Tuesday, October 4, 2022

263 వ సంచిక వివేకపథం

 

వివేకపథం 

సంపుటి: 8 సంచిక:5 జూలై 2022


ఖురాన్‌పై కొన్ని ప్రశ్నలు

ఖురాను, హదీసులను తగినంతగా అధ్యయనం చేశామనుకునే ఇస్లాం విశ్వాసులు, అవిశ్వాసులూ. అన్య విశ్వాసులూ నేను లేవనెత్తిన ప్రశ్నలకు, సమాధానాలు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ముస్తాక్ గారికి నా ఈ విజ్ఞప్తి వర్తిస్తుంది.

1) అనాది కాలం నుండి ఊరుకుండి, ఏదో ఒక కాలాన సృష్టి చేయాలని అల్లా ఎందుకు అనుకున్నాడు?

వేరే మాటలలో చెప్పాలంటే; సృష్టి ఎందుకు చేశాడు? ఎవరికొరకు చేశాడు? లేదా సృష్టికి కారణం ఏమిటి? లేదా సృష్టి ప్రయోజనమేమిటి?

2) ఖురానులో అక్కడక్కడా 'మూలగ్రంథం' గురించిన ప్రస్తావన ఉంది. మీలో ఎవరైనాదాని వివరాలు పూర్తిగా ఇవ్వగలిగితే బాగుంటుంది. మూల గ్రంథంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరిగిన, జరుగుతున్న, జరగనున్న ఘటనలకు సంబంధించిన పూర్తివివరాలు ఉంటాయన్నట్లు కొన్ని మాటలున్నాయి. అల్లా రాసిందేనా ఆ గ్రంథం? ఎప్పుడు రాశాడు? ఎందుకు రాసినట్లు? మొత్తం ఆ గ్రంథంలో రాసినట్లే జరుగుతుందా? వేరుగా కూడా జరుగుతుందా?

3) వేరుగానూ జరగవచ్చు. జరిగింది కూడా అనేట్లయితే, ఇక ఆ గ్రంథం ఎందుకు? జరగనే జరగదు. వేరుగా అల్లా చేయాలనుకున్నా చేయలేడు. అనేట్లైతే, ఇక ప్రవక్తలూ, ఇంకొన్ని గ్రంథాలు ఎందుకు?

4) అల్లా పంపిన గ్రంథాలలో ఏదైనా ఆ మూల గ్రంథంలో ఉన్నన్ని విషయాలున్న గ్రంథం ఉందా? అవన్నీ ఆయా కాలాలకు సంబంధించినంత వరకే చెప్పబడ్డ అసంపూర్ణ గ్రంథాలేనా? 

5) అంతిమ దైవ గ్రంథంగా చెప్పబడ్డ ఖురానుకూ, మూల గ్రంథానికీ మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా? లేదా? ఉంటే ఏమిటా తేడా? లేకుంటే ఇక ఆ మూల గ్రంథంతోపనేముంది?

6) మూల గ్రంథంలో ఏమేమి వ్రాయబడి ఉన్నాయో మనమెవరమైనా గానీ, (ప్రవక్తలతో సహా) తెలుసుకునే అవకాశం ఉందా? లేదా? 

7) మూల గ్రంథంలో లేని విషయాలేమైనా అల్లా పంపిన తౌరాతు, జెబూరు, ఇంజీలు, ఖురాను లాంటి గ్రంథాలలో ఉండే అవకాశం ఉందా? లేదా?

8) అల్లాకు మూలగ్రంథంతో పనేముంది? మనకు గానీ, జిన్నాతులకు గానీ దానితో పనేముంది? ఈ మాటెందుకు అడుగుతున్నానంటే, అల్లాకు దానిని చూడాల్సిన పని లేదు,మనలాంటి వారికి దానిని చూసే అవకాశమూ లేదు కనుక.  

9) తనను తాను పొగడుకోవడం, ఎలా పొగడాలోనూ ఇతరులకు నేర్పి మరీ పొగిడించుకోవడం, అల్లా చేసినంతగా మరే గ్రంథంలోని దేవుడూ చేయలేదన్నది నిజమా? కాదా?

10) ఏ పని మొదలెట్టినా, ఏ మాట మాట్లాడదలచినా, అనంత కరుణామయుడూ,అపార కృపాశీలుడూ అయిన అల్లా పేరుతో అని అనాల్సిందేనని, జనాన్ని ఆదేశించిన అల్లా స్వభావాన్ని ఏమనాలి?

11) ఖురాను అంతటా, అల్లా మాటల్లోనూ, చేతల్లోనూ మనుషులకు ఆశనో, భయాన్నోచూ పెట్టి తన పనులు చేయించాలనుకోవడమే కనపడుతుంది.

12) ఖురాను ఆదేశాలు, సందేశాలు నచ్చినా, నచ్చకున్నా, నమ్మబుద్ధి అయినా, కాకున్నా,సహేతుక మనిపించినా, అనిపించకున్నా విశ్వసించాల్సిందేనని హదీసుల్లో గానీ, ఖురానులో గానీ, ఒక్కసారైనా చెప్పబడిందా? లేదా?

13) ఖురానులో చెప్పబడ్డ 6(8) రోజుల సృష్టిలో లేనివి ఏమైనా విశ్వంలో ఉనికిలో ఉన్నాయా? లేవా? అంటే, దేవుని సింహాసనము, జిబ్రిలు, జేబ్రియల్, సాతాను లాంటివారు 6 రోజులసృష్టిలోని వారేనా? కాదా?

14) స్వర్గ, నరకాలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? అంతిమదినం ఏర్పడేలోపు అందులోఏమేముంటాయి? ఎవరెవరుంటారు? తీర్పు జరగక ముందు వాటి అవసరం ఏముంది? 

15) 'పూర్వ గ్రంథాలను ధృవీకరిస్తుంది ఖురాను', అన్న వచనాలు ఖురానులో అనేకసార్లుఎందుకు చెప్పబడినట్లు? ఇంతకూ పూర్వ గ్రంథాల క్రిందికి ఏవేవి వస్తాయి?

16) ధృవీకరించడమంటే ఏమిటి? వాటిలో ఉన్నవన్నీ సరైనవేనని అనడమేనా? ఈనాడుమనం ఎవరంగానీ, ఖురానునూ, ఆ గ్రంథాలనూ సరిపోల్చి చూసుకునే అవకాశం, ఖురానుప్రకారం ఉందా? లేదా?

17) ఆ గ్రంథాలు యథాతధంగా అంటే అల్లా పంపిన రూపంలోనే, ఇప్పుడు లభిస్తాయా?లభించవా? దీని విషయమై ఖురాను ఏమంటోంది?

18) ముస్తాక్ గారు ఖురానులో చెప్పబడ్డ మూడు గ్రంథాలే కాక, ఇంకా అనేక పూర్వ గ్రంథాలు ఉన్నాయంటున్నారు. ఆ మాట ఖురానును ఎరిగిన వారు అంగీకరిస్తారా? అంగీకరించరా? కొందరలానో, కొందరిలానో అంగీకరించే వారి ప్రకారం, అవేవి? వాటిని గమనించి నిర్ధారించడం ఎలానో ఆ సమూహం వారే తేల్చి చెప్పాల్సి ఉంటుంది కదా? 

19) ఖురాను వెల్లడించిన భావాలు, నచ్చినా, నచ్చకున్నా విశ్వసించాల్సిందేనా? సమంజసం అనిపించకపోయినా అంగీకరించాల్సిందేనా? అంగీకరించాల్సిందేనా? ఈ మూడు ప్రశ్నలకూ ఖురాను ప్రకారం ఏమి సమాధానాలు చెప్పవచ్చు.

20) ఖురానులో అపరిమితమైన కరుణ, కృప, క్షమ కలవాడుగా అల్లా చెప్పబడ్డాడు.చెప్పబడ్డాడు అనేకంటే తన గురించి తానే చెప్పుకున్నాడు. అలా చెప్పమని మహమ్మదును ఆదేశించాడు. ఆ లక్షణాలకు విరుద్దంగా అనేక పనులు చేశాడు, చేయించాడు. ఇది నిజమా?కాదా?

21) సృష్టికర్తకు అవశ్యం సర్వజ్ఞత్వము; సర్వశక్తి మత్తత; అన్న సామర్థ్యాలు ఉండాలనిఅన్ని ఆస్తిక ధోరణుల వారూ అంగీకరిస్తారు. అయితే, ఆయా మతాలు సృష్టికర్తగాఅంగీకరిస్తున్న దేవుడు సర్వజ్ఞుడో కాడో, సర్వశక్తిమంతుడో కాడో, తెలుసుకునే అవకాశంగానీ, విధానంగానీ ఏమైనా ఉందా? అలాంటిదేమీ లేదు, విశ్వసించడమే అంటారా? ఈ విషయం తెలిసిన వారెవరైనా సమాధానం రాయొచ్చు, ముస్తాక్ గారు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంది.

22) ఆయా గ్రంథాల ఆధారంగానే, ఆ గ్రంథములో చెప్పబడిన దేవుడు సర్వజ్ఞుడు,సర్వశక్తిమంతుడు కాడని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? అలాంటి అవకాశంఉందని ఖురానేమైనా చెప్పిందా? 

23) ముస్తాక్ గారు, ఇస్లామేతరులకూ ముక్తి ఉందని ఖురాను చెబుతుందన్నారు. అది ఖురానుకు సరైన వివరణే అవుతుందా? వక్రీకరణ అవుతుందా?

24) ముస్తాక్ గారు ఖురాను భారత రాజ్యాంగం సూచించిన మత స్వేచ్చా విధానానికి ,పూర్తి అనుగుణ్యత కలిగి ఉందని ప్రకటించారు. ఖురాను సరిగనే అర్థమైందనుకున్నవారు ఈ మాటను అంగీకరిస్తారా? అంగీకరించలేరా?

25) ఒకవ్యక్తి చాలా మంచి పనులు చేశాడు. అల్లాను, మహమ్మద్ ప్రవక్తను :అంగీకరించలేదు. అతడు ఖురాను ప్రకారం స్వర్గానికి వెళతాడా? నరకానికి వెళతాడా?

26) ఒకడు చేయగలన్ని చెడ్డ పనులు చేశాడు. చావబోయే ముందు అల్లానే దేవుడు. మహమ్మదే అంతిమ ప్రవక్త అని నమ్ముతున్నాను అని పలికాడు. ఖురాను ప్రకారం అతడుస్వర్గానికి పోతాడా? నరకానికి పోతాడా?

27) 'బహు దైవారాధన నేరమని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి' అన్నది ముస్తాక్ గారిమాట.ముస్తాక్ గారూ మీ అన్ని గ్రంథాలన్నమాట క్రిందకి, భారతం, రామాయణం, భాగవతం, 8 పురాణాలు, వేదంలో ఇంద్ర, అగ్ని, వాయువు, వరుణుల గురించీ, అశ్వినీ దేవతలగురించి చెప్పిన భాగాలూ, అన్నీ వస్తాయా? రావా?

