Monday, January 16, 2023

267 వివేకపథం సంచిక

వివేకపథం

సంపుటి: 8 సంచిక:9 జనవరి 2023

 2024 ఎన్నికలు

రాజకీయ సమీకరణాలు - ఒక విశ్లేషణ

ప్రజాస్వామ్యం దాని సరైన అర్థంలో ఆచరణలోకి రాకపోవడానికి గల కారణాలలో (అడ్డంకులలో) ప్రధానమైనది ప్రజలు తమను పాలించడానికి మరొకరు ఎవరో రావాలని గాఢంగా భావిస్తుండడమే. ఈ నా మాటలు మరొక్కసారి జాగ్రత్తగా పట్టి చూడండి. దీనికి రెండో పార్శ్యం, ఆయా సంఘాలు, సంఘాల నాయకులు కూడా ప్రజల అభిమతానికి అనుగుణంగా, తమకు అవకాశం ఇవ్వండి, తమ నాయకత్వాన్ని బలపరచండి, మీకొరకు మిమ్ములను పాలించే పని చేస్తాము అన్న వైఖరిని కలిగి ఉండడం. అర్థమవుతోందా? ప్రజలు తమను పాలించేవారు రావాలనుకుంటున్నారు. ఇదిగో మేమున్నాం మిమ్ములను పాలించడానికి అని రాజకీయ పార్టీలూ, రాజకీయులు అంటున్నారు. అందుకనే ఈ రెండు ధోరణుల వారి మధ్య ఈ విషయంలో ఘర్షణ లేకుండా పోయింది.

ఈ దేశంలో, ఇంకా సరిగా చెప్పాలంటే ఏ దేశంలోనైనా; ప్రజాస్వామ్యం పూర్తిగా ఆచరణలోకి రాకపోవడానికి, ప్రజలు తమను తామే పరిపాలించుకోవాలి అనుకోకపోవడం, యజమానులం తామేనన్న వైఖరిని చేతలలో చూపించలేకపోవడం, ఒక కారణం కాగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు గానీ, నిర్వహణ విభాగంలో నియమితులైన అధికారులు గానీ, సాధారణ ఉద్యోగులతో సహా ప్రజలే యజమానులు- తామంతా వారి సేవల కొరకు నియమింపబడ్డవారమే నన్న వైఖరిని ఆచరణలో చూపకపోవడం మరో కారణం. ప్రజాస్వామ్యపు అంతస్సారాన్ని గురించిన లోతైన అవగాహన లేనివారికి ఈ విషయం అంతగా అర్థం కాదు. కొందరికి అర్థమైందనుకున్నా, దీనికి ఎంత ప్రాధాన్యత నివ్వాల్సి ఉంటుందన్న దగ్గర అంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడమూ జరుగుతుంటుంది. కేవలం మూలంలో ఉన్న ఈ కారణాలవల్లే ప్రజాస్వామ్యం అనుకున్న రీతిలో ఆచరణలోకి రావడం లేదు.

భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నిర్మాణ సభలోనే, రాజ్యాంగ శుద్ధ ప్రతిని సిద్ధం చేసి, సభకు అందించే సందర్భంలోనే, రాజ్యాంగ రూపకల్పనలో కీలకమైన పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆందోళన పడుతూ, సందేహాన్ని వెలిబుచ్చుతూ అన్నమాటలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. (పూర్తి వివరాలకు 25.11.1949 న రాజ్యాంగ సభలో అంబేద్కర్ ప్రసంగాన్ని చూడండి) ఆనాటి ప్రసంగంలో ముగింపు వాక్యాలుగా డా॥ అంబేద్కర్ ఇలా అన్నారు.

“ఇంకా ఎక్కువ సేపు మాట్లాడి మీకు విసుగు కలిగించ దలచుకోలేదు. స్వాతంత్ర్యం అనేది, నిస్సందేహంగా ఒక సంతోషకర విషయం కానీ ఈ స్వాతంత్ర్యం మన పైన, పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టిందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఏదైనా మనకు చెడు జరిగితే దానికి ఆంగ్లేయులు (ఇతరులే బాధ్యులు అని నిందించే అవకాశం ఇక మనకు లేదు. ఇకమీదట ఏదైనా చెడు జరిగితే మనల్ని మనం తప్ప మరెవరిని నిందించలేము. కొన్ని విషయాలు చెడును కలిగించే పెద్ద ప్రమాదం ఉంది. కాలం త్వరగా మారిపోతూ ఉంది. మనతో పాటు ప్రజలు క్రొత్త సిద్ధాంతాల వైపు కదులుతున్నారు. వారు ప్రజల చేత నడుపబడే ప్రభుత్వము అంటే విసుగు చెందుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అది ప్రజల యొక్క, ప్రజల చేత నడుపబడే ప్రభుత్వమా ? కాదా ? పట్టించుకోవడం లేదు. (మేమైతే) ఈ రాజ్యాంగంలో ప్రజల యొక్క ప్రజల కొరకు, ప్రజల చేత నడపబడే ప్రభుత్వ సూత్రాన్ని పొందుపరచడానికి ప్రయత్నించాము. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, మనం ఈ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించడంలో, అలసించ కూడదు. అలా అలసించినట్లయితే, ప్రజల చేత నడుపబడే ప్రభుత్వానికి బదులుగా, ప్రజల కొరకు ప్రభుత్వాన్ని వీరు కోరుకునేలా చేస్తుంది. ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి తీసుకోవలసిన చొరవలో మనం ఎంత మాత్రం బలహీనంగా ఉండరాదు. దేశానికి సేవ చేసే మార్గం ఇది ఒకటే. ఇంతకుమించినది నాకు కానరావడం లేదు.”

ప్రజాస్వామ్య వాదులారా! మీరు గాని నామమాత్రపు ప్రజాస్వామ్యవాదులు కాకుండా, నిజమైన, నిజాయితీ కలిగిన ప్రజాస్వామ్యవాదులైతే, డాక్టర్ అంబేద్కర్ తన ప్రసంగంలో ఆఖరి మాటగా ఏమి చెప్పి ఈ విషయాలలో అలసత్వం (తాత్సారం) కూడదన్నారో, ఏ విషయంలో ఇదొక్కటే చేయదగింది, దేశ సేవ చేయడంలో ఇంతకంటే మించినది మరొకటి తనకు కానరావడంలేదన్నాడో, ఆ విషయం పట్ల ముందుగా స్పష్టతను కలిగించుకోండి.

భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించింది, ప్రజల కొరకు, ప్రజల చేత నడుపబడే ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే. ప్రజల చేత నడుపబడని, కొందరు నాయకుల చేత నడుపబడే ప్రభుత్వాన్ని కానే కాదు. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలను చాలా శ్రద్ధ పెట్టి పరిశీలించాల్సి ఉంది. 1) ప్రభుత్వం ప్రజల కొరకే ఏర్పడాలి. 2) అది ప్రజల ప్రభుత్వం అనడానికి తగిందై ఉండాలి. 3) ఆ ప్రభుత్వం ప్రజల చేతనే నడుపబడుతుండాలి. ఇది రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించిన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రజల చేత నడపబడుతుండడం అంటే ఏమిటన్న దగ్గరే ప్రజాస్వామ్యపు ఆయువంతా ఇమిడి ఉంది. ఏర్పడ్డ ప్రభుత్వ పాలనంతా ప్రజల కళ్ళ ముందుండాలి. ఆ పాలనలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటూ, నిర్ణయాలు తీసుకునే, అవి అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించుకునే స్థానంలో ఉండగలగాలి. ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రజల చేత పాలింపబడుతుండాలంటే ఇదే అర్థము. ఈ అర్థానికి వేరుగా మరే అర్థాన్ని ఆ మాటలను సాగదీసీ, ముడచబెట్టీ వాటి నెత్తిన పెట్టరాదు.

'కళ్ళ ముందు పాలన, పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యము' ఇదే ప్రజల చేత నడుపబడే ప్రభుత్వం అంటే అర్థం. ఇది అమలు కావడానికి అధికార వికేంద్రీకరణ జరగడం, స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ అమలులోకి రావడం, అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతలు అన్నవి ఎక్కడికక్కడ విభజింపబడడం వినా మరో దారి లేదు. దేశ సేవ చేసుకోడానికి ఇంతకుమించిన మార్గం నాకు కానరావడం లేదని డాక్టర్ అంబేద్కర్ అన్నది, ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చుకోడానికి ఎలాంటి తాత్సరం చేయకుండా ప్రయత్నించాలన్నదే.

కేంద్రీకృత అధికారాన్ని వదులుకొని, ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల చేతికి అధికారాల నప్పగించినప్పుడే ఆ ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రభుత్వాలనబడతాయి. ఆ ప్రభుత్వాలు కూడా, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంలోనే తమ పాలనను కొనసాగించినప్పుడే ప్రజల చేత నడుపబడే పభుత్వాలనడానికి తగినవవుతాయి.

కానీ ఈనాడు జరుగుతున్నదేమిటి?

1) ప్రజలు తమనుపాలించే గొప్ప నాయకుడు రావాలి, కావాలి అనుకుంటున్నారు.

2) అందుకు తగ్గట్టే పార్టీలు, పార్టీ నాయకులు కూడా తమకు పట్టం కడితే, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలు ఈడేరేలా వారిని పాలిస్తామని మహారాజులల్లే వాగ్దానాలు, వరాలు కురిపిస్తున్నారు. ఏది జరగకుండా చూసుకోవడమే అసలైన దేశసేవ అవుతుందని డాక్టర్ అంబేద్కర్ భావించాడో, ఆ జరగకూడంది మాత్రం బలంగా జరుగుతూ వస్తోందీనాటికీ. జరగకుండా చూసుకోవడమే, అదీ ఏమాత్రం అలసత్వం లేకుండా చూసుకోవడమే దేశ సేవ అవుతుందన్నాడో, ఆ రకమైన దేశసేవ మాత్రం సరిపడినంత బలంగా సాగడమే లేదు. గడచిన ఏడు దశాబ్దాల పైబడిన కాలంలో అడపా దడపా ఒకటీ, అరా అలాంటి యత్నాలు జరిగినా అవన్నీ ప్రజా చైతన్యం కారణంగా కాక, ఒకరిద్దరు వ్యక్తుల పైనున్న విశ్వాసం కారణంగా, ఆ వ్యక్తుల ప్రతిభాపాటవాల కారణంగా మాత్రమే జరిగాయి. కనుకనే అవేవీ ఆ వ్యక్తుల అనంతరం గానీ, ఆ వ్యక్తులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం వలన గానీ, నిలదొక్కుకోలేక పోయాయి. అలాంటి ప్రయత్నాలలో పాలుపంచుకున్న నాయకులలో కూడా ‘ప్రజాస్వామ్యము ప్రజాసంక్షేమము' అన్నవాటికంటే తమ తమ స్థానాలను నిలుపుకోవడం అన్నదానికే ప్రాధాన్యత ఉండాలనుకునే లక్షణం నెలకొని ఉండడంతో, ఐక్య కార్యాచరణలన్నీ కడకు అనైక్యత కారణంగానే విఫలమవుతూ వచ్చాయి.

