Saturday, October 8, 2022

265 వివేకపథం సంచిక

వివేకపథం

  సంపుటి: 8 సంచిక:7 అక్టోబరు 2022 


కొన్ని మౌలిక భావనలు 

1) ఒక సమూహం నుండి కట్టుబాటు రూపంలో అందులోని వ్యక్తులకు హక్కులు ఏర్పడ్డాయంటే, ఆ సమూహం పట్ల ఆ వ్యక్తులకు కొన్ని విధులు, బాధ్యతలూ ఏర్పడి ఉంటాయని అంగీకరించి తీరాలి. 

పరస్పర సంబంధములో ఉన్న అనేకుల మధ్య విధులతోనూ, బాధ్యతల తోనూ ముడిపడని హక్కులూ ఏవీ ఏర్పడవు. ఒకవేళ బలాన్ని ప్రదర్శించి ఎవరైనా విధులు నిర్వర్తించకుండా హక్కులు పొందుతున్నారంటే అక్కడ అన్యాయం చోటుచేసుకుని ఉందనాల్సిందే. అక్కడ పశు న్యాయం (బలవంతుడిదే రాజ్యం ) అమలవుతుందని. ఆ సమూహపు కట్టుబాటే అలా ఉంటే, దానిని బానిస వ్యవస్థ తోను పోల్చడానికి అవకాశం లేదు. బానిస వ్యవస్థలోనూ బానిసకు కనీస హక్కులుంటాయి.

ఈ హక్కులూ విధుల గురించి మరింత సబబైన రీతిలో చెప్పుకోవాలంటే విధులు నిర్వర్తించిన వారికే హక్కులు ఏర్పడతాయి. ముందస్తుగా ఏదో ఒకటి చేసినవానికే, ఆ చేసిన మేర తిరిగి పొందడానికి అధికారం హక్కుగా సంక్రమిస్తుంది. అటు సమాజం వ్యక్తికి ముందుగా ఏమిచ్చినా, లేక వ్యక్తి సమాజం నుండి ఏమీ తీసుకోకముందే సమూహానికి ఏమైనా ఇచ్చినా అది పుచ్చుకున్న వారికి రుణం క్రింద జమవుతుంది. అంటే పుచ్చుకున్నదానికి ప్రతిగా సరైన విలువను తిరిగి ఇవ్వాల్సిన విధి (తప్పనిసరి పరిస్థితి) ఏర్పడినట్లే. 

2) సమూహంలోని ఏ కట్టుబాటూ, తన సమూహంలోని ఏ వ్యక్తినీ సమూహం కొరకు త్యాగం చేయమని నిర్దేశించకూడదు. అది తానిచ్చిందానికి సరిపడా తిరిగి చెల్లించమని అడిగే అధికారం వరకే (హక్కును) కలిగి ఉంటుంది. కానీ త్యాగం చేయమని చెప్పే అధికారం ఉండదు. ధార్మిక సమాజంలో హక్కులు, విధుల సక్రమ అమలు అన్న పరిస్థితి ఉంటుంది. ధార్మిక సమాజమంటే, ఎవరికీ తాను చేసిందానికి తగినంత ప్రతిఫలం రాని స్థితి గానీ, తాను చేయందానికి ఫలం అందే పరిస్థితి గానీ లేని సమాజం అని అర్థం. దానినే అన్వయ రూపంలో చెప్పుకుంటే, ప్రతి ఒక్కరికీ తాను చేసిందానికి సరిపడినంత అందుతుండడం, తాను పొందిందానికి సరిపడా చేస్తుండడం (తిరిగి చెల్లిస్తుండడం) అన్న పరిస్థితి, వ్యక్తులపై ఎట్టి ఒత్తిడిలూ లేకుండా అమలవుతూ ఉన్న సమాజం అని.

3) ప్రజలు యజమానులు - సొంతదారులుగ ఉన్న వ్యవస్థలో ఉండాల్సిన పునాది భావన 'అందరూ సమానులు' అన్నదే. అన్ని వ్యవహారాలూ ఈ పునాది భావనను అంగీకరించే, దీనికి లోబడే జరుగుతుండాలి. వ్యక్తి అభివృద్ధి ఉమ్మడి (సమష్టి) అభివృద్ధిలో భాగంగానే, అంటే సమానాభివృద్ధి అన్నదానికి వ్యతిరేకం కాని రీతిలోనే, రూపంలోనే ఉండాలి. ఉండాలి అనడం కంటే యోగ్యులైన పౌరులు, యోగ్యమైన ఒప్పందము (కట్టుబాటు) ఉన్న సమాజంలో అలాగే ఉంటుంది అనడం మరింత సరి అయిన మాట.

4) మంచి సమాజం కొరకు యత్నించే ఉద్యమాలలో ఉద్యమ నిర్మాణం అన్నది ఒక నిరంతరాయ ప్రక్రియ. ఉద్యమాశయాలు సిద్ధించేంత వరకూ చేస్తూ ఉండవలసిన ప్రక్రియ. ఉద్యమాశయాలు నెరవేరిన పిదపనూ కొద్దిగా రూపు మార్చుకొని నిరంతరం కొనసాగుతూనే ఉండాల్సిన ప్రక్రియ కూడా. ఆ దశలో 'సమాజ నిర్మాణం కొరకు' అన్న పేరు మార్పుతో అదే ప్రక్రియ కొనసాగుతుంటుంది.

5) ఎలాగైతే సమాజంలో ప్రధానంగా మూడు తరాలు కొనసాగుతూ ఉంటాయో, అలాగే ఉద్యమాలలోనూ మూడు తరాల కొనసాగింపు ఏర్పాటుండాలి. అందునా మధ్యతరాన్ని అత్యంత శక్తివంతంగా రూపొందించుకో గలిగిన సమాజాలే పురోభివృద్ధి దిశగా లేదా లక్ష్యసాధన దిశగా, బలంగా, వేగంగా ప్రయాణించగలుగుతాయి. కనుక ఉద్యమ నిర్మాణంలోనూ ప్రధాన దృష్టంతా ఉద్యమ బాధ్యతలను స్వీకరించే మధ్యతరాన్ని రూపొందించుకోవడం అన్నదానిపైనే ఉంచాలి. చరిత్రలో కనుమరుగైపోయిన లేదా బలహీనపడిన ఏ ఉద్యమాల నైనా మీరు గమనించండి, అందుకు ముఖ్యమైన కారణం మాత్రం ఆరోగ్యవంతమైన బలమైన మధ్యతరం రూపొందక పోవడమన్నదే అయ్యుంటుంది. ఈ నిజాన్ని చరిత్ర అధ్యయనం వల్లనే కాకుండా, వర్తమానంలో మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్న ఉద్యమాలను జాగ్రత్తగా పరిశీలించగలిగినా తెలిసిపోతుంది.

ఉద్యమ నిర్మాణ ప్రక్రియలో ప్రధాన భాగాలు 

1) ఎ) ఉద్యమాశయాలను, ఉద్యమం రూపొందించిన కార్యక్రమాలను ఇష్టపడే వ్యక్తులను గుర్తించడంతో ఉద్యమ నిర్మాణ కార్యక్రమం ఆరంభం కావాలి. అందుకు అప్పటికి ఉద్యమంలో ఉన్నవారు చేయాల్సింది, వెతకడం, గమనించడం, సమీకరించడం అన్నపనే.

బి) ఆ తరువాత దాని కొనసాగింపు కార్యక్రమంగా వారిని సంఘటిత పరచడం, ఉద్యమింప చేయడం.

సూత్రం: వెదకు, గమనించు, సమీకరించు, సంఘటితపరచు: అన్నదే ఉద్యమ కాయానికి ఆయువుపట్టు. ఇది జరుగుతున్నంతకాలమే ఉద్యమం ఎదుగుతూ, చైతన్యవంతంగా కదులుతూ ఉంటుంది. ఈ పని ఎక్కడ ఏ మేరకు కుంటుపడ్డా అక్కడ ఆ మేరకు ఎదుగుదలా ఆగుతుంది. క్రియాశీలంగా (చురుకుగా) పనిచేయడమూ ఆగుతుంది. 

2) ఎదుగుదల అన్నది ఒక సమాజం లేదా ఒక జాతి, సజీవంగా ఉందనడానికి గుర్తు. ఒక సమాజం ఎదుగుదల కలిగి ఉందనడానికి మూడు రకాల రుజువులు అవసర పడతాయి. 1) అప్పటికి ఆసమూహంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా, (జ్ఞానపరంగా) అదనాన్ని పొంది ఉండడం, పొందుతూ ఉండడం. 2) ఆ సమూహపు సంఖ్య పెరుగుతుండడం. 3) వారంతా ఉమ్మడి ఎదుగుదలకు అవసరమైన పనులతో క్రియాశీలంగా పాలుపంచుకుంటూ ఉండడం. ఈ ప్రక్రియలో, క్రమంలో ఎక్కడ తేడా పడ్డా, ఆ సమాజం, ఆ జాతి, ఆ సంస్థ జీవిత ప్రయాణం తిరుగు ముఖం పట్టిందన్నట్లే. 

గమనిక : ప్రాణిజాతులకు సంబంధించిన మూడు తరాలను వయసును బట్టి విడదీసి చూస్తాము. కానీ ఉద్యమ సంస్థలలోని మూడు తరాలను వయసును బట్టి కాక,ఆ వ్యక్తి ఆ ఉద్యమంలోకి ఎప్పుడు ప్రవేశించాడు, ఎంత కాలంగా ఉంటున్నాడు, ఏ పాత్రను పోషిస్తూ వున్నాడు అన్న వాటిని బట్టి విడగొట్టి చూస్తాము. ఈ తేడాను గమనించండి.

3) ఉద్యమ ఎదుగుదల అన్నది జనం (సభ్యులు) పెరగడంతో ముడిపడి ఉంటుంది. దీనికి గాను ఎప్పటికప్పుడు కొత్త వారిని సభ్యులనుగా చేస్తూ ఉండాల్సిందే. అందుకు ప్రతి సభ్యుడు మరికొందరిని ఉద్యమంలోకి చేర్చుతూ ఉండడమన్నది ఒక్కటే సరైన, బలమైన విధానం అవుతుంది. కనుక ఈ పని ఆరోగ్యంగా, బలంగా, నిరంతరాయంగా జరుగుతుండాలంటే, ఉద్యమ కార్యాచరణలో భాగంగా, సభ్యులందరి సాధారణ బాధ్యతగా కొత్త సభ్యులను చేర్పించడం అన్నదానిని పెట్టుకోవాలి.

4) ఏ ఉద్యమమైనా (సమాజమైనా) ఆరోగ్యంగా, బలంగా, క్రియాశీలంగా ఉండాలంటే మధ్యతరం అంటే ఉద్యమంలో ప్రధాన బాధ్యతల స్థానంలో ఉన్న సమూహం ఆరోగ్యంగా, బలంగా, క్రియాశీలంగా ఉండి తీరాలి. ఈ పని సక్రమంగా జరుగుతూ ఉండాలంటే, అప్పటికి ప్రధాన బాధ్యతలో ఉన్నవారు, తమ తరువాత ఉద్యమంలోకి వచ్చిన వారికి అవగాహన, శిక్షణ గరిపి వారికి ప్రధాన బాధ్యతలను అప్పగించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉండాలి. అందుకై తాము ఉద్యమ నియమ నిబంధనల ప్రకారం ఏర్పరుచుకున్న కాలావధులకు లోబడి తాము అప్పటివరకు నిర్వహిస్తూ వచ్చిన బాధ్యతల నుండి తప్పుకొని, సమర్థులైన రెండో తరం వారికి బాధ్యతల నప్పగించి, వారికి అనుభవం వచ్చేవరకు మార్గదర్శనం చేస్తూ తోడ్పాటునందిస్తుండాలి. నూతనంగా బాధ్యతలలోకి వచ్చిన రెండో తరం వారూ, వీరిని ముందు తరం పెద్దలుగా గౌరవిస్తూ, వారి సలహా సంప్రదింపులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పూనుకోవాలి.

