Tuesday, October 4, 2022

264 సంచిక వివేకపథం


వివేకపథం 

సంపుటి 8 సంచిక:6 ఆగస్టు 2022


జూలై త్రైమాసిక సమావేశాల విశేషాంశాలు

యోచనాశీలురైన చదువరులారా!

జూలై 21,22,23 తేదీలలో జరిగే మండలి త్రైమాసిక సమావేశాలలో “రాజ్యాంగ లక్ష్యాలు ప్రజాస్వామ్యము రిజర్వేషన్లు” అన్న మూడు అంశాలను లోతుగా పరిశీలించి, "ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక” వీటిపై ఎలాంటి వైఖరి కలిగి ఉంటుందోనన్నది నిర్ణయించి, ఉద్యమ భావజాలంగా సమాజానికి అందించాలన్న సదుద్దేశంతో ఈ సమావేశంపెట్టుకున్నాము.

మొదటి రెండు రోజులు సత్యాన్వేషణ మండలి సభ్యులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికసభ్యులు కలసి పై మూడు అంశాలపై కొంత పరిశీలన జరిపాము. 23వ తేదీన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థలైన జెవివి నుండి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, జంపాక్రిష్ణ కిషోరు గారు, జైభారత్ నుండి రమణమూర్తి గారు, రజనీ గారు, లోకనాథ్ గారు మరికొందరు ఆ సంస్థ సభ్యులూ, కొండలరావు గారు, సత్యాన్వేషణ మండలి బృందము సమావేశంలో పాల్గొన్నారు. తొలిరోజు విచారణను ప్రారంభించడానికి వీలుగా కొన్నిఅభిప్రాయాలను వచ్చిన మిత్రుల ముందుంచానిలా. (గమనిక : ఆనాడు చెప్పనవీ కొన్ని సందర్బాన్ననుసరించి జతపడ్డాయిందులో)

వందల (వేల) సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను వారసత్వంగా అందిపుచ్చుకున్న సమాజం మనది. అందులోనూ సాంఘిక అసమానతలన్నవి ప్రపంచంలో మరే సమాజంలోనూ లేనంత అంతరాలతో కుల వ్యవస్థరూపంలో సంక్రమించిన సమాజం మనది. డాక్టర్ అంబేద్కర్ లాటివారైతే, కుల వ్యవస్థలోని మరీ దిగువ కులాల పరిస్థితి, బానిస వ్యవస్థలోని బానిసల పరిస్థితి కన్నా హీనమైనది,అమానుషమైనది అని సూటిగా, స్పష్టంగా ప్రకటించారు కూడా.

ఆశ్చర్యమనిపించేలా బ్రాహ్మణుణ్ణి మనిషి కంటే పైన, మరీ దిగువ కులాల్ని (అస్పృశ్యులు లనబడిన వారిని) మనిషి కంటే దిగువన ఉంచిన, ఉంచగలిగిన ఒక భయంకర ఎగుడు దిగుడుల వ్యవస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న సమాజం మనది.

విదేశీ పాలన అంతమయ్యింది. స్వదేశీ పాలన ఆరంభమయ్యింది. అది స్థిరంగా, అభివృద్దికరంగా, నాలుగు కాలాలపాటు అందరికీ మేలు కలిగించేలా ఉండే ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవలసిన అత్యవసర పరిస్థితి వచ్చింది. స్వాతంత్ర్యం రాకముందు నుండే దాని కొరకైన ప్రయత్నాలు ఆరంభ మైనాయి. 2 సంవత్సరముల 11 నెలల 18 (17)రోజులపాటు (దాదాపు 3 సంవత్సరములు) అనేకమంది నిపుణులు బృందాలుగా ఏర్పడి,రాజ్యాంగంలో పొందుపరచాల్సిన శాసన రూపాలన్నింటినీ సిద్ధం చేసి, 8 నెలలపాటు ,ప్రజాభిప్రాయానికై వెచ్చించి, రాజ్యాంగ సభలోనూ, ప్రత్యంశం పైనా చర్చించి మరీ సిద్ధం చేసుకున్నాం మన రాజ్యాంగాన్ని. 

అయినా దాని గురించిన భిన్నాభిప్రాయాలు నాటినుండి నేటి వరకూ వినపడుతూనే ఉన్నాయి. 1) అది వివిధ రాజ్యాంగాల నుండి ముక్కలు ముక్కలుగా పట్టుకొచ్చి కుట్టుకున్న అతుకుల బొంత. 2) అది మనుస్మృతికి నకలు. 3) 1935 నాటి చట్టాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకున్నాము. 4) మొత్తం ప్రజలందరి ప్రాతినిధ్యంతో రూపొందిన రాజ్యాంగం కాదది. లాటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటినన్నింటికీ రాజ్యాంగ సభలోనే డాక్టర్ అంబేద్కర్ తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. ఆ సందర్భంలోనే రాజ్యాంగం గురించిచాలా తూకమైన నాలుగు మాటలు చాలా స్పష్టంగా ప్రకటించారాయన.

1) రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించి నెహ్రూ ప్రవేశ పెట్టిన తీర్మానం పై 17-12-1946న అంబేద్కర్ మాట్లాడుతూ, ఆ తీర్మానంలోని ఈ దేశ భావి రాజ్యాంగలక్ష్యాలకు చెందిన భాగం వివాదరహితమైంది. అనన్నాడు. “అది వివాదరహితం ఎందుకైందంటే, ఆ తీర్మానంలో అసమంజసాలు లేవు గనుక” అన్నాడు.

2) “మన పార్లమెంటరీ విధానం ........ సుస్థిరత కంటే జవాబుదారీతనానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. ఇండియా వంటి దేశాలలో ఇది చాలా అవసరమైందిగా ఉంది”. (4-11-48 రాజ్యాంగ సభలో)

3) “అమెరికాది ద్వంద ప్రభుత్వాలు, ద్వంద పౌరసత్వ విధానము. మనదీ ద్వంద ప్రభుత్వమే అయినా, ఒకే పౌరసత్వ విధానము”. ఈ రెంటి విషయములోనూ మనదే మెరుగైన రాజ్యాంగము.

4) అమెరికాఆస్ట్రేలియా రాజ్యాంగాలను పోల్చితే, “ఆస్ట్రేలియన్ రాజ్యాంగంలోపార్లమెంటు చాలా చేయగలదు. అమెరికన్ కాంగ్రెసుకు ఈ శక్తి లేదు. ........ ఆస్ట్రేలియన్ రాజ్యాంగం కంటే మన పురోగతి ఏమిటంటే, మనం మిగిలిన శాసనాధికారాలను పార్లమెంటుకే అప్పగించాము. ...... ఆ రకంగా మన రాజ్యాంగం ఫెడరలిజంలో వీలైనంత సరళత్వాన్ని సంతరించుకుంది”. (పూర్తి వివరాలకు ఆ ప్రసంగ వ్యాసాన్ని చూడండి) 

5) ఫెడరల్ విధానానికి దెబ్బ తగలకుండానే దేశమంతటికీ వర్తించే రూపంలోశాసనాలుండేలా మన రాజ్యాంగాన్ని రూపొందించాము.

ఇవీ మన రాజ్యాంగ ప్రత్యేక లక్షణాలు. దీనిపై విమర్శకులేమన్నది ఇప్పుడు మాట్లాడతాను. 

విమర్శ 1 : “రాజ్యాంగ ముసాయిదాలో సగభాగం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి కాపీ చేయబడింది. మిగిలింది ఇతర దేశాల రాజ్యాంగాల నుండి బదులు తెచ్చుకున్నదితప్ప మరేమీ లేదు”.

సమాధానం : “ఈ రాజ్యాంగాన్ని సరిగా అధ్యయనం చేయనివారే ఈ ఆక్షేపణలు చేస్తారు. ఈ రాజ్యాంగం ముసాయిదాలోని క్రొత్తదనం ఏమిటో మీకు (ఇంతకుముందే) వివరించాను”.

మరో విమర్శ 2 : "మైనారిటీలకు రక్షణలు ఇచ్చినందుకు కూడా రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు”.

సమాధానం : "ఈ విషయంలో ముసాయిదా కమిటీని నిందించకండి. ఇది రాజ్యాంగ సభ వారి నిర్ణయాలను అమలుపరిచింది........ నన్ను అడిగితే ఆ పని మంచిదేననడానికివెనుదీయను. ఈ దేశంలో మైనారిటీలు, మెజారిటీలు కూడా చాలా తప్పుదారిలో నడిచాయి. మైనారిటీల ఉనికిని కాదనడం, మెజారిటీ తప్పు. మైనారిటీలు తమను తాము శాశ్వతీకరించుకోవడం కూడా తప్పే. మొదట మనం మైనారిటీల ఉనికిని గుర్తించాలి. ఆ మెజారిటీలు, మైనారిటీలు ఏదో రోజున ఒకటిగా కలిసిపోయేలా చేయాలి”.

విమర్శ 3 : “మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు సరైన రూపంలో లేవు.ప్రాథమిక హక్కులు పరిపూర్ణంగా లేనంతవరకు వాటిని ప్రాథమిక హక్కులనే అనకూడదు”అన్నది ఆరోపణ. 

సమాధానం : "ప్రాథమిక హక్కులపై వారు చేసిన విమర్శ అంతా ఒక అపోహపై ఆధారపడి ఉందని చెప్పడానికి చింతిస్తున్నాను. ఏ రాజ్యాంగంలోనైనా ప్రాథమిక హక్కులకు పరిమితులుండితీరతాయి”. వీటి విషయమై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంది. 

“భావ ప్రకటనా స్వాతంత్ర్యం అనేది చాలా కాలంగా స్థిరపడిన ప్రాథమిక సూత్రం. అది రాజ్యాంగం చేత కాపాడ బడుతుంది. అంతమాత్రాన బాధ్యతారహితంగా ఏదిబడితేఅది ప్రసంగించడం గానీ, ప్రచురించడం గానీ చేసే పరిపూర్ణ హక్కును అది ఇవ్వదు. అదుపులేని, మితిమీరిన అనుమతిని అది ఇవ్వదు. ఇష్టానుసారంగా చేసే ప్రసంగాలకు రక్షణ ఇవ్వదు. ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసే వారిని శిక్షిస్తుంది”. 

అందుచేత అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా ఉన్నాయనడం,మన రాజ్యాంగంలో లేవనడం తప్పు. కనుక దీనిపై వచ్చిన విమర్శ. 1) అవగాహనారాహిత్యంతో చేసిందో, కావాలని చేసిన తప్పుడు ప్రచారమో మాత్రమేనని చెప్పడానికి విచారపడుతున్నాను."

ప్రభుత్వం తన పోలీసు అధికారాన్ని వినియోగించుకొని, స్వేచ్ఛను దుర్వినియోగంచేసే వారిని శిక్షించవచ్చు. ప్రజాసంక్షేమానికి భంగకరమైన ప్రసంగాలు, ప్రజల నైతికతను పాడుచేసే ప్రసంగాలు, ప్రజా శాంతికి హానిచేసే ప్రసంగాలు ఆపవచ్చు. దీనిని ప్రశ్నించడానికిఆస్కారం లేదు”. ఇందు కొరకై రాజ్యాంగ ముసాయిదా చేసిందేమిటంటే, ప్రాథమిక హక్కుల్ని సంపూర్ణం చేసి, పార్లమెంటుకు పోలీస్ అధికార సిద్ధాంతాన్ని కల్పించమని సుప్రీంకోర్టును కోరకుండా, ఈ ప్రాథమిక హక్కులకై రాజ్యాంగమే పరిమితులను విధించే అవకాశంకల్పించింది. అమెరికా సుప్రీంకోర్టు ద్వారా పరిమితుల్ని విధిస్తే, మనం రాజ్యాంగం ద్వారానేపరిమితుల్ని విధించుకున్నాము. పర్యవసానంలో తేడా లేదు”. 

