Thursday, January 5, 2023

2 వివేకపథం సంచిక

 

వివేకపథం

సంపుటి:1  సెప్టెంబరు 1996 సంచిక: 2


విమర్శ - సమీక్ష -1

నా స్పందన ద్వారా కొందరందించిన సూచనలూ, కనబరచిన అనుకూల ప్రతికూల వైఖరులూ, చేసిన పొగడ్తలు, తెగడ్తలు అన్నవి తిన్నగా వివేకాని కందించగా 'విమర్శా వేదిక' అనిగానీ 'సమీక్షా వేదిక' అనిగానీ "విమర్శ - సమీక్ష" అన్న శీర్షికన గానీ వివేకపథంలో కొన్ని పేజీలు కొంతకాలం కేటాయిస్తే బాగుంటుంది అన్న నిర్ణయం చేసింది ఇంగితం. ఆ సంగతి నా ఇచ్ఛ మెచ్చుకోగా వచ్చిందే ఈ చర్చావేదిక. పై మూడు శీర్షికల్లోనూ 'విమర్శ-సమీక్ష' బాగుంది కదూ. ఇప్పటి కనుకుని, 6 మాసాలు సాగిద్దాం. అవసరాన్ని బట్టి అవధిని పెంచుకుందాం. స్పందన-ప్రతిస్పందనుంది కదా మళ్ళా ఈ ముఖమెందుకని మీలో కొందరికి సందేహం రావచ్చు. "స్పందన - ప్రతిస్పందన"కు విషయపరంగా నిర్దిష్ట లక్ష్యాలేమీ ఉండవు. దాని క్షేత్రం అందరి అభిప్రాయాలకూ - అన్ని విషయాలకు విస్తరించి ఉంటుంది. మరి ఈ వేదిక కొన్ని నిర్దిష్టతలకు ఉద్దేశింపబడి ఉంటుంది. ఈ మధ్యనే గుత్తా రాధాకృష్ణగార్కి ఈ విషయం చెప్పాను. మేలుకొలుపు, హేతువాది, హేతువాదం పత్రికలలో వచ్చిన నావి, వెంకటాద్రిగారివీ, మీవి అయిన భావాలను విమర్శనాత్మక విచారణకు లోను చేద్దాం కొంత కాలంపాటు ఏమంటారు అనడగ్గా చాలా బాగుంటుంది. విషయావగాహనా పరంగానూ స్పష్టత ఏర్పడుతుంది. మార్పులు చేర్పులు అవసరమై ఉంటే బయటపడుతుంది. మూడు పత్రికల పాఠకుల వివేకానికీ పని ఏర్పడుతుంది. మనస్సూ - ఆలోచనా - పదునెక్కుతుంది అనుకున్నాము.

ఈ సందర్బంగా మెకటాద్రి గారికీ ఈ సమాచారాన్నందిస్తూ ఇందులో బాధ్యతాయుతంగా పాలుపంచుకో వలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మేలుకొలుపు లోని నా భావాలను తులనాత్మకంగా విశ్లేషించి ఈ "విమర్శా - సమీక్ష" వేదికకు పంపండి. క్లుప్తంగా ఉన్నంతవరకు యథాతథం ముద్రిస్తాను. ఎడిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడితే, ఆ సందర్భంలో మీ భావాలు మరుగుపరచ బడ్డాయని గనుక మీరంటే మలిసంచికలో మొత్తం ప్రకటిస్తాను. ఈ సంచికలో ‘కళా-శాస్త్రం-తత్వం- హేతువాదం' అన్న మీ వ్యాసానికి కారణమైన సూర్యకుమారిగారి కళా-శాస్త్రం" "రసదృష్టి గురించి” అన్న రెండు - వ్యాసాల సారాంశాన్ని ప్రచురించడంతో ఆరంభిస్తాను. మరింత ముందుగా మీకీ విషయం తెలియజేయలేకపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఈ ఆలోచన ఈ మధ్యనే రావడం, రెండవది, హేతువాది డిశంబర్-84 సంచికలో "హేతువాదిలో కాక మరే పత్రికలోనైనా ఆహ్వానంమీద చర్చలో పాల్గొనడానికి అభ్యంతరం లేదు" అన్న మీ హామీ.

పాఠక మిత్రులారా! ఎంత కాదనుకున్న "హేతువాది” తద్వారా వెంకటాద్రిగారి పై రకరకాల కారణాలవల్ల అభిమాన - వ్యతిరేకతలు ఏర్పడ్డవాళ్ళూ, అలాగే "మేలుకొలుపు" ద్వారా సురేంద్రపై అనుకూల-వ్యతిరేకతలు ఏర్పరచుకున్న వాళ్ళు, ఇంకా ‘హేతువాదం’ ద్వారా గుత్తా రాధాకృష్ణగారిపై సానుకూల - అననుకూల దృష్టి కలవాళ్ళు అన్న మూడు వర్గాల రెండు వైఖరుల యోచనా పరులకూ, అభిమాన, వ్యతిరేకులకూ ఈ వేదిక అధ్యయనం వివేకపరంగా ఎంతో ప్రయోజనాన్ని కలిగించగలదు. మా ముగ్గురిలోనూ ఒకరిపట్ల ఒకరికి ఏర్పడి ఉన్న అభిప్రాయాలలో మార్పులు వచ్చేందుకూ పనికిరాగలదు. అందరికీ ఈ వేదిక ఒక చక్కటి అవకాశం అన్నది విభేదించక్కరలేని విషయం. "విమర్శకు-సమీక్షకూ” సిద్ధంకండి. నేను రెడీ అయ్యాను.

భూమిక

భాష నాధారం చేసికుని ఇతరుల భావాలను గ్రహించడం-విమర్శించి  సమీక్షించడం అన్న క్రమంలో చేసేటప్పుడు కొన్ని భాషాపరమైన నియమాల్ని పాటించవలసి ఉంటుంది. ఆ నియమాల్ని అనుసరించడంలో మెలకువ వహించకుంటే చేసేదంతా నేల విడచిన సాముగా మారిపోతుంది. కనుక ఆ విషయంలో పాటించవలసిన (అవగాహన కలిగుండవలసిన) అంశాలను నా అవగాహన నుండి మీ ముందుంచుతాను. సరిచూసి చేర్పులేమైన అవసరమైతే సూచించండి. ప్రయోక్త (వక్త-వ్యాసకర్త)ల వాక్యాలకు అర్థాన్ని గ్రహిస్తున్నామంటే ఏమని? అతడు ఉపయోగించిన భాషా పదాలకు మన స్మృతిలో ఉన్న అర్థాలను జోడిస్తున్నామని అర్థం. ఈ అంశాన్నిక్కడ ఎందుకు ప్రస్తావించినట్లు? భాషా పదాలకు నిర్దిష్టార్ధాలున్నా అంటే ఒక పదం ఒకే ఒక్క అర్థాన్ని కలిగుండడం వీలయి ఉన్నా, పదపదార్థ జ్ఞానం - వాక్యార్ధ జ్ఞానం సందర్భాల ననుసరించి మార్చుకో వలసిన అవసరం లేకున్నా ఈ నియమాన్ని గురించి (ఈ విచారణంతా అక్కర లేకపోయేది) అనుకోవలసిన అవసరం ఉండేది కాదు. కాని మనకు గతం నుండి సంక్రమించిన భాష నానార్థాలతోనూ - పర్యాయ పదాలతోనూ, సాహిత్య కళా ప్రయోగాల కనుగుణ్యంగానూ అంటే ఉత్ప్రేక్ష, ఉపమానము, వ్యంగ్యము, లాక్షణికము అన్న భిన్నర్ధాలను ప్రకటించే రీతిలో ఉండి అందింది. ఈ అంశాన్ని పరిగణించకుండా ప్రయోక్త భాషా ప్రయోగాలకు మనకు తెలిసిన అర్థాన్ని గానీ, మనకు నచ్చిన అర్థాన్నీ గానీ మాత్రమే ఇచ్చుకుంటూ విషయ గ్రహణ చేశా ననుకోవడంలోనే మౌలికమైన దోషం ఏర్పడుతోంది. లేదా పొరబడేందుకు అవకాశం ఏర్పడుతోంది.

