Wednesday, January 4, 2023

1 వివేకపథం సంచిక

 


వివేకపథం

సంపుటి:1   ఆగష్టు 1996  సంచిక : 1


సంపాదకీయం 

పాఠక మిత్రులకు!

గత 5 సం||లుగా "మేలుకొలుపు" సార్థక నామధేయంతో సమాజాన్ని యధాశక్తి మేలుకొలుపుతూనే ఉందన్న సంగతి మీ అందరకూ తెలుసు. అనేక కారణాలవల్ల అది కొత్తరూపు సంతరించుకోవలసి వచ్చింది. సహజంగా మేల్కొన్న వారు వివేకపథాన్ని అనుసరించవలసి ఉంది. అనుసరిస్తారు కూడా. ఆ క్రమాన్ననుసరించే మేలుకొలుపు కూడా అనంతరాభ్యుదయ క్రమాన్ననుసరించి 'వివేకపథం'గా రూపాంతరీకరణ పొందింది. ఇదుగో. ఆ క్రొత్తరూపులో అది మొదటిసారిగా మీ ముందుకొచ్చింది.

భవిష్యత్ప్రణాళికలో భాగంగా పత్రిక రాష్ట్రమంతటా విస్తరించ వలసిన అవసరం ఉంది. అందుకై రాష్ట్రవ్యాపితంగా ప్రతి గ్రంధాలయానికి పత్రికను 'వివేకపథాన్ని' అందించాలన్న యోచన చేయడం జరిగింది. అందువల్లనూ, పాఠక మిత్రులలో పత్రిక అవసరం గుర్తించిన పెక్కుమంది సూచన మేరా పత్రికకు నామమాత్రపు ధరను ఏర్పరచాలనుకుంటున్నాము. మూల్యం అమూల్యంగా ఉండడం సర్వత్రా ఉచితమన్నదే ఇప్పటికీ నా నిశ్చితాభిప్రాయం. 'సత్యపక్షాన నిలవడం - ధర్మబద్ధంగా జీవించడం' అన్నదానికంటే వ్యక్తి సమాజానికి చెల్లించగల మూల్యమేముంటుంది. విషయపరంగా చూసుకుంటే విషయానికి వారు చెల్లించదగిన మూల్యం, పైన పేర్కొన్నట్లు సత్యపక్షాన నిలవడం- ధర్మబద్ధంగా జీవించడమన్నదొక్కటే ఉత్తమమైంది. అది నిజంగా అమూల్యం అవుతుంది కూడా.

ఈనాడు. సమాజం ఒకరకమైన నిద్రాణస్థితిలో ఉంది. దానినుండి మేల్కొని 'వివేకపథం'లో గమనం సాగించాల్సి ఉంది. అలాగే సమాజంలో స్తబ్దత నెలకొని ఉంది. సామాజిక చైతన్యాన్ని వ్యక్తి వ్యక్తిలోనూ ఉత్తేజితం చేయవలసి ఉంది. ఆ పని 'వివేకం' మాత్రమే చేయగలదు. అందుకే మీ ముందుకు వచ్చింది. 'వివేకపథం'. ఆ మా మార్గాన్నందుకుని పధికులు కాగోరిన వారినందరనూ కలిసి నడుద్దాం, కదలి రండంటూ మండలి ఆహ్వానిస్తోంది. ఏ సంఘీయులతోనైనా పొరపొచ్చాలు లేకుండా సమాజహిత రూపమైన కార్యక్రమాల్ని చేయి చేయి కలిపి శక్తి మేర శ్రమించడానికి మండలి సిద్ధంగా ఉంది.

చరిత్ర క్రమాన్ని గమనించగలిగితే, మేధావులు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైందన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. వాస్తవానికి సమూహశక్తి - ప్రజాశక్తి - లేక ఉద్యమం సఫలం కాదన్న నిజాన్ని గుర్తించుతూనే; ఆ శక్తిని క్రమబద్ధీకరించడం, మార్గనిర్దేశం చేసి ఆ దిశగా నడిపించడం అన్న మేధోపరమైన పాత్రనూ, ఆద్యంతమూ దాని అనితరసాధ్యమైన భూమికనూ కూడా సరిగా అర్ధం చేసుకోవలసి ఉంది. లక్ష్యసాధన క్రమంలో ఈ రెంటి యొక్క పరస్పరాధారితత్వం  ఈనాటి జనశక్తిలోనూ, పద నిర్దేశకుల్లోనూ, ఉండవలసినంతగా లేదన్నదో నిష్ఠుర సత్యం. ఈ దిశగా, సరైన అవగాహనతో పాటు జ్ఞాన క్రియాశక్తుల మధ్య సరైన సంబంధమును ఏర్పరచు కోవలసి ఉందన్నది ఈనాటి సామాజిక అవసరం. అదుగో, ఆ అవసరాన్ని తీర్చుకొనేందుకు చేయవలసిన కార్యక్రమంలో భాగమే మండలి గత రెండున్నరేండ్లుగా, మూడేండ్లుగా సాగిస్తున్న సమష్టి వేదిక. ఆయా ధోరణులను నిశితంగా పరిశీలించి పరీక్షించడమన్న స్వభావంతో సాగుతున్న ఆ వేదిక, అటు విషయ పరిశీలనతో పాటు, ఇటు పెక్కురు మేధావుల మధ్య సాన్నిహిత్యమూ, సత్సంబంధాలను నెలకొల్పడం అన్న ఆశయాన్ని కలిగి ఉంది.

 మావంతు మేము చేస్తున్నాం శక్తివంచన లేకుండా. ఎవరి వంతు వారు చేయవలసి ఉంది. అలా అందరివంతూ అందరూ చేయడం ద్వారా మాత్రమే చేయవలసింది చేయవలసినంతా చేయడం అన్నది కుదురుతుంది. సమాజాభ్యుదయం, లక్ష్యం, సరైన జ్ఞానము (అవగాహన), దానికనుగుణ్యమై దేశ కాలాలను అనుసరిస్తూ సాగే సరైన కర్మ - ఆచరణ అన్నవి సాధకాలుగా మనందరం ఒకటిగా కలవవలసి ఉంది. వివేకపథ పధికులుగా మనందరం ఏకమార్గీయులం కావాలని కోరుకుంటూ. వివేకపథానుగమనంలో భాగంగానే -

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర



'మార్క్సిజం' ఒక తులనాత్మక పరిశీలన


మిత్రులారా! అనుకున్నట్లే 13వ తేదీ ఉదయం 10 గంటలకు సభా కార్యక్రమం ఆరంభమైంది. వచ్చిన వారికి చర్చా వేదిక స్వరూపాన్ని పరిచయం చేస్తూ, ఒక్కో విషయాన్ని ప్రత్యేకించి ఎన్నుకుని, దానిపై సమగ్రమైన విచారణ చేయవలసి ఉంటుందనీ, దానికి ఇరుపక్షాలూ, సదస్యులూ కూడా కొన్ని నియమాలను పాటించవలసి ఉందనీ లేకుంటే చర్చ తుదికంటా సజావుగా సాగడం కష్టమవుతుందని చెప్పాను. చెప్పిన దానిపైననే సూటిగా ప్రశ్నించడమూ, అడిగిందానికే, అడిగినంత వరకే నేరుగా సమాధానం చెప్పడమూ అన్నది చర్చ లోతుగా సాగడానికి ఆధార స్థానం వంటిది. ఈ నియమాన్ని వదలి పెట్టామా, ఇక గోష్ఠి ఒక క్రమాన్ని అనుసరించడంపోయి ఏ కొలిక్కి చేరుతుందో నిర్ణయించడానికి వీలులేనిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది అందరం గుర్తుంచుకోవలసిన విషయం. అలాగే చర్చలో వ్యక్తిగత అభిప్రాయాలు చొరబడనీయకుండా ఆయా అంశాలపై మార్క్సు, ఎంగెల్సులు, ఎట్టి భావాలను వెలిబుచ్చారో అన్నది మాత్రమే చర్చించడం వేదిక ప్రధానాశయం. ఈ నియమం లేకుంటే ఎవరికివారు ‘నాకేమనిపిస్తోందంటే' అంటూ ఎవరిదారిన వారుపోయే ప్రమాదం ఉంది. వీటిని గమనించి చర్చను కొనసాగించండి. అంటూ చర్చలో పాల్గొనేవారినీ, సదస్యులను కూడా పరస్పరం పరిచయాలు చేసుకుంటే బాగుంటుందిగదా అనుకుని పరిచయాల కార్యక్రమాన్ని ముగించాము.

