Monday, January 16, 2023

3 వివేకపథం సంచిక




వివేకపథం
సంపుటి:1                  అక్టోబరు 1996                   సంచిక:3 
 
కర్మ సిద్ధాంతం పై చర్చా వేదిక
     ఆస్తిక ఆస్తికేతర పక్షాలలోని విభిన్న సైద్ధాంతిక ధోరణులకు చెందిన విశేషజ్ఞులారా! సత్యధర్మ ప్రతిష్ఠాపనోద్దేశితోద్యమ దీక్షాదక్షులారా! కర్మ సిద్ధాంతావగాహనా వరిష్ఠులారా! శిష్ఠులారా! ప్రధానంగా భారతీయ తాత్విక ధోరణుల్లోనూ, ఎంతో కొంతమేర భారతీయేతర తాత్విక ధోరణుల్లోనూ అంకురించి ఈ దేశంలో దృఢంగా వేళ్ళూని వటవృక్షంలా విస్తరించి ఉంది సైద్ధాంతిక ప్రపంచంలో కర్మసిద్ధాంతం. ఈ దేశంలో దీనిని పట్టిచూడనీ, దీని పై విచారణ సాగించని తాత్విక ధోరణులున్నాయనడం దాదాపు అసాధ్యం . విశేషజ్ఞుల నుండి సామాన్యుల వరకూ అందరి మేధస్సులో అంతో యింతో మేర ఏదోరీతిలో చోటు చేసుకునే ఉంటోంది భావజాలం. అనుకూలంగానో, ప్రతికూలంగానో, కొంతటూ కొంతిటుగానో ఈ సిద్ధాంతాంతర్గతాంశాలచే ప్రభావితంగాని, ప్రస్తావించనివారు లేరు. అయినా గతాన్ని మతికి తెచ్చుకుంటే దీని పై కూలంకష విచారణ (అన్ని ధోరణులవారితో కూడిన సమష్ఠి వేదిక పై, శుద్ధమైన చర్చారూపంగా) జరిగినట్లు స్మృతికి రావడంలేదు. అనుకూలురతోనూ, ప్రతికూలురతోనూ దీనిపై తగినంత సాధి కారకమైన అవగాహన ఉన్నవారు ఎందరు తేలతారన్నది సందిగ్ధమే. (తేలని విషయమే). కనుక ఈ విషయమై అనుకూల - ప్రతికూల పక్షాలవారి అవగాహనలూ, సిద్ధాంతంలోని సత్యాసత్యాలూ (వాది అవగాహనా స్థాయి, వాదంలోని వాస్తవిక స్థాయి) విచారణకు పెట్టి సరిచూసుకోవలసినవిగానే ఉన్నాయి. 
 సమాజాన్ని ప్రభావితం చేస్తున్న జ్ఞానభాగం - భావజాలం - నిరంతరం పరీక్షకూ, పునఃస్సమీక్షలకూ లోను చేయబడుతుండాలన్న వివేకం, సామాజి కాభ్యుదయపరంగా వున్న స్పృహ అన్నవే మమ్మీ పెద్దపనికి ప్రేరేపించాయి. 'సత్యాన్నాస్తి పరోధర్మః' అని ఆర్యోక్తి. సత్యస్థాపనకై యత్నించడం కంటే శ్రేష్టమైన విహితకర్మ (ధర్మము) ఏముంటుంది గనుక. అందుకే సమాజంలో ప్రసిద్ధినొంది సమాజాన్ని నడిపిస్తున్న అనేక ధోరణుల పెద్దలను ఈ వేదికపైకి ఆహ్వానించాము. చర్చలో పాల్గొనడానికి ఆస్తికపక్షంలోని భిన్న ధోరణుల విశేషజ్ఞులూ, అధ్యయనపరులూ పెక్కురంగీకరించారు. వేదిక స్వరూపం (స్థాయి) అర్థం కావడం కొరకు ఆ వివరాలూ మీకందిస్తున్నాము. 
 1) డోంగ్రే:- వీరు భారత దేశంలోనే పూర్వమీమాంస-కర్మసిద్ధాంతం పై సాధికారికంగా చర్చించగల కొద్దిమందిలో ఒకరు.
 2) రామచంద్రుల కోటేశ్వర శర్మ :- శృంగేరి శంకరమఠానికి చెందిన పండితులు తర్కవేదాంతాలందు నిష్ణాతులు. 
 3) మరింగంటి శ్రీరంగాచార్యులు :- విశిష్టాద్వైతానికి చెందిన వీరు తర్క, ఉభయ వేదాంతాలందు విజ్ఞులు.
 4) వాలకొండ నరశింహాచార్యులు :- మధ్వ - ద్వైత సిద్ధాంతానికి చెంది తర్క-ద్వైత తత్వావగాహనలో పెద్దలు. 
 5) పుల్లెల శ్రీరామచంద్రుడు :- విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయిన విద్యాధికులు. సాంప్రదాయక తత్వాల నధ్యయనం చేసినవారు.
 6) అవధానిగారు :- తర్కము, పూర్వోత్తర మీమాంసలనూ అధ్యయనం చేసి, ఇటు ఆధునిక సాంకేతిక విద్యను, కంప్యూటర్ సైన్సెస్ అభ్యసించి 'నిమ్స్' వైద్యాలయంలో కంప్యూటర్ కంట్రోలర్ గా పని చేస్తున్నారు.
     Note:- 1) గూడా సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకట్రావు, విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రిగార్లు, వేదవ్రత మరికొందరికై యత్నస్తున్నాము. ఇక రెండవపక్షంగా ప్రధానంగా సత్య జ్ఞాన సంఘాధ్యక్షులూ, గత పాతికేండ్లుగా భారతీయ తాత్వికాంశాల గురించి విశేష అధ్యయనం సల్పుతున్నవారు, న్యాయ, వైశేషిక దర్శనాల లోతుపాతు లెరిగినవారూ, ప్రమాణ పదార్ధ విద్యలందు తమదైన ప్రత్యేకత కలిగి గాఢమైన అభినివేశం కలవారునైన పెంచలయ్యగారు పాల్గొంటారు. 
     2) చర్చావేదిక నిర్వాహకునిగ (సంధానకర్తగా) ఉంటూనే, అవసరమైనంత మేర పరిశీలన లోతుగా సాగడానికి వీలుగా నా వివేకానికందినంతలో పూర్వపక్షాన్ని వహించడం-యోగ్యమైన సందేహాలను ప్రస్తావించడం - నేనూ చేస్తాను. 
3) ఆస్తికేతర పక్షీయులందరకూ ఈ సమాచారపత్రాన్ని అందజేస్తూ తగినంత అవగాహనతో పూర్వపక్షాన్ని వహించగల మనుకుంటున్న వారుంటే మండలికి; "కర్మసిద్ధాంతంపై చర్చావేదికలో పృచ్ఛకునిగా పాల్గొనుటకు" రానున్నట్లు ముందుగా తెలుపవలసిందిగా కోరుతున్నాము. పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము.
 వేదిక స్వరూప స్వభావాలు - నియమ నిబంధనలు
1) వేదిక చర్చారూపమైంది మాత్రమే. ఉపన్యాస ధోరణికి తావుండదు. ఉపన్యాసములు చేయరాదు.
2) కర్మ సిద్ధాంతంలోని అంతర్భాగాలైన ప్రధానాంశాలను ఒక్కొక్కటిగా తీసుకోవడం దానిని ప్రతిపాదించడం సంశయించి పరిశీలించి పరీక్షించి నిర్ధారించడం అన్నరీతిన సాగుతుంది వేదిక.
3) సిద్ధాంతపక్షం ప్రతిపాదించి, పరీక్ష కిచ్చి - నిర్ధారించే పనినే బాధ్యతగా స్వీకరించాల్సి ఉంటుంది. ఆస్తిక, ఆస్తికేతర పక్షాలవారడుగు ప్రశ్నలపై ఆవేశానికి లోనై మా విషయమలా ఉండనీయండి- మీ అభిప్రాయం చెప్పండి లాటి వైఖరిని అవలంబించరాదు. (Note:- ఎందుకని? అందువల్ల సిద్ధాంతపరీక్ష సజావుగా సాగదు. లోటుపాట్లు, సత్యాసత్యాలు బయటపడవు.) కనుక పృచ్ఛక పక్షాన్ని సైద్ధాంతికులు ప్రశ్నించరాదు. 
4) భాషాపరంగా చర్చలో ప్రతిష్టంభన ఏర్పడిన తావులందు లేక పారిభాషిక పద ప్రయోగాల విషయంలో వాటిని ఉపయోగించినవారు ఆయా పదాల అర్ధాలను నిర్వచించడమో, వివరించడమో చేయాల్సి ఉంటుంది. 
5) అలాగే పృచ్ఛకులు తామడుగు ప్రశ్నలద్వారా సందేహాన్ని సుస్పష్టంగా ప్రకటించడం, అవసరమైన చోటులందు విపులీకరించడం అన్న బాధ్యతను వహించాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక :- ఈ చర్చనీయాంశం సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న భావజాలాన్ని కలిగున్నది గనుక, అభిమాన, వ్యతిరేకతలు ఏర్పడి ఉండడం సహజం. దాని నుండి పుట్టిన ఆవేశాలు చర్చలో చోటుచేసుకునే అవకాశమూ ఉంది. 'సత్యాసత్య వివేచన' ప్రధానాశయంగా సాగే ఈ గోష్టిలో రెండు పక్షాలూ ఇష్టపడి సంయమనాన్ని పాటించవలసి ఉంటుంది. లేకుంటే చర్చా స్వరూపం విజ్ఞతా స్థాయిని కోల్పోయి రభసగా మారే ప్రమాదం ఉంది. అట్టి స్థితి రాకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మనందరి పైనా ఉంది. కోరదగని ఈ స్థితి అనుకోకుండా ఏర్పడప్పుడు నిర్వాహకుని నిర్ణయాలను సహృదయంతోనే అయినా ' తప్పనిసరిగా , అనుసరించాల్సి ఉంటుంది.