అదంతా గతం. ప్రస్తుత పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. ఆనాటి రాజకీయులలోనూ అనైక్యత అనే వేరు పురుగు ఉన్నా, కొన్ని విలువలు పాటింపబడుతుండేవి. ఈనాటి రాజకీయాలలో విలువల గురించి మాట్లాడితే వింతగా చూసే పరిస్థితి నెలకొని ఉంది. ఎత్తుగడలు, కుటిల పన్నాగాలతో, ఎలాగోలా అనుకున్నది సాధించుకున్న వాడే సమర్ధుడు అన్న భావన సర్వత్రా నెలకొని ఉంది. ప్రజలలో కూడా రాజకీయాల పట్ల విశ్వసనీయత అన్నది తొలగిపోయింది. ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. ఎవరి లాభాలు వాళ్లవి అన్నంత వరకు ఓటర్లలో స్పష్టత ఉంది. ఆయా పార్టీలకు గానీ, గుంపు నాయకులకు గానీ కొమ్ము కాయడం కూడా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకోవడంలో భాగంగానే జరుగుతున్నాయి. ఇంతవరకు ఇదంతా అందరికీ తెలిసున్నదే, బహిరంగ రహస్యమే.

సామాజిక మాధ్యమాలు, అందునా ఎలక్ట్రానిక్ మీడియా అడ్డూ ఆపూ, పద్ధతీ పాడూ లేకుండా చెలరేగిపోతున్న ఈ తరుణంలో, అటో ఇటో ఎటో ఒక వైపుకు వంగి ఉన్న రాజకీయ విశ్లేషకుల పోకడలూ విపరీతంగానే ఉంటున్నాయి. ఒక ఛానల్ చూస్తే మనకు కలిగే అభిప్రాయం మరో ఛానల్ను చూస్తున్న వారికి కలిగే అభిప్రాయాలతో ఎక్కడా సరిపోలడం లేదు. ప్రజలు కూడా ఛానల్స్ వాస్తవాలు చెబుతున్నాయని అనుకోవడం మానేశారు తటస్థంగా ఉన్న జనం ఎవడి సొద వాడిది అనుకుంటుండగా, అటో ఇటో వంగి ఉన్న జనమైతే తమది అనుకున్న ఛానళ్లు చెప్పేవన్నీ పచ్చి నిజాలనీ, అవతలి వాళ్ళ ఛానల్ చెప్పేవన్నీ అభూతకల్పనలేననీ, అనుకోవడం, అనడం సాగిస్తున్నారు. జరుగుతున్నది ఏమిటో కనుక్కోవడం ఏదో ఒక ఛానల్ ను చూడటం ద్వారా అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం అన్న పరిస్థితి నెలకొని ఉంది. కనుక రాజకీయ పార్టీలకు సంబంధించి రెండు మూడు సాధారణ అంశాలను చెప్పి 2024 ఎన్నికల గురించి ఒక ప్రజాస్వామ్యవాదిగా కొంత విశ్లేషణ చేస్తాను.

1) దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ ఒక్కటంటే ఒక్కటి లేదు. పార్టీలలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు.

2) ఏక నాయక స్వామ్యమే ప్రధానంగా (ఎక్కువలో ఎక్కువగా) నెలకుని ఉంది. అయితే గియితే, ఆ ఏక నాయకునికి అతి కొద్ది మంది అంతరంగికులుండి, కొంతమేర ఆ సుప్రీమ్, ఆ బృందపు సలహాలను, సూచనలను, అభ్యర్థనలను పట్టించుకుంటూ పాలన సాగించడం వరకు జరుగుతుండవచ్చు.

 3) పెద్ద విషాదమేమంటే, ఈమధ్య అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ కూడా ప్రతిపక్షం లేని, పేరుకు ఉందనుకున్నా మాటా పలుకుకు తావులేని విధంగా అధికార పార్టీల ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఏక నాయక స్వామ్యము, ఏక పార్టీస్వామ్యము అమలవుతుందన్నమాట.

డాక్టర్ అంబేద్కర్ 73 ఏళ్ల నాడే ఈ పరిస్థితిని ఊహించి ఎంతో ఆందోళన పడ్డాడు. ప్రజాస్వామ్యం పేరున ఈ దేశంలో నియంతృత్వమే అమలవుతుందేమోనన్నదే ఆయన ఆందోళన, తానలా భయపడడానికి ఆయన చూపిన కారణం, భక్తీ, వీరపూజ, వ్యక్తారాధన ఈ దేశంలో చాలా బలంగా ఉంటుందన్నదే. ఆ వివరాలు ఆయన మాటల్లోనే వినండి.

“ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆసక్తి కలవారందరికీ జాన్ స్టువర్టు ఇలా హెచ్చరిక చేశాడు. వ్యక్తులు తమ స్వాతంత్ర్యాన్ని ఏ గొప్ప మనిషి పాదాల వద్దా సమర్పించకూడదు. తమ సంస్థలన్నింటినీ తిరగబెట్టే అధికారాలను అతనికి ఇవ్వకూడదు. దేశానికి జీవితాంతం సేవలు చేసిన మహా పురుషులకు సైతం కృతజ్ఞులమై ఉండడంలో తప్పులేదు గానీ, ఆ కృతజ్ఞత చూపడానికీ కొన్ని హద్దులు ఉన్నాయి. ఐరిష్ దేశభక్తుడు డేనియర్ - ఓ-కాన్నెల్ 

చెప్పినట్లుగా, ఏ వ్యక్తీ తన ఆత్మ గౌరవానికి భంగం కలిగేంతగా కృతజ్ఞుడుగా ఉండక్కరలేదు. తన శీలానికి భంగం కలిగే అంతగా ఏ స్త్రీ కృతజ్ఞురాలుగా ఉండక్కరలేదు. అలాగే ఒక దేశం తన స్వాతంత్ర్యానికి భంగం కలిగేంతగా మరో దేశానికి కృతజ్ఞత చూపనక్కరలేదు”.

గమనిక : డాక్టర్ అంబేద్కర్ తాను చెప్పదలుచుకున్న మాటలకు ఉపబలకంగా ఉండడానికని పై మాటలు ఉటంకించి, తిరిగి తన మాటలుగా ఏమంటున్నాడో చూడండి. 

"ఈ హెచ్చరిక ఇతర దేశాల విషయంలో కంటే, మన దేశం విషయంలో చాలా అవసరమైంది. ఎందుకంటే, ఇండియాలో భక్తి లేదా భక్తి భావం, లేదా వీరపూజ రాజకీయాలలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలలో అది పోషించే పాత్ర కంటే, మనదేశంలో పోషించే పాత్ర చాలా ఎక్కువ. మత విషయాలలో భక్తి, ఆత్మ విముక్తికి ఒక మార్గం కావచ్చునేమో గాని, రాజకీయాలలో భక్తీ లేక వీరపూజ, దివాళాకోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికీ సూటిదారి అవుతుంది.”

నిస్పాక్షిక దృష్టీ, సమాజ హితకాంక్షా ప్రజాస్వామ్యంపై మక్కువ గల వారి కొరకే నేనీ " వ్యాసం సిద్ధం చేశాను. డాక్టర్ అంబేద్కర్ వెల్లడించిన పై భావాలను ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాలకూ, వాటితో సంబంధం ఉన్న కేంద్రానికీ అన్వయించి చూపే ప్రయత్నం చేస్తాను.

1) కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పిన బి.జె.పి లో, మోదీ భక్తీ, వీర పూజ అన్న రెండూ హద్దులు లేకుండా నడుస్తున్నాయి. అతని అనుంగు అనుచరునిగా అమిత్ షా గారు ప్రసిద్ధులైనారు. మహా ఉంటే గింటే మరికొద్ది మంది వారి ఇరువురికి అంతరంగికులు ఉండవచ్చు గాక. పరిపాలన మాత్రం ఖరాఖండీగా చక్రవర్తి పాలనే. పాలనలో గాని పార్టీలో గాని ఆయన మాటే శాసనం. 'మోదీ, షా ద్వయం' అన్నమాట వాడుకలోకీ వచ్చేసింది. పైన అంబేద్కర్ చెప్పినట్లు, మిగిలిన వారంతా తమ స్వాతంత్ర్యాన్ని ఆయన పాదాల వద్ద పెట్టినట్లే. కాకుంటే మంచి మారాజల్లే వారిని కొంతవరకు పట్టించుకుండుండవచ్చు నేమో గాని, సుప్రీం మాత్రం మోదీనే. మోదీ గారి మాటా, చేతలలోనే కాకుండా బాడీ లాంగ్వేజ్లో కూడా (నడక, చూపు వగైరాలలో) రాజఠీవీ తొణికిసలాడుతుంటుంది.

* ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే; తెలంగాణలో కే.సీ.ఆర్ గారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురూ పక్కా నియంతలు. వారి వారి పార్టీలలో గానీ, పాలనలో గానీ వారి మాటే శాసనం. చోటామోటా నాయకులే గాక, శాసనసభ్యులు, మంత్రుల దాకా వారి పాదాభివందనాలు చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య వాదులకు వొళ్ళు గగుర్పొడుస్తుంది. రాజరిక వాదులకు, అనుచరులకైనా ఒళ్ళు పులకించిపోతుంది. మరొక స్థాయి వారిలోనైతే, ఆ నాయకుల క్రీగంటి చూపుల కోసం పడిగాపులు పడడమూ కనపడుతుంటుంది. ఈ విధానం వారిలో ఎవరికీ ఎబ్బెట్టుగా అనిపించక పోవడం విచిత్రం. ఈ ఇరువురి పోకడలలోనూ కొన్ని విషయాలలో సారూప్యత కనిపిస్తుంటుంది. అందులో మొదటిది తమ నివాసం నుండే పరిపాలన నిర్వహిస్తుండడం. రెండవది, రాజు గారి దర్శనం లభించడమే మహాభాగ్యం అనుకునేంతగా వారిని కలవడానికే పెద్ద తడవు వేచి ఉండాల్సి రావడం. అదృష్టం కలిసొస్తే కలిసినా ఏదైనా విన్నవించుకోవడం తప్ప స్వతంత్రించి మాట్లాడే అవకాశం లేకపోవడం. ఇవి వ్యక్తిగత విషయాలలో పోలికలు కాగా, సామాజిక సంబంధంగా చెప్పుకోవలసి వస్తే ప్రజాధనాన్ని తమకు నచ్చినట్లు ఖర్చుపెట్టడం, ప్రజా సంక్షేమం పేరిట ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల పందేరాలను చేసేయడం ప్రధానంగా కనిపిస్తుంది. మళ్ళా అధికారంలోకి రావడానికి ఏమేమి చేస్తే పని జరుగుతుందో అందుకు అప్పు చేసైనా సిద్ధపడిపోవడం ఇరువురిలోనూ సమానంగానే కనపడుతుంటుంది. తిరిగి రాబడి నిచ్చే వాటిపై కంటే తిరిగి రాబడినివ్వని రూపంలో ఖర్చు పెట్టిందే ఎక్కువన్నది వీరిరువురి పోకడ గురించి ఆర్థిక నిపుణులు చెప్పే మాట. మొత్తం మీద రాబడి కంటే వ్యయం అధికంగా ఉండే విధానమే ఇద్దరిదీ. ఫలితంగా రెండు రాష్ట్రాలు ప్రజలపై అప్పుల భారాన్ని పెట్టేశాయి. కాకుంటే కేసిఆర్ గారిలో రాజకీయ పరిణితి కనపడినంతగా, జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించదు. తెలంగాణ ప్రభుత్వములో మంత్రిమండలిలో కేసీఆర్ స్వకుటుంబీకులూ, బంధువులూ, ఆయనే గౌరవించే సీనియర్లు కొందరుండడం, వారు ఎంతో కొంత పరిమితిలోనైనా కేసీఆర్ గారితో తమ ఆలోచనలను పంచుకోగలిగి ఉండడంతో, స్థిరమైన రాబడి వనరులకు సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి వచ్చేలా అంగీకరింపచేయడం లాంటి పనులు కొన్ని చేయగలిగారు.

