అడుగుతున్నది ఆరెంటి ఆదారంగా మీరు ప్రకటిస్తున్న అభిప్రాయం సరైందేననడానికి రుజువులున్నాయా? అనిగదా అన్నది మా పక్షం.

జ్ఞాన సిద్ధాంతంలోని ప్రమాణాలు, వాటి క్షేత్రాలు, బలాబలాలు తెలిస్తేగాని ఈ విషయంలో ఒక ముగింపుకు రావడం కుదరదు. ప్రత్యక్ష పూర్వకంగాని అనుమానం ఉండదు. శబ్దం విశ్వాస రూపమేకాని అది సత్యమో, కాదో తెలియదు. కనుక ప్రత్యక్షంగా తెలుసుకొనే, తేల్చుకొనే వీలుందా, మీ అభౌతిక పదార్థపు ఉనికికి అనడుగుతున్నామన్న మాట?

మన జ్ఞానేంద్రియ వ్యవస్థ అంతా పట్టిచ్చేవి, పట్టుకునేవి కూడా భౌతిక పదార్థ నిర్మితాలేనన్నంత వరకు ఆస్తిక, నాస్తిక పక్షాలు రెండూ అంగీకరిస్తూనే ఉన్నాయి. భౌతిక పదార్థ నిర్మితాలైన జ్ఞానేంద్రియాలు, మెదడు కూడా అభౌతికాన్ని పట్టివ్వలేవు, పట్టుకోలేవు. కనుకనే అభౌతిక పదార్థపు ఉనికి అలాంటి పదార్లమొకటి ఉందన్న అంశం ఇప్పటికీ రుజువుకాలేదంటున్నాం. ఇంతవరకు నాస్తికులు అంగీకరిస్తున్నారు, వైజ్ఞానికులూ అంగీకరిస్తున్నారు. ఇక ఆస్తికులైతే రుజువు చూపలేకున్నారు.

  1. ఎ) ప్రాణం ఉండి, తెలివిగల జీవులున్నారన్నది అందరకూ అనుభవములో ఉన్నదే. అందరం అంగీకరిస్తున్నదే.

బి) అవి అభౌతిక పదార్థ లక్షణాలు. భౌతిక పదార్థాలకా లక్షణాలుండవు, రావు అన్నది ఆస్తికుల పక్షం.

( సి) కనుక అభౌతికాలుండాల్సిందేనన్నది వారి ఊహ. 

డి) అట్టిది ఉంది. అదే అన్నిటికంటే ప్రధానమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయన్నది  ఆస్తికుల మరోమాట.

  1. ఎ) అట్టిదొకటి ఉన్నట్లు రుజువులేదు అని ఆస్తికేతరులు (నాస్తికులు, అన్వేషకులు, వైజ్ఞానికులు) అనంటున్నారు.

బి) ఇప్పటికీ తేలలేదు మాత్రమే కాదు, ఎప్పటికీ తేలే, తేల్చుకునే అవకాశము లేదన్నది మండలి పక్షం. 

ఎందుకనంటే, అభౌతిక పదార్థాలను తెలుసుకునే జ్ఞానేంద్రియ వ్యవస్థ కాదు మనది. భౌతిక పదార్థాలను మాత్రమే (అదైనా ఇంద్రియాలకు గల అల్ప సామర్థ్యాల పరిమితి లోపలే) తెలుసుకో గలుగుతాము. భౌతిక జగత్తులోనే అతీంద్రియాలెన్నో ఉన్నాయి. అభౌతికాల మాటిక చెప్పనే అక్కర లేదు. కనుకనే భవిష్యత్తులోనూ (ఇకముందూ) అభౌతికాలుంటాయన్నది తేల్చుకోలేనిదే.

మిత్రులారా! ‘ఆస్తికత ఇప్పటికీ తేలనిదే, ఎప్పటికీ తేలనిదే’ నన్న నిర్ణయానికి మండలి రావడానికి ప్రాతిపదిక ఆస్తికులందరూ అంటున్న ఆత్మలు (పరమాత్మ జీవాత్మలు) అభౌతికాలన్న ప్రాథమిక సూత్రీకరణే. ఇందులో మీరూ నాతో విభేదించే చోటుగానీ, నన్ను తప్పుపట్టే అంశంగానీ ఉంటే ఇంతవరకు పరిమితమై నాతో చర్చకు విచారణకు సిద్ధం కండి. వెంకటాద్రి బృందం వారికి ఈ సందర్భంలో ఒక సూచన చేస్తున్నాను. వెంకటాద్రి గారూ ఒకచోట సూటిగా, మరెన్నోచోట్ల అన్యాపదేశంగా 'దేవుడున్నాడని ఇప్పటికి రుజువు కాలేదు. ఎప్పుడైనా రుజువుచేస్తే అంగీకరించడానికి హేతువాదులకెట్టి అభ్యంతరమూ లేదు' అనన్నారు. మరొక్కమాట.

నా మాటలు వినీ, ఆస్తికుల్లో కొందరు విధం తెలియనివాళ్ళు దేవుడున్నాడని లోగడే రుజువైందనో, మాకు రుజువైందనో అదరగండంగా, అడ్డగోలుగా, ముగ్గుమీదకు రాకుండా, అక్కడక్కడా వదరే అవకాశం ఉంది. ‘లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిః నతు ప్రతిజ్ఞా మాత్రేణ’ అన్న వాళ్ళ సూత్రమే ఇట్టివాళ్ళ నడ్డి విరుస్తోంది. ఈ రకాన్ని నేను (మనం) అడగాల్సిందొక్కటే. అయ్యలారా ఏ గ్రంథం ప్రస్థావిస్తున్న దేవుడు మీకు తెలియబడ్డాడు. (ఆయన లక్షణాలేమిటి?) ఏప్రమాణం ద్వారా మీకు తెలియబడ్డాడు? అంటే మానవ జ్ఞానేంద్రియాలలో అభౌతికాన్ని పట్టిచ్చేదేది. విషయమర్థమైతే మనకందేది అఖండమౌనమే. ఆస్తికత విచారణను ఇప్పటికావుదాం. దీని సమగ్ర విచారణలో దేహం కంటే వేరుగా జీవుడున్నాడని ఎలా తెలిసింది? పరలోకం ఉందని ఎలా తెలిసింది? మరణానంతర జీవితం ఉందని ఎలా తెలిసింది లాటి అనేక ప్రశ్నలున్నాయి.


 నాస్తికతా అనిర్ధారితమే అనడమెలా? దానికి మరో ప్రాతిపదికేమిటి?

ప్రాణము, తెలివి అన్న రెండు లక్షణాలు మనకున్నాయి అన్నది మనమందరం అనుభవంలో గమనించిందే, అంగీకరిస్తున్నదేనని ఆస్తిక విచారణలోనూ, ఆధారపీఠమనదగ్గ అభిప్రాయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా!

ఏవో గుణాలు, క్రియలు కనపడ్డాకనే లేదా అట్టివాటి గురించి వినపడడమో, జరిగాకనే మనలో చింతన, పరిశీలన మొదలౌతాయి. అలా మొదలైనవే ఆస్తిక, నాస్తిక ధోరణులు రెండూ. ఇలా మనందరి అనుభవంలోకి వస్తున్న ఈ ప్రాణము, తెలివితేటలు ఏ పదార్థం లక్షణాలు అన్నదే ఇరు పక్షాలు సమాధానం కోసం వెదికిన పరిశీలనా క్షేత్రం. ఆస్తికులు ఇవి అభౌతిక (చేతన) ద్రవ్యపు లక్షణాలని ప్రకటించగా, నాస్తికులు అలాటిదేమీ లేదు, ఇవి భౌతిక పదార్థ సమ్మేళనజనిత లక్షణాలేనని ప్రకటించారు. ‘ప్రమాణైః అర్థ పరీక్షణం న్యాయం' అన్న సూత్రాన్నెరిగిన ఆస్తికులు, నాస్తికుల్ని ఏ ఏ భౌతిక పదార్థాల సమ్మేళనం వల్ల ప్రాణము, తెలివితేటలు పుట్టాయో చెప్పమని అడిగారు. చెప్పమనే కదా అడిగిందనుకొని, పంచభూతాల సమ్మేళనమని కొందరూ, చతుర్భూతాలని మరికొందరూ, మూడే భూతాలనే వాళ్ళూ మూటి సమ్మేళనం వల్లనే నని బల్లగుద్ది చెప్పేశారు. వెనుకటి కాలపు నాస్తికుల వాదనంతా భౌతిక పదార్థాలు వివిధ నిష్పత్తుల్లో కలయడం వల్ల, ఆ కారణ ద్రవ్యాలలో లేని క్రొత్త లక్షణాలు కార్యద్రవ్యాలలో (కొన్ని కూడి ఏర్పడ్డ ద్రవ్యాలలో) వస్తాయన్న ప్రాతిపదికపైన ఆధారపడిందే. ఈనాటి ఆధునిక భౌతిక విజ్ఞానశాస్త్ర క్షేత్రంలోని వివిధ సమ్మేళన ద్రవ్యాల ఉత్పత్తి పరిశోధనంతా కూడా ఈ ప్రాతిపదికనంగీకరించి సాగుతున్నదే.

గమనిక : వివిధ కారణ ద్రవ్యాలు, వివిధంగా కూడినప్పుడు (సమ్మిళతమైనప్పుడు) రకరకాల క్రొత్త ద్రవ్యాలేర్పడతాయన్నది. అన్ని పక్షాల వారికీ అనుభవంలో ఉన్నదే. ఎన్నిసార్లయినా రుజువుకు పెట్టి చూసుకో గలిగిందే ఇక్కడికిది నిజమో, కాదో తేల్చుకోండి.