5) రెండో తరం వారికి బాధ్యతల నప్పగించడం అంటే, తాము ఉద్యమ కార్యము నుండి తప్పుకోవడం, విరమించుకోవడం అని అర్థం కానే కాదు. సాధారణంగా మన కుటుంబాలలో జరిగే పెద్దతరం తరువాతి తరానికి బాధ్యతలను అప్పగించే ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలిస్తే దీనికి సంబంధించిన సరైన విధానం ఏమిటన్నది సరిగా బోధపడుతుంది. ఈ కుటుంబాలను సరైన అవగాహన ఉన్న కుటుంబాలు, అరకొర జ్ఞానంతో ఉన్న కుటుంబాలు, తప్పు జ్ఞానంతో ఉన్న కుటుంబాలు అన్న మూడుగా విభజించి అర్థం చేసుకోవలసి ఉంటుంది. 

1) సరైన సరిపడినంత అవగాహన ఉన్న కుటుంబాలు 

అ) ఈ తరహా కుటుంబాలలో అప్పటికి బాధ్యతలు స్వీకరించి ఉన్నవారు కుటుంబం మొత్తం పట్ల ఇది నా కుటుంబం. మేమంతా ఒక్కటే అన్న భావాన్ని బలంగా కలిగి ఉంటారు. తమకు సంక్రమించిన స్థానాన్ని అధికారం చలాయించడానికి గాక, బాధ్యతలు నెరవేర్చడానికి సంబంధించినదిగా తలుస్తుంటారు.

ఆ) పెద్దతరాన్ని గౌరవిస్తూ, వారి అనుభవాలను ఉపయోగించుకుంటూ, వారు చేయగల, వారు మాత్రమే చేయగల పనులను వారికి అప్పగిస్తూ, వారిపై అదనపు భారం పడకుండానూ, జాగ్రత్తలు తీసుకుంటూ తమ తమ వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను కొంతవరకు నియంత్రించుకుంటూ, రాబోయే తరాన్ని అభివృద్ధి పరచుకుంటూ, కుటుంబ కార్యాన్ని శక్తి వంచన లేకుండా ఎవరి ఒత్తుడులతోనూ పని లేకుండా స్వచ్చందంగా నిర్వహిస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించిన సంపద విషయంలో ఉత్పత్తి, పంపిణీ, వినియోగము అన్న మూడూ సమతూకంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కుటుంబ శ్రేయస్సుకి అవసరమైన పద్ధతులను (నియమ నిబంధనలను) అమలవుతుండేలాను జాగరూకులై ఉంటారు.

ఇ) ముఖ్యంగా రాబోయే తరాన్ని సమర్ధుల్ని చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉంటారు. అందులో వారికి 1) విద్యనందించడం, 2) పనులు నేర్పడం, 3) కుటుంబంపై ప్రేమ కలిగి ఉండేలా అనుకూల సంబంధాలను అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది.

ఈ) కుటుంబంలో ఇష్టా ఇష్టాల ప్రాతిపదికన ఏవైనా వివాదాలు తలెత్తితే, వాస్తవాల ప్రాతిపదికన వాటిని పరిష్కరించే యత్నాలు చేస్తారే గాని, ఎటో ఒకవైపు మొగ్గిఉండరు. అందరూ బాగుండాలన్న దృష్టీ ప్రధానంగా కలిగి ఉంటారు. పెద్దవాడు తప్పు చేసినా, చిన్నవాడు తప్పు చేసినా తప్పును తప్పుగా చూస్తారు. అయినా శిక్షించడమే పనిగా పెట్టుకోరు. సర్దుబాటు చేయడానికీ, ఇరువురికీ నచ్చజెప్పడానికే ప్రయత్నిస్తారు. తప్పనిసరై ఒకింత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులలోనూ, వ్యక్తిని చక్కజేయాలన్న ప్రేమ పూర్వక దృష్టే ఉంటుంది గాని, ద్వేషంతో కూడిన ధోరణి ఉండదు. 

ఉ) కుటుంబం మొత్తం కూడా సోమరుల పట్ల, సోమరితనం పట్ల విముఖత కలిగి ఉంటారు. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలివేయరు. పైగా, మరింత శ్రద్ధ పెట్టి, ఒత్తిడి పెట్టి మరీ, వారి సోమరితనాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తుంటారు. అదే సమయంలో, శక్తికి మించి పని చేస్తూ, అదనపు భారం మోస్తున్న వారి పని భారం తగ్గించడానికీ అంతే శ్రద్ధ తీసుకుంటారు. మంచి కుటుంబాలలో ఈ వైఖరి ఉందో? లేదో? పరిశీలించి చూడండి. 

ఊ) ఒకవంక కుటుంబ పెద్దరికాన్ని గౌరవిస్తూనే స్వేచ్చగా తమతమ అభిప్రాయాలను చెప్పగలిగి ఉండడం, తన మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదలకు పోకుండా, కుటుంబం తీసుకున్న నిర్ణయాలను అమలు పరచడానికి కలసి కట్టుగా కృషిచేయడానికి సిద్ధపడి ఉండడం, మంచి కుటుంబాలలో కనబడుతుండే మంచి లక్షణం.

ఎ) వ్యక్తిగత ఇష్టాయిష్టాలు నెరవేరుతుండాలని అనిపిస్తున్నా, ఉమ్మడి నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన మేర సర్దుబాటు చేసుకుంటుండడమూ వివేకవంతమైన కుటుంబాలలో కనపడుతుంటుంది. కష్టమైనా, సుఖమైనా ఉమ్మడిగా అనుభవించడమూ జరుగుతుంటుంది. ఇవన్నీ సక్రమంగా జరుగుతుండడానికి ప్రధాన కారణం, మనమంతా ఒక్కటే అన్న ఐకమత్య భావన, కలివిడితనం బలంగా ఉండడమే. వారంతా పరస్పరం, "నేను నా వాళ్ళు” అన్న భావన కలిగి ఉంటారు. సాధారణంగా తనకు అదనం అందాలి, చెందాలి అని ఎవరూ తలంచరు. ఎప్పుడైనా ఎవరైనా అలా భావించినట్లు అనిపిస్తే,మిగిలిన వారంతా దానిని చూస్తూ ఊరుకోకుండా, చక్క చేయడానికి యత్నిస్తారు. 

ఏ) పెద్దతరం, మధ్యతరానికి బాధ్యతల నప్పగించడం, ఓపిక ఉన్నంత కాలం తాము చేయగల పనులను చేస్తూనే కుటుంబ శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటుపడుతుండడం, బాధ్యతలను స్వీకరించిన మధ్యతరం కూడా పెద్దతరం అనుభవాలను, సలహాలను తీసుకుంటుండడం జరుగుతుంటుంది. పెద్దతరం కూడా, రాబోయే తరానికి కుటుంబ శ్రేయస్సుకు చెందిన విలువలను తెలుపుతూ, పనులను నేర్పుతూ వారిని మంచి వ్యక్తులుగా తయారు చేసే విషయంలో క్రియాశీలంగా పనిచేస్తుండడమూ కనపడుతుంటుంది. వారు సోమరులు కాకుండానూ, పనిమంతులయ్యేలానూ, కుటుంబ శీలం కలిగి ఉండేలానూ వారి వ్యక్తిత్వాలను రూపొందించడం జరుగుతుంటుంది.

ఐ) కదాచిత్ వారి మధ్య వివాదాలు తలెత్తితే, వాటిని పరిష్కరించుకునే పద్ధతి అమలవుతూ ఉంటుంది. మంచి కుటుంబాలలో ఉండే ప్రధాన లక్షణం ఉమ్మడితనాన్ని అందరూ కలిగి ఉండడమన్నదే. అందుకనే మంచి కుటుంబాలలో తరచుగా సమస్యలు ఉత్పన్నం కావు. అరుదుగా జనించే సమస్యలైనా దీర్ఘకాలం పారబెట్టుకోకుండా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం జరుగుతుంటుంది.

2) తప్పు జ్ఞానంతో ఉన్న కుటుంబాలు

మిత్రులారా క్రమాన్ననుసరించి అరకొర జ్ఞానంతో ఉన్న కుటుంబాల గురించి చెప్పుకోవాల్సి ఉంది, అయినా ముందుగా అపసవ్య కుటుంబాల గురించిన స్పష్టత ఏర్పడితే, మధ్యరకం కుటుంబాల పోకడను అర్థం చేసుకోవడం సుళువవుతుంది. ఆ మధ్య రకం కుటుంబాలు అక్కడి నుండి ఎటు కదలాలోనూ అవగతమవుతుంది. కనుక మూడో రకం కుటుంబాల రీతిరివాజులను అర్థం చేసుకునే పని చేద్దాం.

1) సరైన అవగాహన సరిపడినంత లేకపోవడంగా కాక, తప్పు అవగాహన బలంగా, పనిచేస్తుండడం ఈ కుటుంబాలలో కనిపిస్తుంటుంది. 

2) ఇందులో అప్పటికి బాధ్యతలు నిర్వహించే స్థానంలో ఉన్నవారు, ఆత్మాధిక్యతా భావాన్ని కలిగి ఉండడం, తన ప్రకారమే అంతా నడుస్తుండాలని తలుస్తుండడం, ఆ రకంగానే ప్రవర్తిస్తుండడం జరుగుతుంటుంది. ఒకే కుటుంబంగా ఉంటూనే ఉన్నా అధికారం చలాయించాలన్న దృష్టి బలంగా ఉంటుంది.

3) పెద్ద తరాన్ని సరైన రీతిలో గౌరవించే లక్షణం కొరవడి ఉంటుంది. పైగా మీరు ప్రతి విషయంలోనూ వేలెట్టకండి. మీరు పని విరమణ చేసిన వారు. కుటుంబ వ్యవహారాలను మేము చక్కబెట్టగలము. అధికారం మాకు కట్టబెట్టి, ప్రతి విషయంలో మాపై మీ సతాయింపేమిటి? మాకు చెప్పడాన్నాపి, మేము చెప్పిన పనులు చేయగలిగినంత చేస్తుండండి, అన్న ధోరణితో ఉంటారు.

4) ఈ రకం కుటుంబాలలో, మధ్యతరం వారు ఒక వంక అటు పెద్ద తరాన్ని సరైన రీతిలో గౌరవించడం గానీ, వారి అనుభవాలను సరిగా వినియోగించడం గానీ చేయకుండడంతో బాటు, మరోవంక తమ తరువాతి తరం వారిపై అవసరం లేనంతగా పెత్తనం చలాయిస్తుంటారు. తాము అధికులం అన్న భావంతో చిన్నవారికి పనులు పురమాయించేస్తుంటారు.

5) అంతకంటేనూ ప్రమాదకరమైన విషయం, వీరు రాబోయే తరాన్ని తయారు చేసుకునే పనిపై శ్రద్ధ పెట్టరు సరికదా, తమ స్థానంలోకి వారు రాకుండేలా జాగ్రత్త పడుతూనూ ఉంటారు. దీర్ఘకాలం పాటు ప్రధాన బాధ్యత (కుటుంబ నిర్వహణాధికారం) తమ చేతిలోనే ఉండాలనుకుంటుంటారు. సాధారణ పద్ధతులను ప్రక్కన పెట్టి, తన ప్రకారమే అంతా జరుగుతుండాలని అనుకుంటూ అందుకు తగినట్లే ఛలాయిస్తుంటారు.