చర్చలో చోటు చేసుకునే చర్చనీయాంశాల వివరాలు కొన్ని 
 ఒక్కమాట :
1. ప్రధానాంశ మేమంటే :- ఏ యిరువురి మధ్య చర్చైనా యోగ్య స్థాయిలో జరగాలంటే చర్చనీయాంశం పట్ల తగినంత అవగాహనా స్పష్టత ఇరువురికీ ఉండాలి. చెప్పేవాడికే విషయం తెలుసుండాలి అడిగే వాడికి అడగడం తెలిస్తే చాలునన్న అపప్రధ లోకంలో వాడుకలోవుంది. నిజాని కది చర్చా సందర్భానికి సరిపోదు. అడగడం రెండు సందర్భాలలో ఏర్పడుతుంది. తెలుసుకోవడానికీ, పరీక్షించడానికీ. ఈ వేదిక రెండో తరహాకు చెందింది. కనుక అడిగే వారికీ విషయం తెలిసుండడం అవసరం. అదే సరైన శాస్త్రీయ చర్చా విధానం కూడా. కనుక విషయం తెలిసి లోపం, దోషం లేదనుకునే వారూ, విషయం తెలిసే లోపమో, దోషమో ఉందనుకునేవారు పాల్గొనే చర్చలే సజావుగా, స్థాయికలిగి కొనసాగుతాయి. ఈ నా మాట సబబే నంటే చర్చలో పాల్గొనబోయే రెండు పక్షాల వాళ్ళూ కర్మ సిద్ధాంత స్వరూపాన్ని గూర్చి మీ మీ అవగాహనలను మాకు వ్రాత మూలకంగా తెలియజేయడం సరైన విధానం. మీ మీ రచనలను మాకు పంపండి. ఈ సిద్ధాంత చర్చలోని ప్రధానాంశాలు మా ఎరికలో ఇలా ఉన్నాయి. కర్మ సిద్ధాంతంలో జీవుడు, దేవుడు, జన్మ-కర్మ, సాధన-ముక్తి, ప్రకృతి అన్న అంశాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. ఇందులో 1) జీవుని స్వరూపం ఏమిటి, జీవునికి దేవునికీ గల నంబంధం ఎట్టిది?
2. దేవుని స్వరూప స్వభావాలు ఏమిటి? అతడు చేయు కర్మ లేమిటి? ప్రకృతిలోనూ, జీవుల ఎడలను అతని వర్తన ఎట్టిది?
     3. జన్మ :- ఎవరికి? ఎలా ఏర్పడింది. అసలు జన్మంటే ఏమిటి ? జన్మకు కర్మ ఎలా కారణం అయ్యింది? జీవునికి కర్మ ఫలితమైన జన్మరావడం విషయాలలో దేవుని పాత్ర ఎంత? జన్మకు కర్మ కారణమా? కర్మకు జన్మ కారణమా? అన్న జఠిల సమస్యకు సరైన సమాధానం ఉందా?
4. కర్మ స్వరూపం ఏమిటి? కర్మ జీవునికేనా - దేవునికీనా? కర్మ బంధం అవడం, అవలేకపోవడం ఉందా? 
5. సాధన కర్మరూపమా? కాదా? అది (ఒక కర్మ) కర్మబంధాన్ని ఎలా తొలగిస్తుంది?
6. ముక్తి అంటే ఏమిటి? ముక్తి నిత్యమా అనిత్యమా? నిత్యమైతే సాధనెందుకూ అనిత్యమైతే దానివల్ల ప్రయోజన మేమిటి?
 7. కర్మ ఫలితం కర్తకు ఎలా అందుతోంది? ఈ అందించే కార్యం దేవుడు ఎలా నిర్వర్తిస్తున్నాడు ?
8. భారతీయ తాత్విక చింతనలో ప్రసిద్ధ ధోరణులన్నీ పై అంశాల్లో ఏకోన్ముఖంగా ఉన్నాయా?
9. వేరు వేరు గ్రంథాలను - ప్రమాణంగా చూపుతూ భిన్న భావాలు (అభిప్రాయాలు) ప్రతిపాదనల్లోకి వస్తే సబబు బేసబబుల్ని నిర్ధారించడం ఎలా?
10. ప్రమాణ నిర్ధారణ కాకుండా సత్యనిర్ధారణకు మార్గం ఏర్పడుతుందా?
 ఎ) కర్మఫల భోగం గత జన్మ కృతమా? ఈ జన్మలో చేసిందా? రెండు రకాలుగానూ జరుగుతుందా? 
నోట్ :- సందర్భవశాత్తు అనేకానేక విషయాలు చర్చలో చోటు చేసుకో వచ్చు. అయినప్పటికీ పై 10 అంశాల చుట్టూతనే సిద్ధాంత ప్రధాన భాగమంతా అల్లుకుని ఉంటుంది.
వేదిక పై నుండు రెండు పక్షాలే కాక, శ్రోతలుగనున్న జిజ్ఞాసువులూ, యిరుపక్షాల అభిమానులూ, వ్యతిరేకులూ పరిశీలకులూ అందరూ ముందుగా పై విషయాల పట్ల తగినంత అవగాహన ఏర్పరచుకుని ఉంటే వేదిక ప్రయోజనం నెరవేరుతుంది.
ఆ సదస్సు హైదరాబాదులోని B.H.E.L. రామచంద్రాపురం H.I.G కాలనీ కమ్యూనిటీ హాలునందు జరుగుతుంది. సభా సమయాలు: అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో ప్రతిరోజూ ఉ. 9 నుండి 12-30 వరకు మధ్యా:-2-30 నుండి 5-30. భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాము. ప్రక్కబట్టలు మాత్రం ఎవరికి వారే వెంట తెచ్చుకోవాలి. కార్యక్రమం మనందరిదీను . కనుక నిర్వహణ రీత్యా ఏమైన అసౌకర్యములు జరిగిన సహృదయంతో సర్దుకు పోవలసిందిగా కోరుతున్నాము. 
శ్రోతలు చర్చ జరుగుతున్నపుడు నేరుగా చర్చలో జోక్యము చేసుకొన రాదు. చర్చనీయాంశానికి సంబంధించి పరిశీలనకు సహకరించే అంశాలు చెప్పదలిస్తే నిర్వాహకులకు వ్రాతమూలంగా అందజేయవచ్చు.
కర్మ సిద్ధాంత పక్ష ప్రతిపాదనకు అంగీకరించిన వారు 
1. శ్రీ V. K. డోంగ్రే - ఉభయ మీమాంస సార్వభౌమ రాష్ట్రపతి అవార్డు గ్రహీత -హైదరాబాదు. 
2. శ్రీ పుల్లెల రామచంద్రులు - రాష్ట్రపతి అవార్డు గ్రహీత - హైదరాబాద్ . 
3. శ్రీ సూరి రామకోటిశాస్త్రి - అద్వైతి - హైదరాబాదు. 
4. శ్రీ రామచంద్రుల కోటేశ్వర శర్మ - అద్వైతి - హైదరాబాదు.
     5. శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులు - విశిష్టాద్వైతి - జీయరు ఆశ్రమం. 
6. శ్రీ వాలకొండ నరసింహాచార్యులు - ద్వైతి - హైదరాబాదు. 
7. శ్రీ వంకం సుబ్బన్న - ఆర్యసమాజిస్టు - ప్రొద్దుటూరు.
8. శ్రీ డా|| పి. సందీప్ - ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాదు. 
9. శ్రీరామ యోగి - ధ్యాన కేంద్రం - హైదరాబాదు. 
10. శ్రీ R.V.S.S. అవధాని - నిమ్స్ కంప్యూటర్ డై రెక్టర్ - హైదరాబాదు. 
     11. శ్రీ ఎమ్. వెంకటరావు - ఇన్ కమ్ టాక్స్ ఆఫీసరు - హైదరాబాదు.

పూర్వ పక్షమునకు (పృచ్చకులుగా) అంగీకరించినవారు
     1. శ్రీ ఎస్. పెంచలయ్య - సత్యజ్ఞాన సంఘము - వెంకటగిరి.
     2. శ్రీ N.V. బ్రహ్మంగారు - జిజ్ఞాసా వేదిక - చీరాల.
3. శ్రీ భౌతికహిత గుత్తా రాధాకృష్ణ - రాష్ట్ర హేతువాద సంఘాధ్యక్షులు విజయవాడ-10. 
 ఇరుపక్షముల కొరకు ప్రయత్నింపబడుతున్న వారు 
1. శ్రీ గూడా సుబ్రమణ్య శాస్త్రి గారు - కంచి. 
     2. శ్రీ ఆచార్య వేదవత్ విమాంసక్ - వడ్లూరు. 
3. శ్రీ గోపాలకృష్ణ శాస్త్రిగారు-ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపాల్ -రాజమండ్రి. 
     4. శ్రీ మేడూరి సత్యన్నారాయణ, ప్రదాన కార్యదర్శి ఆం. ప్ర. హేతువాద సంఘము, (ఇంకొల్లు, ప్రకాశం జిల్లా). 
     5. శ్రీ రావిపూడి వెంకటాద్రి, భారత హేతువాద సంఘ అధ్యక్షులు, చీరాల. 
     6. P.S.R. ఆం. ప్ర. రాష్ట్ర హేతువాద సంఘ అధ్యక్షులు, జిన్నూరు,
రావిపూడి వెంకటాద్రి - ఒక విశ్లేషణ :
(ఆయనలోని తెలుపు నలుపు భాగాలు)
1. విజ్ఞాన శాస్త్ర పరంగా ఆయన సంకలనాల వరకు తీసుకుంటే సమాజాన్ని అజ్ఞాన దశ నుండి విజ్ఞాన దిశగా - మెదలేట్టి చేయాలన్న ఉసి కసిగా ఎగసి పడుతుంటుంది. ఆ రచనల వెనుక - అవెంత సంకలనాలైనా - అకుంఠిత దీక్షతో కూడిన, కాలాన్ని, శ్రమను ఖాతరుచేయని అధ్యయనపు భాగం ద్యోతకమవుతుంటుంది. అయితే ఆ అధ్యయనంలోని తీవ్రత, అజ్ఞానాన్ని పారద్రోలాలన్న ఉసి, కసిగా మారడంతో గతమంతటి పైనా అవసరం లేనంత ద్వేషం - ఆయనలోని వివేకాన్ని - హేతుత్వాన్ని కూడా తొక్కి పట్టి నిక్కుతుంటోది.
2. ఆయనలో రెండు ముఖాలున్నట్లూ, అందులో అక్కరైన సుముఖం కంటే అక్కరలేని పెడమొఖమే ఎక్కువున్నట్లు చెప్పక తప్పదు. నిష్పాక్షిక విశ్లేషణను ఆధారం చేసుకుంటే.
3. అకారణ ద్వేషాలు, వల్లమాలిన అభిమానాలు అన్న వాటిపాలు, సౌమనస్యత, సమతుల్యత, సామరస్యాలన్న వాటితో పోలిస్తే ముప్పాతిక పాలు పై చిలుకే చోటు చేసుకుని ఉన్నాయి. 