అదిగో ఆ ప్రక్రియ మూలంగా ఒకానొక సంక్లిష్ట రసాయన సమ్మేళనం వల్ల ఏర్పడ్డ కార్యద్రవ్యం నుండి పుట్టుకొచ్చిన లక్షణాలే ఇవి అన్నది నాస్తికతకు పునాది (ప్రాతిపదిక), ఇది అర్థమైతేగాని, ఆస్తిక నాస్తికతలకు ప్రాతిపదికలు వేరంటూ నేనెందుకు ప్రస్తావించానో బోధపడదు. ఇక్కడకు ఆగండి. ప్రాణము, తెలుసుకునే లక్షణము మనకు, మనలాటి జీవజాతులకు ఉందని అంగీకరిస్తున్న నాస్తికులు, ప్రకృతిలో, భౌతిక విశ్వంలో మరెక్కడా కనపడని ఈ లక్షణాలు ఏ ద్రవ్యానివి? అనడిగినప్పుడు, ఏమి సమాధానం చెప్పారు? చెప్పగలరు? ఒక అసాధారణ, సంక్లిష్ట సమ్మేళనజనిత కార్యద్రవ్యాల లక్షణాలే ఇవి అనేకదా ప్రాకృతిక జగత్తులోనిది కాని అప్రాకృత ద్రవ్య లక్షణాలని నాస్తికులు అంగీకరించలేరు కదా! కనుకనే నాస్తికుల నిర్ణయం వాస్తవానికి దేవుడు లేడన్నది కాదు. ప్రాణము, చైతన్యము (తెలుసుకొనే లక్షణం) భౌతిక పదార్థ సమ్మేళనజనితమే నన్నదే అవుతోంది. విషయం అర్థమవుతోందా?

ఇంతకూ సారాంశమేమిటి?

అసలింతకు విచారణీయాంశం ఏమిటందాం? నా లెక్క ప్రకారం ఈ రెండు పక్షాల అధ్యయన క్షేత్రం ఒక్కటే. మన అందరి అనుభవంలో నున్న ప్రాణము, చైతన్యము (Life and Consciousness) ఏ పదార్థ లక్షణాలు అన్నదే ఆ అధ్యయనాంశం. ఈ అంశాన్ని అధ్యయన క్షేత్రంగా చూడకుంటే ఈ విషయంలో సరైన విచారణ మొదలవదు.

  1. ఆస్తికులు: భౌతికేతర, అభౌతిక పదార్థ లక్షణాలు అన్నారు.

  2. నాస్తికులు : అది మిగిలిన అన్నింటిలానే భౌతిక పదార్థ సమ్మేళన జనిత కార్యద్రవ్య లక్షణాలు అన్నారు.

పాఠక మిత్రులారా!

ఇదండీ అసలు విషయం. ఇప్పుడు మనం ఆ పరిశీలనాంశంపై ఆస్తికులు, నాస్తికులు ప్రతిపాదించిన ఆస్తిక, నాస్తిక ప్రతిపాదనలను, మీమీ ప్రతిపాదనలను నిరూపించండి స్వాములూ (బాబులూ) అనంటున్నాం. 

  1. మండలికి తెలిసినంతలో, అభౌతిక పదార్థపు ఉనికి నిర్ధారించడం మనకు అసాధ్యం . కనుకనే మేము ఆస్తికత అనిర్ధారితమే కాక, అనిర్ధారణీయం అని కూడా అంటున్నాము.

  2. భౌతిక పదార్థ సమ్మేళన జనితమే ఆ రెండు లక్షణాలు అన్న నాస్తిక ప్రతిపాదన శాస్త్రీయంగా ఈనాటికీ నిర్ధారణ కాలేదింకా అనంటున్నాము. అక్కడితో నాగక, ఆ పనిచేయాల్సింది, తాత్వికులు కాదు. వారు చేయగలిగిందీ కాదది అని అంటున్నాం. జీవం భౌతిక పదార్థ సమ్మేళన జనితమే అవ్వాలి అననుకుంటున్న ఆధునిక జీవ రసాయన శాస్త్ర, అందునా సూక్ష్మ అణు జీవ రసాయన శాస్త్ర క్షేత్ర పరిశోధకులు యత్నించాల్సిన అంశమది అనంటున్నాం. వారికైనా అది సాధ్యపడుతుందో లేదో సందిగ్డమే ఇప్పటికీ. సాధించేందుకు అవకాశాలు లేవనలేము అన్నంత వరకు చెప్పి ఆగాల్సిందే. ఆలోచించండి. సత్యాలను వెదకాలి, గమనించాలి, అంగీకరించటానికి సిద్ధంగా ఉండగలగాలి.

ఆస్తిక విచారణకు అవసరమైన ప్రశ్నావళిని సుమారు 71 ప్రశ్నలను మీ ముందుంచుతున్నాను. వాటన్నింటినీ జాగ్రత్తగా విచారించి సమాధానాలు రాబట్టండి.

ఆస్తిక సిద్ధాంతము-ఒక పరిశీలన.

  1. ఒక సర్వజ్ఞుడు కానివాడు మరొకడిని సర్వజ్ఞుడు కాదని నిర్ణయించగలడా?

  2. ఒక సర్వజ్ఞుడు కానివాడు మరొకడిని సర్వజ్ఞుడు అని నిర్ణయించగలడా?

  3. ఒకనిని సర్వజ్ఞుడు అనాలంటే ఎవరికి సాధ్యం.

  4. ఫలానావాడు సర్వజ్ఞుడని అల్పజ్ఞుడు పలికిన మాటలకు విలువుంటుందా?

  5. ఒక వ్యక్తి సర్వజ్ఞుడో కాదో నిర్ణయించే పద్ధతేదైనా వుందా? ఉంటే అది ఏది?

  6. సర్వవ్యాపకుడు కానివాడు సర్వజ్ఞుడు కాగలడా?

  7. సర్వవ్యాపకుడు కానివాడు సర్వశక్తిమంతుడు కాగలడా?

  8. సర్వశక్తిమంతుడు కానివాడు సర్వవ్యాపకుడు కాగలడా?

  9. సర్వశక్తిమంతుడు కానివాడు సర్వజ్ఞుడు కాగలడా?

  10. సర్వజ్ఞుడు కానివాడు సర్వశక్తిమంతుడు కాగలడా?

  11. సర్వజ్ఞుడు కానివాడు సర్వవ్యాపకుడు కాగలడా?

  12. ఏకదేశి సర్వజ్ఞుడు కాగలడా?

  13. ఏకదేశి సర్వశక్తిమంతుడు కాగలడా?

  14. సర్వజ్ఞునికి ఎదుటివానిని పరీక్షింపవలసిన అవసరం వుంటుందా?

  15. సర్వవ్యాపికి గమనము వుంటుందా?

  16. రాకపోకలు ఉన్నదానిని సర్వవ్యాపకము అనవచ్చా?

  17. స్వరపేటికలాంటి నిర్మాణం లేకుండా మాట్లాడగలగడం సాధ్యమా?

  18. సర్వశక్తిమంతుడికి కూడా ఏదైనా ఒక పని చేయటానికి కొంత సమయం పడుతుందా?

  19. భవిష్యత్ తెలిసినవాడు ప్రజలకు “మీరు అట్లా వుండండి, ఇట్లా వుండండి"అని ప్రబోధిస్తాడా? అలాంటి అవసరం ఉందా?

  20. సర్వశక్తిమంతుడికి అవతలవారిని బ్రతిమిలాడవలసిన అవసరం వుందా?

  21. జనులు దైవాజ్ఞను తిరస్కరించుటకు కారణమేమిటి?

  22. సర్వశక్తిమంతునికి ఆజ్ఞాపించవలసిన అవసరం వుంటుందా?

  23. తిరస్కారము జరిగిందంటే సర్వశక్తిమంతుడు కాదని చెప్పగలమా? లేదా?

  24. అనంత కరుణామయునికి క్రోధం రావటం సంభవమా?

  25. చిన్న మానవ సముదాయాన్ని అదుపుచేయడానికి పెద్ద ప్రయత్నం చేసేవానిని, సర్వశక్తి మంతుడు అనగలమా?

  26. సంకల్పమాత్రంచేత సమస్తమూ సిద్ధింపజేయగలవాడు అవతలవారిని “మీరు ఇట్లా వుండండి; అట్లా వుండండి" అని పలుమార్లు ప్రాధేయపడతాడా?

  27. కోపగించడం, బ్రతిమలాడడం, ఆశపెట్టడం, భయపెట్టడం, శిక్షించడం, క్షమించటం, వగైరా పనులు చేసేవారిని ఏమనాలి? సర్వశక్తిమంతులు అనవచ్చా?

  28. పర సహాయాన్ని కోరేవానిని సర్వశక్తిమంతుడు అనగలమా?

  29. వేదము చెపుతున్న వానిలో కొన్నింటిని అంగీకరించి, మరి కొన్నింటిని తిరస్కరించేవారు ఆస్తికులా? నాస్తికులా?

  30. అలాగే ఇతర మత గ్రంథాలలో కొన్నింటిని అంగీకరించి, మరికొన్నింటిని తిరస్కరించేవారిని ఆ మతగ్రంథం ప్రకారం ఆస్తికులనాలా? నాస్తికులనాలా?

  31. పుట్టుక లేదా ఆరంభం ఉన్నవాడిని దేవుడు అనవచ్చా?

  32. దేవుడు ప్రత్యక్షం అవడంగానీ, మాయమవడంగానీ చేయగలడా?

  33. పరికరము లేకుండా పనిచేయడం సాధ్యమా? కాదా?

  34. సత్య తిరస్కారులు నాస్తికులు అవుతారా? అవ్వరా?

  35. ఖురానును అంగీకరించనివాడు నాస్తికుడు అవుతాడా? కాదా?

  36. దేవుడు ఏకదేశీయుడు అన్నవాడు ఆస్తికుడా? నాస్తికుడా?

  37. దేవునికి రూపం వుందన్నవారు ఆస్తికులా? నాస్తికులా?

  38. దేవునికి రూపం లేదన్నవారు ఆస్తికులా? నాస్తికులా?

  39. క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించనివారు ఆస్తికులా? నాస్తికులా?

  40. యేసుని దేవుడి కుమారుడుగా అంగీకరించువారు ఆస్తికులా? నాస్తికులా?

  41. యేసే దేవుడు అని అంగీకరించేవారు ఆస్తికులా? నాస్తికులా?

  42. యేసును దేవుడు కాదనువారు ఆస్తికులా? నాస్తికులా?

