Wednesday, December 7, 2022

266 వివేకపథం సంచిక

వివేకపథం
సంపుటి: 8 సంచిక:8 డిసెంబరు 2022
మండలి జీవన విధానము (శైలి)

యోచనాశీలురైన మిత్రులారా!
    ఈ పుస్తకం పేరుకు సంబంధించిన క్షేత్ర పరిధి ఒకింత గంభీరమైనది, విస్తృతమైనది కూడా. ఎందుకంటే, ఒక మనిషి జీవనశైలి అన్నది; వ్యక్తి, సమాజము, ప్రకృతి అన్న మూటి సంబంధంగా అతను ఆ జీవితం ప్రవర్తించే తీరును సూచిస్తుంది. జీవితంలో ఎదురు పడే ఆయా సందర్భాలలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు? అన్నది అతని జీవన విధానాన్ని సూచిస్తుంటుంది. మరోరకంగా చెప్పుకుంటే అతని ప్రవర్తనా తీరు అన్నది అతని వ్యక్తిత్వాన్నీ, మూర్తిమత్వాన్నీ ప్రతిబిస్తుంటుంది అనవచ్చు. వ్యక్తిత్వం అన్నది; వ్యక్తి అంగీకరించే విలువలు, అతని ఇష్టాఇష్టాలు, పెరిగిన వాతావరణం ఇవన్నీ అతనిపై చూపిన ప్రభావం అన్న వాటి ఆధారంగా రూపొందుతుంటుంది.
    గమనిక : ప్రియ చదువరులారా! ఎక్కడికక్కడ వరకు నేను చెప్పింది యథార్ధమో కాదో చూసుకుంటూ చదవండి. అవగాహనలో వచ్చే మార్పు, ఇష్టాఇష్టాలలో వచ్చే మార్పు పరిసరాలలో వచ్చే మార్పు అన్నవి వ్యక్తిత్వంలో మార్పుకు దారితీస్తుంటాయి. ఈ సాధారణ సూత్రాన్ని గమనికలో ఉంచుకోండి. నేను చెప్పానని గాక మీ మీ అనుభవాల నుండి సరిచూసుకునే నిర్ణయాలకు రావడం అన్న విధానాన్ని అలవాటుగా చేసుకోండి. ఈనాటి మనిషి సంఘజీవి. కనుక సహజీవనం అనివార్యం. సంఘమంటే ఏదో రకమైన అవగాహనలోకి వచ్చి కలసి జీవించడానికి సిద్ధపడిన సమూహం అని అర్థం. శారీరక, మానసిక అవసరాలే మనిషి మరొక మనిషితో జతకట్టడానికీ, దానిని కొనసాగించడానికీ, ప్రాతిపదికలయ్యాయి. ఈ అవసరాలు 1) సహజావసరాలు, 2) తెచ్చి పెట్టుకున్న అవసరాలు, 3) వచ్చి పడుతున్న అవసరాలు అని మూడుగా ఉంటాయి. ఈ అవసరాలు తీర్చుకోవడానికి, తీరుతూ ఉండడానికి పరస్పరం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదు? అన్న రూపంలోనే ఆ అవగాహన ఉంటుంది. దానినే మనం ఆ సమూహం ఏర్పరచుకున్న కట్టుబాటు (అనుసరించాల్సిన పద్ధతి) అనంటున్నాము.
అవసరాలు తీర్చుకోవడానికి బలాన్ని ప్రదర్శించడం ఒక విధానమైతే, బలాన్ని కాక • ఏర్పరుచుకున్న ఒక పద్ధతిని పాటించడం మరో పద్ధతి. మొదటి విధానాన్ని పశుప్రవృత్తి అనంటున్నాం. రెండో విధానాన్ని సామాజిక పద్ధతి లేదా అవగాహనతో కూడిన పద్ధతి అనంటున్నాం. కట్టుబాటు రూపొందకముందు మనిషి కూడా పశు ప్రవృత్తినే కలిగి ఉండేవాడు. ఆ విధానంలో బలవంతంగా అవసరాలు తీర్చుకోవడం, లొంగి ఉండి అవసరాలు తీర్చుకోవడం అన్నదే జరిగే వీలుంది. ఈ విధానం ద్వారా అవసరాలు తీరడానికి భద్రత లేకపోవడం కారణంగానే, మనిషి అవగాహనా పూర్వకమైన సహజీవన విధానానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే తన మనుగడకూ, అవసరాల నెరవేర్పుకూ, మరో మనిషితో ఇచ్చి పుచ్చుకునే సంబంధాలూ, కలసి జీవించడమూ అన్న రెండు తప్పనిసరి అన్న అవగాహన కలిగిందో ఆనాడే ఉమ్మడి కట్టడి అన్నదానికి బీజావాపనం (విత్తనం వేయడం) జరిగింది. మానవజాతి వికాస క్రమంలో ఇదొక పెద్ద గంతు (ముందడుగు).
    సామాజిక సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే నన్నది నా అవగాహన. కనుకనే మండలి మూల భావనల్లో అదీ ఒకటిగా ఉంది. ముందిచ్చిన వానికి తిరిగి పుచ్చుకునే హక్కు, ముందే పుచ్చుకున్న వానికి తిరిగివ్వాల్సిన విధి ఏర్పడుతుంది అన్నది ఇచ్చిపుచ్చుకునే సంబంధాల విషయంలో సర్వసాధారణ నియమంగా ప్రపంచమంతా (యోచనాపరులంతా) అంగీకరించారు. వీటిని ప్రపంచ దేశాలన్నీ 'హక్కులు - విధులు' అన్న రూపంలో తమ తమ రాజ్యాంగాల ద్వారా నిర్దేశించుకున్నాయి. కనుకనే ఆయా సమాజాలన్నీ తమ సమాజంలో ఒకనిగా ఉన్న వ్యక్తి హక్కులకు రక్షణ కల్పిస్తూ అతడు సమాజం విషయంలో నెరవేర్చవలసిన విధులు నిర్వర్తిస్తుండేలా నియంత్రిస్తూ ఉంటున్నాయి. సామాజిక తత్వశాస్త్ర ప్రాతిపదికలలో ఒకటైన 'పే బ్యాక్ టు ద సొసైటీ' సమాజానికి తిరిగి చెల్లించాలన్నమాట, భారతీయ తాత్వికులు చెప్పిన 'మూడు రుణాలు' అన్న భావనా ఈ ఇచ్చిపుచ్చుకోడానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి తెలిపేటివే. మండలి ఈ విషయాన్ని స్వానుభవం ద్వారా గమనించింది. ప్రతి మనిషి అతడే స్థాయిలో ఉన్నవాడైనా, ఇచ్చుపుచ్చుకునే వ్యవహార సంబంధంగా, సమాజానికి తిరిగి చెల్లించాల్సిన (రుణపడిన) వాడుగానే ఉంటాడన్నది మండలి అవగాహన. కనుక సరైన జీవనశైలిలో తిరిగి చెల్లించడమనే భాగం స్వచ్ఛందంగా పెట్టుకున్నదిగా ఉంటుంది.
సమాజం నుండి తీసుకోకుండా మనిషి జీవించలేడు. అతడు పుట్టిన దగ్గర నుండి (ఉనికి ఆరంభమైన క్షణం నుండీ) సమాజం అతనికి ఇవ్వడం మొదలయ్యింది. అతడు చనిపోయే వరకు సమాజం వివిధ రూపాలలో అతనికి ఇస్తూనే వస్తోంది. అతడు తన అవసరాలు తాను తీర్చుకోలేని దశ నుండి, సమాజావసరాలు తీరడానికి ఎంతోకొంత చేయగలిగే దశలోనూ, తిరిగి వృద్ధాప్యంలో తన అవసరాలు తానే తీర్చుకోలేని దశకు చేరిన సందర్భం వరకు కూడా సమాజం అతనికి ఇస్తూనే ఉంది. మధ్యదశే అతడు తిరిగి చెల్లించడానికి అవకాశమున్న దశ. కనుకనే మండలి జీవన విధానంలో, శక్తివంచన లేకుండా ప్రతి మనిషీ సమాజ హితానికై ఎంతో కొంత చెల్లిస్తూ ఉండాల్సిందేనన్న భావన చోటు చేసుకుంది.
    జీవితానికి సంబంధించిన అవగాహన, ఇష్టాఇష్టాలు, పని సామర్థ్యము, పరిస్థితులు ఒత్తిడి అన్న నాలుగూ మనిషి ప్రవర్తనను నియంత్రిస్తుంటాయి. ఇక్కడికిది సర్వసాధారణమైన విషయమో కాదో ఎవరికి వారుగా మీ మీ జీవితానుభవాలను గమనించి స్పష్టమైన అవగాహనకు రండి. జీవితాన్ని సరిగా సరిపడినంతగా అర్థం చేసుకోవడమంటే, జీవితంలో పై నాలుగూ నిర్వహిస్తున్న పాత్ర ఏమిటో వాటిలో దేనికెంత ప్రాధాన్యతనివ్వాలో తెలుసుకోవడమనే. దీనినే మేము వివేకం అనంటున్నాము. అట్టి వివేకం చూపిన రీతిలో జీవితాన్ని కొనసాగించడాన్నే యోగ్యమైన జీవనశైలి అనంటున్నాము.
    జీవితాన్ని అర్థం చేసుకునే పని చేసిన వారినే తాత్వికులు అని పిలవడం జరుగుతోంది లోకంలో. అయితే ఆ తాత్వికులు తమ తమ అవగాహనలను వివిధంగా ప్రకటించారు. అందువల్ల వారు జ్ఞాన ప్రధానవాదులుగా, కర్మ ప్రధానవాదులుగా, జ్ఞాన కర్మ సముచ్ఛయవాదులుగా పిలవబడ్డారు. ఆ మూటిలో మండలిది జ్ఞాన కర్మ సముచ్ఛయవాదం.
మానవ జీవితమంతా జ్ఞాన యుక్త కర్మల సమాహారంగానే సాగుతోందన్నది సర్వానుభవ సిద్ధం కదా? ఇందులో దేనిని ప్రధానం చేసి, దేనిని అప్రధానం చేసినా జీవనయానం సవ్యంగా సాగదు. ఒక వాస్తవం చెబుతాను, మీరూ మీ మీ అనుభవాలనుండి ఈ వాస్తవాన్ని గమనించండి.
    1) ప్రస్తుతం మన జీవనం 'జ్ఞానము -ఇష్టాఇష్టాలు- పని' అన్న క్రమంలో సాగుతోంది. ఇది నిజమా? కాదా?