పద పదార్థ జ్ఞానం లేకుంటే వాక్యార్థ జ్ఞానం లేదన్నది ఒక నిజం. అయినా కేవలం పదపదార్థ జ్ఞానమే వాక్యార్ధ జ్ఞానం కాదు. అలాగే వాక్యార్థ జ్ఞానమే తాత్పర్య జ్ఞానం కాదు భాష ద్వారా భావగ్రహణ చేయదలచుకున్నప్పుడు ఈ తేడాల్ని గమనించి ఉండడం అవసరం. ఒక రచన ద్వారా ప్రధానంగా మనం గ్రహించాలనుకునేది, గ్రహించాల్సిందీ వక్త (రచయిత) తాత్పర్య (హృదయ) మేమిటన్నదే. ఇంతా చేస్తేనే ఆయన భావం మనకు చేరినట్లు. ఆ పైనే ఆ భావం యొక్క సబబు, బేసబబుల్ని పరిశీలించడం ఆరంభించాలి. లేకుంటే మన విధానం అశాస్త్రీయం, అహేతుకం అవుతుంది ఈ విషయాన్నే 'మేలుకొలుపు' ఆరంభ సంచికల్లో - బహుశా-5వ సంచిక జ్ఞానపీఠం - పేరున వ్రాశాను. "చక్కగా వినడం, విన్న మాటలకు అర్థాన్ని అన్న వారినుండే స్వీకరించడం” అన్నది వినీ, చదివి విషయగ్రహణ చేయాలనుకునేప్పుడు ఆరంభ స్థానమై ఉంది. మరి ప్రయోక్త అందుబాటులో లేనప్పుడు ఎలా అన్నది కీలకమైన ప్రశ్న. ఒక్కమాటలో చెప్పాలంటే మన బుర్రలోని అర్థాన్ని ఆ మాటల నెత్తిన పెట్టడం మినహా చేయగలిగింది లేదు. అదుగో అందువల్లే భాషా నియమాల్ని (అర్థ నిర్థారణ కవసరమైన క్రమాన్ని) తప్పనిసరిగా అనుసరించాలనేది. వెనుకటివారు: భాషాపరంగా ఉన్న ఈ ఇబ్బందిని స్పష్టంగా గ్రహించారు. ఈ సమస్యకు పరిష్కార రూపంగా వారికి తెలిసినంతలో కొన్ని మెలకువల్ని ప్రస్తావించారు, పాటించారు. షడ్లింగాలంటారు వాటిని. ఉపక్రమోపసంహారములు, ఫలము, అపూర్వతా, అర్థ వాదము, యుక్తి.

నోట్: అదలా ఉంచండి. పై సమస్యను-ఇబ్బందిని - అధిగమించడానికి మీ అవగాహనలో మరింత నిర్దిష్టమైన క్రమం ఉంటే మాకు తెలియ జేయండి. అర్థ గ్రహణలోని మరికొన్ని మెలకువలకు 'జ్ఞానపీఠం' సంచికచూడండి.

ఇవేవీ పట్టించుకోకుండా తన యిష్టాయిష్టాల కనుగుణ్యంగా ఎదుటి వారి మాటలకు పెడర్థాలు గుంజాలనుకోవడంలో శాస్త్రీయ దృక్పధంగానీ, హేతుబద్ధతగానీ, సత్యసంధతగానీ, విమర్శా స్థాయిగానీ, యోగ్యతగానీ ఉందనుకోలేము. ఏదో మానవికమైన పొరపాటు జరిగుంటుందిలే అనుకుందామన్నా ప్రయోక్తే నా అభిప్రాయం అది కాదు, నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నారు అని తెలిపాక కూడా నీ అర్థం ఇదే అంటూ మొదలెడితే ఈ అర్థాలు చెప్పేవాని యోగ్యతలలా ఉంచండి, అది అతని దుర్మార్గ స్వభావాన్ని తెలియ జేస్తుంది. ఎవరి విషయంలో నైనా ఈ అంశాలనిలాగే గమనించడం అవసరం. ఇక ఈ సంచికారంభం "కళ - శాస్త్రం” అన్న విషయం పై డా|| సూర్యకుమారి గార్కి-వెంకటాద్రి మధ్య నలిగిన అంశాలతో ఆరంభిస్తాను. విశేషంగా తెలుసుకో గోరినవారు 'హేతువాది' పాత సంచికల్ని తిరగేయండి.

నేపధ్యం :- "ఆధునిక జీవితంలో రసదృష్టి" అన్న పేరున ఎస్. ఎస్. లక్ష్మిగారు ఒక వ్యాసం రాశారు. దాని పై స్పందిస్తూ డా|| సూర్యకుమారి "ఆమె చర్చించిన విషయం ఆహ్వానించదగ్గది” అంటూ ప్రారంభించి నా అభిప్రాయా లంటూ "రసదృష్టి గురించి” అని ఒక వ్యాసం రాశారు. ఫిబ్రవరి 1984 హేతువాదిలో ప్రచురితమైనది. ఆ వ్యాస సార సంగ్రహం ఇలా ఉంది.

1. లక్ష్మిగారు ప్రస్తావించిన విషయాల్లో నేను విభేదిస్తున్న ఒక్క అంశాన్ని ముందుగా చెపుతాను. శాస్త్ర జ్ఞానం పెరిగి ప్రకృతిని అర్థం చేసుకున్న కొద్దీ మానవుడు ప్రకృతిలోని అందాలను చూచి ఆనందించ లేకపోతున్నాడన్న విషయాన్ని నేను అంగీకరించలేను..... సైన్సుతో అర్థంచేసుకున్న వస్తువు స్వరూపం దాని సౌందర్యాన్ని మనం ఆనందించేందుకు అడ్డంకి అవదు.

2. శాస్త్ర విషయాల అవగాహనతో బాటు రసదృష్టి కూడా కలిగి ఉన్నప్పుడే జీవితం సమగ్రమవుతుంది.