ఇక ఇలాంటి ఆర్థికపరమైన నిర్ణయాలలో జగన్మోహన్ రెడ్డి గారి పోకడలో అనుభవ శూన్యత కనపడుతూ ఉంటుంది. రాబోయే 2024 ఎన్నికల నాటికి ఎంతమంది ఓటర్లను ఆకట్టుకోగలం? పట్టుకోగలం? అన్న ఒకే ఒక లక్ష్యంతోనే ఆయన గారి కార్యక్రమాలన్నీ ముడివేసుకొని జరిగాయి. నిజానికి పార్టీలో ఆయనకు సహచరులు గానీ, సలహాదారులు గానీ లేరు. షర్మిల, విజయమ్మ గార్ల సత్సంబంధాలలోనూ, క్రియాశీలంగానూ ఉన్నంతకాలం ఏమైనా అంతర్గత సమావేశాలు, సంప్రదింపులు ఉండేవేమో గాని, ఇప్పుడవి లేవు. ఆయన స్వభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకు అంతరంగికులెవరూ పార్టీలో లేరు. మొత్తం పార్టీ కార్యాచరణ విషయంలో ఒకరిద్దరు వ్యూహకర్తల్ని మాత్రం ఏర్పరుచుకుని, వారితో మాత్రమే అంతర్గత మంతనాలు జరుపుకుంటూ, నిర్ణయాలు తీసుకుంటుండ వచ్చనిపిస్తోంది. ఆ నిర్ణయాల అమలు విషయంలో ముందెవరికి చెప్పాలి తరువాత ఎవరికి చెప్పాలి అన్న విషయంలో మాత్రం తొలి కక్ష్యలోని వారు ముఖ్య అనుచరులు (దగ్గరి వారు), మలి కక్ష్యలోని వారు (తరువాతి వారు) అన్న విభజన ఉంటే ఉండి ఉండవచ్చు.

ఇక టీ.ఆర్.ఎస్ పార్టీ నేతకు సంబంధించినంతలో కేసీఆర్ రాజకీయంగా తలపండిన వ్యక్తి. మంచి వక్త, సంస్కారహీనంగా మాట్లాడడంలోనూ, సంస్కారవంతంగా మాట్లాడడంలోనూ దిట్ట. తనకు ప్రమాదం రాకుండా చూసుకుంటూనే ఎదుటివారిని దెబ్బతీయగల పటిమ కలవారు. అలవి గాని చోట ఒక అడుగు వెనక్కు వేయడానికీ, అలవైన చోట ముందుకు గెంతడానికి కూడా సిద్ధపడే నైజమున్నవారు. ఉపయోగపడతారనుకుంటే ఎవరిని కలుపుకోవడానికైనా, ఉపయోగపడరనుకుంటే ఎంతటి . వారితో తెగతెంపులు చేసుకోడానికైనా సిద్ధపడే స్వభావం ఉన్నవారు. మరొక వ్యూహకర్తతో పని లేకుండా అంతా తానే అయి పార్టీని నడిపించగల సమర్థులు. ఆ మేరకు పార్టీ శ్రేణుల ఆమోదం కూడా ఉన్నవారు.

రాష్ట్ర విభజన తరువాత ఆయన చేపట్టిన కొన్ని పెద్ద కార్యక్రమాలు. 1) మిషన్ భగీరథ. రక్షిత మంచినీరు. 2) కాళేశ్వరం ప్రాజెక్టు, 3) 24 గంటల కరెంటు, 4) సచివాలయ భవన సముదాయ నిర్మాణం, లాంటి కొన్ని పనులు మాటిమాటికీ ఓటర్లుకు చెప్పుకోడానికి ఉన్నాయి. అట్టి వాటిలో కొన్ని వాటికి సంబంధించిన నిపుణులు అంగీకరించ దగనివిగా ఉన్నా, ప్రజలను ఆకట్టుకోవడానికి బాగానే పనికొస్తున్నాయవి. రాజకీయంగా ఆయనకు కలిసొచ్చిన అంశం టి.డి.పి, కాంగ్రెసులు ఆయనకు ప్రతిపక్షంగా నిలబడలేక పోవడం. బి.జె.పి ప్రధాన ప్రత్యర్థి కావడంతో, మైనారిటీలు, కమ్యూనిస్టులతో అనుకూల సంబంధాలు ఏర్పడడం.

రాష్ట్ర విభజన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు, దీర్ఘకాలిక ప్రయోజనాల నివ్వదగిన పెద్ద కార్యక్రమాలేవీ మొదలెట్టలేదు సరి కదా తప్పనిసరిగా చేసుండాల్సిన రెండు ప్రధాన కార్యక్రమాలనూ ప్రక్కన పెట్టేశారు. అవి 1) పోలవరం ప్రాజెక్టు కాగా, 2) అమరావతి రాజధాని నిర్మాణం. చాలా మొండిగా, బండగా, గుడ్డిగా ఈ రెంటిని ప్రక్కన పడేయడమే కాదు వెనక్కి నెట్టేశారాయన.

జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతంతా 'తనకి తెలీదు, మరొకరు చెబితే వినరు’ అన్న స్వభావంలో ఉంది. ఆయన గారికి బాగా కలిసొచ్చిన అంశాలు ఈ రాష్ట్రంలోనూ, కాంగ్రెస్ నిలదొక్కుకోక పోవడం, బలహీన పడిపోవడం. ఆ కాంగ్రెస్ పార్టీలోని అనుభవజ్ఞులైన రాజకీయ నేతలకు సరైన వేదిక లేకపోవడం. బీ.జే.పీ నామమాత్రంగానే ఉండడం. టి.డి.పి శాసనసభ్యుల పైనా, స్థానిక నాయకుల పైనా ప్రజలలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల కారణంగా వ్యతిరేకత ఏర్పడి ఉండడం. ఈ అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కారణంగా ఆ పార్టీకి సానుభూతి పవనాలుగా మారాయి. బయటికి అంతగా కనపడకపోయినా క్రైస్తవుల ఓట్లు తగినంతగానే పని చేశాయని చెప్పాలి. ఈ వాస్తవ పరిస్థితులన్నింటినీ తనపై తనకున్న అతి విశ్వాసం కారణంగా చంద్రబాబు నాయుడు గారు సరిగా అంచనా వేయలేకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసొచ్చిన అంశమే.

చాలామంది పట్టించుకోనిదైన ఎన్నికల విధానంలోని మరో పెద్ద లోపం కూడా, వైసిపి పార్టీకి బాగా కలిసొచ్చిం దనాల్సిందే. అది ఎన్నికలలో గెలుపోటముల నిర్ణయ ప్రక్రియ. ఆ లెక్కలన్నీ ఇక్కడ అవసరం లేదు గానీ, సంగ్రహంగా ఆ వివరాలిలా ఉన్నాయి. పోలైన ఓట్లలో 50% వైసీపీకి వస్తే, 40% వరకు టి.డి.పికి వచ్చాయి. 6% జనసేనకు, మిగిలినవి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బి.జె.పి, స్వతంత్రులు పంచుకున్నారు. ముఖ్యంగా వై.సీ.పీకి, టి.డి.పికి మధ్య ఓట్ల వ్యత్యాసం 30 లక్షలు మాత్రమే. (వైసీపికి 1,50,00,000; టిడిపికి 1,25,00,000) దామాషా పద్ధతిన గానీ ఓట్లను లెక్కించి ఉంటే వై.సీ.పీకి 88 సీట్లు, టి.డి.పికి 69 సీట్లు, జనసేనకు 10 సీట్లు, మిగిలిన వారికి తలా రెండు, మూడు సీట్లు వచ్చి ఉండేవి. ఈ లెక్కల ఆధారంగానే తెగ సంబరాలు చేసుకుంటున్న వై.సి.పి పార్టీకి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు, 'తెగ పెచ్చరిల్లకండి. మీ గెలుపు బలమూ కాదు, టి.డి.పి ఓటమి వాళ్ళ బలహీనతా కాదు. టి.డి.పి ఇప్పటికీ బలంగానే ఉంది' అన్న హెచ్చరిక చేశారు. జగన్ రెడ్డి మరియు వై.సీ.పీ శ్రేయస్సు కోరే ఈ నిజాన్ని బయటపెట్టాననీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బహిరంగంగానే చెప్పారు కూడా.

రాజకీయాలలో అనుభవముండి చూడగలిగిన వారికి ప్రజా సంక్షేమం పేరిట ఓటర్లను ఆకట్టు కోవడం తప్ప మరే ఉద్దేశమూ లేని కార్యాచరణే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతటా కనిపిస్తుంది. ఈ విధానమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడవేయడమే గాక, పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఆ పార్టీ వారు పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, లోలోపల అభద్రతా భావంతో కూడిన ఆత్మరక్షణలో ఉన్నట్లు నిశితంగా చూస్తున్న వారికి తెలుస్తూనే ఉంది.

రెండు రాష్ట్రాల నేపథ్యానికి సంబంధించి మరికొంత చెప్పుకోవలసి ఉన్నా, ప్రస్తుతానికి దానినిక్కడ ఆపి, రేపటి 2024 నాటి ఎన్నికలు - రాజకీయ సమీకరణాల గురించిన ఒక చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

రెండు రాష్ట్రాలలోనూ ప్రధాన ప్రతిపక్షంగా గానీ, రెండో ప్రతిపక్షంగా గానీ ఉండాల్సిన కాంగ్రెస్ మరింత బలహీనపడి ఆ స్థానాలను కోల్పోయింది. తిరిగి నిలదొక్కుకో లేనంతగా పడకన పడిపోయింది. రాష్ట్ర విభజన జరగకుండా ఉండుంటే కొంతకాలం వరకైనా టి.ఆర్.ఎస్, టి.డి.పి, కాంగ్రెస్ ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉండేది. రాష్ట్ర విభజనతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆరంభంలో తెలంగాణలో టి.ఆర్.ఎస్, ఆంధ్రలో టి.డి.పి అధికారంలో ఉన్నాయి. టి.డి.పికి ఆంధ్ర ప్రధానమవడంతో క్రమంగా తెలంగాణలో అది బలహీనపడింది. టీ.ఆర్.ఎస్ ఉద్యమ పార్టీ గానూ, తెలంగాణ సాధించిన పార్టీగానూ ప్రజామోదం పొందడంతో బలమైన ప్రతిపక్షం లేని పార్టీగా అధికారంలోకి వచ్చింది. ఆపై కేసీఆర్ రాజకీయ చతురత (తంత్రం) కారణంగా, కాంగ్రెస్, టి.డి.పిలు కూడా తిరిగి బలం పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్ని సరిగా అంచనా వేసుకున్న బి.జె.పి ప్రధానంగా తెలంగాణపై దృష్టిపెట్టి టి.ఆర్.ఎస్ కు ప్రధాన ప్రతిపక్షంగా మారడానికి పావులు కదిపి సఫలీకృతమైంది. టి.ఆర్.ఎస్ ఆకర్షించగా మిగిలిన వారినీ, టి.ఆర్.ఎస్ లోని అసమ్మతి వర్గాన్ని తనతో కలుపుకునేందుకు పూనుకొని కొంతవరకు విజయం సాధించింది కూడా. పరిస్థితుల్ని అంచనా వేయడంలో సరిపడినంత అనుభవం ఉన్న కెసిఆర్ ఇక కాంగ్రెస్, టి.డి.పిలు తనకు ప్రత్యర్థులు కాలేరనీ, బి.జె.పినే ప్రధాన ప్రత్యర్థి అని గమనించి ఎంతో కష్టంతో కూడుకున్నదే అయినా బి.జె.పితో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైనారు. బి.జె.పి కూడా దేశమంతటా తన అధికారమే ఉండాలన్న ప్రధాన లక్ష్యంలో భాగంగా, తెలంగాణలో అధికార జెండా ఎగరవేయాలన్న నిర్ణయానికి వచ్చి తనదృష్టంతా దీనిపై కేంద్రీకరించింది. తన బలాలను మోహరించింది. తెలంగాణకు సంబంధించినంతలో ప్రస్తుత పరిస్థితి ఇది.

ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ప్రధాన ప్రతిపక్షంగానైనా ఉండదగిన కాంగ్రెస్, వై.సి.పి ఆవిర్భావంతోనూ, దేశవ్యాపితంగా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగానూ, కాంగ్రెస్ శ్రేణులలోని సింహభాగం రాజశేఖరరెడ్డి గారిపై అభిమాన కారణంగా ఏర్పడ్డ జగన్ రెడ్డి గారిపై సానుభూతి కారణంగానూ, కాంగ్రెస్ పార్టీని ఏకోన్ముఖంగా నడిపించే సమర్థత గల నాయకున్ని ఒకరిని అంగీకరించే పరిస్థితి లేని కారణంగానూ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వై.సీ.పీ లోకి చాలా భాగం చేరిపోయింది.

అలా వై.సి.పి, టి.డి.పికి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఎలాగూ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టం కనుక కేసిఆర్ తో విరోధం పెట్టుకోకుండా ఉండాలనుకోవడంతో, వై.సి.పి వారు అక్కడ క్రమంగా బలహీనపడి, ఆ రాష్ట్ర రాజకీయాల నుండి విరమించుకుని, ఆంధ్రకు పరిమితమై అధికారం కొరకు తన సర్వశక్తుల్ని కేంద్రీకరించి పెద్ద ఎత్తునే పుంజుకుంది. అప్పట్లో టి.డి.పి, కేసీఆర్ గారికి జగన్ రెడ్డి గారికి కూడా ఉమ్మడి శత్రువు అవడంతో ఇది సాధ్యపడింది. అటు కెసిఆర్తోనూ ఇటు చంద్రబాబు నాయుడు గారితోను కలబడి నిలబడటం అసాధ్యం అనిపించడం కూడా జగన్ రెడ్డి గారీ విధానాన్ని ఎంచుకోవడానికి కారణమై ఉండవచ్చు.

ఈ దశలో దక్షిణాది రాష్ట్రాలలోనూ జెండా ఎగరవేయాలన్న దృష్టితో ఉన్న బి.జె.పికి రెండు తెలుగు రాష్ట్రాలు అవకాశం ఉన్న ప్రాంతాలుగా కనపడ్డాయి. చాలా విషయాలలో తెలంగాణనే గాక ఆంధ్రకూ కేంద్రంతో అవసరాలుండడం, ఇటు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు తలెత్తడం, అటు తెలంగాణలో కాంగ్రెస్, టి.డి.పి, వై.సి.పి నామమాత్రంగా తయారవడం వగైరాలన్నీ కలిసి వచ్చి బి.జె.పి దృష్టి ఈ రెండు రాష్ట్రాల పైన స్థిరపడిపోయింది.

అందులో ముందుగా తెలంగాణ లోనే తను కాలూనడానికి అవకాశాలు మెండుగా కనిపించాయి. ఆంధ్రలో వైసిపి, టిడిపి నువ్వా నేనా అన్నట్లు చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి. వాటి బలాలూ కుడి ఎడమలన్నట్లుగానే ఉన్నాయి. ఆంధ్రాలో బిజెపి నామమాత్రంగా మాత్రమే ఉంది. కనుకనే రాజకీయ చతురతలో తలపండిన బిజెపి సారధులు తొలివిడతగా తెలంగాణను ఎంచుకున్నారు. టిఆర్ఎస్ ను ఎదుర్కునే శక్తి అప్పటికి ఏ పార్టీకి లేకున్నా, తమకూ లేదని తెలుస్తూనే ఉన్నా ప్రధాన ప్రత్యర్థుడిగా తలపడే, తల పడక తప్పని పరిస్థితి తమకే ఉందన్న విషయాన్నీ, పైకి అంతగా కనపడకున్నా కేసిఆర్ పై పార్టీ శ్రేణులలోనే అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందన్న సంగతిని బాగానే పసికట్టారు బిజెపి కురువృద్ధులు. ఎన్నికలలో గెలిచి కెసిఆర్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కొద్దికాలంలోనే బిజెపి ఈ విషయాలను గమనించి అడుగు వెంట అడుగు వేసుకుంటూ మెట్టు తర్వాత మెట్టు అన్నట్లు పైకి ఎగబ్రాకడానికి వ్యూహరచన ఆనాడే చేసుకుంది. ఈ నేపథ్యమంతా అర్ధమైతే కానీ, రేపటి ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాల్సి ఉంటుందో అంచనా వేయలేము.

రెండు రాష్ట్రాలలో ప్రస్తుత అవసరాలు

1) తెలంగాణలో కేసీఆర్ గారిని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలన్నది బిజెపి / లక్ష్యం.

2) ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలన్నది టిడిపి లక్ష్యం.

3) అటు బిజెపికీ, ఇటు టిడిపికీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వ్యతిరేక ఓట్లను కూడగట్టడం చీలకుండా చూడడం, ఎక్కువలో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగేలా చూసుకోవడం అత్యంత కీలకమైన అంశాలు.

4) ఈ పని సజావుగా జరగాలంటే అటు బిజెపి, ఇటు టిడిపి ఒక అవగాహనకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలనూ జతచేసే రాజకీయ సమీకరణాలకై యత్నించాలి.

5) అందుకై తాము అధికారంలోకి రావడం అన్న ఒకే ఒక్క అంశానికి పరిమితమై ఈ రెండు పార్టీలు మిగిలిన వారితో ఏ రకమైన సర్దుబాటు కైనా సిద్ధపడగలగాలి. అందుకు మొదటి అడుగు వేయాలి.

6) రెండు రాష్ట్రాలలో ఒక్క కమ్యూనిస్టుల పరిస్థితే వేరువేరుగా ఉంటుంది. తెలంగాణలో వారు ఇప్పటివరకు కేసీఆర్ పక్షాన నిలబడి ఉన్నారు. బిజెపితో వారికి సైద్ధాంతిక విభేదం ఉంది కనుక.

7) ఆంధ్రలోనైతే వారు వైసీపీ పాలనను నిర్ద్వంధంగా ఖండిస్తూ వస్తున్నారు కనుక, వారు రేపటి ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. కానీ బిజెపితో కూడిన టిడిపికి అనుకూలంగా మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారా? తమ ఓట్లను వీరికి జోడించగలుగుతారా? అన్నది సందేహమే.

జనసేన:

ఆంధ్రలో మాత్రం రేపటి ఎన్నికలలో జనసేనదే కీలకమైన పాత్ర అవుతుంది. గత ఎన్నికలలోనే దానికి 6శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఈతూరి కచ్చితంగా అంతకుమించే వస్తాయి. మరీ ఎక్కువ అంచనాలకు పోకుండా చూచినా సుమారు 10% వ్యక్తిగతంగా ఆయనకు వస్తాయని అనుకోవచ్చు. అందులో పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కొన్ని, కాపుల ఓట్లు కొన్ని ఉంటాయి. దామాషా పద్ధతిన చూసుకుంటే 175 / 100 × 10 = 17.5 అందాజుగా 17 సీట్లు ఆయనకు చెందుతాయి. కానీ ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయన గెలవగలిగే సీట్లు అన్ని ఉండవు. ఎంత గట్టిగా యత్నించినా అవి 10కి లోపే ఉంటాయి. ఇంకా సరిగా చెప్పాలంటే ఐదారుకు మించవు. ఎందుకంటే ఆయన అభిమానులూ, కాపులూ కూడా రాష్ట్రమంతటా విస్తరించి చీలి ఉంటారు కనుక. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన ఓట్లు వారి అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైనన్ని ఉండవు. ఈ నిజాన్ని గనుక పవన్ కళ్యాణ్ గారు గమనించక పోయినా, ఆయన అంతరంగీకులు ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పకపోయినా, ఆయన బలహీనపడిపోవడమే గాక, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి పరోక్ష కారణంగా చరిత్రలో మిగిలిపోతారు.

ఈ దశలో ఆయన చేయగల అత్యంత పెద్ద తప్పు సీ.ఎం పదవి తనకే కావాలి అని మంకుపట్టు పట్టడమే అవుతుంది. అది తిరగదీసుకోలేని తప్పు అవుతుంది. ఈ పొరపాటు జరగకుండా చూసే పని ప్రధానంగా బిజెపి కేంద్ర కమిటీ తీసుకోవాలి. వారు గాని ఈ దశలో మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే, ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా సాయం చేసినట్లే అవుతుంది. ఆ పని గాని జరిగితే ఎక్కువ నష్టపోయేది బిజెపినే. దాని నష్టం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదిగా ఉంటుంది. తెలంగాణలో అది ఒంటరిగా టీఆర్ఎస్ ని ఎదుర్కొని అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం. కనుక, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓట్లు కూడగట్టడానికీ, చీలకుండా చూసుకోవడానికీ అది ఎందుకైనా సిద్ధపడక తప్పదు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు తెలంగాణలో టిడిపి, షర్మిలమ్మ, కాంగ్రెస్ ఓటర్ల రూపంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఓట్లు ఏమవుతాయన్నది ఇక్కడ కీలకమే అవుతోంది. (రేపటి ఎన్నికలలో టి.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రభావం ఎంత అన్నది చూడాలి) ఇక కాంగ్రెస్ గానీ, కెసిఆర్ కు అనుకూలత చూపితే దాదాపు ఆయన గెలుపే ఖాయమవుతుంది. కేసీఆర్ బిజెపితో ప్రత్యక్షపోరుకు దిగి ఉండడంతో కేసిఆర్ కు, కాంగ్రెసుకు శత్రుత్వం ఉండదు. బిజెపి వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడడం తెలంగాణలో కేసీఆర్ కే కాకుండా కాంగ్రెసుకు, ముస్లింలకు, కమ్యూనిస్టులకు కూడా అవసరం. కనుక కెసిఆర్ గట్టిగా కృషి చేస్తే ఆ సముదాయాలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వ్యూహ రచనలో నిష్ణాతుడైన కేసీఆర్ వీరిని కూడగట్టడంతోపాటు, జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని రాజశేఖరరెడ్డి అభిమాన ఓటర్లను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి తీరతారు. దానికి ప్రతిగా ఆయన ఆంధ్రాలో వైసీపీకి అనుకూలంగా తాను చేయగలంతా చేస్తారు. ఇలా ఏమాత్రం వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయగలిగినా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడక తప్పదని, ఏర్పడతాయని అర్థమవుతుంది. ఈ అవగాహనతోనే ఈ వ్యాసానికి నేను '2024 ఎన్నికలు - రాజకీయ సమీకరణాలు' అన్న పేరు పెట్టాను.