మొదటిరోజు క్రమాన్ననుసరించి ‘గతితార్కిక స్వరూప స్వభావాలు, దాని శాస్త్రీయత' అన్నది చర్చనీయాంశంగా ఉంది. ప్రతిపాదకులుగా ఆనాడు 1) ప్రొ. వి. వి. క్రిష్ణారావుగారు (భౌతిక విజ్ఞాన శాస్త్ర విభాగంలో లెక్చరర్ గా పనిచేశారు వీరు.) 2) చలసాని రాధాకృష్ణ దాసుగారు (సోషల్ సైన్సెస్ స్టడీ సర్కిల్ అన్న దానిని స్థాపించి అనేక సామాజిక సంబంధితాలపై అధ్యయనము, గోష్టులు నిర్వర్తిస్తున్నారు) 3. పరకాల పట్టాభిరామారావుగారు, (కమ్యూనిజం మాసపత్రిక సంపాదకులు) 4. అంజయ్యగారు. (నాగార్జున యూనివర్శిటీలో - మార్క్సిస్టు స్టడీ సెంటర్లో కీలకమైన పాత్ర వహిస్తూ అక్కడే లెక్చరర్ గా పనిచేస్తున్నారు) విషయ  ప్రతిపాదనకు సిద్ధపడ్డారు. ప్రశ్నించడానికిగాను 1) N. V. బ్రహ్మంగారు (వీరు భావ విప్లవోద్యమంలో దాదాపు 50 సంవత్సరాలుగా పనిచేస్తూ సామాజిక రంగంలో క్రియాశీల కార్యకర్తగా, అధ్యయన శీలిగానున్నవారు); 2) ఆరీజ్, (కొంత కాలం కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, పిదప నవ్యమానవవాద ఉద్యమంలోనూ ఉండి వైజ్ఞానికావిష్కరణలను అధ్యయనం చేస్తున్నవారు).  చర్చనారంభించే ముందు అత్యంత ప్రధానమూ, ప్రయోజనకారీ అయిన ఒక విషయాన్ని చెప్పుతాను మనసుకు పట్టించుకోండి. ఇది సామూహిక చర్చా రూపమైన కార్యక్రమం. చర్చలో చోటు చేసుకున్న ప్రతి అంశమూ ఇరుపక్షాలకూ, శ్రోతలకూ తెలుస్తూ ఉండాలి.  మూడు పక్షాలూ స్పష్టంగా గమనిస్తూ ఉండాలి. ఎవరేమేరకు అన్యమనస్కులైనా ఆమేరకు చర్చలో పాల్గొననట్లే అవుతుంది. జాగ్రత్తగా, సావధానతతో ఉండండి. ప్రతి ఒక్కరి మాట అందరకూ, అందరి మాటలు ప్రతి ఒక్కరికీ తెలుస్తూ ఉండాలన్నది అత్యంత కీలకమైన అంశము అని చెప్పాను.

మరో అంశంగా; అసలిట్టి వేదికనేర్పాటు చేయాలన్న ఆలోచనకు నేపధ్యంగా ఉన్న మా అనుభవాల్ని గురించి ప్రస్తావిస్తూ, భిన్న తాత్విక ధోరణుల్ని అధ్యయనం చేస్తూ ఆయా ధోరణులకు చెందిన ప్రసిద్ధులతో చర్చలు జరుపుతూ కొనసాగిన మా అన్వేషణ ఫలితంగా ఆయా ధోరణులను తులనాత్మకంగా పరిశీలించే అవకాశం కలిగింది. దాని పర్యవసానం వాటిల్లోని గుణదోషాలు, బలాబలాలు ఎరుక పడడం. ఆ అవగాహనే ప్రతి ఒక్క ధోరణినీ అందరి ఆలోచనకు, అన్ని ధోరణులను ప్రతి ఒక్కరి ఆలోచనకు అందించి విశ్లేషించి, విచారించి పరీక్షించి నిర్ధారించడానికి అవసరమైన సమష్టివేదిక అవసరాన్ని ఎత్తిచూపింది. అలా ఆరంభమైన సమష్టి చర్చా వేదిక పైకి ఆ క్రమంలో వచ్చిందే మార్క్సిస్టు - తత్వశాస్త్ర చర్చకూడా అనీ చెప్పాను.

అనుకున్న ప్రకారం, గతితర్కాన్ని ఎంగెల్సు, మార్క్సుల అవగాహనా పరంగా ప్రతిపాదించడంటూ ప్రొ: V. V. కృష్ణారావు గారికి సూచించాను. సరేనంటూ మొద లెట్టారాయన.

A Note:- చర్చా రూపంలో సాగిన మూడునాళ్ళ (18 గంటల పైగా) కార్యక్రమమంతా పత్రిక ద్వారా మీముందుంచడం అసాధ్యము, అనవసరమూ కూడా కనుక సారభూత విషయాల్ని, సంఖ్యానుక్రమణిక పద్దతిని మీముందుంచుతాను. చర్చలో పాల్గొన్న రెండుపక్షాలు కూడా తామన్న ప్రతి మాటనూ ఇందులో పొందుపరచలేదన్న అసంతృప్తికి తావీయ వలదని కోరుతున్నాను. 

కృష్ణారావుగారు డైలెక్టిక్సు - అన్న పదం  మూలాన్ని వివరిస్తూ గ్రీకు తాత్వికుల ‘డైలాగు' అన్న పదం నుండి ఆవిర్భవించిందీ డైలెక్టిక్సు అని చెప్పారు. ఆనాడు వారు థీసిస్ - యాంటీ థీసిస్ - సింథసిస్ అన్న క్రమంలో దానిని ఉపయోగించేవారు. వాటినుండి హెగెల్ మూడు సూత్రాల్ని రాబట్టి భావవాదాన్ని వివరించడానికి యత్నించాడు. వాటిని యధాతధంగానే మార్క్సు, ఎంగెల్సులు స్వీకరించారు. అయితే హెగెల్ భావవాదానికి వాటిని అన్వయించగా వీరు భౌతికవాద పరంగా ఆ సూత్రాన్ని అన్వయించి హెగెల్ తలక్రిందులుగా చూపెట్టిన గతితర్కాన్ని సరిగా నిలబెట్టాం అని చెప్పుకున్నారు. అంటూ గతితర్క చారిత్రక నేపధ్యాన్ని భూమికగా ఎత్తిచూపారు.

1) జర్మన్ ఫిలాసఫీ, 2) బ్రిటీషు పొలిటికల్ ఎకానమీ, 3) ఫ్రెంచి సోషలిజం అన్న మూడు మార్క్సిజానికి ప్రాతిపదికలుగా చెప్పుకోవాలి. ఈ అంశాన్ని మార్క్సు ఎంగెల్సులే స్వయంగా చెప్పుకున్నారుకూడా అంటూ మార్క్సిజాన్ని పడికట్ట దలచుకున్న వారు ముందుగా అవగాహించవలసిన మూడు మూలాల్ని - ప్రాతిపదికల్ని - ఎత్తి చూపడంతో తులనాత్మక విశ్లేషణ కార్యక్రమం చాలా సజావుగా ఆరంభమైందనిపించింది. ఇక వరుసగా సంఖ్యాక్రమంలో చూడండి.

[Note:- ఈనాడు మార్క్సిస్టు అభిమానులు, మార్క్సిజం తమకెంతగా వంటబట్టిందో ఒకసారి ఆగి తమలోకి (వెనక్కి) తిరిగి చూసుకోడానికి, వీలైన ఒక మజిలీ ఇది. గుర్తుంచుకోండి,]

1. డైలెక్టిక్సు గురించి మార్క్సు వివరణాత్మక రచనలేవీ చేయలేదు. ఎంగెల్సు మాత్రం డైలెక్టిక్సు ఆఫ్ నేచర్ అన్న గ్రంధాన్ని రచించాడు. యాంటీ డ్యూరింగు లోనూ వీటిని విశ్లేషించాడు.

2) పదార్థపు ఉనికి చలనం రూపంలోనే ఉండగలదు. పదార్ధమూ, చలనమూ విడదీయరానివి. ఉంటే రెండూ ఉంటాయి. లేదంటే రెండూ లేకుండా పోతాయేగాని విడిగా ఉండవు.

3) గతి తర్కానికి ప్రధాన సూత్రాలు మూడు. 1) "యూనిటీ & స్ట్రగుల్ ఆఫ్ అపోజిట్స్"... (విరుద్ధ- శక్తుల మధ్య ఐక్యతా-ఘర్షణ) దీనినే వైరుధ్యాలు అని పిలుస్తున్నారు.

4) ఈ సూత్రాన్ని రుజువుపరచడానికి ఎంగెల్సు చలనము - నిశ్చలత (Motion & Rest) అన్న రెంటినీ - ఉదహరించి ఆ రెండూ ప్రకృతి మూలంలోనే ఉన్న వైరుధ్యాలన్నాడు.

Note:- దీనిపై చాలసేపు చర్చ సాగింది. నిశ్చలత అన్నది సృష్టిలో అసంభవమన్న వైజ్ఞానికావిష్కరణ ఆధారంగా ఆ రెండూ వైరుధ్యాలనడం పొసగదన్నది ప్రతిపక్షం. కాగా అందుకు సరైన సమాధానం ప్రతిపాదక పక్షం నుండి రాలేదు. ఆ విషయం అనిశ్చితంగానే ఆగింది.

రెండో ఉదాహరణగా. పదార్ధము - (కణం) - శక్తి - (తరంగం) అన్నవి ఆపోజిట్సుగా చూపించారు. దీని పైనా సందేహాలు వచ్చాయి. అసలు యూనివర్సులో - కాంట్రాడిక్షన్సు (వైరుధ్యాలు) అన్నవే ఉండడానికి వీల్లేదని, ఆరీజ్, పెంచలయ్య, బ్రహ్మంగార్లు అంటూ,  విరుద్ద శక్తులు - ఐక్యత - ఘర్షణ అన్న పదాల్ని నిర్వచించి. అవెలా ఒక సూత్రంలో ఇముడుతాయో చూపండన్నారు. చాలా సేపు ఈ అంశంపైనా చర్చసాగి పూర్తి గాకుండానే ఆగిపోయింది.

