Monday, May 9, 2022

217 వివేకపథం


వివేకపథం
సంపుటి 4                            సంచిక 7                                 మే 2015

 మానవ హననానికి దారులుతీయగల మతమార్పిడులు

ఈ మధ్య కాలంలో క్రొత్త క్రొత్తగా పుట్టుకొస్తున్న క్రైస్తవ, ఇస్లాం ప్రచారకులు, వారి సంస్థలూ, వంచనతో కూడిన ప్రచారపు ఎత్తుగడలను చేపట్టారు. ఈ రకం వారందరి విషయంలో, వారి మనస్సు నిర్మలంగా లేదన్నది ఒక పచ్చినిజం. అలాగే, తాను చెబుతున్న విషయాలు నిజంగా తనకు తెలీనివి, తేలనివీ ననీ తెలిసే కొందరు, తెలీకనే తెలుసనుకుంటూ కొందరు. 1. మతవ్యాప్తి, 2. బ్రతుకుతెరువు, 3. అధిక సంపాదనలన్న వాటిలో ఏదో ఒకటిగానీ, అన్నింటినీ గాని లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలను, పెద్దఎత్తున చేస్తూ వస్తున్నారు. ఇట్టివారికి ఆరంభంలో కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చడానికి, కొన్ని పెద్ద మత సంస్థలూ అంతర్జాతీయంగా దీనిపై ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న ఇతర దేశాలలోని మతసంస్థలు, మతవ్యాప్తి లక్ష్యంగా పనిచేసే వ్యాపార సంస్థలు సిద్ధపడి పెద్దఎత్తున ఆ పనిచేస్తున్నాయి, చేయిస్తూ వస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఇంత పెద్ద కార్యక్రమం నడుస్తున్న తీరును నిశితంగా, లోతుగా చూడగలిగితే దీనివెనుక మూలరూపంలో మతరాజ్యాధిపత్యాకాంక్ష పనిచేస్తూ ఉన్నట్లే తేలుతుంది. ఇక్కడి మత సంస్థలు, ప్రచారకులూ, మత ప్రచారం కొరకు తామేమేమి చేసిందీ, చేస్తూ ఉంది, దృశ్యాలరూపంలో, రచనల రూపంలో, ప్రసంగాల రూపంలో, సేవల రూపంలో రికార్డు చేసి, ఒక ప్రాజెక్టు రూపంలో దానిని విదేశీ, స్వదేశీ పెద్ద సంస్థలకుజూపి, ఆ సంస్థలతో అనుబంధాన్ని పెట్టుకొని సాగుతున్నారు. అంతా ఒక ప్రణాళికా బద్ధమైన, వల (వలయం)లా సాగిపోతుందిది.

ఇక్కడి రాజకీయ నాయకులకూ, మత సంస్థలు ఓటు బ్యాంకులుగా కనిపిస్తున్నాయి. పనికొస్తున్నాయి. ఇక్కడి రాజకీయమంతా, కుల, మత, వర్గ ప్రాతిపదికన గుండుగుత్తగా ఓట్లను కొనుక్కోవడం అన్నదానిపైనే ప్రధానంగా నడుస్తోంది. ఇది ఇక్కడి వారందరికీ (సామాన్యుడి నుండి, యోచనాపరుల వరకు అందరికీ) ప్రతిసారీ కనపడుతుండే బహిరంగ విషయమే.

ప్రజలకు శాస్త్రీయ సమాచారాన్నందిస్తూ, వివేకవంతుల్ని చేయాల్సిన ప్రభుత్వాలకు, వాటికీ శాస్త్రీయావగాహన ఉండటం లేదు. ప్రభుత్వ రూపంలో ఉన్న అధికార పార్టీ ముఖ్యులకే తట్టెడు అజ్ఞానము, అనేక మూఢనమ్మకాలు ఉంటున్నాయి. పరిపాలకులుగా ఉన్న వారూ, సరైన రీతిలో పరిపాలన సాగించేట్లు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేట్లు చూడవలసిన ప్రతిపక్షాలకూ సరైన అవగాహన లేకపోవడం మంచి, చెడ్డా అన్నది పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే పనిగా పెట్టుకొని ఉండడంలో, వారు దోషారోపణ చేస్తున్న వాటిలో ఏది నిజం - ఏది అబద్దం అన్నది పట్టించుకోడం మానేశారు. ప్రజలున్నూ. ఇకనేం అపసవ్య పోకడలు పోయేరకానికి, వారేయే వేషాలలో, రూపాలలో ఉన్నవారికైనా ఎట్టి భయాలూ లేకుండా పోయాయి. అక్కడితో ఆగక, కులం, మతం పేరుతో గుంపులుగా కూడుతున్న వాళ్ళే తమకు ఓటు బ్యాంకులు అవుతున్నాయనిగమనించిన రాజకీయులూ, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవి ఉండడానికి, కొనసాగడానికి కూడా ఎవరికి చేతనైనంత వారికి సహకరిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు.

అజ్ఞానం, అధికార దాహం, బ్రతుకుదెరువు, పెద్ద వ్యాపారం, సాంఘిక స్థాయి, మత పిచ్చి ఇలా ఒక్కొక్కటిగాను, అన్నీ కలసి ఈ అనవసరపు, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైన మతవ్యాప్తి కార్యక్రమాలు పెద్దఎత్తున, నిరాటంకంగా సాగిపోతున్నాయి. రాజ్యాంగంలో, స్వతంత్రం వచ్చేనాటికున్న వాస్తవ పరిస్థితులతో రకరకాల మతాలు (విశ్వాసాలతో ఉన్న భారత ప్రజలందరినీ కలిపి ఉంచడానికి, ఒకే ఒప్పందం క్రిందికి తేవడానికి తప్పనిసరై ఏర్పాటుచేసుకున్నదే మత స్వేచ్చనివ్వడమన్నది.) పాలకులకూ ఆయా మతాల అధికార ప్రతినిధులుగా ఉన్న సాధుసంతులు, ముల్లాలు, బిషప్ లు క్రమక్రమంగానైనా తమతమ మత గ్రంథాలలోని కాలంచెల్లిన అంశాలను వైజ్ఞానిక పరిశోధనలాధారంగా తప్పనితేలిన అంశాలను మార్చుకుంటూ వచ్చి ఉండాల్సింది. ఆ దిశగా సంస్కరణ యత్నాలైనా చేసి (చేస్తూనూ) ఉండాల్సింది. అలాంటి పనేగనుక చిత్తశుద్ధితో ఆ ప్రతినిధులుగానీ చేస్తూ వచ్చి ఉంటే, పాతవాటిలోని మంచి అలాగే మిగిలి ఉండేది, పనికిరానిదీ, అసలే ఉండకూడనిదీ తొలగింపబడేది - సామాజిక మరియు వ్యక్తి బ్రతుకు అవసరమైనవి చేర్చుకొనబడుతూనూ వచ్చేవి.

రాజ్యాంగం ఒకవంక మత స్వేచ్ఛను, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొంటూనే శాస్త్రీయ దృక్పథమూ, శోధనాతత్వము, మానవత, సంస్కరణాభిలాష అన్న నాల్గింటినీ అలవర్చుకొని పెంపొందించుకోవడం (పెంపొందించడమూ) భారత పౌరులందరి ప్రాథమిక విధుల్లో చేర్చి సరైన దిశా నిర్దేశం చేసింది. రాజ్యాంగపు తొలినాళ్ళలో అందులో చోటుచేసుకొని పలు అంశాలు, అనంతరం ఆచరణనుండి గమనించిన కొన్ని అంశాలను అనవసరమైనవిగా తిరిగి తొలగించుకోవడం, మరికొన్నింటిని జతకూర్చుకోవడం చేసుకుంటూ వచ్చామిప్పటిదాకా సరైన ఎదుగుదలకు ప్రతివారూ అనుసరించాల్సిన రీతి ఇదే.

అత్యంత ప్రాధాన్యత కలిగిన, కీలకమైన ఒక విషయాన్ని మనమందరం స్పష్టంగాతెలుసుకొని ఉండడం అవసరం. రాజ్యాంగ సవరణల రూపంలో చేసుకున్న మార్పులు చేర్పులు (తీసివేతలూ -  కూడికలు) ప్రత్యక్షాచరణనుండి కలిగిన వివేకంతో చేసుకున్నవి గనుక, విలువల దృష్ట్యా అట్టివన్నీ ప్రథమాగ్ర గణ్యాలవుతాయి. అందునా ప్రాథమిక విధులను తొలినాళ్ళలో అంత అవసరంగా గుర్తించని పెద్దలు, కొన్ని దశాబ్దాల పరిశీలనానంతరం, విధులన్నవి శాసనరూపంలో ఉంటేగానీ ప్రజలు వాటిని పాటించరు అన్న అవగాహన ద్వారా వాటినీ జతచేశారు. కనుక ప్రాథమిక హక్కులకంటే, ప్రాథమిక విధులన్నవి ప్రాధాన్యతా క్రమంలో గానీ, ఆచరణ క్రమంలోగానీ ముందువి, మొదటివి అవుతాయి. ఈ అవగాహన మిగిలిన సామాజికావగాహన కవసరమైన ఇతరాంశాలన్నింటికంటే ప్రాథమికమైనవి. ఎందుకంటే…

విధులన్నవి పనుల రూపంలో వ్యక్తులు చేయవలసినవి కాగా, హక్కులు ఆ పని చేసినందుకు ఫలితంగా వారి, వారికి అందవలసినవిగా ఉంటాయి. అంటే విధులు 'పని' రూపం కాగా, హక్కు ఫలితాల రూపం అవుతోంది. ఈ నిజం అర్థం కానంతవరకు దానిని అమలుచేయడానికి ప్రజలు సిద్ధంకానంతవరకు, కనీసం వ్యవస్థ అయినా జనం అలా ప్రవర్తించేలా వత్తిడిని - పరిస్థితుల్ని - సృష్టించనంతకాలం, పనిచేయకుండనే ఫలితం పొందాలనే వైఖరే బలంగా పనిచేస్తుంటుంది సమాజంలో (సాధారణ జనంలో).

విధుల విషయంలో ఏమరిపాటు, పరాకు, ఎగవేత ధోరణి, హక్కుల విషయంలో ‘తెగరంది’ అన్నవే ఈనాడు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు (ముప్పాతిక మూడొంతుల సమస్యలకు) కారణాలవుతున్నాయి. అవగాహనా రాహిత్యము, అలసత్వము, శ్రమపడకుండా రావాలనే దృష్టి, ఇవే మనను పట్టిపీడిస్తున్న రోగరూపాలు.

మతాల చరిత్ర అది ఏ దేశంలో జరిగిందైనా సరే పరమతాన్ని తనదానితో సమానంగా చూడదు. చూడలేదు కూడా. అన్న వాస్తవాన్ని పట్టిచ్చేదిగానే ఉంటుంది. అందులోనూ ఖురాన్, బైబిలు గ్రంథాలలో కనపడే చరిత్ర అంతా, ఆ తరువాతి కాలంతో ఆ గ్రంథాల మార్గనిర్దేశనంలో సాగిన (నడచిన) చరిత్రంతా పరమత అసహనానికి సంబంధించిందే. 'కౄసేడులు' జరిగాయన్నది ఆయామత గ్రంథాలాధారంగానే గాక, విద్యాలయాలలో చరిత్రగా చెప్పబడుతున్న గ్రంథాలలోనూ నిర్వివాదాంశంగా అంగీకరింపబడిందే. అయితే ఆయా గ్రంథాల ఆధారంగా చూస్తే మాత్రం ఖురాన్, బైబిలు పోకడలకు, భారతీయ మతగ్రంథాల పోకడకు ఖచ్చితమైన తేడా ఒకటుంది.