ఒక అసాధారణ పరిస్థితి రేపటి ఎన్నికల నాటికి ఏర్పడి ఉంది. ఆంధ్రలో టిడిపికి, వైసీపీకి; తెలంగాణలో బిఆర్ఎస్ కూ, బిజెపికి కూడా ఎదుటి పక్షం వారి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవడం అన్నదే ప్రధాన వ్యూహంగా, అత్యవసరమైన పనిగా తయారవుతుంది. అధికార మార్పిడి జరగాలన్నది ప్రధాన లక్ష్యమైతేనూ, ఆ మార్పిడి తాము అధికారంలోకి రావడం రూపంలోనే జరగాలన్నది ఆకాంక్ష అయితేనూ, ఈ సమీకరణాలలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, ఆంధ్రలో టిడిపినే అవుతాయి. రెండు చోట్ల అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు రూపంలో ఉన్న పార్టీలతో వీరిరువురు ఉదారంగా సర్దుబాట్లు చేసుకోటానికి సిద్ధపడాలి. అధికారం తమకే దఖలై ఉండడాన్ని మినహాయించి వారు కోరుకున్న సీట్లివ్వడానికి, పాలనలో చోటు కల్పించడానికీ కూడా నిజాయితీగా ముందుకు రావాలి. అదే విధంగా ప్రధాన పార్టీలకు తోడ్పడుతున్న చిన్న పార్టీలు కూటమి విజయానికి అత్యంత కీలకమైన భూమికను పోషిస్తున్నప్పటికీ, అత్యాశకు పోయి ప్రధాన పార్టీలకు తమ తోడ్పాటు అవసరముందన్న కారణాన్ని చూపి వారిపై అలవికానంత ఒత్తిడిని మోపకుండా, వివేకవంతంగా మసులుకోవాలి. తాము అందరూ కలసి ప్రధాన పార్టీకి వత్తాసు పలకడం ద్వారా ఎలాగైతే ఆ పార్టీ విజయానికి కారకులవుతున్నారో, అలాగే కూటమిలోని ప్రతి పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నచోట, పొరపొచ్చాలకు తావియ్యకుండా పెద్ద పార్టీతో పాటు కూటమిలోని మిగిలిన పార్టీలు ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. దీనంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ పార్టీ అభ్యర్థులు ఎంతమంది ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడ్డా, కూటమికే ఓటు అన్న అవగాహన కలిగి ఉండాలి. ఆ మేరకు కూటమిలోని పార్టీలన్నీ కలసి ఓటర్లకు నచ్చ చెప్పాలి. అలాకాక పైకి కూటమిలో ఉంటూ, లోలోపల ఎవరి ప్రయోజనాలకు వారు పెద్దపీట వేసుకుంటే జరిగేది మాత్రం ప్రత్యర్థి గెలుపు, వీరందరి ఓటమి మాత్రమే.

ఈ సందర్భంలో ఆరోగ్యకరమైన ఒక సూచన మనమూ చేయవచ్చు. అధికారంలోకి రావలసి ఉన్న పెద్ద పార్టీలు మొత్తం సీట్లలో 60% సీట్లను తమకు కేటాయించుకుని 40% వరకు కూటమిలోని మిగిలిన పార్టీలకు కేటాయించాలి. అందరూ గెలవాలన్న పూనికతోనే అందరూ పనిచేయాలి. ఈ మొత్తంలో 60% గెలవగలిగినా అధికారం చేజిక్కినట్లే.

మరోమారు గుర్తు చేయాల్సిన ప్రధానాంశం ఏమంటే రేపటి 2024 నాటి ఎన్నికలను రెండు రాష్ట్రాలలోనూ కలసిగట్టుగా జరిగేటివిగా భావించి కూటమి వ్యూహరచన చేసుకొని తీరాలి. 1) చంద్రబాబు నాయుడు గారు బిజెపితో అవగాహనకు వచ్చి, తెలంగాణలో టిడిపి శ్రేణులను తిరిగి కూడగట్టాలి. జనసేన పవన్ కళ్యాణ్, షర్మిల గార్లతోనూ బిజెపి ఒప్పందం చేసుకుని తెలంగాణలో కూటమి కట్టాలి. 2) షర్మిల గారు ఆంధ్రలో టిడిపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేసి తమ తండ్రిగారి అభిమానుల ఓట్లను కూడగట్టాలి. 

కూటమి: బిజెపి, జనసేన, టీవైఎస్ఆర్ ల కూటమి రెండు రాష్ట్రాలలోనూ ఏర్పడాలి. రెండు రాష్ట్రాలలోనూ ఒకే కూటమిలో ఉండడం కమ్యూనిస్టులకు మాత్రం అభ్యంతరము ఉంటుంది. అందుకు ప్రధాన కారణం బిజెపితో వారికి గల సైద్ధాంతిక విభేదం. తెలంగాణలో వారు కేసీఆరే సాయపడతారు. ఆంధ్రాలో జగనుకు వ్యతిరేకంగా పనిచేయడమే, వారికి ఇష్టమైన బిజెపితో కలిసున్న టిడిపి కూటమిలో కలిసిపోవడానికి వీలుకాకపోవచ్చు. వీలున్నంతలో వారు టిడిపికి బయట నుండి తోడ్పడవచ్చు. జైభీమ్ పార్టీ, పి.ఎస్. ప్రవీణ్ కుమార్లను కలుపుకోగలిగినా, మద్దతు కూడగట్టినా వైసీపీ ఓట్లు చీల్చడానికి పనికివస్తుంది. ఇదీ కీలకమే.

ఆంధ్రాలో మరోరకంగా కూటమి ఏర్పడే అవకాశమూ ఉంది. టిడిపి, జనసేనను, షర్మిల గారి తోడ్పాటును, కమ్యూనిస్టులను కలుపుకొని బిజెపిని బయట నుండి సహాయ పడమని అడగవచ్చు. నా అవగాహన ప్రకారం ఈ రెంటిలోనూ బిజెపిని కూటమిలోకి చేర్చుకొని కమ్యూనిస్టులను బయట నుండి సాయమందించమనడమే మెరుగైన దౌతుంది. ఎందుకంటే ముందు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కేంద్రం యొక్క అనుకూల వైఖరి ఆంధ్రకు చాలా అవసరమూ, కీలకమూ అవుతుంది.

పార్టీ ప్రయోజనాలను పట్టించుకోకుండా పార్టీలోని నాయకులు తన ప్రయోజనాలకే పెద్ద పీట వేసుకున్నా, కూటమి ప్రయోజనాలను ప్రక్కన పెట్టి కూటమిలోని పార్టీలు తమ తమ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చుకున్నా, జరిగేది మాత్రం అందరూ నష్టపోవడమే.

1) అధికార పార్టీ ఓట్లను చీల్చడం, 2) వ్యతిరేక ఓట్లు చీలకుండా కట్టడి చేయడం, 3) ఓటింగ్ శాతం ఎక్కువ అయ్యేలా శ్రద్ధ తీసుకోవడం, 4) ఓటింగ్ సక్రమంగా (ఎన్నికలు సక్రమంగా) జరిగేలా శ్రద్ధ పెట్టడం అన్నవే కూటమి గెలుపుకు ప్రధాన సాధనాలు అవుతాయి. ఇదే సమయంలో శత్రుపక్షపు వ్యూహాలనూ సరిగా బేరీజు వేయగలగాలి. ఆంధ్రలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ కూడా కూడగట్టడం అన్న ఎత్తుగడనే అనుసరిస్తాయి. ఆంధ్రలో వైసీపీ కూటమి ఏర్పడే అవకాశం లేదు. అయితే గియితే కాంగ్రెస్ కు చెందిన ఒక గ్రూపు కేసీఆర్, వైసిపికి తోడ్పడవచ్చు. తెలంగాణలో టిడిపి నిర్వహిస్తున్న పాత్రకు ప్రతి చర్యగా ఆంధ్రాలో వైసీపీ తరఫున, టిడిపి కూటమికి వ్యతిరేకంగా తాను చేయగలిగినంతా చేసి తీరతారు. దాని ప్రభావాన్ని కనీస స్థాయికి కుదిరించడం ఎలాగన్నది కూటమి ముందున్న ముఖ్య సమస్యలలో ఒకటి అవుతుంది.

ఆంధ్రలో టిడిపికి కూటమిలోని మిత్ర పార్టీలను సంతృప్తి పరచడమూ, తమ పార్టీలోని సీట్లు కోరే వారిని సముదాయించడమూ, నియంత్రించడమూ అన్నదే అన్నిటికంటే పెద్ద సమస్య అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోగలిగితే, ఆ పరిష్కార రూపము, కూటమిలోని అన్ని పక్షాలకూ మరీ ఎక్కువ అసంతృప్తినివ్వకుండా ఎంతో కొంత సంతృప్తినివ్వగలిగితే, కూటమి విజయం దాదాపు ఖరారు అయినట్లే.

తెలంగాణలో మాత్రం బిఆర్ఎస్ కూటమి ఏర్పడే అవకాశం ఉంది. కేసీఆర్ గారితో ఎంఐఎం, రెండు కమ్యూనిస్టు పార్టీలు జతకడతాయి. ఆ మేరకు కేసిఆర్ గారిప్పటికే ఒక అవగాహనకు వచ్చి ఉండవచ్చు. ఇక పోతే ఆయన కలుపుకోవలసింది, వీలైతే చీల్చవలసింది కాంగ్రెస్ లోని ఒక గ్రూపునూ, టిడిపిలోని కొందరినీ. రాజకీయ చతురత గల వ్యక్తిగా కేసీఆర్ గారు ఈ ప్రయత్నం వరకైనా కచ్చితంగా చేస్తారు. కనుక టిడిపి ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణలోని తన ఓట్లన్నింటినీ కూడగట్టాలి. షర్మిల గారితో సత్సంబంధాలే పెట్టుకోవాలి.

రేపటి ఎన్నికలలో డబ్బు రికార్డు స్థాయిలో ఖర్చవుతుంది. మిత్రపక్షాలంటూ ఉండవు గనుక. జగన్ రెడ్డి గారి ప్రధాన వ్యూహం ఓటర్లకు ఆర్థిక సాయం అందించడం ద్వారా (సూటిగా చెబితే ఓట్లు కొనడం ద్వారా), వారిని కూడగట్టుకోవడం గానే ఉంటుంది. సంక్షేమ పథకాల పేరున ప్రజాధనాన్నే కాక, అదనంగా ఒక ప్రవాహంలా పార్టీ డబ్బును రేపటి ఎన్నికలలో ఖర్చు చేస్తుంది వైసిపి. తెలంగాణలో కేసీఆర్ గారున్నూ ఇతర వ్యూహాలతో పాటు ఓట్లు కొనుగోలు ప్రక్రియనూ పెద్ద ఎత్తునే చేపడతారు. అందులో ఆంధ్రలో మాదిరే ప్రజాధనాన్నీ, పార్టీ ధనాన్ని కూడా లెక్కకు మిక్కిలిగా ఓటర్లపై గుమ్మరిస్తారు.