4. ప్రతి రచనలోనూ ఏదో ఒక తావున, ఏదో ఒక రీతిన అతిశయమూ, ఆధిక్యతా భావము, ప్రకట పడుతూనే ఉంటాయి. ఈ ఆధిక్యతాభావ నేపధ్యంలో తన నంగీకరించని వారిపై అసభ్యంగానూ, అనుచితంగాను దిగజారుడు భాషతో కూడిన దూకుడు కనబడుతూంటుంది. పైగా అదంతా నిర్దాక్షిణ్య సద్విమర్శేనన్న బ్రాంతొకటి. వెతికితే మరికొన్ని అవలక్షణాలూ గోచరించవచ్చేమో కూడా. పైన నేనన్నవి ఆరోపణలు కావనడానికి వీలైన సంఘటనలు చూపకుంటే నేనూ వారి మార్గాన పోతున్నట్లే అవుతుంది. అందుకనే క్రింది వివరాలు. 
 ఆయనలోని నలువు రీతుల కథా కమామీషు
అతిశయం : 1 (ఆగస్టు 96 హేతువాది హేమా సాహిత్య సమీక్ష - 11 పేజీ) నా గ్రంథాల స్థాయిని అందుకోలేని వారి అవాకుల్ని విమర్శలుగా నేను లెక్కవేయను. హానికరమైన, దురుద్దేశ పూర్వకమైన విమర్శలన్నా నేను సహించేది లేదు. (సురేంద్ర:- మరి ఈయనగారి అవాకుల్ని మాత్రం లోకం చచ్చినట్టు సహించుకోవాలన్నమాట !) .
2. పిల్లకుంకలే కాదు, పెద్ద వెధవలు, మంచి పెద్దలు కూడా తప్పులు చేస్తుంటారు, చెపుతుంటారు, రాస్తుంటారు. పిల్లకుంకల్ని మందలిస్తాం, పెద్ద వెధవల్ని చివాట్లు పెడతాం, మంచి పెద్దల్ని విమర్శిస్తాం. అలా చేయకపోతే అందరి తప్పులూ ఒప్పులుగా తర్వాత తరాల వారికి దిగుమతి అవుతాయి. అయితే చివాట్లుతినే పెద్ద వెధవలు ఈ వైఖరిని సహించుకోలేరు. "వెంకటాద్రిగారు అందర్ని విమర్శిస్తారేమిటి?" అంటారు.
3. సురేంద్ర నా రచనలస్థాయి నందుకోవాలంటే కనీసం నాలుగు దశాబ్దాలైనా పడుతుంది.
4. 1-1-93 - మేలుకొలుపులో కూసిన కూతలు నా ఎదుట కూసి వుంటే అప్పుడే అక్కడే సరిగా వాతలు పెట్టేవాణ్ణి. 
5. సురేంద్ర ఆఖరి కొచ్చేశాడు, గిలగిల్లాడుతున్నాడు..
6. అయ్యర్లతో జియ్యర్లతో సత్యాలాటకు రమ్మని మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసే భ్రమాతల వివేకాన్ని ఏ మానంతో కొలవాలి?
అశ్లీల భావజాలం:- 15 సంవత్సరాల పూర్వపు దశ నుండి ఈనాటి వరకు వెంకటాద్రి రచనల్లో, రేపులు, కామజ్వరాలూ, వ్యభిచార కాండలూ ఏదో రీతిలో చటుక్కున జొరబడి కనబడుతూంటాయి - కళా - శాస్త్ర నివాదం పేరున ఆరంభమైన రగడలో - సూర్యకుమారిగారి అభిప్రాయాలు సహేతుకంగా ఎలా తప్పో చెప్పాల్సిందిపోయి అందులోనూ తన అభిరుచినీ, ఉద్వేగాన్ని, (అణగారిన వాంఛలు, తృప్తి పరచుకొనే అవకాశం చీమతలకాయంత చిక్కినా దానిని ఏనుగు తలంత చేసి) శాంతింపజేసుకోజూడడం నిజంగా జుగుప్సాకరం. మీరూ చూడండి.
1.కుమారి ప్రకారం త్రాగుడు, దొంగతనం, రేప్ వగై రాలు కళల్లో అధోమార్గానికి చెందినవి.
(సురేంద్ర:- ఒక పచ్చినిజం చెప్పనా! పైమాటలో మధ్య దాని సంగతి మనకు తెలీదుగానీ ముందుదీ, వెనకదీ వెంకటాద్రిలో ఏ మేరకు చోటు చేసుకుని ఉన్నాయో ఆయా వయసుల్లో ఆయనకూ తెలుసు, ఆయనతో అతి సన్నిహితంగా మెలిగిన, కలసి బ్రతికిన వాళ్ళకూ తెలుసు, మొదటి దాని పాత్ర ఎంతుందో ప్రక్క సమాజం వారికే తెలుసు.)
2. మొత్తంమీద కళలు ఉద్వేగాలకు మారుదారిచూపి పండ బెడుతున్నాయి. 
3. కామోద్రేకాన్ని అణచుకోవడానికి కచ్చడాల్ని ఉపకరణాలుగా చూపి 'పాతి' వ్రత్యాన్ని మాత్రమే బోధించిన 'ఋషు'ల్లాగా, ఉద్వేగ తృప్తి కోసం కళావ్రతం పూనమనడం సమర్థనీయం కాదు. 
సురేంద్ర :- సూర్యకుమారి అభిప్రాయాలు కాని వాటిని ఆమె నెత్తిన పెట్టి స్వకీయోద్వేగశమనం కోసం తానెట్టిన మాట ప్రక్కనబెట్టి గట్టి పట్టుతో ఋషులు, పతివ్రతలూ, కామోద్రేకాలు లాటి అసందర్భ, అసభ్య సన్నివేశాలను నెమరుకు తెచ్చుకునే వీరి పోకడలోని 'పెద్ద వెధవ' తనమెంతో కనుగొనడానికి ఇంగితం కూసింత చాలు. 
4. కళల్లేకుండా బ్రతకలేమనేది ప్రేమికుల వేదనలాటి మనోజ్వరం. "మనిషిని నిర్ల క్ష్యం చేసేవారు తప్ప మరెవరూ కళను నిర్లక్ష్యం చేయరని" కుమారి శపించడం అలాటి జ్వర ప్రకోపంవల్లనే. 
సురేంద్ర :- కళ లేకుండా బ్రతకలేమని సూర్యకుమారి అనలేదు. అది ఈయన అంటగట్టిన అపవాదు. పైగా " ప్రేమికుల వేదనలాటి మనోజ్వరమంట అది.
శంకరాచారుడి హత్య :- ఇదీ ఆ రచనకు శీర్షిక. హత్యకు సంబంధించిన సాధికారికమైన కించిత్సమాచారమైనా ఆ 30 పేజీల రచనలో ఎక్కడుందో నా కంటికగుపడలా, హేతుబుద్దుందన్న వాళ్ళు చూపితే చూస్తాను. 
ఆ రచన ఆరంభం:- ఏసుక్రీస్తు కథకూ శంకరాచారుడి కథకీ కొంత తేడా ఉన్న కొన్ని పోలికలూ ఉన్నాయి. కథల ప్రకారమైతే ఒకరు అధవ - కన్యకూ, మరొకరు విధవకీ పుట్టారు. 
సురేంద్ర :- శంకరాచార్యుని హత్య గురించి రాస్తానంటూ చెప్పి ఏసు పుట్టుక, శంకరుని పుట్టుక అంటూ మొదలెట్టాడేమిటండీ ఈయన. అందులోనూ ఇద్దరూ బహిరంగంగా భర్తలు లేనివాళ్ళేనని మరో అప్రస్తుతాంశ ప్రస్తావన అంటే ప్రతి రచనలో ఎక్కడో చోట నిషిద్ధ శారీరక సంబంధాల ప్రస్తావన లేక కలం సాగదన్న మాట. పైన మూడు తరహా మనుషులుంటారు అన్న వీరి కొలతల్లో నుంచే ఈయన కుర్రకుంకా కాకపోయే - పై అసభ్య, మానసిక వ్యభిచార రూప అశ్లీల ప్రయోగాలవల్ల మంచి పెద్దల్లో చేర్చడానికి వీలుకావడం లేదాయే. ఏం చేద్దాం. తప్పక పరిశేషన్యాయాన్నంగీకరించాల్సి వస్తోంది. 
‘సందర్భ శుద్ధి శూన్యం' అనడానికి ప్రతి ఉపన్యాసం లోనూ అరిగిపోయిన రికార్డులాటి ఈ అవాకుల్ని చూపిస్తాను చూడండి.
మనుషులకు మామూలు పద్ధతిలో పిల్లల్ని పుట్టించడం మన పురాణ కర్తలకు నచ్చదు. పిల్లల్లేక ఏడుస్తున్న దేవుళ్ళకే వాళ్లు మనుషుల్లాటి వాళ్ళను పుట్టించారు. నిజానికి హిందూ దేవుళ్ళకు పెళ్ళాలైతే ఉన్నారు కానీ వాళ్ళవల్ల సహజంగా అందరకూ పుట్టే విధంగా పుట్టిన పిల్లలు లేరు. 
సురేంద్ర :- శంకరాచార్యుడి హత్యకు ఈ అంశానికి ఉన్న సంబంధం ఏమిటో రాటు దేలిన హేతువాదుల హేతుత్వాని కందితే మా వైపూ ఇంత చిందించితే అందుకునే యత్నం చేస్తాం. నా వరకు నాకు మాత్రం ఇదీ కామోద్వేగ తృప్తి సాధనే ఆయనకు. అదే గ్రంథంలో "జనన సమాచారం" అన్న ఉప శీర్షికన ఈయన పోయిన పోకడ చూడండి.
క్రైస్తవుల దేవుడైన యెహెూవాకు పెండ్లాం లేదు. అల్లాకు పెండ్లామే లేదు పొమ్మన్నాడు మహమ్మదు. ఎంతమంది పెళ్ళాలతో ఎన్ని తంటాలు పడ్డా మహమ్మదుకు బ్రతికి బట్టకట్టే ప్రయోజకుడే పుట్టలేదు. అద్వైత మతాచార్యుడైన ఆదిశంకరుడి చరిత్రకు సంబంధించి విచిత్ర మేమంటే ఆయన తన అబ్బ అమ్మకు పుట్టినట్లుగా ఏ శంకర పురాణంలోనూ లేదు. సంతానంలేని ఆర్యాంబ (?) నానాపాట్లు పడితే చివరకు పరమశివుడే ఆమె గర్భంలో (ఎటునుంచో) దూరి (ఎటునుంచో) బయటకు వచ్చాడంటాయి శంకర పురాణాలు. 