  43. ఏదో ఒక విషయంలోనైనా తెలియనితనమున్న వానిని దేవుడు అనవచ్చా?

  44. పరిమిత శక్తివంతుడ్ని దేవుడు అనవచ్చా?

  45. విగ్రహారాధన చేయువారు ఆస్తికులా? నాస్తికులా?

  46. సృష్టికార్యమునకు ముగ్గురితో అవసరముందన్నపుడు ముగ్గురూ పరిమిత శక్తులున్నవారేనా? కాదా?

  47. ఒక సర్వశక్తిమంతుడు కానివాడు మరొకనిని సర్వశక్తిమంతుడు అనగలడా?

  48. ఒక సర్వశక్తిమంతుడు కానివాడు మరొకని సర్వశక్తిమంతుడు కాదనగలడా?

  49. ఒకనిని సర్వశక్తిమంతుడు అనాలంటే ఎవరికి సాధ్యపడుతుంది?

  50. ఒకణ్ణి సర్వశక్తిమంతుడు అనడానికి పద్దతి ఏదైనా వుందా? ఉంటే అది ఏది?

  51. ఫలానావాడు సర్వశక్తిమంతుడని, ఒక అల్పశక్తిమంతుడు పలికిన మాటలకు విలువుంటుందా?

  52. ఒక సర్వవ్యాపకుడు కానివాడు మరొకనిని సర్వవ్యాపకుడు అనగలడా?

  53. ఒక సర్వవ్యాపకుడు కానివాడు మరొకనిని సర్వవ్యాపకుడు కాదనగలడా?

  54. ఒకనిని సర్వవ్యాపకుడు అనాలంటే ఎవరికి సాధ్యపడుతుంది?

  55. ఫలానావాడు సర్వవ్యాపకుడని ఒక పరిమితుడు పలికిన మాటలకు విలువుంటుందా?

  56. ఒకడిని సర్వవ్యాపకుడు అనాలంటే అందుకు తగిన పద్ధతి. ఏదైనా వుందా? ఉంటే, అది ఏది?

  57. సాయిబాబాను దేవుడు అన్నవాడు ఆస్తికుడా? నాస్తికుడా?

  58. అంతా ఆయన సమ్ముఖంలోనే వుంది అన్నదాని అర్థమేమిటి?

  59. తప్పయినా, ఒప్పయినా ఒక విషయంలో కర్తృత్వం వహించినవానిని బాధ్యుడనాలా? వద్దా?

  60. నియమింపబడే వాడిని స్వేచ్ఛాపరుడని అనవచ్చా?

  61. స్వేచ్ఛ ఇస్తే చెడిపోతారని తెలిసీ మంచివారు, హితులు స్వేచ్ఛను ఇస్తారా?

  62. దైవాజ్ఞ మీరడము మనిషికున్న స్వేచ్ఛా? లేక నియమింపబడియున్నదాని ప్రకారమే జరుగుతుందా?

  63. ఒకనిని న్యాయకారి అని ఎప్పుడు అంటాము?

  64. ఒకనిని న్యాయకారి కాదని ఎప్పుడు అంటాము?

  65. ఒకనిని అన్యాయకారి అని ఎప్పుడు అంటాము?

  66. ఒకనిని కృపాశీలుడు అని ఎప్పుడు అంటాము?

  67. ఒకనిని కృపాశీలుడు కాదని ఎప్పుడు అంటాము?

  68. ఒకనిని అనంత కరుణామయుడని ఎప్పుడు అంటాము?

  69. ఒకనిని అనంత కరుణామయుడు కాదని ఎప్పుడు అంటాము?

  70. ఒకనిని పాక్షికుడని ఎప్పుడు అంటాము?

  71. ఒకనిని నిస్పాక్షికుడని ఎప్పుడు అంటాము?

వెంకటాద్రి విశ్వతత్వం - ఒక పరిశీలన-2

“అణుగర్భంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలను గురించి, ప్రాథమిక కణాలను గురించీ అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే పరిశోధన మధ్యలో ఉన్న అంశాలను తీసుకుని, వాటి నుంచి ఏమేమో ఆధ్యాత్మిక తత్వ ఫలితాలను సాధించడానికి, ప్రయత్నించడమంటే, మన తెలివితేటల్ని దండుగ చేసుకోవడమే. జీన్స్ పరింగట్లు అన్న పేర్లు వర్ణిస్తూ, క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రాను, తరంగ సిద్ధాంతం అంటూ తమకు అర్థం తెలియని మాటల చాటున తమ అజ్ఞానాన్ని దాచుకొంటూ ఆత్మ తత్వాన్ని బోధింపజూచే ప్రబుద్ధులు ఇప్పటికీ లేకపోలేదు. శాస్త్రం పేరు చెప్పుకొని ఇలాంటి మోసకారులు మనగలగడం ఈదేశ దౌర్భాగ్యం" (వెంకటాద్రి విశ్వతత్వం, పే.నెం. 62,63)

వెంకటాద్రి రచనల్ని నిశితంగా పరిశీలించగలిగితే, అందులో అక్కడక్కడా ఆణిముత్యాలలాటి మరియు సార్వకాలీన విలువ కలిగిన, వజ్ర సదృశ్యమైన అభిప్రాయాలూ బయటపడుతుంటాయి. మళ్ళా అంతలోనే, అతనే క్రితం ఏవి చేయకూడదు, చెప్పకూడదు అనన్నారో, అవే అదరగండంగా తానే ప్రదర్శిస్తూ ఉన్నట్లు కనబడుతుంటారు. కొద్దిగా అతిశయోక్తే అయినా, అతని రచనల్ని, చదవడం చేతనై చదివిన వారా గుంపులో ఒక్కరంటే, ఒక్కరూ లేరు. లేకుంటే ఇంతకాలానికి ఇదేమిటిలారాశారు ఇలాటివి పరస్పరం పొసగడం లేదుగదా అని అడిగుండేవారు. ఇక్కడెందుకీ ప్రస్తావన చేస్తున్నానంటే, పై పేరాలో వెంకటాద్రి వ్యక్తీకరించిన అభిప్రాయాలన్నీ సార్వకాలీన విలువ కలిగినవే. అయితే ఒకటి రెండు చేర్పులు అవసరమై ఉన్నాయి.

తమకు అర్థం తెలియని మాటల చాటున ఆత్మ తత్వాన్ని గాని, నాస్తికత్వాన్ని గాని, మరోదాన్ని గాని బోధింపజూచే ప్రబుద్ధులు అన్ని ధోరణుల్లోనూ కొనసాగుతున్నారు. శాస్త్రం పేరు చెప్పుకొని ఇలాంటి మోసకారులు అన్నదగ్గర, మోసకారులు గాని, వదరుబోతులు గాని మనగలగడం ఈ దేశ దౌర్భాగ్యం. విషయజ్ఞులు కాని జనాన్ని తమకే తెలియని దారులెంట పరిగెత్తించబూనడం, గుడ్డివాడు గుడ్డివానికి దారిచూపినట్లుంది.

ఒక్క నిజం చెప్పనా! వెంకటాద్రిగా రీవిశ్వతత్వం రచనలో వ్రాసిన అంశాలలో ఎన్నో విషయాలు ఈ కోవకు చెందినవే. సరైన అవగాహన లేకుండానే పల్కిన పెద్ద పెద్ద మాటలే. నా యీ మాటలు నిజమని తేలితే ఆయనే అన్న ఈదేశ దౌర్భాగ్యం క్రిందికి ఇవీ చేరతాయి గదా మరి.

“ఐన్‌స్టీన్ క్షేత్రాన్ని (Feld) వివరించే సందర్భంలో, ఇంకా ముందుకు పోయి విద్యుదయస్కాంత తరంగ ప్రసారాన్నే (అంటే పదార్థాన్నే) ప్రదేశము యొక్క భౌతిక ధర్మం, అన్నాడు" అని రాశారు. వెంకటాద్రి. పేజి. 61. దీనికి ముందు వాక్యం ఆయన సొంతదే ఏమంటుందో చూడండి. “అస్సలుకు ప్రదేశం పదార్థ వ్యాపారమే"

సురేంద్ర - ఆ పుస్తకం చదివిన, ఇప్పటికీ పలుమార్లు చదువుతున్న వెంకటాద్రి అనుయాయులకి రెండు అభిప్రాయాలు పరస్పర విరుద్ధమైనవని ఒక్కరికైనా అనిపించకపోవడాన్నేమనాలి?

  1. "అస్సలు ప్రదేశం పదార్థ వ్యాపారమే” అన్న మాటలు ఒకపట్టాన అర్థం కావడంలా.

  2. అర్థమయ్యాయనిపిస్తున్నంత వరకు పదార్థం అంటే ఉన్నదేదో అది అని, దాని పనినే ప్రదేశమనీ అంటారని (అనాలని) అంటున్నారు వెంకటాద్రి. మళ్ళా ఆ వెంటనే ఐన్ స్టీన్ మాటలంటూ, పదార్థం ప్రదేశముయొక్క ధర్మమని చెబుతున్నారు. పైగా ఈ మాటలు మరింత ఉన్నతమైనవి అనీ అనేస్తున్నారు. నిజానికి అభిప్రాయం ఐన్ స్టీన్ ది అవునో కాదో గాని, వెంకటాద్రి గారు తనదీ, ఐన్ స్టీన్ దీ అంటూ వెల్లడించిన రెండభిప్రాయాలూ సరైనవి కావు (తప్పుడువే). ఈ రెండూ తెలియని తనమూ, తెలుసనుకుంటున్నతనమూ జతకూడి , పలికించిన (రాయించిన) మాటలే.