మన రాజ్యాంగ ముసాయిదాలో ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలు అనుసంధానించబడ్డాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం తయారు చేసిన రాజ్యాంగంలో ఇదొక కొత్తదనం. ఈ ఆదేశిక సూత్రాల పైన కూడా విమర్శ ఉంది.

విమర్శ 4: “ఈ ఆదేశక సూత్రాలు కంటి తుడుపు ప్రకటనలు అన్నారు. ఇవి అమలుకు నోచుకోవు అనన్నారు”.

సమాధానం : “ఈ విమర్శ కేవలం విమర్శ మాత్రమే. వాటికి శాసనబలం లేని మాట నిజమే గానీ, వాటికి ఏ మాత్రం ఆచరణాత్మక శక్తి లేదంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధంగాలేను. అవి నిరుపయోగమన్నా నేను ఒప్పుకోను. ..... మంచి పాలన కోసం, క్రమబద్ధత కోసం, శాంతి కోసం (ఎక్కడెక్కడ) అధికారం అనుమతించబడుతుందో, (అక్కడక్కడ) ఆ అధికారపు అమలును క్రమబద్ధం చేయడానికి కొన్ని ఆదేశాలుండడం అవసరం”.

“ఈ ఆదేశాలను రాజ్యాంగంలో ఉంచడం మరోరకంగానూ సమర్థనీయం. .....ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల ద్వారా పాలన చేపట్టిన వారు, తమ ఇష్టం వచ్చినట్లు పాలించకుండా ఇవి నియంత్రిస్తాయి. పాలన చేపట్టిన వారు ఈ ఆదేశాలను మన్నించి తీరాలి. వీటిని భంగపరిస్తే కోర్టుకు అతడు జవాబుదారీ కాకపోవచ్చు గాని, ఓటరు ముందు ఎన్నికల సమయంలో అతడు జవాబు చెప్పి తీరాలి. హక్కుల బలంతో అధికారం కైవసం చేసుకున్నప్పుడు, ఈ ఆదేశిక సూత్రాలకున్న విలువ ఏపాటిదో అర్థమవుతుంది”.

విమర్శ 5: “కొందరు కేంద్రం బలంగా ఉందంటున్నారు. మరి కొందరు ఇంకా బలంగా ఉండాలంటున్నారు”.

సమాధానం : రాజ్యాంగ ముసాయిదా సమతూకాన్ని పాటించింది. కేంద్రాన్ని మరీ మరీ బలీయం చేసే ధోరణిని మనం వ్యతిరేకించాలి ....... దాని బరువూ బలమూ సమాన నిష్పత్తిలో ఉండాలి. అది మోయాల్సిన బరువు కన్న మించిన బలముండా లనడం పిచ్చితనం తప్ప మరేమీ కాదు.

గమనిక : సంస్థానాల విలీనం విషయంలో అంబేద్కర్ ఇలా అన్నారు. "సంస్థానాలను రాష్ట్రాలలో కలిపేయడం, అలా వీలుకాని వాటిని కేంద్రపాలితప్రాంతాలుగా తీసుకోవడమన్నది చాలా వేగంగా జరిగిన పురోగమనశీలమైన ప్రక్రియ. రాష్ట్రాలలో ఇంకా చేరవలసిన సంస్థానాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత ప్రభుత్వంలోరాష్ట్రాల మాదిరిగానే అవికూడా అంతర్భాగాలు కావాలని కోరుతున్నాను..... ఈ రాజ్యాంగాన్ని గెలిపించే ముందే, సంస్థానాలకు రాష్ట్రాలకు మధ్య ఉండే తేడాలను తుడిచి పెట్టగలమని ఆశిస్తున్నాను”.

విమర్శ 6 : ఇండియాను రాష్ట్రాల యూనియన్ గా పేర్కొనడం సరికాదు.  

సమాధానం : "యూనియన్ అనే మాటను (కావాలనే) ప్రస్ఫుటంగా వినియోగించాము. ముసాయిదా కమిటీ దీనిని ఎందుకు ఉపయోగించిందో చెప్పగలను. ఇతర దేశాల ఫెడరేషన్లలా ఇక్కడి రాష్ట్రాలు చేసుకున్న వడంబడిక కాదు. ఇండియా యూనియన్ నుండి విడిపోవడానికి ఇక్కడి రాష్ట్రాలకు హక్కు లేదు. ఇది (ఇండియా) అవిచ్ఛిన్నమైనది..... దేశమూ, ప్రజలూ, పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ, దేశం ఒకే ఒక అవిభాజ్య రూపం. ఒకే ఒక మౌలిక స్థానం నుండి ఏర్పడిన ఒకే ఒక పరిపాలనలో ఉన్న ఒకే ఒక ప్రజ. అమెరికన్లు తమ ఫెడరేషన్ అవిచ్ఛిన్నమని, ఏ రాష్ట్రానికి దాని నుండి విడిపోయే హక్కు లేదనీ స్థిరీకరించడానికి అంతర్గత యుద్ధమే చేయవలసివచ్చింది. కనుక, దీనిని ఊహలకూ, వివాదాలకూ విడిచిపెట్టే కంటే ఆరంభంలోనే దీనిని స్పష్టం చేయడం మంచిదని ముసాయిదా కమిటీ భావించి, ఆ పదం వాడింది”.

విమర్శ 7 : రాజ్యాంగ సవరణ విధానంపై విమర్శ వచ్చింది. సవరణ చేయాలంటేచాలా కష్టపడాల్సి వచ్చే విధంగా ఉంది సవరణ పద్ధతి అన్నది విమర్శ. రాజ్యాంగంలోని అసంబద్ధతలలో ఒకటి అంటూ వారు ఆక్షేపించారు.

సమాధానం : నిరాధారమైన ఈ ఆరోపణను నేను తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే, అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగాల సవరణ ప్రక్రియలతో పోలిస్తే, మన సవరణ ఏర్పాట్లు సులభాతి సులభం. .... రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకున్న ముసాయిదా కమిటీకి పక్షపాత దృష్టి లేదు. బాగా పనిచేయగల ఒక మంచి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇవ్వడం తప్ప దీనికి మరే స్వార్థ ప్రయోజనమూ లేదు. అలాగే ఈ రాజ్యాంగ సభకు కూడా ఏ స్వార్ధప్రయోజనమూ లేదు.

  • ఈ  ప్రశ్నలుసమాధానాల భాగాన్ని ముగిస్తూ డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడో గమనించండి.

“రాజ్యాంగ ముసాయిదా పై వచ్చిన అన్ని వ్యతిరేక విమర్శలకు సమాధాన మిచ్చాననే అనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని ప్రజల ముందుంచి, గత 8 నెలలుగా వారి నుండి వచ్చిన ఏ ముఖ్య వ్యాఖ్యనూ, విమర్శనూ వదిలివేయలేదనే అనుకుంటున్నాను”.

“నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. దీనిని కొన్ని రాష్ట్ర శాసనసభలు చర్చించాయి. ఆర్థికాంశాల పైనా, ఆర్టికల్ 226 పైన మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. అదీ ఒకటిరెండు రాష్ట్రాల నుండే. ఇది తప్ప ఏ రాష్ట్ర శాసనసభ రాజ్యాంగంలోని ఆర్టికలకు ఏమాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పలేదు”. 

ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు. ముసాయిదా కమిటీయే, రాజ్యాంగ ముసాయిదాను మెరుగుపరచడానికి అనేక సవరణలను సూచించింది. రాష్ట్ర శాసనసభల్లో, జరిగిన చర్చలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రారంభించడానికి ఇది చాలినంత బాగానే ఉందని ధైర్యంగా చెబుతున్నాను. ఇది కార్యశీలమైనది. సరళమైనది. దేశాన్ని శాంతి సమయంలోనూ, యుద్ధ సమయంలోనూ కూడా కాపాడడానికి చాలినంత శక్తివంతమైనదిగా నేను భావిస్తున్నాను.

ఈ క్రొత్త రాజ్యాంగ వినియోగం ద్వారా ఏదైనా చెడు సంభవిస్తే, దానికి కారణం మనది ,చెడ్డ రాజ్యాంగమైనందువల్ల కాదు. అందుకు కారణం మనిషి చెడ్డవాడైనందువల్లనే. అంతే, 

ఆర్యా! రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచుతున్నాను”.

మిత్రులారా! ఉద్యమ సహచరులారా!

డాక్టర్ అంబేద్కర్ ఆనాడు ఒక సాధికారమైన స్థానములో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడిన మాటలివి. అంబేద్కర్ రాజ్యాంగం పై ప్రతికూల దృష్టి కలిగి ఉన్నాడనే వాళ్లకు ఈ వివరాలు అందించాకనూ, బుద్ధి మారకుంటే, అలాంటి మందబుద్ధుల్ని పట్టించుకోకుండడమే మేలు. లేదా అలాంటి అపోహలను జనంలోకి తీసుకెళుతున్నందుకు వారిని కఠినమైన రీతిలో అదుపు చేయడమైనా జరగాలి. ఆ పని ప్రభుత్వం చేయాలి.

ఆయన అవగాహనలోనూ పొరపాట్లుండవచ్చు కదా? అంటూ మరో రకమైన వాదనను తెరమీదకు తెచ్చే అవకాశం ఉంది. అది తప్పని అనను గానీ, అంబేద్కర్ మాత్రం రాజ్యాంగంపట్ల స్పష్టమైన అనుకూల భావన కలిగి ఉన్నాడన్నంతవరకు 100% వాస్తవం అనాల్సిందే. అవన్నీ 04-11-48 నాటి ప్రసంగంలోనివి

  • ఇక, 25-11-1949 నాటి చివరి ప్రసంగంలో మరికొన్ని అభిప్రాయాలు వెల్లడించాడాయన.

ఆర్యా! రాజ్యాంగ సభ డిసెంబరు 9, 1946న మొదటిసారి సమావేశమయ్యింది. అంటే ఇప్పటికి రెండు సంవత్సరముల 11 నెలల 17 రోజులయ్యింది.

ఈ కాలంలో రాజ్యాంగ సభ మొత్తం 11 సార్లు సమావేశమయ్యింది. ఈ సమావేశాల కొరకే 165 రోజులు కేటాయించుకుంది. అందులోనూ ముసాయిదా పరిశీలనకే 114 రోజులు వెచ్చించింది. రాజ్యాంగ ముసాయిదా తయారీకి మూడు సంవత్సరముల సమయంపట్టడంపై, ముసాయిదా కమిటీ తీరిగ్గా పనిచేస్తూ వస్తోందనీ, కాలహరణతో ప్రజాధనందుబారా అవుతోందని ఆరోపణ వచ్చింది. దానికి సమాధానంగా అంబేద్కర్ చాలా వివరంగా ఎంతో బృహత్కార్యాన్ని తాము నిర్వహించామని చెప్పారు. ముసాయిదా పై వచ్చిన 2,473 సవరణలను పరిశీలించి, తమకు ఉత్తమమనిపించిన వాటిని అట్లే ఉంచి, సరిచేయాల్సిన వాటినన్నింటినీ ఎట్టి భేషజానికీ తావియ్యకుండా సరిచేసింది అని చెప్పారు. 