ఈయనకు పెండ్లి కాలేదు. కానీ బ్రహ్మచారిగా నిలబడలేకపోయాడు పరాయి ఆడవాళ్ళ కోసం పరకాయ ప్రవేశ విద్యకూడా నేర్చుకున్నాడు. 
ఇక్కడ శంకరుడు రండా గర్భాన పుట్టాడా? పతివ్రత కడుపున పుట్టాడా అనేది ప్రధానాంశాలు కాదు. ఏ తండ్రికి పుట్టినా ఏదో ఒక తల్లికే పుట్టాడనడంలో తగాదాలేదు. తాదూర సందులేదుకాని మెడకో డోలన్నట్లు తమ పెండ్లాలకు పిల్లల్ని పుట్టించలేని దేవుళ్ళు ఏ రండలకో పిల్లల్ని పుట్టించడ మేమిటి? అనేది ప్రశ్న. 
‘శంకరాచార్యుడి శీలం’ అన్న ఉప శీర్షిక క్రింద. శంకరుడు "బ్రాహ్మణ జారిణీ పుత్రుడు, శంకరుడు, సర్వకర్మ బహిష్కుృతుడు” అని మణిమంజరిలో, స్కాందంలో, కేరళోత్పత్తి గ్రంథాల్లో జుగుప్సాకరమైన కథలల్లి శ్లోకాలు రాసిన వారు ఈనాటి హేతువాదులు కారు.
సురేంద్ర :- ఆ తరహా రచనలు జుగుప్సాకరమైనవి, హేతువాదులు చేయలేనివీనని అంగీకరించుచున్న మాట మంచిదే. మరి ఆ యింగితాన్ని ప్రదర్శించక ప్రతి రచనలోనూ, ఉపన్యాసంలోనూ వాడు దీనితో పోయాడు, ఇది వాడితో పోయింది. అంటే లైంగిక ప్రస్తావనలు ఎందుకు చేస్తున్నట్లు, అలాంటి కబుర్లాడుకుంటేగాని గుబులు చల్లారని నైజం కాకుంటే ఆ ప్రక్కనే మళ్ళా పునరుక్తిగా శంకరుడు పుట్టకముందే తండ్రి మృత్యుడయ్యాడనీ, వితంతువుకు వ్యభిచారంవల్ల పుట్టాడనీ..... వగైరా దూషణగా కేరళోత్పత్తి గ్రంథంలో వ్రాయబడి ఉందని అన్నదే అనడం ఎందుకు? మానసిక బులపాటాన్ని చల్లార్చుకోటానికి గాక, పైగా నా లక్ష్యం శంకరుణ్ణి నిందించడం కాదని ఒక యుక్తి కూడా. ఇంకా చూడండి.
కాబట్టి శంకరుడి శీలాన్ని గురించి వీరేశలింగం పంతులుగానీ, నేను గానీ కథలు చెప్పడం లేదు.
సురేంద్ర :- అవన్నీ కథలేనంటూ వాటినే మాటిమాటికి ఏకధాటిగా పాట పాడుతూ కథలు చెప్పడం లేదనడంలోని హేతుబద్ధత ఏపాటిది? గిట్టనివారిమీద బూతుపరమైన అభాండాలు వేసి దుష్ప్రచారం చేయడం మతస్థుల పద్ధతి. భార్యల్ని తార్చే భర్తలు, భర్తల్ని తార్చే భార్యలు, పతివ్రతలూ, పతివ్రతల్ని రేప్ చేసే దేవుళ్ళూ పిలిస్తే పలుకుతారు పురాణాల్లో. అణగారిన లైంగిక వాంఛల్ని పౌరాణికులు తాటాకుల మీద తీర్చుకున్నారు. 
సురేంద్ర :- ప్రతి రచనలోనూ, ఉపన్యాసంలోనూ అవన్నీ తలచుకుంటూ, పాఠకుల తలపుల కెక్కిస్తూ వీరూ పౌరాణికుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. కాకుంటే వారు తాటాకుల మీద తీర్చుకుంటే వీరు కాగితాల మీద తీర్చుకుంటున్నారు. 
గిట్టనివారే శంకరుని తల్లిని రండను చేశారు. వ్యభిచారిణిని చేశారు. శంకరుని రండ కొడుకుని చేశారు. సన్యాసిని చేశారు. పరకాయ ప్రవేశం చేయించారు. వ్యభిచారం చేయించారు. ఆ కథలు నిజమా అబద్దమా అనేది ప్రస్తుతాంశం కాదు. పరకాయ ప్రవేశ విద్య ఉన్నదని హేతువాదులు అంగీకరించరు. శంకరుడిలాగా ముసుగేసుకుని, మోసం చేసి ఇతరుల భార్యల్ని చెరిస్తే ఈనాటి ధర్మశాస్త్రం గుంజకు కట్టి చర్మం వలుస్తుంది. శంకరుడు చేశాడని చెపుతున్నది వ్యభిచారం కాదు. రేప్. గ్రహిస్తున్నారా వెంకటాద్రి (రాష్ట్రంలోనే ఉత్తమ హేతువాది, మానవ వాదీ) పోకడ. ఆయన కథా వస్తువు, భాషా స్థాయి, "ఇంకా ఉంది చూడండి ఆ పాచిపళ్ళ దాసుని లైంగిక వీరంగం. 
వీరేశలింగం పంతులు రాసిన మండనమిశృడి భార్యతోటి సంవాదమూ, అమరకుని భార్యలతోటి సంగమమునన్న వాటిని ఉటంకించాక ఈయన వ్యాఖ్య..... 
ఈ కామ కళలో ప్రాక్టికల్ నాలెడ్జి కోసం శంకరుడు అలా వేషాలు వేసుకుని ఇళ్ళలోకి జొరబడి కామకండూతినీ, లైంగిక కుతినీ తీర్చుకోవడాన్ని అద్వైత నీతి అంగీకరిస్తుందన్న మాట... కామ తృప్తికోసం వ్యభిచారం చేయటం అద్వైత ధర్మమేనా? ... రాజుగారి నూరుమంది భార్యల్ని వారికి అనుమానం వచ్చేదాకా శంకరుడు అలుపు లేకుండా అనుభవించాడు కదా?
భగంధర వ్యాధి కూడా సుఖరోగమే నంటారు. ఆచార్యులవారికి ఆ వ్యాధి వస్తే పద్మపాదుడు చికిత్సచేసి తగ్గించాడట.
     శంకరుడు కామకళ నేర్చుకున్నది ముండమోపుల వద్దనే. 
     అదే గ్రంథంలో 'వ్రాతలు-చేతలు' అన్న ఉపశీర్షికన.
ఆయన రచనల్లో శృంగారపరమైనవీ, వైరాగ్యపరమైనవీ చోటు చేసుకున్నాయి. ముందాయన విరాగి. అటు తర్వాత భోగి. వ్యభిచారానికి వజ్రోలియోగాన్ని అద్దం పెట్టుకున్న శృంగారయోగి. 
     శంకరుడు మండనమిశృని భార్యను వనదుర్గా మంత్రంతో బంధించి, శ్రీచక్రంలో ప్రతిష్టించి, కల్పాంతందాకా తన ఆశ్రమంలో ఉంచుకోవడమేమిటి? దాన్ని ఇలోప్మెంట్ అందామా? కిడ్నాపింగ్ అందామా? ఇలాంటి వాటినే సామాన్యుడు చేస్తే తగులు కెళ్ళాడు, లేపుకెళ్ళాడు అంటారు. రాజు భార్యల్ని రేప్ చేసిన మహానుభావుడు శారదను మరేమి చేశాడనుకుందాం. వీటన్నిటినిబట్టి శారదా శంకరుల సంబంధానికి ఎలా అర్ధం చెప్పుకోవాలి. 
సురేంద్ర :- ఒకసారి త్రిపురనేని గోపీచంద్ కలిస్తే అరవిందుడికీ ఫ్రెంచి మదర్ కీ ఉన్న సంబంధం గురించి ఆరా తీశాడట ఈయన.అక్కడా ఈయనకు అదేదో సంబంధం ఉంటే బాగుంటుందనే అభిలాష. గోపీచంద్ - మనవంటివాళ్ళ స్థాయిలో అలాంటివాటిని పట్టించుకుంటే ఎలాగండీ అన్నారట. నిజమే. శంకరుడి విషయంలో కూడా మనం అలానే తీర్మానించుకోవచ్చు. అని ఈయన సమన్వయం. 
 “ఇక శంకరపీఠాల విషయానికి వస్తే కంచి కామకోటి పీఠం కామకళా విలసితమైన శక్తిపీఠం”.
 సురేంద్ర :- ఇవండీ ఆయన శాస్త్రీయ దృక్పధంతో హేతుబద్ధంగా ఆలోచిస్తూ చేస్తానంటున్న రచనలోని అంశాలు. "ఒక్క శంకరాచార్యుని హత్య" అన్న గ్రంథంలోనే ఇన్ని ఉన్నాయి. ఇక ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ఒక అశ్వమేధ యాగ కథ ఉంటుంది. అందులో రాణులు గుర్రాన్ని చంపి దాని లింగాన్ని యోనిలో పెట్టుకునే సంఘటన గురించి ఒత్తిచెప్పడం ఉంటుంది. అనుచరులు విన్నదే వింటున్నాం అనైనా చీదరించుకోకుండా విసుగు లేకుండా కుతి తీర్చుకునే కార్యక్రమం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.
     ఇక ఈమధ్య నా పై దిక్కుమాలిన ఆరోపణలెన్నో చేశారాయన. ఒక్కటంటే ఒక్కదానికీ రుజువుల్లేవు. రుజువుపరచడానికి సిద్ధంగానీ, రుజువుపరచలేని ఆరోపణలు చేయరాదన్న ఇంగితం గానీ, రుజువుపరచండని ఎదురాడినపుడు బాధ్యత వహించాలన్న నై తిక బాధ్యతగానీ లేని ఈయన తన స్వభావరీత్యా ఊతపదంగా మారి కుతి తీర్చుకోడానికి సాధనంగా ఏర్పడిఉన్న రేప్ భాషనూ ప్రయోగించారు నేను రేపిస్టునంటూ.