  3. "జ్ఞానం అనంతం. మానవుడు అనంతంగా జ్ఞానం ఆర్జిస్తూనే ఉంటాడు" (పేజి 60)

సురేంద్ర - ఇదీ తెలియకనే తెలుసనుకుంటున్న తొందరపాటువల్ల రాసిన వ్రాతే. ఎలాగంటే జ్ఞానం ఎప్పటికీ అనంతం కాదు, కాలేదు. ఎంత తెలుసుకున్నా అప్పుటికి మనిషి మనుష్యులందరూ కలిసైనా తెలుసుకున్నది ఎంతో కొంతగా మాత్రమే ఉంటుంది. ఇంకా తెలుసుకోవలసింది ఎప్పటికీ అనంతంగా ఉంటూనే ఉంటుందని ఆయన రెండో వాక్యమే చెబుతుంది. దీనిని విచారించాల్సింది మరికొంతా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం, విశ్వం పరిమితం అని, విశ్వం మొత్తంలో ఒకేరకమైన విశ్వసాధారణ నియమాలు పనిచేస్తున్నాయని నిర్ద్వందంగా అంగీకరిస్తోంది. అది నిజమైతే (నిజమో కాదో అంతిమ నిర్ణయం ఇప్పటికి కాలేదు. దీనిని గుర్తుంచుకోండి) విశ్వం మొత్తాన్ని గురించిన జ్ఞానం కలిగిందని మాటవరస కనుకున్నా, అదంతా కలిపి కూడా పరిమిత జ్ఞానమే అవుతుంది. ఇలా గందరగోళపు భాషలో, కఠిన సంస్కృత భూయిష్ట పదజాలంతో, సరిగా, పూర్తిగా అవగాహన కాని లేదా తప్పుగా అర్థం చేసుకున్న వైజ్ఞానిక పదాలతో కూడిన రాతలను వెంకటాద్రి రచనలనుండి మరెన్నింటినో ఎత్తిచూపవచ్చు. నిష్పాక్షికంగా ఉండగలిగి, నిశిత దృష్టి, విడదీసి చూడగల నేర్పు ఉంటే ఆ పనిమీరు మొదలెట్టండి.

ఇక “వెంకటాద్రి ఉష్ణగతిక శాస్తావగాహన"ను విచారిద్దాం

వైజ్ఞానికులు మరింత లోతుగా పరిశీలనలు చేయడం కొరకు, తామెంచుకున్న పరిశోధనాక్షేత్రాలను సాధారణ దృష్టినుండి కాక, విశేష (ప్రత్యేక) దృష్టినుండి విడగొట్టుకుంటూ వస్తున్నారు. ఉదా: ప్రకృతి - భౌతిక, రసాయనిక శాస్త్రాలు, సూక్ష్మ భౌతిక శాస్త్రం, స్థూల భౌతిక శాస్త్రం, సూక్ష్మ రసాయన శాస్త్రం, స్థూల రసాయన శాస్త్రం, ఖగోళశాస్త్రం విశ్వవిజ్ఞాన శాస్త్రం... ఇలానన్నమాట. అందులో విశ్వం గురించిన పరిశోధనా క్షేత్రాన్ని కలిగిన శాస్త్రాన్ని విశ్వవిజ్ఞాన శాస్త్రం (Cosmology) అనంటున్నారు. దీనిలోని, విశ్వం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దేనితో ఏర్పడింది? ఎప్పుడేర్పడింది? ఇప్పుడెలా ఉంది? భవిష్యత్తులో ఏమికానుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే ఈ క్షేత్ర పరిశోధకుల పని. ఆ అన్వేషణా క్రమంలో, ఎప్పటికప్పుడు, వారివారికి లభించిన ఆధారాల సాయంతో వివధ ఊహాత్మక్ నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చారు. వాటినే మనం ఈనాడు విశ్వానికి సంబంధించిన వివిధ పరికల్పనలు (ఊహాత్మక సిద్ధాంతాలు) అనంటున్నాం. మొత్తం మొత్తంగా వాటి వివరాలు నాదగ్గర లేవుగాని, అట్టి ఊహలు 20 పైనే ఉన్నాయని ఆ క్షేత్రాన్ని గురించి తెలిసిన వారంటుంటారు. వాటన్నింటిలోని చిన్ని చిన్ని తేడాలనలా ఉంచితే, వాటిలోని సాధారణాంశాలననుసరించి వాటిని మూడుగా విడగొట్టుకోవచ్చు. 

  1. విశ్వం మహావిస్పోటనం ద్వారా ఉనికిలోకి వచ్చి, వ్యాకోచించటం ద్వారా విస్తరిస్తూ ఉంది. గతంలో ఆ విస్పోటనం జరగడానికి ముందు పరిస్థితుల్ని తాత్కాలికంగా విశ్లేషిస్తే, అనాద్యనంతమైన కాలంలో ఉన్న పదార్థం ఇలా ప్రేలడం - వ్యాకోచించటం - సంకోచించి మరల ప్రేలుడుకు సిద్ధం కావడం అన్న భ్రమణ క్రమాలు అనంతంగా సాగిపోతూనే ఉంటాయి.

  2. సృష్టి అనాదిగా ఒకేలా ఉంది. యధాస్థితి Steady State వాదులనే మాట ఇది.

  3. ఒకటవ వాళ్ళంటున్నట్లు మార్పుకు లోనవుతున్న మాట నిజమేకాని, చివరలో వాళ్ళంటున్నట్లు, ఈ క్రమం అనాద్యానంతంగా సాగేది కాదు అని, రెండవ వాళ్ళంటున్నట్లు యధాతధంగా ఉంది, ఉంటుంది అనడమూ సరికాదని వాళ్ళతో విభేదిస్తూ, ఇది ప్రస్తుతం ఒకటవ వాళ్ళంటున్నట్లు విస్తరిస్తూ ఉందిగాని, క్రమంగా ఈ విశ్వంలోని పదార్థం శక్తిగా మారుతున్న క్రమంలో జనించే ఉష్ణరాశి అంతా ఉష్ణోగ్రతా వ్యత్యాసాన్ని కోల్పోయి, ఉష్ణ సమతాస్థితికి చేరుతుంది. దాంతో ఉష్ణ ప్రసారం ఆగిపోతుంది. నక్షత్రాలలో జరిగే ప్రేలుళ్ళు ఆగిపోతాయి. పదార్థం శక్తిగా మారే ప్రక్రియ ఆగిపోతుంది. దీనినే ఈ సిద్ధాంతాన్ని ప్రకటిస్తుండేవాళ్ళు Heat death of the Universe అనంటున్నారు. దీనినే 'మృత్యుశైథిల్యం' అని తెలుగుచేశారు.

మిత్రులారా! ఇదిగో ఇక్కడ వరకు అర్థమైతేగాని, వెంకటాద్రి గారు విశ్వాన్ని అర్థం చేసుకొనే, విచారించుకొనే సందర్భంలో, ధర్మోడైనమిక్స్ ను - ఉష్ణగతిక శాస్త్రాన్ని ఎందుకు ప్రస్తావించారన్నది అర్థం కాదు. విశ్వం గురించిన విచారణను ప్రక్కన బెడితే ధర్మో డైనమిక్స్ శాస్త్రం ప్రధానంగా ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకొనే విభాగానికి అధికంగా వర్తించేదిగా ఉంది. అయినా అది ఉష్ణప్రవాహం ఉన్న ప్రతి క్షేత్రానికి వర్తించేదిగానూ 

ఉష్ణగతి శాస్త్రం

దీని క్షేత్రం ప్రధానంగా మూడు విభాగాలుగా ఉంటుంది. 

  1. మూడు నియమాలు, 2. మూడు వ్యవస్థలు, 3. ద్రవ్యము + ఉష్ణశక్తి — పీడనము.

1. మూడు ఉష్ణగతి శాస్త్ర నియమాలు.

ఎ) Law of conservation of mass - energy శక్తి ద్రవ్య నిత్యత్వ నియమము (సూత్రము ).

బి) Entropy increases

పదార్థం ఉష్ణశక్తిగా మారి అది ఉష్ణోగ్రతా భేదాన్ననుసరించి ఎక్కువ ఉష్ణోగ్రత స్థాయినుండి తక్కువ ఉష్ణోగ్రత స్థాయికి ప్రవహించే క్రమంలో క్రమంగా ఉష్ణశక్తి మొత్తం పరిమాణపు వినియోగ సామర్థ్యం తగ్గుతుంటుంది. కనుక వినియోగానికి పనికిరాని ఉష్ణశక్తి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దీనినే Entropy increases అనంటారు. Quantity of Unavailable energy is increased వినియోగానికి పనికిరాని ఉష్ణశక్తి పరిమాణం పెరుగుతుంది అన్నదే ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం.

ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత నుండి ఎక్కువ ఉష్ణోగ్రత వైపు ప్రవహించడం అసాధ్యం. (క్లాసియస్)

ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారే క్రమంలో విడుదలైన ఉష్ణశక్తి మొత్తం యాంత్రిక శక్తిగా మారదు. ఎంతో కొంత మొత్తము ఇతర శక్తి రూపాలుగ మారిపోతుంది. లేదా వినియోగానికి రాని ఉష్ణశక్తిగా మిగిలిపోతుంది.

క్లాసియస్ నిర్వచనం : విశ్వంలో శక్తి నిత్యము. దానిని సృజించనూ లేము, నాశనం చెయ్యనూ లేము. అలాగే ఎంట్రోపినీ నాశనం చేయలేము. అది పెరగడమే తప్ప తగ్గదు. 

ఎంట్రోపి = అలభ్య శక్తి లేదా నిరుపయోగిత శక్తి

ఇక రెండవ నియమం : విశ్వంలో ఎంట్రోపి అలభ్యశక్తి లేదా నిరుపయోగిత శక్తి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దీనినే ఎడింటన్ దిగజారిపోతున్న, పడిపోతున్న విశ్వం . Running down of the Universe.

సురేంద్ర: ఈ మాటను పట్టుకొని దేవుణ్ణి పట్టుకొద్దామని ఆస్తిక పక్షం వాళ్ళూ, వాళ్ళెక్కడ దేవుణ్ణి పట్టుకొచ్చేస్తారోనని నాస్తిక పక్షం (వెంకటాద్రి గారి లాటి) వాళ్ళూ, సైన్స్ కానిదాన్నంతా పులిమే పని చేస్తున్నారు.