భారతదేశ ఎన్నికల చరిత్రలోనే రికార్డు స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ డబ్బు ఏరులై పారుతుంది. అందులో ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు పార్టీలూ అగ్ర భాగంలో ఉంటాయి. తెలంగాణలో బిజెపి, ఆంధ్రలో టిడిపి కూడా శక్తి వంచన లేకుండా డబ్బును పంచుతాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీలతో పోటీ పడలేవు. మరో ముఖ్య విషయం: ఆయా పార్టీల వారు తాము పెట్టే సభలకు వచ్చిన జనాన్ని చూసి, పర్వాలేదు మనం బలంగానే ఉన్నాం అనుకొని ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా, జరగకూడని అనర్ధం జరిగిపోతుంది. ఈ విషయంలో అసలు వాస్తవం ఏమంటే, ఏ పార్టీ పెద్ద బహిరంగ సభ జరపాలనుకున్నా సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీకీ ఆ మాత్రం సొంత జనం ఉండనే ఉంటారు. గెలుపోటములు నిర్ణయించేది వీరు కానే కాదు. వీరిలో కొందరు ఆయా పార్టీలకు మూలబలంగా ఉంటారు. పార్టీలు గెలిచినా, ఓడినా వీరు పార్టీలను అంటిపెట్టుకునే ఉంటారు. మరికొందరు కూలికి హాజరయ్యే వారు. వీరు ఏ పార్టీకి బలం కాదు. ఉదాహరణకు టిడిపికి ఆంధ్రలో 25% వరకు, జనసేనకు 5% వరకు, కమ్యూనిస్టులకు 4% వరకు మూలబలం అనదగిన ఓటర్లు ఉన్నారు. వీరి విషయంలో పార్టీలు ఎట్టి ప్రచారాలూ చేయనక్కర లేని పరిస్థితి ఉంటుంది. పార్టీల ప్రచారహోరంతా మిగిలిన ఓటర్లను కూడగట్టుకోవడానికి సంబంధించిందే. ఈ అంశానికి సంబంధించినంతలో మరో నిజం ఏమంటే ఈనాటికీ వైసీపీకి ఈ మూలబలం 10,15 శాతానికి మించి లేదు. అందులోనూ సింహభాగం కులం, మతం కారణంగా వచ్చిందే. వైసీపీకి ఉండే మిగిలిన బలమంతా పందేరాల కారణంగా జమయ్యేది మాత్రమే. ఈ విషయంలో ఈనాటికీ తెలుగుదేశం పార్టీనే బలంగా ఉంది.

వైసీపీ ప్రభుత్వపు చేసిన అధికారిక ప్రకటన ప్రకారమే, వివిధ పథకాల ద్వారా సుమారు 4కోట్ల మందికి లబ్ది చేకూర్చింది. అందులో అన్ని పార్టీల వారూ ఉన్నారు. ఉండక తప్పదు కూడా. వైసీపీ వ్యూహమంతా అందులో సగం మందైనా తమకు ఓట్లు వేసేలా చూసుకోవడం అన్న దగ్గరే ఉంది. వారి ఈ అంచనా అత్యాశతో కూడుకున్నదేమీ కాదు. ఆచరణ సాధ్యం కానిది కూడా కాదు. ప్రతిపక్షాలు గాని ఈ వాస్తవాన్ని గమనించకున్నా, దీనికి ప్రత్యామ్నాయన్ని కనుగొని ఆచరణలో పెట్టకున్నా వైసిపి వారు అనుకున్నదే జరుగుతుంది. ఎందుకంటే ఈనాటికీ చాలామంది ప్రజలలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలన్న ధోరణి బలంగానే ఉంది. ఈ నిజం రాజకీయ పార్టీల వారికీ తెలుసు కనుకనే దానిని చెడగొట్టడానికని, “అవతలి వాళ్ళ దగ్గరా డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి” అని నిస్సిగ్గుగా, నీతిమంతులుగా ఉండకండి అని బహిరంగంగానే ప్రకటనలు చేయడం వరకు దిగజారారు. ఏ పార్టీ దీనికి మినహాయింపు కాదు. 'మాట మీద నిలబడక్కరలేదు' అని అందరూ చెబుతున్నారన్నమాట. 'అన్నీ ఆ తాను ముక్కలే' అంటారు చూడండి, అలాగన్నమాట. ఈనాడు రాజకీయ నాయకులు నీతి వాక్యాల పేరుతో, చెప్పేవన్నీ శుద్ధ అబద్దాలే.

వైసీపీకి 2 కోట్ల ఓట్లు ఉన్నాయనుకునే టీడీపీ కూటమి పోరాడటానికి దిగాలి. అందుకు తగిన సంఖ్యలో ఓట్లను కూడగట్టుకోగలిగితేనే, గెలుపు దిశగా నడక సాగుతుంది. ఈ విషయంలో ఏమాత్రం తాత్సారం చేసినా, కూటమిని రూపొందించడంలో గానీ, కూటమి నిజాయితీగా, ఐకమత్యంతో పని చేయడంలో గానీ తేడా వస్తే గెలుపు అవకాశాలు వేగంగా పడిపోతాయి. ఓటమి అవకాశాలు అంతే వేగంగా పెరిగిపోతాయి. ఆయా బహిరంగ సమావేశాలకు అధిక సంఖ్యలో జనం రావడాన్ని చూసి గానీ, రాకపోవడాన్ని చూసి గానీ అంచనాలు వేసుకోవడం ఎవరు చేసినా, అదంతా పొరపాటు అంచనాల క్రిందకే వస్తాయి. ఓట్లు కూడగట్టడం అన్నది 'చాపక్రింద నీరులా' అన్న చందాన జరగాలి. మనవి అనుకున్న వాటిలో 60% మాత్రమే ఖచ్చితం అనుకోడానికి తగివుంటాయి. ఈ విషయంలో వైసీపీ వ్యూహకర్తల అంచనాలు సరిగానే ఉన్నాయి. 4కోట్ల మందికి లబ్ధి చేకూర్చి 2కోట్లమంది ఓటు వేయవచ్చు దగ్గరున్నారు వాళ్ళు. సాధారణంగా జరిగే ఓటింగ్ శాతాన్ని బట్టైతే సగటున 60,65% పోలవుతుంటాయి. కనుక కోటి యాభై లక్షల ఓట్లు ఎవరికి వస్తే వారు గెలుస్తారు. కానీ 2019లో పార్టీలు పెద్దయత్నమే చేశాయి. వాటిలోనూ వైసీపీ ఓట్ల శాతాన్ని పెంచడంపై బాగా దృష్టి పెట్టింది. ఎందుకంటే టిడిపి వ్యతిరేక ఓట్లను కూడగట్టడం పైనే వారి గెలుపు ఆధారపడి ఉంది కనుక. ఆ విషయంలో అది అద్భుతంగా సఫలమైందనే చెప్పాలి. (ఓటింగ్ 80% జరిగింది) కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులు, స్వతంత్రులూ అందరినీ కలుపుకుంటే కూడా అందరికీ కలిపి 5% ఓట్లే వచ్చాయి. జనసేనకు 5.54(6)% వచ్చాయి. తెలుగుదేశం పార్టీపై అసమ్మతి, వ్యతిరేకతా ఉంది గనుక, వారి సొంత ఓట్ల వరకే 39% వారికి వచ్చాయి. పెరిగిన 15% ఓటింగ్ లాభాన్ని వైసీపీనే పొందింది.

2019 నాటికి ఓట్ల లెక్కలు. (దగ్గరి పూర్ణాంకానికి సరి చేయడమైనది)

మొత్తం ఓటర్లు: 3,93,00,000 కాగా పోలైనవి: 3,14,00,000. 80% పోలయ్యాయి.

వైసీపీకి 50%; టిడిపికి 39%; జనసేనకు 5.5% 

ఇతరులందరికీ కలిపి 5% వచ్చాయి. (కాంగ్రెసుకు 1.17% + బిజెపికి 0.84%+ కమ్యూనిస్టులు, ఇతరులు 3.34% = 5.35)

3,14,00,000 లను 175 సీట్లకు పంచితే, ఒక్కో సీటుకు 1,79,000 ఓట్లు. దామాషా పద్ధతి ప్రకారం లెక్కగడితే వైసీపీకి 88, టిడిపికి 68, జనసేనకు 10, మిగిలినవారికి 9, వెరసి 175 అవుతాయి.

2024 నాటి ఓటర్ల మరియు ఓటింగ్ పరిస్థితి

ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లు 4.5 కోట్ల పైబడి 5 కోట్ల లోపు ఉండే అవకాశం ఉంది. (గమనిక: అన్ని పార్టీలు పోటీపడి క్రొత్త ఓటర్లను చేర్చుతాయి)

ఓటింగ్ శాతం ఈసారి 80కి తగ్గదు. పెరిగితే మరో 5,6% పెరగవచ్చు. కనుక మొత్తం ఓట్లలో పోలయ్యే ఓట్లు గతంతో పోలిస్తే పెరుగుతాయి. 3,93,00,000ల ఓట్లకు 3,14,00,000 ఓట్లు అంటే 80% పోలయితే, 4, 60, 00,000 ఓట్లకు 3,76,00,000, 80% వరకు పోలవుతాయి. దానికి గాని 5,6% కలిపితే అందాజుగా 4 కోట్లు అవుతుంది. ఉజ్జాయింపుగా రేపు 2024 ఎన్నికలలో పోలయ్యే ఓట్ల సంఖ్య 3,75,00,000 వరకు ఉండవచ్చు అనుకుందాం.

ఆయా పార్టీలు పంచుకోగలిగే ఓట్ల నిష్పత్తి ఇలా ఉండవచ్చు

1) టిడిపికి వ్యతిరేకత లేదు గనుక అది పోలైన ఓట్లలో తన 40% ఓట్లను నిలుపుకుంటుంది.

2) జనసేన కూడా 2019 నాటికంటే మెరుగైతే 10 శాతం వరకు దానికి వచ్చే వీలుంది.

3) బిజెపి, రెండు కమ్యూనిస్టు పార్టీలు కొంతపుంజుకోవచ్చు. అది 6% అనుకుందాం. 4) కాంగ్రెస్ ఓట్లు లోపాయికారిగా వైసీపీకి చెందవచ్చు.

5) వైసీపీకి అందాజుగా కాంగ్రెస్ను కలుపుకొని 40% ఓట్లు పడే అవకాశం ఉంది.

6) ఈ లెక్కల మొత్తం నుండి ఒక 10 % ఓట్లు ఎటుపడతాయో చెప్పడం కష్టం.

రేపటి ఎన్నికల ఓట్ల సాధారణ చిత్రం ఇప్పటికిదే. రాబోయే సంవత్సర కాలంలో జరగబోయే మార్పులు చేర్పులను బట్టి 10% దాకా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈసారి కులంతో పాటు మతము పూర్వం కంటే ఎంతో కొంత అధిక ప్రభావాన్ని కనపరిచే అవకాశం ఉంది. కేసీఆర్ గానీ నేరుగా వైసీపీకి అనుకూలంగా వ్యూహరచన చేసి రంగంలోకి దిగితే ఆంధ్రలో ముస్లిం ఓట్లు వైసీపీకి కలిసే అవకాశం ఉంటుంది. వైసీపీకి క్రైస్తవుల ఓట్లు చాలా బలమైనవి. జగన్రెడ్డి గారికి పడే మొత్తం ఓట్లలో సుమారు 30% వరకు అవే అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా క్రైస్తవుల ఓట్లు చీల్చగలిగితే, వైసీపీ ఆత్మరక్షణలో పడిపోతుంది. కాంగ్రెస్లో తలపండిన వాళ్లంతా కూడబలుక్కొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీకి ప్రతికూలంగా, కూటమికి అనుకూలంగా గళం విప్పితే వైసీపీ ఓటమి ఖాయమవుతుంది. ప్రస్తుతం వైసీపీకి బలాన్నివ్వగలిగిన అంశాలు నాలుగే. 1) క్రైస్తవుల ఓట్లు 2) డబ్బు 3) కులపు ఓట్లు 4) కాంగ్రెస్ అనుకూలత. ఈ బలాలకు ప్రతి చర్యను కనుగొనగలిగితే కూటమి గెలుస్తుంది.