గమనిక : ఇక్కడ భారతీయమన్న నా మాటకు ఈనాడు రాజ్యాంగం ప్రకారం చెప్పుకుంటున్న ఇండియన్ అన్న అర్థం కాదు. వేదంతో మొదలెట్టి రకరకాల ఆరాధనా ఈ పద్దతులను, ఆరాధ్యులను పేర్కొంటున్న మతసాహిత్యం అనే నామాటకు అర్థం. దీనిపై సాగతీతలు చేయకండి. అది అపార్థానికి దారితీసే 'ఛలం' అనబడే తప్పుడు పోకడ అవుతుంది.

  1. ఖురాను, బైబిలు పాత నిబంధనల వరకు రెండూ ఏకేశ్వరోపాసనను అంగీకరించినవి. ఏకేశ్వరోపాసనను మాత్రమే అంగీకరించినవి. అంతటితో ఆగక బహుదేవతారాధనను, అన్య దేవతారాధనను, విగ్రహారాధనను నిర్ద్వంద్వంగా ఖండించినవి.

  2. అదేమరి ఇక్కడి సాహిత్యంలో ఏకేశ్వరోపాసన నంగీకరించే సమూహాలతో పాటు, బహు దేవతారాధనను అంగీకరించే, అనుసరించే సమూహాలు ఏకకాలంలో కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంలో మరింత నిజాన్ని చెప్పుకోవాలంటే, ఏకేశ్వరోపాసకుల సంఖ్య ఎప్పుడూ అత్యల్పంగానే ఉంటూ వచ్చిందిక్కడ. విగ్రహారాధన ఆరంభంకాని కాలంలో కూడా బహు దేవతారాధన కొనసాగింది. వేదంలోనే బహుదేవతారాధన ఉందనీ, లేదనీ అనే రెండు సమూహాలు ఈ దేశంలో ప్రక్క ప్రక్కనే కొనసాగుతూ వచ్చాయి. ఇక పురాణ, ఇతిహాసాల రూపంలో ఉన్న విస్తార సాహిత్యమంతా దేవుడొక్కడేనని అక్కడక్కడా చెబుతూనే, ఆ దేవునిగా తలకొకడ్ని పెట్టుకుంటూనూ, బహుదేవతలను అంగీకరిస్తూనూ వచ్చింది. శంకరుని కాలానికే, ఇంకా చెప్పాలంటే బుద్ధుని కాలానికే ఇక్కడ బహుదేవతారాధన, వేదమూలకాల పేరున రకరకాల యజ్ఞయాగాదులు, ప్రబలంగా ఉన్నాయి. భారతీయ ఆస్తిక సాహిత్యంలో షణ్మతాల ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ఒక కాలాన ఇంద్రాగ్నివాయుమిత్రావరుణుల ప్రాధాన్యత సాగగా, పిదప ఆదిశక్తి భావన ప్రధానంగా సాగింది. క్రమంగా త్రిమూర్తులు, ముగ్గురమ్మల కథ పెద్దదిగా సాగింది. అనంతరం వారి సంతానమూ (ఉప దేవుళ్ళుగా) పూజార్హమైనదిగా గుర్తింపబడింది. అనంతర కాలంలో అవతార వాదం వచ్చి పెద్దపీటనధిరోహించింది. ఇప్పటికీ ఈ దేశంలో ప్రబలంగా సాగుతున్నదీభావనే. రామకృష్ణాదులే కాకుండా దత్తాత్రేయునితో మొదలై ఈనాటి రకరకాల బాబాలు, అమ్మలు, యోగుల కథలన్నీ ఈ అవతార వాదపు శాకోపశాఖలే. వీటన్నింటి నేపధ్యంగా, ఈ దేశంలో, ఈ దేశ మత సాహిత్యంలో పరమత సహనానికి, ఎవరిష్టం వారిది అనుకోడానికి కావలసిన ప్రాతిపదికలన్నీ (క్రమక్రమంగానే అనుకుందాం) చోటుచేసుకుంటూ వచ్చాయి. అందుకనే ఇక్కడ త్రిమూర్తులు వారి భార్యలు, వారికి ప్రత్యక్ష, పరోక్ష రూపసంతానాలు, తిరిగి వారందరి మధ్యా ఏదోఒక రూపంలో సంబంధ బాంధవ్యాలు ఇలాటి నిర్మాణమంతా జరిగింది. ఒకవంక ఇట్టివాటినన్నింటినీ పుక్కిట పురాణాలు అంటే సకపోలకల్పితాలు అనంటూనే, వాటినే ప్రామాణికాలుగా ఉదహరించుకోవడమూ సాగింది. గ్రామ దేవతలన్న కల్పనచేసి, మూలదేవత అంశాలనూ, అక్కచెల్లెండ్రనో సామాన్య జనాన్ని నమ్మించడం జరిగింది. ఇలా వివరించుకుంటూ పోతే దీనికిదే ఒక మహాసాగరమవుతుంది. ఎందుకంటే ఇందులోకి గ్రామదేవతల తరువాత పేరంటాళ్ళు, స్థలపురాణాల పేరిట ఒక్కోదేవుడూ, దేవతలకీ సామర్ధ్యబేధాలు రావడంతో దీనికి అంతూపొంతూ లేకుండా పోయింది. నిజానికి వివరణంతా అంత అవసరమైంది కాకపోయినా నేను మొదట ప్రస్తావించిన వివిధ మతాలు, వాటి మతసహనము, మత అసహనముల వాస్తవ పరిస్థితులు అన్నది అర్థం కావడానికి సమాచారం దోహదపడుతుంది.

పర్యవసానం - ఈదేశ మత సాహిత్యంలో పరమత సహనానికి కావలసినంత వెసులుబాటుంది. ఎవరిదారిన వారు తామనుకున్న దైవాన్ని అంగీకరించడానికీ, సేవించడానికీ, ప్రచారం చేసుకోడానికి కూడా కావలసినన్ని దారులున్నాయిక్కడ. దేవుని విషయంలో ఎవరిష్టం వారిది అన్నది అంగీకరింపజేయడానికి, అలవర్చడానికి పెద్దయత్నమే జరిగిందిక్కడ. హరిహరారాధన, హరి హరుణ్ణి, హరుడు హరిని పూజించడమూ, వారు ఒకరికొకరు సాయం చేసుకోవడమూ అన్నదానితో ఆగక శివకేశవాభేద ధోరణీ ఏర్పడింది. కడకు వైదికాన్ని నిరశిస్తూ అభౌతికాత్మ, నిత్యాత్మ లేదని ఖండిస్తూ వచ్చిన బుద్ధుణ్ణి కూడా విష్ణు అవతారాల జాబితాలోకి చేర్చేశారు. కదాచిత్, అక్కడక్కడా జరిగిన పరమతాసహన ఘటనలను మినహాయించితే ఇక్కడ మత సహనపు భాగమే, వైఖరే సాధారణ రూపంలో ఎక్కువకాలం చలామణి అవుతూ వచ్చింది. అటు తర్వాతైతే, వెనకే అప్పుడప్పుడూ జరిగాయంటున్న రీతి ఘటనలూ జరగడం ఆగిపోయి ఈ మతమంటేనే , బహుదేవతారాధన మతమని, విగ్రహారాధన మతమని స్థిరపడిపోయింది. ఈ విధానం మరీ ఈ మధ్యకాలంలోదని అనుకోనక్కర లేదు. బైబిలు పాతనిబంధన కాలానికే, బహుదేవతారాధన, విగ్రహారాధన, సూర్యారాధన ఉన్నట్లు, దానిలోనే ప్రస్తావనలున్నాయి. కనుక ఇక్కడి ప్రధాన మతసాహిత్యంలో గానీ, త్రిమతాచార్యులు ప్రధాన గ్రంథాలుగా , స్వీకరించిన ప్రస్థానత్రయం దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్న మూడు రకాల సాహిత్యాన్ని ప్రస్థానత్రయం అంటారు. (దారిచూపే మూడు లేదా గమ్యం చెప్పే మూడు అన్న అర్థంతో వాడబడిన సమాసమది). ఈ సాహిత్యంలో అక్కడక్కడా ఏకేశ్వరోపాసనకు పెద్దపీట వేసిన సందర్భాలలో బహుదేవతారాధనను నిరశించిన, అల్పమైందిగా భావించిన వాక్యాలు కనిపిస్తాయి గానీ, వాటినీ ఉండనీకూడదన్నంత అసహనాన్ని కనపరచిన గ్రంథాలుగానీ, ఆ అసహనం అమలైన దాఖలాలుగానీ ఇక్కడ లేవు. అట్టివి మొత్తం చరిత్రలో బౌద్ధంపై వైదికం ప్రతి ఉద్యమం చేసిందని చెప్పబడుతున్న కాలంలోనూ, వీరవైష్ణవం, వీరశైవం రాజాదరణ పొందిందంటున్న కాలంలోనూ జరిగినట్లు , చారిత్రిక రచనల్లో కొద్దిపాటి ఆధారాలు దొరుకుతాయి. చారిత్రిక పరిణామక్రమాన్ని గనుక జాగ్రత్తగా పరిశీలించితే ఆమాత్రపు అసమనమూ క్రమంగా తగ్గించడానికి ఆయా కాలాల సంస్కరణాభిలాషులూ కృషిచేశారన్నది తెలుస్తుంది. కనుకనే అనంతర కాలంలో జనులందరూ బహుదేవతారాధానా వైఖరిని అవలంభిస్తూ సహజీవనానికి అలవాటు పడిపోయారు. అదెంతగా సంస్కృతిలో భాగమైందంటే, బహుదేవతారాధనను నిరసిస్తూ, ఈశ్వరుడొక్కడేనన్న ధోరణికి చెందినవారు కూడా గోష్టుల్లో ఆ విషయాన్ని ప్రస్తావించుకోడానికి పరిమితులై సహజీవనమే ఆచరణీయం అన్నదానినే అమలుపరిచారు.