3. జ్ఞానం ఆచరణ అని విజ్ఞానం రెండు భాగాలు. శాస్త్ర విజ్ఞానం మొదటిదైతే, నీతిశాస్త్రం రెండవది. ఈ రెండూ కాని, రసదృష్టికి కూడా జీవితంలో ప్రాధాన్యత ఉంది. అది మానవుడికి అత్యంత సహజమైనది.

4. హేతువాదులూ, మానవతావాదులూ సైన్సు - ఫిలాసఫీల గురించి ఆలోచించినంతగా ఈ రసదృష్టిని గురించి ఆలోచించరనిపిస్తోంది.... జీవితాన్ని దర్శించడంలో రసదృష్టి కూడా ఒక ప్రధాన దృక్కోణం.

5. ఈ శాస్త్ర విజ్ఞానానికి, సౌందర్య దృష్టికీ మధ్య వైరుధ్యం ఏమీ లేదు.

6. మనిషి ప్రకృతిపట్ల స్పందించడానికిగానీ, మనిషికి తనతోటి మనిషి పట్ల కలిగే స్నేహం మొదలైన భావాలకు గానీ కారణం మనిషిలో ఉండే సౌందర్య దృష్టేగాని సైన్సుకాదు.

7. శాస్త్ర జ్ఞానం జీవితాన్ని, ప్రకృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తుంది. కానీ మనుషులంతా సహకార భావంతో కలిసి జీవించేటందుకు అది దోహదం చేయడం లేదు, మానవుడు, రాను రాను ప్రకృతికి దూరం అవుతున్నాడు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి.... ఆధునిక జీవితం యాంత్రికమై పోతూంది.

8. శాస్త్రజ్ఞానంతో బాటు ప్రశాంతంగా జీవితాన్ని చూచి అనుభవించే బ్యాలెన్సు జీవితంలో ఉండాలి.

9. కవిత్వం, నాట్యం, సంగీతం, మొక్కల్ని, జంతువుల్ని పెంచడం మొదలైనవి మనిషి జీవితానికి నిస్సందేహంగా సైన్సు కంటే ముఖ్యమైనవి.

10. మనిషి ప్రకృతిని చూసి ఆనందంతో చిందెయ్యగలడు. ఆ అందాలను చూసి పరవశించగలడు. ప్రకృతికీ మానవుడికీ ఉన్న ఈ అవినాభావాన్ని ఆధునిక జీవితం నామరూపాల్లేకుండా చేసేస్తుంది.... అలాగే గ్రామీణ వాతావరణాన్ని నాగరికత పాడుచేసి పారేసింది.

11. యంత్రాన్ని మన కెంతవరకు అవసరమో అంతవరకే వాడుకునే సంయమనం లేదు.

12. మన చేతుల్తో ఒక మొక్కని పెంచడానికి కూడా వీల్లేని ఇళ్ళల్లో బ్రతుకుతూ కూడా జీవిస్తున్నామనుకోవచ్చునా?

13. రినైజాన్సు రావాలంటే వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలు రెంటిలోనూ కూడా ప్రతిభాపూర్ణమైన నూతన ప్రయోగాలు జరగాలి.

14. కేవలం సైన్సు అమర్చి పెట్టే సుఖాలను అనుభవించడంతోనే సంతృప్తిపడి ఊరుకోక; వైజ్ఞానిక దృక్పథం అలవరచుకుని సౌందర్య దృష్టికి కూడా ప్రాధాన్యత యిచ్చినప్పుడే మేధకూ, మనస్సుకూ కూడా సంతృప్తి కలిగి జీవితం సఫలమవుతుంది.

సురేంద్ర : ఇవండీ ఆ వ్యాసంలోని సూర్యకుమారిగారు వెల్లడించిన భావాలు. నా వరకు నాకు ఆ వ్యాస తాత్పర్యం ఎలా అనిపిస్తోందంటే, జీవితంలో శాస్త్రం, సౌందర్యం లేక రసదృష్టి అన్నవి రెండూ - వేటి పాత్ర అవి నిర్వర్తించాల్సిందే. నిజానికా రెండూ వైరుధ్యాలు కావు. అయినా ఈనాడు జీవితంలో రసదృష్టి భాగం బలహీనంగా ఉంది. కారణం శాస్త్ర భాగం అవసరానికి మించి జీవితంలో చోటు చేసుకోవడమే. జీవితంలో మానసిక - హృదయ భాగానికి తీరవలసిన అవసరాల మేరకు సైన్సుకంటే సౌందర్యానికే అధికతర ప్రాధాన్యత ఉంది. అయినా. ఈ రెంటి పరంగా వచ్చే వికాసమే సిసలైన రినైజాన్సు అవుతుంది. పోతే;

పైన పేర్కొన వాటిలో (4) వాక్యంలోనూ, 9, 10 వాక్యాలలోనూ, 12వ వాక్యంలోనూ సైన్సువల్ల జరిగిన చెడు, కళల అవసరమూ అన్న అంశాలు కొద్దిగా పెద్ద చేసి చెప్పినట్ల నిపిస్తోంది. ఇదామె ఉద్వేగంవల్లగానీ, ఒక అంశాన్ని గట్టిగా చెప్పదలచుకున్నప్పుడు మనిషి అనుసరించే విధానం వల్లగానీ జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడా ఆమె సైన్సుని కొట్టివేసిందనిగానీ, చిన్నబుచ్చిందనిగానీ చెప్పడానికి అవకాశం కనిపించడంలా. పై అంశాల సబబు బేసబబుల్ని మీరూ వివేచించండి.

వెరీ సింపుల్ గా తీసుకుని, చాలవరకు జీవితాన్ని చూస్తూ వెళ్ళడించినవే నీ అభిప్రాయాలు. అయితే కళకు నీవనుకున్నంతగానీ, అలా అనుకుని మరింతగా గానీ చోటిస్తే ఏమవుతుందో ఆలోచించాలి సామాజికాభ్యుదయం కోరే విజ్ఞులంతా అలాగే కళల పేర్న వాటి నడ్డు పెట్టుకుని చరిత్రలో జరిగిన అవాంఛనీయ ఘటనల్ని పరిగణించడం అవసరం. కళాస్వాదన శృతిమించి నపుడల్లా అది అలవాటై వ్యసనంగా మారిన స్థితులను మరచిపోవడంగానీ, ఉపేక్షించడంగానీ విజ్ఞత కాజాలదు గదా.... ఈ తరహా సమీక్ష చేసుంటే అది ఆయన వివేకానికి, సామాజిక సృహకు, పెద్దరికానికీ కూడా అద్దం పట్టినట్లుండేది. అబ్బే అలా జరగలా రావిపూడివారి రసదృష్టి విమర్శ-సమీక్షా కూడా. అందుకే ఈ పునస్సమీక్ష అవసరమైంది. ఆయన పోకడ, మే-84, డిశంబర్-84, జనవరి - ఫిబ్రవరి 85, మార్చి 85 హేతువాది సంచికల్లో వెల్లడైంది. వాటినీ సంక్షిప్తీకరిస్తాను. గమనించండి. మే-84 సంచిక.