5) ఆదిమ కమ్యూనిజం అన్న దాన్ని ఆంత్రోపాలజిస్టులు అంగీకరిస్తున్నారు. ఆ సమాజంలో వర్గాలు లేవు అని కృష్ణారావుగారు అనీ అనడంతోనే మరైతే విరుద్ధ శక్తులు - ఐక్యత - ఘర్షణ నియమం ఏమైపోయినట్లని ప్రతిపక్షం దాడి చేసింది. అయ్యా, ఉండండి బాబూ, ఆనాటి పరిస్థితుల్లో మనిషీ-ప్రకృతీ అన్నవే విరుద్ధ శక్తులుగా ఉన్నాయి. అంటూ కృష్ణారావుగారు, అంజయ్యగారు, దాసుగారు కూడా ఆ దాడిని ఎదుర్కొన్నారు.

[Note:- మార్క్సిస్టు లిక్కడ ఒక అంశాన్ని నిర్ధారించాల్సి ఉంది. ఏదైనా ఒకదాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఆ యూనిట్లో చూపించాలి వైరుధ్యాల్నీ, వాటి ఐక్యతనూ, ఘర్షణనూ. ఈ నియమాన్ని వదిలితే సూత్రానికి అనుగుణ్యతను కోల్పోయినట్లే ప్రతిపాదకులు. -సురేంద్ర]

'మారుతుండడం అన్న ఒక్క విషయం తప్ప ప్రతిదీ మారుతూండేదే' అన్న ఎంగెల్సు వాక్యాన్ని ఉటంకిస్తూ రెండో సూత్రం వివరించబూనారు కృష్ణారావుగారు. 

2వ సూత్రం : 'క్వాంటిటేటివ్ చేంజ్ లీడ్స్ టు. క్వాలిటేటివ్ చేంజ్' (పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారితీస్తుంది. అలాగే గుణాత్మకం - పరిమాణాత్మకంగా, కూడా.)

1) రసాయనశాస్త్రం అంతా ఈ సూత్రాధారంగానే నడుస్తోంది అన్న ప్రతిపాదనొకటి చేశారాయన. అది ఆయనదనుకో నక్కర లేదు. ఎంగెల్సు కూడా తన గ్రంధంలో రసాయనిక పరమైన ఉదాహరణలనే ఎక్కువగా జొప్పించాడు.

2) శ క్తి-పదార్థాల పరస్పర రూపాంతరీకరణ కూడా ఈ సూత్రం పైనే ఆధారపడి జరుగుతోంది.

(Note:- పదార్థం శక్తిగా మారుతోందన్నప్పుడు పరిమాణాత్మకత గుణాత్మకంగా మారుతున్నదా? గుణాత్మకత పరిమాణాత్మకంగా మారుతున్నదా? అసలింతకీ రెండో సూత్రానికిది వర్తిస్తుందా లేదా? పైగా ఇక్కడ రూపాంతరీకరణ పొందబోయేదానిలో విరుద్ధ శక్తులేవి? లాంటి పరిష్కరించవలసిన అంశాలున్నాయి. ఎందుకంటే ఘర్షణే మార్పుకి మూలం అంటున్నాం కదా!)

3) మరో ఉదా:- క్వాలిటీలోని మార్పు క్వాంటిటీలోని మార్పుకు దారి తీస్తుందన్న దాని కొరకు ‘శిక్షితుడైన సైనికుడు - నలుగురు అశిక్షితులను గెలవగలడు' అన్నది ఉటంకించారు.

(Note:- దీనిపై , ప్రతిపక్షంనుండి స్పందన తగినంతగా రాలేదుగాని, ఇది ఆ సూత్రాన్ని నిర్ధారించడానికి సమర్థమయిన ఉదాహరణ కాగలదా అన్నది ప్రతిపాదకులు ఆలోచించాల్సి ఉంది.)

3వ సూత్రం : Negation of Negation (అభావము నభావము చేయుట ) అభావాభావము లేక వ్యతిరేకతను వ్యతిరేకించడం.

(Note:- అనువాదాలు రకరకాలుగా ఉన్నాయి)

1 Ex. విత్తనం అభావం చెంది (లేకుండా పోయి) చెట్టయి మళ్ళా వేలకొలది విత్తనాలుగా (మొదటి లేకపోవడాన్ని లేకుండా చేస్తూ) పునర్బవిస్తుంది. 

2) Ex. గుడ్డు - పిల్లయి - అనేక గుడ్లు పెడుతుంది. ఇంత దాకా చెప్పి ఆ తమ ప్రతిపాదనకు ముగింపుగా: ఎంగెల్సు 'డైలెక్ట్రిక్స్’ను ప్రకృతికీ, సమాజానికి, ఆలోచనకూ అన్వయించి చూపే యత్నం చేశాడు. ఈ మొతాన్ని, అతడు గతితార్కిక భౌతికవాదమనీ, చారిత్రక భౌతికవాదమనీ పేరెట్టాడు. ఇది క్లుప్తంగా గతితార్కిక స్వరూపమూ, స్వభావము అంటూ ముగించారు.

కృష్ణారావుగారు ప్రసంగాన్ని ముగించాక అంజయ్యగారు వచ్చారు. చర్చలో పాల్గొన్నారు. పరకాల పట్టాభిరామారావుగారు కృష్ణారావుగార్ని పూర్తిగా అంగీకరిస్తూ "అభావమున భావము చేయుట” అన్న సూత్రానికి అనుగుణ్యమైన ఉదాహరణను చూపుతానన్నారు. బ్రిటీషు సామ్రాజ్యవాదులు, భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని నెగేట్ చేశారు. అటుపై ఆ అస్వాతంత్ర్యాన్ని నెగేట్ చేస్తూ (1857-1947) దీర్ఘకాలపోరాటం నుండి మరల స్వాతంత్ర్యం ఆవిర్భవించింది. ఇదే అభావము నభావము చేయుట అంటే అనగా.

(Note: అయ్యా! ఆనాటి మార్క్సు ఎంగెల్సుల అవగాహనను పరిశీలించడం వేదిక ఆశయం కాగా, మీరు - ఈనాడు మనమెరిగిన అంశాలను ఆ సూత్రపు చట్రంలో బిగించి చూపుతున్నారు. అలా అయితే ఈనాడు తెలిసిన విజ్ఞానానికి తగిన సూత్రాలు వేదంలో ఉన్నాయనేలాంటి పోకడే అవుతుంది. కనుక మన అన్వయాలు కాదు కావలసింది. వారి సూత్రాలను వారే ఎలా ప్రకృతి, సమాజం, మనిషి అన్నవాటికి సరిపెట్టి చూపారో చూడవలసి ఉంది అని పరిశీలనను మార్క్సు, ఎంగెల్సుల భావాల పైకి మళ్ళించాను)

చర్చారంభంలోనే ఆరిజ్ పదార్థము - చలనము - నిశ్చలత అన్న వాటిని వివరించి నిర్ధారించండి అనడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ రోజు చర్చ మొత్తంలో తేలిన విషయాలిలా వున్నాయి. గతితర్కం ప్రకృతికీ సమాజానికీ, మనిషికీ (ఆలోచనకూ) వర్తిస్తుంది. దానికి సార్వజనీనత, కాలీనత ఉంది. అని కృష్ణారావు గారభిప్రాయపడగా, వాటిని సిద్ధాంత సూత్రాలు (ఫార్ములాలు)గా ఎంచి సమాజగతి నంతటినీ దానిలో ఇమిడ్చి చూపమనడం సరికాదు. వాటిని టెండెన్సీస్ గా తీసుకుని చారిత్రక గతిని అర్ధం చేసుకోడానికి గైడింగ్ పాయింట్సుగా గ్రహించడం ఉచితం. తత్వశాస్త్ర పరిధికీ, పరిభాషకూ, భౌతిక విజ్ఞానశాస్త్ర పరిధికీ, పరిభాషకూ, చాలా తేడా ఉంది. ఇక్కడ ఆపధాలను సామాజిక శాస్త్ర స్థాయి ననుసరించి ఉపయోగించుకోవాలి అని రాధాకృష్ణదాసు గారన్నారు. అంజయ్యగారు వాటికి యూనివర్సాలిటీ ఉందంటూనే; మార్క్సిజం సామాజిక శాస్త్రమే గాని, ప్రకృతి శాస్త్రం కాదు అన్నారు.

ఈ సందర్భంలో చాలా అనిశ్చిత స్థితీ, గందరగోళమూ, ఒకింత ఆవేశమూ చోటు చేసుకున్నాయి. అందరూ విజ్ఞులే గనుక అతితక్కువ సమయంలోనే వేదిక మళ్ళీ విషయ విచారణలో మునిగింది. ఈ సందర్భంలో తెగని సమస్యలుగా కూర్చున్న అంశాలివే:

1) ఫిలాసఫీ- సైన్సు అన్నవి ఒకటా వేరా? వేరైతే వాటి అర్ధాలేమిటి?

2) సైన్సులోనే - నేచురల్ సైన్సుకూ, సోషల్ సైన్సుకూ ఉన్న తేడా ఏమిటి?

3) డైలెక్టిక్సు రెంటికీ వర్తిస్తాయా? సోషల్ సైన్సుకే పరిమితమా?