    2) కానీ జ్ఞానం కలగాలంటే జ్ఞానేంద్రియ వ్యవస్థ పని చేయక తప్పదు. కనుక అవి ఏర్పడుతున్న క్రమాన్ని గనక చెప్పవలసి వస్తే కర్మ- జ్ఞానము- ఇష్టాఇష్టాలు అన్న వరుస ఏర్పడుతుంది. అర్థమవుతోందా? సమస్తమూ కర్మమూలమే అయినా, జ్ఞానం పుట్టిన తరువాత నుండి జరిగేదంతా జ్ఞానము - ఇష్టాఇష్టాలు- పని అన్న క్రమంలోనే సాగుతుంటుంది.
'పనే ఫలితాన్ని పుట్టిస్తుంది' అన్నదీ ఒక సార్వకాలీనమైన సూత్రమే. అంటే నిర్ధారణైన నిజమే. కనుక ఉద్దేశ్యము జ్ఞాన భాగానికి చెందినదే అయినా, ఉద్దేశ్యం నెరవేరాలంటే దానికి సంబంధించిన జ్ఞానం (అవగాహన) చూపిన రీతిలో కర్మ చేయాల్సి ఉంటుంది. ఆచరణకు నోచుకోని ఎంత గొప్ప జ్ఞానమున్నా, జ్ఞాన నిర్దేశికత్వం లేని ఎంతటి పని సామర్థ్యమున్నా మనిషి జీవితం సజావుగా సాగదు. అంటే రావలసినవి రావడం గానీ, పోవలసినవి పోవడం గానీ సాధ్యపడదు. ఈ వాస్తవాన్ని స్వానుభవం ద్వారా స్పష్టంగా గమనించాకనే మండలి, మానవ జీవన విధానం వివేకపథ పదికత్వంగా ఉండాలని నిశ్చయించుకుంది. అంటే ఆయా విషయాలకు చెందిన ఒప్పు జ్ఞానం చూపిన రీతిలో ఇష్టాఇష్టాలను నియంత్రించుకుంటూ జీవించడం అని అర్థం. ఈ విధానాన్నే, వ్యక్తి ఆ జీవితం జాగరుకతతో, నిజాయితీతో ఉంటూ శక్తి వంచన లేకుండా సాధన చేస్తుండాలని తలంచుతుంది, ప్రకటిస్తోంది.
    ఏ వ్యక్తీ తనను తాను సిద్ధావస్థను పొందిన వానిగా అనుకోవడం సరైనది కాదనీ, జీవించి ఉన్నంతకాలం సాధకునిగా భావించుకుంటూ తన నడకపట్ల అప్రమత్తంగా ఉండటమే సరైనదని భావిస్తోంది. సిద్ధావస్థ అంటే 100% వివేకం అదుపులో స్వభావాన్ని నియంత్రించగలిగే స్థితిలో ఉండడం అని అర్థం. 'స్వతంత్రుడు అంటే తన వశంలో తానున్న వాడు' అని అర్థం. ఈ మాటను ఉపయోగించి సిద్ధావస్థ గురించి చెప్పాలంటే, సర్వ స్వతంత్రుడై యుండుట అని చెప్పాల్సి ఉంటుంది. ఆ లెఖ్ఖన ఒక వ్యక్తి సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు అయితే తప్ప సిద్ధావస్థకు చేరలేడు. కనుకనే మండలి జీవనశైలి సాధన స్వభావం కలిగి ఉంటుందని ప్రకటించుకోవడం జరిగింది. ఈ అవగాహన నుండే “సిద్ధుడనైతిని అని తలంచకు, సాధకునిగా కొనసాగడాన్ని విరమించకు” అన్న భావన మండలి మూల భావనల్లో ఒకటిగా వచ్చి చేరింది. వివేకానికీ ఇష్టాఇష్టాలకు పొంతన కుదరడమే మనిషి జీవన శైలిలో ఉన్నత స్థితి అవుతుంది. వెనుకటి తాత్వికులు కొందరు స్వభావం యొక్క బలాన్ని, నిరంకుశత్వాన్ని బాగానే గమనించగలిగారు. స్వభావో దురతిక్రమః అనీ, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము సాధించడమే ఆధ్యాత్మిక జీవనం సాగించదలచిన వారు చేయవలసిన అసలు సాధన అని, స్వతంత్రుడు అవడమంటే ఆత్మ నియంత్రణ కలిగి ఉండడమేననీ స్పష్టంగా ప్రకటించారు. సమ్యక్ జ్ఞానము, దానికి లోబడిన దానిని అనుసరించే ఇష్టాఇష్టాలు (సంకల్పాలు) ఆ మేరకే మాటా, చేత కలిగి ఉండడము ఉన్నవే వివేకవంతమైన జీవన శైలికి ఆధారంగా ఉండే లక్షణాలు.




మండలి అలవర్చుకో మంటున్న దినచర్య రూపము


మిత్రులారా!
    మండలిలోని సభ్యులు తాము ఆచరిస్తూ, అలవాటుగా మార్చుకోడానికి సాధన చేస్తుండాలని, సాటి మనుషులకూ దీనిని పరిచయం చేస్తూ, వారూ ఈ విధానాన్ని అలవరుచుకునేలా ప్రేరణ కలిగిస్తుండాలని భావిస్తున్న మండలి దినచర్య స్వరూపాన్ని ప్రస్తావించుకుందాం. ఒక వ్యక్తి జీవనశైలిని (విధానాన్ని) ప్రతిబింబించడంలో 'దినచర్య' చాలా కీలకమైనదవుతుంది. దినచర్య యొక్క సాధారణ రూపం రోజూ 24 గంటలు ఎలా గడపాలన్నదే అవుతుంది.
నా జీవితాన్ని అతిగా ప్రభావితం చేసిన భావనలు కొన్ని ఉన్నాయి. అవి, జ్ఞాన క్షేత్రానికీ, కర్మ క్షేత్రానికీ సంబంధించినవై యున్నాయి. 1) సోమరులకెచ్చటనూ చోటు లేదు, 2) నశ్రేయో నియమం వినా, 3) కార్యసాధకునికి పట్టుదలే మూలబలం.
ఈ మూడూ వ్యక్తి జీవితంలో ఏ మేరకు పాటింపబడుతున్నాయన్న దానిపైనే చాలావరకు అతని జీవనశైలి ఆధారపడి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఇక్కడికిది నిజమో? కాదో? మీ మీ జీవితానుభవాలను తరచి చూచి ఒక నిర్ణయానికి రండి. పైవాటిని కొద్దిగా వివరిస్తాను.
సోమరితనం :
    చేయాల్సిందేమిటో తెలిసుండే, చేయగలిగి ఉండే చేయడానికి సిద్ధపడకపోవడం దీని లక్షణం. అలసత్వం, నిర్లక్ష్యం, వాయిదా మనస్తత్వం, పని ఎగవేతదనం, పనులను ఇతరులకు పురమాయించడం లాంటి వన్నీ సోమరితనం కారణంగా ఏర్పడుతుండే జీవన విధానాలే సోమరితనమంటే.
    ఒక రకమైన జీవన విధానాన్ని సూచించే మాటలే అవి. కొద్దిగా వివరిస్తాను, మీరు పరిశీలించండి.
యమం- అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అన్న ఐదేంటినీ ఒక వ్రతంగా ఆ జీవితం పాటించాలి అని చెబుతుందా సూత్రం. త్రికరణశుద్ధిగా ఇతరులకు బాధ కలిగించకుండా ప్రవర్తిస్తుండడం, సత్యాలే మాట్లాడుతుండడం, దొంగతనం చేయకుండడం, లైంగిక నిగ్రహం కలిగి ఉండడం, దానం స్వీకరించకుండా ఉండడం అన్న ఐదింటినీ ఆజీవితం (చనిపోయే వరకు) దీక్షగా ఆచరిస్తూ ఉండాలన్నది దానర్థం. మండలి తన స్వీయ జీవితాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే పై ఐదు అంశాలను అమలు చేసుకునే జీవన విధానమే సరైందన్న నిర్ణయానికి వచ్చింది. అయితే వాటిని సంపూర్ణ రూపంలో పాటించడం ఏ వ్యక్తికీ ఒక పట్టాన అయ్యేది కాదన్న విషయాన్ని గమనించే, వాటిని పాటించే విషయంలో చచ్చేవరకు సాధకులంగానే కొనసాగుదాం. సిద్దులమని అనుకోవద్దు, అన్న నియమాన్ని పెట్టుకుని, వాటిని మరింత మరింతగా ఆచరణలోకి తెచ్చుకునేందుకు నిజాయితీగా యత్నిస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉందామని మాకు మేము చెప్పుకున్నాం. మండలి జీవన శైలిని గురించే మాట్లాడుతున్నానని అనిపిస్తోందా?
ఇందులోని రెండు పదాలు, ఈ వ్యాసంలోని మాటలను పోలి ఉన్నాయి. ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండడం అని అర్థం. ఉపనిషత్తులోని 'మా గృధః' అన్న పదానికి సమానమైన అర్థంగల పదమది. ఈ సూత్రం యోగ దర్శనం లోనిది. ఉపనిషద్రచయిత కంటేనూ, మరింత ఉన్నతంగా ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఎలా ఉండాలో వ్యక్తీకరించాడీ రచయిత. దొంగతనం చేయవద్దు అని ఊరుకోకుండా, పరిగ్రహమూ చేయవద్దంటూ, పుచ్చుకోకు అన్నదానిని రెండు మాటలలో చెప్పాడు. ఒక వస్తువును దాని సొంతదారుకు తెలియకుండా (మరొకరిది) తీసుకోవడం 'దొంగతనం' అవుతుంది. ఉమ్మడి సంపదలో న్యాయబద్ధంగా నీవెంతకు హక్కుదారుడివో అంతకుమించి, ఉమ్మడి నుండి వారికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం కాగా, ఉమ్మడి సంపదలో నుండి తనదిగా పొందిన మరొకడు ఇష్టపడి ఇచ్చినా తీసుకోకుండడం అపరిగ్రహం అవుతుంది. ఇతరులది వారికి తెలియకుండా తీసుకోవద్దు. అలాకాక వారే ఇవ్వచూపినా నీది కానిది తీసుకోవద్దు అని ఆ సూత్రకారుడు సంపద విషయంలో ఎట్టి జీవనశైలిని కలిగి ఉండాలో స్పష్టం చేశాడు. మండలి ఈ విషయంలో చాలా స్పష్టత కలిగి ఉంది. ఆ అవగాహనతోనే సమాజాన్నుండి విరాళాలు అడగవద్దు, అడగకుండానే ఇచ్చినా తీసుకోవద్దు అన్న నియమం పెట్టుకున్నాము. గత 40 ఏళ్లుగా ఆ నియమాన్ని పాటిస్తూనే వస్తున్నాము. మండలి జీవనశైలికి సంబంధించినంతలో ఇది ఒక ముఖ్యమైన వైఖరే. ఈ అవగాహన నుండే మూడు న్యాయపరమైన సూత్రాలనూ రూపొందించుకున్నాము. 1) చేసిన వానికే ఫలితం దక్కాలి, 2) చేసినంతకూ దక్కాలి, 3) చేసినంతకే దక్కాలి. ఈ మూడు నియమాలనూ పాటించే వ్యక్తులు మంచి సమాజంలో ఉండదగిన వారవుతారు. ఈ మూటినీ అమలయ్యేలా చూడగలిగే కట్టుబాటు ఉన్న సమాజం మంచి సమాజం అనడానికి తగిందై ఉంటుంది. మంచి వ్యక్తులు, మంచి కట్టుబాట్లు కలిస్తే మంచి సమాజమవుతుంది.