వెంకటాద్రిగారు ఒక రకంగా "కళా-శాస్త్రం” అన్న దాని పై చర్చను ఆరంభిస్తూ ముందు మాటగా నాలుగు మాటలు రాశారు.

1) S. S. లక్ష్మీగారు రసదృష్టి లోపించడానికి పెరుగుతున్న శాస్త్ర జ్ఞానం కారణం అనడాన్ని అంగీకరించనంటూనే "రసదృష్టి గురించి” ప్రారంభించిన సూర్యకుమారిగారూ ఆ ధ్వనినే పొషించింది.

2) నేను కళావేత్తను కాకపోయినా కళను గురించి నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. విశ్వతత్వంలో వాటిని వెళ్ళడించాను.

3) వారికి-ప్రాచీనులకు-ప్రకృతి అర్థం కాలేదు కాబట్టి దాన్ని అనేక కళల్లో అచ్చు గుద్దినట్లు చిత్రించి, ఆనందించి, తృప్తి పొందారు.

4) కొందరి దృష్టిలో మత మెలాగో అలాగే సౌందర్య భావం కూడా వ్యవస్థీకరణ పొందింది. దానికి కొన్ని గిరులు ఏర్పడినాయి.

5) అలవాటైన బానిసత్వం ఎంత సుఖంగా ఉంటుందో, కళాభిజ్ఞత కూడా అంత సుఖంగా ఉంటుంది.

6) మానవుడి సృజనాత్మక శక్తులకు ప్రకృతిని అర్థం చేసుకునే ప్రవృత్తిని కల్పించిన విజ్ఞానశాస్త్రమే నిజమైన ఆధునిక కళారూపమని అంగీకరించాలి.

7) జీవం ఉట్టిపడేట్లు చెక్కడమే శిల్పానికి అత్యున్నత దశ .....కళ మన ఉద్వేగాలకు ఉపశమనం కలిగించే మాట నిజం. కానీ సర్వకాల సర్వావస్థలలోనూ పుష్పాన్ని చూచి ఆహా.....ఓహో అంటూ కూర్చోలేం.

8) ఈనాటి మానవుడు తోలుబొమ్మ లాటలను చూచి ఆనందించే స్థితిలో లేడు. టు డైమెన్షనల్ బొమ్మలాట నుండి త్రి డైమెన్షనల్ బొమ్మలాట దాకనూ, కదలాడే బొమ్మలాట నుండి మాట్లాడే బొమ్మలాట దాకనూ పెరిగిన మానవుణ్ణి హేళన చేస్తూ తోలుబొమ్మ లాటలోని కళా నైపుణ్యాన్నీ, ఆ దశలోని సంస్కృతినీ, ఆ సంస్కృతికి మూలమైన మతాన్ని కొనియాడే రీతి మానసిక వికారానికి చిహ్నం. వికాసానికి కాదు.

9) అలానే విద్యుద్దీపాల యుగంలో ఆముదపు తిల్లికలిచ్చే ఆరోగ్యాన్ని గురించి మాట్లాడడం పరిణామాన్ని తిరస్కరించే జడత్వానికి చిహ్నం. ఈ వికారాలన్నిటికీ మౌలికంగా కారణం మత మనస్తత్వమే.

"విశ్వతత్వం" పై సమీక్షగా సంజీవ్ దేవ్ గారు ప్రశంసాత్మకంగా అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం కనుకనూ సైన్సు, వైజ్ఞానికతలు మానవ సమాజంలో నిర్వహించదగిన పాత్ర విషయంలో సూర్యకుమారిగారికి చులకన భావం లేకపోవడం వల్లనూ, విజ్ఞానశాస్త్రావిష్కరణలు మనిషి బ్రతుకు బాటలో వెలుగు రేఖలనుట నా అభిమతం కూడా కనుకనూ వీరాభిమానం ప్రదర్శించనంత వరకు అభాగపు అనితర సాధ్యమైన ఉపయోగితను గుర్తిస్తూనే ఉన్నాను కనుకనూ ఆ అంశంపై సమీక్ష విమర్శ అనవసరం.

పోతే కళాపరంగా సంజీవ్ దేవ్ గారి సమీక్ష, ఆపై నా విమర్శ కూడా ప్రస్తుతావసరం. 

1) సంజీవ్ దేవ్ సమీక్ష -వైజ్ఞానిక దృక్పధంతో వారు అత్యధునాతన సత్యాలను ఎన్నో అభివ్యక్తపరచడం అద్భుతంగా ఉంది. కానీ కళా విషయంలో మాత్రం వారు ఇంకొంత లోతుగా వ్రాయవలసింది. వైజ్ఞానిక అభిజ్ఞత లేనందున ఆనాటివారు రసానందానికి లోబడి పోయినారు అన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు ప్రకృతి అంటే ఏమో తెలుసు కనుక దాన్ని రసాత్మకంగా ఆనందించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇది నిజం కాదు. వైజ్ఞానిక దృక్పధానికీ కళా దృక్పధానికి సామ్యం లేదు. మనిషిని కేవలం వైజ్ఞానిక దృక్పధం మాత్రమే ఆనందపరచలేదు. రస దృక్పధం కూడా అవసరం.

2) రసానుభూతి వైజ్ఞానిక దారిద్ర్యానికి లక్షణం కాదు. వైజ్ఞానిక వికాసం రసానుభూతిని తీసివేయవలసిన అవసరంలేదు.

3) తినే పదార్ధం ఏయే వస్తువులు కలిస్తే ఆ విధంగా తయారైందో తెలిసిన వైజ్ఞానికుడు దాని రుచికి ఆనందించకుండా ఉండగలడా? (మరికొన్ని ఉదాహరణలు చెప్పాక....)

4) పర్యవసానం ఏమంటే విజ్ఞానశాస్త్రానికి రసానుభూతికీ వైరుధ్యం లేదని.

నోట్ : మీరు సృజించిన మరో విషయం: విజ్ఞానం మారుతూ వికాసం చెందినట్లు కళాసృష్టి అటువంటి వికాసం చెందక అది ఉన్న చోటునే ఉండి పోయిందని ధ్వనించేట్లు రాశారు. ["జీవం ఉట్టిపడేట్లు చెక్కడమే శిల్పానికి అత్యున్నత దశ. ఎన్నాళ్ళున్నా, ఎన్నేళ్ళు గడచినా అదంతే. మనిషి ప్రతిభా వికాసానికి అదే పరాకాష్ట దశ కాదు-కారాదు-కాలేదు” -వెంకటాద్రివి]

దీనిపై, సంజీవదేవ్ ఎంత నిక్కచ్చిగా - సున్నితంగానే అయినా - తన భావాన్ని చెప్పారో చూడండి (సం)

5) నాకు వైజ్ఞానిక రంగంలో అంతగా అభిజ్ఞత లేనట్లే మీకు కళా రంగంలో కూడ.

6) మీరన్నట్లుగా కళ ఎదగకుండా నిలిచిపోలేదు.

7) మీరన్నట్లు "జీవం ఉట్టిపడేట్లు చెక్కడమే శిల్పానికి అత్యున్నత దశ” కాదు. (కొన్ని వివరణ లిచ్చారు).