ఈ దేశ మత సంస్కృతి క్రమ పరిణామం ఇలాగే జరిగిందనడానికి, గట్టి రుజువుగా ఇతర దేశాల నుండి ఇక్కడికి దిగుమతైన క్రైస్తవాన్ని, ఇస్లాంను కూడా ఇక్కడ ఉండనీయడాన్ని ఉదహరించుకోవచ్చు. ఆ రెండు మతాలవాళ్ళు, రాజులు, మతాధిపతులు ఇక్కడి వారిని తమ మతంలోకి రాబట్టుకొనే యత్నాలు చేశారుగానీ ఇక్కడి ఏ మతసంస్థా ఆ రెండు మతాల వారిని తమ మతంలోకి రమ్మని వత్తిడి చేసిన దాఖలాలు లేవు. హిందూ దేశ రాజులు అధికారంలో ఉన్న సమయాలు, ప్రాంతాలలో కూడా క్రైస్తవ మందిరాలనుగానీ, ముస్లింల మసీదులను గానీ ధ్వంసం చేసినట్లు ఆధారాలు లేవు. ఇక విదేశాల నుండి దిగుమతైన రెండు మతాలలోనూ క్రైస్తవం కూడా, ఇక్కడి గుళ్ళను నాశనం చేసిన దాఖలాలు కనబడవు. ముస్లింలు అధికారం చేపట్టిన కాలంలో, ఆ ప్రాంతాలలో మాత్రం చాలా పెద్దఎత్తున ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినట్లు కావలసినంత రుజువు దారుకుతుంది. ఈనాటికీ చారిత్రక అవశేషాలుగా ఈదేశంలో ముస్లింల దండయాత్రలు జరిగిన, రాజ్యాధిపత్యం నెరపిన ప్రాంతాలలోని దేవాలయాల, దేవతామూర్తుల శిధిలాలు తిరుగులేని సాక్ష్యాలనిస్తాయి. అంతదాకా ఎందుకు మహమ్మదు మక్కాలోని 365 దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఆరంభమైన ఆ విధ్వంసకాండ, బుద్ధ విగ్రహాలను, బౌద్దారామాలను ధ్వంసం చేయడమన్నది అవకాశం దొరికినప్పుడల్లా ఈనాటికీ కొనసాగుతూనే వస్తూ ఉంది. ఇస్లాం రాజ్యాధిపతుల్లో ఈదేశంలో బహుగా కీర్తింపబడ్డ అక్బర్ కాలంలోనూ, అతడెంతగా సమతావాది, మతసామరస్యవాదిగా చిత్రింపబడినా, కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేయబడినా యన్న నిజాన్ని చరిత్రను కూలంకషంగా పరిశీలించిన మనవారు ఇప్పటికీ నమ్మలేరు. అది హిందూ వీరాభిమానంతోనో, ఇస్లాం వ్యతిరేకతతోనో చెబుతున్న విషయంగానో కొట్టిపడేస్తారు. కాని అది వాస్తవంగా జరిగిన చరిత్రే.

ఇతర మతాలను 'సహించుకొనే - సహించుకోని' ఈ రెండు వైఖరులకు మూలాలెక్కడున్నాయి? అన్నదే మన విచారణంతటికీ, మనం కనుగొనబోయే, కనుగొనాల్సిన మత సమస్యకు పరిష్కారమన్న దానికీ ఆధారపీఠం అవుతుంది. అందుకే ఇంత విచారణ చేయాల్సి వచ్చింది. 

ఒక్క ఆర్యసమామాజిక వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి వివరణను మినహాయిస్తే ఈదేశంలోని వేదానికి బాష్యాలు, వ్యాఖ్యానాలు వ్రాసిన వారి దగ్గరనుండి, ఉపనిషత్తులలోనూ, స్మృతులలోనూ, అష్టాదశ పురాణాలలోనూ, రామాయణ, భారత, భాగవతాలలోనూ, ఉపపురాణాలలోనూ అన్నింటా దేవుడొక్కడే నంటూనే బహుదేవతారాధనను అంగీకరించడం కనబడుతుంది. పురాణాల్లోని ప్రధాన శతృవులైన దేవతలూ రాక్షసులూ కూడా ఆ ముఖ్య దేవుళ్ళను, దేవతలను ప్రార్థించునట్లు అనేక దేవీ, దేవతల నంగీకరించినట్లు కనబడుతుంది.

ఆయా ప్రతిపాదనలన్నీ సత్యాలేనా అన్నదిగానీ, అందులో ఏది సత్యమని గానీ చర్చించడానికిది సందర్భం కాదు. మన ప్రస్తుతాంశం ఇక్కడ బహుదేవతారాధన ఒక సంస్కృతిగా, సంప్రదాయంగా అంగీకరింపబడి, ఆచరణలో స్థిరపడిందా లేదా? అడపాదడపా దయానందుని లాటివారు, ఒకింత స్పష్టతతో గట్టిగా సైద్ధాంతిక స్థాయిలో ఏదిసత్యమన్న దానిపై ఆయా మతాల పెద్దలతో శాస్త్ర చర్చకు గరంగినా, కొన్ని మతాల పెద్దలను ఓడించినా (పూర్వపక్షం చేసినా, నోరుమూయించినా) సామాన్య జనమంతా ఈదేశములో బహుదేవతారాధనకే అలవాటుపడిపోయారన్నది ప్రత్యక్షంగా రుజువుచేయగల అంశం. విగ్రహాలతో కూడిన దేవాలయాల నిర్మాణం జరక్కముందెలా ఉండేదన్న సంగతినలా ఉంచితే, ఇవి ఉనికిలోకి వచ్చిన నాటినుండి మాత్రం సైద్ధాంతిక స్థాయిలో ఎవరెన్నిచెప్పినా, తేల్చినా, సామాన్య జనం మాత్రం బహుదేవతారాధననే అంగీకరించి అన్యదేవతలను సహించడం, గౌరవించడం, ఇంకాస్త చొరవచేసి అనేకుల్ని పూజించడం దిశగా అలవాటుపడిపోయారు. వారినలా అలవాటుపడేలా చేయగల విస్తార సాహిత్యం ఈదేశ మతంగా చెప్పుకుంటున్న హిందూమతానికుంది. వేదం మొదలుకొని అనేక గ్రంథాలు, అనేక రుషులు, అనేక సిద్ధాంతాలు, అనేక మతాచారాలు కలగలసిన ఓ పెద్ద జనసంద్రాన్ని ఈనాడు హిందువులన్న పేరుతో గుర్తిస్తున్నాం. అందుకనే బహుదేవతారాధనల సమష్టిరూపాన్నే హిందూమతం అంటున్నాం. మన భారతరాజ్యాంగం కూడా ఈ అర్థాన్నంగీకరించే హిందూ శబ్దాన్ని వాడుతోంది. ఈనాడు ఇండియన్ అన్నదానికి సరైన అనువాదం భారతీయుడు అన్నది మాత్రమే. హిందువు అన్నది ఇండియన్ కు అనువాదం కాదు. కనుకనే ఇక్కడి వ్యక్తుల వివరాలను నమోదుచేసే పట్టికల్లో జాతీయత (నేషనాలిటీ) అన్నదగ్గర భారతీయుడు, ఇండియన్ అని పూరిస్తున్నాం. మతం (రెలిజియన్) మతం అన్న దగ్గరే హిందు అన్నది వ్రాస్తున్నాం. వివరణల్లోనూ, క్రైస్తవులు, ముస్లింలు, యూదులను మినహాయించి మిగిలిన బహుదేవతారాధకులందరినీ, జైనులు, సిక్కులు, బౌద్ధులను కూడా కలుపుకొని మరీ హిందువులేనని పేర్కొంటోంది రాజ్యాంగం. కనుక బహుదేవతారాధన అన్యదేవతారాధనా సహిష్ణుత అన్నది హిందూ మతంక్రింద చెప్పబడుతున్న జనాల సంస్కృతిలో పునాదిగా ఉంది.

ఇక మిగిలిన రెండు ప్రధాన మతాల గ్రంథాల మార్గదర్శకత్వం అది అమలైన తీరుకు చెందిన చరిత్ర దీనికి భిన్నంగా ఉంది. నిజానికా రెండు గ్రంథాలు రెండు వేరువేరు మూలాలనుండి పుట్టినవి కాదు. ఆ గ్రంథస్థ విషయాలు, సృష్టి ఆరంభము, దైవము, జరిగిన చారిత్రికాంశాలు అన్నీ అబ్రహాము వరకూ జరిగిందంతా ఏకోన్ముఖంగా ఒకే చరిత్ర అంటున్నాయి. ఈ విషయంలో ఆ రెండు గ్రంథాలనూ నెత్తికెత్తుకున్నవారూ విబేధించుకోవడం లేదు. ఏకాభిప్రాయంతోనే ఉంటున్నారు కనుక పరమత సహనం విషయంలో ఆ రెంటి వైఖరి ఒక్కటే. నిజానికవి రెండు కావుకనుక. రెండు గ్రంథాలలోనూ, మతేతరులపట్ల అసహనాన్ని తెలియపర్చే వాక్యాలు చాలా దొరుకుతాయి.అవకాశమున్నప్పుడల్లా, బలం చాలినప్పుడల్లా, కొన్నిసార్లు బలం చాలకున్నా తెగబడి మరీ, తమ మతాన్ని అనుసరించని వారిపై విపరీతమైన అసహనాన్ని ప్రదర్శించినట్లు ఆ పుస్తకాల్లోనూ ఉంది. అనంతర కాలంలోని చారిత్రకాధారాలున్నాయి, ప్రత్యక్షాధారాలు ఉన్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతుంటే అది ఇలా సాగుతూనే ఉంటుంది. కనుక నా అవగాహనకు లోబడి, వీటి విషయమై కొన్ని సాధారణ సూత్రీకరణలు చేస్తాను. అవి సాధారణీకరణులుగా , తగినవో కావో విచారించండి.

  1. పరమత సహనము - అసహనము అన్న దానిని రెండు పార్శాలుగా విడదీసి అర్థంచేసుకోవాలి.

  2. ఒకటి, ఆయా మతగ్రంథాలు ఏమిచెబుతున్నాయి? రెండు. ఆయా మతస్థుల ప్రవర్తన లెలాగున్నాయి.

ఆయా మత గ్రంథాలు ఏమిచెబుతున్నాయి

ఎ) హిందూ మత గ్రంథాలు: అనేకులు ఆరాధించదగినవారున్నారు. 2. ఎవరిష్టప్రకారం వాళ్ళు వారికి నచ్చినవారిని, వారికి కావలసిన వారిని ఆరాదించవచ్చు. 3. అన్యదేవతల ఆరాధనా ఆ పరమేశ్వరునికే చెందుతుంది. 4. ఏఏ దేవతలనారాదించితే ఆయా దేవతలు వారి సామర్ధ్యంలో కోర్కెలు తీరుస్తారు. 5. వివిధ దేవతల మధ్య తరతమ బేధాలనంగీకరిస్తూనే వారందరినీ అంగీకరిస్తారు. ఇవన్నియూ దేవుళ్ళను గురించి.

  1. రకరకాల సృష్టిక్రమాలు వేదంలో ఉన్నాయి, దర్శనాలలో ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి. 2. శూన్యమునుండి సృష్టి అని ఇక్కడి గ్రంథాలేవీ చెప్పలేదు (వివరాలు తరువాత చెప్పుకుందాం), 3. కాలగణన పద్ధదొకటుందిక్కడ. అనాదిగా, అనేక సృష్టులు జరిగాయి. అనంతంగా జరుగుతునే ఉంటాయి. ఈ సృష్టి జరిగి 195 కోట్ల సంవత్సరాల పైన అయింది.4. భూలోకంలోనే కాక ఇతర లోకాల్లోనూ, ముఖ్యంగా అష్టవసువులనబడే లోకంలో వేరువేరు ద్రవ్యాలతో భూతాలతో చేయబడ్డ ప్రాణులుంటాయి. ఇవన్నీ సృష్టి క్రమం గురించి చెప్పబడ్డాయి.