 ఈయన ఉపన్యాసాలు వినీవినీ వంటబట్టిచ్చుకున్న ఈయన ఆస్థాన భట్రాజుల్లో ఒకడు ఆబోతు శృంగారాన్ని ప్రస్తావించగా మెచ్చుకుని అచ్చేసుకున్నారీయన. అందులో తననే ఆబోతుని చేశారన్న ఇంగితమైనా లేని వీరి స్థాయినీ, హేతుత్వ స్థాయినీ, మానవవాద స్థాయిని గొప్పలుగా చెప్పుకునే వారిని ఒప్పుకోవాలి ముందుగా. ఇక చాలు రాయడానికే అసహ్యంగా ఉంది. వారి పాచిపళ్ళ కథ, కామజ్వరపు వ్యధ, ఇంకా వివరంగా కావాలంటే ఆయన రాసిన ఏ గ్రంథమైనా తీసుకోండి. చెపుతానన్న విషయంతో సంబంధం లేకుండానే ఏదోరకంగా, ఎక్కడో ఒక చోట సంభోగాల జాతర తప్పనిసరిగా మీ ఎదుటపడుతుంది. 
     రాయ్ చాలా రచనలు చేశారు. గతాన్ని, మతాన్ని ఎంతో వ్యతిరేకించి ఉండవచ్చు. ఆయనచే ప్రభావితులైన మరెందరో అంధ విశ్వాసాల్నీ, అజ్ఞాన జనిత మతావేశాన్ని నిష్కర్షగా ఖండించి ఉండవచ్చు. గోరా కూడా మూఢ నమ్మకాలపై వ్యతిరేకోద్యమం నడిపినాయనే. అలానే మరెందరో సంస్కరణకై యత్నించినవారూ ఉండొచ్చు. అయినా ఈయనలో తొంగిచూసినంత అశ్లీలతాంశాల ప్రస్తావన కనబడదు. నోరెత్తితే చాలు ఏదో ఒక రంకు చిత్రాన్ని వర్ణించందే మనస్సూరట చెందదాయె. వీరారాధకులకు, రాటుదేలిన బండబారిన హేతువాదులకూ మాటిమాటికి తలచుకునే పైవాటిలోని అసభ్యత గానీ, మానసికానందానికై పడుతున్న ఆరాటం కానీ కనబడవు. అవన్నీ కూడా శాస్త్రీయ విషయాలలానే, భావ విప్లవ సాహిత్యంలానే కనబడుతుంటాయి. ప్రస్తుతానికాగుతాను. పై సంచికలో మరికొన్ని అంశాల్ని విచారిస్తాను.
 గుంటూరు సదస్సులో వెంకటాద్రి తెగలాగడం ద్వారా మామధ్య ఆరంభమైన విమర్శా- ప్రతివిమర్శల ఆరంభదశలో (గుంటూరులో నేను పదేపదే అడిగిన కార్యకారణాలకు నిర్వచనాలు చెప్పండి అన్న ఒకేఒక ప్రశ్న ఆధారంగా) అతగాడు పేలిన ప్రేలాపనల్ని బట్టి ఆయన్ని మంచి పెద్ద మనిషనాలో మరోటనాలో విజ్ఞులాలోచించండి. 
ఫిబ్రవరి-96 సంచికలో "ఓం శాంతి శాంతి శాంతిః” అన్న శీర్షికన ఒక పేజీకి సరిపోయే రచన చేశారయన. ఆ శీర్షికకూ.... ప్రస్తుతాంశమేమంటే; ప్రజాపతి పెళ్ళాన్ని సృజించుకుని ఆమెను పొంది మనుషుల్ని కన్నాక, వీడేమిటిది? నన్ను పుట్టించి నన్నే పొందుతాడేమిటి? అని ఆమె ఆవుగా మారితే అతడు ఎద్దుగా మారి.... గుర్రంగా మారితే మగగుర్రంగా మారి సంతానాన్ని పుట్టించడాన్ని గురించి డిశంబరు సంచికలో చెప్పుకున్నాం. ప్రజాపతి జంతుసంతానంలో ముచ్చటగా మూడవవాడైన గాడిద ఓంకారానికి ఓంకారం కలిపి ఓండ్ర పెడుతున్నది.... అంటూ నానా చెత్త రాయడానికీ – నా కార్య కారణాలకు నిర్వచనాలు చెప్పండి అనడానికి సంబంధమేమిటో పెద్దలకే పెద్దననుకునే అద్రిగారే చెప్పాలి. 
     అదే సంచికలో "తండ్రీ కొడుకులు-కార్య కారణత" అన్న మరో శీర్షిక తగిలించి ఇవిగో ఈ మాట లుట్టంకించారు. 
1) తండ్రి కొడుకుల మధ్య కార్యకారణాలు వెనక్కు ముందుకూ నడుస్తాయా? అన్నది నా పక్షపు ప్రశ్న కాగా దాన్ని చలోక్తి క్రింద జమ చేశారాయన. అది చాలదన్నట్లు–
అసలు తండ్రి కొడుకుల సంబంధాల్ని కార్యరూపంలో తరచడంలో ఎంత ఔచిత్యమున్నదో పరిశీలించాలి. తండ్రి కొడుకుకు కారణమన్న రోజులు యివికావు. కొడుకు పుడితే పున్నామనరకం తప్పుతుందనుకున్న రోజుల్లో తండ్రి బీజమే పుత్రుడికి కారణమవుతుందనుకున్నందువల్ల, ఆ బీజం నిరంతరాయంగా కొనసాగితే జన్మ కృతార్ధమవుతుందనుకునే ఉద్దేశ్యంతో ఆనాటివారు పుత్రుల్ని పుట్టించుకోడానికి నానాతంటాలు పడినట్లు, భార్యల్ని విధవల్ని సైతం పరపురుషుల వద్ద పండ బెట్టినట్లు చాల పురాణ గాథలున్నాయి. "వీర్యం కుండల్లో పెట్టినా, నీళ్ళలో విడచినా, మనుషులు త్రాగినా, గడ్డిపోచకు తాకినా, ఇసకలో ఇంకినా మనుషులు పుట్టినట్లు........ 
Note:- ఇలా సందర్భంతో పనిలేకుండా ఏదోచోట పుక్కిటి పురాణాల, తాటాకుల్లో పౌరాణికులు ఏదో తీర్చుకున్నారంటూనే వాటినే మాటిమాటికీ నోటి తీట తీరేలా ఉటంకిస్తూ, మానసిక ఊరటను పొందజూచే వీరేమి తీర్చుకో యత్నిస్తున్నట్లే కదా? 
     ఈ 80వ పడిలో పడీ విడివడని అసంతృప్తితో భగవంతుడు అంటే అది కలవాడు 'భగం' అని అర్ధాలు తీస్తూ, అలా నా మిత్రులంటుండే వారంటూ ఒక అతి తెలివిని ప్రదర్శిస్తూ మళ్ళా మర్మాంగాల సంస్మరణ చేస్తున్నారిప్పటికీ. 
మూడు తరహాల మనుషులుంటారన్న ఈయన ఏ తరహా మనిషో ఆ తరహా మనిషిపట్ల విజ్ఞులెలా ప్రవర్తించాలని ఆయనే చెప్పారో గమనించడం , అవసరం.
Note:- పై సంచికలో వీరు విమర్శల పేరున సాగించిన ఆరోపణలు, దూషణలు చేసిన అప వ్యాఖ్యానాలూ, రాసిన వక్రభాష్యాలు.... అందుకుగాను ఆయనెంచుకున్న సాహిత్య శైలి వగై రాలుంటాయి.
 P.S.R గారి విషయం 
మన మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలకు సంబంధించిన భావాల పరంగా ఇప్పటి మీ అవగాహనను వ్రాతమూలకంగా తెలుపండి అని వివేకపథం-1 ద్వారా నేను P.S.R. ను కోరాను. అందుకాయన 4,5,పేజీల సుధీర్ఘ లేఖను నేనడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పకుండగనే ఇతర విషయాలను ప్రస్తావిస్తూ రాయడం, అయ్యా అసలు విషయానికి రండని వివేకపథం-2 ద్వారా కోరడం మీ అందరకు తెలుసు.
ఆయన సుదీర్ఘ లేఖలోని రెండు విషయాల్ని మరలా చెప్పుకోవాలసిన సందర్భం వచ్చిందిప్పుడు, హేతువాది 150 సంచికను బట్టి. 
 వెంకటాద్రి భౌతికవాద పక్షీయులైన ఇతర సోదర సంఘాలతో మాత్రం సౌమనస్యంగా నడచిందెక్కడ అన్న నాభావాల్ని వ్యతిరేకిస్తూ మేమెప్పుడు ఇతర హేతువాద, నాస్తిక సంఘాలతో వివాదపడలేదే అంటూ, వారితో వారికి సత్సంబంధాలుంటాయనడానికి తార్కాణంగా ఈ మధ్య గుత్తా రాధాకృష్ణ గారు వెంకటాద్రిగార్కి 10 వేల రూపాయలు ఉదారంగా విరాళ మివ్వడాన్ని ఉదహరించారు. 
ఆ డబ్బాయన ఏ ఉద్దేశంతో యిచ్చింది రాధాకృష్ణగారి నుండే నేరుగా మాకు తెలిసిందనుకోండి. అసలు విషయం అది కాదు. పై విషయంలో వెంకటాద్రిగారే ఏమన్నారో చూడండి. 
ఆగస్టు - 1996. హేతువాది. 11 పేజీ; హేతువాద సంఘంలో కార్య నిర్వహణ బాధ్యతలు చేపట్టాక (1979 తర్వాత) నాకు మతవాదులతోనూ, మార్క్సిస్టులతోనూ మాత్రమేకాక - “ఇతర హేతువాదులతోనూ నాస్తికులతో సైతం వివాదాలు మరింతగా పెరిగాయి.”
     సురేంద్ర :- అసలు పెద్దాయనే బుద్దిగా నా మాటలు సరైనవేనని, ఆరోపణలు కావనీ ప్రకటిస్తుంటే, మధ్యవారు ఇతరుల విషయమై వకాల్తా పుచ్చుకోనంటూనే వెంకటాద్రిని వెనకేసుకొచ్చేపని నెత్తికెత్తుకోవడంలోని సక్రమాలోచన పాలెంతో రాటు దేలినోళ్ళైనా నీటుగా వివరిస్తే బాగుంటుంది. 
     రాధాకృష్ణగార్ని - వారి సంఘీయుల్ని - హేతువాద ముసుగులో ఉన్నవారనీ, భౌతికవాద ముసుగులో ఉన్నాడనీ, నయా శాంకరులనీ, గోరా గార్ని ప్రచ్ఛన్న వేదాంతి అనీ..... ఇలా ఈసడిస్తూ వెంకటాద్రిగారు గ్రంథాలే రాయగా, P. S. R. గారు మామధ్య అలాంటిదేమిలేదని ఉన్న నిజాన్ని కప్పిపుచ్చడంలోని శాస్త్రీయ దృక్పధం ఏపాటిది? 