28) మతోన్మాదమంటే, “ముక్తి మార్గం నా వద్ద తప్ప ఎవరి వద్దా లేదు అన్న దృష్టి కలిగి ఉండడమే” అని స్పష్టంగా ప్రకటించారు ముస్తాక్ గారు. బాగుందండీ ముస్తాక్ గారూ ఖురానులో అట్టి ప్రకటన ఒక్కటీ లేదు అనన్నారు. అది మరీ బాగుంది. ఇంతకు అల్లాను, మహమ్మదును అంగీకరించని వారికీ ముక్తి ఉంది అని ఖురానులో కానీ, హదీసులలో గానీ ఎక్కడుందో ఒక్క మాట చూపించండి.

29) “ముస్లిమేతరుల వద్ద సత్యమూ ఉంది, ధర్మమూ ఉంది. ఖురాను ప్రకారం అది :వైదిక ధర్మమే. ఖురాను వైదిక ధర్మాన్నే ప్రకటిస్తోంది” అని మీరే చెప్పారు ముస్తాక్ గారూ. ఈ ప్రకటనపై నాకు రెండు, మూడు ప్రశ్నలున్నాయి.

ఎ) ముస్లిమేతరులు అంటే ఏమని అర్థమండీ? 

బి) ఖురాను ప్రకారం సత్యమంటే ఏమిటి? సత్యమేమిటి? 

సి) 'వైదిక ధర్మాన్నే నేను ప్రకటిస్తున్నాను' అని ఖురాను ఎక్కడ చెప్పింది?

డి) వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్న వాడు ముస్లిం అవుతాడా? ముస్లిమేతరుడు అవుతాడా? ఖురాను ప్రకారం.

30) 'మా గ్రంథమే అసలు సిసలు దైవగ్రంథం, మీది దైవ గ్రంథమే కాదు' అని ఎవరన్నా, అది మతోన్మాదాన్ని ప్రదర్శించినట్లేనని బహు బాగా చెప్పారు. ముస్తాక్ గారూ మరైతే ఖురాను అంతిమ దైవ గ్రంథం, ఖురానుతో విభేదించే గ్రంథాలేవీ దైవ గ్రంథాలు కావు, అనడం మతోన్మాదం క్రిందికి వస్తుందా? రాదా?

31) "ఖురాను మత స్వేచ్ఛను ఇవ్వడం లేదన్నది, ఖురానుపై సురేంద్ర చేసిన ఘోరమైన * నిందారోపణ” అని మీరన్నారు. ఇంతకూ మత స్వేచ్ఛను ఇవ్వడం, మత స్వేచ్ఛను నిషిద్ధం చేయడం అంటే ఏమిటండీ ముస్తాక్ గారూ? 

32) దేవుడు (సృష్టికర్త) ఒక్కడే అని అనేక మత గ్రంథాలు చెబుతున్నాయి. అలా చెబుతున్న వాటిలో ఆ దేవుడు విషువేనని ఒకరూ, శివుడేనని మరొకరూ, ఆదిశక్తేనని ఇంకొకరూ, అల్లాయేనని వేరొకరూ ఇలా తలా ఒక రకంగా చెబుతున్నారు. ఆయా దేవుళ్ళరూపురేఖలూ, నివాస స్థలమూ, వారు వారు చేసిన పనులు కూడా వేరువేరుగా చెబుతున్నారు. వీటిలో ఎవరు చెప్పింది అసలు వాస్తవమో నిర్ణయించేదెలాగో సూటిగా చెప్పండి ముస్తాక్ గారూ

33) 'వైదిక ధర్మం ' అన్నది ఏ గ్రంథంలో చెప్పబడిందో తేల్చి చెప్పండి ముస్తాక్ గారూ.అందులో దేవుని గురించి, సృష్టి గురించి, ప్రళయాన్ని గురించీ, అంతిమ దినపు తీర్పుగురించీ, తీర్పు అనంతర స్వర్గ నరకాల గురించీ ఎక్కడ? ఏమని చెప్పిందోనూ, ఆధారాలతోచూపించండి. ఇక్కడ నా ప్రశ్న ఖురాను వేద ధర్మాన్నే ప్రకటిస్తోంది అన్నప్పుడు, ఇక అసలు ఖురానెందుకు? దానికి అంతిమ దైవ గ్రంథమన్న పేరెందుకు? అంతిమ ప్రవక్త ఎందుకు?

34) ఖురాను చెప్పే పూర్వ గ్రంథాలకూ, ఖురానుకు మధ్య ఉన్న పోలికలేమిటి? తేడాలేమిటి? ఖరాఖండిగా ప్రకటించండి. ఖురాను మీకెంత అర్థమైందో, వైదిక గ్రంథాలు ఎంత అర్థమైనాయో పరిశీలిస్తాను. మీ అవగాహనలో లోపముందని తేలితే సరిచేసుకుంటారనే భావిస్తాను.

35) ఖురాను ప్రకారం సకల మానవ సముదాయాలూ దైవ ధర్మాన్నే కలిగివున్నాయని, మీరంటున్నారు. అవునా? అయితే స్వర్గ, నరకాలు ఎవరి కొరకు? సాతాను ఎవరి కొరకు? ప్రవక్తలు ఎవరి కొరకు?

36) మత స్వేచ్ఛలో భాగంగా భారత రాజ్యాంగం విగ్రహారాధన చేసుకోవచ్చు అని చెబుతోంది. ఖురాను అలాంటి మత స్వేచ్ఛను అంగీకరిస్తుందా?

37) భారత రాజ్యాంగం బహు దైవారాధన చేయడం గానీ, ఏ దైవారాధనా చేయకుండాఉండడం గానీ, మత స్వేచ్ఛలో భాగమనే అంటుంది. ఖురాను ఆ రకమైన మత స్వేచ్ఛను అంగీకరిస్తుందా?

38) 'ఖురానులో నన్నే ప్రార్ధించండి, అన్యులను ప్రార్థించకండి' అన్న అర్ధాన్నిచ్చే వచనాలు ఉన్నాయా? లేవా?

39) అలాగే అల్లా సర్వశక్తిమంతుడు కాడు. సర్వజ్ఞుడూ కాడు అనడానికి సరిపడేఈ అర్ధాన్నిచ్చే వచనాలు ఉన్నాయా? లేవా? 

40) దేవదూతలు, జిన్నులు, మానవులు అన్న మూడు జాతులను అల్లా ఎప్పుడెప్పుడు సృష్టించాడు? ఎందుకొరకు సృష్టించాడు? వారి ఆకారాలు ఒకే విధంగా అంటే మనిషిని పోలే ఉంటాయా? మరో రకంగానా?

4) ఒక నాటకంలోని పాత్రధారులు, నాటకంలో రాయబడ్డట్లే ప్రవర్తిస్తూ, మాట్లాడుతూ ,ఉంటే, వారికి స్వేచ్ఛ ఉందంటామా? లేదంటామా?

42) ఆ నాటక రచయిత కూడా నాటకంలో ఒక పాత్ర ధరించి ఉంటే, అతడూ, ఆ పాత్ర వేస్తున్నంతకాలం స్వేచ్ఛ కోల్పోయినట్లే నంటాను. మీరేమంటారు?

43) అవిశ్వాసులకు, బహుదైవారాధకులకు, విగ్రహారాధకులకూ (అన్యవిశ్వాసులకు) : శాశ్వత నరకమే ప్రాప్తిస్తుంది అని ఖురాను స్పష్టంగా ప్రకటించిందా? లేదా?

44) 'అల్లా అగుము అన్న వెంటనే అది అలానే అయిపోతుంది' అని ఖురాను వచనం చెబుతోంది. అయితే అదే ఖురానులో అ పదే పదే చేయమని చెప్పినా, జరగని పనుల గురించిన సమాచారమూ చాలానే ఉంది. ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు ముస్లింలు?

45) “అల్లా అంతటా ఉన్నాడు' అన్న వాక్యమూ, అల్లా పరిమిత స్థలములోనే ఉన్నాడుఅన్న అర్థాన్నిచ్చే వాక్యమూ ఖురానులో ఉంటే ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించగలము?

46) “అల్లా సర్వం తెలిసినవాడు'... అల్లా ఆయా విషయాలు తెలుసుకోవడానికి ఇతరుల సహాయం తీసుకుంటాడు. వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికీ, ఆయా సందర్భాలలో వారెలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికి పరీక్షలు పెడుతుంటాడు, అన్న రెండు వచనాల మధ్యనున్న వైరుధ్యాన్ని, ఎలా పరిష్కరించగలము?

 47) ఖురానులో చెప్పబడ్డ మూల గ్రంథంలో, ఆదాం ఇలా ప్రవర్తిస్తాడు, ఇబ్రహీం ఇలాగే ప్రవర్తిస్తాడు, ఈ యీ సమయాలలో ఈ యీ ప్రాంతాలలో, ఈ సంఘటనలుజరుగుతాయని వ్రాయబడి ఉందా? లేదా?

48) మూల గ్రంథంలో రాయబడిన దానికి వేరుగా ఏమైనా జరగడం గానీ, రాయబడింది జరగక పోవడం గానీ సాధ్యమేనంటుందా? అలా జరగడం అసాధ్యం, అసంభవం అంటుందాఖురాను?

49) అల్లా సర్వజ్ఞత్వాన్నీ, సర్వశక్తి మత్వాన్నీ, సర్వవ్యాపకత్వాన్నీ శంకించేలా చేసే వచనాలేమైనా ఖురానులో ఉన్నాయా? లేవా?

50) నరకం చేరని అవిశ్వాసులు గానీ, స్వర్గం చేరే అవిశ్వాసులు గానీ ఉంటారనిఖురాను చెబుతుందా?

51) నరకం చేరే విశ్వాసి గానీ, స్వర్గం చేరని విశ్వాసి గానీ ఉంటారని ఖురాను ,చెబుతుందా?

52) జీవితంలో ఎక్కువ అధర్మ కార్యాలే చేసిన ఒకడు చివరాఖరుకు అల్లా తప్ప దేవుడు లేడనీ, మహమ్మదు అంతిమ దైవ ప్రవక్త అని, ఖురాను అంతిమ దైవ గ్రంథమని విశ్వసించాడు. విశ్వసిస్తున్నానని పలికాడు. అతడు స్వర్గానికి వెళతాడా? నరకానికెళతాడా?

53) దానికి పూర్తి వ్యతిరేకంగా మరొకడు 99% ధర్మకార్యాలే చేస్తూ వచ్చాడు. కానీ ఏనాడు అల్లా పట్ల, మహమ్మదు పట్లా, ఖురాను పట్ల విశ్వాసాన్ని గానీ, విధేయతను గానీప్రకటించలేదు. చూపించలేదు. అతడు స్వర్గానికెళతాడా? నరకానికెళతాడా? ఖురాను ఏమంటోంది?