Note: పాఠక మిత్రులారా! ఈ అంశాలపై అందరూ ఆలోచించి ఒక సరయిన అవగాహనకు రావాల్సి ఉంది. ఇక్కడ (ఇలాంటి సందర్భాల్లో) స్పష్టత లేకుండా - మార్క్సిజాన్ని తులనాత్మకంగా చూడడం చాలా కష్టం. అంతేకాక ఇక్కడివరకు జరిగిన గోష్టిలో చోటు చేసుకున్న పారిభాషిక పదాలు కొన్ని వున్నాయి. వాటి అర్ధాల్నీ నిర్ధారించుకోవాలి ఇరుపక్షాలూ ముందుగానే. అలాగే అధ్యయనపరులూ ఆ పదాల సరైన అర్ధాల్ని తెలుసుకుని ఉంటేగాని అధ్యయనం సరిగా సాగదు. 1) పదార్ధము 2) చలనము 3) నిశ్చలత 4) వైరుధ్యాలు 5) ఐక్యత 6) ఘర్షణ 7) అభావము 8) పరిమాణము 9) గుణము 10) తత్త్వశాస్త్రము 11) భౌతిక విజ్ఞానశాస్త్రము.

చర్చ ఇక్కడకు సాగాక దాసుగారు మరింత అధ్యయనం అవసరమవుతుం దనడమూ సమయం కూడా అవడంతో, విషయం మధ్యలోనే ఆగిందనీ, మరింత అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని అనుకుంటూ ఆనాటి సదస్సును ముగించుకున్నాము.

మరొక్కమాట మరచాను. ఇప్పటివరకు జరిగిన వైజ్ఞానిక పరిశోధనల్లో ఏ విజ్ఞాన శాఖకు చెందిన పరిశోధనల్లో నైనా గతితార్కిక సూత్రాలను శాస్త్రీయ సూత్రాలుగా అంగీకరించి, ప్రకటించి, వినియోగించుకుని ఏవైన ఫలితాలను రాబట్టినట్లు రుజువుందా? ఉందంటే ఏ శాఖలో ఏ ప్రయోగ సందర్భంలో అలా జరిగిందో తెలుపండి అన్న ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తింది. డైలెక్టిక్సు సూత్రాలు ప్రకృతికీ, సమాజానికీ, మనిషికీ వర్తించే సార్వత్రిక విలువ కలిగిన శాస్త్రీయ సూత్రాలు అనే వారి పైనున్న పెద్ద బాధ్యత ఇది. ఈ అంశాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాదా న్నంగీకరించే వారందరూ అర్ధం చేసుకోవలసి ఉంది. నిర్ధారించ వలసి ఉంటుంది.

జరిగిన పరిశోధనా ఫలితాల్ని ఈనాడు మార్క్సిస్టు గతితార్కిక చట్రంలో ఇమిడ్చి చూపడం వేరు, ఆ పరిశోధకులే గతితార్కిక నియమాల ననుసరించే ఈ ప్రయోగాలు జరిగాయని ప్రకటించడం వేరు.

రెండవరోజు సమావేశం ఉ. గం. 9-30 ని|| ఆరంభమైంది. చాలసేపు పదాలు వాటి అర్థాలు, తత్వశాస్త్రము, విజ్ఞానశాస్త్రము (సైన్సు) అన్న వాటి మధ్య వ్యత్యాసమేమిటి అన్న వాటిపై చర్చసాగింది.

మానవ చారిత్రక పరిణామ క్రమం జంతువుల నుండి మానవుడు విడివడడంతో ఆరంభమవుతుంది. మనిషి నిలుచో గలగడం, ముందు కాళ్ళను చేతులుగా ఉపయోగించ గలగడం అన్ని వాటివల్ల ప్రత్యేకించబడ్డాడు. అదొక గుణాత్మకమైన మార్పు. అని అంజయ్యగారు ప్రతిపాదించగా. మనిషంటే ఏమిటో నిర్వచించండి అని ఆరిజ్ గారు పట్టుబట్టారు.

ప్రకృతితో సంఘర్షిస్తూ కొనసాగించే, జీవన పోరాటంలో మానవుడు సృజనాత్మకత ఆధారంగా పనిముట్లు తయారు చేసుకుని వినియోగించడం అన్నది ఒక విప్లవాత్మక మార్పు అని కృష్ణారావు గారన్నారు. దానిని గతితర్కం చట్రంలో ఇమిడ్చి చూపండని నేనడిగాను. అప్పుడు దాసుగారు మనం అనుకోకుండగనే ప్రతిదాన్ని సూత్రాల చట్రంలో ఇమడ్చాలి అన్న నిర్ణయంలో పడిపోయాం. అది సరికాదని నా అభిప్రాయం అన్నారు.

మొత్తంమీద ప్రతిపాదక పక్షం మానవ సమాజ పరిణామ క్రమాన్ని కొన్ని వ్యవస్థల రూపంలో (మార్క్సు, ఎంగెల్సుల దృష్టినుండే) విభజించి గతితర్క సూత్రబద్ధం చేసే యత్నం చేశారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం బానిస యజమాని వ్యవస్థగా రూపొంది ఆ రెంటి ఘర్షణనుండి రైతు భూస్వామి వ్యవస్థగా రూపాంతరీకరణ (వికసిత దిశలో) పొందింది. ఆ యిద్దరి మధ్య ఘర్షణ కొనసాగి క్రమంగా బూర్జువా వ్యవస్థ పుట్టుకొచ్చింది.

ఇది క్రమంగా పారిశ్రామికీకరణ అధికం కావడం ద్వారా - కార్మికులు - గుత్త పెట్టుబడిదారుల మధ్య ఘర్షణగా మారి పోరాటంద్వారా కార్మికవర్గ నియంతృత్వం ఏర్పడుతుంది అని చారిత్రిక పరిణామ క్రమాన్ని గురించి వివరించారు.

ఈ సందర్భంలో ఆదిమ సమాజంయొక్క ఉనికే అనిర్ధారితమన్న విషయాన్ని ఎన్. వి. బ్రహ్మంగారు గట్టిగా నొక్కి చెప్పగా అంజయ్యగారు మరీ ఈ అంతగా ఏమి తెలియదనకండి దాన్ని గురించి చాలా పరిశోధనలు జరిగాయి అంటూ కొన్ని వివరాలందించారు.

అదలా ఉంచండి ఉత్పత్తి సాధనాలుగా చేతులు పని ప్రారంభించడం ప్రధానమైన అంశం అనడం కంటే దీనినంతటినీ క్రమపరుస్తూ నియంత్రిస్తున్న మెదడును ఉత్పత్తి, పరికరంగా గుర్తించకపోవడం పెద్ద లోపం. అన్నారు బ్రహ్మంగారు. అవన్నీ తరవాత అసలు మనిషంటే ఏమిటో నిర్వచించండి ముందు అంటూ ఆరిజ్ గారు మళ్ళీ తమ ముందటి సందేహాన్ని పునరుద్ఘాటించారు. మీరు చెప్పకుంటే, నన్ను చెప్పమంటే, నేనే చెపుతాను అనీ అన్నారాయన. చెప్పండన్నారు రెండు పక్షాలవారు.

ముందుగా ఒక నిర్వచనం చేశారాయన. తాను గుర్తించిన దానికో రూపాన్ని యివ్వగల జీవ పదార్థం మనిషంటే, రూపాన్నివ్వడం అంటే ఏమిటని ప్రశ్న. ఆయన ఆలోచించుకుని ఈ నిర్వచనానికి మూడు అనుబంధ వాక్యాలు చెప్పాల్సి ఉంటుంది అన్నారు. సరేననగా ఆ మూడూ చెప్పారు. అప్పుడు ఈ మీ నిర్వచనం మనిషి ఏర్పడ్డ దగ్గరనుండీ సరిపోతుందా? అనగా మళ్ళా ఆలోచనలో పడ్డారాయన. చాలసేపు చర్చ జరిగినాక కూడా ఒక ఏకాభిప్రాయానికి రాలేదు వేదిక.

మన చారిత్రిక పరిణామ క్రమాన్నర్థం చేసుకునే సందర్భంలో మార్క్సిస్టు దృక్పథంలో ఉత్పత్తి శక్తులు, (ఉత్పత్తి సాధనాలు, మానవ శ్రమ, ఉత్పత్తి లక్ష్యాలు) చాలా ప్రధానమైనవి. అలాగే ఉత్పత్తి సంబంధాల నెరగడం చాలా అవసరం. పనిచేసేవారు చేయించుకునే యాజమాన్యం అన్న వారి మధ్య ఉండే సంబంధాలనే ఉత్పత్తి సంబంధాలంటారు. ఉత్పత్తి శక్తులూ, ఉత్పత్తి సంబంధాలను కలిపితే ఉత్పత్తి విధానం అవుతుంది. దీనినే ఆయా కాలాల్లోని వ్యవస్థలంటున్నాం. ఈ వ్యవస్థలు మార్క్సిజం ప్రకారం మూడు వర్గాల్లేని ఆదిమ కమ్యూనిస్టు సమాజమూ, భవిష్యత్తులో దీని వికసిత రూపంగా మళ్ళా రాబోయే వర్గరహిత కమ్యూనిజమూ మినహాయించితే మధ్యలోని మూడింటినీ 1) బానిస సమాజం 2) భూస్వామ్య (ఫ్యూడల్) సమాజం 3) పెట్టుబడిదారీ (బూర్జువా) సమాజంగా విభజించారు మార్క్సు, ఎంగెల్సులు. 