ముసాయిదా కమిటీ చేసిన పని ఒకే ఒక్క రాజ్యాంగ సభ సభ్యుడు తప్ప, అందరూ ఏకగ్రీవంగా సంతృప్తి ప్రకటించారు. ఇందుకు ఆనందిస్తున్నాను.... నిజానికి ఎస్సీల ప్రయోజనాలను కాపాడాలని తప్ప మరే పెద్ద ఆశతోనూ నేను రాజ్యాంగ సభలోనికి రాలేదు. ఇంత బాధ్యతాయుతమైన పనిని నాకు అప్పగిస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. రాజ్యాంగ సభ నన్ను ముసాయిదా కమిటీకి ఎన్నుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ముసాయిదా కమిటీ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పుడు మరీ ఆశ్చర్యం కలిగింది. :

నాకంటే పెద్దవారూ, శ్రేష్టులూ, సమర్థులూ ఉండి కూడా, నా పై ఇంత పెద్ద నమ్మకాన్ని పెట్టుకుని నన్ను తన పనిముట్టుగా ఎన్నుకొని, దేశానికి సేవచేసే అవకాశాన్నిచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఎంతోమంది ఉద్దండులు ఎవరి వంతు వాళ్ళుచేయడం వల్లే ఈ బృహత్తర కార్యం నెరవేరిందని దీనిలో పాల్గొన్న వారందరినీ పేరుపేరునాప్రస్తావించారాయన.

ఏ సూత్రాలపై రాజ్యాంగం ఆధారపడి ఉందో వాటిని సభకు వివరించే అవకాశం నాకు లేకపోయింది. ఈ రాజ్యాంగాన్ని ఎంత ఎక్కువగా సమర్ధించవచ్చో అంత ఎక్కువగా నా మిత్రులు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారూ, టిటి కృష్ణమాచారి గారూ సమర్థించారు. కనుక దీని యోగ్యతపై నేను మాట్లాడను. అయినా ఒకటనిపిస్తోంది. “రాజ్యాంగం ఎంత మంచిదైనాదానిని అమలుపరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలుపరిచే వాళ్ళు మంచి వాళ్ళు అయితే అది మంచిదవడం కూడా అంతే ఖాయం”.

ఈ రాజ్యాంగానికి ఖండన ముఖ్యంగా రెండు స్థానాల నుండి వచ్చింది. ఒకటి కమ్యూనిస్టుపార్టీ, రెండు సోషలిస్టుపార్టీ. వారు రాజ్యాంగాన్ని ఎందుకు ఖండిస్తున్నారు? నిజంగా రాజ్యాంగం చెడ్డదైనందువల్లనా?

సమాధానం : అందుకు 'కాదు' అని చెప్పడానికి సాహసిస్తున్నాను. ఆ రెండు పక్షాల వారి ఖండనా, వారి వారి సంస్థల రాజకీయ ప్రయోజనాల కొరకుగా చేసినవి మాత్రమే.

ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించి, పరిష్కరించుకోవడంలో అలసత్వం చూపకూడదు. అలా అలసించితే, ప్రజల చేత నడపబడేప్రభుత్వానికి బదులుగా, ప్రజలను పాలించే ప్రభుత్వాన్ని కోరుకునేలా చేస్తుంది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి తీసుకునే చొరవలో మనం ఎంత మాత్రం బలహీనంగా ఉండరాదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడ మన్నదొక్కటే దేశానికి సేవ చేసే మార్గం. ఇంతకు మించింది నాకు కానరావడం లేదు.

మిత్రులారా! భారత రాజ్యాంగాన్ని గురించి డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయాలు ఏమిటన్నదిఆయన మాటల్లోనే ఒకంత విపులంగానే పట్టి చూసాం. ఇదంతా గమనించాకనూ, ఇంకారాజ్యాంగంపై అంబేద్కర్ కు సదభిప్రాయం లేదు అనే వాళ్ళుంటే, అట్టి వారి బుద్ధిమాంద్యాన్ని, వక్రబుద్ధిని చూసి జాలిపడతానంతే'. రాజ్యాంగం మంచిది కాదు చెడ్డది అనే తప్పు అభిప్రాయంలో మీరు ఎవరైనా ఉంటే వెంటనే దానిని విడిచి పెట్టండి. మన రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. అయినా సంపూర్ణమైంది కాదు.

ఇంతవరకు మాట్లాడి భారత రాజ్యాంగాన్ని గురించిన సందేహాలకు సమాధానాలు చెప్పి, అపోహలను తొలగించే పనిచేసి, ఆ ప్రకరణను ముగిస్తూ, “ఇక్కడితో నేను దీనిని ముగించవచ్చు. కానీ నా మనస్సు దేశ భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నది. అందుకు సంబంధించిన కొన్ని ఆలోచనలను మీ ముందుంచుతాను” అంటూ ఇలా మాట్లాడాడు.రెండు మూడు విషయాలలో తను ఆందోళన చెందుతున్నానన్నాడు.

1. గతంలో ఈ దేశం స్వదేశీయులే చేసిన దేశ ద్రోహకర చర్యల వలన పరాధీన మయ్యింది. స్వతంత్రతను కోల్పోయింది. మరోసారి కూడా ఇది స్వతంత్రాన్ని కోల్పోతుందా అన్న ఆలోచన నన్ను తీవ్రంగా కలవరపరుస్తోంది.

హెచ్చరిక 1 : “భారతీయులు తమ తత్వాలకు అతీతంగా దేశాన్ని చూస్తారా? లేక దేశానికి అతీతంగా తమ తత్వాలను చూస్తారా? నాకు తెలియడం లేదు. కానీ ఒకటినిశ్చయం. దేశ ప్రయోజనాల కంటే తమ సంస్థల (పార్టీల) ప్రయోజనాలే ముఖ్యమైనవిగా చూచినట్లయితే మనం మళ్ళా స్వాతంత్ర్యాన్ని తప్పక కోల్పోతాము. ఇది నిశ్చయం. కనుక స్థిరచిత్తంతో మనమీ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవాలి. మన చివరి రక్తపు బొట్టు (చివరి శ్వాస) ఉన్నంతవరకు మన స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి కంకణం కట్టుకోవాలి”.

హెచ్చరిక 2 : జనవరి 26, 1950 నుండి ఇది ప్రజాస్వామిక దేశమవుతుంది. అంటే ఆ రోజు నుండి ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రజల చేత నడపబడే ప్రభుత్వాన్ని ఇండియా కలిగి ఉంటుందని అర్థం. ఈ ప్రజాస్వామిక విధానాన్ని ఈ దేశం నిలబెట్టుకో గలుగుతుందా? నిలబెట్టుకో లేదా? అన్నదే నాకు ఆందోళన కలిగిస్తున్న రెండో ఆలోచన. మొదటి ఆలోచన కలిగిస్తున్నంత ఆందోళనా ఇది నాకు కలిగిస్తున్నది.

"బౌద్ధ సంఘాల కాలంలోనే ఇండియాలో పార్లమెంటు పద్ధతి అమలులో ఉండేది. ఈప్రజాస్వామిక విధానాన్ని అనంతర కాలంలో ఈ దేశం కోల్పోయింది. రెండోసారి కూడా అలానే జరుగుతుందేమోనన్నది నా ఆందోళన. ఇండియా వంటి దేశంలో ఇది అసాధ్యం కాదు. ప్రజాస్వామ్యం తన రూపాన్ని అలా ఉంచుకునే, ఆచరణలో నియంతృత్వానికి దారి తీయవచ్చు. ఈ దిగజారుడు ఆరంభమైతే జరిగే రెండో ప్రమాదం మరీ పెద్దదిగా ఉంటుంది”.

ఈ ప్రమాదం జరగకుండా ఉండాలంటే, నా దృష్టిలో మొట్టమొదట చేయాల్సింది, మనం మన సాంఘిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండడమే.

1) రక్తపాతంతో కూడిన తిరుగుబాటు పద్ధతులను మనం విడిచి పెట్టాలి. 2) సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, శాసనోల్లఘన వంటి పద్ధతుల్ని విడిచి పెట్టాలి. సాంఘిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగ పద్ధతులు లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంబించడంలో అర్థం ఉంది. కానీ, రాజ్యాంగ పద్ధతులు అందుబాటులో ఉండగా రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంబించడంలో అర్థం లేదు. ఈ రాజ్యాంగేతర పద్ధతులు అరాచకత్వానికి వ్యాకరణం లాంటివి. వీటిని మనం ఎంత త్వరగా వదులుకుంటే మనకు అంత మంచిది.

హెచ్చరిక 3 : పౌరులు తమ స్వాతంత్ర్యాన్ని ఏ వ్యక్తి పాదాల చెంత సమర్పించకూడదు. దేశానికి జీవితాంతం సేవచేసిన మహా పురుషులకు కృతజ్ఞులమై ఉండడంలో తప్పులేదు కానీ, తన ఆత్మగౌరవానికి భంగం కలిగేంతగా కృతజ్ఞత చూపనక్కరలేదు. కృతజ్ఞత పేరున ఏ స్త్రీ తన శీలానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ఈ హెచ్చరిక ఇతర దేశాలలో కంటే మన దేశానికి చాలా అవసరం. ఎందుకంటే, ఇక్కడ భక్తి భావం లేదా వీరపూజ రాజకీయాలలో పెద్ద పాత్ర పోషిస్తుంది. మత విషయాలలో భక్తి ఆత్మ విముక్తికి ఒక మార్గం కావచ్చునేమో గాని, “రాజకీయాలలో భక్తి లేదా వీరపూజ దివాలా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికీ సూటిదారీ అవుతుంది”. కనుక వీరవిధేయత, నాయకుల పట్ల, పార్టీల పట్ల సేవకుడి వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.

హెచ్చరిక 4 : "మనం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాంఘిక ప్రజాస్వామ్యం చేయాలి. సాంఘిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే రాజకీయ స్వాతంత్ర్యం నిలబడదు. సాంఘిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? స్వతంత్రం, సమానత్వం, సోదరత్వాలను జీవన సూత్రాలుగా గుర్తించి ప్రవర్తించే జీవన శైలియే సాంఘిక ప్రజాస్వామ్యమంటే. ఈ మూడింటి సమన్వయ రూపమే సాంఘిక ప్రజాస్వామ్యం. వీటిని ఒక దాని నుండి మరొక దానిన విడదీయరాదు. అలా విడదీస్తే అది ప్రజాస్వామ్య లక్ష్యాన్ని కూలదోసినట్లు.... సమానత్వం లేకుండా స్వతంత్రం వస్తే (ఇస్తే) అది ఎక్కువమందిపై తక్కువ మంది ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. అయితే స్వతంత్ర సమానత్వాలు సహజ రీతిలో ఉండవు. వీటిని అమలులో ఉంచటానికి ఒక కానిస్టేబుల్ అవసరం. (వారసత్వంగా వచ్చిన భారతీయ సమాజంలో) సాంఘిక రంగంలో సమానత్వం లేదు. అసమానతల శ్రేణి అనే (కుల వ్యవస్థ) సిద్ధాంతంపై మన సమాజం ఏర్పడింది. రెండోది ఈ దేశంలో ఆర్థిక సమానత్వం లేదు. ఆర్థిక రంగంలో కొందరు మహా ధనవంతులు, ఎక్కువమంది మహా దరిద్రులు ఉన్న సమాజం మనది. రాజకీయాలలో మనం సమానత్వాన్నికలిగి ఉంటాము. ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తిస్తాము. కానీ, మన సాంఘిక, ఆర్థిక జీవితంలో, మనకు గల సాంఘిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాము. మన సాంఘిక ఆర్థిక జీవితంలో ఈ సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తుంటాము? చాలా కాలం దీన్నిలానే నిరాకరిస్తూ పోతే, మనం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తున్నామన్నమాట. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత తొందరగా మనం తొలగించాలి. లేకుంటే, అసమానతలతో బాధపడేవారు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేస్తారు. ఈ రాజ్యాంగం ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్యం ధ్వంసం అవుతుంది.