3. గమనిక : ఈ మూడో నియమాన్ని మొదటి రెంటిని గమనించి వాటికి సంఖ్యలను,- వరుస నెంబర్లను ఇచ్చి - కనుగొనడంతో 'మూడోది' అనంటున్నాము గాని, దాని స్వభావరీత్యా అది ముందుగా చెప్పుకోవలసిందిగా ఉంది. అందుకనే శాస్త్రజ్ఞులు దీనిని మూడో నియమం అనకుండా (Zeroth Law) పూర్ణాంక నియమము అనన్నారు. అంటే వరుసక్రమంలో ముందుగా చెప్పుకోవలసిందన్న మాట.

నియమం : రెండు పదార్ధములు (ద్రవ్యములు) దేనికదిగా మరోదానితో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నచో, ఆ రెండూ పరస్పర ఉష్ణ సమతాస్థితిలో ఉన్నట్లే. దానినిలా చెబుతారు. 

సూత్రం : A=C; B=C :: A=B

వివిధ ఉష్ణోగ్రతలో ఉన్న పదార్థాలలోని ఉష్ణము, ఎక్కువ వేడినుండి తక్కువ వేడి ఉన్న దానివైపు, రెండు ఉష్ణోగ్రతలు సమమయ్యేంత వరకు ప్రవహిస్తుంటుంది. 

మిత్రులారా! దీని వివరాలు మరింత లోతుగా తెలుసుకోవాలంటే పాఠ్యగ్రంథాలు, ప్రయోక్త పత్రాల ప్రయోగాలు క్రమంగా వంటబట్టించుకోవలసిందే. ఆపని నేను చేయగలిగింది కాదు.

మూడు వ్యవస్థలు

  1. Open system/ వివృత వ్యవస్థ.

  2. Closed system / సంవృత వ్యవస్థ.

  3. Isolated system / ఏకాంత (ప్రత్యేకించిన) వ్యవస్థ.

వ్యవస్థ :  1. ఉష్ణశక్తి, అది కలిగియున్న పదార్థము (ద్రవ్యము). దేని ఆధారంగా ఒక ఆవరణ కలిగి ఉన్నాయో దానిని వ్యవస్థ అంటారు. 2. దీని ఆధారంతో, ఏ హద్దుల మధ్య ఉష్ణశక్తి అది కలిగిన ద్రవ్యరాశి కల పదార్థము తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ ఉన్నాయో దానిని వ్యవస్థ అంటారు.

  1. వివృత వ్యవస్థ : ఒక అధిక ఉష్ణోగ్రత కల ద్రవ్యంతో కూడి ఉన్న ఉష్ణశక్తి, ఉష్ణోగ్రతా వ్యత్యాసం వల్ల తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థం వైపుకు ప్రవహించే సందర్భంలో ఉష్ణశక్తి ప్రవాహం, అది కలిగిఉన్న పదార్థం తోటి మరోదానివైపు ప్రవహించే అవకాశం ఉన్న వ్యవస్థను Open system అనంటారు. ఉదా : మరుగుచున్న నీటిలోని ఉష్ణ ప్రవాహము చల్లగా ఉన్న నీటిలోకి ప్రవహించడానికి మరిగే నీరు కూడా చల్లని నీటిలో ప్రవహించే వీలున్న వ్యవస్థ Open system వివృత వ్యవస్థ అవుతుంది. ఉదా : నీరు బయటకి పోవడానికి గాను తెరవబడిన పైపుగల బాయిలర్.

  2. సంవృత వ్యవస్థ : Closed system : ఉష్ణశక్తిని గ్రహించి ఉన్న ద్రవ్యము మూసిఉన్నఆవరణ కలిగిఉన్న పరికరంలో ఉండి ఉష్ణశక్తి ఆ ద్రవ్యంతో కలిసి కాకుండా అదొక్కటే బయటకి ప్రవహించే వీలున్న వ్యవస్థ. ఉదా : అధిక ఉష్ణోగ్రతతో ఉన్న ఉష్ణశక్తిని నింపి సీలుచేయబడిన సిలిండరు. దీనిలోని శక్తి ప్రవాహము ఆ సిలిండరు గోడల ద్వారా తక్కువ ఉష్ణోగ్రత గల వాటివైపు ప్రవహిస్తుంటుంది. కాని సిలిండరులోని ద్రవ్యము సిలిండరు లోనే ఉంటుంది.

  3. ఏకాంత / వేరుగా ఉన్న వ్యవస్థ : Isolated System : ఉష్ణశక్తిని 1. ద్రవ్యముగాని, ఉష్ణశక్తిగాని, దేనిని విడిచి బయటకు ప్రవహించ వీలుకాదో అట్టి వ్యవస్థ ఏకాంత వ్యవస్థ. దీనికి మానవ కృతాలలో ఖచ్చితమైన ఉదాహరణ లేదు. ప్రకృతిలోని ఏ కొంత భాగాన్నైనా ఏకాంత వ్యవస్థ అనటానికి వీలులేదు. దీనికి ఊహాత్మకమైన ఉదాహరణలు రెండున్నాయి. 100% ఉష్ణ నిరోధకం కలిగిన పెట్టె లేక సిలిండరు. దోషరహితమైన ధర్మాసుప్లాస్కు 2. విశ్వం మొత్తాన్ని ఒక వ్యవస్థగా తీసుకుంటే, విశ్వం బైట అనేది లేదు కనుకను, విశ్వంలో ఉన్న ద్రవ్యము అది కలిగిఉన్న ఉష్ణశక్తి కూడా విశ్వానికి వెలుపలకు ప్రవహించడమన్న ఊహే అసంగతం కనుకనూ, ఖచ్చితమైన ఏకాంత వ్యవస్థకు చెప్పగలిగిన ఒకే ఒక్కటి, విశ్వాన్ని ఒక వ్యవస్థగా తీసుకుంటే, విశ్వమే. విశ్వంలోపల చెప్పుకోవలసి వస్తే deal Thermos Flask అనన్నారు. 

ఇదండీ, వ్యవస్థల వివరం. ఇక్కడ మన వెంకటాద్రి గారు, తన విశ్వతత్వంలో విశ్వం 'Open system' క్రిందికి వస్తుంది అన్న భావాన్ని వెలిబుచ్చారు. అది తప్పు. 2. ధర్మోడైనమిక్స్ రెండో నియమాన్ని ఒకరిద్దరు పరిశోధకులు 'ఉష్ణమరణం' అన్న ఊహకు ఆధారంగా చూపబూనడాన్నుండి బయటపడటానికి, సైన్సు సంబంధించని ఎన్నో తొందరపాటు మాటలు వాడేశారు. అవి సరైనవి కావు. 

హేతువాద సంఘం VS సత్యాన్వేషణ మండలి

- యర్రంశెట్టి జగన్ మోహన్ రావు

గత 7, 8 నెలలు పైగా ఈ శీర్షిక క్రింద నేను వ్రాసిన విషయాన్ని గమనిస్తున్న మిత్రుడొకరు తన సందేహంగా “హేతువాద సంఘానికి, మండలికీ అని వ్రాస్తూ, హేతువాద సంఘంలోని అహేతుకాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. అన్ని హేతువాద సంస్థలు, అందరు హేతువాదులు ఆ విధంగా ఉన్నారని ఎలా అనుకుంటాం" అని అదిగారు. ఈ ప్రశ్న ఇతర పాఠకుల్లోను కలిగే అవకాశముంది. కనుక నా సమాధానం ముందుగా తెలియపర్చి తరువాత విషయానికి ఉపక్రమిస్తాను.

ఈ శీర్షికకు హేతువాద సంఘం vs సత్యాన్వేషణ మండలి అని పేరు పెడుతూ ఉపశీర్షికగా రావిపూడి వెంకటాద్రి VS పుట్టా సురేంద్రబాబు అని పెట్టడం జరిగింది. అంటే హేతువాద సంఘం అని ప్రస్తావించిన ప్రతి సందర్భాన్ని రావిపూడి వెంకటాద్రి మాస్టారు, వారిని అనుసరిస్తున్న వారు అనే అర్థం చేసుకోవలసి ఉంటుంది. వారినే విషయంగా ఎందుకు ఎంచుకున్నామంటే పత్రికా ముఖంగా గాని, సభల్లో ప్రసంగాల రూపంలోగాని ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో సత్యాన్వేషణ మండలి పట్ల వారికున్న అపోహల్ని నిజాలుగా ప్రకటిస్తున్నది వారే. వ్యాసాల మొదటిలోనే నేను ప్రస్తావించినట్లు ఆ ప్రకటనలు వ్యక్తిగతంగాను, సంస్థాగతంగాను, వ్యక్తిత్వాల పరంగాను ఉండటం హేతువాది పాఠకులు గమనించవచ్చు. ఇలాంటి ప్రకటనలు చెయ్యడంలో వారిలో నిజాయితీ లోపం కంటే అవగాహనా లోపమే ఎక్కువగా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్లనే వ్యాసాలన్నీ విషయమే ప్రధానంగా రాయడం జరిగింది. వ్యక్తిగతంగా వారు సమాజానికి కీడుచేసేవారు కాదు. పైగా మేలు చేద్దామనుకునే వారే. అవగాహనల్లోను, విధానాల్లోను ఉన్న విభేదాలే పరిష్కరించుకోవలసి ఉంది. నేను చాలాకాలం వారి హేతువాద పాఠశాలలో విద్యాభ్యాసం చేసినవాడినే. అందుకనే మిత్రునిగానే ఈ రచన మొదలెట్టాను. అదియున్నూ కలసి కూర్చొని, చర్చించుకుంటే చాలావరకు మన అవగాహనల్ని పరస్పరం సరిదిద్దుకోవచ్చు అన్న నా ప్రతిపాదనకు వారు సుముఖంగా లేనందున, మరియు మీ అభిప్రాయం మీరు రాయండి, మా అబిప్రాయం మేము రాస్తాం అన్నందున ఈ విధానంగా చర్చించవలసి వచ్చింది. ఆ హేతువాద మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరని ఆశిస్తూ హేతువాద సంఘానికి మండలికి మధ్య విషయపరంగా ఉన్న మరికొన్ని విభేదాల్ని మీ ముందుంచుతాను.