54) 'ముస్లిమేతరుల' క్రిందికి ఎవరెవరు చేరతారు ఖురాను ప్రకారం? ఖురాను వచనాలుచూపుతూ చెప్పండి.

55) “మాతృభూమిని ప్రేమించడం కూడా విశ్వాసంలో ఒక భాగమే' అని ఒకరనగా,కల్పిత వచనాల సంకలనకర్త అల్బానిగారు, ఇది వట్టి బూటక వచనం అని రాశారు.అంటే మాతృభూమిని ప్రేమించడం ప్రేమించకపోవడం అన్న రెండూ విశ్వాసంలో భాగంకావనే కదా!

ముస్తాక్ గారూ? ఖురాను వైఖరి ప్రకారం, మాతృభూమిని ప్రేమించక పోయినా, అతడు ముస్లింగా ఉండడానికి అభ్యంతరమేమీ లేదు అనే కదా?

56) ఖురాను మత సామరస్య ధోరణి కలిగి ఉందా? లేదా? నా సమాధానం ఏమాత్రం అట్టి స్వభావం కలిగి లేదు మీరేమంటారు ముస్తాక్ గారూ?

57) ఖురాను కనీసం మత సహనం వరకైనా అంగీకరిస్తుందా?

నా సమాధానం, పరిస్థితులననుసరించి మసలుకోండి అని చెబుతుంది, తన వాళ్లకు.అప్పటి పరిస్థితులలో బలం చాలకపోయినా, వేరే దారి లేక పోయినా భరించండి, సహించుకోండి అనంటుంది. తిరగబడే పరిస్థితి ఉంటే తిరగబడండి, అట్టి పరిస్థితి లేకపోయినా, అక్కడి నుండి వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటే వెళ్ళిపోండి అని చెపుతుంది. అడ్డుకునే శక్తి ఉంటే మొదట సందేశం వినిపించండి. వినకుంటే అడ్డుకోండి. ఆ పనిలోఅవిశ్వాసులతో జరిగే పోరాటంలో మీరు చనిపోయినా, అవిశ్వాసులను, అన్యవిశ్వాసులను చంపినా, అది ధర్మమే అవుతుంది. అక్కడ సహించుకోక పోవడమే సరైందే అవుతుంది అని చెబుతుంది.

ముస్తాక్ గారూ ఈ ప్రశ్నకు మీ సమాధానమేమిటో చెప్పండి. ఖురాను అధ్యయనం చేశామనుకునే వారెవరైనా పైనా సమాధానాలు వాస్తవాన్ని చూపుతున్నాయో లేదో చెప్పండి. 

58) ముస్తాక్ గారూ ఖురాను వచనాలలో ప్రధానంగా ధ్వనించేది దేవునిఅసహనమేనంటాను. మీరేమంటారు.

59) తనను దేవునిగా అంగీకరించకపోయినా, మరొకరిని దేవునిగా అంగీకరించినా,తనను అంగీకరిస్తూనే మరొకరినీ అంగీకరించినా, అట్టివారందరి విషయంలో అల్లా ఏ మాత్రం కరుణ గానీ, కృప గానీ చూపడు సరికదా, ఘోరమైన శిక్షలు వేస్తాడు, ఈ లోకంలో,పరలోకంలో కూడా. ఖురాను వచనాలలో ప్రధానంగా కనపడేది ఈ అంశమేనంటాను. మీరేమంటారు ముస్తాక్ గారూ.

60) స్వర్గం అనే ధనమిచ్చి విశ్వాసులను కొనుక్కున్నాను అంటాడు అల్లా. ముస్తాక్ గారూ ఈ అర్థాన్నిచ్చే వచనం ఖురానులో ఉందా? లేదా? ఎందుకొరకు కొనుక్కున్నాడోనూ చెప్పబడి ఉందా? లేదా? చెప్పండి.

61 ) బహు దైవారాధన క్రిందకు ఏమేమి వస్తాయో హదీసులలో చాలా విస్తారంగా చెప్పబడింది.

62) రుజువుకు రాని, రుజువుకు పెట్టడానికి వీలులేని, అంశాలు ఖురానులో చాలాఉన్నాయి. అట్టి వాటినన్నింటినీ సత్యాలేననడం, గుడ్డిగా విశ్వసించడమే తప్ప ఇంకేమీ కాదు కదా ముస్తాక్ గారూ మీరు ఏ హేతుబుద్ధితో అలాంటివన్నీ సత్యా లేనని ప్రచారం చేస్తున్నారు? మా లాంటి వాళ్ళు అట్టి వాటిని ఎందుకు అంగీకరించాలి? అట్టి వాటి విషయంలో ఏమి చేద్దామని మిమ్ము ప్రశ్నించడంలో తప్పేముంది?

63) అల్లా నీ జాతకంలో వ్రాసి ఉన్న దానికంటే మించి నీకే లాభమూ కలుగదు.అలాగే ఆయన వ్రాసిన దానికంటే మించి కష్టనష్టాలు ఎవరూ కలిగించలేరు. అని ప్రవచనాలలో (తిర్మజ) ఉంది. దానర్థం ఏమిటండీ ముస్తాక్ గారూ? ఇంతకూ మనిషికి స్వేచ్ఛ ఉన్నట్లా? లేనట్లా?

64) అల్లా ఏదైనా చేయాలని నిర్ణయిస్తే, ఆ పని జరిగి తీరాలని ఆదేశించగానే ఆ పని జరిగిపోతుంది. (40:68). కానీ ముస్తాక్ గారూ అలా చాలాసార్లు జరగలేదనడానికీ ఆధారాలు ఖురానులోనే చాలా ఉన్నాయి. ఏమి చేద్దామంటారు వాటిని? ఖురానులోఆజ్ఞాతిక్రమ సన్నివేశాలు ఉన్నాయా? లేవా? 

65) అవిశ్వాసులు వారి అవిశ్వాస కారణంగానే నరక పాత్రులు అని ఖురాను చెబుతోందా? లేదా?

66) “దేవుడు లేడు అల్లా తప్ప' అని ప్రకటించిన ఖురాను ఆరంభవచనమే, ఆ మాటద్వారా మూడు భావాలను స్థిరపరిచింది.

ఎ) దేవుడున్నాడు 

బి) దేవుడు ఒక్కడే 

సి) అతడు అల్లానే

ఈ మూటినీ అంగీకరించిన వాడు లేదా విశ్వసించినవాడే విశ్వాసి అవుతాడు. కడమవారంతా ఖురాను ప్రకారం అవిశ్వాసులే. ముస్తాక్ గారూ ఈ వివరణ సరైందేనా? కాదా?దీనినే మరింత వివరిస్తాను. నాది సరైన వివరణనో, వక్రీకరణో చెప్పండి.

వివరణ : ఎ) దేవుడు లేడన్న వారంతా అవిశ్వాసులే. దేవుడున్నాడు, అనేక దేవుళ్ళున్నారుఅన్న వాళ్ళూ ఖురాను ప్రకారం సత్యతిరస్కారులూ అవిశ్వాసులే. దేవుడున్నాడు, దేవుడుఒక్కడే, అతడు అల్లా కాదు అన్న వాళ్ళూ అవిశ్వాసులే. అంటే ఏమని? ఖురాను ప్రకారం ఒక్కణ్ణి విశ్వాసి అనాలంటే అతడు దేవుడున్నాడని అంగీకరిస్తే సరిపోదు, దేవుడున్నాడు, అతడు ఒక్కడే అన్నా సరిపోదు. ఆ ఉన్న ఒక్క దేవుడు అల్లానే అని విశ్వసిస్తేనే అతడువిశ్వాసి అవుతాడు. ఈ మూటికీ తూగని వాడెవరైనా వారంతా నరక పాత్రులే. ఖురాను ఇదే చెబుతోంది, అన్నది నా మాట. మీరేమంటారు ముస్తాక్ గారూ?

67) అల్లా సుమారు లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపాడని ఖురాను చెబుతోంది. దీనిపై అనేక ప్రశ్నలు పుడుతున్నాయి. ముస్తాక్ గారూ సమాధానాలు ఖురాను ప్రకారం చెప్పగలిగితే చెప్పండి.

1 ) అసలు అంత మంది ప్రవక్తలను పంపడం ఎందుకు? అంతా అల్లా అనుకున్నట్లే జరుగుతుంది అని పదే పదే చెప్పింది కదా? తానిష్టపడినదేమో దానిని అనుకునేస్తే సరిపోయేదానికి, ఇంతింతకాలం, ఇంతింతమంది ప్రవక్తలను పంపి, వారిచేత అల్లాను విశ్వసించండిరా అని ప్రకటింపచేస్తూ, జనం ప్రవక్తలను తిరస్కరించినా, అవహేళన చేసినా, నిందించినా,దండించినా, చంపేసినా చూస్తూ ఊరుకోవడమెందుకు? తాను ఇష్టపడితే తప్ప ఎవడూ సన్మార్గానికి మరలడని, దుర్మార్గానికి మరలాలన్నా తాను అలా అనుకుంటేనే జరుగుతుందనీ చెప్పిన అల్లా, సత్య తిరస్కారులు కాకండి, విశ్వాసాన్ని విడవకండి, అన్యులను ఆరాధించకండిఅంటూ పదే పదే, భయపెట్టి, బామాలి, ఆశ పెట్టి, దండించి, చివరకు చంపేస్తూ... వారి వెంటపడి వందల సంవత్సరాలు వెంపర్లాడడమేమిటి. మీకెప్పుడూ ఈ ప్రశ్న పుట్టలేదా?

* ఇవన్నీ చూస్తుంటే, ఖురాన్ దేవుడు సర్వజ్ఞుడు గానీ, సర్వశక్తివంతుడు గాని, అనంతకృపాశీలుడు గానీ, అనంతకరుణామయుడు గానీ కాడని అనిపించడం లేదా? 

 

మేలుకొలుపు ఆరంభ సంచికల నుండి ఆలోచించవలసిన అంశాలు 

(మేలుకొలుపు భూమిక (1-5-91 ) ఒకటవ సంచిక)


1 ) వివేక చోదిత మైన ఉద్యమాలేవైనా అందరూ బాగుండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తుంటాయి. మండలి లక్ష్యమూ అదే. అందుకు ప్రధానంగా సాధించుకోవలసింది వ్యక్తి నిర్మాణమన్నదే.

2) జీవితానికి సంబంధించిన సరైన జ్ఞానము (అవగాహన) ఆ వివేకం చూపిన దారిలో నడవాలన్న ఇచ్చ, నడవగల సామర్ధ్యము కలిగి ఉండడాన్నే నేనిక్కడ వ్యక్తి నిర్మాణము అన్నమాటతో చెబుతున్నాను. 3) తనను తాను ప్రత్యేకించుకునే లక్షణం వ్యక్తి స్వభావంలోనే ఉంది. దానిని అవసరమైన మేర అదుపుచేసుకోగలిగి, సమష్టి భావనను కలిగి ఉండడాన్నే వ్యక్తి నిర్మాణం అంటున్నాను.