6) ఇలాంటి కుటుంబాలలో మధ్యతరం వారి పరిస్థితి ఇలాగుంటే, ఇక పెద్దతరం వారునూ తాము నిర్వహించాల్సిన, నిర్వహించగలిగిన బాధ్యతల గురించి పట్టించుకోరు. పరిస్థితుల ననుసరించి కుటుంబ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకుంటారే గాని, ఇష్టపడి తప్పుకోరు. తప్పుకున్నాక, ఇంకా కుటుంబం కోసం ఎంతో కొంత (చాలా) చేయగలిగి ఉండే, ఏమి చేయకుండా పని విరమణ చేస్తారు. ఇప్పటివరకు చేసింది చాలు. ఇకపై మాకు ఏమీ పనులు చెప్పకండి, అంటుంటారు. అక్కరలేని సందర్భాలలో చొరపడడం, అక్కరైన సందర్భాలలో గమ్మునుండటం చేస్తుంటారు.

7) ఇలాంటి కుటుంబాలలో తరచుగా మూడు తరాల వారి మధ్య కీచులాటలు జరుగుతుంటాయి. ఎవరికి వారు వారి వారి అధికారాలు, హక్కుల కొరకు ప్రాకులాడుతుంటారే గానీ, విధులు, బాధ్యతల విషయాన్ని గురించి ఆలోచించరు. పట్టించుకోరు. ఇలాంటి కుటుంబాలలో ఉమ్మడితనం బలహీనంగానూ విడితనం బలంగానూ పనిచేస్తుంటుంది. బయట నుండి చూచేవారికి ఒకే కుటుంబంగా కనిపిస్తున్నా అంతర్గతంగా, ఉండాల్సినంత ఉమ్మడితనం (ఐక్యత) వారి మధ్య ఉండదు. అవకాశం దొరికినా, సందర్భం ఎదురైనా వారంతా ఎవరికి వారు వారి వారి ప్రాధాన్యతను ప్రదర్శించుకోవడానికో, తమ తమ స్థానాలను పదిల పరుచుకోవడానికో శక్తి వంచన లేకుండా, శక్తికి మించి యత్నిస్తుంటారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడమూ జరుగుతుంటుంది.

8) పనుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం, ఎవరికి వారు ఏదో వంక తప్పించుకోవడానికీ, ఇతరులకు పురమాయించడానికి, అప్పగించడానికి యత్నిస్తుంటారు. ఈ తరహా కుటుంబాలే పుట్టి మునిగే వరకు గుంభనంగా ఉంటూ, తీరా పరిస్థితులు చేజారి పోయాక కుదేలైపోతాయి.

గమనిక : ఇక అటు పూర్తి సరైన రీతిలో గానీ, ఇటు మరీ ఇంత అధ్వాన్నం కాని రీతిలో గానీ సాగుతుండే కుటుంబాలు కొన్ని ఉంటాయి. నిజానికి సమాజంలో ఈ తరహా కుటుంబాలే అధిక సంఖ్యలో ఉంటుంటాయి. ఇలాంటి కుటుంబాలలో బాధ్యతలు నెత్తినేసుకుని అధిక భారము మోస్తుండేవాళ్లు కొందరూ, పనికి ఎగనామం పెట్టి, పేరుకు మాత్రం ముందుండేవారు కొందరూ, అటు పనినీ, ఇటు పేరును కూడా ప్రక్కన పెట్టి నామమాత్రంగా కొనసాగుతుండే వాళ్ళు కొందరూ ఉంటుంటారు. ఇలాంటి కుటుంబాలే ఎదుగూ బొదుగూ లేకుండా సాగుతుంటాయి. బరువు మోసేవారు కొద్దిమందీ భారమై కూర్చునేవారు ఎక్కువమందీ కనుక తయారైతే అట్టి కుటుంబాలు క్రమంగా నీరసించి చితికిపోతాయి. “ఒకనాడు బాగా బ్రతికిన కుటుంబం ఈనాడిలా తయారయ్యింది” అని అంటుంటారు చూడండి అవన్న మాట ఇవి.

ఉద్యమ మిత్రులారా! కుటుంబ పద్ధతిని ఉదాహరణగా తీసుకొని ఇక్కడ నేను వివరించిందంతా, సామాజిక ఉద్యమ సంస్థలకూ, సమాజాలకూ కూడా 100% అన్వయిస్తుంది. ఎందుకంటే ఆయా సంస్థలో అదొక కుటుంబం అనడానికి సరిపోయేటివే. ఇక సమాజం అంటే పెద్ద కుటుంబం అనే అర్థం. నా లెక్క ప్రకారం అత్యంత గంభీరమైన, కీలకమైన విషయాల్నే మీ ముందుంచాను. మన ఉద్యమ వేదిక కూడా పై మూడు తరహాలలో దేనితో ఎక్కువగా పోలుతుందో సీరియస్ గా, శ్రద్ధ పెట్టి కూలంకషంగా పరిశీలించి యదార్థాలను గమనించండి. నా అధ్యయనమూ, అవగాహనల ప్రకారం మన ఐక్యవేదిక మధ్య రకపు స్వభావాన్ని కలిగి ఉండి మూడో రకపు దిశగా కదులుతూ ఉంది. దీనిని పట్టించుకోని తిరగదీసుకోకపోయినా, అలాగే వదిలేసినా అనతి కాలంలోనే ఇది పడకన పడిన ఉద్యమంగా మారిపోతుంది. ఇప్పటికింకా ప్రమాదంలో కూరుకు పోకపోయినా ప్రమాదపుటంచున నడుస్తోంది. ప్రమాదం దిశగానే కదులుతోంది.

దీనిని తిరగదీసుకోవడం, చక్కగా చేసుకోవడం అంటే ఏమిటి? ఎలా? 

1) కార్యకర్తల నిర్మాణానికి పెద్దపీట వేసి యోగ్యులను తయారు చేసుకోవాలి.

2) ఏర్పరుచుకున్న విధివిధానాలను తూ.చ. తప్పకుండా అమలు చేసుకుంటూ ఇప్పటికి , ఆయా బాధ్యతలలో ఉన్నవారు నిర్ణీత కాలం పూర్తవ్వగానే బాధ్యతల నుండి తప్పుకుంటూ, మలితరానికి బాధ్యతలను అప్పగిస్తుండాలి.

3) బాధ్యతల నుండి తప్పుకున్నవారు ఉద్యమానికి దూరంగా ఉండకుండా, ఉద్యమం యొక్క బాగోగులను నిరంతరం పరిశీలించుకుంటూ, ఉద్యమాభివృద్ధికై చేయవలసివున్న వాటిలో తాము చేయగలిగినంత చేస్తూ, తరువాతి తరాలకు స్ఫూర్తిగా ఉంటూ, తమ అనుభవాలను, సామర్థ్యాలను ఉద్యమానికి అందిస్తుండాలి.

4) ఉద్యమానికి మానవ వనరులూ, ఆర్థిక వనరులూ రెండు ప్రధాన ఆలంబనలు అవుతాయి. కనుక ఉద్యమాలలోని ప్రతి ఒక్కరూ ఆ రెండు వనరులను సమకూర్చుకునే, పెంపొందించుకునే పనిలో ఖచ్చితంగా పాలుపంచుకోవాలి.

5) రాష్ట్రస్థాయి బాధ్యులకూ, జిల్లాస్థాయి బాధ్యులకూ తప్పనిసరిగా ఉద్యమం యొక్క పూర్తి స్థితిగతులు తెలిసి ఉండాలి. వారంతా ఎవరికివారు తెలుసుకుంటూనూ ఉండాలి. రాష్ట్రస్థాయి బాధ్యులకు అన్ని జిల్లాల పరిస్థితి తెలిసి ఉండటం తప్పనిసరి కాగా, జిల్లా బాధ్యులకు కూడా అన్ని జిల్లాల పరిస్థితి సాధారణ రూపంలో తెలిసి ఉండడం, తన జిల్లాకు సంబంధించినదైతే పూర్తి అవగాహన కలిగి ఉండడం అవసరం.

6) వేదికలోని బాధ్యులెవరూ అనుచర నాయకత్వ ధోరణిని కలిగి ఉండరాదు. సహచర నాయకత్వ ధోరణినే కలిగి ఉండాలి. క్షేత్రస్థాయిలో ఉద్యమం క్రియాశీలంగా ఉండేలా చూసుకోవడం అన్నిటికంటేనూ కీలకమైందవుతోంది, వీటిపై శ్రద్ధ పెడితే, ఉద్యమం తిరిగి దిశను మార్చుకొని పుంజుకోవడానికి వీలవుతుంది. ఆలోచించండి. - సురేంద్ర


ఉద్యమాలు సాఫల్య వైఫల్యాలు ఒక పరిశీలన 

ఉద్యమ మిత్రులారా! ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనుకుని ఆ పని మొదలెట్టుకొని 12 సంవత్సరములు గడిచాయి. ఆ పని సంతృప్తికరంగా చేయలేకపోయామని గత మహాసభ సమావేశంలోనే నా అభిప్రాయంగా చెప్పాను నేను. అందుకు కారణాలను వెతుక్కుని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని ముందుగా కదలాల్సి ఉందనీ, ఆ మార్పులో భాగంగా సంస్థను, సంస్థ భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకువెళ్లాల్సి ఉందనీ, అందుకై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందని చెప్పాను. మహాసభ జరిగి '6' మాసాలయ్యింది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగించడం విషయమై ఎవరూ శ్రద్ధ పెట్టినట్లు కనపడలేదు. శ్రద్ధ పెట్టడం అలా ఉంచి చాలామంది దాని నసలు పట్టించుకున్నట్లే అనిపించలేదు నాకైతే. 

చాలా కాలంగా ఐక్యవేదిక ముఖ్య బాధ్యులు, సీనియర్స్ ఎదురైనప్పుడల్లా ఉద్యమం క్రమంగా స్తబ్దతకు లోనవుతూ వస్తోంది. ఒకసారి కనుక అది పడకనబడితే తిరిగి కదిలించడం కష్టమవుతుందని వారితో అంటూనే వస్తున్నాను. అయినా ఈ విషయాన్ని వారు కూడా అంత సీరియస్ గా తీసుకోలేదనిపిస్తోంది.

ఉద్యమారంభానికి ముందు నుండి, ఉద్యమ ఆరంభం నుండి, కీలకమైన, క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ వచ్చిన నాకు, ప్రస్తుత ఉద్యమం యొక్క వాస్తవ పరిస్థితులను పూర్తిగా సమీక్షించుకోవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడి ఉన్నట్లు అనిపించడంతో ఇలా మీ ముందుకు వచ్చాను.

ఉద్యమ స్వరూప స్వభావాల గురించి, దాని పనితీరుకు సంబంధించిన పద్ధతుల (విధివిధానాల) గురించి, వాటి అమలకు సంబంధించిన నియమ నిబంధనల గురించీ, సూత్రప్రాయంగా లిఖిత రూపంలోనే వ్రాసుకున్నాం. ఆయా సమావేశాలలో వాటిపై సరిపడినంత విపులంగానే వివరణలు చేసుకున్నాం. మాటలకూ, చేతలకూ మధ్య పొంతన ఉండాలని అంటే సిద్ధాంతానికీ, ఆచరణకు సయోధ్య కుదరాలని వందల (వేల) సంవత్సరాలుగా తాత్వికులెందరో చెబుతూ వస్తున్నారు. మనమూ ఆ విషయాన్ని చాలా స్ఫుటంగా ప్రకటించుకున్నాం. అందుకొరకే మూడు ప్రతిజ్ఞలంటూ స్వయం నియంత్రణ కట్టుబాటును పెట్టుకున్నాం.