  1. వ్యష్టి, సమష్టిల గురించి : హేతువాద సంఘం వ్యష్టి వాదం ప్రధానమైతే, సత్యాన్వేషణ మండలి వ్యష్టి, సమష్టిల రెండింటి శ్రేయస్సు ప్రధానమేనంటుంది. సందర్భాన్ని బట్టి, దేనికి ప్రాధాన్యమివ్వాలో వివేచనాపూర్వకంగా నిర్ణయించవలసిందే నంటుంది. హేతువాద సంఘం కూడా నేరుగా వ్యష్టివాదాన్ని ప్రతిపాదించకపోయినప్పటికిని దాని మజిలీల్లో ఆవశ్యంగా చివరి అంశంగా చెప్పుకొనే మానవవాదం ద్వారా ఈ అంశాన్ని ప్రతిపాదిస్తుంది. మానవ వాదం అంటే ముఖ్యంగా ఎం.ఎన్.రాయ్ ప్రతిపాదించిన మానవ వాదాన్నే వారు సమర్ధిస్తారు. ఎం.ఎన్.రాయ్ ఈ వాదం ద్వారా ప్రతిపాదించిన 22 సూత్రాల్లో మొదటి సూత్రంలో మొదటి వాక్యమే, మానవుడే సమాజానికి నమూనా. ఇక్కడ మానవుడంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి ప్రస్తావించారా లేదా జాతి వాచకంగా వాడారా అని పరిశీలిస్తే ఒక వ్యక్తిని ఉద్దేశించే అన్నారని తేలుతుంది. దానికి ఆధారాలుగా వారి గ్రంధాల్లోని ఈ క్రింది స్టేట్ మెంట్స్ చూడండి.

1. స్వత్వాన్ని కోల్పోయిన మానవుడు, మానసిక పరాధీనతాభావం నెలకొన్న మానవుడు సమాజానికి నమూనా కానేరడు.

2. సమాజం లేకుంటే వ్యక్తిలేడు అనే భావం సరైనది కాదు. వ్యక్తులు లేకుంటేనే వారి సమాహారమైన సమాజం ఉండదని గ్రహించాలి. కాబట్టి అవయవాలు దేహంతో అవిభాజ్యంగా ఉండి. దేహంపై ఆధారపడినట్లుగా వ్యక్తులు సమాజం మీద ఆధారపడరు.

3. శరీరం నుంచి ప్రత్యేకించబడిన అవయవం పనిచేయలేదు. కాని మానవుడలా కాదు. సమాజం నుంచి వేరు చేయబడినా, దూరం చేయబడినా ఒక్కడిగా మానవుడు బ్రతకగలడు. కాకుంటే సమాజ సంపర్కం వల్ల, సాంగత్యం వల్ల అనుభవించే ఆనందానికి మాత్రమే దూరమవుతాడు. మానవుడే కాదు పశుపక్ష్యాదులు సైతం అలా వేరుపడి ఒంటరిగా బ్రతకగలవు.

4. వ్యక్తులు లేకుండా సమాజం లేదు. అందువల్ల వ్యక్తి భద్రతని క్షేమాన్ని కాదంటూ సమాజ క్షేమం లేదు.

5. వ్యక్తి అభివృద్ధి సామాజికాభ్యుదయానికి ప్రాణం.

పై స్టేట్ మెంట్స్ వ్యక్తి వాదాన్ని సమర్ధించటానికి ఉద్దేశించినవే. ఒక్కొక్క స్టేట్ మెంట్ విచారణకు తీసుకుందాం. మానవుడంటే వ్యక్తివాదం ప్రకారం ప్రతి ఒక్క మానవుడు అనే అర్థం. అలా అనుకుంటే మరి ప్రతి ఒక్క మానవుడు సమాజానికి అంటే సమాజం మొత్తానికి నమూనా ఎలా అవగలడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇది చర్చనీయాంశము. ఎం.ఎన్.రాయ్ ఏ అర్థంతో మానవుడన్నాడో చూడాలి. అర్థం చేసుకున్నామనుకున్నవారు వివరించాలి. విశ్లేషిద్దామనుకున్న స్టేట్ మెంట్ లో స్వత్వాన్ని కోల్పోయిన మానవుడు మానసిక పరాధీనత భావం కలిగిన మానవుడు సమాజానికి నమూనా కానేరడు అన్నామంటే మానవులలోనే కొంతమందిని సమాజానికి నమూనాగా మనం అంగీకరించకూడదు అనే అర్థం వస్తుంది. ' అంటే మానవుడు అంటే ప్రతి ఒక్క మానవుడు అనే అర్థం తీసుకున్నట్లయితే ఇది దానికి విరుద్ధంగా ఉంటుంది. అదే విధంగా రెండవ స్టేట్ మెంట్ సమాజం లేకుంటే వ్యక్తి లేడు అనే భావం సరైనది కాదు అనాలంటే కొన్ని సందేహాలు వస్తాయి. అసలు సమాజం అంటే ఏమిటి? ఒకరి కంటే ఎక్కువ మనుషులుండాలి. సమాజం అనాలంటే మరి ఎంతమంది కనీసం, ఎంతమంది గరిష్టం? గరిష్ట సంఖ్యాపరంగా జవాబు చెప్పలేము. కాని సమాజం అంటే కనీసం ఇద్దరు ఉండాల్సిందేనని తెలుస్తోంది. కనీసం ఇద్దరు లేకుంటే మనిషి ఎలా పుడుతున్నాడు. ఎక్కడ ఎలా బ్రతుకుతున్నాడు? ప్రకృతిలో ఒక్క మనిషి సమాజం లేకుండానే బ్రతికాడు అనేదానికి ఒక్క ఉదాహరణ చూపించగలమా? మనిషి సమాజంలోనే పుడుతున్నాడు. సమాజంలోనే వస్తున్నాడు. సమాజం ద్వారానే తన సహజ కాంక్షలు తీర్చుకుంటున్నాడు. వాస్తవం ఈ విధంగా ఉంటే మనిషి సమాజానికి వేరుగా ఉన్నాడు, ఉండగలడు అన్నది కేవలం భావనా ప్రపంచం నుండి నిర్ణయాలు రాబట్టుకొనే భావవాదమవుతుంది గదా! వ్యక్తి, సమాజం - ప్రకృతిలలో అవిభాజ్యమైన భాగం అని అర్థం చేసుకోవటం సరైనది. వ్యక్తి సమాజం నుండి వేరుగా ఉండగలడు అంటే అవిబాజ్యతకు విరుద్దము అవుతుంది. ఎం.ఎన్.రాయ్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇది చర్చనీయాంశము. వ్యక్తులు లేకుండా సమాజం లేదన్నది వాస్తవం. ఇక్కడ వ్యక్తులు అంటే అనేక వ్యక్తులు అని అర్థం అనేకం అంటే కనీసం ఇద్దరు ఉండాలి. ఒకవేళ ప్రళయం వచ్చి మానవజాతి అంతా నశించిపోయి ఒక్క మానవుడు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా ఊహా ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలో చూడవలసిందే. కాని పై స్టేట్ మెంట్ కి అర్థం ఏ ఒక్క వ్యక్తి లేకుంటే అనే అర్థం తీసుకున్నా వాస్తవమే.

వ్యక్తి అభివృద్ధి సామాజిక అభ్యుదయానికి ప్రాణం అనే స్టేట్ మెంట్ ను అర్థం చేసుకోవాలన్నా పైన ఉదయించిన ప్రశ్నలకు సమాధానం రావలసిందే.

మరి సత్యాన్వేషణ మండలి ఏం చెబుతుందో చూద్దాం. నా అవగాహన ప్రకారం వ్యష్టికి, సమష్టికి రెంటికి మండలి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంతేకాదు వ్యష్టికి మాత్రమే ప్రాధాన్యత అనేవారు సమష్టిలోని ప్రతి వ్యక్తికో లేదా ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ప్రతి వ్యక్తికి అని జవాబు చెబుతారు. అంటే అందరి వ్యక్తులకు అనే అర్థం కదా! ఉదా: ఒక గుంపులో 10 మంది ఉంటే మన దగ్గర ఉన్న పండ్లు ప్రతి ఒక్కరికి ఇమ్మంటే అర్థం అందరికీ అనేకదా ప్రతి ఒక్కరి సంక్షేమం అన్నా, అందరి సంక్షేమం అన్నా ఒకే అర్థమా కాదా ఆలోచించండి!

మరి వ్యక్తివాదము, సమష్టి వాదముల సమస్య అంటే ఇంత తేలికగా పరిష్కారమయ్యే సమస్యకాదు అనిపిస్తుంది. వ్యక్తివాదం ప్రకారం సమష్టి కోసం ఏ ఒక్కరిని బలిపెట్టవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పారు. సమష్టి వాదం ప్రకారం ఒక పెద్ద గుంపు క్షేమం కోసం వారిలోని ఒకరిద్దరిని వదులుకోవడం తప్పనిసరైతే, ఆ ఒకరిద్దరిని కాపాడాలనుకొంటే ఆ గుంపు క్షేమాన్ని కాపాడలేము. కనుక ఆ విధంగా కొంతమంది వ్యక్తుల్ని త్యాగం వదులుకోవలసి వస్తుందని సమష్టి వాదం చెపుతుంది. ఎందుకంటే ఆ ఒకరిద్దరు మొత్తం ఆ గుంపుకు ప్రమాదాన్ని కలిగిస్తున్న సందర్భము అయితే వారిద్దరి పైనా సమష్టి చర్య తీసుకుంటుంది. ఇది లోకంలో జరుగుతున్నదే, మరోదారి లేదుకదా! కనుక సందర్భాన్ని బట్టి వ్యక్తికా, సమష్టికా ప్రాదాన్యతకు అర్హత ఉండేదని తేల్చుకోవలసిందే తప్ప. ఒక వ్యక్తి వాదమో, సమష్టి వాదమో అన్ని పరిస్థితులకు పరిష్కారం చూపదు అన్నది వాస్తవికతకు అద్దం పడుతోంది. అందువలన ఏ ఒక్క మానవుడో సమాజానికి నమూనా కాలేడు.