     ఈయనగారేమో - నిర్వచనాలక్కరలేదని ఏ హేతువాదీ అనడు, అంటూ ఎలా అంటారండీ అని దీర్ఘాలు తీస్తుంటే, వీరందరికీ పెద్దాయన ఏమంటున్నారో చూడండి.
అందరికీ అర్థమయ్యే మాటలకు నిర్వచనాలవసరంలేదు. (ఫిబ్రవరి 96, పేజీ 37.)
కార్య కారణాలకు నిర్వచనాలు చెప్పమని డిమాండ్ చేస్తూ “సైకిలుకు సైకిలు భాగాలు కారణమా సైకిలు భాగాలకు సైకిలు కారణమా?' అని ప్రశ్నించారు సురేంద్ర. ఓనమాలు ప్రారంభించడానికి ఇష్టపడని హేతువాదులు దానిని కొంటె ప్రశ్నగా భావించారు. సెప్టెంబరు 95 హేతువాది - 20వ పేజీ.)
P. S. R. గారేమో హేతువాది నిర్వచనాలు అక్కరలేదని ఎలా అనగలడు అంటున్నారు. అసలు పెద్దాయనేమో నిర్వచనాలు చెప్పమని నిగ్గదీయడం కొంటెతనంగా ఎంచారు హేతువాదులు అంటున్నారు.
అదే సంచిక - 22 పేజీలో "సైకిలు భాగాలు సైకిలుకూ, సైకిలు సైకిలు భాగాలకూ కారణాలు కావడం అంతర్గత కారణాల క్రిందికే వస్తాయి. కానీ సైకిలు భాగాలు కుప్పగా పోసి ఉంటే దాన్ని సైకిలు అనము. అప్పుడవి సైకిలుకు కారణాలు కావు.” ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ప్రస్తుత అధ్యక్షుడు P. S. R. చెప్పిన ఈ అంశం సురేంద్రగారి మనసుకు ఎక్కలేదు. ఇవి కార్య కారణాలపై నా భావంగా వెంకటాద్రి ప్రకటించిన మాటలు.
ఇప్పుడు చెప్పండి P.S.R. గారూ! కార్యకారణాలపై పై నా భావాలంటున్నవి కార్యకారణ లక్షణాలు మీకు సరిగా తెలియవనుటకు రుజువులు. కావాలంటే ఈ అంశంపై మన మన అవగాహనలను పరీక్షకు పెట్టుకుందాం రండి. అదలా ఉంచండి - నిర్వచనాలక్కరలేదనలేదన్న మీరు యిప్పుడైనా కార్య కారణాలకు, హేతువన్నదానికీ, హేతువాదమన్న దానికీ, తర్కమన్న దానికీ నిర్వచనాలు చెప్పండి ముందుగా. ఆ వివరాలు ఆధారంగా విషయపరిశీలన , చేద్దాం మరోమాట–
అద్రిగార్కి భద్రత చేకూర్చడానికన్నట్లు ఎవరికీ వకాల్తా పుచ్చుకోనంటూనే ఆయనను సమర్ధించేందుకు పూనుకున్నారు కదా? పై సంచికలోనే కార్య కారణాలను వివరిస్తూ 24వ పేజీలో- "సైకిలు కావాలంటే దాని భాగాలు బిగిస్తాం. భాగాలు కావాలంటే సైకిలును ఊడదీస్తాం” అన్నారు. ఆ తరహా అవగాహనను ఒక స్వతంత్రాలోచనాపరుడిగా సమర్ధిస్తారో, తప్పుబట్టారో చెప్పండి ముందు. 
Note :- ఇది వ్రాస్తున్నది సెప్టెంబర్ - 23న. ఇప్పటికీ మీ నుండి లేఖ రాలేదు. ప్రస్తుతానికి సంబంధించని విషయాలు విడచి ఎక్కడ మీ నుండి సమాధానం ఎదుటివారు కోరుతున్నారో అక్కడ, అడిగినదానికి సూటిగా సమాధానం చెప్పండి. అలా అయితేగానీ విషయపరమైన చర్చ సాగదు సజావుగా. 
 వెంకటాద్రికో బహిరంగ లేఖ 
 ప్రధానంగా వెంకటాద్రిగారికీ, ఆయనకు వత్తాసు పలుకుతున్న అనుయాయులు, సహచరులు, అభిమానులు, దురభిమానులు అనే కేటగిరీలల్లో చేరి ఉన్నవారికి ఈ లేఖలోని మొత్తం విషయం వర్తిస్తుంది. 
     వెంకటాద్రి నాపై విసిరిన విసుర్లలో కొన్ని.... 
     1) (అక్టోబర్ 95 హేతువాది) సురేంద్ర 1-1-93 మేలుకొలుపులో కూసిన కూతలు నా ఎదుట కూసిఉంటే అప్పుడే అక్కడే సరిగ్గా వాతలు పెట్టేవాణ్ణి.
2) సురేంద్ర ఢీకొంటున్నదే భావవిప్లవాన్ని.... భ్రమేంద్ర చేస్తున్నదల్లా కొందరు రేపిస్టుల్ని సైతం పోగుచేసుకుని మతంతో తత్వశాస్త్రాన్ని రేప్ చేయించాలని చూస్తున్నారు. అమాయకులు కొందరు ఆ రేప్ ను శృంగారంగా భమపడుతున్నారు.
3) (జనవరి-96 హేతువాది - ఉత్తరాయణంలో) పెద్దాపురం జంటకవులు, వగైరాలలాటి చాలామంది చర్మాలు వలిచి లోగడనే నేను ఎండగట్టాను. 
4) సురేంద్ర అక్షరాలా మతవాది. ఆ విషయం అతని ఎట్టఎదుటే అడిగాను. నా ముందర కుప్పిగంతులు వేయలేడు కదా!
5) మతం వేరు, తత్వం వేరు అనే విషయం సురేంద్ర అవగాహనకు అందని విషయం. అతనికేమీరాదని నాకు తెలుసు.
6) నా రచనల్లో వైరుధ్యాలుంటే గింటే వాటిని కనుక్కోడానికై నా సురేంద్ర సరైన దిశలో ప్రారంభించి కనీసం నాలుగైదు దశాబ్దాల పాటు చదువుకోవాలి. సరైన దిశలో ప్రశ్నలు వేయడమే అతనికి చేత రాదు.
7) అతనివద్ద వంచనాశిల్పం ఉంది. అతనిదొక స్వాప్నిక మానసిక స్థితి. తానొక హర్ష వర్ధనుణ్ణని పేలపిండి కలలు కంటాడు. జల్పాన్ని తర్క మని, తర్కాన్ని హేతువాదమనీ భ్రమపడతాడు.
8) అతను రకరకాల గాలాలు భుజాన వేసుకుని చేదుపక్కెల వేటలో ద్రిమ్మరుతూనే ఉంటాడు. . బుద్ధిమాంద్యంతో, మానసిక వైకల్యంతో ఉన్న వారు కొందరు అతని గాలాలకు చిక్కుతారు. అలా చిక్కినవారిలో ఒకరిద్దరు నాకు తెలుసు. కొంతకాలం క్రితం నానుంచి దూరమై నన్ను సాధించాలనే లక్ష్యంతో మతిచెడగొట్టుకుని ఒకటికి నాలుగైదు మజిలీలు మారి ఇప్పుడు సురేంద్ర పాదాల క్రింద దూరినాయనకూడా ఒకరున్నారు.
9) ఆ సంతలకు నానా గోత్రాలవారూ హాజరవుతున్నారు. గుత్తాగారు కూడా హాజరవుతున్నట్లుంది. ఆయన తన పేరుకుముందు భౌతికహిత అనే ప్రిఫిక్సుతో వ్యవహరిస్తూ నమో బ్రహ్మాదిభ్యోల సంతలో ఎలా యిముడు తున్నారో తెలియదు. ఒకవేళ మాయలఫకీరు ప్రాణం ఏ చిలకలో దాగుందో కీలకం కనుగొనడానికి ఆ సంతలకు హాజరవుతున్నా రేమో... 
10) అతని నిజ స్వరూపాన్ని మీరున్నూ (హజరత్ ఆలీ) గమనించినందుకు సంతోషం. అతను అంత్యదశలో గిలగిల తన్నుకుంటున్నాడనేది మీరు గమనించారా?
11) ఇంకా అతడొక మతోన్మాది, మతపిచ్చోడు, ఓండ్రపెడుతున్నాడు వగైరా వగైరాలెన్నో అన్నాడు, అటు కుర్రకుంకా ఇటు మంచి పెద్దోడు కాని పెద్దాయన.
12) నవ్వులమారి చెణుకుల పేరునో కుర్రకుంక కొన్ని పిల్ల కూతలు కూశాడు. వారి గురువుగారి మార్గాన్నే అనుసరిస్తూ ఆ అద్రిని పెద్దాబోతుని చేసేశాడు కూడా.
13) మరో పెద్ద వెధవ మేలుకొలుపు జోకాయణం పేర్న డోకుల వీరంగం చేశాడు కొద్ది సేపు. అనరాని మాట లెన్నెన్ని అంటున్నా మిన్నకున్నాను ఆయన్ను అమిత్రునిగా భావించకపోవడంవల్లా, ఎంత చెడ్డా సంస్కరణోధ్యమ క్షేత్రంలో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడన్న భావన నా ఆవేశానికి అడ్డు నిలవడంవల్లా. అందుకే మధ్యలో అన్నాను కూడా తెగలాగొద్దు, మనమధ్య వైరం వద్దు, రసాభాస లొద్దు అని, హితవాక్యం తలబిరుసుగాళ్ళ తలల కెలా ఎక్కుతుంది?
ఈ నాటికి ఒక నిర్ణయానికి వచ్చాన్నేను. మా మధ్య సత్సంబంధాలు దాదాపు అసాధ్యమని తేలింది. అతను అంత్యదశలో గిలగిల్లాడుతున్నాడన్న రోజునే అతని మిత్రులతో చెప్పాను. ఇంకా నేను ఆరంభించనే లేదు అంత్య దశంటా డేమిటీ మీ పెద్దాయన బుద్దిగాని సన్నగిల్లిందా? అని నా సహనం అంత్యదశగా కనపడిందన్న మాట. 
నిజానికి అతని పోకడకు తగిన రీతిలో ఇదుగో ఇప్పుడా రంభిస్తున్నాను. సత్తా వుంటే ఎదురొడ్డి నిల్వవచ్చు.