4) సిద్ధాంత పక్షాన్ని మాటిమాటికీ శోధించవలసిన పని లేనప్పటికీ, ప్రతిపక్షం ఏర్పడినప్పుడల్లా పరీక్షింపబడుటకు సిద్ధంగా ఉండాలి. పరీక్షింపనక్కరలేదు అని మాత్రంఅనరాదు .

5) వ్యక్తి ప్రయోజనాలు అవిఎంతటివైనా సమష్టి ప్రయోజనాలతో పోటీ పడరాదు. 

6) యోగ్యమైన యత్నాలన్నవేవైనా, సిద్ధాంతముఆచరణ అన్న రెండు పార్శాలను కలిగే ఉంటాయి.

7) ఉద్యమారంభకులలో ఉన్న తపన, మంట (జ్వలిత హృదయం) తరువాతి వారిలో ఉండడం లేదు. అతని తరువాత అతని స్థానాన్ని భర్తీ చేసేవారు లేకపోవడం/ రాకపోవడం ,అన్నదే నాడు, నేడు కూడా సర్వత్రా కనపడుతోంది. ప్రతి ఉద్యమమూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది.

8) వ్యక్తుల నిర్మాణం జరగాలి. కార్యకర్తల నిర్మాణం జరగాలి. ఉత్తమ స్థాయి కార్యకర్త, ఒక వంక కార్యరంగంలో క్రియాశీలంగా ఉంటూనే, మరో వంక తనలాంటి మరికొందరిని రూపొందించుకునే పని చేస్తుంటాడు.

9) సమాజ పునర్నిర్మాణ కార్యక్రమానికి వీలైనంత ఎక్కువమంది ఏకత్రాటి పైకిరావడమన్నదొక్కటే ఏకైక పరిష్కారం. అక్కడ కూడా కార్యకర్తల నిర్మాణం అన్నదే అన్నింటికీతిరుమంత్రం అవుతుంది.

మిత్రులారా!

* 1968లో మొదలైన నా సాధన క్రమం 1991 నాటికి ఇక్కడకు చేరింది. అభ్యుదయశక్తుల ఐక్య సంఘటనే, అన్ని సమస్యల పరిష్కారానికీ, సమాజ పునర్నిర్మాణానికీ ఏకైక ఆలంబన అన్న దగ్గరకు చేరాను నేను.

10) కలసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష . వ్యక్తిగతాభిప్రాయాలూ, సిద్ధాంతాలూ, వాస్తవికతల, నిష్పాక్షికతల ప్రాతిపదికన సరిచూడబడాలి. ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విద్యలు మరల సమాజంలో నెలకొని మానవ సమాజానికి నేడు, రేపు కూడా భద్రతను చేకూర్చాలి. 

మేలుకొలుపు 2 (15 -5 -91 ) ఆశ్రమాధిపతుల కర్తవ్యముఆశ్రమ భవిష్యత్తు. ,

గమనిక : వ్యాసాశ్రమంఏర్పేడు, పీఠాధిపతి విద్యా నంద స్వామి వారితో నాకున్న సాన్నిహిత్యం రీత్యా నేను వారి దృష్టికి తెచ్చిన విషయాలే ఈ వ్యాసంలో వ్రాశాను. 

1 ) ఇక్కడ నేను వాడిన 'ఆశ్రమాలు' అన్న పదం వెనుక నా భావం సామాజిక శ్రేయస్సుకోరి ప్రవర్తిస్తున్న సంఘాలు అని మాత్రమే. అవి నాస్తిక, ఆస్తిక, హేతువాదాది ఏ రూపంలో ఉన్నవైనా కూడా అని మాత్రమే.

2) నేను దాదాపు అన్ని సంస్థలలోనూ ఒకే రకమైన బలహీనతను గమనించాను. ఆ సంస్థలు భావితరాన్ని వారసులనూ (వారసుణ్ణి కాదు) రూపొందించుకోక పోవడమన్నదే ఆబలహీనత. మండలి కూడా ఈ బలహీనతకు లోనయ్యే ఉందన్నదో చేదు నిజం. నా దృష్టికందినంతలో గోరా గారు తనదైన రీతిలో దీనికో పరిష్కారాన్ని కనుగొన్నారు. తన కుటుంబాన్నే ఇందుకు ఎంపిక చేసుకున్నారు.

అయితే, ఒక సమస్యను పరిష్కరించాలనుకుంటే, మరో సమస్య వచ్చి కూర్చుంది. గోరా నాస్తికోద్యమం ఒక కుటుంబ ఉద్యమంగా ప్రచారంలోకి వచ్చింది. అదలా ఉంచి మొదటి సమస్యా పరిష్కారం కాలేదు. ఆ కుటుంబంలో మూడోతరం వచ్చేటప్పటికి, వారంతా ఆస్తికులు కాలేదుగానీ, నాస్తికోద్యమం మాత్రం సాగాల్సిన రీతిలో సాగడం లేదు. వారంతా కూడా ఎవరిష్టం వచ్చిన వృత్తి వ్యాపారాల్లోకి వారెళ్ళి పోయారు. 

3) లోకకళ్యాణమే పరమార్థంగా పెట్టుకున్న కార్యకర్తలు తయారు కావలసి ఉంది.కార్యకర్తలంటే తన సిద్ధాంత భావజాలానికి వ్యక్త రూపమైన జీవిక కలిగి, తనలాంటిమరికొందరినీ, తయారుచేసుకోగల వ్యక్తి అని అర్థం.

గమనిక : 1) మిత్రులారా (1991) 30 ఏళ్ల నాటికే లక్ష్యసాధనకై కర్తృత్వం వహించిన వ్యక్తులు తయారు కావాల్సి ఉందన్న నిర్ణయానికి వచ్చాను నేను. అప్పటినుండి నాతో ముడిపడి ఉన్న ఏ ఉద్యమంలో గానీండి, అధ్యయన శిక్షణా తరగతులకు మొదటి స్థానం కల్పిస్తూ వస్తున్నానీనాటికీ (పేజీ 4).

4) అలాగే, దినచర్య నియమబద్ధంగా, కాలంతో ముడిపెట్టి ఉండాలన్నదీ, అంతకు ముందు నుండే సాధన క్రమం అన్న పేరుతో చెబుతూ, చేస్తూ, చేయిస్తూ వస్తున్నాను. 

3వ సంచికలోనే (15-6-91) ఆరోగ్యమూ ఒక పరిశీలనంటూ ఒక వ్యాసం రాశాను. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ, బలాన్ని సంపాదించుకోవడం ఎలానో, ఎంత అవసరమో ,అందులో వివరించాను.

1) అందులో భాగంగా, ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని స్పష్టంగా(ప్రకటించాను. (పేజీ 7) 

2) వ్యక్తి నిర్మాణము : వ్యక్తి నిర్మాణమే సకల సమస్యలకు పరిష్కారం కాగలదన్న సూత్రీకరణా, ఆనాడే రూపొందింది. ఒక రకమైన వ్యక్తే సామాజిక సమస్యలన్నింటికీ కారణం అవుతున్నాడు. మరో రకమైన వ్యక్తే వాటి పరిష్కారానికి కారణం కాగలుగుతాడు, అన్నభావన ఆ అవగాహన నుండి పుట్టిందే.

4వ సంచిక, 15-6-91 గత స్ఫూర్తిఅవశ్యం భావి.

1) జ్ఞానోత్పత్తికి ఆధారం అనుభవమే. అది ఇంద్రియార్ధసన్నికర్ష వల్లనే ఏర్పడుతుంది. సత్య జ్ఞానాన్ని ఆర్జించడం బ్రతుకు అవసరం.

2) "కర్త, ఉద్దేశ్యము, పరికరాలు, విధానము, పని = ఫలితము” అన్న అవగాహన ఆనాటికే సూత్ర రూపాన్ని ధరించి ఉంది. మండలి మూలభావనల్లో ఒకటిగా అది ఈనాటికీనిలచే ఉంది. (పేజీ 4)

3) వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణానికి ఆలంబన. ఎట్టి వ్యక్తులో అట్టి సమాజము ,అన్నది యథార్థము.

4) నేను వ్యక్తం చేస్తున్న భావాలను, రాగద్వేషాలు విడిచి నిశితంగా విమర్శించండని ఆనాడే చెప్పాను. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 1970 ప్రాంతాల నుండి కూడా నేనిదే వైఖరితోఉన్నాను. 1981లో పెంచలయ్య గారితో ప్రథమ సమావేశం కూడా ఈ నియమానికి లోబడే జరిగింది.

5) ఏనాడైతే నేను ప్రకటించిన అభిప్రాయాలు సత్యాలేనని నిరూపించలేకపోయానో ఆనాటి నుండే అవి సత్యాలని చెప్పడం మానేశాను. ఈనాటికీ అదే బిగువుతో ఉన్నాను. అలా ఉండడమే ఎవరికైనా సరైనదవుతుందని అందరికీ చెబుతూ వస్తున్నాను.

6) మంచిని ఎక్కడినుండైనా స్వీకరించు. అదేసమయంలో నీలోని బలహీనతలను తొలగించు కోవడానికి నిజాయితీగా యత్నించు. మానవతకు, వికాసానికి ఇంతకంటే మెరుగైనదారి లేదు. (పేజీ 7).

7) ఒక వంక ఆత్మ విమర్శ చేసుకునే లక్షణమూ, మరో వంక పట్టుకున్న దానిని ఒక ముగింపుకు వచ్చేంతవరకు గట్టిగా పట్టుకుని పనిచేయడమూ, ఇదే అన్నింటికంటే మేలైన జీవన విధానము అన్న నిర్ణయానికి వచ్చాను.

 5వ సంచిక. జ్ఞాన పీఠం,1- 7-91.

1)  జ్ఞానముఅది నడిపించిన రీతిలో నడక. ఇదే మానవ జీవితమంటే. అని ఒక రకంగా నిర్వచించు కోవచ్చు. అయితే ఆ జ్ఞానము ఒప్పు జ్ఞానముతప్పు జ్ఞానము అని రెండు రకాలుగా ఉంటుంది. ఒప్పు జ్ఞానం అనుకున్నది సాధించుకోవడానికి, తప్పు జ్ఞానంఅనుకున్నది సాధించుకోలేకపోవడానికి, అనుకోనిది వచ్చి పైబడడానికి కారణాలవు తున్నాయన్న నిజాన్ని మనిషి తన స్వీయానుభవా లాధారంగా గమనించాడు. అదిగో అక్కడి నుండే, ఒప్పు జ్ఞానమే వస్తుండాలనీ, తప్పు జ్ఞానం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ ఎరుకతో ప్రవర్తించడం మొదలెట్టాడు. దాని కొనసాగింపే ఆ క్రమంలో రూపొందిందే ప్రమాణ విద్య.

2) భావ ప్రసార సాధనంగా భాషను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే, చెప్పేవాడు, వినేవాడూ కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఆ వివరాలే ఈ వ్యాసంలో కొంతవరకు వ్రాశాను.