8) కనుక ఆధునిక విజ్ఞానంవలెనే ఆధునిక కళ కూడా ఎన్నో మార్పులను పొందుతూ వచ్చింది. చాలు ఇంతవరకు. ఈ విశ్వతత్వం గొప్పదనానికి నే నిక్కడ రాసిన కళా సంబంధమైన సందేహాలు ఏ విధంగానూ అడ్డురావు అంటూ ముగించారు సంజీవ్ దేవ్ గారు.

దీని పై వెంకటాద్రి సమాధాన రూపంగా రాసినలేఖలోని అంశాలు

1) మీరు పుస్తకాలు చాల విచక్షణతో చదువుతారని తెలుసు.

2) కళల గురించి నే నెన్నడు సీరియస్ గా ఆలోచించలేదు. అధ్యయనం అంత కన్నా లేదు.

3) మెజారత్, బితోవెన్ లాటి వాగ్గేయకారులు, షెల్లీ లాటి కవులూ హేతువాదులని నాకు తెలుసు.

4) అయినా కళా తపస్సులోనే ఆరాధనాభావం ఉందనీ, అది వ్యవస్థీకరణకు దారితీస్తుందనీ, ఆరాధనా భావమే దైవంలాటి ఒకనాటి అహేతుక వాదాలను వ్యవస్థీకరించి భావ పరిణామాన్ని నిరోధించడానికి మూలమైందనీను అనుకుంటుంటాను.

5) అయితే నిజంగానే నేను పైన చెప్పినట్లు, కళల్ని గురించి నేను చదవలేదు. అందువల్ల ప్రస్తుతం నేను వెళ్ళడించేవి ఆ విషయంలో నా అభిప్రాయాలే. Impressions. ప్రస్తుతానికి దాన్ని, నా "సిద్ధాంతంగా" భావించ నవసరంలేదు.

6) ఎన్నడూ నేను కళల అధ్యయనానికి సమయాన్ని కేటాయించలేక పోయాను.

7) రసానుభూతి వైజ్ఞానిక దారిద్ర్యానికి లక్షణమని కూడా నేను అనలేదు. అనను.

8) భారతీయ సంగీతాన్ని బాగా ఆనందించగలను. అయితే ఈ ఆనంద స్వరూపాన్ని గురించి పట్టించుకోడానికి నాకు అవకాశం దొరకలేదు.

9) మనిషి కేవలం శిల అనీ, పచ్చి హేతువాది అనికూడా అనను.

10) నిజం నేను ఒప్పుకుంటాను. ఆధునిక కళా రూపాలు, శిల్ప రూపాలు నాకు తెలియవు.

11) కళను ఆనందించగలవారి సంఖ్య అధునిక విజ్ఞానంవల్ల తగ్గిందని నేను అంగీకరించను.

12) మీ పట్ల నాకున్న గౌరవ భావానికి అనుగుణమైన ఉత్తరం నా నుండి వచ్చింది. చాల సంతోషం. మీ రావిపూడి.

సురేంద్ర సమీక్ష - విమర్శ 

1) అతి ముఖ్యమైన అంశమేమంటే సంజీవ్ దేవ్ రావిపూడి అభిప్రాయాలలో అతి కీలకమూ - మౌలికమూ అయిన మూడంశాల్ని తప్పుబట్టారు. అలా చేయడం ద్వారా ఆ మూడు విషయాల్లో సూర్యకుమారిగారి వైఖరిని సమర్ధించినట్లూ అయింది. సంజీవ్ దేవ్ గారి ఒక్క వాక్యం ఆయన సమీక్షకు మొత్తాన్ని సంగ్రహిస్తోంది.

"నాకు వైజ్ఞానిక రంగంలో అంతగా అభిజ్ఞత లేనట్లే మీకు కళా రంగంలో కూడా", పాఠక మిత్రులారా! విషయం అర్థం కానంత సంక్లిష్టంగా ఏమీలేదు కదా భాష. ఈ ఒక్క మాటతో సంజీవ్ దేవ్ గారి మనస్సు కళా విషయమై వెంకటాద్రి మాటలకు పూచిక పుల్లంత ప్రామాణికతనూ అంగీకరించడం లేదనేది తేలిపోతోంది. ఈ విషయాన్ని వెంకట్రాదిగారి సమాధానం ద్వారానూ (కళ గురించి ఆయన భావాలకు విలువ యివ్వక్కర లేదన్నది) రుజువౌతోంది. ఒకటికి రెండుసార్లు, మూడుసార్లు కళల గురించి తెలిసినవాణ్ణి కాదని, ఏనాడూ దానిని అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయించలేక పోయాననీ ఆయనే ఒప్పుకున్నారు, చెప్పుకున్నారు కదా!

(నోట్: నిజానికి బొత్తుగా తెలియదని తానే అంగీకరిస్తున్న విషయంలో తగుదునమ్మ అని, వాళ్లెవరో అడిగారు గనుక తగని పని నెత్తి కెత్తుకుని రసజ్ఞులను, రసాభిజ్ఞులనూ తెగనాడి తన కెలానూ లేని రసదృష్టిని ఆభాసంటు బల్లగుద్దే పని ఏ తరహా హేతుబద్ధ యోచన నుండి పుట్టుకొచ్చిందంటారు. ఇందులో వైజ్ఞానిక అవగాహన, దృక్పధాల పాలెంతంటారు. వీరిదేదో సర్వజ్ఞుని చేసి వారెవరో రాటుదేలి నోళ్ళు అడిగారనుకోండి. హేతువాదులకు ఇంగితం సమర్థవంతంగా పని చేస్తుండాలి కదా! అట్టివే ఉన్నట్టయితే నాకు తెలీని విషయమయ్యా అది నన్నెందుకు చంపుతారు. కళల గురించి ఎరిగిన వారి నుండి అభిప్రాయాల్ని సేకరించుకోండి, అని మాత్రమే చెప్పించాలి కదా! తెలీని విషయంలో నిర్ణయాలు చేయడాని కెందుకు సిద్ధమైనట్లు నా ఇంగితానికి అందడంలా.

మరొక్క మాట. అదే సంజీవ్ దేవ్ కాక, ఏ బ్రహ్మమో, పరబ్రహ్మమో కనక అవే మాటలు అని వున్నా అన్నాయనకు హేతువాది ద్వారా వాతలు పెట్టేవారే ఈయన. By chance బ్రతికిపోయారు సంజీవ్ దేవ్ గారు.

మరొక్క మాట:  హేతువాదుల్లో - ముఖ్యంగా ముఖ్యుల్లో - తెలీని విషయాల్లో అనవసరంగా వేలెట్టి వెతికి కలగాపులగం చేసి 'రభస' రసానందాన్ని పొందచూడడం అందందు ఎదురు పుడుతోందీ మధ్య నా డెందానికి. 