ముఖ్య గమనిక: శృతిచ్ఛ భిన్నాః, స్మృతయశ్చ భిన్నాః అన్నది ఇక్కడి శాస్త్రాలు చదివినవారందరి అభిప్రాయం.

బి) బైబిలు ఏమి చెబుతోంది: 1. నేను తప్ప మరో దేవుడు లేడు, మీకు ఉండకూడదు.2. నన్ను విశ్వసించనివాడు, అంగీకరించనివాడు కొట్టివేయబడాలి, 3. అన్యదేవతారాధకుల్ని, విగ్రహాలను పూజించే వారిని వారు మీకు అన్నలైనా, తండ్రులైనా వగైరా ఎట్టి బంధుత్వాలున్నా పట్టించుకోకుండా వారిని వధించాలి. 4. నన్నంగీకరించకున్నా, మరొకర్ని అంగీకరించినా వారిని వెతలపాటు చేస్తాను లేదా చంపేస్తాను.

సి) ఖురాన్ ఏం చెబుతోంది : అవకాశముంటే అవిశ్వాసుల్ని వధించండి, ఎక్కడ వీలైతే అక్కడ, ఎలా వీలైతే అలా.

ముఖ్య గమనిక: ఈ నామాటలు విన్న - చదివిన - వారిలో సహృదయులు, మానవతా విలువలు కలిగిన, ఇస్లాం, బైబిలు విశ్వాసులు కొందరైనా ఇలా అనడం సరికాదని అనబోతారు. 2. పని కట్టుకుని ఇస్లాం, బైబిలు విశ్వాసులుగా ప్రజలను మార్చేయత్నం చేస్తున్న మరో రకం జనమైతే నా మీద ఆగ్రహంతో తిరగబడతారు. నన్ను శతృవుగా ఇంకా సరిగా చెప్పాలంటే దైవ వ్యతిరేకిగా చెప్పబోతారు. ఆ రెండు గ్రంథాలాధారంగా మత ప్రచారంలో ఉన్న ఈ రెండు రకాల వాళ్ళనూ రెండు ప్రశ్నలడుగుతాను.

  1. పైన నేను సూచించిన వైఖరిని చెప్పే వాక్యాలు మీ గ్రంథాలలో ఉన్నాయా? లేవా?

  2.  ఖురానులో యూదులను, క్రైస్తవుల్ని మీతో పాటు సమానంగా చూడండి. ఉండనీయండి అన్న మాట ఉందా? బహుదేవతారాధకుల్ని, విగ్రహారాధకుల్ని, ముస్లిం కానివారిని, మీతో సమానంగా చూడండి, మీతో పాటు ఉండనీయండి అన్న వాక్యాలున్నాయా?

యూదులు, క్రైస్తవులు, విగ్రహారాధకులు, అన్యదేవతారాధకుల పట్ల ఎలా ఉండమంటున్నాయో ఖురాన్లోని ఆ వాక్యాలను ఎత్తిచూపించండి! ఖురాన్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపడం తప్పుకాదు సరికదా చూపడం ఒప్పుకూడా. ఇంకా సరిగా చెప్పాలంటే , చూపకపోవడం తప్పవుతుంది. అవిశ్వాసం క్రిందకే వస్తుందది.

కనుక గ్రంథాలాధారంగా సూటిగా చెప్పుకోవాలంటే, బైబిలు పాత నిబంధన గాని, ఖురాన్ గాని పరమత సహనాన్ని సహించవు పైగా అసహనాన్ని కలిగిస్తాయి. ఇక సామరస్యమన్న మాటకు తావేది?

ఈ మూటికీ పరిమితమై చెప్పుకోవాలంటే బైబిలు, ఖురానుల వలె కాకుండా హిందూమతం క్రిందికి చేరే నానా దైవారాధనలన్నా పరస్పరం సామరస్యంతోనూ, మిత్రసంబంధాలు కొనసాగించుకోవడానికి వీలుగనూ ఉంటాయి. ఇది నిజం కనుకనే, విగ్రహారాధకులు, బహుదేవతారాధకుల మధ్యకు ఒకరిద్దరు క్రైస్తవ ప్రచారకులొచ్చీ మనగలిగారు. ఒక హిందూ కుటుంబలోని ఒక వ్యక్తిని క్రైస్తవ ప్రచారకుడు తమ మతంలోకి మార్చినా ఆ కుటుంబం పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.

ప్రశ్న : మరైతే, ఈ దేశంలో అన్ని మతాలవారూ కొన్ని వందల ఏండ్లుగా కలసిమెలసి, పరస్పరం సహకరించుకొంటూ, సహజీవనం చేస్తూనే ఉన్నారు కదా? ఇదీ చారిత్రకంగా వాస్తవమే కదా? దానికేమంటారు? ఇదెలా సాధ్యపడింది?

మీ ప్రకటనా, ప్రశ్న రెండూ కూడా సరైనవే. అందుకే ఈ విషయాన్ని రెండు కోణాలనుండి పరిశీలించాలన్నాను. పైన మత గ్రంథాల మాటలు నేనన్నట్లే ఉన్నాయో లేదో చూడండి ముందు. అవి అలానే ఉన్నా జనం కలసిమెలసి ఎందుకుంటున్నారో విచారించి నిజాన్ని వెలికితీయాలి, నాకు తెలిసి అందుకు కారణాలివిగో.

  1. అలా కలసిమెలసి జీవిస్తున్న వారంతా మతం మారకముందు ఒకటిగా ఉన్నవారే. బంధుత్వాలు ఉన్నవారే అవడం.

  2. పుట్టుకతోనే వేరువేరు మతాలవాళ్లై ఉండి, చిన్నప్పటినుండి ఇరుగుపొరుగుగా జీవిస్తూ బహుదేవతారాధన సంస్కృతి బలంగా ఉండి, ఆ వాతావరణానికి అలవాటు పడిఉండడం.

  3. సహజంగానే మృదు స్వభావం కలిగి ఉండడం, కుటుంబ పెంపకం నుండే స్నేహము, జాలి, కరుణ, దయ, ఇతరులకు సహాయం చెయ్యడం వంటి విలువలు అంది ఉండడం.

  4. పరస్పరం కలిసి ఉండక తప్పని సామాజిక సంబంధాల వత్తిడికి అలవాటుపడి ఉండడం.

  5. 100% ఖచ్చితత్వం కలిగిన మత విశ్వాసిగా కాక, వ్యక్తిగతంగా ఆ మతాచారాలను అవకాశం ఉన్నంతవరకు పాటిస్తూ, అన్నీ చేయలేమని గానీ, చేయనక్కర లేదని గానీ తలుస్తుండడం.

  6. అక్కడున్న సమాజపు వత్తిడి సహించుకోక తప్పని స్థితిని కలిగిస్తూ ఉండిఉండడం.(దారుల్ హరబ్)

  7. ఆయా కాలాలనాటి రాజ శాసనాలు, రాజ్యాంగం కలిసి ఉండక తప్పని రీతిలో కట్టడి చేయగలగడం ఇవే సహజీవనాన్ని నిలబెట్టగలుగుతున్న కారణాంశాలు. ఇలాటి మరికొన్ని ఉండవచ్చునేమో మీరూ ఆలోచించండి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎలా కలిసి ఉండగలుగుతున్నారన్నది విచారించి సరైన, తగినంత సమాచారం రాబట్టండి. పైన నేనన్న కారణాలే ఎదురవుతాయి.

అదిసరే! ఇప్పుడు దీనినొక విచారణీయాంశంగా ఎందుకు ఎత్తుకున్నట్లు?

మంచి ప్రశ్నే. చాలా కాలం అంటే కొంతకాలం క్రితం వరకు మతమార్పిడులంటే , హిందువులను క్రైస్తవులుగా మార్చడమనే అనిపించేది మనందరికి. ఇప్పటికీ మత మార్పిడులంటే క్రైస్తవంలోకి పోవడం అనే అనిపిస్తుంటుంది చాలామందికి. మమమ్మదీయ రాజుల పరిపాలన ఉన్న కాలంలో ఒక్కొక్కప్పుడు పెద్ద ఎత్తున, మరొకప్పుడు నామమాత్రంగా ఇస్లాంలోకి మతాంతరీరకరణ జరిగినట్లు దాఖలాలున్నాయి గాని, ముస్లింలు లోగడ అదేపనిగా మత మార్పిడులకు పూనుకున్నట్లు బహిరంగ దాఖలాలు లేవు. ఎక్కడో ఒకటి అరా జరిగితే జరుగుతుందేమో. జరుగుతుండవచ్చునంతే. కానీ ఈ మధ్య అంటే ఒక రెండు దశాబ్దాలుగా ఇస్లాం మతాంతరీకరణ ఒక ఉద్యమంగా మొదలై బలాన్ని, వేగాన్ని పుంజుకుంటూ వస్తోంది. దీని వెనుక, అంతర్జాతీయంగానే ఒక ప్రణాళికా రచన ఉన్నట్లు పరిశీలనలో తేలుతోంది. ఇస్లాం సాహిత్యం క్రింద వచ్చే కరపత్రాలు, చిరుపుస్తకాలు, చిన్ని చిన్ని సంస్థలు చేస్తున్న పనుల వల్ల ఈ వాస్తవం బయటపడుతోంది. ఈ దేశంలోని ముస్లిం మత సంస్థలకు ఇతర దేశాలలోని ముస్లింలనుండి ఆర్థిక సహాయము, ఇస్లాం శిక్షణ అందుతున్నట్లు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది.

ఈ రెండు మతాల మత ప్రచార, మతాంతరీకరణ ఉధృతి చూసిన హిందూమత సంస్థలూ చాలా చాలా అసహనానికి లోనై, ఇంతకుముందులా ఉదాశీనంగా ఉండక ప్రతిచర్యకు పూనుకున్నయ్. స్వస్థాన మాగశ్చే. పునరాగశ్చే, ఘర్‌వాపసే, అన్న పేర్లతో ఇస్లాం, క్రైస్తవాలను స్వీకరించిన వారిని తిరిగి హైందవం లోకి వెనక్కు తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టినారు. దేశంలో హిందువులు అధిక జనాభా కలిగినవారై ఉండడమూ, హిందూత్వ భావనగల సంస్థలు క్రమంగా బలం పుంజుకుంటుండడము, ఎంతోకొంత సంఘపరివార్ ప్రభావంతో ఉండి ప్రభుత్వం ఏర్పడడమూ, అందులోని హిందుత్వ మతకూటమి బిజెపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే మతపరమైన అంశాలను రాజకీయాలకు జతచేసి అతి చొరవను చూపిస్తూ పలు ప్రకటనలు చేయడమూ, వి.హెచ్.పి లాంటివి పెద్దఎత్తున హిందూమతంలోకి తిరిగి తీసుకువచ్చే పనులు మొదలెట్టి, దానికి ప్రచారాన్నివ్వడమూ, దీనిని ఎవరాపుతారో చూస్తాము. ఇస్లాం, క్రైస్తవంలోకి పోయినవారినందరినీ తిరిగి హైందవంలోకి తీసుకొచ్చేస్తామన్న ప్రకటనలు చేయడము వగైరాలన్నీ కలగలిసి, దేశంలోని మానవ హితకాంక్షులందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి.