అమిత్రమా ! అద్రీ . ఎంతో భద్రత ఉంది మానవవాదం, భావవిప్లవం ముసుగులో నీ కనుకున్నావు. అమానవికంగా ప్రవర్తిస్తూ మానవవాది వనడం,భావమూలేదు, విప్లవమూలేదు. అంతా కామ ప్రకోపజనిత ఉద్వేగశమనానికై పిచ్చి పురాణపు రాతల్నే మాటిమాటికి ఎత్తి రాసుకుంటూ, అవకాశం వచ్చినపుడల్లా ఉచ్చరించుకుంటూ మానసిక బులపాటాన్ని తీర్చుకునే రీతే ముప్పాతిక మూడొంతుల అంతస్సారంగా కల రచనలు చేసుకుంటూ సాగే నీ కొక స్థాయి కూడానా? ఆ పిచ్చికూతలు భావవిప్లవ సాహిత్యమా?
నీవొక్కడివి తప్ప ఇప్పటికి నా పాత్రోచితిని ప్రశ్నించిన వారుగానీ, నేరుగా సమావేశాల్లో పాల్గొని అతి దగ్గరగా నా పోకడను వీక్షించి (అటు ఆస్తికులలోని భిన్న ధోరణుల వారిలోగానీ, ఇటు ఆస్తికేతరులలోని భిన్న ధోరణుల వారిలో గానీ) నా నిజాయితీని శంకించిన వారుగానీ లేరు.
మరి నీవో నన్నెరిగిందీ లేదు, నాతో ఢీ కొందీలేదు. పిచ్చిబుడంకాయలు, పదిమందిని వెంటేసుకుని పెద్దరికాన్ని సాగించే నీకు ఆ బట్రాజుల మధ్య నున్నంత కాలం లేని పెద్దరికాన్ని - పెద్దరికంలేని తనాన్ని - గుర్తించుకునే అవకాశమే లేదు. 
మొత్తం ఎన్ని పేజీల రచన చేసుంటావు? అందులో పాచిపళ్ళ దాసరిలా లైంగికాంశాల ప్రస్తావన ఎన్నిసార్లు చేసుంటావు. నోరెత్తి మూసే లోపల ఒకసారైనా భూతనకుండా ముగించిందా నీ నాలుక.
మన శాస్త్రీయ దృక్పథమంటావు, మానవత్వమంటావు, సంస్కారమంటావు, సిగ్గుండా లంటావు, సద్విమర్శ అంటావు. ఈ పేర్లన్నంటి వెనక అసభ్య, అశ్లీల, శృంగార, వ్యభిచారాలకు సంబంధించిన ప్రస్తావనలే చేసుకుంటూ బరి తెగించి బజారు భాషతో, గేలిచేస్తూ చౌడప్ప సారస్వత వారసత్వాన్ని అందుకుని అలా ఆడా మగా తేడా వీడి, ఎవర్ని ఎదుర్కొన్న అసలు విషయాన్ని విడిచి పెడ ద్రోవల చిందులేస్తూ పైశాచికానందాన్ని పొందే నిందనీయుడివి నీవు.
అవగాహన పరంగా గానీ, సభ్యతా సంస్కారాల పరంగాగానీ, సౌమనస్యత, మైత్రీ, సామరస్యతల పరంగాగానీ, వ్య క్తిగత ఆచరణ, అలవాట్ల పరంగాగానీ నాకంటే, నే నెరిగిన భిన్న ధోరణులకు చెందిన ఎందరికంటే అధమ స్థాయికి చెందిన వాడివి నీవు.
వాతలు పెడతావా! నేననుకుంటే చర్మం వలవగలను. ఎండగట్టగలను. అందుకే మొదలెట్టాను. నాసత్తా! జ్ఞానపరంగా, పట్టుదల పరంగా, భౌతిక వనరుల (డబ్బు, పరపతుల) పరంగా ఏమిటో నీ వూహ కందనిది. ఎందరో పెద్దల వద్ద బుద్ది గరచినవాణ్ణి గనుక దాని అదుపులో ఇంత కాల మాగాను. చావుంటే రా! ఏ రకంగా ఢీ కొందామన్నా నేను రెడీ. 
     1. వివేకవంతంగా అనుకోవలసివస్తే :- జ్ఞానపరంగా - (విషయ పరంగా) ఎదురుపడదాం రా. వేదిక నేనేర్పాటు చేస్తాను. వ్యయాన్ని భరిస్తాను. సుద్దులు చెప్పగల పెద్దల్ని నలుగుర్ని కూచుండ బెట్టుకుని భావ విప్లవానికవసరమైన అంశాలపై చర్చ సాగిద్దాం. నాలో అసమంజసతగానీ, అవగాహనా లోపంగానీ, తప్పుజ్ఞానాన్ని ప్రచారం చేసే వైఖరిగానీ, దురహంకారంగానీ, ఉన్నాయని మధ్యనున్న పెద్దలు తేల్చితే నీ అభీష్టం మేర నిజంగానే నీచేత వాతలు పెట్టించుకుంటా. అలా జరిగినట్లు నా పత్రికలో నిస్సంకోచంగా ప్రకటిస్తా, మరింత కాలం నీవద్ద విద్యనభ్యసిస్తా. 
మరి నీపోకడలో పై అవలక్షణాలున్నట్లు తేలితే చేసిన నీ వికార చేష్టలకు ఆడిన బోడిమాటలకు, గతంలో ఎందరిపట్లో నీ ఎకసక్కపు నికృష్టపోకడలకు ఫలితంగా నీవేమి చేయబడడానికి సిద్ధపడతావు. ఒకటా, అరా! ఎన్ని కూతలు కూశావు నోటికొచ్చినట్లు. వాచాలత కూడా శూరత్వమేనా?, దానికో పెద్దరికం కావాలా? దైర్యం కావాలా? 
బహిరంగ వేదిక పై నీ నా అవగాహన - అచరణ, వ్య క్తిత్వము అన్న అంశాలాధారంగా రుజువులతో కూడిన విచారణ సాగిద్దాం. చావుంటే సిద్ధపడు. 
ఏనాడో నాకంత్యదశ వచ్చిందన్నావు. కుర్రకుంకా, మంచి పెద్ద కానోడా! మిగిలిన పెద్దల్లో చేరినోడా, అమిత్ర దృష్టితో నేనారంభించి వేసిన తొలితాపిది కాచుకో. 
ఆయా రచనల ద్వారా - భావ విప్లవం పేరన-నీవెలగబెట్టిన నైచ్యాన్ని, సృష్టించిన క్షుద్రసాహిత్యాన్ని ఒక్కొక్కదాన్ని ఎత్తిచూపుతూ ముందుకు రాబోతోంది వివేకపథం. నిలబడి సత్తా చూపు. యుద్దారంభ సంరంభంలో
 నీ అమిత్రుడు 
 సురేంద్ర. 

వెంకటాద్రి వెల్లడించిన భావవైఖరుల గంజాయివనంలో తప్ప జారి కొన్ని మాత్రం తులసి మొక్కలు మొలిచాయి అనడం ఆయన భావవైఖరుల తులసి వనంలో పొరపాటున కొన్ని గంజాయి మొక్కలు మెలిచాయనడంకంటే - తులనాత్మక నమీక్ష అవుతుంది. సమాజంలో ఎవరితో సామరస్యాన్ని నడిపారీయన.
 1. మరొక్కమాట, కళలపై ఒక చర్చావేదిక నేర్పాటు చేస్తాను. పాల్గొనగలరా? 
 2. మీ ఇష్టం వచ్చిన ఒక తాత్వికాంశంపై చర్చ ఏర్పాటు చేయ మంటే చేస్తాను! పాల్గొనగలరా? 
 3. సమాజాన్ని అత్యధికంగా అజ్ఞానంలో ముంచిందని మీరనుకుంటున్న కర్మ సిద్ధాంతం పై వేదిక నేర్పాటు చేశాను. ఆ పక్షంవాళ్ళకు పృచ్ఛకులు స్వేచ్చావంతులని ముందే చెప్పాను. దానిలో పాల్గొనగలరా? 
 4. నవ్య మానవవాదం పై చర్చావేదిక నేర్పాటు చేస్తాను. పాల్గొనగలరా?
 5. నీవు రాసిన అరువు సిద్ధాంతాల రచనలపై చర్చ పెడతాను. సిద్ధ పడగలరా?
 Note : (1) అక్టోబర్, 26, 27, 28 తేదీల్లో B. H. E. L.లో జరిగే చారిత్రాత్మకమైన చర్చావేదిక పై ప్రతిపక్షంలో కూర్చోగలిగే స్థాయిగానీ, యోగ్యత గానీ, ఉంటే ఇదే ఆహ్వానంగా స్వీకరించి రావచ్చు. సమాజంలో నీవజ్ఞానమనుకుంటున్న దాన్ని ప్రచారం చేస్తున్నవారి నెదుర్కోడానికి ఇదొక పెద్ద అవకాశంకూడా కదా? 
 (2 ) ఆ సదస్సుకు వస్తే మాత్రం ఆ మూడు రోజులూ, మనమధ్య నున్న వ్య క్తిగతాం శాల, పరిస్థితుల ప్రభావం 1 శాతం కూడా మీమీద పడనీయను. ఆ సమావేశం వరకు మీరు మా కథిదులు. రాగలిగితేరండి. మనమధ్య రగడలేదు, సమాజపరమైన కార్యక్రమంలో మన పాత్రలు ప్రవర్తించవలసిన తీరువేరు.
 సత్యాన్వేషణలో 
 సురేంద్ర




అద్వైత సిద్ధాంతము - ఒక పరిశీలన - 5
     త్రివిధ సత్తాలు :- వ్యావహారిక సత్తా గురించి గత నెలలో క్లుప్తంగా వివరించాను. విచారణంతా వ్యావహారిక సత్తా పై ఆధారపడేనన్నది ఒక నిష్ఠూర సత్యం. అయితే అద్వైతుల్లో చాలా మందికి ఈ అంశం తెలియవలసినంత స్పష్టంగా తెలుసా అన్నది సందేహమే.
పారమార్ధిక-వ్యావహారిక-ప్రాతిభాసిక సత్తాలలో మధ్యసత్తానే వాస్తవంగా, వాస్తవమనడానికి వీలుగా ఉన్న సత్తాదానికి పై స్థాయిలోనిది పారమార్థిక సత్తా కాగా, దిగువస్థాయికి చెందింది ప్రాతిభాసికసత్తా. పరిగెత్తకుండా నిదానించి ఆ ధోరణివారీ పారిభాషిక పదాల్ని ఏ అవగాహన నుండి వాడారో కూడా అర్థం చేసుకోవడం అధ్యయనపరుల కర్తవ్యం.