మరో విషయం చెప్పితే బాగుంటుందని పిస్తోంది. సంజీవ్ దేవ్ 'కళ' విషయమై వెంకటాద్రి తెలీనితనాన్ని నిర్ణయించడంలో సాధికారతా ఉంది. ఔచిత్యమూ ఉంది. ఈ అంశం వెంకటాద్రి "మీరు పుస్తకాలు చాలా విచక్షణతో చదువుతారని తెలుసు" అని అంగీకరించడమూ, నా సమీక్షలోని సబబు చూపుతోంది. ఇక వైజ్ఞానిక విషయపరంగా సంజీవ్ దేవ్ సమీక్ష సాధికారకమైనది కాదు. ఎందుకంటే, ఆ విషయంలో విజ్ఞాన విషయాల్లో వారే నా కంత అభిజ్ఞత లేదని చెప్పుకున్నారు గనుక. అక్కడకూడా అన్యావిదేశంగా ఎత్తి రాయడంలో నైపుణ్యత-కళ-ను కనపరిచావన్న మరో అంశాన్ని సృశించారాయన మార్మకంగా.

సంజీవదేవ్ గారిది ఈయనలాటి బడిత భాష కాదుగనుకనూ, ఆయన్నెరిగిన వారికి ఆయనెంత భావుకుడో, సున్నిత హృదయులో, ముభావో, నచ్చని విషయాన్ని, అంగీకరించలేని విషయాన్ని, గుచ్చి మాట్లాడేప్పుడున్నూ ఎంత సౌమ్యత, సౌమనస్యత కనబరుస్తారో తెలుసు గనుకనూ ఆయన విమర్శలో భాషా కాఠిన్యత లేకున్న భావి నిష్కర్షత సుస్పష్టంగా ఉంది.

సూచన :- కళల స్వరూప స్వభావాలు ఎరగని వెంకటాద్రిగారి అభిప్రాయాలు స్వీకరించి ఆయనవలెనే కళలపట్ల అకారణ ద్వేషాన్ని ప్రోది చేసుకున్న వారెవరైనా ఉంటే వారికీ, వెంకటాద్రిగారికీ ప్రధానంగా వర్తిస్తుందీ సూచన.

1) కళ అంటే ఏమిటి? కళకు - రసానికి ఉన్న పోలిక-తేడా లెట్టివి? ఓ మానవవాదంలో కళకు - రసానికీ, రసానందానికి ఉన్న స్థానమేమిటి? కళను - రసాన్ని - రసానందాన్ని మినహాయించిన మానవ జీవితాన్ని వర్ణించగలిగితే - చిత్రీకరించ గలిగితే ఆదెలా ఉంటుంది? కళ మానవ సహజాకాంక్షల విషయంలో ఒక భాగం వరకైనా సాధకం అవుతుందా లేదా? అసలు, కళ సాధనమా - సాధ్యమా, రసం సాధనమా-సాధ్యమా? ఈ అంశాలపై వెంకటాద్రి గారు అప్పటి కంటే ఇప్పుడు ఏమైనా విజ్ఞులైయుంటే, అలా అనుకుంటుంటే ఈ 'వివేక పథం'లో "విమర్శ - సమీక్ష" వేదిక పైకి రావచ్చు. రమ్మని ఆహ్వానిస్తున్నాయి కూడా.

డా|| సూర్యకుమారిగార్కి - 1984 మే హేతువాదికి పిదప మిమ్మల్ని అపార్ధం చేసుకున్నట్లు మీరు వెంకటాద్రిగారికో లేఖ వ్రాసినట్లూ, దానిపై ఆయన ఫిబ్రవరి 1984 సంచికలోని ఈ వ్యాసంపై ప్రతివాక్యం పైనా ప్రశ్నిస్తూ అవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వారు మీకో లేఖ వ్రాసినట్లూ డిశంబర్ 1984 హేతువాదిలో ప్రకటించారు. మీకభ్యంతరం లేకుంటే వారి లేఖ-మా లేఖ నకళ్ళను నా కంపవలసిందిగా కోరుతున్నాను. నాకూ వారికీ మధ్య జరిగిన గతం నాలో ఎలాటి భావాల్ని కలిగించిందో కూడా తెలియపరిస్తే 'వివేక పథం' ద్వారా వెంకటాద్రిగారికీ, లోకానికి అందిస్తాను.

పాఠకులకు :- మే-84 సంజీవ్ దేవ్ అభిప్రాయానికి తరువాత మళ్ళా డిశంబర్ 84, 85-జనవరి-ఫిబ్రవరి-మార్చి సంచికల్లో మళ్ళా ‘కళాశాస్త్రం - హేతువాదం’ అన్న శీర్షికన వెంకటాద్రిగారు వ్యాసాలు రాశారు. మే నాటికి తనకు తెలీని విషయమని అంగీకరించిన దానిపై డిశంబర్ నాటికి అధ్యయనాన్నేమైనా ఆరంభించి ముగించారేమో తెలీదు. ఆ విషయం ఆయనే చెప్పాలి. వీటిల్లోనైనా కళ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల్ని కళాభిజ్ఞుల సద్విమర్శకు - సమీక్షకు ఇవ్వగలరా? వారు చేసిన సమీక్షను "నిజాన్ని ఒప్పుకుంటా"నని తన గురించి తానే చెప్పుకుని ఉన్నారు గనుక అంగీకరించగలరా అన్నది మీకూ, నాకూ, వారికీ అందరికికీ తేల్చుకోవలసిన విషయమే. ఇప్పటికే ఈ సంచిక ఈ విషయంతో చాలా భాగం నిండి పోయింది.

పై సంచికలో ఆ మూడు సంచికల్లోని ఆయన కళాభిజ్ఞతను సమీక్షిస్తాను. ఇప్పటి కాగుదాం. స్పందించడని వెంకటాద్రిగారిని మరోసారి అహ్వానిస్తూ.


స్పందన - ప్రతిస్పందన

P.S.R. గారికి మీ అతి సుదీర్ఘ లేఖ అందింది. అనేక విషయాలను ప్రస్తావించారు. నిజానికి ఏ మూడు విషయాలమీద మనమధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయనుకున్నామో (చూడండి వివేకపథం-1. సంచికలో 18వ పేజీ మరోసారి చూడండి) వాటిమీద ఇప్పటికయినా మా ప్రస్తుత అవగాహనను వ్రాయండి. ప్రచురిస్తాను. అది ఇటు మన ఇద్దరికీ, అటు పాఠకులకూ అవగాహన పరంగా ఉపయోగకరం. ఏమంటారు?