    పని చేసిన వానికే ప్రతిఫలం పొందే హక్కు ఉంటుంది. సోమరికి (పని దొంగకు, పనికిమాలిన వానికి) సమాజంలో (ఉమ్మడిలో) కొనసాగే హక్కు ఉండదు. పని చేసిన వానికి కూడా, పనికి తగినంత మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది. ఎక్కువ తీసుకునే హక్కు ఉండదు. అలా అదనంగాని, ఇతరులకు తెలియకుండా తీసుకుంటే దొంగతనమవుతుంది. తిరిగి చెల్లించే షరతుపై సొంతదారు అనుమతితో తీసుకుంటే అప్పు అవుతుంది. (చేయకముందే తీసుకున్నా, చేసిందానికంటే అదనం తీసుకున్నా అది సమాజపు అంగీకారంతో తీసుకుంటే అప్పు అవుతుంది). మరో రకమైన పుచ్చుకునే విధానం ఒకటి ఉంది. తిరిగి చెల్లించ నక్కరలేదన్న షరతును ఇచ్చేవారూ, పుచ్చుకునేవారూ కూడా అంగీకరించి ఇవ్వడం - పుచ్చుకోవడం అన్న విధానమది. దానినే దానం అనంటున్నాము.
    భారతీయ ఆస్తిక సాహిత్యంలో వివిధ రకాల దానాల గురించి విస్తారంగా చెప్పబడి ఉన్నా, తాత్విక సాహిత్యంలో దానికి భిన్నమైన భావన ప్రకటింపబడి ఉంది. ‘అపాత్రునికి దానం చేయకూడదు. పాత్రుడు దానం పుచ్చుకోడు' అన్నదే ఆ భావన. 'ప్రతి గ్రహ సమర్ధోపి పరిగ్రహం తత్ర వర్జయేత్' అన్నదే ఆ సూత్రము. 'పుచ్చుకోవడానికి తగిన అర్హత కలిగి ఉన్నా పుచ్చుకోకు' అని దానర్థం. పరిగ్రహం విడువ దగింది అని ఆ సూక్తి చెబుతున్నా, అంతకంటే ఒక పైమెట్టు 'పుచ్చుకోడు' అన్నది మన అందరి అనుభవంలోనూ ఒక విషయం ఉంది. స్వాభిమాన పూర్ణుడు అడుక్కోడు. చేయని దానికి ఫలితాన్ని కోరడు. ఇచ్చినా తీసుకోడు. తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైతే ఏదో ఒకటి చేశాక తీసుకోవడానికే సిద్ధపడతాడు. ఆ అవకాశమూ లేని స్థితిలో తిరిగి చెల్లించడానికి కట్టుబడే తీసుకుంటాడు.
    మండలి వ్యక్తులు ఈ వైఖరినే కలిగి ఉండాలని ఘంటాపథంగా చెబుతోంది. అలాగే జీవించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఇతరులకూ ఇదే సరైన విధానమని తెలియపరుస్తూ వస్తోంది.
మిత్రులారా ముందు చెప్పిన 1) సోమరుల కెచ్చటనూ చోటు లేదు, 2) నియమాలను పాటించడం కంటే మేలు కలిగించగలిగిందీ లేదు, 3) పని చేస్తూనే వందేళ్లు జీవించాలని కోరుకో, అన్న మూటిని జీవితాచరణలోకి తీసుకుంటే ఎలా ఉండాల్సి ఉంటుందో, ఆ వివరాలని చెబుతూ వచ్చాను. నా వరకు నేను నా జీవన విధానాన్ని అలా మలుచుకునేందుకే సాధన చేసుకుంటూ వస్తున్నాను. దీనినే మండలి జీవన శైలిలో (విధానములో) ముఖ్య భాగంగా తలంచుతున్నాను.
మండలి అంగీకరిస్తున్న దినచర్య గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మండలి జీవన విధానములో అది అతి ముఖ్యమైన భాగంగా ఉంది గనుక. ప్రణాళికాబద్ధమైన దినచర్య జీవనశైలిని చూపిస్తుంటుంది.
    24 గంటలకు ఒక నియతకాలిక కార్యాచరణ ప్రణాళికను గనుక ఏర్పరుచుకుని, ఆ రకంగా జీవించడం మొదలెడితే, అప్పుడది నియమబద్ధ జీవితం అవుతుంది. ఆ నియమాలు కూడా వివేకజనితాలై తనకూ, ఇతరులకూ, ప్రకృతికీ హానికారకాలు కాకుండానూ, వీలైనంతలో మేలు కలిగించగలిగినవి గానూ ఉండాలి. మేము అంగీకరించి, సాధన చేసుకుంటూ ఉన్న దినచర్య ఇదిగో ఇలా ఉంది. 1) కాలకృత్యాలు : అంటే, అదే సమయంలో తిరిగి, తిరిగి (మళ్లీ మళ్లీ) చేస్తుండాల్సిన పనులు అని అర్థం. 1) ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు లేవాలి? 2) లేచాక ఉదయం పూట ఒక క్రమంలో చేయాల్సిన పనులేమిటి? 3)ఆహార స్వీకరణకు చెందిన వివరాలేమిటి?
1) నిద్రా సమయం :
    ప్రపంచ ఆధునిక ఆరోగ్య పరిశోధనలన్నీ నిద్ర ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన జీవితానికి ఆయువుపట్టు అని తేల్చి చెబుతున్నాయి. మనిషికి 6 నుండి 8 గంటల నిద్ర అవసరమవుతుందన్నది సాధారణ సూత్రం. నిద్ర, మెలుకువ అన్న రెండూ కూడా కాలకృత్యాలలో ఒకటి. కనుక నిత్యం ఒకే కాలంలో జరుగుతుండేలా అలవాటు చేసుకోవలసి ఉంది. కొద్దిమందికి మాత్రం ఈ కాల పరిమితి నుండి మినహాయింపు ఉండవచ్చు గానీ, సాధారణ రూపం ఇదే.
    ఇప్పుడు బడులలో చెప్పడం లేదు గానీ, వెనుకటి కాలంలో పెందలకడనే పరుండుము. పెందలకడనే మేల్కాంచుము అన్న సూక్తి మాటిమాటికీ పిల్లల తలకెక్కించే పని జరుగుతుండేది. ఆధునిక జీవన శైలిలో ఒక భ్రష్ట విధానం అలవాటుగా మారిపోయింది. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం, ఝాము ప్రొద్దెక్కే వరకూ నిద్రపోతూనే ఉండడం, అదీ ఒక కుటుంబంలో ఎవరిష్టానికి వారు పడుకోవడం, ఎవరిష్టానికి వారు లేవడం, ఎవరిని ఎవరూ హెచ్చరించే పని చేయకపోవడం అన్నదే ఒక వరవడిగా మారిపోయింది. మేము పెట్టుకున్న, విధానం రాత్రి 10 గంటలకు నిద్రపోవడం, ఉదయం 5 గంటలకు మేల్కొనడం అన్నదిగా ఉంది. దీనిని నిత్య కృత్యంగా, కాలకృత్యంగా అలవాటు చేసుకోగలిగితే పడుకోగానే నిద్ర వస్తుంది. సరైన సమయానికే మెలుకువా వస్తుంది. జీవ గడియారం దీనికి అలవాటు పడుతుంది. సరిగా నిద్రపోగలిగితే మాత్రం ఈ '7' గంటల నిద్ర దాదాపు అందరికీ సరిపోతుంది. నిద్రకు ముందు ఉత్తేజ కరమైన పానీయాలు కానీ, ఒత్తిడిని పెంచే ఆలోచనలు గానీ లేకుండా ఉండేట్లు చూసుకోవాలి. దీనిని పాటించడం మొదలెడితే, మిగిలిన సమయాన్ని ఆరోగ్యంగా, చురుకుగా గడపడానికి కావలసిన పరిస్థితుల్ని (అనుకూల స్థితిని) అందించినట్లే అవుతుంది. 
    2) శుద్ధి కార్యక్రమం : లేచిన వెంటనే ఒక లీటరు నీళ్లు త్రాగటం, ఆపై మొహం కడుక్కోవడం, (దంత ధావనం) తరవాత మలవిసర్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరగాలి. ఈ మూడూ కూడా కాలకృత్యాలే. అంటే మంచినీళ్లు త్రాగడం, పండ్లు తోముకోవడం, మల విసర్జన చేయడం ఒకే కాలంలో చేస్తుండాలన్నమాట. జీవగడియారానికి దీనిని అలవర్చాల్సి ఉంది.
    3) శారీరక వ్యాయామం: శుద్ధి కార్యక్రమం అయ్యాక చేయాల్సిన మొదటి పని శారీరక వ్యాయామం చేయడం. దీనినే కాలకృత్యంగా మలచుకోవాలి. అంటే నిత్యము అదే సమయంలో చేస్తుండాలన్నమాట.