పై వివరాలు ప్రతిపాదకుల నుండి రాగా ప్రశ్నించే పక్షం నుండి అసలు చరిత్ర అలాగే జరిగిందన్నదే పెద్ద సందేహం. అదలా ఉంచి భారత దేశంలో చరిత్ర క్రమమలాగే లేదన్నది కమ్యూనిస్టులు కూడా అంగీకరించిన సత్యం. పైగా పై మూడు వ్యవస్థల్ని గతితార్కిక సూత్రాలద్వారా వ్యాఖ్యానించడమూ దుస్సాధ్యంగా కనబడుతోంది. ఎందుకంటే వర్గాలు - లేవన్న అదిమ కమ్యూనిజం నుండి బానిస సమాజం ఎలా ఉద్భవించింది. ఎలాగోలా ఉద్భవించిందనుకున్నా బానిస - బానిస యజమాని విరుద్ధ శక్తులనుకుంటే వాటిమధ్య ఐక్యత ఘర్షణ ఎక్కడ ఎలా ఏర్పడింది? దాని పర్యవసానంగా Negation of Negation సూత్రం పనిచేసి ఆదిమ కమ్యూనిజం వికసిత రూపంలో ఆవిర్భవించడమో, బానిసలు రాజ్యానికి రావడమో జరగాలి. అలా కాకుండా బానిసలు రైతులు, కౌలుదార్లుగా, యజమానులు భూస్వాములుగా మారారంత మాత్రమే. దీనిని గతితార్కికంగా ఏ సూత్రానికి అప్లై చేద్దామన్నా సరిగా యిమడదు. ఇదీ పరిస్థితి. అలాగే మిగిలిన రెండు వ్యవస్థల్లోనూ మార్క్సు, ఎంగెల్సులు వివరించినట్లు జరగలేదు సరికదా! తద్వ్యతిరేకంగా మధ్యతరగతి నుండి నాయకత్వం పుట్టి విప్లవాల్ని సాధించింది. జరిగినంత వరకైనా, బానిసలుగానీ, రైతులు, రైతు కూలీలు, కౌలుదార్లుగానీ, బూర్జువా వ్యవస్థలో కార్మికులుగానీ నేరుగా వర్గ పోరాటంలో పాల్గొన్న దాఖలా కనపడదు. మనం తిమ్మిని బమ్మినిచేసి సరిపెట్ట జూడడం తప్పిస్తే ఇదీ ప్రధానంగా ప్రతిపక్షం పోకడ.

దీనిపై సమాధానాలకు రుజువు పరచగల స్థాయిలో ప్రతిపాదకులు అందించ లేదన్నది తేలుతోంది టేపు రికార్డులను పునఃపరిశీలిస్తే. మొత్తంమ్మీద చరిత్ర గతితార్కిక సూత్రాల అనుల్లంఘనీయతా నియమాలకు, లోబడలేదన్న పక్షమే బలంగా కనపడిందా నాటి వాదనలో. కనుకనే ఈ విషయంలోనూ మరింత గాఢమైన అధ్యయనం కొనసాగించవలసి ఉందన్న అభిప్రాయానికి వచ్చాము.

నోట్: తప్పదు మరి ఒక విస్తృత క్షేత్ర పరిధిగల సిద్ధాంతాన్ని అలవోకగా కొట్టిపారవేయడం గానీ, చూసీ చూడకుండానే రుజువైందన్న అభిప్రాయానికి రావడంగానీ అశాస్త్రీయం. దానివల్ల ఒనగూడే దేమీ లేకపోగా కొన్ని తప్పుడు నిర్ణయాలకు చేరే ప్రమాదం ఉంది. ఆ విషయాన్నే చెపుతూ దీని పైనా మరింత అధ్యయనంతో మళ్ళా కలుద్దాం అనుకుని ఆనాటి విషయాన్ని ముగించుకున్నాం.

మూడవరోజు సమావేశము మార్క్సు పెడిక్షన్స్ పై మొదలైంది. మొదట మార్క్సు, ఎంగెల్సుల ప్రెడిక్షన్స్ ను వేదికపై నున్నవారు ఇలా ప్రతిపాదించారు.

  1. ఆదిమ కమ్యూనిజమ్ తరువాత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రని, అది బానిస-బానిస యజమాని, రైతు-భూస్వామి, కార్మికుడు-పెట్టుబడి దారుడి మధ్య జరిగిందని, రాబోవు కాలములో వర్గరహిత సమాజము ఏర్పడుతుందన్నారు.

  2. పెట్టుబడిదారీ విధానము పెరిగిన కొద్దీ కార్మికవర్గము మరింత బలపడి తిరుగుబాటు చేసి ఆదిపత్యాన్ని స్వీకరిస్తుందన్నారు.

  3. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాలలోనే ముందుగా విప్లవం వస్తుందని ఉదాహరణకు ఇంగ్లాండు, ఫ్రాన్సు అని వివరించారు.

  4. పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడిన కొద్దీ మధ్యతరగతి వర్గము అంతర్థానమై రెండే వర్గాలు మిగులుతాయన్నారు.

  5. అత్యధిక ప్రజలకు పెట్టుబడిదారీ వ్యవస్థ, ముందు రెండు వ్యవస్థల కంటే ఎక్కువ గౌరవం ఇవ్వదన్నారు.

  6. వ్యవస్థను నియంత్రించే విషయములో ఆర్థిక పరిస్థితులే ప్రధాన భూమికను వహిస్తాయన్నారు.

  7. విప్లవానంతరము సమాజములో నీతి, జాతీయతా భావము, కుటుంబ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పోలీసులు యంత్రాంగము వుండవన్నారు.

  8. బ్రిటన్, అమెరికాలలో పార్లమెంటరీ, పద్ధతి ద్వారా సోషలిజం వచ్చే అవకాశం వుందన్నారు.

  9. అప్పటికి అభివృద్ధి అయిన పరిస్థితుల దృష్ట్యా రష్యాలో ముందు విప్లవం రాగలదన్నారు.

పై ప్రెడిక్షన్స్ పై చర్చానంతరము, మార్క్సు ప్రెడిక్షన్స్ అన్నీ అలానే జరగలేదని అందరూ అంగీకరించినారు. అలా జరగక పోవడానికి కారణము గతితార్కిక భౌతికవాద సూత్రాలలో దోషమా? మార్క్సు పై సూత్రాల కనుగుణంగా సరిగా ప్రెడిక్ట్ చేయలేకపొయాడా? అన్నవిషయము తేలాలంటే మొదట గతితార్కిక భౌతిక సూత్రాలు సరైనవో, కాదో, లోతుగా పరిశీలించాలి. కావున ఆ మూడు సూత్రాల పైనే జనవరి 1997 సం||ములో సమావేశము ఏర్పాటు చేస్తామనీ, అందరూ విషయాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి రావలసిందిగానూ, తమ దృష్టిలో పెద్దలను కూడా వెంట నిడుకొని రావలసిన బాధ్యత ఎవరికి వారు తీసుకో వలసిందిగా నిర్ణయించుకొని సభను ముగించాము.



హేతువాదులకు హేతువాద పాఠాలు-3

మిత్రులారా! పై శీర్షికన జూలై సంచికలో హేతువాదానికి సంబంధించిన అతి కీలకమైన విషయాల్ని కొన్నింటిని ప్రస్తావించాను. హేతువాదుల్లో 'రాటు దేలిన' వాళ్ళ మంటున్నట్టీ, ఇతర సమాజాల్లో హేతువాదులే ఉండరని, తలపోస్తున్నట్టీ, నవ్యమానవ వాదుల్లో కొందరిని గురించీ, కొన్ని సంఘటనల గురించి కూడా కొంత ప్రస్తావన చేశాను. దానికి కొనసాగింపే ఈ వ్యాసం కూడా.