నిమ్మకు నీరెత్తినట్లుండడమూ, తమకేమీకానంత వరకు ఎవరికేమైతే మనకేమిలే అనే వైఖరి కలిగి ఉండడమూ అలవాటుగా మారిన మేథావివర్గానికి (అంటే కనపడుతున్న దానిని చూడగలిగిన, చూస్తున్న వారిలోనూ ఈ రకమైన వారికి) పరిస్థితులు ఆందోళనకరమైనవిగా కనిపించవు.

ఒకవంక ఇస్లాం మత వ్యాప్తికి శాంతియుతమైన, మరియు ఆవేశపూరితమైన అన్న రెండు పద్ధతుల ద్వారా యత్నాలు జరుగుతున్నయ్. అప్పుడప్పుడూ జరుగుతున్న ఉగ్రవాద ఘటనలలో ఎక్కువలో ఎక్కువ ఇస్లాం ఉగ్రవాద సంస్థల పనులగనే తేలుతున్నాయి. అవి క్రమంగా మన రాష్ట్రమంతటా, జిల్లాల వారీగానూ విస్తరిస్తున్నట్లు నిఘావర్గాల సమాచారంఉంది.

ఖురాన్లో ఒక వాక్యముంది. యూదులు, క్రైస్తవులు నీకు ప్రధమ శత్రువులు అని. కనుక ఈనాడు ఇస్లాం మతాంతరీకరణ కార్యక్రమంలో క్రైస్తవుల్ని ఇస్లాంలోకి చేర్చే (మార్చే) పనికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. మరో ఇస్లాం సూత్రం ప్రకారం ఒకతూరి ఇస్లాం స్వీకరించిన వాడు (విశ్వాసంలోకి వచ్చినవాడు) తిరిగి ఇస్లామును విడిచినట్లయితే వాణ్ణి వాడిష్టానికి పోనీలెమ్మని ఊరుకుండరాదు. పోకుండా ఆపాలి, లేకుంటే చంపెయ్యాలి అన్నంత వరకు ఆదేశం ఉంది. అలా ఇస్లాం నుండి మరలిన వాడు ఎదురుగా కనబడుతుంటే, అది ఇస్లాం మత వ్యాప్తికి పెద్ద అవరోధకంగా తయారవడమే కాక, ఉన్న ముస్లింల మానసిక స్థైర్యాన్ని బలహీనపరుస్తుంది. కనుక ఇస్లాం మతవ్యాప్తిని ఇష్టపడేవారు, దీనిని వ్యతిరేకిస్తారు. ఇది అమలు కాకుండా చూసేందుకు గట్టిగా పూనుకుంటారు. ఇక ఇందులోని అతివాదులైతే, హింసాత్మక చర్యలకు దిగుతారు.
ప్రస్తుతం ఏర్పడి ఉన్న కొత్త పరిస్థితి ఇది. భారత రాజ్యాంగం సూచిస్తున్న రీతిలోనూ, స్థాయిలోనూ మత స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదిది. ఆ అధికరణాలను (శాసనాలను) అడ్డుపెట్టుకొని, బలవంతపు లేదా రకరకాల ప్రలోభాలకు లోనుచేస్తూ మతమార్పిడులకు పూనుకుంటున్న సందర్భమిది. మతమార్పిడులు ఏ పేరుతో చేసినా, అందులోని మత మార్పిడులకు లోనవుతున్న మతంలోను, మతసంస్థలు, నేతలు పట్టించుకోనంతవరకు, దానిని అడ్డుకోనంతవరకు హింసకు చోటుండదు. సామాజిక శాంతిభద్రతల పైనా ప్రభావం కనబర్చదు. అదేమరి, ఏ మతానికామతం ఇతరుల్ని తన మతంలోకి తెచ్చుకోవాలని ఒకవంకా, తనలోని వారిని ఇతర మతాలలోకి పోనీకుండా అడ్డుకోవాలని మరోవంకా పూనుకున్నప్పుడు శాంతి భద్రతలకు ఆటంకం కలగడం, క్రమంగా ఘర్షణ వాతావరణం తయారై బలపడటం జరుగుతూ వస్తుంది. దాని పర్యవసానం హింసే. మరోరకంగా ఆలోచించే అవకాశమే లేదు.

ప్రస్తుతం ఈ సమస్యే పుట్టి, పెరుగుతూ వస్తోంది. దీనిని పెంచి పోషించడానికి ఇస్లాం, క్రైస్తవాలకి అంతర్జాతీయంగానే వత్తాసు, వనరులు అందుతుండడం, హిందూత్వ వాదులూ ఈ పనికై పెద్దఎత్తున మానవ, ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవడం, మతం మారిన వారిని తిరిగి వెనక్కు తెచ్చేపనిని పెద్ద స్థాయిలోనే మొదలెట్టడం, అదే సమయంలో గతంలో లాగా మతమార్పిడులు జరుగుతుంటే పట్టించుకో కుండడం అన్న పద్దతిని మార్చుకొని, మతమార్పిడులు జరక్కుండా నిరోధించడం ఇప్పటికీ బలంగా మొదలైంది. ప్రణాళికా బద్దంగా సాగుతోంది కూడా. మతం వ్యక్తిగతమన్న రాజ్యాంగ హృదయాన్ని, ఆదేశాన్ని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది సామాజికాంశంగానే పరిగణింపబడుతోందీనాడు. ఒకవ్యక్తి హిందూమతం నుండి ఇస్లాం, క్రైస్తవాలలోకి పోతుంటే హిందూ సంస్థలు అది అతనిష్టం అనుకోవడంలా. అది తమకు అనిష్టం, నష్టం అనే తలుస్తున్నారు. ఇక ముస్లిం వర్గాల విషయం చెప్పనే అక్కరలేదు. ముస్లిం విశ్వాసం నుండి మరలిన వారిని ఉపేక్షించవద్దు, ఉండనీయొద్దు అనేంతవరకు వారికీ గ్రంథాదేశాలే ఉంటున్నయ్. ఇంతకాలమూ అడ్డూ ఆపూ లేకుండా హిందువుల్ని క్రైస్తవం వైపు మళ్ళించిన క్రైస్తవానికి అటు ముస్లింల నుండి, ఇటు హిందువుల నుండీ నిరోధమూ, ప్రతిఘటన కూడా ఎదురవుతోంది.

వీటి పోకడలూ, ఈరకం సమూహాల వెనుక ఉన్న, పనిచేస్తున్న భావజాలపు ఆవేశ వైఖరి చూస్తుంటే, చూడగలిగితే, అది ఈ దేశ మానవ సమాజానికి మేలుకలిగించేదిగా లేకపోవడమే కాక, ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదిగానూ కనపడుతోంది. చాపకింద నీరులా పాకుతూ లేదా పైకి కనపడకుండా వేరు వ్యవస్థలో విస్తరిస్తూ లోతుగా పాదుకొని బలపడుతూ వస్తున్న ఇది ఇలాగే కొనసాగితే మత ప్రాతిపదికన హింస ఆరంభమై, అంతర్యుద్ధానికి దారితీయవచ్చు. అదేగాని జరిగితే ఇస్లాం, క్రైస్తవాలకి బయటనుంచి అన్నిరకాల వత్తాసు (అండదండలు) లభించి తీరుతాయి. నా ఆలోచనంతా ఆ దిశగా అడుగులు పడకుండా ఏమిచేయాలి? ఏమిచేయాలి? ఏమిచేయాలి? అన్నదే. ఈ దేశ భద్రత, ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించే వారంతా ఆలోచించాల్సింది ఇదే. నా మరో ఆందోళనతో కూడిన ఆలోచనేమంటే, అంతో ఇంతో ఆలోచించగలిగిన, మంచివాళ్ళలోనే ఎక్కువమందికి, ఇదంతా పెద్దది, ప్రమాదకరమైంది కాదన్న అభిప్రాయంగా ఉంటుంది. అట్టి వారికి నేనీవిషయాన్ని బూతద్దంలో చూపిస్తున్నానని అనిపిస్తుంది. ఈ తరహావారు, అంతో ఇంతో ఆలోచించగలిగి ఉంటారు గనుక, తమలోని భావాన్ని తమలోనే ఉంచుకోనీకుండా, ఇదంత తీవ్రమైన విషయం కాదులే అని సందర్భం వచ్చినప్పుడల్లా జనానికి చెప్పుతూ ఉంటారు. అంటే, తాము పూనుకోవలసిందానికి పూనుకోకపోగా, ఆ ప్రయత్నాలను చల్లబరిచే, నీరుగార్చే పనిమాత్రం చేస్తుంటారు. అకర్మణ్యత, నిర్వీర్యత, ఉదాశీనత లన్నవి తొలినుండీ ఈజాతి రుగ్మతలు.

ఈ దేశ సంస్కృతి, వివిధత్వం ద్వారా సహనశీలత, స్వేచ్చ అన్నవాటికి పెద్దపీట వేయగలిగినా, ఎవరిదారి వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, అనే వైఖరినీ పెంచి సాంఘిక అనైక్యతకు దారితీసింది. ఈ దేశ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళందరూ ఏదోఒక ఆ సందర్భంలో అనైక్యతే ఈ దేశ సమస్య అన్నదానిని ప్రస్తావించారు.

యోచనాశీలురైన పాఠక మిత్రులారా! వివిధ కూటాలలో ఉంటూనూ, దేశ సంక్షేమాన్ని, అందరి బాగునూ కోరగల సహృదయులారా చర్చకూ లోతైన విచారణకు దారితీస్తూ ధారావాహికగా సాగించుదామని ఆరంభించిన ఈ విషయంపై వివేకవంతమైన పాత్రపోషణకు మీరూ సిద్ధంకండి. ఈ వ్యాసం మీ దృష్టికి వచ్చి, మీరూ ఈ విచారణలో పాలుపంచుకో గోరుతున్నట్లైతే, వివేకపథం చందాదారులుగా చేరండి. మీ అడ్రసును మాకు తెలపండి. ఆధారాలు లేని అభిప్రాయ ప్రకటనలకు తప్ప, భిన్నాభిప్రాయాలకూ ఇందులో అవకాశం ఉంటుంది. అభిప్రాయ ప్రకటనలు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. లేకుంటే వాటిని స్థలాభావం రీత్యాను, వాటి తూకాన్ని బట్టి యథాతధంగా వెయ్యటం కుదరదు. ఈ నిబంధనను మాకున్న నిర్ణయ స్వేచ్ఛను అంగీకరించే ఇందులో పాల్గొనండి.

విషయాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణించి మాతో కలసి పనిచేయడానికి సిద్ధమైనా, మాతో విభేధిస్తున్నా అట్టివారితో ముఖాముఖి కలసి కూర్చొని వాస్తవాలనరయడానికి మేము (స.మండలి వారం) సిద్ధంగా ఉన్నాము.

రాజ్యాంగం ప్రకారం.

  1. మనది లౌకిక రాజ్యాంగం. అంటే సమష్టి, సామాజిక కార్యక్రమాలన్నవేవైనా మతప్రమేయం లేనివిగా ఉండాలి.

  2. రాజ్యాంగమే కల్పించిన మత స్వేచ్ఛ అన్నదానిని దుర్వినియోగం చేయకుండా లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం కాకుండా ఆయా మతసంస్థలూ, వ్యక్తులు కూడా బాధ్యతతో ప్రవర్తించాలి. నిజాయతీకి లోపం రాకుండా చూసుకోవాలి.