    శారీరక వ్యాయామాలలో రకాలు :
    ఏ కారణాల వల్లనైతేనేమి, శారీరక ఆరోగ్యం, బలం పట్ల ఈనాడు జనంలో చాలా చైతన్యం ఏర్పడింది. రకరకాల జిమ్ములు, యోగా పేరున అనేక ప్రక్రియలు, ఈతకొలనులు, నడకదారులు, సైక్లింగులు, బహిరంగ వ్యాయామశాలలు ఇలా చాలా రకాలు ఉనికిలోకి (అందుబాటులోకి) వచ్చేసాయి. అసలు విషయమేమంటే ఎన్ని రకాల వ్యాయామాలు ఉనికిలోకి వచ్చినా, చేయవలసిన పని రెండు రకాలైనవి గానే ఉంటుంది. 1) సంధి బంధనాలు: కీళ్ళను కదిలించడం, 2) కండరాలను సాగదీయటం, ముడచబెట్టడం. శారీరక వ్యాయామం అంటే అంతే. కనుక ఈ రెండు ప్రక్రియలూ కలిసి ఉండేలా ఎవరికి నచ్చిన విధానాన్ని, వారి వారి సామర్థ్యాలు, వయస్సులను బట్టి వారు ఏర్పరుచుకోవచ్చు. సాధారణ సూత్రం చెప్పమంటే మాత్రం మేము ఇలా చెబుతున్నాము. 30 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు కండరాలకు, కీళ్లకు బలాన్నిచ్చే శరీర నిర్మాణానికి సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది. ఆపైన 60 ఏళ్ల లోపు వారు శరీరం స్థిరంగా ఉండేందుకు అవసరమైన వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక 60 పైబడిన వయస్సు వారు జీవించి ఉన్నంతకాలం చురుకుగా ఉండడానికి తగిన వ్యాయామాలు ఎంచుకుంటే సరిపోతుంది.
    వ్యాయామానికి ఉదయం, సాయంత్రం కూడా తగినవే. వీలుంటే మాత్రం ఉదయమే సరైనది. ఒక గంట పాటు దీనికి కేటాయించండి. వయస్సుతో నిమిత్తం లేకుండా ‘ఈత’ అందరికీ మంచిది. ఈతంటే నీళ్లల్లో కేరింతలాడడం కాదు. కాళ్లు చేతులు వీలైనంత వేగంగా కదిలిస్తూ నీటిపై తేలి ఉండడాన్నే వ్యాయామానికి చెందిన ఈతగా చెప్పుకోవాలి. అలాగే ఒక మోస్తరు అలుపు వచ్చేంత వేగంగా, అంటే ఉజ్జాయింపుగా 8,9 నిమిషాలలో ఒక కిలోమీటరు సాగే వేగంతో నడవడం కూడా వయసులతో నిమిత్తం లేకుండా చేయదగిన వ్యాయామమే. వ్యాయామాన్ని నడకకే పరిమితం చేసుకునేట్లయితే 5,6 కిలోమీటర్ల నడక అవసరమవుతుంది. 45 నిమిషముల పైన గంటలోపు ఉండాలా నడక. ప్రధాన సూత్రం అలసట కలగాలి. గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 120 సార్లు వరకు పెరిగేలా ఉండాలా వేగం. యువకులు మాత్రమే బలాన్ని, సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలనెంచుకోవడమే మంచిది.
    మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలోనూ గుండె, ఊపిరితిత్తులన్నవి మరీ ముఖ్యమైనవి. ఈ రెండు బలమైన కండరాలతో నిర్మాణమై ఉన్నాయి. ఆయా అవయవాలకు చెందిన వ్యాయామం చేయడమంటే, దాని కండరాలను సాగదీయడం, కుంచించడం (ముడచబెట్టడం) అని చెప్పుకున్నాం గుర్తుంది కదా? ఊపిరితిత్తులకు వ్యాయామం చేయాలంటే, దానిని పూర్తిగా గాలితో నింపడం, పూర్తిగా గాలిని వదిలేయడం. నింపి, వదిలేసి బిగబట్టడం అన్న 3 పనులు చేయడం తప్ప మరో మార్గం లేదు. దీనినే ప్రాణాయామం అంటున్నాము.
'తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేదః ప్రాణాయామః' శ్వాస ప్రస్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అర్థం. వాటి సహజగతిని నిరోధించడమే ప్రాణాయామంటే అని యోగ దర్శన కారుడన్నాడు. శ్వాసావయవాల కండరాలను సాగదీయడం, ముడచ పెట్టడం, బిగబట్టడం కొరకు ప్రాణాయామమం చేసి తీరాల్సిందే. శ్వాసావయవాల పని ప్రధానంగా అనియంత్రత వ్యవస్థకు చెందిందే అయినా, కొంతమేర ప్రయత్నపూర్వకంగా నియంత్రించే అవకాశమూ ఉండడంతో ఈ పని అనుకొని చేయడం సాధ్యపడింది.
    ఇక గుండె విషయానికి వస్తే, గుండె కండరాలను సాగదీయడం, కుంచించడం, బిగబట్టడం అన్నవి ఊపిరితిత్తులను నియంత్రించినట్లుగా నియంత్రించడం సాధ్యపడదు. అయితే అలసట కలిగేంతగా పనిచేయడం మన చేతిలో పనే గనుక, అలా వేగవంతంగా పనిచేయడం వల్ల, అనివార్యంగా గుండె కొట్టుకునే పని వేగవంతం అవుతుంది. గుండె కొట్టుకోవడం అంటేనే నాలుగు గదులుగా ఉన్న గుండె గదులు రక్తంతో నిండడం, నిండిన రక్తాన్ని బయటికి నెట్టడం అనే పని జరుగుతుండడం అనే. కనుక ఆ పని వేగంగా జరిగేలా చేస్తే అది గుండె కండరాలను సాగదీయడం, ముడచబెట్టడం అవుతుంది. వేగంగా నడవడం, పరుగెత్తడం, పలుమార్లు ఎగరడం, దండీలు, బస్కీలు లాటివి వేగంగా చేయడం లాంటివన్నీ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచగలుగుతాయి. కనుక వ్యాయామంలో ఆ భాగము అంటే అలసట కలిగించే పని జతపడి ఉండాలి. సహజంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. దానిని 120,130 సార్లు కొట్టుకునేంతగా అలసట కలగాలి. ఆ పని అంటే గుండె వేగంగా కొట్టుకోవడం అనే పని ఒక ఐదు నిమిషాల పాటు జరిగేలా చేయగలిగినా గుండెకు వ్యాయామం అందుతుంది. మండలి దినచర్యలో శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడమన్నది చాలా కీలకమైనదిగా ఉంది. జీవితాసరాలు తీర్చే సంపదలెన్నున్నా, శరీరం మనసు వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే స్థితిలో కనక లేకుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే, కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం వాడుకలోకి వచ్చింది. శరీరం పట్ల నిరాశక్తత, తూష్ఠీభావం కలిగి ఉండడం కొన్ని ఆస్తిక ధోరణలలో వైరాగ్యంలో భాగంగా చెప్పబడి ఉంది. మండలి అవగాహన ప్రకారం అది సరైన అవగాహన నుండి పుట్టింది కాదు. మనిషి సాధించాల్సిన సమస్త కార్యాలకు (తాత్వికులు చతుర్విధ పురుషార్ధాలన్నారు వాటిని) శరీరమూ, మనస్సూ, ఆరోగ్యంగా, బలంగా ఉండడం వినా మరో దారి లేదు.
    'శరీరమాధ్యం ఖలుధర్మసాధనం' అన్నది ఆ విషయాన్ని తెలిపేటిదే. అది సార్వత్రిక విలువ కలిగిన మాట. కనుకనే, మండలి దినచర్యలో శుద్ధి కార్యక్రమం అయ్యాక చేయాల్సిన మొదటి పనిగా వ్యాయామం వచ్చి చేరింది. వ్యాయామం తరువాతది స్నానం చేయడం. లేచిన దగ్గర నుండి స్నానం చేయడం వరకు ఈ నాలుగైదు పనులు ఒక కట్టగా చేయాల్సినవిగా ఉన్నాయి. కనుక ఇవీ కాలనియమంతో చేయాల్సిన కాలకృత్యాల క్రిందికి వస్తాయి. మరోసారి గుర్తు చేస్తాను. సకాలంలో లేవడం, నీళ్లు త్రాగడం, పండ్లు తోమడం, మలవిసర్జన చేయడం, వ్యాయామం, స్నానం చేయడం అన్నవి నిత్యం ఒకే సమయంలో చేయాల్సిన, చేస్తుండాల్సిన పనులు. వీటి వరకు ఒక గంటన్నర సమయం సాధారణంగా సరిపోతుంది. ఉదయం 7 గంటలకంతా ఈ పనులు ముగించుకునేలా దినచర్యలోని మొదటి భాగాన్ని రూపొందించు కుంటే మంచిది.
    ఆహారం: దినచర్యలోని కాలకత్యాలలో భాగంగా తర్వాత వచ్చేది ఆహార స్వీకరణ. వాడుకలో ఉదయం తీసుకునే ఆహారాన్ని ఉపాహారం అంటున్నాం గానీ, ఉదయం పూట తీసుకునే ఆహారం సరైంది గానూ, సరిపడినంత ఉండేలాగూ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే, రాత్రి భోజనం తరువాత సుమారుగా 12 గంటలు అంటే సగం దినం ఆహారం తీసుకోకుండా ఉన్నాం కదా కనుక ఉదయపు ఆహారం విలువైన పోషకాలతో కూడి సరిపడినంత పరిమాణంలో ఉండడమే సరైనది. ఈ ఉదయపు భోజనం (అన్నం) ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలి. నేనైతే గత 55 ఏండ్లుగా గం. 7.30ని.లకు తింటూ వస్తున్నాను. సకాలంలోనే భోజనం చేయాలి. అకాలంలో భోజనం చేయకూడదు అన్నది కాలకృత్యాలలో చాలా కీలకమైనది. మనం చేసిన అలవాటును అనుసరించే, శరీరంలోని జీవ గడియారం జీర్ణరసాలను విడుదల చేస్తుంటుంది. శరీర నిర్మాణంలోనే ఏర్పడి ఉన్న రక్షణ వ్యవస్థలోని అద్భుతమైన ఏర్పాటు ఇది.
ఏ వ్యక్తి జీవితం, పెందలకడనే మేల్కాంచడంతో మొదలవుతుందో అతని సాధారణ నిత్య వ్యవహారాలన్నీ ఎటువంటి హడావుడి లేకుండా సజావుగా సాగిపోతుంటాయి. హడావిడి లేకుండా ప్రశాంతంగా, తినే తిండిపై దృష్టి పెట్టి తినగలిగితేనే ఆ పదార్థాల రుచులను సరిపడినంతగా ఆస్వాదించ గలుగుతాము. చాలామంది వ్యక్తులు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు లభించినప్పుడు ఆవురావురు మంటూ అధిక పరిమాణంలో (పొట్ట పట్టినంతగా గబగబా) మింగేస్తుంటారు. నిజానికీ విధానం రుచిని ఆస్వాదించడం చేతరాని వారు చేసేది మాత్రమే. రుచిని ఆస్వాదించాలంటే 1) ఆ పదార్థం నాలుక మీద వీలైనంత ఎక్కువసేపు ఉండేలా చూడాలి. 2) ఆ సమయంలో మనస్సు ఇతరేతరాంశాల పైకి వెళ్ళరాదు. కనుకనే ఆహారం తీసుకునేటప్పుడు మౌనంగా ఉండాలన్న సూత్రం వచ్చింది.