అందువలనే సత్యాన్వేషణ మండలి వ్యష్టికో లేదా సమష్టికో కాక అందరి శ్రేయస్సునే చెప్తోంది. అసలు ఏ ఉద్యమమైనా ఇలా అందరి శ్రేయస్సు కోరేదే. సర్వేజనా సుఖినో భవన్తు అన్నా, సర్వోద్యమాలకు సమష్టి శ్రేయస్సే లక్ష్యం అన్నా, అందరూ బాగుండాలి , అన్నా అర్థం ఒక్కటే. కాని సామాజిక తత్వవేత్తలలో ఒక్కొక్కరూ ఒక్కో వాదాన్ని, తలకెత్తుకున్నందువల్ల వారి వారి వాదాల్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో సమర్ధించలేక పోవడం, చివరకు మీది మీదే మాది మాదే అని సరిపెట్టుకోవడం జరుగుతోంది. అవసరమైతే ఎం.ఎన్. రాయ్ చెప్పిన 22 సూత్రాలను సమీక్షించాలని, మార్చుకోవలసింది ఏమన్నా ఉంటే మార్చుకోవలసి వస్తుందని రాడికల్ హ్యూమనిస్టు అను ఆంగ్ల పత్రిక మాజీ ఎడిటర్ తన సంపాదకీయాల్లో రాయడాన్ని ఈ సందర్భంగా మానవవాదులకు గుర్తుచేస్తున్నాను. ఇలాంటి స్ఫూర్తిని ప్రదర్శించిన కార్యకర్తలను ఎం.ఎన్.రాయ్ కూడా అభినందించేవారని సీనియర్ హ్యూమనిస్టులు చెబుతుంటారు.

సమాచార హక్కు ప్రచార ఉద్యమ వార్తలు

ఈశ్వరుడంటే ఎవరు? సత్యమేవ జయతే అంటే ఏమిటి? 

ఈ ప్రశ్నలను సమాచార హక్కు కార్యకర్త, యోగాచార్య. రాష్ట్రపతి సచివాలయానికి స.హ. దరఖాస్తు రూపంలో అడిగారు. సచివాలయం ప్రశ్నలను హోం శాఖకు పంపింది. హోంశాఖ న్యాయశాఖకు పంపింది. చట్ట సభల్లో సభ్యులు ఈశ్వరుడి పేరిట ప్రమాణాలు చేస్తుంటారు. అది మొక్కుబడిగా సాగిపోతుంటుంది. అంతేకాని అలా ప్రమాణం చేసే ఎవరూ ప్రశ్న వేసుకోవటం లేదు. ఈశ్వరుడుపై ప్రమాణం చెయ్యటం ఇష్టం లేనివారు తన మనస్సాక్షిగా ప్రమాణం చేస్తుంటారు. అంతేగాని ఈ విధంగా ప్రశ్నించలేదు. అందుకే ఈ ప్రశ్నలకు తొలుత న్యాయశాఖ అవాక్కయింది. తరువాత సమాధానంలో ఈశ్వరుడుని నిర్వచించే రాజ్యాంగ నిబంధన ఏదీలేదని స్పష్టం చేసింది. అయితే న్యాయశాఖ పంపిన సమాధానంతో సంతృప్తి చెందని యోగాచార్య తన సందేహాలను కేంద్ర సమాచార సంఘానికి నివేదించారు. దీనిపై కేంద్ర పౌర సమాచార అధికారి ఎస్.కె.చిట్కారా సమాధానమిస్తూ సత్యమేవ జయతే, సత్యం, మతం, కులం అనే వాటికి రాజ్యాంగంలో ఎక్కడా కూడా నిర్వచనాలు లేవని, కాబట్టి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేమని చెప్పారు. ఆ పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకోవాలని, ఆయా పదాల అర్థాలను అధ్యాపకులు, ఆచార్యులే వివరించాల్సి ఉంటుందన్నారు. అంతేతప్ప స.హ.చట్టం క్రింద అడగరాదని పేర్కొన్నారు. ఆ స.హ.చట్టంలోని సమాచారం అనే మాటకు స్పష్టమైన నిర్వచనం ఉందని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని కొందరు స.హ. కార్యకర్తలను సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్ గారు ఈశ్వరుడు, సత్యం అనే మాటలకు నిర్వచనం మీరు చెప్పగలరా? అని ఎదురు ప్రశ్న వేశారు. అంతేగాక యోగాచార్య అభ్యర్ధనలను నిష్ప్రయోజనకరమైనవిగా పేర్కొంటూ తిరస్కరించారు.

ఈ విషయంపై వివేకపథం పాఠకులు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కార్యకర్తలు స్పందనల రూపంలో పత్రికకు పంపించమని కోరుచున్నాము.

2. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తిస్ ఘడ్ రాష్ట్రాలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, 2005లో ఇచ్చిన అనుమతికి సంబంధించిన ప్రతులను నెలరోజుల్లోగా ఫైల్ నోటింగ్తో సహా హైదరాబాద్ కు చెందిన దరఖాస్తుదారు డి.సురేష్ కుమార్‌కు అందించాలని కేంద్ర సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్, ఆచార్యులు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఆదేశించారు. ఈ ఉత్తర్వులను మొదటి సారిగా తెలుగులో జారీచెయ్యటం విశేషం.

తైమాసిక సమావేశ విశేషాలు

ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 24,25,26 తేదీలలో మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో త్రైమాసిక సమావేశాలు జరిగాయి. డా బ్రహ్మారెడ్డి గారితో సహా సుమారు 30 మంది వరకు వివిధ ప్రాంతాల నుండి సమావేశాలకు హాజరైనారు. మొదటి అంశంగా శాస్త్రీయ దృక్పథంను తీసుకోవడం జరిగింది. ఇక వివరాలలోకి వెళితే ముందుగా పుట్టా సురేంద్ర బాబుగారు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథము దానియొక్క ఆవశ్యకతను వివరిస్తూ, మధ్యలో ఏర్పడిన సందేహాలను తీరుస్తూ ప్రసంగించారు. ఆయన చెప్పిన విషయాలు నా మాటల్లో తెలుపుతున్నాను.

మెదడు ఉన్న ప్రతివాడూ కుతూహలం కలిగి ఉంటాడు. అది బ్రతుకు చరిత్ర కొరకు సహజంగా ఏర్పడింది. ఒక పెద్ద శబ్దము వినపడిన వెంటనే తల అటుత్రిప్పి ఏం జరిగిందో చూస్తాము. కాని జిజ్ఞాస అలాంటిది కాదు. “జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస" తెలుసుకోవాలనే గట్టి కోరికనే జిజ్ఞాస అంటాము. జిజ్ఞాస కలవాడికి స్పష్టమైన ఉద్దేశం ఉంటుంది కనుక తనకు ఏమి తెలియాలనుకొంటున్నాడో, ఇప్పటికి దానిలో ఎంత తెలుసో, మరెంత తెలియవలసి ఉందో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" శ్రద్ధావంతుడైన వాడే జ్ఞానాన్ని పొందగలడు. అంటుండగానే సభనుండి ఒక ప్రశ్న వచ్చింది. శ్రద్ధ ఉంటే సరిపోతుందా? ప్రయత్నాలు చేయాలా? వద్దా? అని దీనికి వివరణగా శ్రద్ధ ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఉండదో? తెల్సుకోవాలి. శ్రద్ధ కలిగిన విషయంలో ప్రయత్నించకుండా ఉండగలడా అన్న విషయాన్ని పరిశీలించాలంటూ ఇష్టము లేకపోయినా, కష్టమైనా శ్రద్ధ పోతుంది. ఉండదు. కనుక ఇష్టమైన పని చేయడానికి ప్రత్యేకించి ప్రయత్నించాలి అన్న అవసరము లేదని ఆయిష్టము ప్రయత్నపరుడ్ని చేస్తుందనుకోవటం జరిగింది. 

రెండవ ప్రశ్నగా సహజంగానే జ్ఞానాన్ని పొందుతున్నాము కదా శ్రద్ధావంతుడే జ్ఞానాన్ని పొందుతాడని ఎలా చెప్పగలరు? అని వచ్చింది. దీనికి సమాధానముగా ఎంపిక చేసుకున్న విషయాలలో శ్రద్ధ గురించి మాట్లాడుకుంటున్నాము. సహజంగానే తెలుసుకొనే వాటిల్లో కూడా సావధానతలలో తేడా ఉంటుంది. మనకు ఐదు ఇంద్రియాలు ఏకకాలంలో పనిచేస్తుంటాయి. కాని ఒకదాని తరువాత మరొక ఇంద్రియజ్ఞానమే మనకు కలుగుతుంటుంది. పూర్వీకులు కూడా “యుగపత్ జ్ఞానా నుత్పత్తిర్ మనసో లింగం" అని గ్రహించారు. అంటే మనస్సు మనకు ఉందనటానికి గుర్తు ఒక సమయములో ఒక ఇంద్రియ జ్ఞానమే మనకు కలుగుతుండడం అని అర్థం.

జ్ఞానం అంటే తెలియడం అనుకున్నాము. తెలియడమంటే ఏమిటి? దీనికి పూర్వీకులు "అసన్ని కృష్ణార్థ పరిచ్చిత్తిః ప్రమ." లేనితనమును పోగొడుతూ ఏదో ఒకటి అనిపించడమే తెలియడమంటే అంటే, ఏదో ఒక విషయాన్ని గురించి ఏదో ఒకటి అనిపించడమే తెలియడము. ఆయా విషయాలు మన స్పృహ (ఎరుక) లోకి రావడం అని అర్థము.

ఉన్నది ఉన్నట్లు తెలిస్తే దానిని ప్రమజ్ఞానము కలిగింది అంటాము. దీనినే కలిగిన జ్ఞానము దోషరహితము కలిగి ఉండడము అని అంటాము. దోషము అంటే తప్పు. ఇది ఉంటే మార్చుకోవాలి. ఇక లోపము అంటే ఉండవలసిందే అయినా తగినంత లేదని అర్థము. ఆ కొరవను చేర్చుకోవడమే లోపాన్ని సరిచేసుకోవడమంటే. ఇలా చూడగలగాలంటే క్షేత్రదర్శనం చేయగలగాలి.