ఆ వ్యక్తిగతమైన దూషణ, భూషణ, తిరస్కారముల ధోరణిని యిష్టపడే వాణ్ణి కాదు, స్వభావతః నేను. అందుకే చాలా కాలం ఈ దారి మనకొద్దంటూనో, ఇహ ఇప్పటినుండైన జరిగింది మరచిపోదాం, కలసి కదులుదాం అంటూనో, రసాభాస ఎవరికీ ప్రయోజనకారి కాదంటూనో సూచన చేస్తూనే వచ్చాను. వెంకటాద్రిగారు చాలా అనుచితంగా, అసభ్యంగా, అకారణంగా నిర్హేతుకమైన దోషారోపణలు, నిందలు వేసి ఇదే ఆరంభం అనీ, క్రమంగా మేలుకొలుపు, మండలి, నా అసలు రూపు బయట పెడతాం అనీ ప్రకటించుకున్నారు. మండలికొచ్చే వాళ్ళు, నాతో కలిసే వాళ్ళు అందరూ మతి చెడినవాళ్ళేనని ప్రకటించారు. ప్రచారం చేస్తూ వస్తున్నారు. వెంకటాద్రిగారూ, మరి ఒకరిద్దరూ మాత్రం అంతో యింతో విజ్ఞానశాస్త్ర పరమైన సమాచారాన్ని సేకరించుకుని ఉండవచ్చునేమో. అందులో అంతో యింతో అర్ధం చేసుకుని ఉండవచ్చు గాక. రావిపూడి రచనల్లో అక్కడక్కడా దొర్లిన సైన్సు సమాచారాన్ని వల్లిస్తూ అసలు శాస్త్రజ్ఞుల కంటేను అధికుల మనుకుంటూండే వాళ్లు వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. అందుకు మచ్చు గత రెండు మూడు నెలలలో నవ్య మానవవాద ప్రముఖుల మంటుండే వారి నుండి మేలుకొలుపుకు అందిన స్పందనల ద్వారా, మీ ఎదుటా ఉంచాను. నిజానికి ఇంకొల్లు సుబ్బారావుగారి ద్వారా సైన్సు మీదనే మాట్లాడుకుందాం రండని ఆ "సైంటిస్టుల" మనుకుంటున్న వారికి కబురంపాను కూడా! గొప్ప భావ విప్లవోద్యమకారులు గదా! భౌతికంగా కదలడ మెందుకు? భావవిప్లవాన్ని ఇంట్లో ఉండే, ఊరి పొలిమేర్లను దాటకుండగనే సాధించవచ్చని కాబోలు. సామరస్య పూర్వక సహకార సంబంధాలన్నవి, తామేర్పరచుకోక పోగా, కోరి దగ్గరకొచ్చి చేయిచాచిన వాండ్లను విసరి కొట్టడ మన్న వింత విధానం ద్వారా ఏర్పరచుకోవాలని కాబోలు, నా కబురుకు సమాధానం లేదు. ఇతరుల్ని గేలిచేయడం, తామంతవాళ్ళం ఇంతవాళ్ళం అనుకోవడం, అయినట్లు ప్రవర్తించడంలాంటి పోకడల్ని గుత్తగొన్న తీరు వీరి హేతుత్వానికి, సమాజ హిత కాంక్షకూ అద్దం పడుతుంది. ఎంతగా సరి పెట్టుకుని, సర్దుకుని పోదామనుకున్నా - మనసూరుకోని రీతిలో హృదయాల్ని గాయ పరచడంలో కళాత్మకంగా ఎదిగిన వీరికి తిట్టకండిబాబూ అన్నా చాలు అదో తిట్టులా అనిపించి బాధపడిపోతుంటారు. సరే. వారి శాస్త్రీయ పోకడకు సంబంధించీ - వారిలోని హేతుబద్దత గురించీ ఒకటి రెండంశాలు మీ ముందుంచుతాను . పరిశీలించండి.

ఎందుకొచ్చిందోగాని "కళా - శాస్త్రం" అన్న అంశంపై గోష్టిగా ఆరంభమై గొడవ, రభసగా మారి వైరంగా స్థిరపడ్డ కథ ‘హేతువాది' నెరిగిన వారందరికీ తెలుసు. ఆ సందర్భంలో రసదృష్టిని రసాభాసగా మార్చిందే కాక గొప్ప భావుకుడూ, సౌందర్యోపాసకుడూ, విమర్శకుడూ అయిన సంజీవదేవ్ సముఖానికి విషయాన్ని తీసుకెళ్ళారు. ఎంత అహేతుక వాదిలోనూ ఏదో చోట హేతుత్వం ప్రకటమవుతుంది అనడానికి గొప్ప దాఖలాలాంటిదా నిర్ణయం అనిపిస్తోంది. ఆ సందర్భంలో ముగింపుగా సంజీవదేవ్ వెంకటాద్రి పోకడపై వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా విలువైనవి. వాస్తవాలకు అత్యంత దగ్గరి మదింపు రూపాలు గనుక. (సంజీవదేవ్:- నాకు వైజ్ఞానిక రంగంలో అంతగా అభిజ్ఞత లేనట్లే మీకు కళా రంగంలో కూడా. మీరన్నట్లు కళ ఎదగకుండా నిలిచిపోలేదు. భౌతిక రసాయనిక విజ్ఞానాలు ఏ విధంగా స్థూలదశనుండి సూక్ష్మదశ దిశగా నిరంతరం పయనించుతున్నాయో అదే ఈ విధంగా కళలుకూడా అనేక నూతనమైన మార్పులతో సరిక్రొత్త ప్రయోగాలతో సూక్ష్మం వైపుకు పయనిస్తున్నాయి.] సురేంద్ర:- కళలు వికసిస్తున్నాయా? లేదా? అన్నది నిజానికిక్కడ అప్రస్తుతం. తనకు తెలియని విషయాల్లో  తలదూర్చడం, ఒక ప్రక్క తెలీదని ఒప్పుకుంటూనే , దానిని సమీక్షించ బూనడం వెంకటాద్రిలాంటి హేతువాది!?!కే చెల్లుతుంది. అయినా వారి మిత్రమండలికి ఆ పోకడ పక్కా హేతుబద్ధంగానే ఉన్నట్లు తోస్తుంది. వీరి ఇంగిత జ్ఞానం అసాధారణంకదా!

ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాధ్యక్షులుగా ప్రస్తుతముంటున్న P.S.R. గారితో నా పరిచయాలు, వారి పోకడ గురించి తెలియజేస్తానని గత సంచికలో ప్రకటించానుగదా! వారి నుండి 12-7-96న రాసిన లేఖ వచ్చింది, దానిని యధాతధం ప్రచురించి, ఆ పై నా ఆలోచనలనూ మీ ముందుంచుతాను.

"మిత్రులు సురేంద్రగారికి నమస్కారం. 1-7-96 సంచికలో, PSRగారితో నా పరిచయాలు, వారి పోకడ గురించి పై సంచికలో పాఠకుల ముందుంచుతానని వ్రాశారు. సంతోషం. సమాజహితంకోరి ఎదురీదే వ్యక్తులు తప్పక విమర్శనాహ్వానించ వలసిందే. అలాగని, అందరితరఫున నేను వకాల్తా పుచ్చుకో లేను. నామటుకు నేను నా వ్యక్తిగత జీవనం గురించి కూడా హేతుబద్దమైన విమర్శకు సిద్ధం. నా గురించి మీరు వ్రాయబోయే ముందు నాదొక మనవి. నా ఉద్యోగరీత్యా, కుటుంబ కారణాలవల్లా హేతువాద సంఘ కార్యక్రమాలకే అతికష్టంమ్మీద హాజరవుతున్నాను. మీరేమనుకున్నా మీకున్న తీరిక, సాధనసంపత్తి నాకు లేదు. పత్రిక మీది కనుక నా ప్రతిస్పందనను పూర్తిగా ప్రచురించడానికి సిద్ధపడి; నా గురించి విమర్శకు దిగమని విజ్ఞప్తి. అపుడే పాఠకులు కూడా మనిద్దరినీ పూర్తిగా అంచనా వేయగలరు. - P.S,R”

సుదీర్ఘ మైన వివరణలతోగానీ, సందర్భాన్ని విడచిన అంశాలుగానీ రచనలో లేనంత వరకు మీ స్పందనను యధాతధంగానే ముద్రిస్తాను. పై లేఖలో “మీరు చేసిన చివరి విజ్ఞప్తి నాకంగీకారమే. పోతే నేను మొదటినుండీ నవ్యమానవవాదుల్ని పదేపదే ప్రశ్నిస్తోంది ముఖ్యంగా మూడు నాలుగంశాల లోనే. శాస్త్రీయ దృక్పధం, స్వతంత్రాలోచన, హేతుబద్దత, సహకార సంబంధాలు (మొత్తంగా వీటన్నింటిలో ముడిపడివున్న భావవిప్లవం) అన్నవాటి పట్ల ఆచరణలో వారు - మీరు ఎలాగున్నా రన్నదే.

గణేశం బాబూరావుగారు మీ గురించి చెప్పడం ద్వారా  పరోక్ష పరిచయం ఏర్పడింది మనమధ్య. బైబిలు పై సాధికారికంగా విమర్శించగల రాయన అన్న విశేషాన్ని చెవినేశారు బాబూరావుగారు. దాంతో క్రైస్తవంపై చర్చావేదిక నేర్పాటు చేస్తూ మిమ్మాహ్వానించినట్లు జ్ఞాపకం మొదటిసారి. అప్పటికి లేఖలద్వారా ఆయా వ్యక్తుల్ని సంబోధించేటప్పుడు; ఆర్యా అనడం నాకు అలవాటుగా ఉంది. చాలా మామూలుగా మిమ్మూ అలానే సంబోధించాను. అంత క్రితం ఎన్నో ధోరణులకు చెందిన ఎందర్నో అలానే సంబోధిస్తూ వస్తున్నా, మీనుండి వచ్చిన ఆరోపణ-విమర్శ ఏనాడూ ఎవరినుండీ నా కెదురవలా. ఆనాటి ఈ లేఖాసారాంశం ఇలా ఉంది. 

1) నన్ను ఆర్యా అని ఎందుకు సంబోధించారు, నేను ఆర్యుణ్ణి కాదుగదా!

దాని పై ప్రతిస్పందిస్తూ, అయ్యా ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్ము ఆర్యా! అని - నేననలేదు. అది సంబోధనగా చాలా గౌరవార్ధకం అని మీకు రాశాను.