    'స్నానేచ భోజనే హోమే జపే మౌన ముపాశ్రయేత్' స్నానం చేసేటప్పుడూ, భోజనం చేసేటప్పుడూ, జప, హోమాలు చేసేటప్పుడు మౌనంగా అంటే పరధ్యానం లేకుండా తదేక ధ్యానంతో ఉండాలని దానర్థం. ఆహారం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. అవన్నీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎంతెంత తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అన్న నాలుగు అంశాలు గనే చెప్పుకుంటే సరిపోతుంది.
    మనిషికి కావలసిన ఆహార పదార్థాలు 5 రకాలు. 1) పిండి పదార్థాలు, 2) మాంసకృత్తులు, 3) ఖనిజ లవణాలు, 4) విటమిన్లు, 5) పీచు పదార్థాలు.
    గమనిక : కొవ్వు పదార్థాలు విడిగా చెప్పుకోకున్నా పరవాలేదు. అవి పిండి పదార్థాల మరొకరూపం కనుక. విడిగా చెప్పుకుందామన్నా అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. అప్పుడు 6 రకాలవుతాయి. (దీనిపై వాద వివాదాలు అనవసరం) ఈ మొత్తాన్ని మనం జంతువుల నుండి గానీ, వృక్షాల నుండి గానీ స్వీకరిస్తున్నాం. వాటికి మాంసాహారము, శాఖాహారము అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి. మాంసాహారం అంటే మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం అని పొరపడకూడదు. జంతు శరీరకంగా ఉన్న ద్రవ్యాన్ని మాంసం అంటున్నాము. అందులోనూ పైన చెప్పుకున్న 5 రకాల ద్రవ్యాలూ ఉంటాయి. జంతు సంబంధం కానివై, వివిధ రకాల చెట్లనుండి అందుతున్న 5 రకాల ద్రవ్యాలను శాఖాహారం అంటున్నాము, పాలు, నెయ్యి అన్న రెంటినీ శాఖాహారులంతా తమ ఆహారములోకి చేర్చుకున్నారు. ఆధునిక ఆహార శాస్త్రజ్ఞులలో కొందరు గుడ్డును శాకాహారం క్రింద జమ చేయాల్సిందేనంటున్నారు. మండలి వీటి విషయంలో వివాదానికి దిగకుండా శాఖాహారము, మాంసాహారము రెండూ మనిషి తినదగినవే నన్న దృష్టి కలిగి ఉంది. సూత్రప్రాయంగా చెప్పుకుంటే మాత్రం పాలు, నెయ్యి, గ్రుడ్డు అన్న మూడు జంతు సంబంధమైనవి అని అనాల్సిందే. రెండు రకాల ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు శాఖాహారాన్ని ఎంపిక చేసుకోవడమే సరైందన్న దృష్టే నా వరకు నాకుంది. మరింత విచారణ చేయాలంటే దానినే ఒక ప్రత్యేకాంశంగా మాట్లాడుకోవలసి ఉంటుంది. కనుక ఇప్పటికి దీనిని ఆపుతాను.
    ఆధునిక ఆహార విజ్ఞాన శాస్త్రం పైన చెప్పుకున్న 5/6 రకాల పదార్థాలనూ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్న రెండుగా పేర్కొంటుంది. కనుక మనం నిత్యం తినే వాటిలో ఈ రెండు రకాలు అవసరమైన వాళ్లలో శరీరానికి అందించే పని చేయాలి. స్థూల పోషకాలు శక్తినివ్వడానికీ, శరీర ధాతువుల నిర్మాణానికీ అవసరం కాగా, వాటి సక్రమ వినియోగానికి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. మనిషి జీవనం సజావుగా సాగుతుండాలంటే అతడు 1) ఆరోగ్యంగా ఉండాలి, 2) బలంగా ఉండాలి. ఆరోగ్యము, బలము అన్నవి రెండూ వేరు వేరు. ఖనిజలవణాలు, విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్య కారకాలుగానూ, పిండి పదార్థాలు (తైలాలు) మాంసకృత్తులు బల కారకాలుగాను చెప్పుకోవచ్చు.
    ధాన్యాలుగా పిలువబడుతున్నవన్నీ ప్రధానంగా పిండి పదార్థాలనూ, పప్పు పదార్థాలుగా చెప్పబడుతున్నవి ప్రధానంగా మాంసకృత్తులునూ, తైలాలను కలిగి ఉంటాయి. కొన్ని దుంప కూరలు పిండి పదార్థాలను అందిస్తాయి. ఇక ఆకుకూరలు, కూరగాయలు ఖనిజలవణాలను, విటమినులను, పీచు పదార్థాలను అందిస్తాయి. ఇవి కాక పాలు, గ్రుడ్డు, వివిధ జీవుల మాంసము మనిషికి అందుబాటులోనున్న ఆహారాలు. ఆహార పదార్థాలకు సంబంధించి ఈ సాధారణ అవగాహనని కలిగి ఉంటే చాలు.
    భౌతిక శ్రమ (శారీరక శ్రమ) అధికంగా ఉన్న వెనుకటి కాలపు జీవన విధానంలో త్వరగా శక్తినివ్వగల పిండి పదార్థాల భాగం ఆహారంలో సింహ భాగంగా ఉండేది. మాంసంతో సహా మిగిలినవన్నీ కూరల భాగం క్రింద ఉండి పరిమాణంలో రెండో స్థానంలో ఉండేవి. దాదాపు భారతదేశం అంతటా ఇదే విధానం అలవాటుగా ఉంది. ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ భాగం తగ్గుతూ వస్తోంది. యంత్రాలు, నూతన సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమ మరింతగా తగ్గిపోయింది. కనుక మన ఆహారంలో పిండి పదార్థాల పరిమాణాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. పిండి పదార్థాల భాగం తగ్గిన మేర మాంసకృతులు, మిగిలిన సూక్ష్మ పోషకాలు, పీచు పదార్థం కలిగి ఉన్న వాటిని పెంచుకోవలసి ఉంది. వివేకవంతమైన జీవనశైలిలో ఆహార పదార్థాల గురించి ఈ వివరం తెలుసుకొని మీ మీ వృత్తి, వ్యాపారాలకు తగినట్లు వీటిని పెట్టుకుంటే సరిపోతుంది.
    ఆహారం ఎప్పుడెప్పుడు తినాలి అన్న విషయం చెప్పుకుంటున్నాం కదూ ఉదయం 7-8 మధ్య ఉపాహారం (ఉదయపు ఆహారం) తీసుకోవాలి. ఈ మొదటి ఆహారం సరిపడినంత తినండి. ఆ తరువాత మధ్యాహ్న భోజనం, ఉదయం తిన్న దగ్గర నుండి 5-6 గంటల వ్యవధినిచ్చి తినాలి. అది మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయం. తిరిగి రాత్రి భోజనం 5-6 గంటల వ్యవధినిచ్చి తినాలి. రాత్రి భోజనం వీలైనంత పెందలాడే చేసేయడం అన్ని విధాల మంచిది. అది రాత్రి 7-8 మధ్య ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది. పరుండబోయే సమయానికి రెండు- రెండున్నర గంటల ముందే రాత్రి భోజనం చేయడం పూర్తిచేసేయాలి. ఏమి తినాలి? ఎప్పుడు తినాలి? వరకు చెప్పుకున్నాం. ఇక ఎంత తినాలి? అన్నది చెప్పుకోవాలి.
    జీవితంలో ఆహారం పాత్ర గురించి విశేష పరిశ్రమ చేసిన వాళ్లు ఈ ఎంత తినాలి అన్న దానికి ఒక సాధారణ సూత్రాన్ని తయారు చేశారు. ఆ వివరాలు కొన్ని ఇవిగో.
'దౌబాగౌ పూర్ణయే ధన్నై తో ఏ నైకం ప్రపోరయేత్ వాయుసంచారానార్థం చతుర్ధ మవశేషయేత్'
మొత్తం పొట్ట ఎంత తింటే నిండుతుందో దానిలో సగభాగం ఘన పదార్థాలను తీసుకోవాలి. పావుభాగం ద్రవాహారంగా ఉండాలి. మిగిలిన పావుభాగం ఎప్పుడూ ఖాళీగానే ఉంచాలి. పొట్టనిండా ఎప్పుడూ తినకూడదు. అని ఆ సూత్రానికి అర్థం. ఈ ఎంత తినాలి అనే దానిని గురించి మరొకరు మరో విధంగా చెప్పారు. భోజనం 1/2 ఘడియలో పూర్తి చేయాలి. అర ఘడియ అంటే 12 నిమిషాలని అర్థం. (రెండున్నర ఘడియలు ఒక గంట అవుతుంది. కనుక ఘడియ అంటే 24 నిమిషాలని అర్థం) తినే సమయంలో మౌనంగా ఉండాలి. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తినరాదు. ఆ తినడం కూడా ప్రతి ముద్దను 32 సార్లు నమలాలి, (బాగా నమలి మింగాలని దానర్థం) గమనిక: ఈ పద్ధతిని పాటించినా పొట్టనిండేంత తినడం సాధ్యపడదు. ఇది సుమారుగా పైన చెప్పిన పరిమాణంగానే ఉంటుంది.
    ఆహార పదార్థాలను తీసుకోవడం వెనక మనకు రెండు అవసరాలు తీర్చుకోవడం అన్న ఉద్దేశం ఉంటుంది. 1) శరీర పోషణకు అవసరం కనుక. ఈ పనికి ఉపయోగపడే అవయవం పొట్ట. 1) మానసిక తృప్తి కొరకు ఈ పనికి ఉపయోగపడేది నాలుక. ఇది రుచికి సంబంధించినది. రుచీపచీ లేనివి అవెంత బలవర్ధకాలైనా (ఆహారపు విలువ కలిగినవైనా) నిత్యం సరిపడినంత తినలేము. కనుక ఆ పదార్థాలు నాలుక అంగీకరించే రూపంలో ఇవ్వగలిగితే ఆహార స్వీకరణ ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని, తృప్తిని కూడా కలిగిస్తుంది. కనుక ఎంత కాలమైనా ఇష్టంగా తినగలుగుతాము. కానీ ఈ నాలుకను తృప్తి పరచడమన్నది, శరీరానికి అవసరమైనంత పరిమాణాలలోనే ఉండాలన్న నియమంగానీ లేకుంటే అది క్రమంగా అవసరం లేనంత పరిమాణంలో తినే అలవాటుకు దారితీస్తుంది. కనుక అది వివేకం సూచించిన పరిమాణాలలోనే ఆహారం ఉండేలా చూసుకుంటూ, రుచినీ ఆస్వాదించగలిగేలా ఉండాలి.