3) చక్కగా వినడం, అవసరమైనప్పుడల్లా, విన్న మాటకు అర్ధాన్ని అన్న వారినే అడిగితెలుసుకోవడం అన్నవి విన్నవాడు తీసుకోవలసిన జాగ్రత్తలు కాగా, సరైన మరియువీలైనంతలో సరళమైన పదాలనే వాడడం, విన్నవాడు అడిగినప్పుడల్లా,తానన్న మాటలకుఅర్ధాలు చెప్పే బాధ్యత తానే వహించడం అన్నవాడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ వ్యాసంరాయక ముందు నుండే చాలా కాలంగా చెప్పేటప్పుడూ, వినేటప్పుడూ కూడా నేనీ జాగ్రత్తలుపాటిస్తూనే వచ్చాను. ఈ విషయం వరకు పెంచలయ్య గారికీ, నాకూ మధ్య భిన్నాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయమే ఉంది. సత్య జ్ఞాన సంఘం దీనిపై ఎక్కడైనా ప్రత్యేకంగా ప్రస్తావించడంగానీ, తరగతులు నిర్వహించడం గానీ చేసిందో లేదో నాకు తెలియదు గానీ, మేము మాత్రం‘భాష పుట్టుక, శక్తి, పరిమితి' అన్న శీర్షికన చాలా వివరంగానే మాట్లాడుకుంటుండే వాళ్ళం.అక్కడితో ఆగక భాషానియమాలంటూ మరికొంత విచారణా చేసాము.

4) ఏ ప్రతిపాదకుడైనా, తన ప్రతిపాదన సరైందేనని రుజువు చేయడానికై, మరొక గ్రంథంలోని వాక్యాన్నో, వ్యక్తి అన్న వాక్యాన్నో చూపించాడనుకోండి. దానర్థం ఆ విషయాన్నిసత్యమని రుజువు చేసే సమర్థత అతనికి లేదన్నట్లే. భాష ద్వారా ఏమి తెలుస్తుంది? ఏమి తెలియదు? అన్న విషయం అర్థమైతే గాని, నేను చెప్పినది సత్యాసత్య విచారణ వేదికలలోఎంత కీలకమైనదో అర్థం కాదు.

5) ఒక ప్రకటితాభిప్రాయాన్ని సత్యమని రుజువు చేయాలంటే, ప్రతిపాదకునికి ఆవిషయంలో ప్రత్యక్షం ద్వారా యథార్థజ్ఞానం కలిగి ఉండడంతో పాటు, ఇప్పుడు మరలాదానిని ప్రయోగ రూపంలో చూపించడమో, ప్రదర్శించడమో చేయగలిగి ఉండాలి. చేయడానికిఅవకాశమూ ఉండాలి. ఆ అవకాశం లేనప్పుడు, ఆ ప్రకటితాభిప్రాయం సత్యమని గానీ,అసత్యమని గానీ నిర్ణయించకూడదు.

గమనిక : అలా మనం నిర్ధారించకపోయినా, అది సత్యమనడానికో, అసత్యమనడానికో• సరిపోయేది గానే ఉంటుంది.

6) పదార్థ వర్గాల గురించి కూడా 1980-90ల మధ్యనే నాకొక స్పష్టత వచ్చింది. మనకు తెలియబడేవన్నీ (మనకు కలిగే జ్ఞానమంతా) వస్తు, ద్రవ్య, గుణ, క్రియలన్న నాలుగు రకాల క్రిందకే చేరిపోతాయి. ఇక ఐదవది వాటి మధ్యనున్న సంబంధాలుగా తెలుస్తుంటాయి. 

గమనిక : ఈ విషయంలో సత్య జ్ఞాన సంఘం కానీ, మీకు మీరుగా గానీ ఎట్టిఅవగాహనతో ఉన్నారో ప్రకటిస్తే, వాటి వాస్తవికత గురించి విచారణ చేయవచ్చు. విచారణ మండలి ప్రకటించిన వాటి దగ్గర నుండైనా ఆరంభించుకోవచ్చు. విచారణ ఎవరి ప్రతిపాదనలతో మొదలెట్టినా, విచారణ పూర్తయ్యాక ఏకాభిప్రాయానికి రావడం, తరువాతఅందరూ వాటినే ప్రకటించడం, వినియోగించుకోవడం చేయాలి. జ్ఞాన క్షేత్రానికి చెందినంతలోఇది ఆయా వ్యక్తులు సత్యానికి ఏ స్థానాన్నిస్తున్నారో అన్నదానిని సూచిస్తుంటుంది. నేనూ,మండలి మాత్రం ఇలా ప్రవర్తించడాన్నే అలవాటు చేసుకుంటున్నాము.

7) కదలికకు కారణం కావలసింది లేకపోవడం, అక్కరలేనిది ఉండడమూ అన్నఅవగాహన నేను జీవితాన్ని స్వయంగా చూసుకోవడం మొదలైన తొలినాళ్లలోనేతెల్లమైపోయింది. దాంతోపాటు ఆ కావాల్సిందేమిటో అది లేకపోవడానికి కారణమేమిటో,రాకపోవడానికి కారణమేమిటో, కారణాన్ని తొలగించటమెలానో, జీవితానుభవాల నుండే తెలిసివచ్చింది (అవగతమైంది). ఈ విచారణలో భాగంగానే, ఒప్పు జ్ఞానం యొక్క పాత్ర ఏమిటో, అది లేకుంటే వచ్చే ఇబ్బందేమిటోనూ, అనుభవ పూర్వకంగానే తెలిసింది. అలాగేతప్పు జ్ఞానం పాత్ర గురించిన అవగాహన కలిగింది.

రుణ త్రయం విముక్తి : సంచిక (7) అని ఉంది.

1) సమాజంలో అనేక కోణాలలో పని చేయగల సంస్థలూ, వ్యక్తులు కావాలి. ఏ ఒక్క సంస్థా అన్ని రకాలైన సామాజికావసరాలను తీర్చలేదు. అన్ని రకాలైన సమస్యలనూ పరిష్కరించలేదు. నేను ఒక కోణాన్ని ఎంచుకున్నాను. 1 ) వ్యక్తుల్ని తయారుచేయడం. 2) వ్యక్తి కంటే సిద్ధాంతమే అనుసరించ తగిందన్న వివేకాన్ని కలిగించడం. 3) సుశిక్షితులైన వ్యక్తుల్ని అన్ని కీలక రంగాలలోకి పంపుతుండడం.

2) మనిషి అతడెంత వాడైనా, సమాజానికి ప్రకృతికీ రుణపడి ఉంటాడన్న అవగాహన స్పష్టంగా కలిగింది. ఆ అవగాహన సమాజంలోని వ్యక్తులకు కలిగించడం, సామాజిక• బాధ్యతన్నది ఎరుకయ్యింది. ఈ నేపథ్యం నుండే 'సామాజిక సంబంధాలు వ్యక్తి పాత్ర' అన్న ఒక అధ్యాయమే రూపొందింది.

3) సత్యాన్వేషణలో సత్యాసత్య విచారణ సందర్భంలో, ఎవరు చెప్పారన్నదానికివిలువివ్వక్కరలేదని, ఏమి చెప్పారో, అది ప్రయోగరీత్యా నిర్ధారించుకోవడానికి తగిందోకాదో చూడడం అన్నదే సరైందేనని తెలుసుకున్నాను. నాటి నుండి, సత్యాన్వేషణ మండలి* మూలభావనల్లో ఒకటిగా యిందిన్నూ.

స్వమంతవ్యంసంచిక (6) 1-8-91

1) సంస్కృతం దేవ భాష అని కొందరూ, మృత భాష అని కొందరూ అంటుంటారు. నిజానికి రెండు పోకడలు అజ్ఞాన జనితలు. అతిపోకడలే. అది ఒక భాష అంతే.వాడుకోగలిగితే, అది పనిచేయగల తావులందు దానిని వాడుకోవాలి. అలాగే మంచి ఎక్కడున్నా స్వీకరించాలి. చెడు విసర్జించాలి. అది ఆస్తికులు చెప్పిందా? నాస్తికులు చెప్పిందా? మరొకరు చెప్పిందా? అన్నది అనవసరమైన గుంజులాట. నేను దాని నుండి బయటపడ్డాను. 

2) ఈనాడు నా గురించి నేను చెప్పుకోవలసి వస్తే, నేను ఏ మతస్తుడనీ కాను, కులస్తుడనీకాను, ఏ వర్గానికి చెంది లేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెబుతున్న విషయం. 

3) వివిధ తాత్వికులు ఎవరికి వారు తాము తెలియవలసింది తెలుసుకున్నామనీ,పొందవలసింది పొందామనీ చెప్పుకున్నారు. దాంతోపాటు తన భావాలతో విభేదించే భావాలు సరైనవి కావని ప్రకటిస్తూనూ వచ్చారు. జ్ఞాన క్షేత్రాలలో ఇది సరైన విధానమే. అయితే ఒకే విషయంపై భిన్నాభిప్రాయాలు వెలవడినప్పుడు, అవన్నీ సరైనవయ్యే అవకాశం లేదన్నది అత్యంత మౌలికమైన నియమం. కనుక రకరకాల ప్రకటనలలో ఏది సరైందో నిశ్చయించుకోవడం సామాజికావసరం. తనది సరైందేనని నిరూపించడం, ఆ ధోరణికిచెందిన వారికి, మరి ఏ ధోరణికి చెందిన వారికైనా సామాజిక బాధ్యత. కనుక భిన్న ధోరణులను పునస్సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి సరైనదని ఖరారయ్యేవరకు ఆ అవసరం ఉంటూనే ఉంటుంది.

4) ఒక వ్యక్తి నిజాయితీపరుడై యుండడానికీ, ఏదైనా విషయంలో నిజం తెలిసి ఉండడానికి చాలా తేడా ఉంది.నిజాయితీ లేనివానికి నిజాలు తెలిసి ఉండడం, నిజాయితీ ఉన్నవానికి నిజాలు తెలిసి ఉండకపోవడం అన్న రెండూ జరిగే అవకాశం ఉంది. కనుక, నిజాయితీపరుడు కనుకఅతడు చెప్పినవన్నీ సత్యాలేననడటంగానీ నిజాయితీ లేని వాడు గనుక అతడు చెప్పినవినిజాలు కావనడం గాని సరైన విధానం కాదు. ఇరువురిలో ఎవరు చెప్పిన దాన్నైనా సత్యాసత్యవిచారణకు లోను చేసి తేలిన దాన్ని స్వీకరించటం అన్నదొక్కటే సరైన రీతి (శాస్త్రీయపద్ధతి) అవుతుంది.