ఉద్యమ వేదిక ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ఉద్యమ లక్ష్యాల సాధనలో చైతన్యవంతంగా సాగుతూ ఉండాలని త్రికరణ శుద్ధిగా భావించే వారిలో ఒకడిగా, ప్రస్తుత ఉద్యమ నడక తీరుపై చాలా అసహనమూ, అసంతృప్తి చోటుచేసుకుని ఉన్నై నాలో. కొన్ని నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. మరికొన్ని చేదుగా ఉండి మింగుడు పడవు. అయినా ఉద్యమ శ్రేయస్సు దృష్ట్యా వాటిని గురించి మాట్లాడుకోవడం చాలా చాలా అవసరం. 

ముందుగా ఉద్యమ స్వరూప స్వభావాలకు సంబంధించిన మౌలకాంశాలు మీ ముందుంచుతాను.

1) అసాంఘిక శక్తులు ఎంతగా పెచ్చరిల్లడానికి కారణం అభ్యుదయ శక్తులు సంఘటితం కాకపోవడమేనని చెప్పుకున్నాం. అందుకే, కలసి పోవడానికి, కలుపుకుపోవడానికీ నిజాయితీగా సిద్ధపడాలని చెప్పుకున్నాం.

2) ఉద్యమ శాఖలలోని ఆయా స్థానాలను పదవులుగా భావించరాదనీ, బాధ్యతలుగా స్వీకరించాలని ప్రకటించుకున్నాము.

3) ఉద్యమకారులంతా పరస్పరం సహచరులే గాని, ఎవరికెవరూ అనుచరులు కారనీ చెప్పుకున్నాం.

4) ఉద్యమ కార్యకర్త ఉద్యమాశయాలకు అనుగుణంగా తనను తాను మలచుకుంటుండాలనీ, తనతో మరికొందరిని తయారు చేసుకునే కృషి నిరంతరం చేస్తూ ఉండాలని రాసుకున్నాం.

5) ఏక నాయక స్వామ్యం ఉండకూడదనీ, అందరూ కలసి బృందస్ఫూర్తితో పనిచేయాలనీ అనుకున్నాం .

6) నియమంగా పెట్టుకున్నట్లు, తగినంత సమయం ఇవ్వగలిగిన వాళ్ళూ శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళూ, తమ పరిధిలో గ్రామాలు, మండలాలు, జిల్లాలు తిరగ గలిగిన వాళ్ళూనే ఆయా విభాగాల బాధ్యతలు స్వీకరించాలని అనుకున్నాం. ఆ సామర్థ్యాలు, అవకాశాలు లేని వాళ్ళు ఆయా బాధ్యతలలోకి రావద్దనీ, వచ్చినాక ఆ బాధ్యతలు నిర్వహించకున్నా, నిర్వహించలేకున్నా ఆ బాధ్యతల నుండి తప్పుకోవాలని చెప్పుకున్నాం.

7) ఎప్పటికప్పుడు ప్రతి మహాసభ నాటికి అన్ని స్థాయిల కమిటీలకూ నూతన బాధ్యుల ఎంపిక జరగాలని, ఇది చాలా కీలకమైన అంశమనీ చెప్పుకున్నాం. తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే మరొక పర్యాయం అదే బాధ్యతలో ఉండే వీలుందని ఉద్యమావసరత రీత్యా మినహాయింపు ఇచ్చుకున్నాం. రాబోయే తడవకు తగిన బాధ్యులను తయారు చేసుకునే బాధ్యత అప్పటికి ఉన్న కమిటీ బాధ్యులదేనని తీర్మానించుకున్నాం. 

గమనిక : రాబోయే క్రొత్త కమిటీకి యోగ్యులైన వ్యక్తుల్ని తయారు చేసుకోలేకపోతే, అది అప్పటి వరకున్న కమిటీ బాధ్యుల వైఫల్యమే అనాల్సిందే. ఎందుకంటే తనలాటి మరొకరిని తయారు చేసుకునే బాధ్యత ప్రస్తుతం బాధ్యతలలో ఉన్న వారిదే కదా

8) ఉద్యమ నిర్మాణం మొదటి పని. ఉద్యమ కార్యాచరణ ఆ తరువాత చేయాల్సిన పని అనుకున్నాం. ఉద్యమ నిర్మాణం క్రిందికి 1) సభ్యత్వ నమోదు, 2)కమిటీల ఏర్పాటు, 3) ప్రాథమిక, ఉన్నత శిక్షణ పొందడం, 4) ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అన్నవి మొదటి దశలో వస్తాయి. మలిదశలో ఉద్యమ విస్తరణ చేయాల్సి ఉంటుంది. విస్తరణ క్రిందికి 1) నూతన సభ్యత్వాలు, 2) నూతన గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లాలలో కమిటీలు, 3) స్థానిక శిక్షణాలయాలు, 4) రాష్ట్ర , జిల్లా, మండల స్థాయి లలో కార్యాలయాలు, 5) అధిక సంఖ్యలో శిక్షకుల, ప్రసంగీకుల తయారీ, అన్నవి వస్తాయి. 

9) ఉద్యమ కార్యాచరణ క్రిందికి 1) రాజ్యాంగం పట్లా, ప్రజాస్వామ్యం పట్లా, ప్రజలకు అవగాహన కలిగించడం, 2) ప్రజలు అవగాహనాపరులూ, పనిమంతులూ, శీలవంతులు అయ్యేలా వారికి తర్ఫీదునివ్వడం. 3) స.హ చట్టాన్ని సమర్ధవంతంగా వినియోగంలోకి వచ్చేలా యత్నించడం. 4) గ్రామసభలు సక్రమంగా జరుపుకునేలా ప్రజల్ని సన్నద్దుల్ని చేయడం. 5) ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసేందుకు దశల వారీగా అప్పటికున్న వనరుల (శక్తి సామర్ధ్యాల)కు లోబడి యత్నించడం. 6) ఆయాదేశ కాల పరిస్థితులననుసరించి రాష్ట్ర కార్యవర్గం రూపొందించిన కార్యక్రమాలను అమలు పరచడం అన్నవి వస్తాయి. 

గమనిక : మన ఐక్యవేదిక ఇతర సంస్థల కార్యక్రమాలనేమీ చేపట్టదు. అంతేకాదు. ఉద్యమ వేదికలోని వ్యక్తులు, వేదిక రూపొందించని కార్యక్రమాలను గానీ, వేదిక లక్ష్యాల సాధనతో ముడిపడని కార్యక్రమాలను గానీ, వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలననుసరించిన కార్యక్రమాలను గానీ చేపట్టరాదు. వేదిక ప్రధానంగా ప్రజలను సమర్ధులను చేయడానికి ఉద్దేశించిందే గాని, ప్రజల పనులు చేసి పెట్టేందుకు ఉద్దేశించింది కాదు.

10) ప్రతి స్థాయి కమిటీ బాధ్యుల పైనా కొన్ని సాధారణ బాధ్యతలుంటాయి. అవి 1) ఉద్యమ నిర్మాణపరమైనవి కాగా, 2) ఉద్యమ కార్యాచరణ పరమైనవి. (వీటికి సంబంధించిన పనుల వివరాలు ముందే వివరించాను) ఇక్కడ అదనంగా చెప్పేదేమంటే ఆ రెండు విభాగాల పనులూ నిత్యమూ నిరంతరాయంగా చేస్తుండాల్సినవే.

11) మనది వ్యక్తి కేంద్రంగా (ప్రధానంగా) నడిచే ఉద్యమం కాదు. విధానం ఆధారంగా నడవాల్సిన ఉద్యమం. కనుక విధివిధానాలు, నియమ నిబంధనలు అత్యంత కీలకమైనవీ, ప్రధానమైనవీ అవుతాయి. 

గమనిక : దీనికి సంబంధించిన ఒక సూత్రాన్ని 1వ నెంబర్ పుస్తకంలోని కరదీపికలో వ్రాసుకున్నాము. దేశంలో జరిగే సమష్ఠియత్నాలన్నీ ఒకే ఒక్కదుర్లక్షణంతో కృంగిపోతున్నాయి. కలిసి పని చేయాల్సిన వ్యక్తులు వ్యవహార నియమాలను పాటించడం లేదు. వ్యక్తులు తనకు అప్పగించబడిన లేదా తాను స్వీకరించిన పని విషయంలో పూర్తి బాధ్యత వహించాలి. అలా బాధ్యత స్వీకరించకపోవడమన్నదే దుర్లక్షణం.

12) మంచిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కానీ కార్యదక్షత, పట్టుదల, నిజాయితీ, బుద్ధి కుశలత కలిగిన కార్యసాధకుల కొరత చాలా ఉంది. అందులోనూ శీలవంతులైన వ్యక్తులు తయారు కానంత కాలం ఏ జాతీ ఉద్దరింపబడదు. ఏ (ఉద్యమమూ సఫలం కాలేదు. 

 13) కరదీపికలోని మరో సూక్తిని గమనించండి. జాతి పునర్నిర్మాణానికి సుసంఘటితులైన, సుశిక్షితులైన వ్యక్తులతో కూడిన సంస్థ నిర్మాణం కావలసి ఉంది. 

14) ఐక్యవేదిక తలపెట్టిన పని కోసం మీ జీవితాన్ని అర్పించగలిగితేనే నీవు నాయకుడివి కాగలుగుతావు. కానీ ఆ విధంగా ఉండడానికి సిద్ధం కాకుండగనే, నాయకులం కావాలనే అనుకుంటుంటారు ఎక్కువమంది.

15) 1) ఉద్యమ భారం మోస్తున్నావా? ఉద్యమానికి భారంగా ఉంటున్నావా?

  2) ఉద్యమానికి తోడ్పడుతున్నావా? ఉద్యమాన్ని వాడుకుంటున్నావా? 

  3) గుర్తింపు కొరకు ఉద్యమంలో ఉంటున్నావా? ఉద్యమకార్యం తృప్తినిస్తోంది గనుకనా ? 

16) అవగాహన, శిక్షణ లేని కార్యకర్తలతో కూడి ఉన్న ఉద్యమాలు ఈసురో మంటుంటాయి. కడకు పడకనపడతాయి.

గమనిక : 1వ నెంబరు పుస్తకం మన ఉద్యమానికి పునాది వంటిది. ప్రతి కార్యకర్తా అందులోని భావాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడం, యథాతథంగా వాటిని ఇష్టపడటం, ఆరకంగా ప్రవర్తించడానికి నిజాయితీతో శక్తివంచన లేకుండా యత్నిస్తుండడం చేస్తుండాలి. 

17) అవగాహన అన్నది రెండు పార్శాలు కలిగి ఉంటుంది. 1) ఉద్యమ నిర్మాణ పరంగా తెలిసుండాల్సిన విషయాలు. 2) సామాజిక సమస్యలు పరిష్కారాల పరంగా తెలిసి ఉండాల్సిన విషయాలు. 

18) 1) ఉద్యమ నిర్మాణపరమైన అంశాలు :

ఏ) ఉద్యమం ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమిటి? బలంగా ఉండడం అంటే ఏమిటి? 

బి) ఉద్యమం చైతన్యవంతంగా ఉండడం అంటే ఏమిటి? స్తబ్దతకు లోనవ్వడం అంటే ఏమిటి? పడకన పడటం అంటే ఏమిటి? 

  1. ఉద్యమం ఆరోగ్యంగా ఉండడం అంటే, ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తులు ఉద్యమాశయాలకు తగిన రీతిలో ప్రవర్తిస్తుండడం, తగనిరీతిలో ప్రవర్తించకుండా ఉండడం.

బలంగా ఉండడమంటే, ఎప్పటికప్పుడు అప్పటికి ఏర్పడి ఉన్న స్థానంలో ఉద్యమ కార్యక్రమాలను ఐకమత్యంగా ఉంటూ చేయగలిగి ఉండడం.