హెచ్చరిక 5: మనలో లేని మరో అంశం సోదరత్వానికి గుర్తింపు. సోదరత్వమంటే ఏమిటి? సోదరత్వమంటే భారతీయులందరి మధ్య మనమంతా అన్నదమ్ములం అన్న భావన.భారతీయులంతా ఒకే ప్రజ అన్న భావన. సాంఘిక జీవితంలో సమైక్యతనూ, సహానుభూతిని, (సంఘీభావాన్ని) కలిగించే సూత్రమిది. 

ప్రజలలో ఈ భావన ఏర్పడడం చాలా కష్టం. భారతీయులు తామంతా ఒకే దేశమని అనుకోవడం ఎంత కష్టమో ఊహించండి. అయితే, ఈ దేశంలో రాజకీయ స్పృహ కల కొందరు మాత్రం భారతదేశ ప్రజలు అన్న మాటను తప్పుపడుతూ, భారత జాతి (భారత దేశము) అన్న మాట సరైంది అనేవారు (నిజానికి) మనమంతా ఒకే జాతి అని నమ్మడం పెద్ద భ్రమకు లోనవ్వడమే. ఎన్నో వేల కులాలుగా చీలిపోయి ఉన్న ప్రజలు ఒకే జాతి ఎలాకాగలరు? సాంఘిక, మానసిక రంగాలలో మనం ఇంకా ఒకే జాతిగా లేమని ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. అప్పుడు మాత్రమే మనం ఒకే జాతిగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించ గలుగుతాము. ఆ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టమే. ఒకే జాతిగా భావించడానికి అడ్డంకిగా ఇక్కడ కులాలు ఉన్నాయి. కులాలు జాతి భావనకు వ్యతిరేకమైనవి. ఎందుకంటే, అవి సాంఘిక జీవితంలో వేరుపాటును కలిగిస్తాయి. కుల సమూహాల మధ్య విద్వేషాన్నీ, అసూయనూ పెంచి పోషిస్తుంటాయి. కనుక అవి జాతి వ్యతిరేకమైన వంటున్నాను. నిజంగా మనం ఒకే దేశంఒకే జాతిగా మారాలని కోరుకున్నట్లయితే, మనం ఈ సమస్యలన్నింటినీ అతిగమించాలి. ఒకే జాతి అనాలంటే ఆ ప్రజల మధ్య సోదర భావం నెలకొని ఉండాలి. ఇక సహోదర భావన లేకపోతే, సమానత్వం, స్వాతంత్ర్యం అనేవి పై పై మెరుగులు (రంగు పూతలు) మాత్రమే అవుతాయి.

హెచ్చరిక 6 : మన ముందున్న, కర్తవ్యాలు (సవాళ్లు) గురించిన నా భావాలివి. ఇవి మీలో కొందరికి రుచించకపోవచ్చు. కానీ, ఈ దేశంలో రాజకీయాధికారం చాలా కాలంగా కొందరి గుత్తాధిపత్యంగా ఉందనడంలో అబద్ధం ఏమీ లేదు. ఇక్కడ చాలామంది బరువులు మోసే పశువులు గానే కాక, బలిపశువులుగానూ ఉంటున్నారు. ఈ ఏకస్వామ్యం (మోనోపలి) అధిక జనుల అభివృద్ధి అవకాశాలను నిర్మూలించడమే కాదు, వారి జీవితాలను దుర్భరంచేసివేసింది. ఈ అణగదొక్కబడిన వర్గాలు గుత్తాధిపత్యపు పాలనతో విసిగిపోయి ఉన్నాయి. తమను తాము పాలించుకోవాలన్న అసహనంతో ఉన్నాయి. ఈ అణగదొక్కబడిన వర్గాలలో తమ సొంత గుర్తింపుకై పడే ఆరాటం, ఒక వర్గ పోరాటంగా గానీ, వర్గాల మధ్య పోరాటంగా గాని మారనివ్వకూడదు. అది ఇంటిని ముక్కలు చేయడానికి దారితీస్తుంది. అది నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తం అవుతుంది. అబ్రహం లింకన్ చెప్పినట్లు ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా తానే చీలిక అయితే అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. అందువల్ల ఎంత త్వరగా (ఈ కొద్దిమంది ఆ అధిక జనుల) ఆకాంక్షలను గుర్తించి నెరవేర్చడానికియత్నిస్తే ఈ కొద్ది మందికీ అంత మంచిది. అది ఈ స్వాతంత్ర రక్షణకు అంత మంచిది. దేశానికి అంత మంచిది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మునుగడకూ అంత మంచిది. జీవన రంగాలన్నింటి లోనూ సోదరత్వాన్ని, సమానత్వాన్ని నెలకొల్పడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అందుకే నే నీ విషయాలను ఇంతగా నొక్కి వక్కాణిస్తున్నాను.

హెచ్చరిక 7: ఇంకా ఎక్కువ సేపు మాట్లాడి ఈ సభకు (మీకు) విసుగు కలిగించదలచుకోలేదు. స్వాతంత్ర్యం అనేది నిస్సందేహంగా సంతోషించదగిన విషయమే.కానీ ఇది మన పైన పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టిందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఇకముందు ఏదైనా చెడు జరిగితే (గతంలోలా) ఆంగ్లేయులను నిందించే అవకాశం లేదు. మనల్ని మనమే నిందించుకోవలసి వస్తోంది. కొన్ని విషయాలలో తప్పులు జరిగే ప్రమాదం పొంచిఉంది. కాలం త్వరగా మారుతోంది. ప్రజలంతా మనతో సహా క్రొత్త క్రొత్త సిద్ధాంతాలవైపు దృష్టి సారిస్తున్నారు. ప్రజల చేత నడపబడే ప్రభుత్వమంటే విసుగు చెంది ఉన్నారు. (ప్రజల చేతకాకుండా) ప్రజల కొరకు నడపబడే ప్రభుత్వానికై సిద్ధపడుతున్నారు. తామే పాలించుకోవడంగా గాక, తమని తమ కొరకు మరొకరు పాలించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మేము ఈ రాజ్యాంగాన్ని ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడి ప్రజల చేతనే నడపబడేదిగా ఉండేలా రూపొందించాము. అలాగే ఉండేలా ఈరాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, ఆ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అడ్డంకుల్ని)గుర్తించడంలో అలసత్వం చూపకూడదు. అలా అలసించినట్లయితే (అజాగ్రత్తగా ఉంటే) ప్రజల చేత నడుపబడాల్సిన ప్రభుత్వానికి బదులుగా, ప్రజల తరపున పాలించే ప్రభుత్వం (మిమ్ము మేము పాలిస్తాము అనే వ్యక్తుల ప్రభుత్వం) ఏర్పడేందుకు దారితీస్తుంది. అలాంటి శక్తులను తొలగించడంలో మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మన యత్నాలు బలహీనంగా ఉండరాదు.

  • ఈ దేశానికి సేవ చేసే మార్గం ఇది ఒక్కటే. దీనికంటే వేరే మార్గం నాకు కానరావడం లేదు.

సారాంశం 

యోచనాశీలురైన మిత్రులారా!

అందరం బాగుండాలి అన్న భావాన్ని, అంగీకరించగలిగిన మానసిక వైఖరి గలవారందరికీ అంబేద్కర్ 1948, 1949 లలో చేసిన రెండు ప్రసంగాల ద్వారా, గతానికీ, వర్తమానానికీ, భవిష్యత్తుకు చెందిన సమస్యలూ, పరిష్కారాలను సూచిస్తూ అక్షర సత్యాలనదగిన భావాలనెన్నింటినో మన ముందు (దేశం ముందు) చాలా సూటిగా ఉంచాడు. నా లెక్క ప్రకారం నిజాయితీ, నిబద్ధత, సమష్టిహితకాంక్ష కలవారికెల్లా అవి శిరోధార్యాలు. ఆయన చూపిన సమస్యా రూపాలను, పరిష్కార రూపాలను గమనించి నడుచుకో గలిగితే ఈ దేశం ఇప్పటికంటే ఎంతో ప్రగతిని సాధించి ఉండేది. గొప్ప విషాదమేమంటే ఆయన ఏ ప్రమాదం రాకూడదనుకున్నాడో, ఆ ప్రమాదం అతను ఊహించిన దానికంటేను పెద్దదిగా, బలంగా స్థిరపడి కొనసాగుతోందీనాడు.

1) ఏక నాయక స్వామ్యం ప్రమాదకరమన్నాడు. అదే అమలవుతోందిప్పటికీ.

2) ప్రజల కొరకు తామే పాలిస్తామనే ప్రభుత్వాలు వద్దన్నాడు. అదే నడుస్తోందిప్పుడు. 

3) అణచివేయబడిన, వెనుకబడిన ప్రజలు, (మెజారిటీ ప్రజలు) అసహనంతో వర్గ పోరాటాలకు దిగితే మహావిపత్తు వచ్చే అవకాశం ఉందన్నాడు. స్వతంత్ర భారతంలో ఆ రకపు విపత్తు ఏర్పడే చిహ్నాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఈ ప్రమాదం నుండి దేశాన్ని ఎట్టి అలసత్వం లేకుండా కాపాడుకోవాలి. ఈ విషయంలో దేశానికి సేవ చేసే మార్గం ఇది ఒక్కటే. ఇంకోటేదీ తనకు కనపడటం లేదన్నాడు గమనించండి.

గమనిక: ఈ మొత్తం వ్యాసం యొక్క సారాంశాన్ని సంగ్రహించుదామనుకున్నాను. ఈకానీ, ఈ వ్యాసాన్ని శ్రద్ధగా చూచి మీరే ఆ సారాంశాన్ని గ్రహించి నాకు తెలిపితే బాగుంటుందని అనిపించింది. ఈ వ్యాసంలో అంబేద్కర్ ప్రధానంగా రెండు అంశాలపై తన భావాలు ప్రకటించారు. 1) రాజ్యాంగం యొక్క బాగోగులు, 2) ఈ దేశం సమైక్యంగా, అఖండంగా, సమానత్వము, స్వాతంత్ర్యాలను అనుభవిస్తూ మన గలగడంలోని సాధక బాధకాలు. ఈ రెండు విషయాలలో డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడన్నది మీకందరికీస్పష్టంగా అర్థం కావాలి. అర్థమయ్యాక అంబేద్కర్ తో ఏకీభవించే వాళ్ళూ, విభేదించే వాళ్ళూకూడా ఉండవచ్చు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఒకే ఒక్క మాట చెప్పి ఆగుతాను. అంబేద్కర్ 'ఒకే ప్రజా-ఒకే దేశం-అందునా సమానత్వం అమలవుతున్న నడక'. ఇదే అతని ఆకాంక్ష, అతడి కల-కల నెరవేరదేమో నన్న ఆందోళన, నెరవేర్చుకోవడానికి మనం ఎలా ఉండాలన్న దిశా నిర్దేశం. ఇదే ఈ వ్యాసం సారాంశం.