వింతలు - విశేషాలు

1) ఈ మధ్య ఇంకొల్లులో ఒక వింత జరిగింది. అక్కడున్న ఒక ధర్మసంస్థ నిర్వహణలో ఒక గోష్టి కార్యక్రమం ఏర్పరచాలనుకోవడం చర్చ నీయాంశంగా ‘ధర్మం’ అన్నదాన్ని స్వీకరించడం జరిగింది. మండలి కార్యక్రమాల్లో పాల్గొంటున్న రావి సుబ్బారావుగారు ఈ కార్యక్రమంలో మీరూ పాల్గొనవచ్చు గదా అని విషయాన్ని నా చెవినేశారు. కార్యక్రమం ఉపన్యాసరూపం కాకుండా చర్చారూపంలో జరుపుతామంటే వస్తానన్నాను. ఈ విషయాన్ని ఇంకొల్లు మేధావుల?!కూ చెప్పి మీరూ పాల్గొనండి సురేంద్ర వస్తున్నాడు కదా అని అడగ్గా, ఆయనొచ్చే కార్యక్రమాల్లో మేము పాల్గొనడమేమిటి? అన్నారట. అదేంటయ్యా! అతడు మిమ్మల్ని చర్చకాహ్వానిస్తున్నాడు కదా! మీరు వెళ్ళకపోతిరి. ఆయనే ఇక్కడకు వస్తున్న సందర్భంలోనైనా ఆయనతో చర్చించి విషయాన్ని తేల్చుకోవచ్చు గదా అని ఈయన మలిప్రశ్న చేయగా - సురేంద్ర మా యింటి గడప ముంగిటకొచ్చి చర్చకు రమ్మన్నా మేము చర్చకు దిగము - అంతే పో అన్నారట.... అదండీ విశేషము. ఈ విశేషంలో వింతేమైనా ఉందో లేదో చూపుంటే చూడండి.

2) ఈ మధ్య వెంకటాద్రిగారి రచనలపై సమీక్ష కార్యక్రమాన్నొక దాన్ని స్వీకరించి కొనసాగించాలనుకుని వారి మిత్రమండలిలో కొందరికి సమీక్ష చేయవలసిందిగా ఒక్కొక్కరికి ఒకటి, రెండు వ్యాసాలను యివ్వడం జరిగింది. నన్నూ రెండు వ్యాసాలపై సమీక్ష రాయమన్నారు. నేనూ సరే నన్నానని నాకూ ఆయనకూ తెలిసినాయనొకరు ఆ విషయాన్ని నా చెవినేశారు. నాకు చెప్పినాయన నిజాయితీపై నాకున్న నమ్మకాన్ని బట్టి అయ్యా, మీరు సత్యాన్నిష్టపడేవారూ, హేతుమంతులూ కనుక గుండెమీద చేయివేసుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మిమ్ము సమీక్షించమన్న ఆయన రచనలు రెండూ ఏయే విషయాలకు సంబంధించినవో వాటిపట్ల సాధికారికంగా నిర్ణయాలు వెళ్ళడించడానికి తగినంత అవగాహన నిజంగా మీకుందా? ఆ అంశాలకు సంబంధించిన మూలాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నారా? అనడిగాను. మామూలుగా చాలా దూకుడుగా ఉండే ఆయన ఒక నిముషం నిదానించి, నావంక తేరిపార చూశారు. ఏందయ్యా పెద్ద ఇరకాటంలో పెట్టావు అంటూ ఒక నవ్వు నవ్వేశారు. నవ్వకండి! విజ్ఞత కలిగిన వాస్తవికునిగా నా ప్రశ్నకు బదులీయండన్నాను. నాకట్టి సాధికారకమైన స్థాయి అవగాహన లేదన్నారు. మరి సమీక్ష చేస్తానని అంగీకరించారా! అనడిగాను. అంగీకరించానన్నారు. ఏ రకమైన హేతుబద్ధాలోచనాధారంగా మీరిందుకు సన్నద్ధులైనారు. తగినంత అవగాహన లేని విషయంలో మీరు చేయబోయే సమీక్ష కున్న విలువెంత? ఆ విషయాన్ని ముందు వెనుకలాలోచించకుండా ఏయే రచనలు ఎవరెవరు సమీక్షిస్తేగాని నిజానికది సమీక్ష అనిపించుకోదో అన్న ఇంగితాన్ని ప్రదర్శించలేని ఆ రచయిత వివేకమెంత? వందిమాగధులు అనుచరులు చేసే సమీక్షల సమీక్షకు విలువుంటుందనుకుంటున్న ఈ విశేషంలోని వింత పాలెంత?

(Note:- ఆ సమీక్ష చేయాలనుకున్న మిత్రునికి రెండు సూచనలు చేశాను. నిజంగా శాస్త్రీయ దృక్పధమూ హేతుబద్దాలోచనా ఉంటే రావిపూడివారికో లేఖ రాసేయండి. అయ్యా ఈ అంశాలు సమీక్షించడం నావల్ల కాదు - న్యాయం చేకూరేవిధంగా - సమీక్షించగలంత అవగాహన వాటిపై నాకు లేదని, లేదా తెగబడి ఏమోమాటానికో సమీక్షించాలనే నిర్ణయించుకుంటే కనీసపక్షం ఈ సమీక్షపై ప్రజల నుండి విమర్శనాహ్వానిస్తున్నానన్న ప్రకటన గూడా సమీక్షతోపాటు ప్రచురించేట్లు చూడండి. అలా కాకుంటే మీ వ్యక్తిత్వాన్నే అనుమానించాల్సి ఉంటుంది.

నేనొక తాత్వికపరమైన రచన చేసి, ఆ విషయాన్ని నానుంచే నేర్చుకున్న నా సహచరునిచేతనే సమీక్ష చేయించాననుకోండి సమీక్షకు ఆ మార్గాన్నెంచుకున్న నా స్థాయి ఎట్టిది? తగుదునమ్మా అని సమీక్షించం బూనిన వారి హేతుబద్ధత ఏపాటిది?

ఆఁ. మరిచాను. అసలీ పోకడా ఆయననుండి నేర్చిందే వాళ్ళు. ఆయన చేసిన సమీక్షారూపాలైన లేక విమర్శారూపాలైన రెండు మూడు రచనల్లో ఒక విషయం కామన్ గా ప్రస్తావించబడింది. 1) కోతి పై ఆయన చేసిన విమర్శ, 2) శంకరాచార్యుని తత్త్వం, వ్యక్తిత్వం గ్రంథ విషయం. పై రెండు సందర్భాలలో తాను ఎగబడి, తెగబడి తెగడానితో చేసిన నిర్ణయాలకు ముందుగా ఈ విషయాల్లో అంత లోతైన అవగాహన లేనివాణ్ని అధ్యయనం చేయనివాణ్ని అని చెప్పుకున్నారు. కళ విషయంగా ఆ విషయం (లోతులు తెలీనివాడన్న విషయం) నిజమేనంటూ సంజీవ్ దేవ్ తన సమీక్షలో ప్రస్ఫుటం గానే ప్రకటించారు. ఇక శంకరతత్త్వం-వ్యక్తిత్వంపై ఈయన అవగాహన ఏపాటిదో ఆ భాషలోనూ, ఆ తత్వంలోనూ లోతున్నవారుగదా తేల్చాలి. ఆ విషయంలో గాఢమైన అవగాహన కలిగినవారిని ఆయనే ఎంచుకుని సమీక్షించమంటే కనీసం అంతో యింతో ఇంగితంపాలుని అంగీకరించవచ్చు.