అతి, అల్పము కాని రీతిలో ఉద్యమ శరీరం అభివృద్ధి చెందుతూ ఉండడం.

2) ఉద్యమం చైతన్యవంతంగా ఉండడమంటే ఉద్యమంలోకి చేరిన వ్యక్తులు (కనీసం బాధ్యతలు స్వీకరించిన వారి వరకైనా) సరిపడినంత సమయాన్నివ్వగలిగి ఉండడం, కార్యాచరణ ప్రణాళికను ఉత్సాహంగా అమలు చేస్తుండడం, అటు అధ్యయన శిక్షణా తరగతుల పరంగానూ, ఇటు ఉద్యమ కార్యక్రమాల విషయంలోనూ ఉత్సాహంతో పాల్గొంటుండడం. నూతన నాయకత్వాన్ని రూపొందించుకునే పని జరుగుతుండడం, బాధ్యతల నుండి విరమించుకున్న వారు కూడా, ఉద్యమము నుండి బయటకి పోకుండా, కోర్ కమిటీలలో ఉంటూ శక్తిమేర పనిచేస్తూనే ఉండడం. 

  • ఈ ఉద్యమం స్తబ్దతకు లోనవ్వడం అంటే పై పనులు జరగవలసినంతగా జరగకపోవడం. 

  • ఉద్యమం పడకనబడడమంటే పై పనులు అన్నీ కానీ, కొన్ని కానీ అసలే జరగకపోవడం.

గమనిక: మానవ వనరులు, ఆర్థిక వనరులు అన్న రెంటి విషయంలోనూ ఎప్పటికప్పుడు అంత క్రితం కంటే మెరుగుదల ఉండడం అన్నది ఉద్యమం ఆరోగ్యంగా, బలంగా, చైతన్యవంతంగా ఉంటుందనడానికి ఒక సాధారణమైన గుర్తు (కొలమానము). 

సారాంశం: సమయాన్నివ్వగలిగి ఉండడం, శిక్షణ పొంది ఉండడం, ఉద్యమ నిర్మాణము, విస్తరణల పరంగా క్రియాశీలంగా పనిచేస్తుండడం, తనను ప్రత్యేకించుకోకుండా కలివిడితనంతో మసులుకుంటుండడం, గుర్తింపు కొరకు గాక, ఉద్యమం కొరకే పని చేయ కలిగి ఉండడం, అన్న లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులున్న ఉద్యమాలను దాని సాధారణార్థంలో ఉద్యమం ఆరోగ్యంగా, బలంగా ఉండడం అని అంటారు.

19) ఉద్యమకారుల మధ్య ముఖ్యంగా ఆయా స్థాయిల కమిటీల బాధ్యతలతో ఉన్నవారి మధ్య ఐక్యత లేకపోయినా, కార్యకర్తల శిక్షణ కార్యక్రమం కుంటుపడినా, నూతన నాయకత్వాన్ని తయారు చేసుకుని వారికి బాధ్యతలనప్పగించడంలో వెనుకబడినా, బాధ్యతలను పదవులుగా భావించి ప్రవర్తించే వైఖరి చోటు చేసుకున్నా ఉద్యమం ఆరోగ్యాన్నీ బలాన్నీ కోల్పోతున్నట్లే అవుతుంది.

20) చాలా కాలంగా, ప్రతి సమావేశంలోనూ శ్రీధర్ చెబుతూ వస్తున్న ఒక అంశం చాలా ప్రధానమైనది. ప్రవర్తనా నియమావళిని ఖరారు పరుచుకోవడం, దానిని కచ్చితంగా అమలు పరుస్తుండడం, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండడం అన్నవి ఏ మాత్రం సడలింపు లేకుండా అమలుపరచుకుంటూ ఉండాలి. అన్నదే అతను చెబుతున్న అంశం.

గమనిక: గత 50 ఏళ్ల నా అనుభవాలు నాకు చెబుతున్న దాన్ని బట్టి, ఉద్యమాలు అవి ఏవైనాగానీండి ఈ విషయంలో జాగ్రత్త పడకుంటే, మొదట అవి ఆరోగ్యాన్ని కోల్పోతాయి. తరువాత రోగగ్రస్థమైపోతాయి. క్రమంగా బలహీన పడటమే కాకుండా, ప్రతికూలాంశాలను, లక్షణాలను కూడా జత చేసుకుంటాయి. దీనికి సంబంధించి చాలాకాలంగా నేను సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వచ్చిన ఒక్క సూత్రాన్ని గుర్తు చేస్తాను.

సూత్రం: ఆరోగ్యము, బలము ఒకటి కావు. అవి పరస్పర సంబంధం కల రెండు. ఉద్యమానికి కావలసింది బలమే అయినా అది ఆరోగ్యము ఉంటేనే పొందడానికి, నిలిపి ఉంచుకోవడానికి సాధ్యపడుతుంది. బలం లేకున్నా, ఆరోగ్యం సరిగా ఉంటే, క్రమంగా బలం అదే సమకూడుతుంది. అదే మరి అప్పటికి ఒకింత బలం ఉన్నా, అనారోగ్యం చోటు చేసుకుంటే అదనపు బలం రావడం మాటలా ఉంచి, ఉన్న బలం కూడా క్రమంగా లేకుండా పోతుంది. కనుక రెంటిలోనూ ఆరోగ్యమే పునాది వంటిది అవుతోంది. ఉద్యమాలకు దీనిని అన్వయించడమంటే, ఉద్యమకారులు ఎందరున్నారన్న దానికంటే ఉద్యమంలో ఉన్న ఆ నలుగురైనా ఉండవలసినట్లు ఉన్నారా? లేదా? చూడడమనే. ఉండవలసినట్లే ఉంటే ఉద్యమం ఆరోగ్యంగా ఉన్నట్లు. ఉండవలసినట్లు లేకుంటే అది అనారోగ్యంగా ఉన్నట్లు. 

21) ఒక సమాజం యొక్క స్థితి, గతి ఆరోగ్యంగా, బలంగా, చైతన్యవంతంగా ఉండాలంటే ఆ సమాజంలోని వ్యక్తులు అవగాహనాపరులు,? పనిమంతులు, శీలవంతులు అయ్యుండాలి. అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. ఇదే సూత్రం వివిధ ఉద్యమ సంస్థలకూ వర్తిస్తుంది. ఈ సూక్తిని అన్వయించే ఒక సంఘటనను గుర్తు చేస్తాను. మీరూ పరిశీలించండి.

  • నీవు మహా మేధావివే. అయినా అందులో విశేషమేమీ లేదు. లోకంలో నీలాంటి మేధావులు చాలామంది లభిస్తారు. నీవు గొప్ప సాహసివి. అయినా అందులోనూ అంత ప్రత్యేకత ఏమీ లేదు. సాహసవంతులు ఎందరో ఉన్నారు. కానీ నీవు శీలవంతుడివి. అదే నీలోని అసాధారణత. లోకంలో శీలవంతులు అరుదుగా ఉంటున్నారు. ఈ మాటలు గాంధీ లోహియా గురించి చెప్పినవి. గాంధీ చెప్పాడు కనుక వీటికి ప్రామాణికత (విలువ) వచ్చిందని నేననడం లేదు. ఒక మహా ఉద్యమంలో దీర్ఘకాలం పాటు కీలక భూమికను పోషించిన గాంధీలాటి వ్యక్తి, ఉద్యమ కార్యములో శీలవంతుల పాత్ర గురించి చాలా ప్రస్ఫుటంగా ఇలా ప్రకటించడం వల్ల, మనలాంటి ఉద్యమకారులు ఉద్యమకారులకు ఉండాల్సిన యోగ్యతల గురించి, తగినంతగా పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోవలసి ఉందన్న వాస్తవాన్ని తెలుపడానికే ఇక్కడ ప్రస్తావించాను.

గమనిక: 'శీలం' అన్న మాట చాలా విస్తృతార్థం కలిగి ఉంది. 'సద్వర్తన' అన్నది దానికి సరిపడే సరళమైన పదం. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే అన్ని విషయాలలోనూ శీలవంతునిగా అంటే సంపూర్ణమైన సద్వరునునిగా ఉండగలగడం సాధ్యపడకపోవచ్చు. ఆ కానీ అతడు ఆయా సంస్థలలో గానీ, ఆయా వృత్తి వ్యాపారాలలో గానీ, తానున్న పాత్రకు (స్థానానికి) న్యాయం చేకూరే మేరైనా సద్వర్తన కలిగి ఉండడం తప్పనిసరి. ఈ లక్షణం గాని లేకుంటే పైన గాంధీ చెప్పినట్లు అతడెంత అవగాహనాపరుడైనా, సాహసవంతుడైనా, పనిమంతుడైనా అంతగా ప్రయోజనమేమి ఉండదు. అంతేగాక కొన్ని సందర్భాలలో ఆ పాత్రకు తగిన సద్వర్తన లేని పనిమంతులవడం వల్ల అతడు తన సామర్థ్యాలను దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. ఈనాడు అనేక చట్టాల విషయంలో అవి దుర్వినియోగం అవుతుండడం మనమందరం చూస్తూనే ఉన్నాము. . 

సమాజంలో నెలకొని ఉన్న అవాంఛనీయ పరిస్థితులు 

కారణాలు నివారణోపాయాలు 

సెప్టెంబర్ 17న జై భారత్ కార్యాలయం (ఎల్బీనగర్ ) లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థల సమావేశంలో, మన '1'వ నెంబర్ పుస్తకం పునర్ముద్రణ చేసే విషయంలో పుస్తకంలో చేయాలనుకున్న మార్పులకు, చేర్పులకు సంబంధించిన ముసాయిదా పత్ర పరిశీలన సందర్భంలో డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి గారు ఒక ప్రశ్న లేవనెత్తి, ఈ విషయానికి సంబంధించి సరైన సమాచారాన్ని జత చేస్తే బాగుంటుంది కదా అని అన్నారు. నాకూ దాని అవసరముందనిపించి అలాగే రాసి పంపుతాను. పరిశీలించండి అని చెప్పాను. ఈ రచన అందుకే.

ప్రశ్న: ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న అవాంఛనీయ పరిస్థితులకు కారణాలేమిటి? వాటిని తొలగించడానికి మనం సూచిస్తున్న పరిష్కారాలేమిటి? ఆ విషయంలో మన వేదిక చేయగలిగిందేమిటి?

సమాధానం: ప్రశ్న చాలా విస్తారమైన క్షేత్రంతో ముడిపడి ఉంది. ఎందుకంటే, సమాజంలోని ఏ రకమైన అపసవ్యతల సంబంధంగా నైనా దీనిని అన్వయించుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎవరికి వారు, వారు వారు ఎంచుకున్న సమస్యాత్మక అంశం యొక్క స్థాయిని, స్థానాన్ని తీవ్రతను బట్టి, పరిష్కార రూపాల స్థాయి, గంభీరత కూడా కలిగి ఉంటాయి. కనుక అంతటి విస్తృత విచారణ చేయకుండా, ప్రస్తుతానికి మన ఐక్యవేదిక తలపెట్టిన అంశానికి పరిమితమై సమాధానం చెప్పేందుకు ప్రయత్నిద్దాం. ముందీ విషయాన్ని వేదిక లోపలి వారంతా అర్థం చేసుకోవాలి. తరువాత దీనితో సంబంధ పడిన వారందరికీ దీనికి సంబంధించిన అవగాహన (ఎరుక) కలిగించాల్సి ఉంది. 