23న అంటే మూడవనాటి వివరాలు 

1) రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? 2) బీసీలకు చట్టసభలలో న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలి. 3) అది సవ్యంగా అమలు జరగాలంటే కుల ప్రాతిపదికన జనగణన జరగాలి. 4) స్త్రీలకూ సరైన రీతిలో రిజర్వేషన్లు ఉండాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని విచారణ  మొదలెట్టుకున్నాం. ఆనాటి మొత్తం విచారణలో కొన్నింట ఏకాభిప్రాయం రాగా, కొన్నింట ఇంకా ఏకాభిప్రాయం రానివీ, ఒకటి రెండు భిన్నాభిప్రాయాలున్నవీ ఎదురైనాయి.

1) ఏ సమాజంలోనైనా ఆ సమాజంలోని కొంతమందికి ఆ సమాజం ఏర్పరచుకున్న పోకడ వల్లనే అన్యాయం జరిగితే, అన్యాయానికి గురైన వారికి న్యాయాన్ని అందించాల్సినబాధ్యత ఆ సమాజానిదే అవుతుంది. స్వతంత్ర పూర్వ భారత దేశంలో కుల వ్యవస్థ కారణంగాపుట్టుకతోనే ప్రజలు; అసమానులుగా (అర్హులుగా, అనర్హులుగా, ఉన్నతులుగా, నిమ్నులుగా, అవకాశాలున్నవారుగా, అవకాశాలు లేనివారుగా) విభజింపబడ్డారు. దీనికి కారణం వివక్షకు గురైన వ్యక్తులు కాదు, వారిని వివక్షకు గురిచేసిన సమాజమే. కనుక తాను చేసిన ఆ ఘోరమైన తప్పిదానికి పశ్చాత్తాపబడి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సామాజిక అసమానత కారణంగా విద్యకూ, సంపదకూ దూరమైన వారిని తిరిగి సమానులుగా చేయడానికి అవసరమైన ప్రతి విషయంలోనూ ప్రత్యేక కేటాయింపుల నిచ్చి వీలైనంత వేగంగా వారిని పైకి తీసుకురావాలి. ఇది వారిపై జాలి చూపటం కాదు. వారిని కరుణించడం కాదు. తనతప్పిదానికి పరిష్కారం చెల్లించుకుంటున్నానన్న ఎరుకలో, చిత్తశుద్ధితో చేయాలి. అయితే ఈ ప్రత్యేక కేటాయింపులన్నవి సాధారణ న్యాయ ప్రక్రియ రూపాలు కావు. ఇవి అసాధారణమైనవి. ఆపద్దర్మంగా ఎంచి చేయవలసినవి. తాత్కాలికమైనవి. కనుకశాశ్వతీకరించరానివి. ఎందుకంటే అందించవలసినవి అందించకపోవడం ఒక రకమైన అసమానత కాగా, ప్రత్యేకంగా అదనంగా అందించడం కూడా మరో రకమైన అసమానతే అవుతుంది. కనుక రిజర్వేషన్లు అసమానత్వ లక్షణం కలిగి ఉంటాయి. అయితే ఉన్న అసమానతలను పోనాడడానికై తెచ్చి పెట్టుకున్న అసమానత ఇది. కొన్ని రకాల ప్రత్యేకతలు అసమానతల్ని పుట్టిస్తాయి. రిజర్వేషన్లు అసమానతల్ని పోగొడతాయి. సాధించవలసింది సమానత్వాన్నే కనుక, సమానత్వం రాగానే ఈ ప్రత్యేక కేటాయింపులు రద్దయిపోవాలి. రిజర్వేషన్లను ఎత్తివేయాలి. ఇది నేను రిజర్వేషన్ల విషయములో ప్రకటించిన భావాలు.

2) రమణమూర్తి గారు: రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, అలాగే రిజర్వేషన్లన్నవి తాత్కాలికం, అవి రోగానికి ఔషధం వంటివి. ఈ ఔషధ సేవనం రోగ నివారణకే, కనుక రోగం ఉన్నంతవరకే, రోగ నివారణ అయిన వెంటనే ఔషధ సేవనం ఆపివేయాలి. అయితే ఆ రిజర్వేషన్ల పరిమాణం నిర్ణయించడానికి సరైన విధానం ఉండాలి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు సరిపడినంత లేవు. రిజర్వేషన్లు విద్యా, ఉపాధి, వైద్య రంగాలలోనే గాక ముఖ్యంగా అధికారానికి నెలవైన చట్టసభలలో బీసీలకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇది జనాభా నిష్పత్తిననుసరించి ఏర్పరచాలి. అలాగే జనాభాలో సగంగా ఉన్న మహిళలకూ అన్ని రంగాలలోనూ ఆ మేరకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇదంతా సవ్యంగా జరగాలంటే, కులాల ప్రాతిపదికన జనగణన జరపాలి. ఈపని తక్షణం మొదలెట్టేలా మన వేదిక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కనుక చట్టసభలలో బీసీలకు తగినంత ప్రాతినిధ్యంఅదెంతో నిర్ధారించడానికి కుల ప్రాతిపదికన జనగణన అన్న వాటికై ఉద్యమించాలి. అందునా ముందుగా కుల జనగణన జరగాలి. అవి రమణమూర్తిగారి అభిప్రాయాలు.

3) డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు : మీ ఇరువురు చెప్పిన వాటిలోనూ మీతో నాకు ఏకాభిప్రాయం ఉంది. రిజర్వేషన్లు సామాజిక వ్యవస్థ కారణంగా ఏర్పడ్డ అసమానతలను తొలగించడానికిఅవసరమైనవే. అయితే అవి శాశ్వతీకరింపబడకూడదన్న అంశాన్నీ చాలా మౌలికమైనదిగానూ, గమనికలో ఉంచుకోవాలి.  

గమనిక: మొత్తంగా రిజర్వేషన్లు (ప్రత్యేక కేటాయింపులు) అనవసరమని ఎవరు అనలేదు. అవసరమే నన్నంతవరకు వేదిక ఏకాభిప్రాయం కలిగి ఉంది.

ఖచ్చితమైన నిర్ణయానికి రాని అంశాలు

ఉద్యోగ కల్పనఉపాధి కల్పన అన్నవి రెండు వేరువేరు విషయాలు. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఏర్పడి ఉండడం అవసరం. అది జీవించే హక్కుకు సంబంధించిన అంశం కనుక ఉపాధి కల్పన అన్నది సామాజిక బాధ్యత. ఇక ఉద్యోగాలన్నవి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన విభాగాలలో, ప్రజల కొరకు పని చేసే ఆయా స్థానాలలోకి వ్యక్తుల్ని నియమించడానికి సంబంధించినవి. కనుక ఆయా స్థానాల పనితీరుకు సంబంధించిన నిపుణ శ్రమ చేయగల సమర్ధుల్ని ఎంపిక చేయడం ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు జరగాలి. ఏ కారణాలు చూపిగానీ, సమర్థత లేని వారిని ఉద్యోగాలలో నియమించరాదు. ప్రత్యేక కేటాయింపుల పేరున, సమర్థులకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడరాదు.

అవసరమైన ఉద్యోగాల సంఖ్య - సిద్ధమైన ఉద్యోగార్ధుల సంఖ్య మధ్య సమతూకం లేకపోవడం మనం ప్రతిసారి చూస్తున్నాం. 100 ఉద్యోగాలు అవసరం అనుకుంటే ఆ ఉద్యోగం కోసం పరుగులెత్తే వారు వేలల్లో ఉంటున్నారు. ఆ ఉద్యోగం కోసం వచ్చిన వారినుండి అవసరమైన 100 మందిని ఎంపిక చేసుకోవడం ఎలాగన్నది, అందరికీ సమన్యాయం జరగాలన్న ప్రాథమిక సూత్రం రీత్యా, చాలా చాలా కీలకమైనది. అంతేకాదు, ఆ ఉద్యోగాలు ఉద్యోగార్థుల కొరకు, వారి హక్కుల అమలు కొరకు ఏర్పడినవి కావు. ప్రజల అవసరాలు తీర్చడానికని రూపొందించబడ్డవి. కనుక ప్రజలకు అవసరమైన సేవలు చేయడం విషయంలో, వచ్చిన వారి నుండి ఎక్కువ సమర్ధత కలిగిన వారినే ఎంపిక చేసుకొని తీరాలి. కనీససామర్ధ్య స్థాయి విషయంలోనూ విద్యాలయం వారు ఉత్తీర్ణత కొరకు పెట్టిన కనీస మార్కుల ప్రాతిపదికను, కనీస అర్హతగా నిర్ణయించనే కూడదు. కనీస అర్హతను 60% మార్కులకుపైనే అని పెట్టి ఎంపిక 100% మార్కుల నుండి మొదలెట్టాలి. శాస్త్రీయమైన ఈ విధానాన్నిగనుక పాటించకుంటే, తగినంత సమర్థత లేని వాళ్ళు రిజర్వేషన్ల పేరిట ఉద్యోగాలలో కూర్చొని అరకొర సేవలే అందిస్తారు. పైగా ఆ లోపం తాత్కాలికంగా కాక అతడు ఉద్యోగ విరమణ చేసే పర్యంతం ప్రజలంతా అనుభవించాల్సి వస్తుంది.

నేనిప్పుడు ప్రస్తావించిన అంశం దేశ పురోభివృద్ధికీ, ప్రజల అవసరాలు సజావుగా తీరుతుండటానికి అత్యంత ఆవశ్యకమై ఉంది. నిజానికి నేనీ చర్చను ఆరంభించే సమయానికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండకూడదు అన్న నిర్ణయంలోనే ఉన్నాను. అణచివేయ బడిన, బలహీనంగా ఉన్న వర్గాలకు వారు సమర్ధులు కావడానికి ఎన్ని రకాల ప్రత్యేక కేటాయింపులు అవసరమైతే అన్నీ కేటాయించి, అన్ని కోణాల నుండి వారిని సమర్థులను చేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా వ్యవస్థను రూపొందించి, రాష్ట్రంలోనే అత్యంత నిపుణులుగా ఎంపిక చేయబడ్డ వారిని ఆ పనిలో వినియోగించాలి. ఉద్యోగాలకై ఏర్పాటు చేసే పోటీ పరీక్షలలో మరెవరు వీరికి దీటు కాలేరన్నంత శిక్షణ వారికి అందేలా చూడాలి. ఉద్యోగ నియామకాలు మాత్రం సామర్ద్య పరీక్ష నుంచే జరగాలి. అక్కడ ఏ రకమైన ప్రత్యేక కేటాయింపులు ఉండకూడదన్న అభిప్రాయంలో ఉన్నాను. మా చర్చలో ఉద్యోగ నియామకాలలోనూ ప్రత్యేక కేటాయింపులు (రిజర్వేషన్లు) ఉండాలన్న అభిప్రాయాన్ని అనేకమంది బలంగా ప్రతిపాదించడంతో, అసమర్థులైనా రిజర్వేషన్ల పేరున ప్రజలకు సరైన సేవలందించలేని వారిని ఎంపిక చేయడం (ప్రజల నెత్తిన పెట్టడం) తప్పుడు విధానం అవుతుంది కదా? అసమర్థులైనా కేటాయించిన మేర వారికే ఉద్యోగాలివ్వాలంటారా? అని ఆ పక్షం వారిని అడిగాను. రిజర్వేషన్లున్నంత మాత్రాన అసమర్థులనైనా ఎంపిక చేయాల్సిందేనన్న రూలేమీ లేదు కదండీ? మేము అలా అనడం లేదు కదా అని ఆదిత్య ప్రదీప్ అన్నాయన అన్నారు. అలాంటి నిబంధన చట్టబద్ధంగా లేకపోయినా, మాలాంటివారు అనకపోయినా ఆచరణలో చాలాసార్లు అదే జరుగుతోంది కదా. 30% రిజర్వేషన్ అనుకుందాం. సాధారణంగా ఎంపిక పద్ధతిలో ఎంపిక చేయాల్సిన 70% మందికి గాను ఉద్యోగార్హులుగా 100 మార్కుల నుండి 90 మార్కుల లోపు వారే 70% పైగా ఉన్నారు. ఇక రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన 30% కొరకు 30% సంఖ్య కంటే ఎక్కువ మందే పరీక్షకు హాజరైనారు. వారిలో 100 మార్కులవారు ఒకరిద్దరున్నారు. 90 మార్కులు పైబడిన వారు మరో ఐదు ఆరుగురు ఉన్నారు.మిగిలిన వారు 35 నుండి 60 మార్కుల లోపు వారున్నారు. అందులోనూ 60 మార్కులవారు 10 మంది ఉన్నారనుకుందాం. 30%లో మిగిలిన వారిని సాధారణ ఉత్తీర్ణతకుచెందిన 35 మార్కులు వచ్చిన వారి వరకు ఎంపిక చేయటం జరుగుతుందా? లేదా? అని అడిగాను. అవును అలాగే జరుగుతుంది. 30% రిజర్వేషన్లు పూర్తి చేయడానికి ఇప్పటివరకు జరుగుతున్న విధానం ఇదేనని దాదాపు అందరూ అంగీకరించారు. ఎవరైనా అలా జరగడం లేదన్నట్లయితే వాదనను ఆపి వాస్తవాలను నిగ్గు తేల్చుకోవడానికి ఆయా ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రకారం నియమింపబడ్డ వారి వివరాలు చూడాల్సి ఉంటుంది అని చెప్పాను.