క్షేత్ర దర్శనం

ఒక విన్న విషయాన్ని గాని, చదివిన విషయాన్ని గాని అది సరైందో కాదో చెప్పగలగాలంటే ముందు ఆ విషయాన్ని క్షేత్ర దర్శనం చేయాలి. క్షేత్ర దర్శనం చేయని జ్ఞానం అంతా పరోక్ష జ్ఞానమే. జీవితానికి సంబంధించిన సాధారణ విషయాలలో మనకు తెలియకుండానే మనము క్షేత్ర దర్శనం చేసి చూసుకుంటూ ఉంటాము, నిర్ణయం చేస్తూ ఉంటాము. ఉదా: రెండు రెండ్లు నాలుగు అని ఎవరైనా చెబితే మనలో మనము క్షేత్ర దర్శనం చేసుకుంటాము. రెండు, రెండు సెట్లు కలిపితే నాలుగు అనుకొని సరిపోయిందంటాము. అలా కాక వేరే అంకె చెబితే తప్పు చెప్పాడంటాము.

అలానే ఒక విన్న వాక్యాన్ని క్షేత్రదర్శనం చేసి అర్ధమైంది అనుకుంటాము. ఉదాహరణకు రాముడు కుక్కను కొట్టెను అన్న దానికి ప్రతి పదానికి అర్థాన్ని దర్శించి అర్ధమైంది అనుకుంటాము. రాముడు అంటే ఒక వ్యక్తి. కుక్క పదానికి పదార్ధము (పదార్ధము అంటే ఆ పదముచేత సూచింపబడేది ఏదో అది అని) తెలిసింది అనుకుంటాము, కొట్టెను పదానికి పదార్థము కొట్టడము అనే పని తెలిసి ఆ వాక్యము అర్థమైందంటాము. ఇక్కడ గమనించాల్సినది ఏమంటే ఆ వాక్యము ఏమి చెబుతుంది. మనకు అర్థమైంది గాని అది సత్యమో కాదో. ఇంకా తెలియవలసే ఉందన్న విషయం.

ఇలా క్షేత్ర దర్శనం చేయగలిగే వారు ప్రతి విషయంలో ఇలానే చేయాలి అన్న దానిని గ్రహించరు. ఉదా: నీవు ఆత్మ స్మరూపుడవు, వాడికి దెయ్యము పట్టింది, దేవుడు పరలోకమునందుండెను, క్వార్కులు ఆరుగా గమనించారు, పరమాణువు రెండువందలకు పైగా సూక్ష్మ పరమాణువులుగా విడగొట్టబడింది మొ..నవి. ముందు వాక్యార్థ జ్ఞానము కలిగిందా? అంటే ఆ వాక్యములో ప్రతి పదానికి పదార్థ (అర్థ) జ్ఞానం కలిగిందా ఆ కలిగిన జ్ఞానము సరైందా, కాదా? అని ఎప్పుడైనా ఆలోచించామా? ఇది ఆలోచించడము మొదలెడితే క్షేత్ర దర్శనం చేయడం మొదలైనట్లు.

చాలా సమయాల్లో వాక్యార్థ జ్ఞానము కలగకుండానే ఆ వాక్యము సత్యమైనదని, అసత్యమైనదని నిర్ణయం చేస్తుంటాము. దీనికి కారణం ఆ విషయం లేక ఆ వాక్యం చెప్పిన వ్యక్తి పైన పెద్దవాడో, చిన్నవాడో నన్న దృక్పథముతో ఆ విషయాన్ని సత్యమనో, అసత్యమనో నిర్ణయించు కొంటుంటాము. ఇలా చూడగలిగితే ఆస్తిక, నాస్తిక, హేతువాదులన్న వారందరిలో ఎక్కువలో ఎక్కువ భాగము ఆయా క్షేత్రాలలో (వారు చెప్పే విషయాలలో) క్షేత్ర దర్శనం చేసే చెప్పారు అనలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇచ్చట గమనించవలసింది “వల్లె వేయడము క్షేత్ర దర్శనం చేయడం కాదు" అని.

అసలు దృష్టికోణముతో చూడడమంటే ఏమిటి? దృష్టికోణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అని వివరించుకుంటుంటే ముందు జ్ఞానమేర్పడుతున్న క్రమము దగ్గర నుండి మొదలు పెట్టాల్సి ఉంది. దీనిని పరిశీలిస్తే తెలియబడే విషయాలు ఆయా జ్ఞానేంద్రియాల (వాసనకు ముక్కు రూపముకు కన్ను మొనవి.) ద్వారా మెదడులోని అనుభవ కేంద్రానికి చేరి గతములో ఏర్పడి ఉన్న స్మృతి కేంద్రముతో సరిపోల్చి చూసుకొని ఇది ఫలాన అన్న జ్ఞానం కలుగుతుంది. ఇది అంతా ఒక సర్క్యూట్ లాగా ఉంటుంది గనుక, ఎదురు పడిన విషయం ఇది ఫలాన అన్నది మనకు తెలుస్తున్నట్లు ఉంటుంది. లోతుగా పరిశీలిస్తే గాని వివిధ కేంద్రాలున్నాయని గుర్తించలేము. ఈ క్రమంలో కలిగిన జ్ఞానాన్నే అనుభూతి చెందడం అంటుంటాము.

ఇలాంటి అనుభూతులలోని సాధారణాంశాల నుండి అభిప్రాయం ఏర్పరచుకుంటాము. ఇది సాధారణంగానే జరిగిపోతుంటుంది. ఉదా: ఏ కాకి నలుపు, బి కాకి నలుపు, సి కాకి నలుపు, డి కాకి నలుపు. సాధారణంగానే కాకులన్నీ నలుపు అన్న అభిప్రాయానికి వస్తాము. ఇలానే మనకు సంబంధపడిన ప్రతి విషయములోనూ, వ్యక్తిని అంచనా వెయ్యడంలోనూ ఇలాంటి అభిప్రాయాలకే వస్తుంటాము. తగినన్ని అనుభూతులు లేకుండా ఒక అభిప్రాయానికి వస్తే ఆ అభిప్రాయము తప్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటినే మనము తొందరపాటు సాధారణీకరణలు (Hasty Generalization) అంటాము. ఇలా అనుభూతుల నుండే కాకుండా మనము విన్న విషయాలతో, చదివిన విషయాలతో కూడా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాము. ఉదా: పెద్దవానిగా గుర్తింపబడే వ్యక్తి మరొక వ్యక్తిని గురించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తము చేస్తే ఆ అభిప్రాయాన్ని అలానే గ్రహించి ఆ అభిప్రాయము మనదిలాగానే భావిస్తాము. ఇలానే మత గ్రంథాలన్నీ తమను ఆచరించే వ్యక్తులకు ఆ మత గ్రంథమే సరైనదని, మిగతావి అన్నీ తప్పులే అనే అభిప్రాయం కలిగిస్తుంటాయి. వారు అలానే ప్రవర్తిస్తుంటారు.

ఇలాంటి అభిప్రాయాలకు, తమ వ్యక్తిత్వం తోడవడము వలన దృక్పథము ఏర్పడుతుంటుంది. దృక్పథము అంటే తమ అభిప్రాయం + తమ వ్యక్తిత్వము అంటాము. తమ అభిప్రాయాలు తమ వ్యక్తిత్వంతో కూడి ఆయా విషయాలపై ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, వాటి ఎడల ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకొని అలా ప్రవర్తించడమే దృక్పథములోనుండి ప్రవర్తించడమంటే.

ఇలాంటి దృక్పథాలు ఎన్ని ఉండవచ్చు అన్న ప్రశ్న రాగా, ఎన్ని వ్యక్తిత్వాలుంటాయో అన్ని దృక్పథాలు రావచ్చుగదా అన్న సమాదానము వచ్చింది. ఈ సమాధానము తార్కికంగా వచ్చిందా? క్షేత్ర దర్శనం చేసి వచ్చిందా అని పరిశీలించుకొంటే తార్కికంగా అని చెప్పవలసి వస్తుంది. ఎందువలనంటే దృక్పథాలు (వైఖరులు) పాక్షికము, నిష్పాక్షికము అని, ఈ పాక్షికము మరలా రెండుగా, ఒకటి అనుకూలము, రెండు ప్రతికూలములని విభజించవచ్చు. 

నిష్పాక్షికము అంటే ఉదాసీనము కాదని అర్ధము చేసుకోవాలి. నిష్పాక్షికము అంటే సత్య పక్షపాతము అని అర్థము.

ఇప్పుడు శాస్త్రీయ దృక్పథమంటే ఏమిటి? మనము అలాంటి దృక్పథాన్ని ఎలా ఏర్పరచుకోగలము? శాస్త్రీయ దృక్పథము అంటే సరైన దృక్పథము అని అర్థము. అది సరైన దృక్పథము కావాలంటే ముందు మనము సరైన అభిప్రాయములోనుండి ఆ దృక్పధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయగలగాలంటే సరైన అభిప్రాయాలు ఏవో? సరికాని అభిప్రాయాలు ఎవో చూడగలగాలి. మన అనుభూతుల నుండి ఏర్పడిన అభిప్రాయాలను, తగినన్ని అనుభూతుల నుండి ఏర్పడిందా, లేదా? గమనించాలి. ఇతరుల నుండి (విని, చదివి) ఏర్పడిన అభిప్రాయాలను ముందు పరీక్షకు పెట్టాలి. అవి సత్యమో కాదో అని పరీక్షించాలి. ఆ తరువాత మూర్తిమత్వము ఏమిటి అన్న విషయం పరిశీలిస్తే, మూర్తిమత్వము ఏర్పడడానికి సామాజీకరణ దోహదం చేస్తుంది, పరిసరాలు ప్రభావం చూపుతాయి. రాగద్వేష రహితుడవై చూడు అంటే సామాజీకరణకు, పరిసరాల ప్రభావానికి లోనుకాకుండా చూడగలగడమే శాస్త్రీయ దృక్పథం (సరైన చూపు) అవుతుంది.


No comments:

Post a Comment