ఒక సాధారణ సూత్రం : (జనరల్ ప్రిన్సిపుల్)

"ఏనాటి సమాజం యొక్క స్థితి, గతులైనా, ఆనాటి సమాజాన్ని నడిపిస్తున్న కట్టుబాట్లు (వీటినే ఇప్పుడు రాజ్యాంగ శాసనాలు, చట్టాలు అనంటున్నారు) స్వరూప స్వభావాలపైనా, వాటి క్రింద జీవిస్తున్న ప్రజల అవగాహన, ఇష్టా ఇష్టాలు, పనితీరు, వ్యక్తిత్వాలు అన్నవాటిపైనా ఆధారపడే ఉంటుంటాయి”.

  • విజ్ఞుల మధ్య ఇది నిర్వివాదాంశం. మీరు కూడా ఎవరికి వారుగా ఇది యదార్థమో, కాదో ఆలోచించండి. 

ఇక ప్రస్తుతాంశానికి (మన విషయానికి) వస్తాను.

ఐక్యవేదిక (మనం) తలపెట్టిన కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నదే కదా? ఆ మాట అన్నామంటేనే, ప్రజాస్వామ్యం ఆచరణలో లేకపోవడమేగాక, అది ప్రమాదంలో పడిందని అనుకుంటున్నామనే కదా? అది కూడా, భారత రాజ్యాంగం సూచిస్తున్న రీతిలో ప్రజాస్వామ్యం ఇక్కడ అమలులో లేదనీ, ప్రజాస్వామ్యం పేరిట అప్రజాస్వామిక (రాజరిక లేదా నియంతృత్వ) విధానాలే అమలవుతున్నాయని అంటున్నామనే.

భారత రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని అమలుపరచుకోవాలనీ, అదే మన ఉద్యమాశయమనీ ప్రకటించుకున్నామంటేనే, ఇప్పుడున్న అవాంఛనీయ పరిస్థితులకు రాజ్యాంగం కారణం కాదని మనం అనుకుంటున్నట్లు. రాజ్యాంగం కారణం కాకుంటే మరింకేది కారణమవుతుంది? పైన చెప్పుకున్న సాధారణ సూత్రం ప్రకారం ప్రజలే ఇందుకు కారణమని తీరాల్సిందే. అయితే ఈ ప్రజలు అన్న సమూహాన్ని రెండుగా విభజించి వివరించుకుంటేనే మన విచారణ సజావుగా సాగుతుంది. ఎందుకంటే ప్రజలు ఏర్పరుచుకున్న వ్యవస్థలో ప్రజల పనులు చేసి పెట్టే స్థానాలలోకి కొందరు ప్రజలు ఉద్యోగులుగా చేరతారు. దేశ పౌరులుగా వారందరూ ప్రజలే అయినా, వ్యవస్థ నిర్వహణ కోసం ఆయా స్థానాలలో (ఉద్యోగాలలో, పదవులలో) ఉన్నంతకాలం వారిని ప్రజల పనులు చేసి పెట్టేవారుగానూ, మిగిలిన జనాన్ని పనులు చేయించుకునే వారుగానూ పిలుచుకుంటాం. దీనిని ఇంత ప్రత్యేకంగా ప్రస్తావించాల్నా అని , మీలో ఎవరికైనా అనిపించవచ్చు. కానీ మనం విచారణ మొదలెట్టిన అంశానికి సంబంధించినంతలో ఈ తేడా చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించినంతలో పైన చెప్పుకున్న రెండు సమూహాలలో చేసి పెట్టే స్థానంలో ఉన్నవారు, సేవక పాత్రలోనూ, చేయించుకునే స్థానంలో ఉన్నవారు యజమాని పాత్రలోనూ ఉంటారు. (ఉన్నారు ఉండాలి) గనుక.

  • అమలు చేసే స్థానంలో ఉన్నవారు అమలు చేయాల్సింది దేనిని? వ్యవస్థ నిర్వహణ కోసం రాజ్యాంగం సూచించిన విధివిధానాలనే కదా? రాజ్యాంగం సూచించిన అన్నదాని క్రిందికి, అది సూచిస్తున్న లక్ష్యాలు ఆ లక్ష్యాల సాధనకై అది సూచిస్తున్న విధివిధానాలు అన్న రెండూ వస్తాయి.

  • అమలు చేయించుకోవలసి ఉన్న స్థానంలో ఉన్నవారు చేయించుకోవాల్సింది ఏమిటి? 

పై సమాధానమే దీనికీ వర్తిస్తుంది. రాజ్యాంగం సూచించిన లక్ష్యాల సాధనకై అది సూచిస్తున్న విధివిధానాలు అన్నవే కదా?

ప్రజల పనులు చేసి పెట్టే వ్యవస్థనంతటినీ రాజ్యాంగ నిర్మాతలు మూడు ప్రధాన విభాగాలుగా రూపొందించారు. 1) శాసన విభాగము, 2) నిర్వహణ విభాగము, 3) న్యాయ విభాగము అంటారు వాటిని. అందులో

1) శాసన విభాగం అత్యంత కీలకమైనది, ప్రభావంతమైనదిగా ఉంది. ఎందుకంటే ఆ విభాగం యజమానులైన ప్రజలు స్వయంగా తమ ప్రతినిధులుగా ఎంపిక చేసిన వారితో ఏర్పడింది కనుక. అందుకనే రాజ్యాంగ పీఠికలో మనది 'గణతంత్ర వ్యవస్థ' అని చెప్పుకున్నాం. గణం అధీనంలో నడిచే వ్యవస్థ అని దానర్థం. ఆ గణం శాసన విభాగం రూపంలో ఉన్న ప్రజాప్రతినిధుల సముదాయమే. 

గమనిక: ఎన్నికల ప్రక్రియ అమలవుతున్న క్షేత్రమంతా అంటే పంచాయితీ వార్డు సభ్యుని నుండి రాష్ట్రపతి ఎంపిక వరకు జరిగేదంతా ప్రజాప్రతినిధుల భాగం క్రిందికే వస్తుంది. ఈ అంశాన్ని గమనికలో ఉంచుకోండి. ఈ విభాగంలోని వారు, పరిమిత కాలం వరకు, రాజ్యాంగం అంగీకరించిన మేర ప్రజల తరపున యజమాని పాత్రను పోషిస్తుంటారు. కనుకనే వ్యవస్థ సక్రమంగా అమలయ్యేలా చూసుకుంటుండడమే కాక, వ్యవస్థ నిర్వహణకు అవసరమైన మేర శాసనాలలో మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని కలిగి ఉంటుందీ విభాగం. కనుకనే ప్రభుత్వం కూడా వీరికే జవాబుదారీగా ఉంటుంది. 

  2) నిర్వహణ విభాగం:

ఇది ప్రజాప్రతినిధుల నుండి ఎంపికైన మంత్రిమండలితో కూడి, వ్యవస్థలోని ఆయా విభాగాల పనులకు సంబంధించిన నిపుణులతో కూడి ఉంటుంది. మంత్రులు ఆయా శాఖల పనితీరును పర్యవేక్షిస్తూ శాసనసభకు ప్రత్యక్షంగానూ, ప్రజలకు పరోక్షంగానూ జవాబుదారీగా ఉంటుంటారు.

3) న్యాయ విభాగం:

దీని పాత్ర ఒకింత చిన్నదే అయినా అత్యంత ప్రభావవంతమైనది. రాజ్యాంగ శాసనాల పట్లా, చట్టాల పట్లా, సమగ్రమైన అవగాహన కలిగి ఉన్న, నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండాల్సిన విభాగం ఇది. వ్యవస్థ పనితీరులో అపసవ్యతలు ఏర్పడినప్పుడల్లా కల్పించుకుని రాజ్యాంగ బద్ధత అన్న కొలత ఆధారంగా వ్యవస్థ పనితీరును పర్యవేక్షిస్తుండే, సక్రమ పరచే, విధులను నిర్వహిస్తుండే సేవా విభాగమిది.

ముఖ్య గమనిక: ఈ చట్రం అర్థమైతేనే, మనం విచారణకు తీసుకున్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పుకోవడం సాధ్యపడుతుంది. ఈ మూడు విభాగాలలోని వారందరినీ కలిపే మనం రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానాలలో ఉన్నవారు అని అంటున్నాము. వీరంతా ప్రజల పనులు చేసి పెట్టేందుకు ఏర్పరుచుకున్న ఉద్యోగులే (వేతన గాండ్లే) అయినా, వ్యవస్థ అంతా సక్రమంగా నడవడానికి అవసరమైన తరతమ భేదాలతో కూడిన నిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. ఆయా అధికార పరిధిలో నిర్వహణకు సంబంధించిన నిర్ణయాధికారాలూ కలిగి ఉంటారు.

మరో సాధారణ సూత్రం

అది ఏనాటి సమాజం కానీయండి, అప్పటికి ఉన్న కట్టుబాట్లు (రాజ్యాంగం) సక్రమంగా అమలు కాకపోవడానికి కారణం దానిని అమలు పరచాల్సిన స్థానాలలో అందుకు తగిన వారు లేకపోవడం, తగని వారు ఉండడమే అవుతుంది. ఈ సందర్భానికి సరిగ్గా సరిపోయే డాక్టర్ అంబేద్కర్ మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేయాల్సిన వారు చెడ్డవారైతే అది చెడ్డదైపోవడం ఖాయం” ఎంతటి తూకమైన మాట చెప్పాడాయన అదీ భారత రాజ్యాంగ నిర్మాణ సభ ముందు చెప్పాడు. అంటే ఒక రకంగా భారతదేశమంతటికి చేసిన హెచ్చరిక లాంటి మాట అన్నమాట.

మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో అమలు చేసే స్థానాలకిందికి పైన చెప్పుకున్న మూడు విభాగాలు వచ్చినా, న్యాయశాఖ మిగిలిన రెండు విభాగాలలోనూ అపసవ్యతలు చోటు చేసుకున్నాయన్న విషయం తన దృష్టికి వచ్చేంతవరకు కల్పించుకోదు. కనుక అపసవ్యతలు  చోటుచేసుకున్నాక దానిని చక్కజేసే పనే దానిది. అయితే అది గాని క్రియాశీలంగా ఉంటే, సమర్థవంతంగా ఉంటే చక్కజేసే పనిని అపసవ్యతలు చోటు చేసుకున్న వెంటనే ఆరంభిస్తుంది. త్వరత్వరగా చక్కజేస్తుంటుంది కూడా. 

  •  న్యాయాలయాల (కోర్టుల) పనితీరు ఎలా ఉందో న్యాయం కోసం కోర్టుల నాశ్రయించిన వారందరికీ తెలుసు. దీనికి ఇదే ప్రత్యేకంగా విచారించాల్సిన, సంస్కరించాల్సిన అంత పెద్ద విషయం కనుక ఇక్కడ కుదరదు.

మిగిలిన రెండు విభాగాలలోనూ ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన విభాగమే అత్యంత శక్తివంతంగా ఉంటూ మిగిలిన వాటిని అతిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనుకనే ప్రభుత్వం అంటే మంత్రిమండలితో కూడిన కార్యనిర్వాహక విభాగం, శాసన విభాగానికి జవాబుదారీగా ఉంటుంది

ఆ రకంగా చూస్తే అమలు చేసే పని మొత్తం వ్యవస్థలోని ప్రజాప్రతినిధుల భాగానికి దఖలై వుందనడమే సూత్రప్రాయంగా సరైనదవుతుంది. ఈ వివరాలన్నీ చక్కగా అర్థమైతేనే, మన ముందున్న ప్రశ్నకు సమాధానం కనుగొనడం సులువవుతుంది. ఇదిగో నా సమాధానం. 

సమాజంలో రాజ్యాంగేతర పోకడలు చోటు చేసుకోవడం ద్వారా ఏర్పడే అవాంఛనీయ పరిస్థితులన్నింటికీ తక్షణ (సాక్షాత్తు) కారణం ప్రజా ప్రతినిధులు సరైన వారు కాకపోవడమే. 