ఇప్పటివరకు జరుగుతున్న ఎంపిక విధానంలో సాధారణ ప్రక్రియలో 70% ఉద్యోగాలు భర్తీ అయ్యాకనూ, 89 మార్కులు వచ్చిన వారు ఖాళీలు లేక ఊరుకుంటున్నారు. మరో వంక 30% రిజర్వేషన్ల విషయంలో మార్కులు అత్యున్నతంగా 60 వచ్చినట్లయితే అక్కడినుండి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఖాళీలు గాని మిగిలి ఉంటే చివరకు 35 మార్కులు వచ్చిన వానికి ఉద్యోగం లభిస్తుంది. ఇలాంటి ఎంపిక విధానం వల్ల సేవా లోపము జరగడం ద్వారా, ప్రజలు పెద్ద సంఖ్యలోనే బాధలు అనుభవిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించే పదోన్నతుల విషయంలోనూ అపసవ్యత చోటు చేసుకుంటుంది. సీనియారిటీ ప్రకారం రావలసిన పదోన్నతులు రిజర్వేషన్ల కారణంగా కొందరు సీనియర్లకు రాకుండా పోతున్నాయి. వారి కంటే వెనుకనున్న వారికి పదోన్నతి లభిస్తోంది. ఆ క్రమంలోనే సీనియర్లు, సామర్థ్యం ఎక్కువగా ఉన్న వాళ్ళూ , జూనియర్ల క్రింద, సామర్థ్యం లేని వాళ్ల క్రింద, పనిచేయాల్సివస్తోంది. దీనికి సంబంధించిన మరో అపసవ్యత వాస్తవంలో చోటుచేసుకుని ఉంటుంది. సాధారణ వర్గం క్రిందికి వచ్చేవారికి 25 సంవత్సరముల గరిష్ట వయోపరిమితి ఉంటే, రిజర్వేషన్లు ఉన్నవాళ్లకది 30, 35 సంవత్సరాలుగానూ ఉంటుంది. అంటే 80, 90 మార్కులువచ్చి రిజర్వేషన్ల కారణంగా 25 సంవత్సరముల వయోపరిమితి దాటిన వారికి ఉద్యోగ అవకాశాలే లేకుండా పోతుండగా, 35 నుండి 60 మార్కులలోపు వచ్చిన వారికి 30, 35సంవత్సరముల వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీనిని అందరికీ న్యాయం (ప్రతి ఒక్కరికి న్యాయం) అందుతుండాలనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రానికి ఎలాఅన్వయించగలుగుతారు? వీటికి యోగ్యమైన సమాధానాలు ఆ సమావేశంలో రాలేదు. వీటన్నింటికంటే రిజర్వేషన్ల పేరున సమన్యాయం జరగని చీకటి కోణం మరొకటుంది. మన వ్యవస్థ ప్రజలను మైనారిటీలు గాను, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గాను మాత్రమే విభజించింది. కానీ ఆ వర్గీకరణల క్రింద మళ్ళా అనేక మతాలు, కులాలు ఉంటున్నాయి వాస్తవంలో. వాటి వాటి దామాషా ప్రకారం అందరికీ రిజర్వేషన్లు అందడం లేదు. అందరికీ తెలియడం కోసం ఒకటి రెండు జరుగుతున్న సంఘటనలనే మీ దృష్టికి తెస్తాను. 

1) ఎస్సీల క్రింద 61 కులాలు ఉన్నాయి. సామాన్య జనం ఎస్సీలనగానే మాలలు, మాదిగలు అనుకుంటుంటారు.

2) ఎస్టీలు క్రింద 33 కులాల వారు ఉన్నారు. సామాన్యంగా గిరిజనులు అననడంవాడుకలో ఉంది.

3) బీసీలు క్రిందకు 140 కులాలు వచ్చాయి. అందులో ఆరేడు కులాల వాళ్ళు కొద్దిగా పుంజుకొని ఉన్నారు. ఇలా ఏ వర్గాన్ని తీసుకున్నా ప్రత్యేక కేటాయింపుల (రిజర్వేషన్ల)ప్రయోజనం నెరవేరకపోగా, వాటిని అడ్డు పెట్టుకొని ఆ వర్గాలలోని నోరు వాయి ఉన్న కొద్ది మందే లబ్ధి పొందుతూ వచ్చారు. 75 సంవత్సరముల స్వతంత్ర భారత చరిత్రలో చూడగలిగినవాళ్లకు ఇది కళ్ళకు కట్టినట్లు కనపడే వాస్తవం.

మచ్చుకు ఎస్సీ రిజర్వేషన్ల విషయం చూద్దాం. మాల మాదిగల వరకు పరిమితమై ఏమిజరిగిందో చూద్దాం. ఉజ్జాయింపుగా మాల మాదిగల జనాభా నిష్పత్తి 30 : 70గా ఉంటుంది. రిజర్వేషన్లను వాడుకున్న పరిమాణాలు పై నిష్పత్తులకు పూర్తి భిన్నంగా మాలలు 70%, మాదిగలు 30% ప్రయోజనాలు పొందారు. ఇక మిగిలిన 5 కులాల పరిస్థితి మరీ అధ్వానం. ఈ అన్యాయాన్ని చాలా కాలం మాదిగలు గుర్తించలేదు. ఒకరిద్దరు గుర్తించినా న్యాయం కొరకు యత్నించలేదు. కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఈ అన్యాయంపై పోరాడటానికి సిద్ధపడ్డారు. దాంతో మాల మాదిగలను ఆ రెండు కులాల నాయకులు వారికి వత్తాసు పలికే పార్టీలు శత్రుకూటాలుగా తయారు చేశారు. ఈ రెండు కులాలు అగ్రకులాలతో పోరాడడం అలా ఉంచి, తమలో తామే కొట్టుకుచస్తున్నారు. జనాభా నిష్పత్తిననుసరించి మా వాటా మాకు రావాలని ఎస్సీల పేరున అడిగిన వాళ్లే, అదే జనాభా ప్రాతిపదికన తమవర్గములోని ఇతరులకు ప్రత్యేక కేటాయింపుల్ని పంచడానికి సిద్ధం కాకపోవడం విడ్డూరం కాదూ! పైగా మాలలే ఏ,బి,సి,డి వర్గీకరణ జరపకూడదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం, రాజ్యాంగపరంగా అలాంటి వర్గీకరణకు అవకాశం లేదని సాంకేతిక అడ్డంకిని చూపి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడాన్ని ఏమనుకోగలం?

ఎలా అగ్రకులాలవారు మిగిలిన బహుజనులకూ అందాల్సిన భాగాన్ని తామే అనుభవించారో, అనుభవిస్తూ ఉండడానికి అలవాటు పడ్డారో, అలానే మాలలులోనిబలవంతులు కొద్దిమంది ఎస్సీలకు వచ్చే బహుజనులకు అందాల్సిన భాగాన్ని తామే కొట్టేసి,కొట్టేస్తూ ఉండడానికి అలవాటు పడిపోయారు.

ఇదే పోకడను ఎస్టీ వర్గంలోని కులాలుకూ, ఓసి వర్గంలోని కులాలకు వర్తింపజేసి చూడవచ్చు. ఇదే సూత్రం నాకు తెలిసి మైనారిటీలకు అన్వయిస్తుంది. మొత్తం మీద ఏమిజరుగుతూ ఉంది? ఏ కులం, ఏ సామాజిక వర్గం క్రింద ఉన్నవాళ్లయినా, వారందరికీ అందాల్సిన ప్రయోజనాలు, ఆ వర్గంలోని బలం ఉన్న వారికే అందుతున్నాయి. అందుతున్నాయనడం కంటే వారే సొంతం చేసుకుంటున్నారు. వారిలో ఎవరికీ నైతిక శీలం గాని, తన గుంపులోని ప్రక్కవానికి న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలన్న సోయగానీ ఉండడంలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఒక నిజాన్ని చెప్పుకొని తీరాలిక్కడ. అనాదిగా బ్రాహ్మణాది అగ్రకులాలవారు ఎలా మిగిలిన సమాజం అంతటికీ సమానంగా పంచడానికి సిద్ధపడలేదో, అనంతరం అగ్రకులాలుగా తీరిన కమ్మ, రెడ్డి కులాలు అలానే మిగిలిన శూద్ర కులాలకు సమానంగా పంచటానికి సిద్ధపడలేదు. ఇక మిగిలిన వెనుకబడిన కులాల క్రిందికి చేరిన సమూహంలోనూఒకింత పై స్థానంలో ఉండి బలం ఉన్నవాళ్లు అదే సూత్రాన్ని పాటించి అందరికీ చెందాల్సిందాన్ని కొందరే పుచ్చేసుకుంటున్నారు. షెడ్యూల్డ్ తెగల వారిలోనూ ఇదే వరుస అమలయింది. వారిలోని 33 కులాలలో నాలుగైదు కులాలే ఈ కేటాయింపులనువాడుకున్నాయి. నా దగ్గర తగినంత సమాచారం లేదు కానీ మైనార్టీ విభాగంలోనూ సమన్యాయం జరిగి ఉండదు. అక్కడా అందులోని బలవంతులు కొందరే వారి కేటాయింపుల మొత్తాన్ని అనుభవించి ఉంటారు. (వారి వివరాలు సేకరిస్తాను). 