“భిన్న తాత్విక ధోరణులు ఒక పరిశీలన-4”

(అద్వైత విచారణ)

ఈ వ్యాసము చదివే ముందు ఒకసారి నవంబరు 1995 సంచిక "భిన్న తాత్విక ధోరణులు ఒక పరిశీలన-3" చదివి దీనిని కొనసాగించగలరు. మన భారతీయ జన స్రవంతిలో అద్వైతానికున్న ప్రసిద్ధి వేరేవానికి లేదు. సాంప్రదాయక విద్వాంసుల స్థాయినుండి, సామాన్యులవరకు అద్వైతాభిమానం - కనబడడం ఒక వంకా, సామాన్యుల విషయం సరే; విశేషజ్ఞుల స్థాయిలోనే అద్వైతంపట్ల ఎంతో సందిగ్ధతా, గందరగోళమూ ఏర్పడి ఉండడం మరొక వంకా గోచరిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అలాగే అద్వైత పరంగా చాలా విస్తృత సాహిత్యం నెలకొని ఉండగా, మరోవంక దానికి దీటైన స్థాయిలో ఖండన సాహిత్యమూ రూపొంది ఉంది. ఇంత జరిగినా ఆ విచారణ, విషయాన్ని ఆ మాత్రం పరికించి ఒక కొలిక్కి చేర్చింది అనలేని స్థితి ఉందీనాడు. దానికి ప్రధాన కారణాలు రెండు మూడున్నాయి.

1) అద్వైతాన్ని ఖండించిన వారిలో ఎక్కువ భాగం సాంప్రదాయకులే అయివుండడం, వారున్నూ ప్రస్థానత్రయాన్నే (ప్రస్థాత్రయమంటే ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలు, గీత) ప్రామాణికంగా స్వీకరించి ఉండడం అన్నది ప్రధాన కారణం. ఎందుకంటే అసలా మూడూ ప్రామాణిక స్థాయి కలిగున్నాయా లేదా అన్నదే తేల్చుకోవలసి ఉండగా ఆ విషయాన్ని విడచి సమాన ప్రామాణ్యంగా వాటిని స్వీకరించాక ఇక తప్పొప్పుల మాట గాలి మూటే. కాగా పోగా, రగడంతా నీవు చెప్పిన అర్థం సరైందా, నేను చెప్పిందినా? అన్న దగ్గరే. అదిన్నీ నీవు చూపిన శ్లోకం (మంత్రం) అధికతమ ప్రామాణికత కలిగుందా? నేను చూపిందా అన్నదీ చర్చనీయాంశ మవుతోంది. దీనిని తేల్చడమెలా? కనుకనే వందల సం||రాలుగా వాటి పై ఖండన మండనలు సాగుతూనే ఉన్నాయి. ఆ వేదిక పైనే అయితే ఎంత కాలమైనా అలా సాగుతూనే ఉంటాయి. కనుక సత్యనిర్ధారణ చేయడ మెలాగన్నది మొదట తేల్చుకుని, ఆపై పరీక్ష నారంభించవలసి ఉంది.

మేము-(పెంచలయ్యగారు, నేనూ) చాలా కాలంగా, అద్వైతుల్ని కలిసి నప్పుడల్లా అద్వైత యోచనలోని తేల్చుకోవలసిన అంశాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాము. దానిపై ఈ మధ్యనే అద్వైతరత్న బిరుదు కలిగి, అద్వైత విశేషునిగా ప్రసిద్ధి బడసిన ఒకరు, అయ్యా! ఈ ఖండనలు తరువాత ముందు మీరెరిగిన అద్వైతాన్ని వినిపించండి. తెలిసి ఖండిస్తున్నారో లేదో మాకు తెలుస్తుంది అన్నారు. విషయ పరిశీలన ఎటునుండి మొదలైతే నేమిలే జరగవలసింది సత్యాసత్య వివేచనే కదా అనుకుని సరే అలాగే చేద్దాం లెండి అన్నాను. అదుగో! దానినీ దృష్టిలో పెట్టుకునీ ఈ రచన చేస్తున్నాను. గతంలోనే అద్వైతాన్ని పరిశీలించ బూనుకుని భూమికగా ఉండదగ్గ అంశాలను ప్రస్తావించాను. ఒక్కసారి వాటిని మననం చేసుకోండి. వాటిలోని ముఖ్యాంశాలు:

1) అద్వైతం ప్రధానంగా అజాతవాదం. మరైతే ఈ కనబడేదంతా ఏమిటి? అని ప్రశ్నించుకుని, వివర్తవాద రీత్యా (అనిపించడమేగాని నిజంగా అలా లేదు. ఉన్నది ఉన్నట్లే నిర్వికారంగానే ఉంది అన్న దృష్టిని ప్రతిపాదిస్తుందీ వాదం) వివరించడానికి యత్నిస్తారు, అద్వైతులు.

2) ఖచ్చితంగా వీరు ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారా? అంగీకరించరా - అన్నది ఇతమిద్ధంగా తేల్చుకోవలసి వుంది.

3) త్రివిధ సత్తాలను ప్రతిపాదించి వివరిస్తారు. పారమార్థిక, వ్యవహారిక, ప్రాతిభాసిక సత్తా లంటారు. వాటిని -

4) వారి తార్కిక పదతిని అధ్యారోప అపవాద న్యాయం అంటారు.

5) నాలుగు ప్రక్రియలను ఆధారం చేసికొని “అధ్యారోప అపవాద పద్ధతిన వాటిని వివరించి, చివరకు తృణీకరిస్తూ బ్రహ్మాన్ని సాధించి, అజాత వాదాన్ని స్థాపించే యత్నం చేస్తారు వీళ్ళు.

ఆప్రక్రియలు 1) కార్యకారణ ప్రక్రియ, దృక్దృశ్య వివేక ప్రక్రియ, అవస్థాత్రయ సాక్షి విచారణ ప్రక్రియ, పంచకోశ విచారణ ప్రక్రియలని వాటి పేర్లు. 

6) అద్వైతం ప్రకారం పరిణామ వాదం తప్ప. పరమార్థ సత్తైన బ్రహ్మము నిర్వికారము, నిరంజనము, ఏకరసము  కనుక. అందు 1) కార్య - కారణ ప్రక్రియను విచారించే సందర్భంలో జీవేశ్వర చైతన్యాలను, మాయ, అవిద్యలను ముందనుకున్న త్రివిధ సత్తాలలో వ్యావహారిక సత్తా పరిధిలో వివరిస్తారు. 

వ్యావహారిక సత్తా - ఏమిటీ వ్యావహారిక సత్తా!? సత్ అంటే ఉన్నది. అని అర్థం చెపుతారు. వ్యవహరించడమంటే మనకు ఏయే విషయాలు, తెలుస్తున్నాయి, ఇకముందు తెలియబడతాయి అనుకుంటున్నామో, గుర్తిస్తున్నామో, వినియోగించు కుంటున్నామో, వేటి గురించి తెలిసిన వాటిగా మాట్లాడుకుంటున్నామో అదంతా వ్యవహారంలో ఉన్నది. (లోక వాడుక) అని చెప్పుకోవచ్చు. అది వ్యవహారిక సత్తంటే సత్తా - అసత్తా అనుకుంటే క్రియా సామర్థ్యం కలదానికి సత్తనీ, అదిలేని దానిని అసత్తనీ (లేనిది) అంటారు ఈ సాధారణంగా            (సశేషం)

 


No comments:

Post a Comment