మన జ్ఞానేంద్రియ వ్యవస్థ పనిచేయడం ఆరంభించినప్పటి నుండి పని విరమించేటంత వరకు ఏవేవి మన కనుభవంలోకి వస్తూ స్థల కాలాల్లో వాటి ఉనికి అవి కలిగి ఉంటున్నాయో అవన్నీ వ్యావహారికసత్తా కలిగిన విషయాలు (అర్థాలు, ప్రమేయాలు) అవుతాయన్నమాట. 
తరువాత ఆలోచించడానికీ, అర్ధం చేసుకోడానికి వీలైందీ, అద్వైతుల సిద్ధాంత స్థాపనకు ఆధారభూతమైందీ ప్రాతిభాసిక సత్తా. మన అనుభవంలోనికి ఏది ఉనికి గలిగి ఉన్నట్లు వస్తున్నదో, నిజానికా కాలంలో, ఆ స్థలంలో లేదో, అది ప్రాతిభాసిక సత్తా. అయితే లేకనే ఉన్నట్లు అనుభవానికొచ్చే, అనిపించే ఇది మరొకదాని ఆధారంతోటే తానున్నట్లు తోపింపజేస్తుంది. ప్రాతిభాసికసత్తా అన్నది వ్యావహారికసత్తా కలిగిన వాస్తవాలని చెప్పుకునేవాటి పై ఆరోపితమై అనుభూతికొస్తుంది. దీనినే భ్రాంతి, భ్రమ అంటారు. లేని దీనిని సత్తా ఎందుకన్నావు అన్నదో చిన్న ప్రశ్న. ప్రాతిభాసిక సత్తా నెరిగినవారు అది లేనిది అనరాదు - దానిలోనిది లేనిది అనాలి అంటారు. భ్రమ సత్యమే. భ్రమలోనిది అసత్యం అనన్నమాట. మాటలగారడీగా దీనిని కొట్టివేసేవారుంటే ఉండచ్చుగానీ, కొట్టేసేవారికంటే, అట్టి పెట్టుకునేవారి అవగాహనే అనుభవాన్ని బట్టి గట్టిదనాల్సి వస్తుంది. ఎలాగంటే. 
ఈనాటి, ఏనాటి సమాజాన్నైనా క్షుణ్ణంగా పరిశీలిస్తే సమాజంలో ఎక్కువ భాగాన్ని తప్పుడు భావాలు ఎన్నో, ఎంతో నడిపిస్తున్నట్లు రుజువులు దొరుకుతాయి. ఎలా త్రాడును పామనుకుని భయకంపితుడవడం చెమటలు పోయడం, పరిగెత్తడం, ధైర్యముంటే కర్రతో కొట్టబోవడం వగై రా పనులన్నీ నిజానికి పాము లేకున్న ఉన్నదనుకోవడం వల్ల ప్రతిచర్యగా చేసిన పనులే. లేనిదే అయినా ఉందనిపించి ఏర్పడ్డ పాము భావన ఎంత పని చేయించిందో చూస్తే ఆ భ్రాంతికి సత్తా ఉందో లేదో అర్థమవుతుంది. ఇలాటి భ్రమలను ఎన్నింటినో పేర్కొనవచ్చు. ప్రధానంగా చెప్పుకుంటే మతపర భావాలలో పెక్కు విలాటివే. ఉదా:-క్రైస్తవుల స్వర్గ నరకాలు, హిందువుల స్వర్గ నరకాలు, కమ్యూనిస్టుల సమసమాజము వగైరాలు. 
(నోట్:- - ఒక్కో విషయాన్ని నేనిలా విశ్లేషించుకుంటూ పోతుంటే చివరికి అద్వైతం తప్పని చెప్పదలచుకున్నా డా, ఒప్పని తేల్చ దలచినట్లా అంటూ ఆలోచించుకుంటూ చెపుతున్న విషయాన్ని ఆ సమాధానాల్ని బట్టి ఒప్పుకోవడమో, నప్పలేదనడమో చేద్దామను కుంటే ఇక ఉన్న దాన్ని చూడడం అసాధ్యం . కనుక చివరి కేమవుద్దో అనుకోక చెపుతున్న విషయాలు అనుభవంలో అలానే ఉన్నయో లేదో చూసుకుంటూ సాగించండి అధ్యయనం. సత్యజ్ఞానార్జనకు అదొక్కటే సరై న విధానం.)
మొత్తంమ్మీద ఏమని తేలినట్లు!? నిజానికది లేనిదే అయినా, ఉన్నట్లు తెలీకున్నా, తేలకున్న ఉందన్న భావము మనిషినెంతో పనిచేయిస్తోంది. అంటే క్రియాకారి అవుతోందన్న మాట. కనకనే భ్రమకు సత్తా - క్రియాశక్తి లేక ఉనికి ఉందనడం. ఇదే అద్వైతుల్లోని ప్రాతిభాసిక సత్తారూపం. అది వస్తువుగా బైట ఉందని, దానర్థం కాదు. అట్టిది ఉందన్న అనుభవం కలగడం ద్వారా మనిషిని ఆ అనుభూతి కనుగుణ్యంగా ప్రయత్న పరుణ్ణి చేస్తోందన్న మాట. ఆ విధంగా అది సత్ - ఉన్నది - అయ్యింది
నిత్యజీవితంలో మనం వాస్తవమంటున్నది మనచేత ఏ రకమైన పనులు చేయిస్తున్నదో, అవాస్తవమంటున్నది కూడా ఆ విషయం తెలీనంత కాలం వాస్తవమైంది చేయిస్తున్నట్లే చేయించగలంత పనీ చేయిస్తోంది.
 ఈ పోలికే అద్వైత సిద్ధాంత నిరూపణకు ఆయువు పట్టు. భ్రాంతిలోనిది (భ్రాంతికాదు) నిజానికి లేనిదే అయినా ఉన్నదాని మాదిరే మనని నడిపించేస్తుంటే (ఆడిం చేస్తుంటే అంటే మరింత బాగుంటుంది) దానికి ఉనికి లేదనడం ఎలా? అన్న తర్కాన్నెత్తుకుని మనచే అవును అదీ సత్తా కలదే అని మనచేత అనిపించి ఎంత సత్తా కలదైనా, మనని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నా నిజానికి చెప్పుకోవాలంటే, ఒప్పుకోవాలంటే అది లేనిదనే గదా అని తిరగ దీసి మరో దెబ్బవేస్తాడు అద్వైత తార్కికుడు. దెబ్బవేయడమే కాదు మన చేత - బ్రతుకులో అది అలాగే ఉండడం, నిజాన్నంగీకరించాలన్న బుద్ధి మనిషికుండడంచేత-అవును నిజంగా లేనిదే ఇంత పని చేయించింది సుమా అని అనిపిస్తాడు. ఇంత వరకు అంగీకరించక తప్పని పరిస్థితిని ఏర్పరచి ఆ పై తన అసలు విషయాన్ని ప్రతిపాదించి నిలబెట్టడానికి పూనుకుంటాడు.
ఇక్కడో ముఖ్య విషయం. ఈ సిద్ధాంతాన్ని పరిశీలిస్తున్నంత కాలం గుర్తులో ఉంచుకోవాల్సి ఉంటుంది. శంకరుని ప్రకారం సత్తా వేరు - సత్యం వేరు. పారమార్థిక సత్తా అన్న దొక్కటే సత్యమనడానికి తగిన యోగ్యత కలిగి ఉంది. మిగిలిన రెండూ మనచే పని చేయిస్తున్నాయి. క్రియా సామర్థ్యం కలిగున్నాయి కనుక ఉన్న వంటున్నామే గాని అంటే అనుభవ రూపంలో మాత్రమే వాటి సత్తాగాని, అనుభవాన్ని పొంది గమనించే మనం లేకుంటే ఆ రూపంలో వాటి ఉనికిగానీ, క్రియా సామర్థ్యంగానీ ఉండదు.
ఏమయ్యా! మన చేత యిన్ని తంటాలుపడేట్లు చేసిన పాము ఉందన్న భ్రాంతి కాలంలోగానీ అంతకు ముందుగానీ, భ్రాంతి తొలగిన పిదపగానీ నిజాని కక్కడ పాము లేనిదే కదా! అలాగే పాము అన్న భ్రమ కలగడానికి ఆధారంగా ఉన్న త్రాడు నీకు తెలియబడినా, తెలియకున్నా మూడు కాలాల్లో దాని ఉనికికి ప్రమాదం ఏమిరాలేదు కదా! అంటే నీకు తాడు కనబడ్డా-కనబడకున్నా ఉన్నది తాడే. పాము కనబడ్డా, నానా తిప్పలు పెట్టినా, చివరికి లేనిదేనని తేలినా- అది ఉందనుకున్నప్పుడూ లేనిదే. లేదనుకున్నప్పుడూ లేనిదే నిజానికి ఎప్పుడూ లేనిదే. అవునా, కాదా అనడిగి అవుననిపించడమే అద్వైత తగ్కంలోని పరమార్థం. ఈ తరహా విచారణ పద్ధతినే అధ్యారోప అపవాద న్యాయం అంటారు.
ఇక పారమార్థిక సత్తాగా పేర్కొని నిజాని కసలున్నది వస్తు తంత్రం సత్యం అని దేనిని అద్వైతులు చెప్పదలచుకున్నారో అది వ్యావహారిక-ప్రాతి భాసిక సత్తాలలోని విషయాల లాగా మన అనుభవంలోనికి ఎప్పటికీ రాదు. అది అప్రమేయం, అతీంద్రియం, ఇదీ అద్వైత వాదనలో ఉన్న మరో ప్రధాన విషయం. ఇప్పటికాగుదాం.
తాత్విక ధోరణుల్ని క్షుణ్ణంగా విచారించి, అవగాహించదలచుకున్నవాడు ఆధోరణికి ప్రాతిపదికలన్నిటిని సంపూర్ణంగా జీర్ణించుకోవలసి ఉంటుంది. లేకుంటే చిట్టచివరిలో మనం తేల్చాలనుకునే సబబు, బేసబబుల విషయంలో పొరబడే ప్రమాదం నెత్తిమీదకొచ్చి కూచుంటుంది.
నోట్ : అద్వైతాభిమానులు, వేత్తలూ, తద్వతి రేకులూ, వేత్తలు ఈ నా భావాలు ఆ సిద్ధాంతాన్ని యధాతథంగా చూపెడుతున్నాయో లేదో నిష్కర్షగా తెలియజేయండి. ఎందుకంటే, ముందుగా అదంటే ఏమిటో నిర్థారించుకున్నాకనే దానిలోని దోషాదోషాలు, బలాబలాలు నిర్ధారించడం సాధ్యం కనుక. ఉంటాను. సెలవ్. 
సత్యాన్వేషణలో.... 
 మీ సురేంద్ర.


No comments:

Post a Comment