ఇదంతా నిష్పాక్షికంగా పరిశీలిస్తుంటే ఏమని తేలుతోంది? అంతా 'బలవంతుడిదే రాజ్యం' గొడవే. ఉమ్మడి భావన గాని, నైతిక శీలంగాని దాదాపు శూన్యం. అతి కొద్ది మంది, మంది బాగునాలోచించే వాళ్ళున్నా వారి ప్రభావం వ్యవస్థ పనితీరుపైన అతి స్వల్పం. కనుక రిజర్వేషన్లప్రధాన ఉద్దేశం నెరవేరాలంటే ఏమి చేయాలి? ఆ చేసే ప్రత్యేక కేటాయింపుల కారణంగా ప్రజలకు అందాల్సిన సేవలు సక్రమంగా అందుతుండాలంటే ఏమి చేయాలి? ఇదే ఈనాడు సంఘహితైషులూ ప్రజాస్వామ్యవాదుల ముందున్న పెను సవాలు. పెద్ద సమస్య. 

కొన్ని సూచనలు చేస్తాను మీరు పరిశీలించండి.

1) అత్యంత కీలకమైన భావం; రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉద్దేశించిన సందర్భంలోనే రిజర్వేషన్ అక్కర్లేని సమాజం (పరిస్థితి) ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏర్పడాలి అన్నదీ మన ఆలోచనలో ఉండాలి. అంటే వీలైనంత త్వరగా ప్రత్యేక కేటాయింపులను ఎత్తివేసే ఉద్దేశంతోనే ప్రత్యేక కేటాయింపుల ప్రక్రియ ఆరంభం కావాలి. నిజాయితీగావాళ్లను మనలో కలుపుకోవాలనుకుంటే, ఇంతకంటే మంచి ఆలోచన లేదు.

2) ప్రత్యేక కేటాయింపులు అవసరం ఉన్న  వర్గాలకు కేటాయించిన ఆ కేటాయింపులు, ఆ వర్గంలోని బలం ఉన్నవారికి అందడంతో మొదలెట్టకుండా, బలహీనంగా ఉన్న వారితో మొదలెట్టి, అందరికీ అందేలా ప్రణాళికా రచన, సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి.

3) ప్రత్యేక కేటాయింపు ప్రయోజనాలు పొంది ఎదిగిన వారిని, కచ్చితంగా రిజర్వేషన్ల పరిధి నుండి తొలగించి, సాధారణ ప్రక్రియకు చెందిన వారిగా నమోదు చేయాలి. :

4) ఆయా పనులకు సంబంధించి అవగాహన నేర్పరితనము అలవరచడానికి ఉద్దేశించిన శిక్షణాలయాలలో ప్రవేశానికి నిర్బంధం చేయాలి. ఏ విద్యను నేర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వరకు, అది సమాజ అవసరాలకు లోబడి, వ్యక్తులకుండాలే గాని,: ఏదో ఒక దానిలో చేరక తప్పదు అన్న శాసనము ఉండాలి.

5) ఎక్కువమందికి ఉద్యోగ కల్పన అన్న తప్పు భావన నుండి బయటపడి అందరికీ ఉపాధి కల్పన అన్న దృష్టి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టాలి.

6) సిఫారుసులు, వంకర దారులంట ప్రవేశాలు జరక్కుండా అంతా బహిరంగ పద్దతిన పారదర్శకంగానే ఎంపిక ప్రక్రియ నడిచేలా విధివిధానాలు కఠినతరంగా ఏర్పరచి పకడ్బందీగా అమలుపరచాలి.

7) రిజర్వేషన్ల ప్రక్రియ ప్రధానోద్దేశం సాంఘిక, ఆర్థిక, రాజకీయ క్షేత్రాలలో వివక్ష కారణంగా వెనుకబడిన వారిని సమానులుగా చేయాలన్నదే కనుక, ఆ మూడు విభాగాలలోను ప్రత్యేక కేటాయింపుల ప్రక్రియను అమలు చేయాలి. అయితే సాంఘికంగా వెనుకబడినసమూహాలకు, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలకు ఈ కేటాయింపుల ప్రక్రియ వేరువేరుగా ఉండాలి. రెంటిని కలగాపులగం చేయరాదు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే రిజర్వేషన్లు వారిపై ఆర్థికభారం పడకుండా ఉండేలా ఆర్ధికపరమైన రాయితీలకు పరిమితమై ఉండాలి. సాంఘికంగా వెనుకబడిన వారికిచ్చే రిజర్వేషన్లలో ఆర్థిక రాయితీలే కాక, ఆ వర్గాలకు చెందిన కేటాయింపులుండాలి. నిర్బంధ ఉచిత విద్య అన్న భావన చాలా ఉదాత్తమైనది. కానీ దానికి 'నాణ్యమైన' అన్న పదం చేర్చి, సక్రమంగా అమలు చేయగలిగితేనే ఆ ఉద్దేశ ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే శాసనాలెంత మంచివైనా దానిని అమలుపరచకుంటే, రావలసిన ఫలితాలు రాకపోగా రాకూడని ఫలితాలు వస్తాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలవారు కాక, ఇతర అగ్రకులాలకు చెందిన పేదవారికి అందరికీ చెందిన విద్యాలయాలలోనే ప్రవేశం కల్పించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఒక ప్రత్యేక గురుకుల పాఠశాలలూ, బీసీలకు మరో ప్రత్యేక పాఠశాలలూ ఏర్పరిచి విద్యార్థులు అక్కడే ఉండేలా భోజన వసతులు అక్కడే కల్పించాలి. ఇక మైనారిటీ వర్గంగా చూడబడుతున్న వారిని ఆ భావన నుండి బయటపడి తాము అందరిలో ఒకరము అనుకునేలా మెజారిటీ ప్రవర్తించేలా చర్యలు తీసుకోవాలి. వారూ 100% భారతీయులు గానే మిగిలిన సమాజం గుర్తించాలి. వారూ తమని తాము అలాగునే భావించుకుని ప్రవర్తించాలి. తాము వేరని మైనారిటీలు గానీ, వారు వేరని మెజారిటీ వారు గానీ తలంచేలా ఇరుపక్షాలు ప్రవర్తించకూడదు. ప్రభుత్వాలూ అలా జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రతిచర్యా ఖచ్చితంగా తీసుకోవాలి. వారికి విడి పాఠశాలలు పెట్టకుండడమే మంచిది. మిగిలిన అన్ని విషయాలకంటే, వారిని మనలో (మొత్తం జాతితో) మమేకమయ్యేలా మిక్కిలి శ్రద్ధ పెట్టడం అవసరం. కనుక వారికి అందరికీ చెందిన పాఠశాలలోనే ప్రవేశం కల్పించాలి, ప్రతి పాఠశాలలోనూ, విద్యలో వెనుకబడిన విద్యార్థుల కొరకై ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న, ఒక చట్టమే ఉండాలి. ఎక్కడికక్కడ అసమానుల్ని సమానుల్ని చేయడం ఎలాగన్నదే ప్రధాన లక్ష్యంగా ఆచరణ ప్రణాళిక ఉండాలి. సమానత్వ సాధన అన్నదొక్కటే మిగిలిన దేనికంటేను ప్రథమ గణ్యమైనది అన్న భావన వ్యక్తులలో కలిగించాలి. అందుకు తగిన నడక సాగేలా కార్యక్రమాలు ఉండాలి.

చాలా కీలకమైన మరో అంశాన్ని చెప్పుకుంటే తప్ప ఈ చక్క చేసుకునే పనికి సమగ్రత రాదు. గతాన్ని తవ్వి తలకెత్తుతూ, అగ్రవర్ణాల వారిపై ఆగ్రహావేశాలు రగిలేలా ఈ ప్రత్యేక కేటాయింపులకు చెందిన వారిని రెచ్చగొట్టే వారిని సంఘ వ్యక్తురేక శక్తులుగా భావించాలి. అలాంటి వారి ప్రసంగాలను, రచనలను ప్రత్యేక న్యాయ విభాగం వారి పర్యవేక్షణలోకితేవాలి. భావ ప్రకటన స్వేచ్చ హక్కు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుబాటుతనానికి దారితీసే ప్రతిచర్యా రాజ్యాంగ విరుద్ధమైనదీ, సంఘవ్యతిరేకమైనదిగా భావించబడాలి. మిగిలిన యే నేరాల కంటేనూ, భారతీయుల మధ్య విభజనను  (వేరుబాటు తనాన్ని) జనింపజేసే పనులను పెద్ద నేరంగా చట్టం చేసి అట్టి వారిని ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా కఠినంగా శిక్షించాలి. ఈ ప్రక్రియలో మానవ తప్పిదంగా దొర్లిన ఒకటో అరో పొరపాట్లను చూపి ఈ ప్రక్రియను నీరు గార్చే పని చేయకూడదు. అయితే, మరొకసారి అలాంటి పొరపాటు జరగకుండా శ్రద్ధపెట్టాలి. నచ్చని వారిపై కక్ష సాధించేందుకు ఈ చట్టాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడాలి. అలాంటి కఠిన చట్టం లేకపోవడం ఒక లోపం కాగా, అట్టి వాటిని దుర్వినియోగం చేయడం మరో దోషం అవుతాయి.

ఒకే దేశంఒకే ప్రజ” ఇదే ఇదే భారత రాజ్యాంగ హృదయపు మొట్టమొదటి,చిట్టచివరి ఆకాంక్ష కూడా. జరిగే ప్రతి అభివృద్ధి ప్రక్రియలోనూ సమానాభివృద్ధి అన్నదే లక్ష్యం కావాలి. సమానాభివృద్ధి ప్రాతిపదికనే దేశం సమగ్రాభివృద్ధి దిశగా నడక సాగించాలి. సాంఘిక, ఆర్థిక సమానత్వం సిద్ధించితే, రాజకీయ సమానత్వానికి మార్గం సుగమం అవుతుంది. అలాకాక, ముందే రాజకీయ సమానత్వం పేరట రిజర్వేషన్లు మొదలెడితే, ఆయా వర్గాల నుండి కొద్దిమంది బలవంతులు మాత్రమే ప్రయోజనం పొంది, మిగిలినవారిపై ఆధిపత్యం చెలాయించడమే వాస్తవంలో జరుగుతుంది.

కనుక రిజర్వేషన్ల అమలు యొక్క ప్రధాన దృష్టంతా; విద్యా, వైద్యము, ఉపాధి కల్పన (ఉద్యోగ కల్పన కాదు) అన్నమూటితో ముడిపడిందై అందరికీ అందుబాటులోకి వచ్చేదిగా ఉండాలి. వైద్యం ద్వారా ఆరోగ్యవంతుడిని చేసి, విద్య ద్వారా సమర్థుల్ని చేయడం, ఎక్కువలో ఎక్కువ మందికి ఆయా పనులకు సంబంధించిన సాంకేతిక విద్యనందించడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యతలను పెంపొందించడం జరగాలి. ఉపాధి కల్పన అన్నది అనిపుణ (నిపుణత లేని) శ్రమల ద్వారా కల్పించడం జరిగినంత కాలం, ఆర్థికంగా వెనుకబడినవారిని ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉండదు. అట్టి వారెంతకాలం ఉన్నా, తక్కువస్థాయి బ్రతుకుల్నే గడుపుతుంటారు. ఉపాధి కల్పన అన్నది నిపుణశ్రమ ప్రాతిపదికనే అమలు చేయాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని రకాల అవకాశాలను కల్పించేదిగా ఆ బోధన, శిక్షణ ఉండాలి. సమాజంలో ఎప్పుడూ శ్రామిక జనం సంఖ్యే పెద్దదిగా ఉంటుంది. కనుక ఆర్థిక సమానత్వం సాధించాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను తీసేయడమో, పెద్ద పరిశ్రమలలో విధిగా శ్రామికులకు యాజమాన్యపు భాగస్వామ్యం లేదా లాభాలలో వాటా ఏర్పరచడమో జరగాలి. సమానత్వ సాధన పేరిట ప్రత్యేక కేటాయింపుల (రిజర్వేషన్ల) ప్రక్రియను ఆరంభించినా సమర్థుల్ని చేయడం విషయంలోనూ, ఆర్థికంగా ఉన్న మిగులులో భాగస్వామ్యం కల్పించడం విషయంలోనూ చిత్తశుద్ధితో ఆచరణకు పూనుకోనంత కాలం,ఈ రిజర్వేషన్ల ప్రక్రియ దుర్వినియోగం అవుతూ, అసమానతలను రావణ కాష్టంలారగులజేస్తూనే ఉంటుంది. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. ఈ

మిత్రులారా! పైన నేను ప్రస్తావించిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే, ఇక ముందు ప్రస్తావించుకునే అంశాలను విచారించుకోవాలి. ఆ అంశాలు కొన్ని ఇలా ఉన్నాయి. 