5) వాస్తవిక దృష్టి కలవాడు అప్పటికి తనకెంత తెలుసో ఎంత తెలియదో యథాతథంగా గుర్తించే యత్నం చేస్తాడు. ఆ విషయం చెప్పవలసి వచ్చినప్పుడున్నూ అంతే నిజాయితీతో తన గురించి తానెట్లు గుర్తించుకుని ఉన్నాడో అంతమేరకే వ్యక్తం చేస్తాడు. ఎవరైనా తన భావాలలోని దోషాలను గుర్తింపజేస్తే, వాటిని అంగీకరించి మార్చుకోవడానికిన్నీ అంతేనిజాయితీగా సిద్ధపడతాడు. తెలియనిది తెలుసని గాని, తెలిసింది తెలియదని గాని అనడు.తన యథార్థస్థాయిని తగ్గించుకోవడం గాని, హెచ్చించు కోవడం గాని చేయడు. ఇదే వాస్తవదృష్టి కలవాని తీరుగా ఉంటుంది. అవసరం లేకుండా తనని తాను ప్రదర్శించుకోడు.  అవసరమైన అవసరానికి మించి తనను గురించి చెప్పుకోడు.

6) తెలుసుకుంటే తెలుస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా తేడా ఉంది. పనితో ముడిపడి ఉన్న విద్యలను 'అభ్యాసక విద్యలు' అంటారు. అలాటివాటిని నేర్చుకోవాలి కాని తెలుసుకుంటే సరిపోదు. చూస్తేనూ తెలుస్తుంది. కానీ చేస్తేనే వస్తుంది. ఏమి చెబుతున్నానో అర్థమైందా? ఈ తేడాను గమనించండి. సరిగా వినియోగించుకోండి. నేర్చుకోవలసిన వాటిని తెలుసు కొని తృప్తి పడితే జీవితంలో చాలాచాలా నష్టపోతాడు మనిషి.

7) అప్పటికది తెలియని విషయమై ఉండడం, అప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం లేకపోవడం ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఒత్తిడి చేస్తుండడం, అన్న పరిస్థితిఏర్పడినప్పుడే మనిషి మరో మనిషి మాటను ఆశ్రయిస్తాడు. కనుక అలాంటి పరిస్థితిలోఎదుటివాడు చెప్పిందాన్ని అంగీకరించి మసలుతాడు. అలా తనకు తెలియని విషయాన్ని అవతలివాడు చెప్పగా, సరైనదేనని స్వీకరించడాన్నే నమ్మడం అంటున్నాం. నిజానికి ఇలా నమ్మడం అన్నది మానవ స్వభావం కాదు. దిక్కులేనప్పుడే (మరో ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే) మరొకరి తలను ఆశ్రయించడం, అంగీకరించడం, చేస్తుంటాడు ఏ మనిషి అయినా. అలాంటప్పుడున్నూ, ఎప్పటికప్పుడు అతణ్ణి సంశయం వెంటాడుతూనే ఉంటుంది. 

స్వమంతవ్యంసంచిక (7) 1-9-91

1) మూడు రకాల మనుషులు ఉంటారు లోకంలో. 1) స్వార్ధపరులు, 2) ధార్మికులు, 3) త్యాగులు. (పేజీ 6)

31-8-91 నాటికి ఎక్కువమంది ఆస్తికి ధోరణికి చెందిన వారితోనే నా పరిచయాలు కొనసాగుతూ వచ్చాయి. అందుకనే, పత్రిక పంపుతున్న వారి జాబితాలో ఎక్కువమంది స్వాములే ఉన్నారు. (పేజీ 15)

స్వమంతవ్యంపై విమర్శసమీక్ష సంచిక (8)1-10-91

1) మానవ జీవనయానంలో, విశ్వాసము, వివేకము అన్న రెండూ వేటి పాత్రలనవి పోషిస్తుంటాయి. ఏదో ఒక్క దానితోనే జీవితాన్ని సాగించటం అసాధ్యం. కానీ విశ్వాసాల 

నుండి అనుభవాల వైపుకు, అక్కడి నుండి వివేకం దగ్గరకు మనిషి నిరంతరం ప్రయాణిస్తూ ,ఉండాలి. ఇదే సరైన జీవన గమనం అవుతుంది.

2) ఈ దేశంలోని వివిధ ఆస్తిక సిద్ధాంతకారులు, తమ తమ వాటిలో ఏది సరైనదో• తెలుసుకోవడానికి, సత్యాసత్య నిర్ణయ పద్ధతిని ఎంచుకొని, పరీక్షించుకోవడం చేయకుండా,ఎవరు చెబుతున్న భావం శాస్త్ర హృదయాన్ని తెలిపేదిగా ఉందో తేల్చడం కోసమే చర్చలు : చేస్తూ వచ్చారు. అందుకే, ఆ పనిని వారు శాస్త్రార్ధ నిర్ణయం కొరకు చేసే విచారణ గానేపేర్కొన్నారు కూడా. 'మీ మాంసా వాక్యార్థ విచారణం' శాస్త్ర వాక్యాలకు ఏది, ఎవరు  చెప్పింది అసలైన అర్థమో విచారించడమే సిద్ధాంత చర్చ అంటే, అన్న దగ్గరే ఉండిపోయారు వారంతా. సత్యస్థాపన విషయంలో జరిగిన పెద్ద పొరపాటిది. నిజానికి ఇది వాక్యార్ధం ప్రతిపాదన ఏమిటో నిర్ణయించడానికి పరిమితమైన ప్రక్రియ మాత్రమే. సత్యాసత్యవిచారణలో అసలు జరగవలసింది, ఇలా నిర్ధారింపబడ్డ అభిప్రాయం సరి అయిందా?కాదా? అన్నది కదా వాక్యార్థం ఫలానా అని నిర్ణయించడం అంటే ప్రతిపాదనను ఖరారు చేయడం అనే కదా ఇది సత్యాసత్య విచారణకు ప్రారంభ స్థానం మాత్రమే కదా ఇందుకే మండలి దీని సంబంధంగా ఒక నియమాన్ని రూపొందించుకుంది.

నియమం :- వక్త హృదయం ఇదేనని నిర్ధారణైనాకనే దాని సబబు బేసబబుల గురించి ,ఆలోచించాలి.

3) నిజానికి శాస్త్రంలోని వాక్యానికి ఇదే అర్థం అని నిర్ణయించే అధికారం వ్యాఖ్యాతలకెవరికీ ఉండదు. వారు, ఎక్కువలో ఎక్కువ, భాషా నియమాలను అనుసరించి, 'వాక్యార్థం ఇదే అయ్యుండాలి' అన్నంతవరకు చేయగలుగుతారు. తాను ఏ భావాన్ని పెట్టుకొనిఆ వాక్యాన్ని చెప్పాడో నిర్ణయించాల్సింది, ఆ మాట అన్న వాడు మాత్రమే.

4) దిన చర్య క్రమబద్ధంగా ఉండాలన్న అభిప్రాయం పెంచలయ్య గారు పరిచయం: కాకముందు నుండే మాకు ఉంది. ఒక రకంగా ఆ విషయంలో పెంచలయ్య గారే మా నుండి స్పూర్తిని పొందారని చెప్పవచ్చు. కాకుంటే ఆయన వృత్తి 'ఫిజికల్ ఎడ్యుకేషన్' కనుక మా దగ్గరకు రాకముందే ఆ విషయాలు తెలిసిన వారని అనవచ్చు.మాతో పరిచయాలయ్యాకనూ చాలా కాలం కాలనీయమంతో వ్యాయామాలు చేయలేదు వారు. అనంతర కాలంలోవ్యాయామాన్ని దినచర్యలో భాగంగా మలచుకొని ఆ జీవితం అలానే ప్రవర్తించారు. 

స్వమంతవ్యంపై విమర్శసమీక్ష (2)1-11- 91

1) ఈ సంచికలో పెక్కుమంది మిత్రులు, పాఠకులు, పత్రికనూ, మండలి పోకడనుప్రశంసిస్తూ రాసిన లేఖలు ఎక్కువగా ఉన్నాయి. అట్టి ప్రశంసాత్మక భావాలన్నీ మా సాధన క్రమంలో మమ్మల్ని మరింత జాగరుకతను, బాధ్యతగాను ప్రవర్తించేలా ఒత్తిడిని కలిగించాయి. ఆమేరకు మమ్మల్ని చైతన్యపరిచిన వారందరికీ కృతజ్ఞతలు.

2) సమాజంలోకి వచ్చి తనదంటూ ఒక సిద్ధాంతాన్ని గాని, అభిప్రాయాన్ని గాని ప్రకటించిన వాడు, తనది పరీక్షించమని అన్యాపదేశంగా చెప్పినట్లే. 'మాది పరీక్షింపనక్కరలేదు' అన్న ధోరణి అది ఎంతటి ప్రసిద్ధుల నుండి వచ్చినా సరైంది కాదు. పరీక్షకు ఏది అతీతం కాదు. విమర్శకూ ఏదీ అతీతం కాదు, అన్న నిర్ణయానికి చేరాము అప్పటికే. ఆ అవగాహన పర్యవసానంగానే, మండలి ఆనాటి నుండి నేటి వరకు, విచారణకు సిద్ధమైన వారందరితోనూ,మాది పరీక్షించండి, దోషాలుంటే మార్చుకుంటాము, లోపాలుంటే పూరించుకుంటాము,అలాగే పరీక్షించే మీరున్నూ మా భావాలలోని ఒప్పులను ఒప్పులని అంగీకరించి, స్వీకరించడానికి సిద్ధం కండి అనీ. .

  • మీది పరీక్షకివ్వండి, మేము పరీక్షిస్తాము, ఒప్పులుంటే అంగీకరించి స్వీకరిస్తాము.దోషాలుంటే వాటిని మీరు మార్చుకోవడానికి, లోపాలుంటే పూరించుకోవడానికి సిద్ధపడండి అనీ, దానిని ఒక నియమంగా ప్రకటిస్తూ వస్తున్నాము.

3) 'మానవ జీవితం జ్ఞానాధారంగా నడుస్తున్నది' అన్నది సర్వానుభవ సిద్ధము. ఆ జ్ఞానము తప్పు జ్ఞానము అయిఉండవచ్చు. ఒప్పు జ్ఞానం అయ్యిండవచ్చు. పారిభాషికంగా: వీటినే భ్రమ, ప్రమ అంటారు. ఒప్పు జ్ఞానానికి మరో పేరు యథార్ధజ్ఞానము. ఒక్క పదంలో చెప్పాలంటే 'సత్యము'. ఒప్పు జ్ఞానమన్నా, యథార్ధజ్ఞానమన్నా, ప్రమాణమన్నా, సత్యము అన్నా ఒక్కటే. అవన్నీ సమానార్థకాలు లేదా పర్యాయపదాలు.

4) జ్ఞానము ఏర్పడుతున్న సాధారణ క్రమంలో( దైనందిన జీవితంలో) రకరకాల కారణాలవల్ల ఒప్పు జ్ఞానము తప్పు జ్ఞానము కూడా కలిగే అవకాశం ఉండడం, తప్పు జ్ఞానం కలిగి,దాని ఆధారంగా ఆయా పనులు చేసినప్పుడు అనుకున్న ఫలితాలు రాకపోగా వ్యతిరేకఫలితాలు రావడం, ఒప్పు జ్ఞానం ఆధారంగానే అనుకున్న ఫలితాలు రావడం గమనించాక మనిషికి కలిగిన జ్ఞానం సరైందో కాదో పట్టి చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. సత్యాన్వేషణ దిశగా మనిషి పురికొల్పిన అసలు కారణం ఇదే.