రేపటి ఎన్నికలు - కూటమి సీట్ల సర్దుబాటు విషయం

టిడిపి పెద్ద పార్టీ. అధికారంలోకి రావలసింది అదే. అయితే కూటమి సంబంధాలు చెక్కుచెదరకుండా ఉండడానికి మిత్రపక్షాలతో ఉదారంగా సీట్లు సర్దుబాటుకు సిద్ధపడి ముందుగా ముందుకు రావలసింది అదే. ఎందుకంటే టిడిపికి వ్యతిరేకంగా చీలిన ప్రతి ఓటు టిడిపి అపజయానికి తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈసారి టిడిపికి గెలుపునివ్వడంలో కీలక పాత్ర పోషించగలది జనసేన పార్టీనే. రేపటి ఎన్నికలలో దాని ఓట్లు 10% పైనే ఉండేందుకు అవకాశం ఉంది. అయినా ఒంటరిగానే పోటీ చేస్తే అది పొందగలిగే సీట్లు ఎన్ని అన్న విషయం సందిగ్ధమే. కనుక దానికి టిడిపితో జట్టు కట్టడం కంటే తెలివైన పని మరొకటి లేదు. అది గాని ఒంటరి పోరుకు సిద్ధమైతే ఎన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే అంత ఎక్కువ స్థానాలలో ఓడిపోవడమే కాక జగన్ వ్యతిరేక ఓట్లని చీలుస్తుంది. కనుక అది టిడిపితో పొత్తు పెట్టుకోకపోవడం అంటే కచ్చితంగా వైసీపీకి కొమ్ము కాసినట్లే అవుతుంది. అది జరగకుండా నివారించాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అత్యాశకు పోకుండా, అధికారం టిడిపికి కట్టబెట్టడానికి సిద్ధపడడమే సరైనదవుతుంది. అందుకు మారుగా టిడిపి కూడా జనసేన తృప్తిపడే స్థాయిలో వారికి సీట్లు కేటాయించడానికి గెలిచి అధికారంలోకి వస్తే, ప్రభుత్వంలో భాగస్వామిని చేయడానికి కూడా సిద్ధపడాలి. నా అవగాహన ప్రకారం కూటమి 175 స్థానాల నుండి పోటీ చేయాలి. మిత్రపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయించాలి. కూటమిలోని ఏ పార్టీ వ్యక్తి అభ్యర్థిగా నిలబడ్డా కూటమి ఏకోన్ముఖంగా అతని గెలుపుకై కృషి చేయాలి. టిడిపి 100 స్థానాలకు పరిమితమై, 25 స్థానాల వరకు జనసేనకు కేటాయించాలి. అలాగే బిజెపికి, కమ్యూనిస్టులకు కూడా వారికి బలమున్న స్థానాలను కేటాయించి వైసీపీ పాలను తొలగించడం లక్ష్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ లోని వైసీపీ వ్యతిరేకులతోనూ మిత్ర సంబంధాలను కొనసాగించి వారు గెలిచే పరిస్థితి ఉన్న స్థానాలలో వారికి బయట నుండి అయినా మద్దతు ఇవ్వాలి. వీలైతే కాంగ్రెస్లోని అతిరధులు ఎవరైనా సిద్ధపడితే టిడిపిలోకి ఆహ్వానించాలి.

డి.ఎల్. రవీంద్ర గారు చెప్పినట్లు ప్రజల మధ్య ఉన్న, ఉండగలిగిన స్వభావం కలిగిన వ్యక్తుల్ని ఏరుకొని అభ్యర్థులుగా నిలబెట్టగలిగితే మంచిదే. అయితే అది అంతర్గత అసమ్మతి వర్గాన్ని తయారు చేయకుండా చూసుకోగలగాలి. వైసీపీని గద్దె దించడం అన్న ఒకే ఒక ఎజెండాతో పనిచేయగలిగితేనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ దఫా వరకు కేంద్రంలో మిత్ర సంబంధాలు పెట్టుకుని టిడిపి అధికారంలోకి వస్తేనే అన్న విధాల మంచిది. ఇప్పటి వాస్తవ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అంతకంటే మంచి నిర్ణయం నాకైతే కనిపించడం 

 లేదు.

ప్రియ పాఠకులారా! కొంతవరకు ముఖ్యమైన విషయాలను మీ దృష్టికి తెచ్చాననే అనుకుంటున్నాను. ముగింపుగా మరికొన్ని అంశాలను మీ దృష్టికి తేవలసి ఉంది. వ్యక్తిగతంగా మేము (మండలి) ప్రజాస్వామ్య వాదులం. రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజాస్వామ్యం . అమలులోకి రావాలని త్రికరణశుద్ధిగా కదులుతున్న వాళ్ళం. కనుక సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉన్న ఏ పార్టీకి అనుకూలురం కాదు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలోని పార్టీలు, కేంద్రంలోని బిజెపి, కాంగ్రెస్ కూడా నియంతృత్వ పోకడలు గల పార్టీలే. అంతరంగంలో ఏకనాయక స్వామ్యంతో కూడిన రాజరిక వ్యవస్థను ఇష్టపడేటివే. కాకుంటే వాటిలోని కొందరు ప్రజాసంక్షేమాన్ని, దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును ఇష్టపడేవారు గానూ, మరికొందరు వాటికంటే తమ ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారుగను ఉండవచ్చు, 

ఈ దశలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేలా పార్టీల స్వభావంలో మార్పులు తేవడం ఎలాగూ అయ్యే పని కాదు గనుక, ఉన్నంతలో ఆంధ్ర రాష్ట్రానికి ఏది మెరుగైన పోకడ అవుతుందన్నంత వరకే నేను దృష్టి పెట్టాను. మనస్ఫూర్తిగా అంటున్నారో, పరిస్థితుల ఒత్తిడి కారణంగా అంటున్నారో గానీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుపు మాట అలా ఉంచి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అందరం కలిసి అని అనేశారు. “వారి ఆ మాటలను ఆసరా చేసుకుని మేముగాని గెలిచి అధికారంలోకి వస్తే అధికార వికేంద్రీకరణ చేస్తాము. స్థానిక ప్రభుత్వాలకు పూర్తి అధికారాలను కట్టబెడతాము”, అని పార్టీ ప్రణాళికలోనే ప్రకటించండని వారిని అంగీకరింపజేసే యత్నం ఒకటి చేయాల్సి ఉంది. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలప్పగించడం జరిగితే నియంతృత్వపు పట్టు సగం పైగా సడలిపోతుంది.

ప్రజాస్వామ్య వాదులంతా కలసికట్టుగా ఆంధ్రలో టిడిపిని, తెలంగాణలో బిజెపి కూటమిని ఒప్పించి గలిగితే, ఒత్తిడి చేయగలిగితే ఇప్పటికదే ఒక పెద్ద ముందడుగు కాగలుగుతుంది. మేధావులంతా ఆలోచించి కలసి కదలాల్సిన తరుణమిది.

ఈ సాధారణ ప్రక్రియకు వేరుగా, అసాధారణ రీతిలో మరికొన్ని సంఘటనలు ఆంధ్రలో చోటు చేసుకునే వీలుంది. వాటిలో 1) ఎన్నికలు రావడానికి ఇంకా సంవత్సరము గడువు ఉంది కనుక, ఈలోపు టిడిపి కూటమి గనుక బాగా బలపడితే, బలపడిందన్నట్లు ప్రజలకు కనపడితే, ఓటమి ఖాయం అన్న అంచుకు గనుక వైసీపీ వస్తే మొత్తం మొత్తంగా డబ్బు పందేరాన్ని ఖర్చును - ఆపివేయవచ్చు. ఎందుకంటే రేపటి ఎన్నికలలో ప్రధాన పార్టీలలో ఎవరు గెలిచినా, ఓడిన వారు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు ఉండవు. కనీసం మళ్ళా వచ్చే ఎన్నికల వరకు అయినా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. కనుక రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకోవాలంటే 10 ఏళ్లు పార్టీ శ్రేణుల్ని నిలబెట్టుకోవలసి వస్తుంది. జగన్ గారు అంత నిరీక్షణకు సిద్ధపడతారని నేననుకోను. డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టాలంటే ఉజ్జాయింపుగా నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లకు సిద్ధపడాల్సిందే. ఓటమి ఖాయమని అనిపించటం జరిగితే మాత్రం అన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుకు ఆయన సిద్ధపడకపోవచ్చు. 175 × 100 కోట్లు అనుకుంటే 17, 500 కోట్లన్న మాట. మరీ అంత కాకపోవచ్చు అనుకున్నా అది 10వేల కోట్ల వరకు ఉంటుంది.

2) వైసీపీ ఓటమిపాలైతే చంద్రబాబు నాయుడు గారు తనకు జరిగిన అవమానానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. కనుక టిడిపి వారికి వైసిపి కనుమరుగు అవడం కంటే, జగన్రెడ్డి గారు, మరికొందరు వైసీపీ అభ్యర్థులు కనీస సంఖ్యలో గెలవాలనే చంద్రబాబునాయుడు గారు కోరుకుంటారు. రాజకీయ చతురత గల వారు కూడా కనుక, జగన్ గారినీ, తన దృష్టిలో ఉన్న వైసీపీ అభ్యర్థులు మరికొందరినీ కూడా గెలిచేట్లు వ్యూహం పన్నినా పన్నవచ్చు. అలాగే జరిగి జగన్ రెడ్డి గారు బలహీన ప్రతిపక్షంగా ఉండాల్సి వస్తే గనుక, వారికి అంతకంటే దయనీయమైన పరిస్థితి మరొకటి ఉండదు.

3) పవన్ కళ్యాణ్ గారి విషయంలోనూ ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆయనగారిలో అధికారంలోకి రావాలి అన్న కాంక్ష కనుక ప్రబలంగా ఉంటే అదే అన్నింటికంటే ముఖ్యమైనది అని గనుక ఆయన నిర్ణయించుకుంటే, టిడిపిని పూర్తి మెజార్టీతో గెలిపించడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే టిడిపి గనుక పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇక జనసేన అధికారంలోకి రావడం సాధ్యపడదు. అది అలా టిడిపి మిత్రపక్షంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. ఎలాగంటే 2024లో టిడిపి అధికారంలోకి వచ్చిందనుకుందాం. ఐదేళ వరకు వాళ్లు చేయగలిగిందేమీ ఉండదు. ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో మిత్ర సంబంధాలు తెంచుకున్నా ఆ ఎన్నికలలో గెలవడం సాధ్యం కాదు. మహా అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడవచ్చునేమో. అంటే మరో ఐదేళ్లు అంటే మొత్తం పదేళ్లు వేచి చూడాల్సిందే. ఇంతటి నిరీక్షణకు పవన్ కళ్యాణ్ గారు గానీ, జనసేన ముఖ్యులు గానీ సిద్ధపడతారా? అన్నది వెంటనే సమాధానం చెప్పలేని ప్రశ్న.

4) 'ఫలాని పార్టీ గెలుపు ఖాయం' అన్నదిగాని ప్రచారం బలంగా సాధారణ ఓటరు దృష్టికి వస్తే ఒక 10% ఓటర్లయినా, గెలిచే వాడికే ఓటు వేద్దాం ఓడిపోయే వారికి వేసి ఓటును ఎందుకు మురగ పెట్టుకోవాలి అనుకునేవారుగా ఉంటారు. గెలుపోవటముల్ని ప్రభావితం చేయడంలో ఒక్కోసారి ఇదీ కీలకమే అవుతుంది.