  3. ప్రాథమిక హక్కు అన్నామంటేనే, అది వ్యక్తిగతాంశమైపోయింది. మత స్వీకరణ, మత విసర్జన అన్న రెండూ తనంత తానుగా ఏరకమైన ఇతర ప్రభావాలకు లోనుకాకుండా ఎంచుకోవలసినవి. రాజ్యాంగాభిలాష అదే. అయినా, ఆచరణలో అది దాదాపు అసాధ్యం . మత ప్రచారం, ప్రచారకుల ప్రభావం, నచ్చజెప్పడం, ఆశా భయాలను చూపెట్టడం అన్నవి చోటుచేసుకోకుండా తనంతతానే ఆ మతాన్ని గురించి ఎరిగి ఇష్టపడి మతాన్ని స్వీకరించడమో, విసర్జించడమో అన్నది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది, జరిగే వీలుంది. ఎక్కువలో ఎక్కువ మంది ఎటో ఒకవైపుకు, ఏదో ఒకదాన్ని చూపి మరలింపబడడమే జరుగుతుంది. ఇదంతా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే.

  4. అది ఏమతస్థులకు చెందిందైనా మతావేశం మామూలు వ్యవహారం కాదు. అది మందిలోకి ప్రవేశించడం అంటే మాస్ హిప్నోసిస్ కు గాని, మాస్ హిస్టీరియాకు గానీ దారితీస్తుంది. అట్టి స్వభావం కలవాటిని ఆరంభమయ్యాక అడ్డుకోవడం, ఆపడం కుదరనే కుదరదు. గట్టిగా నిలువరించాలని పట్టుబట్టినా గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తెచ్చిన చందమే అవుతుందది. కనుక ఇట్టివాటిని ఆరంభం కాకుండానే నిరోధించడమో, ఆరంభంలోనే నిలువరించడమో చేయాలి. లేకుంటే చేతులు కాలాక ఆకులు పట్టిన చందమో, నదిగట్లకు నెర్రెలు పడినప్పుడే పట్టించుకోకుండా, గండ్లు పడినాక ఆపాలనుకోవడమో లాటిదే అవుతుంది.

ఆలోచించగల మంచి వాళ్ళలోనూ తగినంత ముందుచూపు లేకపోవడంతో భవిష్యత్ లో పెనుముప్పై మానవ హననకాండకు దారితీయగల ఈ అత్యంత ప్రమాదకరాంశాన్ని అట్టివారూ అంతగా పట్టించుకోవడం లేదు. పైగా అలాటి ఆపత్తేమీ లేదులే అని ప్రసంగాలు చేస్తున్నారు కూడా. ఇక్కడికిదే ఒక పెద్ద 'విషాదం'

ఇస్లాం, క్రైస్తవ సంఘాల క్రొత్త ఎత్తుగడలు

ఇది చాలదన్నట్లు ఈ మధ్య కాలంలో వ్యూహాత్మకంగా పుట్టుకొస్తున్న చిన్న, పెద్ద ఇస్లాం, క్రైస్తవ మతసంస్థలు ఒక క్రొత్త పోకడలను అందిపుచ్చుకున్నారు. హిందూమత గ్రంథాలలో బైబిలు దేవుణ్ణి గురించి, యేసుని గురించిన ప్రవచనాలున్నాయని, క్రైస్తవులూ, అలాగే మహమ్మదును గురించి హిందూ గ్రంథాలలో చెప్పబడి ఉందని ముస్లింలూ అమాయకుల దగ్గర, అజ్ఞానుల దగ్గర, సామాన్యజనం దగ్గర మాట్లాడను మొదలెట్టారు. పుస్తకాలు, కరపత్రాలు, సి.డి.లు, ప్రసంగాలు, ఫేస్బుక్, యూట్యూబ్ ల్లో సందేశాలు, అన్న వివిధ రూపాలలో ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. ఈ రకం మనుషులంతా రెండు రకాలకు చెందుతారు. ఒకరు, నిజాయితీ ఉండి భ్రమల్లో ఉన్నవారు. రెండు నిజాయితీ లేని, కుటిల స్వభావం కల (మతిలేని కాదు, మతి శెబ్బరితనం కలిగిన) వారు. వీరి పాలిటబడి వీరు చెబుతున్నది నిజమేననుకొనే వారిలో ఎక్కువమంది మొదటి రకంలోకి వస్తారు. అంతేగాని ఈ విషయాన్ని, తెలిసిన వారల్లే ప్రచారం చేస్తూ, పుస్తకాలు రాస్తూ, ఇలా చెప్పేవాళ్ళను తయారు చేసుకుంటున్న వాళ్ళంతా, లేదా ఎక్కువలో ఎక్కువమంది రెండవ కోవకు చెందినవారే.

గతంలో అంటే సుమారు 30 ఏండ్లనాడు, నేను పరవస్తు చిన్నయసూరి వంశానికి చెందిన వాడ్నంటూ తనను తాను పరిచయం చేసుకొని ఒకాయన ఏసుబలి కావడం గురించి, రక్తతర్పణం గురించి హిందూ గ్రంథాలలో ఉందంటూ ప్రసంగాలు చేయడం మొదలెట్టాడు. క్యాసెట్లు విడుదల చేశాడు. అంతకు ముందే నిశ్చితంగా ఈ దుర్బుద్ది ఏకాలం నాటిదో గాని, మరొకడు 'అల్లుపనిషత్తు' పేరనే ఒక దిక్కుమాలిన రచన చేశాడు. అవన్నీ నామమాత్రావశిష్టాలుగా మారిపోయాయి. కాలగతిలో ప్రబావశూన్యాలుగా మిగిలిపోయాయి. వరవడి అదే అయినా, ఎంతో పకడ్బందీగా అదే పోకడను (కుటిల ఎత్తుగడను) ఈనాడు మరికొన్ని క్రైస్తవ, ముస్లిం సంస్థలు, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి పూనుకున్నాయి.

నేనన్నంతగా వారిలో అంత దుర్భుద్ది లేకున్నట్లయితే అలా క్రొత్త భావాలను వాస్తవలుగా వెలికి తీసుకు రాదలుచుకున్నవారు, వాటిని, ఆయా మతసాహిత్యంలో విశేష పరిశ్రమ చేసిన పండిత సభముందు వాటినుంచి, పరీక్షకిచ్చి, తానన్నది సరైందేనని నిర్ధారించాల్సి ఉండాల్సింది. ఏ మతం గురించీ సరిగా తెలియని, బొత్తిగా తెలియని వారి ముందర వీటిని పెట్టి వారిని తమవైపుకు త్రిప్పుకోడాన్ని ఏమనాలి. కుటిల పన్నాగమనిగాక. అట్టివారందరికీ సత్యాన్వేషణ మండలినుండి నేనొక పిలుపునిస్తున్నాను. రండి నిజాయితీ, సత్యాపేక్ష, సామాజిక హితకాంక్ష కలవారైతే, ఆయా ధోరణులకు చెందిన సాధికారిక ప్రతినిధుల ముందు లేదా విశేషజ్ఞుల ముందు మీ భావాలను పెట్టి, వాటిని నిలబెట్టండి. అమాయక జనం బ్రతుకులతో ఆటలాడుకోకండి. ఈ విషయంలో నా పక్షం ఇలాఉంది.

  1. ప్రస్తుతం అట్టి విధానాన్ని గట్టిగా తలకెత్తుకున్న వాళ్ళలో ఇస్లాం తరపున True Message Centre, సత్య సందేశ కేంద్రం ఒకటి. (ఇంకెవరన్నా ఉంటే నాకు తెలియపరచి ఆ వివరాలు ఇవ్వండి).

  2. అద్దంకి రంజిత్ ఓఫిర్ అన్నాయనొకరు. ఓఫిర్ మినిస్ట్రీస్ పేరున ఒక క్రైస్తవ సంస్థను నడుపుతున్నా రాయన.

  3. గుండాబత్తిని దేవదానం గారు మరొకరు. వేదాలలో యేసుప్రభువు దర్శనం, మరి కొన్ని రచనలు చేశారు. విశాఖవారు.

ఇలాంటి రచనలు, ప్రసంగాలు, చేస్తున్న వారెవరైనా ఇది రాజ్యాంగం 19/ఎ ద్వారా మీకు కల్పించిన భావప్రకటనా స్వేచ్చలో భాగం అనిగాని, 25, 26 అధికరణాల ద్వారా లభించిన ప్రచారపు స్వేచ్ఛ హక్కు అనిగాని అనబోతారేమో అది రాజ్యాంగం ఉద్దేశించిన పరిమిత స్వేచ్ఛకు విపరీతార్థాలు చెప్పుకోవడమూ, దానిని దుర్వినియోగ పర్చుకోవడమునే అదలా ఉంచి, తాను మంది తలకెక్కించి, తాననుకున్న దిశగా వారిని తోలుకెళ్ళదలచుకున్న వ్యక్తి తాను వెల్లడిస్తున్న భావాలు సరైనవేనని రుజువు పరిచే నైతిక బాధ్యత వహించాలి. జనంగానీ, ప్రభుత్వం గానీ, పట్టించుకోవడం లేదుకదా అని పెడపోకడలు పోవడం సరికాదు.

తెలిసిన వారే బోధించడానికి, నడిపించడానికి అర్హులు అన్న విద్యావిభాగపు ప్రాథమిక సూత్రాన్ని మనమెవ్వరమూ త్రోసి రాజనరాదు. ప్రక్కన పెట్టేయరాదు. అందుకే విచారణ పద్ధతుల్లో “మాటనగానే సరిపోదు, అదినీకెలా తెలిసింది, మాకెలా తెలుస్తుంది, అది సత్యమేనని నిర్ధారించడమెలా" అన్నది ప్రాథమిక సూత్రమైంది. “లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః నతు ప్రతిజ్ఞా మాత్రేణ" అన్నదే ఆ సూత్రం.

రుజువుపర్చడానికి సిద్ధపడి మీ పక్షాన్ని ప్రకటిస్తూ ఈ చర్చావేదికలో పాలుపంచుకోండి.మాతో ముఖాముఖి చర్చించడానికి సిద్ధపడదల్చుకుంటే మిత్రులంగానే మీకిదే మా ఆహ్వానము.