  • సత్య జ్ఞానార్జన బ్రతుకు అవసరం. జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికిఅవసరం. అది ప్రతి మనిషి అవసరం. ఇంకా సరిగా చెప్పాలంటే మెదడున్న ప్రతి ప్రాణిఅవసరం. అందుకు సత్యాన్వేషణే మార్గం. జీవించి ఉన్నంతవరకు ఒప్పు జ్ఞాన అవసరం ఉంటుంది. కనుక సత్యాన్వేషణా అవసరం అవుతుంది. జీవితానికి చెందిన ఈ నిజం తెలిశాకనే, ఆ జీవితం సత్యాన్వేషిగా కొనసాగాలన్న స్పష్టత, నిశ్చయం కలిగింది నాకు.(సశేషం)


ప్రజాస్వామ్యం- అసలు -నకిలీ 

1) "నోరు ఉన్న వాళ్ళను సంతృప్తి పరిస్తే, నోరులేని వాళ్ళ కోసం ఏమి చేయనక్కరలేదు” అన్నదే రాజకీయుల వక్ర రాజకీయాల ఎత్తుగడల్లో ప్రాథమిక సూత్రం. 

2) అధికార వికేంద్రీకరణబలమైన కేంద్రంఒక పరిశీలన.

అవగాహన + విచక్షణా సామర్థ్యము, కార్యకుశలత ఉన్న ఓటర్లు, ఆ స్థాయిలేని ,ఓటర్లు . 

3) చిన్న పార్టీలు. పెద్ద పార్టీలు, ఎక్కువ సంఖ్యలో పార్టీలు, కనీస సంఖ్యలో పార్టీలు. 

4) ఎన్నికల బరిలో ఒకే అభ్యర్థిఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు.

5) ఓటింగ్ శాతం-ఓటు హక్కు-ఓటు విధి; ఈ దేశానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇప్పట్లో ఏది సరైనది?

6) చిన్న పార్టీల నిషేధం, అల్పసంఖ్యాక వర్గాలు ఎన్నికలలో సమష్టిగా పాల్గొనే అవకాశాన్ని లేకుండా చేస్తోంది.

7) రాజ్యాంగంలో పార్టీల ప్రస్తావన లేదు. ఈ పార్టీలు పెట్టుకునే వెసులుబాటు రాజ్యాంగంలోని ఏ సూత్రీకరణల ఆధారంగా ఏర్పడినట్లు?

8) 50% మించి సీట్లు రానప్పుడు దానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశంఉండదు. పాల్గొన్న అన్ని పార్టీలలో దేనికి 50% సీట్లు రాకపోతే పరిస్థితి ఏమిటి? ఏ పార్టీకిఉన్నంతలో ఎక్కువ సీట్లు వచ్చాయో ఆ పార్టీని (ఆ సంస్థను) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం.

  •  లేదా, ఉన్న పార్టీలలో కొన్ని ఒక కూటమిగా తయారై 50% మించి సీట్లుఉన్నాయని గవర్నరుకు విశ్వాసం కలిగించటం ద్వారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడడం.

9) ఆ వచ్చిన సీట్లు కూడా మైనారిటీల ఓట్ల ద్వారా వచ్చినవిగా ఉండడం మరో విషాదం...

  • పోలయ్యేదే 60, 70 శాతం కాగా, అందులో ఏ పార్టీకి ఆ పార్టీకి 50 శాతానికిలోపే ఓట్లు రావడం ఎక్కువ సందర్భాలలో 30% ఓట్లు వచ్చినా గెలిచే పరిస్థితి ఉండడం...

10) కొన్నిసార్లు బలమైన ప్రతిపక్షం కూడా లేని రీతిలో ఉన్న సీట్లలో మూడింట రెండు వంతులకు పైగా 66% మించి సీట్లు గెలిచిన పరిస్థితుల్లోనూ, ఆ పార్టీకి పోలైన ఓట్లలో 50 శాతం లోపే ఉండడం...

11) ఈ రకమైన పరిస్థితులన్నింటి ద్వారా సాంకేతికంగా చట్టాన్ని సంతృప్తి పరచడమేజరుగుతుంది కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి గానీ, దాని సరి అయిన అర్థంలో ప్రజాస్వామ్యంగానీ ఆచరణలో ఉండదు.

  • ఈనాడు ఎన్నికలన్నవి ఒక ప్రహసంగా మారాయన్నది ప్రజాస్వామ్య రూపురేఖ లెరిగిన ఆలోచనపరులలో నిర్వివాదాంశం.

  • ప్రజాస్వామ్యం పేరున బలము, ప్రలోభాలే పని చేస్తున్నాయి. ఇది రాజకీయులందరికీ తెలిసున్న విషయమే. ఎన్నికల పేరున జరుగుతున్న అపసవ్య పోకడలనన్నింటిని వివరంగా రాయాలంటే దానికదే ఒక పెద్ద పుస్తకం అవుతుంది.

12) ఇలాంటి సందిగ్ధ పరిస్థితులలో గెలిచిన అభ్యర్థులను ఆకట్టుకోవడానికి, వారినితమ వెంట నిలబెట్టు కోవడానికి ఆయా పార్టీలు అందులోని బలవంతులు పన్నే పన్నాగాలు,చేసే కొనుగోళ్లు, అమ్మకాల వ్యాపారాలు, నైతిక విలువల కోణం నుండి చూస్తే ఎంతో జుగుప్సాకరంగా ఉంటాయి.

13) ఇలాంటి సందర్భాలు రాష్ట్రంలో ఏర్పడినప్పుడు, కేంద్రంలో పాలనలో ఉన్న పార్టీలుమరో కొత్త పన్నాగాన్ని ఆచరణలోకి తెచ్చారు. రాష్ట్రాలలో తమకు అనుకూలురైన వారిని గవర్నర్లుగా నియమించుకొని, వారి చేత మరో నాటకం ఆడించటం మొదలెట్టారు. ముందస్తు బలనిరూపణతో పని లేకుండానే తమకు ఇష్టమైన వారికి ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశంఇచ్చి, బలనిరూపణకు కావలసినంత సమయాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించడమే ఆకుటిల పన్నాగం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిది ఔనా? కాదా?. 

14) ఇలా జరిగితేనే బాగుండును అనుకునేవారు ఆ ఎన్నికలలో గెలిచిన వారిలో ఎక్కువగానే ఉంటున్నారు. 1)స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినవారు, 2) చిన్నాచితకా పార్టీలఅభ్యర్థిగా గెలిచిన వాళ్ళు, 3) అప్పటివరకు ఏదో ఒక పార్టీలో ఉండి ఎన్నికలలో తిరుగుబాటుఅభ్యర్థిగా నిలబడి గెలిచినవారు....... ఇలాంటి రకమంతా, అలా మైనారిటీ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం వస్తే బాగుండుననే కోరుకుంటున్నారు. ఈ రకం వాళ్ళు, గెలిచినవారిలో ఒక మోస్తరు బృందాన్ని కలిగి ఉన్న వారిని, మీరు ముందుకు రండి, గవర్నర్ను కలవండి, మేము మీకు మద్దత్తు ఇస్తాం అని ఉసిగొల్పేందుకు సిద్ధపడి పోతున్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఇంతకంటే దుస్థితి (శని దౌర్భాగ్యం పెద్ద రోగం) ఏముంటుంది? 

15) అభివృద్ధి, సంక్షేమం పేరిట జరిగే పెద్ద పెద్ద కేటాయింపుల్లో పెద్దవాటా కొట్టేసేఅవకాశం పదవిలో గానీ, ప్రభుత్వంలో గానీ ఉన్నంతకాలం వారు అధికారపక్షంలోఉండడాన్నే కోరుకుంటారు.

16) రాజకీయులలో అధికార దాహం, ధన దాహంతో పాటు, ఆరెంటినీసాధించుకోవడానికి నైతిక విలువలను వదిలేసినతనం ముప్పిరిగా ఉన్నంతకాలంప్రజాస్వామ్యాన్ని కాపాడడం, నిలుపుకోవడం ఎవరివల్లా అయ్యేపని కాదు. ప్రజాస్వామ్యస్ఫూర్తి నుండి జరుగుతున్న ఈ ఎన్నికల తతంగాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తి కల ఎవరుపరిశీలించినా, ప్రజాస్వామ్యం పేరున నియంతృత్వమో, వ్యాపారమోనే నడుస్తోందని తేలిగ్గానే * అర్థమవుతుంది.

17) ప్రస్తుతం నడుస్తున్న కలీ రాజకీయాలలో, విలువలకు తిలోదకాలిచ్చిన వారే, ఇవ్వగలిగిన వారే విజయాలు సాధిస్తున్నారన్నది కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న వాస్తవం.

18) ఈనాడు, అగ్రకులాధిపత్యాన్ని పడదోసి, దళిత బహుజనులు అధికారం చేజిక్కించుకోవాలన్న అరుపులు చాలా వినపడుతున్నై. కానీ, ఆ పోకడ పోతున్న వాళ్ళ అంతరంగాన్ని దగ్గరగా చూడగలిగితే, అందులో సాంఘిక ప్రజాస్వామ్యం నెలకొల్పాలన్న (ప్రజాస్వామ్య సౌధంలోని ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామ్యాలకు సాంఘిక ప్రజాస్వామ్యమేపునాదిగా ఉండాలన్న) అంబేద్కర్ అవగాహనకు అనుకూలత కలిగిందిగా అనిపించడమే  లేదు. ఆవేశము కసి ప్రతీకారము ఒక వైపు, ఆధిపత్యం చెలాయించాలన్న వాంఛ మరోవైపు కలసి రూపొందిన పోకడ గానే ఉంటుందంతా.

19) వ్యక్తిత్వాలు, విలువలు, నలుగురి బాగు లాటి మాటలు మాట్లాడే నిజాయితీపరులనుచూస్తే, పిచ్చి వాళ్ళనో, మారుతున్న సమాజంలో మారడం చేతకాని వాళ్లనో అనుకుంటూ, అట్టివారు రాజకీయాలకు పనికిరాని వారిని భావించటం జరుగుతుంది.

20) రాజ్యాధికారం లేకుండా, సమూల సంస్కరణలు చేయడం అసాధ్యం అన్నది ఎంత నిజమో, ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోని (నిజాయితీగా పెద్దపీట వేయని) రకం, ఏ సామాజిక వర్గాల నుండి అధికారంలోకి వచ్చినా జరిగేది తన గుంపు ప్రయోజనాలకోసొంత ప్రయోజనాలకో వెంపర్లాడడమే.

21) రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాల సాధనకై, ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఆయా స్థానాలలోకి యోగ్యులు చేరనంత కాలం ఎవరిన్ని సూక్తులు వల్లించినా, ప్రజాస్వామ్యంమాత్రం రాదు. ఇంకేదేదో వస్తుంటుంది.

22) నీతి నీతిగా, అవినీతిని అవినీతిగా, జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగా ప్రజలకుచూపించాల్సిన, వినిపించాల్సిన, ప్రసార మాధ్యమాలు (పత్రికలు, టీవీలు, యూట్యూబ్లు, ఫేస్ బుక్ లు) నీతిని అవినీతిగా, అవినీతిని నీతిగా, జరగని దాన్ని జరిగినదాన్నిగా,జరిగినదాన్ని జరగనిదాన్నిగా, చూపించడంలో పోటీ పడుతున్నాయి.

23) పెద్దగా అధికారం లేని, ఈ రోజు దినవారీ ఆడకూలీలకు నెలకు వచ్చేంత కూడా నెలవారీ జీతం లేని పంచాయితీ సర్పంచి పదవికై 20 లక్షల నుండి 60, 70 లక్షల ఖర్చుపెడుతున్నారు. బాగా పోటీ ఉన్నట్లైతే ఈ ఖర్చు కోటి దాకా ఉంటుందన్నది అవాస్థవంకాదు. అతిశయోక్తి కాదు. ఇంతఖర్చుకు వారంతా ఎందుకు సిద్ధపడుతున్నట్లు? 

24) ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువుపట్టు. మొత్తం ఎన్నికల ప్రక్రియలోప్రజాస్వామ్య స్ఫూర్తికి, స్వభావానికి, ప్రతికూలంగా, ఎక్కడ, ఏది చోటు చేసుకున్నా ఏర్పడేదిప్రజాస్వామ్యం మాత్రం కాదన్నమాటే.

1) ఎన్నికల ప్రకటన, 2) అభ్యర్థులు, 3) ఓటర్ల జాబితా, 4) ఓటింగు, 5) ఎన్నికలప్రచారం, 6) ఎన్నికల పద్ధతి, 7) లోకసభ, శాసనసభలలో అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, 8) ఎక్కడైనా అపసవ్యతలు చోటు చేసుకుంటే తీసుకోవలసిన చర్యలు, 9) ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. మొత్తం ఎన్నికల ప్రక్రియలోని భాగాలివే.

25) నడుస్తున్న ఎన్నికల విధానముఎన్నికల సంస్కరణలు. దామాషా పద్ధతి ఓట్ల లెక్కింపు సీట్ల కేటాయింపు.

26) నిర్ణయాధికారం, పర్యవేక్షణాధికారం, సంపద లాభనష్టాలలో న్యాయబద్ధమైన , భాగస్వామ్యం అమలుకాకున్నా, అమలుకు ఏమైనా ఆటంకాలున్నా, ప్రజాస్వామ్యం క్రియారూపాన్ని ధరించనట్లే. ఆచరణలో లేనట్లే.

27) అధికార వికేంద్రీకరణ విషయంలో గాంధీ, అంబేద్కర్ దృష్టికోణం ఏమిటన్న దానికి సంబంధించిన వాస్తవాలుఅవాస్తవాలు, ఎన్నికలలో రిజర్వేషన్లు, దాని వెనుకనున్న హితకాంక్ష, ఉద్దేశ్యము,  జరుగుతున్న వాస్తవము.

28) ఉండవలసింది లేకపోయినా, ఉండకూడనిది ఉన్నా, అట్టి దానిని ప్రజలునిలదీసినప్పుడే పరిస్థితి చక్కబడుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న వ్యవహార ప్రక్రియలోజరిగే మంచి చెడులకు ప్రధాన బాధ్యులు ప్రజలే అవుతారు. కానీ, చక్కచేయాల్సింది ఇక్కడేనన్న విషయంలో ఎక్కువ మందికి అవగాహన లేదు, అవగాహన ఉన్నవాళ్ల వరకైనా శ్రద్ధా, పట్టుదలా, కార్యోన్ముఖతకు అవసరమైన సంసిద్ధతా లేవు.

29) వ్యక్తి గురించి, అంటే మానవుని గురించి, వ్యక్తులతో కూడియున్న సమాజం గురించి, ప్రకృతి గురించి అవగాహనకు రావాలి.

తలశరీరము కలిస్తేనే మనిషి అవుతాడు. తల జ్ఞానానికి, శరీరం కర్మ భాగానికి ,ప్రాతినిధ్యం వహిస్తాయి.

పై రెండూ కూడా వేరు వేరు భాగాలుగా ఉండలేవు. ఒకవేళ వేరు చేద్దామనుకుంటేరెండు ఉండవు, పనిచేయవు. నశించిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. తలకాయ, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం వీటికి చూపు, వినికిడి,వాసన, రుచి, స్పర్శ వీటి ద్వారా ఈ ప్రకృతి నంతటిని, ఈ సృష్టినంతటిని గ్రహించవచ్చు. గతించినదాని ఆధారంగా, వర్తమానంలో జరుగుతున్న దానిని అర్థం చేసుకొని, భవిష్యత్తును నిర్మించుకునే శక్తి, (ఆలోచన) ఆ తలలోపలి మెదడు గ్రహణ కేంద్రంగా పనిచేస్తున్నది.

అలాగునే మిగిలిన శరీర భాగంకాళ్లు, చేతులు, పొట్ట వగైరాలు. కాళ్లు నడకకు,చేతులు పనులకు, పొట్ట ఆహారం జీర్ణం కావడానికి పని చేస్తాయి. పై రెండు భాగాల పనులు కూడా ఒకదానిమీద మరొకటి ఆధారపడి విడదీయరానివిగా ఉంటాయి. దీనిఅంతటినీ వెనుక నుండి వెన్నుముకతో కలిపి ఉన్న శరీరం నిర్మాణమును మనం అర్థం చేసుకోవాలి.

ఇలాంటి జ్ఞానమే మనకు సమాజంపై ఉండాలి. ప్రజాప్రతినిధులు, అధికార ప్రభుత్వఉద్యోగుల వ్యవస్థలు, పంచ జ్ఞానేంద్రియాల, మెదడు గ్రాహక కేంద్రాల, జ్ఞాన భాగముల పనులు చేసి పెట్టే వారిగా ఉంటారు. ప్రజలు తలకాయ దిగువ భాగంగా వెన్నెముకలా,సమాజంగా పనులు చేయించుకుండే భాగంలో ఉంటారు. దీనినే ప్రభుత్వం, ప్రజలు, మన మనిషి శరీరం గానే ప్రకృతిపై నిలబడి జీవన మునుగడ సాగించే వారము అని గమనించాలి. 

30) జాతీయ భావనలేని ప్రజాస్వామ్యాన్ని విథం తెలిసిన వాళ్లు ఊహించటం కూడా కష్టమే. జాతీయ భావన పునాదిగానే మనం ప్రజాస్వామ్యాన్ని నిర్వచించుకోవాలి, వివరించుకోవాలి.

3) క్రమక్రమంగా నైనా సమాజవాద ఆర్థిక విధానానికి పెద్దపీట వేయకుండా, ఆర్ధిక సమానత్వాన్ని గాని, ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని గాని, సాధించడం అసాధ్యం. దీనికి వేరుగాసాధ్యమనే వాళ్ళవన్నీ గాలి మాటలు మాత్రమే.

32) ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు గాని, ప్రాంతీయ పార్టీల స్వభావములో జాతీయ భావం గనుక సన్నగిల్లితే, అది భారత రాజ్యాంగం సూచిస్తున్న , ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబంధకం అవుతుంది అనడంలో సందేహం లేదు. 

33) ఆనాటి పెద్దలు, అప్పటికే ఏర్పడి ఉన్న అసమానతలు తొలగించడానికి 10సంవత్సరములు ప్రత్యేక కేటాయింపులు అంటే రిజర్వేషన్లు ఏర్పరిస్తే సరిపోతుంది అనుకున్నారు. అది ఎలా సాధ్యం అనుకున్నారో తెలుసుకోవాలి. ఆనాటి వాళ్లు సాధ్యంఅనుకున్నది 75 సంవత్సరములు గడచినా ఈనాటికీ ఎందుకు సాధ్యం కాలేదో వాస్తవాల ప్రాతిపదికన బేరీజు వేసుకోవాలి. ఇది ఇలాగే సాగితే ఇంకెంతకాలానికి, అసలు ఏనాటికైనా, రాజ్యాంగం ఆశించిన సమానత్వం వచ్చే అవకాశం ఉందా? లేదా ? అన్నది ఆలోచించాలి.

34) అణగారిన వర్గాలు లేదా బలహీన వర్గాలు నిలదొక్కుకోవాలన్నా, బలపడాలన్నా,ఏ ఏ విషయాలలో వారికి ప్రత్యేక కేటాయింపులు ఉండాలన్న విషయంలో స్పష్టత లేకుంటే, ఇది రావణ కాష్టంలా మండుతూనే ఉంటుంది. నాకు తెలిసి అది ఒకటి విద్యారంగమే. రెండోది ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే వైద్యరంగం. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అన్న , రెండూ నిజమైన ఆచరణ రూపంలో వారికి అందాలి.

35) గతంలో జరిగిన వివక్షతలను, అన్యాయాలను గుర్తుచేస్తూ, ఆ సమూహాలను రెచ్చగొడుతూ, వారిని గుంపులుగా కూడగడుతూ ఉండే యత్నాలన్నీ, రాజ్యాంగ విరుద్ధమైనవే. అంతే గాక, అట్టి పనులు ప్రజల భవిష్యత్తును పెద్ద సంక్షోభంలోకి నెట్టివేయగల వివిధ శత్రుకూటాలుగా వారిని తీర్చుతాయి. అదే జరిగితే, అది ఈ దేశానికి ప్రళయ దుర్ముహూర్తంవంటిదే అవుతుందన్నాడు డాక్టర్ అంబేద్కర్.

36) రాజ్యాంగ నిర్మాతలు ఎంతో లోతుగా ఆలోచించి, ముక్కోణాకృతిగల శాసన,నిర్వహణ,న్యాయ విభాగాలను, పరస్పర సంబంధపడి ఉంటూనే, అదే సమయంలో వాటివాటి కార్యక్షేత్రాలలో స్వతంత్ర వ్యవస్థలుగను ఉండేలా రూపొందించారు. డా. అంబేద్కర్ ఇది అనుకున్నట్లుగా జరుగుతుందా? లేక రాజకీయ వర్గాలు వీటిని అదుపులోకితెచ్చుకుంటాయా? అన్న సందేహాన్ని ఆనాడే వెలిబుచ్చారు. ఆయన సందేహించినట్లేరాజకీయులు వీటిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇంకా ప్రజాస్వామ్యం మాట ఎక్కడ?కనుక రాజకీయ ప్రక్షాళన జరగకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం దుర్లభం.

                                                                                                                                                                            (సశేషం)


No comments:

Post a Comment