1) ఎవరెవరికి ఎంతెంత శాతం ప్రత్యేక కేటాయింపులు జరగాలి, అన్న విషయానికి, ఈనాటి వరకు 1951న జరిగిన కుల గణన ఆధారంగా నిష్పత్తులు చూడబడుతున్నాయి. కానీ 75 ఏండ్ల కాలగమనంలో ఆ సంఖ్యలలో వచ్చిన తేడాలను పట్టించుకోక పోవడం అశాస్త్రీయం, అన్యాయం కదా? కనుక తక్షణం వాస్తవాలను కనుగొనేందుకు వీలుగా కులాల ప్రాతిపదికన జన గణన జరగాలి. ఇది సక్రమంగా జరగనంత కాలం ఎవరెవరికి ఎంతెంత శాతం రిజర్వేషన్లు ఇస్తే న్యాయం అందించినట్లవుతుందో నిర్ణయించడం :సాధ్యపడదు. ప్రత్యేక కేటాయింపుల విషయంలో ప్రతి కులానికి (వర్గానికి కాదు. వర్గాలు అంటే రాజ్యాంగం నిర్ణయించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రకులాలు అని అర్థం) న్యాయబద్ధమైన వాటా దక్కాలంటే ఈ లెక్క అవసరమే. అందులో అగ్రకులాలను మినహాయించితే మిగిలిన వర్గాలన్నీ ఏదో రూపంలో ప్రత్యేక కేటాయింపుల అవసరం ఉన్నవారే అవుతారు. ఈ మొత్తానికి చిన్న మినహాయింపు కూడా ఉంది.

ఎలా ప్రత్యేక కేటాయింపులను వాడుకుని అభివృద్ధి చెందిన వారికి రిజర్వేషన్లు ఉండకూడదంటున్నామో, అలాగే ప్రత్యేక కేటాయింపులు లేని అగ్రకులాల వారిలోని నిరుపేదలకు ఆర్థికపరమైన ప్రత్యేక కేటాయింపులు ఉండాలి. విషయం అర్థమవుతోందా?రిజర్వేషన్లున్న వర్గాలలో క్రిమిలేయరుకు చెందిన వాళ్లనూ, ప్రత్యేక కేటాయింపులు లేని వర్గాలు (అగ్రకులాల) వారిలోని నిరుపేదలకూ మినహాయింపుల నిచ్చి సమానత్వ సాధనకు• శాస్త్రీయమైన విధానాన్ని ఎంచుకొని అమలు చేయాలన్న మాట.

ఉద్యోగాలు ఉపాధి కల్పన

ఈ రెండు దృక్పధాలు ఎంతో వైవిధ్యం కలవి. పౌరులందరికీ ఉపాధి కల్పన సామాజిక• బాధ్యత. ఆ కారణాన అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. కానీ అందరికీ ఉద్యోగ కల్పన సమాజ బాధ్యత కాదు. సరికదా అనవసరపు పని కూడా. ఉపాధి కల్పన అన్నదిబహుముఖాలుగా ఉంటుంది. ఉద్యోగ కల్పనన్నది ఆ అనేక విభాగాలలో ఒకటి మాత్రమే.ప్రజల అవసరాల కొరకు సృష్టించుకున్నవి ఉద్యోగాలు. కనుక 'అవసరం' అన్నదానికిపరిమితమయ్యే ఉద్యోగాలుంటాయి. దానికి మించి ఉద్యోగాలు కల్పించడం అన్నదిచేయకూడని పనే కాక, సమాజానికి క్రమంగా పెనుభారంగా కూడా తయారై కూర్చుంటుంది. అధిక ఉద్యోగస్తుల వ్యయభారం చాలా పెద్దది. ఇప్పటికీ బడ్జెట్లో 40, 45% జీతభత్యాలకే సరిపోతోంది. అది చాలదన్నట్లు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల బరువు ఒకటి. అవసరానికి మించిన ఉద్యోగాల కల్పన గానీ, పదవీ విరమణ అనంతరం పెన్షన్లు ఇవ్వడం గానీ,సామాజిక న్యాయానికీ, సమానత్వ సాధనకు ప్రతికూలమైనవి అవుతాయి. ఒకవేళ ప్రభుత్వం అందుకు సిద్ధపడ్డా, అందరికీ ఉద్యోగ కల్పన అన్నది సాధ్యపడదు. ఎందుకంటే, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది, ఆయా ఉద్యోగాలు పొందడానికి అవసరమైన చదువులు పూర్తి చేసుకుంటూ ఉద్యోగాలకై పరుగులెడుతూనే ఉంటారు. ఇప్పటికే నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగి, పదవ తరగతి పాస్ అయితే చాలనే బంట్రోతు ఉద్యోగానికి పీజీలుచేసిన వారూ పోటీ పడుతున్నారు. కనుక ప్రభుత్వాలూప్రజలూ కూడా ఉద్యోగాల వ్యవహారాన్ని ప్రక్కనపెట్టి, ఉపాధి అవకాశాల వైపు దృష్టిపెట్టి ఆ దిశగా నడవడం అన్ని రకాలు గానూ మంచిది. అది మాత్రమే సరేంది కూడా.

అర్హుల ఎంపికరిజర్వేషన్లు

ఏ సమాజమైనా తనకు అవసరమైన సేవలందించడానికీ, ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సమర్దులను (నిపుణశ్రమ చేయగల వారిని) మాత్రమే ఎంపిక చేసుకునే విధానాన్నిఅమలు చేసుకుతీరాలి. ఇది ఏ కాలంలోనూ అతిక్రమించడానికి వీల్లేని నియమము. ఎందుకంటే ఆయా విధులు నిర్వర్తించవలసిన స్థానాలలోకి గాని, అసమర్థులు చేరితే జరిగేంత నష్టం మరి ఏరకంగానూ జరుగదు. అయితే ఈ సాధారణ నియమాన్ని అంగీకరిస్తూనే ప్రత్యేక కేటాయింపులను సజావుగా అందించడం, అమలు చేయడం ఎలా గన్నది పరిష్కరించుకో వలసిన అత్యంత ప్రధాన సమస్య అవుతోంది.

సమర్థులు కావడానికి సంబంధించిన అన్ని ప్రత్యేక కేటాయింపులూ, అందరికీ అందించాలన్న దగ్గర ఎవరమూ అభ్యంతర పడాల్సిన అవసరం లేకపోగా, దానిని బాధ్యత తీసుకొని మరీ అమలు చేసుకోవాల్సి ఉంది. కానీ ఆ పనుల అప్పగింత విషయంలో 'సామర్థ్యం' కొలతగానే ఎంపిక జరగాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ ద్వారా నేనిదివివరించడానికి ప్రయత్నిస్తాను. రిజర్వేషన్ శాతం 30 అనుకుందాం. జనరల్ కేటగిరీ కింద 70% ఉద్యోగాలున్నాయి. ఉద్యోగార్థులు 70 శాతం మించి ఉన్నారు. 70%పూర్తవగానే నియామకాలు ఆపేశాం. మిగిలిన 30శాతానికి, ప్రత్యేక కేటాయింపు ఉన్నవర్గాల నుండి ఉద్యోగార్థులు వచ్చారు. వారూ 30 శాతం మించే ఉన్నారు. 

మన పరిష్కార• రూపం ఏమిటంటే, 70 శాతం ఎంపిక అర్హత పరీక్షలో 90 మార్కుల పైబడిన వారినే ఎంపిక చేసుకుంటే, రిజర్వేషన్లకు చెందిన 30% వారిని కూడా 90 మార్కుల పైబడిన వారినే ఎంపిక చేయాలి. ఈ విధానాన్ని అమలు చేయాలంటే కనీస అర్హత క్రింద ఇన్ని మార్కులకు పైబడిన వారేపరీక్షకు ప్రవేశార్హులు అన్న నియమము ఉండాలి. విద్యాలయాలలో ఉత్తీర్ణతకు కనీస మార్కులు 35 అనుకున్నాం. ఆమేరకు మార్కులు వచ్చిన వారు పై తరగతికి అర్హులవుతారు. కానీ ఉద్యోగాల నియామకానికి ఆ ఉత్తీర్ణతను అర్హతగా పెట్టనే కూడదు. ఆయా ఉద్యోగాలకుగాను వేటికి వాటికి అర్హత పరీక్షలు నిర్వహిస్తూ అక్కడ ఆ పనికి అవసరమైన సామర్థ్యాలవిషయంలో కనీస మార్కులు 75% పైగా ఉండాలన్న నియమం పెట్టాలి. అప్పుడు కూడా100 మార్కుల వారితో మొదలెట్టి ఉద్యోగుల సంఖ్య పూర్తయ్యేంతవరకు ఒక్కోమార్కు తగ్గించుకుంటూ 75% మార్కులు వచ్చిన వారి వరకే ఉద్యోగ నియామకాలుండాలి. వెనుకబడిన వర్గాల విద్యార్థులను 75% మార్కులు తగ్గకుండా ఉండేలా, వంద మార్కులకోసం ప్రయత్నించేలా నాణ్యమైన బోధన, శిక్షణ వారికి అందించాలి. ఈ విధానంలో మాత్రమే 1) వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడానికీ, 2) ఉద్యోగ నియామకాలలో సమర్థుల్ని తెచ్చి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే రిజర్వేషన్లను అమలు చేస్తూనే సమాజావసరాలు తీర్చే పనుల్లోకి సమర్ధుల్ని చేర్చుకోవడం అన్నది ఆచరణ లోకి వచ్చి, క్రమంగా సమానత్వం దిశగా అడుగులు వేసేందుకుదోహదపడుతుంది.

మిత్రులారా! ఈ విషయమై మరికొంత చెప్పాల్సి ఉన్నా మీ పరిశీలన కొరకు దీనిని ,ఇప్పటికి ముగిస్తున్నాను. మీరు ఈ వ్యాసస్థ విషయాలను నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించి ,అవసరమైన మార్పులు, చేర్పులను సూచించండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ కార్యాచరణలోకి ఇందులో ఏకాభిప్రాయానికి వచ్చినంతవరకు జతచేసుకుందాం. - మీ సురేంద్ర 

 

1 comment:

  1. సురేంద్ర గారు, రిజెర్వేషన్ పొందిన వ్యక్తిని, అతని కుటుంబాన్ని(భార్య,పిల్లలు) జెనెరల్ కేటగిరీ లోకి మార్చటం కూడా పరిశీలించ దగిన అంశం.

    ReplyDelete