ఎక్కడుందలా? అని అంటూ ఏ నిఘంటువులోనూ అలా లేదు అంటూ ఆర్య, ఆర్యా, ఆర్యౌ లాంటి పదాల్ని ఉటంకించి పార్వతి అనీ, భర్త అనీ, ఇంకా ఒకటి, రెండర్థాలూ చెప్పి నా సంబోధన దోషయుక్తమన్నారు. పైగా ఒకవేళ దానికి ఎక్కడన్నా సత్పురుషుడు అన్న అర్థం ఉందనుకున్నా నన్ను మీరెరుగరు, నేను సత్పురుషుణ్ణో కాదో తెలియకుండానే నన్ను సత్పురుషుడని ఎందుకన్నావు? అంటూ మరో విమర్శ చేశారు. అనవసరమూ, కాసుకు కొరగానిదీ అయిన ఈ రగడెందుకనుకుని ఊరుకున్నాను. అలా నేను ఊరుకోవడం ద్వారా ఆగిన ఆ రగడను, వెంకటాద్రిగార్కి, నాకూ జరుగుతున్న వాద-ప్రతివాదాల సందర్భంగా మళ్ళా కదిలిస్తూ 'తప్పును ఒప్పుకునే స్వభావం గానీ, మార్చుకునే యత్నం గానీ లేని వాణ్నిగా' నన్ను గురించి ఒక నిర్ణయం చేశారు. అంతటితో ఇదేదో ఒక కొలిక్కివచ్చి ఆగితేనే బాగుంటుందిలే అనుకుని మేలుకొలుపు ద్వారానే రండి చర్చించుకుందాం. మొదట చర్చనీయాంశం 'ఆర్యా' పైనే అంటూ మిమ్మాహ్వానించాను. మీనుండి జవాబులేదు.

గుంటూరులో జరిగిన చర్చ సందర్భంగా నిర్వచనాలు అక్కరలేదన లేదంటూ అలా అన్నానని వారన్నారు. గనుక దానిని రుజువు చేయండి, లేదా పత్రికాముఖంగా పొరపాటు జరిగినట్లు ప్రకటించండి అన్న డిమాండ్ లేవదీశారు. అది సరైన విధానమే. అదలా ఉంచి ఇప్పుడడుగుతాను. ఒక ప్రశ్న సూటిగా చెప్పండి.

ప్రశ్న: సైద్ధాంతిక చర్చలలో చోటు చేసుకునే పారిభాషికపదాలకు నిర్వచనాలు చెప్పుకోవలసిన అవసరం ఉందా? లేదా? వాటిపట్ల స్పష్టమైన అవగాహన - లేకుండా ఆ ధోరణి పూర్తిగా అర్ధమైందనడం సాధ్యమా? అసాధ్యమా?

మరొక్కమాట, గుంటూరులోనూ, ఆ పిదప ‘హేతువాది’ ద్వారాను వెంకటాద్రిగారు చేసిన ఆరోపణలూ, నిందలూ రుజువుపరచడమో, పొరపాటైందని తిరిగి ప్రకటించడమో చేయాల్సిన బాధ్యత ఆయనమీద ఉందంటారా? లేదంటారా? లేదంటే ఎందుకనో, ఉందంటే ఆ మాటాయనకు చెప్పగలరేమో చెప్పండి ముందు. సమాజానికి ఎదురీదే స్వభావం ఉందన్నారు గదా మీకు. నిజాయితీగా, నిర్భీతితో నిజాన్ని ప్రకటించడం, అవసరమైతే సరైన పక్షాన నిలచి స్వపర భేదం లేకుండా పోరాడడం సాగించగలగాలి. అదీ ఎదురీదడమంటే. అది మీకుందో, లేదో ఆచరణ ద్వారా తేల్చండి.

ఇప్పటికీ శాస్త్రీయంగా తేలని విషయం ఆర్య - ద్రావిడ వాదం. వలస వాదులు సృష్టించిందీ, ప్రాంతీయవాదులు పెంచి పోషిస్తున్నది ఈ వాదం. అంబేద్కర్ లాంటి మేధావులే ఎంతో పరిశోధన చేసి, తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన కుల నిర్మూలనలో, కులం పుట్టుక గురించి శోధిస్తూ ఆర్య ద్రావిడ వాదం పసలేనిదన్న నిర్ణయానికి వచ్చారు. దాని పై మరింకా ఒకటి రెండు వాదాలున్నాయి. ఆర్యులు ఎక్కడనుండి వచ్చారనే విషయంలో చారిత్రక పరిశోధకుల్లోనే ఏకాభిప్రాయం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, మా దృష్టి నుండి చరిత్రరచన అనేది అతి బలహీనమైన ప్రమాణం. వాటిలోని ఎక్కువ విషయాల్ని శాస్త్రీయస్థాయిలో నిర్ధారించడం సాధ్యపడదు. ఈనాటి మనకు అసలే సాధ్యపడదు. ఎందుకంటే చరిత్ర రచనలకు త్రవ్వకాలలో బయల్పడిన అంశాలు ప్రధానాధారాలు కాగా, ఊహలు, అపోహలు, అభిమాన ద్వేషాలు కలగలిసి సత్యాలూ, సంశయాలూ, అసత్యాల్తో కిచిడీ (పులగం)లా తయారై ఉంటుందది.

మన మనం చదువుకున్న చరిత్ర తిరగరాయాల్సిన అవసరముందన్న వాద నొకటి ప్రధానంగా వుండనే వుంది. ఈ పరిస్థితుల్లో ఆర్య ద్రావిడ సిద్ధాంతం రైటని వారు తేల్చినట్లూ, తేలినా నేనంగీకరించనట్లూ మీ అభియోగం.

పైగా ఆర్యా; అన్న పద ప్రయోగం సంబోధనారకంగా గౌరవసూచకం కాదని మీ వాదన. ఒకవేళ అలా అనుకున్నా నా గురించి తెలియకుండా సత్పురుషుడా అని ఎందుకన్నావు అని మరో రీజనింగ్.

వ్యక్తిగతంగా మీ గురించి ఏమి తెలియని నేను మూర్ఖంగా ఆరోపణలకు దిగను. వాస్తవానికి చాలామేర పరిస్థితులు మనిషిపై నిర్ణయాత్మకంగా ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకు మీరూ, నేనూ కూడా అతీతులం కాదు. అయినప్పటికీ ఉద్యమ కార్యకర్త - ఉద్యమ కార్యానికి - వ్యక్తిగత విషయాలకు ఘర్షణ ఏర్పడి ఏదో ఒకటే తేల్చుకోవలసివస్తే ఉద్యమ కార్యానికే ప్రాధాన్యత ఇస్తాడు. అట్టివారివల్లే ఉద్యమాలు కొనసాగుతాయి.

నాలుగు మాటలు చెప్పి ఇప్పటికాగుతాను. నాకిష్టమైతే భావ విప్లవానికి సంబంధించిన ఒక్కో విషయాన్ని తీసుకుని సద్భావనతోనే చర్చించుకుందాం రండి. తేలిన విషయాలు ఇరువురం స్వీకరిద్దాం. జీవితంలో అమలుచేయడానికి నిజాయితీగా యత్నిద్దాం. చర్చ మీరు కావాలనుకుంటే ఆర్య ద్రావిడ దగ్గరనుండే ఆరంభిద్దాం. కానీ దానికి వేదిక 'పత్రిక' కాదు. ముఖాముఖి చర్చిస్తూ టేపు చేద్దాం. ఆపై ఒక్కో విషయం చర్చకు స్వీకరిద్దాం. మీరెలాగంటే అలా.

ఈ నెల హేతువాది చూశాను. సమీక్షిస్తే బాగుంటుందనిపించింది. మీరూ, మిగిలిన పాఠకులూ చూస్తారు గనుక సంగ్రహంగా చెపుతాను. చూడండి.

(జూలై -96, పేజీ-19) ఒక మత క్రౌర్యాన్ని కాదంటున్నామంటే మరొక మతేతర క్రౌర్యాన్ని ఆహ్వానించాలని దాని భావం కాదు. క్రౌర్యాన్నే తుదముట్టించాలని దాని తాత్పర్యం. అయితే తన క్రౌర్యాన్ని తాను గుర్తించలేని బలహీనత వ్యవస్థీకృత మానవ మనస్తత్వంలో మూర్తీభవించి ఉంది. అందుచేతనే బోధలో కరుణ, ఆచరణలో క్రౌర్యం అన్ని మతాలూ గుత్తకు తీసుకున్నాయి.

విమర్శ: చాలా స్పష్టంగా ఒక అంశాన్ని ప్రతిపాదించారు వెంకటాద్రిగారు. అయితే శోచనీయమైన విషయమేమంటే, ఆయా వ్యక్తులతో చర్చలు-సంభాష ణలు సాగించేటప్పుడు కనపడే వెంకటాదికీ, శాస్త్రీయ రచనలు చేసేటప్పటి వెంకటాద్రికీ పోలికే వుండదు. - బోధలో సారళ్యత - ఆచరణలో క్రౌర్యం, క్రోధవిలసితావేశం కట్టలు తెంచుకుని కనిపిస్తుంది! ఆయనలో ఆచరణలో పరమనియంతగా ప్రవర్తిస్తూ మాటలు మాత్రం ఎలా చెప్పగలరో అదే పేజీలోని ఆయన మాటల్లోనే వినండి.