గమనిక : సాంప్రదాయకంగా మత పెద్దలతో కూడిన సంస్థలు ఇలాటి వంకర పన్నాగాల ద్వారా మతాన్ని ప్రబోధించరనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఏసుగాని, మమమ్మద్ గాని, అనంతరం వచ్చిన వారి శిష్యులు గాని, సాంప్రదాయకంగా ఆ మూల గ్రంథాలను క్షుణ్ణంగా ఒక విద్యలో అధ్యయనం చేసిన వారెవరు గాని, ఇలాటి మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ ఆ రెండు సాంప్రదాయాలకు మూలం ఒక్కటేనన్నది ఖురాన్, బైబిలు అన్న రెంటిలోనూ స్పష్టంగా ఉంది. ప్రవక్తకు గానీ, ఏసుకుగాని, ఈ దేశంలోని వేదాదుల గురించిన అవగాహన ఉన్నదనడానికి ఎట్టి ఆధారాలు, ఇటు క్రీస్తు వాక్కులలో గాని, అటు ప్రవక్త సూక్తులలో గాని లేవు. నాకు తెలిసినంతలో ఇది ఈ దేశంలో అంతో ఇంతో పురాణాలు, సంస్కృతము చదివిన, అమ్ముడుపోయిన మంద మొదలెట్టిన కుటిల పన్నాగమే. అల్లుపనిషత్తులు, రక్తప్రోక్షణబలులు, అహమిద్ది - మంత్రాలు అన్నీ అలాటి ఎత్తుగడలలో భాగాలే. నా యీ మాట అసత్యమన దల్చుకున్న వాళ్ళు నాతో బహిరంగ విచారణకు సిద్ధపడవచ్చు. వేదిక పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళకూడదు. నాతో చర్చకు కూర్చున్న వ్యక్తి, నేను ఆ చర్చ ముగింపు దిశగా కలసి నడవాలి. ఏ ముగింపైనా విచారణకు స్వీకరించిన భావాలు తప్పనో, ఒప్పేననో, తేలలేదనోనన్న మూడు రూపాలలోనే ఉంటుంది. ఈ ముఖంగా పై మూడు ప్రకటనలు చేసిన ముగ్గురునీ ఇలాటి దృష్టి ఉంది నా ఎరుకలోనికి రానివా రెవరికైనా వర్తిస్తుంది. సత్యస్థాపనైక లక్ష్యంతో మీకందరికి ఆహ్వానం పలుకుతూ…

సత్యాన్వేషణలో …

మీ సురేంద్ర.

అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు హైందవ క్రైస్తవం విషయంలో యూట్యూబ్ ద్వారా చేసిన ఛాలెంజ్ ప్రకటనకు ప్రతిస్పందనగా

ఆ సవాల్ కు సిద్ధమంటూ వారికి రాసిన రిజిస్ట్ లెటర్ నకలును ఇక్కడ ముద్రిస్తున్నాము 

'హైందవ క్రైస్తవం' పుస్తక రచయితలైన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికి... 

అయ్యా!

మీ అనుయాయి (?) జగదీష్ ద్వారా అందిన మీ రచనలు కొన్ని జాగ్రత్తగానే చదివాను. దానిపై అతడు, ఈ రచనలపై మీ అభిప్రాయం ఏమిటని నన్నడగ్గా, అవి ఉట్టినే అభిప్రాయం చెప్పి ఊరుకో వలసినవిగా లేవు. వాటి సత్యాసత్యాలపైనా, సబబు, బేసబబులపైనా విపులమైన విచారణ (చర్చ) జరగాల్సి ఉంది అని ఆనాడే చెప్పా, మిమ్మడిగి విచారణకు సిద్ధంచేయమని అతనికి చెప్పాను. ఓఫిర్ గారు చర్చకు వెనుకాడరు, కనుక్కొని చెబుతానన్నారు. అనంతరం కొద్దినెలల సమయంలో, రెండు మూడు సార్లు ఏమైంది జగదీష్ గారు, చర్చ విషయం? అనడగ్గా, మీరు ఏదో పనుల వత్తిడిలో ఉన్నారని చెప్పారాయన. ఒకనాడు మీ 'హైందవం క్రైస్తవం' పుస్తకాన్ని నాకు దాని ధర తీసుకొనే ఇచ్చి దీనిపై మీ అభిప్రాయం చెప్పండని వెళ్ళారు. నేనాపుస్తకాన్ని ఒకింత ఓపిగ్గానే చదివి, అక్కడక్కడా చర్చించాల్సిన విషయాలంటూ నోట్సు రాసుకున్నాను. కొన్ని నెలల తరవాత, జగదీష్ గారు, ఏమైందండీ, మా ఓఫిర్ గారి పుస్తక విషయం? దానిపై అభిప్రాయం చెప్పనేలేదు అనడిగారు. ఆనాడే వారికి నేను విస్పష్టంగా నా అభిప్రాయం తెలియజేశాను. అయ్యా! అది ఏదో ఒక అభిప్రాయం చెప్పి ఊరుకుండవలసిందిగా లేదు. దానిలోని అనేకాంశాలను నిశితంగా పరీక్షించాల్సి ఉంది. ఈ కనుక ఓఫిర్ గారిని విచారణకు రమ్మన్నానని చెప్పి, అందుకు వారిని సిద్ధపరచండి. విచారణకు సిద్ధపడటమే సరైందని ఆయనా చెప్పేఉన్నారు గనుక, సిద్ధపడక పోవడం కుదరదు. అని దానిపై నా అభిప్రాయం చెప్పాను.

ఎందుకనో, తొలినాళ్ళలో మీతో సమావేశం ఏర్పాటుచేస్తానికి సుముఖంగానే ఉన్నా, ఏర్పాటుకై మిమ్ము సంప్రదిస్తానని చెప్పిన జగదీష్ అటు తరువాత, పుస్తకంపై అభిప్రాయం చెప్పమంటే, అభిప్రాయం చెప్పకుండా చర్చకు రమ్మంటారేమిటండీ. అది నాకంగీకారం కాదు. ఆ పుస్తకంపై మీకున్న అభ్యంతరాలేవో తెలియజేయండి. వాటికీ, వాటిలో అవసరమైన వాటికీ ఓఫిర్ గారు సమాధానాలు ఇస్తారు అంటూ వచ్చారు. నేనూ పట్టుదలగా ఆ పుస్తకంపై సత్యాసత్య విచారణ లక్ష్యంగా, ఇరువురమూ కొన్ని విచారణ నియమాలను ఏర్పరచుకొని చర్చకు కూర్చోడం అన్న పద్దతి వినా మరి దేనికీ సిద్ధంకానని పలుసార్లు ఆయనతో నొక్కి చెప్పడమూ, దానికి జగదీష్ గారు, వ్యక్తుల స్థాయీ బేధాలను ప్రస్తావనలోకి తెచ్చి, విచారణకు సిద్ధం కావడానికి సముజ్జీలుండాలి, అవసరం రావాలి. అనంటూ నేను మీకు సమజోడీని కాదన్నట్లు, మీ అంతటి వారు నాలాంటి వారితో చర్చకు కూర్చోడం సరికాదన్నట్లు చెబుతూ, ఆ విషయాన్నే, ఆయనడిగిన దానికి నేను తగినరీతిలో స్పందించలేదంటూనూ ఈ విషయాలు తెలిసిన ఒకరిద్దరితో అంటూవస్తున్నారు.

ఓఫిర్ గారూ! మన ఇరువురికీ సంబంధించినంతలో మీకీ విషయాలు తెలుసోలేదో నాకు తెలియదు గనుక, అవి మీకు తెలీదేమోలే అనుకొని మీ పరోక్షంలో మీవారికీ, నాకూ మధ్య నడచిన కథను నేపధ్యంగా ఉంటుందనుకొని మీ దృష్టికి తెస్తున్నాను. ఒక్కమాట! ఇది వాస్తమేననుకున్నా, ఇలా జరగలేదు, మరోలా జరిగిందని మీ మనిషి అన్నా, ఇకముందు జరగాల్సి ఉన్నదానికెట్టి ఇబ్బందీ ఉండదు. నా దృష్టిలో జరిగింది లేదా జరిగిందని నేననుకుంటున్నది మీ దృష్టికి తేవడమన్నదే ఇక్కడ నా లక్ష్యం.

ఇక ప్రస్తుతాంశానికి వస్తాను.

మీ హైందవ క్రైస్తవాన్ని ఒకసారి మామూలుగా చదివాను. అక్కడ కూడా కొట్టవచ్చినట్లున్న నాకంగీకారం కాని భావాల వరకు గుర్తుంచుకున్నాను. జగదీష్ చదవకుండగనే మాట్లాడితే ఎలా? అంటూ ఒకింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో రెండవసారి విమర్శనాదృష్టితో నోట్స్ రాస్తూ ఆ పుస్తకం చదవటం పూర్తిచేశాను. అటు తరువాతే, చాలా దోషాలున్నయ్ పుస్తకంలో. కూర్చొని మాట్లాడాల్సి ఉంది, అని జగదీష్ తో అన్నాను. ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్ లో చేసి (పెట్టిన) ఛాలెంజి ప్రకటన చూశాక మరోసారి చర్చకవసరమైన అంశాలను ప్రత్యేకించడం కోసం మరోసారీ చదివాను. చర్చకు సిద్ధంకాని వాళ్ళనేమి చేయగలం అన్న ఉద్దేశంలో ఒకింత ఉదాసీనంగా ఉన్న నాకు ఆ మీ సవాలు ప్రకటన వల్ల దీని విషయమై ఊరుకోవడం సరైంది కాదు. కదిలి, కదిలించి చూద్దాం అన్న నిర్ణయానికి వచ్చాను. ఈ దేశంలో ఉన్న ఎవరికైనా ఈ సవాలు వర్తిస్తుందనీ, ఆ పుస్తకంలో అవాస్తవాలున్నాయని రుజువైతే, మీరు హిందూమతం స్వీకరిస్తాననీ, అన్నీ ఒప్పులేనని తేలితే సవాలును స్వీకరించి చర్చలో కూర్చున్నవారు మీ ద్వారా బాప్టిజం తీసుకొని ఆ మార్గానికి రావాలని ఆ చాలెంజి ప్రకటనలో ఉంది. 

నేను ఆ మీ సవాలును స్వీకరిస్తున్నాను

మీరన్న “తేలిన వాటిని అంగీకరించి, సీకరించి ఆచరించాలన్నమాటను 100% అంగీకరిస్తూ, దానికి కట్టుబడి ఉంటానని ఈ లేఖ మూలకంగా తెలియపరుస్తున్నాను. 

  1. వేదంలో చెప్పబడ్డ దేవుడు బైబిలులో చెప్పబడ్డ దేవుడు ఒక్కడేనని రుజువైనా.

  2. బైబిలు దేవుడు, దేవుడనడానికి ఏఏ గుణక్రియా సామర్థ్యాలుండాలని మీరు అన్నారో, దేవుడు గురించి వినికిడి ద్వారా అర్థంచేసుకున్న, తార్కికంగా నిర్ధారించిన ఇతరులు అంటున్నారో, అట్టిది మీ బైబిలు దేవునికి ఉన్నాయని మీరు నిర్ధారించినా (మన విచారణలో తేలినా) నేను మీరన్నట్లు మీ ద్వారా బాప్టిజం తీసుకొని, మీచే పైన చెప్పిన క్రైస్తవుడిగా ఉంటూ ప్రచారము చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తాను.

  3. ఆ పుస్తకంలో, మీరు ప్రతిపాదించిన వాటిలో మీరు సరైనవని నిరూపించాల్సినవి, మీరు నిరూపించక పోయినా, అందులో సరైనవని మీరంటున్న వాటిలో కొన్నింటినైనా సరికానివని మేము నేను నిరూపించినా, మీరు క్రైస్తవాన్ని వదలి, నావెంట నా మార్గంలో నడవాలి. మీ మాట వినేవాళ్ళనూ నా మార్గంలో నడవమని చెప్పాలి.

సత్యాన్వేషణ పద్ధతి 

గమనిక: మీరు, హైందవ క్రైస్తవం, అన్న పుస్తకంలోనే 'బైబిలు గోల మనకెందుకు' అన్న శీర్షికన వ్రాసిన దాన్లో.....