    (గమనిక : పూర్తి సంతృప్తినిచ్చేటంతగా ఎప్పుడూ తిననే కూడదు)
    గమనిక: ఈ విషయాలనే మరో మేథావి వాడుక భాషలోనూ చెప్పాడు. అర్ధాకలితో ఉండాలి భోజనం అని. ఆహారానికి సంబంధించినంతలో ఒక మాట చెప్పి ఆగుతాను. ఎప్పుడూ కడుపునిండా తినవద్దు. రుచి విషయంలోనూ పూర్తి సంతృప్తి నిచ్చేంతగానూ తినవద్దు. పొట్ట నిండక ముందే, నాలుక ఇక చాలు అనక ముందే ఆహారాన్ని తీసుకోవడాన్ని ఆపగలగాలి. ఇదే ఆహారానికి సంబంధించిన సరైన జీవనశైలి. ఎప్పుడుబడితే అప్పుడు, ఏదిబడితే అది, ఎంతబడితే అంత, ఎలాబడితే అలా, ఎక్కడబడితే అక్కడ తినడం అన్నది మనుషులు చేయవలసిన పని కాదు. ఆహార స్వీకరణ అన్నది కాలకృత్యాలలో ఒకటి. కనుక అది ఎల్లప్పుడూ పరిమాణంలో అతి అల్పమూ కాకుండా, 'మితం' అనడానికి తగిందిగా ఉండాలి. రుచి మనిషిని ఈడ్చుకెళుతూ ఉంది. అదే ఈరోజు శారీరక సమస్యలన్నింటికీ ప్రధాన కారణం అవుతూనే ఉంది. సరిపడినంత వ్యాయామము, తగు మాత్రపు భోజనము, సకాల భోజనం అన్న వివేకవంతమైన విధానానికి మరలాలి సమాజం. మండలి. ముఖ్యంగా నేను, నా కుటుంబము పట్టుదలగా ఈ విధానాన్ని పాటిస్తున్నాము.
    ఎన్నింటికి పడుకోవాలన్న విషయం ముందే ప్రస్తావించాను. రాత్రి 10 గంటలకు నిద్రకుపక్రమించడం సరైంది అన్నది సాధారణ సూత్రం. మిత్రులారా సుమారు 55 సంవత్సరాలు నేను ఈ దినచర్యను పాటిస్తూ వస్తున్నాను. నా పరిచయంలోకి వచ్చిన వారందరికీ చెబుతున్నాను. నాతో సన్నిహితంగా ఉంటున్న వారి చేత పాటింపచేస్తున్నాను. అందుకనే మా కేంద్రంలో జరిగే సమావేశాలలోనూ, నా ప్రమేయంతో అక్కడ కూడా జరిగే శిక్షణ తరగతులలోనూ, ఈ విషయము అలవర్చుకోవలసిన అంశంగా జత చేయడం జరుగుతుంది.
కర్మలు చేస్తూ ఉండడం, ఫలితాలను అనుభవిస్తూ ఉండడం, ఇదే జీవితమంటే. ఇంతవరకు నిజమో, కాదో తేల్చుకోండి. మరి జీవితం సాఫీగా సాగుతుండాలంటే చేయవలసింది చేయగలిగి ఉండడం, పొందాల్సింది పొందగలగడం జరుగుతూ ఉండాలి. ఈ రెండు పనులు సక్రమంగా జరుగుతుండాలంటే శరీరము, మనస్సు ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అంతకంటే మరో దారి లేదు గాక లేదు. వెనుకటి వాళ్ళు (చింతకులు) దీనినే ఒక్క మాటలో చెప్పారు. శారీర మాద్యం ఖలుధర్మసాధనం - చేయవలసింది చేయడానికి పొందవలసింది పొందడానికి శరీరమే సాధనము అని దానర్థం. ఇది మన అందరి అనుభవంలోనూ ఉన్న 100% వాస్తవం కదా?
    ఇంకొక్క అంశాన్ని చెప్పుకుంటే దినచర్య ప్రణాళిక పూర్తవుతుంది. అది మానసిక వ్యాయామానికీ, జ్ఞాన క్షేత్రానికీ సంబంధించిన పనిగా ఉంది. దినచర్యలో, కాలకృత్యాల భాగంలో మేథో సామర్థ్యంను పెంచే, అవగాహనను పెంచే పనులను పెట్టుకోవాలి. దీనికి రెండు సమయాలు చక్కగా నప్పుతాయి. 1) ఉదయం లేవగానే, 2) రాత్రి భోజనానంతరం మీరు మీ వృత్తి వ్యాపారాల అనుసరించి, ఎక్కువ వీలున్న సమయాన్ని దీనికి కేటాయించుకోండి. ఒక గంట సమయం ఉంటే బాగుంటుంది. నాకు తెలిసి ఉదయం నిద్ర లేవగానే అన్నది ఎక్కువలో ఎక్కువ సరైంది. పడుకోవడం, నిద్ర లేవడం కాలనియమంలోకి తెచ్చుకోగలిగితే, ఉదయం నిద్ర లేవగానే ఒక గంట చదువుకోవడం, లోతుగా విచారించడం అన్నదాన్ని సాగించడం తేలికవుతుంది. నేను చాలా కాలం 10 గంటలకు పడుకోవడం, ఉదయం 5 గంటలకు లేవడం అన్న విధానాన్ని అనుసరించాను. ప్రస్తుతం 4.30 గం.లకు లేవడం 10-10.30 గం.లకు పడుకోవడం చేస్తున్నాను. తగిన నిద్రా సమయాన్ని పూడ్చడం కోసం మధ్యాహ్నం అరగంట విశ్రాంతికి పెట్టుకున్నాను. ఉదయం 4:30 నుండి 5:40 వరకు చదవడం, రాసుకోవడం చేస్తుంటాను. నీళ్లు తాగడం, పండ్లు తోముకోవడం, మల విసర్జన పూర్తి చేయడం అంతా 15 నిమిషాలలో అవుతుంది. 5.55కు నడక ప్రారంభిస్తాను. 25 నిమిషముల నడక. ఇంటికి వచ్చాక మరో 30 నిమిషముల వ్యాయామం. 10 నిమిషాల ప్రాణాయామం. 4.30 నుండి 7 వరకు మానసిక, శారీరక వ్యాయామాలు, ప్రక్షాళన పనులు అయిపోతాయి. ఉదయపు ఆహారం 7.15 నుండి 7:30 లోపు చేసేస్తాను. 12:30 మధ్యాహ్నం భోజనం, రాత్రి 7 గంటలకు చివర భోజనం, 10,10.30కు నిద్ర (పడక), పగలు 2 దాటితే ఆ పూటకు తినను. రాత్రి 9 దాటితే ఆ పూటకు తినను. ప్రయాణాలలో భోజన సమయము ఉంటుందనిపిస్తే ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఆ సమయానికి ప్రయాణంలోనే తినేస్తాను. నా దినచర్య గత 5 దశాబ్దాలుగా ఇలానే సాగుతోంది. దినచర్య 24 గంటలలో పైన చెప్పినవన్నీ కాల కృత్యాల క్రిందకే వస్తాయి. క్రమం తప్పకుండా కొంతకాలం అభ్యాసం చేస్తే ఇవన్నీ అలవాటుగా మారతాయి. శరీరము, మనస్సు ఈ క్రమాన్ని పాటిస్తాయి.
    గమనిక: దినచర్య విషయంలో ఎవరిని అనుసరించకుండా ఉండడమే సరైనది. ప్రయోగ రీత్యా రుజువైన విధానాన్ని గానీ, వారి వారి వృత్తి వ్యాపారాలను అనుసరించి గానీ ఎవరికివారు దినచర్యను నిర్ణయించుకొని, దానిని తప్పకుండా పాటించడాన్ని అలవాటు చేసుకోవాలి. దినచర్య గానీ స్థిర రూపాన్ని సంతరించుకుంటే జీవితంలో సింహ భాగము నియమబద్ధమైనట్లే. నేను ఆరంభంలో చెప్పినట్లు 'నశ్రేయో నియమం వినా' అన్న సూత్రానికి ఆచరణ రూపమే నేను చేసిన వివరణంతా. క్రమపద్ధతి అన్నది జీవనశైలిని చూపించేదే కదా?
గమనిక: గ్రహణ, ధారణ, స్మరణ, చింతన, సృజన అను ఐదు పనులు మేధో సామర్ధ్యానికి చెందినవి. వీటిని నిరంతరం ప్రతిదినము అభ్యాసం చేస్తుండడం ద్వారా ఈ 5 పనులలోనూ నైపుణ్యతను, చురుకుదనాన్ని సాధించుకోవచ్చు. వినడం కంటే చదవడం వల్ల, చదవడం కంటే రాయడం వల్ల మెదడు చురుకుదనాన్ని పొందుతుంది. కనుక రాయడం అన్న మంచి అలవాటు చేసుకోండి. విన్నదానిని, చదివిన దానిని, తిరిగి రాయడం మొదలెట్టండి, కొనసాగించండి. అది మెదడుకు ఎంత పని అవుతుందో గమనించండి. బట్టీ పట్టడం అన్న పనిలో మెదడుకు సంబంధించిన గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం, తిరిగి గుర్తు తెచ్చుకోవడం అన్న మూడు పనులకు చెందిన అభ్యాసం జరుగుతుంటుంది. కనుక ముఖ్యమైన విషయాలు, సూక్తులు, శ్లోకాలు, పద్యాలు లాంటి వాటిని బట్టీ పట్టండి. అందువల్ల మేథో వ్యాయామం జరుగుతుంటుంది. ముఖ్యమైన అంశాలు స్ఫురణలో ఉంటాయి. మిగిలిన రెంటిలో చింతన పని చదివిన, వినిన మాటల అర్థాలను విమర్శనాత్మకంగా పరిశీలించడం, మాట్లాడడం, వ్యాఖ్యానించడం రూపంలో చేయవలసి ఉంటుంది. వాదప్రతివాదాలను కొనసాగించడం వల్ల కూడా ఆలోచించే నైపుణ్యత ఏర్పడుతుంది. దీనిని తార్కిక ప్రజ్ఞ అని కూడా అనవచ్చు. విషయపరంగా తనకంటే పెద్దవారితోనూ, సమానులతోనూ, చిన్నవారితోనూ కూడా సంభాషిస్తూ ఉంటే తర్కంలో పట్టు దొరుకుతుందని తర్కం తెలిసిన వారంటారు. సక్రమాలోచనా నియమాల శాస్త్రాన్నే తర్కశాస్త్రం అని అంటారు. మేధో సామర్ధ్యాలను పెంచుకోవడానికి తర్కిస్తుండడం కూడా సాధనవుతుంది. అందుకనే మండలి జీవనశైలిలో తర్కాన్ని అలవర్చుకోవడము, అవకాశము, శక్తి ఉన్న మేర ఇతరులకు ఈ విద్యను నేర్పించడము అన్నవి భాగాలైపోయాయి.