వీరు సరైన వారు కాకపోవడం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. 

1) దేనిని అమలు చేయాలో, ఏ ప్రకారంగా అమలు చేయాలో, ఎందుకొరకు అమలు , చేయాలో అన్న విషయాల గురించి సరైన, సరిపడినంత అవగాహన లేకపోవడం.

2) అవగాహన ఉన్నా, దానిని అమలుపరచడానికి అవసరమైనంత సమర్థత లేకపోవడం.

3) ఆ పని చేయడం ఇష్టం లేకపోవడం.

అయితే ఈ మూటిలో మొదటి రెండు బాహ్య కారణాలు కాగా, మూడవది వ్యక్తిత్వపరమైన అంతర్గత కారణం.

  • ఈ మూడు అవలక్షణాలున్న వారిని అయోగ్యులు (తగిన వారు కాదు) అని అంటాము. అవగాహన, సమర్థత, బలమైన ఇష్టము ఉన్న వారిని యోగ్యులు (తగినవారు) అని అంటాము. అందులోనూ మూడవదైన 'ఇష్టం లేకపోవడం అన్నది అయోగ్యతకు చెందినంతలో ముఖ్య మైనది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు యజమాని స్థానంలోనూ, ప్రజా ప్రతినిధులతో సహా వ్యవస్థను నడిపే వారంతా సేవకుల స్థానంలోనూ ఉండాలన్న మాట! కానీ ప్రస్తుతం వ్యవహారమంతా దీనికి పూర్తి విరుద్ధంగా (తలకిందులైన రీతిలో) నడుస్తోంది. అతి చిన్న బంట్రోతు దగ్గర నుండి, అత్యున్నత స్థానంలో ఉన్న ఉద్యోగి వరకు ఎవ్వరికీ ప్రజా సేవకులుగా ఉండడం ఇష్టం లేదు. అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శించడం వారి వైఖరికాగా, బ్రతిమలాడి, ప్రాధేయపడి, పనులు చేయించుకోవడం ప్రజల వైఖరిగా మారింది. ఇక ప్రజాప్రతినిధులైతే తామే యజమానులం, పాలకులమన్నట్లు, ప్రజలు పాలితులు, యాచకులు అన్నట్లు ప్రవర్తించడం జరుగుతోంది. ఎక్కడ చూచినా తనవాళ్లు, పరాయివాళ్లు అన్న దృష్టి పాతుకుపోయి ఉంటుంది. లంచమో, సిఫారసో లేకుండా జరగాల్సిన పనులే జరగడం లేదు. ఆ రెండూ ఉంటే, జరగకూడని పనులైన ఇట్టే జరిగిపోతున్నాయి. ఇదంతా చూడగలిగిన వారికి నిత్యం ఎదురవుతుండే వాస్తవమే.

రాజ్యాంగ లక్ష్యాల సాధనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ రెండు రాజ్యాంగ హృదయాన్ని సూటిగా చూపెడుతున్నాయి.

  • ఆర్టికల్ 14, చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతుండగా, ఆర్టికల్ 15 పౌరుల మధ్య వివక్ష కూడదు అని చెబుతోంది. ఎంత అద్భుతమైన ఆదేశం అది?!? “కులం, మతం, లింగం, ప్రాంతం, వర్గం కారణంగా ఏ ఇరువురి మధ్య వివక్ష చూపరాదు” అంటున్నది ఆ అధికరణం.

గొప్ప విషాదమేమంటే రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానాలలో ఉన్న వారిలో ఎక్కువ : మందికి దీనిని అమలు చేయడం ఇష్టం లేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న అవాంఛనీయ పరిస్థితులన్నింటికీ సాక్షాత్కారణం ఇదే. ఆ భాగంలోని వారిలో చాలామందికి 1) సరిపడినంత అవగాహన లేదు. 2) అవసరమైనంత సామర్థ్యం (పనితనం) లేదు. 3) అన్నింటికంటే ముఖ్యంగా ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే సరిపోవడం లేదు అయిష్టత ఉంది). ప్రతి వానికి పెత్తనం చెలాయించాలనీ, ఆధిపత్యం ఉండాలని అనిపిస్తుంటుంది. ఎక్కువలో ఎక్కువ అవాంఛనీయతలకు ప్రధాన కారణం ఇదే.

ఇప్పటివరకు చెప్పుకున్నది యథాతథంగా అర్థమయి ఉంటే, ప్రజాస్వామ్యం రాజ్యాంగం సూచించిన రీతిలో సజావుగా ఆచరణలోకి రావాలంటే ఆయా స్థానాలలోకి, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల స్థానాలలోకి తగిన వారు రావలసి ఉంటుందనీ, అట్టివారు రాకపోవడం వల్లే ఇట్టి పరిస్థితులు దాపురించాయనీ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇంతవరకే చెప్పుకుని ఊరుకుంటే మనం వేసుకున్న ప్రశ్నలకు పూర్తి సమాధానం చెప్పినట్లు కాదు. ఈ కారణాన్ని తొలగించాలంటే, ఆయా స్థానాలలోకి అయోగ్యులు ఎందుకొస్తున్నారు? యోగ్యులు ఎందుకు రావడం లేదో తెలియాలి. అక్కడ చక్కజేయాలి. మనందరికీ తెలుసు ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసేది ఓటర్ల పాత్రలోనున్న ప్రజలేనని. అంటే సరైన వారు ఎంపిక కావాలంటే, ఎన్నుకునే వారు (ఎంపిక చేసేవారు) సరైన వారు కావాలి. ఎంపిక విధానం సరైంది కావాలి.

సరైన వారు (యోగ్యులు) అంటే ఏమిటో పైన చెప్పుకున్నాం. అయినా మన అంశంతో ముడిపెట్టి మరొక్కసారి గుర్తు చేస్తాను. ఎంపికకు సంబంధించిన విషయాలలో సరైన, సరిపడినంత అవగాహన కలిగి ఉండడం, ఎంపిక చేసే నైపుణ్యత కలిగి ఉండడం, సరైన వారిని తమ ప్రతినిధులుగా నిలుపుకోవాలన్న బలమైన ఇష్టం ఉండడం. ఈ మూడు లక్షణాలు ఉన్న వారిని ఎంపిక చేయడానికి తగిన వారు అని అనాలి. ఈ విషయాన్ని మన ఐక్యవేదిక సూత్రీకరణలలో ఒక సూత్రంగా చాలా స్పష్టంగా చెప్పుకున్నాం.

సూత్రం : “ఎంత కాలం వరకు ప్రజలు అవగాహనాపరులూ, పనిమంతులూ, శీలవంతులూ కారో అంతకాలం వరకు ప్రజాస్వామ్యం దాని సరైన అర్థంలో ఆచరణలోకి , రాదు”.

విషయం అర్థం అవుతుందా? అమలు చేయించుకోవలసిన స్థానంలో (యజమాని స్థానంలో) ఉన్న ప్రజలు అయోగ్యులైతే, అమలు చేయాల్సిన స్థానాలలోకి యోగ్యులు ఎలా రాగలుగుతారు? ఇదే మనం విచారణకు పెట్టుకున్న సమస్యకు మూల కారణం. 

ఇప్పుడు మన ప్రశ్నలోని మూడవ భాగానికి వద్దాం. దీనికి పరిష్కారంగా మనం ఏమి చెబుతున్నాము? పరిష్కారం ఏమిటన్నది ఇప్పటికే మీకూ అర్థమైయుండాలి. సంబంధితాంశాల వరకైనా ప్రజలు అవగాహనాపరులూ, పనిమంతులూ, శీలవంతులుగా రూపొందటమే దీనికి సరైన పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం సేవకులు పాలిస్తున్నారు. యజమానులు పాలింపబడుతున్నారు. గాడిదను బండిమీద పండబెట్టి బండి యజమాని బండి లాగుతున్నాడు. ఈ పోలిక మీలో కొందరికి నచ్చకపోవచ్చు గానీ, వాస్తవ పరిస్థితి ఇంతకంటెనూ అధ్వాన్నంగా ఉంది. గాడిద ఊరికే పడుకుని ఉండకుండా, యజమానిని సతాయించి పనిచేయించుకుంటోంది. అనంటే వాస్తవాన్ని మరింత సరిగా చెప్పినట్లవుతుంది.

యజమానితనానికి చెందినంతలో దాని సారభూత లక్షణం నిర్ణయాధికారమూ, పర్యవేక్షణాధికారమూ, సంపదకు చెందిన లాభనష్టాలలో యాజమాన్యకు భాగస్వామ్యమూ కలిగి ఉండడమన్నదే.

ఓటర్లకు సరిపడినంత అవగాహన, విచక్షణా సామర్ధ్యము, నిస్పాక్షిక దృష్టి లేకపోవడం వల్లే తమ ప్రతినిధిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దగ్గరే జరగాల్సిన తప్పు జరిగిపోతోంది. అంటే యోగ్యులను ఎంపిక చేయకపోవడమూ, అయోగ్యుల్ని ఎంపిక చేయడమూ అన్న కారణం వల్లనే, జరగకూడనిదంతా జరుగుతూ వస్తోందన్నమాట. కనుక ఇప్పుడున్న అవాంఛనీయ పరిస్థితులన్నింటికీ మూల కారణం ప్రజలే అవుతున్నారు. సరైన ఎంపిక లేదు. సమర్థవంతమైన పర్యవేక్షణ లేదు. ఇక్కడ చక్కబడితేనే, వ్యవస్థలో అయోగ్యులు చేరకుండానూ, పొరపాటున చేరినా కొనసాగకుండానూ చేసుకోవడానికి వీలవుతుంది. 

ప్రశ్న : ఇక మన ప్రశ్నలోని ఆఖరి భాగానికి వద్దాం. ఈ దశలో ఐక్యవేదిక రూపంలో మనం ఏమి చేయగలం? ఏమి చేయాలో తెలిసింది. అయినా ఏమి చేయగలం? అని ప్రశ్నించుకుంటున్నాం. ఎందుకలా ప్రశ్నించుకున్నాం? ఈ సందర్భానికి చెందిన మరో రెండు సాధారణ సూత్రాలను గుర్తు చేసుకుందాం.

సూత్రం 1: కర్త, ఉద్దేశ్యము, పరికరాలు, విధానము, పని = ఫలితము. 

సూత్రం 2 : సఫలతకు సూత్రం. ఎంత పనికి అంత యత్నం అవసరము.

1) కర్త అంటే, ఆ పనిని గురించిన అవగాహన కలిగి ఉండి, తనంత తానుగా ఇష్టపడి, ఆ పనికి పూనుకున్నవాడు అని.

2) ఉద్దేశము : ఏమి సాధించాలన్నది స్పష్టంగా తెలిసి ఉండడం, అది చేయకుండా ఉండలేనంత తపన ఉండడం.

3) పరికరాలు : ఆ పనికి అవసరమైన సాధనాలు శుద్ధమైనదిగానూ, శక్తివంతమైనవిగానూ ఉండడం .

4) విధానం : సాధించాలనుకున్న దానిని సాధించడానికి పని ఎక్కడ నుండి ఏ విధంగా మొదలెట్టాలన్న దగ్గర నుండి ఫలితం వచ్చేంతవరకూ పనిచేయించగల సరైన, సరిపడినంత పద్ధతి తెలిసి ఉండడం. 

5) పని: పనే ఫలితాన్ని పుట్టిస్తుంది అన్నది సర్వసాధారణ నియమం. తలపెట్టిన పని (కార్యం) ఎంత పెద్దదో అంతకు సరిపడిన శ్రమను (నిపుణ శ్రమను) చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి.

  • ఇది కార్య కారణ నియమానికి సంబంధించిన సార్వత్రిక నియమం.