 ఇది సందర్భం కాదుగానీ, భవిష్యత్ లో టిడిపికి జనసేన, బిజెపి కూటమి ప్రధాన ప్రత్యర్ధి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రెండు పార్టీలు శాశ్వతంగా అధికారం టిడిపికి ఇవ్వటానికి సిద్ధపడనే పడవు. నమస్కారాలు మీ సురేంద్ర. 


మండలి జీవన విధానము (శైలి)

(గత సంచిక తరువాయి)

యోచనాశీలురైన మిత్రులారా!

ప్రతి వ్యక్తీ సమాజానికి రుణపడి ఉన్నాడని, ఉంటాడని స్పష్టంగా గమనించాము. వెనుకటి భారతీయ చింతకులు కొందరూ ఈ విషయాన్ని స్పష్టంగా గమనించారు. మూడు రుణాలన్న పేరున ప్రస్తావించారు కూడా. వ్యక్తి మాతాపితురులకు, గురువుకు, ప్రకృతికి రుణపడి ఉంటాడని వారన్నారు. ఆ మూటినీ మండలి రెండుగా చెబుతోంది. వ్యక్తికి తల్లిదండ్రులూ, గురువులు కూడా సమాజం క్రిందకే వస్తారు కనుక, వ్యక్తి అటు ప్రకృతికీ, ఇటు సమాజానికీ రుణపడి ఉన్నాడని నిర్ద్వంద్వంగా ప్రకటించింది మండలి. అప్పు తీర్చే పని (తిరిగి చెల్లించే పని) విధిగా చేయాల్సిందేనని తన పరివారానికి చెబుతోంది. 'తిరిగి చెల్లించండి' అన్న భావాన్ని జనానికి తెలియజెప్పడానికీ, వారంతా ఎంతోకొంత చెల్లించేలా చేయడానికీ ప్రయత్నిస్తూ వస్తోంది. మా జీవనశైలికి సంబంధించినంతలో ఇదీ ముఖ్యమైనది గానే ఉంది.

ప్రకృతికి సంబంధించినంతలో, పచ్చదనం, పరిశుభ్రత అన్న రెండంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంటి వాతావరణాన్ని రూపొందించుకోండని ప్రజలకు (మండలి పరిచయంలోకి వచ్చిన వాళ్లకు) చెబుతోంది. ఇంటింటా కొన్నైనా పూల మొక్కలు, ఫల వృక్షాలు పెంచండి అని చెబుతోంది. అవకాశం ఉన్నవాళ్లు పెరటి తోటను పెంచుకోవడం బాగుంటుంది అని సూచిస్తుంది. మా ఇల్లు అనేక పండ్ల చెట్లు, పూల మొక్కలు, పెరటి తోటతో తగినంత పచ్చదనం కలిగి ఉంటుందని, మా ఇంటికి వచ్చిన వారందరికీ తెలిసినదే. నా భార్య శ్యామల, పనిమనిషి లక్ష్మి నిత్యం ఒక గంటైనా వాటి పని చూస్తుంటారు. శారీరక శ్రమేగాక తృప్తిని కూడా ఇస్తుంటుందా పని. ఇంటి వాతావరణం పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలంటే, గృహిణికి ఆ అభిరుచి ఉండడం చాలా అవసరం. ఆ శ్రద్ధ పురుషులకు ఉండకూడదని కాదు గానీ, దీర్ఘకాలం పాటు అది సవ్యంగా కొనసాగుతుండాలంటే మాత్రం మహిళలకు ఆ పని పట్ల మక్కువ ఉంటేనే చక్కగా అవుతుంది. వృత్తి వ్యాపారాలు, సామాజిక సంబంధమైన వ్యవహారాలలో ఎక్కువగా బయట ఉండాల్సిన అవసరం లేని, ఎక్కువ సమయం లేదా రోజూ నిర్ణీత సమయాలలో ఇంటిపట్టునే ఉండే పురుషులైనా ఈ పనిని చేపట్టవచ్చు. అవకాశం ఉంటే స్త్రీ పురుషులు ఇరువురు ఈ పనులను కలసి చేసుకోవచ్చు. మచ్చుకు ఒక నమూనా చెబుతాను. ప్రతి ఇంట్లోనూ ఒక జామ చెట్టు, ఒకటి రెండు కొబ్బరి చెట్లు, ఒక నిమ్మ చెట్టు ఉండేట్లు చూసుకోండి. వాడిన నీరు బయటకు వెళ్లే దగ్గర కొబ్బరి చెట్లు వేయండి. ఒక మద్యస్థ కుటుంబం వాడిన నీరునంతా అవి పీల్చుకుంటాయి. దాదాపు 50,60% మురుగునీటి సమస్య ఉండదు. ఇంటిని చూస్తే ఇల్లాలిని చూసినట్లేనని ఒక సామెత ఉంది. ఇంటిని, ఇంటి పరిసరాలను చూసి ఆ కుటుంబ జీవనశైలిని కొంతవరకు అంచనా వేయవచ్చు. కనుక మండలి జీవనశైలిలో వ్యక్తి తన విషయంలో తానెలా ప్రవర్తిస్తుండాలి? సమాజం విషయంలో తానెలా ప్రవర్తిస్తుంటాలి? ప్రకృతి విషయంలో తానెలా ప్రవర్తిస్తుండాలి? అన్న మూడూ కీలకమైనవే అవుతున్నాయి. దీనినే మండలి ప్రతీకలో ధర్మాచరణ అన్న పేరుతో సూచించుకున్నాము.

భర్తృహరి ఒక సూక్తిని చెప్పాడు, లోకంలోని వ్యక్తుల పోకడకు సంబంధించి ఆయన మనుషుల నైజాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో తెలుపుతోందా ప్రస్తావన.

తమ కార్యంబు పరిత్యజించియు పరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్ 

తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్ధ వ్యాపకుల్ మధ్యముల్

తమకైయన్య హితార్ధ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం 

గము కలిగించెడి వారలెవ్వరో ఎరుగన్ శక్యమే ఏరికిన్ 

ఇందులో మండలి జీవనశైలి రెండవ కోవకు చెందిందిగా ఉంది. పరిస్థితుల ఒత్తిడి కారణంగా కొన్ని అసాధారణ పరిస్థితులలో ఎప్పుడైనా ఒకటో విధంగానూ, మూడో రకంగానూ ప్రవర్తించడమూ జరిగే అవకాశం లేదనను గానీ, సాధారణంగా మా జీవన విధానం రెండో రకానికి చెందింది గానే ఉంది. జీవితానికి సంబంధించిన మా అవగాహనలో త్యాగాలు చేయనక్కరలేదు అన్న భావనా ఉంది. త్యాగాలు చేయనవసరం లేని సమాజమే సరైనది. అదే మంచి సమాజం అని గానీ, ధార్మిక సమాజం అని గానీ అనడానికి తగి ఉంటుంది " అన్న దృష్టి కలిగి ఉన్నాము మేము. ఆ విషయాన్నే సమాజానికీ తెలియజేస్తూ వస్తున్నాము. ఈ విషయాన్ని ఇంకా సరిగా చెప్పాలంటే సామాజిక సంబంధాల పరంగా ఇచ్చిన, పుచ్చుకున్న విలువలను లెక్కవేస్తే, మనిషే సమాజానికి ఇవ్వవలసిన వాడుగా తేలుతుంది. కనుక అప్పు తీర్చుకునే స్థానంలోనే ఉంటాడు గానీ, త్యాగం చేయగల స్థితిలో ఉండడు అన్న దగ్గర ఉన్నాము మేము. కనుకనే మా పనులు చూసుకుంటూనే, ఇతరుల హితం కొరకు పాటుపడుతుండడం సరైన జీవన విధానమవుతుంది అన్న దగ్గర ఉండి, అలా ప్రవర్తించడానికి యథాశక్తి సాధన చేస్తూ ఉన్నాము.

మూడు ప్రతిజ్ఞలు

మండలి జీవనశైలిని చూపించే వాటిలో మూడు ప్రతిజ్ఞలన్నవీ మౌలికమైనవే. 1) సమయాన్ని పాటిస్తుండడం, 2) మాటకు కట్టుబడి ఉండడం, 3) చేస్తానన్న, చేస్తున్న పనిని మనసుపెట్టి చేయడం అన్న మూటినీ ఆచరణకు సంబంధించిన ప్రాతిపదికలుగా ప్రతిజ్ఞాపూర్వకంగా స్వీకరించాలన్నది మండలి నడకకు ఆధారంగా ఉంటోంది. దీనిని 100% అమలు చేయగలుగుతున్నాం అని చెప్పలేము గానీ, శక్తివంచన లేకుండా ఆచరించటానికి యత్నిస్తూ ఉందామన్నది మాకు మేము పెట్టుకున్న నియమంగా ఉన్నది. ఈ మూడు ప్రతిజ్ఞలన్నవి, మా జీవితాలను ఒక క్రమంలోనూ, సమాజ హితకరం గానూ కొనసాగుతుండేందుకు ప్రేరకంగానూ, అటు ఇటు పడిపోకుండేందుకు రక్షణ గోడ గానూ పనిచేస్తూ వస్తున్నాయి. ఈ మూటినీ అలవాటుగా మార్చుకునేందుకు యత్నిస్తుండటమే గాక, సమాజానికీ వీటి అవసరాన్ని ఎరుకపరచి, వారూ వీటిని పాటించేలా, అలవర్చుకునేలా ఒత్తిడి చేస్తూనూ వస్తున్నాము.

మండలి భావజాలంలో వీటికి ఎంత ప్రాధాన్యత ఉందంటే, సామాజిక సంబంధాలలో వ్యక్తుల ప్రవర్తన కారణంగా ఏర్పడే సమస్యలన్నింటిలో ముప్పాతిక మూడొంతులు (99 శాతం లేదా అధిక భాగం) వ్యక్తులు ఈ మూటినీ సక్రమంగా పాటించక పోవడం వల్ల ఏర్పడుతున్నవేనన్న నిర్ణయంలో ఉన్నాము మేము. ఈ విషయం చాలా గంభీరమైనది కనుక కొద్దిగా వివరిస్తాను.

సామాజిక సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే నన్నది మా మూల భావనల్లో ఒకటి. ఇది సామాజిక శాస్త్రజ్ఞులు అంగీకరించిన ప్రాతిపదికల్లో ఒకటి కూడా. కనుక నిర్వివాదాంశం కూడా. కనుక ఈ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు సక్రమంగా కొనసాగుతుండాలంటే, వ్యక్తుల ప్రవర్తనలో పైన చెప్పుకున్న మూడూ ఇమిడి ఉండాలి. మండల జీవన శైలిలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఈ మూటినీ ఆచరించడానికీ, అలవాటుగా మార్చుకోవడానికీ సాధన చేస్తూ వస్తోంది. దాని ఫలితంగా, చాలామంది కంటే మెరుగ్గా ప్రవర్తించ కలుగుతోంది కూడా. నా వరకు నాకు సమయపాలన ప్రాణప్రదమైనది. గత 50 ఏండ్లుగా సమయపాలనను ఒక తపస్సులా చేస్తూ వస్తున్నాను. నా మిత్రులకూ, పరిచయస్తులకూ, ఉద్యమ సహచరులకు కూడా ఈ విషయమై అవగాహన కలిగించి, అలవర్చుకునేలా ఒత్తిడి పెడుతూనూ వస్తున్నాను. అలాగే మాటకు కట్టుబడి ఉండడం, అంగీకరించిన పనిని శ్రద్ధతో చేయడమున్నూ. దీనికి సంబంధించే మండలి భావజాలాలలోకి ఒక సూత్రం వచ్చింది. (ఇంకా ఉంది).



No comments:

Post a Comment