    'జ్ఞానేచ్ఛా క్రియాశక్తుల సమాహారమే మానవ జీవితమంటే' అన్నది మనిషి జీవితాన్ని గురించి మండలి అవగాహన. ఇందులో అవగాహన భాగంలో మనిషి నిత్య జీవితానికి సంబంధించిన విషయాలూ, అలాంటి సంబంధం లేని విషయాలూ అన్న రెండు రకాలు ఉంటుంటాయి. అట్టి వాటిలోనూ స్వానుభవ రూపంలో ప్రత్యక్షంగా తనకే తెలిసిన విషయాలు, పరోక్ష పద్ధతుల ద్వారా తెలిసిన విషయాలు ఉంటాయి. పరోక్ష పద్ధతులంటే ఆధార సహితమైన ఊహ (హేతుబద్ధ యోజన లేదా తార్కిక ఊహ) ద్వారా గానీ, భాషను ఆధారం చేసుకుని ఇతరులు మాట్లాడిన, వ్రాసిన వాటి ద్వారా అని అర్థం. ఆ రెండు విధానాలకున్న శక్తి పరిమితులకు లోబడి ఆయా విషయాల గురించిన జ్ఞానం కలుగుతుంది. అయినా అది పరోక్ష జ్ఞానం అనడానికే తగి ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా తెలిసినట్లు తెలియదన్న మాట. అయినా ఈ 3 రకాలుగా కలిగిన జ్ఞానం ఆధారంగా మనిషి ఇష్టాఇష్టాలను ఏర్పరుచుకుంటూ, వాటిని నెరవేర్చుకోవడానికి యత్నిస్తుంటాడు. ప్రమాణ క్షేత్రాలను గురించి సరైన అవగాహన కలిగించుకుని, ఏ ఏ ప్రమాణం ఎంతవరకు పనికి వస్తుందో గుర్తించి వాటి వాటి క్షేత్రాలలోనే వాటిని వాడుకుంటూ, వాటి పనిని కలగాపులగం చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవడం మండలి జ్ఞాన భాగానికి చెందిన విధానంగా ఉంది. విషయాలను అర్థం చేసుకునే సందర్భంలో గానీ, సబబు బేసబబుల్ని విచారించే సందర్భంలో గానీ, ఎవరు చెప్పారన్నదానికి విలువనీయకుండా, ఏమి చెప్పారో చూడడం, అది సత్యాసత్య పరీక్షకు నిలుస్తుందో, లేదో చూసుకుంటుండడం, పరీక్షలో నిర్ధారణైన వాటినే స్వీకరించడం, వీగిపోయిన వాటిని విడిచి పెట్టేయడం, అప్పటికింకా తేలని వాటిని అనిర్ధారితాల జాబితాలో పెట్టి ఉంచడం అన్నది మండలి అనుసరించే విధానంగా ఉంటోంది. ఈ విధానమే సరైంది అన్న అవగాహన గతంలోని చింతకులు కొందరు కలిగి ఉన్నారు. సూత్రప్రాయంగా వారు చెప్పిన మాటలు కొన్ని మీ దృష్టికి తెస్తాను.
    1) యుక్తియుక్త ముపాదేయం వచనం బాలకాదపి
        అన్య తృణ మివత్యాజ్య మప్యుక్తం పద్మ జన్మనా ॥
    సబబైన మాట పసివాడు చెప్పినా స్వీకరించదగిందే అవుతుంది. అట్లు కానిది ఎంత వాడు చెప్పినా (బ్రహ్మ చెప్పినా) గడ్డిపరకతో సమానంగా విడిచివేయదగిందే అవుతుంది.
    2) పురాణమిత్తేవ నసాదు సర్వం ❘ నచాపికావ్యం నవమిత్య వద్ద్యం❘
        సంతః పరీక్ష్యాన్యతరధ్భజంతే ॥ మూఢః పర ప్రత్యయ నేయ బుద్ధిః॥
వెనుకటి వారు చెప్పిందంతా సరైందేనని గానీ, ఈ మధ్యకాలంలో చెప్పబడింది గనుక అంత విలువైనది కాదనీ అనుకోవడం సరైనది కాదు. బుద్ధిమంతులు చక్కగా పరీక్షించి, శ్రేష్టమైన దానినే స్వీకరిస్తారు. మూఢులు మాత్రమే ఇతరుల వెంట పడిపోతుంటారు.
    గమనిక: ఇది 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అనే ధోరణిని గురించి హెచ్చరించిన శ్లోకము. దీనికి మారుగా మరికొందరు ప్రాచీనులు చెప్పిన వాటిని కాలం చెల్లిన వాటివిగానూ, ఆధునికులు చెప్పిన వాటిని విలువైనవిగనూ తలంచుతున్నారు. ఈ రెండు వైఖరులు బుద్ధిమంతులు అంగీకరించదగినవి కావన్నది మండలి వైఖరి. ఎవరు చెప్పినా, ఎప్పటి వారు చెప్పినా, పరీక్షకు నిలచిన దానినే స్వీకరించడమన్నదే వివేకపథం అవుతుంది.
    3) తాడనాత్తాప నా నిఖిషాత్ సువర్ణమివ పండితాః❘
         పరీక్ష్య ఇక్ష్యవో మధ్వచో నతు గౌరవాత్ ॥
ఎలా స్వర్ణకారుడు బంగారాన్ని కొట్టి, కాల్చి, విరచి పరీక్షించే స్వీకరిస్తాడో, అలాగే నా మాటలను కూడా బాగా పరీక్షించాకనే స్వీకరించండి. నామీద గౌరవంతో స్వీకరించవద్దు. మండలి వ్యక్తుల పైన, గ్రంథాల పైన ప్రామాణిక బుద్ధిని విడిచి పెట్టమని ఖరాకండిగా చెబుతుంది. తానూ అలా ఉండడానికి శతథా యత్నిస్తుంటుంది. తప్పనిసరై ఎదుటివారి మాటలను స్వీకరించాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడునూ, దానిని ప్రామాణిక బుద్ధితో తీసుకోక, పరీక్షా బుద్ధితోనే స్వీకరిస్తుంది. పరీక్షా ఫలితాలననుసరించే పట్టుకోవడం, విడిచిపెట్టడం లాంటివి చేస్తుంటుంది. జ్ఞానక్షేత్రానికి సంబంధించినంతలో మండలి వైఖరి (జీవనశైలి) ఇదేననవచ్చు.
వెనుకటి తాత్వికులు చెప్పిన అనేక మంచి సూచనలలో మండలి అంగీకరిస్తున్న మరో మంచి భావన, లోకాన్ని అనుకూల దృష్టితో చూడమన్నదీ ఒకటి.
    సూక్తి : 'మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే’
    మిత్రుని కంటితో (మిత్రదృష్టితో) సర్వప్రాణులను చూడు అన్నది ఆ మాట అర్థం. ‘భవిష్యంతి ఇతి భూతాని’ అంటే పుట్టినవన్నీ భూతములు అని దానర్థం. మన సందర్భానికి అన్వయించుకుంటే ప్రాణులు అని అర్థం సరిపోతుంది. 'సర్వాన్ని భూతాని' సమస్త ప్రాణుల పట్లా మైత్రీ భావన కలిగి ఉండు అని చెప్పినట్లు. మండలి ఈ భావాన్ని పూర్తిస్థాయిలో కలిగి ఉందని చెప్పలేము గానీ, ఇదొక ఆదర్శంగా పెట్టుకోదగిన గొప్ప భావన అని నిజాయితీగా అంగీకరిస్తోంది. ఆ ఆదర్శాన్ని ఊతగొని, వీలైనంతలో ఎవరికి అపకారం చేయకుండా జీవించాలనుకుంటుంది. మండలి అవగాహన ప్రకారం వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్న మూడుగా విడగొట్టుకొని ఉన్న మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. తాను - సాటి మనుషులు, ఇతర ప్రాణులు + ప్రాణరహితాలు అంటే జడచేతనాత్మకమైన సమస్తమూ ప్రకృతి క్రిందకు వస్తుందన్నమాట.
    ఒక్క మాట చెబితే, మండలి ఆలోచనా విధానం విషయంలో స్పష్టత వస్తుంది. ఒక్క కపటులు తప్ప మండలికి శత్రువులు ఎవరూ లేరు. అవగాహనలో, ఆచరణలో మండలితో ఎంతగా విభేదిస్తున్న వాళ్లతో కూడా, వారు వంచకులు కానంతవరకు సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటుంది. మిత్ర సంబంధాలు కొనసాగించడానికే యత్నిస్తుంటుంది. గత 40 ఏండ్లుగా మేము వివిధ తాత్విక ధోరణుల వారితో ప్రవర్తిస్తూ వస్తున్న తీరు, కొనసాగిస్తున్న సంబంధాలు ఈ విషయములో మా జీవనశైలి ఏమిటన్న దానికి ప్రత్యక్ష తార్కాణాలుగా ఉన్నాయి. వారేమార్గాన పయనిస్తున్నా, సమాజ హితాన్ని కోరే వారిగా, నిజాయితీపరులుగా ఉన్నంతవరకు వారితో మిత్ర సంబంధాలనే కోరుకుంటూ, స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. మా జీవనశైలికి సంబంధించినంతలో ఇదీ ప్రధానమైనదే.
    జీవనశైలిని అర్థం చేసుకునే విషయంలో పట్టి చూడాల్సిన మరో కోణం ఉంది. 1) కనీసావసరాలనూ తగ్గించుకుని అతి వైరాగ్యంతో జీవితాన్ని గడపడం.
ఈ అవసరాలన్నవి శారీరకవసరాలు - మానసిక అవసరాలు అని రెండుగా ఉంటాయి. మొత్తం శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చేవన్నీ శారీరక అవసరాలు గానూ, సుఖ సంతోషాలను, ఆనందాన్ని, హాయినీ, శాంతినీ, తృప్తినీ ఇచ్చే వాటిని మానసిక అవసరాలు గాను అవగాహన కొరకు విడదీసి చెప్పుకుంటాము.
    ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా అంటే వాటిలో ఏవేవి అవి కావాలి, అలాగే ఉండాలి అనిపిస్తుంటుందో వాటిని మానసిక అవసరాలు అనంటారు. వీటినే వెనుకటి తాత్వికులు సుఖం కావాలి, దుఃఖం వద్దు అన్న మాటలతో చెప్పారు. ఆ పదాలకు అర్థం చెబుతూ అనుకూలానుభవం సుఖం, ప్రతికూలానుభవం దుఃఖం అనన్నారు. అంటే ఎట్టి అనుభూతి ఉండాలని, కొనసాగుతుండాలని అనిపిస్తుంటుందో దానిని అనుకూలానుభవం అనీ, మరెట్టి అనుభూతి కలిగితే స్వభావం సహించుకోలేదో, ఉండకూడదు అనిపిస్తుంటుందో అట్టి దానిని ప్రతికూలానుభవం అని అర్థం చెప్పినట్లు.
    ఈ రెండు రకాల జీవితావసరాలను వ్యక్తి (వ్యక్తులు) ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు, ఎవరికి అవకాశం ఉన్నంతలో వారు తీర్చుకోవడానికీ, తృప్తి కలిగేంతగా అంటే ఇక చాలు అనిపించేంతగా ఇతరుల అవసరాల విషయం పట్టించుకోకుండా తీర్చుకోవడానికి యత్నించారనుకోండి, రెండు రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి శరీరం క్రమంగా రోగగ్రస్తమవుతుంది. రెండు ఇతరులతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. మూడు ఇతరుల సహకారం లేకుండా అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. నాలుగు పసి వయస్సు, వృద్ధాప్యము, అంగవైకల్యముల కారణంగా ఏర్పడ్డ అశక్తత, బ్రతకలేని పరిస్థితిని కలిగిస్తుంది. ఈ అనుభవాలన్నింటి కారణంగానే మనిషి క్రమక్రమంగా తన అవసరాలు తీర్చుకునే విషయములో ఒక పద్ధతిని, పరిమితులను విధించుకున్నాడు. ఎట్టి జీవనశైలి యోగ్యమైన దవుతుందో నిర్ణయించే మూల సూత్రం ఇక్కడినుండే రూపొందింది. 'వివేకపు అదుపులో అవసరాలు తీర్చుకోవడమే సరైనది' అన్నదే ఆ సూత్రం.
    ఆయా పనుల విషయంలో, ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత చేయాలో సరైన రీతిలో నిర్ణయించగల జ్ఞానాన్నే వివేకం అంటున్నాను. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్నే వివేకమంటారు. అదెంత బలంగా ఉందన్న దానినే వివేక సామర్థ్యం (విచక్షణా సామర్థ్యం) అని అంటారు.
సహజంగా అంటే స్వభావం ఇష్టపడుతున్న వాటికీ, వివేకం చెబుతున్న వాటికీ మధ్య సానుకూలత ఉన్నంతవరకు మనిషి పనులు చేసేటప్పుడు ఘర్షణ లేకుండానే ఉంటాడు. ఆరెంటి మధ్య తేడా ఏర్పడినప్పుడే మానసికంగా ఘర్షణ మొదలవుతుంది. స్వభావం తృప్తిని లక్ష్యంగా చేసుకొని అవసరాలు తీర్చుకోవడానికి సిద్ధపడుతుండగా, వివేకం దీర్ఘకాలిక ప్రయోజనాలనూ, ఆనుషంగికంగా వచ్చిపడే హితాహితాలను (మేలు, కీడులను) దృష్టిలో పెట్టుకుని, స్వభావం కోరే వాటికి పరిమితులను సూచిస్తుంటుంది. వివేకం చెప్పినట్లు నడుచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకనే సత్యాన్వేషణ మండలి సాధన స్వభావం కల సంస్థ అని ప్రకటించుకోవడం జరిగింది. నా వరకు నేను గత 45 ఏండ్లుగా వివేకం చూపిన బాటలో ప్రయాణించడానికి సాధనచేస్తూనే ఉన్నాను.
    కనుకనే, జీవితానికి సంబంధించిన ఆయా విషయాలకు చెందిన యథార్ధజ్ఞానాన్ని పొందడం (సత్యాన్ని తెలుసుకోవడం) ఆ జ్ఞానం చూపుతున్న విధానంలోనే మనుగడ సాగించడానికి నిజాయితీగా, శక్తివంచన లేకుండా యత్నిస్తుండడం, చనిపోయే వరకు (ఆజీవితం) చేస్తుండాల్సిందే. సిద్ధావస్థ అన్నది అంటే పూర్తి మెలకువగా (అప్రమత్తంగా) ఉండడమన్నది 100% ఎవరికి అదుపులోనూ ఉండదు, అన్న అవగాహనకు వచ్చాము మేము. మండలి జీవనశైలికి సంబంధించిన మూలభావనల్లో ఇదీ ఒకటిగా ఉంది. మండలి ప్రతీక వృత్తంలోనూ ఈ వివరాలు సూత్రప్రాయంగా పొందుపరచడం జరిగింది.
    వాస్తవిక దృష్టి కలిగి ఉండు. సరైన పద్ధతిలో యథార్థజ్ఞానాన్ని పొందడానికై సత్యాన్వేషణ చేయి. అలా కలిగిన జ్ఞాన రాసి పునాదిగా వివేకాన్ని పొందు. ఆ వివేకం చూపిన మార్గంలో ధర్మాచరణకు పూనుకో, ఆ ఆచరణ నీకూ, ఇతరులకూ హితాన్ని కూర్చేదిగా ఉండాలి. అంటే వ్యష్టి, సమష్టి శ్రేయస్సుకు దారి తీసేదిగా, కలిగించేదిగా ఉండాలి. అందుకై చేసే పనులన్నింటి వెనుక ప్రపంచమంతా ఒకే కుటుంబము అన్న ఆదర్శ భావనను నిలుపుకొని ఉండు, అని చెప్పుకోవడం జరిగింది.
    కనుక మా జీవన విధానములో 'భూమి అంతయూ ఒకే మానవ సమాజం ఏర్పడితే బాగుండును', అన్న ఆదర్శ భావన ఉంది. ఆచరణలో దానికంటే ఒక మెట్టు దిగువదైన జాతీయ భావన కలిగి ఉండాలన్న నియమాన్ని ఏర్పరచుకొని ఉన్నాము. అంటే కులము, మతము, లింగము, ప్రాంతము, వర్గములుగా చూడబడుతున్న భారతీయ పౌరులందరినీ, పై కారణాల ఆధారంగా తేడాగా చూడవద్దు. దేశానికి సంబంధించిన విషయాలలో దేశ ప్రయోజనాలకే పెద్దపీటవేయాలి. భారతదేశమంతా ఒకే కుటుంబము, భారతీయులందరూ సహోదరులే, అన్న జాతీయ భావానికి కట్టుబడి ఉండాలి, అని మాకు మేము చెప్పుకుంటున్నాము. అలా ఉండడానికి శతథా యత్నిస్తున్నాము. సమాజ సంబంధాల పరంగా మా జీవన శైలిని నియంత్రిస్తున్న అంశాలలో ఇది చాలా ప్రధానమైనది. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు, దేశం సమైక్యంగా, అఖండంగా ఉండాలి. సమానాభివృద్ధి విధానంగా, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మన ఆలోచనలూ, పనులు సాగుతుండాలి. దానం ఇవ్వడం. పుచ్చుకోవడం అన్న రెండు చేయకూడని పనులు అనుకుంటున్నాము. ఒక వ్యక్తిగా ఇతరుల నుండి తనకోసం ఉచితం (దానం) తీసుకోవద్దు అన్న నియమం పెట్టుకున్నాము. అలాచేయని దానికి ఏదైనా ప్రతిఫలం సమాజం నుండి అందితే, అది సమాజము నుండి అందిన ఋణం (అప్పుగా) భావిస్తున్నాము. దానిని తిరిగి సమాజానికి మేలు కలిగించే పనులకై ఖర్చు పెట్టడం ద్వారా చెల్లించాల్సి ఉంటుందని స్థిరంగా భావిస్తున్నాము. యథావకాశం తిరిగి చెల్లించే పని వివిధ ఉద్యమ వేదికల రూపంలో చేస్తూ వస్తున్నాము.
    శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడానికీ, శాస్త్రీయ పద్ధతులను అనుసరించడానికీ, సామాజికంగా అవసరమైన మానవీయ, నైతిక విలువలను కలిగిఉండడానికీ, సమాజాభివృద్ధికి అవసరమైన మార్పులను ఆహ్వానించడానికీ, ఆ జీవితం అన్వేషణ తత్పరతను కలిగి ఉండడానికి కట్టుబడి ఉండాలని తీర్మానించుకొని, ఆ రకంగా ఉండటానికి సాధన చేసుకుంటూ వస్తున్నాము. జీవితం సజావుగా నడవడానికి, హేతుబద్ధ యోచన (తార్కిక ఊహ లేదా అనుమాన ప్రమాణం), మానవ సమాజం అందించిన సమాచారం అన్న రెంటినీ వాడుకోవడం అనివార్యం - తప్పనిసరి అవుతోంది. కనుక వాటిని వినియోగించుకుంటూనే, సత్యాసత్య నిర్ధారణ చేయవలసిన, చేసుకోవలసిన సందర్భాలలో సరైన ప్రయోగ పద్ధతిన నిర్ధారించుకునే విధానానికి కట్టుబడి ఉండాల్సిందే ఎవరైనా, అన్న స్పష్టత కలిగి ప్రవర్తిస్తున్నాము. హేతుబద్ధ యోచన ద్వారా ఏర్పరచుకున్న అభిప్రాయాలు గానీ, ఇతరుల నుండి సమాచార రూపంలో అందిన భావాలు గానీ, అంతిమాలు కావనీ, అట్టివన్నీ పరోక్ష జ్ఞాన రూపాలేననీ, అట్టి వాటి విషయంలో అవి సత్యమని గానీ, అసత్యమని గానీ నిర్ణయించడానికి (ప్రకటించడానికి) సరైన రీతిలో ప్రయోగ రీత్యా సరిసూచుకో వలసి ఉంటుందనీ దృఢంగా భావిస్తున్నాము. ఆ లోపు వాటిని సత్యాలని గానీ, అసత్యాలని గానీ తలంచటం, ప్రకటించటం చేయకూడదు, అన్న నిర్ణయంలో ఉన్నాము. జ్ఞాన భాగానికి సంబంధించినంతలో మా జీవన శైలి ఇలానే ఉంటుంది. (ఇంకావుంది)

No comments:

Post a Comment