  1. బైబిలు చెప్పే మాటలను మనం అంగీకరిస్తామో, త్రోసివేస్తామో, అది తరువాతి సంగతి. కనీసం వినడానికి మనం ఇష్టపడకపోవడం “చెప్పకండీ చెప్పకండీ మేము వినం" అనడం కుసంస్కారం కాదూ??

  2. వినదగునెవ్వరు చెప్పిన.... సుమతీ అని బద్దెన నీతి వాక్యం చెప్పలేదూ??

  3. మన పిల్లల్ని ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ లాటి కోర్సులు చదివిస్తున్నాం. అవన్నీ / మ్లేచ్చుల చదువులా? లేక మన వేదాల చదువులా? జవాబు మనకు తెలుసు. న్యాయంగా మాట్లాండండి. న్యాయంగా ఆలోచించండి.

  4. ఈనాడు మనదైనందిన జీవితంలో ప్రతిక్షణం మ్లేచ్చు జాతుల నుండి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) పరికరాలు, సౌకర్యాలు అన్నీ ఉపయోగించుకుంటూ, మన విరాట్ పురుష చరిత్ర ఆ గ్రంథంలో వ్రాయబడి ఉందంటే వినకుండా మొహం తిప్పేసుకోవడం న్యాయమా? చెప్పండి?

  5. ఓ అగ్నీ నీవెవరు? మనుషులలో నీకు బంధువెవడు? అని అడుగుతూ అన్వేషించిన మహర్షులు అలా మొహం తిప్పేసుకుంటారా?

  6. విరాట్ పురుషుని పావన చరిత్రను మనం వినకుండా మొహం తిప్పేసుకుంటే, ఆ యాస్కుడూ, గౌతముడూ, విశ్వామిత్రుడు మొదలైన వేదరుషులు మెచ్చుకుంటారా?

  7. ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి స్వామి దయానంద సరస్వతిగారు “సత్యమును అంగీకరించుటకు, అసత్యమును విసర్జించుటకు సభ్యులు సర్వదా సిద్ధంగా ఉండవలెను" అని సెలవిచ్చారు. ఎంతటి ఉన్నతమైన ఆదర్శం అది! ఆ బాటలో నడుద్దాం. తొందరపడి దేనినీ తృణీకరించకుండా, ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉందాం'. విన్న ప్రతి మాటనూ గుడ్డిగా నమ్మవద్దు. "జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును" అని బైబిలు ఆక్షేపిస్తున్నది కూడా. 

కనుక, మనం వింటున్న మాటలు ఎంతవరకు వాస్తవం? ఆ వాదన ఎంతవరకు సమంజసం? అది నిజమా. ఆధారాలున్నాయా? అని పరీక్షించాలి. ఆ తరువాత మనం నిష్పాక్షికంగా జరిపిన పరిశోధనలో సత్యమని నిగ్గుతేలిన విషయాన్ని బహిరంగంగా అంగీకరించి, స్వీకరించి, ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి.

  1. ఇది స్వామి దయానంద సరస్వతి వంటి మహర్షులు చూపిన మహోన్నత మార్గం. ఆ మార్గంలో నడిచేవాడే భరతమాత ముద్దుబిడ్డ అసలైన దేశభక్తుడు.

  2. అందుచేత ఈ నిష్కారణ ద్వేషాన్ని మాని, అసలు సిసలైన భరతమాత ముద్దుబిడ్డలమై భువనపు నడిబొడ్డున చెప్పబడిన మన విరాట్ పురుషుని చరిత్ర విందాం రండి. 

అన్న అభిప్రాయ ప్రకటనలున్నాయి. వాటిలో కొన్ని నాకంగీకారమైనవీ, ఎవరూ కాదనడానికి వీల్లేనివీ అంటే అందరూ అంగీకరించి తీరాల్సినవి ఉన్నాయి. మరికొన్ని నాకంగీకారం కానివి, విచారిస్తే న్యాయం కాదనిపించేవీ ఉన్నాయి. ప్రస్తుతం మన ఈ చాలెంజి వేదికకూ అవసరమైన వాటిని మాత్రం ఎత్తి చూపుతాను. మిగిలిన వాటిని అసమంజసమేమిటన్నదీ కావాలంటే రేపటి మన విచారణ వేదికలో మీరే అన్న పరిశీలనా పద్ధతిన పరిశీలించుకుందాం.

  1. ఎవరు చెప్పారన్న దానిని పట్టించుకోకుండా, ఎవరు చెప్పిందాన్నెనా వినడానికి సిద్ధంగా ఉండాలి.

  2. విన్న ప్రతిదానినీ గుడ్డిగా నమ్మకూడదు. (ఒప్పేనని అంగీకరించకూడదనేనా?) జ్ఞానం లేనివాడే ప్రతిదానినీ నమ్ముతాడు.

  3. విన్న మాటలు, ఆ మాటలన్నవాడు చేస్తున్న వాదనా సమంజసంగా ఉందా? లేదా? అన్నది పరీక్షించాలి.

  4. పరీక్షించే వారు నిష్పాక్షిక దృష్టితో, నిష్పక్షపాతంగా పరిశోధించాలి.

  5. అలాంటి సరైన పరిశోధనలో సత్యమని తేలిన దానిని అంగీకరించాలి, స్వీకరించాలి, ఆచరించాలి.

  6. ఇలాటి వైఖరిని కలిగి ఉన్న వారినే సరైన మనిషి, వివేకవంతుడు లేదా సత్యసంధుడు అనాలి.

ఓఫిర్ గారూ, ఈ శీర్షికలో పై ఆరు భావాలూ నాకు శిరోధార్యం. వాటిని అంగీకరించడానికీ, స్వీకరించడానికి కాదు కాదు అంగీకరించాను, స్వీకరించాను, ఆచరిస్తున్నాను. ఇకముందూ ఆచరిస్తూనే ఉంటాను.

గమనిక : హైందవ క్రైస్తవంలోనే 56వ పుటలో ఒక పట్టికట్టి రెండు మూడు విలువైన అభిప్రాయాలు మీరు ప్రకటించారు.

  1. మీరు విద్యను అర్ధిస్తున్నారా? జ్ఞానార్థులేనా? సత్యాన్ని గ్రహించాలన్న తృష్ణ మీలో ఉందా?

  2. విద్యను జ్ఞానాన్ని ఆర్జించాలనుకొనే వ్యక్తికి ఉండవలసిన మొదటి అర్హత ఏమిటో తెలుసా?

  3. అప్పటివరకు మనసులో ఉన్న అభిప్రాయాలను మార్చుకోడానికి ఇష్టపడడమే విద్యార్థికుండాల్సిన మొదటి లక్షణం.

  4. తనలోని అభిప్రాయాలను మార్చుకోకుండా, వదులుకోకుండా అతడు క్రొత్త విషయాలను ఎలా నేర్చుకుంటాడు? జ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాడు?

  5. మొదట విద్యార్థులమైతే, ఆ తరువాత ద్విజులమూ కావచ్చు, భూసురులమూ కావచ్చు.

ఓఫిర్ గారూ! ఇందులోనూ కొన్ని విచారించాల్సిన అంశాలున్నాయి. నా అవగాహనకు సరికాదనిపించే మాటలూ ఉన్నాయి. వాటినలా ఉంచి, సారాంశంగా, అందరం స్వీకరించ దగినవి అనే రూపంలో వాక్యనిర్మాణం చేస్తాను. మీకివి అంగీకారమో, కాదో తేల్చిచెప్పండి.

  1. జిజ్ఞాసికి లేదా విద్యార్థికి జ్ఞానాన్ని ఆర్జించాలనే లేదా విద్యనార్జించాలనే కోర్కె తీవ్రత కలిగిందై ఉండడం అవసరం. అలాగే జ్ఞానార్జనా పద్ధతులు తెలిసుండడం కూడా అవసరం. అంటే చదివితే ఎంత తెలుస్తుంది, హేతుబద్దాలోచనలకు ఎంత తెలుస్తుంది? ప్రత్యక్షానుభవానికి ఎంత తెలుస్తుంది? కలిగింది సత్యమో - బ్రమో ఎలా తెలుస్తుంది? అన్నది తెలిసి, దానిని వినియోగించ గలిగి ఉండడం అనన్నమాట.

  2. అవెప్పటి నుండి మనలో పేరుకుని, దృఢంగా పాదుకుని ఉన్న అభిప్రాయాలు కానీయండీ, పునర్విచారణలో, ప్రయోగరీత్యా మార్చుకోవలసినవని గాని, వదులకోవలసినవని గాని తేలితే అందుకు సిద్ధపడాలి. క్రొత్త విషయాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండగలగాలి. తప్పుల్ని వదులకోవడానికీ, ఒప్పుల్ని స్వీకరించడానికి సిద్ధంకానివాడు సరైన జ్ఞానాన్ని ఎలా ఆర్జిస్తాడు?

ఈ విషయాలు నాకంగీకారమైనవే. మీకూ అంగీకారమో కాదో సూటిగా ప్రకటించండి.

ముగింపు

హైందవ క్రైస్తవంపై విచారణకు మీరు సిద్ధపడితే, ముందుగా ఒకసారి మనం,  మరికొందరు విచారణా శీలురనూ కలుపుకొని విచారణకు అవసరమైన సూత్రీకరణలను మరి కొన్నింటినీ పై సూత్రీకరణలకు కలుపుకొని, యోగ్యమైన చర్చావేదికను చేసుకుందాం. మీకు వ్రాసిన ఈ లేఖను మా మాసపత్రిక వివేకపథంలోనూ ప్రచురించి హిందూ, క్రైస్తవ, ఇస్లాం పక్షాలకు చెంది మా ఎరుకలో ఉన్న మరికొందరకు ఈ సమాచారం అందిస్తాము. అంతర్జాలంలోనూ వీలున్నచోట్ల ఉంచబోతాము. దీనిపై అభిలాష, శ్రద్ధ ఉన్నవాళ్ళెవరైనా మీకెదురుపడితే మీ పక్షాన ఉండదలిస్తేనూ ఉండమని మీకు ప్రతి పక్షంగా ఉండదలిస్తేనూఉండవచ్చని, ఎవరికి వారుగా మీతోగాని, నాతోగాని సంప్రదించవచ్చని చెబుతాను.

పరిశీలకులుగా ఉండగోరిన వారికీ ప్రవేశాన్ని కల్పించడంలో నాకు అభ్యంతరం లేదు. అయితే ఈ వేదికలో పాల్గొనే వారందరికీ విచారణలో తేలిన అంశాలను అంగీకరించి స్వీకరించాల్సి ఉంటుందన్న నియామాన్ని వర్తింపజేయటం బాగుంటుందని నా అభిప్రాయము. విచారణ వేదిక విషయంలో మీ సూచనలేమైనా ఉన్నచో వాటినీ తెలియపర్చండి. వీలైనంత త్వరగా 'హైందవ క్రైస్తవం' గ్రంథ విచారణకు సంసిద్ధతను తెలుపుతూ మలిదశ యత్నాలకు దారితీసే రీతిలో సమాధానం రాస్తారని ఆశిస్తాను. 

ప్రస్తుతానికి ఉంటాను.. సెలవు.

సత్యాన్వేషణలో

  మీ సురేంద్ర. 


No comments:

Post a Comment