వెంక : "హేతువాది ఏ నిర్బంధాన్నీ, నియంతృత్వాన్నీ, క్రౌర్యాన్నీ, అంగీకరించడు. గిట్టనివాని మీద వాటిని ప్రయోగించడు. (Note: వెంకటాద్రి  నెరిగిన ప్రతివారికీ తెలుసు ఆయనపట్ల ఇదెంత అసత్యమో) ప్రయోగించడానికి కొన్ని కారణాలు కనిపెట్టడు. అభిప్రాయ ప్రకటనమీద ఆంక్షలు విధించడు.

సురేంద్ర: పై లెక్కన ఆయన హేతువాదైనా కాకపోయుండాలి. లేదా పై అభిప్రాయం తప్పుడుదై గొప్పలు చెప్పుకోడానికి ఉపయోగించుకునేదైనా అయ్యుండాలి.

చీరాల సభలో మేలుకొలుపును సభకు పరిచయం చేస్తూ వెంకటాద్రి అన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. "ఇది మేలుకొలుపు అనే మాసపత్రికండి. పత్రికంటే ఏమో అనుకునేరు. ఇదుగో యిదే" అంటూ ఆనాడు ఆ గొంతులో కనబరచిన వ్యంగ్యమూ, ముఖంలో కళాత్మకంగా వ్యక్తీకరించిన చులకన భావముతో పై గొప్ప మాటలు పోల్చుకుంటే మాటలకూ చేతలకు ఎంత వ్యత్యాసాన్ని కనబరచగలడు!? మనిషి. అందునా హేతువాది అనిపిస్తూంటుం దిప్పటికీ.

"ఈ నాటి సామాజిక సిద్ధాంతాలను సైతం ఎప్పటి కప్పుడు సహేతుకంగా బేరీజు వేసుకుంటూ పురోగమించడం అవసరం" (జూలై 26-22. పేజీ) ఎప్పుడో 10, 15 సం||రాల క్రితం వెంకటాద్రిలోని హేతుత్వంలో నుండిపై భావాల స్థాయి నుండి; ఈనాడు సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న మార్క్సిజం, అంబేద్కరిజం లాటి సామాజిక సిద్ధాంతాల తులనాత్మక విశ్లేషణా రూపమైన చర్చావేదికకు ఆహ్వానించినా, వత్తిడి చేసినా, సవాళ్ళు విసరినా ఉలకనీ పలకని ఈ నాటి ఆయన. వారి మిత్రుల హేతుత్వస్థాయి పడిపోయిం దనాలా? పురోగమించిం దనాలా? వివేచించగల నేర్పుంటే వివేచించండి.

"సిద్దాంతా లెప్పుడూ ఆచరణకు ముందుండి ఆచరణను నడపాలి.” (పేజీ 22) దీనర్థం వారి ఆచరణ ద్వారా వారి సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే వీలుందనే గదా! పే. 21 (సిద్ధాంతంలో, లేక తదవగాహనలో లేని చెడు ఆచరణలో అమాంతంగా పుట్టుక రాదు.)

సురేంద్ర:- అంటే ఆచరణలో కనిపించే అసంగీతత్వమూ, అహేతుకతా, అసభ్యతా, కౌర్యాదులన్నీ అవగాహనమీద ఆధార పడుంటాయనే గదా! ఆ లెక్కన ఈయన్ను లెక్కించడానికి బ్రతుకులో ఆయా వ్యక్తులతో ఈయన ప్రవర్తించిన రీతిని పరిశీలన కివ్వడానికి ఈయన గారుగానీ, హేతుమంతుడవశ్యం నీతిమంతుడుగానూ, మానవవాది అవశ్యం మానవతా వాదిగానూ ఉంటాడనే ఈ బృందంగానీ సిద్ధపడగలరా, బహిరంగ పరిశీలనకు సిద్ధపడితే తగిన ఆధారాలతో వేదిక నెక్కడానికి నేను రెడీ. అలాగే వారు. నన్ను పరిశీలిస్తానన్నా రెడీనే. ఎవరి గదుల్లో వారు కూచుని ఆదర్శాలు వల్లించ డానికీ, రచనల్లో శాస్త్రీయ దృక్పథం, హేతు పద్ధతి, స్వతంత్రాలోచన, స్వేచ్ఛ సమానత్వం లాటి గొప్ప గొప్ప మాటలు గుప్పించడానికి పెదగా వ్యక్తిత్వాలతో పనేమీలేదు. అసలు వ్యక్తిత్వాలు లేనివాళ్ళే ఉన్న వాళ్ళ కంటే గొప్పలు పోతుంటారు. ఆదర్శాలూ వల్లిస్తుంటారు అనేది చారిత్రికంగా తరచుగా కనబడే సత్యం.

"పిడివాద మన్న తర్వాత ఒక స్థాయిలో లౌకిక - అలౌకిక భేదం ఉండదు:- ఏ పిడివాదమూ ఏనాడూ శాఖా భేదాన్ని కూడా క్షమించలేదనేది జగమెరిగిన రహస్యం .” (పేజీ. 20)

ఈ వ్యాసం నిండా వాస్తవాలు చాలా గుప్పించారాయన. అయితే ఆ నాటికి (1981 నాటికి) ఆయన ఏవేవి అనుచితాలూ, అవాంఛనీయాలూ, ప్రగతి నిరోధకాలూ అన్నారో, అనుకున్నారో వాటి నన్నిటినీ, అధవా ఎక్కువ భాగం ఆయన జీవితంలో అనుసరించారు. ఆయన మిత్రులలోనే ఒకరిద్దరు నలుగురి సమక్షంలోనే నాతో "ఈనాడు మనకందుబాటులో ఫాసిస్టు అని ఉదహనించదగ్గ వ్యక్తి దొరుకుతాడా అనుకుంటే" చీరాల ప్రాంతంలో ఫాసిజం పేరన గ్రంధమే రాసినాయ నొకరున్నారు. నిఖార్సయిన ఫాసిస్టు అనుకోవచ్చు నన్నారు. మరి ఆ మాట బైటబడి నేరుగా వారికే సూచించగలరా? అని నేనడగా, అంతటి అవకాశం అతడిస్తే నిఖార్సయిన ఫాసిస్టు కాకుండా పోతాడు గదండీ అని ఒక జోకూ వేశారు మళ్ళీ.

భౌతికవాద పక్షాల్లో శాఖా భేదంతో ఉన్న గోరా నచ్చాడా వీరికి? మిగిలిన హేతువాద ఉద్యమకారులు నచ్చారా, మార్క్సిస్టులు నచ్చారా, ఎవడన్నా ఎదుటపడనీ? (పరిశీలించకుండాన్నే వారిని అల్పునిగా లెక్కకట్టే నైజం వీరిలో ఉన్నంత ఇతరులలో కానరాదు.)

సలహాలు సహించుకోలేని, సంప్రదింపుల కిష్టపడని, పరిశీలించడానికి సిద్ధపడని, పరిశీలించే వారికి అవకాశమివ్వని వీరి సామాజిక సంబంధాల వైఖరిలో సామరస్య పూర్వక సహకార సంబంధాలన్న భావనకు చోటెక్కడో మామూలు చూపుకు అందదు.

ఒక్కమాట చెప్పి యిప్పటికాగుతాను. రాటు తేలినోళ్ళం, హేతువాదంలో దీటుగాళ్ళం శాస్త్రీయవగాహనలో పోటు మగలం, వగైరా కితాబులు తమకు తామే తగిలించుకుంటూ లోకాన్ని సాటి ఉద్యమకారుల్నీ కూడా అల్పంగా చూచే వీరికి నే చెప్పదలచుకున్న దొక్కటే.

రండి బహిరంగ వేదికకు? ఒకో అంశాన్ని (భావ విప్లవంలో చోటు చేసుకో దగ్గ వాటిని) చర్చకు స్వీకరించుదాం. చర్చల్లో పరిశీలన - పరీక్ష రెండు కోణాల్లో ఉండాలి. 1) విషయ పరిశీలన పరీక్ష; 2) వ్యక్తి అవగాహన, ఆచరణల పరీక్ష, మరోమాటలో చెప్పుకోవాలంటే "వాద బలమెంత? వాది బలమెంత?” తేల్చుకుందాం రండి.

ఇంకొల్లు త్రిమూర్తుల్లో ఒకరైన షేక్ బాబుతో ఈ కధ నారంభిస్తాను. షేక్బాబు గారూ? సైన్సు అన్నది చర్చనీయాంశం. వేదిక బాపట్ల లేక చీరాలల్లో మీరూ నేనే చర్చించాలి. టేపు చేద్దాం చర్చనంతా. శాస్త్రీయ పోకడ ఉంటే రండి. ఉంటాను. సెలవ్. 

గమనిక : ఈ సంచికలో వెంకటాద్రిగారిపై విమర్శ కొంత ఘాటుగా వుండి వుండవొచ్చు. హేతువాదిలో తమ పత్రిక కొన్ని మాసములు విడుదల కాదన్నట్లు ప్రకటించారు. కాన మా వివేకపథంను నా ప్రతిస్పందనకు వేదికగా ఉపయోగించుకో వలసినదని వెంకటాద్రిగారిని తదితరులను కోరుచున్నాము. విషయపరంగా వున్నంత వరకూ యథాతథంగా వివేకపథంలో వేయగలమని హామీ ఇస్తున్నాము. మీ అందరి ఆగమనాన్ని కాంక్షిస్తూ, సత్యాన్వేషణలో....

మీ సురేంద్ర


No comments:

Post a Comment