పైన చెప్పుకున్న రెండు సూత్రాలలో రెండో సూత్రాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనమేమి చేయగలం? అని ఎందుకు ప్రశ్నించుకున్నామో బోధపడుతుంది.

ప్రజాస్వామ్యాన్ని అమలులోకి తెచ్చుకోవడానికి చేయాల్సి ఉన్న పని చాలా బృహత్తరమైనది. ఒక పట్టాన ఏదో ఒక సంస్థ చేయగలిగింది కాదు. ప్రజల్ని సర్వజ్ఞుల్ని చేయడం కాదు గానీ, ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకైనా, సరిపడినంత (అవసరమున్నంత) అవగాహన కలిగించడం, ప్రజాప్రతినిధుల్ని ఎంచుకునే విషయములో సమర్ధుల్ని చేయడం, సామాజిక బాధ్యత గల (కనీసం ఎన్నికల విషయం వరకైనా నైతిక బాధ్యత గల) వారినిగా వారిని తయారు చేయడం జరగాలి. దాంతో పాటు ఎన్నికల విధానములో ఉన్న లోటుపాట్లను చక్క చేసుకునే పనికి పూనుకోవడం జరగాలి. ఒక ఓటు ఒక విలువ, ప్రతి ఓటుకూ విలువ, అపసవ్యతలకు అవకాశం లేని ఓటింగ్. 100% ఓటింగ్ లాంటి సంస్కరణలు జరగాలి. ఇదంతా ఒక బృహత్తర కార్యక్రమం. పెద్ద ఎత్తున చేయాల్సిందే కాక, చాలాకాలం చేయాల్సిన పని కూడా. కనుకనే, ఈ దశలో మనం ఏమి చేయగలం? అని ప్రశ్నించుకుంటున్నాము.

మన కార్యాచరణ ద్విముఖాత్మకంగా ఉండాలి. 1) ప్రజల్ని యోగ్యులనుగా తయారు చేయడం, 2) వ్యవస్థలోని చట్టాల ఆధారంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం (ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒకటి రెండు ముఖ్యాంశాల పైనే ఆ ఒత్తిడి) కార్యక్రమము ఉంటుంది.

మరొక ముఖ్యాంశం వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల్ని మంచి పౌరులుగా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. అందుకొరకు ఏర్పడిందే విద్యాశాఖ. ఈ విద్య రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి సామాజిక స్పృహకల బాధ్యతాయుతమైన పౌరుణ్ణి తయారు చేసేందుకు అవసరమైంది కాగా, రెండోది సామాజిక అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులను సిద్ధం చేసేందుకు అవసరమైన ఉత్పాదక విద్య. ఈ రెంటిలోనూ యోగ్యతను తెచ్చి పెట్టేది మొదటి విద్యే. అందుకనే యోగ్యతల గురించి చెప్పుకునే సందర్భంలో, అవగాహన, పనితనాల కంటే వ్యక్తిత్వం కీలకమైందని చెప్పుకున్నాం. బలమైన ఇష్టమన్నదీ, శీలమన్నదీ, నైతికత అన్నదీ కూడా ఈ వ్యక్తిత్వానికి సంబంధించినవే అవుతాయి. 

  • వ్యక్తిత్వ నిర్మాణానికి, అధ్యయనము, శిక్షణ, అనుకూల వాతావరణము అన్నవి శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ పని చేయాల్సిందీ, చేయగలిగిందీ కూడా వ్యవన్డే. వ్యవస్థను అమలు పరచాల్సిన ప్రభుత్వమే. 

ఇప్పటికే మనం చేయాల్సిన పనుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి. 1) ఎన్నికల సంస్కరణలు, 2) అధికార వికేంద్రీకరణ, 3) గ్రామసభల సక్రమ నిర్వహణ, 4) వీటికి సంబంధించిన ఒకటి రెండు చట్టాల సమర్థ వినియోగము.

మరో ముఖ్య గమనిక

మనం తల పెట్టిన ఏ విషయానికి సంబంధించిన, ఏ కార్యక్రమాన్ని మొదలెట్టాలన్నా, మొట్టమొదట మన ఎదుట కనపడేది ఆ పనికి తగిన వ్యక్తుల సమీకరణ అన్నదే. దీని యొక్క వాస్తవ పరిస్థితులను బట్టే, ఈ దశలో ఏమిచేయగలం అన్నదానికి సరైన సమాధానం చెప్పుకోగలుగుతాము. కనుకనే సిద్ధాంత పునాది కల ఉద్యమాలకు దశలవారీ కార్యాచరణ ప్రణాళిక అన్నది అత్యంత ప్రధానమైన అంశంగా ఉంటుంది.

ఇందులో ప్రస్తావించిన అంశాలపై మరికొంత వివరంగా మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. ఈ వ్యాసం సాధారణ అవగాహనకు మాత్రమే పనికి వస్తుంది. విశేషావగాహన కలిగించుకోవాలంటే ఒక్కొక్క అంశాన్ని, కనీసం ఇందులో ముఖ్యమనుకున్న కొన్ని ఈ అంశాలనైనా విపుల విచారణకు లోనుచేయడమే మంచిదన్నది నా అభిప్రాయం. మనం వేసుకున్న ప్రశ్నకు సంగ్రహంగానైనా సమాధానం ఇందులో ఉందా? లేదా? చెప్పండి. ఏవైనా మార్పులూ, చేర్పులూ అవసరమనిపిస్తే వాటిని లిఖిత రూపంలో వ్రాసుకు రండి. మరికొంత మాట్లాడాల్సింది ఉందనిపిస్తున్న ఇప్పటికీ ఆగుతాను.                     -నమస్కారాలు. మీ సురేంద్ర. 

ఖురాను అధ్యయనపరులకు సత్యాన్వేషణ మండలి పిలుపు 

యోచనాశీలురైన ఇస్లాం విద్వాంసులారా!

ఈనాడు ఖురాను వచనాలకు అర్ధాలు చెబుతున్న పండితులలోనే, కొన్ని వచనాలకు వేరు వేరు అర్థాలు చెప్పడం, పరస్పరం విభేదించుకోవడం కనపడుతుంది. ఒకే వచనానికి అనేక అర్ధాలు చెబుతున్న వీరిని జాగ్రత్తగా గమనిస్తున్న వారికి, ఇంతకూ ఖురాను ఏమి చెబుతున్నట్లు? అన్న సందేహం పుడుతుంది. ఈ ప్రశ్నను ఆ అర్ధాలు చెబుతున్న వారిని అడిగినప్పుడు, ఎవరికి వారు తాను చెప్పిందే సరైన అర్థము. ఇతరులు చెబుతున్నది తప్పు అర్థము. ఖురానును సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అలాంటి తప్పు వివరణలు వస్తున్నాయి, అని అందరూ చెబుతున్నారు. ఇప్పుడు మన ముందు మరో ప్రశ్న పుట్టుకొచ్చింది. ఇంతకూ ఖురాను అసలు అర్థం ఏమిటన్నది నిర్ణయించడానికి ఏదైనా పద్ధతి ఉందా? అన్నదే ఆ ప్రశ్న.

ఒక దశాబ్దం పైగా సత్యాన్వేషణ మండలి వాళ్ళము ఖురాను పండితులతో అనేకసార్లుగా, ఇంతకు ఈ నాలుగైదు అంశాల గురించి ఖురాను చెబుతున్న వాస్తవమేమిటి? అన్న పరిశీలన చేస్తూ వస్తున్నాము. ఇందుకోసమై నేనూ ఖురానును ఒకింత నిశితంగాను, శ్రద్ధగానే అధ్యయనం చేశాను. ఆ అధ్యయనము, ఆ పరిశీలనల వలన ఖురాను గురించి నాకు కలిగిన అవగాహన ఇలా ఉంది.

1) ఖురాను మానవ సమూహాన్నంతటినీ ఒకటిగా చూడదు. వారిని విశ్వాసులుగానూ అవిశ్వాసులుగాను రెండుగా విభజించి చూస్తుంది. అంటే విశ్వాసులూ, అవిశ్వాసులు ఒకటి కాదు. సమానులు కాదంటుంది.

2) అవిశ్వాసులకు, వారు ఈ లోక సంబంధంగా మంచి పనులు చేసినప్పటికీ వారికి , స్వర్గం లభించదు.

3) విశ్వాసులకు, వారెన్ని దుష్కర్మలు చేసినా పశ్చాతాపపడి, దేవునికి విధేయుడు అయితే వారికి స్వర్గం వస్తుంది. అంటే వారు వారు చేసిన మంచి, చెడ్డ పనులను బట్టి గాక, వారు విశ్వసా? అవిశ్వాసా? అన్న దానిని బట్టే వారికి స్వర్గంగానీ, నరకం గానీ ప్రాప్తిస్తాయి.

4) ఒక ఇస్లాం రాజ్యంలో, ముస్లిమేతరులూ, ముస్లిములూ సమానంగా పరిగణింపబడరు. ముస్లింలకు ఉన్నన్ని హక్కులు ముస్లిమేతరులకు ఉండవు. ముస్లిమేతరులకున్న నిబంధనలన్నీ ముస్లిములకు ఉండవు. 

5) ముస్లిమేతరులతో, ముస్లింలు మిత్ర సంబంధాలు కొనసాగించాలని గానీ, కొనసాగించ వచ్చని గానీ చెప్పదు. అవిశ్వాసులు బంధువులైనా వారితో మిత్ర సంబంధాలు వద్దు. బంధుత్వానికి సంబంధించిన, అదీ తల్లిదండ్రుల విషయంలో వారి పట్ల బాధ్యతలను నెరవేర్చండి అన్నంతవరకే అనుమతి ఉంది.

6) అవిశ్వాసులతో పోరాటమే మీకు విధించబడింది. ఆయా సమయ సందర్భాలను బట్టి, బలాబలాలను బట్టి పోరాట పద్ధతులలో మార్పేగాని (సంధి కూడా పోరాటంలో భాగమే), అది మైత్రి కాదు. కాకూడదు అన్న వైఖరినే కలిగి ఉండాలని చెబుతోంది.

7) భారత రాజ్యాంగం సూచిస్తున్న ఎ) మానవులంతా సమానులు. బి) కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, లింగాన్ని, జాతిని బట్టి భారత పౌరుల మధ్య తేడా చూడకూడదు. సి)  ప్రతి ఒక్కరికి మత స్వేచ్చ సమానంగా ఉంది అన్న విషయాలకు ఖురాను అనుగుణ్యత కలిగి లేదు.

8) ఈనాటి, రేపటి సమాజాలకు సరిపడని విషయాలెన్నో ఖురానులో ఉన్నాయి. ఇవి నా అవగాహన నుండి ఏర్పడ్డ అభిప్రాయాలు.

ఇస్లాం విద్వాంసులలో కొందరు, ఎ) ఖురాను భారత రాజ్యాంగానికి 100% అనుగుణ్యత కలిగి ఉందనీ, బి) విశ్వాసులు, అవిశ్వాసుల విషయములో ఖురాను గురించిన మీ అవగాహన సరైంది కాదు. 

ఖురాను అలా చెప్పడం లేదనీ, సి) అవిశ్వాసులు కూడా వారు చేసిన మంచి పనులు కారణంగా స్వర్గం చేరతారని ఖురాను చెబుతుందని అంటున్నారు.

ముగింపు: ఇంతకూ ఖురాను ఏమి చెబుతుందో అన్నది నిర్ధారించడానికై ఈ ఆహ్వానం పలుకుతున్నాము. ఖురాను పై పట్టు, ఈ విషయంపై అభిరుచి ఉన్నవారు మమ్ము సంప్రదించండి.

           -నమస్కారం, మీ సురేంద్ర


No comments:

Post a Comment